49.1 ప్రథమ పరిచ్ఛేదం నరేంద్రుడు, నిరంజన్ ప్రభృతులతో కృపాసింధు శ్రీరామకృష్ణులు
బుధవారం, డిసెంబర్ 23, 1885
శుక్రవారం, డిసెంబర్ 11, 1885 నాడు శ్రీరామకృష్ణులను కలకత్తా శివారులోనున్న కాశీపూర్‌లోని ఒక సుందర ఉద్యాన గృహానికి తరలించారు. ఐదు ఎకరాల వైశాల్యంగల ఆ తోట రకరకాల పువ్వుల, పళ్ళ చెట్లతో కన్నుల పండువుగా ఒప్పారుతోంది. శ్రీరామకృష్ణులు మహాసమాధి పొందింది ఈ ఇంట్లోనే.
కాశీపూర్లోకి వచ్చాక శ్రీరామకృష్ణులు ద్విగుణీకృతమైన శక్త్యుత్సాహాలతో, గతంలో దక్షిణేశ్వరంలో తాము ప్రారంభించిన ఆధ్యాత్మిక తోడ్పాటును పూర్తి చేయడంలో నిమగ్నమైపోయారు. త్వరలోనే తాము దేహం చాలించనున్నందున తమ ఆధ్యాత్మిక సంపదలను భక్తులకు విరివిగా పంచిపెట్టసాగారు. సంతకు వెళ్ళిన పళ్ళ వ్యాపారస్థుడు మొదట పళ్ళ ధర విషయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు. కాని ప్రొద్దువాలే సమయంలో సంత మూయనున్నప్పుడు తన పళ్ళను ఎలాంటి బేరసారాలు లేకుండానే ఇచ్చివేస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా ప్రస్తుతం ఇలాంటి వ్యాపారస్థుడి మాదిరే ఉన్నారు. ఈయన ఆధ్యాత్మిక శక్తులు ఇక్కడ అత్యధికంగా వ్యక్తం కావడం భక్తులు గమనించారు. తమ గురించి గతంలో ఆయన చేసిన భవిష్యవాణులు ఇప్పుడు నిజమయ్యాయి. “నేను వెళ్ళిపోయే ముందు అంతా బహిరంగ పరిచి వెళ్ళిపోతాను.” “జనం పెద్ద సంఖ్యలో దీని గురించి తెలుసుకుని గుసగుసలాడు తున్నప్పుడు అమ్మ దీన్ని వెనక్కు తీసివేసుకుంటుంది.” “వడపోత పోసినట్లు భక్తులు లోపలి వారు, బయటివారు అని రెండు వర్గాలుగా విడిపోతారు” – ఇలాంటి భవిష్యవాణులు. నరేంద్రుడి నాయకత్వంలో బాలభక్తులు కొందరు సర్వసంగాలను పరిత్యజించి తమ జీవితాలను భగవత్సాక్షాత్కారానికి, మానవాళి సేవకు అంకితం చేస్తారన్న సంగతిని ఆయన ముందుగానే ఊహించారు.
కాశీపూర్‌లోని ఇంటికి రెండు అంతస్తులు ఉన్నాయి. క్రింద మూడు గదులు, పైన రెండు గదులు. పై అంతస్తు మధ్యలో ఉన్న ఒక పెద్ద గదిలో శ్రీరామకృష్ణులు విడిది చేశారు. దానికి ఎడమ ప్రక్కన ఉన్న ఒక చిన్న గదిలో ఆయనకు సేవ చేస్తున్నవారికి బస. కుడి వైపున ఉన్న వసారాలో ఆయన కూర్చునేవారు, పచార్లు చేసేవారు. కింద అంతస్తులో ఉన్న హాలును, దానికి కుడి ప్రక్కగా ఉన్న ఒక చిన్న గదిని భక్తులు ఉపయోగించేవారు. ఎడమ వైపున చివరగా ఉన్న ఒక చిన్న గదిని మాతృమూర్తి శారదాదేవి ఉపయోగించేవారు. తోటలో కొన్ని చిన్న ఇళ్ళు, రెండు కొలనులు, చక్కటి కాలిబాటలు ఉన్నాయి. ఈ క్రొత్త ప్రదేశంలో శ్రీరామకృష్ణులు ధారళంగా ఊపిరి పీల్చుకోసాగారు.
కాశీపూర్ ఉద్యానగృహం
శ్రీరామకృష్ణులు భక్తుల పాలిట కల్పతరువైన ప్రదేశం*
ఈ సమయానికి భక్తులు దాదాపు అందరూ చేరుకొన్నారు. 1881 నుండి వారు రావడం మొదలయింది. 1884 చివరలో శ్రీరామకృష్ణులతో శరత్, శశిలకు పరిచయం ఏర్పడింది. 1885 మధ్యలో కళాశాల పరీక్షలు ముగిసినప్పటి నుండి వారు దాదాపు ప్రతిరోజూ ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. గిరీశ్ఘోష్, శ్రీరామకృష్ణులను మొదటిసారిగా సెప్టెంబర్ 1884 లో స్టార్ థియేటర్లో కలుసుకున్నాడు. మూడు నెలల తరువాత, అంటే డిసెంబర్ నుండి అతడు శ్రీరామకృష్ణుల వద్దకు అనునిత్యం వస్తూనే ఉన్నాడు. శారదాప్రసన్న శ్రీరామకృష్ణులను తొలిసారిగా, డిసెంబర్ 1884 చివరలో, దక్షిణేశ్వరంలో సందర్శించాడు. సుబోధ్, క్షీరోద్లు ఆయన్ను ఆగష్టు 1885 లో ప్రథమంగా కలుసుకున్నారు.
శరత్ (స్వామి శారదానంద)
శశి (స్వామి రామకృష్ణానంద)
ఆయనకు సేవ చేసే నిమిత్తం బాలభక్తులు అక్కడే బసచేస్తూ అప్పుడప్పుడు తమ ఇళ్ళకు వెళ్ళి వస్తున్నారు. గృహస్థులు దాదాపు ప్రతిరోజూ ఆయన్ను చూడడానికి వస్తున్నారు. వారిలో కొందరు అప్పుడప్పుడు రాత్రిళ్ళు అక్కడే బసచేసేవారు కూడా.
డిసెంబరు 23 నాటి ఉదయం శ్రీరామకృష్ణులు అడ్డూ అదుపు లేకుండా తమ ప్రేమను భక్తులకు పంచిపెట్టేస్తున్నారు. నిరంజన్‌తో “నువ్వు నా తండ్రివి. నేను నీ ఒడిలో కూర్చుంటాను” అన్నారు. కాళీపదుడి వక్షాన్ని స్పృశించి “నీ చైతన్యం జాగృతం అవుగాక!” అన్నారు. అతడి చుబుకాన్ని ఆప్యాయంగా పుచ్చుకొని ఇలా అన్నారు: “భగవంతుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థించారో లేక సంధ్యాది నిత్యకర్మలను అనుష్ఠించారో వారు ఇక్కడకు వచ్చి తీరుతారు.” ఇవాళ ఉదయం ఆయన ఇద్దరు భక్తురాళ్ళపై విశేష కృపను అనుగ్రహించారు. సమాధిస్థితిలో తమ పాదాల ద్వారా వారి హృదయాలను స్పృశించేసరికి వారికి కళ్ళ వెంట అశ్రువులు స్రవించాయి. వారిలో ఒక స్త్రీ విలపిస్తూనే “మీరు ఎంతటి దయామయులు” అన్నది. నిజంగానే నేడు ఆయన ప్రేమ ఎల్లలన్నిటినీ అతిక్రమించింది. సింథీకి చెందిన గోపాల్ పట్ల ఆయన కృప చూపదలిచారు. ఒక భక్తుడితో “గోపాల్‌ను పిలుచుకురా” అన్నారు.
సాయంకాలమయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని ధ్యానంలో మునిగి పోయారు. కాసేపటి తరువాత కొందరు భక్తులతో అతి మృదుస్వరంలో మాట్లాడసాగారు. కాళీ, ఛునీలాల్, ‘మ’, నవగోపాల్, శశి, నిరంజన్ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇక్కడి కోసం ముక్కాలిపీట ఒకటి కొని తీసుకురా, ధర ఎంత ఉంటుంది?
‘మ’ : రెండు మూడు రూపాయల మధ్యలో ఉండవచ్చునండి.
శ్రీరామకృష్ణులు: చెక్కతో చేసిన పీట ఒకటి పన్నెండు అణాలకే లభ్య మయ్యేటప్పుడు ముక్కాలి పీటకు అంత ధర ఎందుకు పెట్టాలి?
‘మ’ : బహుశా అంత ధర ఉండకపోవచ్చులెండి.
శ్రీరామకృష్ణులు: అది సరే, రేపు బృహస్పతీవారం – మూడవ ప్రహరాన రాహుకాలం ఉంది. నువ్వు మూడింటికి మునుపే రాగలవా?
‘మ’ : అలాగేనండి. మూడింటి లోపే వచ్చేస్తాను.
49.1.1 శ్రీరామకృష్ణుల వ్యాధికి కారణం?
శ్రీరామకృష్ణులు: అది సరే, ఈ రోగం నయమవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందంటావు?
‘మ’ : కాస్త తీవ్రతరం అయింది కదా! ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చునండి.
శ్రీరామకృష్ణులు: ఎన్ని రోజులు?
‘మ’ : ఐదు లేక ఆరు నెలలు పట్టవచ్చునండి.
ఇది విని శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాడిలా కలత చెందారు. “ఏమిటి! ఏమంటున్నావు?” అన్నారు.
‘మ’ : నేను చెప్పేది, పూర్తిగా స్వస్థత చేకూరడానికండీ.
శ్రీరామకృష్ణులు: అదీ, అలా చెప్పు. అది సరే, నాకు ఈ సంగతి చెప్పగలవా? ఇన్ని దైవీరూప దర్శనాలు, భావావస్థలు, సమాధి అన్నీ కలుగుతున్నప్పటికీ వ్యాధి ఎందుకు సంక్రమించినట్లు?
‘మ’ : అయ్యా, మీరు ఎంతో బాధకు లోనవుతున్నారన్న మాట నిజమే. కాని దాన్లో ఒక అంతరార్థం ఇమిడి ఉంది.
శ్రీరామకృష్ణులు: ఏమిటది?
‘మ’ : మీ స్థితిలో మార్పు వస్తోంది. అది నిరాకారం వైపుకు మరలుతోంది. ‘విద్యా నేను’ కూడా నిలవడం లేదు.
శ్రీరామకృష్ణులు: ఆ, లోక శిక్షణ నిలిచిపోతోంది. ఇక మీదట ఉపదేశాలను ఇవ్వజాలను. సర్వం రామమయంగా గాంచుతున్నాను. ఒక్కోసారి ‘ఎవరికి బోధించాలి?’ అని మనస్సులో ఆలోచన మెదలుతుంది. నేను ఇక్కడ ఈ అద్దె ఇంట్లో ఉంటున్నందువల్ల రకరకాల భక్తులు ఇక్కడకు వస్తున్నారు.
“కృష్ణప్రసన్న సేన్, శశధర్లలా* ‘ఫలానా సమయానికి లెక్చర్లు ఉంటాయి’ అని నేను సైన్–బోర్డ్ పెట్టుకొనే పని లేదనుకుంటాను.” (శ్రీరామకృష్ణులు ‘మ’ నవ్వారు.)
‘మ’ : వ్యాధిలో మరో ఉద్దేశం కూడా ఉంది. అది శిష్యులను ఎన్నుకోవడం. ఐదు సంవత్సరాల తపస్సు ద్వారా సాధించలేనివి – అంటే ప్రేమ, భక్తి మొదలైనవన్నీ, భక్తులు ఈ కొన్ని రోజులలోనే సాధించారు.
శ్రీరామకృష్ణులు: ఆ, ఆ మాట నిజమే. కాని నిరంజన్ ఇంటికి వెళ్ళొచ్చాడు. (నిరంజన్‌తో) నీకు ఏమనిపిస్తోందో చెప్పు నాయనా.
నిరంజన్: ఇది వరకు నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని. అందులో సందేహం లేదు. కాని ప్రస్తుతం మీరు లేకుండా నేను జీవించలేను.
‘మ’ : ఈ బాలురు ఎంత గొప్ప వ్యక్తులో ఒక రోజు నేను గమనించాను.
శ్రీరామకృష్ణులు: ఎక్కడ?
‘మ’ : అయ్యా, ఒక రోజు శ్యాంపుకూర్ ఇంట్లో ఒక మూల నిలబడి నేను ఈ భక్తులను చూశాను. మిమ్మల్ని సేవించే నిమిత్తం వీరు ఎన్ని అవరోధాలను అతిక్రమించి వచ్చారో స్పష్టంగా అర్థం చేసుకున్నాను.
49.1.2 సమాధి స్థితి – నిరాకారం, లయం – ఆంతరంగిక వర్గం
ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు అంతర్ముఖులయ్యారు. కాసేపటి తరువాత సమాధిస్థితి నొందారు.
బాహ్య చైతన్యంలోకి వచ్చాక ‘మ’ తో ఇలా అన్నారు: “సర్వం సాకారం నుండి నిరాకారం వైపు వెళుతూ ఉన్నట్లుగా చూశాను. ఇంకా అన్ని విషయాలు చెప్పాలని ఉంది కాని చెప్పలేకపోతున్నాను. అది సరే, నిరాకారం వైపు నాకు కలుగుతోన్న ఆకర్షణ, నా లయం సమీపిస్తోందనడానికి సంకేతం. అవునంటావా, కాదంటావా?”
‘మ’ (నివ్వెరబోయి): కావచ్చునండి.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడు కూడా నేను నిరాకార అఖండ సచ్చిదానందాన్ని గాంచుతున్నాను. ఇలాగే…. కాని నా భావాలను ఎంతో ప్రయాసతో అణచుకుంటున్నాను.
“శిష్యులను ఎన్నుకోవడమంటూ నువ్వు చెప్పిన మాట నిజమే. ఈ వ్యాధి కారణంగా ఆంతరంగిక వర్గానికి చెందినవారు ఎవరు, బాహ్య వర్గానికి చెందిన వారు ఎవరు అన్న విషయం తెలియవస్తోంది. సంసారాన్ని వదలిపెట్టి ఇక్కడ ఉంటున్న వారు ఆంతరంగికులు. అప్పుడప్పుడు వచ్చిపోతూ, ‘మహాశయా, ఎలా ఉన్నారు?’ అని అడిగేవాళ్ళు బాహ్య వర్గానికి చెందినవారు.
“భవనాథ్ను చూశావు కదా! శ్యాంపుకూర్లో ఉన్నప్పుడు ఒక రోజు పెళ్ళికొడుకు దుస్తులు ధరించి వచ్చాడు. ‘ఎలా ఉన్నారండీ?’ అని అడిగాడు. ఆ తరువాత అతణ్ణి చూడలేదు. నరేంద్రుడి నిమిత్తం మాత్రమే నేను భవనాథ్ పట్ల ప్రేమ కనబరుస్తాను. కాని అతడు నా ఆలోచనల్లో ఇప్పుడు ఎంతమాత్రమూ లేడు.
49.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు ఎవరు? – స్వీయ వచనాలలో
ఆహుస్త్వామృషయస్సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ (గీత : 10 – 13)
(‘మ’ తో) “భగవంతుడు తన భక్తుల నిమిత్తం దేహధారణ చేసినప్పుడు అనేకమంది భక్తులు కూడా ఆయనతోపాటు వస్తారు. వారిలో కొందరు ఆంతరంగికులు, కొందరు బయటివారు. మరికొందరు ‘పోషకులు’.
“పది లేక పదకొండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక మైదానంగుండా విశాలాక్షి ఆలయం వైపుకు వెళుతూ ఉండగా మొట్టమొదటిసారి నాకు అలాంటి స్థితి కలిగింది. ఆహా! అది ఎలాంటి దర్శనం! పూర్తిగా బాహ్యజ్ఞానాన్ని కోల్పోయాను.
“22 లేక 23 సంవత్సరాల వయస్సులో కాళీ ఆలయంలో అమ్మ నాతో ఒకసారి ‘నువ్వు అక్షరమవుదా మనుకుంటున్నావా?’ అని అడిగింది. అక్షరం అంటే ఏమిటో నాకు తెలిసింది కాదు.దాని గురించి హలధారిని అడిగాను. ‘క్షరం అంటే జీవుడు, అక్షరం అంటే పరమాత్మ’ అని చెప్పాడాతడు.
“సాయంకాలం హారతి సమయంలో కుఠీ పైకెక్కి ఇలా కేకలు పెట్టేవాడిని: ‘అరే భక్తులారా, మీరంతా ఎక్కడ ఉన్నార్రా? త్వరగా నా వద్దకు రండి. నేను ఈ ప్రాపంచిక వ్యక్తుల సాంగత్యంలో చచ్చిపోతున్నాను. ‘ఇంగ్లీషుమ్యాను’ లకు ఈ సంగతి చెప్పాను. ‘అదంతా నీ మనోభ్రమ మాత్రమే’ అని వారు కొట్టిపారేశారు. బహుశా వీరు చెప్పిందే సబబు కావచ్చు అని తలచి స్థిమితపడ్డాను. కాని ప్రస్తుతం అదంతా నిజమే అవుతోంది. భక్తులందరూ ఇక్కడకు వచ్చి చేరుతున్నారు.
“ఇంకా, అమ్మ నాకు ఐదుగురు పోషకులను చూపించింది. వారిలో మొదటి వ్యక్తి మథుర్ బాబు. రెండవ వ్యక్తి శంభుమల్లిక్; అప్పటికి నేను అతణ్ణి చూసింది లేదు. నెత్తిమీద టోపీ పెట్టుకుని తెల్లగా ఉన్న వ్యక్తిని భావావస్థలో చూశాను. చాలా రోజుల తరువాత శంభును చూసినప్పుడు భావావస్థలో కనిపించిన వ్యక్తి ఈతడే అని జ్ఞాపకం వచ్చింది. తక్కిన ముగ్గురు పోషకులు ఎవరో ఇంత వరకు తేలలేదు. కాని వారందరూ తెల్లగానే ఉన్నారు. సురేంద్రుడు కూడా ఒక పోషకుడిలాగా తోస్తున్నాడు.
“ఆ స్థితి కలిగినప్పుడు నా మాదిరే ఉన్న వ్యక్తి ఒకరు వచ్చి ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల న్నిటినీ కుదిపివేశాడు. షడ్చక్రాలలోని ఒక్కో పద్మంలో జిహ్వ ద్వారా రమించసాగాడు. అధోముఖమై ఉన్న పద్మాలన్నీ ఊర్ధ్వముఖంగా వికసించేవి, చివరగా సహస్రారంలోని పద్మం వికసించింది.
“ఎవరైనా భక్తులు రావడానికి ముందుగానే వారి భావం ఎలాంటిదో అమ్మ నాకు చూపించేది. ఒకసారి చైతన్యదేవుల కీర్తన బృందం మర్రిచెట్టునుండి పొగడచెట్టు వైపుగా పోతూవుండడం చూశాను. అది చూసింది భావావస్థలో కాదు. సాక్షాత్తూ ఈ కళ్ళతోనే. ఆ బృందంలో బలరామ్‌ను చూశాను. నిన్ను (‘మ’ ను) కూడా చూసినట్లున్నాను. నా వద్దకు మాటిమాటికీ రావడంవల్ల నీకూ, ఛునీకీ ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమయింది. శరత్, శశిలను ఏసుక్రీస్తు అనుయాయులుగా చూశాను.
“మర్రిచెట్టు క్రింద ఒక కుర్రవాడిని చూశాను. ‘మరైతే నీకు అబ్బాయి పుడతాడు’ అన్నాడు హృదయ్. ‘స్త్రీల నందరినీ నేను తల్లిగా భావిస్తాను. మరి నాకు సంతానం ఎలా కలుగుతుంది?’ అన్నాను. రాఖాలే ఆ కుర్రవాడు.
“నేను అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా, నన్ను ఇలాంటి స్థితిలో నిలిపావు కదా! మరి అలాంటప్పుడు ఎవరైనా సంపన్నుడిని నా వద్దకు పంపు.’ అందుకే మథుర్బాబు నాకు పద్నాలుగు సంవత్సరాల పాటు సేవ చేశాడు. (1858 నుండి 1871 వరకు) ఆతడు నన్ను ఎంతగా సేవించాడని! నేను అడిగినదే తడవు సాధుసేవ నిమిత్తం ఒక ప్రత్యేకమైన భాండాగారాన్ని ఏర్పాటు చేశాడు. నా కోసం బండి, పల్లకీలను ఏర్పాటు చేసేవాడు. నేను ఎవరికి ఏ వస్తువును ఇవ్వమంటే ఆ వస్తువును ఇచ్చేవాడు. బ్రాహ్మణి అతణ్ణి ప్రతాప రుద్రుడనేది.*
“విజయ్ ఈ రూపాన్ని (శ్రీరామకృష్ణులను) దర్శించాడు. దీన్ని నువ్వు ఎలా వివరించగలవు? విజయ్ ‘ఇప్పుడు నేను మిమ్మల్ని స్పృశిస్తున్నట్లే స్పృశించాను’ అన్నాడు.
“మొత్తం ముప్ఫై ఒక్కరు భక్తులు ఉన్నారని నోటో (లాటూ) లెక్కబెట్టాడు. అదేమంత పెద్ద సంఖ్య కాదు. కాని విజయ్, కేదార్ల ద్వారా మరికొందరు భక్తులు తయారవుతున్నారు.
“ఆఖరి రోజుల్లో పాయసం తింటూనే జీవించాలని ఒకసారి ఒక దర్శనంలో వెల్లడయింది.ఈ జబ్బు సంక్రమించాక ఒక రోజు పత్ని (శారదాదేవి) నాకు పాయసం తినిపించింది. అప్పుడు ‘పాయసం మీద జీవించడమంటే ఇదేనా, ఇంత బాధాకరంగానా?’ అంటూ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాను.
49.3 తృతీయ పరిచ్ఛేదం భగవంతునికై నరేంద్రుని వ్యాకులత
సోమవారం, జనవరి 4, 1886
నేడు కృష్ణపక్ష చతుర్దశి. సమయం సాయంత్రం నాలుగు గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. తమ ఆరోగ్యం గురించి విచారించడానికి దక్షిణేశ్వరంనుండి రామ్ఛటర్జీ వచ్చి వెళ్ళాడని ‘మ’ తో చెప్పారు. ప్రస్తుతం దక్షిణేశ్వరంలో బాగా చలివేస్తోందా అని అడిగారు.
ఇంతలో నరేంద్రుడు వచ్చాడు. మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులు ఆతడివంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఇవాళ నరేంద్రుడికై ఆయన ప్రేమ పొంగి పొరలుతున్నట్లు ‘మ’ కు తోచింది. నరేంద్రుడు ఏడ్చాడని ఆయన ‘మ’ కు సైగచేసి చూపించారు. పిదప కాసేపు ఊరకే ఉన్నారు. మళ్ళీ, నరేంద్రుడు దారి పొడవునా ఏడుస్తూనే ఇంటినుండి వచ్చాడని సూచనలతో ‘మ’ కు తెలియజేశారు.
కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నరేంద్రుడు సంభాషణ ప్రారంభించాడు.
నరేంద్రుడు: ఇవాళ అక్కడకు వెళదామనుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులు: ఎక్కడికి?
నరేంద్రుడు: దక్షిణేశ్వరానికి. అక్కడ బిల్వవృక్షం కింద ధుని రగిలించా లనుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులు: వద్దు. వారు (మందుగుండు కర్మాగారం అధికారులు) అందుకు అభ్యంతరం చెప్తారు. పంచవటి చక్కని ప్రదేశం! అక్కడ ఎంతో మంది సాధువులు జపధ్యానాలు చేశారు. కాని బాగా చలివేస్తుంది. పైగా, చీకటిగా ఉంటుంది.
మళ్ళీ అందరూ కాసేపు మౌనంగా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, నరేంద్రుడితో): నీ చదువు కొనసాగించవా?
నరేంద్రుడు (శ్రీరామకృష్ణులను, ‘మ’ ను చూస్తూ) : ఇంతవరకు నేను చదివిన చదువులను మరచిపోయేలా ఏదైనా ఔషధం దొరికితే బ్రతికిపోతాను.
గదిలో పెద్దగోపాల్ కూడా ఉన్నాడు. “నేను కూడా నరేంద్రుడి వెంట వెళతాను” అన్నాడు.
శ్రీరామకృష్ణుల కోసం కాళీపద ఘోష్ ఒక పెట్టెలో ద్రాక్షపళ్ళు తెచ్చాడు. ఆ పెట్టె శ్రీరామకృష్ణుల ప్రక్కనే ఉంది. ఆయన వాటిలో కొన్నిటిని నరేంద్రుడికి ఇచ్చి మిగతా పళ్ళను భక్తులకోసం నేల మీద గుమ్మరించారు.
49.4 చతుర్థ పరిచ్ఛేదం నరేంద్రుని తీవ్రవైరాగ్యం
సంధ్యాకాలమయింది. నరేంద్రుడు కింది అంతస్తులోని గదిలో కూర్చుని పొగ తాగుతున్నాడు. ‘మ’ తో ఏకాంతంగా మాట్లాడుతూ వ్యాకులతతో తన ప్రాణాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయో చెబుతున్నాడు.
నరేంద్రుడు: గత శనివారంనాడు నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి నాకు హృదయంలో అదోలా అనిపించింది.
‘మ’ : కుండలినీ జాగృతి!
నరేంద్రుడు: బహుశా అదే అయివుండవచ్చు. ఇడా, పింగళ నాడులను నేను స్పష్టంగా చూశాను. హాజ్రాను నా ఛాతీ మీద చెయ్యివేసి చూడమన్నాను. నిన్న పై అంతస్తులో ఆయన (శ్రీరామకృష్ణులు) వద్దకు వెళ్ళి దాని గురించి చెప్పాను. ఆయనతో ఇలా అన్నాను: ‘అందరికీ సిద్ధించింది. నాక్కూడా ఏమైనా ఇవ్వండి. అందరికీ సాధ్యపడింది. నేనొక్కడిని ఏమీ సాధించకుండా మిగిలిపోవాలా?’
‘మ’ : ఆయన ఏం చెప్పారు?
నరేంద్రుడు: ఆయన ఇలా అన్నారు: ‘నువ్వు ముందుగా ఇంటి సమస్యలను కాస్త చక్కదిద్దుకొని రా. నీకు సర్వం సిద్దిస్తుందిలే. నీకేం కావాలి?’ నేను ఇలా జవాబు ఇచ్చాను: ‘మూడు రోజులపాటు సమాధి స్థితిలోనే నిమగ్నమై ఉండి పోవాలన్నదే నా కోరిక. అప్పుడప్పుడు కాస్త ఆహారం తీసుకోవడానికి తిరిగి వస్తాను.’ అందుకు ఆయన ఇలా అన్నారు: ‘నీది ఎంతటి అల్పబుద్ధి! దీని కంటే ఉన్నతమైన స్థితి కూడా ఉంది. “సర్వమూ నీవే” అని నువ్వే కదా పాడుతుంటావు.’
‘మ’ : ఆ, ఆ మాట ఆయన ఎప్పుడూ చెబుతూనే ఉంటారు – సమాధి స్థితినుండి క్రిందకు దిగివచ్చిన వ్యక్తి భగవంతుడే ఈ సమస్త జీవజగత్తులుగా అయివుండడం చూస్తాడని చెబుతుంటారు. ఈశ్వరకోటికి చెందినవారు అలాంటి స్థితిని పొందగలరు. సాధారణ జీవుడు సమాధిస్థితిని పొందితే సాధారణ స్థాయికి తిరిగి రాలేడని ఆయన చెబుతుంటారు.
నరేంద్రుడు: ఆయన ఇలా అన్నారు: ‘నువ్వు ఇంటి పనులను కాస్త చక్కదిద్దుకొని రా. సమాధిస్థితి కంటే కూడా ఉన్నత స్థితిని పొందగలవు.’ ఇవాళ ఉదయం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళంతా చీవాట్లు పెట్టారు. ‘నువ్వెందుకు దేశద్రిమ్మరిలా తిరుగుతుంటావు? నీ Law (న్యాయవిద్య) పరీక్షలు కూడా దగ్గరపడుతున్నాయి. వాటిపట్ల నువ్వు బొత్తిగా శ్రద్ధ వహించడం లేదు. ఊరకే అటూ ఇటూ తిరుగాడుతుంటావు’ అన్నారు.
‘మ’ : మీ అమ్మగారు ఏమైనా అన్నారా?
నరేంద్రుడు: ఊహూ, ఆమె నాకు భోజనం పెట్టడానికే ఆతురత చూపింది. ఏదో కాస్త తిన్నాను కాని తిన మనస్కరించలేదు.
‘మ’ : తరువాత?
నరేంద్రుడు: తర్వాత మా అమ్మమ్మ గారింటికి చదువుకో డానికి వెళ్ళాను. చదవడానికి ప్రయత్నిస్తూంటే, హృదయాన్ని ఏదో చెప్పరాని భయం పట్టుకొంది. చదువు అన్నది భయంకరమైనదిగా తోచింది, హృదయంలో ఏదో సంక్షోభం మొదలయింది. అప్పుడు ఏడ్చినంతగా జీవితంలో ఎన్నడూ ఏడ్వనే లేదు. పిదప పుస్తకాలు విసిరిపడేసి పరుగెత్తసాగాను. వీథులగుండా పరుగెత్తుకుంటూ వచ్చాను. చెప్పులు ఎక్కడ జారిపడిపోయాయో కూడా తెలియదు. ఒక గడ్డివామి ప్రక్కనుండి వెళ్ళాను. ఒళ్ళంతా గడ్డి. నేను అలా కాశీపూర్ రోడ్డువరకు పరుగెత్తుకుంటూనే వచ్చాను.
నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ సంభాషణ కొనసాగించాడు.
నరేంద్రుడు: వివేకచూడామణి చదివినప్పటినుండి మనస్సు మరింతగా క్రుంగిపోయింది. అందులో అనేక తపస్సుల ద్వారానూ, భాగ్యవశానా ఈ మూడు విషయాలు లభ్యమవుతాయని శంకరాచార్యులు చెప్పారు. అవి: మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయః. (మానవ జన్మ, మోక్షం కావాలన్న ఆకాంక్ష, మహాపురుషుల సాంగత్యం)
“నేను ఇలా తలపోశాను: ‘నేను ఈ మూడింటినీ సాధించాను దానిలో సందేహం లేదు. అనేక తపస్సుల కారణంగా మనుష్య జన్మ లభించింది, అనేక తపస్సుల కారణంగా ముముక్షుత్వం లభించింది. అనేక తపస్సుల మూలంగా ఇటువంటి మహాపురుషుడి సాంగత్యం లభించింది.’”
‘మ’ : ఆహా!
కాశీపూర్ ఉద్యానగృహంలో నరేంద్రుడు (నరేంద్రనాథ్ దత్తా)
నరేంద్రుడు: సంసారం ఇక ఎంత మాత్రం రుచించడం లేదు. సంసారంలో ఉన్న వారి సాంగత్యం కూడా రుచించడం లేదు, ఏదో ఒకరిద్దరు భక్తులు మినహా.
నరేంద్రుడు మళ్ళీ మౌనం వహించాడు. అతడిలో తీవ్రవైరాగ్యం దావానలంలా రగులుతోంది. ఆ తాపానికి ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. నరేంద్రుడు మళ్ళీ మాట్లాడసాగాడు.
నరేంద్రుడు (‘మ’ తో): మీకందరికీ శాంతి లభించింది. నా హృదయం అశాంతితో కొట్టుమిట్టాడుతోంది. మీరందరూ ధన్యులు.
‘మ’ ఏమీ పలకలేదు. కాని లోలోన ఇలా తలపోశాడు: ‘భగవద్దర్శనం లభించేది ఆయన కోసం తీవ్రంగా పరితపించినప్పుడే అని పరమహంస దేవులు చెబుతుంటారు కదా! ఆ పరితాపం ఎలాంటిదో ఇప్పుడు నా కళ్ళ ముందే చూస్తున్నాను.’
సంధ్యాకాలం అవగానే ‘మ’ పై అంతస్తులోని గదికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు నిద్రపోతున్నారు.
సమయం రాత్రి తొమ్మిది గంటలవుతోంది. శశి నిరంజన్లు శ్రీరామకృష్ణుల వద్ద కూర్చుని ఉన్నారు. మధ్యమధ్యలో ఆయన నరేంద్రుడి గురించి మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఆహా! నరేంద్రుడి స్థితి ఎంత అద్భుతంగా ఉంది! చూశారా! ఇదే నరేంద్రుడు మొదట్లో సాకార రూపాలను అంగీకరించేవాడు కాదు. ఇప్పుడు చూడండి, భగవంతుడికోసం ఇతడి ప్రాణాలు ఎంతగా విలవిల్లాడుతున్నాయో! భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం ఎలా అని శిష్యుడు, గురువును ప్రశ్నించిన ఆ కథ మీకు తెలుసు కదా! గురువు, శిష్యుడితో ‘నువ్వు నా వెంటరా. ఏం జరిగితే భగవంతుణ్ణి పొందగలమో నీకు చూపిస్తాను’ అన్నాడు. ఇలా పలికి గురువు, శిష్యుణ్ణి ఒక చెరువు వద్దకు తీసుకువెళ్ళి అతడి తలను నీటిలో అదిమిపెట్టాడు. కాసేపటి తరువాత విడిచిపెట్టి ‘నీళ్ళలో ఉన్నప్పుడు నీ కెలా అనిపించింది?’ అని అడిగాడు. ఆ శిష్యుడు ‘ప్రాణాలు పోతున్నాయనిపించింది. శ్వాస పీల్చుకోడానికి ప్రాణాలు తల్లడిల్లిపోయాయి’ అన్నాడు.
“భగవంతుడికోసం ఆ విధంగా ప్రాణాలు విలవిల్లాడితే ఆయన దర్శనానికి ఇక ఎక్కువకాలం వేచి ఉండే పని లేదని తెలుసుకుంటావు. అరుణోదయం అయినప్పుడు, తూర్పు దిక్కున అకాశం ఎర్రబడినప్పుడు సూర్యోదయం అవనున్నదని తెలుస్తుంది.”
ఇవాళ శ్రీరామకృష్ణుల ఆరోగ్యపరిస్థితి మరీ దిగజారి ఉంది. ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ నరేంద్రుడి గురించి ఇన్ని మాటలు చెప్పారు. సైగలు చేసి చెప్పారు.
నరేంద్రుడు ఆ రాత్రి దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయాడు. అమావాస్య అయినందున గాఢాంధకారం అలుముకునివుంది. అతడితో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా వెళ్ళారు. ఆ రాత్రికి ‘మ’ కాశీపూర్ గృహంలోనే ఉండిపోయాడు; తాను సన్న్యాసుల మధ్య కూర్చుని ఉన్నట్లు కలగన్నాడు.
49.5 పంచమ పరిచ్ఛేదం భక్తుల వైరాగ్యం – సంసారం నరకయాతన
మంగళావారం, జనవరి 5, 1886
శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చుని ‘మ’ తో మాట్లాడు తున్నారు. గదిలో వేరే ఎవరూ లేరు. సమయం సాయంత్రం నాలుగు గంటలవుతోంది.
శ్రీరామకృష్ణులు: క్షీరోద్ గంగాసాగర్‌కు* వెళ్ళే పక్షంలో నువ్వు అతడికి ఒక కంబళి కొనియివ్వు.
‘మ’ : అలాగేనండి.
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనం వహించి మళ్ళీ ఇలా అన్నారు.
శ్రీరామకృష్ణులు: అది సరే, ఈ కుర్రవాళ్ళందరికీ ఏమవుతోందో చెప్పగలవా? కొందరు పూరీ వెళుతున్నారు, కొందరు గంగాసాగర్‌కు వెళుతున్నారు. అందరూ ఇళ్ళు వదలిపెట్టి వచ్చేస్తున్నారు. నరేంద్రుడి విషయమే తీసుకో. తీవ్ర వైరాగ్యం జనిస్తే సంసారం ఒక కూపంలాగానూ, బంధువులు కాలసర్పాలుగానూ తోస్తారు.
‘మ’ : అవునండి. సంసారంలో చెప్పనలవిగాని యాతనలు!
శ్రీరామకృష్ణులు: నరక యాతనలు! జన్మించినప్పటి నుండి యాతనలే! దారాపుత్రులతో ఎటువంటి యాతనలో నువ్వే చూస్తున్నావు కదా!
‘మ’ : అవునండి మీరే చెప్పారు కదా – ‘సంసారంలోకి ప్రవేశించని ఈ బాలభక్తులకు ఇచ్చిపుచ్చుకోవడాలు అంటూ ఏమీ ఉండవు. మనిషిని సంసారంలో బంధించేది ఈ ఇచ్చిపుచ్చుకోవడాలే.’
శ్రీరామకృష్ణులు: నిరంజన్ ఎలా ఉంటాడో చూస్తున్నావు కదా! ‘నీది నువ్వు తీసుకో, నాది నాకు ఇవ్వు’ – అతడిది ఇదే ధోరణి, అంతే. అంతకు మించి సంసారంతో ఎలాంటి సంబంధమూ లేదు. వెనుక నుండి అతణ్ణి లాగేదంటూ ఏమీ లేదు.
“కామినీ కాంచనాలే సంసారం. నువ్వే చూస్తుంటావు కదా – డబ్బు ఉంటే మూట కట్టుకోవాలన్న కోరిక కలుగుతుంది.”
‘మ’ కడుపుబ్బ నవ్వాడు, శ్రీరామకృష్ణులు కూడా నవ్వారు.
‘మ’ : డబ్బు బయటకు తీయడానికి మునుపు జనం ఎంతో యోచిస్తారు. (ఇద్దరూ నవ్వారు) కాని, త్రిగుణాతీతులై సంసారంలో మనగలిగితే ఆ సంగతి వేరు అని దక్షిణేశ్వరంలో మీరు ఒకసారి చెప్పారు.
శ్రీరామకృష్ణులు: అవును, పసిబాలునిలా.
‘మ’ : కాని అది చాలా కష్టమండి. అందుకు ఎంతో శక్తి అవసరం.
శ్రీరామకృష్ణులు మౌనం వహించారు.
‘మ’ : నిన్న వాళ్ళు ధ్యానించడానికి దక్షిణేశ్వరం వెళ్ళారు. ఇక్కడ నేనో కలగన్నాను.
శ్రీరామకృష్ణులు: ఏం కల కన్నావు?
‘మ’ : నరేంద్రాదులు సన్న్యాసులు అయినట్లు కలగన్నాను. వారు ధునిచుట్టూ కూర్చుని ఉన్నారు. నేను కూడా వారి నడుమ కూర్చుని ఉన్నాను. వారు పొగాకు సేవిస్తూ పొగ వదులుతున్నారు. గంజాయి వాసన వస్తోందని నేనన్నాను.
49.5.1 మానసిక త్యాగం – శ్రీరామకృష్ణుల పసిపిల్లవాడి స్థితి
శ్రీరామకృష్ణులు: కావలసింది మానసిక త్యాగం. అలా ఎవరైనా చేయగలిగితే అతడు కూడా సన్న్యాసే.
శ్రీరామకృష్ణులు కొంతసేపు ఊరకుండి మళ్లీ తమ హితోపదేశాలను కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: కాని కోరికలను మంట పెట్టాలి సుమా! ఎవరైనా, విజయం సాధించగలిగేది అప్పుడే.
‘మ’ : బడేబజార్కు చెందిన మార్వాడీలతో మీరు ‘నాకు భక్తి కావాలన్న కోరిక ఉం’ దన్నారు. దాన్ని కోరికగా పరిగణించ రనుకుంటాను.
శ్రీరామకృష్ణులు: అవును. ఇది ఎలాంటిదంటే, హించే (పొన్నగంటి) ఆకు ఇతర ఆకుకూరలలో చేరదు. అది పిత్తాన్ని తగ్గిస్తుంది.
“అది సరే, అంతటి ఆనందం, భావం – అవన్నీ ఎక్కడకు వెళ్ళినట్లు?” ‘మ’ : బహుశా మీరిప్పుడు గీతలో వర్ణింపబడిన త్రిగుణాతీత స్థితిలో ఉన్నారు కాబోలు. సత్త్వరజస్తమో గుణాలు మూడూ వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. కాని మీరు మాత్రం నిర్లిప్తులై ఉన్నారు. సత్త్వగుణం కూడా మీకు అంటడం లేదు.
శ్రీరామకృష్ణులు: ఆ, నిజమే. అమ్మ నన్ను పసిపిల్లవాడి స్థితిలో నిలిపింది. అది సరే, ఈ దేహం ఇక నిలువదంటావా?
పిదప ఇద్దరూ మౌనం వహించారు. నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. ఇంటి వ్యవహారాలు కొన్ని చక్కదిద్దుకోవడానికి అతడు ఇంటికి వెళ్ళనున్నాడు.
నరేంద్రుడి తండ్రి దివంగతు డయినప్పటినుండి అతడి ఇంట్లో అనేక కష్టాలు. ఇంట్లోవారందరూ ఒక్కోసారి పస్తులు కూడా ఉండవలసి వస్తోంది. నరేంద్రుడు ఇంటికి పెద్దకొడుకు అతడు ధనార్జన చేసి ఇంట్లోని వారిని పోషిస్తాడని వారందరూ అతడి మీదనే ఆశలు పెట్టుకున్నారు. కాని నరేంద్రుడు ప్రస్తుతం తీవ్రవైరాగ్యంతో నిండి ఉన్నాడు; లా పరీక్షలకు కూర్చోలేకపోయాడు. ఇంటి ఖర్చులకోసం ఏమైనా ఏర్పాట్లు చేయడానికి నేడు కలకత్తా వెళుతున్నాడు. వందరూపాయాలు అప్పు ఇవ్వడానికి ఒక స్నేహితుడు అంగీకరించాడు. దానితో మూడు నెలలపాటు ఇల్లు గడిచిపోతుంది.
నరేంద్రుడు: నేను ఇంటికి వెళ్తున్నాను. (‘మ’ తో) దారిలో మహిమా చక్రవర్తి ఇంటికి వెళ్తాను. మీరుకూడా వస్తారా?
‘మ’ కు వెళ్ళాలని లేదు. అతడివంక చూస్తూ శ్రీరామకృష్ణులు, నరేంద్రుడితో “ఎందుకు?” అన్నారు.
నరేంద్రుడు: అదే దారిలో వెళ్తున్నాను కదా! అందువల్ల మహిమా చక్రవర్తి ఇంటి వద్ద ఆగి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళతాను.
శ్రీరామకృష్ణులు నరేంద్రుడి వైపు తదేకంగా చూశారు.
నరేంద్రుడు: ఇక్కడకు వచ్చే స్నేహితు డొకడు వందరూపాయలు అప్పు ఇస్తానన్నాడు. అది పుచ్చుకొని మూడు నెలలపాటు మా కుటుంబం గడిచేలా ఏర్పాటు చేసి వస్తాను.
శ్రీరామకృష్ణులు ‘మ’ వంక చూస్తూ మౌనంగా ఉండిపోయారు.
‘మ’ (నరేంద్రుడితో): నువ్వు బయలుదేరు. నేను తరువాత వస్తాను.
49.6 షష్ఠ పరిచ్ఛేదం నరేంద్రునికి జ్ఞాన, భక్తి యోగాల సమన్వయోపదేశం
గురువారం, మార్చ్ 11, 1886
సమయం రాత్రి ఎనిమిది గంటలు. శ్రీరామకృష్ణులు రెండవ అంతస్తులో ఉన్న తమ గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, శశి, ‘మ’, శరత్, పెద్ద గోపాల్‌లు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు.శరత్ ఆయన మంచం ప్రక్కన నిలబడి విసనకర్రతో విసురుతున్నాడు. శ్రీరామకృష్ణులు తమ వ్యాధి గురించి మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: మీలో ఎవరైనా దక్షిణేశ్వరంలో ఉన్న బోలానాథ్ వద్దకు వెళితే అతడు ఔషధ తైలమొకటి ఇస్తాడు. దాన్ని ఎలా వాడాలో కూడా చెబుతాడు.
పెద్దగోపాల్: మరయితే రేపు ఉదయమే మేం వెళ్ళి దాన్ని తీసుకువస్తాం.
‘మ’ : ఇవాళ రాత్రికి ఎవరైనా వెళుతున్నట్లయితే ఆ వ్యక్తే పట్టుకురావచ్చు.
శశి: నేను వెళ్ళగలను.
శ్రీరామకృష్ణులు (శరత్‌ను చూపుతూ): ఇతడు వెళ్ళవచ్చు.
కాసేపటి తరువాత భోలానాథ్ నుండి ఆ తైలం తీసుకురావడానికి శరత్ దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయాడు.
భక్తులు శ్రీరామకృష్ణుల మంచం చుట్టూ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఉన్నట్లుండి ఆయన లేచి కూర్చుని నరేంద్రుణ్ణి ఉద్దేశించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: బ్రహ్మం, మచ్చ లేనిది. మూడు గుణాలూ బ్రహ్మంలో ఉన్నాయి. కాని అది మాత్రం నిర్లిప్తం.
“వాయువులో సుగంధం, దుర్గంధం రెండూ ఉంటాయి. కాని వాయువు మాత్రం నిర్లిప్తం కదా!
“ఒకసారి కాశీలో శంకరాచార్యులు వీథిలో వెళ్తున్నారు. చండాలు డొకడు మాంసం మోసుకొని వెళ్తూ ఉన్నట్టుండి ఆయన్ను స్పృశించాడు. ‘అరే, నువ్వు నన్ను తాకావే!’ అన్నారు శంకరులు. అందుకు చండాలుడు ఇలా సమాధానమిచ్చాడు: ‘అయ్యా మీరు నన్ను తాకలేదు. నేను కూడా మిమ్మల్ని తాకలేదు. ఆత్మ అనేది నిర్లిప్తం. మీరు ఆ శుద్ధ ఆత్మయే.’
“బ్రహ్మం, మాయలలో జ్ఞాని మాయను తిరస్కరిస్తాడు.
“మాయ అన్నది తెరలాంటిది. ఇలా చూడు, నేను ఈ తువ్వాలును నీకూ, దీపానికి మధ్యలో పెట్టాను. దీపపు వెలుగును నువ్విప్పుడు చూడజాలవు.”
శ్రీరామకృష్ణులు తువ్వాలును తమకు, భక్తులకు మధ్య ఉంచి ఇలా అన్నారు: “ఇలా చూడండి. మీకు నా ముఖం ఇప్పుడు కనిపించడం లేదు. రాంప్రసాద్ పాట ఒకటి ఉంది కదా – ‘తెర తీసి చూడండి’ అని.
“అయితే భక్తుడు మాయను వదలడు. అతడు మహామాయను పూజిస్తాడు. ఆమెకు శరణాగతుడై ‘అమ్మా నాకు దారి ఇవ్వు. నువ్వు దారి ఇచ్చినప్పుడే నాకు బ్రహ్మజ్ఞానం లభించేది’ అని ప్రార్థిస్తాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థలనే మూడు స్థితులను జ్ఞానులు కొట్టిపడేస్తారు. కాని భక్తుడు ఈ మూడు స్థితులనూ అంగీకరిస్తాడు. ‘నేను’ ఉన్నంత వరకు సర్వమూ ఉంటుంది. ఈ ‘నేను’ ఉన్నంత వరకు భగవంతుడే మాయ, జీవజగత్తులు, ఇరవై నాలుగు తత్వాలుగా విరాజిల్లుతున్నట్లు భక్తుడు దర్శిస్తాడు.”
నరేంద్రుడు, ప్రభృతులు మౌనంగా వింటున్నారు.
శ్రీరామకృష్ణులు: కాని మాయావాదం శుష్కమైనది. (నరేంద్రుడితో) నేనేం చెప్పానో చెప్పు.
నరేంద్రుడు: శుష్కమైనది.
శ్రీరామకృష్ణులు నరేంద్రుడి ముఖాన్ని, చేతులను ఆప్యాయంగా స్పృశిస్తూ ఇలా అన్నారు: “ఇతడివన్నీ (నరేంద్రుడివి) భక్తుడి లక్షణాలు. జ్ఞాని లక్షణాలు వేరుగా ఉంటాయి. అతడి ముఖం శుష్కంగా ఉంటుంది.
“జ్ఞాన సముపార్జనానంతరం కూడా జ్ఞాని విద్యామాయను ఆశ్రయించుకొని ఉండవచ్చు. భక్తి, దయ, వైరాగ్యం – వీటిని నిలుపుకొని ఉండవచ్చును. ఇందులో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది, లోకశిక్షణ; రెండవది రసాస్వాదన. సమాధిస్థితిలో మగ్నుడై, జ్ఞాని మౌనం వహించినట్లయితే లోకశిక్షణ జరగదు. అందుకనే శంకరాచార్యులు ‘విద్యా నేను’ ను నిలుపుకున్నారు. పైగా, భగవదానందాన్ని అనుభవించడానికి భక్తుల సాంగత్యంలో జ్ఞాని భక్తిని ఆశ్రయించుకొని ఉంటాడు.
“ఈ ‘విద్యా నేను’, ‘భక్తుడి నేను’ – వీటిలో దోషం లేదు. ‘దుష్ట నేను’ ఉంటే అది హానికరం. భగవంతుడి దర్శనం కలిగితే బాలక స్వభావం ఏర్పడుతుంది. ‘బాలుడి నేను’ లో ఎలాంటి దోషమూ లేదు. అది అద్దంలో ముఖం ప్రతిబింబించడం లాంటిది. అది జనులను తిట్టజాలదు. కాలిపోయిన తాడు, కేవలం చూడడానికి మాత్రమే తాడు ఆకారంలో ఉంటుంది. ‘ఉఫ్’ మని ఊదితే అది ఎగిరిపోతుంది. జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయిన అహంకారం ఎవరికీ హాని చేయజాలదు. ఆ ‘నేను’ కేవలం నామమాత్రమే.
“నిత్యానికి చేరుకున్నాక మళ్ళీ లీలకు రావడం నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నాక తిరిగి ఇవతలి ఒడ్డుకు రావడం వంటిది. అలా తిరిగి రావడమనేది లోకశిక్షణ, ఆనందం నిమిత్తం, భగవల్లీలలో పాలుపంచుకొనే నిమిత్తం.”
శ్రీరామకృష్ణులు అతి మృదుస్వరంలో మాట్లాడుతున్నారు. భక్తులను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “దేహం ఇంతగా రోగగ్రస్తమై ఉంది. కాని అమ్మ నా మనసును అవిద్యామాయలో మాత్రం నిలుపనేలేదు. మీరే చూడండి. రామ్‌లాల్ కానీ, లేక ఇల్లు కానీ, లేక భార్యకానీ నాకు జ్ఞాపకం లేనే లేదు. నేను ఆ కాయస్థ బాలుడైన పూర్ణుడి గురించే చింతిస్తున్నాను. తక్కినవారి గురించి నాకు ఇసుమంతైనా ఆదుర్దా లేదు.
“లోకుల నిమిత్తం, భక్తుల నిమిత్తం, భగవంతుడే నాలో ఈ విద్యా మాయను నిలిపాడు.
“కాని విద్యామాయ ఉన్నట్లయితే మళ్ళీ రావలసి ఉంటుంది. అవతార పురుషులు ఈ విద్యామాయను నిలుపుకుంటారు. ఇసుమంతయినా కోర్కెలు ఉంటే మళ్ళీ రావలసి ఉంటుంది. తిరిగి తిరిగి, మళ్ళీ రావలసిందే. కోరికలన్నీ నశించినప్పుడే ముక్తి. కాని భక్తులు ముక్తిని కోరుకోరు.
“కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది; వారికి తిరిగి రావలసిన పని లేదు. జ్ఞానుల లక్ష్యం ముక్తి.”
నరేంద్రుడు: ఆ మధ్య ఓ రోజు మేము మహిమాచక్రవర్తి ఇంటికి వెళ్ళాం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అయితే?
నరేంద్రుడు: అలాంటి శుష్కజ్ఞానిని ఇంతవరకు ఎన్నడూ నేను చూసింది లేదు.
శ్రీరామకృష్ణులు: ఏమైందేమిటి?
నరేంద్రుడు: అతడు మమ్మల్ని పాడమనేసరికి గంగాధర్ పాడాడు. ‘కృష్ణుడి నామము వినినంతనే రాధాదేవి ప్రాణములు తెప్పరిల్లినవి. అటూ ఇటూ చూసేసరికి ఎదురుగా తమాలవృక్షం కానవచ్చింది’ – ఈ పాట.
“ఈ పాట విని మహిమాచక్రవర్తి ఇలా అన్నాడు: ‘అలాంటి పాటలు ఇక్కడ పాడడం ఎందుకు? ప్రేమ గీమ లాంటి విషయాలన్నీ నాకు బొత్తిగా గిట్టవు. పైగా, ఇక్కడ నేను నా భార్యాబిడ్డలతో ఉంటున్నాను. అలాంటి పాటలు ఇక్కడ పాడడమా?’”
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అతడికి ఎంత భయమో చూడు!
49.7 సప్తమ పరిచ్ఛేదం భక్తుల కొరకే శ్రీరామకృష్ణుల దేహధారణ
ఆదివారం, మార్చ్ 14, 1886
శ్రీరామకృష్ణులు మేడ మీదవున్న విశాలమైన గదిలో ఉత్తరాభిముఖులై కూర్చుని ఉన్నారు. సంధ్యాకాలమయింది. ఆయన ఎంతో అస్వస్థులై ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్లు మృదువుగా ఆయన పాదాలను ఒత్తుతున్నారు. ‘మ’ కూడా ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. అతణ్ణి కూడా కాళ్ళు పట్టమని శ్రీరామకృష్ణులు సైగ చేశారు.
గడచిన ఆదివారంనాడు భక్తులు పూజా, ప్రార్థనలతో శ్రీరామకృష్ణుల జన్మదినం జరుపుకున్నారు. క్రిందటి సంవత్సరం ఆయన జన్మదినాన్ని భక్తులు దక్షిణేశ్వర కాళీ ఆలయంలో మహా వైభవంగా జరుపుకున్నారు. అయితే ఈసారి, ఆయన అనారోగ్యం కారణంగా భక్తులందరూ విషాదసాగరంలో మునిగి ఉన్నారు. ఏదో నామమాత్రంగా జన్మదినం జరిపారు.
మాతృశ్రీ శారదాదేవి అక్కడే వసిస్తూ రాత్రింబవళ్ళు శ్రీరామకృష్ణులకు సేవాశుశ్రూషలు చేయడంలో నిమగ్నమైపోయారు. బాలభక్తులైన నరేంద్రుడు, రాఖాల్, నిరంజన్, శశి, శరత్, బాబూరామ్, యోగీన్, లాటూ, కాళీలు ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి ఆ ఉద్యాన గృహంలోనే ఉంటూ ఆయన్ను సేవిస్తున్నారు. తారక్, సింథీగోపాల్, చిన్న గోపాల్కూడా వచ్చి చేరారు. గృహస్థులైన భక్తులు ప్రతి రోజూ వచ్చి చికిత్సకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యమధ్యలో రాత్రిళ్ళు కూడా అక్కడే గడుపుతున్నారు.
శ్రీరామకృష్ణులు నేడు మరీ అనారోగ్యంగా ఉన్నారు. నడిరేయి, ఫాల్గుణ శుక్ల నవమి. నిండు వెన్నెల తోటను ముంచెత్తుతోంది. వసంత వాయువులు ఆహ్లాదకరంగా వీస్తున్నాయి. తీగలు, వృక్షాలు ఆనందంతో తలలు ఊపుతున్నాయి. అయితే భక్తుల హృదయాలలో అవి ఎలాంటి ఆహ్లాదాన్నీ కలిగించలేకపోయాయి. వారు విషాదసాగరంలో మునిగి ఉన్నారు. శత్రుసేనలతో చుట్టు ముట్టబడిన ఒక సుందర నగరంలో వసిస్తున్నవారివలె ఉంది వారి పరిస్థితి. సర్వత్రా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది.
శ్రీరామకృష్ణులకు నిద్రపట్టడం లేదు. మంచం మీద విశ్రమించి ఉన్నారు. ఆయనకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని ఒకరిద్దరు భక్తులు సమీపాన కూర్చుని ఉన్నారు. మధ్యమధ్యలో ఆయన కునుకు తీస్తున్నట్లుగా ఉంది.
పక్కనే ‘మ’ కూర్చుని ఉన్నాడు. తమకు దగ్గరగా రమ్మని శ్రీరామకృష్ణులు, ‘మ’ కు సైగచేసి చెప్పారు. రాళ్ళుకూడా కరిగిపోతాయేమో అనిపించేలా ఉంది ఆయన బాధ. అతి కష్టంతో మెల్లమెల్లగా ‘మ’ తో ఇలా అన్నారు: “మీరందరూ ఏడుస్తారనే భయంతోనే నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను. ‘ఈ కష్టం మేము చూడలేము. ప్రాణం పోతేనే మేలు’ అని మీరందరూ అన్నట్లయితే నేను ఈ దేహం విడిచి వెళ్ళిపోతాను.”
ఈ మాటలు విని భక్తులకు గుండెల్లో గునపాలు దించినట్లనిపించింది. తల్లి, తండ్రి, సంరక్షకుడు – సర్వస్వమూ అయిన శ్రీరామకృష్ణులే అలా అన్నప్పుడు ఇక వారు ఎవరితో మొరపెట్టుకోగలరు? అందరూ మౌనం వహించారు. ‘ Crucifixion (సిలువవేయడం) అంటే ఇదేనా? భక్తుల కోసమే కదా ఈ శరీర యాతనలన్నీ అనుభవించడం’ అని కొందరు తలచారు.
అర్ధరాత్రి శ్రీరామకృష్ణుల పరిస్థితి మరింతగా విషమిస్తోంది. ఏం చేయాలో భక్తులకు పాలుపోవడంలేదు. వారిలో ఒకరు కలకత్తాకు వెళ్ళారు. ఉపేంద్ర, నవగోపాల్ అనే ఇద్దరు డాక్టర్లను వెంటబెట్టుకొని గిరీశ్ అదే రాత్రి అక్కడకు చేరుకున్నాడు.
భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చుని ఉన్నారు. కొద్దిగా తేరుకొన్న తరువాత ఆయన ఇలా అన్నారు: “సుస్తీ అన్నది దేహానికి చెందినది. అది దాని స్వభావం. దేహం అనేది పంచభూతాలచే నిర్మితమైనదిగా చూస్తున్నాను.”
గిరీశ్ వంక చూస్తూ ఇలా అన్నారు: “నేను దైవీరూపాలు దర్శిస్తున్నాను. అందులో ఈ రూపం (శ్రీరామకృష్ణుల రూపం) కూడా ఉంది.”
49.8 అష్టమ పరిచ్ఛేదం సమాధి స్థితిలో
సోమవారం, మార్చి 15, 1886
ఉదయం ఏడుగంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణుల పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉంది. ఒక్కోసారి అతి మెల్లగాను, ఒక్కోసారి సైగల ద్వారాను భక్తులతో మాట్లాడుతున్నారు. నరేంద్రుడు, రాఖాల్, లాటూ, ‘మ’, సింథీకి చెందిన గోపాల్ ప్రభృతులు కూడా అక్కడే గదిలో ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితి గతరాత్రి విషమించడాన్ని తలచుకొని వారందరూ శోకతప్త హృదయాలతో మౌనంగా కూర్చుని ఉన్నారు.
49.8.1 భగవంతుడు, జీవుడు, జగత్తు
శ్రీరామకృష్ణులు (‘మ’ వంకచూస్తూ): ఇప్పుడు నేను ఏం చూస్తున్నానో తెలుసా? భగవంతుడే సమస్తం అయివున్నాడు. మానవులు, తక్కిన జీవజాలం తోలుతో తయారుచేయబడి ఉన్నట్లు చూస్తున్నాను. స్వయంగా భగవంతుడే వాటి లోపల ఉండి వాటి కాళ్ళు చేతులు, శిరస్సు తిప్పుతున్నాడు. ఇలాంటి దర్శనమే గతంలో ఒకసారి కలిగింది – మైనంతో చేసిన ఇళ్ళు, తోటలు, రహదారులు, మనుష్యులు, పశువుల మల్లే సమస్తం ఒకే వస్తువుతో తయారై ఉంది. భగవంతుడే బలిపీఠం, బలి ఇచ్చేవాడు, బలిపశువుగానూ అయివున్నట్లు చూస్తున్నాను.
జీవుల దుఃఖాలను చూసి సైపలేక, మానవ శరీరం ధరించి వచ్చి, జీవుల మేలుకొరకే శ్రీరామకృష్ణులు తమ శరీరాన్ని బలి ఇస్తున్నారు.
సర్వత్రా నెలకొని ఉన్న ఏకైక వస్తువును గురించిన ఆ అనుభూతిని వర్ణిస్తూ శ్రీరామకృష్ణులు ఆ భావంలో తాదాత్మ్యం చెంది “ఆహా, ఆహా” అన్నారు.
వెంటనే సమాధిస్థితిలోకి వెళ్ళిపోయారు. దేహం, ప్రపంచం – దీని గురించిన జ్ఞానం లేదు. భక్తులు కింకర్తవ్యతామూఢులై కూర్చుండిపోయారు. కాసేపటి తరువాత కొద్దిగా బాహ్యస్పృహలోకి వచ్చి, “ప్రస్తుతం నాకు ఏ బాధ లేదు. మునుపటిలాగానే ఉన్నాను” అన్నారు. సుఖదుఃఖాలకు అతీతమైన ఈ స్థితిని చూసి భక్తులు ఆశ్చర్య చకితులయ్యారు.
లాటూవంక చూస్తూ ఆయన ఇలా అన్నారు. “అదిగో, లోటో తన చేతి మీద తలవాల్చి కూర్చున్నాడు. భగవంతుడే ఆ విధంగా తలవాల్చి కూర్చున్నట్లు చూస్తున్నాను.”
శ్రీరామకృష్ణులు భక్తుల వైపు చూస్తున్నారు. ఆ చూపులో వాత్సల్యం తొణికిసలాడుతోంది. పసిపాప బుగ్గలు పట్టుకొని గారాబంగా ఆడించినట్లు రాఖాల్, నరేంద్రుల చుబుకాలను స్పృశిస్తూ ఆప్యాయత కురిపిస్తున్నారు.
49.8.2 లీలా సమాప్తి ఎందుకు?
కాసేపటి తరువాత ‘మ’ తో “ఈ దేహం ఇంకా కొన్ని రోజులు నిలిచి ఉంటే లోకులకు చైతన్యం కలిగి ఉండేది” అన్నారు. ఇలా పలికి కాసేపు ఏమీ మాట్లాడకుండా ఊరకుండిపోయారు. పిదప “కాని అలా జరగదు. ఈ దేహం నిలువదు” అన్నారు.
ఆయన ఇంకా ఏం చెబుతారో అని భక్తులు ఎదురు చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: కాని ఇది నిలువబోదు. ఇది భగవదేచ్ఛ. లేకుంటే నా సరళత్వాన్ని, మూర్ఖత్వాన్ని చూసి లోకులు నన్ను మోసగించవచ్చు. అమాయకంగా అందరికీ నేను సమస్తం ఇచ్చివేయవచ్చు. ఈ కలియుగంలో లోకులకు జపధ్యానాలపట్ల విముఖత ఉంది.
రాఖాల్ (వినయపూర్వకంగా): మీ దేహం మరికొంతకాలం నిలిచేటట్లు మీరు భగవంతునికి చెప్పండి.
నరేంద్రుడు: మీ సంకల్పం, భగవంతుడి సంకల్పం – రెండూ ఒక్క టై పోయాయి.
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనం వహించారు. ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడు, రాఖాల్ తదితరులతో): నేను చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ప్రస్తుతం నేను, అమ్మ ఒకటై పోయినట్లుగా చూస్తున్నాను. ఆడపడుచు భయంతో రాధాదేవి ‘నువ్వు నా హృదయంలోనే వసించు’ అని కృష్ణుణ్ణి ప్రార్థించింది. కాని అనంతరం ఆమె, కృష్ణ దర్శనానికై వ్యాకులతతో తల్లడిల్లిపోయింది. గుండెలు చీల్చేలా ఆమె ఏడ్చి మొరపెట్టుకున్నాసరే, కృష్ణుడు మాత్రం బయటకు రానేలేదు.
రాఖాల్ (భక్తులతో, మృదుస్వరంలో): ఈయన గౌరాంగుని అవతారం గురించి చెబుతున్నారు.
49.9 నవమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు, ఆయన అనుచరులు
భక్తులు స్తబ్ధులై కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఆదరంతో వారి వంక చూస్తున్నారు.తరువాత చేతిని హృదయం మీద పెట్టారు. ఏమో చెప్పనున్నారు.
శ్రీరామకృష్ణులు: అవును. ఒకటి అమ్మ, రెండవది ఆమె భక్తుడు. ఇది వరలో చెయ్యి విరిగింది ఆ భక్తుడికే. ప్రస్తుతం వ్యాధితో బాధపడుతోంది కూడా ఆతడే.
భక్తులు మారు పలుకలేదు.
శ్రీరామకృష్ణులు: ఎవరికి చెప్పను? నా మాటలను ఎవరు అర్థం చేసుకోగలరు?
కొంతసేపటికి ఇలా అన్నారు: “భగవంతుడు మానవుడై – అవతార పురుషుడై తన భక్తులతో పాటు వస్తాడు. భక్తులు ఆయనతో పాటే తిరిగి వెళ్ళిపోతారు.”
పిదప ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇలా అన్నారు: “వీథిగాయకుల బృందం హఠాత్తుగా వచ్చింది; నాట్యం చేసింది, పాటలు పాడింది. అంతలోనే, ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. అది వచ్చింది, తిరిగి వెళ్ళిపోయింది కూడా. కాని ఈ సంగతి ఎవరూ గుర్తించలేదు.”
శ్రీరామకృష్ణులు, భక్తులు నవ్వారు.
కాసేపటి తరువాత ఆయన ఇలా అన్నారు:
“దేహధారణ చేసినప్పుడు కష్టాలు అనుభవించవలసిందే.
“ఒక్కోసారి ‘మళ్ళీ తిరిగివచ్చేలా ఉండకూడదు’ అని నాకు నేను చెప్పు కుంటుంటాను. కాని మరో విషయం ఉంది. బయట విందు భోజనాలు తినగా తినగా, ఇంట్లోని పచ్చడి మెతుకులు రుచించవు. పైగా ఈ దేహధారణ కూడా భక్తుల నిమిత్తమే.”
49.9.1 నరేంద్రుని జ్ఞానం, భక్తి – త్యాగం
పిదప నరేంద్రుడి వంక ప్రేమగా చూస్తూ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): చండాలు డొకడు మాంసఖండం మోసుకొని వెళ్తున్నాడు. గంగాస్నానం ఆచరించాక శంకరాచార్యులు ప్రక్కనుండి వెళ్తున్నారు. హఠాత్తుగా చండాలుడు ఆయన్ను తాకాడు. శంకరులు కోపంతో ‘ఓయీ! నువ్వు నన్ను తాకావే!’ అన్నారు. అందుకు చండాలుడు ఇలా చెప్పాడు: ‘స్వామీ, మీరు నన్ను తాకలేదు, నేను కూడా మిమ్మల్ని తాకలేదు. మీరే విచారణ చేసి చూడండి. మీరు దేహమా, మనస్సా లేక బుద్ధియా? మీరు ఎవరో విచారణ చేయండి. శుద్ధ ఆత్మ నిర్లిప్తమైనది. సత్త్వరజస్తమో గుణాలలో దేనితోనూ లిప్తం కాదు.’
“బ్రహ్మం ఎలాంటిదో తెలుసా? అది వాయువు లాంటిది. వాయువులో సుగంధం, దుర్గంధం రెండూ ఉంటాయి. కాని వాయువు మాత్రం నిర్లిప్తం.”
నరేంద్రుడు: అవునండి.
శ్రీరామకృష్ణులు: అది గుణాతీతం, మాయాతీతం. అవిద్యామాయ, విద్యామాయలు రెండింటికీ అతీతం. కామినీ కాంచనాలు అవిద్య. జ్ఞానం, వైరాగ్యం, భక్తి – ఇవన్నీ విద్యామాయకు చెందిన సంపదలు. శంకరాచార్యులు విద్యామాయను నిలుపుకొని ఉండేవారు. నువ్వు, వీరందరూ నా కోసం ఇంతగా చింతిస్తున్నారు కదా – ఇది కూడా విద్యామాయే.
“విద్యామాయను పట్టుకొని వెళ్తే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. విద్యామాయ అనేది మెట్లు ఎక్కేటప్పుడు మిగిలివున్న ఆఖరి మెట్టు వంటిది. ఆ తరువాత డాబా ఉంటుంది. డాబా మీదకు చేరుకున్నాకకూడా కొందరు మెట్ల నుండి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అంటే జ్ఞానప్రాప్తి అనంతరం కూడా కొందరు లోకశిక్షణ నిమిత్తం ‘విద్యా నేను’ ను నిలుపుకుంటారు. ఇంకా, భక్తిని ఆస్వాదించడానికి, భక్తులతో క్రీడించడానికి వారు ఈ ‘విద్యానేను’ ను నిలుపుకుంటారు.”
నరేంద్రుడు: త్యాగం చేయడం గురించి మాట్లాడితే కొందరు నా పట్ల కోపం పూనుతారు.
శ్రీరామకృష్ణులు (మెల్లగా): త్యాగమన్నది ఆవశ్యకం.
పిదప తమ శరీర భాగాలను చూపిస్తూ ఆయన ఇలా అన్నారు: “ఒక వస్తువుపైన మరో వస్తువు పేర్చినప్పుడు క్రింది వస్తువును పొందాలంటే పైనున్న వస్తువును తొలగించాలి కదా! అది తొలగించకుండా క్రింది వస్తువు ఎలా లభిస్తుంది?”
నరేంద్రుడు: నిజమేనండి!
శ్రీరామకృష్ణులు (మెల్లగా నరేంద్రుడితో): సర్వం భగవన్మయంగా దర్శిస్తున్నప్పుడు అన్యంగా ఏమైనా కనిపిస్తుందా?
నరేంద్రుడు: సంసారాన్ని త్యజించవలసిందేనా?
శ్రీరామకృష్ణులు: ఇందాకే చెప్పాను కదా – సర్వం భగవన్మయంగా దర్శిస్తున్నప్పుడు అన్యంగా ఏమైనా కనిపిస్తుందా? అప్పుడు సంసారం గింసారం లాంటిది ఏదైనా కనిపిస్తుందా?
“అయితే నేను చెప్పేది మానసిక త్యాగం. ఇక్కడకు వచ్చే వారిలో సంసారులంటూ ఎవరూ లేరు. కొంతమందికి స్వల్పంగా కోరిక ఉంది – స్త్రీ పట్ల కోరిక. (రాఖాల్, ‘మ’ లు నవ్వారు) అది కూడా తీరిపోయింది.
49.9.2 నరేంద్రునిలో సమస్త భావాలూ ఉన్నాయి
శ్రీరామకృష్ణులు తదేకంగా నరేంద్రుడి వంకే చూస్తున్నారు. ఆయన హృదయం ప్రేమానందంతో ఉప్పొంగిపోతోంది. భక్తుల వైపు తిరిగి “చాలా” అన్నారు.
నరేంద్రుడు (నవ్వుతూ): ఏమిటా “చాలా” ?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మహాత్యాగానికి రంగం సిద్ధమవుతున్నట్లు నేను చూస్తున్నాను.
నరేంద్రుడు తదితరులు శ్రీరామకృష్ణుల వంకే చూడసాగారు. రాఖాల్ సంభాషణ కొనసాగించాడు.
రాఖాల్: నరేంద్రుడు ప్రస్తుతం మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవునవును. తక్కినవారు కూడా అనేకులు అర్థం చేసుకుంటున్నట్టుగా నేను చూస్తున్నాను.(‘మ’ తో) ఏమయ్యా ఏమంటావు?
‘మ’ : అవునండి.
శ్రీరామకృష్ణులు నరేంద్రుడు, ‘మ’ ల వంక చూస్తున్నారు. చేతితో సైగచేసి రాఖాల్ తదితర భక్తులకు వారిని చూపుతున్నారు. ముందుగా నరేంద్రుణ్ణి చూపించారు. తరువాత ‘మ’ ను చూపించారు. ఆయన సైగలను అర్థం చేసుకుని రాఖాల్ నవ్వుతూ ఇలా అన్నాడు: “మీరు చెప్పేది నరేంద్రుడిది వీరభావమని, ఈయనది (‘మ’ ది) సఖీభావమని. అంతే కదా!”
నరేంద్రుడు (నవ్వుతూ): ఈయన (‘మ’) ఎక్కువగా మాట్లాడడు. పైగా, సిగ్గు ఎక్కువ. బహుశా అందుకేనేమో అలా అంటున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, నరేంద్రుడితో): అది సరే, నా భావం ఏమిటో చెప్పు.
నరేంద్రుడు: వీరభావం, సఖీభావం, సమస్త భావాలూ ఉన్నాయి.
49.9.3 శ్రీరామకృష్ణులు ఎవరు?
ఈ మాట విని శ్రీరామకృష్ణులు దైవీభావమగ్నులైనారు. హృదయం మీద చెయ్యివేసుకొని నరేంద్రాది భక్తులతో ఇలా అన్నారు: “ఏమయితే ఉందో, అదంతా దీనిలో నుండే వచ్చినట్లుగా చూస్తున్నాను. (నరేంద్రుడితో) నువ్వు ఏమని అర్థం చేసుకున్నావు?”
నరేంద్రుడు: సృష్టింపబడ్డ పదార్థాలన్నీ మీలో నుండే వచ్చాయి అని.
శ్రీరామకృష్ణులు (ఆనందాతిశయంతో రాఖాల్తో): అతడేం చెప్పాడో విన్నావా?
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ఏదైనా పాట పాడమన్నారు. అతడిలో వైరాగ్య భావాలు చెలరేగుతున్నాయి. స్వరయుక్తంగా ఒక స్తోత్రం గానం చేయసాగాడు.
నళినీ దళ గత జలమతి తరళమ్ ।
తద్వజ్జీవిత మతిశయ చపలమ్ ॥
క్షణమపి సజ్జన సంగతి రేకా ।
భవతి భవార్ణవ తరణే నౌకా ॥
(భావం: పద్మపత్రం పైనున్న నీరు ఎంత అస్థిరమో, ఈ జీవితం కూడా అంతే అస్థిరం. సజ్జనులతోటి సాంగత్యం క్షణకాలమైనప్పటికీ అది సంసార సాగరాన్ని దాటింపచేసే నౌకలాంటిది.)
నరేంద్రుడు ఒకటి రెండు చరణాలు పూర్తి చేయగానే శ్రీరామకృష్ణులు సైగచేసి “అదేమిటి? అది అతిసామాన్య భావం” అన్నారు.
నరేంద్రుడు ప్రస్తుతం సఖీభావపు పాట పాడసాగాడు:
ఎంత వింత నెచ్చెలీ
చావు బ్రతుకు వింత విధులు
వ్రజకాంతుడు పారిపోయె
చెంతనుండి వింతగాను ॥ ఎం ॥
ఈ దీన వ్రజకాంత
ఎంతసేపో బ్రతుకదింక
నా కంటెను సుందరులను
మరిగినాడు మాధవుండు ॥ ఎం ॥
గొల్లవాని పిల్లనని
కల్లకపట మెరుగనని
నల్లవాడు నను మరచెను
అయ్యయ్యో! అన్యాయము ॥ ఎం ॥
అంత లేత వలపుగాడు
అంత దివ్యమైనవాడు
బయటి తళుకుబెళుకు చూచి
వారి వేడునొనుచునుండె ॥ ఎం ॥
ఇటులగునని ఎవ్వరైన
ఎంచినారె ఇతని గూర్చి
బుద్ధిలేని మందమతిని
ముందె ఊహచేయనైతి ॥ ఎం ॥
మోహమంది అతని అంద
మునకు మురిసిపోతి చెలియ
అతని పాదములను యెదకు
హత్తుకొనగ ఆర్తనైతి ॥ ఎం ॥
యమునలోన మునిగిపోయి
విషమునైన త్రాగివైతు
లతలు పేని మెడ బిగించి
పీకనైన పిసుకుకొందు ॥ ఎం ॥
తరుతమాల శాఖనుండి
మెడకు ఉరిని పోసికొందు ॥ ఎం ॥
ఏమి చేయలేని ఎడల
కృష్ణనామ భజనతోడ
ఈ నికృష్ట జీవనంబు
సర్వనాశనంబొనర్తు ॥ ఎం ॥
ఈ పాట విని శ్రీరామకృష్ణులు, భక్తులు ముగ్ధులైపోయారు. శ్రీరామకృష్ణుల, రాఖాల్ల కనుకొలకులనుండి ప్రేమాశ్రువులు రాలుతున్నాయి. పిదప నరేంద్రుడు వ్రజగోపికల భావంతో ఉన్మత్తుడై కీర్తన గానం చేశాడు:
చిన్ని కన్నయ్యా । నా ప్రేమ కన్నయ్యా
నా కృష్ణ కన్నయ్యా । నా వాడివి నీవయ్యా ।
నీకేమి చెప్పను? నేనేమి చెప్పను?
నే నాడుదానను, అదృష్టహీనను
చేతగాదు నా కేమి చెప్పను
నీ కేమి చెప్పుటో నేనేమి ఎరుగను । ॥ చి ॥
నా చేతి కద్దము నీవు కృష్ణయ్యా
నా శిఖన పుష్పము నీవు కన్నయ్యా
నిన్ను పూవుగా చేతు మిత్రమా
జడల మాటున ముడిచి దాచెద ॥ చి ॥
శిరము పైనను చేరియున్నను
నిన్ను చూడగా నేరరెవ్వరు ॥ చి ॥
నా పెదవి విడియము నీవు కృష్ణయ్యా
నా కనుల కాటుక నీవు కన్నయ్యా
పెదవు లెరుపుగా పండజేతును
కనుల కాటుక పెట్టుకొందును ॥ చి ॥
నా మేన చందనంబీవు కృష్ణయ్యా
నా కంఠహారము నీవు కన్నయ్యా
నిన్ను ఒడలికి పూసుకొందును
నా తనువు ప్రాణము చల్లబరుతువు ॥ చి ॥
నా సుగంధ పరిమళా! నా ప్రేమ కన్నయ్యా
నా చిన్ని కన్న, వన్నె కన్నయ్యా ॥ చి ॥
అందాల హారమా మెడను దాల్తును
నా మెడన ఊగుచు తూగుచుందువు
నా గుండె ఊయల ఊపుచుండగా
నా యెదన హాయిగా నిదురపోదువు ॥ చి ॥
నా దేహ పెన్నిధి నీవు కృష్ణయ్యా
నా గృహ నివాసివి నీవు కన్నయ్యా
ఎగురు పక్షికి రెక్కలెట్టులొ
ఈదు చేపకు నీరమెట్టులొ
నీవు నా కటు ఓ ప్రభువతంసమా ॥ చి ॥