17. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్ం శరీరం
ఓం (3) క్రతో స్మర కృతగ్ం స్మర క్రతో స్మర కృతగ్ం స్మర
18. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ
అర్థం:ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది.ఈ శరీరప్రాణం మరణంలేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయి, విచారణ చేయి.
ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ప్రారబ్ధకర్మలను అనుభవించడానికి మమ్మల్ని అనుభవమార్గంలో తీసుకెళ్ళు. మా ఘోరమైన తప్పుల నుండి మమ్మల్ని విముక్తున్ని చేయి. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.
వివరణ (Verse 17): ఈ శ్లోకం ఒక “స్వయం సూచన” (Self suggestion) లేక “స్వయం ప్రేరణ” (Self Motivation) మంత్రం లాంటిది.నిత్యజీవితములోనైనా సరే, ఆధ్యాత్మిక జీవితములోనైనా సరే ఒక లక్ష్యము ఎంచుకొన్నప్పుడు ఆ లక్ష్యము నుండి జారకుండా ఉండడానికి మన మనసుకు మనమే గుర్తుచేసుకోవడం ఇది.మహారాజైనా, బిక్షగాడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. దీనిని గుర్తుచేస్తూ ఒక సాధకునికి చెప్తున్న మంత్రం ఇది.
వివరణ (Verse 18): అనుభవమార్గం అంటే “ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, క్రొత్తపనులతో అంటే చేయబోయేపనుల ఫలితం మాకు అంటకుండా చేయి” అని అర్థం. అంటే చేయబోయే పనులు నిష్కామంగా చేసేట్టు చేయి అని అర్థం.
ఈ శ్లోకంతో “ఈశావాస్య ఉపనిషత్తు” సంపూర్ణమౌతుంది.