అద్వైత గోస్వామి: శ్రీ చైతన్యుల సన్నిహిత సహచరుడు.
అనాహత శబ్దం: ఓం నామాంతరం
అనులోమం, విలోమం: ఆద్యాశక్తి క్రమంగా స్థూలమైన జీవజగత్తులుగా, తత్త్వాలుగా అవటం అనులోమం. ఈ స్థూల వ్యక్తీకరణలు మళ్లీ ఆద్యాశక్తిలో ఒదిగిపోవటం విలోమం.
అవధూత: భాగవతంలో పేర్కొన్న అత్యున్నత శ్రేణికి చెందిన సాధువు.
అష్టవసువులు: ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు.
అష్టసిద్ధులు: యోగమార్గంలో పురోగమిస్తున్నప్పుడు యోగి సంతరించుకొనే అమానుష శక్తులు. ఇవి ప్రధానంగా ఎనిమిది. అవి: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం.
అష్టావక్ర సంహిత: సప్రామాణిక అద్వైత వేదాంత గ్రంథం.
ఆగమనీ: నవరాత్రులు ఆరంభమైన రోజున పాడే పాటలు. హిమవంతుని కుమార్తె అయిన ఉమ, కైలాసం నుండి తన పుట్టింటికి ఏడాదికి ఒకమారు వచ్చేటప్పుడు, తల్లి కుమార్తెను ఆహ్వానిస్తూ పాడే వాత్సల్యభావపు పాటలు.
ఆజ్ఞ: సుషుమ్నాలోని ఆరవ కేంద్రం.
ఆవరణం, విక్షేపం: ఇవి రెండు మాయ యొక్క శక్తులు. ఆవరణం సత్యాన్ని మరుగుపరుస్తుంది, విక్షేపం అసత్యాన్ని సత్యంగా చూపుతుంది.
ఉపాధి: వేదాంత వాక్యం; అర్థం బంధం. ఆత్మను లౌకిక జీవితంలో పెనుగొన చేసే సంకెల.
కపిలుడు: గొప్పఋషి, సాంఖ్యతత్త్వశాస్త్ర కర్త.
కబీర్: పదిహేనవ శతాబ్ద అంతంలో, పదహారవ శతాబ్దం తొలి భాగాన నివసించిన మత సంస్కర్త, మార్మికుడు, గీత రచయిత. సాలె కులంలో జన్మించిన ఇతడు ఒక మతసంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. విశాల, విశ్వజనీన భావాలతో కూడుకొన్న ఇతడి ఉపదేశాల కారణంగా హిందువులు, మహమ్మదీయులు ఇతణ్ణి ఒకే తీరులో గౌరవించారు.
కమలకాంతుడు: వంగదేశపు మార్మిక కవి.
కుండలినీ: ప్రతి వ్యక్తిలోను నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తి. తంత్రశాస్త్రం ప్రకారం ప్రతి దేహంలో మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే ఆరు కేంద్రాలు ఉంటాయి. ఇవి క్రియాశీల కేంద్రాలు; ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి జీవశక్తిని సంతరించుకొని సముచితమైన ఆధ్యాత్మిక దర్శనంతో యోగదృష్టితో అభివ్యక్తిని పొందుతుంది. సుషుమ్నా నాడిలో నెలకొని ఉన్న ఈ కేంద్రాలు వెన్నెముక అడుగు నుండి సహస్రారం దాకా కుండలినీ యొక్క ఆరోహణ క్రమంలోని మెట్లు. ఈ కేంద్రాల గుండా సుషుమ్నా పొడవునా కుండలినీ నిరాఘాటంగా ఎగువకూ దిగువకూ సంచరించినప్పుడు షట్చక్రభేదనం జరిగిందని చెబుతారు. జననేంద్రియానికి, అపానానికి నడుమన ఉన్న మూలాధార చక్రం కుండలినీ స్థానంగా పరిగణిస్తారు. ఈ కేంద్రాలను ఆధిభౌతికంగా పద్మాల క్రింద అభివర్ణిస్తారు. మూలాధారాన్ని చతుర్దళ పద్మంగా పేర్కొంటారు. జననేంద్రియ మూలంలో ఉన్న స్వాధిష్ఠానం షష్ఠదళ పద్మం. నాభి ప్రదేశంలోని మణిపూర చక్రం దశదళ పద్మం. హృదయ స్థానంలో అనాహత చక్రం ద్వాదశ (12) దళ పద్మం. కంఠం దిగువ స్థానంలోని విశుద్ధ చక్రం పదహారు రేకుల పద్మం. భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రం ద్విదళ పద్మం. సహస్రార స్థానం సహస్రదళ పద్మం. ఇది శివుని నివాసం. ఇది పూర్ణచంద్రుని ధవళ వర్ణంలోను, మెరుపు ప్రకాశంలోను ఉంటుంది. ప్రసన్నతలో చంద్రకాంతికి దీటుగా ఉంటుంది. ఇదే అత్యున్నత గమ్యస్థానం. జాగృతమైన ఆధ్యాత్మిక శక్తి ఈ స్థానంలోనే దేదీప్యమానంగా అభివ్యక్తీకృతమవుతుంది.
కుంభకం: ఊపిరి నిలిపి ఉంచటం, ప్రాణాయామ ప్రక్రియ. రాజయోగ, హఠయోగాలలో అభివర్ణించబడింది.
కుమారిపూజ: తంత్రశాస్త్రం నిర్దేశించిన సాధన. ఇందులో జగజ్జనని అభివ్యక్తీకరణగా ఒక కన్య (బాలిక) పూజింపబడుతుంది.
కేశవభారతి: చైతన్యదేవులకు సన్న్యాసదీక్ష ఒసగిన గురువు.
కైవర్త: బెస్తకులం
గిరి: శంకరుల సంప్రదాయంలోని పది తెగలలో ఒక తెగకు చెందిన సన్న్యాసులు.
గోసాయి: వైష్ణవ సాధువు
ఘోష్పారా: ఇదొక వైష్ణవ సంప్రదాయ శాఖ. ఈ సంప్రదాయస్థులు సామాన్యంగా ప్రశ్నార్థకమైన సాధనానుష్ఠానాలలో పాల్గొంటారు.
చతుర్వింశతి తత్త్వాలు: పంచభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
చైతన్య లీల: శ్రీచైతన్యుల జీవిత చరిత్రను అభివర్ణించే గిరీశ్చంద్ర ఘోష్ రచించిన నాటకం.
చైతన్యులు: 1485 లో వంగదేశంలోని నవద్వీప్లో జన్మించిన వైష్ణవమత ప్రవక్త. ఈయనను గౌరాంగుడు, గౌర్, గోరా, నిమాయ్ పేర్లతో పేర్కొనడం కద్దు.
జంగ్ బహదూర్: నేపాల మహారాజు కొలువులోని ఉన్నతోద్యోగి.
జగాయ్, మధాయ్: ఇద్దరు దుష్టులు; పిదప శ్రీచైతన్యులచే ఉద్ధరింపబడ్డారు.
జీవన్ముక్తుడు: భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి అన్న యథార్థ జ్ఞానం గలవాడు. దేహంలో వసిస్తున్నప్పుడే మాయ నుండి విముక్తుడైనవాడు.
నవద్వీప్: శ్రీచైతన్యుల జన్మస్థలం.
నవవిధాన్: ‘బ్రహ్మ సమాజం’ నుండి వైదొలగి కేశవచంద్ర సేన్ స్థాపించిన బ్రహ్మసమాజం పేరు.
నిత్యానందుడు: శ్రీచైతన్యుల సహచరుడు, ప్రియశిష్యుడు.
నిర్వికల్ప సమాధి: సాధకుడు పరబ్రహ్మంలో తాదాత్మ్య అనుభూతి చెందిన అత్యున్నత సమాధి స్థితి.
పంచతప: తపస్సాధనలో సాధకుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో అగ్నిని రగిలించి, వాటి మధ్య తాను కూర్చుంటాడు. అతడి నడినెత్తిన చండప్రచండంగా గ్రీష్మ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు.
పంచదశి: వేదాంత గ్రంథం, విద్యారణ్య మహర్షి విరచితం.
పంచప్రాణాలు: ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం.
పంచవటి: మర్రి, రావి, వేప, ఉసిరి, బిల్వ వృక్షాలు ఉన్న చోటు; ఆధ్యాత్మిక సాధనలకు ఉత్కృష్ట స్థలంగా పరిగణింపబడుతున్నది.
ఫల్గు: ఉత్తర భారతదేశంలో ఇసుక ఉపరితలం క్రింద ప్రవహించే నది.
భావముఖం: అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి స్థితి. ఈ స్థితిలో సాధకుడు తనమనస్సును నిత్యం, లీలల సరిహద్దు రేఖ వద్ద నిలిపి ఉంచుతాడు. ఈ స్థితి నుంచే సాధకుడు వర్ణనాతీతమైన నిర్గుణ బ్రహాన్ని ధ్యానిస్తాడు; భగవత్ వ్యక్తీకరణగా గోచరమయ్యే లీలా ప్రపంచ కార్యకలాపాలలోను పాల్గొనగల్గుతాడు.
భైరవి: తాంత్రిక సంప్రదాయానికి చెందిన సన్న్యాసిని.
భైరవుడు: తాంత్రిక సంప్రదాయానికి చెందిన సాధకుడు. ఈ పేరు శివుణ్ణి కూడా సూచిస్తుంది; ఆయన భయానక రూపాలలో ఒకటి.
మనుసంహిత: మనువు రచించిన హైందవ ధర్మశాస్త్ర గ్రంథం.
మహానిర్వాణ తంత్రం: సప్రామాణిక తంత్రశాస్త్ర గ్రంథం.
రూప, సనాతనులు: శ్రీ చైతన్యుల అంతేవాసులు.
వైధీభక్తి: శాస్త్రానుసారం విధివిహితంగా భగవంతుని పూజిస్తూ నెరపే భక్తి.
శచి: శ్రీ చైతన్యమహాప్రభు తల్లి.
శవసాధన: ఒక తాంత్రిక సాధన; ఇందులో సాధకుడు ఒక శవాన్ని తన ఆసనంగా చేసుకొంటాడు.
శ్రీదాముడు: శ్రీకృష్ణుని భక్తుడు, సహచరుడు.
శ్రీవాసుడు: శ్రీచైతన్యమహాప్రభు సహచరుడు.
షడ్దర్శనాలు: న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస.
షోడశోపచారాలు: ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, అభిషేకం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ప్రదక్షిణం, నమస్కారం.
సుదాముడు: శ్రీకృష్ణుని భక్తుడు, సహచరుడు.
స్వస్త్వయనం: రోగ నివారణకు, మంగళం ఒనగూరడానికి నిర్వర్తించే ఒక కర్మకాండ.
హరిదాసు: శ్రీచైతన్యుల అంతేవాసి.
హవిష్యాన్నం: అతి పవిత్రంగా పరిగణింపబడే అన్నం, పప్పు, నెయ్యితో కూడిన ఆహారం.