38.1 ప్రథమ పరిచ్ఛేదం బలరామ్ ఇంట్లో నరేంద్రుడు, గిరీశ్, లాటూ, నారాయణ్ ప్రభృతులతో
బుధవారం, మార్చి 11, 1885
నేడు దక్షిణేశ్వరం నుండి శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరామ్బోసు ఇంటికి విచ్చేశారు. వారి ఇంట్లో శ్రీ జగన్నాథస్వామి అన్నప్రసాదం ఆరగించారు. బలరామ్బోసుది జమీందారీ కుటుంబం. అతడి కుటుంబంలోని వారందరూ భక్తితత్పరులు, పుణ్యాత్ములు. వారి ఇంట్లో శ్రీ జగన్నాథస్వామికి నిత్యపూజలు జరుగుతూ ఉంటాయి. వారు పరమ నిష్ఠతో స్వామిని సేవిస్తూ ఉంటారు. వారి ఇంటి భోజనం చాలా పవిత్రమైనదని శ్రీరామకృష్ణులు తరచూ చెబుతూంటారు.
‘ఓ బలరామా! నిజంగానే నువ్వు ధన్యుడవు సుమా! నీ గృహం నేడు శ్రీరామకృష్ణుల ప్రధాన కార్యక్షేత్రమై ఒప్పారుతోంది. అది ఎన్ని నోముల ఫలమో కదా! శ్రీవాసుని గృహంలో గౌరాంగ మహాప్రభువులు శ్రీకృష్ణ ప్రేమను పంచి పెట్టటానికి వేంచేసిన రీతిలోనే శ్రీరామకృష్ణులు నీ గృహాన్ని పావనం చేశారు. నూతన భక్తులు ఎంతోమంది ఆయనపట్ల ఆకర్షితులై నీ గృహానికి వచ్చారు. భక్తుల సాంగత్యంలో ఆయన ఈ భవనంలో ఎన్నోసార్లు మహదానందంతో గానం చేశారు, నృత్యం చేశారు. నీ భాగ్యం ఏమని కొనియాడగలం?’
శ్రీరామకృష్ణులు తమ అంతరంగ భక్తులను చూడటానికి ఎంతగానో ఆరాటపడేవారు. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కూర్చుని విలపిస్తూండేవారు. కంటిపై కునుకు ఉండేది కాదు. జగన్మాతతో ఇలా మొరపెట్టుకొనేవారు: “అమ్మా! అతడు భక్తితత్పరుడు, నువ్వు అతణ్ణి ఆకర్షించివెయ్యి. అమ్మా, అతణ్ణి ఇక్కడకు తీసుకురా. ఒకవేళ అతడు ఇక్కడకు రాలేని పక్షంలో నన్నే అక్కడకు తోడ్కొనిపో. నేను అతణ్ణి చూసి వస్తాను.” ఈ ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు బలరామ్ ఇంటికి తరచూ వెళుతూ ఉంటారు. నిష్కపటులు, పవిత్ర హృదయులు, కామినీ కాంచనాల పట్ల అనాసక్తులయిన బాలురను చూడాలన్నదే ఆయన రాకలోని ఆంతర్యం. ఈ బాలభక్తులను సాదరంగా ఆహ్వానించి భోజనాలు పెడుతుండమని ఆయన తరచూ బలరామ్‌కు చెబుతుంటారు. శ్రీరామకృష్ణులు బలరామ్ ఇంటికి రాగానే ఈ బాలురను రావిస్తారు. ఆయన బలరామ్‌తో ఇలా అంటారు: “నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్ తదితర బాలురు సామాన్యులు కారు. వారు సాక్షాత్తూ భగవదంశతో జన్మించిన వారు. వీరికి తినిపించితే శ్రీమన్నారాయణునికే భోజనం పెట్టినంత ఫలం! ఇది నీకు ఎంతో మేలు ఒనగూరుస్తుంది.” ఇంకా భక్తులతో ఇలా అంటారు: “ఇది శ్రీ జగన్నాథుని ప్రసాదం, పరిశుద్ధమైన అన్నం. మొహమాటం లేకుండా భుజించండి.”
గిరీశ్చంద్ర ఘోష్ తొలిసారి శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ ఇంట్లోనే. శ్రీరామకృష్ణులు జగన్నాథస్వామి రథయాత్ర నాడు రథాన్ని లాగుతూ కీర్తనానందంలో ఉన్మత్తులయిందీ ఇక్కడే. ఆయన తన ప్రేమ దర్బారులో భక్తులకు అపరిమిత దివ్యానందాన్ని పంచిపెట్టిందీ ఇక్కడే.
38.1.1 స్కూలు నుండి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన ‘మ’
‘మ’ బలరామ్ ఇంటికి సమీపంలో ఉన్న ఒక విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు పది గంటలకు బలరామ్ ఇంటికి విచ్చేస్తారని అతడు విన్నాడు. అందుకని మధ్యాహ్నం అతడు బడిలో కాస్త తీరిక చేసుకొని బలరామ్ ఇంటికి వచ్చాడు. అప్పటికి శ్రీరామకృష్ణులు భోజనం ముగించి ఇంటి అతిథుల గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యమధ్యలో కొద్దిగా మసాలా దినుసులు నోట్లో వేసుకొంటున్నారు. ఆయన చుట్టూ బాలభక్తులు కూర్చుని ఉన్నారు. ‘మ’ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు(‘మ’ తో, ఆప్యాయంగా): నువ్వు ఎలా వచ్చావు? స్కూలు లేదా?
‘మ’ : స్కూలునుండే వస్తున్నానండి. ప్రస్తుతం అక్కడ చెప్పుకోదగ్గ పని అంటూ ఏమీ లేదు.
ఒక భక్తుడు: ఏమండోయ్, ఈయనగారు (‘మ’) స్కూలు నుండి పారిపోయి వస్తున్నారు.
(అందరూ నవ్వారు.)
‘మ’ తనలో ఇలా అనుకొన్నాడు: ‘ఆహా! నన్ను ఏదో అజ్ఞాతశక్తి ఈడ్చుకొని వచ్చేసింది!’
శ్రీరామకృష్ణులు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. కాసేపటి తరువాత ‘మ’ ను దగ్గరకు పిలిచి అనేక విషయాల గురించి మాట్లాడసాగారు. పిదప ఇలా అన్నారు: “నా చొక్కా, తువ్వాలు పిండి ఆరవేయి.” మళ్ళీ ఇలా అన్నారు: “నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. కాస్త నెమ్మదిగా ఒత్తవోయ్.” ‘మ’ కు సేవ చేయటం ఎలాగో తెలియదాయె. అందుకే శ్రీరామకృష్ణులు సేవ చేయడం ఎలాగో అతడికి నేర్పిస్తున్నారు. ‘మ’ ఎంతో వినయంతో ఆయన పాదాలను ఒత్తసాగాడు మాటల నడుమ శ్రీరామకృష్ణులు ఉపదేశాలు ఇస్తున్నారు.
38.1.2 శ్రీరామకృష్ణుల త్యాగనిరతి – చిన్న నరేంద్రుని గురించి సంభాషణ
శ్రీరామకృష్ణులు (‘మ’)తో: ఆ, ఈ మధ్య ఎన్నో రోజులుగా నేను లోహ వస్తువును దేనినీ స్పృశించలేకపోతున్నాను. నాకు ఎందుకు ఇలా అవుతోందో కాస్త చెప్పు. ఒకసారి పాత్ర నొకదానిని తాకాను. అంతే! తేలు కుట్టినట్లు ఒకటే బాధ! బహిర్భుమికి పోతున్నప్పుడు చెంబును ఎలాగైనా వాడవలసిందే కదా! అందుకనే చేతిని తువ్వాలుతో కప్పి చెంబు పట్టుకొని చూద్దామనుకున్నాను. కాని ఆ విధంగా చెంబును తాకానో లేదో, మళ్ళీ తేలు కుట్టినట్లు అదే బాధ! అది భరించరాని నొప్పి అనుకో. చివరకు అమ్మను ఇలా ప్రార్థించాను: ‘అమ్మా! మళ్ళీ ఇటువంటి పనులు చేయను. ఈసారికి క్షమించు.”
“అవునూ, చిన్న నరేంద్రుడు ఇక్కడకు వస్తూ ఉంటాడు కదా! ఆ విషయమై ఇంట్లోవారు అతణ్ణి ఏమయినా అంటారా? అతడి హృదయం ఎంతో పవిత్రమయినది, అతడికి స్త్రీ సుఖం అంటే ఏమిటో కూడా తెలియదు.”
‘మ’ : అవునండీ, ‘ఆధారం పెద్దది’.
శ్రీరామకృష్ణులు: అవును. ‘భగవద్విషయాలు ఒక్కమారు వింటే చాలు, జ్ఞాపకం ఉండిపోతాయి’ అంటాడతడు. చిన్నప్పుడు, ‘నాకు భగవంతుడు దర్శనం ఇవ్వటం లేదే’ అంటూ విలపించేవాడట.
ఈ విధంగా చిన్న నరేంద్రుడి గురించి సంభాషణ సాగుతూ ఉండగా అక్కడ ఉన్న భక్తులలో ఒకరు ‘మ’ తో “అయ్యా, మీరు స్కూలుకు వెళ్ళరా?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: సమయం ఎంత?
భక్తుడు: పది నిమిషాలు తక్కువ ఒంటిగంట.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు ఇక బయలుదేరటం మంచిది. అసలే పని వదలిపెట్టి వచ్చావాయె. (లాటూతో) రాఖాల్ ఎక్కడ?
లాటూ: అతడు వెళ్ళిపోయాడండీ.
శ్రీరామకృష్ణులు: నన్ను చూడకుండానే వెళ్ళిపోయాడా?
38.2 ద్వితీయ పరిచ్ఛేదం భక్తులతో శ్రీరామకృష్ణులు – అవతార తత్త్వం
సాయంకాలం స్కూలు వదలగానే ‘మ’ బలరాం ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆనందమయులై ముందు గదిలో భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆయనతోపాటు భక్తులు కూడా ఆనందంలో ఓలలాడుతున్నారు. ‘మ’ వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. అతణ్ణి దగ్గరగా వచ్చి కూర్చోమని ఆయన సైగ చేశారు. గిరీశ్ ఘోష్, సురేష్ మిత్ర, బలరామ్, లాటూ, ఛునీలాల్ తదితర భక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): నువ్వు ఒకసారి నరేంద్రుడితో వాదించి చూడు, అతడు ఏం మాట్లాడతాడో గమనించు.
గిరీశ్ (నవ్వుతూ): నరేంద్రుడు ‘భగవంతుడు అనంతుడు’ అంటాడు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి, వినేటటువంటి వస్తువులను భగవదంశలుగా పేర్కొనరాదని వాదిస్తాడు. ఎందుకంటే, అనంతుడికి అంశలు ఏమిటి? అది సాధ్యం కాదు.
శ్రీరామకృష్ణులు: భగవంతుడు అనంతుడే కావచ్చు. అపార మహిమాన్వితుడే కావచ్చు. కాని ఆయన తలచుకొంటే ఆయనలోని సారపదార్థం మానవుని ద్వారా వ్యక్తం అవగలదు, అవుతుంది కూడా. భగవంతుడు మానవరూపంలో అవతరిస్తాడు అనే విషయాన్ని సాదృశ్యాల ద్వారా వివరించలేం. అందుకు ప్రత్యక్షానుభవం కావాలి. ఉపమానాల ద్వారా కొద్దికొద్దిగా సూచనప్రాయంగా మాత్రమే తెలుసుకోగలం. ఆవు శరీరంలో దాని కొమ్మునో కాలినో లేక దాని తోకనో – దేనిని తాకినా అది ఆవును తాకినట్లే అవుతుంది కదా! కాని, మనకు సంబంధించినంత వరకు ఆవులోని సారపదార్థం పాలు మాత్రమే – ఆ పాలు ఆవు పొదుగు నుండి లభిస్తుంది. అదేవిధంగా లోకులకు ప్రేమభక్తిని నేర్పించాలనే ఉద్దేశంతో భగవంతుడు మానవ దేహాన్ని ధరించి మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు.
గిరీశ్: ‘భగవంతుడు అనంతుడు. ఆయన్ను మనం సంపూర్ణంగా తెలుసుకోగలమా ఏమిటి?’ అంటూ ఉంటాడు నరేంద్రుడు.
38.2.1 భగవంతుడు – అవతారం
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడం ఎవరి తరం? ఆయనలోని అధికాంశాన్ని తెలుసుకోలేం, అల్పాంశాన్ని కూడా తెలుసుకోలేం. ఆయన్ను పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఏమిటి? ఆయన్ను సాక్షాత్కరించుకుంటే చాలు, పని జరిగిపోతుంది. భగవదవతారాన్ని చూసినట్లయితే భగవంతుణ్ణి చూసినట్లే. ఎవరైనా వ్యక్తి గంగానది వద్దకు వెళ్ళి గంగాజలాన్ని స్పృశించాడనుకుందాం. అలా స్పృశించిన పిదప ఆ వ్యక్తి, ‘అవును, నేను గంగాజాలాన్ని దర్శించాను, స్పృశించాను’ అంటాడు. అంతే కాని అతడు గంగానదిని హరిద్వార్ నుండి గంగాసాగర్ (గంగానది సముద్రంలో కలిసే చోటు, బెంగాల్లో ఉన్నది) వరకు చేతులతో స్పృశించాల్సిన అవసరం లేదు కదా! (అందరూ నవ్వారు) నీ పాదాలను తాకితే నిన్ను తాకినట్లే కదా! (నవ్వులు)
“సముద్రం వద్దకు వెళ్ళి ఒకింత జలాన్ని స్పృశించినట్లయితే అది సముద్రాన్ని స్పృశించినట్లే అవుతుంది. అగ్నితత్త్వం అన్నిచోట్లా ఉంది, కాని కట్టెలో అధికంగా ఉంటుంది.”
గిరీశ్(నవ్వుతూ): ఆ, అదే, ఆ అగ్ని లభించే చోటే నాకు కావలసింది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అగ్నితత్త్వం కట్టెలో అధికంగా ఉంటుంది. భగవత్ తత్త్వం గురించి వెదకాలనుకుంటే మనిషిలో వెదకు. మనిషిలో ఆయన అభివ్యక్తీకరణ అధికం. ఎవరిలో అయితే ఊర్జిత భక్తి ప్రస్ఫుటంగా అగుపిస్తుందో, ప్రేమభక్తి పొంగిపొరలుతూ ఉంటుందో, ఎవరయితే భగవంతుని కోసం పిచ్చివాడే అవుతాడో, ఆయన ప్రేమలో మత్తిల్లిపోతాడో అతడిలో భగవంతుడు అవతరించాడని నిశ్చయంగా తెలుసుకో.
(‘మ’ వంక చూస్తూ) “భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడన్నది నిజమే. కాని ఆయన శక్తి కొన్నిచోట్ల అధికంగానూ, మరికొన్ని చోట్ల స్వల్పంగానూ వ్యక్తీకృతమై ఉంటుంది. అదేశక్తి ఒక్కోసారి (అవతార పురుషుల్లో) పూర్ణ భావంలో ఉంటుంది. అవతార పురుషుడు శక్తికి చెందినవాడే.” (అంటే, శక్తియే అవతారపురుషుడిగా జన్మిస్తుంది.)
గిరీశ్: నరేంద్రుడు, ‘భగవంతుడు అవాఙ్మానసగోచరుడు’ అని అంటాడు.
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది కాదు. భగవంతుడు ఈ మనస్సుకు అగోచరం అన్నమాట నిజమే కాని శుద్ధ మానసానికి ఆయన గోచరుడే. ఆయన ఈ బుద్ధికి అగోచరుడు కాని శుద్ధబుద్ధికి గోచరుడే. కామినీ కాంచనాల పట్ల అనురక్తి తొలగిపోగానే మనోబుద్ధులు శుద్ధమైపోతాయి. ఆ స్థితిలో శుద్ధమనస్సు, శుద్ధ బుద్ధి – రెండూ ఒక్కటే. భగవంతుడు శుద్ధ మానసానికి గోచరుడు. ప్రాచీన ఋషులు, మునులు భగవంతుణ్ణి దర్శించలేదా ఏమిటి? వారు చైతన్యం ద్వారా చైతన్యాన్ని సాక్షాత్కరింపచేసుకున్నారు.
గిరీశ్ (నవ్వుతూ): నరేంద్రుడు నాతో వాదనలో ఓడిపోయాడండీ.
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది కాదు సంగతి. నరేంద్రుడు అసలు విషయం నాతో చెప్పాడులే. ‘గిరీశ్ ఘోష్‌కు భగవదవతారం పట్ల అంతటి విశ్వాసం ఉంటే మరి నేను ఏం చేయగలను? అలాంటి విశ్వాసాన్ని వమ్ముచేయటం మంచిది కాదు కదా!’
గిరీశ్(నవ్వుతూ): మహాశయా, మేమందరం నిరాఘాటంగా మాట్లాడుతూనే ఉన్నాం. కాని మాస్టర్ (‘మ’) నోరు మెదపకుండా కూర్చుని ఉన్నాడు. ఇతడు ఏదో ఆలోచనలో ఉన్నాడు. అయ్యా దీన్ని గురించి మీరు ఏమంటారు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇటువంటి వ్యక్తుల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పే లోకోక్తి ఒకటి ఉంది: ‘అతిగా వాగేవాడు; తన హృదయపు లోతులను అంతబట్టనివ్వనివాడు; చెవిలో తులసిదళం పెట్టుకొని తన భక్తిని చాటేవాడు; పొడవాటి మేలి ముసుగును ధరించి తాను పెద్ద పతివ్రతనని చాటజూపే స్త్రీ – కాని నిజానికి ఆమె ప్రవర్తన సరైనదిగా ఉండదు; ఇంకా నాచుతో నిండిన కొలను – దాన్లో స్నానం చేస్తే సన్నిపాత జ్వరం వస్తుంది.’
(నవ్వుతూ) “కాని ఇతడి (‘మ’) విషయం వేరు. ఇతడు గంభీర స్వభావి.” (అందరూ నవ్వారు)
ఛునీలాల్: ‘మ’ గురించి అందరూ పలు విధాలుగా చెబుతున్నారు. చిన్న నరేంద్రుడు, బాబూరామ్ ఇతడి విద్యార్థులు. ఇతడే వారిని మీ వద్దకు తోడ్కొని వస్తున్నాడని, అందువల్ల వారి చదువులు పాడవుతున్నాయని వదంతి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇతణ్ణే తప్పు పడుతున్నారు.
శ్రీరామకృష్ణులు: కాని వారి మాటలను ఎవరు నమ్ముతారు?
ఈ విధంగా చర్చ జరుగుతుండగా నారాయణ్ అనే అబ్బాయి గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడి వయస్సు పదిహేడు లేక పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది, మంచి మేనిరంగు. స్కూలులో చదువుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఎంతగానో అభిమానిస్తారు. అతణ్ణి చూడాలని, అతడికి ఏమయినా తినిపించాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. అతడి కోసం దక్షిణేశ్వరంలో కూర్చుని విలపించేవాడు కూడా. ఆయన నారాయణ్‌ను సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు.
గిరీశ్ (నారాయణ్‌ను చూస్తూ): ఇతడికి ఎవరు ఉప్పు అందించారు? చూడబోతే ‘మ’ యే వీటన్నిటికీ కారణం అనిపిస్తోంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆగు, ఆగు. ఇప్పటికే పలువురు ఇతణ్ణి తప్పు పడుతున్నారు. దానికి తోడు నువ్వు కూడా ఇలా మాట్లాడతావా?
38.2.2 పొట్టకూటికోసమైన చింత
ఇంతలో నరేంద్రుడి గురించి ప్రస్తావన వచ్చింది.
ఒక భక్తుడు: ప్రస్తుతం అతడు మీ వద్దకు అంతగా రావటం లేదు, ఎందుకట?
శ్రీరామకృష్ణులు: ఒక సామెత ఉంది: ‘పొట్టకూటికోసమైన చింత ఆశ్చర్యకరం, అది కాళిదాసు బుద్ధిని కూడా హరించివేస్తుంది.’
బలరామ్: నరేంద్రుడు శివగుహ కుటుంబానికి చెందిన అన్నదా గుహ వద్దకు తరచూ వెళుతుంటాడు.
శ్రీరామకృష్ణులు: అవును. నరేంద్రుడు, అన్నదా మొదలైన వారు ఒక ఆఫీసు అధికారి ఇంటికి వెళ్ళి బ్రహ్మ సమాజ సభలు నిర్వహిస్తూ ఉంటారు.
ఒక భక్తుడు: ఆ అధికారి పేరు తారాపదుడు.
బలరామ్ (నవ్వుతూ): అన్నదా గుహకు అహంకారం ఎక్కువ అని బ్రాహ్మణులు చెబుతుంటారు.
శ్రీరామకృష్ణులు: బ్రాహ్మణులు చెప్పే అటువంటి మాటలు వినబోకు. వారి సంగతి నీకు తెలిసిందే కదా! ఎవరైనా ఏదైనా ఇస్తే అతడు మంచివాడు, లేకుంటే పనికిమాలిన వాడు. (అందరూ నవ్వారు) అన్నదాను నేను ఎరుగుదును. అతడు సజ్జనుడు.
38.3 తృతీయ పరిచ్ఛేదం భక్తులతో భజనానందంలో
గది అంతా భక్తులతో నిండిపోయి ఉంది. శ్రీరామకృష్ణులు కోరటంతో తారాపదుడు శ్రీకృష్ణుని గురించిన పాట నొకదాన్ని పాడాడు:
ఓ కేశవా! బృందావనాంతర
లతా నికుంజ వినోద విహారా! కేశవా!
హే మాధవా! ఓ మధుర మనోహర!
మురళీధరా! మానస చోరా!
బోలో హరినామ్! హే మన గావో శ్రీహరి నామ్!
గంభీర స్వర్మే భజో ప్రభు హరినామ్ ॥
నిత్య యౌవనా! హే వ్రజబాలా! కాళీదమనా! ఆర్తిహరా!
కపటలోచనా! కామితవదనా!
బర్హిబర్హావతంసా
రాధారమణీ హృదయ మనోహర!
బోలో హరినామ్ । హే మన గావో శ్రీహరినామ్ ।
గంభీర స్వర్మే భజో ప్రభు హరినామ్ ॥
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఆహా, ఇది అద్భుతమైన పాట. ఈ పాట నువ్వు వ్రాశావా?
ఒక భక్తుడు: అవునండీ, చైతన్య లీల నాటకం కోసమని ఈయన ఈ పాటలు వ్రాశారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఈ పాట చాలా బాగా రక్తి కట్టింది.
శ్రీరామకృష్ణులు కోరడంతో తారాపదుడు మరో రెండు పాటలు పాడాడు. మొదటి పాటలో రాధాదేవితోపాటు శ్రీకృష్ణ ప్రేమలో పాలుపంచుకొమ్మని నితాయ్ ప్రజలకు ప్రబోధిస్తున్నాడు:
రండు రండూ రండు రండందరూ రండు
రండు రాధాప్రేమ రండు గైకొనరండు ॥
అత్యంత వెల్లువై అత్యున్నతంబుగా
ఆమె ప్రేమయె మన కతి దగ్గరగా పారు
అది నిలచు కాలము అతి స్వల్పమేగాన
రండందరూ రండు రండు గైకొనరండు ॥ రం ॥
ఆమె దేహము నుండి అగణితంబైనట్టి
ప్రేమవాహినులెన్నొ ప్రవహించుచున్నవి
ఏ పాత్రదెత్తురో ఆ పాత్రయేనిండు
గాన మీరందరూ కదలి గైకొనరండు ॥ రం ॥
ప్రేమ నిర్మితమైన ప్రేమరూపిణి రాధ
ఏ జంకు గొంకులను ఏమాత్రమునులేక
ప్రేమ అందరిపైన కుమ్మరించుచునుండె
గాన మీరందరు కదలి గైకొనరండు ॥ రం ॥
ఆ ప్రేమ హృదయమును అపవర్గ సుఖముచే
ఓపజాలని మత్తులో పులకలెత్తింప
ప్రేమచే లాగబడి ప్రభు హరిని భజియింప
రండందరూ రండు రండు వేగమె రండు ॥ రం ॥
పిదప తారపదుడు గౌరాంగుని గురించి పాడాడు:
ఎవరవయ్యా నీవు స్వర్ణ గౌరాంగ?
జీవతాపము తీర్చువాడ గౌరాంగ ॥
ప్రేమాబ్ధిలో నీవు పెనుతుపాను లేప
పడవ సాఫిగ నందు నడుపలేకున్నాను ॥ ఎ ॥
ఒకసారి బృందావనాంతరాన నీవు
గోవులను గాచితివి గోపబాలుని రీతి
మురళి కరమున బూని మోహపరవశత
పడవైచితివి గోపభామినుల నీవు ॥ ఎ ॥
గోవర్ధనంబును గోట నెత్తుచును
బ్రోచితివి చెడునుండి బృందావనంబు
కాళ్ళు నొచ్చిన గోపభామినుల కాళ్ళు
పట్టితివి ప్రేమ పరితాపమున నీవు ॥ ఎ ॥
భక్తులందరూ ‘మ’ ను పాడమని కోరారు. కాని ‘మ’ సిగ్గుతో కుంచించుకుపోయి “ఊహూ, నా వల్ల కాదు” అన్నాడు.
గిరీశ్(శ్రీరామకృష్ణులతో, నవ్వుతూ): మహాశయా, ‘మ’ తో పాడించటం ఎలా?
శ్రీరామకృష్ణులు (విసుగుతో): ఇతడు స్కూలులో అందరికి తన పళ్ళన్నీ చూపిస్తుంటాడు. కాని ఇక్కడ పాట పాడమనేసరికి సిగ్గుపడిపోతాడు.
‘మ’ సిగ్గుతో తలవంచుకొని మాటపలుకు లేకుండా కూర్చుండిపోయాడు.
సురేశ్ మిత్ర కాస్త దూరంలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు గిరీశ్ ఘోష్‌ను చూపిస్తూ అతడితో ఆప్యాయంగా ఇలా అన్నారు: “నువ్వు ‘హద్దూ అదుపూ లేకుండా జీవితాన్ని గడిపాను’ అంటుంటావు కదా! ఇతడు (గిరీశ్) నిన్ను మించినవాడు.”
సురేశ్(నవ్వుతూ): ఆ, తెలుసునండీ. ఆ విషయంలో ఇతడు మా తాత.
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా, నేను పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ జనం నన్ను విద్వాంసుడని అంటుంటారు.
38.3.1 శాస్త్ర పాండిత్యం – ‘ఉత్తరం’ దృష్టాంతం – పంచాంగం, వర్షం
శ్రీరామకృష్ణులు: మహిమాచక్రవర్తి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు. అతడు గొప్ప వ్యక్తి. (‘మ’ తో) నువ్వేమంటావు?
‘మ’ : అవును, నిజమేనండీ.
గిరీశ్: ఏమిటి, శాస్త్రజ్ఞానమా? అలాంటివి ఎన్నో చూశాను. ఇప్పుడు నేను వాటి మాయలో చిక్కుకోను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నా అభిప్రాయం ఏమిటో తెలుసా? పుస్తకాలు, శాస్త్రాలు మొదలైన వన్నీ కేవలం భగవంతుని వద్దకు చేరే మార్గాన్ని తెలియచేయగలవు. ఆ మార్గం తెలుసుకున్న పిదప పుస్తకాల, శాస్త్రాల అవసరం మరి ఉండబోదు. అటుపైన కావలసింది సాధనలో నిమగ్నమై పోవటమే.
“ఒక వ్యక్తికి ఒక ఉత్తరం వచ్చింది. అతడి బంధువుల కోసం కొన్ని వస్తువులను కొని తెమ్మని అందులో వ్రాసి ఉంది. పిదప ఆ వ్యక్తి వస్తువులను కొనటానికి వెళ్ళినప్పుడు ఉత్తరం కనబడలేదు. ఎంత వెదికినా అది దొరకలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఎంతో అదుర్దాతో దానికోసం ఇక్కడా అక్కడా వెదకడం మొదలుపెట్టాడు. మరి కొందరు కూడా అతడితో కలిసి వెదకసాగారు. చివరకు ఆ ఉత్తరం దొరికేసరికి ఆ వ్యక్తి ఎంతగానో సంబరపడిపోయాడు. అప్పుడు అతడు ఎంతో జాగ్రత్తగా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకొని దాన్లో వ్రాసిన విషయాన్ని చదివాడు. అందులో ఐదు శేర్ల మిఠాయి, ఒక ధోవతి, ఏవో మరికొన్ని వస్తువులు తీసుకురమ్మని వ్రాసి ఉంది.
“అది చదివాక అతడికి ఆ ఉత్తరం అవసరం మరి లేకపోయింది. ఉత్తరాన్ని ప్రక్కకు పెట్టి అతడు ఆ వస్తువులను సమకూర్చటంలో నిమగ్నమైపోయాడు. ఉత్తరం అవసరం ఎంతవరకు? అందులోని విషయాలు తెలియనంతవరకే. ఆ విషయాలు తెలిసిన తరువాత కావలసింది ఆ వస్తువులకై ప్రయత్నం చేయటమే. భగవంతుని పొందేమార్గమేమిటో శాస్త్రాలలో తెలుపబడి ఉంది. అయితే వాటిలోని విషయాలు తెలుసుకున్న తరువాత అందుకు తగ్గట్టుగా పరిశ్రమించటం ప్రారంభించాలి. సద్వస్తువు ప్రాప్తించేది అప్పుడే. కేవలం పాండిత్యం వల్ల ఏం ఒరుగుతుంది? శాస్త్ర పండితుడు అనేక శ్లోకాలు వల్లె వేస్తుండవచ్చు. కాని అతడికి సంసారం పట్ల అనురక్తి ఉన్నట్లయితే, అంతరంగాన కామినీకాంచనాలను వాంఛించినట్లయితే అతడు శాస్త్రవిషయాలను అవగతం చేసుకోలేడు. అటువంటి వ్యక్తి శాస్త్రాలు అధ్యయనం చేయటం వ్యర్థం. ఈ ఏడాది ఇరవై పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో వ్రాయబడి ఉందనుకోండి. కాని పంచాంగాన్ని పుచ్చుకొని పిండితే ఒక్క బొట్టు నీరైన రాదు, కనీసం ఒక్క బొట్టు కూడా రాదు.” (అందరూ నవ్వారు)
గిరీశ్ (నవ్వుతూ): మహాశయా, పంచాంగం పిండినప్పుడు ఒక్క బొట్టు అయినా నీరు రాదా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): శాస్త్రపండితుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. కాని అతడి దృష్టి ఎక్కడ ఉంటుంది? కామినీ కాంచనాలపైనే; దేహసుఖాలు, ధనం పైనే.
“రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. కాని దాని దృష్టి మాత్రం క్రిందపడి ఉన్న పీనుగులపైనే. (అందరూ నవ్వారు) అది కేవలం చచ్చిన జంతువులు, పీనుగుల కోసమే వెదుకుతూ ఉంటుంది.
(గిరీశ్‌తో) “నరేంద్రుడు ఉన్నత శ్రేణికి చెందినవాడు. అతడు అన్నింటా ప్రతిభావంతుడే. చదువులలో, పాటలు పాడటంలో, వాయిద్యాలు వాయించటంలో, వివేక వైరాగ్యాలలో, సత్యం పలకటంలో – అన్నింటిలోనూ నిష్ణాతుడే. అతడు జితేంద్రియుడు కూడా.
(‘మ’ తో) “ఏమోయ్, ఏమంటావ్? అతడు అశేష ప్రతిభావంతుడు కదా!”
‘మ’ : అవునండీ, నిజమే.
శ్రీరామకృష్ణులు (‘మ’ ను దగ్గరకు పిలిచి): ఇలా చూడు, గిరీశ్కి అనురాగం, విశ్వాసం అధికం.
‘మ’ అభిమానపూర్వకంగా తదేకదృష్టితో గిరీశ్ వంక చూస్తుండిపోయాడు. గిరీశ్ శ్రీరామకృష్ణుల వద్దకు ఈ మధ్యనే వస్తున్నాడు. అయితే ‘మ’ కు అతడు ఎంతో చిరపరిచితుడిలాగా, దీర్ఘకాల మిత్రుడిగా, అత్యంత ఆత్మీయుడిగా తోచాడు. శ్రీరామకృష్ణుల భక్తబృందమనే హారంలో గిరీశ్ ఓ విశిష్ట రత్నం లాంటివాడు.
నారాయణ్ శ్రీరామకృష్ణులను ఏదయినా పాట పాడమని అభ్యర్థించాడు. శ్రీరామకృష్ణులు జగజ్జనని గురించి పాడసాగారు.
పదిలపరచవే మనసా! అమ్మ శ్యామను
అతి ప్రియమగు నా అమ్మ శ్యామను
నిలుపుము నీలో అతి భద్రముగా
పరులెవ్వరినీ చేరనీయకుము
మన మిరువురమే ఆమెను చూతము….
శ్రీరామకృష్ణులు సంసారంలోని జీవుల దుఃఖాలను తమపై ఆరోపించుకున్నట్లు ఆవేదనాపూర్వకంగా పాడసాగారు:
ఆనందమయి మాతా వెనుకాడకే నీ
నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా
(నీ) పదములు తప్ప మది అన్యమెరుగదు….
పిదప జగజ్జనని యొక్క బ్రహ్మానందం గురించిన పాటపాడారు:
అదిగో! అల్లదిగో! అమ్మదిగో చూడదిగో!
పారవశ్యమున ఒడలు మరచి
పరమేశ్వరుతో నాడుచున్నది….
భక్తులు ఈ పాటలను వింటూ స్తబ్ధులై ఉండిపోయారు. తదేక దృష్టితో శ్రీరామకృష్ణులను చూడసాగారు.
గానం పూర్తయింది. కొద్దిసేపటి తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నాకు కాస్త జలుబు చేసింది. అందుకనే బాగా పాడలేకపోయాను.”
38.4 చతుర్థ పరిచ్ఛేదం సంధ్యాకాలంలో శ్రీరామకృష్ణులు
క్రమంగా సాయంకాలం అయింది. సాయంకాలపు నీలి నీడలు కలకత్తా నగరంపై ప్రసరించాయి. నగరంలోని రణగొణ ధ్వని ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఆలయాలలో జేగంటలు, శంఖారావాలు సాయంకాలపు హారతిని నినదించాయి. భక్తులు తమ ప్రాపంచిక పనులను ప్రక్కనపెట్టి తమ మనస్సులను భగవత్ చింతన, ధ్యానాలలో లగ్నం చేశారు. ఈ గోధూళివేళ శ్రీరామకృష్ణులలో ఎల్లప్పుడూ భావపారవశ్యతను కలిగిస్తుంది.
శ్రీరామకృష్ణులు తమ సుమధుర కంఠంతో జగన్మాత నామాన్ని ఉచ్చరిస్తున్నారు. భక్తులు తమ తమ స్థానాలలో కూర్చుని ఈ అద్భుతమూర్తిని తదేకంగా చూస్తున్నారు. సర్వదా భగవదనుభూతిలోనే నిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులు ఇలా జగజ్జనని నామాన్ని జపించడంలోని అంతరార్థం ఏమిటి? భగవంతుణ్ణి ఆరాధించడం ఎలాగో లోకులకు నేర్పాలనే కదా!
తరువాత శ్రీరామకృష్ణులు జగజ్జననిని సంబోధిస్తూ ఆర్ద్రంగా ఇలా ప్రార్థించారు: “అమ్మా! శరణాగతోహం, శరణాగతోహం – నేను నీ పాదపద్మాలవద్ద శరణు వేడుకుంటున్నాను. నాకు ఎటువంటి దేహసుఖాలూ వద్దు, కీర్తి ప్రతిష్ఠలూ వద్దు. నేను అష్టసిద్ధులను కూడా కోరుకోను. నాకు కావలసిందల్లా నీ పాదపద్మాలపై శుద్ధభక్తే. నాకు అటువంటి నిష్కామ, అహేతుక భక్తిని ప్రసాదించు. అమ్మా! నీ భువనమోహన మాయలో నన్ను మైమరచేట్లు చేయవద్దు. అమ్మా, ఈ మాయా సంసారంలోని కామినీ కాంచనాల పట్ల అనురక్తుడినయ్యేలా చేయవద్దు. నేను భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను. దయతో నాకు నీ పాదపద్మాలపై భక్తి నొసగు.”
శ్రీరామకృష్ణుల హృదయాంతరాళాల నుండి వెలువడిన ఈ వేడికోలులోని ప్రతి అక్షరం, ప్రతి పదం భక్తుల హృదయాలను ఆర్ద్రం చేసింది. ఆయన మధుర స్వరం, పసిపిల్లవాడి లాంటి కల్లాకపటం ఎరుగని నైజం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి.
‘మ’ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు: ‘భగవన్నామాన్ని నిరవచ్ఛిన్నంగా ఉచ్చరించేవాడికి ఇక సంధ్యాకాలంతో పనేమిటి?’
గిరీశ్ శ్రీరామకృష్ణులను తన ఇంటికి ఆహ్వానించాడు. నేడే రావాలని పట్టు పడుతున్నాడు.
శ్రీరామకృష్ణులు: బాగా ఆలస్యం అవుతుందేమో?
గిరీశ్: లేదండి, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు. పైగా నేను థియేటర్‌కు కూడా వెళ్ళవలసి ఉంది; అక్కడ ఒక తగాదాను పరిష్కరించాలి.
38.5 పంచమ పరిచ్ఛేదం మార్గమధ్యంలో శ్రీరామకృష్ణుల భావావస్థ
సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు గిరీశ్ ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. బలరామ్ ఇంట్లో శ్రీరామకృష్ణులకు భోజనం ముందుగానే ఏర్పాటు చేయబడి ఉంది. అందువలన బలరామ్ నొచ్చుకుంటాడనే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు: “బలరామ్, నువ్వు నా భోజనాన్ని గిరీశ్ ఇంటికే పంపించు. అక్కడే తింటాను.”
రెండవ అంతస్తు నుండి క్రిందకు దిగుతున్నప్పుడు ఆయన భావపరవశులయ్యారు. వెంట నారాయణ్, ‘మ’ లు ఉన్నారు; కాస్త వెనుక రామ్, ఛునీలాల్ మొదలయిన భక్తులు వస్తున్నారు. “శ్రీరామకృష్ణుల వెంట ఎవరు వెళుతున్నారు” అని ఎవరో అడిగారు. శ్రీరామకృష్ణులు “ఎవరో ఒక్కరు ఉంటే చాలు” అన్నారు. భావావస్థలో ఆయన పడిపోతారనే ఉద్దేశంతో నారాయణ్ ఆయనకు చెయ్యి అందివ్వబోయాడు. దీనిపట్ల శ్రీరామకృష్ణులు కొద్దిగా అసహనం ప్రకటించారు. కొద్దిసేపటి తరువాత ఆయన నారాయణ్‌తో ఆప్యాయంగా ఇలా అన్నారు: “నువ్వు అలా నా చెయ్యి పట్టుకుంటే చూసేవాళ్ళు నేను మత్తులో ఉన్నాననుకుంటారు. నా అంతట నేనే నడవగలను.” గిరీశ్ ఇల్లు దగ్గరలోనే ఉంది. శ్రీరామకృష్ణులు బోస్పారా కూడలిని దాటుతున్నారు. హఠాత్తుగా ఆయన వడివడిగా నడవటం ప్రారంభించారు. భక్తులు వెనుకబడిపోయారు. బహుశా ఆయన భావపరవశులయ్యారేమో! వేదాలు మనోవాక్కులకు అతీతంగా పేర్కొనే పరబ్రహ్మం గురించి చింతన చేస్తూ ఆయన ఉన్మత్తులై అడుగులు వేస్తున్నట్లుగా తోస్తోంది. కొద్దిసేపటి క్రితమే బలరామ్ ఇంట్లో ఆయన, ‘భగవంతుడు శుద్ధ మనస్సుకు, శుద్ధ బుద్ధికి, శుద్ధ ఆత్మకు గోచరుడు’ అన్నారు ప్రస్తుతం ఆయన అదే భావంలో ఉన్నట్టుగా కనిపించారు.
ఇంతలో నరేంద్రుడు కాస్త దూరం నుండి రావడం కనిపించింది. సాధారణంగా అయితే శ్రీరామకృష్ణులు అతణ్ణి చూడగానే ‘నరేంద్రుడు, నరేంద్రుడు’ అంటూ మహదానంద పడిపోయేవారు. కాని ప్రస్తుతం నరేంద్రుడు వచ్చి ఎదురుగా నిలబడినప్పటికీ ఆయన అతణ్ణి పలకరించలేదు; భావావస్థలో మగ్నమై ఉన్నారు కదా! గిరీశ్ ఇల్లు ఉన్న వీథిలో ప్రవేశించిన పిదపనే శ్రీరామకృష్ణులు కొద్దిగా మాట్లాడగలిగారు. నరేంద్రుడితో ఇలా అన్నారు: “ఏం నాయనా, బాగానే ఉన్నావు కదా! ఇందాక నేను నీతో మాట్లాడలేకపోయాను.” ఆయన మాట్లాడుతున్న ప్రతి అక్షరంలో కారుణ్యం ఉట్టిపడుతోంది. ఇంకా గిరీశ్ ఇంటి వాకిలికి చేరలేదు. హఠాత్తుగా ఆయన అలాగే నిలబడిపోయి నరేంద్రుడితో ఇలా అన్నారు: “అసలు విషయం ఇదే – ‘ఇది’ ఒకటి, ‘అది’ ఒకటి.” ఆయన జీవుడు, జగత్తులను ఉద్దేశిస్తూ ఈ మాటలు పలికారో ఏమో! ఆయన ప్రస్తుతం తమ హృదయాంతరాళాలలో ఏం దర్శిస్తున్నారో? ఆయన పలికిన ఒకటి రెండు మాటలు భక్తులకు వేదవాణిలా తోచింది. పిదప నెమ్మదిగా నడుస్తూ శ్రీరామకృష్ణులు గిరీశ్ ఇంట్లోకి ప్రవేశించారు.
38.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – నిత్యగోపాల్
గిరీశ్ వాకిలి వద్దే నిలబడి ఆయనకు స్వాగతం పలికాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు; పైకి లేవడమే లేదు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ మనేసరికి అతడు ఆయన పాదధూళి స్వీకరించి పైకి లేచాడు. తరువాత ఆయన్ను రెండవ అంతస్తులోని అతిథుల గదిలోకి తీసుకొని వెళ్ళాడు. భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆయనకు దగ్గరగా కూర్చోవాలని, ఆయన మహోపదేశాలను వినాలనీ భక్తుల ఆకాంక్ష. శ్రీరామకృష్ణులు కూర్చోబోయే ముందు ప్రక్కన ఒక వార్తాపత్రిక పడిఉండటం చూశారు. దాన్ని చూసి ఆయన దాన్ని అక్కడ నుండి తీసివేయమన్నారు. ఎందుకంటే వార్తాపత్రికలలో ఉండేది లౌకికసమాచారమే కదా! పరస్పర దూషణలు, అవినీతి సమాచారం మొదలయిన విషయాలే కదా అందులో ఉండేది! అందుకనే అది అపవిత్రమైనది.
వార్తాపత్రిక అక్కడ నుండి తొలగించిన పిదప శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. నిత్యగోపాల్ ముందుకు వచ్చి ఆయనకు ప్రణమిల్లాడు.
శ్రీరామకృష్ణులు (నిత్యగోపాల్తో): ఏమోయ్, చాలాకాలంగా నువ్వు దక్షిణేశ్వరం రావటంలేదే?
నిత్యగోపాల్: ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండటం లేదండీ. ఒళ్ళంతా ఒకటే నొప్పులు.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడు ఎలా ఉంది?
నిత్యగోపాల్: ఏమంత మెరుగ్గా లేదండి.
శ్రీరామకృష్ణులు: మనస్సును ఒకటి రెండు స్థాయిలు క్రిందకు తీసుకురా.
నిత్యగోపాల్: లోకుల సాంగత్యం బొత్తిగా రుచించటం లేదు. వారు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి భయం వేస్తూంటుంది, మరోసారి బాగా ధైర్యం కూడా కలుగుతుంది.
శ్రీరామకృష్ణులు: అది సహజమే. నీతోపాటు ఎవరు ఉంటున్నారు?
నిత్యగోపాల్: తారక్ (కాలాంతరంలో స్వామి శివానంద). అతడు సర్వదా నాతోనే ఉంటాడు. కాని కొన్ని సమయాల్లో అతడి సాంగత్యం కూడా రుచించడం లేదు.
శ్రీరామకృష్ణులు: నాంగ్టా ఇలా చెప్పేవాడు: వాళ్ళ మఠంలో సిద్ధులు సముపార్జించిన వ్యక్తి ఒకడు ఉండేవాడట. అతడు సర్వదా ఆకాశం కేసి చూస్తూ నడిచేవాడు. కాని అతడి సహచరుడు ఒకడు వెళ్ళిపోయేసరికి అతడు ఎంతో వ్యధకు లోనయ్యాడు.
శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూండగానే భావపరవశులయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఇలా అన్నారు: “నువ్వు వచ్చావా? నేను కూడా వచ్చాను.”
ఈ మాటలను ఎవరు అర్థం చేసుకోగలరు? బహుశ దేవభాష అంటే ఇదేనేమో!
38.7 సప్తమ పరిచ్ఛేదం అవతారం గురించి సంభాషణ
పలువురు భక్తులు శ్రీరామకృష్ణుల చుట్టూ కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, గిరీశ్, హరిపదుడు, ఛునీలాల్, బలరామ్, ‘మ’ మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు.
భగవంతుడు మానవరూపంలో అవతరిస్తాడన్న విషయాన్ని నరేంద్రుడు అంగీకరించడు. మరోవైపు గిరీశ్‌కు ప్రగాఢ విశ్వాసం – భగవంతుడు ప్రతియుగంలోనూ మానవరూపాన్ని ధరించి మర్త్యలోకంలో అడుగిడతాడని. వీరిద్దరు ఈ విషయంపై చర్చిస్తుంటే వినాలని శ్రీరామకృష్ణులు కుతూహలపడుతున్నారు. అందువల్ల ఆయన గిరీశ్‌తో ఇలా అన్నారు: “మీ రిద్దరూ ఆంగ్లంలో కాస్త చర్చించుకోండి. నాకు వినాలని ఉంది.”
చర్చ ప్రారంభమైంది, వంగ భాషలోనే జరిగింది. మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు కూడా దొర్లుతున్నాయి. నరేంద్రుడు ఇలా అన్నాడు: “భగవంతుడు అనంతుడు. ఆయన్ను అవగతం చేసుకొనే సామర్థ్యం మన కెక్కడిది? ఆయన అందరిలోనూ ఉన్నాడు; మరి అటువంటప్పుడు ఆయన కేవలం ఒక వ్యక్తి ద్వారానే అవతరిస్తాడని ఎలా చెప్పగలం?”
శ్రీరామకృష్ణులు (మృదువుగా): నరేంద్రుని మాటలతో నేను ఏకీభవిస్తాను. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. కాని ఒక్క విషయం గుర్తించుకోవాలి. ఆయన శక్తి వ్యక్తీకరణలో తారతమ్యాలు ఉంటాయి. కొన్నిచోట్ల ఆయన అవిద్యాశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది, మరి కొన్నిచోట్ల విద్యాశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది.
“ఒక ఆధారం గుండా ఆయన శక్తి అధికంగా అభివ్యక్తీకరిస్తుంది, మరో ఆధారం గుండా స్వల్పంగా అభివ్యక్తీకరిస్తుంది. అందుచేతనే మానవు లందరూ సమానులు కారు.”
రామ్: ఈ వాదనలు అన్నీ వ్యర్థమే కదా!
శ్రీరామకృష్ణులు (తీక్షణంగా): ఊహూ, వీటన్నిటిలోనూ ఒక అంతరార్థం ఉంది.
గిరీశ్ (నరేంద్రుడితో): భగవంతుడు మానవరూపాన్ని ధరించడని నీకు ఎలా తెలుసు?
నరేంద్రుడు: భగవంతుడు అవాఙ్మానసగోచరుడు.
శ్రీరామకృష్ణులు: కాదు, కాదు. ఆయన శుద్ధబుద్ధికి గోచరుడు. శుద్ధబుద్ధి, శుద్ధఆత్మ రెండూ ఒక్కటే. ఋషులు శుద్ధబుద్ధి, శుద్ధఆత్మ ద్వారా శుద్ధ ఆత్మను సాక్షాత్కరించుకున్నారు.
గిరీశ్ (నరేంద్రుడితో): భగవంతుడు మానవరూపంలో అవతరించి, లోకులకు దైవసంబంధ విషయాలు బోధించనట్లయితే మరి ఆ పనిని ఎవరు నిర్వర్తించగలరు? మానవులకు భక్తి జ్ఞానాలను ప్రబోధించే నిమిత్తం భగవంతుడు దేహధారణ చేస్తాడు.
నరేంద్రుడు: అలా చేయవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు మన అంతరంగంలో నుండే మనలను నడిపించగలడు.
శ్రీరామకృష్ణులు: అవునవును, ఆయన అంతర్యామి రూపంలో మనకు బోధిస్తాడు.
ఆ తరువాత నరేంద్రుడు, గిరీశ్ తీవ్రంగా వాదించుకోవటంలో మునిగిపోయారు. భగవంతుడు అనంతుడయితే ఆయనకు అంశలు ఎలా ఉండగలవు? ఈ విషయం గురించి హామిల్టన్ అభిప్రాయం ఏమిటి? హెర్బర్ట్ స్పెన్సర్, టిండాల్, హక్స్లీ మొదలైన వారు ఏమన్నారు? – ఇటువంటి విషయాల గురించిన వాదన సాగుతోంది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇలా చూడు, ఇటువంటి వాదనలు నాకు రుచించవు. నేను సమస్తం భగవంతునిగానే దర్శిస్తున్నాను. మరి అలాంటప్పుడు నేను ఎందుకు వాదించాలి? సమస్తం భగవంతుడే. ఆయనే సమస్తం అయి ఉన్నట్లు దర్శిస్తున్నాను. ఇదీ ఉంది, అది కూడా ఉంది (అంటే, భగవంతుడే సమస్తం అయివున్నాడు; మళ్ళీ, సమస్తానికి అతీతంగా కూడా ఉన్నాడు.) ఒకానొక స్థితిలో మనోబుద్ధులు రెండూ అఖండంలో లీనమైపోతాయి. (గిరీశ్‌తో) దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
గిరీశ్ (నవ్వుతూ): ఆ విషయం గురించి నన్ను అడగటం ఎందుకు? ఏదో ఆ ఒక్క ముక్క తప్ప తక్కినవన్నీ అర్థమయినట్లు! (అందరూ నవ్వారు).
38.7.1 రామానుజుల విశిష్టాద్వైతం
శ్రీరామకృష్ణులు: మళ్ళీ, నేను సమాధిస్థితి నుండి రెండు మెట్లు క్రిందకు దిగి రానిదే ఏమీ మాట్లాడజాలను. శంకరుని అద్వైత వేదాంతం నిజమే, రామానుజుల విశిష్టాద్వైతమూ నిజమే.
నరేంద్రుడు: విశిష్టాద్వైతం అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: అది రామానుజాచార్యుల సిద్ధాంతం. దాని ప్రకారం, జీవజగత్ – విశిష్ట – బ్రహ్మం. (అంటే, పరబ్రహ్మం జీవజగత్తులతో ప్రతిపాదింపబడుతుంది.) బ్రహ్మం, జీవులు, జగత్తు – అన్నీ కలసి ఒక్కటే. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి బిల్వఫలం బరువును తూచాలనుకున్నాడనుకొందాం. అందునిమిత్తం అతడు ఆ ఫలం పెంకును, కండను, విత్తనాలను వేరుచేశాడు. కాని ఎవరైనా పండు బరువును తెలుసుకోవాలంటే కేవలం దాని కండను మాత్రమే తూచుతారా ఏమిటి? కండ, పెంకు, విత్తనాలు – అన్నింటినీ కలిపి బరువు తూచవలసి ఉంటుంది. మొదట్లో కేవలం కండ మాత్రమే సారపదార్థమనీ, పెంకు, విత్తనాలు నిస్సారమనీ తోస్తుంది. అయితే పిదప విచారణ చేసి చూస్తే పెంకు, విత్తనాలు, కండ అన్నీ ఒకే ఫలానికి చెందినవిగా గ్రహించగలవు. కండ దేనికైతే చెందినదో పెంకు, విత్తనాలు కూడా దానికే చెందినవి. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మొదట్లో ‘నేతి, నేతి’ అంటూ విచారణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మం జీవుడు కాదు, జగత్తు కాదు – ఈ విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మం ఒక్కటే వస్తువు, తక్కినదంతా అవస్తువు (అంటే అస్తిత్వం లేనిది). అటుపిమ్మట కండ దేనికైతే చెందినదో పెంకు, విత్తనాలు కూడా దానికే చెందినవని బోధ కలుగుతుంది. దేనినైతే బ్రహ్మం అంటున్నామో దానినుండే జీవజగత్తులు ఉద్భవించాయని బోధ కలుగుతుంది. నిత్యం దేనికైతే చెందినదో లీలకూడా దానికే చెందినది. అందుచేతనే రామానుజాచార్యులు ‘జీవజగత్ విశిష్ట–బ్రహ్మం’ అన్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఇదే.”
38.8 అష్టమ పరిచ్ఛేదం భగవద్దర్శనం – అవతార పురుషులు
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): “నేను భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను. ఇక నేను దేని గురించి విచారణ చేయాలి? భగవంతుడే సర్వమూ అయివున్నట్లు దర్శిస్తున్నాను. ఆయనే జీవులు, జగత్తుగా అయివున్నాడు. కాని (ఆంతరంగిక) చైతన్యం ప్రాప్తించకుండా (సర్వత్రా వ్యాప్తమై ఉన్న) చైతన్యాన్ని తెలుసుకోలేము. విచారణ ఎంతవరకు? భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోనంతవరకే. అయితే కేవలం నోటి మాటలతో అది సాధ్యపడదు. నేను దర్శిస్తున్నది ఇదే – భగవంతుడే సమస్తం అయివున్నాడు. ఆయన కృపతో చైతన్యం ప్రాప్తించుకోవాలి. చైతన్యం ప్రాప్తించుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు అలా సమాధి స్థితిని పొందిన వ్యక్తి ఒకోసారి తన దేహాన్ని మరచిపోతాడు; కామినీ కాంచనాల పట్ల ఆసక్తి తొలగిపోతుంది; భగవద్విషయాలు తప్ప అన్యమైనది ఏదీ రుచించదు. అటువంటి వ్యక్తి లౌకిక విషయాలు వింటే ఎంతో యాతనకు గురి అవుతాడు. (ఆంతరంగిక) చైతన్యాన్ని ప్రాప్తించుకున్నప్పుడే సర్వత్రా వ్యాప్తమై ఉన్న చైతన్యాన్ని తెలుసుకోగలం.”
38.8.1 నరేంద్రునికి ఉపదేశం – కాళీయే బ్రహ్మం
పిదప శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “భగవంతుణ్ణి గురించి విచారణ చేయడం ద్వారా లభ్యమయ్యే జ్ఞానం ఒక విధంగా ఉంటుంది, ఆయన్ను ధ్యానించడం ద్వారా మరోవిధంగా తెలుసుకుంటాం. అయితే భగవంతుడే తన స్వరూపాన్ని వెల్లడి చేసినప్పుడు ఆ జ్ఞానం వేరే విధంగా ఉంటుంది. భగవంతుడు భక్తునికి భగవదవతార తత్త్వాన్ని తెలియజేసినప్పుడు, మానవరూపంలో తన లీలను ఎలా ప్రదర్శిస్తాడో వెల్లడి చేసినప్పుడు మరి విచారణ చేయవలసిన అవసరం ఉండబోదు. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక వ్యక్తి చీకటి గదిలో ఉన్నాడనుకొందాం. వెలుగు కోసమని అతడు అగ్గిపుల్లను వెలిగించాలని ప్రయత్నిస్తుంటాడు. అలా అగ్గిపుల్లను గీయగా గీయగా ఉన్నట్టుండి వెలుగు వస్తుంది. అదే విధంగా భగవంతుడు మనకు మెరుపులా దివ్య ప్రకాశాన్ని ఇచ్చినట్లయితే సంశయాలన్నీ సమసిపోతాయి. ఈ విధంగా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోగలమా?”
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తమ ప్రక్కన కూర్చోమన్నారు. ఎంతో ఆప్యాయంగా అతడి క్షేమసమాచారాల గురించి అడుగుతున్నారు.
నరేంద్రుడు(శ్రీరామకృష్ణులతో): కాళీమాతను మూడు నాలుగు రోజుల పాటు ధ్యానించాను. కాని ఏమీ ప్రాప్తించలేదు.
శ్రీరామకృష్ణులు: నెమ్మది నెమ్మదిగా ప్రాప్తిస్తుంది. కాళీ అంటే వేరే ఎవరో కాదు; ఎవరయితే బ్రహ్మమో ఆయనే కాళీ కూడా. కాళీమాత ఆద్యాశక్తి. భగవంతుడు నిష్క్రియుడై ఉన్నప్పుడు నేను దానిని బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలను నిర్వహించేటప్పుడు శక్తి అంటాను, కాళీ అంటాను. దేనినయితే నువ్వు బ్రహ్మం అంటున్నావో దానినే నేను కాళీ అంటాను. బ్రహ్మం, కాళీలు వేర్వేరు కాదు. అవి అగ్ని, దాని దాహనశక్తి వంటివి. అగ్ని గురించి ఆలోచించి నప్పుడు దాని దాహకశక్తి గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. కాళీని అంగీకరిస్తే బ్రహ్మాన్ని కూడా అంగీకరించవలసి ఉంటుంది; బ్రహ్మాన్ని అంగీకరిస్తే కాళీని కూడా అంగీకరించవలసి ఉంటుంది.
“బ్రహ్మం, శక్తి వేర్వేరు కాదు. బ్రహ్మాన్నే నేను శక్తి, కాళీ అంటాను.”
అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. గిరీశ్ థియేటరుకు వెళ్ళడానికని హరిపదునితో ఒక బండి పిలిపించమని చెప్పాడు. హరిపదుడు బండి పిలవడానికి వెళుతుండగా శ్రీరామకృష్ణులు నవ్వుతూ అతడితో ఇలా అన్నారు: “బండిని పిలుచుకు రావటం మరచిపోకు సుమా!” (అందరూ నవ్వారు)
హరిపదుడు (నవ్వుతూ): అయ్యా, నేను ఆ పని మీదనే వెళుతున్నాను. అటువంటప్పుడు దాన్ని ఎలా మరచిపోగలను?
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): మిమ్మల్ని వదలి నేను థియేటరుకు వెళ్ళ వలసి వస్తోంది.
శ్రీరామకృష్ణులు: లేదు, లేదు, నువ్వు రెండింటినీ పట్టుకోవాలి. జనక మహారాజు భగవంతుడు, సంసారం రెండింటినీ పట్టుకొని ‘పొర్లే పాత్ర నుండి పాలు తాగేవాడు’. (అందరూ నవ్వారు)
గిరీశ్: థియేటర్ వ్యవహారాలన్నీ ఆ కుర్రవాళ్ళకే వదిలివేయాలని అనుకుంటున్నాను.
శ్రీరామకృష్ణులు: వద్దు, వద్దు. ఇదే మంచిది. పలువురికి ఉపకారం జరుగుతోంది కదా!
నరేంద్రుడు (మెల్లగా): ఇప్పుడిప్పుడే (శ్రీరామకృష్ణులను) భగవంతుడు, అవతారపురుషుడు అన్నాడు. మళ్ళీ థియేటరకు కూడా వెళ్ళాలని అంటున్నాడు.
38.9 నవమ పరిచ్ఛేదం సమాధి స్థితి, భావావస్థలలో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తమకు దగ్గరగా కూర్చోబెట్టుకొని తదేకంగా అతణ్ణి చూడసాగారు. ఉన్నట్లుండి శ్రీరామకృష్ణులు అతడికి మరి కాస్త దగ్గరగా జరిగారు. నరేంద్రుడు అవతారవాదాన్ని అంగీకరించడు. కాని అందువల్ల కలిగే నష్టం ఏమిటి? నరేంద్రుడి పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమ పొంగి పరవళ్ళు తొక్కుతోంది. ఆయన నరేంద్రుడి ఒంటిని నిమురుతూ బృందావనంలో గోపికలు రాధాదేవితో చెప్పిన ఈ మాటలు పలికారు: “నీ మనస్సు గాయపడితే పడనివ్వు, మా మనస్సులు కూడా గాయపడ్డాయి.”
38.9.1 విచారణ ఎంత వరకూ?
పిదప శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఇలా అన్నారు: “వాదనలు చేస్తున్నంత వరకు ఆ వ్యక్తి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేడు. మీరు ఇందాక వాదించుకున్నారు కదా! కాని అది నాకు రుచించలేదు.
“విందు భోజనం జరుగుతున్న ఇంట్లో శబ్దం వినిపించేది అతిథులు భోజనానికి కూర్చోనంతవరకే. అన్నం, కూరలు వడ్డించగానే మూడు వంతులు సద్దుమణుగుతుంది. (అందరూ నవ్వారు) ఇంకా తక్కిన పదార్థాలు వడ్డించేకొద్దీ శబ్దం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చివరకు పెరుగు వడ్డించాక కేవలం ‘సుప్, సుప్’ అన్న సవ్వడి మాత్రమే వినవస్తుంది. భోజనానంతరం అతిథులు నిద్రకు ఉపక్రమిస్తారు, అంతా నిశ్శబ్దం అయిపోతుంది.
మనం భగవంతుని వైపు ఎంతగా పురోగమిస్తే విచారణ, వాదనలు అంతగా తగ్గిపోతాయి. ఆయనను ప్రాప్తించుకున్న పిదప శబ్దం అంటే విచారణలు, వాదనలు ఆగిపోతాయి. తరువాత నిద్ర, అంటే సమాధి స్థితి.”
శ్రీరామకృష్ణులు నెమ్మదిగా నరేంద్రుడి శరీరాన్ని నిమురుతూ, అతడి చుబుకాన్ని పుచ్చుకొని అప్యాయంగా “హరి ఓం హరి ఓం హరి ఓం” అంటున్నారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నరేంద్రుడిలో ఆయన సాక్షాత్తూ నారాయణుణ్ణి దర్శిస్తున్నారా?
శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్యస్పృహను కోల్పోతున్నారు. ఆయన చేతులు నరేంద్రుడి పాదాల పైనే ఉన్నాయి. అదే స్థితిలో ఆయన నరేంద్రుడి దేహాన్ని నెమ్మదిగా నిమురసాగారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారో? క్రమక్రమంగా ఆయన స్థితిలో మార్పు వచ్చింది. ఆయన చేతులు జోడించి నరేంద్రుడితో ఇలా అన్నారు: “దయచేసి ఒక పాట పాడు. అప్పుడు నేను మళ్ళీ సాధారణ స్థితికి వస్తాను. లేకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను.”
తరువాత శ్రీరామకృష్ణులు కొద్దిసేపటి వరకు చిత్తరువులా నిశ్చలంగా కూర్చుండిపోయారు. తదనంతరం భావపరవశులై ఇలా అన్నారు: “రాధాదేవీ, యమునానదిలో పడిపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయి. ఆహా! ఆమె శ్రీకృష్ణ ప్రేమలో పిచ్చిదే అయిపోయింది.”
పిదప భావావస్థ మరింత తీవ్రమైంది. శ్రీరామకృష్ణులు ఒక పాటలోని చరణాలను తెలుపుతూ ఇలా అన్నారు:
సఖీ నాకు చెప్పవే ఇక నెంత దూరమే
నా వంశిమోహనుడు నర్తించు ఆ వనము.
ఇచ్చోటికి గూడ వచ్చిచేరుచునుండ
ఆ మోహనుని మేను సౌగంధ సౌరభము ॥ స ॥
కాని నే పూర్తిగా గాసిల్లిపోయితిని
ఇక సాగదే కాలు ఇక నెంత మాత్రము ॥ స ॥
శ్రీరామకృష్ణులు బాహ్యప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయారు. ఎవరినీ పట్టించుకోవటం లేదు; చివరకు నరేంద్రుణ్ణి కూడా గుర్తించ లేదు. ఆయన ఎక్కడ కూర్చున్నారో కూడా ఆయనకు ఎరుక లేదు. ఆయన మనస్సు సంపూర్ణంగా భగవంతుడిలో లీనమైపోయినట్లు ఉంది. ఉన్నట్లుండి ఆయన “గౌరాంగుని ప్రేమలోని ఉన్మత్తత!” అంటూ లేచి నిలబడ్డారు. మళ్ళీ కూర్చుని ఇలా అన్నారు: “ఒక వెలుగు వస్తున్నట్లుగా నేను గాంచుతున్నాను. కాని అది ఎక్కడ నుండి వస్తోందో అర్థం కావడం లేదు.”
నరేంద్రుడు పాట పాడాడు.
నీ మోము నగుపరచి నా వ్యధను పూర్తిగా
తొలగించినాడవు దేవా ।
నీ అందచందమను ఇంద్రజాలము మదిని
భ్రమచెంద జేసినది దేవా……
ఈ పాటను వింటూ శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు – నిమీలిత నేత్రాలు, స్పందనహీన దేహం!
సమాధి స్థితి నుండి బాహ్యస్పృహ కలిగింది. తన నేస్తాలు కనబడక పోయి నట్లయితే, పిల్లలు అడిగే రీతిలో ఆయన ఇలా అన్నారు: “నన్ను (దక్షిణేశ్వరానికి) ఎవరు తీసుకువెళతారు?”
రాత్రి బాగా పొద్దుపోయింది. చీకటి రాత్రి! శ్రీరామకృష్ణులు వెళ్ళడానికి బండి రప్పించారు. భక్తులు బండి ప్రక్కన గౌరవ సూచకంగా నిలబడ్డారు. శ్రీరామకృష్ణులను ఎంతో జాగ్రత్తగా బండిలోకి ఎక్కించారు. ఆయన ఇంకా భావావస్థలోనే ఉన్నారు. బండి బయలుదేరింది. భక్తులు బండి కనుమరుగయ్యేవరకు చూస్తూండిపోయారు; పిదప తమ తమ ఇళ్ళకు బయలుదేరారు.
38.10 దశమ పరిచ్ఛేదం ‘మ’ మనోగతం
ఆ నిశీథిలో సర్వత్రా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. భక్తులు తమ హృదయమధ్యంలో పరమహంస శ్రీరామకృష్ణదేవుల అద్భుతమూర్తిని దర్శిస్తూ, ఆయన అమృత వాక్కులను స్మరిస్తూ నెమ్మదిగా తమ ఇళ్ళకేసి అడుగులు వేస్తున్నారు. వారి అంతరంగాలలో ఒక్కటే ప్రార్థన.
నీ మోము నగుపరచి నా వ్యధను పూర్తిగా
తొలగించినాడవు దేవా
నీ అందచందమను ఇంద్రజాలము మదిని
భ్రమ చెందజేసినది దేవా!
‘మ’ ఇలా తలపోస్తూ నడుస్తున్నాడు: “భగవంతుడు నిజంగానే మానవరూపంలో అవతరిస్తాడా? అనంత స్వరూపుడైన భగవంతుడు పరిమితమైన మూడున్నర మూరల మనిషి దేహాన్ని దాలుస్తాడా? విచారణ చేసి అర్థం చేసుకున్నది ఏమిటి? ఏమీ లేదు. శ్రీరామకృష్ణులు ఎంత చక్కగా చెప్పారు – ‘విచారణ ఉన్నంతవరకు సద్వస్తువు ప్రాప్తించదని తెలుసుకో.’ అది కూడా నిజమే, అల్పమైన ఈ బుద్ధితో అనంతుడైన భగవంతుణ్ణి తెలుసుకోగలమా? ఒక సేరు పాత్రలో నాలుగు సేర్లు పాలు పడతాయా ఏమిటి? అయితే భగవంతుడు అనుగ్రహించి తన కృపాకటాక్షవీక్షణాన్ని ప్రసరించినట్లయితే సంశయాలన్నీ పటాపంచలైపోతాయి – ‘ఛిద్యంతే సర్వసంశయాః’
“అవతార వాదాన్ని విశ్వసించటం ఎలా? అయితే ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులే విశదపరచినప్పుడు ఎందుకు విశ్వసించకూడదు? ఆయనే చెప్పారు కదా – విశ్వాసం! విశ్వాసం! విశ్వాసం! గురువాక్యాలపట్ల అమోఘమైన విశ్వాసం! ‘ఓ ప్రభో! ఈ సంసారమనే సాగరంలో జీవితమనే సూర్యుడు అస్తమించబోతున్నాడు. నేను ఇంకా దిక్కుతోచక అటూఇటూ తిరుగాడుతున్నాను. నీ కృపాకటాక్ష వీక్షణాన్ని పరపి నన్ను ఈ ఘోర సంసారం నుండి తరింపజెయ్యి. నాకు వేరే మార్గం లేదు; నువ్వే శరణ్యం! నువ్వే శరణ్యం!’
“భగవత్ కృపతో నాకు ఆయన వాక్కులపట్ల నమ్మకం కుదిరింది. తక్కిన వారిని వారి ఇచ్ఛ వచ్చిన రీతిలో పలుకనివ్వు. కాని నేను మాత్రం దేవతలకు సైతం దుర్లభమైన ఈ విశ్వాసాన్ని వదలుకుంటానా ఏమిటి? ‘జ్ఞాన చర్చలు’ చేస్తూ చేస్తూ ఫౌస్ట్ (Faust) లాగా తయారవ్వాలా ఏమిటి? బయట వెన్నెల పిండారబోస్తూ ఉండగా, ఫౌస్ట్లాగా గదిలో ఒంటరిగా చీకటిలో కూర్చొని ‘అరే, ఏమీ తెలుసుకోలేకపోయానే! సైన్సు, ఫిలాసఫీలు అన్నీ వ్యర్థం అయిపోయాయే! ఇక ఈ జీవనానికి అర్థం ఏమిటి?’ అని తలపోస్తూ విషమున్నపాత్రను చేతబట్టుకొని ఆత్మహత్యకు పాల్పడాలా? లేకపోతే అలెస్టార్ మల్లే అజ్ఞానపు భారాన్ని మోయలేక గండశిలపై శిరస్సు ఉంచి మృత్యువు కోసం ఎదురు చూడాలా? లేదు, లేదు; ఈ పండితులమల్లే పరిమితమైన ఈ బుద్ధితో అతి నిగూఢమైన రహస్యాన్ని భేదించే ప్రయత్నం చేయాలని నాకు లేదు. ఒక సేరు పాత్రలో నాలుగు సేర్లు పాలు పడతాయా ఏమిటి? నేను గురువాక్యాలనే శరణు వేడుతాను. ఆహా! ఎంత చక్కటి మాట – ‘గురువాక్యాల పట్ల విశ్వాసం.’ ‘ఓ భగవంతుడా! నాకు నీ పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రసాదించు. నిరర్థక ప్రేలాపనలలో నన్ను ఇరికించ వద్దు. నీ పాదపద్మాలపట్ల శుద్ధభక్తి, అంటే అహేతుక భక్తిని ప్రసాదించు. నీ భువనమోహన మాయలో నన్ను సమ్మోహితుణ్ణి అయ్యేలా చేయవద్దు.”
ఈ విధంగా ఆలోచిస్తూ ‘మ’ ఆ నిశీథిలో తన ఇంటకేసి సాగిపోతున్నాడు. ‘గిరీశ్ది ఎంతటి విశ్వాసం! అతడు శ్రీరామకృష్ణులను రెండు మూడుసార్లు దర్శించాడో లేదో, అంతే! ఆయనతో ఇలా అన్నాడు: “ప్రభూ! మానవరూపంలో అవతరించిన భగవంతుడవే నువ్వు. నన్ను సంసారమనే ఈ మృత్యుకూపం నుండి తరింపజెయ్యి.” గిరీశ్ చెప్పింది వాస్తవమే. భగవంతుడు మానవరూపంలో అవతరించకపోతే మరి జనులకు తన ఇంటి మనిషిలా ఎవరు బోధిస్తారు? భగవంతుడు ఒక్కడే వస్తువు; తక్కినదంతా అవస్తువు, అస్తిత్వం లేనిది అని ఎవరు ఉపదేశిస్తారు? కామినీ కాంచనాలనే పశువాంఛలలో బద్ధుడైన మనిషిని విముక్తుణ్ణి చేసి మళ్ళీ అమృతత్వానికి అధికారిగా చేయడం మరి ఎవరికి సాధ్యం? గీతలో చెప్పబడింది కదా– ‘పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం! ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥’ అని.
ఆహా! శ్రీరామకృష్ణులది ఎంతటి మహోన్నతమైన ప్రేమ! నారాయణ్ కోసం విలపిస్తారు, నరేంద్రుడి కొరకు పిచ్చివారే అయిపోతారు. ఆయన ఇలా అంటుంటారు: “నరేంద్రుడు, నారాయణ్, రాఖాల్, భవనాథ్, పూర్ణుడు, బాబూరాం మొదలైన వారు అందరూ సాక్షాత్తూ నారాయణులే సుమా! నా కొరకు దేహధారణ చేసి ఈ భువి మీదకు వచ్చారు.” ఇటువంటి ప్రేమ ‘ఇతడు ఫలానా మనిషి’ అన్న బుద్ధితో కలిగే ప్రేమ కాదు. ఇది దైవీ ప్రేమ – ఈ బాలురు సాక్షాత్తూ నారాయణులే అన్న భావంతో జనించే ప్రేమ. ఈ బాలురు పవిత్ర హృదయులు, స్త్రీలను ఎన్నడూ ఐహికదృష్టితో వీక్షించినవారు కాదు, లేశమాత్రమైనా కామగంధం లేనివారు. అందుకనే వీరిలో భగవంతుడు అధికంగా ప్రకాశిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అంతర్దృష్టి కలవారు. అందువల్లనే ఎవరు విషయాసక్తులో, ఎవరు సరళ హృదయులో చూడగానే తెలుసుకోగలరు. అటువంటి సరళ హృదయులను చూడగానే వారిని సాక్షాత్తూ నారాయణులుగా ఎంచి వారిని సేవించాలని చూస్తారు. వారికి స్నానం చేయిస్తారు, వారిని నిద్ర పుచ్చుతారు. వారిని చూడాలని విలపిస్తారు. పదేపదే కలకత్తాకు వస్తుంటారు. తమ గృహస్థ భక్తులతో ఇలా అంటుంటారు: “ఈ బాలురను పిలిపించి భోజనాలు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.” ఇది మాయాజగత్తుకు చెందిన ఐహిక ప్రేమా, లేక స్వచ్ఛమైన భగవత్ ప్రేమా? కేవలం మట్టి ప్రతిమకే పరమ నిష్ఠతో షోడశోపచార పూజ చేస్తాము. మరి అటువంటప్పుడు నర రూపం దాల్చిన ఈ పరిశుద్ధాత్ములను పూజించలేమా ఏమిటి? పైగా, వీరు భగవంతుని ప్రత్యేక లీలలో ఆయన కార్యంలో అనుచరులుగా పాలు పంచుకోవడానికి వచ్చిన వారు. ఆయనకు జన్మ జన్మలలోనూ సహచరులు.
శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి చూడగానే బాహ్యచైతన్యాన్ని కోల్పోతారు. నరేంద్రుడిలో భగవత్శక్తి విశేషంగా ప్రకాశిస్తోంది. అతణ్ణి చూడగానే ఆయన “నరేంద్రా, నరేంద్రా” అంటూ పిచ్చివారే అయిపోతారు; సహజంగానే భగవదుద్దీపన కలుగుతుంది. ఓ నరేంద్రా! నువ్వు నిజంగానే ధన్యుడవు సుమా! నువ్వు ఆ పురుషోత్తముడి అపార ప్రేమకు పాత్రుడవయ్యావు.
ఈ విధంగా ఆలోచిస్తూ భక్తులందరూ తమ తమ ఇళ్ళకు చేరుకున్నారు.
38.11 ఏకాదశ పరిచ్ఛేదం ఆంతరంగికులతో బలరామ్ ఇంట్లో
సోమవారం, ఏప్రిల్ 6, 1885
అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటింది. చైత్రమాసం; ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో బలరామ్ ఇంటి అతిథుల గదిలో కూర్చొని ‘మ’ తో సంభాషిస్తున్నారు. తమ బాలభక్తులను చూడాలనీ, దేవేంద్ర ఇంటికి వెళ్ళడానికనీ ఆయన కలకత్తా వచ్చారు.
శ్రీరామకృష్ణులు సర్వదా ప్రేమోన్మత్త స్థితిలోనో లేక సమాధి స్థితిలోనో మగ్నులై ఉంటారు. అయినప్పటికీ ఆయన అనునిత్యం తమ అంతరంగ భక్తుల ఆధ్యాత్మికోన్నతి గురించి విచారిస్తూనే ఉంటారు. తల్లితండ్రులు తమ పసిబాలుర కోసమూ, పక్షులు రెక్కలు రాని తన పిల్లలకొరకూ ఎలా ఆరాటపడుతూ శ్రద్ధగా పోషించి పెంచుతాయో అలాగే శ్రీరామకృష్ణులు తమ అంతరంగ భక్తులకు భగవలబ్ధి ఎలా కలుగుతుందా అని చింతన చేస్తూ ఉంటారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): మూడు గంటలకు వస్తానని చెప్పాను, అందుకే వచ్చేశాను. కాని ఎండ విపరీతం.
‘మ’ : అవునండి. మీకు చాలా శ్రమ కలిగింది.
భక్తులు శ్రీరామకృష్ణులకు విసనకర్రతో వీస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: చిన్న నరేంద్రుడు, బాబూరామ్ కోసమని వచ్చాను. పూర్ణుడిని తోడ్కొని రాలేదు ఎందుకని?
‘మ’ : అతడు నలుగురిలోకి రావడం ఇష్టపడడు. అందరి ముందు మీరు కనుక అతణ్ణి ప్రశంసిస్తే ఆ విషయం ఇంట్లో వారి చెవిన పడుతుందేమోనని అతడి భయం.
38.11.1 పుస్తకాలలో ఉపదేశాలు – సాధుసాంగత్యం
శ్రీరామకృష్ణులు: ఆ, ఆ మాట నిజమే. ఇకమీదట అలా చేయనులే. అది సరే, నువ్వు పూర్ణుడికి ధర్మోపదేశాలు చేస్తున్నావు కదా! అది చాలామంచిది.
‘మ’ : విద్యాసాగర్ బడివాచకాలలోనే చాలా ధర్మోపదేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ‘భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు; నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు’ మొదలైనవి. ఇటువంటి పాఠాలు నేర్పుతున్నందుకు తల్లిదండ్రులు కోపగిస్తే మేమేం చేయగలం?
శ్రీరామకృష్ణులు: పుస్తకాలలో గ్రంథకర్తలు ఎన్నో నీతులు వ్రాస్తారు. కాని ఈ పుస్తకాలు వ్రాసినవాళ్ళే ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. సాధుసాంగత్యం ద్వారానే ఈ విషయాలను అవగతం చేసుకోగలం. సర్వసంగ పరిత్యాగి ఉపదేశం ఇచ్చినప్పుడు మాత్రమే లోకులు ఆ విషయాలను శ్రద్ధగా ఆలకిస్తారు. కేవలం నోటి మాటల పండితుల లేక పుస్తకాలు వ్రాసే విద్వాంసుల ఉపదేశాలు వారికి రుచించవు. వైద్యుడు తన ప్రక్కన బెల్లం అచ్చులను పెట్టుకొని రోగులకు బెల్లం తినవద్దని సలహా ఇస్తే వారు ఆ సలహాను ఖాతరు చేయరు.
“అది సరే, పూర్ణుడికి భావావస్థలు ఏమైనా కలుగుతున్నాయా?”
‘మ’ : బయటకు ఎటువంటి భావావేశం కానరాదు. ఒక రోజు మీరు పలికిన మాటలనే నేను అతడితో చెప్పాను.
శ్రీరామకృష్ణులు: ఏ పలుకులు?
‘మ’ : మీరు చెప్పారు కదా – ఆధారం సామాన్యమైనదయితే ఆ వ్యక్తి తన భావావేశాలను నియంత్రించుకోలేడు అని. ఆధారం కనుక పెద్దదయితే అతడి అంతరంగాన భావావేశం తీవ్రంగా ఉంటుంది కాని అతడు ఆ లక్షణాలను బయటకు ప్రకటించడు. మీరు చెప్పినట్లు – పెద్ద చెరువులోకి ఏనుగు దిగితే అది చెరువులో ఎటువంటి అలజడినీ కలిగించలేదు, అది చెరువులోకి దిగినట్లు కూడా తెలియరాదు. కాని అది ఒక చిన్న మడుగులోకి కనుక దిగినట్లయితే పరిస్థితి తారుమారైపోతుంది. నీరు అల్లకల్లోలమై బయటకు కూడా చెదురుతుంది.
శ్రీరామకృష్ణులు: పూర్ణుడు తన భావావేశాలను బయటకు చూపించడు. అతడి స్వభావం వేరు. మరికొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఏమంటావు?
‘మ’ : కళ్ళు బాగా ప్రకాశవంతంగా, కొట్టొచ్చి నట్లు కానవస్తాయి.
పూర్ణుడు (పూర్ణచంద్ర ఘోష్)
శ్రీరామకృష్ణులు: కళ్ళు కేవలం ప్రకాశవంతంగా ఉంటే సరిపోదు. అయితే దివ్యనేత్రాలు వేరుగా ఉంటాయి. అది సరే, ఆ పిదప (అంటే, శ్రీరామకృష్ణులను కలసిన పిమ్మట) అతడికి ఏమైనా దర్శనాలు కలిగాయా?
‘మ’ : అవునండి, ఈ విషయమై అతడితో మాట్లాడాను. భగవత్చింతన చేయగానే, భగవంతుడి నామాన్ని జపించగానే కళ్ళవెంట నీళ్ళు స్రవించటం, రోమాంచితమవడం వంటివి జరుగుతున్నాయని గత నాలుగైదు రోజులుగా నాతో చెబుతున్నాడు.
కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. తరువాత ‘మ’ ఇలా అన్నాడు: “పూర్ణుడు బహుశ తన ఇంటి వాకిలివద్ద నిలబడి మన కొరకు ఎదురు చూస్తుంటాడు. మనలో ఎవరైనా ఆ దారిలో వెళ్తే వెంటనే పరుగు పరుగున వచ్చి వారికి నమస్కారం చేస్తాడు.”
శ్రీరామకృష్ణులు: ఆహా! ఆహా!
ఇలా సంభాషణ జరిగిన పిదప శ్రీరామకృష్ణులు దిండును ఆనుకొని కాసేపు విశ్రమించారు. ‘మ’ బయటకు వెళ్ళాడు. కాసేపటి తరువాత అతడు పన్నెండు సంవత్సరాల బాలుడి నొకడిని తోడ్కొని వచ్చాడు. ఆ బాలుడి పేరు క్షీరోద్; ‘మ’ పనిచేస్తున్న స్కూలులోనే చదువుకుంటున్నాడు.
‘మ’ : ఈ అబ్బాయి చాలా మంచివాడు. భగవద్విషయాలు వినడంలో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కళ్ళు రెండూ లేడికళ్ళలాగా ఉన్నాయి.
క్షీరోద్, శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. పిదప ఎంతో భక్తిభావంతో ఆయన పాదాలను ఒత్తసాగాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): రాఖాల్ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. అతడికి కూడా ఒంట్లో బాగోలేదు; ఏదో కురుపు లేచిందట. అతడు త్వరలో తండ్రి కాబోతున్నాడని విన్నాను.
పల్టు, వినోద్‌లు ఎదురుగా కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ పల్టుతో ఇలా అన్నారు: “నువ్వు మీ తండ్రిగారికి ఏమని చెప్పావు? (‘మ’ తో) ఈ అబ్బాయి తండ్రి ఇతణ్ణి ఇక్కడకు రావద్దనేసరికి ఇతడు ఘాటుగా సమాధానం ఇచ్చాడట. (పల్టుతో) చెప్పవోయ్, ఏమని చెప్పావు?”
పల్టు:నేను ఆయనతో ఇలా అన్నాను: ‘అవును, నేను శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్తున్నాను. ఇందులో తప్పు ఏమిటో చెప్పండి? (శ్రీరామకృష్ణులు, ‘మ’ లు నవ్వారు) అవసరమైతే ఇంకా ఘాటుగా చెబుతాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, ‘మ’ తో): ఏమయ్యా, అంతదూరం వెళ్ళటం మంచిదే నంటావా?
‘మ’ : లేదండి. అంతగా మితిమీరటం మంచిది కాదు. (శ్రీరామకృష్ణులు నవ్వారు)
శ్రీరామకృష్ణులు(వినోద్‌తో): నువ్వెలా ఉన్నావు? నువ్వు అక్కడకు (దక్షిణేశ్వరానికి) రావడంలేదేం?
వినోద్: వద్దామనే అనుకున్నానండి. కాని ఒంట్లో బాగుండటం లేదు. మళ్ళీ సుస్తీ చేస్తుందేమోనని అక్కడకు రాలేదు.
శ్రీరామకృష్ణులు: ఒకసారి దక్షిణేశ్వరానికి రారాదూ! అక్కడి గాలి మంచిది; నీకు స్వస్థత చేకూరుతుంది.
ఇంతలో చిన్న నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు కాళ్ళు మొహం కడుగుకొనటానికి వెళుతున్నారు. చిన్న నరేంద్రుడు తువ్వాలు నొక దానిని చేతబట్టుకొని ఆయనకు నీరు అందివ్వడానికి వెళ్ళాడు. ‘మ’ కూడా వెంట ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: విపరీతమైన ఎండలు!
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: నువ్వు ఆ చిన్న గదిలో ఎలా ఉంటున్నావు? మేడపైన ఉన్న ఆ గదిలో వేడిగా ఉంటుంది కదూ!
‘మ’ : అవునండి. చాలా వేడిగా ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: పైగా, నీ భార్యకు మతి సరిగా లేదాయె. ఆమెను చల్లగా ఉన్న గదిలో ఉంచు.
‘మ’ : అవునండి. ఆమెను క్రింద ఉన్న గదిలోనే పడుకోమని చెప్పాను.
శ్రీరామకృష్ణులు అతిథుల గదిలోకి తిరిగివచ్చి కూర్చున్నారు. ‘మ’ తో “నువ్వు గత ఆదివారం దక్షిణేశ్వరానికి రాలేదేం?” అని అడిగారు.
‘మ’ : అయ్యా, మా ఆవిడ ఇంట్లో ఒక్కతె ఉన్నది. ఆమెకు తోడుగా ఎవరూ లేనందున రాలేకపోయాను.
శ్రీరామకృష్ణులు బండిలో నిము గోస్వామి వీథిలోని దేవేంద్రుని ఇంటికి వెళుతున్నారు. వెంట చిన్న నరేంద్రుడు, ‘మ’, ఇంకా ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. దారి పొడవునా శ్రీరామకృష్ణులు పూర్ణుడి గురించే మాట్లాడుతున్నారు, అతడికోసం ఆరాటపడుతున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఆధారం విశేషమైనది! లేకుంటే తనకోసం నాతో జపం ఎలా చేయిస్తాడు? అతడికి ఈ విషయాలు ఏవీ తెలియవు.
పూర్ణుడికోసం శ్రీరామకృష్ణులు బీజమంత్రాన్ని జపించారని విని ‘మ’ తదితర భక్తులు నివ్వెరపోయారు.
శ్రీరామకృష్ణులు: ఇవాళ అతణ్ణి తీసుకు వచ్చివుంటే బాగుండేది. అతణ్ణి ఎందుకు తోడ్కొనిరాలేదు?
చిన్న నరేంద్రుడు నవ్వడం చూసి శ్రీరామకృష్ణులు, భక్తులు కూడా నవ్వారు. శ్రీరామకృష్ణులు ఆనందంతో అతణ్ణి చూపిస్తూ ‘మ’ తో ఇలా అన్నారు: “చూడు, చూడు! ఎలా నవ్వుతున్నాడో! ఏమీ ఎరుగనట్లు! అతడి మనస్సులో ఏమీ లేదు. భూమి, భార్య, ధనం – ఈ మూడూ అతడి మనస్సులో లేనేలేవు. కామినీ కాంచనాలు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోనిదే భగవత్ సాక్షాత్కారం కలుగదు.”
బండి దేవేంద్రుని ఇంటి వైపుగా వెళుతోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఒకసారి దేవేంద్రునితో ఇలా అన్నారు: “నేను నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను.” అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నాడు: “నేను కూడా ఇందు నిమిత్తమే ఇవాళ ఇక్కడకు వచ్చాను. వచ్చే ఆదివారం నాడు మీరు మా ఇంటిని పావనం చేయాలి.” శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు: “కాని నీకు ఆదాయం తక్కువ. ఎక్కువ మందిని పిలిపించ వద్దు. పైగా బండి బాడుగ కూడా ఎక్కువే.” దేవేంద్ర నవ్వుతూ ఇలా అన్నాడు: “ఆదాయం తక్కువైతే మాత్రం ఏమిటి? ‘ఋణం కృత్వా ఘృతం పిబేత్’ (అప్పు చేసైనా సరే నెయ్యి తినాలి)”. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు చాలాసేపు నవ్వుతూ ఉండిపోయారు.
కొద్దిసేపట్లో బండి దేవేంద్రుని ఇల్లు చేరింది. శ్రీరామకృష్ణులు దేవేంద్రుడితో ఇలా అన్నారు: “దేవేంద్రా, నా భోజనానికి అంటూ పెద్దగా ఏర్పాట్లు ఏమీ చేయవద్దు. నాకు మామూలు భోజనమే సరిపోతుంది. ఇవాళ ఒంట్లో కాస్త నలతగా ఉంది.”
38.12 ద్వాదశ పరిచ్ఛేదం భక్తులతో దేవేంద్రుడి ఇంట్లో
పిదప శ్రీరామకృష్ణులు దేవేంద్రుడి ఇంట్లోకి వెళ్లి భక్తులతో పాటు అతిథుల గదిలో ఆసీనులయ్యారు. సాయంకాలం అయింది. గదిలో దీపం వెలుగుతోంది. చిన్న నరేంద్రుడు, రామ్, ‘మ’, గిరీశ్, దేవేంద్ర, అక్షయ్, ఉపేంద్ర మొదలైన భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చున్నారు. ఆయన ఒక బాల భక్తుణ్ణి చూస్తూ ఆనందంతో పరవశులవుతున్నారు. అతణ్ణి చూపుతూ భక్తులతో ఇలా అన్నారు: “మనిషిని సంసారంలో బంధించే భూమి, భార్య, ధనం అనే మూడు వస్తువుల పట్ల ఇతడికి అనురక్తి అనేది ఎంతమాత్రం లేదు. ఈ మూడు వస్తువులపైన కనుక మనస్సును ఉంచినట్లయితే అటువంటి మనస్సు భగవంతునిపైన లగ్నం కాదు. ఇతడికి ఇంకా ఏదో దర్శనం కూడా కలిగింది. (భక్తుడితో) చెప్పవోయి, నువ్వేం చూశావో చెప్పు?”
38.12.1 కామినీ కాంచనాలు – బ్రహ్మానందం
భక్తుడు (నవ్వుతూ): పెద్ద పెద్ద పెంట కుప్పలను చూశాను. కొందరు వాటిపైన కూర్చున్నారు, మరికొందరు వాటికి దూరంగా కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి మరిచిపోయిన సంసార జీవుల పరిస్థితి ఎలా అవుతుందనేదే ఇతడు చూసింది. అందుకనే ఇతడి మనస్సు నుండి అవన్నీ తొలగిపోతున్నాయి. కామినీ కాంచనాలనుండి మనస్సు వైదొలగినట్లయితే ఇక చింతించే పని ఏముంది?
“ఆహా! ఎంతటి విచిత్రం! నేను ఎన్నో జపధ్యానాలు చేసిన తరువాతనే ఇవన్నీ నన్ను వదలిపోయాయి. ఇతడి మనస్సు నుండి ఇవన్నీ ఇంత త్వరగా అడుగంటా ఎలా తొలగిపోయాయి? కామాన్ని వదలించుకోవటం సామాన్య విషయమా ఏమిటి? ఆరు మాసాల (సాధన) తరువాత నా ఛాతీ అదోలా అవసాగింది. అప్పుడు చెట్టు క్రింద పడిపోయి భోరున విలపించసాగాను. అమ్మతో ఇలా మొరపెట్టుకున్నాను: ‘అమ్మా! అలా కనుక అయినట్లయితే కత్తితో గొంతుకోసుకుంటాను.’
(భక్తులతో) “కామినీ కాంచనాలు మనస్సు నుండి తొలగిపోతే ఇక ఏం మిగులుతుంది? అప్పుడు ఉండేది కేవలం బ్రహ్మానందం మాత్రమే.”
శశి(కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద) ఈ మధ్యనే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉన్నాడు. అతడు విద్యాసాగర్ కళాశాలలో బి.ఏ. మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతడి గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఆ అబ్బాయి మనస్సు అప్పుడప్పుడు ధనం వైపుకు వెళుతుంది. కాని కొందరి మనస్సు అటువైపు వెళ్ళనే వెళ్ళదు. కొందరు యువకులు వివాహం చేసుకోనే చేసుకోరు.
భక్తులు నిశ్శబ్దంగా ఆయన పలుకులు వింటున్నారు.
38.12.2 అవతార పురుషులను ఎవరు గుర్తించగలరు?
శ్రీరామకృష్ణులు (భక్తులతో): మనస్సు నుండి కామినీ కాంచనాలు సంపూర్ణంగా తొలగిపోనిదే అవతార పురుషులను గుర్తించడం కష్టం. వంకాయలు అమ్మే వాడిని రత్నం విలువ ఎంత అని ప్రశ్నించగా అతడు దానికి బదులుగా తొమ్మిది వీసెల వంకాయలు ఇస్తానన్నాడు. అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వనన్నాడు.
ఈ మాటలు విని భక్తులు అందరూ నవ్వారు. చిన్న నరేంద్రుడు బిగ్గరగా నవ్వాడు. అతడు ఈ పలుకులలోని అంతరార్థాన్ని వెంటనే పసిగట్టాడని శ్రీరామకృష్ణులు గ్రహించారు.
శ్రీరామకృష్ణులు: ఇతడు ఎంతటి కుశాగ్రబుద్ధియో చూడండి. నాంగ్టా కూడా ఇలాగే చటుక్కున అర్థం చేసుకోగలిగేవాడు. గీత, భాగవతం మొదలైన శాస్త్ర విషయాలలో ఏది కావాలంటే అది చటుక్కున అర్థం చేసుకొనే వాడు.
“బాల్యం నుండే కామినీ కాంచనాల త్యాగం! ఇది ఎంత ఆశ్చర్యకరం! చాలా కొద్దిమందికి మాత్రమే ఇలా అవుతుంది. అలా కామినీ కాంచనాల పరిత్యాగం చేయని వ్యక్తి కాకి పొడిచిన పండులాంటి వాడు. కాకి పొడిచిన పళ్ళను భగవంతునికి సమర్పించలేము సరికదా, వాటిని స్వయంగా తినాలన్నా సంకోచమే.
“కొందరు మొదట్లో ఎన్నో పాపాలు చేసుంటారు; కాని వృద్ధాప్యంలో భగవన్నామాన్ని స్మరిస్తుంటారు. ఇది గుడ్డిలో మెల్ల.
“ఫలానా మల్లిక్ తల్లి గొప్పింటికి చెందినది. ఆమె నన్ను ‘వేశ్యలు ఉద్ధరింపబడరా?’ అని అడిగింది. మొదట్లో ఆమె అటువంటి పనులు ఎన్నో చేసి ఉంది; అందుకే అలా అడిగింది. దానికి నేను ఇలా చెప్పాను: ‘ఆ, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. అయితే, ఇక మీదట అటువంటి తప్పులు చేయబోనని శపథం చేసి వ్యాకులచిత్తంతో విలపిస్తే వారు కూడా ఉద్ధరింపబడతారు. ఊరకే హరినామం జపిస్తే ఏమిటి ప్రయోజనం? హృదయపూర్వకంగా విలపించాలి.’”
38.13 త్రయోదశ పరిచ్ఛేదం భజనానందం, సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు
తరువాత మృదంగం, తాళాలతో సంకీర్తన ప్రారంభమయింది. గాయకుడు, కేశవభారతి నుండి శ్రీ గౌరాంగుడు సన్న్యాసాన్ని గైకొనే సన్నివేశం గురించిన పాట పాడసాగాడు:
ఏమా దర్శనం ఏమి దర్శనం
కేశవభారతి ఆశ్రమంబున
అనుపమేయమగు అనుగ్రహముతో
గోరా కన్నుల గారు ధారలు….
ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులయ్యారు. తరువాత గాయకుడు, శ్రీకృష్ణుడి కొరకు బృందావన గోపిక యొక్క విరహవేదనను వర్ణించే పాట పాడాడు. తన శ్రీకృష్ణుణ్ణి వెనక్కు ఇచ్చి వెయ్యమని ఆమె మాధవీలతతో ప్రాధేయపడుతోంది:
నా కీయవా నా నాథుని?
నా కివ్వవే ఓ మాధవీ
అతడు నా వాడేనే ఓ మాధవీ
నా ప్రియుని విడిపించి
నీ దాసి గావింపవే (నన్ను) ॥ నా ॥
నీరు చేపకువలె
అతడు నా ప్రాణమె
నా కివ్వవే మాధవీ
నా ప్రియుని నా కివ్వవే మాధవి ॥ నా ॥
ఎట దాచితే మాధవీ
ఏ కపట మెరుగనే ఓ మాధవీ ।
నీవెంత దొంగవె ఓ మాధవీ ॥ నా ॥
నే బాల బేలనని
నీ గుండె పొదరింట
దాచినావటె మాధవీ ॥ నా ॥
నా మాధవుని విడచి
నిలువలేనే మాధవీ
నా ప్రియుని ఎడబాసి
నే బ్రతుకనే మాధవీ ॥ నా ॥
నా కీయవా నా నాథుని
నా కివ్వవే ఓ మాధవి ॥ నా ॥
మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులు ‘నా ప్రాణానికి ప్రాణమైన శ్రీకృష్ణుడు నివసించే మథురా నగరం ఇక్కడ నుండి ఎంతదూరం?’ అని అర్థం వచ్చే కొన్ని చరణాలు జోడిస్తున్నారు.
పిదప ఆయన సమాధిస్థితిలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి వరకు అలాగే నిశ్చలంగా ఉండిపోయారు. తరువాత క్రమంగా సమాధిస్థితి నుండి కొద్దిగా బాహ్యస్పృహలోకి వచ్చారు; కాని ఇంకా భావావస్థలోనే ఉన్నారు. ఆ స్థితిలోనే ఆయన భక్తుల గురించి మాట్లాడసాగారు. మధ్య మధ్యలో జగజ్జననితో కూడా సంభాషిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (భావావస్థలోనే): అమ్మా! అతణ్ణి నీ వద్దకు లాగి వేసుకో. నేను ఇక ఎక్కువగా (అతడి గురించి) యోచించజాలను. (‘మ’ తో) నా మనస్సు నీ బావమరిది వైపు కొద్దిగా మళ్ళివుంది.
(గిరీశ్‌తో) “నువ్వు ఎన్నెన్నో బూతు మాటలు మాట్లాడావు. పోనీలే, అవన్నీ ఆ విధంగా బయటపడటమే మంచిది. కొందరికి చెడు రక్తం కారణాన జబ్బు చేస్తుంది. అలాంటి చెడు రక్తం ఎంతగా వదిలిపోతే అంత మంచిది. (మనిషి) ఉపాధిని నాశనం చేసేటప్పుడు శబ్దం వస్తుంది. కట్టె కాలేటప్పుడు ‘చిట్ పట్’ శబ్దం చేస్తుంది; పూర్తిగా కాలిపోయిన తరువాత ఏ శబ్దమూ ఉండదు.
“నువ్వు రోజు రోజుకూ పరిశుద్ధుడవైపోతావు. రోజు రోజుకూ నువ్వు విశేషంగా ఉన్నతి నొందుతావు. లోకులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు.
“నేను ఎక్కువగా రాలేను. ఏది ఏమైనా, నీకు దానంతట అదే సిద్ధిస్తుందిలే.”
శ్రీరామకృష్ణుల భావావస్థ తీవ్రం కాసాగింది. మళ్ళీ ఆయన జగజ్జననితో సంభాషించసాగారు.
శ్రీరామకృష్ణులు(జగజ్జననితో): అమ్మా! మంచివాడిని మంచి చేయటంలో ఏమున్నది గొప్పతనం? అమ్మా చచ్చినవాడిని చంపడం వల్ల ఏం ఒరుగుతుంది? ఎదురుగా నిలబడ్డవాడిని చంపడంలోనే కదా నీ మహిమ బయటపడేది.
శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఉన్నట్టుండి కాస్త బిగ్గరగా ఇలా అన్నారు: “నేను దక్షిణేశ్వరం నుండి వచ్చాను. అమ్మా, నేను వెళ్తున్నాను.”
దూరం నుండి తల్లి పిలుపు విని పిల్లవాడు బదులు పలికే రీతిలో ఉంది శ్రీరామకృష్ణులు మాట్లాడే తీరు. మళ్ళీ ఆయన సమాధి స్థితిలో నిశ్చలంగా కూర్చుండిపోయారు. భక్తులు రెప్ప వాల్చకుండా ఆయన్నే చూస్తున్నారు. భావావస్థలోనే ఆయన “నేను పూరీలు ఇక తినను” అన్నారు. ఆయన్ను దర్శించడానికి వచ్చిన పొరుగింటి వైష్ణవ గోస్వాములు ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయారు.
38.14 చతుర్దశ పరిచ్ఛేదం రామ్, గిరీశ్ ప్రభృత భక్తులతో శ్రీరామకృష్ణులు
తరువాత శ్రీరామకృష్ణులు భక్తులతో ఉల్లాసభరితంగా ముచ్చటించసాగారు. చైత్రమాసపు ఎండలు విపరీతంగా దంచివేస్తున్నాయి. దేవేంద్రుడు పాల ఐస్‌క్రీమ్ తయారు చేయించాడు. దానిని అతడు శ్రీరామకృష్ణులకు, భక్తులకు సమర్పించాడు. ‘మ’ లోస్వరంలో “ Encore, Encore (అంటే, once more, once more – ఐస్‌క్రీమ్‌ను మరోసారి ఇవ్వండి అని అర్థం)” అంటున్నాడు. అది విని భక్తులు పగలబడి నవ్వసాగారు. ఐస్‌క్రీమ్‌ను చూసి శ్రీరామకృష్ణులు పసి బాలునివలె ఎంతగానో ఆనందపడిపోయారు.
శ్రీరామకృష్ణులు: కీర్తనలు సుమధురంగా ఉన్నాయి. గోపికల స్థితిని హృద్యంగమంగా చిత్రీకరించారు. ‘నా కీయవా నా నాథుని? నా కివ్వవే ఓ మాధవీ’ అది గోపికల ప్రేమోన్మాద స్థితి. ఎంతటి ఆశ్చర్యం! గోపికలు శ్రీకృష్ణుడికై పిచ్చివారే అయిపోయారు.
ఒక భక్తుడు మరో భక్తుణ్ణి చూపిస్తూ “ఇతడిది సఖీభావం – గోపీభావం” అన్నాడు.
రామ్: ఇతడిలో రెండు భావాలూ ఉన్నాయి. మధుర భావమూ ఉంది, జ్ఞానుల కఠోర భావం కూడా ఉంది.
శ్రీరామకృష్ణులు: ఏమయ్యా, నువ్వేమంటావు?
పిదప శ్రీరామకృష్ణులు సురేంద్ర గురించి అడిగారు.
రామ్: కబురు పంపానండి. కాని రాలేదు.
శ్రీరామకృష్ణులు: పాపం! ఆఫీసు పనిలో బాగా అలసిపోతాడు.
ఒక భక్తుడు: రాంబాబు మీ గురించి వ్రాస్తున్నాడండి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏం వ్రాస్తున్నాడు?
భక్తుడు: ‘పరమహంసలవారి భక్తి’ అనే పేరుతో ఒక వ్యాసం వ్రాస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: మంచిది. దీనితో రామ్ పేరు మారుమ్రోగిపోతుంది.
గిరీశ్(నవ్వుతూ): అతడు మీ శిష్యుడిననే పేరుతో ప్రసిద్ధి కెక్కుతాడు.
శ్రీరామకృష్ణులు: నాకు శిష్యులు గిష్యులు అంటూ ఎవరూ లేరు. నేను శ్రీరాముడి దాసానుదాసుడను.
ఇరుగు పొరుగు వ్యక్తులు కొందరు వచ్చారు. కాని వారిని చూసి శ్రీరామకృష్ణులు ప్రసన్నులు కాలేదు. ఆయన ఇలా అన్నారు: “ఇది ఎలాంటి పొరుగు? ఇక్కడ (భక్తి తత్పరులు) ఎవరూ తారసపడటం లేదే!”
దేవేంద్రుడు, శ్రీరామకృష్ణులను ఇంటి లోపలకు తీసుకువెళ్ళి ఆయనకు ఉపాహారం మొదలైనవి సమర్పించాడు. తరువాత ఆయన ప్రసన్నవదనంతో వచ్చి మళ్ళీ అతిథుల గదిలో ఆసీనులయ్యారు. భక్తులూ ఆయనకు సమీపంగా కూర్చున్నారు. ఉపేంద్ర* , అక్షయ్* లు శ్రీరామకృష్ణులకు రెండు వైపులా కూర్చుని ఆయన పాదాలను సేవించసాగారు. ఆయన దేవేంద్రుడి ఇంటి స్త్రీల గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు.
శ్రీరామకృష్ణులు: పల్లెటూరి ఆడపడుచులు కదా! చాలామంచి స్వభావం కలవారు, భక్తితత్పరులు.
శ్రీరామకృష్ణులు ఆత్మారాములు కదా! ఆనంద తన్మయత్వంతో ఈ పాట పాడారు:
ఎన్నిచోటులో ఎపుడు గ్రుమ్మరుచు
అరుగుచుండునో పరివ్రాజకా!
నీదు పయనమిట నొక్క గడియయే
నిలువగదోయీ సాధుసత్తమా ॥ ఎ ॥
చేతనున్న నీ భిక్షాపాత్రతో
కాంతివంతమై మెరసిపోవు నీ
వదనరాజ మొకసారి దర్శనము
చేయనిమ్ము ఓ సాధుపుంగవా ॥ ఎ ॥
గిరీశ్ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా గిరీశ్కి నమస్కారం చేశారు. పిదప దేవేంద్రాది భక్తులు ఆయన్ను బండిలో ఎక్కించారు. బండి దక్షిణేశ్వరం వైపుగా బయలుదేరింది.
దేవేంద్రుడు ఇంట్లోకి వచ్చి చావడిలో పొరుగింటి వ్యక్తి ఒకడు ఒక మూలగా ఉన్న బెంచి మీద ఆదమరచి నిద్రపోతుండటం గమనించాడు. నిద్రలేపేసరికి అతడు కళ్ళు నులుముకుంటూ లేచి “పరమహంస దేవులు వచ్చారా?” అని అడిగారు. అది విని అందరూ గొల్లున నవ్వారు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణులను దర్శిద్దామని ఆయనకంటే ముందుగానే వచ్చాడు. కాని బాగా ఉక్క పోస్తుండటంతో చావడిలోకి వచ్చి బెంచి మీద కాస్త విశ్రమిద్దామనుకున్నాడు. తీరా చూస్తే ఆదమరిచి నిద్రపోయాడు.
శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వరాభిముఖంగా పయనిస్తోంది. శ్రీరామకృష్ణులు, ‘మ’ తో ఆనందంగా ఇలా అన్నారు: “ఇవాళ బోలెడు ‘కుల్ఫీ’ (అంటే ఐస్‌క్రీమ్) తిన్నాను. నువ్వు దక్షిణేశ్వరం వచ్చేటప్పుడు నాలుగైదు పట్రా.” కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అన్నారు: “ప్రస్తుతం నా మనస్సు ఈ కుర్రవాళ్ళ వైపుకు లాగుతోంది – చిన్న నరేంద్రుడు, పూర్ణుడు; ఇంకా, నీ బావమరిది.”
‘మ’ : మీరనేది ద్విజుని గురించేనా?
శ్రీరామకృష్ణులు: ఊహూ, ద్విజుడి సంగతి సరే కానీ నేను చెప్పేది అతడి అన్న గురించి.
‘మ’ : ఓహో!
బండి దక్షిణేశ్వర కాళికాలయం దిశగా సాగిపోతోంది.