(1896 – లండన్‌లో ఉపన్యసించింది)
బ్రహ్మం (అఖండం), అనంతం, సాంతంగా – ప్రపంచంగా ఎలా మారింది? అత్యంత క్లిష్టమైన ఈ ప్రశ్న, అద్వైత వేదాంతాన్ని గ్రహింప పూనువారి నందరిని ఎదుర్కొంటుంది. ఎప్పుడూ బయలుదేరుతూ ఎప్పటికీ నిలిచివుండే ప్రశ్న ఇది. నే డీ ప్రశ్నను గూర్చి విచారిస్తాను. విషయం సుబోధకంగా ఉండటానికి నేను గీచిన ఈ రేఖాకృతిని చూడండి.
ఇందులో ‘అ’ అన్నది బ్రహ్మం. ‘ఆ’ అనేది జగత్తు. బ్రహ్మం, ప్రపంచంగా మారింది. ప్రపంచమంటే భౌతిక ప్రపంచం మాత్రమేకాదు. మానసిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు, ఊర్ధ్వ లోకాలు, అధోలోకాలు – ఇంతెందుకు? ఏమేమి ఉందో అదంతా ఈ ‘ప్రపంచ’ శబ్దంలో చేరుతుంది. మనస్సు ఒక మార్పుకి పేరు. శరీరం ఇంకో మార్పుకి పేరు.
ఇలా ఎన్నో మార్పులున్నాయి. ఈ మార్పులన్నిటి కూడికే ప్రపంచం. ఈ బ్రహ్మం (అ) దేశకాల నిమిత్తములు (ఇ) ద్వారా రావడం వల్ల ప్రపంచంగా (ఆ) మారింది. ఇదే అద్వైతంలోని మూలభావం. దేశ, కాల, నిమిత్తములు అనే గాజుపలక ద్వారా, మనం బ్రహ్మాన్ని చూస్తాం. ఆ పలక క్రిందనుండి అతడు, ప్రపంచంగా కనిపిస్తాడు. అఖండునిలో దేశ, కాల, నిమిత్తములు లేవని, ఇందువల్ల వెంటనే స్పష్టపడుతుంది. అక్కడ మనస్సు లేదు. (అనగా భావన లేదు.) కాబట్టి కాలం అనే భావన ఎలా వుంటుంది? వాక్య బేధమేమీ కానరాదు కనుక, దేశ భావంకూడా ఉండజాలదు. మనకు గల చలన భావంకాని, నిమిత్త భావంకాని, కేవల పదార్థంలో (ఒక్కటే అయిన దానిలో) ఎలా ఉంటుంది? బ్రహ్మం – భ్రంశం చెందిందని అందామా? – జగత్తుగా – అయిన పిదపగాని, నిమిత్తభావం కలుగ నేరదనే, ఖండరూపుడు కావడానికి ముందువేవీ ఉండజాలవనే మనం గ్రహించి సుస్థిరంగా జ్ఞప్తిపెట్టుకోవాలి. షోపన్హోర్ వ్రాసిన తత్త్వగ్రంథంలో, వేదాంతం అపార్థం చేసికోబడిందని నా అభిప్రాయం. అతని ప్రకారం “ఇచ్ఛ” సర్వశక్తిమంతం. “ఇచ్ఛ” ను అతడు పరిపూర్ణుని స్థానంలో నిలిపాడు. కానీ అది ఎలా అవుతుంది? ఇచ్ఛ మార్పులు పొందేది. ఇంద్రియార్థములకు లోనైనది. దేశ కాల నిమిత్తాల మీది రేఖ కావల చలనం, మార్పులు ఉండనేరవుకదా? ఆ రేఖకు అడుగుననే బాహ్యచలనంగాని, అంతర చలనంగాని ఉండగలవు. కావున పైభాగంలో ఇచ్ఛ ఉండజాలదు. అంటే ప్రపంచం ఇచ్ఛ వల్ల కలిగిందనడం అసంభవం. మన శరీర ధర్మాన్ని గూర్చి విచారించినా, ఇచ్ఛ అన్ని చలనాలకు కారణభూతం కాదు గదా? ఈ కుర్చీని జరుపుతున్నాను. ఈ చలనానికి నా ఇచ్ఛయే కారణం. అదే రెండవ చివరలో, కండర చలనంగా గోచరిస్తోంది. కుర్చీని కదిలించిన శక్తే హృదయం, శ్వాసకోశాలు, మొదలైన వానినికూడ ఆడిస్తున్నాయి. కానీ అక్కడ ఇచ్ఛకు స్థానమే లేదు. ఈ రెండు చలనాలకు మూలమైన శక్తి ఒక్కటే అని ఒప్పుకుంటే, చైతన్య క్షేత్రమున కెగిసిన తర్వాత, ఆ శక్తి ఇచ్ఛనామం పొందును కానీ, అంతకు ముందు దాని కా పేరు పెట్టుట పొరపాటనడం స్పష్టం. షోపన్హోర్ కల్పించిన తత్త్వమతం ఈ ప్రమాదం వల్ల ఎంతో గందరగోళం పొందింది.
ఒక రాయి క్రింద పడిందనుకోండి. ఎందుకు పడిందని మనం అడుగుతాం. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉండాలి అనే ఊహే కదా ఇలా ప్రశ్నించడానికి మూలం? ఈ విషయాన్ని మీ మనస్సులకు బాగా విశదపరచుకోండి. కారణ విచారమెప్పుడు చేసినా, “ప్రతి కార్యానికి ఒక కారణం ఉండి తీరుతుంది – అంటే, ఆ కార్యానికి ముందు, దానికి కారణభూతమైన మరొక కార్యం జరిగి ఉండాలి” అని మనం ఊహిస్తున్నాం. ఈ పూర్వాపరత్వ సంబంధాన్నే నిమిత్తతాన్యాయం (లా ఆ్యప్ కాజేషన్) అంటారు. ప్రపంచంలో ప్రతిదీ, ‘వరుసగా కార్యరూపాన్ని, కారణ రూపాన్ని’ పొందుతూ ఉంటుందని దీని భావం. ప్రతిదీ తన తర్వాత జరిగిన కొన్నిటికి కారణం, తనకు ముందు జరిగిన ఏదో ఒకదానికి తాను కార్యం. ఈ నిమిత్తతా న్యాయాన్ని అనుసరించే మన ఆలోచన అంతా నడుస్తుంది. ప్రపంచంలో గల ప్రతి అణువుకు – అది దేనిదైనా కానీ – తక్కిన అణువు లన్నిటికీ సంబంధం వుందని మన నమ్మకం. ఈ నమ్మకం ఎలా పుట్టిందన్న విషయాన్ని గూర్చి చాలా చర్చలు జరిగాయి. యూరప్ ఖండంలోని సహజ జ్ఞానవాదులు (ఇన్ట్యూటివ్ ఫిలాసఫర్స్)మానవుని కిది స్వతస్సిద్ధమన్నారు. ఇతరులు ఇది అనుభవ ప్రాప్తమన్నారు. కానీ విషయం పరిష్కారం కాలేదు. దీన్నిగూర్చి వేదాంత సిద్ధాంతమేమో, ముందు ముందు చూడగలం. కానీ మీ రీ క్రింది విషయాన్ని మొదట గ్రహించాలి. “ఏల” అని ప్రశ్నించడానికి మూలం, మన చుట్టూగల అన్నిటికీ పూర్వం కొన్ని ఉండిందనీ, తర్వాత కొన్ని వస్తాయనీ, మనకు గల నమ్మకమే. ఆ ప్రశ్నకు మూలమగు, మరొక నమ్మకమేమంటే, “ఈ ప్రపంచంలో గల సర్వ వస్తువులూ, పరస్పరాపేక్షములు; మరి దేనితోను, సంబంధంలేక స్వతంత్రంగా ఉండే వస్తువే లేదు” అని. ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటుందనే సూత్రం, సమస్త విశ్వంలోను పరిఢవిల్లుతోంది. కాబట్టి “పరిపూర్ణ వస్తువు ఎలా కలిగింది. దానికి కారణమేమి?” అనే ప్రశ్నలు ఎంత అసంగతాలో చూడండి. ఆ వస్తువుకు మరొక వస్తువుతో సంబంధం వుంటుందనే, ఇది దానిపై ఆధారపడి వుందనే భావించి, ఆ పరిపూర్ణ వస్తువును ప్రపంచ క్షేత్రానికి దింపడం కాదా ఇది? అఖండునిలో దేశకాల నిమిత్తాలు లేవు. అతడు కేవలుడు (వన్) అద్వితీయుడు, స్వయంభవమైన వస్తువుకు కారణం ఉండదు. సర్వస్వతంత్ర వస్తువుకు కారణం వుండదు. ఉంటే అది స్వతంత్రం ఎలా అవుతుంది? సంబద్ధమవుతుంది కదా? ఇతరముతో సాపేక్షతగల వస్తువు స్వతంత్రం కానేరాదు. కావున అఖండ వస్తువు ఖండ మెట్లయిందన్న ప్రశ్నయే అసంగతం. దానిలో తనను తానే ఖండించుకొనే దోషం ఉంది. ఈ సూక్ష్మభావ విచారాన్ని వదలి, సామాన్య తార్కిక దృష్టితో విచారిద్దాం.
“పరిపూర్ణ వస్తువు, అపరిపూర్ణ మెట్లయింది?” అనే ప్రశ్నకు సమాధానం లభించిందనుకోండి. అప్పుడు పరిపూర్ణ వస్తువు, పరిపూర్ణంగానే ఉంటుందా? అదీ అపరిపూర్ణమే అయిపోయింది. సామాన్య భాషలో, జ్ఞానం “ఎఱుక” అనే మాటకర్థమేమి? మన మనస్సుకు అర్థం కావడం అనే కదా? మనస్సుకు అర్థం కాక మించి ఉండేది ‘ఎఱుక’ ఎలా అవుతుంది? పరిపూర్ణ వస్తువు మనస్సుకు తెలిస్తే, అది మనస్సుచేత పరిమితమై ఉండాలి! అట్లైతే అది ఇంకా పరిపూర్ణమెలా అవుతుంది? పరిమిత వస్తువులు మాత్రమే మనస్సుకు అవగత మవుతాయి. కాబట్టి “పరిపూర్ణుడిని తెలిసికోవడం” అనే వాక్యమే అసంబద్ధం. దానిలోనే భావ విరుద్ధత ఉంది. కాబట్టే, ఈ ప్రశ్నకు ఇంత వరకు సమాధానం లభించలేదు. లభిస్తే పరిపూర్ణుడే నిలువడు. మానవబుద్ధిలో ఇమిడిన దేవుడు, మనలాగా పరిమితుడైన, మానవుడవుతాడు కానీ, ఇంకా దేవుడుగానే ఉంటాడా? అతనిని తెలిసికోవడం అసాధ్యం. అతడెప్పుడూ అజ్ఞేయుడే.
కానీ అద్వైత మత ప్రకారం, అతడు జ్ఞానాతీతుడు. ఈ మహత్తర విషయాన్ని మనం గ్రహించాలి. అజ్ఞేయవాదులుకూడ భగవంతుడు అజ్ఞేయుడంటారు. వారి భావం సరియైందని మీరు తలంచరాదు. ఈ దృష్టాంతాన్ని చూడండి. ఈ కుర్చీ మనకు తెలుస్తోంది. ఇది జ్ఞాతం. ఆకాశానికి అవతల ఏముందో, అక్కడ మానవులుంటారో, ఉండరో అనే విషయం అజ్ఞేయంగా ఉండవచ్చు. ఈ అర్థంలో, భగవంతుడు జ్ఞాతుడు కాడు. అజ్ఞేయుడు కాదు. అతడు “జ్ఞాతం” కన్నా అధికుడు. భగవంతుడు ‘అజ్ఞాతుడు’, ‘అజ్ఞేయుడు’ అనడానికి సరైన అర్థమిది. కొన్ని విషయాలను గూర్చి, ఇవి “అజ్ఞాతములు”, “అజ్ఞేయములు” – అంటామే, ఆ అర్థంలో కాదు. భగవంతుడు “జ్ఞానాతీతుడు”. ఈ కుర్చీ జ్ఞాత వస్తువు. కాని భగవంతుడు దీనికన్నా ఎన్నోరె ట్లధికుడు. ఏలన ఆయనతోనే, ఆయన ద్వారానే, ఈ కుర్చీ ఉనికి మనకు తెలుస్తోంది. జ్ఞానమంతటికీ ఆయనే సాక్షి, నిత్యసాక్షి. మనం ఏమి తెలుసుకున్నా ఆయనలోనే, ఆయన ద్వారానే తెలుసుకోవాలి. అతడు మన ఆత్మసారం. ఈ ‘అహము’ నకు, ఈ ‘నేను’ కు అతడే సారం. అహంతయందే, మనకేది తెలియవచ్చినా, అహంత మూలంగానే కదా? అంటే మీరేది తెలుసుకున్నా బ్రహ్మమునందే, బ్రహ్మం మూలంగానే తెలుసుకోవాలి. ఈ కుర్చీని భగవంతునందే, భగవంతుని మూలంగానే తెలుసుకోవాలి. కాబట్టి భగవంతుడు, ఈ కుర్చీకన్న మనకు ఎన్నోరెట్లు దగ్గర. కాని ఎన్నోరెట్లు ఉన్నతుడుకూడా. అతడు జ్ఞాతుడు కాడు. అజ్ఞాతుడుకూడా కాదు. (అంటే అర్థం చేసికోలేం, అర్థం చేసికోగలంకూడ.) కానీ రెంటికన్న అపారంగా అధికుడు. అతడే మీ ఆత్మ. “ఆ శుభమూర్తి ఈ ప్రపంచంలో నిండి వుండకపోతే, ఇక్కడ ఎవ్వడైనా, ఒక క్షణమాత్రం జీవింపగలడా? ఒక్కమారైనా ఊపిరి పీల్చగలడా? అతనియందే, అతని ద్వారానే కదా ఊపిరి పీలుస్తున్నాం? అతడెక్కడనో ఉండి నా నాళాలలోని రక్తాన్ని ప్రవహింప జేస్తున్నాడని కాదు దీని అర్థం. అతడు దీనికంతటికీ మూలసత్యమనే, నా ఆత్మకు అతడే ఆత్మ అనే దీనికర్థం. అతడు “మాకు తెలుసని” మీరు చెప్పనే లేరు. అలా అనడం ఆపచారప్రాయమగు సత్యం. మీరు, మీలోనుండి బైటికి పోజాలరు కాన, మీరతన్నెరుగుట అసాధ్యం. విషయీకరణమే జ్ఞానం. ఇందుకుదాహరణం – జ్ఞప్తి చేసుకొనేప్పుడు మనం ఎన్నో వస్తువుల్ని మనలోనుండి బైటకి విసిరి, విషయీకరిస్తూ (దృశ్య వస్తువులుగా చేసికొంటూ) ఉంటాం. జ్ఞాపకమంతా, నేను చూచిన, నేనె ఱిగిన వస్తువులన్నీ ఉండేది నా మనస్సు లోనే. ఆ వస్తువుల ఆకృతులు, అవి కల్పించిన భావాలు నా మనస్సులోనే ఉన్నాయి. వానిని గూర్చి ఆలోచించాలంటే, వానిని గహ్రించాలంటే, నా మొదటి పని ఆ ఆకృతుల్ని, ఆ ముద్రిత భావాలను, ప్రక్షీపించడమే. భగవంతుని విషయంలో ఈ విషయీకరణం అసాధ్యం. మన ఆత్మకు సారభూతుడగు వానిని ప్రక్షేపించడం ఎలా? “నీ ఆత్మకు మూలమగు అతడే సత్యం. అతడే ఆత్మ; శ్వేతకేతూ నీవే అది” అనే అత్యంత గంభీర సత్యం ఉపనిషత్తులో ఉంది. “నీవే భగవంతుడవు,” అనే వాక్యానికి ఇదే అర్థం. అతనిని ఇతర విధంగా, నిర్వచించడం అసాధ్యం. తండ్రిగా, సోదరుడుగా, ప్రాణమిత్రుడిగా, వర్ణింపజూచే వారంతా, విషయీకరణ ప్రమాదం పాలవుతున్నారు. అన్నిటికీ అతడు అనంత విషయి (ఎటర్నల్ సబ్జక్ట్). నేను ఈ కుర్చీని చూస్తున్నాను. కాబట్టి దీనికి నేను విషయిని (ద్రష్టను). అట్లే భగవంతుడు, నా ఆత్మకు నిత్య విషయి, నిత్య ద్రష్ట. మీ ఆత్మలకు సారభూతుడైన వానిని, అన్నిటికీ మూలసత్యమైన వానిని, విషయీకరించి, ఇతర వస్తుభావంతో చూడటం ఎలా? కాబట్టి నేను ఇప్పటికే చెప్పినట్లు, “అతడు అజ్ఞేయుడు కాడు, అజ్ఞాతుడుకూడ కాడు. కానీ రెంటికన్నా అపారంగా అధికుడు.” మన ఆత్మయే అతడు; అనగా అతడు, మనం ఒకటే. కాబట్టి మనకు అతడు జ్ఞేయుడు కాడు, అజ్ఞేయుడూ కాడు. జ్ఞేయుడేల కాదు అంటే మీరు, మీ ఆత్మను బైటికి తీసి, దృశ్య వస్తువుగా చేసికోజాలరు కాబట్టి. అది మీరే అయినప్పుడు దాన్ని విడదీయడం ఎలా? అజ్ఞేయుడేల కాడంటే మీకన్న, మీకు తెలిసిన వస్తువేది వుంది? మీ జ్ఞానమంతటికీ కేంద్రస్థానం ఆత్మే కదా? ఇదే అర్థంలో భగవంతుడు అజ్ఞేయుడు కాడు. జ్ఞాతుడూ కాడు. కానీ ఈ రెంటికన్నా అత్యధికుడు. భగవంతుడంటే సత్యమైన మన ఆత్మయేకదా?
ఇప్పటికి తెలిసిన విషయాలేమంటే మొదటిది, ‘అఖండ వస్తువు ఎలా కలిగింది?’ అనే ప్రశ్నలో తన్ను తాను ఖండించుకునే దోషం ఉంది. రెండోది, “అద్వైత వేదాంతంలో గల భగవంతుని గూర్చిన భావం, మనం, అతడు వేర్వేరు కాదని, అందువల్ల మనమతనికి ఇతరత్వమాపాదించి విషయీకరింపజాలమని, మనకది తెలిసినా తెలీకున్నా, అతనితోనే మన జీవనం, అతనితోనే మన వ్యాపారాలు, మనం ఎప్పుడేమి చేసినా అతని ద్వారానే –” ఇక దేశకాల నిమిత్తములంటే ఏమో ఆలోచిద్దాం. అద్వైతమంటే ఏకత్వం. ఉండేది ఒక వస్తువే. రెండవది ఏదీ లేదు. కాని ఈ దేశకాల నిమిత్తము లాచరించడం వల్ల అద్వయుడు, బహురూపుడై కనిపిస్తున్నాడనే వాదం వుంది. కాబట్టి ఇప్పుడు రెండు వస్తువులు ఏర్పడుతున్నాయి. అఖండుడు, మాయ. (దేశ, కాల, నిమిత్తముల సమష్టి నామం) ఈ రెండు వస్తువులున్నాయనే మాట చాల సత్యంగానే తోస్తుంది. కాని రెండు అనడం ఎలా పొసగుతుందని అద్వైతి ప్రశ్నిస్తాడు. బ్రహ్మంలాగా, సర్వస్వతంత్రమైన ఏశక్తికీ లొంగని రెండు వస్తువులేవి? అలా ఉండటం సాధ్యమా? దేశ కాల నిమిత్తములకు, స్వతంత్రమైన అస్తిత్వం వుందా? కాలానికి అట్టి ఉనికి లేనేలేదు. మనస్సులోని ప్రతి మార్పులోను అది మారుతూ ఉంటుంది. కల గనేవాడికి ఒక్కొక్కసారి ఎన్నోఏళ్లు గడిచినట్లు తోస్తుంది. ఒక్కొక్కసారి ఎన్నో నెలలు ఒక్క నిమిషంలాగా అనిపిస్తుంది. అంటే కాలం మన మనోవృత్తులపై ఆధారపడింది. ఒక్కొక్కసారి కాల స్మృతియే నశించడంకూడ ఉంది. దేశంకూడా అట్టిదే. అది ఏమైంది మనం తెలుసుకోలేం. అది అనిర్వచనీయమని, ఇతర వస్తువులపై ఆధారపడని ప్రత్యేకమైన ఉనికి దానికి లేదని మాత్రం మనకు తెలుసు. నిమిత్తతకూడ ఇట్టిదే.
దేశ, కాల, నిమిత్తములు మూడింటిలో ఒక విశేషం ఉంది. ఇతర వస్తుసంబంధంలేని ప్రత్యేకమైన ఉనికి వానిలో దేనికీ లేదు. ఏ రంగూలేక, ఏ హద్దులులేక, పరిసర వస్తువులతో సంబంధంలేక ఉండే దేశాన్ని ప్రత్యేకించి భావించగలరేమో ప్రయత్నించి చూడండి. అది మీ వల్లకాని పని. రెండు హద్దుల నడిమి దిశనో, మూడు వస్తువుల మధ్య ఇమిడినదిగానో, భావింపవలసి వస్తుంది. ఏదో ఒక వస్తువుతో, సంబంధం కల్పిస్తే తప్ప దానికి ఉనికే ఉండదు. కాలాన్నిగూర్చికూడ ఇంతే. రెండు సంఘటనలను తీసికొని ఇది ముందు, ఇది వెనుక అని సంబంధపరిస్తే తప్ప, కాలం రూపుదాల్చదు. దేశ నిర్ణయానికి బాహ్య వస్తుసంబంధం ఎలా అవసరమో, కాలనిర్ణయానికి రెండు సంఘటనలు అట్లే అవసరం. ఇక నిమిత్తతకు దేశకాలంతో అవినాభావ సంబంధం ఉంది. స్వతంత్రమగు ఉనికి లేకపోవడమే ఈ మూడింటిలోగల ప్రత్యేక ధర్మం. ఈ గోడకు, ఈ కుర్చీకికల ప్రత్యేక అస్తిత్వంకూడ దీనికి లేదు. అన్నిటిని ఆవరించి వుండీ, తాకనలవికాని నీడల వంటివవి. వానికి వాస్తవమగు ఉనికి లేదు. నిజమే కాని, అవి లేవు అనగలమా? వాని ద్వారానే కదా ఈ వస్తు ప్రపంచమంతా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు తేలిన మొదటి విషయ మేమంటే, ఈ దేశ కాల నిమిత్తతల సంయోగానికి, అస్తిత్వంకాని, అనస్తిత్వంకాని లేదనుట. రెండవ విషయమిది. ఒక్కొక్కప్పుడు అదృశ్యమవుతుందనడం. ఇందుకొక ఉదాహరణం. సముద్రంపై ఒక తరంగం ఉంది. అది సముద్రంకన్నా భిన్నం కాదని మనకు నిస్సంశయంగా తెలుసు. కాని దానిలో “తరంగ” మనే భిన్నతకూడ ఉంది. ఈ భేదానికి మూలమేమి? నామ రూపాలే. అంటే మనస్సులోని భావమూ, ఆకారమూ. కాని తరంగ రూపాన్ని సముద్రం నుండి విడదీసి భావించగలమా? భావించనే లేము. సముద్రునికీ, దానికీ అవినాభావ సంబంధం ఉంది. తరంగం అణగిన క్షణంలోనే, రూపం నశిస్తుంది. కాని ఆ రూపం భ్రాంతినుండి జనించలేదు. తరంగం ఉండినంత కాలం రూపం ఉండింది. కావున దాన్ని చూడక తప్పింది కాదు. ఇది మాయ.
ఇట్లే ఈ ప్రపంచమంతా ఒక రూప విశేషమనవచ్చు. నిర్గుణ బ్రహ్మమే సముద్రం. మీరు, నేను, సూర్యమండలాలు, నక్షత్ర మండలాలు మొదలైన వన్నీ ఆ సముద్ర తరంగ విశేషాలు. ఆ తరంగాలు (సముద్రం నుండి) భిన్నములుగా కాన్పించడానికి కారణమేమి? రూపమే. ఆ రూపం దేశ, కాల, నిమిత్తాలలో కల్పించబడింది. వీని అన్నిటికీ ఆ తరంగమే ఆధారం. తరంగం అణుగుటతోడనే, అవి అదృశ్యాలవుతాయి. ఈ మాయను ఏ మానవుడు విడనాడుతాడో, వానికది అదృశ్యమౌతుంది. అతడు, అంతట ముక్తుడౌతాడు. ఈ పోరాటమంతా దేశ కాల నిమిత్తాలను – ఇవే మన ముక్తి మార్గాలను, ఎప్పుడూ అడ్డగించేవి – అంటి పెట్టుకొని వుండే అభ్యాసాన్ని జయించడానికే. పరిణామవాదం అంటే ఏమి? దానిలోని రెండు అంగాలేవి? అంతర్నిహితమైన మహామహత్వం కలదై, తన మహత్వాన్ని వ్యక్త రూపమొందించడానికి యత్నిస్తున్న అపరిమిత శక్తి ఒకటి. పరిసర సన్నివేశాలు ప్రతికూలములవడం వల్ల ఆ ప్రయత్నాలను విఫలం చేసే సందర్భాలు రెండవది. ఈ పరిసర పరిస్థితులపై విజయం సాధించుటకోసం ఆ శక్తి వేర్వేరు శరీరాలను ధరిస్తూ ఉంటుంది. కీటాణువు (అమీబా = ప్రాథమిక దశలోని సూక్ష్మజీవి) ఈ పోరాటంలో నిలువజాలక మరొక శరీరాన్ని పొంది, కొన్ని నిరోధాలను జయిస్తుంది. అటు తర్వాత మరొక శరీరాన్ని, ఆ తర్వాత ఇంకొక శరీరాన్ని, ఇలా వేర్వేరు శరీరాలను ధరిస్తూ పోయి పోయి చివరకి మానవుడవుతుంది. ఈ పరిణామవాదాన్ని ఇంతటితో ఆపక, దాని తార్కిక పరమావధికి తీసికొనిపోతే, ఆ సూక్ష్మాతిసూక్ష్మజీవి రూపంనుండి మనుష్యరూపం వరకు, పరిణమించిన ఆ మహాశక్తి, ప్రకృతి కల్పించే అంతరాయాలన్నిటిని, కాలక్రమంలో విజయవంతంగా ఎదుర్కొని, చివరకు ప్రకృతి పరిసరాల నన్నిటినీ తప్పించుకొని విముక్తమవుతుంది కదా? ఈ భావాన్ని ఆధ్యాత్మిక భాషలో చెబితే “ప్రతి కర్మకు విషయం, విషయి అనే రెండు అంగాలుంటాయి. జీవితానికి ఏకైక లక్ష్యం, విషయికి విషయంపై పూర్ణాధికారం కల్పించడమే” అవుతుంది. ఇందుకొక ఉదాహరణం నన్నొకడు, కసరి మాటలాడటంవల్ల నా మనసు నొచ్చు కుంటుంది. అప్పుడు నేనేం చేస్తాను. పరిసర సన్నివేశాలు ఎలాంటివైనా, బాధపడకుండా ఉండే శక్తిని ఆర్జించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు వాని ఇష్టమొచ్చినట్లు వాడు మాటలాడుకోవచ్చు. నేను చలింపను. విజయార్థం మనం అందరం చేసే సాధన ఇట్టిదే. నైతిక ప్రవర్తనమంటే ఏమి? విషయికి పరమాత్మతో సామరస్యం కల్పించి, అనిత్య ప్రకృతి దాస్యంనుండి విముక్తిని పొందే బలాన్ని అతనికి చేకూర్చడమే కదా? ఈ ప్రకృతి అనంత వస్తువు కాదు కాబట్టి మన పరిసరాలనన్ని మనం జయించగల దినం వచ్చి తీరుతుందనడం మా వేదాంత సిద్ధాంతం.
మనం గ్రహించాల్సిన మరొక విషయం ఉంది. ప్రకృతి అనంతం కాదని మనకెలా తెలుసు? తత్త్వవిచారం మూలంగానే, అది మనకు బోధపడుతుంది. పరిచ్ఛిన్నమైన అఖండ పదార్థమే ఈ ప్రకృతి. కాబట్టే, దీనికి ఆద్యాంతాలున్నాయి. అందువల్ల ఈ పరిసరాలన్ని మనం జయించే దినం వచ్చి తీరాలి. కాని జయించడం ఎలా? మన చుట్టూవున్న వస్తుకోటనంతా జయించడం సాధ్యమా? కాదు, అది అసంభవం. నీటిలోని తన శత్రువర్గం నుండి, చిరుచేప తప్పించుకోజూస్తుంది. ఆ కోరికనది ఎలా సాధించుకొంటుంది? రెక్కలుగల పక్షిగా మారడంవల్ల. తన పరిసరాలగు నీటినిగాని, గాలినికాని మార్చడంవల్ల కాదు. అంటే మార్పు ఎప్పుడూ ‘విషయి’ లోనే కలగాలి. లోకంలో కలిగే పరిణామక్రమాన్ని అంతా విచారించి చూస్తే, విషయిలో కలిగే మార్పువల్లే, ప్రకృతిపై విజయం చేకూరుతూ వుంటుందని తెలుస్తుంది. ఈ ధర్మం, నైతిక జీవితానికి, ఆస్తికధర్మ జీవితానికి కూడ అన్వయిస్తుంది. కీడుపైన విజయానికంతా, ‘విషయి’ లో కలిగిన మార్పే కారణంగా ఉంటుంది. కాబట్టి అద్వైత వేదాంతం, మానవుని అంతరంగిక పరివర్తనానికి అత్యంత ప్రాముఖ్యమిస్తోంది. దౌష్ట్యం, క్లేశం – అనడమంతా – అర్థరహిత ప్రసంగం. అవి మీ వెలుపల లేవు. కోపానికి ఏ మాత్రం తావీయకుండేంత మనోదార్డ్యం నాకుంటే నాకు కోపమెన్నడూ రాదు. అట్లే ద్వేషానికి అందకుండా వుంటే, నా కెన్నడూ ద్వేషం కలుగజాలదు.
కాబట్టి, “మన పరిసరాలను జయించడం ఎలా?” అనే పై ప్రశ్నకు “మన ఆంతరంగిక బలానికి పరిపూర్ణత చేకూర్చుకోవడం” అనే సమాధానం ఆధునిక పరిశోధనలతో – భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో – ఏకీభవిస్తూ, వానిని మించి, మరికొన్ని అడుగులుకూడ వేసినది అద్వైత మత మొక్కటే అని నేను చెప్ప సాహసిస్తున్నాను. అందుచేతనే ఆధునిక శాస్త్రజ్ఞులకు, ఆ మతంపై మిక్కిలి ఆదరం ఉంది. పూర్వపు ద్వైత మతములు వారిని తృప్తి పరుపలేదు. వారి పరీక్షకు అవి తట్టుకోలేక పోయాయి. మనిషికి విశ్వాసం వుండాలనడం నిజమే. కానీ కేవలం విశ్వాసమే చాలదు. బుద్ధితో కూడిన (ఆలోచనాత్మకమైన) విశ్వాసం అవసరం. ఇప్పుడు – ఈ 19 వ శతాబ్దాంతంలో – తమ అనాది సిద్ధ మతానికి సంబంధించని మతాలన్నీ అసత్యాలు అని బుద్ధిపాటవం గలవారెవ్వరూ చెప్పరు. అట్టి అపరిపక్వ భావాల్ని ఇప్పటికైనా వదలాలి. ఈ హితోపదేశం మీ దేశానికే కాక అన్ని దేశాలకూ అన్వయిస్తుంది. అన్నిటకన్న ఎక్కువగా మా దేశానికి అన్వయిస్తుంది. అక్కడ ఈ అద్వైత మతాన్ని జనసామాన్యానికి అందనివ్వలేదు. మొదట అది కొందరు తాపసులకు లభించింది. వాళ్లు దాన్ని అరణ్యాలలో తాము నిర్మించుకొన్న ఆశ్రమాలకు తీసికొని వెళ్ళారు. దానికి అందువల్ల “ఆరణ్యక తత్త్వశాస్త్రం” అనే పేరు వచ్చింది. దైవానుగ్రహంవల్ల బుద్ధుడు అవతరించి దాన్ని జనసామాన్యానికి విచ్చలవిడిగా బోధించాడు. దేశ జనులంతా దాన్ని అంగీకరించి బౌద్ధులయ్యారు. కాలాంతరంలో నాస్తికులు, అజ్ఞేయవాదులు బయలుదేరి, జనులకు మతిభ్రష్టత కల్పించడంవల్ల, అనాత్మవాదపరమై, కూలిపోవ నారంభించిన దేశాన్ని మళ్ళీ అద్వైతమతమే పునరుద్ధరించింది.
కాబట్టి అద్వైత మతం అనాత్మవాద కూపంనుండి, హిందూ మతాన్ని రెండుసార్లు సంరక్షించింది. ఈ అనాత్మవాదం బుద్ధుని రాకకు ముందు భయంకర వ్యాప్తిని పొందింది. ఈ కాలపు అనాత్మవాదంకన్నా అది ఎంతో ఘోరం, ఎంతో వికృతం. ఇప్పటి అనాత్మవాదులకు, నాకూ ఒక విధమైన ఏకీభావం ఉంది. ఉన్నది ఒక్క వస్తువనియే నా మతంకూడా. అది ‘ఆత్మ’ అని నా వాదం. భౌతిక (జడ) పదార్థమని వారి వాదం. మనకు గల విశ్వాసం, ఆస్తికత, సర్వమూ జడపదార్థంనుండే కలిగిందని వారూ, బ్రహ్మంనుండి కలిగిందని నేనూ అంటాం. బుద్ధుని పూర్వపు అనాత్మ వాదంలో ఇంతమాత్రపు అనుకూలతకూడా లేదు. “తినండి, త్రాగండి, ఉల్లాసంగా బ్రతకండి, భగవంతుడు లేడు, ఆత్మ లేదు, పుణ్యలోకం లేదు. ఆస్తికధర్మం, దుష్టులైన మతాచార్యులు, పూజారులు కల్పించిన బూటకం” అని వారి బోధ. “బ్రతికినంత కాలం, సాధ్యమైనంత సుఖం అనుభవించాలి. అప్పు తెచ్చి అయినా తింటూండాలి. అప్పు తీరకపోతే పోనివ్వండి”. ఈ మతం అపారంగా వ్యాపించిపోయింది. దానికిప్పటికి, “లోకాయత దర్శన” *మని పేరు. బుద్ధుడు, వేదాంతమతాన్ని బహిరంగపరచి, జనులకు బోధించి, హిందూదేశాన్ని కాపాడాడు. ఆయన నిర్యాణానంతరం వేయి సంవత్సరాలకు అట్టి దుస్థితే దాపురించింది. అప్పటి బౌద్ధమతంలో, వెర్రి గుంపు సామాన్య ప్రజలు. ఇట్లెందరో ఉండటం వల్ల, వారిలో ఎక్కువపాలు అజ్ఞానంలో మునిగి వుండటం వల్ల బౌద్ధమతం కాలక్రమంలో చెడు త్రోవలలో పడి గుణహీనమయింది. బౌద్ధ మతంలో దేవుడు కాని, జగత్పరిపాలకుడుకాని లేకపోవడంతో జనులు క్రమక్రమంగా వారి తొల్లిటి దేవుళ్లను, తొల్లిటపిశాచాలను, తొల్లిటి భూతాలను మళ్ళీ బయటకు తీసి, బౌద్ధమతం పేరిటనే “కలగూర గంప” అయిన బీభత్స మతాన్ని ఒకదాన్ని ఆచరణలోకి తెచ్చారు. అగ్రజాతులలో విచ్చలవిడి నడతగాను, హీనజాతులలో మూఢవిశ్వాస రూపంలోనూ, అనాత్మవాద మతం మరల వ్యాప్తమయింది. అంతట శంకరాచార్యుడు అవతరించి, వేదాంత మతానికి మరల ప్రాణంపోసి, దానికి హేతుబద్ధరూపం కల్పించాడు. ఉపనిషత్కర్తలు తమ అభిప్రాయాలకు అంతగా కారణాలు వివరించలేదు. వేదాంత మతాన్ని నైతిక దృక్పథంనుండి చూచి బుద్ధుడు, వైజ్ఞానిక దృక్పథంనుండి చూచి శంకరుడు తమ బోధలు చేశారు. శంకరాచార్యుడు ఆ మతాన్ని అతిజాగ్రత్తతో పరిశీలించి వాదా లన్నిటికీ, కార్యకారణ రూపసంబంధాన్ని కనుగొని, దాన్ని విపులీకరించి, అత్యద్భుతమైన అద్వైత మతాన్ని లోకుల యెదుట పెట్టాడు.
యూరోప్‌లో ఇప్పుడు అనాత్మవాదం వ్యాప్తిలో ఉంది. ఈ సంశయాత్ములు వినాశమొందకుండా మీరు, వారి కోసం భగవంతుని ప్రార్థించవచ్చు. కానీ వారంత మాత్రాన జంకి, లొంగిపోరు. హేతువాదం కానీ వారిని తృప్తిపరచదు. యుక్తియుక్తమైన మతమొక్కటే మీ దేశాన్ని ఉద్ధరించగలదు. తార్కిక బుద్ధికి ఆగగల మతం – ఆ భిన్నత్వాన్ని, ఏకత్వాన్ని, నిర్గుణత్వాన్ని, బోధించే మతం – అద్వైతమొక్కటే. ఆస్తికత క్షీణించి, అధర్మం అభివృద్ధి పొందడం మొదలైనప్పుడల్లా ఈ అద్వైత మతం పొడచూపుతుంది. కాబట్టి యూరోప్, అమెరికా ఖండాలలో అది నాటుకొంది.
అద్వైత వేదాంతాన్ని గూర్చి ఇంకొక మాట చెబుతాను. పూర్వకాలపు ఉపనిషత్తులలో అత్యున్నత కవితా మహత్వం ఉంది. మహిత భావ సందీపిత కవితవల్ల మానవులకు, దివ్యభావోద్వేగం కలుగుతుందని ప్లేటో చెప్పాడు. అందుకే కాబోలు కవితా మూలమున లోకాన్ని దివ్యభావ ప్రదీపం చేయడానికై మానవాళికి – సత్యాన్ని చూపడానికై మహర్షులు, మానవాతీతులై, మంత్ర ద్రష్టలై యథార్థ ద్రష్టలై ఒప్పారు. వారు ఎన్నడూ ఉపన్యసించలేదు. దార్శనిక విచారాలు చేయలేదు. గ్రంథాలు రచించలేదు. కానీ వారి హృదయాలనుండి మనోహర గాన రసముబికి వెల్లివిరుస్తూండేది. బుద్ధుని హృదయం విశ్వ మానవ కళ్యాణాత్మకం. ఆయన ఓరిమి మేర లేనిది. ఆయన బోధించినది జన సామాన్యానికి ఆచరణయోగ్యమైన, తేటతెల్లమైన మతం. దాన్ని ఆయన ఇంటింటికి కొనిపోయాడు. శంకరాచార్యుని బుద్ధిపాటవం వర్ణనాతీతం. అతని తార్కికశక్తి అత్యంత తీక్షణం. విశ్వమానవ ప్రేమకారుణ్యాలతో, పొంగారు బుద్ధుని హృదయం, తేజోదుర్నిరీక్ష్యమైన శంకరుని బుద్ధి నేడు వియ్యమందాలి. ఆ సంబంధం వల్ల, అత్యున్నత తత్త్వజ్ఞానం వెలువడగలదు. అప్పుడు భౌతిక శాస్త్రాలకు, ఆస్తిక ధర్మానికి వైరం నశించి సఖ్యం చేకూర గలదు. ఇది భావికాలపు మతం కాగలదు. దీనికి మనం రూపమేర్పరింప గలిగితిమేని, ఆ మతం సార్వకాలికమై నిలిచి వుండటం నిస్సంశయం. ఆధునిక భౌతిక శాస్త్రాలు ఇప్పటికే చాలావర కీ త్రోవను పట్టినవి కావడం వల్ల, వానికిట్టి మతం మాత్రమే సమ్మతం కాగలదు. లోకంలోని సర్వవస్తువులూ, ఒక్క శక్తిదాల్చిన వ్యక్తరూపాలే అని భౌతిక శాస్త్రజ్ఞుడు అన్నప్పుడు, ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన భగవంతుడు మన జ్ఞప్తికి రాడా? “జగత్తులో ప్రవేశించిన ఒక్క అగ్నియే అనేక రూపాలు పొంది కన్పించే విధంగా, ఆ సర్వ భూతాంతరాత్మ ఒక్కటే ఇన్ని ఆత్మలుగా భాసి స్తున్నది. అంతటితో అది ముగిసిపోక, ఇంకా అనంతంగానే మిగిలింది.” భౌతికశాస్త్రం ఏ త్రోవలో సాగుతోందో తెలిసింది కదా? తత్వశాస్త్రం ద్వారా హిందూజాతి మనశ్శాస్త్రాంశాలను హృదయంగమం చేసికొంది. యూరోప్ దేశస్థులు బాహ్య (జడ) ప్రకృతితో ఆరంభించి పరిశీలించారు. కాని ఇప్పుడు వారూ అదే నిశ్చితార్థానికి వచ్చారు అంటే, మానసిక పరిశోధన ద్వారా, మనం చివరకి అ ఏకత్వాన్ని, ఏ విశ్వాత్ముని, ఏ సర్వాంతర్యామిని, ఏ సర్వవస్తు సత్యాన్ని, ఏ నిత్యముక్తుని, ఏ నిత్యానందుని, ఏ నిత్యుని చేరుతామో – భౌతిక శాస్త్ర పరిశోధనల ద్వారాకూడ, మనం ఆ ఏకత్వాన్నే చేరుతాం. అఖీల ప్రపంచ మూలమైన ఒక్క శక్తే, సకల చరాచర రూపంలో కనిపిస్తున్న దనీ, మానవజాతి నడిచేది, విముక్తి మార్గంలో కాని, దాస్య మార్గంలో కాదనీ, భౌతిక శాస్త్రాలు బోధిస్తున్నాయి. మానవుడు నీతి మార్గంలో ఎందుకు నడవాలి? ఆ మార్గం బంధ విమోచనానికి, అవినీతిమార్గం దాస్యానికీ కొంపోవును కనుక.
అద్వైత మతంలో మరొక విశిష్టత వుంది. అది విధ్వంసన మార్గాన్ని ఎప్పుడూ చేపట్టలేదు. ఇంకొక అద్భుత విశేషమేమంటే, “ఎవ్వరికైనా – అజ్ఞానంచే క్షుద్ర రూపారాధనలం దాసక్తులైన వారికైనా, వారి విశ్వాసాలను చలింప చేయరాదు. చలింప చేయడానికి బదులు, వారిని క్రమక్రమంగా ఉన్నత మార్గాలు పట్టేలా చేయాలి. ఇతడని అతడని చూడక, భేదాలు పాటింపక, అందరికీ తోడ్పడుతుండాలి” అనే బోధ. అద్వైతంలో ప్రతిపాదింపబడిన దైవం సమష్టి స్వరూపుడు. సర్వమూ ఆ దైవంలోనివే. ప్రతి మానవునికి అనుకూలించే విశ్వజనీన మతాన్ని అన్వేషించేవారు, కొన్ని మతాలను మాత్రమే దృష్టిపథంలో ఉంచుకోరాదు. సర్వ మతాలూ అందులో చేరేలా చూడాలి. అంటే అది ప్రాథమికములు మొదలు పరిపక్వముల వరకు – అన్ని తరగతుల మతాలకు అన్వయించే సమష్టి స్వరూపం కలదిగా ఉండాలి.
ఈ ఆశయం మరి ఏ ఇతర మతంలోకూడా స్పష్టంగా కానరాదు. ఆ మతాలన్నీ అంశములే. సమష్టి స్వరూపం పొందడానికి పాటుపడు తున్నవే. అంశముల ఉనికి, ఈ సమష్టిత్వం కోసమే. కాబట్టి అద్వైత మతమెప్పుడు గానీ, హిందూదేశంలో కల వివిధ భిన్న మతాలతో కలహించ లేదు. ఆ దేశంలో ఇప్పుడెందరో ద్వైతులున్నారు. వారి సంఖ్యయే అత్యధికం. బుద్ధిపరిణతి పొందని వారికి ఆ మతమే సరియైనదని తోస్తుంది కదా? “ప్రపంచం అనడానికి అదే కదా సులభం, స్వాభావికం, సామాన్యబుద్ధికి గోచరం అయిన అర్థం. కానీ అద్వైతులకు వారితో కలహం లేదు. ఈశ్వరుడు జగత్తు బైట ఎక్కడనో పుణ్యలోకంలో ఉన్నాడని ద్వైతీ, తన ఆత్మయే ఈశ్వరుడు, ఆయన దూరన వున్నాడనడం అపచారమని, దోషభూయిష్ట ప్రసంగమని అద్వైతీ అంటారు. అద్వైతికి భేద భావమే దుస్సహం. సమీప వస్తువు లన్నిటికన్నా ఆయన సమీపస్థుడు. “ఏకత్వం” అనడం కన్నా, ఆ సామీప్యాన్ని తెలుపగల మాట ఏ భాషలోనూ లేదు. తక్కిన ఆశయాలన్నీ అతనికి అసంతృప్తికరాలే. కానీ ద్వైతికి ఇట్టి తలంపు ఘోరాపచారంగాను, దుస్సహంగానూ తోస్తుంది. అయినా అద్వైతి ద్వైతితో కలహించడు. ఇతరాభిప్రాయాలుండడం సహజమే అనీ, ఆ త్రోవ సరియైనదే అనీ, అతడు భావిస్తాడు. “ద్వైతికి అనేకత్వం కన్పించియే తీరాలి! అదే అతనికి స్వాభావికం. కాబట్టి అతన్ని అలాగే చూడనివ్వండి –” అని అద్వైతి భావిస్తాడు. అతని వాదం భిన్నమైనా అతడుకూడ తన గమ్యానికే గదా పయనిస్తున్నాడు? ద్వైతి ఇట్లేమాత్రం తలచడు. అతని దృక్పథంనుండి, ఇతర భావాలన్నీ తప్పులే. ద్వైతులంతా – ప్రపంచంలో ఎక్కడి వారైనా – సగుణ బ్రహ్మనే నమ్ముతారు. దీనిలో వింతేముంది? ఆ దైవానికి కేవలం మానవ లక్షణాలే. ఆ మహాప్రభువు ఒకని యెడల సముఖుడు, మరొకనియెడ విముఖుడు. అకారణంగా, అతడొక్కొక్కని పట్ల, ఒక్కొక్క జాతి పట్ల పక్షపాతం వహించి, వారిని తన అనుగ్రహంతో ముంచి తేలుస్తాడు. ఇందువల్ల భగవంతునికి కొందరు ఇష్టులుంటారని ద్వైతికి నమ్మకం కలుగుతుంది. తాను అందులో ఒకడు కావాలని అతనికి కోరిక. “మా దేవునికి మాపై అనుగ్రహం. మా మతాన్ని నమ్మిన వారికిగాని, ఆయన అనుగ్రహం లభించదు” అనే ఆశయం, ఇంచుమించు, అన్ని (ద్వైత) మతాల్లో వుంది. దైవానుగ్రహాన్ని పొందే అదృష్టంతో జన్మించిన ఏ కొద్దిమందో తప్ప తక్కిన వారు, తలక్రిందులుగా తపస్సు చేసినా, తరింపజాలరను ధృడవిశ్వాసంగల ద్వైతులుకూడ కొందరున్నారు. “తరింపగోరే వారికి మా మతమొక్కటే మార్గం” అనే విశ్వాసం కొద్దిగానో, గొప్పగానో ప్రకటించని ద్వైత మత మొక్కటైనా లేదని పందెమొడ్డి చెప్పవచ్చు. కాబట్టే ద్వైత మతాలు ఒండొంటితో నిరంతర యుద్ధాలు సల్పుతూండడం. ఇలా ఉండక పోవడం స్వభావవిరుద్ధం కదా? మరొక విషయం ద్వైతులు పామర జనులనుబ్బించి, లోకాదరణమందుట వాడుక. తమకు కొన్ని అసాధారణాధికారాలు, ప్రత్యేకమైన హక్కులు వున్నాయనుకోవడం వారికిష్టం. చేత బెత్తం పట్టుకొని కొట్టడానికి సిద్ధంగా వుండే భగవంతుడొకడుంటే తప్ప, మానవులు నీతిపథంలో నడవ జాలరని ద్వైతి భావిస్తాడు. ఆలోచించుకోలేని పామర జనులు, ప్రాయికంగా ద్వైతులుగానే వుంటారు. ఎన్నో వేలేండ్లు పాప మీ సామాన్యజనులు ప్రతి దేశంలో హింస పాలయినారు. కాబట్టే, “తరించడం” అనే మాటలకు హింసా భయ విముక్తి అనే వారి అభిప్రాయం. “ఏమీ? మీ మతంలో సైతాన్ లేడా? అదెలా సాధ్యం?” అని అమెరికా దేశ క్రైస్తవ మత ప్రచారకుడొకడు నన్నడిగాడు. కాని ప్రపంచంలో జన్మించిన లోకోత్తర పురుషులంతా, అత్యున్నతమైన నిర్గుణ దైవాన్నే అవలంబించారు. “నేను, నా తండ్రి వేర్వేరు కాము” అని పల్కిన మహాపురుషుని శక్తే లక్షోప లక్షల జనులకు సంక్రమించింది. ఎన్నో వేలేండ్లుగా అది నీతిపథాన్నే చూపుతోంది. ఆ మహనీయుడు అద్వైతి కాబట్టి, దయామయుడైనాడు అని మనకు తెలుసు. సగుణ దైవంకన్నా పైమెట్టుకు ఎక్కలేని పామరులతో ఆయన “పుణ్యలోకంలో వుండే మీ తండ్రిని ప్రార్థించండి” అన్నాడు. అంతకన్న కొంత ఉన్నతాశయం గ్రహించగల వారితో “నేను తీగను, మీరు దాని రెమ్మలు (ఉపశాఖలు)” అన్నాడు. కాని ఎవరి ద్వారా తన తత్వాన్ని చాలా వరకు వ్యక్తపరిచాడో ఆ శిష్యులకు, “నేనును, నా తండ్రియు అభిన్నులం” అనే పరమసత్యాన్ని తెలిపాడు.
బుద్ధ భగవానునికి ద్వైత దైవములం దేమాత్రం ఆదరం లేదు. ఆయన అనాత్మవాది అనీ, నిరీశ్వరవాది అనీ అంటారు. కానీ ఆ మహాత్ముడు క్షుద్రజీవి అయిన ఒక మేకను సంరక్షించడానికి తన శరీరాన్ని అర్పింప సమకట్టాడు. ఆయన జగతిలో విస్తరింపజేసిన నైతిక ధర్మాలు అత్యున్నతాలు. అంతకన్న ఉదార ధర్మాలు ఏ దేశంలోనూ లేవు. ఎక్కడ పుట్టిన నీతి శాస్త్రమైనా, ఆ మహానీయుని దివ్యతేజంలోని కిరణం వంటిదే. ప్రపంచ చరిత్రలో అత్యద్భుతమైన నూతన యుగమిప్పుడు ప్రారంభమైంది. ఇప్పటబుద్ధి పరిపాకాన్ని ఎవ్వరూ, నూరేండ్ల క్రిందటకూడా, కలలోనైనా చూచి ఉండరు. ఇప్పటి వైజ్ఞానిక కల్లోల పరంపరను, ఎవ్వరూ యాభై ఏళ్ల కిందటకూడ కలలోనైనా చూచి ఉండరు. ఇట్టి, ఈ అత్యద్భుత పురోగమన కాలంలో, ప్రపంచంలోని విశాల హృదయాలను సంకుచితపరచి, స్వల్ప పరిమితులలో ఇమిడేలా చేయడం సాధ్యమా? ఇలా చేయాలనుకోడం వాళ్లను మృగప్రాయులుగా, బుద్ధి వివేక రహితులుగా, పామరులుగా చేయడమే. వారి నైతిక జీవమును నశింప చేయడమే. అపార హృదయ వైశాల్యంతో, అత్యున్నత బుద్ధిపాటవం; అనంత కారుణ్యంతో, అనంత జ్ఞానం సమ్మేళనం పొందడమే ఇప్పుడవసరం. భగవంతునికి ఈ మూడు లక్షణాలు మాత్రమే వున్నాయని వేదాంత సిద్ధాంతం. అఖండ సత్త (ఉనికి), అఖండ చిత్తు (జ్ఞానం), అఖండానందం. ఈ మూడు ఆభిన్నాలని వేదాంత వాదం. చిదానందాలులేని సత్త, చిత్తులేని ఆనందం, ఆనందంలేని చిత్తు వుండడం అసంభవం. కాబట్టి అఖండ సచ్చిదానందం మనకు కావలసింది. అదే మన ఆదర్శం. వీని సమత్వం కావాలి. అసమత్వం కాదు. శంకరుని బుద్ధి, బుద్ధుని హృదయం సమ్మేళనం పొందడం సాధ్యమే. మనమంతా, ఆ అత్యద్భుత ధర్మం, ఆ ఉదారాశయ సిద్ధిని సాధించ యత్నింతుముగాక అనడమే నా ఆశయం.