4.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో కేదార్ జరిపించిన ఉత్సవం
ఆదివారం, ఆగష్ట్ 13, 1882
నేడు అమావాస్య తిథి. అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు. దక్షిణేశ్వరాలయంలో శ్రీరామకృష్ణ పరమహంస తమ గదిలో కేదారాది భక్తులతో సంభాషిస్తున్నారు.
కేదార్ ఛటర్జీ ఇల్లు హాలీ శహర్‌లో ఉంది. అతడు ప్రభుత్వ అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఢాకాలో చాల సంవత్సరాలు నివసించాడు. ఆ రోజుల్లో విజయ్‌కృష్ణ గోస్వామి, కేదార్‌తో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడటం కద్దు. భగవన్మహిమలను గురించి వినగానే కేదార్ కళ్లు అశ్రుపూరితాలవుతాయి. అతడు లోగడ బ్రహ్మసమాజస్థుడు.
శ్రీరామకృష్ణులు తమ గదికి దక్షిణాన ఉన్న వసారాలో భక్తులతోపాటు కూర్చునివున్నారు. రామ్, మనోమోహన్, సురేంద్ర, రాఖాల్, భవనాథ్, ‘మ’ లుకూడా ఉన్నారు. నేడు కేదార్ ఒక ఉత్సవం కోసం ఏర్పాట్లు చేయించాడు. సంకీర్తన కూడా జరుగుతుంది. అందు నిమిత్తం రామ్ ఒక గాయకుణ్ణి తోడ్కొని వచ్చాడు. రోజంతా ఆనందోత్సాహమే.
గాయకుడు పాట పాడుతూంటే శ్రీరామకృష్ణులు తమ గదిలోని చిన్ని మంచం మీద కూర్చుని సమాధిమగ్నులైనారు. ‘మ’ తదితరులు మంచం సమీపంలో నేల మీద కూర్చుని ఉన్నారు.
4.1.1 సమాధితత్త్వం – సర్వధర్మ సమన్వయం – హిందూ, ముస్లిం, క్రైస్తవులు
బాహ్య స్పృహలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు సమాధితత్త్వాన్ని గురించి చెప్పసాగారు.
శ్రీరామకృష్ణులు: “సచ్చిదానంద లబ్ధి పొందితే సమాధి కలుగుతుంది. ఆ స్థ్ధితిలో కర్మ త్యాగమవుతుంది. గాయకుడు రాలేదే అని మదనపడుతున్నాం. ఇంతలో గాయకుడు వచ్చేశాడు. ఇక గాయకుడి పేరు ఎత్తవలసిన అవసరంలేదు కదా!
“తేనెటీగ ఝంకారం చేసేది పువ్వు మీద కూర్చునే వరకే. కాని సాధకుడు కర్మత్యాగం చెయ్యకూడదు. పూజ, జపధ్యానాలు, సంధ్యావందనాది కర్మలు, తీర్థ్ధాటనం – ఇవన్నీ చెయ్యవలసిందే.
“భగవత్సాక్షాత్కారానంతరమూ ఎవరైనా విచారణ చేసే పక్షంలో, అతడు పువ్వు నుండి తేనె గ్రోలుతూన్నప్పుడు మెల్లగా ఝంకారం చేసే తేనెటీగ వంటివాడు.”
గాయకుడు బాగా పాడాడు. శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. గాయకుడితో ఇలా అన్నారు: “ఏ వ్యక్తికైనా ఏదో ఒక గొప్పగుణం – సంగీతంలో గాని, ఏదైనా ఒక విద్యలో నైపుణ్యం గాని ఉంటే అతడిలో భగవత్ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు.”
గాయకుడు: మహాశయా! భగవంతుణ్ణి పొందడానికి మార్గం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భక్తే సారం. భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు. అలాగైతే భక్తుడని ఎవరిని సంబోధించటం? ఎవడి మనస్సు సదా భగవంతుడి మీదనే నెలకొని ఉంటుందో అతడే భక్తుడు. అహంకారం, అభిమానం ఉంటే భక్తుడు కాజాలడు. ‘నేను’ అనే కొండశిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలువదు; జారి క్రిందికి పోతుంది. నేను కేవలం యంత్రాన్ని.
(కేదారాది భక్తులతో) “అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. అన్ని మతాలూ సత్యమే. మేడ మీదికి ఎక్కటమే కావలసింది. దాన్ని నువ్వు సరైన మెట్లు ఎక్కి సాధించవచ్చు. చెక్కమెట్లు ఎక్కిపోవచ్చు, లేదా నిచ్చెనెక్కి అయినా పోవచ్చు. లేక పగ్గంగాని, పాతిన వెదురుబొంగు కాని పట్టుకొని ఎక్కవచ్చు.
“ఇతర మతాల్లో మూఢవిశ్వాసాలు, లోటుపాట్లు ఉన్నాయని మీరనవచ్చు. ఉంటే ఏమిటి? ఉంటే ఉండనీ. నేను చెప్పేదేమంటే అన్ని మతాల్లోనూ లోటు పాట్లు, మూఢవిశ్వాసాలు ఉంటాయి. నా గడియారమే సరియైన సమయం చూపుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావలసింది భగవంతుడి పట్ల వ్యాకులత, ప్రేమ, ఆయన మీద మనస్సు లగ్నమవటం. ఆయన అంతర్యామి; అంతరంగంలోని ప్రేమ, వ్యాకులతలను మాత్రమే చూస్తాడు.
“ఒక తండ్రికి అధిక సంతానం ఉందని అనుకుందాం. పెద్దపిల్లలు తండ్రిని ‘నాన్నా’ అని స్పష్టంగా పిలుస్తారు. చిన్నపిల్లలు ‘నా’ లేక ‘నానా’ అనే పిలుస్తారు. ‘నా’ లేక ‘నానా’ అని పిలిచేవారి మీద తండ్రి కోపగించుకొంటాడా ఏమిటి? వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా సరిగా ఉచ్చరించలేకపోతున్నారేగాని, తననే పిలుస్తున్నారని తండ్రి ఎరుగడా ఏమిటి? తండ్రికి పిల్లలందరూ సమానులే. అలాగే ఒకే భగవంతుణ్ణి భక్తులు అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఒక చెరువుకు నాలుగు వైపులా ఘట్టాలున్నాయి. హిందువులు ఒక ఘట్టంలో నీరు తాగుతూ ఆ నీటిని ‘జలం’ అంటున్నారు. మరో ఘట్టంలో మహమ్మదీయులు నీరు తాగుతూ ‘పానీ’ అంటున్నారు. అలాగే ఆంగ్లేయులు మరో ఘట్టంలోని నీరు తాగుతూ ‘వాటర్’ అంటున్నారు. మరో ఘట్టంలో ‘ఆక్వా’ అంటున్నారు. భగవంతుడొక్కడేగాని ఆయన్ను వేర్వేరు పేర్లతో పిలుస్తారు.”
4.2 ద్వితీయ పరిచ్ఛేదం కామినీ కాంచనాలే యోగానికి అడ్డంకులు
గురువారం, ఆగష్టు 24, 1882
దక్షిణేశ్వర కాళికాలయం. శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యంవైపు ఉన్న పొడవైన వసారాలో హాజ్రాతో మాట్లాడుతున్నారు. ‘మ’ వచ్చి శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు నమస్కరించాడు. హాజ్రా, రాఖాల్, రామ్‌లాల్ తదితరులు శ్రీరామకృష్ణులతో కొద్దిరోజులుగా నివసిస్తున్నారు. రామ్‌లాల్, శ్రీరామకృష్ణుల అన్న కుమారుడు; కాళికాలయ పూజారిగా ఉంటున్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ ‘మ’ తో): ఇంకా రెండు మూడుసార్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ను కలుసుకోవాలి. చిత్రకారుడు మొదట చిత్రం బాహ్యాకృతిని చిత్రిస్తాడు. తరువాత తీరికగా వివరాలతో చిత్రాన్ని మార్తిచేసి, రంగులు వేస్తాడు. మట్టిబొమ్మలు తయారుచేసేవాడు మొదట బొమ్మ ఆకారాన్ని మట్టితో చేసి, ఆ తరువాత సుద్దతో రంగు పూస్తాడు. చివరికి రకరకాల రంగులను సున్నితమైన కుంచెతో వేస్తాడు. ఇలాగే ఒకదాని తరువాత ఒకటి చెయ్యాలి.
“ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌కు అంతా సిద్ధంగానే ఉంది కాని, ఆతడి లోపలి పదార్థం ఒక పొరతో కప్పబడివుంది. కొన్ని మంచిపనులు చేస్తున్నాడు కాని, అంతరంగాన ఏముందో ఎరుగడాయె. అంతరంగాన బంగారం దాగివుంది. లోపల భగవంతుడు నివసిస్తున్నాడు. అది తెలుసుకుంటే సమస్త కార్యకలాపాలను వదలివేసి వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే భావన కలుగుతుంది.”
కాసేపు నిలబడీ, కాసేపు పచార్లు చేస్తూ శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడుతున్నారు.
4.2.1 సాధన – కామినీ కాంచనాల’ తుపాను’ నియంత్రణ
శ్రీరామకృష్ణులు: అంతరంగంలో ఉన్నదాన్ని తెలుసుకోటానికి కొంత సాధన అవసరం.
‘మ’ : యావజ్జీవితం సాధన చెయ్యాలా?
శ్రీరామకృష్ణులు: లేదు. కాని మొదట్లో బాగా కష్టపడి సాధన చెయ్యాలి. తరువాత అంత పరిశ్రమ అవసరం లేదు. ఎదురు గాలి వీస్తున్నప్పుడూ, గాలివాన కొడుతున్నప్పుడూ, సుడిగాలి లేక తుపాన్ చెలరేగే సమయాల్లోనూ, నది వంపుల గుండా పయనించేటప్పుడూ పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కానిని గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది. కాని వీటి నన్నింటినీ దాటిన తరువాత, మరి భయం లేదు. వంపులతో కూడిన ఆ మార్గాన్ని దాటాక, అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు. చుక్కాని మీద ఊరకే చెయ్యి వేసి ఉంటాడు. తరువాత తెరచాపను మెల్లగా ఎత్తుతాడు. తదనంతరం పొగత్రాగ మొదలుపెడతాడు. అలాగే మానవ జీవన యాత్రలో కూడా కామినీ కాంచనాలనే సుడిగాలులను, గాలివానలను అధిగమించాకనే జీవితంలో శాంతి లభిస్తుంది.
4.2.2 యోగతత్త్వం – యోగభ్రష్టుడు – ‘నివాతనిష్కంపమివ ప్రదీపం’ – యోగావరోధాలు
“కొందరిలో యోగి లక్షణాలు కానవస్తాయి. కాని వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కామినీ కాంచనాలే యోగానికి విఘ్నం కలిగిస్తాయి. భోగవాసనలు కొద్దిగా ఉండటం చేత యోగభ్రష్టుడై సంసారంలో వచ్చిపడతాడు. కాని ఆ భోగవాసనలు సమసిపోయాక తిరిగి భగవంతుని కోరతాడు, తిరిగి యోగావస్థ్ధ పొందుతాడు.
“ ‘సట్కా–కల్’ అనబడే చేపలు పట్టే (స్ప్రింగ్) వలను చూశావా?”
‘మ’ : లేదండీ, నేను చూడలేదు.
శ్రీరామకృష్ణులు: గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని వాడతారు. ఒక వెదురు బొంగును నేలలో పాతి దాని రెండవ చివరను వంచి పెడతారు. ఈ చివరనుండి ఒక కొక్కెం వేలాడదీయబడి నీటి మీద వాలివుంటుంది. ఆ కొక్కానికి ఒక ఎర కట్టబడివుంటుంది. చేప ఎరను నోట కరచుకొన్నప్పుడు, హఠాత్తుగా వెదురుబొంగు నిట్టనిలువు స్థ్ధానాన్ని చేరుకొంటుంది.
“మళ్ళీ ఉదాహరణకు త్రాసును చూడు. ఒక వైపు బరువు వేస్తే క్రింది ముల్లు, పై ముల్లు ఒకే గీత వద్ద నిలువవు. క్రింది ముల్లు మనస్సు, పై ముల్లు భగవంతుడు. క్రింది ముల్లు, పై ముల్లుతో సమాంతరంగా ఉండటమే యోగం.
“మనస్సు స్థిరం కాకపోతే యోగం సిద్ధించదు. మనస్సనే దీపాన్ని ఈ సంసారమనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది. దీపం ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగం ప్రాప్తిస్తుంది.
“యోగానికి కామినీ కాంచనాలే అడ్డంకులు. విశ్లేషించి చూడు. స్త్రీ శరీరంలో ఏముంది – రక్తం, మాంసం, కొవ్వు, మలమూత్రాలు మొదలైనవే గదా! అలాంటి శరీరం పట్ల ఆసక్తి ఎందుకు ఉంచుకోవాలి?
“కొన్ని సమయాల్లో త్యాగాన్ని సాధన చెయ్యటానికి నేను రాజసిక భావాన్ని కల్పించుకొంటాను. జరీ అంచు ఉడుపులు ధరించి, వేలికి ఉంగరం పెట్టుకొని, పొడవాటి గొట్టంగల హుక్కా పీల్చాలనే ఆశ కలిగింది. మధుర్‌బాబు వెంటనే వాటిని సమకూర్చాడు. కాసేపు వాటన్నిటినీ ధరించాను. తరువాత మనస్సుతో ‘ఓ మనసా! జరీ అంచువస్త్రం అంటారే అది ఇదే’ అంటూ తక్షణమే దాన్ని విప్పి విసిరిపారేశాను. ఆ తరువాత దానివైపు నా మనస్సు పోలేదు. ‘మనస్సా దీని పేరే శాలువా. దీని పేరే ఉంగరం. ఇదే పొడవైన హుక్కాతో పొగపీల్చటం’ అంటూ మనస్సుకు చెప్పాను. తరువాత అన్నిటినీ ఆవల పారేశాను. ఆ తరువాత మళ్ళీ నా మనస్సులో వాటిపై కోర్కె జనించలేదు.
సంధ్యాసమయమవుతోంది. గది ఆగ్నేయ వసారా గుమ్మం వద్ద శ్రీరామకృష్ణులు ఒంటరిగా ‘మ’ తో మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: యోగిపుంగవుడి మనస్సు సదా భగవంతుడి మీదనే ఉంటుంది; ఆత్మస్థుడై ఉంటాడు. చూడగానే అతణ్ణి గుర్తించవచ్చు. అతడి కళ్లు గుడ్లు పొదిగే సమయంలో పక్షి కళ్ళలా పరధ్యానంగా ఉంటాయి. పక్షి మనస్సు పూర్తిగా గుడ్ల మీదే నిలిచి ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని నా కొకటి తెచ్చి చూపిస్తావా?
‘మ’ : సరేనండీ. అలాంటి చిత్రం ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.
4.3 తృతీయ పరిచ్ఛేదం గురు శిష్య సంవాదం – గోప్య విషయాలు
సంధ్యాసమయమయింది. కాళికాలయంలోను, రాధాకాంత ఆలయంలోను, ఇతర ఆలయాల్లోను, గదులలోను దీపాలు వెలిగాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి చిన్న మంచం మీద కూర్చుని కొంతసేపు జగన్మాతృ చింతన చేశారు. ఆ తరువాత మధురంగా భగవన్నామస్మరణ చెయ్యసాగారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి పొగ వేశారు. ఒక ప్రక్క ప్రమిదదీపం వెలుగుతోంది. కాసేపట్లో శంఖారావం, కంచుగంటల ధ్వనులు వినవచ్చాయి. కాళికాలయంలో హారతులు మొదలయ్యాయి. నాడు శుక్లపక్ష దశమి. చంద్రుడు నాలుగు వైపులా వెన్నెల వెదజల్లుతున్నాడు.
హారతులు పూర్తి అయ్యాయి. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. గదిలో ‘మ’ మాత్రం నేల మీద కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడసాగారు.
4.3.1 ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’
శ్రీరామకృష్ణులు: నిష్కామకర్మ గావించు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచిపనులే. కాని వాటిని నిష్కామంగా చెయ్యటానికి ప్రయత్నించాలి.
‘మ’ : అవునండీ. కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుందా? కొన్ని రోజుల క్రితం ఒక హిందీ పుస్తకంలో ఇలా చదివాను:
‘జహాఁ రామ్ తహాఁ నహీ కామ్,
జహాఁ కామ్ తహాఁ నహీ రామ్’
(అంటే రాముడున్న చోట కామం ఉండదు. కామం ఉన్నచోట రాముడు ఉండడు).
శ్రీరామకృష్ణులు: ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. భక్తుడు భగవన్నామ స్మరణ చెయ్యటమూ కర్మే. అద్వైతులు ‘సో-హం’ భావంతో ధ్యానం చెయ్యటమూ కర్మే. ఇంతెందుకు – ఊపిరి వదలటం కూడా కర్మే సుమా! కర్మత్యాగం చేసే ఉపాయం లేదు. అందుచేత కర్మలు చెయ్యి. కాని ఫలితాన్ని భగవంతుడికే వదిలిపెట్టు.
‘మ’ : అలాగే చేస్తాను. అధిక ధనసంపాదనకు ప్రయత్నించవచ్చా?
శ్రీరామకృష్ణులు: ధార్మిక జీవనానికై చేయవచ్చు. అధికంగా ధనం సంపాదించడానికి ప్రయత్నించు, కాని సరైన మార్గంలోనే. లక్ష్యం ధన సంపాదన కాదు; భగవత్ సేవయే. భగవంతుని సేవించటానికై సంపాదించే డబ్బులో దోషం ఉండదు.
‘మ’ : కుటుంబ కర్తవ్యం ఎంతకాలం?
శ్రీరామకృష్ణులు: తిండి బట్టలకు కష్టపడనంత వరకు. పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడ్డ తరువాత వాళ్ళ భారాన్ని వహించే అవసరం లేదు. పక్షిపిల్ల స్వయంగా ఆహారం సేకరింప నేర్చిన తరువాత తల్లి వద్దకు వెళితే, తల్లి దాన్ని ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది.
‘మ’ : ఎంతకాలం కర్మలు ఆచరించాలి?
శ్రీరామకృష్ణులు: కాయ కాస్తే పువ్వు నిలబడదు. భగవద్దర్శనం అయ్యాక కర్మలు చేయనక్కర్లేదు. అందుకు మనస్సు ఇచ్ఛగించదు కూడా.
“తాగుబోతు అధికంగా కల్లు తాగితే అతడికి స్పృహే ఉండదు. ఏదో కాస్త పుచ్చుకొంటే పనిపాటులు చేసుకోగలుగుతాడు. భగవంతుడి వైపు ఎంతగా పోతావో ఆయన అంతగా నీ పనిని తగ్గిస్తాడు. భయపడకు. కోడలు గర్భవతి అయితే అత్తగారు ఆమె పనిని కొద్దికొద్దిగా తగ్గించివేస్తుంది. నెలలు నిండాక ఆమెను ఏ పనినీ చేయనివ్వదు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ సంరక్షణే ఆమె కర్తవ్యం.
“కర్మ తీరిపోతే ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు. గృహిణి ఇంటి పనంతా పూర్తి చేసుకొని స్నానానికి వెళ్లినప్పుడు ఎంత పిలిచినా తిరిగి చూడదు.”
4.3.2 భగవల్లాభం, భగవద్దర్శనం అంటే? దానికి మార్గం ఏది?
‘మ’ : అయ్యా, భగవల్లాభమంటే అర్థం ఏమిటి? దేన్ని భగవద్దర్శన మంటారు? అదెలా లభిస్తుంది?
శ్రీరామకృష్ణులు: వైష్ణవమత సంప్రదాయాన్ననుసరించి భగవదన్వేషకులు నాలుగు విధాలుగా విభజించబడ్డారు: ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు.
“బాటలో అప్పుడే కాలుపెట్టిన వ్యక్తిని ప్రవర్తకుడని పేర్కొంటారు. పూజ, జప, ధ్యాన, నామసంకీర్తనాది సాధన భజనలు చేస్తూన్న వ్యక్తిని సాధకుడని పిలుస్తారు. భగవంతుడున్నాడనే బోధ కలిగిన వ్యక్తిని సిద్ధుడంటారు. సిద్ధుని స్థితి వేదాంతంలో ఈ ఉపమానంతో వర్ణింపబడింది: గృహ యజమాని చీకటి గదిలో నిద్రపోతున్నాడు. అతణ్ణి వెతకటానికై వచ్చిన వ్యక్తి చీకట్లో తడుముతుంటే సోఫా మీద చెయ్యిపడగానే ‘నేతి, నేతి’ – ‘ఇది కాదు, ఇది కాదు’ అంటాడు. చేతికి కిటికీ తగలగానే ‘నేతి, నేతి’ అంటాడు. తలుపు మీద చెయ్యి పడగానే ‘నేతి, నేతి’ అంటాడు. ఆ తరువాత యజమాని శరీరం మీద చెయ్యి తగలగానే ‘ఇక్కడ ఉన్నాడు, ఉన్నాడు’ అంటాడు. అంటే ఆ వ్యక్తికి యజమాని ఉన్నాడని మాత్రమే బోధపడింది. కాని అతణ్ణి గురించి ఎక్కువగా తెలియదు.
“మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వారే సిద్ధసిద్ధులు. ఇంటి యజమానితో అతిసన్నిహిత పరిచయం ఏర్పడటమనే స్థ్ధితే ప్రత్యేకం. ప్రేమభక్తి ద్వారా భగవంతునితో అతి సన్నిహితమైన పరిచయం కలిగిన స్థితి అది. సిద్ధులు భగవంతుని పొందినవారే. దాన్లో సందేహమే లేదు. కాని సిద్ధసిద్ధులు ఆయనతో అతిసన్నిహితంగా మెలగేవారు.
“భగవల్లాభం కోరే పక్షంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించాలి.
శాంతభావం: ఋషులకు ఈ భావం ఉండేది. భోగవాసన ఇసుమంత కూడా వారికి ఉండదు. భార్యకు, భర్తపట్ల ఉన్న ప్రేమాభిమానం వంటిది ఇది – ఆమె ఆతణ్ణి మన్మథునిగానే గాంచుతుంది.
దాస్యభావం: హనుమంతుడి భావం మాదిరి! రామకార్యార్థమై పోయేటప్పుడు సింహపరాక్రముడు! భార్యలోనూ దాస్యభావం ఉంటుంది. భర్తను ప్రాణ సమానంగా సేవిస్తుంది. తల్లికికూడా కొంత దాస్యభావం ఉంటుంది. యశోదకుకూడా ఈ భావం ఉండేది.
సఖ్యభావం: స్నేహితుని మాదిరి. ‘రా! పక్కన కూర్చో!’ అన్న స్థ్ధాయిలో సన్నిహితంగా మెలగటం. కుచేలుని వంటి వారు ఒక్కొక్కసారి ఎంగిలి చేసిన పళ్లను కృష్ణునికి ఇచ్చారు. తినిపించారు. ఇంకొకసారి భుజాల మీద ఎక్కి కూర్చున్నారు.
వాత్సల్యభావం: యశోద భావం వంటిది. ఈ భావం భార్యలోకూడా కొంత ఉంటుంది – భర్తకు మనసారా భోజనం పెడుతుంది. బిడ్డ కడుపారా తింటేనే తల్లికి తృప్తి. కృష్ణుడు తింటాడని చేత వెన్న పట్టుకొని యశోద తిరుగుతూండేది.
మధురభావం: రాధాదేవి భావన లాంటిది ఇది. భార్య స్థితి కూడా ఇదే. ఈ మధురభావంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్యాది భావాలు అన్నీ ఇమిడి ఉన్నాయి.
‘మ’ : అయ్యా, ఈ కళ్లతో భగవంతుణ్ణి చూడగలమా?
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి ఈ చర్మ చక్షువులతో చూడలేం. సాధనలు చేయగా చేయగా ప్రేమ చక్షువులు, ప్రేమ కర్ణాలతో కూడుకొన్న ప్రేమమయ దేహం ఏర్పడుతుంది. అలా ప్రేమ చక్షువులతో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ ప్రేమకర్ణాలకు దైవవాణి వినబడుతుంది. ఆ విధంగానే ప్రేమమయ లైంగికావయవాలు కూడా ఏర్పడతాయి.
ఈ మాటలకు ‘మ’ ఫక్కున నవ్వాడు. శ్రీరామకృష్ణులు విసుగుచెందక, “ఈ ప్రేమమయ శరీరంతో ఆత్మ భగవంతుడితో సంగమిస్తుంది” అన్నారు.
‘మ’ శ్రద్ధగా వినసాగాడు.
శ్రీరామకృష్ణులు: భగవంతుడి పట్ల ప్రగాఢప్రేమ కలుగకుండా ఇది సంభవం కాదు. ప్రేమ పరిపూరితుడైన వ్యక్తి సమస్త ప్రపంచాన్ని భగవన్మయంగా చూస్తాడు. పచ్చకామెర్లు ముదిరిన రోగికి వస్తువులన్నీ పసుపు పచ్చగా కనబడతాయి. అలాంటి స్థితిలో ‘అతడే నేను’ (సో-హం) అని అవగాహన మౌతుంది. తాగుబోతు అధికంగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ‘నేనే కాళిని’ అంటూ కేకలు వేస్తాడు. గోపికలు ప్రేమోన్మత్తులై, ‘నేనే కృష్ణుణ్ణి’ అంటూ ప్రకటించుకొన్నారు. అహోరాత్రాలు భగవంతుణ్ణే స్మరిస్తే సర్వత్రా ఆయన్నే చూడగలం. వెలుగుతున్న దీపారాధన వత్తిని ఏకాగ్రంగా చాలసేపు చూస్తూవుంటే నాలుగువైపుల దీపశిఖలను చూస్తాం గదా!
నాలుగు వైపులా కనబడే దీపశిఖలు నిజమైనవి కావు అన్న భావం అప్పుడు ‘మ’ మనస్సులో తళుక్కుమంది.
4.3.3 భగవద్దర్శనం అంటే మతిభ్రమణమా? – ‘సంశయాత్మా వినశ్యతి’
అంతర్యామి అయిన శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “చైతన్యాన్ని గురించి చింతన చేస్తే అచైతన్యులం ఎన్నటికీ కాజాలం. మాటిమాటికీ భగవంతుణ్ణి గురించే చింతిస్తూవుంటే మతిభ్రమ కలుగుతుందని ఒకసారి శివనాథశాస్త్రి అంటే నేనతడితో ‘ఏమిటి? చైతన్యాన్ని స్మరిస్తూండే వ్యక్తి అచైతన్య మెలా అవుతాడు?’ అన్నాను.”
‘మ’ : చిత్తం, నా కది అర్థమైంది. ఇది అనిత్యమైన వస్తువులను స్మరించటం కాదు కదా! భగవంతుడు నిత్యచైతన్య స్వరూపుడు; ఆయనపై మనస్సును లగ్నం చేస్తే మనిషి అచైతన్యమెలా అవుతాడు?
శ్రీరామకృష్ణులు (ప్రసన్నంగా): ఇది భగవంతుని కృప. ఆయన కృపలేనిదే సందేహం నివృత్తి కాదు. ఆత్మసాక్షాత్కారం కలగకుండా సందేహ నివృత్తి కాదు. ఆయన కృప కలిగితే ఇక ఎలాంటి భయమూ లేదు. బిడ్డ తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తున్నా పడిపోయే అవకాశం ఉంది కదా! కాని తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకొంటే ఇక భయం లేదు. భగవంతుడు కృపతో సందేహాలను రూపుమాపి దర్శనమిస్తే ఇక కష్టాలు ఉండవు. కాని ఆయన్ను పొందటానికి ఎంతో మనోవ్యాకులతతో సాధన, ప్రార్థ్ధనలు చేయగా చేయగా ఆయన కృప కలుగుతుంది. బిడ్డ ఎంతోసేపు అటూ ఇటూ పరుగులు పెడుతూండటం చూసి తల్లికి దయ కలుగుతుంది. దాగుకొనివున్న ఆమె బయటకు వచ్చి బిడ్డ ఎదుట నిలబడుతుంది.
‘భగవంతుడు మనలను అంతగా పరుగులు పెట్టించటం ఎందుకు?’ అని ‘మ’ ఆలోచిస్తూన్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు:
“మనం అటూ ఇటూ పరుగులు పెట్టాలన్నదే ఆయన ఇచ్ఛ. అప్పుడే తమాషాగా ఉంటుంది. తన లీల మూలంగానే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. దీన్నే మహామాయ అంటారు. అందుకే ఈ శక్తి స్వరూపిణీ జగజ్జనని చరణాల వద్ద శరణాగతుడవు కావాలి. ఆమె ఈ లోకాన్ని మాయాపాశంతో బంధించి ఉంచింది. ఈ పాశాన్ని ఛేదింప గలిగితే భగవద్దర్శనం కలుగుతుంది.
4.3.4 ఆద్యాశక్తి మహామాయ – శక్తిసాధన
“భగవంతుడి కృపను సాధించుకోవాలంటే ఆద్యాశక్తి స్వరూపిణిని ప్రసన్నురాలిగా చేసుకోవాలి. ఆమే మహామాయ. జగత్తును మైమరపింపజేస్తూ సృష్టి స్థితి ప్రళయాలను నిర్వర్తిస్తోంది. ఈ అజ్ఞానపు తెరను మన కళ్ళ ముందు పరచింది. ఆ మహామాయ తలుపు తెరిస్తేనే లోపలికి ప్రవేశించవచ్చు. బైటపడివుంటే బాహ్య వస్తువులను చూడగలం, ఆ నిత్య సచ్చిదానంద పురుషుణ్ణి తెలుసుకోలేం. అందుకే దేవీమాహాత్మ్య (దుర్గాసప్తశతి) పురాణంలో మధుకైటభుల వధకై బ్రహ్మాది దేవతలు మహామాయను స్తుతించారు.
“శక్తే ఈ జగత్తుకు మూలాధారం. ఆద్యాశక్తిలోనే విద్య, అవిద్య నెలకొని ఉన్నాయి. అవిద్య మోహంలో పడవేస్తుంది. కామినీకాంచన వాంఛ దాన్లో నుండే ఉద్భవిస్తుంది. అది మనిషిని మోహపరవశుని గావిస్తుంది. భక్తి, జ్ఞాన, దయ, ప్రేమల ద్వారా విద్య భగవంతుడి వద్దకు తీసుకొనిపోతుంది.
“ఆ అవిద్యను ప్రసన్నం చేసుకోవాలి. అదే శక్తి పూజల ఉద్దేశం. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికే పలు భావాలలో పూజలు ఉన్నాయి. దాసీభావంతోను, సంతాన భావంతోను, వీరభావంతోను ఉపాసిస్తారు. అంటే పురుషుడు రతిలో స్త్రీని ఎలా సంతృప్తి పరుస్తాడో వీరభావంలో ఆమెను అలా ఆనందపరచాలి.
“శక్తి సాధనలు ఎంతో కష్టం. నేను సఖీభావంలోను, దాసీభావంలోను రెండేళ్ళు గడిపాను. కాని సంతాన భావమే నా సహజ నైజం. స్త్రీల స్తనాలను నా కన్నతల్లి స్తనాలుగా భావిస్తాను.
“స్త్రీలు అందరూ శక్తిస్వరూపిణులు. పశ్చిమ ప్రాంతాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్) వారి వివాహ సమయంలో వరుడి చేతిలో కత్తి ఉంటుంది; వంగదేశంలో అడకత్తెర ఉంటుంది. శక్తిరూపిణి అయిన వధువు సహాయంతో వరుడు మహామాయను ఛేదిస్తాడని దాని సూచితార్థం. ఇదే వీరభావ ఉపాసన. ఏనాడూ నేను వీరభావాన్ని ఆశ్రయించలేదు, నాది సంతాన భావమే సుమా!
“కన్య మూర్తీభవించిన శక్తిస్వరూపిణి. వివాహ సమయంలో చూడలేదా? వరుడు బుద్ధిహీనుడిలా వెనుక కూర్చుని ఉంటాడు. కాని వధువు ఎంతో ధైర్యంతో ఉంటుంది.
4.3.5 భగవద్దర్శనంతో బాహ్య శోభ విస్మృతి
“భగవద్దర్శనమైతే ఆయన బాహ్య శోభను, సృష్టి వైభవాన్ని మరచిపోతారు. భగవత్ దర్శనానంతరం ఆయన వైభవాలను గురించి ఆలోచించరు. భక్తుడు బ్రహ్మానందంలో మునిగాక బాహ్యవిషయాలను గురించి గణించడు. నరేంద్రుణ్ణి చూశాక ‘నీ పేరేమిటి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు?’ అని నేను అడుగనవసరం లేదు. అలాంటి ప్రశ్నలకు సమయ మెక్కడుంది? ఒకప్పుడు ఒకడు హనుమంతుణ్ణి ‘ఈ రోజు తిథి ఏమిటి?’ అని అడిగాడు. అందుకు హనుమంతుడు ‘నాయనా! రాముణ్ణి స్మరించటమే తప్ప తిథి, వార, నక్షత్రాలను గురించి నాకేమీ తెలియదు’ అన్నాడట.”
4.4 పంచమ పరిచ్ఛేదం భజనానందంలో నరేంద్రాదులతో – నరేంద్రునితో ప్రేమాలింగనం
సాయంత్రమైంది. నరేంద్రుడు పాడుతున్నాడు. రాఖాల్, లాటు, ‘మ’, హాజ్రా, నరేంద్రుడి బ్రహ్మసమాజ మిత్రుడు ప్రియ ప్రభృతులున్నారు. మృదంగ నాదం పాటకు జత చేరింది.
ఎన్నటికో నికనెన్నటికో
ఆ శుభసమయం బెన్నటికో
అంచితముగ భాగ్యారుణ కాంతులు
తెలతెలవారే దెన్నటికో॥ ఎ ॥
సత్యస్వరూపుడు కరుణామయుడు
అందములొలికే సుందరరూపుడు
డెందము నందలి మందిరమున తా
దీప్తులు నింపే దెన్నటికో॥ ఎ ॥
అనవరతంబును ఆతని గాంచుచు
అంతమునందున ఆనందాంబుధి
ఇటునటు తేలుచు ఈదులాడుచు
మునకలు వేసే దెన్నటికో॥ ఎ ॥
అనంత విజ్ఞానంబుగ ఆత్మను
జొచ్చిన నిన్ను నిశ్చేష్టతతో
చూచుచు చిత్తము నీ పదములలో
స్వర్గము జూచే దెన్నటికో ప్రభూ!
స్వర్గము జూచే దెన్నటికో॥ ఎ ॥
హృదయాకాశపు వీథులలోన
నీలిగగనపు నీడలలోన
బ్రహ్మానందపు అమృతమూర్తిగ
నీ ఉదయించే దెన్నటికో॥ ఎ ॥
చంద్రుని జూచుచు చకోరి ఆడుచు
నున్న విధముగా నిన్ను చూచి నే
దివ్యానందపు తేటల తేలుచు
నృత్యము చేసే దెన్నటికో॥ ఎ ॥
ప్రసన్న వదనముతోడ పాడుమీ
వాసుదేవు శ్రీభాసుర నామము
రసవాహినులై మధుర సుధారస
మది హృది పొంగుచు పొరలునంతగా॥ ప్ర ॥
వదలక దానిని ఆస్వాదించుచు
సదయుల కందర కంద జేయుమీ॥ ప్ర ॥
మాడిపోయి నీ హృదయక్షేత్రము
బీడువారగా కామజ్వాలలకు
పాడుము శ్రీహరి పావన నామము
తడిసి మెత్తబడు దైవకరుణచే॥ ప్ర ॥
ఘోర కష్టములు కూడి నిలువగా
పరమపురుషుని భజన మరువకుము
కరుణాళుని యా నామగర్జనకు
పరువడి తెగును పాపపాశములు॥ ప్ర ॥
అనవరతానందాస్వాదనచే
పావన బ్రహ్మానందమందున
మన మా దైవమునందు ఏకమై
మనసా ధన్యతబొంద జేరుమిట॥ ప్ర ॥
నరేంద్రుడు, తక్కిన భక్తులంతా శ్రీరామకృష్ణుల చుట్టూ తిరుగుతూ సంకీర్తన చేస్తున్నారు. శ్రీరామకృష్ణులూ భక్తులతో పాటు ఆనందంతో నృత్యం చేస్తూ సంకీర్తన చేశారు. సంకీర్తన పూర్తికాగానే శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి మాటి మాటికీ ఆలింగనం చేసుకొని “ఈ రోజు నా కెంతో ఆనందం కలిగించావు నాయనా” అన్నారు.
రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం. అప్పటికీ శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రేమ ప్రవాహం ఉప్పొంగుతూనే ఉంది. తమ గదికి ఉత్తరాన ఉన్న వసారాలో ఒంటరిగా పచార్లు చేస్తున్నారు. మధ్యమధ్యలో జగజ్జననితోకూడా ఏదో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఉన్మత్తుని మాదిరి ఇలా అంటున్నారు: “నువ్వు నన్నేం చెయ్యగలవు?” జగజ్జనని ఎవరికి తోడుగా ఉంటుందో అతణ్ణి ‘మాయ’ ఏం చెయ్యగలదు అని శ్రీరామకృష్ణులు అంటున్నారా ఏమిటి? నరేంద్రుడు, ‘మ’, ప్రియ – వీరు శ్రీరామకృష్ణుల వద్దనే ఆ రాత్రి ఉంటారు. శ్రీరామకృష్ణుల ఆనందానికి మేర లేకుండా ఉంది.
మాతృదేవి నహబత్తులో నివసిస్తున్నారు. ఆమె రొట్టెలు, పప్పు మొదలైనవి చేసి భక్తులకోసం రాత్రి భోజనం పంపించారు. ఆగ్నేయ వసారాలో ఆకులు వేశారు.
ఈ విధంగా భక్తులు అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల వద్దనే రాత్రిళ్ళు గడిపేవారు. భక్తుల ఖర్చుల నిమిత్తం సురేంద్రుడు ప్రతి నెలా కొంత పైకం ఇచ్చేవాడు.
4.4.1 నరేంద్రాదులకు భగవత్ సంబంధిత విషయాలను మాత్రమే సంభాషించుకొవాలని హితవు
గది తూర్పు వసారా వద్ద నరేంద్రాదులు ఇలా సంభాషించుకొంటున్నారు.
నరేంద్రుడు: ఈనాటి యువకులు మీ కెలా అనిపిస్తున్నారు?
‘మ’ : ఫరవాలేదు. కాని వారికి ధార్మిక ఉపదేశాలు కరువైనాయి.
నరేంద్రుడు: నాకు తెలిసినంతవరకు యువకులు అధఃపతితులవుతున్నారు. బడి ఎగగొట్టటం, ధూమపానం చెయ్యటం, అనవసరమైన తగాదాలు, ఆడంబరం మొదలైనవి సహజమైపోయాయి. అంతేకాదు, పోరాని చోట్లకు కూడా పోతున్నారు.
‘మ’ : మేం చదువుకొనే రోజుల్లో ఇలాంటి విషయాలు కనీ వినీ ఎరుగం.
నరేంద్రుడు: బహుశా మీరు సన్నిహితంగా వారితో కలసి ఉండరను కొంటాను. వారు నీతిబాహ్యులైన వ్యక్తులతో మాట్లాడటం నా కళ్లారా చూశాను. బహుశా వారు, వీరితో సన్నిహితంగా ఉంటూవుండొచ్చు.
‘మ’ : ఇది చాలా విచిత్రం సుమా!
నరేంద్రుడు: వారిలో చాలామంది చెడు అలవాట్లకు లోనవటం నే నెరుగుదును. విద్యాసంస్థ్ధల
అధికారులు, పిల్లల తల్లితండ్రులు ఈ విషయాలను ఒక కంట గమనిస్తే బాగుంటుంది.
అలా వాళ్లు మాట్లాడుకుంటూవుంటే శ్రీరామకృష్ణులు తమ గదిలోనుంచి వారి వద్దకొచ్చి చిరునవ్వుతో “మీరేం మాట్లాడుకుంటున్నారు?” అని అడిగారు.
నరేంద్రుడు (‘మ’ ను చూపుతూ): ఈయనతో పాఠశాలల గురించి అడుగుతున్నాను. నేటి విద్యార్థ్ధుల నడవడి ఉండవలసిన రీతిలో ఉండటం లేదు.
ఇది వినగానే శ్రీరామకృష్ణులు గంభీర స్వరంలో ‘మ’ తో ఇలా అన్నారు: “ఇలాటి సంభాషణ మంచిది కాదు. దైవ సంబంధమైన సంభాషణలు తప్ప తక్కిన వేటిలోనూ మునుగరాదు. నువ్వు వీరికంటే వయస్సులో పెద్దవాడివి, వివేకం గలవాడివి. అలాటి విషయాలు మాట్లాడటానికి నువ్వు ప్రోత్సహించ కూడదు.”
అప్పుడు నరేంద్రుడి వయస్సు సుమారు పందొమ్మిదేళ్లు, ‘మ’ కు సుమారు ఇరవై ఎనిమిదేళ్లు.
‘మ’ లజ్జితుడయ్యాడు. నరేంద్రుడు, తక్కినవారు మౌనం వహించారు.
తరువాత భక్తులు తృప్తితో భోజనం చేస్తూవుంటే, శ్రీరామకృష్ణులు నిలబడి వారిని సంతోషంతో చూస్తున్నారు. ఆనాటి రాత్రి శ్రీరామకృష్ణుల ఆనందానికి మేర లేకపోయింది.
భోజనం చేశాక భక్తులు శ్రీరామకృష్ణుల గదిలో పరచిన చాపమీద విశ్రమించారు. ఆయనతో వారు మాట్లాడసాగారు. అదొక ఆనంద సంతలా ఉంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ‘విజ్ఞాన గగనమున ప్రేమ చంద్రుడు’ అనే పాట పాడమనగానే, నరేంద్రుడు పాట ప్రారంభించాడు. కొందరు భక్తులు మృదంగ తాళాలు పాటకు అనువుగా వాయించటం మొదలుపెట్టారు.
విజ్ఞాన గగనమున
ప్రేమచంద్రుడు పూర్ణ
బింబమున ఉదయించెను॥ వి ॥
ప్రేమ పోటున అలలు
పొంగి పొరలుచులేచి
అన్నిదిక్కుల పారెను॥ వి ॥
దేవ జయమగు నీకు
దేవాదిదేవుడవు
జయమహో జయము, జయము॥ వి ॥
చంద్రబింబము చుట్టు
వెలుగు తారల రీతి
మెరయుదురు నీ భక్తులు॥ వి ॥
కారుణ్యపూర్ణుడవు
వారలకు హితుడవు
నీ వాడుదువు వారితో॥ వి ॥
స్వర్గద్వారములన్ని
ఈ రోజు తెరువబడె
చూడు! కన్నుల పండుగ॥ వి ॥
నవ్యదినమను మలయ
పవనము ఆనంద
తరంగాలను పొంగించెను॥ వి ॥
యోగు లెల్లరకును
ఆనందమత్తత
పారవశ్యము గొల్పగా॥ వి ॥
దివ్యప్రేమ సుగంధ
మును భూమి మీదకు
మెల్లగా వెదజల్లెను॥ వి ॥
నవ్యదిన పద్మము
లోకసాగరమందు
వికసింపగా సాగెను॥ వి ॥
ఆ పద్మమున అమ్మ
ఆనంద ఠీవితో
ఆసీనయై యుండెను॥ వి ॥
ఆనందముగ మరచి
సుధనెట్లు మధుపములు
గ్రోలుచున్నవో చూడుడు॥ వి ॥
హృదయమును మరపించు
విశ్వమోహనమైన
అమ్మ మోమును గాంచుము॥ వి ॥
ఆమె పదముల చెంత
ఆనందమత్తులై
భక్తబృందము లాడును॥ వి ॥
అది ఎంత నిరుపమము
ఆమె లావణ్యము
ఆమె కనుపడినపుడు॥ వి ॥
హృదయంబు నందున
ఎట్టి విస్తారత
వ్యాప్తి చెందుచునుండును॥ వి ॥
నేను మీ అందరను
నమ్ర భావంబున
ప్రాధేయపడుచుంటిని॥ వి ॥
అన్నదమ్ములార
ఆమె ఘనతను పాడ
ప్రేమదాసుడు కోరును॥ వి ॥
ఈ కీర్తన గానం చేస్తూ శ్రీరామకృష్ణులు నృత్యం చెయ్యనారంభించారు. భక్తులుకూడా చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. సంకీర్తన పూర్తికాగానే శ్రీరామకృష్ణులు ఈశాన్యం వైపు వసారాలో పచార్లు చెయ్యసాగారు. హాజ్రా ఆ వసారాలోనే కూర్చునివున్నాడు. శ్రీరామకృష్ణులు అతడి వద్దకెళ్లి కూర్చున్నారు. ‘మ’ కూడా అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుణ్ణి చూసి “నువ్వు కలలు కంటూ ఉంటావా?” అని అడిగారు.
భక్తుడు: అవునండీ. మొన్నీమధ్య ఒక వింతైన కల వచ్చింది. ఈ ప్రపంచమంతా జలావృతమైవుంది. కనుచూపుమేరా నీరే. అందులో కొన్ని పడవలు తేలుతున్నాయి. హఠాత్తుగా అతిపెద్ద అలలు చెలరేగి వాటిని ముంచివేశాయి. కొందరు వ్యక్తులతో కూడా నేనొక నౌకలోకి ఎక్కబోతున్నాను. అప్పుడు ఒక బ్రాహ్మణుడు జలరాశి మీదుగా నడిచిపోతూ మాకు కనబడ్డాడు. “ఈ విధంగా మీరెలా నడవగలుగుతున్నారు?” అని నేనడిగాను. ఆ బ్రాహ్మణుడు మందహాసంతో “ఇక్కడేమీ కష్టంలేదు. నీళ్ళ అడుగున ఒక వంతెన ఉంది” అన్నాడు. “మీ రెక్కడకు వెళుతున్నారు?” అని నేను అడగ్గా, “భవానీపూర్” అని బదులిచ్చాడు. “కాస్త ఆగండి, నేనూ మీతో వస్తాను” అన్నాన్నేను.
శ్రీరామకృష్ణులు: ఈ మాటలు వింటూంటే నాకు రోమాంచితమౌతోంది.
భక్తుడు: కాని ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: “నేను తొందర్లో ఉన్నాను. పడవలోనుంచి దిగటానికి నీకు ఇంకా సమయం ఉంది. నేను వెళుతున్నాను. ఈ దారి గుర్తుంచుకొని నా వెనుకే రా.”
శ్రీరామకృష్ణులు: నా ఒళ్లు పులకరిస్తోంది. నువ్వు వీలైనంత తొందర్లో మంత్రోపదేశం స్వీకరించు.
రాత్రి పదకొండు గంటలయ్యాక నరేంద్రాది భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోనే నేల మీద పడకలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు.
మంగళవారం, అక్టోబర్ 17, 1882
తెల్లవారింది. ఒకరిద్దరు భక్తులు నిద్రలేచి చూసేసరికి పరమహంస దేవులు పసిబాలుడి మాదిరి దిగంబరులై, దైవీ నామస్మరణ చేస్తూ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఆయన కంఠస్వరం మధురాతిమధురంగా ఉంది. ఒకసారి గంగానది వైపు చూస్తూ, మరొకసారి గదిలోని దేవుళ్ళ చిత్రపటాల వద్ద మోకరిల్లుతూ, వేరొకసారి మధురస్వరంతో పవిత్రనామ కీర్తన చేస్తూన్నారు. ఇలా పలుకుతున్నారు: “వేదాలు, పురాణాలు, తంత్రశాస్త్రాలు, గీత, గాయత్రి, భాగవతం, భక్తులు, భగవానుడు.” గీతను ఉద్దేశిస్తూ అనేకసార్లు “త్యాగీ త్యాగీ త్యాగీ” అని అంటున్నారు. తదుపరి “బ్రహ్మం నువ్వే, శక్తివి నువ్వే, స్త్రీవి నువ్వే, పురుషుడవు నువ్వే, విరాట్ నువ్వే, స్వరాట్ నువ్వే. నిత్యం నువ్వే, లీలామయుడవు నువ్వే. చతుర్వింశతి తత్త్వాలూ నువ్వే” అని మాటిమాటికీ అంటున్నారు.
ఇంతలో కాళికాలయంలోను, విష్ణ్వాలయంలోను మంగళహారతులు మొదలయ్యాయి. కంచుగంటలు మోగుతున్నాయి, శంఖనాదాలు వినవస్తున్నాయి. భక్తులు లేచి బైటికివచ్చి చూసేసరికి ఆలయ ఉద్యానవనంలో పూజారులు, నౌకర్లు పూజలకు పువ్వులు సేకరించటం కనబడింది. నహబత్తులో మేళగాళ్లు మేలుకొలుపు గీతాలు ఆలాపిస్తున్నారు.
నరేంద్రాది భక్తులు కాలకృత్యాలు ముగించుకొని శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. శ్రీరామకృష్ణులు ఈశాన్య వసారాలో పశ్చిమంగా నిలబడి ఉన్నారు.
నరేంద్రుడు: పంచవటి వద్ద నానక్ సంప్రదాయపు సాధువులు కొందరు కూర్చుని ఉండటం చూశాను.
శ్రీరామకృష్ణులు: అవును, వారు నిన్ననే వచ్చారు. (నరేంద్రుడితో) మీరంతా చాప మీద ఒకటిగా కూర్చోండి. చూడాలని కుతూహలపడుతున్నాను.
భక్తులంతా చాప మీద ఆసీనులయ్యాక శ్రీరామకృష్ణులు ఆనందంతో వారిని పరికిస్తూ సంభాషణ మొదలుపెట్టారు. నరేంద్రుడు సాధనానుష్ఠానాల గురించిన ప్రస్తావన తెచ్చాడు.
4.4.2 స్త్రీలతో సాధన నిషేధం – సంతానభావం అతిపవిత్రం
శ్రీరామకృష్ణులు (నరేంద్రాదులతో): అన్ని ఆధ్యాత్మిక సాధనల సారం భక్తే. భగవంతుణ్ణి ప్రేమిస్తే వివేక వైరాగ్యాలు సహజంగానే లభిస్తాయి.
నరేంద్రుడు: స్త్రీలతో కలసి సాధనలు చెయ్యటం తంత్రశాస్త్రాల్లో పేర్కోబడిందా?
శ్రీరామకృష్ణులు: అవన్నీ మంచిదారులు కావు సుమా! చాలా కఠినమైనవి. ఈ సాధనల ద్వారా అధఃపతనమయ్యే అవకాశాలు ఎక్కువ. స్త్రీతో కలసి వీర భావంతోనూ, దాసీభావంతోనూ, మాతృభావంతోనూ – మూడు రీతులుగా సాధన చెయ్యవచ్చు. వీరభావ సాధన అమిత కష్టం. నాది మాతృభావం. దాసీభావం కూడా మంచిదే. కాని సంతానభావం అతి పవిత్రభావం.
అప్పుడు నానక్ పంథీ సాధువులు గదిలోకి వస్తూ శ్రీరామకృష్ణులకు అభివాదం చేస్తూ “నమో నారాయణాయ” అని అన్నారు. శ్రీరామకృష్ణులు వారిని ఆసీనులవమన్నారు.
4.4.3 భగవంతునికి సమస్తమూ సాధ్యమే
శ్రీరామకృష్ణులు: భగవంతుడికి సాధ్యం కానిదేదీ లేదు సుమా! ఆయన యథార్థ స్వరూపాన్ని ఎవరూ వర్ణించలేరు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఫలానా తోటలో ఇద్దరు యోగులుండేవారు. ఆధ్యాత్మిక సాధనల్లో వారు రోజులు గడుపుతున్నారు. ఒక రోజు నారద మహర్షి ఆ దారిన పోవటం జరిగింది. ఆయన ఎవరో తెలిసి ఒక యోగి నారదుణ్ణి ఇలా అడిగాడు: “మీరు శ్రీమన్నారాయణుడి వద్దనుంచి వస్తున్నారా? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు?” అందుకు నారదుడు ఇలా అన్నాడు: ‘ఆయన ఒక సూది బెజ్జం గుండా ఏనుగులను, ఒంటెలను పంపించటం, రప్పించటం చూశాను.’ ఆ మాటలు విని ఆ యోగి ‘భగవంతుడికి అంతా సుసాధ్యమే. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు సుమా!’ అని అన్నాడు. కాని రెండవ యోగి, ‘ఏమిటీ? సూదిబెజ్జం గుండా ఏనుగులను పంపిస్తున్నాడా? అది ఎప్పటికన్నా వీలవుతుందా? మీరు నారాయణుడి వద్దకు పోనేలేదు’ అని అన్నాడు.
ఉదయం సుమారు తొమ్మిది గంటలైంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. కొన్నగర్ నుంచి మనోమోహన్ కుటుంబ సమేతంగా వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, “నేను వీరిని కలకత్తాకు తీసుకొనిపోతున్నాను” అన్నాడు. శ్రీరామకృష్ణులు వారి యోగక్షేమాలడిగి “వీరిని కలకత్తాకు తీసుకుపోతున్నావా? నేడు కార్తీకమాసం ఆరంభం, అగస్త్యమాత్రాదినం. నీకు బాగానే జరుగుతుందని ఆశిస్తాను” అన్నారు. ఆ తర్వాత నవ్వుతూ వేరే విషయాలు మాట్లాడసాగారు.
4.4.4 నరేంద్రాదులకు ధ్యాననిమగ్నులవమని ఉపదేశం
నరేంద్రుడు, అతడి మిత్రులు గంగలో స్నానాలు చేసివచ్చారు. శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా నరేంద్రుడితో “త్వరగా వెళ్లి పంచవటిలోని వటవృక్షం కింద కూర్చుని ధ్యానం చెయ్యి, ఆసనం ఇవ్వనా?” అన్నారు.
ఉదయం సుమారు పదిన్నరకు నరేంద్రుడు, అతడి బ్రహ్మసమాజ మిత్రులు పంచవటి పాదమూలం వద్ద ధ్యానం చేస్తున్నారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చారు. ‘మ’ కూడా వచ్చాడు.
శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ భక్తులతో “ధ్యానం చేసే సమయంలో భగవంతునిలో లీనమైపోవాలి. పైపైనే తేలుతూంటే సముద్రం లోపలున్న రత్నాలు అందుతాయా?” అంటూ ఇలా పాడసాగారు:
శ్రీ కాళి నామము చేకొని లోతుకు
దిగిపొమ్ము, దిగిపొమ్ము హృదయాబ్ధిలోనికి
హృదయాబ్ధి లోపల వెలలేని రత్నాలు
కోకొల్లలుగ దాగె కుప్పకుప్పలు మనసా॥ శ్రీ ॥
ఏ కొద్ది గ్రుంకులలో ఏమి చిక్కకున్న
మణు లందులేవని మదినెంచకెప్పుడు
గాఢదీక్షను బూని మనసు గట్టిగపట్టి
కాళి చేరెడి దారి గనుగొని దిగిపొమ్ము॥ శ్రీ ॥
సంద్ర గర్భంబున విజ్ఞానగని గలదు
శాంతిముత్యము లందు విభ్రాంతి గొల్పును
శ్రద్ధాభక్తులతోడ శాస్త్రానుసరణచే
చేయగలవు పొలుపుగ వానిని॥ శ్రీ ॥
అబ్ధి లోపల తిరుగు ఆరు తిమింగ్లాలు
కామక్రోధాదులు కబళింప జూచుచు
వివేకమను పసుపు పూసుకుంటివేని
వాని కోరలనుండి కాచు ఆ వాసన॥ శ్రీ ॥
కడలి గర్భమున పరచియున్నవి చాల
వెలలేని రత్నాలు ఎనలేని ముత్యాలు
రామప్రసాదుని పలుకు నీవాలకించి
పిడికెళ్ల గొనిరమ్ము వడి దానిలో దుమికి॥ శ్రీ ॥
4.4.5 బ్రహ్మసమాజం – సమాజ సంస్కరణ – మొదట భగవద్దర్శనం, తదుపరి లోకశిక్షణ
నరేంద్రుడు, అతడి మిత్రులు పంచవటి అరుగునుంచి దిగి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడుతూ తమ గదికేసి నడిచి వస్తున్నారు. ఆయన మాటలు కొనసాగించారు: “నువ్వు సముద్రపు నీళ్లలో మునిగితే తిమింగలం పట్టుకుంటుంది. హృదయరత్నాకర అగాధ జలంలో కామక్రోధాలనే ఆరు తిమింగలాలున్నాయి. కాని వివేక వైరాగ్యాలనే పసుపు రాసుకుంటే అవి నిన్ను తాకలేవు. వివేక వైరాగ్యాలు ఉదయించకుండా కేవలం పాండిత్యం, లెక్చర్ల వల్ల నువ్వు ఏం సాధించగలవు? భగవంతు డొక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం. అతడే యథార్థ వస్తువు, తక్కినదంతా అస్తిత్వం లేనిది. అదే వివేచన.
“మొదట భగవంతుణ్ణి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకో. కావాలంటే ఆ తరువాత లెక్చర్లు ఇచ్చుకో. వివేక వైరాగ్యాలు లేకుండా కేవలం ‘బ్రహ్మం’ అనగానే సరిపోతుందా? అదెలాగంటే వట్టి శంఖం ఊదినట్లవుతుంది. ఒక కథ వినండి:
“ఒక గ్రామంలో పద్మలోచనుడనే యువకుడుండేవాడు. ఆ గ్రామంలో అందరూ అతణ్ణి ‘పోడో’ అని పిలిచేవారు. ఆ గ్రామంలో పాడుబడ్డ దేవాలయం ఒకటి ఉంది. ఆలయ ప్రాంగణమంతా రావి, మర్రి మొదలైన వృక్షాలతో నిండి ఉంది. గర్భగుళ్లో గబ్బిలాలు గూళ్లుకట్టుకొని నివాసం చేస్తున్నాయి. నేలంతా ధూళి, గబ్బిలాల రెట్టలతో నిండిపోయివుంది. ఈ కారణంగా ఆ ఆలయంలోకి ఎవరూ వెళ్లేవారు కాదు.
“ఒక రోజు సాయంత్రం గ్రామస్థ్ధులకు శంఖారావం వినిపించింది. చెవులు రిక్కించి వినేసరికి ఆ శబ్దం పాడుబడ్డ దేవాలయం వైపునుంచి వస్తోందని గ్రహించారు. ఎవరో ఆ దేవాలయాన్ని బాగుచేయించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కాబోలు – అందుచేత సాయంకాలం హారతి జరుగుతోందని భావించి గ్రామంలోని ఆబాలగోపాలం భగవద్దర్శనార్థం ఆలయం వద్దకు పరుగుపరుగున వచ్చారు. కాని అక్కడకు వచ్చి చూస్తే ఆలయం యథాప్రకారం పాడుబడ్డ అవతారంతోనే కనబడింది. ఒక గ్రామస్థుడు తలుపు తెరిచి చూడగా పోడో ఒక మూల నిలబడి శంఖం ఊదుతున్నాడు. విగ్రహ ప్రతిష్ఠ లేదు. ఇది వరకు మాదిరే గబ్బిలాల రెట్టలతో నిండివుంది. అప్పుడతడు పోడో నుద్దేశించి ఇలా కేకవేశాడు.
ఇదియేమిర మందమతీ
విగ్రహమా నెలకొల్పవు
(మలినమునా తొలగింపవు)
ఆలయమున శంఖూదుచు
గగ్గోలును గావింతువు॥ ఇ ॥
అహర్నిశంబాగకుండ
ఏకాదశి గబ్బిలములు
కీకర బాకర మనుచు (గందరగోళము చేయును)॥ ఇ ॥
“హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించాలనుకుంటే, ఆయన్ను పొందాలనుకుంటే; కేవలం ‘భూ, భూ’ అని శంఖం ఊదితే ఏమిటి ప్రయోజనం? కాబట్టి మొదట మనస్సును శుద్ధిచెయ్యి.
“మనస్సు పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్రమైన ఆసనంలో వచ్చికూర్చుంటాడు. గబ్బిలాల రెట్టలుంటే దేవుణ్ణి ప్రతిష్ఠించలేం. పదకొండు గబ్బిలాలంటే పదకొండు ఇంద్రియాలు. ముందు మాధవుణ్ణి ప్రతిష్ఠ చెయ్యి. ఆ మీదట ఇష్టముంటే ఉపన్యాసాలు ఇవ్వు.
“ముందు మునకవేసి రత్నాలను వెలికి తీసుకురా. ఆ తరువాతనే ఇతర పనులు సుమా! మునక వెయ్యటానికి సిద్ధపడరు! సాధన లేదు, భజన లేదు, వివేక వైరాగ్యాలు లేవు. చిలుక పలుకుల మాదిరి రెండు మాటలు నేర్చి వెంటనే లెక్చర్లివ్వటమే!
“ఇతరులకు ఉపదేశించటం చాలా కష్టం. భగవద్దర్శనమైనాక భగవదాదేశాన్ని పొందినప్పుడు లోకులకు బోధించవచ్చు.”
4.4.6 అవిద్యా స్త్రీ – ఆంతరంగిక భక్తితో సర్వం వశమౌతాయి
ఇలా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు ఉత్తరం వైపు వసారాలోకి వచ్చి నిలబడ్డారు. ‘మ’ పక్కనే నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాటిమాటికీ “వివేక వైరాగ్యాలు లేనిదే భగవంతుణ్ణి పొందలేరు” అంటూండటం విని ‘మ’ తనలో ఇలా అనుకోసాగాడు: ‘వివేక వైరాగ్యాలంటే కామినీ కాంచనాలను త్యజించటమా?’ ‘మ’ కు వివాహమైంది. వయస్సు 28 సం ॥ లు; కళాశాలలో చదివి ఆంగ్లవిద్యను అభ్యసించాడు.
‘మ’ (శ్రీరామకృష్ణులతో): ‘నువ్వు నిరాదరిస్తున్నావు. నేను ఆత్మహత్య చేసుకొంటాను’ అని భార్య బెదిరిస్తే ఏం చెయ్యాలి?
శ్రీరామకృష్ణులు (గంభీరంగా): అలాంటి భార్యను పరిత్యజించాలి. ఆత్మహత్య చేసుకోనివ్వు, మరేదైనా చేసుకోనివ్వు. భగవన్మార్గంలో అడ్డంకులు వేసే భార్య అవిద్యాస్త్రీ.
ఈ మాటలు విని ‘మ’ గాఢంగా యోచిస్తూ, గోడను ఆనుకొని నిలబడిపోయాడు. నరేంద్రాది భక్తులూ మౌనం పాటించారు. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ‘మ’ వద్దకు వచ్చి మెల్లగా అతడితో ఇలా అన్నారు: “భగవంతుని పట్ల యథార్థమైన ప్రేమ అంతరంగంలో ఉంటే రాజు, దుష్టప్రజలు, భార్య – అంతా అతడి వశంలోకి వస్తారు. భర్తకు యథార్థమైన భక్తివుంటే భార్య కూడా క్రమేణా భగవన్మార్గం అనుసరిస్తుంది. భర్త తాను మంచివాడయితే ఈశ్వరేచ్ఛ వల్ల భార్య కూడా సరైన మార్గానికి వస్తుంది.”
‘మ’ చింతాగ్నిలో దగ్ధుడౌతున్నాడు. లోలోపల ఇలా అనుకుంటున్నాడు: ‘ఆత్మహత్య చేసుకొంటే చేసుకోనీ, నేనేం చేస్తాను?’
‘మ’ (శ్రీరామకృష్ణులతో): సంసారంలో చాలా భయం వేస్తుంది.
శ్రీరామకృష్ణులు (‘మ’, నరేంద్రాదులతో): నిజమే. అందుకే చైతన్యులు నిత్యానందుడితో ఇలా అన్నాడు: ‘చూడు తమ్ముడూ! సంసారంలో జీవులకు గతి లేనే లేదు.’
‘మ’ తో ఏకాంతంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “చూడు, భగవంతుడి పట్ల శుద్ధభక్తి కలుగకపోతే మరోగతి లేనే లేదు సుమా! భగవల్లాభం పొందాక సంసారం చేసినా భయం లేదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్లి సాధనల ద్వారా శుద్ధభక్తిని సముపార్జిస్తే – సంసారంలో ఉన్నప్పటికీ భయం లేదు. చైతన్యులకు గృహస్థ భక్తులూ ఉండేవారు. వారు నామమాత్రం గృహస్థులు. అనాసక్తులై ఉండేవారు.”
మధ్యాహ్నమైంది. ఆలయంలో పూజలు ముగిశాయి. నైవేద్యం సమర్పించారు. ఆలయం తలుపులు మూసేశారు.
శ్రీరామకృష్ణులు భోజనానికి కూర్చున్నారు. నరేంద్రాది భక్తులూ నాడు శ్రీరామకృష్ణులతో కలిసి ప్రసాదం స్వీకరించారు.
4.5 షష్ఠ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో ‘మ’ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
ఆదివారం, అక్టోబర్ 22, 1882
అప్పుడు సమయర్ ఉదయం 9 గంటలు. నేడు విజయదశమి.
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరాలయంలో తమ గదిలో చిన్నమంచం మీద విశ్రమించి ఉన్నారు. ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు. కొద్దిరోజులుగా రాఖాల్ శ్రీరామకృష్ణుల వద్దనే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల అన్న కుమారుడు రాంలాల్, హాజ్రా అక్కడే ఉంటున్నారు. నరేంద్రుడు, భవనాథ్ అప్పుడప్పుడు వచ్చిపోయేవారు. బాబూరాం ఆయన్ను ఒకటో రెండోసార్లు దర్శించాడు.
శ్రీరామకృష్ణులు: దుర్గాపూజకు మీకు సెలవు లిచ్చారా?
‘మ’ : ఇచ్చారు. సప్తమి, అష్టమి, నవమి – ఈ మూడు రోజులూ నేను కేశవసేన్ ఇంటికి వెళ్ళాను.
శ్రీరామకృష్ణులు: అలాగా?
‘మ’ : దుర్గాపూజ మీద చక్కని వ్యాఖ్యానం విన్నాను.
శ్రీరామకృష్ణులు: దానిని గురించి చెప్పు.
‘మ’ : కేశవసేన్ ఇంట్లో ప్రతిరోజూ ఉదయం పది లేక పదకొండు గంటల వరకు ఉపాసన జరిగేది. ఉపాసనా సమయంలో కేశవసేన్ దుర్గాపూజను గురించి వ్యాఖ్యానం చేశాడు. అతడిలా అన్నాడు: ఎవరైనా దుర్గామాతను హృదయ మందిరంలోకి తీసుకు రాగలిగితే, లక్ష్మీ, సరస్వతీ, కార్తికేయుడు (కుమారస్వామి), వినాయకుడు – వీరందరూ తమంత తామే అరుదెంచుతారు. లక్ష్మీ అంటే సంపద, సరస్వతీ అంటే జ్ఞానం, కార్తికేయుడంటే విక్రమం, గణపతి అంటే సిద్ధి – దుర్గాదేవి హృదయ మందిరంలోకి అరుదెంచితే ఇవన్నీ తమంత తామే వస్తాయి.
4.5.1 శ్రీరామకృష్ణులు – నరేంద్రాది ఆంతరంగీకులతో
శ్రీరామకృష్ణులు కేశవ్ వ్యాఖ్యానాన్ని విన్నారు. మధ్యమధ్యలో ప్రశ్నలు వేశారు. అంతా విన్నాక ‘మ’ తో ఇలా అన్నారు: “నువ్వు ఇక్కడకూ అక్కడకూ పోకుండా తిన్నగా ఇక్కడికే రా. ఆంతరంగిక భక్తులు ఇక్కడకు మాత్రమే వస్తారు. నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్ – వీరు నా ఆంతరంగికులు. వీరు సామాన్యులు కారు సుమా! నువ్వు ఒక రోజు వీరికి ఆతిధ్యం ఇవ్వు. నరేంద్రుడి గురించి నీ అభిప్రాయం ఏమిటి?”
‘మ’ : అతణ్ణి ఎంతో ఉన్నతుడిగా భావిస్తాను.
శ్రీరామకృష్ణులు: నరేంద్రుడిలో ఎన్ని ప్రతిభలో పరికించు. సంగీతంలోను, చదువులోను గొప్పప్రతిభ ఉంది. పైగా జితేంద్రియుడు. వివాహం చేసుకోడట. చిన్ననాటినుంచి భగవంతుడిపైనే మనస్సు కలవాడు.
4.5.2 సాకారమా? నిరాకారమా? – చిన్మయమూర్తి ధ్యానం – మాతృ ధ్యానం
శ్రీరామకృష్ణులు మళ్ళీ ‘మ’ తో సంభాషించసాగారు: “ప్రస్తుతం నీ భగవత్ చింతన ఎలా సాగుతోంది? నీకు సాకారం నచ్చుతుందా? లేక నిరాకారమా?”
‘మ’ : ఇప్పుడు సాకారం వైపు మనస్సు పోవటం లేదు. కానీ నిరాకారంలోను మనస్సు స్థ్ధిరంగా లగ్నం చేయలేకపోతున్నాను.
శ్రీరామకృష్ణులు: చూశావా? నిరాకారంలో ఒక్కసారిగా మనస్సు స్థ్ధిరం కాలేదు. ప్రాథమిక దశలో సాకారమే మంచిది.
‘మ’ : అలా అయితే మృణ్మయ విగ్రహాలను ధ్యానించటమా?
శ్రీరామకృష్ణులు: మృణ్మయ విగ్రహాలని పలుకుతున్నా వెందుకు? అవి చిన్మయ విగ్రహాలు సుమా!
‘మ’ : అలాగే కానివ్వండి. కాని కాళ్లు చేతులు మొదలైన అంగాలనన్నీ ధ్యానించాలి కదా! ప్రాథమిక దశలో రూపధ్యానం చేయకుంటే మనస్సు స్థిరం కాదని మీరు చెప్పారు కదా! దీన్నే ఆలోచిస్తున్నాను. భగవంతుడు నానారూపాలను ధరిస్తాడు కదా! అలా అయితే కన్నతల్లి రూపాన్ని ధ్యానం చేయవచ్చా?
శ్రీరామకృష్ణులు: చేయవచ్చు. తల్లి గురువు; తల్లి బ్రహ్మస్వరూపిణి.
‘మ’ మౌనం వహించాడు. కొంతసేపయ్యాక మళ్ళీ ‘మ’ ఇలా అడిగాడు: “నిరాకార ధ్యానంలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? దాన్ని వర్ణించ వీలవుతుందా?”
శ్రీరామకృష్ణులు కాసేపు యోచించి, “అదెలాగో తెలుసా?” అంటూ కాస్సేపు మౌనంగా ఉన్నారు. తరువాత సాకార నిరాకార దర్శనానుభూతులను గురించి ‘మ’ కి కొన్ని మాటల్లో తెలిపారు.
శ్రీరామకృష్ణులు: చూడు. దీనిని విశేషంగా అర్థం చేసుకోవాలంటే సాధనలు ఆవశ్యకం. అదెలాగంటే తాళం వేసివున్న ఇంట్లో నుంచి నిధులను తీసుకోగోరితే తాళం చెవిని వెదకి తీసుకురావాలి. తాళం తీసి లోపలకు వెళ్లాలి. ఆ పైన నిధులను కళ్లారా చూడగలవు. మనస్సులో ‘ఇదుగో తాళం చెవిని తెచ్చాను, ఇదుగో తలుపు తెరిచాను, పెట్టె తాళం పగులగొట్టి నిధులను గైకొన్నాను’ అని ఊహిస్తూ నిలబడితే ప్రయోజనం ఏమీ లేదు. కావలసింది సాధన సుమా!
4.6 సప్తమ పరిచ్ఛేదం భగవంతుడు అనంతుడు, శ్రీరామకృష్ణులూ అనంతులు – అన్నీ మార్గాలే – బృందావన దర్శనం
(జ్ఞానుల దృష్ట్యా అవతారాలు అసంఖ్యాకం – కుటీచకుడు – తీర్థయాత్రలు ఎందుకు?)
“జ్ఞానులు నిరాకారాన్ని ధ్యానిస్తారు. వారు అవతారతత్త్వాన్ని అంగీకరించరు. అర్జునుడు, శ్రీకృష్ణుణ్ణి “నువ్వు పూర్ణబ్రహ్మానివి” అని స్తుతించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడితో ఇలా అన్నాడు: “నేను పూర్ణబ్రహ్మాన్ని అవునో కాదో తెలసుకొంటావు గాక. నువ్వు నాతో రా.” ఇలా అంటూ ఒక చోటుకు తోడ్కొని వెళ్ళి “నువ్వు ఏం చూస్తున్నావు?” అని అడిగాడు. అందుకు అర్జునుడు ఇలా అన్నాడు: “నే నొక మహావృక్షాన్ని చూస్తున్నాను. ఆ వృక్షం మీద నల్ల నేరేడు పండ్ల మాదిరి గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్న లెక్కలేనన్ని పళ్ళను చూస్తున్నాను.” అప్పుడు కృష్ణుడు అతడితో ఇలా అన్నాడు: “అర్జునా! ఇంకా కాస్త దగ్గరకు వచ్చి చూడు. అవి అసంఖ్యాకాలైన నేరేడుపళ్ళ గుత్తులు కావు సుమా! లెక్కలేనన్ని నా వంటి కృష్ణులు చెట్టునిండా వేలాడుతున్నారు.” అంటే ఆ పూర్ణబ్రహ్మసదృశమైన వృక్షంలో అసంఖ్యాకాలైన అవతారాలు వస్తున్నాయి పోతున్నాయి.
“కబీరుదాసుకు నిరాకారం మీద ఎంతో నిష్ఠ ఉండేది. అతడు శ్రీకృష్ణుణ్ణి గురించి ఇలా పలికాడు: “నేను అతణ్ణి ఎందుకు అర్చించాలి? గోపికలు చప్పట్లు కొడతారు. అతడు కోతి మాదిరి గెంతులువేస్తూ నృత్యం చేస్తాడు. (నవ్వుతూ) నేను సాకారవాదుల వద్ద సాకారవాదిని, నిరాకారవాదుల వద్ద నిరాకారవాదిని.”
‘మ’ (నవ్వుతూ): ఎవరిని గురించి మాట్లాడుతున్నామో, అతడు (భగవంతుడు) అనంతుడు. అలాగే మీరూ అనంతులు. మీ అంతు తెలుసుకోలేము.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నువ్వు తెలుసుకొన్నావు. నీకు మరో విషయం చెబుతాను. చూడు, అన్ని మతాలను స్వీకరించాలి. అన్ని మతాలను కొంత సాధించి తెలుసుకోవాలి. పావులాటలో ఒక పావు ఒక పూర్తి పరిభ్రమణం చేస్తేగాని మధ్యగడిని చేరుకోలేదు; కాని మధ్యగడిలో ప్రవేశించాక ఆ పావును మరే పామా నెగ్గలేదు.
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: యోగుల్లో రెండు రకాలవారు ఉన్నారు – బహూదక, కుటీచక అని. బహూదకుడు అనేక తీర్థ్ధాలను దర్శిస్తూంటాడుగాని అతడికి మనశ్శాంతి ఇంకా దక్కివుండదు. కుటీచకుడు కుటీరంలో స్థ్ధిరంగా కూర్చుని ఉండే యోగి. కుటీచకుడు ప్రథమంలో అన్ని తీర్థాలను దర్శించుకొని మనస్సును స్థిరం చేసుకొన్నవాడు. మనశ్శాంతితో అతడు స్థిరంగా ఒకచోట ఆసనం మీద కూర్చుని భగవంతుణ్ణి ధ్యానిస్తాడు. అతడు తీర్థస్థలాలకు పోవాలనే అవసరం లేనివాడు. ఒక్కచోట కూర్చునే ఆనందించగలడు. వారిలో ఎవరైనా ఒకరు ఒక తీర్థస్థలాన్ని దర్శిస్తే, అది కేవలం కొత్త స్ఫూర్తి నిమిత్తమే.
“నాకు సర్వధర్మాలను ఒకసారి ఆచరించాల్సి వచ్చింది. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ మతాలను స్వీకరించి పాటించాను. ఆపైన శాక్త, వైష్ణవ, వేదాంత సంప్రదాయాలను గైకొని పాటించాను. నేను కనుగొన్న సత్యం ఏమంటే భగవంతుడు ఒక్కడే – అందరూ అతణ్ణి చేరటానికే ప్రయత్నిస్తూన్నారు. కాని వేర్వేరు మార్గాలను అనుసరిస్తున్నారు.
“తీర్థయాత్రలలో ఒక్కోసారి నాకు ఎంతో కష్టం కలిగేది. మథుర్బాబుతో కాశీలో రాజాబాబుగారి ఇంట్లో కూర్చుని కేవలం డబ్బు, జమీందారీ సంగతులను విని ఏడ్వసాగాను. నన్ను ఎక్కడకు తీసుకొచ్చావు తల్లీ? దక్షిణేశ్వరంలోనే హాయిగా కాలం గడుపుతూండేవాడినే అని విలపించాను. ప్రయాగకు వెళ్ళాను. ఇతర ప్రదేశాల్లో చూసిన రీతిలోనే చెట్టు చేమలూ, బావులు గుంటలూ చూశాను.
“కాని తీర్థ్ధస్థలాలలో భగవదుద్దీపన తప్పక కలుగుతుంది. మథుర్బాబుతో బృందావనానికి వెళ్లాను. మథుర్బాబు కుటుంబంవారు కూడా ఉన్నారు. హృదయ్ కూడా ఉన్నాడు. కాళీయ దమన ఘట్టాన్ని చూడగానే నాలో ఉద్దీపన జనించింది. నేను పారవశ్యంలో మునిగిపోయాను. చిన్నబిడ్డకు స్నానం చేయించేట్లు హృదయ్ నాకు అక్కడ స్నానం చేయించేవాడు.
“సాయంత్రం వేళలలో యమునానదీ తీరానికి షికారుకు వెళ్ళేవాడను. మేతకు వనానికి పోయి తిరిగివస్తూన్న గోవులను చూడటంతోనే నాకు ఆ కృష్ణుడి భావోద్దీపన కలిగి పిచ్చివాడి మాదిరి ‘కృష్ణుడెక్కడ? కృష్ణుడెక్కడ?’ అంటూ కేకలు పెడుతూ పరుగులు పెట్టేవాణ్ణి.
పల్లకీలో ఎక్కి శ్యామకుండం, రాధాకుండం* దారిన పోయాను. గోవర్థన గిరి కళ్ళపడగానే పల్లకీ దిగి వెంటనే ఒక్క పరుగునపోయి కొండ మీద నిలబడ్డాను. పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాను. అప్పుడు ఆ కొండ ప్రాంతవాసులు నన్ను కొండమీదినుంచి దింపారు. ఆ దారి పొడవునా పచ్చిక బయళ్లు, చెట్టు చేమలు, లేళ్ళు అన్నింటిని చూస్తూ బాహ్యచైతన్యం కోల్పోయాను. కన్నీళ్ళతో వస్త్రాలు తడిసిపోయాయి. పల్లకీలో కూర్చుని ‘ఓ కృష్ణా! అన్నీ ఉన్నాయి కాని నువ్వు మాత్రం కనబడటం లేదే!’ అని మనస్సులో అమిత వేదనతో నోట మాట పెగలేది కాదు. హృదయ్ పల్లకీ వెంటే నడిచేవాడు. పల్లకీ బోయీలను జాగ్రత్తగా తీసుకెళ్ళమని హెచ్చరించేవాడు.
“గంగామాయి (ఒక భక్తురాలు) నన్ను అమితంగా అభిమానించేది. ఆమె కడు వృద్ధురాలు. నిధువనం వద్ద ఒక కుటీరంలో ఒంటరిగా నివసిస్తూండేది. నా భావాన్ని, నా స్థితిని పరికించి, ‘సాక్షాత్తూ రాధాదేవి మానవదేహం దాల్చి వచ్చింది’ అని పలికేది. నన్ను ఆమె ‘దులాలీ’ అని సంబోధించేది. ఆమె వద్ద ఉన్నప్పుడు నేను ఇంటికి పోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం అన్నీ మరచిపోయేవాణ్ణి. ఒక్కోరోజు హృదయ్ మేం బసచేసిన ఇంటినుంచి భోజనం తెచ్చి నాకు పెట్టేవాడు. ఒక్కోసారి గంగామాయి స్వయంగా వంటచేసి నాకు భోజనం పెట్టేది.”
“గంగామాయి భగవదావేశానికి లోనయ్యేది. అలాంటి సమయాల్లో జనం పెద్దగుంపుగా వచ్చి ఆమెను చూసేవారు. ఒక రోజు అలాంటి భగవదావేశంలో ఆమె హృదయ్ భుజాల మీద ఎక్కి కూర్చుంది.”
“గంగామాయి వద్ద నుంచి కలకత్తాకు తిరిగి రావటానికి నాకు మనస్కరించలేదు. గంగామాయి వద్ద నేను నివసించటానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి. నా కోసం ఉప్పుడుబియ్యపు అన్నం వండేటట్లుగానూ, కుటీరంలో ఒక వైపు గంగామాయి పడక, మరొకవైపు నా పడకా ఏర్పాటయినాయి.”
“అన్ని ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు హృదయుడు నాతో ‘నీ కెప్పుడూ అజీర్ణ రోగం. నిన్నెవరు చూసుకుంటారు?’ అని పలుకగా గంగామాయి వెంటనే ‘ఆ చింత నీ కెందుకు? నేను ఉన్నాను. నేను చూసుకుంటాను. నేను సేవ చేస్తాను’ అని పలికింది. ఒక వైపు హృదయ్ నన్ను చేయిపట్టుకొని లాగుతున్నాడు. మరో వైపు గంగామాయి. ఇలా వారిద్దరూ లాగుతూంటే నా తల్లి (చంద్రమణీ దేవి) జ్ఞాపకం వచ్చింది. అమ్మ దక్షిణేశ్వర కాళికాలయంలోని నహబత్తులో ఒంటరిగా నివసిస్తోంది కదా! అని తలపుకు వచ్చింది. ఇక అక్కడ ఉండటానికి మనసొప్పలేదు. ‘నేను పోవలసిందే’ అని వెంటనే గంగామాయికి చెప్పేశాను. బృందావనపు వాతావరణం నాకు ఎంతో నచ్చింది. కొత్త యాత్రికులు వెళితే వ్రజ బాలురు ‘హరి బోలో – గఠరీ ఖోలో (హరి అని చెప్పు, మూట విప్పు)’ అని చెప్పేవారు.”
మధ్యాహ్నం 11 గంటలు అయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయ ప్రసాదం స్వీకరించారు. మధ్యాహ్నం కాసేపు విశ్రమించి లేచి మళ్ళీ భక్తులతో సంభాషిస్తూ సాయంకాలం వరకు గడిపారు. మధ్యమధ్యలో ప్రణవనాదాన్నో లేక ‘హా! చైతన్య మహాప్రభూ!’ అనో ఉచ్చరిస్తూన్నారు.
ఆలయాలలో సంధ్యాకాల హారతులు మొదలైనాయి. నేడు విజయ దశమి. శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వచ్చి దేవికి ప్రణమిల్లారు. ఆ తరువాత భక్తులు ఆయనకు పాదాభివందనాలు చేసి పాదధూళి స్వీకరించారు. రాంలాల్ కాళీమాతకు హారతి ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు రామ్‌లాల్‌ను సంబోధించి “ఓ రామ్‌లాల్! నువ్వు ఎక్కడ” అని అడిగారు. దేవికి ‘సిద్ధి’* నైవేద్యం అర్పించారు. శ్రీరామకృష్ణులు దాన్ని స్పృశిస్తారు. అందుకోసమే రామ్‌లాల్‌ను పిలిచారు. భక్తులందరికీ దాన్లో కాస్త ఇవ్వమని చెప్పారు.
4.7 అష్టమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో బలరామ్ ప్రభృతులతో – బలరామ్కి ఉపదేశం
(లక్షణాలు – సత్య సంధత – సర్వధర్మ సమన్వయం – కామినీ కాంచనాలే మాయ)
మంగళవారం, అక్టోబర్ 24, 1882
అప్పుడు సాయంత్రం సుమారు నాలుగు గంటల వేళ. శ్రీరామకృష్ణులు తినుబండారాలు ఉంచిన అలమారు వద్ద నిలబడి ఉన్నారు. బలరాంబాబు, ‘మ’ కలకత్తా నుంచి వచ్చి ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ వారితో ఇలా అన్నారు: “తినుబండారాలు తీసుకోటానికి చేయి పెట్టబోయాను – ఇంతలో ఒక బల్లి నా మీద పడింది. వెంటనే చెయ్యి వెనక్కు తీసేసుకొన్నాను.” (అందరూ నవ్వారు)
“ఇలాంటివన్నీ పాటించాలోయ్! చూడు, రాఖాల్కు జబ్బు చేసింది. నా కాళ్లు చేతులు నొప్పి పుడుతున్నాయి. అసలు జరిగింది ఏమంటే నేడు ఉదయాన్నే నిద్ర లేవగానే రాఖాల్ వస్తున్నాడని తలచి ఫలానా వ్యక్తి ముఖం చూశాను (అందరూ నవ్వారు). లక్షణాలు కూడా చూడాలి. ఆ రోజు నరేంద్రుడు ఒంటి కంటి వ్యక్తిని తీసుకువచ్చాడు. అతడి మిత్రుడట. కన్ను పూర్తిగా గుడ్డిదేమీ కాదు. ఏది ఏమైనా నరేంద్రుడికి ఇతనితో ఎలా పొత్తు కుదిరిందో అనుకున్నాను.”
“ఇక్కడకు ఒక వ్యక్తి తరచూ వస్తూండేవాడు. అతడు తీసుకువచ్చే తినుబండారాలను నేను నోట పెట్టుకోలేకపోయేవాణ్ణి. అతడు ఒక కార్యాలయంలో పని చేసేవాడు. అతడి నెల జీతం ఇరవై రూపాయలు. అబద్ధపు లెక్కలు వ్రాసి నెలకు ఇంకో ఇరవై రూపాయలు ఆర్జించేవాడు. అతడు అబద్ధాల పుట్ట. అతడి సమక్షంలో నేను పెదవి విప్పేవాడిని కాను. ఒక్కోసారి ఆఫీసుకు ఎగనామం పెట్టి ఇక్కడే మూడు నాలుగు రోజులు గడిపేవాడు. ఎందుకు తెలుసా? నేను ఎవరికైనా సిఫారసు చేసి ఏదో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తానని అతగాడి అసలు ఉద్దేశం.”
బలరామ్ ఒక పరమ వైష్ణవ భక్తుల కుటుంబానికి చెందినవాడు. అతడి తండ్రి ఎంతో దైవభక్తి గలవాడు; ఇప్పుడు వృద్ధుడయ్యాడు. తలమీద పిలక, మెడలో తులసి పూసల మాల, చేతిలో సదా జపమాల పుచ్చుకొని జపం చేస్తూండేవాడు. ఆయనకు ఒరిస్సాలో పెద్ద జమీ ఉంది. కొఠార్లోను, బృందావనంలోను, ఇంకా కొన్నిచోట్ల రాధాకృష్ణ ఆలయాలు, సత్రాలు కట్టించాడు.
బలరామ్ కొత్తగా రాసాగాడు. అందుచేత శ్రీరామకృష్ణులు మాటల మూలాన పలురకాల ఉపదేశాలు చేస్తున్నారు.
బలరామ్ బోస్
శ్రీరామకృష్ణులు (బలరామ్‌తో): కొన్ని రోజుల క్రితం ఫలానా వ్యక్తి వచ్చివున్నాడు. అతగాడు తన నల్లని భార్యకు దాసుడని నేను విని ఉన్నాను.
“జనం భగవంతుణ్ణి ఎందుకు దర్శించలేకున్నారు? కారణం – కామినీ కాంచనాలు అడ్డంకులుగా నిలిచి ఉన్నాయి. నీతో అతడు, ‘ఒక పరమహంస నా తండ్రి వద్దకు రాగా, ఆయన పరమహంస చేత కోడికూర తినిపించాడు’ అనటం ఎంత సిగ్గుచేటు వ్యవహారం. (బలరామ్నవ్వాడు).
4.7.1 బర్డ్వాన్ దారిలో జరిగిన సంఘటన
“చూడు, నా ఈ మనోస్థితిని వివరించగలరా? ఒకసారి నేను వర్ధమాన్ (బర్డ్వాన్) గుండా కామార్పుకూర్కు ఎడ్లబండిలో పోతున్నాను. మధ్యలో గాలివాన వచ్చింది. ఇంతలో కొందరు వ్యక్తులు బండివద్ద గుమిగూడారు. నా తోటి ప్రయాణీకులు వారు దోపిడీ దొంగలని చెప్పారు. వెంటనే నేను భగవన్నామం ఉచ్చరించసాగాను. ఒకసారి కాళీ కాళీ అనీ, రామా రామా అనీ, మరోసారి ఆంజనేయా, ఆంజనేయా అనీ ఉచ్చరించసాగాను. దాన్ని గురించి నువ్వు ఏమంటావు?”
ఒకే పరమేశ్వరుడు – అసంఖ్యాక నామాలు – విభిన్న ధర్మావలంబులు లేక విభిన్న సంప్రదాయస్థులు కేవలం వాదులాడుకొంటూంటారు – అని శ్రీరామకృష్ణులు తెలియపరుస్తున్నారా ఏమిటి?
శ్రీరామకృష్ణులు (బలరామ్‌తో): కామినీ కాంచనాలే మాయ. మనిషి వాటిలోనే ఎక్కువకాలం మునిగితే ఆధ్యాత్మిక జాగరణ కోల్పోతాడు. అతడు తాను చాలా బాగున్నాననుకొంటాడు. పాకీవాడు అపరిశుద్ధాన్ని తలకెత్తుకొని పోతూంటాడు, కొంతకాలానికి అతడు ఆ దుర్గంధానికి అలవడిపోతాడు. భగవన్నామ, గుణసంకీర్తనలను అభ్యసిస్తూ పోతే క్రమేణా భక్తి కలుగుతుంది. (‘మ’ తో) భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించటంలో సిగ్గుపడకూడదు. ‘లజ్జ, భయం, ద్వేషం – ఈ మూడింటిని వదలకుంటే భగవన్మార్గంలో పురోగమించలేరు.
“కామార్పుకూర్లో చాలా బాగా నామసంకీర్తన చేసేవారు, మృదంగం అవీ ఇవీ ఉంటాయి. కీర్తన ఎంతో అద్భుతంగా ఉంటుంది.”
(బలరామ్‌తో): “బృందావనంలో మీ వాళ్ళు ఏదన్నా దైవవిగ్రహాన్ని ప్రతిష్ఠించారా?”
బలరామ్: అవునండీ. బృందావనంలో ఒక వనంలో శ్యామసుందర విగ్రహ ప్రతిష్ఠ చేసి, నిత్యపూజాది సేవలు యథారీతి జరిపిస్తున్నాం.
శ్రీరామకృష్ణులు: నేను బృందావనానికి వెళ్ళివున్నాను. అక్కడి ‘నిధువనం’ ఎంతో చక్కటి ప్రదేశం.