50.1 ప్రథమ పరిచ్ఛేదం కాశీపూర్‌లో నరేంద్రాదులతో
శుక్రవారం, ఏప్రెల్ 9, 1886
సమయం సాయంత్రం అయిదు గంటలు. కాశీపూర్ ఉద్యాన గృహం క్రింది అంతస్తులో నరేంద్రుడు, కాళీ, నిరంజన్, ‘మ’ లు మాట్లాడుకుంటూ ఉన్నారు.
నిరంజన్ (‘మ’ తో): విద్యాసాగర్ కొత్త స్కూలు నొకదానిని ప్రారంభించ బోతున్నాడన్న విషయం నిజమేనా? అందులో నరేంద్రునికి ఉద్యోగం ప్రయత్నించరాదా?
కాళీ (స్వామి అభేదానంద)
నరేంద్రుడు: విద్యాసాగర్ వద్ద నేను చేసిన పని చాలులే.
నరేంద్రుడు ఇప్పుడే బుద్ధగయ నుండి తిరిగి వచ్చాడు. అతడు అక్కడకు కాళీ, తారక్‌లతో వెళ్ళాడు. ఆ పవిత్ర ప్రదేశాలలో అతడు బుద్ధుని విగ్రహం ఎదుట ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడైపోయాడు. ఏ వృక్షం క్రిందనైతే బుద్ధుడికి నిర్వాణం ప్రాప్తించిందో, ఇప్పుడు అక్కడ ఒక నూతన వృక్షం మొలిచింది. నరేంద్రుడు ఆ వృక్షాన్ని కూడా దర్శించాడు.
కాళీ ఇలా అన్నాడు: “ఒక రోజు గయలో ఉమేష్బాబు ఇంట్లో నరేంద్రుడు మృదంగంతో ఖ్యాల్, ద్రుపద్ ఇత్యాది రాగాలు ఆలాపించాడు.”
శ్రీరామకృష్ణులు పై అంతస్తులో ఉన్న పెద్ద గదిలో తమ మంచం మీద కూర్చుని ఉన్నారు. రాత్రి సమయం. అప్పుడు అక్కడ ఆయనతో పాటు ‘మ’ ఒక్కడే ఉన్నాడు, శ్రీరామకృష్ణులకు విసన కర్రతో వీస్తున్నాడు. కాసేపటి తరువాత లాటూ వచ్చి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఒక ఉత్తరీయం, జత చెప్పులు తీసుకొని రా.
‘మ’ : అలాగేనండి.
శ్రీరామకృష్ణులు (లాటుతో): ఉత్తరీయం ధర పది అణాలు, అటుపైన చెప్పులు. మొత్తం ఎంత అవుతుంది?
లాటూ: ఒక రూపాయి పది అణాలండీ.
దానిని గుర్తుంచుకోమని శ్రీరామకృష్ణులు ‘మ’ కు సైగ చేశారు.
నరేంద్రుడు గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శశి, రాఖాల్, ఇంకా ఒకరిద్దరు భక్తులు కూడా వచ్చి కూర్చున్నారు. తమ పాదాలను మృదువుగా ఒత్తమని శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో చెప్పారు. తరువాత “భోజనం చేశావా?” అని అడిగారు.
50.1.1 “అస్తి నాస్తి మధ్య స్థితి”
శ్రీరామకృష్ణులు (‘మ’ తో, నవ్వుతూ): ఇతడు అక్కడకు (బుద్ధగయ) వెళ్ళాడు.
‘మ’ (నరేంద్రుడితో): బుద్ధుడి సిద్ధాంతాలు ఏమిటి?
నరేంద్రుడు: తపస్సు ద్వారా ఆయన సాక్షాత్కరించుకొన్న విషయాలను మాటలలో చెప్పలేకపోయాడు. ఆ కారణంగా లోకులు ఆయన్ను నాస్తికుడన్నారు.
శ్రీరామకృష్ణులు (సైగలు చేస్తూ): నాస్తికుడెందుకు? ఆయన నాస్తికుడు కాదు. తన ఆంతరంగిక అనుభవాలను మాటలలో వ్యక్తం చేయలేకపోయాడు. బుద్ధుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? బోధస్వరూపాన్ని ధ్యానిస్తూ అట్లే అయిపోవడం, బోధస్వరూపంగా అయిపోవడం.
నరేంద్రుడు: అవునండీ. బుద్ధులలో మూడు తరగతుల వారున్నారు – బుద్ధుడు, అర్హతుడు, బోధిసత్త్వుడు.
శ్రీరామకృష్ణులు: ఇది కూడా భగవంతుని లీలయే – ఇది ఒక నూతన లీల. బుద్ధుణ్ణి నాస్తికుడని ఎందుకు అనాలి? స్వరూపం యొక్క బోధ ఎక్కడైతే ఉంటుందో అది అస్తి, నాస్తిలకు మధ్య ఉన్నటువంటి స్థితి.
నరేంద్రుడు (‘మ’ తో): ఆ స్థితిలో పరస్పర విరుద్ధాలు కలుసుకొంటాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే శీతల జలం తయారవుతుంది. మళ్ళీ అదే హైడ్రోజన్, ఆక్సిజన్లను ఆక్సో–హైడ్రోజన్ బ్లో పైప్‌లో వాడతారు. ఆ స్థితిలో కర్మలు, కర్మత్యాగం రెండూ సాధ్యమే; అంటే అప్పుడు నిష్కామకర్మ సాధ్యం అవుతుంది.
“ఇంద్రియ సుఖాలలో నిమగ్నమైవున్న ప్రాపంచిక వ్యక్తులు సర్వం అస్తియే అంటారు. కాని మాయావాదులు నాస్తి, అంటే ‘ఉన్నది ఏమీ లేదు’ అంటారు. బుద్ధుని స్థితి ఈ అస్తి, నాస్తులకు అతీతమైనది.”
శ్రీరామకృష్ణులు: ఈ అస్తి, నాస్తి అనేవి ప్రకృతి యొక్క గుణాలు. అయితే, సత్యం ఈ రెంటికీ అతీతం.
భక్తులు కాసేపు మౌనంగా ఉండిపోయారు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): బుద్ధుడు ఏం ఉపదేశించాడు?
50.1.2 బుద్ధుని వైరాగ్యం, దయ
నరేంద్రుడు: భగవంతుడు ఉన్నాడా, లేడా అనే విషయాన్ని ఆయన చర్చించలేదు. కాని ఆయన అందరి పట్ల దయ చూపాడు.
“ఒకసారి, డేగ ఒక పక్షి మీదకు దూకి, దానిని కబళించబోయినప్పుడు బుద్ధుడు ఆ పక్షిని రక్షించడానికి తన శరీరంలోని మాంసాన్ని డేగకు ఇచ్చాడు.”
శ్రీరామకృష్ణులు మౌనంగా ఉన్నారు. నరేంద్రుడు మరింత ఉత్సాహంతో బుద్ధుని గురించి మాట్లాడసాగాడు.
నరేంద్రుడు: ఆహా! బుద్ధునిది ఎంత గొప్ప వైరాగ్యం! రాకుమారుడైవుండీ కూడా సకలం త్యాగం చేశాడు. తనకంటూ ఏమీ లేని, ఎలాంటి సంపదలు లేని వ్యక్తికి త్యాగం చేయడానికంటూ ఏం ఉంటుంది? ఆయన బుద్ధత్వాన్ని పొంది నిర్వాణం ప్రాప్తించుకున్నాక ఒకసారి తన గృహానికి వెళ్ళాడు. అప్పుడు భార్య, కుమారుడు, ఇంకా ఆ రాజవంశానికి చెందిన పలువురిని వైరాగ్య జీవితాన్ని అలవరచుకోమని ఉద్బోధించాడు. ఆహా! ఎంతటి వైరాగ్యం! మరోవైపు వ్యాసుడి ప్రవర్తనే తీసుకోండి. తన కుమారుడైన శుకదేవుడు సంసారాన్ని పరిత్యజించడానికి ఆయన ఒప్పుకోలేదు. ‘కుమారా!గృహస్థాశ్రమంలో ఉంటూనే ధర్మాన్ని ఆచరించు’ అని సలహా ఇచ్చాడు.
శ్రీరామకృష్ణులు మౌనంగానే ఉన్నారు.
నరేంద్రుడు: శక్తి, భక్తి లాంటివి వేటినీ బుద్ధుడు లెక్క చెయ్యలేదు. ఆయన కోరుకున్నది కేవలం నిర్వాణం మాత్రమే. ఆయన వైరాగ్యం అనూహ్యమైనది! తపస్సు నిమిత్తం బోధివృక్షం క్రింద కూర్చుని ‘ఇహైవ సుష్యుతు మే శరీరం’ అని శపథం పూనాడు. అంటే అర్థం: ‘నిర్వాణ ప్రాప్తి లభించని పక్షంలో నా శరీరం ఇక్కడే శిథిలమైపోవు గాక!’ ఆహా, ఎంతటి ప్రగాఢ సంకల్పం!
“ఈ దేహమే పెద్ద శత్రువు. దీన్ని జయించనిదే ఏమైనా సాధించగలమా!”
శశి: కాని మాంసం భుజించడం వలన సత్త్వగుణం పెంపొందుతుందని నువ్వే కదా చెబుతుంటావు; మాంసం తినమని నువ్వే కదా నొక్కి చెబుతుంటావు.
నరేంద్రుడు: నేను మాంసం తింటానన్న మాట నిజమే. కాని కావాలంటే కేవలం అన్నం మీదనే జీవించగలను. కనీసం ఉప్పుకూడా లేకుండా కేవలం అన్నం తింటూ ఉండగలను.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. సైగల ద్వారా నరేంద్రుడితో, బుద్ధుడి తల మీద శిఖ ఏమైనా ఉందా అని అడిగారు.
నరేంద్రుడు: లేదండి. రుద్రాక్ష మాలలను ఒక దానిమీద మరొకటి పేర్చినప్పుడు ఎలా ఉంటుందో, ఆయన తల మీద అలా ఉంది.
శ్రీరామకృష్ణులు: మరి ఆయన కళ్ళు?
నరేంద్రుడు: ఆయన సమాధి స్థితిలో ఉన్నట్లుగా అవి సూచిస్తున్నాయి.
50.1.3 ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా! – “నేనే ఆయన”
శ్రీరామకృష్ణులు మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. నరేంద్రుడు తదితర భక్తులు ఆయన వంకే తదేకంగా చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన వదనంలో చిరునవ్వు తళుక్కున మెరిసింది. నరేంద్రుడితో సంభాషించ సాగారు. ‘మ’ ఆయనకు విసురుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, పెసరపప్పు, సెనగపప్పు, చింతపండు అన్నీ – ఏమంటావు?
నరేంద్రుడు: ఆ స్థితులన్నిటినీ అనుభూతం చేసుకొన్నాక మీరు ప్రస్తుతం మనస్సును దిగువ స్థాయిలో నిలిపి ఉంచారు.
‘మ’ (స్వగతం): అవును అన్ని స్థితులను అనుభూతం చేసుకొని ప్రస్తుతం భక్తుడి స్థితిలో ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: ఎవరో నన్ను క్రిందికి లాగిపెట్టినట్లు ఉంది.
ఈ విధంగా పలికి శ్రీరామకృష్ణులు, ‘మ’ చేతిలో నుండి విసనకర్ర తీసుకొని మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఈ విసనకర్రను ఎలాగైతే ఎదురుగా, ప్రత్యక్షంగా చూస్తున్నానో, సరిగ్గా అదే విధంగానే నేను భగవంతుణ్ణి చూశాను. ఇంకా, నేను చూసింది –
ఇలా పలికి శ్రీరామకృష్ణులు తమ హృదయం మీద చెయ్యి వేసి, సైగలు చేస్తూ నరేంద్రుడితో “నేనేం అన్నానో చెప్పు” అన్నారు.
నరేంద్రుడు: నేను అర్థం చేసుకున్నాను.
శ్రీరామకృష్ణులు: చెప్పు చూద్దాం.
నరేంద్రుడు: నేను సరిగ్గా వినలేదు.
శ్రీరామకృష్ణులు మళ్ళీ సైగలు చేస్తూ “ఆయనా (భగవంతుడు), ఈ హృదయ మధ్యంలో ఉన్న వ్యక్తీ ఒక్కరే అని చూశాను” అన్నారు.
నరేంద్రుడు: అవునవును! సోఽహం (నేనే ఆ పరబ్రహ్మాన్ని).
శ్రీరామకృష్ణులు: కాని ఆ ఇద్దరినీ ఒక గీత మాత్రమే విభజిస్తోంది – నేను దివ్యానందాన్ని అనుభవించే నిమిత్తం.
నరేంద్రుడు (‘మ’ తో): మహాత్ములు తాము ముక్తి నొందాక కూడా ఇతరులను ఉద్ధరించే నిమిత్తం అహంకారాన్ని నిలుపుకుంటారు, శరీర సుఖదుఃఖాలను అనుభవిస్తారు.
“అది కూలీపని లాంటిది. మనం చేసే కూలీపని ఇక వేరే గత్యంతరం లేకనే. వారు చేసే కూలీపని వారి ఇచ్ఛ మేరకే.”
మళ్ళీ అందరూ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తరువాత సంభాషణ కొనసాగింది.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడు తదితరులతో): డాబా స్పష్టంగా కనిపిస్తోంది. కాని అక్కడకు వెళ్ళడం ఎంతో కష్టం.
నరేంద్రుడు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: కాని అక్కడకు ఎవరైనా చేరుకున్నట్లయితే, అక్కడ నుండి త్రాడును క్రిందికి వ్రేలాడదీసి మరొకరిని కూడా పైకి లాక్కోవచ్చు.
50.1.4 శ్రీరామకృష్ణుల అయిదు రకాల సమాధి స్థితులు
“ఒకసారి హృషీకేశ్ సాధువు ఒకరు దక్షిణేశ్వరానికి వచ్చాడు. అతడు నాతో ‘ఏం ఆశ్చర్యం! నీలో ఐదు రకాల సమాధి స్థితులను గమనిస్తున్నాను’ అన్నాడు.
“ఒక్కోసారి కోతిలా – కోతి ఒక కొమ్మనుండి మరో కొమ్మ మీదకు గెంతుతూ చెట్టు ఎక్కే విధంగా మహావాయువు దేహమనే వృక్షంలో ఒక చక్రం నుండి మరో చక్రం వద్దకు గెంతుతూపోతుంది. అప్పుడు సమాధిస్థితి కలుగుతుంది.
“ఒక్కోసారి చేప మాదిరి – చేప, నీటిలో వేగంగా కదలిపోతూ మహదానందంగా విహరిస్తు న్నట్లుగా మహావాయువు దేహంలో పైకి కదులుతూ పోతుంది. అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది.
“ఒక్కోసారి పక్షిలా – పక్షి ఒక కొమ్మనుండి మరో కొమ్మ మీదకు ఎగిరే విధంగా దేహమనే వృక్షంలో మహావాయువు పక్షిలా పైకి ఎగురుతూ పోతుంది.
“ఒక్కోసారి చీమలా – చీమ మెల్లగా ప్రాకుతూ పోయినట్లుగా మహావాయువు ఒక చక్రం నుండి మరో చక్రం వద్దకు పోతుంది. ఆ విధంగా మహావాయువు సహస్రారం చేరుకున్నప్పుడు సమాధిస్థితి కలుగుతుంది.
“ఒక్కోసారి పాము యొక్క తిర్యక్ గమనంలాగా ఉంటుంది. అంటే మహా వాయువు గమనం, పాము మెలికలు తిరుగుతూ పోతున్నట్లుగా ఉంటుంది. ఆ విధంగా మహావాయువు సహస్రారం చేరుకున్నాక సమాధిస్థితి కలుగుతుంది.”
రాఖాల్ (భక్తులతో): నేటికి ఇక చాలులే. ఆయన ఇప్పటికే చాలా మాట్లాడారు. ఇంకా మాట్లాడితే వ్యాధి విషమించే ప్రమాదం ఉంది.
50.2 ద్వితీయ పరిచ్ఛేదం సంతకు వెళ్ళొచ్చిన భక్తునితో శ్రీరామకృష్ణులు
సోమవారం, ఏప్రెల్ 12, 1886
సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచంమీద కూర్చున్నారు. శశి, ‘మ’ అక్కడ ఉన్నారు. విసనకర్రతో విసరమని ఆయన ‘మ’ కు సైగ చేశారు. బెంగాలీ సంవత్సరాంత వేడుకల సందర్భంగా ఆ ప్రాంతంలో సంత జరిగింది. ఆ సంతలో ఏవైనా వస్తువులు కొని తెమ్మని శ్రీరామకృష్ణులు ఒక భక్తుణ్ణి పంపి ఉన్నారు. ఆ భక్తుడు తిరిగి వచ్చాడు.
శ్రీరామకృష్ణులు: ఏమేం కొనితెచ్చావు?
భక్తుడు: ఐదు పైసల కలకండ, రెండు పైసలకు ఒక చెమ్చా, రెండు పైసలకు కూరగాయలు కోసే కత్తి ఒకటి.
శ్రీరామకృష్ణులు: పేనాకత్తి తీసుకు రాలేదా?
భక్తుడు: రెండు పైసలకు అది లభించలేదు.
శ్రీరామకృష్ణులు (ఆతురతతో): త్వరగా వెళ్ళి దాన్ని పట్రా.
‘మ’ క్రింద తోటలో పచార్లు చేస్తున్నాడు. నరేంద్రుడు, తారక్ కలకత్తా నుండి తిరిగివచ్చారు. వారు దారిలో గిరీశ్ ఘోష్ ఇంటికి వెళ్ళి వచ్చారు.
తారక్: ఇవాళ మేము చాలా ఎక్కువగా తిన్నాం.
నరేంద్రుడు: ఇవాళ మనస్సు చాలా దిగువకు వెళ్ళిపోయింది. తపస్సు చేద్దాం రండి. (‘మ’ తో) మనశ్శరీరాలకు ఎంతటి బానిసత్వమో చూడండి.
“మనం సరిగ్గా కూలీల లాగానే ఉన్నాం – ఈ శరీరం, మనస్సు మనకు చెందినవి కావు, మరెవరికో చెందినవి అన్నట్లుగా.”
సంధ్యాకాలమయింది. ఇంట్లో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు ఉత్తరాభిముఖులై మంచం మీద కూర్చుని ఉన్నారు; జగజ్జనని ధ్యానంలో మగ్నులై ఉన్నారు. కాసేపటి తరువాత బలరామ్ పురోహితుల కుటుంబానికి చెందిన ఫకీర్ అపరాధ భంజన స్తోత్రం పఠించాడు. శశి, ‘మ’ ఇంకా ఒకరిద్దరు భక్తులు గదిలో ఉన్నారు. స్తోత్ర పఠనం పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి సభక్తికంగా జగజ్జననికి నమస్కరించారు.
‘మ’ శ్రీరామకృష్ణులకు విసనకర్రతో వీస్తున్నాడు. ఆయన సైగలు చేస్తూ ‘మ’ తో “ఒక రాతి కప్పు తీసుకురా – తెల్లరాతి కప్పు. అందులో పావు సేరు పాలు పట్టేలా ఉండాలి” అన్నారు. ఇలా అని ఆయన తమ చేత్తో కప్పు ఆకారాన్ని గీచి సూచించారు.
‘మ’ : అలాగేనండి.
శ్రీరామకృష్ణులు: తక్కిన కప్పులతో కూర వేసుకుని తింటుంటే చేప వాసన వస్తోంది.
50.3 తృతీయ పరిచ్ఛేదం కర్మఫలం -ఈశ్వరకోటి, జీవకోటి – అంతా మాయే!
మంగళవారం, ఏప్రెల్ 13, 1886
ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది. గతరాత్రి ‘మ’ ఉద్యాన గృహంలోనే బస చేశాడు. గంగలో స్నానం చేశాక వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. రాంచంద్ర దత్త అప్పుడే వచ్చాడు. అతడు పువ్వుల మాలను తీసుకువచ్చాడు; దాన్ని శ్రీరామకృష్ణులకు సమర్పించాడు. పలువురు భక్తులు క్రింది అంతస్తులోనే ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే శ్రీరామకృష్ణుల గదిలో ఉన్నారు.
శ్రీరామకృష్ణులు, రామ్‌తో మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడు నువ్వు నన్నెలా చూస్తున్నావు?
రామ్: మీలో సర్వం దర్శనీయమే.
“ప్రస్తుతం మీ రోగం గురించిన ప్రస్తావన వచ్చింది.”
శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సైగలు చేసి “నా రోగం గురించిన ప్రస్తావన వచ్చిందా?” అన్నారు.
శ్రీరామకృష్ణులకు చెప్పులు సరిపోలేదు. డా ॥ రాజేంద్ర దత్త ఆయనకు ఒక జత కొత్త చెప్పులు కొనదలచాడు* . అందునిమిత్తం ఆయన పాదాల కొలతలు తీసుకున్నాడు.
శ్రీరామకృష్ణులు సైగలు చేస్తూ ‘మ’ తో రాతి కప్పు విషయం ఏమయిందని అడిగారు. ‘మ’ వెంటనే లేచి నిలబడ్డాడు. తక్షణమే కలకత్తాకు వెళ్లి కప్పు తీసుకు రావడానికి నిశ్చయించుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: దాని గురించి ఇప్పుడు ఏమీ పట్టించుకోవద్దులే.
‘మ’ : లేదండి. కొందరు భక్తులు కలకత్తాకు వెళుతున్నారు. నేను కూడా వారితో పాటు వెళతాను.
కలకత్తాలో కప్పు కొని మధ్యాహ్నం కాశీపూరు తిరిగి వచ్చాడు ‘మ’. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు సమీపంగా కప్పు ఉంచాడు. ఆయన దాన్ని చేతిలోకి తీసుకుని చూశారు. గదిలో రాఖాల్, శశి, చిన్న నరేంద్రుడు ఉన్నారు. డా ॥ రాజేంద్ర దత్త, డా ॥ శ్రీనాథ్, రాఖాల్, హాల్దార్ మొదలైనవారు కూడా అక్కడకు వచ్చి కూర్చున్నారు. డాక్టర్లు, శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని గురించిన విషయమంతా విన్నారు. డా ॥ శ్రీనాథ్ చేతిలో భగవద్గీత పుస్తకం ఉంది.
డా ॥ శ్రీనాథ్ (తన స్నేహితులతో): సర్వమూ ప్రకృతి అధీనంలోనే ఉంది. కర్మ ఫలం నుండి ఎవరూ తప్పించుకోలేరు; దీనినే ప్రారబ్ధం అంటారు.
శ్రీరామకృష్ణులు: ఎందుకు, భగవన్నామం ఉచ్చరించి, ఆయన్ను ధ్యానించి ఆయన వద్ద శరణాగతి పొందినట్లయితే –
డా ॥ శ్రీనాథ్: అయ్యా, కాని ప్రారబ్ధం నుండి ఎలా తప్పించుకోగలం? పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలం ఉండనే ఉంటుంది కదా?
శ్రీరామకృష్ణులు: మనిషి ఆ కర్మ ఫలాన్ని కొద్దిగా అనుభవిస్తాడన్నమాట నిజమే. కాని భగవన్నామ మహిమతో అందులో చాలా వరకు తొలగిపోతుంది. ఒక వ్యక్తికి పుట్టుకతోనే ఒక కన్ను గ్రుడ్డిది, పూర్వ జన్మలో అతడు చేసిన పాపానికి ఫలితమది. ఇంకా ఆరు జన్మల పాటు అతడికి అలా ఆ శిక్ష అనుభవించ వలసి ఉంది. అయితే అతడు గంగాస్నానం ఆచరించాడు. గంగాస్నానం వల్ల ముక్తి కలుగుతుంది. గంగాస్నానం కారణంగా అతడి అంధత్వం పోలేదు కాని మరి ఆరు జన్మలు ఎత్తవలసిన అవసరం లేకపోయింది.
డా ॥ శ్రీనాథ్: అయ్యా, కాని కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోజాలరని శాస్త్రాలు చెప్తున్నాయి కదా!
డా ॥ శ్రీనాథ్ వాదించడానికి సిద్ధపడుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఈశ్వరకోటి, జీవకోటికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని ఇతడికి చెప్పు. ఈశ్వరకోటి వల్ల అపరాధం జరుగదని చెప్పు.
‘మ’ మౌనంగా ఉన్నాడు. పిదప రాఖాల్తో “నువ్వు చెప్పు” అన్నాడు. కాసేపటి తరువాత డాక్టర్లు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు, హల్దార్‌తో మాట్లాడసాగారు.
హల్దార్: డా ॥ శ్రీనాథ్ వేదాంత చర్చలు చేస్తుంటాడు. అతడు యోగ వాసిష్ఠం అధ్యయనం చేశాడు.
శ్రీరామకృష్ణులు: గృహస్థు అయివుండీ ‘సర్వం స్వప్నవత్’ అనడం మంచిది కాదు.
కాళిదాస్ అనే వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఒక భక్తుడు “అతడు కూడా వేదాంత చర్చలు చేస్తుంటాడు. కాని అతడు వ్యాజ్యాలలో చిక్కుకొని దివాలా తీశాడు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును. అంతా మాయే అని అంటుంటారు, మళ్ళీ వ్యాజ్యాలు కూడా నడుపుతుంటారు! (హల్దార్‌తో) జనాయికి చెందిన ముఖర్జీ కూడా మొదట్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండేవాడు. చివరి రోజుల్లో అసలు విషయం ఏమిటో అతడికి తెలిసి వచ్చింది. నా ఆరోగ్యం కనుక బాగున్నట్లయితే డా ॥ శ్రీనాథ్‌తో ఇంకాసేపు మాట్లాడి ఉండేవాడిని. జ్ఞానం గురించి ఊరకే మాట్లాడినంత మాత్రాన అది లభిస్తుందా ఏమిటి?
50.3.1 జితేంద్రియుడు అనే మాటలో శ్రీరామకృష్ణులకు రోమాంచితం
హల్దార్: అవునండి. నేను కూడా జ్ఞానం అంటూ ఎంతో చూశాను. ఇప్పుడు నాకు కాస్త భక్తి కలిగితే బ్రతికిపోతాను. ఒక రోజు నేను నా సమస్య గురించి మీ వద్దకు వచ్చాను. మీరు దానిని పరిష్కరించారు.
శ్రీరామకృష్ణులు (ఆతురతతో): ఏమిటది?
హల్దార్: అయ్యా, ఆ కుర్రవాడు (చిన్న నరేంద్రుణ్ణి చూపుతూ) ఇక్కడకు వచ్చినపుడు అతడు జితేంద్రియుడని మీరు అన్నారు.
శ్రీరామకృష్ణులు: అవునయ్యా, నిజమే. అతడిలోకి విషయాసక్తి అసలు ప్రవేశించనే లేదు. కామం అంటే ఏమిటో తెలియదంటాడతడు. (‘మ’ తో) నీ చెయ్యి పెట్టి చూడు, నాకు రోమాంచిత మవుతున్నట్లుంది.
లేశమాత్రమైనా కామంలేని పరిశుద్ధ మనస్సు అన్న ఆలోచన మనస్సులో మెదలగానే శ్రీరామకృష్ణులకు రోమాంచితమయింది. అలాంటి పవిత్ర హృదయులలో భగవంతుడు ప్రస్ఫుటంగా విరాజిల్లుతాడని ఆయన చెబుతుంటారు కదా!
హల్దార్ సెలవు తీసుకున్నాడు.
50.3.2 ‘మద్గురు శ్రీ జగద్గురు’ – రాఖాల్, శశి
శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆయన్ను దర్శించే నిమిత్తం ఒక పిచ్చి స్త్రీ అక్కడకు వచ్చి అందరినీ సతాయిస్తోంది. ఆమెది మధురభావం. తరచూ ఉద్యానగృహంలోకి పరుగెడుతూ వచ్చి అందరినీ తోసుకుంటూ వెళ్ళి శ్రీరామకృష్ణుల గదిలోకి పోతుంది. భక్తులు ఆమెను కొట్టడం కూడా జరిగింది. కాని అలా రావడం మాత్రం ఆమె మానలేదు.
శశి: ఆమె కనుక మళ్ళీ ఇక్కడకు వస్తే ఆమెను బయటకు గెంటివేస్తాను.
శ్రీరామకృష్ణులు (కారుణ్యంతో): వద్దు, వద్దు, ఆమెను వస్తే రానివ్వండిలే. మళ్ళీ తనంతట తానే వెళ్ళిపోతుంది.
రాఖాల్: మొదట్లో ఈయన వద్దకు వేరే ఎవరయినా వస్తే నాక్కూడా అసూయ కలిగేది. కాని తరువాత ఈయనే దయచూపి ‘మద్గురు శ్రీ జగద్గురు’ అని దర్శింప చేశారు. ఈయన వచ్చింది కేవలం మన కోసం మాత్రమేనా ఏమిటి?
శశి: ఆ మాట నిజమే. కాని ఈయనకు జబ్బు చేసి ఉన్నప్పుడు ఆమె వచ్చి ఎందుకు అలా ఇబ్బంది పెట్టాలి? ఆమెతో పెద్ద తలనొప్పి అని అందరికి తెలిసిందే కదా!
రాఖాల్: మన మందరం ఈయనకు ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాం. మనమంతా పరిపూర్ణత్వం పొందాక ఈయన వద్దకు వచ్చామా ఏమిటి? మనం ఈయనకు కష్టం కలిగించలేదా? నరేంద్రుడు మొదలైన వారు మొదట్లో ఈయనతో ఎలా ప్రవర్తించేవారని? ఎలా వాదించేవారని?
శశి: నరేంద్రుడు తాను చెప్పినదంతా చేసి చూపించేవాడు.
రాఖాల్: డా ॥ సర్కార్ ఎలా మాట్లాడేవాడని! అలా అనుకుంటే ఎవరూ నిర్దోషులు కాదు.
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా, రాఖాల్తో): ఏమైనా తింటావా?
రాఖాల్: ఇప్పుడు వద్దు. తరువాత తింటాను.
శ్రీరామకృష్ణులు సైగలు చేస్తూ “భోజనం ఇక్కడే చేస్తావా?” అని ‘మ’ ను అడిగారు.
రాఖాల్(‘మ’ తో): మీరు భోజనం ఇక్కడే చెయ్యండి. ఈయన చెబుతున్నారు కదా!
ఐదేళ్ళ బాలుడిలా శ్రీరామకృష్ణులు దిగంబరంగా భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో పిచ్చి స్త్రీ మేడ మెట్లెక్కి గది తలుపు వద్ద నిలబడింది.
‘మ’ (మెల్లగా, శశితో): ఆమెను నమస్కారం చేసి వెళ్ళిపొమ్మను. ఇప్పుడు గొడవ చేయడం వల్ల ఉపయోగం లేదు.
శశి ఆమెను క్రిందకు పిలుచుకు వెళ్ళాడు.
నేడు బెంగాలీ సంవత్సరాది. చాలామంది భక్తురాండ్రు వచ్చాడు. వారు శ్రీరామకృష్ణులకు, శారదాదేవికి ప్రణామం చేశారు. వారిలో బలరామ్ బోసు భార్య, మనోమోహన్ భార్య, బాగ్బజార్‌కు చెందిన బ్రాహ్మణి కూడా ఉన్నారు. వారిలో పలువురు తమ పిల్లలను తోడ్కొని వచ్చారు.
కొంతమంది భక్తురాండ్రు శ్రీరామకృష్ణుల పాదాలపై పువ్వులు సమర్పించారు. తొమ్మిది లేక పది సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలు కొన్ని పాటలు పాడారు. అందులో ఒక పాట:
విశ్రాంతికై మేము విలపించినాము
అకట ఆ విశ్రాంతి లభ్యమే కాదు
ఎటనుండి వచ్చితిమొ ఎరుక లేదు
ఎటుకొట్టుకొని మేము ఏగెదము కూడ….
శ్రీరామకృష్ణులు, సైగ చేస్తూ “మంచిది. వీరు అమ్మ గురించి పాడుతున్నారు” అన్నారు.
బాగ్బజార్‌కు చెందిన బ్రాహ్మణిది బాలిక స్వభావం. ఆమెను పాడమని శ్రీరామకృష్ణులు, రాఖాల్కు సైగ చేసి చెప్పమన్నారు. బ్రాహ్మణి పాట పాడుతుంటే భక్తులు నవ్వసాగారు.
భక్తురాండ్రు క్రిందకు వెళ్ళిపోయారు.
50.3.3 నరేంద్రుని వైరాగ్యం, వ్యాకులత
సాయంకాల సమయం. ‘మ’, మరికొందరు భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు లోపలికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అంటూవున్నట్లు ఒరనుండి తీసిన ఖడ్గంలా అతడు అగుపిస్తున్నాడు.
నరేంద్రుడు, శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చున్నాడు. ఆయనకు వినిపించేలా స్త్రీల విషయమై తనకున్న విరక్తిని వ్యక్తం చేశాడు. భగవత్సాక్షాత్కార మార్గంలో స్త్రీలు ఎలాటి అడ్డంకులో భక్తులకు చెప్పాడు.
శ్రీరామకృష్ణులు ఏం మాట్లాడలేదు. మౌనంగా నరేంద్రుడు చెప్పేది విన్నారు.
నరేంద్రుడు కొనసాగించాడు: “నాకు శాంతి కావాలి. నాకు భగవంతుడు కూడా అక్కర్లేదు.”
శ్రీరామకృష్ణులు తదేకంగా నరేంద్రుడి వంక చూస్తున్నారు. నరేంద్రుడు మధ్యమధ్యలో ‘సత్యం జ్ఞాన మనంతమ్’ అంటున్నాడు.
సమయం రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు తమ మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆయనకు ఎదురుగా కొంతమంది భక్తులు నేలమీద కూర్చుని ఉన్నారు. సురేంద్రుడు తన ఆఫీసునుండి వచ్చాడు. అతడి చేతిలో నాలుగు కమలా పళ్ళు, రెండు పువ్వుల మాలలు ఉన్నాయి. భక్తుల వంక, శ్రీరామకృష్ణుల వంక అతడు మార్చి మార్చి చూశాడు. పిదప ఆయనకు తన గోడునంతా వెళ్ళబోసుకున్నాడు.
సురేంద్రుడు (‘మ’ తదితరుల వంక చూస్తూ): ఆఫీసు పనినంతా పూర్తి చేసుకొని వస్తున్నాను. ఒకే సమయంలో రెండు పడవలపైన కాళ్ళు పెట్టడం ఎంతవరకు మంచిది అని తలచాను. అందుకే, ముందుగా నా పనులన్నిటినీ ముగించుకొని ఇక్కడకు వచ్చాను. ఇవాళ సంవత్సరంలో మొదటి రోజు, పైగా మంగళవారం. జగజ్జననిని ఆరాధించడానికి శుభదినం. కాని నేను కాళీఘాట్‌కు వెళ్ళలేదు. ఎవరైతే స్వయంగా కాళీయో, ఎవరైతే కాళీని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారో ఆయన్ను చూస్తే చాలు అనుకున్నాను.
శ్రీరామకృష్ణులు నవ్వారు.
సురేంద్రుడు: గురువును కానీ, లేక సాధువును కానీ దర్శించే టప్పుడు ఫలపుష్పాలు తీసుకు వెళ్ళాలని చెబుతుంటారు. అందుకే నేను వీటిని తీసుకు వచ్చాను….(శ్రీరామకృష్ణులతో) నేను ఈ డబ్బునంతా మీ కోసమే వెచ్చిస్తున్నాను. నా మనస్సెలాంటిదో భగవంతుడికే ఎరుక. ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా కూడా కొంతమంది చాలా బాధపడిపోతారు. మరికొందరు వెయ్యి రూపాయలయినా సరే, ఏమాత్రం సంకోచం లేకుండా ఖర్చు పెడతారు. భక్తుడి ఆంతరంగిక ప్రేమను గాంచి ఆతడు సమర్పించేదానిని భగవంతుడు స్వీకరిస్తాడు.
శ్రీరామకృష్ణులు, సురేంద్రుడితో “నువ్వు చెప్పింది నిజమే” అంటూ తల ఊపారు.
సురేంద్రుడు: నిన్న నేను ఇక్కడకు రాలేకపోయాను. నిన్న, సంవత్సరంలో చివరి రోజు కదా! మీ పటాన్ని పువ్వులతో అలంకరించాను.
శ్రీరామకృష్ణులు, ‘మ’ కు సైగ చేస్తూ “ఆహా! ఎంతటి భక్తి!” అన్నారు.
సురేంద్రుడు: నేను ఇక్కడకు వచ్చేటప్పుడు ఈ రెండు మాలలను నాలుగు అణాలకు కొన్నాను.
దాదాపుగా భక్తులందరూ సెలవు తీసుకున్నారు.
కాళ్ళు ఒత్తి, పిదప విసరమని శ్రీరామకృష్ణులు ‘మ’ కు చెప్పారు.
50.4 చతుర్థ పరిచ్ఛేదం గిరీశ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
శుక్రవారం, ఏప్రెల్ 16, 1886
కాశీపూర్ ఉద్యాన గృహంలోని కాలిబాటలను, వృక్షాలను, కొలనులోని నీటిని తన శీతల కిరణాలతో ముంచెత్తుతూ చంద్రుడు కాంతివంతంగా ప్రకాశి స్తున్నాడు. గిరీశ్, ‘మ’, లాటూ, మరికొందరు భక్తులు కొలనులోకి వెళ్ళే మెట్ల వద్ద కూర్చుని ఉన్నారు. ఇల్లు, కొలనుకు పశ్చిమంగా ఉంది. రెండవ అంతస్తులోని రామకృష్ణుల గదిలో దీపం వెలుగుతోంది. ఆయన మంచం మీద కూర్చుని ఉన్నారు. గదిలో పలువురు భక్తులు ఉన్నారు.
50.4.1 గిరీశ్, ‘మ’ ల సంభాషణ
కాసేపటి తరువాత గిరీశ్, ‘మ’ లు తోట బాటలో పచార్లు చేస్తున్నారు.
‘మ’ : ఆహా! ఈ చంద్రకాంతి ఎంత మనోహరంగా ఉంది! అనాదిగా ప్రకృతి నియమాలు అవే నడుస్తున్నట్లున్నాయి.
గిరీశ్: ఆ సంగతి నీకెలా తెలుసు?
‘మ’ : ప్రకృతి నియమాలు మారవు. టెలిస్కోపు ద్వారా కొత్త నక్షత్రాలను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. చంద్రుని మీద పర్వతాలు కూడా ఉండడం వారు చూశారు.
గిరీశ్: అలా అని ఖచ్చితంగా చెప్పలేము. వాటిని నమ్మాలంటే కష్టం.
‘మ’ : ఎందుకు? టెలిస్కోపు ద్వారా వారు ఆ పర్వతాలు చూశారు.
గిరీశ్: వారి పరిశీలన సరైనదేనని ఎలా చెప్పగలవు? ఒకవేళ భూమికి, చంద్రునికి మధ్య మరేవైనా ఉన్నాయనుకో. కాంతి వాటిగుండా ప్రసరించడం మూలంగా అలా కనిపించి ఉండవచ్చు ననుకోవచ్చు కదా!
50.4.2 గిరీశ్, లాటూ, ‘మ’, బాబూరామ్, నిరంజన్, రాఖాల్ ప్రభృతులతో
నరేంద్రుడు, రాఖాల్, నిరంజన్, శరత్, శశి, బాబూరామ్, కాళీ, యోగీన్, లాటూ, మరికొందరు యువభక్తులు శ్రీరామకృష్ణులకు సపర్యలు చేసే నిమిత్తం అక్కడే ఉద్యాన గృహంలోనే ఉంటున్నారు. ఈ రోజు సాయంత్రం నరేంద్రుడు, కాళీ, తారక్ దక్షిణేశ్వరానికి వెళ్ళారు. ఈ రాత్రి అంతా వారు పంచవటిలో ధ్యానం చేస్తూ గడపదలిచారు.
గిరీశ్, లాటూ, ‘మ’ శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళారు. ఆయన మంచం మీద కూర్చుని ఉన్నారు. శశి, మరిద్దరు భక్తులు ఆయనకు సపర్యలు చేస్తున్నారు. బాబూరామ్, నిరంజన్, రాఖాల్లు కూడా గదిలోకి వచ్చారు. అది విశాలమైన గది. కొన్ని ఔషధాలు, కావలసిన తక్కిన వస్తువులు శ్రీరామకృష్ణుల మంచానికి దగ్గరగా ఉన్నాయి. గదికి ఉత్తర దిశగా ఉన్న ద్వారం గుండా భక్తులు గదిలోకి రాకపోకలు సాగిస్తుంటారు.
శ్రీరామకృష్ణులకు రాత్రంతా సపర్యలు చేయవలసి ఉండడంతో భక్తులు వంతులవారీగా ఆయనను సేవిస్తున్నారు. ఆయన్ను సేవిస్తున్న భక్తుడు ఆయన మంచానికి దోమతెరను కట్టి క్రింద చాపమీదనే పడుకొంటాడు, లేకుంటే రాత్రంతా మేల్కొని ఉంటాడు. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులకు అతి స్వల్పంగా నిద్ర పడుతోంది. అందువలన ఆయన్ను సేవిస్తున్న భక్తుడు కూడా మేల్కొనే ఉంటాడు.
నేడు ఆయన పరిస్థితి కాస్త తేలిగ్గా ఉంది. భక్తులు ఆయనకు ప్రణామంచేసి నేల మీద కూర్చున్నారు. దీపం దగ్గరగా తీసుకురమ్మని ఆయన ‘మ’ కు చెప్పారు. తరువాత గిరీశ్‌ను ఆప్యాయంగా పలకరించారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఏమయ్యా! బాగున్నావా? (లాటుతో) ఇతని కోసం పొగాకు సిద్ధం చెయ్యి, తాంబూలం కూడా ఇవ్వు.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు గిరీశ్‌కు కొన్ని తినుబండారాలు కూడా ఇవ్వమని లాటూకు చెప్పారు. అవి తీసుకురావడానికి ఒక వ్యక్తి దుకాణానికి వెళ్ళాడని లాటూ బదులిచ్చాడు.
శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. ఒక భక్తుడు ఆయనకు కొన్ని పూల మాలలు సమర్పించాడు. శ్రీరామకృష్ణులు వాటిని ఒక్కొక్కటిగా తమ మెడలో ధరించారు. ఆయన హృదయంలో ప్రత్యక్షంగా ఆ భగవంతుడే విరాజిల్లుతున్నాడు కదా! అందుచేతనే ఆయన ఆ భగవంతుణ్ణి ఇలా ఆరాధిస్తున్నట్లున్నారు. భక్తులు నివ్వెరపాటుతో ఆయనవైపే చూస్తూ ఉన్నారు. తమ మెడలో నుండి రెండు మాలలను తీసి ఆయన వాటిని గిరీశ్‌కు ఇచ్చారు.
శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో తినుబండారాలు వచ్చాయా అని అడుగుతూనే ఉన్నారు.
‘మ’ శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు. మంచం మీద ఒక భక్తుడు సమర్పించిన చందనపు విసనకర్ర ఉంది. శ్రీరామకృష్ణులు దానిని ‘మ’ కు ఇచ్చారు. ‘మ’ దానితో విసరసాగాడు. ‘మ’ కు కూడా ఆయన రెండు మాలలు ఇచ్చారు.
ఏడాదిన్నర క్రితం ‘మ’ కుమారుడు మరణించాడు. అతడికి ఏడు లేక ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. ఆ అబ్బాయి శ్రీరామకృష్ణులను ఎన్నోసార్లు భక్తులతో పాటు కీర్తనానందంలో ఉన్మత్తులై ఉండగా దర్శించాడు. లాటూ దానిని గురించి శ్రీరామకృష్ణులకు చెబుతున్నాడు.
లాటూ: మరణించిన ఆ కుమారుడి పుస్తకాలు చూసి గతరాత్రి ఈయన (‘మ’) బిగ్గరగా రోదించారు. ఈయన భార్య కూడా పుత్రశోకంతో దాదాపు పిచ్చిదే అయిపోయింది. ఒక్కోసారి ఆమె తక్కిన పిల్లలను కొడుతుంటుంది. అప్పుడప్పుడు ఈయన రాత్రిళ్ళు ఇక్కడే బస చేస్తుంటారన్న విషయమై ఆమె ఇంట్లో పెద్ద గొడవే సృష్టిస్తుంది.
ఈ సంగతి విని శ్రీరామకృష్ణులు విచారపడినట్టున్నారు, ఏమీ మాట్లాడలేదు.
గిరీశ్: అందులో ఆశ్చర్యమేమీ లేదు. శ్రీకృష్ణుడినుండి గీతోపదేశం పొందాక కూడా అభిమన్యుడు మరణించాడన్న దుఃఖంతో అర్జునుడు మూర్ఛపోయాడు.
ఇంతలో గిరీశ్ కోసం తినుబండారాలు వచ్చాయి. వాటిని బారానగర్‌లోని ఫాగూ దుకాణం నుండి తీసుకు వచ్చారు. కచోరీలు, పూరీలు, మిఠాయిలు మొదలైనవి శ్రీరామకృష్ణులు కొద్దిగా పుచ్చుకుని తక్కినదంతా గిరీశ్‌కు తమ చేతులతో ఇచ్చారు. గిరీశ్ వాటిని మహాప్రసాదంగా స్వీకరించాడు. అతడు శ్రీరామకృష్ణుల ముందు కూర్చుని వాటిని తినసాగాడు. అతడికి మంచినీరు కావలసి వచ్చింది. గదిలో ఆగ్నేయ మూలన ఒక కూజా ఉంది. అది ఏప్రెల్ మాసం, చాలా వేడిగా ఉంది. శ్రీరామకృష్ణులు “ఇక్కడ మంచి నీరు ఉంది” అన్నారు.
లేచి నిలబడడానికి కూడా శక్తి లేనంతగా శ్రీరామకృష్ణులు వ్యాధితో బాధపడుతున్నారు. మరి భక్తులు నిశ్చేష్టులై చూస్తున్నదేమిటి? ఆయన మంచం దిగి కూజా వైపుగా వెళ్ళారు. ఐదేళ్ళ బాలుడిలా దిగంబరంగా ఉన్నారు. తమంతట తామే కూజాలోనుండి నీటిని గ్లాసులోకి పోశారు. భక్తులకు శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆయన ఒకటి రెండు చుక్కల నీటిని అరచేతిలో పోసుకొని అది చల్లగా ఉందా లేదా అని చూశారు. అది మరీ అంత చల్లగా లేదు. కాని ఏం చేయడం? అక్కడ వేరే నీరు లేదు. చివరకు అయిష్టంగానే గిరీశ్‌కు అదే నీటిని ఇచ్చారు.
గిరీశ్, తినుబండారాలు తింటున్నాడు. నలువైపులా భక్తులు కూర్చుని ఉన్నారు. ‘మ’, శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు.
50.4.3 సంసారంలో భగవత్ప్రాప్తికి మార్గం
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): దేవేంద్రబాబు సంసారం పరిత్యజించడానికి నిశ్చయించుకున్నాడు.
వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సైగల ద్వారా “మరి ఆతడి భార్యా బిడ్డలకు తిండి ఎవరు పెడతారు?” అని గిరీశ్‌ను అడిగారు.
గిరీశ్: నాకు తెలియదండీ.
మిగిలిన భక్తులు మౌనంగా ఉండిపోయారు. తినుబండారాలు తింటూ గిరీశ్ మళ్ళీ మాట్లాడసాగాడు.
గిరీశ్: అది సరే కానీ మహాశయా, ఏది మంచిదంటారు? మనస్సులో వ్యధ నొందుతూ సంసారాన్ని త్యజించటమా లేక సంసారంలోనే ఉంటూ భగవచ్చింతన చేయడమా?
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): గీతలో చదవలేదా? ఆసక్తిరహితులై సంసారంలో ఉంటూ కర్మలు చేస్తే, సర్వం మిథ్యే అని జ్ఞానం పొందాక సంసారంలో ఉన్నట్లయితే యథార్థంగా పొందవచ్చు.
“మనస్సులో వ్యధ నొందుతూ త్యజించే వారు హీనశ్రేణికి చెందినవారు. గార్హస్థ్యంలో ఉన్న జ్ఞాని ఎలాంటి వాడో తెలుసా? అతడు గాజుతో చేసిన ఇంట్లో నివసించే వ్యక్తి లాంటివాడు. అతడు లోపలా, బయటా కూడా చూడగలడు.”
గదిలో నిశ్శబ్దం నెలకొంది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): కచోరీలు వేడిగా, రుచిగా ఉన్నాయి.
‘మ’ (గిరీశ్‌తో): ఫాగూ దూకాణంనుండి తెచ్చినవి కదా! అది బాగా పేరు మోసిన దుకాణం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును పేరుమోసిన దుకాణం.
గిరీశ్(నవ్వుతూ): కచోరీలు నిజంగానే బాగున్నాయి.
శ్రీరామకృష్ణులు: పూరీలు ఉండనివ్వులే. కచోరీలు తిను. (‘మ’ తో) కాని కచోరీలు రాజసిక ఆహారం సుమా!
50.4.4 సంసారుల మనస్సు, సన్న్యాసుల మనస్సుల మధ్య వ్యత్యాసం
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా, నా మనస్సు ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉంది. మళ్ళీ, అంతలోనే అది దిగజారి పోతుందెందుకని?
శ్రీరామకృష్ణులు: సంసారంలో ఉన్నప్పుడు అలాగే అవుతుంది. గృహస్థుని మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటుంది, మళ్ళీ నిమ్నస్థాయికి దిగిపోతుంది. అతడు ఒక్కోసారి అత్యంత భక్తిని కలిగి ఉంటాడు. మరోసారి, ఆ భక్తి తగ్గుముఖం పడుతుంది. అతడు కామినీ కాంచనాల నడుమ నివసించ వలసి ఉంటుంది కదా – అందుకే అలా అవుతుంది. గృహస్థు ఒక్కోసారి భగవచ్చింతన చేస్తాడు, భగవన్నామాన్ని ఉచ్చరిస్తాడు. మళ్ళీ, ఒక్కోసారి మనస్సును కామినీ కాంచనాలపై లగ్నం చేసి ఉంటాడు.ఇది ఈగలాగ అన్నమాట. ఈగ ఒక్కోసారి మిఠాయి మీద వ్రాలుతుంది, మరోసారి క్రుళ్ళుతున్న పుండు మీదనో లేక మలం మీదనో వ్రాలుతుంది.
“కాని సన్న్యాసుల విషయం వేరు. వారు మనస్సును కామినీ కాంచనాల నుండి ఉపసంహరించుకుని దానిని కేవలం భగవంతునిపైనే లగ్నం చేయగలరు. వారు కేవలం భగవత్ రసాన్ని పానం చేయగలరు. నిజమైన త్యాగికి భగవంతుడు తప్ప అన్యమైనదేదీ రుచించదు. లౌకిక సంభాషణలు జరిగే చోటు నుండి అతడు లేచి వెళ్ళిపోతాడు. అతడు కేవలం భగవత్ప్రసంగాలు మాత్రమే వింటాడు. నిజమైన త్యాగి భగవత్ విషయాలు తప్ప వేరే ఏమీ మాట్లాడనే మాట్లాడడు.
“తేనెటీగలు కేవలం పువ్వుల మీదనే వ్రాలుతాయి, మకరందాన్ని గ్రోలుతాయి. వాటికి వేరే వస్తువులు ఏవీ రుచించవు.”
గిరీశ్ చేతులు కడుక్కోడానికి వసారాలోకి వెళ్ళాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): భగవంతుడి అనుగ్రహం కావాలి. అప్పుడే మనస్సు ఆయన మీద సంపూర్ణంగా నిలుస్తుంది.
“అదిసరే, గిరీశ్ కచోరీలు ఎక్కువగా తినేశాడు. ఇవాళ ఇక ఏమీ తినవద్దని అతడికి చెప్పు.”
50.5 పంచమ పరిచ్ఛేదం వైదీ భక్తి – భక్తి ఉన్మాదం
గిరీశ్ గదిలోకి తిరిగివచ్చి శ్రీరామకృష్ణుల ముందు కూర్చున్నాడు. అతడు తాంబూలం నములుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): రాఖాల్ ప్రస్తుతం ఏది మంచిది ఏది కాదు, ఏది సత్యం ఏది అసత్యం అన్న విషయం అర్థం చేసుకున్నాడు. అతడు తన కుటుంబంతో నివసిస్తున్నాడన్న మాట నిజమే; కాని అసలు విషయం ఏమిటో అతడు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. అతడికి భార్య ఉంది, కుమారుడు కూడా జన్మించాడు. కాన ఇదంతా మిథ్య అనీ, అనిత్యమనీ అతడికి తేటతెల్లమై పోయింది. రాఖాల్ ఎన్నటికీ సంసారంలో చిక్కువడడు.
“అతడు బురద చేప వంటివాడు. ఆ చేప బురదలోనే వసిస్తుంటుంది కాని దాని శరీరానికి బురద మరక కూడా పడదు.”
50.5.1 గిరీశ్ విశ్వాసం – మీ విషయంలో ఎలాంటి నియమమూ వర్తించదు!
గిరీశ్: మహాశయా! నాకు ఇవన్నీ అర్థం కావు. మీరు తలచుకుంటే అందరినీ నిర్లిప్తులుగా, పరిశుద్ధులుగా చేయగలరు. సంసారులను, సన్న్యాసులను అందరినీ మీరు ఉద్ధరించగలరు. మలయమారుతం వీచినప్పుడు వృక్షాలన్నీ చందన వృక్షాలుగా మారిపోతాయి.
శ్రీరామకృష్ణులు: అయితే ఆ వృక్షాలలో సారపదార్థం లేనట్లయితే అవి చందనంగా మారవు. ఉదాహరణకు ప్రత్తి చెట్టు – ఇంకా మరికొన్ని చెట్లు ఉన్నాయి, అవి చందనంగా మారవు.
గిరీశ్: ఆ మాట నేను పట్టించుకోను.
శ్రీరామకృష్ణులు: కాని, నియమం అలా ఉంది.
గిరీశ్: మీ విషయంలో ఎలాంటి నియమమూ వర్తించదు.
భక్తులు ఈ సంభాషణను నివ్వెరబోయి వింటున్నారు. మధ్య మధ్యలో ‘మ’ విసనకర్ర వీచడం కూడా మరచిపోతున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఆ, అది నిజమే కావచ్చు. భక్తివాహిని పొంగి ప్రవహి స్తున్నప్పుడు చుట్టు ప్రక్కల ఉన్న భూమి యావత్తు వెదురుగడ లోతు నీటిలో మునిగి పోతుంది. ఒక వ్యక్తికి భక్తి ఉన్మాదం కలిగినప్పుడు అతడు వేద విధులను పాటించడు. పూజ కోసం దూర్వాగ్రాసాన్ని కోస్తాడు కాని దానిని శుభ్రం చెయ్యడు. చేతికి ఏది అందితే అది తీసుకుంటాడు. తులసిపత్రాలను కోసేటప్పుడు ‘పట పట’ మంటూ కొమ్మలు కూడా విరిచేస్తాడు. ఆహా! నాకు ఎలాంటి స్థితులు కలిగాయని!
(‘మ’ తో) “భక్తి అలవడినప్పుడు మరేమీ అవసరం ఉండదు.”
‘మ’ : అవునండి.
50.5.2 రామావతారం, కృష్ణావతారం – సీత, రాధ
శ్రీరామకృష్ణులు: భగవంతుని పట్ల ఏదో ఒక్క భావాన్నే స్థిరంగా అలవరచు కోవాలి. రామావతారంలో శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య మొదలైన భావాలన్నీ ఉండేవి. కృష్ణావతారంలో అవన్నీ ఉండేవి, వాటికి తోడుగా మధురభావం కూడా ఉంది.
“రాధాదేవి, శ్రీకృష్ణుని పట్ల మధుర భావాన్ని కలిగి ఉండేది; అది కాల్పనిక మైన ప్రేమ. కాని సీత విషయంలో అది భర్త పట్ల పతివ్రత కలిగి ఉండే శుద్ధ ప్రేమ. దాన్లో ఎలాంటి అన్యభావమూ లేదు.
“కాని ఇదంతా భగవంతుని లీలే. వేర్వేరు కాలాలకు అనుగుణంగా ఆయన వేర్వేరు భావాలను ప్రదర్శిస్తుంటాడు.”
50.5.3 శ్రీరామకృష్ణులు – పాగ్లీ
విజయ్‌కృష్ణ గోస్వామి, శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరం వెళ్ళేటప్పుడు అతడితో పాటు ఒక మతి చలించిన స్త్రీ కూడా వెళ్ళేది. ఆమె కాళీ మాత గురించిన పాటలు పాడి శ్రీరామకృష్ణులకు వినిపించేది, బ్రహ్మ సమాజ గీతాలు కూడా పాడేది. ప్రస్తుతం ఆమె తరచూ కాశీపుర్ ఉద్యాన గృహానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాలని పెద్దగా గొడవ చేస్తూ ఉంది. ఆమెను దూరంగా ఉంచడానికి భక్తులు సర్వదా అప్రమత్తతతో ఉండవలసి వస్తోంది. ఆమెను ‘పాగ్లీ’ (అంటే, పిచ్చి స్త్రీ అని అర్థం) అని పిలుస్తుంటారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్ తదితరులతో): పాగ్లీ మధుర భావాన్ని ఆపాదించుకుని ఉంది. గతంలో ఒకసారి ఆమె దక్షిణేశ్వరానికి వచ్చింది; ఉన్నట్టుండి ఏడ్వడం మొదలుపెట్టింది. ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని నేను అడిగేసరికి ‘నాకు తలనొప్పి వేస్తోంది’ అని బదులిచ్చింది. (అందరూ నవ్వారు) మరో నాడు నేను భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె అక్కడకు వచ్చింది. హఠాత్తుగా ‘మీరు నాపట్ల దయ చూపించరా?’ అని అడిగింది. ఆమె ఉద్దేశం ఏమిటో అప్పుడు నాకు తెలియదాయె. నా మటుకు నేను భోజనం చేస్తున్నాను. మళ్ళీ ఆమె ‘మీరు నన్ను మానసికంగా ఎందుకు నెట్టివేశారు?’ అంది. ‘నీ భావం ఏమిటి?’ అని ఆమెను అడిగాను. మధుర భావమని ఆమె సమాధానమిచ్చింది. నేను ‘ఓహ్! నాది మాతృభావం. స్త్రీల నందరినీ నేను జగన్మాతృ స్వరూపిణులుగానే భావిస్తాను. స్త్రీలందరూ నాకు తల్లులే’ అన్నాను. ఆమె ‘అదంతా నాకు తెలియదు’ అంది. అప్పుడు నేను రామ్‌లాల్‌ను పిలుస్తూ ఇలా అన్నాను: ‘అరే రామ్‌లాల్! ఈమె “మానసికంగా నెట్టివేయడం” అంటూ ఏదో అంటోంది. నువ్వు వచ్చి కాస్త విను!’ ఇప్పటికి కూడా ఆమె ఇంకా అదే భావంలోనే ఉంది.
గిరీశ్: ఆ పాగ్లీ నిజంగానే ధన్యురాలు. ఆమె పిచ్చిదే కావచ్చు, భక్తుల చేతిలో దెబ్బలే తిని ఉండవచ్చు. కాని ఇరవై నాలుగు గంటలు ఆమె మీ గురించే ఆలోచిస్తోంది కదా! మిమ్మల్ని ఏ భావంలో ఆరాధించినా సరే, ఆమెకు ఎలాంటి హాని వాటిల్లబోదు.
“అయ్యా, నేను నా భావాలను ఎలా వ్యక్తం చేయగలను? మీ గురించి చింతన చేయడం వల్ల నేను ఎలాంటివాణ్ణి ఎలా అయిపోయానో మీరే చూడండి! మొదట్లో నాకు బద్ధకం ఉండేది. ఇప్పుడా బద్ధకం భగవంతుని పట్ల శరణాగత భావంగా మారిపోయింది. గతంలో నేను పాపిని. అయితే ప్రస్తుతం నిరహంకారి నైపోయాను. ఇంకా నన్నేం చెప్పమంటారు?”
భక్తులు స్తబ్ధులై వింటున్నారు. పాగ్లీ పట్ల రాఖాల్ తన సానుభూతిని వ్యక్తం చేశాడు. “ఆమె విషయంగా మనకందరికీ బాధగానే ఉంది. ఆమె ఇక్కడ గొడవ సృష్టిస్తుంటుంది కానీ అందుచేత ఎన్నో కష్టాలు కూడా పడుతోంది” అన్నాడు.
నిరంజన్ (రాఖాల్తో): నీకు ఇంట్లో భార్య ఉంది కాబట్టే నువ్వు అలా తలుస్తున్నావు. మేం ఆ పాగ్లీని చంపగలం.
రాఖాల్ (తీవ్రంగా): ఈయన (శ్రీరామకృష్ణుల) ముందు అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం?
50.5.4 ధనసద్వినియోగం – ‘పొలాల గట్లు’ దృష్టాంతం
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): సంసారం అంటే కామినీ కాంచనాలే. అనేకులు ధనాన్ని రక్తంగా భావిస్తారు. కాని ధనాన్ని నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ బహుశా ఏదో ఒక రోజున అది నీ చేతినుండి పూర్తిగా జారిపోవచ్చు.
“మా పల్లెప్రాంతాల్లో రైతులు తమ పొలాల చుట్టూ గట్లు వేస్తారు. ఆ రైతులు వాటిని ఎలా వేస్తారో నీకు తెలిసే ఉంటుంది! ఎంతో శ్రమకోర్చి వారు పొలానికి నలువైపులా గట్లు వేస్తారు. కాని వర్షపు నీరు తాకిడికి ఆ గట్లు తెగిపోతాయి. అయితే కొంత మంది రైతులు గట్లలో కొంత భాగం తెరచి ఉంచి ఆ భాగాన్ని గడ్డితో కప్పి ఉంచుతారు. వర్షం పడినప్పుడు, పొలంలో ఒండ్రుమట్టి పొరలు పొరలుగా పేరుకునేలా చేయడంతో వర్షపు నీరు బయటకు వెళ్ళిపోతుంది. దాని ఫలితంగా మంచి ఫలసాయం లభిస్తుంది.
“ధనాన్ని భగవత్సేవలోనూ, సాధువుల, భక్తుల సేవలోనూ, దానధర్మాలలోనూ వెచ్చించే వాళ్ళే దానిని సద్వినియోగపరుస్తున్న వారు. వారి ధనం సఫలమవుతుంది.
“డాక్టర్లు సమర్పించేవి ఏవీ నేను తినలేను. లోకుల కష్టాలతో ధనం సంపాదించే వారి ధనం చీమూ నెత్తురులే.”
ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు ఇద్దరు డాక్టర్లు పేర్లు చెప్పారు.
గిరీశ్: డా ॥ రాజేంద్ర దత్త ఎంతో ఉదారబుద్ధి కలవాడు. ఎవరి వద్ద నుండీ పైస కూడా పుచ్చుకోడు. దానధర్మాలు కూడా చేస్తుంటాడు.
50.6 షష్ఠ పరిచ్ఛేదం నరేంద్రాది భక్తులతో శ్రీరామకృష్ణులు
శనివారం, ఏప్రెల్ 17, 1886
పౌర్ణమి రాత్రి. కొన్నాళ్ళుగా నరేంద్రుడు ప్రతిరోజూ దక్షిణేశ్వరం వెళ్ళి, పంచవటిలో ధ్యాన సాధనలు చేస్తున్నాడు. నేటి సాయంత్రం అతడు తారక్, కాళీలతో కలసి అక్కడ నుండి తిరిగి వచ్చాడు.
సమయం రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది. చల్లని వెన్నెల, దక్షిణపు గాలి ఉద్యానవనాన్ని శోభస్కరం చేస్తున్నాయి. పలువురు భక్తులు క్రింది అంతస్తులో ధ్యానం చేస్తున్నారు. వారిని గురించి చెబుతూ నరేంద్రుడు, ‘మ’ తో “వారు ఒక్కటొక్కటిగా ఉపాధులను వర్జిస్తున్నారు” అన్నాడు.
కాసేపటి తరువాత ‘మ’ పై అంతస్తుకు వెళ్ళి శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నాడు. తమ తువ్వాలు, పెద్ద పాత్రను కడగమని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు. ‘మ’ వాటిని కొలను వద్దకు తీసుకు వెళ్ళి వెన్నెల వెలుగులో కడిగాడు.
మరుసటి రోజు ఉదయమే రమ్మని శ్రీరామకృష్ణులు ‘మ’ కు కబురంపారు. ‘మ’ గంగాస్నానం చేశాక వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించాడు. పుత్రశోకంతో కుమిలిపోతున్న ‘మ’ భార్యను ఉద్యానగృహానికి వచ్చి ఇక్కడే భోజనం చెయ్యమని చెప్పమన్నా రాయన.
సైగల ద్వారా ఆయన ‘మ’ తో ఇలా అన్నారు: “ఆమెను ఇక్కడికి రమ్మని చెప్పు. రెండు రోజులు బస చేయనివ్వు. పసిబిడ్డను కూడా తీసుకు రమ్మని చెప్పు.”
‘మ’ : అలాగేనండి. భగవంతుని పట్ల ఆమె ప్రగాఢ భక్తిని అలవర్చుకుంటే చాలా బాగుంటుంది.
శ్రీరామకృష్ణులు మళ్ళీ సైగలతో ఇలా అన్నారు: “ఉహూ, భక్తిని దుఃఖం ప్రక్కకు నెట్టివేస్తుంది. పైగా పోయినవాడు ఎదిగిన కుర్రవాడు కదా!
“కృష్ణకిశోర్‌కు ఇద్దరు కుమారులు ఉండేవారు. వారిద్దరు మన భవనాథ్ వయస్కులు. వారికి యూనివర్సిటీ పట్టాలు రెండేసి ఉండేవి. వారిద్దరూ చనిపోవడం జరిగింది. అంతటి గొప్ప జ్ఞాని అయివుండి కూడా కృష్ణకిశోర్ మొదట్లో తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భగవంతుడు నాకు సంతానం ఇవ్వనేలేదు, ఎంతటి అదృష్టమో చూడు!
“అర్జునుడు మహాజ్ఞాని! పైగా, తోడుగా కృష్ణుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ అభిమన్యుని మరణంతో అతడు దుఃఖ సాగరంలో మునిగిపోయాడు.
“కిశోరీ రావడం లేదు ఎందుకని?”
ఒక భక్తుడు: ఆతడు ప్రతిరోజు స్నానం చేయడానికి గంగానదికి వస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: మరి ఇక్కడికి ఎందుకు రావటం లేదు?
భక్తుడు: నేను రమ్మని చెబుతానండి.
శ్రీరామకృష్ణులు(లాటూతో): హరీశ్ రావడంలేదు ఎందుకని?
50.6.1 స్త్రీలకు ‘లజ్జ’ ఎంతో అవసరం
‘మ’ కుటుంబానికి చెందిన తొమ్మిది లేక పది సంవత్సరాల అమ్మాయిలు ఇద్దరు కాళీమాత గురించిన పాటలు కొన్ని పాడి వాటిని శ్రీరామకృష్ణులకు విని పించారు. గతంలో ఒకసారి(అక్టోబరు 30, 1884) ఆయన శ్యాంపుకూర్లోని ‘మ’ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయిలు పాటలు పాడారు.
ఇవాళ ఆ అమ్మాయిలు పాడుతుంటే విని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆనందించారు. ఆ అమ్మాయిలు పై అంతస్తులో పాడుతున్నప్పుడు భక్తులు క్రింది అంతస్తు నుండే విన్నారు. తరువాత వారిని క్రిందకు పిలిపించి మళ్ళీ పాడమని చెప్పి, విన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఆ అమ్మాయిలకు ఇక పైన వేరే పాటలేవీ నేర్పించవద్దు. వారు తమంతట తాముగా పాడితే అది వేరే విషయం. కాని అలా ఎవరు పడితే వారి ముందు పాడడం వల్ల వారికి లజ్జ అనేది తొలగిపోతుంది. స్త్రీలకు లజ్జ ఎంతో అవసరం సుమా!
50.6.2 శ్రీరామకృష్ణుల ఆత్మపూజ
శ్రీరామకృష్ణులకు దగ్గరగా ఉన్న పూలబుట్టలో పువ్వులు, చందనం ఉన్నాయి. ఆయన మంచంపై కూర్చుని పుష్ప, చందనాలతో తమను తాము పూజించు కున్నారు. పువ్వులను ఒకసారి శిరస్సు మీద, మరోసారి కంఠాన, మరో సారి హృదయం మీద, మరోసారి నాభి మీద ఇడుకున్నారు.
కొన్నగర్కు చెందిన మనోమోహన్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా అంతరాత్మను పూజించడంలోనే నిమగ్నమై ఉన్నారు. తమ మెడలో ఒక పూలమాలను ధరించారు. కాసేపటి తరువాత ఆయన మనోమోహన్ పట్ల ప్రసన్నులైనట్లు కనిపించారు. ఆతడికి కొన్ని పువ్వులు ఇచ్చారు. ‘మ’ కు కూడా ఒక పువ్వు ఇచ్చారు.
50.7 సప్తమ పరిచ్ఛేదం బుద్ధుడు – శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు
సమయం ఉదయం తొమ్మిది గంటలు కావస్తున్నది. శ్రీరామకృష్ణులు, ‘మ’ మాట్లాడు కుంటున్నారు. గదిలో శశి కూడా ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నరేంద్రుడు, శశి ఏం మాట్లాడుకున్నారు? వారు ఏం చర్చించుకున్నారు?
‘మ’ (శశితో): మీరు ఏం మాట్లాడుకున్నారు?
శశి: మేం మాట్లాడుతున్నట్లు మీకు చెప్పింది నిరంజనా?
శ్రీరామకృష్ణులు: మీరు చర్చించుకున్నది ఏమిటి? ‘భగవంతుడు నాస్తి, అస్తి’ – ఇలాంటి మాటలు నాకు వినిపించాయి.
శశి (నవ్వుతూ): నరేంద్రుని పిలవనా?
శ్రీరామకృష్ణులు: ఆ, పిలువు.
నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు అతణ్ణి ఏమైనా అడుగు. (నరేంద్రునితో) మీరేం మాట్లాడుకున్నారు?
నరేంద్రుడు: నాకు కాస్త అజీర్తి చేసింది. ఇక నేను ఏం చెప్పను?
శ్రీరామకృష్ణులు: అది తగ్గిపోతుందిలే.
‘మ’ (నవ్వుతూ): బుద్ధుడి అనుభూతుల గురించి చెప్పు.
నరేంద్రుడు: నేను స్వయంగా బుద్ధుడి నయ్యానా ఏమిటి, నన్ను బుద్ధుని గురించి మాట్లాడమని చెబుతున్నారు?
‘మ’ : భగవంతుని అస్తిత్వం గురించి బుద్ధుడు ఏం చెప్పాడు?
నరేంద్రుడు: భగవంతుడు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? జగత్తును సృష్టించింది మీరే. ఈ విషయం గురించి బెర్క్లీ చెప్పిన సంగతి మీకు తెలిసిందే కదా!
‘మ’ : అవును, నాకు తెలుసు. ఇంద్రియాల అనుభూతి ద్వారానే జగత్తుకు ఉనికి ఏర్పడుతుందని బెర్క్లీ వాదం.
50.7.1 “మనస్సే జగత్తు”
శ్రీరామకృష్ణులు: నాంగ్టా ఇలా అనేవాడు: ‘ఈ జగత్తు అనేది ఉండేది మనస్సులోనే. మళ్ళీ అది ఆ మనస్సులోనే లయమైపోతుంది.’ కాని ‘నేను’ ఉన్నంత వరకు సేవ్య – సేవక భావాన్ని అవలంబించడమే ఉత్తమం.
నరేంద్రుడు (‘మ’ తో): భగవంతుడు ఉన్నాడని తర్కం ద్వారా మీరు ఎలా ఋజువు చేయగలరు? కాని మీరు విశ్వాసం మీద ఆధారపడితే సేవ్య – సేవక భావాన్ని కూడా అంగీకరించ వలసిందే. ఆ భావాన్ని అంగీకరించినప్పుడు భగవంతుడు దయామయుడనే చెప్పి తీరవలసి వస్తుంది.
“మీరు ప్రపంచంలోని దుఃఖాలను గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. భగవంతుడు ఇన్ని సుఖాలను కూడా ప్రసాదించాడన్న విషయాన్ని ఎందుకు మరచిపోతారు? ఆయనకు మనపట్ల ఎంతటి దయ! ఆయన మనకు మూడు గొప్ప విషయాలను ప్రసాదించాడు: మానవ జన్మ, భగవంతుని తెలుసుకోవాలన్న వ్యాకులత, మహాపురుష సాంగత్యం – మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయః (వివేకచూడామణి – 3).”
అందరూ మౌనంగా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రునితో): అయితే నా లోపల విశేషమైన వ్యక్తి ఎవరో ఉన్నట్లు నాకు తోస్తుంది.
ఇంతలో డా ॥ రాజేంద్రలాల్ వచ్చి కూర్చున్నాడు. ఆయన శ్రీరామకృష్ణులకు హోమియోపతి వైద్యం చేస్తున్నాడు. చికిత్స గురించిన మాటలు అయ్యాక శ్రీరామకృష్ణులు డాక్టరుకు మనోమోహన్ను చూపించారు.
రాజేంద్రలాల్: ఈయన నాకు దూరపు బంధువు.
నరేంద్రుడు క్రిందకు వెళ్ళాడు, తనలో తాను పాడుకొంటున్నాడు:
నీ మోము నగుపరచి నా వ్యధను పూర్తిగా
తొలగించినాడవు దేవా!
నీ అంద చందమను ఇంద్రజాలము మదిని
భ్రమ చెందజేసినది దేవా ॥
నిను గాంచి ఈ యేడు లోకముల్ ఎడతెగని
తమ వ్యధను పూర్తిగా మరచినవి దేవా ।
అతి బీదనగు నను గూర్చి ఇక నే
నేమి తెల్పజాలుదును నీకు దేవా ॥
నరేంద్రుడికి కాస్త అజీర్తి చేసింది. అతడు ‘మ’ తో ఇలా అన్నాడు: “భక్తి మార్గాన్ని అనుసరించినప్పుడు మనస్సు దేహం మీద కూడా కొద్దిగా నిలుస్తుంది. లేకుంటే, నేను ఎవరిని? మనిషినీ కాను, దేవతనూ కాను. నాకు సుఖమూ లేదు, దుఃఖమూ లేదు.”
50.7.2 శ్రీరామకృష్ణుల ఆత్మపూజ – సురేంద్రుడు – కొలను వద్ద భక్తుల సంకీర్తన
సమయం రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది. సురేంద్రుడు మరి కొందరు భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి, ఆయనకు పూలమాలలు సమర్పించారు. బాబూరామ్, లాటూ, ‘మ’ లు కూడా గదిలో ఉన్నారు.
సురేంద్రు డిచ్చిన మాలను శ్రీరామకృష్ణులు తామే స్వయంగా కంఠంలో ధరించారు. అందరూ మౌనంగా కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు తటాలున సురేంద్రుడికి సైగచేసి తమకు సమీపంగా రమ్మన్నారు. అతడు మంచానికి దగ్గరగా వచ్చాక ఆయన తమ మెడలోని మాలను తీసి ఆతని మెడలో వేశారు. పిదప సురేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. ఆయన సైగచేస్తూ సురేంద్రునితో తమ పాదాలు ఒత్తమన్నారు. సురేంద్రుడు మృదువుగా ఆయన పాదాలు ఒత్తసాగాడు.
పలువురు భక్తులు తోటలో ఉన్న కొలను వద్ద మృదంగ, తాళ వాయిద్యాల తోడ్పాటుతో గానం చేస్తున్నారు. హరినామ సంకీర్తన చేయమని శ్రీరామకృష్ణులు లాటూ ద్వారా కబురు పంపారు.
‘మ’, బాబూరామ్ తదితర భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదిలో కూర్చుని ఉన్నారు. కొలను వద్ద భక్తులు పాడుతున్న హరినామ సంకీర్తన గదిలోకి వినబడుతోంది. ఆ సంకీర్తన విని శ్రీరామకృష్ణులు ‘మ’, బాబూరామ్లను కూడా అక్కడకు వెళ్ళమని సైగ చేశారు, నాట్యం కూడా చేయమన్నారు.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు మరో భక్తుడి ద్వారా ‘గోరాకు నాట్యం చేయడం కూడా తెలుసు సుమా!’, ‘గోరా భావాలను నేనెలా వర్ణంచగలను?’ ‘నా గోరా రెండు చేతులు పైకెత్తి నాట్యం చేస్తాడు’ అనే చరణాలను కూడా జోడించి గానం చేయమని భక్తులకు కబురు పంపారు.
సంకీర్తన ముగిసింది సురేంద్రుడు పారవశ్యంలో ఈ పాట పాడాడు:
పిచ్చివాడు నా తండ్రి పిచ్చి శ్యామ నా తల్లి
పిచ్చివారి పుత్రుడను పిచ్చివాడ నేను గూడ ॥ పి ॥
వాయించుచు బుగ్గలపై పల్కించును నా తండ్రి
భా, భా, భ, భా, భంమ్మను బోలు ధ్వనిని ॥ పి ॥
మద్యముచే తూలిపోయి మాయమ్మపైబడును
అడ్డముగా నా తండ్రి దేహముపై అపుడపుడు ॥ పి ॥
తారుమారు ధారలుగా తార కురులు వ్రేలాడును
మాత పాదపద్మముపై మధుకరములు మూగుచుండ ॥ పి ॥
ఆమె నృత్య మొనరింపగ ఆమె చేతి కంకణములు
గలగలమని మార్మోగెడు కలరవమును ఆలకింపుము ॥ పి ॥