43.1 ప్రథమ పరిచ్ఛేదం వినోద్, రాఖాల్, చిన్న నరేంద్రుడు తదితర భక్తులతో
మంగళవారం, జూలై 28, 1885
సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు బలరామ్బోసు ఇంటి అతిథుల గదిలో భక్తులతోపాటు కూర్చుని ఉన్నారు. వినోద్, రాఖాల్, చిన్న నరేంద్రుడు, ‘మ’ తదితర భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు నేటి ఉదయం బలరామ్ ఇంటికి విచ్చేసి భక్తులతో పాటు అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. బలరాం ఇంట్లో జగన్నాథస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. జగన్నాథస్వామికి నివేదించబడిన కారణాన బలరామ్ ఇంట్లోని భోజనాన్ని పవిత్ర భోజనంగా శ్రీరామకృష్ణులు పరిగణిస్తారు.
నందబోసు బాగ్‌బజార్‌లో వసిస్తున్న ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడి ఇంట్లో దేవీదేవతల చిత్తరువులు అనేకం ఉన్నాయని నారాయణ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణులకు తెలిపారు. ఆ చిత్తరువులను చూడగోరి శ్రీరామకృష్ణులు ఈ రోజు మధ్యాహ్నం నందబోసు ఇంటికి వెళ్ళనున్నారు. కుమార్తె మరణించిందన్న దుఃఖంతో కుమిలిపోతున్న ఒక బ్రాహ్మణస్త్రీ ఇల్లు అక్కడికి దగ్గరలోనే ఉంది. ఆమె శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ప్రపత్తులు కలిగివుంది. ఆయన్ను దర్శించే నిమిత్తం తరచూ దక్షిణేశ్వరం వస్తూంటుంది. తన ఇంటికి రమ్మని దీనంగా వేడుకొని ఉంది. ఆమె ప్రార్థనను మన్నించి శ్రీరామకృష్ణులు ఆమె ఇంటికి కూడా వెళ్ళనున్నారు. తరువాత అక్కడినుండి గణు తల్లి అనే భక్తురాలి ఇంటికి వెళ్ళనున్నారు.
ఒకనొక సందర్భంలో చిన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో ‘నాకు చాలా పనులు ఉన్నాయి. పరీక్షలకు తయారు కావలసి ఉంది. అందువల్ల నేను తరచూ మీ వద్దకు రాలేను’ అన్నాడు.
శ్రీరామకృష్ణులు (చిన్న నరేంద్రుడితో): ఇవాళ నిన్ను నేను పిలిపించలేదే!
చిన్న నరేంద్రుడు (నవ్వుతూ): అది నిజమే. అయితే దాని గురించి ఇప్పుడు చేసేది ఏముంది?
శ్రీరామకృష్ణులు: సరే నాయనా, నేను నీ చదువులలో జోక్యం చేసుకోను. నీకు తీరిక ఉన్నప్పుడే నా వద్దకు రావచ్చు.
శ్రీరామకృష్ణులు తమ మనస్సు గాయపడిన ధోరణిలో ఈ మాటలన్నారు. శ్రీరామకృష్ణులు నందబోసు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆయన కోసం ఒక పల్లకీ రప్పించారు. భగవన్నామం ఉచ్చరిస్తూ ఆయన పల్లకీ ఎక్కారు. నల్ల పాలీషు చెప్పులు తొడుగుకొని, ఎర్రంచు పంచె ధరించి ఉన్నారు. ఉత్తరీయం లేదు. ఆయన పల్లకీలో కూర్చున్నాక ‘మ’ ఆయన చెప్పులను తీసి ప్రక్కన పెట్టాడు. తాను కూడా పల్లకీ వెంబడే నడవసాగాడు. ఇంతలో పరేశ్కూడా వచ్చి వారిని కలుసుకున్నాడు.
పల్లకీ నందబోసు ఇంటి ద్వారం దాటి విశాలమైన ఖాళీ స్థలం మీదుగా వెళ్ళి ఇంటి ముంగిట ఆగింది. ఇంటి యజమాని కుటుంబంతో సహా వచ్చి శ్రీరామకృష్ణులకు మ్రొక్కాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో చెప్పులు అందించమని చెప్పి పల్లకీనుండి దిగారు. పిదప అందరూ కలసి మేడపై నున్న పెద్ద హాలులోకి వెళ్ళారు. ఆ హాలులో నాలుగు గోడలకూ దేవీదేవతల చిత్రపటాలు వ్రేలాడుతున్నాయి.
ఇంటి యజమాని నందబోసు, అతడి తమ్ముడు పశుపతి వచ్చి శ్రీరామకృష్ణులతో మాట్లాడసాగారు. ఇంతలో భక్తులు కూడా అక్కడకు వచ్చారు. వారితోపాటు గిరీశ్ సోదరుడు అతుల్కూడా వచ్చాడు. ప్రసన్నుని తండ్రి నందబోసు ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు. ఆయన కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. ప్రసన్నుడు శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ప్రపత్తులున్నవాడు.
43.2 ద్వితీయ పరిచ్ఛేదం నందబోస్ ఇంట్లో చిత్రపటాలు
శ్రీరామకృష్ణులు చిత్రపటాలను చూడసాగారు. ఆయనతోబాటు భక్తులు కూడా చిత్రపటాలను చూస్తున్నారు. పశుపతి వారికి చిత్రపటాలను గురించి వివరిస్తున్నాడు.
మొదటి చిత్రపటం చతుర్భుజ విష్ణువుది. దాన్ని చూడగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మునిగిపోయారు. నిలబడి ఉన్న వ్యక్తి అలాగే కూర్చుండిపోయి కాసేపు అదేస్థితిలో ఉండిపోయారు.
రెండవ చిత్రపటంలో భక్తవత్సలుడైన శ్రీరామచంద్రుడు హనుమంతుని శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నాడు. హనుమంతుడి దృష్టి శ్రీరాముడి పాదపద్మాలపై నిలిచి ఉంది. శ్రీరామకృష్ణులు ఈ చిత్రపటాన్ని చాలాసేపు చూస్తూండిపోయారు. భావపారవశ్యంలో “ఆహా! ఆహా!” అన్నారు.
మూడవ పటంలో వేణుగానలోలుడైన కృష్ణుడు పిల్లనగ్రోవి చేతపట్టుకొని కదంబవృక్షం క్రింద నిలబడివున్నాడు.
నాల్గవ చిత్రపటంలో వామనుడు గొడుగు చేతబట్టుకొని బలిచక్రవర్తి యజ్ఞశాలకు పోతున్నాడు. “వామనా!” అంటూ శ్రీరామకృష్ణులు తదేకంగా వామనుడి వంక చూస్తూండిపోయారు.
పిదప శ్రీరామకృష్ణులు నరసింహస్వామి పటం చూశారు. ఆ తరువాత బృందావనంలో గోపబాలురతో యమునానది తీరాన ఆవులను మేపుతున్న కృష్ణుడి పటం. దాన్ని చూసి ‘మ’ “ఆహా! ఎంత చక్కటి పటం” అన్నాడు.
తరువాత ధూమావతి, షోడశి, భువనేశ్వరి, తారా, కాళీ పటాలు ఉన్నాయి. అవి చూసి శ్రీరామకృష్ణులు “ఇవన్నీ ఉగ్రమూర్తులు. ఇటువంటి వాటిని ఇంట్లో పెట్టుకోరాదు. ఇలాంటి మూర్తిని ఒకవేళ ఇంట్లో ఉంచినట్లయితే యథావిధిగా పూజాదులు నిర్వర్తించాలి. కాని మీ అదృష్టం బాగుంది. అందుకే మీరు వాటిని అలా ఉంచుకోగలిగారు” అన్నారు.
అటుపైన అన్నపూర్ణాదేవి పటం. అది చూసి శ్రీరామకృష్ణులు పారవశ్యంలో “ఆహా! ఎంతబాగుంది!” అన్నారు.
అటు తరువాత రాధాదేవి చిత్రపటం. నికుంజవనంలో ఆమె తన చెలులతో పాటు సింహాసనంపై రాగాలాపన చేస్తోంది. శ్రీరామకృష్ణులు ఆ చిత్రాన్ని చాలాసేపు చూస్తూండిపోయారు.
ఈ విధంగా చిత్రపటాలను చూసిన తరువాత శ్రీరామకృష్ణులు ఇంటి యజమాని వద్దకు వెళ్ళి “ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. మీరు నిజమైన హిందువులు. ఆంగ్ల చిత్రాలు ఏవీ లేకుండా ఈ చిత్రాలను ఉంచారే! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అన్నారు.
నందబోసు కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులతో “మీరు నిలబడే ఉన్నారేం? రండి, వచ్చి కూర్చోండి.” అన్నాడు. శ్రీరామకృష్ణులు కూర్చుని ఇలా అన్నారు: “ఈ పటాలన్నీ బాగా పెద్దవి.”
నందబోసు: ఆంగ్లేయుల పటాలు కూడా ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అయితే అవి ఎక్కువగా లేవుగా! మీకు ఆంగ్లేయుల పద్ధతులపై పెద్దగా మోజు లేనట్లే ఉంది.
కేశవ్సేన్ ‘నవ విధాన్’ అనే చిత్రపటం గోడకు వ్రేలాడుతోంది. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుడైన సురేశ్ మిత్ర ఆ చిత్రాన్ని వేయించాడు. అందులో శ్రీరామకృష్ణులు కేశవ్సేన్కు భిన్న మతస్థులు భిన్న మార్గాలను అనుసరించి ఒకే గమ్యాన్ని చేరుకుంటున్నారని చూపిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: అదిగో, సురేంద్రుడి పటం!
ప్రసన్నుడి తండ్రి (నవ్వుతూ): అందులో మీరు కూడా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): దాన్లో అన్నీ ఉన్నాయి. అది ఆధునిక భావం.
ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావపరవశులై జగజ్జననితో సంభాషించసాగారు. కాసేపటి తరువాత త్రాగుబోతువలె “నాకు స్పృహ తప్పలేదు” అన్నారు. ఇంటివైపు దృష్టిని సారించి “ఇల్లు బాగా పెద్దదిగానే ఉంది. కాని అందులో ఉన్నదేమిటి? ఇటుకలు, కొయ్య, మట్టే కదా!” అన్నారు.
కొంతసేపైన తరువాత “దేవీదేవతల చిత్రపటాల నన్నిటినీ చూశాక నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని పలికి ఇలా కొనసాగించారు: “అయితే కాళీ, తారా వంటి ఉగ్రమూర్తుల చిత్రాలు పెట్టుకోవడం మంచిది కాదు. అలా పెట్టుకున్నట్లయితే నిత్యపూజలు చేస్తూండాలి.”
పశుపతి (నవ్వుతూ): తల్లి ఇలా ఎన్ని రోజులు నడిపిస్తే అన్ని రోజులు జరుగుతాయి లెండి.
శ్రీరామకృష్ణులు: ఆ, ఆ మాట నిజమే. కాని భగవంతుడి పట్ల మనస్సు నిలపడం మంచిది. ఆయన్ను మరచిపోవడం మంచిది కాదు.
నందబోసు: ఎక్కడిది, భగవంతుడి వైపు మా మనస్సు నిలిస్తే కదా!
శ్రీరామకృష్ణులు: ఆయన కృపతో అది సాధ్యపడుతుంది.
నందబోసు: కాని ఆయన కృప కలగటం లేదే? ఆయనకు నిజంగానే తన కృపను ప్రసాదించే శక్తి ఉందా?
43.2.1 సంపూర్ణ శరణాగతి – భగవంతుడే కర్త
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అర్థమయింది. నీది పండితుల భావం – ఎవరు ఎలా కర్మలు చేస్తే అలా ఫలం అనుభవిస్తారు అనేటటువంటి భావం. ఇలాంటి భావాలను వదలివెయ్యి. భగవంతుణ్ణి శరణు జొచ్చితే కర్మ క్షయమైపోతుంది. నేను పువ్వులు చేత బట్టుకొని అమ్మతో ఇలా అన్నాను. ‘అమ్మా, ఇదిగో నీ పాపం, ఇదిగో నీ పుణ్యం – రెండూ నువ్వే తీసుకో, నాకు ఏదీ వద్దు. నాకు కేవలం శుద్ధభక్తిని మాత్రం ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ మంచి, ఇదిగో నీ చెడు – రెండూ నువ్వే తీసుకో, నాకు మంచిచెడులు ఏవీ వద్దు. నాకు కేవలం శుద్ధభక్తిని మాత్రం ప్రసాదించు. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం – రెండూ నువ్వే తీసుకో. నాకు ధర్మాధర్మాలు ఏవీ వద్దు. అమ్మా, ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం.– రెండూ నువ్వే తీసుకో. నాకు జ్ఞానాజ్ఞానాలు ఏవీ వద్దు. నాకు కేవలం శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించు. అమ్మా, ఇదిగో శుచి, ఇదిగో నీ అశుచి – రెండూ నువ్వే తీసుకో. నాకు కేవలం శుద్ధభక్తిని మాత్రమే ప్రసాదించు.’
నందబోసు: భగవంతుడు శాసనాన్ని ఉల్లంఘించగలడా?
శ్రీరామకృష్ణులు: అదేమిటి, నువ్వు అలా అడుగుతావేమిటి? ఆయన భగవంతుడు. ఆయనకు అంతా సాధ్యమే.శాసనాన్ని ఏర్పరచిన వాడు కావాలంటే దాన్ని మార్చనూగలడు.
43.2.2 భోగలాలస – భగవంతుడు పక్షపాతా? – భగవంతుడు ఇచ్ఛామయుడు
“కాని నువ్వు అలా మాట్లాడవచ్చు. ఎందుకంటే నీకు భోగాలను అనుభవించాలన్న కోరిక ఉంది. అందుకే అలా మాట్లాడుతున్నావు. భోగాలను అనుభవింపనిదే చైతన్యం జాగృతమవదని కొందరి అభిప్రాయం. కాని అనుభవించ డానికంటూ ఏముందని? కామినీ కాంచనాల సుఖం అనేది ఇప్పుడు ఉంటుంది! మరుక్షణంలో కనుమరుగై పోతుంది. అది కేవలం క్షణభంగురం మాత్రమే. పైగా, కామినీ కాంచనాలలో ఏముంది? రేగిపండులా తోలు, విత్తనం మాత్రమే. తింటే ఆమ్లశూల చేస్తుంది. లేకుంటే అది ఏదైనా తీపి వస్తువులాంటిది. ఒకసారి మ్రింగగానే ఇక ఏమీ మిగలదు.”
నందబోసు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత ఇలా అన్నాడు: “జనం అలాగే అంటారనుకోండి. కాని భగవంతుడు పక్షపాతం ఉన్నవాడా? అంతా ఆయన కృప ద్వారానే జరుగుతున్నట్లయితే మరి ఆయన పక్షపాతి అవవలసిందే కదా!”
శ్రీరామకృష్ణులు: కాని స్వయంగా భగవంతుడే సర్వమూ అయి ఒప్పారుతున్నాడు. జీవ జగత్తులుగా విరాజిల్లుతున్నాడు. పూర్ణజ్ఞానం సిద్ధించినప్పుడు ఆ బోధ కలుగుతుంది. భగవంతుడు మనస్సు, బుద్ధి, దేహం మొదలైన ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడు. మరి అలాంటప్పుడు ఆయన ఎవరి పట్ల పక్షపాతం వహించగలడు?
నందబోసు: భగవంతుడు నానా రూపాలను ఎందుకు ధరించాడు? ఒక చోట జ్ఞానిగాను, మరో చోట అజ్ఞానిగానూ ఎందుకున్నాడు?
శ్రీరామకృష్ణులు: అదంతా ఆయన ఇష్టం.
అతుల్: ఈ విషయం గురించి కేదార్ బాబు చాలా చక్కగా చెప్పాడు. భగవంతుడు లోకాన్ని ఎందుకు సృష్టించాడని ఎవరో అడగ్గా అందుకు అతడు ‘ఏ సమావేశంలోనైతే భగవంతుడు సృష్టి చేయాలని యోచన చేశాడో, ఆ సమావేశానికి నేను హాజరు కాలేదన్నాడు.’ (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: అదంతా ఆయన ఇష్టం.
ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు.
సకలము నీ తలపే
జరిగింతువు అటువలెనే
నీ పనులను నీ వొనరుప
తాజేసితిమని తలతురు ॥ స ॥
పంకమందు కూరునట్లు
భద్రగజమును బంధింతువు
కుంటివాని దూకింతువు
కొండల పైపైకి కూడ ॥ స ॥
కూలద్రోతు నీవొకరిని
ఘోర భవాఘాతమందు
ఎక్కింతువు వేరొకరిని
ఎనలేని బ్రహ్మపదము ॥ స ॥
నే యంత్రము నీవు యంత్రివి
నే గృహమును నీవు గృహిణి
నే రథమును నీవు రథివి
ఎటు నడపెదొ అటె నడతును ॥ స ॥
పాట పాడి శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. “ఆమె ఆనందమయి, సృష్టి స్థితి లయాలనే లీలలను నిర్వహిస్తోంది. జీవులు అసంఖ్యాకం. వారిలో ఏ ఒకరో లేక ఇద్దరు మాత్రమే ముక్తులు అవుతున్నారు. ఆమె ఎంతగానో సంబరపడిపోతుంది.
లక్షలోన ఏదో ఒకటి
తెంచుకొనుచు ఎగిరిపోవు
దాని చూచి నవ్వుకొనుచు
చప్పట్లను చరతు నీవు.
“అమ్మా, అదిచూసి నువ్వు చప్పట్లు చరుస్తూ నవ్వుతావు. కొందరు సంసారంలో బద్ధులవుతున్నారు. మరికొందరు ముక్తులవుతున్నారు.
ఎన్నెన్ని పడవలు ఎగుడు దిగుడు గలిగి
భవసాగరంబుపై పయనించుచుండె
పయనించుచుండిన పడవలవి యెన్ని
ఆ సాగరము లోతులందున మునిగిపోవు.”
43.2.3 ‘నేను’ ను అన్వేషించు’ – అపరిపక్వమైన ‘నేను’ ను త్యజించు
నందబోసు: పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఇదంతా ఆమె ఇష్టం! కాని ఇందులో మా ప్రాణాలే పోతున్నాయి.
శ్రీరామకృష్ణులు: కాని నువ్వు ఎవరివి? ఆమే సర్వమూ అయివుంది. ఆమెను తెలుసుకోనంతవరకే ‘నేను, నేను’ అంటూ ఉంటావు.
“అందరూ భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటారు. అందరూ ఉద్ధరింపబడతారు. కొందరికి పెందలకడనే భోజనం లభిస్తుంది. కొందరికి మధ్యాహ్న సమయంలో, మరికొందరికి సాయంకాలాన లభిస్తుంది. కాని ఎవరూ పస్తు ఉండరు. అందరూ తమ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు.”
పశుపతి: అవునండీ. భగవంతుడే సమస్తమూ అయివున్నాడని అనిపిస్తోంది.
శ్రీరామకృష్ణులు: ‘నేను ఎవర్ని’ అంటూ ఈ ‘నేను’ ను అన్వేషించు. ‘నేను’ అనేది ఎముకలా లేక మాంసమా లేక రక్తమా లేక ప్రేవులా? ‘నేను’ ను వెదకుతూపోయినప్పుడు ‘నువ్వు’ ను కనుగొంటావు. అంటే, లోపల భగవంతుడి శక్తి కంటే వేరుగా మరేమీ లేదు. ఉన్నది ‘నేను’ కాదు, ‘ఆయనే’. (పశుపతితో) సిరిసంపదలున్నప్పటికీ నీకు మిడిసిపాటు లేదు. ఈ ‘నేను’ ను పూర్తిగా త్యజింపలేము. ఈ ‘నేను’ అనేది వదిలేది కాదు కాబట్టి ఆ వెధవను భగవంతుడి దాసుడిగా పడి ఉండనివ్వు. (అందరూ నవ్వారు) నేను భగవంతుడి భక్తుడను, భగవంతుడి బిడ్డను, భగవంతుడి దాసుడను అనేటటువంటి అహం మంచిది. కామినీ కాంచనాలలో అనురక్తమై ఉన్న ‘నేను’ అపరిపక్వమైన ‘నేను’. అలాంటి ‘నేను’ ను పరిత్యజించాలి.”
అహంకారం గురించిన ఈ అద్భుత వ్యాఖ్యానం విని ఇంటి యజమానితో సహా అక్కడ ఉన్న వారందరూ నిశ్చేష్టులైపోయారు.
43.2.4 జ్ఞాని లక్షణాలు – ఐశ్వర్యం వల్ల ‘మత్తు’
శ్రీరామకృష్ణులు (పశుపతితో): జ్ఞానికి రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది, అతడికి అహంకారమనేది ఉండదు. రెండవది శాంతస్వభావం కలిగి ఉంటాడు. నువ్వు ఈ రెండు లక్షణాలనూ కలిగి ఉన్నావు. అంటే నీ మీద భగవంతుడి అనుగ్రహం ఉందన్నమాట.
“అధిక సంపద భగవంతుణ్ణి మరిపింపచేస్తుంది. సంపద స్వభావమే అలాంటిది. యదుమల్లిక్ బాగా సంపన్నుడయ్యాడు. అందుచేత ఈ నడుమ అతడు భగవద్విషయాలు మాట్లాడటం లేదు. ప్రప్రథమంలో అతడు భగవత్ప్రసంగాలలో ఎంతో ఆనందం పొందేవాడు.
“కామినీకాంచనాలు ఒక విధమైన మద్యం లాంటివి. మద్యపానం ఎక్కువగా చేస్తే చిన్నాన్న, పెద్దనాన్న అన్న ఎరుక ఉండదు. వాళ్ళను కూడా అనరాని మాటలు అంటాడు. త్రాగుబోతుకు పెద్ద చిన్న అనే వ్యత్యాసం కనబడదు.”
నందబోసు: అవునండి, ఆ మాట నిజమే.
43.2.5 ‘మామిడి పళ్ళు తినడమే ముఖ్యం, లెక్కలు వ్యర్థం – నిరర్థక విషయాలు – సన్నిపాత రోగి
పశుపతి: మహాశయా! Spiritualism, Theosophy (ఆధ్యాత్మిక వాదము, దివ్యజ్ఞానం)ల గురించి మీ అభిప్రాయమేమిటి? సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం, ఇవన్నీ నిజంగానే ఉన్నాయంటారా?
శ్రీరామకృష్ణులు: ఏమో నాయనా, అవన్నీ నాకు తెలియవు. వాటి గురించి అంతగా తల పగలగొట్టుకోవడం ఎందుకు? మామిడి తోటకు మామిడి పళ్ళు తినడానికి వచ్చావు. అంతేకాని, తోటలో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల కొమ్మలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆకులు ఉన్నాయి అంటూ లెక్కించడం వల్ల ప్రయోజనం ఏమిటి? నేను తోటకు మామిడి పళ్ళను తినడానికి వచ్చాను, పళ్ళు తిని పోతాను.
“అయితే చైతన్యం కనుక ఒకసారి జాగృతమైనట్లయితే, భగవంతుణ్ణి ఒకసారి తెలుసుకో గలిగినట్లయితే, మరి అటువంటి నిరర్థక విషయాలను తెలుసుకోవాలన్న ఇచ్ఛ జనించదు. సన్నిపాత రోగి అసందర్భంగా వాగుతూ ఉంటాడు. ‘నేను ఐదు సేర్ల అన్నం తింటాను. పీపా నీళ్ళు త్రాగుతాను’ అంటూంటాడు. వైద్యుడు ఇవన్నీ వింటూ ‘అలాగే, అలాగే తిందువులే’ అంటూంటాడు. ఇలా పలుకుతూ అతడు పొగాకు సేవిస్తూంటాడు. కాని సన్నిపాతం తొలగిపోయిన తరువాత రోగి మాట్లాడే మాటలను అతడు లక్ష్యపెడతాడు.”
43.2.6 భగవత్సంబంధం క్షణకాలమైనా చాలు! – అహల్య, నారదుడు
పశుపతి: బహుశా మా సన్నిపాతం చిరకాలం ఉంటుందేమో?
శ్రీరామకృష్ణులు: అలా ఎందుకు అనుకోవాలి? భగవంతుడిపై మనస్సును నిలుపు, చైతన్యం జాగృతమవుతుంది.
పశుపతి (నవ్వుతూ): భగవంతుడితోటి మా సంబంధం క్షణికమైనది. పొగాకు సేవించడం ఎంతసేపు ఉంటుందో అంతసేపు మాత్రమే. (అందరూ నవ్వారు.)
శ్రీరామకృష్ణులు: అలా ఉంటే ఉండవచ్చుగాక! భగవంతుడితో సంబంధం క్షణకాలం ఉన్నా సరే, అదే ముక్తిని కలుగజేస్తుంది.
“అహల్య శ్రీరాముడితో ఇలా అంది: ‘ప్రభో! నేను పంది కడుపున పుట్టినా సరే, లేకుంటే మరే ప్రాణిగా పుట్టిన సరే – నీ పాదపద్మాలపట్ల మనస్సు నిలిచేటట్లు, నీ పట్ల శుద్ధభక్తిని కలిగేటట్లు నన్ను అనుగ్రహించు.’
“నారదుడు రాముడితో ‘ఓ రామా! నేను నీనుండి మరే వరమూ కోరను. నాకు శుద్ధభక్తిని ప్రసాదించు. నీ భువనమోహన మాయలో నేను పడిపోకుండా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు.’
“భగవంతుణ్ణి హృదయాంతరాళాలనుండి ప్రార్థించినట్లయితే ఆయన పట్ల మనస్సు నిలుస్తుంది. ఆయన పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలుగుతుంది.
43.2.7 భగవంతుడు కల్పతరువు – పాపం, పరలోకం – అంత్యకాలంలో భగవచ్చింతన – భరతుడు
“ ‘మా సన్నిపాతం పోయేదెలా?’ ‘మరి మా గతి ఏమయ్యేట్లు?’ ‘మేము పాపులం’ – ఇలాంటి భావాలను వదిలిపెట్టండి. (నంద బోసుతో) దానికి బదులుగా ‘ఏమిటీ? నేను ఒకసారి రామనామాన్ని ఉచ్చరించాను. మరి నాకు పాపం ఎక్కడిది?’ అనేటటువంటి ప్రగాఢ విశ్వాసం కావాలి.”
నందబోసు: పరలోక మనేది ఉందా? పాపాలకు శిక్ష ఉందా?
శ్రీరామకృష్ణులు: నువ్వు మామిడిపళ్ళు తినవయ్యా బాబూ! ‘పరలోకం ఉందా లేదా?’ ‘దీని తరువాత ఏమవుతుంది?’ – ఇలాంటి విషయాలను లెక్కించడంవల్ల ఏమిటి ప్రయోజనం? మామిడిపళ్ళను తిను. కావలసింది మామిడి పళ్ళు. కావలసింది భగవంతుడి పట్ల భక్తి –
నందబోసు: కాని మామిడిచెట్టు ఎక్కడ ఉంది? మామిడి పళ్ళు ఎక్కడ లభిస్తాయి?
శ్రీరామకృష్ణులు: చెట్టా? భగవంతుడు అనాది అనంత బ్రహ్మం. ఆయన ఉండనే ఉన్నాడు. ఆయన నిత్యుడు. కాని ఒక్క విషయం – భగవంతుడు కల్పతరువు.
రావే మనసా షికారు పోదము
కాళీకల్ప ద్రుమంబునకు
ప్రోగుచేయుమా చెట్టు క్రిందను
నాలుగు పురుషార్థంబులను.
“కల్పతరువు వద్దకు వెళ్ళి ప్రార్థించాలి. అప్పుడే పళ్ళు లభిస్తాయి. పళ్ళు వృక్షం నుండి అప్పుడే నేల రాలుతాయి. అప్పుడు మనం పళ్ళను ప్రోగుచేసుకోవచ్చు. ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పళ్ళు.
“జ్ఞానులు మోక్షాన్ని కోరుకుంటారు. భక్తులు భక్తిని అంటే అహేతుక భక్తిని అపేక్షిస్తారు. వారు ధర్మార్థ కామాలను కోరుకోరు.
“నువ్వు పరలోకం గురించి అడిగావు కదా? భగవద్గీత ప్రకారం మనిషి మరణించేటప్పుడు దేనినైతే ఆలోచిస్తాడో మరుజన్మలో అలాగే అవుతాడు. భరత మహారాజు మరణించేటప్పుడు ‘జింక, జింక’ అని దుఃఖీస్తూ ప్రాణాలు వదిలాడు. అందుకే అతడు మరుజన్మలో జింకలా జన్మించవలసి వచ్చింది. కాబట్టి జపం, ధ్యానం, పూజ మొదలైనవి రాత్రింబవళ్ళు అభ్యసించాలి. అప్పుడే, ఈ అభ్యాస బలంతో, మరణకాలంలో భగవచ్చింతన సాధ్యపడుతుంది. ఈ విధంగా మరణం సంభవిస్తే, ఆ వ్యక్తి భగవత్ స్వభావాన్ని పొందుతాడు.
“కేశవ్సేన్ కూడా నన్ను పరలోకం గురించి అడిగాడు. అందుకు నేను ‘ఇలా వీటన్నిటి గురించి లెక్కలు కట్టడం వల్ల నీ కేమిటి ప్రయోజనం?’ అన్నాను. ఇంకా ఇలా చెప్పాను: “భగవంతుణ్ణి ప్రాప్తించుకోనంతవరకు మళ్ళీ మళ్ళీ సంసారంలోకి రాకపోకలు సాగించాల్సిందే. కుమ్మరి మట్టితో చేసిన కుండలు, మూతలు ఎండబెడతాడు. పశువులు వాటిని త్రొక్కివేసినట్లయితే అతడు కాలిపోయిన వాటిని పారేస్తాడు. కాని పచ్చిగా ఉన్న వాటిని మళ్ళీ మట్టిలో కలుపుతాడు. వాటిని సారెపై పెట్టి కొత్త కుండలను తయారుచేస్తారు.”
43.3 తృతీయ పరిచ్ఛేదం రజోగుణ చిహ్నాలు – జ్ఞాన భక్తి, శుద్ధ భక్తి
ఇంతవరకు ఇంటి యజమాని శ్రీరామకృష్ణులకు ఉపాహారం సమర్పించే సూచనలు చూపలేదు. అందువల్ల శ్రీరామకృష్ణులే స్వయంగా నందబోసుతో ఇలా అన్నారు: “ఇలా చూడు, నువ్వు తినడానికి ఏమైనా ఇవ్వాలి. నేను ఒక రోజు యదుమల్లిక్ తల్లితో ‘ఏమైనా తినడానికి ఇవ్వవమ్మా, లేకుంటే అది గృహస్థులకు అశుభం కలిగిస్తుంది’ అని చెప్పాను.”
నందబోసు మిఠాయిలు తెప్పించాడు. శ్రీరామకృష్ణులు వాటిని తినసాగారు. నందబోసు తదితరులు శ్రీరామకృష్ణుల వంక తదేకంగా చూస్తున్నారు. మిఠాయిలు తిన్న తరువాత ఆయన చేతులు కడుక్కోవాలనుకున్నారు. అయితే మిఠాయిలు తీసుకువచ్చిన పళ్ళాన్ని తివాచీ మీద ఉంచారు. అందువల్ల ఆయన పళ్ళెంలో చేతులు కడుక్కోలేకపోయారు. పనిమనిషి ఆయన చేతులు కడుక్కోవడానికని ఒక కంచుపాత్ర తీసుకువచ్చింది. కాని శ్రీరామకృష్ణులు దాన్ని ఉపయోగించలేదు; ఎందుకంటే రజోగుణం గలవారు అలా చేస్తారు కాబట్టి. కంచుపాత్రను చూడగానే ఆయన పని మనిషితో “అది అక్కర లేదు. దాన్ని తీసుకువెళ్ళిపో” అన్నారు. ఇంటి యజమాని “ఇందులో చేతులు కడుక్కోండి” అన్నాడు. శ్రీరామకృష్ణులు పరధ్యానంగా “ఏమిటి? చేతులుకడుక్కోవాలా?” అన్నారు.
తరువాత ఆయన దక్షిణపు వసారాలోకి వెళ్ళారు. చేతులు కడుక్కోవడానికి ‘మ’ ను నీళ్ళు పోయమన్నారు. ‘మ’ ఒక చెంబుతో నీళ్ళు పోశాడు. చేతులు కడుక్కొని ఆయన తువ్వాలుతో తుడుచుకున్నారు. గదికి తిరిగి వచ్చాక ఒక పళ్లెంలో తాంబూలాలు తెచ్చి ఆయనకు ఇచ్చారు. కాని ఆ పళ్ళెంనుండి ముందుగానే కొందరు అతిథులు తాంబూలాలు తీసుకొన్నందున ఆయన వాటిని స్వీకరించలేక పోయారు.
నందబోసు (శ్రీరామకృష్ణులతో): మిమ్మల్ని ఒక మాట అడగాలి?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏమిటది?
నందబోసు: మీరు తాంబూలం స్వీకరించ లేదు ఎందుకని? అంతా బాగానే ఉంది కాని అదొక్కటే లోపంగా కానవస్తోంది.
శ్రీరామకృష్ణులు: ఇష్టదేవతకు సమర్పించి, స్వీకరించడం నా అలవాటు.
నందబోసు: మీరు దాన్ని ఎలా తీసుకున్నా చివరకు ఇష్టదేవతకు చేరేదే కాదా!
శ్రీరామకృష్ణులు: జ్ఞానమార్గం అని ఒకటి ఉంది. భక్తిమార్గం అని మరొకటి ఉంది. జ్ఞానులు బ్రహ్మజ్ఞానం ఆపాదించుకొని అన్ని వస్తువులను స్వీకరించగలరు. భక్తిమార్గంలో (శుచి, అశుచి అని) కొద్దిగా భేదబుద్ధి ఉంటుంది.
నందబోసు: అయినా, మీరు చేసింది సముచితమని నేను భావించను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నా భావం అలాంటిది సుమా! అయితే నువ్వు చెప్పేది కూడా నిజమే. శాస్త్రాలలో అది కూడా చెప్పబడింది.
పిదప శ్రీరామకృష్ణులు ఇంటియజమానిని ముఖస్తుతిపరుల నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.
శ్రీరామకృష్ణులు: మరో ముఖ్య విషయం – ముఖస్తుతిపరుల నుండి జాగ్రత్తగా ఉండు. వారు తమ స్వార్థం కోసం అటూ ఇటూ తిరుగుతుంటారు. (ప్రసన్నుడి తండ్రితో) మీరు ఉండటం ఇక్కడేనా?
ప్రసన్నుడి తండ్రి: లేదండి, మా ఇల్లు ఇక్కడకు సమీపంలోనే ఉంది. కాస్త పొగ త్రాగుతారా?
శ్రీరామకృష్ణులు (ఎంతో వినయంతో): వద్దండీ, మీరే త్రాగండి, నాకిప్పుడు పొగ త్రాగాలనిలేదు.
నందబోసు ఇల్లు చాలా పెద్దది. శ్రీరామకృష్ణులు అతడితో “యదుమల్లిక్ ఇల్లు ఇంత పెద్దది కాదు. అదే సంగతి ఆనాడు నేను అతడితో చెప్పాను” అన్నారు.
నందబోసు: ఆయన జోరాసాంకోలో కొత్త ఇల్లు ఒకటి కట్టించాడండి.
శ్రీరామకృష్ణులు నందబోసును ఉత్సాహపరుస్తూ ఇలా అంటున్నారు.
శ్రీరామకృష్ణులు (నందబోసుతో): నువ్వు సంసారంలో ఉంటూనే భగవంతునిపై మనస్సును లగ్నం చేశావు. ఇదేమైనా సామాన్య విషయమా? సంసారం త్యజించిన వాడు భగవంతుణ్ణి ఎలాగైనా సరే ప్రార్థించి తీరతాడు. అందులో ఘనత ఏముంది? సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ప్రార్థించేవాడు నిజంగానే ధన్యుడు సుమా! అలాంటి వ్యక్తి ఇరవై మణుగులు బరువు ఉన్న రాయిని తొలగించాక వస్తువును పొందే వ్యక్తి లాంటివాడు.
“ఏదో ఒక భావాన్ని ఆశ్రయించి భగవంతుణ్ణి ప్రార్థించాలి. హనుమంతుడిది జ్ఞానభక్తి, నారదుడిది శుద్ధభక్తి.
“శ్రీరాముడు హనుమంతుడితో, ‘హనుమా! నువ్వు నన్ను ఏ భావంతో ఆరాధిస్తావు?’ అని అడిగాడు. అందుకు హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు: ‘ఒక్కోసారి నిన్ను పూర్ణుడుగాను, నన్ను అంశగాను గాంచుతాను. ఒక్కోసారి నిన్ను ప్రభువుగాను, నన్ను దాసుడిగాను చూస్తాను. కాని ఓ రామా! తత్త్వజ్ఞానం కలిగినప్పుడు మాత్రం ‘నువ్వే నేను, నేను నువ్వు’ గా గాంచుతాను.’
“శ్రీరాముడు నారదుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు నారదుడు, ‘ఓ రామా! నీ పాదపద్మాలపట్ల శుద్ధభక్తి కలిగేలా, నీ భువనమోహన మాయలో సమ్మోహితుడను అవకుండేలా నాకు వరం ప్రసాదించు’ అన్నాడు.”
శ్రీరామకృష్ణులు బయలుదేరనున్నారు. నందబోసుతో ఇలా అన్నారు: “భగవద్గీత ప్రకారం పలువురి చేత గౌరవింపబడుతూ పూజింపబడే వ్యక్తిలో భగవంతుడి విశేషశక్తి ఉంటుంది. నీలో భగవంతుడి శక్తి ఉంది.”
నందబోసు: శక్తి మానవులందరిలోనూ సమానంగా ఉంది.
శ్రీరామకృష్ణులు (తీక్షణంగా): మీతో వచ్చిన చిక్కే ఇది! అందరికీ శక్తి సమానంగా ఉంటుందా ఏమిటి? విభువు రూపంలో భగవంతుడు సర్వభూతాలలో ఒకటిగానే విరాజిల్లుతున్నాడన్నది నిజమే. కాని ఆయన శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు ఉన్నాయి.
“విద్యాసాగర్ కూడా నాతో ఇదే మాట అన్నాడు. ‘భగవంతుడు కొందరికి ఎక్కువ శక్తిని, కొందరికి తక్కువ శక్తిని ప్రసాదించాడా ఏమిటి?’ అని అడిగాడు. అందుకు నేను ఇలా జవాబిచ్చాను: ‘శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు లేనట్లయితే మేమందరం మిమ్మల్ని చూడడానికి ఎందుకు వచ్చాం? మీ తలపైన రెండు కొమ్ములు మొలిచాయా ఏమిటి?’”
శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. భక్తులు కూడా ఆయనతో పాటు లేచారు. పశుపతి, ఇంటి ద్వారం దాకా వచ్చి వారిని సాగనంపాడు.
43.4 చతుర్థ పరిచ్ఛేదం దుఃఖీతురాలైన బ్రాహ్మణి ఇంట్లో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు బాగ్‌బజార్ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి రానున్నారు. ఏకైక కుమార్తె పోయిందన్న బాధతో దుఃఖీస్తున్న బ్రాహ్మణ వితంతువు ఆమె. ఇటుకలతో కట్టబడిన పాత ఇల్లు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎడమవైపున ఆవులకొట్టం ఉంది. భక్తులు మేడ మీద కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. పలువురు మేడపైన బారులుతీరి నిలబడ్డారు. మరికొందరు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణుల దర్శనానికై వారందరూ ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
బ్రాహ్మణికి ఒక చెల్లెలు ఉంది. అక్కాచెల్లెళ్లిద్దరూ వితంతువులే. ఇదే ఇంట్లో వారి అన్నదమ్ములు కూడా తమ కుటుంబాలతో నివసిస్తున్నారు. రోజంతా బ్రాహ్మణి శ్రీరామకృష్ణులకు స్వాగతం పలకటానికీ, ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సముచిత మర్యాదలు చేయడానికీ ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉంది. శ్రీరామకృష్ణులు నందబోసు ఇంట్లో ఉన్నంత సేపు ఆయన తన ఇంటికి ఎప్పుడు విచ్చేస్తారన్న అతురతతో ఆమె మాటిమాటికీ బయటకు వచ్చి చూసింది. నందబోసు ఇంటినుండి ఆమె ఇంటికి వస్తానని శ్రీరామకృష్ణులు ఆమెకు మాట ఇచ్చారు. అయితే ఆలస్యమై పోయింది కదా! మరి ఆయన రారేమో! అన్న తలంపుతో బ్రాహ్మణి కలత చెంది తానే స్వయంగా అక్కడకు వెళ్ళింది.
ఇంతలో శ్రీరామకృష్ణులు ఇంట్లోకి వచ్చారు. భక్తులు ఆయన్ను మేడమీదకు తోడ్కొని వెళ్లి అక్కడ పరిచిన తివాచీపై ఆసీనులను చేశారు. ‘మ’, నారాయణ్, యోగీన్, దేవేంద్ర తదితరులు ఒక చాపమీద కూర్చున్నారు. కాసేపటి తరువాత చిన్ననరేంద్రుడు, మరి కొందరు భక్తులు వచ్చారు. బ్రాహ్మణి చెల్లెలు మేడపైకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లింది. ఆయనతో వినమ్రంగా ఇలా అంది: “మీరింకా రాకపోవడంతో కారణం తెలుసుకోడానికి అక్కయ్య ఇప్పుడే నందబోసు గారి ఇంటికి వెళ్ళింది. కాసేపట్లోనే తిరిగి వస్తుంది.”
ఇంట్లో క్రింద వాకిట్లో ఏదో అలికిడి కాగా, ఆమె “అదుగో, అక్కయ్య వచ్చేసింది” అంటూ క్రిందకు వెళ్ళింది. కాని వచ్చింది ఆమె కాదు.
బ్రాహ్మణి (గోలాప్ సుందరీ దేవీ / గోలాప్-మా)
శ్రీరామకృష్ణులు దరహాసవదనులై భక్తుల నడుమ కూర్చుని ఉన్నారు.
‘మ’ (దేవేంద్రతో): ఆహా! ఎంత అద్భుత దృశ్యం. పిల్లలు పెద్దలు, స్త్రీలు పురుషులు – అందరూ బారులుదీరి నిలబడి ఉన్నారు. వారు శ్రీరామకృష్ణుల దర్శనానికై ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయన ఉపదేశ అమృతాన్ని గ్రోలాలని ఆతురపడుతున్నారు.
దేవేంద్ (శ్రీరామకృష్ణులతో): అయ్యా, నందబోసుగారి ఇంటికంటే ఇది మంచి స్థలమని మాష్టరు గారు (‘మ’) అంటున్నారు. వీరు భక్తితత్పరులు అంటున్నారు.
శ్రీరామకృష్ణులు అది విని నవ్వి ఉరుకున్నారు.
ఇంతలో బ్రాహ్మణి చెల్లెలు “ఇదిగోనండి. అక్కయ్య వచ్చేసింది!” అంటూ వచ్చింది.
బ్రాహ్మణి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లింది. ఆనందాతిశయంతో ఆమెకు ఏం మాట్లాడాలో తోచడంలేదు. గద్గదస్వరంతో ఇలా అంది:
“అయ్యో! ఈ ఆనందంతో నేను చచ్చిపోతానేమో అనిపిస్తోంది. అయ్యలారా! నేనెలా బ్రతుకుతానో మీరే చెప్పండి. నా చిన్నారి చండి (మరణించిన కుమార్తె పేరు) సిపాయి సిబ్బందితో వచ్చేది – అప్పుడు సిపాయిలు దారి కిరువైపులా బారులుతీరి నిలబడి కాపలా కాసేవారు. అప్పుడుకూడా నా కింతటి ఆనందం కలుగలేదంటే నమ్మండి. ఆహా! చండి మరణించిందన్న దుఃఖం నా కిప్పుడు ఇసుమంతైనా లేదు. ఈయన బహుశా రారేమో అనుకున్నాను. అలాంటి పక్షంలో నేను ఈయన కోసం చేసిన పిండివంటలన్నీ గంగలో పారేద్దామని నిశ్చయించుకున్నాను. ఈయనతో ఇక ఎన్నటికీ మాట్లాడకూడదు, ఎక్కడికైనా వచ్చారని తెలిస్తే దూరంనుండి దర్శించి తిరిగి వచ్చేయాలని తీర్మానించుకున్నాను.
“నా సంతోషం గురించి అందరికీ తెలిపి వస్తాను. నా అదృష్టం చూడమని యోగీన్తో చెప్పివస్తాను.”
బ్రాహ్మణి ఆనందం పట్టలేక మళ్ళీ ఇలా అంది: “కూలీవాడు ఒకడు ఒక రూపాయి లాటరీ టికెట్టు కొని లక్షరూపాయల బహుమతి గెలిచాడట. అతడావార్త వినగానే ఆనందంపట్టలేక గుండె ఆగి చచ్చిపోయాడు. అవును అతడు నిజంగానే చచ్చిపోయాడు. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయ్యలారా! మీరందరూ నన్ను ఆశీర్వదించండి. లేకుంటే నేను చచ్చిపోతానేమో అన్నట్లుంది.”
బ్రాహ్మణి పారవశ్యాన్ని చూసి ‘మ’ దిగ్భ్రమచెందాడు. ఆమె పాదధూళిని స్వీకరించే నిమిత్తం ముందుకు వెళ్ళాడు. “ఇదేమిటయ్యా?” అంటూ బ్రాహ్మణి అతడికి ప్రతి నమస్కారం చేసింది.
భక్తులను చూస్తూ బ్రాహ్మణి ఆనందంలో మైమరచిపోతూ ఇలా అంది: “మీరందరూ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను చిన్న నరేంద్రుణ్ణి కూడా పిలుచుకు వచ్చాను. అతడు లేకుంటే మనల్ని నవ్వించడానికి ఎవరుంటారు?”
ఆమె ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆమె చెల్లెలు మేడపైకి వచ్చి “అక్కయ్యా! క్రిందకు రావమ్మా! నువ్విక్కడ నిలబడి ఉంటే పని ఎలా సాగుతుంది? నువ్వు లేకుండా నేనే ఒంటరిగా పనిచేసుకోగలనా?” అంది.
కాసేపటి తర్వాత ఆమె ఎంతో భక్తిపూర్వకంగా శ్రీరామకృష్ణులను వేరే గదిలోకి తీసుకువెళ్ళి ఆయనకు మిఠాయిలు, తినుబండారాలు సమర్పించింది. భక్తులకు మేడపైనే తినుబండారాలు పెట్టారు.
రాత్రి సుమారు ఎనిమిది గంటలకు శ్రీరామకృష్ణులు బయలుదేరారు. ఆయన ఇంటి ద్వారం వద్దకు వచ్చాక బ్రాహ్మణి తన మరదలిని “అమ్మాయీ! వెంటనే వచ్చి పరమహంసల వారి పాదధూళి స్వీకరించు” అంటూ ఎలుగెత్తి పిలిచింది. ఆమె మరదలు వచ్చి ఆయనకు ప్రణామం చేసింది. తరువాత బ్రాహ్మణి తమ్ముళ్ళలో ఒకరు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. అతణ్ణి పరిచయం చేస్తూ బ్రాహ్మణి “ఇతడు నా తమ్ముళ్ళలో ఒకడు, వట్టి మూర్ఖుడు” అంది. శ్రీరామకృష్ణులు “కాదు కాదు, వీరందరూ మంచివారే” అన్నారు.
ఒక వ్యక్తి దీపం పట్టుకొని వారికి దారిచూపిస్తున్నాడు. ఒక చోట వెలుతురు సరిగాలేదు. చిన్న నరేంద్రుడు అందరినీ నవ్వించడానికిగాను “ఏమయ్యా, దీపం చూపించు, అప్పుడే పని అయిపోయిందనుకున్నావా?” అన్నాడు. అది విని అందరూ గొల్లున నవ్వారు.
శ్రీరామకృష్ణులు ఆవుల కొట్టం వద్దకు వచ్చారు. బ్రాహ్మణి ఆయనతో “ఇది మా ఆవుల కొట్టమండి” అంది. శ్రీరామకృష్ణులు కొట్టం ఎదుట భక్తపరివేష్టితులై నిలబడ్డారు. ‘మ’ ఆయనకు ప్రణమిల్లి పాదధూళి స్వీకరించాడు.
శ్రీరామకృష్ణులు అక్కడనుంచి గణుతల్లి ఇంటికి వెళ్ళనున్నారు.
43.5 పంచమ పరిచ్ఛేదం గణు తల్లి ఇంట్లో శ్రీరామకృష్ణులు
సమయం రాత్రి ఎనిమిదిన్నర కావస్తోంది. బహుళ పాడ్యమి అయినందున ఆకాశం, ఇళ్ళు, వీథులు – అన్నీ వెన్నెలలో తళతళలాడుతున్నాయి. శ్రీరామకృష్ణులు గణుతల్లి ఇంటి అతిథుల గదిలో భక్తులతో పాటు కూర్చుని ఉన్నారు. ఆ గదిని ఒక సంగీత బృందంవారు ఉపయోగించు కుంటున్నారు. కొందరు యువకులు మధ్యమధ్యలో వచ్చి శ్రీరామకృష్ణుల ప్రీత్యర్థం వాయిద్యాలు వాయిస్తూన్నారు.
ఆయన వెంట భక్తులు, బ్రాహ్మణి కూడా వచ్చివున్నారు. ఆమె ఒకసారి ఇంటిలోపలకు వెళ్తుంది. మరోసారి అతిథుల గది వద్దకు వచ్చి నిలబడిపోతుంది. ఆ ప్రాంతానికి చెందిన పలువురు కుర్రాళ్ళు కిటికీలు ఎక్కి శ్రీరామకృష్ణులను తొంగి చూస్తున్నారు. గణుతల్లి ఇంటికి శ్రీరామకృష్ణులు వచ్చారన్న వార్త విని ఆ చుట్టుప్రక్క ఇళ్లలోని ఆబాలగోపాలమూ ఆ మహాపురుషుణ్ణి దర్శించడానికి తండోపతండాలుగా వస్తున్నారు.
కుర్రవాళ్లు కిటికీలు ఎక్కడం చూచి చిన్న నరేంద్రుడు, “ఏయ్! ఇక్కడేముంది? వెళ్లండి, ఇళ్లకు వెళ్ళండి” అంటూ గద్దించాడు. శ్రీరామకృష్ణులు అత్యంతవాత్సల్యంతో, “ఉండనివ్వు నాయనా, ఉండనివ్వు” అన్నారు. మధ్య మధ్యలో ఆయన “హరి ఓం! హరి ఓం!” అంటున్నారు.
గదిలో తివాచీ పరచి ఉన్నారు. తివాచీపై ఆసనం వేసి శ్రీరామకృష్ణులను కూర్చోబెట్టారు. గాయకులకు అక్కడ చోటు చాలనందున ఆయన తమ ఆసనం దూరంగా లాక్కొని వారిని తివాచీపై కూర్చోమని చెప్పారు. ఆ యువకులు “ఓ కేశవా! బృందావనాంతర లతానికుంజ వినోద విహార! కేశవా!” అనే పాట పాడారు.
శ్రీరామకృష్ణులు: ఆహా! ఎంత చక్కని పాట! ఏం ఆ ఫిడేలు వాద్యం! అద్భుతం!
ఒక యువకుడు పిల్లనగ్రోవి ఊదుతున్నాడు. అతడితోపాటు మరో యువకుని చూపిస్తూ శ్రీరామకృష్ణులు “వీరిద్దరిదీ చక్కని జోడి” అన్నారు. పిదప కచేరి కొనసాగింది. శ్రీరామకృష్ణులు ఆనందభరితులై” ఆహా! ఎంత మధురం!” అన్నారు. ఒక యువకుని చూపుతూ “ఇతడికి అన్ని వాయిద్యాలు వాయించడం తెలసినట్లుంది” అన్నారు. ‘మ’ తో “వీరందరూ చాలా మంచివారు” అన్నారు.
ఆ యువకులు పాడడం ముగించాక భక్తులతో “మీరు ఏమైన పాడండి” అని కోరారు. బ్రాహ్మణి తలుపు వద్ద నిలబడి ఉంది. ఆమె ఇలా అంది: “వీరిలో ఎవరికీ పాడటం రాదు. కేవలం మహిమాబాబుకుమాత్రం తెలిసి ఉండవచ్చు. కాని ఈయన (శ్రీరామకృష్ణులు) ముందు పాడరు.”
ఒక యువకుడు: ఎందుకు? నేను మా నాన్నగారి ముందు పాడతానే?
చిన్న నరేంద్రుడు (బిగ్గరగా నవ్వుతూ): ఈయన ఇంకా అంత ముందుకు పోలేదులే.
అందరూ నవ్వసాగారు. కాసేపటి తరువాత బ్రాహ్మణి శ్రీరామకృష్ణులను “మీరు లోపలికి రండి” అంది. ఆయన “ఎందుకు?” అని ప్రశ్నించారు.
బ్రాహ్మణి: ఉపాహారం లోపల ఏర్పాటు చేశారు. రండి.
శ్రీరామకృష్ణులు: ఇక్కడికే తీసుకురావచ్చు కదా!
బ్రాహ్మణి: గణుతల్లి మిమ్మల్ని లోపలకు వచ్చి ఇంటిని పావనం చేయమని ప్రార్థిస్తోంది. మీ పవిత్ర పాధదూళితో ఇల్లు కాశీక్షేత్రమై పోతుంది. అప్పుడు ఇంట్లో మరణించినా ఎలాంటి చింతా ఉండదు అంటోంది.
బ్రాహ్మణి, ఇంటి బాలురతో పాటు శ్రీరామకృష్ణులు ఇంటి లోపలకు వెళ్ళారు. భక్తులు బయట వెన్నెలలో పచార్లు చేస్తున్నారు. ‘మ’, వినోద్‌లు ఇంటికి దక్షిణంగా ఉన్న బాటపై పచార్లు చేస్తున్నారు. పరమహంసల వారి జీవితంలోని వివిధ సంఘటనలను వారు నెమరువేసుకుంటున్నారు.
43.6 షష్ఠ పరిచ్ఛేదం ఏసు క్రీస్తు, చైతన్యులు, శ్రీరామకృష్ణులు – ముగ్గురూ ఒక్కటే!
శ్రీరామకృష్ణులు బలరామ్ బోసు ఇంటికి తిరిగివచ్చారు. అతిథుల గదికి పడమరగా ఉన్న చిన్న గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గణుతల్లి ఇంటినుండి తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యమయింది. సమయం పాపుతక్కువ పదకొండు అవుతోంది.
శ్రీరామకృష్ణులు యోగీన్తో “నా కాళ్లు కాస్త మృదువుగా ఒత్తు నాయనా” అన్నారు. ‘మ’ దగ్గరగా కూర్చుని ఉన్నారు. యోగీన్ కాళ్ళు పడుతుండగా ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు “నాకు ఆకలివేస్తుంది. కొద్దిగా రవ్వ పాయసం తింటాను” అన్నారు.
బ్రాహ్మణి కూడా బలరామ్ ఇంటికి భక్తులతోపాటు వచ్చి ఉంది. ఆమె తమ్ముడు బాగా తబలా వాయిస్తాడు. శ్రీరామకృష్ణులు ఆమెను చూడగానే “ఈసారి నరేంద్రుడో లేక మరెవరైనా గాయకుడు వచ్చినప్పుడు ఈమె తమ్ముణ్ణి పిలవనంపితే సరిపోతుంది” అన్నారు.
తరువాత ఆయన కొద్దిగా రవ్వ పాయసం సేవించారు. యోగీన్ తదితర భక్తులు క్రమంగా వెళ్ళిపోయారు. ‘మ’ శ్రీరామకృష్ణుల పాదాలను సుతిమెత్తగా ఒత్తుతున్నాడు. బ్రాహ్మణి, ఆమె బంధువర్గాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు “ఆహా! వాళ్ళు ఎంతగా సంతోషపడ్డారు!” అన్నారు.
‘మ’ : ఏం వింత! ఏసు ప్రభువు కాలంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మార్థా, మేరీ అనే ఇద్దరు సోదరీమణులు ఏసు ప్రభువు భక్తురాళ్ళుగా ఉండేవారు.
శ్రీరామకృష్ణులు (ఆతురతతో): ఏమిటి, ఏమిటా కథ?
‘మ’ : ఏసుక్రీస్తు భక్తులను వెంటబెట్టుకుని ఇదే విధంగా భక్తురాలి ఇంటికి వెళ్ళారు. వారిలో ఒక సోదరి ఆయన్ను చూడగానే భావోల్లాసంతో నిండిపోయింది. ఆ సన్నివేశం గౌరాంగుని గురించిన ఈ పాటను జ్ఞప్తికి తెస్తుంది.
నా గోరా దివ్యరూప
సాగరమున నా కనుగవ
దిగి మునిగి మరల నాకు
అగపడవు తిరిగి వచ్చి
దిగి దిగి లోతుకు నా మది
దిగిపోయెను తామరం
ఏ గతి యీదుకు బయటకు
రాగలనను సంగతి మరచి
“ఇంకొక సోదరి ఒంటరిగా ఏసుప్రభువుకోసం తినుబండారాలు తయారు చేస్తోంది. ఆమె ఏసు ప్రభువు వద్దకు వచ్చి ఇలా ఫిర్యాదు చేసింది: ‘ప్రభూ! ఇది ఎంత అన్యాయమో చూడండి! నేనిక్కడ ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటూ ఉన్నాను. అక్క ఏమో ఇక్కడ మీతో కూర్చుని ఉంది.’ అప్పుడు ఏసు ప్రభువు ఇలా అన్నాడు: ‘మీ అక్క నిజంగానే ధన్యురాలమ్మా. మానవ జీవిత ఉద్దేశమైన భగవత్ప్రేమను ఆమె సంపాదించింది.’”
శ్రీరామకృష్ణులు: అది సరే, ఇదంతా చూస్తే, నీకు ఏమనిపిస్తోంది?
‘మ’ : ఏసుక్రీస్తు, చైతన్యులు, తమరు ఒక్కటేనని తోస్తోంది.
శ్రీరామకృష్ణులు: అవునవును. ఒక్కటే, నిజంగా ఒక్కటే. ఆయన (భగవంతుడు) – చూస్తున్నావు కదా – ఇందులో ఏ విధంగా విరాజిల్లుతున్నాడో.
ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు తమ శరీరాన్ని వేలితో చూపించారు, భగవంతుడే ఈ రూపంలో అవతరించాడు అన్నట్లుగా.
‘మ’ : మీరు ఆ రోజు అవతార తత్వాన్ని విపులంగా వర్ణించారు.
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పాను?
‘మ’ : దిగంతాల వరకు వ్యాపించివున్న విశాల మైదానాన్ని ఊహించు కోమన్నారు. కాని ఎదురుగా ఒక గోడ ఉన్నందున మైదానాన్ని చూడలేకపోతున్నాం. గోడలో గుండ్రని రంథ్రం ఒకటి ఉంది. ఆ రంధ్రం గుండా అనంత మైదానాన్ని కొంత చూడవచ్చు.
శ్రీరామకృష్ణులు: ఆ రంధ్రమేమిటో చెప్పు.
‘మ’ : మీరే ఆ రంధ్రం. మీ ద్వారా సర్వమూ దర్శించవచ్చు. దిగ్దిగంతాలకు వ్యాపించిన ఆ మైదానాన్ని చూడవచ్చు.
ఈ మాటతో శ్రీరామకృష్ణులు అమితంగా సంతుష్టులయ్యారు. ‘మ’ వీపు తడుతూ “నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకున్నావు. మంచిది, చాలా మంచిది” అన్నారు.
‘మ’ : దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పూర్ణబ్రహ్మం ఒక మానవదేహంలో ఎలా ఇముడుతుంది? దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
శ్రీరామకృష్ణులు ఈ విషయంగా ఒక పాట పాడారు:
పిచ్చివాని వలెను తాను
గడప గడప తిరుగును
బిచ్చగానివలె తాను
గడప గడప తిరుగును
అసలెవరొ అతడెవరొ
అంతెవరికి అగుపడడు.
‘మ’ : మీరు ఏసుక్రీస్తు విషయంకూడా చెప్పారు.
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పాను?
‘మ’ : యదుమల్లిక్ తోటలో ఏసు ప్రభువు పటాన్ని చూసి మీరు భావసమాధి మగ్నులయ్యారు. అప్పుడు ఏసు ప్రభువు పటంనుండి దిగివచ్చి మీలో లీనమైపోవడం మీరు చూశారు.
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్లీ ఇలా అన్నారు: “గొంతులో వ్యాధి రావడానికి అర్థం ఉంది. లేకుంటే నేను వెళ్ళిన చోటల్లా పాడి, నాట్యంచేసి అందరి ముందు తేలిక అయిపోయేవాడిని.”
తరువాత ఆయన ద్విజుడి గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ద్విజుడు రాలేదేం?
‘మ’ : నేను రమ్మనే చెప్పానండి. అతడు వస్తానని చెప్పాడు. మరి ఎందుకు రాలేదో తెలియడం లేదు.
శ్రీరామకృష్ణులు: అతడికి నేనంటే అనురాగం. అదిసరే, అతడు ఇక్కడికి (అంటే ఆంతరంగిక శిష్యవర్గంలోకి) చెందిన వాడే కదా! ఏమంటావు?
‘మ’ : అవునండి, అలాగే అయివుండాలి. లేకుంటే అతడికి ఇంతటి అనురాగం ఎలా కలుగుతుంది?
శ్రీరామకృష్ణులు దోమతెర లోపల పడుకున్నారు. ‘మ’ దోమతెర లోపల కూర్చొని విసనకర్రతో వీస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అతడి వైపుకు తిరిగి భగవంతుడు మానవరూపంలో అవతరించి ఒనర్చే లీలలను గురించి చెబుతున్నారు. పిదప ‘మ’ యొక్క ఆధ్యాత్మిక మార్గమేమిటో అతడికి చెప్పారు.
శ్రీరామకృష్ణులు: నీ మార్గం అదే. మొదట్లో నాక్కూడా భగవద్రూప దర్శనాలు అయ్యేవి కావు. చూస్తున్నావుకదా – ఇప్పుడు మళ్ళీ రూపదర్శనాలు తగ్గిపోతున్నాయి.
‘మ’ : లీలలన్నిటిలోకి నాకు నరలీల బాగా నచ్చుతుంది.
శ్రీరామకృష్ణులు: ఆ భావం ఉంటే చాలు, పైగా, నన్ను చూస్తున్నావు కదా! భగవంతుడు తమ రూపంలో అవతరించి నరలీల జరుపుతున్నారని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా?