40.1 ప్రథమ పరిచ్ఛేదం నరేంద్రుడు, యోగిన్, బాబూరామ్ ప్రభృత భక్తులతో బలరామ్ ఇంట్లో
శుక్రవారం, ఏప్రిల్ 24, 1885
నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరామ్బోసు ఇంటికి విచ్చేశారు. మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు ‘మ’, బలరామ్ ఇంటికి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు అతిథుల గదిలో నిద్రిస్తున్నారు. ఆయనతోపాటు ఒకరిద్దరు భక్తులు కూడా విశ్రాంతి తీసుకొంటున్నారు.
‘మ’ మెల్లగా గదిలోకి వచ్చి ఒక ప్రక్కగా కూర్చున్నాడు. పసిబాలుని పోలిన ఆ సరళ హృదయుణ్ణి చూసి తనలో ఇలా తలపోయసాగాడు: ‘ఆహా! ఈ మహాపురుషుడుకూడా సాధారణ మానవుడిలా నిద్రిస్తున్నాడు కదా! మానవజన్మ ఎత్తినందుకు మానవుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు.’ ‘మ’ విసనకర్ర పుచ్చుకొని శ్రీరామకృష్ణులకు మెల్లగా విసరసాగాడు. కాసేపయ్యాక ఆయన లేచి కూర్చున్నారు. ‘మ’ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి పాదధూళి తీసుకున్నాడు.
40.1.1 శ్రీరామకృష్ణుల వ్యాధి ప్రారంభ సూచన
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా, ‘మ’ తో): ఏం నాయనా, క్షేమమే కదా! అదేమిటో కాని నా గొంతు పుండు అయింది. వేకువజామున చాలా బాధ కలుగుతోంది. ఎలా నయమవుతుందో చెప్పు నాయనా! (విచారంతో) వారు మామిడికాయ పచ్చడి చేశారు. దానిని కొద్దిగా తిన్నాను.
“ఇప్పుడు నీ భార్య ఎలా ఉంది? ఆ రోజు కాస్త నలతగా ఉన్నట్లు కనిపించింది. ఆమెకు చలువచేసే పదార్థాలు పెట్టించు.”
‘మ’ : కొబ్బరిబొండాం నీళ్ళు మొదలైనవి ఇవ్వమంటారా?
శ్రీరామకృష్ణులు: ఆ, పటికబెల్లం పానకం త్రాగటం మంచిది.
‘మ’ : గత ఆదివారం నేను మా తల్లితండ్రుల ఇంటికి వెళ్ళిపోయాను.
శ్రీరామకృష్ణులు: నువ్వు మంచి పని చేశావు. ఇంట్లో ఉండటం వల్ల నీకు సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో నీ తల్లితండ్రులు ఉన్నారు కదా! అందువల్ల ఇంటి వ్యవహారాలు అంతగా నువ్వు పట్టించుకోనక్కర లేదు.
శ్రీరామకృష్ణులు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆయన నోరు తడారిపోసాగింది. పసిబాలుడిలా ఆయన ‘మ’ తో “నా నోరు తడారిపోతోంది. అందరికీ ఇలాగే అవుతుందా?” అన్నారు.
‘మ’ (యోగీన్తో): యోగీన్ బాబూ, నీకు కూడా నోరు ఎండి పోతోందా?
యోగీన్: లేదే! ఈయనకు వేడిచేసినట్లుంది.
(అరియాదాహకు చెందిన యోగీన్, శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తులలో ఒకడు. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం సర్వసంగాలను పరిత్యజించి స్వామి యోగానంద నామంతో సన్న్యాసం పుచ్చుకున్నాడు.)
శ్రీరామకృష్ణుల దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది చూసి కొందరు భక్తులు నవ్వసాగారు.
శ్రీరామకృష్ణులు: పిల్లలకు పాలు పట్టించడానికి కూర్చున్న తల్లిలా కూర్చొని ఉన్నాను. (అందరూ నవ్వారు) అది సరే, నోరు ఎండిపోతోంది. నేను బేరిపండు తిననా లేక జామ్రూలా?*
యోగీన్ (స్వామి యోగానంద)
బాబూరాం: అయితే నేను వెళ్ళి జామ్రూల్ పండు తీసుకువస్తాను.
శ్రీరామకృష్ణులు: నువ్వు ఈ ఎండలో వెళ్ళనక్కరలేదు.
‘మ’, శ్రీరామకృష్ణులకు ఇంకా విసురుతూనే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇక చాలులే. చాలాసేపటి నుండి విసురుతున్నావు.
‘మ’ : ఫరవాలేదండీ. నా కేమీ కష్టంగా లేదు.
శ్రీరామకృష్ణులు (ఆప్యాయంగా): కష్టంగా లేదా?
‘మ’ అక్కడకు దగ్గర్లోని స్కూలులో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం కాస్త తీరిక దొరకడంవల్ల శ్రీరామకృష్ణులను దర్శించుకోవడానికి వచ్చాడు. అతడు స్కూలుకు వెళ్ళడానికి సమయం అవుతోంది. అందువల్ల మళ్ళీ స్కూలుకు బయలుదేరే ఉద్దేశంతో అతడు శ్రీరామకృష్ణుల పాదాలకు మొక్కాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇప్పుడే వెళ్ళిపోతావా?
ఒక భక్తుడు: స్కూలు ఇంకా వదల్లేదండీ. ఇతడు విశ్రాంతి సమయంలో వచ్చాడు. అంతే!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): పాపం! ఇంటి ఇల్లాలు లాగానా? ఆమె ఏడెనిమిది మంది పిల్లల తల్లి. ఆమెకు రాత్రింబవళ్ళు ఇంటి పనులతోనే సరిపోతుంది. వీటన్నిటి మధ్య అప్పుడప్పుడు వచ్చి భర్తకు సేవచేసి పోతుంటుంది. (అందరూ నవ్వారు.)
40.2 ద్వితీయ పరిచ్ఛేదం ఆంతరంగికులతో
నాలుగు గంటలకు స్కూలు వదిలిపెట్టిన తరువాత ‘మ’ మళ్ళీ బలరామ్బోసు ఇంటికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు దరహాసవదనంతో అతిథుల గదిలో ఆసీనులై ఉన్నారు. భక్తులు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. చిన్న నరేంద్రుడు, రామ్ వచ్చారు. నరేంద్రుడుకూడా వచ్చి ఉన్నాడు. ‘మ’, శ్రీరామకృష్ణులకు మ్రొక్కి కూర్చున్నాడు. ఇంట్లోపలి నుండి బలరామ్, శ్రీరామకృష్ణుల కోసం ఒక పళ్ళెంలో హల్వా పంపించాడు. ఎందుకంటే గొంతులో పుండు అయినందున ఆయన ఘనపదార్థాలు ఏవీ తినలేకుండా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (హల్వాను చూస్తూ నరేంద్రుడితో): చూడవోయ్! మంచి మంచి పదార్థాలు వచ్చాయి. తిను, తిను! (అందరూ నవ్వారు)
క్రమంగా సాయంకాలం కాసాగింది. శ్రీరామకృష్ణులు గిరీశ్ ఇంటికి వెళ్ళనున్నారు. ఆ సందర్భం పురస్కరించుకొని గిరీశ్ తన ఇంట్లో ఉత్సవం జరుపుతున్నాడు. ఇంటి రెండవ అంతస్తు నుండి శ్రీరామకృష్ణులు, ‘మ’ క్రిందికి దిగివచ్చారు. ‘మ’, మరికొందరు భక్తులు ఆయనతోపాటు ఉన్నారు. ఇంటి ద్వారం వద్దకు రాగానే హిందుస్థానీ బిచ్చగాడు ఒకడు రామనామం గానం చేయటం ఆయన చూశారు. రామనామం వింటూనే నిశ్చలంగా నిలబడిపోయారు, మనస్సు అంతర్ముఖమైపోయింది. ఈ విధంగా కాసేపు నిలబడిన తరువాత ఆయన ‘మ’ తో “చాలా బాగా పాడాడు” అన్నారు. ఎవరో భక్తుడు ఆ బిచ్చగాడికి నాలుగు పైసలు ఇచ్చాడు.
శ్రీరామకృష్ణులు బోస్పారా వీథిలోకి ప్రవేశించారు. నవ్వుతూ ‘మ’ తో ఇలా అన్నారు: “ఏమయ్యా, వీరు ఏమంటున్నారు? పరమహంస సేన వస్తోంది అంటున్నారా? ఏమంటున్నారు ఈ మూర్ఖులు?” (అందరూ నవ్వారు)
40.3 తృతీయ పరిచ్ఛేదం అవతారము మరియు సిద్ధ పురుషుల మధ్య వ్యత్యాసం
భక్తులతో కలసి శ్రీరామకృష్ణులు గిరీశ్ ఇంట్లోకి వెళ్ళారు. గిరీశ్ అనేక మంది భక్తులను ఆహ్వానించాడు. వారిలో చాలామంది ముందుగానే అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణుల రాకకై ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చారని విని వారందరూ లేచి నిలబడ్డారు. దరహాసవదనారవిందులై ఆయన ఆసనం స్వీకరించారు. భక్తులు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. గిరీశ్, మహిమాచరణ్, రామ్, భవనాథ్ ప్రభృతులు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇంకా బాబూరామ్, నరేంద్రుడు, యోగీన్, చిన్న నరేంద్రుడు, ఛునీలాల్, బలరామ్ మొదలైనవారు కూడా ఆయనతో పాటే వచ్చి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (మహిమాతో): నేను నీ గురించి గిరీశ్ ఘోష్‌తో ఇలా చెప్పాను: ‘ఫలానా ఆయన ఉన్నాడు. అతడు చాలా లోతైన మనిషి. నువ్వు కేవలం మోకాలి వరకే మునిగిఉన్నావు.’ నువ్విప్పుడు నా మాటను నిలబెట్టాలి. మీరిద్దరూ వాదన చేయండి. కాని రాజీమాత్రం పడవద్దు సుమా! (అందరూ నవ్వారు)
మహిమాచరణ్, గిరీశ్‌లు ఇద్దరూ వాదన మొదలుపెట్టారు. కొద్దిసేపు వాదన జరగ్గానే రామ్, “ఈ వాదనలన్నీ ఎందుకు? కొంతసేపు కీర్తనలు పాడుకుందాం” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (రామ్‌తో): లేదు లేదు. ఇందులో కూడా ఎంతో అర్థం ఇమిడి ఉంది. వీళ్ళు ‘ఇంగ్లీషు మ్యాన్లు’ కదా! వీళ్ళు ఎలా వాదిస్తారో చూడాలని ఉంది.
సాధనలు చేయడం ద్వారా అందరు శ్రీకృష్ణుడిలా అవగలరన్నది మహిమాచరణ్ వాదం. అయితే గిరీశ్ వాదం ఏమిటంటే – శ్రీకృష్ణుడు భగవదవతారం. మనిషి సాధనలు ఎన్ని చేసినా అవతార పురుషుడు మాత్రం కాలేడు.
మహిమా: నేను చెప్పేది ఏమిటంటే, ప్రతిబంధకాలు తొలగించినట్లయితే మారేడుచెట్టు మామిడిచెట్టు కాగలదు. యోగసాధనల ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
గిరీశ్: మహాశయా, మీరు ఏమయినా చెప్పండి – యోగసాధనలు ద్వారా కాని లేక మరే సాధనల ద్వారా కాని అది సాధ్యం కానే కాదు. కేవలం కృష్ణుడు మాత్రమే కృష్ణుడు అవగలడు. ఎవరయినా వ్యక్తి మరొకరి భావాల నన్నిటినీ ఆపాదించుకొన్నట్లయితే – ఉదాహరణకు రాధాభావమే తీసుకోండి, అప్పుడు ఆ వ్యక్తి రాధే కానీ వేరొకరు కాదు. కృష్ణుడి సకల భావాలను ఎవరిలోనైనా చూడగలిగితే అప్పుడు మనం సాక్షాత్తూ కృష్ణుణ్ణే చూస్తున్నామని అనుకోవాలి.
మహిమాచరణ్ తరువాత ఎక్కువగా వాదించలేకపోయాడు. చివరకు అతడు ఒక రకంగా గిరీశ్ వాదనలను అంగీకరించినట్లే అయింది.
మహిమా (గిరీశ్‌తో): మహాశయా! అవును, రెండూ సత్యమే. జ్ఞానమార్గం, భక్తిమార్గం రెండూ భగవంతుడి సంకల్పం ద్వారా ఏర్పడినవే. ఈయన చెప్పినట్లు వేర్వేరు మార్గాల ద్వారా మనుష్యులు ఒకే గమ్యాన్ని చేరుకుంటారు.
శ్రీరామకృష్ణులు (మహిమాను ప్రక్కకు పిలిచి): ఏమంటావ్, నేను చెప్పింది నిజం కాదా?
మహిమా: నిజమేనండీ. మీరు చెప్పినట్లు రెండు మార్గాలూ యథార్థమైనవే.
శ్రీరామకృష్ణులు: గిరీశ్ది ఎంతటి ప్రగాఢ విశ్వాసమో నువ్వే చూశావు కదా! ఫలహారం చేయడం కూడా మరచిపోయాడు. ఒకవేళ నువ్వు కనుక అంగీకరించనట్లయితే కుక్కలాగా గొంతుపట్టుకొని చీల్చి చండాడి ఉండేవాడు. మొత్తానికి మీ వాదన చూసి మేమంతా ఆనందించాం. మీరిద్దరు పరస్పరం తెలుసుకున్నారు. నేనుకూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.
40.4 చతుర్థ పరిచ్ఛేదం భజనానందంలో శ్రీరామకృష్ణులు
గాయకుడు తన బృందంతోపాటు వచ్చి గది మధ్యలో కూర్చున్నాడు. సంకీర్తన ప్రారంభించడానికి అతడు శ్రీరామకృష్ణుల అనుమతికి నిరీక్షిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అనుమతి ఇచ్చారు. గాయకుడు పాడసాగాడు:
నా గోరా నా పెన్నిధి
నరులందున చింతామణి
రాధాయని వ్యధ చెందుచు
పుడమినబడి పొరలాడును ॥ నా ॥
మిక్కుటమగు మక్కువతో
పొక్కుచు తా నా నామము
ఎక్కువగా పలవించుచు
రాధా యను మరల మరల ॥ నా ॥
నిండిన కన్నులు ప్రేమతో
దండిగ ధారలు గురియగ
మెండుగ పొరలును దొరలును
పుడమినబడు మరియొకపరి ॥ నా ॥
రాధాయని వ్యధచెందుచు
పృథివినబడి మూర్ఛిల్లగ
వ్యధచెందిన తనువెల్లను
పులకించును గగురొందును ॥ నా ॥
పలుకొకటేగాని వేరు
పలుకదు అతని నాలుక
పలుకును వసు* డీలాగు
గోరా కీ వేదనేల? ॥ నా ॥
కీర్తన కొనసాగింది.
రాధ యమునానదీ తీరాన ఉన్న కదంబవృక్షం క్రింద శ్రీకృష్ణుణ్ణి మొదటి సారి కలుసుకున్నది. ఆమె చెలులు ఆ సమయంలో ఆమె స్థితిని వర్ణించే పాట:
ఏ బాధ తన యెదను బాధించుచున్నదో
ఏ రూపు తన చూపు కాంక్షించుచున్నదో
క్షణక్షణము లోపలికి క్షణక్షణము వెలుపలికి
వచ్చిపోవుచు కడమి వనము వైపుకు చూచు ॥ ఏ ॥
బంధుజాలము జూచి భయమందుచున్నదా?
దయ్యమేమైనను తన నావహించెనా?
తత్తరము చెందుచు తడబడుచునున్నది
ఉడుపులను సమముగా తొడగలేకున్నది ॥ ఏ ॥
దారిలో సొమ్ములు జారిపోవుచునుండె
అపుడపుడు వణకుచు అదరిపోవుచునుండె
అకటా! జవ్వని తాను అందులో యువరాణి
వైవాహికంబయిన వనితగూడను తాను ॥ ఏ ॥
ఏమి కాంక్షించునో? ఎరుగలేమో మనసు
చెయిజాపి చంద్రుని చేకొనగ జూచును
పలుకు చండీదాసు* పరమ వినయముతోడ
శ్రీకృష్ణు వలలోన చిక్కినది శ్రీరాధ ॥ ఏ ॥
కీర్తన కొనసాగింది. చెలులు, రాధతో ఇలా అన్నారు:
ఏమే రాధా! ఇంతటి బాధ
కేమి గతంబొ చెప్పగదే
చారుముఖీ నీ మనసెచ్చటికో
చంచలమై ఇపుడేగినది ॥ ఏ ॥
ఏల భూమిని పిచ్చిదానివలె
కాలి గోళ్లతో గీరెదవు?
మేలిబంగరువన్నె ఇప్పుడు
బూదిరంగుగా మారినదే ॥ ఏ ॥
సిందూరవర్ణపు చిన్నవస్త్రము
శ్రద్ధలేక భువిజారినదే
నీరునిండి నీ నీలికన్నులు
ఎరుపు రంగుగా మారినవే ॥ ఏ ॥
అందమైన నీ వదన సరోజము
వాడిపోయి ముకుళించినదే
అంత దిగులు నీ కేల కల్గెనో
చెలుల కిప్పుడు చెప్పగదే ॥ ఏ ॥
నిన్నేబాధ ఇంతచేసెనో
ఇక మాకైనను చెప్పనిచో
దుఃఖతప్తమై నీ హృదయంబు
ముక్కలు ముక్కలుగ పగులు గదే ॥ ఏ ॥
రాధ, చెలులతో ఇలా అంది:
కృష్ణుని ముఖారవింద కనువిందుకై ఆకాంక్ష
శ్రీకృష్ణుడి పిల్లనగ్రోవి నాదాన్ని వింటూనే రాధ పిచ్చిపట్టిన దానిలా అయిపోయింది. తన చెలులతో ఆమె ఇలా అంది:
వేణుగాన రవము వీనుల బడగనే
విహ్వలయై రాధ భాషించె వెర్రిగా
ఎవరే! మాయలమారి ఇల్లువాకిలి విడచి
కదంబవనిలోన కాపురము సాగించె ॥ వే ॥
ఆ మురళీ రవళీ నా చెవుల చెచ్చెరజొచ్చి
హృదయతంత్రిని మీటి యెద కదిలించెను
మనసు చంచలమగుచు కనుల కాల్వలుగట్ట
అకటా ఊపిరికూడ పీల్చలేకున్నాను ॥ వే ॥
అబ్బా! ఆతడు వేణువెటు లూదునోగాని
ఆ రవళిచే పొంగి ఆత్మ ఝల్లనిపించు
అతని చూడక గుండె ఆగుచునుండె
యేమాత్ర మింటిలో ఇక నిలవనేరను ॥ వే ॥
నా ప్రాణ మతనికై పరితాపపడుచుండె
చిత్రవధ గావించు చింత చీల్చుచునుండ
‘ఆతని చూచిన యపుడె’ అనియె ఉద్ధవదాసు
‘సందేహమే లేదు చనిపోయెదవు రాధ’ ॥ వే ॥
గానం కొనసాగింది. శ్రీకృష్ణ దర్శనానికి రాధాదేవి తహతహలాడుతూ తన చెలులతో ఇలాఅంది:
కాదంబ వనినుండి విన్నానె ఓ చెలీ!
మొదటగా మోహన మురళీరవంబు
మరునాడు వందిమాగధుడు చెప్పగ విని ॥ వే ॥
పులకించె ప్రాణము పొంది ఉద్రేకము
ఓ ప్రాణమిత్రమా! నీ వొక్క రోజున
పాడలేదటె అతని భవ్యనామమును
(అహాహా! కృష్ణుని ఆనంద నామము
తేనెసోనలుగారు తీపి సంభవితము) ॥ వే ॥
అగణితంబైనట్టి అతని సుగుణంబులు
వర్ణించిపోయిరి వారు సుజ్ఞానులు
ఏ కపట మెరుగని చిన్నపిల్లను నేను
కరుణ ఇంచుకలేనివారు నా పెద్దలు ॥ వే ॥
పెంపొందుచున్నది ప్రియునిపై నా ప్రేమ
ఇకనెంతొ కాలము నే బ్రతుకలేను
దూరమాలోచింప మరణమే శరణమని
తెలిసిపోయెను నాకు తేటతెల్లముగ ॥ వే ॥
ఏ మార్గమున నేగి ఇకను నా ప్రియుని
మోహనాంగుని మదనమోహనుని కృష్ణు
చేరగలనో నాకు చెప్పవటె సఖీ
(చేయెత్తి మ్రొక్కుదునె చిన్నవైనను నీకు) ॥ వే ॥
‘అహాహా! కృష్ణుని ఆనందనామము తేనెసొనలుగారు తీపి సంభరితము’ – ఈ చరణం విన్న పిదప శ్రీరామకృష్ణులు కూర్చోలేకపోయారు; లేచి నిలబడ్డారు. బాహ్యచైతన్యం కోల్పోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయనకు కుడివైపు చిన్న నరేంద్రుడు నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత కొద్దిగా బాహ్యచైతన్యం కలిగాక తమ మధురకంఠంతో ‘కృష్ణ కృష్ణ’ అంటున్నారు. ఆయన కళ్ళ నుండి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి. మెల్లగా కూర్చున్నారు.
గాయకుడు మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు. రాధాదేవి సఖీయైన విశాఖ పరుగున వెళ్ళి కృష్ణుడి చిత్తరువు నొకదానిని తీసుకువచ్చింది. ఆమె దానిని పట్టుకొని రాధాదేవికి ఎదురుగా నిలబడింది. రాధాదేవి ఆ చిత్తరువు చూస్తూ ఇలా అంది: “ఈ చిత్తరువులో ఎవరినైతే చూస్తున్నానో అతణ్ణి యమునా తీరాన చూసినప్పటి నుండి నా పరిస్థితి ఇలా అయిపోయింది.”
యమునా తటిలో ఎవని గాంచితినో
అతని చిత్రమిట గాంచితిని
ఎవని నామమును విశాఖ పల్కెనొ
అతని రూపమిట చిత్రితమైనది ॥ య ॥
మోహనమురళీ నెవరు ఊదిరో
అతడే నా హృదయాధినాథుడు
అతని గుణములే వందిమాగధుడు
పాటలు పాడెను నాకు తెలుపుచు ॥ య ॥
మాయలు పన్ని నా హృదయమును
మోహపరచి హరియించె నాతడు
‘ఇత డతడే గాకన్యుడుగాడు’
అనుచు రాధ పడి మూర్ఛచెందెను ॥ య ॥
సేదదీర్చిన చెలులను గనియనె
‘ఆత్మలో నెవ్వరి బింబము గంటినొ
అతని చూపుడొ సఖులారా!’
తప్పక చూపెదమనెడు వాగ్దానము
ఆమెకు చేసిరి ఆ సఖులు ॥ య ॥
ప్రస్తుతం శ్రీరామకృష్ణులు, నరేంద్రాది భక్తులతో కలిసి బిగ్గరగా కీర్తనలను గానం చేయసాగారు:
అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులు గార్తురు
ఆనందముతో నాడుచు జగమును హరి భజనములో నాడజేతురు….
కీర్తన కొనసాగింది:
చైతన్యుల ప్రేమ తరంగాలలో
నదియా ఆడుతూన్నది….
శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. బాహ్యస్పృహ కలిగాక కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు(‘మ’ తో): ఇంతకు ముందు ఎటువైపు ముఖం త్రిప్పి కూర్చున్నానో ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు.
40.5 పంచమ పరిచ్ఛేదం నరేంద్రునితో సంభాషణ – హాజ్రా ‘కపటనారాయణుడు’
తరువాత ఆయన భక్తులతో సంభాషణ కొనసాగించారు.
నరేంద్రుడు (శ్రీరామకృష్ణులతో): హాజ్రా ఇప్పుడు మంచివాడై పోయాడండి.
శ్రీరామకృష్ణులు: నీకు తెలియదులే. కొందరు వ్యక్తులు ఒక వైపు ‘రామ, రామ’ అంటుంటారు, మరో వైపు ఇతరుల మీదకు రువ్వడానికి రాళ్ళు దాచి ఉంచుకొంటారు.
నరేంద్రుడు: లేదండీ. ఈ విషయంలో నేను మీతో ఏకీభవించను. జనం అతడిపట్ల చేసే ఫిర్యాదుల గురించి నేను అతడితో వివరంగా మాట్లాడాను. అన్నిట్లోనూ ‘తాను నిర్దోషి’ అనే చెప్పాడు.
శ్రీరామకృష్ణులు: అతడికి నిష్ఠ అనేది ఉంది. ఒకింత జపం చేస్తాడు. కాని అతడు అదోరకం మనిషి. ఆ రోజు బండివాడికి బాడుగ ఇవ్వనే లేదు.
నరేంద్రుడు: లేదండీ, అతడు నాతో ఇచ్చాననే చెప్పాడు.
శ్రీరామకృష్ణులు: అతడి వద్ద పైకం ఎక్కడిది?
నరేంద్రుడు: బహుశా రామ్‌లాల్ వద్ద తీసుకొని ఉండవచ్చు.
శ్రీరామకృష్ణులు: నువ్వు అతణ్ణి వివరంగా అడిగావా? ఒకసారి నేను అమ్మను ఇలా ప్రార్థించాను: ‘అమ్మా, హాజ్రాలో కపటం అనేది కనుక ఉన్నట్లయితే అతణ్ణి ఇక్కడ నుండి వైతొలగించు.’ పిదప హాజ్రాకు ఆ సంగతి చెప్పాను. కొన్ని రోజుల తరువాత హాజ్రా నా వద్దకు వచ్చి, ‘చూస్తున్నారు కదా! నేను ఇంకా ఇక్కడే ఉన్నాను’ అన్నాడు. (శ్రీరామకృష్ణులతో సహా అందరూ నవ్వారు) కాని అటుపిదప కొన్ని రోజులకే అతడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
“హాజ్రాను ఏదో విధంగా పంపించమనీ, కన్నీళ్ళతో తాను దాదాపు ఏమీ చూడలేక పోతున్నాననీ హాజ్రా తల్లి రామ్‌లాల్ ద్వారా నాకు కబురు పంపింది. నేను హాజ్రాకు ఎంతగానో చెప్పిచూశాను. ‘పాపం! ముసలి తల్లి. కనీసం ఒక్క సారైనా వెళ్ళి చూసిరా’ అన్నాను. కాని అతడు మాత్రం నా మాట వినలేదు. చివరకు పాపం! ఆ ముసలి తల్లి అతడి కోసం ఏడుస్తూనే ప్రాణాలు వదిలిందట.”
నరేంద్రుడు: ఈసారి ఊరికి పోతాడు!
శ్రీరామకృష్ణులు: ఊ, ఊ, ఇప్పుడా ఊరికి పోతాడు! వాడో దొంగవెధవ! ధూర్తుడు! వాడి సంగతి నీకు తెలియదు. సింథీలో హాజ్రా కొన్నిరోజులు బస చేశాడని గోపాల్ నాతో చెప్పాడు. అక్కడి వాళ్ళు అతడికి బియ్యం, నెయ్యి మొదలైన సంబారాలు ఇచ్చేవారట. అతడు వారితో ‘నేను ఇటువంటి నాసిరకం బియ్యం, నెయ్యి తింటానా ఏమిటి?’ అనేవాడట. అతడు భాట్పారాకు చెందిన ఈశాన్తో పాటు అక్కడకు వెళ్ళి ఉన్నాడు. తాను బయలుకు వెళ్ళడానికి ఈశాన్ను నీరు తెమ్మని చెప్పేవాడట. అది అక్కడి బ్రాహ్మణులకు కోపం కలిగించింది.
నరేంద్రుడు: ఆ, ఆ విషయం కూడా హాజ్రాతో మాట్లాడానండి. ఈశాన్ బాబే నీరివ్వడానికి స్వయంగా ముందుకు వచ్చాడని అతడు చెప్పాడు. పైగా భాట్పారాలోని బ్రాహ్మణులు అనేకులు, అతడికి గౌరవమర్యాదలు కూడా చూపేవారట.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అతడు చేసిన జపతపాలకు లభించిన కొద్దిపాటి ఫలం అది. మరో విషయం – శారీరక లక్షణాలు కూడా మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తిని సూచిస్తాయి. పొట్టిగా ఉండటం, శరీరం అక్కడక్కడా వంకర్లు తిరిగి ఉండటం మంచి లక్షణాలు కావు. అటువంటి లక్షణాలున్న వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాప్తించడానికి చాలాకాలం పడుతుంది.
భవనాథ్: మహాశయా, అలాంటి మాటలను మాట్లాడటం ఎందుకు? వాటిని అలా ఉండనివ్వండి.
శ్రీరామకృష్ణులు: నన్ను అపార్థం చేసుకోవద్దు. (నరేంద్రుడితో) లోకుల స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకోగలనని నువ్వు అంటుంటావు కదా! అందుకే ఇవన్నీ నీకు చెబుతోంది. హాజ్రాలాంటి వ్యక్తుల పట్ల నా వైఖరి ఎలాంటిదో తెలుసా? సాధువు రూపంలో ఉన్న నారాయణుడే కపటి, నీచుడి రూపాలను కూడా ధరిస్తుంటాడని నేను భావిస్తాను. (మహిమాతో) ఏమయ్యా, నువ్వేమంటావు? అందరూ నారాయణులే కదా!
మహిమా: అవునండీ, అందరూ నారాయణులే.
40.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – మూడురకాల ప్రేమలు
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా! ‘ఏకాంగీ ప్రేమ’ అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: ‘ఏకాంగీ ప్రేమ’ అంటే ఏకపక్షమైన ప్రేమ. ఉదాహరణకు నీరు బాతును కోరుకోదు; కాని బాతు నీటిని ప్రేమిస్తుంది. ఇంకా, మూడు రకాల ప్రేమలు ఉన్నాయి. అవి: సాధారణ ప్రేమ, సమంజస ప్రేమ, సమర్థ ప్రేమ.
“సాధారణ ప్రేమలో ప్రేమికుడు ఇలా భావిస్తాడు: ‘కేవలం నేను సుఖంగా ఉంటే చాలు. నువ్వు సుఖంగా ఉన్నా సరే, లేకపోయినా సరే – దానితో నాకు నిమిత్తం లేదు.’ శ్రీకృష్ణుడి పట్ల చంద్రావళి ఇటువంటి భావాన్నే కలిగి ఉండేది.
“ఇకపోతే సమంజస ప్రేమ – దీన్లో నేను సుఖంగా ఉండాలి, నువ్వు కూడా సుఖంగా ఉండాలి అనే భావం. ఇది ఉదాత్తమైన ప్రేమ.
“ఇకపోతే మూడవ రకానికి చెందినది – సమర్థప్రేమ. ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైన ప్రేమ. శ్రీకృష్ణుడి పట్ల రాధాదేవి ఇటువంటి ప్రేమను కలిగివుండేది.
“కృష్ణుడి సుఖంలోనే ఆమె సుఖంకూడా ఇమిడివుంది. ‘నేను ఏమైపోయినా ఫరవాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు’ – అనేటటువంటి భావం.
“గోపికల ఈ భావం ఎంతో ఉన్నతమైనది.
“గోపికలంటే ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఆ అరణ్యంలో అరవై వేల మంది ఋషులు నివసించేవారట. వారందరూ శ్రీరాముణ్ణి దర్శింప ఆరాటపడిపోయారు. అప్పుడు శ్రీరాముడు వారిపట్ల అనురాగంతో నిండిన దృక్కు నొకదాన్ని పరపాడు. ఫలానా పురాణం ప్రకారం ఆ ఋషులే తరువాత కాలంలో బృందావనంలోని గోపికలుగా జన్మించారు.”
ఒక భక్తుడు: మహాశయా, ఆంతరంగికులంటే ఎవరు?
శ్రీరామకృష్ణులు: దీన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. సభామండపంలో స్తంభాలు లోపలా ఉంటాయి, బయటకూడా ఉంటాయి. ఆంతరంగికులు లోపలి స్తంభాలను పోలి ఉంటారు. సర్వదా గురువు సామీప్యంలో ఉండేవారే ఆంతరంగికులు.
40.6.1 శ్రీరాముడు, భరద్వాజుడు – జ్ఞాన, భక్తి యోగాల సమన్వయం
“(మహిమాతో) జ్ఞాని అయినవాడు భగవద్రూపాన్నీ కోరుకోడు, భగవదవతారాన్నీ కోరుకోడు. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు ఆయన ఎంతో మంది ఋషులను కలుసుకోవటం తటస్థించింది. వారు ఎంతో ఆదరంతో శ్రీరాముణ్ణి తమ ఆశ్రమాలకు తోడ్కొని వెళ్లి సత్కరించారు. ఆయనతో వాళ్ళు ఇలా అన్నారు: ‘ఓ రామా, నేడు నిన్ను దర్శించటంతో మా జన్మలు సార్థకమయ్యాయి. కాని మేము నిన్ను దశరథ తనయుడిగానే ఎరుగుదుం. భరద్వాజాది మునులు నిన్ను భగవదవతారంగా పేర్కొంటారు. కాని మేము మాత్రం అలా పేర్కోము. మేము ఆ అఖండ సచ్చిదానందుణ్ణే ధ్యానిస్తాం.’ శ్రీరాముడు వారి పట్ల ప్రసన్నుడై, చిరునవ్వు నవ్వాడు.
“ఓహ్! ఆ కాలంలో నేను ఎటువంటి స్థితిలో ఉండేవాడినని! నా మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోయేది. ఆ విధంగా ఎన్నో రోజులు గడచిపోయేవి. అప్పుడు భక్తిని, భక్తులను కూడా త్యజించివేశాను. జడుడనైపోయాను. నా తలను గూర్చిన ఎరుక కూడా ఉండేది కాదు. ప్రాణాలు పోతున్నట్లు అనిపించేది. రామ్‌లాల్ పినతల్లిని (మాతృమూర్తి శారదాదేవి) పిలిపిద్దామనుకున్నాను.
“గదిలోని చిత్రపటాల నన్నిటినీ తొలగించమని చెప్పాను. మళ్ళీ బాహ్యస్పృహ కలిగాక, మనస్సు సాధారణ స్థాయికి దిగివచ్చేటప్పుడు ప్రాణాలు కొట్టుకుపోయేవి. చివరకు ‘మనస్సును దేనిపైన నిలిపి ఉంచటమా?’ అని ఆలోచించాను. తరువాత దానిని భక్తి, భక్తులపై నిలిపాను.
“అప్పుడు అందరినీ ‘నాకు ఏమయింది?’ అని ప్రశ్నించేవాడిని. భోలానాథ్* ఇలా అన్నాడు: ‘మహాభారతంలో ఈ స్థితి గురించిన వివరణ ఉంది. సమాధి స్థితుడైన వ్యక్తి ఆ స్థితి నుండి సాధారణ స్థాయికి దిగి వచ్చినప్పుడు ఎలా జీవించగలడు? అందుకే అతడికి భక్తి, భక్తుల సాంగత్యం అవసరమవుతుంది. అలా కానట్లయితే అతడు తన మనస్సును మరి దేనిమీద నిలపగలడు?’”
40.7 సప్తమ పరిచ్ఛేదం జీవుని మరియు అవతార పురుషుల సమాధి స్థితులలో వ్యత్యాసం
మహిమా(శ్రీరామకృష్ణులతో): సమాధిస్థితి నుండి మామూలు స్థితికి ఎవరైనా తిరిగి రాగలరా?
శ్రీరామకృష్ణులు (మహిమాతో లోస్వరంలో): ఈ విషయం నీకు విడిగా ఉన్నప్పుడు చెబుతాను. నువ్వే ఈ విషయం వినడానికి యోగ్యుడవు.
“కువర్‌సింగ్ (ఒక సిపాయి) కూడా ఇదే విషయం అడిగాడు. జీవుడు, భగవంతుడి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సాధన భజనలు చేయడం ద్వారా జీవుడు ఏదో రకంగా సమాధిస్థితిని పొందగలడు; కాని ఆ స్థితి నుండి తిరిగి రాలేడు. కాని అవతార పురుషులు సమాధి స్థితిని పొందిన పిదప కూడా సాధారణ స్థితికి రాగలుగుతారు. జీవుడు ఒక రాజోద్యోగిలాంటివాడు. అతడు రాజుగారి ఏడంతస్తుల భవనంలో, మహా అయితే బయట ఉన్న దర్బారు వరకు మాత్రమే పోగలడు. కాని రాకుమారుడు మాత్రం ఏడు అంతస్తులలోనూ యథేచ్ఛగా రాకపోకలు సాగించగలడు, మళ్ళీ బయటకు కూడా రాగలడు. సమాధిస్థితి నుండి ఎవరూ బయటకు రాలేరని ప్రతి ఒక్కరూ అనటం కద్దు. మరి అలాంటప్పుడు శంకరులు, రామానుజులు మొదలైనవారి సంగతి ఏమిటంటావు?వారు ‘విద్యా నేను’ ను నిలుపుకున్నారు.”
మహిమా: అవునవును. లేకుంటే వారు అటువంటి గ్రంథాలన్నీ వ్రాయగలిగి ఉండేవారు కాదు.
శ్రీరామకృష్ణులు: ఇంకా ప్రహ్లాదుడు, నారదుడు, హనుమంతుడు – వీరు కూడా సమాధిస్థితి అనంతరం భక్తిని నిలుపుకున్నారు.
మహిమా: అవునండీ.
40.7.1 జ్ఞానచర్చలు – సమాధి తరువాతే జ్ఞానం – ‘విద్యానేను’
శ్రీరామకృష్ణులు: కొందరు జ్ఞానచర్చలు చేసి తమ గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. వారు బహుశా ఒకింత వేదాంతం ఏమైనా చదివి ఉంటారు. కాని యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అహంకారమనేది ఉండదు. అంటే సమాధి స్థితి పొందినప్పుడు, మనిషి భగవంతుడితో ఏకం అయినప్పుడు అహంకారమనేది ఉండదు. సమాధిస్థితి కలగనిదే యథార్థ జ్ఞానలబ్ధి అసాధ్యం. అలాంటి స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడితో ఏకం అయిపోతాడు. ఆ తరువాత అతడికి అహం అనేది ఉండదు. ఇది ఎలాంటిదో తెలుసా? మిట్టమధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు వస్తాడు. అప్పుడు నువ్వు నలువైపులకు తిరిగిచూసినా నీ నీడ కనిపించదు. అదే విధంగా యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, సమాధిస్థితిని పొందినప్పుడు అహం అనే నీడ ఉండదు.
“యథార్థజ్ఞానం పొందిన పిదప ‘అహం’ అనేది ఉన్నట్లయితే అది ‘విద్యా నేను’, ‘భక్తి నేను’, ‘దాసుడిననే నేను’ గా తెలుసుకో. అది ‘అవిద్యా నేను’ కాదు.
“ఇంకా జ్ఞానం, భక్తి అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా సరే, నువ్వు చేరుకొనేది ఆ భగవంతుణ్ణే. భగవంతుడి పట్ల జ్ఞాని ఒక విధమైన భావం కలిగి ఉంటాడు, భక్తుడు మరో విధమైన భావం కలిగి ఉంటాడు. జ్ఞాని యొక్క భగవంతుడు తేజోమయుడు, భక్తుడి భగవంతుడు రసమయుడు.”
40.7.2 దేవీమాహత్మ్యం – జగజ్జనని మాయ
భవనాథ్ శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చుని ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నాడు. అతడు నరేంద్రుడి సహచరుడు; మొదట్లో బ్రహ్మ సమాజానికి వెళుతూండేవాడు.
భవనాథ్ (శ్రీరామకృష్ణులతో): అయ్యా, ఒక సంగతి అడగాలను కొంటున్నాను. చండీ (దేవీమాహాత్మ్యం) నాకు అర్థం కావడం లేదు. అందులో జగజ్జనని జీవుల నందరినీ హతమార్చుతున్నట్లు వ్రాసి ఉంది. దీని అర్థం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: అదంతా ఆమె లీల. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచించేవాణ్ణి. తరువాత అంతా మాయగానే దర్శించాను. ఆమె చేసే సృష్టీ మాయే; ఆమె సలిపే సంహారం కూడా మాయే.
ఇంటి డాబా మీద భోజనానికి విస్తళ్ళు వేశారు. గిరీశ్ వచ్చి శ్రీరామకృష్ణులను, భక్తులను భోజనానికి ఆహ్వానించాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వెన్నెలతో కలిసి జగత్తు చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా తోస్తోంది. భక్తులందరూ భోజనానికి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు వారికి ఎదురుగా ఆసీనులయ్యారు. అందరి హృదయాలు ఆనందభరితమై ఉన్నాయి.
నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ఎదురుగా ఉన్న పంక్తిలో కూర్చుని ఉన్నాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మధ్యమధ్యలో ఆయన అతడి క్షేమసమాచారాల గురించి విచారిస్తున్నారు. భోజనం చేస్తూ ఆయన హఠాత్తుగా లేచి తమకు వడ్డించిన పుచ్చకాయ షర్బతు, పెరుగులను రెండు చేతులతోనూ పట్టుకొని నరేంద్రుడి వద్దకు వచ్చారు. అతడితో “నాయనా! ఇదిగో, ఇవి తీసుకో” అన్నారు. తరువాత ఆయన తమ ఆసనంలో కూర్చున్నారు.
40.8 అష్టమ పరిచ్ఛేదం హాజ్రా విషయంగా నరేంద్రునితో శ్రీరామకృష్ణులు
శనివారం, మే 9, 1885
అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు బలరామ్ ఇంటి ముందు గదిలో భక్తులతో ఆనందంగా కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, ‘మ’, భవనాథ్, పూర్ణుడు, పల్టు, చిన్న నరేంద్రుడు, గిరీశ్, రామ్, వినోద్, ద్విజుడు తదితరులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు.
ఆ సమయంలో బలరామ్ అక్కడ లేడు. జబ్బు చేయడంతో వాతావరణ మార్పుకోసమని ‘ముంగేర్’ వెళ్ళి ఉన్నాడు. అతడి పెద్ద కుమార్తె వీరినందరినీ ఆహ్వానించి పెద్ద ఉత్సవమే జరిపింది, విందు భోజనంతో సత్కరించింది. భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకొంటున్నారు.
శ్రీరామకృష్ణులు పదే పదే ‘మ’ ను ఇలా అడుగుతున్నారు: “నాది ఉదార స్వభావమేనా? చెప్పు.” భవనాథ్ నవ్వుతూ “ఆయన్ను అడగటం ఎందుకు? ఆయన ఉలకడు, పలకడు” అన్నాడు.
ఇంతలో ఒక హిందుస్థానీ బిచ్చగాడు వచ్చి భక్తుల అనుమతితో ఒకటి రెండు పాటలు పాడాడు. అవి నరేంద్రుడికి నచ్చాయి. అతడు బిచ్చగాడిని ఇంకా పాడమన్నాడు.
శ్రీరామకృష్ణులు: చాలు, చాలు. ఇక అక్కర్లేదు. డబ్బులు ఎక్కడున్నాయి? (నరేంద్రుడితో) నువ్వు పాడమని అయితే చెప్పావు కాని డబ్బులు ఇచ్చే వారెవరు?
ఒక భక్తుడు (నవ్వుతూ): మహాశయా, మీరలా దిండును అనుకొని కూర్చోవడం చూసి ఆ బిచ్చగాడు మిమ్మల్ని పెద్ద జమీందారుగా భావించి ఉండవచ్చు. (అందరూ నవ్వారు.)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): జబ్బు మనిషని కూడా అనుకోవచ్చు కదా!
అటుపై హాజ్రా అహంకారం గురించిన ప్రస్తావన వచ్చింది. అతడు ఏదో కారణంగా దక్షిణేశ్వరం వదిలిపోవలసి వచ్చింది.
నరేంద్రుడు: హాజ్రా తనకు అహంకారం ఉండేదని ఇప్పుడు ఒప్పు కుంటున్నాడు.
శ్రీరామకృష్ణులు: అతడి మాటలు నమ్మవద్దు. మళ్ళీ దక్షిణేశ్వరం రావటానికి ఇలాంటి ఎత్తులు వేస్తుంటాడు. (భక్తులతో) హాజ్రా ఎంతో ఉత్తముడనేది నరేంద్రుడి అభిప్రాయం.
నరేంద్రుడు: ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే.
శ్రీరామకృష్ణులు: ఇంత విన్న తరువాత కూడానా?
నరేంద్రుడు: అతడిలో కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని సుగుణాలు అనేకం.
శ్రీరామకృష్ణులు: హాజ్రాకు మంచి నిష్ఠ అనేది మాత్రం ఉంది. అతడు ఒకసారి నాతో ఇలా అన్నాడు: ‘ప్రస్తుతం మీకు నేనంటే నచ్చటం లేదు కదా! కాని తరువాత నన్ను వెతుక్కుంటూ మీరే వస్తారు.’ శ్రీరాంపూర్ నుండి ఒక గోస్వామి వచ్చాడు. అతడు అద్వైత గోస్వామి వంశజుడు. దక్షిణేశ్వరంలో ఒకటి రెండు రోజులు ఉండాలన్నది అతడి అభిలాష. నేను సాదరంగా అతణ్ణి అక్కడ బస చేయమని చెప్పాను. అప్పుడు హాజ్రా నాతో ‘అతణ్ణి ఆలయ నిర్వహణాధికారి వద్దకు పంపివెయ్యండి’ అన్నాడు. అతడి ఉద్దేశం ఏమిటో తెలుసా? గోస్వామికి పాలు పళ్ళు కావలసివస్తే తన వాటలో నుండి ఇవ్వవలసి వస్తుందనే అతడి భయం. నేను హాజ్రాతో ఇలా అన్నాను: ‘ఓరీ నీచుడా! అతడు గోస్వామి వంశజుడని నేను అతడికి సాష్టాంగ నమస్కారం చేస్తాను. మరి నువ్వో! సంసారంలో జీవించి కామినీ కాంచనాలలో మునిగి నానారకాల పనులు చేసిన తరువాత ఏదో కొద్దిగా జపం చేస్తున్నాననే భావంతో ఇంతటి అహంకారమా? సిగ్గులేదూ?’
40.8.1 హాజ్రా – శ్రీరామకృష్ణులలో సత్త్వగుణం పాలు ఎంత?
“సత్త్వగుణం ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. రజస్తమోగుణాలు మనిషిని భగవంతుడి నుండి దూరం చేస్తాయి. సత్త్వగుణాన్ని తెలుపురంగుతోనూ, రజోగుణాన్ని ఎరుపు రంగుతోనూ, తమోగుణాన్ని నలుపు రంగుతోనూ పోలుస్తారు. ఒకసారి నేను హాజ్రాతో ‘ఎవరికి ఎంత సత్త్వగుణం ఉందో చెప్పు అన్నాను. అందుకు అతడిలా అన్నాడు: ‘నరేంద్రుడికి పదహారణాల* సత్త్వగుణం ఉంది. నాకు మాత్రం రూపాయి మీద రెండు అణాలు ఎక్కువే ఉంది.’ మరి ‘నా సంగతో?’ అని నేను అడిగేసరికి అతడు ‘మీ కింకా ఎరుపు రంగు ఛాయలు ఉన్నాయి. మీ కున్నది ముప్పావలాయే!” అన్నాడు. (అందరూ నవ్వారు)
“హాజ్రా దక్షిణేశ్వరంలో కూర్చుని జపం చేసుకొనేవాడు. ఒక వైపు జపమాల త్రిప్పుతూనే మరోవైపు దళారీ (మధ్యవర్తి) పని చేస్తుండేవాడు. అతడు ఒకటి రెండు వేల రూపాయల అప్పు తీర్చవలసి ఉంది. ఆలయంలోని వంట బ్రాహ్మణుల గురించి ఈసడిస్తూ మాట్లాడేవాడు. ‘ఇలాంటి వారితో నేను మాట్లాడటమా?’ అంటూండేవాడు. (అందరూ నవ్వారు)
40.8.2 కోరిక భగవత్ప్రాప్తికి అవరోధం – భగవంతునిది బాలక స్వభావం
“విషయం ఏమిటో తెలుసా? ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేము. ధర్మం అతి సూక్ష్మమైనది. సూదిలోకి దారం ఎక్కించేటప్పుడు దారంలో ఒక్క నూలుప్రోగు విడివడి ఉన్నా సరే, దానిని సూదిలోకి ఎక్కించలేము.
“కొందరు ముప్ఫై ఏళ్ళపాటు జపం చేసివుంటారు. అయినప్పటికీ ఏం ప్రయోజనం? క్రుళ్ళిపోతున్న పుండు మామూలు మందులతో మానదు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టవలసి ఉంటుంది.
“కోరికలు ఉన్నట్లయితే, సాధనలు ఎన్ని చేసినప్పటికీ యోగం సిద్ధించదు. కాని ఒక్క విషయం మాత్రం నిజం. భగవత్ కృప కలిగినట్లయితే, ఆయన కనుక అనుగ్రహించినట్లయితే ఒక్క క్షణంలోనే యోగం సిద్ధిస్తుంది. వెయ్యేళ్ళుగా చీకటితో నిండిన గదిలోకి ఎవరైనా దీపాన్ని తీసుకువస్తే ఆ గది ఒక్క క్షణంలో ప్రకాశవంత మవుతుంది కదా! అలాంటిదే ఇదీను.
“పేదబాలు డొకడు ఒక పెద్ద ఆసామీ దృష్టిలో పడ్డాడు. ఆయన ఆ పేదవాడికి తన కుమార్తె నిచ్చి పెళ్ళి చేశాడు. వెంటనే ఆ పేదవాడికి ఇల్లూవాకిలీ, పొలం పుట్రా, బండ్లూ వాహనాలూ, సేద్యగాండ్రూ – అన్నీ చేకూరాయి.”
ఒక భక్తుడు: మహాశయా, భగవత్కృప ఎలా లభ్యమవుతుంది?
శ్రీరామకృష్ణులు: భగవంతుడిది బాలక స్వభావం. పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టుకొని ఇంటి గడప మీద కూర్చుని ఉన్నాడనుకుందాం. దారిలో ఎంతోమంది వస్తూ పోతూవుంటారు. వారిలో చాలామంది ఆ బాలుణ్ణి రత్నాలు ఇవ్వమని అడుగుతారు. కాని ఆ పిల్లవాడు ముఖం ప్రక్కకు త్రిప్పుకొని ‘ఊహూ, నేను ఇవ్వనంటే ఇవ్వను’ అంటాడు. అయితే కాసేపటి తరువాత ఎవరో వ్యక్తి ఆ దారిన వెళుతున్నాడనుకుందాం; అతడు రత్నాలు కావాలని కూడా అడగడు. అయినా సరే, ఈ బాలుడు అతడి వెంట పరుగు పరుగున వెళ్ళి రత్నాలన్నిటినీ బలవంతంగా ఆ వ్యక్తి చేతిలో పెడతాడు.
40.8.3 త్యాగంతోనే భగవల్లబ్ధి – శ్రీరామకృష్ణులకు తోడు – భూతం దృష్టాంతం
“త్యాగం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేము. నా మాటలను ఎవరు ఆలకిస్తారు? నా భావాలను అర్థం చేసుకొని నాకు తోడుగా ఉండే వ్యక్తి ఎవరైనా దొరుకుతారా అని నేను చూస్తున్నాను. మంచి భక్తుణ్ణి ఎవరినయినా చూస్తే, ‘ఓ, ఇతడు నాకు తోడుగా ఉంటా’ డని తలుస్తాను. తీరా చూస్తే అతడు మరోలా ప్రవర్తించటం గమనిస్తాను.
“ఒక భూతం తనకు తోడుగా ఉండటానికి ఎవడైన దొరుకుతాడా అని వెదకుతూ ఉండేది. శని మంగళ వారాలలో దుర్మరణం చెందివారు భూతాలవుతారు. అందువల్ల శని మంగళ వారాల్లో ఆ విధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించే సూచనలు ఉంటే ఈ భూతం అక్కడకు ఒక్క పరుగున వెళ్ళేది. ‘కనీసం ఇప్పటికైనా నాకు ఒకడు తోడు దొరకనున్నాడు’ అని తలచేది. కాని తీరా వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి లేచి నిలబడేవాడు. అతడు బహుశా ఇంటి పై కప్పు నుండి జారి క్రింద పడి స్పృహ కోల్పోయి ఉంటాడు; ఎలాంటి ప్రమాదమూ లేకుండా బయటపడతాడు.
“మథుర్బాబుకు ఒకసారి భావపారవశ్యం కలిగింది. ఎప్పుడు చూసినా తాగుబోతులా ఉండేవాడు, ఏ పనీ చేసుకోలేక పోయేవాడు. అప్పుడందరూ ఇలా అన్నారు: ‘ఈయనకు ఇలా అయిపోతే మరి ఈయన జమీందారీ వ్యవహారాలన్నీ ఎవరు చూస్తారు? చిన్న పూజారి (శ్రీరామకృష్ణులు) ఆయనకు ఏదో మందు పెట్టాడు.’
“నరేంద్రుడు ఇక్కడకు వచ్చిన కొత్తలో అతడి ఛాతీని చేతితో స్పృశించగానే అతడు బాహ్యస్పృహ కోల్పోయాడు. మళ్ళీ స్పృహ రాగానే ‘ఏమండీ, మీరు నాకు అలా ఎందుకు చేశారు? నాకు అమ్మా నాన్నా ఉన్నారు సుమా!’ అన్నాడు. ‘నేను’, ‘నాది’ అన్నది అజ్ఞాన జనితం.
40.8.4 సంసారం మిథ్య – గురువు, శిష్యుడు కథలు
“ఒక గురువు తన శిష్యుడితో ఇలా అన్నాడు: ‘సంసారం అనేది మిథ్య నువ్వు నాతో పాటు వచ్చెయ్యి.’ శిష్యుడు అయ్యా! మా అమ్మ, నాన్న, భార్య – వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. వీరిని వదలి నేను ఎలా రాగలను?’ అన్నాడు. అందుకు గురువు అతడితో నువ్వు ‘నా వాళ్ళు, నా వాళ్ళు’ అంటున్నావు నిజమే. పైగా వారు నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు. అయితే ఇదంతా నీ భ్రమే. నేను నీ కొక కిటుకు నేర్పుతాను. దాని ద్వారా వారు నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది’ అన్నాడు. ఇలా పలికి గురువు, శిష్యుడికి ఒక గుళిక ఇచ్చి ‘ఇంటికి వెళ్లాక దీన్ని మింగు, దీని ప్రభావంతో నువ్వు పీనుగవలె బిగుసుకు పడిపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు. చుట్టూ జరిగేదంతా వినగలవు, చూడగలవు. నేను వచ్చాక మళ్ళీ క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తావు” అని చెప్పాడు.
“శిష్యుడు ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పినట్లే చేశాడు; శవంలా పడిపోయాడు. ఇంట్లో ఏడ్పులు, పెడబొబ్బలు మొదలయ్యాయి. తల్లి, భార్య, ఇంకా తక్కిన వారందరూ గుండెలు బాదుకుంటూ నేలపైపడి దొర్లుతూ విలపించసాగారు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడకు వచ్చి ఏమైందని అడిగాడు. ‘ఇతడు చనిపోయా’ డన్నారు వారందరు. బ్రాహ్మణుడు శిష్యుడి నాడి పరీక్షించి ‘అరే, ఇదేమిటి? ఇతడు చనిపోలేదు! నే నొక ఔషధం ఇస్తాను. అది పుచ్చుకోగానే మళ్ళీ మామూలు మనిషై పోతాడు’ అన్నాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వారందరి ఆనందానికి హద్దు లేకపోయింది. స్వర్గం, భువికి దిగి వచ్చినట్లు వారికి తోచింది. ‘కాని, మీకు ఒక సంగతి చెప్పాలి’ అంటూ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: ‘ఈ ఔషధాన్ని ముందుగా మరో వ్యక్తి సేవించాలి. ఆ తరువాత మిగిలిన దానిని ఇతడు సేవించాలి. అయితే ఔషధాన్ని ముందుగా పుచ్చుకొన్న వ్యక్తి మరణిస్తాడు. మీరందరూ ఇతడికి కావలసిన వారే కదా! మీలో ఎవరో ఒకరు ఈ ఔషధాన్ని తప్పక సేవిస్తారనే అనుకుంటున్నాను. ఇతడి తల్లి, భార్య ఇంతగా గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారే! ఔషధం పుచ్చుకోవడానికి వీరికి నిశ్చయంగా ఎలాంటి సంకోచమూ ఉండబోదు’.
“ఆ మాట వినగానే వారందరూ ఏడుపు మాని ముఖముఖాలు చూసుకోసాగారు. ఆ వ్యక్తి తల్లి ‘ఇంత పెద్ద సంసారమే! నేను పోతే దీన్నంతా ఎవరు చూసుకుంటారు?’ అంటూ చింతాక్రాంతురాలై పోయింది. కొన్ని క్షణాల క్రితమే ‘అయ్యో, నాకేం కర్మ దాపురించింది!’ అంటూ విలపిస్తున్న భార్య ‘పోయే వాళ్ళెవరో పోయారు. నేను కనుక పోతే ఈ పసిపిల్లలను ఎవరు చూసుకుంటారు’ అని పలికి ఊరకుండిపోయింది.
“శిష్యుడు ఇదంతా చూస్తూ, వింటున్నాడు. అతడు వెంటనే లేచి నిలబడి, గురువుతో ఇలా అన్నాడు: ‘గురువర్యా! పదండి వెళదాం. నేను కూడా మీతోపాటు వచ్చేస్తాను.’ (అందరూ నవ్వారు)
“మరొక శిష్యుడు తన గురువుతో ఇలా అన్నాడు: ‘గురువర్యా! నా భార్య నన్ను ఎంతగానో సేవిస్తుంది. ఆమె కోసమే నేను సంసారం త్యజింపలేకుండా ఉన్నాను.’ ఆ శిష్యుడు హఠయోగం అభ్యసించేవాడు. శిష్యుడు తన భార్యను పరీక్షించడానికని గురువు అతడికి ఒక ప్రక్రియ నేర్పించాడు. ఒక రోజు అతడి ఇంట్లో ఏడ్పులు, పెడబొబ్బలు మొదలయ్యాయి. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి ఆ హఠయోగి (అంటే శిష్యుడు) ఆసనంపై కూర్చొని ఉన్నాడు; దేహమంతా వంకర్లు తిరిగి బిగుసుకుపోయి ఉంది. అందరూ అతడి ప్రాణం పోయిందనుకున్నారు. అతడి భార్య నేల మీద పడి విలపిస్తూ ఇలా అంటోంది. ‘అయ్యో, నాకు ఇదెక్కడి గ్రహచారం దాపురించింది! అయ్యో, మీరు మా కోసం ఏం కూడబెట్టారు! ఏం చేశారు! అమ్మల్లారా! అక్కల్లారా! ఇలా జరుగుతుందని నేనెన్నడూ ఊహించనైనా లేదే!’
“ఇంతలో బంధువులు వచ్చి శవాన్ని బయటకు తీసుకుపోవడానికి మంచం తెచ్చారు. కాని అప్పుడు వారికి ఒక ఇబ్బంది ఎదురయింది. శిష్యుడి దేహం వంకర్లు తిరిగి బిగుసుకుపోయి ఉండటం చేత ఇంటి ద్వారం గుండా దాన్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు, ద్వారం ఇరుకైపోయింది. అప్పుడు పొరుగింటి వ్యక్తి పరుగున వెళ్ళి ఒక గొడ్డలి తీసుకువచ్చాడు; దానితో ద్వారబంధం పగుల గొట్టసాగాడు. ఆ శబ్దం వినడంతో నేల మీద పడి విలపిస్తూన్న ఆ ఇల్లాలు పరుగెత్తుకుంటూ వచ్చింది. ఏడుస్తూనే, ‘ఏమయ్యా, మీరేం చేస్తున్నారు?’ అని అడిగింది. ‘ఈ దేహాన్ని బయటకు తీసుకుపోలేక పోతున్నాం. అందుకని ద్వార బంధాన్ని పగులగొడుతున్నాం’ అన్నారు వారు. అప్పుడు ఆ ఇల్లాలు ‘అయ్యో, అలాంటి పని మాత్రం చేయకండి. నే నిప్పుడు వితంతువునైపోయాను కదా! నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. పైగా ఈ పసికందును పెంచాలి. ఈ ద్వారాన్ని పగులగొట్టినట్లయితే మళ్ళీ కొత్తది చేయించే తాహతు నాకు లేదు. ఆయన నొసటి వ్రాత ప్రకారం ఆయనకు ఏం జరగాల్సి ఉందో అది జరిగింది. శవాన్ని బయటకు తీసుకువెళ్ళడానికి ఆయన కాళ్ళు చేతులు నరకండి’ అంది. అప్పుడు శిష్యుడు ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. అప్పటికి ఔషధ ప్రభావం తగ్గిపోయింది. భార్యతో ‘నీచురాలా, నా కాళ్ళూ చేతులు నరుకుతావా?’ అన్నాడు. అలా అంటూనే ఇల్లు విడిచిపెట్టి గురువుతో సహా వెళ్ళిపోయాడు. (అందరూ నవ్వారు.)
“అనేకమంది స్త్రీలు ఏడుస్తున్నట్లు నటిస్తారు. ఏడ్వవలసి వస్తుందని వారు ముందుగానే ముక్కునత్తును, తక్కిన ఆభరణాలన్నిటినీ తీసివేస్తారు; వాటిని ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి భద్రపరుస్తారు. ఆ తరువాత గుండెలు బాదుకుంటూ నేలమీద పడి ‘అమ్మల్లారా! అక్కల్లారా! చూడండి. నా కెక్కడి కర్మ దాపురించిందో!’ అంటూ విలపిస్తారు.”
40.9 నవమ పరిచ్ఛేదం అవతారవాదం – నరేంద్రుడు, గిరీశ్
నరేంద్రుడు: ఋజువు లేకుండా భగవంతుడు మానవరూపంలో అవతరిస్తాడని ఎలా విశ్వసించగలను?
గిరీశ్: విశ్వాసం అన్నదే దానికి ఋజువు. ఈ వస్తువు ఇక్కడ ఉందనడానికి ఋజువు ఏమిటి? విశ్వాసమే దానికి ఋజువు.
ఒక భక్తుడు: బాహ్యప్రపంచం అన్నది మనకు బాహ్యంలో ఉంటున్నదని తత్త్వవేత్తలు ఋజువు చేయగలిగారా? అది మన తిరుగులేని విశ్వాసం అని చెప్పి వదిలేశారే?
గిరీశ్ (నరేంద్రుడితో): భగవంతుడు నీ ముందుకువచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయన్ను విశ్వసించవు. ‘నేను భగవంతుణ్ణి, మానవ రూపంలో వచ్చాను’ అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు.
దేవతల అమరత్వం గురించిన ప్రస్తావన వచ్చింది.
నరేంద్రుడు: దానికి ఋజువు ఎక్కడుంది?
గిరీశ్: వారు నీ ఎదుట నిలబడ్డా సరే, నువ్వు నమ్మవు.
నరేంద్రుడు: వారు గత యుగాలలో కూడా ఉన్నారని నాకు ఋజువు కావాలి.
‘మ’ పల్టుతో ఏదో అన్నాడు.
పల్టు(నరేంద్రుడితో, నవ్వుతూ): అమరత్వానికి ఆది ఉండకూడదనే అవసరం ఏముంది? అమరులు కావాలంటే అంతం లేకుంటే చాలు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నరేంద్రుడు వకీలు పుత్రుడు. పల్టు డిప్టీ(డిప్యూటీ మేజిస్ట్రేటు) కుమారుడు.
యోగీన్ (నవ్వుతూ, గిరీశ్ తదితర భక్తులతో): ఇకమీదట ఈయన (శ్రీరామకృష్ణులు) నరేంద్రుడి మాటలతో ఏకీభవించరు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఒకసారి నేను చాతకపక్షి ఆకాశం నుండి పడే నీరు తప్ప మరే నీరు త్రాగదని చెప్పాను. ‘చాతకపక్షి మామూలు నీటిని కూడా త్రాగుతుం’ దని నరేంద్రుడన్నాడు. అప్పుడు నేను అమ్మతో, ‘అమ్మా, మరి నేను చెప్పే విషయాలన్నీ మిథ్యయేనా?’ అన్నాను. ఎంతో వ్యధకు లోనయ్యాను. కొన్నాళ్ళ తరువాత నరేంద్రుడు మళ్ళీ వచ్చాడు. గదిలో కొన్ని పక్షులు ఎగురుతుండటం చూసి ‘అదే!అదే !’ అంటూ అరిచాడు. ఏమిటని నేను అడగ్గా ‘అదే! చాతకపక్షి!’ అన్నాడు. చూడబోతే అవన్నీ గబ్బిలాలే! ఆ రోజునుండి అతడు చెప్పేది నేను అంగీకరించటం లేదు. (అందరూ నవ్వారు).
40.9.1 శ్రీరామకృష్ణుల దర్శనాలు చిత్తభ్రమలా?
“యదుమల్లిక్ తోటలో నరేంద్రుడు నాతో ‘మీరు చూసే భగవద్రూపాలన్నీ మీ చిత్తభ్రమలే’ అన్నాడు. నేను నిశ్చేష్టుడనయ్యాను. ‘అవన్నీ నాతో మాట్లాడుతాయి కూడా!’ అన్నాను. నరేంద్రుడు ‘ఆ, అలా అనుకోవచ్చు’ అన్నాడు. అప్పుడు నేను అమ్మ వద్దకు వెళ్ళి విలపించసాగాను. ‘అమ్మా! ఇదేమిటి, ఇలా అయిపోయిందేమిటి? మరి ఇదంతా అసత్యమేనా? నరేంద్రుడు అలా అన్నాడే?’ అని మొరపెట్టుకున్నాను. అప్పుడు నాకు దర్శనమైంది. చైతన్యం – అఖండ చైతన్యం – చైతన్యమయ రూపం. ఆ దైవీరూపం ఇలా అన్నది: ‘నువ్వు చెప్పేవన్నీ మిథ్య ఐనట్లయితే అవి వాస్తవాలతో ఎలా సరిపోలుతున్నాయి?’ అప్పుడు నేను నరేంద్రుడితో ‘ఏరా వెధవా, నువ్వు నాకు అపనమ్మకం పుట్టిస్తావా? ఇకపై నువ్విక్కడకు రావద్దు’ అన్నాను.”
40.9.2 శాస్త్రాలు – శబ్దార్థం, మర్మార్థం
మళ్ళీ చర్చ కొనసాగింది. నరేంద్రుడు వాదిస్తున్నాడు. నరేంద్రుడి వయస్సు ప్రస్తుతం 22 సంవత్సరాల నాలుగు నెలలు.
నరేంద్రుడు (గిరీశ్, ‘మ’ ప్రభృతులతో) : మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట ‘బ్రహ్మజ్ఞానం పొందనివాడికి నరకం ప్రాప్తిస్తుంది’ అని ఉంది. మళ్ళీ అందులోనే మరొకచోట ‘పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు’ అని ఉంది. మనుసంహితలో మనువు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యుక్లో తన మృత్యువును గురించే వర్ణించాడు.
“సాంఖ్య శాస్త్రం ప్రకారం ‘ఈశ్వరః సిద్ధః’ – అంటే ‘భగవంతుడు ఉన్నాడు’ అనే దానికి ఋజువు లేదు. మళ్ళీ, సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి, వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది.
“కాని ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చెయ్యండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టంవచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరించాలి? శ్వేతవర్ణం కాంతి ఎర్రటి స్ఫటికం ద్వారా వస్తే ఎర్రగానూ, పచ్చని స్ఫటికం ద్వారా వచ్చినప్పుడు పచ్చగానూ అగుపిస్తుంది.”
ఒక భక్తుడు: భగవంతుడే స్వయంగా గీతోపదేశం చేశాడు.
శ్రీరామకృష్ణులు: గీత సకలశాస్త్రాల సారం. సన్న్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది.
ఒక భక్తుడు: శ్రీకృష్ణుడే గీతోపదేశం చేశాడు.
నరేంద్రుడు: శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరయినా చేశారో?
నరేంద్రుడి పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరపోయారు!
శ్రీరామకృష్ణులు: మంచి వాదన జరుగుతోంది. శాస్త్రాలకు శబ్దార్థం, మర్మార్థం అని రెండు అర్థాలు ఉన్నాయి. మనం భగవంతుని వచనాలతో సరిపోలే మర్మార్థాన్ని మాత్రమే స్వీకరించాలి. ఉత్తరంలోని విషయాలకు, ఉత్తరం వ్రాసిన వ్యక్తి ముఖతా వెలువడే విషయాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. శాస్త్రాలు ఉత్తరంలో వ్రాయబడిన విషయాల వంటివి; భగవంతుడి వచనాలు ముఖతా వెలువడే పలుకులు. నేను అమ్మ ముఖతా వెలువడే పలుకులతో సరిపోలనిదే దేనినీ అంగీకరించను.
సంభాషణ ప్రస్తుతం భగవదవతారాల గురించి నడుస్తోంది.
నరేంద్రుడు: భగవంతుడిపై విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడ వ్రేలాడుతూ ఉన్నాడో నాకు అనవసరం. బ్రహ్మాండం అనంతం, అవతారాలూ అనంతమే.
‘బ్రహ్మాండం అనంతం, అవతారాలూ అనంతమే’ అన్న పలుకులు వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి “ఆహా!” అన్నారు.
‘మ’ భవనాథ్తో ఏదో అన్నాడు.
భవనాథ్: ‘ఏనుగును చూడనేలేదు. మరి అటువంటప్పుడు అది సూదిలో దూరిందో లేదో నా కెలా తెలుస్తుంది? భగవంతుడి గురించి నాకు తెలియదు. మరి ఆయన మానవ రూపంలో అవతరిస్తాడా లేదా అని తర్క విచారణల ద్వారా ఎలా తెలుసుకోగలం?’ అని మాష్టర్ మహాశయ్ (‘మ’) అంటున్నారు.
శ్రీరామకృష్ణులు: భగవంతుడికి అంతా సాధ్యమే. ఆయన గారడీ చేస్తాడు. గారడీవాడు కత్తిని మింగివేస్తాడు, మళ్ళీ బయటకు తీస్తాడు. అతడు రాళ్ళు రప్పలు కూడా మింగుతాడు.
40.10 దశమ పరిచ్ఛేదం కర్మకాండ – శ్రీరామకృష్ణుల బ్రహ్మజ్ఞాన స్థితి
ఒక భక్తుడు: ‘గృహస్థులు సంసార బాధ్యతలు నిర్వర్తించవలసిందే. వారు వాటిని పరిత్యజించరాదు’ అని బ్రహ్మసమాజస్థులు బోధిస్తారు.
గిరీశ్: సులభ్ సమాచార్ పత్రికలో ఆ విధంగా వ్రాసి ఉండటం నేను చూశాను. కాని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చేయవలసిన కర్మలే సరిగ్గా చేయ లేకపోతున్నాం. దానికి తోడు సాంసారిక కర్తవ్యాలు కూడా నిర్వర్తించాలట!
శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి ‘మ’ వంక చూస్తూ కళ్ళతో ‘ఇతడు చెప్పింది వాస్తవమే’ అన్నట్టు సైగ చేశారు.
కర్మకాండ నిర్వర్తించడమనేది చాలా కష్టమైనదని ‘మ’ అర్థం చేసుకున్నాడు.
ఇంతలో పూర్ణుడు వచ్చాడు.
శ్రీరామకృష్ణులు: మే మిక్కడ ఉన్నట్లు నీ కెవరు చెప్పారు?
పూర్ణుడు: శారదాప్రసన్న.
శ్రీరామకృష్ణులు (భక్తురాండ్రతో): ఇతడికి తినడానికి ఏమైనా ఇవ్వండి.
ప్రస్తుతం నరేంద్రుడు పాడటానికి సిద్ధమవుతున్నాడు. శ్రీరామకృష్ణులు, భక్తులు అతడి పాట వినడానికి కుతూహల పడుతున్నారు. నరేంద్రుడు పాడటం మొదలుపెట్టారు:
ఆసన్నమైన నీదు పిడుగు
పాటొకటి నిర్ణయించు (పాలించును)
పచ్చగడ్డి బయలులను
గుట్టలను ఆకసమును ॥ ఆ ॥
దేవదేవ! ధర్మరాజ!
మహాకాల! మహాశూన్య
దివ్యపురుష! త్రాహిప్రభో!
ఘోరపాపహారి శివ! ॥ ఆ ॥
* * *
మధురం మధురం నీ శుభనామం
మధురం మధురం నీ నామం
దీనజనావన దీనశరణ్యా…..
మళ్లీ నరేంద్రుడు ఒక పాట పాడాడు.
అతడే గతియని
ప్రేమతో నాతని
అర్చన సేయుము ఓ మనసా!
అసలే తలచవు
అతని నెందుకు
ఆపదలన్నియు
హరియించునుగా
భ్రాంతిచె మోసము
బడి మరచెదవు
నిన్నే నీవు ఓ మనసా!
ఇటనే బండార
మున్నదనుకొని
ఇంత వ్యామోహము
లోకాటవిపై
సఖులు, సంపద
చాలాకాలము
నీకడ నిలుపగా
రావే మనసా!
అసలే ఆతని
మరచెదవేమొ
భద్రము సుమ్మ ఓ మనసా!
సత్యము కొలువు
మసత్యము విడుమీ
జీవిత మందలి
దిగులు నశించును
యెదలో నిలుపుము
నే వచియించిన
మంచి మాటను ఓ మనసా!
గళమెత్తుచు ప్రభు
హరి నామమును
గానము చేయుము ఓ మనసా!
భవసాగరమును
తరియించెదవు
దుష్టకామముల
తొలగించినచో
తను, మన, జీవన
ముల నాతని
కర్పణ చేయుము ఓ మనసా!
పల్టు: ఆ పాట పాడరా?
నరేంద్రుడు: ఏ పాట?
పల్టు: ‘దేవదయాళో దేవ కృపాళో.’
నరేంద్రుడు పాడసాగాడు:
దేవదయాళో దేవ కృపాళో
దేవదేవ జయదేవకృపాళో
దేవకృపాళో దేవదయాళో
దేవదేవ జయ దేవదయాళో ॥ దే ॥
ప్రేమపూర్ణమై అనుపమేయమగు
నీ ముఖమెప్పుడు వీక్షించెదనో
భవభయ బాధల పాపతాపముల
భయ మిక నా కెటనున్నది ఓ ప్రభూ! ॥ దే ॥
ప్రభాతభానుని ప్రథమ కిరణము
చీకటు లెల్లను చిమ్మివేయుగతి
హృదయ మధ్యమున విస్తరిల్లు నీ
దివ్యప్రకాశము తీర్చు దుఃఖములు ॥ దే ॥
ఆ ప్రకాశము మధురాంజనమై
పలువిధ బాధల బహుళ దుఃఖముల
నఖ ముఖములను నాల్గు దిక్కులను
చెదరగొట్టి చేకూర్చు శాంతిని ॥ దే ॥
(నీ) దయాపరతను కరుణాళుతను
హృదయ కుహరమున యోచించగనే
అణచరాని ఆనందబాష్పములు
చేరి చెంపల కారు ధారలుగ ॥ దే ॥
దేవదయాళో దేవకృపాళో
చాటెద నీ పరిపూర్ణ కరుణను
నీదు పనుల నెరవేర్చుచుండగా
పోవుగాక నా ప్రాణవాయువు ॥ దే ॥
‘మ’ కోరగా నరేంద్రుడు మళ్ళీ పాడాడు. ‘మ’, భక్తులలో పలువురు చేతులు జోడించి వినసాగారు.
బ్రహ్మానందపు మధుమత్తతలో
మత్తిలుచుండవె ఓ మనసా!
భువిపై దొరలుచు పొరలుచు నేడ్చుచు
హరిని భజింపవె ఓ మనసా…..
నరేంద్రుడు మళ్ళీ పాడసాగాడు:
మనసా చేయుము మాధవు ధ్యానము
నిత్య నిరంజను నిర్మలాత్ముని
ఎంత నిరుపమం బాతని తేజము
ఎంత మోహనం బాతని రూపము….
ఆ తరువాత నరేంద్రుడు మరో పాట పాడాడు:
ధన్యుడవు ధన్యుడవు ధన్యుడవు దేవ నీవు
అంతులేదు అద్భుతంబు
జగము నీదు చేతిపనియె
దేవదేవ ఈ విశ్వము ॥ వే ॥
నీదు ఇంపుసొంపు లనెడు
నిధులతోడ నిండియుండె
లోకమెల్ల దేవదేవ ॥ వే ॥
పైడి కంఠమాలలోని
మణుల వలెను మెరయుచుండు
లెక్కలేని చుక్కలెన్నొ
మిణుకు మిణుకు మిణుకు మనుచు ॥ వే ॥
సోమ సూర్యు లెన్ని వేలు
పైన పైన నున్నవాని
ఎన్నడైన ఎన్నగలరె ॥ వే ॥
పొరలిపోవు ధాన్యములతొ
రాసులైన సంపదలతొ
పులకరించు పుడమి తల్లి ॥ వే ॥
నరేంద్రుడు మరొకపాట పాడాడు:
నీలిగగన పళ్లెమందు నిలచి జ్యోతులూ
కాంతులీని వెలుగుచుండె సూర్యచంద్రులూ
మిణుకు మిణుకు మనుచు వెలుగు రత్నతారలూ
నీదు చకిత రూపమునకు తొడుగు ఉడుపులూ….
నరేంద్రుడు కొనసాగించాడు:
పరిశుద్ధాత్ముడు ప్రధాన పురుషుడు
కారణ కారణు డనాది నిత్యుడు
నరుడా నీ మది నాతని యందు
చేర్చి గట్టిగా బిగియగట్టుము
ప్రాణరూపుడై చెలగి సర్వమున
అనంత విశ్వము నావరించును…..
నారాయణ్ కోర్కె మేరకు నరేంద్రుడు పాడసాగాడు:
అమ్మా రమ్మా బంగరుబొమ్మా
రమ్మా హృదయము రంజిలునమ్మా
నా హృదయములో నిలువగదమ్మా
నీ ముఖవీక్షణ చేయుదునమ్మా ॥ అ ॥
అయ్యయ్యయ్యో అతికష్టముతో
జననమాదిగా నే పడు బాధలు
తెలియగదమ్మా నను గన్నమ్మా
నిను తిలకించుచు వాని భరించితి ॥ అ ॥
తెరువగదమ్మా నీ హృదిపద్మము
తెలుపుము నీ నిజతత్వమందున
నా ప్రియజననీ భాగ్యదాయినీ
మనోరంజనీ! ముక్తిప్రదాయిని! ॥ అ ॥
తరువాత నరేంద్రుడు తానుగా ఎంచుకొన్న ఈ పాట పాడాడు:
రూపులేని నీ అందము
దట్టమైన చీకటిలో
మెరయుచు స్పందించుచుండె
అందువలన అంధకార
కొండగుహన యోగివరులు
ధ్యానింతురు నిన్ను జనని……
ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు గాఢ సమాధిమగ్నులయ్యారు. నరేంద్రుడు మళ్ళీ పాడాడు:
బ్రహ్మానందపు మధుమత్తతలో
మత్తిలుచుండవె ఓ మనసా…..
శ్రీరామకృష్ణులు భావావస్థలో ఉన్నారు; గోడకు ఆనుకొని ఉత్తరాభిముఖులై కాళ్ళు ఊపుతూ దిండుపై కూర్చున్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. భావావస్థలో ఆయన జగజ్జననితో ఇలా మాట్లాడసాగారు: “ప్రస్తుతం నేను ఇక్కడే భోజనం చేసి వెళతాను. నువ్వు వచ్చావా? నువ్వు మూటామల్లె సర్దుకొని చోటు నిశ్చయించుకొని వచ్చావా?” మళ్ళీ ఇలా కొనసాగించారు: “ప్రస్తుతం నాకు ఎవరి సాంగత్యమూ రుచించటం లేదు. అమ్మా, నేను పాట లెందుకు వినాలి? అవి మనస్సును కాస్త వెలుపలకు తీసుకు వస్తాయి.”
శ్రీరామకృష్ణులు భావావస్థనుండి క్రమంగా బాహ్యచైతన్యంలోకి వస్తున్నారు. భక్తులవంక చూస్తూ ఇలా అన్నారు: “చేపలను ప్రాణంతో నీటి కుండలో పెట్టేవారిని చూసి మొదట్లో నేను ఆశ్చర్యపోయేవాణ్ణి. ‘వీళ్ళు ఎంతటి క్రూరులు. తరువాత ఈ చేపలను చంపేస్తారు’ అనుకొనేవాడిని. తరువాత నా స్థితి మారి పోయినప్పుడు ఈ శరీరాలు కేవలం దిండు గలీబులుగా మాత్రమే తోచేవి, అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒక్కటే.
భవనాథ్: మరి అలాంటప్పుడు మనిషిని హింసిస్తే పాపం చుట్టుకోదా? చంపవచ్చా?
శ్రీరామకృష్ణులు: ఆ, ఆ స్థితిని పొందినట్లయితే అది సాధ్యమే. అది బ్రహ్మజ్ఞాన స్థితి. ఆ స్థితి అందరికీ కలుగదు.
“సమాధి స్థితి నుండి ఒకటి రెండు మెట్లు క్రిందకు దిగివచ్చినప్పుడు మాత్రమే భక్తి – భక్తుల సాంగత్యం రుచిస్తుంది.
“భగవంతుడిలో విద్య, అవిద్యలు రెండూ ఉన్నాయి. విద్యామాయ మనిషిని భగవంతుని దిశగా తీసుకువెళుతుంది; అవిద్యామాయ భగవంతుడి నుండి దూరంగా తీసుకుపోతుంది. జ్ఞానం, భక్తి, దయ, వైరాగ్యం– ఇవన్నీ విద్యా మాయ లోనివి. వీటన్నిటినీ ఆశ్రయించుకోవడం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అలాంటి వ్యక్తి మరో మెట్టు ఎక్కగానే భగవంతుణ్ణి చేరుకుంటాడు, బ్రహ్మజ్ఞానం పొందుతాడు. ఆ స్థితిలో భగవంతుడే సమస్తం అయివున్నాడని యథార్థంగా బోధపడుతుంది; యథార్థంగా చూడవచ్చు. త్యాజ్యగ్రాహ్య భావాలు (అంటే ఇది త్యజింపదగ్గది, ఇది స్వీకరింప తగ్గది అన్న భావాలు) ఉండవు. అతడు ఎవరి మీదా కోపగించుకోనూ లేడు.
“ఒక రోజు బండిలో పోతున్నప్పుడు ఒక ఇంటి వసారాలో ఇద్దరు వేశ్యలు నిలబడి ఉండటం చూశాను. వారిని సాక్షాత్తూ జగజ్జనని స్వరూపిణులుగా గాంచాను. వారిని అలా చూసి ప్రణామం చేశాను.
“మొట్టమొదట అలాంటి స్థితి కలిగినప్పుడు నేను కాళీమాతను పూజించటం, ఆమెకు నైవేద్యం సమర్పించడం చేయలేకపోయాను. ఆలయ నిర్వహణాధికారి ‘పూజారి నైవేద్యం సమర్పించకుంటే మరేం చేస్తాడట’ అంటూ అవమానకరంగా ఏదో మాట్లాడాడని హలధారి, హృదయ్‌లు వచ్చి చెప్పారు. అది విని నేను కేవలం నవ్వాను, కొంచెం కూడా కోపం కలుగలేదు. ఈ బ్రహ్మజ్ఞానం సిద్ధించుకొన్న పిదప భగవల్లీలను ఆస్వాదిస్తూ తిరగండి. ఒక సాధువు ఒక నగరంలో చూడదగ్గ స్థలాల నన్నిటినీ చూస్తున్నాడు. దారిలో అతడికి మునుపే పరిచయం ఉన్న మరొక సాధువు తారసపడ్డాడు. రెండవ సాధువు మొదటి సాధువుతో ఇలా అన్నాడు: ‘ఏమయ్యా, నువ్వు నగరమంతా అంత ఉల్లాసంగా తిరుగుతున్నావు కదా! నీ మూటామల్లె ఎక్కడ? వాటిని ఎవరైనా దొంగలించడమైతే జరుగలేదు కదా!’ అందుకు మొదటి సాధువు ‘లేదు, లేదు. నేనొక సత్రంలో గది తీసుకున్నాను. మూటామల్లె అక్కడ సర్దిపెట్టి గదికి తాళం వేశాను. ప్రస్తుతం ఇలా నగరంలోని వింతలను చూస్తూ తిరుగుతున్నాను’ అన్నాడు.” (అందరూ నవ్వారు)
భవనాథ్: ఇవి అత్యున్నత స్థితికి చెందిన విషయాలు.
‘మ’ (స్వగతంలో): బ్రహ్మజ్ఞానానంతరం భగవల్లీలను చవి చూడడం! సమాధి స్థితి పొందాక సాధారణ స్థితికి దిగిరావడం!
శ్రీరామకృష్ణులు (‘మ’, తదితరులతో): బ్రహ్మజ్ఞానం అంత సులువుగా లభిస్తుందా ఏమిటి? మనస్సు నశించకుండా అది సాధ్యం కాదు. గురువు శిష్యుడితో ‘నువ్వు నీ మనస్సును నా కివ్వు. నేను నీకు జ్ఞానం ప్రసాదిస్తాను’ అన్నాడు. నాంగ్టా ‘మనస్సును విచ్చలవిడిగా తిరుగనీయవద్దు’ అనేవాడు.
40.10.1 జగత్తు, అహంకారం – కుండలు, సూర్యుడు దృష్టాంతం
“ఈ స్థితిలో కేవలం భగవత్ప్రసంగాలు, భక్తుల సాంగత్యం మాత్రమే రుచిస్తాయి.
(రామ్‌తో) “నువ్వు డాక్టరువు కదా! ఔషధం రక్తంలో కలసి దానితో ఏకమైనప్పుడే కదా ఔషధం పనిచేస్తుంది. అదే విధంగా ఆ స్థితిలో బ్రహ్మజ్ఞాని లోపలా వెలుపలా భగవంతుణ్ణి దర్శిస్తాడు; భగవంతుడే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మలుగా అయివున్నట్లు దర్శిస్తాడు.”
‘మ’ (స్వగతం): విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, జీర్ణించు కోవడం.
శ్రీరామకృష్ణులు: మనస్సు నశించగానే బ్రహ్మజ్ఞాన స్థితి కలుగుతుంది. మనస్సు నశించినప్పుడే ‘నేను’, ‘నేను’ అంటూ ఉండే ‘అహం’ నశించిపోతుంది. ఈ స్థితి భక్తిమార్గం ద్వారానూ కలుగుతుంది, జ్ఞానమార్గం అంటే విచారణామార్గం ద్వారా కూడా కలుగుతుంది. జ్ఞానమార్గగాములు ‘నేతి, నేతి’ అంటే ‘ఇదంతా మాయ, స్వప్నం లాటిది’ అంటూ విచారణ చేస్తారు. ఈ జగత్తును ‘నేతి, నేతి’ అంటూ జగత్తును మాయగా తృణీకరిస్తారు. జగత్తు మాయమైనప్పుడు మిగిలేది జీవులే, అంటే ‘అహంకారాలే’.
“అహంకారాన్ని ఒక కుండతో పోల్చవచ్చు. నీటితో నిండి ఉన్న కుండలు పది ఉన్నాయనుకుందాం. వాటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. అప్పుడు మనకు ఎందరు సూర్యులు కానవస్తారు?”
ఒక భక్తుడు: పది బింబాలు కనిపిస్తాయి. అసలు సూర్యుడు ఉండనే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: సరే, వాటిలో ఒక కుండను పగులగొడితే ఎందరు సూర్యులు కనిపిస్తారు?
భక్తుడు: తొమ్మిది; యథార్థ సూర్యుడు ఒకడు ఉండనే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: సరే, తొమ్మిది కుండలనూ పగులగొడితే ఎందరు సూర్యులను చూడవచ్చు.
భక్తుడు: ఒక సూర్యబింబం, ఒక యథార్థ సూర్యుడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఆఖరి కుండను కూడా పగలగొడితే ఏం మిగులుతుంది?
గిరీశ్: ఆ యథార్థమైన సూర్యు డొక్కడేనండి.
శ్రీరామకృష్ణులు: అది కాదు. అప్పుడు ఏదైతే ఉంటుందో దానిని నోటితో చెప్పజాలం. ఏదైతే ఉందో అదే ఉంది. ప్రతిబింబ సూర్యుడు లేకుంటే యథార్థ సూర్యుడు ఉన్నట్లు ఎలా తెలుసుకోగలవు? సమాధి స్థితిని పొందిన తరువాత ‘అహం’ తత్త్వం నాశనమవుతుంది. సమాధి స్థితి నుండి క్రిందకు దిగివచ్చిన వ్యక్తి అక్కడ ఏం చూశాడో నోటితో చెప్పజాలడు.
40.11 ఏకాదశ పరిచ్ఛేదం భక్తులకు అభయప్రదానం
సంధ్యాకాలం అయింది. బలరామ్ ఇంటి ముంగిటి గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. ఆయన చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భావావస్థలోనే): ఇక్కడ వేరే ఎవరూ లేరు. కాబట్టి మీకు ఈ విషయం చెబుతున్నాను. హృదయాంతరాళాల నుండి భగవంతుణ్ణి తెలుసుకోవాలని కోరుకొనేవాడు ఆయన్ను తప్పక పొందుతాడు; ఆయన్ను పొంది తీరుతాడు. భగవంతుడి కోసం పరితపించిపోయి ఆయన తప్ప అన్యమైనది ఏదీ కోరనివాడు ఆయన్ను పొంది తీరుతాడు.
“ఈ చోటుకు చెందిన వాళ్ళు (అంటే, ఆంతరంగిక భక్తులు) అందరూ వచ్చేశారు. ఇకమీదట వచ్చే వాళ్ళందరూ బయటివాళ్ళే. వారుకూడా అప్పుడప్పుడు వస్తూంటారు. అమ్మ వారికి ‘ఇలా చెయ్యి. ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించు’ అని ఆదేశాల నిస్తుంది.
“జీవుడి మనస్సు భగవంతుడివైపు మరలదు ఎందుకని? భగవంతుడి కంటే ఆయన మహామాయ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. జడ్జిగారికంటే ఆయన బంట్రోతు శక్తి ఎక్కువ. (అందరూ నవ్వారు)
40.11.1 భువనమోహన మాయ – శ్రీరాముడు, నారదుడు
“శ్రీరాముడు, నారదుడితో, ‘ఓ నారదా, నేను నీ స్తోత్ర పాఠాలతో ప్రసన్నుడినయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. అందుకు నారదుడు ‘ప్రభో! నీ పాదపద్మాలపై శుద్ధభక్తి కలిగేలా, నీ భువన మోహన మాయలో నేను మైమరవకుండా ఉండేలా అనుగ్రహించు’ అన్నాడు. రాముడు ‘తథాస్తు. ఇంకా ఏమైనా కోరుకో’ అన్నాడు. ‘ప్రభో! ఇంక వేరే ఏమీ అక్కరలేదు’ అన్నాడు నారదుడు.
“ఈ భువనమోహన మాయలో అందరూ మైమరచి ఉన్నారు. భగవంతుడు మానవరూపం ధరించినప్పుడు ఆయన కూడా దీన్లో మైమరచిపోతాడు. శ్రీరాముడు సీతకోసం విలపిస్తూ అటూ ఇటూ తిరుగుతూండేవాడు. ‘పంచభూతముల బంధనములో బ్రహ్మము చేసెను ఆక్రందనము.’
“కాని మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి – భగవంతుడు సంకల్ప మాత్రానే ముక్తుడు కాగలడు.
భవనాథ్: రైల్వే గార్డు రైలుపెట్టెలో తలుపు వేసుకొని కూర్చుంటాడు. మళ్ళీ ఇష్టపడితే తలుపు తీసుకొని బయటకు వస్తాడు.
శ్రీరామకృష్ణులు: అవతారపురుషులలా ఈశ్వరకోటికి చెందినవారు సంకల్పమాత్రానే ముక్తులు కాగలరు. కాని జీవకోటికి చెందినవారు ఆ విధంగా ముక్తి పొందలేరు. జీవులు కామినీ కాంచనాలలో బద్ధులై ఉన్నారు. గది తలుపులు, కిటికీలు అన్నీ మరమేకులతో బిగించినట్లయితే వారు బయటకు ఎలా రాగలరు?
భవనాథ్ (నవ్వుతూ): రైలులోని మూడవ తరగతి ప్రయాణీకుల్లా. వారున్న పెట్టెకు తాళం వేసినప్పుడు వారు బయటకు రాలేరు.
40.11.2 భగవంతుడే గురువు
గిరీశ్: జీవుడు ఈ విధంగా అన్ని వైపుల నుండి బంధింపబడి ఉన్నట్లయితే మరి అతడి గతి ఏమిటి?
శ్రీరామకృష్ణులు: అయితే భగవంతుడు స్వయంగా గురువు రూపంలో వచ్చి మాయాపాశాలను త్రెంచివేసినట్లయితే, మరి భయపడే పనిలేదు.
జీవుల మాయాపాశాలను త్రెంచివేయడానికి ఈసారి కూడా భగవంతుడు గురువు రూపంలో వచ్చాడని శ్రీరామకృష్ణులు చెబుతున్నారా ఏమిటి?