3.అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః
అర్థం: రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.
వివరణ: మనకు తెలుసు రాక్షసులు అంటే ఇతరులను పీడించే స్వభావం లేక గుణాలు కలిగినవారని. అంటే తమ ఆనందం కోసం ఇతరులను చంపడానికైనా తయారుగాఉండేవారు. దీని ప్రకారం మన సమాజంలోనే మనం ఎంతోమంది రాక్షసుల మధ్య ఉన్నామని మనకు తెలుసు. ఇక ఈ శ్లోకం విషయానికి వస్తే ఆత్మహంతకులు అనగా ఎప్పుడూ శరీరసుఖాలే జీవితలక్ష్యాలుగా చేసుకొని దేవుడి గురించి లేక పరమాత్మ గురించి ఆలోచన చేయనివారు. వీరు రాక్షసులతో సమానం. వీరు చనిపోయినతర్వాత రాక్షసుల లోకాలు పొందుతారు అంటే తమ స్వభావం ప్రకారమే మళ్ళీ జన్మిస్తారు. అంటే మళ్ళీమళ్ళీ పుడుతూ, చస్తూ బాధలకు గురి అవుతుంటారు. గాఢమైన చీకటి అని ఎందుకన్నారంటే వీరు కన్నూమిన్నూ కానకుండా సంచరిస్తారు. చీకటిలోనే కదా మనం కూడా అలా కదిలేది.
పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యఫలంగానూ, దైవానుగ్రహం వలననూ లభించిన మనుష్యజన్మలో పురుషశరీరంలో ఉంటూ, వేదవేదాంతాలలో నిష్ణాతుడై తన ముక్తి కోసం ప్రయత్నించక, అనిత్యాలైన ధనపుత్రదారగృహాదుల ఆర్జనలో ఎవరైతే తలమునకలవు తుంటారో అట్టి మూఢులు తమను తామే చంపుకునే ఆత్మఘాతకులు. — Vivekachudamani Verse 4