(లండన్లో ఉపన్యసించింది)
మానవజాతి భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఇంతవరకు కారణా లయినటువంటివి, ఇకమీద కారణాలు కానున్నట్టివి అయిన మూలశక్తు లన్నిటిలో కూడ, మతరూపంలో కనబడేదాన్ని మించింది మరోటి లేదు. సంఘవ్యవస్థ లన్నిటి వెనుకా, ఎక్కడో ఒకచోట మతమహిమ తప్పకుండా ఉంటుంది. మానవ సమాజాల్లో స్నేహభావాన్ని కలిగించే శక్తుల్లో అద్భుతమైన శక్తి మతంనుంచే పుడుతోంది. అనేక సందర్భాల్లో జాతి, దేశం, వంశం అనే బాంధవ్యాలను మించి, ఎంతో బలవత్తరంగా, మత సంబంధం ఏర్పడ్డం – మనకు తెలిసిందే. ఒక దేవతనే ఆరాధిస్తూ, ఒక మతాన్నే అవలంబించే వారు, పరస్పరం విశ్వాసాన్ని, అభిమానాన్ని ఎక్కువగా చూపుకొంటూ, ఒక వంశంలో పుట్టినవారికంటే, అన్నదమ్ములకంటేకూడ ప్రేమభావంతో, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండడం, మనకు తెలుసు. ఇటువంటమతమనేదాని పుట్టుక తెలుసుకోడానికై ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మనకు సంక్రమించిన ప్రాచీన మతాలన్నిట్లో, – అవి “అపౌరుషేయాలు” అన్న వాదం వుంది. మానవుని మేధస్సులో కాక, అతని బుద్ధికి అతీతమైన మరెక్కడినుంచో అవి వెలిశాయంటారు.
ఈనాటి విద్యావంతులు కొంతవరకు ఒప్పుకునే సిద్ధాంతాలు రెండు వున్నాయి. మతం “పైతృకం” అనే సిద్ధాంతం ఒకటి. “అఖండ” భావనలోని మార్పు అనే సిద్ధాంతం రెండవది. మతానికి మొదటి దశ పితృదేవతా ఆరాధనమని ఒక పక్షంవారి వాదన; ప్రకృతిలోని మూలశక్తులకు రూప కల్పన చేయడం, – అని రెండవ పక్షంవారి వాదం. మరణించిన తన బంధువుల్ని స్మరించుకోవాలన్న కోరిక మనిషిలో వుంటుంది. శరీరం నాశనమైన తరువాత కూడా వారు సజీవులుగా వున్నట్టుగానే భావించుకుని, వాళ్లకు పిండదానాలు చేస్తూ, వాళ్లని ఆరాధించాలనుకుంటాడు. దీన్నుండి మతమనేది పుట్టింది. ఈజిప్టు, బాబిలోనియా, చైనా, అమెరికా మొదలైన దేశాల్లోని ఆయా జాతుల ప్రాచీన మతాలను పరిశీలిస్తే, పితృదేవతల పూజే మతానికి ఆది (మొదలు) అనే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రాచీన కాలపు ఈజిప్టు దేశస్థులు, ‘ఆత్మ’ అంటే ఒకవిధమైన సూక్ష్మ శరీరమని భావించారు. ప్రతి మనిషి శరీరం లోపల, దాన్ని పోలిన మరో శరీరం ఇమిడి వుంటుంది. ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ సూక్ష్మశరీరం వాని స్థూలశరీరంనుండి వెళ్లిపోతుంది. కానీ, అది సజీవంగానే వుంటుంది. అదైనా, – ఆ స్థూలమృత శరీరం శిథిలం కాకుండా వుండేంతవరకే. కాబట్టే ఈజిప్టువాళ్లు మృతశరీరాలు శిథిలమైపోకుండా ఎంతో శ్రద్ధతో కాపాడేవాళ్లు. “పిరమిడు” లనే నాలుగు కోణాలున్న గోపురాల్లాంటి పెద్దపెద్ద సమాధులు కట్టి, వానిలో ఆ శరీరాన్ని కాపాడేవాళ్లు. బాహ్యశరీరంలో ఏ భాగమైనా పాడైతే అలాంటి నష్టమే సూక్ష్మశరీరానికీ కల్గుతుందని వాళ్ల నమ్మకం. ఇది “పితృదేవతారాధన” అనడం స్పష్టం. బాబిలోనియాలోని ప్రజలక్కూడ ఇలాంటి సూక్ష్మశరీరం ఒకటి వుందనే నమ్మకం వుంది. కానీ కొంచెం తేడా వుంది. ఆ సూక్ష్మశరీరికి ప్రేమ అనేది వుండదంటారు. తనకు ఆహారం, నీళ్లు ఇవ్వమని బ్రతికివున్నవాళ్లను అది బెదిరిస్తుందట! ఎన్నో విధాలుగా తనకు సహాయం చేయమంటుందట!! ఆ ఆత్మకు సొంత బిడ్డలపైన, భార్యపైనకూడ ప్రేమ వుండదు. పూర్వం భారతీయుల్లోకూడ ఇటువంటి పితృపూజ వుందనే సూచనలు కన్పడుతున్నాయి. చైనావాళ్ల మతానికికూడ పునాది పితృపూజనమే అని చెప్పవచ్చు. ఇప్పటికీ వాళ్ల దేశంలో ఇదే పరిస్థితి. పితృదేవతారాధనం ఒక్కటే ఆ దేశంలో వర్థిల్లుతున్న మతమనికూడ చెప్పవచ్చు. ఇలా, పితృపూజనమే మతానికి మూలమని వాదించే వాళ్లకు ప్రబలమైన ఆధారం ఒక పక్షంలో ఏర్పడుతోంది.
మతం, ప్రకృతిశక్తుల ఆరాధనంనుండి పుట్టిందని ప్రాచీన ఆర్య గ్రంథాలనుండి ఉదాహరణలు చూపే పండితులు రెండో పక్షం వాళ్లు. భారతదేశమంతటా పితృదేవతారాధన వుంది అనడానికి రుజువులు ఇప్పుడు కన్పిస్తున్నా, ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా వానిజాడ కనిపించదు. ఆర్యజాతివారి గ్రంథాల్లో చాలా ప్రాచీనమైంది ఋగ్వేదసంహిత. అందులో ఈ విషయం ఎక్కడా కనిపించదు. ఆధునిక పండితులు అందులో వున్నది ప్రకృతి ఆరాధనమే అని అభిప్రాయపడ్డారు. కనిపిస్తున్న ఈ ప్రపంచం వెనుక ఏమి దాగివుందో తెలుసుకోవాలని మానవుని బుద్ధి సదా పెనగులాడుతూ వుంటుంది. ఉదయాస్తమానాలు, తుఫానులు, ప్రకృతి శక్తులు, వానిలోని సౌందర్యం, యివన్నీ మనిషిని ఆకర్షించాయి. అంతేకాకుండా వాటి రహస్యం గ్రహించాలనికూడ కోరిక కలిగింది. ఆ ప్రకృతి ఘటనలను సుగుణాలుగా భావించి, ఒకప్పుడు అందమైనవి, మరొకప్పుడు ప్రకృతికి అతీతాలుగా వున్నవే అయిన శరీర ఆత్మలను వానిలో ఆరోపించసాగారు. అటువంటప్రయత్నాలు చేసినపుడు, ఈ ప్రకృతి సంఘటనలు, మొదట సుగుణాలుగా భావనచేయబడినా, లేకున్నా, చివరికి అవి నిర్గుణాలుగా భావించడం జరిగింది. గ్రీకుల విషయంలోకూడ ఇదే జరిగింది. వాళ్ల పురాణాలంతా నిర్గుణారోపణతో కూడిన ప్రకృతి ఆరాధనే. ప్రాచీనకాలపు జర్మనులు, స్కాండినేవియన్లు, ఇంకా ఇతరులైన ఆర్యజాతుల విషయంలోకూడ ఇలాగే జరిగింది. కాబట్టి ప్రకృతి శక్తుల్ని, సగుణాలుగా భావించడంతోనే మతం ప్రారంభమైందను రెండవ పక్షానికి వాదబలం చేకూరుతోంది.
ఈ రెండు వాదాలు, పరస్పరం విరుద్ధాలుగా కన్పిస్తున్నా, మరో మూడో సిద్ధాంతంచేత వీనిని సమన్వయింపవచ్చు. అదే మతానికి నిజమైన అంకురమని నా కనిపిస్తుంది. ఇంద్రియాలు ఏర్పరచే హద్దులను అతిక్రమించే ప్రయత్నమే అది అని నా భావన. మనిషి తన పూర్వీకుల (అంటే మరణించినవారి) ఆత్మలకోసం అన్వేషిస్తూంటాడు. అంటే ఈ శరీరం నాశనమైన తర్వాత నిలిచినదాన్ని గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడన్నమాట. లేదా, మహత్తరమయినటువంటి ప్రకృతి వికారాలకు (మార్పులకు) మూలమైన మహాశక్తిని గ్రహించాలని ప్రయత్నిస్తూంటాడు. ఈ రెండిట్లో ఏదైనా, – ఒకటి మాత్రం స్పష్టం – మనిషి తన ఇంద్రియ పరిమితుల్ని దాటిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు తన ఇంద్రియాలతో తృప్తిపొంది వుండలేడు. వానిని అతిక్రమించాలని చూస్తూంటాడు. దీనికి కారణం తెలిసిందే. మతాన్ని గూర్చి, అమృతత్వాన్ని గూర్చి మొట్టమొదటి భావన కలలద్వారా కలుగుతుందని నా కనిపిస్తుంది. కల ఒక విచిత్రావస్థ. పసివాళ్లు, పామరులు, జాగ్రత్, స్వప్నావస్థలకు గల భేదాన్ని అంతగా గ్రహించలేరని మనకు తెలుసు. నిద్రావస్థలోని శరీరం మృతిచెందినట్లుగా కనిపిస్తుంది. కాని మనసు దాని విచిత్ర చర్యలను అన్నిటినీ సాగిస్తూనేవుంటుందన్న వాదం, వాళ్లకు సహజంగా కన్పించడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదు. అట్లే, ఈ శరీరం మరణించిన తర్వాతకూడా ఇటువంటి చర్యలే జరుగుతూంటాయనుకోవడం విడ్డూరం కాదు. అలౌకిక సంఘటనల్ని ఇలా గ్రహించటం చాలా సహజమని, నా అభిప్రాయం. ఈ స్వప్న భావనను ఆధారం చేసికొని మానవుని బుద్ధి క్రమక్రమంగా ఉత్తమ భావనలకు ప్రయత్నిస్తుంది. కాలం గడిచేకొద్దీ, మనుషుల్లో చాలామంది, – ఈ కలలు జాగ్రదవస్థలో రుజువయ్యేవి కాకున్నా, స్వప్నావస్థలో వేరొకస్థితిని పొందక, తాను మేల్కొని వున్నప్పటి అనుభవాలనే మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటాడని గ్రహించారనడం వాస్తవం.
అయినప్పటికీ, అప్పటికే తత్త్వాన్వేషణ ప్రారంభమైంది. ఆ విచారణ అంతర్ముఖమయింది. మనస్సుయొక్క సూక్ష్మతర స్థితుల్ని గూర్చి విమర్శనలను సాగించి, జాగ్రత్, స్వప్నములను మించిన సూక్ష్మతరావస్థలను కనుగొన్నారు. ప్రపంచంలోని సుస్థిరమైన మతాలన్నింట్లో ఈ దశ (అవస్థ) పేర్కొన్నారు. దాన్ని తన్మయత (ఎక్స్టసి) లేదా దివ్యప్రేరణ (ఇన్స్పిరేషన్) అంటారు. ఆ మతాలన్నింట్లో, ఆయా మతస్థాపనాచార్యులు, ప్రవక్తలు, ఉపదేశకులు, – జాగ్రత్, నిద్రావస్థలకు భిన్నమైన మనోదశలను పొందినట్లు, ఆ స్థితిలో వాళ్లు ఆధ్యాత్మికము లనబడే కొత్త అనుభవాల్ని పొందినట్లు చెప్పారు. జాగ్రదావస్థలోకంటే గొప్పగా వాళ్లు, ఆ స్థితిలో, గొప్ప విషయాలను గ్రహించారు. ఉదాహరణకు, బ్రాహ్మణాలలోని మతాలను చూడండి. వేదాలను ఋషులు రచించారంటారు. కొన్ని సత్యాల్ని అపరోక్షానుభూతివల్ల గడించినవారే ఈ ఋషులు. ఋషి అంటే – మంత్రద్రష్ట. అంటే, వేద మంత్రాలలో వున్న భావాల్ని దర్శించినవాడని అర్థం. అతీంద్రియ విషయాలను గూర్చి “దర్శించారు” అన్న పదాన్ని ప్రయోగించడానికి ఒప్పుకుంటే, కొన్ని గొప్ప సత్యాలను తాము దర్శించామనీ వానిని గ్రంథస్థంచేశామనీ వారు ప్రకటించారు. ఇటువంటి సత్యాలనే, యూదులు, క్రైస్తవులు ప్రవచించారు.
దక్షిణశాఖా సంప్రదాయంవాళ్లైన బౌద్ధుల విషయంలో ఈ విషయంపై ఒకింత ఆక్షేపణకు అవకాశం ఉంది. బౌద్ధులు భగవంతుడన్నా, ఆత్మ అన్నా నమ్మరుకదా? అలాంటప్పుడు వారి మతానికి అతీంద్రియావస్థలోని అనుభవాలెలా ఆధారాలవుతాయని ప్రశ్నించవచ్చు. దానికి సమాధాన మేమంటే – బౌద్ధులుకూడ, శాశ్వతనీతిని లేదా ధర్మాన్ని కనిపెట్టారు. ఆ నీతిధర్మం, హేతుబద్ధమైన విచారం వల్ల జన్మించింది కాదు. బుద్ధుడు అతీంద్రియావస్థలో దాన్ని కనిపెట్టి ప్రకటించాడు. “ది లైట్ ఆ్యప్ ఏషియా” అన్న మనోహర పద్యకావ్యంలో బుద్ధచరిత్ర సంగ్రహంగా వుంది. అతీంద్రియావస్థను పొందేంత వరకు, బుద్ధుడు ఒక అశ్వత్థవృక్షం కింద కూర్చున్నాడని ఆ గ్రంథంలో వుంది కదా? ఆయన ఉపదేశాలన్నీ అటువంటి దివ్యావస్థలో లభ్యమైనవేకానీ, తర్కబద్ధమైన ఆలోచనల మూలంగా లభించినవి కావు.
ఈవిధంగా అన్ని మతాలూ ఒక మహత్తరమైన భావాన్ని ప్రకటిస్తున్నాయి. మానవుడి మనస్సు కొన్ని సమయాల్లో, ఇంద్రియాతీతక్షేత్రాలకు పోవడమేకాక, యుక్తియుక్త విచారక్షేత్రాన్ని కూడ దాటిపోతుందట!! అప్పుడది ఇంద్రియాలు ఎప్పుడూ అనుభవించనట్టి, తర్కానికి నిలువనట్టి సత్యాన్ని ప్రత్యక్షంగా చూడగల్గుతుంది. ఇట్టి సత్యాలే ప్రపంచంలో అన్ని మతాలకూ మూలాధారాలు. వీటిని గూర్చి సందేహం వెలిబుచ్చటానికి, తర్కంతో పరీక్షించడానికి, మనకు అధికారం వుంది, నిజమే. కానీ, లోకంలోని అన్ని మతాలనూ, ఇంద్రియ ఆవరణలనూ, తర్కపు హద్దుల్నీ దాటిపోగల యీ విచిత్రమైన శక్తి మనస్సుకు వుందని సిద్ధాంతీకరిస్తున్నాయి.
మతాలన్నీ ప్రకటించే ఈ విషయాలు ఎంతవరకు, నిజం అనే విచారణ అటుండనిచ్చి, ఒక విశేషంమాత్రం వాటి అన్నిటికి సామాన్యమై కన్పిస్తోంది. పదార్థ విజ్ఞానశాస్త్రం కనిపెట్టిన ప్రత్యక్షరూప సత్యాలవంటివి కాక, ఇవన్నీ కేవలం మనస్సుకే అర్థమయ్యేవి. బాగా వ్యవస్థాపితములైన అన్ని మత తత్త్వాల్లో – ఇవి కేవలం ‘భావమయవ్యక్తి’ అనిగానీ, ‘సర్వవ్యాపి’ అనిగానీ అనుభూతిగోచరుడైన దేవుడు అనిగానీ, నీతిశాసనమనిగానీ, అస్తిత్వం కల్గిన ప్రతిదానికీ ఆధారమైన మూలసత్త్వం అనిగానీ చెప్పబడు తున్నాయి. ఈ కాలంలోకూడ, – ఇంద్రియాతీతమైన మనస్సితితో ప్రమేయం లేకుండా, మతబోధలు చేస్తున్నామని చెప్పేవారంతా, ప్రాచీనుల ఈ పురాతన భావాలనే తీసికొని వాటికి “నీతిశాస్త్రం”, “ఐక్యాదర్శం” వగైరా పేర్లు పెట్టడం గమనార్హం. దీన్నిబట్టి ఈ భావకల్పనం, ఇంద్రియాలలో ప్రభవించడంలేదని తేలుతోంది. మనలో ఎవరుకూడ సంపూర్ణ ఆదర్శమూర్తి అయిన మానవుని చూళ్లేదు. అయినా, అటువంటి వ్యక్తి వుంటాడని నమ్మండి – అని చెబుతారు. మన మెవరమూ గొప్ప ఆదర్శమూర్తిని చూడలేకపోయినా అటువంటి ఆదర్శం లేకుండా పురోభివృద్ధిని పొందలేము. కాబట్టి ఆదర్శభావైకమూర్తి ఒకటి వుందనీ, ఈ మతాలన్నీ ఆ మూర్తినే మనకు చూపించాలని ప్రయత్ని స్తున్నాయనీ స్పష్టమవుతోంది. ఆ మూర్తిని సగుణపురుష రూపంగానో, నిర్గుణభావంగానో, ఒక విశిష్టధర్మంగానో, కేవల సత్తా రూపంగానో అవి చిత్రిస్తాయి. ఆ ఆదర్శంతో తాదాత్మ్యం పొందాలనే మనం నిరంతరం శ్రమిస్తున్నాం. ప్రతి మానవుడు – అతడెట్టివాడైనా, ఎక్కడ ఉన్నా, సర్వశక్తిమంతమైన ఒక ఆదర్శమూర్తిని భావనచేస్తూ వుంటాడు. ప్రతి మానవుడూ, ఒక అఖండ, ఆనందమయ స్వరూపుణ్ణి ఆదర్శంగా భావిస్తూ వుంటాడు. మనచుట్టూ జరిగే కార్యాలన్నీ అంతటా కన్పిస్తున్న ప్రవృత్తి అంతా, ఆ అప్రతిహతశక్తినో, ఆ పరిపూర్ణ ఆనందాన్నో చేరడానికి జరిగే పెనగులాటే సుమండీ! కానీ ఇలా ఎంత ప్రయత్నించినా ఆ శక్తి ఇంద్రియాల ద్వారా లభించదన్న విషయాన్ని కొందరు తొందరలోనే గ్రహిస్తారు. అంటే ఆ అఖండశక్తిని గ్రహించడానికి ఈ ఇంద్రియాల ప్రజ్ఞ చాలదనీ, ఈ దేహానికి అట్టి శక్తి లేదనీ గ్రహిస్తారు. పరిమితమైన దేని సహాయంతోనైనా, ఆ అఖండశక్తిని వ్యక్తం చేయడం అసంభవం. ఈ విషయం ఏదో సమయంలో అతనికి తెలుస్తుంది. ఈ విరామమే – అంటే ఈ ప్రయత్నాన్ని వదలడమే నీతిధర్మానికి పునాది. పరిత్యాగమే నీతి సూత్రానికి ఆధారం. త్యాగశీలంపై ఆధారపడని నీతిశాస్త్రాన్ని ఎవరూ బోధించరు.
“నాహం; త్వమేవ” (నేను కాదు, నీవే) అని నీతిశాస్త్రం చెబుతుంది. “అహం కాదు; నాహం” అన్నదే దాని ఆదర్శసూత్రం. ఇంద్రియాల ద్వారా ఆ అనంతశక్తినికానీ, ఆ పరిపూర్ణానందాన్నికానీ, పొందాలని ప్రయత్నించి నపుడు, మనిషి గట్టిగా పట్టుకునివున్నా, నిరర్థకమైన, అహాన్ని (వ్యక్తి భావన) వదలిపెట్టాలని, నీతిశాస్త్రం శాసిస్తోంది. ఇతరులను ముందు నిలిపి, నీవు చివర నిలుచుండవలసి వుంటుంది. ఇంద్రియాలేమో, “నేను” ముందు అంటాయి. నీతిధర్మం మాత్రం “నేను” చివర ఉండాలంటుంది. ఇలా నీతి శాస్త్రాలన్నిటికీ పరిత్యాగం పునాది. భౌతిక ప్రపంచంలో “వ్యష్టి” వినాశం కావాలి. ప్రస్ఫుటం కారాదు. ఆ అనంతమూర్తి ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తమయ్యేవాడు కాడు. ఆ విధంగా కావడం సాధ్యపడదు. ఊహించడానికి అసాధ్యం.
మానవుడు ఆ అఖండమూర్తిని చక్కగా దర్శించాలంటే, ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించి, లోకాంతరాలకు పయనించాలి. ఇలా భావించినప్పుడే రకరకాలైన నీతిశాస్త్రాలు పుట్టాయి. వాటి అన్నిట్లోకూడ అహంకారం త్యాగం చేయాలన్న ప్రధానభావం వుంది. అహంకారాన్ని పరిపూర్ణంగా నశింప చేయటమే నీతికి పరమ గమ్యం. తమ వ్యష్టిత్వాన్ని గూర్చి తలపోయ కూడదని చెబితే మానవులు భయపడతారు. తమ అస్తిత్వాన్ని కోల్పోవడమంటే వాళ్లకు భయం. అయినా వీళ్లే నీతిధర్మ పరమాదర్శాలు సమంజసాలని చెబుతారు. కానీ సమస్త నీతికీ ప్రయోజనం, పరమార్థం గమ్యమూ కూడ ఈ వ్యష్టిత్వాన్ని వినాశం చేయడమేకానీ, వ్యష్టిత్వ నిర్మాణం కానేకాదని వాళ్లు తెలుసుకోవడం లేదు.
మనుషులమధ్య ఏర్పడే నైతిక సంబంధాలను, “ఉపయోగ మానములు” (యుటిలిటేరియన్ స్టాండర్డ్స్) వివరింపలేవు. ఎందుకంటే నీతిసూత్రాలు ఉపయోగమనే దాని విచారణనుబట్టి ఏర్పడవు. ఈ ప్రకృతికి అతీతమైన ఒక ఆధారం లేకుండ – అంటే అతీంద్రియ దృష్టి లేకుండ – నీతిధర్మం కలగదు. పరిపూర్ణత్వాన్ని అందుకోవడం అనే ఆవేదనే లేకపోతే ఆదర్శమే లేదు. మానవులను తమతమ సంఘనియమాలకు లోబరచి బంధింపకోరే ఏ సంప్రదాయమూ, మానవధర్మశాస్త్రాన్ని వివరించలేదు. ప్రయోజన సిద్ధాంతం గూర్చి వాదించేవాడు, మనల్ని పరిపూర్ణాన్ని గురించిన ప్రయత్నాన్నే వదలిపెట్టుడని కోరవచ్చు. అతీంద్రియానుభవాలలో సంసాధన చేయడం సాధ్యంకాదనీ, అది ఒక వెర్రి ప్రయత్నమనీ వాదించవచ్చు. కానీ అలా చెబుతూనే, నీతితో, సంఘానికి మేలుచేయండని హెచ్చరిస్తాడు. మనం సత్కార్యం ఏల చేయాలి? సత్కార్యం అనేది అవాంతర (సెకండరి) విషయం. మనకు ఒక గమ్యం వుండాలికదా? నీతి మాత్రమే పరమార్థంకాదు. అది ఒక పరమార్థాన్ని చేర్చే సాధనం మాత్రమే. ఆ గమ్యం లేనప్పుడు నీతి లేకపోతేనేం? నేను ఇతరులకు ఉపకార మేలచేయాలి? అపకారం ఎందుకు చేయకూడదు? మానవజాతికి సుఖాల్ని అనుభవించడమే పరమార్థమైతే నేను నా సౌఖ్యాన్నే ఎందుకు చూచుకోకూడదు? ఇతరులకు అసౌఖ్యం ఏల కలిగించరాదు? అలాచేస్తే అడ్డుపడే దెవరు? అంతేకాక, ప్రయోజన వాదానికి వున్న ఆధారం చాలా సంకుచితం. ఈనాటి సంఘాచార సంప్రదాయాలన్నీ, నేడున్న సంఘంనుండే పుడుతున్నాయి. సంఘం శాశ్వతంగా వుంటుందని ఊహించడానికి ప్రయోజనవాదికున్న ఆధార మేమి? యుగాంతములకు పూర్వం సంఘంలేదు. ఆ తర్వాతా అది వుండక పోవచ్చు. ఒకవేళ ఇది, మనం అత్యుత్తమ పరిణామాన్నిపొందే మార్గంలో ఒక తాత్కాలిక అవస్థ కావచ్చు. కాబట్టి, సంఘంనుండి మాత్రమే సంగ్రహించిన ఏ ధర్మంకానీ, చిరస్థాయిగా వుండదు. అది మానవ స్వభావాన్నంతా తనలో ఇముడ్చుకోలేదు. ఈ ప్రయోజనవాద సిద్ధాంతాలు, ప్రస్తుత సంఘస్థితికి అనుకూలంగా మాత్రం ఉపకరిస్తాయి అనవచ్చునేమో? అంతకుమించి వాటికి విలువలేదు. కానీ, మతంనుండీ, ఆధ్యాత్మిక విచారం నుండీ, సంగ్రహించిన ధర్మసిద్ధాంతంకానీ, నీతిశాస్త్రంకానీ, మానవుని అనంత స్వరూపాన్ని సంపూర్ణంగా తనలో ఇముడ్చుకోగలిగినంత విశాల మైనది. అది వ్యష్టిప్రసక్తిని స్వీకరించి, అఖండంతో సంబంధాన్ని ఏర్పరచుకొంటుంది. సంఘంతోకూడ సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఎందుకంటే వ్యక్తులే సంఘంగా మారుతారుకదా? కాబట్టి అది ఒక వ్యక్తికీ, అతని శాశ్వతజీవనానికీకూడా వర్తిస్తుంది. అట్లే సంఘమంతటికీ – ఆ సంఘం ఏ కాలంలో, ఏ స్థితిలో వున్నాకూడా వర్తిస్తుంది. కాబట్టి మానవ జాతికి ఆధ్యాత్మికమైన మతం ఎప్పుడూ అవసరమని మనం గ్రహించవచ్చు. జడపదార్థాలను గూర్చి ఆలోచిస్తూండడం ఆనందంగా వుండవచ్చుకానీ, మనిషి ఎప్పుడూ దాన్నే తలుచుకుంటూ వుండలేడు.
ఆధ్యాత్మిక విషయాలను గూర్చి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, ఈ ప్రపంచంలోని వ్యవహారాలకు అడ్డు కలుగుతుందనే వాదమొకటి ఉంది. “మనం ముందు ఈలోకవ్యవహారాలను గూర్చి శ్రద్ధవహించాలి. అవి పూర్తయిన తర్వాత పరలోకాలను గూర్చి ఆలోచించవచ్చు” అనే వాదం, చైనా దేశ రుషి అయిన కన్ఫ్యూషియస్ నాటి, ప్రాచీనకాలంలో వుంది. ఈ లోకాన్ని గూర్చి శ్రద్ధపూనడం మంచిదే. కాని పారమార్థిక విషయాలను గూర్చి ఆలోచించినప్పుడు, ప్రపంచ వ్యవహార సంబంధాలు ‘కొంచెం’ విచ్ఛిన్నమైతే, ఇహలోక వ్యవహారాలను గూర్చి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తూంటే, ఇహపరాలకు రెండింటికి భంగం కలుగుతుందే! ఇది మనల్ని నాస్తికులనుగా చేస్తుంది. మనిషికి ప్రకృతి పరమగమ్యం కాదుకదా? అంతకన్నా ఉత్తమమైన పరమార్థం ఒకటివుంది.
ప్రకృతిని అతిక్రమించాలని ప్రయత్నించేంతవరకే మానవుడు, మానవుడనిపించుకోడానికి అర్హుడవుతాడు. ఈ ప్రకృతి ‘బాహ్య’ మనీ, ‘ఆంతర’ మనీ రెండు రకాలు. మన శరీరంలోనూ, దాని వెలుపలనూ ఉండే జడపదార్థ పరమాణువుల్ని పాలించే ధర్మమే కాకుండా, ఆంతరమైవున్న సూక్ష్మతర ప్రకృతిని పాలించేవి కూడ, ఈ ప్రకృతి శబ్దంలో చేరుతుంది. బాహ్య ప్రకృతినికూడ పరిపాలించే మూలశక్తి నిజానికి ఈ సూక్ష్మతర ప్రకృతే. బాహ్యతర ప్రకృతిని జయించడం ఘనకార్యమే! కానీ మన లోపలి ప్రకృతిని జయించడం ఇంకా గొప్పకార్యం! ఈ నక్షత్రాల్ని, గ్రహాల్ని పాలించే ధర్మాల్ని గ్రహించడం గొప్ప విషయమే. గౌరవించదగిన విషయమే. కాని మానవుని విషయవ్పాంచల్ని, భావాల్ని, ఇచ్ఛాశక్తిని పాలించే ప్రకృతి ధర్మాల్ని తెలుసుకోవడం, ఎంతో గొప్పదీ, గౌరవించదగిందీ అయిన విషయం. ఈ అభ్యంతర పురుషుణ్ణి జయించడం, మనిషి మనసులో వుండే సూక్ష్మతర చర్యల రహస్యాన్ని గ్రహించడం, పూర్తిగా మతానికి మాత్రమే సంబంధించిన పని. మానవ ప్రకృతి – అంటే సామాన్య మానవ ప్రకృతి – గొప్పగొప్ప, ఆధిభౌతిక విషయాలనే గ్రహించాలనుకొంటుంది. సామాన్యుడికి మిక్కిలి సూక్ష్మమైన విషయాలేమీ తెలీవు. అందుచేతనే పామరులైనవాళ్లు వేలాది గొఱ్ఱెపిల్లల్ని చంపే సింహాన్ని చూసి మెచ్చుకుంటారు. అది సింహానికి తాత్కాలికంగా విజయాన్ని కలిగించినా, గొఱ్ఱెపిల్లల పాలిట మృత్యు వవుతోందని వాళ్లు ఒక్కక్షణం ఆగి, ఆలోచించరు. పశుబలాన్ని ప్రకటిస్తే, వాళ్లకు సంతోషం కలుగుతుంది. సరే, మామూలు మనుష్యు లిలావున్నారు. బాహ్యవిషయాలను చూచి వాళ్లు ఆనందిస్తారు. కానీ, ప్రతి సంఘంలోకూడ, ఇంకో తెగవారున్నారు. వాళ్ల ఆనందం, ఇంద్రియానుభవంలో లేదు. దాని కతీతంగా వుంటుంది. ఈ జడపదార్థానికి అతీతంగా వుండే దాని జాడను వాళ్లు అప్పుడప్పుడూ తెలుసుకుంటారు. దాన్ని పొందటానికి వాళ్లు గిజగిజ లాడుతారు. వివిధ జాతుల చరిత్రను విమర్శనదృష్టితో చదివితే, ఇలాంటమనుషుల సంఖ్య ఏ జాతిలో ఎక్కువగా వుంటుందో, ఆ జాతి ఔన్నత్యాన్ని పొందుతుందనీ, పరిపూర్ణాన్ని గూర్చిన ఈ అన్వేషణం – ప్రయోజనవాదులు అది వ్యర్థమైనదంటారేమో – ఏ జాతిలో క్షీణిస్తుందో ఆ జాతి దైన్యాన్ని పొందుతుందనీ మనం గ్రహించవచ్చు. అంటే, ఏ జాతికైనా, దాని ఆధ్యాత్మిక వర్తనమే సౌష్ఠవానికి మూలాధారమనీ, ఆ ఆధ్యాత్మిక చింతన క్షీణించి, నాస్తికత బలపడినప్పుడు, ఆ జాతికి మరణ చిహ్నాలు మొదలౌతాయనీ అర్థం.
మత విచారం వల్ల మనం నేర్చుకోగల్గిన సుస్థిర విషయాలు, సత్యాలు, అటుంచి, అందువల్ల మనం అనుభవింపజాలే ఆనందమటుంచి, మతాన్ని ఒక శాస్త్రంగా, ఒక అధ్యయనాంశంగా మాత్రమే గ్రహించినా, దానివల్ల మనిషి బుద్ధికి లభించగల వ్యవసాయం సైతం, మిక్కిలి శ్రేయస్కరం ఉత్తమోత్తమమూ అయివుంటుంది. పరిపూర్ణాన్ని గూర్చిన విచారణ, ఆ అఖండస్వరూపాన్ని అర్థంచేసికోవడానికి చేసే ప్రయత్నం, ఇంద్రియ అనుభవాల్ని, అంటే భౌతిక ప్రపంచాన్ని దాటిపోవాలనే చేష్ట, ఆధ్యాత్మిక పురుషుడిగా పరిణతి చెందాలనే కోరిక, – ఇంతెందుకు, పరిపూర్ణంతో తాదాత్మ్యాన్ని పొందడానికి రాత్రింబగళ్లు సాగించేసాధన – ఈ తీవ్రయత్నమే, మానవుడు చేయగల్గిన సాధనలలో కంతటికి గొప్పది, గౌరవించదగిందీ అనడానికి సందేహంలేదు. కొందరు తినడంలో ఆనందాన్ని పొందుతారు. వాళ్లను ఎగతాళి చేయడానికి మనకు అధికారం లేదు. మరికొంతమంది కొన్నికొన్ని వస్తువుల్ని సేకరించి పెట్టుకోవడంలో ఆనందాన్ని పొందుతారు. వాళ్లు అలా చేయగూడదనటానికీ మనకు అర్హతలేదు. అట్లే ఆధ్యాత్మిక విచారంలో మహానందాన్ని అనుభవించే పురుషుణ్ణి చూసి, ‘కాద’ నడానికీ, వాళ్లు అర్హులుకారు. జీవి క్షుద్రతరమైనకొద్దీ ఇంద్రియానుభవం వల్ల కలిగే ఆనందం ఎక్కువగా వుంటుంది. కుక్క కాని, తోడేలుకాని తినేంత ఇష్టంగా, మనిషి తన ఆహారాన్ని తినలేడు. కానీ కుక్క, తోడేలు అనుభవించే సుఖానుభవాలన్నీ, వానివాని (ఆయా) ఇంద్రియాల్లో మాత్రం చొచ్చుకొని పోతాయనవచ్చు. ప్రతి జాతిలోకూడ, క్షుద్ర మానవకోటి యిట్లే తమ ఇంద్రియానుభవాల్లో ఆనందాన్ని పొందుతుంది. సంస్కారులు, విద్యా వంతులు, – మననం, తత్త్వ విచారం, కళలు, శాస్త్రాలు మొదలగు వానివల్ల ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మికసాధన ఇంకా ఉత్తమవృత్తి అనవచ్చు. ఆ విషయం అనంతమగుటవల్ల ఆ క్షేత్రం అత్యుత్తమం. అక్కడ అనుభవించే ఆనందం కూడ, దానిలో రుచికలవాళ్లకు మహోత్కృష్టమై వుంటుంది సుమండీ! కాబట్టి మనిషి, ఆనందంకోసం పాటుపడవలసిందే అని ప్రయోజనవాదుల మతాన్ని అనుసరించినా, అన్నిట్లోకి ఆధ్యాత్మికానందం, చాలా గొప్పది కాబట్టి, మనిషి ఆధ్యాత్మిక చింతను సాధనచేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక వ్యాసంగం, నా మనసుకు అత్యంత అవసరమనితోస్తోంది. దాని ఫలాన్నిబట్టి చూస్తే, అదట్టిదే అని మనకు అర్థమవుతుంది. మానవ హృదయంలో చలనం కల్గింపగల అత్యుత్తమ శక్తి దాంట్లో ఉంది. ఆధ్యాత్మికం కాబట్టి, మరే పదార్థమూ, అంతశక్తిని మనలో ప్రేరేపించలేదు. మానవకోటి చరిత్ర, మనకు తెలిసినంతలో, ఇట్లే ఉండిందనీ, దాని మహిమ తగ్గలేదనీ స్పష్టమవుతోనే ఉంది. కేవలం ప్రయోజనవాదాన్ని అవలంబించే పురుషులు సైతం, నీతిమంతులూ, ఉత్తములూ అయివుండగలరనడాన్ని నేనుకాదనను. కేవలం ప్రయోజనవాదాన్ని పాటించేవారిలో కూడ, బుద్ధిమంతులు, నీతి మంతులు, యోగ్యులు అయిన మహనీయులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అయినా ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్లు, లోకంలో వశీకరణశక్తిని ప్రయోగిస్తున్నారేమో అని అనదగినవాళ్లు, తమ జీవితంచేతనే ఆధ్యాత్మిక వహ్నిని, ఇతరులలో ప్రజ్వలింపచేయగలిగినవాళ్లు – ఇట్టివారి నందర్నీ, వెనుక వుండి నడిపించేది, ఆధ్యాత్మికచింతనే అని, – అంటే – పారమార్థిక విచారమే అని తెలుస్తోంది. వాళ్లను కదిలించే ఆ మూలశక్తే మతం. ప్రతి మనిషికి సహజమైన అనంతశక్తిని ప్రత్యక్షం చేసుకోవడానికై ప్రేరేపించే మహాశక్తి మతమే. శీలనిర్మాణంలోను, శ్రేయస్కరం, గొప్పది అయిన ప్రతి కార్యాన్నీ, ప్రోత్సహించడంలోను, ఇతరులకు శాంతిని కలిగించడంలోను, తమకు శాంతిని కలిగించుకోవడంలోను, మూలాధారశక్తిగా వుండేది మతమే! కాబట్టి, ఆ దృష్టితో ఆధ్యాత్మిక చింతనకు పూనుకోవాలి. మతాన్ని ఇప్పుడు, మునుపటికంటే విశాలతర భావాలతో పరిశీలింపవలసి ఉంది. సంకుచితం, పరిమితం, కలహకారణం అయిన మత భావాలు అంతరించాలి. మతాన్ని గూర్చిన భిన్న సంప్రదాయభావాలన్నీ, జాతి, శ్రేణి, సంబంధమగు వేర్వేరు భావాలన్నీ – వదలివేయాలి. ప్రతి శ్రేణికి, ప్రతి జాతికి, ఒక ప్రత్యేక దేవత ఉండాలనే భావం, తక్కిన వారంతా అపమార్గంలో వెళ్లేవాళ్లే అనే భావం, – మూఢవిశ్వాసాలవల్ల కలుగుతున్నాయని గ్రహించి, విడిచిపెట్టాలి. అట్టి ఊహల్ని పారద్రోలాలి. మానవుని బుద్ధి వికసించేకొద్దీ, దాని ఆధ్యాత్మిక గమనంకూడ విశాలమవుతూ వుంటుంది. ఎవరైనా, ఒక భావాన్ని గ్రంథస్థం చేస్తే, అది భూమిలో, వెంటనే దిగంతాల వరకూ వ్యాపించే కాలం వచ్చింది. కేవలం ఆధిభౌతిక సాధనాల వల్లే, మనకు ప్రపంచమంతటితో కలయిక కలుగుతోంది. కాబట్టి భవిష్యత్తులో మతాలన్నీ దానికనుగుణంగా విశాలములు, విశ్వజనీనములుగా మారాలి.
భావికాలంలో పారమార్థికాదర్శాలు, ప్రపంచంలో ఉత్తమం, మహనీయమూ అయిన దాన్నంతటినీ, తమలో ఇముడ్చుకోవడమేకాక, తర్వాతి కాల పరిణతినికూడ ఇముడ్చుకోవడానికి, పరిపూర్ణావకాశాన్ని ఈయవలసి వుండాలి! పూర్వం వున్నదాన్లో యోగ్యమైనదాన్నంతా రక్షించాలి. ఇదివరకే సంకుచితమై వున్నదానితో, భావికాలంలో కొత్త విషయాన్ని చేర్చడానికి అవకాశం వుండాలి! మతాలు పూర్తిగా ఉదారంగా వుండాలి. తమ తమ ప్రత్యేక భగవదాదర్శాలు వేర్వేరయినంతమాత్రాన ఒకదాన్నొకటద్వేషించుకోవడం తగదు. భగవంతు డొకడున్నాడని – మన భావాల ప్రకారం ఏమాత్రం విశ్వసింపకపోయినా, ఆత్మవిద్యాపరాయణులూ, వివేకవంతులూ అయిన వాళ్ల నెంతమందినో నేను స్వయంగా చూశాను. మనకంటే కూడ ఎక్కువగా వాళ్లు భగవంతుణ్ణి గూర్చి గ్రహించే వుంటారు. సగుణబ్రహ్మం, నిర్గుణబ్రహ్మం, పరిపూర్ణం, నీతి ధర్మం, స్థితప్రజ్ఞత్వం మొదలైనవన్నీ, మత నిర్వచనంలో ఇమిడి ఉండాలి. ఈ విధంగా మతం విశాలమైందైతే, నూరింతలు ఎక్కువగా అది మేలు కలిగిస్తుంది. మతాలు మహాశక్తిమంతా లైనప్పటికీ సంకుచితాలవడం వల్ల ప్రపంచంలో మేలుకంటే కీడునే ఎక్కువగా కల్గిస్తున్నాయి.
ఈ కాలంలో కూడ ఎన్నో మత సంప్రదాయాలకు, సమాజాలకు, దాదాపుగా ఒకేవిధమైన ధర్మాదర్శాలే వున్నాయి. అయినా ఒకరు ఆ ఆదర్శాల్ని ప్రకటించే రీతిని తప్పి, యేకొంత భేదంతోనో మరొకరు వానిని ప్రకటించడంవల్ల, తమలోతాము పోరాటాలు చేస్తూండడం మనం చూడ వచ్చు. కాబట్టి మతాలు విశాలతరంగా ఉండితీరాలి. మతభావాలు, సార్వజనీనాలు, అఖండాలు కావాలి. అప్పుడే “మతం” పూర్ణప్రయోజనకారి కాగలదు. మతమహిమ యిప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసివస్తోంది. మతాలు మరణిస్తున్నాయనే పారమార్థికచింత ప్రపంచంలోనుండి తొలగిపోతోందనీ ఒక్కొక్కప్పుడు అనడం కద్దు. నాకేమో, అవి ఇప్పుడే అభివృద్ధి చెందడానికి మొదలయిన ట్లనిపిస్తోంది. మత మహిమ విశాలమై, పవిత్రమై, మనిషి జీవితంలో ప్రతి అంశంలో ప్రవేశింపబోతోంది. మతం, ప్రత్యేకించి కొందరి చేతుల్లో – అంటే కొందరు పురోహితుల చేతుల్లో – ఉన్నంతకాలం అది దేవాలయాల్లో, క్రైస్తవుల గుళ్లల్లో, పుస్తకాల్లో, సిద్ధాంతాలలో, కర్మకాండలలో, విగ్రహాల్లో, సంస్కారాల్లో మాత్రమే నిలిచిపోయింది. కాని సత్యం, పారమార్థికం, విశ్వజనీనం అయిన రూపాన్ని పొందినప్పుడు మాత్రమే మతం, సనాతనం, సజీవం అయి సత్వరంగా వర్ధిల్లుతుంది. అప్పుడే అది మన ప్రకృతిలో ప్రవేశిస్తుంది. మన ప్రతి ఉద్యమాన్ని చైతన్యవంతం చేస్తుంది. సంఘంలో సర్వత్రా చొచ్చుకొనిపోయి వ్యాపిస్తుంది; ఇదివరకు ఎన్నడూ జరగనంతగా శుభప్రదమై అనంతశక్తితో వృద్ధిచెందుతుంది.
మత విధానాలు అన్నీ కలిసే కూలిపోవడమో, నిలిచివుండటమో జరుగుతుంది కాబట్టి, ఆయా సంప్రదాయాల్లో, పరస్పరం, సామరస్యం వుండటం ముఖ్యం. అది పరస్పర గౌరవమర్యాదలపై ఆధారపడి ఉండాలి కానీ, ఈ రోజుల్లో అలవాటైనట్లు, పైపైకి చూపించే సుహృద్భావంపై ఆధారపడి వుండకూడదు సుమండీ! అన్నిటికంటె ముఖ్యమైంది ఆయా మతాచార సంప్రదాయాల మధ్య మైత్రి వుండాలి. ఈ సంప్రదాయాల పాదాలు భూమిపైనే వున్నాయి. కాని వీని శిఖరాలు మాత్రం ఆకాశాన్ని ఛేదించుకుని పోతున్నాయి. భౌతికశాస్త్రం ప్రబలమైంది. ఇటువంటి చెలిమి చేకూరాలంటే, రెండు తెగలవారు, కొన్ని పట్టుదలలు విడువవలసి వుంటుంది. మిక్కిలి ముఖ్యమైనవానిని కూడ – ఒక్కో సందర్భంలో పరితాపంభరించీ విడువవలసి వుంటుంది. కాని ఇటువంటి త్యాగానికి ఒప్పుకోవడం వల్ల, రెండు తెగలవాళ్లు లాభం పొందుతారు. పురోగమిస్తారు కూడ. పర్యవసానం – దేశ కాలాలచే కట్టుబడక, మనస్సుకూ, ఇంద్రియాలకూ అందిరాక, వీనికతీతంగా ఒప్పుతూ, అవ్యక్తమూ, అనంతమూ, అయిన ‘ఏకమేవాద్వితీయం’ అగు ప్రజ్ఞానాన్ని కలుసుకొని, దానిలో ఐక్యం పొందగల్గుతుంది.