35.1 ప్రథమ పరిచ్ఛేదం ప్రహ్లాద చరిత్ర నాటకం – శ్రీరామకృష్ణుల సమాధి స్థితి
ఆదివారం, డిసెంబరు 14, 1884
నేడు శ్రీరామకృష్ణులు ప్రహ్లాద చరిత్ర నాటకాన్ని తిలకించడానికి బీడన్ వీథిలోని స్టార్ థియేటర్‌కు విచ్చేశారు. ‘మ’, బాబూరామ్, నారాయణ్ తదితర భక్తులు ఆయనతో ఉన్నారు. హాలు లోపల ప్రకాశవంతంగా ఉంది. నాటకం ఇంకా ప్రారంభం కాలేదు. గిరీశ్‌తో మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు బాక్సులో కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ! నువ్వు చాలా నాటకాలు రచించావే!
గిరీశ్: అయ్యా, నేను కేవలం వ్రాశానే తప్ప అర్థం చేసుకున్నదేమిటి?
శ్రీరామకృష్ణులు: లేదు, లేదు. నువ్వు ఎంతో అర్థం చేసుకున్నావు. అంతరంగాన భక్తి లేకుంటే నాటకంలో దైవీ పాత్రలను చిత్రీకరించలేమని ఆ రోజు నేను నీతో చెప్పాను కదా!
“అవును, నిజమే. ఆధ్యాత్మిక భావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి నేను కేశవ్సేన్ ఇంటికి నవ బృందావనం నాటకం చూడడానికి వెళ్ళాను. అక్కడికి ఎవరో ఒక డిప్టీ (డిప్యూటీ మేజిస్ట్రేటు) కూడా వచ్చాడు. నెలకు ఎనిమిది వందల రూపాయల జీతమట. బాగా చదువుకున్నవాడని అందరూ చెప్పారు. అయితే అతడు తన కుమారుడితోనే సతమతమవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి నాటకం బాగా కనిపించేలా సరైన చోటు కోసం వెదకడంలోనే అతడు ఆతురత చూపాడు. నాటకంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సంభాషణలను విననేలేదు. ఆ పిల్లవాడు ‘నాన్నా, ఇదేమిటి, అదేమిటి’ అంటూ పలురకాల ప్రశ్నలతో అతణ్ణి వేధిస్తూనే ఉన్నాడు. అతడికి సమయమంతా పిల్లవాడితోనే సరిపోయింది. చూశావా, అతడు పుస్తకాలను ఊరకే చదివాడు కానీ వాటి భావాన్ని జీర్ణించుకోలేదు.
గిరీశ్: ‘ఇంకా ఈ థియేటర్ పనులను పట్టించుకోవడం ఎందుకు?’ అని ఒక్కోసారి నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను.
శ్రీరామకృష్ణులు: లేదు, లేదు. నువ్వు వీటిని కొనసాగించు. నీ నాటకాల ద్వారా జనులు ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు.
నాటకం మొదలయింది. చదువుకోడానికి ప్రహ్లాదుడు పాఠశాలకు వచ్చాడు. అతణ్ణి చూడగానే ఒకటి రెండుసార్లు ‘ప్రహ్లాద’ అంటూ శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులైపోయారు.
మరో సన్నివేశంలో ప్రహ్లాదుణ్ణి ఏనుగుతో తొక్కించే దృశ్యాన్ని చూసి శ్రీరామకృష్ణులు విలపించ సాగారు. ప్రహ్లాదుణ్ణి మంటలలోకి విసిరివేయడం చూసి ఆయనకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
సన్నివేశం మారింది. లక్ష్మీనారాయణులు గోలోకంలో కూర్చుని ఉన్నారు. ప్రహ్లాదుని గురించి నారాయణుడు చింతిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తూనే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులయ్యారు.
35.2 ద్వితీయ పరిచ్ఛేదం భక్తులతో భగవత్ప్రసంగం
35.2.1 భగవద్దర్శన లక్షణాలు – మూడు రకాల భక్తులు
నాటకం ముగిశాక గిరీశ్, శ్రీరామకృష్ణులను థియేటర్లోని తన గదిలోకి తోడ్కొని వెళ్ళాడు. శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “అయ్యా, వివాహ విభ్రాటం (వివాహపు గందరగోళం) అనే నాటకం చూస్తారా?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: ఊహూ, లేదు, లేదు. ప్రహ్లాద చరిత్ర తరువాత ఇదేమిటి? భగవత్ప్రసంగాలతో నాటకం ముగించండని నేను ఒకసారి ఒక నాటక బృందం వారితో చెప్పాను. ఇంతవరకు మనం చక్కని భగవత్ప్రసంగాలను విన్నాం. మళ్ళీ, అంతలోనే వివాహ విభ్రాటం చూడడమా! సాంసారిక కథలు వినడమా! దీనితో మళ్ళీ పాత కథే మొదలవుతుంది, పాత భావాలే వచ్చి చేరుతాయి.
గిరీశ్: అయ్యా, మీకు నాటకం ఎలా ఉంది?
శ్రీరామకృష్ణులు: సాక్షాత్తూ ఆ భగవంతుడే వేర్వేరు పాత్రలుగా నటిస్తున్నట్లు చూశాను. స్త్రీ పాత్రలు ధరించినవారు సాక్షాత్తూ ఆనందమయి దేవిగానూ, గోలోకంలో గోపాలురుగా నటించిన వారిని సాక్షాత్తూ నారాయణుడిగానూ చూశాను. భగవంతుడే ఈ సమస్తం అయివున్నాడు.
“ఎవరైనా వ్యక్తికి భగవద్దర్శనం అయిందా లేదా అని తెలుసుకోడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి – ఆనందం. అతడికి సంకోచం ఉండదు, సముద్రం లాగా ఉంటాడు. సముద్ర ఉపరితలంపై కెరటాలు, హోరు ఉంటాయి కానీ లోపల అంతా గాంభీర్యమే. భగవద్దర్శనం పొందిన వ్యక్తి ఒక్కోసారి పిచ్చివాడిలా, ఒక్కోసారి పిశాచిలా ప్రవర్తిస్తాడు – శుచి, అశుచుల జ్ఞానం ఉండదు. ఒక్కోసారి జడునిలా ఉంటాడు. ఎందుకంటే, లోపలా బయటా భగవంతుణ్ణి దర్శిస్తూ నిశ్చేష్టుడై ఉంటాడు. ఒక్కోసారి బాలుని వలె ఎటువంటి బంధనం లేకుండా ఉంటాడు, వస్త్రం చంకలో పెట్టుకుని తిరుగుతుంటాడు. బాలక భావంలో అతడు పలురకాలుగా ప్రవర్తిస్తుంటాడు, ఒక్కోసారి బాలుని వలె చిలిపి చేష్టలు చేస్తుంటాడు; ఒక్కోసారి యువకుని వలె సింహసదృశుడై పని చేస్తుంటాడు, లోక శిక్షణ గరపుతూ ఉంటాడు.
“అహంకారం కారణంగా జీవుడు భగవంతుణ్ణి చూడలేడు. మేఘం అడ్డువచ్చినప్పుడు సూర్యుడు కానరాడు. సూర్యుడు మనకు కనిపించడం లేదు కాబట్టి ఆయన లేడని చెప్పగలమా ఏమిటి? సూర్యుడు ఉండనే ఉన్నాడు.
“అయితే ‘బాలుడి నేను’ లో దోషం లేదు, పైగా మేలు కూడా ఉంది. ఆకు కూరలు తింటే ఉదరంలో చెరుపు చేస్తుంది. కాని హించే ఆకుకూర తింటే మేలు చేస్తుంది. అందుకే, హించేను ఆకుకూర అని కచ్చితంగా చెప్పలేం. అలాగే కలకండ మిఠాయిల క్రిందికి రాదు. తక్కిన మిఠాయిలు ఒంటికి మంచివి కావు. కాని కలకండతో అటువంటి ప్రమాదం ఏమీ లేదు.
“అందుకే నేను కేశవ్సేన్తో ‘ఇంతకంటే ఎక్కువగా నేను ఏమైనా చెప్పినట్లయితే నీ సమాజం అంటూ ఏదీ నిలువబోదు’ అని చెప్పాను. అది విని అతడు బెంబేలెత్తిపోయాడు. అప్పుడు నేను అతడితో ‘ ‘బాలుడి నేను’, ‘దాసుడి నేను’ – వీటిలో దోషం లేదులే’ అని చెప్పాను.
“భగవద్దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడే జీవజగత్తులుగా విరాజిల్లుతున్నట్లు గాంచుతాడు; సర్వమూ ఆయనే. అటువంటి భక్తుణ్ణే ఉత్తమ భక్తుడు అంటారు.”
గిరీశ్చంద్ర ఘోష్
గిరీశ్ (నవ్వుతూ): అవును, సర్వమూ భగవంతుడే అయితే భక్తుడు జాడమాత్రంగా ‘నేను’ ను నిలుపుకుంటాడు; అందులో దోషం లేదు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును, అందులో దోషం లేదు. ఆ కించిత్తు ‘నేను’ భగవంతుడితో ఆనందించే నిమిత్తమే. ‘నేను’, ‘నువ్వు’ అన్న భేదభావం, అంటే సేవ్య సేవక భావం ఉన్నప్పుడు మాత్రమే భగవదానందాన్ని అనుభవించగలం.
“ఇంకా, మధ్యమ శ్రేణికి చెందిన భక్తులు కూడా ఉన్నారు. వారు భగవంతుణ్ణి సర్వభూతాలలోనూ అంతర్యామిగా దర్శిస్తారు. అధమ శ్రేణికి చెందిన భక్తులు ‘భగవంతుడు ఉన్నాడు; అదుగో, అక్కడ ఉన్నాడు’ అంటారు. అంటే, ఆకాశానికి పైన ఉన్నాడని వారి ఉద్దేశం. (అందరూ నవ్వారు)
“నాటకంలో గోలోకపు గోపబాలురను చూసి నాకు భగవంతుడే అన్నీ అయి ఉన్నాడన్న బోధ కలిగింది. భగవంతుణ్ణి దర్శించిన వ్యక్తికి ‘ఆయనే కర్త, ఆయనే అన్నీ చేస్తున్నాడు’ అని యథార్థంగా తెలియవస్తుంది.”
గిరీశ్: అయ్యా, భగవంతుడే సమస్తం చేస్తున్నాడని నాకు యథార్థంగా అవగతమయింది.
శ్రీరామకృష్ణులు: నేను ‘అమ్మా! నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపే దానవు. నేను జడాన్ని, నువ్వు చైతన్యవంతం చేసేదానవు. నువ్వు ఎలా చేయిస్తే అలాగే చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను’ అని అంటాను. అయితే అజ్ఞాని ‘నేను కొంత చేస్తున్నాను. భగవంతుడు కొంత చేస్తున్నాడు’ అంటాడు.
35.2.2 కర్మయోగంతో చిత్తశుద్ధి
గిరీశ్: మహాశయా, వాస్తవానికి నేను ఏమీ చెయ్యడం లేదు. మరి అటువంటప్పుడు కర్మల గురించి పట్టించుకోవడం ఎందుకు?
శ్రీరామకృష్ణులు: లేదయ్యా, కర్మ మంచిదే. పొలంలోని రాళ్ళు రప్పలు తొలగించి భూమిని బాగా దున్ని ఏం నాటితే అది మొలకెత్తుతుంది. అయితే కర్మలు నిష్కామ భావంతో ఒనరించాలి.
“పరమహంసలు రెండు రకాలుగా ఉంటారు – జ్ఞానీ పరమహంస, ప్రేమీ పరమహంస. కేవలం తన వరకు జ్ఞానం కలిగితే చాలు అనుకునేవాడు జ్ఞాని. ప్రేమీ పరమహంసలు శుకదేవాదులలా భగవంతుణ్ణి పొందాక లోకశిక్షణ గరపుతారు. కొందరు మామిడిపండు తిని మూతి తుడిచేసుకుంటారు; మరికొందరు ఇతరులతో కలసి పండును పంచుకుంటారు. బావి త్రవ్వడానికి పారలు, గంపలు అవసరం. బావి త్రవ్వేశాక కొంతమంది పారలు, గంపలు బావిలోకి విసిరివేస్తారు. అయితే మరికొంతమంది వాటిని ప్రక్కన ఉంచుతారు – ఎవరైనా పొరుగువారికి ఉపయోగపడుతాయనే ఉద్దేశంతో. శుకదేవుడు లాంటివారు ఇతరుల కోసం పారలు, గంపలు పదిలపరచి ఉంచారు. (గిరీశ్‌తో) నువ్వు కూడా అలాగే చెయ్యాలి.
35.2.3 సర్వదా ‘పాపాన్ని’ తలపోసే వాడు ‘పాపే’ అవుతాడు – అహేతుక భక్తి
గిరీశ్: మీరు నన్ను ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు: నువ్వు జగజ్జనని నామం మీద విశ్వాసం కలిగి ఉండు. సకలం సిద్ధిస్తుంది.
గిరీశ్: అయితే నేను పాపిని.
శ్రీరామకృష్ణులు: సర్వదా, ‘పాపం, పాపం’ అంటూ తలపోసే ధూర్తుడు పాపిగానే మిగులుతాడు.
గిరీశ్: మహాశయా, నేను కూర్చున్న స్థానమే అపవిత్రమైపోతుంది.
శ్రీరామకృష్ణులు: అది నువ్వెలా చెప్పగలవు? వెయ్యి సంవత్సరాలుగా చీకటిలో మ్రగ్గుతున్న గదిలోకి దీపం తెచ్చావనుకో; అప్పుడా గది కాస్తకాస్తగా ప్రకాశవంతమౌతుందా లేక ఒక్కసారిగానా?
గిరీశ్: అంటే మీరు నన్ను ఆశీర్వదించినట్లే.
శ్రీరామకృష్ణులు: నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే – అంతకంటే నేనేం చెప్పగలను? నేనేదో తిని తిరుగాడుతూ ఉంటాను, భగవన్నామం పలుకుతూ ఉంటాను.
గిరీశ్: మహాశయా, ఆ మనస్ఫూర్తి భావమనేది నాకు కొరవడింది. దయచేసి అది కాస్త నాకు ప్రసాదించండి.
శ్రీరామకృష్ణులు: అలా ఇవ్వడానికి నే నెవర్ని? నారదుడు, శుకదేవుడు వంటివారు ఉన్నట్లయితే వారు అలా చేయగలరు.
గిరీశ్: నారదుడు, శుకదేవుడు నాకు కనిపించడం లేదు.అయితే ఇక్కడ మీరే నా ముందు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అలాగే, నీకు విశ్వాసం ఉంది.
కాసేపు అందరూ మౌనంగా ఉన్న తరువాత మళ్ళీ సంభాషణ మొదలయింది.
గిరీశ్: నాకు ఒక కోరిక ఉంది – అహేతుక భక్తిని పొందాలని.
శ్రీరామకృష్ణులు: ఆ భక్తి కేవలం ఈశ్వరకోటికి మాత్రమే జనిస్తుంది. జీవకోటికి కలుగదు.
అందరూ మౌనంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు దృష్టిని పైకి పరపి ఒక పాట పాడసాగారు:
సాధ్యమేన శ్యామ దర్శనం । ప్రతివారికిని
లభ్యమేన కాళిసంపద । ప్రతివారికిని
సత్యమేదో ఏలచూడదు – నా పిచ్చి మనసు
సాధ్యమేన శ్యామ దర్శనం । నాకెన్నడైన
తపములెన్నో చేసియుండియు । సదాశివుడు
శ్యామపాద అరుణ దర్శనం । చేయంగలేడు
మనోమోహనమైన దర్శనం । ఎవ్వారికైనా ॥ సా ॥
అమ్మపాద ధ్యానపరునకు । విలువేమిలేదు
స్వర్గమిచ్చు ఇంద్రభోగము । విలువేమిలేదు
శ్యామకృపావీక్షణంబులు । పైబడినవాడు
బ్రహ్మానందమందు ఈదును । ఆ ధన్యజీవి
అమ్మ పాదపద్మ ధ్యానము । చేతనగునె
దేవతాధిపతికినైనను । సాధ్యమగునె
యోగయోగేశుకైనను । అతిదుర్లభంబు
సాధ్యమేన శ్యామ దర్శనం । ప్రతివారికిని
దీనుడైన కమలకాంతుడు । ఇది తెలిసికూడ
అమ్మ దివ్య పాదపద్మము । కాంక్షించుచుండు
సాధ్యమగున శ్యామ దర్శనం । ప్రతివారికిని
లభ్యమగున కాళిసంపద । ప్రతివారికిని
ఆఖరి చరణాన్ని గిరీశ్ మళ్ళీ పాడాడు:
దీనుడైన కమలకాంతుడు ఇది తెలిసి కూడ
అమ్మ దివ్యపాదపద్మము కాంక్షించుచుండు
35.3 తృతీయ పరిచ్ఛేదం భగవద్దర్శనానికి మార్గం – తీవ్రవైరాగ్యం, వ్యాకులత
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): తీవ్రవైరాగ్యం జనించినప్పుడు భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. ప్రాణాలు విలవిల్లాడిపోవాలి. ‘భగవంతుణ్ణి పొందడం ఎలా?’ అని ఒక శిష్యుడు గురువును అడిగాడు. ‘నాతో పాటురా’ అని గురువు అతణ్ణి ఒక చెరువు వద్దకు తోడ్కొని వెళ్ళి బలవంతంగా నీటిలో ముంచి అదిమిపెట్టాడు – కాసేపటి తరువాత అతణ్ణి నీటిలో నుండి బయటకు లాగి ‘నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది?’ అని అడిగాడు. ‘అయ్యా, ప్రాణాలు విలవిల్లాడి పోయాయి. ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను’ అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు, ‘నాయనా, భగవంతుని కోసం ఈ విధంగా ప్రాణాలు కొట్టుకుపోయినప్పుడు మాత్రమే ఆయన్ను సాక్షాత్కరించుకోగలం’ అన్నాడు.
“అందుకే నేను ‘మూడు రకాల ఆకర్షణలను ఏకం చేసి దానిని భగవన్ముఖం చేస్తే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు’ అని చెబుతాను. అవి: విషయలోలురకు విషయ వస్తువుల పట్ల ఉన్న ఆకర్షణ, పతివ్రతకు భర్త పట్ల ఉన్న ఆకర్షణ, తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ. ఈ మూడు రకాల ప్రేమలను ఏకంచేసి ఆ ప్రేమను భగవంతుని పట్ల చూపగలిగితే తక్షణమే ఆయన సాక్షాత్కారం కలుగుతుంది.
అమ్మా! శ్యామా! యని నీ వార్తితో
ఆక్రోశించిన ఓ మనసా
ఆవేదనగని ఆగగల్గునా
అమ్మ శ్యామ నీ కగుపడకుండగ
“ఆ విధంగా వ్యాకులత చెందితే ఆయన దర్శనం ఇచ్చి తీరవలసి వస్తుంది.
35.3.1 జ్ఞాన, భక్తియోగాల సమన్వయం – కలియుగానికి నారదీయ భక్తే శ్రేష్ఠం
“ఆ రోజు భక్తి అంటే అర్థమేమిటో నీకు చెప్పాను కదా! అది ఏమిటంటే, మనోవాక్కాయాల ద్వారా ఆయన్ను భజించడమే. కాయంతో అంటే శరీరంతో – అంటే చేతుల ద్వారా ఆయన్ను పూజించడం, సేవించడం; పాదాలతో ఆయన నెలవుకు అంటే పవిత్ర ప్రదేశాలకు వెళ్లడం; చెవులతో ఆయన మహిమలను, నామగుణ కీర్తనలను వినడం, కళ్ళతో ఆయన ప్రతిమను దర్శించడం. మనస్సుతో అంటే సర్వదా ఆయన గురించి ధ్యాన చింతనలు చేయడం; ఆయన లీలలను స్మరించడం. వాక్కులతో అంటే ఆయన యొక్క స్తుతిస్తోత్రాలు పఠించడం, నామగుణ కీర్తనలు చేయడం మొదలైనవి.
“కలియుగానికి నారదీయ భక్తే యుక్తమైనది. అంటే సర్వదా ఆయన నామగుణ కీర్తనలు చేయడం. తీరిక అంటూ లేనివారు కనీసం ఉదయం, సాయంత్రం చేతులతో చప్పట్లు చరుస్తూ నిండు మనస్సుతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి.
“ ‘భక్తుణ్ణి నేను’ వల్ల అహంకారం కలుగదు. అది అజ్ఞానాన్ని కలిగించదు. తద్విరుద్ధంగా భగవల్లాభం చేకూరుతుంది. ‘నేను’ అనేది సాధారణమైన ‘నేను’ లాంటిది కాదు. ఇది ఎలాగంటే, హించే ఆకుకూర ఆకుకూరలలోకి రాదు. సాధారణంగా ఆకుకూరలు తింటే అస్వస్థత చేస్తుంది. అయితే హించే ఆకుకూర తినడం మేలు చేస్తుంది; పిత్తనాశం అవుతుంది. కలకండ మిఠాయిలకు చెందినది కాదు. సాధారణంగా మిఠాయిలు తింటే చెరుపు చేస్తుంది. అయితే పటికబెల్లం తినడం వల్ల ఆమ్లవికారం తొలగిపోతుంది.
“నిష్ఠ ద్వారా భక్తి కలుగుతుంది. భక్తి పరిపక్వమైనప్పుడు అది భావంగా మారుతుంది. భావం ఘనీభూతమైనప్పుడు అది మహాభావంగా పరిణమిస్తుంది. అన్నిటికంటే చివరగా ఉన్నది ప్రేమ. ప్రేమ అనేది రజ్జువు (తాడు) లాంటిది. భక్తుడికి ప్రేమ కలిగితే భగవంతుడు అతడికి బద్ధుడవుతాడు, పారిపోలేడు. సామాన్యజీవుడు మహా అయితే భావం వరకు సంప్రాప్తించుకోగలడు. ప్రేమ, మహాభావాలు కేవలం ఈశ్వరకోటికి మాత్రమే సాధ్యం. చైతన్యదేవులకు ఈ స్థితి కలిగింది.
“జ్ఞానయోగం అంటే ఏమిటో తెలుసా? అది స్వస్వరూపాన్ని తెలుసుకునే మార్గం; ‘నా నిజస్వరూపం బ్రహ్మమే’ అన్న బోధ. ప్రహ్లాదుడు అప్పుడప్పుడు స్వస్వరూపంలో నెలకొని ఉండేవాడు. మరికొన్నిసార్లు ‘నేను ఒకడిని, నువ్వు (భగవంతుడు) మరొకడివి’ అనే భావంలో ఉండేవాడు, అప్పుడు భక్తిభావంలో నెలకొని ఉండేవాడు.
“హనుమంతుడు రాముడితో ఇలా అన్నాడు: “ఓ రామా, ఒక్కోసారి నిన్ను పూర్ణుడిగా, నన్ను అంశగా దర్శిస్తూంటాను. మరోసారి నిన్ను ప్రభువుగా, నన్ను దాసుడిగా చూస్తుంటాను. అయితే ఓ రామా, తత్త్వజ్ఞానం కలిగినప్పుడు మాత్రం ‘నువ్వే నేను, నేనే నువ్వు’ గా దర్శిస్తుంటాను.”
గిరీశ్: ఆహా!
35.3.2 సంసారంలో భగవత్సాక్షాత్కారానికి మార్గం
శ్రీరామకృష్ణులు: భగవత్సాక్షాత్కారం సంసారంలో ఎందుకు సాధ్యం కాదు? అయితే వివేక వైరాగ్యాలు ఉండాలి. భగవంతుడే యథార్థమైన వస్తువు, తక్కినవన్నీ అనిత్యమైనవి, కేవలం రెండురోజులు మాత్రమే మనగలిగేవి – ఈ ఎరుక దృఢపడాలి. పైపైనే తేలటం వలన ఏం లాభం? బాగా లోతులోకి మునిగిపోవాలి.
ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబునందు
అట్టడుగు లోతులను అందగలవేని
ప్రభు ప్రేమ రత్నము పొందెద వచట……
శ్రీరామకృష్ణులు: మరో విషయం గుర్తుంచుకోవాలి. సముద్రంలో కామం మొదలైన మొసళ్ళ భయం ఉంటుంది.
గిరీశ్ : యముడి భయం నాకు లేదు.
శ్రీరామకృష్ణులు: అది కాదు. నేను చెబుతోంది కామం మొదలైన మొసళ్ళ భయం గురించి. అందుకే, దూకే ముందు పసుపు రాచుకుని దూకాలి – వివేక వైరాగ్యలనే పసుపు.
“సంసారంలో కొంతమందికి జ్ఞానం కలుగుతుంది. అందుకే గుప్తయోగి, వ్యక్తయోగి అని రెండు రకాల యోగుల గురించి పేర్కోబడి ఉంది. సంసారాన్ని త్యజించినవారు వ్యక్తయోగులు – వారిని అందరూ గుర్తించగలరు. అయితే గుప్తయోగులు సంసారంలోనే జీవిస్తారు, వారు బయటపడరు. ఇది ఎలాగంటే, పనిమనిషి ఇంటి పనులన్నీ చేస్తుంది కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన పిల్లల మీదే ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే, నీకు ఇదివరకు ఒకసారి చెప్పినట్లు, అక్రమ సంబంధం నెరపుతున్న స్త్రీ ఇంటి పనుల నన్నిటినీ ఉత్సాహంతోనే చేస్తుంటుంది కాని ఆమె మనస్సు మాత్రం సర్వదా తన ప్రియుడి మీదనే ఉంటుంది. వివేక వైరాగ్యాలు అలవర్చుకోవడం ఎంతో కష్టం. ‘నేను కర్తను, ఈ వస్తువులన్నీ నావే’ అన్న భావన అంత సులభంగా తొలగిపోదు. నేనొక డిప్టీని చూశాను; అతడికి నెలకు ఎనిమిది వందల రూపాయల జీతమట. ఒకవైపు భగవత్ప్రసంగాలు జరుగుతున్నాయి. అయితే మన డిప్టీగారు మాత్రం వాటి పట్ల మనస్సు ఇసుమంతైనా నిలపలేదు. అతడు తనతోపాటు కొడుకును వెంటబెట్టుకు వచ్చాడు. వాడిని ఒకసారి ఇక్కడ కూర్చోబెట్టడం, మరోసారి అక్కడ కూర్చోబెట్టడం – దీనితోనే సరిపోయింది ఆ డిప్టీకి. మరో వ్యక్తి గురించి నాకు తెలుసు, అయితే అతడి పేరు మాత్రం చెప్పను. అతడు ఎంతగానో జపం చేస్తూండేవాడు కానీ పదివేల రూపాయల కోసం కక్కుర్తిపడి అబద్ధపు సాక్ష్యం చెప్పాడు. అందుకే వివేక వైరాగ్యాలు కలిగివుంటే గృహస్థాశ్రమంలో కూడా భగవత్సాక్షాత్కారం సాధ్యపడుతుందని నేను చెబుతున్నాను.”
గిరీశ్: మరి ఈ పాపి గతి ఏమిటంటారు?
కారుణ్యం ఉట్టిపడే స్వరంలో శ్రీరామకృష్ణులు పైకి చూస్తూ ఈ పాట పాడసాగారు:
హరిపద ధ్యానము నిరతము చేయుము
హరిపద ధ్యానమె పరమపావనము ॥ హ ॥
హరియించును హరి నరకయాతనలు
దూరము చేయును మరణభయంబును
భవతాపంబును పారద్రోలుచు
తరియించును భవనీరధి తృటిలో ॥ హ ॥
ఈ లోకమునకు ఏల వచ్చితివొ
ఎంచి చూడవె ఓ మనసా!
దుష్టచేష్టలకు దుశ్చింతలకును
ఫలమేమైనను గలదె చూడగా ॥ హ ॥
వానిలో మెలగుట మాని వేగమె
శాశ్వతుడగు పరమేశ్వరు గూర్చి
ఈ లోకములో ఇపుడే చేయుము
గాఢతపంబును తీవ్రధ్యానమును ॥ హ ॥
35.3.3 మహామాయ – సీతా రామ లక్ష్మణులు – ముఖ్త్యార్నామా
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ‘తరియించును భవనీరధి తృటిలో.’ మహామాయ ద్వారం నుండి ప్రక్కకు తప్పుకున్నప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది. మహామాయ దయ అవసరం. శక్తి ఉపాసనలు అందు నిమిత్తమే. నువ్వే చూడు. భగవంతుడు మనకు సమీపంలోనే ఉన్నాడు. అయితే ఆయన్ను తెలుసుకోలేము. అందుకు కారణం మహామాయ మధ్యలో ఉండడమే. రామలక్ష్మణులు, సీత వెళుతున్నారు. ముందు రాముడు, మధ్యలో సీత, ఆమె వెనుక లక్ష్మణుడు. లక్ష్మణుడికి రాముడు కేవలం రెండున్నర మూరల దూరంలోనే ఉన్నాడు. అయినప్పటికీ అతడు రాముణ్ణి చూడలేకున్నాడు. ఎందుకంటే సీతాదేవి, అంటే మహామాయ మధ్యన ఉంది కాబట్టి.
“భగవంతుణ్ణి ఉపాసించడానికి ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి. నాకు మూడు భావాలు ఉన్నవి: సంతాన భావం, దాసీభావం, సఖీభావం. దాసీభావం, సఖీభావంలో చాలా రోజులు ఉన్నాను. ఆ సమయంలో స్త్రీల వలె దుస్తులు, నగలు, ఓణీలు ధరించేవాడిని. సంతానభావం అతి శ్రేష్ఠమైనది.
“వీరభావం మంచిది కాదు. కొంతమంది ఈ భావాన్ని ఆశ్రయిస్తారు. ఈ భావం పాటించే వ్యక్తి తనను పురుషుడిగానూ, స్త్రీని ప్రకృతిగానూ భావించుకుంటాడు. అంటే ప్రకృతిని స్త్రీ రూపంలో చూసి, రమించడం ద్వారా ప్రసన్నం చేసుకోవడం. అయితే ఈ భావంలో తరచూ పతనమే సంభవిస్తుంది.”
గిరీశ్: ఒకానొకప్పుడు నేను కూడా అదే భావాన్ని అవలంబించే వాడిని.
శ్రీరామకృష్ణులు గిరీశ్ వంక చింతాక్రాంతులై చూశారు.
గిరీశ్: నాకు ఇంకా ఆ అవరోధం ఉండనే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో సెలవియ్యండి.
శ్రీరామకృష్ణులు కాసేపు ఆలోచించి ఇలా అన్నారు: “భగవంతునికి ముఖ్త్యారునామా నివ్వు. ఆయన్ను ఇచ్ఛవచ్చినట్లు చేసుకోనివ్వు.”
35.4 చతుర్థ పరిచ్ఛేదం భగవత్ప్రేమకు శుద్ధ సత్త్వమే ప్రధానం – సచ్చిదానందం, కారణానందం
తరువాత సంభాషణ శ్రీరామకృష్ణుల బాలభక్తుల వైపు మరలింది.
శ్రీరామకృష్ణులు (గిరీశ్ తదితరులతో): ధ్యానం చేసేటప్పుడు నేను వారి ఆంతరిక లక్షణాల నన్నిటినీ గమనిస్తాను. ఇల్లు, ఆస్తిపాస్తులు సంపాదించాలన్న యోచన వారికి లేదు. స్త్రీ సుఖం పట్ల వారికి ఆసక్తి లేదు. వారిలో వివాహితులైన వారు భార్యతో కలసి నిద్రించరు. విషయం ఏమిటో తెలుసా? రజోగుణం తొలగిపోనిదే, శుద్ధ సత్త్వం కలుగనిదే భగవంతుని పట్ల మనస్సు స్థిరంగా నెలకొనదు. ఆయన పట్ల ప్రేమ జనించదు, ఆయన్ను పొందజాలం.
గిరీశ్: మీరు నన్ను ఆశీర్వదించారు.
శ్రీరామకృష్ణులు: ఎక్కడిది? అయితే నిజమైన తపన కలిగి ఉంటే నువ్వు సాధించగలవని చెప్పాను.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు “ఆనందమయీ!” అని ఉచ్చరిస్తూ సమాధిస్థితిలోకి వెళ్ళి పోయారు. చాలాసేపటి వరకు అదే స్థితిలో ఉన్నారు. కొద్దిగా బాహ్యస్పృహలోకి వచ్చాక “ఆ ధూర్తులందరూ ఎక్కడ ఉన్నారు?” అన్నారు. బాబూరామ్ను పిలుచుకు వచ్చాడు ‘మ’. బాబూరామ్, తక్కిన భక్తుల వంక చూస్తూ శ్రీరామకృష్ణులు, ఇంకా భావపారవశ్యంలోనే ఉండి, “సచ్చిదానందం అనేది మంచిదే. మరి కారణానందం (దివ్యోన్మత్త ఆనందం) సంగతి ఏమిటి?” అన్నారు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు పాడడం ప్రారంభించారు.
తెలిసికొంటి తెలిసికొంటి తెలియదగినదెల్ల నిపుడు
సర్వమెరుగు నొకని నుండె, భావ మర్మమెరిగినాను….
* * *
నేనెందుకు పోవలె కాశీ కంచీ
గంగా గయ ప్రభాసముకూ
కాళీనామమును కలవరించుచు
కడపటి శ్వాసను వదలుచుండగా….
సంభాషణ కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అమ్మను ప్రార్థించేటప్పుడు నేను ‘అమ్మా, నాకు మరేమీ వద్దు. కేవలం శుద్ధభక్తిని మాత్రమే ప్రసాదించు’ అనేవాడిని.”
గిరీశ్ శాంతభావంతో ఉండడం చూసి శ్రీరామకృష్ణులు సంతోషించారు. అతడితో “నీకు ఈ భావమే బాగుంది. శాంత భావమే నీకు యుక్తం” అన్నారు.
శ్రీరామకృష్ణులు థియేటర్ మేనేజర్ గదిలో కూర్చుని ఉన్నారు. ఎవరో వచ్చి “ప్రస్తుతం వివాహ విభ్రాటం నాటకం ప్రదర్శించబోతున్నారు చూస్తారా?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు గిరీశ్‌తో ఇలా అన్నారు: “ఇదేమిటి? ప్రహ్లాద చరిత్ర తరువాత వివాహ విభ్రాటమా? మొదట పాయసం, తరువాత చేదు కాకరకాయల కూరా!”
35.4.1 శ్రీరామకృష్ణులు – నటీమణులు
నాటకం ముగిశాక, గిరీశ్ సూచనల మేరకు నటీమణులు అందరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేయడానికి వచ్చారు. వారందరు ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు. కొందరు ప్రణామం చేస్తూ ఆయన పాదాలను స్పృశించడం భక్తులు గమనించారు. ఆయన వారితో అతి మృదుస్వరంలో “అమ్మా, చాలు! చాలు, అమ్మా!” అంటున్నారు.
నటీమణులందరూ గది వదలిపెట్టి వెళ్ళాక శ్రీరామకృష్ణులు భక్తులతో ‘సర్వమూ ఆయనే. కేవలం రూపాలు మాత్రమే వేరు’ అన్నారు.
బండి సిద్ధంగా ఉంది. గిరీశ్ తదితరులందరూ శ్రీరామకృష్ణులను సాగనంపడానికి వీథిలోకి, బండి వద్దకు వచ్చారు. బండిలోకి ఎక్కుతూనే శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధిమగ్నులైపోయారు. నారాయణ్, మరికొందరు భక్తులు ఆయనతో ఉన్నారు. బండి దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయింది.
35.5 పంచమ పరిచ్ఛేదం ‘మ’, ప్రసన్న, కేదార్, రామ్, నిత్యగోపాల్, తారక్, సురేంద్ర ప్రభృతులతో
శనివారం, డిసెంబర్ 27, 1884
ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు శ్రీరామకృష్ణ పరమహంస దేవులను దర్శించే నిమిత్తం దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చారు. వారిలో కొందరు ఉదయమే వచ్చారు. వారిలో కేదార్, రామ్, నిత్యగోపాల్, తారక్, సురేంద్ర, ‘మ’, శారదాప్రసన్న, ఇంకా పలువురు బాలభక్తులూ ఉన్నారు. శారదాప్రసన్న శీరామకృష్ణులను దర్శించడం ఇదే మొదటిసారి.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): బంకిం ఎక్కడ? అతణ్ణి నీతోపాటు తోడ్కొని రాలేదా?
బంకిం ఒక స్కూలు విద్యార్థి. శ్రీరామకృష్ణులు అతణ్ణి బాగ్‌బజార్‌లో చూడడం జరిగింది. అతణ్ణి దూరం నుండి చూసే శ్రీరామకృష్ణులు “మంచి కుర్రాడు” అన్నారు.
కాసేపటి తరువాత ఆయన భక్తులతో పాటు పంచవటికి వెళ్ళారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి కూర్చున్నారు, కొందరు నిలబడే ఉన్నారు. ఆయన నైఋతి దిశగా తిరిగి పంచవటి అరుగు మీద కూర్చున్నారు. నవ్వుతూ ‘మ’ ను “పుస్తకం తెచ్చావా?” అని అడిగారు.
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: కాస్త చదివి వినిపించు.
35.5.1 దేవీ ఛౌధురాణి పుస్తకం – రాజు కర్తవ్యం
ఆ పుస్తకం పేరు ఏమిటో తెలుసుకోడానికి భక్తులు ఆతుర పడుతున్నారు. దాని పేరు దేవీ చౌధురాణి. ఆ పుస్తకంలో నిష్కామకర్మ గురించి చర్చించబడి ఉందని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. ఆ పుస్తక రచయితయైన బంకించంద్ర ఛటోపాధ్యాయ సుప్రసిద్ధుడని ఆయన విని ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన బంకింను కలుసుకోవడం కూడా జరిగింది. ఆ పుస్తకంలో బంకిం వ్రాసిన విషయాన్నిబట్టి ఆతడి నైజం ఎటువంటిదో తెలుసుకోదలచారు శ్రీరామకృష్ణులు.
‘మ’ ఇలా అన్నాడు: “కథానాయిక ఒక అమ్మాయి. ఆమె భవానీ పాఠక్ అనే బందిపోటు చేతుల్లో పడింది. ఆమె పేరు ప్రఫుల్ల, అయితే బందిపోటు ఆమె పేరును దేవీ చౌధురాణిగా మార్చాడు. భవానీ వస్తుతః మంచివాడే. అతడు, ప్రఫుల్ల చేత అనేక ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠింప చేశాడు; నిష్కామకర్మ చేయడం ఎలాగో కూడా ఆమెకు నేర్పాడు. దుష్టులను దోచి ఆ ధనంతో బీదసాదలకు అన్నం పెట్టేవాడు. అతడు ప్రఫుల్లతో ‘నేను దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాను’ అన్నాడు.”
శ్రీరామకృష్ణులు: అయితే అది రాజు కర్తవ్యం.
‘మ’ : ఒకచోట రచయిత భక్తి గురించి వ్రాశాడు. ప్రఫుల్లతో పాటు ఉండడానికి భవానీ పాఠక్ నిశి అనే అమ్మాయిని పంపాడు. నిశి పరమభక్తురాలు; శ్రీకృష్ణుణ్ణి తన భర్తగా భావించేది. ప్రఫుల్లకు ఇదివరకే వివాహమైంది. ఆమె తండ్రి గతించాడు. తల్లితో కలిసి జీవించేది. ఇరుగు పొరుగువారు ఆమె శీలం గురించి దుష్ప్రచారం చేసి ఆమెను బహిష్కరించడం జరిగింది. అందుచేత ఆమె మామగారు కూడా ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళలేదు, తన కుమారుడితో కాపురం చేయనివ్వలేదు. తరువాత, తన కుమారుడికి మళ్ళీ వివాహం చేశాడు. కాని ప్రఫుల్ల మాత్రం భర్త పట్ల అమితమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండేది.
(శ్రీరామకృష్ణులతో) “అయ్యా, ఇక్కడ నుండి విన్నట్లయితే కథ మీకు బాగా అర్థమవుతుంది.
‘మ’ చదవసాగాడు:
నిశి: నేను భవానీ పాఠక్ కుమార్తెను. ఆయన నాకు తండ్రి. ఒక రకంగా ఆయన
నన్ను కన్యాదానం చేశాడనే చెప్పాలి.
ప్రఫుల్ల: ‘ఒక రకంగా’ అంటే ఏమిటి అర్థం?
నిశి: నేను నా సర్వస్వాన్ని శ్రీకృష్ణుడికే అర్పించాను?
ప్రఫుల్ల: అదెలా?
నిశి : నా రూపలావణ్యాలు, ప్రాణం అన్నీను.
ప్రఫుల్ల: అంటే ఆతడే నీ భర్తా?
నిశి: అవును. ఎందుకంటే నా మీద సంపూర్ణ అధికారం ఉన్నవాడే నాకు భర్త అవుతాడు కాబట్టి.
ప్రఫుల్ల (గాఢంగా నిట్టూరుస్తూ): ఏమో మరి, ఆ సంగతి నాకు తెలియదు. భర్త అంటే ఏమిటో నీకు తెలియదు కాబట్టే నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీకు నిజమైన భర్త కనుక ఉన్నట్లయితే నీ మనస్సు ఎన్నటికీ శ్రీకృష్ణుని వైపుకు మరలేది కాదు.
ప్రఫుల్ల భర్త అయిన బ్రజేశ్వర్ మూర్ఖుడే. తన భార్య తన్ను ఇంతగా ప్రేమిస్తుందన్న సంగతి అతడికి తెలియదాయె.
నిశి: శ్రీకృష్ణుణ్ణి అందరూ ప్రేమించగలరు. ఎందుకంటే అతడి రూపం అనంతం, యౌవనం అనంతం, వైభవం అనంతం.
ఈ అమ్మాయి నిశి, భవానీకి శిష్యురాలు. వాదించడంలో దిట్ట. అయితే ప్రఫుల్లకు చదువుసంధ్యలు లేవు. అందుచేతనే ఆమె నిశి వాదనలకు సమాధానం ఇవ్వలేకపోయింది. కాని హిందూధర్మం రచించిన వాళ్ళకు సమాధానం తెలుసు. భగవంతుడు అనంతుడన్న మాట నిజమే. కాని ఆయన్ను ఈ చిన్ని హృదయ పంజరంలో నింపలేము. హృదయంలో కేవలం పరిమితమైనదానిని మాత్రమే నిలుపుకోగలము. అందుకే హైందవుడు ఆ అనంత జగదీశ్వరుణ్ణి తన హృదయ పంజరంలో పరిమితమైన శ్రీకృష్ణుడిగా ఆరాధిస్తాడు. భర్త మరింత స్పష్టంగా పరిమితమైనవాడు. అందుచేతనే భర్త పట్ల పవిత్రప్రేమ భార్య అలవరచు కున్నట్లయితే, భగవంతుడి వైపు సాగించే ప్రయాణంలో భర్త తొలిమెట్టు అవుతాడు. అందువల్లనే హైందవ స్త్రీకి భర్తే ఏకైక దైవం. హిందూ సమాజంతో పోలిస్తే తక్కిన సమాజాలన్నీ ఈ విషయంలో దిగదుడుపే.
ప్రఫుల్ల అమాయకురాలు. నిశి వాదనలు ఏవీ ఆమెకు అర్థం కాలేదు. నిశితో ఇలా అంది: “సఖీ, నీ వాదనలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు కాని, ఇంతకీ నీ పేరేమిటో నువ్వు చెప్పనే లేదు.”
నిశి: భవానీ పాఠక్ నాకు నిశి (అంటే రాత్రి అని అర్థం) అనే పేరు పెట్టాడు. నేను దివా (అంటే పగలు)కు సోదరిని. ఏదో ఒక రోజు నా సోదరిని నీకు పరిచయం చేస్తాను. అయితే ఇప్పుడు నేను చెబుతున్న విషయం పూర్తి చెయ్యనివ్వు. భగవంతుడే నిజమైన భర్త; ఇంకా, స్త్రీకి భర్తే ఏకైక దైవం. శ్రీకృష్ణుడు అందరికీ దేవుడే. మనం ఇద్దరు దేవుళ్ళను ఎందుకు ఆరాధించాలి? ఈ చిన్ని హృదయపు కొద్దిపాటి భక్తిని రెండుగా విభజిస్తే మిగిలేది ఏముంటుంది?
ప్రఫుల్ల: అవివేకంగా మాట్లాడకు. స్త్రీ భక్తికి పరిధి అంటూ ఏమైనా ఉందా?
నిశి: స్త్రీ ప్రేమకు పరిధి లేదు. అయితే భక్తి అన్నది ఒకటి, ప్రేమ అన్నది మరొకటి.
35.5.2 మొదట సాధన, తరువాతే శాస్త్రాధ్యయనం
పుస్తకంలోని ఈ భాగాన్ని క్లుప్తంగా చెబుతూ, ప్రఫుల్ల చేత భవానీ ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభింప చేశాడని చెప్పాడు ‘మ’. తరువాత చదవడం కొనసాగించాడు:
మొదటి సంవత్సరం ప్రఫుల్ల ఉన్న ఇంట్లోకి భవానీ పురుషులెవర్నీ ప్రవేశించ నివ్వలేదు, ఇంటి బయట ఆమెను పురుషులెవ్వరితోనూ మాట్లాడనివ్వలేదు. రెండవ సంవత్సరం పురుషులతో మాట్లాడకూడదన్న నిబంధన తొలగించబడింది కాని ఆమె ఇంట్లోకి మాత్రం పురుషులెవ్వరూ వెళ్ళరాదన్న నియమం మాత్రం అలాగే కొనసాగింది. మూడవ సంవత్సరం ప్రఫుల్ల శిరోముండనం గావించుకుంది. అప్పుడు భవానీ తాను ఎంచుకొన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె వద్దకు వెళ్ళేవాడు. శిరోముండనం గావించుకున్న ప్రఫుల్ల, తల క్రిందకు దించుకుని వారితో శాస్త్ర విషయాల గురించి మాట్లాడేది.
తరువాత ప్రఫుల్ల శాస్త్రాలను అధ్యయనం చేయడం ప్రారంభించిందని ‘మ’ చదివాడు: ఆమె వ్యాకరణం చదవడం ముగించింది; పిదప రఘువంశం, కుమార సంభవం, శాకుంతలం, నైషధం అధ్యయనం చేసింది. సాంఖ్య వేదాంత న్యాయశాస్త్రాలను కూడా స్వల్పంగా అధ్యయనం చేసింది.
శ్రీరామకృష్ణులు: దీని అర్థం ఏమిటో తెలుసా? శాస్త్రాలను పఠించనిదే జ్ఞానం దక్కదని ఈ పుస్తక రచయిత అభిప్రాయం. మొదట పుస్తక పరిజ్ఞానం, భగవంతుని గురించిన జ్ఞానం అటుపిమ్మటే అని ఇలాంటి వారి తలంపు. అయితే నేను యదుమల్లిక్ను పరిచయం చేసుకోవాలనుకుంటే ముందుగా అతడికి ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, ధనం ఎంత ఉంది, రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయి – ఇవన్నీ తెలుసుకోవలసిన అగత్యం ఉందా ఏమిటి? అందుకు బదులుగా, నేను ఏదో విధంగా యదుమల్లిక్ ఇంట్లోకి – ద్వారపాలకులను మంచి చేసుకునైనా సరే, లేకుంటే వారి దురుసు వర్తనను పట్టించుకోకుండానైనా సరే – ప్రవేశించి అతడితో మాట్లాడాలి. అప్పుడు అతడి ఇళ్ళు వాకిళ్ళు, ఆస్తిపాస్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే అతణ్ణి అడిగితే చాలు, వివరాలన్నీ తెలిసిపోతాయి. అప్పుడు అది నాకు సులభమైన పని. ముందుగా రాముడు వస్తాడు, అతడి వెనుక ఆతడి సంపదలు, అంటే జగత్తు వస్తుంది. అందుకే వాల్మీకి ‘మరా’ అనే మంత్రాన్ని జపించాడు. ‘మ’ అంటే అర్థం భగవంతుడు, తరువాత వచ్చే ‘రా’ అంటే అర్థం జగత్తు, అంటే ఆయన సంపదలు.
భక్తులు శ్రీరామకృష్ణుల వచనాలను శ్రద్ధగా వింటున్నారు.
35.6 షష్ఠ పరిచ్ఛేదం నిష్కామ కర్మ – ఫల త్యాగం, భక్తి
ప్రఫుల్ల కథను చదవడం ‘మ’ కొనసాగించాడు:
అధ్యయనం పూర్తి చేశాక ప్రఫుల్ల చాలాకాలం సాధనలు అనుష్ఠించింది. తరువాత ఒక రోజు భవానీ ఆమె వద్దకు వచ్చి ఆమెకు నిష్కామకర్మ గురించి ఉపదేశించాడు. గీతలోని శ్లోకాన్ని ఉదహరించాడు:
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార ।
అసక్తో హ్యాచన్కర్మ పరమాప్నోతి పూరుషః ॥ (గీత – 3:19)
(భావం: అనాసక్తుడవై సర్వదా కర్మ ఒనరించు. ఎందుకంటే, అనాసక్తితో కర్మ చేయడం వల్ల మనిషి పరమపదాన్ని ప్రాప్తించుకుంటాడు.)
తరువాత భవానీ నిష్కామకర్మ యొక్క మూడు లక్షణాలను తెలిపాడు: మొదటిది ఇంద్రియ సంయమం. రెండవది నిరహంకారం. మూడవది కర్మ ఫలాన్ని శ్రీకృష్ణునికే సమర్పించడం. నిరహంకారం లేకుండా ధర్మాన్ని ఆచరించడం సాధ్యం కాదని కూడా చెప్పాడు. గీతలో నుండి మరో శ్లోకాన్ని ఉదహరించాడు:
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ॥
అహంకార విమూఢాత్మా కర్తా-హ మితి మన్యతే ॥ (గీత – 3:27)
(భావం: సర్వ కర్మలూ ప్రకృతి యొక్క గుణాల ద్వారా నిర్వహింపబడుతున్నాయి. అయితే అహంకారంతో మూఢుడైన వ్యక్తి తన్నుతాను కర్తగా భావించుకుంటున్నాడు.)
తరువాత భవానీ కర్మఫలాన్ని శ్రీకృష్ణునికి సమర్పించే విషయాన్ని వివరించాడు.
గీతలోని ఈ శ్లోకాన్ని ఉదహరించాడు.
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణమ్ ॥ (గీత – 9:27)
(భావం: ఓ కౌంతేయా! నువ్వు ఏం చేసినా సరే, ఏం తిన్నా సరే, ఏ తపస్సు చేసినా సరే – వాటన్నిటినీ నాకు సమర్పణభావంతో చేయి.)
శ్రీరామకృష్ణులు: ఇది బాగానే ఉంది. ఇవి గీతలోని వచనాలు; వీటిని ఎవరూ ఖండించలేరు. కాని మరో విషయం ఒకటి ఉంది. ఈ రచయిత కర్మ ఫలాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించమని చెబుతాడు కానీ ఆతడి పట్ల భక్తిని అలవర్చుకునే విషయం ప్రస్తావించడం లేదు.
‘మ’ : అవును, ఆ విషయం ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడలేదు.
35.6.1 లెక్కలు కట్టే బుద్ధి ఉండకూడదు
“తరువాత ప్రఫుల్ల, భవానీలు ధనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయమై మాట్లాడుకున్నారు. తన సంపదనంతా శ్రీకృష్ణుడికే సమర్పించానని చెప్పింది ప్రఫుల్ల.
‘మ’ పుస్తకంలో నుండి చదవసాగాడు:
ప్రఫుల్ల: నేను చేస్తున్న కర్మల మాదిరి నా సమస్త సంపదలనూ శ్రీకృష్ణునికే అర్పించాను.
భవానీ: సమస్తమూనా?
ప్రఫుల్ల: అవును, సమస్తమూ.
భవానీ: అలా అయితే నువ్వు అనాసక్త భావంతో కర్మలు ఒనరించలేవు. ఆహారం కోసం కర్మలు చేయవలసివస్తే, ఆ కర్మల పట్ల ఆసక్తి జనిస్తుంది. అంటే, నీ ఎదురుగా రెండు మార్గాలు ఉన్నాయి: భిక్షమెత్తడం ద్వారానైనా ఆహారం సంపాదించుకోవాలి, లేకుంటే నీ సొంతధనం పైనన్నా జీవించాలి. చివరకు భిక్షగాడు కూడా తన భిక్షపట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి, దేహ సంరక్షణకై నువ్వు నీ సొంతధనాన్నే ఉపయోగించాలి.
‘మ’ (నవ్వుతూ, శ్రీరామకృష్ణులతో): ఇది లెక్కలు కట్టే బుద్ధి.
శ్రీరామకృష్ణులు: అవును, లెక్కలు కట్టే బుద్ధి అంటే ఇదే. సంసారంలోని వ్యక్తుల ధోరణి అలాగే ఉంటుంది. కాని భగవంతుణ్ణి కోరుకునేవాడు ఆ మార్గంలోనే నిమగ్నమైపోతాడు. దేహ సంరక్షణకై ఇంత కావాలి, అంత కావాలి అంటూ లెక్కలు కట్టడు.
‘మ’ : తరువాత భవానీ, ప్రఫుల్లను ‘ఈ ధనాన్నంతా శ్రీకృష్ణునికి ఎలా సమర్పిస్తావు?’ అని అడిగాడు. ప్రఫుల్ల ఇలా అంది: ‘అలా ఎందుకు అడుగుతున్నావు? శ్రీకృష్ణుడు సకల భూతాలలోను ఉంటున్నాడు. కాబట్టి ఈ ధనాన్ని అందరికీ పంచిపెడతాను.’ ‘మంచిది, మంచిది’ అన్నాడు భవానీ.
భవానీ గీతలో నుండి ఈ శ్లోకాలను ఉదహరించాడు:
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వ మాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥
ఆత్మేపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో-ర్జున ।
సుఖం వా యది వా దుఃఖం స యో గీ పరమో మతః ॥ (గీత 6:30 – 32)
(భావం: నన్ను సర్వభూతాలలోనూ, నా యందు సర్వ భూతాలనూ దర్శించేవాడు నా నుండి ఎన్నటికీ విడివడడు. ఎవడు ఏకత్వమందు సుప్రతిష్ఠితుడై సర్వభూతాలలోనూ ఉన్న నన్ను ఆ భూతాలలోని ఆత్మగా భజిస్తాడో, అతడు ఎలా జీవిస్తున్నప్పటికీ నాయందే జీవిస్తాడు. సర్వత్రా ఉన్న సుఖదుఃఖాలను తన సుఖదుఃఖాలతో సమానంగా చూసే యోగి పరమశ్రేష్ఠుడుగా ఎన్నబడతాడు.)
శ్రీరామకృష్ణులు: ఇవి ఉత్తమ భక్తుని లక్షణాలు.
35.6.2 విషయలంపటుల మాటలు
‘మ’ మళ్ళీ పుస్తకం నుండి చదవసాగాడు.
సర్వభూతాలకు దానం ద్వారా సహాయం చేయాలనుకుంటే కష్టపడి పని చేయవలసి ఉంటుంది. అందుకే కొద్దిపాటి వేషధారణ, ఆడంబరం, విలాసం ప్రదర్శించవలసిన అవసరం ఉంది. అందుకే భవానీ “అప్పుడప్పుడు కొద్దిపాటి దుకాణదారీ బుద్ధి అవసరం” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (తీవ్రంగా): ‘కొద్దిపాటి దుకాణదారీబుద్ధి అవసరం!’ – ఆలోచనలకు అనుగుణంగానే మాటలు కూడా ఉంటాయి. రాత్రింబవళ్ళు విషయ చింతన చేస్తూ, జనులతో కపటంగా వర్తిస్తూ ఉంటే ఆతడి పలుకులు కూడా అలాగే అయిపోతాయి. ముల్లంగి తింటే ముల్లంగి త్రేన్పులే వస్తాయి. దుకాణదారీబుద్ధి గురించి మాట్లాడడానికి బదులుగా అతడు ‘తన్నుతాను అకర్తగా భావించుకుని కర్తవలె పనులు చేయాలి’ అని చెప్పి ఉండవలసింది. ఒక రోజు ఒక వ్యక్తి ఇక్కడ పాట పాడాడు. ఆ పాటలో ‘లాభం’, ‘నష్టం’ అనే పదాలు పదే పదే దొర్లాయి. అతణ్ణి పాడడం ఆపమని చెప్పాను. రాత్రింబవళ్ళు దేని గురించి ఆలోచిస్తామో దాని గురించిన మాటలే వస్తాయి.
35.7 సప్తమ పరిచ్ఛేదం భగవద్దర్శనానికి మార్గం – శ్రీరామకృష్ణుల స్వీయ అనుభవాలు
‘మ’ చదవడం కొనసాగించాడు. రచయిత భగవద్దర్శనం గురించి వర్ణిస్తున్నాడు.
ప్రస్తుతం ప్రఫుల్ల, దేవి చౌధురాణి అయింది. అది వైశాఖ మాసం. నౌకాగృహం డాబాపైన కూర్చుని దేవి దివా, మరో సహచరురాలితో మాట్లాడుతోంది.
చంద్రోదయమయింది. నౌకకు గంగానదిలో లంగరు వేశారు. ‘భగవంతుణ్ణి చూడగలమా’ అనే విషయం మీద సంభాషణ జరుగుతోంది. దేవి ఇలా అంది: “పువ్వుల సువాసనను ముక్కు ద్వారా ఆఘ్రాణించినంత స్పష్టంగా భగవంతుణ్ణి మనసుతో అనుభూతం చేసుకోవచ్చు.”
ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అవును. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభూతం చేసుకొనవచ్చు. అయితే అది ఈ సాధారణ మనస్సుతో కాదు. భగవంతుణ్ణి అనుభూతం చేసుకోగలిగేది శుద్ధ మనస్సు మాత్రమే. ఆ సమయంలో ఈ సాధారణ మనస్సు ఉండదు. మనస్సులో లేశమాత్రమైనా విషయాసక్తి ఉన్నట్లైతే ఆ మనస్సును శుద్ధమైనది అనలేము. మనస్సులోని మాలిన్యాలన్నీ తొలగిపోయి అది శుద్ధమైనప్పుడు దానిని నువ్వు శుద్ధ మనస్సు అనవచ్చు, లేకుంటే శుద్ధ ఆత్మ అనవచ్చు.
35.7.1 యోగ దుర్భిణి – పతివ్రతా ధర్మం
‘మ’ : భగవంతుణ్ణి మనస్సు ద్వారా అంత సులభంగా అనుభూతం చేసుకోలేమని రచయిత తరువాతి పుటలలో వ్రాశాడు. ప్రత్యక్షంగా చూడడానికి దుర్భిణి అవసరమని అతడు అంటాడు. యోగమే ఈ దుర్భిణి: గీతలో చెప్పినట్లు జ్ఞాన, భక్తి, కర్మ యోగాలని యోగం మూడు రకాలు. ఈ యోగ దుర్భిణి ద్వారానే భగవంతుని చూడగలుగుతాం.
శ్రీరామకృష్ణులు: ఇది చాలా మంచి మాట. గీతలోని మాట.
‘మ’ : చివరికి దేవీ చౌధురాణి తన భర్తను కలుసుకుంది. ఎంతో భక్తి పూర్వకంగా ఆమె అతడితో ఇలా అంది: “నువ్వు నా దేవుడివి. నేను వేరే దేవుణ్ణి అర్చించడం నేర్చుకోవాలనుకున్నాను గాని అది సాధ్యపడలేదు. నువ్వు సకల దేవతల స్థానాన్ని ఆక్రమించుకున్నావు.”
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆమె నేర్చుకోలేకపోయింది. దీనినే పతివ్రతా ధర్మం అంటారు. ఇది కూడా ఒక మార్గమే.
పుస్తకం చదవడం పూర్తి అయింది. శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆయన ఏం చెబుతారో అని భక్తులు ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఒక విధంగా, ఇది చెడ్డది ఏమీ కాదు. దీనిని పతివ్రతా ధర్మం అంటారు. భగవంతుణ్ణి విగ్రహరూపంలో పూజించ గలిగినప్పుడు సజీవంగా ఉన్న మానవుని రూపంలో ఎందుకు పూజించలేం? ఈ ప్రపంచంలో మానవుని రూపంలో లీలలను ప్రదర్శిస్తోంది ఆ భగవంతుడే.
35.7.2 శ్రీరామకృష్ణుల బ్రహ్మజ్ఞాని స్థితి – సర్వ భూతాలలో ఈశ్వర దర్శనం
“ఆహా! నేను ఎలాంటి స్థితులు గడిచి వచ్చాను! కొన్ని రోజుల పాటు శివుడు, దుర్గల భావంలో, మరికొన్ని రోజులపాటు రాధాకృష్ణుల భావంలో, మరికొన్ని రోజులపాటు సీతారాముల భావంలోను తాదాత్మ్యం చెంది ఉండే వాడిని. రాధాభావంలో ‘కృష్ణా! కృష్ణా!’ అంటూ కృష్ణుడి కోసం విలపించేవాడిని. సీతాభావంలో ‘రామా! రామా!’ అంటూ విలపించేవాడిని. అయితే లీల అన్నదే ఆఖరి దశ కాదు. ఈ సమస్త భావాలను అనుభూతం చేసుకున్నాక నేను అమ్మతో ఇలా అన్నాను: ‘అమ్మా! ఈ స్థితులన్నింటిలో వియోగం ఉంది. ఇలాంటి వియోగంలేని స్థితి నాకు ప్రసాదించు.’ అటు తరువాత నేను ఎన్నో రోజులపాటు అఖండ సచ్చిదానందుని భావనలో ఉండిపోయాను. గదిలో నుండి దేవీ దేవతల చిత్రపటాలన్నీ తొలగించివేశాను. భగవంతుణ్ణి సర్వభూతాలలోను దర్శించసాగాను. పూజ తొలగిపోయింది. ఈ బిల్వవృక్షం చూస్తున్నారు కదా! దీని ఆకులు కోయడానికి నేను ఆ వృక్షం వద్దకు వెళ్ళేవాడిని. ఒక రోజు ఆకులు కోసేటప్పుడు ఆకులతోపాటు కొద్దిపాటి బెరడు కూడా వచ్చేసింది. వృక్షాన్ని చైతన్యమయంగా దర్శించాను. దానిని గాయపరిచానన్న బాధ కలిగింది. ఒక రోజు దూర్వాగ్రాసాన్ని కోయడానికి ప్రయత్నించాను. అయితే, అలా కోయడానికి మనస్సు ఒప్పుకోలేదు. అప్పుడు బలవంతంగానే దూర్వాగ్రాసాన్ని కోశాను.
“నేను నిమ్మపండును కోయలేను. ఒక రోజు అతికష్టం మీద ‘జై కాళీ’ అంటూ ఆమె ఎదుట బలి ఇచ్చే రీతిలో నిమ్మపండును కోయగలిగాను. మరొక రోజు పువ్వులు కోయబోతున్నాను. అవి చెట్లపైన విరబూసి ఉన్నవి. వెంటనే నాకు విరాట్ దర్శనం కలిగింది. ఆయన పూజ అప్పుడే అయిపోయినట్లు నాకు తోచింది. పూవులన్నీ ఆయన శిరస్సు మీద అలంకరించబడిన పూలగుత్తుల్లాగా అగుపించాయి. అటుపైన పువ్వులు కోయలేకపోయాను.
“భగవంతుడు, మానవుడి ద్వారా కూడా తన లీలను ప్రదర్శిస్తుంటాడు. నేను మానవుణ్ణి సాక్షాత్తూ నారాయణుడిగానే దర్శిస్తాను. కట్టెను రుద్దుతూ ఉన్నప్పుడు అగ్ని జనించే విధంగా ప్రగాడమైన భక్తి ఉన్నట్లయితే మనిషిలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఎర మంచిదైనట్లయితే పెద్ద చేప దాన్ని ఆవురావురు మంటూ తినివేస్తుంది. ప్రేమోన్మాదం కలిగినప్పుడు సకలభూతాలలోనూ భగవంతుణ్ణి చూడవచ్చు. గోపికలు సకలభూతాలలోనూ శ్రీకృష్ణుణ్ణి దర్శించారు, సర్వం కృష్ణమయంగా గాంచారు. వారు ‘నేనే కృష్ణుణ్ణి’ అనేవారు. ఆ సమయంలో వారు భగవదున్మాద స్థితిలో ఉండేవారు. వృక్షాలను చూసి ‘వీరు శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తున్న తపస్వులు’ అనేవారు. గడ్డిని చూసి ‘ఇలా చూడు, శ్రీకృష్ణుడి స్పర్శతో పృథ్వికి రోమాంచితమయింది’ అనేవారు.
35.7.3 పతివ్రతా ధర్మం, విగ్రహారాధన
“పతివ్రతా ధర్మంలో పతియే దేవుడు. అలా ఎందుకు కాకూడదు? భగవంతుణ్ణి విగ్రహం ద్వారా ఆరాధించ గలిగినప్పుడు జీవంతో ఉన్న మనిషి రూపంలో ఆరాధించలేమా ఏమిటి? కాని విగ్రహంలో భగవంతుని ఉనికిని అనుభూతం చేసుకోవాలంటే మూడు విషయాలు అవసరమవుతాయి. మొదటిది పూజారి యొక్క భక్తి. రెండవది విగ్రహం సుందరంగా ఉండాలి. మూడవది గృహస్థుని భక్తి. భక్తుడి మనస్సు చివరగా నరలీలలోనే విలీనమౌతుందని వైష్ణవచరణ్ ఒకసారి అన్నాడు.
35.7.4 భగవద్దర్శనానికి ఉపాయం తీవ్ర వైరాగ్యం
“కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. భగవత్సాక్షాత్కారం కలుగకుండా ఆయన ఈ విధంగా మానవరూపంలో తన లీలలను ప్రదర్శిస్తున్నాడన్న విషయాన్ని దర్శించలేము. భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తి లక్షణం ఏమిటో తెలుసా? అతడికి బాలక స్వభావం ఏర్పడుతుంది. బాలక స్వభావం ఎందుకో తెలుసా? ఎందుకంటే భగవంతుడు కూడా బాలునిలాంటి వాడే కాబట్టి. అందుకే భగవంతుణ్ణి దర్శించినవాడు బాలునిలా అయిపోతాడు.
“భగవద్దర్శనం కావాలి. మరి ఇప్పుడు దాన్ని పొందడం ఎలా అనేదే ప్రశ్న. దానికి ఉపాయం తీవ్ర వైరాగ్యం. భగవంతునితో ‘ఓ జగత్పతీ! నేను నీ జగత్తులో లేనా ఏమిటి? నువ్వు నా మీద దయ చూపవా ఏమిటి? ధూర్తుడా!’ అనగలిగే టటువంటి తీవ్రమైన వైఖరి ఉండాలి.
“నువ్వు ఎవరినయితే ధ్యానిస్తావో ఆతడి స్వభావాన్నే పొందుతావు. శివుణ్ణి పూజించడం ద్వారా శివుడి స్వభావాన్ని పొందుతాము. రామభక్తుడొకడు రాత్రింబవళ్ళు హనుమంతుని చింతన చేసేవాడు. ‘నేను హనుమంతుడినైపోయా’ నని భావించేవాడు. చివరికి అతడికి ఎంతటి దృఢవిశ్వాసం ఏర్పడిందంటే, అతడికి కొద్దిపాటి తోక కూడా మొలిచింది. శివుని అంశలో జ్ఞానం కలుగుతుంది. విష్ణువు అంశలో భక్తి కలుగుతుంది. శివుని అంశ ఉన్నవాడి స్వభావం జ్ఞానిగానూ, విష్ణువు అంశ ఉన్నవాడి స్వభావం భక్తునిగానూ ఉంటుంది.”
35.7.5 అవతార పురుషుడు, జీవుడు
‘మ’ : అయితే మరి చైతన్యదేవుల సంగతి ఏమిటి? ఆయనలో భక్తిజ్ఞానాలు రెండూ కలగలసి ఉండేవని మీరు చెప్పేవారు కదా!
శ్రీరామకృష్ణులు (తీవ్రంగా): ఆయన సంగతి వేరు. ఆయన భగవంతుడి అవతారం. ఆయనకు, జీవునికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయనకు ఎటువంటి వైరాగ్యం ఉండేదంటే, సార్వభౌముడు* ఆయన నాలుక మీద చక్కెర ఉంచినప్పుడు అది గాలికి ఎగిరిపోయింది కానీ తడిగా మాత్రం కాలేదు. ఆయన సర్వదా సమాధిస్థితిలో మగ్నులై ఉండేవారు. ఆయనది ఎంతటి గొప్ప కామ విజయం! ఆయన్ను జీవునితో పోల్చడమా! సింహం మాంసం తింటుంది కాని అది పన్నెండు సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే రమిస్తుంది. పిచ్చుక కేవలం గింజలను మాత్రమే తింటుంది. కాని అది రాత్రింబవళ్ళు రమిస్తూనే ఉంటుంది. అవతార పురుషుడు, జీవుని మధ్య ఉన్న వ్యత్యాసం కూడా అలాంటిదే. జీవుడు కామాన్ని త్యజిస్తాడు కాని బహుశా మళ్ళీ ఏదో ఒకసారి రమిస్తాడు. అతడు నిగ్రహించుకోలేడు.
(‘మ’ తో) “లజ్జ ఎందుకు? భగవంతుణ్ణి అనుభూతం చేసుకొన్నవాడు మనిషిని పురుగులా చూస్తాడు. ‘లజ్జ, ద్వేషం, భయం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం సాధించలేము.’ ఇవన్నీ పాశాలు. అష్టపాశాల గురించి విని ఉన్నావు కదా?
“నిత్యసిద్ధునికి సంసారంలో భయమెందుకు? ఇది పాచికల ఆటలాంటిది. ఇందులో మళ్ళీ పాచికలను విసిరితే ఏమవుతుందోనన్న భయం అతడికి లేదు. కావాలనుకుంటే నిత్యసిద్ధుడు సంసారంలో కూడా మనగలడు. కొంతమంది రెండు కత్తులతోనూ సాము చేయగలరు. అలా సాము చేయడంలో వారి నైపుణ్యం ఎలాంటిదంటే వారి మీదకు రాళ్ళు విసిరితే అవి కత్తులకు తగిలి దూరంగా పడిపోతాయి.”
35.7.6 యోగంతో భగవద్దర్శనం – యోగి లక్షణాలు
భక్తుడు: అయ్యా, భగవంతుణ్ణి దర్శించడం ఎలా?
శ్రీరామకృష్ణులు: మనస్సును సంపూర్ణంగా భగవంతునిపైన లగ్నం చేయనిదే ఆయన్ను దర్శించగలమా ఏమిటి? భాగవతంలో శుకదేవుని గురించి ప్రస్తావన ఉంది. నడుస్తూ వెళ్ళేటప్పుడు అతడు కరవాలం ధరించిన సైనికుడిలా వెళ్ళేవాడు; దృష్టి స్థిరంగా ఉండేది, అటూ ఇటూ ఎక్కడకు మరలేది కాదు. కేవలం ఒకే ఒక్క లక్ష్యం; ఆ లక్ష్యం భగవంతుడే. దీనినే యోగం అంటారు.
“చాతకపక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. గంగ, యమున, గోదావరి, ఇంకా తక్కిన నదులన్నీ పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సప్త సముద్రాలూ పరిపూర్ణంగా ఉంటాయి. అయినా కూడా చాతకపక్షి ఆ నీటిని తాగనే తాగదు. అది కేవలం మేఘం నుండి జాలువారే నీటిని మాత్రమే తాగుతుంది.
“అలాంటి యోగాన్ని అలవర్చుకున్నవాడు భగవంతుణ్ణి దర్శించగలడు. థియేటరులో కూర్చున్న ప్రేక్షకులు, తెర ఎత్తనంత వరకు ఇల్లు, ఆఫీసు, స్కూలు మొదలైన విషయాలు మాట్లాడుకుంటుంటారు. తెర ఎత్తగానే ఈ సంభాషణ అంతా ఆగిపోతుంది. వారు నాటకాన్ని తదేక దృష్టితో చూస్తారు. చాలా సేపటి తరువాత ఎవరైనా ఒకటి రెండు మాటలు మాట్లాడినా అవి నాటకం గురించే అయివుంటాయి.
“త్రాగుబోతు మద్యం సేవించాక అతడు కేవలం మద్యపానంలోని ఆనందం గురించి మాత్రమే మాట్లాడతాడు.”
35.8 అష్టమ పరిచ్ఛేదం నిత్యగోపాల్, కేదార్ తదితర భక్తులతో
శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిత్యగోపాల్ కూర్చుని ఉన్నాడు. అతడు సర్వదా భావావస్థలో ఉంటున్నాడు; నోటమాట లేదు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): గోపాల్! నువ్వెందుకు అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు?
నిత్యగోపాల్ బాలుడిలా “ఏమో – నాకు – తెలియదు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: అర్థమయింది. నువ్వెందుకు మాట్లాడడం లేదో అర్థమయింది. నువ్వు బహుశా ఏమైనా అపరాధం జరిగిపోతుందేమోనని భయపడుతున్నావు. నువ్వు చేస్తున్నది సరైనదే. జయ విజయులు శ్రీమన్నారాయణుడి వద్ద ద్వారపాలకులుగా ఉండేవారు. సనక సనందాది ఋషులను వారు లోనికి వెళ్ళడానికి అనుమతించలేదు. ఈ అపరాధం కారణంగా జయవిజయులు భూమ్మీద మూడుసార్లు జన్మనెత్తవలసి వచ్చింది.
“ఇంకా, శ్రీదాముని గురించి కూడా ఉంది కదా! అతడు గోలోకంలో విరజకు (శ్రీకృష్ణుని సహచరురాలు) ద్వారపాలకుడుగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు విరజ ఇంట్లో ఉండేటప్పుడు ఆతణ్ణి పట్టుకోవాలనే ఉద్దేశంతో రాధాదేవి ఆమె ఇంట్లోకి ప్రవేశించబోయింది. అయితే శ్రీదాముడు ఆమెను వెళ్ళనివ్వలేదు. అప్పుడు రాధ శ్రీదాముణ్ణి మర్త్యలోకంలో అసురుడిగా జన్మించమని శపించింది. తరువాత శ్రీదాముడు కూడా ఆమెకు ప్రతిశాపం ఇచ్చాడు.
“అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లవాడు తండ్రి చేయిపట్టుకుని నడిచేటప్పుడు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాని తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నప్పుడు వాడికి భయమెందుకు?”
శ్రీదాముని కథ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది.
కేదార్ ఛటర్జీ ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే అతడికి కలకత్తా నుండి ఢాకాకు బదిలీ అయింది. అతడు శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. అతడి ద్వారా ఢాకాలో కూడా అనేకమంది భక్తులు తయారయ్యారు. వారందరూ తరచూ అతడి వద్దకు ఉపదేశం నిమిత్తం వస్తూంటారు. ఆధ్యాత్మిక పథాన్ని అనుసరిస్తున్న వ్యక్తి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి భక్తులు ఆతడి వద్దకు మిఠాయిలు మొదలైన వాటిని తీసుకు వస్తుంటారు.
35.8.1 వివిధ రకాల భక్తుల కోసం శ్రీరామకృష్ణుల పలురకాల భావాలు, స్థితులు
కేదార్ (వినయపూర్వకంగా, శ్రీరామకృష్ణులతో): అయ్యా, భక్తులు అలా సమర్పించే వాటిని నేను తినవచ్చునా?
శ్రీరామకృష్ణులు: వారు ఆ వస్తువులను భగవంతుని పట్ల భక్తి భావంతో సమర్పించినట్లయితే దాన్లో ఎలాంటి దోషమూ లేదు. కాని ఏమైనా కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో వారు ఇస్తే వాటితో ప్రమాదమే సుమా!
కేదార్: భక్తులకు నేను విషయాన్నంతా వివరించాను. ప్రస్తుతం నేను నిశ్చింతగా ఉన్నాను. నా పట్ల అనుగ్రహం చూపిన వ్యక్తికి (శ్రీరామకృష్ణులు) సర్వం తెలుసునని నేను వారితో చెప్పాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ మాట నిజమే. నువ్వే చూడు. ఇక్కడకు అన్ని రకాలవారూ వస్తుంటారు. అందుకే అన్ని రకాల భావాలూ ఇక్కడ కానవస్తాయి.
కేదార్: నానా విషయాలను తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు లేదు? ప్రతిదీ కాస్త కాస్త తెలుసుకుని ఉండాలి. చిల్లర అంగడి పెట్టిన వ్యక్తి అందులో అన్ని రకాల వస్తువులూ పెడతాడు; కొద్దిగా పప్పు దినుసులు పెడతాడు, కొద్దిగా చింతపండు కూడా పెడతాడు. సంగీతంలో ప్రవీణుడైన వ్యక్తికి కాస్తోకూస్తో అన్ని రకాల వాయిద్యాలనూ వాయించడం తెలిసే ఉంటుంది.
శ్రీరామకృష్ణులు గది నుండి బయటకు వచ్చి సరుగుడు తోపు వైపుకు వెళ్ళారు. ఒక భక్తుడు వెంట వెళ్ళి అక్కడ ఒక చెంబు పెట్టి వచ్చాడు.
భక్తులు తోటలో పచార్లు చేస్తున్నారు. కొందరు శ్రీరామకృష్ణుల గదికి వెళ్ళి పోయారు, మరికొందరు పంచవటికి వెళ్ళి ఆయన్ను అక్కడే కలుసుకున్నారు. ఆయన వారితో ఇలా అన్నారు: “అజీర్తి చేసింది. మల్లిక్ కుటుంబీకుల ఇంట్లో భోజనం చేశాను. వారు ఉత్త లౌకికులు.”
శ్రీరామకృష్ణుల తాంబూలం డబ్బా, ఇంకా ఒకటి రెండు వస్తువులు పంచవటి అరుగుమీద ఉన్నాయి. వాటిని తీసుకురమ్మని ఆయన ‘మ’ కు చెప్పారు. తరువాత తమ గది వైపుగా వెళ్ళారు, భక్తులు ఆయన్ను అనుసరించారు.
మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత భక్తులు కొందరు వచ్చారు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద దిండును ఆనుకొని కూర్చున్నారు.
35.8.2 ఏదో ఒక భావంలో సాధన చేయాలి -ఏకకాలంలో జ్ఞానం, భక్తి భావాల సాధన
ఒక భక్తుడు: అయ్యా, బుద్ధి ద్వారా భగవంతుని గుణాలను తెలుసుకోగలమా?
శ్రీరామకృష్ణులు: తప్పకుండా. అయితే అది ఈ బుద్ధితో కాదు. భగవంతుణ్ణి అంత సులువుగా తెలుసుకోగలమా ఏమిటి? అందుకు సాధన చేయాలి. ఇంకా, భగవంతుని పట్ల ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి; ఉదాహరణకు, దాస్యభావం. ఋషులు శాంతభావాన్ని కలిగి ఉండేవారు. జ్ఞానుల భావం ఏమిటో తెలుసా? అది స్వస్వరూప జ్ఞానం. (నవ్వుతూ, ఒక భక్తుడితో) నీ భావం ఏమిటి?
ఆ భక్తుడు ఏమీ బదులు చెప్పలేదు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నీకు రెండు భావాలూ ఉన్నాయి. నువ్వు స్వస్వరూప ధ్యానమూ చేస్తావు, దాస్యభావాన్నీ అవలంబిస్తావు. ఏమంటావ్, నిజమే కదా?
భక్తుడు నవ్వుతూ, సంకోచంతో “అవునండీ” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అందుకే నేను ఇతరుల మనస్సులోని భావాలను పసిగట్టగలనని హాజ్రా అంటూ ఉంటాడు.
“ఎంతో పురోగమించిన పిదపే అలా రెండు భావాలనూ అలవర్చుకోగలం. ప్రహ్లాదుడు అలా చేసేవాడు. కాని ఆ విధంగా సాధన చేయడానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది.
“మరో దృష్టాంతం విను. ఎవరైనా వ్యక్తి రేగికంపను గట్టిగా పట్టుకుని ఉన్నాడనుకో. అతడి చేతుల నుండి ధారాపాతంగా రక్తం కారుతుంది. అయినా కూడా అతడు ‘ఏముంది, నాకు ఏమీ కాలేదు, నాకు గాయం ఏమీ కాలేదు’ అంటాడు. అతడి చేతికి కలిగిన గాయం గురించి అడిగినట్లయితే అతడు ‘బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను’ అంటాడు. ఈ విధంగా కేవలం నోటి మాటలు చెప్పడం వల్ల ఏమిటి ప్రయోజనం? భావసాధన చేయాలి.”
భక్తులు అమిత శ్రద్ధతో శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను వింటున్నారు.