ఇప్పటి వరకు మనం రెండు సంపుటాలలో చదివిన శ్రీరామకృష్ణ కథామృతం మన హృదయాల్లో వర్ణనాతీతమైన భావాలను ఉత్పన్నం చేసి ఉంటుంది. ఈ అద్భుతమైన సంభాషణలు చదివే భాగ్యాన్ని మనకు అందించిన కృపాళువైన ఆ వ్యక్తిని గురించి ఈ సమయంలో తెలుసుకోవటం సముచితం కదా!
“ప్రపంచాన్ని మరచిపోవాలా? వెళ్లి ‘మ’ ను చూడండి. మనస్సులో నుంచి లౌకిక వాంఛలను తొలగించి దాన్లో భగవచ్చింతన నింపడం ఎలాగో ఆయనకు తెలుసు.”– ‘మ’ ను గురించి భక్తులు వెలిబుచ్చిన అభిప్రాయం.
బాల్యం
‘మ’ అనే పేరులో తమను గుప్తపరుచుకొన్న మహేంద్రనాథ్ గుప్త శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో ఒకరు. కలకత్తాలో మథుసూదన గుప్త స్వర్ణమయి దంపతులకు కుమారుడుగా 1854, జూలై 14 వ తేదీన ఇతడు జన్మించాడు. తండ్రి కలకత్తా ఉన్నతన్యాయస్థానంలో ఒక ఉన్నతోద్యోగి.
ఊహ తెలియని వయస్సులోనే ‘మ’ శ్రీరామకృష్ణులచే ఆకట్టుకోబడ్డాడు. తన నాలుగో ఏట ఒకసారి తన తల్లితో ‘మహేష్’ అనే ప్రదేశంలో జరుగుతున్న రథయాత్ర ఉత్సవం దర్శించబోయాడు. తిరిగి వస్తున్నప్పుడు దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్లారు. ఆ సంఘటన గురించి కాలాంతరంలో ‘మ’ ఇలా చెప్పాడు: “ఆలయం ప్రదక్షిణం చేస్తూన్నప్పుడు నేను మా తల్లిగారి నుండి విడిపోయాను. ఏడుస్తూ దేవాలయం ముంగిట వస్తూవున్నప్పుడు ఒక అందమైన బ్రాహ్మణుడు అక్కడకు వచ్చి నా తలను చేత్తో తడవి నన్ను అనునయించారు. పిదప నన్ను దగ్గరకు లాక్కొంటూ, ‘ఇతడు ఎవరి పిల్లవాడు? ఇతడి తల్లి ఎక్కడ?’ అంటూ బిగ్గరగా అడిగారు. ఆయన కచ్చితంగా శ్రీరామకృష్ణులే అయివుండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన కాళికాలయ పూజారిగా ఉండేవారు.”
చిన్నతనం నుండే ‘మ’ ప్రకృతి పట్ల, భగవంతుని పట్ల అనురక్తుడై ఉండేవాడు. ఐదేళ్ల వయస్సులోనే ఇంటి మేడ మీద నిలబడి విస్తృత ఆకాశాన్ని చూసి ఆనందపడిపోవడమూ, జోరుగా కురుస్తున్న వానలో తడిసిపోతూ ఆనందించడమూ ఆతడికి ఎంతో ప్రీతి కలిగించేవి. దారిలో ఉన్న ఆలయాలలో మ్రొక్కి మరీ పాఠశాలకు వెళ్ళేవాడు.
ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్నప్పుడే ‘మ’ కు దినచర్య వ్రాసే అలవాటు ఉండేది. “ఉదయం లేచి తల్లితండ్రులకు ప్రణామం చేశాను”, “పాఠశాలకు వెళుతున్నప్పుడు అలవాటు ప్రకారం దారిలో కాళీమాతను, శీతలాదేవిని ప్రార్థించాను” – ఇలా ఆ దినచర్య పుస్తకంలో వ్రాసుకొనేవాడు. ఈ అలవాటు శ్రీరామకృష్ణ కథామృతం అనే కావ్యాన్ని రూపొందించడానికి అతడికి పునాదిగా అమరింది.
విద్యాభ్యాసం
‘మ’ సూక్ష్మగ్రాహి. 1875 ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. పిదప ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. కలకత్తాలోని పలు పాఠశాలలో అతడు ప్రధానోపాధ్యాయుడుగా పనిచేశాడు. ఉత్తమ ఉపాధ్యాయుడైన ఆతడు ప్రాచ్య పాశ్చాత్య తత్త్వశాస్త్రం, చరిత్ర, సాహిత్యం, ఖగోళశాస్త్రం, విజ్ఞానం మొదలైన అంశాలలో మేధావియై ఒప్పారాడు. వీటితోబాటు సంస్కృత వ్యాకరణ సాహిత్యాలు, దర్శనాలు, పురాణాలు స్మృతులు, బౌద్ధమత గ్రంథాలు, జ్యోతిష్యం, ఆయుర్వేదం తదితర విషయాలలోనూ ఆరితేరాడు.
ఆధ్యాత్మిక అనురక్తి
చదువుపట్ల అతడు ఎంతో ఆసక్తి కనబరచినప్పటికీ ఆతడి హృదయం సహజంగానే ఆధ్యాత్మికతను కోరింది. బ్రహ్మసమాజ అగ్రనాయకులలో ఒకరైన కేశవచంద్రసేన్ ఆ రోజుల్లో ఇటువంటి యువకులకు ఆదర్శ పురుషుడుగా వెలుగొందాడు. ‘మ’ కూడా ఆతడి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఉన్నత ఆదర్శాలను జీవితంలో లక్ష్యంగా చేపట్టిన ఈ యువ హృదయంలో నాడు కేశవసేన్ నాటిన బీజమే కాలాంతరంలో శ్రీరామకృష్ణులనే కల్పతరువు చల్లని నీడలో ఆధ్యాత్మికతగా చిగురించి, ఎదగ కారణమైంది.
వివాహం
కళాశాలలో చదువుతున్నప్పుడే ‘మ’ కు వివాహం అయింది. కేశవ్సేన్ దూరపు బంధువుల కుమార్తెయైన నికుంజాదేవిని ‘మ’ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు మగపిల్లలకు, ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయ్యాడు. కుటుంబభారం ఉద్యోగం చేయవలసిన నిర్బంధంలో ఉంచినప్పటికీ తాను చేపట్టిన ఉన్నత ఆదర్శాలు, కట్టుబాట్ల నుంచి వీసం కూడా చలించకుండా ‘మ’ జీవించాడు.
శ్రీరామకృష్ణులతో సమావేశం
సుఖదుఃఖాలు మారిమారి రావడమే జీవితం. రెంటినీ ఒక ఉపదేశంగా, అభ్యాసంగా తీసుకొన్నావాడు జీవితంలో పురోగమిస్తాడు. సామాన్యంగా సుఖాలకంటే దుఃఖ అనుభవాలే ఒకరిని భగవన్మార్గంలో పయనించేలా చేస్తాయి. ‘మ’ జీవితంలోనూ తటస్థించిన అనేక పరాజయాలు, చేదు సంఘటనలు అతణ్ణి శ్రీరామకృష్ణులతో సంయోగ పరిచింది.
చిన్నతనంలోనే ‘మ’ తల్లిని కోల్పోయాడు. తల్లి మరణానంతరం, ఇంటి గొడవల కారణంగా ఉమ్మడి కుటుంబం ఛిద్రమైంది. ‘మ’ శాంతికాముకుడు. కుటుంబ సమస్యలు, కుటుంబంలోని వారి స్వార్థం అతడి ఆ శాంతికి విఘ్నాలైనవి. కాబట్టి అతడు తన భార్యతో ఉన్నపళంగా ఒకనాటి రాత్రి ఇంటినుండి బయటకు వచ్చేశాడు. సోదరి ఇంటికి వెళ్లడమే అతడి ఉద్దేశం. కాని దారిలో బండిచక్రం ఒకటి విరిగిపోవడంతో అతడు ప్రయాణం కొనసాగించలేకపోయాడు. అందుచేత సమీపంలో ఉన్న మిత్రుని ఇంట ఆశ్రయం పొందగోరాడు. కాని ఆ మిత్రుడు అతడి రాకకు విముఖత కనబరిచాడు. అందువల్ల ఆ రాత్రే అక్కడ నుండి బయలుదేరి ఎలాగో ఒక బండిని కుదుర్చుకొని సోదరి ఇంటికి వెళ్లగలిగాడు. తన అప్పటి మనోస్థితిలో ఆత్మహత్యకు పాల్పడాలని కూడా ఎంచినట్లు కాలాంతరంలో ‘మ’ చెప్పడం కద్దు.
మర్నాడు మధ్యాహ్నం తన మేనల్లుడైన సిద్ధుతో వెళ్లి శ్రీరామకృష్ణులను ‘మ’ దర్శించాడు. “ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడబోయిన నేను నా స్వస్వరూపాన్ని కనుగొన్నాను. కుటుంబ సమస్యలు నన్ను భగవంతుని వద్దకు కొనిపోయాయి. శ్రీరామకృష్ణులను దర్శించాక నేను నా గత జీవితాన్ని అడుగంటా మరచిపోయాను. ఆయన వశీకరణ, ఆధ్యాత్మిక శక్తులు నా విషాద స్మృతులను పూర్తిగా తుడిచి పెట్టివేశాయి” అని తదనంతరకాలంలో ‘మ’ తెలిపాడు. ‘మ’ శ్రీరామకృష్ణులను సందర్శించిన రోజు 1882, ఫిబ్రవరి 26.
ఆశ్చర్యకరమైన ఒక నిజం ఏమిటంటే, ‘మ’ తో శ్రీరామకృష్ణుల గురించి చెప్పి ఆతణ్ణి ఆయన వద్దకు తోడ్కొనిపోయిన సిద్ధు ఆ తరువాత శ్రీరామకృష్ణులను మరి ఎన్నడూ సందర్శించలేదు.
శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్ద
భగవాన్ శ్రీరామకృష్ణులు తమ శిష్యులను ఎంపిక చేసే విధానం అద్భుతం. ఆంతరంగికులైన శిష్యులను ఆయన అంతకు మునుపే దివ్యదర్శనాలలో చూసేవారు. వాళ్లు వచ్చిన పిదప ఆ విషయం వాళ్లకు తెలిపేవారు. ఆ విధంగానే ‘మ’ తోను, “నువ్వు నాడు చైతన్య భాగవతం పఠించినప్పుడు నిన్ను నేను అవగతం చేసుకొన్నాను. నువ్వు నా వాడివి. తండ్రి కొడుకుల అనుబంధం మనది…. అవును, నీ లక్ష్యం ఏమిటి? నువ్వు ఎవరు? నీ పూర్వాపరాలు ఏమిటి? నీ గతజన్మలు ఏవి? నీ భవిష్యత్తు ఏమిటో నాకు తెలుసు. నీ కళ్లు, కనుబొమలు, ముఖం వంటి వాటి లక్షణాలనుబట్టే నువ్వు ఒక యోగివని తెలుసుకొన్నాను. ధ్యానం నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన యోగిలా ఉన్నావు నువ్వు” అని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు.
భగవాన్ శ్రీరామకృష్ణులతో ‘మ’ కు ఈ విధంగా కలిగిన దివ్య అనుబంధం రోజులు గడిచేకొద్దీ సర్వతోముఖంగా పెంపొందసాగింది. సంసారంలో భార్యాపిల్లలతో జీవిస్తున్నప్పటికీ హృదయంలో సాధు సన్న్యాసులనే నిజమైన బంధువులుగా పరిగణించి, వారి సాంగత్యంలో మెలగసాగాడు ‘మ’. శ్రీరామకృష్ణుల అమృత వచనాలను వినడంలోను, ఆయనతో కలిసి అనేక చోట్లకు వెళ్లడంలోను, పాటలు విని ఆనందించడంలోను కాలం వెళ్లబుచ్చసాగాడు. ధ్యాన పద్ధతులు, తక్కిన సాధనలు – వీటితోపాటు మతం, ఆధ్యాత్మిక సంబంధమైన సంశయాలకు వివరణలంటూ శ్రీరామకృష్ణుల నుండి ‘మ’ తెలుసుకొన్నవి కోకొల్లలు. శ్రీరామకృష్ణులు గరపిన ధ్యానం, జపం వంటివాటిని కూడ అభ్యసించాడు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వచ్చి పలు దినాలు అక్కడే బసచేసి జపతపాదులలో అతడు మునిగిపోయి ఉండడం ‘కథామృతం’ నుంచి తెలియవస్తోంది.
శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూర్ను, శ్రీరామకృష్ణులతో సంబంధం కలిగివున్న ప్రదేశాలను దర్శించగోరాడు ‘మ’. శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది కామార్పుకూర్కు వెళ్ళినప్పుడు, ఆ పుణ్యభూమి దివ్యప్రకాశంతో దేదీప్య మానంగా వెలిగిపోతూ ఉండడం చూశాడు. చెట్టుచేమలు, జంతుజాలం, పక్షులు అన్నీ దివ్యప్రకాశంలో ఆవృతమైనట్లు గాంచాడు. అన్నిటికీ మ్రొక్కాడు. ఒక పిల్లి దివ్య ప్రకాశంతో వెలిగిపోతూ ఉండటం చూసి దానికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఈ సంగతులు విన్న శ్రీరామకృష్ణులు, ‘మ’ ప్రేమ విభీషణుని ప్రేమ వంటిదని చెప్పారు. శ్రీరామకృష్ణుల అనుజ్ఞ మేరకు పూరీ వెళ్లి జగన్నాథుని ‘మ’ దర్శించాడు. ఒక క్షణం తనను మరచిపోయి జగన్నాథుని రూపాన్ని రెండు చేతులతోను కౌగిలించుకొని ఆనందించాడు.
విద్యాసాగర్ పాఠశాలలో ‘మ’ పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాఠశాల పరీక్షా ఫలితాలు అనుకున్నంత బాగా రాలేదు. శ్రీరామకృష్ణుల పట్ల ‘మ’ కలిగి ఉన్న మితి మీరిన బాంధవ్యమే ఇందుకు కారణం అని విద్యాసాగర్ ‘మ’ పైన నిందారోపణ చేశాడు. నిజాయితీపరుడైన ‘మ’ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఈ కారణంగా కుటుంబం ఆర్థిక ఇక్కట్లలో పడిపోయింది. రేపటి స్థితి ఏమవుతుందో అని ‘మ’ కలత చెంది యోచిస్తూన్నప్పుడు శ్రీరామకృష్ణుల భక్తుడైన సురేంద్రుని నుండి ఒక ఉత్తరం వచ్చింది. దాన్లో రిప్పన్ కళాశాలలో ఆచార్య పదవిని స్వీకరించమని ‘మ’ ను అతడు కోరివున్నాడు. భగవంతుని ఈ కృపాకటాక్షం చూసి ద్రవించిపోయిన ‘మ’ ఆ ఉద్యోగాన్ని స్వీకరించాడు. నాటి నుంచి ‘మ’ జీవితంలో దారిద్ర్యం తొలగిపోయి సౌభాగ్యం అంకురించింది. కాలాంతరంలో మోడర్న్ పాఠశాలను కోనుగోలు చేసి దాన్ని సమర్థవంతంగా నిర్వహించి, కలకత్తాలోనే అత్యుత్తమ పాఠశాలగా దాన్ని తీర్చిదిద్దాడు.
శ్రీరామకృష్ణులతోటి ‘మ’ అనుబంధం ప్రగాఢతరమైనప్పుడు ‘మ’ లో పరిత్యాగ భావనలు చిగురించాయి. సర్వసంగ పరిత్యాగం చేసి సన్న్యాసి కావాలనుకొన్నాడు. కాని శ్రీరామకృష్ణులు అతడికంటూ మరో మార్గం వేసివుంచారు. కాబట్టి అతడితో, “నువ్వు పరిపూర్ణంగా భగవంతుని మీదే ఆధారపడి జీవిస్తున్నావు. కనుక సర్వం ఎందుకు త్యజించాలి?” అని అడిగారు. మరొకనాడు, “భాగవత పండితుణ్ణి సర్వసంగ పరిత్యాగం చేయ భగవంతుడు అనుమతించడు. వాళ్లు పరిత్యజిస్తే భాగవతాన్ని లోకానికి చాటిచెప్పేవారు ఎవరు? సజ్జనుల మేలుకోసం భగవంతుడు భాగవత పండితులను సంసారంలో బంధించి ఉంచుతాడు. నిన్ను కూడా జగజ్జనని అందుకోసమే సంసారంలో నిలిపి ఉంచింది” అని అన్నారు.
శ్రీరామకృష్ణుల ఈ జవాబు ‘మ’ కు జీవనమార్గాన్ని చూపడమే గాక, అతడు ఒనరింపనున్న మహత్కార్యాన్ని సూచనప్రాయంగా తెలిపింది.
కార్యారంభం
చిరుతప్రాయంలోనే ‘మ’ కు దినచర్య వ్రాసే అలవాటు ఉందని ఇంతకు మునుపే తెలుసుకొన్నాం. శ్రీరామకృష్ణులను అతడు సందర్శించిన ప్రతి దినాన్ని, జరిగిన సంఘటనలను, శ్రీరామకృష్ణుల వచనాలను దినచర్యలో ‘మ’ వ్రాస్తూ వచ్చాడు. తీరిక సమయాలలో చదువుకోడానికీ, తాను బాగా అవగాహన చేసుకోడానికీ అతడు వాటిని వ్రాసుకొన్నాడు. కాని ఇదే కాలాంతరంలో లోకానికే ఆధ్యాత్మిక మహా పెన్నిధియైన శ్రీరామకృష్ణ కథామృతంగా వెలుగొందినది.
‘మ’ సదా సర్వవేళలా తనను నేపథ్యంలోనే ఉంచుకొన్నాడు. శ్రీరామకృష్ణ కథామృతంలో గుప్తంగా ఉంచుకోగోరి తనను ‘మ’, మణి, మోహినీమోహన్, మాస్టర్, ఒక భక్తుడు, ఇంగ్లీషు మ్యాన్, సేవకుడు ఇత్యాది పేర్లతో వ్యవహరించుకొన్నాడు. దీనినే స్వామి వివేకానంద ‘మ’ కు వ్రాసిన ఉత్తరంలో “సోక్రటీస్ సంభాషణ లన్నిటిలోను స్ఫురించే వ్యక్తి ప్లేటోయే. మీరో, మిమ్మల్ని బాగా గుప్తపరచుకొన్నారు” అని వ్రాసి ఉన్నారు.
ఇంతటి విశిష్ఠ గ్రంథాన్ని రూపొందించడంలో అతడి సహజ ప్రతిభలైన జ్ఞాపకశక్తి, రచనా పాటవం మొదలైనవి సహాయం చేసినవనటం నిజమైనప్పటికీ దాని నేపథ్యంలో ఆధ్యాత్మికోన్నతి ఉందన్న విషయం విస్మరించలేని సత్యం.
శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం
శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం ఆయన సన్న్యాస శిష్యులు వరాహనగర్లోని పాడుబడ్డ. భవనం ఒకదాన్లో ఆధ్యాత్మిక సాధనానుష్ఠానాలలో మగ్నులై జీవిస్తూ వచ్చారు. పరిత్యాగానికీ, పావనత్వానికీ ఆలవాలంగా శ్రీరామకృష్ణులను పరిగణించాడు ‘మ’. ఆయన శిష్యులను, అదే తీరులో పరిగణించా డతడు. కనుకనే ఆ శిష్యులు జీవిస్తూ వచ్చిన వరాహనగర మఠానికి తరచూ వెళ్లేవాడు. వారికి తనకు చేతనైన సహాయం కూడా అందిస్తూ వచ్చాడు. తన శక్తి మేరకు ఆధ్యాత్మిక సాధనలూ అనుష్ఠించాడు. వారిలో ఎవరైన ఒకరు అతడి ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికీ దాన్ని వదలిపెట్టి వాళ్లతో వచ్చేసేవాడు; “పావన సన్న్యాసి ఒకరు వచ్చివున్నారు. భగవంతుడే వారి రూపంలో వస్తాడు. స్నాన భోజనాదులన్నీ ఒకింత వాయిదా వేసుకోరాదా? ఇంతమాత్రం చేయకుంటే దానికంటె పెద్ద తప్పు మరొకటి ఉండబోదు” అంటా డతడు.
భక్తులతో
1905లో ‘మ’ ప్రధానోపాధ్యాయ పదవీ విరమణ చేశాడు. ఆ తరువాత మాడర్న్ పాఠశాలను కొనుగోలు చేసి దాన్లో ఒక ప్రత్యేకమైన గదిలో జీవించసాగాడు. అక్కడే భక్తులనూ సన్యాసులనూ కలుసుకొనేవాడు.
విశాల వక్షం, వివేకం పొడసూపే విశాలమైన నుదురు, మంచి ఎత్తు, ఆజానుబాహువులు, భగవచ్చింతనను ప్రతిఫలించే నేత్రాలు, భగవంతుని పాదపద్మాల మ్రోల పడివున్న హృదయం, తెల్లని దట్టమైన పొడవుపాటి గడ్డం, మధ్యలో బట్టతల పడిన శిరస్సు, శాంతం దయ ఉట్టిపడే ముఖారవిందం – వేదకాలం నాటి ఋషివంటి గంభీరమైన ఆకృతి ‘మ’ ది. అతడు భక్తులతో మాట్లాడటం గురించి స్వామి రాఘవానంద ఇలా అంటున్నారు: “ఆకాశమే చూరుగా, చుట్టూ చెట్టుచేమలు ఆవృతమై ఉండగా సంధ్యాసమయంలో ‘మ’ మేడ మీద కూర్చుని ఉండటం ప్రాచీన మహర్షిని జ్ఞప్తికి తెస్తుంది. ఆకాశంలో దోగాడే నక్షత్ర సమూహాలు ఎల్లలులేని భగవంతుడు గుర్తుకు తెస్తున్న, కళ్లు మిరిమిట్లు గొలిపే ఆ సమయంలోనే భగవంతుడు, ఆయన ప్రేమ, పరిష్కరించలేని ఆ అనవరత సమస్యకు పరిష్కారం కనుగొన మనిషి మానసంలో తల ఎత్తే ఆసక్తి, వీటిని జీవించి చూపిన భగవాన్ శ్రీరామకృష్ణుల మహత్ జీవితం మొదలైన వాటి గురించి ఆయన చెబుతారు.”
తన భావనలను విని ఆనందించి తనను శ్లాఘించేవారితో, “నేను అతి సామాన్యమైన వ్యక్తిని. కాని ఒక్కమాట. ఒక పెద్ద అమృతసాగరం ప్రక్కన నేను జీవిస్తున్నాను. దాన్లో నుంచి కొన్ని బిందెల నీళ్లు తీసి పదిలపరచుకొన్నాను. నన్ను చూడగోరి వచ్చే భక్తులకు ఆ అమృతజలాన్ని ఇచ్చి ఉపచరించి ఆనందిస్తున్నాను. ఆయన అమృత వచనాలు పలుకడం తప్ప నేను మరేం మాట్లాడగలను!” అనేవాడు ‘మ’.
శ్రీరామకృష్ణుల భక్తులకు, శిష్యులకు ‘మ’ ఒక శరణాలయంగా వెలు గొందాడని చెప్పడం అతిశయోక్తి కాబోదు. ఆతడి స్ఫూర్తితో మఠంలో సన్యాసులుగా చేరినవారు ఎందరో. “శ్రీరామకృష్ణ మఠంలో చేరిన సన్యాసులలో ఎనభై శాతం మంది శ్రీరామకృష్ణ కథామృతం చదివిన తరువాత చేరినవారే అని వింటున్నాను” అని స్వామి విజ్ఞానానంద అన్నారు. ఆనాడే కాదు నేటికీ అది యథార్థమే.
కాశీ, బృందావనం, అయోధ్య మొదలైన తీర్థ స్థలాలను ‘మ’ సందర్శించాడు. 1912లో మాతృమూర్తి శారదామాతతో మళ్లీ కాశీయాత్ర చేశాడు. పిదప అక్కడ నుంచి హరిద్వార్, కంఖల్, హృషీకేశ్, బృందావనం మొదలైన చోట్లకు వెళ్లాడు. కాని శ్రీరామకృష్ణులతో సంబంధం ఉన్న స్థలాలే ‘మ’ కు ప్రధాన తీర్థాలై ఒప్పారాయి. దక్షిణేశ్వరం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అతడు, “అక్కడ ఆధ్యాత్మిక అగ్ని జాజ్వల్యమానంగా మండుతోంది. అక్కడకు వెళ్లిన ఎవరైనాసరే పరిశుద్ధులవుతారు. మనోమాలిన్యాలన్నీ ఆ అగ్నిలో దగ్ధమై బూడిదైపోతాయి; మనిషికి అమరత్వం సిద్ధిస్తుంది. భగవంతుడే అక్కడ మానవరూపంలో ముఫై ఏళ్లు జీవించాడు! దక్షిణేశ్వరంలో ఆధ్యాత్మిక భావనలను ప్రత్యక్షంగా పొందవచ్చు” అనేవాడు.
ఒకసారి భక్తుడొకడు ‘మ’ తో, “మీరు ధన్యులు, శ్రీరామకృష్ణులను మీరు దర్శించి ఉన్నారు. ఆయన అమృత వచనాలు విని ఉన్నారు. ఆయన్ను స్పృశించి ఉన్నారు. ఆయనకు సేవలు ఒనరించి ఉన్నారు” అన్నాడు. అందుకు ‘మ’, “అలా అనుకోవద్దు. ‘తమ ఆస్తి, శక్తి అన్నీ తమ పిల్లలకే చెందుతాయి’ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆయన ఆస్తి ఏమిటి? వివేకం, వైరాగ్యం, జ్ఞానం, భక్తి, ప్రేమ – ఇవే ఆయన ఆస్తి. ఆయన్ను తలచుకొన్నవారికి ఇవన్నీ కలుగుతాయి” అన్నాడు.
‘మ’ జీవితం అందరికీ ఒక పాఠంగా ఒప్పారుతోంది. జీవిత సమస్యలు అగ్ని పరీక్షలను తను భగవంతుని ఎడ ఉంచిన విశ్వాసానికి ఏర్పడే ఒక సవాలుగా ‘మ’ స్వీకరించాడు. ఈ ప్రపంచం వేడిమిని వెలిగ్రక్కే కొలిమి వంటిదని ఆయన అభిప్రాయం; కాని దాని ఆ వేడిమి తగలని చోట ఆయన ఉన్నాడు.
ఎవరైనా సమస్యలతో ‘మ’ వద్దకు వస్తే ఆయన ఇలా అనేవాడు: “కోపం, కోర్కె, సమస్యలు వీటన్నిటినీ భగవంతుడు సృష్టించింది మహానుభావులను రూపొందించడానికే. సుడిగాలి వీచినా, నేర్పరియైన పడవ నడిపేవాడు పడవ తలక్రిందులవకుండా నడుపుతాడు. ఉవ్వెత్తున లేచి పడుతున్న పెద్ద అలల మధ్య పడవను పోనివ్వడంలో అతడు ఇచ్ఛగించి, ఆనందిస్తాడు. కాని పడవలో కూర్చున్న బలహీనులు ‘కుయ్యో మొర్రో’ అంటూ గగ్గోలు పెడతారు. తుపాను పక్షి అనే పక్షి ఒకటి ఉంది. గాలివాన వీచినప్పుడు తక్కిన పక్షులు, మృగాలు తమ ఆవాసాలలో నక్కి ఉంటాయి. కాని ఈ తుపాను పక్షి అప్పుడు మాత్రమే తన గూటి నుంచి బయటకు వస్తుంది. రెక్కలు విప్పి ఆ గాలివానకు ఎదురొడ్డి ఎగురుతూ ఆనందిస్తుంది. మనమూ అదే విధంగా ఉండాలి. సదా ఉత్సాహంగా ఉండండి. మనకు కావలసింది బలం; జీవితంలోని దుఃఖాలు ఒడుదుడుకులను ఎదుర్కోవడానికి కావలసింది మనోస్థైర్యం. మనిషి దేహం ఉన్నంతవరకు సమస్యలు, దుఃఖాలు ఉండే తీరతాయి.”
చివరి రోజులు
‘మ’ (మహేంద్రనాథ్ గుప్తా)
1905 లో పాఠశాల జీవితం నుంచి, విద్యాబోధన నుంచి ‘మ’ విశ్రమించాడు. ఆ పిదప దాదాపు 27 ఏళ్లు శ్రీరామకృష్ణ అమృత వచనాలను లోకానికి అందించే ఉదాత్త కార్యంలో పూర్తిగా నిమగ్నుడయ్యాడు. చివరి రోజులలో దేహారోగ్యం బాగా చెడిపోయిన స్థితిలోను ఆయన ఆ కార్యాన్ని ఆపలేదు. ఇక వీలుకాని పరిస్థితిలో ఒకరోజు రాత్రి ఒంటి గంటకు ఆయన ముద్రణాలయం నుంచి వచ్చిన అచ్చు పుటలను కిరసిన్ దీపం వెలుగులో సరిదిద్దుకోసాగాడు. అప్పుడు స్వామి నిత్యాత్మానంద ఆయన వద్దకు వచ్చి ఇలా అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని చెప్పినప్పుడు, ‘మ’ ఇలా అన్నాడు:
“శ్రీరామకృష్ణుల అనుపమాన సందేశమైన కథామృతం చదివి జనం శాంతి పొందుతున్నారు. దేహం నశించడం తథ్యం అయినప్పుడు, ఇతరులకు శాంతి పంచియివ్వడంలో అది నశించనీ. మనం ప్రపంచంలో జీవిస్తున్నాం. దాని బాధ లేమిటో నాకు బాగా తెలుసు. అయినప్పటికీ శ్రీరామకృష్ణ కథామృతం అనే ఈ గ్రంథం మూలంగా నేను ఆ బాధల నన్నింటినీ మరచిపోతున్నాను. అటువంటి ఒక గ్రంథం వెలువడాలనే నే నింతగా తొందరపడుతున్నాను.”
1932 మార్చ్ నెల ఠాకూర్పారీలో ఉన్న తమ స్వగృహంలో ‘మ’ ప్రవేశించాడు. జూన్ 3 వ తేదీ ఫలహారిణీ కాళీపూజ పర్వదినాన తమ వద్దకు వచ్చిన భక్తులను కాళీపూజ తిలకించడానికి బేలూర్ మఠానికి పంపించాడు. మాతృమూర్తి శారదాదేవి తన గృహంలో ప్రారంభించిన శ్రీరామకృష్ణుల పూజను ‘మ’ ముగించాడు. శ్రీరామకృష్ణ కథామృతం చివరి భాగం అచ్చు ప్రతులను సరిదిద్ది ముద్రణాలయానికి పంపించాడు. పిదప, “అమ్మా! గురుదేవా! నన్ను నీ చేతుల్లోకి తీసుకో” అంటూ ‘మ’ తుదిశ్వాస విడిచాడు. నాడు 1932, జూన్ 4 వ తారీఖు. అప్పుడు ఆయన వయస్సు 78 ఏళ్లు.
తన జీవితాన్ని శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్ద సమర్పించడం ద్వారా ‘మ’ అమరుడయ్యాడు. శ్రీరామకృష్ణ కథామృతం ద్వారాను అమరత్వం సిద్ధించు కొన్నాడు.
స్వామి వివేకానంద
స్వామి బ్రహ్మానంద
స్వామి యోగానంద
స్వామి నిరంజనానంద
స్వామి ప్రేమానంద
స్వామి శివానంద
స్వామి అద్భుతానంద
స్వామి తురీయానంద
స్వామి రామకృష్ణానంద
స్వామి శారదానంద
స్వామి అద్వైతానంద
స్వామి అఖండానంద
స్వామి త్రిగుణాతీతానంద
స్వామి సుబోధానంద
స్వామి విజ్ఞానానంద
స్వామి అభేదానంద
నాగ్ మహాశయ్ (దుర్గాచరణ్ నాగ్)
యోగిన్ మా
అక్షయ్ కుమార్ సేన్
గౌరీ మా