ప్రియమైన సోదరుడు ‘మ’ కు,
నువ్వు పంపిన శ్రీరామకృష్ణ కథామృత చతుర్థ భాగం మూడు రోజుల క్రితం అందుకున్నాను. నేటికి దాన్ని చదవడం పూర్తిచేశాను. నిజంగా నువ్వు ధన్యుడవు. దేశం యావత్తు మీద అమృతం చిలకరించావు….చాలాకాలం క్రితం శ్రీరామకృష్ణులతో నేను జరిపిన సంభాషణలను తెలుసుకో గోరావు. నీ కోసం ఇప్పుడు ఆ సంభాషణలను వ్రాయ ప్రయత్నిస్తాను. శ్రీరామకృష్ణులను సందర్శించిన తారీఖులు, వారాలు, సమయం, ఆయన ముఖతా జాలువారిన వచనాలను కచ్చితంగా వ్రాసి ఉంచుకోవటానికి నేను నీలా నోచుకొని పుట్టలేదు. ఈ లేఖలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నా అనుభవాలను జోడిస్తున్నాను. నేను అనేక విషయాలు మరచిపోయాను. కనుక ఒక రోజు జరిగిన సంఘటనలు మరో రోజు జరిగిన వాటితో కలగాపులగం చేసే అవకాశం ఉంది.
బహుశా 1881 దుర్గాపూజ సెలవులలో నేను శ్రీరామకృష్ణులను మొట్టమొదటసారి దర్శించాను. దక్షిణేశ్వరానికి ఒక పడవలో వచ్చాను; స్నానఘట్టం మెట్లు ఎక్కుతూ ఒక వ్యక్తిని “పరమహంసగారు ఎక్కడున్నారు?” అని అడిగాను.
“అక్కడ ఉన్నారు” అని జవాబు వచ్చింది. తోటకు అభిముఖంగా ఉన్న ఉత్తరం వైపు ఉన్న వసారాలోని ఒక వ్యక్తిని చూపించాడతడు. ఒక దిండునానుకొని ఆయన కూర్చుని ఉన్నారు. నల్లంచు ధోవతి ధరించి ఉన్నారు. దిండు, నల్లంచు ధోవతి కళ్ళబడగానే, “ఈయన ఎలాటి పరమహంసై ఉంటారు?”* అని అనుకున్నాను.
దగ్గరకి వెళ్ళి చూద్దును కదా, దిండుకు సగం ఆనుకొని చాచి ఉన్న మోకాళ్ళ చుట్టూ చేతులు కొక్కెంలా వేసుకొని ఆయన కూర్చొని ఉన్నారు. అప్పుడు ఇలా అనుకున్నాను: ‘పెద్ద మనుషులు దిండ్లకు ఆనుకుని కూర్చున్నట్లు ఈయనకు కూర్చునే వాడుక లేదు. కాబట్టి ఈయనే పరమహంస!’ ఆయనకు కుడివైపు, దిండు ప్రక్కన ఒక పెద్దమనిషి కూర్చుని ఉన్నాడు. అతడి పేరు రాజేంద్రలాల్ మిత్ర అనీ, వంగ ప్రభుత్వ సహాయ కార్యదర్శి అనీ తెలుసుకొన్నాను. కాస్త దూరంలో ఇతరులు కూర్చుని ఉన్నారు.
కొన్ని క్షణాలు గడిచాక శ్రీరామకృష్ణులు, రాజేంద్రబాబుతో, “కేశవ్ వస్తున్నాడేమో చూడు” అన్నారు. నాడు కేశవ్సేన్ వస్తున్నాడని స్పష్టమైంది.
ఎవరో కాస్త దూరం వెళ్ళి, తిరిగి వచ్చి, “లేదు. ఆయన రావడం లేదు” అన్నారు.
కాసేపయ్యాక, బయట ఏదో శబ్దం వినబడితే, “మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి” అన్నారాయన.
మళ్ళీ ఎవరో వెళ్ళి చూసివచ్చి అదే సమాధానం చెప్పారు.
అప్పుడు శ్రీరామకృష్ణులు నవ్వి ఇలా అన్నారు: “బయట ఆకులు చేసిన మర్మర ధ్వని విని రాధ, ‘హో, నా ప్రాణనాథుడు వచ్చాడు’ అనుకొనేది. చూడండి, కేశవ్ ఎప్పుడూ అలా ఆశలతో వేధిస్తూ ఉంటాడు. ఇదీ అతడి పద్ధతి.”
మునిమాపు వేళ, కేశవ్ తన బృందంతో వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన కూడా అదే రీతిలో అతడికి ప్రణామం చేశారు.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు అర్ధబాహ్యస్పృహలో ఇలా అన్నారు: “చూడండి! యావత్తు కలకత్తా జనాన్ని తోడ్కొని వచ్చాడు. నేను ఒక లెక్చర్ ఇవ్వాలని అనుకొంటున్నాడేమో! అటువంటిది ఏమీ చేయలేను. నీకు ఇష్టం ఉంటే నువ్వే లెక్చరివ్వు. లెక్చరివ్వడం నావల్ల కాని పని.”
ఇంకా భావపారవశ్యంలో ఉండే, నవ్వుతూ ఇలా అన్నారు: “నేను తింటాను, త్రాగుతాను, సంతోషంగా ఉంటాను; ఆడతాను, నిద్రిస్తాను. కాని లెక్చర్లు మాత్రం ఇవ్వలేను.”
ఆయన్ను చూస్తూ కేశవ్సేన్ భావపారవశ్యంలో మధ్య మధ్య ‘ఆహా! ఆహా!’ అంటున్నాడు.
నేనూ శ్రీరామకృష్ణులను చూస్తూ ఉన్నాను. ‘ఇది నటనా?’ అనుకొన్నాను. ఇలాంటిది నే నెన్నడూ చూసి ఉండలేదు. నా విశ్వాసం ఎంత ప్రగాఢమో నీకు సువిదితమే!
సమాధి స్థితినుంచి బాహ్యచైతన్యంలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు, కేశవ్‌తో ఇలా అన్నారు: “కేశవ్! ఒక రోజు నేను మీ సమాజానికి వెళ్ళాను. నీ ప్రసంగం నడుమ, ‘మన మందరం భక్తి వాహినిలో మునిగిపోయి తిన్నగా సచ్చిదానంద సాగరంలోకి వెళ్ళిపోదాం’ అనటం విన్నాను. వెంటనే తల ఎత్తి గేలరీ వంక (గేలరీలో కేశవ్ భార్య, ఇతర స్త్రీలు కూర్చుని ఉన్నారు.) చూసి ఇక ‘ఈ స్త్రీల గతి ఏమిటి?’ అనుకున్నాను. చూడు కేశవ్, మీరు గృహస్థులు. ఒకే మారుగా సచ్చిదానంద సాగరాన్ని ఎలా చేరుకోగలరు? తోకకు ఇటుక కట్టిన ముంగిస వంటివారు మీరు. దేన్ని చూసో భయపడినప్పుడు, అది గోడను ఎగబ్రాకి తన గూట్లో కూర్చుంటుంది. అది అలా ఎంతసేపు అక్కడ కూర్చోగలదు? ఇటుకరాయి దాన్ని క్రిందకు లాగివేస్తుంది, దప్పున నేల మీద పడుతుంది. మీరు కొంత ధ్యాన ధారణలు చేస్తారు. కాని భార్యా బిడ్దల భారం మిమ్మల్ని క్రిందికి లాగివేస్తుంది. మీరు భక్తి వాహినిలో మునిగిపోవచ్చు. కాని మీరు మళ్ళీ తీరానికి రావాలి. మార్చి మార్చి మునుగుతూ, తేలుతూ ఉండండి. మునిగి ఒకేమారు ఎలా అంతర్ధానం కాగలరు?”
అందుకు కేశవ్ “అలా అయితే గృహస్థులకు గతి లేదా? మహర్షి దేవేంద్ర నాథ్ టాగూర్ సంగతి ఏమిటి?” అని అడిగాడు.
“దేవేంద్రనాథ్ టాగూర్, దేవేంద్ర, దేవేంద్ర” అంటూ శ్రీరామకృష్ణులు ఆయనకు నమస్కరించాడు.
పిదప ఇలా అన్నారు: “మీకొక కథ చెబుతాను, వినండి. ఒక వ్యక్తి తన ఇంట్లో దుర్గాపూజ మహోత్సవాన్ని వైభవంగా జరిపేవాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు మేకపోతుల బలి సాగుతూ ఉండేది. కాని కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ బలి కార్యక్రమ అట్టహాసం చప్పబడింది. అప్పుడు ఎవరో వచ్చి ఆ వ్యక్తిని ‘అయ్యా, మీ ఇంట్లో జరిగే బలి కార్యక్రమం చప్పబడి పోయింది ఎందుకని?’ అని అడిగాడు. అందుకు అతడు, ‘నువ్వు చూడలేదా? నా పళ్ళన్నీ ఊడిపోయాయి’ అన్నాడు. దేవేంద్రుడు ఇప్పుడు జపధ్యానాలలో కాలం గడుపుతున్నాడు. ఈ వృద్ధాప్యంలో అతడు అలా ఉండడం సహజమే. కాని నిస్సందేహంగా అతడు గొప్పవ్యక్తే.
“చూడు, మాయామోహంలో పడివున్నంత వరకు మనిషి లేత కొబ్బరి కాయ వంటివాడు. లేత కొబ్బరికాయనుంచి కొబ్బరిని తీయాలంటే కొబ్బరి చిప్పను కూడా కాస్త గోకితీయవలసి వస్తుంది కదా! కాని ముదిరిన లేక ఎండు కొబ్బరికాయలో కొబ్బరి, చిప్ప విడివడి ఉంటాయి. కొబ్బరికాయను ఆడిస్తే, లోపల కొబ్బరి కురిడి గలగల మంటుంది. దేహంనుంచి ఆత్మ వేరైనదని అతడు గ్రహిస్తాడు. ఆ రెంటికీ పరస్పర సంబంధం ఉండదు.
“కష్టాలన్నిటికీ కారణం ఈ ‘అహ’ మే. ఈ తుచ్ఛ అహం ఎన్నటికీ మనిషిని వదలిపోదా? కూలిపోయిన ఇంటి శిథిలాల నుంచి రావిచెట్టు పెరగడం మీరు చూసివుంటారు. నేడు దానిని నరికి వేయండి, కాని రేపు క్రొత్త మొలక పైకిరావడం చూడవచ్చు. అహం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వెల్లుల్లి పాయ నలుగగొట్టిన గిన్నెను ఎన్నిసార్లు తోమినా దాని వాసన పూర్తిగా పోదు.”
సంభాషిస్తూ శ్రీరామకృష్ణులు, కేశవ్‌తో ఇలా అన్నారు: “మంచిది కేశవ్! మీ కలకత్తా బాబులు భగవంతుడు లేడంటారని నాకు తెలుసు. అది నిజమేనా? ఒక కలకత్తా పెద్దమనిషి మేడ మెట్లు ఎక్కాలనుకున్నాడు. ఒక మెట్టు ఎక్కాడు; ఆయాసపడుతూ స్పృహతప్పి క్రిందపడిపోయాడు. అతడి బంధువులు హాహాకారాలు చేసి డాక్టరు కోసం కబురు పంపారు. కాని డాక్టర్ వచ్చే లోపుగానే అయ్యగారు కాస్తా వైకుంఠయాత్ర చేసేశారు. ఈ మాత్రం సత్తా ఉన్నవారు ‘దేవుడు లేడు’ అంటుంటారు.”
ఒక గంటకుపైగా ఇలా గడిచాక కీర్తన ప్రారంభమైంది. తరువాత నేను చూసిన దృశ్యం ఈ జీవితంలోనే కాదు, జన్మజన్మాంతరాల్లో కూడా మరిచిపోలేను. కేశవ్‌తో సహా అందరూ నాట్యం చేశారు. అందరూ శ్రీరామకృష్ణుల చుట్టూ వృత్తాకారంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూ చేస్తూ ఆయన హఠాత్తుగా నిశ్చలంగా నిలబడిపోయారు, సమాధి మగ్నులయ్యారు. ఇలా చాలాసేపు ఉండిపోయారు. ఆయన మాటలు విన్నాక, దీన్నంతా చూశాక, ‘అవును, ఈయన నిజంగా పరమహంసే!’ అనుకున్నాను.
మరో రోజు, బహుశ 1883 లో, కొందరు శ్రీరాంపూర్ యువకులతో నేను శ్రీరామకృష్ణులను దర్శించాను. వారిని చూస్తూ ఆయన, “వీరెందుకు ఇక్కడకు వచ్చారు?” అని అడిగారు.
నేను: మీ దర్శనార్థం.
శ్రీరామకృష్ణులు: నాలో ఏముంది చూడడానికి? అక్కడకు వెళ్ళి ఆ బిల్డింగులు చూడవచ్చు కదా?
నేను: మహాశయా! వాటిని చూడడానికి వారు రాలేదు, మిమ్మల్ని చూడడానికే వచ్చారు.
శ్రీరామకృష్ణులు: ఓ! అలాగైతే వీరు చెకుముకిరాళ్ళు అన్నమాట. వారిలో అగ్ని ఉంది. చెకుముకి రాళ్ళను నీళ్ళ క్రింద వేయి సంవత్సరాలు ఉంచినప్పటికీ, ఆ రాళ్ళను ఒకదానితో ఒకటి కొట్టిన మరుక్షణమే నిప్పుకణాలు బయల్వెడలతాయి. వీరు ఆ కోవకు చెందిన వారు కాబోలు. కాని నా నుంచి నిప్పుకణాలను రప్పించాలనుకోవడం వృథా ప్రయత్నమే.
ఇలా ఆయన వ్యాఖ్యానించగానే మేమందరం నవ్వుకున్నాం. నాడు మాతో ఆయన మాట్లాడిన ఇతర విషయాలు నాకు జ్ఞాపకం లేవు. కాని కామినీ కాంచనాల పరిత్యాగం గురించీ, అహాన్ని తొలగించుకోవటం అసాధ్యమనీ ఆయన మాతో చెప్పినట్లు నాకు లీలగా జ్ఞాపకం ఉంది.
మరో రోజు ఆయన్ను దర్శించాను. నేను ప్రణామం చేసి కూర్చున్న తరువాత ఆయన నాతో, “నాకు ఆ పదార్థం తెచ్చిపెడతావా – పుల్లగా, తీయగా, కార్కు తీయగానే బుసబుసమంటూ పొంగుతుందే, అది” అన్నారు.
నేను: లెమనేడ్?
శ్రీరామకృష్ణులు: నా కోసం ఒక సీసా తీసుకు రాకూడదా?
ఒక సీసా లెమనేడ్ తెచ్చి ఆయనకు ఇచ్చాననుకొంటాను. ఆ రోజు ఆయన వద్ద నేను తప్ప మరెవరూ లేరనే నాకు గుర్తు. ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగాను.
నేను: మీరు కులభేదాలు పాటిస్తారా?
శ్రీరామకృష్ణులు: అవును అని ఎలా చెప్పగలను? నేను కేశవ్ ఇంట్లో కూర తిన్నాను. ఒకసారి ఏం జరిగిందో చెబుతాను. ఒక పొడవాటి గడ్డం* ఉన్న వ్యక్తి మంచుగడ్డ తీసుకువచ్చాడు. కాని నాకు దాన్ని తిన బుద్ధిపుట్టలేదు. కొంత సేపయ్యాక మరెవరో అదే వ్యక్తినుంచి కొంత మంచు గడ్డను తెచ్చారు. ఆస్వాదిస్తూ దాన్ని తినగలిగాను. చూడు, కుల కట్టుబాట్లు వాటంతట అవే తొలగిపోతాయి. కొబ్బరి, తాటిచెట్లు ఎదిగేకొద్దీ వాటి మట్టలు వాటంతట అవే రాలిపోతాయి. అట్లే కుల నియమాలు తొలగిపోతాయి. కాని ఆ మూఢుల్లా (బ్రహ్మసమాజస్థుల్లా) బలవంతంగా తొలగించరాదు.
నేను: కేశవ్‌ను గురించి మీరు ఏమనుకుంటున్నారు?
శ్రీరామకృష్ణులు: ఓ, అతడు సాధు స్వభావం కలవాడు.
నేను: త్రైలోక్యుడో?
శ్రీరామకృష్ణులు: మంచివాడు, బాగా పాడతాడు.
నేను: శివనాథ్ బాబు?
శ్రీరామకృష్ణులు: చాలా మంచివాడు. కాని వాదిస్తూ ఉంటాడు.
నేను: హిందూవుకూ, బ్రహ్మసమాజస్థుడికీ తేడా ఏమిటి?
శ్రీరామకృష్ణులు: తేడా అంతగా లేదు. సన్నాయి వాయించే ఒక వ్యక్తి ఒకే రాగంలో వాయిస్తూ పోతాడు, మరో వ్యక్తి విభిన్న రాగాలు పలికిస్తాడు. బ్రహ్మ సమాజస్థులు ఒకే రాగాన్ని ఆలాపిస్తారు, వారు నిరాకారాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. కాని హిందువులు వివిధ రాగాలు ఆలాపిస్తారు, అంటే భగవంతుణ్ణి వివిధ రూపాల్లో ఆరాధించడంలో ఆనందిస్తారు.
“నిరాకార భగవంతుని నీటితోను, సాకార భగవంతుని మంచుగడ్డలతోను పోల్చవచ్చు. నీరు ఘనీభవించి మంచుగడ్డగా రూపాంతరం చెందుతుంది. జ్ఞానాగ్ని వేడిమిచే మంచుగడ్డ నీరుగా కరుగుతుంది. భక్తియొక్క శీతల ప్రభావం చేత నీరు, మంచుగడ్డ రూపాన్ని సంతరించుకొంటుంది.
“ఉన్నది ఒక్కటే, జనం దానిని వివిధ నామాలతో పేర్కొంటారు. ఒక ఘట్టం నుండి నీరు తీసుకువెళ్ళేవారు ‘జలం’ అంటారు. రెండవ ఘట్టం నుండి తీసుకువెళ్ళేవారు ‘పానీ’ అంటారు. మూడవ ఘట్టంవారు ‘వాటర్’ అనీ నాలుగవ ఘట్టంవారు ‘ఆక్వా’ అనీ పేర్కోటం కద్దు. కాని ఉన్న పదార్థం ఒక్కటే, నీరు.”
బారిసాల్ వాస్తవ్యుడైన అచలానంద తీర్థ అవధూతను కలుసుకున్నానని శ్రీరామకృష్ణులకు చెప్పాను.
శ్రీరామకృష్ణులు: కొత్రంగ్కు చెందిన రామకుమార్ కదా అతడు?
నేను: అవునండీ.
శ్రీరామకృష్ణులు: నీకు ఎలా అనిపించాడు?
నేను: బాగా నచ్చాడండీ.
శ్రీరామకృష్ణులు: సరే, నీకు ఎవరు బాగా నచ్చారు, అతడా లేక నేనా?
నేను: మీ ఇద్దరి మధ్య పోల్చడానికి ఏం ఉంది? అతడు పండితుడు, విద్వాంసుడు. కాని మీరు పండితులా?
నా జవాబు విని శ్రీరామకృష్ణులు దిగ్భ్రమచెంది, మౌనం వహించారు. ఓ క్షణం తరువాత నేను “అతడు పండితుడే కావచ్చు కాని మీరు సరదా మనిషి, మీ సాహచర్యం ఎంతో సరదాగా ఉంటుంది” అన్నాను.
ఈ మాట విని శ్రీరామకృష్ణులు నవ్వి, “భేష్, భేష్! బాగా చెప్పావు” అన్నారు.
“నా పంచవటిని సందర్శించావా?” అని అడిగారు.
నేను: సందర్శించానండీ.
తాము అక్కడ అనుష్ఠించిన సాధనల గురించి కొంచెం వివరించి చెప్పారు. నాంగ్టా గురించి కూడా చెప్పారు.
తరువాత నేను ఆయన్ను, “భగవదనుభూతి నే నెలా పొందగలను?” అని అడిగాను.
శ్రీరామకృష్ణులు: ఇనుమును అయస్కాంతం ఆకర్షించే తీరులో భగవంతుడు మనలను సర్వదా ఆకర్షిస్తున్నాడు. కాని ఇనుము మట్టిచే కప్పబడినప్పుడు అయస్కాంతం దానిని ఆకర్షించదు. మట్టిని కడిగివేసిన మరుక్షణమే అయస్కాంతం, ఇనుమును ఆకర్షిస్తుంది. భగవంతునికై విలపించు. కన్నీరు నీ మనస్సులోని మాలిన్యాన్ని కడిగి వేస్తుంది.
ఆయన పలుకులు నేను వ్రాసుకొంటున్నప్పుడు ఆయన ఇలా వ్యాఖ్యానించారు: “ఇలా చూడు, ‘గంజాయి’ అనే మాటను పలుమార్లు కేవలం ఉచ్చరిస్తే మత్తు కలుగుతుందా? గంజాయి ఆకు తెచ్చి, దాన్ని నూరి నీళ్ళలో కలిపి త్రాగాలి…”
పిదప ఇలా అన్నారు: “మీరు గృహస్థ జీవితం గడుపనున్నారు కనుక మీ మనస్సును భగవచ్చింతనలో ఉన్మత్తం చేసుకోండి. మీరు మీ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటారు, కాని ఆ ఆహ్లాదకర ఉన్మత్తతను అట్లే నిలుపుకోండి. కాని శుకదేవునిలా భగవచ్చింతన అనే కైపులో బాహ్యస్పృహను కోల్పోయి, దిగంబరులుగా మీరు పడివుండలేరు. సంసారంలో మీరు ఉన్నంతకాలం భగవంతునికి ముఖ్త్యారునామా ఇచ్చివేయండి. మీ బాధ్యతలన్నీ ఆయన పరంచేయండి, ఆయన ఇచ్ఛ మేరకు నిర్వర్తిస్తాడు. ధనవంతుని ఇంటి దాసీమనిషిగా ఈ సంసారంలో జీవించండి. ఆమె తన యజమాని పిల్లలకు స్నానం చేయిస్తుంది, ఆహారం తినిపిస్తుంది, వాత్సల్యంతో అనేక విధాలుగా వారిని చూసుకొంటుంది – వారు తన సొంత పిల్లలన్నట్లు. కాని వారు తన పిల్లలు కారనే విషయం ఆమెకు బాగా తెలుసు. ఆమెను పనినుండి తొలగించి వేయగానే ఆటకట్టు. అప్పుడు ఆ యజమాని పిల్లలతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉండదు.
“పనసతొనలు వొలవబోయే ముందు చేతులకు చమురు రాచుకుంటే, జిగట అంటుకోదు. ఆ విధంగానే భక్తి అనే చమురుతో నిన్ను పరిరక్షించుకో; పిదప సంసారం నిన్ను అంటుకోదు, నీ పై ప్రభావం చూపలేదు.”
ఇలా చెబుతున్నంతసేపు శ్రీరామకృష్ణులు నేల మీదనే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు లేచి మంచం మీద నడుం వాల్చారు.
“కాస్త విసురు” అన్నారు నాతో.
నేను విసరసాగాను. అయన మౌనంగా ఉన్నారు.
కాసేపయ్యాక ఇలా అన్నారు. “ఓహ్! చాలా వేడిగా ఉంది. విసన కర్రను నీళ్ళలో తడపరాదా?”
“ఆహా! మీ కోర్కెలకు కొదవ లేదు!” అని అన్నాను.
అందుకు శ్రీరామకృష్ణులు నవ్వి, సాగదీస్తూ, “ఎందుకు ఉండకూడదు?” అన్నారు.
“మంచిది. వాటిని పూర్తిగా ఉండనివ్వండి” అన్నాను.
నాడు ఆయన సాన్నిధ్యంలో నేను పొందిన ఆనందం వర్ణనాతీతం.
నువ్వు నీ పుస్తకం మూడవ భాగంలో* ప్రస్తావించినట్లు చివరిసారిగా ఆయన్ను దర్శించాను. ఆ రోజు నాతో అప్పుడే పట్టభద్రుడైన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా వచ్చాడు. మరో రోజు నువ్వు అతణ్ణి కలుసుకున్నావు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు “ఇతణ్ణి ఎక్కడనుంచి పట్టుకువచ్చావు? ఇతడు సజ్జనుడు!” అన్నారు నాతో.
పిదప ఇలా కొనసాగించారు: “నువ్వు న్యాయవాదివి. చాలా తెలివిగల వాడివి. నీ తెలివిలో కొంచెం నాకు ఇవ్వరాదా? ఆ రోజు నీ తండ్రిగారు ఇక్కడకు వచ్చి మూడు రోజులు గడిపారు.”
నేను: మీకు ఎలా అనిపించారు?
శ్రీరామకృష్ణులు: మంచివారే కాని మధ్యమధ్యలో అసందర్భంగా మాట్లాడుతుంటారు.
నేను: ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆ జాడ్యం వదలిపోయేలా చేయండి.
ఆ మాటకు శ్రీరామకృష్ణులు చిన్నగా నవ్వారు.
నేను: మాకు ఏమైనా ఉపదేశాలు ఇవ్వండి.
శ్రీరామకృష్ణులు: నీకు హృదయ్ తెలుసా?
నేను: ఆ, పేరు విన్నాను.
శ్రీరామకృష్ణులు: హృదయ్ నాతో ఇలా అనేవాడు: ‘మామా! నీ ఉపదేశాల నన్నిటినీ ఒకేసారి ఇచ్చేయవద్దు, పదే పదే ఒకే ఉపదేశాన్ని ఇస్తుంటా వెందుకు?’ అందుకు నేను ఇలా అనేవాణ్ణి: ‘ఒరే మూర్ఖుడా! నీ కెందుకురా? అవి నా పలుకులు, వాటిని నా ఇష్టానుసారం లక్షసార్లు చెప్పిందే చెప్తూంటాను. నువ్వు నోరు మూసుకో.’
నేను (నవ్వుతూ): అంతే కదా!
కాసేపయ్యాక ఆయన మంచం మీద నుంచి లేచి, కూర్చున్నారు. ఓంకారాన్ని అనేకసార్లు జపించారు. తరువాత ఈ పాటపాడారు:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రము నందు….
రెండు మూడు చరణాలు పాడగానే సమాధిమగ్నులయ్యారు.
సమాధిస్థితినుంచి బాహ్య స్పృహలోకి వచ్చాక గదిలో పచార్లు చేయసాగారు. ధరించిన పంచెను రెండు చేతులతో నడుందాకా పైకి లాక్కున్నారు. పంచె ఒక చెంగు నేలమీద దోగాడుతోంది, రెండవ చెంగు వదులుగా క్రిందికి వ్రేలాడుతోంది.
నా సహచరుణ్ణి మోచేత్తో పొడుస్తూ, “చూడు ధోవతి తీరు!” అంటూ గుసగుసలో చెప్పాను.
ఒక క్షణకాలం తరువాత ఆయన “హు! ఏం పీడ! తీసిపారేస్తా!” అంటూ తన ధోవతిని తీసిపారేశారు. దిగంబరంగా గదిలో పచార్లు చేయసాగారు. గది ఉత్తరం వైపు నుండి ఒక గొడుగును, చేతికర్రను తీసుకువచ్చి, “ఇవి మీవా?” అని అడిగారు.
మావి కావు అని నేను అనబోతూ ఉండగా ఆయన ఇలా అన్నారు: “నాకు తెలుసు. ఒక వ్యక్తిని అతడి గొడుగు, చేతికర్రతో బేరీజు వేయగలను. కొంతసేపటి క్రితం ఇక్కడ కూర్చుని ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోకుండా నా మాటలన్నిటిని దిగమ్రింగిన ఆ ఫలానా వ్యక్తికి చెందినవి ఇవి.”
కొన్ని నిమిషాలు గడిచాక, అదే స్థితిలోనే తమ మంచం ఉత్తరం చివర కూర్చుని, “నువ్వు నన్ను అనాగరకునిగా పరిగణిస్తున్నావా?” అని అడిగారు.
నేను: లేదండీ, మీరు నాగరికులు. నన్నెందుకు అలా అడుగుతున్నారు?
శ్రీరామకృష్ణులు: చూడు, శివనాథ్ ప్రభృతులు నేను నాగరికుణ్ణి కానని భావిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను వస్త్రం ధరించి ఉండాలట. నీకు గిరీశ్ఘోష్ తెలుసా?
నేను: ఏ గిరీశ్ ఘోష్? నాటకాలు వేసే గిరీశ్ఘోషా?
శ్రీరామకృష్ణులు: అవును.
నేను: అతణ్ణి ఎప్పుడూ చూడలేదు. కాని అతడి గురించి విన్నాను.
శ్రీరామకృష్ణులు: మంచివాడు.
నేను: అతడు త్రాగుతాడంటారు.
శ్రీరామకృష్ణులు: త్రాగనీ! త్రాగనీ! త్రాగుడు ఎంతకాలం కొనసాగిస్తాడు? నీకు నరేంద్రుడు తెలుసా?
నేను: తెలియదండీ.
శ్రీరామకృష్ణులు: అతణ్ణి నువ్వు కలుసుకోవాలని నా అభిలాష, అతడ బి.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, అవివాహితుడు.
నేను: మంచిదండి, అతణ్ణి కలుసుకొంటాను.
శ్రీరామకృష్ణులు: ఈ రోజు రాంచంద్ర దత్త ఇంట్లో సంకీర్తన జరుగనున్నది. నువ్వు అతణ్ణి అక్కడ కలుసుకోవచ్చు. ఈ సాయంత్రం అక్కడకు వెళ్ళు.
నేను: అలాగేనండి.
శ్రీరామకృష్ణులు: సరే, మరిచిపోవద్దు సుమా!
నేను: ఇది మీ ఆదేశం. నేను శిరసావహించనా? తప్పకుండా వెళతాను. తరువాత ఆయన తమ గదిలోని చిత్రపటాలను మాకు చూపించి “బుద్ధుని చిత్రపటం దొరుకుతుందా?” అని అడిగారు.
నేను: దొరకవచ్చండీ!
శ్రీరామకృష్ణులు: నాకోసం ఒకటి పట్టుకురా.
నేను: అలాగేనండి. ఈసారి వచ్చినప్పుడు తీసుకువస్తాను.
కాని నేను మళ్ళీ దక్షిణేశ్వరం వెళ్లటం జరగలేదు.
ఆనాటి సాయంత్రం నేను రాంబాబు ఇంటికి వెళ్ళి నరేంద్రుణ్ణి కలుసు కున్నాను. ఒక గదిలో శ్రీరామకృష్ణులు ఒక దిండుకు చేరగిలబడి కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు ఆయనకు కుడి వైపు, నేను ఎదురుగా కూర్చున్నాం.
నరేంద్రుణ్ణి ఆయన నాతో మాట్లాడమన్నారు. కాని నరేంద్రుడు, “ఈ రోజు విపరీతమైన తలనొప్పిగా ఉంది. మాట్లాడాలని లేదు” అన్నాడు.
“మరొక రోజు మాట్లాడుకోవచ్చు” అన్నాను నేను.
ఆ మరో రోజు 1897 వ సం ॥ మే లేక జూన్ నెలలో ఆల్మోరాలో తటస్థించింది. శ్రీరామకృష్ణుల అభిలాష పన్నెండేళ్ళ తరువాత నెరవేరింది. ఓహ్! ఆల్మోరాలో స్వామి వివేకానందతో ఎంత ఆనందంగా ఆ రోజులు గడిపానో కదా! కొన్ని వేళల్లో అతడు బసచేసిన ఇంట్లో, కొన్ని సందర్భాలలో నా ఇంట్లో, ఒక రోజు ఏకాంతంలో ఇద్దరం ఒక కొండ శిఖరం మీద. ఆ తరువాత అతణ్ణి నే నెన్నడూ కలుసుకోలేదు. ఆల్మోరాలో మేం ఇద్దరం కలుసుకోవడం శ్రీరామకృష్ణుల మనోవాంఛితాన్ని నెరవేర్చటానికేమో అని నాకు అనిపిస్తోంది.
శ్రీరామకృష్ణులను నేను నాలుగైదుసార్ల కంటే ఎక్కువగా కలుసుకోలేదు. కాని ఆ స్వల్ప కాలవ్యవధిలోనే మేం, సహాధ్యాయుల మన్నంత సన్నిహితులమై పోయాం. ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో యథేచ్ఛగా ప్రవర్తించే వాడిని. కాని ఆయన సాన్నిధ్యం నుండి వచ్చేశాక, ‘బాప్రే! ఆయన పరమహంస! నేనలా ప్రవర్తించడం అనుచితం’ అనుకొనేవాడిని. ఆ కొన్ని రోజులలో నేను చూసినవీ, విన్నవీ నా యావజ్జీవితాన్ని మధురాతిమధురం చేసివేశాయి. అమృతం చిందించే ఆ పరమాద్భుత దరహాసాన్ని నా జ్ఞాపకాల సొరుగులో గోప్యంగా తాళం వేసి ఉంచుకొన్నాను. నా వంటి దురదృష్టవంతునికి అదొక పెన్నిధి. ఆ దరహాసం నుండి జాలువారిన అమృత కణం లక్షలాది మానవుల జీవితాలను సుదూర అమెరికాలో సైతం ఎలా మధురాతిమధురం చేస్తూ ఉన్నాదో ఊహిస్తేనే నా హృదయం ఆనందంలో ఓలలాడుతుంది. నాకే అలా అనిపిస్తూ ఉంటే, నువ్వు ఎంతటి భాగ్యశాలివో నీకే ఎరుక!