(న్యూయార్క్లో ఉపన్యాసం: 19–1–1896)
బ్రహ్మాండం
మనచుట్టూ, పువ్వులెంతో మనోహరంగా కనిపిస్తున్నాయి. ప్రాతః కాలంలో ఉదయించే సూర్యుడు, సౌందర్యాన్ని ప్రవహింప జేస్తూంటాడు. సృష్టి, మనోహరకాంతుల్ని ప్రసరిస్తూంటుంది. ఈ విశ్వమంతా, ఎంతో అందంగా కనిపిస్తోంది. మానవుడు ఈ భూమిలో పుట్టింది మొదలు ఈ సౌందర్యాన్నంతా అనుభవిస్తున్నాడు. పర్వతాలు ఎంతో గంభీరాలై గౌరవభాజనాలై కనిపిస్తాయి. సముద్రాన్ని చేరే కోరికతో ఎంతో వేగంగా ప్రవహించే మహానదులు, మార్గం కనిపించని మరు భూములు, అంతులేని మహాసముద్రాలు, నక్షత్రాలతో ప్రకాశించే నీలాకాశం, ఇవన్నీ భక్తిని కలిగిస్తూ మహనీయాలై, మనోహరంగా కనిపిస్తాయి. ప్రకృతి అని మనం పేర్కొనే ఈ ఉనికి అంతా, మానవుని స్మృతిని దాటిన ప్రాచీన కాలంనుండి, మానవ హృదయంపై పని చేస్తూనే వుంది. మానవుని సంకల్పాన్ని అది పరివర్తనం చేస్తూనే ఉంది. దానికి ప్రతి క్రియగా “ఇవన్నీ ఏమి? ఎక్కడనుండి వస్తున్నాయి?” అనే ఆలోచన బయలుదేరింది. మానవ రచనలలో, మహాపురాతనమైన వేదాలలోని ప్రాచీన భాగాల నిర్మాణ కాలంలో సహితం ఈ ప్రశ్న బయలుదేరింది. “ఇదంతా దేన్నుండి పుడుతోంది? అస్తిత్వంకాని, నాస్తిత్వంకాని లేక, అంధకారంలో అణిగివున్న కాలంలో, ఈ విశ్వాన్ని ఆవిష్కరించిన వారెవరు? ఎలా పుట్టించారు? దీని రహస్యాన్ని తెలిసిన వారెవ్వరు?” అనే సందేహం కలిగింది. ఈ ప్రశ్నయొక్క సమాధానానికై ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా, ఇంకా కోటి సార్లు ఈ ప్రశ్నకు సమాధానంకోసం ప్రయత్నించ వలసి వుంటుంది. ఇలా చెప్పడంతో, పూర్వసమాధానాలన్నీ వృధా అయ్యాయనే భావం కాదు. ప్రశ్నను గూర్చి వెలువడిన ప్రతి సమాధానంలో కొంత సత్యం ఇమిడి వుంది. కాలక్రమాన ఈ సత్యం బలం కూర్చుకొంటూ పోతోంది. ఈ ప్రశ్నకు భారతదేశ తాత్త్వికుల గ్రంథాలనుండే నేను సంగ్రహింపజాలిన సమాధానాన్ని ఆధునిక విజ్ఞానానుసరణంగా ఇప్పుడు మీ ఎదుట తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
ప్రశ్నలలోకెల్ల అత్యంత పురాతనమైన ఈ ప్రశ్నయందలి కొన్ని అంశాలు ఇదివరకే పరిష్కరించబడినాయి. దానిలో మొదటి విషయం – “ఆస్తిత్వంకాని, నాస్తిత్వంకాని లేని కాలమొకటి వుం” దనడం. అంటే ఈ విశ్వంలేని కాలం ఉంది. సముద్రాలు, మహాసముద్రాలు కలిగి, నదులు, పర్వతాలు, పట్టణాలు కలిగి, పల్లెలు కలిగి, ఇంకా మానవ సంఘాలు, జంతు సంతానాలు, వృక్ష వర్గాలు, పక్షి జాతులు, ఈ గ్రహాలు, ఈ జ్యోతిర్మండలాలు, ఇంతెందుకు? సృష్టిలోని అనంత నానాత్వం కలిగి ప్రకాశించే, మన భూమాతేలేని కాలం సహితం వుందట! ఈ మాట నిజమేనా? దీన్ని ఎలా పరిష్కారం చేయగలిగారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చుట్టూ మనిషికి కనిపించే ఈ ప్రకృతియొక్క తత్త్వమెట్టిది? ఒక మొక్కను ఉదాహరణగా తీసుకొందాం. మనిషి ఒక గింజను నేలలో పెడతాడు. కొంత కాలానికి ఒక మొలక తలచూపి, నెమ్మదిగా పైకి వస్తుంది. ఇంకా పెరిగి పెరిగి, మహావృక్ష మవుతుంది. చివరికది చచ్చిపోతుంది. గింజమాత్రం మిగులుతుంది. ఇలా ఒక చక్రం ఏర్పడుతుంది. అది గింజనుండి బయలుదేరి, చెట్టైంది. చివరికి గింజ రూపంలో అస్తమించింది. ఒక పక్షిని చూడండి. అదొక గ్రుడ్డునుండి పుడుతుంది. కొంతకాలం జీవిస్తుంది. మరణిస్తుంది. కొన్ని గ్రుడ్లను తన వెనుక విడిచిపోతుంది. అవి ముందు రాబోవు పక్షులకు బీజాలై ఒప్పుతున్నాయి. మృగాల విషయమూ ఇంతే. మనిషి విషయమూ ఇలాగే వుంటుంది. సృష్టిలోని ప్రతిదీ, ఏదో బీజంనుండి, ఏదో అంకురంనుండి అంటే – ఏదో ఒక సూక్ష్మతరమైన రూపంనుండి, బయలుదేరి క్రమంగా, స్థూలతర రూపాలను ధరించి వృద్ధి చెందుతుంది. ఆ విధంగా కొంతకాలం గడిపి, తిరిగి మొదటసూక్ష్మతర రూపానికి మరలి అంతరిస్తాయి. రమణీయమైన సూర్య కిరణాలకు, నాట్యరంగమై ఒప్పే వర్ష బిందువు, సముద్రంనుండి ఆవిరి రూపంలో పైకి లాగబడుతోంది. గాలిలో పైపైకి పోయి పోయి, అక్కడ నీరుగా మారి, ఈ వర్ష బిందురూపం ధరించి నేలరాలుతోంది. మళ్లీ అది ఆవిరి రూపాన్ని ధరిస్తుంది. ప్రకృతిలో, మన చుట్టూ కనిపించే ప్రతి వస్తుమా ఇలాగే ప్రవర్తిస్తూంటుంది. ఈ మహాపర్వతాలు మంచుప్రవాహాలయొక్క నదులయొక్క రాపిడికి లోనవుతూంటాయి. ఆ రాపిడి వల్ల నెమ్మదిగానైనా, తప్పక నలిగిపోతుంటాయి. ఈ జలధారలు, వానిని పొడిచేసి, యిసుకగా మార్చి, సముద్రంలోనికి లాగికొనిపోతాయి. సముద్రగర్భంలో ఈ ఇసుక పొరలు పొరలుగా పేరుకొని, గట్టిపడి, శిలాకృతిని ధరిస్తాయి. క్రమక్రమంగా, ఇవి కొండలుగా ఏర్పడి భావి సంతతి వారికి మరల పర్వతముల రూపంలో ప్రత్యక్షమవుతాయి. ఇంకొకసారి, అవి నలిగి, పొడియై పోవలసే వుంటుంది. ఇట్లే చక్రం తిరుగుతూండ వలసిందే. ఇసుకనుండి, మహాపర్వతాలు ప్రభవిస్తాయి. అవి తిరిగి ఇసుకగా మారుతూంటాయి.
ప్రకృతియొక్క ఆద్యంతాలు ఒక తీరున ఉండటం సత్యమైతే – మన అనుభవంలో తద్వ్యతిరేకం ఏమీ గోచరించడం లేదు కదా? – ఒక్క చిన్న ఇసుకరేణువుయొక్క సృష్టిలో వర్తించే విధానమే మహత్తరములైన సూర్యగోళాలను, తారకలను, ఈ విశ్వాన్నంతటినీ సృష్టించడంలో అనువర్తించడం నిజమైతే – అణువుయొక్క నిర్మాణాన్ననుసరించే, విశ్వమంతటియొక్క నిర్మాణ మన చెల్లితే, ఈ అఖీల విశ్వమూను ఒకే నియమంతో నిర్మింపబడి వుండడం నిజమైతే – ఇంక వేదాలు ఘోషించునట్లుగా, “ఒక్క మట్టి ముద్దయొక్క తత్త్వాన్ని తెలిసికొనజాలితే విశ్వమంతటియొక్క తత్త్వాన్ని తెలిసికొన్నట్లే –” అవుతుంది. ఒక్క చిన్నమొక్కను తీసికొని దాని జీవరహస్యాన్ని కనిపెడితిమా, విశ్వ రహస్యాన్నంతా గ్రహింపగల్గుతాం. ఒక్క ఇసుక రేణువుయొక్క గుట్టును తెలిసికొంటే, విశ్వంయొక్క గుట్టంతా తెలిసిపోతుంది. ఈ సూత్రాన్నే దృశ్య ప్రపంచమంతటికీ అనువర్తింపజేస్తే, సమస్తానికీ ఆద్యంతాలు దాదాపుగా ఒక తీరుగా ఉంటాయని, సులభంగా గ్రహింపగలుగుతాం కదా? ఇసుకనుండి కొండలు పుట్టి, తిరిగి ఇసుకగా మారుతున్నాయి. నదులు ఆవిరిమూలంగా పుట్టి మరల ఆవిరి అవుతున్నాయి. నరజీవి నరజీవ కణాలనుండి ఆవిర్భవించి కడపట నరజీవకణాల్లోనే అంతమవుతుంది. జగత్తు అంతా – నక్షత్రాలు సహా – ఒక సూక్ష్మతరమైన వాయు రూపంనుండి కలిగిందే. దానిలో మరల లయ మందవలసిందే. దీన్నుండి మనం నేర్చుకోవలసిందేమి? ఈ కనిపించే స్థూల రూపం ఫలితమనే, సూక్ష్మతర రూపం దీని కారణమనే కదా? వేలకొద్దీ సంవత్సరాలకు పూర్వం తత్త్వశాస్త్రాలకు మూలపురుషుడైన కపిల మహర్షి – విలయమంటే, కార్య రూపంలో కనిపించేది, తిరిగి కారణ రూపాన్ని పొందడమే అని ఋజువు చేసి వున్నాడు. ఇక్కడ ఉన్న ఈ బల్లను నాశనం చేస్తే, అది తనకు మూలమైన సూక్ష్మతరరూపాన్ని తిరిగి పొందుతుంది. అంటే ఏ అణువుల సముదాయం మనమిప్పుడు ‘బల్ల’ అని పిలుస్తున్నట్టి ఆకారంగా ఏర్పడిందో, ఆ అణువులు తమ సూక్ష్మతర రూపాన్ని తిరిగి పొందుతాయి. ఒక మనుష్యుడు మరణించేటప్పుడు, తాను ఏ భూతములతో ఈ శరీరాన్ని కూర్చుకున్నాడో ఆ భూతములు, తమ తమ స్వస్వరూపాలను తిరిగి పొందుతాయి. ఈ భూమి నశించేట్లయితే, దాని కీ రూపాన్ని ఇచ్చిన భూతములు స్వస్వరూపాలను తిరిగి పొందుతాయి. విలయమంటే ఇదే – కార్యం తిరిగి కారణ రూపాన్ని పొందడమే. కాబట్టి కార్యమనేది – అంటే ఫలితంగా ఏర్పడింది – మొదటి కారణమే అనీ వేరుకాదనీ తెలిసి కొంటున్నాం. కారణమే వేరొక ఆకారమునంది కార్యమై కనిపిస్తుంది. ఈ అద్దమనేది కార్యం. దీనికి కారణముంది. ఆ కారణమే కార్యమగు అద్దం రూపంలో వ్యక్తమవుతోంది. కొంత భౌతిక పదార్థమూ నిర్మించే వాని హస్తములందలి శక్తీ కలిసి మనమిప్పుడు అద్దమని పిలిచే రూప మేర్పడటానికి “ఉపాదాన” “నిమిత్త” కారణాలవుతున్నాయి. శిల్పి హస్తము నందలి కౌశల్యం ఈ అద్దంలో ఆశ్లేష శక్తిరూపంలో (అంటే అంటుకొని వుండే శక్తి – ఎట్హిషన్ – రూపంలో) ఉంది. అది లేకపోతే ఈ అద్దంలోని రేణువులన్నీ దేనికవి విడిపోతాయి. కాచమనే (గాజు) పదార్థం ఈ అద్దంలో వుంది. ఈ సూక్ష్మతర కారణాలు, క్రొత్తగా ధరించిన దృశ్యరూపమే (కనిపించే ఆకారం) ఈ అద్దం. ఈ అద్దాన్ని పగులగొట్టితే దానిలోని అంటిపెట్టుకొని వుండే గుణం పోయి తన మూలశక్తిలో చేరుకొంటుంది. దీనిలోని గాజు రేణువులు, ఇంకో క్రొత్త ఆకారంగా ఏర్పడే వరకు అలాగే నిలిచి వుంటాయి.
కాబట్టి కార్యం తన కారణంనుండి వేరయ్యేది కాదని తెలిసికొన్నాం. ఈ కార్యమనేది కారణంయొక్క ప్రతిరూపమే. అంటే కారణంయొక్క స్థూలతరాకారమే. కాబట్టి మనం చెట్లు, జంతువులు, మనుషులు అని చెప్పే వేర్వేరు రూపాలన్నీ లేస్తూ, పడుతూ, అనంతంగా మళ్లీ పునరావృత్తిని పొందుతూంటాయని తెలుస్తుంది. విత్తనంనుండి చెట్టు పుడుతుంది (వస్తుంది), చెట్టునుండి విత్తనం ఏర్పడుతుంది. అది తిరిగి చెట్టు రూపాన్ని ధరిస్తుంది. ఇలాగే జరుగుతూంటుంది. దీనికంతం లేదు. నీటి చుక్కలు పర్వత సానువులలోపడి దొర్లుచూపోయి సముద్రాన్ని చేరుతాయి. అవి తిరిగి ఆవిరిరూపంలో పైకి లేస్తాయి. పర్వతాలపైన వర్షరూపంలో పడి, ఇంకోసారి సముద్రాన్ని చేరుతాయి. ఇలా సర్వరూపాలు లేస్తూ, పడుతూ, చక్రాకృతిలో సాగుతూంటాయి. జీవులందరి విషయంకూడ ఇదే. మనం చూడజాలునట్టి తాకగలట్టి, వినజాలునట్టి, ఊహింపగలట్టి సమస్తమూ ఇట్లే వర్తిల్లు తున్నాయి. మనిషి శరీరమందలి ఉచ్ఛ్వాస నిశ్వాసలలాగా, మన తెలివికి గోచరించే సర్వమూ ఇదే రీతిలో వుంటున్నాయి. అలలు లేస్తూ మునుగుతూ మళ్లీ లేస్తూ మునుగుతూ ఉండే విధంగా సృష్టిలోకల అన్నీ ప్రవర్తి స్తూంటాయి. పైకి లేచే ప్రతి అలనంటుకొని ఒక పల్లంకూడ ఏర్పడుతుంది. ప్రతి పల్లానికి అనుసరణగా, ఒక అల ఏర్పడుతుంది. ఒకే ధర్మం అంతటా వర్తిస్తున్నందువల్ల, ఈ జగమునంతటినీ ఒక్క సమష్టి వస్తువుగా భావిస్తే, ఈ నియమం చెల్లతగియే ఉంటుంది. ఈ జగత్తంతాకూడ తన కారణరూపాన్ని ఎప్పుడో తిరిగి పొందవలసే ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, శరీరం, మనస్సు ఇంకా, ఈ విశ్వంలో ఉన్న అన్నీ, సూక్ష్మతరాలైన తమతమ కారణ రూపాలను, మరల పొందవలసే ఉన్నాయి. అవి అదృశ్యం కావలసినవే. అంటే విలయాన్ని పొందవలసిందే. కానీ ఆ సూక్ష్మతర ఆకారంలో – అంటే తమ కారణ స్వరూపంలో – నిలిచే వుంటాయి. ఆ సూక్ష్మ ఆకారాలు తిరిగి క్రొత్త ప్రపంచాలు, క్రొత్త సూర్యులు, క్రొత్త చంద్రులు, క్రొత్త నక్షత్రాలై స్థూలరూపాన్ని ధరించి బయల్పడగలవు.
ఇవి ఈ విధంగా, పడుతూ లేస్తూ వుండటాన్ని గూర్చి మరొక రహస్యాన్ని గ్రహించాలి. విత్తు చెట్టు వల్ల కలుగుతోంది. అది తిరిగి తక్షణమే చెట్టుకాదు. కొంతకాలం నివృత్తి స్థితిలో ఉన్నట్లు నిలిచి వుంటుంది. లేక సూక్ష్మదశలో అవ్యక్త రూప ప్రవృత్తి కలిగి వుంటుంది. ఆ విత్తనం భూమిలో ఉన్నప్పుడు కొంత పని చేస్తుంది. కొన్ని విభాగాలుగా విడిపోతుంది. విచ్ఛిన్నమవుతుందన్న మాట! ఇలా అది విచ్ఛిన్నమైన స్థితినుండే నిర్మాణకర్మ ప్రారంభం కావలసి వుంటుంది. అదే విధంగా విశ్వమంతా అదృశ్యమై, అవ్యక్తమై, సూక్ష్మాకారంలో కొంతకాలం వుండాలి. ఇట్లొకసారి విశ్వమంతా నిమ్నదశను పొంది, సూక్ష్మతరమైన అవ్యక్త దశలో మొదట కొంతకాలం గడిపి, తిరిగి బహిర్గతమై దృశ్యమయ్యే (కనిపించే) కాలం వస్తుంది. ఈ కాలమంతటిని ‘కల్పం’ అంటారు. ఆధునికులకు ఈ సందర్భంలో, ఒక క్లిష్టమైన సందేహం కలుగుతోంది. సూక్ష్మాకారాలు చాలనెమ్మదిగా వివృతిని (వికాసం) పొందుతూ, క్రమక్రమంగా స్థూలతరాకృతులను ధరిస్తూ వుంటాయి కదా? కార్యకారణాలు వేరు కావనీ, కారణంయొక్క రూపాంతరమే కార్యమనీ గ్రహించంకదా? కాబట్టి ఈ విశ్వమంతా శూన్యం నుండి కలిగిందనజాలం. కారణంలేక ఏదీ ఉద్భవం కాజాలదనీ, కారణమే రూపాంతరం పొంది కార్యమవుతూంటుందనీ మన మెరుగుదుం కదా?
అట్లయితే, “ఈ విశ్వమంతా దేన్నుండి ఉద్భవిస్తోంది? దేనినుండి ఈ నరరూపం కల్గుతోంది? –” అంటే “అంతకు ముందుండిన సూక్ష్మతర ఆకృతినుండి” అనాలి. దేన్నుండి చెట్టు పుడుతోంది? విత్తనంనుండే కదా? ఈ చెట్టంతా ఒక విత్తనమునం దిమిడి వుంది. అది బహిర్గతమై దృశ్యరూపం ధరిస్తుంది (అంటే కనిపిస్తుంది). అదే రీతిగా విశ్వమంతా, సూక్ష్మతరాకృతిలో వున్న తన స్వస్వరూపంనుండే వెలుపలికి వచ్చి యీ వ్యక్త రూపాన్ని ధరించిందనాలి. మరల ఇదెప్పుడో, తన సూక్ష్మతరాకృతిని పొంది, ఆ పిమ్మట తిరిగి స్థూలతర దృశ్య రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి సూక్ష్మాకృతులు క్రమేణ స్థూలతరాకృతులను ధరిస్తాయి. ఒక హద్దును చేరి తర్వాత వెనుకకు తిరిగి సూక్ష్మతరాకృతులను పొందుతుంటాయి. ఈ తీరుగా సూక్ష్మతరాకృతులు స్థూలతరాకృతులుగా మారుతూ పోతూండడాన్ని ఆధునికులు “పరిణామం” (ఇవల్యూషన్) అంటున్నారు. ఇదంతా నిజమే. నిస్సందేహంగా సత్యమే. మనం అనుభవపూర్వకంగా గ్రహిస్తున్న విషయమే. వివేకవంతుడెవడూ, పరిణామవాదులతో తగువులాడబోడు. కాని మన మింకొక విషయాన్నికూడ గ్రహింపవలసి ఉంది. ఇంకొక అడుగు ముందుకు పోవలసి వుంది. అదేది? ‘పరిణామ’ మనే ‘వివృతి’ (ఇవల్యూషన్) దానిముందరి ‘సంవృతి’ (ఇన్వల్యూషన్) నుండి రావలసి వుంటుందని గుర్తించాలి. విత్తు చెట్టుకు పుట్టుక స్థానమనడం సరే కానీ, ముందొక చెట్టు, ఆ విత్తునకు పుట్టుక స్థానమై వెలసెనని గ్రహించాలి! పెద్ద చెట్టు సూక్ష్మరూపంలోవున్న విత్తునుండి వస్తోంది సరే! ఆ విత్తనం, పూర్వం ముడుచుకొని పోయిన – అంటే ‘సంవృతి’ పొందిన ఒక పెద్ద చెట్టుయొక్క రూపాంతరమే సుమండీ! ఈ జగత్తంతా సూక్ష్మతరాకృతిలో వున్న విశ్వవ్యాపి జగత్తులోనే వుంది. నరరూపంగా వికాసాన్ని పొందనున్న చిన్నజీవకణం (శుక్ల బిందువు) ‘సంవృతి’ దాల్చిన ఒక మనిషే సుమండీ. అతడే తిరిగి వివృతినంది నరరూపంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తే “పరణామవాదుల” తో మనకు వైరమే లేదు. ఏలంటారా? వా రీ అంశాన్ని అంగీకరిస్తే, వారు మత విధ్వంసకులు కావడానికి మారుగా, మతానికెంతో బలాన్ని కూర్చిన వారవుతారు.
సరే! శూన్యంనుండి ఏదీ రాజాలదనడం రుజువైంది. ప్రతిదీ అనాది కాలంనుండి ఉన్నదే అనాలి. ఇంకా అనంతకాలం వుండబోవునదే. కాని దానిగతి పరంపరగా సంభావిస్తూండే నిమ్నోన్నత దశలను పొందుతూ, అలల నడకలాగా జరుగుతూంటుంది; సూక్ష్మతర రూపాలతో, వెనక్కి పోతూ, స్థూలతర రూపాలతో ముందుకువస్తూ వుంటుంది. ప్రకృతిలో ఎప్పుడూ, ‘సంవృతి’, ‘వివృతి’ నిరంతరం సంభవిస్తూనే ఉంటుంది. అత్యంత క్షుద్రజీవి మొదలుకొని, ఉత్తమోత్తముడైన సిద్ధపురుషుని వరకు – మధ్య కలిగే పరిణామ పరంపర అంతా, ముందొక దానిలో సంవృతిని పొంది నిగూఢమై వుండాలి. ఆ సంవృతి దేనిది? అనే శంక బయలు దేరుతుంది. ఏది సంవృతి నందింది? “బ్రహ్మం” అందామా అనుకుంటే, “అట్లనుట సరికాదు” అని పరిణామవాది అడ్డుపెడతాడు. ఎందువల్లో చూద్దాం. “బ్రహ్మం చిద్రూపమని అంటారు కదా? ‘పరిణామ’ యాత్రలో చాలదూరం గడిచిన తర్వాతగాని చిత్తు (‘తెలివి’) అన్నది చూపట్టదు. మనిషిలోను కొన్ని ఉత్తమజాతి జీవుల్లోను మాత్రమే తెలివి కనిపిస్తోంది. అంతేకాక, ఈ తెలివి లోకంలో ఉత్పన్నం కావడానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది–” అని వాని వాదం. ‘పరిణామ’ వాది చెప్పే ఈ ఆక్షేపణ నిరాధారమని మన సిద్ధాంతాన్ని బట్టే తెలిసికోగలం. చెట్టు విత్తనంనుండి పుట్టి, తిరిగి విత్తులో ముగిసిపోతుంది కదా? ఆది, అంతం ఒకటే అవుతున్నాయి. ఈ భూమి, తన “ఉపాదాన కారణం” నుండి వెలువడి తిరిగి దానిలోనే విలీనమవుతోంది. కాబట్టి ‘అది’ తెలిస్తే, ‘అంతం’ తెలిసి నట్లవుతోంది. ఇంతేకాక ‘అంతం’ తెలిస్తే, ‘ఆది’ కూడా తెలిసిందనవచ్చు. అట్లయితే చిన్న ఏకకణజీవి (ప్రోటోప్లాసమ్) మొదలు, ప్రపూర్ణతనందిన నరసత్తముని వరకుగల అవిచ్ఛిన్న జీవయాత్రలో చివరికి పరిపూర్ణుడైన మానవోత్తముడు కాగలడు. కాబట్టి ఆదిలోకూడ అతడుండే తీరాలి. కాబట్టి ఆ ఏకకణజీవి, ఆ మహావిజ్ఞాన సంపన్నుడైన పురుషుని సంవృత రూపమే అయి వుండాలి కదా? మనకది కనిపించదు కాని, ఆ సంవృత జ్ఞానరాశే, ఇప్పుడు ప్రపూర్ణుడై వెలసే నరసత్తముడయ్యే వరకు వివృతిని పొందుచు వచ్చింది. గణిత శాస్త్రాను గుణ్యంగా, ఈ అంశాన్ని రుజువు చేయవచ్చు. మొత్తం మీద శక్తిరాశి శాశ్వతంగా ఒక్కటై, హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుందనే శాస్త్రసిద్ధాంతం సత్యమైతే, ఒక యంత్రంలో ముందుగా పెట్టి వుండని దేన్నిగాని ఆ యంత్రంనుండి పొందజాలమనడం నిజం. అంటే ఒక యంత్రంలో ఎంత బొగ్గు, నీరు వుంటాయో ఆ పరిమితి ననుసరించి యింజన్కూడ పని చేస్తుంది (బొగ్గు నీరు ఎంతవరకు వుంటుందో అంతవరకన్న మాట!) నేనిప్పుడు చేయజాలిన పని అంతా గాలి, అన్నం మొదలైన రూపాలతో నాయందిడుకొన్న దానికి సరిపోవలసిందే. జరిగేదేమంటే, రూపాంతరం చెందడం, వ్యక్తం కావడం మాత్రమే. ఈ విశ్వంయొక్క సంపదను గణితం వేసేటప్పుడు, ఒక్క నలుసు జడ పదార్థాన్ని కాని, ఒక్క తులం శక్తినిగాని సృష్టి చేయజాలం. ఇంకా అందులో వున్న ఒక్క నలుసు పదార్థాన్ని కాని, ఒక్క తులం శక్తిని కాని తరిగింపజాలం. అయితే ఈ తెలివి అనేది ఎక్కడిది? అది ఏకకణజీవిలో లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా శూన్యంనుండి వచ్చి వుండాలి? ఇది వెర్రిమాట కాదా? కాబట్టి ఇప్పుడు తేలిన పర్యవసానమిది. పరిపూర్ణ మానవోత్తముడు, ముక్త పురుషుడు, దివ్యత్వాన్ని సాధించిన మానవాగ్రణి, ప్రకృతి బంధాలను దాటిపోయి, అన్నిటికీ అతీతుడై తరించినట్టి, జనన మరణాల ద్వారా పరిణామ పరంపరలో తగులనట్టి, క్రైస్తవుల చేత “క్రీస్తు పురుషు” డనీ, బౌద్ధుల చేత “జీవన్ముక్తు” డనీ పిలువబడే మహనీయుడైన పురుషోత్తముడే “పరిణామ పరంపర” కు, అంటే వివృతి రేఖకు ఒక కొనలో ఇప్పుడు నిలుచువాడే, పూర్వమొకప్పుడు “సంవృతి” నంది, రెండవ కొనయందొక ఏకకణజీవిగా నిలిచి వుండొచ్చని నిస్సంశయంగా చెప్పవచ్చు.
ఈ వాదం విశాల విశ్వానికంతకు, అనువర్తింప జేస్తే, జగత్తునకు ఆది కారణం, సృష్టికర్త, ఆ విజ్ఞానరాశే అని తేలుతుంది. మానవున కీ జగత్తును గురించి లభించిన అత్యంత సిద్ధ భావన ఏది? అది “విజ్ఞాన రాశి” అనే ఒక భాగానికి, మరొక భాగానికి అనుసంధానాన్ని గూర్చు విజ్ఞానమనే. ప్రాచీనులు సృష్టి విధాన సిద్ధాంత రూపంలో ప్రకటింప ప్రయత్నించిన దీ “విజ్ఞాన రాశి” నే. కాబట్టి అన్నిటికీ మూలాధారం విజ్ఞానమే. మొదట ఈ విజ్ఞానం ‘సంవృతమై’ ఉంటుంది. చివరకు ‘వివృతి’ నొంది కనిపిస్తుంది. ఈ విశ్వంలో చూపట్టే విజ్ఞానరాశి అంతా, ముందు సంవృతిని పొంది, ఇప్పుడు వివృతి నందుతున్న విశ్వవిజ్ఞాన రాశే. ఈ విశ్వవిజ్ఞానరాశినే మేం భగవంతుడంటున్నాం. దాన్ని మీరింకే పేరుపెట్టి అయినా పిలవండి. మొదట్లో ఈ అనంత విశ్వవిజ్ఞానరాశి వుందనడం నిస్సంశయం. ఈ విశ్వవిజ్ఞానరాశి సంవృతమవుతూ, వివృతమవుతూ ఉంటుంది. పరిపూర్ణుడై తేజరిల్లే క్రీస్తు పురుషుడు, బుద్ధ పురుషుడు అయ్యేవరకు ‘వివృతి’ చెందుతూ వుంటుంది. తర్వాత అది తన కారణ రూపం దెస మరలి చివరకు ఆ స్థితిని పొందును. మన మత గ్రంథా లన్నిటిలో అందువల్లే “భగవంతునియందే జనిస్తూ, వానియందే చరిస్తూ, వానియందే జీవిస్తూంటా” మని చెప్పబడుతోంది. మనం భగవంతునిలో నుండి వెలువడి వచ్చి తిరిగి భగవంతుని లోనికి ప్రవేశిస్తూంటామని సర్వమత గ్రంథాలు బోధించడానికి కారణమిదే. వేదాంత పరిభాషను చూచి భయపడకండి. పరిభాషా పదాలకే భయపడితే మీరు తత్త్వవిదులు కానోపరు. అనంతమైన “ఈ విశ్వరాశి” నే మత శాస్త్రకర్తలు “భగవంతు” డని పేర్కొన్నారు.
“భగవంతుడు భగవంతుడంటూ, తాతలనాటి పదాన్నే పలుమారు నీవేల వాడుతున్నా” వని నన్ననేకులు ప్రశ్నిస్తారు. మన కార్యానికది శ్రేష్ఠతమమైనది. అంతకుమించి శ్రేష్ఠతర పదం కానరాదు. మానవకోటయొక్క ఆశలు, కోరికలు, ఆనందం, సర్వం ఆ శబ్దంలో కలకాలంగా కేంద్రీకరింపబడి వున్నాయి. ఆ శబ్దరాజాన్ని మన మీనాడు మార్చడం సాధ్యం కాదు. ఇటువంటి శబ్దాలను, వాని భావాల్ని, బాగా అనుభవానికి తెచ్చుకొని, వాని అర్థాన్ని పూర్ణంగా గ్రహించిన మహర్షులు మొదట కల్పన చేశారు. అవి సంఘంలో, వాడుక లోనికి రాగా, రాగా, పామర జనుల నోటబడి వాని అర్థం, మహిమ తరిగిపోయింది. “భగవంతు” డనే పదం నరుని స్మృతికి మీరిన చాలా పురాతన కాలంనుండి వాడుకలో ఉంది. విశ్వ విజ్ఞానరాశి అంతా ఈ శబ్దంవల్ల సూచితమౌతుంది. అత్యుత్తమం, అత్యంత పావనం అయిన అన్నిటిని, ఈ పదం స్ఫురింపచేస్తుంది. ఎవడో ఒక పిచ్చివాడు తగదన్న మాత్రాన మనం దాన్ని లాగి పారవేయాలంటారా? ఇంకొకడు వచ్చి “నా మాటను స్వీకరించండి” అంటాడు. మళ్లీ ఇంకొకడు వచ్చి, “నా మాటను వినండి” అంటాడు. ఇట్టి పిచ్చివాళ్ల మాటలకు అంతం వుండదు. వాని నామోదించడంకన్న మీ రీ పురాణ పదాన్నే ప్రయోగించడం మేలు. దాన్ని ఇప్పుడావరించి వున్న మూఢభావాల్ని తొలగించి, దాని సరైన భావాన్ని గ్రహించి సార్థకంగా అనుభవానికి తెచ్చుకొని, ఈ ప్రాచీన శబ్దాన్నే ఉపయోగింతురు గాక! భావసంసర్గ నియమాల (లాస్ ఆ్యప్ అసోసియేషన్) మహిమ మీకు తెలిస్తే ఈ శబ్దాలు అత్యంత ప్రభవాన్వితాలు, ఉదాత్తాలు అయిన అసంఖ్యాక భావాలతో కలిసినవని మీకు స్పష్టమౌతుంది. ఈ పదాలను లక్షలకొద్దీ జనులు ప్రయోగించి సంభావించారు. అత్యున్నతం. శ్రేష్ఠతమం అయిన భావనలను వాని యందు అనుసంధానం చేశారు. వివేక జనకమైన సర్వం, ప్రేమాస్పదమైన అఖీలం, మానవ ప్రకృతిలోవున్న గంచీబీరం, ఘనం అయిన సమస్తమూ, ఈ శబ్దాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా అనుసంధింపబడిన పవిత్ర భావాలకు సంజ్ఞకై ఒప్పే శబ్దాలను ఇపుడు త్రోసివేయడం పొసగదు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పడంమాత్రంచేత ఈ భావాలను మీకు అర్థం తెలిసేలా చెప్పాలని ప్రయత్నిస్తే మీకేమీ అవగతం కాదు. అయినా ఎంతో పెనుగులాడి, మనం చివరికి ఆయన దగ్గరికే, ఆ పురాణ పురుషుని వద్దకే, ఆ పరాత్పరుని కడకే వచ్చి చేరాం.
జడ పదార్థమనండి, సంకల్పమనండి, శక్తి అనండి, విజ్ఞానమనండి మరి ఇట్టి ఏ పేరుతోనైనా పిలవండి, విశ్వశక్తి ధరించే ఈ రూపాలన్నీ విశ్వవిజ్ఞానరాశియొక్క వ్యక్త రూపాలు మాత్రమే అని, మనకిప్పుడు తెలిసింది. దాన్నే మనం ఇక పరమేశ్వరుడనే పేరుతో వ్యవహరిద్దాం. మీరు చూస్తున్న, స్పృశిస్తున్న, వింటున్న, చెప్పడమెందుకు? ఈ జగత్తంతా – వాని నిర్మాణమే. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే, వాని “సృష్టి” (బహిర్గత స్వరూపం) అనాలి. ఇంకా స్పష్టంగా నిర్దుష్టంగా చెప్పాలంటే ఈ సర్వమూ పరమాత్మే అనాలి! సూర్యుడుగా ప్రకాశించేది, తారలుగా మెరిసేది ఆయనే. మహాసముద్రమూ ఆయనే. వర్షరూపంలో చల్లగా వర్షించేది ఆయనే. మనం తీసుకునే ఊపిరీ ఆయనే. మన శరీరంలో శక్తి రూపంలో ప్రకటితమయ్యే దంతా ఆయనే. ఈ వినబడే ప్రసంగం, ప్రసంగించే పురుషుడుకూడ ఆయనే. ఇక్కడ కూర్చుని వింటున్నదీ ఆయనే. నేను నిలుచున్న పీఠం సైతం ఆయనే. మీ ముఖాలను చూడటానికై నాకు తోడ్పడే వెలుతురు ఆయనే. ఆయనే ఈ సర్వమూ. ఆ ఆత్మయే ఈ జగానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణంకూడ అయి వున్నాడు. చిన్న జీవకణంలో సంవృతినొంది వున్నది ఆయనే. మరోవైపు, వివృతినొంది పురుషోత్తముడై కనిపించేదీ ఆయనే. అతిసూక్ష్మమైన అణువునందణగి వుండేదీ ఆయనే. ఇంకా ఆయనే నెమ్మది నెమ్మదిగా, తన మహిమను ప్రకటిస్తూ చివరకు తన్ను తానే చేరుతాడు. ఈ బ్రహ్మాండంయొక్క రహస్య మిదే. “నేను పురుషుడిని. నీవు స్త్రీవి; యౌవనోద్రేకంతో, ధీరత్వంతో తిరిగేదీ నీవే. కర్రనాధారంగా గొని తడబడుచు నడిచేముసలివీ నీవే. నీవు అంతటా వుంటావు. ఓ ప్రభూ! సకలమూ నీవే! ఈ బ్రహ్మాండ తత్త్వాన్నిగూర్చి, నరుని బుద్ధికి తృప్తినీయజాలు వివరణమిది ఒకటే. వేయేల? మనమూ బ్రహ్మంనందు పుడుతున్నాం. ఆ బ్రహ్మమునందే తిరుగుతున్నాం. ఆ బ్రహ్మంనందే లయమును పొందుతున్నాం.