(న్యూయార్క్లో ఉపన్యసించబడింది)
మనమిక్కడ నిలబడ్డాం. కాని మన దృష్టి ఎంతో దూరం – మైళ్ళ దూరంకూడా – ముందుకు పరుగెత్తుతూ వుంటుంది. మానవుడు బుద్ధి తెలిసింది మొదలు ఇలా చేస్తున్నాడు. అతడెప్పుడూ ముందుకు చూస్తూంటాడు. భవిష్యత్తు లోనికి చొరబడుతూ వుంటాడు. శరీర పతనానంతరం, తానెక్కడికి వెళ్లేదికూడ తెలిసికోగోరుతాడు. ఈ జిజ్ఞాస తీర్చడానికై ఎన్నోఊహలు చేయబడ్డాయి. ఎన్నో మతాలు ప్రతిపాదించ బడినాయి. అందులో కొన్ని నిరాకరించబడగా, కొన్ని అంగీకారం పొందాయి. భూలోకంలో మానవుడుండేంత వరకు, మానవుని ఆలోచనా శక్తి వుండేంత వరకు, ఇలాగే జరుగుతూ వుంటుంది. ప్రతి మతంలోను, కొంత సత్యముంది. సత్యంకాని దెంతో వుంది. హిందూదేశంలో ఈ విషయాన్నిగూర్చి జరిగిన విచారంయొక్క పర్యవసానాన్ని మీ కిప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. హైందవతత్త్వజ్ఞు లీ విషయంలో అప్పుడ ప్పుడూ ప్రకటిస్తూ వచ్చిన వివిధ భావాలను సమరస పరచడానికి యత్నిస్తాను. మానసిక శాస్త్రజ్ఞుల భావాలకు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల భావాలకు పొందిక కల్గించే ప్రయత్నం చేస్తాను. సాధ్యమైతే ఈ రెంటిని ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞుల భావాలతో పొందుపరుస్తాను.
వేదాంత శాస్త్రపు పరిశ్రమ అంతా, ఏకత్వాన్ని అన్వేషించడమే. హిందువుల బుద్ధి వ్యష్టి సంఘటనల్లో, వ్యష్టి విశేషాల్లో ఆసక్తంకాదు. దానికి కావలసింది సామాన్యధర్మాలు కాదు; సార్వలౌకిక ధర్మాలు. “ఏది తెలిస్తే మిగతాదంతా తెలుస్తుందో” దానికోసమే అన్వేషణంతా; “ఒక్క మట్టి ముద్దను గ్రహిస్తే, మట్టి సంబంధమైనదంతా ఎలా గ్రాహ్య మౌతుందో, అలా దేన్ని తెలుసుకుంటే, ఈ అఖీల ప్రపంచమూ తెలుస్తుందో” ఆ పదార్థం కోసమే అన్వేషణమంతా; ఈ ప్రపంచాన్ని పరిశోధిస్తే అదంతా, ఒకే భౌతిక పదార్థంగా తేలుతుందని హిందూ తత్త్వజ్ఞుల మతం. దాన్ని వాళ్లు “ఆకాశం” అని అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, భావాలతో మనకు కనిపించేదంతా ఆకాశం ధరించే ఒక్కొక్క రూపభేదమే. అది అంతటా వుంటుంది, (సర్వగతం) సూక్ష్మం; ఘన, ద్రవ, వాయుపదార్థములనీ ఆకృతులు, మూర్తులు, శరీరాలు అనీ; భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనీ మనం వ్యవహరించే దంతా ఈ ఆకాశపదార్థ కల్పితమే.
ఈ ఆకాశ పదార్థంలో జగత్తును నిర్మించే శక్తి ఏది? ఆకాశంతో పాటు, అంతటా వ్యాపించే శక్తికూడ వుంది. లోకంలో కనిపించే శక్తి అంతా బలరూపానగాని, ఆకర్షణ రూపంలోగాని, చివరకు చింతన రూపంలోగాని – ఆ ఏకశక్తి రూపభేదాలే. హిందువు లా శక్తిని “ప్రాణం” అంటారు. ఈ ప్రాణం, ఆకాశంతో సంయోగంవల్ల ఈ జగత్తునంతా సృష్టిస్తోంది. ప్రతి కల్పాదిలో “ప్రాణం” ఆకాశమనే అనంత సాగరంలో నిద్రపోతుందనవచ్చు. అప్పుడు దానిలో చలనముండదు. తర్వాత అది మేల్కొని కదిలేటప్పుడు – కంపించడానికి మొదలుపెట్టినపుడు – ఈ ఆకాశ సాగరంనుండి, గ్రహమండలాలు, సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, భూమి, మానవులు, జంతువులు, వృక్షాలు వివిధ శక్తుల గోచరరూపాలు, ప్రకృతి రచనా విశేషాలు; ఇవన్నీ బయలు వెడలుతాయి. కాబట్టి వీరి మతం ప్రకారం, వివిధ రూపాలతో గోచరించే శక్తికంతటికి మూల మీ ప్రాణం. వివిధ రూపాలతో కనిపించే భౌతిక పదార్థ మంతటికీ, మూల మీ ఆకాశం. ఈ కల్పాంతంలో ఘనపదార్థ మనబడేదంతా, కరగి, అంతకన్నా సూక్ష్మమైన ద్రవరూపాన్ని పొందు తుంది. అదీ కరగి వాయురూపాన్ని పొందుతుంది. అది ఇంకా సూక్ష్మమైన, యింకా సమరూపమైన, వేడిమి సెగలలో, ఆ తర్వాత మూలపదార్థమైన ఆకాశంలో అంతర్లీనమైపోతుంది. ఆకర్షణ (ఎట్రాక్షన్) నిరాకర్షణ (రిపల్షన్)లు, చలన మనబడేదంతా, మూలశక్తి అయిన ప్రాణంలో లయిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాణం మళ్లీ కొంత కాలం క్రియారహితమై, మళ్లీ లేచి మళ్లీ ఈ రూపాలన్నీ ప్రదర్శించి, కల్పాంతంలో మళ్లీ పూర్తిగా అణగిపోతుంది. ఇట్లే సృష్టి అణిగిపోతూ – కనిపిస్తూ, ముందు వెనుకల మధ్య ఊగులాడుతూంటుంది. ఆధునిక భౌతికశాస్త్ర పరిభాషలో, ఇది ఒకప్పుడు స్థితి శీలంగా (స్టాటిక్), మరొకప్పుడు గతి శీలం (డైనమిక్)గా వుంటుంది. ఒకప్పుడిది నిద్రపోతుంది (ప్రసుప్తం). వేరొకప్పుడిది క్రియాశీలం. అనాది నుండి ఈ మార్పులిలా జరుగుతూన్నాయి. ఈ పరిశీలన ఇంకా అసమగ్రమే. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులకుకూడ ఇది తెలిసిన విషయమే. వారి అన్వేషణ ఇంతకు మించిపోదు. కాని అందువల్ల, మన పరిశీలన ఎందుకు ఆగిపోవాలి? దేన్ని తెలుసుకుంటే సర్వమూ తెలుస్తుందో, ఆ వస్తువును మనం ఇంకా అందుకోలేదు కదా? మనమిప్పటికి చేసిన పని, ఈ జగత్తునంతా, భౌతిక పదార్థం, శక్తి – లేక పూర్వీకుల పరిభాషలో ఆకాశం, ప్రాణం – అనే రెండు అంగాలుగా విభజించడం. ఈ ప్రాణాకాశాలకు మూలపదార్థమేదో దాన్ని తెలుసుకోవడం మన తరువాతి పని. ఈ రెంటికన్నా ఉత్తమమైంది మనస్సు. దానికివి రెండూ అంగాలని నిరూపించవచ్చు. సర్వత్రా వ్యాపించి వున్న మననశక్తి అయిన మనస్సు (లేక, మహత్తు)లో నుండే ఇవి రెండూ కల్పించబడినాయి. ఈ రెంటికన్న మహత్తు సూక్ష్మతరం. అదే ఈ రెండుగా చీలుతుంది. మొదట ఉండినదీ మహత్తే. అది వ్యక్త రూపాన్ని పొందినప్పుడు మారి, ఈ రెండుగా అయింది. ఈ రెంటి కూడికతో జగత్తంతా నిర్మించబడింది.
ఇక మనశ్శాస్త్రానికి వద్దాం. నేను మీ వైపు చూస్తున్నాను. కళ్లు, ఈ బాహ్యవిషయ స్పర్శలను నా దగ్గరకి తెస్తున్నాయి. స్పర్శ నాడులు వానిని మెదడుకు చేరుస్తాయి. కళ్లు దృగింద్రియాలు (చూచే ఇంద్రియాలు) కావు. అవి బాహ్యోపకరణాలు (బయట సాధనాలు) మాత్రమే. ఎలాగంటే, ఈ విషయ స్పర్శను మెదడుకు తీసికొనివెళ్లే స్పర్శేంద్రియం నశిస్తే నాకు ఇరవై కళ్లున్నా మిమ్మల్ని చూడలేను. కంటి పాప పొరపై ఏర్పడే బింబం, ఎంత సమగ్రంగావున్నా, మీరు నాకు కనబడరు. కాబట్టి ఇంద్రియం వేరు. దాని సాధనాలు (ఉపకరణాలు) వేరు. ఈ ఉపకరణాల (కళ్ల) వెనుక ఆ దృగింద్రియం ఉండాలి! విషయ స్పర్శలన్నిటి సంగతి ఇదే. ముక్కు వాసన చూచే ఇంద్రియం (ఘ్రాణేంద్రియం) కాదు. అది ఉపకరణం మాత్రమే. ఇంద్రియం దాని వెనుక ఉంది. మనకున్న ఐదు ఇంద్రియాలలోను మొదట భౌతిక శరీరంలో, బాహ్యోపకరణాలుంటాయి. కాని ఇవి చాలవు. నేను మీతో మాట్లాడుతున్నాను. మీ రా మాటలను ఏకాగ్రతతో వింటున్నారనుకోండి. అప్పుడేదో జరుగుతుంది. గంట మోగిందనుకోండి. ఆ శబ్దం మీకు వినిపించకపోవచ్చు. శబ్ద తరంగాలు మీ చెవిని చేరి గూబను తాకాయి. నరం ఆ స్పర్శను మెదడుకు తీసికొని పోయింది. జరగ వలసిన ప్రక్రియ అంతా ఇలా జరగినా, మీ కా శబ్దమేల వినబడలేదు? ఏదో కొరవడింది. మనస్సు ఇంద్రియంలో చేరలేదు. మనస్సు ఇంద్రియంతో చేరనప్పుడు, ఇంద్రియం ఏ వార్త తెచ్చినా అది స్వీకరించదు. ఇంద్రియాలతో చేరినప్పుడే అది వార్తలను స్వీకరించ గలదు. కాని ఇంతటితో కార్యక్రమ మంతా పూర్తి కాలేదు. ఉపకరణాలు బాహ్యస్పర్శను తేవచ్చు; ఇంద్రియాలు వానిని లోనికి చేర్చవచ్చు. మనస్సు, ఇంద్రియాలతో చేరి వుండొచ్చు. కాని తెలివి – బోధము– (పర్సెప్షన్) కలుగక పోవచ్చు. ఇంకా ఒక పని జరగాలి. లోపల ఒక ప్రతిక్రియ (రియాక్షన్) కలగాలి! ఆ ప్రతిక్రియ కలగడంతోనే తెలివి (బోధం) కలుగుతుంది. బాహ్య విషయం వార్తా తరంగాన్ని నా మెదడు లోనికి పంపుతుంది. నా మనస్సు దాన్ని స్వీకరించి బుద్ధి ఎదుట పెడుతుంది. బుద్ధి తనలో, పూర్వం కలిగిన ముద్రలతో (ఇంప్రెషన్స్ = భావాంకాలు) దాన్ని వర్గీకరించి ప్రతీకార తరంగాన్ని పంపుతుంది. ఆ తరంగంతోనే తెలివి ఏర్పడుతుంది. కానీ ఇంకా కార్యక్రమం ముగియ లేదు. ఇంకాఒకపని మిగిలుంది. ఇక్కడ ఒక ఛాయాగ్రాహక యంత్రం (కెమెరా) ఉందనుకోండి అక్కడ ఒక గుడ్డ వుంది. ఆ గుడ్డపై ఒక వస్తురూపాన్ని కల్పించాలని నా ఉద్దేశం. నేనేమి చేయాలి? వస్తువుయొక్క వివిధ కాంతి కిరణాలు ఆ యంత్రం గుండా పోయి, ఆ వస్త్రంపై పడేలాగా చేయాలి కదా? ఈ రూపాన్ని గ్రహించడానికి ఏర్పడిన వస్తువు నిశ్చలంగా వుండటంకూడ అవసరం. కదులుతున్న వస్తువుపైన రూపాన్ని కల్పించడం ఎలా? అది నిలుకడ కలిగిన వస్తువుగా వుండాలి. ఎందుకంటే నేను దానిమీద ప్రసరింప జేసే కాంతి కిరణాలు చలిస్తూంటాయి. ఈ చలించే కిరణాలను చేరదీసి, ఒకచోట కూర్చి వానికి పరస్పర సామరస్యం కల్పించి సమగ్ర పరచడం, స్థిర వస్తువు మీదనే కదా సాధ్యమవుతుంది? మన విషయ స్పర్శల సంగతికూడ ఇలాంటిదే. ఇంద్రియాలు వానిని లోపలికి తెచ్చి, మనస్సు దగ్గరికి చేర్చగా, మనస్సు వానిని బుద్ధి ఎదుట పెడుతుంది. బుద్ధికి వెనుక స్థిర వస్తువొకటి లేకపోతే, ఈ వివిధ స్పర్శ చిహ్నాలకు అక్కడ పొందిక కుదరి ఏకీభావమేర్పడి, బాహ్యవిషయ రూపం, నిర్దుష్టంగా అక్కడ చిత్రితం కావడం అసాధ్యం కదా? మార్పులతో నిండిన మన, మనశ్శరీర సంయోగమూర్తిలో, ఏకీభావం కల్పించేది ఏది? క్షణక్షణం మారుతున్న ఈ వస్తువును, ముందటిదే అని గుర్తింప సాధ్య పరచేదేది? మన మనస్సులపై ముద్రితములై వున్న వివిధ భావ చిహ్నాలు దేనిపై ఒకటిగా కూర్పబడతాయి? ఇంద్రియగోచర వస్తు చిహ్నాలన్నీ దేనిపైకూడి స్థిరంగా నిలిచి, పొందికగల సమష్టి రూపంలో కనబడతాయి? ఈ కార్యం సాధ్యం కావడానికి ఒక వస్తువుండాలనీ, మనశ్శరీరాలతో పోల్చి చూస్తే అది నిశ్చలమైందిగా వుండాలనీ తెలుసు కున్నాం. కెమెరా ఒక గుడ్డపై కదా రూపకల్పన చేస్తుంది? కాంతి కిరణాలతో పోల్చి చూస్తే ఆ గుడ్డ నిశ్చలమైంది కాకపోతే, దానిపై రూపమేర్పడుతుందా? దీన్నిబట్టి తేలిందేమంటే మనస్సు, ఆకృతులను దేనిపై చిత్రిస్తూందో, మనోబుద్ధులు కొనితెచ్చే విషయ స్పర్శలు దేనిపై నిలిచి వర్గీకరణమొంది సమష్టి రూపాన్ని ధరిస్తాయో, అది – ఆ దర్శించే వస్తువు – వ్యక్తిత్వం కలదిగా వుండాలి. దాన్ని మానవుని ‘ఆత్మ’ అని అంటారు.
ప్రాణాకాశాలుగా వేరుపడేది ‘విశ్వమానసం’ (మహత్తు) అనీ, మనస్సు కావల మనలో, ఆత్మ వుందనీ తెలుసుకున్నాం. జగత్తులో విశ్వమానసం వెనుక ఒక ఆత్మ (విశ్వాత్మ) వుంది. దాన్నే దైవమంటారు. మానవ వ్యక్తిలో ఉండేదాన్ని మానవాత్మ (జీవాత్మ) అంటారు. ఈ జగత్తులో, ఈ ప్రపంచ వ్యవస్థలో, విశ్వమానస మెలా ప్రాణాకాశాలుగా వికాసం చెందిందో అలాగే, విశ్వాత్మ విశ్వమానసంగా వికసించిందని మనం తెలుసుకోవాలి. వ్యక్తిలోకూడ ఇలాగే జరుగుతుందా? అతని శరీరాన్ని సృష్టించేది అతని మానసమేనా? అతని మానసాన్ని సృష్టించేది అతని ఆత్మేనా? అంటే అతని ఆత్మ, మనశ్శరీరాలు మూడూ, ప్రత్యేక భిన్నవస్తువులా, మూడూ ఒక దానిలోని వేనా? లేక ఒకే వస్తువుయొక్క మూడు భిన్నావస్థలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికై మనం క్రమంగా ప్రయత్నిద్దాం. మనకు కన్పించే ఈ బాహ్యశరీరం లోపల స్పర్శేంద్రియ మనోబుద్ధులు, బుద్ధికి వెనుక ఆత్మ వున్నాయని యిదివరకే తెలిసికొన్నాం. ఆత్మ శరీరం కాదని, మనస్సుకూడ కాదని మన తాత్కాలిక నిర్ణయం. మత ప్రపంచంలో దీన్ని గూర్చి, అభిప్రాయ భేదాలేర్పడుతున్నాయి. ద్వైతమనే పేరుతో వున్న మతాలన్నీ ‘ఆత్మ’ ‘సగుణ’ మంటాయి. దానికనేక గుణాలున్నాయనీ, మన అనుభూతులన్నీ – భోగాలు, కష్టాలు, సుఖాలు – నిజంగా దానివే అనీ బోధిస్తాయి. ఆత్మకట్టి గుణాలేవీ లేవనీ, అది నిర్గుణమనీ అద్వైతుల మతం.
మొదట ద్వైతులను తీసికొని ఆత్మనుగూర్చి, దాని తర్వాతి గతిని గూర్చి వారి భావాన్ని తెలపడానికి యత్నిస్తాను. తర్వాత ద్వైతభావాన్ని నిరాకరించే మతాన్ని విచారించి చివరకు అద్వైత మతం కలిగించే సామరస్యాన్ని తెలిసికోవడానికి ప్రయత్నిద్దాం. జీవాత్మ మనస్సు, శరీరాల కంటే భిన్నం. అది ప్రాణాకాశ సమ్మేళన ఫలమూ కాదు. కాబట్టి మృత్యువు లేనిదై వుండాలి. ఎందుకు? మృత్యువంటే ఏమి? మూల వస్తువులుగా చీలిపోవడం. వస్తు సంయోగంతో కలిగిన దానికే కదా ఇలా వియోగం కలుగుతుంది? రెండు మూడు వస్తువుల కూడికచే కలిగిన వస్తువే వియోగ దశలో, మూల వస్తువుగా చీలిపోగలదు. సంయుక్త వస్తువుకాని దానికి వియోగ దశ, అంటే మృత్యువు కలుగ జాలదు. అది నిత్యం. అది అనంతకాలం నిలిచి వుంటుంది. అది సృష్టించబడింది కాదు. సృష్టించబడిన వస్తువులన్నీ సంయుక్తాలే. శూన్యంలోనుండి సృష్టి కలగడం ఎవ్వరూ చూళ్లేదు. మనకు తెలిసిన సృష్టి అంతా అంతకు ముందుండిన కొన్ని వస్తువులను కూర్చి కల్పించబడిన కొత్తరూపాలే. కాబట్టి అసంయుక్త వస్తువైన జీవాత్మ అనాది సిద్ధమైనదిగా వుండాలి, అనంతంగా ఎప్పటికీ ఉంటుంది. శరీర పతనానంతరంకూడ ఆత్మ నిలిచే వుంటుంది. వేదాంత మత ప్రకారం ఈ శరీర వియోగకాలంలో, నరుని జీవశక్తులు మరలి మనస్సులో లీనమవుతాయి. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. ప్రాణం ఆత్మలో చేరుతుంది. అటు తర్వాత జీవాత్మ సూక్ష్మశరీర మనబడు దానితోకూడ (దాన్ని ఆచ్ఛాదనగా ధరించిందేమో అన్నట్లు) బయటకు వస్తుంది. దాన్ని మీరు, మానసిక శరీరమనిగాని, పారమార్థిక శరీరమని గాని అనవచ్చు. మానవుని సంస్కారాలు దీనిలో వుంటాయి. సంస్కారమంటే ఏమి? మనస్సొక సరస్సు లాంటిది. ప్రతి తలంపు ఆ సరస్సునందొక తరంగమనవచ్చు. సరస్సులో అలలు ఎలా పైకి లేస్తూ, కిందపడి మాయమవుతూ వుంటాయో, అలాగే ఈ భావ తరంగాలు కూడ మనస్సులో పొడచూపుతూ, అణగిపోతూ వుంటాయి. కానీ ఆ అణగిపోవడం తాత్కాలికం మాత్రమే. అవి క్రమాధికంగా, సూక్ష్మాలు, సూక్ష్మాంతరాలు అవుతాయి కానీ, అన్నీ అక్కడే, పిలుపు వినబడినంతనే పైకెగసి రావడానికి సిద్ధంగా అణగి వుంటాయి. జ్ఞప్తి చేసికోవడమంటే, సూక్ష్మరూపంలో అణగివున్న భావాలను మళ్లీ, తరంగ రూపంలో వెలికి రమ్మని పిలవడమే. మనం తలచిన తలపులన్నీ, చేసిన పనులన్నీ మనస్సులో ఇలా సూక్ష్మరూపంలో నిలిచి వుంటాయి. మానవుడు మృతి నొందేటప్పుడు, యీ సూక్ష్మచిహ్నాలు, సమష్టి రూపంలో మనస్సులో వుండి, ఒక సూక్ష్మశరీరం ద్వారా పని చేస్తాయి. ఆత్మ ఈ సంస్కారాలను సూక్ష్మ శరీరాన్ని ధరించిందేమో అన్నట్లు బహిర్గతమవుతుంది. ఈ వివిధ సంస్కారాలచే చిహ్నితములైన వివిధ శక్తుల సమష్టి ఫలంతో, ఆత్మ తర్వాతి గతి నిర్ణయించబడుతుంది. మా శాస్త్రాలలో ఆత్మకు మూడు వేర్వేరు గమ్యాలు పేర్కొనబడ్డాయి.
ఆధ్యాత్మికోన్నతిని పొందిన వారు మరణించినప్పుడు సూర్య కిరణాల వెంట వెళ్లి సూర్య లోకమనబడే దాన్ని చేరుతారు. దాని ద్వారా చంద్రలోక మనబడే దాన్నీ, దాని ద్వారా విద్యుల్లోకమనబడే దాన్నీ చేరుతారు. అప్పటికే పరమ సుఖస్థితి (ముక్తి) నొందిన మరొక ఆత్మ, వారినక్కడ కలిసికొని లోకాలన్నింట్లో ఉన్నతమైన బ్రహ్మలోకానికి వారిని తీసికొని పోతుంది. ఈ ఆత్మలు అక్కడ సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు అవుతాయి. దాదాపు భగవంతునికున్నంత జ్ఞానశక్తులు వారి కలవడతాయి. వాళ్లకక్కడే స్థిర నివాసమని ద్వైతులూ, అలాకాక కల్పాంతంలో వాళ్లు బ్రహ్మంతో ఐక్యం పొందుతారని అద్వైతులూ చెబుతారు. ఫలాపేక్షతో సత్కర్మలు చేసిన వారు రెండవ తరగతికి చేరుతారు. వీరు మరణించినప్పుడు తమ సత్కర్మఫలంగా, చంద్రలోకం అనబడే లోకానికి తీసుకుపోబడతారు. అక్కడ చాలా స్వర్గాలుంటాయి. వాళ్ల కక్కడ సూక్ష్మ శరీరాలు – దేవతా శరీరాలు – ప్రాప్తిస్తాయి. వాళ్లు దేవతలై స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ, దీర్ఘకాలమక్కడ నివసిస్తారు. అటుతర్వాత వారి పూర్వకర్మం వారిని మళ్ళీ ఎదుర్కొని భూలోకానికి పడదోస్తుంది. వాయులోక, మేఘ లోకాది మార్గాన, వర్ష బిందురూపంతో వారు భూలోకంలో పడతారు. అక్కడ వారేదో ఒక ధాన్యంలో చేరి వుంటారు. వారి నూత్న శరీరానికి కావలసిన పదార్థాన్ని అమర్చే అర్హత వున్నవా డా ధాన్యమును సకాలంలో తినడం తటస్థిస్తుంది. చివర తరగతి వారు పాపాత్ములు. వారు మరణించినప్పుడు భూతాలుగా, పిశాచాలుగా మారి భూమికి, చంద్రలోకానికి మధ్య ఎక్కడో నివశిస్తారు. ఇందులో కొందరు మానవులకశాంతిని కలిగిస్తారు. కొందరు స్నేహాన్ని చూపిస్తారు. ఇలా కొంతకాలమున్న తర్వాత వారు భూమిపై కూలి, జంతువు లవుతారు. జంతు శరీరంలో కొన్నాళ్లు గడిపిన తర్వాత, దాన్నుండి విముక్తులై మళ్లీ మానవు లవుతారు. వారికప్పుడు మోక్ష సాధనార్థం కృషి చేయడానికి మరొక అవకాశం లభిస్తుంది. దీన్నిబట్టి తేలిందేమంటే, దాదాపు పరిపూర్ణ స్థితినందుకొన్న వారు – అతి స్వల్పమైన పాపం మాత్రమే మిగిలున్నవారు. సూర్యకిరణ మార్గంలో బ్రహ్మలోకాన్ని చేరుతారు. మధ్యమ స్థితినొందిన వారు – స్వర్గంపై కోర్కెతో కొంత సత్కర్మ చేసిన వారు – చంద్రలోకంలోని స్వర్గాలకు వెళ్లి దేవతా శరీరాలను పొందుతారు. కాని వారు మళ్లీ మనుష్యరూపాన్ని పొందాలి. అంటే పరిపూర్ణత్వం పొందే అవకాశం వారికి ఇంకొకసారి లభిస్తుంది. మిక్కిలి పాపిష్ఠులుగా వున్నవారు భూత పిశాచాలై, ఆ తర్వాత మృగాలు కావలసి వుంటారు. అటు తర్వాత మళ్లీ మానవులై సిద్ధత్వాన్ని సాధించడానికి మరొక అవకాశాన్ని పొందుతారు. భూలోకాన్ని కర్మభూమి అంటారు. మానవుడు సత్కర్మకాని, దుష్కర్మగాని, చేసే చోటిదే. స్వర్గ కాంక్షతో సత్కర్మ చేసి దేవత్వాన్ని పొందిన వా డా దేవతా శరీరంతో దుష్కర్మ పోగు చేసికోజాలడు. భూలోకంలో చేసిన సత్కర్మ ఫలాన్ని అనుభవించడమే అక్కడ జరిగే పని. ఆ సత్కర్మం వ్యయమయిన తోడనే తన పూర్వజీవితపు దుష్కర్మ సముదాయంయొక్క సమష్టి బలమెదుర్కొని అతన్ని మరల భూలోకానికి పడద్రోస్తుంది. అట్లే పిశాచాలైన వారు ఆ దశలో కొత్త కర్మను కూర్చుకోజాలరు. పూర్వ దుష్కర్మల ఫలాలను అనుభవించడమే అప్పుడు జరిగే పని. వాళ్లు తర్వాత జంతు శరీరాలతో వున్నప్పుకూడ జరిగేదదే. ఆ దశకూడ అంతమొందిన తర్వాత వాళ్లు మానవు లవుతారు. సత్కర్మలకు బహుమాన రూపంలో, దుష్కర్మలకు శిక్షా రూపంలో కలిగే జీవిత దశలు, నూతన కర్మలను కలిగించడానికి సమర్థం కావు. ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మాత్రమే ఆ దశలు కలుగుతాయి. మిక్కిలి అసాధారణ రూపాలైన సత్కర్మలు, దుష్కర్మలు, అతిత్వరితంగా ఫలితమిస్తాయి. ఎలా అంటే జీవితకాలంలో అంతా దుష్కార్యాలే చేస్తూన్నవాడు, ఏదో ఒక సత్కార్యం చేస్తే, ఆ సత్కార్య ఫలం వెంటనే కలుగుతుంది. కాని ఆ ఫలానుభూతి ముగియడంతోడనే అతని దుష్కార్య ఫలితాలుకూడ అనుభవానికొస్తాయి. సగటున జీవిత వైఖరి మంచిది కాకపోయినా, కొన్ని సత్కార్యాలను, కొన్ని మహాకార్యాలను చేసిన వారు దేవతలవుతారు. కాని కొన్నాళ్లా దేవతా శరీరాలతో వుండి, దేవతాశక్తు లనుభవించిన తర్వాత వాళ్లు, మళ్లీ మానవులు కావలసి వుంటుంది. సత్కర్మ బలం ఇలా ఖర్చయిన వెంటనే, ముందటి దుష్కర్మ అనుభవానికొస్తుంది. మిక్కిలి అసాధారణ దుష్కార్యాలు చేసిన వారు భూత, పిశాచ శరీరాలు ధరించవలసి వస్తుంది. ఆ దుష్కర్మ ఫలమంతా అనుభవించవలసి వస్తుంది. ఆ దుష్కర్మ ఫలమంతా అనుభవించిన తర్వాత వారు సంపాదించుకొనివున్న కొద్ది పాటి సుకృతంతో, వారు మరల మనుష్యత్వాన్ని పొందుతారు. బ్రహ్మ లోకానికి (ఆ లోకం ప్రాప్తించిన వారికి పునఃపతనంగాని, పునరావృత్తి గాని లేవు) పోయే మార్గానికి దేవయానమనీ, స్వర్గ లోకానికి వెళ్లే మార్గానికి పితృయానమనీ పేర్లు.
కాబట్టి వేదాంత మత ప్రకారం సర్వ ప్రాణులలో మానవుడు శ్రేష్ఠుడు. కర్మ క్షేత్రమైన ఈ భూలోకం అన్ని లోకాలలో శ్రేష్ఠం. ఇదే కదా, పరిపూర్ణత్వం పొందే గొప్ప అవకాశాన్ని మానవునకు కల్పించేది! దేవతలు – దేవతలనండి, ఊర్ధ్వ లోక వాసులనండి (ఏంజెల్స్) – వారంతా, మనుష్యత్వమందితే తప్ప పరిపూర్ణులు కాజాలరు. ఇదే మహాకేంద్రం. అద్భుత సమస్థితి, అద్భుతావకాశం – ఈ మానవ జీవితం.
తత్త్వశాస్త్రంలో గల రెండవ దృక్పథాన్ని ఇప్పుడు చూద్దాం. నేనిప్పుడు వివరిస్తూన్న ఆత్మవాదాన్ని బౌద్ధ మతస్థులు ఏ మాత్రమూ అంగీకరించరు. “ఈ మనశ్శరీరాలకు మూలమైన వస్తువేదో ఒకటి వుందని ఊహించడమెందుకు? భావ ప్రచారానికీ అడ్డు కల్పించడ మెందుకు? మనస్సు, శరీరాలతో కూడిన ఈ మూర్తికాక, మరొక మూడవ వస్తువు – ఈ ఆత్మ – వుందని అంగీకరించాలా? దాంతో ఏమి పని? ఈ మూర్తిని గ్రహించడానికి కావలసినదంతా, దానిలోనే లేదా? మూడవ వస్తువునొకదాన్ని కొత్తగా తెచ్చి పెట్టుకోవడమేల?” అని వారి వాదం. ఈ వాదాలు, ఈ తర్కం, బలిష్ఠములు. బాహ్య పరిశోధనకు ఈ మూర్తి స్వయంబోధకంగానే కానవస్తుంది. మనం చాలామంది అలా భావిస్తామనే మాటమాత్రం నిస్సంశయం. అయినప్పుడు, మనశ్శరీరాలు రెంటికి భిన్నమై రెంటికి వెనుక నిలిచి, రెంటికి మూలాధారమైన ఈ ఆత్మ ఒకటి వుందని ఎందుకు చెప్పాలి? మనశ్శరీరాలు మాత్రమే ఉండనీ! నిరంతరం మారుతూ వుండే భౌతిక పదార్థ ప్రవాహం పేరు శరీరం. నిరంతర పరిణామం చెందే చైతన్య (ఎఱుక) ప్రవాహపు లేక పరంపరాప్రవాహం పేరు మనస్సు. బాహ్య దృష్టికీ రెండూ ఒకటిగా కనబడటానికి కారణమేమి? ఈ ఐక్యం నిజం కాదనుకొందాం. మండుతూన్న దివిటీ నొకదాన్ని వేగంగా, గిరగిరా త్రిప్పండి. చక్రాకృతిగల మంట కనిపిస్తుంది. నిజానికి ఏ చక్రమూ లేదు. కాని దివిటీయొక్క అవిరామ పరిభ్రమణం, ఆ చక్ర భ్రాంతిని కల్పిస్తోంది. అట్లే ఈ జీవితంలో ఐక్యం లేదు. అవిరామంగా, అపార వేగంతో ప్రవహిస్తున్న, భౌతిక పదార్థరాశి అది. ఈ పదార్థాల రాశినంతా మనమొకే వస్తువనవచ్చు. అంతే. మనస్సు విషయంకూడ అలాంటిదే. భావాలన్నీ పరస్పర భిన్నములు. ఐక్య భ్రాంతి కల్పించేది ప్రవాహ వేగమే. కాబట్టి మూడవ వస్తువుతో అవసరం లేదు. జగత్తంతటిలో కనిపించే ఈ మనశ్శరీర దృశ్యమే నిజంగా ఉండేది. వీని కాధారమని మరొక వస్తువును ప్రతిపాదించకు. ఈ బౌద్ధమత భావాన్ని ఈ కాలంలో కొన్ని మతాలవారు, కొన్ని మత శాఖలవారు అవలంబించి, ప్రతివారూ అది కొత్త భావమనీ, తామే దాన్ని సృష్టించామనీ చెప్పుకొంటున్నారు.
బౌద్ధతత్త్వ శాస్త్రాలనేకములలోని మూల భావమిది – “ఈ జగత్తు స్వయంపూర్ణకం. దీనికొక మూలాధారాన్ని కల్పింప జూడటం కేవలం అనావశ్యకం. ఈ ఇంద్రియగోచర ప్రపంచం వినా, ఇంకేదీ లేదు. ఈ ప్రపంచానికి ఆధారభూతంగా ఇంకొక దాన్ని భావించడం నిష్ప్రయో జనం. గుణ సముదాయమే ఈ సర్వమూ. ఏదో ఒక వస్తువుందనీ, ఈ గుణాలు దానికి సంబంధించినవనీ అపోహపడట మెందుకు? వస్తువేదో వుందనే భ్రాంతికి కారణం గుణాలయొక్క వేగవంతమైన పరస్పర వినిమయా (మార్పు)లే కానీ, వాని వెనుక స్థిర వస్తువొకటి వుండటం కాదు.” – ఈ వాదాలలో కొన్ని అత్యద్భుతాలు; మన సామాన్యానుభవా నికి అనురూపమై ఉండటం వల్ల అవి అందరికీ నచ్చుతాయి. నిజానికి కోటికొక్కరైనా ప్రకృతి దృశ్యాలుకాక వేరేదైనా భావించగలరా? జన సామాన్యానికి, ప్రకృతి ఎప్పుడూ మారుతూ, వేగంగా తిరుగుతూ, కూడుతూ, కలసిపోతున్న పరిణామరాశిగా కనిపిస్తుంది. దీని వెనుకవుండే నిశ్చలసముద్రంయొక్క క్షణదర్శన భాగ్యమైనా వున్నవారు చాలా అరుదు. జన సామాన్యానికి ఈ జగత్తు నిరంతర చలనమయమే. భయంకరమైన కల్లోల రాశే. మనకిప్పుడు రెండు వాదాలు కనిపిస్తున్నాయి. మనశ్శరీరాలకు మూలమై, నిర్వికారం, సుస్థిరం అయిన వస్తువేదో వుందని ఒక వాదం. నిర్వికారతకాని, సుస్థిరతకాని ఈ జగత్తులో లేనే లేదు. అంతా మార్పులమయం. మార్పులు తప్ప ఇంకేమీ లేదు – అనేది రెండో వాదం. ఈ భిన్నభావాల పరిష్కారం, తత్త్వ విచారంలోని ఆవలి మెట్టయిన అద్వైత మతంలో కలుగుతోంది.
ఈ అంతటికి మూలమైన వస్తువొకటుంది. అది నిర్వికారం (మార్పులు లేనిది) అనే ద్వైత వాదమును అద్వైత మత మంగీకరిస్తుంది. మార్పులులేని వస్తువు ఒకటి లేకపోతే, మార్పు అనే భావాన్ని మనం గ్రహింపజాలం. అంతగా మారిన వస్తువొకదాన్ని తెలిసికొన్నపుడే, మనకు వస్తువులోని మార్పు గోచరమవుతుంది. అంతకన్నా తక్కువగా మార్పు మరొక వస్తువుతో పోల్చినప్పుడే వస్తువుకూడ ఎక్కువ మార్పులున్న దానిగానే తెలుస్తుంది. ఇలా పోగా పోగా, చివరికి మార్పులకే లోకువకాని, వస్తువొకటి ఉండి తీరాలని మన మంగీకరించక తప్పదు. ఈ వ్యక్త ప్రపంచమంతా, ఒక కాలంలో అవ్యక్త స్థితిలో నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండి వుండాలి. భిన్న ముఖాల నాకర్షించే, పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణకి ఫలమే ఆ నిశ్చలత్వం. అప్పు డే శక్తీ గోచరరూపంలో వుండదు. సమస్థితి (ఈక్విలిబ్రియం) చెదిరినప్పడే కదా శక్తి గోచర రూపానికొస్తుంది? ఆ సమస్థితి మళ్ళీ రావడాని కీ జగత్తు అవిరామంగా పరువులిడుతోంది. ఇంతకన్నా నిస్సంశయంగా, మన కీ విషయం తెలీదు. నిర్వికార వస్తువొకటి వుందని ద్వైతులు చెప్పేమాట నిజమే; కాని అది మనస్సు కాదు, శరీరం కాదు; ఈ రెంటికి భిన్నమైన మరొక మూలపదార్థమవడం మాత్రం పొరపాటు. ఈ ప్రపంచమంతా మార్పుల రాశి అనే బౌద్ధవాదం నిస్సంశయంగా సత్యమే. ఎందుకంటే నేనీ ప్రపంచం కన్నా, వేరై వుండేంతవరకు, నేను వెనుక నిలుచుండి, ఎదుట వుండే వొక వస్తువును చూస్తున్నంత వరకు, చూసేవాడు, చూడబడేది – అనే రెండు వస్తువులున్నంత వరకు ఈ ప్రపంచం మార్పులు కలదిగానే – ఎప్పుడూ మారుతూన్నదిగానే – కనిపిస్తుంది; యథార్థ స్థితి ఏమంటే, ఈ లోకంలో మార్పు వుంది. నిర్వికారతా వుంది. ఆత్మ, మనస్సు, శరీరం – ఇవి మూడు ప్రత్యేక వస్తువులు కావు. ఈ మూడూకల మూర్తి ఏక వస్తువు. మనశ్శరీరాలుగా, మనశ్శరీరాల కతీతంగా కనిపించేది వొకే వస్తువు. కాని అది ఒకే కాలంలో ఈ మూడుగా వుండదు. శరీరాన్ని చూసే వానికి మనస్సు కనిపించదు. మనస్సును చూసే వానికి, ఆత్మ అనేది కనిపించదు. ఆత్మను చూసే వానికి మనస్సు శరీరాలు అదృశ్యాలవుతాయి. చలనమే (కదలిక) చూసేవానికి, పరిపూర్ణ నిశ్చలత్వమెన్నడూ కనిపించదు. పరిపూర్ణ నిశ్చలత్వం చూసే వానికి చలనం కనిపించదు. తాడు నొక్కొక్కసారి పాముగా భ్రాంతి పడుతారు. అలాంటప్పుడు పామును చూసేవానికి తాడు అదృశ్యమవుతుంది. ఈ భ్రాంతి నశించగా, తాడును చూసే వానికి పాము మాయమౌతుంది.
అంటే, ఉండేది ఒక్క వస్తువే. అది సర్వాత్మకం. అదే నానా రూపాలతో కనిపిస్తూంది. ప్రపంచంలో నిజంగా వుండేది ఈ ఆత్మ – యథార్థ వస్తువు – ఒకటే. అద్వైత పరిభాషలో దీన్ని బ్రహ్మమంటారు. నామరూపాలు అడ్డురావడం వల్ల ఇదే నానారూపకంగా కనిపిస్తుంది. సముద్ర తరంగాలు చూడండి. ఒక్క అలైనా నిజంగా, సముద్రంకంటే వేరా? కాకపోయినా వేరుగా ఎందుకు కనిపిస్తుంది? నామరూప కారణంవల్లే – తరంగ రూపాన్ని, దానికి మనం పెట్టుకున్న తరంగమనే పేరు గోచరిస్తుంది. ఇందువల్లే అది సముద్రంకంటే భిన్నమైంది. ఈ నామరూపాలు లేకపోతే, అది ఆ సముద్రమే. తరంగానికి, సముద్రానికి నిజమైన భేదం ఎవరు కల్పించగలరు? అంటే, ఈ ప్రపంచమంతా అభిన్నమైన ఒకే అస్తిత్వం. నామరూపాలు ఈ భేదాలన్నిటినీ కల్పించాయి. సూర్యుడు లక్షోప లక్షల జల బిందువులపై ప్రకాశిస్తాడు. అప్పుడు ప్రతి బిందువుపైనా పరిపూర్ణరూపంతో, ఒకే సూర్యబింబం కనిపిస్తుంది కదా? అట్లే ఈ ఏకైక వస్తువు – ఈ ఆత్మ – ఈ ప్రపంచంలో వుండే, ఒకే యథార్థ వస్తువు, ఈ అసంఖ్యాక భేదాలతో నిండి, నామరూపాలతో ప్రతిబింబించి భిన్నంగా కనిపిస్తున్నది. కాని నిజానికది ఏకవస్తువే. “నేను”, “నీవు” అనేవే లేవు; అంతా “నేను” ; లోకం అంతా “నీవు”. ఈ అద్వైత భావం, రెండు అనే భావం పరిపూర్ణమైన మిథ్య. మనకు సామాన్యంగా కనిపించే ఈ జగత్తు ఈ అసత్య జ్ఞానఫలం; వివేకం కలిగి “ఉండేదంతా ఒక్కటే రెండు లేవు” అని మానవుడు కనుగొన్న ప్పుడు తానే ఈ జగత్తని అతనికితెలిసిపోతుంది. “ఈ నిరంతర పరిణామరూపంలో వుండే జగత్తును నేనే. సర్వ పరిణామాలకు, సర్వ గుణాలకు అతీతుడనైన నిత్యపరిపూర్ణుడుని, నిత్యానందమయుడిని నేనే–”
కాబట్టి ఉండేదంతా ఆ నిత్యశుద్ధం, నిత్యపరిపూర్ణం, అవికార్యం, అవికృతం అయిన ఒక్క ఆత్మే. అది ఎన్నడూ మార్పును పొందలేదు. జగత్తులోని మార్పులన్నీ ఆ ఏకమైన ఆత్మలోని అసత్య దృశ్యాలు.
నామరూపాలు ఆ ఆత్మపై ఈ స్వప్న దృశ్యాలనన్నిటినీ చిత్రించాయి. తరంగాన్ని సముద్రంనుండి భిన్నంగా చేసేది రూపమే. తరంగం అణగిపోతే రూపం నిలుస్తుందా? నిలువదు. అదృశ్య మవుతుంది. తరంగపు ఉనికికి సముద్రపు ఉనికే ఆధారం. కాని సముద్రపు ఉనికికి తరంగపు ఉనికి ఏ మాత్రమూ ఆధారం కాదు. తరంగమున్నంతసేపే రూపం వుంటుంది. తరంగమదృశ్యం కావడం తోనే, అదీ అదృశ్యమవుతుంది. అప్పుడది నిలువజాలదు. ఈ నామ రూపాలు మాయ అనబడేదానిచేత కల్పించబడతాయి. ఈ మాయే వ్యక్తిత్వాలను కల్పిస్తుంది. అంటే – ప్రతి వారినీ, వేర్వేరుగా కనిపించేలా చేస్తుంది. కాని దానికి ఉనికి (అస్తిత్వం) లేదు. అది వుందని చెప్పజాలం. రూపముందని చెప్పడానికి వీలులేదు. మరొక వస్తువు ఉనికిపై అది ఆధారపడి వుంటుంది కదా? అది లేదనీ అనలేం – ఈ భిన్నతనంతా అదే కదా కల్పిస్తోంది? అంటే అద్వైత వేదాంత ప్రకారం, ఈ మాయ లేక అవిద్య లేక నామరూపాలు లేక యూరోప్ దేశం వారన్నట్లు “దేశ కాల నిమిత్తత్వాలు” – ఈ అఖండ పరిపూర్ణ వస్తువునుండి, ఈ ఏకత్వం నుండి, ఈ ప్రపంచ నానాత్వాన్ని కల్పించి, దృష్టి గోచరం చేస్తోంది. వాస్తవంగా ఈ ప్రపంచం ఏక పదార్థమే. పరమ సత్యాలు రెండున్నాయని భావించడమంతా పొరపాటే. ఏక వస్తువుందని తెలిసికోవడమే నిజం తెలుసుకోవడం. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఈ సత్యం అనుదినం స్థాపింపబడుతోంది. మీరు, నేను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకే భౌతిక పదార్థ సాగరంలోని వేర్వేరు బిందువుల వేర్వేరు పేర్లనీ, ఈ పదార్థ రాశిరూపం, నిరంతరం పరిణామం పొందుతూ వుందనీ నేడు నిరూపించబడింది. సూర్యునిలో కొన్ని నెలల క్రిందట వుండిన శక్తిలో ఒక స్వల్పాంశం నేడు మానవునిలో వుండవచ్చు; రేపొక జంతువులో, ఆ మరుదిన మొక వృక్షంలో వుండవచ్చు. అది ఎప్పుడూ వస్తూ, పోతూ వుంది. ఇదంతా ఒకే అఖండం, అనంతం అయిన పదార్థ రాశి. దానిలో భేదాన్ని కల్పించేది నామరూపాలే. అందొక చుక్కను సూర్యుడని, ఇంకొక చుక్కను చంద్రుడని, వేరొక చుక్కను నక్షత్రమనీ, మరొకదాన్ని మనుష్యుడనీ, ఇంకొక దాన్ని జంతువనీ, వేరొకదాన్ని వృక్షమనీ ఇలా అనంత నామములతో వ్యవహరిస్తూ వుంటాం. ఈ పేర్లన్నీ కృత్రిమాలే. సత్యదూరాలు. ఇదంతా నిరంతర పరిణామమొందే ఒక పదార్థ రాశి కదా? మరొక దృక్పథంనుండి ఈ ప్రపంచమే ఒక భావ సముద్రమనీ, అందులో మన మొక్కొక్కరమొక్క మనస్సనే పేరుగల బిందువు వంటివారమనీ చెప్పవచ్చు. నీవొక మనస్సువు, నేనొక మనస్సును, ప్రతి మానవుడు ఒక మనస్సు. ఇంతే కాదు మన కళ్లు భ్రాంతి రహితాలైనపుడు, మనస్సు నిర్మలమైనపుడు, జ్ఞాన దృక్పథం నుండి మన కీ ప్రపంచమే నిత్యశుద్ధం, నిర్వకారం, అనశ్వరం (నాశం లేనిది) అయిన అఖండ పరతత్త్వంగా కనిపిస్తుంది.
అలాంటప్పుడు ద్వైతులు ప్రతిపాదించే సాంపరామ (మరణానంతర) గతి విషయమేమవుతుంది? మరణించిన మానవుడు స్వర్గానికో, మరే లోకానికో పోతాడనీ, పాపాత్ములు పిశాచాలు, జంతువులు అవుతారనీ, ఇంకా ఇట్టివే ఏవో వారు చెబుతారు కదా? వచ్చేవాళ్లు లేరు – పోయేవారు లేరు – అని అద్వైతి అంటాడు. నీవెలా రాగలవు? ఎలా పోగలవు? నీవు పరిపూర్ణుడవు కదా? (పరిపూర్ణుడు) నీవు వెళ్లడానికే చోటుంది? ఒక బడిలో కొందరు బాలబాలికల పరీక్ష జరుగుతున్నది, పరీక్షాధికారి లేనిపోని కఠిన ప్రశ్నలడిగాడు. “ఈ భూమి పడిపోకుండా ఎందుకు నిలిచి వుంది?” అనేది అందులో ఒక ప్రశ్న. గ్రహమండలంయొక్క ఆకర్షణ శక్తో, మరేదో వారికి అర్థంకాని విషయం అతని మనస్సులో ఉంది. బిడ్డలలో అనేకు లా ప్రశ్ననే అర్థంచేసుకో జాలక, ఏవేవో వెర్రిమొర్రి సమాధానాలు చెప్పారు. కాని అందులో ఒక బుద్ధిశాలిని అయిన బాలిక “అది ఎక్కడ పడగలదు?” అని మారు ప్రశ్న వేసింది! పరీక్షకుడి ప్రశ్నే అర్థం లేనిది. అనంత జగత్తులో క్రిందు మీదులు లేవు. సంబంధ భావం వర్తించే చోటనే క్రిందు మీదులుండ గలవు. అట్లే ఆత్మ విషయాన్నిగూర్చి మాట్లాడేటప్పుడు జనన, మరణ వ్యవహారమే అర్థరహితం. పోయేవారెవరు? వచ్చే వారెవరు? నీవెక్కడ లేవు? నీ వాక్రమించని స్వర్గం ఎక్కడుంది? జీవాత్మ సర్వగతం. అది ఎక్కడికి పోగలదు? ఎక్కడికీ పోలేదు. అది అంతటా వుంది. కాబట్టి పరిపూర్ణత్వమొందిన వాళ్లకు ఈ శిశు స్వప్నం, ఈ జనన మరణాలు స్వర్గాలు, ఉన్నత లోకాలు, అధోలోకాలు అనే భ్రాంతి వెంటనే అదృశ్య మవుతుంది. దాదాపు పరిపూర్ణ దశకు వచ్చిన వారి కీ భ్రాంతి, బ్రహ్మ లోకం వరకు గల దృశ్యాలన్నీ, చూపి అదృశ్యమవుతాయి. అజ్ఞానులకు మాత్రమది నిలిచి వుంటుంది.
స్వర్గానికి వెళ్లడం, మరణించడం, పుట్టడం అనే విషయాలను లోకమంతా నమ్మడానికి కారణమేమి? నేనొక గ్రంథాన్ని చదువుతు న్నాను. ఒక్కొక్క పుటను ముగించి మరొక పుటను త్రిప్పుతున్నాను. మార్పు చెందుతున్న దేది? వచ్చేది, పోయేది ఏది? నేను కాదు, ఆ పుస్తకం. ఒక్కొక్క అధ్యాయం చదువుతూ, త్రిప్పి వేస్తున్నాం. అప్పుడప్పుడు ఒక్కొక్క దృశ్యం కనిపిస్తూ వుంటుంది. అదీ చదివి త్రిప్పి వేయబడు తుంది. ఆ తర్వాత మరొకటి వస్తుంది. కాని ఆత్మలో మార్పేమీ లేదు. అది నిత్యం. మారేది ప్రకృతి. మానవుని ఆత్మ కాదు. అది ఎన్నడూ మార్పు నొందదు. జనన మరణాలు ప్రకృతిలోనివి. నీ లోనివి కావు. కాని పామరులు భ్రాంతికి లోనవుతారు. తిరిగేది సూర్యుడు, భూమికాదు అని ఎలా భ్రమ పడుతున్నామో, అట్లే మృతి నొందేది మనం, ప్రకృతి కాదు అని భ్రమపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ భ్రమలు. పరుగెత్తేది పొలములు, రైతులు కాదు అని ఎలా భ్రమపడుతున్నామో, అట్లే ఈ జనన మరణ విషయంలోకూడ భ్రమపడుతున్నాం. ఒక్కొక్క మానసిక స్థితిలో వుండే మనుష్యుల కీ ప్రపంచం, భూమి, సూర్య, చంద్ర నక్షత్రాలుగా కనిపిస్తాయి. అదే మానసిక స్థితిలో వున్న వారందరి కీ అట్లే అనిపిస్తుంది. మీకూ, నాకూ మధ్య వివిధ క్షేత్రాలలో – లక్షోప లక్షల జీవులున్నారు. వాళ్లు మనల్ని చూడజాలరు. మనం వారిని చూడజాలం. మన మానసిక స్థితిలోనే, మనముండే క్షేత్రంలోనే వుండే వాళ్లు మాత్రమే మనకు కనిపిస్తారు. ఒకే శ్రుతిలో వుండే వాద్యాలు ఒండొంటిని అనుకరిస్తాయి. “మానవ శ్రుతి” అనబడేది మారితే, మానవులిక ఇక్కడ గోచరించరు. “మానవలోక” మంతా మాయమై, ఇంకేదో ఒక దృశ్యం కనిపిస్తుంది. అది దేవతలు, దేవతాలోకం కావచ్చు. లేక పాపాత్ములకు పిశాచాలు, పిశాచలోకం కావచ్చు. కాని ఇవన్నీ వేర్వేరు దృక్పథాలనుండి కనిపించే ఒకే లోకం. మానవ క్షేత్రంనుండి ఇవి ధాత్రీ, సూర్య, చంద్ర, నక్షత్రాదులు; పాప క్షేత్రంనుండి ఇదే నరకలోకం. స్వర్గ కాంక్ష గలవారి కిదే స్వర్గం. సింహాసనస్థుడైన ఒక దేవుని ముందు నిలిచి, అతణ్ణి కీర్తించడమే జీవిత పరమార్థంగా గల వారికి, మరణానంతరం ఆ దృశ్యమే కనిపిస్తుంది. వారి కీ లోకమే విశాల స్వర్గంగా మారిపోతుంది. రెక్కలుగల దేవతలు, అక్కడ అనేక జాతుల వారుంటారు. గద్దెపై ఒక దేవుడు కూర్చుని వుంటాడు. ఈ స్వర్గాలన్నీ మానవ కల్పితాలు. కాబట్టి ద్వైతి చెప్పేదంతా నిజమైనా, అది కేవల స్వకల్పితం అని అద్వైతి చెబుతాడు. ఈ లోకాలు, భూత పిశాచాలు, దేవతలు, నూత్న శరీర ధారణలు, పునర్జన్మలు ఇవన్నీ పురాణ కథలు. ఈ మనుష్య జీవితంకూడ అలాంటిదే. ఈ జీవితమొక్కటే సత్యమనుకొనే మహాప్రమాదానికి మనుష్యులంతా లోనవుతున్నారు. ఇతర విషయాలు పురాణ కథలన్నప్పుడు, వా రామాటను బాగానే గ్రహిస్తారు. కాని తమ నమ్మకాలుకూడ అట్టివే అని వారంగీకరించరు. ఈ కన్పించేదంతా కేవల కల్పిత కథ. మన మీ శరీరాలం అనడంకన్నా పెద్దబొంకు లేదు. మనమెన్నడూ శరీరాలుగా ఉండలేదు. ఎన్నటికీ ఉండబోం. మనం, మానవమాత్రులమే అనుటకన్న పెద్దబొంకు ఉండబోదు. జగదీశ్వరుడంటే మనమే కదా? ఈశ్వరుని ఆరాధించడంలో మనమెప్పుడు, మనలో దాగివుండే ఆత్మనే ఆరాధిస్తూ వుంటాం. “నేను ఆజన్మ (పుట్టుకతోనే) పాపిని, ఆజన్మ దుష్టుడను” అనడంకన్నా ఘోరమైన అసత్యాన్ని నీవు పల్కజాలవు. ఇతరులను పాపిగా తలచేవాడే పాపి. ఇక్కడ ఒక పసిబిడ్డ వుందనీ, నీ వీ మేజాపై ఒక డబ్బు మూటను పెట్టావనీ అనుకో! ఆ మూటను ఒక దొంగ తీసికొని పోయినాడనుకో! బిడ్డకేమీ విశేషం జరిగిన ట్లనిపించదు. బిడ్డ లోపల దొంగలేడు కాబట్టి, బయటకూడ దొంగ లేడు. లోకంలో నీచత్వం కనిపించేది పాపాత్ములకు, నీచులకు. మంచివారికి కనిపించదు. కాబట్టే పాపాత్ముల కీ లోకం నరక రూపంలోను, కొంతవరకు సజ్జనులైన వారికి స్వర్గ రూపంలోను, పరిపూర్ణత్వాన్ని పొందిన వారికి భగవత్పూర్ణంగానూ కనిపిస్తుంది. పరిపూర్ణ స్థితి ప్రాప్తించినప్పుడు గాని, కన్నుల కడ్డుపడి వున్న తెరపడిపోదు. మానవుడప్పుడు పరిశుద్ధుడు నిర్మలుడు అవుతాడు. అతని కప్పుడు సర్వమూ కొత్త రీతిగా కనిపిస్తుంది. లక్షోప లక్షల సంవత్సరాలుగా తనను వేధిస్తూన్న దుస్స్వప్నాలన్నీ మాయమవుతాయి. తాను మానవుడనో, దేవత అనో, భూతమనో తలచుకొన్నవాడు అధమ స్థితిలోనో, ఉన్నత స్థితిలోనో, ఈ భూమి మీదో స్వర్గంలోనో, మరెక్కడనో జీవిస్తూన్నట్లు తలచినవాడు, తాను నిజంగా అంతటా వున్నాడనీ (సర్వగతుడని) కాలమంతా తనలోనిది కానీ, తాను కాలంలోని వాడు కాడనీ, స్వర్గాలన్నీ తనలోనివి కానీ, తాను స్వర్గంలోని వాడు కాడనీ మానవులు అనాది కాలంనుండి ఆరాధిస్తున్న దేవతలంతా తనలోనే వున్నారనీ, తాను వారెవ్వరిలో లేడనీ గ్రహిస్తాడు. దేవతలను, భూత పిశాచాలను, మానవులను, వృక్ష జాతులను, జంతువులను, శిలలను, ఇలా అన్నిటిని కల్పించినది తానే అని అతనికి తెలిసొస్తుంది. మానవుని యథార్థ తత్త్వం స్వర్గంకంటె ఉన్నతమనీ, మన జగత్తుకంటె సమగ్రమనీ, అనంతకాలంకంటె అనంతమనీ, సర్వవ్యాప్తమైన ఆకాశం కంటె అధిక వ్యాప్తమనీ, అతని కప్పుడు వ్యక్తమౌతుంది. అప్పుడుకాని మానవుడు, భయరహితుడు కాడు, ముక్తినందడు. భ్రాంతి, మోహాలన్నీ అప్పుడు సమసిపోతాయి. తాపాలన్నీ అదృశ్యమవుతాయి. భయాలన్నీ శాశ్వతంగా అంతరిస్తాయి. జననం నిష్క్రమిస్తుంది. దానితోనే మరణమూ నిష్క్రమిస్తుంది. దుఃఖాలెగిరిపోతాయి. వానితో సుఖాలెగిరిపోతాయి. భూలోకా లదృశ్యమవుతాయి. వానితో స్వర్గలోకాలూ అదృశ్యమౌతాయి. శరీరాలు మాయమౌతాయి. వానితో మానసమూ మాయమౌతుంది. అట్టివాని కీ జగత్తంతా అదృశ్యమవుతుందనవచ్చు. విరుద్ధ శక్తులకు అవిరామంగా జరుగుతున్న సంఘర్షణంతా, ఒకేసారి నిలిచిపోతుంది. ప్రాణాకాశాలుగా, ప్రకృతి సంఘర్షణలుగా, ప్రకృతిగా, స్వర్గాలుగా, ధరిత్రులుగా, వృక్షాలుగా, జంతువులుగా, మనుష్యులుగా, దేవతలుగా కనిపించినదంతా రూపుమారి ఒకే అనంతం, అఖండం, అవికారం అయిన అస్తిత్వంగా అయిపోతుంది. తానే ఆ అస్తిత్వమని ప్రాజ్ఞుడు గుర్తిస్తాడు. “రంగు రంగుల మబ్బులు, ఆకాశం ఎదుటికి వచ్చి ఒక క్షణంసేపు అక్కడుండి మాయమైపోయేలాగా” యీ భూలోకాలు, స్వర్గలోకాలు, చంద్రుడు, దేవతలు, సుఖాలు, దుఃఖాలు, ఈ ఆత్మ ఎదుట కనిపిస్తాయి. కాని ఈ దృశ్యాలన్నీ కడచిపోయి, అనంతం, అవికారం అయిన వినీలాకాశం మాత్రమే మిగిలుంటుంది. ఆకాశ మెన్నటికీ మార్పునొందదు. మార్పులు చెందేవి మబ్బులే. ఆకాశం మారిందనుకోవడం పొరపాటు. మనం అపరిశుద్ధులమనీ, పరిమితుల మనీ, భిన్నులమనీ, అనుకోవడం పొరపాటు. పారమార్థిక మానవుడే ఏక అఖండ సత్తాస్వరూపుడు.
ఇపుడు రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. మొదటిది – “ఇదొక మతం. ఒక తత్త్వశాస్త్ర భావం. కాని దీనిని సాధించడం సాధ్యమా?” అనేది. సాధ్యమే. భ్రాంతిని పూర్తిగా జయించిన వారు కొంద రీ లోకంలో ఇప్పటికే జీవించి వున్నారు. జయించడంతోనే వారు మరణిస్తారా? మనం అనుకొన్నంత త్వరగా మరణించరు. రెండు చక్రాలు, ఒక ఇరుసు కొయ్యతో కూడి నడుస్తున్నాయి. అందొక చక్రాన్ని పట్టుకొని ఆ ఇరుసు కొయ్యను ఒక గొడ్డలితో తెగగొట్టితే, నేను పట్టుకొన్న చక్రం మాత్రమే ఆగిపోతుంది. రెండవది, పూర్వ వేగబలం వల్ల కొంతదూరం పోయి తర్వాత పడిపోతుంది. ఒక చక్రం, ఈ పరిశుద్ధ పరిపూర్ణ వస్తువు. ఈ ఆత్మ రెండవ చక్రం, మీ మనస్సు శరీరాలనే బాహ్యభ్రాంతి. ఈ రెండూ కర్మమనే ఇరుసుకొయ్యతో కూడివున్నాయి. వీనికి గల సంబంధాన్ని భేదించేది జ్ఞానమనే గొడ్డలి. ఆత్మచక్రం నడక మానుతుంది. తనకు రాకపోకలు, జనన మరణాలు కలవనీ, తాను ప్రకృతి అనీ, తనకు కోపాలు, కోరికలు కలవనీ భావించడం మానుతుంది. కాని మనశ్శరీరాలనే రెండవ చక్రం పూర్వకర్మ ప్రభావంతో కొంతకాలం జీవిస్తుంది. ఆ బలం నశించిన తర్వాత – ఆ కర్మ ఫలమంతా, అనుభవించిన తర్వాత అవి పడిపోతాయి. అటు తర్వాత ఆత్మకు విమోచనం కలుగుతుంది. ఇక స్వర్గానికి పోవడం, మళ్ళీ పుట్టడం ఉండదు. బ్రహ్మలోకానికైనా, మరే ఉన్నత లోకానికైనా పోవడమూ లేదు. అతడు ఎక్కడనుండి రాగలడు? ఎక్కడికి పోగలడు? ఈ జీవితంలోనే ఈ స్థితినందుకున్నవాడు, ఈ ప్రపంచాన్ని సాధారణ రూపంలో కాక, సత్యరూపంతో, ఒక్క క్షణకాలమైనా చూడగల్గిన వాడు, జీవన్ముక్తు డనబడతాడు. ఈ జీవన్ముక్త దశను పొందడమే వేదాంతి లక్ష్యం.
నేనొకసారి హిందూదేశ పశ్చిమ ప్రాంతంలో, సముద్ర తీరపు ఎడారి ప్రదేశంలో ప్రయాణిస్తున్నాను. ప్రయాణమంతా కాలినడకనే. ఎన్నోనాళ్లు ఆ ఎడారిలో నడిచాను. చక్కని చెరువులు వాని చుట్టు వృక్షపంక్తులు, తల క్రిందులుగా ప్రతిబింబించి, కన్నుల పండువు చేస్తున్న ఆ చెట్ల నీడలను ప్రతిరోజూ చూచి ఆశ్చర్యపడేవాడిని. “ఎంత అద్భుతంగా ఉంది? ఇది ఎడారి ప్రదేశమట?” అని అనుకొనేవాణ్ణి. అందమైన ఆ చెరువులు, చెట్లు, మొక్కలూ చూస్తూ దాదాపొక నెల్లాళ్లు నడిచాను. ఒకనాడు దాహం వేసి, నీళ్లు తాగాలనుకొని ఒక నిర్మల మనోహరమైన జలాశయం దగ్గరికి వెళ్లాలని చూచాను. కాని దగ్గరకి వెళ్లగానే అది అదృశ్యమైంది. నేను పుస్తకాలలో చదువుతూండిన ఎండమావులివే అనీ, ప్రతి దినం ఈ ఎండమావులను చూస్తూకూడ తెలిసికోలేకపోయాననీ నా కప్పుడు తళుక్కున స్ఫురించింది. మరునాడు, మరల నడక సాగించాను. ఆ చెరువు మళ్లీ కనిపించింది. కానీ అది చెరువు కాదు, ఎండమావి అనే జ్ఞానంకూడ ఆ వెంటనే స్ఫురించింది. ఈ జగత్తు విషయంకూడ అట్టిదే. జగత్తనే ఎండమావులో మనమందరం, దిన దినం, నెల నెల, ఏటేట ప్రయాణిస్తున్నాం. కానీ ఎండమావులని తెలిసికోలేకున్నాం. ఈ అజ్ఞాన మొకనాడు చెదరిపోతుంది. కానీ అది మళ్లీ కలుగుతుంది. పూర్వకర్మ బలంచేత, ఈ శరీరం నిలిచి వుండాలి. కాబట్టి ఎండమావులు మళ్లీ కనిపిస్తాయి. కర్మబంధం వుండేంతకాలం ఈ జగత్తు మనల్ని వదలదు. స్త్రీలు, పురుషులు, జంతువులు, తరులతాదులు, అనురాగాలు, బాధ్యతలు – అవేవీ విడువవు. కాని వానికి మునుపటి బలం వుండదు. కొత్తగా లభించిన ఈ జ్ఞానంవల్ల కర్మబలం తరిగిపోతుంది. దానిలోని విషం విరిగిపోతుంది. అది ఇప్పుడు మారురూపు పొందింది. ఎందుకంటే దాని గుట్టు తెలిసిపోయిందనే భావంకూడ మనకిప్పుడుంది. సత్యానికీ, ఎండమావులకూ గల అపారభేదం ఇప్పుడు తెలిసింది కదా?
ఈ స్థితి లభించినప్పుడు ప్రపంచం మునుపటిదిగా వుండదు. కాని దీనిలో కొంత అపాయంకూడ వుంది. “నేను పుణ్య పాపాల కతీతుణ్ణి. కాబట్టి నీతి, ధర్మాలు నాయెడ వర్తించవు; నేను నా యిష్టానుసారం ప్రవర్తించవచ్చు” అని ఈ వేదాంతాన్ని ఆధారంగా చేసికొని పలికే వాళ్లను మనం ప్రతి దేశంలో చూస్తున్నాం. “నేను బద్ధుడిని కాను. నేను భగవంతుడిని; నన్ను యథేచ్ఛగా నడవనివ్వండి –” అని పలికే అవివేకులెందరో ఈ దేశంలో ఇప్పుడు కూడ వున్నారు. ఇలాంటి మాటలు నింద్యములే కానీ, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక నియమాలన్నిటికీ ఆత్మ అతీతమనే మాటమాత్రం నిజమే. నియమాలకు లోబడడమంతా దాస్య స్థితి. నియమాలు దాటిన తర్వాతనే మోక్షం. ముక్తి, ఆత్మకు స్వతస్సిద్ధం. దాని “జన్మహక్కు” అనడంకూడ నిజమే. సత్యమైన ఆ ముక్తి, భౌతిక పదార్థ రూపమైన తెర ద్వారా ప్రకాశించి, అసత్యమైన మానవ స్వేచ్ఛా (ఫ్రీవిల్) రూపంలో కనిపిస్తుంది. జీవితంలో ప్రతిక్షణం మనకు స్వేచ్ఛ వుందనిపిస్తుంది. ఆ భావం లేనిది మనం ఒక నిమేషకాలమైనా జీవించలేం. మాట్లాడలేం. ఊపిరి పీల్చలేం. కాని కొంచెం ఆలోచించి చూస్తే, మనం యంత్రమాత్రులమే అనీ, స్వేచ్ఛారహితులమనీ తెలిసిపోతుంది. ఇందులో నిజమేది? స్వేచ్ఛాభావం భ్రాంతా? స్వేచ్ఛాభావం భ్రాంతి అని ఒక పక్షంవారు, దాస్యభావం భ్రాంతి అని రెండవ పక్షంవారు వాదిస్తారు. ఇలా జరగడాని కేమి కారణం? మానవుడు నిజంగా స్వతంత్రుడే. పారమార్థిక మానవుడు స్వతంత్రుడుగా వుండే తీరాలి. ఈ మాయా ప్రపంచంలోనికి, ఈ నామ రూపాలలోనికి వచ్చినప్పుడే అతడు బద్ధుడవుతున్నాడు. స్వతంత్రేచ్ఛ (ఫ్రీ విల్) అనే మాటే తప్పు. ఇచ్ఛకు స్వతంత్రత ఉండజాలదు. ఎలా వుంటుంది? పారమార్థిక మానవుడు బద్ధుడైన తర్వాతే, ఇచ్ఛ జన్మిస్తుంది. అంతకు ముందు కాదు. మానవుని ఇచ్ఛ బద్ధం. ఆ ఇచ్ఛకు మూలాధారమైన వస్తువు నిత్యముక్తం. కాబట్టి ఈ బద్ధ దశలోకూడ – అంటే, భూమిపై మానవ జీవితంలో లేక స్వర్గంలో దేవతాజీవితంలో – మన దివ్యస్థితికి స్వాభావికమైన ముక్తి జ్ఞప్తిలో నిలిచి వుంటుంది. మళ్లీ దాన్నందుకోవడానికే మనమందరం – తెలిసి కొందరు, తెలియక కొందరు – పరిశ్రమిస్తున్నాం. ఆత్మ స్వాతంత్ర్యం – ముక్తి – సాధించుకొన్న వానిని, నియమాలు ఎలా బంధిస్తాయి? ఈ జగత్తులోని నియమమేదీ అతణ్ణి బంధింపజాలదు. జగత్తే అతనిది కదా?
అతడే జగత్తంతా; జగత్తంతా అతడే అనైనా అనొచ్చు లేక, అతనికి జగత్తే లేదు అనవచ్చు. అలా అయితే, అతని కీ క్షుద్రభావాలు – స్త్రీ పురుష భావాలు, దేశ భావం – ఎలా వుంటాయి? నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను బిడ్డను – ఇలాంటి మాటలతడెలా అంటాడు? అవి అసత్యాలు కావా? అబద్ధాలని అతనికి తెలుసు. ఇవి పురుషుల హక్కులు, ఈ యితరము స్త్రీల హక్కులు అని అతడెలా అనగలడు? ఎవ్వరికీ హక్కులు లేవు. అసలు వేర్వేరుగా, ఎవ్వరూ లేరు కదా? పురుషుడు లేడు, స్త్రీ లేదు; ఆత్మకు స్త్రీత్వ పురుషత్వాదులు లేవు. అది నిత్యశుద్ధం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, మా దీ దేశం, ఆ దేశం అనడం కల్ల. జగత్తంతా నా దేశమే. అదంతా నాదే. దాన్ని నా శరీరంగా ధరించి వున్నాను. కానీ ఈ ఉన్నత భావాలు ప్రకటిస్తూనే లోకులకు, నీచాతి నీచులుగా తోచే అసహ్య కార్యాలు చేసేవారున్నారు. ఇట్లేల చేస్తున్నారని వాళ్ల నడిగితే, అది మన భ్రాంతి అనీ, తాము తప్పు చేయలేమనీ, వారు బదులు చెబుతారు. వారి మాటలు పరిశీలించి విషయ నిర్ధారణ చేయడమెలా? ఏ ప్రమాణాన్ని బట్టి? ఆ ప్రమాణాన్నిప్పుడు వివరిస్తాను.
మంచీ, చెడులు రెండూ ఆత్మ పారిపార్శ్విక ప్రదర్శనలే అయినా, చెడుగు వెలుపలి పొర, మంచి లోపలి పొర. రెండవది పారమార్థిక మానవునికి, ఆత్మకు దగ్గరగా వుంటుంది. కాబట్టి చెడుగు పొరను భేదించిన వాడే ఆత్మను చేరగలడు. ఆత్మను చేరిన వానికేమి అంటుకొని వుంటుంది? కొంచెం కర్మ. పూర్వ జీవితబలంలో మిగిలి వున్న ఒక స్వల్పాంశం. కాని అదంతా మంచికి సంబంధించిందే. దుష్కర్మ బల మంతా అనుభవించాలి. అదంతా సమసిపోవాలి. పూర్వం చేసిన పాపాలన్నీ నిశ్శేషంగా దగ్ధమై పోవాలి. అప్పుడు కానీ, సత్యాన్ని అనుభవంలోకి ఎవరూ తెచ్చుకోలేరు. అంటే ఆత్మస్థుడై, సత్యానుభూతిని ఇంకా అంటుకొని వుండేది, పూర్వపు సత్సంస్కారంలో మిగిలి వున్న భాగం; సత్కర్మబలం. అలాంటి వాడు, ఈ శరీరంలో జీవించి, నిరంతరం కార్యనిమగ్నుడై వున్నా, పరోపకారాలే చేస్తాడు. అతని నోట వచ్చే మాటలన్నీ స్వస్తివాచక రూపాలే (మంగళప్రదమైనవే). అతని చేతులు సత్కార్యాలే చేస్తాయి. అతని మనస్సు, యోగ్యములైన ఆలోచనలనే ఆలోచిస్తాయి. అతడెక్కడికి పోయినా, అతని ఉనికి అందరికీ శుభాన్ని కలిగిస్తుంది. శుభంయొక్క మూర్తీభావమే అతడు. అట్టివాడు, తన సాన్నిధ్య మాత్రంచేతనే, పరమదుర్మార్గునికూడ, సాధుశ్రేష్ఠునిగా మార్చగలడు. అతడు మౌనంగా వున్నా, అతని ఉనికే మానవజాతికి మంగళాశాసనంగా వర్తిస్తుంది. అట్టివారు అపకారమేదైనా చేయగలరా? పాపాలు చేయగలరా? సత్యానుభూతికి, శుష్క ప్రసంగాలకు, ధ్రువాల కున్నంత భేదముందని మీరు జ్ఞాపకముంచుకోవాలి! వట్టి మూఢులు కూడ మాటలు చెప్పగలరు. చిలుకలుకూడ మాట్లాడగలవు. మాట్లాడటం, అనుభూతి పొందటం వేర్వేరు విష యాలు. వేదాంతాలు, మతాలు, చర్చలు, గ్రంథాలు, వాదాలు, గుళ్లు, తెగలు – ఇవీ, ఇలాంటివీ, కొన్నివిధాల మంచివే. కాని సత్యానుభూతి కలిగినప్పుడివన్నీ జారిపోతాయి. దేశ పటాలు మంచివే కానీ, దేశాన్ని ఒకసారి చూచిన తర్వాత దేశ పటాన్ని చూస్తే ఎంత భేదం కనిపిస్తుంది? కాబట్టి సత్యాన్ని చవిచూచిన వారికి, తార్కిక వాదోపవాదాలు, మానసిక వ్యాయామ విద్యలు, సత్యాన్ని గ్రహించడానికి అవసరమా? (కావాలా?) అది వారి ప్రాణాలకు ప్రాణం; వారు ప్రత్యక్షంగా చూచి అనుభవించిన వస్తువు. కేవల స్పర్శమాత్ర జ్ఞానం కాదది, అంతకంటె గొప్పది. నీకది ఉపనిషత్తు ఋషులు చెప్పినట్టి “హస్తామలకం” (చేతిలోని ఉసిరికకాయ)గా వుంటే, “ఇదిగో అది” అని నీవు చెప్పగలవు కదా? అట్లే సత్యంయొక్క అపరోక్షానుభూతి కలవారు, “ఇదే ఆత్మ” అని అంటారు. నీవు వారితో సంవత్సరాల తరబడిగా వాదించవచ్చు. కాని వారు నిన్ను చూచి చిరునవ్వు నవ్వుతారు. నీ మాటలన్నీ పసిబిడ్డలయొక్క పిచ్చిమాటలుగా భావిస్తారు. బిడ్డనట్లే మాట్లాడనిస్తారు. వారు సత్యాన్ని చవిచూచి పరిపూర్ణు లయ్యారు. నీ వొక దేశాన్ని చూశావనుకో! నీ దగ్గరికొకడు వచ్చి, ఆ దేశం లేదని వాదించ మొదలుపెడతాడు. అతడు అలా ఎంతసేపు వాదించినా, నీవతన్ని గూర్చి ఏమనుకొంటావు? అతడు పిచ్చాసుపత్రికి పంపదగిన వాడనేకదా? కాబట్టి జ్ఞానసిద్ధుడు ఇలా అంటాడు. “ఈ చిన్నచిన్న మతాలను గూర్చి లోకంలో జరిగే ప్రసంగాలన్నీ అసంబద్ధ ప్రలాపాలు. అపరోక్షానుభూతే, బ్రహ్మవిద్యకు ప్రాణం, మూలసత్త్వం – బ్రహ్మవిద్య ననుభూతం చేసికోవచ్చు.” నీవందుకు సిద్ధంగా వున్నావా? నీకది కావాలా? కావాలంటే లభిస్తుంది. అప్పుడు నీది నిజంగా, ధర్మసందీప్త జీవనమవుతుంది. నీవు అపరోక్షానుభూతి నొందేంత వరకు, నీకు నిరీశ్వరవాదులకు భేదం లేదు. నిరీశ్వరవాదులు నిష్కపటులు. కాని బ్రహ్మవిద్యలో నమ్మకం వుందని చెబుతూ, దాన్ని అనుభూతం చేసికోవడానికి యత్నించనివాడు కపటి.
“అపరోక్షనుభూతి కలిగిం తర్వాత ఏం జరుగుతుంది?” అన్నది రెండవ ప్రశ్న. ఈ జగత్తంతా ఏక వస్తువే అనీ, మనమే ఆ అఖండ పరమాత్మ అనీ తెలిసికొన్నామనుకోండి. ఈ ఆత్మ తప్ప వేరే లేదని, ఈ వివిధ రూపాలతో కనిపిస్తున్నదదే అనీ తెలిసికొన్నామనుకోండి. ఆ తర్వాత మన కేమవుతుంది? పనులన్నీ మానుకొని, ఒక మూలకు పోయి, అక్కడ కూర్చుని మరణిస్తామా? “అది లోకానికి ఎలా ఉపకరి స్తుంది?” ఆ పాత ప్రశ్నే! మొదటి సంగతి, లోకానికి ఎందుకుపక రించాలి? అలా చేయాలనడాని కేమైనా కారణం వుందా? అది లోకానికి ఎలా ఉపకరిస్తుందని ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉందా? ఆ ప్రశ్నకర్థమేమి? పసిబిడ్డకొకడికి పంచదార చిలుకలు కావాలి. మీరు విద్యుచ్ఛక్తిని గూర్చి పరిశోధనలు చేస్తున్నారనుకోండి. ఆ బిడ్డ వచ్చి “ఈ పరిశోధనల వల్ల పంచదార చిలుకలు లభిస్తాయా?” అని అడిగితే, లభించవని బదులిస్తారు. అలా అయితే “దీనివల్ల ఏం ప్రయోజనం?” అని బిడ్డ అడుగుతాడు. అట్లే, మనుష్యులు “ఇది లోకానికెలా ఉపకరిస్తుంది? దీనిచే మాకు డబ్బు లభిస్తుందా?” అని అడుగుతారు. “లభించదు.” “అలా అయితే దీనిలో ఏమి గుణముంది?” లోకానికి ఉపకరించటం అంటే జనుల అర్థమిది. అయినా బ్రహ్మ విద్యానుభూతి లోకానికి అత్యంతంగా ఉపకరిస్తుంది. ఆ అనుభూతి కలిగితే, ఒక్క వస్తువు మాత్రమే వుందని తెలిసికొంటే, ప్రేమ ప్రవాహ మూలములు ఎండిపోతాయనీ, జీవితం శూన్యాకృతి దాల్చుననీ, తనకు ప్రేమప్రదమైన సర్వం, ఇహపర లోకాలనుండి శాశ్వతంగా, అదృశ్యమైనట్లు అనిపిస్తుం దనీ ప్రజలు భయపడతారు. లోకంలో మహత్తర కార్యాలు నిర్వహించిన వాళ్లంతా, తమ వ్యక్తిత్వాల పట్ల కేవలం ఉపేక్షాభావం చూపిన వారే కదా అని వాళ్లు కొంచెంకూడ గుర్తించరు. తనకు ప్రేమప్రదమైన వస్తువు నీచం కాదు. క్షుద్రం కాదు, అనిత్యం కాదు అని తెలుసుకొని ప్రేమించువానిదే ప్రేమ. తనకు ప్రేమప్రదమైన వస్తువొక మట్టిపెళ్లకాదనీ, ప్రత్యక్షదైవమే అనీ, తెలిసికొని ప్రేమించే వానిదే ప్రేమ. భార్యకు భర్తపట్లగల ప్రేమ, అతనిని భగవత్స్వరూపునిగా భావించేట ప్పుడు ఎక్కువవుతుంది. భర్తకు భార్యపట్ల గల ప్రేమ, ఆమె భగవత్స్వరూపిణి అని తెలిసినప్పుడు అధికమవుతుంది. తల్లికి బిడ్డలపట్ల గల ప్రేమ వారిని భగవత్స్వరూపులుగా భావించినప్పు డధిక మవుతుంది. భగవంతుడే తన గర్భశత్రువు రూపాన్ని ధరించాడని తెలిసినవాడా శత్రువును ప్రేమిస్తాడు. సాధుపురుష రూపంలో వున్నది భగవంతుడే అని తెలిసినవాడు ఆ సాధుపురుషుని ప్రేమిస్తాడు. అతడే ఘోరపాతకిని కూడ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆ పాతకి రూపానికికూడ మూలం భగవంతుడే అని అతనికి తెలుసు. క్షుద్రమైన అహంభావం నశించి (నేను అనే భావం పోయి) ఆ స్థానంలో భగవంతు డెవరిలో సుప్రతిష్టితమై వుంటాడో, అలాంటి వానికి లోకాన్ని ఉఱ్ఱూతలూగించే శక్తి కలుగుతుంది. జగత్తంతా అతనికి కొత్త రూపం ధరించి కనిపిస్తుంది. బాధలు, తాపాలు, అదృశ్యమౌతాయి. కష్టాలుండవు. పట్టెడన్నానికై రోజూ అగచాట్లుపడి, పోరాడి, పోటీలు పడవలసిన చెరసాలగా ఇప్పుడు కనిపించే ఈ లోకం అప్పుడు క్రీడానందభూమిగా మారిపోతుంది. రమణీయ రూపాన్ని ధరిస్తుంది. అలాంటి అనుభూతిని సాధించిన వానికే “ఈ లోకం ఎంత అందమైనది” అనే అధికారం వుంటుంది. ఈ లోకం కేవలం మంచిది అనే అర్హత అతనికి మాత్రమే వుంది. ఆ అనుభూతిచేత లోకానికి కలిగే మహోపకారమిది. లోకమిప్పటి స్పర్థలతో, సంఘర్షణలతో సాగిపోతుండటానికి బదులు, మానవులంతా, ఈ మహాసత్యంలో ఒక లేశాంశమైనా అనుభూతం చేసికొంటే, లోక స్వరూపమే మారి, అది వివాద రంగంగా, యుద్ధభూమిగా వుండక, శాంతినికేతమై తేజరిల్లుతుంది. ప్రతివాడు ఇతరులను వెనక్కినెట్టి, తాను ముందుకు పోవాలని చూచే ఈ పోటీ, ఈ వేగిరపాటు – కేవలం అనుచితం, నీతిబాహ్యమైన ఈ వేగిర పాటు – లోకంనుండి మాయమౌతుంది. దాంతో ప్రయాసలన్నీ అంతరిస్తాయి. ద్వేషాలన్నీ తొలగిపోతాయి. ఈర్ష్యాసూయలన్నీ మటుమాయమౌతాయి. దురాకృత మంతా ఒక్కసారిగా అంతరిస్తుంది. అప్పు డీ భూమి దేవతా వాసమౌతుంది. ఈ భూమే స్వర్గమౌతుంది. అప్పుడు – దేవతలు, దేవతలతోపాటు ఆటలాడుతున్నప్పుడు, దేవతలు, దేవతలతో కలసి పనులు చేస్తున్నపుడు, దేవతలు – దేవతలను ప్రేమించేటప్పుడు – ఈ లోకంలో కీడెలా వుండగలదు? దివ్యానుభూతి వలన కలిగే మహోపకారమిది. మానవ సంఘంలో మీ కిప్పుడు కనిపించేదంతా, అప్పుడు మారి మరొక రూపాన్ని ధరిస్తుంది. మనిషిలో అప్పుడు మీకు లోపాలు కనిపించవు. ఇది మొదటి లాభం; గొప్పది, ఎవరైనా – స్త్రీగాని, పురుషుడుగాని – తప్పు చేస్తే వారిని చులకనగా, తిరస్కార దృష్టితో చూడరు. రాత్రి వేళ, వీథులకెక్కడానికి సంశయింపని, అభాగినులను, కులీన స్త్రీలుకూడ తృణీకరించరు. వారిలోకూడ అప్పుడు భగవంతుడే కనిపిస్తాడు కదా? అసహనం, దండనం మనసులోకే రావు. అవన్నీ అదృశ్యమై, ప్రేమ – మహోన్నత ప్రేమాదర్శం – పరిపూర్ణ బలంతో సుప్రతిష్ఠితమౌతుంది. మానవజాతిని, అప్పుడు సరైన దారిలోనడిచేలా చేయడానికి కొరడాలు, బెత్తాలు కావలసి వుంటుందా?
లోకంలోని స్త్రీ, పురుషులలో ఒక దశలక్షాంశం కూర్చుని “ఓ మానవులారా! ఓ జంతువులారా! ఓ ప్రాణికోటులారా! మీరంతా, ఆ అద్వితీయుడు, ఆ సజీవదైవం, ఆ ఈశ్వరుని ప్రత్యక్ష స్వరూపాలు” అని కొన్ని నిమిషాలపాటు పల్కుతూంటే, ఈ లోకమంతా ఒక్క అరగంటలో మారిపోతుంది. ప్రతిచోట, ఘోర, ద్వేష రూపమైన అగ్నివర్షం కురిపించుతూండడానికి మీరు, ఈర్ష్యాపకార రూపాలైన ఆలోచనా ప్రవాహాలను లోకంలోకి పంపుతూండటానికి మారు, ప్రతి దేశంలోని జనులు, ఇదంతా అతడే – అని భావిస్తారు. మీరు చూచేది, తలచేది అంతా అతణ్ణే. మీలో దోషముంటే తప్ప మీకు దోషమెలా కనిపిస్తుంది? మీ మనస్సులో దొంగ కూర్చుని వుంటే తప్ప మీకు దొంగ ఎలా కనిపిస్తాడు? మీరు హంతకులైతే తప్ప మీకు హంతకుడెలా కనిపిస్తాడు? మంచివాళ్లుగా మారండి. పాపం మీకు కనిపించదు. జగత్తంతా ఈ విధంగామారిపోతుంది. సంఘానికి కలిగే మహోపకార మిది. మానవ వ్యవస్థకు కలిగే మహోపకారమిది. ప్రాచీనకాలంలో హిందూ దేశంలో అక్కడక్కడ ఒక్కొక్కరి కీ భావాలు స్ఫురిస్తూ వచ్చాయి. వాళ్లల్లో కొందరు ఈ భావాల ఫల రూప పర్యవసానాన్నికూడ తెలిసికొన్నారు. కాని మత గురువులకు బుద్ధి వైశాల్యం లేకపోవుట చేత, దేశం పరాధీనమై వుండటం చేత, ఇంకా ఇతర కారణాల చేత, ఈ భావాలు ప్రచారం పొందలేదు. కాని అవి అద్భుతసత్యాలు. అవి ఆచరించబడిన చోట్లంతా మానవుడు దివ్యత్వం పొందినాడు. అట్టి దివ్య పురుషులలోని, ఒకరి స్పర్శతో, నా జీవితమంతా మారిపోయింది. ఆ మహనీయునిగూర్చి, రేపాదివారం నాడు మీ ఎదుట ప్రసంగిస్తాను. ఈ భావాలు లోకమంతటా వెదజల్లే కాలం సమీపిస్తోంది. మఠాల లోపలే నివసించి వుండే బదులు, తత్త్వశాస్త్రాలలో అణగి విద్వాంసులకు మాత్రమే అందుబాటులో వుండేందుకు బదులు, కొన్ని తెగలకు, కొంతమంది విద్యాధికులకు సొంత సొమ్ముగా వుండటానికి బదులు, ఆ భావాలు దిగంతాల వరకు విచ్చల విడిగా వెదజల్ల బడతాయి. అప్పుడది సర్వ జనులకు – సిద్ధులకు, బద్ధులకు, స్త్రీలకు, పురుషులకు, శిశువులకు, పండితులకు, పామరులకు – అందరికీ సమానాధికారం గల సొమ్ము అవుతుంది. అప్పుడది ప్రపంచ వాతావరణమంతా నిండి వ్యాపిస్తుంది. అప్పుడు మనం పీల్చేగాలికూడ ప్రతిస్పందనతో “తత్త్వమసి” (అది నీవే) అని పలుకుతూంటుంది. వేన వేల సూర్య మండలాలతో కూడిన ఈ అఖీల ప్రపంచం, మాట్లాడగల ప్రతి భూతం మూలంగా, ఐక్యకంఠంగా “తత్త్వమసి” అని పల్కుతూంటుంది.