(అన్నింటియందు భగవంతుడు)
(1896 లండన్లో ఉపన్యసించింది)
మన జీవితాలు చాలా వరకు అంతులేని విపత్తులలో మునిగి వుంటాయనీ, ఆ స్థితిని మార్చడం మనకు అశక్యమనీ, ఇప్పటికే కనుగొన్నాం. ఈ దుఃస్థితిని సరిచేయుట కోసం, మనం అనాదికాలంనుండి పోరాడు తున్నాం. కాని సర్వం యథాపూర్వంగానే జరుగుతోంది. ప్రతిక్రియలు సంపాదించే కొద్దీ, దురవగాహములైన క్రొత్త విపత్తులలముకొంటూ ఉంటాయి. ఈ కష్టాలనుండి తప్పించుకోవడానికి ఒక్క మార్గమే ఉందని, అన్ని మతాలూ ఒక దైవాన్ని ప్రతిపాదించడంకూడ మనకు తెలుసు. ఈ కాలపు “బ్రదుక నేర్చిన బుద్ధిమంతుల” మాటవిని, ప్రపంచ స్థితికి లొంగి, ఎట్లో కాలం గడుపుకుంటూ వుంటే నిష్కృుతి లభించదా? అప్పటికీ, ఆపదలే మన గతి అని మతాలు హెచ్చరిస్తున్నాయి. మతాల బోధ ఏమంటే “ఈ ప్రపంచానికి అతీతమైనదొకటి వుంది. పంచేంద్రియ జీవితమే, ఈ భౌతిక ప్రపంచ జీవితమే సర్వం అనడం తప్పదు. అది ఒక స్వల్పాంశం మాత్రమే. అందులోనూ, స్థూలదృష్టికి తోచే ఉపరిభాగం మాత్రమే. దీనికి మూలమును, దీనికి అతీతమును అయి అఖండ పరతత్వం ఉంది. అందులో ఆపదలుండవు.” దీనిని కొందరు దైవం, కొందరు అల్లా, కొందరు జిహోవా, కొందరు జోవ్ మొదలైన పేర్లతో పిలుస్తారు. వేదాంతి దీనిని బ్రహ్మమంటాడు.
“మీ రీ అస్తిత్వములను చాలించుట మంచిది” అనేనా మతాల బోధ? పైకి అట్లేననిపిస్తుంది. “ఈ లోకంలో గల క్లేశములకు ప్రతిక్రియ ఏమి?” అనే ప్రశ్నకు వచ్చే సమాధానం, “జీవితాన్ని వదలండి” అనే అభిప్రాయం కల్గిస్తుంది. వెనకటికి ఒక కథ చెప్పినట్లుంది ఈ ప్రతిక్రియ. “ఒకడి తలపై దోమ వాలింది. వాని మిత్రుడు దోమను చంపడానికై ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు, దోమయే కాక, మనుష్యుడుకూడ చచ్చిపోయాడట!” ఈ ప్రతిక్రియలోకూడా ఇట్టి అర్థమే స్ఫురిస్తోంది. జీవితం వ్యధమయం. లోకం దుఃఖమయం. బుద్ధి ఉన్న వాడెవ్వడూ, ఇది కాదనజాలడు.
కాని దీనికి మతాలు బోధించే ప్రతిక్రియ ఏది? ఈ ప్రపంచం అసత్యమనీ, సత్యమైన ప్రపంచం ఒకటి దీనికి అతీతమైనది వుందనీ కొందరందురు. చిక్కంతా ఇక్కడే. ఈ ప్రతిక్రియ సర్వనాశనం చేసేదిగా వుంది. అటువంటిది ప్రతిక్రియ ఎలా అవుతుంది? ఇది తప్పితే మరో విధంగా లేదా? ఈ ప్రశ్నకు వేదాంతం చెప్పే సమాధానమేమంటే, “మతాలన్నీ చేసే బోధ సత్యమే, నిర్దుష్టమే. కాని, దీన్ని సరిగా అర్థం చేసికోవాలి.” చాలమంది దీన్ని అపార్థం చేసికొంటారు. మతాలలో గల అస్పష్టత ఇందుకు కొంత కారణమే కానీ, నిజమగు లోపం హృదయబద్ధుల సమ్మేళనం లేకపోవడం. హృదయం అత్యంత మహనీయం. జీవితంలోని ముఖ్య ప్రేరణలకు అదే ఉత్పత్తి స్థానం. దైవ సంపదకది పీఠం. బుద్ధి పరిపూర్ణంగా ఉండి, హృదయం లేకుండడం కంటే, కొంచెమైన హృదయ ముండి, బుద్ధి బొత్తిగా లేకుండటమే నూరింతలు శ్రేష్ఠమని నా అభిప్రాయం. హృదయం కలవాడు బ్రదుకగలడు. అభివృద్ధి నొందగలడు. కాని హృదయ శూన్యునికి ఎంత బుద్ధి ఉన్నా, అతడు శుష్కజీవియై మరణిస్తాడు.
కాని హృదయ ప్రేరణలనే ఆధారంగాగొని జీవించేవాడు, పెక్కు కడగండ్ల పాలౌతాడు. గోతులలో కూలే అవకాశాలు అతనికి ఎక్కువ. కాబట్టి బుద్ధికూడ దానితో కలిసి వుండాలి. అలా అని హృదయాన్ని తృప్తి పరచడానికై బుద్ధికాని, బుద్ధిని తృప్తి పరచడానికి హృదయంకాని, హీనం కాకూడదు. ప్రతి వాడూ అనంతమైన తార్కిక బుద్ధితోపాటు, అనంతమైన హృదయ వైశాల్య సానుభూతులనుకూడ సాధించుకోవాలి.
ప్రపంచంలో మన కోరికలకేమైనా మితి వుందా? ప్రపంచం అనంతమవడం వల్ల, అనంతమైన సానుభూతికీ, అనంతమైన సంస్కృతకీ, అనంతమైన తార్కికశక్తికీ ఈ లోకంలో తావుంది. కాబట్టి అవి అనంతంగా వస్తూ వుండాలి. మనలో ఎప్పుడూ అవి సమాంతర రేఖల్లాగా ప్రక్క ప్రక్కల నడుస్తూ వుండాలి!
సాధారణంగా మతాలన్నీ ఈ విషయాన్ని గ్రహించాయి గాని, అన్నీ ఒక్క ప్రమాదానికే గురి అవుతున్నాయి. అన్నీ హృదయానికి, చిత్త వృత్తులకు, అత్యంత ప్రాముఖ్యాన్నిస్తాయి. “ప్రపంచం దోషమయం. కాబట్టి దాన్ని, పరిత్యజించు” అనేదే బోధ. అది మహనీయం. అదొక్కటే సరైన బోధ. సత్యాన్ని గ్రహించడానికి అసత్యాన్ని విడనాడాలనడం నిర్వివాదాంశం. మంచిని కోరేవారమంతా చెడును విడనాడాలనడం, జీవాన్ని కోరేవారంతా మరణప్రాయాలను విడనాడాలనడం, ఇట్లే నిర్వివాదాంశాలు.
నిజమే కాని, ఈ బోధకర్థం ఇంద్రియ జీవితాన్ని విడనాడుమనే అయితే, మనకింకేమి మిగులుతుంది? మనకు తెలిసిన జీవితం ఈ ఇంద్రియ జీవితమే కదా? జీవిత మంటే, ఇంకేమైనా అర్థముందా? దీన్ని త్యజిస్తే ఏమి మిగులుతుంది.
వేదాంతంలోని ముఖ్యతత్వ విచార భాగానికి వచ్చినప్పుడు మన కీ విషయం, ఇంతకన్నా చక్కగా విశదం కాగలదు. ఇప్పటి కీ మాట మాత్రం చెబుతాను. ఈ సమస్యకు యుక్తి, యుక్తమైన పరిష్కారం వేదాంతంలో మాత్రమే ఉంది. వేదాంతం బోధింప జూచే పాఠాన్ని గూర్చిమాత్రం ఇక్కడ చెబుతాను. ప్రపంచాన్ని దైవంగా చూడాలనడం ఆ పాఠం.
వేదాంతం, ప్రపంచాన్ని తూలనాడుతుందనడం నిజం కాదు. వైరాగ్యాదర్శం ఆ మతంలో పరమావధినందింది. ఇది మరెక్కడా కానరాదు. కాని మూల విధ్వంసకాలైన, శుష్క మార్గాలనది బోధించదు. “ప్రపంచం దైవస్వరూపం. మన కళ్లకు, మన సామాన్యబుద్ధికి తోచే ప్రపంచాన్ని విడనాడి, దాని యథార్థ రూపాన్ని తెలుసుకోండి. దాన్ని దైవంగా చూడండి. అది దైవమే” అనేదే వేదాంత బోధ. అత్యంత ప్రాచీనమైన ఉపనిషత్తొకటి “ఈశావాస్యమిదగ్ం సర్వమ్” (ఈ జగత్తులో వుండే సర్వమూ, ఈశ్వరునితో ఆచ్ఛాదించాలి) అనే బోధతోనే ప్రారంభమవుతోంది.
ఈ ఆచ్ఛాదన ఎలా? నిరాధారమైన ఆశలను కల్పించుకోవడం వల్ల కాదు. ఉన్న దోషాల్ని చూడకుండటం వల్ల కాదు. వాస్తవంగా, అన్నిటిలో దైవాన్ని చూడాలి. ఇదే ప్రపంచాన్ని విడనాడటం. అప్పుడేమి మిగులుతుంది? దైవమే. దీని అర్థమేమి? నీ భార్యను విడనాడ పనిలేదు. ఆమె ఉండవచ్చు. కానీ, ఆమెలో దైవాన్ని చూడాలి. “మీ బిడ్డలను విడనాడండి” – అంటే ఏమి? కొందరు మృగప్రాయుల్లాగా, వారినింటినుండి తరిమి కొట్టడమా? కానే కాదు. అలా చేయడం రాక్షసకార్యం; ఆస్తిక ధర్మం కాదు. నీ బిడ్డలలో దైవాన్ని చూడమనే ఆ బోధకర్థం. ప్రతి విషయంలోనూ ఇట్లే ఆచరించాలి. జీవమునందు, మృత్యువు నందు, సుఖమందు, దుఃఖమందు, అన్నిటి యందు, దైవం సమంగా నిలిచివుంటాడు. జగత్తంతా దైవమయం. కన్నులు విప్పి చూస్తే, ఆయనను దర్శింపగలరు. ఇదే వేదాంత బోధ. మీరూహించిన జగత్తును త్యజించండి. ఆ ఊహ నిరాధారమైంది. మిక్కిలి అసంపూర్ణమైన మీ అనుభూతి, మీ అసమగ్ర తార్కిక శక్తి, మీ లోపాలు, ఇవే ఆ ఊహకాధారాలు. కాబట్టి దాన్ని త్యజించండి. మన బుద్ధిలో ఇంతకాలంగా నిలిచి వున్న జగత్తును మనం కల్పించుకొన్న అసత్య జగత్తును, అత్యాసక్తితో, మనమంటి పెట్టుకొని వున్న జగత్తును త్యజించండి. కళ్లు తెరవండి. మీరనుకొంటున్న రూపంలో అది ఎప్పుడూ లేదని తెలుసుకోండి. అది ఒక స్వప్న దృశ్యం. మాయ. నిజంగా వుండినది దైవమే. బిడ్డలో ఉన్నదతడే. భార్యలో ఉన్నదతడే, భర్తలో ఉన్నదతడే, సజ్జనులలో ఉన్నదతడే, దుర్జనులలో ఉన్నదతడే, పాపిలో ఉన్నదతడే. జీవంలో ఉన్నదతడే. మృత్యువులో ఉన్నదతడే.
ఈ సిద్ధాంతం మిక్కిలి అపూర్వంగా మిక్కిలి ఆశ్చర్యకరంగా తోచవచ్చు. కాని వేదాంత మతం దాన్ని స్థాపించి, బోధించి, వ్యాపింపజేయ చూస్తోంది. ఆ మతం బోధించే సత్యాలలో ఇది మొదటిది.
జీవితంలో గల అపాయాలను, అశుభాలను, మన మీ మార్గంచే తప్పించుకోగలం. కోరికల్ని త్యజించండి. మన కష్టాలన్నిటికీ మూలమవే. కోరిక తీరనిచో మనోవ్యధ. కోరిక లేకపోతే వ్యధకూడా లేదు. అపార్థం కలగకుండటానికై నా అభిప్రాయం కొంచెం విశదీకరిస్తాను. గోడలకు కోరికలు లేవు, వ్యధలు లేవు. నిజమే కాని, అవి పరిణామమొందే వస్తువులు కావు కదా? ఈ కుర్చీకికూడ కోరికలు లేవు, బాధలు లేవు. కాని, కుర్చీ ఎప్పటికీ కుర్చీయే. సుఖానుభూతిలో, దివ్యత్వం వుంది. దుఃఖానుభూతిలో కూడా దివ్యత్వం ఉంది. కీడువల్లకూడా ఉపయోగం కలదని చెప్పవచ్చు. దుఃఖానుభూతికికూడ నీతి బోధక ప్రభావం వుందని మనకు తెలుసు. చేసిన పనులెన్నిటికో మనం పశ్చాత్తాపపడతాం. కాని వాటి వల్ల, మనకెట్టి గుణపాఠాలు లభించాయి. నా మట్టుకు నేను కొన్ని సత్కార్యాలు చేసినందుకు ఎంత సంతోషిస్తానో, అనేక దుష్కార్యాలు చేసినందుకుకూడా అంతే సంతోషిస్తాను. సరియైన త్రోవలో అప్పుడప్పుడు నడిచినందుకు నాకు సంతోషం. పెక్కుమార్లు తప్పు త్రోవల్లో పడ్డందుకుకూడా సంతోషమే. అవన్నీ నా కత్యుత్తమ పాఠాలు నేర్పినవి కదా? నేను, చిన్ననాటినుండీ తలచిన తలపుల యొక్క, చేసిన చేతల యొక్క సమష్టి ఫలమునే ఇప్పటి నేను. ప్రతి తలంపు, ప్రతి చేత, దాని దాని ఫలాలను కలిగించింది. నా అభివృద్ధి మొత్తం ఆ ఫలాలే.
కోరికలు కోరడం మంచిది కాదని మనకందరికి తెలుసు. కాని కోరికలు త్యజించడం అంటే ఏమి? జీవితం జరగడం ఎలా? కోరికనే కాక, మనుష్యునికూడా నశింపజేయు ఆత్మహత్యా రూపమైన బోధకదా యిది? కాదు. దాని సరియైన అర్థమిది. ఆస్తి ఉంచుకోవద్దని కాదు బోధ, ఆవశ్యకమైన వస్తువులుంచుకోవద్దనికూడా కాదు. అనావస్యకములైనా, హాయిగొల్పెడు వస్తువులుంచుకోవడానికిక్కూడ ఆక్షేపం లేదు. కావలసిన వస్తువుల నన్నిటిని – ఇంకా ఇతరములను కూడా – ఉంచుకోవచ్చు. కాని సత్యం తెలిసికొని ఆచరించండి. ధనమెవ్వరిది కాదు. ఒక వస్తువు మీ సొంతమని కాని, దానియందు మీకుకూడా కొంత భాగముందని కాని భావించకండి. మీ రెవరు? నే నెవడను? ఇతరు లెవరు? సర్వం ఈశ్వరునిదే. అన్నిటిలో ఈశ్వరుని చూడమని కదా ఉపనిషత్తుల బోధ? మీరనుభవించే సంపదలో భగవంతుడున్నాడు. మీలో అంకురించే కోరికలో అతడున్నాడు. ఆ కోరికను తీర్చుకోవడానికై మీరు కొనే వస్తువుల్లో అతడున్నాడు. మీ అందమైన వస్త్రాల్లో అతడున్నాడు. మీ నాజూకైన నగల్లో అతడున్నాడు. ఈ మార్గాల్లో నడవాలి మీ తలపులు. ఈ దృష్టితో చూడనారంభించడంతోనే, ప్రపంచమంతా క్రొత్తరూపం ధరిస్తుంది. మీ ప్రతి చలనమందు, మీ సంభాషణయందు, మీ రూపమందు, అన్నిటిలో, ఈశ్వరునుంచితే, దృశ్యమంతా మారి, ప్రపంచం కష్టభూయిష్ఠ రంగంగా కనిపించడానికి మారు స్వర్గలోకమైపోతుంది.
“ఈశ్వర రాజ్యం మీలో ఉంది” అని జీసస్ అన్నాడు. వేదాంత బోధకూడా అదే. లోక గురువులంతా అదే చెబుతారు. “చూడడానికి కళ్లున్నవారంతా చూడనీ; వినడానికి చెవులుండే వాళ్లంతా విననీ!” మనం ఎన్నాళ్లనుండో, వెదకు సత్యం మనలోనే వుందనీ, ఎప్పుడునూ అక్కడనే ఉండిందనీ, వేదాంతం చాటుతోంది. అజ్ఞానాంధులమై, అది పోయిందని భ్రమసి ఏడుస్తూ, బొబ్బరిస్తూ ప్రపంచమంతా వెదికి శ్రమించాం. కాని ఆ సత్యం మొదటినుండీ మన హృదయాలలోనే నివశించింది. అక్కడే దాన్ని కనుగొనవచ్చు.
“ప్రపంచాన్ని త్యజించండి” అనే వాక్యాన్ని మామూలు వాడుకలో గల అపరిపక్వార్థంలో గ్రహిస్తే, మనమేపనినీ చేయక, ఏమీ ఆలోచించక, మట్టి ముద్దలుగా చేష్టలు దక్కి పడి ఉండాలి. సర్వమూ నియతి వశమనే నమ్మకం కలవారమై ప్రకృతి ధర్మానికి దాసులమై సర్వ కాలగతులకు విధేయు లమై ఇటునటు త్రిప్పటలు పడాలి. వ్యర్థ వాంఛలకు లోబడి, అంతటా తిరిగే సామాన్య మానవులకు, “కర్మ” మంటే ఏమో ఎలా తెలుస్తుంది? విషయలోలుడై, చిత్తవృత్తులచే, ఇటునటు బలాత్కారంగా లాగబడే వాడు, కర్మమంటే ఏమో ఎలా గ్రహించగలడు? నిష్కాముడై కేవలం నిస్వార్థపరుడై ఉండేవానికే కర్మాచరణ సాధ్యం. ఉద్దేశమేమీ లేని వాడే, కర్మాచరణ యోగ్యుడు. సాధింప దగిన స్వలాభమేమీ లేనివాడు చేసేది కర్మం.
పటములోని చిత్రాన్ని చూసి, ఆనందించేదెవరు? అమ్మేవాడా? చూసేవాడా? – అమ్మేవాడు “జమా ఖర్చు” లెక్కలు చూసుకుంటూ, తనకు మిగిలేదెంతో తేల్చుకుంటూ, ఆ పటాన్ని అమ్మితే తనకు వచ్చే లాభాన్ని లెక్కించుకుంటూ ఉంటాడు. వాని ఆలోచన అంతా అక్కడే వుంటుంది. అతని చెవి, వేలం పాటల మీద, దృష్టి వేలపు సుత్తి మీద వుంటుంది. పాట ఎంత త్వరితంగా పెరుగుతుందో వినడంలోనే అతడు నిమగ్నుడై ఉంటాడు. కొనే ఉద్దేశం, అమ్మే ఉద్దేశం లేక, అక్కడికి వచ్చి ఊరికే పటం చూచేవాడు దాని సౌందర్యానికి ఆనందిస్తూ ఉంటాడు. అతనిదే ఆనందానుభూతి! ఈ జగత్తంతా ఒక చిత్రపటం. కోర్కెలన్నీ నశించినప్పుడు గాని, మానవులు దానిలో ఆనందాన్ని పొందజాలరు. అప్పు డీ అమ్మకాలు, ఈ కొనుగోళ్లు, ఈ వెర్రి స్వామ్యభావాలు నిలిచిపోతాయి. అప్పిచ్చేవాడు, కొనేవాడు, అమ్మేవాడు, అదృశ్యమైనప్పుడు ఈ అత్యంత మనోజ్ఞమైన ప్రపంచ చిత్రం మాత్రం నిలిచి వుంటుంది. ఈశ్వరుని గూర్చి, ఈ క్రింది దాని కన్న, ఎక్కువ హృదయంగమమైన భావాన్ని నేనెక్కడా చదువ లేదు. “అతడు మహాకవి, అనాది కవి, జగత్తంతా అతడు నిరవధికానందమున రచించిన కావ్యం. అందు శ్లోకాలున్నాయి.ఛందోబద్ధములైన, అంత్యప్రాస గీతికలున్నాయి. లయ, తాళ, బద్ధములైన గేయాలున్నాయి.” నిష్కాము లమైనపుడు మన మీ ఈశ్వర నిర్మిత జగత్కావ్యాన్ని చదివి ఆనందించగలం.
అప్పుడు, సర్వం దైవమయ మవుతుంది. వెలుతురు సోకకపోవడంతో అపవిత్రాలుగా ఇన్నాళ్లు భావింపబడుతూండిన మూలలు, సందులు, గొందులు, చీకటి కోనలు, అప్పుడు దివ్య తేజోమయములవుతాయి. అవన్నీ వాని వాస్తవ స్వరూపాలలో కనిపిస్తాయి. అప్పు డీ ఏడ్పులు, ఆర్పులు, బాల క్రీడలనీ, వానిని మనం ప్రేక్షకులమై చూచామనే (చూస్తున్నామనీ) గ్రహించి మన ప్రవర్తనలకు మనమే నవ్వుకుంటాం.
కావున మీ కర్మములు చేయండని వేదాంతం బోధిస్తుంది. త్యాగమే– ఇంద్రియగోచరమైన, ఈ అసత్య ప్రపంచపు త్యాగమే – కర్మ రహస్యం. అది మొదటనే బోధిస్తుంది. ఆ బోధ కర్థ మేమి? సర్వత్రా భగవంతుని చూడండని, అలా చూస్తూ, కర్మలు చేయండి. నూరేళ్లు జీవించాలనుకోండి. ఐహిక వాఛలన్నీ కలిగి వున్నా ఆక్షేపం లేదు. కాని కోరికలకు ఒక దివ్యతను ఆపాదించుకోండి. పరోపకార పరాయణం, ఆనందమయం, నిరంతర కార్యాచరణమగ్నం అగు దీర్ఘ జీవితాన్ని కోరండి. ఇలా చేస్తే, మీకు విమోచన మార్గం లభిస్తుంది. వేరుమార్గం లేదు. సత్యంతెలిసికోక, నిరర్థకములైన ఐహిక భోగాలలో కూలిపోయిన వానికి పతనమే గతి. వానికెన్నటికీ ఆదర్శ సిద్ధి లభించదు. అలాకాక ప్రపంచాన్ని ఎప్పుడూ శపిస్తూ, అడవులకు వెళ్లి శరీరాన్ని ఉపేక్షించి, ఉపవాసాలతో, ప్రాణాలు కొద్ది కొద్దిగా తీసికొంటూ, హృదయాన్ని రసహీనమైన ఎడారిగా మార్చుకొని, సానుభూతికి స్వస్తి చెప్పి, కరుకుదనానికి, నిర్దాక్షిణ్యానికి, ఎరయైన వాడుకూడా దారి తప్పిన వాడే. “అతి” సర్వత్రా వర్జింప వలసి వుండగా, సరియైన త్రోవను విడిచి, ఒక చివర కొకరు, రెండవ చివరకింకొకరు పోయారు. ఇరువురూ త్రోవ తప్పిన వారే. ఇరువురికి గమ్యమసాధ్యమే.
కాబట్టి ప్రతి వస్తువులోనూ భగవంతునుంచి, ప్రతి వస్తువులో కూడా భగవంతుడున్నాడని గుర్తించి, ఎల్లప్పుడూ కర్మా చరణాసక్తులై ఉండండి. కాని ఈ జీవితాన్ని దివ్యమని భావించి, దైవంగానే ఎంచి ఇదే మన కర్తవ్యమనీ, ఇది తప్ప మనకు కోరదగినదేదీ లేదనీ, ఎల్లప్పుడూ విశ్వసించండి. అన్ని వస్తువులలో ఈశ్వరుడుండగా, అతనికై మరో చోటికెళ్ళడ మెందుకు? ప్రతి కర్మములోను, ప్రతి తలంపులోను, ప్రతి చిత్తప్రవృత్తిలోను, అతడిప్పటికే కలడు కదా? ఈ విషయం తెలిసికొని పనులు చేసికొంటూ ఉండాలి! త్రోవ ఇదొక్కటే. వేరే త్రోవ లేదు. ఇలా చేస్తే కర్మఫలాలు మనల్ని బంధించలేవు. నిరర్థక వాంఛలే, మన కష్టాలకు, వ్యధలకు మూలములని మన కిప్పటికే తెలుసు. కానీ వానిని దివ్యీకరించి దైవ సంబంధంచే వానిని పవిత్రం చేస్తే, ఇక అవి కష్టాలను గాని వ్యధలను గాని కల్పించవు. ఈ రహస్యం తెలిసే వరకు మానవులకు ఈ ప్రపంచం రాక్షసంగానే కనిపిస్తుంది. తమ లోపల, తమ చుట్టు పట్ల, సర్వత్రా అనంతమైన ఆనందనిధి వుందని ఎందరికో తెలీదు. వాళ్లింతదాకా దాన్ని కనుక్కోలేదు. రాక్షస ప్రపంచమంటే ఏమి? “అజ్ఞానమే” అని వేదాంతమిచ్చే సమాధానం.
మహత్తర నదీతీరంలో కూర్చుని మనం దప్పికతో చస్తున్నాం. అన్నరాశి ప్రక్కనే కూర్చుని, ఆకటితో చస్తున్నాం. ఆనందమయ జగత్తు ఇక్కడే ఉంది. కాని అది మనకు కనిపించడం లేదు. అహోరాత్రాలు మనం దానిలోనే నివసిస్తున్నాం. కానీ అది మన కళ్లకు ఆనందమయం కానట్టు కనిపిస్తోంది. మతములు ఈ వింతను పరిశోధించి, దాన్ని మనకు స్పష్టం చేయాలని చూస్తాయి. ఈ ఆనందమయ ప్రపంచానికై, అన్ని హృదయాలూ ఉవ్విళ్ళూరుతున్నాయి. అన్ని దేశ ప్రజలు దాని కోసమే వెదకుతున్నారు. సర్వ మతాలకు ఇది ఏకైక లక్ష్యం. కాని ఒక్కొక్క మత లక్ష్యం, ఒక్కొక్క భాషలో తెలుపబడింది. ఈ భాషాభేదం వల్లే, లక్ష్య బేధమున్నట్టు అనిపిస్తుంది. ఒకరొక భాషలో ఒక విధంగా, మరొకరు ఇంకో భాషలో కొంత భేదంగా తెలిపారు. కాని అందరిలో వున్న భావం ఒకటేనేమో?
ఈ సందర్భంలో ఇంక కొన్ని ప్రశ్నలుకూడ తలెత్తుతున్నాయి. మాటలు చెప్పడం చాలా సులభం. “సర్వ పదార్థాల్లోను, సర్వ స్థలాల్లోనూ భగవంతుని చూచిన వెంటనే ఈ ప్రపంచం ఆనందమయమవుతుంది –” అనే భావం, నేను చిన్ననాటినుండి వింటున్నాను. కాని లోకంతో కలిసి నాలుగు దెబ్బలు తిన్న వెంటనే ఆ భావం అదృశ్యమవుతుంది. జనులందరిలో దేవుడున్నాడని భావిస్తూ, నేను వీథిలో నడుస్తున్నాను. బలిష్ఠుడొకడు వచ్చి, నన్ను పడగెంటుతాడు. నేను, నేల కూలి చప్పున లేచి, ముఖం జేవురించగా, వాణ్ణి పడగొట్టాలని ప్రయత్నిస్తాను. దేవత్వ భావమదృశ్యమైంది. అందరిలోను “ఈశ్వరుని చూడు” డను మాట చిన్నప్పటినుండి వింటున్నాను. అందరి లోను, అన్నిటిలోను, ఈశ్వరుని చూడుడనియే సర్వమతాల బోధకూడ. బైబిల్ క్రొత్త నిబంధనలో, ఏసుక్రీస్తు ఇలా బోధించాడు కదా? మన మందరం ఆ బోధ నెరుగుదుం కాని, దాన్ని కార్యరూపంలో పెట్టి చూడటం లోనే చిక్కు. ఈసోపు నీతికథల (ఈస్యప్ ఫేబుల్స్) లో ఒక దుప్పి, తన ప్రతిబింబాన్ని ఒక చెరువులో చూచుకొని, “నా శక్తి ఎంత అపారమో చూడు. నా తల ఎంత అద్భుతంగా ఉందో? నా కాళ్ళెంత బలిష్ఠమో? నేనెంత త్వరగా నడవగలనో చూడు –” అని తన పిల్లతో ప్రగల్భాలు పలుకుతూ వుంటుంది. ఇంతలో దూరాన కుక్కల అరుపు విని, అది అపార వేగంతో పారిపోతుంది. కొన్ని మైళ్లిలా పరుగిడి, రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తుంది. ఈ వింత చర్యకి పిల్ల అర్థమడిగితే “నాకు చాలా శక్తి ఉంది. నిజమే కాని, కుక్కల అరుపు వినబడటంతోనే నా ధైర్యం సడలిపోతుంది” అని అది బదులు చెప్పింది. మన విషయంకూడ ఇట్టిదే.
మన మానవత్వం ఎంతో గొప్పదని మన తలంపు. మనం బలవంతులమని, ధీరులమని భావించుకొని, గొప్ప లక్ష్యాలను సాధించాలను కుంటాం. కాని క్లిష్ట సందర్భాలు ఎదుర్కొని, సత్య నిష్ఠను పరీక్షింప మొదలిడినప్పుడూ, హృదయ ప్రేరణలు నియమ భంగానికి పురికొల్పే టప్పుడూ – ఈ కుక్క అరుపులు వినవచ్చినప్పుడు – కథలోని దుప్పి పరిస్థితి మనకు వస్తుంది. అలాంటప్పుడు ఈ బోధలన్నిటికి ఫలమేమి? అపారమైన ఫలముంది. పట్టు వదలక చేసే ప్రయత్నమెప్పుడూ విజయవంత మౌతుందనడమే ఆ ఫలం. ఒక్క దినంలో దీన్ని సాధించడం అసాధ్యం.
“ఈ ఆత్మను గూర్చి మొదట వినాలి. పిదప మననం చేయాలి. తర్వాత ఎడతెగకుండా ధ్యానం చేయాలి.” ప్రతి వానికీ – నేలపై ప్రాకే క్రిమికికూడ – వినీలాకాశం కనిపిస్తుంది. కాని అదెంత దూరం? అట్లే, మన లక్ష్యంకూడ. అది అపారమైన దూరం. నిజమే! కాని దాన్ని పొంది తీరాలనడంకూడ నిజమే. లక్ష్యాన్ని మాత్రమే కాదు పొందాల్సింది, పరమ లక్ష్యాన్నికూడ. అనేకులు లక్ష్యమేదీ లేక చీకటిలోలాగా జీవితాలు గడుపు తున్నారు. లక్ష్య ముండేవాడు ఒక వెయ్యి తప్పులు చేస్తే, లక్ష్యం లేనివాడు యాభైవేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. ఈ లక్ష్యాన్ని గూర్చి సాధ్యమైనంత వినాలి. నిరంతర శ్రవణంవల్ల అది మన హృదయంలో ప్రవేశించాలి. మన బుద్ధికెక్కాలి. రక్తనాళాలలో దూరాలి. ప్రతి రోమ కూపంలో వ్యాపించాలి. అంతట మనం దాన్ని గూర్చి ధ్యానించాలి. “హృదయం భావభరితమైనప్పుడు నోరు మాట్లాడుతుంది.” హృదయం భావ బంధురమైనపుడు హస్తం కూడ పనిచేస్తుంది.
మనల్ని కర్మాచరణకు పురికొల్పేవి భావాలే కాబట్టి, మనస్సును అత్యున్నత భావాలతో నింపుకోండి. ప్రతి దినమూ వానిని గూర్చి వినండి. ప్రతి నెల వానిని గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అపజయాలను లక్ష్య పెట్టకండి. అవి కలగటం చిత్రమా? జీవితానికి అలంకారప్రాయాలు కదా అవి? అవి లేని జీవితమెంత మందంగా ఉంటుంది. ఈ పోరాటాలే జీవితానికి స్వారస్యమిచ్చేవి. అవే జీవిత సౌరభాలు కాబట్టి, ఈ పొరపాట్లను ఈ పోరాటాలను, లక్ష్య పెట్టవద్దు. ఆవు అసత్య మాడదు. నిజమే, కానీ అది ఎప్పటికీ ఆవే. మానవుడు కాజాలదు. కాబట్టి అపజయాలచే నిరుత్సాహమొందకండి. లక్ష్యసిద్ధికై వేయిసార్లు పోరాడండి. వేయిసార్లూ ఓటమి ప్రాప్తిస్తే, ఇంకోసారి మరల ప్రయత్నించండి. అన్నిటిలో దైవాన్ని చూడటమే ఆదర్శం. కాని మీరన్నిటిలో చూడజాలకపోతే మీకత్యంత ప్రియమైన వస్తువులో మొదట చూడండి. ఆ తర్వాత మరొక దానిలో, అంతట ఇంకొక దానిలో; ఇలా క్రమ వ్యాప్తిని పొందింపవచ్చు. ఆత్మకు జీవిత పరిమితి లేదు. దాని జీవితం అనంతం. కాబట్టి కాలం చాలదని భీతిల్లక సావకాశంగా ఉద్యమాలు సాగించండి. కార్యసిద్ధి చేకూరుతుంది.
“ఏకమైన ఈ ఆత్మకు, మనోజవంకన్న, ఎక్కువ వేగం వుంది. అది దేవతలకు సైతం ప్రాప్తించలేదు. మనసుకు దురవగాహం. అది కదులుతుండటం వల్లనే సర్వం కదులును. అన్నిటికీ అదే ఉనికి. అది చలిస్తుంది, చలించదు; అది దూరం, దగ్గరా కూడ; అది అన్నిటికీ లోపల, బైటకూడ ఉంది. అన్నిటినీ నిండి ఉంటుంది. సర్వ ప్రాణుల్లోనూ ఆ ఆత్మనే; ఆ ఆత్మలోనే సర్వ ప్రాణులను చూసే వాడు, ఆత్మకెన్నడూ దూరం కానేరడు. జీవకోట్లన్నీ, ప్రపంచమంతా, ఆత్మలోనివిగా కన్గొనినప్పుడే మానవునికి పరమసత్యం సిద్ధించినట్లు. అతనికిక మోహాలు లేవు. జగత్తులో ఈ ఏకత్వాన్ని కనుగొన్నవానికిక శోకం ఎలా ఉండగలదు?” –
వేదాంత మతంలోగల మహావిశేషాలలో, ఈ సర్వజీవైక్యత – ఈ సర్వైక్యత ఒకటి. అజ్ఞానమే తాపత్రయ మూలమనే, భిన్నత్వ భావమే – మానవులంతా భిన్నులు, జాతులన్నీ భిన్నములు, భూమండల, చంద్ర మండలాలు, పరమాణువులన్నీ పరస్పర భిన్నములు – అనే ఈ భిన్నత్వ భావమే అజ్ఞానమనీ అది నిరూపిస్తుంది. ఈ భేద భావమే, మన తాపత్రయ కారణం. ఈ భిన్నత్వం లేదనీ, అది అసత్యమనీ, వేదాంతం పలుకుతోంది. పైకి మాత్రమే ఈ భిన్నత్వం, లోపల ఏకత్వమే కనిపిస్తుంది. మానవు లొండొరులకు, జాతులొండొంటికి; ఉన్నతులకు, హీనులకు; ధనికులకు, బీదలకు; దేవతలకు, మానవులకు; మానవులకు జంతు జాలానికి; అన్నిట్లో ఐక్యమే వుందని కనిపిస్తుంది. అగాధ పరిశీలన చేస్తే, సర్వ పదార్థాలు ఆ ఒక్కని వివిధ రూపాలే అని తెలిసొస్తుంది. ఈ ఐక్య భావాన్ని గ్రహించు వానికిక మోహ భ్రాంతులు లేవు. అతడెట్లు భ్రాంతుడౌతాడు? అన్నింటిలో వున్న సత్యం అన్నింటిలో వున్న నిగూఢ సత్యం అతనికి తెలిసిపోయింది కదా? అతనికిక తాపాలు ఎలా వుంటాయి. కోరికలేం వుంటాయి? అన్నిటిలో గల సత్యం ఆ మూల సత్యమే, ఆ పరమాత్ముడే, ఆ సర్వైక్యత్వమే, ఆ అఖండ సత్తయే, ఆ అఖండచిత్తే, ఆ అఖండానందమే అని అతడు గ్రహించాడు కదా? అక్కడ మరణం లేదు. వ్యాధి లేదు, దుఃఖం లేదు. తాపం లేదు, అసంతృప్తి లేదు, అంతా పరిపూర్ణైక్యం. పరిపూర్ణానందం. అతడిప్పుడు ఎవనికై దుఃఖీస్తాడు? పరమ సత్యంలో మరణం లేదు, తాపం లేదు. అందు ఎవరికోసం దుఃఖీంచడం? ఎవరియెడ సానుభూతి చూపడం? సర్వం అతడే నిండి ఉన్నాడు; ఆ శుద్ధుడు, ఆ అకాయుడు, ఆ నిరవయవుడు, ఆ పాపరహితుడు, ఆ కవి, ఆ మనీషి, ఆ స్వయంభువు, ఆ కర్మఫల ప్రదాత! ఈ అజ్ఞలోకానికి – అవిద్యావయా రూపమైన ఈ లోకానికి – నిజమైన ఉనికి వుందనుకొని దాన్ని ఉపాసించేవారు చీకటిలో అల్లాడు తున్నారు, జీవిత కాలమంతా, ఈ లోకంలోనే గడిపి, దీనికన్నా ఉన్నతం, దీనికన్న శ్రేష్ఠం, అయినదొకటి వుందని తెలిసికోనివారు, అంతకన్నా చీకటిలో అల్లాడుతున్నారు. కానీ ఈ ప్రకృతి రహస్యాన్ని తెలిసినవాడు, ప్రకృతిని ఆధారంగా చేసుకొని ప్రకృతికి అతీతమైన వస్తువును కన్గొనినవాడు మరణాన్ని దాటుతాడు; ప్రకృతికి అతీతమైన వస్తువు తోడ్పాటుతో నిత్యానంద ప్రాప్తి పొందుతాడు. “సూర్యుడా! నీ బంగారు బింబంతో కప్పిపెట్టిన నీలోని సత్యాన్ని, తెర తొలగించి కళ్లకు కనిపించేలా చేయి. నీలో నివసించి వున్న సత్యం నాకు తెలుసు. నీ కిరణాల యొక్క దివ్యత్వంయొక్క వాస్తవికార్థం నాకు తెలుసు. నీలోనుండి ప్రకాశించే ఆ వస్తువు నాకు తెలిసిందే. ఆ సత్యాన్ని నేను చూస్తున్నాను. ఆ సత్యమే నాలోకూడా ఉంది. నేనే ఆ సత్యాన్ని.”