(29–10–1896 నాడు లండన్లో ఉపన్యసించింది)
ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ఒకటి. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ దాన్ని మృత్యు రహస్యం (సీక్రెట్ ఆ్యప్ డెత్) అనే పేరుతో ఆంగ్లీకరించాడు. మీలోని కొందరు దాన్ని చదివి వుండవచ్చు. ఆ ఉపనిషత్తులో కొంత భాగమును ఈనాడు మీకు చదివి వినిపిస్తాను. లోకోత్పత్తిని, లోక సృష్టిని మూలంగా తీసికొని చేసిన బాహ్యవిచారం వల్ల పారమార్థిక తత్త్వమేమీ తెలియరానందువల్ల, ఆంతరంగిక ప్రపంచం దెస, బుద్ధి మరల్ప వలసి వచ్చిందని మన కిప్పటికే తెలుసు. సరిగా అక్కడే, అంటే మానవుని ఆంతరంగిక ప్రకృతి విచారంతోడనే కఠోపనిషత్తు ప్రారంభమవుతోంది. బాహ్యప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? అది ఎలా ఉత్పత్తి అయింది? అని పూర్వపు ఆలోచన. మానవుడు జీవించడానికి, తిరగడానికి, ఆధార భూతమైనది అతనిలో ఏది? అతని మరణానంతరం అది ఏమైపోతుంది? అనేది ఇప్పటి విచారం. ఆదిమ తత్వవేత్తలు భౌతికవస్తు విచారమూలంగా, పరాత్పర వస్తువును గ్రహించాలనుకున్నారు. వారి విచారణలు, ప్రపంచాన్ని ఏలే ఒక జగదీశ్వరునందుకొని, అంతకుమించి పైకి పోజాలక పోయినవి. ఆ జగదీశ్వరుడు అన్ని విధాలా మానవునికన్న ఉన్నతుడు. కాని సర్వవిధాలా మానవుడే. కాబట్టి, పరమసత్యంగా అంగీకరింపబడలేదు. అది సత్యంలో ఒక అంశం కావచ్చు. మన మీ జగత్తును మానవదృష్టితో చూస్తున్నాం. కాబట్టి ఈ జగత్తుకు ఆధారభూతుడైన దైవంకూడ మానవబుద్ధి కల్పితుడే.
తత్త్వవిచారం చేయగల ఆవొకటి వుందనుకోండి. ఆ ఆవుకు దైవాన్వేషణబుద్ధి కలిగితే, దానికొక గోజగత్తు స్ఫురిస్తుంది. ఆ జగత్తుకు కారణభూతుడుకూడ గోబుద్ధి కల్పితుడే. గోవుకు మన దైవం కనిపించుట అసంభవం. పిల్లులు తత్త్వ విచార మారంభించాయనుకోండి. వానికొక పిల్లి జగత్తు కన్పిస్తుంది. ఆ జగత్తు వొక మార్జాలపతి పరిపాలనలో ఉంటుంది. అట్లే మన మానవ సమాధానంకూడ సమగ్రం కాజాలదు. మన జగద్భావమే అసమగ్రం. అహంభావపూరితుడై మానవుడెన్ని ప్రగల్భాలు పలికినా, నిజమిదే. బాహ్య విచారమూలంగా, జగత్సమస్యకు లభించే సమాధానంలో ఈ గొప్ప లోపముంది. మనకు కనిపించేది మన ప్రత్యేక జగత్తు. సత్యాన్ని గూర్చి మనకు మాత్రమే ఏర్పడిన భావం. ఆ సత్యం ఇంద్రియగోచరం కానిది. బుద్ధికికూడ గోచరం కానిది. పంచేంద్రియాలున్న వారికీ జగత్తులో ఎంత గోచరిస్తుందో, అంతే మనకు తెలిసిన యీ జగత్తు. మరొక ఇంద్రియం లభిస్తే మన కీ జగత్తంతా మారిపోతుంది. సూదంటురాయిలాగా ఆకర్షించే శక్తిగల ఇంద్రియ మొకటి కలిగితే, మన మిప్పుడెరుగని ఎరుగజాలని, కోటానుకోట్ల శక్తులు మనకింద్రియ గోచరం కావచ్చు. మన ఇంద్రియాలశక్తి స్వల్పం. మిక్కిలి పరిమితం. ఆ స్వల్ప పరిమితుల లోపలనే మనం జగత్తనుకొనేది ఇమిడి వుంటుంది. ఆ స్వల్ప జగత్సమస్యనే మన దైవం తీర్చును. పరిపూర్ణ జగత్సమస్య అట్లే నిలిచి ఉంటుంది. కానీ బుద్ధిచే గొప్పవాడయిన మానవుడు, ఇంతటితో ఊరుకోక, సర్వ జగత్తులకు ఒక్కుమ్మడిగా అన్వయింపగల సమాధానాన్ని – సురనరాది సర్వ భూతకోటి ఒక్కటిలోనే ఉండు జగత్తును, ప్రకృతి వికారాలన్నిటికి అన్వయించే సమాధానాన్ని సాధింప చూస్తాడు.
అంటే, ఏ జగత్తులో సర్వజగత్తులూ వున్నాయో, ఆ జగత్తును కనుగొనడం మన ప్రథమ కార్యం. ఏ పదార్థం, ఈ వివిధ క్షేత్రాలలోగల జగత్తులన్నిటికి, సామాన్యమై ఉందో – అది, ఇంద్రియగోచరమైందైనా, కానిదైనా – ఆ పదార్థాన్ని కనుగొనాలి. ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు, సామాన్యధర్మం నిష్కర్షగా తెలియదగినదేదైనా ఒక్కటి లభించినా, మన సమస్య పరిష్కారమైనట్లే. ఉనికిగల సర్వం, ఒకే మూలంనుండి ఉత్పత్తియై వుండాలని, కేవలం హేతుబద్ధ వాదంవల్ల స్థాపించినా, మనం కొంత దారిలో పడినట్లే. కాని మనకు తెలిసిన ఈ దృశ్యజగత్తు మూలంగానే, మన సమస్యా పరిష్కారం కాజాలదనడం నిస్సంశయం. మనకు గోచరించేది, సృష్టిలో ఒక అంశం మాత్రమే కదా?
కాబట్టి అగాధ పరిశోధన ఒక్కటే కార్యసాధకం కావచ్చునని తేలుతోంది. కేంద్రానికి దూరంగా ఉండేవరకు, వ్యత్యాసాలు, వైషమ్యాలు అధికంగా వుంటాయనీ, కేంద్రాన్ని సమీపించే కొద్దీ, ఐక్యభావం అధిక మవుతూ ఉంటుందనీ, పూర్వ పరిశోధకులు కన్గొన్నారు. వలయ మధ్యాన్ని (సెంటర్ ఆ్యప్ ది సర్కిల్) సమీపించేకొద్దీ, కిరణ రేఖలు (రేడియై) అన్నీ కలిసి ఏకీభవించే కేంద్రాన్ని సమీపిస్తాం. అట్లే దానికి దూరమైనకొద్దీ, కిరణ రేఖలకు ఒండొంటికి కల దూరం అధికమవుతూ వుంటుంది. బాహ్య ప్రపంచం, మూల సత్యానికి చాలాదూరంలో ఉంది. కాబట్టి ఇంద్రియాలకు పరస్పర భిన్నాలుగా కనిపించే దృశ్యాలన్నీ ఏకీభావం వహించి కనిపించే ప్రదేశం అందులో ఉండజాలదు. మనకు తెలిసిన బాహ్యజగత్తు, విశ్వసృష్టిలో, ఒక స్వల్పాంశం మాత్రమే. ఇతరాంశములు – ఒకదానికన్నా ఒకటి ఉన్నత క్షేత్రాలలో – వున్నాయి కదా? మానసికం, నైతికం, వైజ్ఞానికం ఒక్క అంశాన్ని మాత్రమే తీసికొని, తత్సాహాయం వల్ల సర్వాన్నీ అర్థం చేసికోవడం కేవలం అసంభవం. ఈ విభిన్న క్షేత్రాలన్నిటికీ మూలకేంద్రమని చెప్పదగిన స్థానమేదైనా వుందా? అని కనుగొని, ఆ కేంద్రంనుండి సమస్యను పరిష్కరించాలి. ఇదే చేయవలసిన పని. ఆ కేంద్రం ఎక్కడ? మనలోనే. ప్రాచీన మహర్షులు మిక్కిలి లోతైన పరిశోధనలు చేసి, మానవాత్మయొక్క గర్భాంతరాళంలోనే విశ్వ జగత్కేంద్రం ఇమిడి వుందని గ్రహించారు. ఈ క్షేత్రాలన్నీ ఆ కేంద్ర స్థానం వైపునకే ఆకర్షింపబడుతూంటాయి. అంటే అన్ని క్షేత్రాలకు అదే కూడలి. కాబట్టి ఆ చోట, సుప్రతిష్ఠితులమైతే తప్ప సర్వమునకు అన్వయించు సమాధానాన్ని కనుగొనజాలం. బాహ్యజగత్తును ఎవరు నిర్మించారు? అనే ప్రాథమిక ప్రశ్న అంత ప్రసక్తం కాదనీ, అది పరిష్కారమైనా నిరుపయోగమనీ తెలిసిపోయింది.
ఈ విషయాన్ని కఠోపనిషత్తు మిక్కిలి అలంకారప్రాయమైన భాషలో బోధిస్తోంది. పూర్వకాలంలో ఒక ధనికుడుండేవాడు. అతడొక యాగం చేశాడు. తన దగ్గరున్నదంతా ఇచ్చేయడం ఆ యాగంలోని నియమం. కాని ఈ కర్త సత్యశీలుడు కాడు. ఆ యాగం చేసిన గౌరవమే అతను కోరింది. అందువల్ల తన కక్కరలేని వ్యర్థ వస్తువులు మాత్రం – వట్టిపోయిన ఆవులను, గ్రుడ్డి, కుంటి, ముసలి వాటిని మాత్రం – ఇచ్చేవాడు. అతనికి నచికేతుడనే కొడుకు ఉన్నాడు. తండ్రి ప్రవర్తనను, నియమభంగాన్ని, అతడు గ్రహించాడు. కాని తెలపడం ఎలా? హిందూ బాలబాలికలకు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. అందువల్ల బాలుడు తండ్రిని అత్యంతభక్తితో సమీపించి మిక్కిలి వినయంగా, “నన్నెవరి కర్పిస్తావు? నీకున్నదంతా ఇచ్చేయాలికదా ఈ యాగ నియమాన్ని చెల్లించడానికి?” అని అడిగాడు. తండ్రి మిక్కిలి ఆశ్చర్యపడి, “నాయనా! ఇదేమి ప్రశ్న? తండ్రి తన కుమారునే ఇచ్చేస్తాడా?” అన్నాడు. కాని నచికేతుడూరకుండక, రెండోసారి, మూడోసారికూడ ఆ ప్రశ్ననే అడిగాడు. తండ్రి కోపంతో “నిన్ను యముడికి ఇస్తున్నాను” అన్నాడు. బాలుడంత యముని దగ్గరకు వెళ్లాడు. మృతులైన మానవులలో యముడు ప్రథముడు. అతడు స్వర్గలోకానికి వెళ్లి పితృ దేవతలకు అతిథి అయ్యాడు. మరణించిన సజ్జనులంతా అతని దగ్గరకు వెళ్లి చాలాకాలం నివసిస్తారు. ఆయన బహు పరిశుద్ధుడు. బహు పావనుడు. సుగుణ సౌశీల్యాలు కలవాడు. యముడను పేరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ బాలు డాయన లోకానికి వెళ్లాడు. అప్పుడు యముడింట్లో లేడు. దేవతలు సైతం కొన్నివేళల్లో ఇళ్లల్లో ఉండరు. బాలుడు మూడునాళ్లు కాచుకొని వున్న తర్వాత యముడు వచ్చాడు.
“బుధవరేణ్యా! నమస్కరించదగిన అతిథివి. మూడు నాళ్లిక్కడే వేచివున్నావు. అందునా ఉపవసించావు. నా అభివాదములందుకో. నీకు శుభమగుగాక! నేను ఇంట లేనందుకు చింతిస్తున్నాను. కానీ ఆ లోపాన్ని ఇప్పుడు సవరిస్తాను. ఒక్కొక్క నాటికి ఒక్కొక్క వరం వంతున, మూడు వరాలు కోరుకో” అని అన్నాడు. అందుపై బాలుడు “నా తండ్రికి నాపై కల కోపం శమించు గాక! నీవు, నన్నిక్కడనుండి పంపినప్పుడు అతడు నన్ననుగ్రహదృష్టితో అంగీకరించుగాక! ఇది నా మొదటి వరం” అన్నాడు. యము డీ వరాన్ని పూర్తిగా ప్రసాదించాడు. స్వర్గ ప్రాప్తి కలిగించే ఒకానొక విద్యను బోధించ మనడమే రెండవ వరం. అత్యంత ప్రాచీనకాలంలో – వేదములలోని సంహితాభాగంలో – తేజోమయ శరీరం కలిగి, పితరులతో జీవించే, స్వర్గ లోకపు భావ మొకటి వుండేదని మనకు తెలుసు. కాలక్రమంలో ఇతర భావాలు ఉత్పన్నమయ్యాయి. కాని అవి తృప్తికరాలు కాలేదు. అంతకన్న ఉన్నత భావాలు అవసరమయ్యాయి. స్వర్గలోక జీవనంలో, భూలోక జీవనంకన్న అంతగా ఆధిక్యం కనిపించలేదు. పరిపూర్ణారోగ్యం, అపార సంపద, కోరినన్ని ఇంద్రియభోగాలు, వజ్రంతో సమానమైన శరీరం, రోగాలు ఎన్నడూ రాకుండటం; – ఇంతకంటే ఆధిక్యమేమైనా ఉందా? అది ఈ భౌతిక లోకంవంటిదేకాని, ఇంతకన్న కొంత నాజూకైనది. ఈ బాహ్య భౌతికలోకం మన సమస్యా పరిష్కారానికి ఉపకరించదని ఇప్పటికే చూచాం. కాబట్టి స్వర్గ లోకంకూడ ఉపకరింపజాలదు. ప్రకృతి వికారాలలో భౌతిక పదార్థమయములత్యంత స్వల్పం. అందులో అత్యంతభాగం భౌతికమే కాదు. కాబట్టి ఈ మన లోకమెలా మన సమస్యా పరిష్కారాని కసమర్థమో, అట్లే భౌతిక పదార్థ నిర్మితమైన, ఎట్టి మహాలోకమైనా అసమర్థమే అవుతుంది.
మన జీవిత గమన వైఖరిని నిర్ణయించడంలో, మన భావాలకు, చిత్తవృత్తులకువున్న ప్రాముఖ్యం, బాహ్యప్రపంచ వికారాలకు లేనేలేదు. మన ఆంతరంగిక ప్రపంచమంతా అనంతం. అందు నిరంతరమెంతో పని సాగుతూ ఉంటుంది. దానితో పోల్చి చూస్తే ఇంద్రియకల్పనలు అతిక్షుద్రంగా తోస్తాయి. పంచేంద్రియగోచర జగత్తే సర్వజగత్తు అను ప్రమాదంలో పడి, సంహితలు, స్వర్గాన్ని ఆదర్శ భూమిగా చేశాయి. కాబట్టి అవి సర్వజనామోదం పొందలేదు. కాని నచికేతుని, రెండవ వరం యీ స్వర్గాన్ని చేకూర్చే క్రతువు నొకదాన్ని నేర్పుమన్నదే. ఈ క్రతువుచే దేవతలు ప్రీతులై, స్వర్గాన్నిస్తారని వేదాలలో ఒక భావం ఉంది.
సర్వమత గ్రంథాలను పరీక్షిస్తే పాతపడినవాని కన్నిటికి, పవిత్రత ఆరోపించబడుతుందని తెలుస్తుంది. కాగితం చేయలేని పూర్వకాలంలో మనవారు వాడుతూండిన భూర్జపత్రాలు, ఇప్పుడు పూజ్యభావాన్ని పొందాయి కదా? అట్లే పూర్వకాలంలో వాడుతూన్న వంట పాత్రల విషయంకూడ; హిందూదేశంలో ఈ ఆచారం అత్యంత వ్యాప్తిలో వుంది. రెండు కొయ్యల (ఆరణుల) ఒరిపిడిచేత అగ్నిని కల్పించే తొమ్మిది, పదివేలేండ్లనాటి ఆచారమునిప్పటికీ అనుసరిస్తారు. యజ్ఞ యాగాదుల్లో ఇతర మార్గాలు నిషిద్ధాలుకూడ. ఆసియా ఖండపు ఆర్యులలోని రెండవ శాఖవారు, విద్యుల్లత నుండి అగ్నిని సేకరించుకొనే ప్రాచీనాచారాన్ని పాటిస్తున్నారు. క్రొత్త మార్గాలు ఏర్పడిన పిదపకూడ యీ పాత విధులు పూజ్యభావంతో అనుసరింపబడతాయి.
అట్లే హీబ్రూ జాతివారిప్పుడు, కాగితం వాడేవారైనా, వారి పూర్వీకుల నాటి తోలుకాగితా న్నిప్పుడు పూజ్యభావంతో చూస్తారు. అన్ని జాతులు ఇలాగే చేస్తారు. ఇప్పుడు, పవిత్రంగా ఎన్నబడే ఆచారాలన్నీ పూర్వమున్నవి. వైదిక క్రతువు లట్టివే. కాలక్రమంలో ఉత్తమ మార్గాలు లభించి, భావాలు కూడ ఉత్తమమైనవి కానీ, ఈ ప్రాచీనాచారాలట్లే నిలిచి వున్నాయి. ఇవి ఏవో కొన్ని సందర్భాలలో ఆచరింపబడుతూ, పవిత్ర భావాన్ని ఆర్జించుకొన్నవి.
తర్వాత కొందరు, ఈ క్రతువులు జరపడమే వృత్తిగా పూనారు. వారే ఋత్విజులు. వారికిదియే బ్రదుకు తెరువు. వారెంతో ప్రచారం చేసి యీ క్రతువులకు వ్యాప్తి కల్పించారు. “ఆహుతుల పరిమళంచే ఆకర్షింపబడి దేవతలు దిగి వస్తారు. యాగములచే లభింపరాని, కామ్య వస్తువులే లేవు. ఒక్కొక్క విధమైన వేదిక నిర్మించి, కొన్ని మంత్రాలుచ్చరిస్తూ, కొన్ని ఆహుతు లర్పిస్తే, ఈప్సితార్థాలన్నీ దేవతలు ప్రసాదిస్తారు.” కాబట్టే స్వర్గ ప్రాప్తినిచ్చే క్రతువును తెలుపుమని నచికేతుడు కోరాడు. యము డీ వరాన్నికూడ నిరభ్యంతరంగా ప్రసాదించి, అది నచికేతుని పేరనే వాడుకలోకి వచ్చేలా కూడ వరమిచ్చాడు.
ఇక మూడవ వరం. దీనితోనే ఉపనిషత్తు నిజంగా ప్రారంభ మవుతుంది. “ఒక సంశయం. మనుష్యుడు మరణించిన తర్వాతకూడ ఉంటాడని కొందరు, ఉండడని కొందరు అంటారు. నిజం నీ దగ్గర తెలుసు కోవాలని వుంది. ఇదే నా మూడవ వరం” అని బాలుడన్నాడు. మొదటి వరాలను సులభంగా ఇచ్చిన యముడు ఈ వరాన్ని విని భీతిల్లి ఇలా అన్నాడు: “ఈ ధర్మం సులభంగా తెలియదగింది కాదు. దేవతలుకూడ, ముందీవిషయంలో సందేహగ్రస్తులైనారు. కాబట్టి దీనికై నిర్బంధించక, మరో వరం కోరుకో –”
కాని బాలుడు, దృఢనిశ్చయంతో ఇలా అన్నాడు: “నీవు చెప్పినట్లు ఇది సులభంగా తెలియదగిన ధర్మం కాదు. దేవతలుకూడ దీని విషయంలో సంశయగ్రస్తులవడం నిజమే. కాని ఈ విషయంలో నాకు నీ వంటి బోధకుడు ఇంకెవ్వరు లభిస్తారు? దీనికి సమానమైన మరొక వరంకూడ ఏదీ లేదు–”
యముడిలా అన్నాడు: “శతాయుష్కులైన, పుత్ర, పౌత్రులను, పశుసమృద్ధిని, ఏనుగులను, ధనాన్ని, గుర్రాలను కోరుకో. కావలసినంత భూమి, సంపద కోరుకో. ఇష్టమొచ్చినంత దీర్ఘ జీవితాన్ని కోరుకో. ధనానికీ, చిరజీవితానికి సమానమని నీకు తోచిన మరే వరాన్నైనాకోరుకో. లేక దిగంత రాజ్యాధిపతివికా. సర్వకామోపభోగా లనుభవించేలా చూస్తాను. భూలోక దుర్లభమైన కోరికలన్నీ కోరుకో. మానవులకు లభ్యంకాని స్త్రీ రత్నాలను, రథాలను, వాద్యాలను, నీ భోగ్యార్థం ఇస్తున్నాను. కాని, మరణానంతర విషయాన్ని గూర్చి ప్రశ్నించకు.”
నచికేతుడిలా బదులు పలికాడు: “నీవు పేర్కొన్న భోగాలన్నీ నేడున్న, రేపుండనివి. ఇంద్రియాల తేజస్సంతా, ముదిమికి బలి అవుతుంది. అతి దీర్ఘజీవితం కూడ స్వల్పమే. కాబట్టి, నీ గుర్రాలు, నీ నృత్య గీతాలు, నీవే ఉంచుకో. మనుష్యుడు ధనంతో ఎన్నటికీ తృప్తి చెందడు. నీ దర్శనం లభించిన వారు ధనాన్నుంచుకోగలరా? మా జీవితం నీ యిచ్ఛకధీనం. నేను కోరిన వరాన్నే నాకు ప్రసాదించు–”
యముడీ పలుకులకు సంతోషపడి ఇలా అన్నాడు: “శ్రేయస్సు (మోక్ష ప్రదమైన పరమ సత్య జ్ఞానం) వేరు, ప్రేయస్సు (ఇహపర సుఖాన్వేషణం) వేరు. ఇవి కేవలం విరుద్ధ గమ్యాలవడం వల్ల, ఈ మార్గాలు ఆశ్రయించే మానవుల పరిశ్రమలు వేర్వేరుగా ఉంటాయి. శ్రేయోమార్గాన్ని పట్టిన వాడు సాధువవుతాడు. ప్రేయోమార్గాన్ని పట్టినవాడు పరమార్థాన్ని పొందజాలడు. ఈ రెండు మార్గాలూ, మనుష్యుని ఆకర్షింపజూస్తాయి. ధీరుడు (బుద్ధిశాలి) ఈ రెంటిని పరీక్షించి, గుణాగుణ వివేచనం చేసి, శ్రేయోమార్గాన్నే వరిస్తాడు. మందుడు ప్రాపంచిక భోగాసక్తుడై, ప్రేయోమార్గాన్ని వరిస్తాడు. నీవు చక్కగా ఆలోచించి, ప్రియములు, ప్రియరూపాలు అయిన కామ్య వస్తువులను త్యజించి, ప్రాజ్ఞత చూపావు.” యముడంత నచికేతునికి ఆత్మవిద్య బోధించ నారంభించాడు.
వేదకాలంలో నీతి వైరాగ్యాదర్శాలు ఎంత ఔన్నత్యాన్ని పొంది వుండిందో కానీ, భోగాసక్తిని జయించిన వారిలో తప్ప, సత్యం ప్రకాశింప జాలదని సిద్ధాంతీకరించారు. వ్యర్థమైన ఈ ఇంద్రియ భోగవాంఛలు మనలో నిరంతరం ఘోషిస్తూ మనస్సును వెలికీడ్చేలా వున్నంతకాలం, ఏదో ఒక క్షుద్ర రూపానికో, రసానికో, స్పర్శకో, మనం ప్రతిక్షణం దాస్యం చేసేంత కాలం, ఎన్ని ప్రగల్భాలాడినా, సత్యం మన హృదయాల్లో ఎలా ప్రకాశిస్తుంది?
యముడిలా చెప్పాడు: ధన మోహంచే, మూఢుడైన పామరునికి అనంతర జీవితం అనేది ఒకటుందనియే స్ఫురించదు. ‘ఉన్న దీ ఒక్క లోకమే. మరొకటి లేదు’ అని తలచేవాడు, మాటిమాటికి పుడుతూ చస్తూ వుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించడం కష్టం. నిరంతరం వింటూ వున్నా, చాలమంది దీన్ని గ్రహింపజాలరు. ఎందుకంటే ఇందులో, నేర్పేవాడు, నేర్చుకొనేవాడు అసామాన్యులుగా ఉండాలి. గురువొక్కడు, ఆశ్చర్యకరమైన నేర్పు కలవాడు లభిస్తే చాలదు. నేర్పరి అయిన వాడుగాని దాన్ని గ్రహింపజాలడు. లేనిపోని హేతువాదాలతో మనస్సును కలవరపెట్టడం నిష్ప్రయోజనం. అది సత్యం. తర్కవాదాలకు అవకాశమిచ్చే విషయం కాదు. తర్కానికి అందేటటువంటి విషయంకూడ కాదు. ప్రతి మతం వారు “విశ్వసించడం” అవసరమని బోధిస్తారు. “గ్రుడ్డి నమ్మకాన్ని” (కారణ విచారం చేయని నమ్మకం) విధిస్తారు. గ్రుడ్డి నమ్మకం ఆక్షేపణీయమే కాని, పరిశీలించి చూస్తే దానికి వెనుక మహాసత్యం కనిపిస్తుంది. ఈ మాటకు నిజమైన అర్థం మనకు ఇక్కడ తెలియగలదు. ఈశ్వరుడు హేతువాదానికి అందేవాడు కాదు. కాబట్టి లేనిపోని వాదాలతో మనస్సును కలవరపెట్టరాదు. సత్యం అనుభవవేద్యం కాని, వాదాలచే నిర్ణయింపబడేది కాదు. చర్చలు, తర్కాలు గోచర విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అట్టి విషయాలు లేనప్పుడు చర్చలకు, తర్కాలకు ఆధారమే లేదు. గోచరమైన కొన్ని విషయాలను ఒకదాంతో ఒకటి పోల్చడమే ‘తర్క’ మంటారు. ఆ విషయాలు లేకపోతే తర్కంకూడ ఉండజాలదు. ఆ విషయాలు బాహ్య ప్రపంచంలోనివే కావలసిన అవసరం లేదు కదా? ఆంతరంగిక ప్రపంచంలోనివికూడ కావచ్చు. రసాయన శాస్త్రజ్ఞుడు కొన్ని ద్రవ్యాలతో, కొన్ని ఫలితాలను పొందుతాడు. మీరు వానిని చూస్తారు, గ్రహిస్తారు. ఆ సత్యాలపై మీ రసాయన విషయక వాదాలు నిర్మించుకొంటారు. భౌతిక శాస్త్రజ్ఞుల, ఇతర శాస్త్రజ్ఞుల విషయంకూడ ఇంతే. జ్ఞానమంతా జ్ఞాత (తెలియబడిన) విషయాలపై నిలుస్తుంది. అట్టి జ్ఞానం మీదనే మన వాదనిర్మాణం. కాని అదేమి చిత్రమో, మానవకోటిలో చాలా భాగం – ముఖ్యంగా ఈ కాలంలో – ఆస్తిక ధర్మ విషయంలో అలాంటి జ్ఞానం కలగడం అసంభవమనీ, కాబట్టి వ్యర్థ వాదాలే మనకు గల ఆధారమనీ భావిస్తారు. వ్యర్థ వాదాలతో మనస్సును కలవరపెట్టరాదని అందువల్లే ఇక్కడ చెప్పడం; ఆస్తిక ధర్మాచరణమంటే, సత్యానుభూతికాని వాగ్వివాదాలు కావు. మన ఆత్మలను పరిశోధించుకొని అక్కడ ఏముందో కనుక్కోవాలి. ఆ కనుక్కున్న దాన్ని గ్రహించాలి. గ్రహించినదాన్ని అనుభూతం చేసికోవాలి. మతమంటే అది. వాదో పవాదాలు ఎన్నైనా, ఆస్తికధర్మాన్ని కల్పింపజాలవు. భగవంతుడున్నాడా? లేడా? అనే ప్రశ్నను తార్కిక వాదంమూలంగా పరిష్కరించడం అసాధ్యం. ఉన్నాడనడానికి, లేడనటానికీకూడ వాదాలుంటాయి. కానీ దేవుడుంటే, అతడుండేది మన హృదయాల్లో అనడం స్పష్టం. ప్రపంచం ఉందా? లేదా? అనే వాదం ఇంకా పరిష్కారం కాలేదు. అది కేవలం భావమయమే అనే వాళ్ళకూ (ఐడియలిస్ట్స్ = ఆదర్శ విజ్ఞానవాదులు), వస్తుజాలమంతా ఉంది అనేవారికీ, (రియలిస్ట్స్ = ప్రత్యక్షవాదులు) వాదాలింకా అనంతంగా చెలరేగుతూనే ఉన్నాయి. కానీ ప్రపంచం ఉందనీ, జరుగుతోందనీ, మనకు తెలుసు. మాటల అర్థాన్ని మార్చడమే మనం చేసే పని. అట్లే జీవిత సమస్యలన్నిటి విషయంలోకూడ జరుగుతున్న స్థితిని మరువరాదు. బాహ్యవస్తు పరిశోధకులలాగా మనం ఆ ఆంతరంగిక వస్తు పరిశోధనలు చేసి కొన్ని సత్యాల్ని గ్రహించాలి. వాని ఆధారంతోనే, ఆస్తికధర్మ నిర్మాణం చేయాలి. మతాలలోకల ప్రతి యుక్తిహీన సిద్ధాంతాన్ని విశ్వసించాలి అనే విపరీతవాదం అంగీకరింప తగనిది. మానవబుద్ధికి కొంత గౌరవం వుంది కదా? అలా నమ్మమనే వాడు తన ఆత్మగౌరవాన్ని కోల్పోతాడు. నమ్మితే, మీరు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. “మానసిక పరిశోధనతో ఈ యీ సత్యాలను మేము కనుగొన్నాం” అని చెప్పే అధికారం ప్రపంచంలోని జ్ఞాన సిద్ధులకు మాత్రమే వుంది. మనంకూడ అలా చేసి, ఆ సత్యాలను నమ్మవచ్చు. అంతకు ముందు నమ్మనవసరం లేదు. ఆస్తికధర్మంలోకల బలమింతే. కాని, ఆస్తికధర్మాన్ని ఆక్షేపించేవారిలో, నూటికి ఇంచుమించు నూర్గురు, తమ మనస్సులను పరిశోధించుకో లేదనీ, ఆ సత్యాలను కనుక్కునే ప్రయత్నాలే చేయలేదనీ మీరు జ్ఞప్తి పెట్టుకోవాలి. కాబట్టి వారి వాదాలను, కేవల నిరాధారాలుగా త్యజింపవచ్చు. సూర్యుడున్నాడని నమ్మేవారంతా బుద్ధిహీనులని ఒక గుడ్డివాడు పలికితే, ఆ పల్కులను ఎవరైనా ఆదరిస్తారా?
ఈ అపరోక్షానుభూతివాదం గొప్పది, మనం నేర్చుకోవలసింది, వదలకూడనిది. దైవానుభూతి గ్రంథ పఠనంవల్లగాని, దేవాలయాల్లోగాని లభించదని గ్రహించేంత వరకు మతాలలో కల కల్లోలాలు, పోరాటాలు, భేదభావాలు నశించవు. ఆస్తికధర్మం ఒక అనుభూతి. దేవుని, ఆత్మను ప్రత్యక్షంగా చూచిన వానికే అది లభించింది. తన మత గ్రంథాలనన్నిటిని కంఠస్థం చేసికొని, ఎడతెగని ప్రవాహంగా ఉపన్యసించగల అత్యున్నత క్రైస్తవ మతాచార్యునికి, తుచ్ఛుడై విద్యాగంధం లేని అనాత్మవాదికీ నిజమైన భేదమేమీ లేదు. మనమందరం నాస్తికులమే. ఆ సత్యాన్ని అంగీకరింతుము గాక! మత భావం బుద్ధికి సమ్మతమైన మాత్రాన మనం ఆస్తికధర్మాన్ని అవలంబిస్తున్నామనడం పొరపాటు. క్రైస్తవులమనే వారికి, మహమ్మదీయుల మనే వారికి, లేక యే యితర మతావలంబులమనే వారికి, అందరికీ ఇది అన్వయిస్తుంది. ఏసు క్రీస్తు కొండపై చేసిన బోధ (సెర్మెన్ ఆన్ ది మౌంట్) లోని సత్యాన్ని అనుభూతం చేసికొన్నవాడు, ఆ క్షణంలోనే భగవంతుడుగా మారిపోతాడు. కాని ఎన్నో కోట్లమంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారట. దీని అర్థమేమంటే, మానవజాతి భవిష్యత్కాలంలో ఎప్పుడో, ఆ బోధ ననుభూతం చేసికొంటుందేమో కాని ప్రస్తుతం రెండు కోట్లలో నిజమైన క్రైస్తవుడు ఒకడైనా లేడు.
అట్లే, హిందూ దేశంలో ముప్ఫయి కోట్ల వేదాంతులున్నారంటారు. కాని ఇందులో వేయింటికొక్కడైనా నిజమైన ఆస్తిక ధర్మానుభూతి కలవాడుంటే, ఈ ప్రపంచం ఎంతో మారిపోయి ఉంటుంది. మనమంతా నాస్తికులమే. కాని, నాస్తికుడని నిజమాడిన వానితో యుద్ధానికి దిగుతాం.
మనమందరం చీకటిలో ఉన్నాం. మతాలనేవి బుద్ధి గోచర సూత్రాలు (బుద్ధికి మాత్రమే తోచేవి). వ్యర్థములైన మాటలు; అర్థం లేనివి; చక్కగా ఉపన్యసించగల వాడిని మనం ఆస్తిక ధర్మపరుడంటాం. కాని, అది కాదు. ఆస్తికధర్మం “పదాల కూర్పులో, అద్భుతపు పొందిక; శ్రోతలకు ఆవేశం కలిగించే వాక్చాతుర్యం, శాస్త్ర పాఠాలకు రకరకాల అర్థాలు కల్పించగల శక్తి, ఇవన్నీ విద్యాధికులకు ఆనందం కలిగించే జిత్తులే కాని, ఆస్తికధర్మ పరత్వ నిదర్శనాలు కావు.” మన ఆత్మలలో సత్యానుభూతి ప్రారంభమైనప్పుడు కాని, ఆస్తికధర్మం ప్రవేశించదు. అప్పుడే ఆస్తికధర్మ సూర్యోదయం. అప్పుడుకాని మనం నీతిపరులం కాజాలం. ప్రస్తుత స్థితిలో మనం మృగాల కన్నా, అంతకంటే ఎక్కువ నీతిపరులం కాము. సంఘంలోకల శిక్షా స్మృతులే మనలను అదుపులో ఉంచుతున్నాయి. “దొంగలను శిక్షింపం” అని సంఘం నేడు ప్రకటిస్తే, మన మందరం, ఒకరి యింటిపై ఒకరు పడి దోచుకుంటాం. మనలను నీతిపరులను చేస్తున్నది పోలీసువాడు. సంఘంలో పరువు ప్రతిష్ఠల కోసమే, మన నీతి ప్రవర్తనం. నిజానికి, మృగంకన్నా మనం ఎక్కువ నీతిపరులం కాము. ఈ మాటలో ఎంతో సత్యముందని మన మనసులకు తెలుసు. కాబట్టి మనం వంచకులం కాకుండా ఉంటాము కాక! మనం ఆస్తిక ధర్మపరులం కామనీ, ఇతరులను హీనులుగా చూచే అధికారం మనకు లేదనీ ఒప్పుకుంటాము కాక! మనమందరం సోదరుల మనే, ఆస్తిక ధర్మానుభూతి కలిగినప్పుడు, మనం నీతిపరుల మవుతామనీ ఒప్పుకుంటాం గాక!
మీరొక దేశాన్ని చూశారనుకోండి! అయినను, ఇంకొకరి బలత్కారంచే దాన్ని చూడలేదని చెప్పినా, చూచిన సంగతి, మీ హృదయాంతరాళంలో తెలుసుకొనే వున్నారు కదా? ఈ బాహ్య ప్రపంచం కన్నా ఎంతో స్పష్టంగా ఆస్తిక ధర్మం, భగవంతుడు, మీకు కనిపించి ఉంటే, వానిలొ మీకు కల విశ్వాసాన్ని చలింప జేయుట సాధ్యమా? మీకు యథార్థ విశ్వాసం లభించిందని అప్పుడు చెప్పవచ్చు. “ఆవగింజ పాటి విశ్వాసమైన కలవాడు” అనే మీ బైబిల్లోని మాటలకిదే అర్థం. అప్పటి మీకు సత్యం తెలుస్తుంది. మీరే సత్యంగా అయ్యారు కదా?
“ఆస్తిక ధర్మాన్ని గూర్చి ప్రసంగించుటంతా నిష్ప్రయోజనం. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి” అనడమే వేదాంత ముఖ్య సూత్రం. కానీ, ఇది చాలకష్టం. మన హృదయాంతరాళాలలో నివసించే ఆ పురాణ పురుషుడు, అణువు గర్భంలో దాగి వున్నాడు. ఋషులు అతనిని అంతరవలోక (ఆత్మ విచార) దృష్టితో గ్రహించి కష్టసుఖాలకూ, ధర్మాధర్మాలు అనబడే వానికీ, సుకృత, దుష్కృతములకూ, అస్తిత్వ, నాస్తిత్వాలకూ అతీతులయ్యారు. అతణ్ణి చూడటమంటే, పరమార్థాన్ని చూడటమే. అయితే స్వర్గ విషయమేమి? ఆ సుఖ, దుఃఖ స్పర్శలేని సుఖమే స్వర్గ భావం. అంటే మానవునికి జీవిత సుఖాలన్నీ కావాలి. కాని, జీవిత దుఃఖాలేమాత్రమూ వద్దు. ఇది అందరూ కోరే సహజమైన కోరికే. కాని ఇది కేవలం భ్రాంతి జనితం. కేవలం మంచి, కేవలం చెడు అన్నవి లేనే లేవు.
రోము పట్టణపు ఒక ధనికుడి కథ మీరంతా వినే వుంటారు. తన ఆస్తిలో పదిలక్షల పౌనులు (సుమారు ఒకటిన్నర కోటి రూపాయలు) మాత్రమే మిగిలాయని అతనికి ఒకనాడు తెలిసింది. అతడు వెంటనే, “అయ్యో, రేపు నా గతేమి?” అని ఆత్మహత్య చేసికొన్నాడట! సుఖమంటే ఏమి? దుఃఖమంటే ఏమి? అది నిరంతరం రూపుమారుతూండే వస్తువు. చిన్ననాడు, నాకు పెట్టె గుర్రపు బండి తోలడం పరమార్థం. ఆ భావం ఇప్పుడు మారిపోయింది. కాబట్టి, ఎప్పటి సుఖాన్ని నమ్ముకొని మనం నిలబడాలి? ఈ విషయాన్ని అర్థం చేసికోవడానికై, మనమందరం, శక్తివంచనలేక ప్రయత్నించాలి. ఇది మనస్సులను అవలీలగా, తన పిడికిలినుండి వీడునది కాదు. కాబట్టి దీన్ని చక్కగా గ్రహించడం చాల ముఖ్యం. సుఖం అనే మాటకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం కనిపిస్తుంది. ప్రతి దినం ఒక నల్లమందుగడ్డ మింగితే తప్ప సుఖీంపజాలని వాడొకడు నాకు తెలుసు. వాడు కోరే స్వర్గం నల్లమందు మయమైనది కావచ్చు. కాని నాకది దుష్ట స్వర్గం. అరేబియా దేశ కావ్యాలలో వర్ణించబడిన స్వర్గంలో, మనోహర వనవాటికలూ వాని మధ్యలో నదీ ప్రవాహాలు కనిపిస్తూ ఉంటాయి. మా దేశంలో మితిమీరిన జలసమృద్ధి వుంది. వరదలలో ఎన్నో గ్రామాలు మునిగిపోతూంటాయి. వేనవేలు జీవాలు నశిస్తూ వుంటాయి. కాబట్టి నా స్వర్గంలో వనాలు, నదులు ఉండవు. కొద్దిపాటి వానలుగల స్వర్గాన్ని నేను కోరుతాను. మనల్ని ఆహ్లాదపరిచే వస్తువు లెప్పుడూ మారుతూ వుంటాయి. వయసులో వున్న వ్యక్తి కలగాంచే స్వర్గలోకంలో వానికొక చక్కని భార్య ఉంటుంది. వాడే ముసలివాడైన తర్వాత భార్య అక్కర లేదు. ఎవరెవరి స్వర్గం వారి వారి, అక్కరల కనురూపమై ఉంటుంది. అక్కరలతో పాటు, స్వర్గంకూడ మారిపోతూ వుంటుంది. ఇంద్రియభోగాలే పరమార్థంగా కలవారు, కోరే స్వర్గం మనకు లభిస్తే మనమభివృద్ధి నొందజాలం. ఆత్మకు అంతకన్న ఘోరశాపం తగుల జాలదు. కొంచెంసేపు ఆడి, కొంచెంసేపు ఏడ్చి, అంతట పడి చావడం – కుక్కలాగా! ఇంతేనా మనకు సాధ్యం? ఇట్టి విషయాలు కోరేవారు, మనుష్య జాతినెట్టి ఘోరశాపం పాలుచేస్తున్నారు! యథార్థ సుఖాన్ని తెలుసుకోలేక, ఈ ప్రాపంచిక సుఖాలకై ఆరాటపడేవారు చేసేదిదే. తత్త్వశాస్త్రాలు బోధించేది యథార్థ సుఖాన్ని తెలుసుకోమని గాని, సుఖాన్ని పరిత్యజింపుమని కాదు. నార్వే దేశస్థుల స్వర్గం భయంకర యుద్ధభూమి. అందరూ ఓడిన్ (వారి ముఖ్య దైవం) ఎదుట కూర్చుంటారు. వారందరు ఒక అడవి పందిని వేటాడి, పిదప యుద్ధంలో, ఒకరినొకరు చీల్చి చెండాడుతారు. తరువాత ఏదో విచిత్ర విధంగా, వారి గాయాలన్నీ కొంతసేపటికి మానిపోగా, అందరు ఒక పెద్ద చావడిలో చేరుతారు. అక్కడ పందిమాంసం పక్వం చేసి పెట్టారు. వారందరూ స్వేచ్ఛగా తిని, త్రాగి, సుఖీస్తారు. ఆ పంది మరల బ్రతికి మరునాటి వేటకు సిద్ధంగా ఉంటుంది. ఇది చాలవరకు, మన స్వర్గం వంటిదే, దానికన్న దుష్టం కాదు – మన భావాలు ఒకవేళ కొంత ఎక్కువ నాజూకైనవేమో. నార్వే వారికెలా ప్రతిదినం వేటాడి, చంపితినే, అడవి పంది, మరునాటి వేటకు, అనుభూతికి సజీవమై ఉంటుందో, అట్లే మనం అడవి పందులను వేటాడి, సర్వభోగమయమైన చోటికి పోగోరుతాం.
వృద్ధి క్షయాలు లేక నిత్యంగా వుండే సుఖమొకటి – పరమ సుఖం – వుందని, తత్త్వశాస్త్ర సిద్ధాంతం. మనమిక్కడ చూచే వేడుకలు, ఉల్లాసాలు ఆ సుఖమే కాజాలవు కాని, సుఖ మొక్కటే అని ఈ జీవితంలో కనిపించే, ప్రతి సుఖలేశం, ఆ పరమ సుఖంలోని అంశమే అనీ వేదాంతం చెబుతుంది. ప్రతి క్షణమూ మనం ఆ పరమ సుఖాన్నే అనుభవిస్తున్నాం. కాని, అది ప్రచ్ఛన్నమై (కప్పబడి) సరిగా గ్రహింపబడక, వికార రూపంలో కనిపి స్తూంటుంది. ఎక్కడెక్కడ ఇష్టసిద్ధి జరుగుతుందో, సుఖమగ్నత కనిపిస్తుందో, ఆనందం కనిపిస్తుందో – చివరకు దొంగకు దొంగతనం వల్ల కలిగిన సుఖమైనా – అక్కడ అంతా ఆ పరమ సుఖమే ప్రకటితమవుతోంది. కానీ ప్రచ్ఛన్నమై, వివిధములైన అన్య విషయాలతో కలసిపోవడంతో, తేటదనం కోల్పోయి, తప్పుగా గ్రహింపబడుతోంది. దాన్ని సరిగ్గా గ్రహింపగోరేవారు, త్యాగ మార్గాన్ని పట్టాలి. అజ్ఞానాన్ని వదలాలి. అసత్యాన్ని త్యజించాలి. అప్పుడు సత్యం కనిపించడం మొదలవుతుంది. సత్యం అనుభవసిద్ధమైతే, మొదట త్యజించబడిన వస్తువులన్నీ క్రొత్త రూపాలతో, క్రొత్త విధంగా కనిపిస్తాయి. వానిలో దైవత్వం తోస్తుంది. అప్పుడవి పరిశుద్ధములు, మహోదాత్తాలూ కావడం వల్ల, వాని యథార్థ రూపం మనం గ్రహింప గల్గుతాం. కాని సత్యమొకసారి, ఒక్కక్షణం దర్శనం ఇచ్చిన తర్వాతే, ఇలా గ్రహించడం సాధ్యమవుతుంది. వానిని మొదట పరిత్యజించాలి. పిదప అవి – దైవాకృతితో – మళ్ళీ వస్తాయి. కాని మనం మన తాపాలను, దుః ఖాలను, క్షుద్ర సుఖాలను అన్నిటిని విడనాడాలి.
“వేదాలన్నీ దేన్ని గూర్చి చెబుతాయో, తపస్సులన్నీ దేన్ని ప్రకటిస్తాయో, దేన్నికోరి నరులు బ్రహ్మచర్యమాచరిస్తారో, దాన్ని నీకు ఒక్క మాటలో చెబుతాను. అది “ఓమ్”. ఈ ఓంకారాన్ని వేదాలు అపారంగా ప్రశంసిస్తాయనీ, అది అత్యంత పవిత్రంగా పరిగణింపబడుతుందనీ మీకు తెలుస్తుంది.
“శరీర పతనానంతరం మానవు డేమవుతాడు?” అనే ప్రశ్నకు యముడిప్పుడు సమాధాన మిస్తున్నాడు. “ఈ జ్ఞానికి, జనన మరణాలు లేవు. అతడు దేన్నుండీ పుట్టలేదు. ఈ అజుడు (పుట్టుక లేనివాడు) నిత్యుడు, శాశ్వతుడు అయిన పురాణ పురుషుడు. శరీరం నశించినప్పుడుకూడ నశించడు. చంపుతున్నట్లు హంత (చంపేవాడు) తలచినా, హతుడు (చంపబడేవాడు) చస్తున్నట్లు తలంచినా ఉభయులు, చక్కగా ఎరుగరు. ఆత్మ చంపదు. చంపబడదు.” ఎంత మహోన్నత సిద్ధాంతం? ప్రారంభంలో ఉన్న విపశ్చిచ్ఛబ్దాన్ని గమనించండి. ఆత్మ నిత్యబుద్ధం (జ్ఞానమయం), నిత్య శుద్ధం అని వేదాంత బోధ. ఈ లక్షణాలు కొన్ని ప్రాణులలో దీప్తిమంతములై ప్రకాశిస్తూంటాయి. కొన్నిటిలో మందంగా కనిపిస్తాయి. ప్రాణులకు మధ్యకల భేదమిదే. మానవులొక్కొక్కరికీ, మానవులకు ఇతర ప్రాణులకు ఉండేది “ప్రకార భేదం” కాదు. “పరిణామ భేదమే”. అంటే, జాతి భేదం ఏమాత్రం లేదు. లోపల వుండే శక్తి, పైకి గోచరించడంలోకల హెచ్చు తక్కువలందే భేదం. నిత్యానందం, నిత్యశుద్ధం, నిత్య పరిపూర్ణం అయిన ఈ అఖండ వస్తువే, ప్రతి వానికీ మూలం, ప్రతి వానిలో కల సత్యం. పుణ్యాత్ముల్లో, పాపాత్ముల్లో, సుఖ జీవుల్లో, దుఃఖ జీవుల్లో, సురూపులలో, కురూపులలో, మానవజాతిలో, మృగజాతులలో సర్వత్రా దీపించేది ఆ ఆత్మయే. ఆ పరంజ్యోతియే. దాని ప్రకాశం వ్యక్తంకావడంలో పరిమాణ భేదాలుంటాయి. అదే, ఈ భేదాలన్నిటికీ కారణం. కొందరిలో ఇది ఎక్కువగాను, కొందరిలో తక్కువగాను కన్పిస్తుంది. కాని ఈ భేదాలచే ఆత్మలో ఎట్టి మార్పులూ కలుగవు. వస్త్రధారణ పద్ధతి వల్ల ఒకరి శరీరంలో ఎక్కువ భాగం, మరొకరి శరీరంలో తక్కువ భాగం, కనిపించినంత మాత్రాన, వారి శరీరాలు మార్పు చెందుతాయా? మరొక విషయాన్ని ఇక్కడ జ్ఞప్తిలో వుంచుకోవడం మంచిది. వేదాంతమతమందెక్కడా, మంచి చెడుగుల ప్రస్తావమే లేదు. అవి భిన్న వస్తువులు కావు. ఒకే వస్తువు. పరిమాణ భేదాలచేత, వాని కా పేర్లు వస్తాయి. నేడొక వస్తువును నేను సుఖప్రదమంటాను. రేపు నా స్థితిగతు లభివృద్ధి పొందినపుడదే వస్తువును దుఃఖం కలిగించేదని అంటానేమో? చలిపోగొట్టి సుఖాన్నిచ్చే నిప్పే మనల్ని బెడిద చేయవచ్చు. ఆ తప్పు అగ్నిదా? ఆత్మ పరిశుద్ధం. పరిపూర్ణం కావడం వల్ల, దుష్కృుతాలు చేసేవాడు, తన పట్ల తానే అసత్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి తన స్వభావమే తెలీదు. హంతకునిలో కూడ పరిశుద్ధాత్మ నిలిచే వుంటుంది. చావదు. అలా ప్రవర్తించడం వాని లోపం. తన పరిశుద్ధాత్మను గోచరింప చేసే శక్తి వానికి లేకపోయింది. అతడు దానిని కప్పిపెట్టుకున్నాడు. తన్ను చంపుతున్నా రనుకొనే వానిలోకూడ ఆత్మ చావదు. అది నిత్యం. దాన్ని చంపడం, నశింప చేయటం అసాధ్యం. “అణువుల (అత్యంత స్వల్ప వస్తువుల) కన్న ఎంతో అణీయము (చిన్నది) మహిత (మిక్కిలి పెద్ద) వస్తువుల కన్నా ఎంతో మహీయము (పెద్దది) అయి, పరమాత్మ, మనుష్యుల హృదయ గుహాంతరాళములో నిహితుడై ఉన్నాడు. పాప (వాంఛా) రహితులు శోకం లేనివారు కావడం వల్ల, దైవానుగ్రహం వల్ల, అతన్ని దర్శిస్తారు. ఆత్మ శరీరాలందవస్థితుడై ఉండీ, అశరీరుడనీ, దేశంలో ఉన్నట్టు కనిపించినా దేశాతీతుడనీ, పరిపూర్ణుడనీ, సర్వగతుడనీ తెలిసి ధీరులు దుఃఖాన్ని పొందకుండా వుంటారు.
“ఈ ఆత్మ వాక్ఛక్తి చేతగాని, బుద్ధిబలం వల్లకానీ, వేదాధ్యయనం వల్లగానీ లభించదు.” ఇది, మిక్కిలి సాహస సిద్ధాంతం. మన ఋషుల బుద్ధి ప్రచారం నిరంకుశ విజృంభణ కలదనీ, నిర్భయంగా వారెంత నూత్న సత్యాన్నైనా ప్రకటిస్తారనీ ఇదివరకే చెప్పాను. క్రైస్తవులు తమ బైబిల్ నాదరించడం కన్న ఎన్నోరెట్లు ఉన్నతమైన భావంతో హిందూ దేశంలో ఈ వేదాలు ఆదరింపబడతాయని మీరు జ్ఞప్తియందుంచుకోవాలి. సత్యావిష్కరణం (రెవలేషన్) అంటే, ఒక మానవుడు, దైవ ప్రేరితుడై తెలిపిన సత్యమని మా అర్థం. వేదంలో ఉండటంచేత ఈ పదార్థాలన్నీ కలిగాయని హిందూదేశీయుల భావం. “సృష్టి అంతా వేదాల్లో, వేదమూలంగా కలిగింది. జ్ఞానమనబడేదంతా వేదాల్లో ఉంది. అందలి ప్రతి వాక్కు పవిత్రం, నిత్యం; ఆత్మలాగా నిత్యం, ఆద్యంతరహితం. సృష్టికర్త భావమంతా, ఈ గ్రంథంలో ఉందనవచ్చు.” వేదం ఈ దృష్టితో ఆదరింపబడుతుంది. ఒక కార్యం నీతిరహితమని అనడం ఎందుకు? వేదాలు అలా చెప్పాయి కాబట్టి; ఇట్లుండీ ఈ ఋషులు వేదాధ్యయనం ఎంత చేసినా, పరమసత్యం తెలియరాదన్నారు. ఎంత సాహసం! “ఈ పరమాత్ముడెవని యెడల సంప్రీతుడవుతాడో ఆ మానవుని కతడు సాక్షాత్కరించుకొంటాడు.” అయితే అతనికి పక్షపాత ముంటుందా? అనే ఆక్షేపణ రావచ్చునని యముడిలా విశదీకరిస్తున్నాడు. “దుశ్చరితులకు, అశాంత మానసులకు సత్యజ్యోతి ఎన్నటికీ గోచరింపదు. ఇంద్రియనిగ్రహాన్ని త్రికరణశుద్ధినీ, సత్యసందీప్త హృదయం కలవానికి నిర్దుష్ట కర్తవ్య నిర్వహణంలో సిద్ధహస్తుడైన వానికి, సాధన చేసేవానికి మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కరిస్తుంది.”
ఈ చక్కని ఉపమానాన్ని చూడండి. ఆత్మను రథి (రథముపై ఎక్కి వెళ్ళేవాడు) గాను, శరీరాన్ని రథముగాను, బుద్ధిని సారథిగాను, మనస్సును పగ్గములు గాను, ఇంద్రియాలను గుర్రాలుగాను భావించుకోండి. ఎవని గుర్రాలు బాగా వశమై ఉంటాయో, ఎవని పగ్గాలు దృఢములై సారథి (బుద్ధి) చేతికి బాగా స్వాధీనమై ఉంటాయో, వాడు గమ్యమైన విశ్వాత్మ పదం చేరుతాడు. కానీ ఎవని గుర్రాలు (ఇంద్రియాలు) వశంకావో, ఎవని పగ్గాలు (మనస్సు) చక్కగా నడుపబడుట లేదో వాడు నశిస్తాడు. సర్వభూతములలో నిగూఢమై ఉండే ఆత్మ, ఇంద్రియదృష్టికి ప్రకాశింపదు. నిర్మలం, తీక్షణం అయిన బుద్ధికలిగిన సూక్ష్మదర్శులకు మాత్రమే అది గోచరిస్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల కతీతమై, అవ్యయమై, నిత్యమై, అనాద్యనంతమై ప్రకృతికికూడ అతీతమై ఉండే ధ్రువ పదార్థాన్ని ఎవడు సాక్షాత్కరించు కొంటాడో వాడు, మృత్యుముఖంనుండి విమోచనం పొందుతాడు. కాని ఇది మిక్కిలి కష్టభూయిష్టమైన మార్గం. అది కత్తి అంచుపై నడుచుట వంటిది. మిక్కిలి దూరం, అపాయకరం. కాని నడుంకట్టి ముందంజ వేయండి. ఉస్సురుస్సురనకండి. నిరుత్సాహం చెందకండి. లెండి, నిదుర నుండి మేల్కొనండి. గమ్యం లభించే వరకు ఆగకండి.
అపరోక్షానుభూతే ఉపనిషత్తులన్నిటిలోగల కేంద్ర భావం. ఎన్నో సమస్యలు మనలను – ముఖ్యంగా ఆధునికకాలం వారిని, – ఎదుర్కొంటూ వుంటాయి. “ఇది ఎలా ఉపయోగకరం?” అనే ప్రశ్న, ఇప్పుడు ప్రతి విషయాన్ని గూర్చి, బయలుదేరుతూంటుంది. ఇతర ప్రశ్నలుకూడ ఎన్నో ఉంటాయి. ఈ ప్రశ్నలను పరిష్కరించడంలో, మన జీవితాన ఇప్పటికి ఏర్పడి వున్న భావ సంసర్గములెంతో ప్రబలమైన భాగం వహిస్తాయి. ఈ భావ సంసర్గాలు (అసోసియేషన్ ఆ్యప్ ఐడియాస్) మన మనస్సులపై నిరంకుశ పరిపాలనం చేస్తూంటాయి. చిన్ననాటినుండి సగుణబ్రహ్మను గూర్చి, మనస్సుయొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి వింటున్నవారికి, ఈ భావాలు మిక్కిలి కటువుగా నిష్ఠురంగా తోచుతాయి కాని, వారివి చక్కగా విని ఆలోచిస్తే, అవి వారి జీవితాల్లో కలిసిపోయి భయం కలిగించవు. సామాన్యంగా అందరూ అడిగే ప్రశ్నకు ఒక్కటే సమాధానం. ప్రయోజన వాదులు (యుటిలిటేరియన్స్) మానవులకు, సుఖాన్వేషణ మంచిదే అంటున్నారు కదా? అలాంటప్పుడు ఆధ్యాత్మిక చింతనవల్ల సుఖం పొందేవారు, ఆ విధమైన సుఖాన్ని ఏల వెదుకరాదు? అనేకులకు ఇంద్రియ భోగాలు సుఖప్రదములు కాబట్టి, వాటిని వారు అన్వేషిస్తారు. కొందరికవి రుచింపక, ఉత్తమ సుఖములపై ఆసక్తి ఉంటుంది. కుక్క సుఖమంతా కూడు నీళ్లలోనే. భౌతిక పరిశోధకుడొకడు సర్వమూ వదలి, పర్వతాగ్రంలో నివసించి ఒక నక్షత్ర స్థానాన్ని పరీక్షిస్తూ వుంటాడు. వానికందువల్ల కలిగే ఆనందాన్ని కుక్క గ్రహింపగలదా? అది వానిని చూచి, పిచ్చివాడని నవ్వ వచ్చు. పాప మీ పరిశోధకుడు, నిరుపేదయై, వివాహమాడక, మిక్కిలి నిరాడంబరంగా జీవిస్తున్నాడేమో, కుక్క వానిని పరిహసింపవచ్చు. కాని దానికత డిట్లు సమాధానం చెబుతాడు. “నీ సుఖమంతా ఇంద్రియములందే. ఆ సుఖాన్ని నీవు అనుభవిస్తావు. అంతకు మించి నీకేమీ తెలీదు. కాని నాకిది మహానందాన్ని ఇచ్చే జీవితం. నీ సుఖాన్ని నీ యిష్టం వచ్చినట్లు అనుభవించే అధికారం నీకుంటే నాకూ అట్టి అధికారం ఉంది.” ప్రపంచా న్నంతా మన ఆలోచనా పరిధిలోకి తెచ్చి, ప్రపంచమంతటికీ మన బుద్ధిని ప్రమాణం చేయాలని చూడటమే ఇందులో వున్న ప్రమాదం. మామూలు ఇంద్రియ విషయాలు నీకత్యంత సంతోషాన్ని కల్గింపవచ్చు. నాకట్లు కలిగింపకపోవచ్చు. నీ మార్గమే సరియైనదని నీవు వాదిస్తే, నేను కాదంటాను. సాంసారిక హితవాదికీ (వరల్డ్ యుటిలిటేరియన్ = ఉపయోగమే ఆదర్శంగాగల లౌకికునికి) ఆస్తిక ధర్మాచరణకూ ఇదే భేదం. మొదటివాడు, నేనెంత సుఖపడుతున్నానో చూడు, డబ్బును సంపాదిస్తున్నాను. ఆస్తిక ధర్మ విషయాన్నే నేను పెట్టుకోను. దాన్ని సాధించడం చాలకష్టం. అది లేనందువల్ల నేను హాయిగా వున్నాను” అంటాడు. ప్రయోజన లక్ష్యం కలవాళ్లకు – వాళ్లకు మాత్రం – ఇది బాగైనదే. కాని ఈ ప్రపంచం ఘోరమైంది. తోడి లోకులను బాధింపక, ఎవడెంత సుఖం పొందినా తప్పక పొందనీ. కాని అతడు నా దగ్గరకు వచ్చి “నీవుకూడ, నాలాగా ప్రవర్తించాలి. అలా చేయకపోతే నీవు తెలివితక్కువ వాడివనిపించు కుంటావు” అని చెబితే, నే నీ సమాధానమిస్తాను. “నీవు పొరబడుతున్నావు. ఆ వస్తువులు నీకు సుఖప్రదం కావచ్చు కానీ, నాకవి ఏమాత్రమూ గిట్టవు. ధనం సంపాదించడమే గమ్యంగా జీవింపవలసి వస్తే, జీవితం నిస్సార మవుతుంది. అంతకంటే చావడం మేలు.” – ఆస్తిక ధర్మపరుడిచ్చే సమాధానమిది; అసలు సత్యమేమంటే ఈ క్షుద్ర విషయాలతో సంబంధం వదలుకొన్న వాళ్లకే, ఆస్తిక ధర్మ జీవనం సాధ్యం. ప్రతివాడూ వానిని మొదట అనుభవించాలి. భోగానుభవమయిన తర్వాతగాని, ఆధ్యాత్మిక ప్రపంచం కనిపించదు.
ఇంద్రియభోగాలను గూర్చి కొందరికి మరొక భావంకూడ ఉంది. ఆశలు కల్పించి, తప్పు త్రోవకు లాగే అపాయకరమైన భావమిది. ప్రాచీన కాలం నుండి ప్రతి మతమునందు ఈ భావం కనిపిస్తుంది. కాలక్రమాన ఈ జగత్తులోగల దుఃఖాలన్నీ నశించి, సుఖాలు, భోగాలు మాత్రమే మిగిలి, ఈ భూలోకం స్వర్గలోకంగా మారిపోవునట! నేనిది నమ్మను. భూలోక మెప్పటికీ ఇట్లే ఉంటుంది. ఇట్లనుట మిక్కిలి భయంకరమే కానీ నాకు గత్యంతరం లేదు. ఈ లోకంలోని దుఃఖరాశి, జీర్ణించిన కీళ్లవాతం వంటిది. శరీరంలో ఒక భాగంనుండి తరిమితే, అది మరొక భాగానికి పోతుంది. అక్కడ నుండి తరిమితే, ఇంకోచోట బాధింప నారంభిస్తుంది. ఏమి ప్రతిక్రియలు చేసినా, అది నిలిచే వుంటుంది. ఆదిమకాల మానవులు అడవులలో నివసిస్తూ ఒకరినొకరు తినేవారు. ఈ కాలంలో ఒకరినొకరు తినరు. ఒకరినొకరు మోసం చేస్తారు. ఎన్నో దేశాలు, ఎన్నో పట్టణాలు, ఈ మోసాలతో అధోగతిపాలవుతున్నాయి. ఇది అభివృద్ధి అనిపించు కుంటుందా? లోకాభివృద్ధి అనేది, వాంఛాభివృద్ధే అని నా అభిప్రాయం. వాంఛలే, ఈ యాచక బుద్ధే – కష్టాలన్నిటికీ కారణమని నా దృఢవిశ్వాసం. యాచకునికి చూచినదానిపై అంతా వాంఛ. అతడెప్పుడూ ఏదో ఒకదానికై యాచిస్తూ వుంటాడు. అతని కోరికలకు అంతం లేదు. కోరికలు తీరే అవకాశం పదింతలు పెరిగితే, కోరికల బలం నూరింతలు పెరుగుతుంది. లోకంలోగల సుఖరాశి, దుఃఖరాశి ఏ కాలంలో చూచినా, ఇంచుమించు సమంగానే ఉంటుంది. సముద్రంలో లేచే ప్రతి అలా, ఒక పల్లమును ఎక్కడో కల్పించే వుంటుంది. ఒక మనిషికి సుఖం కలిగితే, మరొక మనుష్యునికి – లేక ఒక జంతువుకు – దుఃఖం కలిగే వుండాలి. మనుష్యుల సంఖ్య పెరిగిపోతోంది. జంతువులలో కొన్ని జాతుల సంఖ్య తరిగిపోతోంది. మనం వానిని చంపి, వాని విహార భూమిని ఆక్రమించి, వాని జీవనాధారాలను నిర్మూలిస్తున్నాం. ఇదేనా సుఖాభివృద్ధి? బలిష్ఠ జాతులు, బలహీన జాతులను బలిగొంటున్నారు. కానీ బలిష్ఠ జాతికి సుఖం చేకూరిందా? లేదు. వారొకరినొకరు చంపుకోవడం ప్రారంభిస్తారు. ఈ భూలోకం ఎలా స్వర్గం కాగలదో నాకు తోచకున్నది. యథార్థ స్థితి ఇందుకు విరుద్ధం. యుక్తియుక్తంగా ఆలోచించినా అది అసంభవమనే అనిపిస్తుంది.
సమగ్రత్వం పరిపూర్ణమందుకాని కానరాదు. మనం స్వభావ సిద్ధంగానే పరిపూర్ణులం. ఆ పరిపూర్ణతను వ్యక్తపరచడానికే మన ప్రయత్నం. మీరు, నేను, సర్వ ప్రాణులు, దాన్ని వ్యక్త పరచడానికే యత్నిస్తున్నాం. ఈ భావం వరకు చిక్కులేమీ లేవు. కాని దేని ఆధారంతో? జర్మన్ తత్త్వ విచారపరులొక విపరీతవాదాన్ని తెస్తున్నారు. ఈ వ్యక్తీకరణం క్రమ క్రమ సమగ్రతను పొంది, చివరకు పరిపూర్ణమై, మనల్ని పరిపూర్ణులను చేస్తుందట! పూర్ణాభివ్యక్తిత్వం (పెర్ఫెక్ట్ మానిఫెస్టేషన్) అంటే ఏమి? పరిమితం కానిది పరిపూర్ణం. పరిమితమయ్యేది వ్యక్తీకరణం. అంటే, మనం పరిమితులం కాబట్టి, పరిమితులమవుతాం. పరస్పర విరుద్ధ భావాల సమ్మేళనం. పసిబిడ్డలకిది సుఖాన్నివ్వచ్చు. వారినవి సంతృప్తిపరచవచ్చు. కాని వారి మనస్సులు అసత్యభావాలతో నిండి కలుషితములై పోతాయి. ఆస్తిక ధర్మాభివృద్ధి కిది ప్రతికూలిస్తుంది. కాని స్థానభ్రష్టత వల్లనే ఈ భూలోక జీవనం దాపురించిందనీ, మనుష్యుడంటే పతితుడైన భగవంతుడే అని, ఆదాం పతన మొందెననీ, మనకు తెలుసు. మనుష్యత్వమనేది భ్రష్టదశ అని బోధింపని మతం ఈ కాలంలో లేదు. పతనమొంది మనం మృగదశకు వచ్చాం. ఇప్పుడు మరల పైకెగబ్రాకుతున్నాం. చివరకు, దాస్య విముక్తి నొందగలం. కాని ఇక్కడ ఉన్నంతకాలం, పరిపూర్ణత్వాన్ని సమగ్రంగా వ్యక్తపరుపజాలం. అందుకై ఎంతో పాటుపడతాం కాని, ఇంద్రియాలకు బందీలై ఉండేవరకు, పరిపూర్ణత్వాన్ని వ్యక్తపరచడం అసంభవమని తెలిసిపోయే దినం వచ్చి తీరుతుంది. అప్పుడు మనం పరిపూర్ణత్వం దెస ప్రయాణించ మొదలుపెడతాం.
ఇదే త్యాగం. మనం ప్రవేశించిన మార్గానికెదుటి త్రోవపట్టడమే త్యాగమార్గం పట్టడం. నీతికారుణ్యము లా వెంటనే ప్రారంభమవుతాయి. నీతి శాస్త్రాలన్నిటికీ మూల సూత్రమేది? “నా-హం, త్వమసి” (నేను కాదు; నీవు). బాహ్య జగత్తునకు వ్యక్తపరచే యత్నంలో సర్వమూలమైన పరిపూర్ణమే ఈ “నేను” గా పరిణమిస్తోంది. అట్లుత్పత్తియైన యీ “నేను” (అహమ్) ఈ స్వల్ప (పరిమిత) స్థితినుండి ఎగసి తన యథార్థ తత్వమైన పరిపూర్ణంలో చేరిపోవాలి. “సోదరా, నేను కాదు నీవు” అన్నప్పుడంతా నీవట్లే సమసిపోవ యత్నిస్తున్నావు. కాని “నీవుకాదు నేను” అన్నప్పుడంతా, ఇంద్రియ ప్రపంచం ద్వారా పరిపూర్ణుని వ్యక్తపరుపజూచే ప్రమాదంలో పడుతున్నావు. అందువల్ల పోరాటాలు, ఆరాటాలు ఉప్పతిల్లును. కాని కొన్నాళ్ళకు త్యాగ బుద్ధి వచ్చి తీరుతుంది – శాశ్వత త్యాగబుద్ధి. ఈ క్షుద్ర “అహం” అంతరిస్తుంది. “ఈ స్వల్ప జీవితంపై ఇంత ఆసక్తి ఏల? ఇక్కడైనా, మరెక్కడైనా సుఖాలను అనుభవించాలనే వ్యర్థ వాంఛలు, మరణాన్ని కలిగిస్తాయి.”
మృగాలనుండి మానవులు పరిణమించారంటే, భ్రంశం చెందిన మానవులు మృగాలైరని అనరాదా? కాదని మీకెలా తెలుస్తుంది. జీవులు క్రమోన్నతులై అతి స్వల్పమైనవి మొదలు, అతి మహితముల వరకు చూపట్టుచుండటమే కదా, పరిణామవాదాని కాధారం? గమనమెప్పుడు, క్రిందనుండి పైకేగాని, పై నుండి క్రిందకెప్పుడు కాదని దీన్నిబట్టి తేలుతోంది? రెండు విధాల వాదాలు చెల్లుతాయి. ఈ రెండు మార్పులు – ఒక దాని తర్వాత మరొకటి – జరుగుతున్నాయనే నా నమ్మకం. సంకోచం (ఇన్వాల్యూషన్) లేని వ్యాకోచం (ఇవొల్యూషన్) ఎలా ఉండగలదు? ఉత్తమ జీవితానికై మనకు గల కాంక్ష ఉన్నత జీవితంనుండి భ్రంశమొందితిమని సూచిస్తున్నది. సూక్ష్మాంశ భేదమేమైనా ఉంటుందేమోకాని, మొత్తానికిది సత్యమే కావచ్చు. కాలపరిపాకంలో మనమంతా పరిపూర్ణతనందుతాం. కాని ఈ పరిమిత జగత్తును త్యజిస్తే కాని, అది జరగదని, క్రీస్తు, బుద్ధుడు, వేదాంతం ఐక్యకంఠంగా చెబుతున్నారు. నేనది దృఢంగా, విశ్వసిస్తున్నాను. ఈ జగత్తు తుచ్ఛం. మహా ఐనచో అదొక బీభత్స వికృత రూపమని, సత్యానికి నీడవంటిదని అనవచ్చు. సత్యమే మనకు గమ్యం. త్యాగమే దానికి మార్గం. మన జీవితానికదే మూలధారం. స్వార్థభావం లేని క్షణాల్లోనే మనం సత్య సుఖ జీవితాన్ని మనలోని దివ్యత్వాన్ని చవి చూస్తున్నాం. క్షుద్రం, భిన్నతా రూపం అయిన ఈ “అహం” అంతరించాలి. మనం సత్యమునందున్నామని, ఆ సత్యమే దైవమనీ, అతడే, మన యథార్థ తత్త్వమనీ, అతడెప్పుడూ మనలో, మనతో ఉన్నాడని మనకప్పుడు బోధపడుతుంది. మనం అతనిలో జీవిస్తాం గాక! అతనియందు సుప్రతిష్ఠితులమగుదుం కాక! అదే ఆనంద స్థితి. ఆత్మలో జీవించే జీవితమే జీవితం. ఈ అనుభూతి నొందడానికి మనమెల్లరం ప్రయత్నింతుం గాక!