41.1 ప్రథమ పరిచ్ఛేదం భక్తులతో శ్రీరామకృష్ణులు
శనివారం, మే 23, 1885
నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని రాంచంద్రదత్త ఇంటికి విచ్చేశారు. భక్తులతోపాటు ఇంట్లోని అతిథుల గదిలో ఆసీనులయ్యారు. అప్పుడు సమయం సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. ఆయనకు ఎదురుగా మహిమాచరణ్, ఎడమ వైపు ‘మ’, చుట్టూ పల్టు, భవనాథ్, నిత్యగోపాల్, హరమోహన్లు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తుల యోగక్షేమాలు విచారిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు(‘మ’ తో): చిన్ననరేంద్రుడు రాలేదా?
ఇంతలో చిన్ననరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు: అతడు రాలేదా?
‘మ’ : ఎవరండీ?
శ్రీరామకృష్ణులు: కిశోరీ. గిరీశ్ ఘోష్ రాడా? నరేంద్రుడు రాడా?
కాసేపటి తర్వాత నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): కేదార్ ఛటర్జీకూడా వచ్చి ఉంటే బాగుండేది. అతడు గిరీశ్ ఘోష్ అభిప్రాయాలతో ఏకీభవిస్తాడు. (నవ్వుతూ, మహిమాతో) అతడుకూడా అదే విషయం (శ్రీరామకృష్ణులు భగవదవతారమనే విషయం) చెబుతుంటాడు.
రామ్ సంకీర్తన ఏర్పాట్లు చేస్తున్నాడు. గాయకుడు వచ్చి చేతులు జోడించి శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “అయ్యా, మీరు సెలవిస్తే మేము కీర్తనలను ప్రారంభిస్తాం.”
శ్రీరామకృష్ణులు కాసిని మంచినీరు త్రాగి, సంచిలో ఉన్న మసాలా దినుసులు కొన్నిటిని నోట్లో వేసుకొన్నారు. పిదప సంచిని కట్టిపెట్టమని ‘మ’ తో చెప్పారు.
గాయకుడు కీర్తనలు గానం చేయటం ప్రారంభించాడు.
మృదంగ నాదం వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశు లవుతున్నారు. కీర్తనలోని తొలి పల్లవిని వినగానే సమాధి స్థితులయ్యారు. ఆ స్థితిలో ఆయన తమకు సమీపంలో కూర్చుని ఉన్న నిత్యగోపాల్ ఒడిలో కాళ్ళు పెట్టారు. నిత్యగోపాల్ కూడా భావపరవశు డవుతున్నాడు. భక్తులందరూ స్తబ్ధులై ఈ అద్భుత దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నారు.
41.1.1 నిత్యం, లీల
కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు కొద్దిగా బాహ్యచైతన్యంలోకి వచ్చి ఇలా అన్నారు: “నిత్యం నుండి లీలకు, లీల నుండి నిత్యానికి. (నిత్యగోపాల్తో) నీ ఆదర్శం ఏది?
నిత్యగోపాల్ (వినయపూర్వకంగా): రెండూ మంచివేనండీ.
శ్రీరామకృష్ణులు కళ్ళు మూసుకొని ఇలా అన్నారు: “కేవలం అలాగే ఉంటుందా ఏమిటి? కళ్ళు మూసుకుంటేనేనా భగవంతుడు. కళ్ళు తెరిస్తే ఆయన ఉండడా? నిత్యం ఎవరికైతే చెందినదో లీల కూడా ఆయనకే చెందినది; లీల ఎవరిదో నిత్యంకూడా ఆయనదే.
(మహిమాతో) “నీ కొక సంగతి చెప్పాలి.”
మహిమా: అయ్యా, రెండూ భగవంతుడి ఇచ్ఛమేరకే.
శ్రీరామకృష్ణులు: కొందరు ఏడంతస్తుల మేడ ఎక్కిన తర్వాత క్రిందకు దిగిరాలేరు. మరికొందరు మేడ ఎక్కిన తర్వాత మళ్ళీ క్రిందకు రాకపోకలు సాగించగలరు.
“ఉద్ధవుడు గోపికలతో ఇలా అన్నాడు: ‘మీరు ఎవరినైతే కృష్ణుడు అంటున్నారో, అతడు సర్వభూతాలలోనూ ఉన్నాడు. ఆతడే జీవజగత్తులై ఉంటున్నాడు.’
“అందుకే నేను, ‘కళ్ళు మూసుకుంటేనేనా ధ్యానం? కళ్ళు తెరిస్తే ఏమీ లేదా?’ అంటాను.”
41.1.2 నిర్వాణం – తోతాపురి – భక్తి బీజం
మహిమా: మహాశయా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భక్తుడికి కూడా ఏదో ఒక సమయంలో నిర్వాణం* కావలసిందే కదా!
శ్రీరామకృష్ణులు: భక్తులకు నిర్వాణం కావలసిందే అంటూ ఏమీ లేదు. కొన్ని సంప్రదాయాల్లో ఇలా చెప్పబడింది: ‘నిత్యకృష్ణుడు, నిత్యభక్తులు ఉన్నారు. కృష్ణుడు చిన్మయుడే, ఆయన ధామమూ చిన్మయమే’.
“కృష్ణుడు నిత్యుడే, ఆయన భక్తులూ నిత్యులే. కృష్ణుడూ, ఆయన భక్తులూ ఎల్లప్పుడూ సమీపంలో ఉండే చంద్రుడు, నక్షత్రాలవంటి వారు. నువ్వే అంటుంటావు కదా – అంతర్భహిర్యది హరి స్తపసా తతః కిమ్ (లోపలా వెలుపలా హరిని దర్శింప కలిగినట్లయితే ఇక తపస్సు చేయనేల?) పైగా విష్ణువు అంశతో జన్మించిన భక్తుడు, తన భక్తిని సమూలంగా తొలగించుకోజాలడని నీతో చెప్పాను కదా! ఒకసారి నేను ఒక జ్ఞాని (తోతాపురి) వలలో చిక్కుకున్నాను. అతడు నాకు పదకొండు నెలలపాటు వేదాంతం నూరిపోశాడు. కాని నాలోని భక్తిబీజాన్ని మటుకు నశింప చేయలేకపోయాడు. నా మనస్సు ఎక్కడెక్కడ తిరిగినాసరే మళ్ళీ, ‘అమ్మా, అమ్మా’ అంటూ జగజ్జనని పాదాల వద్ద వ్రాలేది. నేను జగజ్జననిని గురించిన పాటలు పాడేటప్పుడు అతడు ‘అరే! ఇదేమిటి?’ అంటూ విలపించేవాడు. చూశారా, అతడు అంతటి మహాజ్ఞాని అయినప్పటికీ అలా కన్నీరు కార్చేవాడు. (చిన్ననరేంద్రుడు తదితరులతో) ఆలేఖ్ లతా రసాన్ని త్రాగినవాడి పొట్టలో కూడా ఆ మొక్క పెరుగుతుందని లోకోక్తి ఒకటి ఉంది కదా! భక్తిబీజాన్ని ఒకసారి నాటినట్లయితే దాని ఫలితం అనివార్యం. అది క్రమక్రమంగా చెట్టుగా పెరిగి పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది.
“‘ముసలం కుల నాశనమ్’ – యాదవులు ముసలాన్ని ఎంతగా అరగదీసి నప్పటికీ కొద్దిగా మిగిలే ఉండిపోయింది. ఆ కాస్తే యదువంశాన్ని నాశనం చేసింది. వెయ్యిసార్లు జ్ఞానవిచారణలు చేసినాసరే, అంతరంగాన భక్తిబీజం ఉన్నట్లయితే, తిరిగి తిరిగి మళ్ళా ‘హరిబోల్’ అంటూ హరిని చేరుకోవలసిందే.”
భక్తులు శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను శ్రద్ధగా వింటున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మహిమాచరణ్తో “నీకు ఏది ఇష్టం?” అని అడిగారు.
మహిమా (నవ్వుతూ): మరేదీ కాదు కానీ నాకు మామిడి పళ్ళంటే మాత్రం చాలా ఇష్టమండీ.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): ఒక్కడివే తింటావా? లేక అందరితో కలసి పంచుకొని తింటావా?
మహిమా(నవ్వుతూ): అందరికీ పంచిపెట్టి తినాలనే ఆరాటం లేదు కాని ఒక్కడినే తింటే చాలు.
శ్రీరామకృష్ణులు: కాని నా భావ మేమిటో తెలుసా? కళ్ళు తెరిస్తే భగవంతుడు ఉండడా ఏమిటి? నేను నిత్యం, లీలలు రెండింటినీ అంగీకరిస్తాను.
“భగవంతుణ్ణి ప్రాప్తించుకొన్నప్పుడు ఆయనే స్వరాట్గానూ, ఆయనే విరాట్గానూ ఉన్నట్లు తెలుసుకుంటాం. అఖండ సచ్చిదానందమూ ఆయనే; మళ్ళీ ఆయనే జీవజగత్తులుగా కూడా అయివున్నాడు.
41.1.3 కేవలం శాస్త్రాధ్యాయనం చాలదు – సాధనతోనే ప్రత్యక్ష జ్ఞానం
“సాధనలు చేయాలి. కేవలం శాస్త్రాలు అధ్యయనం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. నే నొకసారి విద్యాసాగర్‌ను చూశాను. అతడు ఎంతో చదువుకున్నవాడు. అయితే అంతరంగాన ఏముందో అతడికి తెలియదాయె. పిల్లలకు చదువు చెప్పించడంతోటే అతడు సంతుష్టుడయ్యాడు. భగవదానందాన్ని చవిచూడలేదు. ఊరకే చదివినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? చదివిన విషయాన్ని జీర్ణించుకోవాలి. ఇరవై పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో వ్రాసి ఉంటుంది. కాని పంచాంగాన్ని పట్టుకుని పిండితే కనీసం ఒక్కబొట్టు నీరైనా రాలదు కదా!”
మహిమా: సంసారంలో కర్తవ్యాలు అనేకం. సాధనలు చేయటానికి మాకు తీరిక ఎక్కడిది?
శ్రీరామకృష్ణులు: నువ్వు అలా ఎందుకు మాట్లాడతావు? జగత్తు అంతా స్వప్నం లాంటిదనే కదా నువ్వు అంటూంటావు?
“రామలక్ష్మణులు లంకకు వెళ్ళవలసి ఉన్నప్పుడు ఎదురుగావున్న సముద్రాన్ని చూసి లక్ష్మణుడు కోపోద్రిక్తుడయ్యాడు. ధనుర్బాణాలు చేతబట్టి ఇలా అన్నాడు: ‘ఈ సముద్రం మనల్ని లంకకు వెళ్ళనివ్వటం లేదు. నేను ఈ వరుణుణ్ణి వధిస్తాను.’ అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి ఇలా సమాధాన పరిచాడు: ‘లక్ష్మణా! నువ్వు చూస్తున్నదంతా స్వప్నం లాంటిది, అనిత్యమైనది. సముద్రమూ అనిత్యమే, నీ క్రోధమూ అనిత్యమే. మిథ్యను మిథ్య ద్వారా వధించడం కూడా మిథ్యే అవుతుంది కదా!’”
41.1.4 కర్మయోగం, భక్తియోగం – సద్గురువు
మహిమాచరణ్ మౌనం వహించాడు. అతడికి ఎన్నో సంసార బాధ్యతలు ఉన్నాయి. పరోపకారార్థం ఇటీవలే అతడు ఒక పాఠశాలను కూడా ఆరంభించాడు.
శ్రీరామకృష్ణులు (మహిమాతో): ఒకసారి శంభు మల్లిక్ నాతో ఇలా అన్నాడు: ‘నా దగ్గర ఉన్న ధనాన్ని స్కూళ్ళు, డిస్పెన్సరీలు, రహదారులు, నదీఘట్టాలు నిర్మించటం మొదలైన సత్కార్యాలకు వినియోగింపదలిచాను.’ అందుకు నేను ఇలా అన్నాను: ‘నువ్వు ఆ పనులన్నింటినీ నిష్కామ భావంతో చేసినట్లయితే మంచిదే. కాని అలా నిష్కామకర్మలు చేయడం మాత్రం చాలా కష్టం. ప్రతిఫలాపేక్ష ఎక్కడినుండి వస్తుందో తెలియదు కాని మొత్తానికి అది వచ్చి పడుతుంది. మరో సంగతి – భగవంతుడు గనుక నీకు ప్రత్యక్షమైనట్లయితే, నువ్వు ఆయనను స్కూళ్ళు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు మొదలైనవాటిని కోరుకొంటావా ఏమిటి?’”
ఒక భక్తుడు: అయ్యా, సంసారంలో ఉన్నవారికి మార్గమేమిటి?
శ్రీరామకృష్ణులు: సాధుసాంగత్యం, భగవత్ప్రసంగాలు శ్రవణం చేయటం.
“సంసారులు మత్తెక్కి ఉన్నారు; కామినీకాంచనాలలో మైమరచి ఉన్నారు. మద్యం త్రాగి మత్తెక్కి ఉన్నవాడికి బియ్యపు కడుగు కొద్దికొద్దిగా తాపిస్తున్నట్లయితే క్రమేణా మత్తు దిగుతుంది. అంతేగాక, సద్గురువు వద్ద ఉపదేశం పొందాలి. సద్గురువుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. కాశీకి వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించి వచ్చినవాడి వద్దనే కాశీక్షేత్రం గురించిన విషయాలు వినాలి. కేవలం పాండిత్యంతో ఒరిగేదేమీ ఉండదు. ఈ సంసారం అనిత్యమన్న ఎరుకేలేని పండితుని వద్ద ఉపదేశం పుచ్చుకోవడం మంచిది కాదు. పండితుడికి వివేకవైరాగ్యాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు ఉపదేశాలను ఇవ్వగలడు.
“ఒకసారి సామాధ్యాయి నాతో ‘భగవంతుడు నీరసుడు (రసహీనుడు)’ అని అన్నాడు. ఎవరయితే రసస్వరూపుడో ఆయన్ను నీరసుడని పలకడమా! ఎవరో ‘మా మామగారి ఆవుల కొట్టం నిండా గుఱ్ఱాలు ఉన్నా’ యన్నాడట! (అందరూ నవ్వారు)
41.1.5 నేను, నాది : అజ్ఞానం – జ్ఞానం – విజ్ఞానం
“సంసారులు మత్తెక్కి ఉన్నారు. సంసారి సదా ఇలా తలపోస్తూంటాడు: ‘నేను ఇదంతా చేస్తున్నాను. ఈ ఇల్లూ, కుటుంబమూ అంతా నాకు చెందినదే.’ తన తొర్రిపళ్ళన్నీ చూపిస్తూ ఇలా అంటూంటాడు: ‘నేను లేకపోతే వీరి(భార్యా పిల్లలు) గతి ఏమిటి? వీరిని చూసుకొనేవారెవరు? నా భార్య, కుటుంబమూ – వీరందరి బాగోగులు ఎవరు చూసుకుంటారు?’ రాఖాల్ ఒకసారి నాతో ‘మరి నా భార్య గతి ఏమయ్యేట్లు?’ అన్నాడు.”
హరమోహన్: రాఖాల్ అలా అన్నాడా?
శ్రీరామకృష్ణులు: అలాకాకపోతే మరేమంటాడు? జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానంకూడా ఉంటుంది. లక్ష్మణుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు: ‘అన్నా! ఇదెక్కడి చోద్యం! సాక్షాత్తూ వసిష్ఠ మహర్షే పుత్రశోకంతో ఇలా కుమిలిపోతున్నా డేమిటి?’ అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరచాడు: ‘లక్ష్మణా! ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతడికి అజ్ఞానం కూడా ఉంటుంది. అందుకే నువ్వు జ్ఞానాజ్ఞానాలు రెండింటికీ అతీతుడివై పో.’
“ఒక వ్యక్తికి కాలిలో ముల్లు గుచ్చుకొందనుకుందాం. అప్పు డతడు ఆ ముల్లును తీయడానికి మరొక ముల్లును తీసుకువస్తాడు. పిదప ఆ ముల్లుతో కాలిలో గుచ్చుకున్న ముల్లును తీసివేశాక ఆ రెండు ముళ్ళను పారేస్తాడు. అజ్ఞానమనే ముల్లును తొలగించడానికి జ్ఞానమనే ముల్లును సంపాదించవలసి ఉంటుంది. ఆ తరువాత జ్ఞానాజ్ఞానాలనే రెండు ముళ్ళను పారేశాక, విజ్ఞానం జనిస్తుంది. మరి విజ్ఞాన మంటే ఏమిటి? భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని అపరోక్షానుభూతి ద్వారా ఎరిగి ఆయన్ను గురించి విశేషంగా తెలుసుకోవాలి; ఆయనతో సన్నిహితంగా సంభాషణలు నెరపాలి – దీనినే విజ్ఞానం అంటారు. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడితో ‘అర్జునా! నువ్వు మూడు గుణాలకూ అతీతుడవై పో’ అన్నాడు.
“ఈ విజ్ఞానాన్ని ప్రాప్తించుకోడానికి విద్యామాయను ఆశ్రయించాలి. భగవంతుడు సత్యం, జగత్తు అనిత్యం. విద్యామాయా అంటే – భగవంతుడు సత్యం, జగత్తు అనిత్యం అనే విచారణ. అంటే వివేకవైరాగ్యాలు విద్యామాయకు చెందినవి. పైగా భగవంతుడి నామగుణకీర్తనలు, ధ్యానం, సాధుసాంగత్యం, ప్రార్థన – ఇవన్నీ కూడా విద్యామాయ లోనివే. విద్యామాయను, డాబా మీదికి ఎక్కడానికి మునుపు మిగిలివున్న కొన్ని ఆఖరి మెట్లతో పోల్చవచ్చు. మరో మెట్టు ఎక్కగానే డాబాపైకి చేరుకొన్నట్లే. డాబా ఎక్కడమంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడమని అర్థం.
41.1.6 కామినీ కాంచన త్యాగులు – సంసారులు
“విషయలోలురు మత్తెక్కి ఉన్నారు; కామినీకాంచనాలలో మైమరచి ఉన్నారు. వారికి (పారమార్థిక భావాలకు సంబంధించిన) స్పృహ బొత్తిగా ఉండదు. అందుకనే నేను ఈ కుర్రవాళ్ళను ఇంతగా అభిమానిస్తాను. వీరిలోకి కామినీకాంచనాలు ఇంకా ప్రవేశించలేదు. వీరు ‘మంచి ఆధారాలు’ – భగవంతుడి పనులలో ఉపయోగపడతారు. సంసారులు కేవలం ముళ్ళతో నిండివున్న చేపల వంటివారు. ముళ్ళను తొలగిస్తూ పోతే చివరకు తినడానికంటూ చేపలో ఏమీ మిగలదు.
“సంసార జీవులు వడగళ్ళతో దెబ్బతిన్న మామిడిపళ్ళ వంటివారు. అటువంటి పళ్ళను భగవంతుడికి సమర్పించాలంటే వాటిపై గంగాజలం చిలకరించి శుద్ధీకరించవలసి ఉంటుంది. అలా శుద్ధీకరింపబడినప్పటికీ వాటిని నైవేద్యంగా సమర్పించడం అరుదు. ఒకవేళ ఆ పళ్ళను ఉపయోగించవలసి వస్తే, ఆ భగవంతుడే సర్వమూ అయివున్నాడనే భావంతో బ్రహ్మజ్ఞానాన్ని ఆపాదించుకోవలసి ఉంటుంది.”
ఇంతలో అశ్వనీకుమార్ దత్త, బిహారీ భాదురీ కుమారునితోపాటు థియోసఫీ (దివ్యజ్ఞాన సమాజం) సభ్యుడు ఒకరు కూడా వచ్చారు. కాసేపటి తర్వాత ముఖర్జీ సోదరు లిద్దరూ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. ఇంటి ప్రాంగణంలో సంకీర్తన కొరకై ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మృదంగ నాదం వినగానే శ్రీరామకృష్ణులు గదిలోనుండి బయటకు వచ్చి ప్రాంగణంలో ఆసీనులయ్యారు. భక్తులుకూడా ఆయన్ను అనుసరించి ప్రాంగణంలో కూర్చున్నారు.
భవనాథ్, శ్రీరామకృష్ణులకు అశ్వనీకుమార్‌ను పరిచయం చేశాడు. ఆయన అశ్వనీని ‘మ’ కు పరిచయం చేశాడు. ‘మ’, అశ్వనీ లిద్దరూ మాట్లాడుకొంటూండగా నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అశ్వనీతో “నరేంద్రు డంటే ఇతడే” అన్నారు.
41.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల వ్యాధికి ప్రథమ సూచనలు
శనివారం, జూన్ 13, 1885
సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో మధ్యాహ్న భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. పండితు డొకరు నేలమీద పరచిన చాపపై కూర్చుని ఉన్నాడు. తన ఏకైక కుమార్తెను కోల్పోయిన బ్రాహ్మణ వితంతువు ఒకామె ఉత్తరం వైపు వాకిలి వద్ద నిలబడి ఉంది. కిశోరీ కూడా గదిలోనే ఉన్నాడు. ‘మ’ వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగప్రణామం చేశాడు. అతడితోపాటు ద్విజుడు, మరికొందరు భక్తులుకూడా వచ్చారు. ఈ మధ్య శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగుండటం లేదు; గొంతునొప్పి, జలుబుతో బాధపడుతున్నారు. ఆయన క్యాన్సర్ వ్యాధికి ఇవి ప్రథమ సూచనలు. వేసవి కాలపు ఎండలు బాగా దంచేస్తున్నాయి. అందువల్ల ‘మ’ కూడా ఇటీవల కొద్దిగా అస్వస్థతకు గురైనాడు. ఆ కారణంగా అతడు శ్రీరామకృష్ణుల దర్శనానికి తరచూ దక్షిణేశ్వరానికి రాలేకపోయాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఓ, నువ్వు వచ్చావా? నువ్వు పంపిన మారేడు పండు చాలా బాగుంది. నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా?
‘మ’ : ఆ, ఈ మధ్య కాస్త మెరుగ్గానే ఉందండి.
శ్రీరామకృష్ణులు: ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. అప్పుడప్పుడు కొంచెం మంచుగడ్డ పుచ్చుకో. ఈ ఎండల కారణంగా నాక్కూడా వేడిచేసి చాలా బాధపడుతున్నాను. అందుకని కుల్ఫీ (ఐస్‌క్రీమ్), మంచుగడ్డలు ఎక్కువగా తిన్నాను. దానితో గొంతు పుండు అయింది. లాలాజలం దుర్వాసన వేస్తోంది.
41.2.1 శ్రీరామకృష్ణుల భక్తి జ్ఞాన స్థితులు
“నేను అమ్మతో ‘అమ్మా! నాకు స్వస్థత కలిగించు. ఇకమీదట కుల్ఫీ తిననులే’ అన్నాను. మళ్ళీ అమ్మతో ‘అమ్మా! మంచుగడ్డకూడా తిన’ నని చెప్పాను. అమ్మతో ‘ఇకమీదట తినను’ అని చెప్పాను కాబట్టి నేను కుల్ఫీ, మంచుగడ్డల వంటివి ఇకపై తినజాలను. కాని ఒక్కోసారి మరచిపోతూ ఉంటాను. ఒకసారి నేను ‘ఆదివారాల్లో చేప తినను’ అన్నాను. కాని ఒక ఆదివారంనాడు ఆ సంగతి మరచిపోయి చేపను తినేశాను. కాని తెలిసి తెలిసీ మాత్రం నేను మాట తప్పను. ఒక రోజు సరుగుడు తోపు వద్దకు చెంబుతో నీరు పట్టుకురమ్మని ఎవరికో చెప్పాను. అయితే అతడుకూడా బయలుకు పోవడంవల్ల మరో వ్యక్తి నీరు పట్టుకొచ్చాడు. తర్వాత నేను వచ్చి చూసేసరికి ఈ వ్యక్తి చెంబు చేతపట్టుకొని నిలబడి ఉన్నాడు. కాని నేను ఆ నీరు వాడలేకపోయాను. మరేం చెయ్యను? నిస్సహాయుడనై అలాగే నిలబడిపోయాను. నేను చెప్పిన వ్యక్తి నీరు తీసుకొని వచ్చేంతవరకు అలాగే ఎదురుచూస్తూండిపోయాను.
“అమ్మ పాదపద్మాల వద్ద పువ్వులను సమర్పించి అన్నింటినీ త్యాగం చేసేటప్పుడు ఇలా అన్నాను: ‘అమ్మా! ఇదిగో నీ మడి, ఇదిగో నీ మైల – రెండింటినీ నువ్వే తీసుకో. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం – రెండింటినీ నీకే సమర్పిస్తున్నాను. అదేవిధంగా పాపపుణ్యాలను, మంచిచెడులను కూడా ఆమెకే సమర్పించి శుద్ధభక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకొన్నాను. కాని ‘ఇదిగో నీ సత్యం, ఇదిగో నీ అసత్యం – రెండింటినీ నువ్వే తీసుకో’ అని మాత్రం అనలేకపోయాను.”
ఎవరో భక్తుడు మంచుగడ్డ తీసుకువచ్చాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీమళ్ళీ ‘మ’ తో “ఏమయ్యా, కొద్దిగా తిననా?” అని అడుగుతున్నారు. ‘మ’ వినయపూర్వకంగా “వద్దండీ. మీరు అమ్మను సంప్రదించకుండా మాత్రం తినవద్దు” అన్నాడు. శ్రీరామకృష్ణులు మంచుగడ్డ తినలేదు.
శ్రీరామకృష్ణులు: మడి, మైల అనేవి భక్తుడికే కాని జ్ఞానికి కాదు. విజయ్ అత్తగారు ఒకసారి నాతో ఇలా అంది: ‘నేను ఎవరంటే వాళ్ళ చేతి అన్నం తినలేనే! నా కింకా అలాంటి స్థితి రాలేదే!’ అందుకు నే నిలా సమాధాన మిచ్చాను: “ఎవరంటే వారి చేతి అన్నం తినడంతోటే జ్ఞానం కలుగుతుందా ఏమిటి? కుక్క ఏదిపడితే అది తింటూంటుంది. మరి అందుకని కుక్క జ్ఞానియా?’
(‘మ’ తో) “నేను పలురకాల కూరలను ఎందుకు తింటానో తెలుసా? ఏకపక్ష పోకడ వచ్చినట్లయితే నేను ఈ భక్తుల సాంగత్యాన్ని వదలవలసి వస్తుందేమోనని.
“నేను కేశవసేన్తో ఇలా అన్నాను ‘ఇంకా ముందుకు వెళ్ళి ఉపదేశాలు ఇచ్చినట్లయితే నీ సమాజం అంటూ ఏదీ నిలువదు సుమా!’ జ్ఞానావస్థలో సమాజం గిమాజం లాంటివన్నీ మిథ్యే, స్వప్నంలాంటివే. ఒకసారి నేను చేపలు తినటం మానివేశాను. మొదట్లో కష్టంగా ఉండేది; కాని ఆ తరువాత అంత కష్టంగా అనిపించలేదు. పక్షి గూడును ఎవరైనా కాల్చివేస్తే అది ఆకాశాన్ని ఆశ్రయించుకొని అటూ ఇటూ ఎగురుతూ ఉంటుంది. దేహం, జగత్తులు మిథ్య అని యథార్థంగా బోధ కలిగినట్లయితే ఆ తరువాత ఆత్మ, సమాధిస్థితి పొందుతుంది.
“మొదట్లో నాకు అటువంటి జ్ఞాని మనోస్థితే ఉండేది. లోకుల సాంగత్యం రుచించేది కాదు. ఫలానాచోట ఒక జ్ఞానో లేక భక్తుడో ఉన్నట్లు వినేవాడిని. అయితే కొద్దిరోజుల పిదప అతడు మరణించాడని తెలియవచ్చేది. అంతా అశాశ్వతంగా తోచేది. అందుకనే లోకుల సాంగత్యం రుచించేది కాదు. ఆ తరువాత అమ్మ నా మనస్సును దిగువకు తీసుకువచ్చి భక్తి, భక్తులలో నిలిపింది.
“శ్రీరామకృష్ణుల మనోస్థితిలోని మార్పులను గురించిన విషయాలను ‘మ’ నిశ్చేష్టుడై వింటున్నాడు. ప్రస్తుతం భగవంతుడు మానవరూపంలో ఎందుకు అవతరిస్తాడనే విషయాలను శ్రీరామకృష్ణులు విశదపరచ సాగారు.
41.2.2 అవతార లీల
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): భగవంతుడు మానవరూపం ధరించడం ఎందుకో తెలుసా? మానవరూపం ద్వారా ఆయన వాణి వినవచ్చు. దీనిద్వారా ఆయన తన లీలను ప్రదర్శిస్తాడు, భగవదానందాన్ని చవి చూస్తాడు. కాని తక్కిన భక్తుల ద్వారా భగవంతుడు స్వల్పంగా మాత్రమే వ్యక్తమౌతాడు. ఏదైనా వస్తువును చప్పరిస్తూ పోతే కొద్దిగా రసం లభించడం లాంటిది ఇది. పువ్వును చప్పరిస్తూపోతే కొద్దిగా మధువు లభించడం లాంటిది. (‘మ’ తో) ఇది నీకు అర్థమవుతోంది కదా?
‘మ’ : ఆ, స్పష్టంగా అర్థమవుతోందండి.
41.2.3 శ్రీరామకృష్ణులు, ద్విజుడు – పూర్వజన్మ సంస్కారాలు
శ్రీరామకృష్ణులు ద్విజుడితో మాట్లాడసాగారు. ద్విజుడి వయస్సు దాదాపు పదహారు సంవత్సరాలు ఉంటుంది. అతడి తండ్రి ద్వితీయ వివాహం చేసుకొన్నాడు. ద్విజుడు తరచూ ‘మ’ తోపాటు దక్షిణేశ్వరం వస్తూంటాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఎంతగానో అభిమానిస్తారు. తన తండ్రి తనను దక్షిణేశ్వరం రానివ్వడం లేదని ద్విజుడు చెప్పాడు.
శ్రీరామకృష్ణులు (ద్విజుడితో): నీ సోదరులుకూడా నన్ను తేలికచేసి మాట్లాడుతుంటారా?
ద్విజుడేమీ బదులు పలుకలేదు.
‘మ’ (శ్రీరామకృష్ణులతో): మీ గురించి తేలికగా మాట్లాడేవారందరూ జీవితంలో ఒకటి రెండు ఎదురుదెబ్బలు తినగానే దారిలోకి వస్తారు.
శ్రీరామకృష్ణులు (ద్విజుడి సోదరులను ప్రస్తావిస్తూ): సవతి తల్లి ఉంది కదా! అందువల్ల వారు ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు.
అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ద్విజుని ఒకసారి పూర్ణుడికి పరిచయం చెయ్యి.
‘మ’ : అలాగేనండీ. (ద్విజుడితో) పానిహాటీకి వెళ్ళు.
శ్రీరామకృష్ణులు: నేను అందరినీ పానిహాటీకీ వెళ్ళమని చెబుతున్నాను. (‘మ’ తో) నువ్వు వెళ్ళవా?
శ్రీరామకృష్ణులు పానిహాటీ మహోత్సవానికి వెళదామనుకొంటున్నారు. అందుకనే భక్తులను కూడా అక్కడికి రమ్మని చెబుతున్నారు.
‘మ’ : అవునండి. వెళ్ళాలనే ఉంది.
శ్రీరామకృష్ణులు: పెద్ద పడవ నొకదానిని ఏర్పాటుచేసుకొందాం. అప్పుడది అటూ ఇటూ ఊగకుండా ఉంటుంది. గిరీశ్ ఘోష్ రాడంటావా?
శ్రీరామకృష్ణులు ద్విజుడి వంక తదేకంగా చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: అది సరే, (కలకత్తా నగరంలో) ఇంత మంది కుర్రాళ్ళు ఉన్నారు కదా! అయితే ఈ కుర్రాడు మటుకు ఇక్కడకు ఎందుకు వస్తున్నట్లు? ఇతడికి పూర్వజన్మ సంస్కారాలు కొన్ని ఉన్నాయి.
‘మ’ : అవునండి.
శ్రీరామకృష్ణులు: పూర్వజన్మ సంస్కారాలనేవి ఉండనే ఉంటాయి. ఎవరైనా పూర్వజన్మలలో ఎన్నో సత్కర్మలు కనుక చేసి ఉన్నట్లయితే, ఆఖరి జన్మలో అతడు సర (నిష్కపట) స్వభావాన్ని పొందుతాడు. ఆఖరి జన్మలో అతడు పిచ్చివాడిలా (అంటే పరమానందభరితుడై) ఉంటాడు.
41.2.4 భగవదేచ్ఛ – ‘ఊ’, ‘ఊహూ’
“నిజం చెప్పాలంటే సర్వమూ భగవదేచ్ఛే సుమా! ఆయన ‘ఊ’ అనడం తోటే జగత్తు అంతా పరిభ్రమిస్తోంది; ఆయన ‘ఊహూ’ అనగానే ఈ పరిభ్రమణ మంతా ఆగిపోతుంది.
“ఒక వ్యక్తి మరొకరికి ఆశీర్వాదం ఎందుకు చేయరాదో తెలుసా? ఎందుకంటే మానవ సంకల్పం ద్వారా ఏదీ జరుగదు. జరిగేదంతా భగవదేచ్ఛతోటే.
“ఒకనాడు నేను కెప్టన్ ఇంటికి వెళ్ళాను. దారిలో కొందరు కుర్రవాళ్ళు వెళుతూండటం చూశాను. వారు మరో తరహాకు చెందినవారు. వారిలో ఒకడికి – వయస్సు పందొమ్మిది లేక ఇరవై సంవత్సరాలు ఉంటుంది – పాపిట ప్రక్కకు తీసివుంది. ఈల వేసుకొంటూ వెళుతున్నాడు. అందరూ ఎకసక్కాలాడుకొంటూ వెళుతున్నారు.
“వారిలో కొందరు గాఢ తమస్సులో మునిగి ఉండటం చూశాను. పిల్లనగ్రోవి ఊదుకొంటూ వెళుతున్నారు. ఆ మాత్రానికే వారు గర్వంతో విర్రవీగిపోతున్నారు.
(ద్విజుడితో) జ్ఞానం పొందినవాడికి ఎవరైనా విమర్శిస్తారనే భయమెందుకు? జ్ఞాని గ్రహణశక్తి కమ్మరి దాగలివలె ఏమాత్రమూ చలించదు. దాగలి మీద సమ్మెటపోట్లు పడుతూనే ఉంటాయి. కాని అవి దాగలికి ఎలాంటి హానీ కలిగించలేవు.
“నేను ఫలానా వ్యక్తి తండ్రి దారిలో పోతూండగా చూశాను.”
‘మ’ : అతడు చాలా నిష్కపట స్వభావం కలవాడండి.
శ్రీరామకృష్ణులు: కాని అతడి కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి.
41.2.5 కెప్టెన్, శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు భక్తులతో కెప్టెన్ ఇంటికి వెళ్ళినప్పుటి విషయాలను చెబుతున్నారు. కెప్టెన్ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చే బాలభక్తుల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. బహుశా హాజ్రా అతడి చెవిలో ఏదో ఊదినట్లుంది.
శ్రీరామకృష్ణులు: కెప్టెన్‌తో సంభాషిస్తూన్నప్పుడు నే నిలా అన్నాను: ‘ప్రకృతి, పురుషులు తప్పించి మరేమీ లేదు. నారదుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు: ‘ఓ రామా! నువ్వు చూసే పురుషులందరూ నీ అంశలే; నువ్వు చూసే స్త్రీలందరూ సీతాదేవి అంశలే.’
కెప్టన్ ఈ మాటతో చాలా సంతుష్టుడై ఇలా అన్నాడు: “మీకు యథార్థ జ్ఞానం కలిగింది. పురుషులందరూ రాముడి అంశ కారణంగా రాములే; స్త్రీ లందరూ సీతాదేవి అంశ కారణంగా సీతలే.”
ఇలా పలికిన వెంటనే అతడు ఉన్నట్టుండి ఈ బాలభక్తులను ఇలా విమర్శించసాగాడు: “వారు ఆంగ్లవిద్యను అభ్యసించేవాళ్ళు; ఏదిపడితే అది తింటూంటారు. వారు సర్వదా మీ వద్దకు రావటం మంచిది కాదు.దానివల్ల మీకు హాని కలుగవచ్చు. హాజ్రా చాలా మంచి వ్యక్తి, ఉత్తముడు. ఆ కుర్రవాళ్ళను మీ వద్దకు ఎక్కువగా రానివ్వవద్దు.”
మొదట్లో నేను మర్యాదగా “వారు వస్తూంటే నేనేం చేయగలను?” అన్నాను. పిదప అతణ్ణి తూర్పారబట్టసాగాను. అది చూసి అతడి కుమార్తె నవ్వడం మొదలుపెట్టింది. అతడితో ఇలా అన్నాను: “విషయాసక్తుడైన వ్యక్తి భగవంతుడికి చాలాదూరంగా ఉంటాడు. విషయాసక్తి కనుక లేనట్లయితే అతడికి భగవంతుడు కేవలం ఒక మూర దూరంలోనే, అంటే అతి సమీపంలో ఉంటాడు.” అటుపిదప కెప్టన్, రాఖాల్ గురించి మాట్లాడుతూ “రాఖాల్ అందరి ఇళ్ళలోనూ తింటూంటాడు” అన్నాడు. బహుశా అతడికి హాజ్రా ఈ విషయం చెప్పివుంటాడు. అందుకు నేను ఇలా అన్నాను: “జపతపాలను ఎంతగా అనుష్ఠించినా సరే విషయాసక్తి కనుక ఉన్నట్లయితే ఒరిగేది ఏమీ ఉండదు. పంది మాంసం తిన్నప్పటికీ మనస్సు కనుక భగవంతుడి పట్ల లగ్నమై ఉంటే అటువంటి వ్యక్తి ధన్యుడే సుమా! అతడు క్రమక్రమంగా భగవల్లబ్ధిని పొంది తీరతాడు. హాజ్రా ఇంత జపతపాదులు చేస్తూంటాడు; అయితే వీటి మధ్య దళారీ పని (మధ్యవర్తిత్వం నెరిపి డబ్బు సంపాదించే పని) కూడా చేస్తూంటాడు.”
అప్పుడు కెప్టన్ “ఆ, ఆ మాట నిజమే” అన్నాడు. అతణ్ణి నే నిలా అడిగాను: “ఇప్పుడిప్పుడే పురుషులందరూ శ్రీరాముడి అంశలనీ, స్త్రీలందరూ సీతాదేవి అంశలనీ అన్నావే! మళ్ళీ ఇంతలోనే ఇలా మాట్లాడతా వేమిటి?”
కెప్టెన్ “ఆ మాట నిజమే కాని మీరు అందరినీ ప్రేమించటం లేదు” అన్నాడు.
అందుకు నే నిలా చెప్పాను: “శాస్త్రాల్లో ‘ఆపో నారాయణః’ అని చెప్పబడి ఉంది. అంటే అంతా నీరే అని అర్థం. కాని కొన్నీ నీళ్లు మాత్రమే త్రాగడానికి పనికివస్తాయి; కొన్ని నీళ్లు స్నానార్థం ఉపయోగపడతాయి. మరికొన్ని నీళ్లు మనం కేవలం శౌచానికి మాత్రమే వాడగలం. ఇక్కడ కూర్చొన్న నీ భార్య, కుమార్తెను నేను సాక్షాత్తూ ఆనందమూర్తి ఐన దేవీస్వరూపిణులుగా గాంచుచున్నాను.” అప్పుడు కెప్టెన్ “అవునవును. ఆ మాట నిజమే” అంటూ నా కాళ్ళు పట్టుకోబోయాడు.
ఇలా పలికిన పిదప శ్రీరామకృష్ణులు కెప్టెన్ సుగుణాల గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: కెప్టెన్లో సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజూ అతడు నిత్యకర్మలు నిర్వర్తిస్తూంటాడు. ఇంట్లో తానే స్వయంగా దేవతారాధన చేస్తుంటాడు. దేవతాప్రతిమకు స్నానం చేయించేటప్పుడు ఎన్ని మంత్రాలు ఉచ్చరిస్తుంటాడని! కెప్టెన్ కర్మకాండను నిష్ఠతో ఆచరించే వ్యక్తి. అతడు ప్రతి రోజూ పూజ, జపం, హారతి, స్తోత్ర పఠనం మొదలైనటువంటి నిత్యకర్మలు చేస్తూంటాడు.
“నేను కెప్టెన్‌ను మందలిస్తూ ఇలా అన్నాను: ‘మితిమీరి చదవటం వల్లనే నువ్విలా పాడైపోయావు. ఇకమీదట ఏమీ చదవవద్దు.’
“నా ఆధ్యాత్మిక స్థితుల గురించి కెప్టెన్ ‘మీది ఉడ్డీయమాన భావం (అంటే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న పక్షిలాంటి భావం అని అర్థం)’ అన్నాడు. జీవాత్మ, పరమాత్మ లనేవి రెండు ఉన్నాయి. జీవాత్మ ఒక పక్షి లాంటిది; పరమాత్మ ఆకాశం, అంటే చిదాకాశం లాంటిది. కెప్టెన్ ఇలా అన్నాడు: ‘మీ జీవాత్మ చిదాకాశంలోకి ఎగిరిపోతుంది. అప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది.’
(నవ్వుతూ) “కెప్టెన్ బెంగాలీలను విమర్శించాడు. అతడిలా అన్నాడు: ‘బెంగాలీలు పరమ మూఢులు. ప్రక్కనే మాణిక్యం (అంటే శ్రీరామకృష్ణులు) ఉన్నప్పటికీ వారు గుర్తించలేకున్నారు.’
41.2.6 గృహస్థ భక్తుడు – కర్మలు ఎంతకాలం?
“కెప్టెన్ తండ్రి గొప్ప భక్తుడు. ఆంగ్లేయ సైన్యంలో సుబేదారుగా ఉండేవాడు. యుద్ధభూమిలోకూడా ఆయన పూజకు వేళయినప్పుడు క్రమం తప్పకుండా పూజ చేసేవాడు. ఒకచేత్తో శివపూజ చేసేవాడు; మరో చేత్తో కత్తి, తుపాకీలను పట్టుకొని ఉండేవాడు.
(‘మ’ తో) “కాని విషయ మేమిటంటే కెప్టెన్ రాత్రింబవళ్ళు ఐహిక కర్మల్లో మునిగి ఉంటాడు. నేను అతడి ఇంటికి వెళ్ళినప్పుడల్లా, అతడు భార్యాబిడ్డల నడుమ కూర్చుని ఉండటం చూస్తాను. అంతేకాకుండా జమా ఖర్చులు చూపించటానికని అతని గుమాస్తాలు మధ్యమధ్యలో వస్తూపోతూంటారు. కాని అతడి మనస్సు అప్పుడప్పుడు భగవంతుడి వైపుకు కూడా మళ్ళుతూ ఉంటుంది. అది సన్నిపాతరోగి పరిస్థితి లాంటిది. సన్నిపాత రోగంతో ఒళ్ళెరగక పడివున్న వ్యక్తి అప్పుడప్పుడు కొద్దిగా స్పృహలోకి వచ్చి ‘మంచినీళ్ళు, మంచి నీళ్ళు’ అని అరుస్తూంటాడు. కాని మంచినీళ్ళు తెచ్చేలోపలే మళ్ళీ స్పృహతప్పి పడిపోతాడు. అందుకనే నేను కెప్టన్తో ‘నువ్వు నిత్యకర్మలు అనుష్ఠించేవాడివి’ అన్నాను. అతడు “అవునండి. పూజాది కర్మల ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మాబోటి జీవులకు కర్మకాండను మించి వేరే మార్గం లేదు’ అన్నాడు.
“నేనతడితో ఇలా అన్నాను: ‘కాని కర్మలు ఎల్లకాలం చేస్తూనే ఉండాలా? తేనెటీగలు ఎంతసేపు ఝంకారం చేస్తూంటాయి? పువ్వులపై వ్రాలనంత వరకే. మధువును సేవించటం మొదలుపెట్టగానే ఆ ఝంకారం ఆగిపోతుంది.’ అందుకు కెప్టెన్ “మేంకూడా మీలాగే పూజాది కర్మలను త్యజించాలా ఏమిటి?’ అని అడిగాడు. అయితే అతడి మాటల్లో నిలకడ లేదు. ఒక్కోసారి ఇదంతా జడం అంటుంటాడు, మరోసారి ఇదంతా చైతన్యం అంటూంటాడు. ‘జడం ఎక్కడ ఉంది? అంతా చైతన్యమే’ అని నే నంటాను.”
41.2.7 ‘మ’, పూర్ణుడు – ద్విజుడు
శ్రీరామకృష్ణులు ‘మ’ ను పూర్ణుడి గురించి అడగసాగారు.
శ్రీరామకృష్ణులు: మరోసారి పూర్ణుణ్ణి చూడగలిగితే నా మనస్సు కాస్త స్థిమితపడుతుంది. అతడు ఎంత తెలివైనవాడు! అతడికి నా పట్ల ఎంతటి అపేక్ష! ‘మిమ్మల్ని చూడాలని నా మనస్సు కూడా తహతహలాడుతుంది’ అన్నాడు. (‘మ’ తో) అతణ్ణి స్కూలు నుండి తీసుకువెళ్ళిపోయారు కదా! అందువల్ల నీకేమైనా హాని కలుగుతుందా?
‘మ’ : ఒకవేళ ఆయన (విద్యాసాగర్) నా కారణంగా ఆ అబ్బాయిని స్కూలు నుండి తీసుకువెళ్ళిపోయారని చెబితే అందుకు నేను సంజాయిషీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
శ్రీరామకృష్ణులు: ఏమని సంజాయిషీ ఇస్తావు?
‘మ’ : సాధుసాంగత్యంవల్ల భగవచ్చింతన ఒనగూరుతుంది – ఇందులో తప్పంటూ ఏమీ లేదని స్పష్టంగా చెబుతాను. పైగా ‘మీరు (విద్యాసాగర్) నిర్ణయించిన పాఠ్య పుస్తకాలలో భగవంతుణ్ణి ప్రాణప్రదంగా ప్రేమించమని ఉందని చెబుతాను. (శ్రీరామకృష్ణులు నవ్వారు.)
శ్రీరామకృష్ణులు: కెప్టెన్ ఇంటికి చిన్ననరేంద్రుణ్ణి పిలిపించాను. అతడితో ‘ఏమోయ్, మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంటికి వెళదాం పద’ అన్నాను. అతడు ‘రండి వెళదాం’ అనైతే అన్నాడు కాని భయంతో బిక్కుబిక్కుమంటూ నడవసాగాడు. పాపం వాళ్ళ నాన్నగారికి తెలుస్తుందేమోనని భయం! (అందరూ నవ్వారు)
(అఖీల్బాబు పొరుగువాడితో) “ఏమయ్యా, ఈ మధ్య చాలాకాలంగా నువ్వు రావడం లేదే? ఏడెనిమిది మాసాలు అయ్యుంటుంది కదూ?”
పొరుగు వ్యక్తి: ఆ, దాదాపు ఒక సంవత్సరం అయిందండి.
శ్రీరామకృష్ణులు: నీతోపాటు మరో పెద్దమనిషి వచ్చేవాడు కదా!
పొరుగు వ్యక్తి: అవునండి. అతడి పేరు నీలమణి బాబు.
శ్రీరామకృష్ణులు: అతడిప్పుడు ఎందుకు రావడం లేదు? అతణ్ణి ఒకసారి రమ్మని చెప్పు.నాకు అతణ్ణి చూడాలని ఉంది. (పొరుగు వ్యక్తితోపాటు వచ్చిన ఒక బాలుణ్ణి చూస్తూ) ఈ బాలుడు ఎవరు?
పొరుగు వ్యక్తి: ఈ బాలుడు అస్సాం వాస్తవ్యుడండి.
శ్రీరామకృష్ణులు: అస్సాం అంటే ఎక్కడ ఉంది? అది ఏ దిశలో ఉంది?
పిమ్మట ద్విజుడు ఆశు గురించి మాట్లాడసాగాడు. ఆశు తండ్రి అతనికి వివాహం చేయాలని చూస్తున్నాడు. కాని ఆశుకు వివాహం చేసుకోవడం సుతరామూ ఇష్టం లేదు.
శ్రీరామకృష్ణులు: చూశారా! అతడికి పెళ్ళి చేసుకోవాలని లేదు. అయితే వారు బలవంతంగా చేయాలని చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో తన అన్నకు గౌరవ మివ్వాలని చెబుతూ ఇలా అన్నారు: “జ్యేష్ఠ సోదరుడు పితృసమానుడు. అతణ్ణి గౌరవించాలి.”
41.3 తృతీయ పరిచ్ఛేదం రాధాదేవి తత్త్వం – శ్రీరామకృష్ణులు – మృత్యు తత్త్వం
పండితుడు నేల మీద పరచిన చాపమీద కూర్చుని ఉన్నాడు. అతడు ఉత్తర భారతదేశానికి చెందినవాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ ‘మ’ తో): ఈయన భాగవతంలో మంచి పాండిత్యం ఉన్నవాడు.
‘మ’, భక్తులు ఆ పండితుడి వంక తదేకంగా చూడసాగారు.
శ్రీరామకృష్ణులు (పండితుడితో): ఏమండీ, యోగమాయ అంటే ఏమిటో చెబుతారా?
పండితుడు యోగమాయ గురించి ఏదో వివరణ ఇచ్చాడు.
శ్రీరామకృష్ణులు: రాధాదేవిని యోగమాయ అన రెందుకని?
ఈ ప్రశ్నకుకూడా పండితుడు మునుపటిలాగానే ఏదో వివరణ ఇచ్చాడు. దానితో శ్రీరామకృష్ణులే స్వయంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పసాగారు.
శ్రీరామకృష్ణులు: రాధాదేవిది విశుద్ధ సత్త్వగుణం; ఆమె ప్రేమమయ స్వరూపిణి. యోగమాయలో సత్త్వరజస్తమోగుణాలు మూడూ ఉంటాయి. రాధాదేవిలో విశుద్ధ సత్త్వగుణం తప్ప మరేదీ లేదు.
(‘మ’ తో) “నరేంద్రుడు ప్రస్తుతం రాధాదేవిని ఎంతగానో అంగీకరిస్తున్నాడు. సచ్చిదానందుణ్ణి ప్రేమించడం ఎలాగో నేర్చుకోవాలంటే దానిని రాధాదేవి నుండి తెలుసుకోవాలని అంటున్నాడు.
“సచ్చిదానందుడు స్వయంగా రసాస్వాదన చేయటానికి రాధాదేవిని సృష్టించాడు. రాధాదేవి సచ్చిదానంద కృష్ణుడి దేహంనుండి బయల్వెడలింది. సచ్చిదానంద కృష్ణుడే ‘ఆధారం’ ; మళ్ళీ ఆతడే రాధాదేవి రూపంలో ‘ఆధేయం’. స్వీయ రసాస్వాదనకి అంటే సచ్చిదానందుణ్ణి ప్రేమించి ఆనందాన్ని అనుభవించటానికి ఆతడు రాధాదేవి రూపం దాల్చాడు.
“వైష్ణవ గ్రంథాలలో ఇలా చెప్పబడి ఉంది; రాధాదేవి పుట్టగానే కళ్ళు తెరవలేదట – అంటే ఈ కళ్ళతో కృష్ణుణ్ణి తప్ప వేరే ఎవరినీ చూడను అని భావం. రాధాదేవిని చూడాలని యశోద కృష్ణుణ్ణి ఎత్తుకొని వచ్చింది. అప్పుడు కృష్ణుణ్ణి చూడాలనే ఆమె కళ్ళు తెరిచింది. కృష్ణుడు ఆడుతున్నట్లు నటించి ఆమె కళ్ళను స్పృశించాడు. (అస్సామీ బాలుడితో) చిన్నపిల్లలు ఇతరుల కళ్ళను వ్రేళ్లతో స్పృశించడం నువ్వు చూసేవుంటావు కదూ!”
41.3.1 సంసారులు – త్యాగధనులైన యువకుల మధ్య వ్యత్యాసం
పండితుడు శ్రీరామకృష్ణుల వద్దనుంచి సెలవు తీసుకొంటున్నాడు.
పండితుడు: నేనిక వెళతానండి.
శ్రీరామకృష్ణులు (స్నేహపూర్వకంగా): ఏమైనా సంపాదించుకొన్నావా?
పండితుడు: లేదండి. సంపాదన మందకొడిగా ఉంది.
కాసేపటి తర్వాత పండితుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి వెళ్ళిపోయాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): విషయలోలురకు, బాలురకు ఎంతటి వ్యత్యాసమో చూడు. ఈ పండితుడికి రాత్రింబవళ్ళు డబ్బు గురించిన చింతే. పొట్టకూటి కోసమని కలకత్తాకు వచ్చాడు. లేకుంటే ఇంట్లో వాళ్ళు పస్తులు ఉండవలసి వస్తోంది. అందుకనే అందరి ఇళ్ళ ముందు పడిగాపులు కాయవలసి వస్తోంది. అతడు మనస్సును ఏకాగ్రం చేసి భగవచ్చింతన చేసేది ఎప్పుడు? కాని బాలురలో కామినీకాంచనాలు ప్రవేశించలేదు. తలచుకొన్నమాత్రానే వారు మనస్సును భగవంతునిపై నిలుపగలరు.
“బాలురకు విషయాసక్తుల సాంగత్యం రుచించదు. ఒక్కోసారి రాఖాల్ ‘విషయాసక్తులు రావడం చూడగానే నాకు భయం వేస్తుంది’ అంటుంటాడు. నాకు ప్రారంభంలో ఆధ్యాత్మిక అనుభూతులు కలిగేటప్పుడు విషయలోలురు రావటం చూడగానే నేను గది తలుపులు మూసుకొనేవాడిని.
41.3.2 కామార్పుకూర్లో శ్రీరామ్ మల్లిక్
“కామార్పుకూర్లో శ్రీరామ్ మల్లిక్పట్ల నాకు చాలా అపేక్ష ఉండేది. కాని అతడు ఇక్కడకు వచ్చినప్పుడు అతణ్ణి తాకలేకపోయాను. చిన్నప్పుడు శ్రీరామ్ అంటే చెప్పలేని ప్రీతి. రాత్రింబవళ్ళు మేమిద్దరం కలసి ఉండేవాళ్ళం, కలసి పడుకొనేవాళ్ళం. అప్పుడు నా వయస్సు పదహారు లేక పదిహేడు సంవత్సరాలు ఉంటుంది. చూసిన వాళ్ళంతా ‘వీరిద్దరిలో ఒకరు ఆడపిల్ల అయివుంటే ఇద్దరూ వివాహం చేసుకొని ఉండేవారు’ అనేవారు. అతడింట్లో మేమిద్దరం కలసి ఆడుకొనేవాళ్ళం. ఆనాటి సంగతులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. అతడి బంధువులు పల్లకీలలో వచ్చేవారు, బోయీలు ‘ఒహొం ఒహొం ఒహొం ఒహొం’ అంటూ ఉండేవాళ్ళు. శ్రీరామ్‌ను చూడాలని నేను చాలాసార్లు కబురంపాను. ప్రస్తుతం అతడు చానక్లో అంగడి పెట్టుకొని ఉన్నాడు. ఆ మధ్య ఒకసారి ఇక్కడకు వచ్చి రెండు రోజులు గడిపాడు.
“శ్రీరామ్ ఇలా అన్నాడు: ‘సంతానం లేనందున అన్న కుమారుణ్ణి పెంచుకొన్నాం. కాని వాడుకూడా చనిపోయాడు.’ ఇలా పలుకుతూ శ్రీరామ్ కంటతడి పెట్టుకొని గాఢంగా నిట్టూర్చాడు. అన్న కుమారుడి కోసమని అతడు దుఃఖంతో కుమిలిపోతున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు: ‘పిల్లలు లేనందున నా భార్య ఆ కుర్రవాణ్ణి ఎంతో గారాబంగా పెంచింది. ఇప్పుడు వాడు కూడా పోవడంతో ఆమె దుఃఖంలో మునిగిపోయింది. నేను ఆమెతో “పిచ్చిదానా! ఏడ్చి ఏం లాభం? కాశీ వెళతావా?” అని అడిగాను.’
“ ‘పిచ్చిదానా’ అంటూనే ఒక్కసారిగా అతణ్ణి నిస్సత్తువ ఆవహించింది. నేను అతణ్ణి తాకలేకపోయాను; లోపల సత్తా అంటూ ఏమీ లేదు.”
శ్రీరామకృష్ణులు ఈ విధంగా శోక విచారాల గురించి చెబుతూండగా ఉత్తరం వైపునున్న తలుపు వద్ద కుమార్తె మరణించిందన్న దుఃఖంలో మునిగి ఉన్న బ్రాహ్మణ వితంతువు (గోలాప్ మా) నిలబడి ఉంది. ఆమె తన ఏకైక పుత్రికను జమీందారుల కుటుంబంలో ఇచ్చింది. అల్లుడు కలకత్తా నగర వాస్తవ్యుడు; రాజాబిరుదాంకితుడు. ఆ అమ్మాయి పుట్టినింటికి వచ్చినప్పుడల్లా మందీమార్బలంతో ఎంతో దర్జాగా వచ్చేది. అది చూసి ఆ స్త్రీ ఉప్పొంగిపోయేది. అటువంటి కుమార్తె కొన్నిరోజుల క్రితమే చనిపోయింది. దానితో పాపం ఆమె దుఃఖంతో క్రుంగిపోయింది. గత కొద్దిరోజులుగా ఆమె ప్రతి రోజూ బాగ్బజారు నుండి దక్షిణేశ్వరానికి పిచ్చిదానిలా పరుగెత్తుకుంటూ వస్తోంది. శ్రీరామకృష్ణులు ఏదైనా ఉపాయం చెబుతారేమోనని ఆమె ఆశ. ఆమె కూడా శ్రీరామ్ మల్లిక్ శోక ఉదంతం విన్నది.
శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (బ్రాహ్మణ స్త్రీ, తదితర భక్తులతో): ఆ మధ్య ఒక రోజు ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. కాసేపు కూర్చున్న పిదప అతడు ‘నేను వెళతానండి. వెళ్ళి నా కుమారుడి చంద్రవదనాన్ని చూడాలి’ అన్నాడు. అది విని నన్ను నేను అదుపుచేసుకోలేకపోయాను. ‘ఓరీ ధూర్తుడా! మరి అలాంటప్పుడు ఇక్కడ నుండి లేచి వెళ్ళిపోవెందుకని? భగవంతుడి చంద్రవదనం కంటే నీ కుమారుడి చంద్రవదనంపైనే అంతటి అపేక్షా?’ అన్నాను.
41.3.3 జన్మ మృత్యువులు – గారడీ వాడు, గారడీ
(‘మ’ తో) “అసలు విషయం ఏమిటో తెలుసా? భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. జీవులు, జగత్తు, ఇల్లూవాకిలీ, పిల్లాజల్లా – ఇవన్నీ గారడీవాడి గారడీయే. గారడీవాడు కర్రతో డోలును వాయిస్తూ ‘క్షూ క్షూ మంత్ర కాళీ! రండి, గారడీ చూడండి’ అంటూంటాడు. ప్రేక్షకులతో ‘రండి, ఈ కుండ మీది మూత తీయండి’ అంటాడు. మూత తీయగానే కుండలో నుంచి అనేక పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కాని గారడీవాడే సత్యం; వాడు చేసే గారడీ అంతా అనిత్యం. అనిత్యమనేది ఇప్పటికిప్పుడు ఉంటుంది; ఇంతలోనే మాయమైపోతుంది. ఒకసారి కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నప్పుడు నంది ఆయనకు సమీపంలో ఉన్నాడు. హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినవచ్చింది. ‘స్వామీ, ఇదేమి శబ్దం’ అని నంది ప్రశ్నించగా శివుడు ‘రావణుడు జన్మించాడు. అందుకే ఈ శబ్దం!’ అని బదులిచ్చాడు. కాస్సేపటి తర్వాత మళ్ళీ మరో భయంకర శబ్దం వినవచ్చింది. నంది మళ్ళీ ‘ప్రభూ ఇదేమి శబ్దం?’ అని అడగ్గా శివుడు నవ్వుతూ ‘ప్రస్తుతం రావణ వధ జరిగింది’ అన్నాడు. చావు పుట్టుకలు – ఇవన్నీ గారడీలాంటివి. ఈ క్షణంలో ఉంటాయి, ఇంతలోనే కనుమరుగైపోతాయి. భగవంతుడే సత్యం, తక్కినవన్నీ అనిత్యం. నీరు మాత్రమే సత్యం; అయితే నీటిబుడగ లనేవి ఇప్పుడు ఉంటాయి, మరుక్షణంలో ఉండవు. నీటి బుడగలు నీటిలో కలసిపోతాయి. ఏ నీటి నుండి అయితే పుట్టాయో ఆ నీటిలోనే లయమైపోతాయి.
“భగవంతుడు మహాసముద్రం లాంటివాడు, జీవులు అందులోని బుడగల లాంటివారు. వారు అందులోనే జన్మిస్తారు, అందులోనే లయమైపోతారుకూడా. పిల్లలు ఒక పెద్ద బుడగతోపాటు ఉన్న చిన్న బుడగలవంటివారు.
“భగవంతుడే సత్యం. ఆయనపట్ల భక్తి పెంపొందించుకోవడానికి, ఆయన్ను సాక్షాత్కరించు కోవడానికి ప్రయత్నించండి. దుఃఖీంచడం వల్ల ఏమిటి ప్రయోజనం?”
అందరూ మౌనంగా ఉండిపోయారు. బ్రాహ్మణ స్త్రీ “ఇక నేను వెళతానండి” అంది.
శ్రీరామకృష్ణులు (బ్రాహ్మణ స్త్రీతో సాదరంగా): ఇప్పుడే వెళతావా? చాలా ఎండగా ఉందే? వీరితోపాటు బండిలో పోవచ్చుకదా!
సాయంకాలం నాలుగు గంటలయింది. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. భక్తు డొకడు శ్రీరామకృష్ణులకు మంచిగంధపు చెక్కతో చేసిన విసనకర్ర నొక దానిని తెప్పించి ఇచ్చాడు. ఆయన దానిని చేతపట్టుకొని ఎంతో ఆనందంతో “ఆహా!ఆహా! ఓం తత్సత్! కాళీ!” అంటూ ముందుగా గదిలో ఉన్న దేవీ దేవతల పటాలన్నింటికీ వీచసాగారు. పిదప తమకు వీచుకోసాగారు. ‘మ’ తో “చూడు, చూడు! ఎంత బాగా గాలి వస్తోందో!” అన్నారు. అదిచూసి ‘మ’ కూడా సంబరపడిపోయాడు.
41.4 చతుర్థ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – కెప్టెన్
ఇంతలో కెప్టెన్ తన పిల్లలను వెంటబెట్టుకొని వచ్చాడు.
శ్రీరామకృష్ణులు కిశోరీతో “ఈ పిల్లలకు ఆలయాల నన్నింటినీ చూపించి తీసుకు రా” అన్నారు. పిదప కెప్టెన్‌తో మాట్లాడసాగారు. ‘మ’, ద్విజుడు తదితర భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉత్తరాభిముఖులై చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు; కెప్టన్‌ను కూడా తమకు ఎదురుగా చిన్న మంచంపై కూర్చోమని చెప్పారు.
41.4.1 విద్యా ‘నేను’ – దాసుడను ‘నేను’
శ్రీరామకృష్ణులు: ఇందాక నీ గురించే వీరితో చెబుతూ ఉన్నాను. ఏం భక్తి! ఏం పూజ! ఎన్ని రకాల హారతులు!
కెప్టెన్ (సిగ్గుతో): పూజాహారతుల గురించి నాకేమి తెలుసునండి. నే నేదో సామాన్యుణ్ణి.
శ్రీరామకృష్ణులు: అసలు వచ్చిన గొడవంతా కామినీకాంచనాల పట్ల ఆసక్తి కలిగివున్న ‘నేను’ తోటే. నేను భగవంతుడి దాసుడను అనే ‘నేను’ లో ఎలాంటి దోషమూ లేదు. బాలుడి ‘నేను’ కూడా అలాంటిదే. బాలుడు ఏ గుణం వశంలోనూ ఉండడు. చిన్నపిల్లలు క్షణంలో కలహించుకొంటారు, మరుక్షణంలోనే మళ్ళీ నేస్తాలైపోతారు. ఎంతో జాగ్రత్తగా ఇసుకలో బొమ్మరిల్లు కడతారు, అంతలోనే దానిని పడగొట్టేస్తారు. దాసుడి ‘నేను’, బాలకుడి ‘నేను’ – వీటిలో ఏ దోషమూ లేదు. ఈ అహం, అహం లెక్కలోకి వచ్చేది కాదు. పటికబెల్లం మిఠాయిలలోకి రాదు. మిఠాయిలు తింటే సుస్తీ చేస్తుంది; కాని పటికబెల్లం తిన్నట్లయితే అది ఆమ్లశూలను హరిస్తుంది. అలాంటిదే ఈ దాసుడి లేక బాలుడి ‘నేను’ కూడా. ఇంకా చెప్పుకోవాలంటె, ఓంకారం తక్కిన శబ్దాలకు చెందినది కాదు.
“ఈ అహం ద్వారానే సచ్చిదానందుణ్ణి ప్రేమించగలం. ఈ అహం వదిలేదైతే కాదు కాబట్టి దీన్ని దాసుడి ‘నేను’, భక్తుడి ‘నేను’ గా ఉండనివ్వండి. లేనట్లయితే మనిషి మరి దేన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తాడు? గోపికలది ఎంతటి ప్రేమ! (కెప్టెన్‌తో) నువ్వు భాగవతం బాగా చదివావు కదా! గోపికల ప్రేమ గురించి కాస్త చెప్పు చూద్దాం.”
కెప్టెన్: శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి రాజఠీవి లేదాయె. అయినప్పటికీ గోపికలు అతణ్ణి తమ ప్రాణాలకంటే మిన్నగా ప్రేమించారు. అందుకే కృష్ణుడు ఇలా అన్నాడు: “నేను వీరి ఋణాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ గోపికలు నాకు దేహం, మనస్సు, చిత్తం – సమస్తం నాకే అర్పించారు.”
శ్రీకృష్ణుడి గురించిన విషయాలను వినగానే శ్రీరామకృష్ణులకు కృష్ణోద్దీపన కలిగింది. “గోవిందా, గోవిందా, గోవిందా” అంటూ భావపరవశు లవుతున్నారు. క్రమక్రమంగా బాహ్యస్పృహను కోల్పోతున్నారు. కెప్టెన్ దీనినంతా విస్మయంతో చూస్తూ “ధన్యులు! ధన్యులు!” అన్నాడు.
కెప్టెన్‌తోపాటు గదిలో ఉన్నవారందరూ శ్రీరామకృష్ణుల అద్భుత ప్రేమావస్థను చూస్తున్నారు. ఆయన మళ్ళీ బాహస్పృహలోకి వచ్చేంతవరకు రెప్పవాల్చకుండా ఆయన వంకే చూస్తూండిపోయారు. బాహ్యస్పృహ కలిగాక ఆయన మళ్ళీ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఆ తరువాత ఏమయింది?
కెప్టెన్: యోగిభి రగమ్యం – శ్రీకృష్ణుడు యోగులకు లభ్యంకాడు; అంటే ఆతడు మీలాంటి యోగులకు లభించడు. కాని గోపికలకు సులభంగా లభ్యమయ్యాడు. యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ ఆతణ్ణి పొందలేకపోయారు. కాని గోపికలు సునాయాసంగానే ఆతణ్ణి పొందగలిగారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): శ్రీకృష్ణుడు గోపికల చేతులనుండి భుజించాడు, వారితో ఆటలాడాడు, వారికై విలపించాడు; వారివద్ద ప్రేమతో మంకుపట్లు కూడా పట్టేవాడు.
41.4.2 బంకిం – ‘వార్తా పత్రికలో లేదే!’
ఒక భక్తుడు: బంకిం కృష్ణచరిత్రను వ్రాశాడండి.
శ్రీరామకృష్ణులు: అతడు కృష్ణుణ్ణి అంగీకరిస్తాడు కాని రాధాదేవిని అంగీకరించడు.
కెప్టెన్: అతడు కృష్ణలీలలను ఒప్పుకోడు.
శ్రీరామకృష్ణులు: కామాది ప్రవృత్తులు కూడా అవసరమేనని అతడు వాదిస్తాడట.
ఒక భక్తుడు: అతడు నవజీవన్ అనే పత్రికలో ‘ధర్మాచరణ చేయటం శారీరక మానసిక ఆధ్యాత్మికాది సకల ప్రవృత్తులను వికసింపజేయటానికే’ అని వ్రాశాడు.
కెప్టెన్: కామాది ప్రవృత్తులు అవసరమని వ్రాశాడా? మరి అలాంటప్పుడు అతడు లీలలను ఎందుకు ఒప్పుకోడు? భగవంతుడే మానవరూపం ధరించి బృందావనంలో తన లీలను ప్రదర్శించాడు, రాధాకృష్ణ లీలను ప్రదర్శించాడు. బంకిం మరి ఈ లీలను ఎందుకు అంగీకరించడు?
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): ఈ విషయాలన్నీ వార్తాపత్రికలలో ఉండవు కదా! మరి అటువంటప్పుడు అతడు వాటిని ఎలా నమ్మగలడు?
“ఒక వ్యక్తి తన మిత్రుడితో ‘మిత్రమా, నిన్న నేను ఫలానా చోట వెళుతూన్నప్పుడు ఒక ఇల్లు దభీమని కూప్పకూలిపోవడం చూశాను’ అన్నాడు. ఆ మిత్రుడు ‘కాస్త ఆగవోయ్. వెళ్ళి వార్తాపత్రిక చూసి వస్తాను’ అన్నాడు. కాని అందులో ఈ ఇల్లు కూలిపోయిన సమాచారం లేదు. ఆ మిత్రుడు ‘మరి వార్తాపత్రికలో ఈ సమాచారం లేదే! అంటే ఆ సంఘటన జరిగి ఉండదు’ అన్నాడు. మొదటి వ్యక్తి, ‘అరే బాబూ! ఇల్లు కూలిపోవడం కళ్ళారా చూసి వచ్చాను అని చెబుతూంటే నువ్వు నమ్మవేమిటి?’ అన్నాడు. అప్పుడు ఆ మిత్రుడు ‘నువ్వు చెప్పినట్లు జరిగివుంటే ఉండవచ్చు గాక! కాని వార్తాపత్రికలో ఆ సమాచారం లేదు. మరి అలాంటప్పుడు దాన్ని నే నెలా నమ్మగలను?’ అన్నాడు.
“భగవంతుడు మానవరూపంలో తన లీలలను ప్రదర్శిస్తాడన్న విషయాన్ని బంకిం ఎలా విశ్వసించగలడు? ఈ విషయం అతడు చదువుకున్న ఆంగ్ల విద్యలో లేదాయె. పూర్ణావతారాన్ని వివరించడం చాలా కష్టం. ఏమంటావు? ‘మూడున్నర మూరల మనిషిలో అనంత స్వరూపం ఇమిడి ఉండటం!’”
41.4.3 పూర్ణావతారం – అవతారం భక్తుల కోసమే, జ్ఞానులకు కాదు
కెప్టెన్: కృష్ణస్తు భగవాన్ స్వయం – అవతారపురుషుని గురించి వర్ణించేటప్పుడు పూర్ణావతారమా లేక అంశావతారమా అని చెప్పవలసి వస్తుంది.
శ్రీరామకృష్ణులు: పూర్ణం, అంశలు అగ్ని, దాని విస్ఫులింగాల వంటివి. భగవదవతారం భక్తులకోసంగాని జ్ఞానులకోసం కాదు. అధ్యాత్మ రామాయణంలో ఇలా ఉంది: ‘ఓ రామా! వ్యాప్యమూ నువ్వే, వ్యాపకుడమా నువ్వే – వాచ్యవాచక భేదేన త్వమేవ పరమేశ్వర.’
కెప్టెన్: వాచ్యవాచకము అంటే వ్యాప్యవ్యాపకమే.
శ్రీరామకృష్ణులు: ‘వ్యాపకము’ అంటే ఒక చిన్నరూపంలో వ్యక్తమవడం – భగవంతుడు మానవరూపంలో అవతరించటం లాంటిది.
41.5 పంచమ పరిచ్ఛేదం అహంకారమే భగవద్దర్శనానికి అవరోధం
ఈ విధంగా శ్రీరామకృష్ణులు కెప్టెన్ తదితర భక్తులతో మాట్లాడుతూ ఉండగా బ్రహ్మసమాజానికి చెందిన జయగోపాల్ సేన్, త్రైలోక్యుడు గదిలోకి వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడి వంక నవ్వుతూ చూసి సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: ఈ అహంకారం కారణంగానే భగవద్దర్శనం కావటం లేదు. భగవంతుడి ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారమనేది చెట్టుబోదెలా పడివుంది. ఈ బోదెను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యంకాదు.
“ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకొనే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది: ‘నే నిప్పుడు ఏం పని చేయాలో చెప్పు. నువ్వు నాకు ఏ పనీ అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను త్రుంచివేస్తాను.’ ఆ వ్యక్తి తనకు కావలసిన పనుల నన్నింటినీ ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకొన్నాడు. చివరకు ఆ భూతానికి ఇవ్వడానికంటూ అతడి వద్ద ఏ పనీ లేకుండాపోయింది. ‘ఇప్పుడు నీ మెడ త్రుంచి వేస్తాను’ అంది ఆ భూతం. పాపం అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ‘ఒక క్షణం ఆగు. నే నిప్పుడే వస్తాను’ అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగు పరుగున వెళ్లాడు. ఆయనకు ఈ ఉదంతాన్ని తెలిపి ‘అయ్యా, నే నో పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. ఇదీ సంగతి! నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవియ్యండి’ అన్నాడు. గురువుగారు అతడికి వంకరటింకరగా ఉన్న వెంట్రుక నొకదానిని ఇచ్చారు. దాన్ని ఆ భూతానికి ఇచ్చి తిన్నగా చెయ్యమని చెప్పమన్నారు. ఆ భూతం రాత్రింబవళ్ళు ఆ వెంట్రుకను తిన్నగా చెయ్యటంలోనే నిమగ్నమయింది. కాని ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా? అది ఎలా వంకరగా ఉండేదో అలాగే ఉంది.
“అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లుంటుంది, మళ్ళీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు.
“ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఇంటి యజమాని వంట సామాన్ల గదిని చూసుకొనే బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించాడనుకొందాం. సామాన్ల గదిలో ఆ వ్యక్తి ఉన్నంతవరకు యజమాని ఆ పనిలో జోక్యం చేసుకోడు. కాని ఆ వ్యక్తి తన ఇచ్ఛమేరకు ఆ పనిని వదలిపెట్టి పోయినప్పుడు యజమానే స్వయంగా వచ్చి ఆ పనిని చేపడతాడు. గదికి తాళంవేసి సామాన్ల బాధ్యతను స్వీకరిస్తాడు.
“సంరక్షకులను నియమించేది యుక్తవయస్సురాని పిల్లలకు (మైనర్లు) మాత్రమే. పిల్లవాడు తన ఆస్తిపాస్తులను తానుగా సంరక్షించుకోలేడు కదా! అందుకని రాజుగారే ఆ పిల్లవాడి భారం వహిస్తారు. అహంకారం త్యజింపనిదే భగవంతుడు మన భారాన్ని స్వీకరించడు.
41.5.1 ‘శ్రీమన్నారాయణుడు, ఆపదలో ఉన్న భక్తుడు’ కథ
“ఒకసారి వైకుంఠంలో లక్ష్మీనారాయణులు కూర్చొని ఉన్నప్పుడు నారాయణుడు ఉన్నట్లుండి లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఆయన పాదాలను ఒత్తుతోంది. ఆమె నారాయణుడితో ‘ప్రభూ! ఎక్కడికి వెళుతున్నారు?’ అని అడిగింది. ‘నా భక్తు డొకడు ఆపదలో ఉన్నాడు. అతణ్ణి రక్షించడానికి వెళుతున్నాను’ అని పలికి నారాయణుడు బయటకు వెళ్ళిపోయాడు. కానీ వెంటనే తిరిగి వచ్చాడు. ఇంత త్వరగా తిరిగి వచ్చారే అని లక్ష్మీదేవి అడగ్గా నారాయణుడు నవ్వి ఇలా అన్నాడు: ‘ఆ భక్తుడు నా ప్రేమలో ఉన్మత్తుడై వెళుతూన్నప్పుడు దారిలో చాకలివారు ఉతికి ఆరవేసిన బట్టలపై నడుస్తూ వెళ్లాడు. అది చూసి చాకలివారు దుడ్డుకర్రలు చేతపట్టుకొని అతణ్ణి కొట్టడానికని వెంటబడ్డారు. అందుకే నేను అతణ్ణి రక్షించడానికే వెళ్ళబోయాను.’ మరి మళ్ళీ తిరిగి వచ్చారెందుకని లక్ష్మీదేవి ప్రశ్నించగా నారాయణుడు నవ్వుతూ ‘చాకలివాళ్ళపై రువ్వడానికని భక్తుడు రాళ్ళు చేతిలోకి తీసుకొన్నాడు. అది చూసి నేను తిరిగి వచ్చేశాను’ అన్నాడు. (అందరూ నవ్వారు)
41.5.2 పరిపక్వమైన ‘నేను’ – అపరిపక్వమైన ‘నేను’
“ఒకసారి నేను కేశవసేన్తో ‘అహం’ ను వదలిపెట్టమని చెప్పాను. అప్పుడతడు ‘మహాశయా! మరి నా సమాజం నిలిచేది ఎలాగా?’ అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను: ‘నీ తెలివి తెల్లారినట్లే ఉంది. నేను చెప్పేది అపరిపక్వమైన ‘నేను’ ను అంటే కామినీకాంచనాలలో అనురక్తమై ఉన్న ‘నేను’ ను త్యజించమని. అంతేకాని పరిపక్వమైన ‘నేను’ ను అంటే భగవంతుడి దాసుడను, భగవంతుడి బిడ్డను అనే ‘నేను’ ను కాదు. ఇటువంటి ‘నేను’ లో ఎలాంటి దోషమూ లేదు.”
త్రైలోక్యుడు: అహంకారం పోవటమనేది చాలాకష్టం. లోకులు అహంకారం తొలగిపోయిందనుకొంటారు. కాని అది పూర్తిగా పోనేపోదు.
శ్రీరామకృష్ణులు: అహంకారం కలుగుతుందేమోననే భయంతో గౌరీపండితుడు తనను తాను ‘నేను’ అని సంబోధించేవాడు కాదు; అందుకు బదులుగా ‘ఇది’ అని పలికేవాడు. నేనుకూడా అది చూసి ‘నేను’ కు బదులుగా ‘ఇది’ అనసాగాను. నేను తిన్నాను అని పలకడానికి బదులుగా ఇది తిన్నది అనేవాణ్ణి. మథుర్బాబు అది చూసి ఒక రోజు ఇలా అన్నాడు: ‘బాబా, ఇదేమిటి? నువ్వు కూడా అలా మాట్లాడతా వెందుకు? వారికి అహంకారం ఉంది కాబట్టి వారిని అలా మాట్లాడుకోనివ్వు. అయితే నీకు అహంకారం లేదుకదా! నీకు అలా పలికే అవసర మేమిటి?’
“నేను కేశవ్‌తో ఇలా అన్నాను: ‘ఈ అహంకారమనేది వదిలేది కాదు కదా! అందువల్ల దీన్ని దాసుడిగా, అంటే భగవంతుని దాసుడిగా ఉండనివ్వు.’ ప్రహ్లాదుడు రెండు భావాలనూ కలిగి ఉండేవాడు. ఒక్కోసారి ‘సోఽహం’ భావనలో ‘నువ్వే నేను, నేనే నువ్వు’ అనేవాడు. మళ్ళీ ‘అహం’ భావన వచ్చి నప్పుడు ‘నేను దాసుణ్ణి, నువ్వు ప్రభువ్వి” అనేవాడు. ఒకసారి ‘సోఽహం’ భావంలో స్థిరంగా నెలకొన్న పిదప ‘భగవంతుడి దాసుణ్ణి’ అనే భావంలో ఉండవచ్చు. అప్పు డతడు తనను తాను భగవంతుడి దాసుడిగా భావించుకోవచ్చు.
41.5.3 బ్రహ్మజ్ఞాన లక్షణాలు – కర్మత్యాగం
(కెప్టెన్‌తో) “బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీమద్భాగవతంలో జ్ఞాని లక్షణాలు నాలుగు పేర్కొనబడ్డాయి. అవి: 1. బాలకవత్ 2. జడవత్ 3. ఉన్మాదవత్ 4. పిశాచవత్.
“బ్రహ్మజ్ఞానం పొందినవాడికి ఒక్కోసారి ఐదు సంవత్సరాల బాలుడి స్థితి కలుగుతుంది. మళ్ళీ ఒక్కోసారి ఉన్మాదిలా అంటే పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. మరికొన్ని సందర్భాలలో జడునిలా ఉంటాడు. ఈ స్థితిలో కర్మలు చేయజాలడు; కర్మత్యాగం సంభవిస్తుంది. అయితే జనకుడు మొదలైనవారు కర్మలు చేశారని నువ్వు చెప్పవచ్చు. ఆ మాట నిజమే కాని ఆ కాలంనాటి వాళ్ళు ఉద్యోగస్థులపై భారం మోపి నిశ్చింతగా ఉండేవాళ్ళు. పైగా అప్పటి జనులు మంచి నమ్మకస్థులు కూడా.”
శ్రీరామకృష్ణులు కర్మత్యాగం గురించి మాట్లాడసాగారు. కాని కర్మలు చేయాలన్న అభిలాష కలిగినవారు ఆ కర్మలను ఆసక్తిరహితులై చేయాలని చెబుతున్నారు.
శ్రీరామకృష్ణులు: జ్ఞానోదయం అయిన పిదప ఎక్కువగా కర్మలు చేయజాలరు.
త్రైలోక్యుడు: ఎందుకు? పవహారీ బాబావంటి గొప్ప యోగే జనుల వాద వివాదాలను తీరుస్తూ ఉండేవాడు. వారి కోర్టు గొడవలుకూడా ఆయనే పరిష్కరిస్తూ ఉండేవాడు.
శ్రీరామకృష్ణులు: అవునవును, ఆ మాట నిజమే. డాక్టర్ దుర్గాచరణ్ ఎంత పెద్ద తాగుబోతు! ఇరవై నాలుగు గంటలూ మద్యం సేవిస్తూ ఉంటాడు. కాని పని దగ్గరికి వచ్చేసరికి మామూలుగానే ఉంటాడు. రోగులకు చికిత్స చేసేటప్పుడు ఎలాంటి పొరబాటు జరుగదు. భక్తిని సంపాదించుకొన్న తర్వాత కర్మలు చేసినట్లయితే ఏ దోషమూ లేదు. కాని అది చాలా కష్టం; అందుకు తీవ్ర తపస్సు అవసరం.
“భగవంతుడే సమస్తమూ చేస్తున్నాడు; మనం కేవలం ఆయన పరికరాల వంటివారం. ఒకసారి కాళీ ఆలయం ఎదుట సిక్కులు కొందరు ‘భగవంతుడు దయామయుడు’ అన్నారు. అందుకు నేను ‘దయ ఎవరి మీద?’ అని అడిగాను. సిక్కులు ‘అయ్యా, ఆయన మనందరి మీద దయ చూపిస్తున్నాడు కదా!’ అన్నారు. అప్పుడు నేను ఇలా అన్నాను: ‘మనమందరం ఆయన బిడ్డలం. తన సొంత బిడ్డలమీద దయ చూపడం ఏమంతగా చెప్పుకోవలసిన విషయమా? తండ్రి తన బిడ్డల బాగోగులను చూసుకొని తీరాలి. లేకుంటే బ్రాహ్మణపేట వాళ్ళు వచ్చి బిడ్డలను పెంచుతారా ఏమిటి?’ అది సరే, ఎవరైతే భగవంతుడు దయామయు డంటున్నారో వారు ఎన్నటికైనా మనం భగవంతుని బిడ్డలమేగాని పరాయివారి బిడ్డలం కామని అర్థం చేసుకోగలరా?”
కెప్టెన్: అవునండి. వారు భగవంతుణ్ణి తమవాడిగా ఎంచరు.
41.5.4 భగవంతుడు భక్తపరాధీనుడు – ‘జమిందారు, కాపలాదారుడు’ – ‘శ్రీకృష్ణుడు, విదురుడు’
శ్రీరామకృష్ణులు: మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి దయామయుడని పేర్కొనరాదా? సాధనావస్థలో ఉన్నంతవరకూ అలా పేర్కొనవలసిందే. ఆయన్ను ప్రాప్తించుకున్న పిదప ఆయన మన సొంత తండ్రి లేక తల్లి అనే బోధ కలుగుతుంది. భగవత్ప్రాప్తి కలుగనంతవరకు మనమందరం ఆయనకు దూరంగా ఉన్నట్లు, పరాయివాళ్ళ బిడ్డలన్నట్లు తోస్తుంది.
“సాధనావస్థలో భగవంతునికి గుణాలన్నింటినీ ఆపాదించాలి. హాజ్రా ఒకసారి నరేంద్రుడితో ఇలా అన్నాడు: ‘భగవంతుడు అనంతుడు. ఆయన ఐశ్వర్యాలూ అనంతమే. నువ్వు సమర్పించే మిఠాయిలు, అరటిపళ్ళు, ఆయన స్వీకరిస్తాడా ఏమిటి? నువ్వు పాడే పాటలు ఆయన వింటాడా ఏమిటి? ఇవన్నీ నీ మనోభ్రమలే.’ అది వింటూనే నరేంద్రుడు అరవై అడుగులు క్రిందకు క్రుంగిపోయాడు. అప్పుడు నేను హాజ్రాతో ఇలా అన్నాను: ‘నువ్వెంతటి నీచుడవు! ఈ బాలురతో ఇలా మాట్లాడితే వీరు ఎక్కడ ఉంటారు? భక్తిని కోల్పోయిన వ్యక్తి దేన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తాడు? భగవంతుడి ఐశ్వర్యాలు అనంతం అన్నమాట నిజమే. అయినప్పటికీ ఆయన భక్తపరాధీనుడుకూడా. జమీందారు కొలువు తీరినప్పుడు ఆయన ఇంటి కాపలాదారుడు వచ్చి ఒక మూల నిలబడ్డా డనుకొందాం. అతడు ఏదో వస్తువును తన చేతిగుడ్డ క్రింద దాచి ఉంచాడు, ఎంతగానో సంకోచిస్తున్నాడు. జమీందారు ‘ఏమయ్యా, ఏమిటి సంగతి? నీ చేతిలో ఉన్న దేమిటి?’ అని అడిగాడు. కాపలాదారుడు ఎంతో సంకోచిస్తూ ఒక సీతాఫలాన్ని బయటకు తీసి జమీందారుకు ఇచ్చాడు. ఆయనతో ఇలా అన్నాడు: ‘అయ్యా, మీరు ఈ పండును పుచ్చుకోవాలనేదే నా కోరిక.’ జమీందారు కాపలాదారుడి భక్తిభావాన్ని చూసి ఎంతో సంతోషించాడు. సీతాఫలాన్ని తీసుకొని ఎంతో ఆదరంగా ఇలా అన్నాడు: ‘ఆహా! ఈ సీతాఫలం చాలా బాగుందే! దీన్ని నువ్వు ఇంత కష్టపడి ఎక్కడి నుండి తెచ్చావు?’
“భగవంతుడు భక్తపరాధీనుడు. దుర్యోధనుడు కృష్ణుణ్ణి అమిత ఆదరంగా తన ప్రాసాదంలోనే భుజింపమనీ, అక్కడే బసచేయమనీ కోరాడు. కాని కృష్ణుడు విదురుని కుటీరానికే వెళ్ళాడు. ఆతడు భక్తవత్సలుడు, విదురుని ఇంట్లో సామాన్యమైన భోజనాన్నే అమృతంలాగా సేవించాడు.
“పూర్ణజ్ఞాని లక్షణం మరొకటుంది – పిశాచవత్. అన్నపానాల గురించి అతడికి ఎలాంటి నియమాలూ ఉండవు. శుచి, అశుచి అన్న ఆలోచనే ఉండదు. పూర్ణజ్ఞాని, బొత్తిగా తెలివి లేనివాడు – వీరిరువురికి బాహ్య లక్షణాలు ఒకేలా ఉంటాయి. పూర్ణజ్ఞాని గంగాస్నానం ఆచరించేటప్పుడు బహుశా మంత్రోచ్చారణ చేసి ఉండడు. దేవతాపూజ చేసేటప్పుడు అతడు పువ్వుల నన్నింటినీ ఒక్క సారిగా భగవంతుని పాదాల వద్ద సమర్పించవచ్చు. అతడు ఎలాంటి విధివిహితాలను పాటించడు.
41.5.5 కర్మత్యాగం – ‘ఓడ స్తంభంపై పక్షి’ దృష్టాంతం
“సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మత్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంతవరకు కర్మ ఉండనే ఉంటుంది.
“ఒక పక్షి గంగానదిలో లంగరు దించివున్న ఓడ స్తంభంపై పరధ్యానంగా వ్రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రం లోపలకు ప్రవేశించింది. అప్పుడు పక్షికి ఎరుకవచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడా తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది, కాని అలా ఎంతదూరం పోయినా దానికి తీరం కనిపించనేలేదు. అందువల్ల అది తిరిగివచ్చి ఓడ స్తంభంపైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పుదిశగా ఎగిరిపోయింది, ఆ దిశలోకూడా తీరం కానరాలేదు. ఆ పక్షి నలువైపులా చూసింది, కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడ స్తంభంపైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకొన్న పిదప అది మళ్ళీ దక్షిణ దిశగా వెళ్ళింది; అదేవిధంగా పడమటి వైపుగాకూడా వెళ్ళింది. తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగివచ్చి ఆ ఓడ స్తంభం పైనే వ్రాలింది; మళ్ళీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తరువాత దాని మనస్సులో ఎటువంటి అలజడి, అశాంతి చోటుచేసుకోలేదు.”
కెప్టెన్: ఆహా, ఏం దృష్టాంతం!
41.5.6 భోగలాలస ఉపశమిస్తేనే భగవంతుని కొరకు వ్యాకులత
శ్రీరామకృష్ణులు: సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతుంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు. కామినీకాంచనాల పట్ల వారికి ఉన్న ఆసక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది, త్యాగభావన జనిస్తుంది. చాలామందికి సుఖభోగాలు అనుభవింపనిదే త్యాగబుద్ధి కలుగదు.
“సాధకులలో కుటీచకుడు, బహూదకుడు అని రెండు రకాల వారు ఉన్నారు. సాధకులు కొందరు పలు తీర్థస్థలాలను సందర్శిస్తూంటారు. వారు ఒక చోట స్థిరంగా కూర్చోలేరు. వారు అన్ని క్షేత్రాలలోని నీటిని త్రాగాలి. ఆ విధంగా పర్యటించి ఆశలు తీరిన పిదప వారు ఒకచోట కుటీరం వేసుకొని కూర్చుంటారు. అటుపైన నిశ్చింతులై, మళ్ళీ అటూయిటూ తిరగాలని ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా భగవద్ధ్యానపరాయణులవుతారు.
“కాని అనుభవించడానికంటూ సంసారంలో ఏముంది? కామినీ కాంచనాలా? అవి కేవలం క్షణికానందం మాత్రమే. ఇప్పుడుంటుంది, ఇంతలోనే కనుమరుగైపోతుంది.
41.5.7 మార్గం: వ్యాకులత, త్యాగం – ‘అసాధారణ ఔషధం’ దృష్టాంతం
“సంసారమనేది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ దట్టమైన మేఘాలతో నిండివున్న ఆకాశం లాంటిది. అందువల్ల సూర్యుడు కనిపించడు. సంసారంలో అధికపాలు దుఃఖమే. కామినీకాంచనాలనే మేఘాలు సూర్యుణ్ణి కనిపించనివ్వవు. కొందరు నన్ను ఇలా అడుగుతారు: ‘మహాశయా, భగవంతుడు ఇటువంటి సంసారాన్ని ఎందుకు సృష్టించాడు? మాకు మార్గం అంటూ ఏమీ లేదా?’ వారితో నేను ఇలా అంటూంటాను: ‘మార్గం లేకేం? అనుకూల పవనాలు వీచేలా, శుభయోగం ప్రాప్తించేలా భగవంతుణ్ణి శరణు వేడండి; వ్యాకులచిత్తంతో ఆయన్ను ప్రార్థించండి. వ్యాకులచిత్తంతో ఆయన్ను ప్రార్థించినట్లయితే ఆయన మీ ప్రార్థనలను విని తీరతాడు.’
“ఒక వ్యక్తి కుమారుడు మరణావస్థలో ఉన్నాడు. పాపం ఆ వ్యక్తి కనిపించిన వారినల్లా బిడ్డను బ్రతికించుకునే ఉపాయం చెప్పమని బతిమాలుతూ తిరుగుతున్నాడు. ఎవరో ఒకాయన ‘దీనికి మందు ఒకటి ఉంది. దాన్ని నువ్వు సంపాదించగలిగితే మంచిదే – స్వాతి నక్షత్రపు వర్షపు నీరు ఒక పుర్రెలో పడాలి. అందులోని నీటిని త్రాగటానికి ఏదైనా కప్ప వస్తున్నప్పుడు ఒక పాము దాని వెంటపడాలి. కప్పను కాటువేసే సమయంలో ఆ పాము విషం పుర్రెలో పడాలి, కప్ప తప్పించుకోవాలి. ఆ పుర్రెలోని విష జలాన్ని తెచ్చి రోగికి త్రాపించాలి.’ ఆ వ్యక్తి పరమ వ్యాకులతతో స్వాతి నక్షత్ర సమయంలో బయలుదేరాడు. అదే సమయంలో వర్షం కురవసాగింది. అప్పు డా వ్యక్తి వ్యాకులచిత్తంతో ‘ఓ భగవంతుడా! స్వాతినక్షత్రపు వర్షం కురుస్తోంది. ప్రస్తుతం పుర్రె లభించేలా చెయ్యి’ అని ప్రార్థించాడు. అటుయిటూ వెదుకుతూండగా చివరకు అతడికి వర్షపు నీటితో ఉన్న పుర్రె ఒకటి కనిపించిది. అప్పుడా వ్యక్తి ‘ఓ భగవంతుడా! నువ్వు కరుణించి ఇప్పుడు కప్ప, పాము కూడా వచ్చేలా చెయ్యి’ అంటూ మొరపెట్టుకొన్నాడు. వ్యాకులత తీవ్రమైనదవటం చేత అతడికి అన్నీ త్వరితంగా లభించాయి. చూస్తూండగానే ఒక పాము కప్ప వెంటపడుతూ వచ్చింది. అది కప్పను కాటువేయబోతూండగా దాని విషం పుర్రెలో పడింది.
“భగవంతుని శరణువేడి వ్యాకులచిత్తంతో ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థనలను విని తీరతాడు, అన్నింటినీ సానుకూలంగా మార్చివేస్తాడు.”
కెప్టన్: ఆహా! ఏం ఉపమానం!
శ్రీరామకృష్ణులు: అవును, భగవంతుడు అన్నింటినీ సానుకూలంగా చేస్తాడు. సాధకుడు బహుశా అవివాహితుడై ఉండవచ్చు; దానితో అతడు తన మనస్సును సంపూర్ణంగా భగవంతునిపై లగ్నం చేయగలడు. లేకుంటే అతడి సోదరులు ఉద్యోగాలు చేసి ఇంటి అవసరాలు తీరుస్తూ ఉండవచ్చు. లేకపోతే కుమారుడు పెద్దవాడై ఇంటి బాధ్యతలు స్వీకరించవచ్చు. అప్పుడు ఆ సాధకుడికి సంసార బాధ్యతల గురించి చింతించవలసిన అవసరం ఉండదు. అప్పు డతడు సులభంగా తన మనస్సును నూటికి నూరుపాళ్ళు భగవంతునికే సమర్పించవచ్చు.
“కాని కామినీకాంచనాలను త్యజింపనిదే యోగం సిద్ధించదు. అజ్ఞానం, అవిద్యలు నశించేది త్యాగం చేసినప్పుడు మాత్రమే. భూతద్దంపై సూర్యకిరణాలు పడటంతో అనేక వస్తువులు కాలిపోతాయి. కాని గదిలో నీడ ఉంటుంది; అక్కడకు భూతద్దాన్ని తీసుకువెళ్ళినట్లయితే అలా జరగదు. గదిని వదలిపెట్టి బయటకు వచ్చి నిలబడవలసి ఉంటుంది.
41.5.8 భగవత్సాక్షాత్కారం తరువాత సంసారం
“కాని కొంతమంది జ్ఞాన సముపార్జనానంతరం సంసారంలో ఉంటూంటారు. వారు గది లోపలా బయటా – రెండుచోట్లా ఏముందో స్పష్టంగా చూడగలరు. జ్ఞానప్రకాశం సంసారాన్ని వెలుగుతో నింపివేస్తుంది. ఆ వెలుగులో వారు మంచీచెడు, నిత్యానిత్యాలు – వీటన్నింటినీ చూడగలరు.
“భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవించే అజ్ఞానులు మట్టిగోడలతో కట్టిన ఇంట్లో నివసించే వారిలాంటివారు. మిణుకు మిణుకుమనే కొద్దిపాటి వెలుగులో వారు కేవలం ఇంటి లోపలి ప్రదేశాన్ని మాత్రమే చూడగలుగుతారు. కాని జ్ఞానాన్ని సముపార్జించుకొని భగవంతుణ్ణి సాక్షాత్కరించుకొన్న పిదప సంసారంలో జీవించేవారు అద్దాల ఇంట్లో నివసించే వారి లాంటివారు. వారు ఇంటి లోపలా చూడగలరు, బయటి వస్తువులు కూడా చూడగలరు. జ్ఞాన సూర్యుడి వెలుగు ఇంట్లోకి తేజోమయంగా ప్రవేశిస్తోంది. ఆ ఇంట్లో ఉన్నవారు ఇంట్లోపలి వస్తువులను ఏది మంచిది – ఏది కాదు, ఏది నిత్యం – ఏది అనిత్యం అని ఎంతో స్పష్టంగా చూడగలరు.
41.5.9 భగవంతుడే కర్త – పుష్పదంతుడు – గురుగిరి
“భగవంతుడే కర్త, తక్కిన వారందరూ కేవలం ఆయన పరికరాలు మాత్రమే. అందుకనే జ్ఞానికూడా అహంకారం ఉంచుకోడు. శివ మహిమ్నస్తోత్రం వ్రాసిన వ్యక్తికి (పుష్పదంతుడు) ఆ విషయమై అహంకారం కలిగింది. అప్పుడు శివుడి నంది తన దంతాలను బయటకు చూపించినప్పుడు అతడి అహంకారం చూర్ణమై పోయింది. అతడు నంది దంతాలలో ఒక్కొక్క దంతాన్ని ఒక్కో మంత్రంగా గాంచాడు. దీని అర్థ మేమిటో తెలుసా? ఈ మంత్రాలన్నీ అనాది కాలంగా ఉన్నవి. స్తోత్రం వ్రాసిన వ్యక్తి ప్రస్తుతం చేసింది వాటిని ఆవిష్కరించడం మాత్రమే
“ ‘గురుగిరి’ నెరపడం మంచిది కాదు. భగవంతుని ఆదేశం లేకుండా ఆచార్యులు కాజాలరు. నేను గురువు నని స్వయంగా చెప్పేవాడు హీనుడు! మీరు త్రాసు పళ్ళాలను చూడలేదా? తేలికగా ఉన్న పళ్ళెం పైకి వెళుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయిని పొందిన వ్యక్తి తేలికగా ఉన్న పళ్ళెంలా ఉచ్చస్థాయిలో ఉంటాడు. అందరూ గురువులవుదామనుకొంటారు. కాని శిష్యులు కాగోరేవారు అరుదు.”
త్రైలోక్యుడు చిన్న మంచానికి ఉత్తరంగా నేలమీద కూర్చొని ఉన్నాడు. అతడు పాడటానికి సంసిద్ధుడవుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో “ఆహా, నువ్వు ఎంత మధురంగా పాడతావు!” అన్నారు.
త్రైలోక్యుడు తంబురా మీటుతూ పాడటం ప్రారంభించాడు:
ఉండేది నీ వొకడవె
ఈ సర్వము నీ మయమే
నా హృదయము నీతోనే
తన్మయముగ గావించితి ॥ ఉం ॥
నిన్నొకనినె కనుగొంటిని
ఉండేది నీ వొకడవె
ఓ దేవా! హృదయేశా!
సర్వైకావాసగృహా ॥ ఉం ॥
నీ ఉండని దేహృదయము?
వసియించెద వందరిలో
ఉండేది నీ వొకడవె
ఈ సర్వము నీ మయమే ॥ ఉం ॥
పండితుడో పామరుడో
హిందువుడో ముస్లిముడో
నీ తలచిన రీతిగనే
వారందరి నొనరింతువు ॥ ఉం ॥
కైలాసమొ కాబాయొ
వసియించెద వంతటను
కావున నీ కొక్కనికే
మ్రొక్కెద రందరు మ్రోల ॥ ఉం ॥
భువినుండి దివి దాక
దివినుండి పాతాళము
ఏ చోటుల నే జూచిన
నిన్నే చూచెద నచ్చట ॥ ఉం ॥
ధ్యానించి కనుగొంటిని
నిస్సందేహముగా గంటిని
లేదొకటి నీ సామ్యం
బని జాఫరునకు* తెలిసెను. ॥ ఉం ॥
సర్వము నీవే సర్వేశా
నా సర్వము నీవే సర్వేశా!
నా ఉనికీ మనికీ నీలోనే
నా యనువారలు లే రెవరూ….
పాటలు వింటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తు లవుతున్నారు. మధ్య మధ్యలో “ఆహా! సర్వము నీవే! ఆహా! ఆహా” అంటున్నారు.
పాట పూర్తయింది. అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలయింది. శ్రీరామకృష్ణులు ముఖప్రక్షాళనకోసం సరుగుడు తోపుకు వెళ్ళారు. వెంట ‘మ’ కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు దరహాసవదనంతో మాట్లాడుతూ వెళుతున్నారు. ఉన్నట్లుండి ‘మ’ తో ఇలా అన్నారు: “మీరు ప్రసాద మేమీ పుచ్చుకోలేదే? తక్కినవా రెవరూ కూడా తీసుకోలేదే?” భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వాలని శ్రీరామకృష్ణులు ఆరాటం చెందారు.
41.5.10 శ్రీరామకృష్ణులు – నరేంద్రుడు
శ్రీరామకృష్ణులు నేడు సంధ్యానంతరం కలకత్తా వెళ్ళనున్నారు. సరుగుడు తోపునుండి తిరిగివస్తూ ‘మ’ తో ఇలా అన్నారు: “నేను ఎవరి బండిలో వెళతానో తెలియదు.”
సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించారు, సాంబ్రాణి ధూపం కూడా వేశారు. ఆలయాలలో దీపాలు వెలిగించారు. నహబత్తులో సన్నాయి మేళాలు మొదలయ్యాయి. సాయంకాలపు హారతులు ప్రారంభం కానున్నాయి.
శ్రీరామకృష్ణులు చిన్నమంచంపై కూర్చొని దేవీదేవతల నామసంకీర్తన చేశారు. అనంతరం జగజ్జననిని ధ్యానించసాగారు. ఆలయాలలో హారతులు ముగిశాయి. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు గదిలో అటూయిటూ పచార్లు చేస్తూ మధ్యమధ్యలో భక్తులతో మాట్లాడుతున్నారు. కలకత్తా వెళ్ళే విషయమై ‘మ’ తో మాట్లాడారు.
ఈ సమయంలో నరేంద్రుడు వచ్చాడు. అతడితోపాటు శరత్, మరిద్దరు బాలభక్తులు కూడా ఉన్నారు. వారందరూ శ్రీరామకృష్ణులకు సాష్టాంగప్రణామం చేశారు.
నరేంద్రుణ్ణి చూస్తూ శ్రీరామకృష్ణుల ప్రేమతో ఉప్పొంగిపోతున్నారు. సంతోషం పట్టలేక వాత్సల్యంతో అతడి చుబుకాన్ని పుచ్చుకొని “నాయనా! నువ్వొచ్చేశావా?” అన్నారు.
శ్రీరామకృష్ణులు గదిలో పశ్చిమాభిముఖులై గంగానదికి ఎదురుగా నిలబడి ఉన్నారు. నరేంద్రుడు, అతడి మిత్రులు పూర్వాభిముఖులై ఆయనతో మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నరేంద్రుడు వచ్చాడే! అతణ్ణి కబురంపి పిలిపించాను. మరి ఇప్పుడు కలకత్తాకు పోవడమెలా? నువ్వేమంటావు?
‘మ’ : ఇవాళ వెళ్ళవద్దులెండి.
శ్రీరామకృష్ణులు: సరే, రేపు వెళ్దాంలే. పడవలోనో, బండిలోనో ఏదో ఒకదాన్లో వెళదాం. (తక్కిన భక్తులతో) చీకటిపడింది. మీరిక బయలుదేరండి.
భక్తులు ఒక్క రొక్కరుగా ఆయనకు ప్రణామంచేసి సెలవు పుచ్చుకున్నారు.