36.1 ప్రథమ పరిచ్ఛేదం నరేంద్రాది భక్తులతో భజనానందంలో
ఆదివారం, ఫిబ్రవరి 22, 1885
పరమహంస శ్రీరామకృష్ణ దేవులు దక్షిణేశ్వర ఆలయంలోని తమ గదికి ఈశాన్యంలో ఉన్న పొడవాటి వసారాలో ఆసీనులై ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది. గత సోమవారం, ఫాల్గుణ శుక్ల విదియ నాడు శ్రీరామకృష్ణుల జన్మ తిథి. ఈ సందర్భంగా భక్తులు నేడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నరేంద్రుడు, రాఖాల్, బాబూరామ్, భవనాథ్, సురేంద్ర, గిరీంద్ర, వినోద్, హాజ్రా, రామ్‌లాల్, రామ్, నిత్యగోపాల్, మణిమల్లిక్, గిరీశ్, సింథీకి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైన భక్తులు అక్కడ హాజరై ఉన్నారు. ఇంతలో ‘మ’ వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన అతణ్ణి కూర్చోమని సైగ చేశారు.
నరోత్తమ్ కీర్తనలు గానం చేస్తున్నాడు. గోపబాలురు కృష్ణుడితో సమావేశం అవడం గురించిన కీర్తనలు అవి. కీర్తనలు వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. కృష్ణుడు గోవులను కాచేందుకు రావటంలో ఆలస్యమవుతోంది. ఎవరో గోపబాలుడు, ‘యశోదాదేవి కృష్ణుణ్ణి రానివ్వటం లే’ దన్నాడు. బలరాముడు పట్టుదలగా ‘నేను బాకా ఊది కృష్ణుణ్ణి రప్పిస్తాను’ అన్నాడు. కృష్ణుడి పట్ల బలరాముడిది మేరమీరిన ప్రేమ!
గాయకుని పాట కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవితో ఊదుతున్నాడు. ఆ మధురనాదం వింటూనే గోపగోపికలు ఆనందం పట్టలేకపోయారు.
శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు కూర్చుని కీర్తనలు వింటున్నారు. ఉన్నట్టుండి ఆయన దృష్టి సమీపంలో కూర్చున్న నరేంద్రుని మీద పడింది. వెంటనే ఆయన లేచి నిలబడి సమాధిమగ్నులైనారు. నరేంద్రుడి మోకాలిని తమ పాదంతో స్పృశిస్తూ నిలబడిపోయారు. కాసేపటికి బాహ్యస్పృహ కలిగాక మళ్ళీ కూర్చున్నారు. నరేంద్రుడు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. కీర్తనలు కొనసాగాయి.
శ్రీరామకృష్ణులు బాబూరామ్‌తో మెల్లగా, “గదిలో పాయసం ఉంది. వెళ్ళి నరేంద్రుడికి పెట్టు” అన్నారు.
శ్రీరామకృష్ణులు నరేంద్రుడిలో సాక్షాత్తూ నారాయణుణ్ణి దర్శిస్తున్నారా?
కీర్తనలు ముగిశాక ఆయన తమ గదిలోకి వచ్చి అమిత వాత్సల్యంతో నరేంద్రుడికి మిఠాయిలు తినిపించసాగారు.
భగవంతుడే శ్రీరామకృష్ణుల రూపంలో అవతరించాడని గిరీశ్ దృఢంగా విశ్వసిస్తాడు.
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): మీరు చేసే పనులన్నీ శ్రీకృష్ణుడి లాంటివే. శ్రీకృష్ణుడు కూడా యశోదవద్ద ఎన్నో టక్కులు ఆడేవాడు.
శ్రీరామకృష్ణులు: ఆ, శ్రీకృష్ణుడు అవతారపురుషుడు. భగవంతుడు మానవరూపం దాల్చినప్పుడు అట్లే ప్రవర్తిస్తాడు. కృష్ణుడు గోవర్ధన గిరిని అవలీలగా ఎత్తివేశాడు. అయితే పీట మోసుకువెళ్ళటానికి కూడా ఎంతగానో శ్రమ పడుతున్నట్లు నందుణ్ణి నమ్మించాడు.
గిరీశ్: అర్థం అయింది. మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాను.
36.1.1 నూతన వస్త్రధారణ – సమాధి, భావపారవస్య స్థితిలో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. సమయం ఉదయం పదకొండు గంటలు అవుతోంది. రామ్ తదితర భక్తులు ఆయనకు కొత్త బట్టలు కట్టబెట్టాలని చూస్తున్నారు. అయితే ఆయన వద్దంటున్నారు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న ఒక వ్యక్తిని చూపుతూ “అతడు ఏమనుకుంటాడో” అన్నారు. భక్తులు బలవంతం చేయటంతో చివరకు “మీరందరూ చెబుతున్నారు కాబట్టి వేసుకుంటానులే, తీసుకురండి” అన్నారు.
భక్తులు ఆయనకు గదిలోనే భోజనం సిద్ధం చేస్తున్నారు. కాసేపటి తరువాత ఆయన నరేంద్రుణ్ణి ఏదైనా పాట పాడమన్నారు. నరేంద్రుడు పాడసాగాడు:
రూపులేని నీ అందము
దట్టమైన చీకటిలో
మెరయుచు స్పందించుచుండె
అందువలన అంధకార
కొండగుహన యోగివరులు
ధ్యానింతురు నిన్ను జనని ॥ రూ ॥
హద్దుపద్దు గానరాని
అంధకార మడుపునందు
నిర్వాణపు అలలనుండి
నిశ్చలమై నిలచిపోని
శాంతి సోకుచున్న దమ్మ ॥ రూ ॥
శూన్యమైన రూపుదాల్చి
చీకటనెడు చీరగట్టి
సమాధ్యాలయములోన
ఏకాకిగ కూరుచుంటి
వెవరవమ్మ నీవు మాత ॥ రూ ॥
భయము బాపు పాదపద్మ
ములనుండి ప్రేమ మెరపు
లెన్నొ మెరయుచున్నవమ్మ
మెరసిపోవుచున్నవమ్మ ॥ రూ ॥
బిగ్గరగా భీషణముగ
నవ్వెడు నీ శక్తి – ముఖము
కొట్టవచ్చినట్లు పైకి
వెలిగిపోవుచున్న దమ్మ ॥ రూ ॥
నరేంద్రుడు, ‘సమాధ్యాలయములోన ఏకాకిగ కూరుచుంటి వెవరవమ్మ నీవు మాత’ అని పాడగానే శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహ కోల్పోయి సమాధి మగ్నులయ్యారు. చాలాసేపటి తరువాత ఆయనకు బాహ్యస్పృహ కలిగింది. తరువాత భక్తులతో కలసి భోజనానికి కూర్చున్నారు. ఇంకా భావపారవశ్యంలోనే ఉన్నారు. రెండు చేతులతోనూ అన్నం తింటున్నారు. భవనాథ్తో “నువ్వు నాకు అన్నం తినిపించు” అన్నారు. ఇంకా భావావస్థలో ఉండటం చేత ఆయన అన్నం స్వయంగా తమ చేత్తో తినలేకపోతున్నారు. భవనాథ్ ఆయనకు తినిపించసాగాడు.
శ్రీరామకృష్ణులు చాలా తక్కువగా తిన్నారు. భోజనం తరువాత రామ్ ఆయనతో “మీరు భోజనం చేసిన విస్తరిలోనే నిత్యగోపాల్ భోంచేస్తాడట” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి, నేను తిన్న విస్తరిలోనా! ఎందుకు?
రామ్: ఏం, అందులో తప్పేముంది?
నిత్యగోపాల్ కూడా భావావేశంలో ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతడి నోట్లో ఒకటి రెండు ముద్దలు పెట్టి తినిపించారు.
కాసేపటికి కొన్నగర్ నుండి పడవలో భక్తులు దిగారు. వారు సంకీర్తన చేస్తూ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. సంకీర్తనానంతరం ఉపాహారం చేయడానికి వారు బయటకు వెళ్ళారు. గాయకుడు నరోత్తమ్ గదిలోనే కూర్చుని ఉన్నాడు. నరోత్తమ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “కొన్నగర్ భక్తుల పాటలు చప్పగా ఉన్నాయి. పాటలు ఎలా ఉండాలంటే, పాడటం మొదలుపెట్టగానే అందరూ లేచి నిలబడి నాట్యం చేసేలా ఉండాలి.
“ఇలాంటి పాటపాడాలి – ‘గౌరాంగుడి ప్రేమ వెల్లువలో నదియా యావత్తు కంపించిపోతోంది.’
(నరోత్తమ్తో) “దానితోపాటు ఇదికూడా పాడాలి.
అరుగో ఇద్దరు సోదరులు హరిని పాడుచు అశ్రులు గార్తురు
ఆనందముతో నాడుచు జగమును హరిభజనముతో…..
“ఇంకా, ఇది కూడా పాడాలి.
ఓ గౌరు ఓ నిత్తాయి మీరు
ధన్యజీవులు, పావన జన్ములు……”
36.2 ద్వితీయ పరిచ్ఛేదం భక్తులతో సంభాషణ
భక్తులు ప్రసాదం పుచ్చుకుంటున్నారు. మిఠాయి, అటుకుల వంటివి తిని సంతుష్టులవుతున్నారు. శ్రీరామకృష్ణులు ‘మ’ తో “ముఖర్జీలను పిలవలేదా? గాయకులకు భోజనం పెట్టమని సురేంద్రతో చెప్పు” అన్నారు.
ఇంతలో బిపిన్ సర్కార్ వచ్చాడు. భక్తులు “ఈయన బిపిన్ సర్కార్” అంటూ ఆయన్ను శ్రీరామకృష్ణులకు పరిచయం చేశారు. శ్రీరామకృష్ణులు లేచి, మళ్ళీ కూర్చున్నారు. “ఈయనకు కూర్చోడానికి ఆసనం వెయ్యండి, తాంబూలం ఇవ్వండి” అన్నారు. బిపిన్ సర్కార్‌తో వినమ్రంగా “మీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఇవాళ జనం ఎక్కువగా ఉన్నారు” అన్నారు.
గిరీంద్రను చూపిస్తూ శ్రీరామకృష్ణులు బాబూరామ్‌తో, “ఈయనకు ఆసనం ఇవ్వు” అన్నారు. నిత్యగోపాల్ నేల మీదనే కూర్చొని ఉండటం చూసి ఆయన “ఇతడికి కూడా ఆసనం ఇవ్వు” అన్నారు.
సింథీకు చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ సైగ చేస్తూ రాఖాల్తో “నీ చేయి (అంటే నాడి) చూపించుకో” అన్నారు. తరువాత నవ్వుతూ రామ్‌లాల్‌తో “గిరీశ్ ఘోష్‌తో స్నేహంగా ఉండు. అప్పుడప్పుడు థియేటర్‌కు వెళ్ళి నాటకాలు చూడవచ్చు” అన్నారు.
నరేంద్రుడు, హాజ్రాతో వసారాలో చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాడు. తండ్రి మరణించాక నరేంద్రుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కాసేపటికి నరేంద్రుడు వచ్చి గదిలో కూర్చున్నాడు.
36.2.1 నరేంద్రునికి వివిధ ఉపదేశాలు
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): ఇందాక నువ్వు హాజ్రాతో ఏదో మాట్లాడుతున్నట్లున్నావు. పాపం, మీరిద్దరు ఒకే రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ సామెత తెలుసుగా – ‘నువ్వు పరాయి దేశంలో తిరుగులాడుతున్నావు, అతడు ప్రేయసిని ఎడబాసి ఉన్నాడు.’ హాజ్రాకు కూడా పదిహేను వందలు అవసరమై ఉంది. (నవ్వులు)
“హాజ్రా ఇలా అంటాడు: ‘నరేంద్రుడికి నూటికి నూరుపాళ్ల సత్త్వగుణం అలవడింది. అయితే కొద్దిగా రజోగుణం మిగిలి ఉంది. మరి నాకో? నాకు విశుద్ధ సత్త్వం కలిగింది – నూటికి నూటపాతిక పాళ్ళు.’ (అందరూ నవ్వారు)
“హాజ్రాతో నేను, ‘నువ్వు కేవలం విచారణ చేస్తుంటావు. అందుచేతనే శుష్కించిపోయి ఉన్నావు’ అన్నాను. అందుకు అతడు ‘నేను సూర్యుడి సుధారసాన్ని గ్రోలుతాను. అందుకే శుష్కించిపోయి ఉన్నాను’ అన్నాడు.
“శుద్ధభక్తి గురించి చెబుతూ నేను ‘శుద్ధభక్తుడు ధనం, ఐశ్వర్యం ఇత్యాదులు ఏవీ ఆకాంక్షించడు’ అన్నాను. అందుకు అతడు ‘భగవంతుని కృప వెల్లువలా ముంచుకొచ్చినప్పుడు గుంటలు, కాలువలు అన్నీ వాటంతట అవే నిండిపోతాయి. శుద్ధభక్తీ కలుగుతుంది, షడైశ్వర్యాలూ కలుగుతాయి. పుష్కలంగా ధనం కూడా వచ్చి చేరుతుంది’ అన్నాడు.”
36.2.2 నరేంద్రుడు అఖండానికి చెందినవాడు
నేలమీద నరేంద్రుడు తదితర భక్తులు కూర్చుని ఉన్నారు. గిరీశ్ కూడా వచ్చి వారితోపాటు కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): నేను నరేంద్రుణ్ణి ఆత్మస్వరూపంగా భావిస్తాను. నేను అతడు చెప్పిన మాటను వింటాను.
గిరీశ్: మీరు ఎవరి మాట మాత్రం వినరు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అతడిది పురుష భావం. నాది ప్రకృతి భావం. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు, అఖండానికి చెందినవాడు.
గిరీశ్ ధూమపానం నిమిత్తం బయటకు వెళ్ళాడు.
36.2.3 శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు – పాండిత్యం, శాస్త్రం
నరేంద్రుడు (శ్రీరామకృష్ణులతో): నేను గిరీశ్ ఘోష్‌తో మాట్లాడాను. అతడు నిజంగానే గొప్ప వ్యక్తి. మీ గురించిన చర్చ వచ్చింది.
శ్రీరామకృష్ణులు: ఏం చర్చించారు?
నరేంద్రుడు: మీరు చదువు సంధ్యలు లేనివారు, మేమందరం పండితులం – ఈ ధోరణిలో మాట్లాడుకున్నాం. (నవ్వులు)
మణిమల్లిక్ (శ్రీరామకృష్ణులతో): మీరు ఏమీ చదవకుండానే పండితులు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రాదులతో): నేను నిజం చెబుతున్నాను – వేదాంతం మొదలైన శాస్త్రాలు ఏవీ చదవలేదని నాకు ఇసుమంతైనా బాధ లేదు. వేదాంతసారం ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అని నాకు తెలుసు. ఇక, గీతలోని సారం ఏమిటి – ‘గీతా’ అని పదిసార్లు ఉచ్చరిస్తే ఏమవుతుందో అది. అలా ఉచ్చరించినప్పుడు అది ‘త్యాగీ, త్యాగీ’ గా మారిపోతుంది.
“శాస్త్రాల మర్మాన్ని గురుముఖతా తెలుసుకోవాలి. ఆ తరువాత సాధన భజనలు చేయాలి. ఉత్తరం చదవకుండానే అది కనబడకుండా పోయింది. అందరూ కలసి దానికోసం వెతుకసాగారు. అది దొరికాక దానిలోని విషయం ఏమటని చూశారు. అందులో ఐదు శేర్ల మిఠాయి, ఒక ధోవతి పంపమని వ్రాసుంది. అంతే! ఉత్తరాన్ని తీసి ప్రక్కన పెట్టి వారు ఐదు శేర్ల మిఠాయి, ధోవతిని సమకూర్చుకోవడంలో నిమగ్నమైపోయారు. ఈ విధంగా శాస్త్రాల మర్మాన్ని తెలుసుకున్న పిదప, మరి పుస్తకాలు చదవవలసిన అగత్యం ఏమిటి? ప్రస్తుతం చేయవలసింది సాధన భజనలే.”
ఇంతలో గిరీశ్ గదిలోకి వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఏమయ్యా, మీరందరు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారట. నే నెప్పుడూ తింటూ త్రాగుతూ ఉంటాననేనా లేక వేరే ఏమైనా ఉందా?
గిరీశ్: మీ గురించి మేమేం మాట్లాడేది? మీరు సాధువులా ఏమిటి?
శ్రీరామకృష్ణులు: నేను సాధువును కాను, గీధువును కాను. నిజంగానే నాకు ‘నేను సాధువు’ నన్న ఎరుకే లేదు.
గిరీశ్: హాస్యాలాడడంలో కూడా నేను మీకు సాటిరాను.
శ్రీరామకృష్ణులు: ఒకసారి నేను ఎర్ర అంచు ధోవతి ధరించి జయగోపాల్ సేన్ ఉద్యానగృహానికి వెళ్ళాను. ఆ సమయంలో కేశవ్సేన్ కూడా అక్కడే ఉన్నాడు. అతడు నా ఎర్ర అంచు ధోవతి చూసి ‘నేడు ఎరుపు రంగు వాగై పారుతోందే!’ అన్నాడు. అందుకు నేను ‘ఇదంతా కేశవ్ సేన్ మనస్సు దోచుకోవడానికే. అందుకే ఎరుపు రంగు ఇలా పరవళ్ళు తొక్కుతోంది’ అన్నాను.
నరేంద్రుడు పాడనున్నాడు. శ్రీరామకృష్ణులు ‘మ’ ను గోడకు తగిలించిన తంబురా తీసి నరేంద్రుడికి ఇవ్వమన్నారు. నరేంద్రుడు చాలాసేపటి వరకు తంబురా శ్రుతి చేయడంలోనే నిమగ్నమయ్యాడు. శ్రీరామకృష్ణులతో పాటు తక్కిన వారందరికీ కూడా అది విసుగు పుట్టించింది.
వినోద్ ఇలా అన్నాడు: “అతడు ఇవాళ శ్రుతులు సరిచేస్తాడు. ఎప్పుడైనా మరో రోజు పాడతాడు.” (నవ్వులు)
శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు: “తంబురాను ముక్కలు చెక్కలుగా పగులకొడదా మనిపిస్తోంది. ఏమిటి ఈ ‘టంగ్ టంగ్’ ధ్వని – పిదప ‘తానా నానా తేరే నుమ్’ అంటాడు.”
భవనాథ్: సంగీత కచేరి మొదలుపెట్టడానికి ముందు వారు ఇలాగే విసుగు పుట్టిస్తారు.
నరేంద్రుడు (శ్రుతి సరిచేస్తూ): అలా విసుగు పుట్టేది సంగీతం అర్థం కానివాళ్ళకే.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): చూశారా, ఒక్క మాటతోనే ఇతడు మనల్నందరినీ కొట్టిపారేశాడు.
36.2.4 నరేంద్రుని పాట, శ్రీరామకృష్ణుల భావపారవశ్యం
నరేంద్రుడు పాడటం మొదలుపెట్టాడు.
అంతరాత్మవై నడిపెడు మాతా ।
అనయ మా హృదయమునందు మేల్కొనుము…..
* * *
ఓ ఏకతార
పాడుమమ్మ తార
నాకు జీవాధార…..
* * *
రూపులేని నీ అందము
దట్టమైన చీకటిలో
మెరయుచు స్పందించుచుండె….
పాటలు వింటూ శ్రీరామకృష్ణులు భావస్థితిని పొంది మంచం మీద నుండి క్రిందకు దిగి నరేంద్రుడికి దగ్గరగా కూర్చున్నారు. భావావస్థలోనే మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: పాట పాడనా? థూ థూ! (నిత్యగోపాల్తో) నువ్వు ఏమన్నావు – ఉద్దీపన కలగడానికి కీర్తనలు వినాలా? ఆ తరువాత ఏం వస్తుందో ఏం పోతుందో ఎవరి కెరుక?
“నరేంద్రుడు జ్వాలను రగిల్చాడు. అది మంచిదే. ఇప్పుడు అంతటా నిశ్శబ్దం నెలకొని ఉంది. ఇదీ మంచిదే. నేను నిశ్శబ్దంగా ఉన్నాను, నుమ్వా నిశ్శబ్దంగా ఉన్నావు. కావలసిందల్లా ఆనందరసంలో మునిగిపోవడమే.
“పాట పాడనా? ఆ, పాడనూగలను. నీరు స్థిరంగా ఉన్నా నీరే, అలల రూపంలో ఉన్నా నీరే.”
36.2.5 నరేంద్రునికి ఉపదేశం – జ్ఞానం, అజ్ఞానం రెండింటికీ అతీతంగా వెళ్ళు
నరేంద్రుడు ఆయనకు సమీపంగా కూర్చుని ఉన్నాడు. అతడి ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు. అందువల్ల అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉంటున్నాడు. ఆధునిక బ్రహ్మసమాజానికి వెళ్ళి వచ్చేవాడు. ఇప్పుడు కూడా సర్వదా జ్ఞాన విచారణలో మునిగి ఉన్నాడు. వేదాంతం వగైరా శాస్త్రాలు చదవటంలో అతడికి ఆసక్తి అధికం. వయస్సు దాదాపు 23 సంవత్సరాలు. శ్రీరామకృష్ణులు అతడి వైపే చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, నరేంద్రుడితో): నువ్వు ‘ఖ* ’ వు కదా! అయితే ‘టేక్సో’ (tax) అంటే ఇంట్లోని ఇబ్బందుల గురించి ఆలోచించవలసి వస్తోంది. (అందరూ నవ్వారు)
“కృష్ణకిశోర్ తాను ‘ఖ’ ను అంటూ ఉండేవాడు. ఒక రోజు అతడి ఇంటికి వెళ్ళి చూసేసరికి అతడు దేని గురించో దిగాలుగా కనిపించాడు. మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. నేను, ‘ఏమయ్యా, ఏం జరిగింది? ఇలా కూర్చున్నా వేమిటి?’ అని అడిగాను. అందుకు అతడు ఇలా అన్నాడు: ‘ట్యాక్స్ అధికారులు వచ్చారు. పన్నులు కట్టకపోతే ఇంట్లోని పాత్రలు, సామానులు అన్నీ వేలం వేస్తామన్నారు. అందు గురించి ఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్నాను.’ నేను నవ్వుతూ ఇలా అన్నాను: ‘నువ్వు ‘ఖ’ వు కదా! అంటే, ఆకాశం లాంటి వాడివి. ఆ వెధవలు పాత్రలు, సామాన్లు తీసుకు వెళ్తామంటే తీసుకోనివ్వు. నీ కేమిటి నష్టం?’
(నరేంద్రుడితో) “అందుకే నీకు చెబుతున్నాను – నువ్వు ‘ఖ’ వని. ఇంతగా ఎందుకు చింతిస్తావు? కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడో తెలుసా? – ‘అష్టసిద్ధులలో ఏ ఒక్క సిద్ధి ఉన్నా కొద్దిపాటి శక్తి లభిస్తుంది. అయితే నన్ను మాత్రం పొందలేవు.’ సిద్ధుల ద్వారా అధిక శక్తి, బలం, ధనం వగైరాలు పొందవచ్చు కాని భగవంతుని ప్రాప్తించుకోలేము.
“మరో విషయం ఉంది. జ్ఞానాజ్ఞానాలకు అతీతుడవవు. ఫలానా వ్యక్తి పెద్దజ్ఞాని అని చాలామంది చెబుతుంటారు. అయితే వాస్తవానికి అది నిజం కాదు. వసిష్ఠుడు ఎంతటి మహాజ్ఞాని! అయినప్పటికీ పుత్రశోకంతో కుమిలిపోయాడు. అది చూసి లక్ష్మణుడు రాముడితో ‘అన్నా! ఇదెక్కడి చోద్యం? వసిష్ఠుడు ఎంతటి మహాజ్ఞాని! మరి ఆయన కూడా అలా దుఃఖీస్తున్నాడేమిటి?’ అని అడిగాడు. అప్పుడు రాముడు అతడికి ఇలా విశదపరచాడు: ‘తమ్ముడూ, జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అతడికి అజ్ఞానం కూడా ఉంటుంది. వెలుగును గురించిన ఎరుక ఉన్నవాడికి చీకటిని గురించిన ఎరుక కూడా ఉంటుంది. మంచి అంటే ఏమిటో, సుఖం అంటే ఏమిటో తెలిసిన వాడికి చెడు అంటే ఏమిటో, దుఃఖం అంటే ఏమిటో కూడా తెలిసే ఉంటుంది. తమ్ముడూ, నువ్వు ఈ ద్వంద్వాలకు అతీతుడవయిపో. సుఖదుఃఖాలకు, జ్ఞానాజ్ఞానాలకు ఆవలగా వెళ్ళిపో.’ (నరేంద్రుడితో) అందుకే నీకు చెబుతున్నాను. నువ్వు జ్ఞానాజ్ఞానాలను అధిగమించి పో.”
36.3 తృతీయ పరిచ్ఛేదం గృహస్థుడు – దానధర్మాలు; మనోయోగం, కర్మయోగం
శ్రీరామకృష్ణులు మళ్ళీ చిన్న మంచం మీద కూర్చున్నారు. భక్తులు నేలపై కూర్చుని ఉన్నారు. సురేంద్ర ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అతడి కేసి ఆప్యాయంగా చూస్తూ మాట్లాడసాగారు. మాటల మధ్యలో ఉపదేశాలనిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (సురేంద్రుడితో): అప్పుడప్పుడు వస్తూ ఉండు. ‘చెంబును రోజూ తోముతూ ఉండాలి. లేకుంటే అది మకిలిపట్టిపోతుంది’ అని నాంగ్టా అనేవాడు. సాధుసాంగత్యం సర్వదా అవసరం.
“కామినీ కాంచనాల త్యాగం సన్న్యాసులకై ఉద్దేశింపబడినది. మీకు ఉద్దేశింపబడినది అది కాదు. మీరు మధ్యమధ్యలో ఏకాంతంలోకి పోయి భగవంతుణ్ణి వ్యాకులచిత్తంతో ప్రార్థించాలి. మీరు మానసికంగా పరిత్యజించాలి.
“భక్తుడు వీర స్వభావం లేనివాడయితే భగవంతుడు, సంసారం రెండిటి పట్లా మనస్సు నిలపజాలడు. జనక మహారాజు సాధన భజనలు చేసిన పిదప సిద్ధుడై సంసార జీవితం గడిపాడు. అతడు జ్ఞానం, కర్మ అనే రెండు కత్తులతో సాము చేశాడు.”
ఇలా పలికిన పిదప శ్రీరామకృష్ణులు పాడసాగారు:
ఈ లోకమే ఒక్క ఆనందసౌధం
ఆనందముగ నిందు తిని త్రాగుచుందు
మతిలేని ఓ వైద్యకులసంభవుండ నీ
చూపు విషయాలు పైపైనె చూచు ॥ ఈ ॥
ఆ జనక మహారాజు అసమానఘనుండు
ఏ లోపమాతనికి ఇహపరమునందు
ఇద్దాని అద్దాని తాననుభవించు
పొరలేటి పాత్రలో తన పాలు గ్రోలు ॥ ఈ ॥
శ్రీరామకృష్ణులు: చైతన్యదేవులు చెప్పినట్లు మీకు జీవుల పట్ల దయ, భక్తుల సేవ, నామ సంకీర్తనలు ఆచరణీయాలు.
(సురేంద్రుడితో) “నీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు ఒక వాణిజ్య కార్యాలయంలో పని చేస్తున్నావు. నువ్వు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. అందుకే నీకు ఈ విషయాలన్నీ చెబుతున్నాను.
“నువ్వు ఆఫీసులో అబద్ధాలు చెబుతుంటావు. అలాంటప్పుడు నువ్వు సమర్పించే ఆహారాన్ని నేను ఎందుకు తింటానో తెలుసా? నువ్వు దానధర్మాలు చేస్తుంటావు కాబట్టి. నువ్వు సంపాదించే దానికంటే ఎక్కువగానే దానం చేస్తుంటావు. ‘పుచ్చకాయ విత్తనం కాయ కంటే పెద్దదిగా ఉంటుంది.’
“నేను పిసినారులు సమర్పించిన వాటిని తినలేను. వారి సొమ్ము వ్యాజ్యాలలోనూ, దొంగల పాలవ్వడంలోనూ, వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చుకు గానూ – ఇలా పలు రకాలుగా వ్యర్థమై, చివరకు తప్పుదారి పట్టిన పిల్లలు ఉన్న డబ్బంతా ఊడ్చివేస్తారు. పిసినారుల వ్యవహారం ఇలాగే సాగుతుంది.
“నువ్వు దానధర్మాలు చేస్తున్నావు; అది చాలా మంచి పని. డబ్బున్న వాడు దానం చేయాలి. పిసినారుల డబ్బు హరించుకుపోతుంది. అయితే దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది, సత్కార్యాలకు వినియోగింపబడుతుంది. కామార్పుకూర్లో రైతులు కాలువలు త్రవ్వి పొలంలో నీటిని పారిస్తారు. ఒక్కోసారి కాలువలో నీటి ప్రవాహం ఎంత ఉద్ధృతంగా ఉంటుందంటే, ఆ తాకిడికి పొలం గట్లు కొట్టుకుపోయి పంట నాశనమైపోతుంది. అందుకే రైతులు గట్లకు అక్కడక్కడ రంధ్రాలు పెడతారు. నీరు కొద్దికొద్దిగా ఈ రంధ్రాల నుండి బయటకు పారుతూ ఉంటుంది. అందువల్ల నీటి తాకిడికి గట్టు తెగిపోయే ప్రమాదం ఉండదు. పైగా, పొలంలోని మట్టి మెత్తగా తయారవుతుంది. దీనితో భూమి సారవంతమవుతుంది, అధిక దిగుబడి లభిస్తుంది. దానధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు, నాలుగు పురుషార్థాలనూ సాధించుకుంటాడు.”
దానధర్మాలకు సంబంధించిన ఈ ఉపదేశాలను భక్తులు అమితశ్రద్ధతో వింటున్నారు.
సురేంద్రుడు: నేను ధ్యానం బాగా చేయలేకపోతున్నాను. మధ్యమధ్యలో ‘అమ్మా, అమ్మా’ అంటూంటాను. నిద్రపోయే ముందు ‘అమ్మా, అమ్మా’ అంటూ నిద్రపోతాను.
శ్రీరామకృష్ణులు: అది చాలు. స్మరణ మననాలయితే ఉన్నాయి కదా!
“మనోయోగం, కర్మయోగం అని రెండు రకాల యోగాలు ఉన్నాయి. పూజ, తీర్థయాత్ర, జీవసేవ మొదలైన కర్మలు గురువు ఉపదేశాన్ని అనుసరించి చేయటాన్ని కర్మయోగం అంటారు. జనక మహారాజు అనుష్ఠించిన కర్మలను కూడా కర్మయోగం అంటారు. యోగులు చేసే స్మరణ మననాలను మనోయోగం అంటారు.
“కాళికాలయానికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో ఇలా అనుకొంటాను: ‘అమ్మా! మనస్సు కూడా నువ్వే కదా!’ అందుచేతనే శుద్ధ మనస్సు, శుద్ధబుద్ధి, శుద్ధ ఆత్మ – అన్నీ ఒక్కటే.”
సాయంకాలం కాబోతోంది. పలువురు భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఇళ్ళకు తిరిగి వెళుతున్నారు. శ్రీరామకృష్ణులు పడమటి మొగసాలలోకి వెళ్ళారు. వెంట భవనాథ్, ‘మ’ లు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భవనాథ్తో): ఎందుకు ఇక్కడకు తరచూ రావడం లేదు?
భవనాథ్ (నవ్వుతూ): అయ్యా, నేను రెండు వారాలకు ఒకసారి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. ఆ రోజు మిమ్మల్ని వీథిలో చూశాను. అందువల్ల మళ్ళీ ఇక్కడకు రాలేదు.
శ్రీరామకృష్ణులు: అదేమిటి? కేవలం దర్శనంతోటే ఒరిగేది ఏముంది? స్పర్శనం, సంభాషించటం – ఇవన్నీకూడా కావాలి.
36.4 చతుర్థ పరిచ్ఛేదం గిరీశ్ ప్రభృత భక్తులతో ప్రేమోన్మత్తతలో శ్రీరామకృష్ణులు
సంధ్యాకాలం అయింది. ఆలయాలలో హారతి గంటానాదాలు వినవస్తున్నాయి. ఆరు లేక ఏడు రోజులలో, వచ్చే పూర్ణిమనాడు హోలి పండుగ.
ఆలయ శిఖరాలు, ప్రాంగణం, ఉద్యానవనం, వృక్షాగ్రాలు వెన్నెలలో మనోహర రూపాలను సంతరించుకొని ఉన్నవి. ఈ సమయంలో గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో జగన్మాత ధ్యానంలో మగ్నులై ఉన్నారు.
ఇంకా ఒకరిద్దరు భక్తులు అక్కడే ఉన్నారు. నరేంద్రుడు ముందుగానే వెళ్ళిపోయాడు.
ఆలయాలలో హారతి ముగిసింది. శ్రీరామకృష్ణులు భావావేశంలో ఈశాన్య దిశలో ఉన్న పొడవాటి వసారాలో నెమ్మదిగా పచార్లు చేస్తున్నారు. ఉన్నట్టుండి ‘మ’ ను ఉద్దేశిస్తూ “ఆహా, నరేంద్రుడు ఎంత మధురంగా పాడాడు!” అన్నారు.
‘మ’ : అవునండీ.
36.4.1 తంత్రశాస్త్రాలలో మహాకాళీ ధ్యానం
శ్రీరామకృష్ణులు: తంత్రశాస్త్రాలు చీకటిలో ధ్యానించటాన్ని నిర్దేశించాయి. ఆ సమయంలో సూర్యప్రకాశం ఎక్కడిది?
ఇంతలో గిరీశ్ ఘోష్ వచ్చి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు గానం చేయసాగారు.
నా మాయీ నల్లనిదా! నల్లనిదా నిజముగనే ।
శ్యామాంగా! దిగంబరీ! హృదయాబ్జపు ఉద్దీపనీ……
శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులయ్యారు. నిలబడి గిరీశ్ మీద చెయ్యివేసి పాడసాగారు.
నే నెందుకు పోవలె కాశీ కంచీ
గంగా గయాప్రభాసముకూ….
* * *
తెలిసికొంటి తెలిసికొంటి తెలియదగినదెల్ల నిపుడు
సర్వమెరుగు నొకనినుండె భావమర్మ మెరిగినాను…
గిరీశ్‌ను చూస్తూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులైనారు. నిలబడే పాడసాగారు:
నాకేదీ ఇక భయము
మృతి యన నిర్భయము
నా కేదీ మృతి భయము
లేదిక నాకే భయము ॥ నా ॥
కాళీమా పదపద్మము
జేసితి జీవశరణ్యము
నిర్భయమా పదరాజము
నా కేదీ మృత్యు భయము ॥ నా ॥
శ్రీ కాళీ ఘననామము
చేకొని శిరమున బంధము
వైచితి పిలకకు మంత్రము
నా కేదీ మృత్యు భయము ॥ నా ॥
గావించితిని నా దేహము
లోకసంత విక్రయము
చేసితి ఖర్చాధనము
కొనుటకు దుర్గానామము….. ॥ నా ॥
ప్రేమోన్మత్తులై ఆయన ఈ చరణాలను మళ్ళీ పాడారు.
గావించితిని నా దేహము
లోకసంత విక్రయము
చేసితి ఖర్చాధనము
కొనుటకు దుర్గానామము ॥ నా ॥
(గిరీశ్, ‘మ’ లను చూస్తూ) “భావంతో దేహం నిండిపోయింది. అది జ్ఞానాన్ని హరించివేసింది.
“ఇక్కడ జ్ఞానం అంటే అర్థం బాహ్య ప్రపంచం గురించిన ఎరుక. కావలసింది తత్త్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇత్యాదులు. శరీరం భావంతో నిండి పోయింది; దానితో శరీర జ్ఞానం నశించిపోయింది.
36.4.2 శ్రీరామకృష్ణులు అవతారమా? – పరమహంస స్థితి
“భక్తియే సారం. సకామ భక్తి అనేది ఉంది. నిష్కామ భక్తి, శుద్ధ భక్తి, అహేతుక భక్తి అనేవి కూడా ఉన్నవి. కేశవ్సేన్ తదితరులకు అహేతుక భక్తి గురించి తెలియదు. దాన్లో ఎలాంటి ఆకాంక్షా ఉండదు; కేవలం భగవంతుని పాద పద్మాలపై భక్తిమాత్రం ఉంటుంది.
“ఊర్జిత భక్తి అని కూడా ఒకటి ఉంది. ఈ భక్తి పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. చైతన్యదేవుల వలె భక్తుడు భావావస్థలో నవ్వుతాడు, పాడతాడు, నాట్యం చేస్తాడు. రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ‘తమ్ముడూ, ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను స్వయంగా విరాజిల్లుతున్నట్లు తెలుసుకో.’”
శ్రీరామకృష్ణులు తమ స్థితులను సూచిస్తున్నారా? ఆయన కూడా చైతన్య దేవులలాగా అవతార పురుషులా? జీవులకు భక్తి అంటే ఏమిటో నేర్పించడానికి అవతరించారా?
గిరీశ్: మీ కృప ఉంటే సర్వమూ సాధ్యపడుతుంది. ఎంత అధ్వాన్నంగా ఉండేవాడిని! ఇప్పుడు ఎంత బాగుపడ్డాను!
శ్రీరామకృష్ణులు: అవునయ్యా, నీకు సంస్కారాలు ఉన్నాయి మరి. అందువల్లనే అలా జరిగింది. తగిన సమయం రాకుండా ఏదీ జరుగదు. రోగం నయమయ్యే దశలో ఉన్నప్పుడు వైద్యుడు ‘ఈ ఆకును బాగా నూరి, దాని రసం పుచ్చుకో’ అంటాడు. వైద్యుడు చెప్పినట్లు ఔషధం సేవించిన పిదప రోగం నయమైపోయింది. మరి ఇప్పుడు రోగం, ఆకును నూరి సేవించడం వల్ల నయమైందనుకోవాలా, లేక దానంతట అదే నయమైందనుకోవాలా – ఈ విషయం ఎవరు చెప్పగలరు?
“లక్ష్మణుడు లవకుశులతో ఇలా అన్నాడు: ‘మీరు ఇంకా చిన్న పిల్లలు. శ్రీరాముడి గురించి మీకు తెలియదు. ఆయన పాదస్పర్శతో రాయిలా పడివున్న అహల్య మానవరూపం దాల్చింది.’ అందుకు లవకుశులు ఇలా చెప్పారు: ‘అయ్యా, ఈ సంగతి మాకు తెలుసు; మేము కూడా విని ఉన్నాం. రాయిలా పడివున్న అహల్య మానవరూపం ధరిస్తుందని గౌతమముని వచించాడు. ఆయన అహల్యతో ఇలా అని ఉన్నాడు: “త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ఆశ్రమం గుండా వెళతాడు. అప్పుడు ఆయన పాదస్పర్శతో నువ్వు మళ్ళీ మానవరూపం దాలుస్తావు.’” మరి ఇప్పుడు ఆమె మానవరూపం ధరించడం శ్రీరాముడి గొప్పదనం కారణంగానా లేక గౌతమముని వాక్శుద్ధా, ఏమనుకోవాలి?’
“సర్వమూ భగవంతుడి ఇచ్ఛతోనే జరుగుతోంది. ఇక్కడ నీకు చైతన్యం జాగృతమయిందంటే అందుకు నేను కేవలం నిమిత్తమాత్రుడి నని తెలుసుకో. చందమామ అందరికీ మామే. భగవంతుడి ఇచ్ఛతోనే సర్వమూ జరుగుతోంది.”
గిరీశ్ (నవ్వుతూ): భగవంతుడి ఇచ్ఛతోటే కదా! నేను చెబుతోంది కూడా అదే.(అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): సరళ (నిష్కపట) స్వభావం ఉంటే సత్వరంగానే భగవంతుణ్ణి పొందవచ్చు. ఇటువంటి వ్యక్తులకు జ్ఞానం ప్రాప్తించదు: ఒకటి – కల్లాకపటంతో నిండి ఉన్న కుటిల మనస్కులు; రెండు – మడి, మైల అంటూ పట్టుకొని వ్రేలాడే వాళ్ళు; మూడు – సంశయాత్ములు.
శ్రీరామకృష్ణులు నిత్యగోపాల్ భావావస్థను ప్రశంసిస్తూ మాట్లాడారు.
ఇంకా ముగ్గురు నలుగురు భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో వసారాలో నిలబడి ఆయన సంభాషణను వింటున్నారు. ఆయన ప్రస్తుతం పరమహంస స్థితిని వర్ణిస్తున్నారు: “పరమహంసకు సదా ‘భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం’ అన్న ఎరుక ఉంటుంది. పాల నుండి నీటిని వేరు చేయగల శక్తి హంసకు మాత్రమే ఉంది. హంస నాలుక నుండి ఒక విధమైన పుల్లటి రసం వెలవడుతుంది. పాలలో నీళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ రసం ద్వారా పాలు, నీరు వేరయిపోతాయి. పరమహంస నోటిలో కూడా పుల్లని రసం ఉంటుంది – అది ప్రేమభక్తి. ప్రేమభక్తి ఉండటం వల్లనే నిత్యానిత్య వివేకం జనిస్తుంది, భగవదనుభూతి కలుగుతుంది, భగవద్దర్శనం లభిస్తుంది.”
36.5 పంచమ పరిచ్ఛేదం గిరీశ్ ఇంట్లో – జ్ఞాన, భక్తి సమన్వయం
బుధవారం, ఫిబ్రవరి 25, 1885
బోస్పారా వీథిలోని గిరీశ్ఘోష్ ఇంట్లో శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు ఆసీనులై భగవత్ ప్రసంగం గావిస్తున్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు. ‘మ’ వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. గత ఆదివారం నాడు దక్షిణేశ్వరంలో భక్తులు శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆయన ఇవాళ గిరీశ్ఘోష్ ఇంటికి విచ్చేశారు. ఇక్కడి నుండి స్టార్థియేటర్లో వృషకేతు అనే నాటకం తిలకించటానికి వెళతారు. ప్రస్తుతం ఆయన బ్రహ్మజ్ఞానం, భక్తి తత్త్వాలను సమన్వయపరచడం ఎలాగో వివరిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్ తదితర భక్తులతో): జీవుడికి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు రకాల స్థితులు ఉంటాయి.
“జ్ఞాన విచారణ చేసేవాళ్ళు ఈ మూడు స్థితులను కొట్టిపారేస్తారు. బ్రహ్మం ఈ మూడు స్థితులకు అతీతమనీ; స్థూలసూక్ష్మ కారణ శరీరాలు మూడింటికీ, సత్త్వరజస్తమోగుణాలు మూడింటికీ అతీతమనీ వారు ఉద్ఘాటిస్తారు. అద్దంలో ప్రతిబింబంవలె సమస్తమూ మాయే. ప్రతిబింబానికి ఎటువంటి అస్తిత్వం లేదు కదా – బ్రహ్మం ఒక్కటే వస్తువు, తక్కినదంతా అవస్తువు (అస్తిత్వంలేనిది).
“బ్రహ్మజ్ఞానులు ఇంకా ఇలా అంటారు: ‘దేహాత్మబుద్ధి ఉండటం వల్లనే ద్వంద్వ భావన ఏర్పడేది; ప్రతిబింబం కూడా సత్యంగానే తోస్తుంది. ఆ బుద్ధి కనుక నశించిపోతే ‘సోఽహం’ అంటే ‘నేనే ఆ బ్రహ్మాన్ని’ అన్న అనుభూతి కలుగుతుంది.”
36.5.1 విచారణ, భక్తి – రెండు మార్గాలు – జ్ఞానయోగం, భక్తియోగం
ఒక భక్తుడు: మరయితే మేమందరం విచారణా మార్గాన్ని అనుసరించాలా?
శ్రీరామకృష్ణులు: ‘విచారణా మార్గం’ ఉండనే ఉంది; అది వేదాంతుల మార్గం. భక్తి మార్గం అని మరోమార్గం కూడా ఉంది. భక్తుడు వ్యాకుల చిత్తంతో బ్రహ్మజ్ఞానం కోసం విలపిస్తే అతడు దాన్ని కూడా ప్రాప్తించుకోగలడు.* ఈ విధంగా జ్ఞానయోగం, భక్తియోగం అని రెండు మార్గాలు ఉన్నాయి.
“రెండు మార్గాల ద్వారానూ బ్రహ్మజ్ఞానం పొందవచ్చు. కొంతమంది బ్రహ్మజ్ఞానం పొందిన పిదప కూడా భక్తిని నిలుపుకొని ఉంటారు – లోకులకు ఉపదేశించే నిమిత్తం. ఉదాహరణకు, అవతారపురుషులు ఈ కోవకు చెందినవారు.
“అయితే దేహాత్మ బుద్ధి, ‘నేను’ అనే బుద్ధి అంత సులువుగా పోదు. భగవంతుని కృపతో సమాధి స్థితిలో మగ్నుడైనప్పుడు ఆ భావన నశించిపోతుంది. ఈ సమాధి నిర్వికల్ప సమాధి, జడసమాధి.
“సమాధిస్థితి అనంతరం అవతార పురుషులు, తదితర మహానుభావులకు ఈ ‘నేను’ అనే భావన తిరిగి వస్తుంది; ఇది ‘విద్యా నేను’, ‘భక్తుడిననే నేను’. ఈ ‘విద్యా నేను’ ద్వారా లోకశిక్షణ జరుగుతుంది. శంకరాచార్యులు ‘విద్యా నేను’ ను నిలుపుకొన్నారు.
“చైతన్యదేవులు ఈ ‘నేను’ ద్వారానే భక్తి రసాన్ని గ్రోలేవాడు. భక్తిని కలిగి ఉండి భక్తుల సాంగత్యంలో గడిపేవాడు, భగవత్ ప్రసంగాలు చేసేవాడు, నామ సంకీర్తనలు చేసేవాడు.
“ ‘నేను’ అనే భావన సులభంగా నశించదు. అందుచేతనే భక్తుడు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను తీసిపడెయ్యడు. అతడు ఈ స్థితుల నన్నింటినీ అంగీకరిస్తాడు, సత్త్వరజస్తమోగుణాలను కూడా అంగీకరిస్తాడు. భగవంతుడే ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నట్లు భక్తుడు దర్శిస్తాడు. మళ్ళీ, ఆయన సాకార చిన్మయ రూపంలో దర్శనం ఇస్తున్నట్లుగా భక్తుడు గాంచుతాడు.
“భక్తుడు విద్యామాయను ఆశ్రయిస్తాడు. సాధుసాంగత్యం, తీర్థయాత్రలు చేయడం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం – వీటన్నిటినీ ఆశ్రయించుకుంటాడు. భక్తుడు ఇలా అంటాడు: “ఈ ‘నేను’ అనేది సులువుగా నశించదు కాబట్టి ఈ వెధవను ‘దాసుడి’ గా ఉండనివ్వు, ‘భక్తుడి’ గా ఉండనివ్వు.”
“భక్తుడు కూడా ఏకత్వ జ్ఞానాన్ని పొందుతాడు. అతడు భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ లేదని గాంచుతాడు. అతడు ‘ఇదంతా స్వప్నం లాంటిది’ అని పలుకడు. అందుకు మారుగా ‘భగవంతుడే ఇవన్నిటిగా అయివున్నాడు’ అంటాడు. మైనపు తోటలోని వస్తువులన్నీ మైనంతో చేసినవే, అయితే రూపాలు అనేకం.
“అయితే పరిపక్వ భక్తి కలిగినప్పుడు మాత్రమే అటువంటి బోధ జనిస్తుంది. అధికంగా పిత్తం చేరినప్పుడు పచ్చకామెర్ల రోగం దాపురిస్తుంది. అప్పుడు అంతా పచ్చగానే అగుపిస్తుంది. రాధాదేవి కృష్ణుడి గురించిన చింతన చేసి చేసి సమస్తమూ కృష్ణమయంగా దర్శించింది. ఆఖరికి ‘తాను కూడా కృష్ణుడే’ అన్న బోధ కలిగిందామెకు. పాదరసపు కొలనులో చాలారోజుల పాటు సీసాన్ని ఉంచినట్లయితే, అది కూడా పాదరసంగా మారిపోతుంది. కుమ్మరిపురుగును గురించి ఆలోచన చేసి చేసి బొద్దింక నిశ్చలంగా అయిపోతుంది, కదలిక ఉండదు. చివరకు అది కుమ్మరి పురుగుగానే మారిపోతుంది. భక్తుడు కూడా భగవచ్చింతన చేసి చేసి ‘అహంశూన్యుడు’ అయిపోతాడు; ‘భగవంతుడే నేను,’ ‘నేనే భగవంతుడు’ గా అనుభూతి నొందుతాడు. బొద్దింక, కుమ్మరి పురుగుగా అయిపోయినప్పుడు సర్వమూ సిద్ధించినట్లే. తత్క్షణమే ముక్తి!
36.5.2 వివిధ భావాలలో సాధన – ‘నాది మాతృభావం!’
“భగవంతుడు ఈ ‘నేను’ అనే భావన ఉంచినంతవరకు, ఒకే భావాన్ని ఆశ్రయించి ఆయన్ను ప్రార్థించాలి. ఈ భావాలు శాంత, దాస్య, వాత్సల్య మొదలైనవి.
“నేను దాసీభావంలో బ్రహ్మమయి దాసిగా ఒక ఏడాదిపాటు ఉన్నాను. స్త్రీల వలె దుస్తులు మొదలైనవి ధరించేవాడిని. ముక్కుపుడకను కూడా పెట్టుకొనేవాడిని. స్త్రీభావంలో ఉండటం ద్వారా కామాన్ని జయించవచ్చు.
“ఆ ఆద్యాశక్తినే పూజించాలి. ఆమెను ప్రసన్నం చేసుకోవాలి. స్త్రీ రూపాలన్నీ ఆమే ధరించి ఉంది. అందుకనే, నాది మాతృభావం. “మాతృభావం అతిశుద్ధమైన భావం. తంత్రశాస్త్రాలలో వామాచారం గురించిన ప్రస్తావన కూడా ఉంది. అయితే అది మంచిది కాదు. భోగం ఉంచుకుంటేనే భయం ఉంటుంది సుమా!
“మాతృభావం నిర్జల ఏకాదశి ఉపవాసం లాంటిది. ఈ భావంలో ఎటువంటి భోగవాసన కూడా ఉండదు. కొంతమంది పళ్ళు, కాయలు తిని ఏకాదశిని పాటిస్తారు. మరికొందరు పూరీ, బంగాళాదుంపల కూర తింటూ ఏకాదశిని పాటిస్తారు. నేను పాటించేది నిర్జల ఏకాదశి. నేను మాతృభావంతో షోడశి (పదహారు సంవత్సరాల కన్య)ని పూజించాను; స్తనాన్ని మాతృస్తనంగా, యోనిని మాతృయోనిగా దర్శించాను.
“ఈ మాతృభావ మనేది సాధనలో తుది మాట. ‘నువ్వు అమ్మవు, నేను నీ బిడ్డను’ – ఇదే తుది పలుకు.
36.5.3 సన్న్యాసులకు, గృహస్థులకు నియమాలు
“సన్న్యాసి జీవితం నిర్జల ఏకాదశి లాంటిది. సన్న్యాసి, భోగాలకు అంటిపెట్టుకుని ఉంటే, అది భయహేతువే సుమా! కామినీ కాంచనాలు భోగాలు; సన్న్యాసి, భోగాలను అనుభవిస్తే ఉమ్మివేసి మళ్లీ దాన్ని మ్రింగటం వంటిది. డబ్బుదస్కం, కీర్తి ప్రతిష్ఠలు, ఇంద్రియ సుఖాలు – ఇవన్నీ భోగాలు. సన్న్యాసి, భక్తురాండ్రతో కలసి కూర్చోవడం లేక సంభాషించటం కూడా మంచిది కాదు. అలా చేయడం అతడికి హానికరం, ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. పరులకు ఉపదేశం ఒనగూరదు, లోకశిక్షణ సాధ్యపడదు. సన్న్యాసి దేహధారణ లోకశిక్షణ నిమిత్తమే.
“స్త్రీలతో పాటు కూర్చోవడం లేక ఎక్కువసేపు వారితో సంభాషించడం కూడా ఒక రకంగా రమించడంగానే పరిగణనకు వస్తుంది. రమించడం ఎనిమిది రకాలుగా ఉంటుంది* . స్త్రీయుక్క సంభాషణను వింటూ అందులో ఆనందం పొందడం ఒక విధమైన సంభోగం. స్త్రీల గురించి మాట్లాడటం మరోరకమైన సంభోగం. ఒంటరిగా స్త్రీలతో గుసగుసలాడటం మూడవ రకం. స్త్రీలకు చెందిన వస్తువును దగ్గర ఉంచుకొని ఆనందం పొందటం నాల్గవ రకం. స్పృశించటం ఐదవ రకం. అందుకనే, గురుపత్ని యువతి అయిన పక్షంలో సన్న్యాసి ఆమె పాదాలను స్పృశించరాదు. సన్న్యాసికి ఇవన్నీ నియమాలు.
“సంసారుల సంగతి వేరు. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు అన్నాచెల్లెళ్ళవలె మెలగాలి. వారికి తక్కిన ఏడు రకాల మైథునాలలో అంతగా దోషం ఏమీ ఉండదు.
“గృహస్థుకు దేవ ఋణం, పితౄణం, ఋషి ఋణం అనే ఋణాలు ఉంటాయి. వీటికి తోడు స్త్రీ (భార్యా) ఋణం కూడా ఉంటుంది. ఆమెను ఒక రిద్దరు పిల్లలకు తల్లిని చేయాలి; యోగ్యురాలు అయిన పక్షంలో ఆమెను పోషించాలి.
“ఎవరు మంచి భార్యో, ఎవరు కాదో సంసారులు తెలుసుకోవాలి. ఎవరు విద్యాశక్తి, ఎవరు అవిద్యాశక్తి అన్న విషయం వారికి ఎరుకలోకి రాదు. ఉత్తమురాలైన భార్య విద్యాశక్తిగా పనిచేస్తుంది. ఆమెలో కామక్రోధాదులు స్వల్పంగా ఉంటాయి; తక్కువగా నిద్రిస్తుంది. తన ప్రక్కనుంచి భర్త తలను ఆమె దూరంగా తోసివేస్తుంది. విద్యాశక్తి అయిన స్త్రీ స్నేహం, దయ, భక్తి, లజ్జ మొదలైన సుగుణాలను కలిగి ఉంటుంది. ఆమె అందరినీ వాత్సల్యభావంతో సేవిస్తుంది. భర్తకు భగవంతుని పట్ల భక్తి ఇనుమడించేలా సాయపడుతుంది. భర్త ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుందనీ, తత్కారణంగా భగవచ్చింతనకు తీరిక లభించదనే ఉద్దేశంతో అటువంటి స్త్రీ ఎక్కువగా ఖర్చు చేయదు.
“మగ లక్షణాలు కలిగిన స్త్రీలు కొందరు ఉంటారు. వారు అవలక్షణాలు కలిగి ఉంటారు – మెల్లకన్ను, గుంటలు పడ్డ కళ్ళు, పిల్లి కళ్ళు, దూడలకు ఉన్నటువంటి దవడలు, పావురాయి రొమ్ములు.”
36.5.4 తరించడానికి మార్గం – ఐదు రకాల సమాధి స్థితులు
గిరీశ్: మేము తరించటానికి మార్గం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భక్తే సారం. సాత్త్విక భక్తి, రజో భక్తి, తామసిక భక్తి అని భక్తి మూడు రకాలు. సాత్విక భక్తి కలవాడు నమ్రత, అణకువ కలిగి ఉంటాడు. తామసిక భక్తునిది బందిపోటు దొంగల భావం. “నేను జగజ్జనని నామం ఉచ్చరించాను. ఇక నాకు పాపం ఎలా చుట్టుకుంటుంది? నువ్వు నా సొంత తల్లివి! నాకు దర్శనం ఇచ్చి తీరాల్సిందే” – అనేటటువంటి భావం.
గిరీశ్ (నవ్వుతూ): అయ్యా, మాకు తామసిక భక్తి మీరు నేర్పిన విద్యే!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అయితే భగవద్దర్శనపు చిహ్నాలు కొన్ని ఉన్నాయి. భగవంతుని దర్శించినప్పుడు సాధకుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. సమాధి స్థితులు ఐదు రకాలుగా ఉంటాయి. 1. చీమలా పయనించటం. ఈ స్థితిలో మహావాయువు చీమలా పైకి లేస్తుంది. 2. చేపలా (అంటే నీటిలో ఈదేలాగున) పయనించటం. 3. ( పాము చరచర ప్రాకుతూ పోయినట్లు) తిర్యక్ గతి. 4. పక్షిలా ఎగరటం – పక్షి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగరడం లాంటిది. 5. మర్కట గమనం – ఈ స్థితిలో మహావాయువు ఒక్క గెంతులో శిరస్సులోకి ప్రవేశిస్తుంది; సాధకుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు.
36.5.5 స్థిత సమాధి, ఉన్మనా సమాధి
“ఇంకా, రెండు రకాల సమాధి స్థితులు ఉన్నాయి. ఒకటి – స్థిత సమాధి; ఈ స్థితిలో సాధకుడు సంపూర్ణంగా బాహ్యాస్పృహను కోల్పోతాడు. చాలాకాలం పాటు, బహుశా ఎన్నో రోజుల పాటు ఆ స్థితిలోనే ఉండిపోతాడు. రెండవది, ఉన్మనా సమాధి – మనస్సును హఠాత్తుగా నలువైపుల నుండి ఉపసంహరించుకొని భగవంతునిలో లగ్నం చేయటం.
(‘మ’ తో) “నీకు ఈ విషయం అర్థమయిందా?”
‘మ’ : అవునండీ. అర్థమయింది.
గిరీశ్: భగవంతుణ్ణి సాధనల ద్వారా ప్రాప్తించుకోవచ్చా?
శ్రీరామకృష్ణులు: లోకులు నానావిధాలుగా భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నారు. కొంతమంది అనేక తపస్సులు, సాధన భజనలు చేసి ఆయన్ను ప్రాప్తించుకున్నారు. – వీరిని సాధన సిద్ధులు అంటారు. కొంతమంది జన్మతః సిద్ధులు. ఉదాహరణకు నారదుడు, శుక మహర్షి మొదలైన వారు – వీరిని నిత్యసిద్ధులు అంటారు. హఠాత్ సిద్ధులు అని మరికొందరు ఉంటారు. వీరు హఠాత్తుగా సిద్ధిని పొందుతారు. ఆశలు అన్నీ అడుగంటినప్పుడు, అకస్మాత్తుగా గొప్ప సంపదను పొందటం వంటిది ఇది. ఇంకా, భగవత్ కృపతో ఆయన్ను స్వప్నంలో సాక్షాత్కరించుకున్న సందర్భాలుకూడా ఉన్నాయి.
36.6 షష్ఠ పరిచ్ఛేదం గిరీశ్ శాంత భావం – కలియుగంలో శూద్రులకు భక్తి, ముక్తి
ఇలా పలికి శ్రీరామకృష్ణులు భావపరవశులై గానం చేయసాగారు:
సాధ్యమేన శ్యామ దర్శనం ప్రతివారికిని
లభ్యమేన కాళి సంపద ప్రతివారికిని…..
కొద్దిసేపు ఆయన భావావస్థలోనే ఉన్నారు. గిరీశ్ తదితర భక్తులు ఆయన ముందు కూర్చుని ఉన్నారు. కొన్ని రోజుల క్రితం గిరీశ్ స్టార్ థియేటర్లో ఆయనతో దురుసుగా మాట్లాడి ఉన్నాడు. అయితే నేడు ప్రశాంతంగా ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): నీకు ఈ భావం ఎంతో ఉత్తమమైనది – శాంత భావం. అందుకనే నేను అమ్మను ఇలా ప్రార్థించాను: ‘అమ్మా, ఇష్టమొచ్చినట్లు నన్ను నానామాటలు అనకుండా ఉండేటట్లు గిరీశ్‌ను శాంతింపజెయ్యి.’
గిరీశ్ (‘మ’ తో): ఎవరో నా నాలుకను అదిమిపెట్టినట్లు నన్ను మాట్లాడనివ్వడం లేదు.
శ్రీరామకృష్ణులు ఇంకా అంతర్ముఖ స్థితిలోనే ఉన్నారు. బయటి వ్యక్తులను వస్తువులను క్రమక్రమంగా మరచిపోతున్నట్లు ఉన్నారు. మనస్సును క్రిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ భక్తులకేసి చూశారు.
‘మ’ వంక దృష్టిని నిలిపి ఇలా అన్నారు: “వీరందరు అక్కడకు (దక్షిణేశ్వరానికి) వస్తుంటారు. వస్తే రానివ్వు. అమ్మకు అంతా తెలుసు.” పొరుగు కుర్రాడితో, “ఏమిటోయ్, నీకు ఏం అనిపిస్తోంది? మానవుడి కర్తవ్యం ఏమిటి?” అన్నారు.
అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశమని ఆయన సూచిస్తున్నారా?
(నారాయణ్‌తో) “ఏమిటి, నువ్వు పాస్ (ఉత్తీర్ణత) అవదల్చుకోలేదా? నాయనా, విను. పాశముక్తుడే శివుడు. పాశబద్ధుడే జీవుడు” అన్నారు.
శ్రీరామకృష్ణులు ఇంకా భావమగ్నులై ఉన్నారు. ఆ స్థితిలోనే ప్రక్కన గ్లాసులో ఉన్న నీటిని త్రాగివేశారు. పిదప తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు: “ఇదేమిటి? భావావస్థలోనే నీళ్ళు త్రాగేనే!’
36.6.1 శ్రీరామకృష్ణులు, అతుల్ – తీవ్ర వ్యాకులత
ఇంకా సాయంకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు గిరీశ్ సోదరుడు అతుల్‌తో మాట్లాడుతున్నారు. భక్తులతోపాటు అతుల్ ఆయన ముందు కూర్చున్నాడు. అతడు హైకోర్టులో వకీలుగా ఉన్నాడు. పొరుగింటికి చెందిన బ్రాహ్మణుడొకడు కూడా ఆయన దగ్గరగా కూర్చుని ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (అతుల్‌తో): మీకు నేను చెప్పదలచుకున్న విషయం ఇదే. మీరు మీ సంసార బాధ్యతలనూ నిర్వర్తించండి, భక్తిని ప్రాప్తింపచేసే వాటినీ చేయండి.
పొరుగింటి బ్రాహ్మణుడు: బ్రాహ్మణుడు కానట్లయితే సిద్ధిని పొందజాలరా?
శ్రీరామకృష్ణులు: అలా ఎందుకు అంటావు? కలియుగంలో శూద్రులు భక్తిని పొందుతారని పేర్కొనబడింది. శబరి, రుహిదాస్, అస్పృశ్యుడు గుహుడు – వీరందరి దృష్టాంతాలూ ఉన్నాయి.
నారాయణ్ (నవ్వుతూ): బ్రాహ్మణుడు, శూద్రుడు – అందరూ ఒక్కటే.
బ్రాహ్మణుడు: భగవంతుని సాక్షాత్కరించుకోవటం ఒక్క జన్మలోనే సాధ్యపడుతుందా?
శ్రీరామకృష్ణులు: భగవంతుడి దయ ఉన్నట్లయితే సాధ్యం కానిది ఏముంది! వెయ్యి సంవత్సరాలుగా చీకటిలో మ్రగ్గుతున్న గదిలోకి దీపాన్ని తెస్తే, చీకటి కొద్దికొద్దిగా తొలగిపోతుందా ఏమిటి? గది ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది.
(అతుల్‌తో) “తీవ్ర వైరాగ్యం కావాలి – ఒర నుండి తీసిన ఖడ్గంలా. అటువంటి వైరాగ్యం కలిగిన వ్యక్తికి బంధువులు కాలసర్పాలుగా అగుపిస్తారు, ఇల్లు మృత్యుకూపంలా తోస్తుంది.
“ఇంకా, అంతరంగాన అమిత ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థన హృదయపూర్వక మైనదైతే ఆయన ఆ ప్రార్థనను విని తీరతాడు.”
ఈ అమోఘ వాక్కులను భక్తులు ఏకాగ్రత చిత్తంతో ఆలకిస్తూ వాటి గురించి పర్యాలోచిస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (అతుల్‌తో): ఏమంటావ్? అటువంటి అకుంఠిత దీక్ష తీవ్రవ్యాకులత కలుగదంటావా?
అతుల్: మనస్సు భగవంతునిపై నిలువదే!
శ్రీరామకృష్ణులు: ‘అభ్యాసయోగం’ అని ఒకటి ఉంది. ప్రతి దినం భగవంతుణ్ణి ప్రార్థించటం అభ్యసించాలి. ఒక్క రోజులోనే విజయం చేకూరదు. ఇలా ప్రతిరోజూ భగవంతుణ్ణి ప్రార్థించగా ప్రార్థించగా వ్యాకులత జనిస్తుంది.
“రాత్రింబవళ్ళు కేవలం లౌకిక కర్మలు చేయడంలోనే నిమగ్నమైతే, వ్యాకులత ఎలా జనిస్తుంది? భగవత్ ప్రసంగాలను వినడంలో యదుమల్లిక్ మొదట్లో ఎంతో ఆనందాన్ని పొందేవాడు. తానే స్వయంగా ప్రసంగించేవాడు కూడా. ఈ మధ్యకాలంలో అంతగా ఆసక్తిని కనబరచటం లేదు. రాత్రింబవళ్ళు ముఖస్తుతిపరులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు; వారితో కేవలం లౌకిక సంభాషణలలో మునిగి ఉంటాడు.”
36.6.2 శ్రీరామకృష్ణుల సంధ్యాకాల ప్రార్థన – తేజ్చంద్ర
సాయంకాలం అయింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు దేవీ దేవతల నామాలు స్తుతిస్తున్నారు, గానం చేస్తున్నారు; ఆర్తితో ప్రార్థిస్తున్నారు. ‘హరి బోల్, హరి బోల్’ అంటున్నారు. మళ్ళీ ‘రామ రామ’ అని పలుకుతున్నారు. మళ్ళీ ‘అమ్మా! నిత్యలీలామయీ’, ‘అమ్మా! మార్గం ఏమిటో సెలవియ్యమ్మా, అమ్మా’ ‘శరణాగత, శరణాగత, శరణాగత’ అంటున్నారు.
గిరీశ్ అశాంతిగా ఉండటం గమనించి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. తేజ్చంద్రతో “నువ్వు కాస్త దగ్గరగా రా” అన్నారు. తేజ్చంద్ర దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ కుర్రవాడు ‘మ’ తో గుసగుసలాడుతూ ‘నేను వెళ్ళాలి’ అన్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఆ కుర్రాడు ఏమంటున్నాడు?
‘మ’ : ఇంటికి వెళ్ళాలంటున్నాడు.
శ్రీరామకృష్ణులు: నేను వీరి (బాల భక్తుల) సాంగత్యాన్ని ఇంతగా ఎందుకు కోరుకుంటానో తెలుసా? వీరు పరిశుద్ధమైన పాత్రల వంటివారు; వీరిలోకి విషయబుద్ధి ప్రవేశించలేదు. విషయబుద్ధి ఉన్న వ్యక్తి ఉపదేశాలను గ్రహింపు చేసుకోలేడు. కొత్త కుండలో పాలను ఉంచవచ్చు. పెరుగును తోడుబెట్టిన కుండలో పాలను ఉంచినట్లయితే, ఆ పాలు విరిగిపోతాయి.
“వెల్లుల్లి నలుగగొట్టిన పాత్రను వెయ్యిసార్లు తోమినాసరే వెల్లుల్లి వాసన పోగొట్టలేవు.”
36.7 సప్తమ పరిచ్ఛేదం వృషకేతు నాటకం – నరేంద్రాది ప్రభృత భక్తులతో
శ్రీరామకృష్ణులు వృషకేతు* నాటకం చూడడానికి బీడన్ వీథిలోని స్టార్ థియేటర్‌కు విచ్చేశారు. థియేటర్లో ఒక బాక్సులో దక్షిణాభిముఖంగా కూర్చున్నారు. ‘మ’ తదితర భక్తులు సమీపంలో కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నరేంద్రుడు వచ్చాడా?
‘మ’ : ఆ, వచ్చాడండీ.
నాటకం మొదలయింది. కర్ణుడి దాతృత్వ గుణాన్ని పరీక్షించే నిమిత్తం భగవంతుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అతడి కోరిక మేరకు కర్ణుడు, అతడి సతీమణి పద్మావతి తమ కుమారుడు వృషకేతును బలి ఇచ్చారు. పద్మావతి రోదిస్తూ ఆ మాంసాన్ని వండి అతిథిగా వచ్చిన ఆ ముసలి బ్రాహ్మణుడికి వడ్డించింది. ఆ బ్రాహ్మణుడు అది తింటూ కర్ణుడితో “రా, మన మిద్దరం కలసి భోంచేద్దాం” అన్నాడు. కర్ణుడు, “ఊహూ, అది నా వల్ల కాదు. కుమారుడి మాంసాన్ని నేను ఆరగించలేను” అన్నాడు. ఈ సన్నివేశాన్ని చూస్తూ ఒక భక్తుడు గాఢంగా నిట్టూర్చాడు. శ్రీరామకృష్ణులు కూడా తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
నాటకం పూర్తయ్యాక ఆయన థియేటర్ విశ్రామ గృహానికి వెళ్ళారు. గిరీశ్, నరేంద్రుడు ప్రభృతులు అక్కడ కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు గదిలోకి వచ్చారు. నరేంద్రుడికి సమీపంగా వెళ్ళి నిలబడి, “నేను వచ్చాను” అన్నారు, తరువాత కూర్చున్నారు. థియేటర్లో నుండి వాయిద్యాల నాదం ఇంకా వినవస్తోంది.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఈ నాదం వింటూంటే నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. దక్షిణేశ్వరంలో సన్నాయి వాయించేవారు. అది వింటూ నేను భావపరవశుణ్ణి అయిపోయేవాడిని. ఒక సాధువు నా ఈ స్థితిని చూసి ‘ఇది బ్రహ్మజ్ఞానానికి చిహ్నం’ అన్నాడు.
వాయిద్యాల నాదం ఆగిపోయింది. శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషించసాగారు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఈ థియేటర్ నీకు చెందినదా లేక మీ అందరిదా?
గిరీశ్: అయ్యా, ఇది మాకందరికీ చెందినది.
శ్రీరామకృష్ణులు: ‘మా అందరికీ’ అన్న మాటే మంచిది. ‘నాది’ అనటం మంచిది కాదు. కొంతమంది ‘నేనే స్వయంగా వచ్చాను’ అంటుంటారు. ఇటువంటి మాటలు అహంకారం, అల్పబుద్ధి కలవారు మాట్లాడుతుంటారు.
నరేంద్రుడు: అంతా నాటకమే కదా!
శ్రీరామకృష్ణులు: అవునవును, నిజమే. అయితే కొన్ని చోట్ల విద్యానాటకం ఉంటుంది, మరికొన్ని చోట్ల అవిద్యా నాటకం ఉంటుంది.
నరేంద్రుడు: అంతా విద్యా నాటకమే.
శ్రీరామకృష్ణులు: అవునవును. అయితే ఈ విషయం బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అవగతమవుతుంది. భక్తిమార్గం అనుసరించే భక్తుడికి విద్యా మాయ, అవిద్యామాయలు రెండూ ఉంటాయి. నువ్వు కాస్త పాడు నాయనా.
నరేంద్రుడు పాట పాడసాగాడు:
పరమానందపు ఎరుక సాగరో
పరి భాగంబున పైపై కెగయుచు
పరమానంద ప్రేమతరంగాల్
లేచు టెంతటి పారవశ్యమో!
పరమేశ్వరుని చిద్విలాసమో । ॥ ప ॥
ఉపరితలంబున ఉద్భవించుచు
నవ్యమనోహర నిత్యనూతన
అత్యాశ్చర్యకర పద దివ్యా
నందోత్తుంగ తరంగ పంక్తులు ॥ ప ॥
ఎల్లవేళల లేచెడు నిర్మల
రూపరాసు లా తరంగ పంక్తులు ॥ ప ॥
దేశ పరిచ్ఛిన్న కుడ్యములు
ఏ విధి కరుగుచు అంతరించునో
ఆ విధి కలియును మరియొక పరి
సర్వోన్నత దివ్యసమైక్యమందున ॥ ప ॥
అట్టి సమయమున అమితోత్సాహము
పొంగిపొరలగా పరవశత్వమున
చేతులెత్తుచు ఆడుచు మనసా
పాడుము శ్రీహరి పావన నామము ॥ ప ॥
నరేంద్రుడు ‘మరియొక పరి సర్వోన్నత దివ్యసమైక్యమందు’ అని పాడినప్పుడు శ్రీరామకృష్ణులు, “బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడే ఇది అవగతం అయ్యేది. ఇందాక నువ్వు అంటూ ఉన్నావే, అంతా విద్యే అని” అన్నారు.
నరేంద్రుడు, ‘చేతులెత్తుచు ఆడుచు మనసా పాడుము శ్రీహరి పావన నామము’ అంటూ పాడినప్పుడు శ్రీరామకృష్ణులు అతడితో “ఆ చరణాన్ని రెండుసార్లు పాడు” అన్నారు.
పాట ముగిశాక శ్రీరామకృష్ణులు భక్తులతో సంభాషణ కొనసాగించారు.
గిరీశ్: దేవేంద్ర బాబు రాలేదు. ఆయన అభిమానం దెబ్బతిన్న ధోరణిలో ‘మాలో పాలకోవా ఎక్కడిది? మాలో ఉన్నది మినప్పప్పు కదా! మేం వచ్చి ఏం చేయాలి?’ అన్నాడు.
శ్రీరామకృష్ణులు (విస్మయంతో): ఏమిటి, అలా అన్నాడా? ఇదివరకు ఆయన ఇలా మాట్లాడేవాడు కాదే!
శ్రీరామకృష్ణులు ఉపాహారం తింటున్నారు. నరేంద్రుడికి కూడా తినడానికి ఇచ్చారు.
యతీన్ దేవ్ (శ్రీరామకృష్ణులతో): ఎప్పుడు చూసినా మీరు ‘నరేంద్రా! ఇది తిను, అది తిను’ అంటూంటారే! మరి మేమందరం ఎందుకూ కొరగాని వాళ్ళమా?
యతీన్ను శ్రీరామకృష్ణులు ఎంతగానో ప్రేమిస్తారు. అప్పుడప్పుడు అతడు దక్షిణేశ్వరం వెళ్ళి ఆయన్ను దర్శిస్తుంటాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా అక్కడే బస చేస్తుంటాడు. అతడు శోభాబజార్లోని జమీందారీ కుటుంబానికి చెందినవాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, నరేంద్రుడితో): అతడు చెబుతోంది నీ గురించే.
ఇలా అని చిరునగవులు చిందిస్తూ ఆయన ఆప్యాయంగా యతీన్ చుబుకం పట్టుకొని “అక్కడకు (దక్షిణేశ్వరానికి) రావయ్యా, వచ్చి భోంచేయవయ్యా” అన్నారు.
తరువాత శ్రీరామకృష్ణులు ఒక ప్రహసనం చూడటానికి వెళ్ళారు. బాక్సులో కూర్చున్నారు. ప్రహసనంలో పనిమనిషి మాటలు విని నవ్వసాగారు.
36.7.1 గిరీశ్ అవతారవాదం – శ్రీరామకృష్ణులు అవతారమా?
కొద్దిసేపటి తరువాత ఆయన అన్యమనస్కులయ్యారు. ‘మ’ తో గుసగుసగా మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): గిరీశ్ ఘోష్ చెప్పేది (అంటే, శ్రీరామకృష్ణులు అవతార పురుషులు అనడం) నిజమే నంటావా?
‘మ’ : ఆ, నిజమేనండీ. లేకుంటే అందరికీ అలానే ఎందుకు తోస్తుంది?
శ్రీరామకృష్ణులు: ఇలా చూడు, ఇప్పుడు నాకు ఒక విశేషమైన స్థితి కలుగుతోంది. ఇంతకు ముందున్న స్థితి మారిపోయింది. ప్రస్తుతం నేను లోహ వస్తువు దేనినీ తాకలేకపోతున్నాను.
‘మ’ నిర్ఘాంతపోయి ఈ పలుకులు వింటున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఇది ఒక వినూత్నమైన స్థితి. ఇందులో నిగూఢమైన అర్థం ఉంది.
శ్రీరామకృష్ణులు లోహ వస్తువులను స్పృశించలేకపోతున్నారు. ఈ విషయం అవతార పురుషులు ప్రాపంచిక సంపదలతో ఎటువంటి సంబంధాన్ని సహించలేరని తెలుపుతోందా?
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అది సరే, నా స్థితిలో మార్పు కలగడం నువ్వు గమనిస్తున్నావా?
‘మ’ : ఎలాంటి మార్పు గురించి మీరు అంటున్నది?
శ్రీరామకృష్ణులు: నేను చేసే పనుల్లో.
‘మ’ : మీకు కర్మలు పెరుగుతున్నాయి. అనేకులు మీ గురించి తెలుసుకొంటున్నారు.
శ్రీరామకృష్ణులు: చూశావా? గతంలో నేను చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి.
ఇలా పలికి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఉన్నట్టుండి, “అవునూ, పల్టుకు ధ్యానం ఎందుకు కుదరడంలేదో చెప్పగలవా?” అన్నారు.
ప్రస్తుతం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమౌతున్నారు. ఆయన ఒకసారి గిరీశ్ గురించి ఒక భక్తుడితో ‘వెల్లుల్లిని నలగగొట్టిన పాత్రను వెయ్యిసార్లు తోమినా సరే, వెల్లుల్లి వాసన పోతుందా ఏమిటి?’ అన్నారు. గిరీశ్ ఈ విషయంగా నొచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు బయలుదేరినప్పుడు ఆయనకు తన మనస్సులోని మాటను చెప్పాడు.
గిరీశ్ (శ్రీరామకృష్ణులతో): అయ్యా, ఈ వెల్లుల్లి వాసన పోతుందంటారా?
శ్రీరామకృష్ణులు: పోతుంది.
గిరీశ్: వాసన పోతుందనే కదా మీరు చెబుతోంది!
శ్రీరామకృష్ణులు: అగ్ని రాజుకొన్నప్పుడు వాసనలన్నీ కొట్టుకుపోతాయి. వెల్లుల్లి వాసన వస్తున్న పాత్రను మంటలో వేడిచేస్తే వాసన తొలగిపోతుంది, కొత్త పాత్రలా తయారవుతుంది.
“ ‘నేను సాధించలేను’ అనేవాడు నిజంగానే ఏమీ సాధించలేడు. ‘నేను ముక్తుణ్ణి’ అని తలచేవాడు ముక్తుడే అయిపోతాడు; ‘నేను బద్ధుణ్ణి’ అని తలచేవాడు బద్ధుడే అయిపోతాడు. దృఢ చిత్తంతో ‘నేను ముక్తుణ్ణి’ అనేవాడు ముక్తుడే అయిపోతాడు. రాత్రింబవళ్ళు ‘నేను బద్ధుణ్ణి, నేను బద్ధుణ్ణి’ అని పలికేవాడు బద్ధుడే అయిపోతాడు.