47.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తులతో శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులు
సోమవారం, అక్టోబర్ 26, 1885
సమయం ఉదయం పదిగంటలు కావస్తోంది. ‘మ’ శ్యాంపుకూర్లో పరమహంస శ్రీరామకృష్ణుదేవులు వసిస్తున్న ఇంటికి వచ్చాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, డా.సర్కార్‌కు ఆ సమాచారం తెలియపరచడానికి ఆయన వద్దకు వెళ్ళనున్నాడు ‘మ’.
శరత్కాలం. కొన్నిరోజుల క్రితం శ్రీరామకృష్ణుల భక్తులందరూ దుర్గాపూజ మహోత్సవాన్ని జరుపుకున్నారు. కాని వారు ఈ పండుగ వేడుకలను ఆనందంతో జరుపుకోలేకపోయారు. అందుకు కారణం, మూడు నెలలుగా శ్రీరామకృష్ణులు గొంతు వ్యాధితో బాధపడుతూండడమే. డాక్టర్లు ఈ వ్యాధి నయమయ్యేది కాదని నిర్ధారించారు. ఈ వార్తతో హతాశులైన శిష్యులు లోలోపలే కుమిలిపోతూ ఏకాంతంలో మౌనంగా కన్నీరు కారుస్తున్నారు. మనఃప్రాణాలు యావత్తూ సమర్పించుకొని అహేతుక కృపాసింధువు, పరమ పూజనీయులు, గురువరేణ్యులు అయిన శ్రీరామకృష్ణులకు సేవలు ఒనరిస్తున్నారు. నరేంద్రాది యువశిష్యులు గురుదేవులకు సేవాశుశ్రూషలు చేస్తూ, సర్వసంగ పరిత్యాగం ద్వారా త్యాగజీవన శిఖరాగ్రాలు చేరుకోవడానికి సోపానాలు అమర్చుకుంటున్నారు. భగవత్ సాక్షాత్కారమనే జీవిత లక్ష్యానికి వలసిన వైరాగ్యం తపస్సులనే పునాదులు వేసుకొంటున్నారు.
శ్రీరామకృష్ణులను దర్శింప భక్తులు ఎడతెరపి లేకుండా గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు. వ్యాధితో అమితంగా బాధపడుతున్నప్పటికీ ఆయన వారినందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ పరమశాంతిని పొందడానికి మార్గమేమిటో విసుగు చెందక విశదపరుస్తూనే ఉన్నారు. ఎంతయినా ఆయన కరుణాసాగరులు కదా! ఆయన దయకు సాటి లేదాయె! మానవాళి ఉద్ధరింపబడే దెలా, పరమ శ్రేయస్సును ప్రాప్తించుకునే దెలా అన్నదే అహర్నిశలూ ఆయన చింత. భగవత్ప్రసంగాలు వచిస్తూవుంటే ఆయన వదనం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తోంది. ఈ విధంగా నిర్విరామంగా సంభాషిస్తూండటం ఆయన వ్యాధిని ప్రకోపింప చేస్తోందన్న విషయం గమనించి డా.సర్కార్ ‘మీరు మాట్లాడకూడ’ దని కట్టడిచేశాడు. తరువాత “మీరు ఇతరులతో మాట్లాడకూడదు కాని నాతో మాట్లాడవచ్చునులే” అన్నాడు. శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడల్లా ఆరు, ఏడు గంటలు ఆయన సాంగత్యంలోనే గడుపుతూ ఆయన ముఖతా వెలువడే వచనామృతాన్ని తనివితీరా గ్రోలుతూంటాడు డాక్టర్.
“డాక్టరుగారికి ఏమని చెప్పాలి” అంటూ ‘మ’, శ్రీరామకృష్ణులను అడిగాడు. అందుకు ఆయన, “ఇవాళ కాస్త తేలికగా ఉంది. ఔషధం వల్లనో ఏమో? మరి అలాగయితే అదే ఔషధాన్ని తీసుకుంటే సరిపోతుంది కదా?” అన్నారు.
‘మ’ : నేను డాక్టరు వద్దకు వెళుతున్నాను. ఆయనకు పరిస్థితినంతా వివరిస్తాను. ఏది మంచిదో ఆయనే యోచించి చెబుతాడు.
శ్రీరామకృష్ణులు: రెండు మూడు రోజులుగా పూర్ణుడు రానేలేదు. మనస్సంతా అదోలా ఉంది.
‘మ’ (కాళీతో): కాళీ బాబూ, మీరు వెళ్ళి పూర్ణుణ్ణి పిలుచుకు రావచ్చు కదా!
కాళీ: ఇప్పుడే వెళ్తానండి.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): డాక్టరుగారి అబ్బాయి ఉత్తముడు. ఒకసారి రమ్మని చెప్పు.
47.2 ద్వితీయ పరిచ్ఛేదం ‘మ’, డా.సర్కార్ల సంభాషణ
‘మ’, డాక్టరు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆయన ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు మిత్రులతో కూర్చుని ఉన్నాడు.
డాక్టరు(‘మ’ తో): ఒక నిమిషం క్రితమే నీ గురించి వీరితో చెబుతున్నాను. పది గంటలకే వస్తానని చెప్పావు కదా! ఇంకా రాలేదేమిటా అని నేను ఒకటిన్నర గంటల నుండి ఎదురు చూస్తున్నాను. ఆయనకు ఏమీ కాలేదు కదా అని చింతిస్తూ ఉన్నాను. (మిత్రుడితో) ఆ పాట పాడమా?
మిత్రుడు పాడసాగాడు:
ఎన్నాళ్లు జీవించియున్నావొ అన్నాళ్లు
భగవాను నామ ప్రభావంబు ప్రకటింపు
దిగ్భ్రాంతిగొల్పు నాతని దివ్యతేజంబు
విశ్వంబు సర్వంబు వెల్గించుచున్నది ॥ ఎ ॥
పారంబుగానని పరమేశు ప్రేమంబు
అమృతవాహినులట్లు ఆనందమున నింపు
సర్వేశు కారుణ్య సంస్మరణ మాత్రమే
దీపింపజేయు నీ దేహావయవములన్ని ॥ ఎ ॥
మానవుం డాతని మహనీయ వర్ణనం
బేలాగు చేయును వివరించి తగురీతి!
విదళించు నాతని విస్తార కరుణయే
గడియ లోపల ఘోరదుఃఖజాలములన్ని ॥ ఎ ॥
కడలిలో పుడమిలో గగనంబు లోపల
ఈ భూమి యందలి యెల్ల ప్రాంతములందు
నిర్విరామంబుగా నిర్విశేషంబుగా
మానవుల్భగవంతు మహి వెదకుచున్నారు ॥ ఎ ॥
ఎంతగా వారలు వెదకుచున్నారలో
అడుగుచున్నారంత ఆశ్చర్యమున నెపుడు
‘ఎందున్న దాతని మొదలెందు నున్నది?
ఎందున్నదాతని తుది యెచట నున్నది?’ ॥ ఎ ॥
సత్యవిజ్ఞానపు వాసగృహం బతడు
నిత్యశాశ్వత జీవ అమృతతత్వ మాతడు
అనవరత జాగృత జ్ఞాననేత్రంబతడు
అకలంకమౌ యేకపావనత్వం బతడు ॥ ఎ ॥
ఏకమై, నిత్యమై, ఆనందఘనమైన
పరమేశు ముఖదర్శనంబుచే మన హృదయ
మందున్న వేదనామయమైన దుఃఖంపు
ఛాయలన్నియు బాగ తుడిచివేయగబడు ॥ ఎ ॥
డాక్టరు(‘మ’ తో): ఈ పాట ఎంత బాగుందో కదా!
‘మ’ : అవునండి. చాలా బాగుంది. హృదయాన్ని అనంత భావంతో నింపి వేసింది.
డాక్టరు (ఆప్యాయంగా): చాలా ఆలస్యమయిపోయింది. నువ్వు ఏమైనా తిన్నావా లేదా? నేను మాత్రం పది లోపే అన్న పానాలన్నింటినీ ముగించుకుంటాను. తరువాత రోగులను చూడడానికి బయలుదేరతాను. భోజనం చేయకుండా వెళ్తే ఒళ్ళు చచ్చుబడినట్లుంటుంది. అన్నట్లు మిమ్మల్నందరినీ ఒక రోజు భోజనానికి పిలుద్దా మనుకుంటున్నాను.
‘మ’ : అది చాలా బాగుంటుందండి.
డాక్టరు: అది సరే, దాన్ని ఇక్కడే ఏర్పాటు చేయమంటావా లేక అక్కడ శ్యాంపుకూర్ ఇంట్లోనా? అది మీరే నిర్ణయించండి.
‘మ’ : మహాశయా! ఇక్కడైనా సరే, లేక అక్కడైనా సరే. అందరమూ మీతో కలిసి ఆనందంగా భుజిస్తాం.
పిదప సంభాషణ కాళీమాత గురించి నడవసాగింది.
డాక్టరు: కాళీమాత సంథాల్ తెగకు చెందిన స్త్రీ.
‘మ’ బిగ్గరగా నవ్వసాగాడు. “మీకు ఈ సమాచారం ఎక్కడ లభించింది?” అన్నాడు.
డాక్టరు: నేను ఆ సంగతి ఎక్కడో విన్నట్లు గుర్తు. (‘మ’ నవ్వుతూనే ఉన్నాడు.)
నిన్న విజయ్‌కృష్ణ గోస్వామి తదితర భక్తులు శ్రీరామకృష్ణుల సమక్షంలో భావసమాధి నొందారు. డాక్టరు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. సంభాషణ దాని గురించి నడుస్తోంది.
డాక్టరు: ఆ, వారు భావావస్థ పొందారన్న సంగతి చూశాను. కాని అపరిమితంగా భావం కలగడం మంచిదేనంటావా?
‘మ’ : ‘భగవచ్చింతన ద్వారా కలిగే భావపారవశ్యత అపరిమితంగా ఉన్నప్పటికీ దాన్లో ఎలాంటి హానీ లేదు’ అంటారు పరమహంస దేవులు. ఇంకా ఆయన ఇలా అంటుంటారు: ‘మాణిక్యం నుండి వెలువడే జ్యోతి వెలుగును ప్రసాదిస్తుంది, దేహానికి ఉపశమనం కలుగజేస్తుంది; అంతేకాని అది దేహం కాలేలా చేయదు’.
డాక్టరు: మాణిక్యపు జ్యోతా! అది కూడా reflected light (పరావర్తనం చెందిన కాంతి)యే కదా!
‘మ’ : ఆయన ఇంకా ఇలా అంటారు: ‘అమృత సరోవరంలో మునగడం వలన మనిషి మరణించడు. భగవంతుడు అమృత సరోవరం. అందులో మునగడం మనిషికి ఎలాంటి హానీ కలిగించదు. అందుకు భిన్నంగా, భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే అది ఆతణ్ణి అమరుని చేస్తుంది’.
డాక్టరు: ఆ, ఆ మాట నిజమే.
డాక్టరు, ‘మ’ ఇద్దరూ బండిలో కూర్చున్నారు. ఇద్దరు ముగ్గురు రోగులను చూసిన తరువాత శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులను చూడ వెళ్ళనున్నాడు డాక్టరు. వారు బండిలో సంభాషణ కొనసాగించారు. డాక్టరు, మహిమాచరణ్ చక్రవర్తి అహంకారాన్ని గురించి ప్రస్తావించాడు.
‘మ’ : ఆయన శ్రీరామకృష్ణుల వద్దకు వస్తుంటాడు కదా! కాస్త అహంకారం ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలువబోదు. శ్రీరామకృష్ణుల సమక్షంలో జీవుడి అహంకారం చూర్ణమైపోతుంది. ఎందుకంటే, స్వయంగా ఆయన అహంకారశూన్యులు కదా! నిరహంకారం దగ్గరగా వచ్చేసరికి అహంకారం పలాయనమై పోతుంది. విద్యాసాగర్ మహాశయుడు ఎంత గొప్పవ్యక్తో మీకు తెలిసిందే కదా! అలాంటి వ్యక్తి శ్రీరామకృష్ణుల సమక్షంలో ఎంతటి వినయం, నమ్రత ప్రదర్శించాడని! శ్రీరామకృష్ణులు ఆయన్ను చూడడానికి బాదుర్బాగాన్ ఇంటికి వెళ్ళారు. విద్యాసాగర్‌తో సమావేశం ముగిశాక సెలవు తీసుకొనేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది. విద్యాసాగర్ తానే స్వయంగా లైబ్రరీ గదినుండి దీపం పట్టుకొని దారి చూపుతూ వచ్చి శ్రీరామకృష్ణులను బండి ఎక్కించాడు.బండి కదులుతున్నప్పుడు చేతులు జోడించి నిలబడ్డాడు.
డాక్టరు: ఈయన గురించి విద్యాసాగర్ అభిప్రాయం ఏమిటి?
‘మ’ : ఆ రోజు ఆయన ఎంతో భక్తిని ప్రదర్శించారు. కాని అటు తరువాత ఆయనతో మాట్లాడినప్పుడు వైష్ణవులు పేర్కొనే భావం వంటివి ఆయనకు అంతగా నచ్చనట్లు తెలిసింది. ఈ విషయంలో ఆయనకూడా మీలాంటివారే.
డాక్టరు: చేతులు జోడించడం, పాదాల మ్రోల శిరస్సు వంచి మ్రొక్కడం వంటి విషయాలు నాక్కూడా నచ్చవు. నా దృష్టిలో శిరస్సు, పాదాలు రెండూ ఒక్కటే. కాని ఎవరైనా పాదాలను వేరుగా భావిస్తే వారిని అలాగే చేసుకోనివ్వు.
‘మ’ : మీరు భావం వంటి వాటిని ఇష్టపడరు. శ్రీరామకృష్ణులు మిమ్మల్ని అప్పుడప్పుడు ‘లోతైన వ్యక్తి’ గా పేర్కొనడం కద్దు. బహుశా మీకు ఆ విషయం గుర్తు ఉండవచ్చు. నిన్న ఆయన మీతో చెప్పారు కదా – ఏనుగు ఒక చిన్న మడుగులోకి దిగితే అంతా చెల్లాచెదరైపోతుంది. కాని, ఒక పెద్ద చెరువులోకి దిగినట్లయితే అది అందులోకి దిగినట్లు కూడా తెలియరాదు. ‘లోతైన’ వ్యక్తిలో భావహస్తి ప్రవేశించినా అది ఆతడి మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. మీరు లోతైన హృదయం గలవారని ఆయన అంటారు.
డాక్టరు: I don’t deserve that compliment (నేను ఆ ప్రశంసకు అనర్హుణ్ణి). అయినా నాకు తెలీక అడుగుతాను – భావం మాత్రం ఏమిటి? అది కేవలం ఒక feeling (భావం) మాత్రమే కదా! ఇంకా, భక్తిలాంటి అన్యమైన భావాలు కూడా ఉన్నాయి. భావం అధికరించినప్పుడు కొందరు దాన్ని నిగ్రహించుకోగలరు. మరికొందరు అలా చేయలేరు.
‘మ’ : భావానికి సంబంధించి వివరణ ఇవ్వవచ్చు, ఇవ్వలేకుండానూపోవచ్చు. కాని మహాశయా, భావభక్తి అనేది అపూర్వమైనదన్న విషయం అంగీకరించవలసిందే. మీ లైబ్రరీలో నేను Stebbing on Darwinism (డార్విన్ సిద్ధాంతాలపై స్టెబింగ్) అన్న పుస్తకం చూశాను. స్టెబింగ్ అంటాడు – మానవుడి మనస్సు పరిణామక్రమం ద్వారా వచ్చినది కానివండి, లేకుంటే భగవంతుడి సృష్టే కానివ్వండి. అది అద్భుతమైనదే సుమా! theory of light (కాంతికి సంబంధించిన సిద్ధాంతం) నుండి ఆయన ఒక చక్కటి దృష్టాంతం ఇచ్చాడు. Whether you know the wave theory of light or not, light in either case is equally wonderful (కాంతి తరంగ సిద్ధాంతం మీకు తెలుసో లేదో కాని రెండు సందర్భాలలోనూ కాంతి అన్నది అద్భుతమైనదే సుమా)
డాక్టరు: ఆ, చూశాను. స్టెబింగ్, డార్విన్ సిద్ధాంతాలనూ అంగీకరిస్తాడు, భగవంతుణ్ణి కూడా అంగీకరిస్తాడు.
సంభాషణ శ్రీరామకృష్ణుల వైపుకు తిరిగింది.
డాక్టరు: ఆయన కాళీ ఉపాసకుడిగా ఉన్నట్టున్నారు.
‘మ’ : కాని ఆయన కాళీమాతకు అర్థం వేరు. వేదాలు పరబ్రహ్మమని పేర్కొనేదానిని ఆయన కాళీ అంటారు. మహమ్మదీయులు అల్లా అనేదానిని, క్రైస్తవులు గాడ్ (భగవంతుడు) అనేదానిని ఆయన కాళీ అంటారు. ఆయన అనేకమంది దేవుళ్ళను చూడరు. ఆయన చూసేది ఒకే భగవంతుణ్ణి. ప్రాచీన బ్రహ్మజ్ఞానులు బ్రహ్మమని పేర్కొనే దానిని, యోగులు ఆత్మ అని పిలిచే దానిని, భక్తులు భగవంతుడని ప్రార్థించే దానిని ఆయన కాళీ అంటారు.
“ఆయన చెప్పే ‘రంగు తొట్టె’ కథ మీరు విన్నారా? ఒక వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకపు ద్రావణం ఉండేది. దానితో అతడు ఎవరికి ఏ రంగు కావాలంటే ఆ రంగులో వస్త్రాలు అద్దకం చేసి ఇచ్చేవాడు – ఎరువు, నీలం, ఆకుపచ్చ – అలా ఏ రంగు కావాలంటే అది. ఈ తతంగమంతా చూస్తున్న ఒక వ్యక్తి వచ్చి ఇతడితో ‘అయ్యా, మీరు ఏ రంగుతోనైతే ఈ వస్త్రాల నన్నిటినీ అద్దకం చేస్తున్నారో నాకు ఆ రంగు కావాలి’ అన్నాడు.
“అదే విధంగా శ్రీరామకృష్ణులలో సర్వభావాలూ, సర్వయోగాలూ సమ్మిళితమై ఉన్నాయి. అందుకే అన్ని సంప్రదాయాలకూ, అన్ని మతాలకూ చెందిన జనం వచ్చి ఆయన వద్ద శాంతిని, ఆనందాన్ని పొందుతారు. ఆయన భావాలు ఎంత అగాధమైనవో, ఆధ్యాత్మిక అనుభవాలు ఎంత అపారమైనవో ఎవరు తెలుసుకోగలరు?”
డాక్టరు: All things to all men (అందరికీ అన్ని విషయాలు) – అని సెయింట్ పాల్ చెప్పివుండవచ్చు కాని దేనిని నేను అంగీకరించను.
‘మ’ : శ్రీరామకృష్ణుల మనోస్థితి ఏమిటో అవగతం చేసుకొనే వారెవరు? నూలు వ్యాపారంలో ఉన్నవాడు మాత్రమే 40 వ నంబరు 41 వ నెంబరు నూలుల మధ్య ఉన్న తేడాను చెప్పగలడని ఆయన అంటుంటారు. స్వయంగా చిత్రకారులం కానిదే మరో చిత్రకారుడి కళను ప్రశంసించలేం. మహాపురుషుల హృదయం అగాధమైనది (గంభీరమైనది). మనం కూడా క్రీస్తులా కానిదే క్రీస్తు యొక్క సమస్త భావాలనూ అర్థం చేసుకోలేము. క్రీస్తు కూడా చెప్పేవాడు కదా – Be perfect as your Father in heaven is perfect (స్వర్గంలో ఉన్న నీ పితవలె నువ్వు కూడా పరిపూర్ణుడివికా).
డాక్టరు: ఆయన బాగోగులు చూడడానికి మీరు ఏం ఏర్పాట్లు చేశారు?
‘మ’ : ప్రస్తుతం వయస్సులో కాస్త పెద్దవారైన భక్తులు రోజుకు ఒక్కరు చొప్పున ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. ఒక రోజు గిరీశ్‌బాబు, ఒక రోజు రాంబాబు, ఒక రోజు బలరాంబాబు, ఒక రోజు సురేశ్ బాబు, ఒక రోజు నవగోపాల్, ఒక రోజు కాళీబాబు – ఆ విధంగా.
47.3 తృతీయ పరిచ్ఛేదం శుష్క పాండిత్యంతో ఒరిగేదేముంది?
ఈ విధంగా మాట్లాడుతూ వారు శ్యాంపుకూర్ ఇంటిని చేరుకొనేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. డా.సర్కార్, ‘మ’ లు ఇద్దరూ రెండవ అంతస్తులోని శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లారు. వ్యాధిని పూర్తిగా మరచిపోయి ఆయన ఎప్పటిలాగా బ్రహ్మానందంలో ఓలలాడుతూ కనిపించారు. గిరీశ్ ఘోష్, చిన్న నరేంద్రుడు, శరత్ మొదలైన భక్తులు పలువురు ఆ మహాయోగి సమక్షంలో మంత్రముగ్ధులై కూర్చుని ఆయన వచనామృతాన్ని గ్రోలుతున్నారు. ‘మ’, డాక్టరులు ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నారు. డాక్టరును చూడగానే ఆయన నవ్వుతూ “ఇవాళ చాలా తేలికగా ఉంది” అన్నారు.
పిదప ఆయన, భక్తులతో తమ ఆధ్యాత్మిక ప్రసంగాలను కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: వివేక వైరాగ్యాలు లేకుండా వట్టి పాండిత్యంతో ఒరిగేదేముంది? భగవంతుడి పాదపద్మాల గురించి చింతన చేస్తూ నేను ఒక విశేష స్థితిని పొందుతూంటాను. అప్పుడు కట్టుకున్న పంచె జారిపోతుంది. నా పాదాల నుండి తల వరకు ఏదో సరసరమంటూ ప్రాకుతూ పోతున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థితిలో సమస్తం గడ్డిపోచలా తోస్తుంది. వివేకమనేది లేకుండా భగవంతుడిపట్ల ప్రేమ అంటూ లేని పండితుణ్ణి చూస్తే నాకు ఆతడు గడ్డిపోచలా తోస్తాడు.
47.3.1 డా. రామ్ నారాయణ్ – బంకిమ్ చంద్ర చటర్జీ
“ఒక రోజు రామ్ నారాయణ్ డాక్టరు నాతో వాదిస్తున్నాడు. అప్పుడు నాకు ఉన్నట్టుండి అలాంటి స్థితి కలిగింది. అతడితో నేను ఇలా అన్నాను: ‘ఏమిటి నువ్వు అంటున్నది? భగవంతుణ్ణి తర్కం ద్వారా అర్థం చేసుకోగలవా ఏమిటి? ఆయన సృష్టి గురించి మాత్రం నువ్వు ఏం తెలుసుకోగలవు? నీదంతా కుయుక్తులతో కూడిన బుద్ధి’. నా మనోస్థితిని చూసి అతడు ఏడ్వసాగాడు; నా పాదాలు ఒత్తసాగాడు.
డాక్టరు: రామ్ నారాయణ్ నిష్ఠాగరిష్ఠుడైన హిందువు, అందుకే అలా చేశాడు. పువ్వులు, చందనం మొదలైన వాటిని సమర్పించడంలో విశ్వాసం ఉన్నవాడు.
మ (స్వగతం): శంఖం, గంటలు ఇత్యాదులతో నాకు పనిలేదని డాక్టరు చెబుతున్నాడు.
శ్రీరామకృష్ణులు(డాక్టరుతో): బంకిమ్ (బంకించంద్ర ఛటోపాధ్యాయ) మీకు చెందిన పండితుడే కదా! ఒకసారి నేను అతణ్ణి కలుసుకున్నాను. ఆతడితో నేను మానవుడి కర్తవ్యమేమిటి అని అడిగాను. అందుకు అతడు ‘ఆహార నిద్రామైధునాలు’ అని జవాబిచ్చాడు. ఆ మాటలు విని నాకు రోత పుట్టింది. అతడితో ఇలా అన్నాను: ‘ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఎంతటి అల్పబుద్ధివి! రాత్రింబవళ్ళు దేని గురించి ఆలోచిస్తుంటావో, ఏమైతే చేస్తుంటావో అదే నీ నోట వెలువడుతోంది. ముల్లంగి తింటే ముల్లంగి త్రేన్పులే వస్తాయి’. అటు తరువాత భగవత్ప్రసంగాలు జరిగాయి. ఇంట్లో సంకీర్తన జరిగింది. నేను నాట్యం కూడా చేశాను. అప్పుడు బంకిమ్ నాతో ‘మహాశయా, మీరు మా ఇంటిక్కూడా ఒకసారి రావాలి’ అన్నాడు. అందుకు నేను ‘అది భగవంతుడి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది’ అన్నాను. ‘అక్కడ కూడా భక్తులు ఉన్నారు. మీరు వచ్చి వారిని చూడాలి’ అన్నాడతడు. నేను నవ్వుతూ ‘ఎలాంటి భక్తులు? ‘గోపాల్, గోపాల్’ – అనేటటువంటి భక్తులా?’ అన్నాను.
47.3.2 ‘గోపాల్, గోపాల్’ కథ
డాక్టరు: ‘గోపాల్, గోపాల్’ – ఏమిటా కథ?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): స్వర్ణకారుడి దుకాణం ఒకటి ఉండేది. అతడు కంఠంలో మాల, నొసట తిలకం, చేతిలో జపమాల పట్టుకొని గొప్ప భక్తుడిలా, అపర వైష్ణవుడిలా అగుపించేవాడు. జనులందరూ అతడి పట్ల విశ్వాసంతో అతడి దుకాణానికే వచ్చేవారు. ఆతడు పరమభక్తుడనీ, జనులను ఎన్నటికీ మోసగించడనీ తలచేవారు. దుకాణంలోకి కొనుగోలుదారులు రాగానే ఒక పనివాడు ‘కేశవ! కేశవ!’ అంటాడు. కాసేపటి తరువాత మరొక పనివాడు ‘గోపాల! గోపాల!’ అంటాడు. ఇంకాసేపటి తరువాత మరొక పనివాడు ‘హరి! హరి!’ అంటాడు. కొన్ని క్షణాల తరువాత మరొకడు ‘హర!హర!’ అంటాడు. ఇంతగా భగవంతుడి నామసంకీర్తన జరుగుతూండడం చూసి సహజంగానే కొనుగోలుదారులందరు ‘ఈ స్వర్ణకారుడు సజ్జనుడు’ అని తలచేవారు. కాని అసలు విషయం ఏమిటో తెలుసా? ‘కేశవ! కేశవ!’ అన్న వ్యక్తి వాస్తవానికి ‘వీరందరూ ఎవరు? (కే సబ్)’ అని అడుగుతున్నాడు. రెండవ పనివాడు ‘గోపాల! గోపాల!’ అనడంలోని అంతరార్థం ఏమిటంటే, ‘నేను వీరిని బాగా పరిశీలించి చూశాను. వీరు కేవలం ఆవుల మందలాంటి వారే (మూర్ఖులు, మందమతులు) అని (నవ్వులు). ‘హరి!హరి!’ అంటున్న మూడవ వ్యక్తి వీరు కేవలం ఆవులమంద లాంటి వారు మాత్రమే అయినప్పుడు మరి వీరిని హరిద్దామా (అంటే దోచుకుందామా) అని అడుగుతున్నాడు. (నవ్వులు) ‘హర, హర’ అన్న వ్యక్తి ‘ఆ, హరించండి, హరించండి. ఇది వట్టి ఆవుల మందే కదా!’ అనే భావంతో తన అనుమతిని ప్రకటిస్తున్నాడు. (అందరూ నవ్వారు)
47.3.3 మూర్ఖుడు విద్వాంసుడైపోతాడు!
“ఒకసారి నేను మథుర్బాబుతో కలసి ఒక చోటికి వెళ్ళాను. నాతో వాదించడానికి పలువురు పండితులు అక్కడికి వచ్చి ఉన్నారు. మరి నేనేమో మూర్ఖుడినన్న సంగతి మీకందరికీ తెలిసినదే కదా! (అందరూ నవ్వారు) ఆ పండితులు నా ఆ వినూత్నావస్థను చూశారు. సంభాషణ ముగిసిన తరువాత నాతో ఇలా అన్నారు: ‘మహాశయా, మీతో మాట్లాడిన తరువాత గతంలో మేము అధ్యయనం చేసినదంతా – మా పాండిత్యం, జ్ఞానం అంతా– గడ్డిపోచలా తోస్తోంది. భగవంతుడి కృప ఉన్నట్లయితే జ్ఞానానికి కొరత అనేది ఉండదన్న విషయం మాకు ఇప్పుడు అవగతమవుతోంది. మూర్ఖుడు విద్వాంసుడైపోతాడు, మూగవాడు కూడా మాట్లాడడం ప్రారంభిస్తాడు’. అందుకే కేవలం పుస్తకాలు అధ్యయనం చేయడం వల్ల ఎవరూ విద్వాంసులు కాలేరని నేను చెబుతూ ఉంటాను.
“ఆ, ఆ మాట నిజమే. భగవత్కృప కలిగినట్లయితే జ్ఞానానికి కొదవ ఉంటుందా ఏమిటి? నా విషయమే తీసుకోండి. నేనా మూర్ఖుణ్ణి! నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. మరి ఈ పలుకుల నన్నిటినీ మాట్లాడుతున్నది ఎవరు?ఈ జ్ఞానభాండాగారమనేది ఎన్నటికీ తరగనిది. కామార్పుకూర్లో ధాన్యం వ్యాపారస్థులు ఉన్నారు. ధాన్యం కొలిచేటప్పుడు వారు ‘రాం రాం, రాం రాం’ అంటూంటారు. ఒక వ్యక్తి కొలుస్తుంటాడు; అది పూర్తయ్యేలోపునే మరో వ్యక్తి కుప్ప నింపుతాడు. కుప్ప అయిపోగానే దానిని నింపుతూండడమే రెండవ వ్యక్తి పని. నా సంగతి కూడా అంతే. నేను మాట్లాడుతున్నప్పుడు, పూర్తి కావచ్చినప్పుడు అమ్మ తటాలున తన అక్షయ జ్ఞానభాండాగారం నుండి కుప్పను నింపి వేస్తుంది.
47.3.4 శ్రీరామకృష్ణుల ప్రప్రథమ సమాధి స్థితి
“బాల్యంలో నాలో భగవంతుడే స్వయంగా వ్యక్తీకృతుడైనాడు. అప్పుడు నా వయస్సు పదకొండు సంవత్సరాలు. ఒక రోజు నేను వరి పొలాల నడుమ నడిచి పోతూవుండగా ఏదో చూశాను. నేను స్పృహతప్పి పడిపోయానని, ఎలాంటి కదలిక లేకుండా పడి ఉన్నానని తరువాత అందరూ చెప్పారు. ఆ రోజునుండే నేను పూర్తిగా మరోలా అయిపోయాను. నాలోనే మరో వ్యక్తిని చూడసాగాను. ఆలయంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ చెయ్యి చాలాసార్లు దేవుడి వైపుకు వెళ్ళడానికి బదులుగా నా శిరస్సు వైపుకే వెళ్ళేది; పువ్వులను శిరస్సుపై ఉంచేది. అప్పుడు నాతోపాటు ఉంటున్న కుర్రాడు నా వద్దకు వచ్చేవాడు కాదు. ‘నీ ముఖంలో ఏదో జ్యోతి కానవస్తోంది. నీకు అతిసమీపంగా రావాలంటే నాకు భయం వేస్తోంది’ అనేవాడు.”
47.4 చతుర్థ పరిచ్ఛేదం స్వతంత్రేచ్ఛ – భగవదేచ్ఛ
శ్రీరామకృష్ణులు : “నేనో మూర్ఖుణ్ణి! నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. మరి ఇవన్నీ మాట్లాడుతున్నది ఎవరు? నేను అమ్మతో ఇలా అంటాను: ‘అమ్మా, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను రథాన్ని, నువ్వు సారథివి; నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను. ఎలా పలికిస్తే అలా పలుకుతాను. నాహం, నాహం. తుహు, తుహు’. విజయం ఆమెకు చెందినదే. నేను కేవలం యంత్రం లాంటివాణ్ణి. ఒకసారి రాధాదేవి వెయ్యి రంధ్రాలున్న నీటి కుండను నెత్తిమీద పెట్టుకొని వెళుతోంది. కాని నీరు ఒక బొట్టుకూడా కారలేదు. అప్పుడు అందరూ “ఇటువంటి శీలవతి మళ్లీ మనకు లభించదు” అంటూ ఆమెను ప్రశంసించసాగారు. అందుకు రాధాదేవి ఇలా అంది: ‘మీరు నన్నెందుకు ప్రశంసిస్తారు? మీరు ‘కృష్ణుడికి జై, కృష్ణుడికి జై’ అనండి. నేను కేవలం ఆతడి దాసిని మాత్రమే.”
‘ఒకసారి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను విజయ్ ఛాతిమీద పాదాలను మోపాను. విజయ్ అంటే నాకు ఎంత గౌరవమో మీకు తెలిసిందే కదా! అలాంటిది, ఆ విజయ్ ఛాతీ మీదే పాదాల నుంచాను. దీనికి మీరేమంటారు?”
డాక్టరు: కాని ప్రస్తుతం జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం.
శ్రీరామకృష్ణులు (చేతులు జోడించి): నేనేం చెయ్యను? అలాంటి స్థితి కలిగినప్పుడు నేను స్పృహ కోల్పోతాను. అప్పుడు ఏం చేస్తున్నానో నాకు బొత్తిగా తెలియదు.
డాక్టరు: జాగ్రత్తగా ఉండడమే మంచిది. ప్రస్తుతం చేతులు జోడించడం వల్ల ఏమిటి ప్రయోజనం?
శ్రీరామకృష్ణులు: ఆ స్థితిలో నా అంతటగా నేను ఏమైనా చేయగలనా? ఆ స్థితి గురించి ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు ఇదంతా ఒక కపట నాటకంగా భావించి నట్లయితే నీ సైన్సు, గీన్సులు అన్నీ బూడిదతో సమానం అంటాను.
డాక్టరు: మహాశయా, ఇదంతా కపట నాటకంగా భావించే పక్షంలో ఇంతగా నేను ఇక్కడకు ఎందుకు వస్తాను? నా పనులన్నిటినీ వదలి నేను ఇక్కడకు వస్తున్నాను. ఈ కారణంగా ఎంతోమంది రోగుల ఇళ్ళకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడకు వచ్చి ఆరు లేక ఏడు గంటలు ఏకబిగిన గడుపుతున్నాను.
47.4.1 ‘భగవంతుడే ‘కర్త’ – కృష్ణార్జునులు
శ్రీరామకృష్ణులు: మథుర్బాబుతో నేను ఒకసారి ఇలా అన్నాను: ‘నువ్వొక సంపన్నుడివి; నన్ను గౌరవిస్తున్నందువల్ల నేను కృతార్థుడినైపోయానని నువ్వు ఎన్నటికీ తలచవద్దు. నువ్వు నాకు గౌరవం ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. అంతే!’ కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి – కేవలం మనిషి ఏం చేయగలడు? ఒక వ్యక్తిని మరో వ్యక్తి గౌరవించేలా చేసేది ఆ భగవంతుడే. భగవంతుడి శక్తిముందు మనిషి కేవలం గడ్డిపోచలాంటివాడు మాత్రమే.
డాక్టరు: ఎవరో ఫలానా బెస్తవాడు* మీకు విధేయుడైనాడు కాబట్టి నేనూ విధేయుడనని అనుకుంటున్నారా ఏమిటి?….. మీకు నేను గౌరవం ఇస్తానన్న మాట నిజమే. అయితే నేను ఒక వ్యక్తిగా గౌరవం ఇస్తాను.
శ్రీరామకృష్ణులు: ఏమయ్యా, నాకు గౌరవం ఇవ్వమని నీతో చెబుతున్నానా ఏమిటి?
గిరీశ్ఘోష్: తనకు గౌరవం చూపించమని ఈయన మీకు చెప్పడం లేదు కదా?
డాక్టరు (శ్రీరామకృష్ణులతో): దీన్ని మీరు ఏమంటారు? భగవదేచ్ఛ అంటారా?
శ్రీరామకృష్ణులు: కాకపోతే మరి ఏమిటి? భగవంతుడి శక్తి ముందు మనిషి ఏం చేయగలడు? అర్జునుడు శ్రీకృష్ణుడితో కురుక్షేత్రంలో ఇలా అన్నాడు: ‘నేను యుద్ధం చెయ్యను. నా వాళ్ళనే చంపడం నా వల్ల కాని పని.’ అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ‘అర్జునా! నువ్వు యుద్ధం చేయవలసిందే. నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయిస్తుంది.’ యుద్ధభూమిలో ఉన్నవారందరూ ఇదివరకే మరణించి ఉన్నారన్న విషయం శ్రీకృష్ణుడు అర్జునుడికి దర్శింపచేశాడు.
“ఒకసారి కొందరు సిక్కులు దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చారు. వారు ఇలా అన్నారు: ‘రావిచెట్టు ఆకులు కదలాడుతున్నాయి కదా! అవి అలా కదలాడడం కూడా భగవత్సంకల్పం వల్లనే.’ ఆయన సంకల్పం లేకుండా ఒక్క ఆకు కూడా కదలాడదు.
డాక్టరు: సర్వమూ భగవత్సంకల్పమే అయినప్పుడు మరి మీరు ఇంతగా ఎందుకు మాట్లాడుతూంటారు? లోకులకు జ్ఞానప్రదానం చేయడానికి ఇన్ని మాటలు ఎందుకు చెబుతారు?
శ్రీరామకృష్ణులు: ఆయన పలికిస్తాడు కాబట్టి పలుకుతాను. నేను యంత్రం ఆయన నడిపేవాడు.
డాక్టరు: మీరు యంత్రాన్ని అంటున్నారు, అది బాగానే ఉంది. లేకుంటే, సర్వం భగవంతుడిగానే తలచి మౌనంగా ఉండండి.
గిరీశ్ (డాక్టరుతో): అయ్యా, మీరు మీకు నచ్చినట్లు భావించుకోవచ్చు. అయితే వాస్తవం ఏమిటంటే భగవంతుడు మనచేత చేయిస్తాడు కాబట్టే మనం చేస్తాము. ఆయన సంకల్పానికి విరుద్ధంగా మనం కనీసం ఒక్క అడుగైనా వేయగలమా?
డాక్టరు: Free will (స్వతంత్రేచ్ఛ) ఇచ్చింది భగవంతుడే కదా! మరి అలాంటప్పుడు నాకు ఇష్టం ఉంటే భగవచ్చింతన చేస్తాను, లేకుంటే లేదు.
గిరీశ్: భగవచ్చింతన కానివ్వండి, మరేదైనా సత్కార్యమే కానివ్వండి – అది మీకు మంచిదని తోస్తోంది కాబట్టే మీరు చేస్తారు. వాస్తవానికి ఆ పనులను స్వయంగా చేయడం లేదు. అవి మంచివని తోస్తున్నాయి కాబట్టే చేస్తారు.
డాక్టరు: అలా ఎందుకు అనుకోవాలి? నేను వాటిని నా కర్తవ్యంగా ఎంచి చేస్తాను.
గిరీశ్: ఆ కర్తవ్య నిర్వహణ మంచిదని మీకు తోస్తోంది కాబట్టే మీరు చేస్తారు.
డాక్టరు: ఎవరైనా పిల్లవాడు మంటల్లోపడి కాలిపోతున్నాడనుకో. అప్పుడు అతణ్ణి కాపాడటం నా కర్తవ్యంగా భావించే నేను చేస్తాను.
గిరీశ్: పిల్లవాడిని కాపాడడంలో మీకు ఆనందం లభిస్తుంది. అందుకే మీరు మంటలలోకి దూకుతారు. మిమ్మల్ని అలా ఆ పని చేయడానికి పురికొల్పేది ఆ ఆనందమే. మిఠాయిలు తినాలన్న కోరికతో ముందుగా నల్లమందు తినడం లాంటిది ఇది. (అందరూ నవ్వారు)
47.4.2 “జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా” – ‘భూమిలోని నాణాల బిందె’ దృష్టాంతం
శ్రీరామకృష్ణులు: వ్యక్తి ఏదైనా పనిని తలపెట్టేముందు అతడికి విశ్వాసమనేది కావలసి ఉంటుంది. అప్పుడు ఆ వస్తువు గురించి తలచుకోగానే ఆనందం కలుగుతుంది. అప్పుడే ఆతడు ఆ పనిచేయడానికి సంసిద్ధుడవుతాడు. బంగారు నాణేలున్న బిందె ఒకటి భూమిలో పూడ్చబడి ఉందనుకోండి. మొదట్లో ఈ జ్ఞానం, ఈ విశ్వాసం ఎంతయినా అవసరం. బిందెను గురించి తలచుకోగానే ఆ జ్ఞానం ఉన్న వ్యక్తికి ఆనందం కలుగుతుంది. ఆ తరువాత అతడు త్రవ్వడం ఆరంభిస్తాడు. అలా తవ్వుతూన్నప్పుడు ‘టంగ్’ అనే శబ్దం రాగానే అతడి ఆనందం అధికరిస్తుంది. పిదప అతడు ఆ బిందె అంచును చూస్తాడు. అప్పుడు ఆనందం మరింతగా పెరుగుతుంది. ఆ విధంగా ఆనందం క్రమక్రమంగా అధికరిస్తూ వస్తుంది. సాధువులు గంజాయి సిద్ధం చేసుకోవడం నేను కాళీఆలయం వసారాలో నిలబడి చూశాను. అలా సిద్ధం చేసుకొనేటప్పుడు వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయేవి.
డాక్టరు: కాని అగ్ని విషయమే తీసుకోండి. అది వేడిమి, వెలుగు రెండింటినీ ఇస్తుంది. వెలుగులో మనం వస్తువులను చూడగలమన్నమాట నిజమే కాని వేడిమి కారణంగా దేహం కాలుతుంది. అదే విధంగా కర్తవ్యం నిర్వహించడానికి వెళ్తే కేవలం ఆనందమే లభ్యమవుతుందని ఏమీ లేదు. అందులో కష్టాలు కూడా ఉంటాయి.
‘మ’ (గిరీశ్‌తో): ఒక సామెత ఉంది కదా – ‘కడుపు నిండా అన్నం పెడితే అప్పుడు వీపు కూడా ఆ అన్నదాత పిడిగుద్దులను భరిస్తుంది.’ కష్టాలలో కూడా ఆనందం ఉంటుంది.
గిరీశ్ (డాక్టరుతో): కర్తవ్యం అనేది శుష్కమైనది.
డాక్టరు: ఎందుకు?
గిరీశ్: మరైతే అది రుచికరమైనదేననుకోండి. (అందరూ నవ్వారు)
‘మ’ : మళ్ళీ మనం మిఠాయిల కోసమని కక్కుర్తిపడి నల్లమందు తీసుకొనే విషయానికే వచ్చాం.
గిరీశ్ (డాక్టరుతో): కర్తవ్యమనేది రుచికరంగానే ఉండాలి. లేకుంటే దాన్ని ఎందుకు చేస్తున్నట్లు?
డాక్టరు: మనస్సు ఆ విధంగా మ్రొగ్గి ఉంటుంది.
47.4.3 స్వతంత్రేచ్ఛ – శ్రీరామకృష్ణులు
‘మ’ (గిరీశ్‌తో): మనోస్వభావం ఆ విధంగా మనస్సును పట్టి లాగు తుంటుంది. మనస్సు ఆ విధంగా మ్రొగ్గివున్న పక్షంలో మరి Free will (స్వతంత్రేచ్ఛ) ఏమయినట్లు?
డాక్టరు: ఇచ్ఛ అనేది పూర్తిగా స్వతంత్రమైనదని నేను చెప్పడం లేదు. ఒక ఆవు తాడుతో గుంజకు కట్టబడి ఉందనుకో. అప్పుడు ఆ తాడు పొడవు ఎంతయితే ఉందో అంత దూరంలోపే ఆవు Free గా (స్వతంత్రంగా) ఉంటుంది. కాని ఆ తాడు పొడవు సరిపోనప్పుడు–
శ్రీరామకృష్ణులు: యదుమల్లిక్ కూడా ఇదే ఉదాహరణ చెప్పాడు. (చిన్న నరేంద్రుడితో) ఈ ఉదాహరణ ఏదైనా ఆంగ్ల పుస్తకంలో ఉందా?
(డాక్టరుతో) “ఇలా చూడు. భగవంతుడే సమస్తం చేస్తున్నాడు. ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని – ఈ విశ్వాసం ఎవరికైనా కలిగినట్లయితే ఆతడు జీవన్ముక్తుడే సుమా! ‘నీ పనులను నీ వొనరుప తాజేసితిమని తలతురు!’ ఇది ఎలాంటిదో తెలుసా? వేదాంతంలో ఒక చక్కటి దృష్టాంతం ఉంది. కుండలో అన్నం వండుతున్నావనుకో. అందులోకే బంగాళాదుంపలు, వంకాయలు పడేశావనుకో. కాసేపట్లోనే అన్నం, బంగాళాదుంపలు, వంకాయలు అన్నీ కుండలో గెంతులు వేయడం మొదలుపెడతాయి. అది ‘మేము కదలాడుతున్నాం, మేము గెంతులు వేస్తున్నాం’ అని అహంకరిస్తున్నట్లు తోస్తుంది. చిన్న పిల్లలు వాటిని చూసి బంగాళాదుంపలు, వంకాయలు, అన్నం నిజంగానే జీవంతో ఉన్నవనీ, అందుకనే అవి అలా గెంతులు వేస్తున్నవనీ భావిస్తారు. కాని జ్ఞానం కలిగిన అంటే వాటి సంగతి తెలిసివున్న పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు ‘ఆ బంగాళాదుంపలు, వంకాయలు, అన్నం సజీవమైనవి కావు, అవి తమంతట తామే గెంతులు వేయడం లేదు, క్రిందవున్న మంట కారణంగానే అవి అలా ఎగురుతున్నాయి. పొయ్యిలోనుండి మండుతున్న కట్టెను కనుక తీసివేస్తే అవి ఇక ఎంతమాత్రం కదలాడవు’ అని వివరిస్తారు. అదే విధంగా జీవుడి ‘నేను కర్తను’ అనే అహంకారం అజ్ఞానం నుండి జనిస్తుంది. భగవంతుడి శక్తి మూలంగానే అందరూ శక్తిమంతులు. మండుతున్న కట్టెను తీసివేయగానే అంతా స్తబ్ధు అయిపోతుంది. తీగ ద్వారా లాగబడినప్పుడు తోలుబొమ్మలు రంగస్థలం మీద చక్కగా నాట్యం చేస్తాయి. కాని తీగ తెగిపోయినప్పుడు అవి ఇక కదలవు, మెదలవు.
“భగవద్దర్శనం కానంతవరకు, పరుసవేది స్పృశించనంతవరకు ‘నేను కర్తను’ అన్న భ్రమ ఉంటుంది. ‘నేను మంచి పనులు చేస్తున్నాను, చెడ్డపనులు చేస్తున్నాను’ అన్న ఎరుక ఉంటుంది. ఆ విధంగా, అవి వేర్వేరు అన్న ఎరుక భగవంతుడి మాయ వల్లనే కలుగుతుంది. తన మాయా సంసారాన్ని నడిపించడానికి భగవంతుడు ఈ విధమైన ఏర్పాట్లు చేశాడు. విద్యామాయను ఆశ్రయించడం ద్వారా, సన్మార్గాన్ని అనుసరించడం వల్లా ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు, ఆయన్ను దర్శించుకున్నవాడు మాత్రమే మాయను దాటిపోగలడు. ‘భగవంతు డొక్కడే కర్త, నేను అకర్తను’ అన్న విశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఆతడే జీవన్ముక్తుడు. నేను కేశవ్సేన్కు ఈ సంగతే చెప్పాను.”
గిరీశ్ (డాక్టరుతో): స్వతంత్రేచ్ఛ ఉన్నదన్న సంగతి మీకు ఎలా తెలుసు?
డాక్టరు: Reasoning (విచారణ) ద్వారా కాదు. I feel it (దాన్ని నేను అనుభూతి నొందుతాను).
గిరీశ్: మరయితే మేము తద్విరుద్ధంగా అనుభూతి పొందుతాము. మమ్మల్ని ఎవరో నియంత్రిస్తున్నట్లు భావిస్తాం. (అందరూ నవ్వారు.)
డాక్టరు: కర్తవ్య నిర్వహణలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, కర్తవ్యాన్ని కర్తవ్యంగా భావించి చేయడం. రెండు, ఆనందం కోసం చేయడం. కాని ప్రారంభ స్థితిలో, మనం కర్తవ్యాన్ని నిర్వహించేది ఆనందం లభిస్తుందన్న ఉద్దేశంతో కాదు. భగవంతుడికి సమర్పించిన మిఠాయిలో చీమలు చూసి పూజారి ఎంతగానో బాధపడిపోయేవాడు. ఈ సంగతి నేను బాల్యంలో గమనించాను. అందువల్ల పూజారి మిఠాయిలు చూడగానే ఆనందించేవాడు కాదు. అతడు కలత చెందేవాడు.
‘మ’ (స్వగతం): కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు ఆనందం కలుగుతుందా లేక తరువాత కలుగుతుందా అన్న సంగతి చెప్పడం కష్టం. ఆనందం కావాలనే ఉబలాటంతో పనిచేస్తే మరి స్వతంత్రేచ్ఛ ఏమయినట్లు?
47.5 పంచమ పరిచ్ఛేదం అహేతుక భక్తి – దాస్యభావం
శ్రీరామకృష్ణులు: ఈయన (డాక్టరు) చెబుతున్న దానిని అహేతుక భక్తి అంటారు. నేను మహేంద్ర సర్కార్ నుండి ఏమీ ఆశించను, అతడితో నాకు ఏ అవసరమూ లేదు. అయినప్పుటికీ మహేంద్ర సర్కార్‌ను చూడగానే నాకు ఆనందం కలుగుతుంది – దీనినే అహేతుక భక్తి అంటారు. కాని ఇందులో ఒకింత ఆనందం లభిస్తూంటే దానికి నేనేం చేయగలను?
47.5.1 శుద్ధభక్తి – అహల్య – నారదుడు
“ఒకసారి అహల్య రాముడితో ఇలా అంది: ‘ఓ రామా! నేను పందిగా జన్మించినా సరే, దాని గురించి నాకు ఎలాంటి చింతా లేదు. కాని నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలిగేలా మాత్రం అనుగ్రహించు, అన్యంగా నేను మరేమీ కోరను.’
“రావణుణ్ణి వధించాలన్న విషయం శ్రీరాముడికి జ్ఞాపకం చేయడానికి నారదుడు అయోధ్యకు వెళ్ళాడు. సీతారాములను దర్శించి నారదుడు వారిని స్తోత్రపాఠాలతో స్తుతించసాగాడు. రాముడు వాటితో సంతుష్టుడై, ‘నారదా, నేను నీ స్తోత్రపాఠాలతో సంప్రీతుడనైనాను. నువ్వు ఏదైనా వరం కోరుకో’ అన్నాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు: ‘ఓ రామా, నువ్వు నాకు వరం ఇచ్చి తీరవలసిందే అంటే నాకు ఈ వరాన్ని ప్రసాదించు – నీ పాదపద్మాలపట్ల నాకు శుద్ధభక్తి కలిగేలా చెయ్యి. నీ భువనమోహన మాయలో నేను సమ్మోహితుణ్ణి కాకుండేలా చెయ్యి’. ‘ఇంకా వేరే ఏమయినా కోరుకో’ అన్నాడు రాముడు. అందుకు జవాబుగా ‘నేను వేరే ఏమీ కోరుకోను. నేను కేవలం నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తిని మాత్రమే కోరుకుంటాను’ అన్నాడు నారదుడు.
“ఈయన (డాక్టరు) భావం కూడా అలాంటేదే – భగవంతుణ్ణి దర్శించడ మొక్కటే కావలసింది; ధనం, కీర్తి, దేహసుఖాలు మొదలైనవి ఏవీ వద్దు – ఇలాంటిదే ఆ భావం. దీనినే శుద్ధభక్తి అంటారు.
“ఇందులో కొద్దిగా ఆనందమనేదయితే ఉంటుంది కాని అది విషయానందం కాదు; అది భక్తి వల్ల కలిగే ఆనందం, ప్రేమానందం. నేను శంభుమల్లిక్ ఇంటికి తరచూ వెళ్ళేవాడిని. అతడు ఒకసారి నాతో ఇలా అన్నాడు: ‘మీరు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడుతుంటారు కదా! ఇందులో మీకు తప్పక ఆనందం కలుగుతూంటుంది. అందుకే ఇలా వస్తున్నారు.’ అవును, ఇందులో ఇంతమాత్రం ఆనందం ఉందన్న సంగతి నిజం.
“కాని దీనికంటే ఉన్నతమైన మరో స్థితి ఉంది. ఆ స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి బాలుడివలె అటూ ఇటూ తిరుగుతూంటాడు. ఏదీ స్థిరం కాదు. బాలుడు బహుశా ఒక మిడతను చూసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
(భక్తులతో) “ఈయన (డాక్టరు) మనోవైఖరి ఏమిటో మీకు అర్థమయిందా? అది భగవంతుణ్ణి ప్రార్థించడం – ఓ భగవంతుడా, నాకు సద్బుద్ధిని ప్రసాదించు.చెడు విషయాలపై నా మనస్సు పోకుండేలా చెయ్యి – ఇలా వేడుకోవడం.
47.5.2 దాస్యభావం – శ్రీరామకృష్ణులు
“నాక్కూడా అలాంటి స్థితి ఉండేది. దాన్ని దాస్యభావం అంటారు. నేను ‘అమ్మా, అమ్మా’ అంటూ హృదయవిదారకంగా విలపిస్తుండేవాడిని. అది చూసి జనులు అట్లే నిలబడిపోయేవారు. నేను అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను భ్రష్టుణ్ణి చేయాలనీ, నా పిచ్చితనాన్ని బాగు చెయ్యాలనీ ఒక వ్యక్తి నా గదిలోకి ఒక వేశ్యను తీసుకువచ్చాడు. ఆమె చాలా అందంగా ఉంది, కళ్ళు కూడా చక్కగావున్నాయి. నేను ‘అమ్మా అమ్మా’ అంటూ గదిలో నుండి బయటకు వచ్చేశాను? ‘అన్నా, గదిలోకి ఎవరో వచ్చారు. నువ్విక్కడకు వచ్చి చూడు’ అంటూ హలధారి కోసం పిలువసాగాను. ఆ స్త్రీ గురించి హలధారితో పాటు అందరికీ చెప్పేశాను. ఆ స్థితిలో నేను ‘అమ్మా, అమ్మా’ అంటూ రోదించే వాడిని. అలా రోదిస్తూ ‘అమ్మా, నన్ను రక్షించు. అమ్మా, నన్ను పరిశుద్ధుణ్ణి చేసివెయ్యి. నా మనస్సు సత్తు నుండి అసత్తు వైపుకు వెళ్ళకుండేలా చెయ్యి’ అనేవాడిని. (డాక్టరుతో) నీ ఈ వైఖరి కూడా చాలామంచిది. ఇది అసలైన భక్తుడి భావం – దాసుడిననే భావం.
47.5.3 శుద్ధసత్త్వం – కర్మత్యాగం
“ఎవరైనా వ్యక్తిలో శుద్ధసత్త్వగుణం కనుక ఉన్నట్లయితే ఆతడు కేవలం భగవచ్చింతన మాత్రం చేస్తాడు. ఆతడికి మరేదీ రుచించదు. కొంతమంది ప్రారబ్ధకర్మ ఫలంగా శుద్ధసత్త్వంతో జన్మిస్తారు. ఎలాంటి కోరికలు లేకుండా కర్మలు చేయడం వల్ల చివరకు శుద్ధసత్త్వగుణం ప్రాప్తిస్తుంది. రజస్సుతో మిశ్రితమై ఉన్న సత్త్వగుణం ఉన్నట్లయితే మనస్సు క్రమక్రమంగా నానా విషయాల వైపుకు మరలుతుంది. అప్పుడు జగత్తుకు ఉపకారం చేయాలన్న దంభం అంకురిస్తుంది. జగత్తుకు ఉపకారం చేయడమనేది ఈ అల్పజీవికి ఎంతో కష్టమైన పని. కాని ఎవరైనా పరోపకారం నిమిత్తం ఎలాంటి కామనలు లేకుండా కర్మలు చేస్తే అందులో తప్పు లేదు. దీనినే నిష్కామ కర్మ అంటారు. ఈ విధంగా కర్మలు చేయ ప్రయత్నించడం ఎంతో ఉత్తమం. కాని అందరూ అలా చేయజాలరు; ఎందుకంటే అది ఎంతో కష్టమైనది కనుక. సర్వులూ కర్మను చేయవలసిందే. ఏదో ఒకరిద్దరు మాత్రమే కర్మలను త్యజించగలరు. ఏదో ఒకరిద్దరిలో మాత్రమే శుద్ధసత్త్వం కానవస్తుంది. ఈ నిష్కామకర్మలు చేస్తూపోతే రజోమిశ్రిత సత్త్వగుణం క్రమంగా శుద్ధసత్త్వంగా పరిణమిస్తుంది.
“శుద్ధసత్త్వగుణం పొందినప్పుడు భగవదనుగ్రహంతో ఆయన్ను సాక్షా త్కరించుకోవచ్చు.
“సామాన్యులు ఈ శుద్ధసత్త్వ స్థితిని అర్థం చేసుకోలేరు. ఒకసారి హేమ్ నాతో ఇలా అన్నాడు: ‘ఏమండి పూజారిగారూ! ప్రపంచంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించడమే కదా మానవ జీవిత లక్ష్యం! ఏమంటారు?’”
47.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు – తీవ్ర వైరాగ్యం
మంగళవారం, అక్టోబరు 27, 1885
శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ గృహంలో తమ గదిలో కూర్చుని నరేంద్రుడు మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. అప్పుడు సమయం ఉదయం పదిగంటలు కావస్తోంది.
నరేంద్రుడు: నిన్న డాక్టరు ఎంత విచిత్రంగా మాట్లాడాడో కదా!
ఒక భక్తుడు: అవును, చేప గాలానికి చిక్కుకుంది కాని దారం తెగిపోయింది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాని గాలం ములికి దాని నోట్లోనే ఉంది కదా! అది చచ్చి నీటిపైనే తేలుతూ ఉంటుంది.
నరేంద్రుడు బయటకు వెళ్ళాడు. మళ్ళీ కాసేపట్లోనే తిరిగి వస్తాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో పూర్ణుడి గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: భక్తుడు ప్రకృతి భావంలో పురుషుణ్ణి (అంటే భగవంతుణ్ణి) ఆలింగనం చేసుకొని ముద్దుపెట్టుకోవాలనుకుంటాడు. నేను ఈ సంగతి నీ కోసం మాత్రమే చెబుతున్నాను సుమా! సామాన్యులు వీటిని వినరాదు.
‘మ’ : భగవంతుడు పరిపరి విధాలుగా క్రీడిస్తూంటాడు. చివరకు మీ రోగం కూడా ఆయన క్రీడలో ఒక భాగమే. ఈ రోగం కారణంగానే పలువురు భక్తులు క్రొత్తగా ఇక్కడకు వస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ‘ఏ రోగం లేకుండానే అద్దె ఇంట్లో ఉన్నట్లయితే జనులు ఏమనుకొంటారు?’ అని భూపతి అన్నాడు. అది సరే, డాక్టరు సంగతి ఏమయింది?
‘మ’ : ‘నేను దాసుణ్ణి, నువ్వు ప్రభువ్వు’ అంటూ ఆయన దాస్యభావాన్నయితే అంగీకరిస్తాడు కాని మళ్ళీ ‘మనిషిలో భగవద్భావాన్ని ఎందుకు ఆరోపిస్తారు?’ అని అడుగుతాడు.
శ్రీరామకృష్ణులు: అదేమిటో నువ్వే చూడు. ఇవాళ ఆతడి ఇంటికి వెళ్తున్నావా?
‘మ’ : మీ పరిస్థితిని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఉంటే వెళతాను.
శ్రీరామకృష్ణులు: నీకు ఆ అబ్బాయి బంకిం ఎలా అనిపిస్తాడు? అతడు ఇక్కడకు రాలేని పక్షంలో నువ్వే ఆతడికి ఏమైనా సూచనలు ఇస్తూ ఉండు. దానివల్ల ఆతడిలో చైతన్యం జాగృతమవుతుంది.
47.6.1 సంసారం, భగవంతుడు – తీవ్రవైరాగ్యం – ‘ముక్కునత్తును భద్రపరిచిన స్త్రీ’ దృష్టాంతం
నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చున్నాడు. తండ్రి కాలంచేశాక నరేంద్రుడు ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇంట్లో తల్లిని, తోబుట్టువులను పోషించవలసి ఉంది. పైగా, అతడు లా (న్యాయవిద్య) పరీక్షలకు తయారవుతున్నాడు. ఇటీవలే కొన్ని నెలలపాటు విద్యాసాగర్‌కు చెందిన బౌ–బజారు స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇంటి కష్టాలు తీరేలా ఏమైనా ఏర్పాట్లు చేసి, నిశ్చింతతో ఉండడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరామకృష్ణులకు ఇవన్నీ తెలుసు. నరేంద్రుడి వంక తదేక దృష్టితో ఆప్యాయంగా చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో) : అది సరే, నేను కేశవ్‌తో ఇలా అన్నాను: ‘యదృచ్ఛాలాభ’ (దొరికిదానితో సంతృప్తి పొందడం). గొప్ప ఇంటికి చెందిన అబ్బాయికి అన్నపానాదుల గురించి చింతించాల్సిన పని లేదు. అతడికి నెల ఖర్చులకు డబ్బు లభిస్తుంది. నరేంద్రుడు కూడా అత్యున్నత స్థాయికి చెందినవాడు. మరి అలాంటప్పుడు అతడు ఇటువంటి చిక్కు పరిస్థితుల్లో ఎందుకు ఉన్నట్లు? భగవంతునికి సంపూర్ణంగా మనస్సును సమర్పిస్తే అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తాడు.
‘మ’ : నరేంద్రుడికి కూడా ఏర్పాటు చేయబడుతుంది. అయితే అందుకు ఇంకా తరుణం రాలేదు.
శ్రీరామకృష్ణులు: కాని తీవ్ర వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆ రీతిలో లెక్కలు కట్టడు – ‘కుటుంబ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తాను, ఆ తరువాత సాధనలు చేస్తాను’ అంటూ ఆ వ్యక్తి తలచడు. తీవ్రవైరాగ్యం కలిగితే మనసులో అలాంటి ఆలోచనలేవీ పొడసూపవు. (నవ్వుతూ) ఒకసారి ఒక గోస్వామి లెక్చర్ ఇచ్చాడు. ‘పదివేల రూపాయలు సంపాదించుకున్నట్లయితే దానితో అన్నపానాదులన్నింటినీ సమకూర్చుకోవచ్చు. అటుపిదప నిశ్చింతగా భగవంతుని ప్రార్థించవచ్చు’ అని అన్నాడతడు.
“ఒకసారి కేశవ్సేన్ కూడా అలాంటిదే ఏదో చెప్పాడు.అతడు నాతో ఇలా అన్నాడు: ‘మహాశయా! ఎవరైనా వ్యక్తి ఇల్లు, ఆస్తిపాస్తుల వ్యహారాలన్నీ చక్కదిద్దుకొని భగవచ్చింతన చేయాలనుకోవడం మంచిదేనంటారా? అందులో తప్పేమైనా ఉందంటారా?’ అందుకు నేను ఇలా అన్నాను: ‘తీవ్ర వైరాగ్యం కలిగినట్లయితే సంసారం మృత్యుకూపంలా అగుపిస్తుంది. స్వజనమే కాలసర్పాలుగా తోస్తారు. అప్పుడు “ధనం సమకూరుస్తాను, విషయాలన్నిటినీ చక్కదిద్దుతాను” – ఇలాంటి లెక్కింపులేవీ ఉండవు.’ భగవంతు డొక్కడే వస్తువు, తక్కినవన్నీ అవస్తువులే (అస్తిత్వం లేనివి). భగవంతుణ్ణి వదిలిపెట్టి విషయచింతన చేయడమా!
“ఒక స్త్రీకి పెద్ద దుఃఖం వచ్చిపడింది. ముందుగా ఆమె తన ముక్కు నత్తును తీసి తనకొంగుకు ముడివేసుకుంది. తరువాత ‘అయ్యో! నాకు ఎంత పెద్ద కష్టం వచ్చిపడింది’ అంటూ నేల మీద పడి దొర్లుతూ ఏడ్వసాగింది. కాని ముక్కు నత్తు విరిగిపోకుండా జాగ్రత్తపడింది”. (అందరూ నవ్వారు.)
ఈ మాటలు విని నరేంద్రుడు బాణం గుచ్చుకున్నవాడిలా నేలపై పడిపోయాడు. అతడి మనో భావాలను అర్థం చేసుకున్న ‘మ’ నవ్వుతూ అతడితో “ఏమిటి, ఎందుకు అలా పడిపోయావు?” అన్నాడు.
నవ్వుతూ శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “పరాయి పురుషులతో అక్రమసంబంధాలు నెరపుతున్న స్త్రీల ప్రవర్తనను అర్థం చేసుకోలేని, తన బావతో కలిసి శయనించినందుకు సిగ్గుపడని ఒక స్త్రీని నువ్వు గుర్తుకు తెస్తున్నావు. తనను సమర్థించుకొనే సాకుతో ఆమె ఇలా అంది: ‘ఏమైనా బావ సొంత మనిషి. ఈ స్త్రీలు పరాయి పురుషులతో తెగించి ఎలా జీవిస్తున్నారు?’”
‘మ’ స్వయంగా సంసార జీవితం గడుపుతున్నాడు. తన ప్రవర్తనకు సిగ్గు చెందకపోవటం అటుంచి, అతడు నరేంద్రుని చూసి నవ్వాడు. అందుచేతనే శ్రీరామకృష్ణులు తన బావతో అక్రమసంబంధం కలిగివుండి, అవినీతిపరులైన స్త్రీలను విమర్శించిన ఆ స్త్రీని గురించి ప్రస్తావించారు.
కింది అంతస్తులో ఎవరో వైష్ణవ గీతాలు ఆలాపిస్తున్నారు. ఆ పాటలు విని శ్రీరామకృష్ణులు ముగ్ధులై ఆతడికి ఏమైనా ఇవ్వమన్నారు. అందునిమిత్తం ఒక భక్తుడు క్రిందకు వెళ్ళాడు. కాసేపటి తరువాత, ఆ వైష్ణవుడికి భిక్షం ఏం ఇచ్చారని శ్రీరామకృష్ణులు అడిగేసరికి రెండు పైసలు ఇచ్చారని ఎవరో చెప్పారు. అది విని ఆయన ఇలా అన్నారు: “ఓస్, ఇంతేనా! ఇది అతడు చాకిరీ చేసి సంపాదించిన డబ్బు. ఈ డబ్బు సంపాదించడానికి అతడు ఎంతగా కష్టపడి ఉంటాడో, యజమానిని ఎంతగా ముఖస్తుతి చేసి ఉంటాడో కదా! కనీసం నాలుగు అణాలయినా ఇస్తాడనుకున్నాను.”
47.6.2 విద్యుత్ పరికరం – బాగ్చీ చిత్రాలు – పెద్ద శిరోజాల సన్న్యాసి
ఏదైనా విద్యుత్ పరికరం ఒకదాన్ని తీసుకువచ్చి విద్యుత్ అంటే ఎలాంటిదో చూపిస్తానని చిన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు చెప్పి ఉన్నాడు. ఈ రోజు ఆ పరికరాన్ని తీసుకువచ్చి చూపించాడు.
సమయం మధ్యాహ్నం రెండు గంటలు అయింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చుని ఉన్నారు. అతుల్ ఒక మిత్రుణ్ణి తోడ్కొని వచ్చాడు. అతడు మున్సిఫ్‌గా పనిచేస్తున్నాడు. శిక్దార్పారాకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు బాగ్చీ వచ్చి శ్రీరామకృష్ణులకు కొన్ని చిత్రపటాలు బహూకరించాడు. ఆయన వాటిని ఆనందభరితులై చూడసాగారు. షడ్భుజమూర్తి చిత్రపటాన్ని చూసి “చూడండి, ఎలా ఉందో!” అంటూ భక్తులకు చూపించారు. పిదప ‘అహల్యోద్ధారణ’ చిత్రాన్ని భక్తులకు చూపించారు. అందులో శ్రీరాముడి చిత్రాన్ని చూసి ఆనందించారు.
బాగ్చీకి స్త్రీలలా పొడవైన శిరోజాలు ఉన్నాయి. అది చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “చాలా కాలం క్రిందట దక్షిణేశ్వరానికి ఒక సన్న్యాసి వచ్చాడు. అతడి శిరోజాలు తొమ్మిది మూరల పొడవులో ఉండేవి. అతడు ‘రాధ, రాధ’ అంటూ రాధా నామాన్ని ఉచ్చరిస్తూండేవాడు. నకిలీ వ్యక్తి కాదు, అసలైన వాడే సుమా!”
కాసేపటి తరువాత నరేంద్రుడు పాడసాగాడు. ఆ పాటలన్నీ వైరాగ్య తత్త్వంతో కూడుకొన్నవి.
ఈలాగు వ్యర్థముగ నా దినము లన్నియు
గడపవలసినదేన దేవా…..
అంతరాత్మవై నడిపెడు మాతా
అనయమా హృదయమునందు మేల్కొనుము
ఒడిలో నిడుకొని దివారాత్రములు
లాలించుచు నను పాలించెదవు….
హే దయామయ ప్రభో! కారుణ్యమూర్తీ
హే కృపారస సింధో! హే దీనబంధో! ॥ హే ॥
మధుపంబువలె ఆత్మ మైమరచి నీ పాద
పద్మకుహరము లోపల నొదుగకున్నచో
ఏ లాభమును పొందనేర్తు నీ జన్మమున
ఏమి సార్థమింక ఈ జన్మమున నాకు ॥ హే ॥
పరమ పెన్నిధివైన నిను వదలియున్నచో
ఈ బహుళ సంపదల కేమి ఫలితము కలదు ॥ హే ॥
అతియింపు అతిసొంపు అతిలలితమగు శిశువు
ముఖమందు నీ ప్రేమ ముఖచాయ యొక ఇంత
ప్రకటమై బయటికి తెలియరాకున్నచో
ఆ చూపులో తృప్తి అనుభవించగలేను ॥ హే ॥
నీలాల నా యాత్మ నింగిపై నీ ప్రేమ
చంద్రోదయంబగుచు చల్లపరుపకయున్న
ఆ చంద్రచంద్రికలు ఆ జ్యోత్స్న తీరు
కారుచీకటి రాత్రికన్న చీకటి నాకు ॥ హే ॥
పతివ్రతా తిలకంపు పరమ నిష్కళ ప్రేమ
వెలయింతయని తెలుప వీలుగల్గని దివ్య
ప్రేమరత్నము చేత పొదగబడకున్నచో
అతి కళంకితమగుచు అగుపించుచుండ ॥ హే ॥
నీచమై పాపమాన నిర్లక్ష్యమున పుట్టు
సంశయము నిను గూర్చి పడినపుడు మనసుపై
పాముకాటున బాధ భరియింపలేనట్లు
మెలితిరిగి బాధలో మెలగుదును ఓ ప్రభో ॥ హే ॥
47.7 సప్తమ పరిచ్ఛేదం భక్తులతో భజనానందం – సమాధి స్థితి
సమయం సాయంకాలం ఐదున్నర అవుతోంది. డా.సర్కార్ వచ్చి శ్రీరామకృష్ణుల నాడి పరీక్షించి కొన్ని మందులు వ్రాసి ఇచ్చాడు. నరేంద్రుడు, గిరీశ్, దుకరి డాక్టర్, చిన్న నరేంద్రుడు, రాఖాల్, ‘మ’, శరత్, శ్యాంబసు మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు.
డా.సర్కార్ జబ్బు గురించి కాసేపు మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు ఔషధం పుచ్చుకున్నాక డాక్టరు “మీరు శ్యాంబాబుతో మాట్లాడుతూ ఉండండి. నేను సెలవు తీసుకుంటాను” అన్నాడు. శ్రీరామకృష్ణులు, మరొక భక్తుడు “పాటలు ఏమైనా వింటారా?” అని డాక్టరును అడిగారు.
డాక్టరు (శ్రీరామకృష్ణులతో): పాటలు పాడుతూ మీరు నాట్యం చేయ నారంభిస్తారు. మీరు భావోద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి.
డాక్టరు మళ్ళీ కూర్చున్నాడు. నరేంద్రుడు తన మధుర కంఠంతో గానం చేయసాగాడు. తంబురా, మృదంగం కూడా జతకలిశాయి.
ధన్యుడవు ధన్యుడవు ధన్యుడవు దేవ నీవు…..
రూపులేని నీ అందము
దట్టమైన చీకటిలో
మెరయుచు స్పందించుచుండె
అందువలన అంధకార
కొండగుహన యోగివరులు
ధ్యానింతురు నిన్ను జనని….
డా.సర్కార్, ‘మ’ తో “ఈ పాట ఈయనకు ప్రమాదకరమైనది” అన్నాడు. డాక్టరు ఏమంటున్నాడని శ్రీరామకృష్ణులు ‘మ’ ను అడిగారు. “ఈ పాట వినడం వల్ల మీకు భావసమాధి కలుగుతుందేమోనని డాక్టరు భయపడుతున్నారు” అన్నాడు ‘మ’.
ఈ విధంగా సంభాషణ నడుస్తూవుండగానే శ్రీరామకృష్ణులు కొద్దిగా భావస్థితి నొందారు. చేతులు జోడించి డాక్టరుతో “లేదు, లేదు. భావసమాధి ఎందుకు కలుగుతుంది?” అన్నారు. ఈ మాటలు అన్నారో లేదో, ఆయన వెంటనే ప్రగాఢ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు, దేహం నిశ్చలమైపోయింది, కనురెప్పలు ఆడడం లేదు, నోటమాట రావడం లేదు. బాహ్య ప్రపంచ స్పృహ ఏమాత్రం లేకుండా, శిలావిగ్రహంలా ఆయన అలాగే ఉండిపోయారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం సమస్తం అంతర్ముఖమైపోయాయి.
నరేంద్రుడు గానం కొనసాగించాడు.
ఎంత సొగసు ఎంత వలపు
లేదు లేదు నే జూచిన
నీదు వదనమునకు సాటి ।
నా జీవననాథుడు నా
బీద గుడిసెలోకి వచ్చె
నా ప్రేమపు ఝరులన్ని
ఎగజిమ్మె ఎల్లయడల ।
ఎరిగింపుము నీ విప్పుడు
నా ప్రాణ ప్రియనాథ
నీ పాదంబుల సన్నిధి
ఏ పెన్నిధి నుంచవలెను ।
నా ప్రాణము, నా జీవము
గైకొనుమని వేడికొందు
ఇంకేదీ నీ పదముల
నర్పింపగలవొ తెలుపు?
నా కున్నది సర్వంబును
నా దనియెడి దేదైనను
అది యంతయు దయయుంచి
తీసికొనుము బీద ననక ।
హే దయామయ ప్రభో! కారుణ్యమూర్తీ!
హే కృపారస సింధో! హే దీనబంధో!…..
“పతివ్రతా తిలకంపు పరమ నిష్కళ ప్రేమ” అన్న చరణాన్ని విని డాక్టరు కళ్ళు చెమ్మగిల్లాయి. “ఆహా, ఆహా” అన్నాడు. నరేంద్రుడు మరోపాట పాడాడు:
ఎన్నటికో నిక నెన్నటికో
ఆ శుభ సమయం బెన్నటికో
అంచితముగ భాగ్యారుణ కాంతుల
తెలతెలవారే దెన్నటికో…….
47.8 అష్టమ పరిచ్ఛేదం అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం – బ్రహ్మ స్వరూపం
శ్రీరామకృష్ణులు మళ్ళీ బాహ్యస్మృతి పొందారు. గానం ముగిశాక ఆయన తమ వచనామృతాన్ని భక్తులకు విరివిగా పంచిపెట్టసాగారు.భక్తులు నిశ్శబ్దంగా ఆ వచనామృతాన్ని గ్రోలుతున్నారు.అందరూ ఆ సుందర దరహాస వదనం కేసి కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ బాధాకరమైన వ్యాధి తాలూకు ఛాయలను ఆయన వదనం ఏమాత్రం ప్రకటించటం లేదు. దివ్యానందంతో వదనం ప్రకాశిస్తోంది.
శ్రీరామకృష్ణులు, డాక్టరును ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “ఈ కృత్రిమ నమ్రతను వదలిపెట్టు. భగవన్నామాన్ని కీర్తించడంలో లజ్జ ఎందుకు? ‘లజ్జ, ద్వేషం, భయం – ఈ మూడూ ఉన్నట్లయితే భగవంతుణ్ణి పొందలేవు’ అన్న నానుడి ఉంది కదా – అది ముమ్మాటికీ నిజం! “నేను ఇంతటి పెద్దమనిషిని! నేను ‘హరి, హరి’ అంటూ నాట్యం చేస్తున్నానన్న సంగతి విని తక్కిన పెద్ద మనుషులు ఏమనుకుంటారో! ఆ డాక్టరు ‘హరి, హరి’ అంటూ నాట్యం చేశాడు. ఇది ఎంతగా సిగ్గుపడాల్సిన విషయం!’ అని అనుకుంటారేమో!” – ఇలాంటి భావనలను వదలిపెట్టు.
డాక్టరు: నేను అలాంటి మాటలను లెక్కచెయ్యను. లోకులు ఏమంటే మాత్రం నాకేమిటి?
శ్రీరామకృష్ణులు: ఆ, నాకు తెలుసు. ఆ విషయమై నువ్వు ఎంతమాత్రం బెసగవులే! (నవ్వారు)
“ఇలా చూడు. జ్ఞానం, అజ్ఞానం– రెండింటికీ అతీతుడవయిపో. అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలవు. నానా విషయాలను తెలుసుకోవడం అజ్ఞానం అంటారు. పాండిత్యం ఉందన్న అహంకారం కూడా అజ్ఞానమే. సర్వభూతాలలోనూ ఉన్నది ఒకే భగవంతుడే– ఈ నిశ్చయాత్మకమైన బుద్ధినే జ్ఞానం అంటారు. భగవంతుణ్ణి విశేషంగా తెలుసుకుంటే దాన్ని విజ్ఞానం అంటారు. కాలికి ముల్లు గుచ్చుకుంటే దాన్ని లాగివేయడానికి మరొక ముల్లు అవసరమవుతుంది. అజ్ఞానమనే ముల్లును తొలగించడానికి ముందుగా జ్ఞానమనే ముల్లును తీసుకురావలసి ఉంటుంది. అటుపిమ్మట, జ్ఞానాజ్ఞానాలు రెండింటినీ పారవేయాలి. భగవంతుడు జ్ఞానాజ్ఞానాలు రెండింటికీ అతీతుడు. లక్ష్మణుడు, రాముడితో ఇలా అన్నాడు: ‘రామా, ఇది ఎంత ఆశ్చర్యకరం! వసిష్ఠ మహర్షి ఇంతటి మహాజ్ఞాని అయివుండి కూడా పుత్రశోకంతో అలా దీనంగా విలపిస్తున్నాడే!’ అప్పుడు రాముడు, లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు: ‘తమ్ముడూ, జ్ఞానం ఉన్న వ్యక్తికి అజ్ఞానం కూడా ఉంటుంది. ఏకత్వం అన్న జ్ఞానం ఉన్నవాడికి అనేకం గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. వెలుగు గురించిన ఎరుక ఉన్నవాడికి చీకటి గురించిన ఎరుక కూడా ఉంటుంది. బ్రహ్మం జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది; పాపపుణ్యాలు, ధర్మాధర్మాలు, శుచి అశుచులకు అతీతమైనది.’”
ఇలా పలికి శ్రీరామకృష్ణులు, రాంప్రసాద్ పాట నొకదానిని గానం చేశారు:
రావే మనసా షికారు పోదము
కాళీకల్ప ద్రుమంబునకు
ప్రోగుచేయు మా చెట్టు క్రిందను
నాలుగు పురుషార్థంబులును…..
47.8.1 బ్రహ్మస్వరూపం ‘అవాఙ్మానస గోచరం’ – పార్వతీ దేవి, హిమవంతుడు
శ్యాంబసు: రెండు ముళ్ళనూ పారేశాక ఏం మిగులుతుంది?
శ్రీరామకృష్ణులు: నిత్యశుద్ధబోధ రూపమ్. దాన్ని నీకు నేను ఎలా వివరించగను? ఎన్నడూ నెయ్యి తినని వ్యక్తి ‘నెయ్యి అన్నది (అంటే, నెయ్యి రుచి) ఎలా ఉంటుంది?’ అని అడిగితే అతడికి ఏమని సమాధానం ఇవ్వగలం? మహా అయితే ‘నెయ్యి అంటే ఎలా ఉంటుంది? నెయ్యి, నెయ్యిలా ఉంటుంది’ అని మాత్రం చెప్పగలం. ఒక అమ్మాయి తన స్నేహితురాలిని ఇలా అడిగింది: ‘సఖీ, నీ భర్త వచ్చాడు కదా! భర్తతో ఎలాంటి ఆనందం అనుభవిస్తున్నావో కాస్త చెప్పు’ అని అడిగింది. అందుకు ఆ స్నేహితురాలు ‘సఖీ, నీక్కూడా భర్త వచ్చి నప్పుడు ఆ విషయం అర్థమవుతుందిలే. ఇప్పుడు నీకు నేను ఎలా వివరించగలను’ అన్నది.
“పార్వతీదేవి ఒకసారి హిమవంతుని కుమార్తెగా జన్మించినదని పురాణాలలో చెప్పబడింది. అప్పుడు ఆమె, ఆయనకు అనేక రూపాలలో దర్శన మిచ్చింది. ఈ రూపాలను దర్శించాక హిమవంతుడు చివరగా పార్వతీదేవితో ‘అమ్మా, వేదాలలో బ్రహ్మమని ఏదైతే వర్ణింపబడిందో, ఆ బ్రహ్మదర్శనాన్ని నాకు కలుగుజెయ్యి’ అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ‘తండ్రీ, బ్రహ్మదర్శనం కావాలనుకుంటే సాధుసాంగత్యం చేయండి’ అన్నది.
“బ్రహ్మం అనేది ఎలాంటిదో నోటితో చెప్పజాలం. అన్నీ ఎంగిలి అయిపోయాయి, కాని బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాలేదని ఒకసారి ఎవరో అన్నారు. దీని అర్థం ఏమిటంటే వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన శాస్త్రాలు నోటితో ఉచ్చరింపబడిన మూలాన ఎంగిలి అయిపోయాయి. కాని బ్రహ్మం అనేది ఎలాంటిదో ఇంతవరకు ఎవరూ నోటితో చెప్పలేకపోయారు. అందుకనే బ్రహ్మం ఇంతవరకు ఎంగిలి కాలేదు. సచ్చిదానందుడితో క్రీడించడం, సంసర్గం పొందడంలో గల ఆనందాన్ని నోటితో చెప్పలేము. ఆ ఆనందాన్ని పొందిన వ్యక్తికి మాత్రమే అది ఎలా ఉంటుందో తెలుస్తుంది.”
47.9 నవమ పరిచ్ఛేదం అహంకారం – పాపం, పుణ్యం
డాక్టరును ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు తమ అమృత వచనాలను కొనసాగించారు: “అహంకారం వదలనిదే జ్ఞానం కలుగదు. ‘నేను ముక్తుడినయ్యేదెప్పుడు? ఈ ‘నేను’ అనేది వదలినప్పుడే’ అన్న సూక్తి ఒకటి ఉంది కదా! ‘నేను’, ‘నాది’ అన్నది అజ్ఞానం. ‘నువ్వు’, ‘నీది’ అన్నది జ్ఞానం. భక్తుడైన వాడు ఇలా అంటాడు: ‘ఓ భగవంతుడా, నువ్వే కర్తవు, నువ్వే సమస్తం చేస్తున్నావు. నేను కేవలం యంత్రాన్ని. నువ్వు నాతో ఎలా చేయిస్తావో అలా చేస్తాను. ఈ సంపద, ఆస్తిపాస్తులు, ఈ జగత్తు యావత్తూ నీకు చెందినవే. ఈ ఇల్లు, ఈ కుటుంబం అంతా నీకు చెందినదే. నాదంటూ ఏమీ లేదు. నేను దాసుడను. నీ ఆజ్ఞ ప్రకారం నిన్ను సేవించడం వరకే నా హక్కు.’
“ఎవరైనా కొన్ని పుస్తకాలు చదివి ఉంటారనుకోండి, వారికి వెంటనే అహంకారం వచ్చేస్తుంది. ఒకసారి నేను కాళీకృష్ణ టాగుర్‌తో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాను. వెంటనే అతడు ‘ఇవన్నీ నాకు తెలిసినవే’ అన్నాడు. అప్పుడు అతడితో నేను ఇలా అన్నాను: ‘ఢిల్లీ చూసినవాడు ‘నేను ఢిల్లీ చూశాను’ అని చెప్పి తిరుగుతూ బడాయికి పోతూంటాడా ఏమిటి? పెద్దమనిషి అయినవాడు ‘నేను పెద్దమనిషిని’ అని చెప్పి తిరుగుతుంటాడా?’”
శ్యాంబసు: అయితే కాళీకృష్ణ టాగూర్ మీ పట్ల అమిత గౌరవం ఉన్నావాడు.
శ్రీరామకృష్ణులు: అరే బాబూ, దంభమనేది మనిషిని ఎలా మార్చి వేస్తుందో చూడండి. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో ఒక పాకీపని చేసే స్త్రీకి ఎంతటి అహంకారం ఉండేదని! ఆమె ఒంటి మీద ఒకటి రెండు నగలు ఉండేవి. ఆమె అహంకారమంతా ఆ నగలతో వచ్చిందే. ఒక రోజు ఆమె వస్తున్న దారిలో కొందరు వ్యక్తులు పోవడం చూసింది. వెంటనే ఆమె ‘దారి నుండి ప్రక్కకు తప్పుకోండి’ అంటూ కేకపెట్టింది. ఆమెకే అంతటి అహంకారం ఉన్నప్పుడు ఇక ఇతరుల గురించి వేరే ఏమైనా చెప్పాలా?
శ్యాంబసు: మహాశయా, భగవంతుడే సమస్తం చేస్తున్నప్పుడు మనిషి పాపాలకు శిక్ష ఎందుకు అనుభవించాలి?
శ్రీరామకృష్ణులు: నీది వట్టి కంసాలి బుద్ధి!
నరేంద్రుడు: అంటే లెక్కలు కట్టే బుద్ధి అని అర్థం. కంసాలి ప్రతివస్తువు బరువునూ త్రాసులో ఖచ్చితంగా తూచుతాడు కదా!
శ్రీరామకృష్ణులు: నేను చెప్పేది ఏమిటంటే: అరే బాబూ, నువ్వు మామిడి పళ్ళను తిను. మామిడి తోటలో ఎన్ని వందల చెట్లు ఉన్నాయి, ఎన్ని వేల కొమ్మలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆకులు ఉన్నాయి – ఇలాంటి లెక్కలతో నీకు ప్రయోజనం ఏమిటి? నువ్వు మామిడి పళ్ళను తినడానికి వచ్చావు. ఆ పళ్ళను తిని సంతుష్టుడివవు.
(శ్యాంబసుతో) “ఈ సంసారంలో భగవంతుడి కోసం సాధనలు చేసే నిమిత్తం నీకు ఈ మానవజన్మ లభించింది. భగవంతుడి పాదపద్మాలపై భక్తి అనేది ఎలా కలుగుతుందో, ఆ విషయమై ప్రయత్నించు. తక్కిన నిరర్థక విషయాలతో నీకు ఏమిటి పని? ఫెలోజపీ (ఫిలాసఫీ – తత్త్వశాస్త్రం) చర్చించడం ద్వారా నీకు ఒరిగేదేమిటి? ఇలా చూడు, అర ముంత కల్లుతోనే నువ్వు మత్తిల్లుతున్నప్పుడు కల్లు దుకాణంలో ఎన్ని ముంతల కల్లు నిల్వవుంది అన్న లెక్కలతో నీకు ప్రయోజనం ఏమిటి?”
డాక్టరు: భగవంతుడి పానశాలలోని మద్యం కొలవ శక్యం కాదు. అది అపరిమితం!
శ్రీరామకృష్ణులు (శ్యాంబసుతో): భగవంతుడికి ముఖ్త్యార్నామా ఇవ్వవచ్చు కదా! నీ భారమంతా ఆయన మీదనే వెయ్యి. ఎవరైనా సజ్జనుడికి నీ బాధ్యతను అప్పగిస్తే ఆయన నిన్ను మోసం చేయడు కదా! పాపానికి శిక్షవేయాలా వద్దా అన్న సంగతి భగవంతుడికే తెలుసు.
డాక్టరు: భగవంతుడి మనస్సులో ఏముందో ఆయనకే తెలుసు. లెక్కలు కట్టడం ద్వారా మనిషి దాన్ని తెలుసుకోలేడు. ఆయన ఈ లెక్కలన్నింటికీ అతీతుడు.
“శ్రీరామకృష్ణులు (శ్యాంబసుతో): మీ కలకత్తావాసులు ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతుంటారు. ‘భగవంతుడికి పక్షపాత బుద్ధి ఉంది’ అని అంటూంటారు. ఎందుకంటే, ఆయన ఒక వ్యక్తిని సుఖాలలోనూ, మరో వ్యక్తిని దుఃఖాలలోనూ ఉంచాడన్నదే వారి వాదన. ఈ ధూర్తులు తమలో ఏమైతే ఉందో భగవంతుడిలో కూడా దాన్నే చూస్తారు.
“హేమ్ దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. నన్ను కలసినప్పుడల్లా ఇలా అనేవాడు: ‘ఏమండీ, పూజారిగారూ! ప్రపంచంలో కావలసింది ఒకే ఒక వస్తువు. అది కీర్తి ప్రతిష్ఠలు, ఏమంటారు? భగవత్సాక్షాత్కారమే మానవజీవిత లక్ష్యమని చెప్పేవాళ్ళు బహు అరుదు కదా!’”
47.10 దశమ పరిచ్ఛేదం స్థూల, సూక్ష్మ శరీరాలు
శ్యాంబసు: మేము సూక్ష్మశరీరం గురించి ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. అలాంటి సూక్ష్మశరీరాన్ని ఎవరైనా చూపించగలరా? మనిషి మరణించిన తరువాత సూక్ష్మశరీరం స్థూలశరీరాన్ని వదలి వెళ్ళిపోతుందన్న విషయాన్ని ఎవరైనా చూపించగలరా?
శ్రీరామకృష్ణులు: యథార్థమైన భక్తులకు ఈ విషయాలన్నీ నీకు చూపించాల్సిన అగత్యం లేదు. ఎవరో పనికిమాలినవాడు ఈ విషయాలను నమ్ముతాడా లేదా అన్న విషయాన్ని వారు ఖాతరు చెయ్యరు. ఒక పెద్దమనిషిని తమ వశంలో పెట్టుకోవాలనే కోరికలు వారికి ఉండవు.
శ్యాంబసు: స్థూలదేహం, సూక్ష్మదేహాల మధ్య ఉన్న తారతమ్యం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: పంచభూత నిర్మితమైన దేహాన్ని స్థూలదేహం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం వీటితో నెలకొని ఉన్నది సూక్ష్మశరీరం. ఏ శరీరంతో అయితే భగవదానందం ప్రాప్తిస్తుందో, భగవంతునితో సంసర్గం పొందుతామో దాన్ని కారణ శరీరం అంటారు. తంత్రశాస్త్రాలు దీనిని ‘భగవతీ తనువు’ గా పేర్కొంటాయి. వీటన్నిటికీ అతీతంగా మహాకారణం ఉంది. దీన్ని మాటల్లో చెప్పలేము.
47.10.1 సాధనే ప్రధానం – భక్తే సారం – జగజ్జననికి శ్రీరామకృష్ణుల ప్రార్థన
“(ఉపదేశాలను) కేవలం వినడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమైనా చెయ్యి. ‘భంగు, భంగు’ అని ఊరకే వల్లెవేసినంత మాత్రాన ఏమవుతుంది? అలా అనడం వల్ల మత్తు ఎక్కుతుందా ఏమిటి? భంగును లేపనంలా చేసి శరీరం యావత్తు అలదుకొన్నా మత్తు మాత్రం ఎక్కదు. దాన్ని కొద్దిగా సేవించవలసి ఉంటుంది. నూలు వ్యాపారం చేయని వ్యక్తి 41 వ నంబరు నూలు ఏది, 40 వ నంబరు నూలు ఏది అన్న విషయాన్ని ఎలా గుర్తించగలడు? ఆ వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఏ నంబరు కావాలంటే ఆ నంబరు నూలు తీసి ఇవ్వగలడు. అది అతడికి ఎంతమాత్రం కష్టం కాదు. అందుకే నేను చెబుతోంది, కాస్త సాధన చెయ్యమని. అప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణాలంటే ఏవో అర్థం చేసుకోగలవు. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కేవలం ఆయన పాదపద్మాల పట్ల భక్తిని మాత్రమే కోరు.
“అహల్య శాప విమోచనం తరువాత, శ్రీరాముడు ఆమెతో ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు అహల్య రాముణ్ణి ఇలా వేడుకొంది: ‘ఓ రామా, నువ్వు వరం అనుగ్రహిస్తానంటే నేను కొరుకొనేది ఇదే – నేను పందిగా జన్మించినా సరే, అందువల్ల జరిగే నష్టమేమీ లేదు. కాని ఓ రామా, నీ పాదపద్మాల పట్ల నా మనస్సు లగ్నమయ్యేలా మాత్రం అనుగ్రహించు.’
“నేను అమ్మ వద్ద కేవలం భక్తిని మాత్రమే కోరుకున్నాను. అమ్మ పాదాల వద్ద పుష్పాంజలి సమర్పించి, చేతులు జోడించి ఇలా వేడుకున్నాను:
“ ‘అమ్మా, ఇదిగో నీ అజ్ఞానం, ఇదిగో నీ జ్ఞానం – నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ శుచి, ఇదిగో నీ అశుచి – నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదిగో నీ పాపం, ఇదిగో నీ పుణ్యం – నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదిగో నీ మంచి, ఇదిగో నీ చెడు – నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం – నాకు శుద్ధభక్తిని ప్రసాదించు’.
“ధర్మం అంటే దానాది కర్మలు. ధర్మాన్ని అంగీకరించినట్లయితే అధర్మాన్ని కూడా అంగీకరించవలసిందే. పుణ్యాన్ని అంగీకరిస్తే పాపాన్నీ అంగీకరించ వలసిందే. జ్ఞానాన్ని అంగీకరిస్తే అజ్ఞానాన్ని, శుచిని అంగీకరిస్తే అశుచిని అంగీకరించాలి. వెలుగు గురించిన ఎరుక ఉన్నవాడికి చీకటి గురించిన ఎరుక కూడా ఉంటుంది. ఏకత్వం గురించిన బోధ ఉన్నవాడికి అనేకం గురించిన బోధ కూడా ఉంటుంది. మంచి అంటే ఏమిటో తెలిసినవాడికి చెడు అంటే ఏమిటో కూడా తెలిసే ఉంటుంది.
“ఎవరైనా వ్యక్తి పంది మాంసాన్ని భుజించినప్పటికీ భగవంతుడి పాదపద్మాలపై భక్తిని కలిగివున్నట్లయితే, అతడు ధన్యుడు. హవిష్యాన్నం (నెయ్యి, అన్నం, కూరగాయలు మొదలైనవి) స్వీకరించినప్పటికీ మనస్సులో సంసారం పట్ల ఆసక్తి ఉంటే–”
డాక్టరు: అప్పుడు అలాంటి వ్యక్తి తుచ్ఛుడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి – బుద్ధుడు ఒకసారి పందిమాంసం తిన్నాడు. దాని కారణంగా ఆయనకు ఉదరశూల జనించింది. ఆ బాధను వదలించుకొనే నిమిత్తం ఆయన నల్లమందు సేవించేవాడు. నిర్వాణం అంటే ఏమిటో తెలుసా? నల్లమందు మత్తుతో ఆయన తెలివి లేకుండా ఉండేవాడు, బాహ్యస్పృహ ఉండేది కాదు. దానినే వాళ్ళు నిర్వాణం అనేవారు.”
బుద్ధ భగవానుడి నిర్వాణం గురించి డాక్టరు చేసిన వ్యాఖ్యానం విని అందరూ నవ్వారు. పిదప సంభాషణ కొనసాగింది.
47.11 ఏకాదశ పరిచ్ఛేదం సంసార ధర్మం – నిష్కామ బుద్ధి
శ్రీరామకృష్ణులు (శ్యాంబసుతో): సంసార ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పులేదు. కాని భగవంతుడి పాదపద్మాలపై మనస్సు నిలిపి, నిష్కామ బుద్ధితో నీ బాధ్యతలను నిర్వర్తించు. ఒక ఫలానా వ్యక్తికి వీపు మీద రాచపుండు లేచిందనుకో. అప్పుడు అతడు అందరితోనూ మామూలుగానే మాట్లాడుతూ ఉంటాడు; బహుశా తన దైనందిన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడి మనస్సు మాత్రం ఆ పుండు మీదనే ఉంటుంది. అదేవిధంగా సంసారంలో కర్తవ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ మనస్సు మాత్రం భగవంతువైపే మరలి ఉండాలి.
“నీతిబాహ్యురాలైన స్త్రీలా సంసారంలో జీవించు. ఆమె ఇంటి పనులన్నిటినీ చేస్తూనే ఉంటుంది కాని ఆమె మనస్సు మాత్రం తన ప్రియుడిపైనే నిలచి ఉంటుంది (డాక్టరుతో) అర్థమయిందా?”
డాక్టరు: నాకు అలాంటి భావం ఎప్పుడూ రాలేదు. మరి అలాంటప్పుడు ఎలా అర్థం చేసుకోగలను?
శ్యాంబసు: కొద్దిగా అర్థం చేసుకొని ఉంటారు. ఏమంటారు? (అందరూ నవ్వారూ)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): పైగా, అతడు ఆ వ్యాపారంలో చాలా రోజులుగా ఉన్నాడాయె! ఏమంటావ్? (అందరూ నవ్వారు)
శ్యాంబసు: మహాశయా, థియోసఫీ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: స్థూలంగా విషయం ఏమిటంటే, శిష్యులను తయారు చేసుకుంటూ తిరిగే వాళ్ళు అథమశ్రేణికి చెందినవారు. అదే విధంగా సిద్ధులు అనే నానారకాల శక్తులను ఆశించేవాళ్ళు కూడా అథమశ్రేణికి చెందినవారే – గంగానది మీద నడచుకుంటూ వెళ్ళడం, ఎక్కడో విదేశాలలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చెప్పడం – ఇలాంటి శక్తులు. ఇలాంటి వారికి భగవంతుడి పట్ల శుద్ధభక్తి కలగడం ఎంతో కష్టం.
శ్యాంబసు: కాని థియోసఫిస్ట్లు (దివ్యజ్ఞాన సమాజం వారు) హైందవ ధర్మాన్ని పునరుద్ధ రించడానికి ప్రయత్నిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: నాకు వారి గురించి ఎక్కువగా తెలియదు.
శ్యాంబసు: మరణించిన తరువాత జీవాత్మ ఎక్కడకు వెళుతుంది? చంద్రలోకానికా లేక నక్షత్ర లోకానికా? థియోసఫీ ద్వారా ఇలాంటి విషయాల నన్నిటినీ తెలుసుకోవచ్చు.
శ్రీరామకృష్ణులు: అలా ఉంటే ఉండవచ్చు గాక. కాని నా భావం ఏమిటో తెలుసా? ‘ఇవాళ తిథి ఏమిటి?’ అని ఒకసారి హనుమంతుణ్ణి ఎవరో అడిగారు. అందుకు హనుమంతుడు ‘నాకు తిథివార నక్షత్రాల లాంటివి ఏవీ బొత్తిగా తెలియదు. నేను కేవలం రామచింతన మాత్రం చేస్తాను’ అని జవాబిచ్చాడు. నా వైఖరి కూడా అదే.
శ్యాంబసు: థియోసఫిస్ట్లు మహాత్ములు ఉన్నారని విశ్వసిస్తారు. మీరు కూడా దాన్ని నమ్ముతారా?
శ్రీరామకృష్ణులు: నువ్వు నా మాటలను నమ్ముతానంటే, నీ ప్రశ్నకు నేను అవుననే సమాధానమిస్తాను. కాని ప్రస్తుతానికి ఈ విషయాలన్నిటినీ అలా ఉండనివ్వు. నాకు కాస్తనయమయ్యాక నువ్వు మళ్ళీ రా. నీకు నాపట్ల విశ్వాసం కనుక ఉన్నట్లయితే నీకు శాంతి లభించే మార్గమేమిటో తెలుస్తుంది. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా – నేను ధనం, వస్త్రాలు ఏవీ స్వీకరించను. ఇక్కడఎలాంటి కానుకలు చెల్లించవలసిన పనిలేదు కాబట్టే ఇంతమంది జనం ఇక్కడకు వస్తారు. (అందరూనవ్వారు.)
(డాక్టరుతో) “నీకు ఇలా చెబుతున్నానని మరోలా భావించవద్దు కాని నువ్వు ధనం, పేరు ప్రతిష్ఠలు, లెక్చర్లు ఇవ్వడం మొదలైనవాటినన్నిటినీ కావలసినంతగా అనుభవించావు. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు మనస్సును భగవంతుడి పైన లగ్నం చెయ్యి. ఇక్కడకు అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడంవల్ల ఉద్దీపన కలుగుతుంది.”
కాసేపటి తరువాత డాక్టరు బయలుదేరడానికి లేచి నిలబడ్డాడు. ఇంతలో గిరీశ్ఘోష్ గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. గిరీశ్‌ను చూసి డాక్టరు సంబరపడిపోతూ మళ్ళీ కూర్చున్నాడు.
డాక్టరు (గిరీశ్‌ను చూపుతూ): నేను ఇక్కడ కూర్చున్నంత సేపు ఇతడు రానేరాడు. నేను బయలుదేరడానికి లేవగానే, వచ్చి కూర్చుంటాడు.
గిరీశ్, డా. సర్కార్లు ఇద్దరూ డాక్టరు స్థాపించిన Science Association (విజ్ఞాన సంస్థ) గురించి మాట్లాడుకోసాగారు.
శ్రీరామకృష్ణులు: ఒకరోజు నువ్వు నన్ను అక్కడకు తీసుకు వెళ్ళమా?
డాక్టరు: మీరు అక్కడకు వచ్చారంటే భగవంతుడి అద్భుత కార్యాలను చూసి స్పృహ కోల్పోతారు.
శ్రీరామకృష్ణులు: నిజంగానా?
47.12 ద్వాదశ పరిచ్ఛేదం డా.సర్కార్‌తో గిరీశ్, నరేంద్రుల సంభాషణ
డాక్టరు(గిరీశ్‌తో): మీరు ఏమైనా చెయ్యండి కాని, do not worship him as God (ఈయన్ను భగవంతుడిగా మాత్రం ఆరాధించకండి). ఇంతమంచి వ్యక్తికి, తల తిరిగేలా మీరు ఎందుకు చేస్తారు?
గిరీశ్: నన్నేం చేయమంటారండి, మహాశయా? ఎవరైతే నన్ను ఈ సంసార సాగరం నుండి తరింపచేశారో, అంతకంటే ముఖ్యంగా నా సంశయాలన్నిటినీ పారద్రోలారో ఆయన్ను ఏమని భావించమంటారు? ఆయన మలాన్ని కూడా అశుద్ధంగా భావించజాలను.
డాక్టరు: మలం విషయంలో నాక్కూడా ఎలాంటి ఏవగింపూ లేదు. ఒకసారి ఒక దుకాణదారుడి అబ్బాయిని చికిత్స నిమిత్తం నా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతడు అక్కడే మలవిసర్జన చేశాడు. అందరూ రుమాళ్లతో ముక్కులు మూసుకున్నారు. నేను ఆ అబ్బాయి ప్రక్కనే అరగంటసేపు కూర్చున్నాను కాని ముక్కు మాత్రం మూసుకోలేదు. పాకీవాడు తొట్టెలో మలాన్ని ఎత్తుకొని పోయేటప్పుడు నేను ముక్కు మూసుకోలేదు. పాకీవాడికీ నాకూ తారతమ్యం లేదు కదా. మరి అలాంటప్పుడు అతణ్ణి చిన్నచూపు చూడడమెందుకు? నేను ఈయన (శ్రీరామకృష్ణుల) పాదధూళిని కళ్ళకు అద్దుకోలేనా ఏమిటి? ఇదిగో చూడండి (డాక్టరు, శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాడు.)
గిరీశ్: ఈ శుభ ముహూర్తాన దేవతలు కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు.
డాక్టరు: ఒక మనిషి పాదధూళిని స్వీకరించడంలో అద్భుతం ఏముంది? ఇదిగో చూడండి, నేను అందరి పాదధూళిని స్వీకరించగలను. (డాక్టరు అందరి కాళ్ళకు మ్రొక్కసాగాడు)
నరేంద్రుడు(డాక్టరుతో): ఈయన్ను మేము భగవంతుడిలా భావిస్తాము. అది ఎలాంటిదో తెలుసా? Vegetable creation, Animal creation (శాక సృష్టి జంతు సృష్టి) నడుమ ఒక చోట ఇది మొక్కా లేక జంతువా అని నిర్ధారించడం కష్టమైపోతుంది. అదేవిధంగా మానవలోకానికి, దేవలోకానికి నడుమ ఒక స్థితిలో, ఒక వ్యక్తి మానవుడా లేక దేవుడా అని నిర్ధారించడం ఎంతోకష్టం.
డాక్టరు: అదే తమ్ముడూ, దేవుడి విషయంలో ఇలాంటి ఉపమానాలు చెల్లవు.
నరేంద్రుడు: ఈయన God (దేవుడు) అని నేను చెప్పడం లేదు కాని Godlike man (దేవుడిలాంటమనిషి) అని చెబుతున్నాను.
డాక్టరు: ఎవరెవరి భావాలను వారి మనస్సులోనే అణచివేసుకోవాలి. వాటిని బయటకు ప్రదర్శించడం మంచిది కాదు. నా భావాలను అర్థం చేసుకొనే వారు ఎవరూ లేరు. నా ఆప్తమిత్రులు కూడా నన్ను దయాదాక్షిణ్యం లేనివాడుగా భావిస్తారు. అంతెందుకు, కొన్నిరోజుల గడిచాక మీరు కూడా నన్ను అపార్థం చేసుకొని చెప్పుదెబ్బలతో బయటకు తరిమివేస్తారో, ఏమో?
శ్రీరామకృష్ణులు: అదేమిటి, అలా మాట్లాడతావు? వీరందరూ నిన్ను ఎంతగా ప్రేమిస్తారని! నువ్వు వస్తావని వీరందరూ నీ కోసం ఎదురు తెన్నులు చూస్తుంటారు.
గిరీశ్: ఇక్కడ ఉన్న వారందరికీ మీ మీద ఎంతో గౌరవం ఉంది.
డాక్టరు: నా భార్య, కుమారుడు కూడా నన్ను Hard hearted (కఠోర హృదయుడి) గానే తలుస్తారు. ఎందుకంటే నేను నా భావాలను ఎన్నడూ వెల్లడించను కదా!
గిరీశ్: అయ్యా, మరి అలాంటప్పుడు మీరు కనీసం మీ స్నేహితుల మీద దయతలచి ఐనా సరే, మీ హృదయ కవాటాలను తెరవండి.
డాక్టరు: ఏమని చెప్పమంటావు? మీకంటే ఎక్కువగా నాకు భావావేశం కలుగుతుంది. I shed tears in solitude (ఏకాంతంలో కన్నీరు కారుస్తుంటాను)
(శ్రీరామకృష్ణులతో) అది సరే, భావావస్థలో మీరు ఇతరుల దేహాల మీద పాదాలు మోపుతారు కదా! అది మంచిది కాదు సుమా!
శ్రీరామకృష్ణులు: నాకు తెలిసే అలా చేస్తున్నాననుకుంటున్నావా?
డాక్టరు: ఆ పని మంచిది కాదు అని మీరు కూడా భావిస్తారు కదా! ఏమంటారు?
శ్రీరామకృష్ణులు: భావసమాధిలో నాకు ఏమవుతుందో నీకు ఎలా వివరించగలను? ఆ స్థితి నుండి కిందికి దిగివచ్చిన తరువాత ఈ రోగం బహుశా ఆ స్థితుల కారణంగానే వచ్చిందేమోనని నాకు కొన్ని సమయాల్లో అనిపిస్తుంది. భగవద్భావంలో నాకు ఉన్మాదం కలుగుతుంది, దైవోన్మాదంతో అలా అయిపోతుంది. అందుకు నేనేం చేయను?
డాక్టరు: సమాధి స్థితిలో ఇతరులపై పాదాలు మోపడం మంచిది కాదనే ఈయన ఒప్పుకుంటున్నారు. తాను చేసిన పని అపచారమని తెలుసుకుని విచారం వ్యక్తపరుస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): నువ్వు తెలివైనవాడివి కదా! నువ్వు మాట్లాడవెందుకని? విషయాన్నంతా డాక్టరుకు విశదపరుచు.
గిరీశ్ (డాక్టరుతో): మహాశయా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సమాధి స్థితిలో భక్తులు దేహాలను తాకినందుకు కాదు ఈయన విచారం వ్యక్తపరుస్తోంది. ఈయన దేహం పరిశుద్ధమైనది. భక్తుల మేలు కోరే ఈయన వారిని అలా స్పృశిస్తారు. ఈ విధంగా వారిని స్పృశించి వారి పాపాలు గ్రహించి నందునే ఈ వ్యాధి సంక్రమించినదేమోనని ఈయన కొన్ని సమయాల్లో అనుకుంటారు.
“మీ సంగతే తీసుకోండి. మీకు కడుపునొప్పి వచ్చినప్పుడు, రాత్రిళ్ళు నిద్ర పోకుండా చదువుతున్నప్పుడు అందుకు మీరు విచారించలేదా? అందుకని రాత్రిళ్ళు మేలుకొని చదవడం కాని పని అవుతుందా? జబ్బు చేసిందని ఈయన కూడా కాస్త విచారించి ఉంటారు, అంతే. కాని భక్తుల యోగక్షేమాలకై వారిని స్పృశించడం అపచారమని ఈయన తలంచడంలేదు సుమా!”
ఈ మాటలు విని డా. సర్కార్ చకితుడై “నీ వద్ద నేను ఓడిపోయాను. నీ పాదధూళి స్వీకరిస్తాను” అంటూ గిరీశ్ కాళ్ళకు నమస్కరించాడు. పిదప నరేంద్రుడితో, “ఎవరైనా ఏమైనా చెప్పనివ్వు. గిరీశ్ తెలివి తేటలను మాత్రం ఒప్పుకోవలసిందే” అన్నాడు.
నరేంద్రుడు (డాక్టరుతో): మీరు ఆ విషయాన్ని మరో దృక్కోణం నుండి ఆలోచించండి. Scientific Research కోసం (విజ్ఞానశాస్త్ర పరిశోధనలకై) మీరు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా జీవితాన్ని ధారపోస్తారు కదా! కాని భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనేది Grandest of all Sciences (సర్వోత్కృష్ట జ్ఞానం) – మరి అలాంటప్పుడు ఆ జ్ఞానం సముపార్జించే నిమిత్తం ఆరోగ్యాన్ని లక్ష్యపెట్టకపోవడం అసహజం కాదు కదా!
డాక్టరు: ఏసుక్రీస్తు, చైతన్యుడు, బుద్ధుడు, మహమ్మద్ మొదలైన మతాచార్యులందరూ చివరికి అహంకారపూరితులయ్యారు. వారందరూ ‘నేను చెప్పిందే వేదం’ అన్నారు. ఇది ఎంత శోచనీయం!
గిరీశ్ (డాక్టరుతో): అయ్యా, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మీరు వారిని అహంకారపూరితులని అంటున్నారు. వారిలో మీరు ఈ దోషాన్ని ఎంచారు. ఈ కారణం చేత మిమ్మల్ని కూడా అహంకారపూరితులుగా జమకట్టవచ్చు.
డా.సర్కార్ ఏమీ బదులివ్వలేదు.
నరేంద్రుడు (డాక్టరుతో): We offer worship to him bordering on divine worship. (మేము ఈయన్ను భగవంతుడిగానే ఆరాధిస్తున్నామని చెప్పుకోవాలి)
వీరి మాటలన్నీ వింటూ శ్రీరామకృష్ణులు పసిబాలుడిలా ఆనందంగా నవ్వుతున్నారు.