బుధవారం, జూన్ 19, 1895
(ఈ రోజు నుండి ఏడు వారాల పాటు వివేకానందస్వామి సహస్ర ద్వీపవనంలో తన శిష్యబృందానికి పాఠాలు మొదలు పెట్టారు. ఆయన చిత్తం సదా కార్యనిమగ్నమై ఉండేది. ఆ రోజు అక్కడ అంతా సమావేశం కానప్పటికీ, ఉన్న ముగ్గురు, నలుగురికి కాలహరణం చేయకుండా బోధించడం మొదలుపెట్టారు. అక్కడి వారంతా క్రైస్తవులనే కారణం వలన కావచ్చును, ఆయన బైబిల్ తెచ్చి, ‘జాన్ సువార్త’ (బుక్ ఆఫ్ జాన్) తెరిచారు.)
“ఆదిలో శబ్దం వినవచ్చింది, అది దేవుని వద్దనుండి వచ్చింది కనుక శబ్దమే దేవుడు”. దీనినే హైందవులు ‘మాయ’ అని చెబుతారు, ఇది దేవుని వ్యక్తీకరణలో చాలా ముఖ్యమైనది ఎందువలనంటే అదే ఆయన శక్తి కనుక. విశ్వమంతటా ప్రతిబింబించే పరబ్రహ్మమునే మనము ప్రకృతి అని అంటున్నాము. శబ్దం రెండు విధాలుగా వ్యక్తమవుతోంది – మొదటిది ప్రకృతి రూపంలోనూ, రెండవది అవతారమూర్తులైన కృష్ణుడు, బుద్ధుడు, జీసస్క్రైస్తు, రామకృష్ణుల రూపంలోనూ తెలియబడుతోంది. అయితే ఈ అవతార మూర్తులను మనము తెలునుకోగలం కాని పరబ్రహ్మమును తెలుసుకోలేము. ఈ పుత్రులను (అవతారమూర్తులను) మానవత్వపు అద్దకం ద్వారా తెలుసుకోగలము గాని ఆ తండ్రిని (పరబ్రహ్మమును) తెలుసుకోలేము.
జాన్ సువార్తలోని మొదటి అయిదు పద్యాల్లో క్రైస్తవమత సారమంతా ఇమిడి ఉంది, ఇందు ప్రతీ పదము వేదాంత తత్త్వభరితంగా విరాజిల్లుతోంది.
పరిపూర్ణమైనది ఏదీ అపరిపూర్ణం కాజాలదు. అది తమస్సులో ఉన్నా ఆ అంధకారం దానిని బాధించజాలదు. మన దృష్టిలోపంచేత సూర్యుని చూడలేనంత మాత్రాన సూర్యునికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అలాగే అంతటా విరాజిల్లే పరబ్రహ్మమును దుష్టత్వం ఏమీ చేయలేదు. ఇరవైతొమ్మిదో పద్యానికి అర్థం – ‘మనం పరిపూర్ణులమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు.’ దైవపరంగా మనమూ, క్రీస్తు ఒకటే కాని మనల్ని మాయ ఆవరించి ఉన్నది, అది తొలగిన నాడు మనమంతా ఒక్కటే అనే సత్యం ఇక్కడ తేటతెల్లమవుతోంది.
త్రిమూర్త్యాత్మకమైన క్రీస్తు అన్నిటికి అతీతుడు, ఏకాత్మకమైన క్రీస్తు కేవలం నైతికరూపుడు, వీరిరువురు మనకు సహాయపడలేరు. భగవదవతారమైన క్రీస్తు – తన దైవత్వాన్ని మరువని క్రీస్తు, మాత్రమే మనకు తోడ్పడగలడు, అతనికి ఎటువంటి అపరిపూర్ణతా లేదు. అటువంటవారికది పుట్టుకనుండి తెలిసే ఉంటుంది. ఇతరులను సంతుష్ట పరిచేందుకు మాత్రమే నాటక రంగానికి వచ్చే నటుల వంటివారు ఈ అవతారమూర్తులు, వారికి ఐహిక స్పర్శ ఉండదు. కేవలం మనకోసం వారు తాత్కాలికంగా ఉపాధులను దాల్చినా, వాస్తవానికి వారు ఉపాధి రహితులు, అపరిచ్ఛిన్నులు, నిత్యముక్తులు.
* * *
మంచితనం సత్యానికి దగ్గరగా ఉన్నా అది సత్యం కాజాలదు. అందువలన కేవలం మంచితనంతో సంతృప్తి చెందకూడదు, దుష్టత్వం నుండి మనల్ని మనం రక్షించుకునే మార్గం కూడా తెలుసుకుని, ఆపై ఈ రెండింటికి, (మంచితనం, దుష్టత్వం) అతీతంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ మంచీ చెడుల సర్దుబాటుతనం తెలుసుకుని ఉండటం ఆవశ్యకం.
ద్వైతం అనే ఆలోచన ప్రాచీన పారశీకులలో* కూడా ఉంది. నిజానికి మంచీ చెడుల రెండూ ఒక్కటే,* అవి మన మనోగతాలే. మనస్సు తన స్వస్థానానికి చేరుకున్ననాడు ఈ రెండూ దానిని ప్రభావితం చెయ్యలేవు. పరిపూర్ణ విముక్తడవు అయ్యేందుకు ప్రయత్నించు; అప్పుడే స్వాతంత్ర్యం, అంతులేని ఆనందం, అనుభవంలోనికి రాగలదు. దుష్టత్వం అనేది ఇనుప సంకెల అయితే మంచితనం బంగారు సంకెల, ఈ రెంటికీ మధ్య అంతే తేడా కానీ రెండూ సంకెళ్ళే, వాటి నుండి విముక్తుడవయ్యే మార్గాన్ని యోచించు. అయితే ముందుగా ఇనుప సంకెల నుండి విముక్తుడివి కావటానికి బంగారు సంకెల ఆసరా తీసుకో, ఆ తరువాత దానిని కూడా వదిలివేయి. ముల్లుని ముల్లుతోనే తీయాలనే పద్ధతిని ఇక్కడ పాటించు, విముక్తుడవు అవడానికి యత్నించు.
* * *
లోకంలో ఎప్పుడు ఇచ్చేవాడిగానే, ఒక దాతగానే ఉండేందుకు ప్రయత్నించు, తిరిగి ఏమీ ఆశించకు. ప్రేమను పంచుతూ, సహాయ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, సేవ చేస్తూ, నీ వలన ఏ కొంతైనా మేలు జరిగేలా నిన్ను నీవు తయారు చేసుకో; ఫలాకాంక్షను పూర్తిగా విడనాడు. ఇచ్చి పుచ్చుకునే బేరాలకు అతీతంగా ఉండుము. మనకు భగవంతుడు ఒసగే రీతిలోనే, మనమూ మన ఔదార్యాన్ని లోకానికి చూపుదాము.
భగవంతుడొక్కడే దాత, లోకులందరూ కేవలం వర్తకులు. భగవంతుని సంతకంతో ఉన్న పత్రం సర్వత్రా ఆదరించబడాలి.
వివరించ, ప్రకటించ శక్యంకాని ప్రేమసారమే భగవంతుడు అన్నది తెలుసుకోవలసిందే, అది నిర్వచించడానికి వీలు కానిది.
* * *
మన పోరాటాలతో, ఆరాటాలతో వాటి వలన కలిగే బాధలతో, సంసారం మహా భయంకరంగా కనిపిస్తుంది కానీ అదంతా భగవంతుని దృష్టిలో క్రీడామాత్రమే. ఈ విశ్వం వినోదార్ధం, క్రీడార్ధంగా దేవునిచే సృజించబడింది. ఇది అంతా కేవలం ఆయనలీల, మనం దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి రెండు చిన్న కుక్కపిల్లలు ఒకదానిని ఒకటి తరుముకుంటూ, దెబ్బలాడుకుంటూ ఉంటే, మనం వినోదంగానే చూస్తాము, దాని వలన ఏ హాని జరగదని మనకు తెలుసు అలాగే మన పోరాటాలు భగవంతునికి వినోదంగానే తోస్తాయి కాని కుపితుడిని చేయజాలవు.
ఓ మాతా! ఈ జీవనమనే సముద్రమందు
నా పడవ మునిగిపోతోంది.
మాయ సుడిగాలియై చుట్టుముట్టగా
బంధమను పెనుతుఫాను వలన
అదిసుడులు తిరుగుతున్నది.
చుక్కాని అయిన మనస్సు బలహీనం కాగా
పంచేంద్రియాలు అనే తెడ్లు పట్టు తప్పుతున్నవి.
ఈ రీతిన శిధిలమవుతున్న పనిముట్లతో
నా పడవ మునిగిపోతోంది
ఓ మాతా! నన్ను కాపాడుము!
అమ్మా! నీ చల్లని చూపు అన్నింటి మీదా సమానంగానే కరుణను కురిపిస్తుంది; పావనాత్ముని యందు, పాపాత్ముని యందు సమానంగానే ప్రసరిస్తుంది. ఓ మాతా! నీ ఉనికి అంతటా భాసిస్తోంది. నీ దివ్యతేజం సదా పరిశుద్ధమైనది, అవికారమైనది, అది దేనిచేతా కలుషితం కాజాలదు. మనోహర రూపిణివైన ఓ మాతా! సర్వజీవుల్లోనూ అంతర్జ్యోతివై వెలుగొందే నీకు ఇవే మా ప్రణామాలు! ఈ సృష్టిలోని చరాచరములన్నింటి ప్రతిస్పందనకు నీవే కారణం. తేనెను తేనెటీగ ఆస్వాదిస్తోందన్నా, చంద్రుని రాకతో కమలం వికసిస్తున్నదన్నా, దాని వెనుకగా ఉన్న కారణం నీవే! ఈ పరమాత్మ తత్త్వాన్ని అర్థం చేసుకున్నందునే ఋషులు నిందాస్తుతులను చేయరు.
ఈ విషయం మీరంతా అర్థం చేసుకుని మిమ్మేది బాధింపజాలదని గ్రహించండి. మీరు ముక్తులు కాదా? జీవంలో ప్రాణమై, కంటికి చూపై, చెవికి వినికిడి అయి, వెలుగొందే ఆ పరమాత్మ విరాజమానతత్త్వాన్ని గుర్తించండి. రక్షక భటునిచే తరమబడే వ్యక్తి వలె, మనం ఈ లోకంలో సంచరిస్తూ, విశ్వసౌందర్యాన్ని ఒక పార్శ్వమే దర్శిస్తున్నాము. అంతఃకరణాన్ని మరచి జడాన్ని ఆశ్రయించడం వల్లనే ఈ అవస్థ కలిగింది.
ఆదివారం, జూన్ 23
ధీరునివై, నిష్కపటివై ఉండుము. ఇలా ఉంటూ, ఏమార్గాన్ని అవలంబించినా నీవు చేరవలసిన గమ్యం చేరుకోగలవు. గొలుసులోని ఏ భాగం చేజిక్కినా, మొత్తం గొలుసుని సాధించవచ్చు కదా; వృక్షానికి నీరు పోయాలంటే, వృక్షమూలానికి నీరు పోసిన, అది సమస్తంగా వృక్షానికంతకూ అందించినట్లుగా, భగవంతుని పొందితే, సమస్తమునూ పొందినట్లే!
పాక్షికంగా చూసే బుద్ధి లోకానికి చేటు. నీవు ఎన్ని కోణాలు ఎక్కువ చూడగలిగితే అంత మంచిది. ఈ విధమైన దృష్టిచే, విశ్వంలో గల ప్రాణుల యందున్న ఆత్మను ఏ మార్గం ద్వారానైనా, భక్తిచే గాని, జ్ఞానంచే గాని, ఏ విధంగానైనా దర్శించగలవు. ముందుగా నీ స్వభావాన్ని నిర్ణయించుకో, ఆపై నీ సాధనను నిష్ఠగా కొనసాగించు. శ్రద్ధా, దీక్షా ఉంటే నీ లక్ష్యాన్ని తేలికగా సాధించగలవు. ప్రార్థనాలయాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు – ఇవన్నీ ప్రారంభదశలో లేతమొక్కకు చుట్టూ ఉన్న కంచె వంటివి, మొక్క కాస్తా వృక్షం అయితే ఈ కంచె అవసరం ఉండదు. అలాగే వివిధ మతాలు, సిద్ధాంతాలు ప్రారంభదశలో అవసరమైనా, పరిణతి సాధించే కొద్దీ వాటినుంచి బయట పడాలి. ఒక విధంగా చెప్పాలంటే నిష్ఠ అనేది మొక్కను కుండీలో ఉంచి కాపాడటం వంటిది, వికాసం పొందడానికి అది సహాయపడుతుంది.
* * *
సముద్రాన్ని గమనించు, అలను పట్టించుకోవద్దు; చీమకూ, బ్రహ్మకు వ్యత్యాసం లేదని గ్రహించు, ఇందు ఒకటి అల్పమని, మరి యొకటి అధికమని ఏమీ తేడాలేదు. ప్రతీ కీటకమూ ఏసుప్రభువుకి సోదరుడే. మనమంతా ఇక్కడా ఉన్నాము, సూర్యునిలో, నక్షత్రాలలోనూ ఉన్నాము. ఆత్మ, దేశ, కాలాలకు అతీతమైనది, సర్వగతమైనది. భగవంతుని కీర్తించే ప్రతీ జిహ్వా నా జిహ్వే; దర్శించగలిగే ప్రతీనేత్రం నా నేత్రమే; మనం కేవలం ఈ శరీరానికి పరిమితంగా లేము, ఈ విశ్వమే మన శరీరం. మాయాజాలంలో దండాన్ని తిప్పుతూ దృశ్యాలను కల్పించుకునే ఇంద్రజాలికులం మనం. తన గూటిని దారాలతో ధృఢంగా అల్లుతూ, క్షణంలో ఏ తావుకైనా వెళ్ళగలిగిన ప్రజ్ఞ కలిగిన సాలీడువంటి వారం. మనం ప్రారంభంలో, శరీరానికి పరిమితిని కల్పించుకుని ఒక మేధస్సునే ఉపయోగిస్తున్నా, సాధనతో ఇంద్రియాతీత ప్రజ్ఞతో, సమస్త వ్యక్తుల మేధస్సుని ఉపయోగించుకోగలిగినంతటి శక్తి మనలో దాగి ఉంది.
అహమును వీడి, కేవల సత్తామాత్రమై, సర్వాన్ని తనలోనే ప్రతిఫలింపచేస్తూ, నిర్వికారమై ఒప్పే స్ఫటికాన్ని పోలి ఉండటానికి ప్రయత్నించాలి. ఆ స్థితి ప్రాప్తించగానే మనకు ఇక కర్మాచరణం ఉండదు, ఏ మాలిన్యమూ అంటదు.
నీవే అఖండ బ్రహ్మమని గుర్తించు, క్రమంగా భయం అంతరిస్తుంది. సదా నేనూ, నా పరమపితా ఒక్కరమేనని మననం చేస్తూ ఉండుము.
* * *
రాబోయే కాలంలో క్రైస్తవులు ద్రాక్షతీగపైన ఉండే గుత్తుల వలె, అసంఖ్యాకులై ఉంటారు; ఒక పాత్రలోని నీరు సల సలా కాగడం మొదలిడితే, ముందుగా ఒక బుడగ తరువాత మరొక బుడగ, ఇలా అసంఖ్యాకమైన బుడగలు వస్తూనే ఉంటాయి కదా, ఆ నీరంతా మరిగి ఆవిరి అయ్యేవరకు ఇలా బుడగలు వెలువడుతూనే ఉంటాయి. బుద్ధుడు, క్రీస్తు అనేవారు ఈ లోకం వెలువరించిన అతి పెద్ద బుడగలు కాగా మోసెస్ ఒక చిన్న బుడగ, ఇలా ఎన్నో బుడగలు, అయితే ఏదో ఒకనాటికి అన్ని బుడగలు నిష్క్రమిస్తాయి; అప్పుడు నిత్యనూతన సృష్టి తన కార్యక్రమానికి సరికొత్త నీటిని తీసుకువస్తుంది.
సోమవారం, జూన్ 24
నేటి పఠనాంశం – నారద భక్తి సూత్రాలు
భగవంతుని యందు గల తీవ్రమైన అనురాగం మరియు పరమాసక్తియే భక్తి అని చెప్పవచ్చును. ఇది పరిశుద్ధమైనది, నిస్వార్థమైనది, పవిత్రమైనది మరియు అమృతసదృశమైన మాధుర్యాన్ని కలిగి ఉండును.
నా గురుదేవులైన శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు – ఈ ప్రపంచం ఒక ఉన్మత్త శరణాలయం; కొందరు ధనవ్యామోహంతో, కొందరు స్త్రీ వ్యామోహంతో, మరికొందరు కీర్తి ప్రతిష్ఠల వ్యామోహంతో పిచ్చివారైతే, అత్యల్ప సంఖ్యాకులు మాత్రమే భగవంతుని నిమిత్తం పిచ్చివారవుతున్నారు. ఇందులో, భగవంతుని యందు ఉన్మత్తత కలిగి ఉండటమే నా అభిమతం. మనలను క్షణంలో బంగారంగా మార్చే పరుసవేది వంటివాడు భగవంతుడు. దీనివలన ఆకృతి నిలిచి ఉన్నా, స్వభావం మారినట్టే, మనలో హాని చేసే గుణం. తొలగిపోయి, పరి శుద్ధమై నిలిచి ఉంటాము.
ధన్యులైన ఈ భక్తులు వివిధ విధాలుగా ఉంటారు. కొందరు ప్రేమపూర్వకముగా భగవంతుని చింతన చేస్తూ విలపిస్తారు, కొందరు సంతోషస్వాంతులై నవ్వుతుంటారు, ఇంకొందరు దివ్యభావావేశముతో నృత్యము చేస్తుంటారు, మరి కొందరు భావాతీతములైన అత్యద్భుత విషయాలను ప్రబోధిస్తుంటారు. దృశ్యము ఏదైనా, వారంతా పరమోన్నతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
ప్రవక్తలు బోధనలు చేస్తే, అవతారమూర్తులైన జీసస్ క్రీస్తు, బుద్ధుడు, శ్రీరామకృష్ణులు వంటి వారు వీక్షణ మాత్రంచే గాని, స్పర్శచే గాని పరివర్తన తీసుకు రాగలరు. ఈ శక్తి దైవశక్తి, ఇది పరంపరానుగతంగా గురువు శిష్యులకు సంక్రమింపచేస్తారు. ఇటువంటి ఈ జ్ఞాన స్నాన సంస్కారం (బాప్టిజమ్) అనాది నుంచి వస్తూనే ఉన్నది.
భక్తి అనేది లౌకికమైన వాంఛలను నిరోధించేది కాబట్టి కోరికలను తీర్చుకోవడానికి దానిని వినియోగించలేము. నారదుడు భక్తి లక్షణాలను ఇలా పేర్కొన్నాడు – ‘మనస్సును, వాక్కును, కర్మనూ సర్వం భగవంతునికి అర్పించి, ఆ భగవత్ స్మరణకు కించిత్ ఎడబాటు కలిగినా పరమవ్యాకులత కలిగినప్పుడు, అది భక్తి లక్షణంగా గుర్తించవచ్చును’.
భక్తి పరమోత్కృష్టమైన ప్రేమ రూపము. అది ప్రేమ కొరకు ప్రేమించడమై ఉన్నది. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ యొక్క సంపూర్ణరూపమే భక్తి అనబడును.
సర్వమును త్యజించినవాడు సన్న్యాసి అగును. ఆ స్థితిలో, భగవద్గతులైనపుడు, హృదయమునందు ఉత్పన్నమయ్యే ఉత్కృష్ట భావావేశస్థితి, అజ్ఞానావరణాన్ని తొలగిస్తూ ఆత్మ ప్రకాశం ఏర్పడేందుకు తోడ్పడుతుంది.
వేద శాస్త్రవిధులను వీడగలిగే శక్తి కలిగేవరకూ, వాటిని పాటించే తీరాలి. ఫలము పక్వానికి వచ్చేంతవరకూ ఓపికతో నిరీక్షించాలి. కేవలం పుస్తకజ్ఞానము సరిపోదు. సాక్షాత్కారమే మతతత్త్వానికి ప్రామాణికము. ప్రతీవ్యక్తి దీని కొరకై సాధన చేయాలి – ‘నేను కనుగొన్నాను కాని అది నీకు కష్టతరమైన పని’ అని చెప్పే ఏ బోధకుడిని నమ్మవద్దు. ‘నీవు సాధించగలవు’ అని దారి చూపి, ప్రోత్సహించే గురువునే విశ్వసించాలి. వేదాలు అన్ని కాలాల్లోనూ సత్యానికి ప్రామాణికంగా నిలిచి ఉన్నాయి, అవి ప్రత్యక్షసాక్ష్యాలు.
‘ఆ ప్రేమభానుడు వన దిశావలయంలో భాసించిన క్షణం నుండీ సమస్త కర్మలను భగవదర్పితం చేయనారంభిస్తాం; అంతట ఆ భగవంతుని ఎడబాటు క్షణమైనా బాయజాలక, వ్యాకులత చెందుతాము.’
భగవంతుని యందు గల ప్రేమకూ, భగవంతునికీ నడుమ ఏ రకమైన అడ్డంకులను రానీయవద్దు. ఆయనను శుద్ధ మనస్సుతో ప్రేమించు, ప్రేమించు, ప్రేమిస్తూనేఉండు; లోకులు ఏ విధముగానైనా అనుకోనీ, లక్ష్యపెట్టవద్దు. ప్రేమను మూడు రీతులుగా చెప్పవచ్చును – ఒకటి పుచ్చుకోవడమే కాని ఇవ్వడం తెలియనిది, రెండవది ఇచ్చి పుచ్చుకునే ప్రేమ, మూడవది ఫలాపేక్ష ఇంచుకైనా లేని ఉత్తమ ప్రేమ. ఇది దీపం వెలుగుకి ఆకర్షితమయ్యే మిడుత కున్న ఆసక్తి వంటి ప్రేమ. ఈ ప్రేమ కర్మకన్నా, యోగంకన్నా, జ్ఞానంకన్నా అధికతరమైనది.
కర్మ అనేది చేసేవానికి, శిక్షణ కొరకై ఉన్నది, దానివలన ఇతరులెవ్వరికీ లాభం కలుగదు. ప్రవక్తలు దారి చూపుతారు, అంత వరకే, మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. నీవు దేని గురించి నిరంతరం స్మరిస్తావో, నీవు చివరికి అదే అవుతావు, కాబట్టి జీసస్ మీద నీ భారం ఉంచి, అతడిని ప్రేమిస్తూ, అతని గురించి చింతిస్తూ ఉంటే, నీవు అతనే కాగలవు.
‘ఉత్కృష్ట ప్రేమ, ఉత్కృష్ట జ్ఞానం – రెండూ సమానమే’.
అలాగని దేవుని సిద్ధాంతాలను వల్లె వేస్తూ కూర్చుంటే చాలదు, నీవు వాటిని ప్రేమించాలి, సాధన చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలివేసి, ఈ సాధన అనే లేత మొక్క మీదే దృష్టిని కేంద్రీకరించు. అహోరాత్రాలు ఇదే ధ్యాసలో ఉండు. దైనందిన కార్యక్రమాలను కూడా భగవంతుని పరంగా చేస్తూ ఉండు – ఆయనకోసమే భుజించు, నిద్రించు, సంభాషించు, ఈ రకమైన సాధన ఎంతో లాభాన్ని చేకూరుస్తూంది.
భగవదవతారమూర్తుల కృపాలబ్ధిని, భగవత్ప్రేమను సముపార్జించు; ఈ రెండూ భగవత్ప్రాప్తికి ముఖ్యములు. ఇందు సజ్జన సాంగత్యం అతిదుర్లభం, మనకు అది ఏ కాస్త లభించినా జీవితం పరిపూర్ణ పరిణామం పొందడంలో సహాయపడుతుంది. నిజానికి నీ మనస్సులో అలాంటి కోరిక బలంగా ఉంటే, అలాంటి మహనీయుడు నీ వద్దకు వస్తాడు. వారి సాన్నిధ్యంతో ఏ స్థలమైనా పరమపావనమై తీరుతుంది. వారు సాక్షాత్ భగవన్మూర్తులు. వారి మాటలే వేద శాసనాల వంటివి. వారుండే ప్రాంతమంతా వారి ఉనికిచే పవిత్రమై, దివ్యతరంగాలతో అక్కడున్నవారిని అందరిని ముంచెత్తుతుంది. తన్మూలంగా అందరూ పవిత్రులవుతారు.
అలాంటి భగవద్భక్తులకు జాతి, కుల, రూప, ధన, విద్య, వృత్తి భేదములు ఉండవు ఎందుకంటే వారి దృష్టిలో అంతా సమానమే, అంతా ఆ భగవంతుని స్వజనమే.
ముఖ్యంగా ఈ సాధనలో, ప్రారంభదశలో దుస్సాంగత్యాన్ని పూర్తిగా త్యజించాలి. అది నీ మనస్సుని పెడత్రోవ పట్టనిస్తుంది. నేను, నాది అనే అహంకార భావనలను నిర్మూలించుకోవాలి. అన్నింటిని త్యజించినవాని కొరకు భగవంతుడు తప్పక వెతుకుతూ వస్తాడు. ఐహిక బంధాలను, సోమరితనాన్ని వదిలించుకోవాలి. నీ కర్తవ్యనిర్వహణలో దృఢంగా ఉంటూ, వెనుతిరిగి చూడకు. నీ కున్న సమస్తాన్ని ఆ భగవంతుని పాదారవిందముల వద్ద విడిచిపెట్టి, విడిచిన వాటి గురించిన తలంపును కూడా రానీయవద్దు. ధనాన్ని గురించిన గాని, పేరు ప్రతిష్ఠల గురించి గాని అన్వేషించేంత వ్యవధిలేదు, కేవలం భగవచ్చింతనకు మించి ఇంక ఏ తలంపుని రానీయకు, అప్పుడే అఖండమూ, అత్యద్భుతము అయిన ఆ ప్రేమామృతం మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. లౌకిక వాంఛలు గాజుపూసల వంటివి కాని భగవత్ప్రేమ నిత్యనూతనం, సంతత ప్రవర్ధమానం, అది అనుభూతిచే మాత్రం పొందబడేది. అన్ని మార్గాల్లోను ఈ ప్రేమమయ భక్తి మార్గమే అత్యంత సులభమైనదని గ్రహించడానికి ఏ తర్కాన్ని ఆశ్రయించనవసరం లేదు. దీనికి ప్రమాణాలను వెతికే పని లేదు. మన మనస్సు పరిధి అనే వలలోనికి ఆ భగవంతుని లాగలేము, ఇది నిరూపణలకు అందని సత్యం.
ప్రేమ సంబంధరహితమైనది. అది ఏ రకంగా ఉపయోగించినా దాని శక్తి ఒకటే, శాంతి ఆనందాలే దాని స్వభావాలు. హంతకుడైనా తన బిడ్డను ముద్దాడేటప్పుడు అన్యవిషయాలను విస్మరిస్తాడు, కనుక ప్రేమతత్త్వపు యదార్ధ రూపు పరమానందమే. కామ క్రోధాలను వదిలి, అహంకారాన్ని, అహం అనే భావాన్ని విసర్జించి సర్వం భగవదర్పణం చేయాలి. నేను లేను, సర్వం నువ్వే, ఉన్నది నీవే అనే భావనను దృఢంగా చేసుకుని, కీడు వాటిల్లినా, భగవంతుడు నీతో క్రీడిస్తున్నాడని గ్రహించి, ఆనంద పరవశుడవు అవుతూ, ప్రేమ దేశకాలాతీతమైనదని, అఖండమైనదని గుర్తించుము.
మంగళవారం, జూన్ 25
సుఖము, దుఃఖము అనే రెండూ ఒకదాని వెన్నంటే ఇంకోటి ఉంటాయి. అయితే పురోగమిస్తున్న వారిలో ఇవి త్వరితంగా కానవస్తూ ఉంటాయి. మనకు ఈ రెండూ కావలసినవి కాదు ఎందుచేతంటే ఇవి వాస్తవ స్వభావాన్ని మరుగుపరుస్తాయి. ఈ రెండూ బంధనాలే, ఒకటి ఇనుపదైతే, ఇంకోటి బంగారుది, అంతేతేడా! ఈ రెండు అవస్థలకు అతీతంగా ఉన్న ఆత్మ, నిర్వికార, శాశ్వతానందాన్ని కలుగజేసేది. అది మనం ఎక్కడ నుండో తెచ్చి సంపాదించుకునేది కాదు, అది మనలోనే మరుగున పడి ఉన్నది, మకిలిని తొలగిస్తే దానంతటదే బయటపడుతుంది.
ఆత్మలోనే నిష్ఠుడవై నిలిస్తే, నిజమైన విశ్వప్రేమ కలుగుతుంది. మన వైఖరి అత్యున్నతమై ఉన్నప్పుడు, ఈ విశ్వమనే చిత్రాన్ని పరిపూర్ణ శాంతమనస్సుతో వీక్షించగలం. ఈ సంసారాన్ని చిన్న పిల్లల ఆట వలె భావించినప్పుడు కలవరపాటు కలగదు. పొగడ్తలు మనస్సుని ఆనందపరిస్తే, తిరస్కారాలు దానిని కుంగదీస్తాయి, ఈ మానసిక ఉద్వేగాలు, ఇంద్రియాకర్షణలు క్షణభంగురమైనవి. యదార్థమైనటువంటిది, స్వతంత్రమైనది, శాశ్వతమైనది ఆనందదాయకమైనది అయి ఏకమై నిలిచిన ఆత్మానంద స్థితినే మన మతధర్మాలు పేర్కొన్నాయి. ఆంతరికమైన ఆ ఆనందపు నిధిని సముపార్జించే ప్రయత్నమే మన ఆధ్యాత్మికతకు కొలబద్ధగా నిలుస్తుంది.
ఈ అంతర ప్రపంచంలోని నిజతత్త్వం, బాహ్య ప్రపంచ విస్తృతి కన్నా ఎన్నోరెట్లు అధికతరమై ఉన్నది. వాస్తవానికి బాహ్యంగా కనిపించేది, అంతరమైనదాని ఛాయ మాత్రమే. ఈ జగత్తు వాస్తవముకాదు, మిధ్యకాదు, సత్యపు ఛాయ అని తెలుసుకోవాలి. ‘సత్యం యొక్క స్వర్ణ వర్ణపు ఛాయయే భావన’ అని ఒక కవి అంటాడు.
ఈ సృష్టిలోనికి ప్రవేశం కలుగగానే, మనకది సజీవమై తోస్తుంది, వాస్తవానికి విషయాలు జడమైనవి, మనమే వాటికి ప్రాణం పోసి రూపునిస్తున్నాము. ఆ తరువాత మూర్ఖుల వలె, వాటిని చూసి భయపడటమో లేదా ఆనందించడమో చేస్తున్నాం. సంతనుండి ఇంటికి వస్తూ, గాలివాన రాగా తలదాచుకోవడానికి పువ్వులు అమ్మేవారింటికి వెళ్ళిన బెస్త పడుచులవలె ప్రవర్తించకండి. ఆ బెస్త పడుచులకి సువాసనలు వెదజల్లే పూవుల మధ్య పడక ఏర్పాటు చేసినా, ఆ వాసనను ఆఘ్రాణించలేక, చివరికి తాము తెచ్చుకున్న ఖాళీ చేపల బుట్టల మీద నీరు చల్లి, ఆవాసనతో సంతృప్తి చెంది గాఢంగా నిద్రపోతారు. ఈ సంసారమే ఒక చేపలబుట్టవంటిది, దీనిపై మనం ఆధార పడకూడదు. అలా ఆధారపడేవారు తామసికులు, సంసార బద్ధులు. వీరి తరువాత వచ్చేవారు రాజసికులు. ఎంత సేపూ నేనూ, నాది అనే అహంకారపూరిత స్వభావులై ఉంటారు. అయితే వీరు కొంతవరకు సత్కర్మలు చేస్తూ, ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. అందరికంటే ఉత్తములు సాత్త్వికులు. వీరు నిరంతరం అంతర్ముఖులై, ఆత్మారాములై ఉంటారు. ఈ సత్త్వ, రజస్తమోగుణాలు అందరిలో ఉన్నా, ఒక్కొక్కరిలో ఒక్కోగుణం ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది.
సృష్టి అంటే నిర్మించడం కాదు, ఉన్నదానినే సమత్వస్థితికి తీసుకువచ్చే యత్నం చేయడం. తేలడానికి వీలుగా, గాలానికి కట్టే బెండు ముక్కను ఒకటి తీసుకుని, దానిని చిన్న చిన్నగా ముక్కలు చేసి, ఒక నీటితోట్టె అడుగున పడవేస్తే, అవి ఒకొక్కటిగా, గాని గుంపులుగా గాని, నీటి ఉపరితలానికి అంటే తమ యథాస్థానానికి చేరుకునే ప్రయత్నం ఎలా చేస్తూ, తాము కోల్పోయిన సమత్వాన్ని తిరిగి పొందేందుకు యత్నిస్తాయో అటువంటిదే ఈ సృష్టిక్రమం కూడా. ఈ సమత్వస్థితిని చేరేందుకు మంచితో పాటు చెడు కూడా కొంత అవసరమే, ఒకసారి చేరుకుంటే ఆ స్థితి అంతమైపోతుంది. ప్రపంచం అంతమయ్యేటప్పుడు దానితో పాటే మంచి చెడులు కూడా అంతరిస్తాయి, మనం ప్రపంచాతీతులమైనప్పుడే ఈ మంచి చెడులను అతిక్రమించి బ్రహ్మానందాన్ని పొందగలము.
బాధ లేని సుఖాన్ని, చెడు లేని మంచిని పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇటువంటి సమత్వమే జీవనంలో ఉంది. అయితే మనకు కావలసింది స్వాతంత్ర్యం – జీవనంకాదు, దానితో ముడిపడి ఉన్న మంచి కాదు, సుఖం కాదు. సృష్టి అనంతమై ఉన్నది, దానికి ఆది, అంతం లేవు. అనంతమనే సరోవరంలో సదా చలించే ఒక చిరు అల అని చెప్పవచ్చును. ఇందులో కొన్ని చోట్ల సమత్వం కనిపిస్తున్నా, ఇంకా అందుకోబడిన లోతైన తావులూ ఉన్నాయి, అందువలన ఈ వీచిక అలా కొనసాగుతూనే ఉంటుంది. పుట్టుక, మరణం అనేవి ఒకే నాణేనికి గల రెండు పార్శ్వాలు. జీవన సంరంభం, మరణమూ ఈ రెండూ మాయ యొక్క పరిణామాలే. ఈ మాయకు అతీతంగా నిలిచి ఉన్నదే యదార్థతత్త్వమైన ఆత్మ. ఈ స్థితిని మరువడం వల్లనే మనం భగవంతుడు అని పేరు పెట్టి బాహ్యంగా పూజించినా, అది వాస్తవానికి మనలోనే అన్ని వేళలా ఉన్న మన ఆత్మే. ఈ సత్యం గ్రహించాలి.
మనం సమత్వస్థితి సాధించాలంటే, ముందుగా తమస్సుని రజస్సు చేతా, రజస్సును సత్వం చేతా జయించాలి. ఈ సుందరమైన శుద్ధ సత్త్వం కాలక్రమేణా ప్రవర్ధమవుతుంది. బంధనాలను తెంచుకుంటే విముక్తుడవయి, నీ తండ్రిని జీసస్ మాదిరిగా చూడగలవు. అనంత శక్తిని కలిగి ఉన్నామని గుర్తించడమే మతం. దౌర్బల్యాన్ని వదిలించుకుంటే బానిసత్వం తొలగుతుంది. నీవు స్వతంత్రుడవైన ఆత్మవు, మృత్యురహితుడవు; స్వతంత్రుడవని గుర్తిస్తే భగవంతుని చేరినట్లే;
* * *
ప్రపంచం నా నిమిత్తం ఏర్పడిందే కాని నేను ప్రపంచం నిమిత్తం ఏర్పడినవాడిని కాను. మంచి చెడులనేవి మన బానిసలే కానీ మనం వాటి బానిసలం కాము. వికాసం పొందకుండా ఉన్నస్థితిలోనే నిలిచి ఉండటం పశు లక్షణం; హితాన్ని కోరుతూ, అహితాన్ని తొలగించుకోవడం మానవ స్వభావం. అయితే ఈ రెంటికీ అతీతంగా ఉండటం, నిత్యానందపరిపూర్ణుడై నిలవడం దైవలక్షణం. మనం భగవత్స్వరూపులమై ఉందాము! హృదయాన్ని సాగరమంత విశాలం చేసుకుని, తుచ్ఛ విషయాలకు అతీతంగా ఉంటూ, కీడు వాటిల్లినా లక్ష్యపెట్టక, ప్రపంచాన్ని ఒక చిత్రపటంగా భావిస్తూ, దాని యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, నిన్నేదీ బాధపెట్టలేదని గ్రహించు. పిల్లలు ఆటల్లో, బురదగుంటలో నుండి గాజుపూసలు కనిపెట్టి ఆనందిస్తుంటారు, ఇహంలో మేలు అంటే ఇలాంటిదే. తొణకని సంతృప్తితో లోకాన్ని ప్రశాంతంగా గమనిస్తూ, మంచి చెడులు రెండూ ఈశ్వర లీలలే అని భావించి సమానంగా పరిగ్రహించు.
నా గురుదేవులు ఇలా చెప్పేవారు – ‘సర్వం నారాయణుడే అయినా వ్యాఘ్రనారాయణునికి దూరంగా ఉండాలి. నీరు ఎక్కడ ఉన్నా నీరే, అలాగని తాగవలసి వచ్చినప్పుడు మురికి నీటిని వర్జిస్తాము కదా’ ;
‘ఆ భగవంతునికి సూర్య చంద్రులు జ్యోతులైతే, ఆకాశం ధూపకలశం. ఇంక దేవాలయాలతో పని ఏముంది? ఓ దేవా! అన్ని కళ్ళూ నీ కళ్ళే అయినా నీకు కన్ను లేదు. అన్ని చేతులూ నీ చేతులే అయినా నీకు చెయ్యి లేదు’.
* * *
ఏదీ తప్పించుకోవద్దు, అలాగని కోరనూ వద్దు. వచ్చిన దానిని స్వీకరించు. దేని వల్లా బాధితులం కాకపొవడమే స్వాతంత్ర్యలక్షణం. కేవలం సహనంగా ఉంటేసరిపోదు, అసంగుడివై మెలగాలి. ఈ సందర్భంలో ఎద్దు కథ గుర్తుకు తెచ్చుకుందాం-ఒక దోమ చాలాసేపు ఎద్దు కొమ్ముపై ఉండి, ఎద్దు చలించకపోవడంతో, ‘ఓ వృషభరాజమా! చాలా సేపుగా నేనిక్కడే కూర్చుని ఉన్నాను. నీకు బాధ కలిగించానేమో! ఇదిగో ఇపుడే వెళ్ళిపోతున్నా’ నంటే, దానికి ఆ వృషభం ప్రతిస్పందిస్తూ, ‘నాకెలాంటి ఇబ్బందీ లేదు. నీ కుటుంబాన్ని యావత్తు తీసుకువచ్చినా కొమ్ముపై ఉంచినా నాకే ఇబ్బందిని కలిగించలేవని చెప్పింది.
* * *
బుధవారం, జూన్ 26
మనలో స్వార్ధచింతన లేనప్పుడే, మహోత్తమ కార్యాలను నిర్వర్తించగలుగుతూ ఉత్తమోత్తమ ప్రభావాన్ని చూడగలం. ఈ విషయం మేధావులైన వారందరికీ తెలుసును. మనం నిమిత్తమాత్రులమై ఆ భగవంతునికే సర్వాన్ని వదిలేద్దాం. “అర్జునా! నాకీ ముల్లోకాల్లోనూ చేయదగిన కర్తవ్యమంటూ ఏదీ లేదు” అని శ్రీకృష్ణుడు అంటాడు. సమస్తమూ ఈశ్వరాధీనమని భావించు, దేనికీ చలించవద్దు, అప్పుడే నిజమైన కర్మను చేయగలవు. వాస్తవానికి శక్తిని నీవు చూడలేవు, ఫలాన్ని మాత్రమే చూడగలవు. అహంకారాన్ని పూర్తిగా వదిలించుకుని, ప్రతీ కర్మా దేవుని నిమిత్తమే, దేవుని పనిగానే భావిస్తూ కొనసాగించు. మనలోని ఈ నిస్సంగత్వం మనలను దేవుని వద్దకు త్వరితంగా చేరుస్తుంది. సంకుచితమైన అహాన్ని వదిలితే, ఉదాత్తమైన ‘అహంబ్రహ్మాస్మి’ అవగతమవుతుంది.
మనలను రూపొందించేవి మన తలపులే కనుక తలపుల పట్ల జాగరూకులై ఉండాలి. మాటలు అప్రధానాలు, తలపులతో పోలిస్తే, ఎందుకంటే తలపులు సుదూరం ప్రయాణం చేస్తాయి. మనం తలచే ప్రతీ దానిలో మన వ్యక్తిత్వం వెల్లడి అవుతూంటుంది. అందువలన పవిత్రులు, నిర్మలమనస్కులలో వారి పరిహాసాలలో, దూషణలలో సైతం ప్రేమ, స్వచ్ఛత నిబిడీకృతమై ఉంటాయి.
భగవంతుని తలుచుకోవడం తప్ప దేనినీ ఆశించకు. ప్రతిఫలాన్ని ఆశించని నిష్కాములే ఫలితాలను సాధించగలరు. పరివ్రాజక భిక్షువులు తామేదీ చేయలేదనుకుంటూనే ఇంటింటికి వెళ్ళి ధర్మాలను అందిస్తూ ఉంటారు. వారు దేన్నీ తమది అని అనుకోరు. తాము చేసే కార్యం ఇంతటిది అని ఎరిగి ఉండే జ్ఞానం అహంకారపూరితమై, చివరికి అందులో మంచిని అదృశ్యమయ్యేలా చేస్తుంది. ‘నేను’ అనే ఆలోచనే కపటమైనది, కాని దానినే జ్ఞానం అని అనుకుంటే చెట్టుకు కట్టి ఉన్న ఎద్దు మాదిరిగా చుట్టూ తిరగడమే అవుతుంది. దేవుడు అంతర్గతమై ఉన్నాడు కనుకనే ఆయన కార్యాలు అత్యుత్తమంగా కొనసాగుచున్నాయి అలాగే ఎవరైతే తనను తాను వెల్లడి కానివ్వడో, వారే విశేషాలను సాధించగలరు. ముందుగా నిన్ను నీవు జయించుకుంటే, విశ్వమంతా నీదే అవుతుంది.
సత్త్వదశలో ఇంద్రియాతీతమైన, తర్కాతీతమైన స్థితి కలుగుతుంది. వస్తు తత్త్వం గోచరిస్తుంది, మనలను కప్పి ఉంచిన వజ్రకుడ్యం అహంకారమే. ప్రతీదానిని ‘నేను’ పరంగా అన్వయించుకుంటూ ‘నేను ఇది చేశాను’, ‘నేను అది సాధించాను’ అనే సంకుచితమైన అహాన్ని వదిలివేయాలి. ‘నేను కాదు నీవు’ అనడాన్ని అనుభవంలోనికి తీసుకురానంతకాలం స్వర్గరాజ్యంలో అడుగుపెట్టలేవు. సంసారాన్ని త్యజించడమంటే, ‘నేను’ అనేది మరవడమే, దాని ఎరుకను విస్మరించడమే; దేహధారులమైనా దేహపరులం కాకపోవడమే; ఈ విధంగా చేయాలంటే ఇతరులు నిన్ను నిందించినపుడు, వారిని దీవించు; వారు తమకు హాని చేసుకుంటూ నీకు మేలు చేస్తున్న విధానాన్ని గమనించు. ఇలా నీవు ద్వేషాన్ని ఎదుర్కోగలిగిన నాడు, నీ అహం పూర్తిగా తొలగి, భగవంతునికి మరింత దగ్గరవుతావు. తల్లి కోతివలె, మనం కూడా సంసారమనే బిడ్డ పట్ల గాఢానురక్తిని కలిగి ఉంటాము కానీ ఏదో ఒక నాడు దానిని వదిలి వేసే స్థితివస్తుంది, ఆనాడు మన దృష్టి భగవంతుని యందు లగ్నమై, ధర్మం నిమిత్తం హింసలపాలవడానికి కూడా సిద్ధమవుతుంది. ఇది చదువుతో నిమిత్తం లేనిది, ఎంత తక్కువ చదివినా, చేరవలసిన చోటుకే చేరుస్తుంది.
భోగమనేది వేయితలల సర్పం వంటిది, దానిని కాలికింద తొక్కి ఉంచాలి. అన్నింటిని వదిలీ, ముందుకు సాగినప్పుడు, ఒకోసారి ఫలితం ఏమీ సిద్ధించుటలేదనే నిరుత్సాహం కలుగుతుంది, అయినా పట్టు వదలకు, కార్యసాధకునివై నిలబడు; ఈ సంసారమనే రాక్షసికి, అహంకారమే ప్రభువు. ఆ సంకుచితహంకారమును పక్కకు నెట్టి సుస్థిరంగా నిలబడి, ఆటంకాలైన కామకాంచనాలు, కీర్తి ప్రతిష్ఠలను లక్ష్యపెట్టని స్థితికి చేరుకుని, భగవంతుడినే ఆశ్రయించు; అప్పుడే నీ ఉదాసీనతను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోగలవు. ఇంద్రియ సుఖాలు ఆనందాన్ని కలుగజేస్తాయనడం ఐహికవాదన, అది సరియైనది కాదు, అది అశాశ్వతమైనది, ఎడారిలోని ఎండమావుల వంటిదే.
భగవంతునికి సంపూర్తిగా ఆత్మార్పణం చేసుకున్న వారు అందరికన్నా ఎక్కువ మేలు చేయగలరు. పరిపూర్ణమైన అత్మశుద్ధి కలిగినవారు ఎందరో ప్రబోధకులకన్నా అధికశక్తివంతులవుతారు. ఎందుకంటే స్వచ్ఛత, మౌనం నుండే అమోఘ శక్తి వెలువడుతుంది. “కమలంవలె ఒక చోట నిలకడగా ఉండి నీ దళాలను వికసించుకోగలిగితే అప్పుడు మధుపాలు స్వయంగా నిన్ను వెతుకుతూ వస్తాయి.” శ్రీరామకృష్ణులకు, కేశవ్ చంద్రసేన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది. లోకంలో పాపం, దోషం ఉన్నాయని గాని, వాటిని ప్రతిఘటించాలని గాని శ్రీరామకృష్ణులు భావించలేదు. కేశవ్ చంద్రసేన్ గొప్పనైతిక సంస్కర్త, నాయకుడు, బ్రహ్మసమాజ స్థాపనాచార్యుడు. అయితేనేమి, పన్నెండేళ్ళ తరువాత, ఈ దక్షిణేశ్వర ప్రశాంత ప్రవక్త కేవలం భారతదేశంలోనే కాక, యావత్ ప్రపంచంలో విప్లవాన్ని తీసుకు వచ్చారు. అఖండ శక్తి సముపార్జితులు నిశ్శబ్దంగా జీవిస్తూ అందరినీ ప్రేమించగలుగుతూ, తమ వ్యక్తిత్వాన్ని ఉపసంహరిస్తారు. వారెన్నడూ ‘నేను’, ‘నాది’ అని తలవరు; నిమిత్తమాత్రులై ఉంటారు. భగవంతునితో సంపూర్ణ తాదాత్మ్యాన్ని కలిగి ఉన్న ఇట్టి ఆదర్మజీవులు, నిష్కాములే క్రీస్తుగా, బుద్ధునిగా రూపొందుతారు. వీరే నిజమైన లోక ప్రవక్తలు. వీరు జీవన్ముక్తులు, నిస్వార్థులు, అహంకార రహితులు, లోభవిరహితులు, తత్త్వస్వరూపులు.
గురువారం, జూన్ 27
(స్వామీజీ నేటి ఉదయం ‘కొత్త నిబంధన’ (న్యూటెస్టామెంట్) పుచ్చుకుని వచ్చి జాన్ సువార్తను గురించి మళ్ళీ ప్రసంగించారు.)
మహమ్మద్, క్రీస్తు లోకానికి పంపుతానని వాగ్దానం చేసిన శాంతిదూతను తానేనని తెల్పారు. క్రీస్తు అప్రాకృత జన్ముడని తెలపడం ఆవశ్యకం కాదని మహమ్మద్ అభిప్రాయపడ్డారు. కారణజన్ములైన వారు అన్ని కాలాల్లోనూ, దేశాల్లోనూ ఉన్నారు. వారందరు భగవంతుని పుత్రులమనే చెప్పుకున్నారు.
జ్ఞానం అనేది కేవలం పరస్పర సంబంధాన్ని తెలిపేది మాత్రమే. మనం దైవం కావచ్చు కాని దైవాన్ని తెలుసుకోలేము. ‘తాను తెలుసుకున్నాను’ అనుకున్నప్పుడే ఆదాముకు పతనం సంభవించింది. దానికి ముందు అతను సత్యానికి ప్రతీకగా, పవిత్రతకు మారుగా ఉన్నాడు. మనం మన ప్రతిబింబాన్ని మాత్రమే చూడగలం గాని అసలు స్వరూపాన్ని చూడలేము. ప్రేమ మన స్వరూపం, కానీ దానిని గురించిన భావనలో మాయారూపాన్ని ఉపయోగించుకోవలసిందే, దీని వలన పదార్థం అనేది బాహ్యంగా రూపుదిద్దుకున్న ఆకృతే అని తెలుస్తోంది.
ప్రాపంచిక విషయాలనుండి మరలడమే నివృత్తిగా చెప్పబడింది. హిందు పురాణాలు ఈ విధంగా చెప్పాయి – సృష్టిలో మొదట సృజింపబడిన నలుగురిని* దేవుడు హంస రూపంలో, ‘సృష్టిలోనిదంతా అప్రధానమే’ నని హెచ్చరిక చేయగా వారు సృష్టి కార్యము నందు దిగక, నివృత్తులై మెలిగారు. దీనర్థం ఏమిటంటే భావం శబ్దమూలంగా వ్యక్తీకరించబడుతుంది, వ్యక్తీకరణం ద్వారా అది క్షీణదశకు చేరుతుంది, ఎందుకంటే శబ్దం భావాన్ని అంతం చేస్తుంది కనుక,* అయినా ఆవరణాన్ని చూసి భ్రాంతి చెంది మనం తత్త్వం గ్రహించలేకపోతున్నామని మనకు తెలుసును. ఈ విషయం ప్రతీ మతాచార్యుడు అర్థం చేసుకుని, ఒక పరంపరలో అనాదిగా ఈ తత్త్వరహస్యాన్ని కాలానుగుణంగా మనకు చెబుతూనే ఉన్నారు. ప్రవక్తలందరూ ఈ తత్త్వసారాన్ని గుర్తించి మనకు అనుగుణంగా నూతన రూపంలో తెలియజేస్తూ ఉంటారు. నా గురుదేవులు కూడా మతమనేది ఒకటేనని ఆ పరమార్థం ఏకమేనని బోధించారు.
మనం నామ, రూపాలనుండి విడివడి, దేహ భ్రాంతిని వదిలివేసినప్పుడు మాత్రమే, మంచి, చెడులకు అతీతమైన బంధరాహిత్యాన్ని పొందగలం, లేనిచో పురోగమనం శాశ్వతబంధానికి దారి తీస్తుంది. శరీర రాహిత్య స్థితే మనకు వాంఛనీయమైనది. ఏశరీరమైనా, చివరికి దేవతా శరీరం అయినా, దానినుండి విముక్తిని పొందే తీరాలి. బ్రహ్మమే నిజమైన ఉనికిని గలది; ఇందులో రెండోది ఉండదు ఎందుకంటే అఖండావస్థ అనేది ఒక్కటిగానే ఉంటుంది కాని రెండు అఖండవస్తువులు ఉండలేవు. అందువలన బ్రహ్మమూ, నిరుపాధికమైన ఆత్మ ఒక్కటే గాని, వేరు కావు. అది నేనై ఉన్నాను;* సత్కర్మలు బంధ విమోచనకు దారి తీస్తాయి, దాని వలన కర్తకే ఉపయోగం, ఇతరులకు కాదు.
* * *
జ్ఞానమనేది వర్గీకరణం చేయడానికే ఉపయోగపడుతుంది. ఒకే రకం వస్తువులను అనేకంగా చూసినప్పుడు, ఆ సముదాయానికి ఒక పేరు పెట్టి మనం సంతోషపడతాం. మనం సత్యాన్ని కనుగొంటాం కాని దానికి మూల కారణాన్ని యోచించం. విస్తృతమైన అజ్ఞానపు పరిధిలో తిరుగాడుతూ, ఏదో తెలుసుకున్నామని భ్రాంతి చెందుతాం, ఎందుచేత ఈ విధంగా జరుగుతోంది? అనే ప్రశ్నకు ప్రాపంచకరీతిలో సమాధానం లభ్యమవదు, దాని కొరకు భగవంతుడినే ఆశ్రయించాలి. జ్ఞాత ఎన్నటికీ నిర్వచనీయుడు కాజాలడు, ఇది ఉప్పురాయి సముద్రంలో పడిన మరుక్షణమే కరిగిపోయి, దాని ఉనికిని కోల్పోవడం వంటిది.
అభిన్నంగా, ఏకత్వాన్ని కలిగి ఉన్నదే దైవం; భేద కల్పనంగా తోచేదంతా సృష్టి – దీనిని అతిక్రమిస్తే, జనన, మరణ వలయాన్ని ఛేదించి, శాశ్వత పథానికి చేరుకుని భగవంతునిలో నెలకొనగలవు, భగవంతుడివే కాగలవు. అందు వలన ఈ ముక్తిని సాధించేందుకు, జీవితాన్ని సాధనామయం చేయవలెను. మనమంతా పుస్తకంలోని పుటల వంటి వారం, అంతా ఒకరికే చెందినవారం, మార్పు లేని శాశ్వతులం. మన ముందు ఒక కంచుకాగడాని గిరగిరా తిప్పితే, ఆ అగ్ని సుదర్శన చక్రం వలె తిరుగుతూ మన కంటికి ఎలా కనిపిస్తుందో, అలా ఈ సమస్త విశ్వంలో భాసించేది ఆత్మే. సమస్త వ్యక్తులలోని ఏకత్వానికి మూలం ఆత్మే, అది అచలం, నిత్యం, నిర్వికారం కనుక జీవుడే దేవుడని అంటున్నాము. అది ప్రాణం కాదు, ప్రాణంగా రూపొందించబడినది, అలాగే అనుభవం కూడా కాదు, అలారూపొందించబడింది మాత్రమే.
* * *
ఈరోజులలో చాలా మంది, భగవంతుడు ప్రపంచానికి చేసిన మేలు గుర్తించక, ‘భగవంతుని వలన ప్రయోజనం ఏమిటి? అని అవివేకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. భగవంతుడనేవాడు పురపాలనా అధికారా ఏమిటి, మనం ప్రశ్నించగానే మన ముందు నిలబడి సమాధానం ఇవ్వడానికి.
మనం చేయవలసినదల్లా ఏమిటంటే సమస్తములైన కోరికలను, రాగ ద్వేషాలను విడనాడాలి. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలనం చేయాలి. మనస్సుని, శరీరాన్ని నిర్మలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇవన్నీ భగవత్ప్రాప్తికి సాధనా పరికరాలుగా ఉపయోగిస్తాయి. ఈ సాధనలో ఆనందాన్ని ఆశించక, సత్యాన్ని సత్యం కొరకే అన్వేషించు, ఏదో లభ్యం అవుతుందని ఆశించవద్దు. ఆనందం కలగవచ్చు, కాని దానికై ఎదురు చూడవద్దు. ఆశించడం అనేది ప్రోత్సాహకరమైన విషయం కాదు. అన్య విషయాలు ఏవీ నీ లక్ష్యం కారాదు, కేవలం భగవత్ప్రాప్తి మాత్రమే నీ లక్ష్యం కావాలి, దాని కొరకు అవసరమైతే నరక మార్గంలో అయినా ప్రయాణం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి; ఈ రీతిగా ఉంటేనే, చివరికి సత్యాన్ని చేరగలవు.
శుక్రవారం, జూన్ 28
నేడు అందరం కలిసి వనభోజనానికని బయటకు వెళ్ళాం. స్వామీజీ ఎప్పటి వలె మధ్య మధ్యలో బోధిస్తూనే ఉన్నా, ఎవరూ పుస్తకాలు తెచ్చుకోనందున, ఏమి వ్రాయబడలేదు. అయితే, ఉదయం ఉపాహార సమయంలో స్వామి ఇలా చెప్పారు.
అన్ని రకాలైన ఆహారం పట్ల కృతజ్ఞుడివై ఉండు. ఆహారం పరబ్రహ్మ స్వరూపం. ఆతని విరాట్ శక్తి మనకు ఈ విధంగా లభ్యమై వ్యక్తిగతశక్తిగా పరిణమిస్తూ, సమస్త కార్యాలను నిర్వహించడంలో తోడ్పడుతోంది.
శనివారం, జూన్, 29
(స్వామీజీ నేటి ఉదయం భగవద్గీత చేత పుచ్చుకుని తరగతికి వచ్చారు)
పరమాత్ముడైన శ్రీకృష్ణుడు, నిద్రను జయించి గుడాకేశుడైన అర్జునునితో సంభాషిస్తున్నాడు; దానిని మన పరంగా అన్వయిస్తే, ధర్మ క్షేత్రమైన సంసారమే యుద్ధరంగం; ధర్శమూర్తులైన ఐదుగురు, మరులుగొని, ఆసక్తిని పెంపొందించే నూరు మందితో యుద్ధం చేస్తున్నారు. జాగృతాన్ని పొందిన ఆత్మే, అర్జునుడై, ఇందు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందుకు మనలను మోహావశులను చేసే విషయసుఖాలన్నింటితోనూ పోరాడి, నిర్జించవలసి ఉంది. దీనికై మనం బ్రహ్మస్వరూపులమనే సత్యాన్ని తప్ప, అన్యమైన ఆలోచనలను చేయరాదు. ఆసక్తికాని, అనురాగంకాని, లేకనే సమస్త కార్యాలను ఆ శ్రీకృష్ణుడు చేసి చూపించాడు. ఆయన సంసారంలో మెలిగినా నిస్సంగుడై మెలిగాడు. ఆ మహనీయుడు చేసిన అనుష్ఠానపరమైన బోధనం ఇదే – ‘సమస్త కార్యాలను ఆచరించు, కాని వాటితో సంగం పెట్టుకోకు. కర్తవ్యాలను కర్తృత్వబుద్ధితోకాక, స్వార్ధ రహితంగా నిర్వర్తించుము’.
* * *
స్వాతంత్ర్యానికి ఎప్పుడు నామం, రూపం ఉండవు; మనమంతా మట్టితో చేయబడిన కుండలవంటి వారం, మట్టి కుండగా మారినపుడు, స్వేచ్ఛను కోల్పోతుంది, దానికి స్వాతంత్ర్యం లేదు, అది పరిమితిని కలిగి ఉంది. ఒక కుండ ఎప్పుడు ‘నేను స్వతంత్రుడిని’ అని చెప్పలేదు. దాని అస్తిత్వాన్ని కోల్పోయిననాడే తిరిగి అది స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకోగలదు.
ఈ విశ్వమంతా ఒకే ఆత్మ యొక్క వివిధ రాగాలతో నిండి ఉంది, ఒకోసారి అపస్వరాలు దొర్లుతూ ఉంటాయి, అయితే తదనంతర స్వరసమ్మేళనామాధుర్యంతో అది సంపూర్ణమవుతూ ఉంటుంది. ఈ విశ్వవీణపుతంత్రిలో, స్వాతంత్ర్యం, బలం, ఐక్యత నిబిడీకృతమై ఉన్నాయి.
నీ స్వాతంత్ర్యం ఇతరులను బాధించేది అయితే, అది స్వాతంత్ర్యం కాదు. నీ వలన ఎవరికి హాని కలగరాదు.
‘దౌర్బల్యతే అన్ని కష్టాలకు కారణం’ అని మిల్టన్ మహాకవి అన్నాడు. మనం చేసే కర్మలోనే దుఃఖం దాగి ఉంది, అది విడదీయలేనటువంటిది. (అతిగా నవ్వేవాడు అధికంగా బాధపడతాడు అనేది తెలిసినదే). మనకు కర్మ చేయడానికే అధికారం ఉంది కాని, కర్మఫలాన్ని ఆశించడానికి అధికారం లేదు.
* * *
మనలోని చెడు తలంపులు రోగ క్రిముల వంటివి, వాటిని పెరగనీయరాదు.
మన శరీరాన్ని ఇనపముక్కగా భావిస్తే, అందుండి బయట పడే ప్రతీ ఆలోచనా, ఒక చిన్న సుత్తి దెబ్బతో సమానమే. దీనిని బట్టి యోచనలు జాగ్రత్తగా చేయాలి అని తెలుస్తుంది.
మన హృదయకవాటాన్ని తెరిచి ఉంచితే, విశ్వంలోని సమస్త సద్భావాలు అందు ప్రవేశిస్తాయి.
ఉపదేశగ్రంథం యావత్తు మనలోనే నిక్షిప్తమై ఉంది. సోహం, సోహం (అతడే నేను, అతడే నేను) అనే నిత్య సచ్చిదానంద సంగీతం అహోరాత్రాలు నీ హదయంలో మధురంగా ఆలాపన చేస్తూ, ‘ఓ మూఢుడా! నీకు వినిపించడం లేదా!’ అని ఘోషిస్తోంది.
పిపీలికాది బ్రహ్మపర్యంతం, అంతటా నిబిడీకృతమై ఉన్న జ్ఞానం ఒక్కటే. నిజమైన మతం, ధర్మం ఒక్కటే. మనం నామాలకు, ప్రతీకలకు, ఉదాహరణలకు, ప్రాధాన్యతలను కలిపించి, కలహిస్తున్నాము. సాక్షాత్కారం పొందిన వారు వారిదైన రాజ్యంలో భద్రంగా ఉన్నారు; మిగిలినవారు తమని తామే కోల్పోయి, విశ్వం చేజారిందనే భ్రమలో ఉన్నారు.
సంపూర్ణశక్తి చేయదగిన కార్యాచరణం ఏమీ ఉండదు, దానికి అస్తిత్వమే ఉంటుంది. పారమార్థిక పరిపూర్ణత ఒక్కటే అయినా, వ్యావహారికంగా అనేకంగా ఉన్నట్లు భాసిస్తుంది.
ఆదివారం, జూన్ 30
మనస్సులో రూపం లేకుండా ధ్యానించాలనుకోవడం అసాధ్యాన్ని సుసాధ్యం చేద్దామనుకోవడమే. జంతుజాలమైనా, వృక్షజాలమైనా ఉదాహరణగా ఒక దానిని గుర్తించకుండా, ఆ తెగను గుర్తించడం కష్టమే కదా, భగవంతుని విషయమూ అంతే.
పృధ్విలోని అద్భుత భావసముదాయాన్నే మనం భగవంతుడని అంటున్నాము.
ప్రతీ ఆలోచనలోనూ రెండు భాగాలు ఉంటాయి ఆ పదం, మరియు దాని చింతన, మనకు అవి రెండూ అవసరమే; భౌతిక వాదులు కాని, ఆదర్శవాదులు కాని చెప్పేది సరియైనది కాదు, మనకు భావమూ, దాని యొక్క వ్యక్తీకరణమూ రెండూ ముఖ్యమే.
జ్ఞానమనేది, అద్దంలోని మన ప్రతిబింబం వంటిది. ఎవ్వరూ ఆ బ్రహ్మాన్ని గురించిగాని, ఆత్మను గురించి తెలుసుకోలేరూ, అయినా మనమే ఆ ఆత్మ, ఆ బ్రహ్మమన్నది సత్యం. జ్ఞానం దానిని సూచిస్తుంది, కాని అదే జ్ఞానం కాదు.
నిర్వాణంలో బుద్ధుడు ఇలా చెబుతాడు – ‘నీవు అనే సంకుచితాహంకారం నశించినపుడే, ఉత్తమత్త్వాన్ని పొందగలవు, అదే నీ సత్యమైన ఉనికిని చూపిస్తుంది.’
దివ్యమైన అంతర్జ్యోతి అందరిలోనూ మరుగున పడి ఉంది. ఇది ఇనుముతో చేసిన దీపపుసెమ్మెలోని దీపం వంటిది, పారదర్శకత్వం లేనందున లోపల దీపం వెలుగుతున్నా, బయటకు దాని కాంతి ప్రసరింపజాలదు. అయితే ఆ ఆవరణాన్ని, అద్దం మాదిరిగా పారదర్శకత్వం చూపే విధంగా, దాని సాంద్రతను నిస్వార్ధత, శుద్ధత్వం అనే లక్షణాలతో తగ్గించవచ్చును. శ్రీరామకృష్ణులు గాజుపేటికగా రూపాంతరాన్ని పొందిన వ్యక్తి, ఆయనలోని ఆ జ్యోతిని మనం చూడగలం. మనమంతా ఆ మార్పుని చెందే ప్రక్రియలో ఉన్నాం, సమున్నత పరావర్తనం చెందబోతున్నాం. అయితే పేటిక మారనంతవరకు, భౌతిక సాధనాలగుండా ఆలోచించవలసినదే, దీనికి సహనం చాలా అవసరమై ఉంది, అసహనంతో విజయాన్ని సాధించలేము.
* * *
పరమయోగులంతా ఆ పరమతత్వానికి ప్రత్యక్ష నిదర్శనాలు అయితే శిష్యులు గురువుని తత్త్వంగా ఎంచి, ఆ పరమతత్వాన్ని విస్మరిస్తారు.
సాకార బ్రహ్మాన్ని గురించి బుద్ధుని నిరంతర ఖండన, విగ్రహారాధనకు దారి తీసింది. వేదకాలంలో విగ్రహాలు లేవు, ప్రజలు భగవంతుడిని సర్వత్రా దర్శించేవారు. అయితే భగవంతుడు సృష్టికర్త అని, మిత్రుడు అనే భావాలు దెబ్బ తినడంతో, విగ్రహాలు ఉత్పన్నమయ్యాయి. బుద్ధుడే ఒక విగ్రహమయ్యాడు, జీసస్ కూడా అంతే. ఈ విగ్రహ శ్రేణిలో అన్ని రకాలు కొలువుతీరి ఉన్నాయి, అయితే ఇవి ఉండవలసినవే.
సంస్కరణలు ఎప్పుడూ బలవంతంగా అమలు జరపకూడదు, అలా చేస్తే ఆశయమే వెనుకబడి పోతుంది. ఎవ్వరినీ నీవు చెడ్డవాడివి, దుర్మార్గుడివి అనవద్దు, దానికి బదులుగా, ‘నీవు మంచివాడివే, ఇంకా కొంత మంచితనం పెంచుకునే ప్రయత్నం చెయ్యమని’ సున్నితంగా చెప్పాలి.
ప్రతీ దేశంలోను మతాచార్యులు కొంత హాని చేస్తూ ఉన్నారు. వారొక ఆచారాన్ని బలపరిచేందుకు, మరి కొన్నింటిని తలకిందులు చేసే ప్రయత్నాన్ని చేస్తూ వస్తున్నారు. అయితే స్వచ్ఛమైన ప్రేమ ఎన్నడూ దూషణకు దిగదు, ఆ పని చేసేది దురాశ. న్యాయమైన కోపం, సమర్థనీయమైన సంహారం అనేవి లేనే లేవు.
మీరు ఎవరినైనా సింహంగా మారేందుకు అడ్డుపడితే, వారు నక్కగా మారే అవకాశం ఉంది. స్త్రీలు శక్తిస్వరూపిణులు, అయితే పురుషాధిక్యత వలన, వారి శక్తి చెడుకు దారి తీసి నక్కలుగా మారుతున్నారు. వారిని అణకదొక్కే ప్రయత్నాన్ని విరమిస్తే, వారు సింహాలుగా తయారవుతారు.
సామాన్య భాషలో చెప్పాలంటే, ఆధ్యాత్మిక ఆశయాలను బుద్ధిని సక్రమంగా వినియోగిస్తూ, సమత్వస్థాయిలో నిలపగలగాలి, లేకపోతే అది కేవలం భావపరత్వంగా దిగజారే ప్రమాదం ఉంది.
* * *
తత్త్వ విషయంలో భేదాలు ఉన్నా, ఆస్తికులంతా ఒక్క విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. అది మార్పు చెందే ఈ ప్రకృతి వెనుక, ఆధారభూతంగా, నిర్వికార సత్యం అనేది ఒకటి నిశ్చయంగా ఉందనే విషయాన్ని. అయితే బుద్దుడు దీన్ని సుతరాము అంగీకరించలేదు, అతను ‘బ్రహ్మము, ఆత్మ, జీవుడు లేడు’ అని అన్నాడు. అయితే శీల ప్రధానంగా చూస్తే, బుద్దుని వంటివానిని ఈ ప్రపంచం ఇంతవరకు చూసి ఉండలేదు. ఆతని తరువాత పేర్కొనబడ్డ వాడు క్రీస్తు. అయితే శ్రీకృష్ణుని బోధలు గీత ద్వారా ప్రకటింపబడి, ప్రపంచస్థాయిలో అత్యున్నతంగా నిలిచాయి. ఆ అద్భుతగీత, ప్రపంచాన్ని పునరుజ్జీవనం గావించింది; ఆ అద్భుత గీతారచయితకు దీటైన వారు ఈ ప్రపంచంలో ఇక ముందుకూడా ఉండబోరు.
లోకంలో ఉన్న శక్తి ఒక్కటే, అదే హితంగానూ, అహితంగానూ వ్యక్తమవుతూ ఉంది. మంచి, చెడూ అనేవి ఒక నది నుండి విడివడి, వ్యతిరేక దిశలలో ప్రయాణం చేసే రెండు పాయలు వంటివి.
సోమవారం, జూలై 1
(శ్రీరామకృష్ణ దేవా!)
శ్రీరామకృష్ణుల తండ్రి అత్యంత పూర్వాచార పరాయణుడైన ఒక బ్రాహ్మణుడు. ఆయన సదాచారసంపన్నులైన బ్రాహ్మణుల వద్దనే దానాన్ని స్వీకరించేవారు. అది దైవ ప్రసాదితమైన భిక్షగా భావించి తీసుకునేవారు. అందులో కూడా అవతలివారి యోగ్యతలను గుర్తిస్తేనే, వారి వద్ద తీసుకునేవారు. ఆయన ఎటు వంటి పనిని చేపట్టలేదు. ఉద్యోగిగా గాని, ఆలయపూజారిగా గాని, పుస్తక విక్రేతగా గాని, సేవకునిగా గాని ఉండేందుకు ఇష్టపడేవారు కాదు.
హైందవధర్మం దేవాలయాల మీద ఆధారపడింది కాదు; దేవాలయాలు అన్నీ ధ్వంసం కావించబడినా, సనాతన ధర్మం అణువంతైనా చెక్కు చెదరదు. మానవుడు తన కోసం కాక, దైవంకోసం, అతిథుల కోసం ఆశ్రయాన్ని ఏర్పాటు చేయాలి, అందువలన గృహ నిర్మాణం చేపట్టినా, అది స్వార్థంగా కాక, అతిథినారాయణులను సేవించేందుకని భావించాలి, అలాగే భగవంతునికి ఉనికిపట్టుగా దేవాలయాలను నిర్మిస్తారు.
శ్రీరామకృష్ణులు చిన్నతనంలో ప్రకృతి అనబడే కాళీమాత ఆలయంలో అర్చకునిగా చేరవలసివచ్చింది. దీనికి కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితులే అని చెప్పవచ్చును. ఆ ఆలయంలో కాళీమాత ఒక పురుషమూర్తి మీద తన పాదాలను ఆన్చి నిలబడి ఉంటుంది – మాయ తొలగనిదే, ఏమి తెలుసుకోలేమనేదే దీని భావం. బ్రహ్మాం స్త్రీ కాదు, పురుషుడు కాదు, అజ్ఞేయంగా, అజ్ఞాతంగా ఉంటూ, మనకు దర్శనీయమవడానికి మాయ అనే మేసుగువేసుకుని జగన్మాతగా, సృష్టిని వెలువరిస్తూ ఉంటుంది. ఆవిడ కింద ఉన్న విగ్రహం – శివునిది – మాయచే ఆవృతుడై శవంగా సాగిలపడి ఉన్నాడు. దీనికి జ్ఞాని అయినవాడు, శక్తిచే బ్రహ్మాన్ని కప్పిన మాయను తొలగిస్తాను అని అంటాడు. అదే భక్తుడైతే, ‘నేను అమ్మను ప్రార్థించి, తలుపు తెరవమంటాను. ఆ తాళంచెవి ఆమె చేతిలోనే ఉంది, ఆవిడ దయచే నేను మాయాచ్ఛాదనాన్ని తొలగించుకుంటాను’ అని అంటాడు. లక్ష్యం ఒక్కటే, దారి వేరు, అంతే.
ఈ కాళీమాతను నిత్యపూజ చేయడం వలన, మన బాలార్చకుని హృదయంలో ప్రగాఢ భక్తి నెలకొంది. అందువలన అతడు నిత్య విధిని సరిగ్గా కొనసాగించలేకపోయేవాడు. ఆలయ ఆవరణంలో ఒక మూలన కూర్చుని ధ్యాన నిమగ్నుడయ్యేవాడు. ఒక రోజు గంగా ప్రవాహం, అతడొక కుటీరాన్ని నిర్మించుకోవడానికి కావలసిన సాధనా సామగ్రిని నీటి ఒరవడితో తెచ్చి, సరిగ్గా అతని పాదాల వద్దకు చేర్చింది. ఆయన ఒక చిన్న కుటీరం నిర్మించుకుని అందులోనే ఉంటూ, ఉపవాసం చేస్తూ, విలపిస్తూ, ప్రార్థించేవాడు. ఆ లోకమాత ధ్యానం తప్ప, తక్కిన తలపులను అన్నింటిని వదిలేశాడు. బంధువు ఒకరు, రోజుకొకసారి ఆయనకు ఆహారాన్ని తినిపిస్తూ, కనిపెట్టి ఉన్నాడు. అతని ప్రయత్నంలో తోడ్పడేందుకు, కాలాంతరంలో ఒక సన్న్యాసిని అతని వద్దకు వెతుకుతూ వచ్చింది. ఆయనకు కావలసిన గురువులందరూ, ఆయనను వెదుకుతూ, వారే రాసాగారు. ప్రతీ గురువు బోధను ఆయన శ్రద్ధతో, ఆత్రుతతో ఆలకించేవారు. కానీ పూజ మాత్రం ఆ జగన్మాతకే చేసేవారు, ఆయనకి సర్వమూ జగన్మాతే.
శ్రీరామకృష్ణులు ఎవరి గురించి గాని ఒక పరుషవాక్కుని పలికి ఎరుగరు. ప్రతీ సంప్రదాయంవారూ, అతడు తమకు చెందిన వాడే అని తలపోసేంత విధంగా, చక్కని సహనముర్తిగా ఉండేవారు. ఆయన అందరిని సమంగా ప్రేమించేవారు. ఆయనకు సర్వమతాలు సత్యాలే, ప్రతీమతానికి ఆయన చోటిచ్చారు. ఆయనది ప్రేమించే విధానం, గర్జించే విధానం కాదు. శాంతమూర్తులు నిర్మిస్తారు, గర్జించేవారు వ్యాప్తిని కలిగిస్తారు. ధర్మజ్యోతిని వ్యాపింపజేయుటకు, గర్జించే వర్గంలోని వాడు సెయింట్ పాల్.*
ఏమైనా సెయింట్ పాల్ యుగం అంతరించింది. మనం నేటి నవీన జ్యోతులం కావలసి వుంది. ఇపుడు ఆవశ్యకమైనది తనను తాను చక్కబరుచుకోగల వ్యవస్థ. అలాంటిదాన్ని, మనం పొందగలిగితే, అదే లోకానికి చరమ ధర్మమై నిలుస్తుంది. తిరిగే చక్రానికి సాయపడాలికాని ఆపేందుకు ప్రయత్నించరాదు. ధార్మిక తరంగాలు ఉవ్వెత్తున లేస్తూ, పడుతూ ఉంటాయి, అందులో మహోత్తుంగ తరంగాగ్రాన్ని, యుగ ప్రవక్త అధిష్ఠించి ఉంటాడు. నిర్మాణశీలమైన నవయుగధర్మాన్ని బోధించేందుకే శ్రీరామకృష్ణులు అవతరించారు. ఆయన శాస్త్రీయ పద్ధతినే అనుసరించారు, ఇందులో ‘నమ్ము’ అని కాక ‘చూడు, నాకు కనిపిస్తోంది, నీకు కనపడగలదు’ అనే ధర్మం ఉంది. ప్రతీ వ్యక్తికీ భగవత్ప్రాప్తి కలుగుతుంది, సామరస్యం అందరికి అందుబాటులోనే ఉంది, సాధనాన్ని వినియోగిస్తే దర్శనం తప్పక కలుగుతుంది. శ్రీరామకృష్ణుల బోధనలన్నీ హిందు మత సారమే, అవి ప్రత్యేకాలు కావు. ఆయన ఎన్నడూ అలా చెప్పుకోలేదు; అంతేకాక పేరూ ప్రతిష్ఠలని ఆశించలేదు, పైపెచ్చు తృణీకరించారు.
ఆయన తన బోధామృతాన్ని ఇంచు మించుగా నలభై ఏళ్ళ వయసులో ఆరంభించారు. అయితే దీనికై ఆయన ఎవరి వద్దకు వెళ్ళలేదు, తన బోధలను కోరుతూ తన వద్దకు వచ్చే వారి కొరకై వేచి ఉన్నారు. ఆనాటి సంప్రదాయం ప్రకారం, తల్లితండ్రులు ఆయనకు ఐదేళ్ళ బాలికతో వివాహంజరిపించారు, ఆ తరువాత ఆ బాలిక తన పుట్టింటికి వెళ్ళిపోయింది. యువకుడైన తన భర్త హృదయంలో ఉన్న భగవత్ తృష్ణ అనే అలజడి గురించి ఆమెకు ఎంత మాత్రమూ తెలియదు. ఆమెకు యుక్తవయస్సు వచ్చేసరికి, ఈయన తన సాధనానిష్ఠలో సంపూర్తి పరిణితిని సాధించి ఉన్నారు. కాలినడకన ఆమె తన పుట్టినింటి నుండి బయలుదేరి దక్షిణేశ్వరంలో తన భర్త నివసిస్తున్న కాళీ ఆలయానికి వచ్చింది. స్వయంగా పావనురాలు, విశుద్ధ మనస్కురాలు కావడంచేత, చూడగానే ఆయన స్థితిని గుర్తించగలిగింది. ఆయన కార్యంలో వీలైన రీతిలో సహాయాన్ని అందించాలని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయింది, అయితే ఆయనను గృహస్థ స్థాయికి దింపాలని ఎన్నడూ తలవలేదు.
అవతారమూర్తులలో ఒకరిగా, శ్రీరామకృష్ణుని అర్చిస్తూ భారతదేశమంతటా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఆయన జన్మ దినాన్ని పండుగగా జరుపుకుంటున్నారు.
* * *
విచిత్ర ఆకారంతో, నున్నటి శిలలాగా ఉండే దాన్ని సాలగ్రామం అని అంటారు, దానిని సర్వవ్యాపి అయిన విష్ణువుకి చిహ్నంగా భావిస్తారు. ప్రతీ ఉదయం ఒక పూజారి వచ్చి, ధూప దీప నైవేద్యానంతరం, పవళింపజేస్తాడు. ఆ తరువాత ఈ రీతిగా చేస్తున్న ఆరాధనలో దోషాలుంటే మన్నించమని వేడుకుంటాడు. ఒక ప్రతీక మూలంగా, అతడు భగవంతుడిని భావిస్తూ, ఆ క్రమంలో తనదైన దివ్యాత్మను ఆ ప్రతీకలో ప్రవేశింపజేస్తాడు.
టిబెట్‌లో ఒక తెగ వారు ఈ విధంగా భావిస్తారు – ‘మంచిని, అందంగా ఉండే దానిని మాత్రమే ఆరాధించడం దౌర్బల్యం, దుష్టమైన దానిని, దాగి ఉన్నదానిని కూడా ప్రేమించి ఆరాధించాలి’. ఈ సంప్రదాయస్థులలో వివాహం ఉండదు. భారతదేశంలో వీరు రహస్యసంఘాలను స్థాపించుకుంటూ ఉంటారు, బహిరంగంగా వీరు మనలేరు. మర్యాదస్థులు ఎవరూ వాటిలో చేరలేరు. సామ్యవాదాన్ని నెలకొల్పడానికి టిబెట్‌లో మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి, మూడుసార్లు అవి విఫలమైనాయి. శక్తిని సిద్ధించుకునేందుకు, వారు తపస్సుని వినియోగించి, విజయాన్ని సాధిస్తారు.
అసలు తపస్సు అంటే ‘దహింపజేసేది’ అని అర్థం. మనలోని ఉత్తమత్త్వాన్ని తీక్షణతకు గురి చేయడానికి, ఇది ఒక విధమైన సాధన. ఇది ఒకో రీతిగా చేస్తారు. కొందరు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిరంతరంగా ఓంకారాన్ని జపిస్తూ, వ్రతంగా భావిస్తారు. ఈ క్రియలు ఒక రకమైన శక్తిని ఉద్భవింప జేస్తాయి. ఆశక్తిని నీవు భౌతికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, నీకు ఇష్టం వచ్చిన రూపంలో మార్చుకొనవచ్చును. ఇటు వంటి తపోభావన హైందవ ధర్మం అంతటా అంతర్గతమై ఉంది. విశ్వసృష్టికి భగవంతుడు తపస్సు చేసి నాంది పలికాడని హిందువులు భావిస్తారు.* ఏ కార్యాన్ని సాధించడానికైనా ఇదొక మానసిక సాధన. ‘ముల్లోకాలలో దేనినైనా సరే, తపస్సు ద్వారా పొందవచ్చును’.
* * *
వివిధ వర్గాల గురించి, సానుభూతి లేక మాట్లాడేవారంతా తెలిసీ, తెలియక అయోమయంలో ఉన్న అబద్ధాల కోరులనే చెప్పవచ్చును. కేవలం ఒక వర్గాన్ని నమ్మేవారు తక్కినవాటిలోని సత్యాన్ని చూడలేరు.
* * *
మహాభక్తుడైన హనుమంతుని ఒకరు, నేడు తిథి ఏమిటి? అని అడుగగా, ‘భగవంతుడే నా నిత్యతిథి, ఇతర తిథులను గురించి నేను లక్ష్యపెట్టను’ అని జవాబిచ్చాడు.
* * *
మంగళవారం, జూలై 2 (జగన్మాత)
(జగన్మాత)
శాక్తేయులు విరాట్శక్తిని మాతృభావంతో పూజిస్తారు. వారికి మాతృనామం మధురతమం! మాతృత్వమే భారతనారీత్వ మహోన్నతాదర్శమై విరాజిల్లుతుంది. దైవాన్ని మాతృ భావంతో ప్రేమ స్వరూపంగా ఆరాధించడాన్ని దక్షిణాపధమని అంటారు, ఈ మార్గం ఐహికసంపదలకై కాక, ఆధ్యాత్మికతను ఇనుమడింపజేసేదిగా చెబుతారు. అదే భగవంతుని, వామాచార మార్గంలో పూజిస్తే, అది విరివిగా ఐహిక సంపదలను చేకూరుస్తుంది కాని పారమార్థికతను కలిగించదు, అంతే కాక అది చివరికి పతనానికి దారి తీస్తుంది.
శక్తి మాతృరూపంలోనే ఆవిష్కృతమవుతుంది. తండ్రిగా భావించడం కంటే తల్లిగా తలచడం పైమెట్టుగా పరిగణిస్తారు.. ఒక పిల్లవాడు తన తల్లిని గురించి ఏ కార్యాన్నైనా చేయగల శక్తివంతురాలని ఎలా భావిస్తాడో, అలాగే ‘మాత’ అనే పదం వినగానే దివ్యశక్తి అనీ, సర్వశక్తిస్వరూపిణి అనీ మనకు స్ఫురిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి జగన్మాతే; ఆమెను ఆరాధించనిదే ఆత్మజ్ఞానాన్ని ఎన్నటికీ పొందలేము. దయామయురాలని, సర్వశక్తిసంపన్నురాలని, అంతటా వ్యాపించి ఉన్నదనీ, అనేవన్నీ ఆ లోకమాతకు విశేషణాలు. ఈ విశ్వశక్తికి మూలకారణం అ జగన్మాత. ఈ విశ్వమంతటా నిండి ఉన్నది ఆమె శక్తే, ఆమే ప్రాణం, ఆమే జ్ఞానం, ఆమే ప్రేమమయం. విశ్వమంతటా ఉన్నా ఆమె విశ్వం కంటే వేరుగానే ఉంది. ఆమె సాకారంగా, మాతృభావంలో స్పందిస్తుంది (శ్రీరామకృష్ణులు ఆమెను దర్శించిన విధంగా), ఆమె మన ప్రార్థనలను ఆలకించి, సఫలం చేస్తుంది.
ఏ రూపంలోనైనా, ఏ క్షణంలోనైనా ఆమె మనకు దర్శనమిస్తుంది. ఆ తల్లికి నామరూపాలు రెండు ఉండచ్చు లేక రూప రహితంగా నామం మాత్రమే ఉండవచ్చు; ఈ విభిన్న వైఖరులలో ఆమెను ఆరాధిస్తే, నామరూప రహితమైన ఆ చిత్స్వరూపాన్ని అందుకోగల స్థాయికి చేరగలం.
శరీరంలోని జీవాణువుల సముదాయాన్ని కలిపి వ్యక్తి అన్నట్లుగా, ప్రతీజీవిని అణువుగా భావిస్తే, ఆ అణువుల సముదాయమే ఈశ్వరుడు, ఆపైన ఉన్నదే నిర్గుణ బ్రహ్మం. శాంతస్థితిని కలిగి ఉన్న సాగరం నిర్గుణ బ్రహ్మమైతే, అలలతో ప్రచలితమైన సాగరం జగన్మాత. ఆమె దేశ, కాల, నిమిత్తాలకు ఆధారం. ఆమె రెండు విధాలుగా ఉన్నది – ఒకటి షరతులకు లోబడిన విధానం, రెండవది అతీతమైనది. మొదటి దాని యందు ఆమె దైవంగా, జీవునిగా, ప్రకృతిగా భాసిస్తుంది. రెండవదానియందు ఆమె తెలియబడనిదిగా, తెలియరానిదిగా అలరారుతోంది. త్రికోణపు ఉనికిని గల జీవుడు, దేవుడు, ప్రకృతి అనే విశిష్టాద్వైతపు త్రిపుటి ఇందునుండే వెలువడింది.
జగన్మాతలోని ఒక అంశ కృష్ణునిగా, మరొకటి బుద్దునిగా, వేరొకటక్రీస్తుగా భాసించింది. ఆ జగన్మాత అంశను మన తల్లిలో లేశమైనా చూసి, ఆరాధించగలిగితే, అది మహత్త్వాన్ని చేకూరుస్తుంది. భక్తి, జ్ఞానం కావాలంటే ఆమెను తప్పక ఆరాధించాలి.
బుధవారం, జూలై 3
ఒక విధంగా చెప్పాలంటే మతమనేది భయంతో మొదలవుతుంది. ‘భగవంతుడిని గురించిన భయమే జ్ఞానానికి ప్రాతిపదిక’ అయితే క్రమంగా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. అయితే సంపూర్ణజ్ఞానం కలిగే వరకు భయం ఛాయలు నిలిచే ఉంటాయి. క్రీస్తు మానవుడై ఉన్నందున, కాలుష్యాన్ని చూసి నిరసించాల్సి వచ్చింది; కాని భగవంతుడో, దోషాన్ని పరిగణించడు, కోపాన్ని పొందడు. దోషోద్ఘాటనం ఎప్పటికి మహోన్నతం కాలేదు. డేవిడ్ చేతులు రక్తసిక్తాలైనందున, అతడు ఆలయాన్ని నిర్మించలేక పోయాడు.*
మనలో ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ ఎంతగా అభివృద్ధి చెందితే, అంతగా వాటిని బాహ్యంగానూ చూడగలం. పరదూషణం వాస్తవానికి ఆత్మ దూషణమే. నీ పరిధిలో ఉన్న పిండాండాన్ని నీవు చక్కబెట్టగలిగితే, బ్రహ్మాండం తనంతట తానే నీకు సరిపడే విధంగా ఉంటుంది. ఇది జలశాస్త్రంలో చెప్పబడిన విధంగా, ఒక నీటి బిందువు విశ్వంతో సరితూగగలదు అనే విషయం వంటిది. మనలో లేనిది మనకు బయట కనపడదు. ఒక చిన్న ఇంజనుకు పెద్ద ఇంజను ఎలాగో ఈ విశ్వం మనకు అలాంటిది; చిన్నదానిలో కనిపించే దోషం పెద్దదానిలో ఏర్పడే చిక్కుని ఊహింపజేస్తుంది.
ప్రపంచంలో సాధించబడిన ప్రతీ విజయం, ప్రేమ చేత సాధించబడిందే. దోషారోపణం చేత ఎన్నడూ మేలు జరుగదు. వేల కొద్దీ సంవత్సరాలుగా, విమర్శనామార్గాన్ని పరిశీలించడమైనది, ఖండన దేన్నీ సాధించలేదు.
నిజమైన వేదాంతికి అందరి పట్లా సానుభూతి ఉండాలి. అద్వైతమే వేదాంతానికి ఆత్మ. ద్వైతులు తమ మతం ఒక్కటే ముక్తిమార్గమని తలుస్తూ, పరమత సహనాన్ని తక్కువ కలిగి ఉంటారు. శైవులు అనబడే ఇంకొక రకం ద్వైతులలో, ఘంటాకర్ణుడనే భక్తుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘంటాకర్ణుడు శివపూజా దురంధరుడు.అతని భక్తి ఎటువంటిదంటే, ఇతర దేవతల పేర్లు పొరపాటున కూడా చెవిని బడకుండా చెవులకు రెండుగంటలు కట్టుకుంటాడు. అయితే అతని భక్తి ప్రగాఢమైనది కావడంతో, శివుడు తనకూ, విష్ణువుకి అభేదం లేదని తెలిపేందుకు సగం విష్ణువుగా, సగం శివునిగా గల రూపంతో అతని ముందు ప్రత్యక్షమవగా, ఆయనకు ధూపం సమర్పిస్తూ, ఆ ధూపం విష్ణు సగభాగంగల నాశికారంధ్రంలోనికి వెళ్ళడంచూసి, విష్ణువు ఆ సువాసనను ఆఘ్రాణించకుండా, దురభిమానంతో తన వేలితో ఆ నాసికా పుటాన్ని మూసి వేశాడు.
* * *
మాంసాహారి అయిన సింహం ఒక చరువు చరిచి, చతికిలబడుతుంది కాని ఓరిమిగల ఎద్దు రోజంతా తింటూ, నిద్రిస్తున్నా నడుస్తూంటుంది. చురుకైన వ్యక్తిగా పేర్కొనబడే అమెరికన్, వరిఅన్నం తిని జీవించే చైనాదేశపు కూలీవాడితో పోటిలో నిలబడలేకపోతున్నాడు. సైన్యం పెత్తనం ప్రాబల్యంలో ఉన్నంత వరకూ మాంసాహార భక్షణం కొనసాగుతుంది; కాని విజ్ఞానం వికాసం పొందే కొద్దీ, ఈ ప్రాబల్యం తగ్గి, శాకాహారులకు ప్రవేశం కలుగుతుంది.
* * *
భగవంతుని ప్రేమించుటకై మనలను మనం విభజించుకుంటున్నాము – నేను, నా ఆత్మను ప్రేమించడం. దేవుడు నన్ను సృజిస్తే, నేను దేవుని సృజించాను. మన నమూనాని అనుసరించి మనం భగవంతుడిని సృజించాము కాని ఆయన మనలను దాసులుగా చెప్పలేదు. మనమే మన ప్రభువుగా ఆయనని సృష్టించుకున్నాము. భగవంతుడూ, మనము ఏకమేనని సఖులమని గ్రహించగలిగినపుడు సమత్వస్థితి, స్వాతంత్ర్యమూ సిద్ధిస్తుంది. నిత్యత్వానికి నీవు దూరంగా ఉన్నంత కాలం, చివరికి ఒక వెంట్రుకవాసి దూరంలో ఉన్నా, భయం నిన్ను వీడదు.
లోకానికి ఏమి లాభం చేకూరగలదు? అనే మూర్ఖపు ప్రశ్న ఎన్నడూ వేయవద్దు, లోకం సంగతి వదిలేసి, ప్రేమించడం నేర్చుకో కాని ప్రతిఫలం ఆశించకు; ప్రేమించు కాని దేని కొరకు నిరీక్షించకు; ప్రేమించు, అన్ని మతాలను మరిచిపోయి ప్రేమించు; ఆ ప్రేమ అనే మద్యాన్ని ఉన్నత్తునివై గ్రోలుము; ‘ఓ దేవా! నేను సదా నీ వాడినే, నేను సదా నీ వాడినే’ అంటూ ఇతర విషయాలన్నీ మరిచి, నిమగ్నుడవవు. భగవంతుడంటే ప్రేమ స్వరూపమే. ఒక పిల్లి తన పిల్లలను ప్రేమించడాన్ని చూస్తే, ఆ భావంలో నిమగ్నమై నీవు అక్కేడ్ నిలబడి ప్రార్థించు, భగవంతుడు అక్కడే ప్రత్యక్షమవుతాడు. ‘నేను నీ వాడిని, నేను నీ వాడిని’ అని సదా పలుకుతూ ఉండు, ఆయన్ని అన్వేషించకు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు, కన్నెత్తి చూడు, అంతే!
విశ్వజ్యోతి, జగదాధారమైన ఆ పరమాత్మ మిమ్మల్ని శాశ్వతజీవులుగా ఒనర్చు గాక!
* * *
నిర్గుణ బ్రహ్మాన్ని మనం పూజించలేం, కాబట్టి మన స్వభావానికి తగినట్లుగా అవతారమూర్తిని పూజించాలి. జీసస్ మన స్వభావం కలిగి ఉన్న వాడే, అతను క్రీస్తు కాగలిగాడు, మనమూ కాగలం, అలా అవగలగాలి. క్రీస్తు, బుద్దుడు అనేవి మనకు ప్రాప్యమయ్యే స్థితికి పేర్లు మాత్రమే. జీసస్, గౌతముడు అనబడేవారు ఆ స్థితిని వ్యక్తీకరించారు. జగన్మాత అవతారం అన్నింటి కంటే మహోన్నతమైనది. మన చుట్టూ ఆవరణాన్ని నిర్మించుకునే వారం మనమే, ఆ బంధాలను వదిలించుకోగలవారమూ మనమే. ఆత్మ భయరహితమైనది. బాహ్యంగా భగవంతుడిని పూజించడం మంచిదే, కాని మనం ఎందుకు చేస్తున్నామనేది ఆ స్థితిలో బోధపడదు. మనకు ఆత్మజ్ఞానం కలిగినపుడు మాత్రమే, అది గ్రాహ్యమవుతుంది. ప్రేమ దాల్చే మహోన్నతరూపం సాయుజ్యమే.
“తన్ను పురుఘనిగ నను నాడుదానిని గను
కన్న కాలమదెప్పుడో గడచిపోయె;
నిరువురము గాగ నుండిన స్కృతియె మిగిలె
నొక్కరముగనైతిమి ప్రేమ మిక్కుటముగ”
-పారసీక సూఫీగీతం*
జ్ఞానం నిత్యమై, భగవంతునితో పాటు ఉండేదే. ఆ ఆధ్యాత్మికతను కనుగొన్న ద్రష్ట దివ్యావేశంతో, దానిని లోకాన ఆవిష్కరించాడు. అయితే వెలిబుచ్చినది కూడా నిత్యమైనదే, అయినా ఇదే చివరిదని దృఢపరుచుకుని, గుడ్డిగా అనుసరించరాదు. హైందవులు తమ మతాన్ని తామే విమర్శించడానికి సాహసిస్తారని, వారిని జయించిన వారు, ఏళ్ళగా విమర్శిస్తూ ఉన్నారు, కాని ఇదే హైందవులను స్వతంత్రులను చేస్తోంది. విదేశీపాలకులు తమకు తెలియకుండానే వారిని స్వతంత్రులను చేశారు. నిజంగా పూజించవలసినదానిని దూషిస్తున్నామనే భావన హిందువులలో లేనే లేదు. పవిత్ర విషయాలను గురించి మాట్లాడడాన్ని పవిత్రకార్యంగానే వారు భావిస్తారు. అంతే కాక ప్రవక్తల పట్ల, గ్రంధాల పట్ల, కపట భక్తి పట్ల వారికెలాంటి కృత్రిమ గౌరవమూ లేదు.
చర్చ్ క్రీస్తుని తనకు అనుగుణంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుందే కాని, క్రీస్తుకు అనుగుణంగా తనను దిద్దుకో యత్నించదు. అందువలన ఆ ఉపయోగానికి అనుకూలమైన గ్రంథాలు మాత్రమే పదిల పరచబడినాయి. దీని సారాంశం ఏమంటే గ్రంథాల మీద మనం ఆధారపడకూడదు. గ్రంధపూజ కూడా స్వేచ్ఛను అరికట్టే విగ్రహారాధన వంటిదే. విజ్ఞానం, మతం, తత్త్యం సర్వం గ్రంథంలో తప్పక ఉండాలి.
జీవరాశిలో, అన్నిటికన్నా మానవజన్మే ఉత్కృష్టమైనది. ఈ లోకమే అన్నిలోకాల కన్నా గొప్పది. మానవమేధకు అందని విధంగా దేవుడిని ఊహించజాలం కనుక దేవుడు మానవుడు, మానవుడే దేవుడు. అయితే మన ఆలోచనస్థాయిలో ఉన్నతిని కలిగిన నాడు, మన మనశ్శరీరాలను, భావనను, అతిక్రమించవలసి ఉంటుంది, లోకాతీతులం కావలసి ఉంటుంది. నిర్గుణ తత్త్వాన్ని అందుకున్నాక, ఈ లోకంలో మనలేము. మన గ్రాహ్యంలో ఉన్న ఈ ప్రపంచంలో, మానవుడే శిఖరాన్ని అధిరోహించినవాడు.
మొత్తం జ్ఞానం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది; ఒక్కప్పుడు అది అధికంగానూ, ఒకప్పుడు స్వల్పంగానూ వ్యక్తమవుతూ వస్తుంది, అంతే, దాని మూలం మనలోనే ఉంది, అక్కడే దానిని కనుగొనగలం.
* * *
పదాలచే, వర్ణాలచే, ధ్వనిచే వ్యక్తమయ్యే అనుభవాలే, కవిత్వంగా, చిత్రలేఖనంగా, సంగీతంగా అలరారుతున్నాయి.
* * *
త్వరితంగా పాపఫలాన్ని అనుభవించేవారు ధన్యులనే చెప్పాలి ఎందుకంటే వారి ఖాతా తొందరలోనే ముగించబడుతుంది! ఎవరి శిక్ష నిలిపి ఉంచబడుతుందో, వారే మందభాగ్యులు, వారి దుఃఖానుభవం మరింతగా పెరుగుతుంది.
సమత్వస్థితిని సాధించినవారు ఆ దైవమును చేరిన వారిగా చెప్పబడుచున్నారు. ద్వేషము ఆత్మహత్యతో సమానం, కనుక జీవన ధర్మం ప్రేమ అని చెప్పబడింది. ఈ స్థాయికి ఎదిగినవాడు, పరిపూర్ణతను పొందినట్లే. మనం ఎదిగే కొద్దీ, కార్యాచరణం తగ్గుతూ వస్తుంది. సాత్త్వికులు ఇదంతా బాల్యక్రీడగా భావిస్తారు తప్ప దేని గురించి విచారించరు.
దెబ్బ కొట్టడం సులువే, కాని కోపాన్ని నిగ్రహించుకుని కొట్టకుండా ఆగడం చాలాకష్టం. “ఓ పరమేశ్వరా! నిన్ను నేను శరణు వేడుతున్నాను” అని సంపూర్తిగా శరణాగతి భావంతో, సర్వం ఆయనకి వదిలేసి నిమిత్తభావాన్ని ఏర్పరుచుకోవాలి.
శుక్రవారం, జులై 5
నీవు మారడానికి సంసిద్ధంగా లేకపోతే, సత్యాన్ని గాంచలేవు. అయితే ఈ సత్యాన్వేషణలో దృఢమైన సంకల్పం, పట్టుదలను కలిగి ఉండాలి.
భారతదేశంలో, ప్రాచీన శాఖలలో ఒకటైన చార్వాకుల శాఖ పరమ భౌతికవాదులు నాస్తికులు. అయితే వారు ఇప్పుడు అంతరించారు, వారి గ్రంథాలు కూడా చాలా మటుకు నశించాయి. ‘ఆత్మ శరీరం నుండి ఉత్పన్నమై, దానితో నశిస్తుంది, శరీర పతనానంతరం ఆత్మ ఉందనడానికి ప్రమాణం లేదు’ అన్నది వారి వాదన. విషయసుఖాలకు ప్రాధాన్యతను ఇస్తూ, అగోచరమైన దానిని వారు నిరాకరించారు.
* * *
జీవాత్మ పరమాత్మ యందు ఐక్యతను చెందుటయే సమాధి అనబడును. ఇది సమత్వస్థితిని కలిగి ఉండడమని చెప్పవచ్చును.
* * *
భౌతికవాదం, ‘ముక్తి పొందడనేది భ్రమ’ అని అంటుంది. అయితే ఆదర్శవాది ‘బంధంలో ఉన్నామనుకోవడమే భ్రాంతి’ అని చెబుతాడు. అయితే వేదాంతం ఇలా అంటుంది – ‘నీవు బద్ధుడవు, ముక్తుడవు అన్న రెండూ నిజాలే; ఐహికావస్థలో సదా బద్ధుడివి, ఆధ్యాత్మికావస్థలో సర్వదా విముక్తుడవు’. బంధమోక్షాలకు, రెండింటికీ, అతీతుడవు కావడానికి ప్రయత్నించుము.
మనమంతా శివస్వరూపులం, నాశరహిత ఇంద్రియాతీత జ్ఞాన స్వరూపులం.
అఖండ శక్తి అందరిలోనూ నిబిడీకృతమై ఉన్నది; ఆ జగన్మాతను ప్రార్థిస్తే నీలోని శక్తి నీకు తెలియవస్తుంది.
ఓ మాతా! వాగ్ధాత్రీ! చేతనాస్వరూపిణివై, వాగ్రూపిణివై నా జిహ్వయందు నర్తించుమా!
ఓ కాళీ! మేఘగర్జనలో దాగి ఉన్న ఓ మాతా! కాల రూపిణీ! అమోఘశక్తి స్వరూపిణీ! నాలో ఆవిర్భవించుమా!
శనివారం, జూలై 6
(వ్యాససూత్రాలకు శంకరుల వేదాంత భాష్యం నేటి ప్రసంగాంశం)
ఓం తత్ సత్!
శ్రీశంకరుల ప్రకారం, విశ్వంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటనేను, రెండవది నీవు; ఈ రెంటికీ వెలుగుకి, చీకటికి ఉన్న వ్యత్యాసం ఉంది, అందువలన అవి ఒకదాని నుండి ఇంకొకటి వచ్చిందని చెప్పజాలము.
విషయిలో విషయం ఆరోపించబడింది, ఇందు విషయం సత్యం, రెండవది కేవలం ఆభాసం. దీనికి విరుద్ధంగా నిరూపించలేం. జడం, బాహ్యప్రపంచమనేవి ఒకానొక స్థితిలో ఉన్న ఆత్మే వాస్తవానికి నెలకొని ఉన్నది ఒక తత్త్వమే.
సత్యాసత్యాల మేళవింపు నుండి ఈ ప్రపంచం నిర్మితమైనట్లు మనకు గోచరమవుతోంది. సంసారమనేది విరుద్ధశక్తుల పరస్పర సంఘర్షణమని చెప్పవచ్చును, ఇది ఎలాంటిదంటే సమాంతర చతుర్భుజంలో ఒక బంతి ఒక మూల నుండి వ్యతిరేక దిశలో ఉన్న ఇంకో మూలకు పరుగిడునట్లుగా ఊహించవచ్చును. ప్రపంచమే దేవుడు, అదే సత్యం, కానీ మనం చూసే విధంగా కాదు. దీనిని ‘అధ్యాస’ అని అంటారు. ఇందులో వ్యావహారిక సత్తా అంటే ప్రపంచం, పారమార్థిక సత్తా అంటే బ్రహ్మం, మాయ ప్రభావంచే, పారమార్థిక సత్తా అయిన బ్రహ్మమును, జనులు ప్రపంచంగా భావిస్తారు. ఇది ఎలాంటిదంటే ముత్యపుచిప్పలో లేని మెరుపుని (వెండిని) మనం చూశామని చెప్పడం వంటిది. మనం చూసిన ఒక దృశ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేటప్పుడు, తాత్కాలికంగా మన మదిలో ఆ దృశ్యం కదలాడినా, అది యదార్థం కాదు కదా, ఇది కూడా అటువంటిదే. ఇంకొక ఉదాహరణ తీసుకోవచ్చును, వేడిమి నీటి ధర్మం కాదు, కాని నీరు వేడిగా ఉంది అంటే తనది కాని ధర్మాన్ని తనపై ఆరోపించినట్లే కదా. వాస్తవానికి, సత్యం మన ముందే ఉన్నా, మనం చూసే మాధ్యమాన్ని బట్టి అది ఇంకొక రీతిలో కనిపిస్తుంది.
మనోగోచరంగానే తప్ప నిన్ను నీవు ఎన్నటికి తెలుసుకోలేవు. ఒక వస్తువును మరొక దానిగా భ్రమించేటప్పుడు, ప్రత్యక్షంగా ఉన్నదానినే పరిగణిస్తాం కాని పరోక్షమైన దానిని తలవము. ఇలాగే మనం విషయాన్ని విషయిగా భ్రమిస్తున్నాం. ఆత్మ ఎప్పుడూ విషయం కాదు. మనస్సు అంతరింద్రియం అయితే బాహ్యేంద్రియాలు దాని ఉపకరణాలు. ‘నేను ఉన్నాను’ అని గ్రహించ గల శక్తి విషయిలో ఉన్నా, ఆత్మ పరంగా విషయమవగలదు కాని మనస్సు పరంగా, ఇంద్రియపరంగా విషయమవడం లేదు. ఒక భావం మీద ఇంకో భావాన్ని ఆరోపించగలం, ఉదాహరణకి ఆకాశం నీలంగా ఉందంటే, ఆకాశం ఒక భావం మాత్రమే. దాని మీద ఇంకొక భావాన్ని ఆపాదిస్తున్నాం, అందువలన నీలంగా ఉందని చెబుతున్నాం, అంతే!
విద్యా, అవిద్యా ఉన్నా, ఆత్మ ఎన్నడూ అవిద్య చేత బాధితం కాదు. వ్యావహారిక జ్ఞానం మంచిదే, ఎందుకంటే అదే పారమార్థికతకు దారి తీస్తుంది. ఇంద్రియ పరమైన జ్ఞానం గాని, మానసిక జ్ఞానంగాని, వైదిక జ్ఞానంగాని పారమార్థికం కాదు, ఎందుకంటే ఇవన్నీ వ్యావహారిక జ్ఞానానికి సంబంధించినవే. ‘నేను దేహాన్ని’ అనే భ్రాంతి మొట్టమొదట పోగొట్టుకుంటే, తత్త్వ జ్ఞానం వైపు అడుగు సాగుతుంది. పశు జ్ఞానం కన్నా మానవుని జ్ఞానం ఒక మెట్టుపైనే ఉంది.
* * *
వేదాలలోని ఒక భాగం కర్మకాండ, కర్మకలాపాలకు చెందినది కాగా ఇంకొక భాగం బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది. ఈ రెండో దానిలో తత్త్వం కూడా ఉంది. ఈ భాగంలో ఆత్మతత్త్వం గురించిన వివరణ ఉండటం చేత, వేదజ్ఞానం పారమార్థిక జ్ఞానానికి దగ్గరగా ఉంది. అయితే బ్రహ్మజ్ఞానమనేది ఏ పుస్తకం మీదా ఆధారపడి ఉన్నది కాదు, అది నిరపేక్షమైనది. గ్రంధపఠనం చేత, వివరణ చేత వాస్తవాన్ని అనుభవంలోనికి తెచ్చుకోలేము. మనస్సనే అద్దం నుండి ధూళిని తుడిచివేస్తే, అది నిర్మలమైన తక్షణం, సాక్షాత్కారమన్నది అనుభవానికి వచ్చి, నీవు బ్రహ్మమేనని గుర్తించగలవు.
దేవుడున్నాడు అయితే చావు పుట్టుకలు గాని, మంచి చెడులుగాని, పాప పుణ్యాలు గాని, లేవు – ఉన్నది అంతా బ్రహ్మమే.* మనం తాడుని చూసి పాము అని భ్రమిస్తున్నాం, తప్పు మనలో ఉంది. మనం భగవంతుని ప్రేమిస్తే మంచిని మాత్రమే చేయగలం ఎందుకంటే ఆయన ప్రేమలో ప్రతిబింబిస్తాడు.
ఆత్మకు కులం లేదు, ఉందనుకోవడం భ్రాంతిదాయకం. అలాగే చలనం, గుణం, జనన మరణాలు కూడా లేవు. అది ఎన్నటికి మార్పు చెందనిది, ఎప్పటికీ నిలిచి ఉన్నది. తాను ధరించే రూపాలన్నింటికి, ఆత్మ నిత్యసాక్షి, అయితే మనం రూపాన్నే ఆత్మగా భావిస్తున్నాం. అది నిత్య మాయ, తుది మొదలు లేక నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. వేదాలు ఒక మెట్టు దిగి మనకు తత్త్వం బోధించాలి ఎందుకంటే అత్యున్నతమైన తత్త్వాన్ని, అత్యున్నత మార్గంలో బోధిస్తే, మనం గ్రహించజాలం.
స్వర్గమనేది వాంఛ నుండి ఉత్పన్నమైన ఒక మూఢ విశ్వాసం. వాంఛ ఎప్పుడూ పతనానికే దారి తీస్తుంది. ప్రతీ దానిని దైవ భావంతోనే సమీపించు, లేనిచో దోషం కానవస్తుంది. భ్రమ అనే ఆచ్ఛాదం తొలగనంతవరకూ, దోషాలు కనబడుతూనే ఉంటాయి, ఈ భ్రమల నుండి విముక్తి చెందటమే మోక్షం.
ఒక విధంగా ఆలోచిస్తే, బ్రహ్మం ప్రతీ వ్యక్తికి తెలిసే ఉంది; ‘నేను ఉన్నాను’ అని ప్రతీ వ్యక్తికి తెలుసు, అయితే దాని అంతరార్ధం తెలవదు. ఉన్నామని అందరికీ తెలిసినా, ఎలా ఉన్నామన్నది తెలియదు. సాధారణ జ్ఞానంతో అది తెలవదు. కాని వికసిత పుష్పమైన వేదసారాంశం ‘మనలో ప్రతీ వ్యక్తిలో ఉన్న ఆత్మ బ్రహ్మమేనన్న’ మకరందాన్ని కలిగి ఉంది. మనకు గోచరమయ్యేవి – జననం, వికాసం, మరణం అనే మూడు అవస్థల్లో ఉన్నాయి. అయితే మన అనుభూతి వేదాతీతం, ఎందుకంటే అనుభూతి మీదనే వేదాలు ఆధారపడి ఉన్నాయి. పరతత్త్వశాస్త్రమే మహోన్నతమైన వేదాంతం అని చెప్పవచ్చును.
సృష్టికి ఆది ఉన్నదనడం తత్త్వశాస్త్రానికి గొడ్డలిపెట్టు వంటిది. విశ్వానికి శక్తినిచ్చేది మాయ, ఇది రెండు రీతులలో, స్థిరంగానూ అస్థిరంగానూ వ్యక్తమవుతూ ఉంది. జగన్మాత మనలను విముక్తులను చేయనిదే, మనం దీనినుండి బయటపడలేము.
జగత్తు భోగార్థం ఏర్పడి ఉన్నది, అయితే దేనినీ ఆశించకు. ఆశించడమే దౌర్బల్యం. కోరిక మనలను యాచకులుగా మారుస్తోంది. మనం చక్రవర్తి తనయులమే కానీ యాచకులం కాదు, ఇది గుర్తు ఉంచుకోండి.
ఆదివారం, ఉదయం జులై 7
ఆ అనంత స్వరూపం తనను తాను అనేకాంశాలుగా విభాగించుకున్నా, అనంతంగానే నిలిచి ఉంది. దాన్లోని ప్రతీ అంశా అనంతమే అయి ఉన్నది.*
ఆ బ్రహ్మము సాకారరూపంగా ఉన్నా, నిరాకారంగా ఉన్నా, వ్యక్తంగా ఉన్నా, అవ్యక్తంగా ఉన్నా, ఎప్పుడూ ఒక్కటే అన్నది అర్థం చేసుకోవాలి. తెలిసినవాడు (జ్ఞాత), తెలుసుకోదగినది (జ్ఞేయము) ఒక్కటే అని గ్రహించాలి. తెలిసినవాడు (జ్ఞాత) తెలుసుకోదగినది (జ్ఞేయం), ఆ జ్ఞానం గురించిన అవగాహన అనే ఈ త్రిపుటిచే విశ్వం వ్యక్తం అవుతోంది. అలాంటి ఆ బ్రహ్మాన్ని యోగి తన ఆత్మశక్తిచే ధ్యానంలో అనుభూతి చెందగలుగుతున్నాడు.
మనం ప్రకృతి అన్నా, విధి అన్నా, అది కేవలం ఆ భగవత్సంకల్పం మాత్రమే.
భోగాలను అపేక్షిస్తున్నంత కాలం బంధం నిలిచే ఉంటుంది ఎందుకంటే కోరికలను తీర్చుకోవడమే భోగం, ఆ భోగం ఎప్పుడూ అపరిపూర్ణమైనదే. జీవాత్మ ప్రకృతితో తాదాత్మ్యం చెందుతుంది. జీవాత్మ, ప్రకృతి, భగవంతుడు అనే మూడింటికి అంతర్గతంగా ఉన్న వాస్తవం ఆ బ్రహ్మమే, అయితే దానిని మనం వెలికి తేనంతవరకూ అదృశ్యంగానే ఉంటుంది. రాపిడి చేత నిప్పుని పుట్టించినట్లుగా, శరీరాన్ని కింద అరణిగా, ప్రణవాన్ని వాడిగా ఉన్న అరణిగా చేసుకుని, ధ్యానమనే మధనాన్ని తీవ్రంగా చేస్తే, బ్రహ్మజ్ఞాన తేజం ఆత్మలో ప్రదీప్తమవుతుంది, దానికి తపం అవసరం. శరీరాన్ని నిటారుగా నిలబెట్టి, బయటకు పరుగిడే ఇంద్రియాలను అంతర్ముఖం గావించి మనస్సులో నెలకొల్పాలి, అప్పుడు ధారణచే మనస్సుని ఏకాగ్రంగా ధ్యానంలో లగ్నం చేయాలి. పాలలోని వెన్నమాదిరిగా బ్రహ్మం విశ్వం అంతా వ్యాపించి ఉంది, అయితే మథనం వల్లనే అది వ్యక్తం అవగలదు. అందువలన ధ్యానం ఆత్మ సాక్షాత్కారానికి సాధనం అవుతుంది.
ఇంద్రియాతీతమైన శుద్ధచైతన్యం ఒకటి ఉందనీ, అదే స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనీ హైందవ వేదాంత శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.
* * *
చలనమే జగత్తు, మథనం చివరకు సమస్తాన్ని అంతమొందిస్తుంది. అంతట విరామం ఏర్పడి, తిరిగి సర్వం ప్రారంభమవుతుంది.
* * *
చర్మావరణంపై భ్రాంతి ఉన్నంత వరకూ, అంటే శరీరమే తాను అనే తలంపు కలిగి ఉన్నంతవరకూ, భగవంతుడిని చూడటం సాధ్యపడదు.
* * *
ఆదివారం, మధ్యాహ్న సమయం
భారతదేశంలో దర్శనశాస్త్రాలు ఆరు ఉన్నాయి, అవి ప్రామాణికాలు. ఎందువల్లనంటే అవి వేదం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి.
వ్యాసుని వేదాంతం ఉపనిషత్తులను మించి ఉంది. ఆయన సూత్రభావంలో రచించాడు (బ్రహ్మసూత్రాలు). ఇవి విశేషంగా సందిగ్ధార్ధాంగా నిలవడంతో, వీటి నుండి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతంగా వెలువడి, వివిధ భాష్యకారులు వారి వారి భావనలకు అనుగుణంగా వీటిని మలుచుకున్నారు.
మతగ్రంథాలు విశేషంగా వ్యక్తుల చరిత్రలు తెలియజేసినా, ఉపనిషత్తులలో అని ఉండవు. వేదాలు ఇంచుమించుగా తత్త్వ ప్రతిపాదికలుగానే నిలుస్తాయి. తత్త్వంలేని మతం మూఢవిశ్వాసాలకు నిలయమైతే, మతంలేని తత్త్వం నాస్తికత్వానికి దారితీస్తుంది.
అద్వైతాన్ని మరోవిధంగా చెప్పేదే విశిష్టాద్వైతం, దీని ప్రచారకుడైన రామానుజుడు ఇలా తెలియచేస్తాడు – ‘లోకహితార్థమై, వేదవ్యాసుడు వేదాలనబడే క్షీరసాగరాన్ని మధించి, వేదాంతమనే ఈ నవనీతాన్ని (వెన్నను) మనకు అందించాడు.’ అంతే కాక, ‘సకలగుణాలు, అర్హతలు కేవలం ఆ విశ్వానికి అధిపతి అయిన ఆ పరబ్రహ్మానికి (శ్రీమహావిష్ణువు) మాత్రమే చెందినవి’ అని అన్నారు. శుద్ధ ద్వైతానికి చెందిన మధ్వుని మతంలో, స్త్రీలకు వేదాధ్యయనం చేసే అర్హత ఉంది. ఆయన ఉదాహరణలు ముఖ్యంగా పురాణాల నుండి ఉంటాయి. అయితే ఆయన దృక్పథం ప్రకారం మోక్షం విష్ణువు ద్వారా తప్ప అన్యులవలన రాదు. బ్రహ్మమనగా విష్ణువే కాని శివుడు కాదని అంటారు.
సోమవారం, జులై 8
అయితే మధ్వుని వ్యాఖ్యలలో తర్కం లేదు, అది వేదావిష్కరణంగానే ఉంటుంది.
రామానుజులు ఇలా అంటారు – ‘వేదాధ్యయనం పరమ పవిత్రమైనది. అందువలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల సంతానం అవశ్యం చిన్నతనం నుండి (ఎనిమిది, పది లేక పదకొండేళ్ళ వయస్సు) గురుసన్నిధికి వెళ్ళి వేదాధ్యయనాన్ని సాంగోపాంగంగా ఆరంభించాలి.’
జపం అంటే పవిత్ర మంత్రాన్ని పదే పదే ఉచ్ఛరించడం అని అర్థం; దాని వలన భక్తుడు బ్రహ్మాన్ని పొందగలుగుతాడు. అయితే కేవలం యజ్ఞ, యాగాదులనే పడవ ద్వారా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి సాధ్యం కాదు, దానికి మించిన సాధనం కావాలి. అజ్ఞానం నశింప చేసుకోవడమే ముక్తికి మార్గం, అది బ్రహ్మజ్ఞానం కలగడం వల్లనే సాధ్యపడుతుంది, అందువలన బ్రహ్మజ్ఞానమంటేనే మోక్షం. అయితే దీనికై యజ్ఞయాగాలనే కర్మకలాపాలు మాత్రమే సాధనాలుగా భావించక, ప్రణవజపాన్ని అనుష్ఠానం చేస్తే అది సహాయపడగలదు.
అన్నింటా భేదాన్ని చూడటమే అజ్ఞానానికి మూల కారణంగా చెప్పబడింది, ఇది దుఃఖ హేతువుగా పరిణమిస్తుంది. అందువలన ఏదో పొందగోరి, ఆశించి చేసే ఆ కర్మకలాపాలు తారతమ్యాలను పెంపొందించేవి కనుక, వాటిని విడనాడడమే శ్రేయస్కరం.
మనమే ఆత్మ, ఆ ఆత్మ బ్రహ్మం తప్ప వేరుకాదు. ఆ బ్రహ్మం నిష్క్రియమైనది అనే జ్ఞానం సమస్త భ్రమలను తొలగించి వేస్తుంది. ఆ తత్త్వజ్ఞానాన్ని ముందుగా ఆలకించాలి, తరువాత మననం చేసుకోవాలి, చివరకు దానిని అనుభూతం చేసుకోవాలి. తర్కాన్ని ఉపయోగిస్తూ, నిరంతర మననంతో ఆ జ్ఞానాన్ని మన జీవితంలో భాగం చేసుకుంటూ, నెలకొల్పగలగడమే అనుభూతిగా చెప్పవచ్చును. ఈ ధ్యానాన్ని, ఎడతెగకుండా ఒక పాత్ర నుండి మరొక పాత్రలో పడే అవిచ్ఛిన్నమైన తైలధారతో పోల్చవచ్చును. ధ్యానం వలన మనస్సు ఇటువంటి స్థితికి లోనై మోక్షప్రాప్తికి సాధనభూతమవుతుంది. నిరంతరం సో-హం, సో-హం అని మననం చేయడం వలన, అది మోక్ష కల్పంగా పరిణమిస్తుంది, ఈ విధంగా రాత్రింబవళ్ళు నిరంతర చింతనం సాగిస్తే సాక్షాత్కారం అవశ్యం లభించగలదు. భగవంతుని గురించి చేసే తదేకధ్యానమూ, స్మరణమే ‘భక్తి’ అని చెప్పబడింది.
సత్కర్మలు పరోక్షంగా భక్తిమార్గంలో సహాయకాలుగా నిలుస్తాయి. సద్భావాలు, సత్కర్మలలో భేదం కలిగించే తత్త్వం తక్కువగా ఉన్నందున అవి ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగానైనా మోక్షమార్గం వైపు దారితీస్తాయి. (దుష్కర్మలు దారి తప్పిస్తాయి) కర్మను ఆచరించాలి కాని ఫలాన్ని ఆశించకూడదు, దానిని భగవదర్పణం చేయాలి. జ్ఞానం ఒక్కటే పరిపూర్ణమైనటువంటిది. సత్యస్వరూపుడైన భగవంతుని అచంచల భక్తితో ఎవరు సేవిస్తారో, వారికి ఆ భగవంతుని సాక్షాత్కారం తప్పక సిద్ధిస్తుంది.
* * *
మనం దీపాల వంటివారం, మన జ్వలనాన్నే జీవనమని అంటున్నాము. ప్రాణవాయువు సరఫరా ఆగిపోతే, దీపం కొడిగట్టక తప్పదు. అయితే మనం చేయదగినది ఏమిటంటే దీపాన్ని పరిశుద్ధంగా, నిర్మలంగా ఉంచుకోవడమే; జీవితమంటే కొన్నింటి సంయోగంతో ఏర్పడిన మిశ్రమం, కూడిన వాటికి విడిపోవడం తప్పదు, అదే జీవన సిద్ధాంతం.
మంగళవారం, జులై 9
ఆత్మ స్వరూపంగా భావిస్తే, మానవుడు నిజానికి ముక్తుడే, అయితే మానవ స్వరూపంగా భావిస్తే బద్ధుడు; శరీర స్థితుల వలన మార్పు చెందుతూ ఉంటాడు. మోక్షసాధనానికి మానవశరీరమనే యంత్రమే శ్రేష్ఠమైనది, అన్నింటికన్నా ఉత్తమోత్తమమైనది. ఈ మానవ శరీరాన్ని ఆత్మస్థితిని పొందేందుకు తనకు అనుకూలంగా మలుచుకోగలడు, అయితే ప్రతీ ఒక్కరూ దీనిని నిరూపణ చేసేందుకు యత్నించాలి, ఇది ఎవరికి వారే చేసుకోవాలి గానీ ఇంకొకరి కొరకై కాదు. రాజయోగం నిరూపించి చూపే విజ్ఞానాన్ని కలిగి ఉంది, అంతే కాక స్వానుభవమైన దానినే బోధించగలం. తార్కికజ్ఞానమే అంతర్దృష్టిని కలుగజేస్తుంది కాని తర్కానికి అతీతంగా, కేవలం విశ్వాసం వలన అది సాధ్యపడదు.
కర్మ హృదయాన్ని శుద్ధి చేసి, జ్ఞానానికి దారి తీస్తుంది. సర్వ ప్రాణులకు హితాన్ని చేయడమే మనం చేయతగిన కర్మ అని బౌద్ధులు నిర్వచించారు. భగవదారాధనం, శ్రౌతస్మార్త కర్మలు కూడా చిత్తశుద్ధిని కలుగజేస్తాయని బ్రాహ్మణులు వచించారు. అయితే శంకరులు, ‘సత్కర్మ అయినా, దుష్కర్మ అయినా, సమస్త కర్మలూ జ్ఞాన విరుద్ధాలే’ అని వక్కాణించి చెప్పారు. అజ్ఞాన కారకాలైన కర్మలు ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా రజస్సుని, తమస్సుని వృద్ధి చేసేవే, అందువలన అవి పాపభూయిష్ఠాలే. కేవలం సత్త్వం జ్ఞానానికి దారిని చూపుతుంది. నిష్కామ పుణ్యకర్మలు మాయా తెరను తొలగింపచేసి, జ్ఞానాన్ని వెల్లడి కావించి, సాక్షాత్కారమందు తోడ్పడతాయి.
జ్ఞానమనేది సృష్టించబడేది కాదు, దానిని కనుగొనడమే మనం చేయవలసింది. మహాసత్యాలను కనుగొన్న ప్రతీ వ్యక్తి స్ఫూర్తిదాయకుడే, అటువంటి ఆధ్యాత్మిక తత్త్వవేత్తనే మనం ‘ప్రవక్త’ అని అంటున్నాము. అదే భౌతికరంగంలో అయితే శాస్త్రవేత్త అని అన్నా, మనం శాస్త్రజ్ఞునికన్నా ప్రవక్తకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తుంటాము.
తత్త్వార్థసారం బ్రహ్మమనీ, అదే సమస్త జ్ఞాన పరమార్థమని తెలియచేస్తూ శంకరులు, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనేవి కేవలం బ్రహ్మం యొక్క ఊహాచిత్రాలు మాత్రమే అని తెలియజేస్తారు. రామానుజులు చైతన్యాన్ని బ్రహ్మలక్షణంగా ఆపాదిస్తారు. నిజమైన అద్వైతులు బ్రహ్మానికి ఏ అర్థంలోనూ ఏ లక్షణాన్ని ఆపాదించరు. శుద్ధచైతన్య జ్ఞానసారమే భగవంతుడు అని రామానుజుల భావం. అభిన్నమైన చైతన్యాన్ని భేదదృష్టితో తిలకిస్తేనే, విశ్వం ఏర్పడుతుంది.
* * *
ప్రపంచంలోని తాత్త్విక పరమైన మతాల్లో బౌద్ధమతం ఒకటి భారతదేశంలో జనసామాన్యంలోనికి బాగా వ్యాప్తిని చెందింది. ఇరవై అయిదు శతాబ్దాల క్రితం అలాంటి మహోత్కృష్ట ఆశయాలను ఆకళింపు చేసుకున్న ఆర్యులు ఎంతటి అద్భుత సంస్కృతి సంపన్నులో కదా!
వర్ణవ్యవస్థను అంగీకరించని తత్త్వజ్ఞుడు బుద్ధుడు ఒక్కడే. అతని అనుయాయులలో ఒక్కరు కూడా భారతదేశంలో మిగిలి ఉండలేదు. ఇతర తత్త్వజ్ఞులు సామాజికపరంగా ఎంత ఎత్తుకు వెళ్ళినా కొంత రాబందువు స్వభావాన్ని కలిగి ఉన్నవారే. నా గురుదేవులు ఇలా అనేవారు – ‘రాబందువు ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగురుతుంది కానీ దాని దృష్ఠి నేలమీద కుళ్ళి, దుర్వాసనను గలిగి ఉన్న మాంసఖండం మీదే లగ్నమై ఉంటుంది.’
* * *
ప్రాచీన హైందవులు అద్భుతమైన పాండిత్యం కలవారు, వారు సజీవంగా కదలాడే విజ్ఞానగనులు. ‘వారు, ఎవరి జ్ఞానం పుస్తకాల్లో ఉంటుందో, ఎవరి ధనం అన్యుల హస్తాల్లో ఉంటుందో, అలాంటి వారికి జ్ఞానమూ, ధనము ఉన్నా లేనట్లే’ అని చెప్పారు.
‘శ్రీ శంకరులు సాక్షాత్ శివస్వరూపంగా అనేకులచేత పరిగణించబడేవారు.’
బుధవారం, జులై 10
భారతదేశంలో ఆరుకోట్ల ఏభై లక్షల మహమ్మదీయులున్నారు. వారిలో అనేకులు సూఫీ సంప్రదాయస్థులు.* సూఫీలు మనిషిని దేవుడితో తాదాత్మ్యం చేస్తారు, వారి ద్వారా ఈ భావన ఐరోపా ఖండంలో ప్రవేశించింది. వారు ‘నేనే పరమసత్యమని’ అన్నా, వారి సిద్ధాంతాలలో బాహాటమైనవే కాక నిగూఢ భాగం కూడా కొంత ఉంది, అయితే మహమ్మదు దీనిని అంగీకరించలేదు.
‘హాషాషిన్’ అనే పదం, ‘అస్సాసిన్’ గా (రహస్యంగా చంపేవాడు) మారింది. తమ మతాన్ని గుర్తించని వారిని, విశ్వాసం లేని వారిని ప్రాచీన మహమ్మదీయ సంప్రదాయస్థులు చంపుతుండేవారు. అందువలన ఆ పేరు వచ్చింది.
మహమ్మదీయుల ఆరాధనలో, భగవంతుడు సర్వత్రా ఉన్నాడనడానికి గుర్తుగా, నీటితో నిండి ఉన్న పాత్రను దగ్గర పెట్టుకుంటారు.
హైందవులు దశావతారాలు ఉన్నాయి అని విశ్వసిస్తారు, ఇందు తొమ్మిది వచ్చాయి, పదవది రానుంది.
గ్రంధాలను ఉటంకిస్తూ తన భావాలను సమర్థించుకునే ప్రయత్నం శంకరులు అప్పుడప్పుడు చేసారు; బుద్ధుడు ధీశాలి, అతను ‘ఏ గ్రంధాన్ని నమ్మవద్దు. నేనే ఉత్తమోత్తమమైన గ్రంధాన్ని, నాతో ఏకీభవిస్తే, అవి నిజాలే అని చెప్పవచ్చును. యజ్ఞయాగాదులు, ప్రార్థనలు నిష్ఫలాలే’ అని పరిపూర్ణమైన నీతిశాస్త్రం మానవ లోకానికి ప్రసాదించిన మహనీయుడు బుద్ధుడు. మంచితనానికి మంచితనమై, ప్రేమను ప్రేమించిన అతని సౌజన్యం అవ్యాజ్యం అని చెప్పవచ్చును.
వేదాలు పేర్కొన్నాయి కనుక బ్రహ్మవిచారం చేయాలని శంకరులు అన్నారు. తార్కిక జ్ఞానం స్ఫూర్తిగా నిలిచి అనుభవ సిద్ధికి తోడ్పడగలవు, గ్రంధాలు వీటికి అనుబంధంగా నిలుస్తాయి. వేదాలలో విశ్వజ్ఞానమంతా మూర్తీభవించి ఉంది అనవచ్చు, వేదాలను వెలువరించినాడనడంలోనే భగవంతుని అస్తిత్వానికి నిదర్శనం కనిపిస్తోంది. సమస్తమైన జ్ఞానానికి వేదాలు గని కాగా మానవుడు వాయువుని నిశ్వసించే విధంగా, భగవంతుడు వేదాలను నిశ్వసించినందున, భగవంతుని శక్తీ, జ్ఞానం అనంతాలని అంటున్నాము.
భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడా లేదా అన్నది అప్రధానమైనటువంటిది, కానీ వేదాలను మాత్రం ఆయన వెలువరించాడన్నది ప్రధాన విషయం. వేదాల ద్వారానే లోకానికి భగవంతుడిని గురించిన జ్ఞానం కలిగింది, ఇంకో మార్గం ఏదీ లేదు.
‘వేదాల్లో లేని విషయం ఏదీ లేదు’ అన్న శంకరుని విశ్వాసం ఎంత సార్వజనీనమైనది అంటే, ఆవు కనిపించకపోతే, వేదంలో వెతుకు అన్న సామెతకు దారి తీసింది. శంకరుని ప్రకారం, కర్మ పరతంత్రత జ్ఞానం కాదు. బ్రహ్మజ్ఞానం అనేది నైతిక విధుల మీదగాని, క్రతువుల మీదగాని, వివిధ కర్మ కలాపాల మీదగానీ ఆధారపడి ఉండక, స్వతంత్రంగా నిలిచి ఉన్నది. ఒక స్థాణువుని చూసి, ఒకరు దయ్యం అని భావించినా మరొకరు మరో విధంగా తలచినా, వీరి అభిప్రాయాల మీద స్థాణువు తనను తాను మార్చుకోదు కదా!
గ్రంధాలుకాని, తర్కంకాని మనకు భగవంతుని చూపలేవు కనుక వేదాంతమన్నది ఆవశ్యకమైనది. అతీంద్రియ దృష్టి వలన బ్రహ్మసాక్షాత్కారం సాధ్యం కాగలదని వేదాంతం బోధిస్తోంది. దీనికొరకు ద్వైతభావనను విడనాడి, అఖండ, నిర్గుణ బ్రహ్మభావాన్ని పొందాలి. ప్రతీ జీవిలో అంతర్గతమై ఉన్నది ఆ బ్రహ్మమే, మనం గ్రహించవలసింది ఆ బ్రహ్మమే. ‘నేను’ అని మనకు స్ఫురింపచేసేది ఆ బ్రహ్మమే. ఇలా మన చుట్టూ వివిధ విధాలుగా ప్రకటితమైనా, అది గుర్తించలేక ఉన్నాం. ఆ సత్యావిష్కరణ జరిగిన క్షణం సమస్త దుఃఖమూ మటుమాటమై పోతుంది. ఏకత్వాన్ని అందుకోగలిగితే, ద్వైతభావన తొలగిపోతుంది. అందువలన క్రతువుల వలన కాక, ఆత్మాన్వేషణ, ఆత్మ ఉపాసన వలన ఆత్మతత్త్వం బోధపడగలదు.
బ్రహ్మవిద్య ఉత్తమోత్తమ విద్య అనీ, శాస్త్రజ్ఞానం దానికన్నా తక్కువ స్థాయి కలదని మనకు ముండకోపనిషత్తు, తెలియచేస్తున్నది. జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది, పరావిద్య, అపరావిద్య అనే ఈ రెండు విధాలలో, లౌకిక జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉన్నదంతా అపరవిద్య కాగా దేని మూలంగా బ్రహ్మం ప్రాప్తం కాగలదో తెలిపే దానిని పరావిద్య అని అంటాము. బ్రహ్మం సర్వం తన ప్రకృతి నుండే సృజిస్తోంది, దానికి బాహ్యమైనదేదీ లేదు. సర్వశక్తులు బ్రహ్మమయమైనవే, ఉన్నదంతా బ్రహ్మమే; ఎవరు సమస్త యజ్ఞాలను ఆత్మపరంగా అన్వయించుకుంటారో, వారే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, బాహ్యంగా ఉపాసన చేసే వారిని అజ్ఞానులు అని చెప్పవచ్చును, ఎందుచేతనంటే వారు ఆ కర్మల వలన బ్రహ్మాన్ని పొందగలమని భావిస్తారు. యోగమార్గం ద్వారా (సుఘమ్నా పద్ధతిలో) వెళ్ళే వారు ఆత్మను పొందగలరు, అయితే వారు గురువుని ఆశ్రయించి ముందుకు సాగాలి. సర్వం ఆత్మ నుండే ఉద్భవిస్తోంది. ధ్యానమనే బాణంతో, ఆత్మను లక్ష్యంగా పెట్టుకుని మనస్సు అనబడే వింటిని సూటిగా వదిలితే కలిగేది సాక్షాత్కారమే. పరిమిత స్వభావంతో అపరిమితాన్ని, అనంతత్త్వాన్ని వివరించలేము, ఇది అర్ధమైతే వాదనలకు తావులేదు.
భక్తివలన, ధ్యానం వలన, బ్రహ్మచర్యం వలన, దివ్యజ్ఞానాన్ని పొందవచ్చును. “సత్యమేవజయతే నానృతమ్” – సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు; బ్రహ్మజ్ఞాన మార్గం సత్యపథంలోనే సాగుతుంది, సత్యానికీ, ప్రేమకు స్థానం బ్రహ్మమ్.
గురువారం, జులై 11
మాతృప్రేమ లేనిదే సృష్టి సాగదు. ఏదీ పూర్తిగా భౌతికం కాదు, పూర్తిగా అమూర్తమూ కాదు, ఒకదాని వెనుక ఒకటి ఉంటూ, పరస్పర సమర్థకాలుగా ఉంటాయి. ఈ దృశ్యమయ జగత్తుకి మరుగున ఒక తత్త్వం ఉందనేది ఆస్తికులందరూ అభిప్రాయపడతారు. అయితే దాని ప్రకృతిని గురించిన విషయం అయినా, స్వభావం గురించిన విషయం అయినా చూస్తే, అప్పుడు వారిలో భిన్నాభిప్రాయాలు మొదలవుతాయి. అనాత్మవాదులైతే ప్రత్యక్షానికి మరుగున అసలు ఏదీ లేనేలేదని అంటారు.
అయితే సర్వమతాల్లోనూ, అతీంద్రియావస్థ అని చెప్పబడేది ఒక్కటే. హిందువులైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, మహమ్మదీయులైనా, ఏ మతంవారైనా శరీరభావాన్ని అతిక్రమించగలిగితే, పొందే అనుభూతి ఒక్కటే.
* * *
జీసస్ మరణానంతరం, దాదాపు ఇరవై అయిదు సంవత్సరాలకు, అతని శిష్యుడైన థామస్ ద్వారా ప్రపంచంలోని అతి పవిత్ర క్రైస్తవులలో కొందరు భారతదేశంలో అడుగిడారు. ఇది అంతా ఆంగ్లోశాగ్జన్లు అనాగరికంగా గుహల్లో ఉంటూ, తమ శరీరాలకు రంగులు పులుముకునే కాలంలో జరిగింది. ఒకప్పుడు భారతదేశంలో క్రైస్తవులు ముప్ఫై లక్షల మంది ఉండేవారు కాని ఇప్పుడు వారి సంఖ్య పదిలక్షలు మాత్రమే.
క్రైస్తవం సదా ఖడ్గం చేతనే వ్యాప్తిగావించబడింది. అంతటి సాధుసత్తమునికి శిష్యులై, అలా హత్యలను సాగించడం విచిత్రం. బౌద్ధం, క్రైస్తవం, మహమ్మదీయం మతాలు మూడూ ప్రచారక మతాలే, వీటికన్నా ప్రాచీనమతాలైన హిందూమతం, యూదుల మతం, జొరాస్టరీయ మతం, ఎన్నడూ ఇతరులను తమ మతాలలోనికి చేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అయితే బౌద్ధులు, ఖడ్గం చేతకాక, తమ సౌజన్యం చేతనే ఒకానొక సమయంలో జనాభాలో మూడువంతుల మందిని తమ మతంలోకి చేర్చుకున్నారు.
బౌద్ధులు తర్కబద్ధంగా నాస్తికత్వాన్ని కలిగి ఉన్నారు. నిజానికి శూన్య వాదానికి, పరమాత్మ వాదానికి మధ్యన ఇంకొకటి లేదు, అయితే తమ వాదాన్ని తర్క పరమావధి పర్యంతం కొనసాగిస్తూ, బుద్ధికి సంబంధించినంత వరకూ సర్వవిధ్వంసకులైనారు. అద్వైతులు తమ వాదాన్ని తర్క పరమావధితో, దాని నుండి సమస్త దృశ్య ప్రపంచం దేనినుండి రూపొందుతుందో, అలాంటి ఏకం, అభిన్నం, అవిభక్తమైన వస్తువును కనుగొనడంలో కృతకృత్యులైనారు. అయితే బౌద్ధులకూ, అద్వైతులకూ ఏకకాలంలోనే ఉనికి, ఉనికిలేని స్థితి గురించిన భావన కలిగింది. ఇందువు ఒకటి సత్యం, రెండవది మిధ్య, యదార్ధవాది ఏకత్వం సత్యమని, శూన్యవాది అనేకత్వం సత్యమని భావిస్తాడు, దీనివల్లనే లోకమంతా నెలకొని ఉన్న కలహం, గుంజాటనలు కలుగుతున్నాయి.
‘శూన్యవాదికి ఏకత్వ భావన ఎలా కలుగుతుంది?’ అని యదార్ధవాది ప్రశ్నిస్తాడు. గిర్రున చక్రంలా తిప్పబడే కొరివికి ఉండే విరామ బిందువుని బట్టి దాని చలనాన్ని వివరించవచ్చును. అయితే నేపధ్యమైనది ఒకటి ఉందనే విషయం ఎలా కలుగుతుందో శూన్యవాది ఎన్నటికీ చెప్పలేడు, అలాగే ఏకమైనది అనేకంగా ఎలా భాసిస్తోందో ఆదర్శవాది తెలుపలేడు. దీనికి జవాబు అతీంద్రియమైనది, ఇది ఇంద్రియజ్ఞానాన్ని మించి ఉన్నది, మనో బుద్ధులకు అతీతమై ఎదుగగలిగి, ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆదర్శవాది ఉపయోగించగల సాధనం ద్వారా లభ్యం కాగలదు. పరతత్త్వానుభూతి పొందగలగడం వల్లనే సాధ్యపడుతుంది. వివేకానందుడనే వ్యక్తి పరతత్త్వంలో లయమొంది, తిరిగి మానవస్థితికి రాగలడు, అప్పుడు అతనికి ప్రత్యక్షంగానూ, అతని ద్వారా ఇతరులకు పరోక్షంగానూ బోధపడగలదు. ఇలా తర్కం ముగిసిన చోట ఆత్మానుభూతి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం మన మనస్సులకు అందనిదీ, కాలాంతరంలో అందుబాటు కాగలిగేది ఏదో, అదే లోకానికి మేలు చేసేది. అందువలన బ్రహ్మవిద్య అనేది లోకంలోని ఉత్తమమైన విద్య. అయితే ఈ భావన స్పష్టం కాకపోయినా తెలియకుండానే అన్ని యుగాల్లోనూ మనిషి మతం ద్వారా పరావిద్యను అంటిపెట్టుకునే ఉన్నాడు. అయితే ఈ సాధనలో ఆ పాడి ఆవు ఎన్నిసార్లు తన్నినా, లెక్క చెయ్యక అంటిపెట్టుకుని ఉంటే, తప్పక నీకు ఆ పాలు లభ్యం కాగలవు. సమృద్ధిగా పాలను ఇచ్చే ఆవు తన్నినా గోపాలకుడు, దానిని లక్ష్యపెట్టడు.
సాక్షాత్కారమైన అందమైన చందమామ శిశురూపంలో ఉద్భవించనున్నాడు, మంచి ఆహారాన్ని సమకూర్చి ఆ శిశువుని పెరగనిస్తే, విశ్వవ్యాప్తరూపుని దాల్చగలుగుతుంది. కోరిక అనే రాజుకి, జ్ఞానమనే రాజుకి జరిగే యుద్ధంలో, జ్ఞానం వీగిపోయే సమయాన, ఉపనిషత్తు అనే రాణితో చెలిమి ఏర్పడింది, దాని ఫలితమైన సాక్షాత్కార పుత్రోద్భవం, జ్ఞానానికి అంతిమ విజయాన్ని చేకూర్చింది.* ప్రేమ సంకల్పశక్తినంతటిని ఏకాగ్రం చేయగలదు.
భక్తిమార్గం సహజమైనది, ఆహ్లాదకరమైనది. అయితే తత్త్వజ్ఞానం అనేది కొండవాగును దాని మూలానికి బలవంతాన వెనక్కి మళ్ళించడం వంటిది, ఈ మార్గం త్వరితగతమైనా, దుర్గమమైనది. సమస్తాన్ని నిరోధించమని తత్త్వం బోధిస్తే, సర్వం ప్రవాహానికే వదిలివేసి, శరణాగతి చెందమని భక్తి ప్రబోధిస్తుంది. భక్తి మార్గం దూరమైనా, అలసట లేక ఆనందంగా సాగే ప్రయాణం వంటిది.
‘మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం’ అన్నట్లుగా ఓ పరమేశ్వరా! నేను సదా నీ వాడినే! నాది, నేను అంటూ ఏదీ లేదు కనుక ఇక నుండి నేను ఏం చేసినా దానికి కర్తవు నీవే! ఓ అమృతరూపా! నీకు ఇవ్వడానికి ధనమూ లేదు, నేర్చుకోవడానికి బుద్ధీలేదు, యోగాన్ని అభ్యసించేందుకు సమయమూ లేదు, అందువలన నా తనువు, నా మనస్సు, నా ఆత్మను నీకు సంపూర్తిగా అర్పిస్తున్నాను.
ఎంతటి అజ్ఞానమైనా, చెడు తలపులైనా, జీవునికి, దేవునికి మధ్యన అవరోధాన్ని కల్పించలేవు. ఒకవేళ భగవంతుడు లేడని అనుకున్నా ప్రేమ మార్గాన్ని పటిష్ఠంగా అవలంబించు. కుళ్ళిన మాంసానికై పాకులాడే శునకం వలె జీవించకుండా, భగవదన్వేషణలో ప్రాణాలు వదలగలిగినా అది ఉత్తమ కార్యమే కాగలదు. అందువలన మహోత్తమ ఆదర్శాన్ని ఎన్నుకుని, దానికై జీవితాన్ని ధారాదత్తం చేయాలి. మరణం ఎవరికైనా అనివార్యం కనుక, ఒక మహాప్రయోజనానికై జీవితాన్ని అంకితం చేయగలడం ఉత్తమం.
ప్రేమ సునాయాసంగా తత్త్వాన్ని అందిస్తుంది, దాని వెంటే జ్ఞానం, ఆపై పరాభక్తి లభిస్తాయి.
జ్ఞానం వివేచనాత్మకమైనది అవడం చేత, ప్రతీదానిని తేలికగా అంగీకరించలేదు. కానీ భక్తి భగవంతుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడనే నమ్మకంతో అన్నింటినీ అంగీకరిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఈ సూఫీ పద్యంలో అర్థం గోచరిస్తుంది.
రబియా
అనారోగ్యంతో ఉన్న రబియాను చూడ
ఇరువురు సాధుపుంగవులేతెంచిరి.
హసాన్, మాలిక్ లనెడి సుప్రసిద్ధులైన
వారు ఈ విధముగా ఆ భామతోడ పల్కసాగిరి.
ప్రేమ పరిశుద్ధమైనదైన ప్రభువొసగిన
ఈ దండన సహించశక్యమైనదే అని హసాన్ పల్కగా,
దేవుని ఆజ్ఞకు బద్ధుడైనవానికి దండనలోనే
ఆనందము కల్గునని మాలిక్ వచించెను.
వారిరువురి మాటలను విన్న రబియాకు,
అందు సంకల్పపు ఛాయలు గోచరించగా,
ఓ పూజ్యులారా! ఆ ప్రభుముఖారవిందమును దర్శించిన
వారికి దండనమనే స్ఫురణ ఛాయామాత్రంగా
నైనా ఉండదు కదా! అని ప్రశాంతంగా బదులు పలికింది.
శుక్రవారం, జులై 12
శంకరుల వాఖ్యానం
వ్యాసుని బ్రహ్మసూత్రాలలోని నాలుగవదైన ‘తత్తు సమన్వయాత్’ అనే దానికి శ్రీ శంకరులు చేసిన వ్యాఖ్యానం గురించి నేటి తరగతి నిర్వహించబడింది.
దీనికి అర్థం, వేదాంత గ్రంథములన్నింటికీ ముఖ్యాంశమైనదగుటచే బ్రహ్మము కేవలం శాస్త్రాల చేతనే తెలియబడుతోంది అనీ, వేదాంత మూలంగానే ఈశ్వరుడిని తెలుసుకోవాలి అనీ చెప్పబడింది. వేదాలు అన్నీ ఆయనను సృష్టి, స్థితి, లయ కారునిగా ప్రతిపాదిస్తాయి, ఈ ఈశ్వరుడు హిందుదేవతా గణములలో త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మ, విష్ణువు, శివునికి మూలమైనటువంటివాడు.
“మమ్మల్ని అంధకారసాగరం నుండి ఆవలి ఒడ్డుకి చేర్చగల పరమ పితవు నీవే” (గురుదేవునితో శిష్యుల అభ్యర్ధన).
వేదాలు నీకు బ్రహ్మాన్ని చూపలేకపోయినా, వాస్తవాన్ని మరుగున పరుస్తూ ఉన్న ముసుగుని తీయడంలో సహాయపడి, సత్యదర్శనాన్ని పరోక్షంగా చేయిస్తాయి. ఇందు మొదటగా తొలిగే తెర ‘అజ్ఞానం’, అది తొలగగానే పాపం నిర్మూలమై, కోరికలు నిశ్శేషమై, స్వార్ధపరత్వాన్ని అంతం గావించి, దుఃఖాన్ని మటుమాయం చేస్తుంది. ‘నేనూ, భగవంతుడు ఒక్కటే’ అని గుర్తెరిగినపుడే ఈ అజ్ఞానం తొలుగుతుంది. అప్పుడు కర్త, కర్మ అనే ద్వంద్వభావన తొలగి, ఆత్మతో తాదాత్మ్యాన్ని చెందుతారు. దీనికి నీవు శరీరాన్ని కావని గ్రహించడం మూలం, ఇదే చికిత్సలోని మూల రహస్యం. వశీకరణంలో ఉన్న జగత్తునుండి బయటపడేందుకు ప్రయత్నం చేయడమే దీనికి కీలకమై ఉన్న విషయం.
ముక్తిమార్గానికి, ముందుగా చెడునడత నుండి సన్మార్గానికి మళ్ళి, ఆపై రెంటిని వదిలేయాలి. తమస్సుని రజస్సు సహాయంతో అంతం చేసి, ఆపై రెంటినీ సత్త్వంలో విలీనం చేయాలి. అనంతరం ఈ త్రిగుణాలకు అతీతంగా వెళ్ళి, నీ ప్రతీశ్వాసా ప్రార్థనై అలరారే స్థితిని పొందాలి.
నీవు ఎవరి వద్ద నుంచైనా లబ్దిని పొందావంటే, ఏదైనా గ్రహించగలిగావంటే, దాని తాలూకు బీజం నీ గతజన్మలో పడిందని గ్రహించు. ఎందుకంటే అనుభవమే అసలు గురువు.
సిద్ధుల వలన దుఃఖం కలుగుతుంది కనుక కోరికలను నిర్మూలనం చేయాలి. కందిరీగల పుట్టలో చేయిపెట్టిన చందం వంటిది కోరికలను కలిగి ఉండటం అని తెలుసుకో; తీపిపూత కలిగిన విషపు గుళికలు వంటివి కోరికలు అని తెలుసుకోవడంతో వైరాగ్యం కలుగుతుంది.
మనస్సు బ్రహ్మం కాదు (శంకరవచనం), తత్త్వమసి (అది నీవే అయి ఉన్నావు), అహం బ్రహ్మాస్మి (నేనే బ్రహ్మాన్ని) అనే మహావాక్యాలను సాక్షాత్కరించుకోగలిగితే హృదయగ్రంధులు విడిపోతాయి, అప్పుడు సమస్త సంశయాలు దూరం కాగలవు. భగవంతుడు మనకు పైన (వేరుగా) ఉన్నంత కాలం, నిర్భయులం కాలేము, ఏది వేరుగా ఉంటుందో, అది సదా వేరుగానే ఉంటుంది. పుణ్యఫలం చేత ఐక్యతను పొంది ఉన్నా, పుణ్యం క్షీణించిన పిదప తిరిగి వియోగాన్ని పొందక తప్పదు. జీవబ్రహ్మైక్యమనే ఆచ్ఛాదన తొలగించడానికి పుణ్యకర్మ సహాయపడుతుంది. మనం ఎప్పుడూ ముక్తులమే, దీనిని గుర్తించాలి. “యమే వైషవృణుతే” – ఎవరిని ఆత్మ వరిస్తుందో అంటే మనమే ఆత్మ అని, మనలను మనమే ఎన్నుకుంటున్నామని అర్థం.
దర్శనం దేని మీద ఆధారపడి ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా, అది బాహ్యంగా దేనిమీద ఆధారపడిలేదు, మన స్వప్రయత్నం చేతనే సాధ్యపడుతుంది అని చెప్పవచ్చును. మన ప్రయత్నంచే అద్దంపైనున్న మాలిన్యాలను తొలగించుకుంటాము అంతే, అద్దం మారదు. తెలుసుకోదగిన వాడు కాని, ఆ విషయంపై అవగాహన కాని, తెలిసినవాడు కాని ఎవ్వరూ లేరు. తనకు ఏమీ తెలియదని గుర్తెరిగినవాడికే సమస్తమూ తెలుసు, తనకు సిద్ధాంతమంతా తెలుసనుకునేవాడికి ఏమీ తెలియదని భావం.
మనం బద్ధులమని భావించడమే ఒక భ్రాంతి; ఆస్తికధర్మం ఐహికం కాదు, అది ఆత్మప్రక్షాళనానికై ఉద్దేశించబడిందే కాని ప్రపంచం కొరకు కాదు. స్వేచ్ఛ లేదా విముక్తి అన్నది ఆత్మస్వభావమై ఉన్నది, దానిని విడదీయలేము. అది నిత్యశుద్ధమై, పరిపూర్ణమై, నిర్వికారమైనటువంటిది. దీనిని నీవు ఎన్నటికి తెలుసుకోలేవు, దీనిని వివరించడానికి ‘ఇదికాదు’, ‘ఇదికాదు’ అని చెప్పగలమే కాని అంతకు మించి వివరణ ఇవ్వలేము.
ఎటువంటి మానసిక శక్తులతో కాని, కల్పనలతో కాని ఊహించ నలవి కానిదే బ్రహ్మము. (శంకర వచనం)
* * *
విశ్వం అంతా ఒక భావన అయితే, వేదాలు ఆ భావనను వెలువరించే వాక్కులు. మనం ఈ విశ్వాన్ని సృజించనూగలం లేదా సృజించడాన్ని మానివేయగలం కాని వాక్ పునశ్చరణ వలన దృశ్యమాన ఫలం ఏర్పడుతుంది, ఇది కొందరి నమ్మకం. వారు మనలో ప్రతి ఒక్కరూ సృజనాత్మకులమేనని భావిస్తారు. వాక్కులను ఉచ్ఛరించిన, తదనుగుణమైన భావన ఏర్పడుతుంది, తద్వారా ఫలితం వ్యక్తం కాగలదు. ‘భావనే విశ్వశక్తి, దానిని ప్రకటించేది శబ్దం’ అని మీమాంసకులు వచిస్తారు. వీరు హిందూ తత్త్వజ్ఞులలో ఒక శాఖకు చెందినవారు.
శనివారం, జులై 13
సృష్టిలో మనకు గోచరించేది సమస్తం మిశ్రమ పదార్థమే, ఇంద్రియపరమైన జ్ఞానమంతా విశ్లేషణ ద్వారా కలుగుతుంది. మనస్సుని ఏక వస్తువనీ, స్వతంత్రమని భావించడమే ద్వైతం. తత్త్వజ్ఞానం కేవలం గ్రంథాలను పఠిస్తే వచ్చేదికాదు, ఎక్కువగా చదివిన కొద్దీ మరింతగా కలవరపెడుతూ ఉంటుంది. భావ తత్త్వజ్ఞులు మనస్సు అనేది మిశ్రితం కాదని భావన చేయడంచే ఇచ్ఛా స్వతంత్ర్యాన్ని కలిగి ఉన్నారు. మనస్తత్వ శాస్త్రం మనస్సు మిశ్రితమైనదని తెలుపుతోంది, అయితే మిశ్రితపదార్థం ఎప్పుడూ బాహ్యశక్తులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది కనుక ఇచ్ఛ అనేది బాహ్యమైన వాటితో ముడిపడి ఉండాలి కాని మనిషికి ఆకలి లేకపోతే తినేందుకు కూడా సంకల్పించడు కనుక సంకల్పం కోరికతో ముడిపడి ఉంది. అయితే మనం స్వతంత్రులమే అన్నది ప్రతీ వ్యక్తికి అనుభవైక వైద్యమే.
ఈ తలంపులు భ్రమ అని నాస్తికుడు అంటాడు, అయితే ప్రపంచం ఉన్నదని ఎలా నిరూపిస్తావు? మన అందరికి గోచరమై అనుభూతమవుతోంది కనుక ఇది ప్రమాణం అని అన్నా సర్వులు ప్రపంచం సత్యమని స్థిరపరిస్తే, స్వాతంత్ర్యం స్థిరపరిచినట్లే, కాని ఇప్పుడు ఉన్న సంకల్పం స్వతంత్రమైనది కాదు. స్వాతంత్ర్యం పట్ల మనిషికి స్వాభావికంగా ఉన్న విశ్వాసమే హేతువాదానికి మూలమైనది. సంకల్పసిద్ధి వలన స్వాతంత్ర్యం బద్ధులను చేస్తోంది, దీనిని తొలగించుకునేందుకే, మానవుడు నిరంతర తీవ్రప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనంతం, అపరిమితం, నిరపాధికమైనది ఒక్కటే స్వతంత్ర్యంగా మనగలదు. ఇప్పుడు మేధలోని స్వాతంత్ర్యం ఒక స్మృతి మాత్రమే, అది స్వాతంత్ర్యాన్ని చేరుకునే ప్రయత్నం మాత్రమే.
ఈ విశ్వంలోని ప్రతీది ఒక చక్రభ్రమణాన్ని పూర్తి చేసుకుని తిరిగి తన మూలానికి చేరుకుని శాంతిని పొందే ప్రయత్నమే చేస్తోంది. సమత్వాన్ని కనుగొని, దానిని సముపార్జించుకునేందుకు చేసే ప్రయత్నాన్నే సుఖాన్వేషణమని అంటున్నాము. ఇందులో నీతి ఏమంటే, బద్ధమై ఉన్న సంకల్పం విముక్తం అవడానికి ప్రయత్నిస్తోంది. మనం పూర్ణత్వం నుండి వెలువడ్డామనడానికి ఇదే తార్కాణం.
* * *
కర్తవ్యం అనేది ఆత్మను దహించివేస్తున్న మధ్యాహ్న సూర్యుని ప్రతాపం వంటిది. ‘ఓ రాజా! ఈ అమృత బిందువుని గ్రోలి సుఖంగా ఉండమని ప్రబోధిస్తుంది.’ (నేను కర్తను కాను అని తలపోయడమే అమృతసారం.)
ప్రతిక్రియను ఆశించక క్రియనొనర్చడం నేర్చుకోవాలి. క్రియ ఆనందకరమైనా, ప్రతిక్రియలో దుఃఖం మిగలవచ్చు. ఒక చిన్న పిల్లవాడు నిప్పుని చూసి ఆకర్షించబడి, ఆనందంగా అందులో చేతిని పెడితే, ఏమౌతుంది? ప్రతిక్రియగా మంట, బాధ మిగులుతాయి, దానిని మాన్పగలిగితే ఇంక భయపడవలసింది ఏదీ ఉండదు. మనస్సుని నిగ్రహించి, ప్రతీదానికీ స్పందించనీయక సాక్షీభూతంగా ఉండేవిధంగా తర్ఫీదునిస్తే, అప్పుడే నీవు సంతోషంగా ఉండగలవు. మనల్ని మనం పూర్తిగా విస్మరించిన క్షణాలే ఆనందదాయకములైనవి. చేసే పనిని ఒక విధిగా భావించక, స్వేచ్ఛతో చేయడం అలవరుచుకో; మనకు విధివిహిత కర్తవ్యమంటూ ఏదీ లేదు. జీవితమనే అంతులేని విరామ సమయంలో మనం ఆడుకునే క్రీడాస్థలమే ఈ ప్రపంచం.
నిర్భయులుగా ఉండటమే మనుగడలోని రహస్యం. ‘ఎవరి మీదా ఆధారపడి ఉండకు, నా గతి ఏమి కానుందో అని ఎన్నడూ భయపడవద్దు.’ ఏ సహాయమూ కోరనప్పుడే నీవు సర్వ స్వతంత్రుడవు.
* * *
ఆత్మసంరక్షణార్థం కొరకు చేసే పోరాటం కూడా సరియైనది కాదు, ఇతరులతో చేసే మామూలు పోరాటాల కన్నా ఇది ఉత్తమం కావచ్చును. కాని క్రోధానికి న్యాయమైన కోపం అనే పర్యాయపదం లేదు ఎందువల్లనంటే సర్వసమత్వాన్ని గుర్తించనందునే క్రోధం కలుగుతుంది.
ఆదివారం, జులై 14
భారతదేశంలో, దేని ద్వారా భగవంతుడిని దర్శించగలమో దానిని తత్త్వశాస్త్రంగా నిర్వచిస్తారు. ఆస్తికత్వానికి కారణమైనది తత్త్వమే అందువలన వీటిమధ్యగల సంబంధం ఏమిటని ఏ హైందవుడూ ప్రశ్నించడు.
తత్త్వశాస్త్ర విచారక్రమంలో మూడు దశలు ఉన్నాయి: మనస్సుని ఒక విషయంపై లగ్నం చేయుట, అందు సాధారణ ధర్మాన్ని కనిపెట్టడం, మరియూ దానిని ఇతరములనుండి వేరు చేయుట. సర్వసమ్మతమై, వడపోతగా నిలిచి ఉన్నది ‘ఏకం’ అన్నది మాత్రమే. ఆస్తికధర్మంలో ముందుగా వచ్చేవి ప్రతీకలు, రూపాలు, తరువాత పురాణాలు, ఆఖరుగా తత్త్వం. అయితే మొదటి రెండూ తాత్కాలికాలు, తత్త్వమే అన్నింటికి మూలమైనది, మిగిలినవన్నీ ఆ పరమపదసోపానానికి చేర్చే సాధనానికి మార్గాలే.
పాశ్చాత్యుల అభిప్రాయం మేరకు కొత్త నిబంధన (న్యూటెస్టామెంట్) ప్రకారం క్రీస్తు లేనిది, మతం లేదు. ఇదే విధంగా, మోసెస్ గురించి, ప్రవక్తల గురించి యూదుల మతంలోనూ ఉంది ఎందుకంటే ఈ మతాలన్నీ పురాణాల మీదే ఆధారపడి ఉన్నాయి. నిజమైన మతం ఎప్పుడూ పురాణాలకు అతీతంగా నిలిచి ఉంటుందిగాని దాని మీద ఆధారపడి ఉండదు. ఆధునిక విజ్ఞానశాస్త్రం మతపునాదులను బలపరుస్తోంది. విశ్వమంతా ఒక్కటే అనడాన్ని శాస్త్రీయంగా నిరూపించవచ్చు. వేదాంతి దేనినైతే ‘సత్తా’ అని అంటాడో, దానినే భౌతిక శాస్త్రజ్ఞుడు ‘పదార్థం’ అని అంటున్నాడు. ఇందులో ఇరువురికీ ఏ మాత్రం కలహం లేదు, ఎందువల్లనంటే ఆ రెండూ ఒక్కటే కనుక. పరమాణువు గోచరించకున్నా, ఊహించశక్యం కానిదైనా, అందు విశ్వశక్తి ప్రభవాలు నిండి ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలియచేసేదే వేదాంతులు ఆత్మను గురించి వచిస్తున్నారు. ఒకే విషయాన్ని భిన్న శబ్దాలతో అన్ని సంప్రదాయాలవారు తెలియచేస్తున్నారు.
వేదాంతమూ, ఆధునిక విజ్ఞానమూ కూడా తమని తాము నిలబెట్టుకునేందుకు ఒకానొక కారణాన్ని ప్రతిపాదిస్తున్నాయి. అందులోనే సర్వమూ ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకి, కుండలు తయారు చేసే కుమ్మరిని తీసుకుంటే, కుమ్మరి నిమిత్తకారణంగా, మట్టి ఉపాదాన కారణంగా, తిప్పడానికి సహకరించే కుమ్మరిసారె, సహకార కారణాలుగా కనిపిస్తాయి. అయితే ఒకే సత్పదార్థం నుండి ఉత్పన్నమైన ఆత్మ ఈ మూడు కారణాలను కలిగి ఉన్నది ఎందువల్లనంటే కారణమైనది, ప్రత్యక్షభూతమైనదీ అదే కనుక.
“జగత్తు సత్యం కాదు, ఆభాసం మాత్రమే; అవిద్య అనే తెరద్వారా చూడబడే బ్రహ్మమే ప్రకృతి” అని వేదాంతి చెబుతాడు. విశ్వమే దైవమని భావించేవారు, దేవుడు ప్రకృతిగా రూపొందాడు అని అంటారు. అద్వైతులు బ్రహ్మం జగత్తుగా భాసించినా, వాస్తవానికి కాదు అని అంటారు.
అనుభూతిని మనస్సులో ఒక యదార్థతగా, బుద్ధిలో ఒక ముద్రగా మాత్రమే మనం గ్రహించగలం, బుద్ధిని మార్చలేము గాని మనస్సుని ముందుకూ, వెనక్కూ నెట్టగలం; మనస్సు భూత, భవిష్యద్వర్తమానాలలో ఉండగలదు కనుక అందు యదార్థాలు భద్రపరచబడి ఉన్నాయి. మనస్సు చింతనగానూ, భావంగానూ, సంకల్పంగానూ రూపుదాలుస్తున్నందున, దేశకాల నిమిత్తాలు సర్వం మనస్సులో ఉన్నాయనీ, మనస్సు సర్వగతమని చెప్పబడుతోంది.
దేశ, కాల, నిమిత్తాలు భావనలోని రీతులు అని జర్మన్ తత్త్వవేత్త ‘కాన్ట్’ పేర్కొన్నా, మన వేదాంతం ఈ తత్త్వాన్ని యుగాలపూర్వమే లోకానికి బోధించి, దీనినే మాయ అని పేర్కొన్నది. షోపెన్హోర్ వేదాలను హేతువాదంగా భావించినా, శంకరులు వేదాల ప్రామాణికతను సమర్థించారు.
* * *
వృక్షాలలోని సారూప్యాన్ని వదిలి, అత్యున్నతమైన జ్ఞాన సంబంధంగా చూస్తే అవి అన్నీ ‘ఏకం’ అని తెలుస్తుంది.
వ్యక్తిగత దైవమనేది విశ్వంలోని సామాన్యీకరణమే అయినా అది అస్పష్టమైనది, తత్త్వంతో కూడినది.
ఏకత్వమనేది తనని తాను పరిణమించుకునేది, అందునుండే సమస్తం వెలువడుతున్నాయి.
యదార్ధాలను గుర్తించేది భౌతికశాస్త్రమైతే, ఆ యదార్థ కుసుమాలను అన్నింటిని దారంతో ముడివేసే సూత్రమే తత్త్వశాస్త్రం. పృధక్కరణమైన ప్రతీది తత్త్వశాస్త్ర సంబంధమైనదే, వృక్షమూలంలో ఎరువు వేయడం సైతం ఇందు ఇమిడి ఉంటుంది.
ఆస్తికధర్మంలో ఆకారం ఉంది, సూత్రం ఉంది, చివరగా పారమార్థిక ఏకత్వం ఉన్నది. వివరాలను పట్టించుకోక, మూలానికి వెళ్ళి, ఏకత్వాన్ని చేరుకో.
* * *
ఆసురీగుణాలు అంధకారానికి ప్రతీకలు కాగా దైవీగుణాలు తేజోమయ దివ్వెలకు ప్రతీకలు, అయితే ఈ రెంటిని ఛేదించాలి. మానవుడొక్కడే సజీవత్వాన్ని కలిగి ఉన్నాడు, ఈ పై రెండింటి యందు సమత్వాన్ని పెంపొందించుకోగలిగితే, బంధం నుండి విముక్తుడు కాగలడు. మానవుడు తన ముక్తిని సాధించుకోగలిగే మార్గం ఇదొక్కటే, అది ఈ లోకం నందే సాధ్యపడుతుంది.
సోమవారం, జులై 15
టిబెట్‌లో మాదిరిగా బహుభర్తృత్వం ఉన్నచోట, స్త్రీలు శారీరకంగా పురుషులకంటే బలవంతులు. ఆంగ్లేయులు అక్కడకు వెళ్ళినప్పుడు, ఈ స్త్రీలు వారిని కొండలమీదకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో మోసేవారు.
మలబార్లో బహుభర్తృత్వం లేకున్నా స్త్రీలు అన్నింటా ముందంజ వేస్తున్నారు. అక్కడ అన్నిచోట్ల అత్యంత పారిశుభ్రత కానవస్తుంది. విద్యాభ్యాసానికి కూడా అఖండమైన ప్రోత్సాహం ఉంది. నేను అక్కడ సంస్కృతం స్వచ్ఛంగా మాట్లాడగలిగిన అనేక మంది స్త్రీలను చూసాను. భారతదేశంలో, మిగిలిన ప్రాంతాల్లో సంస్కృతంలో సంభాషించగలిగే స్త్రీ కోటికి ఒక్కరు కూడా ఉండరు. మలబారు ప్రాంతం తన స్వాతంత్ర్యాన్ని ఎన్నడూ పోర్చుగీసులచే గాని, ముసల్మానులచేగాని కోల్పోలేదు. స్వాతంత్ర్యం ఉన్నతికి దోహదంచేస్తే, బానిసత్వం నీచత్వాన్ని ఆపాదిస్తుంది.
ఆర్యేతర జాతియైన ద్రావిడులు మధ్య ఆసియాకు చెందినవారు. వీరు ఆర్యులకన్నా ముందు వచ్చినవారు, అత్యంత నాగరికులు. వీరిలో పురుషులకన్నా స్త్రీలే ముందడుగు వేయడంలో ప్రసిద్ధులు. కాలక్రమాన వారిలో చీలికలు ఏర్పడగా, కొందరు ఈజిప్టుకు, కొందరు బాబిలోనియాకు తరలిపోగా, తక్కిన కొందరు మాత్రమే భారతదేశంలో నిలిచి ఉండిపోయారు.
మంగళవారం, జులై 16
శంకరుల వ్యాఖ్యానాలు
అదృష్టం అనే కానరాని కారణం, మనలను త్యాగానికి, ఆరాధనకు దారి తీయించి తన్మూలంగా ఫలితాలను అందజేస్తోంది. అయితే ముక్తికి ముందుగా శ్రవణం, తదుపరి మననం, ఆపై నిదిధ్యాసనం ఆవశ్యకం.
కర్మఫలం, జ్ఞానఫలం రెండూ భిన్నాలు. చేయడం, చేయకపోవడం అన్నది నైతికమైనదైనా, అవి మనశ్శరీరాలకు సంబంధించినవి. సమస్త సుఖదుఃఖాలు ఇంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉండటంతో, వాటిని అనుభవించేందుకు శరీరం ఆవశ్యకం. శరీరాన్ని బట్టి, దాని ధర్మమూ ఉన్నతంగానే ఉంటుంది. బ్రహ్మపర్యంతం ఈ సూత్రం వర్తిస్తుంది. శరీరం ఉన్నంతవరకూ సుఖదుఃఖాలు ఉండవలసిందే, శరీరాన్ని వదిలితే తప్ప వీటి నుండి తప్పించుకోలేము. ఆత్మ శరీరరహితమైనదని శంకరులు వచించారు.
ముక్తిని ప్రసాదించే సూత్రమంటూ ఏదీ లేదు, నీవు సదా ముక్తుడవే. నీకు స్వాతంత్ర్యం లేదనుకుంటే దానిని ఇవ్వగలిగే వేరే ఏదీ లేదు. ఆత్మ స్వయంప్రకాశం కలది, కార్యకారణాలు దాని దరిచేరలేవు. ఇటువంటి శరీర రహితస్థితే మోక్షం. గతించినదానికి, ఉన్నదానికి, రానున్నదానికి అతీతమైనదే బ్రహ్మము. ముక్తి అనేది దేనికైనా ఫలమైతే, దానికి విలువ ఉండదు ఎందుకంటే అప్పుడది సంకీర్ణమై ఉన్నందున, సంసార బంధ బీజాలు అందు నిక్షిప్తాలై నిలుస్తాయి. ముక్తి అన్నది సహజంగా ఉన్నదే, ప్రాప్తించుకునేది కాదు, అది అసలైన ఆత్మ స్వరూపం.
అయితే కర్మ, ఉపాసన అనేవి మాయ తెరను తొలగించేందుకు, బంధాన్ని, భ్రాంతిని పారద్రోలేందుకు ఆవశ్యకాలే. అవి మనకు ముక్తిని ఇవ్వలేకపోయినా, కళ్ళు తెరిచి, మనలను మనం పరికించేందుకు దోహదకరాలుగా నిలుస్తాయి. శంకరులు వేదాల్లో అద్వైత వేదాంతం మకుటాయమానమైనదని వచించారు. అయితే వేదాల్లో ప్రస్తావించబడిన ఇతర ఉపాసనలు కూడా ఆవశ్యకమే, వీటివలన కూడా అనేకులు భగవంతుని పొందగలరు, కేవలం అద్వైతంతో కూడా కొందరు బ్రహ్మాన్ని పొందగలరు. ఏది ఏమైనా, అద్వైతం సిద్ధించే లక్ష్యం వద్దకే కర్మ, ఉపాసనలు కూడా మనలను చేరుస్తాయి.
గ్రంథాలు మనలోని అజ్ఞానాన్ని నిర్మూలించేందుకు సహాయపడతాయి. అయితే మతగ్రంథాలను అనుసరిస్తూనే, ముక్తికి మార్గాన్ని చూపగలగడం శంకరులు సాధించిన మహత్కార్యం. అయితే అది కూడా ఒక రకమైన తార్కిక నైశిత్యమే. ముందుగా మానవుడికి స్థూలావలంబనాన్ని అందజేసి, క్రమక్రమంగా మెట్లు అధిరోహించేలా చేయాలి. ఇదే వివిధ మతాల ప్రయత్నం, అందువల్లనే వాటి ఉనికికి ప్రయోజనం చేకూరుతాయి. ప్రతీ మతమూ సాధకునికి ఏదో ఒక దశలో సరిపడి ఉండటానికి గల కారణం ఇదే. అజ్ఞానాన్ని తొలగించేందుకు సాధనాలైన మతగ్రంథాలు, తామే ఆ అజ్ఞానంలో ఒక భాగమై ఉన్నాయి. అయితే వాటి కర్తవ్యం జ్ఞానాన్ని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమే. “సత్యం అసత్యాన్ని తరిమివేస్తుంది. ‘నీవు స్వతహాగా ముక్తుడవే, నిన్ను ముక్తునిగా చేయుటకు అవకాశం లేదు’ నీకంటూ ఒక మతం ఉన్నంతవరకూ, నీకు దేవుడు లేడు. “తనకు అంతా తెలుసుననుకునేవానికి నిజానికి ఏమీ తెలియదు” జ్ఞాతను తెలుసుకోగలిగినవాడెవ్వడు? బ్రహ్మం, విశ్వం అనేవి రెండు నిత్యసత్యాలు కాగా ఇందు మొదటిది నిర్వికారం, రెండవది సాకారం. విశ్వం శాశ్వతంగా ఉంటుంది, మన మనస్సుకి అందని చోటుని మనం నిత్యమని అంటున్నాము. శిలను చూస్తావు లేదా శిల్పాన్ని చూస్తావు కాని రెంటిని ఏకకాలంలో చూడవు’ అయినా ఆ రెండు ఒక్కటే కదా!
* * *
క్షణమైనా నిశ్చలతను కలిగి ఉండగలవా? అయితే అందరు యోగులు అది సాధ్యమేనని వక్కాణించి చెబుతారు.
* * *
తనని తాను దుర్బలుడనని అనుకోవడమే మహాపాపం. నీకంటే అధికుడు ఎవ్వరూ లేరు; నీవే బ్రహ్మమని గుర్తించు; ఈ శక్తి అంతా నీ ద్వారా సంక్రమించిందే. సూర్య, చంద్ర, నక్షత్రాదులకు మనం అతీతులం. మానవుడే దేవుడని బోధించు, దాని వలన దోషం లేదు అయితే దోషాన్ని సృష్టించకు. ‘నేను ఈశ్వరుడిని, సర్వేశ్వరుడిని’ అని ఎలుగెత్తి చాటుము, బంధాన్ని కల్పించుకునే వాళ్ళం మనమే, తెంచగలవాళ్ళం మనమే.
ఏ కర్మా నీకు ముక్తిని ఇవ్వలేదు, కేవలం జ్ఞానమే ముక్తుడిని చేస్తుంది, జ్ఞానం తిరుగులేనటువంటిది. మనస్సు జ్ఞానాన్ని స్వీకరించనూ లేదు, అలాగని తిరస్కరించనూ లేదు, అయితే జ్ఞానం ఉదయించిన క్షణాన దాన్ని అంగీకరించే తీరాలి, అందువలన జ్ఞానం అనేది మనస్సులో తయారవకపోయినా, తదావిష్కరణ మాత్రం మనస్సు అందు కలుగుతుంది.
నీ సహజ స్వరూప సిద్ధిని పొందేందుకే కర్మ, ఉపాసనలు నిర్దేశితాలై ఉన్నాయి. ఆత్మను శరీరంగా భావించడమే భ్రాంతి, అందువలన శరీరంలో ఉంటూ, ముక్తులం కావడం అన్నది సాధ్యమే. శరీరానికి ఆత్మతో ఎలాంటి పోలిక లేదు. భ్రాంతి కారకమైనది వాస్తవాన్ని అవాస్తవంగా చూపుతుంది కాని శూన్యంగా చూపలేదు.
బుధవారం, జులై 17
రామానుజులు విశ్వాన్ని చిత్తు, అచిత్తు, ఈశ్వరులుగా అంటే జీవుడు, జడమయ ప్రకృతి, భగవంతునిగా విభజించారు. దీనినే ఇంకో విధంగా చైతన్యయుక్తం, చైతన్యరహితం, అతీంద్రియ చైతన్యంగా భావించవచ్చును. అయితే శంకరులు చిత్‌స్వరూపమైన ఆత్మా, బ్రహ్మం ఒక్కటే అనే పేర్కొన్నారు. ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ – బ్రహ్మమే సత్యం, జ్ఞానం, అనంత తత్త్వం. ఇవి అన్నీ గుణాలు కావు. బ్రహ్మానికి సంబంధించిన ఏ భావనైనా యోగ్యమైన గుణారోపణమే అవుతోంది, మనం ‘ఓం తత్ సత్’ అని మాత్రమే చెప్పగలం.
శంకరులు ఇతరములకు వేరుగా అస్తిత్వాన్ని గుర్తించగలవా? అని ప్రశ్నిస్తాడు. రెండు వస్తువులలో భేదం ఏ విధంగా కనిపిస్తోంది అంటే ఆ భేదం ఇంద్రియరీత్యా గ్రహించబడటంలేదు, అలా అయితే సర్వం దాన్లో ఏకం అవుతాయి. వాటిని ఒక దాని తరువాత ఒకటిగా చూడాలి. ఒక వస్తువు ఎలాంటిదో యోచించేముందు అది ఎలాంటిది కాదో అని కూడా కొంత మనకు తెలుస్తుంది. మన జ్ఞాపకంలో ఉన్న లక్షణాలతో పోల్చడం వలన భేదాలను గ్రహిస్తున్నాం. కాని భేదం వస్తుస్వభావంలో లేదు, బుద్ధిలో ఉంది. సజాతీయమైన వస్తువు వెలుపల ఉన్నా, భేదలక్షణాలు బుద్ధిలో ఉన్నందున, అనేకం అనే భావన కలుగుతోంది.
భేదలక్షణాలు వేరుగా ఉన్నా, ఒక వస్తువులో కలపబడినప్పుడు గుణాలుగా మారుతున్నాయి. భేదం అంటే ఏమిటో ఖచ్చితంగా చెప్పలేము. వస్తువును గురించి మనకు గోచరించేది, అనుభూతమయ్యేది కేవలం అస్తిత్వమే, తక్కినదంతా మనలోనే ఉంది. ఉండటం అన్నది ఒక్కటే మనకు గల తార్కాణం. తాడుని చూసి పాముగా భ్రాంతి చెందినా, పాముకి గల కొన్ని లక్షణాలు తాడులో ఆరోపించబడటం చేత అలాంటి అపార్థానికి దారి తీస్తుంది. సర్పజ్ఞానం మనస్సులో కలగడం చేత రజ్జుజ్ఞానం నశిస్తుంది, అలాగే రజ్జు జ్ఞానం కలిగినప్పుడు సర్పజ్ఞానం నశిస్తుంది. అయితే ఒకటి మాత్రం కనబడిందంటే రెండవది లేదని కాదు. అలాగే జగద్భావం బ్రహ్మభావంలో ఒక తెరగా ఉంది, దానినే మనం తొలగించుకోవాలి, అయితే దానికి అస్తిత్వం అంటూ ఉండనే ఉన్నది.
శంకరులు ‘ఎరుకను’ కలిగి ఉండటమే అస్తిత్వానికి చరమ ప్రమాణమని అంటారు. అది స్వయంప్రకాశమానం, స్వచేతనాన్ని కలిగి ఉంది; ఇంద్రియాతీత స్థితికి చేరాలంటే మనకు ఎరుక ఆవశ్యకమే. జ్ఞానమన్నది నిరుపాధికం, అది ఇంద్రియాల మీదగాని, మరే ఇతర సాధనాల మీదగాని ఆధారపడి లేదు. చైతన్యం లేనిది ఎరుకలేదు. స్వయం ప్రకాశమానమైన జ్ఞానం మందావస్థలో చైతన్యంగా పిలువబడుతోంది, చైతన్యం లేక దేనిని చూడటం సాధ్యం కాదు. నిజానికి చైతన్యం ఎరుకకి ప్రకృతిగా ఉన్నది. అస్తిత్వము, జ్ఞానం రెండూ ఒక్కటే, దేనికి కారణం అనావశ్యకమో అదే అనంతం. జ్ఞానం తనకు తానే ప్రమాణం కాబట్టి నిత్యం. ఎరుక మనస్సులో లేదు కాని మనస్సుని తీసుకువస్తుంది. అది స్వతంత్రమైనటువంటిది, ఏకైక జ్ఞాత కనుక జ్ఞానమే ఆత్మ. అయితే ఆత్మజ్ఞాత కాజాలదు ఎందువల్లనంటే జ్ఞానాన్ని గ్రహించడం వల్లనే ఒకడు జ్ఞాత అవుతాడు. శంకరులు ఆత్మను ఈ ‘నేను’ అన్నది కాదు అంటారు, ఎందుకంటే ఆత్మలో అహంస్ఫురణలేదు, మనం ఆత్మకు ప్రతిబింబాలమే; ఆత్మ, బ్రహ్మమూ ఒక్కటే.
బ్రహ్మం గురించి మాట్లాడినా, ఆలోచించినా అది సాపేక్షంగానే అవుతుంది కనుక ఈ తార్కిక వాదాలు నిలుస్తాయి. యోగంలో జ్ఞానమూ, అనుభూతి ఒక్కటే. రామానుజులు బోధించిన విశిష్టాద్వైతంలో కొంతవరకు ఏకత్వపు ఛాయలు ఉన్నందున, అది అద్వైతపు ఆవరణలో కొంతవరకు ఉంది. విశిష్ఠమంటే ప్రత్యేకత కలిగినటువంటి విభాగం. ప్రపంచ స్వభావమే ప్రకృతి, దానిలో పరిణామం కలుగుతోంది. పరిణామశీల భావాలచే వ్యక్తీకరించబడిన పదాలు ఎన్నటికీ బ్రహ్మాన్ని నిరూపించలేవు. అవి కొన్ని గుణాలు మినహాయించబడిన దాని దగ్గరకు చేరుస్తాయి. కాని అది బ్రహ్మం కాజాలదు, అది కేవలం వాగ్రూపమైన ఏకీకరణం మాత్రమే.
గురువారం, జులై 18
శంకరుల సాంఖ్య సిద్ధాంత ఖండనమే నేటి పాఠ్యాంశం
సాంఖ్యులు చైతన్యం మిశ్రణం అనీ, పరిశీలిస్తూ వెడితే ఆవల సాక్షిగా పురుషుడు సిద్ధిస్తాడని చెబుతారు. అనగా పురుషులు అనేకులు, మనలో ఒక్కొక్కడు ఒక పురుషుడు. అద్వైతం ఇందుకు భిన్నంగా పురుషుడు అద్వితీయుడని చాటి చెబుతుంది. ఈ పురుషునికి చైతన్యం కాని, జడత్వంగాని, మరే ఇతర గుణాలు కాని ఉండవు ఎందుకంటే గుణాలు బంధాన్ని కల్పించనూవచ్చు లేదా అంతరించనూ వచ్చు అందువలన ఏకం, అద్వితీయమైన ఆ బ్రహ్మానికి గుణాలు ఉండరాదు, జ్ఞానం సైతం ఉండరాదు. అంతేకాక, అది విశ్వానికి కాని మరి ఏ ఇతరములైన దానికి గాని కారణం కాజాలదు. “సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయమే” – ఓ సౌమ్యుడా! ఆదిలో అస్తిత్వం మాత్రమే, అద్వితీయ బ్రహ్మం మాత్రమే ఉన్నది. అని వేదాలు చెబుతున్నాయి.
సత్త్వం జ్ఞానంతో కలిసి ఉన్నంత మాత్రాన సత్త్వం జ్ఞానానికి కారణం కాదు. సత్త్వమన్నది మానవులలో ముందుగా ఉన్నదానినే బయటకు తెస్తుంది. ఇనపగుండును నిప్పుకి దగ్గరగా పెడితే, దానిలోని అంతర్గత గుణం చేత అది కూడా వేడిగా మారుతుందే తప్ప, నిప్పు అందులో ప్రవేశించదు కదా!
జ్ఞానం బ్రహ్మస్వరూపమైనది కనుక బంధం కాజాలదని శంకరులు చెబుతారు. వ్యక్తమై ఉన్నా, అవ్యక్తమై ఉన్నా విశ్వమన్నది ఎప్పుడూ ఉంది, కాబట్టి ఒక నిత్యవస్తువు ఉంది.
బ్రహ్మం జ్ఞానము, బలము, క్రియను కలిగి ఉన్నది. దానికి ఏ రూపం ఉండనవసరం లేదు. పరిమితమైనదానితో అనంత జ్ఞానాన్ని అందుకునేందుకు కంచెగా, జీవునికి రూపం ఆవశ్యకం. భగవంతునికి ఏ సహాయమూ అవసరం లేదు. చలనాత్మకమైన ఆత్మ తత్త్వం అంటూ ఏదీ లేదు, ఉన్నది ఒక్క ఆత్మే. జీవుడు చైతన్యయుక్తుడై, ఈ శరీరంలో పంచ ప్రాణాలను ఏకం చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఆ జీవుడే ఆత్మ ఎందువల్లనంటే సర్వమూ ఆత్మమయమే కనుక. దానిపై నీకు గల అవగాహన అంతా భ్రాంతి కారకమే కాని వాస్తవానికి జీవునిలో లేదు. నీవు బ్రహ్మానివే, మరే విధంగా తలచినా దోషమే. కృష్ణుడిని కృష్ణునిగా కాక కృష్ణునిలోని ఆత్మను ఉపాసించాలి, ఆత్మోపాసన వల్లనే ముక్తి లభిస్తుంది. సగుణోపాసనలో ఆత్మ విషయీకరించబడి ఉన్నది. “స్వస్వరూపాను సంధానమే భక్తి” అంటారు శంకరులు.
భగవత్ప్రాప్తికై అనుసరించబడే మార్గాలన్నీ సరియైనవే; దీనిని చుట్టూ ఉండే నక్షత్రాలను బట్టి ధ్రువనక్షత్రాన్ని పోల్చడంగా చెప్పవచ్చును.
* * *
భగవద్గీత వేదాంత ప్రామాణిక గ్రంధాలలో శ్రేష్ఠమైనది.
శుక్రవారం, జులై 19
‘నీవు’ అని నేనంటున్నంతవరకూ, భగవంతుడు మన రక్షకుడనటానికి నాకు అధికారం ఉంది. ఇంకొకరిని చూసినపుడు, సాధక బాధకాలను అన్నింటిని గ్రహించి, మూడవ వ్యక్తిలో నెలకొల్పాలి, అదే ఈ త్రిభుజానికి శిఖరం కాగలదు.
ఆవిరి ముందు మంచుగా మారి తర్వాత నీరవుతోంది, ఆపై గంగానది అవుతోంది; అయితే ఆవిరిగా ఉన్నప్పుడు గంగానదిలేదు, నీరుగా ఉన్నప్పుడు, దానిలోని ఆవిరిని గురించి మనం యోచించడం లేదు. సృష్టిభావన గాని పరిణామ భావనగాని సంకల్పంతోనే గట్టిగా ముడిపడి ఉన్నాయి. ప్రపంచం చలనాత్మకంగా భావించినంత కాలం, దాని వెనుక సంకల్పం ఉందని గ్రహించాలి. భౌతికశాస్త్రం ఇంద్రియాలభ్రాంతిని స్పష్టంగా నిరూపిస్తోంది. మనం చూసే రీతి, వినే రీతి, అనుభవం పొందే రీతి, వాసన చూసే రీతి, అంటూ నిజానికి ఏదీలేదు. కొన్ని ఫలితాలను కలిగించే స్పందనలు ఇంద్రియానుభవంగా మనకు సాపేక్షకమైన సత్యంగా గోచరిస్తోంది.
సత్యం అని అర్థాన్ని తెలిపే సంస్కృత పదం ‘సత్’. మన దృక్పధం నుండి ప్రపంచం ఇచ్ఛారూపంగానూ, చైతన్యవంతంగా గోచరిస్తుంది. మనకు మన అస్తిత్వం ఎలాంటిదో, సగుణబ్రహ్మానికి దాని అస్తిత్వమూ అలాంటిదే. మన మాదిరిగా బ్రహ్మాన్ని సాకారరూపంలోనూ దర్శించవచ్చును. మనుష్యులుగా మనకు భగవంతుడనేవాడు ఒకడుండాలి. అయితే ఆత్మ స్థితి ప్రాప్యమైనపుడు, ఆ అవసరం ఉండదు. ఇందువలనే శ్రీరామకృష్ణులు సదా జగన్మాత తనముందు ప్రత్యక్షమూర్తిగా కదలాడటాన్ని గాంచారు, అయితే సమాధి స్థితిలో ఆయనకు, ఆత్మ తప్ప ఇతరాలన్నీ అదృశ్యాలైనాయి. సగుణబ్రహ్మం క్రమక్రమంగా సన్నిహితమవుతూ, చివరకు లీనమైపోతుంది. అప్పుడు ఇంక ‘నేను’ అనే భావం కూడా ఉండదు, సర్వం ఆత్మలోనే లయించిపోతుంది.
చైతన్యం అనేది ఒక బంధమని, చైతన్యం నుండి రూపం వెలువడుతుందని జగత్కల్పనావాదం చెబుతుంది, కానీ చైతన్యం దేనికైనా కారణం అయినా, స్వయంగా తాను కార్యంగానే ఉంది. ఇదే మాయ. భగవంతుడు మనలను సృజిస్తుంటే మనం భగవంతుని సృజిస్తున్నాము, ఇది కూడా మాయే. ఈ చక్రభ్రమణానికి అంతులేదు. మనస్సు శరీరాన్ని నిర్మిస్తే, శరీరం మనస్సుని కల్పిస్తోంది. గుడ్డు నుండి పిల్ల వెలువడితే, పిల్ల పెద్దదై గుడ్డుని వెలువరిస్తోంది. చెట్టు నుంచి విత్తు, విత్తు నుండి చెట్టూ మొదలవుతున్నాయి. జగత్తు భేదమయమైనది కాదు, అలా అని ఏకజాతీయం కాదు. మానవుడు స్వతంత్రతను కలిగి ఉన్నాడు కనుక ఉభయపక్షాలను అతిక్రమించాలి. వాస్తవ స్థితిని గ్రహించాలంటే అస్తిత్వం, సంకల్పం, బోధ, క్రియ, గమనం, జ్ఞానం అనే వాటినన్నింటిని అతిక్రమించాలి. జీవునికి నిజమైన వ్యక్తిత్వం లేనేలేదు. విభజనానికి అతీతమై ఉండే తత్త్వం ఏదో అదే ఏకత్వం, అదే సత్యం, ఆనందం, మోక్షం, అమృతం. మాయా వ్యక్తిత్వాన్ని నిలుపుకునేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ దుష్కృతాలే. ఈ వ్యక్తిత్వాన్ని వదిలించుకునేందుకు చేసే ప్రయత్నాలు సుకృతాలు. అయితే ప్రపంచంలోని ప్రతీదీ తెలిసిగాని, తెలియకగాని ఈ వ్యక్తిత్త్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకే ప్రయత్నిస్తోంది. సమస్త నీతి ధర్మాలు ఈ భేదభావ వినాశనం మీదే ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే భేదభావమే పాపానికి మూలం. నీతి మొదటగా నిలిస్తే, మతం దానిని ఒక పద్ధతిలోనికి తెస్తుంది. ఆచారాలు ముందు వస్తే, వాటిని విశదీకరించేందుకు పురాణాలు అనుసరించాయి. హేతువాదాతీతమైన నియతిని అనుసరించి సంఘటనలు జరిగితే, వాటిని గ్రహించే యత్నంలో హేతువాదం తలఎత్తుతుంది, అది నెమరు వేసే ప్రక్రియవంటిది. మానవుల క్రియలకు, హేతువు అనేది చరిత్రకారునిగా నిలుస్తుంది.
* * *
బుద్ధుడు గొప్ప వేదాంతి, (బౌద్ధమతం నిజానికి వేదాంతశాఖే) శంకరుడు ‘ప్రచ్ఛన్న బుద్ధుడు’ అని పేర్కొనబడ్డాడు. బుద్ధుడు దేనిని విభజించాడో, శంకరుడు వాటి నుండి తయారు చేసాడు. బుద్ధుడు వేదాలకు గాని, వర్ణ వ్యవస్థకుగాని, మతాచార్యులకు గాని, ఆచారాలకుగాని దాసోహమనక, హేతువాదం ఎంతవరకు తీసుకువెడుతుందో, అంతవరకూ నిర్భయంగా ఆ మార్గాన్ని అనుసరించాడు. అలాంటి నిర్భయమైన సత్యాన్వేషణను, సకల జీవుల పట్ల చూపిన కారుణ్యమును, ప్రపంచం ఇంతవరకు చూసి ఉండలేదు. ధార్మిక ప్రపంచంలో బుద్ధుని వాషింగ్టన్గా చెప్పవచ్చును. ప్రపంచానికి అందివ్వడానికే అతనొక సామ్రాజ్యాన్ని జయించాడు కాని తన కొరకు కాదు, అమెరికన్లకు వాషింగ్టన్ ఈ విధంగానే చేశాడు కదా!
శనివారం, జులై 20
మనకు నిజమైన జ్ఞానమైనా, మతమైనా అనుభూతి మాత్రమే. ఆత్మను గురించి యుగాల పర్యంతం సంభాషించినా ఆత్మజ్ఞానాన్ని పొందలేము. వాదానికి, నాస్తికత్వానికి భేదంలేదు, ఒక రకంగా నాస్తికుడిలో నిజమైన మనిషి ఉన్నాడు. కాంతిపథంలో వేసే ప్రతీ అడుగూ నా స్వంతమే అవుతుంది. నీవొక దేశానికి వెళ్ళినపుడు అక్కడ కలిగిన అనుభవాలు నీవవుతాయి, అందువలన మనలను మనం అనుభూతమొనర్చుకునే ప్రయత్నం చేయాలి. మనకు ఆహారాన్ని అందివ్వడమే ఆచార్యుల పని, అది మనకు పుష్టిని కలిగించాలంటే, తినవలసిన పని మనదే. అయితే సిద్ధాంతరూపంగానే తప్ప వాదం ఎన్నడూ భగవంతుడిని నిరూపించలేదు.
బాహ్యంలో భగవంతుడిని కనుగొనడం అసాధ్యం. మన చుట్టూ ఉన్న దివ్యత్వాన్ని మనమే వెలువరిస్తున్నాము, మన దేహమే మహోత్తమ దేవాలయం. మనలో మనం చూసే తత్త్వానికే అస్పష్టమైన అనుకరణంగా బాహ్యంలో చూడగలుగుతున్నాము.
మనోశక్తులను ఏకాగ్రం చేయడం ఒక్కటే బ్రహ్మసాక్షాత్కారానికి మన దగ్గరున్న సాధనం. నీ అంతరాత్మను తెలుసుకుంటే భూత భవిష్యద్వర్తమానాల్లోని ఆత్మలను అన్నింటిని తెలుసుకున్నట్లే ఇచ్ఛాశక్తి మనస్సుని ఏకాగ్రం చేస్తుంది. ప్రేమ, భక్తి, ప్రాణాయామం వంటివి ఈ శక్తిని ఉద్రేకపరిచేందుకు, హద్దుల్లో ఉంచేందుకు దోహదపడతాయి. ఏకాగ్రమైన చిత్తం దివ్యమైన కాంతిని వెదజల్లుతూ, ఒక దీపం వలె ఆత్మలోని ప్రతిమూలను మనకు ప్రకాశవంతంగా చూపిస్తుంది.
ఒకే ఒక్క మార్గం సర్వులకూ అనుకూలంగా ఉండదు, అందువలన వివిధ మార్గాలు ఏర్పడ్డాయి. అంతమాత్రాన అవి అన్నీ ఒకదాని వెంబడి మరొకటి దాటవలసిన మెట్లు కావు. క్రియాకలాపాలు అధమం కాగా, బాహ్య భగవదారాధన మధ్యమం, అంతరాత్మ ఉపాసనం ఉత్తమం. కొందరిలో ఈ విధానం అనుసరిస్తూ రావలసి ఉండచ్చు, అనేకులకు ఒక్క మార్గావలంబనమే ఆవశ్యకమై ఉంటుంది. జ్ఞాన ప్రాప్తికై ముందు కర్మ, భక్తి సోపానాలను దాటవలసి ఉంటుంది అని చెప్పడం కంటే గొప్ప తప్పిదం ఉండదు.
మీకు వీలైన పద్ధతిలో వెడుతూ, అంతకంటే ఉన్నతమైన మార్గం ప్రాప్తించేవరకు, దానిని వీడక అవలంబించాలి. ఉన్నతమైనది లభ్యం అయినప్పుడు నీ యుక్తిచే నీవు గ్రహించగలవు. బోధనకు అతీతమైన అవస్థే సమాధ్యవస్థ, అయితే మానసిక రోగలక్షణాలతో కూడిన మైమరుపు చూసి, అది సమాధి అని పొరపడరాదు. దివ్యజ్ఞాన స్థితిని కొలిచేందుకు బాహ్యంగా ఏదీ ప్రామాణికమైనది లేదు, అది అనుభవైకవేద్యం. అయితే పొరపాట్లకు లోను కాకుండా మనలను హెచ్చరించే ప్రబోధం అంతర్వాణి, అది యుక్తికి యుక్తం కానిదానిని గుర్తు పడుతుంది. ఆధ్యాత్మిక ధర్మం ఎప్పుడూ హేతువాదానికి అతీతంగానే నిలుస్తుంది. సహజ జ్ఞానం మంచు అయితే తార్కిక జ్ఞానం నీరు వంటిది, ఇంక దివ్యజ్ఞానం అతి సూక్ష్మరూపమైన ఆవిరి; ఇవి ఒకదాని వెంబడి ఒకటిగా వెలువడుతూనే ఉన్నాయి. జడం, శరీరం, అంతఃకరణం, అలాగే బోధరహితావస్థ, బోధావస్థ, జ్ఞానావస్థ, సర్వత్రా ఈ శాశ్వతక్రమం గోచరమవుతూనే ఉంటుంది. అయితే మొదట మనం ఏది చేపడతామో, అదే ఈ క్రమానికి ఆరంభమనుకుంటాము. అయితే వాదనకు, రెండు పక్షాలూ సమానబలం కలిగి ఉన్నవే, సమానంగానే యదార్థమైనవి, ఈ రెండింటిని అతిక్రమించి, అవి లేని స్థానాన్ని పొందగలగాలి, మధ్యలోని క్రమాలు అన్నీ మాయను కలిగి ఉన్నవే.
ఆధ్యాత్మిక ధర్మము వాదానికి, అస్వాభావికానికి అతీతమైనటువంటిది. శ్రద్ధ అంటే నమ్మకం కాదు, పరతత్త్వానిపై పట్టుని కలిగి ఉంటే ప్రకాశం. అయితే దీనిపై ముందుగా శ్రవణం చేయాలి, ఆ తరువాత కారణాలు వెదుకనారంభించి, ఆత్మను గురించిన వాదాన్ని తెలుసుకోగలిగినంత తెలుసుకో, హేతువాదమనే వెల్లువను దాని మీద ప్రవహించనిచ్చి, చివరికి ఏది నిలుస్తుందో దానిని స్వీకరించు; ఒకవేళ ఏదీ మిగలలేదనుకుంటే, మూఢవిశ్వాసం నుండి విముక్తుడనైనానని భావించుము. ఆత్మను తొలగించగలది ఏదీ లేదనీ, అది అన్ని శోధనలకు అతీతమై నిలుస్తుందనే నిశ్చయం నీకు కలిగినప్పుడు, దానిని దృఢంగా విశ్వసిస్తూ, అందరికీ బోధించు. సత్యం ఎన్నటికీ పాక్షికం కాజాలదు, అది సకల లోక కళ్యాణార్థమై నిలిచి ఉన్నది. అందువలన ప్రశాంతచిత్తుడవై తత్త్వానుసంధానాన్ని గావిస్తూ, నీ మనస్సుని ఏకాగ్రం చేసి, చివరకు దానిని అందులో ఐక్యం చేసే ప్రయత్నాన్ని గావించుము. అప్పుడు ఇంక మాటలతో పనిలేదు, మౌనమే సత్యాన్ని తెలియజేస్తుంది. కాలయాపన చేస్తూ, మాటలతో శక్తిని వృథా చేయక, మౌనం పాటిస్తూ, ధ్యాననిమగ్నుడవు అయ్యేందుకు ప్రయత్నించు. ఎటువంటి బాహ్యకల్లోలాలతో నీ మనస్సుని కలత చెందనీయవద్దు. అయితే నీ మనస్సు ఉన్నత స్థితికి చేరిననాడు, నీకు తద్విషయాల ఎరుక లేకుండానే ఉంటుంది. అందువలన మౌనంగా శక్తిని కూడగట్టుకుంటూ, ఆధ్యాత్మిక శక్తిని సృజించగల యంత్రానివి అయ్యేందుకు సాధన చేయాలి. ఎవరికైనా దానం చేయాలంటే, ముందుగా తాను రాజై ఉండాలి, ఒక బిచ్చగాడు ఏమి దానం చేయగలడు? సర్వవిధాలా సంతోషంగా ఉన్నవాడే ఇతరులకు ఆనందంగా ఇవ్వగలడు.
* * *
నీ వద్ద ఉన్న ధనాన్ని భగవంతునిదనీ, దానికి కేవలం నీవు ఒక కాపలావాడివని భావిస్తూ, ఎటువంటి మమకారాన్ని ఆసక్తినీ పెంచుకోవద్దు. పేరు ప్రతిష్ఠలనూ, ధనాన్ని లక్ష్యపెట్టవద్దు. అవి ఘోరబంధాలుగా పరిణమించి ఆటంకాలు కాగలవు. అద్భుత వాతావరణంతో నిండి ఉన్న స్వేచ్ఛను అనుభవించు, నీవు ముక్తుడవు, ముక్తుడవు, సదా ముక్తుడివే! “ఆహా! నేనెంతటి ధన్యుడిని! నేను సర్వస్వతంత్రుడిని! అనంతత్త్వాన్ని నేనే! ఆద్యంతాలు కానరాని ఆత్మను నేనే! సర్వం ఆత్మమయం!” అంటూ సదా స్మరణం చేస్తూ ఉండు.
ఆదివారం, జులై 21
పతంజలి యోగ సూత్రాలు
చిత్తాన్ని నిరోధిస్తూ, వృత్తులుగా మారనివ్వని విధానాన్ని తెలిపే శాస్త్రమే యోగశాస్త్రం. ఇంద్రియభావాల సమ్మేళనమై, క్రియా, ప్రతిక్రియలను కలిగి, అశాశ్వతమై ఉన్నదే మనస్సు. మనస్సు తనదైన సూక్ష్మస్వరూపంలో విహరిస్తూ, ఆ ప్రభావాన్ని స్థూలశరీరంపై చూపుతోంది. మనస్సనే తెరచాటున ఆత్మ దాగి ఉందని వేదాంతం తెలుపుతోంది. వేదాంతం మనస్సు, శరీరం అనే రెండింటి అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నా, దేనిలో అయితే నానాత్వం లేక, ఏది శాశ్వతం, పరమం, ఏకమై వెలుగొందుతుందో, అలాంటి తత్త్వాన్ని కలిగిన ఆత్మను ప్రతిపాదిస్తోంది. జన్మము పునస్సంయోగమైతే, మరణం వియోగం, ఇలా విభాగించుకుంటూ పోతే, చివరకు మిగిలేది ఆత్మ; ఆపై విభజన సాగించలేనందున, అది నిత్య తత్త్వాన్ని అందించేదని బోధపడుతుంది.
ప్రతీ తరంగం వెనుక అగాధమైన సముద్రం నిలిచి ఉంది; ఈ అలలు కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా ఉన్నా, అవి అన్నీ వాస్తవానికి సముద్రాన్నే సారంగా కలిగి ఉన్నవే. ఈ అలలు శాంతిస్తే, సంపూర్ణంగా సముద్రమే కదా! దీనినే పతంజలి ‘దృశ్యహీనమైన ద్రష్టగా’ తెలిపారు. మనస్సు క్రియాశీలమైనపుడు, ఆత్మ దానితో సమ్మిశ్రతమై ఉంటుంది. పూర్వరూపాలు త్వరితంగా ఒకదానివెంబడి ఒకటి వెలువడడమే స్మృతి అని చెప్పబడుతోంది.
దేనిపట్లా ఆసక్తిని పెంచుకోక నిస్సంగుడివిగా ఉండేందుకు ప్రయత్నించు. జ్ఞానమే శక్తి, ఒకటి లభిస్తే రెండవది దానంతటదే వస్తుంది. జ్ఞానం వలన భౌతికప్రపంచాన్ని దూరంగా ఉంచవచ్చు. ఏ వస్తువునుండైనా సమస్త గుణాలను ఒకదాని వెంట ఒకటి, అదృశ్యమయ్యేవరకు వాటిని మానసికంగా తొలగించుకోగలిగితే అప్పుడు ఇచ్ఛామాత్రాన ఆ వస్తువుని నీ స్మృతినుండి అదృశ్యమయ్యేలా చేసుకోగలవు.
దృఢచిత్తం కలవారు త్వరితంగా అభివృద్ధిని పొందుతూ, ఆరునెలల్లోనే యోగులు కాగలరు; సామాన్యులకు యోగ సిద్ధిని పొందేందుకు సంవత్సరాలు పట్టవచ్చును; అయితే ఇతర విషయాలను విడిచిపెట్టి తదేక శ్రద్ధతో సాధన చేస్తే పన్నెండేళ్ళలో గమ్యాన్ని చేరుకోగలరు. అయితే ఇలాంటివేవీ కాకుండా భక్తిచే కూడా గమ్యాన్ని పొందవచ్చును, కాని అది సమయం ఎక్కువ తీసుకుంటుంది.
మనస్సుకు గోచరించిన విధంగా, మనస్సు గ్రహించే ఆత్మే ఈశ్వరుడు. ఆయన నామధేయం ఓంకారం, అందువలన దానిని స్మరించు, జపించు, ధ్యానించు. దాని అద్భుత స్వభావాన్ని, లక్షణాలను చింతన చేయాలి. నిరంతర ఓంకార జపమే నిజమైన ఉపాసన. ఓంకారాన్ని శబ్దమాత్రంగా కాక సాక్షాత్ పరబ్రహ్మంగా భావన చేయాలి.
మతం కొత్తగా దేన్నీ నీకు తెచ్చి ఇవ్వదు. అంతరాయాలను తొలగించి, ఆత్మ దర్శనం పొందడంలో అది సహాయకారి కాగలదు. శరీరమనే సాధనాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, రుగ్మత అన్నది పెద్ద అవాంతరం కాగలదు, అందువలన ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించాలి. ఇంక మనోవ్యాకులం అన్నది దాదాపుగా అధిగమించలేని హద్దు, అయితే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవానికి వ్యాకులత ఉండబోదు. సంశయాత్మక బుద్ధి, దీక్ష లేకపోవడం, భ్రాంతి అనేవి ఈ మార్గంలోని ఇతర ఆటంకాలు.
* * *
ప్రాణశక్తులు సూక్ష్మంగా ఉంటూ చలనానికి మూలంగా నిలుస్తాయి. అవి మొత్తం పది, అందు ఐదు బహిర్గతాలైనవి కాగా ఐదు అంతర్గతాలు. ఒక మహావాహిని ఊర్ధ్వంగా, మరొకటి అధోముఖంగా ఈ శరీరమందు ప్రవహిస్తున్నాయి. శ్వాసమూలంగా ప్రాణగతిని నిరోధించడమే ప్రాణాయామం. శ్వాస వంటచెరుకు అయితే, శరీరం యంత్రం, ప్రాణమే ఆవిరి అవుతుంది. ఈ ప్రాణాయామంలో, పూరకం (శ్వాసను పీల్చుకోవడం) కుంభకం (శ్వాసను స్తంభించడం), రేచకం (శ్వాసను వదలడం) అనే మూడు అంగాలున్నాయి.
* * *
నీలోని ఆధ్యాత్మిక శక్తిని వెలికి తెచ్చేవాడే గురువు. బోధనలు ఎవరైనా చెయ్యవచ్చును కానీ గురువు ద్వారా శిష్యునికి లభించే దీక్షే ఫలిస్తుంది. శిష్యులకు పరస్పరం సోదర సంబంధం ఉంటుంది, ఈ సౌభ్రాతృత్వాన్ని హిందూ ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది. గురుపరంపర నుండి తాను గ్రహించిన విజ్ఞానశక్తిని, మంత్రాన్ని, గురువు తన శిష్యునికి అందజేస్తాడు. గురువు అనుగ్రహం లేనిదే ఏదీ సాధ్యం కాదు. యోగసాధనలు సరియైన రీతిలో చేయకపోతే వాంఛలకు దారి తీస్తాయి, దీని వలన ప్రమాదం వాటిల్లవచ్చు, అయితే గురువు చెంతన ఉంటే ఇవి సంభవించవు. ప్రతీ దేవతకూ ఒక మంత్రం ఉంది. ఎవరి ఇష్టానికి అనుకూలంగా వారు ఆ దేవతోపాసనను చేస్తూ, లక్ష్యసాధనకై శ్రమించాలి. నిరంతరం మంత్రజపం చేయడం వలన మనస్సు లక్ష్యంలో స్థిరపడుతుంది, ఇటువంటి ఉపాసనా పద్ధతి, భక్తుల అనుష్ఠానంగా భారతదేశమంతటా కనిపిస్తుంది.
మంగళవారం, జులై 23
భగవద్గీత – కర్మయోగం
కర్మయోగం ద్వారా ముక్తిని సాధించాలనుకునేవారు, నిష్కాములై ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలి. అలాంటి కర్మ, జ్ఞానంగా మారి మోక్షాన్ని చేకూర్చగలదు. అయితే జ్ఞానప్రాప్తి కలగకుండా, కర్మను మధ్యలో వదలరాదు. భగవదర్పితంగా చేసే కర్మ బంధహేతువు కాదు. అయితే కర్మను చేయడంలో సుఖాన్ని ఆశించడం గాని, దుఃఖానికి వెరవడం గాని చేయవద్దు. “మనస్సు, శరీరమే కర్మను చేయిస్తున్నాయి, నేను కాదు” అని నిరంతరం జపిస్తూ, దానిని అనుభూతమొనర్చుకుంటే, కర్మను ఆచరిస్తున్నాననే ఎరుక కూడా లేకుండా పోతుంది.
సమస్త కర్మలను భగవంతుని నిమిత్తమే ఆచరించు. ప్రపంచంలోనే ఉంటున్నా, బురదలోని తామరాకు ఆ మాలిన్యాన్ని అంటించుకోనట్లుగా నిర్లిప్తుడివై ఈ సంసారంలో మెలగాలి. ఎవరు ఎలా ప్రవర్తించినా, అందరి పట్లా ప్రేమను కలిగి ఉండాలి. గుడ్డివాడు రంగులను గుర్తించలేడు, అలాగే మనలో దోషం లేకపోతే, బయట ఎలా కనిపిస్తోంది? మనలో ఉన్నదానిని, బాహ్యంగా కనిపించేదానితో పోలుస్తూ, గుణదోషాలను బేరీజు వేస్తాం. మన మనస్సు నిర్మలంగా ఉంటే, మాలిన్యాన్ని చూడలేము. మాలిన్యం ప్రపంచంలో ఉండి ఉండవచ్చును కానీ మనలో అది లేదు. ప్రతీ పురుషుడిని, స్త్రీని, శిశువుని బ్రహ్మరూపంగా భావించు; అంతర్దృష్టి వలన, అంతర్జ్యోతి సహాయంతో సమస్తంలో బ్రహ్మాన్ని అవలోకించు, అంతట బ్రహ్మేతరమైనదేదీ నీకు గోచరించదు. ఈ సంసారాన్ని కాంక్షించకు, ఎందుకంటే నీవు ఏది కోరితే, నీకు అదే సిద్ధిస్తుంది, అందువలన భగవంతుడిని, కేవలం భగవంతుడిని మాత్రమే ప్రాప్తించ యత్నించు. ఆధిపత్యం ఎక్కువైన కొద్దీ, భయమూ, బంధమూ మొదలవుతాయి. మనం చిన్నదైన చీమకంటే ఎంత భయాన్ని, బాధను కలిగి ఉన్నామో యోచించండి! వీటన్నింటి నుండి వెలువడి, భగవంతుడిని ఆశ్రయించండి. సృష్టితత్త్వాన్ని కాక, సృష్టి కర్తను గురించి తెలిపే శాస్త్రాన్ని నేర్చుకోండి.
‘నేనే కర్తను, నేనే క్రియను’, ‘కామక్రోధాలను అరికట్టగలిగినవాడే యోగి’, ‘అభ్యాస వైరాగ్యాలతోనే మనోజయం లభిస్తుంది’ అనేవి గుర్తుంచుకోండి.
* * *
మా పూర్వులు ప్రశాంతచిత్తులుగా ఉంటూ, భగవంతుని గురించి, ధర్మాన్ని గురించి యోచించేవారు. వారి మాదిరిగా మనకూ అలాంటి యోచన, సాధన చేయగలిగిన శక్తి ఉంది, కానీ లాభాలను పొందాలనే సంకుచిత ఆరాటాన్ని కలిగి ఉంటే ఆ శక్తి చేజారిపోతుంది.
* * *
రోగనివారణాశక్తి శరీరంలోనే ఉంది. మానసికస్థితులు, ఔషధం, వ్యాయామం ఈ శక్తిని క్రియాశీలంగా చేస్తాయి. భౌతికపరమైన ఇబ్బందులు ఉన్నంతవరకూ, భౌతిక శక్తుల సహాయం మనకు అవసరమౌతుంది. నాడీ మండలానికి దాసులమై ఉన్నంత కాలం, వాటిని మనం అలక్ష్యం చేయలేము.
చేతనావస్థ అన్నది మనస్సుకి శరీరానికి సంబంధించినది, దీనికి తక్కువలో ఇంకో అవస్థ ఉంది, అందుక్రియ ఉండదు. తత్త్వశాస్త్రమంతా మనస్సును గురించిన ఊహాసంవిధానమే, అయితే ఆధ్యాత్మిక ధర్మం సాయుజ్యం, సాక్షాత్కారం మీద ఆధారపడి ఉంది. సాక్షాత్కారం జ్ఞానానికి ఆధారమై, అతీంద్రియ మానసానికి అందని విధంగా ఉన్నది. ‘అప్తులు’ అనబడేవారు ధర్మాన్ని సాక్షాత్కరించుకున్నవారు, వారి పద్ధతిని అవలంభిస్తే నీవు అలాంటి సాక్షాత్కారాన్ని పొందగలవు. ప్రతీ శాస్త్రానికీ, ప్రత్యేక విధానము, సాధన సామాగ్రీ కావలసి ఉంది. వంటింటి పాత్రలను ఉపయోగిస్తూ, ఖగోళ శాస్త్రవేత్త శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలను చూపలేడు, అందుకు అతనికి దూరదర్శిని కావాలి. ఇలాగే, ధర్మ తత్త్వాలను తెలుసుకోవాలంటే, ముందుగా వాటి గురించిన అవగాహన కలవారి విధానాలను నీవు గమనించి, పాటించాలి. శాస్త్రం మహత్తరమైనది అయిన కొద్దీ, దానిని అభ్యసించేందుకు చేయవలసిన సాధనలు కూడా, అంతే విలక్షణంగా ఉంటాయి. ఈ సంసారంలోనికి మనం ప్రవేశించకముందే, భగవంతుడు ఉపాయాలను కల్పించి ఉంచాడు, వాటిని కనుగొనడమే మనం చేయవలసిన కార్యం. అయితే పద్ధతులను గురించి వాదులాటలోనికి దిగవద్దు. సాక్షాత్కారాన్నే లక్ష్యంగా పెట్టుకుని, ఆ మార్గాలలో నీకు అనుకూలమైన దానిని ఎంచుకొని ఆరంభించు. ఇతరులు మామిడిపళ్ళ బుట్ట గురించి వాదులాడుతూ ఉంటే, వాదులాడుకోనీ, నీవు మామిడిపళ్ళను తినడం మొదలుపెట్టు. క్రీస్తుని గాంచగలిగితే, నీవు క్రైస్తవుడివి అవుతావు, ఇంక మిగతావన్నీ అనవసరాలు.
సందేశం ఉంటేనే దూత అవసరం ఉంటుంది, అలాగే దేవుడు ఉండే చోటే దేవాలయం అవుతుంది కాని దేవాలయం ఉండటంచేత దైవత్వం కలుగదు.
ఉపనిషత్తులలో చెప్పిన విధంగా, శ్వేతకేతువు వదనంలో బ్రహ్మవర్ఛస్సు వెల్గొందిన విధంగా, నీ ముఖంలో బ్రహ్మవర్ఛస్సు వెలుగొందేవరకూ బ్రహ్మవిద్యను అభ్యసించు.
ఊహను ఖండించగల ఊహ కలహానికి నాంది అవుతుంది, అందువలన అనుభవసిద్ధమైన దాని గురించే మాట్లాడు, దానిని ఎవరూ కాదనలేరు. సాక్షాత్కారమే పాల్ మహాశయుడిని క్రైస్తవంలోనికి దింపింది.
మంగళవారం, మధ్యాహ్నం, జులై 23
(భోజనానంతరం జరిగిన లఘు సంభాషణలో స్వామీజీ ఇలా చెప్పారు)
భ్రమ భ్రమను కల్పించగలదు. భ్రమ అన్నది తనను తాను సృజించుకుంటూ, తనను తానే నశింపచేసుకుంటుంది, మాయ కూడా ఇలాంటిదే. జ్ఞానం మాయ మీద ఆధారపడి ఉండటంతో, ఒక చక్ర వలయంలో తిరుగాడుతూ ఉంది, కాలంతో తిరుగుతూ తనను తానే నశింపచేసుకుంటోంది. మనం తాడుని పట్టుకుని ఉన్నంతకాలం, మాయతో తాదాత్మ్యం చెంది ఉంటాము, తాడుని వదిలితే కాని విముక్తి లేదు, భ్రమ ఆత్మను స్పృశించలేదు. సాక్షీమాత్రంగా ఉన్నపుడే విశ్వచిత్రాన్ని ప్రశాంత చిత్తునివై చూస్తూ ప్రశంసించ గలుగుతావు.
బుధవారం, జులై 24
యోగసాధనచే కలిగే సిద్ధులు పూర్ణ యోగికి ఆటంకాలు కావు. అయితే ప్రారంభదశలో ఉన్నవారికి అవి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి, అవి సాధనలో ఆటంకాలై నిలుస్తాయి. సాధన సఫలవంతం అవుతోందని తెలిపే శక్తులే సిద్ధులు. ఇవి మంత్ర ఉచ్ఛారణచే గాని, ధ్యానం వలన గాని, యోగసాధన వలనగాని, ఉపవాసాల వలనగాని, చివరకు ఔషధాలు, మూలికల వలనగాని కలుగవచ్చు. అయితే సిద్ధుల పట్ల అభిలాషను జయించిన వ్యక్తీ, తన కర్మలచే సముపార్జించిన పుణ్యాన్ని సైతం పరిత్యజించిన వ్యక్తీ, మేఘమనే సమాధిస్థితిని పొందుతాడు. మేఘం వర్షించేవిధంగా, అతడు కూడా పవిత్రతను విరజిమ్ముతూ ఉంటాడు.
ధ్యానమనేది ఒకదాని వెంట మరొకటిగా అనేక ఆలంబనాల మీద నిలిచేది. అయితే, ఒక్క ఆలంబనం మీదనే దృష్టి నిలపగలిగేది ఏకాగ్రత అనబడుతుంది.
మనస్సు ఆత్మ చేత గ్రహించబడుతోంది కాని, స్వయం ప్రకాశమానమైనది కాదు. ఆత్మ దేనికీ కారణం కాజాలదు. పురుషుడు (ఆత్మ) ప్రకృతితో సంయోగాన్ని పొందడు, పొందినట్లు భ్రమిస్తూ ఉన్నాం.
* * *
జాలిపడకుండా, పరితాపం చెందకుండా సహాయం చేయడాన్ని నేర్చుకో; శత్రువులో, మిత్రునిలో సమభావాన్ని అలవరుచుకో, ఇవి చేయగలిగి, నీ కోరికలను నశింపచేసుకుంటే, నీ లక్ష్యాన్ని నీవు చేరుకున్నట్లే.
ఇచ్ఛ అనబడే వటవృక్షాన్ని, అసంగత్వం అనే గొడ్డలితో ఛేదించాలి, అప్పుడే అది పూర్తిగా కనుమరుగవుతుంది. ‘వినాశనకారియైన భ్రాంతిని తొలగించుకుని, సంగత్వపు దోషాలను జయించినవాడే ముక్తుడై అలరారుతున్నాడు’.
ఎవరినైనా వ్యక్తిగతంగా ప్రేమించడమే బంధం, అందరియందు సరిసమానమైన ప్రేమ కలిగిననాడు సమస్త వాంఛలూ తొలగిపోతాయి.
సర్వభక్షకకాలం ఆసన్నమైనపుడు సర్వం నశించవలసిందే, లోకాన్ని బాగు చేయాలని, సీతాకోక చిలుకకు రంగులు దిద్దే ప్రయత్నం చేయడం ఎందుకు? ఏదో ఒకనాటికి అంతా నశించవలసిందే. సదా పని చేస్తూ, చివరకు ఏమీసాధింపజాలని తెల్ల ఎలుకలమాదిరి ఉండవద్దు. వాంఛ అన్నది మంచి కొరకైనా, చెడుకైనా, దోషభూయిష్ఠమైనదే. పట్టుచిక్కని మాంసపు ముక్కకై వెనుతిరిగి వెడుతూ, దిక్కులేని చావు కొనితెచ్చుకునే కుక్కబతుకుకై ఆరాటపడవద్దు. కోరికలకు చోటుని ఇవ్వక, వాటిని నిర్మూలించు.
* * *
మాయాధీశుడైన పరమాత్మే ఈశ్వరుడు. మాయకు అధీనుడైన పరమాత్మే జీవుడు. ఈ దృశ్యప్రపంచమంతా మాయతో నిండి ఉంది; ఏదో నాటికి పూర్తిగా అదృశ్యం కాగలదు.
మాయ వృక్ష తత్త్వంగా భాసిస్తోంది. భగవత్ తత్త్వాన్ని మాయావరణంలో ఉన్నందున మనం వృక్షతత్త్వంగా చూస్తున్నాం. దేని గురించైనా ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం మాయలోని భాగమే. మాయ ఎందుకు వచ్చిందని అడగటం అనవసరం ఎందుకంటే దానికి ఎన్నటికీ జవాబు దొరకదు. మాయకు అతీతుడైన వానికి దాని అవసరం రాదు. అపకారం ‘ఎందుకు’ అనే ప్రశ్నను పుట్టిస్తుంది గాని ‘ఎందుకు’ అనే ప్రశ్న అపకారాన్ని పుట్టించడం లేదు కనుక ‘ఎందుకు’ అని అడగడమే దోషం. భ్రాంతి భ్రాంతిని నశింపజేస్తోంది. హేతువాదం పరస్పరవిరుద్ధాల మీద ఆధారపడి ఉండడంతో తనను తానే నశింపచేసుకోవాలి. ఇంద్రియ గ్రహణమనేది ఊహాజనితం. అయితే, ఊహాజనితమైనదంతా ఇంద్రియ జ్ఞానం నుండే వెలువడుతోంది.
బ్రహ్మతేజాన్ని ప్రతిఫలించే విధంగా అవిద్య గోచరిస్తున్నా, స్వయంగా అది శూన్యమైనటువంటిది. సూర్యకాంతి తనమీద పడితేగాని, మేఘం మనకు గోచరించదు.
నలుగురు ప్రయాణీకులు బాగా ఎత్తుగా ఉన్న ఒక గోడ వద్దకు వచ్చారు. అందులో మొదటివాడు కష్టపడి దానిని ఎక్కి, వెనుకకు చూడకుండా ఆవలివైపుకి దూకేశాడు. రెండవవాడు గోడపైకి ఎక్కి, ఆహా! అని విభ్రాంతి చెందుతూ అదృశ్యమయ్యాడు. మూడవ వ్యక్తి గోడ ఎక్కి, ఆవలి వైపుకి చూస్తూ పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అంతకు ముందు వారిని అనుసరించాడు. నాలుగవ వ్యక్తి మాత్రం తన సహచరుల ఉదంతాన్ని లోకానికి తెలిపేందుకు, గోడ ఎక్కి కూడా, వెనుతిరిగి వచ్చాడు. మాయాకుడ్యాన్ని దాటిన మహనీయుల నుండి వెలువడే నవ్వులో మాయాతీతమైనది ఒకటి ఉందని మనకు తెలుపుతుంది.
బ్రహ్మం నుండి విడివడిన మనం, బ్రహ్మానికి కొన్ని గుణాలను ఆరోపించడంతో ఈశ్వర తత్త్వం ఏర్పడుతోంది. మనస్సు మూలంగా మనకు గోచరమయ్యే విశ్వయధార్ధ్యమే ఈశ్వరుడు. మూఢ విశ్వాసుల మనస్సులలోని దుఃఖకారణాలే పిశాచరూపంగా వ్యక్తం అవుతున్నాయి.
గురువారం, జులై 25
పతంజలి యోగసూత్రాలు
విషయాలు జరిగినా, జరగడానికి కారణాలైనా, లేదా జరిగేందుకు అంగీకరించబడినా, వాటి ఫలితం సరిసమానంగానే ఉంటుంది.
పరిపూర్ణమైన బ్రహ్మచర్యం బుద్ధిబలాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని అత్యధికంగా ఇవ్వగలదు. బ్రహ్మచారి మనోవాక్కాయముల యందు అంతః శుద్ధిని కలిగి ఉండాలి, శరీరాభిమానాన్ని త్యజించాలి, శరీర స్పృహను వీలైనంతవరకూ విడనాడాలి.
ఆసనం స్థిరమైనదిగానూ, సుఖంగానూ ఉండాలి. నిరంతర అభ్యాసంతో, మనస్సును అంతరాత్మతో అనుసంధానం చేసిన ఎడల ఆసనసిద్ధి కలుగును.
ఒకే వస్తువుయందు ఎడతెగని దీక్షను కలిగి ఉండటమే ధ్యానమని అంటాము.
ప్రశాంతమైన సరస్సులో రాయిని వేస్తే, అలలు ఏర్పడతాయి. అవి ప్రతీది వేరుగా ఉన్నట్లు కనిపించినా వాటి ప్రభావం ఒకదాని మీద ఒకటి ఉంటుంది. మన మనస్సు విషయం కూడా ఇలాంటిదే. మనకు తెలియకుండా మనలో ఆలోచనలు అనే వలయాలు అజ్ఞాతంగా ఉంటాయి, అదే యోగులలో ఈ కార్యం వారికి తెలిసే జరుగుతుంది, వాటికి వారు సాక్షులుగా ఉండగలరు. ఇదే మనకి, వారికీ ఉన్న తేడా. యోగసాధన, సాలీడు మాదిరిగా, ఏ పోచ నుండైనా వర్తించేందుకు సమర్థులుగా తయారు చేస్తుంది. యోగులు కానివారు ఉన్నచోటే కదలక, బద్ధులై ఉంటారు.
* * *
హింసను చేయడం వలన, అది బంధాన్ని కల్పించి, సత్యం మరుగున పడేలా చేస్తుంది. దోషరహితమైన మంచితనాన్ని అవలంబించినంత మాత్రాన సరిపోదు, మాయను జయించాలి, అప్పుడే అది మనలను అనుసరిస్తుంది. ఏదీ కోరనివారే ప్రకృతికి అధిపతులు. బంధం విడివడగానే, వాస్తవానికి సమస్తం, వారి వద్దకే వస్తాయి.
బంధాలనుండి విడివడిన మహనీయుని శరణువేడుము, కాలక్రమములో తన కృపచే అతను నిన్ను విముక్తుడిని గావిస్తాడు. అంతకంటే ఈశ్వర శరణాగతి మరింత ఉత్తమం, అయితే అది కష్టతరమైనది. మానవులలో శతాబ్దానికి ఏ ఒక్కరో ఈ కార్యాన్ని సాధించే సమర్థతను కలిగి ఉంటారు. ఏ అనుభవాన్ని పొందేందుకు ప్రయత్నించక దేనినీ గ్రహించక, ఏ కార్యమునందు తగులుకొనక, స్వంతమనే దేదీ ఉంచుకోక, సమస్తాన్నీ, సర్వస్వాన్నీ ఆ భగవంతునికి సమర్పించి, ‘నీ సంకల్పమే జరుగుతుంది’ అని మనస్ఫూర్తిగా వచించగలగాలి. ఈ సంసారబంధం స్వప్నభ్రాంతిని కలిగినటువంటిది. దీని నుండి మేలుకుని, ఆ బంధాన్ని వదిలించుకుని, భగవంతుని శరణువేడుము, అప్పుడే ఈ ‘మాయ’ అనే ఎడారిని దాటగలవు.
ఎందు వెదకెదవీవు మిత్రమా? సర్వతంత్ర స్వతంత్రము
ఏ లోకమునందు దొరకదు, ఇదియె నిత్యము సత్యము
మందిరములను గ్రంథములనూ వ్యర్థము అన్వేషణం
నీకు బంధనమైన త్రాటిని నీవే గట్టిగ పట్టుకొంటవి
వ్యర్థముగ మరి దేనికిపుడు నీదు శోకాలాపము
త్రెంచు బంధము ధీరతను మ్రోగించు సన్న్యాసీ!
– ఓం! తత్! సత్! ఓం!
దాతలై వర్తించగల అవకాశం ఉన్నచో, అది మహాభాగ్యంగా భావించాలి, ఎందుకంటే దాని మూలంగానే వృద్ధి కలుగుతుంది. మనకు తోడ్పడేందుకే, పేదవాడు దారిద్ర్యబాధను అనుభవిస్తున్నాడు, అందువలన దాత, గ్రహీతకు ప్రణామం చేసి, వినయంగా సమర్పించాలి. ప్రతీ జీవియందు మరుగున ఉన్న ఆ భగవదునికిని గుర్తిస్తూ, నీ ముడుపులను సమర్పించు; దోషాలను వెతికే ప్రయత్నాన్ని మానివేయి; లోపాలు ఉన్నాయనే భావనే వాటిని సృజిస్తున్నాయి. శక్తివంతమైన ఆలోచనలే పరిపూర్ణతను పెంపొందిస్తూ, ఆ లోపాలను సరిపెడతాయి. స్వలాభాలను లెక్కించక, సర్వకర్మల ఫలాన్ని భగవంతునికి సమర్పిస్తూ చేసిన ఎడల పుణ్య, పాపాలు నిన్ను బాధించలేవు.
కర్మాచరణమే మతం కాదు, అయినా సక్రమమైన కర్మాచరణం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. వాస్తవానికి ‘జాలి’ అనేది తమస్సుకి సంబంధించింది. ఎందుకంటే నీవు ఎవరిని చూసి జాలి పడుతున్నావు? భగవంతుని చూసి జాలిపడగలవా? ఈ సృష్టిలో భగవంతుడు వినా మరేదైనా మిగిలి ఉందా? నీ వికాసానికి తోడ్పడేందుకు ప్రపంచమనే నైతిక పరమైన వ్యాయామశాలను ఆయన ఏర్పాటు చేసి ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేయి. అంతే తప్ప ప్రపంచానికి నీవు సాయపడగలనని ఎన్నడూ భావించకు. నిన్ను శపించేవాడి పట్ల కృతజ్ఞత చూపించు, ఎందుకంటే అతను నీకు శాపం అనేది ఎటువంటిదో తెలియజెప్పే అద్దాన్ని చూపడమే కాక, నీ ఆత్మనిగ్రహం ఎంతటితో తెలియజేసే అవకాశం కూడా కల్పిస్తున్నాడు, అందువలన అతడిని తప్పక దీవించి, సంతోషాన్ని పొందాలి. సాధన లేనిదే శక్తి వెలువడదు, అద్దం లేనిదే మనలను మనం చూసుకోలేము.
అపవిత్ర కార్యం ఎంతటి చెడ్డదో, అలాంటి అపవిత్రపు ఆలోచనలు కలగడం కూడా అంతే చెడుని కలుగజేస్తుంది. కోరికలపై నియంత్రణను కలిగి ఉండటం మహోన్నత ఫలితాలను అందజేస్తుంది. భోగశక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చే ప్రయత్నం చేయి, వీర్యనిగ్రహం కలిగి ఉండటం ఆవశ్యకం కోల్పోవడం అంటే శక్తిని చేజార్చుకున్నట్లే శక్తివంతమైన జలప్రవాహమే గనుల తవ్వకంలో ఉపయోగపడుతుంది, అలాగే ఈ శక్తి ద్వారా ఘనకార్యాలను సాధించవచ్చును.
మనకు ఈనాడు కావలసిన విశ్వాసం ఏమంటే భగవంతుడు ఉన్నాడు కనుక, అతడిని ఇహంలోనే, ఈ క్షణంలోనే చూడగలమని తెలుసుకోవడం. ‘నీవు ప్రపంచాన్ని గురించి యోచిస్తే, భగవంతుడు నీ గురించి జాగ్రత్త వహిస్తాడు’ అని ఒక చికాగోకు చెందిన ఆచార్యుడు అన్నా, అది వాస్తవం కాదు. ఇహాన్ని గురించి మనం జాగ్రత్తపడితే, పరాన్ని గురించి జాగ్రత్తపడి, ఉచితంగా అందచేసేందుకు దేవుడు అవసరమా?
శుక్రవారం, జులై 26
బృహదారణ్యకోపనిషత్తు
“ఆత్మ ద్వారా ఆత్మ కోసమే సర్వాన్ని ప్రేమిస్తున్నాము, మనకు ఆత్మ మూలంగానే సర్వమూ తెలుస్తోంది” అని యాజ్ఞవల్క్యుడు తన భార్య అయిన మైత్రేయికి తెలిపాడు. ఆత్మ ఎన్నటికీ జ్ఞేయం కాజాలదు, జ్ఞాత ఎలా జ్ఞేయం అవగలదు? ఎవరు తాను ఆత్మనని గ్రహిస్తారో అతను తనకు తానేశాస్త. విశ్వమూ, దాని కర్తా రెండూ తానేనని అతడు గ్రహిస్తాడు.
* * *
అన్యోపదేశ మార్గంలో తత్త్వాన్ని తెలిపేవని పురాణగాధలకు అనవసర ప్రాముఖ్యాన్ని ఇవ్వడం మూఢవిశ్వాసమే కాక దుర్బలత్వానికి నిదర్శనం. సత్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. సత్యాన్ని మాత్రమే బోధించు, ఏ మూఢ విశ్వాసానికి అంజలి ఘటించవద్దు. వినేవారి స్థాయికి సత్యాన్ని ఎన్నడూ దిగలాగవద్దు.
శనివారం, జులై 27
కఠోపనిషత్తు
ఆత్మతత్త్వాన్ని తెలుసుకునేందుకు, దానిని అనుభూతమొనర్చిన వారి వద్దకే వెళ్ళాలి; మిగిలిన వారి వద్దకు వెళ్ళవద్దు, అందరూ వట్టి వాచాలురే. సాక్షాత్కారమన్నది భూత భవిష్యత్తులకు, పుణ్యపాపాలకు, సమస్త ద్వంద్వాలకు అతీతమైనటువంటిది. ‘నిర్మలమైన ఆత్మ కలవారికి సాక్షాత్కారం సాధ్యమై, శాశ్వతశాంతి ఆత్మలో నెలకొని ఉంటుంది’. అయితే ప్రవచనాలు గాని, వాదాలుగాని, గ్రంధపఠనం గాని, మహోన్నత ధీశక్తిగాని, చివరకు వేదాలు గాని ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేవు.
మనలో జీవాత్మ, పరమాత్మ రెండూ ఉన్నాయి. జీవాత్మ కేవలం ప్రతిబింబ మాత్రమేనని, పరమాత్మ ఒక్కటే యదార్థ భాస్కరుడని ఋషులు తెలియచేస్తున్నారు.
మనస్సుని ఇంద్రియాలతో సంయోగం చేస్తే గాని, కన్ను, ముక్కు, చెవి మొదలైన వాటి మూలంగా విషయజ్ఞానం కలగదు. మనస్సు యొక్క శక్తి బాహ్యేంద్రియాలచే ఉపయోగించబడుతోంది. అందువలన ఇంద్రియాలను బయటకు పోనీక, అంతర్ముఖం చేస్తే, దేహభ్రాంతిని విడనాడి, బాహ్య ప్రపంచాన్ని తొలగించుకోగలవు.
బాహ్య ప్రపంచంలో మనం చూసే ఈ మాయనే విగతజీవులు, వారి మానసిక స్థితిని అనుసరించి స్వర్గంగా గాని, నరకంగా గాని చూస్తున్నారు. ఇహమూ, పరమూ రెండూ స్వప్నాలే, ఇహం నమూనాని కలిగి ఉంటే పరం స్వప్నమౌతోంది, అందుచేత రెంటినీ తొలగించుకో; అంతా సర్వగతమై, ఇక్కడే ఉంది. విలయం అన్నది మనస్సుకి, శరీరానికి, ప్రకృతికి కలుగుతుంది కాని మనకు కలుగదు; మనం పోవడమూ లేదు, రావడమూ లేదు. వివేకానందస్వామి అనే మానవుడు ప్రకృతిలో ఉన్నందున, అతను జన్మించి ఉన్నాడు, మరణిస్తాడు కానీ వివేకానందస్వామి రూపంలో మనం చూసే ఆత్మ ఎన్నడూ జన్మించి ఉండలేదు, ఎన్నటికీ మరణించదు. అది నిత్యమూ మరియు మార్పు లేనటువంటి సత్యము.
మనశ్శక్తిని మనం పంచేంద్రియాలుగా చూసినా, ఒక్కటిగా చూసినా, దాని శక్తి ఎప్పుడూ ఒక్కటే. గుడ్డివాడు ఇలా అంటాడు – ‘లోకంలో ప్రతీదానికీ ఒక ప్రత్యేకమైన ప్రతిధ్వని ఉంది, అందువలన నేను చప్పట్లు కొట్టి ఆ ప్రతిధ్వనిని విని, నా చుట్టూ ఉన్న సర్వం గురించి చెప్పగలుగుతాను.’ అందువల్లనే దట్టంగా ఉన్న పొగమంచులో గుడ్డివాడు, కళ్ళున్నవాడికి సురక్షితమైన దారిని చూపించగలడు, ఎందుకంటే అతని దృష్టిలో చీకటికి, పొగమంచుకి భేదం లేదు.
మనస్సుని నిగ్రహించుకుని, ఇంద్రియాలను అరికట్టగలిగితే, నీవు ఒక యోగివి కాగలవు; ఆ తరువాత, అన్నీ వాటంతటవే వస్తాయి. బాహ్యేంద్రియాల నుండి మనశ్శక్తిని తొలగించు; వినడానికి, చూడటానికి, ఆఘ్రాణించడానికి, రుచి చూడటానికి నిరాకరించు; అయితే ఇలా నీకు తెలియకుండానే, నీ మనస్సు దేని మీదైనా ఏకాగ్రంగా ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నావు, కాబట్టి ప్రజ్ఞతో ఈ కార్యాన్ని చేయడం సాధ్యమే. మనస్సు ఇంద్రియాలను తన ఇష్టం వచ్చిన చోటు పెట్టగలదు, అందువలన శరీరం ద్వారానే ప్రవర్తించడం అనివార్యమనే మూఢ విశ్యాసాన్ని వదిలివేయి, అది ఏమీ అనివార్యం కాదు. ఆత్మ మందిరంలోకి నిరాటంకంగా ప్రవేశించి, ఉపనిషత్తులను నీ ఆత్మనుండే పొందు. సర్వానికీ అఖండమైన విజ్ఞానగనివి, మహోత్తమ గ్రంధానివి నీవే అయి ఉన్నావు. అంతరాచార్యుని ప్రబోధం జరగనిదే, బాహ్య బోధనలన్నీ నిష్ఫలాలే. దానికి, హృదయమనే గ్రంథాన్ని తెరవగలగడమే మార్గం. బాహ్యబోధనలు ఇందుకు ఉపయుక్తాలై నిలుస్తాయి. సంకల్పమనేది నిశ్శబ్దమైన సూక్ష్మ అంతర్యామిగా ఉంటూ, ‘ఇది చేయి, ఇది చేయవద్దు’ అని తెలుపుతూ యదార్ధమైన పరిపాలకుని వలె ప్రవర్తిస్తుంది. మనలను బంధనంలో ఇరికించే పనులన్నీ ఈ సంకల్పమే చేయిస్తోంది. అయితే జ్ఞానహీనమైన సంకల్పం బంధహేతువుగా, జ్ఞానవంతమైన సంకల్పం మోక్షసాధనంగా మారుతున్నాయి. సంకల్పాన్ని దృఢతరం చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, ప్రతీ మార్గమూ ఒక యోగమే. అయితే శాస్త్రబద్ధమైన యోగం కార్యాన్ని శీఘ్రంగా నెరవేర్చగలదు. భక్తి, కర్మ, రాజ, జ్ఞానయోగాలు అమోఘమైన ఫలితాలను కలిగి ఉన్నాయి. అన్ని శక్తులను, తత్త్వాన్ని, కర్మను, భక్తిని, ధ్యానాన్ని మిళితం చేసి, నీ సాధన నౌకకు ఉన్న తెరచాపను పూర్తిగా తెరిచి, నీ గమ్యాన్ని త్వరితంగా చేరేందుకు ప్రయత్నించు, ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది.
* * *
క్రైస్తవుల జ్ఞానస్నాన సంస్కారం (బాప్టిజమ్) అనే బాహ్యశుద్ధి క్రియ అంతరశుద్ధికి చిహ్నంగా నిలుస్తుంది. బౌద్ధమతం నుండి ఈ ఆచారం గ్రహించబడింది.
క్రైస్తవమతంలోని ‘యూకారిస్ట్’ (మహాప్రసాద వినియోగం) అనే ఆచారం, ఇప్పటికీ నిలిచి ఉన్న అడవిజాతుల వారి అత్యంత పూర్వాచారం. వారు తమ నాయకులలో ప్రముఖులైన వారిని వధించి, వారి మాంసాన్ని ఆరగించడం ద్వారా ఆ గుణాలు తమలో కూడా కలుగుతాయని, అలా ఒక్కరిలో ఉన్న ప్రముఖ లక్షణాలు జాతికంతటికీ అలవడతాయనీ భావించేవారు. నరబలి అన్నది యూదులకూ ఆదర్శమే, జెహోవా వారిని ఎన్నిసార్లు దండించినా, వారు ఆ ఆచారాన్ని వదలలేదు. జీసస్ సాధుసత్తముడు ప్రేమమయుడు, అయితే యూదియా మతవిశ్వాసాలకు అతని సిద్ధాంతాలను అనుకూలించేటట్లు చేయడానికే ప్రాయశ్చిత్త రూపంలో యజ్ఞపశురూపంలో నరబలి సిద్ధాంతాన్ని ఆమోదించే విధంగా రక్తాన్ని చిందించాడు. ఈ క్రూర సిద్ధాంతం క్రైస్తవమతాన్ని, జీసస్ బోధలనుండి విడనాడచేసి, హింసాత్మక రక్తపాతాన్ని చూసేలా చేసింది. ఏ కార్యం చేసేటప్పుడైనా ‘ఇది నా స్వభావం’ అని చెప్పు, అంతేకాని ఇది నా విధి అనవద్దు.
‘సత్యమేవ జయతే నానృతమ్’ – సత్యమే జయిస్తుంది తప్ప వేరేది కాదు. అందువలన సత్యాన్ని దృఢంగా పట్టుకుంటే దైవసాక్షాత్కారం కలుగుతుంది.
* * *
భారతదేశంలో ప్రాచీనకాలం నుండి బ్రాహ్మణ కులస్థులు తాము శాసనాతిరిక్తులమని భావించేవారు. తాము దైవ స్వరూపులమని వారి భావన. వారు నిరుపేదలే అయినా వారి దుర్బలత్వం అంతా అధికారవాంఛలో ఉంది. యోగ్యులు, ధార్మికులు, నిరుపేదలైన వీరు ఆరు కోట్ల మంది ఉన్నారు, అయితే శాసనాతీతులమని, దండనాతీతులమని పుట్టుక నుండి బోధించడంచే వారిలా ఉన్నారు. తాము ద్విజులమని, బ్రహ్మసంతానమని వారి భావన.
ఆదివారం, జులై 28
అవధూత గీత*
“మానసిక ప్రశాంతత మీదే జ్ఞానం అంతా ఆధారపడి ఉంది.”
“ఎవరైతే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడో, ఎవరైతే ఆత్మకు ఆత్మో, అతనికి నా వందనాలు ఏ విధంగా అందజేయగలను” !
“ఆత్మయే నా తత్త్వం అని గ్రహించగలగడమే జ్ఞానమూ, సాక్షాత్కారమూ”. నేను అతడినే, ఇందులో సందేహం కించిత్ కూడా లేదు.
ఏ భావంగాని, శబ్దంగాని, పనిగాని నాకు బంధాన్ని కల్పించలేదు. “నేను ఇంద్రియాతీతుడిని, చిదానంద స్వరూపుడిని.”
ఉన్నదల్లా ఆత్మే, ఇందులో అస్తిత్వంలేదు, నాస్తిత్వం లేదు. ద్వంద్వ భావాలను, మూఢవిశ్వాసాలను వదిలించుకో, జాతి, జన్మ, దేవతలు, ఇవన్నీ మాయమైపోనీ, ఉండటం గురించో, అవడం గురించో అనవసర ప్రసంగాలెందుకు? ద్వైతం, అద్వైతం గురించి కూడా మాటలెందుకు? ఏకత్వం గురించి కాని, అనేకత్వం గురించి కాని మాట్లాడేందుకు నీవెప్పుడు రెండుగా ఉన్నావు? విశ్వమంతా నిండి ఉన్నది ఆ పరమ పావనుడే, ఆయన మాత్రమే అని గుర్తించు. యోగం నిన్ను నిర్మలుడిగా చేస్తుందని అనకు ఎందుకంటే స్వతఃసిద్ధంగా నీవు నిర్మలుడివే అయి ఉన్నావు, దానిని నీకు బోధించేవారెవ్వరూ లేరు.
ఈ అవధూతాగీతా రచయితలవంటివారే ఆధ్యాత్మిక ధర్మాన్ని సజీవంగా పదిలపరచగలవారు. స్వయంగా వారు సాక్షాత్కారస్థితిని కలిగి ఉన్నందున, దేనినీ వారు లక్ష్యించక, శీతోష్ణాలను, ఆపదలను లెక్కించక ఉంటారు. కణకణమండే నిప్పులలో కూర్చుని ఉన్నా ఆ వేడిమి వారిని తాకదు, ఎందుకంటే వారు నిశ్చలంగా కూర్చుని ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
“జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనే ఈ మూడు మడతల బంధనం ఎప్పుడైతే తొలుగుతుందో, అప్పుడే ఆత్మ ఉన్నట్లుగా అర్ధమవుతుంది.”
నీవు మనస్సుని నిగ్రహిస్తే ఏమిటి, నిగ్రహించకపోతే ఏమిటి? నీవు ధనవంతుడవైతేనేమి? నిర్ధనుడవైతేనేమి? నీవు ఎప్పటికీ నిత్య శుద్ధమైనటువంటి ఆత్మవే. అందువలన “నేను ఆత్మను, నన్ను ఏదీ బంధించజాలదు. నిర్వికార ఆకాశాన్ని నేను; విశ్వాసమేఘాలు నా మీద నుండి వెడుతున్నా అవి నన్ను అంటుకోలేవు” అని వచించు.
పుణ్యపాపాలను మరిచిపో, మోక్షం అనడం చిన్న పిల్లలమాట వంటిది. “ఆ నిత్య జ్ఞానాన్ని నేనే, ఆ విశుద్ధి తత్త్వాన్ని నేనే”.
ఎవరూ ఎన్నడూ బద్ధులు కాలేరు, ముక్తులు కాలేరు. నేను తప్ప అన్యులెవరూ లేరు. నేను అనంతత్త్వాన్ని, నిత్య ముక్తుడిని. జ్ఞానసారమైన నన్ను మార్చేది ఏదీ లేదు. ఎవరు బోధించగలరు? ఎవరికి బోధించగలరు?
తర్కాన్ని, తర్కశాస్త్రాన్ని వదిలివేయి. బానిసకే బానిసలు కానవస్తారు, అలాగే భ్రాంతిమతులకే భ్రాంతి కానవస్తుంది, అపవిత్రునికే అపవిత్రత కనిపిస్తుంది.
దేశ, కాల నిమిత్తాలనేవి అన్నీ భ్రాంతిజనకాలే. నీవు బద్ధుడవనీ, ముక్తుడివి అవుతావని అనుకోవడమే ఒక జాడ్యం. నీవు నిర్వికారుడివి. మాట్లాడకుండా కూర్చుని సమస్త విషయాలను కరిగిపోనివ్వు, అవి అన్నీ వట్టి స్వప్నాలే. భేదం, తారతమ్యం వంటివన్నీ మూఢవిశ్వాసాలే. అందువలన మౌనం వహించి, నీ తత్త్వాన్ని తెలుసుకో.
“నేను అమృతమయ స్వరూపుడిని”. ఏ ఆదర్శాన్ని అనుసరించక పోయినా ఈ వాక్యాన్ని దృఢపరుచుకో. భయపడవద్దు, నీవు సత్యస్వరూపుడివి, ప్రశాంత చిత్తుడివి అందువలన అనవసరంగా నిన్ను నీవు కలవరపరుచుకో వద్దు. నీవు ఎన్నడూ బద్ధునిగా లేవు. ఎన్నడూ పాపాత్మునిగానో, పుణ్యాత్మునిగానో లేవు. ఈ భ్రమలను విడనాడి, ప్రశాంతంగా ఉండుము. ఉపాసించేది ఎవరిని? ఉపాసించేవారెవ్వరు? సర్వం ఆత్మే. ఇంకో విధంగా మాట్లాడటం, భావించడం మూఢ విశ్వాసమే. ‘నేను ఆత్మను, నేను ఆత్మను’ అంటూ మననం చేయి, తక్కినది అంతా అదృశ్యం కానివ్వు.
సోమవారం, జులై 29
మనం ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు, ఒకోసారి దాని చుట్టూ ఉన్న పరిసరాలను వర్ణిస్తూ సూచిస్తాం. అయితే ‘సచ్చిదానందం’ (సత్–చిత్–ఆనందం) గురించి చెప్పేటప్పుడు అనిర్వచనీయమైనది అని అతీతతీరాన్ని సూచిస్తాము. అది ‘ఉంది’ అని కూడా చెప్పలేము, ఎందుకంటే అదీ సాపేక్షమే. ఏ భావన అయినా, ఏ ఊహ అయినా నిరుపయోగమే. ‘నేతి, నేతి’ అంటే ‘ఇది కాదు, ఇది కాదు’ అని మాత్రమే చెప్పగలం. భావించగలగడం కూడా ఒక పరిమితిని కలుగజేస్తుంది, దాని వలన అసలుని కోల్పోతాము.
రేయింబవళ్ళు ఇంద్రియాలు నిన్ను మోసం చేస్తున్నాయనే విషయం యుగాలకు ముందే వేదాంతం కనుగొంది. దానిని ఆధునిక శాస్త్రం ఇప్పుడిప్పుడే కనుక్కుంటోంది. ఒక చిత్రపటానికి పొడవు, వెడల్పు మాత్రమే ఉన్నా, చిత్రకారుడు మనల్ని వంచిస్తూ కృత్తిమంగా లోతుని కూడా కలిపిస్తూ, ప్రకృతిని అనుసరిస్తున్నాడు. ఏ ఇద్దరూ ఒకే విధంగా ప్రపంచాన్ని చూడలేరు. దేనిలోనూ చలనం, మార్పు అన్నవి లేవని అత్యున్నత జ్ఞానం తెలుపుతుంది. ప్రకృతిని అఖండంగా ఎంచి, అందు చలనాన్ని అధ్యయనం చేయి. మనస్సు, శరీరం నిజమైన ఆత్మకాదు; అవి రెండూ ప్రకృతికి చెందినవి, అందువలన అవి వస్తుతత్త్వానివని గ్రహిస్తాం; మనశ్శరీరాలు అతిక్రమించబడటంతో అవి కల్పించేవి అన్నీ అంతరిస్తాయి. ప్రాపంచికదృష్టి అంతరిస్తే, నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. వ్యావహారిక జ్ఞానాన్ని అతిక్రమించడమే మనకు కావలసింది. అఖండమైన మనస్సు కాని, జ్ఞానం కాని లేవు ఎందువలనంటే మనస్సు, జ్ఞానాలు కూడా పరిమితాలే. మనం ఇప్పుడు తెరద్వారా చూస్తున్నాం, జ్ఞానానికి పరమార్థమైనటువంటి అనిర్వచనీయ తత్త్వాన్ని సమీపించనున్నాం.
నలుపలకల అట్టముక్కలో ఒక సూదిబెజ్జం వంటి రంధ్రం చేసి, దాని ద్వారా ఒక పటాన్ని చూస్తే మనకు పూర్తి అవగాహన ఎన్నటికీ కలుగదు, అయినా మనం చూసేది పటాన్నే. అయితే ఆ రంధ్రం పెద్దది అవుతున్నకొద్దీ, మనకు స్పష్టతరమైన దర్శనం కలుగుతూ ఉంటుంది. నామరూపాలను మనం అర్థం చేసుకోవడంలో యదార్థం నుండి విభిన్న దృశ్యాలుగా చూస్తున్నాం, అట్టను పూర్తిగా తొలగించినప్పుడూ అదే పటం ఉంటుంది కాని, దానిని యదార్ధ రీతిలో చూస్తాం. ఎన్ని విశేషణాలను, తప్పులను ఆరోపించినా, వాటివలన పటం కించిత్ కూడా మారదు. అలాగే ఆత్మే అన్నింటిలోని తత్త్వమై ఉంది, మనం చూసేదంతా ఆత్మే, అయితే నామరూపాలు కలదానిగా చూస్తున్నాం, నామరూపాలన్నీ మనకు మధ్యనగల తెరలో ఉన్నాయి.
ఈ నామరూపాలు అద్దం మీద మచ్చల వలె ఉన్నాయి, వాటిని తెలియపరచేది వెలుతురు. బ్రహ్మం అనబడే తత్త్వం లేనిదే మాయను సైతం మనం కనుగొనలేము. వివేకానందస్వామి అనబడేవాడు ఈ అద్ధంపైన ఉన్న మచ్చ మాత్రమే. నేను ఆత్మను, నిర్వికారుడిని, పరమార్థాన్ని; ఆ పరమార్థమే నన్ను వివేకానందస్వామిని చూసేలా చేయగలుగుతోంది. ప్రతీభ్రాంతిలోని మూలతత్త్వమూ ఆత్మే, అయితే అద్దంపై గల మచ్చలనే సూర్యుడని అనలేము, సూర్యుడు సాక్షీభూతుడై మనకు చూపెట్టేవాడు మాత్రమే. మనం చేసే పాప, పుణ్య కర్మల వలన ఈ మచ్చలు వృద్ధి చెందడమో, క్షీణించడమో జరుగుతుంది, అయితే అవి బ్రహ్మంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. మనస్సుని నిర్మలం చేసుకుంటే, ‘నేనూ, నా తండ్రి ఒక్కరమే’ అన్న సత్యం అనుభూతమౌతుంది.
మొదటగా మనం గ్రహిస్తాం, ఆ తరువాత తర్కిస్తాం, వాస్తవానికి ఈ గ్రహించే సామర్ధ్యాన్నే అలవరుచుకుంటే, ఆ తరువాత అదే మతమని, సాక్షాత్కారమనీ తెలుస్తుంది. మతసంప్రదాయాలను గురించి గాని, ఆచార్యులను గురించిగాని, గ్రంధాలను గురించి గాని తెలువకపోయినా ఫరవాలేదు, సాక్షాత్కారతపన కలిగితే చాలు, ఇంక మిగిలినవి అక్కర్లేదు. మనస్సుని నిర్మలం చేసుకోవడమే మతం యొక్క లక్ష్యంగా చెప్పబడింది. మనంతట మనం మనలోని కళంకాలను తొలగించుకుంటేగాని, తత్త్వాన్ని వాస్తవిక రూపంలో చూడలేము. ఒక పసిపాప హృదయంలో ఏ భావాలు లేక ఎలా నిర్మలంగా ఉంటుందో, అలాంటి నిర్మలత్వాన్ని అలవరుచుకో; పసిపిల్లలు తమ కళ్ళ ముందర దోపిడీ జరిగినా, వారు స్పందించరు ఎందువలనంటే వారి మనస్సులో ఆ ముద్ర లేదు, ఇదీ మనకు కావలసింది; సమస్యాపూరణంలోని మూలవిషయాన్ని గుర్తించగలిగితే, అదే పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది, అలాగే మన మనస్సు అకళంకం, విముక్తమైతే మనకు స్వాతంత్ర్యం, స్వచ్ఛతే మన చుట్టూ గోచరిస్తూ ఉంటాయి. ఏ నిముషాన హృదయంలోని ముడులు విడివడతాయో, అప్పుడు వక్రతలన్నీ చక్కబడి, ఈ ప్రపంచం ఒక స్వప్నం మాదిరి అదృశ్యమౌతుంది. మనకు మెలకువ రాగానే ‘ఇలాంటి తుచ్ఛ విషయాలను గురించి ఎలా కలగన్నామా అని ఆశ్చర్యం వేయగలదు’ !
ఎవరిని కనుగొంటే, ఎంతటి దుఃఖపర్వతాలైనా శక్తి విహీనాలై, ఆత్మను అంటుకోజాలవో, అతడే ఆ పరబ్రహ్మము.
జ్ఞానఖడ్గంతో బంధాలనే చక్రాలను ఖండించి వేస్తే, ఆత్మ విముక్తమై వెలుస్తుంది. అయితే ప్రవాహవేగంతో బండి, చక్రం, నిమిత్తాలై కదులుతూనే ఉంటాయి, ఇప్పుడది సరియైన ఋజుమార్గంలోనే వెడుతూ హితం మాత్రమే చేయగలుగుతుంది. ఎవరైనా చెడుని ఒనరించాలని చూస్తే, ఆ మానవుడు జీవన్ముక్తుడు కాడనే విషయాన్ని గ్రహించు; అయితే జ్ఞానఖడ్గం ఉపయోగించే ముందు చిత్తశుద్ధిని కలిగి, చక్రాలు తిన్నగా నడుస్తున్నాయా లేదా అన్నది గుర్తించాలి. చిత్తశుద్ధిని కలిగి ఉన్న కర్మాచరణం తెలిసి కాని తెలియక గాని భ్రాంతులను పటాపంచలు చేస్తుంది. ఇంకొకరిని పాపులుగా భావించగలగడం ఘోరమైన తప్పిదం. అజ్ఞాతంగా చేయబడినా, సత్కర్మ సత్ఫలాన్నే కలిగించి, బంధమోచనానికి దారి తీస్తుంది.
అద్దం మీదగల మచ్చలను చూసి సూర్యుడనుకోవటమే ప్రాధమిక తప్పిదం. అసలైన ‘నేను’ అనే సూర్యుడు సదా నిర్వికారుడని గుర్తించి, ఆ మచ్చలను తొలగించుకునే ప్రయత్నాన్ని చేయాలి. మానవుడే ఎన్నటికీ సర్వశ్రేష్ఠజీవి. మానవునిలో ఆ కృష్ణుని, బుద్ధుని చూడగలగడమే ఉత్తమారాధనం. నీవు ఏది వాంఛిస్తే, దానిని సృజించుకుంటావు, అందుకని వాంఛలను విడనాడుము.
* * *
దేవతలు, గతించిన పూజ్యులు ఈ లోకాన్నే స్వర్గంగా గాంచుతూ ఇక్కడే ఉన్నారు. వారి వారి మనోస్థితులను అనుసరించి, సర్వం గాంచేది ఆ ఒక్క ‘అనిర్వచనీయమైనటువంటి వస్తువునే’. ఈ భూమియందే అది ప్రాప్తించబడును. స్వర్గానికి వెళ్ళాలని ఎన్నడూ కోరవద్దు, అది ఒక పెద్ద భ్రాంతి కారకం. మితిమీరిన సంపదలు గాని, గర్భదారిద్ర్యం గాని బంధాలుగా నిలిచి ధర్మానికి దూరం చేస్తాయి. భగవంతుని ప్రసాదాలుగా మనకు మూడు లభిస్తున్నాయి. ఒకటి, మానవ శరీరం. (మనం స్వయంగా భగవత్స్వరూపులమే ఎందుకంటే మానవమానసం భగవంతుని ప్రతిబింబమే). రెండవది ముముక్షుత్వ సంకల్పం. మూడవది, సంసార సాగరాన్ని దాటగలిగిన మహనీయులైన ఆచార్యుల తోడ్పాటు. ఈ మూడు నీకు ఉన్న ఎడల, నీవు ముక్తుడివవడం నిస్సంశయం.
నీ బుద్ధి బలాన్ని ఉపయోగించి తెలుసుకున్నది ఒక సరికొత్త వాదంతో వీగిపోవచ్చును. కానీ నీవు అనుభూతమొనర్చుకున్నది శాశ్వతంగా నీదే అవుతుంది. ప్రవచనాల వలన, కేవలం ప్రవచనాల వలన కలిగే ఫలం అల్పమైనది అందువలన, ప్రతీ విషయంలోనూ, మానవునిలోనూ, మృగంలోనూ, కర్మలోనూ, ఆహారంలోనూ అన్నింటియందు భగవంతుని గాంచే అలవాటుని అభ్యాసం చేసుకోవాలి.
ఇంగర్సాల్ ఒకసారి నాతో ఇలా అన్నాడు– ‘ఇహలోక జీవనాన్ని లాభదాయకంగా ఉపయోగించుకోవడమే చేయవలసిన కర్తవ్యమనీ, ఉదాహరణంగా తీసుకుంటే, నారింజపండులోని రసాన్ని, ఒక చుక్క అయినా మిగలకుండా పిండి తీసుకోవడమే తన అభిమతమని’ చెప్పాడు. దానికి బదులుగా నేను ఇలా చెప్పాను – ‘ఈ లోకమనే నారింజను నీకన్నా బాగా ఉపయోగించడం నాకు వచ్చు, ఆ పద్ధతిలో రసం ఇంకా బాగా వస్తుంది. నాకు మరణం లేదు కనుక నాకు తొందరలేదు; నాలో భయం లేదు కనుక సమస్త స్త్రీ పురుషులను సమానంగా ప్రేమించగలను, నాకు అందరూ భగవత్స్వరూపులే; మానవుడిని మాధవునిగా, జీవుని భగవంతునిగా ఎంచి ప్రేమించడం ఎంతటి దివ్యానందాన్ని ఇవ్వగలదో ప్రయత్నించి చూడు; ఈ విధంగా చేస్తే, నారింజలోని రసం దశసహస్ర గుణాధికంగా లభ్యం కాగలదు, అప్పుడు దాని నుండి ప్రతీ చుక్కా రాబట్టుకో, దానిని వృధా పోనివ్వద్దు.’
మనకు సంకల్పంగా తోచేదాని వెనుకన ఉండి ఆధారభూతమైనదే ఆత్మ, అయితే అది నిజానికి ముక్తమై ఉన్నది.
సోమవారం, మధ్యాహ్నం
స్వీయాదర్శాన్ని పూర్తిగా అవలంబించనందున, స్త్రీకి పురుషునితో సమానమైన ప్రతిపత్తిని ఇవ్వనందున, జీసస్ అపరిపూర్ణుడు. అతని కొరకు స్త్రీలు చేయగలిగినది అంతా చేసినా, అతను యూదులు ఆచారానికే కట్టుబడి, ఒక్కస్త్రీనైనా శిష్యురాలిగా స్వీకరించలేదు. అయితే సౌశీల్యంలో, బుద్దుని తరువాత అతనే అగ్రగణ్యుడు; బుద్దుడు కూడా పరిపూర్ణుడు కాడు, కానీ స్త్రీకి కూడా సమానాధికారం ధర్మవిషయమై ఉన్నదని అంగీకరించి, దానికి నిదర్శనంగా అతని సతీమణిని ప్రధమ శిష్యురాలిగా చేసుకున్నాడు; ఆమె శిష్యులలో అగ్రగణ్యురాలు కాగలిగి, భారత నారీమణుల బౌద్ధోద్యమానికి నాయకురాలిగా నిలువగలిగింది, మనం ఈ మహనీయులను విమర్శనాత్మకంగా చూడరాదు, వారిని మనకంటే పై మెట్టుపై ఉన్నవారిగానే గణించాలి, అయితే ఒక మానవుడు ఎంతటి మహనీయుడైనా, అతడినే నమ్ముకుని ఉండక, మనం కూడా అలా అయ్యేందుకు ప్రయత్నించాలి; మనం కూడా బుద్ధులం, క్రీస్తులం కావాలి.
ఏ మనిషినైనా అతని లోపాలను బట్టి గణించకూడదు, ఎవరికుండే గొప్పగుణాలు వారికి ఉంటాయి. ప్రతీవ్యక్తిలోనూ దోషాలు ఉంటాయి, అందువలన గుణగణాలను నిర్ణయించేందుకు ఇది సరియైన పద్ధతి కాదు.
‘వీర’ అనే సంస్కృత పదానికి, ఆంగ్ల రూపంగా ‘హీరోయిక్’ అని వాడుతారు. దీనికి మూలమైనది ‘వర్చ్యు’ అంటే సుగుణం, సౌశీల్యము కలిగినవాడే ఉత్తమ యోధునిగా గుణవంతునిగా ప్రాచీనకాలంలో గుర్తించబడేవాడు.
* * *
మంగళవారం, జులై 30
క్రీస్తు, బుద్ధుడు వంటివారు, మన ఆంతరంగిక శక్తులను వ్యక్తీకరించుకునేందుకు ఆలంబనాలు మాత్రమే, మన ప్రార్థనలను మనమే సఫలం చేసుకోవాలి.
జీసస్ జన్మించకుండా ఉంటే, మానవకోటికి తరుణోపాయం ఉండేదేకాదని తలచడం మహాపరాధం. మానవునిలోని దివ్యత్వం తన ఉనికిని ఏదోనాటికి చాటుతుంది. మానవస్వభావ వైభవాన్ని మరువద్దు. ఇంతకు ముందూ, ఇక మీదటా మనమే పరాత్పరులమన్న విషయం గుర్తుంచుకో. క్రీస్తులు, బుద్ధులు కూడా ఈ ఆత్మసాగరంలోని వీచికలు మాత్రమే. నీలోని పరమాత్మకు తప్ప మరి దేనికీ ప్రణమిల్లకు; నీకు నీవు సాక్షాత్తు ఆ దేవదేవుడవేనని గ్రహించేంతవరకూ నీకు ముక్తి లేదు.
మన పూర్వకర్మలన్నీ మంచివే ఎందుకంటే మనలను గమ్యంవైపుకి తీసుకువెడతాయి. మనం ఎవరిని ప్రాధేయపడాలి? నేనే ఆ పరమార్థ తత్త్వాన్ని, మిగిలినదంతా స్వప్నానుభవంగానే మిగులుతుంది. అఖండ సచ్చిదానంద సాగరమే నీవు అయినప్పుడు, ఎన్నడూ నీవు కల్పించుకున్న చిరు వీచిక అయిన ‘నేను’ గా భావించవద్దు, ఆ భావన కేవలం అలగా గుర్తించు; సత్యకాముడు (సత్యాన్ని ఎప్పుడూ ప్రేమించేవాడు) తనలోని అంతర్వాణి తనకిలా ఉద్భోధించడాన్ని విన్నాడు– “నీవు అనంతడవు, విశ్వం అంతా నీలోనే ఉంది. నిన్ను నీవు నిగ్రహించుకుని, యదార్థమైన నీ ఆత్మ వాణిని ఆలకించు.”
పవిత్ర స్వరూపులై, నిశ్శబ్ద జీవనాన్ని సాగిస్తూ, మహోన్నతమైన ఆలోచనలు కలిగిన మహనీయుల పరిపూర్ణత, పోరాటాలను సాగించే ప్రవక్తల కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉండి, లోక హితాన్నే కలుగజేస్తూ ఉంటుంది. వీరు ఒకరు తరువాత ఒకరుగా నిష్క్రమించినా, చివరకు మహాశక్తివంతమైన మహనీయుని ఆవిర్భావానికి కారకులవుతారు.
* * *
జ్ఞానం స్వతఃసిద్ధంగా ఉన్నదే, మానవుడు దానిని కేవలం కనుగొంటాడు. భగవంతునిచే ప్రపంచానికి అందజేయబడిన శాశ్వత జ్ఞానస్వరూపాలే వేదాలు. అవి ఉత్తమోత్తమమైన తత్త్వాన్ని తెలియజేస్తూ, ఈ అద్భుత ప్రతిపాదనను తెలిపాయి.
* * *
బాధను కలిగించేదైనా, కలిగించకపోయినా, సత్యాన్నే ధీరత్వంతో వచించు; దౌర్బల్యానికి ఎన్నడూ గురికావద్దు. బుద్ధిశాలురమని భావించేవారు సత్యం దుర్భరమైనదని దానిని జారవిడిస్తే, అలాగే పోనివ్వు; అలాంటి యోచనలుగలవారు ఎంత శీఘ్రంగా నిష్క్రమిస్తే అంత మంచిది. అవివేకపు భావాలు పసిపిల్లలకు, పశుప్రాయులకు మాత్రమే, అయితే వీరు ఇళ్ళలోనూ, అడవులల్లో మాత్రమే ఉండక, వీరిలో కొందరు వేదికలు కూడా ఎక్కారు.
ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాక నీవింకా ప్రార్థనాలయానికే పరిమితిమవడం మంచిది కాదు, ఈవలకు వచ్చి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించు.
పురోగతి అన్నది అంతా ద్వంద్వప్రపంచంలోనే, మానవావిర్భావమే మహోన్నతమైనది, మానవుడే సర్వశ్రేష్ఠజీవి; ఇహంలోనే మనం ఈ సాపేక్షతను తొలగించుకుని జీవన్ముక్తిని పొందగలం, మన జీవన పరమావధి ఇదే అయి ఉంది. మనం పొందగలం ఎందుకంటే దీనిని కొందరు ఇదివరకే పొంది ఉన్నారు. అందువలన ఏ సూక్ష్మేతరరూపులు వచ్చినా, వారుండగలిగేది ద్వంద్వప్రపంచంలోనే, మనకన్నా అధికంగా వారెన్నటికీ సాధించలేరు. ఎందుకంటే సాధించవలసినది మోక్షప్రాప్తి మాత్రమే కదా!
దేవతలు ఎప్పుడూ చెడుకర్మలు చేయరుకనుక వారు శిక్షలను అనుభవించరూ, తరించనూ తరించరు. మనలను సంసార స్వప్నాన్ని నుండి మేలుకొలిపేవి, ఆపదలే. అనే మనకు ఈ ప్రాపంచికపు అసంపూర్ణతను చూపించి, మోక్షపధంవైపు దారిని చూపిస్తాయి.
* * *
ఒక వస్తువు అస్పష్టంగా ఉన్నప్పుడు ఒక విధంగా పిలువబడి, అదే స్పష్టమైనపుడు యదార్థంగా కనిపించడంతో మరోలా పిలువబడుతుంది. అలాగే నైతిక స్వభావం ఉన్నతమైన కొద్దీ దర్మన శక్తీ అంత ఉన్నతమై ఉంటుంది. తద్వారా సంకల్పమూ అంతటి దృఢతరమై భాసించి యదార్ధతను చూపగలదు.
మంగళవారం, మధ్యాహ్నం
పరదేశమనే సంస్కృతపదం నుండి, ‘పేరడైస్’ అనే ఆంగ్ల పదం పుట్టింది, అదే పారసీకభాషలోనికి తీసుకోబడింది; దానికి అర్థంగా ‘దేశానికి ఆవల’ అని గాని, ఆవల ఉన్న దేశం అని గాని, లేదా పరలోకం అని గాని వస్తుంది. ప్రాచీన ఆర్యులు ఎన్నడూ శరీరమే మానవుడు అని భావించక, ఆత్మ పరంగానే విశ్వసించారు. వారి దృష్టిలో ఏ కార్యమైనా కారణం కంటే అధికతరం కాలేదు, అంతేకాక ఏ కారణం నిత్యమూ కాదు, కాబట్టి సమస్త కార్యాలకు ఒక ముగింపు ఉంది, అందువలన స్వర్గనరకాలు కూడా తాత్కాలికమైనవే అని భావించారు.
వేదాంత తత్త్వమంతా ఈ చిన్న కథలో నిబిడీకృతమై ఉన్నది; బంగారు రెక్కలను కలిగి ఉన్న రెండు పక్షులు ఒకే చెట్టుపై కూర్చుని ఉన్నాయి. అందులో ఒకటి ప్రశాంతంగా రాజఠీవిని కలిగి యుండి, శోభాయమానమైన తన స్వస్థితి యందు నిమగ్నమై, చెట్టుకి పైన ఉన్న కొమ్మపై కూర్చుని ఉండగా, రెండవది కింది భాగంలో గల కొమ్మలపై అస్థిమితంగా కూర్చుని, ఒకసారి ఆ చెట్టుకి గల తియ్యని పళ్ళను, మరోసారి చేదుగా ఉన్న పళ్ళను తింటూ ఉంది. ఒక్కోసారి, అమిత చేదుగా ఉన్న పండుని తినినపుడు, కొంతసేపు తన పని మాని, ఆ పైన ప్రకాశవంతంగా కనిపిస్తున్న పక్షిని చూసినా, అంతలోనే యథాప్రకారం తిరిగి పళ్ళను తినే కార్యక్రమాలలో నిమగ్నమవుతోంది. మళ్ళీ ఒక చేదు ఫలాన్ని తిన్నప్పుడు, కొన్ని కొమ్మలను దాటుకుంటూ, పైనున్న పక్షివైపుకి కొంత వస్తోంది. ఈ విధంగా ఎన్నో మార్లు జరుగగా చివరకు అది పైనున్న పక్షి చోటుకి వచ్చింది, రాగానే తనను తాను మరిచి, అందులో విలీనమై పోయింది. ఆ స్థితిలో, అసలు రెండోపక్షి (పైన ఉన్నది) లేనే లేదనీ, అన్నివేళలా ప్రశాంతంగా, ఆత్మవైభవాన్ని వెలువరించే ఆ పై పక్షి తన యధాస్థితి అనీ, దానికి అమాంతంగా స్ఫురణకి వచ్చింది.
బుధవారం, జులై 31
లూధర్, మతంలోనికి తొంగి చూసి, త్యాగాన్ని తొలగించి నీతిని మాత్రం మిగిల్చాడు. నాస్తికులు, భౌతికవాదులకు నీతి ఉండవచ్చును, కానీ ఆస్తికులకు మతధర్మమే ముఖ్యం కదా!
మహాత్ముల పవిత్రతకు వెల చెల్లించేవారు దుష్టులే, ఈ విషయాన్ని నీవు వారిని చూసినప్పుడు గుర్తుకు తెచ్చుకో, ఇది ఎలాంటిదంటే సంపన్నుల భోగాలకు వెలను ఇచ్చే పేదవారి పరిశ్రమ వంటిది; ఇదే సూత్రం ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వర్తిస్తుంది. జనసామాన్యుల పతనావస్థకు మూల్యంగానే ప్రకృతి, మీరాబాయి, బుద్దుడు వంటి మహాత్ములను సృష్టించింది.
* * *
భగవద్గీత ఈ విధంగా తెలియజేస్తోంది – ‘పవిత్రాత్ముల్లోని పవిత్రతను నేనే’ ‘నేనే మూలాన్ని, సర్వం నేనే, ప్రతీ వ్యక్తి వారి స్వీయమార్గాలలో దానిని వినియోగించుకుంటున్నాడు’, ‘సర్వం నేనే నిర్వహిస్తున్నాను, నీవు కేవలం నిమిత్తమాత్రుడివి.’
అధికంగా ప్రసంగిస్తూ కాలయాపన చేయక, ఆత్మానుభూతిని పొందే ప్రయత్నం చేయి, అప్పుడే నీవు జ్ఞానివి కాగలవు. జ్ఞానమంటే ఇదే, తక్కినదంతా అజ్ఞానమే. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మమొక్కటే తెలుసుకోదగినది.
* * *
సంతోషం, జ్ఞానం యొక్క అన్వేషణలో సత్యం ప్రతిబంధకమౌతుంది. రజస్సు కామం ద్వారా, తమస్సు భ్రాంతి, సోమరితనాల ద్వారా బంధితులను గావిస్తాయి. రజస్సుని, తమస్సుని సత్త్వం ద్వారా జయించి, ఆ తర్వాత దానిని కూడా భగవదర్పితం చేయడమే ముక్తికి మార్గం.
భక్తియోగి అచిరకాలంలోనే త్రిగుణాలను జయించి, బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందగలడు.*
సంకల్పం, ఎరుక, ఇంద్రియాలు, ఇచ్ఛ, వాంఛలు (అరిషడ్వర్గాలు) అన్నీ కలిపే జీవాత్మగా పేర్కొనబడుతోంది.
ముందుగా ఇంద్రియగోచరమైన శరీరము, రెండవది శరీరమే తాను అనుకునే జీవుడూ (మాయచే కప్పబడిన పరబ్రహ్మం) మూడవది నిత్య శుద్ధ ముక్తమైన ఆత్మ. అసంపూర్ణ భావనలో, ఇదే ప్రకృతిగా అనిపిస్తుంది, అయితే పూర్తిగా చూడగలిగినప్పుడు స్మృతి కూడా మిగులకుండా ప్రకృతి అంతా మాయమౌతుంది. వీటిలో పరిణామశీలమైనది శరీరము, నిత్యపరిణామ శీలమైనది ప్రకృతి, ఎటువంటి మార్పులేనిది (నిర్వికారమైనది) ఆత్మ.
* * *
ఆశను సంపూర్తిగా త్యజించగలగడమే మహోన్నతస్థితి. అసలు ఆశించదగినది అంటూ ఏది ఉంది? ఆశాబంధాలను ఛేదించి, నీ స్వస్వభావ స్థితిలో నెలకొని ఉండుము. కపటము లేక, సర్వమూ భగవదర్పితం గావించుము.
‘స్వస్థ’ అనే సంస్కృత పదానికి అర్థం ‘ఆత్మస్థితిలో నెలకొని ఉండుట.’ ఈ పదం భారతదేశంలో, ‘నీవు క్షేమంగా ఉన్నావా? లేదా సుఖంగా ఉన్నావా? అనే అర్థంలో వాడబడుతోంది. అలాగే ఒక వస్తువుని చూసానని చెప్పేందుకు హిందువులు, ఒక పదార్థాన్ని చూసానంటారు. ఈ విశ్వం సైతం ఒక పదార్థమే సుమా!
పరిణితుడైన వ్యక్తి యొక్క శరీరం యాంత్రికంగానైనా సత్కర్మలనే చేస్తుంది, అది మంచిని మాత్రమే చేయగలదు, ఎందుకంటే అది పరిశుద్ధం గావించబడి ఉంది. కాలచక్ర ఉరవడిలో పూర్వకర్మలన్నీ మంచివే, ఎందుకనగా వాటివల్లనే దుష్ట సంస్కారాలు అన్నీ భస్మం గావించబడ్డాయి.
* * *
భగవంతుని గురించి తలవనిరోజు, ప్రసంగించని రోజు దుర్దినం అవుతుంది కాని మేఘావృతమైన రోజు కాదు.
భగవంతుని పట్ల చూపించే ప్రేమే నిజమైన భక్తి, వ్యక్తుల పట్ల చూపే ప్రేమ భక్తి కాజాలదు. పాశ్చాత్యదేశాల్లో మీరు వ్యక్తిగత దైవంగా భావించే సాకారరూపం కన్నా పరమేశ్వరభావన మిన్న అయినది. ‘ఎవరి నుండి ఈ విశ్వం సృజించబడుతోందో, ఎవరిలో నెలకొని ఉన్నదో, ఎవరిలో తిరిగి లయమవుతున్నదో అతనే ఆ ఈశ్వరుడు. అతను నిత్యుడు, శుద్ధుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, కృపాసాగరుడు, ముక్తుడు, గురువులకే గురువు, అనిర్వచనీయ ప్రేమ స్వరూపుడు.’
భగవంతుడిని మనిషి తన బుద్ధితో నిర్మించుకోలేడు, కాని తన శక్త్యానుసారం చూడగలిగి, తానెరిగిన ఉత్తమ గుణాలను అన్నింటిని ఆయనకు ఆపాదిస్తున్నాడు. ఆయనకున్న ప్రతీ లక్షణమూ పూర్ణత్వాన్ని కలిగి ఉన్నదే; అందువలన ఒకో గుణంతో సర్వాన్ని సూచించగలగడమే సగుణ బ్రహ్మారాధనకు, తాత్త్వికపరమైన వివరణగా చెప్పవచ్చును. ఈ కారణంచేతనే, ఈశ్వరుడు నిరాకారుడైనా, అన్ని రూపాలను కలిగి ఉన్నాడు, నిర్గుణుడైనా అన్ని గుణాలను కలిగి ఉన్నాడు. మానవులుగా మనం, ఉనికి త్రయంగా దేవుడు, జీవుడు, ప్రకృతి అని గుర్తించడం తప్ప ఇంకో దారి లేదు.
ఒక భక్తునికి ఈ తాత్త్వికపరమైన భేదాలు అన్నీ వ్యర్థంగా అనిపిస్తాయి. తర్కాన్ని కొంచెమైనా అతను లక్ష్యపెట్టడు, తిరిగి వాదించేందుకు ప్రయత్నించడు, కాని గ్రహించగలడు. విశుద్ధమైన భగవంతుని ప్రేమలో విలీనం కావాలని ఆరాటపడతాడు; ముక్తి కన్నా అదే ప్రశస్తంగా భావించే భక్తులు ఎందరో ఉన్నారు. వారు ‘మేము పంచదారగా మారేందుకు సుముఖంగా లేము, పంచదారను రుచి చూసేందుకే ఇష్టపడతాము; ఆయన ప్రేమను అనుభూతమొనర్చుకోగలగడమే మా ఆశయం’ అని అంటారు. అయితే భక్తియోగంలో ఆవశ్యకమైనది యదార్థమైన, గాఢమైన అనురక్తి. మన సాధారణ కోరికలు అన్నీ ఈ బాహ్యప్రపంచం వలన నెరవేరుతాయి కనుక మనం భగవంతుని గురించి యోచించము. మన అవసరాలు భౌతికప్రపంచ పరిమితులలో ఉన్నంత కాలమూ, భగవంతుని ఆవశ్యకత మనకు కలుగదు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలి, ఇహంలో సర్వత్రా విఫలమనోరథులమైనపుడే మనకు ప్రాపంచికతను మించి ఏదో ఉన్నదని జ్ఞప్తికి వచ్చి, భగవంతుడిని పొందగోరుతాము.
భక్తి వినాశకారి కాదు, అది ముక్తిని పొందేందుకు మన శక్తి సామర్థ్యాలను సాధనలో వినియోగించాలని ప్రబోధిస్తుంది. మనకున్న శక్తి సామర్థ్యాలను సంపూర్తిగా భగవంతుని వైపుకి మరల్చాలి; క్షణికమైన భోగాలలో వ్యర్థం చేసే ప్రేమ అంతటినీ, భగవంతుని వైపు ప్రసరించేలా సాధన చేయాలి.
మీ పాశ్చాత్యుల మతధర్మానికీ, భక్తి సిద్ధాంతానికీ భేదం ఉంది. భక్తితత్త్వంలో ఎటువంటి భయాలు లేవు, ఏ వ్యక్తులను శాంతింపచేసే ప్రయత్నం గాని, అనుగ్రహం కలిగించుకునే ప్రయత్నం చేయనవసరం లేదు. భగవంతుని యందు ఎటువంటి గురుభావం గాని, జంకు గానీ లేకుండా, తమ స్వంత బిడ్డగా భావించి, ఉపాసన చేసే భక్తులు కూడా ఉన్నారు. యథార్థ ప్రేమలో భయం ఉండదు, ఒకవేళ భయం లేశమైనా ఉంటే భక్తి కలుగనే కలుగదు. అంతే కాక భక్తిలో బేరసారాలకు తావు లేదు, యాచన కూడా అనర్హమైనదే, భగవంతుడిని కోరికలు కోరడం మహాపరాధంగా భక్తునికి తోస్తుంది. సంపదలకోసమని గాని, ఆరోగ్యం కోసమని గాని, ఆఖరుకి స్వర్గప్రాప్తికని గాని ప్రార్థించడు.
భగవంతుడిని ప్రేమించాలనుకునేవారు, భక్తునిగా ఉండగోరేవారు, కోరికల చిట్టాని ద్వారం అవతలే వదిలి మరీ లోపలికి ప్రవేశించాలి. దుకాణదారుని తత్త్వాన్ని వదిలివేసి, ఆ తేజోమయుని నిలయంలో పాదం మోపాలి. భగవంతుడిని ఏది ప్రార్థిస్తే, అది లభ్యం కాగలదు, అలా అని యాచకుని వలె ఆయన ముందు మోకరిల్లడం నీచమైన విషయం. గంగాతీరంలో నివసిస్తూ, నీటి కొరకై బావిని తవ్వేవారు మూర్ఖులే కదా; వజ్రాల గనిలో ప్రవేశించి గాజుపూసలకై ఆరాటపడటం మూర్ఖత్వమే కదా! ప్రాపంచిక భోగాలకై, ఆయురారోగ్యాలకై చేసే ప్రార్థనలు భక్తి అనిపించుకోవు, అవి అధమస్థాయికి చెందిన కర్మగా పరిగణించబడతాయి, భక్తి ఉత్తమ స్థాయికి చెందినది. మనం, విశ్వానికే చక్రవర్తి అయిన వాని దగ్గరకు వెళ్ళేటప్పుడు యాచకుల అవతారంలో వెళ్ళలేము కదా! చిరిగిన వస్త్రాలను ధరించిన బికారి, చక్రవర్తి సన్నిధిలోనికి వెళ్ళాలని అనుకున్నా ద్వారపాలకులు వెళ్ళనివ్వరు. అందువలన రాజరాజేశ్వరుడైన భగవానుని సన్నిధికి, భిక్షుక వేషాన్ని ధరించి వెళ్ళలేము. అక్కడ వర్తకులకు కూడా ప్రవేశం లేదు. క్రయ విక్రయాలు అక్కడ జరుగవు. అమ్మేవారిని, కొనేవారిని జీసస్ ఆలయం నుండి వెళ్ళగొట్టాడని మీరు బైబిల్లో చదివే ఉన్నారు.
అందువలన స్వర్గాది భోగవాంఛలను త్యజించగలగడమే భక్తి సౌధానికి ఫ్రథమ సోపానం. స్వర్గమనేది భూలోకం మాదిరిగానే ఉన్నా ఇంకొంత మెరుగ్గా ఉంటుంది. స్వర్గం పరమభోగ స్థానమని క్రైస్తవుల అభిప్రాయం. స్వర్గ గమన వాంఛ భోగానుభవానికే దారి తీస్తుంది. అది భగవంతుని సన్నిధికి ఎలా చేర్చగలదు? దానిని వదిలివేసి, అకళంకమైన నిస్వార్థ ప్రేమను పెంపొందించుకోవాలి. ఇహంలో గాని, పరంలో గాని ఎటువంటి వాంఛలు లేని విరాగాన్ని భక్తుడు అలవరచుకోవాలి.
‘సుఖదుఃఖాలకు అతీతంగా, లాభనష్టాలకు దూరంగా భగవంతుని అనునిత్యం భజిస్తూ ఉండు; నిముషమైనా కాలాన్ని వృధా చెయ్యకు. ఇతరత్రా చింతలనన్నింటిని విడనాడి, రేయింబవళ్ళు సంపూర్ణ చిత్తంతో భగవంతుడిని ఉపాసించాలి. ఇలాంటి ఉపాసన వలన, దైవసాక్షాత్కారం, తదనుభూతి స్వంతం కాగలదు.
గురువారం, ఆగష్టు 1
ఆధ్యాత్మిక పథంలోకి మనం అడుగిడేందుకు తోడ్పడేవాడే నిజమైన గురువు. ఆయన వలన మనలో ఆధ్యాత్మిక వాహిని ప్రవహించి, మనకు ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. వ్యక్తిత్వ పరంగా మితిమీరిన విశ్వాసం, దౌర్బల్యం, మూర్త్యారాధనకు దారితీయగలదు; అలా కాక, గురువు పట్ల గాఢభక్తి, శీఘ్ర వికాసానికి దోహదపడుతుంది, ఆయన మనల్ని అంతర గురువుతో కలుపుతాడు. నీ గురువులో సత్యసంధత ఉంటే, ఆయనను ఆరాధించు, ఇటువంటి గురుభక్తి నిన్ను ఉన్నత పథాలకు త్వరితంగా చేరుస్తుంది.
శ్రీరామకృష్ణుల స్వచ్ఛత పసిపిల్లలను పోలినటువంటిది. ఆయన తన జీవితంలో ధనాన్ని తాకలేదు, కామం ఆయనలో పూర్తిగా నిర్మూలించబడింది. మహాతత్త్వబోధకుల వద్దకు, సాధారణ జీవనానికి కావలసిన భౌతికశాస్త్రాన్నో, మరేదో నేర్చుకోవడానికి వెళ్ళవద్దు, వారి శక్తి అంతా ఆధ్యాత్మిక రంగంలో నిండి ఉంది. శ్రీరామకృష్ణునిలో దైవత్వం మాత్రమే వెల్లివిరిసేది. ఆయన కంటికి దోషాలు కనపడవు, అంతటి విశుద్ధాత్ముడు ఆ మహనీయుడు. ఈ కొద్దిమంది పరమహంసల పవిత్రతే లోకాన్ని నిలబెడుతోంది, వారంతా గతిస్తే ప్రపంచం విచ్ఛిన్నం కాగలదు. వారు తమ ఉనికి వల్లనే లోకకళ్యాణానికి, తమకు తెలియకుండానే దోహదపడుతూ ఉంటారు.
* * *
పుస్తకాలు మనలోని అంధకారాన్ని తొలగించి, అంతర్జ్యోతిని గుర్తించే విధానంలో సహాయపడతాయి, అయితే స్వయంగా జ్ఞాన సముపార్జన కలిగినపుడే, వాటి యొక్క అంతరార్ధాన్ని గుర్తించగలం. ఒకసారి ఆ ప్రకాశం కలుగగానే, పుస్తకాలను విడిచిపెట్టి, అంతరవలోకనంలో నిమగ్నుడవు కావాలి. సమస్త గ్రంథాల్లోని విజ్ఞానం నీలోనే ఉంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే వేయిరెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మ విశ్వాసాన్ని ఎన్నడూ వదలకు, నీవు ఈ విశ్వంలో సమస్తాన్ని సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి, నిరాశకు గురికావద్దు, సమస్త శక్తీ నీలోనే నిబిడీకృతమై ఉన్నది.
పుస్తకాలమీదగాని, ఏ ప్రవక్త ఉనికి మీద గానీ, ఏ మతధర్మమైనా, జీవనమైనా ఆధారపడి ఉంటే, అలాంటివన్నీ నశించిపోనివ్వు! సమస్త ధర్మమూ మనలోనే ఉంది, దానిని కనుగొనేందుకు మనకు తోడ్పాటుని ఇవ్వడం కంటే గ్రంథాలూ, గురువులూ మరేమీ చేయలేరు. ఒకవేళ వారి తోడ్పాటులేకున్నా, సమస్త తత్త్వార్థాన్ని మనలోనే చూడగలము. గ్రంధాలకు, గురువులకు కృతజ్ఞుడవై ఉండవచ్చునుగాని బంధానికి లోబడవద్దు. గురువుని భగవంతునిగా పూజించు, కాని ఆయన మాటలను గుడ్డిగా శిరసావహించవద్దు. నీకు నీవే ఆలోచించుకుంటూ, ఆయనను ప్రేమించు; మూఢ విశ్వాసాలు నిన్ను తరింపజేయలేవు, నీ ముక్తికై నీవే పాటుపడాలి. భగవంతుడే నీకు నిత్యసహాయుడనే విషయాన్ని స్థిరంగా కలిగి ఉండాలి.
స్వతంత్రంగా మనగలగడం, మహోన్నతమైన ప్రేమను కలిగి ఉండటం, రెండూ కలగలిసి ఉండాలి, అప్పుడు ఈ రెండింటిలో ఏదీ ప్రతిబంధకం కాజాలదు. భగవంతుడికి మనం ఏమీ ఇవ్వలేము, సర్వం ఆయనే మనకు ఇచ్చేవాడు. గురువులకే గురువైనవాడు భగవంతుడు. మన ఆత్మలకు ఆత్మ అనీ, మనమే ఆయన అని గుర్తిస్తాము. అలాంటివాడిని ప్రేమించడంలో వింతేముంది? ‘మనం ఎటువంటి పొగవెలువడని, వేడిమి లేని నిశ్చల పరంజ్యోతిగా ఉండాలని అనుకుంటాము’. భగవంతుడిని తప్ప అన్యం ఏదీ నీవు చూడలేనప్పుడు, నీవు ఎవరికి ఉపకారం చేయగలవు? భగవంతునికైతే నీవు ఉపకారం చేయలేవు! ఎటువంటి శంకలు లేకుండా, అభిన్నమైనది ఈ విశ్వం అని గుర్తించు. నీవేమైనా ఉపకారం చేయదలిస్తే అది నీకు నీవే చేసుకుంటున్నావని గ్రహించు, ప్రతిగ్రహీతదే పైమెట్టని గుర్తించు, అందువల్లనే నీకు అతడిని సేవించే అవకాశం కలుగుతోంది. పరిమళాన్ని వెదజల్లడం గులాబి స్వభావం, పరిమళిస్తున్నాననే తలంపు దానికి ఉండదు, అలాంటి స్వభావాన్నే నీవు అలవరచుకోవాలి.
హైందవ సంస్కర్తలలో, రాజారామమోహన్ రాయ్ ఈ రకమైన స్వార్థరహిత కర్మకు నిదర్శనం. తన యావజ్జీవితాన్ని దేశ ప్రగతికై వెచ్చించాడు. సహగమనమనే దురాచారాన్ని రూపుమాపింది ఆయనే. ఈ సంస్కరణ ఆంగ్లేయుల వలన జరిగిందని సామాన్యజన వాడుకలో ఉన్నా, ఈ ఆచారాన్ని ప్రతిఘటిస్తూ మొదటిసారిగా ఆందోళన ప్రారంభించింది ఆయనే. దానిని రూపుమాపేందుకు ప్రభుత్వపు తోడ్పాటుని ఆయన పొందగలిగాడు. ఆయన ఈ ఉద్యమాన్ని ఆరంభించేవరకు ఆంగ్లేయులు ఏమీ చేసిన పాపానపోలేదు. ఇదే కాక, బ్రహ్మసమాజమనే పేరుతో ఒక సంస్థను కూడా ఆయన నెలకొల్పాడు. ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు లక్ష డాలర్లు వసూలు చేసి, ఆ విశ్వవిద్యాలయం వారికి అన్ని హక్కులు ఇచ్చేసి, ఏ మాత్రం పేరు ప్రఖ్యాతులు ఆశించక తను బయటకు వచ్చేసాడు.
గురువారం, మధ్యాహ్నం
రంగులరాట్నం మాదిరిగా, ఈ విశ్వంలో కొనసాగే దేహపరంపరలకు అంతే లేదు. జీవులు వాటిని అధిరోహించి తిరుగుతారు. ఈ పరంపర నిత్యంగా కొనసాగుతూ ఉంటుంది. జీవులు దిగిపోతూ ఉన్నా, మళ్ళీ పునరావృత్తంలో ఎక్కుతూనే ఉంటారు, అందువల్లనే మానవుల భూతభవిష్యత్తులను తెలుసుకునే వీలు ఏర్పడుతోంది, నిజానికి సర్వమూ వర్తమానమే. ఒక వరునలో ఉన్న జీవుడు, ఆ అనుభూతులను అన్నింటిని పొందాలి, ఒక వరుస నుండి వేరొక వరుసకు వెడుతూ ఉంటారు, ఎన్నో పరంపరల అనంతరం, జీవులు తాము సాక్షాత్తు బ్రహ్మమే అని గుర్తించడంతో, శాశ్వత ముక్తిని పొందుతారు. ఒకానొక కీలక విషయమును చేజిక్కించుకుని, ఆ పరంపరను చేరువకు తీసుకువచ్చే శక్తిని తేలికగానే పొందవచ్చును, అయితే దానివలన పెద్దప్రయోజనం ఏమీ ఉండదు. అంతేకాక ఇటువంటి శక్తికై, ఎంతో ఆధ్యాత్మిక బలాన్ని వ్యయం చేయవలసి ఉంటుంది. ఇలాంటివాటికై పాకులాడక, భగవంతుని ఆరాధనలో నిమగ్నులు కావాలి.
శుక్రవారం, ఆగష్టు 2
ఒకే ఆదర్శం పట్ల నిష్ఠ కలిగి ఉండటం సాక్షాత్కారానికి మొదటి మెట్టు. సకల పుష్పాల నుండి మధువుని గ్రహించడంలో తప్పులేదు, అలాగే అందరి పట్లా స్నేహభావాన్ని కనబరచు, ఎవరినీ నొప్పించని విధంగా ఆర్ద్రతను కలిగి ఉండు, కానీ నీ విధానాన్ని నీవు అవలంబించు. అవతలివారి స్థానంలో ఆలోచించడం ఇంతకంటే ఉన్నతదశ. నేనే సర్వమూ అయినప్పుడు, నా సోదరుని పట్ల నిజమైన సానుభూతిని చూపిస్తూ, అతని దృక్పథంతో ఎందుకు చూడలేను? అయితే నేను మానసికంగా దుర్బలునిగా ఉన్నంత వరకూ, ఒకే దారి వెంబడి నిష్ఠగా ప్రయాణాన్ని సాగించాలి; బలవంతుడిననే విశ్వాసం కలిగిననాడు అందరి భావాలను అర్ధం చేసుకుంటూ, వారి పట్ల సానుభూతి చూపగలుగుతాను.
ఏదో ఒక ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండడమన్నది ప్రాచీన అభిప్రాయం అన్నింటిలోనూ, సమతుల్యత కలిగిన వికాస పద్ధతిలో అనుసరించడం ఆధునిక విధానం; అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక వికాసాన్ని కలిగి ఉండి, మనస్సుని నియంత్రణలో ఉంచుకోగలగడం ఉపయుక్తమైనది, ఇది శీఘ్రఫలాన్ని అందిస్తుంది. దీని వలన నిన్ను నీవు సరియైన పద్ధతిలో నిలుపుకోగలుగుతావు. ముందుగా ఏకాగ్రతను అభ్యసిస్తే, దానిని ఏ విషయంలోనైనా వినియోగించవచ్చు, దాని వలన నీకే నష్టమూ వాటిల్లదు. పరిపూర్ణతను సాధించినవారికి సమస్తమూ లభ్యమైనట్లే కదా. అద్వైతంలోనే ద్వైతం ఇమిడి ఉంది.
‘ముందుగా నేను అతడిని చూశాను, ఆ తరువాత అతను నన్ను చూశాడు. నా చూపు అతని వైపు తళక్కుమంది, అతడి చూపూ అలాగే ఉంది’. ఇలా ఇది కొంతకాలం సాగాక, ఆ రెండు ఆత్మలూ ఏకమై ఒక్కటిగా నిలిచిపోయాయి.
* * *
సమాధి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నాలో నేను ఏకాగ్రతను పొంది తరువాత విషయంలో మనస్సును నిలుపుతున్నాను. అప్పుడు విషయి విషయాలకు ఐక్యం సిద్ధిస్తోంది.
ప్రతి విషయంలోను పూర్ణ సానుభూతిని కలిగి ఉండాలి, ఆ పైనే అద్వైతసిద్ధిలో అడుగిడేందుకు ప్రయత్నించాలి. ఒక్కసారి పరిపూర్ణత సిద్ధిస్తే, నిన్ను నీవు నియంత్రించుకోగలవు. ప్రతీ కార్యమందూ పరిపూర్ణ శక్తిని నిలుపుకో. తాత్కాలికంగా అద్వైతాన్ని మరిచి ద్వైతివి అవడానికీ, తిరిగి సంకల్పమాత్రంచే అద్వైతివి అయ్యేవిధంగా నిన్ను నీవు తీర్చిదిద్దుకో.
* * *
కార్యకారణాలనేవి మాయాజనితాలు; చిన్నపిల్లలకు చెప్పే కల్పిత కథలవంటివే ఇవి కూడా అనే స్థాయికి ఎదగాలి. వాస్తవానికి కార్యం అని ఒకటి, కారణమని ఒకటి లేవు, అలా లేవని మనం తెలుసుకోబోతున్నాం. నీకు వీలైతే బుద్ధిని, తర్కాన్ని వదిలి రూపకాలంకార భావనలను నీ మనస్సులో చొరబడనివ్వు, సంబంధాన్ని గురించి ఆలోచించకు. కల్పనాజనితమైన చక్కని కవిత్వాన్ని యోచిస్తూ, పురాణాలను అన్నింటినీ కావ్యపరంగా ఊహించు, దీనిలో తార్కికతను రానివ్వద్దు; అది ఒక ప్రవాహంలా నీ మనస్సునందు ప్రవహించనీ; కాంతివలయం ఒకటి నీ చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా భావించు, అది ఎక్కడి నుండి వస్తోంది, ఎవరు పట్టుకున్నారని ఆలోచించవద్దు. ఇటువంటి సృజనాత్మకతచే నీకు సత్యం తేటతెల్లం కాగలదు.
పురాణ కర్తలందరూ తాము విన్నవాటిని, వాటిని సంకేతాలుగా భావించి రచించారు. వాటిలోంచి ఇతివృత్తాలను మాత్రం బయటకు తీసే ప్రయత్నాన్ని చెయ్యవద్దు. వాటిని ఉన్నదున్నట్లుగానే గ్రహించి, వాటి ప్రభావంచే తదనుగుణ సత్ఫలితాన్ని పొందేందుకు ప్రయత్నించు.
* * *
నీ ప్రార్థనను సఫలం చేసేది నీ సంకల్పశక్తి మాత్రమే; వివిధ వర్గాలకు వివిధ మతాశయ రూపాలతో గోచరించేది అదే; దానిని మనం బుద్ధుడన్నా, జీసస్ అన్నా, కృష్ణుడన్నా, జెహోవా అన్నా, అల్లా అన్నా, చివరికది ఆత్మే, ‘నేను’ అనేదే.
* * *
భావనలు వర్ధిల్లవచ్చు, అయితే వాటిని చారిత్రకంగా ప్రతిపాదించే అలంకారాలకు విలువలేదు. మనకు కనబడేవాటికంటే మోసెస్‌కు గోచరించిన దృశ్యాలు భ్రమలై ఉండేందుకు మరింతగా అవకాశం ఉంది. ఎందుకంటే మనకు గల జ్ఞానంచే, భ్రమ వలన వంచితులమయ్యే అవకాశం తక్కువ.
మన ఆత్మగ్రంథాన్ని తెరిచే వరకూ, తక్కినవి నిరుపయోగాలే కదా! మన గ్రంధానికి బలం చేకూర్చే ప్రయత్నంలో, మిగిలినవి అందించే సహకారాన్ని బట్టి వాటి మంచితనం నిర్ణయమౌతుంది. బలవంతుడికే బలం విలువ అర్ధమౌతుంది. సింహాన్ని గురించి సరిగ్గా తెలుసుకునేది ఏనుగే కాని, ఎలుక కాదు. అలాగే జీసస్‌తో సమానులం కానిదే జీసస్‌ను ఎలా అవగాహన చేసుకోగలం? రెండు రొట్టెలతో ఐదువేల మందికి సంతర్పణం చేయడం కానీ, ఐదు రొట్టెలతో రెండువేల మందికి సంతర్పణ చేయడం కాని వాస్తవంగా తోచదు, ఇవి రెండు కూడా పరస్పర ప్రభావాన్ని కలిగి ఉన్నవికావు. వైభవోపేతమైన దానిని, తత్సమానమైనదే కొనియాడగలదు, భగవంతుడే భగవంతుని గ్రహించగలడు. కలగనేవాడికి కలతప్ప మరో ఆధారం లేదు; కల, కలగనేవాడు విభిన్నులు కారు. మనలో “సో-హం, సో-హం” అనేదే జీవన పల్లవి, తక్కిన చరణాలన్నీ రూపాంతరాలే, అని అసలు ఇతివృత్తాన్ని మార్చలేవు. మనమే సజీవ గ్రంథాలం, మన నుండి వెలువడినవే గ్రంథాలు. ప్రతీది కదిలే భగవంతుని రూపంగానే, సజీవ క్రైస్తుగానే భావించు; సజీవ కావ్యమైన మానవుడిని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించు. మనలోని కాంతి పరావర్తనంచే క్రీస్తులు, బుద్ధులు వెలుగొందుచున్నారు. ఆ కాంతి లేనినాడు వారు మృతప్రాయులే.
నీ స్వశక్తిపై నీవు ఆధారపడు; మృతశరీరం దేనికీ స్పందించదు. దేహమే ఆత్మ అనే తలంపు తుడిచివేయాలి, అప్పుడే మనం శరీరం కాదని అర్ధం కాగలదు.
శనివారం, ఆగష్టు 3
ఈ జన్మంలోనే జీవన్ముక్తిని పొందాలనుకునేవారు తమ జీవితకాలంలోనే అనేక వేల సంవత్సరాల కర్మానుభవాన్ని పొందవలసి ఉంటుంది. సామాన్యులు నిదానంగానే ఉండగలరు కానీ వీరు కాలావధికి అతీతంగా ఉంటారు. ఈ తీరులోనే మనకు బుద్ధులు, క్రైస్తవులు లభిస్తారు.
* * *
ఒకప్పుడు మదాలస అనే రాణి ఉండేది. జీవన్ముక్తురాలైన ఆమె తన పిల్లలు కూడా ఆ విధంగా కావాలని అభిలషిస్తూ, ఊయలలో పడుకోబెట్టి, వారిని ఊపుతూ ‘నీవే ఆ బ్రహ్మానివి, నీవే బ్రహ్మానివి’ (తత్త్వమసి, తత్త్వమసి) అంటూ జోలపాటలు పాడేది. ఊయల దశ నుండి ఈ విధమైన శిక్షణ ఇవ్వడంతో ఆ పిల్లలలో మొదటి ముగ్గురూ సన్న్యాస జీవితాన్ని స్వీకరించారు. రాజు నాలుగవవాడిని తప్పించడంతో, ఆవిడ అతనికి ఒక చీటి ఇచ్చి, అత్యవసర పరిస్థితుల్లో దానిని చూడమని చెప్పింది. అందులో, ‘బ్రహ్మమే సత్యం, తక్కినదంతా మిథ్యే. ఆత్మ చంపబడేది కాదు, చంపదు. ఏకాంతవాసం చేయి లేదా సాధుజనసహవాసం చేయ’ మని వ్రాసి ఉంది. దానిని చదివిన ఆ నాలుగవవాడు కూడా సంసారాన్ని త్యజించి సన్న్యాసి అయ్యాడు.
త్యజించాలి, ప్రపంచాన్ని త్యజించాలి. దొంగతనంగా ఇంట్లో చొరబడి, ఎవరైనా తరుముతారనే భయంతో అటూ ఇటూ చూసే కుక్కల మాదిరిగా, ప్రస్తుతం మనం ఉన్నాం. అలాంటి భయాన్ని విడనాడి, సార్వభౌమునివలె వర్తించాలి. సమస్త ప్రపంచమూ నీదేనని గ్రహించు, అన్నింటిని త్యజిస్తేగాని ఇది నీకు అలవడదు; దానివలనే నీవు నిబద్ధుడివి కాగలవు. శారీరకంగా కాకపోయినా మానసికంగా త్యజించు, హృదయాంతరాళం నుండి ఈ భావన కలగాలి. వైరాగ్యాన్ని కలిగి ఉండటమే నిజమైన త్యాగం, ఇది లేనిదే ఆధ్యాత్మిక పురోగమనం సాధ్యపడదు. దేనినీ కోరవద్దు. ఎందుకంటే నీవు కోరినదల్లా నీకు లభిస్తుంది, ఇదే బంధానికి హేతువవుతుంది. ఇది ఒకప్పుడు మూడు వరాలను పొందిన ఒక వ్యక్తి జీవితంలో తటస్థించిన అనుభవాలను గుర్తుకు తెస్తుంది.* సంతృప్తిని కలిగి ఉంటేగాని ముక్తి లభించదు – ‘ఉద్దరేదాత్మ నాత్మానమ్’ తనను తానే ఉద్ధరించుకోవాలి.
నిన్ను అందరిలోనూ చూడగలగడం అలవరుచుకో, అందరూ ఒక్కటే అని గ్రహించు. ఇతర విషయాలన్నీ అనర్థకాలుగా భావించు; జరిగినదేదో జరిగిపోయింది, మూఢ విశ్వాసాలను విడనాడి, దుర్బలత్వాన్ని పారద్రోలుము. గతించినదాని గురించి పశ్చాత్తాపపడవద్దు, చేసిన సత్కార్యాలను గుర్తుకు తెచ్చుకోవద్దు. స్వేచ్ఛను కలిగి ఉండు. దుర్బలులైనవారు, భయస్థులు, అజ్ఞానులు ఎన్నటికీ ఆత్మను పొందలేరు. జరిగిన దానిని నీవు మార్చలేవు, కర్మఫలం లభించే తీరుతుంది, అయితే చేసిన తప్పులను మళ్ళీ చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నించు. సమస్త కర్మఫలాన్ని భగవంతునికి అర్పణ గావించుము; సమస్తమూ అంటే దుష్కర్మలే కాక సత్కర్మ ఫలాన్ని కూడా అని అర్థం. స్వప్రయత్నాన్ని విడనాడి, సంపూర్ణంగా శరణాగతి పొందితే, భగవంతుడు తప్పక తోడ్పడతాడు.
‘వాంఛలను సేవించడంలో, ప్రపంచం ఉన్మత్తత చెందుతోంది’. పగలూ, రాత్రీ రెండు ఒకేసారి ఎలా సంభవించవో, అలాగే భగవంతుడూ, వాంఛ (రాముడు, కాముడు) రెండూ ఒకే చోట ఉండవు, అందువలన వాంఛలను త్యజించుము.
* * *
భోజనం, భోజనం అని స్మరించడానికీ, తినడానికీ చాలా భేదం ఉంది. అలాగే నీరు, నీరు అని తలవడానికీ, తాగడానికీ భేదం ఉంది. ఈ విధంగానే భగవంతుడు, భగవంతుడు అని పలకడానికీ, సాక్షాత్కారం పొందడానికి భేదం ఉంటుంది. దీనికి తీవ్రప్రయత్నం చేయాలి.
అల తిరిగి సముద్రంలో కలిసినందువలన అపరిమితం కాగలదు, కేవలం అల రూపంలో అది సాధ్యపడదు. అయితే అది కలిసాక, తిరిగి తన ఇష్టం వచ్చినంత పెద్ద అల కాగలదు. అందువలన సంసారప్రవాహంతో తాదాత్మ్యాన్ని తెంపుకుని, నీవు ముక్తుడనని గ్రహించు.
మనకు గోచరించని కొన్ని విషయాలకు ఒక క్రమాన్ని ఏర్పరిచేదే నిజమైన తత్త్వశాస్త్రం. మేధ అందుకోలేని మెట్టునుంచే మతం ప్రారంభమవుతుంది. ఈశ్వర ప్రేరితజ్ఞానం, దాని నుండి కలిగే స్ఫూర్తి హేతువాదానికంటే గొప్పవి, కాని దానిని ఖండించకూడదు. కష్టమైన కార్యాలకు ఉపయోగించే మోటు పనిముట్టే హేతువాదం, జ్ఞానం మనకు యదార్థాన్ని చూపే ఉజ్వల దీపం. అయితే ప్రతీ కార్యం వెనుక స్ఫూర్తి ఉండే తీరాలనే నియమం ఏమీ లేదు.
* * *
మాయలో పురోగతి వలన నీవు బయలుదేరిన చోటుకే తిరిగి చేరుకుంటావు, అది ఒక వృత్తం లాంటిది. కాని వాస్తవానికి, నీవు ప్రారంభంలో అజ్ఞుడివైనా, గమ్యాన్ని చేరుకునే సమయానికి సర్వజ్ఞాన సంపన్నుడవు కాగలవు. భగవదారాధన, సాధుసాంగత్యం, చిత్తైకాగ్రత, ధ్యానం, నిస్వార్థ కర్మాచరణం – ఇవన్నీ మాయాజాలం నుంచి విడివడే మార్గాలు. ముందస్తుగా మనకు మోక్షం పొందాలనే తీవ్రసంకల్పం ఉండాలి. అజ్ఞానపుటంధకారాన్ని పటాపంచలు చేసే జ్ఞానతేజం మనలోనే ఉంది, జ్ఞానమే మన స్వరూపం అయి ఉన్నది. (జన్మహక్కు అన్నది లేదు, ఎందుకంటే మనం వాస్తవానికి జన్మించనే లేదు) మనలోని జ్ఞానాన్ని ఆవరించి ఉన్న మేఘాలను తొలగించడమే మన కర్తవ్యం.
సకల భోగాల యందు గల వాంఛను (భూలోకపు భోగాలు గానీ, స్వర్గలోకపు భోగాలు గానీ) విడనాడు. ఇంద్రియాలను, మనస్సుని అంతర్ముఖం గావించు. దుఃఖీస్తున్నామనే భావన లేకుండా దుఃఖాన్ని గ్రహించు. ముక్తిని తప్ప మరి దేని గురించి తలవకు. గురువుపట్ల, గురువు చేసే బోధలపట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటూ, మోక్షం ప్రాప్తించగలదనే నమ్మకాన్ని కలిగి ఉండు. ఏమి జరిగినా ‘సో-హం, సో-హం’ అని అంటూ ఉండుము. నీవు ఏమి చేస్తున్నప్పటికీ, తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, బాధల్లో ఉన్నా ‘సో-హం’ అని నీకు నీవు తలుస్తూ, ఉన్నది ఆత్మ ఒక్కటే అని నీ మనస్సుకు సదా తెలుపుతూండుము. క్షణంలో కల చెదిరిపోగలదు, ఈ జగత్తు మిధ్య అనీ, బ్రహ్మం ఒక్కటే సత్యమనీ అహర్నిశలు చింతించు. పగలూ, రాత్రీ ఇదే భావనను కలిగి, తీవ్ర సంకల్పాన్ని కలిగి మోక్షాన్ని ఆపేక్షించు.
బంధుమిత్రులనేవారు ‘ఎండిపోయిన పాత బావుల’ వంటి వారు, మనం అందులోనికి దిగి, కర్తవ్యం, బంధం అనే కలలను కంటూ ఉంటాము. దీనికి అంతులేదు. ఈ భ్రాంతిలో పడి ఎవరికో సాయం చేస్తున్నానని అనుకోకు, ఇది శాఖోపశాఖలైన మర్రిచెట్టు వంటిది, విస్తరిస్తూనే ఉంటుంది. నీవు ద్వైతివైతే, భగవంతునికి సాయం చేయాలనుకోవడం అవివేకమే అవుతుంది. నీవు అద్వైతివైతే, నీవే భగవంతుడివని నీకు తెలుసు, ఇంక విద్యుక్త ధర్మమంటూ ఏమి ఉంది? భర్తకుగాని, బిడ్డకుగాని, స్నేహితుడని గాని నీవు చేసేదంటూ ఏదీ లేదు. ప్రాప్తించే దానికి తల ఒగ్గి, నిశ్చలంగా ఉండు; ప్రవాహం వలన ఎగుడు దిగుడులు సంభవించినా చలించకు, ఈ శరీరం నశిస్తే నశించనివ్వు; ఈ శరీర స్మృతిని విస్మరిస్తూ, నీవే బ్రహ్మమని గుర్తించు.
వర్తమానానికి మాత్రమే ఉనికి ఉంది.. భూత, భవిష్యత్ కాలాలు ఆలోచనలో కూడా ఉండవు, ఎందుకంటే వాటిని గురించి భావించడానికైనా, వాటిని వర్తమానంగా చేసుకోవాలి. ఈ సంసారం కేవలం భ్రాంతిమయమై ఉంది, అందువలన ఈ భ్రాంతికి అధీనుడవు కావద్దు. అది ఎలాంటిది కాదో నీకు తెలిసినందున, ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయి. ఈ శరీరాన్ని గురించిన చింతన వదిలివేయి, దాని ఉనికిని విస్మరించు, కర్తవ్యం అనే నియంతృత్వ భావన కాలకూట విషంతో సమానమైనది. శరీర సంబంధిత కర్తవ్వపాలనలో తగుల్కోవడమే లోకాన్ని నాశనం చేస్తోంది.
ఏదో లభిస్తుందని ఆశిస్తూ కాలయాపన చేయడమెందుకు? వీణను చేతబుచ్చుకుని, వీణా నాదాన్ని ఇక్కడే పలికించు. స్వర్గం కొరకు వేచి ఉండటం అవివేకమే కదా, స్వర్గంలో సాధించడానికి ఏమీ ఉండదు. అందువలన ఈ క్షణమే నీ ప్రయత్నాన్ని ఆరంభించు. కాషాయ వస్త్రం స్వాతంత్ర్యచిహ్నం, అందువలన లౌకిక వేషాన్ని వదిలి వేసి, స్వాతంత్ర్య పతాకమైన కాషాయాన్ని ధరించు.
ఆదివారం, ఆగష్టు 4
‘అజ్ఞులు ఆరాధించే దైవాన్నే నేను మీకు బోధిస్తున్నాను’.
అద్వితీయము, ఏకమూ అయినటువంటి ఈ బ్రహ్మమే తెలిసినవాటిల్లో అత్యుత్తమమైనది. మనకు సర్వత్రా గోచరమయ్యేది ఆ బ్రహ్మమే. అందరికీ తమలో ఉన్న ఆత్మ తెలుసు, ‘నేను ఉన్నాను’ అనే ఎరుక అందరిలో, ఆఖరుకి జంతువులలో కూడా ఉంది. అయితే దాని ఆవిష్కారం గురించే తెలుసుకోవలసి ఉంటుంది. మీ పిల్లలకు దీని గురించి బోధించండి, వారు అర్థం చేసుకోగలరు. ప్రతీ మతంలో, అజ్ఞాతంగానైనా సరే, ఆత్మ గురించిన ఆరాధన మాత్రమే ఉంది, ఎందుకంటే ఆత్మ వినా అన్యం ఏదీ లేదు.
జీవితంలో బంధమనే లతకు పెనవేసుకోవడం వల్లనే, దోషాలకు మూలం అవుతోంది. దాని వల్లనే సమస్త దుర్గుణాలు అలవడడమే కాక, ధనాన్ని దైవంగా మారుస్తోంది. దీనికి తోడు భయం ఒకటి వచ్చి చేరుతోంది. అందువలన ఐహికమైన దానిని ఏదీ లెక్క చేయకు. దేని యందు ఆసక్తి చూపనినాడు, (ఆఖరుకి జీవితం పట్ల కూడా) నీవు పూర్తిగా భయరహితుడవు కాగలవు.
లోకంలో అనేకత్వాన్ని గాంచేవాడు, మృత్యువు నుండి మృత్యువాతను పడుతూనే ఉంటాడు. అంతా ఏకమే అని గ్రహించిననాడు, శారీరకంగా గాని, మానసికంగా గాని మరణం ఉండదు. సమస్త శరీరాల్లో ఉన్నది నేనే, కాబట్టి శరీరం కూడా శాశ్వతమే. చెట్టు, జంతువు, సూర్యుడు, చంద్రుడు, ఈ విశ్వమంతా నా శరీరమే అయి ఉండగా, ఇంక దానికి నాశనం ఏమిటి? ప్రతీ భావము, మనస్సు నాదే అయినప్పుడు దానికి మరణం ఎలా సంభవిస్తుంది? ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఇది గ్రహించిననాడు, అన్ని సంశయాలు దూరం కాగలవు. ఒక శిరోజం రాలినంత మాత్రాన మనం మరణించామని అనుకోము, అలాగే ఒక శరీరం పతనమైనంత మాత్రాన ఏమీ కాదు, అదీ ఒక శిరోజం రాలిపోవడం వంటిదే.
* * *
బ్రహ్మము జ్ఞానాతీతమైనదే. అది వాక్కుకి, భావనకు, చైతన్యానికి కూడా అతీతంగా ఉన్నది. పశుత్వం (తమోగుణ ప్రధానం), మానవత్వం (రజోగుణ ప్రధానం), దైవత్వం (సత్త్వగుణ ప్రధానం) అనే మూడు అవస్థలున్నాయి. అస్తిత్వాన్ని కలిగిన వారు మహోన్నత స్థితిని పొందినవారు. వారికి ఆ స్థితిలో కర్తవ్యం నశించి, ప్రేమమాత్రం వెల్లి విరుస్తూ, సూదంటురాయి మాదిరిగా ఇతరులను ఆకర్షిస్తూ ఉంటారు. అదే స్వతంత్ర్యం. ఆ స్థితిలో నీవు పనిగట్టుకుని ధర్మకార్యాలను చేయకపోయినా, నీవు చేసేదంతా ధర్మంగానే ఉంటుంది. బ్రహ్మవిదుడు సమస్త దేవతలకంటే గొప్పవాడు. జీసస్ మోహాన్ని జయించి, ‘ఓ సైతానూ, నా నుండి వెనక్కి వెళ్ళమని’ చెప్పినపుడు, దేవతలు సైతం అతడిని పూజించవచ్చారు. అలాంటవానికి ఎవరూ సహాయం చేయ సమర్థులు కారు, యావత్ విశ్వమే ఆ బ్రహ్మవిదునికి మోకరిల్లుతుంది. అతని ప్రభావం ఇతరులను పవిత్రులుగా చేస్తుంది. అందువలన నీ సాధనలో అలాంటి బ్రహ్మవిదులను పూజించు; మనకు దైవం నుండి మూడు అతివిలువైన బహుమతులు లభించాయి. ఒకటి మానవశరీరం, రెండు ముక్తిని పొందాలనే తీవ్ర సంకల్పం, మూడవది దానికి దారి చూపే మహాపురుషుని సంశ్రయం; ఇవి తప్పక ముముక్షుత్వానికి దారి తీస్తాయి.
* * *
శాశ్వతమైన శరీర వినాశనం నిర్వాణం అంతేకాక, ఇది వ్యతిరిక్త పక్షం, నేను ఇది కాను, అది కాను అనే ప్రతిపాదన కలది. వేదాంతం దీనికంటే ఒకడుగు ముందుకు వేసి, ‘నేను అఖండమైన ఉనికిని కలిగి ఉన్నాను’ (సత్), ‘అఖండమైన ఆనందాన్ని అయి ఉన్నాను’, ‘నేను బ్రహ్మాన్నే అయి ఉన్నాను’ (అహం బ్రహ్మాస్మి) అని ప్రతిపాదిస్తుంది.
బౌద్ధాన్ని అవలంబించేవారిలో, అనేకులు మోక్షసిద్ధాంతాన్ని విశ్వసిస్తారు, వీరు నిజమైన వేదాంతులు. సింహదేశపు బౌద్ధులు మాత్రం నిర్వాణమంటే చేర్చుకోవడంగా భావిస్తారు.
విశ్వాసం గాని, అవిశ్వాసం గాని, ‘నేను’ ను నశింపజేయలేదు. విశ్వాసంతో వచ్చి అవిశ్వాసంతో పోయేది భ్రాంతి మాత్రమే. ఏదీ ఆత్మకు బోధించలేదు, అటువంటి ఆత్మకు ప్రణామములు. ‘ఆత్మజ్ఞానంతో స్వయం ప్రకాశమానమైన అట్టి పరబ్రహ్మానికి ప్రణామములు’. శరీరం ఒక చీకటిగది వంటిది, మనం అందులో ప్రవేశించగానే, అది తేజోమయమై, సజీవమౌతుంది. ఆ ప్రకాశాన్ని ఏది అడ్డుకోలేదు, అది నశించనిది. దాని యందు అజ్ఞానపు ఆవరణం ఉన్నా, అది నశింపశక్యం కానిది.
* * *
ప్రస్తుతకాలంలో, భగవంతుడిని అఖండ శక్తి స్వరూపిణి అయిన మాతగా ఉపాసిస్తే, పవిత్రత కలుగుతుంది; అంతేకాక ఈ అమెరికా ఖండంలో అఖండ శక్తి వెలువడగలదు. ఇక్కడ మతసంస్థల వలన అణిచివేత లేదు, పేదదేశాలలో మాదిరిగా ఎవరూ బాధపడటం లేదు. స్త్రీ యుగాల పర్యంతం బాధపడుతూ ఉన్నది, దీని వలన ఆమెకు అనంతసహనమూ, అఖండ కార్యదీక్షా అలవడినాయి. ఆమె ఒక ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉండగలదు. దీని వల్లనే ప్రతీదేశంలో మతాచార్యులకూ, మూఢవిశ్వాసాలతో కూడిన మతాలకు సైతం ఆమె ఆలంబనగా నిలిచి ఉంది. ఇదే ఆమెను విముక్తురాలిని చేయగలదు. వేదాంతులమై, ఈ మహాశయాన్ని జనసామాన్యంలో ప్రచారం గావించాలి, అది ఈ స్వతంత్ర అమెరికాదేశంలోనే సాధ్యపడుతుంది. భారతదేశంలో బుద్ధుడు, శంకరుడు, మరికొందరు, ఈ ఆశయాలను వెలువరించినా, సామాన్యులు దీనిని పూర్తిగా గ్రహించలేకపోయారు. ఈ నవీన యుగం వారు వేదాంత ఆశయాలకు అనుగుణంగా జీవించడాన్ని నేర్చుకోవాలి, అది స్త్రీల మూలంగానే రావలసి ఉంది.
“దివ్యసౌందర్యంతో అలరారే ఆ ప్రియమైన తల్లిని నీ హృదయానికి అతి దగ్గరగా, జాగ్రత్తగా నిలుపుకో”.
“ఆ మాత నామస్మరణం తప్ప, తక్కినవన్నిటినీ వదిలి వేయుము”.
“నీ మనస్సునందు ఎటువంటి చెడు ఆలోచనలను చేరనివ్వక, పవిత్ర హృదయంతో ఆ మాతను కాంచుము”.
“జీవితానికి చంద్రునివంటి చల్లదనాన్ని ప్రసాదించే ఓ తల్లీ, ఆత్మలకే ఆత్మవై, సకల చరాచరములందు నెలకొన్న మాతవి నీవే అయి ఉన్నావు.”
ఆదివారం, మధ్యాహ్నం
శరీరం ఎలా మనస్సు చేతిలో ఉపకరణమో, అలాగే మనస్సు ఆత్మ చేతిలో ఉపకరణం. పదార్థం వలన బాహ్యచలనం కలిగితే, మనస్సు వలన అంతఃచలనం కలుగుతోంది. సమస్తమైన పరిణామాలు, ఆది, అంతాలు కాలానికి లోబడి ఉన్నాయి. ఆత్మ మార్పు చెందనిది. అయితే, పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణమైతే అనంతమై అలరారాలి. అనంతమైనది ఎప్పుడూ ఒక్కటే అయి అద్వితీయమై ఉంటుంది గానీ, రెండు అనంతాలు ఉండవు. అది అనేకంగా కనిపించినా, వాస్తవానికి ఒక్కటే అయి ఉన్నది. ఒక వ్యక్తి సూర్యునికి దగ్గరగా వెడదామని వేసే ప్రతీ అడుగులో, సూర్యుడిని విభిన్నంగా చూస్తూ ఉంటాడు. అయినా అతడు చూసేది ఒకే సూర్యుడిని కదా!
అస్తిత్వమే ఏకత్వానికి మూలం. ఆ మూలాన్ని కనుగొన్నంతనే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. సమస్తమైన రంగులను ఒక్క రంగులోనికి తీసుకువస్తే, చిత్రలేఖనం అంతం కాగలదు. పరిపూర్ణత్వం విశ్రాంతికి చిహ్నం. సమస్త రూపాలు ఒకే మూలతత్త్వమని మనం విశ్వసిస్తాం. బౌద్ధులు, యూదులు, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, పారసీకులు, ఇలా వివిధ మతస్థులు ఒకే ధర్మాన్ని, ఇంచుమించుగా సమానవాక్కులతో బోధించారు. అయితే హిందువులు దీనికి కారణాలను కూడా తెలుసుకుని, ఆ ధర్మాలకు బలం చేకూర్చారు. అందరిలో ఉన్నది తానే అయినందున, అందరినీ సమానంగా ప్రేమించాలి. ఉన్న బ్రహ్మం ఒక్కటే.
ప్రపంచానికి చెందిన మహాధర్మప్రవక్తల్లో బుద్ధుడు, జీసస్, లావోట్జీ వంటివారు సామాన్య ధర్మ సూత్రాలను అతిక్రమిస్తూ, ‘నీ శత్రువులకు మేలు చేయుము’, ‘నిన్ను ద్వేషించేవారిని ప్రేమించమని’ వచించారు.
ధర్మసూత్రాలు స్వతసిద్ధంగానే ఉన్నాయి. వాటిని మనం సృష్టించడం లేదు, అయితే కనుగొంటున్నాం…. మతం అనుభూతిలో ఇమిడి ఉంది. సిద్ధాంతాలు మతధర్మాలు కావు, అవి పద్ధతులు మాత్రమే. వివిధ మతాలన్నీ ఒక్క మతం నుండే వెలువడి, వివిధ జాతుల వారికి అనుగుణంగా మలచబడ్డాయి. సిద్ధాంతాలు కలహానికే దారితీస్తాయి; అందువల్లనే శాంతిని వెదజల్లవలసిన భగవన్నామం, లోకంలోని సగం రక్తపాతానికి హేతువైనది. మూలకారణాన్ని కనుగొని, దాని వద్దకు తిన్నగా వెళ్ళు. భగవతత్త్వాన్ని గురించి భగవంతుడినే అడుగు, అతడు తప్పక నీకు తెలుపగలడు. అతడు తెలుపుతాడనే ప్రతీ మతమూ చాటి చెబుతుంది.
నీ పరంగా నీవు చెప్పవలసింది నీ వద్ద ఉండాలి, లేకపోతే ఇతరులు చెప్పినదాన్ని గురించి ఏ భావమైనా నీకెలా కలుగుతుంది? పాత మూఢ విశ్వాసాలను పట్టుకుని పాకులాడవద్దు. నూతనత్వాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉండు. ‘తాతముత్తాతల నాటి కాలం తవ్విన బావిలోని ఉప్పునీటినే త్రాగుతూ, ఇతరులు తవ్విన బావిలోని మంచినీటిని తాగననేవారు మూర్ఖులే కదా!’ స్వయంగా మనం భగవత్సాక్షాత్కారాన్ని పొందేవరకు, ఆయన గురించి ఏమీ తెలుసుకోలేము. స్వతఃసిద్ధంగా ప్రతీ వ్యక్తీ పరిపూర్ణుడే. అయితే అది ప్రవక్తలలో ప్రకాశిస్తూ ఉండగా, మనలో వికాశ దశలో ఉంది. మనం భగవంతుని చూడనిదే మోసెస్ చూశాడని గ్రహించడం ఎలాగ? భగవంతుడు ఎవరికైనా ప్రత్యక్షమై ఉంటే, నాకూ ప్రత్యక్షమవుతాడు. నేను ఆయనను తిన్నగా కలుస్తాను, ఆయన నాతో మాట్లాడవచ్చు. కేవలం నమ్మకం ఆధారంగా తీసుకోవడం నాస్తికత, దైవతిరస్కారం అవుతుంది. రెండువేల ఏళ్ళక్రిందట అరేబియా ఎడారుల్లో భగవంతుడు మానవుడితో సంభాషించి ఉంటే, నేడు నాతోనూ సంభాషించగలడు. లేనిచో ఆయన శాశ్వత తత్త్వాన్ని నేను ఎలా తెలుసుకోగలను? దేవుని పొందేందుకు ఏ మార్గాన్ని అయినా అవలంబించు, ఆయన్ను చేరుకోవడమే కావలసింది. కానీ అలా పొందే ప్రయత్నంలో ఎవ్వరినీ అణగద్రొక్కవద్దు.
జ్ఞానులు అజ్ఞానుల పట్ల దయను కలిగి ఉండాలి. అన్నీ తెలిసినవాడు, చీమకోసమైనా శరీరాన్ని సమర్పించేందుకు సిద్ధమై ఉండాలి, ఎందుకంటే ఈ శరీరం తృణప్రాయమైనదని అతడికి తెలుసును కాబట్టి.
సోమవారం, ఆగష్టు 5
ఉత్తమోత్తమమైన స్థితిని పొందేందుకు వివిధ స్థాయిలలో క్రమక్రమంగా అధిరోహణ చేయవలెనా లేక ఒక్కసారిగా ఆ స్థాయిని పొందవచ్చునా అన్నది ఒక ప్రశ్న. తన పూర్వులు వందల కొద్దీ సంవత్సరాలలో సాధించిన ప్రగతిని, నేటి అమెరికన్ కుర్రవాడు పాతిక సంవత్సరాలలో సాధిస్తున్నాడు. అలాగే నేటి కాలంలో, హైందవుడు తన పూర్వీకులు గత ఎనిమిది వేల సంవత్సరాలలో సాధించిన ఉన్నతిని ఇరవై ఏళ్ళలో పొందగలడు. భౌతికపరమైన విశ్లేషణలో అత్యంత సూక్ష్మరూపంతో మొదలై మానవ రూపం దాకా గర్భంలో రూపుదిద్దుకుంటోంది. ఇవి ఆధునిక శాస్త్రబోధలు. వేదాంతం ఇంకో అడుగు ముందుకు వేసి, మనం గత మానవ జీవితాన్నే కాక భావికాల జీవితాన్ని కూడా జీవించవలసి ఉందని వక్కాణిస్తుంది. వీటిలో మొదటి దానిని నెరవేర్చగలవాడు విద్యావంతుడైతే, రెండవదానిని నెరవేర్చేవాడు జీవన్ముక్తుడు.
కాలమే మన ఆలోచనలకు ప్రమాణంగా నిలుస్తుంది. అయితే ఆలోచనలు ఊహించరానంత వేగవంతంగా ఉంటాయి కాబట్టి, భావిజీవితం గడిచే వేగానికి పరిమితి లేదు, అందువలన ఆ కాలపరిధి ఎంతో మనం చెప్పలేము. అది ఒక క్షణం కావచ్చును, లేదా ఏభై జీవిత కాలాల పర్యంతం కావచ్చును, అది సంకల్పతీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని బోధనలను బోధితులకు అనుగుణంగా మార్చవలసి ఉంటుంది. దహించే అగ్ని సర్వ సిద్ధంగా ఉంది, అది నీటిని, మంచిగడ్డలను సైతం శీఘ్రంగా దహించివేస్తుంది. తుపాకీని పక్షులగుంపుకి గురిపెట్టి పేలిస్తే, కనీసం ఒక పక్షి అయినా దొరికే అవకాశం ఉంది. అలాగే తత్త్వసర్వస్వాన్ని, అన్ని సత్యాలను మానవుని ముందు పెడితే, తనకు అనుగుణ్యమైన దానిని, కనీసం ఒక్కటైనా తీసుకుని ఆచరించే అవకాశం ఉంది. గతకాలపు జీవితాల వలన ప్రవృత్తులు రూపొందించబడ్డాయి, కాబట్టి ప్రవృత్తిని అనుసరించి బోధించాలి. జ్ఞానమో, యోగమో, భక్తో, కర్మాచరణమో, వీటిలో ఏది ఒకదానిని ఆధారంగా చేసుకుని, తక్కినవాటిని దానితో కలిపి బోధించు. జ్ఞానాన్ని ప్రేమతో సరితూగే విధంగానూ, యోగాన్ని యుక్తితోనూ బోధించి, అనుష్ఠానం తప్పనిసరి అయ్యే విధంగా చూడాలి. వారున్న స్థానం నుండి పురోగతి సాధ్యమయ్యేలా చేయాలి. మతబోధలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే ఉండాలి కాని రూపుమాపేవిగా ఉండరాదు.
ప్రతీ ప్రవృత్తి గత జన్మకర్మను అనుసరించి, అతడనుసరించవలసిన మార్గాన్ని చూపుతుంది. వృత్తంలోని వ్యాసార్థాలన్నీ కేంద్రానికే చేరుస్తాయి, అందువలన ఎవరి ప్రవృత్తిని చెడగొట్టేందుకు ప్రయత్నించకు. దాని వలన గురువు, శిష్యుల ఏకాగ్రతలను దారి మళ్ళించడమే అవుతుంది. జ్ఞానబోధను చేసేటప్పుడు నీవు జ్ఞానివై ఉండి, శిష్యుడి మానసిక దశను అందుకోగల స్థితిలో ఉండాలి. ఇతర యోగాల విషయం కూడా అంతే. ప్రతీ విభాగంనందూ, అదొక్కటే నీ లక్ష్యసాధన అనే రీతిలో పెంపొందించుకో, ఇదే నిజమైన సామరస్య ఐక్యతకు దోహదకారి అవగలదు. విస్తారంగానే కాక తీవ్రతరంగానూ అలవరచుకోవాలి, అయితే నియంత్రణను కూడి ఉండాలి. మనం అనంతమై ఉన్నాము, పరిమితి అన్నది లేదు. అత్యంత నిష్ఠాపరుడైన మహమ్మదీయునికి ఉన్న తీవ్రతనూ, ప్రచండ నాస్తికునికి గల భావవైశాల్యాన్ని మనం పొందవచ్చును.
దీనికి మార్గం మనస్సుని ఏదో ఒక విషయం మీద లగ్నం చేయడమే కాదు; మనస్సుని విశాలంగా చేసి, దాని పట్ల నియంత్రణను కలిగి ఉండాలి, అప్పుడే నీ ఇష్టం వచ్చిన వైపుకి దానిని మరల్చవచ్చు. దీని వలన విస్తరణ, తీవ్రమైన పట్టూ రెండూ లభ్యం కాగలవు. జ్ఞానమే సర్వమూ అనే రీతిలో జ్ఞానానుభవాన్ని గడించాలి. అదే విధానంలో భక్తి, కర్మ, రాజయోగాలలో నిష్ణాణతను సాధించాలి. అలలను వదిలివేసి, సముద్రాన్నే ఆశ్రయించాలి, అప్పుడే నీ ఇచ్ఛానుకూలంగా అలలపై పట్టుని కలిగి ఉంటావు. నీ మానస సరోవరాన్ని నిశ్చలంగా ఉంచుకోవాలి, అప్పుడే ఇతరుల మనస్సులను నీవు అర్థం చేసుకోగలవు.
శిష్యుని ప్రవృత్తికి అనుగుణంగా తన యావచ్ఛక్తిని వినియోగించేవాడే నిజమైన గురువు. నిజమైన సానుభూతిలేనిదే ఎన్నటికీ బోధించలేము. ప్రతీ మానవుడూ బాధ్యతలను గుర్తెరిగిన వాడనే ఆలోచనను పక్కకు పెట్టు, పరిపూర్ణతను కలిగినవాడే బాధ్యతాయుతంగా ఉంటాడు. అజ్ఞానులు మోహమనే మదిరాపానంలో కూరుకునిపోయి ఉన్నారు, వారిపట్ల సహనాన్ని కలిగి ఉండాలి. వారిపట్ల ప్రేమను కలిగి ఉండి, వారి మనోదుర్బలతకు సరియైన కారణాన్ని కనుగొని, ప్రపంచాన్ని సరియైన రీతిలో అవలోకనం చేసుకునేందుకు తోడ్పడాలి. జీవన్ముక్తులు మాత్రమే స్వతంత్రతను కలిగిన సంకల్పాలతో ఉంటారని గుర్తుంచుకో, మిగిలినవారంతా బంధంలో ఉండే ప్రవర్తిస్తుంటారు. సంకల్పం, సంకల్పరూపంలోనే బద్ధమై ఉన్నది. నీరు హిమాలయశిఖరం మీద మంచు నుండి కరిగేటప్పుడు స్వతంత్ర్యమై ఉంది, కానీ నదిరూపు దాల్చగానే, ఒడ్డుని కలిగి ఉండి బద్ధమై ప్రవర్తిస్తుంది. అయితే దాని గమ్యస్థానమైన సముద్రాన్ని చేరగానే, తిరిగి స్వాతంత్ర్యాన్ని పొందుతోంది. ఇందు మొదటిది పతనావస్థ కాగా, రెండవది తిరిగి పోయిన దానిని పొందడంగా చెప్పవచ్చును. తన స్వాతంత్ర్యాన్ని తాను పొందనిదే అణువైనా నిలకడగా ఉండలేదు.
కొన్ని భావనలు భావపరంపరనుండి విముక్తిని పొందేందుకు సహాయపడతాయి. ఈ విశ్వమే మిధ్యాభావనతో ఏర్పడినది, ఇందులో ఒక రకమైన భావనలు ఇంకొకరకాన్ని నివారిస్తూ ఉంటాయి. ప్రపంచం అంతా పాపం, దుఃఖం, మరణంతో నిండి ఉందని తెలిపేవి భయంకరమైనవి, అలా కాక, ‘నేను పవిత్రుడిని’, ‘భగవంతుడున్నాడు’, ‘బాధ అన్నది లేదు’ అనే భావనలు మంచివే కాక, బంధాలను తొలగించే ప్రయత్నం కూడా చేస్తాయి. సాకారదైవాన్ని గురించి భావన, మహోన్నత భావనలలో మహోన్నతమై, సంసార శృంఖలాలను తెంచివేస్తుంది.
‘ఓం తత్ సత్’ అన్నది మాయకు అతీతమై ఉన్నది. భగవంతుడు నిత్యుడై వెలుగొందుతున్నాడు. నయాగరా జలపాతం ఉన్నంత వరకూ, అందులో ఇంద్రధనస్సు వెలుగొందుతూనే ఉంటుంది, నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ జగత్తు జలపాతం వంటిదే, ఇంద్రధనస్సు సాకారదైవం వంటిది, ఈ రెండూ నిత్యాలే. మాయ సత్తు కాదు, అసత్తూ కాదు. నయాగరాజలపాతమూ, దానిలోని ఇంద్రచాపమూ మాయవరణం నుండి కాంచబడే నిత్య, సవికల్ప బ్రహ్మమే. క్రైస్తవులు, పారసీకులు మాయను రెండుగా విభజించి, మంచిదైవభాగాన్ని భగవంతునిగానూ, రెండోదానిని ‘సైతాన్’ అని పేర్కొంటారు. వేదాంతం మాయను సంపూర్ణంగా గుర్తించగలిగి, దానికి అతీతమై వెలుగొందే దానిని, ఏకమై ఉన్నదానిని, బ్రహ్మం అని గుర్తించింది.
* * *
క్రైస్తవమతం సెమిటిక్ సంప్రదాయం నుండి తొలగిపోతోందని, మహమ్మద్ కనుగొని, తదీయవర్గానికి చెందినది ఎలాంటిదై ఉండాలో, భగవంతుడిని ఏకభావనతో ఎలా విశ్వసించాలో, తన బోధల ద్వారా తెలిపి ఉన్నాడు. ఆర్యులు నమ్మే ‘నేనూ నా తండ్రీ ఒక్కరమే’ అన్న భావన అతడిలో విసుగుని, భయాన్ని కలిగించింది. వాస్తవానికి, ద్వైత భావనను కలిగిన జెహోవాకంటే, త్రిమూర్తి భావన ఒక మెట్టుపైనే ఉంది. నరుడూ, నారాయణుడు ఒక్కరే (జీవుడు, దేవుడు) అని గుర్తించే భావశృంఖలంలో అవతారసిద్ధాంతం మొదటి కొలికి. భగవంతుడు ముందుగా ఒక మానవరూపంలో గోచరించి, వివిధ కాలాల్లో ఇతర మానవ రూపాలను ధరించి, చిట్టచివరకు సమస్త మానవుల్లోనూ నెలకొని ఉండటం కానవస్తుంది. అద్వైత భావన మహోన్నతం, ఈశ్వర భావన దానికన్నా కాస్త క్రింద ఉంది. భావన అనేది యుక్తి కన్నా త్వరితంగా, విశేషంగా నిన్ను మహోన్నత స్థితికి చేర్చగలదు.
కొద్దిమందైనా కేవలం భగవంతుని కొరకే జీవిస్తూ, లోకం నిమిత్తం ధర్మాన్ని కాపాడెదరు గాక! నీవు భ్రాంతి జనకుడవై ఉండి, జనకుడివలె నటించవద్దు (జనకుడు ఒక రాజు; రాజ్యపాలన ధర్మంగా భావిస్తూ, మానసికంగా సర్వసంగుడైనటువంటి వాడు). ‘నాకు ఆదర్శం అర్ధమవుతోంది కాని దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాను’ అని నిజాయితీగా నీ స్థితి తెలియజేయి, అంతే కానీ త్యజించకుండా, త్యజించినట్లుగా నటించవద్దు. నీవు అన్నింటిని వదిలివేయగలిగితే, దృఢంగా నిలబడు. సమరంలో ఒక వందమంది పడిపోయినా, పతాకాన్ని ధరించి ముందుకు కదిలివెళ్ళు, ఎవరు పరాజయం పాలైనా ఫరవాలేదు. పడిపోయేవాడు పతాకాన్ని ముందుకు వెళ్ళేవాడికి ఇస్తాడు, పతాకానికి పతనం లేదు.
నేను పరిశుద్ధుడనై ఉండగా, నాకు మాలిన్యం ఎందుకు అంటుతుంది? దేవుని ప్రాప్తికై పోరాటం సాగించు, తక్కినదంతా వదిలివేయి, ఏదీ వచ్చి నిన్ను చేరాలని కోరుకోకు, ఏవైనా తొలగిపోతూ ఉంటే సంతోషించు; నీవు గమనించకపోయినా, విజయం నిన్ను వరిస్తుంది. జీసస్ పన్నెండు మంది బెస్తవారిని లోకానికి అప్పగించి వెళ్ళాడు, ఆ కొద్ది మందే రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టగలిగారు.
దేవుని పవిత్రపీఠం ముందు నిర్మలహృదయులు, ఉత్తములే ఉంటారు. ఎన్నడూ యత్నమే చేయని వ్యక్తికంటే తంటాలుపడేవాడు అధికుడే కదా! సర్వసంగ పరిత్యాగం చేసిన వారిని చూడటం సైతం ఆత్మనైర్మల్యానికి దోహదం చేస్తుంది. దేవుని కొరకై నిలబడు; ప్రపంచాన్ని పోనివ్వు. ఇందులో రాజీపడవద్దు, అన్నింటిని వదిలిపేస్తేనే నీకు దేహభ్రాంతి తొలగుతుంది. ఆ భావం పతనమైతే, నీవు విముక్తుడవే, ఆ విధంగా ముక్తుడివి కావాలి. మరణంతో మాత్రం మనకు ముక్తి లభించదు. స్వప్రయత్నంతోనే, జీవితకాలంలో ముక్తిని పొందగలగాలి. ఆపై శరీరం పతనమైనవారికి, ఇంక పునర్జన్మ లేదు.
సత్యానికి సత్యమే ప్రమాణంగా నిలుస్తుంది, వేరేమికాదు. సత్కర్మాచరణం సత్యానికి ప్రమాణం ఏమీ కాదు; సూర్యుని చూసేందుకు దివిటీ అవసరం లేదు; లోకాన్నంతా నశింపచేయగలిగినా సత్యం సత్యమే, దానికై స్థిరంగా నిలబడు. మతపరంగా, కర్మకలాపాలు, బాహ్యవిధులను ఆచరించడం జనసామాన్యాన్ని బహుళంగా ఆకర్షిస్తుంది, కాని నిజానికి బాహ్యాచారాల్లో ఏమీలేదు.
ఒక సాలీడు తన నుండే గూటిని వెలువరిస్తూ, తిరిగి తనలోనికే లాగుకున్నట్లుగా ఈ విశ్వమంతా భగవంతునిచే సృష్టించబడి, తిరిగి లయం పొందుతోంది.
మంగళవారం, ఆగష్టు 6
‘నేను’ అనేది లేకుండా, బాహ్యంలో నీవు ఉండలేవు. ఈ విషయంలో కొందరు తత్త్వజ్ఞులు, విషయిలోనే బాహ్యప్రపంచం ఉందిగాని, వేరేగా లేదనే నిర్ధారణకు వచ్చారు. మరికొందరు ‘నేను’ అనేది నీవు అనే దాని నుండే తెలియబడేదనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఈ రెండూ అభిప్రాయాలలో పాక్షిక సత్యమే ఉంది. శరీరం ఏ విధంగా భౌతికమో, ప్రకృతిగతమైనదో, భావమూ అలాంటిదే. జడమూ, మనస్సూ కలగలిపిన మరో తత్త్వంలో ఈ రెండూ విభజన చెందుతూ, ఏకంలో నెలకొని ఉన్నాయి. ఆ ఏకమే యదార్థమైన ఆత్మ.
అనిర్వచనీయమైన అస్తిత్వం మనస్సుగానూ, పదార్థంగానూ వ్యక్తమవుతోంది. కొన్ని నిర్ణీత మార్గాల్లో, ప్రకృతికి లోబడి అవి వర్తిస్తున్నాయి. ఏకరూపంలో అవి స్వత్రంతను కలిగి ఉన్నాయి. అనేకంలో నియమబద్ధమై ఉన్నాయి. ఈ బంధమంతటిలోనూ, ఏదో స్వాతంత్ర్యభావం సదా వ్యక్తం అవుతూనే ఉంటుంది, దానినే ‘నివృత్తి’ లేదా ‘రాగవిముఖత’ అని గాని అంటాము. కోరికల ద్వారా ఐహిక విషయాలపట్ల ఆసక్తిని పెంపొందించుకునే మార్గాన్ని ‘ప్రవృత్తి’ అని అంటారు.
మనలను బంధవిముక్తులను చేసే క్రియాపధం నైతికమైనది, బద్ధులను చేసేది అవినీతిపరమైనది. సర్వమూ చక్రగతమై, బయలుదేరిన చోటుకే తిరిగి వస్తుండటంతో, మనకు ఈ ప్రపంచం అనంతంగా తోస్తుంది. వృత్తం కలుస్తుంది కనుక ఇహంలో శాంతి లభించదు, అందువలన దీని నుండి బయటపడాలి, దీనికి ముక్తే ఏకైక మార్గం.
* * *
దోషమనేది రూపం మారినా, గుణాన్ని కలిగే ఉంటుంది. పూర్వకాలంలో బలవంతులదే రాజ్యంగా ఉండేది, ఇప్పుడు వంచకులది. భారతదేశంలో దుస్థితి అమెరికాలోని దుస్థితి అంతకాదు, ఇక్కడ పేదవాడు తన దుస్థితికి హెచ్చు అంతరాన్ని చూస్తున్నాడు.
మంచి చెడులు రెండూ, వేరుచేయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి, ఒకటి కావాలంటే రెండోది కూడా వస్తుంది. ఈ విశ్వంలోని శక్తినంతటిని ఒక సరస్సుగా భావిస్తే, అందులో లేచే ప్రతీ అల వలన ఒక పల్లం ఏర్పడుతోంది, మొత్తంగా చూస్తే శక్తి ఒక్కటే; అంటే ఒక మనిషి సంతోషం మరొకరి దుఃఖానికి కారణం అవుతుంది. బాహ్యసుఖం భౌతికం మరియు నిర్ణీతమై ఉంది; లోకాతీతమైన ఆనందం మాత్రమే ఎవరికి నష్టం కలిగించని విధంగా ఉంటుంది. ఐహిక సుఖాలు, ఐహిక దుఃఖాలకు రూపాంతరమే అన్నది గుర్తుంచుకోవాలి.
అలతో ఎగసిపడేవారు, కింద ఏర్పడిన పల్లం వైపు దృక్కు సారించరు. ఎన్నడూ నీవు ఈ ప్రపంచానికి మేలు చేయగలవని గాని, సంతోషంగా ఉంచగలవని గానీ, తలవద్దు. గానుగెద్దు ఎన్నటికీ తన ముందు ఉంచబడిన గడ్డిని అందుకోలేదు, నూనె గానుగను మాత్రమే తిప్పుతూంటుంది. ఇలాగే మనం కూడా ప్రకృతి యంత్రాన్ని తిప్పుతూ, సుఖమనే దానిని అభిలషిస్తూ దాని వెంబడి పరుగులు తీస్తూంటాము. దీనికి అంతమన్నది లేక నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. మనలోని చెడు సంస్కారాలను తొలగించుకోకపోతే, ఉన్నతమైనది ఉందని గుర్తించలేము, ఆ పరిస్థితుల్లో ఉన్నదానితో సంతృప్తిని చెందుతూ, విముక్తికై ప్రయత్నించనే ప్రయత్నించం. ఐహిక సుఖాన్వేషణ నిరర్ధకమని తెలిసేంతవరకూ, పారమార్థికత అనే తలంపు రాదు. మానవ పరిజ్ఞానమంతా పరావిద్యలోని ఒక అంశం మాత్రమే అని గుర్తించాలి.
మానవునిలో మంచి చెడులు రెండూ సమత్వస్థితిలో ఉన్నందున, ఈ రెంటి నుంచి విముక్తి పొందేందుకు కొంత అవకాశం ఉంది.
ముక్తుడైనవాడు ఎన్నడూ బద్ధుడు కాలేడు. బంధమే లేనిచోట కార్యకారణాలు ఉండవు. అందువలన ఎలా విముక్తుడైనాడనేది అసంగతమవుతుంది. ‘కలలో నేనొక నక్కగా ఉన్నాను, అంతట ఒక కుక్క నన్ను తరమసాగింది’ – ఇందులో, కుక్క ఎందుకు తరమిందని ఎలా అడుగుతాము? నక్క కలలోని ఒక అంశం, కుక్క తరమటమూ సక్రమమే, కాని ఈ రెండు సంగతులు కలకు చెందినవే; కలను విడిచివేస్తే, వాటికి ఉనికి లేదు. మతధర్మం, విజ్ఞానం – ఈ రెండూ మనలను బంధవిమోచనంలో సహాయపడగలవు; అయితే మతం ప్రాచీనమైనది, పవిత్రమైనదిగా భావించబడుతోంది. ఒక రకంగా అది నిజమే, ఎందుకంటే అందులో నీతి ప్రధాన విషయం, విజ్ఞానం దానిని గణించదు.
‘హృదయనైర్మల్యం కలిగిన వారు ధన్యజీవులు, వారు భగవంతుడిని దర్శించగలరు’. సమస్త గ్రంథాలు, ప్రవక్తలు లేకపోయినా, ఈ ఒక్క వాక్యం మానవకోటిని తరింపచేస్తుంది. నిర్మలమైన మనస్సు భగవత్సాక్షాత్కారాన్ని కలుగజేస్తుంది. విశ్వగానానికి ఇదే పల్లవి అయి ఉంది. నిర్మలత్వంలో బంధం ఉండదు. అజ్ఞానపు పొరలను నిర్మలత్వంతో కరిగిస్తే, మన స్వస్వరూపం బయటపడుతుంది. అంతట మనం ఎన్నడూ బద్ధులమై లేమని గుర్తిస్తాము. అనేకత్వం దృష్టితో లోకాన్ని పరికించడమే మహాపాతకం. అందరినీ ఆత్మస్వరూపులుగానే భావిస్తూ, ప్రేమించు, భేదభావనలు అన్నింటినీ వదిలివేయి.
* * *
పైశాచిక ప్రవృత్తి అనేది శరీరంలో ఒక పుండువంటిది, దానికి ఉపచారాలు చేసి బాగుచేసుకోవాలి. అందువలన దానికి జాగ్రత్తగా ఉపచర్యలు చేస్తూ, అది పూర్తిగా మాయమయ్యేవరకు కనిపెట్టుకుని ఉండాలి, అప్పుడే సంపూర్తి ఆరోగ్యం, ఆనందం లభ్యం కాగలవు.
వ్యావహారిక స్థితిలో ఆలోచిస్తున్నంతవరకూ, మనకు ఆ విషయాల వలన బాధ ఉందని అనుకున్నా, వాటి వలన మేలు కూడా ప్రాప్తిస్తుందని భావిస్తాము. ఈ స్థితికి బయట ఉండే, ఆ సహాయాన్నే దైవమని అంటున్నాం. సహాయమనేది ఒక సమగ్రరూపంగా ఉంటే, ఆ భావనే దైవం.
దయ, మంచితనం, పరోపకారగుణం అనే వాటి యొక్క విశిష్ట సమ్మేళనమే భగవంతుడు. మనకు భగవంతుడి పట్ల ఈ విధమైన నిశ్చితాభిప్రాయం ఉండాలి. ఆత్మస్వరూపులుగా మనల్ని మనం భావించినప్పుడు, మనం శరీరరహితులమే. అలా అని ‘నేను భగవంతుడినే, కనుక ఏ విషం నాకు హాని కలిగించదు’ అని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. మనకు శరీర స్పృహ ఉన్నంతవరకూ, మనకు భగవత్సాక్షాత్కారం లభించనట్లే. నది సముద్రంలో కలిసాక, దాన్లోని చిన్న సుడిగుండం నిలిచి ఉండగలదా? సహాయం కొరకై నీవు బాధపడితే, తప్పక అది నీకు లభ్యమవుతుంది. చివరకు, సహాయం చేసిన వాడు, ఆశించినవాడు, ఇరువురూ అంతర్ధానమవడాన్ని నీవు గమనిస్తావు, అంతటితో ఆట ముగిసి, ఆత్మ మాత్రమే నిలుస్తుంది.
ఇది సాధించి, ఆత్మావలోకనం నుండి వెనుతిరిగి, ఈ సంసారంలో నీవు ఏ విధంగా ప్రవర్తించినా, ఈ శరీరం వలన నీకు ఏ హాని జరుగదు; ఎందుకంటే సమస్త ప్రతిబంధశక్తులు భస్మీపటలం అయితేనే ముక్తి సాధ్యం కాగలదు. ఎప్పుడైతే మాలిన్యమంతా దగ్దం అవుతుందో, అప్పుడు పొగబారని, వేడిమిలేని, పరంజ్యోతి ప్రకాశవంతమై వెలుగొందడం ఆరంభిస్తుంది.
ప్రారబ్దకర్మ జీవుని వెంటాడినా, చెడునంతా దగ్ధం చేసినపుడు అది మంచి మాత్రమే చేస్తూంటుంది. కొరత వేయబడిన ఒక దొంగ మరణించేముందు తన పూర్వ దుష్కర్మఫలాన్ని అంతా అనుభవించాడు. అంతకు ముందు జన్మలో, అతడొక యోగి అయినా, భ్రష్ఠత చెందడంచే తిరిగి దొంగగా జన్మించాడు. అయితే అతని పూర్వపు సత్కర్మ ఫలప్రదమై, దేహాంత సమయంలో జీసస్‌ను కలిపి, ముక్తుడిని గావించింది.
మహావిరోధిని సైతం బుద్ధుడు విముక్తుడిని గావించాడు. ఆతడు బుద్ధుడిని తీవ్రంగా ద్వేషిస్తూ, సతతమూ అతని గురించే చింతిస్తూ ఉండేవాడు. ఈ ఆలోచనాసరళిచే అతని మనస్సు నిర్మలమై, ముక్తిని పొందేందుకు సంసిద్ధుడిని చేసింది. అందువలన, సదా భగవంతుని స్మరిస్తూ ఉండు, అదే నిన్ను పవిత్రునిగా చేస్తుంది….
(మా ప్రియగురువర్యులు మాకు చేసిన మనోహర తత్త్వబోధలు ఇంతటితో ముగిసాయి. ఆ మరునాడే ఆయన సహస్రద్వీపవనం నుండి న్యూయార్క్‌కు వెళ్ళారు.)