(అమెరికాలో ఉపన్యసించబడింది)
మీలో చాలామంది, మాక్స్ ముల్లర్ వ్రాసిన “వేదాంతోపన్యాస త్రయము” ను చదివే వుంటారు. ఆ వేదాంతశాస్త్రాన్ని గూర్చే జర్మనీ భాషలో ఆచార్య డ్యూసేన్గారు వ్రాసిన గ్రంథాన్ని మీలో కొందరు చదివి వుంటారు. హిందువుల మతాదర్శాలను గూర్చి, పాశ్చాత్య దేశాలలో వ్రాసిన వ్రాతలలోను, చేసిన బోధలలో హిందువుల మతాభిప్రాయాలందలి సిద్ధాంత మొకటి మాత్రం ఎక్కువగా ప్రస్తావింపబడుతోంది. అది “జీవేశ్వరులు ఒకరే” అనే పక్షంవారి సిద్ధాంతమైన “అద్వైత వాదం”. ఆ ఒక్క సిద్ధాంతంలోనే వేదాల బోధ అంతా ఇమిడి వున్నట్లు భావించడమూ కద్దు. కానీ హిందువుల సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇతర సిద్ధాంతాలను అవలంబించిన వారితో పోల్చి చూస్తే, ఈ అద్వైతవాదుల సంఖ్య తక్కువ అనొచ్చు. చాలా పురాతన కాలంనుండి, భారతదేశంలో చాలా మత సంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఫలానా సంప్రదాయం వారు, ఫలానా సిద్ధాంతాలను అంగీకరించాలి అని నిర్ధారణ చేయడానికై నిర్ణయించబడిన లేక ఆమోదించబడిన గురు పీఠంగాని, సంఘంకాని, హిందూదేశంలో ఎన్నడూ లేదు. కాబట్టి ప్రజలు తమ తమ సంప్రదాయాలను తామే నిర్ణయించు కోవడానికీ, తమ తమ శాఖలను తామే నిర్మించుకోవడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ కలవారై ఉండేవారు. అందువల్లనే భారతదేశం, పూర్వంనుండీ, నానామత సంప్రదాయాలతో నిండి వుండటం సంభవించింది. ఈనాడు భారతదేశంలో ఎన్ని వందల మత సంప్రదాయాలున్నాయో చెప్పలేం. క్రొత్తవి అనేకం ప్రతి సంవత్సరమూ తలెత్తుతూంటాయి. భారతదేశంలో కనబడే మత ప్రచారానికి అంతమే కనిపించదు.
వివిధములైన ఈ సంప్రదాయాలను ఆస్తికములని, నాస్తికములని, మొదట రెండు ముఖ్య భాగాలుగా విభజింపవచ్చు. హిందూమతానికి మూల గ్రంథములైన వేదాలను, సనాతనధర్మ ప్రతిపాదకాలని అంగీకరించువాని ‘ఆస్తికము’ లనీ, వేదాలను నిరాకరించి యితర ప్రమాణాలపై ఆధారపడే వానిని ‘నాస్తికము’ లనీ భారతదేశంలో పేర్కొంటారు. (ఈ విభజనలో ‘నాస్తిక’ శబ్దానికి, ‘ఈశ్వరుని నమ్మనివారు’ అనే అర్థం కాదు. వేదాలను నమ్మనివారు అని అర్థం). ఈ కాలంలో వుండే నాస్తిక హైందవ సంప్రదాయపరులలో జైనులు, బౌద్ధులు ముఖ్యులు. ఆస్తిక మతాలలోకూడ కొందరు వేదాలు, తర్క విమర్శనకు అతీతములైన ప్రమాణాలని వాదించేవారు, మరికొందరు వానిని తర్క విమర్శనకు నిలిచేంత వరకే అంగీకరించి, తదితర భాగాలను త్రోసివేయాలని వాదించేవారూ వున్నారు.
ఆస్తిక శాఖలలో, సాంఖ్యులు, నైయ్యాయికులు, మీమాంసకులు అనే మూడుతెగలలో మొదటి ఇద్దరు, తత్త్వ దార్శనికవాదులైనా, ప్రత్యేక శాఖా సంప్రదాయాలను నెలకొల్పలేదు. ఉత్తర మీమాంసకులు లేక వేదాంతులు, అనబడే శాఖవారే ఇప్పుడు భారతదేశాన్ని ఆక్రమించి వున్నారని చెప్పాలి. వారి సిద్ధాంతాన్నే వేదాంతమంటారు. హైందవ తత్త్వశాస్త్రా (దర్శనము) లన్నీ వేదాల తుది భాగాలైన (వేదాంతాలు) ఉపనిషత్తుల నుండే ఉద్భ వించాయి. అయినా ఇతర ప్రమాణాలను గ్రహించక ఈ వేదాంతము పైనే ఆధారపడి తమ ఉపాసనా విధులను, తత్త్వశాస్త్రాన్నీ నిర్మించుకొనపూనిన అద్వైతులే, వేదాంతులు అను పేరును తమ ప్రత్యేక నామంగా స్వీకరించారు. కాలక్రమంలో వేదాంతం విజయవంతమైంది. భారతదేశంలో ఇప్పుడు గల సంప్రదాయాలన్నీ వేదాంత శాఖలలో దేనినో ఒకదానిని అనుసరించేవే. అయినా ఈ సంప్రదాయాలకు ఏకీభావం లేదు.
వేదాంతులలో మూడు ముఖ్య మత శాఖల వారున్నారు. ఒక్క విషయంలో వీరందరు ఏకీభవిస్తారు. అందరూ భగవంతుడున్నాడని విశ్వసిస్తారు. అందరు వేదాలు, ఈశ్వర ప్రోక్తములని నమ్ముతారు. కాని క్రైస్తవులు, మహమ్మదీయులు నమ్మే విధంగా కాదు. వీరి అర్థం వేరు. వేదాలు, భగవద్విజ్ఞానాన్ని ప్రకటిస్తాయి. భగవంతుడు సనాతనుడు. అందువల్ల వాని విజ్ఞానంకూడ అట్లే సనాతనం. కాబట్టి వేదాలుకూడ సనాతనములు అని వీరి అభిప్రాయం. మరొక విషయంలోకూడ వీరికి ఐకమత్యం వుంది. సృష్టి చక్రాకృతిలో (ఇన్ సైకిల్స్) నడుస్తుందనడంలో వీరు ఏకీభవిస్తారు. ఈ సృష్టి అంతా ఒకప్పుడు దృశ్యమవుతూ, మరొకప్పుడు అదృశ్యమవుతూ వస్తుంది. సృష్టి ఒకప్పుడు ఆవిష్కృతమై (ప్రొజెక్టెడ్) క్రమ క్రమంగా స్థూలతరాకారాలను ధరిస్తూపోయి, దీర్ఘకాలం తర్వాత మళ్లీ చాలా సూక్ష్మమైన రూపాలను పొందుతూ, విచ్ఛిన్నమై, అణిగిపోతుంది. అటు తర్వాత కొంత విరామకాలం ఏర్పడుతుంది. ఆ తర్వాత తిరిగి దృశ్యరూపం ధరించ ప్రారంభించి, పూర్వపు తీరునే వర్తిస్తుంది. ప్రకృతి శాస్త్రజ్ఞులు “ఈథరు” అని పిలిచేదాన్ని పోలినట్టి “ఆకాశం” అనే దృశ్య మొకటి, “ప్రాణ” మనే శక్తి ఒకటి కలవని వాళ్లుచెబుతారు. ఈ “ప్రాణం” యొక్క స్పందనం (వైబ్రేషన్ = చలనం) వల్ల ఈ జగమంతా కల్పిత మవుతోందని అంటారు. కల్పాంతంలో, ఈ సృష్టి అంతా క్రమక్రమంగా, సూక్ష్మతర రూపాలను ధరించి, ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశాన్ని చూడ్డానికిగాని, తాకడానికిగాని, సాధ్యం కాదు. కానీ దానినుండే సమస్తమూ సృష్టించ బడుతోంది. మనకు ప్రకృతిలో కనిపించే గురుత్వాకర్షణం (గ్రావిటేషన్), వికర్షణం (రిపల్షన్), ఆలోచనాగతి, భావగతి, నాడీచలనం, మొదలైన వేర్వేరు శక్తులన్నీ, ప్రాణశక్తిలో కలిసిపోతాయి. అప్పుడు ప్రాణశక్తి స్పందనం నిలిచిపోతుంది. తరువాతి కల్పారంభ సమయం వరకు, అది అలా స్పందిచని స్థితిలో వుంటుంది. తర్వాత ఆ ప్రాణశక్తి మళ్లీ స్పందించడానికి ప్రారంభిస్తుంది. క్రమక్రమంగా దాని స్పందన, ఆకాశంలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఆయా రూపాలన్నీ వెనుకటిలాగా వెలువడుతాయి. అంటే ఆవిష్కృతిని పొందుతాయి.
మొదట నేను మీకు తెలపాలనుకున్నది, ద్వైత సిద్ధాంతాన్ని గూర్చి. దీని ప్రకారం, ఈ జగత్తును సృష్టించి దీని పాలనకర్తయై వెలసే దేవుడు ప్రకృతికి, జీవునికి ఎప్పుడూ వేరుగానే వుంటాడు. దేవుడు నిత్యుడు. ప్రకృతీ నిత్యపదార్థమే. జీవులూ నిత్యులే. ఇందులో ప్రకృతి, జీవులు మార్పులు పొందుతూ వేరు రూపాలను ధరిస్తూంటారు. దేవుడు మార్పులను పొందడు. దేవుడు గుణసహితుడు. అంటే ఆయనలో గుణాలున్నాయి. అలా అనడంవల్ల, వానికొక శరీరం ఉందని భావింపతగదు. ఆయనలో మానవ లక్షణాలుంటాయి. అంటే కృపాళువు, న్యాయశీలుడు, శక్తిమంతుడు, స్తోత్రం చేయదగినవాడు, ప్రేమాస్పదుడు, ప్రేమ చూపేవాడు – అని వర్ణించడానికి తగినవాడు. ఇంతేల? ఆయన ‘నర దైవత’ మనదగినవాడు. కాని ఎంతటనరవరునితో పోల్చినా, ఇంకా గొప్పవాడై ప్రకాశిస్తాడు. నరునిలో వున్న దుర్గుణాలేవీ ఆయనలో వుండవు. వారు, ఆయనను, ‘అనంత కల్యాణ గుణసాంద్రుడు’ అని వర్ణిస్తారు. ద్రవ్యము లేకుండా సృష్టి చేయడానికి వీలుకాదు కాబట్టి, ప్రకృతి అనే మూలద్రవ్యంనుండి, ఆయన జగత్తును నిర్మాణం చేస్తుంటాడు. పరమాణువాదులు (ఆటమిస్ట్స్) అనబడే ద్వైతులు కొందరున్నారు. వీరు వేదాంతులు కారు. ప్రకృతి, అనంత సంఖ్యాకములైన పరమాణువుల సమూహమనీ, భగవత్సంకల్పం వానిపైన ప్రతిఫలించగానే, సృష్టి ప్రారంభమవుతుందనీ వీరి సిద్ధాంతం. వేదాంతులైన ద్వైతులు, వీరి వాదానికి అంగీకరించక, పరమాణువాదం తర్కవిమర్శనకు నిలిచేది కాదంటారు. పరమాణువులు అనేవి క్షేత్రగణితంలోని చుక్కలను (పాయింట్స్ = బిందువులు) పోలిన విభజించ సాధ్యంకాని పరిమాణంలేని చిన్న నలుసులు. ఇలా ఖండించడానికి వీలుకాని, పరిమాణంలేని నలుసులను, అనంతంగా తీసుకొని కలిపినప్పటికీ అట్లే వుంటాయి కదా? విభజించడానికి వీల్లేని వస్తువులు ఒక విభాజ్య వస్తువుగా కలవ గలుగుతాయా? సున్నలను ఎన్నిటిని ఒకదాంతో ఒకటి చేర్చినా, సంఖ్యాపరిమాణం ఏర్పడుతుందా? అట్లే అంతర్భాగాలుకాని, పరిమాణంకాని లేని పరమాణు సముదా యంతో జగత్తును నిర్మాణం చేయడం అసంభవం. కాబట్టి వేద ప్రామాణికులైన ద్వైతులు అవ్యక్తమై, అవర్ణనీయమై (వర్ణించరానిదై) ఒప్పే ప్రకృతి అనేది వుందనీ, దాంతో భగవంతుడు విశ్వసృష్టిని చేస్తూంటాడనీ వాదిస్తారు భారతీయులలో చాలమంది ద్వైతులు. సామాన్యంగా మానవుని స్వభావం ద్వైతభావాన్ని మించి పైకి పోజాలదు. భూమిలోవున్న జనుల్లో నూటికి తొంబది తొమ్మండుగురికి మతమేమైనా వుందంటే, అది ద్వైత మతమే. యూరప్‌లో, ఆసియా పశ్చిమ భాగంలోవున్న మతాలన్నీ ద్వైత సంప్రదాయకాలే. అలాకాక తప్పదు. సామాన్య నరుడు, స్థూలాకృతిలేని దేనినిగానీ భావన చేయజాలడు. అలాంటి వాడు తన బుద్ధికి గ్రాహ్యమైన దాన్నే అంటిపెట్టుకొని వుండాలని కోరుతాడు. అంటే ఉన్నత పారమార్థిక భావాలను సైతం, తానున్న క్షేత్రానికి దింపి ఊహిస్తాడు. సూక్ష్మతమ భావాలను సైతం స్థూలంగా చేసినపుడే అతడేమైనా గ్రహింపగలడు. ప్రపంచంలో ఎక్కడైనా, సామాన్యునికిగల మతం ఇటువంటిదే. ఒక రాజో, గొప్ప ఐశ్వర్యవంతుడైన చక్రవర్తో అయి, తమకు దూరంగా ఉండేవానిని దేవుణ్ణిగా ఊహించుకొని వాళ్లు నమ్ముతారు. అయినా వారు ఆయనను ఈ లోకంలోని చక్రవర్తు లందరికంటె పవిత్రుడిగా చేస్తారు. అన్ని సద్గుణాలను వానికి ఆరోపిస్తారు. దుర్గుణాలనన్నిటిని వానినుండి దూరం చేస్తారు. కాని కీడులేని మేలు ఉండగలుగుతుందా? చీకటి అనే భావం తెలియనప్పుడు వెలుగును భావించడం సాధ్యమా?
అనంత కల్యాణగుణసాంద్రుడు, న్యాయశీలుడు, కృపామయుడు అయిన భగవంతుని పరిపాలనలో వుండే ప్రపంచంలో ఇన్ని చెడుగులెలా వుండగలవు? అనే ముఖ్యసందేహం, ద్వైత మతాలకంతా బాధాకరంగా ఉంది. అన్ని ద్వైత మతాల్లో ఈ సందేహం తలెత్తింది. అయినా దీనికి సమాధానం చెప్పడానికి హిందువులు ‘సైతాను’ అనే పిశాచాన్ని ఒకదాన్ని సృష్టి చేయలేదు. ఆ దోషాన్నంతా నరునిపైన వేయడంలో హిందువులంతా ఏకీభవిస్తున్నారు. అది వారికి సహజమైన కార్యం. ఎలా అంటే, శూన్యంనుండి జీవులు సృష్టి కావడం వారు నమ్మరని యింతకు ముందే చెప్పాను. మనమెప్పుడూ భవిష్యత్తును, మన ఇష్టమొచ్చినట్లు నిర్ణయం చేసికొని, అలా జీవిస్తున్నాం కదా? ప్రతి వాడూ, ప్రతి దినమూ, మరునాటస్థితిని నిర్మాణం చేసికోవడానికి యత్నిస్తాడు. రేపటి గతిని, నేడు నిర్ణయి స్తున్నాం. ఎల్లుండి గతిని, రేపు నిర్ధారణ చేసికొంటాం. ఇలా సాగిపోతూ వుంటుంది. ఈ వాదనను, వెనుకకు మరలించి, భూతకాలానికి అనువర్తింప చేయటమూ సమంజసమే. మన భవిష్యత్తును, మన కర్మల చేత నిర్ధారించే టట్లయితే, ఈ సూత్రాన్ని భూతకాలానికి మాత్రం ఎందుకు అన్వయించ కూడదు? అంతులేని ఒక గొలుసులో కొన్ని రకాల కడియాల వరుస, ఒక నిర్ణీత క్రమంలో, మాటిమాటికి వస్తూ వుంటుందని మనకు తెలిస్తే, వానిలో ఒక కడియాల వరుసను గ్రహిస్తే గొలుసు స్వభావా న్నంతటినీ గ్రహింపగలుగుతాం. అదే విధంగా అనంతంగా సాగివస్తున్న కాలంలో, కొంతభాగాన్ని వేరు చేసి, ఆ భాగాన్ని పరిశోధించి, దాని తత్త్వాన్ని నిర్ధారణ చేయజాలితే, ప్రకృతి అంతటా ఒకే తీరుగా నడిచేదైతే, ఆ నిర్ధారణే, అనంతమైన వచ్చే ‘కాలం’ అనే గొలుసుకు వినియోగిస్తుంది. కొంత మితమైన కాలంలో మన గతిని, మనం నిర్ణయించుకోజాలడం సత్యమైతే, మనం సర్వత్రా చూస్తున్నట్లు ప్రతి దానికి ఒక కారణం వుండి తీరాలనేటప్పుడూ, మన ఇప్పటి దశ మన పూర్వకర్మ సమష్టి ఫలమే అయివుండాలనడం తథ్యం. కాబట్టి నరుని గతిని నిర్ణయించడానికి వేరొకడు ఉండవలసిన ఆవశ్యకత కాన్పించదు. ప్రపంచంలో కనిపించే కీడులకు మనమే కర్తలం. ఇతరు లెవ్వరూ కారు. ఈ కీడుల నన్నిటినీ మనమే తెచ్చిపెట్టుకొన్నాం. దుష్కార్యాల ఫలితంగా, దుఃఖాన్ని అనుభవించడాన్ని అంతటా మనం చూస్తూనే వున్నాం. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు కనిపించే దుఃఖంలో చాలాభాగం నరుని పూర్వ దుష్కర్మ ఫలమే. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి నరునిదే బాధ్యత. భగవంతుని దోషం లేదు. అనంత కృపానిధి అయిన జగత్పిత, నిందింప దగినవాడు కాడు. “మనం నాటిన విత్తనపు ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం.”
ప్రతి జీవాత్మ చివరికి మోక్షాన్ని పొంది తీరాలి అనడం ద్వైత మతంలోని మరొక విశిష్ట ధర్మసూత్రం. ఒక్క జీవాత్మకూడ త్రోసి వేయబడదు. భిన్న భిన్నావస్థల్ని అనుభవిస్తూ, వివిధ గతుల సుఖదుఃఖాల్ని అనుభవిస్తూ ప్రతి జీవుడు చివరికి తప్పక విముక్తుడు కావలసిందే. సరే, దేన్నుండి విముక్తుడు కావడం? ఈ జగత్తునుండి. జీవులందరు, విడుదల పొందాలనడం సకల హిందూ సంప్రదాయాలవారు సామాన్యంగా అంగీకరించే భావం. కంటికి కనిపిస్తూ (దృశ్యమై) అనుభవించబడే (అనుభోక్తం) ఈ స్థూల జగత్తు కానీ, కేవల భావ కల్పితమైన వేరొక జగంకానీ, శుభాశుభాల సమ్మిళితమే కాన, ఇందేదీ నిర్దుష్టంకాని, సత్యంకానీ కాజాలదు. ద్వైతుల సిద్ధాంతం ప్రకారం జగత్తుకు అతీతమై, కేవలం ఆనందమయం, కేవలం సుఖప్రదం అయిన ప్రదేశం ఒకటుంది. అక్కడికి చేరిన తర్వాత ఇక పుట్టడం, చావడం, జన్మజన్మాంతరాల అవసరం లేకుండా పోతుంది. ఈ భావన ద్వైతులకు అత్యంత ప్రియమైంది. అక్కడ రోగాలుండవు. చావనునదే ఉండదు. నిరంతరానందం చేకూరుతుంది. అక్కడి వారు ఎప్పుడూ భగవత్సన్నిధానంలో వుండి, ఆ సాన్నిధ్య సుఖాన్ని అనుభవిస్తూంటారు. నీచమైన కీటకం మొదలు, అత్యుత్తములు గంధర్వులు, దేవతలు మొదలగువారంతా దుఃఖమనేది ఎన్నడూ కలగని ఆ పర లోకానికి ఎన్నడో చేరి తీరాలని వీరి విశ్వాసం. కాని మన ఈ లోకం ఎన్నడూ అంతరించబోదు. శాశ్వతంగా సాగుతూండవలసిందే. తరంగ రూపంలో, క్రిందికి అణుగుతూ, పైకి లేస్తూ మాత్రం వుంటుంది. ఎన్నో యుగాలు గడిచినా, దీనికి అంతం లేదు. తరించవలసిన, పరిపూర్ణత పొందవలసిన జీవులసంఖ్య అనంతంగా ఉంది. కొన్ని జీవులు వృక్షాల్లో వున్నాయి. కొన్ని పశువుల్లో వున్నాయి. కొన్ని మనుషుల్లో; కొన్ని దేవతలలో; అవన్నీ – ఉత్తమోత్తమ దేవతలలో వున్న జీవులు సైతం – పూర్ణం కానివే. అన్నీ బద్ధజీవులే. ఈ బంధమంటే ఏమి? జనన మరణాలు పొందుతూండ వలసిన నిర్బంధమే. ఉత్తమ దేవతలలో సైతం ప్రతి ఒక్కరు మరణం పాలు పడక తీరదు. “దేవతలు” అంటే ఏమి? కొన్ని ఉత్తమ దశలను లేక అధికార పదవులను పొందిన వారు అని అర్థం. ఉదాహరణకు దేవరాజగు ఇంద్రుడు – అంటే, ఒకానొక ఉద్యోగ పదవిలో వున్నవాడని అర్థం. ఎంతో ఉన్నతదశను సాధించిన ఒకానొక జీవుడు, ఈ కల్పంలో ఆ ఉద్యోగాన్ని పొందాడు. ఈ కల్పాంతంలో అతడు తిరిగి నరుడై పుట్టి భూలోకానికి రావలసిన వాడే. ఈ కల్పంలో చాలా యోగ్యుడైన మరొకడు పైకి పోయి, రానున్న కల్పములో ఆ ఇంద్రపదమును పొందుతాడు. దేవతలందరి స్థితి ఇలాంటిదే. ఆ ఉద్యోగ పదవులు, వంతుల ప్రకారం కోట్ల కొలది జీవాత్మలు అనుభవించి, తమ ఉద్యోగపు గడువు చెల్లిపోగానే, క్రిందకి వచ్చి, మనుషులుగా పుడతారు. స్వర్గ లోకాలను చేరాలనో, తోడిమానవుల స్తోత్రాలను పొందాలనో ఆశపడి సత్కార్యాలు చేస్తూ పరోపకారపారీణులై ఈ లోకంలో జీవించిన వారు మరణానంతరం తమ సత్కర్మల ఫలితంగా దేవతలవుతారు. కాని అది మోక్షం కాదు. ఫలాపేక్ష ఉన్నంత వరకు మోక్షం దొరకదు. నరుడు దేనిని కోరుతాడో, భగవంతుడు దానిని వానికిస్తాడు. నరులు అధికారాలు కోరుకుంటారు. ప్రతిష్ఠలను కోరుకుంటారు. దేవతలై సుఖాలను పొందగోరుతారు. వారి కోరికలన్నీ ఫలిస్తాయి. కాని కర్మ ఫలమేదీ శాశ్వతం కాదు. కొంతగడువు చెల్లిన తర్వాత ఆ ఫలం ముగుస్తుంది. యుగం గడిచిపోవచ్చు. ఆ కాలపరిమితి తరువాతెజనా ఫలానుభవం తుదముట్ట వలసిందే. దేవతలు దిగివచ్చి, మళ్లీ మనుష్యులై పుట్టి, మోక్ష సాధనకై మరొక అవకాశాన్ని పొందుతారు. పశువులుకూడ ఉన్నతికి వచ్చి, మనుషులుగా, దేవతలుగా పుట్టవచ్చు. అవి మరల మనుషులుగానో, పశువులుగానో పుట్టడమూ జరగొచ్చు. వాని భోగాసక్తి, జీవన పిపాస, అహంకారం, మమకారబంధనం వదిలి పోయేంత వరకు అవి అలా పునరావృత్తిని పొందుతూండవలసిందే. ఈ అహంకార మమకారాలే నేను, నాది అనే ఈ భావాలే లోకమందలి అనర్ధాలకన్నిటికీ మూలం. “ఇది నీ బిడ్డడేనా?” అని మీరొక ద్వైతవాదిని ప్రశ్నిస్తే “కాదు, భగవంతునిది. నా సంపద నాది కాదు. భగవంతునిదే–” అని ప్రత్యుత్తరమిస్తాడు. ఇలా సర్వమూ భగవంతునిదే అనే భావనను అతడు సాధన చేస్తాడు.
భారతదేశంలోని ద్వైత మతస్థులు శాకాహార నియమాన్ని నిష్ఠతో పాటిస్తారు. జీవహింస కూడదని శ్రద్ధతో బోధిస్తారు. అయినా ఈ విషయంలో బౌద్ధుల అభిప్రాయానికీ, వీరి భావనకు చాల భేదముంది. “ఏ జంతువును కాని, చంపకూడదని నీవెందుకు బోధిస్తావు?” అని బౌద్ధునొకనిని ప్రశ్నిస్తే దేని ప్రాణాన్నిగాని తీయడానికి మనకు అధికారం లేదంటాడతడు. సరే “నీవేల జంతు వధ చేయవు?” అని అద్వైతవాదిని అడిగితే “అది భగవంతునిది కావడం చేత” అని అతడంటాడు. ఇలా నేను, నాది అనే మాటలు భగవంతుని పట్ల మాత్రమే చెల్లుతుందని ద్వైతులు అంటారు. “నేను” అనగలవాడు భగవంతుడొక్కడే. సర్వమూ అతనిదే. “నేను”, “నాది” అనే భావనలు తొలగిపోయే దశకు నరుడు వచ్చినప్పుడు, అంటే సర్వాన్నీ ఆ సర్వేశ్వరునికి అర్పణం చేయబడినప్పుడు అన్నిటినీ ప్రేమించగలిగి, ప్రతిఫలాపేక్ష లేకుండా, ఒకానొక జంతువు ప్రాణరక్షణార్థం తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి సంసిద్ధుడైనపుడు, వాని హృదయం పవిత్రమౌతుంది. ఆ విధంగా హృదయం పవిత్రమైనపుడు ఆ హృదయంలో భగవద్భక్తి పుడుతుంది. భగవంతుడొక్కడే ప్రతి జీవాత్మను ఆకర్షింపగల ఏకైక కేంద్రం. “సూదిని మట్టితో కప్పిపెడితే, సూదంటురాయి దాన్ని ఆకర్షించదు. కాని ఆ మట్టిని తొలగించిన వెంటనే ఆకర్షిస్తుంది” అని ద్వైతవాది పలుకు తూంటాడు. భగవంతుడే సూదంటురాయి. జీవుడే సూది; దుష్కర్మలే దాన్ని కప్పిపెట్టే మన్ను. జీవాత్మ పరిశుభ్రత చెందిన తక్షణమే, అది భగవంతునివైపునకు సహజంగానే ఆకర్షించబడుతుంది. తర్వాత అది శాశ్వతంగా భగవత్సాన్నిధ్యంలో నిలిచిపోతుంది. కాని సదా వేరుగానే వుంటుంది. సిద్ధాత్మలు తమ ఇష్టమొచ్చిన రూపాలను ధరించగల్గుతాయి. తమ కిష్టమైతే సిద్ధాత్మలు నూరు శరీరాలను ధరింపగలవు. అశరీరిగా ఉండాలనుకుంటే అట్లే వుంటాయి. సిద్ధాత్మ దాదాపుగా సర్వశక్తిమంత మవుతుంది. సృష్టించే అధికారం మాత్రం దానికుండదు. ఆ అధికారం భగవంతునికే వుంటుంది. ఎంత పరిపూర్ణుడయినా వేరొకడు జగత్పరిపాలన కర్మను నిర్వర్తింపజాలడు. ఆ శక్తి భగవంతుని కొక్కనికే వుంటుంది. కానీ జీవాత్మలన్నీ సిద్ధిని పొందినప్పుడు, శాశ్వతానందాన్ని అనుభవించి సంతత భగవత్సాన్నిధ్యంలో ఉండగలవు. ఇది ద్వైతుల సిద్ధాంతం.
ద్వైతులు ప్రవచించే భావం ఇంకొకటి వుంది. “దేవా! నాకు దీన్ని అనుగ్రహించు! దాన్ని ప్రసాదించు!” అంటూ ప్రార్థనలు చేయుట వారికి నచ్చదు. అలా కోరుకోవడం తగదని వాళ్ల అభిప్రాయం. ఐహికములైన వరాలను కోరుకోవలసి వస్తే, తక్కువ వారిని చేరి వేడుకోవాలి. అశాశ్వత ఫలాలకై ప్రార్థించేటట్లయితే, సామాన్య దేవతలనో, గంధర్వులనో, సిద్ధ పురుషులనో గూర్చి అటువంటి ప్రార్థనలు చేయవచ్చు. కాని పరమేశ్వరుని యెడల కేవలం భక్తి మాత్రమే చూపవలసి వుంటుంది. “దేవా! నాకు దీన్నివ్వు. దాన్నివ్వు” అని భగవంతుని వేడటం దైవదూషణ. ద్వైతుల సిద్ధాంతం ప్రకారం, దేవతలలో ఒకరిని గూర్చి ప్రార్థిస్తే మనుష్యుడు తన కోరికలను ఎప్పుడో ఒకప్పుడు పొందజాలుతాడు. కానీ మోక్షాన్ని కోరేవాడు భగవత్సేవ చేయాలి. భారతదేశంలో సామాన్య ప్రజల మతమిదే.
వేదాంతతత్త్వంయొక్క యథార్థరూపం, విశిష్టాద్వైతులనబడే వారితో ప్రారంభమవుతోంది. కార్యం, కారణంనుండి ఎన్నడూ వేరు కాదు. కార్య మనేది కారణమే. వేరు రూపాన్ని ధరించడంచేత ఏర్పడుతోందని వీరి వాదం. జగత్తు కార్యం, ఈశ్వరుడు కారణం. కాన జగత్తును, ఈశ్వరుడును ఏకమే అయి వుండాలి. భిన్నత్వం వుండజాలదు. ఈ జగత్తునకు ఈశ్వరుడే నిమిత్త కారణం, ఉపాదాన కారణం అనే ప్రతిపాదనతో వారి సిద్ధాంతం ప్రారంభమవుతోంది. బ్రహ్మమే సృష్టికర్త. అంతేకాక, ఆ బ్రహ్మమే ఈ విశ్వమంతా ఆవిష్కృతి పొందడానికి (వెలువడేదానికి) ప్రధానమైన మూల కారణం. “క్రియేషన్” అనే మీ ఆంగ్ల పదానికి సరైన పర్యాయపదం సంస్కృత భాషలో లేదు. ‘క్రియేషన్’ అంటే శూన్యంనుండి కల్పింపబడటం అని పాశ్చాత్యుల విశ్వాసం. సృష్టి ఆ విధంగా జరుగుతుందనే సిద్ధాంతాన్ని అంగీకరించే తెగవారు ఎవ్వరూ భారతదేశంలో ఇప్పుడు లేరు. ఇలాంటవిశ్వాసంగల కొందరు పూర్వమెన్నడో ఉన్నారట కాని, త్వరలోనే వారి నోరు కట్టుబడింది. అటువంటి విశ్వాసం కల సంప్రదాయమేదీ నా కిప్పుడు కన్పించడంలేదు. సృష్టి శబ్దానికి మా అర్థం – అంతకు ముందున్న వస్తువులే వెలికి ఆవిష్కరించడం. విశిష్టాద్వైత మతం ప్రకారం విశ్వమంతా బ్రహ్మమే. ఈ జగత్తుకు ఉపాదాన కారణం ఆయనే. “సాలె పురుగు గూడునల్లుకొని దారమంతా దాని లోపలినుండి వచ్చే విధంగా, బ్రహ్మంనుండి విశ్వమంతా బహిష్కృతమవుతోంది” అని వేదాలలో చదువుతున్నాం.
కార్యం, కారణంయొక్క రూపాంతరమే అయితే, ఒక సందేహం బయలుదేరుతుంది. అజడమైనట్టి, అఖండ జ్ఞాన స్వరూపమైనట్టి, బ్రహ్మంనుండి, జడం, నిస్తేజం, మూఢం అయిన జగత్తు ఎలా పుడుతుంది? కారణం, స్వచ్ఛం, పరిపూర్ణం అయి వుండగా, కార్యం కేవలం తద్భిన్నంగా ఎలా వుండగలదు? దీనికి విశిష్టాద్వైతులు చెప్పే పరిహారమేమి? వారిదొక విచిత్ర సిద్ధాంతం. బ్రహ్మం, ప్రకృతి, జీవుడు అనే మూడు ఒకే సత్త. ఇందులో బ్రహ్మం ఆత్మ అనీ, ప్రకృతి, జీవులు, ఆ ఆత్మకు శరీరమని చెప్పవచ్చునని వారి సిద్ధాంతం. నాకొక శరీరం, ఆత్మ, ఉన్నట్లు ఈ అఖీల విశ్వం, సర్వ జీవాత్మలు, బ్రహ్మమునకు శరీరం కాగా తాను ఆత్మలన్నిటికీ పరమాత్మగా ఒప్పుతున్నాడు. అంటే విశ్వానికి బ్రహ్మమే ఉపాదాన కారణం. శరీరం మారవచ్చు. యౌవనం, వృద్ధాప్యం, బలం, శుష్కించడం అనే అవస్థలు దానికి కలుగవచ్చు. అయినా ఇవేవీ ఆత్మ నంటవు. ఈ శరీరాలద్వారా సదా ప్రకాశిస్తూ, శాశ్వత సత్తాకరూపంలో, ఆత్మ యథాస్థితిని నిలిచి వుండేదే. శరీరాలు రావచ్చు, పోవచ్చు. ఆత్మ మాత్రం మారదు. అట్లే విశ్వమంతా భగవంతునికి (బ్రహ్మమునకు) శరీరం. ఈ అర్థంలో అది బ్రహ్మమే. కాని విశ్వంలో కలిగే మార్పులు (వికారాలు) బ్రహ్మమునంటవు. ఈ ద్రవ్యరాశితో ఈశ్వరుడు విశ్వాన్ని నిర్మిస్తాడు. కల్పాంతంలో వాని ఈ శరీరం సూక్ష్మతరావస్థను పొంది సంకోచమును పొందును. వేరొక కల్పారంభంలో అది మరల వ్యాకోచాన్ని పొందుతుంది. అప్పుడు దానిలోనుండి ఈ లోకాలన్నీ పుడతాయి.
ద్వైతులు, విశిష్టాద్వైతులుకూడ ఆత్మ సహజంగా పవిత్రమైనదనీ, తన కర్మ చేతనే మలినమవుతుందనీ అంగీకరిస్తారు. ఈ అంశాన్ని ద్వైతులకంటె, విశిష్టాద్వైతులు చాలా మనోహరంగా చెబుతారు. ఆత్మయొక్క నిర్మలత, పూర్ణత, సంకోచాన్నిపొంది మరల వికసిస్తూ వుంటుందని అంటారు. మనంపడే శ్రమ అంతా ఆత్మకు సహజ లక్షణములైన ప్రజ్ఞానాన్ని, నిర్మలత్వాన్ని, మహిమను మళ్లీ ప్రకటించడం కోసమే. ఆత్మలకు అనేక గుణాలున్నాయి. కాని సర్వాధికార, సర్వజ్ఞత్వాలు మాత్రం లేవు. ప్రతి దుష్కర్మ, ఆత్మ సహజతేజాన్ని సంకుచితం చేస్తుంది. ప్రతి సత్కార్యం దాన్ని వికసింప జేస్తుంది. జీవాత్మలన్నీ బ్రహ్మంయొక్క అంశాలు. “ఒకే జ్వాలనుండి, కోట్లాదిగా సమాన లక్షణాలతో ఒప్పే, నిప్పు కణాలు ఎగిరి వచ్చేలాగ అఖండ రూపి అయిన బ్రహ్మంనుండి ఆత్మలన్నీ ఉద్భవించాయి.” ప్రతి జీవికీ పరమ ప్రాప్యమొక్కటే. విశిష్టాద్వైతుల దేవుడుకూడ సగుణుడే. అనంత కల్యాణగుణ సముద్రుడు. కాని అతడు ఈ జగమంతటా అంతర్యామిగా ఉంటాడు. అన్నిటిలో, అంతటా బ్రహ్మం వ్యాపించి వుంటుంది. సమస్తమూ బ్రహ్మం అనడంలో బ్రహ్మం సర్వోపగతుడు అనే వేదాల అభిప్రాయం. భగవంతుడు ఈ గోడ అయ్యాడని భావం కాదు. ఈ గోడలో కూడ భగవంతుడున్నాడని అర్థం. ఈ విశాల జగత్తులో ఒక్క అణువు కాని, పరమాణువు కాని, భగవంతునిచే పరివ్యాప్తము కానిది లేదు. ఆత్మలన్నీ పరిమితాలు, సర్వవ్యాపకత వానికి లేదు. వాని ప్రభావాలు వికాసము నొందుట వల్ల అవి పరిపూర్ణతను పొందినప్పుడు, వానికి అటు పిమ్మట జనన మరణాలుండవు. శాశ్వతంగా అవి భగవత్సాన్నిధ్యంలో ఉండిపోతాయి.
ఇక అద్వైత మతానికి వద్దాం. ఏ దేశంలో కాని, ఏ యుగంలో కాని, తత్త్వశాస్త్రంనుండి, మతంనుండి, పొడచూపిన మిక్కిలి ప్రముఖమైనది, చాలా అందమైనది అయిన పుష్పరాజం ఇదే అని మా అభిప్రాయం. ఇందు నరుని జిజ్ఞాస అత్యుత్తమ వికాసం పొందింది. అత్యంత దురవగాహమని భావించబడే మర్మముల సైతం ఇది దాటిపోయింది. దీనిని అద్వైత వేదాంతమంటారు. ఇది ప్రజాసామాన్య మతం కావడానికి సాధ్యం కాజాలనంత దురవగాహం, అత్యున్నతం అయి వెలుగుతోంది. దీనికి జన్మస్థానమైన భారతదేశంలో సైతం, గడచిన మూడు వేల సంవత్సరాల నుండి, ఇది ప్రాముఖ్యం గాంచివున్నా ప్రజాసామాన్యంలో ప్రవేశించలేదు. అద్వైత సిద్ధాంతాన్ని గ్రహించడం, సర్వదేశాలలోని, మహాధీమంతులైన స్త్రీ పురుషులకుకూడ కష్టసాధ్యంగా వుందని ముందు ముందు మనం తెలిసికోగల్గుతాం. మనమంత దుర్బలులమైపోయాం. అంతటి అధోగతిలో కూలిపోయాం. మన ప్రజ్ఞలను గూర్చి మనమెంతగా ప్రగల్భాలు పలికినా, స్వభావం చేతనే మనం వేరే ఆధారాన్ని కోరే వాళ్లమే. ఎప్పుడూ ఏదో ఒక ఆధారానికై దేవులాడుతూ వుండే బక్కచిక్కిన మొక్కలలాగా ఉన్నాం. “సుఖతరమైన మతమును” ఉపదేశించండని నన్నెన్నోసార్లు అనేకులు అడిగారు. కాని సత్యాన్ని బోధించుడని కోరువారు చాలా అరుదు. ఆ సత్యాన్ని గ్రహింప సాహసించే వారింకా అరుదు. దానిని సంపూర్ణంగా ఆచరించే ధైర్యాన్ని కలిగిన వారు లేనేలేరనవచ్చు. ఇది వారి దోషం కాదు. బుద్ధిబలంలోని లోపం. ఏ కొత్త భావమైనా, అందులో ముఖ్యంగా, అదొక ఉద్దండ భావన అయితే, గొప్ప కలవరాన్ని కల్గించి మన మెదడులో ఒక క్రొత్తమార్గాన్ని కల్పింప జూస్తుంది. దానికి ముందున్న భావ నిర్మాణమంతా చలించిపోయి, నరుని స్థాయి చెడిపోతుంది. వారేదో ఒక పద్ధతికి అలవాటుపడి వుంటారు కదా? పురాతన, మూఢవిశ్వాస సముదాయాన్ని ఎంతటినో వారిప్పుడు అతిక్రమించి రావలసి వుంటుంది. వంశపారం పర్యంగా వస్తున్న మూర్ఖాభిప్రాయాలను, అంటే కులదురభిమానాలను, గ్రామ్య మూఢవిశ్వాసాలను, దేశీయ గర్వాలను – వీటన్నిటినీ మించి – ప్రతి నరునిలో పాతుకొనివున్న పిచ్చిపిచ్చి నమ్మకాల సమూహాలను ఎన్నింటినో విసర్జింపవలసి వస్తుంది. అయినాకూడ సాహసించి సత్యాన్వేషణను పూని, దీక్ష వహించి, తుదముట్ట దానిని అనుసరించు ధీరోత్తములు కొంద రీ లోకంలో జన్మిస్తూనే వుంటారు.
అద్వైతి బోధించేదేమి? భగవంతు డొకడున్నాడా? ఉంటే అతడు ఈ విశ్వానికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం అయి వుండాలి. అతడు సృష్టికర్తగా వుండడమే కాక, సృష్టికూడ తానే, అంటే ఈ జగత్తుకూడ అతడే. అదెలా సాధ్యం? కేవలం ఆత్మస్వరూపి అయిన పరబ్రహ్మం జగత్తుగా మారడమా? అవును. కాని ఆభాసగా మాత్రమే (లేనిది వున్నట్లు కనిపించడం). “విశ్వము” గా పామర జనులు చూస్తున్నది సత్యదృష్టికి లేనేలేదు. మీరు, నేను, మనకు కనిపించే వస్తుసమూహం ఇదంతా ఏమి? కేవలం భ్రాంతి రూపాలు. అఖండమై, ఆనంద స్వరూపమై, వెలిగే ఒక్క వస్తువు తప్ప వేరేదీ లేదు. ఆ ఒక్క సత్తాకంలోనే మన మీ స్వప్నాల నన్నిటినీ చూస్తున్నాం. ఆ ఏకైక సత్తాకం ఆత్మ. అది అఖండం, సర్వాతీతం. జ్ఞానము నంతటికీ అతీతం, జ్ఞేయమునంతటికీ కూడ అతీతం. జగత్తు రూపంలో మనం చూచే అన్నిటిలో అది వ్యాపించింది. అది ఒక్కటే సత్పదార్థం. ఈ బల్ల అదే. అదే నా ఎదుట కూర్చుని నా మాటలు వినే జనం. ఈ గోడకూడ అదే. నామ రూపాలను తొలగించారో, ఇక మిగిలేదంతా అదే. దానికి వేదాంతి స్త్రీ అనిగాని, పురుషుడని గాని పేరు పెట్టడు. ఈ భావాలు కల్పితాలు. మానవుని మేధస్సుచేత కల్పింపబడిన భ్రాంతులు. ఆత్మలో స్త్రీ పురుష భేదంలేదు. భ్రాంతికి లోబడి పశుప్రాయులైపోయిన వారు స్త్రీ అనీ, పురుషుడనీ భావనలు కల్పించుకొంటారు. జ్ఞానసిద్ధులకు స్త్రీ పురుష భేదం కనిపించదు. విశ్వానికి అతీతులైన వారి కీ భేదమెలా గోచరిస్తుంది? ప్రతి జీవి, ప్రతి వస్తువు, ఇటువంటి భేద భావమేదో స్ఫురింపచేయునట్టి, అతి ఉజ్వలం, నిత్యానందమయం అయిన ఆత్మయే సుమండీ! భౌతికములైన నామం, రూపం, మూర్తి, ఈ భేదాలను కల్పిస్తున్నాయి. నామం, రూపం అనే భేదాలను రెంటిని తొలగించామంటే, విశ్వమంతా ఏకమై ప్రకాశిస్తుంది. రెండు ఉన్నవనడమే కల్ల. అంతటా ఒక్కటి మాత్రమే వుంది. మీరూ, నేనూ ఏకమే. ప్రకృతిగాని, భగవంతుడుగాని, జగత్తుగాని ఉన్నాయనే మాట అసత్యం. అంతా ఏకైక సత్పదార్థమే. దానినుండే, నామ రూపమూలంగా, ఇవన్నీ కల్పితము లవుతున్నాయి. “జ్ఞాత” ను (అంటే తెలిసికొను వానిని) తెలిసికొనుట ఎలా? అతడు తెలియబడే వాడు కాడు. నీ ఆత్మనే నీవు చూడటం ఎలా? కాని నీ ఆకారానికి ప్రతిబింబం కలిగించగలవు. అలా ఏర్పడిన ఆ ఏకైక సత్య వస్తువైన ఆత్మయొక్క ప్రతిబింబమే ఈ విశ్వం. మంచివి, చెడ్డవి అయిన బింబగ్రాహకముల* పైన ఏర్పడే ప్రతిబింబాలు మంచివీ, చెడ్డవీ అయిన స్వరూపాలుగా గోచరిస్తాయి. హంతకునిలో వుండే బింబగ్రాహకం చెడ్డది. కాని అందులో ప్రతిబింబించే ఆత్మ మంచిదే. రుషిలోని బింబగ్రాహకం నిర్మలంగా వుంటుంది. ఆత్మ వస్తుతః నిర్మలమైనదే. అద్వితీయమైన సత్తాకమై, క్షుద్ర కీటకం మొదలు శ్రేష్ఠుడైన సిద్ధపురుషుని వరకు, అందరిలోనూ ప్రతిబింబించే ఆత్మ ఒక్కటియే సుమండీ! ఈ విశ్వమంతా ఏకైక సత్తాకమే. స్థూలంగా, మానసికంగా, నైతికంగా, పారమార్థికంగా, సర్వవిధాలా అది ఒక్కటే. ఆ ఏకైక సత్తాకమును, వేర్వేరు రూపాలతో చూస్తూ, దానిలో ఆయా స్వరూపాల నన్నిటిని కల్పన చేస్తున్నాం. మానవ స్వభావంచేత ఆవరింపబడి వున్న జీవికి, ఆ స్వరూపజాలం, మనుష్య లోకంగా కనిపిస్తుంది. అంతకు మించిన ఉన్నత దశలో వున్న వానికి, అది స్వర్గంగా కనిపించవచ్చు. ఈ విశ్వంలో ఒక్క ఆత్మ మాత్రమే ఉంది. రెండు లేవు. అది వచ్చేది కాదు, పోయేది కాదు, పుట్టేది కాదు, గిట్టేది కాదు; పునర్జన్మలను పొందేదీ కాదు; ఇక అది మరణించేదెలా? వెళ్లిపోయే దెక్కడికి? స్వర్గ లోకాలు, భూలోకాలు, ఇంకా తదితర లోకాలన్నీ మనస్సుచేత కల్పించబడిన బెటకపు రూపాలే. నిజంగా అట్టివేవీ ఇప్పుడు లేవు. గతకాలంలో వున్నవికావు. భావికాలంలో ఉండబోయేవీ కావు.
నేను సర్వవ్యాపిని. నే నెక్కడికి వెళ్లడం? ఇప్పటికే నేను లేని చోటేది? నేను, “ప్రకృతి కావ్యాన్ని” చదువుతున్నాను. పుట తరువాత పుటగా చదివి ముగించి, త్రిప్పి వేస్తున్నాను. జీవిత స్వప్నాలు ఒకదాని తరువాత ఒకటిగా గడిచిపోతున్నాయి. జీవన పుటను ఇంకొక దాన్ని త్రిప్పునపుడంతా, మరొక జీవన స్వప్నం సిద్ధమవుతూ వుంటుంది. అదీ గడిచిపోతుంది. ఇలాంటివి గడిచిపోగా పోగా, నా చదువును ముగించి, చదువుట చాలించి ప్రక్కకు తొలగి నిలుచుంటాను. పుస్తకాన్ని వదిలేస్తాను. అటు తర్వాత అంతా ముగుస్తుంది. అద్వైతి బోధించేదేమి? పూర్వముండినట్టి, ఇక ఉండబోవునట్టి దేవతల నందరిని అతడు పదభ్రష్టులను చేసి, ఆ సింహాసనంపై మానవుని ఆత్మను ప్రతిష్ఠిస్తాడు. అది సూర్య చంద్రాదులకన్నా మిన్న. స్వర్గ లోకాలను అతిక్రమించి వెలిగేది. ఈ మహావిశ్వంకంటే ఎంతో ఘనతరమైంది – అని అతడంటాడు. ఈ మహామానవరూపంతో కనిపించే ఈ ఆత్మయొక్క దివ్యవైభవాన్ని ఏ గ్రంథాలు, ఏ వేదాలు, ఏ శాస్త్రాలు, వర్ణింపజాలవు. విరాట్పురుష రూపాన, అంటే పూర్వమున్నట్టిది, వర్తమానంలో కలిగేటు వంటిది, భవిష్యత్తులో వుండబోవునట్టిదీ, అయిన ఏకైక దైవమతడే. కాబట్టి అట్టి, నా ఆత్మను వినా, ఎవరిని కాని నేను పూజించాలనుకోను. “స్వాత్మారాధన చేసుకుంటాను” అని అద్వైతి ప్రవచిస్తాడు. నేను నమస్కరించే దెవరికి? నా ఆత్మకే నేను ప్రణామం చేస్తాను. నేను ఎవరి సహాయాన్నీ కోరను. ఈ విశాల విశ్వంలో, అఖండ బ్రహ్మమునై వెలిగే నాకెవడు సహాయాన్నివ్వగలడు? అట్టి తలపులు పిచ్చి కలలు. వెర్రి భ్రాంతులు. ఎవరికైనా, ఎన్నడైనా, ఇతరులు అండగా నిలువగల్గుతారా? కల్ల, కల్ల. ఆకాశానికి, ఆవలి ఊర్ధ్వ లోకాలనుండి తనకేదో సహాయం రాగలదని అపేక్ష వహించి, దేవురిస్తూ, మొరలిడే చీబీరుడు, ద్వైతవాది, మీకెప్పుడు తటస్థించినా, ఆ ఊర్ధ్వలోకాలు అన్నీ తనలోనివే అని అతడు గ్రహింపజాలకున్నాడని తెలుసుకోండి. ఏ స్వర్గంనుండో తనకు సహాయమొస్తుందని అతడు పేరాశ పడతాడు కదా? సరే, అట్టి ఆధారం, అట్టి సహాయం వానికి ప్రాప్తిస్తుందనుకోండి. అలా ప్రాప్తించడమూ మనకు తెలుసు. కానీ ఆ సహాయం ‘తన’ నుండే సుమండీ వానికి లభిస్తున్నది. కాని అతడుమాత్రం దానిని, బయటనుండి వచ్చిన దానిగా భ్రాంతి పడుతూంటాడు. ఒక రోగి మంచంలో పడివుండగా, ఎవరో తలుపు తట్టినట్లు శబ్దం వినవచ్చింది. అతడు నెమ్మదిగా లేచి వెళ్లి తలుపు తీశాడు. ఎవరూ కనిపించలేదు. తిరిగి పోయి మంచంపై పడుకున్నాడు. ఆ చప్పుడు మళ్లీ వినిపించింది. ఇంకోసారి లేచి వెళ్లి తలుపు తెరిచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇలా కొన్నిసార్లు జరిగింది. చివరికది తన గుండె కొట్టుకోవడం వల్ల గలిగిన చప్పుడే అనీ, తలుపు దగ్గర చప్పుడైనట్లు తలచడం తన భ్రాంతే అనీ అతడు గ్రహించాడు. ఈ విధంగానే నరుడు దేవునికోసం తనకు వెలుపల వ్యర్థంగా వెదకి వెదకి, తాను బయలుదేరిన తావునకే – అంటే తన ఆత్మ దగ్గరకే మళ్లీ వచ్చి చేరుతాడు. తాను గుట్టలందు, గుహలందు వెదకే దైవం, ఈ నదిలో, ఆ గుడిలో ఇంకా, అర్చనాలయాల్లో, ఆకాశంలో, కనుక్కోవాలనుకున్న దేవుడు, పరలోకంలో ఎక్కడో కూర్చుని జగత్తును పరిపాలిస్తున్నట్లు, తాను భావించుకొన్న భగవంతుడు; – తన ఆత్మే అని, చివరికతడు తెలుసుకుంటాడు. “అహం బ్రహ్మాస్మి! శివోహం! నేను బ్రహ్మముని, బ్రహ్మమును నేనే!” నేను వినా భగవంతుడు లేడు. క్షుద్రతరమైన ఈ అహం ఎన్నడూ లేదు.
సరేకానీ, “అఖండ బ్రహ్మం ఇలా భ్రమలలో ఎలా చిక్కుకొంది?” అనవచ్చు. అతడు భ్రమపడలేదు. పరిపూర్ణుడైన బ్రహ్మం కలగాంచడం ఎలా? అతడెన్నడూ కల గాంచలేదు. సత్య పదార్థానికి స్వప్నాలుండవు. భ్రాంతి ఎలా కలిగిందనే ప్రశ్నే అసంగతమైంది. భ్రాంతి, భ్రాంతినుండి పుట్టినదే సుమండీ! సత్యం ప్రకాశించిన తర్వాత భ్రాంతి ఉండజాలదు. భ్రాంతికి భ్రాంతే ఆధారం. బ్రహ్మంపై, సత్యంపై, ఆత్మపై భ్రాంతి నిలువజాలదు. మీరెన్నడూ భ్రాంతి పడలేదు. మీలో భ్రాంతి చేరింది. మీ కెదురుగా భ్రాంతి నిలిచి వుంది. అదో ఒక మేఘం. ఇంకో మేఘం వచ్చి, దాన్ని నెట్టివేసి, ఆ స్థలంలో తాను నిలుచుంది. వేరొకటి వచ్చి దీన్ని నెట్టేస్తుంది. స్థిరంగా నిలిచి వుండే వినీలాకాశంలో వేర్వేరు రంగులతోను, వేర్వేరు ఆకృతులతోను, మెరిసే మబ్బులు కనిపించి, స్వల్ప కాలముండి, మాయమవుతూంటాయి. సుస్థిరమైన వినీలాకాశం నిర్లేపమై (వానికంటు కోక) సదా, ఒక్క తీరుగానే నిలిచి వుంటుంది. అదే విధంగా, మీరూ ఎప్పుడూ నిర్మలులై, నిత్యపరిపూర్ణులై ప్రకాశిస్తున్నారు. ఈ విశ్వంలో ప్రకాశించే దేవతలు మీరే. “దేవతలు” అనడం పొరపాటు. ఇద్ద రెక్కడుంటారు? ఒక్కరే కదా? “మీరు, నేను” – అనడమే దోషం. “నేను” అనే అనాలి. లక్షలకొద్దీ నోళ్ల ద్వారా తినేది నేనే. నాకు ఆకలెలా వుంటుంది? అనంతములైన చేతులతో పాటుపడేది నేనే. నేను నిష్క్రియుడుగా వుండడ మెలా? ఈ విశ్వ జీవనమునంతా గడిపేది నేనే. నాకు మరణమెక్కడిది? నేను జనన మరణాలకు అతీతుడను. నేను మోక్షానికై వెదకడం ఎందుకు? సహజంగానే నేను నిత్యముక్తుడిని. జగన్నాథుడనైన నన్ను బంధించే దెవరు? లోకంలోకి వేదశాస్త్రాలన్నీ ఈ విశ్వంలో కల ఏకైక అస్తిత్వమైన నా యొక్క దివ్యవైభవాన్ని ప్రకటింపజూచే స్వల్ప పటాల వంటివి. కాబట్టి ఈ వేద శాస్త్రాలు నా కేపాటివి? – అద్వైత మతాన్ని అవలంబించినవా డీవిధంగా అంటాడు.
“సత్యాన్ని తెలిసికొని, క్షణంలో విముక్తుడివికా –” అప్పుడు చీకట్లన్నీ తొలగిపోతాయి. విశ్వమయుడైన అఖండునితో నరుడు తానేకమవడం తెలిసికొన్నప్పుడు, తాను వేరు అనే భావం అంతరించినప్పుడు; స్త్రీ పురుషులంతా, దేవతలు, త్రిదశ గణాలు, సర్వమూ, జంతుజాలం, చెట్ల సముదాయం, విశ్వమంతా ఒక్కటిగా కలిసిపోయినప్పుడు – భయమంతా ఎగిరిపోతుంది. నాకు నేను అపాయం కలిగించుకుంటానా? నన్ను నేను హింసించుకొంటానా? ఇంక నేను ఎవర్ని గూర్చి భయపడాలి? నీ పట్ల నీకే భయమా? ఎలా కలుగుతుంది? ఇక దుఃఖమనేది వుండజాలదు. నాకప్పుడు దుఃఖాన్ని కలిగించే దేముంటుంది? విశ్వరూపాన్ని ధరించిన సద్వస్తువు నేనే కదా? అప్పుడు మత్సరాలన్నీ అంతరిస్తాయి. ఎవరిపట్ల మాత్సర్యాన్ని వహించడం! నాపట్లేనా! అప్పుడు దుస్సంకల్పాలన్నీ పటాపంచలై పోగలవు. ఎవర్ని గూర్చి నేను దుస్సంకల్పాలను పూనగలను? నన్ను గూర్చేనా? నేను వినా విశ్వంలో, అన్యులు లేరే? సత్య జ్ఞానానికి ఇదొక్కటే మార్గమని వేదాంతి బోధిస్తున్నాడు? భేద భావాన్ని రూపుమాపండి. అనేక మనే భ్రాంతిని నాశనం చేయండి. “అనేకత్వంతో కనిపించే, ఈ జగత్తులో ఎవడు ఆ ఏకత్వాన్ని గాంచగలడో, ఈ జడ పదార్థ రాశిలో ఎవడు ఆ ఏకైక జ్ఞానరూపిని గుర్తింప గలుగుతాడో, ఛాయామాత్రమైన యీ ప్రపంచంలో ఎవడు ఆ సత్య బ్రహ్మమును ప్రత్యక్షం చేసికొంటాడో, అతనికి శాశ్వతానందం చేకూరగలదు. మరెవరికీ కాదు. ఇతరుని కెవనికీ అది చిక్కదు.” భగవంతుని గూర్చి, భారత జిజ్ఞాసువులు అవలంబించిన సోపానత్రయంలోని ప్రధానాంశాలివి. విశ్వానికి భిన్నంగా ఉండే ఈశ్వరునితో వారి జిజ్ఞాస ప్రారంభమైందని గ్రహించాం. విశ్వ శరీరంయొక్క బాహ్యభాగాన్ని విడిచి, దాని అభ్యంతరాన్ని ప్రవేశించి – అంటే భగవంతుని విశ్వవ్యాప్త రూపాన్ని చేరి – అత్మే ఆ భగవంతుడనీ, అదే ఈ జగత్తులో భిన్నభిన్న స్వరూపాలతో కనిపించే, ఏకైక వస్తువనీ, గుర్తించడంతో ఈ జిజ్ఞాసకు పర్యవసానం తేలింది. వేదాల పర్యవసానపు బోధ యిది. ఇది ద్వైతంలో ప్రారంభమై, విశిష్టాద్వైతం ద్వారా, పరిపూర్ణద్వైతంలో పర్యవసిస్తోంది. ఈ పర్యవసానంలో చేరజాలువారు మిక్కిలి అరుదనీ, దాన్ని చేరడమటుంచి, నమ్మడానికి సాహసించే వారే అరుదనీ, దీన్ని ఆచరణలో పెట్టగల వారింకా చాలా అరుదనీ మనకు తెలుసు. అయినా లోకంలోని నీతికంతటికీ ధర్మానికంతటికీ పారమార్థికత కంతటికీ వివరణ దీనిలోనే వుంది. “పరోపకారం చేయుము” అని ప్రతి వారూ బోధించడ మెందుకు? దీని కీలక మెక్కడుంది? ఉత్తమ పురుషులంతా విశ్వమానవ సోదరత్వాన్ని బోధించడానికి కారణమేమి? ఇంకా గొప్పవారు, సర్వభూత సోదరత్వాన్ని ఉపదేశించడానికి కారణమేమి? ఎందుకంటే నరులు గ్రహించినా గ్రహించకున్నా అన్నిటికీ వెనకనుండి మూఢం, వ్యక్తిగతం అయిన అజ్ఞానమంతటి వెనుకనుండి – ఈ అనేకత్వం అసత్యమనీ, విశ్వమంతా ఏకైక వస్తువనీ చాటుతూ విశ్వాత్మయొక్క అఖండతేజం ప్రకాశిస్తోంది.
ఈ చివరి మాట ననుసరించి మనకున్న సర్వమూ, ఒక్క జగత్తు మాత్రమే అవుతుంది. దాన్నే ఇంద్రియాల ద్వారా భౌతిక పదార్థంగా, బుద్ధి ద్వారా జీవాత్మల సమూహంగా, పారమార్థిక జ్ఞానం ద్వారా, బ్రహ్మంగా తెలిసికొంటున్నాం. ప్రపంచంలో పాపమనీ, అశుభమనీ పేర్కొనబడే ముసుగులతో తన్ను తాను కప్పుకొనే మనిషికి, ఈ విశ్వం వికార రూపమైన ఘోర వస్తువుగా మారి కన్పిస్తుంది. భోగాలను వాంఛించే మరొకనికి ఈ విశ్వమే మారి స్వర్గంగా కనిపిస్తుంది. ఇంక జ్ఞాన సిద్ధునికి ఈ విశ్వమే అదృశ్యమై తన ఆత్మే కనిపిస్తుంది.
వర్తమాన సంఘ స్థితిని బట్టి, ఈ సోపానత్రయం అత్యవసరం. ఇందు ఒకటి వేరొకదాన్ని ఖండించదు. ఒకటి మరొకదాని పరిణామంగా వుంటుంది. అద్వైతిగాని, విశిష్టాద్వైతిగాని, ద్వైత సిద్ధాంతాన్ని అనుచిత మనడు. “అదీ సత్య దృష్టే. కాని ఒకింత తక్కువ. అదీ పూర్ణ సత్యానికి మార్గమే.” కాబట్టి ప్రతి నరుడు తన ఆలోచనా విధానాన్ననుసరించి, ఈ విశ్వాన్నిగూర్చి, తన దృక్పథాన్ని అవలంబించడం మంచిది. ఎవనికీ అపకారం చేయకండి. ఎవని దృక్పథాన్నీ భగ్నం చేయకండి. అతడున్న స్థితిని గ్రహించి మీకు చేతనయితే వానికి చేయూత నిచ్చి పై మెట్టుకు చేర్చండి. అంతేకాని వానికి అవరోధాలను కల్గించకండి. నిర్మూలన చేయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరూ సత్య స్వరూపాన్ని అంటే బ్రహ్మమును పొందుతారు సుమండీ! “హృద్గత వాంఛలడగు తఱిని మర్త్యుడే అమరుడగును” – అప్పుడే నరుడే నారాయణుడవుతాడు.