39.1 పథమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల సాధనలు స్వీయ వచనాలలో
ఆదివారం, ఏప్రిల్ 12, 1885
సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరామ్బోసు ఇంటికి విచ్చేశారు. ఇంటి అతిథుల గదిలో గిరీశ్, చిన్న నరేంద్రుడు, పల్టు, ద్విజుడు, పూర్ణుడు, మహేంద్ర ముఖర్జీ తదితర భక్తులతో ఆసీనులయ్యారు. కాసేపటి తరువాత త్రైలోక్యనాథ్ సన్యాల్, జయగోపాల్ సేన్ తదితర బ్రహ్మసమాజస్థులు కూడా వచ్చారు. కొందరు భక్తురాండ్రు కూడా వచ్చి ఉన్నారు. వారు తెరవెనుక కూర్చుని ఉన్నారు. వారిలో మోహినీ మోహన్ భార్యకూడా ఉంది. పుత్రశోకంతో ఆమెకు దాదాపు పిచ్చే పట్టింది. ఆమెలాగానే మానసిక వ్యధతో మరికొందరు, శ్రీరామకృష్ణుల వద్ద మనఃశాంతిని పొందగోరి అక్కడకు వచ్చి ఉన్నారు.
‘మ’ మూడు గంటలకు వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భక్తులకు తమ సాధనలు గురించి, తాము పొందిన పలు రకాల అనుభూతుల గురించి వివరిస్తున్నారు. ‘మ’ శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ఆదేశానుసారం ఆయనకు సమీపంలో కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సాధనావస్థలో నేను ధ్యానం చేస్తున్నప్పుడల్లా నిజంగానే ఒక వ్యక్తి శూలం చేతబట్టుకొని సమీపంలో కూర్చుని ఉన్నట్లు గాంచేవాడిని. అతడు నన్ను ఇలా భయపెట్టేవాడు: ‘మనస్సును భగవంతుని పాదపద్మాలలో కనుక లగ్నం చేయకపోతే శూలంతో పొడిచి చంపేస్తాను. మనస్సు కనుక స్థిరంగా ఉండకపోతే ఈ శూలం నీ ఛాతిలోకి దిగిపోతుంది!’
39.1.1 నిత్యం, లీల – పురుషుడు, ప్రకృతి
ఒక్కోసారి అమ్మ నా మనస్సును నిత్యం నుండి లీలకు తీసుకువచ్చేది, మళ్ళీ లీల నుండి నిత్యానికి కొనిపోయేది.
మనస్సు లీలా స్థితిలోకి దిగివచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో రాత్రింబవళ్ళు సీతారాముల గురించే చింతన చేసేవాడిని; సర్వదా సీతారాముల రూప దర్శనాలు కలుగుతూ ఉండేవి. ఎల్లవేళలా రామ్‌లాలాను* చేతపుచ్చుకొని తిరిగేవాడిని. అతడికి ఒక్కోసారి స్నానం చేయించేవాడిని, మరోసారి అన్నం తినిపించేవాడిని.
రామ్‌లాలా
“మళ్ళీ, ఒక్కోసారి రాధాకృష్ణుల భావంలో ఉండేవాడిని; సర్వదా అవే రూపాల్ని దర్శించేవాడిని. లేకుంటే మళ్ళీ ఒక్కోసారి గౌరంగుడి భావంలో నిమగ్నమై ఉండేవాడిని. అది పురుషుడు, ప్రకృతి – రెండు భావాల సమ్మేళనం. ఆ స్థితిలో సర్వదా గౌరాంగుని రూపదర్శనమే కలుగుతూ ఉండేది.
“ఆ తరువాత నా మనోస్థితి మారిపోయింది. అప్పుడు మనస్సు లీలను వదలిపెట్టి నిత్యానికి ఎగసింది. ఆ స్థితిలో తులసిచెట్టు, మునగచెట్టు రెండూ ఒకేలా తోచాయి. అటుపైన దైవీరూపాలు రుచించలేదు. అవి వస్తూ పోతూ ఉండేటివేనని నాకు నేనే నచ్చచెప్పుకున్నాను. అప్పుడు వాటిని నా మనస్సు నుండి తొలగించివేశాను. గదిలో ఉన్న దేవుళ్ళ పటాలు, చిత్తరువులు అన్నిటినీ తీసివేశాను. ఆదిపురుషుడైన ఆ అఖండ సచ్చిదానందుణ్ణి గురించి మాత్రమే చింతన చేయసాగాను. ఆ పురుషుడికి నేను దాసిననే భావంతో ఉండేవాడిని.
“నేను అన్ని రకాల సాధనలూ అనుష్ఠించాను. సాత్విక, రాజసిక, తామసిక మని సాధనలు మూడు రకాలు. సాత్విక సాధనలో సాధకుడు వ్యాకులచిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు, లేకుంటే ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉంటాడు; ఎటువంటి ఫలాపేక్షా ఉండదు. రాజసిక సాధనలో పలురకాల క్రియలు చేయవలసి ఉంటుంది – ఇన్నిసార్లు పురశ్చరణం చేయాలి, ఇన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలి, పంచాగ్ని తపస్సు అనుష్ఠించాలి, షోడశోపచార పూజ చేయాలి మొదలైనవి. తామసిక సాధనలో తమోగుణాన్ని ఆశ్రయించుకొని సాధన చేస్తారు. అటువంటి సాధకులు ఇలా అంటూంటారు: ‘జై కాళీ! ఏమిటీ, నువ్వు నాకు దర్శనం ఇవ్వవా? నువ్వు కనుక దర్శనం ఇవ్వకపోతే కత్తితో నా గొంతు కోసుకుంటాను!’ తాంత్రిక సాధనలలో లాగానే ఈ సాధనలో విధి విహితాలు అంటూ ఏవీ ఉండవు.
“సాధనావస్థలో నేను అద్భుత దర్శనాల నన్నింటినీ గాంచాను. ఆత్మయొక్క సంగమాన్ని ప్రత్యక్షంగా చూసేవాడివి. నాలాంటి రూపంగల మనిషి ఒకడు నా శరీరంలోకి ప్రవేశించి ఆరు పద్మాలలోని ప్రతి పద్మంతోనూ రమించేవాడు. ఆరు పద్మాలు ముడుచుకొని ఉండేవి. అతడు రమించడంతో ప్రతి పద్మం విచ్చుకొని ఊర్ధ్వముఖమై పోయేది. ఈ విధంగా మూలాధార, స్వాధిష్ఠాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార పద్మాలన్నీ విచ్చుకునేవి. అధోముఖంగా ఉన్నవి ఊర్ధ్వముఖమై పోవడం ప్రత్యక్షంగా దర్శించాను.
39.1.2 ధ్యాన యోగం – ‘నివాత నిష్కంపమివ ప్రదీపమ్’ – చేపలు పట్టే వ్యక్తి కథ
“సాధనా సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు, గాలిలేని చోట నిశ్చలంగా ఉన్న దీపశిఖ భావాన్ని ఆరోపింపజేసుకొనేవాడిని.
“ప్రగాఢ ధ్యానంలో బాహ్యజ్ఞానం ఉండదు. ఒక వేటగాడు పక్షినొకదానికి గురిపెట్టాడు. ఆ సమయంలో పెళ్ళి ఊరేగింపు ఒకటి మేళతాళాలతో, బంధుగణంతో, గుఱ్ఱబ్బండ్లతో ఆ దారిన వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఊరేగింపు చాలా సేపటివరకు వేటగాడి ప్రక్కనుంచే వెళ్ళింది. కాని అతడికి వీటన్నిటి గురించిన ఎరుకే లేదు. తన ప్రక్కనుండే పెండ్లికుమారుడు వెళ్ళాడన్న సంగతి అతడికి తెలియనేలేదు.
“ఒక వ్యక్తి ఒంటరిగా చెరువు ఒడ్డున చేపలు పట్టడానికి కూర్చున్నాడు. చాలాసేపటి తరువాత గాలానికి కట్టిన బెండు కదలాడసాగింది. మధ్య మధ్యలో అది నీటిలోకి మునుగుతోంది. అప్పుడు చేప, ఎరను తినడానికి ప్రయత్నిస్తోందని ఆ వ్యక్తి గ్రహించాడు. దానిని పట్టడానికని అతడు కర్రను ఒక్క ఉదుటున లాగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక బాటసారి అతడి వద్దకు వచ్చి, ‘అయ్యా, ఫలానా పంతులుగారి ఇల్లు ఎక్కడ?’ అని అడిగాడు. చేపలు పట్టే వాడినుండి ఎటువంటి జవాబు రాలేదు. ఆ సమయంలో అతడు గాలాన్ని లాగి వేయటానికి సరియైన అదనుకోసం ఎదురు చూస్తున్నాడు. బాటసారి మళ్ళీ మళ్లీ అతడితో బిగ్గరగా ‘అయ్యా, ఫలానా పంతులుగారి ఇల్లు ఎక్కడ ఉందో చెబుతారా?’ అంటూ అడుగుతున్నాడు. కాని ఆ వ్యక్తికి దీన్ని గురించిన ఎరుక లేనేలేదు. అతడి చేతులు కంపిస్తున్నాయి; దృష్టి యావత్తు బెండుపైనే ఉంది. చివరకు బాటసారి విసుక్కుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతడు ఆ విధంగా చాలాదూరం వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ బెండు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో చేపలు పట్టేవాడు ఒక్క ఉదుటున గాలాన్ని పైకి లాగి చేపను బయటపడవేశాడు. అప్పుడతడు తువ్వాలుతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని దూరంగా వెళుతున్న బాటసారిని ‘ఏమయ్యా, ఇటు తిరిగి చూడు’ అంటూ ఎలుగెత్తి పిలిచాడు. బాటసారి అతడి కేకలు లక్ష్యపెట్టక తన దారిన తాను వెళ్ళసాగాడు. కాని ఆ వ్యక్తి పలుమార్లు కేకలు పెట్టడంతో బాటసారి అతడి వద్దకు తిరిగివచ్చి ‘ఏమయ్యా, ఎందుకు నన్ను అంతగా పిలుస్తున్నావు?’ అని అడిగాడు. అందుకతడు ‘ఇందాక నువ్వు నన్ను ఏదో అడుగుతున్నట్టున్నావే?’ అన్నాడు. ఆ బాటసారి ‘అప్పుడు అన్నిసార్లు పిలిచినా బదులు పలుకలేదు కాని ఇప్పుడు, ఏమిటి సంగతి? అంటూ ప్రశ్నిస్తున్నావే?’ అన్నాడు. ‘ఆ సమయంలో బెండు మునగడానికి సిద్ధంగా ఉంది, అందువల్ల అప్పుడు నువ్వు చెప్పింది ఏదీ వినలేకపోయాను’ అన్నాడు ఆ చేపలు పట్టేవాడు.
“ధ్యానంలో ఇటువంటి ఏకాగ్రత సాధ్యమే. ఆ సమయంలో అన్యమైనది ఏదీ కనిపించదు, వినపించదు కూడా. స్పర్శజ్ఞానం కూడా ఉండదు. శరీరంపై పాము ప్రాకుతూ ఉండవచ్చు, కాని అతడికి ఆ విషయం తెలియనైనా తెలియదు. ఆ ఎరుక ధ్యానిస్తున్న వ్యక్తికీ ఉండదు, పాముకు కూడా ఉండదు.
“ధ్యానం ప్రగాఢమైనప్పుడు ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి. మనస్సు బహిర్ముఖం కాదు. ఇది ఇంటి తలుపులను మూసివేయడంలాంటిది. రూప, రస, గంధ, స్పర్శ, శబ్దాలనే ఐదు ఇంద్రియ విషయాలు బయటనే పడివుంటాయి.
“ధ్యానం చేసేటప్పుడు ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ సాధకుడి ఎదుటకు వస్తాయి. కాని ధ్యానం ప్రగాఢం అయ్యాక అవి మరి రాజాలవు; బయటే పడివుంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎన్ని రకాల దర్శనాలను గాంచేవాడినని! ధనరాశి, శాలువ, ఒక పళ్ళెంనిండా మిఠాయిలు, ముక్కునత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు – వీటినన్నిటినీ ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు నా మనస్సును ఇలా ప్రశ్నించాను: ‘ఓ మనస్సా! వీటిలో నువ్వు దేనిని కోరుకుంటావు? దేనినైనా అనుభవించా లనుకుంటే చెప్పు.’ మనస్సు ‘వద్దు, నాకు ఏదీ వద్దు; భగవంతుడి పాదపద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కరలేదు’ అని బదులు పలికింది. గాజు అల్మారాలోని వస్తువుల నన్నింటినీ బయటనుండే చూసినట్లు ఆ స్త్రీల లోపలా, బయటా, సమస్తమూ చూశాను. వారిలో నేను మలమూత్రాలు, ప్రేగులు, రక్తం, క్రిములు, కఫం ఇత్యాదులన్నింటినీ చూశాను.”
39.1.3 సిద్ధులను కోరుకొనేది హీనులే – ‘గురుగిరి’
శ్రీరామకృష్ణుల నామం పలికి రోగాలు నయం చేయగలనని గిరీశ్ ఘోష్ అప్పుడప్పుడు చెబుతుంటాడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్ తదితర భక్తులతో): సిద్ధులను కోరుకొనేది హీనులే. వ్యాధులు నయం చేయడం, వ్యాజ్యాలు గెలిపించటం, నీళ్ల మీద నడవటం మొదలైన సిద్ధులను వారు ఆకాంక్షిస్తారు. శుద్ధభక్తులు భగవంతుని పాదపద్మాలను తప్ప అన్యం దేనినీ కాంక్షించరు. హృదయ్ నాతో ఒకసారి ‘మామా! అమ్మ వద్ద ఏవైనా శక్తులు, సిద్ధులు కోరుకో’ అన్నాడు. నాది బాలక స్వభావం కదా! కాళీ ఆలయంలో జపం చేసేటప్పుడు అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా హృదయ్ నన్ను నీనుండి కొన్ని శక్తులు, సిద్ధులను కోరుకోమన్నాడు.’ అమ్మ వెంటనే నాకు ఒక దృశ్యాన్ని చూపించింది. వృద్ధవేశ్య ఒకతె వచ్చి నా వైపుకు వీపు త్రిప్పి పాదాలపై భారంమోపి గొంతుకు కూర్చుంది. వయస్సు నలభై సంవత్సరాలు ఉంటుంది. పెద్ద పెద్ద పిరుదులు కలది, నల్లంచు చీర ధరించి ఉంది. కూర్చుని మలవిసర్జన చేయసాగింది. సిద్ధులు ఆ వృద్ధవేశ్య మలం లాంటివని అమ్మ నాకు వెల్లడిచేసింది. అప్పుడు వెళ్ళి హృదయ్‌ను చీవాట్లు పెట్టాను. ‘అమ్మను ఆ విధంగా ప్రార్థించమని నువ్వు నా కెందుకు చెప్పావు? నీ కారణంగానే నేను అలాంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చింది.’
“ఎవరికైనా కొద్దిపాటి సిద్ధులు కలిగినా అతడికి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. చాలామందికి తాము ‘గురుగిరి’* నెరపాలన్న కోరిక ఉంటుంది. వారిని ‘పలువురు వ్యక్తులు గౌరవిస్తారు, శిష్యులు సేవ చేస్తారు’ వంటి తలంపులు కలిగివుంటారు. అతడి గురించి లోకులు ఇలా అంటూంటారు: ‘ఓహ్! ఫలానా వ్యక్తికి దశ తిరిగింది. ఇంటికి ఎంతో మంది వచ్చి పోతుంటారు. చాలామంది శిష్యులు, సేవకులు తయారయ్యారు. ఇంట్లో ఎన్నో వస్తువులు కుప్పలు తెప్పలుగా పడివున్నాయి. జనం అతడికి పలురకాల కానుకలు చెల్లిస్తుంటారు. అతడు తలచుకుంటే ఎంతోమందికి భోజనం పెట్టించగలడు.’
“ ‘గురుగిరి’ వేశ్యావృత్తి లాంటిది. తుచ్ఛమైన ధనం, పేరు ప్రతిష్ఠలు, శారీరక సుఖం– వీటన్నిటికోసం తన్ను తాను అమ్ముకోవడమా! ఏ శరీరం, మనస్సు, ఆత్మల ద్వారా భగవత్ ప్రాప్తిని పొందగలమో ఆ శరీరం, మనస్సు, ఆత్మలను సామాన్య వస్తువులకోసం అలా అమ్ముకోవడం మంచిది కాదు. ఒక వ్యక్తి ఫలానా స్త్రీ గురించి ఇలా అన్నాడు: ‘ఆహా, ప్రస్తుతం ఆమె దశ తిరిగి పోయింది. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇంట్లో ఎన్ని వస్తువులని! మంచాలు, కుర్చీలు, పాత్ర సామగ్రి – ఎన్నని చెప్పమంటావ్! ఎంతమందిని వశం చేసుకుంది! ఎంతమంది వస్తూ పోతూవుంటారు!’ అంటే అర్థం – ఆమె ప్రస్తుతం వేశ్య అయిందని. అందుకనే ఆమె సుఖాలకు అంతులేకుండా ఉంది. మొదట్లో ఆమె ఒక సజ్జనుడి ఇంట్లో పనిమనిషిగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఒక వేశ్య. సామాన్య వస్తువుల కోసం తన్ను తాను సర్వనాశనం చేసుకుంది.”
39.1.4 పాప పురుషుని ప్రలోభం – శ్రీరామకృష్ణుల బ్రహ్మజ్ఞాన స్థితి – మహ్మదీయుని దర్శనం
శ్రీరామకృష్ణులు : “సాధన కాలంలో ధ్యానం చేస్తూ చేస్తూ నేను ఇంకా ఎన్ని దృశ్యాలు చూసేవాడినని! ఒకసారి బిల్వవృక్షం క్రింద ధ్యానం చేస్తున్నప్పుడు పాప పురుషుడు ఆంగ్ల సిపాయిరూపంలో వచ్చాడు. రకరకాలుగా ప్రలోభ పెట్టసాగాడు. ధనం, కీర్తి ప్రతిష్ఠలు, స్త్రీ సుఖం, పలురకాల సిద్ధులు – వీటన్నిటినీ ఇవ్వచూపాడు. అప్పుడు నేను అమ్మను ప్రార్థించసాగాను. ఇప్పుడు మీకు అతి గోప్యమైన విషయాన్ని చెబుతున్నాను. అప్పుడు అమ్మ దర్శనం ఇచ్చింది. నేను అమ్మతో “అమ్మా”, అతణ్ణి నరికెయ్యి” అన్నాను. అమ్మయొక్క ఆ భువనమోహన రూపం నాకు జ్ఞప్తికి వస్తోంది. కృష్ణమయి (బలరామ్ కుమార్తె, బాలిక) రూపంలో వచ్చింది. ఆమె ఒక్క వీక్షణంతోనే జగత్తు యావత్తూ చలించిపోతున్నట్లు ఉంది.”
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ తమ స్మృతులను నెమరు వేసుకుంటూ ఇలా అన్నారు: “ఇంకా ఎన్నో దర్శనాలను గాంచాను. కాని ఎవరో నన్ను చెప్పనివ్వటం లేదు. నా నోటిని గట్టిగా అదిమి పట్టినట్లు ఉంది. తులసి చెట్టు, మునగచెట్టు రెండూ ఒక్కటిగా తోస్తూండేవి. భేదభావన తొలగిపోయింది. ఒక రోజు మర్రిచెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేస్తుండగా ఒక దర్శనం కలిగింది. గడ్డంతో ఉన్న మహమ్మదీయుడు* ఒక మట్టిపళ్ళెంలో అన్నంతో ఎదురుగా వచ్చాడు. పళ్ళెంలోనుండి మహమ్మదీయులకు అన్నంపెట్టి నాక్కూడా కొద్దిగా ఇచ్చాడు. ‘ఉన్నది ఒక్కటే, రెండవది లేదు’ అని అమ్మ నాకు చూపించింది. సచ్చిదానందుడే నానారూపాలు ధరించి ఉన్నాడు. ఆయనే సమస్త జీవ జగత్తులై విరాజిల్లుతున్నాడు. ఆయనే అన్నం అయివున్నాడు.
39.1.5 శ్రీరామకృష్ణుల బాలక స్వభావం
(గిరీశ్, ‘మ’ తదితరులతో) “నాది బాలక స్వభావం. ‘మామా! అమ్మ వద్దకు వెళ్ళి కొన్ని శక్తులను కోరుకో’ అని హృదయ్ చెప్పిందే తడవు నేను అందు గురించి అమ్మ వద్దకు వెళ్ళాను. అప్పుడు అమ్మ నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందంటే, నావద్ద ఎవరు ఉంటే వారి మాటను వినవలసి వచ్చేది. తనవద్ద వేరే ఎవ్వరూ లేకపోతే సర్వం అంధకారబంధురంగా గాంచే చిన్నపిల్లవాడిలా ఉండేది నా పరిస్థితి. హృదయ్ నా వద్ద లేకపోతే ప్రాణాలు పోతున్నట్లు తోచేది. ఇలా చూడండి! ప్రస్తుతం నాకు అదే భావం కలుగుతోంది. మాట్లాడుతూనే మనస్సు ఉద్దీపనమవుతోంది.”
ఈ విధంగా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. అతి కష్టం మీద తమను తాము సంబాళించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భావావస్థలో ఇలా అన్నారు: “ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాను.కాని చిరకాలంగా మీరు ఇక్కడ కూర్చున్నట్లు తోస్తోంది. ఎప్పుడు వచ్చారో, ఎక్కడకు వచ్చారో – ఇవేవీ స్ఫురణకు రావడం లేదు.” అటు పిమ్మట ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. కొద్దిగా బాహ్యచైతన్యంలోకి వచ్చి, “మంచినీళ్ళు త్రాగుతాను” అన్నారు. సమాధి స్థితినుండి బాహ్యచైతన్యంలోకి వచ్చేటప్పుడు మనస్సును సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఆయన తరచూ అలా అంటుంటారు. గిరీశ్ ఆయన వద్దకు కొత్తగా వస్తూ ఉన్న వ్యక్తి; అందువల్ల అతడు ఈ సంగతి ఎరుగడు. మంచినీళ్ళు తీసుకురావడానికి లేచాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి వారిస్తూ, “లేదయ్యా, ఇప్పుడు త్రాగలేను” అన్నారు. అందరూ కాస్సేపు మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో):ఏమయ్యా ఈ (గోప్యమైన) అనుభూతులన్నీ చెప్పి నేను ఏదైనా తప్పు చేశానా?
పాపం! ‘మ’ ఏం చెప్పగలడు? మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ శ్రీరామకృష్ణులే ఇలా అన్నారు: “లేదు, లేదు. తప్పు ఎందుకు అవుతుంది? నేను ఈ విషయాలన్నీ మీలో విశ్వాసం కలిగించడానికి చెప్పాను.” కాసేపటి తరువాత ‘మ’ ను బ్రతిమిలాడుతూ, “అతణ్ణి ఇక్కడకు తీసుకురావా?” అన్నారు. ఆయన అలా బ్రతిమిలాడుతోంది పూర్ణుడి గురించి.
‘మ’ (సంకోచిస్తూ): ఆ, ఇప్పుడే కబురంపుతానండీ.
శ్రీరామకృష్ణులు: పూర్ణుడితో నేను మజిలీ చేరుకొన్నాను.
శ్రీరామకృష్ణులు ఇలా పలకడంలోని అంతరార్థం ఏమిటి? తమ ఆంతరంగిక భక్తులలో బహుశా పూర్ణుడు చిట్టచివరి వాడనా?
39.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల మహాభావం – భైరవీ బ్రాహ్మణి సేవ
గిరీశ్ తదితరులను సంబోధిస్తూ శ్రీరామకృష్ణులు తమ మహాభావ స్థితిని గురించి వర్ణించసాగారు.
శ్రీరామకృష్ణులు(భక్తులతో) : ఆ స్థితి కలిగిన తరువాత పొందిన ఆనందం అంతకు మునుపు నేను పడిన యాతనలకు సమానంగా ఉండేది. మహాభావం భగవద్భావం; అది ఈ దేహం, మనస్సులను తలక్రిందులు చేసివేస్తుంది. పెద్ద ఏనుగు ఒకటి చిన్న రెల్లుగడ్డి గుడిసెలోకి చొరబడటం లాంటిది అది. దానితో పునాదులతోసహా గుడిసె కుదిపివేయబడుతుంది. బహుశా కుప్పకూలి ఛిన్నాభిన్నమైపోతుంది.
“భగవంతుడి కోసం కలిగే వియోగతాపం సామాన్యమైనది కాదు. రూప, సనాతనులకు (చైతన్యదేవుల శిష్యులు) అలాంటి స్థితి కలిగినప్పుడు వారు ఏ చెట్టుక్రింద కూర్చుంటే ఆ చెట్టు ఆకులు కమలిపోయేవి. నేను ఆ స్థితిలో మూడు రోజులు స్పృహలేకుండా పడి ఉన్నాను. ఏమాత్రం కదలలేకపోయేవాడిని; ఒకే చోట పడిపోయి ఉండేవాడిని. స్పృహ వచ్చాక బ్రాహ్మణి (భైరవీ బ్రాహ్మణి) నన్ను స్నానం చేయించడానికి తీసుకువెళ్లింది. కాని నా శరీరం స్పర్శను భరించే స్థితిలో లేదు. అందుకని బ్రాహ్మణి నా శరీరాన్ని ఒక దళసరి దుప్పటితో కప్పింది. ఆ దుప్పటి మీద చేయివేసి నన్ను తీసుకువెళ్ళింది. (నేను క్రింద పడిపోయి ఉన్నప్పుడు) శరీరానికి అంటుకొన్న మట్టి అంతా మాడిపోయి ఉండేది.
“ఆ స్థితి కలిగినప్పుడు వెన్నెముకగుండా నాగలి పోతున్నట్లు అనిపించేది. ‘ఓ! ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి’ అంటూ అరిచేవాడిని. కాని ఆ తరువాత ఎంతటి ఆనందం కలిగేదని!”
శ్రీరామకృష్ణుల ఈ మహాభావ స్థితి వర్ణనలను భక్తులు చేష్టలుదక్కి వింటున్నారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): కాని మీరు అంత దూరం వెళ్ళవలసిన పనిలేదు. నా అనుభవాలు ఇతరులకు దృష్టాంతాలుగా ఉండటం కోసమే. మీరు అనేక విషయాలను పట్టుకొని ఉంటారు. కాని నేను మాత్రం కేవలం ఒకే భావాన్ని ఆశ్రయించుకుని ఉంటాను. భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ నాకు రుచించదు. ఇది ఆయన ఇచ్ఛ (నవ్వారు). ఏక కాండం చెట్లూ ఉన్నాయి, ఐదు కొమ్మల చెట్లుకూడా ఉన్నాయి. (అందరూ నవ్వారు).
“నా అనుభవాలు ఇతరులకు దృష్టాంతాలుగా ఉండటం కోసమే. మీరు అనాసక్తులై సంసారంలో జీవించండి. శరీరానికి బురద అంటుకుంటుంది. కాని దానిని విదిలించుకోండి – బురద చేపలా. కళంక సాగరంలో ఈదులాడవచ్చు కానీ శరీరానికి కళంకం అంటుకోరాదు.”
గిరీశ్ (నవ్వుతూ) : మీక్కూడా వివాహం అయింది కదా! (నవ్వులు)
39.2.1 కామినీ కాంచనాలే సంసారం – అవిద్యా స్త్రీల మోహినీ శక్తి – ‘నిరుద్యోగి, గులాబీ’ కథ
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : సంస్కారం* కోసమని వివాహం చేసుకోవలసి వచ్చింది. కాని సాంసారిక జీవితం ఎలా గడపగలను? (భగవంతునికై వ్యాకులత ఎంత తీవ్రంగా ఉండేదంటే) నా మెడలో జంధ్యం వేసినప్పుడల్లా దానంతట అదే పడిపోయేది. నేను దానిని నిలుపుకోలేక పోయేవాడిని. సంస్కారంకోసం శుకమహర్షి వివాహం చేసుకున్నాడని ఒక సంప్రదాయం వారు చెబుతారు. బహుశా ఒక కుమార్తె కూడా జన్మించిందంటారు. (అందరూ నవ్వారు.)
“సంసారం అంటే కామినీకాంచనాలే. అవి భగవంతుణ్ణి మరపింపచేస్తాయి.
గిరీశ్: కాని ఈ కామినీ కాంచనాలు వదలిపోవే!
శ్రీరామకృష్ణులు: వ్యాకులచిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించు. వివేకం కోసం ప్రార్థించు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యం – దీనినే వివేకం అంటారు. వడపోత వస్త్రం గుండా నీటిని వడపోయాలి. అప్పుడు మురికి అంతా ఒక వైపు ఉంటుంది, శుద్ధమైన నీరు మరోవైపు ఉంటుంది. ఈ సంసారంలో వివేకమనే వడపోత వస్త్రాన్ని ఉపయోగించండి. మీరు భగవంతుణ్ణి తెలుసుకుని సంసారంలో జీవించండి. అప్పుడు దానిని విద్యాసంసారం అంటారు.
“స్త్రీల మోహినీ శక్తి ఎలాటిదో చూడండి! నేను చెప్పేది అవిద్యా స్వరూపిణులైన స్త్రీల గురించి. వారు పురుషులను మూర్ఖులుగా చేసిపడేస్తారు, పురుషులలోని సారపదార్థాన్ని లాగేస్తారు. అందుకే స్త్రీ పురుషులు ఒకచోట కూర్చుని ఉండడంచూస్తే నేను “అమ్మయ్యో! వీరి పని ఇంతటితో సరి!” అంటుంటాను. (‘మ’ వైపు చూస్తూ) హారు ఎంత మంచి బాలుడు! పాపం! అతణ్ణి భూతం ఆవహించింది. అందరూ ఒక రోజు “అరే, హారు ఎక్కడ, హారు ఎక్కడ?” అంటూ అతడి కోసం వెదకసాగారు. తీరా చూసేసరికి, అతడు మర్రిచెట్టు కింద మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతడిలో ఇదివరకు ఉన్న అందం, వర్చస్సు, సంతోషం ఇప్పుడు లేవు. పాపం! మర్రిచెట్టులోని భూతం అతణ్ణి ఆవహించింది.
“ ‘ఒకసారి అక్కడకు వెళ్ళరాదూ!’ అని భార్య, భర్తతో చెప్పగానే వెంటనే అతడు లేచి నిలబడతాడు. ‘కూర్చో’ అనగానే కూర్చుంటాడు.
“తన ఉద్యోగం పోయినందున ఒక వ్యక్తి కొత్త ఉద్యోగంకోసం ఒక కంపెనీకి దరఖాస్తు పెట్టుకున్నాడు. కాని ఆ కంపెనీ అధికారి ‘ప్రస్తుతం ఉద్యోగాలు ఖాళీ లేవు. అప్పుడప్పుడు వచ్చి చూస్తూవుండు’ అన్నాడు. పాపం! ఆ వ్యక్తి చాలా రోజులపాటు చెప్పులు అరిగేలా ఆ అధికారి చుట్టూ తిరిగాడు. కాని అతడికి సదా ‘ప్రస్తుతం ఖాళీలు లేవు. తరువాత చూద్దాం’ అనే సమాధానమే ఎదురయింది. చివరకు ఆ వ్యక్తి విసిగి వేసారిపోయి, నిరాశతో స్నేహితుడికి తన గోడు వెళ్ళబోసు కున్నాడు. ఆ స్నేహితుడు అతడితో ‘నువ్వెంత మూర్ఖుడివి! ఆ అధికారి చూట్టూ అలా పిచ్చికుక్కలా ఎందుకు తిరుగుతావు? నువ్వెళ్ళి గులాబీని పట్టుకో. రేపే నీ పని జరిగిపోతుంది.’ అన్నాడు. ఆ వ్యక్తి ‘అలాగే, ఆమె వద్దకు ఇప్పుడే వెళతాను’ అంటూ బయలుదేరాడు. గులాబీ ఆ అధికారి ఉంపుడుగత్తె. ఆ వ్యక్తి ఆమె వద్దకు వెళ్ళి ఇలా ప్రాధేయపడ్డాడు: ‘అమ్మా, నేనో పేద బ్రాహ్మణుణ్ణి. నాకు పెద్దకష్టం వచ్చిపడింది. నన్ను ఈ కష్టంనుండి మీరే గట్టెక్కించాలి. అమ్మా, చాలా రోజులుగా పనిలేదు. ఇంట్లో పిల్లలు తిండిలేక మాడిపోతున్నారు. మీరు ఒక్క మాట చెప్పినట్లయితే నా పని జరిగిపోతుంది.’ ఆ బ్రాహ్మణుడి దుస్థితి చూసి గులాబీ జాలిపడింది. ‘అయ్యో పాపం! ఈ బ్రాహ్మణుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి?’ అనుకుని ‘అదిసరే కానీ, నాయనా! నీ పని జరగాలంటే ఎవరికి చెప్పవలసి ఉంటుంది?’ అని అడిగింది. బ్రాహ్మణుడు ‘అమ్మా, ఆ కంపెనీ అధికారికి కేవలం ఒక్కమాట చెబితే చాలు. నా పని కచ్చితంగా జరిగిపోతుంది’ అన్నాడు. అప్పుడు గులాబి ‘ఆ అధికారితో నేను ఇవాళే మాట్లాడి నీ పని జరిగేలా చూస్తాను. సరేనా!’ అంది. మరుసటి రోజు ఉదయమే ఆ బ్రాహ్మణుడి ఇంటికి కంపెనీ బంట్రోతు ఒకడు వచ్చి ‘ఇవాల్టి నుండే మీరు పనిలో చేరమని ఉత్తర్వు వచ్చింది’ అన్నాడు. ఆ సదరు అధికారి, కంపెనీ యజమానితో ‘ఇతడు యోగ్యుడు. ఇతడికి నేను మన కంపెనీలో ఉద్యోగమిచ్చాను. ఇతడి వల్ల మన కంపెనీ లాభిస్తుంది’ అని చెప్పి ఆయన్ను ఒప్పించాడు.
“అందరూ కామినీ కాంచనాలలోనే మునిగివున్నారు. కాని వాటిని నేను ఖాతరు చేయను. భగవంతుడు తప్ప అన్యమైనదేదీ ఎరుగనని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను.”
39.3 తృతీయ పరిచ్ఛేదం సత్యసంధతే కలియుగంలో తపస్సు – ఈశ్వర కోటి, జీవకోటి
ఒక భక్తుడు: మహాశయా! ‘నవ–హుల్లోల్’ అంటూ ఒక కొత్త ధార్మికశాఖ ప్రారంభమయింది. లలిత్ ఛటర్జీ దాన్లో సభ్యుడు.
శ్రీరామకృష్ణులు: ఆ, పలు మతాలు ఉన్నాయి. అవన్నీ ఆ ఒకే భగవంతుని చేరటానికి వేర్వేరు మార్గాలు. కాని అందరూ ‘నా మతమే సరియైనది’, ‘నా గడియారమే సరైన సమయం చూపిస్తోంది’ అనుకుంటారు.
గిరీశ్(‘మ’ తో): పోప్ చెప్పిన మాటలు జ్ఞాపకమున్నాయి కదా!
“Tis with our judgements as our watches, none
Go just alike, yet each believes his own.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో) : ఏమయ్యా, దీని అర్థం ఏమిటి?
‘మ’ : ప్రతి ఒక్కరు తమ గడియారమే సరియైనదని తలుస్తారు. కాని ఏ గడియారమూ మరో గడియారంతో సరిపోదు.
శ్రీరామకృష్ణులు: గడియారాలు తప్పు సమయం చూపుతాయి కానీ సూర్యుడు సరిగ్గానే నడుస్తాడు కదా! అందువల్ల మన గడియారాన్ని సూర్యుడితో సరిచూసుకోవాలి.
ఒక భక్తుడు: ఫలానా వ్యక్తి సదా అబద్ధాలు ఆడుతుంటాడు.అతడు వట్టి అబద్ధాలపుట్ట అనుకోండి!
శ్రీరామకృష్ణులు: సత్యం పలకడమే కలియుగానికి తపస్సు. కలియుగంలో ఇతర తపస్సులు చేయడం ఎంతో కష్టం. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే భగవంతుణ్ణి పొందగలము. తులసీదాస్ దోహా ఒకటి ఇలా ఉంది: ‘సత్యకథా భగవత్ అధీనతా, పరస్త్రీ మాతృసమాన్ । ఇస్ సే హరి న మిలే తో తులసీ ఝూట్ జబాన్ ॥ (సత్యం వచించటం, భగవంతునిపై ఆధారపడి ఉండటం, పరస్త్రీని తల్లిగా దర్శించడం – వీటి ద్వారా భగవంతుడు లభించనట్లయితే తులసీదాస్ అసత్యవాదియే)
“తండ్రి చేసిన అప్పులను తీర్చే భారాన్ని కేశవ్సేన్ తన మీద వేసుకొన్నాడు. వ్రాతపత్రాలు వంటివి ఏవీ లేవు. మరెవరైనా అయితే ‘నాకు తెలీదు పొ’ మ్మని చెప్పేవాళ్ళు. ఒకసారి నేను జోరాసాంకో (కలకత్తాలో ఒక వీథి) లోని దేవేంద్రుని సమాజం చూడటానికి వెళ్ళాను. ఆ సమయంలో కేశవ్సేన్ వేదికపై కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అతడు ప్రాయంలో ఉన్నాడు. అది చూసి నేను మథుర్బాబుతో ఇలా అన్నాను: ‘ఇక్కడ ధ్యానం చేస్తున్న వారందరిలో ఈ యువకుని గాలపు బెండు మాత్రమే నీటిలో మునిగివుంది, ‘చేప’ గాలంవద్ద తచ్చాడుతోంది.’*
“ఫలానా వ్యక్తి పేరు చెప్పను కాని అతడు పదివేల రూపాయలకోసం న్యాయస్థానంలో అబద్ధం చెప్పాడు, వ్యాజ్యెం గెలవడానికి నాతో కాళీమాతకు అర్ఘ్యాన్ని సమర్పింపచేశాడు. అతడు నాతో ‘బాబా! ఈ అర్ఘ్యాన్ని అమ్మకు సమర్పించు!’ అన్నాడు. నేను పసిపిల్లవాడిలా అతడి మాటలు నమ్మి ఆ అర్ఘ్యాన్ని సమర్పించాను.”
భక్తుడు: అతడు గట్టివాడేనండి!
శ్రీరామకృష్ణులు: కాని అతడికి నాపట్ల ఎంతో విశ్వాసం ఉండేది. నేను అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే అమ్మ అతడి ప్రార్థనలను తప్పక ఆలకిస్తుందని అతడికి గట్టి నమ్మకం.
లలిత్ బాబు విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అహంకారం అంత సులభంగా వదలిపెడుతుందా ఏమిటి? అలా అహంకారం లేనివాళ్ళు ఏదో ఒకరిద్దరు మాత్రమే తారసపడతారు. అలాంటి వారిలో బలరాం ఒకడు. (ఒక భక్తుణ్ణి చూపిస్తూ) ఇతడు మరొకడు. వీరి స్థానంలో వేరే ఎవరయినా ఉంటే అహంకారంతో విర్రవీగిపోయి ఉండేవాళ్ళు. జుట్టుకు పాపిటలు తీసి తమ తమోగుణాలను ప్రదర్శించి ఉండేవారు. వారు తమ పాండిత్యాన్ని చూసుకొని ఎంతగానో గర్విస్తారు. చూడు, ఆ లావు బాపనయ్యకు (ప్రాణకృష్ణకు) ఇంకా కొద్దిగా అహంకారం ఉంది. (‘మ’ తో) మహిమా చక్రవర్తి, అనేక శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి. ఏమంటావు?”
‘మ’ : అవునండీ. అతడు ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : అలాంటప్పుడు అతణ్ణి గిరీశ్ ఘోష్‌కు పరిచయం చేస్తే బాగుంటుంది. ఇద్దరు చర్చించుకొంటూ ఉంటే చూడాలని ఉంది.
గిరీశ్ (నవ్వుతూ): సాధనలు చేయడం ద్వారా అందరూ శ్రీకృష్ణునిలా కావచ్చని అతడు అంటాడట కదా!
శ్రీరామకృష్ణులు: పూర్తిగా అలాగని కాదుకానీ, ఆ ధోరణిలోనే ఏదో అంటుంటాడు.
భక్తుడు: అయ్యా, అందరూ శ్రీకృష్ణునిలా కాగలరా?
శ్రీరామకృష్ణులు: అవతార పురుషులు లేక వారి అంశతో జన్మించిన వారిని ఈశ్వరకోటి అంటారు. సాధారణ మనుష్యులను జీవులు లేక జీవకోటి అంటారు. జీవకోటికి చెందినవారు సాధనలుచేసి భగవంతుణ్ణి పొందుతారు. వారు సమాధిస్థితి పొందాక తిరిగిరారు.
“ఈశ్వరకోటికి చెందిన వ్యక్తి రాకుమారుడి లాంటివాడు. ఏడంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు వెళ్ళే ద్వారాల తాళం చెవులు అతడి వద్ద ఉంటాయి. అతడు ఏడు అంతస్తులనూ ఎక్కగలడు. మళ్ళీ తన ఇష్టానుసారం క్రిందకు దిగి రాగలడు కూడా. జీవకోటికి చెందిన వాడు ఒక సాధారణ ఉద్యోగి లాంటివాడు. అతడు భవనంలోని కొన్ని గదుల్లోకి మాత్రమే వెళ్ళగలడు. అంతకు మించి అతడు వెళ్లజాలడు.
39.3.1 భక్తి జ్ఞానాల సమన్వయం
“జనకుడు జ్ఞాని. సాధనలు చేసి జ్ఞానం సముపార్జించుకున్నవాడు. కాని శుకమహర్షి సాక్షాత్తు జ్ఞానమూర్తియే.”
గిరిశ్: ఆహా!
శ్రీరామకృష్ణులు: శుకమహర్షికి సాధనలు చేసి జ్ఞానం సంపాదించవలసిన అవసరం లేకపోయింది. నారదుడు కూడా శుకమహర్షిలా బ్రహ్మజ్ఞాని. కాని లోకులకు ఉపదేశించే నిమిత్తం ఆయన భక్తిని ఆశ్రయించుకొని ఉండేవాడు. ప్రహ్లాదుడు ఒక్కోసారి ‘సో – హం’ భావంలోనూ, మరోసారి దాస్యభావంలోను, సంతానభావంలోను ఉండేవాడు. హనుమంతుడు కూడా అటువంటి స్థితిలోనే ఉండేవాడు.
“తలచుకొన్నంత మాత్రాన అందరికీ అలాంటి స్థితి ఏర్పడదు. కొన్ని వెదురుగడలలో డొల్ల ఎక్కువగా ఉంటుంది, మరి కొన్నింటిలో తక్కువగా ఉంటుంది.”
39.4 చతుర్థ పరిచ్ఛేదం కామినీ కాంచనాలు -తీవ్రవైరాగ్యం
ఒక భక్తుడు: మీ ఆధ్యాత్మిక స్థితులన్నీ ఇతరులకు సోదాహరణలుగా ఉంటాయని కదా మీరు చెబుతోంది. మరి మేం ఏం చెయ్యాలో సెలవియ్యండి.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి తీవ్రవైరాగ్యం ఉండాలన్నది నిశ్చయం. భగవత్ మార్గంలో అవరోధాలుగా తోచేవాటిని తత్క్షణమే పరిత్యజించాలి. తరువాత చూసుకోవచ్చు లెమ్మని వాయిదాలు వేసుకోవడం మంచిది కాదు. కామినీ కాంచనాలు భగవన్మార్గంలోని అవరోధాలు. వాటి నుండి మనస్సును ఉపసంహరించుకోవాలి.
“మందకొడితనం, సోమరితనం ఉంటే భగవత్ప్రాప్తి అసాధ్యం. ఒక వ్యక్తి, తుండుగుడ్డను భుజం మీద వేసుకొని స్నానం చేయడానికి పోతున్నప్పుడు అతడి భార్య అతణ్ణి ఈసడిస్తూ ఇలా అంది: “నువ్వు ఎందుకూ కొరగావు. వయస్సు పైబడుతోంది. అయినప్పటికీ నువ్వు వీటినన్నిటినీ వదలలేకుండా ఉన్నావు. నన్ను వదలి ఒక్క రోజుకూడా ఉండలేవు. ఆ ఫలానా వ్యక్తిని చూడు! అతడు ఎంతటి త్యాగో!”
“భర్త: ఏం, అతడు ఏం చేశాడు?
“భార్య: అతడికి పదహారుగురు భార్యలు. అతడు వారిని ఒకరి వెంట ఒకరినిగా పరిత్యజిస్తున్నాడు. అలా త్యాగం చేయడం నీకు ఎన్నటికీ చేతకాదు.
“భర్త: ఏమిటి, అతడు తన భార్యలను ఒక్కరొక్కరినిగా త్యజిస్తున్నాడా? ఒసేయ్ పిచ్చిదానా! అలాంటివాడు త్యాగం చేయజాలడు. త్యాగం చేసేవాడు కొద్దికొద్దిగా త్యాగం చేస్తాడా ఏమిటి?
“భార్య (నవ్వుతూ) : ఎలాగైనా నీ కంటే మేలే కదా!
“భర్త: ఒసేయ్ పిచ్చిదానా! నీకు అర్థం కావటం లేదు. అతడు త్యాగం చేయజాలడు, నేను త్యజించగలను. ఇదిగో చూడు! నేను వెళ్ళిపోతున్నాను!”
శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు: “దీనినే తీవ్రవైరాగ్యం అంటారు. ఆ వ్యక్తికి వివేకం కలుగగానే, తత్క్షణమే పరిత్యజించాడు. ఉన్న పళానే భుజం మీద తుండుగుడ్డతోనే వెళ్ళిపోయాడు. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టడానికని తిరిగి రాలేదు. ఇంటికేసి ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు.
“త్యాగం చేసే వ్యక్తికి ఎంతో మనోబలం ఉండాలి. బందిపోటు దొంగలా తెగింపు ఉండాలి. బందిపోట్లు ఇంటిని దోచుకొనే ముందు ‘చంపు! నరకు! ఇంటిని కొల్లగొట్టు!’ అంటూ కేకలుపెడతారు.
“మరి మీరేం చేయాలి? భగవంతునిపట్ల భక్తి, ప్రేమలను అలవరచుకొని రోజులు గడపండి.
“కృష్ణుడు వెళ్ళిపోయాక అతణ్ణి చూడలేక పోవడంతో యశోదకు దాదాపు పిచ్చి పట్టినట్లయింది. ఆ స్థితిలో రాధ వద్దకు వెళ్ళింది. ఆమె దుఃఖాన్ని చూసి రాధ ఆమెకు ఆద్యాశక్తి రూపంలో దర్శనం ఇచ్చి, ‘అమ్మా, ఏదైనా వరం కోరుకో’ అంది. అందుకు యశోద ఇలా అంది: ‘అమ్మా, నన్ను ఇంకేం కోరమంటావు? అయితే మనోవాక్కాయాల ద్వారా కృష్ణుణ్ణి సేవించేట్లు అనుగ్రహించు. ఈ కళ్ళతో అతడి భక్తులకు దర్శించేటట్లు, అతడి లీలలు జరిగేచోట్లకు ఈ కాళ్ళతో నడచిపోయేటట్లు, ఈ చేతులతోకృష్ణుణ్ణి అతడి భక్తులను సేవించేటట్లు, ఈ ఇంద్రియాలన్నీ అతడి పనులనే ఒనరించేటట్లు ఆశీర్వదించు.’”
ఇలా అంటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశ్యానికి లోనవుతున్నారు. ఉన్నట్టుండి తమలో తాము ఇలా మాట్లాడుకొన్నారు. “సంహారమూర్తి కాళీయా? లేదు, లేదు. నిత్యకాళి!” అతికష్టం మీద తమను తాము సంబాళించుకొని కాసిని నీళ్లు త్రాగారు. యశోదాదేవి గురించి ఇంకా ఏదో చెప్పబోతున్నారు. ఇంతలో మహేంద్ర ముఖర్జీ వచ్చాడు. మహేంద్ర, అతడి తమ్ముడు ప్రియ ముఖర్జీ – వీరిద్దరూ ఈ మధ్యనే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నారు. మహేంద్రుని వయస్సు 36 లేక 37 సం ॥ లు. ప్రియ అతడికంటే రెండేళ్ళు చిన్నవాడు, ఇంజనీరు. మహేంద్రుడికి పిండిమిల్లు ఉంది. తమ పనులను చూసుకొనేందుకు వారు కొందరిని నియమించారు. అందువల్ల వారికి తీరిక ఎక్కువ. స్వగ్రామమైన కేదేటిలో వారికి ఇల్లు ఉంది. కలకత్తాలోని బాగ్ బజారులో కూడా ఒక ఇల్లు ఉంది. శ్రీరామకృష్ణుల వద్దకు వారితో పాటు ఒక బాలభక్తుడు వచ్చేవాడు. పేరు హరి. అతడికి వివాహం అయింది. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అమిత భక్తిప్రపత్తులు. మహేంద్ర దక్షిణేశ్వరం వచ్చి చాలా రోజులయింది. హరి కూడా చాలా రోజులుగా రాలేదు. ఇవాళ అతడుకూడా మహేంద్రతో పాటు వచ్చాడు. నవ్వుతో మహేంద్రుడి ముఖం కళకళలాడుతోంది. మహేంద్ర, హరి ఇద్దరు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి సంగతి? ఇన్ని రోజులు దక్షిణేశ్వరం రాలేదు?
మహేంద్ర: అయ్యా, కేదేటి వెళ్ళి ఉన్నాను. కలకత్తాలో లేను.
శ్రీరామకృష్ణులు: ఏమయ్యా, పిల్లాజెల్లా లేరు. ఎవరికీ చాకిరీ చేయనక్కరలేదు. అయినప్పటికీ తీరిక దొరకడం లేదా? బాగుంది వ్యవహారం!
భక్తులు మౌనంగా ఉండిపోయారు. మహేంద్ర కాస్త సిగ్గు పడ్డాడు.
శ్రీరామకృష్ణులు: నీకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు సరళ హృదయుడివి, ఔదార్యం గలవాడివి. నీకు భగవంతుని పట్ల భక్తి ఉంది.
మహేంద్ర: అవునండి. మీరు నా మేలుకోరే ఇవన్నీ చెబుతున్నారు.
39.4.1 విషయాసక్తులు – బిడ్డల రూపంలో మాయ
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : ఇక్కడ జరిగే ‘నాటకాలకు’ కానుకలు చెల్లించనక్కరలేదు. ఒకసారి యదుమల్లిక్ తల్లి నాతో ఇలా అంది: ‘బాబా, తక్కిన సాధువులందరూ డబ్బు, డబ్బు అంటూ పీడిస్తుంటారు. కాని నీకు మాత్రం అలాంటి అలవాటు లేదే!’ విషయాసక్తులు డబ్బు ఖర్చు పెట్టాలంటే చికాకుపడతారు.
“ఫలానా చోట నాటక ప్రదర్శన జరుగనున్నది. ఒక వ్యక్తి అక్కడ కూర్చుని నాటకం చూడాలనే ఉద్దేశంతో వచ్చాడు. కాని, లోనికి తొంగిచూసేసరికి నాటక బృందం ప్రేక్షకుల వద్ద పైకం వసూలు చేయడం అతడు గమనించాడు. దానితో అతడు అక్కడనుంచి చల్లగా జారుకున్నాడు. మరొక చోట కూడా నాటకం ప్రదర్శింపబడుతోందని విని అక్కడకు వెళ్ళి చూశాడు. విచారించి చూస్తే అక్కడ నాటకం చూడటానికి ఎలాంటి రుసుమూ చెల్లించనక్కరలేదని తెలిసింది. అక్కడ ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నారు! ఎలాగోలా అతడు ఆ గుంపులో అటూ ఇటూ త్రోసుకుంటూ వెళ్ళి సభామండపంలో కూర్చోడానికి చక్కటి చోటు సంపాదించుకున్నాడు. పిదప అక్కడ కూర్చుని మీసాల మెలి వేస్తూ నాటకం చూడసాగాడు. (అందరూ నవ్వారు.)
“మనస్సును ప్రక్కకు మళ్లించడానికంటూ నీకు పిల్లలు లేరు కదా! నాకు ఒక డిప్టీ (డిప్యూటీ మేజిస్ట్రేటు) గురించి తెలుసు. అతడికి నెలకు ఎనిమిది వందల రూపాయల జీతం. ఒకసారి కేశవ్సేన్ ఇంట్లో నాటకం చూడడానికి వచ్చాడు. రాఖాల్ తదితరులతో నేను కూడా అక్కడకు వెళ్ళాను. నేను కూర్చున్న చోటుకు సమీపంలోనే ఆ డిప్టీ కూడా కూర్చున్నాడు. రాఖాల్ కాస్సేపు బయటకుపోగానే డిప్టీ తన కుమారుణ్ణి అక్కడ కూర్చోబెట్టాడు. నేను వెంటనే ‘ఇక్కడ చోటు లేదు’ అని చెప్పాను. అప్పుడు నా స్థితి ఎలా ఉండేదంటే, నా వద్ద కూర్చున్న వాళ్ళు ఎలా చెబితే అలా చేయవలసి వచ్చేది. అందుకే రాఖాల్ను నా ప్రక్కన కూర్చోబెట్టుకున్నాను. నాటకం జరుగుతున్నంత సేపూ పాపం! ఆ డిప్టీ అవస్థ చెప్పనలవి కాదు. కేవలం తన బిడ్డను సముదాయించడంతోనే అతడికి సరిపోయింది. ఒక్కసారి కూడా నాటకంకేసి దృష్టిని పోనివ్వలేదు! పైగా, అతగాడు తన భార్య చేతిలో కీలుబొమ్మని విన్నాను. ఆమె లేవమంటే లేస్తాడట, కూర్చోమంటే కూర్చుంటాడట. దానికి తోడు చప్పిడి ముక్కు, కోతిముఖం కుమారుణ్ణి చూసి తెగ మురిసిపోతున్నాడు.
(మహేంద్రతో) “నువ్వు ధ్యానం అభ్యసిస్తున్నావా?”
మహేంద్ర: ఆ, ఏదో కొద్దిగా.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ) : అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వస్తూ ఉండు.
మహేంద్ (నవ్వుతూ) : అయ్యా, నాకు బంధనాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు కదా! మీరే వాటిని సడలించాలి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ముందు నువ్వు వస్తే కదా! అలా వచ్చినప్పుడే, బంధనాలు ఎక్కడ ఉన్నాయో పట్టిపట్టి చూస్తాను. అసలు నువ్వు రావెందుకని?
మహేంద్ర: పనుల ఒత్తిడివలన రాలేకపోతున్నాను. పైగా మధ్య మధ్యలో కేదేటిలోని ఇంటికి కూడా వెళ్ళవలసి ఉంటుంది.
శ్రీరామకృష్ణులు (భక్తులను వ్రేలితో చూపిస్తూ, మహేంద్రతో) : వీరందరికీ ఇళ్ళూ వాకిళ్ళూ లేవా, పనిపాటలు లేవా? వీళ్ళు ఎలా వస్తున్నారు?
(హరితో) “నువ్వెందుకు రావడం లేదు? నీ భార్య నీ వద్దకు వచ్చి ఉందా?
హరి: లేదండి.
శ్రీరామకృష్ణులు: మరి అలాంటప్పుడు నన్నెందుకు మరచిపోయావు?
హరి: నాకు జబ్బు చేసిందండీ.
శ్రీరామకృష్ణులు: ఇతడు చిక్కిపోయి ఉన్నాడు. అయితే ఇతడి భక్తికేమీ కొదువలేదు. ఇతడి భక్తి పొంగి పొరలుతోంది. కాని అది ఇబ్బంది కలిగించే భక్తి (నవ్వులు)
శ్రీరామకృష్ణులు ఒక భక్తుడి భార్యను ‘హాబీ తల్లి’ అని సంబోధిస్తుంటారు. ఆమె సోదరుడు కూడా అక్కడకు వచ్చివున్నాడు. కళాశాలలో చదువుకుంటున్నాడు. వయస్సు దాదాపు ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు. అతడు లేచి క్రికెట్ ఆడటానికి వెళ్ళిపోయాడు. అతడి తమ్ముడు(ద్విజుడు) కూడా శ్రీరామకృష్ణుల పట్ల భక్తిప్రపత్తులు ఉన్నవాడు. అతడు కూడా తన అన్నతోపాటు వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాలు తర్వాత ద్విజుడు తిరిగివచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో “నువ్వు వెళ్ళలేదా?” అని అడిగారు. “బహుశ పాట వినాలని కాబోలు, తిరిగి వచ్చాడు” అన్నాడొక భక్తుడు.
నేడు బ్రహ్మసమాజ సభ్యుడైన త్రైలోక్యుడు పాటలు పాడనున్నాడు. పల్టుకూడా వచ్చాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు “అరే, ఇదేమిటి? పల్టు కూడా వచ్చాడే!” అన్నారు.
39.4.2 శ్రీరామకృష్ణులు – పూర్ణుడు
ఇంతలో పూర్ణుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి అతికష్టం మీద రప్పించారు. పూర్ణుడి ఇంట్లోని వారు అతడు వెళ్ళడానికి ససేమిరా అంగీకరించనేలేదు. పూర్ణుడు, ‘మ’ పనిచేస్తున్న స్కూలులోనే అయిదవ తరగతి చదువుతున్నాడు. పూర్ణుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. ఆయన అతణ్ణి తమకు సమీపంగా కూర్చోబెట్టుకొని అతడితో లోస్వరంలో సంభాషిస్తున్నారు. ‘మ’ మాత్రమే వారికి దగ్గరిగా కూర్చుని ఉన్నాడు. మిగిలిన భక్తులంతా తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నారు. గిరీశ్ ఒక ప్రక్కన కూర్చుని ‘కేశవ్ జీవిత చరిత్ర’ అనే పుస్తకం చదువుతున్నాడు.
శ్రీరామకృష్ణులు (పూర్ణుడితో) : దగ్గరకు రా నాయనా!
గిరీశ్: ఎవరీ అబ్బాయి?
ఈ అబ్బాయి గురించి నలుగురికీ తెలిసినట్లయితే అది అతడి ఇంట్లోని వారి చెవినబడి అతడికి సమస్యలు సృష్టిస్తుందనీ, అందుకని అందరు తనను నిందిస్తారనీ ‘మ’ భయపడుతున్నాడు. అందుకే గిరీశ్‌తో విసుగ్గా “ఎవరో కనిపించడం లేదా? అతడో అబ్బాయి” అన్నాడు.
గిరీశ్ (నవ్వుతూ): ఆ, ఆ సంగతి చూస్తునే ఉన్నాను.
శ్రీరామకృష్ణులు (పూర్ణుడితో, మెల్లగా): నేను చెప్పినట్లు అన్నీ చేస్తున్నావు కదా!
పూర్ణుడు: ఆ, చేస్తున్నానండి.
శ్రీరామకృష్ణులు: ఏమైనా కలలు వస్తుంటాయా? అగ్నిశిఖ? వెలుగుతున్నదివిటీ? ముత్తైదువు, శ్మశానం లాంటివి? ఇలాంటివి చూడడం చాలా మంచిది.
పూర్ణుడు: మిమ్మల్ని చూశానండి. మీరు కూర్చుని ఉన్నారు, ఏదో చెబుతూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి, ఏమైనా ఉపదేశాలా? ఏదీ ఒకటి చెప్పు, చూద్దాం!
పూర్ణుడు: జ్ఞాపకం రావడం లేదండి.
శ్రీరామకృష్ణులు: ఏది ఏమైనా, అది చాలా మంచిది! నువ్వు ఉన్నతి నొందుతావు. నీకు నా పట్ల ఆకర్షణ అయితే ఉంది కదా!
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు “అక్కడకు (దక్షిణేశ్వరానికి) రావా?” అన్నారు. పూర్ణుడు “ఏమో చెప్పలేనండి” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఎందుకు? దక్షిణేశ్వరంలో మీ చుట్టాలెవరో ఉన్నారు కదా!
పూర్ణుడు: అవును, ఉన్నారండి. కాని అక్కడకు వెళ్ళటానికి నాకు కాస్త ఇబ్బంది.
గిరీశ్ ఇంకా కేశవ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చదువుతున్నాడు. బ్రహ్మసమాజ సభ్యుడైన త్రైలోక్యుడు వ్రాసిన పుస్తకం అది. అందులో ఇలా వ్రాసివుంది: శ్రీరామకృష్ణ పరమహంసలవారు మొదట్లో సంసారం పట్ల చాలా విరక్తిని ప్రదర్శించేవారు; కాని కేశవ్‌చంద్ర సేన్‌తో పరిచయం ఏర్పడిన తరువాత ఆయన తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడాయన సంసారంలో ఉంటూనే ధర్మం ఆచరించవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఇది చదివిన భక్తులు చాలామంది శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిపారు. పుస్తకంలోని ఆ పుటలను ఆయనకు చదివి వినిపించారు కూడా. ఇవాళ ఈ విషయమై త్రైలోక్యుడితో మాట్లాడాలని భక్తులు పట్టుదలతో ఉన్నారు.
గిరీశ్ చేతిలోని పుస్తకాన్ని చూసి శ్రీరామకృష్ణులు గిరీశ్, ‘మ’, రామ్ తదితర భక్తులతో ఇలా అన్నారు: “వీళ్ళు సంసారాన్ని అంటిపెట్టుకొనే ఉంటారు. అందుకనే ఎప్పుడు చూసినా ‘సంసారం, సంసారం’ అంటుంటారు. వారు కామినీ కాంచనాలలో మునిగివున్నారు. భగవంతుణ్ణి సంప్రాప్తించుకున్న పిదప ఎవరూ అలా మాట్లాడరు. భగవదానందాన్ని పొందినప్పుడు సంసారం కాకిరెట్టలా తోస్తుంది. మొదట్లో నేను ప్రతిదాన్ని ‘ఛీ, ఛీ’ అంటూ వదలిపెట్టేశాను. విషయాసక్తుల సాంగత్యం వదలి పెట్టేశాను. మధ్యమధ్యలో భక్తుల సాంగత్యం కూడా త్యజించేవాడిని. ఎందుకంటే చేరదీసిన భక్తులందరూ ఒక్కరొక్కరుగా టపటపమంటూ రాలిపోయారు. అది విన్నప్పుడల్లా గుండె బాధతో విలవిల్లాడిపోయేది. కాని ప్రస్తుతం ఒకరిద్దరిని నాతోబాటు అట్టెబెట్టుకొన్నాను.”
39.5 పంచమ పరిచ్ఛేదం భక్తులతో భజనానందంలో
గిరీశ్ మళ్ళీ వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. త్రైలోక్యుడు జయగోపాల్ సేన్‌తో వచ్చాడు. వారిద్దరు శ్రీరామకృష్ణులకు ప్రణామంచేసి కూర్చున్నారు. ఆయన వారి యోగక్షేమాలు విచారించారు. ఇంతలో చిన్న నరేంద్రుడు వచ్చి, మ్రొక్కాడు. ఆయన అతడితో “గత శనివారం రాలేదేం!” అన్నారు.
ప్రస్తుతం త్రైలోక్యుడు పాటలు పాడటానికి సంసిద్ధుడయ్యాడు.
శ్రీరామకృష్ణులు: ఆహా! ఆ రోజు నువ్వు ఆనందమయి దేవి గురించి ఎంత చక్కగా పాడావు! ఎలాంటి పాట! తక్కిన పాటలు పేలవంగా తోచాయి. అదేరోజు నరేంద్రుడు పాడిన పాటకూడా నచ్చలేదు. అవే పాటలు మళ్ళీ ఇవాళ కూడా పాడు.
త్రైలోక్యుడు పాడడం మొదలుపెట్టాడు.
జయ గౌరాంగ । జయ శచిపుత్రా
సద్గుణ నిలయ ఆనందాబ్ధే
ప్రేమప్రమాణా హిరణ్యవర్ణా
పుంసారిమోహన నయనరంజన ॥ జ ॥
జాపబడిన ఆజానుబాహువులు
పద్మనాళ సదృశ యుగళములు
మానవాళి సంక్షేమకరములు ॥ జ ॥
ప్రేమ మధుర వదనారవిందము
అద్వితీయ సౌందర్య సదనము
వంపుతిరుగు నా నల్లముంగురులు
సొంపునింపు నా తళుకు చెక్కిళులు ॥ జ ॥
దివ్యప్రేమ వెల్గొండు అందము
నేత్రపర్వసౌందర్య కందము ॥ జ ॥
దివ్య దీధితులు వెల్గులీనగా
భావస్ఫూర్తితో ప్రకాశింపగా
దివ్యభావమున మేను వణకగా
స్వర్ణఛాయ శ్రీ గౌరు చంద్రుడు
మత్తగజము వలె నృత్యముచేయును ॥ జ ॥
కంపన మొందుచు కదలియాడును
భక్తి పిచ్చిలో సర్వావయవములు ॥ జ ॥
సర్వమానవ దుర్లభయశుడు
ప్రేమ సుధారస పూర్ణసాగరుడు
శ్వపచుని సైతము సహోదరునిగా
గాఢప్రేమలో కౌగలించును ॥ జ ॥
చేతులెత్తుచు చేయుచు నృత్యము
పాడును శ్రీహరి పావన నామము
వారి ధారలుగ చేరి చెంపల
కారువరదలై కన్నుల నశ్రులు ॥ జ ॥
“హృదయరత్నము యేడి నా హరి?”
అనుచు నేడ్చుచు, ఆక్రందించుచు
గర్జన చేయుచు, కంపన మొందుచు
ఆగ్రహంబుచే బొబ్బలుపెట్టును ॥ జ ॥
కడిమి పూవువలె గగురుపొందిన
తనువు ధూళిలో పొరలు పుడమిపై ॥ జ ॥
ఓ హరి లీలా శ్రీనికేతనా!
ఓ ప్రేమామృత ధారావాహిని
దీనబాంధవా! బంగ్లా శోభా!
జయచైతన్యా! జయగౌరాంగ
భక్తహృదయ సందీపన చంద్ర.
శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళనకు వెళ్ళారు. భక్తురాండ్రు తెర వెనుక కూర్చొని ఉన్నారు. ఆయన్ను దర్శించి ప్రణామం చేసుకోవాలని కుతూహల పడుతున్నారు. శ్రీరామకృష్ణులు వారికి దర్శనం ఇచ్చి గదిలోకి తిరిగివచ్చారు. త్రైలోక్యుడితో “ఆనందమయి పాట పాడు” అన్నారు. త్రైలోక్యుడు పాడసాగాడు.
మాత నీదు ప్రేమ మానవాళి మీద
ఎంత గాఢమమ్మ సుంత తెలియలేను….
పాట వింటూ వింటూ చిన్న నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నమైపోయాడు. అతణ్ణి చూపిస్తూ శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “చూడు, చూడు! ఎంతటి ప్రగాఢ ధ్యానమో! బాహ్యస్పృహ బొత్తిగా లేదాయె!” పాట పూర్తయిన పిమ్మట శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో ‘వెర్రి వానిని చేయవే నీ ప్రేమలోన’, పాట పాడమని కోరారు. త్రైలోక్యుడు ఆ పాట పాడిన తరువాత రామ్ అతడితో హరినామం గురించిన పాట పాడమన్నాడు. త్రైలోక్యుడు పాడసాగాడు:
హరి హరి హరి యని హరిని భజించుము
హరి హరి హరి యని హరిని పొగడుము
హరి యను పాడుచు ముక్తకంఠమున
తరియించుము సంసార సాగరము ॥ హ ॥
హరి వసియించును భూజలములలో
హరి వసియించును అనిలానలముల
శ్రీహరి నిలయము సూర్యచంద్రులు
హరి హరి హరి యని హరిని భజించుము ॥ హ ॥
అనంత విశ్వము గానుపించును
నిండిన శ్రీహరి నిజరూపముగా
హరి హరి హరి యని హరిని భజింపుము
హరి హరి హరి యని హరిని పాడుము ॥ హ ॥
పాట పూర్తయ్యాక ‘మ’ మెల్లగా ‘గౌర్ నితాయి’ పాట పాడమన్నాడు. శ్రీరామకృష్ణులు కూడా అదే పాట పాడమన్నారు. త్రైలోక్యుడితో పాటు శ్రీరామకృష్ణులు, భక్తులు కలసి ఆ పాట పాడారు.
అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులు గార్తురు,
ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు….
ఈ పాట పూర్తయిన తరువాత శ్రీరామకృష్ణులు క్రింద పాటలు పాడారు.
గౌరాంగుడి ప్రేమవెల్లువలో
నదియా మొత్తం కంపించిపోతోంది….
* * *
వారెవరురా? అటు పోవుచుండు!
ఆ వైపు నడుచుచు హరిని బాడుచు పోవు
ఓయి మాధాయి నీవు పోయి అటు చూడరా
ఆ గౌరు నిత్తాయిగా వారలున్నారు ॥ వా ॥
బంగరు అందెలు పదముల దాల్చి
బోడి తలలతో తొడిగి పీలికలు
అడుగులు తడబడ అటునిటు తూలుచు
వెర్రివానివలె నరుగుచుండు ॥ వా ॥
చిన్న నరేంద్రుడు ఇంటికి బయలుదేరుతున్నాడు. అతడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నువ్వు నీ తల్లితండ్రులపట్ల ఎంతో శ్రద్ధాభక్తులు చూపాలి. కాని భగవన్మార్గంలో అడ్డు కల్పిస్తే మాత్రం వారి మాటను వినవద్దు. నడుం బిగించి, దృఢనిశ్చయుడవై ఉండు. తండ్రి భగవన్మార్గానికి అడ్డువేస్తే ఇలా పలుకు: ‘భగవన్మార్గానికి అడ్డువచ్చే తండ్రి తండ్రి కాడు. అతడొక నీచుడు.’”
చిన్న నరేంద్రుడు: నిజానికి నాకు ఎటువంటి భయం లేదండి.
గిరీశ్ ఇంటినుండి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి త్రైలోక్యుడికి పరిచయం చేసి “మీరిద్దరు కాస్త మాట్లాడుకోండి” అన్నారు. వారు కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత శ్రీరామకృష్ణులు, త్రైలోక్యుడితో “ఆ పాట మళ్ళీ ఒక సారి పాడమా?” అన్నారు.
త్రైలోక్యుడు పాట పాడసాగాడు.
జయగౌరాంగ, జయ శచి పుత్రా
సద్గుణ నిలయా ఆనందాబ్ధే….
“గౌరాంగుడు నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు” – ఇది విని శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. భావపారవశ్యంలో బాహ్యస్పృహను కోల్పోయారు. కాసేపటికి తరువాత మళ్ళీ బాహ్యచైతన్యం కలిగాక త్రైలోక్యుడితో “ఆ పాట పాడమా – ‘ఏమా దర్శనం ఏమి దర్శనం’ పాట” అని బ్రతిమాలుతున్నట్లు అడిగారు.
త్రైలోక్యుడు ఆ పాట పాడాడు.
ఏమాదర్శనం ఏమి దర్శనం
కేశవభారతి ఆశ్రమంబున
అనుపమేయమగు అనుగ్రహముతో
గోరా కన్నులగారు ధారలు ॥ ఏ ॥
పరవశించి తా ప్రేమపరతలో
మత్తగజమువలె తూగుచునాడును
ఆడుచుపాడును పాడుచునాడును
ఆడిపాడి తాపాడి చూపును ॥ ఏ ॥
బాష్పవార్ధిలో ఈదులాడును
పొరలి దొరలును భూమి మీదను
ప్రభు హరినామము ప్రలాపించుచు
విలపించి గగ్గోలు గొల్పును ॥ ఏ ॥
దిక్కులన్నియు పిక్కటిల్లగా
సింహగర్జనము చేసి పాడును
హరికి దాసుడను నమ్రభావమున
ప్రేమభిక్షను వేడునంతనే ॥ ఏ ॥
కేశముక్తుడై కాని గట్టుచు
పరమపూజ్యమగు దివ్యప్రేమగల
నతని రూపమును గాంచినంతనె
రాతి గుండెయును మెత్తబారును ॥ ఏ ॥
జీవదుఃఖభరహతస్వాంతుడై
సర్వసంగ పరిత్యాగమొనర్చి
అవిచ్ఛిన్నముగ ప్రేమామృతమును
ప్రసాదించును కుమ్మరించుచు ॥ ఏ ॥
ప్రేమదాసుడు దాసుడైనచో
గడపగడపను గడచి గౌరుని
ప్రభావంబును పాడుచుండును
అవిచ్ఛిన్నముగ అనంతంబుగా ॥ ఏ ॥
కీర్తనలు ముగిశాయి. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ఇంకా భక్తులతో పరివేష్టితులై ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (రామ్‌తో) : ఇవాళ ప్రక్క వాయిద్యాలే లేవు. ప్రక్క వాయిద్యాలు ఉంటే పాటలు ఇంకా రక్తి కట్టేవి. (నవ్వుతూ) బలరామ్ చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలుసా? బాపనయ్య పాడిఆవు మేత తక్కువ మేయాలి, పాలు మటుకు కడవలకొద్దీ ఇవ్వాలి. (అందరూ నవ్వారు.) ‘వాయిద్యాలు మీరే వాయించుకోండి, పాటలూ మీరే పాడుకోండి’ అనడం లాంటిది బలరామ్ వైఖరి (అందరూ నవ్వారు.)
39.6 షష్ఠ పరిచ్ఛేదం సంసారం, భగవదానందం – త్రైలోక్యునితో చర్చ
సాయంకాలమయింది. సంజె దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు జగజ్జననికి మ్రొక్కి, భగవన్నామ స్మరణ చేస్తున్నారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి ఆ మధుర స్మరణం వింటున్నారు. గిరీశ్, ‘మ’, బలరాం, త్రైలోక్యుడు తదితర భక్తులు కూడా అక్కడే ఉన్నారు. కొంతసేపటి తరువాత భక్తులు త్రైలోక్యుడు వ్రాసిన ‘కేశవ్ జీవిత చరిత్ర’ అనే పుస్తకంలో శ్రీరామకృష్ణులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారని వ్రాసివున్న విషయాలను త్రైలోక్యుడి ముందు ప్రస్తావించాలనుకున్నారు. ఈ విషయమై వారు ముందుగానే నిశ్చయించుకొన్నారు. గిరీశ్ చర్చను ప్రారంభించాడు.
గిరీశ్ (త్రైలోక్యుడితో) : కేశవ్ సాంగత్యం తరువాత శ్రీరామకృష్ణులు గృహస్థ జీవితానికి సంబంధించిన తమ అభిప్రాయాలను మార్చుకున్నారని మీరు వ్రాశారు కదా! కాని అది నిజం కాదు.
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుడు తదితర భక్తులతో): భగవదానందాన్ని చవిచూశాక సంసారంలోని ఆనందం రుచించదు. భగవదానందాన్ని ప్రాప్తించుకొన్నట్లయితే సంసారం చప్పగా, రుచిహీనంగా తోస్తుంది. ఎవరికైనా పట్టుపంచె దొరికి నట్లయితే ఆ వ్యక్తి కోరాగుడ్డను ఖాతరు చేయడు.
త్రైలోక్యుడు: నేను ప్రస్తావించింది సంసారంలో ఉన్నవారి గురించే కాని సర్వసంగపరిత్యాగుల గురించి కాదు.
శ్రీరామకృష్ణులు: అదేమిటి, నువ్వు అలా మాట్లాడుతున్నావు? సంసారంలో ఉంటూ ధార్మిక జీవితం గడుపుతామని పలికేవారు ఒక్కసారి భగవదానందాన్ని రుచిచూసినట్లయితే వారికి ఇతరమైనది ఏదీ రుచించదు. కర్మ బంధనం సడలిపోతుంది. భగవదానందం ఇనుమడించేకొద్దీ, అటుపై వారు కర్మలను నిర్వర్తింపజాలరు. కేవలం భగవదానందాన్నే అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటారు. విషయసుఖాలను, స్త్రీ సుఖాలను భగవదానందంతో పోల్చగలమా? ఒక్కసారి భగవదానందాన్ని చవిచూసినట్లయితే ఆ వ్యక్తి దానికోసం పరుగులుతీస్తాడు. అప్పుడు అతడికి సంసారం ఉన్నాసరే లేకున్నా సరే దానితో సంబంధం ఉండదు.
“చుట్టూ సప్తసముద్రాలు, నదులు, చెరువులు నీటితో పొంగి పొరలుతూ ఉంటాయి. కాని చాతకపక్షి, దప్పికతో గొంతెండిపోతున్నా సరే ఆ నీటిని మాత్రం తాగదు. దప్పికతో ప్రాణాలు పోతున్నా సరే, అది మటుకు ఆ నీటిని తాగనే తాగదు. స్వాతి నక్షత్రాన కురిసే వానజల్లు కోసం ‘ఆ’ అంటూ అది నోరు తెరుచుకుని కూర్చుని ఉంటుంది. దానికి స్వాతి నక్షత్రపు నీరు తప్ప తక్కినవన్నీ బలాదూరే.
39.6.1 రెండు అణాల మత్తు – రెండింటిని పట్టుకుంటాం!
“లోకులు భగవంతుడు, సంసారం రెండింటినీ పట్టుకొని ఉందామని తలుస్తారు. రెండు అణాల సారాయి త్రాగినవాడు మత్తులోనూ ఉంటాడు, తన పనులనూ చేసుకోగలడు. కాని తప్పతాగినవాడు రెండిటా ఉండగలడా ఏమిటి?
భగవదానందాన్ని పొందినట్లయితే మరేదీ రుచించదు. అటువంటి వ్యక్తి ముందు కామినీ కాంచనాల మాట ఎత్తగానే అతడికి గుండెల్లో గునపం దించినట్లవుతుంది.”
తరువాత శ్రీరామకృష్ణులు పాట పాడుతున్నట్లు రాగయుక్తంగా ఇలా పలికారు: “లౌకికుల సంభాషణ నాకు బొత్తిగా సరిపోదు!” పిదప ఇలా అన్నారు: “ఎవరైనా భగవంతుడికోసం పిచ్చివాడయినప్పుడు అతడికి ధనం ఇత్యాదులు బొత్తిగా సరిపడవు.”
త్రైలోక్యుడు: అయ్యా, సంసారంలో ఉండటానికి ధనం అవసరం కదా! కొద్దిగా డబ్బు కూడాబెట్టుకోవాల్సి కూడా ఉంటుంది. దానధర్మాలు వగైరాలు చేయవలసి ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: ఏమిటీ, మొదట ధనం కూడబెట్టి అటుపిమ్మట భగవచ్చింతనమా? పైగా దానధర్మాల గురించి మాట్లాడుతున్నావా? లోకులు కుమార్తె పెళ్ళికని వేలకు వేల రూపాయలు ఖర్చు పెడతారు. కాని పక్కింటివాడు తిండిలేక మాడుతూ ఉంటే అతడికి పట్టెడన్నం పెట్టడానికి కూడా ఎంతగా బాధపడతారని! అతడికి ఆ పట్టెడన్నం పెట్టడంకూడా ఎంతగానో తర్జన భర్జనలు చేసిన తరువాతనే! ఒక ప్రక్క జనులు ‘అన్నమో రామచంద్ర!’ అని అల్లాడుతూ ఉంటే వీరు మాత్రం ఇలా అంటుంటారు: ‘నేనేం చేయగలను? వెధవలు బ్రతకనీ, లేకపోతే చావనీ. నాకు కావలసిందల్లా నేనూ, నా కుటుంబం హాయిగా ఉండటమే.’ అలాంటి వారు జీవుల పట్ల కనికరం గురించి మాట్లాడుతూ ఉంటారు!
త్రైలోక్యుడు: అయ్యా, కాని సంసారంలో కూడా మహనీయులు ఉన్నారు. ఉదాహరణకు చైతన్యదేవుల శిష్యుడైన పుండరీక విద్యానిధినే తీసుకోండి. ఆయన గృహస్థుగానే జీవించాడు కదా!
శ్రీరామకృష్ణులు: ఆయన పీకలదాకా మద్యం సేవించాడు. ఇంకాస్త సేవించి ఉంటే గృహస్థుగా జీవించి ఉండగలిగేవాడే కాదు.
త్రైలోక్యుడు మౌనంగా ఉండిపోయాడు. ‘మ’ గిరీశ్ చెవిలో “మరి అతడు వ్రాసింది నిజం కాదు కదా!” అన్నాడు.
గిరీశ్ (త్రైలోక్యుడితో) : మరి మీరు వ్రాసింది నిజం కాదు కదా!
త్రైలోక్యుడు: అలా ఎందుకు అనుకోవాలి? గృహస్థుగా ఉంటూ పారమార్థిక జీవితం గడపవచ్చని ఆయనే (శ్రీరామకృష్ణులే) సెలవిస్తుంటారు కదా!
శ్రీరామకృష్ణులు: అవును, అలా జీవించవచ్చు. కాని జ్ఞానాన్ని సముపార్జించిన తరువాత సంసారంలో జీవించాలి, భగవంతుణ్ణి పొందిన తరువాత అలా ఉండాలి. అప్పుడు కళంక సాగరంలో ఈతకొట్టినా సరే, కళంకం అంటుకోదు. అటువంటి వ్యక్తి బురద చేపలా జీవించవచ్చు. భగవత్ ప్రాప్తి అనంతరం ఆ వ్యక్తి జీవించే సంసారం విద్యాసంసారం. అలాంటి సంసారంలో కామినీ కాంచనాలనేవి ఉండవు; అందులో ఉండేది భక్తి, భక్తుడు, భగవంతుడు మాత్రమే. నాక్కూడా భార్య ఉంది. ఇంట్లో పాత్రలు, కంచాలు ఉన్నాయి. దేశదిమ్మరులకు భోజనం కూడా పెట్టిస్తుంటాను. ఇలాంటి భక్తులు, ఉదాహరణకు హాబీ తల్లి వచ్చినప్పుడు వారి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను.
39.7 సప్తమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – అవతార తత్త్వం
ఒక భక్తుడు (త్రైలోక్యుడితో) : మీ పుస్తకంలో భగవదవతారాన్ని విశ్వసించరని వ్రాశారు. చైతన్యదేవుల గురించి ప్రస్తావిస్తూ, మీరు ఆ విషయం వ్రాశారు.
త్రైలోక్యుడు: స్వయంగా చైతన్యదేవులే అవతారవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా! పూరీలో అద్వైత తదితర భక్తులు ‘శ్రీచైతన్యులే భగవంతుడు’ అంటూ పాట పాడినప్పుడు ఆయన తమ గది తలుపులు మూసివేసుకున్నారు. భగవంతుడి ఐశ్వర్యాలు అనంతం. ఈయన (శ్రీరామకృష్ణులు) చెప్పినట్లు భక్తుడు, భగవంతుడి కచేరి చావడి. చావడి చక్కగా అలంకరించబడి ఉన్నట్లయితే, యజమాని ఐశ్వర్యమంతా అక్కడే ప్రదర్శితమై ఉందనడం పొరబాటు కాదా? సామానులన్నీ చావడిలోనే ఉంటాయా? వేరేచోట ఉండవా?
గిరీశ్: ఈయన (శ్రీరామకృష్ణులు) చెప్పేది భగవంతుడి సారం ప్రేమ అని. ఇలాంటి భగవత్ప్రేమ ఏ మానవుడి ద్వారా ప్రకటితమవుతుందో అతడే మనకు కావలసిన వాడు. ‘ఆవు పొదుగునుండే కదా మనకు పాలు లభ్యమయ్యేది! అందువల్ల మనకు కావలసింది పొదుగే. ఆవు శరీరంలోని కాళ్ళు, కొమ్ములు, తోక వంటి తక్కిన భాగాలతో మనకు పనిలేదు’ అంటారీయన.
త్రైలోక్యుడు: భగవంతుడి ప్రేమ అనే క్షీరం అసంఖ్యాక మాధ్యమాల గుండా ప్రవహిస్తోంది. ఆయన అనంత శక్తిస్వరూపుడు.
గిరీశ్: ఆ ప్రేమ ముందు వేరొక శక్తి నిలబడగలదా?
త్రైలోక్యుడు: శక్తిస్వరూపుడైన ఆ భగవంతుడు తలచుకుంటే అది సాధ్యమే. అంతా భగవంతుడి శక్తిలోనే ఇమిడివుంది.
గిరీశ్: అవును, నిజమే. కాని అవిద్యాశక్తి అనికూడా ఒకటి ఉంది.
త్రైలోక్యుడు: అవిద్య అనేది ఒక వస్తువా ఏమిటి? అలాంటి పేరుతో ఏదైనా వస్తువు ఉందా? చీకటి అనేది వెలుతురు లేమి అన్నట్లు అవిద్య అనేది ఒక అభావం (లేమి) మాత్రమే. ప్రేమను మనం అత్యున్నత స్థానంలో ఉంచుతామనే విషయంలో అనుమానానికి తావులేదు. భగవంతుడికి ఒక బిందువన్నది మనకు మహాసముద్రంతో సమానం. కాని భగవంతుడి సంబంధంగా ప్రేమ అనేదే అంతం అన్నట్లయితే అది భగవంతుడికి హద్దులు కల్పించినట్లవుతుంది.
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుడు తదితర భక్తులతో) : అవునవును, అది నిజమే. కాని ఒకింత కల్లు పుచ్చుకోగానే మనకు మత్తెక్కుతున్నప్పుడు కల్లు దుకాణంలో ఇక ఎంత కల్లు నిల్వవుందో తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి? భగవంతుడి అనంత శక్తులతో మన కేమిటి పని?
గిరీశ్(త్రైలోక్యుడితో) : మీరు భగవదవతారాలను విశ్వసిస్తారా?
త్రైలోక్యుడు: భగవంతుడు అవతరించేది భక్తుల ద్వారానే. అనంత శక్తుల వ్యక్తీకరణ సాధ్యం కాదు, కాబోదు కూడా. మానవుడి ద్వారా అనంత శక్తులు అభివ్యక్తం కావడమనేది అసాధ్యం.
గిరీశ్: మీ పిల్లలను ‘బ్రహ్మ గోపాల్’ అంటూ సేవించవచ్చు కానీ మహాపురుషులను భగవంతుడిగా పూజించలేమా ఏమిటి?
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యునితో) : అనంతాన్ని గురించి యోచించి నీ తల ఎందుకు బద్దలుకొట్టుకుంటావు? నిన్ను స్పృశించాలంటే నీ శరీరం మొత్తం స్పృశించాలా? గంగాస్నానం చేయదలిస్తే హరిద్వార్ నుండి గంగాసాగర్ వరకు స్పృశిస్తూ పోవాలా?
“ఈ ‘నేను’ అనేది తొలగిపోగానే జంజాటాలన్నీ సమసిపోతాయి. ‘నేను’ అనేది ఉన్నంతవరకు భేదబుద్ధి ఉంటుంది. ‘నేను’ అనేది వైదొలగిన తరువాత ఏదైతే మిగిలి ఉంటుందో దానిని ఎవరూ తీసుకోనూలేరు, నోటితో చెప్పనూలేరు. ఏదైతే ఉందో అదే ఉంది. ఈ ‘నేను’ తొలగిపోయిన తరువాత, ‘కొద్దిగా ఇతడి ద్వారా వ్యక్తమవుతోంది, తక్కినది అతడి ద్వారా వ్యక్తమవుతోంది’ – ఇదంతా నోటితో చెప్పజాలం. సచ్చిదానందమనేది సాగరం. అందులో ‘నేను’ అనే కుండ ఉన్నది. కుండ ఉన్నంతవరకు నీరు కుండ లోపలి భాగం, బయటి భాగం అని రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. కుండ పగిలిపోయిన తరువాత, ఒక్కటే జలం – ఆ మాట కూడా చెప్పలేం. ఎందుకంటే అప్పుడు చెప్పేవారు ఎవరు ఉన్నారు?
చర్చ ముగిసిన తరువాత శ్రీరామకృష్ణులు, త్రైలోక్యుడితో ఉల్లాసంగా మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా?
త్రైలోక్యుడు: ఎక్కడిదండి? మీ సమక్షంలో ఉన్నంతవరకు భగవదుద్దీపన కలుగుతూ ఉంటుంది. ఇక్కడనుండి వెళ్లిపోగానే మళ్ళీ కథ మామూలే.
శ్రీరామకృష్ణులు: చెప్పులు తొడుక్కున్నప్పుడు ముళ్ళపై నడవడంలో భయం లేదు. ‘భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యం’ అన్న బోధ ఉంటే కామినీకాంచనాల భయం ఉండదు.
సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతోంది. ఉపాహారం పెట్టడానికని బలరామ్ త్రైలోక్యుణ్ణి ఇంటి లోపలకు తీసుకువెళ్ళాడు. త్రైలోక్యుడు, అతడి మతాన్ని అవలంబించే వారి గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
39.7.1 అవతారాన్ని గుర్తించడం అందరికీ సాధ్యమా?
శ్రీరామకృష్ణులు (గిరీశ్, ‘మ’ తదితర భక్తులతో) : వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? ఒక చిన్న బావిలోని కప్పల్లాంటివారు. ఆ కప్పలు ఎన్నడూ బయటి ప్రపంచాన్ని చూసి ఎరుగవు. తమ చిన్న బావి గురించి మాత్రమే వాటికి తెలుసు. అందుకే బయట ప్రపంచం అనేది ఉన్నదని అవి ఎంతమాత్రం విశ్వసించవు. భగవదానందం ఎలాంటిదో వారికి తెలియలేదు కాబట్టే వారు ‘సంసారం సంసారం’ అంటూ పలవరిస్తూ ఉంటారు.
(గిరీశ్‌తో) “వారితో వాదించే పని ఏముంది? వారు భగవంతుడు, సంసారం – రెంటినీ పట్టుకు వ్రేలాడుతుంటారు. భగవదానందాన్ని చవి చూడనిదే ఆ ఆనందం ఎలాంటిదో అర్థం చేసుకోజాలం. అయిదు సంవత్సరాల బాలుడికి రతి సుఖం ఎలాంటిదో తెలియచేయగలమా? విషయాసక్తులు ‘భగవాన్, భగవాన్’ అంటూ ఉండటం కేవలం చిలుక పలుకుల్లాంటివి. ఇంట్లోని తోడికోడళ్ళు కలహించుకొనేటప్పుడు వారి మాటలు విని పిల్లలు కూడా ‘దేవుని సాక్షిగా’, ‘నాకు తోడుగా భగవంతుడు ఉన్నాడు’ అనడం నేర్చుకుంటారు.
39.7.2 వజ్రాన్ని వెల కట్టే వివిధ వ్యాపారుల కథ
“పోనీలే, అది వారి తప్పు కాదు. అందరూ ఆ అఖండ సచ్చిదానందుణ్ణి అవగతం చేసుకోగలరా ఏమిటి? శ్రీరాముణ్ణి కేవలం పన్నెండుమంది ఋషులు మాత్రమే గుర్తించగలిగారు. అందరూ అతణ్ణి గుర్తించలేకపోయారు. అవతార పురుషుణ్ణి కొందరు సాధారణ మానవుడిగా తలుస్తారు, మరి కొందరు సాధుపుంగవుడిగా భావిస్తారు. కేవలం ఏ ఇద్దరో ముగ్గురో మాత్రమే ఆయన్ను అవతార పురుషుడిగా గుర్తించగలుగుతారు.
“ఎవరి దగ్గర ఎంత పెట్టుబడి ఉంటుందో, దానికి తగ్గట్లు వారు వస్తువులకు వెల కడతారు. ఒక ధనవంతుడు తన పనివాడితో ఇలా అన్నాడు: ‘ఈ వజ్రాన్ని బజారుకు తీసుకువెళ్ళి దీనికి ఎవరు ఎంత వెల కడతారో నాకు తెలియచెయ్యి. ముందు దీన్ని వంకాయల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళు’ అన్నాడు. పనివాడు దానిని వంకాయల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ వ్యాపారి వజ్రాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ‘తమ్ముడూ, దీనికి బదులుగా తొమ్మిది వీసెల వంకాయలనిస్తాను. సరేనా’ అన్నాడు. అందకు పనివాడు, ‘చూడవయ్యా! ధర కొద్దిగా పెంచు. సరేలే, పది వీసెల వంకాయల నివ్వు’ అన్నాడు. వంకాయల వ్యాపారి, ‘ఊహు, నేను బజారు ధరకంటే ఎక్కువగానే చెప్పాను. నీకు గిట్టు బాటయితే ఇచ్చి వెళ్ళు, లేదంటే లేదు’ అన్నాడు.
“పనివాడు నవ్వుతూ వెళ్ళి తన యజమానికి తెలిపాడు: ‘అయ్యా, వంకాయాల వ్యాపారి తొమ్మిది వీసెల వంకాయల కంటే ఎక్కువగా ఒక్క వంకాయ కూడా ఇవ్వనన్నాడు. బజారు ధరకంటే ఎక్కువగా చెప్పేశా నన్నాడతడు.’ యజమాని చిరుదరహాసంతో ఇలా అన్నాడు: ‘ఎంతైనా అతడు వంకాయల వ్యాపారి కదా! వజ్రం విలువ అతడికి ఏం తెలుస్తుంది? దీనిని నువ్విప్పుడు బట్టల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళు. బట్టల వ్యాపారి పెట్టుబడి కాస్త ఎక్కువే కదా! అతడెంత ధర చెప్తాడో చూద్దాం?’ పనివాడు వజ్రాన్ని బట్టల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి ‘ఏమయ్యా దీన్ని తీసుకుంటావా? దీనికి ఏం ధర ఇస్తావు?’ అని అడిగాడు. అందుకు బట్టల వ్యాపారి, ‘ఆ, వస్తువు బాగానే ఉంది. దీంతో మంచి ఆభరణం చేయించుకోవచ్చు. తమ్ముడూ, దీనికి నేను తొమ్మిది వందల రూపాయల నిస్తాను’ అన్నాడు.
“ ‘అయ్యా, ధర ఇంకాస్త పెంచినట్లయితే దీన్ని మీకే ఇచ్చేస్తాను. సరేలే, వెయ్యి రూపాయలు ఇచ్చుకోండి’ అన్నాడు పనివాడు.
“ ‘ఇంక వేరే ఏమీ మాట్లాడవద్దు. నేను బజారు ధరకంటే ఎక్కువే చెప్పాను. తొమ్మిది వందలకుపైన ఒక్క రూపాయికూడా ఇవ్వను” అని ఖరాఖండిగా చెప్పేశాడు బట్టలవ్యాపారి.
“పనివాడు తనలో తాను నవ్వుకుంటూ యజమాని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు: ‘బట్టల వ్యాపారి తొమ్మిది వందలకుపైన ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నాడు. పైగా, నేను బజారు ధరకంటే ఎక్కువగానే చెప్పాను అన్నాడు.’ ఆ యజమాని పగలబడి నవ్వుతూ ‘ఇప్పుడు దీన్ని రత్నాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి అతడేం చెప్తాడో చూడు’ అన్నాడు. పనివాడు దానిని రత్నాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళాడు. దాన్ని చూసిన మరుక్షణానే అతడు ‘లక్ష రూపాయలు ఇస్తాను’ అన్నాడు.
39.7.3 ఈశ్వరకోటి – జీవకోటి
వీరు సంసారంలో ‘ధర్మం, ధర్మం’ అంటూ గగ్గోలు పెడుతుంటారు. తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసిన ఒక గదిలో ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. పైకప్పులోని ఒక సన్నని రంధ్రంగుండా కొద్దిగా వెలుతురు వస్తోంది. ఆ విధంగా పైకప్పు ఉన్నప్పుడు సూర్యుణ్ణి దర్శించలేం కదా! పైగా కొద్దిపాటి వెలుతురుతో ప్రయోజనం ఏమిటి? కామినీ కాంచనాలే పైకప్పు. పైకప్పును తొలగించకుండా సూర్యుణ్ణి చూడగలమా? సంసారులు ఆ గదిలో బంధింపబడివున్న వ్యక్తిలాంటి వారు. “అవతార పురుషులు ఈశ్వరకోటికి చెందినవారు. వారు ఆరుబయట తిరిగే వ్యక్తులలాంటి వారు. సంసారంలో ఎన్నటికీ బద్ధులు కారు, బందీలు అవరు. వారి ‘నేను’ నలువైపులా గోడలు, తలపైన కప్పు ఉండడం లాంటిది. అందులో ఉన్న వ్యక్తికి బయటి వస్తువులు ఏవీ కనిపించవు.
అవతార పురుషులు మొదలైనవారి ‘నేను’ పలచని ‘నేను’. ఆ ‘నేను’ ద్వారా వారు సర్వదా భగవంతుణ్ణి దర్శిస్తారు. ఒక వ్యక్తి ఒక ప్రహరీగోడ ప్రక్కన నిలబడ్డాడనుకుందాం. ప్రహరీగోడకు రెండు వైపులా అనంత మైదానం ఉంది. గోడలో కనుక రంధ్రం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ రంధ్రం గుండా గోడకు అటువైపు ఉన్నదంతా చూడగలుగుతాడు. రంధ్రం పెద్దదైనట్లయితే దానిగుండా రాకపోకలు కూడా చేయవచ్చు. అవతార పురుషులు మొదలైనవారి ‘నేను’ ఈ విధంగా రంధ్రం ఉన్న గోడవంటిది. వారు గోడకు ఇటువైపుగా ఉన్నప్పటికీ గోడకు ఆవల ఉన్న అనంత మైదానాన్ని కూడా చూడగలుగుతారు. దీని అర్థం ఏమిటంటే దేహధారణ చేసినప్పటికీ వారు సదా భగవంతుడితో సంయోగం (అంటే కలిసి) చెంది ఉంటారు. పైగా, ఇచ్ఛ వచ్చినప్పుడల్లా వారు రంధ్రం గుండా గోడ ఆవలి వైపుకు వెళ్ళి సమాధిస్థితులవుతారు. రంధ్రం కనుక పెద్దదైతే వారు దానిగుండా రావడం పోవడం కూడా చేస్తారు. సమాధి స్థితి పొందినప్పటికీ వారు మళ్ళీ సాధారణ స్థాయికి దిగిరాగలరు.
భక్తులంతా నివ్వెరబోయి ఈ అద్భుత అవతారతత్త్వ వివరణను వింటున్నారు.