(తేది 20–10–1896 నాడు లండన్లో ఉపన్యసించినది)
అద్వైత వేదాంతానికి మూలాధారప్రాయములైన సిద్ధాంతాలలో ఒకటై కనిపించే మాయ, అంకురరూపంలో, సంహితలోనే ఉందనీ, ఉపనిషత్తులలో విస్తరిల్లి, పరిణత రూపంలో కనిపించే భావాలన్నీ, ఏదో ఒక రూపంలో, సంహితల్లోనే కనిపిస్తున్నాయనీ మనకిప్పటికే తెలుసు. “మాయ” అన్నది మీలో అనేకులకు ఇప్పటికే పరిచితమై వుంది. ‘భ్రాంతి’ అనే అపార్థంలో మాయాశబ్దం తరచు వాడుతారని, “ఈ ప్రపంచం మాయ” అన్నప్పుడు, “భ్రాంతిజనిత” మనే అర్థం చెప్పవలసి వస్తుందనీ మీకు తెలుసు. ఈ అనువాదం అసంతృప్తికరమేకాక, తప్పుకూడ; మాయ అనేది ఒక వాదం కాదు. ప్రపంచ ధర్మాన్ని ఉన్నది ఉన్నట్టు తెలిపే మాట అది. సంహితలో అంకురరూపంలో కనిపించే ఆ శబ్దార్థాన్ని మొదట పరిశీలిస్తే దాన్ని గ్రహించడం సాధ్యమవుతుంది. “దేవతలు” అనే భావం ఎలా పుట్టిందీ మనం ఇప్పటికే చూశాం. మొదట వారు, బలిష్ఠులగు పురుషులే అనీ, వాళ్లల్లో అంతకన్నా ఆధిక్యమేమీ లేదనీకూడ మనకు తెలుసు. గ్రీకుల – యూదుల – పారసీకుల – ఇతరుల – పురాతన మతగ్రంథాలలో కనిపించే దేవతాకృత్యాలు కొన్ని ఘోరాతిఘోరాలై మీలో కొందరికి దుర్భరములుగా కన్పిస్తాయి. కానీ మనం ఈ 19 వ శతాబ్దంవారమనీ, ఆ దేవతలు, ఎన్నో వేల ఏళ్లనాటివారనీ, చదివేటప్పుడు మరిచిపోతాం. వాళ్లను పూజించే జనులుకూడ అట్టి చర్యలకు అలవాటుపడినవారే అవడంవల్ల, వారి కా దేవతల కృత్యాలు, అసాధారణాలుగా కానీ, భయానకాలుగా కానీ, కన్పించి వుండవు అన్న విషయాన్నికూడ మరచిపోతాం. మన జీవితకాలమందంతా నేర్చుకొంటూ వుండవలసిన ముఖ్యమైన పాఠమిది. ఇతరుల గుణాగుణ విమర్శ చేసేటప్పుడు, మన ఆదర్శాలనే ప్రమాణంగా తీసికోవడం సరికాదు. ఎవని చర్యలను, వానివాని ఆదర్శాల ప్రకారం విచారించాలికానీ, ఇతరుల ఆదర్శాల ప్రకారం కాదు. లోకులతో వ్యవహరించేటపుడంతా, మన మీ మహాప్రమాదానికి లోనవుతున్నాం. మన దేవతలను ప్రమాణంగా తీసికొని ఇతరుల దేవతలను, మన ఆదర్శాలను ప్రమాణంగా తీసికొని ఇతరుల ఆదర్శాలను, మన ఉద్దేశాలనుబట్టి ఇతరుల ఉద్దేశాలను, విమర్శించే దురభ్యాసమే మన కలహాలలో అనేక కలహాలకు మూలకారణమని నా దృఢవిశ్వాసం. నేను చేసిన పనినే, మరొకడుకూడ చేస్తే నన్ను పురికొల్పిన ఉద్దేశమే, వానినికూడ పురికొల్పిందని నేను భావిస్తాను. ఒక్క కార్యమే, వివిధ కారణాలవల్ల సంభవింపవచ్చునను సత్యాన్ని మరిచిపోవడమే ఈ మహాప్రమాదానికి మూలం. వాని ఉద్దేశం, నా ఉద్దేశానికంటే కేవలం భిన్నమేమో! కాబట్టి, ఈ పురాతన మతాలను గూర్చి విచారించేటప్పుడు, ఆ కాలపు తలపులు, ఆ కాలపు జీవితవిధానం, మనం జ్ఞప్తియందుంచు కోవాలి. మన ఇప్పటి దృక్పథాన్ని మరచి, ఆ కాలపు దృక్పథాన్ని అవలంబించాలి.
బైబిల్ పాత నిబంధనలో వర్ణింపబడిన, జెహోవా చర్యలలోని క్రౌర్యం, నిర్దాక్షిణ్యం చూచి ఎందరో ఆశ్చర్యచకితులౌతారు. కాని, ఏల? భగవంతుని గూర్చి మనమిప్పుడు కల్పించుకొన్న భావాలే, ఆ ప్రాచీనకాలపు యూదుల జిహోవాలోకూడ ఉండాలి అనడానికి వీరికేమి అధికారం? మనమింకొక విషయంకూడ జ్ఞప్తిలో పెట్టుకోవాలి. మతాన్ని, దేవుణ్ణి గూర్చిన ప్రాచీనకాలపు వారి ఆశయాలు, భవిష్యత్కాలంవారికి పరిహసనీయాలుగా అనిపిస్తాయి. కాని ఇలా మార్పులొందే భావాలనన్నిటినీ పరిశీలిస్తే వానినన్నిటిని ఒకటిగా చేర్చే, సువర్ణసూత్రంవంటి ఐక్యబంధమొకటి కనిపిస్తుంది. ఈ సూత్రాన్ని కనుగొనడమే వేదాంత లక్ష్యం. “ఈ వివిధాశయాలన్నీ ముత్యాలు. వీని అన్నిటిలోనూ దూరివుండే దారం నేను” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ఆధునికాభిప్రాయాలనుబట్టి ఆలోచించేవారికి, ఆ ఆశయాలు ఎంత అసంబద్ధములుగా, ఎంత దుస్సహాలుగా వున్నా, వాని నన్నిటిని ఒకటిగా కూర్చే దారాన్ని కనుగొనడమే వేదాంతం చేయవలసిన కార్యం. ఆ పూర్వకాలపు మానసికవాతావరణంలో ఆ ఆశయాలే, తృప్తికరములై పొందిక కలిగి ఉండేవి. ఆ వాతావరణంనుండి ఊడబెరికి, ఇప్పటి వాతావరణంలో పెట్టి పరీక్షించినప్పుడే అవి వికృతంగా కనిపించేది. ఆ కాలపు యూదుడు ఇప్పుడు సూక్ష్మబుద్ధియై, ఆధునిక మార్గాలవలంబించి ధనార్జనాపరుడైనట్లే, పూర్వకాలపు ఆర్యుడిప్పుడు హైందవుడై, ప్రాజ్ఞతకు పేరుగాంచినట్లే, మునుపటి జిహోవా, మునుపటి దేవతలుకూడ, ఇప్పుడు పరిణామం పొందారు. అర్చించువారిలోని పరిణామాన్ని గుర్తించి, అర్చితుని పరిణామాన్నికూడ గుర్తించకుండటం మిక్కిలి పొరపాటు. మనం ఎలా భావాల రూపాలమో, అట్లే దేవతలుకూడ భావస్వరూపులే. ఆ భావాలు ఎలా పెరిగాయో, ఈ భావాలు కూడా అలాగే పెరిగాయి. దేవుడు పెరిగాడనేమాట, మీకు కొంత వింతగా తోచవచ్చును. ఎలా పెరగగలడు? ఆయనలో మార్పులుండవు కదా? ఇది ఒక విధంగా నిజమేకాని, ఆ అర్థంలో మానవుడుకూడ పెరగడు. భగవంతుని గూర్చి మానవుని భావాలు సర్వదా మారుతున్నాయి. సర్వదా విశాలము లవుతున్నాయి. ఇంద్రియగోచరములైన మానవ స్వరూపాల కన్నిటికి, మూలమైన పారమార్థిక మానవుడు అచలుడు, అవికారుడు, పరిశుద్ధుడు, నిత్యపరిపూర్ణుడు అని మున్ముందు తెలుసుకోగలరు. అట్లే భగవంతుని గూర్చి మనకుగల తలంపుకూడ, మనం సృష్టించుకొన్నదే. మన భగవంతుడు, ఆ భావానికి మూర్తీభావమే. ఆ భావానికి, ఆధారభూతుడైన పారమార్థిక భగవంతుడు, నిత్యశుద్ధుడు, నిర్వికారుడు. కాని ప్రత్యక్ష భగవంతుడెప్పుడూ మారుతూ వెనుకవుండే సత్యాన్ని (పారమార్థిక భగవంతుని) క్రమాధికంగా వెలిపరచుతూంటాడు. సత్యాన్ని ఎక్కువ ప్రకటిస్తే “పురోగతి” (ప్రొగ్రెషన్) అనీ, ఎక్కువ మరగుపరచడాన్ని “తిరోగతి” (రిట్రాగ్రేషన్) అనీ అంటారు. అంటే మనం పెరిగేకొద్దీ దేవతలూ పెరుగు తుంటారు. సామాన్య దృక్పథంనుండి మాట్లాడితే, – మనం పరిణామం చెందేకొద్దీ, మన యథార్థత ఎట్లు బయటపడుతూంటుందో, అట్లే దేవతలు పరిణామం చెందేకొద్దీ, వారి యథార్థతకూడ బయటపడుతూ ఉంటుంది.
మనం ఇప్పుడు మాయావాదాన్ని గ్రహింపగలుగుతాం. లోకంలో ఉండే సర్వమతాలను విచారించే వారికి స్ఫురించే ప్రశ్న యిది. లోకంలో సామరస్యం లేకపోవడానికి కారణమేమి? ఈ దుఃస్థితి ఎట్లేర్పడింది? మతభావోత్పత్తి అయిన ప్రాచీనకాలంలో, ఈ సమస్యలు లేవు. ఆదిమకాల మానవుడికి లోకంలో అసంబద్ధత ఏదీ కన్పించలేదు. తన చుట్టుపట్ల వున్న స్థితిగతులు అతనికి ప్రతికూలం కావు. అభిప్రాయభేద బాధలేదు. మంచి చెడ్డలు వేర్వేరు అనికూడ తోచలేదు. కాని అతని హృదయంలో ఒకప్పుడు సమ్మతికి సూచన, ఒకప్పుడు అసమ్మతికి సూచన స్ఫురిస్తూ ఉండింది. అతడు తాత్కాలిక హృదయప్రేరణలను అనుసరించి ప్రవర్తించేవాడు. ఎప్పటికెలా తోచితే అలా ప్రవర్తించాడు. దేహశక్తిని వినియోగించి తోచిన పనిని చేశాడు. కార్యాకార్య విచారణ లేదు. హృదయప్రేరణలను నిరోధించే ప్రయత్నమే లేదు. ఆదిమకాల దేవతలూ అటువంటివారే. వారి ప్రవర్తనలకూ, తాత్కాలిక హృదయప్రేరణలే కారణం. ఇంద్రుడు వచ్చి రాక్షసబలాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు. జిహోవాకు ఒకనిపట్ల అనుగ్రహం. మరొకనిపట్ల ఆగ్రహం. అందుకు కారణం ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరూ ఆలోచించరు. విమర్శించే ఆచారమే అప్పటికి ప్రారంభం కాలేదు. అతడేమి చేసినా అది సరే. మంచిచెడ్డలు అనుభవమే లేదు. మనకిప్పుడు దుష్కార్యాలుగా కనబడే వానిని దేవతలెన్నో చేశారు. ఇంద్రాదు లెన్నోసార్లు ఘోరములైన దుష్కార్యాలు చేశారు. కానీ, ఇంద్రు నారాధించువారికవి దుష్కార్యాలనే భావమే స్ఫురించలేదు. అందువల్ల వారతనిని ప్రశ్నించలేదు. నైతికాశయాలు అభివృద్ధి పొందేకొద్దీ, సంఘర్షణం ప్రారంభమయింది. మానవబుద్ధిలో ఒక కొత్త జ్ఞానం (ఎరుక) కనిపించింది. దానికి ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క పేరు. అది ఈశ్వరవాణి కావచ్చు. పూర్వ విద్యాఫలం కావచ్చు. మరేదైనా కావచ్చు. కానీ దానిలోగల విశేషమేమంటే, అది మానవనైజములైన హృదయప్రేరణలను నిరోధించే ప్రభావం కలది. ‘చేయి’ అనే హృదయప్రేరణ కలిగిన వెంటనే, “చేయకు” అనే శబ్దమొకటవినిపిస్తుంది. ఇంద్రియాలద్వారా, బాహ్య ప్రపంచంలోనికి వెళ్లి రమించు అని మనస్సును ఎప్పుడును ప్రేరించే భావపుంజం, వెనువెంటనే “వొద్దు” అని బోధించే భావపుంజంకూడ ఒకటి వుంది. ఈ రెండోది మిక్కిలి నీరసమై, హీనస్వరం కలిగి వుంటుంది. కాని దాని ఉనికి నిస్సంశయం. ఈ రెండు ప్రేరణలను తెలిపే చక్కని సంస్కృత శబ్దాలు రెండున్నాయి. అవి ‘ప్రవృత్తి’, ‘నివృత్తి’. ముందుకు పోవడం, వెనక్కి అడుగు పెట్టడం, సాధారణంగా, మన కార్యాల కీ ప్రవృత్తియే కారణం. “వలదు” అని బోధించే నివృత్తితో ఆధ్యాత్మిక జీవనం (రిలిజను) ఆరంభమవుతోంది. అది లేనివానికి, ఆత్మాన్వేషణం ప్రారంభం కాలేదు. యుద్ధ నిమగ్నులైన దేవతలు, ఒక ప్రక్క అర్చింపబడుతూనే ఉండిరి. కానీ మరోప్రక్క ఈ నివృత్తిపరత ప్రవేశించి, మానవుల ఆశయాలను పెంపొందింపసాగింది. మానవ హృదయాల్లో ప్రేమ స్వల్పంగా అంకురించింది. అది అత్యంత స్వల్పం. ఇప్పటికీ అది అంతగా అభివృద్ధి పొందలేదు. మొదట దానికి ఒక తెగ లోపలనే ప్రచారం. ఆ తెగకు చేరినవారి అందరిపట్ల అది వర్తించుచుండి వుంటుంది. ఒక్కొక్క తెగకు చేరిన దేవుడు ఆయా తెగపట్ల ప్రేమ కల్గి దాన్ని సంరక్షిస్తూ వుండెడివాడు. కొన్ని జాతుల్లో ఒక్కొక్క వర్గంవారు, ఇప్పుడూ తామొక మూలపురుషుని వంశంలోని వారమని చెప్పుకొనునట్లే, ఆ కాలంలో కొన్ని తెగలవారు తాము, తమ దేవుని సంతతివారమని చెప్పుకొంటూ వుండేవారు. అట్టివాళ్లూ, సూర్యచంద్రాదుల సంతతివారమని చెప్పుకొనేవారు, ఇప్పుడుకూడ ఉన్నారు. సూర్య చంద్రవంశ చక్రవర్తుల బలపరాక్రమము లనేక ప్రాచీన సంస్కృత గ్రంథాలలో వర్ణింపబడి వున్నాయి.
మొదట్లో వారు సూర్యచంద్రాదులను పూజించి, కాలక్రమంలో వారి సంతతి వాళ్లమని అనుకోసాగారు. సంఘంలో ఈ భావాలు అభివృద్ధి పొందే కొద్దీ, ప్రేమ, ఒండొరుల పట్ల బాధ్యత, సాంఘిక వ్యవస్థ, ఇవన్నీ అంకుర ప్రాయాలుగా ఉప్పతిల్లినవి. సహనం, ఆత్మనిగ్రహం లేనిదే సాంఘిక జీవనం చేయడం ఎలా అనే ప్రశ్న అటు తర్వాత బయలుదేరింది. అప్పుడప్పుడు తమ హృదయ ప్రేరణల్ని అరికట్టక తాలిమి వహింపక, భావోద్రేకా నుసారమైన ప్రవర్తనను నిగ్రహింపకపోతే, ఇద్దరు ఒకటిగా కలిసి ఎలా జీవించగలరు? నిగ్రహించుకోవాలి అన్న తలపున కిదే మూలం. సాంఘిక జీవనమంతా ఈ నిగ్రహం మీదనే ఆధారపడివుంది. ఈ సహన నిగ్రహాలు నేర్వనివారి జీవితాలు, దుర్భర క్లేశమయంగా వుంటాయని మనకు తెలుసు.
ఈ పారమార్థిక భావాలు ఉదయించడంతోనే మానవబుద్ధికి ఇంకా ఉన్నతం, ఇంకా నైతికం అయిన మరేదో ఒకటి స్ఫురించింది. హద్దు పద్దులు లేక, పోరాటాలకలవడి, మద్య మాంసాలకు దాసులై, గాఢ మద్య మందలి, వేపుడు మాంసమందలి వాసనలచేగాని సంతృప్తినొందకుండిన దేవతలు ఇప్పుడు వెగటుగా తోచారు. ఇంద్రుడు ఒక్కొక్కసారి తప్పతాగి, నేలపైబడి అపస్మార ప్రలాపాలాడుతూ వుంటాడు. ఇట్టి దేవతల పట్ల అసహ్యం మొదలైంది. ఇటువంటి పనులకు మూలమైన ఉద్దేశాలేమో విచారించడం ప్రారంభమైంది. ఈ విచారణకు దేవతలుకూడ గురయ్యారు. వారి చర్యలకు తగు సమాధానమేమీ లభించలేదు. అందువల్ల ఆ గుణాలు గల దేవతలు పరిత్యజింపబడ్డారు. అంటే దేవతలను గూర్చిన ఆశయాలు ఉన్నతాలయ్యాయి. తొల్లిటి దేవతల సర్వగుణాలను, సర్వచర్యలను పరిశీలించి తమకు అసంగతంగా తోచినవానిని పరిత్యజించి, నిరాక్షేపంగా తోచినవానిని ఉంచి, వాని నన్నిటిని చేర్చి, దేవదేవుడు అనే, ఒక్కదేవుని కల్పించుకొన్నారు. ఈ దేవుడు కేవల శక్తిమంతుడు మాత్రమే కాడు. అంతకన్న ఆధిక్యమవసరమయ్యెను. అతడు నీతిప్రధానుడు. మానవులన్న అతనికి ప్రేమ. వారి కతడు ఉపకారి. కాని దేవుని దేవత్వం మాత్రం అలాగే నిలిచివుండింది. కానీ నైతికంగా అతనిని ఇప్పుడు ఉన్నతుణ్ణి చేశారు. అతని శక్తినికూడ అధికం చేశారు. లోకంలో అంతకన్న నీతి పరిపూర్ణుడు లేడు. అతడు సర్వ శక్తివంతుడు.
కాని, ఈ అతుకుల పనివల్ల కార్యసిద్ధి కాలేదు. విస్తరణ మధికమైన కొద్దీ పరిష్కరింప వలసిన సమస్యకూడ గాఢంకాజొచ్చింది. దేవుని గుణాధిక్యత పదింతలైతే, వానిని గూర్చిన సంశయాలు వేయింతలయ్యాయి. ఈ సర్వేశ్వరుని బాధ్యతతో పోల్చిచూస్తే, జిహోవా బాధ్యత కొద్దిపాటిది. ఈ చిక్కు, ఇప్పటికీ వుంది. ప్రేమ పరిపూర్ణుడు, శక్తి పరిపూర్ణుడు అయిన సర్వేశ్వరుని పరిపాలనంలో ప్రపంచంలో ఘోర సంఘటనలు ఎందుకు నిలిచివున్నాయి? సుఖం కంటే, దుఃఖాలు ఇంత అధికంగా వుండటానికి కారణమేమి? మేలుకన్నా, కీడు ఇంత ఎక్కువగా ఎందుకుంది? ఈ ప్రశ్నలన్నీ మరచిపోయినా, ప్రపంచం ఘోరహింసామయం అనే సత్యాన్ని మరచిపోవడం ఎలా? “ఇదిగో పసుపు, ఇదిగో ముసుగు” అని ఆశలు కల్పించి, నేలపాలుచేసే ఘోర నరకమిది. మన హృదయ ప్రేరణలు అత్యంత బలిష్ఠములు. కానీ ఆ వ్పాంచలను తీర్చుకొనేశక్తి మనకు లేదు. మన బుద్ధి ఎంత నిరోధించినా, నిలువక హృదయప్రేరణ మహాకల్లోలం, మనలను ముందుకు నెట్టుకొనిపోతుంది. కాని ఒక్క అడుగు వేసిన తోడనే దెబ్బ పడుతుంది. ఈ లోకంలో ఇలా జీవిస్తూ వుండడమే మన విధి. ఇంద్రియ భావాదర్శాలకు ఏమాత్రం అందుబాటులోలేని మహోన్నతాదర్శాలు మన బుద్ధికి గోచరిస్తాయి. కానీ, వానికి కార్యరూపం కలుగజేయడం మనకు అసాధ్యం. మన చుట్టుగల సామాన్యజనసమ్మర్దం మనల్ని అణచివేస్తుంది. అలా అని, ఆదర్శసాధన యత్నాలే మానుకొని, ఈ లోకంలో ఎలాగో కాలంగడుపుకొంటే, నేను మృగప్రాయుడనై, మనుష్య నామానికి అనర్హుడ నవుతాను. ఈ రెంటిలో ఏ మార్గమవలంబించినా సుఖం లభించదు. పుట్టినవారు పుట్టినట్లే సామాన్య జీవితంతో తృప్తిపొంది వుండేవారికి క్లేశమే ప్రాప్తి. అలాకాక, పశుప్రాయజీవితాన్నిష్టపడక సాహసించి ఉన్నతాదర్శ సాధనోద్యుక్తులైనవారికి అంతకన్నా వేయిరెట్లు అధికమగు క్లేశమే లభిస్తుంది. ఇదే ఉన్నత స్థితి. దీనికి కారణమేమి? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. సమాధానం వుండడమే అసంభవం. కాని ఈ చిక్కులోనుండి తప్పించుకొనే మార్గాన్ని వేదాంతం చూపుతోంది. నేను చెప్పవలసిన విషయాల్లో కొన్ని మీకు భయం కలిగించవచ్చు. కాని మీరు వానిని జ్ఞప్తియందుంచుకొని, ఆలోచించి మనస్సులకు ఎక్కించుకొంటే, ఆ సొత్తు మీదై మిమ్మల్ని ఉన్నత క్షేత్రానికి కొనిపోయి, సత్యాన్ని గ్రహించడానికి, సత్యంతో జీవించడానికి సమర్థతను ఇస్తుంది. “లేనిపోని, ఆశలు కల్పిస్తూ, వానిని కూలద్రోస్తూ ఉండే ఘోరనరకమే ఈ ప్రపంచం” అనడంలో అతిశయోక్తి ఏమీలేదు. దీనిని గూర్చి మనకేమీ తెలీదు. కానీ, తెలీదనడానికికూడ వీలులేదు. ఈ గొలుసును గూర్చి నాకేమీ తెలీనప్పుడు, అది వుందని నేనెట్లు చెప్పగలను? అది ఉన్నట్లు కనిపించడం భ్రాంతేమో? కలగంటున్నానేమో? మీ ఎదుట మాటలాడుతున్నాననడం, మీరు వింటున్నాననడం కలేమో? కల కాదని ఎవ్వరూ నిరూపింపజాలరు. నా బుద్ధియే కలలోని వస్తువేమో? ఎవ్వరూ తమ బుద్ధిని చూడలేదుకదా? అది ఉన్నదని చెప్పేవారందరికీ ఊహే ప్రమాణం. సర్వ విషయాలను గూర్చికూడ ఇదే స్థితి. నా శరీరం వుంది అనడంకూడ ఊహే. కాని దాని ఉనికి నాకు తెలీదని చెప్పజాలను. ఈ జ్ఞానాజ్ఞానముల నడిమి అవస్థ, రాత్రి, పగలుకాని దురవగాహమగు ఈ సంజవెలుగు, ఈ సత్యాసత్యముల కలయిక – వీని కలయిక ఎక్కడైనదీ ఎవ్వరికీ తెలియదు. కలలో నడవడం వంటిది మన జీవితం. సగం నిద్ర, సగం మెలకువ. మంచుతెర వంటిదేదో మన చూపును అడ్డగిస్తూ వుంటుంది. ఇదే మన అందరి గతి. ఇంద్రియగోచర జ్ఞానమంతటి గతీ ఇదే. తత్త్వజ్ఞానగతి, భౌతికశాస్త్ర జ్ఞానగతి – ఇంతేల, – మానవ జ్ఞానమంతటగతీ ఇదే. వీనిని గూర్చి ఎన్ని ప్రగల్భాలు పలికినా, నిజం మాత్రమిదే. జగత్తు లక్షణమే ఇది. భౌతిక పదార్థమనండి, ఆత్మ అనండి, మరేదైనా అనండి – ప్రతి వస్తువును గూర్చిన సత్యమిదే. అవి ఉన్నవని చెప్పజాలం. లేవనీ చెప్పజాలం. అవి ఏకం అనజాలం. అనేకం అనజాలం. వెలుగు చీకటుల కలయిక – ఒక మార్గం ననుసరింపక, స్పష్టంగా తెలిసికోవడానికి సాధ్యంకాక, వేరుచేయడానికి అలవికాక, – ఇందెప్పుడూ, నిత్య కేళీవిహారం సల్పుతూంటుంది. నిజంకాని నిజంకాదు; మెలకువ, కాని నిద్రకూడ; ఇదంతా లోకపు యథాతథస్థితి. దీనికే మాయ – అని పేరు. మన మీ మాయలో జన్మిస్తాం, ఈ మాయలో జీవిస్తాం. ఈ మాయలో తలచుకొంటాం. ఈ మాయలో కలలు కంటాం. దీనిలోనే మనం తత్త్వజ్ఞులం. దీనిలోనే సాధుపురుషులం. దీనిలోనే పిశాచులం. దీనిలోనే దేవతలం. మీ ఆశయాలు ఎంత విశాలంగానైనా వ్యాపించనీండి. ఎంత ఉన్నతికైనా ఎగురనివ్వండి. అనంత స్థితి నందినవనండి. లేక మీ ఇచ్ఛ వచ్చిన పేరింకేదైనా పెట్టుకోండి. ఈ ప్రచారమంతా మాయావరణం లోపలనే. దీనిని మార్చడం అసాధ్యం. మానవ జ్ఞానమంతా ఈ మాయా విస్తరణమే. అది గోచరించే విధంగా, దానిని గ్రహించడానికై చేసేప్రయత్నమే. ఇదంతా నామరూపాల కార్యం. రూపంగల ప్రతి వస్తువు, మీ మనస్సులో ఒక భావాన్ని నిర్మించేదంతా మాయలోనిదే. దేశకాల నిమిత్తములకు లోబడినదంతా, మాయలోనిదేకదా?
భగవంతుని గూర్చి ప్రాచీనకాలంలో ఉండిన ఆశయాలకు మళ్లీ వద్దాం. అవి ఏమయ్యాయి? శాశ్వత ప్రేమమయుడు, స్వార్థరహితుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన పురుషుడొకడు లోకాన్ని పరిపాలిస్తున్నాడను విషయంకూడ కొంతకాలానికి సంశయగ్రస్తమయింది. ధర్మమూర్తీ, ప్రేమమూర్తీ అయిన భగవంతుడు ఉండడం నిజమైతే, తన సంతానమైన జీవకోట్లు – మానవులు, ఇతర ప్రాణులు – కోటానుకోట్లు మరణిస్తూ వుండడం అతనికి కనబడదా? అని తత్త్వజ్ఞుడు ప్రశ్నించాడు. లెక్కలేని యితర ప్రాణులను హింసించకుండా, ఈ లోకంలో ఒక్క ప్రాణి అయినా క్షణకాలం జీవించడం సాధ్యమా? వేలకొద్దీ సూక్ష్మజీవులను నశింపజేయక, మీ రొక్కసారైనా ఊపిరిపీల్చగలరా? కోట్లకొలది జీవముల నాశమే మీ జీవనానికాధారం. మీ జీవితంలోని ప్రతి క్షణమూ, మీ ఊర్పులలో ఒక్కొక్కటీ, వేలకొద్దీ జీవులకు మరణం. మీరు కదిలినా, మెదలినా, కోట్లకొద్దీ జీవాలు నశిస్తున్నాయి. మీరు తినే ప్రతి కబళంతోను, కోట్లకొద్దీ జీవాలను చంపు తున్నారు. అవి ఎందుకు చావాలి? అవి క్షుద్రజీవులు కదా? అనే వెర్రివాదం ఒకటి వాడుకకెక్కింది. కానీ అది నిజమేనా? మానవుడధికమో చీమ అధికమో? ఎవరికి తెలుసు? ఇందులోని సత్యాసత్యాలను ఎవరు నిరూపిస్తారు? ఈ ప్రశ్నను అటుంచి అవి క్షుద్రజీవులని ఒప్పుకున్నా అవి ఎందుకు చావాలి? క్షుద్రములైనకొద్దీ, అవి జీవించడం మరీ ముఖ్యంకదా? వాని జీవనం ఇంద్రియాలలోనే కావడంవల్ల, వాని కష్టసుఖానుభూతులు, మనవానికన్న వేయిరెట్లధికం. కడుపు నింపుకోవడంలో కుక్కలకు, తోడేళ్లకు ఉండే హర్షపారవశ్యం మనకుంటుందా? మన శక్తికి ముఖ్య విహారభూములు బుద్ధి, ఆత్మ ఎలాగో, అట్లే వాని శక్తికి విహార భూములు ఇంద్రియాలు. వానికి ఇంద్రియాలే సర్వస్వం. అందు వానికి శివమెత్తిపోతుంది. మానవ జాతికి ఎన్నడు తెలియని మహాసంతుష్టిని అవి అందనుభవిస్తాయి. అట్లే వానికి, అందు కలుగు బాధకూడ అంత అధికం. మృగాల సుఖానుభూతి, మనదాని కన్నా, అంత అధికమైతే, వాని వ్యధానుభూతికూడ అంత అధికంగా ఉంటుందని స్పష్టమౌతోంది. ఎన్ని రెట్లో అధికమనికూడా చెప్పవచ్చు. అంటే మనిషి మరణయాతనకంటే, ఇతర ప్రాణుల మరణ యాతన వేయిరెట్లధికం. కానీ, మనం వానిని వధిస్తాం. పాపం, వానికింత తీవ్రవేదనను కలిగిస్తున్నామే అని ఏమాత్రమూ చింతించం. ఇది మాయ. మానవుని పోలిన, సగుణదైవ మొకడున్నాడనీ, అతడే ఈ ప్రపంచాన్నంతా నిర్మించాడనీ తలచితే, కీడులోనుండి మేలు కలుగుతుందను వాదం అంగీకరించబడదు. వేనవేల మేళ్లు రానిమ్ము. కాని అవి కీడులో నుండి ఎందుకు రావాలి? అది అంగీకరిస్తే, నా పంచేంద్రియ సుఖాల కోసం, నేను ఇతరుల గొంతులు కోయవచ్చు కదా? కీడులోనుండి మేలు ఎందుకు రావాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు. సమాధానం చెప్పడం అసాధ్యమని హిందూతత్వ శాస్త్రాలు అంగీకరించాయి.
వేదాంత మతంలాగా, నిరంకుశ ధైర్యసాహసాలతో సత్యాన్వేషణం చేసిన మతం ఇంకేదీ కానరాదు. దాని గమనాన్ని ఏదీ నిరోధింపలేదు. సత్యం పలుకగోరు వారినందరిని అణచివేయ జూచే మతాచార్య వర్గం లేకపోవడం, ఆ అన్వేషణకు ఎంతో సహకరించింది. మా దేశంలో మత ప్రచారకులకు ఎప్పుడూ పరిపూర్ణ స్వాతంత్ర్యం ఉంది. అక్కడ పూర్వాచారాల అధికారమంతా సాంఘిక జీవనంమీదనే. మీ పాశ్చాత్య దేశంలో సాంఘిక స్వాతంత్ర్యానికి మేరలేదు. సాంఘికాచార విషయంలో హిందూదేశంలో కఠినమైన కట్టడ ఉంది. కానీ మతాభిప్రాయాల విషయంలో ఎట్టి అడ్డంకులూ లేవు. ఇంగ్లాండులో ఎవరే బట్టలు తొడుగుకున్నా, ఎవరేమి తిన్నా అడిగేవారు లేరు. కాని, గుడికి పోవడం తప్పనీండి, వెంటనే అతడు ప్రజానింద పాలౌతాడు. మీరు మత విషయంలో సాంఘికాచారాన్ని పాటించి దాన్ని అనుసరించాలి. ఆ పిదప దాని సత్యాన్ని గూర్చి మీ ఇష్టమొచ్చినట్లు విచారించుకోవచ్చు. హిందూదేశంలో ఎవ్వడైన మరొక కులం వారింట భోజనం చేస్తే, సంఘమంతా వానిపైన బడి, వాని నణచివేస్తుంది. వస్త్రధారణ విషయంలోకూడ, తన పూర్వీకుల రీతిని అనుసరింపని వాని గతికూడ అట్లే. మొదటి రైలుబండిని చూడటానికి మరో గ్రామానికి వెళ్లినవాడొకణ్ణి వెలివేశారట. కాని మత విషయంలో మాత్రం, ఎట్టి నిర్బంధం లేదు. నాస్తికులు, అనాత్మవాదులు (మెటీరియలిస్ట్స్), బౌద్ధులు ప్రక్కప్రక్కనే నివసిస్తారు. వివిధ మతాలవారు, వివిధాశయాలవారు, క్రొత్తక్రొత్త మార్గాన్ని బట్టే ఊహలు – అభావ్యములైనవి కూడ కలవాళ్లు ఇరుగు పొరుగుల్లో ఉంటారు. అన్ని మతాల ప్రచారకులు, తమ తమ మతాలను బోధించి అనుచరులను సంపాదించుకొంటారు. దేవాలయ ద్వారాల దగ్గరే అనాత్మ వాదులు నిలుచుండి, తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తూంటారు. ఎవ్వరూ వారి తెరువుపోరు.
బుద్ధుడు మిక్కిలి వృద్ధుడై మరణించాడు. ఆయన జీవితాన్ని ఆసక్తితో చదివిన నా మిత్రుడొక అమెరికా దేశస్థుడు, భౌతికశాస్త్రవేత్త వున్నాడు. అతనికి బుద్ధుని మరణరీతి రుచించలేదు. సిలువ మ్రానిమీద కదా అట్టివారు మరణించాలి? ఎంత వెర్రి భావం? హత్యచేయబడటమే గుర్తా గొప్ప తనానికి? ఇట్టి తలపులు హిందూదేశంలో ఎన్నడూ లేవు. మహాపురుషుడగు బుద్ధుడు హిందువుల దేవతలను, జగదీశ్వరునికూడ నిందిస్తూ దేశమంతటా పర్యటించాడు. కాని పండుముదుసలి అయ్యేవరకు – ఎన్నభై యేళ్లు బ్రతికాడు. దేశంలో సగభాగాన్ని తన మతంవైపుకి త్రిప్పుకున్నాడు.
ఇక చార్వాకమతం. ఆ మతస్థులు ఈ 19 వ శతాబ్దంలో అయితే బహిరంగంగా బోధించలేకపోయేవారు. అంత అసభ్యరూపంగా, అంత ఘోరరీతిలో వారు అనాత్మవాదాన్ని బోధించారు. మతమంతా అసంబద్ధ ప్రలాపమనీ, అది మతాచార్యుల కుతంత్ర ఫలితమనీ, మూఢులు, వంచకులు, రాక్షసులు, వేదాలను కల్పించిరనీ, భగవంతుని ఉనికి, నిత్యమైన ఆత్మ ఉనికి, కల్ల అనీ వారు ప్రతి పట్టణానికి వెళ్లి, ప్రతి దేవాలయం దగ్గర, నిరాఘాటంగా బోధింపగల్గారు. ఆత్మ అనేదొకటి ఉంటే, మరణా నంతరం అది ఆలుబిడ్డల పట్ల మమతవల్ల ఎందుకు తిరిగిరాదు? ఆత్మ అనేది వుంటే, దానికి మరణానంతరంకూడ మమకారం నిలిచివుండాలనీ, అది మంచి వస్త్రాలను, చక్కటి భోజనాన్ని కోరుతూ వుంటుందని వారి తలంపు! ఇట్టి బోధలు చేస్తున్నా ఈ చార్వాకుల జోలికి ఎవ్వరూ పోలేదు.
మొట్టమొదటి నుండి, హిందూదేశంలో మత స్వాతంత్ర్యం మహోజ్వలంగా ఉండిందని మీరు దీనివల్ల గ్రహింపగలరు. స్వాతంత్ర్యం లేకపోతే, అభివృద్ధి అసంభవమని గుర్తుంచుకోండి. గురుపదవికి గల స్వాతంత్ర్యాన్ని మీ చేతుల్లో ఉంచుకొని, మీ యిష్టానుసారంగా ఇతరులను త్రోవచూపి నడిపిస్తూంటే, వాళ్లు అభివృద్ధి చెందుతారనీ, ఆ అభివృద్ధికి మీరు తోడ్పడగలరనీ భావించడం అర్థరహితం. అది అపాయకరమగు బొంకు. లక్షోపలక్షల జనుల అభివృద్ధిని ఇది నాశనం చేసింది. మానవులకు స్వాతంత్ర్య జ్యోతి ఉండుగాక! వారికి త్రోవచూపడానికి సమర్థమైనదది ఒకటే. మా హిందూదేశంలో ఆధ్యాత్మిక విషయాల్లో స్వాతంత్ర్యం ఇచ్చాం. నేటికిని మా మతభావనలో అపారమగు ఆధ్యాత్మికశక్తి వుంది. ఆ స్వాతంత్ర్యాన్నే మీరు, సాంఘిక విషయాలలో ఇచ్చారు. తత్ఫలితంగా మీకు అత్యత్భుతమైన సాంఘిక వ్యవస్థ లభించింది. మేము సాంఘికాభివృద్ధి కనుకూలించు స్వాతంత్ర్యాన్నీయలేదు. అందువల్ల మా సాంఘికస్థితి సంకుచితమై ఉంది. మీరు మత విషయాల్లో ఎప్పుడూ స్వాతంత్ర్యం ఇవ్వలేదు. అంతేకాక కత్తులతో, తుపాకులతో మీ మతాశయాన్ని ఇతర మతస్థులలోకి బలాత్కారంగా ఎక్కించారు. కాబట్టి మీ యూరోపు దేశీయుల మనసుల్లో మతధర్మాభివృద్ధి గిడసబారి, క్షీణరూపంలో ఉంది. మా దేశంలో సంఘానికి సంకెళ్లను వదలించాలి. మీ దేశంలో ఆధ్యాత్మికతకు సంకెళ్లను వదలించాలి. అలా జరిగితే, మానవుడు అత్యద్భుత వికాసంతో అభివృద్ధి నందగలడు. మానవుని ఆధ్యాత్మిక, నైతిక, సాంఘికాభివృద్ధులలో ఐక్యభావ మొకటి వుందని మనం గ్రహిస్తే, ఆస్తిక ధర్మమనేది దాని సంపూర్ణార్థంలో మన సంఘమంతటిలో ప్రవేశించి, మన జీవిత కార్యాలన్నిటిలో కనిపించు చుండాలని తెలుసుకోగలం. వేదాంత జ్ఞానదృష్టితో విచారిస్తే, విజ్ఞాన శాస్త్రాలన్నీ ఆస్తికధర్మానికి వ్యక్తరూపాలే అని తెలుస్తుంది. ప్రపంచంలోగల సర్వమూ అలాంటిదే అనీ తెలుస్తుంది.
ఈ స్వాతంత్ర్య వాతావరణంలో నిర్మింపబడిన శాస్త్రాలను రెండు శాఖలుగా విభజింపవచ్చు. ఒకటి అనాత్మవాదపరం, ఆక్షేపమయం; రెండవది ఆస్తికం, నిర్మాణపరం; అదేమి చిత్రమోకానీ, ప్రతి దేశంలో ఈ రెండు పక్షాలూ కనిపిస్తున్నాయి. సాంఘిక దురాచారమొకటి ఉందనుకోండి. దాన్ని ఒక పక్షంవారు, అతితీవ్రంగా ఖండించి, దానిపై అగ్నివర్షం కురిపిస్తారు. తమ అభిప్రాయమే సరైనదని వారికున్న విశ్వాసం, మొండి పట్టుదల క్రిందికికూడ దిగుతుంది. ప్రతి సంఘంలోను ఇలాంటి తీవ్రవాదులైన మూర్ఖులుంటారు. ఈ మూర్ఖాపవాదాల్లో పెక్కుసార్లు స్త్రీలు కూడ చేరుతారు. భావావేశం స్త్రీలకు నైజంకదా? ఇలా ఉద్ఘోషించేవారి కందరికీ కొందరు అనుచరులు లభిస్తారు. పడగొట్టడం సులభమైన పని. మూర్ఖావేశపరులు దేనినైనా పడగొట్టగలరు. కానీ నిర్మాణకార్యం వారికి అంతగా తెలీదు. వారు లోకానికి మంచి చేస్తున్నామని భావిస్తారే కానీ, వారు చేసే అపకారమే అధికం. సాంఘిక వ్యవస్థా నిర్మాణం ఒక్క దినంలో పూర్తయింది కాదు కాబట్టి, అట్టిదాన్ని మార్చాలంటే, దానిలోవున్న దోషానికి కారణం తెలుసుకొని దాన్ని తొలగించాలి. దూషణ మాత్రాన అది తొలగి పోదు. దోషమూలాన్ని సంస్కరిస్తే దోషం తనంతట తానే తొలగి పోతుంది. దాన్ని నిందిస్తూ ఎంతగా ఘోషించినా, ఫలం కలుగదు. అపకార రూపమైన ఫలం మాత్రం కలుగుతుంది. ఈ మూర్ఖావేశపరులు ఒక పక్షంవారు. రెండవ పక్షంవారు ప్రేమ, సానుభూతితో నిండిన మనస్సు కలవారు. అగాధ పరిశ్రమ చేసి మూలకారణాన్ని కనిపెట్టాలని వీరికి తెలుసు. వీరే మహా పురుషులు. సాధుసత్తములు. లోకంలోని ప్రతి మతకర్త “పూర్వ మతప్రవక్తల బోధను పరిపూర్ణం చేయడానికై నా రాక, దాన్ని కూల ద్రోయడానికి కాదు” అని ప్రకటించుకొన్న విషయాన్ని మరువరాదు. అనేకులు ఈ మాటలను అపార్థం చేసికొని, లోకప్రీతి నార్జించడానికై, వారు తమ ఉత్తమాదర్శాలను పోకడపెట్టి, లోక దురాచారాలను అంగీకరిం చారనుకున్నారు. తమకు సత్యమని తోచిన విధంగా మాటలాడటానికి, ప్రవర్తించడానికి ధైర్యం చాలక, పిరికితనం చూపారనేవారూ వున్నారు. కాని యిది పొరపాటు. లోకంలోని జనులంతా తమ బిడ్డలనే ఆ మహనీయుల భావన. వీరిపట్ల వారి హృదయాలు ప్రేమతో నిండి, తొలకాడు తూంటాయి. ఆ మహా ప్రేమకుగల అపారశక్తి ఈ మూర్ఖచిత్తులకెలా తెలియగలదు? అనంత సానుభూతితో అనంత సహనంతో నిండిన హృదయాలు గల ఆ మహాపురుషులే లోకానికి నిజమైన తండ్రులు. నిజమైన దేవతలు. వారు దేనినైనా సహిస్తారు. దేనికైనా ఓర్చుకొంటారు. మానవ సంఘం ఎలా అభివృద్ధిచెందుతుందో వాళ్లకు తెలుసు. అందుకు అనువైన సాధనాలను, వారు శాంతంతో, మెల్లమెల్లగా జాగ్రత్తతో ప్రయోగిస్తున్నారు. తెగనాడక, భయపెట్టక, ప్రేమతో, పదిలంగా పట్టుకొని, ఒక్కొక్క మెట్టిక్కించి పైకి తేవడమే వారనుసరించిన మార్గం. అట్టివారే ఉపనిషత్కర్తలు. మనుష్యుల ఆశయాలు నైతికంగా, ఉన్నత క్షేత్రాన్నందుకున్నాయనీ, అందువల్ల భగవంతుని గూర్చిన పూర్వభావాలు, ఇప్పుడు వికృతంగా ఉంటాయనీ వారికి తెలుసు. నాస్తికుల బోధలలోకూడ ఎంతో సత్యం – బంగరు ముద్దల వంటి సత్యం వుందని వారికి తెలుసు. కానీ ఈ మణులను ఒక్కటిగా కూర్చిన దారాన్ని తెంపి, గగనమార్గంలో ఎక్కడనో ఒక నూతన సంఘాన్ని నిర్మించాలనుకొనేవారు యత్నసిద్ధి నొందజాలరని కూడ వారికి తెలుసు.
మనం క్రొత్త నిర్మాణాలను చేయం. స్థలాలు మాత్రం మారుస్తాం. అక్కడి దిక్కడ, ఇక్కడి దక్కడ పెడతామేకానీ, కొత్తగా కల్పించడం మనకు శక్యంకాదు. విత్తనం నెమ్మదిగా, క్రమక్రమంగా కదా చెట్టవుతుంది? ఇది జ్ఞాపకముంచుకొని, మనం సత్యసాధనార్థం కృషిచేస్తూ, లభించిన సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి! క్రొత్త సత్యాలను కల్పింపజూడరాదు. కాబట్టి ప్రాచీనకాలపు ఋషులు, భగవంతుని గూర్చిన పాతభావాలు అప్పటి కాలానికి అనుకూలింపవని నిందించక, వానిలోకల సత్యాన్ని పరిశోధించి వేర్పరుప చూచారు. తత్ఫలమే వేదాంతవిద్య. పూర్వపు అనేక దేవతలనుండి, ఆ పిమ్మట ఏకైకమూర్తి అయిన జగదీశ్వరునినుండి, ఇంకా మిక్కిలి అభ్యున్నతమైన నిర్గుణబ్రహ్మాన్ని వారు కనుగొన్నారు. ప్రపంచ మంతటిలో ఐక్యాన్ని కన్గొన్నారు. ఈ భేదమయ ప్రపంచంలోగల సర్వవస్తువుల్లోను, సమానంగా నిలిచి ఉండే సర్వభూతాంతరాత్మ అయిన ఆ ఒక్కడిని; మరణోన్ముఖమైన ఈ అనిత్య ప్రపంచంలో ఉండే ఆ నిత్యపరిపూర్ణజీవి నొక్కడిని; అచేతనం, అవిద్యామయం అయిన ఈ ప్రపంచంలో, జ్ఞాన తేజోమయుడైన ఆ చైతన్యమూర్తి నొక్కడిని, – ఎవరు తెలుసుకుంటారో వారిదే శాశ్వత శాంతి. అది మరెవ్వరికీ లేదు. ఎవ్వరికీ లేదు.