37.1 ప్రథమ పరిచ్ఛేదం హోలీ పండుగ, భక్తులతో శ్రీరామకృష్ణులు
ఆదివారం, మార్చి 1, 1885
నేడు డోలా యాత్ర, హోలీ పండుగ – శ్రీ చైతన్య మహాప్రభువుల జన్మదినం. దక్షిణేశ్వర ఆలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు; సమాధి స్థితిలో మగ్నులై ఉన్నారు. మహిమాచరణ్, రామ్‌చంద్ర దత్త, మనోమోహన్, నవాయి చైతన్య, నరేంద్రుడు, ‘మ’ మొదలైన భక్తులు నేల మీద కూర్చుని తదేక దృష్టితో ఆయన్ను చూస్తున్నారు.
బాహ్యస్పృహ కలిగాక శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, “హరిభక్తి గురించి కాస్త చెప్పు” అన్నారు. మహిమాచరణ్ నారద పంచరాత్రంలో నారదుడు తపస్సు చేస్తుండగా ఈ విధంగా దైవవాణి విన్నాడని ఉంది” అంటూ ఈ స్తవాన్ని పఠించాడు:
ఆరాధితో యది హరిస్తపసా తతః కిమ్ ।
నారాధితో యది హరిస్తపసా తతః కిమ్ ॥
అంతర్బహిర్యది హరిస్తపసా తతః కిమ్ ॥
వాంతర్బహిర్యది హరిస్తపసా తతః కిమ్ ॥
విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యాసు వత్స ॥
వ్రజ వ్రజ ద్విజ శీఘ్రం శంకరం జ్ఞానసింధుమ్ ॥
లభ లభ హరిభక్తిం వైష్ణవోక్తం సుపక్వామ్ ॥
భవనిగడ నిబంధచ్ఛేదనీం కర్తరీం చ ॥
భావం :
భగవంతుని ప్రేమించుచు భజియించిన వత్సా
ఎందుకురా ఇక నెందుకురా తపమెందుకురా తనయా ॥
భగవంతుని ప్రేమించక భజియించిన వత్సా
పనియేమిర ఫలమేమిర తపమేలర తనయా ॥
లోవెలుపల లోకేశుని తిలకించిన వత్సా
ఎందుకురా ఇక నెందుకురా తపమెందుకురా తనయా ॥
లోవెలుపల లోకేశుని గనకుండిన తనయా
పనియేమిర ఫలమేమిర తపమేలర తండ్రీ ॥
చాలించర ఇక చాలును నా వత్సా తపము
జ్ఞానాంబుధి యగు శంకరు దరిచేరర త్వరగా ॥
భవపాశముల న్ద్రుంచు పరభక్తిని తనయా
పర భక్తులు కీర్తించు పరభక్తిని తాతా
బడయుమురా పరమేశ్వరు ప్రార్థించి బాబూ ॥
37.1.1 జీవకోటి, ఈశ్వరకోటి
శ్రీరామకృష్ణులు: జీవకోటి, ఈశ్వరకోటి అని రెండు తరగతుల భక్తులు ఉన్నారు. జీవకోటికి చెందినవారి (అంటే సాధారణ భక్తుల) భక్తి వైధీభక్తి. వీరు శాస్త్రవిహితంగా పూజావ్రతాలు, జపతపాలు, పురశ్చరణాది కర్మలు ఆచరిస్తారు. ఈ ‘వైధీభక్తి’ దశ పిదప వారికి జ్ఞానోదయమౌతుంది; తరువాత సమాధి స్థితి. ఈ విధంగా సమాధి స్థితిలో లీనమైన తరువాత జీవకోట్లు సాధారణ స్థితికి తిరిగిరారు.
“కాని ఈశ్వరకోట్ల విషయం వేరు. వారిది అనులోమం, విలోమంగా ఉంటుంది. ఈశ్వర కోటికి చెందిన వ్యక్తి ‘నేతి, నేతి’ విచారణ చేస్తూ మెట్లు ఎక్కి మేడ మీదకు వెళ్ళాక మేడ ఏ వస్తువులతో అయితే తయారైవుందో, అవే వస్తువులతో అంటే ఇటుకలు, బంకమన్ను, సున్నంతోటే మెట్లు కూడా కట్టబడి ఉన్నాయని గాంచుతాడు. అప్పుడు అతడు తన ఇచ్ఛమేరకు మేడ మీదనే ఉండవచ్చు; లేకుంటే మెట్లు దిగడం, ఎక్కడం కూడా చేయవచ్చు.
37.1.2 శుకుడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు
“శుక మహర్షి సమాధి స్థితిలో ఉండేవాడు. అది నిర్వికల్ప సమాధి, జడ సమాధి. పరీక్షిత్తు మహారాజుకు భాగవతం వినిపించడానికి భగవంతుడు శుక మహర్షి వద్దకు నారదమునిని పంపాడు. శుకమహర్షి బాహ్యజ్ఞానశూన్యుడై జడునిలా కూర్చుని ఉండటం నారదముని చూశాడు. అప్పుడు నారదముని వీణను మీటుతూ నాలుగు శ్లోకాలలో శ్రీహరి రూపాన్ని వర్ణిస్తూ గానం చేశాడు. మొదటి శ్లోకం గానం చేస్తూవుంటే శుకమహర్షికి రోమాంచితమయింది. క్రమంగా కనులనుండి అశ్రువులు స్రవించసాగాయి, ఆయన అంతరంగాన హృదయ మధ్యంలో చిన్మయ రూపాన్ని దర్శించసాగాడు. జడసమాధి పిదప కూడా ఆయన మళ్ళీ భగవంతుని రూపాలను దర్శించసాగాడు. శుకమహర్షి ఈశ్వరకోటికి చెందినవాడు.
“హనుమంతుడు సాకార నిరాకారాలు రెండింటినీ సాక్షాత్కరించుకున్న తరువాత శ్రీరామచంద్రుని పట్ల నిష్ఠ కలిగి ఉన్నాడు. ఎవరైతే శ్రీరామచంద్రుడో చిద్ఘన ఆనందస్వరూపం కూడా ఆయనే.
“ప్రహ్లాదుడు ఒక్కోసారి ‘సోఽహం’ భావంలోను, మరోసారి దాస్యభావంలోనూ నెలకొని ఉండేవాడు. అటువంటి వ్యక్తి భక్తిని కాక మరి దేన్ని ఆశ్రయించుకొని జీవించగలడు? అందుకే సేవ్య సేవక భావాన్ని ఆశ్రయించాలి – ‘నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి’ అనే భావం ఇది. ఈ భావంతో అతడు హరిరసాన్ని ఆస్వాదించగలడు. ఇది రసరసిక భావం – ‘ఓ భగవంతుడా! నువ్వు రసము, నేను రసికుణ్ణి’ అనే భావం.
37.1.3 విద్యా ‘నేను’ – అవిద్యా ‘నేను’
“ ‘భక్తుడిననే నేను’, ‘విద్యా నేను’, ‘బాలకుణ్ణి అనే నేను’ – వీటిలో దోషం లేదు. శంకరాచార్యులు లోకశిక్షణ (లోకులకు ఉపదేశించే), నిమిత్తం ‘విద్యా నేను’ ను అట్టిపెట్టుకొని ఉండేవారు. ‘నేను బాలుణ్ణి’ అనే ‘నేను’ లో అనురక్త్తి ఉండదు. బాలుడు మూడు గుణాలకు అతీతంగా ఉంటాడు. అతడు ఏ గుణానికీ వశవర్తి కాడు. ఈ క్షణంలో కోపంగా ఉంటాడు, మరుక్షణంలో అంతా మరచిపోతాడు. ఒక క్షణం బొమ్మరిల్లు కడతాడు, మరుక్షణమే దానిని గురించి మరచిపోతాడు. తన తోటి ఆటగాళ్ళతో చెలిమిగా ఉంటాడు; కాని కొద్ది రోజులు వారు కనపడకపోయేసరికి వాళ్ళ గురించి అంతా మరచిపోతాడు. బాలుడు సత్త్వరజఃతమోగుణాలలో దేని వశంలోనూ ఉండడు.
“ ‘నువ్వు భగవంతుడవు, నేను భక్తుణ్ణి’ – ఇది భక్తుడి భావం. ఈ ‘నేను’ ‘భక్తుడి నేను’. భక్తుడు ఈ ‘నేను’ ను ఎందుకు నిలుపుకుంటాడు? దీనికి కారణం ఉంది: ఈ ‘నేను’ అనేది వదిలిపోయేది కాదు; మరి అలాంటప్పుడు ఆ వెధవను ‘భక్తుడిననే నేను’, ‘దాసుడిననే నేను’ గా పడి ఉండనివ్వు.
“వెయ్యిసార్లు విచారణ చెయ్యి. కాని ఈ ‘నేను’ మాత్రం వదలిపోదు. ‘నేను’ అనేది కుండ లాంటిది, పరబ్రహ్మం సముద్రం లాంటిది – ఎటుచూసినా జలమయం. కుండ లోపలా నీరే, బయట కూడా నీరే. ఎటు వైపు చూసినా అనంత జలరాశి; అయితే కుండ మటుకు ఉండనే ఉంది. ‘భక్తుడి ననే నేను’ కూడా ఆ కుండ లాంటిదే. కుండ ఉన్నంతవరకు ‘నేను’, ‘నువ్వు’ అనేవి ఉంటాయి. అంతవరకు ‘నువ్వు భగవంతుడివి, నేను భక్తుణ్ణి’, ‘నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి’ అనే భావం కూడా ఉంటుంది. లక్షసార్లు విచారణ చెయ్యి, ఇది మాత్రం వదిలేది కాదు. కుండ అనేది లేకపోతే, అది వేరే విషయం.”
37.2 ద్వితీయ పరిచ్ఛేదం నరేంద్రునికి సన్న్యాస ఉపదేశం
ఇంతలో నరేంద్రుడు వచ్చి ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో మాట్లాడసాగారు; మాట్లాడుతూనే మంచం దిగి నేల మీద కూర్చున్నారు. నేల మీద చాప పరచి ఉంది. ఇంతలో గది మనుష్యులతో నిండిపోయింది. వారిలో భక్తులూ ఉన్నారు, కేవలం దర్శించుకోవడానికి వచ్చిన వారు కూడా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు(నరేంద్రుడితో): నువ్వు కులాసాయే కదా! నువ్వు తరచూ గిరిశ్ ఘోష్ ఇంటికి పోతూవుంటావట, నిజమేనా?
నరేంద్రుడు: అవునండి. అప్పుడప్పుడు వెళుతుంటాను.
గిరీశ్ గత కొన్ని నెలలుగా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉన్నాడు. గిరీశ్ విశ్వాసాన్ని అంతుపట్టలేమని శ్రీరామకృష్ణులు అంటుంటారు. శ్రీరామకృష్ణుల పట్ల గిరీశ్కి ఎంతటి విశ్వాసమో అంతటి అనురాగం కూడా. ఇంట్లో సదా శ్రీరామకృష్ణుల చింతనలో మునిగి ఉంటాడు. నరేంద్రుడే కాక హరిపదుడు, దేవేంద్రుడు మొదలైన భక్తులు కూడా ఎంతోమంది గిరీశ్ ఇంటికి తరచూ వెళుతూ ఉంటారు. అతడు వారితో కేవలం శ్రీరామకృష్ణుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. గిరీశ్ గృహస్థుడు; అడ్డదిడ్డంగా జీవితం గడిపినవాడు. అయితే నరేంద్రుడు కామినీ కాంచనాలను త్యజిస్తాడనీ, సర్వసంగ పరిత్యాగి అవుతాడనీ శ్రీరామకృష్ణులు ఎరుగుదురు. అందుచేతనే ఆయన నరేంద్రుడితో ఇలా అంటున్నారు.
37.2.1 గిరీశ్ వంటి వారికి యోగమూ కావాలి, భోగమూ కావాలి
శ్రీరామకృష్ణులు: నువ్వు గిరీశ్ వద్దకు తరచూ వెళ్తూంటావా? అయితే వెల్లుల్లిపాయ నలగగొట్టిన పాత్రను ఎన్నిసార్లు తోమినా సరే, కొద్దిగానైన వాసన ఉండనే ఉంటుంది. ఇక్కడకు వచ్చే కుర్రవాళ్ళు పరిశుద్ధాత్మలు; కామినీ కాంచనాల స్పర్శ లేనివారు. చాలా రోజులపాటు కామినీకాంచనాలలో మునిగి ఉంటే వెల్లుల్లిలా వాసన వస్తూ ఉంటుంది. వారు కాకి కొట్టిన పళ్ళలాంటి వారు. అటువంటి పళ్ళు భగవంతుని నైవేద్యానికి పనికి రావు, స్వయంగా తిందామన్నా సందేహమే. ఇంకా కొత్త కుండ, పెరుగు తోడుపెట్టిన కుండల విషయాన్ని తీసుకో. పెరుగు తోడుపెట్టే కుండలో పాలు నిల్వ ఉంచాలంటే భయం వేస్తుంది.ఎందుకంటే, సాధారణంగా ఆ పాలు విరిగిపోతాయి కదా!*
గిరీశ్లాంటి గృహస్థులు వేరే తరగతికి చెందినవారు. వారికి యోగమూ కావాలి, భోగమూ కావాలి. వారి భావం రావణుడి భావం లాంటిది. రావణుడికి అప్సరసలూ కావాలి, రాముణ్ణి కూడా ప్రాప్తించుకోవాలి. రాక్షసులు సకల భోగాలనూ అనుభవిస్తారు, నారాయణుణ్ణి కూడా సాక్షాత్కరించుకుంటారు.”
నరేంద్రుడు: గిరీశ్ ఘోష్ పాత సావాసాలు వదిలి పెట్టేశాడు.
శ్రీరామకృష్ణులు: ఎద్దు ముసలిదైన తరువాత దానికి విత్తులు కొట్టారట! అలా ఉంది నువ్వు చెబుతున్నది. ఒకసారి బర్డ్వాన్‌లో విత్తు కొట్టిన ఎద్దు ఒకటి ఆవుల వెంట పడటం చూశాను. దారిలో ఎడ్లబండి తోలుకుంటూ పోతున్న వాడిని ‘ఇదెక్కడి చోద్యం? విత్తుకొట్టిన ఎద్దు, ఆవు వెంట పడటం ఏమిటి?’ అని అడిగాను. అందుకు అతడు ‘మహాశయా, ఆ మాట నిజమే. కాని అది ముసలిదైన తరువాత దానికి విత్తులు కొట్టారు. అందుకే దానికి పాత వాసనలు పోలేదు’ అని చెప్పాడు.
“ఒక చోట కొందరు సన్న్యాసులు కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆ దారిన ఒక యువతి వెళ్ళడం జరిగింది. వారందరూ మునుపటి మాదిరే భగవత్ చింతనలోనే నిమగ్నమై ఉన్నారు. కాని వారిలో ఒకడు మాత్రం ఓరచూపుతో ఆమెకేసి చూశాడు. అతడు ముగ్గురు బిడ్డలకు తండ్రి అయ్యాక సన్న్యాసం పుచ్చుకొన్నవాడు.
“వెల్లుల్లిని బాగా నలగగొట్టిన పాత్రలోని వెల్లుల్లి వాసన పోతుందా ఏమిటి? చింతచెట్టుకు మామిడిపళ్ళు కాస్తాయా ఏమిటి? అవును, సిద్ధులు సముపార్జించిన వారు ఎవరైనా అలా చింతచెట్టుకు మామిడిపళ్ళు కాయించవచ్చు. కాని అందరికీ అలా సిద్ధులు లభిస్తాయా ఏమిటి?
“సంసారులకు తీరిక ఎక్కడిది? ఒకడు ఒక పండితునిచే భాగవతం చెప్పించుకోవాలనుకున్నాడు. అతడి స్నేహితుడు అతడితో ఇలా చెప్పాడు: ‘చక్కగా భాగవతం చెప్పే పండితుడొకాయన ఉన్నాడు. కాని చిక్కు ఏమిటంటే, ఆయనకు పొలంపుట్ర ఉంది. సేద్యం పనులన్నీ ఆయనే చూసుకోవాలి. నాలుగు నాగళ్ళు, నాలుగు జతల ఎడ్లు ఉన్నాయి. సదా ఆయనకు ఈ పనులను చక్కదిద్దుకోవడంలోనే బొత్తిగా తీరిక అనేది ఉండదు.’ అప్పుడు పండితుడి అవసరం ఉన్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు: ‘ఆ విధంగా తీరికే లేని భాగవత పండితుడితో నాకు పనిలేదు. నాగళ్ళు, ఎద్దులతో సతమతమయ్యే పండితుడి కోసం కాదు నేను వెదకేది. నాకు కావలసింది కుదురుగా కూర్చొని భాగవతాన్ని విడమరిచి చెప్పే పండితుడు.’
“ఒక పండితుడు, రాజుగారికి ప్రతిరోజూ భాగవతం చదివి వినిపించేవాడు. రోజూ చదవడం ముగించాక పండితుడు రాజును ‘రాజుగారూ, విషయం అర్థం చేసుకున్నారా?’ అని అడిగేవాడు. అందుకు రాజుగారు ‘ముందు మీరు అర్థం చేసుకోండి’ అని బదులు పలికేవాడు. రాజుగారు అలా ఎందుకు అంటున్నారో పండితుడు రోజూ ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచించేవాడు. అతడు సాధనానుష్ఠానాలు అభ్యసించే వ్యక్తి. క్రమంగా అతడికి జ్ఞానోదయం అయింది. లోకంలో భగవంతుడి పాదపద్మాలే యథార్థ వస్తువని, తక్కినదంతా మిథ్య అని బోధపడింది. సంసారం పట్ల విరక్తి చెంది అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు ఒక వ్యక్తి ద్వారా ‘రాజా! నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను’ అని రాజుకు కబురు పంపాడు.
“మరి నేను లౌకికులను చిన్నచూపు చూస్తానా? ఊహూ, అప్పుడు నేను వీరిని బ్రహ్మజ్ఞానం దృష్టితో చూస్తాను. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. అందరూ నారాయణులే, సర్వయోనులూ మాతృయోనియే. అప్పుడు వేశ్య, పతివ్రతల మధ్య ఎటువంటి భేదమూ కనిపించదు.
37.2.2 అందరూ మినపప్పు కొనేవాళ్ళు మాత్రమే!
“కాని ఏం చెప్పమంటావు? అందరూ కేవలం మినప్పప్పును కొనేవాళ్ళు మాత్రమే. కామినీ కాంచనాలను వదలడానికి ఎవరూ ఇష్టపడరు. లోకులు స్త్రీ సౌందర్యంలో మోహితులైపోతారు, సంపదలు చూడగానే మైమరచిపోతారు. కాని భగవంతుడి రూపాన్ని దర్శించిన వ్యక్తికి బ్రహ్మపదవి కూడా తుచ్ఛమనిపిస్తుంది.
“ఒకసారి రావణుడితో ఎవరో ఇలా అన్నారు: ‘నువ్వు ఎన్నో మారువేషాలు ధరించి సీత వద్దకు వెళుతూంటావు కదా! అయితే రాముడి రూపాన్ని ధరించి ఆమె వద్దకు వెళ్ళవు ఎందుకని?’ అందుకు రావణుడు ఇలా బదులిచ్చాడు: ‘శ్రీరాముడి రూపాన్ని హృదయంలో ఒక్కసారి చూస్తే చాలు – రంభ, తిలోత్తమలు కూడా చితాభస్మంలా తోస్తారు. బ్రహ్మపదవి కూడా తుచ్ఛమైపోతుంది. ఇక పరస్త్రీ విషయం వేరే చెప్పాలా?’
“అందరూ మినప్పప్పును కొనేవాళ్ళే. ఆత్మశుద్ధి లేకుండా భగవంతుని పట్ల శుద్ధభక్తి కలుగదు; ఆయనపట్ల లక్ష్యం కుదరదు. మనస్సు అటూ ఇటూ పరుగులు పెడుతూనే ఉంటుంది.
(మనోమోహన్తో* ) “నువ్వు కోపగించుకోవచ్చు, లేకపోతే మరేదైనా చేయవచ్చు. రాఖాల్తో నేను ఇలా అన్నాను: ‘నువ్వు భగవంతుడి కోసం గంగలో దూకి చచ్చావన్న మాటనైనా నేను వినగలుగుతానేమో కాని నువ్వు ఒకరి కింద గులాంగా ఉంటూ నౌకరీ చేస్తున్నావన్న మాట మాత్రం వినలేను.’
37.2.3 నేపాలీ అమ్మాయి – భగవంతునికే దాస్యం – సాధువు, అక్బర్ కథ
“ఒక రోజు ఒక నేపాలీ అమ్మాయి ఇక్కడకు వచ్చింది. వీణను మీటుతూ చాలా చక్కగా పాడింది. ‘నీకు పెళ్ళయిందా?’ అని ఎవరో అడిగేసరికి ఆ అమ్మాయి, ‘నేను భగవంతుడికి మాత్రమే దాసిని. ఇక మరెవరికి దాసిని అవమంటారు?’ అని బదులిచ్చింది.
“కామినీ కాంచనాల నడుమ జీవిస్తూ ఉంటే యోగం ఎలా సిద్ధిస్తుంది? వాటి నడుమ అనాసక్తుడై జీవించడం చాలా కష్టం. ఒక వైపు భార్యకు గులాము, మరో వైపు డబ్బుకు గులాము, ఇంకొక వైపు తాను పనిచేసే యజమానికి గులాము.
ఒక కథ చెబుతా వినండి: అది ఢిల్లీ పాదుషాగా అక్బరు రాజ్యం చేసే కాలం. ఆ రాజ్యంలో ఒక ఫకీరు అడవిలో ఒక కుటీరంలో నివసించేవాడు. ఫకీరు వద్దకు తరచూ సందర్శకులు వస్తూండేవారు. వారికి బాగా మర్యాద చేయాలని ఫకీరుకు ఎంతో కోరికగా ఉండేది. అయితే అందుకు ధనం కావాలి కదా! అందుకని అతడు ఇలా తలచాడు: ‘అక్బరు వద్దకు వెళ్ళి ఇందు నిమిత్తం ధనం యాచిస్తాను. అక్బరు ఇంటి తలుపులు సాధువులకు, ఫకీర్లకు ఎల్లప్పుడు తెరచే ఉంటాయి కదా!’ ఫకీరు అక్బరు వద్దకు వెళ్ళిన సమయంలో ఆయన నమాజు చేస్తున్నాడు. ఫకీరు కూడా అక్కడే కూర్చున్నాడు. అక్బరు నమాజు చేసేటప్పుడు ‘యా అల్లా, నాకు సిరిసంపదలు ప్రసాదించు’ అంటూ ప్రార్థించడం ఫకీరు విన్నాడు. అది వినగానే ఫకీరు లేచి వెళ్ళిపోసాగాడు. అక్బరు సైగచేసి అతణ్ణి ఆగమని చెప్పాడు. నమాజు పూర్తిచేశాక ఆయన ఫకీరును ‘మీరు వచ్చి కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళిపోతున్నారే? మీ రాకకు కారణం ఏమిటి?’ అని అడిగాడు. అందుకు ఫకీరు ‘ఇది పాదుషావారు వినవలసిన విషయం కాదు. నేను వెళతా’ నన్నాడు. కారణం ఏమిటో చెప్పమని అక్బరు పట్టుపట్టడంతో ఫకీరు ఇలా చెప్పాడు: ‘నా కుటీరానికి ఎంతోమంది అతిథులు వస్తూ ఉంటారు. వారికి మర్యాద చేయడానికి అవసరమైన ధనం యాచించే నిమిత్తం ఇక్కడకు వచ్చాను.’ మరి అలాంటప్పుడు ధనం కోరకుండానే వెళ్ళిపోతున్నారెందుకు అని అక్బరు అడగడంతో ఫకీరు ఇలా బదులు ఇచ్చాడు: ‘నువ్వు కూడా సిరి సంపదల కోసం యాచించటం చూశాను. అలాంటప్పుడు ఒక యాచకుని మళ్ళీ యాచించడ మెందుకు? కావాలంటే ఆ అల్లానే యాచిద్దామనుకొని వెళ్ళిపోతున్నాను.’”
37.2.4 శ్రీరామకృష్ణుల సత్త్వగుణ స్థితి
నరేంద్రుడు: గిరీశ్ ఘోష్ ప్రస్తుతం కేవలం భగవత్ విషయాలను గురించే చింతన చేస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: అది చాలా మంచిది. కాని అంత దుర్భాషణ లెందుకు? ప్రస్తుతం నేను ఉన్న స్థితిలో అటువంటి తిట్లు, ప్రవర్తన ఓర్చుకోలేను. పిడుగు పడ్డప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద సామానులు అంతగా చలించవు. కాని కిటికీలకు ఉన్న గాజు చట్రాలు ‘టక్ టక్’ మంటూ అల్లల్లాడుతాయి. ప్రస్తుతం నేను వీటిని ఓర్చుకునే స్థితిలో లేను. సత్త్వగుణ స్థితిలో కేకలు, కోలాహలం సహింపలేం. అందుకే హృదయ్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు; అమ్మ అతణ్ణి ఇక్కడ ఉండనివ్వలేదు. చివరి రోజుల్లో మరింతగా మితిమీరిపోయాడు. సదా నన్ను దుర్భాషలాడుతుండేవాడు, ఏదో ఒక గొడవ చేస్తూండేవాడు.
37.2.5 నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణుల ఆప్యాయతానురాగాలు
(నరేంద్రుడితో) “గిరీశ్ ఘోష్ చెప్పే విషయం (శ్రీరామకృష్ణులు అవతార పురుషులని గిరీశ్ వాదిస్తుంటాడు) నువ్వు అంగీకరిస్తావా?”
నరేంద్రుడు: నేను ఏమీ చెప్పలేదు. అంతా ఆయనే మాట్లాడతాడు. మీరు అవతార పురుషులని అతడికి విశ్వాసం. ఈ విషయం గురించి నేను ఏమీ చెప్పలేదు.
శ్రీరామకృష్ణులు: కాని అతడిది ఎంతటి ప్రగాఢ విశ్వాసం! నువ్వు చూసే ఉంటావు కదా!
భక్తులు శ్రీరామకృష్ణులను తదేక దృష్టితో చూస్తున్నారు. ఆయన నేల మీద పరచిన చాప మీద కూర్చుని ఉన్నారు. ప్రక్కన ‘మ’, ఎదురుగా నరేంద్రుడు, చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు కొద్దిసేపు నరేంద్రుడిపై ఆప్యాయత, అనురాగాలతో నిండిన దృక్కులను పరపి మౌనంగా ఉండిపోయారు. తరువాత హృదయాంతరాళంనుండి వెలువడుతున్న ఉద్వేగంతో, “నాయనా! కామినీ కాంచనాలు త్యజించనిదే యోగం సిద్ధించదు” అన్నారు నరేంద్రుడితో. ఇలా అంటున్నప్పుడు ఆయన పూర్తిగా భావపరిపూర్ణులైపోయారు. ఆప్యాయత, కారుణ్యం వర్షిస్తున్న దృక్కులతో నరేంద్రుణ్ణి వీక్షిస్తూ పాట పాడసాగారు.*
చెప్పగానూ లేము చెప్పకుండనులేము
నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధ
ఇప్పుడే నిను గోలుపోవనున్నామని ॥ చె ॥
ఏ మర్మమెరిగి మే మెన్ని గండాలు
దాటినామో యొరుల దాటించినామో
ఆ మర్మమే నీకు తెలియదు రాధ!
నీ వేమి చేతువో నీదె భారంబునంతా ॥ చె ॥
నరేంద్రుడు తనను వదలిపెట్టి వేరే ఎవరి పంచనైనా చేరుతాడేమోనని శ్రీరామకృష్ణులు భయపడుతున్నట్టున్నారు. నరేంద్రుడు అశ్రుపూరిత నయనాలతో ఆయన వంకే చూస్తుండిపోయాడు.
సందర్శకులలో మొదటిసారిగా వచ్చిన ఒక వ్యక్తి ఈ సన్నివేశాన్నంతా గమనించి శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “అయ్యా, కామినీ కాంచనాలను త్యజించవలసిందే అన్నారు కదా! మరి అలాంటప్పుడు మా లాంటి గృహస్థులు ఏం చేయాలి?”
శ్రీరామకృష్ణులు: కావాలంటే కామినీ కాంచనాలను నువ్వు అనుభవించుకో, మేం మాట్లాడుకొనేది మాలో మాకు సంబంధించిన విషయం.
37.2.6 గృహస్థులతో ‘ముందుకు సాగిపో!’…
మహిమాచరణ్ ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (మహిమాచరణ్తో): ముందుకు సాగిపో! ఇంకా ముందుకు సాగిపో! చందన వృక్షాలు లభిస్తాయి. ఇంకా ముందుకు వెళ్ళు! వెండి గనులు కనుగొంటావు. మరింత ముందుకు సాగిపో, బంగారు గనులు గాంచగలవు. ఇంకా ముందుకు పోయినట్లయితే వజ్రాలు వైడూర్యాలు లభిస్తాయి. ముందుకు సాగిపో!
మహిమాచరణ్: అయ్యా, మేం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏదో బంధం మమ్మల్ని వెనక్కు లాగుతోంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు? ఆ పాశాలను తెంచివెయ్యి, భగవన్నామ ప్రభావంతో వాటిని కోసివెయ్యి. ‘కాళికాదేవి నామ ప్రభావంతో కాలుడి పాశంకూడా తెగిపోతుంది.’
తండ్రి మరణించాక నరేంద్రుడి ఇంట్లో ఎన్నో కష్టాలు. అతడి భుజస్కంధాలపై ఎన్నో బాధ్యతలు వచ్చి పడ్డాయి. మధ్యమధ్యలో శ్రీరామకృష్ణులు నరేంద్రుడి వంక చూస్తూ అతడితో ఇలా అన్నారు: “నువ్వు చికిత్సకుడవు అయిపోయావా? శతమారీ భవేద్వైద్యః సహస్రమారీ చికిత్సకః (నూరు మంది రోగులను చంపినవాడు వైద్యుడు, వెయ్యిమందిని చంపినవాడు చికిత్సకుడు.” (అందరునవ్వారు)
నరేంద్రుడు పిన్న వయస్సులోనే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నట్టున్నారు.
నరేంద్రుడు నవ్వి ఊరుకున్నాడు.
37.3 తృతీయ పరిచ్ఛేదం హోలీ పండుగ – రాధాకాంత, కాళికాలయాల దర్శనం – భక్తులపై కుంకుమ
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నవాయి చైతన్య పాడుతున్న పాటలను భక్తులు భక్తిభావంతో వింటున్నారు. శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి లేచారు. గదిలో నుండి బయటకు వచ్చి రాధాకృష్ణాలయానికి వెళ్ళి మ్రొక్కారు. ‘మ’ కూడా ఆయన్ను అనుసరించి ఆయనతోపాటు రాధాకృష్ణులకు మ్రొక్కాడు. నేడు హోలీ పండుగ. రంగు కలిపిన కుంకుమ పళ్ళెంలో ఉంది. శ్రీరామకృష్ణులు ఆ కుంకుమను రాధాకృష్ణులకు అర్పించి మళ్ళీ ప్రణామం చేశారు. ఆ తరువాత ఆయన కాళీ ఆలయానికి వెళ్ళారు. ఆలయపు మెట్లు ఎక్కాక మొగసాల వద్దే నిలబడి కాసేపు జగజ్జననిని దర్శించారు. తరువాత గర్భగుడిలోకి వెళ్ళి కాళీమాతకు ప్రణమిల్లారు.
ఆమె పాదాలపై కూడా కుంకుమను సమర్పించి మళ్ళీ గదికి తిరిగి వస్తూ “బాబూరామ్ను తోడ్కొని రాలేదేం?” అని ‘మ’ ను అడిగారు.
శ్రీరామకృష్ణులు, ‘మ’ గదిలోకి వచ్చారు. వెంట ఒక భక్తుడు పళ్ళెంలో కుంకుమ తెచ్చాడు. శ్రీరామకృష్ణులు గదిలో ఉన్న పటాలన్నిటికీ ఆ కుంకుమ పెట్టారు; కాని ఏసుక్రీస్తు పటానికి, తమ పటానికి కుంకుమ పెట్టలేదు. అటుపైన నరేంద్రాది భక్తుల మీద కుంకుమ చల్లారు. భక్తులందరూ లేచి ఆయన పాదధూళిని స్వీకరించారు.
మధ్యాహ్నం భక్తులందరూ తోటలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. గదిలో ‘మ’ ఒక్కడే శ్రీరామకృష్ణులతో ఉన్నాడు. ఆయన ‘మ’ తో మెల్లగా మాట్లాడుతున్నారు. “అందరూ ధ్యానం బాగా కుదురుతోందని చెబుతున్నారు. కాని పల్టుకు మాత్రం కుదరటం లేదట! అలా ఎందుకు అవుతోంది? నరేంద్రుణ్ణి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు సరళ స్వభావి. అయితే ఇంటి సమస్యల కారణంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాడు; అందుచేతనే ప్రస్తుతం కాస్త అణగి ఉన్నాడు. కాని ఈ భావం ఎక్కువ రోజులు ఉండదులే.”
నరేంద్రుడు వసారాలో ఒక వేదాంతితో దేన్ని గురించో వాదిస్తున్నాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు బయటకు వెళ్ళి వారిని చూస్తున్నారు. క్రమంగా భక్తులందరూ మళ్ళీ గదిలో గుమిగూడారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్ను స్తోత్రాలు పఠించమన్నారు. మహిమచరణ్ మహానిర్వాణ తంత్రంలోని ఈ స్తోత్రాన్ని వల్లించసాగాడు.
హృదయకమల మధ్యే నిర్విశేషం నిరీహం ।
హరిహర విధివేద్యం యోగిభిర్ధ్యాన గమ్యం ॥
జనన మరణ భీతి భ్రంశి సచ్చిత్ స్వరూపమ్ ।
సకల భువన బీజం బ్రహ్మచైతన్యమీడే ॥
37.3.1 భక్తే యథార్థ వస్తువు
ఇంకా ఒకటి రెండు స్తోత్రాలు పఠించిన తరువాత మహిమాచరణ్, శంకరాచార్య విరచితమైన శివనామావల్యష్టకమ్ పఠించసాగాడు. ఇందులో సంసారం అనేది దుఃఖమయమైన కీకారణ్యంతో పోల్చబడింది:
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే,
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో…
శ్రీరామకృష్ణులు(మహిమాచరణ్తో): సంసారం కూపమనీ, అరణ్యమనీ ఎందుకు అంటావు? ప్రప్రథమంలో అలా అనవలసి ఉంటుంది. కాని భగవంతుణ్ణి ఆశ్రయించాక మరి భయం ఎందుకు? అప్పుడు సంసారమే ఆనంద ధామంగా ఒప్పారుతుంది.
అలా అంటూ శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు:
ఈ లోకమే ఒక ఆనంద సౌధం
ఆనందముగ నిందు తిని త్రాగుచుందు
మతిలేని ఓ వైద్య కులసంభవుండు
నీ చూపు విషయాలు పైపైకి చూచు.
“ఎందుకు భయపడాలి? భగవంతుణ్ణి గట్టిగా పట్టుకో. ముళ్ళ కంపలపై నడవాలా? అయితే ఏమిటి? జోళ్ళు తొడుక్కొని నడువు. దాగుడుమూతల ఆటలో బామ్మను పట్టుకొన్నవాడెవ్వడూ దొంగ కాజాలడు కదా!
“జనక మహారాజు రెండు కత్తులతోను సాము చేసేవాడు. ఒకటి జ్ఞాన ఖడ్గం, రెండవది కర్మ అనే ఖడ్గం. నేర్పరియైన ఆటగాడు ఎవరి గురించి కూడా భయపడడు.”
శ్రీరామకృష్ణులు చిన్నమంచంపై కూర్చుని భగవత్ ప్రసంగం గావిస్తున్నారు. మంచానికి దగ్గరగా ‘మ’ కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నా మనస్సు ఇంకా మహిమాచరణ్ పాడిన స్తోత్రంపైనే లగ్నమై ఉంది.
నవాయి చైతన్య తక్కిన భక్తులు కీర్తనలు పాడటం ప్రారంభించారు. శ్రీరామకృష్ణులు కూడా వారితో జత కలిపి పాడుతూ భావోన్మత్తులయ్యారు; సంకీర్తనా బృందం నడుమ నాట్యం చేయసాగారు.
సంకీర్తన ముగిశాక ఇలా అన్నారు: “మనకు కావలసింది ఇదే –భగవన్నామ సంకీర్తనలో మగ్నులమైపోవడమే. తక్కినదంతా మిథ్యే. ప్రేమ, భక్తే యథార్థ వస్తువు. తక్కినవన్నీ అవస్తువులు (అంటే అస్తిత్వం లేనివి).”
37.4 చతుర్థ పరిచ్ఛేదం ‘మ’ తో సంభాషణ
తరువాత శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్ళారు. వినోద్ గురించి ‘మ’ ను అడుగుతున్నారు. వినోద్, ‘మ’ పనిచేస్తున్న స్కూలులో విద్యార్థి. భగవత్ చింతనలో అప్పుడప్పుడు భావపారవశ్యతను పొందుతూ ఉంటాడు. అందుకే శ్రీరామకృష్ణులు అతణ్ణి అమితంగా ప్రేమిస్తారు. పంచవటినుండి తమ గదికి తిరిగి వస్తూ ఆయన ‘మ’ ను ఇలా అడిగారు: “అది సరే, కొంతమంది నన్ను అవతారపురుషుడు అంటుంటారు కదా! దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?” గదికి తిరిగి వచ్చాక చిన్నమంచం మీద కూర్చుని ఆయన ‘మ’ ను మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. తక్కిన భక్తులు కాస్త దూరంగా కూర్చుని ఉన్నారు. వారు ఈ సంభాషణ వినలేకపోతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఈ విషయంపై ఏమిటి నీ అభిప్రాయం?
‘మ’ : అవునండి. నాక్కూడా అలాగే అనిపిస్తుంది. మీరు చైతన్యదేవుల్లా తోస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: ఇది పూర్ణావతారమా లేక అంశావతారమా? ఇది ఎన్ని వంతుల అవతారమో చెప్పు.
‘మ’ : అది ఎన్ని వంతులో చెప్పలేను కాని భగవత్ శక్తి అవతరించిందని మటుకు నిశ్చయంగా చెప్పగలను. భగవంతుడే మీలో ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: అవును. చైతన్యదేవులు కూడా భగవత్ శక్తిని కోరుకున్నారు.
కాసేపటి తర్వాత “కాని ఆయన షడ్భుజుడా?” అని అడిగారు.
‘చైతన్యదేవులను భక్తులు షడ్భుజరూపంలో చూశారు. శ్రీరామకృష్ణులు ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావించారో!’ అని ‘మ’ తలపోయసాగాడు.
37.4.1 శ్రీరామకృష్ణులు – తర్కం
నరేంద్రుడు ఎవరితోనో తీవ్రంగా వాదిస్తున్నాడు. రాంచంద్రదత్త ఇటీవలే జబ్బు నుండి కోలుకున్నాడు. అతడు కూడా నరేంద్రుడితో వాదించటం మొదలుపెట్టాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నాకు వాదోపవాదాలు బొత్తిగా నచ్చవు. (రామ్‌తో) ఆపు నీ వాదనలు. అసలే జబ్బునపడ్డావు. సరేలే, నెమ్మదిగా మాట్లాడు. (‘మ’ తో) నాకు ఇటువంటి వాదులాటలు బొత్తిగా నచ్చవు. నేను విలపిస్తూ అమ్మతో ఇలా ప్రార్థించాను: ‘అమ్మా, కొందరు భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అంటారు. మరికొందరు అలా కాదు మరోలా ఉంటాడు అంటారు. ఏది నిజమో నువ్వే నాకు తెలియజెయ్యి.’”
37.5 పంచమ పరిచ్ఛేదం భక్తులతో శ్రీరామకృష్ణులు – రాఖాల్, భవనాథ్, నరేంద్ర, బాబూరామ్
శనివారం, మార్చి 7 1885
సమయం మధ్యాహ్నం మూడు గంటలు. శ్రీరామకృష్ణులు ఆనందంగా భక్తులతో సంభాషిస్తున్నారు. బాబూరామ్, చిన్న నరేంద్రుడు, పల్టు, హరిపదుడు, మోహినీమోహన్ తదితర భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన వద్ద ఉంటున్న ఒక బ్రాహ్మణ యువకుడు కూడా అక్కడ ఉన్నాడు.
మాతృమూర్తి శ్రీ శారదాదేవి ప్రస్తుతం నహబత్తులో వసిస్తున్నారు. ఆమె శ్రీరామకృష్ణుల సేవార్థం అప్పుడప్పుడు ఇక్కడ వసిస్తుంటారు. మోహినీ మోహన్‌తోపాటు అతడి భార్య, నవీన్ బాబు తల్లికూడా వచ్చి ఉన్నారు. భక్తురాండ్రు ఇద్దరూ నహబత్తుకు వెళ్ళి మాతృమూర్తిని దర్శించారు. భక్తులు శ్రీరామకృష్ణుల గదినుండి వెళ్లిపోయాక వచ్చి ఆయనకు ప్రణమిల్లాలని వారిర్వురూ నహబత్తులో వేచి ఉన్నారు. బాల భక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు ఆనంద పరవశులవుతున్నారు.
రాఖాల్ ప్రస్తుతం దక్షిణేశ్వరంలో ఉండటం లేదు. కొన్ని నెలలు బృందావనంలో బలరామ్‌తో పాటు గడిపాడు. అక్కడ నుండి తిరిగివచ్చిన తరువాత ఇంట్లోనే ఉంటున్నాడు.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): రాఖాల్ ప్రస్తుతం పెన్షన్ (పింఛను) పుచ్చుకుంటున్నాడు. చాలాకాలం పాటు బృందావనంలో గడిపి ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నాడు. అతడి భార్యకూడా ఇంటికి వచ్చి ఉంది. కాని వెయ్యి రూపాయల జీతం ఇచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా చెయ్యను అని రాఖాల్ నాతో చెప్పాడు.
“ఒక్కోసారి ఇక్కడ పడుకొని ‘ఇప్పుడు మీతోటి సాంగత్యం కూడా నచ్చటం లేదు’ అంటున్నాడు. అప్పుడు అతడి ఆధ్యాత్మిక స్థితి అలాంటిది.
భవనాథ్ వివాహం చేసుకున్నాడు. కాని అతడు రాత్రి అంతా భార్యతో భగవద్విషయాల గురించే మాట్లాడుతుంటాడు. అతడితో నేను ‘భార్యతో అప్పుడప్పుడు వేడుకలు, వినోదాలు చేస్తూండవోయి’ అని చెప్పగా అతడు కోపంతో మండిపోయి ‘ఏమిటీ, మేం కూడా వేడుకలు, వినోదాలతో కాలం వ్యర్థం చేసుకోవాలా?’ అన్నాడు.
(భక్తులతో) “అయితే నరేంద్రుడి కోసం నేను పడ్డ ఆరాటం చిన్న నరేంద్రుడి కోసం పడలేదు.
(హరిపదుడితో) “నువ్వు గిరీశ్ ఘోష్ వద్దకు వెళుతూ ఉంటావా?
హరిపదుడు: అవునండి, అతడి ఇల్లు మా ఇంటికి దగ్గరే. అతడి వద్దకు నేను తరచూ వెళుతూ ఉంటాను.
శ్రీరామకృష్ణులు: నరేంద్రుడు కూడా వెళుతూ ఉంటాడా?
హరిపదుడు: ఆ, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు.
శ్రీరామకృష్ణులు: గిరీశ్ చెప్పేదాన్ని గురించి నరేంద్రుడు ఏమంటుంటాడు?
(శ్రీరామకృష్ణులు భగవదవతారమని గిరీశ్ వాదిస్తుంటాడు.)
హరిపదుడు: ఓ, ఆ వాదనలో నరేంద్రుడు ఓడిపోయాడు.
శ్రీరామకృష్ణులు: అది కాదోయ్, నరేంద్రుడు నాకు అసలు విషయం చెప్పాడు. ‘గిరీశ్కి అంతటి దృఢవిశ్వాసం ఉన్నప్పుడు దానిని నేనెందుకు ఖండించాలని’ అని ఊరకున్నాడట.
అనుకూల్ ముఖర్జీ బంధువు ఒకాయన గదిలోనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆయనతో “నువ్వు నరేంద్రుణ్ణి ఎరుగుదువా?” అని అడిగారు.
ఆయన “అవునండి. అతడు చాలా బుద్ధిమంతుడైన కుర్రాడు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): చూశారా! ఈయన నరేంద్రుణ్ణి ప్రశంసిస్తున్నాడు. అంటే ఈయన ఉత్తముడన్నమాట. ఇటీవల ఒక రోజు నరేంద్రుడు ఇక్కడకు వచ్చి త్రైలోక్యుడితో కలసి పాడాడు. కాని ఆ రోజు పాటలు పేలవంగా తోచాయి.
37.5.1 బాబూరామ్ రెండు గుర్రాల స్వారీ – జ్ఞానాజ్ఞానాలకు అతీతమైపోవాలి
శ్రీరామకృష్ణులు బాబూరామ్ వంక చూస్తూ మాట్లాడసాగారు. బాబూరామ్, ‘మ’ పనిచేసే స్కూలులోనే పదవ తరగతి చదివే విద్యార్థి.
శ్రీరామకృష్ణులు(బాబూరాంతో): నీ పుస్తకాలు ఎక్కడ? నువ్వు చదువుకోవా ఏమిటి? (‘మ’ తో) ఇతడు ఏకకాలంలో రెండు గుర్రాలను స్వారీ చేస్తానంటాడు.
“అయితే అది చాలా కఠినమైన మార్గం. భగవంతుణ్ణి ఏ కాస్తో కూస్తో తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? వసిష్ఠ మహర్షి అంతటి వాడికే పుత్రశోకం కలిగింది. లక్ష్మణుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. రాముడితో ‘రామా! ఇదెక్కడి చోద్యం?’ అని అడిగాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడికి ఇలా విశదపరిచాడు: ‘తమ్ముడూ, ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది? జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. అందువల్ల నువ్వు జ్ఞానాజ్ఞానాలు రెండింటికీ అతీతుడవై పో. కాలికి ముల్లు గుచ్చుకుంది అనుకొందాం. అప్పుడు మరొక ముల్లును వెతకి తీసుకువచ్చి దానితో కాలికి గుచ్చుకొన్న ముల్లును బయటకు తీయాలి. తరువాత ముళ్ళు రెండిటినీ పారవేస్తాం. అందువల్ల అజ్ఞానమనే ముల్లును తొలగించటానికి జ్ఞానమనే ముల్లును సేకరించాలి. పిదప జ్ఞానాజ్ఞానాలకు అతీతమైపోవాలి.”
బాబూరామ్ (నవ్వుతూ): నేను కోరుకొనేది కూడా అదే.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): అరే, నువ్వు అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటావే! అలారెండింటినీ కోరుకోవడంవల్ల ఏమైనా సాధ్యపడుతుందా? భగవంతుణ్ణి కోరుకునే పక్షంలో ఇక్కడకు వచ్చెయ్యి.
బాబూరాం (నవ్వుతూ): మీరే లాగేసుకోండి.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): రాఖాల్ ఇక్కడే ఉండేవాడు. కాని అతడి సంగతి వేరే. ఇక్కడ ఉండటానికి అతడి తండ్రి అనుమతించాడు.ఈ కుర్రవాళ్ళు కనుక ఇక్కడ ఉన్నట్లయితే వీరి ఇళ్ళలో పెద్ద గొడవలే తలెత్తుతాయి.
(బాబూరామ్‌తో) “నువ్వు దుర్బలుడివి. నీకు ధైర్యం తక్కువ. చిన్న నరేంద్రుడు ఏమంటాడో తెలుసా – ‘నేను ఇక్కడకు వచ్చి ఉంటానండి’ అంటాడు.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు నేలపై పరచిన చాప మీద బాలభక్తుల నడుమ కూర్చున్నారు. ‘మ’ ఆయనకు సమీపంగా కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నేను కామినీ కాంచన త్యాగుల కోసం వెదకుతున్నాను. ఎవరైనా కుర్రవాడు తారసపడితే ‘ఓ, ఇతడు నా దగ్గరే ఉండిపోతాడులే’ అనుకుంటాను. కాని అందరూ ఏదో ఒక సాకు చూపుతూనే ఉంటారు.
“తనకు తోడుగా ఉండటానికి ఎవరైనా దొరకుతారేమోనని భూతం ఒకటి సదా వెదకుతూ ఉండేది. శని, మంగళవారాల్లో దుర్మరణం చెందినవాడు భూతం అవుతాడని చెప్పుకుంటుంటారు. అందువల్ల, ఎవరైనా మేడ మీద నుండి క్రిందకు పడిపోయినా లేకపోతే కాలుజారి కొద్దిగా స్పృహ కోల్పోయినా, ఆ భూతం పరుగు పరుగున వారి వద్దకు వెళ్ళేది – ‘వీడు దుర్మరణం పాలవుతాడు. అప్పుడు భూతమైపోయి నాకు తోడుగా ఉంటాడు’ అనే ఆశతో. కాని ఆ వ్యక్తి కొద్ది సేపట్లోనే తెప్పరిల్లి లేచేవాడు. అయ్యో పాపం! ఆ భూతం నొసటి వ్రాత! ఒక్కడుకూడా దానికి తోడు దొరకడాయె!
“రాఖాల్ సంగతి చూడు. ఎప్పుడు చూసినా ‘మరి నా భార్య గతి ఏమిటి?’ అంటుంటాడు. ఇకపోతే నరేంద్రుడు – నేను అతడి వక్షఃస్థలాన్ని కొద్దిగా స్పృశించగానే స్పృహ కోల్పోయాడు. స్పృహ రాగానే ‘మీరు నన్నేంచేశారు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు సుమా!’ అన్నాడు.
“భగవంతుడు నన్ను ఈ స్థితిలో (సన్న్యాసిగా) ఎందుకు ఉంచాడు? చైతన్య దేవులు సన్న్యాసం పుచ్చుకున్నారు. ఎందుకంటే, అప్పుడు అందరూ తమకు ప్రణామం చేస్తారనీ, అలా ఒక్కసారి ప్రణామం చేసినవాడు కూడా ఉద్ధరింపబడతాడనీ.”
మోహనీమోహన్, శ్రీరామకృష్ణుల కోసం ఒక బుట్టలో మిఠాయిలు తెచ్చాడు.
శ్రీరామకృష్ణులు: ఈ మిఠాయిలు ఎవరు పట్టుకొచ్చారు?
బాబూరామ్, మోహినీమోహన్ వంక చూపించాడు. శ్రీరామకృష్ణులు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మిఠాయిలను స్పృశించి కొద్దిగా స్వీకరించారు. పిదప ఆ మిఠాయిలను భక్తులకు పంచిపెట్టారు. అయితే చిన్న నరేంద్రుడు, మరిద్దరు బాలభక్తులకు మాత్రం ఆయన స్వయంగా తమ చేత్తో తినిపించారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇందులో ఒక అర్థం ఉంది. పవిత్ర హృదయులలో భగవంతుని అభివ్యక్తీకరణ అధికం. నేను కామార్పుకూర్కు వెళ్ళినప్పుడు కొంతమంది బాలురకు నా చేతులతో తినుబండారాలు తినిపించేవాడిని. చినే శంఖారి అది చూసి ‘అదేమిటి, నువ్వు మాకు అలా తినిపించవే’ అనేవాడు. అయితే నేను వారికి ఎలా తినిపించగలను? వారిలో ఒకడు తన వదినతో ఉంటున్నాడు, మరొకడు ఫలానా స్త్రీతో ఉంటున్నాడు.”
37.6 షష్ఠ పరిచ్ఛేదం భక్తుల గురించి శ్రీరామకృష్ణులు
37.6.1 లౌకికుల ప్రవర్తన – శ్రీరామకృష్ణుల అనుకరణ
శ్రీరామకృష్ణులు తమ మంచం మీద కూర్చొని పవిత్ర హృదయులైన ఆ బాలభక్తులతో అమిత ఆనందంలో ఓలలాడుతున్నారు. కీర్తనలు పాడే గాయకి హావభావాలను అనుకరిస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు. గాయకి రకరకాల ఆభరణాలు ధరించి తన బృందంతో కలసి పాటలు పాడుతూ ఉంటుంది. రంగురంగుల రుమాలు నొకదానిని చేతపట్టుకొని బృందం నడుమ నిలబడి ఆమె పాటలు పాడుతుంది. మధ్యమధ్యలో ఆమె దగ్గుతున్నట్లు నటించి అందరూ చూసేలా తన ముక్కునత్తును కాస్త సర్దుకుంటుంది. ఎవరైనా పెద్దమనిషి వచ్చినట్లయితే, పాట పాడుతూనే వారికి ‘రండి, కూర్చోండి’ అంటూ స్వాగతం పలుకుతుంది. ఒక్కోసారి చేతులను ఆడిస్తూ చేతులకున్న బంగారు గాజులను అందరికీ చూపుతుంది.
శ్రీరామకృష్ణుల ఈ అనుకరణను చూసి భక్తులు కడుపుబ్బ నవ్వుతున్నారు. నవ్వును ఆపుకోలేక పల్టు నేలమీదపడి దొర్లుతున్నాడు. అతణ్ణి చూపుతూ శ్రీరామకృష్ణులు, ‘మ’ తో ఇలా అన్నారు: “పసిపిల్లవాడు కదా! అందుకే అలా నేలమీదపడి పొర్లుతూ నవ్వుతున్నాడు.”
శ్రీరామకృష్ణులు (పల్టుతో, నవ్వుతూ): మీ నాన్నగారికి ఈ విషయాలన్నీ చెప్పవద్దు సుమా! అప్పుడు ఆయనకు నా పట్ల ఉన్న ఆ కొద్దిపాటి గౌరవం కూడా పోతుంది. ఎంతయినా ఆయన ‘ఇంగ్లీషు మ్యాన్’ కదా!
(భక్తులతో) “చాలామంది ఒక వంక సంధ్య వారుస్తూనే ఉంటారు, మరో వంక ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేస్తుంటారు. సంధ్యవార్చేటప్పుడు మాట్లడకూడదు కదా! అందుచేత వారు పెదవులు బిగబట్టే ఉంచి ‘ఇది తీసుకురా’, ‘అది తీసుకురా’, ‘ఊ’, ‘ఊహూ’ అంటూ పలురకాల సైగలు చేస్తుంటారు. (నవ్వులు)
“మరికొందరు ఉన్నారు. వారు ఒక వైపు జపమాల చేత పుచ్చుకుని జపం చేస్తుంటారు, మరో వైపు చేపలు అమ్మేవాడితో బేరంకూడా చేస్తుంటారు. జపం చేస్తూనే వారు ‘ఆ, అది, ఆ చేప కావాలి’ అంటూ వ్రేలితో చూపిస్తూ ఉంటారు. బేరసారాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ వారు ఆ సమయానికే కేటాయించుకుంటారు. (అందరూ నవ్వారు)
“కొందరు స్త్రీలు గంగలో స్నానం చేయడానికి వెళుతూంటారు. ఆ సమయంలో భగవత్ చింతన మాట దేవుడెరుగు కాని వారు ఆ సమయాన్నంతా ఉబుసుపోని కబుర్లలో వెళ్ళబుచ్చుతుంటారు – ‘మీ అబ్బాయికి పెళ్ళి అయిందా?’ ‘అమ్మాయికి ఏం నగలు పెట్టారు?’ ‘ఫలానా వ్యక్తికి జబ్బు చేసిందట!’ ‘వాళ్ళ ఇంటికి కొత్త కోడలు వచ్చింది.’ ‘వీళ్ళ అల్లుడు వచ్చి ఉన్నాడు.’ ‘వాళ్ళ అమ్మాయి కొత్త ఇంటి కాపురానికి వెళ్ళింది.’ ‘ఫలానా వాళ్ళ అబ్బాయి పెళ్ళి చూపులకని వెళ్ళాడు. అమ్మాయి తండ్రి కట్నకానుకలు బాగానే సమర్పించుకుంటా డనుకుంటాను.’ ‘మా హరి కాసేపైనా నన్ను వదలి ఉండలేడు.’ ‘ఇన్ని రోజులు నిన్ను చూడటానికి రాలేకపోయాను వదినా! ఫలానా వారి అబ్బాయి పెళ్ళి ఖాయం చేయవలసి వచ్చింది. అందువల్ల బొత్తిగా తీరుబడి లేకపోయింది!’ – వారి సంభాషణ అంతా ఇదే ధోరణిలో సాగుతూ ఉంటుంది.
“చూశారా! వారు పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడానికని వెళ్ళారు కాని మాట్లాడేవన్నీ సంసారం గురించిన సంగతులే.”
37.6.2 చిన్న నరేంద్రుణ్ణి చూస్తూ సమాధి స్థితి
శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడి వైపు తదేక దృష్టితో చూస్తున్నారు. అలా చూస్తూనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పవిత్ర హృదయులైన భక్తులలో ఆయన సాక్షాత్తూ భగవంతుణ్ణి దర్శిస్తున్నారా? సమాధి స్థితిలో నిశ్చలంగా ఉన్న ఆ మహాపురుషుణ్ణి భక్తులు రెప్పవాల్చకుండా దర్శిస్తున్నారు. కొన్ని క్షణాలకు మునుపు పకపకమంటూ నవ్వులతో ప్రతిధ్వనించిన గదిలో ఇప్పుడు ఎవరూ లేనట్లు పూర్తిగా నిశ్శబ్దం నెలకొంది. శ్రీరామకృష్ణుల శరీరం కదలడం లేదు, మెదలడం లేదు; కనురెప్పలు ఆర్పటం లేదు; శ్వాస ఆడటం లేదు; చేతులు జోడించి రాతిబొమ్మలా స్థిరంగా కూర్చుండిపోయారు.
కాసేపైన తరువాత బాహ్యస్పృహ కలిగింది. ఇంతవరకు శ్వాస స్థిరంగా ఉండటం వల్ల ప్రస్తుతం ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆయన మనస్సు క్రమంగా సమాధి స్థితి నుండి బయటకు వస్తోంది. ఇంకా భావావస్థలోనే ఉంటూ ఆయన తమ దృష్టిని భక్తులకేసి ప్రసరించారు. భక్తుల ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మిక స్థితిగతుల గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (చిన్న నరేంద్రుడితో): నిన్ను చూడాలని ఎంతగానో ఆరాటపడ్డాను. నీ అభీష్టం సిద్ధిస్తుంది. అప్పుడ ప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు. అది సరే, నీకు ఏం కావాలి? జ్ఞానమా లేక భక్తా?
చిన్న నరేంద్రుడు (నరేంద్రనాథ్)
చిన్న నరేంద్రుడు: శుద్ధభక్తేనండి.
శ్రీరామకృష్ణులు: ఫలానా వ్యక్తిని ఎరుగకుండానే నీకు అతడిపట్ల శ్రద్ధా భక్తులు ఎలా కలుగుతాయి? (‘మ’ ను చూపి నవ్వుతూ) ఉదాహరణకు ఇతడు ఎవరో తెలియకుండా నువ్వు ఇతణ్ణి ఎలా ప్రేమించగలవు? (‘మ’ తో) అయితే పవిత్ర హృదయులు ‘కేవలం భక్తినే కోరుకుంటాను’ అన్నారంటే అందులో ఏదో అర్థం ఉండనే ఉంటుంది. తగిన సంస్కారాలు లేనిదే స్వతస్సిద్ధంగా ఎవరికీ భక్తి జనించదు. ఇదే ప్రేమభక్తి లక్షణం. జ్ఞానభక్తి అనేది మరొకటి ఉంది – అది విచారణ ద్వారా సిద్ధించే భక్తి.
(చిన్న నరేంద్రుడితో) “ఏదీ, నీ చొక్కా విప్పు. నీ శరీర లక్షణాలను చూస్తాను. విశాలమైన వక్షస్థలం! అంటే నీకు తప్పక సిద్ధిస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు.”
శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. తక్కిన భక్తులను ఒక్క రొక్కరిగా సంబోధిస్తూ ఆప్యాయంగా వారి ఆధ్యాత్మిక భవిష్యత్తు గురించి మాట్లాడసాగారు.
(పల్టుతో) “నీకు కూడా సిద్ధిస్తుంది. కాని కొద్దిగా సమయం పడుతుంది. (బాబూరామ్‌తో) నేను నిన్ను నా వద్దకు ఎందుకు లాక్కోవడంలేదో తెలుసా? మీ ఇంట్లోవాళ్ళు పెద్ద గొడవ సృష్టిస్తారనే భయంతోనే.
(మోహినీమోహన్తో) “నీ విషయం అంతా సవ్యంగానే ఉంది. కొద్దిగా బాకీ మిగిలి ఉంది, అంతే. అది కూడా పూర్తి అయిపోతే, ఇక శేషం అంటూ ఏమీ ఉండదు. ఈ కర్మలు, కర్తవ్యాలు, సంసారం – ఏవీ మిగలవు. అంతా వదిలి పోవటం మంచిదేగా?”
ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు అమిత వాత్సల్యంతో మోహినీ మోహన్ వంక చూడసాగారు. అతడి హృదయాంతరాళంలోని భావాలన్నిటినీ ఆయన పరిశీలిస్తున్నారా? భగవంతుడి కోసం సర్వం వదలిపెట్టడమే మంచిదని మోహినీమోహన్ యోచిస్తున్నాడా? కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “భాగవత పండితుణ్ణి భగవంతుడు ఒక పాశంతో బంధించి ఉంచుతాడు. లేకుంటే జనులకు భాగవతం బోధించటానికి ఎవరు ఉంటారు? అందువల్ల, లోకోపదేశం నిమిత్తం భగవంతుడు అతణ్ణి బంధించి ఉంచుతాడు. అందుకనే అమ్మ నిన్ను సంసారంలో ఉంచింది.”
పిదప శ్రీరామకృష్ణులు బ్రాహ్మణ యువకుణ్ణి ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు.
37.6.3 జ్ఞానయోగం, భక్తియోగం
శ్రీరామకృష్ణులు (బ్రాహ్మణ యువకుడితో): నువ్వు జ్ఞానచర్చలు వదిలిపెట్టు. భక్తిని ఆశ్రయించు. భక్తే సారం. నువ్వు ఇక్కడ ఉండబట్టి మూడు రోజులు అవుతోంది కదూ?
బ్రాహ్మణ యువకుడు(చేతులు జోడించి): అవునండి.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి విశ్వసించు. ఆయన మీదనే భారం వేసి ఉండు. అప్పుడు మనం స్వయంగా చేయవలసింది అంటూ ఏమీ ఉండదు. అంతా కాళీమాతే చూసుకుంటుంది.
“జ్ఞానం రాజదర్బారు వరకే పోగలదు. కాని భక్తి అంతఃపురంలోకి కూడా పోగలదు. శుద్ధాత్మ నిర్లిప్తమైంది. దాని లోపల విద్య, అవిద్యలు రెండూ ఉంటాయి. అయినప్పటికీ అది నిర్లిప్తంగా ఉంటుంది. వాయువులో ఒక్కోసారి సుగంధం ఉంటుంది, మరోసారి దుర్గంధం కూడా ఉంటుంది. కాని వాయువు మాత్రం నిర్లిప్తం కదా!
37.6.4 బ్రహ్మజ్ఞాని స్థితి – వ్యాసుడు, గోపికల కథ – జీవన్ముక్తుడు
“ఒకసారి వ్యాసమహర్షి యమునా నదిని దాటడానికి నది ఒడ్డుకు వచ్చాడు. అదే సమయంలో గోపికలు కూడా అక్కడకు వచ్చారు. ఆవలి ఒడ్డుకు చేరి విక్రయించే ఉద్దేశంతో వారు తమతోపాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పట్టుకుపోతున్నారు. కాని అక్కడ ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్ళటమా అని అందరూ దిగులుగా ఉన్నారు. అప్పుడు వ్యాసమహర్షి వారితో ‘నాకు చాలా ఆకలి వేస్తోంది’ అన్నారు. గోపికలు వారివద్దనున్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆయనకు ఇచ్చారు. వాటినన్నిటినీ ఆయన దాదాపు పూర్తిగా తినివేశాడు. పిదప ఆయన యమునా నదిని ఉద్దేశిస్తూ ‘ఓ యమునా! నేను కనుక ఏమీ తినని పక్షంలో, ఈ నీటిని రెండు పాయలుగా చేసి మధ్యలో మాకు దారి ఇవ్వు. మేమందరం ఆ దారిగుండా ఆవలి ఒడ్డుకు చేరుకుంటాం’ అన్నాడు. వెంటనే నది రెండు పాయలుగా విడిపోయి దారి ఏర్పడింది. వ్యాసుడు, గోపికలు తదితరులు ఆ దారిగుండా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు.
“వ్యాసుడు ‘నేను ఏమీ తినలేదు’ అనడంలోని అర్థం ‘నేను ఆ శుద్ధాత్మ స్వరూపాన్ని’ అనే. శుద్ధాత్మ నిర్లిప్తమైనది, ప్రకృతికి అతీతమైనది. దానికి ఆకలి దప్పులు, చావు పుట్టుకలు అనేవి ఉండవు. అది అజరం (అంటే వయస్సు పైబడటం లాంటిది ఏదీ లేనిది), అమరం, మేరుపర్వతం లాంటిది (అంటే, నిశ్చలమైనది).
“ఇలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడే జీవన్ముక్తుడు. ఆత్మ, దేహం వేరు వేరు అని అతడు యథార్థంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతుణ్ణి దర్శించినట్లయితే దేహాత్మభావన మరి ఉండబోదు. దేహం, ఆత్మలు రెండూ వేరైనవి. కొబ్బరికాయలో నీళ్ళు ఎండిపోయి ఎండు కొబ్బరి తయారైన పిదప కొబ్బరికాయ, కొబ్బరి వేరు వేరు అయిపోతాయి. అప్పుడు కాయను కదిలిస్తే లోపల ఉన్న కొబ్బరి కూడా కదులుతూ ఉంటుంది. అదే విధంగా ఆత్మకూడా దేహంలో కదులుతూ ఉంటుంది. విషయాసక్తి అనే నీరు ఎండిపోయినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ వేరు, దేహం వేరు అన్న బోధ కలుగుతుంది. లేత పోకకాయ నుండి వక్కను కాని, లేత బాదంకాయ నుండి బాదంపప్పును కాని వేరు చేయలేము. కాని కాయ పండినప్పుడు వక్క, బాదంపప్పు టెంక నుండి విడివడతాయి. కాయ పండినప్పుడు లోపలి రసం ఎండిపోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు విషయరసం ఎండిపోతుంది.
“కాని అటువంటి జ్ఞానం జనించడం ఎంతో కష్టం. ఊరకే నోటితో పలికినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలుగదు. కొందరు మహాజ్ఞానుల వలె నటిస్తుంటారు. (నవ్వుతూ) నాకు తెలిసిన వ్యక్తి ఒకడు తనకు బ్రహ్మజ్ఞానం కలిగిందని డంబాలు కొడుతుంటాడు; మరోవైపు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటాడు. ఇలా అబద్ధాలు చెబుతావెందుకని ఎవరైనా గదమాయిస్తే అతడు ఇలా సమాధానమిస్తాడు: ‘ఎందుకు, జగత్తు స్వప్నం లాంటిదే కదా! సర్వం మిథ్య అయినప్పుడు సత్యవచనం మటుకు వాస్తవమైనది ఎలా అవుతుంది? అబద్ధం మిథ్యే, సత్యమూ మిథ్యే.’” (అందరూ నవ్వారు)
37.7 సప్తమ పరిచ్ఛేదం ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’
భక్తులతో కలసి శ్రీరామకృష్ణులు దరహాసవదనులై నేలమీద పరచిన చాపపై కూర్చున్నారు; భక్తులతో “నా పాదాలను కాస్త ఒత్తండి” అన్నారు. భక్తులు ఆయన పాదాలను ఒత్తసాగారు. ఆయన నవ్వుతూ ‘మ’ తో “ఇందులో ఎంతో అర్థం ఇమిడి ఉంది” అన్నారు.
పిదప శ్రీరామకృష్ణులు తమ హృదయం మీద చేయి వేసుకొని ఇలా అన్నారు: “ఇందులో ఏమైనా ఉంటే, ఇలా సేవించడం ద్వారా వారి అజ్ఞానం, అవిద్యలు అన్నీ పూర్తిగా పటాపంచలై పోతాయి.” అటుపైన ఆయన ఏదో నిగూఢ విషయం చెబుతున్నట్లు గంభీరముద్ర వహించారు.
శ్రీరామకృష్ణులు(‘మ’ తో): ఇక్కడ పరాయివారు అంటూ ఎవరూ లేరు. ఒక రోజు హరీశ్ నాతోపాటు ఉన్నప్పుడు ఈ తొడుగును (అంటే శ్రీరామకృష్ణుల దేహాన్ని) వదలిపెట్టి సచ్చిదానందుడు బయటకు రావటం చూశాను. ఆతడు బయటకు వచ్చి ‘నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను’ అన్నాడు. ఆ సమయంలో నేను అదేదో నా మనోభ్రమ అనుకున్నాను. అటుపైన కాసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయాను. పిదప స్వయంగా ఆ సచ్చిదానందుడే ఇలా పలికాడు: ‘చైతన్యదేవులు కూడా శక్తిని ఆరాధించాడు.’
భక్తులందరూ చేష్టలు ఉడిగి ఈ పలుకులు వింటున్నారు. కొందరు భక్తులు ‘సచ్చిదానందుడే శ్రీరామకృష్ణుల రూపంలో మన ముందు కూర్చున్నాడా? భగవంతుడు మళ్ళీ అవతరించాడా?’ అని తలపోస్తున్నారు.
శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడసాగారు. ‘మ’ తో ఇలా అన్నారు: “సంపూర్ణ ఆవిర్భావంగా దర్శించాను. కాని ఈసారి దైవీశక్తి సత్త్వగుణ వైభవం ద్వారా ఆవిర్భవించింది.”
భక్తులు అందరూ నివ్వెరపోయి ఈ మాటలు వింటున్నారు.
37.7.1 యోగమాయ – అవతార లీల
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇప్పుడే, అమ్మతో ‘అమ్మా, నేను ఇక ఎక్కువగా మాట్లాడజాలను’ అని మొరపెట్టుకున్నాను. ఇంకా ఇలా విన్నవించుకొన్నాను: ‘అమ్మా, నేను ఎవరినైనా ఒక్కమారు స్పృశించగానే అతడికి చైతన్యం జాగృతమయ్యేలా అనుగ్రహించు.’ యోగమాయ మహిమ చెప్పనలవి కాదు. ఆమె లోకులను తన ఇంద్రజాలంతో మైమరపించగలదు. లీలలో యోగమాయ తన ఈ మహిమలను ధారాళంగా చూపించింది. ఆమె శక్తి ద్వారానే సుబోలుడు (శ్రీకృష్ణుడి నేస్తం) శ్రీకృష్ణుడు, రాధికల కలయికను సాధించగలిగాడు. ఆద్యాశక్తి అయిన యోగమాయకు ఆకర్షణ శక్తి ఉంది. నేను కూడా అదే శక్తిని ఆరోపింప చేసుకున్నాను.
“అది సరే, ఇక్కడకు వచ్చేవారికి ఏమైనా దర్శనాలు కలుగుతున్నాయా?”
‘మ’ : అవునండి, కలుగుతున్నాయి.
శ్రీరామకృష్ణులు: అది నీకు ఎలా తెలుసు?
‘మ’ (నవ్వుతూ): ‘ఆయన వద్దకు వెళ్ళినవారు ఎవరూ తిరిగి (సంసారంలోకి) రా’ రని అందరూ చెబుతుంటారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): పెద్ద కప్ప ఒకటి నీటిపాము నోట పడింది. పాపం! ఆ పాము అవస్థ చెప్పనలవికాదు. అది కప్పను ఇటు మింగనూ లేదు, అటు కక్కనూ లేదు. మరో వైపు కప్పకు కూడా కష్టమే; బాధతో బెకబెక మంటోంది. అది నాగుపాము నోట పడివుంటే రెండు బెకబెకలతోనే దాని పని సరిపోయేది. శాంతి లభించి ఉండేది. (అందరూ నవ్వారు)
(బాలభక్తులతో) “మీరు త్రైలోక్యుడు వ్రాసిన భక్తి చైతన్య చంద్రిక అనే పుస్తకాన్ని చదవండి. అతణ్ణి అడిగి పుస్తకం ప్రతి నొకదానిని తీసుకోండి. చైతన్యదేవుల గురించి చక్కగా వ్రాశాడు.”
ఒక భక్తుడు: త్రైలోక్యుడు ఆ పుస్తకం ఇస్తాడంటారా?
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): తోటలో పళ్ళు విరగకాసినప్పుడు ఒకటి రెండు పళ్ళు ఊరకే ఇస్తుంటారు కదా! (అందరూ నవ్వారు) త్రైలోక్యుడు ఉచితంగా ఇవ్వడా ఏమిటి? (పల్టుతో) అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూవుండు.
పల్టు: వీలునుబట్టి వస్తూవుంటానండి.
శ్రీరామకృష్ణులు: కలకత్తాలో నేను ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు నువ్వు అక్కడకు వచ్చి నన్ను కలుసుకోవచ్చు కదా!
పల్టు: అలాగేనండి, ప్రయత్నం చేస్తాను.
శ్రీరామకృష్ణులు: ఇది లెక్కలుకట్టే బుద్ధి.
పల్టు: వస్తాను అని చెప్పి రాకపోతే అబద్ధం చెప్పినట్లవుతుంది కదా!
శ్రీరామకృష్ణులు(‘మ’ తో): పాపం! వీళ్ళు స్వతంత్రులు కారుకదా! వీరు రాకపోయినా సరే, నేను అది అబద్ధంగా తలంచను.
(హరిపదునితో) “మహేంద్ర ముఖర్జీ ఈ మధ్య రావడం లేదు. ఎందుకని?”
హరిపదుడు: ఎందుకో తెలియదండీ.
‘మ’ (నవ్వుతూ): ఆయన జ్ఞానయోగ సాధన చేస్తున్నాడండి.
శ్రీరామకృష్ణులు: అది కాదు. ఆ రోజు ప్రహ్లాద చరిత్ర నాటకం చూడబోవటానికి ఇక్కడకు బండి పంపుతాను అని చెప్పాడు. కాని పంపలేదు. అందుకే కాబోలు తరువాత ఇటువైపు తిరిగి చూడనైనా లేదు.
‘మ’ : ఒక రోజు నేను మహిమాచక్రవర్తిని కలుసుకున్నాను. అతడితో మాట్లాడాక మహేంద్ర అతడి ఇంటికి తరచూ వెళ్తున్నట్లు నాకు అనిపించింది.
శ్రీరామకృష్ణులు: కాని మహిమాచక్రవర్తి భక్తి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడే! ‘ఆరాధి యది హరి స్తపసా తతఃకిమ్’ వంటి భక్తి స్తోత్రాలు వల్లిస్తూవుంటాడే!
‘మ’ (నవ్వుతూ): అవి మీరు వల్లించమంటారు కాబట్టి వల్లిస్తూంటాడు.
గిరీశ్చంద్రఘోష్, శ్రీరామకృష్ణుల వద్దకు ఈ మధ్యనే వస్తూ ఉన్నాడు. అతడు ఈ మధ్యకాలంలో సదా శ్రీరామకృష్ణుల గురించే మాట్లాడుతూంటాడు.
హరిపదుడు: ప్రస్తుతం గిరీశ్ ఘోష్ పలు దర్శనాలు గాంచుతున్నాడు. ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత సర్వదా భగవత్ చింతనలోనే మునిగివుంటాడు. ఎన్నో దర్శిస్తూ ఉంటాడు.
శ్రీరామకృష్ణులు: ఆ, అది సంభవమే. గంగానది తీరానికి వెళ్ళినప్పుడు పడవలు, ఓడలు వంటి వాటి నెన్నిటినో చూడవచ్చు.
హరిపదుడు: గిరీశ్ ఘోష్ ఇలా అంటుంటాడు: ‘ఇక మీదట నేను నా పనిలోనే నిమగ్నమై ఉంటాను. తెల్లవారి లేవడంతోటే కలం, కాగితం పుచ్చుకొని కూర్చుంటాను. రోజంతా పుస్తకాలు వ్రాయడంలోనే గడుపుతాను.’ కాని ఇలా సంకల్పిస్తాడే కాని పాపం అతడికి వీలుమాత్రం దొరకదు. అతడి వద్దకు మేం వెళితే, కేవలం మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. మీరు నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరానికి పంపమని చెప్పారట కదా! అందువల్ల ఒక బండి కుదిర్చి నరేంద్రుణ్ణి పంపుతాను అని చెప్పాడు.
సమయం సాయంత్రం ఐదు గంటలయింది. చిన్న నరేంద్రుడు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఈశాన్య వసారాలోకి తీసుకువెళ్ళి ఏకాంతంలో పలు ఉపదేశాలు చేశారు. కాసేపటి తరువాత అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామంచేసి వెళ్ళిపోయాడు. ఇంకా పలువురు భక్తులు కూడా సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు.
శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని మోహినీమోహన్తో మాట్లాడుతున్నారు. మోహినీ భార్య, కుమారుడు మరణించిన పిదప దాదాపు పిచ్చిదైపోయింది. ఒక్కోసారి నవ్వుతుంది, మరోసారి ఏడుస్తూ ఉంటుంది. అయితే దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడు నీ భార్య ఎలా ఉంది?
మోహినీమోహన్: ఇక్కడకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కాని, అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి పెద్ద గొడవే సృష్టిస్తూ ఉంటుంది. ఒక రోజు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది.
ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు కాసేపు చింతాక్రాంతులయ్యారు.
మోహినీమోహన్(వినయపూర్వకంగా): మీరు ఆమెకు రెండు మంచి మాటలు చెప్పండి.
శ్రీరామకృష్ణులు: ఆమెను వంట చేయనివ్వకు. వంటచేస్తే తల వేడెక్కిపోతుంది. సర్వదా ఎవరో ఒకరిని ఆమెకు తోడుగా ఉంచు.
37.8 అష్టమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల సన్న్యాస స్థితి – తారక్‌తో సంభాషణ
సాయంకాలం అయింది. ఆలయంలో సంధ్యాహారతులు మొదలవనున్నాయి. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించి, సాంబ్రాణి ధూపం వేశారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని జగన్మాతకు నమస్కరించి స్వరయుక్తంగా భగవన్నామాన్ని గానంచేస్తున్నారు. గదిలో ‘మ’ తప్ప మరెవరూ లేరు. ‘మ’ నేలమీద కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు, ‘మ’ కూడా లేచాడు. గదికి పశ్చిమ ఉత్తర ద్వారాలను చూపుతూ ఆయన ‘మ’ తో “వాటిని మూసివేయి” అన్నారు. ‘మ’ తలుపులు మూసివేసి వచ్చి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు “ఒకసారి ఆలయానికి వెళ్ళి కాళీమాతను దర్శించి వద్దాం రా” అన్నారు. ఇలా అంటూ ‘మ’ చేయి పట్టుకొని అతడి మీదనే భారం మోపి ప్రాంగణం గుండా నడచి కాళికాలయం చేరుకున్నారు. ‘మ’ తో “నువ్వు వెళ్ళి అతణ్ణి(బాబూరామ్ను) పిలుచుకురా” అని అక్కడే కూర్చున్నారు. ‘మ’ వెంటనే బాబూరామ్ను పిలుచుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు కాళీమాత దర్శనం చేసుకొని మరల ప్రాంగణం మీదుగా గదికి తిరిగి వచ్చారు. “అమ్మా! అమ్మా! రాజరాజేశ్వరీ!” అంటున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నారు.
ఇప్పుడు శ్రీరామకృష్ణులు అసాధారణమైన స్థితిలో ఉన్నారు. ఆయన లోహవస్తువు దేనినీ తాకలేకుండా ఉన్నారు. తాకినట్లయితే వెంటనే తేలుకుట్టినంత బాధ. అందువల్ల కొన్ని రోజులుగా అరటాకులోనే భోంచేస్తున్నారు, కంచంలో తినటం లేదు. మట్టి గ్లాసుతో నీరు త్రాగుతున్నారు; కంచు గ్లాసుతో త్రాగటం లేదు. కాళ్ళు చేతులు కడుక్కోటానికి ఇత్తడి చెంబు ఉపయోగించలేకున్నారు. అందువల్ల భక్తులను కొన్ని మట్టిముంతలు తెమ్మని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఇలా అన్నారు: “ఐశ్వర్యానికి సంబంధించిన విషయాలన్నీ అమ్మ పూర్తిగా నా మనస్సు నుండి తొలగిస్తున్నట్లువుంది.”
ప్రసన్నుడు కొన్ని మట్టి ముంతలను తీసుకువచ్చాడు. కాని అవి చాలా చిన్నవి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు: “ఈ ముంతలు చాల చిన్నవి. కాని అతడు చాలామంచి బాలుడు. ఒకసారి నేను చెప్పగానే బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడిపోయాడు. ఎంతటి బాలక స్వభావం!”
37.8.1 ‘ఓ సాధూ జాగ్రత్త !’
బేల్ఘరియా (కలకత్తాలోని ఒక ప్రాంతం)కు చెందిన తారక్ ఒక స్నేహితుడితో వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన మంచం మీద కూర్చుని ఉన్నారు. గదిలో దీపం వెలుగుతోంది. కొందరు భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు.
తారక్ వయస్సు సుమారు ఇరవై సంవత్సరాలు ఉంటుంది; వివాహితుడు. తారక్ తల్లితండ్రులు శ్రీరామకృష్ణుల వద్దకు రావటానికి అతణ్ణి అనుమతించరు. తారక్ బౌబజార్ వద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఎక్కువగా అక్కడే నివసిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఎంతగానో అభిమానిస్తారు. తోడ వచ్చిన స్నేహితుడు కొద్దిగా తమోగుణం కలవాడు. ధార్మిక విషయాలన్నా, శ్రీరామకృష్ణులన్నా చులకనగా చూస్తాడు; వ్యంగ్యంగా మాట్లాడతాడు.
శ్రీరామకృష్ణులు(తారక్ స్నేహితుడితో): ఆలయాలను అన్నింటినీ ఒక మారు దర్శించిరా.
స్నేహితుడు: ఓ, అవన్నీ ముందుగానే చూసేశాను.
శ్రీరామకృష్ణులు: అది సరే కాని తారక్ ఇక్కడకు రావడం మంచిది కాదా?
స్నేహితుడు: అది మీకే తెలియాలి.
శ్రీరామకృష్ణులు (‘మ’ ను చూపుతూ): అతడు హెడ్మాష్టరు.
స్నేహితుడు: ఓహో!
ఆ తరువాత శ్రీరామకృష్ణులు తారక్ క్షేమ సమాచారాలు విచారించారు. అతడితో చాలాసేపు మాట్లాడారు. పిదప అతడు ఇంటికి పోవటానికి సిద్ధమయ్యాడు. పలు విషయాలలో జాగ్రత్తగా ఉండమని శ్రీరామకృష్ణులు అతణ్ణి హెచ్చరించారు.
శ్రీరామకృష్ణులు(తారక్‌తో): ‘సాధూ! జాగ్రత్తగా ఉండు.’ కామినీ కాంచనాల బారినుండి జాగ్రత్తగా ఉండు. స్త్రీ వలలో ఒక్కమారు చిక్కావంటే తప్పించుకోలేవు. అది విశాలాక్షి (కామార్పుకూర్కు ప్రక్కనున్న సెలయేరు) లోని సుడిగుండం లాంటిది. అందులో పడినవాడు మళ్ళీ బయటికి రాలేడు. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూవుండు.
తారక్: ఇంట్లో వారు రానివ్వరు.
37.8.2 భగవంతుని కొరకు పెద్దవారి మాటలను ఉల్లంఘించడంలో తప్పు లేదు
ఒక భక్తుడు: ఎవరైనా తల్లి తన బిడ్డతో ‘దక్షిణేశ్వరానికి వెళ్ళవద్దు. అలా వెళ్ళినట్లయితే నా రక్తం తాగినంత ఒట్టు’ అని అంటే ఏం చేయాలి?
శ్రీరామకృష్ణులు: అలా మాట్లాడే తల్లి తల్లే కాదు; ఆమె అవిద్యారూపిణి. అట్టి తల్లి మాట వినకపోయినా తప్పులేదు. అటువంటి తల్లి భగవదన్వేషణ మార్గంలో విఘ్నం కలిగిస్తుంది. భగవంతునికై పెద్దవారి మాటలను ఉల్లంఘించటంలో తప్పులేదు. రాముడికోసం భరతుడు కైకేయి ఆదేశాన్ని శిరసావహించలేదు. శ్రీకృష్ణుణ్ణి దర్శించటానికి గోపికలు తమ భర్తల ఆజ్ఞలను ఉల్లఘించారు. శ్రీమన్నారాయణునికొరకు ప్రహ్లాదుడు తండ్రి మాటను జవదాటాడు. భగవంతునికి ప్రీతి చేకూర్చటానికై గురువైన శుక్రాచార్యుల ఉపదేశాలను బలిచక్రవర్తి పెడచెవిన పెట్టాడు. అయితే ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో – ‘భగవదన్వేషణ మార్గంలో పోవద్దు అన్నమాట తప్ప తక్కినవన్నీ శిరసావహించాలి సుమా!’ ఏదీ నీ చెయ్యి చూడనివ్వు.
శ్రీరామకృష్ణులు తారక్ చేతిని తమ చేతిలోకి తీసుకొని ఎంత బరువు ఉందో చూడసాగారు. తరువాత ఇలా అన్నారు: “కొద్దిగా ప్రతిబంధకాలు ఉన్నాయి. భయపడవద్దు; ఆ కాస్త పోతుందిలే. భగవంతుణ్ణి ప్రార్థించు; ఇక్కడకు అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఆ కాస్త పోతుందిలే. కలకత్తాలో బౌ బజారులోని ఇల్లు నువ్వే ఏర్పాటు చేసుకొన్నావా?”
తారక్: లేదండి. వాళ్ళే (తల్లితండ్రులే) ఏర్పాటు చేశారు.
శ్రీరామకృష్ణులు(నవ్వుతూ): వాళ్ళు ఏర్పాటు చేశారా లేక ‘పులి’ భయంతో నువ్వే ఏర్పాటు చేసుకున్నావా?
తారక్‌కి వివాహం అయింది. ‘పులి’ అని చెప్పి శ్రీరామకృష్ణులు అతడి భార్యను ఉద్దేశిస్తున్నారు కాబోలు.
శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి తారక్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద పడుకొని ఉన్నారు. తారక్ గురించి చింతన చేస్తున్నట్లు ఉన్నారు. ఉన్నట్టుండి ‘మ’ తో ఇలా అన్నారు: “చూడు, నేను వీళ్ళకోసం ఇంతగా ఎందుకు ఆరాటపడుతుంటాను?” ‘మ’ మౌనంగా ఉండిపోయాడు ఏం బదులు చెప్పాలా అని యోచిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు “ఏం, మాట్లాడవేం” అన్నారు.
ఇంతలో మోహినీ మోహన్ భార్య గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులకు ప్రణామంచేసి ఒక ప్రక్కన కూర్చుంది. శ్రీరామకృష్ణులు తారక్ స్నేహితుడి గురించి ‘మ’ తో ఇలా అన్నారు: “తారక్ తనతోపాటు ఆ స్నేహితుణ్ణి ఎందుకు తీసుకొచ్చాడు?”
‘మ’ : చాలా దూరం కదా! అందువల్ల దారిలో తోడుగా ఉంటాడని తోడ్కొని వచ్చి ఉంటాడు.
శ్రీరామకృష్ణులు హఠాత్తుగా మోహినీ మోహన్ భార్యను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “ఇలా చూడు. దుర్మరణం పొందిన వారు పిశాచాలవుతారు. జాగ్రత్త! మనస్సు స్థిమితపరచుకో. ఇంతకాలంగా ఇక్కడకు వస్తూ ఎన్నో ఉపదేశాలు వింటూ చివరకు ఆత్మహత్య చేసుకొంటావా? జాగ్రత్త!”
తరువాత మోహినీ మోహన్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని భార్య కూడా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనతో మెల్లగా ఏదో మాట్లాడసాగింది.
శ్రీరామకృష్ణులు : నువ్వు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నావా?
మోహినీ మోహన్ భార్య : ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉంటాను. నహబత్లో అమ్మ వద్ద ఉండనా?
శ్రీరామకృష్ణులు : మంచిదే! కాని నువ్వు తరచు ఆత్మహత్య చేసుకుంటాను అంటుంటావే! అందుకే భయం వేస్తోంది. పైగా ప్రక్కన గంగానది కూడా ఉందాయె.