(లండన్లో ఉపన్యసించింది)
మనిషి ఇంద్రియాలకు లొంగి ఉంటాడు. తాను జీవిస్తున్న, నిత్యవిహారం చేస్తున్న ఈ బాహ్యప్రపంచం, అతనికి వాస్తవంగా తోచడం సహజమేకదా? కాని ప్రతి మానవుని బుద్ధిలో, ప్రతి జాతి బుద్ధిలో, ఏదో ఒక సమయంలో ‘ఇది సత్యమేనా’ అనే ప్రశ్న అప్రయత్నంగా పుడుతున్నది. కాలమంతా రకరకాల విషయభోగాల్లోనే గడుపుతూ ‘ఇంద్రియాలను నమ్మవచ్చా?’ అని ఆలోచించడానికైనా, తీరికలేని వానినికూడ మరణం వరిస్తుంది. అప్పుడు, అతడుకూడ విషయవాస్తవికతను గూర్చి సందేహించ వలసి ఉంటుంది. “జగత్తు వాస్తవమేనా?” అనే సమస్యే ఆస్తికధర్మ జీవనానికి (రెలిజియన్) ఆరంభం. దాని పరిష్కారమే ఆ జీవన పరమార్థం. ఐతిహాసిక యుగానికి పూర్వం, పురాణ యుగానికికూడ పూర్వం, నాగరికతా సూర్యుడు ఉదయించడానికి ముందే, మానవుని బుద్ధి యింకా కనుచీకటిలో తడుముకొంటున్న ఆదిమకాలంలో కూడ, ఈ ప్రశ్నే బయలుదేరింది. “ఇది ఏమవుతుంది? ఏది వాస్తవం–”
“నరుని మరణాన్ని గూర్చి రెండు భిన్నాభిప్రాయాలున్నాయి. అతడు శాశ్వతంగా అంతరించాడని కొందరి వాదం. జీవించే ఉన్నాడని మరికొందరి వాదం. ఇందులో ఏది నిజం? –” అనే విచారం (ఆలోచన)తోనే కఠోపనిషత్తు ప్రారంభమవుతోంది. ఈ ప్రశ్నకు ఎన్నెన్నో సమాధానా లియ్యబడినాయి. మానసికశాస్త్రాలు, వేదాంతశాస్త్రాలు, మతశాస్త్రాలు, – ఇవన్నీ ఈ సమాధానాలతోనే నిండి ఉన్నాయి. కొంద రీ విచారాన్నే “మరణానంతరం ఏమి? ఏది నిత్యం?” అనే ప్రశ్నలకు మూలమైన, బుద్ధి, అశాంతినే – అణచివేయజూచారు. కాని మరణమనేది ఉండేంతకాలం, ఇటువంటి ప్రయత్నాలు ఎలా కొనసాగుతాయి? ఇంద్రియాతీతమైన దేదీలేదు, మన ఆశలను, లక్ష్యాలను, ప్రస్తుత కాల పరిమితిలోనే ఉంచుతామనీ చెప్పవచ్చు. ఇంద్రియ ప్రపంచాన్ని దాటిపోకుండ మనస్సును నిరోధించే ప్రయత్నం చేయవచ్చు. బుద్ధిని ఈవిధంగా అరికట్టి ఉంచే ప్రయత్నానికి బాహ్య ప్రపంచమంతా సహకరింపవచ్చు. ఈ ప్రయత్నంలో లోకులంతా ఏకీభావాన్నీ చూపవచ్చు. కాని మరణమనేది ఉన్నంతకాలం, “నిత్యాతినిత్యములైనట్లు, సత్యాతిసత్యములైనట్లు మన మెంతో జలగపట్టుతో పట్టుకుని ఉండీ ఈ ఐహికవిషయాలన్నీ మరణంతో అంతమొందేవేనా?” అనే ప్రశ్న, నిరంతరం బయలుదేరుతూనే వుంటుంది. క్షణమాత్రంలో జగత్తంతా, అదృశ్యమై, ఎట్లో ఎక్కడికోపోతుంది. పర్వతాగ్రంలో, చరియదగ్గర నిలబడి, తన పక్కనే నోరు తెరుచుకొని ఉన్న ఘోరరాక్షసిలా కనిపించే, అగాధమైన చీకటి కోనను చూస్తే ఎంతటి ధీరుడైనా, జంకి, వెనుకకు తగ్గి, “ఇది నిత్యమేనా?” అని ప్రశ్నించుకుంటాడు. జీవితకాలమంతా, ఎంతో బుద్ధిపాటవంతో, తదేక దీక్షతో, పరిశ్రమించి నిర్మించుకున్న ఆశాసౌధాలు, ఒక్క నిమిషంలోనే కూలి నేలపాలౌతాయి. “అవి నిత్యములేనా?” అనే ప్రశ్న మళ్లీ తలెత్తి సమాధానం ఆశిస్తుంది. కాలం గడిచేకొద్దీ, మనల్ని ఈ ప్రశ్న మరింత బలంతో వేధిస్తూ ఉంటుంది. మరో విషయం. మనిషి సుఖాభిలాషి. సుఖంకోసం ఎన్నెన్ని మార్గాల్లోనో మనిషి పరుగెత్తుతాడు. ఈ వెర్రి వెదకులాట అంతా, ఇంద్రియాలకు కనిపించే ఈ బాహ్య ప్రపంచంలోనే. పట్టిందెల్ల బంగార మవుతున్న ఒక యువకుణ్ణి ప్రశ్నించి చూడండి. “ప్రపంచం నిత్యమే. సత్యమే” అంటాడు. అప్పు డాతని నమ్మకమదే. వార్ధక్యదశలో మళ్లీ వాడినే ప్రశ్నించండి. అప్పటికతడెన్నో ఆశాభంగాలనుభవించి ఉంటాడు. అతడిప్పుడు – “అంతా అదృష్టంపై ఆధారపడి వుంటుందం” టాడు. తన కోరికలు నెరవేరజాలవని అతనికి తెలిసిపోయింది. ఏ దారి పట్టినా, దాటశక్యంకాని, వజ్రకఠినమైన గోడ అడ్డుతగులుతోంది. ఇంద్రియవ్యాపార ఫలం మొదట అనుకూలంగా ఉన్నా, తర్వాత ఎదురు తిరుగుతోంది. ఏదీ శాశ్వతం కాదు. అన్నీ అనిత్యాలే. భోగాలు, దౌర్భాగ్యం, విభవం, సంపద, అధికారపదవి, దరిద్రం, – అన్నీ అనిత్యాలే. ఇంతెందుకు? జీవితమే అట్టిది.
మనిషి అవలంబింపదగిన మత మార్గాలు రెండే. శూన్యవాది (నిహిలిస్ట్) అయి, సర్వమూ శూన్యమని, భూతభవిష్యత్తులను గూర్చి – వర్తమానాన్ని గూర్చిగూడ – తెలిసికోలేమని వాదించడం ఒక మార్గం. “వర్తమానాన్ని గూర్చి కూడ” అనడం ఎందుకంటే భూతభవిష్యత్తులు శూన్యమనే వాళ్లు వర్తమానం ఉందనడం అవివేకం. ఇది “తల్లిదండ్రులు లేరు. బిడ్డపుట్టాడు” అనడం లాంటిది. ఈ శూన్యవాదం ఒక మార్గం. క్షణమాత్రమైనా నిజంగా శూన్యవాది కాగలవాడిని నేనెన్నడూ చూడలేదు. మాటల్లో మాత్రం శూన్యవాదిగా ఉండటం చాలా సులభం.
ఇంక, రెండవమార్గం సత్యాన్వేషణ రూపమైన విషయ విచారం. అనిత్యమై నిరంతర పరిణామాలు చెందే, ఈ జగత్తులో ఏదైనా సత్యపదార్థం వుందా? – అని పరిశీలించడం. భౌతిక పరమాణువులతో కల్పింపబడిన ఈ శరీరంలో, నిత్య పదార్థమేదైనా వుందా? అనే విచారం మొట్టమొదటనుండి, మానవుడు చేస్తూనే వున్నాడు. అప్పటినుండీ, సత్య జ్ఞానం అతని బుద్ధికి ఎన్నోసార్లు, మెరుపు మెరిసినట్లు తళుక్కుమని స్ఫురిస్తూనే ఉంది. అప్పుడుకూడ కొందరు, ఈ శరీరాన్ని అతిక్రమించి, ఒక అడుగు వేసిన వాళ్లున్నారు. వాళ్లకు మరో శరీరం కనిపించింది. అది చాలవరకు, స్థూలశరీరం వంటిదేకాని, దీనికన్నా సమగ్రమూ, శ్రేష్ఠ మూను. ఈ శరీరం నాశనమైన తర్వాత కూడ నిలిచి వుండేది. మృతకళేబరం దగ్ధంచేస్తున్న, అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి పలికే ఈ ఋక్కు వేదంలో వుంది. “ఇతణ్ణి నీ చేతులతో ఎంతో జాగ్రత్తగా, ఏమాత్రమూ కసుగం (కుండా)నట్లు, ఎత్తుకొనిపోయి శుభలక్షణాలతో నిండిన దివ్యదేహాన్నిచ్చి, వ్యధా, మరణాలెరుగని పితృ లోకంలో చేర్చు.” ఈ ఆశయం అన్ని మతాల్లో కనిపిస్తుంది. దీనితో కూడ మరొక్క ఆశయంకూడ వుంది. అది, మానవుడు తన పూర్వస్థితి నుండి పతనం పొందాడనడం. ఈ మతమనక, ఆ మతమనక అన్ని మతాల్లోనూ ఈ ఆశయం వుంది. కొన్నింట్లో పురాణ కథారూపంలో, కొన్నింట్లో స్పష్టమైన తాత్త్విక సిద్ధాంత రూపంలో, మరికొన్నింట్లో మనోహర కవితారూపంలోనూ ఇది కనిపిస్తుంది. కాని, మానవుని పూర్వస్థితి, యిప్పటిదానికన్నా ఉన్నతం అనే ఈ ఆశయం సర్వదేశ శాస్త్రాల్లోను, సర్వదేశ పురాణాల్లోనూ కనబడు తోంది. యూదుల వేదంలో పేర్కొనబడిన, ‘ఆదాము’ పతన కథలో వున్న మూల భావం యిదే. హిందువుల ‘కృతయుగం’ సత్యయుగం. అప్పుడు, కోరిన వారికి తప్ప మరణం లేదు. ఇష్టమొచ్చినన్నాళ్లు శరీరం నిలిచివుంటుంది. బుద్ధి ప్రసన్నమై పటుత్వంతో ఉంటుంది. పాపాలు లేవు, దుఃఖము లేదు. అది మారి ఈ కలియుగం వచ్చింది. ఇక, జలప్రళయ కథకూడ అన్ని మతాల్లో వుంది. కాలం అధోగతిని పట్టిందనే భావం, అన్ని మతాల్లోనూ వుందని చెప్పడానికి ఈ కథ ఒక్కటే చాలు. ఈ అధోగమనం సాగి సాగి, భూలోకమంతా పాపపంకిలమైనప్పుడు జల ప్రళయం వచ్చి, మానవజాతిని చాలవరకు రూపుమాపింది. ఆ తర్వాత ఆరోహణక్రమం మళ్లీ ప్రారంభమై, ఇప్పుడు మెల్లమెల్లగా సాగుతోంది. చివరకు మళ్లీ పూర్వపు పవిత్రదశ రాగలదు. బైబిల్ పాతనిబంధనలో (ఓల్డ్ టెస్టమెంట్) జలప్రళయకథ మీ అందరికీ తెలుసు. ఆ కథే పూర్వకాలపు బాబిలోనియా, ఈజిప్ట్, చైనా, హిందూదేశాల్లోకూడా వ్యాప్తిలో వుండింది. మనువు అనే ఒక ప్రాచీన మహాపురుషుడు, గంగాతీరంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా, చిరుచేప ఒకటి వచ్చి అతని ఆశ్రయం కోరింది. అతడు, దాన్ని ఒక నీటి కుండలో ఉంచి, దాని రాకకు కారణ మడిగాడు. పెద్ద చేప ఒకటి తరుముతున్నందున, సంరక్షణార్థం వచ్చానని అది చెప్పగా, దాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఉదయానికి ఆ చిరుచేప, కుండనిండుగా పెరిగి, “ఈ కుండ నాకిక చాలద” న్నది. మనువు దాన్ని ఒక చెరువులో వుంచాడు. కాని మరునాటికది చెరువునిండా పెరిగి, ఇక ఇదీ చాలదంది. ఆ తర్వాత దాన్ని అతడు ఒక నదిలో వుంచగా, ఉదయానికి అది కూడ నిండేటట్లు పెరిగింది. చివరకు దాన్నతడు సముద్రంలో ఉంచగా, అది అతనితో ఇలా అంది: “మనూ, నేను సృష్టికర్తను. ఈ భూలోకాన్ని ప్రళయ జలరాశిలో ముంచివేయనున్నాను. నీకిది సకాలంలో తెలపడానికై ఈ రూపంలో వచ్చాను. నీవు ఓడ నొకదాన్ని నిర్మించుకొని, జీవకోటిలో రకానికి ఒక్కొక్క జతవంతున, అందులో ఉంచి, నీవుకూడ, సకుటుంబంగా దానిలో ప్రవేశించు. జలరాశిలోనుండి నా కొమ్ము బైటికి పొడుచుకుని వస్తుంది. దానికి నీ ఓడను బిగించికట్టి, వెల్లువ తీసిన తర్వాత, వెలుపలికి వచ్చి, భూలోకంలో మరలా జీవకోటిని అభివృద్ధి చేయి.” అట్లే భూలోకం ప్రళయంలో మునిగిపోగా, మనువు తన కుటుంబాన్ని, జీవులలో రకానికి ఒక జతను, ప్రతి వృక్షజాతి విత్తనాలను జాగ్రత్తచేసి, ప్రళయం తీరిన తర్వాత భూమిని మళ్లీ జీవకోటితో నింపాడు. ఆ మనువువంశం వాళ్లవడం వల్ల మనకు “మానవులు” అన్న పేరు వచ్చింది.
మనసులోని సత్యాన్ని, మాటలతో స్పష్టపరిచే సాధనమే భాష. మాటలింకా రాని పాప, ఏవేవో అవ్యక్త శబ్దాలుమాత్రం ఉచ్చరించి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుపడానికి ప్రయత్నిస్తుందనుకోవచ్చు. కావలసిన అవయవాలు, ఉపాయాలు లేకపోవడమే లోపం. మహావేదాంతుల భాష, పసిపాపల అవ్యక్తోచ్చారణలు, ఒక్క జాతికే చెందినవి. వానికిగల భేదమంతా, తరగతుల్లోనే. అంటే వానికి వున్నది పరిమాణ భేదమేకాని, ప్రకారభేదం కాదు. అట్లే కచ్చితంగా, విస్పష్టంగా, నియమానుసారంగా, భావాన్ని వ్యక్తపరుస్తుందని చెప్పబడే ఆధునిక వాగ్విధానమూ, కథారూపమై, నిగూఢభావమై, మంచుకమ్మిన వస్తువులాగ, అస్పష్టంగా వుండే మన పురాణ భాషితాలు, ఒక్క జాతికే చెందినవి.విస్పష్టతలోనే తారతమ్యం. ఒక్క మహత్తర భావమే వీటికన్నిటికి మూలం. అది వ్యక్తరూపంలో బయటికి రావడానికై అందరిలోను, పెనగులాడుతూ వుంటుందని చెప్పవచ్చు. గనుల్లో ప్రకృతిసిద్ధ రూపంలో బంగారుదిమ్మెలు కనిపించేవిధంగా, మన పురాణవాఙ్మయంలో అమూల్యసత్యాలు కనిపిస్తూంటాయి. మన ఆధునిక గ్రంథాలా? అవి విస్పష్టభావాలుగల చక్కని అందమైన భాషలో వ్రాయబడినప్పటికీ, వానిలో ఎన్నోసార్లు వట్టి పనికిమాలిన చెత్త, చెదారం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి పురాణ కథారూపంలో వున్నంతమాత్రాన, ఆధునిక స్త్రీ పురుషుల సిద్ధాంతాలకు భిన్నంగా వున్నంతమాత్రాన, వస్తువును నిరాకరింపనఖ్కర్లేదు. తమ తమ, మత ప్రవక్తల బోధలను విశ్వసించండి అని అంటున్న కారణం చేతనే, మతాలు పరిహాసపాత్రములైతే, ఈ ఆధునికులు ఇంకెంత పరిహాస పాత్రులు కావాలో? మోసెస్నుకాని, క్రీస్తునుకాని, బుద్ధునికాని, ప్రమాణీ కరించేవారు, ఈ కాలంలో నగుబాట్లపాలౌతారు. కాని హాక్స్లీ, టెండాల్, డార్విన్ మొదలగు వారి పేరు చెబితేచాలు ఇక ఎవ్వరూ నోరెత్తరు. “హాక్స్లీ ఉవాచ” అంటే చాలు. ఎంతో మందికి, ఇక అది పరమసత్యమే. మన “మూఢ విశ్వాసం” అంతరించిపోయిందట! నిజమే. కాని ఇది జరిగింది మతవిషయంలో మాత్రమే. ఆ విశ్వాసానికి బదులు, భౌతికశాస్త్రాలను గూర్చిన మూఢవిశ్వాసం చెలరేగింది. దానిమూలంగానే జీవామృత ప్రాయమైన ఆధ్యాత్మిక భావాలు, వీనిమూలంగా కామ కాంచన వ్యామోహాలూ ఆవిర్భవిస్తాయి. అది దైవారాధన; ఇది హేయమైన ధనానికి, పేరుప్రతిష్ఠలకూ, ఆరాధన – ఇదే భేదం.
పురాణ కథావిషయాల్లోకి మళ్లీ వద్దాం. ఆ కథల కన్నిటికీ మూలమై దీపించే ముఖ్యభావం మానవుడు, తన పూర్వస్థితి నుండీ పతనం చెందాడనడమే. ఆధునిక పరిశోధకులు, ఈ భావాన్ని ఏమాత్రమూ అంగీకరించరు. పరిణామవాదుల మతానికికూడ ఇది ప్రత్యక్ష విరుద్ధం. మానవుడు నత్తజాతికి చెందిన క్షుద్రజీవుల క్రమపరిణామ రూపమవడం వల్ల, పురాణ కథాభావం సత్యంకాదని వారి వాదం. కాని హైందవ పురాణవాఙ్మయం ప్రకారం, ఈ రెంటికీ సమరసత్విం కుదర్పవచ్చు. దానిలో ‘కల్పము’ లనేవి (థియరీ ఆప్ సైకిల్స్) వున్నాయి. “కాలం నడకను అలల నడకతో పోల్చవచ్చును. ప్రతి అల తర్వాత దిగుడు, మరుక్షణంలో మరల ఎగుడు, ఆ వెంటనే దిగుడు, వెంటనే మరల ఎగుడు. ఈ చలనమంతా చక్రపరివర్తన రూపంలో సాగుతూంటుంది. మానవుడు కేవల పరిణామ ఫలం కానేరడని ఆధునిక పరిశోధనలవల్లకూడ స్పష్టపడుతోంది.” “ప్రతి వ్యాకోచ దశకు (ఇవొల్యూషన్) ముందు సంకోచదశ (ఇన్వొల్యూషన్) ఉండే తీరుతుంది. యంత్రంలో వున్న శక్తికన్నా అధికమైనశక్తి దానిలోనుండి వెలువడి రాజాలదని ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులంటారు. శూన్యంలోనుండి ఏదీ పుట్టదు. నత్తలోనుండి మానవుడు పరిణమించివుంటే, క్రీస్తు, బుద్ధుడు మొదలైన పరిపూర్ణ దశను పొందిన మానవులు, నత్తలో సంకుచితరూపంలో వుండితీరాలి. లేకపోతే ఆ మహాన్నత పురుషులు ఎక్కడినుండి వచ్చారు? శూన్యంలోనుండి ఉనికి రాదు. అభావంలోనుండి భావం రాదు.” కాబట్టి మా శాస్త్ర సిద్ధాంతాన్ని, ఆధునిక పరిశోధకులు ప్రకటించిన సత్యంతో సామరస్యమొందింపవచ్చు. మెల్లమెల్లగా క్రమపరిణామమొంది, చివరకు మహాపురుష రూపంలో తేజరిల్లే శక్తి శూన్యంనుండి పుట్టజాలదు. ఎక్కడో అది వుండి తీరుతుంది. ఈ శక్తికి మూలరూపం నత్తో, దానికి మూల రూపమైన ఇంకేదో (ప్రోటోప్లాజం) జీవాణుద్రవ్యం, అయితే, ఆ మూల ద్రవ్యంలో ఎలాగో ఈ మహాపురుషశక్తి అణగి వుండాలి. శరీరమనే పేరుగల భౌతిక పదార్థ సముదాయానికి ఆత్మ, చింతాశక్తి మొదలైన రూపాలతో భాసించే శక్తి మూలమా? లేక ఆ శక్తికి శరీరం మూలమా? అనే సమస్యను ఇప్పుడు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ శక్తే శరీరానికి మూలమని సర్వమతాల సిద్ధాంతం. కాని, శరీరమనే యంత్రంలోని భాగాలు ఒక క్రమంలో వున్నపుడు, దానిలోనుండి శక్తి పుడుతుందని ఆధునిక తత్త్వ విచారపరులు కొందరంటారు. వీరు మతాన్ని అంగీకరించి, ఆత్మ (భావ సముదాయం) ఈ భౌతిక యంత్రంచే కల్పింపబడిందనీ, అనగా దేశానికి, బుద్ధికీ, మూలమైన భౌతిక పదార్థాల కలయికకు (సామాన్యమైన కలయికకానీ, రాసాయనికమైన కలయికగాని) ఫలమే ఈ ఆత్మ అని ఒప్పుకున్నా, సమస్యా పరిష్కారం కాదు. “ఈ శరీరం ఎలా ఏర్పడింది? దానిలోగల పరమాణువుల నన్నిటిని, ఈ శరీరరూపంగా కూర్చివుంచేది ఏ శక్తి? చుట్టుప్రక్కలవున్న భౌతిక పదార్థాలనుండి, తనకు కావలసిన సామగ్రిని చేకూర్చుకొని, నా శరీరం ఒకరకంగా, ఇంకో శరీరం ఇంకో రకంగా, ఇలా ఎన్నో రకాల శరీరాలను కల్పించేది ఏ శక్తి? ఈ అనంత భేదాలకు కారణభూతమైనదేది? కాబట్టి ఆత్మ అనే శక్తికి భౌతిక పరమాణు సముదాయంతో నిర్మింపబడిన శరీరం, మూలమనడం యుక్తియుక్తంకాదు. “ఈ పరమాణువులెలా ఒకటిగా కూడాయి? ఆ కూర్చినశక్తి ఎక్కడినుండి వచ్చింది? ఆ పరమా ణువుల కలయికకు మరొకశక్తి కారణం. ఆత్మకు, ఆ పరమాణు పదార్థం కారణం. పదార్థరాశిని ఒకటిగా కూర్చిన ఆత్మయే ఈ కూడికవల్ల కలిగిం దనడం జవాబేకాదు.” వివాదాంశాలలో అన్నిటికో లేక చాలా భాగానికో అన్వయిస్తూ పూర్వ సిద్ధాంతాలకు విరుద్ధం కాకుండేవాదమే ఆదరింప తగింది. భౌతిక పదార్థాన్ని సంగ్రహించి, శరీరాన్ని నిర్మించే శక్తే, ఆ శరీరం ద్వారా కనిపిస్తుందనడమే ఎక్కువ సమంజసం. కాబట్టి శరీరంద్వారా దీపించే చింతాశక్తులు పరమాణు సముదాయ వ్యవస్థాఫలములే అని, వానికి స్వతంత్రమగు ఉనికియే లేదనీ చెప్పటం అర్థరహితవాదం. అసలు భౌతిక పదార్థాలలో నుండి శక్తి ఉత్పన్నమవడమే అసంభవం. ఇంతేకాదు. భౌతిక పదార్థ మనేదానికి నిజమగు ఉనికియే లేదనికూడ నిరూపించవచ్చు. ఒక దశలో ఉన్న శక్తే భౌతికపదార్థం. ఘనత, కఠినత, మొదలగు భౌతిక పదార్థ లక్షణాలన్నీ చలనంవల్ల కలుగుతుందనవచ్చు. ద్రవపదార్థాల్లో అపరిమితమైన ఆవర్తచలనం ప్రవేశింపజేస్తే, వానికి ఘనపదార్థాలకున్న బలం లభిస్తుంది. తుఫాను సమయంలో ఏర్పడే వాయుగుండం, ఘనరూపం చెంది, ఘన పదార్థాలను చీల్చడం, విరచడంకూడా కద్దు. సాలెపురుగు గూటిలోని దారం ఒకదాన్ని అపారవేగంతో చలింపచేస్తే, అది యినుపగొలుసులాగా బలిష్ఠమై, అత్యంత కఠినమైన మహావృక్షపు బోదెను రెండుగా చీల్చివేయగలదు. ఈ దృక్పథంనుండి, విషయ పరిశీలన చేస్తే, భౌతిక పదార్థమనబడుదానికి, నిజమగు ఉనికియే లేదని సులభంగా నిరూపించవచ్చు. తద్విరుద్ధవాదాన్ని నెగ్గించుట అసాధ్యం.
శరీర మూలంలో ప్రకాశించేశక్తి ఏదైనా, అది అణువులను గ్రహించి, వానితో రూప (మానవ శరీర) నిర్మాణం చేస్తుందనడం మాత్రం స్పష్టం. మన శరీరాన్ని నిర్మించడానికి మరెవ్వరూ రావడంలేదు. నా కోసం ఇంకెవ్వరూ భోజనం చేయరు. నేనే తిని, నేనే అరిగించుకొని, రక్త శల్యాదులను దానితో నేనే నిర్మించుకోవాలి. నాలో ఉండి, ఈ పనులన్నీ నెరవేరుస్తున్న అద్భుత నిగూఢశక్తి ఏది? భూత, భవిష్యద్విషయ భావన కొందరికి వెరపు కలిగిస్తుంది. మరికొందరు, అది గాలిలో మేడలు కట్టడం లాంటి వ్యర్థ కాలయాపనమని భావిస్తారు. ఐనా – ప్రస్తుత విషయమైన, “మనలో వుండి దీపించు శక్తియేది?” అనే సమస్యను గూర్చి ఆలోచిద్దాం. ఈ శక్తికి లేక ఈ శక్తి ప్రదర్శనకు కారణభూతమైంది తేజస్వంతమైన ఒక వస్తువనీ, అది ఈ శరీరాన్ని పోలినదైనా, ఇది నశించిన తర్వాత కూడ, అది నిలిచి ఉంటుందని, అతి పురాతనకాలపు శాస్త్రకారుల సిద్ధాంతం. తరువాతికాలంలో అంతకన్న ఉన్నతమైన ఈ క్రింది సిద్ధాంతం వెలువడింది. ‘ఆ శక్తికి మూలం తేజోమయమైన శరీరం కాదు. రూపముండే వస్తువులన్నీ, పరమాణువుల కూడికచేతనే ఏర్పడుతాయి. వానికి స్వతస్సిద్ధమైన చలనశక్తి లేదు. మన శరీరంలోని శక్తికి, మూలకారణం మరేదైనా అయితే, ఆ తేజోమయశక్తికీ వేరే కారణం వుంటుంది. ఆ మూలకారణం ఆత్మ. స్థూలశరీరం ద్వారా ప్రదర్శితమగుశక్తి, తేజోమయ శరీరంవల్ల కలిగినట్లు తోచినా, దానికి మూలం ఆత్మయే. మనస్సు, ఈ తేజోమయ శరీరంలో ఇమిడి ఉంటుంది. మనస్సు ద్వారా శరీరానికి శక్తినిచ్చేది ఆత్మ. ప్రతి మానవునికీ ఒక ప్రత్యేకమైన ఆత్మ, ఒక ప్రత్యేకమైన సూక్ష్మశరీరం వుంటాయి. ఆ సూక్ష్మశరీరం ద్వారా, మనం స్థూలశరీరానికి శక్తి నిస్తున్నాం. శరీరానికి, మనస్సుకుకూడ, భిన్నమని ఈ సిద్ధాంతంచే ప్రతిపాదింపబడిన ఆత్మతత్త్వాన్ని గూర్చి తీవ్రమైన చర్చలు ప్రారంభమైనాయి. ఎన్నో విధాలైన ఊహలు కల్గాయి. ఎన్నో దృక్పథాలనుండి పరిశీలనం సాగింది. తత్ఫలితంగా ఏర్పడిన ఆధ్యాత్మిక మతాలు కొన్ని మీకు నివేదిస్తాను. ఆత్మతత్వాన్ని గూర్చి భిన్నాభిప్రాయాలున్నా, ఒక్క విషయంలో మాత్రం అన్ని మతాలవారు ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. “దానికి ఆకారంకాని, అవయవాలుకానీ లేవు. నిరాకారం, నిరవయవం అయిన పదార్థం అన్నిట్లో వుండాలి. దేశకాలాలకు మనస్సే ఉత్పత్తి స్థానం. కాలం లేకపోతే, నిమిత్తత్వం నిలువజాలదు. ముందు, వెనుకలు అనే భావం కలిగితేనేకదా నిమిత్తత్వం అనే భావం కలుగ గలుగుతుంది? కాబట్టి, దేశకాలనిమిత్తత్వాలు మనస్సు లోనివే. ఈ ఆత్మ, మనస్సుకు అతీతం, ఆకారరహితమూ కాబట్టి, అది దేశకాల నిమిత్తత్త్వాలకు అతీతమై ఉండాలి.” దీని తర్వాతి అభిప్రాయం, మా వేదాంతమంతటిలోను అత్యున్నతమైంది. “ఆద్యంతాలులేని రెండు వస్తువులుండజాలవు. ఆత్మ, ఆద్యంతరహితమైతే, ఒక్క ఆత్మే ఉండాలి. కాబట్టి ప్రతి మానవునికి ఒక ప్రత్యేకమైన ఆత్మ వుండడం అసంభవం. అంటే సత్యదృష్టికి మానవుడు ఏకం, పరిపూర్ణం, సర్వాగతమూ అయిన ఆత్మయే. స్థూలదృష్టికి కనిపించే మానవుడు, ఆ పారమార్థిక మానవుని పరిచ్ఛిన్న రూపం.” ఈ దృక్పథం నుండి విచారిస్తే పురాణ కథాసిద్ధాంతం సత్యమే అవుతుంది. ఇంద్రియగోచరుడైన మానవుడు, ఎంత మహనీయుడైనా, బుద్ధికి అతీతుడైన, పారమార్థిక మానవునికి మందమైన ప్రతిబింబం వంటివాడే. పారమార్థిక మానవుడైన ఆత్మ, కార్యకారణాతీతుడు, దేశకాలాలచే బాధింపబడనివాడూ అవడంవల్ల నిత్యముక్తుడు. అతడెప్పుడూ బద్ధుడు కాలేదు, కాజాలడు. దానికి ప్రతిబింబమైన ఇంద్రియగోచర మానవుడు, దేశకాల నిమిత్తతలకు లోబడి వుండడంచే బద్ధుడు. బద్ధుడుగా కనిపిస్తాడేకానీ, నిజంగా బద్ధుడుకాడని కొందరు వేదాంతుల మతం. ఈ సర్వగతత్వం, ఈ ఆధ్యాత్మికత్వం, ఈ పరిపూర్ణత్వం – ఇదే మన ఆత్మలలోని సత్యం. ప్రతి ఆత్మా, అనంతం. కాబట్టి జననమరణా లెట్లుండగలవు? ఒక పరీక్షాధికారి, “ఈ భూమి ఏల పడిపోకుండా నిలచి ఉంద” ని బాలబాలికలను ప్రశ్నించాడు. ఆకర్షణశక్తిని గూర్చిన సమాధానమేదో ఇస్తారని అతని భావన. కాని, బుద్ధిశాలి అయిన ఒక బాలిక “అది ఎక్కడ పడగలదు?” అని మారు ప్రశ్నవేసి, పరీక్షకుని ప్రశ్న అర్థరహితమైందని నిరూపించింది. అది ఎగరడం, పడటం అసంభవం. అనంతమైన మహాకాశంలో క్రిందు, మీదులు లేవు. ఆద్యంతములు కల స్థలంలోనే అవి వుంటాయి. అనంత వస్తువుకు, రాకపోకలెట్లుంటాయి. అది ఎక్కడినుండి రాగలదు? ఎక్కడికి పోగలదు? కాబట్టి, మానవుడు ఉన్నత మానసిక క్షేత్రానికి ఎగరాలనుకుంటే, భూతభవిష్యత్తుల తలంపే మానుకోవాలి. జననమరణాలతో బంధింపబడ్డ ఈ శరీరంతో ఐక్యభావాన్ని మరచిపోవాలి. సత్యదృష్టికి, మానవుడు ఈ శరీరం కాదు. ఆటుపోటులకు లోనైన ఈ మనస్సూ కాదు. వీనికి అతీతమై, నిత్యమై వుండే ఆత్మే అతడు. మనస్సు, శరీరాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. క్షణక్షణమూ మారుతున్నా, ఒకటే నిరంతర ప్రవాహంలా కనిపించే నదీజలంలాగా, ఎప్పుడూ మారే స్వభావంగల విషయ పరంపరనే మనశ్శరీరాలంటున్నాం. ఈ శరీరంలోని అణువులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కొన్ని నిమిషాలపాటైనా ఒకే శరీరం ఎవ్వరికీ ఉండదు. కాని, మనం దాన్ని ఒక్క శరీరంగానే భావిస్తాం. మనస్సు విషయంకూడ ఇట్టిదే. ఒక క్షణంలో సౌఖ్యం, మరుక్షణంలో అసౌఖ్యం. ఒక క్షణంలో బలం. మరుక్షణంలో దౌర్బల్యం. ఈవిధంగా అది నిరంతర వికారాలకు లోనయ్యే సుడిగుండం వంటిది. అటువంటిది ఆత్మ ఎలా అవుతుంది? ఆత్మ అనంతం కదా? అనిత్య వస్తువులోనే మార్పు ఉండగలదు. అనంతవస్తువులో మార్పు కలిగిందనటం, అసంబద్ధ ప్రలాపం. పరిమిత శరీరులం కనుక, మనం మరో స్థలానికి పోగలం. జగత్తులోని ప్రతి అణువు, క్షణక్షణం అలా కదలుతూనే ఉంది. కాని, జగత్తునంతా సమష్టిగా (ఒక్క మొత్తంగా) భావిస్తే అది కదలజాలదు. మారజాలదు. చలనమంటే సంబంధభావం. మరొక వస్తువుంటేకదా దగ్గరకు రావడంకాని, దూరమవడంకాని జరుగుతుంది? జగత్తులోని ప్రతి అణువు మరొక అణువుకు దూరంగానో, దగ్గరగానో చలింపగలదు. కాని జగత్తునంతా సమష్టిగా భావించినప్పుడు, అది దేనికి దగ్గరవుతుంది? దేనికి దూరమవుతుంది? అది తప్ప వేరే వస్తువేదీ లేదుకదా? కాబట్టి అనంతం, ఏకం అయిన ఈ పదార్థం మార్పులు లేనిది, అచలం పరిపూర్ణం. పారమార్థిక మానవు డనడంలోని భావమిదే. అనగా మన యథార్థతత్త్వం, అఖండ వస్తువులో వుందికాని, ఖండ వస్తువులో లేదు. మనం నిరంతర పరిణామం చెందే, స్వల్ప పరిమితజీవులమనేభావం ఎంత పురాతనమైనా, ఎంత సుఖప్రదమైనా అది భ్రాంతిజనితమే. “నీవు విశ్వాత్మకుడవు, సర్వగతుడవు” అని చెబితే, మానవుడు భయపడతాడు. కాని నిజానికి ప్రతి వస్తువు మూలంగా పనిచేసేది నీవే; ప్రతి కాలితో నడిచేది నీవే. ప్రతి పెదవితో మాట్లాడునది నీవే. ప్రతి హృదయంలో కష్టసుఖాదు లనుభవించేది నీవే.
ఈ సత్యాన్ని తెలిపితే మనుషులు భయపడతారు. తమ వ్యక్తిత్వం ఏంకావాలని వారు మాటిమాటికి ఆతృతతో ప్రశ్నిస్తారు. కాని వ్యక్తిత్వమంటే ఏమి? నాకు దాన్ని చూడాలని ఉంది. చంటిబిడ్డడికి మీసాలుండవు. ఆ బిడ్డడు పెద్దయిన తర్వాత గడ్డం మీసాలు ఏర్పడతాయి. వ్యక్తిత్వం, శరీర సంబంధమైనదైతే, అప్పుడది నశిస్తుంది కదా? అట్లే నాకొక చెయ్యిపోయినా, కన్నుపోయినా, నా వ్యక్తిత్వం నశిస్తుంది. త్రాగుబోతు, తన త్రాగుడును మానరాదు. మానితే వాని వ్యక్తిత్వం నశిస్తుంది. దొంగ మంచివాడు కారాదు. అయితే వాడి వ్యక్తిత్వం నశిస్తుంది. ఇంతెందుకు? ఈ వ్యక్తిత్వ నష్టభీతివల్ల, ఎవ్వరూ తమ అలవాట్లను మార్చుకోరాదు. నిజానికి వ్యక్తిత్వమనేది పరిపూర్ణతలో తప్ప ఇంకెక్కడా లేదు. తక్కిన దశల్లో, అన్ని చోట్ల, అన్ని వేళల్లో మార్పుతేలేక ఈ వ్యక్తిత్వం ఎక్కడుంటుంది? జ్ఞాపకాల్లోనా? అట్లైతే, తలమీద దెబ్బతగిలి, నా పూర్వజీవితాన్ని మరచిపోతే నా వ్యక్తిత్వం నశించి నా కథ ముగిసినట్లే. నా చిన్ననాటి రెండుమూడేండ్లు నాకు జ్ఞాపకం లేవు. ఉనికికి ప్రమాణం జ్ఞాపకమే అయితే, ఆ మరచిన భాగం నశించినట్లే. ఆ కాలంలో నేను జీవించలేదు. వ్యక్తిత్వ శబ్దానికి ఎంత సంకుచితమైన అర్థమిది? నిజం ఏమంటే మనకింకా వ్యక్తిత్వం ప్రాప్తింపనేలేదు. దానికోసం అంటే మన యథార్థతత్త్వమైన పరిపూర్ణత్వాన్ని చేరడానికోసం, ప్రయాసపడుతున్నాం. అఖీల జగత్తులో జీవించేవాడిదే జీవితం. అనిత్య వస్తువుల్లో లక్ష్యముంచి జీవించడమంతా మరణంవైపు పరుగులు పెట్టడమే. విశ్వంతో ఒకటై – అనగా అందరితో ఏకీభావబుద్ధితో గడిపిన కొద్దికాలమే మనం జీవించినట్లు. తక్కిందంతా క్షుద్రజీవితం. అది జీవితమే కాదు. మరణంకూడా; మనకుగల మరణభీతికి ఈ క్షుద్రజీవితమే కారణం. జగత్తులో ఒక్క జీవైనాసరే – జీవించి వున్నంతకాలం, తానుకూడ జీవించే వుంటాడు అనే సత్యాన్ని జీవితంలో అనుసరిస్తే తప్ప మానవుడు మరణభీతిని జయింపజాలడు. “అన్నివస్తువుల్లో, అన్ని జీవుల్లో నేనే వున్నాను. ఈ జీవకోటి అంతా నేనే; ఈ జగత్తంతా నేనే” అని అనగల స్థితిలోగాని మానవుడు నిర్భయత్వాన్ని పొందజాలడు. ఎప్పుడూ మార్పులుపొందే వస్తువులకు అంతం లేకుండడం అసంభవం. “ఆత్మ అనంతం. కావున అదే వ్యక్తి. అఖండ పదార్థాన్ని ఖండించడం ఎలా? తునకలుగా విరచడం ఎలా? ఎప్పుడూ అది ఏకమే. అఖండమే. అదే మానవవ్యక్తి. అదే మానవుని యథార్థరూపం. అందుబాటుకాని యథార్థ మానవవ్యక్తిత్వాన్ని ప్రదర్శిం చడానికై పడుపాట్ల మూర్తీభావమే ఇంద్రియగోచర మానవుడు” అని ఒక ప్రాచీనకాలపు హిందూవేదాంతి పల్కినాడు. ఆత్మకు పరిణామం లేదు. లోకంలో కలుగుతున్న మార్పులు – దుర్మార్గుడు మంచివాడవడం, మృగం మానవుడు కావడం – ఇట్టి యే పరిణామాలుకానీ ఆత్మలోనివి కావు. పరిణామమంతా ప్రకృతిలోనే. తత్ఫలంగా ప్రదర్శితమయ్యేది ఆత్మ. నా ముందొక తెరవుందనీ, దానిలోని ఒక చిన్నరంధ్రం ద్వారా, మీలో కొందరి ముఖాలు మాత్రమే నాకు తెలుస్తోందని భావించండి. ఆ రంధ్రం పెద్దదైనకొద్దీ మీలో ఎక్కువమందిని చూడగలుగుతాను. చివరికి ఆ తెర అదృశ్యమైనపుడు మీరంతా పూర్తిగా కనిపిస్తారు. ఇందులో మీరేమీ మారలేదు. మారినది రంధ్రమే. మీరు క్రమాధికంగా గోచరించారు. ఆత్మవిషయం కూడ ఇట్టిదే. పరిపూర్ణత ఎప్పుడో వచ్చేదికాదు. మీరు ఇప్పుడే పరిపూర్ణులు; నిత్యముక్తులు. ఐతే మతాలు, భగవంతుడు, భవిష్యత్సుఖాన్వేషణ, – వీని కర్థమేమి? మానవునికి ఒక దైవమేల కావాలి? ప్రతి జాతిలో సాంఘికదశలో తమకు ఆదర్శంగా వుండే, పరిపూర్ణత్వానికై ఎన్నోచోట్ల, – మానవుల్లోనో, భగవంతునిలోనో – ఇతర చోట్లనో – జనులు ఏల వెదకులాడుతూంటారు? – అనే ప్రశ్న రావచ్చును. ఆ పరిపూర్ణత్వం మీలో ఉందికాబట్టే, ఈ అన్వేషణ. మీ హృదయస్పందన శబ్దాన్నే మీరు గుర్తింపలేకున్నారు. అది, మరెక్కడనుండో, వచ్చిందనుకొంటున్నారు. మీ ఆత్మలోని భగవంతుడే తనను అన్వేషించి, ప్రత్యక్షపరచుకొమ్మని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. వివిధ మత దేవాలయాల్లో, భూమ్యాకాశాలలో, ఎక్కడెక్కడనో వెదకి వెదకి ప్రదక్షిణ మంతా ముగిసిన తర్వాత, ప్రారంభ స్థానానికి, అంటే మీ ఆత్మ దగ్గరికే వస్తారు. అప్పుడు మీకు సత్యం గోచరిస్తుంది. ఎవనికోసం మీరు లోకమంతా వెదికారో, ఎవనికోసం వివిధ మత దేవాలయాల్లో విలపించి ప్రార్థించారో, ఎవడు గూఢాతిగూఢరూపంలో, మేఘాలచాటున దాగివున్నాడనుకొన్నారో, అతడు సర్వ వస్తువులకన్నా, మీకు చాలా (అత్యంత) దగ్గరలో వున్నాడు. అది మీ ఆత్మయే. ఆత్మయే మీ జీవంలో, శరీరంలో వ్యక్తిత్వంలోగల పరమసత్యం అని వ్యక్తమవుతుంది. అదే మీ స్వాభావిక తత్వం. అందులో సుప్రతిష్ఠితులు కండి. దానిని వ్యక్తపరచండి. మీరు పరిశుద్ధులు కానక్కరలేదు. ఇప్పటికే పరిశుద్ధులు. పరిపూర్ణులు కానక్కరలేదు. ఇప్పటికే పరిపూర్ణులు. ప్రకృతి అనే తెర అడ్డుపడివుండడం వల్ల సత్యం మీకు గోచరించడంలేదు. ప్రతి మంచి తలపువలనా, ప్రతి మంచి పనివలనా, ఆ తెరను కొంచెం చించివేస్తున్నారనవచ్చు. ఇలా చించేకొద్దీ, మొదట దృష్టి గోచరం కాకున్న నిత్యశుద్ధమూ, అనంతమూ అయిన పరతత్త్వం (పరమ సత్యమగు బ్రహ్మం) క్రమాధికంగా సాక్షాత్కరిస్తుంది. మానవుని చరిత్ర అంతా ఇదే. దేదీప్య మానంగా ప్రకాశించడం పరతత్త్వానికి నైజం. కాబట్టి మధ్యన ఉండే తెర పలుచబారేకొద్దీ దాని వెలుగు అధికాధికంగా కనిపిస్తూ వుంటుంది. దాన్ని తెలుసుకోలేం. కానీ తెలుసుకోడానికి వ్యర్థ పరిశ్రమ చేస్తూంటాం. అది నిత్య విషయి (సబ్జెక్ట్). కాబట్టి తన తత్త్వాన్ని కోల్పోతేతప్ప దాన్ని తెలుసు కోలేం. అతడు నిత్యద్రష్ట. ప్రపంచానికి నిత్యసాక్షి. అతడే నీ ఆత్మ. జ్ఞానం విషయీకరణం (ఆబ్జెక్టిఫికేషన్) కాబట్టి అది ఉపాధి (లిమిటేషన్); ఒక క్రింది మెట్టు; అవనత దశ; అనంత విషయీస్వరూపులం అయిన మనం దాన్ని మరలా తెలుసుకోవడం ఎలా? తన వాస్తవికతత్త్వమైన ఈ మహోన్నత స్థితిని, తన జీవితంలో ప్రదర్శించడానికై, మానవుడెన్నోవిధాల యత్నిస్తూ వుంటాడు. లేకపోతే ఇన్ని ధర్మశాస్త్రాలు ఎందుకు వచ్చాయి? ఆ శాస్త్రా లన్నిటిలో పరోపకారమనే భావం అత్యంత ప్రాముఖ్యాన్ని పొంది, కేంద్ర స్థానం ఆక్రమించుకొనివుంది. మానవ జీవితంలో ముఖ్యసూత్రంగా ఉండవలసింది భూతదయ; మానవులపైనా జంతుకోటిపైనా దయ. “నేనే ఈ జగత్తును. ఈ జగత్తంతా ఒక్కటే–” అనే పరమసత్యమే, వేర్వేరు ధర్మశాస్త్రాలలో వేర్వేరు విధాలుగా బోధింపబడి వుందని చెప్పవచ్చు. కాకపోతే నే నితరులకేల ఉపకారం చేయాలి? “చేయి” అని నన్ను బలాత్కరించేదేది? సానుభూతి అంటే, సర్వైక్యభావమే కదా? ఎట్టి కఠిన హృదయులకైనా, ఇతరులపట్ల ఒక్కొక్కసారి, జాలి కలుగుతుంది. తన వ్యక్తిత్వం, భ్రాంతి జనితమైన మిథ్య అనీ, దాన్ని అంటిపట్టుకొని ఉండాలనుకోవడం నీచ లక్షణమనీ చెబితే భయపడేవాడుకూడ స్వార్థత్యాగపరిపూర్ణతే సన్మార్గ జీవన ముఖ్యసూత్రమని చెబుతాడు. కాని స్వార్థ త్యాగ పరిపూర్ణత అంటే ఏమి? ఈ అసత్య వ్యక్తిత్వాన్ని పరిత్యజించడం, స్వార్థపరత్వాన్నంతా త్యజించడమే కదా? ఈ మమతాహంకారాలు, పూర్వపు మూఢశ్వాసాల ఫలం. ఈ మిథ్యావ్యక్తిత్వం క్షీణించేకొద్దీ, సత్యవ్యక్తిత్వం వ్యక్తమవుతూంటుంది. అది ధర్మబోధకంతటికీ కేంద్రం, ఆధారం, సారభూతమూ అయిన స్వార్థత్యాగం. ప్రపంచమంతా – బుద్ధిపూర్వకంగానో, ఊరికేనో – ఈ స్వార్థత్యాగ లక్షణాన్ని కొద్ది గొప్పలుగా ఆచరిస్తూ, దాని వైపునకు మెల్లగా సాగుతోంది. తాము ఇలా చేస్తున్నామని తెలియనివారు, మమతాహంకార మూలమగు వ్యక్తిత్వం భ్రాంతిజనితమని, పరిమితమని తెలిసికొని, ఈ స్వార్థత్యాగాన్ని బుద్ధి పూర్వకంగా చేయాలి. ఇప్పటి మానవుడు, సర్వాధారమైన అనంత పరతత్వపు క్షణదర్శనప్రాయుడు. సర్వాత్మకమగు అనంతవహ్నిలో ఒక్క కణం వంటి వాడు. అనంతత్వమే అతని సత్య స్వభావం.
ఈ జ్ఞానానికి ఉపయోగమేమి? దీనివల్ల ఏమి ఫలం? ఈ కాలంలో ప్రతి వస్తువులోని గుణాగుణాల్ని, ధనలాభ దృష్టితోనే విచారించడం పరిపాటి అయిపోయింది. కాని సత్యాన్ని, ఈ దృష్టితో పరిశీలించమని ఎవరు చెప్పారు? ఒకవేళ దానివల్ల ఉపయోగం లేకపోతే దాని సత్యత్వం తగ్గిపోతుందా? సత్యానికి అది ప్రమాణం కానేకాదు. అయినా, ఈ సత్యం అత్యంత ఉపయుకమైంది కూడా! ప్రతి మానవుడూ సుఖమే కోరుతాడు. దాన్ని అనేకులు అనిత్యపదార్థములనుండి సాధించుకోవాలని ప్రయత్నిస్తారు. ఇంద్రియాలవల్ల సుఖం ఎన్నడూ ప్రాప్తించలేదు. ఇంద్రియాలవల్లకాని, ఇంద్రియలోలత్వం వల్లకాని, సుఖీంచినవాడెవ్వడూ లేడు. సుఖం ఆత్మలో మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆత్మ సుఖాన్ని ఆర్జించుకోవడంకన్నా, మానవులకు అధికోపయుక్త మగు కార్యమేమి ఉండగలదు? ఇక, తరువాతి విషయం. దుఃఖానికి మూలకారణం అజ్ఞానం. పరమపురుషుడు అనిత్యుడనీ, అతడు ఏడుస్తాడు మొత్తుకొంటాడనే భావించటంకన్న అజ్ఞానం ఉండదు. శాశ్వతం, నిత్యశుద్ధం అగు పరమాత్మకు మూర్తీభావాలమైన మనం తుచ్ఛములు, పరిమితములు అయిన ఈ మనశ్శరీరాలం అని తలచడం ఈ అజ్ఞానం దాల్చిన ముఖ్య రూపం. స్వార్థపరత్వమంతా దీన్నుండి కలిగేదే. నేనొక స్వల్ప శరీరమను అని అనుకొన్నతోడనే, దీనిని ఎట్లైన, – అందువల్ల ఎవరికి ఏమి అపకారం కలిగినా – జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరిక కలుగుతుంది. అప్పుడు నాకు, మీకూ భిన్నత ఏర్పడుతుంది. ఈ భిన్నభావం అన్ని అనర్థాలకు, అన్ని కడగండ్లకు దారితీస్తుంది. ఈ స్వార్థపరత్వాన్ని, ఈ సంకుచిత భావాన్ని, ఈ నీచతను ఏ కొద్దిమందైనా పరిత్యజించితే, రేపటికే భూలోకం స్వర్గ లోకంగా మారిపోతుంది. ఇంతకన్న మహోపయోగ మేమి ఉండగలదు? ఎన్ని యంత్రాలు ఏర్పడినా, భౌతికజ్ఞానం ఎంత అభివృద్ధిపొందినా, ఈ ఫలం లభించదు. వ్యథలు ఎక్కువ కావటమే వానివల్ల ఫలం. ఆత్మజ్ఞానం లేనివానికి కలిగే భౌతికజ్ఞానమంతా మంటలో పెట్టిన కట్టెలవంటిది. స్వార్థపరులు ఈ జ్ఞానంచే ఇతరుల సొమ్మును అపహరించడానికి, ఇతరులకై తమ జీవితాల్ని వినియోగించడానికి మారు వారి జీవితాలనే, తమ మనుగడకోసం ఆహుతి కొనడానికీ సమర్థులౌతారు.
“దీనిని అభ్యసించడం సాధ్యమా? ఆధునిక సంఘంలో ఇది ఆచరణ యోగ్యమా?” అనేది ఇంకో ప్రశ్న. సత్యం సంఘానికెన్నడూ దాసోహ మనదు. సంఘమే సత్యానికి లొంగి సేవచేయాలి. అలా ప్రవర్తించని సంఘానికి నాశం సిద్ధం. సత్యానుసారంగా సంఘాలను తీర్చుకోవాలిగాని సంఘానికి అనుకూలించేటట్లుగా, సత్యం మార్పుల్ని పొందదు. స్వార్థ రాహిత్యం వంటి మహోత్తమాదర్శం, ఏ సంఘంలో అభ్యసించడం సాధ్యం కాదో, ఆ సంఘాన్ని వీడి, మానవుడు అడవుల్లో వుండడం మేలు. అలా చేసేవాడే ధీరుడు. ధీరత రెండు విధములది. ఫిరంగి గుండును ఎదుర్కోవడం ఒకటి, ఆధ్యాత్మిక విశ్వాస నిష్ఠాగరిష్ఠత ఇంకొకటి. భారతదేశంపై దండెత్తివచ్చిన చక్రవర్తి ఒకడు గురువుగారి ఆజ్ఞ ప్రకారం అక్కడి జ్ఞాన సిద్ధులను చూడగోరి, వెదకి వెదకి, చివరికొక మహావృద్ధసాధువును చేరబోయెను. కొద్దిపాటి సంభాషణవలననే ఆయన మహాపురుషుడని గ్రహించి, తమ దేశానికి రమ్మని ప్రార్థించాడు. “నేను రాజాలను. ఈ అరణ్య నివాసమే నాకు చాలు” అని ఆయన బదులివ్వగా, “నేను సార్వభౌముడను. మీకు సంపద, పదవి, విభవం అంతా ఇస్తాను” అని అతడు ఆశ చూపాడు. సాధువు అప్పటికిని రాననగా, “రాకపోతే చంపుతాను” అని బెదిరించాడు. ఆయన ప్రశాంతంగా నవ్వి, “సార్వభౌమా! ఇంత బుద్ధిమాలిన మాట నీవెప్పుడూ పలికి వుండవు. నీవు నన్ను చంపజాలవు. ఎండ నన్ను ఎండింపజాలదు. (ఎండచే నేను ఎండిపోను) అగ్ని కాల్చలేదు. కత్తి ఛేదించలేదు. నేను ఆద్యంతాలులేని నిత్యం, సర్వగతం, సర్వశక్తిమంతం అయిన ఆత్మను” అనెను. ఇది ఆధ్యాత్మిక ధీరత. అది సింహవ్యాఘ్రాదుల ధీరత. 1857 వ సంవత్సరపు సిపాయీల తిరుగు బాటులో సాధుసత్తముడైన ఒక స్వామిని మహమ్మదీయుడొకడు, ఖడ్గంతో పొడిచాడు. హిందువులు ఆ అపరాధిని పట్టుకొని చంపడానికై స్వామి వద్దకు తెచ్చారు. స్వామి అతన్ని ప్రశాంతదృష్టితో చూచి “సోదరా! నీవు అతడివే” అని పలికి ప్రాణాలు విడిచాడు. ఆధ్యాత్మిక ధీరతకిది ఒక నిదర్శనం. మీ సంఘాన్ని సత్యమార్గంలో పెట్టుకోజాలకపోతే, మీ శరీరబలాన్ని గూర్చి, మీ పాశ్చాత్యసంస్థా విశిష్టతను గూర్చి, ప్రగల్భాలు పలకడం మానుకోండి. “ఈ ధీరత సంఘ శ్రేయస్కరం కాదు. అందువల్ల అభ్యాసయోగ్యంకాదు” అంటారా? ధనార్జనే కాబోలు, సంఘశ్రేయస్కరం? అత్యున్నత సత్యాలు, అభ్యాసయోగ్యాలై, ఆచరింపబడే సంఘమే శ్రేష్ఠ సంఘమని నా అభిప్రాయం. మీ సంఘంలో ఇట్టి ఉన్నత సత్యాభ్యాసమే అనువుకాకపోతే అనువగునట్లు దాన్ని ఎంత త్వరగా మారిస్తే అంత మంచిది. ఈ ప్రయత్నంలో సుస్థిరులై, మీరు స్త్రీలనక, పురుషులనక, అందరూ సత్యాన్ని విశ్వసించడానికి అభ్యసించడానికి సాహసించండి. ఇట్టి ధైర్యం కలవారు, కొన్ని నూర్లమంది లోకానికి కావలసి వున్నారు. సత్యాన్ని తెలుసుకోడానికి సాహసించే ధైర్యం, జీవిత రూపంలో ఆ సత్యాన్ని ప్రకటించడానికి సాహసించే ధైర్యం, నిర్భీతితో మరణం ఎదుర్కొనే, మరణానికి స్వాగతం చెప్పే ధైర్యం, “నేను ఆత్మను. విశ్వంలో ఏదీ నన్ను చంపజాలదు” అని మానవునకు వ్యక్తపరచు ధైర్యం, – అట్టి ధైర్యాన్ని అభ్యసించండి. అప్పుడు మీరు ముక్తులౌతారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. “ఈ ఆత్మనుగూర్చి వినాలి. పిదప మననం చేయాలి. ఆ పిదప నిరంతర ధ్యానం చేయాలి.”
ఈ కాలంలో కార్యాచరణాన్ని ప్రశంసించడం, ఆలోచనా గతిని నిరసించడం ఆచారమవుతోంది. పనిచేయడం మంచిది. నిజమే. కాని దానికి మూలం ఆలోచనేకదా? కండరాల ద్వారా, కొంచంగా కనిపించే శక్తిని పని అంటారు. ఆలోచన లేనిదే, ఏ పనీ కలుగజాలదు. కాబట్టి మీ బుద్ధిని ఉత్తమమైన తలంపులతో, అత్యున్నతములైన ఆదర్శాలతో నిండించుకొని, రేయింబవళ్లు వానిని దృష్టిలో వుంచుకొని ఉండండి. తత్ఫలంగా అత్యుత్తమ కార్యాలు చేస్తారు. మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి. పరిశుద్ధులమనే అనండి. మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒకదాన్ని కల్పించుకొని వున్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెంటాడుతోంది. నిండుగర్భిణి అయిన ఒక సింహం, ఆహారంకోసం తిరుగుతూ, ఒక గొర్రెలమందను చూచి, దానిలోకి దుమికింది. కానీ ఆ పరిశ్రమను ఓర్వజాలక, ఈని, అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ క్రిందనే పెరిగి, వానితోపాటు గడ్డిమేస్తూ, వానిలాగానే గొర్రె అరపు అరుస్తూండింది. పెద్దదైన తర్వాతకూడ, తాను గొర్రె అనే దాని తలపు. మరొక సింహం ఒకనాడు, ఆ ప్రాంతానికి ఆహారార్థం వచ్చి, ఆ మందలో సింహం వుండడం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూచి ఆశ్చర్యపడింది. దాని దగ్గరకు వెళ్లి, అది గొర్రెకాదనీ, సింహమనీ తెలుపడానికి ప్రయత్నించింది కాని, అది దొరకక పారిపోతూ వుండింది. సమయంకోసం వేచివుండి, ఆ “గొర్రె – సింహం” నిద్రిస్తూండగా, దగ్గరకు వెళ్లి, “నీవు సింహమవు” అని దానికి చెప్పింది. “కాదు, నేను గొర్రెనే” అని అది గొర్రె అరుపు అరిచింది. అంతట దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తను ఉభయుల ప్రతిబింబాల్ని చూపింది. అంతట, ఆ “గొర్రె – సింహం” తన ప్రతిబింబాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూడగా, క్షణమాత్రంలో తాను సింహమనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు పోయి, సింహగర్జనం వచ్చింది. మీరు సింహాలు. నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన ఆత్మయే మీరు. విశ్వశక్తి మీలో అణగివుంది. “మిత్రమా! ఏడుస్తున్నావేల? నీకు జననమరణాలు లేవు. వ్యాధి దుఃఖాలు లేవు. అనంతమైన ఆకాశం వంటివాడివి నీవు. రంగు రంగుల మబ్బులు దానినావరించి, ఒక క్షణమాత్రం క్రీడించి మాయమౌతూ ఉంటాయి. కానీ, ఆకాశమెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే. దుర్జనత్వం మనకేల కనిపిస్తోంది?
చెట్టుమోడొకటి నిలిచి ఉండింది. చీకటిలో దానిని ఒక దొంగ చూచి పోలీస్ జవాను అని అనుకున్నాడు. ప్రియురాలికోసం వేచివుండిన యువకు డొకడు చూచి, తన ప్రియురాలనుకున్నాడు. దయ్యాల కథలు విన్న ఒక బిడ్డ చూచి, దయ్యమనుకొని భయంతో అరవసాగింది. కానీ అక్కడున్నది ఆ మోడే. మన మనఃస్థితియే మనకు లోకంలో కనిపిస్తుంది. ఒక గదిలో ఒక బిడ్డ ఉన్నదనుకోండి. ఆ గదిలో ఉన్న ధనపుమూటను ఒక దొంగ దొంగిలించుకొనిపోతే, బిడ్డకు అది దొంగతనం అని తెలుస్తుందా? మనలో ఉన్నదే మనకు బయట కనిపిస్తుంది. బిడ్డకు లోపల దొంగలేడు. కాబట్టి బయటకూడ లేడు. జ్ఞానమంతా ఇట్టిదే. “ప్రపంచంలో దుర్జనులున్నారు, పాపులున్నారు” అని అనకండి. “మా దృష్టికి, ఇంకా దుర్జనులు, పాపులు కనిపించుచున్నారే” అని దుఃఖీంచండి. విలపించండి. లోకోపకారం చేయగోరితే లోకాన్ని తూలనాడి, దాన్ని ఇంకా బలహీనం చేయకండి. పాపం, దుఃఖం మొదలగునవన్నీ బలహీనతకు ఫలములే సుమండీ! ఇట్టి బోధలచే లోకంలో ఉన్న బలహీనత క్రమక్రమంగా ఎక్కువవుతోంది. చిన్నప్పటినుండీ “మీరు దుర్బలులు, మీరు పాపాత్ములు–” అని లోకులకు చెబుతున్నారు. “మీరందరు – మీలోని అధమాధములు సైతం అమృతపుత్రులు, మహిమాఢ్యులు” అని బోధించండి. చిన్ననాటినుండీ బలప్రదాలు, ధైర్యప్రదాలు, ఆశాజనకాలు, అయిన ఆశయాలతో వారి బుద్ధులను నిందించండి. మీరూ అట్టి భావాలనే పొందండి. అధీరతను, నిరాశను పెంపొందించే ఆశయాలను చేరనీయకండి. “సో-హం, సోహం” (నేను అతడిని) అను భావం, మీ మనస్సుల్లోకి ఎక్కించుకోండి. రేయింబవళ్లు, మీ మనస్సులు ఆ భావంతో ధ్వనించుచుండునుగాక! మరణకాలంలోకూడ “సో-హం” అని ప్రకటించండి. అదే సత్యం. అనంతమైన విశ్వశక్తి అంతా మీదే. మీ మనస్సుల్ని ఆవరించి ఉన్న వెర్రినమ్మకాలను పారద్రోలండి. సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని అభ్యసించండి. గమ్యం దూరమే కావచ్చును. కాని లెండి; మేలుకోండి; ఆగక గమ్యం చేరుకోండి.