52.1 ప్రథమ పరిచ్ఛేదం వరాహనగర మఠం
శ్రీరామకృష్ణులు 1886 వ సం ॥ ఆగష్టు 16, సోమవారం నాడు మహా సమాధి చెందారు. ఆయన కనుమరుగవడంతో మనస్సు కలత చెందిన యువశిష్యులు, భక్తులు దుఃఖ సాగరంలో మునిగిపోయి, నౌకాభంగంలో చిక్కువడి పోయిన వారిలా తయారయ్యారు.
శ్రీరామకృష్ణులు జీవించిన కాలంలో ఆయన సేవలో పాల్గొన్న కారణంగా ఏ ప్రగాఢ ప్రేమతో పెనవేసుకొనిపోయి ఉన్నారో, అదే ప్రగాఢ ప్రేమ ఇప్పుడూ వారిని పెనవేసుకొనే ఉంది. మార్గదర్శిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా కనుమరుగవడం వారిని భయోత్పాతంలో ఉంచింది. అయినప్పటికీ ఒకే లక్ష్యంతో జీవించిన వారు ఒకరినొకరు అనునయించుకొని శ్రీరామకృషుల పట్ల కలిగివున్న ప్రేమ పాశంతో కట్టువడి కలిసికట్టుగా ఉన్నారు.
సామాన్య ప్రజల నుండి వారి స్థితి విభిన్నంగా ఉంది. సంసార జీవితం గడపడమన్నది వారికి అసాధ్యంగా తోచింది. లౌకికులతో మాట్లాడటం, మెలగడం వారికి వేదనాభరితమైంది. శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడటంలో మాత్రమే వారు ఆసక్తులై ఉన్నారు; ఆనందం చెందేవారు. ఇతరులతో మాట్లాడటం వారికి రుచించలేదు.
‘ఆయన్ను మనం మళ్లీ దర్శించాలి కదా? ఆయన్ను దర్శించడం ఎలా?’ అన్నదే వారి ఏకైక ఆలోచన. “మనోవ్యాకులతతో భగవంతుని పిలిస్తే ఆయన ఆ నిజమైన పిలుపుకు చెవివొగ్గి సాక్షాత్కరిస్తాడు” అని శ్రీరామకృష్ణులు వచించి ఉన్నారు. తమ పిలుపు హృదయపూర్వకమైనదైతే ఆయన కచ్చితంగా ఆలకిస్తాడనే భావనే అహర్నిశలూ వారిలో పాదుకొని ఉంది; సుషుప్త్యవస్థలోను, జాగ్రదవస్థలోను ఎడతెగక కొనసాగింది. ఏకాంతంలో వారు పసిపిల్లలవలె శ్రీరామకృష్ణులను తలచుకొని విలపించారు, ఖీన్నులైనారు. ఆయన ఆలోచనల్లో లీనమై కలకత్తా వీథులలో తిరుగాడారు. ఈ విషయంగా శ్రీరామకృష్ణులు ఒకసారి ‘మ’ తో, ‘నేను గతించాక మీరందరూ కలత చెంది, విలపిస్తూ వీథుల్లో తిరుగుతారు అని తలచినప్పుడు బాధ కలుగుతోంది. ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి మనస్కరించడం లేదు’ అని చెప్పివున్నారు.
‘భగవంతునిలా మనలను సంరక్షించిన ఆయన నేడు లేరు. కాని మనం జీవిస్తూనే ఉన్నామే? ఈ అశాశ్వత ప్రాపంచిక జీవితంలో ఇంకా బతకవలసి వస్తోందే? అనుకొంటే ఈ నిలకడలేని ప్రాపంచిక జీవితాన్ని త్రోసిరాజనవచ్చు. కాని అలా ఎక్కడ చేస్తున్నాం? ఇంకా జీవిస్తూనే ఉన్నామే, ఇది ఆశ్చర్యకరమే!’ అని పదేపదే యోచించి మనోక్షోభ చెందారు ఆ యువశిష్యులు.
శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం
సన్న్యాస జీవితానికి శ్రీరామకృష్ణులే ఎంపిక చేసిన ఈ యువ సింహ సదృశులు హృదయాంతరాళాల్లో సంపూర్ణంగా త్యజించినవారై ఉన్నప్పటికీ, విధి విహితంగా సన్న్యాసం స్వీకరించలేదు. కాబట్టి కాశీపూర్‌లో బసచేసి రేయింబవళ్ళు శ్రీరామకృష్ణులకు సేవ చేస్తూ వచ్చిన అంతరంగ భక్తులైన ఈ యువకులలో అత్యధికులు శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం గత్యంతరంలేక తమ ఇచ్ఛకు మారుగా ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఎవరినీ సన్న్యాస జీవితానికి వలసిన కాషాయవస్త్రాదులను చేపట్టమని శ్రీరామకృష్ణులు చెప్పలేదు. వారిని ఇంటి పేర్లతోనే జనం ఇంకా పేర్కోసాగారు. కాని వారి హృదయాలలో శ్రీరామకృష్ణులు రగిలించిన వైరాగ్య జ్వాల జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉంది.
వీరిలో ఒకరిద్దరికి వెళ్లడానికి చోటంటూ ఏదీలేదు. శ్రీరామకృష్ణుల ప్రేమకూ, అనుగ్రహానికి పాత్రుడూ, ఉదారుడూ అయిన సురేంద్రుడు వీరితో ఇలా అన్నాడు: “మీరు ఎక్కడకు వెళతారు? ఒక ఇంటిని అద్దెకు తీసుకొందాం. అక్కడ శ్రీరామకృష్ణులకు మందిరాన్ని ఏర్పాటు చేద్దాం, ఆరాధిద్దాము. గృహస్థులమైన మేము సంసారంలో భార్యాపిల్లలతో చిక్కువడివుంటే మా పరిస్థితి ఏమవుతుంది? అందుకే శాంతి నిమిత్తం మేం తరచూ అక్కడకు వస్తాం. కాశీపూర్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణులు వసించి ఉన్నప్పుడు కొంత మొత్తం నేను ఇస్తూవచ్చాను. అదే మొత్తాన్ని మీకు ఇప్పుడు సంతోషంగా ఇస్తాను. మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది.”
ఈ ఏర్పాటు మేరకు వరాహనగర్లో (బారానగర్) ఒక ఇల్లు అద్దెకు తీసుకోబడింది. ఇదే కాలాంతరంలో సాధువులు జీవించే ఒక మఠంగా, సన్న్యాసులు బసచేసే స్థలంగా, ఒక సన్న్యాసి మఠంగా రూపొందింది. మొదట కొన్ని నెలలకు సురేంద్రుడు ముప్ఫై రూపాయల చొప్పున ప్రతినెల ఇస్తూ వచ్చాడు. క్రమంగా ఒకరి వెంట ఒకరుగా ఇతరులు కూడా రావడంతో దాన్ని అరవై రూపాయలుగా పెంచి యిస్తూవచ్చాడు, పిదప నూరు రూపాయలుగా హెచ్చించాడు. ఒక నెల ఇంటి అద్దె పదకొండు రూపాయలు. వంటవానికి నెల జీతం ఆరు రూపాయలు. మిగిలిన పైకం తిండికోసం వెచ్చించేవారు.
కాశీపూర్ ఉద్యాన గృహం నుండి శ్రీరామకృష్ణులు ఉపయోగించిన పరుపు, ఇతర సామానులన్నీ చిన్నగోపాల్ తీనుకువచ్చాడు. అక్కడ వంటచేసిన బ్రాహ్మణుడే ఇక్కడా వంటవానిగా నియమింపబడ్డాడు. మొట్టమొదట మఠంలోకి వచ్చి నిరంతరంగా బసచేసిన వ్యక్తి పెద్దగోపాల్. శరత్ కొన్ని రాత్రుళ్లు బసచేశాడు. ఆరంభంలో శరత్, శశి, బాబూరాం, నిరంజన్, కాళీలు అవకాశం చిక్కినప్పుడల్లా వస్తూపోతూ వచ్చారు. బృందావనం నుండి తిరిగి వచ్చిన తారక్ నిరంతరంగా మఠంలో బసచేయసాగాడు. మఠం ఆరంభ కాలంలో రాఖాల్, యోగీన్, లాటూ, కాళీ మొదలైనవారు మాతృదేవితో బృందావనం వెళ్లివున్నారు. కాళీ నెల రోజుల్లోనే తిరిగివచ్చాడు. తారక్ కొన్ని నెలల తరువాత తిరిగివచ్చాడు. యోగీన్, లాటూలు ఒక సం ॥ తరువాత తిరిగివచ్చారు. వీరందరూ మఠానికి తరచూ రాసాగారు.
కొంతకాలం గడిచాక నరేంద్రుడు రాఖాల్, నిరంజన్, శరత్, శశి, బాబూరాం, యోగీన్, తారక్, కాళీ, లాటూ మొదలైన యువకులు సన్న్యాస జీవితం పరిగ్రహించారు. శారదాప్రసన్నుడు, సుబోధ్ కొంతకాలం తరువాత వచ్చి, సన్న్యాసం పుచ్చుకొన్నారు.* తపస్సుకై టిబెట్ వెళ్ళివున్న గంగాధర్ తిరిగి రాగానే మఠంలో చేరాడు. ఈతడే కాశీలోని విశ్వనాథుని ఆలయంలో సాయంత్ర హారతి సమయంలో గానం చేసే స్తోత్రాన్ని* సోదర శిష్యులకు నేర్పించాడు. ఇతడికి నరేంద్రుడంటే అపరిమిత ప్రేమ. తరచూ వస్తూపోతూ ఉన్న హరి, కొంతకాలం గడిచాక మఠంలో చేరాడు. శ్రీరామకృష్ణులు గుర్తించిన యువ సన్యాసుల సంఖ్య ఈతడితో పూర్తయింది.
గృహస్థ భక్తులు తరచూ మఠానికి వచ్చి యువ సన్న్యాసులను చూసిపోతూ ఉన్నారు. వారితో కలిసి ధ్యానం చేస్తూ, శాస్త్రాలు అధ్యయనం చేస్తూ కొన్ని గంటలు, కొన్ని వేళల్లో కొన్ని రోజులు సైతం గడిపేవారు.
“సురేంద్రా, నువ్వు ధన్యుడవు! మొట్టమొదట ఈ మఠం నీచే స్థాపించబడింది. దీని స్థాపనకు నీ ఇచ్ఛే కారణం. నిన్ను పరికరంగా చేసుకొని శ్రీరామకృష్ణుల మూలమంత్రమైన కామినీ కాంచన పరిత్యాగ చిహ్నం అమరింది. పరిశుద్ధాత్ములైన నరేంద్రుడు మొదలైన యువ సన్న్యాసుల ద్వారా అమరమైన హైందవ ధర్మాన్ని జనం ముందు నెలకొల్పారు శ్రీరామకృష్ణులు. సోదరుడా! నీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోగలరు! ఆ యువ సన్యాసులు అనాథల్లా, ‘నువ్వు ఎప్పుడు వస్తావు?’ అని నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ‘నేడు ఇంటి అద్దె చెల్లించి నందున డబ్బంతా అయిపోయింది. తినడానికి తిండి లేదు. నువ్వు వస్తే తిండికి ఏర్పాటు చేస్తావు. నువ్వు ఎప్పుడు వస్తావు?’ అని ఎదురుచూస్తున్నారు. నీ అనురాగాన్నీ, దేన్నీ ఎదురుచూడని సేవనూ తలిస్తే ఎవరి కళ్ల వెంట అశ్రువులు స్రవించవు!”
వరాహ నగర మఠం
సురేంద్రుడు నిజంగానే పుణ్య పురుషుడు. శ్రీరామకృష్ణుల పేరిట ప్రపంచ వ్యాప్తంగా మఠాలు విలసిల్లటానికి పునాది వేసింది ఈతడే అనవచ్చు. శ్రీరామకృష్ణుల పట్ల ఆతడు కనబరచిన ప్రేమ, ఆతడిలోని ఉదారతే ఈ ఉన్నతులైన యువకులు సన్న్యాస జీవితం స్వీకరించడానికి బాసటగా నిలచింది. వీళ్లు, తమ ఉపదేశాలను స్వీకరించి కామినీ కాంచనాలను పరిత్యజించి భగవన్మార్గంలో వెళ్లడానికి ఒక పరికరంగా సురేంద్రుని ఉపయోగించుకొన్నారని చెప్పవచ్చు.
ఇలా ఆరంభమైన మఠం ‘వరాహ నగర మఠం’ గా పేర్కోబడింది. నరేంద్రుడు, రాఖాల్ మొదలైన యువ సన్న్యాసులలో వివేక వైరాగ్య జ్వాల తీవ్రంగా రగులుకొన్నది. ఒకసారి రాఖాల్ను ఇంటికి తోడ్కొని పోవడానికి ఆతడి తండ్రి వచ్చినప్పుడు, తిరిగి పోవడానికి అతడు నిరాకరించాడు; ఆయనతో, “మిమ్మల్ని నేను, నన్ను మీరు మరిచిపోయేలా భగవంతుడు అనుగ్రహించుగాక!” అని అన్నాడు. “కామినీ కాంచనాలను మనం అందరం పరిత్యజించాలి అన్నదే శ్రీరామకృష్ణుల ఆదేశం. మనం ఇంటికి తిరిగి వెళ్లడమా?” అంటూ వాళ్లు తమలో తాము మాట్లాడుకొన్నారు. పరిత్యాగంలో ఆసక్తిపరులై, పరిత్యాగమనే పర్వతాగ్రాన్ని అధిరోహించినవారిలా ఈ యువకులు విరాజిల్లారు.
శ్రీరామకృష్ణులు వినియోగించిన వస్తువులు బలరామ్ ఇంటి నుండి కూడా మఠానికి తీసుకువచ్చారు. పూజామందిరంలో శ్రీరామకృష్ణులను అనునిత్యం వారు ఆరాధించసాగారు. ముప్పొద్దులా ఆయన పూజలో శశి నిమగ్నుడైనాడు. మఠ నిర్వహణ బాధ్యతను నరేంద్రుడు స్వీకరించి, మఠాధిపతిగా కూడా ఆతడే వ్యవహరించసాగాడు. తమ సోదర శిష్యులతో అతడు, “నిష్కామ కర్మ అని గీత వచించేది జపం, ధ్యానం మొదలైనవే తప్ప లౌకిక కర్తవ్యాలు కావు. ఈ సాధనలే మనకు కావలసినవి; మనం అనుష్ఠించ తగ్గవి. ఇవి లేకుంటే మనకు భగవద్దర్శనం కాకుండానే నిరర్థకులుగా నశించిపోతాం” అంటూ పదేపదే హెచ్చరించేవాడు. సోదర శిష్యులూ తమ ఆధ్యాత్మిక పురోగతికి నరేంద్రుణ్ణే ఆసరా చేసుకొన్నారు.
ఆ యువ సన్న్యాసులు తమను ‘దానవులనీ’ – అంటే శివగణాలని వ్యవహరించుకోసాగారు. వారంతా కూర్చునే ఆహ్వానితుల గదిని ‘దానవుల గది’ అని పిలిచేవారు.
మేడమీద దక్షిణ మూలనున్న ఒక గదిని ఏకాంతంలో ధ్యానం చేయడానికి, అధ్యయనానికి కేటాయించారు. కాళీ ఈ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకొని చాలాసేపు ఉండిపోవడం కద్దు. కనుక ఈ గదిని ‘కాళీతపస్వీ గది’ అని పిలిచేవారు. ఈ గదికి ఉత్తరాన ఉన్న గది పూజామందిరం. దాని తరువాతిది నైవేద్యం తయారుచేసే గది. ఈ గదిలో కూర్చుని కూడా హారతిని తిలకించవచ్చు. భక్తులు సామాన్యంగా ఇక్కడ నుండే శ్రీరామకృష్ణులకు ప్రణామం చేస్తారు. నైవేద్యం తయారుచేసే గదికి ఉత్తరాన ‘దానవుల గది’ ఉంది. ఇది విశాలమైన గది. మఠ సోదరులు ఇక్కడే సమావేశమవుతారు. భక్తులు, అతిథులు వస్తే వారిని ఇక్కడే ఆహ్వానించేవారు. ఈ గదికి ప్రక్కన కాస్త ఉత్తరాన ఇంకొక చిన్న గదిలో భక్తులు భుజిస్తారు. ఆహ్వానితుల గదికి తూర్పున ఒక వసారా ఉంది. పర్వదినాలలో భక్తులు ఇక్కడే భోజనం చేస్తారు. వసారాకు ఉత్తరాన వంటగది ఉంది.
పూజా మందిరానికీ, కాళీ తపస్వి గదికీ తూర్పున ఒక వసారా ఉంది. దాని నైరుతి మూలన వరాహ నగర సొసైటీ గ్రంథాలయం ఉంది. ఈ గదులన్నీ మేడమీద ఉన్నాయి. కాళీతపస్వి గదికీ, గ్రంథాలయానికీ మధ్య మేడమీదకు దారితీసే మెట్లు ఉన్నవి. అదే విధంగా భోజనశాల ప్రక్కన డాబా మీదకు దారితీసే మెట్లు ఉన్నవి. నరేంద్రుడు, తక్కిన సోదర శిష్యులు ఈ మెట్ల గుండా కొన్ని సమయాల్లో సాయంత్రవేళ డాబామీదకు వెళ్లేవారు. అక్కడ కూర్చుని దైవసంబంధమైన విషయాలు మాట్లాడుకోవటం కద్దు. శ్రీరామకృష్ణుల ఉపదేశాలు, శంకరులు, రామానుజులు, ఏసు, భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలు, వేదాలు పురాణాలు తంత్రాలు మొదలైన వాటి గురించి చర్చించి ఆనందించేవారు.
‘దానవుల గదిలో’ కూర్చుని నరేంద్రుడు తన సుమధుర కంఠంతో పాడేవాడు. శరత్ మొదలైనవారికి పాటలు నేర్పేవాడు. కాళీ వాయిద్యం వాయించడం నేర్పాడు. ఆ గదిలో నరేంద్రుడు తన సోదర శిష్యులతో ఎన్నోసార్లు హరినామ సంకీర్తనలో లీనమై నృత్యం చేశాడు!
వరాహనగర మఠంలో ఈ యువసన్న్యాసులు గడిపిన కఠోర ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం చెప్పాలి! బాహ్యలోకం నుండి కనుమరుగైన శ్రీరామకృష్ణులను తమ హృదయాంతరాళాలలో ఆవాహనం చేయాలనే ఉద్విగ్నతలో వారు మునిగివున్నారు. అప్పుడప్పుడు వాళ్లు గాంచిన దివ్యదర్శనాలు ఎంతటి దారిద్ర్యాన్ని, ఆవేదనను, బహిష్కరణను, ఎకసెక్కాలను లెక్కించక మళ్లీ మళ్లీ ప్రయత్నించే స్థితికి వారిని పిచ్చివారిని చేసివేసినవి. బాహ్యచైతన్యరహితులై, భక్తి గీతాలు ఆలాపించడంలో, నృత్యం చేయడంలో రుచిగలిగినవారై అహర్నిశలూ ప్రార్థనలలోను, ధ్యానంలోను, శాస్త్రాధ్యయనంలోను ఆసక్తిపరులై వాళ్లు విరాజిల్లారు. భగవద్దర్శనమే వాళ్ల జీవిత ఏకైక లక్ష్యంగా మారింది. వేదపురాణ తంత్ర గ్రంథాలలో పేర్కొన్న సన్న్యాస జీవిత నియమాలను తు.చ. తప్పక మనస్ఫూర్తిగా పాటించ సాగారు. పగటివేళ మఠంలోను, చెట్టు క్రింద; అర్ధరాత్రి సమీపంలోని శ్మశానంలోను, గంగాతీరంలోను ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించారు; తపస్సు ఆచరించారు. శ్రీరామకృష్ణులు అనుష్ఠించి చూపిన అనుపమాన తపస్యాదుల గురించిన జ్ఞాపకం వారి తపోగ్నిని ప్రజ్వలనం చేసింది. ధ్యానం కొనసాగించడానికై ఆ యువకులు పస్తులువుండి చావడానికైనా సిద్ధమైనారు.
వరాహనగర మఠంలో తపోమయ జీవితంలో శ్రీరామకృష్ణుల యువశిష్యులు
52.1 ద్వితీయ పరిచ్ఛేదం వరాహనగర మఠంలో శివరాత్రి మహోత్సవం
సోమవారం, ఫిబ్రవరి 21, 1887
వరాహనగర మఠం. నేడు మహాశివరాత్రి. రెండు రోజుల తరువాత శ్రీరామకృష్ణుల జన్మదినం. వరాహనగరంలో మఠం ప్రారంభించి ఐదు నెలలు అయింది. శ్రీరామకృష్ణులు మహాసమాధి చెంది కొన్ని నెలలే గడిచాయి. నరేంద్రుడు, రాఖాల్ వంటి భక్తుల మనస్సులో తీవ్రవైరాగ్యం నెలకొని ఉంది.
నాటి ఉదయం నరేంద్రుడు తన కుటుంబ వ్యాజ్యెం నిమిత్తం కలకత్తాకు వెళ్లివున్నాడు. న్యాయస్థానంలో అతడు సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. ‘మ’ తొమ్మిది గంటల సమయంలో మఠానికి వచ్చాడు. అతడు గదిలోకి రాగానే చూసిన తారక్ మహదానందంతో ‘శివుడు తాండవము చేసె నదిగో’ అనే పాట పాడగా, అతడితో రాఖాల్ జతకలిపి పాడాడు. పాడుతూ ఇద్దరూ నృత్యం చేశారు. ఆ పాటను నరేంద్రుడు కొన్ని రోజుల క్రితమే స్వరకల్పన చేశాడు.
శివుడు తాండవము చేసె నదిగో
భూ భూ భుంమ్మని బుగ్గల నొక్కగ
బా బా భంమ్మని ప్రతిధ్వనించెను ॥ శి ॥
డిమి డిమి డిమ్మని డమరు గొట్టెను
కదలెను అటునిటు కపాలమాల ॥ శి ॥
గల గల జటలలో గంగ మ్రోగెను
భగ భగ శూలము మంటలు గ్రక్కెను ॥ శి ॥
కిల కిల నవ్వెను ఫాలచంద్రుడు
ధగ ధగ మెరసెను జటాజూటము ॥ శి ॥
శివరాత్రి కారణంగా మఠంలో అందరూ ఉపవాసం ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్, నిరంజన్, శరత్, శశి, కాళీ, బాబూరామ్, తారక్, హరీశ్, గోపాల్, శారదా, ‘మ’ మొదలైనవారు అక్కడ ఉన్నారు. యోగీన్, లాటూ బృందావనంలో ఉన్నారు. వారు ఇంకా మఠాన్ని చూడలేదు.
శరత్, కాళీ, నిరంజన్, శారదా – వీళ్లు రాబోయే శనివారం జగన్నాథ దర్శనార్థం పూరీ క్షేత్రానికి వెళ్ళనున్నారు. శశి రేయింబవళ్లు శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నుడై ఉన్నాడు.
పూజ పూర్తయింది. శరత్ తంబూరా మీటి పాడాడు.
శివశంకరా శివశంకరా
కైలాసపతి మహాదేవా
నందివాహనా నాగభూషణా….
నరేంద్రుడు కలకత్తా నుంచే అప్పుడే తిరిగివచ్చాడు, ఇంకా స్నానం చేయలేదు. అతణ్ణి చూసిన కాళీ, “వ్యాజ్యెం ఏమైంది?” అని అడిగాడు. నరేంద్రుడు విసుగుతో, “నువ్వెందుకు దాన్ని గురించి సతాయిస్తావు?” అన్నాడు.
నరేంద్రుడు పొగత్రాగుతూ ‘మ’ మొదలైనవారితో మాట్లాడసాగాడు. “కామినీ కాంచనాలు పరిత్యజించకుండా గతీ, మోక్షం లేదు. కామం నరకం యొక్క వాకిలి. జనంలో అత్యధిక సంఖ్యాకులు కామానికి బానిసలు. శివుడు, కృష్ణుల విషయమే వేరు. శివుడు శక్తిని నియంత్రించి ఉంచాడు. కృష్ణుడు గృహస్థ జీవితం గడిపిన మాట నిజమే. కాని ఎటువంటి నిర్లిప్తత! క్షణమాత్రంలో బృందావనాన్ని త్యజించాడే!”
రాఖాల్: తాను పరిపాలించిన ద్వారకను అట్లే త్యజించాడు!
నరేంద్రుడు గంగలో స్నానం చేసి చేత తడిసిన తువ్వాలుతో తిరిగి వచ్చాడు. అప్పుడు ఒడలంతా గంగ మన్నును అలదుకొని ఉన్న శారదాప్రసన్న, నరేంద్రునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శివరాత్రి ఉపవాసం ఉన్న అతడు గంగలో స్నానం చేయడానికి వెళ్లాడు. నరేంద్రుడు పూజామందిరానికి వెళ్లి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ధ్యానంలో మగ్నుడయ్యాడు.
భవనాథ్ గురించిన ప్రస్తావన వచ్చింది. భవనాథ్ వివాహితుడు. అందుచేత ఉద్యోగం వెదుకవలసి వచ్చింది. అతణ్ణి గురించి నరేంద్రుడు, “అతడి వంటివారు సంసారప్పురుగులు” అన్నాడు.
సాయంకాలం కావచ్చింది. శివరాత్రి పూజకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోమానికైన సమిధలు, బిళ్వదళాలు సేకరింపబడ్డాయి. పూజ పిదప హోమం నిర్వర్తింపబడుతుంది. శశి పూజామందిరంలోను తక్కిన గదులలోను ధూపం వేశాడు. దైవనామాలను ఉచ్చరిస్తూ ప్రతి దేవీ దేవతల చిత్రపటం ముందు సభక్తికంగా ప్రణామం చేశాడు. శ్రీశ్రీ గురుదేవాయ నమః, శ్రీశ్రీ కాళికాయై నమః, శ్రీశ్రీ జగన్నాథ సుభద్ర బలరామేభ్యో నమః, శ్రీశ్రీ షడ్భుజాయ నమః, శ్రీశ్రీ రాధావల్లభాయ నమః, శ్రీ నిత్యానందాయ నమః, శ్రీ అద్వైతాయ నమః, శ్రీ భక్తేభ్యో నమః, శ్రీ గోపాలయ శ్రీశ్రీ యశోదాయై నమః శ్రీరామాయ, శ్రీ లక్ష్మణాయ, శ్రీ విశ్వామిత్రాయ నమః అంటూ స్తుతించాడు.
మఠం ఆవరణలోని బిల్వవృక్షం క్రింద శివపూజకు ఏర్పాట్లు చేశారు. రాత్రి తొమ్మిది గంటలు. మొదటి జాము పూజ ప్రారంభం కానున్నది. పదకొండున్నర గంటలకు రెండవ జాము పూజ జరుగుతుంది. నాలుగు జాములలోను పూజ నిర్వర్తింపబడుతుంది. నరేంద్రుడు, రాఖాల్, శరత్, కాళీ, సింధీకి చెందిన గోపాల్ మొదలైన వారు బిల్వవృక్షం క్రింద కూర్చుని ఉన్నారు. భూపతి, ‘మ’ కూడా ఉన్నారు. మఠ సోదరులలో ఒకరు పూజ చేశారు.
కాళీ గీతాపారాయణం చేశాడు. మధ్యమధ్యలో సాంఖ్యయోగం, కర్మయోగం గురించి నరేంద్రునితో వాదించాడు.
కాళీ: సమస్తం నేనే. సృష్టి స్థితి లయా లన్నిటినీ నేనే జరుపుతున్నాను.
నరేంద్రుడు: నేను ఎలా సృష్టించగలను? మరో శక్తి నా ద్వారా చేయిస్తోంది. అన్ని పనులు అట్లే – మనం చింతన చేయడం కూడా ఆయన ఇచ్ఛమేరకే.
‘మ’ (స్వగతం): ‘నేను ధ్యానం చేస్తున్నాను అన్న భావన ఉన్నంతవరకు మన మందరం ఆద్యాశక్తి ఇలాకాలో ఉన్నవారమే. శక్తిని అంగీకరించే తీరాలి’ అని శ్రీరామకృష్ణులు వచించడం కద్దు.
కాళీ ఒకింతసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. పిదప, “కర్మల గురించి ప్రస్తావించానే, అవన్నీ కేవలం మిథ్య. చింతన అన్నదే లేదు. వీటిని గురించి యోచిస్తేనే నవ్వు వస్తోంది” అన్నాడు.
నరేంద్రుడు: సోఽహం (నేనే అతణ్ణి) అన్నప్పుడు ఏ ‘నేను’ ను సూచి స్తున్నామో అది ఈ సామాన్యమైన ‘నేను’ కాదు. మనస్సు, దేహం వీటి నన్నిటిని తొలగించినప్పుడు ఏది మిగిలి ఉంటుందో అదే ఆ ‘నేను’.
“శాంతిః శాంతిః శాంతిః” అంటూ కాళీ గీతాపారాయణం పూర్తిచేశాడు.
నరేంద్రాదు లందరూ లేచి నిలబడి పాడుతూ, నృత్యం చేస్తూ బిల్వవృక్షాన్ని ప్రదక్షిణ చేశారు. మధ్యమధ్యలో ‘శివగురు శివగురు’ అనే మంత్రాన్ని ఉచ్చరించారు. అర్ధరాత్రి. కృష్ణపక్షపు చతుర్దశి కావడంతో సర్వత్రా గాఢాంధకారం అలముకొని ఉంది. జీవకోటి యావత్తూ ప్రశాంతంగా ఉంది.
కాషాయాంబరాలు ధరించిన యువసన్న్యాసులైన ఆ భక్తులు ఉచ్చరించిన ‘శివగురు’ మహామంత్ర నాదం గంభీరమైన మేఘగర్జనలా ఆకాశాన్ని గమించి అఖండ సచ్చిదానందంలో లీనమైపోయింది.
పూజ ముగిసింది. ఉషఃకాలాన నరేంద్రాదులు గంగాస్నానం చేశారు.
స్నానానంతరం భక్తులు శ్రీరామకృష్ణలకు ప్రణామాలర్పించి వసారాలో ఒక్కరొక్కరుగా వచ్చి కూర్చున్నారు. నరేంద్రుడు ఒక అందమైన కాషాయాంబరం ధరించి ఉన్నాడు. ఆతడి ముఖాన, మేనున కానవచ్చిన దివ్యతేజస్సు ఉడుపుల ఛాయతో మిళితమైపోయి ఉంది. తేజోవంతమైన ఆతడి ముఖార విందాన కరుణ తొణికిస లాడసాగింది. జనులకు భక్తిజ్ఞానాలు బోధించడానికే ఆ అఖండ సచ్చిదానంద సాగరం నుండి ఒక బుద్బుదంగా ఉద్భవించి మానవరూపంలో అవతరించినట్లు ఆతడు విరాజిల్లాడు. ఆతణ్ణి చూసిన వారు తమ దృష్టిని మరి దేనిమీదా మరల్చలేకపోయారు. అప్పుడు నరేంద్రుని వయస్సు ఇరవై నాలుగేళ్లు. ఈ పిన్నవయస్సులోనే చైతన్యులు కూడా సంసారాన్ని పరిత్యజించాడు.
భక్తుల పారణ (ఉపవాస విరమణ) నిమిత్తం పళ్లు, మిఠాయిలు బలరామ్ ముందు రోజు పంపివున్నాడు. రాఖాల్ తదితర భక్తులతో నరేంద్రుడు గదిలో నిలబడే వాటిని ఆరగించాడు. కాస్త తినగానే ఆనందంతో, “బలరామ్ ధన్యుడు, నిజంగా బలరామ్ ధన్యుడు” అని అన్నాడు.
పిదప నరేంద్రుడు ఒక బాలునిలా తమాషా చేయసాగాడు. రసగుల్లా నోట పెట్టుకొని నిశ్చలంగా నిలబడిపోయాడు. కనురెప్పలు అల్లార్చడం లేదు. ఒక భక్తుడు అతడు క్రిందపడిపోకుండా పట్టుకొన్నాడు. కాసేపయ్యాక నరేంద్రుడు రసగుల్లాను నోట ఉంచుకొనే కళ్లు తెరిచి “నేను బాగానే ఉన్నాను” అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు.
‘మ’, తదితరులకు పానీయాలు, మిఠాయి ప్రసాదం ఇవ్వబడ్డాయి. వీరిలో పాంగిపొరలిన ఆనంద వెల్లువను చూసి ‘మ’ మహదానందభరితుడయ్యాడు. “జై గురుమహరాజ్! జై గురుమహరాజ్!” అంటూ భక్తులు నినదించారు.
52.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల ప్రేమ గురించి నరేంద్రుడు, ‘మ’ సంభాషణ
శుక్రవారం, మార్చ్ 25, 1887
సన్న్యాస సోదరులను చూడడానికి ‘మ’ వరాహనగర మఠానికి వచ్చాడు. దేవేంద్రుడు వెంట వచ్చాడు. ‘మ’ తరచూ రావడం కద్దు. కొన్ని సమయాల్లో ఒకటి రెండు రోజులు అక్కడ బస చేయడమూ పరిపాటి. గత శనివారం వచ్చిన వాడు మూడు రోజులు ఉండిపోయాడు. మఠంలోని సన్న్యాసులలో, ముఖ్యంగా నరేంద్రునిలో తీవ్రవైరాగ్యం నెలకొని ఉంది. దాన్ని చూడడానికై ‘మ’ తరచూ వస్తుంటాడు.
సాయంత్ర సమయం. నాటి రాత్రి అక్కడే గడప నెంచాడు ‘మ’. శశి సుమధుర స్వరంలో దైవనామాన్ని ఉచ్చరిస్తూ పూజా మందిరంలో దీపం వెలిగించి, ధూపం వేశాడు. తక్కిన గదులలో ఉన్న దేవీదేవతల చిత్తరువుల ముందూ సాంబ్రాణి ధూపం వేశాడు.
దీపారాధన ముగిసింది. సన్న్యాసులు, ‘మ’, దేవేంద్రాదులు చేతులు జోడించి హారతి దర్శిస్తూ ‘జయ శివ ఓంకార’ పాటను అందరూ గానం చేశారు.
నరేంద్రుడు, ‘మ’ మాట్లాడుకుంటున్నారు. నరేంద్రుడు, శ్రీరామకృష్ణులను పలుమార్లు కలుసుకొన్న విషయమూ, తన జీవితంలో తత్కారణంగా జరిగిన సంఘటనల గురించీ చెప్పాడు.
నరేంద్రుడు: ప్రథమంలో నేను ఆయన్ను కలుసుకొన్నప్పుడు నన్ను చూసి, “నువ్వు వచ్చేశావా!” అన్నారు. ‘చాలాకాలంగా పరిచితులైన ఒక వ్యక్తిలా నాతో మాట్లాడుతున్నారే! ఎంత ఆశ్చర్యం!’ అని నాలో నేను అనుకున్నాను. “నీకు జ్యోతి దర్శనం కలుగుతోందా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “అవునండీ, నిద్రపోవడానికి ముందు నుదురు సమీపాన ఒక జ్యోతి పరిభ్రమిస్తూ ఉన్నట్లు గాంచుతాను” అన్నాను.
‘మ’ : ఇప్పుడూ చూస్తున్నావా?
నరేంద్రుడు: మునుపు తరచూ చూసేవాడను. ఒక రోజు యదుమల్లిక్ ఉద్యానగృహంలో శ్రీరామకృష్ణులు నన్ను స్పృశించి ఏదో ఉచ్చరించారు. నేను స్పృహకోల్పోయాను. ఆ స్పర్శచే జనించిన పరమానందం ఒక నెల రోజుల వరకూ నాలో నెలకొనే ఉంది.
నాకు వివాహం జరుగనున్నదని వినగానే ఆయన జగజ్జనని పాదార విందాలను పుచ్చుకొని విలపించారు. ‘అమ్మా! దీన్ని ఆపించు. నరేంద్రుడు మునిగి పోకుండా చూడు!’ అంటూ మొరపెట్టుకొన్నారు.
“నా తండ్రి గతించాక తల్లి, సోదరులు పస్తులు ఉండి కష్టపడ్డారు. అప్పుడు ఒక రోజు అన్నదా గుహతో ఆయన్ను చూడబోయాను. ‘నరేంద్రుని తండ్రి మరణించాడు. అతడు ఎంతో కష్టాల్లో ఉన్నాడు. మిత్రులు ఇప్పుడు అతడికి కొంత ధన సహాయం చేస్తే బాగుటుంది’ అన్నారు అతడితో. అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాక నేను ఆయన్ను కసురుకొన్నాను. ‘ఇవన్నీ అతడితో ఎందుకు చెప్పారు?’ అన్నాను. ఆయన విలపించసాగారు. విలపిస్తూనే, ‘నాయనా! నీ కోసమైతే నేను ఇంటింటికి వెళ్లి భిక్షం ఎత్తడానికీ సిద్ధమే’ అని అన్నారు. ఆయన తన ప్రేమచే మమ్మల్ని ఆకట్టుకున్నారు. మీరు ఏమంటారు?”
‘మ’ : దాన్లో వీసమంత సందేహమూ లేదు. నిష్కామమైన ఆయన ప్రేమను ఏమని చెప్పాలి!
నరేంద్రుడు: ఒక రోజు ఆయన ఏకాంతంలో నాతో ఏదో చెప్పారు. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. దీన్ని మీరు ఇక్కడవున్న మరెవరికీ చెప్పకండి.
‘మ’ : చెప్పను. ఆయన ఏమన్నారు?’
నరేంద్రుడు: తమకు సిద్ధులు ఉపయోగించడం ఇష్టం లేదనీ, నా ద్వారా వాటిని ఉపయోగిస్తాననీ అన్నారు. నేను నిరాకరించాను.
“ఆయన మాటలు నేను విస్మరిస్తానని ఆయన మీతోనూ చెప్పి ఉంటారు. ఆయన దివ్య దర్శనాలను వట్టి చిత్తభ్రమలు అని నేను పరిహసించాను.
“ఆయన నాతో, ‘నేను కుఠీపై కెక్తి, “నా ప్రియమైన బిడ్డల్లారా! నా భక్తులారా! మీరు ఎక్కడ ఉన్నారు? రండి సత్వరం రండి. మిమ్మల్ని చూడలేక నా మనస్సు క్షోభిస్తోంది!” అని కేకలు పెట్టి పిలిచాను’ అన్నారు. భక్తులు వస్తారని ఆయనతో జగజ్జనని చెప్పి ఉంది. ‘చూశారా? ఇప్పుడు అవన్నీ అట్లే జరుగుతున్నాయి’ అన్నారు. నేను ఏం చెప్పగలను! మౌనం పాటించాను.
“ఒక రోజు తన గది తలుపు మూసుకొని దేవేంద్రుడు, గిరీశ్‌తో నా గురించి, ‘అతడు ఎవరన్నది చెప్పివేస్తే అతడు తన దేహాన్ని నిలుపుకోడు’ అన్నారు.”
‘మ’ : అవును, అలాగే వినివున్నాం. మాతోను ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది. కాశీపూర్‌లో ఒకసారి నిర్వికల్ప సమాధిలో నీ స్వస్వరూపం అభివ్యక్తమైనది కదా?
నరేంద్రుడు: అవును. దేహం ఉన్నట్లే ఆ స్థితిలో నాకు తోచలేదు. కేవలం ముఖం మాత్రమే ద్యోతకమైనది. శ్రీరామకృష్ణులు మేడ మీది గదిలో ఉన్నారు. నేను క్రింద ఉన్నాను. అప్పుడు ఆ స్థితి నాకు ఏర్పడింది. నేను విలపించసాగాను. ‘నాకు ఏమైంది?’ అని అడిగాను. పెద్దగోపాల్ మేడ మీదకు పరిగెత్తి శ్రీరామకృష్ణులతో, ‘నరేంద్రుడు విలపిస్తున్నాడు’ అన్నాడు. కాసేపయ్యాక నేను ఆయన్ను చూడడానికి మేడ మీదకు వెళ్లినప్పుడు ఆయన నన్ను చూసి, ‘ఇప్పుడు గ్రహించావు కదా? తాళం చెవి నా వద్ద ఉంది’ అన్నారు. ‘నాకు ఏమైంది?’ అని నేను అడిగినప్పుడు తక్కిన భక్తులను చూస్తూ ఆయన, ‘తాను ఎవరన్నది ఇతడు గ్రహిస్తే ఇతడి దేహం నిలువదు. అందుకే మూసి ఉంచాను’ అన్నారు. ఒక రోజు ‘నువ్వు కోరితే కృష్ణుణ్ణి నీ హృదయంలో కాంచగలవు’ అన్నారు. అందుకు నేను, ‘నాకు కృష్ణుడు గిష్ణుడులాంటి విషయాలలో నమ్మకంలేదు’ అన్నాను. (‘మ’, నరేంద్రుడు నవ్వారు)
“కొన్ని స్థలాలు, కొన్ని వస్తువులు లేక కొందరు వ్యక్తులను చూస్తున్నప్పుడు వారిని గత జన్మలో నేను చూసినట్లు ఒక అంతరంగ భావన నాకు జనిస్తుంది. వాళ్లు బాగా పరిచయస్థుల్లా తోస్తారు. ఆమ్హర్ట్స్ వీథిలోని శరత్ ఇంటికి వెళ్లినప్పుడు అతడితో, ‘ఈ ఇల్లు నాకు ఇదివరలోనే పరిచయమైనట్లు తోస్తూంది. ఈ ఇంట్లోని గదులు, దారులు చాలాకాలంగా నాకు తెలిసినట్లు అనిపిస్తున్నవి’ అని అన్నాను.
“నాకు ఏది ఇష్టమో అదే చేస్తూవచ్చాను. ఏనాడూ ఆయన వ్యతిరేకించలేదు. నేను
బ్రహ్మసమాజంలో సభ్యుడుగా ఉన్నానని మీకు తెలుసు కదా?”
‘మ’ : అవును, తెలుసు.
నరేంద్రుడు: అక్కడకు స్త్రీలు కూడా వస్తారని ఆయనకు తెలుసు. స్త్రీలు ప్రక్కన ఉన్నప్పుడు ధ్యానం
ఎలా చేయగలవని ఆయన ఆక్షేపించినా నన్ను అందు గురించి ఏమీ అడగలేదు. ఒక రోజు నాతో, ‘నువ్వు బ్రహ్మసమాజంలో సభ్యుడైనట్లు రాఖాల్తో ఏమీ చెప్పవద్దు, అతడూ చేరాలంటాడు’ అన్నారు.
‘మ’ : నీకు మనోస్థైర్యం ఎక్కువ అందుకే నిన్ను అడ్డగించలేదు.
నరేంద్రుడు: జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలుతిన్న కారణంగానే నా మనోస్థితి అలా ఉంది. మాస్టర్ (‘మ’), మీరు జీవితంలో ఇంత కష్టపడినట్లు తెలియరావడం లేదు. కష్టపడకుంటే భగవంతుని సంపూర్ణంగా ఆధారం చేసుకొని జీవించడం అసాధ్యం.
“అది సరే, ఫలానా వ్యక్తిలో ఎంత వినమ్రత, అణకువ, సరళత్వం! నాలోను ఇలాటి వినమ్రత ఎలా కలుగుతుందో చెప్పండి?”
‘మ’ : నీ అహంకారం గురించి శ్రీరామకృష్ణులు ‘అహం కార్’ (ఎవరి అహంకారం) అనేవారు.
నరేంద్రుడు: దాని అర్థం ఏమిటి?
‘మ’ : రాధతో నెచ్చెలి ఒకతె, ‘నువ్వు అహంకారివి. అందుకే కృష్ణుని పరిహాసం చేశావు’ అన్నది. ఇది విన్న మరొక చెలి, ‘అవును, నిజమే. కాని ఇది కృష్ణుడు నా నాయకుడు అన్న అహంకారం. ఇది కృష్ణుడే ఆమెలో నెలకొల్పాడు’ అని జవాబు చెప్పింది.
“నీ ద్వారా అనేక పనులు నిర్వర్తించడానికి భగవంతుడే ఈ అహాన్ని నీలో ఉంచాడన్నదే శ్రీరామకృష్ణులు చెప్పిన మాటకు అర్థం.”
నరేంద్రుడు: నాకు దుఃఖం లేదని నా అహంకారం దండోరా వేస్తోంది.
‘మ’ (నవ్వుతూ): అలా అయితే నీ ఇచ్ఛమేరకు అహంకారాన్ని ఉంచుకో. (ఇద్దరూ నవ్వారు.)
పిదప విజయకృష్ణ గోస్వామి గురించీ, మిగిలిన భక్తుల గురించీ ప్రస్తావన వచ్చింది.
నరేంద్రుడు: విజయ్ను గురించి శ్రీరామకృష్ణులు, ‘అతడు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు’ అనేవారు.
‘మ’ : అంటే, ఇంకా గదిలోకి ప్రవేశించలేదు. ఒకసారి శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్లో ఉన్నప్పుడు విజయ్ ఆయనతో, ‘మీ ఈ దేహంతోనే ఢాకాలో మీ దర్శనం కలిగింది’ అన్నాడు. నుమ్వా ఆ మాట విన్నావు.
నరేంద్రుడు: అవును. దేవేంద్రుడు, రాంబాబూ తదితరులు సంసారం త్యజింప ఎంతగానో ప్రయత్నించారు. రాంబాబు ఏకాంతంలో నాతో ‘రెండేళ్లలో నిశ్చయంగా త్యజిస్తాను’ అన్నాడు.
‘మ’ : రెండేళ్ల తరువాతా? అంటే కుమార్తెలకు వివాహ ఏర్పాట్లన్నీ చేసిన తరువాతా?
నరేంద్రుడు: ఆ ఇంటిని అద్దెకు ఇచ్చేసి, మరో చిన్న ఇల్లు కొంటాడు. కుమార్తెల వివాహ ఏర్పాట్లు ఇంటివారు చూసుకొంటారు.
‘మ’ : గోపాల్* అత్యున్నత స్థితిలో ఉన్నాడు కదా?
నరేంద్రుడు: ఎట్లా?
‘మ’ : తీవ్ర పారవశ్యంతో హరినామం ఉచ్చరిస్తున్నప్పుడు కన్నీరు కాలువలు కడుతోంది, రోమాంచితమవుతూన్నది.
నరేంద్రుడు: పారవశ్యం కలిగితేనే గొప్పవాడైపోయినట్లా? కాళీ, శరత్, శశి, శారదలు గోపాల్ కంటే అత్యున్నత స్థితిలో ఉన్నవారు. వీరిలో ఎంతటి పరిత్యాగం! గోపాల్ శ్రీరామకృష్ణులను అంగీకరించడు కదా!
‘మ’ : అతడు ఈ చోటుకు చెందినవాడు కాడని శ్రీరామకృష్ణులే చెప్పివున్నారు. కాని శ్రీరామకృష్ణుల పట్ల అతడు అత్యంత భక్తి కలిగి ఉండటం నేను చూశాను.
నరేంద్రుడు: ఏం చూశారు?
‘మ’ : మొదట్లో నేను దక్షిణేశ్వరం వస్తూవున్నప్పుడు ఒక రోజు శ్రీరామకృష్ణుల గదిలో నుండి భక్తులు బయటకు వచ్చారు. పిదప నిత్యగోపాల్ ఇటుకలతో నిర్మితమైన కాలిబాటలో శ్రీరామకృష్ణుల ముందు మోకరిల్లి, చేతులు జోడించుకొని నిలబడ్డాడు. వెన్నెల కాంతి ప్రకాశిస్తూవుంది. శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరాన ఉన్న వసారాను ఆనుకొనివున్న కాలిబాట అది. అప్పుడక్కడ మరెవరూ లేరు. ఆ దృశ్యం శ్రీరామకృష్ణుల వద్ద గోపాల్ శరణాగతి పొందుతూ ఉన్నట్లు, ఆయన అతడికి అభయ ప్రదానం ఇస్తూవున్నట్లు నాకు తోచింది.
నరేంద్రుడు: నేను చూడలేదు.
‘మ’ : అతడు పరమహంస స్థితిలో ఉన్నాడని శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. అదే సమయం భక్తురాండ్రతో సన్నిహితంగా మెలగవద్దనీ అతణ్ణి హెచ్చరించారు. పలుమార్లు హెచ్చరించి ఉన్నారు.
నరేంద్రుడు: అతడు పరమహంస స్థితిలో ఉండి ఉంటే అతడికి ధనంపట్ల ఆసక్తి ఎందుకు ఉంది అని శ్రీరామకృష్ణులు నాతో అన్నారు. పైగా, ‘అతడు ఈ చోటుకు చెందినవాడు కాడు. ఎవరు నాకు అతి సన్నిహితులో వాళ్లు సదా ఇక్కడకు వస్తూవుంటారు’ అని చెప్పేవారు. ‘గోపాల్ ఒక సిద్ధుడు – హఠాత్ సిద్ధుడు. కాని ఈ చోటుకు చెందినవాడు కాడు. అతడు నాకు కావలసినవాడైతే అతణ్ణి చూడ నే నెందుకు విలపించడం లేదు?’ అని నన్ను అడిగారు. కొందరు అతణ్ణి నిత్యానందుని అవతారంగా జమకట్టేశారు. కాని శ్రీరామకృష్ణులు, ‘అద్వైతుడు, చైతన్యుడు, నిత్యానందుడు ముగ్గురూ నేనే. ఒక దేహంలో ముగ్గురు’ అని పలుమార్లు నాతో చెప్పివున్నారు.
52.4 చతుర్థ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల సాంగత్యంలో నరేంద్రుని స్మృతులు
శుక్రవారం, ఏప్రెల్ 8, 1887
వరాహనగర మఠంలో కాళీతపస్వి గదిలో ఇద్దరు భక్తులు కూర్చుని ఉన్నారు. ఒకరు సన్న్యాసి, మరొకరు గృహస్థు. ఇద్దరికీ వయస్సు ఇరవై నాలుగు లేక ఇరవై ఐదు ఉండవచ్చు. ఇద్దరూ మాట్లాడుకొంటున్నారు. అప్పుడు ‘మ’ వచ్చాడు. మఠంలో మూడు రోజులు గడపాలనే ఉద్దేశంతో వచ్చాడతడు.
ఉదయం ఎనిమిది గంటలు. ‘మ’ పూజామందిరంలో శ్రీరామకృష్ణులకు మ్రొక్కిన పిదప నరేంద్రుడు, రాఖాల్ మొదలైన భక్తులను కలుసుకొన్నాడు. ఆ తరువాత కాళీ గదికి వెళ్లి అక్కడ ఆ ఇద్దరు మాట్లాడుకొంటున్నది విన్నాడు. గృహస్థ భక్తుడు సన్న్యాసం పుచ్చుకోగోరాడు. సన్న్యాసి వద్దన్నాడు.
సన్న్యాసి: నీకున్న ఆ కొన్ని కర్తవ్యాలను పూర్తిచేయకూడదా? కాస్త ప్రయత్నిస్తే సత్వరం అవి పూర్తవుతాయి. తను నరకబాధలు అనుభవించాలని ఒక ఫలానా వ్యక్తి తెలుసుకొన్నాడు. అతడు తన మిత్రుడితో, “నరకం ఎలా ఉంటుంది?” అని అడిగాడు. అందుకు మిత్రుడు నేల మీద నరకం చిత్రాన్ని వేయసాగాడు. చిత్రం వేశాక దానిమీద అటూ ఇటూ దొర్లి “నా నరకవాసం పూర్తయింది” అన్నాడు.
గృహస్థ భక్తుడు: నాకు సంసార జీవితం నచ్చలేదు. ఆహా, మీరు ఎంత ఆనందంగా ఉన్నారు!
సన్న్యాసి: వ్యర్థంగా మాట్లాడబోకు. ఇంటినుంచి బయటకు రావాలనుకొంటే వచ్చెయ్యి. నీ కోర్కెలన్నీ పూర్తిచేసుకో.
తొమ్మిది గంటలు కాగానే శశి పూజ ప్రారంభించాడు.
సమయం పదకొండు గంటలయింది. మఠ సోదరులు ఒక్కొక్కరుగా గంగలో స్నానం చేసి వచ్చారు. పిదప శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీరామకృష్ణులకు మ్రొక్కి, ధ్యానంలో మగ్నులయ్యారు. శ్రీరామకృష్ణుల నైవేద్యం పూర్తికాగానే అందరూ కలిసి కూర్చుని భోజనం చేశారు. ‘మ’ కూడా భోజనం చేశాడు.
సాయంత్రం అయింది. ధూపం వేశారు. పిదప హారతి నిర్వర్తించారు. రాఖాల్, శశి, పెద్దగోపాల్, హరీశ్‌లు వసారాలో కూర్చుని ఉన్నారు. ‘మ’ కూడా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల నైవేద్య ప్రసాదాన్ని జాగ్రత్తగా తయారుచేయాలని రాఖాల్ అన్నాడు.
రాఖాల్ (శశి, తదితరులతో): ఒక రోజు ఆయన భోజనం చేయడానికి మునుపే, ఆ భోజనంలో ఒకింత నేను తినేశాను. అది చూసి ఆయన, ‘ఎందుకు ఇలా చేశావు? నీ ముఖం చూడను’ అన్నారు. నేను ఏడ్చేశాను.
పెద్దగోపాల్: కాశీపూర్ ఉద్యానంలో ఒక రోజు ఆయనకు అట్టెపెట్టి ఉంచిన భోజనం మీద నేను దీర్ఘంగా నిశ్వసించాను. ఆ భోజనాన్ని ఆయన నిరాకరించారు.
వసారాలో ‘మ’, నరేంద్రునితో మాట్లాడుతూ నడుస్తున్నాడు.
నరేంద్రుడు: నేను దేన్నీ ఒప్పుకోనని మీకు తెలుసు కదా?
‘మ’ : అంటే భగవంతుని సాకారత్వం గురించా?
నరేంద్రుడు: మొదట్లో ఆయన చెప్పిన అనేక విషయాలను నేను అంగీకరించలేదు. ఒక రోజు ఆయన నాతో, ‘అలా అయితే ఇక్కడకు ఎందుకు వస్తున్నావు?’ అని అడిగారు. నేను ‘మిమ్మల్ని చూద్దామని వస్తున్నానే కాని, మీ మాటలు వినడానికి కాదు’ అని జవాబు చెప్పాను.
‘మ’ : అందుకు ఆయన ఏమన్నారు?
నరేంద్రుడు: ఆయన ఎంతో సంతోషించారు.
శనివారం, ఏప్రెల్ 9, 1887
శ్రీరామకృష్ణులకు నైవేద్యం అర్పించగానే మఠ సోదరులు ప్రసాదం ఆరగించి, విశ్రాంతి తీసుకొన్నారు. నరేంద్రుడు, ‘మ’ మఠానికి పశ్చిమాన ఉన్న తోటలో ఒక చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకోసాగారు. నరేంద్రుడు, శ్రీరామకృష్ణులను చూసింది మొదలు జరిగిన పలు సంఘటనలు వివరిస్తున్నాడు.
‘మ’ : మొట్టమొదట ఆయన్ను చూసిన రోజు నీకు జ్ఞాపకం ఉందా?
నరేంద్రుడు: దక్షిణేశ్వర కాళికాలయంలోని ఆయన గదిలోనే అది తటస్థించింది. నాడు నేను ఈ రెండు పాటలు పాడాను.
నరేంద్రుడు ఆ పాటలు పాడాడు:
మరలు మనస మన నిజ నికేతనంబునకు
మారువేషముల దాల్చి
పరదేశపు ఈ భువిలో
వ్యర్థముగా దిమ్మదిరుగు
చుండనేల మన మిచట? ॥ మ ॥
వరలు సకల ప్రాణతతులు
పంచమహాభూతములును
గారొక్కరు నీవారలు
వారెల్ల పరాయివారు ॥ మ ॥
పరవారల ప్రేమలోబడి
మరతువు నిన్నేల మనస
నీ వారల నా రీతిని
ఏల మరచుచున్నావు? ॥ మ ॥
సరి మార్గము గనపరచెడు
కరదీపిక ప్రేమజ్యోతి
ధరియించుచు అధిరోహణ
మొనరింపుము సత్యపథము ॥ మ ॥
నీ దారిన బత్తెముగా
నీ సుగుణములను తెమ్ము
పరుల కంటబడనీయక
భద్రముగా వాని దాచి ॥ మ ॥
ఇరువురు దారిని దోచెడు
దొంగల వలె లోభ మోహ
మనువారలు నీ సంపద
గొనిపోవగ దాగినారు ॥ మ ॥
అనవరతము నిన్నాపద
దరిజేరక రక్షించెడు
శమదమ మను రక్షక
భటవర్గము వెంటగొనుము ॥ మ ॥
సత్పురుషుల సాంగత్యము
స్వాగత మొసగెడు సత్రము
అలసిన నీ అవయవముల
నిట విశ్రాంతిని గొననిమ్ము ॥ మ ॥
సంశయమేదైన నీకు
బొడసూపినచో నచ్చట
సత్రపు సంరక్షకుని
సరిమార్గము నరసికొనుము ॥ మ ॥
దారిలో భయమేర్పడిన
ఈశ్వరు నెలుగెత్తి పిలువు
ఆ దారికి ప్రభుడతడు
మృత్యువు సైతము మ్రొక్కును ॥ మ ॥
ఈలాగు వ్యర్థముగ నా దినములన్నియు
గడుపవలసినదేన దేవా ॥ ఈ ॥
రాత్రింబగళ్లు నే నార్తితో వేచితిని
ఆశాసథము వైపు దేవా
విశ్వనాథుడ వీవు బిచ్చగాడను నేను
ఏలాగు హృది నిలువమని వేడగలను? ॥ ఈ ॥
నా బీద ఎదయను గుడిసె తలుపులు బాగ
తెరువబడియున్నవి దేవా
దయయుంచి ఒకసారి దానిలోనికి వచ్చి
హృదయ దాహము తీర్పరావా? ॥ ఈ ॥
‘మ’ : పాట విని ఆయన ఏమన్నారు?
నరేంద్రుడు: ఆయన భావపారవశ్యంలో మునిగిపోయారు. ప్రక్కన ఉన్న రాంబాబు మొదలైన వారితో ‘ఈ కుర్రాడు ఎవరు?ఆహా! ఎంత బాగా పాడుతున్నాడు!’ అన్నారు. మళ్లీ రమ్మని నాతో చెప్పారు.
‘మ’ : మళ్లీ ఆయన్ను ఎక్కడ కలుసుకొన్నావు?
నరేంద్రుడు: మళ్లీ రాజ్‌మోహన్ ఇంట్లో. పిదప దక్షిణేశ్వరంలో. అప్పుడు నన్ను స్తుతించారు; ‘నువ్వు నారాయణుడవు. నా కోసం దేహధారణ చేసి వచ్చావు’ అని పాడారు. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి.
‘మ’ : ఇంకా ఆయన ఏం చెప్పారు?
నరేంద్రుడు: ఆయన ఇలా అన్నారు: ‘నువ్వు నా కోసం దేహం ధరించి వచ్చావు. నేను జగజ్జననితో, “అమ్మా, నేను వెళ్లగలనా? అలా వెళితే ఎవరితో మాట్లాడతాను? అమ్మా, కామినీ కాంచనాలను అడుగంటా త్యజించిన శుద్ధ భక్తుల సాంగత్యం కలుగకుంటే నే నెలా భూమ్మీద జీవించగలను?” అని మొరపెట్టుకొన్నాను. నువ్వు రాత్రి ఇక్కడకు వచ్చి నన్ను నిద్రలేపి, “నేనొచ్చేశాను” అన్నావు.’ కాని నాకో ఏమీ తెలియదు. నేను కలకత్తాలో నా ఇంట్లో ఆదమరచి నిద్రపోతున్నాను.
‘మ’ : అలా అయితే ఒకే సమయంలో నువ్వు ఉండటమూ జరిగింది, లేకపోవటమూ తటస్థించింది. భగవంతుడు సాకారుడైనట్లు, అదే సమయంలో నిరాకారుడైనట్లు మాదిరి.
నరేంద్రుడు: అవును. ఇది ఎవరితోనూ చెప్పకండి – కాశీపూర్‌లో నాలో శక్తిని ప్రసారం చేశారు.
‘మ’ : పిదప నువ్వు కాశీపూర్ ఉద్యానంలో చెట్టు క్రింద ధుని రగిలించి దాని ప్రక్కన కూర్చున్నావు కదా?
నరేంద్రుడు: అవును. ప్రక్కనే కూర్చునివున్న కాళీతో, “నా చెయ్యి పుచ్చుకొని చూడు’ అన్నాను. చెయ్యి పుచ్చుకొన్న కాళీ ‘నీ దేహం నుండి విద్యుచ్ఛక్తి ప్రసరించేట్లు నాకు ఆఘాతం కలిగింది’ అన్నాడు. ఈ విషయం మాలో ఎవరికీ చెప్పనని వాగ్దానం చేయండి.
‘మ’ : నీ ద్వారా పలు గొప్ప కార్యాలు నిర్వర్తించబడాలన్న ఉన్నత ఆశయంతో ఆయన నీలో శక్తిని ప్రసరింపచేశారు. ఒక రోజు ఒక కాగితం ముక్క మీద, ‘నరేన్ జనానికి బోధిస్తాడు’ అని వ్రాశారు.
నరేంద్రుడు: కాని నేను, ‘అదంతా నా వల్ల కాదు’ అన్నాను. అందుకు ఆయన, ‘నీ నరనరాలు దాన్ని చేస్తాయి’ అన్నారు. శరత్‌ను పరిరక్షించే బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పుడతడు భగవంతునికై వ్యాకులత చెందుతున్నాడు. అతడిలో కుండలినీశక్తి జాగృతమైంది.
‘మ’ : ఇకపై చెత్తాచెదారం ప్రోగవకుండా చూసుకోవాలి. ‘చెరువులో వసించటానికి చేపలు పెద్ద కలుగులు తవ్వుతాయి. కాని చెత్తాచెదారం అడ్డుపడితే ఆ కలుగులలో అవి వసించలేవు’ అని శ్రీరామకృష్ణులు చెప్పటం నీకు గుర్తేననుకొంటాను.
నరేంద్రుడు: నన్ను నారాయణుడని సంబోధించేవారాయన.
‘మ’ : ఆ విషయం నాకు తెలుసు.
నరేంద్రుడు: అయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆయన కాళ్లు కడుగుకోవడానికి నేను నీళ్లు అందించడం ఆయన అనుమతించేవారు కారు. కాశీపూర్‌లో ఒక రోజు భక్తులతో, ‘తాళంచెవి నా వద్ద ఉంది. స్వస్వరూపాన్ని గ్రహిస్తే దేహాన్ని వదలి వేస్తాడు’ అన్నారు.
‘మ’ : ఒక రోజు నీకు ఆ పరిస్థితి (నిర్వికల్ప సమాధి) ఏర్పడింది కదా?
నరేంద్రుడు: అవును. ఆ సమయంలో నాకు దేహం లేనట్లూ, తల మాత్రమే ఉన్నట్లూ ఒక అనుభూతి ఏర్పడింది! అప్పుడు న్యాయపరీక్షలకై ఇంట్లో చదువు కొంటున్నాను. హఠాత్తుగా, “నేను ఏం చేస్తున్నాను?” అన్నభావం మనస్సులో మెదలింది.
‘మ’ : శ్రీరామకృష్ణులు కాశీపూర్‌లో ఉన్న సమయంలోనా?
నరేంద్రుడు: అవును. ఉన్మాదిలా ఇంట్లో నుండి పారిపోయి వచ్చాను. నన్ను చూడగానే ఆయన, ‘నీకు ఏం కావాలి?’ అని అడిగారు. ‘నాకు సమాధిలో మగ్నమైపోవాలని ఉంది’ అని బదులు చెప్పాను. అందుకు ఆయన, ‘నువ్వు అల్పబుద్ధివి! సమాధికి ఆవల కెళ్లు! సమాధి అతిస్వల్ప విషయం!’ అన్నారు.
‘మ’ : అవును. ఆయన జ్ఞానాన్ని దాటి విజ్ఞానం అనే స్థితిని గురించి చెప్పారు. అంటే, డాబా ఎక్కిన పిదప మెట్లగుండా ఎక్కి, దిగటం లాటిది.
నరేంద్రుడు: జ్ఞానం జ్ఞానం అంటూ పరితపిస్తున్నాడు కాళీ., నేను అతణ్ణి కసురుతున్నాను. ‘జ్ఞానమా కావాలి? మొదట భక్తి పరిపక్వత కానివ్వు’ అన్నాను. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తారక్‌తో, ‘పారవశ్యం, భక్తి – వీటికి అంతమే లేదు’ అన్నారు.
‘మ’ : నీ గురించి ఇంకా ఏం చెప్పారు?
నరేంద్రుడు: నేను ఏం చెప్పినా అట్లే విశ్వసించేవారు. నే నొకసారి, మీరు గాంచే దివ్యదర్శనాలన్నీ మీ చిత్తభ్రమలు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన జగజ్జనని వద్దకు వెళ్లి, ‘నరేంద్రుడు ఇలా అంటూన్నాడే, అలా ఐతే అన్నీ కేవలం భ్రమలేనా?’ అని అడిగారు. పిదప నా వద్దకు వచ్చి అవన్నీ యథార్థమే అని జగజ్జనని చెప్పిందని చెప్పారు.
“పైగా నాతో, ‘నీ పాట వింటే (తన వక్షాన్ని తాకి చూపుతూ) దీన్లో ఉండే వ్యక్తి పాములా బుసకొట్టి, పడగవిప్పి నిశ్చలంగా నిలబడి వింటూవున్నట్లు తోస్తుంది’ అన్నారు – మీకు జ్ఞాపకం ఉందనుకొంటాను.
“మాస్టర్ (‘మ’), నన్ను గురించి ఆయన ఇంత చెప్పినప్పటికీ నేను సాధించింది ఏమిటి?”
‘మ’ : ఇప్పుడు నువ్వు శివవేషం ధరించావు; నువ్వు ధనం స్వీకరించలేవు. శ్రీరామకృష్ణులు చెప్పే కథ నీకు తెలిసిందే!
నరేంద్రుడు: ఏమిటది? చెప్పండి.
‘మ’ : ఒక పగటి వేషగాడు శివవేషం ధరించాడు. అతడు ఒక ఇంటికి వెళ్లినప్పుడు, ఆ ఇంట్లోని వారు అతడికి ఒక రూపాయి ఇచ్చారు. కాని అతడు దాన్ని స్వీకరించలేదు. తన ఇంటికి వెళ్లి వేషం తీసివేసి, కాళ్లు చేతులు కడుక్కొన్నాక తిరిగి వచ్చి రూపాయి అడిగాడు. ‘నువ్వెందుకు మొదట పుచ్చుకోలేదు?’ అని ఆ ఇంటివారు అడిగినప్పుడు, ‘అప్పుడు నేను శివవేషం ధరించి ఉన్నాను. శివుడు ఒక సన్న్యాసి. ధనం ముట్టరాదు’ అని బదులు చెప్పాడు.
ఇది విని నరేంద్రుడు పగలబడి నవ్వాడు.
‘మ’ : నువ్వు ప్రస్తుతం ఒక వైద్యుని వేషం ధరించి ఉన్నావు. బాధ్యత అంతా నీ మీదనే ఉంది. మఠ సోదరుల సంరక్షకుడవు.
నరేంద్రుడు: మేం శ్రీరామకృష్ణులు చూపిన మార్గంలోనే సాధనలు అనుష్ఠిస్తున్నాం. కాని రాంబాబు దీన్ని పరిహసించడమే వింతగా ఉంది. ‘మేం శ్రీరామకృష్ణులను దర్శించాము. ఇక సాధనలు ఎందుకు?’ అంటాడతడు.
‘మ’ : ఎవరికి దేన్లో విశ్వాసం ఉన్నదో దాని ప్రకారం చేసుకోవచ్చు.
నరేంద్రుడు: మమ్మల్ని సాధనలు అనుష్ఠించమని ఆయన చెప్పారు.
నరేంద్రుడు మళ్లీ శ్రీరామకృష్ణుల అవ్యాజ ప్రేమను గురించి చెప్పసాగాడు.
నరేంద్రుడు: ఎన్నోసార్లు ఆయన నా కోసం జగజ్జనని వద్దకు వెళ్లి మొరపెట్టుకొన్నారు. నా తండ్రి గతించాక తినడానికి తిండిలేక మేం ఇంట్లో దుర్భరావస్థలో ఉన్నప్పుడు నా కోసం జగజ్జననిని ధనం ఇప్పించమని ప్రార్థించారు.
‘మ’ : అవన్నీ నాకు తెలుసు. నువ్వు ఒకసారి నాతో చెప్పి ఉన్నావు.
నరేంద్రుడు: కాని నాకు ధనం లభించలేదు. శ్రీరామకృష్ణులు నాతో, ‘సామాన్యమైన తిండీ బట్టకు నీకు లోటు ఉండదు’ అని అన్నారు. నా పట్ల ఆయనకు ఎంతటి అవ్యాజ ప్రేమ! అదే సమయంలో నాలో ఏదన్నా చెడుతలంపు మెదలితే ఆయనకు వెంటనే తెలిసిపోయేది. అన్నదాగుహతో తిరుగుతున్నప్పుడు దుష్ట సహవాసంలో చిక్కువడ్డాను. ఆ రోజుల్లో నా చేతిగుండా ఏ ఆహారాన్ని ఆయన తినలేకపోయేవారు. తినడానికి చేయి ఎత్తేవారు. కాని చెయ్యి పైకి పోయేదికాదు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడూ అట్లే. తినడానికై చేతిని నోటి దాకా తీసుకువెళ్లేవారు. ఆ తరువాత సాధ్యం అయ్యేది కాదు. పిదప నాతో, ‘ఇంకా నువ్వు తయారుకాలేదు’ అనేవారు.
“కొన్ని సందర్భాలలో నేను అడుగంటా విశ్వాసాన్ని కోల్పోయేవాడిని. ఒకసారి బాబూరాం ఇంట్లో ఉన్నప్పుడు సర్వం శూన్యం, దేవుడు గీవుడు ఎవరూ లేరు అనే భావన జనించింది.”
‘మ’ : తమకూ ఇలాటి స్థితి ఏర్పడిందని శ్రీరామకృష్ణులే స్వయంగా చెప్పి ఉన్నారు.
ఇద్దరూ కాసేపు మౌనం వహించారు. పిదప ‘మ’, “మీరు ధన్యులు. రేయింబవళ్లు ఆయన చింతనలోనే ఉన్నారు” అన్నాడు. అందుకు నరేంద్రుడు, “భగవత్సాక్షాత్కారం పొందనందున దేహత్యాగం చేయాలన్న భావన మాకు ఇంకా కలుగడం లేదే!” అన్నాడు.
రాత్రి అయింది. నిరంజన్ పూరీ నుంచి తిరిగివచ్చాడు. అతణ్ణి చూసి మఠ సోదరులు, ‘మ’ ఎంతో సంతోషించారు. అతడు పూరీయాత్రానుభవాలు వివరించాడు. అతడి వయస్సు ఇరవై ఐదు లేక ఇరవై ఆరు ఉండవచ్చు.
హారతి తదనంతరం కొందరు ధ్యానమగ్నులయ్యారు. కొందరు వసారాలో కూర్చుని నిరంజన్‌తో మాట్లాడసాగారు. రాత్రి తొమ్మిది గంటలకు శ్రీరామకృష్ణులకు శశి నైవేద్యం అర్పించాడు. పిదప శ్రీరామకృష్ణులు శయనించారు.
మఠ సోదరులు నిరంజన్‌తో కలిసి భోజనం చేశారు. చపాతీ, కూర, బెల్లం, శ్రీరామకృష్ణుల ప్రసాదమైన రవ్వపాయసం – ఇవే వారి రాత్రి ఆహారం.
52.5 పంచమ పరిచ్ఛేదం భక్తుల హృదయాలలో శ్రీరామకృష్ణులు – నరేంద్రాదుల తీవ్రవైరాగ్యం, సాధన
శనివారం, మే 7, 1887
వైశాఖ పౌర్ణమి. సాయం సమయం. కలకత్తాలోని గురుప్రసాద్ చౌధరీ వీథిలోని ‘మ’ ఇంటి ముందు గదిలో ఒక మంచం మీద కూర్చుని నరేంద్రుడు, ‘మ’ మాట్లాడుకొంటున్నారు. అది ‘మ’ అధ్యయనం చేసే గది. నరేంద్రుడు రావడానికి కాస్త ముందుగా మర్చెంట్ ఆఫ్ వెనీస్, కోమస్, బ్లాకీ యొక్క సెల్ఫ్–కల్చెర్ (స్వీయ సంస్కృతి) గ్రంథాలను విద్యార్థులకు పాఠం చెప్పడానికై ‘మ’ చదువుతున్నాడు.
నరేంద్రుడు (‘మ’ తో): నా కేదీ నచ్చడం లేదు. ప్రస్తుతం మీతో మాట్లాడు తున్నప్పటికీ, ఈ క్షణమే నేను ఇక్కడ నుంచి పారిపోవాలని అనిపిస్తూవుంది.
నరేంద్రుడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. పిదప, “ప్రాయోపవేశం చేయనా?” అని అడిగాడు.
‘మ’ : మంచిది. భగవంతునికై దేన్నయినా చేయవచ్చు.
నరేంద్రుడు: ఒకవేళ ఆకలిని ఓర్చుకోలేకుంటే?
‘మ’ : ఏదో తిని సాధన కొనసాగించవచ్చు.
నరేంద్రుడు మళ్లీ కొన్ని నిమిషాలు మౌనం వహించాడు.
నరేంద్రుడు: భగవంతుడు లేడని తోస్తోంది! ఇన్ని ప్రార్థనలు చేసినప్పటికీ చెవి ఒగ్గలేదు.
“ఏమేం దర్శించాను! సువర్ణాక్షరాలలో మంత్రాలు ప్రకాశిస్తూ ఉండటం చూశాను. కాళీ స్వరూపాన్ని ఎన్నోమార్లు గాంచాను. ఇంకా ఎన్నెన్నో దివ్య దర్శనాలు. అయినప్పటికీ నాకు శాంతి లభించలేదు. నాకు ఒక అణా ఇవ్వగలరా?
నరేంద్రుడు శోభాబజార్ నుంచి వరాహనగర్ మఠానికి బండిలో వెళ్లవలసి ఉంది. అందుకోసమే ఈ అణా. అప్పుడు సాత్కరి బండిలో వచ్చి దిగాడు. అతడికి నరేంద్రుని వయస్సే ఉంటుంది. అతడు యువసన్న్యాసులను ఎంతో అభిమానిస్తాడు. తరచూ మఠానికి వెళుతూ ఉంటాడు. అతడి ఇల్లు వరాహనగర మఠానికి సమీపంలో ఉంది, కార్యాలయం కలకత్తాలో ఉంది. అతడికి సొంత బండి ఉంది. ఆ బండి కలకత్తా నుంచి తిరిగివచ్చేటప్పుడే నరేంద్రుణ్ణి చూశాడు. “నేను ఇతడితో వెళతాను” అంటూ నరేంద్రుడు పైకాన్ని ‘మ’ కు తిరిగి ఇచ్చేశాడు. పిదప ‘మ’ తో, “తినడానికి ఏదన్నా పెట్టండి” అన్నాడు. ‘మ’ ఉపాహారానికి ఏర్పాటు చేశాడు.
‘మ’ కూడా వారితో అదే బండిలో మఠానికి వెళ్లాడు. సాయంత్రానికి మఠం చేరుకొన్నారు. ఈ యువకులు ఎలా రోజులు గడుపుతున్నారో, ఏఏ సాధనలు అనుష్ఠిస్తున్నారో తెలుసుకోగోరాడు ‘మ’. తమ శిష్యులలో శ్రీరామకృష్ణులు ఎలా అభివ్యక్తం అవుతున్నారో తెలుసుకోవడానికి ‘మ’ తరచూ మఠానికి వచ్చేవాడు.
నాడు మఠంలో నిరంజన్ లేడు. ఒంటరిగా జీవిస్తున్న తల్లిని చూడడానికి ఇంటికి వెళ్లాడు. బాబూరామ్, శరత్, కాళీ ముగ్గురూ పూరీకి వెళ్లివున్నారు. వాళ్లు ఇంకా కొన్ని రోజులు పూరీలోనే ఉండిపోయి జగన్నాథుని రథయాత్ర తిలకించి తిరిగివద్దామనుకొన్నారు.
ఈ సోదరులను చూసుకొనే బాధ్యత నరేంద్రునిది. శారదాప్రసన్న కొన్ని రోజులుగా తీవ్రసాధనలో మునిగివున్నాడు. నరేంద్రుడు అతడితోను తన ప్రాయోపవేశం గురించి తెలిపి ఉన్నాడు. నరేంద్రుడు కలకత్తాకు వెళ్లివున్నప్పుడు అతడు ఎవరితోను చెప్పకుండా ఎక్కడకో వెళ్లిపోయాడు. తిరిగివచ్చి సంగతి సందర్భాలు తెలుసుకొన్నాడు నరేంద్రుడు. “రాజా (రాఖాల్) అతణ్ణి ఎందుకు వెళ్లనిచ్చాడు?” అని అడిగాడు. అయితే రాఖాల్ అప్పుడు అక్కడ లేడు. అతడు దక్షిణేశ్వరానికి వెళ్లివున్నాడు. రాఖాల్ను సోదరులు ప్రేమతో ‘రాజా’ అని పిలుస్తారు. ‘రాఖాల్ రాజా’ శ్రీకృష్ణుని నామాంతరం.
నరేంద్రుడు: రాజా తిరిగిరానీ, బాగా చీవాట్లు పెడతాను. అతడు ప్రసన్నని ఎలా పోనిచ్చాడు? (హరీశ్‌తో) అప్పుడు నువ్వు కాళ్లను బలంగా అదిమిపెట్టి మహాప్రసంగం చేస్తూవున్నావా? అతణ్ణి నువ్వు ఆపి ఉండవచ్చు కదా?
హరీశ్ (వణకిపోతూ హీనస్వరంలో): తారక్ ఆపాడు. వినకుండా అతడు వెళ్లిపోయాడు.
నరేంద్రుడు (‘మ’ తో): చూశారా నా సమస్య? ఇక్కడా ఒక మాయ సంసారంలో చిక్కువడి ఉన్నాను. ఆ కుర్రాడు ఎక్కడకు పోయినట్లు?
రాఖాల్ దక్షిణేశ్వర కాళీ ఆలయం నుండి భవనాథ్తో కలిసి తిరిగివచ్చాడు. రాఖాల్తో నరేంద్రుడు, ప్రసన్నుని గురించి చెప్పాడు. ప్రసన్నుడు నరేంద్రుని కొక ఉత్తరం వ్రాసి ఉన్నాడు. ఆ ఉత్తరం చదివారు. దాన్లో, “నేను బృందావనానికి కాలినడకన పోతున్నాను. ఇక్కడ ఉండటం ప్రమాదంగా తోస్తోంది. ఇక్కడ నా మనస్సులో మార్పు గోచరిస్తున్నది. మునుపు నా తల్లితండ్రులను, బంధువులను కలలో గాంచేవాడను. ఇప్పుడు స్త్రీనే చూస్తున్నాను. రెండుసార్లు ఎంతో కష్టపడ్డాను. అందుకే అప్పుడు ఇంటికి వెళ్లాను. ఇప్పుడు సుదూరానికి పోతున్నాను. శ్రీరామకృష్ణులు ఒకసారి నాతో, ‘నీ ఇంట్లో వాళ్లు ఏం చేయడానికీ సంశయించరు. వారిని నమ్మవద్దు’ అని హెచ్చరించి ఉన్నారు” అని ఉంది.
రాఖాల్: అతడు వెళ్లిపోవడానికి ఇవే కారణాలు. మరో మాట కూడా ప్రసన్నుడు చెప్పాడు. ‘తల్లి, సోదరీసోదరులను చూడడానికి నరేంద్రుడు తరచూ ఇంటికి వెళ్లివస్తున్నాడు. కుటుంబ వ్యాజ్యాన్ని నడిపిస్తున్నాడు. నాకూ అలా ఇంటికి పోవాలనే ఆకాంక్ష కలుగుతుందేమో అని భయపడుతున్నాను.’
నరేంద్రుడు మౌనం వహించాడు.
రాఖాల్ తీర్థయాత్ర చేయాలని చెప్పాడు. “ఇక్కడ బసచేయడం వల్ల ఎలాటి పురోగతి కలిగినట్లూ తెలియడం లేదు. భగవత్సాక్షాత్కారం గురించి శ్రీరామకృష్ణులు చెప్పినవేవీ జరగలేదే!” అన్నాడు.
రాఖాల్ పడుకొన్నాడు. కొందరు అతడి ప్రక్కన కూర్చున్నారు; కొందరు పడుకొన్నారు.
రాఖాల్: నర్మదకు వెళదాం రా.
నరేంద్రుడు: వెళ్లి ఏం ప్రయోజనం? జ్ఞానం సిద్ధిస్తుందా ఏమిటి? ఎందుకు జ్ఞానం జ్ఞానం అంటూ తొందరపడుతున్నావు?
ఒక భక్తుడు: అలా అయితే నువ్వు ఎందుకు సంసారం త్యజించావు?
నరేంద్రుడు: రామ్ లభించలేదన్నందున శ్యామాతో జీవితం గడపాలా ఏమిటి? భగవద్దర్శనం కలుగలేదన్నందున పిల్లాజల్లాను కనబోతున్నావా? నువ్వు ఏం అంటున్నావు?
నరేంద్రుడు బయటకు వెళ్లాడు. రాఖాల్ పడుకొని ఉన్నాడు. కాసేపయ్యాక నరేంద్రుడు తిరిగి వచ్చి కూర్చున్నాడు.
ఒక సోదరుడు పడుకొనే తమాషాగా, భగవంతుని దర్శించలేదన్న విరహవేదన భరించలేని వ్యక్తిలా, “అయ్యో, ఒక కత్తి ఇవ్వండి. ఇక జీవించడం నిరర్థకం. ఇకపై నేను దీన్ని భరించలేను” అన్నాడు.
నరేంద్రుడు (గంభీరంగా): ఇదిగో కత్తి ఉంది! అందుకో (అందరూ నవ్వారు)
మళ్లీ శారదాప్రసన్నుని గురించిన ప్రస్తావన వచ్చింది.
నరేంద్రుడు: ఇక్కడా మాయే అయితే ఇక సన్న్యాసం ఎందుకు?
రాఖాల్: ‘ముక్తి–తత్సాధన’ అనే పుస్తకంలో సన్న్యాసులు కలిసి జీవించడం మంచిది కాదు అని పేర్కోబడి ఉంది. సన్న్యాసుల నగరం గురించి దాన్లో వర్ణించబడింది.
శశి: నేను సన్న్యాసం గిన్యాసం దేన్నీ అంగీకరించను. నా వరకు వెళ్లకూడని స్థలం అంటూ ఏదీ లేదు, బస చేయలేని స్థలం అంటూ ఏదీ నాకు లేదు.
భవనాథ్ గురించిన ప్రస్తావన వచ్చింది. భవనాథ్ భార్య అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంది.
నరేంద్రుడు (రాఖాల్తో): భవనాథ్ భార్య బ్రతికి బట్టకట్టిందనుకొంటాను. అందుకే ఆమెను తోడ్కొని వాహ్యాళిగా దక్షిణేశ్వరానికి వెళ్లినట్లున్నాడు.
కాంకూర్గాచ్ఛి ఉద్యానం గురించి ప్రస్తావన వచ్చింది. దాని సొంతదారుడైన రామ్ అక్కడ ఒక ఆలయం నిర్మించనున్నాడు. అక్కడ శ్రీరామకృష్ణుల అస్తికలు పదిలపరచబడి ఉన్నవి.
నరేంద్రుడు (రాఖాల్తో): రాంబాబు ‘మ’ ను ఒక నిర్వాహక సభ్యునిగా నియమించాడు.
‘మ’ (రాఖాల్తో): ఏమిటి? నాకేం తెలియదే!
మునిమాపువేళ అయింది. పూజామందిరంలో శ్రీరామకృష్ణుల చిత్రపటం ముందు శశి ధూపం వేశాడు. మధుర స్వరంలో దైవనామాలను ఉచ్చరిస్తూ తక్కిన గదులలోని దేవీదేవతల చిత్రపటాలకు ధూపం చూపి, మ్రొక్కాడు. పిదప హారతి నిర్వర్తించాడు. మఠసోదరులు, తక్కిన భక్తులు చేతులు జోడించుకొని హారతి తిలకించారు. గంటల, జేగంటల నాదంతో జతకలుపుతూ అందరూ కలిసి హారతి పాట గానం చేశారు:
జయ శివ ఓంకార, భజ శివ ఓంకార
బ్రహ్మా విష్ణు సదాశివ,
హరహరహర మహాదేవా.
కాశీ విశ్వనాథుని సన్నిధిలో పాడే పాట ఇది.
మఠంలోని సన్న్యాస సోదరులను చూసి ‘మ’ పరమానందభరితుడయ్యాడు.
రాత్రి భోజనం పూర్తయ్యేసరికి పదకొండు గంటలయింది. అందరూ నిద్రకు ఉపక్రమించారు. ‘మ’ కు పడక ఏర్పాటు చేసి ఇచ్చారు.
రాత్రి రెండు గంటల వేళ. ‘మ’ కు నిద్రపట్టలేదు. ‘ఇక్కడ అందరూ ఉన్నారు. అదే అయోధ్య కాని రాముడు మాత్రం లేడు’ తనలో అనుకొన్నాడు ‘మ’. సందడి చేయకుండా లేచి బయటకు వచ్చాడు. వైశాఖ పౌర్ణమి. ఒంటరిగా, శ్రీరామకృష్ణులను చింతన చేస్తూ ‘మ’ గంగాతీరంలో నడవసాగాడు.
శనివారం నాడు వచ్చిన ‘మ’ బుధవారం వరకు, ఐదు రోజులు మఠంలో ఉండిపోయాడు. ఆదివారం గృహస్థ భక్తులు మఠానికి రావడం కద్దు. ‘మ’ శ్రీరామకృష్ణులతో యోగవాసిష్ఠం గురించి ఒకింత అడిగి ఉన్నాడు. దేహాభిమానం ఉన్నప్పుడు యోగవాసిష్ఠంలో పేర్కోబడిన సోఽహం భావనను చేపట్టడం మంచిది కాదని, సేవ్యసేవక భావం మంచిదని ఆయన చెప్పివున్నారు. మఠ సోదరులు దీన్ని గురించి ఏమంటున్నారో తెలుసుకోగోరాడు ‘మ’. కాబట్టి యోగవాసిష్ఠం గురించి ప్రస్తావించాడు.
‘మ’ : యోగవాసిష్ఠం బ్రహ్మజ్ఞానం గురించి ఏం చెబుతోంది?
రాఖాల్: ఆకలి, దప్పిక, సుఖదుఃఖాలు ఇవన్నీ మాయ! మనస్సును నశింపచేసుకోవడమే మార్గం.
‘మ’ : మనస్సు నశించాక మిగిలి ఉన్నది బ్రహ్మం. అంతే కదా?
రాఖాల్: అవును.
‘మ’ : శ్రీరామకృష్ణులు దీన్నే చెబుతారు. నాంగ్టా దీన్ని ఆయనకు వివ రించాడు. అది సరే. వసిష్ఠుడు రాముణ్ణి గార్హస్థ్య జీవితం గడపమన్నట్లు ఏదైనా చెప్పబడి ఉందా?
రాఖాల్: ఎక్కడ, నే నింతవరకు అలా ఏమీ చూడలేదు. దాన్లో రాముడు అవతారమనే అంగీకరించబడలేదు.
ఇలా మాట్లాడుకొంటూ ఉన్నప్పుడు నరేంద్రుడు, తారక్, ఒకరిద్దరు భక్తులు గంగాతీరం నుంచి తిరిగి వచ్చారు. వారు కొన్నగర్ వెళ్లాలనుకొన్నారు. పడవ దొరకనందున తిరిగివచ్చేశారు. వాళ్లూ వచ్చి కూర్చున్నారు. యోగవాసిష్ఠం గురించిన మాటలు కొనసాగాయి.
నరేంద్రుడు (‘మ’ తో): దాన్లో అనేక చక్కని కథలు ఉన్నాయి. లీలా కథ మీకు తెలుసా?
‘మ’ : అవును. యోగావాసిష్ఠంలో చదివినట్లు గుర్తు. లీలాకు బ్రహ్మజ్ఞానం కలిగింది కదా!
నరేంద్రుడు: అవును. ఇంద్ర – అహల్య సంభాషణ చదివారా? రాజా విదురత్* చండాలుడుగా మారటం తెలుసా?
‘మ’ : గుర్తుకు వస్తోంది.
నరేంద్రుడు: అరణ్య వర్ణన ఎంత మనోహరంగా ఉంది.
నరేంద్రుడు, ఇతర భక్తులు గంగలో స్నానం చేయడానికి వెళ్లారు. ‘మ’ కూడా వెళ్లాడు. ఎండ తీక్షణతను చూసి ‘మ’ గొడుగు అందుకొన్నాడు. వరాహనగర్కు చెందిన శరశ్చంద్రుడు కూడా స్నానార్థం వాళ్లతో వెళ్లాడు. అతడు సంప్రదాయస్థుడైన బ్రాహ్మణ యువకుడు; మఠానికి తరచూ వస్తూవుంటాడు. కొన్ని రోజులకు మునుపు తీవ్రవైరాగ్యం జనించి పలు పుణ్యతీర్థాలను సేవించి వచ్చాడు.
‘మ’ (శరశ్చంద్రతో): విపరీతమైన ఎండ.
నరేంద్రుడు: ఓ! అందుకే గొడుకు పుచ్చుకొన్నారా? (‘మ’, నవ్వాడు)
భక్తులందరూ చేత తువ్వాళ్లతో మఠం నుంచి బయలుదేరి గంగాతీరంలోని పరామాని ఘట్టం ప్రక్కనున్న ఘట్టంలో స్నానం చేశారు. అందరూ కాషాయాంబరాలు ధరించి ఉన్నారు. నాడు మే 8 వ తారీఖు.
‘మ’ (నరేంద్రునితో): నిజంగానే ఎండ తీక్షణంగా ఉంది. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
నరేంద్రుడు: వైరాగ్యానికి అడ్డంకి దేహం. అంతే కదా! మీకూ దేవేంద్ర బాబుకు –
‘మ’ నవ్వేసి, ‘దేహం మాత్రమేనా?’ అనుకొన్నాడు.
స్నానం పూర్తయ్యాక భక్తులు మఠానికి తిరిగి వచ్చారు. కాళ్లు చేతులు కడుక్కొని పూజామందిరానికి వెళ్లారు. శ్రీరామకృష్ణులకు మ్రొక్కి ఆయన పాదపద్మాలకు సుమాలు సమర్పించారు.
నరేంద్రుడు పూజామందిరానికి రావడంలో కాస్త జాప్యం అయింది. శ్రీరామకృష్ణులకు మ్రొక్కి, పుష్పాలు సమర్పించాలని చూస్తే బుట్ట ఖాళీగా ఉంది. “పువ్వులు లేవే” అన్నాడు బిగ్గరగా. మిగిలివున్న బిళ్వదళాలను చందనంలో ముంచి తీసి శ్రీరామకృష్ణులకు అర్పించాడు. ఒకసారి గంటకొట్టి శ్రీరామకృష్ణులకు మ్రొక్కి, ఆహ్వానితుల గదిలోకి వచ్చి కూర్చున్నాడు.
నరేంద్రుడు ‘దానవుల’ గదిలో కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన ‘మ’ ఛునీలాల్, తక్కిన సోదర సన్న్యాసులు కూర్చున్నారు. ధర్మప్రబోధం గురించిన ప్రస్తావన వచ్చింది.
‘మ’ (నరేంద్రునితో): బెత్తం దెబ్బలకు భయపడే నేను భగవంతుణ్ణి గురించి మాట్లాడను అంటారు విద్యాసాగర్.
నరేంద్రుడు: బెత్తం దెబ్బల భయమా? అదేమిటి?
‘మ’ : విద్యాసాగర్ ఇలా అంటారు: ‘మరణించిన తరువాత మన మందరం భగవంతుని వద్దకు పోతామని అనుకొందాం. యమదూతలు కేశవసేన్ను లాక్కొచ్చి భగవంతుని ఎదుట నిలబెడతారు. కేశవసేన్ సంసార జీవితంలో కచ్చితంగా కొన్ని పాపాలకు ఒడిగట్టే ఉంటాడు. ఇవి నిరూపితం కాగానే భగవంతుడు, ‘ఇతడికి ఇరవై ఐదు కొరడా దెబ్బలు తగిలించండి’ అంటాడు. తరువాత నన్ను కూడా భగవంతుని ముందుకు తీసుకువచ్చి నిలబెడతారనుకోండి. నేను కేశవ్సేన్ సమాజానికి చెందినవాడిని; అనేక చెడు కార్యాలకు పాల్పబడిన వాణ్ణి. కాబట్టి నాకూ బెత్తం దెబ్బల ఆజ్ఞ అవుతుంది. అప్పుడు నేను ‘కేశవ్సేన్ నాకు ఇలా ఉపదేశించాడు. అందుకే నేను ఇలా ప్రవర్తించాను’ అని అంటాను. వెంటనే భగవంతుడు మళ్లీ కేశవ్సేన్ను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. కేశవ్ రాగానే, ‘నువ్వు ఇతడికి ఉపదేశం చేశావా? నీకే భగవంతుణ్ణి గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఉపదేశం ఒకటా? ఎవరక్కడ? ఇతడికి ఇంకా ఇరవై ఐదు వాతలు తగిలించండి’ అంటాడు. (అందరూ నవ్వారు.)
“అందుకే విద్యాసాగర్, ‘నన్నే నేను చూసుకోలేకపోతున్నాను. ఇతరులకోసం నేను బెత్తం దెబ్బలు తినడమా? భగవంతుని గురించి నాకే ఏమీ తెలియనప్పుడు ఇతరులకు ఏం బోధించగలను?’ అంటాడు.”
నరేంద్రుడు: దీన్ని అవగతం చేసుకోలేని వ్యక్తి తక్కిన విషయాలు ఎలా గ్రహించాడట?
‘మ’ : ఏ విషయాలు?
నరేంద్రుడు: ఆయన భగవంతుణ్ణి తెలుసుకోలేదని అంటున్నాడు. అలాంటప్పుడు దయ, పరోపకారాలను ఎలా అవగతం చేసుకొన్నాడు? పాఠశాల గురించి ఎలా అర్థం చేసుకొన్నాడు? పాఠశాలలు నిర్వహించి, విద్యార్థులకు విద్య బోధించాలని ఎలా తెలుసుకొన్నాడు? వాళ్లు వివాహం చేసుకొని పిల్లాజల్లా కనడం సరైనదే అని ఎలా అర్థం చేసుకొన్నాడు? ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకొన్నవాడు మాత్రమే అన్నిటినీ సరిగ్గా అర్థం చేసుకోగలడు.
‘మ’ (స్వగతం): అవును. శ్రీరామకృష్ణులు కూడా, ‘భగవంతుని తెలుసు కొన్నవాడే సమస్తం తెలుసుకొన్నవాడు’ అని స్పష్టంగా తెలిపి ఉన్నారు. ‘సంసార జీవితం గడపడం, పాఠశాలలు నిర్వహించడం మొదలైనవి రజోగుణ కార్యాలు. నీలో దయ ఉంది. కాని అది రజోగుణ జనిత సత్త్వం. దాన్లో తప్పులేదు’ అని విద్యాసాగర్‌కు శ్రీరామకృష్ణులు చెప్పివున్నారు.
మధ్యాహ్న భోజనానంతరం అందరూ ఒకింతసేపు విశ్రాంతి తీసుకొన్నారు. ‘మ’, ఛునీలాల్ నైవేద్య గృహానికి ప్రక్కన ఉన్న మెట్ల మీద కూర్చుని మాట్లాడు కొంటున్నారు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా తను దర్శించిన వైనం ఛునీలాల్ తెలిపాడు. జీవితంలో విసుగెత్తిపోయి ఒకసారి తీర్థయాత్ర చేసిన సంగతీ చెప్పాడు.
కాసేపయ్యాక నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. యోగవాసిష్ఠం గురించిన ప్రస్తావన వచ్చింది.
నరేంద్రుడు (‘మ’ తో): విదురత్ చండాలుడైనాడా?
‘మ’ : లవణుని గురించా అడుగుతున్నావు?*
నరేంద్రుడు: ఓ! మీరు చదివారా?
‘మ’ : అవును, కాస్త చదివాను.
నరేంద్రుడు: ఇక్కడున్న పుస్తకంలో దాన్ని చదివారా?
‘మ’ : కాదు. ఇంట్లో ఉన్న పుస్తకంలో కాస్త చదివాను.
నరేంద్రుడు చిన్నగోపాల్ను పొగత్రాగడానికి ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు చిన్నగోపాల్ ధ్యానం చేస్తున్నాడు.
నరేంద్రుడు(చిన్నగోపాల్‌తో): ఏమోయ్! పొగత్రాగడానికి ఏర్పాటు చెయ్యి. ఇప్పుడు ధ్యానం అవసరం ఏమిటి? మొదట భగవంతునికి, సాధువులకు సేవలొనరించి నిన్ను సిద్ధం చేసుకో. పిదప ధ్యానం చేయవచ్చు. మొదట సేవ, ఆ తరువాత ధ్యానం. (అందరూ నవ్వారు)
మఠాన్ని ఆనుకొని పశ్చిమాన ఉన్న భూభాగంలో చెట్లు చేమలు అడవిలా పెరిగి ఉన్నాయి. ‘మ’ ఒక చెట్టు క్రింద ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా ప్రసన్నుడు వచ్చాడు. అప్పుడు సమయం మూడు గంటలు అయివుంటుంది.
‘మ’ : ఇన్ని రోజులుగా ఎక్కడకు వెళ్లివున్నావు? నిన్ను గురించి అందరూ ఎంత ఆందోళన చెందారని! వారిని చూశావా? ఎప్పుడు వచ్చావు?
ప్రసన్నుడు: ఇప్పుడే వచ్చాను. రాగానే వాళ్లను చూశాను.
‘మ’ : బృందావనానికి పోతూవున్నట్లు ఉత్తరం వ్రాసి పెట్టావు. మే మంతా ఎంతో కలత చెందాము. ఎంతవరకు వెళ్లావు?
ప్రసన్నుడు: కొన్నగర్ దాకా. (ఇద్దరూ నవ్వారు)
‘మ’ : కూర్చో. జరిగిందంతా చెప్పు, వింటాను. మొదట ఎక్కడకు వెళ్లావు?
ప్రసన్నుడు: మొదట దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్లాను. అక్కడ ఆ రాత్రి బసచేశాను.
‘మ’ (నవ్వుతూ): హాజ్రా, ఎలా ఉన్నాడు?
ప్రసన్నుడు: హాజ్రా నాతో, ‘నన్ను గురించి ఏమనుకొంటున్నావు?’ అని అడిగాడు. (ఇద్దరూ నవ్వారు)
‘మ’ (నవ్వుతూ): బదులు ఏం చెప్పావు?
ప్రసన్నుడు: ఏం చెప్పలేదు.
‘మ’ : తరువాత?
ప్రసన్నుడు: నాకు పొగాకు పట్టుకొచ్చావా అని అడిగాడు. (ఇద్దరూ నవ్వారు) నాతో పనిచేయించుకోవాలనుకొన్నాడు. (నవ్వు)
‘మ’ : సరి, తరువాత ఎక్కడకు వెళ్లావు?
ప్రసన్నుడు: కొన్నగర్ వెళ్లాను. రాత్రి ఒకచోట బసచేశాను. పశ్చిమ ప్రాంతాలకు వెళ్లదలచి రైలు ఛార్జీ లభిస్తుందా అని కొందరిని అడిగాను.
‘మ’ : వాళ్లు ఏమన్నారు?
ప్రసన్నుడు: కాస్త ఇవ్వవచ్చు, అంత పైకం ఎవరు ఇస్తారని వాళ్లు అన్నారు. (ఇద్దరూ నవ్వారు)
‘మ’ : నీ వద్ద ఏం ఉన్నాయి?
ప్రసన్నుడు: ఒకటి రెండు బట్టలు, శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రం. చిత్రాన్ని నేను ఎవరికీ చూపలేదు.
మఠానికి శశి తండ్రి వచ్చాడు ఆయన తన కుమారుణ్ణి మఠం నుంచి తోడ్కొని పోవడానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దాదాపు తొమ్మిది నెలలు మరే ఆలోచనా పెట్టుకోక శ్రీరామకృష్ణులకు సేవలొనరించాడు శశి. అతడు కళాశాలలో బి.ఏ. చదువుకొంటున్నాడు. ప్రతిభ కారణంగా అతడికి ఉపకార వేతనం లభించింది. తండ్రి పేదవాడు, గొప్ప సాధకుడు. తల్లిదండ్రులకు శశి పెద్ద కుమారుడు. ఇతడు చదివి, ఉద్యోగం చేసి, ధనం ఆర్జించి తమ కష్టాలను బాపుతాడని వాళ్లు ఆశించారు. కాని ఇతడో భగవత్సాక్షాత్కారానికై సర్వం త్యజించాడు. శశి ఏడుస్తూనే తన మిత్రులతో, “నేను ఏం చేయగలను? నాకు ఏమీ తోచడం లేదు. తల్లిదండ్రులకు ఏ సేవలూ చేయలేకున్నాను! పాపం, వాళ్లు ఎంత ఆశించారు! నా తల్లికి నగలు చేయించాలనుకొన్నాను. కాని వీలుపడలేదు. ఇంటికి తిరిగి వెళ్లాలనే యోచనే భయం కలిగిస్తోంది. ఇక అది చేయడం నా వల్ల కాదు. శ్రీరామకృష్ణులో కామినీకాంచనాలను త్యజించమన్నారు. నేను ఏం చేయగలను?” అని వాపోయి, దుఃఖీంచాడు.
శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం శశి ఇంటికి తిరిగి వస్తాడని అతడి తండ్రి ఆశించాడు. కొన్ని రోజులు ఇంట్లో గడిపిన శశి, వరాహనగర మఠం ప్రారంభించిన కొన్ని రోజులకే మఠానికి వెళ్లసాగాడు. పిదప అక్కడే శాశ్వతంగా ఉండిపోయాడు. అందుచేత ఆతడి తండ్రి, శశిని తోడ్కొని వెళ్ల మఠానికి వచ్చాడు. తండ్రి రాక తెలుసుకోగానే వెనుక వైపు నుంచి పారిపోయాడు శశి.
శశి తండ్రికి ‘మ’ బాగా తెలుసు. పై వసారాలో నడుస్తూ ఇద్దరూ మాట్లాడుకోసాగారు.
శశితండ్రి: వీరికి నాయకుడెవరు? అన్ని గందరగోళాలకీ మూలకారణం ఆ నరేంద్రుడే. వీళ్లందరూ మంచి కుర్రవాళ్లుగా ఇంటికి తిరిగి వచ్చారు; చదువు కొనసాగించారు కూడా.
‘మ’ : ఇక్కడ నాయకుడంటూ ఎవరూ లేరు. అందరూ సమానులే. నరేంద్రుడు ఏం చేయగలడు? తనకు ఇష్టం లేకుండా ఎవరైనా సంసారం త్యజించి రాగలరా? మనం రాగలమా ఏమిటి?
శశితండ్రి: కాని మీరు చేస్తున్నది సరైన పని; ఇదీ చేస్తున్నారు, అదీ చేస్తున్నారు. మీరు గడుపుతున్నదీ ఆధ్యాత్మిక జీవితమే కదా! దీన్నే మన మందరమూ పాటించాలి. ఇక్కడకు రావచ్చు, ఇంట్లోను గడపవచ్చు. అతడి తల్లి ఎంత కుమిలిపోతోందో తెలుసా?
‘మ’ : విచారవదనుడై మౌనం పాటించాడు.
శశితండ్రి: సాధువును వెదకుతూ ఇంతగా తిరుగులాడటమా? నేను అతణ్ణి ఒక మంచి సాధువు వద్దకు తోడ్కొని వెళతాను. ఇంద్రనారాయణ్ వద్దకు ఒక సాధువు వచ్చివున్నారు. ఎంతో మంచివాడు. శశిని వెళ్లి ఆయన్ను దర్శించమను.
పిదప రాఖాల్, ‘మ’ కాళీ తపస్వి గదికి తూర్పున ఉన్న వసారాలో మాట్లాడుకోసాగారు.
రాఖాల్: మాస్టర్, రండి. మన మందరం సాధనలు అనుష్ఠిద్దాం. అందుకే కదా ఇంటికి తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాం. “భగవత్సాక్షాత్కారం ఇంకా పొందలేదు కదా? ఏం సాధనలు నువ్వు అనుష్ఠిస్తున్నావు? పరిత్యజించి ఏమిటి ప్రయోజనం?” అని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలి? కాని నరేంద్రుడు దీనికంతా నోరు మూయించే జవాబు యిస్తున్నాడు. ‘రామ్ లభించనందున శ్యామాతో జీవనం సాగించి పిల్లలను కనాలా?’ అని అడుగుతాడు. నరేంద్రుడు కొన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు అతడితో మాట్లాడి చూడండి.
‘మ’ : బాగా చెప్పావు. రాఖాల్, నీలో తీవ్రమనోవ్యాకులత కానవస్తోంది.
రాఖాల్: మాస్టర్, నా పరిస్థితిని ఏమని వర్ణించను? నర్మదకు వెళదామని నా మనస్సు నేటి మధ్యాహ్నం ఆరాటపడింది. సాధనలు అనుష్ఠించాలి; లేకుంటే దేన్నీ సాధించలేము. శుకదేవునిలోను ఈ ప్రపంచం పట్ల భయం ఉండేది. అందుకే జన్మించగానే అరణ్యాలకు వెళ్లిపోయాడు. వ్యాసుడు ఆపాలని ప్రయత్నించాడు; కాని సాధ్యం కాలేదు.
‘మ’ : అవును. యోగోపనిషత్తులో దీన్ని గురించిన వివరణ ఉంది. మాయ అనే ఈ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికై శుకదేవుడు పారిపోయాడు. వ్యాస–శుకుల సంభాషణలు ఆ గ్రంథంలో ఉన్నాయి. సంసారంలో ఉంటూ శుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపమన్నాడు వ్యాసుడు. అందుకు శుకుడు, ‘హరి పాదపద్మాలే సారం’ అన్నాడు. వివాహం చేసుకొని స్త్రీలతో జీవింప శుకుడు ఇచ్ఛగించలేదు.
రాఖాల్: స్త్రీలను చూడకుండా ఉంటే చాలని అనేకులు అనుకుంటారు. స్త్రీలను చూసినప్పుడు తల వంచుకొంటే మాత్రం ఏం ప్రయోజనం? నరేంద్రుడు నిన్న రాత్రి చక్కగా చెప్పాడు: “ఎంతవరకు మన మనస్సులలో కామం నెలకొని ఉంటుందో అంతవరకు స్త్రీలు ఉండనేఉంటారు; కామం నుంచి విముక్తులైతే స్త్రీ–పురుష విభేదం ఉండదు.”
‘మ’ : బాగా చెప్పావు. పిల్లలకు స్త్రీ–పురుష విభేదమే ఉండదు.
రాఖాల్: అందుకే చెబుతున్నాను – సాధనలు అత్యావశ్యకం. మాయకు ఆవల వెళ్లకుంటే ఎలా జ్ఞానం లభిస్తుంది? రండి, ఆహ్వానితుల గదికి వెళదాం. వరాహనగరం నుండి కొందరు పెద్దమనుషులు వచ్చి ఉన్నారు. వాళ్లతో నరేంద్రుడు మాట్లాడుతున్నాడు, వెళ్లి విందాం.
నరేంద్రుడు మాట్లాడుతున్నాడు. ‘మ’ లోపలకు వెళ్లలేదు. బయటి వసారాలో పచార్లు చేస్తూ వాళ్ల మాటలు ఒకింత విన్నాడు.
నరేంద్రుడు: సంధ్యావందనాదులు నిర్వర్తించడానికి కచ్చితమైన సమయమో, స్థలమో అవసరం లేదు.
పెద్దమనిషి: సాధనలు అనుష్ఠిస్తే చాలా? భగవంతుని పొందనగునా?
నరేంద్రుడు: అది ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు:
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయ న్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥
త మేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
త త్ప్రసాదా త్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥* (గీత – 18.61–62)
“ఆయన అనుగ్రహం లేకపోతే సాధన తపస్సుల దేనివల్లా ప్రయోజనం లేదు. అందుకే ఆయన్ను శరణుపొందాలి.”
పెద్దమనిషి: మేం ఇక మీదట తరచూ వచ్చి మీ ప్రశాంతతకు భంగం కలిగించవచ్చా?
నరేంద్రుడు: మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ ఘట్టంలోనే మేం నిత్యం స్నానం చేస్తున్నాం.
పెద్దమనిషి: మాకు ఎలాటి అభ్యంతరమూ లేదు. కాని ఇతరులు రాకుండా చూసుకోండి.
నరేంద్రుడు: అలా అయితే మేం అక్కడకు వెళ్లం.
పెద్దమనిషి: నేను ఆ అర్థంలో చెప్పలేదు. ఇతరులు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు మీరు వెళ్లకపోవడం మంచిదని అంటున్నాను.
సాయంత్రం హారతి నిర్వర్తించబడింది. భక్తులు చేతులు జోడించుకొని ‘జయ శివ ఓంకార’ పాటను ఆలాపించి, శ్రీరామకృష్ణులకు మ్రొక్కారు. పిదప ఆహ్వానితుల గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ‘మ’ అక్కడ కూర్చుని ఉన్నాడు. ప్రసన్నుడు గురుగీత నుంచి పఠించసాగాడు. పిదప నరేంద్రుడు గురుగీతను రాగయుక్తంగా గానం చేశాడు:
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ।
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ॥
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షిభూతం ।
భావాతీతం త్రిగుణ రహితం సంతతమ్ తం నమామి ॥
మళ్లీ నరేంద్రుడు పాడసాగాడు:
న గురో రధికం న గురో రధికం
ఇతి శివాను శాసనమ్
శ్రీమత్ పరం బ్రహ్మ గురుం వదామి
శ్రీమత్ పరం బ్రహ్మ గురుం భజామి
శ్రీమత్ పరం బ్రహ్మ గురుం స్మరామి
శ్రీమత్ పరం బ్రహ్మ గురుం నమామి.
నరేంద్రుడు గానం చేసిన గురుగీత శ్లోకాలను విని భక్తుల మనస్సులు గాలిలేని చోట వెలిగే దీపశిఖలా నిశ్చలమైనాయి. ‘నాగస్వరం విన్న నాగంలా నరేంద్రుడు పాడుతున్నప్పుడు ఈ హృదయంలో నెలకొనివున్న వ్యక్తి కదలా మెదలక ఆలకిస్తా’ డన్న శ్రీరామకృష్ణుల వచనాలు ఎంత నిజం! ఈ మఠ సోదరులలో ఎంతటి గురుభక్తి!
కాళీ తపస్వీ గదిలో రాఖాల్ కూర్చుని ఉన్నాడు. ప్రక్కన ‘మ’, ప్రసన్నలు ఉన్నారు.
రాఖాల్ తన భార్యను, పిల్లవాడిని పరిత్యజించాడు. ఆతడి హృదయంలో రేయింబవళ్లు తీవ్రవైరాగ్య జ్వాల రగులుతూ ఉంది. ఒంటరిగా నర్మదా నదీతీరానికి లేక మరెక్కడికో వెళ్లిపోవాలనే ఆలోచన అతడిలో మెదలింది. ఈ స్థితిలో ప్రసన్నునికి మఠాన్ని వీడి ఎక్కడకూ వెళ్లవద్దని ఉద్బోధిస్తున్నాడు.
రాఖాల్ (ప్రసన్నునితో): మఠం వీడి బయటకువచ్చి ఎక్కడ తిరుగాడుతావు? ఇక్కడ సాధుసాంగత్యం లభిస్తోంది! ఇది వదలిపెట్టి పోవడమా? నరేంద్రుని వంటి ఒకరి సాంగత్యం లభించేదేనా? ఆతణ్ణి వదలి ఎక్కడకు పోతావు?
ప్రసన్నుడు: నా తల్లిదండ్రులు కలకత్తాలోనే ఉన్నారు గదా! వాళ్ల ప్రేమాను రాగాలు నన్ను ఆకర్షిస్తే ఏం చేయాలి? ఆ భయంతోనే సుదూరానికి పారిపోగోరాను.
రాఖాల్: శ్రీరామకృష్ణులు మనలను ప్రేమించినట్లుగా తల్లితండ్రులు ప్రేమిస్తారా? ఆయనకు మనం ఏం చేశామని ఆయన మన పట్ల అంతటి ప్రేమను చూపారు! దేహం, మనస్సు, ఆత్మల మొత్తం సంక్షేమం పట్ల ఆయన ఎంతటి అక్కర తీసుకొన్నారు? ఆయననుంచి వీటిని పొంద మనకు ఏం అర్హత ఉందని!
‘మ’ (స్వగతం): ఆహా! రాఖాల్ సరిగ్గానే చెబుతున్నాడు. అందుకే శ్రీరామకృష్ణులను అహేతుక కృపాసింధువు అని ప్రశంసిస్తున్నారు.
ప్రసన్నుడు (రాఖాల్తో): నీకు మఠం వీడి బయటకు వెళ్లిపోవాలని అనిపించటం లేదా?
రాఖాల్: నర్మదా తీరంలో ఏదో ఒక తోటలో బసచేసి సాధనలు అనుష్ఠిం చాలని ఎప్పుడైనా ఆకాంక్ష బయలుదేరుతుంది. మూడు రోజులైనా పంచ తపస్సు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాని అదే సమయంలో విషయాసక్తుల తోటకు వెళ్లడమా అని మనస్సు సంకోచిస్తూ ఉంటుంది.
ఆహ్వానితుల గదిలో తారక్, ప్రసన్నులు మాట్లాడుకొంటున్నారు. తారక్‌కు తల్లి లేదు. రాఖాల్ తండ్రిలా ఇతడి తండ్రీ పునర్వివాహం చేసుకొన్నాడు. తారక్‌కు కూడా వివాహమైంది. ప్రస్తుతం ఇతడి భార్య జీవించి లేదు. అందుకే తారక్‌కు మఠమే గృహమైపోయింది.
ప్రసన్నుడు: జ్ఞానం లభించలేదు, ప్రేమా జనించలేదు. దేన్ని ఆధారం చేసుకొని బ్రతకాలి?
తారక్: జ్ఞానం లభించడం ఎంతోకష్టం. కాని ప్రేమ జనించ లేదంటున్నావే, అదెలా?
ప్రసన్నుడు: భగవంతునికై నేను విలపించలేకున్నానే! కాబట్టి ప్రేమ జనించిందని ఎలా చెప్పగలను? ఇన్ని రోజులుగా నేను ఏం సాధించాను?
తారక్: ఎందుకు అలా అంటున్నావు? పరమహంస దేవులను ప్రత్యక్షంగా చూశావే! పిదప జ్ఞానం ఎందుకు కలుగదు?
ప్రసన్నుడు: ఎలాటి జ్ఞానం ఉదయిస్తుంది? జ్ఞానం అంటే అనుభూతి. దేన్ని అనుభూతం చేసుకోవడం? భగవంతుడు ఉన్నాడా లేడా అన్న విషయం గురించిన ప్రస్ఫుట జ్ఞానం నాకు లేదే!
తారక్: అది నిజమే. జ్ఞానుల మతం ప్రకారం భగవంతుడు లేడు.
‘మ’ (స్వగతం): ఆహా! భగవంతుని పొందగోరే వ్యక్తిలో ప్రసన్నుడి ఈ స్థితి నెలకొని ఉంటుందని శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న భావన కొన్ని సమయాల్లో కలుగుతుంది. తారక్ ప్రస్తుతం బౌద్ధం అధ్యయనం చేస్తున్నాడు. అందుకే జ్ఞానుల మతం ప్రకారం భగవంతుడు లేడని అంటున్నాడు. కాని శ్రీరామకృష్ణులు, “జ్ఞాని, భక్తుడు చేరుకొనేది ఒకే చోటుకే” అని చెప్పేవారు.
52.6 షష్ఠ పరిచ్ఛేదం సోదర శిష్యులతో నరేంద్రుడు
కాళీ తపస్వి గదిలో నరేంద్రుడు, ప్రసన్నుడు మాట్లాడుకొంటున్నారు. ఆ గదిలో మరో మూల రాఖాల్, హరీష్, చిన్నగోపాల్ కూర్చుని ఉన్నారు. కాసేపటికి పెద్దగోపాల్ వచ్చాడు.
నరేంద్రుడు గీత నుంచి కొన్ని శ్లోకాలు పఠిస్తూండగా, ప్రసన్నుడు వింటున్నాడు:
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ॥ (గీత 18–61)
నరేంద్రుడు: శ్రీకృష్ణుడు ఏం చెబుతున్నాడో విన్నావా? ‘యంత్రంలో తిరుగుతూ ఉన్నట్లు’ ; అంటే సర్వజీవులను మాయ అనే యంత్రం మీద నిలిపి త్రిప్పుతున్నాడు. భగవంతుని తెలుసుకో ప్రయత్నించడమా? నువ్వు పురుగు కంటే హీనమైన వాడవు. నువ్వు ఆయన్ను తెలుసుకోగలవా? కాస్త యోచించి చూడు. మనిషి ఏపాటి? ఇదుగో చూస్తున్నావు గదా – అసంఖ్యాక నక్షత్రాలు. అవి ఒక్కొక్కటి ఒక సౌరకుటుంబమని పేర్కోబడుతున్నవి. ఒక సౌరకుటుంబంతో పోల్చినప్పుడు మనం జీవించే ప్రపంచం ఒక నీటిబిందుమాత్రం. జనం పురుగుల్లా ప్రపంచంలో మసలుతున్నారు
పిదప నరేంద్రుడు పాడాడు.
భూ ధూళిలో మేము పుట్టితిమి దేవా
దుమ్ముచేతను కనులు కమ్మెచీకటులు
పసివారివలె దుమ్ము లోపల నాడినాము
దీనజన రక్షకా దేహి అభయమ్ము ॥ భూ ॥
ఒక్క తప్పుకె మమ్ము ప్రక్కకీడ్చెదవా?
ఒడినుండి ఓ ప్రభూ పడద్రోతువేమి?
నిస్సహాయులుగాను నిలిపి వెడలెదవా?
అట్లయినచో మేము అసలెదుగలేము
దిగ్భ్రమలో భగ్నమై పడియుందు మెపుడు ॥ భూ ॥
పసిపాప మనసుగల పసివారమయ్య
తడబడుచు ప్రతి అడుగు పడుచుండినాము
ఏల మాకై కిన్క నేల బూనెదవు?
నీ తీవ్ర ప్రకోపమున నిలువవలెనా మేము? ॥ భూ ॥
చిన్నవారము మేము చీదరించకుము
కడుప్రేమతో తెలుపు చెడుచేసినపుడు
నూరుసారులు మరల పడుచుంటి మకట!
గతిలేని మనసుతో ఎవడేమి చేయు. ॥ భూ ॥
పిదప ప్రసన్నుడితో, “ఆయన పాదపద్మాల వద్ద శరణుపొందు” అన్నాడు.
మళ్లీ నరేంద్రుడు పారవశ్యంలో మరోపాట పాడాడు:
నేడు దాసుడను నేను దాసుడను
నేను దాసుడను దేవా!
నీవు ప్రభుడవు నీవు ప్రభుడవు
నీవు ప్రభుడవు దేవా! ॥ నే ॥
గోచి ఒక్కటి రెండు రొట్టెలు
ఇచ్చినావు నాకు
నీదు నామము పాడుచుండగా
హృదిని భక్తి పొరలు ॥ నే ॥
పొంగిపొరలు నా భక్తి భావములు
హృదయమందు లేచి
భద్రకవచముగ కాచుచుండును
బాధనుండి నన్ను ॥ నే ॥
“నీవు దేవుడవు దయాపూర్ణు” డని
పాడుచుందు సతతము
చరణ సన్నిధిని కబీరుదాసు
శరణుజొచ్చినాడ. ॥ నే ॥
నరేంద్రుడు (ప్రసన్నునితో): శ్రీరామకృష్ణుల వచనాలు నీకు జ్ఞాపకం లేవా? “భగవంతుడు ఒక చక్కెర కొండ. నువ్వు ఒక చీమవు. ఒక చక్కెర కణం తింటేనే నీ కడుపు నిండిపోతుంది! కాని చక్కెర కొండను అట్లే ఇంటికి తీసుకు పోదామను కొంటున్నావు. శుకదేవుడు ఒక గండుచీమ. అంతే” అని ఆయన చెప్పడం మరచి పోయావా? అందుకే నేను కాళీతో, “మూర్ఖుడా! నువ్వు భగవంతుణ్ణి కొలబద్దతో కొలవ ప్రయత్నిస్తావా? అది సాధ్యమేనా? భగవంతుడు దయా సముద్రుడు. బానిసవై ఆయన్ను శరణు పొందు. ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన్ను ప్రార్థించు” అన్నాను.
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ ।
మృత్యోర్మాఽమృతంగమయ ఆవిరావిర్మయేతి
రుద్రయిత్తే దక్షిణం ముఖం తేనమాం పాహి నిత్యమ్ ॥
ప్రసన్నుడు: ఏ సాధనలు అనుష్ఠించాలి?
నరేంద్రుడు: ఆయన నామజపం చేస్తే చాలు. శ్రీరామకృష్ణుల పాట నీకు జ్ఞాపకం లేదా? ఆ పాటను నరేంద్రుడు గానం చేశాడు:
నాకున్న విశ్వాస మొకే ఒక్క నామం
అదె పుణ్యనామం బదె శ్యామ నామం ॥ నా ॥
ఏ పంచపాత్రయు ఏ ఉద్ధరిణెయు
ఏ మందహాసముల్ యే సంప్రదాయముల్
యే పాత్రయైనను ఏ మంత్రమైన
పనిలేదు వానితో పని నాకు లేదు ॥ నా ॥
శివభక్తుడను నేను శివు ననుసరింతు
శివుని ఆజ్ఞను నేను శిరసావహింతు
పరమ నామము మృత్యుపాశముల్చేదించు
అది శ్యామ నామంబని అతడు ప్రకటించె ॥ నా ॥
ఏమి జరిగిన జరుగు యేమరక జపియింతు
మాని మృత్యువు భీతి మాత నీ నామం
శివభక్తుడను నేను శివు ననుసరింతు
శివుని ఆజ్ఞను నేను శిరసావహింతు ॥ నా ॥
పసిపాప మనసుగల పసి వారమయ్య
తడబడుచు ప్రతి అడుగు పడుచుండినాము
ఏల మాకై కిన్కనేల బూనెదవు?
నీ తీవ్రప్రకోపమున నిలువవలెనా మేము?
ప్రసన్నుడు: ఇప్పుడు నువ్వు భగవంతుడు ఉన్నాడు అంటున్నావు. పిదప చార్వాకుడు తదితర చింతనాపరులు చెప్పినట్లు ఈ లోకం స్వయంకల్పితమని చెబుతున్నావు.
నరేంద్రుడు: నువ్వు రసాయనశాస్త్రంలో చదవలేదా? విభిన్న మూలకాలను ఎవరు సమ్మిశ్రితం చేస్తున్నారు? మనిషి మేధాశక్తే ఆక్సిజన్, హైడ్రోజన్, విద్యుచ్ఛక్తులను మిశ్రితం చేసి నీటిని ఉత్పన్నం చేస్తూంది? మేధాశక్తిని అందరూ అంగీకరిస్తున్నారు. మూర్తీభవించిన జ్ఞానస్వరూపుడు మనకు పైన ఉన్నాడు. ఆయనే వీటి నన్నిటిని జరిపిస్తున్నాడు.
ప్రసన్నుడు: భగవంతుడు మూర్తీభవించిన దయామయుడని ఎలా తెలుసుకోవడం?
నరేంద్రుడు: వేదం, “యిత్తే దక్షిణమ్ ముఖం” అని పేర్కొంటోంది (నీ యొక్క కరుణారవిందం). జాన్ స్టూవర్ట్ మిల్ కూడా దీన్నే వక్కాణిస్తున్నాడు. మనిషిలో కరుణను నెలకొల్పిన భగవంతుడు, తనలో మరెంత కరుణ నెలకొల్పుకొని ఉన్నాడో! “విశ్వాసమే సారం” అని శ్రీరామకృష్ణులు చెప్పే ఉన్నారు. భగవంతుడు అతి సమీపంలో ఉన్నాడు. దీన్ని విశ్వసిస్తేనే చాలు, ఆయన్ను పొందవచ్చు.
ఇలా అంటూ నరేంద్రుడు అతి మధురస్వనంలో పాడసాగాడు.
ఓ సాధకా!
ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా
నీ ప్రక్క నత్యంత చేరువన నేనుండ!
ఎక్కడో దూరాన వెదకుచున్నావింక
ప్రక్కనే అంటుకొని ఇక్కడే నేనుండ
చర్మమందున లేను రోమమందున లేను
మాంసమందున లేను ఎముకలందున లేను
మందిరమ్మున లేను మస్చిద్దులో లేను
కాశియందున లేను కైలాసమున లేను
ద్వారకాపురిగాని అయోధ్యలోగాని
కనుగొనగ నేరవు నన్ను నీ వా పురముల
శ్రద్ధగల తావులలో వెదికి చూచెదవేని
తప్పక నను నీవు దర్శింపజాలుదువు
యోగసాధనగాదు యోగ్యకార్యముగాదు
వైరాగ్యమున గాదు సన్న్యాసమున గాదు
వెతతోడ నను మాత్రమే వెదకుచున్నచో
పరుగుపరుగున వత్తు పరుగెత్తి నీ కడకు.
ప్రసన్నుడు: కొన్ని సమయాల్లో నువ్వు భగవంతుడే లేడంటున్నావు; ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. నీ మాటలు నమ్మశక్యం కాకున్నవి. తరచూ నువ్వు అభిప్రాయాలను మార్చేస్తూంటావు. (అందరూ నవ్వారు)
నరేంద్రుడు: మంచిది. ఈ వచనాలను నేను ఏనాడూ మార్చబోను; మనస్సులో కాంక్షలు, వాసనలు ఉన్నంతవరకు భగవంతుని పట్ల విశ్వాసం కలుగదు. ఏదో ఒక కాంక్ష ఉండనే ఉంటుంది. చదువుకోవాలన్న ఆకాంక్ష ఉండవచ్చు, పట్టభద్రుడు కావాలి, పండితుణ్ణి కావాలి అనే ఆకాంక్ష అంతరంగాన గూడుకట్టుకొని ఉండవచ్చు.
నరేంద్రుడు భక్త్యావేశంతో గద్గదస్వరంతో పాడసాగాడు:
వందనమో పరమేశ్వర వందనమో సర్వేశ్వర
వందనమో భాగ్యదాత వందనమో శుభప్రదాత
ఆర్తత్రాణపరాయణ దుఃఖహరాభయవిదూర
జయ జయ శ్రీ భువనోద్ధర నీ కిదె మా వందనంబు ॥ వం ॥
వందనమో అతినిగూఢ వందనమో ఖండరహిత
వందనమో అద్వితీయ వందనమో అనుపమేయ
సర్వాత్మక సత్యాత్మ విశ్వాత్మక పరమాత్మా
జయ జయ సర్వేశ్వర నీ కిదె మా వందనంబు ॥ వం ॥
వందనమో కరుణాఘన వందనమో జగద్వంద్య
నా సర్వంబున కీవె గతి తవ పదములకిదె వందనంబు
జయ జయ సర్వేశ్వర నీ కిదె మా వందనంబు ॥ వం ॥
మా ప్రార్థన మిది యొకటే
ఏ వరమును కోరగలము
ఇహ పర సద్విజ్ఞానము
మా కొసగి కనుపింపుము
అని మే మనయము నిను
ప్రార్థింతుము భాగ్యదాత
జయ జయ జయ పరమేశ్వర
నీ కిదె మా వందనంబు ॥ వం ॥ ॥ వం ॥
నరేంద్రుడు మళ్లీ పాడాడు. సోదరులను బ్రహ్మానందము పానం చేయమని ఆహ్వానించాడు. “కస్తూరి మృగాన కస్తూరి ఉన్నట్లు భగవంతుడు అత్యంత సమీపంలోనే, మనలోనే ఉన్నాడు” అన్నాడు.
ప్రేమ పాత్రలో బ్రహ్మానందము
పానము చేయుము ఓ సాధో!
తనివి తీరి సంతృప్తి చెంది యా
మధుమత్తతలో మత్తిలు సాధో! ॥ ప్రే ॥
ఏడ్పులలో నీ శైశవము
యువతుల వలలో యౌవనము
బిరబిర కరిగి అరుగుదెంచినది
వలవల బొగివెడి వార్ధకము ॥ ప్రే ॥
కఫ వాతంబులు కంఠము గప్పెను
వేచియుంటివి కాటి కేగుటకు
వాకిట వాహకు లరుగుదెంచిరి
రుద్రభూమికి చేరవేయుటకు ॥ ప్రే ॥
నాభిన పరిమళ కస్తూరి
గలదని నీ వా కస్తూరి
మృగమున కే విధి తెలిపెదవు!
ఏ విధి బోధన చేయుదువు ॥ ప్రే ॥
దారి జూపెడు సద్గురు సాయము
లేక మనుజుడు తిరుగు లోకమున
బుద్ధిలేని కస్తూరి మృగమువలె
అంధప్రాయముగ భ్రాంతి చెందుచు ॥ ప్రే ॥
‘మ’ వసారాలో ఉండే ఇదంతా వింటున్నాడు.
నరేంద్రుడు లేచాడు. గదిలోనుంచి బయటకు వస్తున్నప్పుడు, “మీతో తీవ్రంగా మాట్లాడి నా తల తిరిగిపోతున్నది” అన్నాడు.
‘మ’ ను చూడగానే, “రండి! కాస్త దాహం తీర్చుకొందాం” అన్నాడు. మఠ సోదరులలో ఒకరు నరేంద్రునితో, “అయితే భగవంతుడు లేడని అంటున్నావా?” అని అడిగాడు. అది విని నరేంద్రుడు నవ్వాడు.
సోమవారం, మే 9, 1887
ఉదయం ‘మ’ మఠం తోటలోని ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. అతడు తనలో ఇలా తలపోయసాగాడు: ‘శ్రీరామకృష్ణులు ఈ యువకులను కామినీకాంచనాలను పరిత్యజించేట్లు చేసేశారు. ఆహా! భగవద్దర్శనానికి వీరు ఎలా ఆరాటపడుతున్నారో! ఈ స్థలం వైకుంఠమే! సందేహం లేదు. వీళ్లు సాక్షాత్తూ నారాయణులే! శ్రీరామకృష్ణులు కనుమరుగై ఎన్నో రోజులు కాలేదు. అందుకే ఆయన భావనలు, లక్ష్యాలు అట్లే ఉన్నవి. అదే అయోధ్య, కాని రాముడు మాత్రం లేడు. శ్రీరామకృష్ణులు వీళ్లను గృహత్యాగం చేయించారు. కాని కొందరిని గృహస్థాశ్రమంలోనే ఉండేట్లు చేశారు. ఎందుకు అలా చేశారు? వాళ్లకు మోక్షం లేదేమో!’
నరేంద్రుడు మేడ మీది గదిలో నుండే ‘మ’ ఏకాంతంలో ఉండటం చూశాడు. క్రిందికి దిగి వచ్చి నవ్వుతూ ‘మ’ తో, “ఏం మాస్టర్! ఏం చేస్తున్నారు?” అని అడిగాడు.
కాసేపు మాట్లాడిన తరువాత ‘మ’, “నీ కంఠస్వరం ఎంతో మధురంగా ఉంది. ఏదన్నా పాడు” అన్నాడు.
నరేంద్రుడు శివాపరాధ క్షమాపణ స్తోత్రం గానం చేశాడు:
ఆదౌకర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వైతత్రదుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేనవక్తుం
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ శివం భోశ్రీమహాదేవ శంభో1
బాల్యే దుఃఖాతిరేకా న్మలలుళిత వపుః స్తన్యపానే
పిపాసానోశక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితా జంతవోమాం తుదంతి
నానారోగాదిదుఃఖాద్దురితపరవశశ్శంకరం న స్మరామి
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….2
ప్రౌఢోఽహంయౌవనస్థోవిషయవిషధరైః పంచభిర్మర్మనంధౌ
దష్టోనష్టో వివేక స్సుతధనయువతిస్వాదుసౌఖ్యేనిషణ్ణః
శైవీ చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….3
వార్ధక్యే చేంద్రియాణాం వికలగతమతిశ్చాధిదైవాదితాపైః
వాపై రోగైర్వియోగైర్వ్యసనకృశతనుః జ్ఞప్తిహీనం చ దీనమ్
మిథ్యామోహాభిలాషై ర్భృమతి మమ మనోధూర్జటేర్ధ్యాన శూన్యం
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….4
స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాం గతోయం
పూజార్థం వా కదాచిద్బహుతరగహనేఽఖండ బిల్వీదలాని
నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుష్పై స్త్వదర్థం
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….5
దుగ్ధైర్మథ్వాజ్యయుక్తై ర్దధిగుడసహితైస్స్నాపితం నైవ లింగం
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితంనప్రసూనైః
ధూపైః కర్పూర దీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారైః
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….6
నోశక్యంస్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఢ్యే
శ్రౌతే వార్తాకథం మే ద్విజకులవిహి తేబ్రహ్మమార్గానుసారే
జ్ఞాతే తత్త్వే విచారే శ్రవణ మననయోః కోనిదిధ్యాసిత వ్యః
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ…..7
ధ్యాత్వా చిత్తేశివాఖ్యం ప్రచురతతరధనం నైవదత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైఃహుతవహవదనే నార్పితం బీజ మంత్రైః
నో దత్తం గాంగతీరేవ్రత పరిచరణే రుద్రజాప్యం నజప్తం
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….8
నగ్నోనిస్సంగశుద్ధిస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో
నాసాగ్రే న్యస్త దృష్టిర్విదితభవగుణో నైవ దృష్టిః కదాచిత్
ఉన్మత్తావస్థయా త్వాం విదితగతమతిశ్శంకరం న స్మరామి
క్ష్యంతవ్యోమేఽపరాధశ్శివశివ….9
స్థిత్వాస్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభితే సూక్ష్మమార్గే
శాంతే దాంతే ప్రలీనే ప్రకటిత గహనే దివ్యరూపే శివాఖ్యే
లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలగతతనౌ శంకరం నా స్మరామి
క్ష్యంతవ్యోమేఽపరాధశ్శివశివ….10
హృద్యం వేదాంతవేద్యం హృదయసరసిజే దీపముద్యత్ప్రకాశం
సత్యం శాంతస్వరూపం సకలమునిమనః పద్మషండైక వేద్యమ్
జాగ్రత్స్వప్నేసుషుప్తౌ త్రిగుణ పదహృతం శంకరం న స్మరామి
క్షంతవ్యోమేఽపరాధశ్శివశివ….11
చంద్రోద్భాసిత రేఖరే స్మరహరే గంగాధరే శంకరే
స్సర్పైర్భూషితకర్ణ కంఠకుహరే నేత్రోత్థనైశ్వానరే
దంతిత్విక్కృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే
మోక్షార్థం కురు చిత్తవృత్తిమమలొ మంత్రైస్తు కిం కర్మభిః12
కింవానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కింవాపుత్రకళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం,
జ్ఞాత్వైతతణ భంగురం సపదిహి త్యాజ్యం మనోదూరతః
స్మాత్మార్థం గురువాక్యతో భజమన శ్శ్రీపార్వతీవల్లభమ్13
పౌరోహిత్యం రజని చరితం గ్రామణిత్వం నియోగో
మాఠాపత్యం హ్యనృత వచనం సాక్షివాదః పరాన్నం
బ్రహ్మద్వేషః ఖీలజనరతిః ప్రాణినాం నిర్దయత్వం
మా భూద్దేవో మమ పశుపతే జన్మజన్మాంతరేషు14
ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతిగతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః
లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం
తన్మాన్మాం కరుణాకరః కరుణయా త్వం రక్ష రక్షాధునా.15
నరేంద్రుడు: అనురక్తతలేని గృహస్థ జీవితం అంటూ మీరు మాట్లాడవచ్చు. కాని కామినీకాంచనాలు త్యజించకుంటే ఏమీ లభించదు. స్త్రీలతో జీవించడం విసుగు అనిపించడం లేదా? – క్రిములు, కఫం, రక్తం, దుర్వాసనతో నిండిన దేహం!
ఇలా అంటూ ఈ పాట పాడాడు:
ఓ మానవా నీవు భ్రాంతి విడనాడి
నీ దుష్టసంకల్పముల విడచిపెట్టుమీ ॥ ఓ ॥
భగవంతుని కనుగొని భవబాధలను గడచి
స్వేచ్ఛగా లోకాన జీవించు మానవా ॥ ఓ ॥
మూన్నాళ్ల ముచ్చటగ మురిసిపోవుచు నీవు
పూర్తిగ భగవంతు మరిచిపోయితివి
నీ జీవమున కిపుడు నీడెవరు తోడెవరు
అకటకట! ఇది ఏమి హాస్యాస్పదమురా ॥ ఓ ॥
పిదప కౌపీన పంచకం గానం చేశాడు:
వేదాన్త వాక్యేషు సదా రమన్తః
భిక్షాన్న మత్రేణ చ తుష్టి మన్తః
విశోక మన్తఃకరణే రమన్తః
కౌపీన వన్తః ఖలు భాగ్యవన్తః….
నరేంద్రుడు మళ్లీ ఇలా అన్నాడు: “మనిషి ఎందుకు సంసార జీవితంలో చిక్కువడాలి? ఎందుకు మాయలో చిక్కుకోవాలి? మనిషి స్వస్వరూపం ఏమిటి? చిదానందరూపశ్శివోఽహం – నేనే ఆ సచ్చిదానందం.”
మళ్లీ శంకరాచార్య నిర్వాణషట్కం గానం చేశాడు:
మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న శ్రోత్రం న జిహ్వ న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు
శ్చిదానందరూపశ్శివోఽహం శివోఽహమ్……
పిదప వాసుదేవాష్టకం గానం చేశాడు:
ఓమితి జ్ఞానరూపేణ రాగజీర్ణేన జీర్యతః ।
కామనిద్రాం ప్రపన్నోఽస్మి త్రాహి మాం మధుసూదన ॥
న గతిర్విద్యతే నాథ త్వమేకః శరణం ప్రభో ।
పాపపంకే నిమగ్నోఽస్మి త్రాహి మాం మధుసూదన ॥
మోహితో మోహజాలేన పుత్రదారగృహాదిషు ।
తృష్ణయా పీడ్యమానోఽస్మి త్రాహి మాం మధుసూదన ॥
భక్తిహీనం చ దీనం చ దుఃఖశోకాతురం ప్రభో ।
అనాశ్రయమనాథం చ త్రాహి మాం మధుసూ న ॥
గతాగతేన శ్రాంతోఽస్మి దీర్ఘసంసార వర్త్మసు ।
పునర్నాగంతుమిచ్ఛామి త్రాహి మాం మధుసూదన ॥
బహవోఽపి మయా దృష్టం యోనిద్వారం పృథక్ పృథక్ ।
గర్భవాసే మహద్దుఃఖం త్రాహి మాం మధుసూదన ॥
తేన దేవ ప్రపన్నోఽస్మి నారాయణ పరాయణః ।
జగత్ సంసార మోక్షార్థం త్రాహి మాం మధుసూదన ॥
వాచయామి యథోత్పంతం ప్రణమామి తవాగ్రతః ।
జరామరణభీతోఽస్మి త్రాహి మాం మధుసూదన ॥
సకృతం న కృతం కించిత్ దుష్కృతం చ కృతం మయా ।
సంసారే పాపపంకోఽస్మి త్రాహి మాం మధుసూదన ॥
దేహాంతర సహస్రాణామాన్యోన్యం చ కృతం మయా ।
కర్తృత్వం చ మనుష్యాణాం త్రాహి మాం మధుసూదన ॥
వాక్యేన యత్ ప్రతిజ్ఞాతం కర్మణా నోపపాదితమ్ ।
సోఽహం దేవ దురాచారస్త్రాహి మాం మధుసూదన ॥
యత్ర యత్రహి జాతోఽస్మి స్త్రీషు వా పురుషేషు వా ।
తత్ర తత్రచలా భక్తిస్త్రాహి మాం మధుసూదన ॥
‘మ’ (స్వగతం): నరేంద్రునిలో ఎంతటి తీవ్రవైరాగ్యం! కాబట్టే ఈ యువకులందరిలో వైరాగ్యజ్వాలను రగిలించగలిగాడు. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులు వీరిని చూసినప్పుడు కామినీకాంచనాలను త్యజించాలనే ఉద్దేశం మనస్సున జనిస్తుంది. వీరి స్థితి ఎంత అద్భుతం! మా వంటి వారిని శ్రీరామకృష్ణులు ఎందుకు ఇంకా సంసారంలో వదలి ఉంచారు? ఏదైనా మార్గం చూపుతారా? తీవ్ర వైరాగ్యం ఇప్పిస్తారా లేక సంసారంలోనే ఉంచివేస్తారా?
నరేంద్రుడు, ఒక రిద్దరు యువకులు భోజనానంతరం కలకత్తా వెళ్లారు. నరేంద్రుడు రాత్రికి తిరిగి వచ్చేస్తాడు. అతడి ఇంటి వ్యాజ్యెం ఇంకా పూర్తి కాలేదు. నరేంద్రుడు మఠంలో లేనందున మఠ సోదరులు కలత చెందారు. ఎప్పుడు తిరిగి వస్తాడోనని ఆరాటపడ్డారు.
52.7 సప్తమ పరిచ్ఛేదం
భోజనానంతరం అందరూ కాసేపు విశ్రాంతి తీసుకొన్నారు. పెద్దగోపాల్ పుస్తకంలో పాటలు చూసి వ్రాసుకొంటున్నాడు.
సాయంత్రం కాబోతున్నది. అప్పుడు రవీంద్ర ఉన్మాదిలా అక్కడకు వచ్చాడు. కాళ్లకు పాదరక్షలు లేవు. నలుపు అంచు పంచెలో సగం మాత్రమే ధరించి ఉన్నాడు. అతడి కళ్లు ఉన్మాది కళ్లలా తిరుగుతున్నాయి. అతణ్ణి చూసి అందరూ దిగ్భ్రమచెంది, “ఏం జరిగింది?” అని అడిగారు.
రవీంద్ర ఇలా అన్నాడు: “కాస్త ఊపిరి పీల్చుకోవాలి. పిదప వివరంగా చెబుతాను. నేను ఇక ఇంటికి తిరిగివెళ్లను. ఇక్కడే మీతో ఉండిపోతాను. ఆమె ఒక ద్రోహి. ఏం చెప్పను! ఆమెకోసం నా ఐదేళ్ల త్రాగుడు వ్యసనానికి కూడా స్వస్తి చెప్పేశాను. గత ఎనిమిది నెలలుగా ఒక చుక్క మధువుకూడా పుచ్చుకోలేదు. ఆమె నమ్మకద్రోహం చేసింది!”
మఠసోదరులు అతడితో, “కాస్త శాంతం వహించు” అన్నారు. కాసేపయ్యాక, “ఎలా ఇక్కడకు వచ్చావు?” అని అడిగారు.
రవీంద్ర: కలకత్తా నుంచి కాలినడకన వచ్చాను.
మఠ సోదరులు, “నీ సగం పంచె ఏమైంది?” అని అడిగారు.
రవీంద్ర: వచ్చేటప్పుడు ఆమె పట్టుకొని లాగింది. అందుకే సగం చిరిగిపోయింది.
మఠసోదరులు: గంగలో స్నానం చేసి రా. మొదట ప్రశాంతంగా ఉండు పిదప మాట్లాడదాం.
రవీంద్ర కలకత్తాలో ఒక గౌరవనీయ కాయస్థ కుటుంబానికి చెందినవాడు. అతడి వయస్సు ఇరవై రెండేళ్లు ఉండవచ్చు. దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులను అతడు దర్శించి ఉన్నాడు; ఆయన అనుగ్రహానికి పాత్రుడైనవాడు.
ఒకసారి మూడు రాత్రుళ్లు శ్రీరామకృష్ణుల వద్ద ఉండిపోయాడు. సరళ స్వభావి. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఎంతో అభిమానించారు. అతడితో, “నువ్వు కొంతకాలం వేచివుండాలి. ఇంకా కాస్త అనుభవించాలన్న ఆకాంక్ష మిగిలి ఉంది! ఇప్పుడు ఏమీ జరగదు. దొంగ దోచుకోడానికి ప్రారంభించినప్పుడు పోలీసులు అతణ్ణి ఏమీ చేయరు. దోచుకొన్న పిదపే పోలీసులు వచ్చి ఖైదు చేస్తారు” అని చెప్పివున్నారు.
రవీంద్ర ఒక వెలయాలి వలలో చిక్కుకొని ఉన్నాడు. పేదలపట్ల కరుణ, భగవంతుని పట్ల భక్తి వంటి సుగుణాలు అతడిలో ఉన్నాయి. వెలయాలు తనకు నమ్మకద్రోహం చేసిందని గ్రహించి కట్టుబట్టలతో మఠానికి పరిగెత్తి వచ్చాడు. మళ్లీ సంసారంలో అడుగిడరాదని తీర్మానించాడు.
రవీంద్ర గంగలో స్నానం చేయడానికి పారమానిక్ ఘట్టానికి వెళ్లాడు. ఒక భక్తుడు అతడి వెంట వెళ్లాడు. రవీంద్ర సాధుసాంగత్యం చేసి మంచి బుద్ధిని అలవరచుకోవాలని ఆ భక్తుని ఆకాంక్ష. స్నానం చేశాక భక్తుడు రవీంద్రను సమీపంలోని శ్మశానానికి తోడ్కొని వెళ్లాడు. అక్కడ ఒక పీనుగును చూపించాడు. పిదప భక్తుడు అతడితో, “మఠ సోదరులు తరచూ రాత్రుళ్లు ఇక్కడకు వచ్చి ఏకాంతంలో ధ్యానం చేస్తూంటారు. మనమూ ఇక్కడ ధ్యానం చేయడం మంచిది. జీవితం అశాశ్వతం అన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు” అన్నాడు. రవీంద్ర ధ్యానంలో మగ్నుడైనాడు. కాని అతడు ఎక్కువసేపు ధ్యానంలో లగ్నం కాలేకపోయాడు. మనస్సు సంచలన స్థితిలో ఉంది.
ఇద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. పూజామందిరంలోకి వెళ్లి శ్రీరామకృష్ణులకు మ్రొక్కారు. “ఈ గదిలో మఠ సోదరులు ధ్యానం చేస్తూ ఉంటారు” అన్నాడు భక్తుడు. రవీంద్ర ధ్యానం చేయ కూర్చున్నాడు. ఇక్కడా అతడు ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోయాడు.
‘మ’ : ఏమిటి? మనస్సు అధికంగా సంచలనమవుతున్నదా? అందుకే వెంటనే లేచావా? ధ్యానం బాగా కుదరలేదు కాబోలు.
రవీంద్ర: మనస్సు సంచలనమై ఉండటం నిజమే. కాని ఇక సంసారంలోకి తిరిగి పోను. ఇది ముమ్మాటికీ సత్యం!
‘మ’, రవీంద్ర మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవరూ లేరు. ‘మ’ బుద్ధుని గురించి చెప్పసాగాడు. “దేవకన్యల గానం విని బుద్ధునికి ప్రప్రథమంలో నిజం వెల్లడైంది. ఇప్పుడల్లా మఠంలో బుద్ధచరిత్ర, చైతన్య చరితామృతం గురించి చర్చలు జరుగుతున్నాయి.”
ఇలా అంటూ ‘మ’ ఆ పాట పాడాడు.
విశ్రాంతికై మేము విలపించినాము
అకట ఆ విశ్రాంతి లభ్యమే కాదు
ఎటనుండి వచ్చితిమొ ఎరుకయే లేదు
ఎటుకొట్టుకొని మేము ఏగెదము కూడ….
కలకత్తా నుంచి నరేంద్రుడు, తారక్, హరీశ్ ముగ్గురూ రాత్రి తిరిగి వచ్చారు. రాగానే, “ఒక పెద్ద విందు భోజనం చేశాం!” అన్నారు. కలకత్తాలో ఒక భక్తుడు వారిని ఆహ్వానించి, విందు చేశాడు.
నరేంద్రుడు, భక్తులు, ‘మ’, రవీంద్రలు పెద్ద గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు మఠానికి తిరిగి రాగానే రవీంద్రుని కథనం యావత్తూ అడిగి తెలుసు కొన్నాడు.
నరేంద్రుడు పాడాడు. పాట మూలంగా రవీంద్రునికి ఉపదేశించాడు.
ఓ మానవా నీవు భ్రాంతి విడనాడి
నీ దుష్టసంకల్పముల విడచిపెట్టుమీ ॥ ఓ ॥
భగవంతుని కనుగొని భవబాధలను గడచి
స్వేచ్ఛగా లోకాన జీవించు మానవా ॥ ఓ ॥
మూన్నాళ్ల ముచ్చటగ మురిసిపోవును నీవు
పూర్తిగ భగవంతు మరచిపోయితిని ॥ ఓ ॥
నీ జీవమున కిపుడు నీడెవరు తోడెవరు
అకటకట! ఇది ఏమి హాస్యాస్పదమురా ॥ ఓ ॥
నరేంద్రుడు మళ్లీ పాడాడు. రవీంద్రునికి ఉపదేశిస్తున్నట్లు గానం చేశాడు:
ప్రేమ పాత్రలో బ్రహ్మానందము
పానము చేయుము ఓ సాధో…..
కాసేపయ్యాక మఠసోదరులు కాళీతపస్వి గదిలో కూర్చున్నారు. గిరీశ్ తాను రచించిన చైతన్య చరితామృతం, బుద్ధచరిత్ర అనే కొత్త పుస్తకాలు పంపి ఉన్నాడు. నరేంద్రుడు, శశి, రాఖాల్, ప్రసన్న, ‘మ’ లు కూర్చుని ఉన్నారు.
కొత్త మఠం ఆరంభం నుంచే శశి నిండు మనస్సుతో పూజాకైంకర్యం చేస్తూవచ్చాడు. గురుభక్తి పూర్ణమైన ఆతడి సేవను చూసి అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. శ్రీరామకృష్ణులు జబ్బులో ఉన్నప్పుడు ఎట్లా రేయింబవళ్లు సేవలు ఒనరించాడో అదే రీతిలో ఇప్పుడూ కొరవడని స్ఫూర్తితో, భక్తితో అతడు సేవిస్తూ వచ్చాడు.
మఠ సోదరులలో ఒకరు బుద్ధ చరిత్రను, చైతన్య చరితామృతాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. రాగయుక్తంగా, పరిహాస ధోరణిలో చైతన్య చరితామృతాన్ని పఠించాడు. నరేంద్రుడు పుస్తకాన్ని లాక్కొని, “ఇలాగే మంచి విషయాన్ని చెడగొడతావు” అన్నాడు.
చైతన్య దేవులు భక్తిని జనులకు పంచిన విభాగాన్ని నరేంద్రుడే స్వయంగా పఠించాడు.
మఠ సోదరుడు: ఏ వ్యక్తీ ప్రేమభక్తిని మరొకరికి అందించలేడని నే నంటున్నాను.
నరేంద్రుడు: పరమహంసదేవులు నా కది ఇచ్చారు.
మఠ సోదరుడు: సరి, ఇప్పుడు ఇది నీలో ఉన్నదా?
నరేంద్రుడు: ప్రేమ గురించి నువ్వెలా తెలుసుకోగలవు? నువ్వు సేవక వర్గానికి చెందినవాడివి. మీరందరూ నా కాళ్లు ఒత్తవలసివాళ్లు. (అందరూ నవ్వారు) సర్వజ్ఞుడనని గర్వించబోకు. (నువ్వు) వెళ్లి నాకు పొగత్రాగడానికి ఏర్పాటు చెయ్యి. (అందరూ నవ్వారు)
మఠ సోదరుడు: నిశ్చయంగా ఏర్పాటు చెయ్యను. (అందరూ నవ్వారు)
‘మ’ (స్వగతం): శ్రీరామకృష్ణులు నరేంద్రునికి మాత్రమే కాదు, మఠ సోదరులలో పలువురికీ అంతర ప్రకాశాన్ని ఇచ్చారు. ఆ ప్రకాశం లేకుంటే కామినీ కాంచన త్యాగం చేయనగునా?
మంగళవారం, మే 10, 1887
జగజ్జనని ఆరాధనకు నాడు పర్వదినం. నరేంద్రాదులు నాడు జగజ్జననికి ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజా మందిరానికి ఎదుట హోమానికి ఏర్పాట్లు చేశారు. హోమం నిర్వర్తింపబడగానే బలి ఇస్తారు. తంత్రశాస్త్ర గ్రంథాల్లో హోమం, బలి విధివిహితాలు పేర్కోబడి ఉన్నవి. నరేంద్రుడు గీతాపారాయణం చేశాడు.
‘మ’ గంగలో స్నానం చేయడానికి వెళ్లాడు. రవీంద్ర ఒంటరిగా మేడమీద పచార్లు చేస్తున్నాడు. నరేంద్రుడు శంకరుల నిర్వాణషట్కం స్వరయుక్తంగా గానం చేశాడు:
న మృత్యు ర్న శంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ ।
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య
శ్చిదానందరూపః శివోఽహం శివోఽహమ్
అహం నిర్వి (ల్పీ)ల్పో నిరాకారరూ(పీ)పో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ ।
న చా సంగతం నైవ ముక్తిర్న మేయ
శ్చిదానందరూపః శివోఽహం శివోఽహమ్
రవీంద్ర గంగలో స్నానమాడి తడిబట్టలతో తిరిగి వచ్చాడు.
నరేంద్రుడు. (‘మ’ తో ఏకాంతంలో): ఇతడు స్నానం చేసి వచ్చాడు. ఇప్పుడు ఇతడికి సన్న్యాసం ఇప్పిస్తే బాగుంటుంది. (‘మ’, నరేంద్రుడు నవ్వారు)
ప్రసన్నుడు రవీంద్రను తడిబట్టలను విప్పమని చెప్పి అతడికి ఒక కాషాయవస్త్రం తెచ్చి ఇచ్చాడు.
నరేంద్రుడు (‘మ’ తో): ఇప్పుడు అతడు త్యాగి ఉడుపులు ధరించాలి..
‘మ’ (నవ్వుతూ): ఏ రకమైన పరిత్యాగం ఇది?
నరేంద్రుడు: కామినీకాంచన పరిత్యాగమే.
రవీంద్ర కాషాయ వస్త్రం ధరించాడు. అతడు కాళీ తపస్వి గదిలోకి వెళ్లి కూర్చున్నాడు; ఒకింత ధ్యానం చేయ ప్రయత్నిస్తూన్నట్లు కానవచ్చాడు.