34.1 ప్రథమ పరిచ్ఛేదం అధర్ ఇంట్లో శ్రీరామకృష్ణులు – బంకించంద్రతో సంభాషణ
శనివారం, డిసెంబరు 6, 1884
అధర్సేన్ శ్రీరామకృష్ణులకు ప్రియతమ భక్తుడు. అతడి వయస్సు 29 లేక 30 సంవత్సరాలు ఉండవచ్చు. కలకత్తాలో ఉత్తర ప్రాంతంలోని శోభాబజార్లో నివసించేవాడు, డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా పనిచేసేవాడు. రోజంతా ఆఫీసులో కష్టపడి పని చేశాక సాయంకాలం ఇంటికి వెళ్ళి, కాళ్ళు చేతులు కడుక్కుని అక్కడి నుండి బాడుగ బండిలో దక్షిణేశ్వరానికి వెళ్ళేవాడు. అయితే శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను వినడానికి అతడికి అంతగా అవకాశం ఉండేది కాదు; ఎందుకంటే ఆయనకు ప్రణామం చేశాక అతడు ఆలయమూర్తుల సందర్శనానికి వెళ్ళేవాడు. తరువాత శ్రీరామకృష్ణుల గదికి వచ్చి ఆయన ఆదేశం మేరకు క్రింద పరచివున్న చాప మీద విశ్రమించేవాడు. రోజంతా కష్టపడి పనిచేసి ఉండటం వల్ల అతడికి వెంటనే నిద్రపట్టేసేది. తొమ్మిది లేక పది గంటల ప్రాంతంలో అతణ్ణి ఎవరైనా నిద్ర లేపేవారు. అతడు లేచి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి బాడుగ బండిలో ఇంటికి వెళ్ళిపోయేవాడు. అయితే అతడి ఆనందమంతా శ్రీరామకృష్ణులను దర్శించడంలోనే ఉండేది.
అతడి అభ్యర్థన మేరకు శ్రీరామకృష్ణులు తరచూ అతడి ఇంటికి వెళ్ళేవారు. ఆ సందర్భాలలో అతడు పెద్ద ఉత్సవాలనే నిర్వహించేవాడు. అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు సమావేశమయ్యేవారు. అధర్ వారిని షడ్రసోపేత విందుభోజనాలతో సత్కరించేవాడు. ఒక రోజు శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు ఆయనతో ఇలా అన్నాడు: “అయ్యా, మీరు చాలా రోజులుగా మా ఇంటికి రాలేదు. ఆ కారణంగా ఇల్లంతా బోసిపోయినట్లు ఉంది, అదోరకమైన వాసన కొడుతోంది. అయితే ఇవాళ మీ రాకతో ఇల్లంతా ఎలా కళకళలాడుతోందో చూడండి! మీ ఉనికి కారణంగా ఇల్లు సుగంధంతో గుబాళిస్తోంది. ఈ రోజు నేను భగవంతుణ్ణి ఎంతో ఆర్తితో ప్రార్థించాను, కన్నీరు కూడా కార్చాను.” అది విని శ్రీరామకృష్ణులు కరుణాపూరిత దృక్కులతో “నిజంగా!” అన్నారు.
నేడు శ్రీరామకృష్ణులు భక్తులతో కలసి అధర్సేన్ ఇంటికి విచ్చేశారు. అందరి హృదయాలు ఆనందంతో పరవశించిపోతున్నాయి. అధర్ ఇవాళ పెద్ద విందుభోజనమే ఏర్పాటుచేశాడు. చాలామంది క్రొత్తవారు కూడా వచ్చారు. అధర్ ఆహ్వానం మేరకు పలువురు డిప్యూటీ మేజిస్ట్రేట్లు కూడా అక్కడ సమావేశమయ్యారు. శ్రీరామకృష్ణులను దర్శించి ఆయన నిజంగానే మహాపురుషుడా అన్న విషయం స్వయంగా నిర్ధారించుకోవడానికి వారు వచ్చారు. వారిలో బంకించంద్ర ఛటోపాధ్యాయ కూడా ఉన్నాడు. 19 వ శతాబ్ద ఉత్తరార్ధపు వంగసాహితీవేత్తలలో ఆయన్ను అగ్రగణ్యునిగా పేర్కోవచ్చు. ఆధునిక వంగ సాహిత్యానికి రూపురేఖలు కల్పించింది ఆయనే. సామాజిక, మతపరమైన ఇతివృత్తాలపైన ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు. సుప్రసిద్ధ వందేమాతర గీతం ఆయన రచించిన ‘ఆనంద మఠం’ అనే నవల లోనిదే. ఆయనపైన పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం కూడా ఉంది. ప్రాచీన హిందూ గ్రంథాలకు నూతన వ్యాఖ్యానాలు చేసి ఆయన సామాజికపరంగా విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించాడు.
శ్రీరామకృష్ణులు దరహాసవదనంతో భక్తులతో సంభాషిస్తున్నారు. అధర్ తన స్నేహితులను ఆయనకు పరిచయం చేశాడు.
అధర్ (బంకింను చూపుతూ శ్రీరామకృష్ణులతో): మహాశయా, ఈయన గొప్ప పండితుడు. ఎన్నో పుస్తకాలు కూడా రచించాడు. మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. ఈయన పేరు బంకిం బాబు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): బంకిం* ఏమండీ, మీరు అలా వంగి ఉండడానికి ఏమిటి కారణం?
బంకిం (నవ్వుతూ): మహాశయా, అందుకు బూటు దెబ్బలే కారణం. (అందరూ నవ్వారు) ఆంగ్ల సాహెబుల బూటు దెబ్బలు తిని నేను అలా వంగిపోయాను.
34.1.1 త్రిభంగి, రాధాకృష్ణులు
శ్రీరామకృష్ణులు: పారవశ్యప్రేమలో శ్రీకృష్ణుడు అలా వంగిపోయేవాడు. రాధాదేవి పట్ల ప్రేమ కారణంగా అతడి శరీరం అలా త్రిభంగిగా అయిపోయి ఉండేదని అతడి రూపం గురించి కొంత మంది వ్యాఖ్యానం ఇస్తుంటారు. శ్రీకృష్ణుడు నలుపు రంగులో ఎందుకు ఉండేవాడో తెలుసా? పైగా, అంత కురచగా – కేవలం మూడున్నర మూరల ఎత్తులో ఎందుకు ఉండేవాడు? భగవంతుడు దూరంగా ఉన్నంత వరకు ఆయన అలాగే కానవస్తాడు. దూరం నుండి చూసినప్పుడు సముద్రపు నీరు నీలి రంగులో కనిపించడం లాంటిది అది. అయితే ఆ నీటికి సమీపంగా వెళ్ళి, దానిని చేతిలోకి తీసుకొన్నట్లయితే అది అటుపైన నీలిరంగులో ఉండదు, శ్వేతవర్ణంలో పారదర్శకంగా ఉంటుంది. దూరం నుండి చూడడం వల్ల సూర్యుడు కూడా చిన్నగా కనిపిస్తాడు. సమీపానికి వెళ్ళేకొద్దీ అలా చిన్నగా కనిపించడు. భగవంతుని యథార్థ స్వరూపం తెలుసుకున్నప్పుడు ఆయన నీలం రంగులోనూ ఉండడు, కురచగానూ ఉండడు. అయితే అది సుదూరమైన విషయం. సమాధిస్థితిని పొందకుండా ఆ విషయం అవగతం కాదు. ‘నేను’, ‘నువ్వు’ ఉన్నంతవరకు నామరూపాలు కూడా ఉంటాయి. సర్వమూ భగవంతుని లీలయే. ‘నేను’, ‘నువ్వు’ ల ఎరుక ఉన్నంత వరకు, భగవంతుడు నానారూపాలుగా వ్యక్తమవుతూనే ఉంటాడు.
“శ్రీకృష్ణుడు పురుషుడు, శ్రీమతి (రాధాదేవి) ఆతడి శక్తి – ఆద్యాశక్తి. వారిద్దరూ పురుషప్రకృతులు. యుగళమూర్తి అర్థమేమిటో తెలుసా? పురుషుడు, ప్రకృతులు అభేదాలు. వాటి మధ్య ఎటువంటి భేదమూ ఉండదు. ప్రకృతి లేకుండా పురుషుడు ఉండలేడు, అలాగే పురుషుడు లేకుండా ప్రకృతీ ఉండలేదు. వీటిలో ఒకదానిని చెప్పినట్లయితే దానికి తోడుగా రెండవదానిని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇది అగ్ని, దాని దాహకశక్తి వంటిది. దాహకశక్తి లేకుండా అగ్నిని గురించి మనం ఆలోచించలేం. అదేవిధంగా అగ్నిని వదలిపెట్టి కేవలం దాహకశక్తిని మాత్రమే కూడా ఊహించలేం. అందుకే యుగళమూర్తిలో శ్రీకృష్ణుని దృష్టి రాధ వైపు, రాధ దృష్టి శ్రీకృష్ణుని వైపూ ఉంటుంది.
రాధ గౌరవర్ణంలో ఉంటుంది – మెరుపులా; అందుకే కృష్ణుడు పీతాంబరాలు ధరిస్తాడు. దానితోపాటు ఆమె నీలమణి కూడా ధరిస్తుంది. రాధ పాదాలకు గజ్జెలు కడుతుంది. అందుకే కృష్ణుడు కూడా గజ్జెలు కడతాడు. అంటే, పురుష ప్రకృతుల మధ్య బాహ్యాభ్యంతరాలలో పొంతన ఉంది.”
శ్రీరామకృష్ణులు ఈ మాటలు ముగించేసరికి బంకిం, ఆయన స్నేహితులు ఆంగ్లంలో మెల్లగా మాట్లాడుకోసాగారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, బంకిం తదితరులతో): ఏమండీ, మీరందరూ ఆంగ్లంలో ఏం మాట్లాడుకుంటున్నారు? (అందరూ నవ్వారు)
అధర్: అయ్యా, ఇంతవరకు మీరు చెప్పిన విషయాలను గురించే, శ్రీకృష్ణుని రూపం గురించి మీ రిచ్చిన వ్యాఖ్యానం
గురించే మాట్లాడుకుంటున్నాం.
బంకించంద్ర చటర్జీ
34.1.2 ‘డామ్’ – శ్రీరామకృష్ణులు చెప్పిన తమాషా కథ
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నాకు ఒక తమాషా కథ గుర్తుకు వచ్చి నవ్వొస్తుంది. ఒక కథ చెబుతాను వినండి: ఒకసారి క్షురకుడొకడు ఒక పెద్దమనిషికి క్షవరం చేయడానికి వెళ్ళాడు. క్షవరం చేస్తున్నప్పుడు ఆ పెద్దమనిషికి కొద్దిగా గాటు పడింది. వెంటనే ఆయన ‘డామ్’ అని అరిచాడు. అయితే ఆ క్షురకుడికి డామ్ అంటే అర్థం ఏమిటో తెలియదాయె. అతడు తన క్షవరం కత్తి, ఇతర సామాగ్రినంతటినీ ప్రక్కన పెట్టి, చొక్కా చేతులను మడుచుకొన్నాడు – అది శీతాకాలం. పిదప ఆ పెద్దమనిషితో ఇలా అన్నాడు: ‘ఇందాక నువ్వు నన్ను డామ్ అన్నావు. దాని అర్థమేమిటో నువ్వు చెప్పి తీరాలి.’ అందుకు ఆ పెద్దమనిషి, ‘తమ్ముడూ, ఆ పదానికి విశేషమైన అర్థమంటూ ఏమీ లేదులే. నువ్వు నీ క్షవరం పని కానివ్వు, అయితే కాస్త జాగ్రత్తగా చెయ్యి’ అన్నాడు. కాని క్షురకుడు అంత సులభంగా వదలే రకం కాదు. ఆ పెద్దమనిషితో ఇలా అన్నాడు: ‘డామ్ అన్న పదానికి అర్థం మంచిది అయిన పక్షంలో నేను డామ్, మా నాన్నగారు డామ్, మా పద్నాలుగు తరాలూ డామ్. (అందరూ నవ్వారు) కాని దానికి చెడు అర్థం వస్తే నువ్వు డామ్, మీ నాన్నగారు డామ్, మీ పద్నాలుగు తరాలూ డామ్యే. (అందరూ నవ్వారు) వట్టి డామ్యే కాదు, ‘డామ్–డామ్–డామ్–డామ్–డామ్’.
అందరూ గొల్లున నవ్వసాగారు. నవ్వులు సద్దుమణిగాక బంకిం సంభాషణ ప్రారంభించాడు.
34.2 ద్వితీయ పరిచ్ఛేదం ప్రచారం – శ్రీరామకృష్ణులు
బంకిం: అయ్యా, మీరు ప్రచారం చేయరు ఎందుకని?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ప్రచారమా? ప్రచారం చేయాలని మనిషిని అలా తలపింప చేసేది ఆతడి దర్పమే. మనిషి కేవలం ఒక అల్పజీవి మాత్రమే. ప్రచారం చేసేది ఆ భగవంతుడే. ఎవరైతే ఈ సూర్యచంద్రులను సృష్టించాడో, ఈ జగత్తును ప్రకాశింప చేస్తున్నాడో ఆ భగవంతుడే ప్రచారం చేస్తాడు. ప్రచారం చేయడమనేది సామాన్య విషయమా ఏమిటి? ఆయన సాక్షాత్కరించి ఆదేశం ఇవ్వకుంటే ప్రచారం జరగదు. అయితే ఎవరైనా ప్రచారం చేయాలనుకుంటే అతణ్ణి ఎవరూ ఆపలేరు. భగవంతుని ఆదేశమైతే లభించలేదు కానీ అతడు మాత్రం వాగుతూనే ఉంటాడు. జనం అతడి మాటలను ఏదో ఒకటి రెండు రోజుల పాటు మాత్రమే వింటారు. తరువాత దాన్ని గురించి అంతా మరచిపోతారు. అది కేవలం పాలపొంగు లాంటిది. అతడు మాట్లాడుతున్నంత సేపు జనం ‘ఆహా! ఏం మాట్లాడుతున్నాడు!’ అంటారు. అతడు మాట్లాడటం ఆపగానే అంతా మాయమైపోతుంది.
“పాత్ర కింద మంట ఉన్నంతవరకు పాత్రలోని పాలు ‘సుయ్’ మంటూ పొంగుతాయి. మంటను తీసివేసి చూడు, పాలు మళ్ళీ మునుపటిలాగానే చల్లారి పోతాయి.
“సాధనలు చేసి శక్తిని పెంపొందించుకోవాలి. లేకుంటే ప్రచారం జరగదు. ‘నీకు స్వయంగా పడుకోడానికి చోటు లేదు కానీ మరొకడిని కూడా వచ్చి పడుకోమని పిలుస్తున్నావు’ అనే సామెత ఉంది కదా! నీకు పడుకోడానికే చోటు లేదు. అయితే నువ్వు మాత్రం ‘రా, మిత్రమా, రా! ఇక్కడకు వచ్చి నాతో పాటు పడుకో’ అని పిలిచినట్లుంది వ్యవహారం. (నవ్వులు)
“కామార్పుకూర్లోని హల్దార్పుకూర్ చెరువు గట్టున కొంతమంది ప్రతిరోజూ బయలుకు పోయేవారు. ప్రాతఃకాలంలో అక్కడకు వచ్చిన గ్రామస్థులు అది చూసి వారిని తిట్టిపోసేవారు. అయితే వారు మాత్రం అక్కడ బయలుకు వెళ్ళడం మానలేదు. చివరకు గ్రామస్థులు కంపెనీవారికి అర్జీ పెట్టుకున్నారు. అప్పుడు కంపెనీ బంట్రోతు ఒకడు అక్కడకు వచ్చి ‘ఇక్కడ ఎవరూ మలమూత్రాలను విసర్జించరాదు. అలా చేసిన వారికి శిక్ష పడుతుంది’ అని నోటీసు పెట్టి వెళ్ళాడు. దానితో ఒక్కసారిగా వారు చేస్తున్న నిర్వాకం ఆగిపోయింది, మళ్ళీ ఏ గొడవా లేదు. అది కంపెనీవారి హుకుం కదా! అందరూ దాన్ని శిరసావహించ వలసిందే.
“అదే విధంగా భగవంతుడు సాక్షాత్కరించి ఆదేశం ఇచ్చినట్లయితే అప్పుడు ప్రచారం చెయ్యవచ్చు, లోకశిక్షణ చెయ్యవచ్చు. లేకుంటే, నీ మాటలు వినేవారెవరు?”
అందరూ శ్రద్ధగా, ఈ మాటలను వింటున్నారు.
34.2.1 మరణానంతరం – పరలోకం
శ్రీరామకృష్ణులు (బంకింతో): మీరు గొప్ప పండితులు కదా! ఎన్నో పుస్తకాలు కూడా రచించారు. మనిషి కర్తవ్యాలు ఏమిటంటారు? మరణం తరువాత అతడికి తోడుగా వెళ్ళేవి ఏమిటి? మీరు పరలోకాలను విశ్వసిస్తారు కదా?
బంకిం: పరలోకాలా? అవేమిటండి?
శ్రీరామకృష్ణులు: అవును. జ్ఞానం పొందిన తరువాత మరణిస్తే అప్పుడు పరలోకాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు, పునర్జన్మ ఉండదు. కాని జ్ఞానం ప్రాప్తించనంత వరకు, భగవల్లబ్ధి కలుగనంతవరకు సంసారంలోకి తిరిగి రావలసి ఉంటుంది, ఏ విధంగానూ తప్పించుకోలేము. అటువంటి వ్యక్తికి పరలోకాలు కూడా ఉండనే ఉంటాయి. అయితే జ్ఞానప్రాప్తి పొందాక, భగవద్దర్శనం కలిగాక, ముక్తిని గడించాక మళ్ళీ రావలసిన పని లేదు. ఉడకబెట్టిన ధాన్యాన్ని నాటితే అది మొలకెత్తదు. అదే విధంగా ఎవరైనా వ్యక్తి జ్ఞానాగ్నిలో పరిపక్వత చెందితే అటు పిమ్మట అతడు సృష్టి విలాసంలో పాల్గొనలేడు, సంసార జీవితం గడపలేడు; కామినీ కాంచనాల పట్ల అతడికి అనురక్తి ఉండదు. ఉడకబెట్టిన ధాన్యాన్ని పొలంలో నాటడం వల్ల ఏం ప్రయోజనం?
బంకిం (నవ్వుతూ): అయ్యా, మరి అలాగంటే కలుపు మొక్కల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
శ్రీరామకృష్ణులు: అయితే నువ్వు జ్ఞానిని కలుపుమొక్క అనలేవు. భగవంతుని దర్శనం పొందినవాడు అమృత ఫలాన్ని ప్రాప్తించుకున్న వాడవుతాడు, అంతే కాని అది ఏదో సొరకాయో, గుమ్మడికాయో కాదు. అతడికి పునర్జన్మ ఉండదు. పృథ్విలో కానీ, సూర్యలోకంలో కానీ, చంద్రలోకంలో కానీ – ఎక్కడా వారికి మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు.
“ఉపమాన ప్రమాణం ఏకపక్షమైనది. మీరు పండితులు, తర్కం చదవలేదా. ఎవరైనా వ్యక్తి పులిలాగా భయంకరంగా ఉన్నాడు అన్నారంటే, దాని అర్థం ఆ వ్యక్తికి పులిలా భయంకరమైన తోకో లేక కుండ ముఖమో ఉందని కాదు. (అందరూ నవ్వారు)
“నేను కేశవ్సేన్తో కూడా ఇదే విషయం చెప్పాను. అతడు నన్ను ‘మహాశయా, పరలోకం అనేది ఉందంటారా?’ అని అడిగాడు. నేను ఉందనీ చెప్పలేదు, లేదనీ చెప్పలేదు. కుమ్మరి కుండలను ఎండలో ఎండబెడతాడు. వాటిలో పచ్చి కుండలూ ఉంటాయి, కాల్చిన కుండలు కూడా ఉంటాయి. ఒక్కోసారి పశువులు వాటిని తొక్కివేస్తాయి. కాల్చిన కుండలు కనుక పగిలిపోతే కుమ్మరి వాటిని పారేస్తాడు. అయితే పచ్చికుండలు పగిలిపోయినప్పుడు అతడు వాటిని మళ్ళీ తీసుకుంటాడు. తీసుకువచ్చి నీటిలో తడిపి ఆ మట్టిని సారె మీద వేసి మళ్ళీ కొత్త కుండలను తయారుచేస్తాడు; పచ్చి కుండలను అతడు పారెయ్యడు. అందుకే నేను కేశవ్సేన్తో ఇలా అన్నాను: ‘పచ్చిగా ఉన్నంత వరకు అంటే పరిపక్వం కానంతవరకు కుమ్మరి నిన్ను వదలడు. జ్ఞానం ప్రాప్తించనంతవరకు, భగవద్దర్శనం కానంతవరకు కుమ్మరి మళ్ళీ నిన్ను సారె మీద వేయనే వేస్తాడు; అతడు నిన్ను వదలడు సుమా! అంటే మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలోకి రావలసిందే. తప్పించుకునే మార్గం లేదు. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నప్పుడు మాత్రమే ముక్తి. అప్పుడే కుమ్మరి నిన్ను వదలుతాడు. ఎందుకంటే అటువంటి వ్యక్తి ద్వారా ఈ మాయా సంసారంలో ఏ పనీ జరగదు.’ జ్ఞాని మాయకు అతీతంగా వెళ్ళినవాడు. మాయాసంసారంలో అతడు ఇక ఏం చెయ్యగలడు?
“కాని ఈ మాయా సంసారంలో లోకశిక్షణ నిమిత్తం భగవంతుడు కొందరు జ్ఞానులను అట్టేబెడతాడు. లోకులకు ఉపదేశించడానికి జ్ఞాని విద్యామాయను ఆశ్రయించుకుని ఈ లోకంలో జీవిస్తాడు. తన పని కోసం భగవంతుడు వారిని ఈ ప్రపంచంలో నిలిపి ఉంచుతాడు. శుకుడు, శంకరాచార్యులు ఇందుకు ఉదాహరణ.
34.2.2 శుష్కపాండిత్యం, కామినీ కాంచనాలు – గ్రద్ద, రాబందుల దృష్టి
(నవ్వుతూ, బంకింతో) “అది సరే, మానవుని కర్తవ్యాలు ఏమిటంటారు?”
బంకిం (నవ్వుతూ): అయ్యా, వాటి గురించి మీరు అడిగితే ఆహార నిద్రామైథునాలనే చెబుతాను.
శ్రీరామకృష్ణులు (తీవ్రంగా): ఏయ్? నువ్వు వట్టి సిగ్గుమాలిన వాడిలా ఉన్నావే! రాత్రింబవళ్ళు నువ్వు ఏమైతే చేస్తావో అదే నీ నోటి నుండి వెలువడుతుంది. మనిషి ఏది తింటే అవే త్రేన్పులు వస్తాయి. ముల్లంగి తింటే ముల్లంగి త్రేన్పులే వస్తాయి. కొబ్బరి తింటే కొబ్బరి త్రేన్పులే వస్తాయి. రాత్రింబవళ్ళు నువ్వు కామినీ కాంచనాలలోనే వసిస్తున్నావు. అందుకే నీ నోటి నుంచి అవే మాటలు వస్తున్నాయి. కేవలం విషయ వస్తువుల గురించి చింతన చేయడం వల్ల లెక్కలుకట్టే బుద్ధి వచ్చి పడుతుంది, మనిషి వంచకుడవుతాడు. అందుకు మారుగా భగవచ్చింతన చేయడం వల్ల మనిషికి సరళ స్వభావం చేకూరుతుంది. ఇందాక నువ్వు మాట్లాడావే, అటువంటి మాటలను భగవత్సాక్షాత్కారం పొందిన వారెవ్వరూ మాట్లాడరు. భగవచ్చింతన లేనట్లయితే, వివేక వైరాగ్యాలు లేనట్లయితే కేవలం పాండిత్యంతో ఏమిటి ప్రయోజనం? మనస్సు కామినీ కాంచనాల పట్ల నిలచి ఉన్నట్లయితే పాండిత్యం వల్ల ఒరిగేదేముంది?
“గద్దలు, రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయన్న మాట నిజమే. అయితే వాటి దృష్టి మాత్రం క్రింద ఉన్న పీనుగుల గోతిపైనే ఉంటుంది. పండితుడు ఎన్నో పుస్తకాలు, శాస్త్రాలు చదివాడన్నమాట నిజమే. అతడు శ్లోకాలను గడగడా వల్లించగలడు, పుస్తకాలనూ వ్రాసి ఉంటాడు. అయితే స్త్రీల పట్ల ఆసక్తి కలిగివుండి, ధనం, పేరుప్రతిష్ఠలను సారవస్తువులుగా భావించినట్లయితే అతడు ఎటువంటి పండితుడు? మనస్సు భగవంతుని పట్ల నిలవనట్లయితే అతడు పండితుడెలా కాగలడు?
“భక్తుల గురించి కొందరు ఇలా అంటుంటారు. ‘రాత్రింబవళ్ళు వీళ్ళు భగవంతుడా, భగవంతుడా అంటూంటారు. వీళ్ళకి పిచ్చి పట్టింది. పేరుప్రతిష్ఠలు, ఇంద్రియసుఖాలు మొదలైన భోగాలను మనం ఎంత బాగా అనుభవిస్తున్నామో కదా!’ కాకి కూడా తాను ఎంతో తెలివైనదనే భావిస్తుంటుంది. ఉదయం లేవగానే అది చేసే మొదటి పని ఏమిటంటే, ఇతరుల మలాన్ని తినడమే. అది అటూ ఇటూ ఎంత మిడిసిపాటుతో తిరుగుతూంటుందో మీరు చూసే ఉంటారు! అది నిజంగానే తెలివైనది సుమా! (అందరూ స్తబ్ధులై ఉన్నారు) అయితే భగవచ్చింతన చేసేవారు విషయ వస్తువుల పట్ల, కామినీ కాంచనాల పట్ల తమకున్న అనురక్తి తొలగిపోయేలా రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తారు. వారికి విషయసుఖాలనే రసం చేదుగా తోస్తుంది, హరి పాదపద్మాలనే సుధ తప్ప మరేదీ వారికి రుచించదు. వారి స్వభావం హంస స్వభావం లాంటిది. హంస ముందు పాలు, నీళ్ళను కలిపి ఉంచినట్లయితే అది నీటిని వదిలిపెట్టి పాలను త్రాగుతుంది. మరి హంస గమనాన్ని మీరు చూసే ఉంటారు కదా! అది తిన్నగా ఏకదిశలో వెళ్తుంది. శుద్ధభక్తుని గమనం కూడా కేవలం భగవంతుని వైపుకు మాత్రమే మరలి ఉంటుంది. అతడికి వేరే ఏమీ అక్కర లేదు, వేరే ఏమీ రుచించదు.
(బంకింతో, మృదువుగా) మీరు అన్యధా భావించకండి.
బంకిం: అయ్యా, నేను ఇక్కడకు వచ్చింది తియ్యని మాటలు వినడానికి కాదు.
34.3 తృతీయ పరిచ్ఛేదం పరోపకారం – శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు (బంకింతో): సంసారం అంటే కామినీ కాంచనాలే. వీటినే మాయ అంటారు. అవి భగవంతుణ్ణి చూడనివ్వకుండా, ఆయన గురించి ఆలోచించ నివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు అన్నాచెల్లెళ్ళ వలె జీవించాలి, సర్వదా భగవంతుడి గురించే సంభాషిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మనస్సులు భగవంతుని వైపుగానే పయనిస్తాయి. అప్పుడు భార్య, ఆధ్యాత్మిక పథంలో సహాయకురాలవుతుంది. పశుప్రవృత్తి తొలగి పోనిదే భగవదానందాన్ని ఆస్వాదించలేము. పశుప్రవృత్తి వదలిపోయేలా భగవంతుని ప్రార్థించాలి, వ్యాకుల మనస్కుడవై ప్రార్థన చేయాలి. ఆయన అంతర్యామి కదా! ప్రార్థన హృదయాంతరాళాలలో నుండి వచ్చినట్లయితే ఆయన దానిని విని తీరుతాడు.
“ఇకపోతే, కాంచనం. నేను పంచవటి దిగువన గంగానది ఒడ్డున కూర్చుని ‘రూపాయి మట్టి’ ‘రూపాయి మట్టి’ ‘మట్టే రూపాయి’ ‘రూపాయి మట్టే’ అంటూ ఆ రెండింటినీ గంగలో పారేశాను.”
బంకిం: రూపాయి మట్టా! అయ్యా, మీ వద్ద నాలుగు పైసలు ఉంటే వాటిని పేదవాళ్ళకు ఇవ్వవచ్చు కదా? రూపాయి కనుక మట్టి అయిన పక్షంలో దయ, పరోపకారం వంటివి ఒనరించలేమే!
శ్రీరామకృష్ణులు (బంకింతో): దయా! పరోపకారమా! పరోపకారం చేస్తాననడానికి నీకు ఎంత ధైర్యం? మనిషి ఆడంబరంగా అటూ ఇటూ తిరుగుతుంటాడు, అయితే అతడు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా నిలబడి అతడి నోట్లో మూత్రం పోసినా సరే అతడికి తెలియను కూడా తెలియదు. నోరు నిండి పోతుంది. అప్పుడు అతడి అహంకారం, స్వాతిశయం, దర్పం అన్నీ ఎక్కడకు పోయినట్లు?
“సన్న్యాసి కామినీ కాంచనాలను పరిత్యజించాలి. వాటిని అతడు మళ్ళీ స్వీకరించలేడు. ఉమ్మి వేసినవాడు మళ్ళీ దానిని నాకడు. సన్న్యాసి ఎవరికైనా ఏమైనా ఇస్తే, అలా ఇచ్చింది తాను కానని అతడికి తెలుసు. దయ అనేది భగవంతునికి చెందినది. మనిషి ఏం దయ చూపగలడని? దానం గీనం అన్నీ రాముడి సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. యథార్థ సన్న్యాసి మానసికం గానూ త్యజిస్తాడు, బాహ్యం గానూ త్యజిస్తాడు. బెల్లం తినని వ్యక్తి వద్ద బెల్లం ఉండడం కూడా మంచిది కాదు. అతడు తన వద్ద బెల్లం ఉంచుకుని, బెల్లం తినవద్దని ఇతరులకు చెబితే వారు అతడి మాటలు వినరు.
“గృహస్థులకు ధనం అవసరమే. ఎందుకంటే అతడికి భార్యాబిడ్డలు ఉన్నారు కాబట్టి. భార్యాబిడ్డలకు తిండి పెట్టడానికి అతడు సంచయం చేయవలసి ఉంటుంది. పక్షి, ఫకీరు సంచయం చేయరు అనే లోకోక్తి ఉర్ది. అయితే పక్షికి పిల్లలు పుట్టినట్లయితే అది వాటి కోసం ఆహారాన్ని ముక్కున కరచుకొని తెస్తుంది. అంటే, పక్షి కూడా సంచయం చేయవలసి వస్తుంది. అందుకే, గృహస్థుకు ధనం అవసరమవుతుంది; తన కుటుంబాన్ని పోషించాలి కదా!
“గృహస్థు యథార్థ భక్తుడైన పక్షంలో అతడు అనాసక్త భావంతో తన కర్తవ్యాలను నిర్వహిస్తాడు. కర్మఫలం, అంటే లాభనష్టాలు సుఖదుఃఖాలను అతడు భగవంతుడికే సమర్పించి వేస్తాడు, రాత్రింబవళ్ళు భక్తి కోసం ఆయన్ను ప్రార్థిస్తాడు. మరేమీ కోరుకోడు. దీనినే నిష్కామకర్మ, అంటే అనురక్తి లేకుండా కర్మ చేయడం అంటారు. సన్న్యాసి కూడా కర్మలన్నిటినీ నిష్కామభావంతో చేయవలసి ఉంటుంది. అయితే గృహస్థుల మల్లే అతడికి లౌకిక కర్తవ్యాలు ఉండవు.
“గృహస్థు నిష్కామ భావంతో ఎవరికైనా ఏదైనా దానం చేసినట్లయితే నిజానికి అతడు తనకే ఉపకారం చేసుకుంటున్నాడు, పరోపకారం కాదు. సకల భూతాలలోనూ భగవంతుడు విరాజిల్లు తున్నాడు. గృహస్థు అలా చేయడం వల్ల ఆ భగవంతుణ్ణే సేవించినట్లవుతుంది. భగవంతుణ్ణి సేవించడం వల్ల అతడు తనకు తానే ఉపకారం చేసుకున్నట్లవుతుంది కానీ పరోపకారం కాదు. సర్వ భూతాలలోనూ భగవంతుణ్ణి సేవించడమంటే ఇదే. కేవలం మనుషుల్లోనే కాదు జీవ జంతువుల్లో కూడా ఎవరైనా భగవంతుణ్ణి సేవించినట్లయితే, పేరుప్రతిష్ఠలను, మరణానంతరం స్వర్గాన్ని ఆకాంక్షించనట్లయితే, ఎవరినయితే సేవిస్తున్నాడో వారి నుండి ప్రతిఫలంగా ఏమీ కోరనట్లయితే – ఈ విధంగా సేవించి నట్లయితే అది యథార్థమైన నిష్కామకర్మ, అనాసక్త కర్మ చేసినట్లే అవుతుంది. ఈ విధంగా నిష్కామకర్మ చేసిన వ్యక్తి తనకు తానే మేలు చేసుకున్నవాడవుతాడు. దీనినే కర్మయోగం అంటారు. ఈ కర్మయోగం కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి ఓ మార్గమే. అయితే ఇది ఎంతో కష్టమైనది, కలియుగానికి సరిపడనిది.
“అందుకే ఎవరైతే అనాసక్త భావంతో ఈ విధంగా కర్మలు ఒనరిస్తారో, దయ దానగుణాలను కలిగి ఉంటారో వారు తమకే మేలు చేసుకుంటున్నారని నేను చెబుతున్నాను. పరోపకారం, ఇతరులకు మేలు చెయ్యడం – ఇవన్నీ భగవంతుడు చేస్తాడు, జీవుల కోసం ఎవరైతే ఈ సూర్యచంద్రులను, తల్లితండ్రులను, పువ్వులు పళ్ళను, ధాన్యాన్ని సృష్టించాడో ఆ భగవంతుడు. తల్లితండ్రులు నీ పట్ల కనబరచే ప్రేమ ఆ భగవంతుని ప్రేమే. తన సృష్టిని సంరక్షించడానికి ఆ ప్రేమను వారికి ఇచ్చింది ఆ భగవంతుడే. దయాళువులో నువ్వు చూస్తున్న దయ భగవంతుని దయే. అది నిస్సహాయ జీవులను కాపాడడానికి ఆయన ఇచ్చింది. నువ్వు దయ చూపినా సరే, లేకున్నా సరే ఆయన ఏదో ఒక విధంగా తన పనిని జరిపిస్తాడు. ఆయన పనిని అడ్డుకునేదంటూ ఏదీ ఉండదు.
34.3.1 భగవంతుడే సత్యం – తక్కినదంతా అసత్యం
“మరైతే మానవుడి కర్తవ్యం ఏమిటి? భగవంతుని వద్ద శరణాగతి నొందడమే. మనోవ్యాకులతతో ఆయన దర్శనానికై ఆయన్ను ప్రార్థించడమే. ఇంతకంటే మరేం ఉంది?
“ఒకసారి శంభు నాతో ఇలా అన్నాడు: ‘అయ్యా, అనేక ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టించాలన్నది నా కోరిక. అలా చేయడం వల్ల బీదసాదలకు ఎంతో మేలు జరుగుతుంది.’ అందుకు నేను ఇలా అన్నాను: ‘ఆ, వాటినన్నిటినీ అనాసక్త భావంతో చేస్తే అది చెడ్డదేమీ కాదు. అయితే భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి లేనట్లయితే ఆ విధంగా అనాసక్తులై ఉండడం చాలా కష్టం. పైగా, అనేక పనులలో తలమునకలైనట్లయితే అనురక్తి ఎటువైపు నుండి వచ్చి పడుతుందో తెలియనైనా తెలియదు. నిష్కామభావంతో పనిచేస్తున్నానని నువ్వు తలంచవచ్చు. కాని బహుశా కీర్తి కాంక్ష అప్పటికే వేళ్లూని ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతుల పట్ల మక్కువ ఏర్పడి ఉండవచ్చు. ఇంకా, అధికంగా పనులు చేస్తుండడం వల్ల, ఆ పని ఒత్తిడి నిన్ను భగవంతుణ్ణి మరచిపోయేలా చేస్తుంది.’ నేను శంభుతో ఇంకా ఇలా అన్నాను: ‘శంభూ, నిన్నొక విషయం అడగాలి. భగవంతుడు ప్రత్యక్షమైనట్లయితే నువ్వు ఆయన్ను కోరుకుంటావా లేక కొన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కావాలని కోరుకుంటావా?’ ఆయన్ను పొందినట్లయితే మరేదీ రుచించదు. కలకండ పానకం రుచి చూశాక మామూలు బెల్లంపానకం రుచించదు.
“ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కట్టిస్తూ అందులోనే ఆనందం పొందేవాళ్ళు మంచివారే అనడంలో సందేహం లేదు. కాని వారు వేరే రకానికి చెందిన వారు. శుద్ధభక్తుడు భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ కోరడు. ఒకవేళ అతడు పనులలో అధికంగా చిక్కువడినప్పుడు వ్యాకుల మనస్సుతో ఇలా ప్రార్థిస్తాడు: ‘ఓ భగవంతుడా, నా మీద దయచూపి నా కర్మలు తగ్గించివెయ్యి. రాత్రింబవళ్ళు నీ గురించే చింతన చేయవలసిన మనస్సు తన శక్తిని వ్యర్థం చేసివేస్తోంది. అది లౌకిక చింతన మాత్రమే చేస్తోంది.’ శుద్ధభక్తులు పూర్తిగా ఒక ప్రత్యేక తరగతికి చెందినవారు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం అన్న బోధ కలుగకుండా శుద్ధభక్తి జనించదు. ఈ సంసారం అనిత్యం, ఇది కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది, ఈ సంసారాన్ని సృష్టించినవాడు మాత్రమే సత్యం, నిత్యం అన్న బోధ కలుగకుండా శుద్ధభక్తి జనించదు.
“జనకుడు మొదలైనవారు భగవంతుని ఆదేశంతోనే కర్మలు చేశారు.
34.4 చతుర్థ పరిచ్ఛేదం మొదట భగవంతుడు, తరువాతే అన్నీ
(బంకింతో) “శాస్త్రాలు, పుస్తకాలు చదవకుండా భగవంతుణ్ణి పొందలేమని కొందరు తలుస్తారు. ముందుగా ప్రాపంచిక విషయాలు, అందులోని ప్రాణుల విషయాలు తెలుసుకోవాలనీ, ముందుగా ‘సైన్సు’ చదవాలనీ వారు భావిస్తారు. (అందరూ నవ్వారు) భగవంతుని సృష్టిని అర్థం చేసుకోకుండా ఆయన్ను తెలుసుకోలేమని వారు అంటారు. మీరేమంటారు? సైన్సు ముందా లేక భగవంతుడు ముందా?”
బంకిం: ఆ, ముందుగా ప్రపంచంలోని పలు విషయాలను గురించి తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం కూడా. ప్రపంచాన్ని గురించి కొద్దిగానైనా తెలుసుకోకుండా భగవంతుణ్ణి ఎలా తెలుసుకోగలం? ముందుగా పుస్తకాలు చదివి కొంత తెలుసుకోవాలి.
శ్రీరామకృష్ణులు: మీరందరూ గొంతు చించుకొని చెప్పే మాటే అది. కాని ముందుగా భగవంతుడు, అటు తరువాతే సృష్టి. ఆయన్ను పొందాక, అవసరమైతే అన్నీ తెలుసుకోగలం.
“ముందుగా ఏదోవిధంగా యదుమల్లిక్తో పరిచయం కల్పించుకోవాలి, అటుపిదప అతడికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, తోటలు ఎన్ని ఉన్నాయి, రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోగోరితే అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. స్వయంగా యదుమల్లికే ఆ విషయాలన్నీ నీకు తెలియచేస్తాడు. అయితే నువ్వు యదుమల్లిక్ను కలుసుకోనేలేదు, అతడి ఇంట్లోకి వెళ్దామంటే ద్వారపాలకుడు అనుమతించడం లేదు – మరి అలాంటప్పుడు అతడికి ఇళ్ళు ఎన్ని, తోటలు ఎన్ని, రొక్కపత్రాలు ఎన్ని అన్న ఖచ్చితమైన సమాచారం ఎలా లభిస్తుంది? భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు సర్వమూ తెలిసిపోతుంది; అయితే అప్పుడు సామాన్య విషయాలు తెలుసుకోగోరవు. వేదాలలో ఇదే విషయం చెప్పబడింది. ఒక వ్యక్తిని జనం చూడనంతవరకు అతడి గుణగణాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అతడు వచ్చి ఎదుట నిలబడగానే మాటలన్నీ ఆగిపోతాయి. ఆతడి సాన్నిధ్యంలో ఉండడంలోనే ఆనందపడిపోతారు. ఆతడితో మాట్లాడంలోనే పరవశించిపోతారు. అటుపైన ఆతడి గుణగణాల గురించి మాటలు ఏవీ ఉండవు.
“ముందుగా భవత్సాక్షాత్కారం; సృష్టి లేక అన్యవిషయాలన్నీ అటు తరువాతనే. వాల్మీకికి రామమంత్రం ఒసగబడింది, కాని అతడికి ‘మరా’, ‘మరా’ అని జపం చేయమని చెప్పారు. ‘మ’ అంటే అర్థం భగవంతుడు, ‘రా’ అంటే జగత్తు అని. ముందుగా భగవంతుడు, అటు తరువాత జగత్తు. ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు. ఒకటి (1) తరువాత యాభై సున్నలు పెట్టినట్టయితే అది చాలా పెద్ద సంఖ్య అవుతుంది. అయితే ఆ ఒకటిని తుడిచి వేసినట్లయితే ఏమీ మిగలదు. అనేకం తయారయ్యేది ఒకటితోనే. ముందుగా ఒకటి, అటు తరువాత అనేకం. ముందుగా భగవంతుడు, అటు తరువాత జీవజగత్తులు.
“నీకు కావలసింది భగవత్సాక్షాత్కారం. ఈ జగత్తు, సృష్టి, సైన్సు గీన్సు – వీటన్నిటి గురించి నువ్వు అంతగా తలబ్రద్దలు కొట్టుకోవడం ఎందుకు? నీకు కావలసింది మామిడి పళ్లు తినడమే. తోటలో ఎన్ని వందల మామిడి చెట్లు ఉన్నాయి, ఎన్ని వేల కొమ్మలు ఉన్నాయి, ఎన్ని లక్షల ఆకులు ఉన్నాయి – వీటన్నిటి గురించిన సమాచారం నీ కెందుకు? నువ్వు మామిడిపళ్లు తినడానికి వచ్చావు, మామిడి పళ్ళు తిని వెళ్ళు. ఈ ప్రపంచంలోకి మనిషి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోడానికి వచ్చాడు. దీన్ని మరచిపోయి మనస్సును నానా విషయాలలో లగ్నం చేయడం మంచిది కాదు. నువ్వు మామిడిపళ్లు తినడానికి వచ్చావు; మామిడి పళ్ళు తినే వెళ్ళు.”
బంకిం: ఆ మామిడిపళ్ళు ఎక్కడ లభ్యమవుతాయి?
శ్రీరామకృష్ణులు: వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించు. నీ ప్రార్థన కనుక హృదయ పూర్వకమైనదైతే ఆయన దాన్ని విని తీరతాడు. నీ ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడేలా ఆయన నీకు బహుశ సత్సాంగత్యాన్ని లభింపచేయవచ్చు. ‘ఇలా ఇలా చేస్తే భగవంతుణ్ణి పొందవచ్చు’ నని ఎవరైనా తెలుపవచ్చు.
బంకిం: ఎవరు? గురువా? మంచి మంచి మామిడిపళ్ళన్నీ తానే తినేసి చెడిపోయిన పళ్ళను మనకు ఇస్తాడాయన. (నవ్వులు)
శ్రీరామకృష్ణులు: ఎందుకయ్యా, అలా ఎందుకు అంటావు? తన బిడ్డలలో ఎవరికి ఏది జీర్ణమవుతుందో తల్లికి బాగా తెలుసు. వాళ్ళందరూ పలావో లేక వేపుడో జీర్ణించుకోగలరా ఏమిటి? ఇంటికి చేపలు తెచ్చారనుకుందాం. బిడ్డలందరికీ తల్లి పలావో లేక వేపుడో చేసి ఇవ్వదు. అరుగుదల బాగాలేని బలహీనుడైన పిల్లవాడికి ఆమె సాధారణమైన పులుసు చేసి ఇస్తుంది. అందుకని ఆ పిల్లవాడిని ఆమె తక్కువగా ప్రేమిస్తుందని చెప్పగలమా?
34.4.1 భగవత్ప్రాప్తికి మార్గం – వ్యాకులత, సరళ విశ్వాసం
“గురువు వాక్యాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. గురువే సచ్చిదానందుడు, సచ్చిదానందుడే గురువు. పసిపిల్లవాడి వలె ఆయన వాక్కులను విశ్వసించినట్లయితే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు. అవును, పసిపిల్లవాడి విశ్వాసం! ఫలానా వ్యక్తిని చూపిస్తూ ‘వాడు నీ అన్న’ అని తల్లి చెప్పినట్లయితే ఆ పిల్లవాడు వెంటనే ఆ వ్యక్తిని నిజంగానే తన అన్నగా భావిస్తాడు. నూటికి నూట పాతిక పాళ్ళ విశ్వాసం! ఈ పిల్లవాడు బ్రాహ్మణుల అబ్బాయి అయివుండవచ్చు, ఆ వ్యక్తి వడ్రంగుల అబ్బాయో లేక కుమ్మరుల అబ్బాయో అయివుండవచ్చు. అయినప్పటికీ ఈ పిల్లవాడు అతణ్ణి తన అన్నగానే విశ్వసిస్తాడు. ఆ గదిలో బూచి ఉందని తల్లి చెప్పిందనుకోండి. ఆ గదిలో నిశ్చయంగానే బూచి ఉందని ఆ పిల్లవాడు విశ్వసిస్తాడు. పిల్లవాడి విశ్వాసమంటే ఇదే. గురువు వాక్యాల పట్ల ఇటువంటి విశ్వాసం ఉండాలి. కపటబుద్ధి, పట్వారీ బుద్ధి, వాదించే నైజం ద్వారా భగవంతుణ్ణి పొందలేము. విశ్వాసం, సరళ స్వభావం ఉండాలి. కపట స్వభావం చెల్లదు. సరళ స్వభావం కలవాడికి భగవంతుడు అతి సమీపంగా ఉంటాడు. అయితే కపట స్వభావం కలవాడికి ఆయన చాలా చాలా దూరం.
“తల్లిని చూడకపోతే పిల్లవాడు హతాశుడైపోతాడు. చేతిలో మిఠాయిపెట్టి అతణ్ణి మరిపించాలని నువ్వు ప్రయత్నం చేయవచ్చు. అయితే అతడు అలా మరచిపోయేరకం కాదు. ‘ఊహూ, నేను మా అమ్మ వద్దకు వెళ్ళాలి’ అని మాత్రమే ఏడుస్తుంటాడు. భగవంతుని కోసం ఇటువంటి వ్యాకులత ఉండాలి. ఆహా! అది ఎలాంటి వ్యాకులత! ‘అమ్మా అమ్మా’ అంటూ పిల్లవాడు తల్లి కోసం ఎంతగా తల్లడిల్లిపోతాడు! అతడు తల్లిని ఏ విధంగానూ మరువడు. ఎవరికైతే సంసారంలోని సుఖాలన్నీ రుచిహీనంగా తోస్తాయో, ఎవరికైతే డబ్బు, పేరు ప్రతిష్ఠలు, దేహసుఖాలు, ఇంద్రియ సుఖాలు – ఇవన్నీ బొత్తిగా రుచించవో, ఆతడు మాత్రమే ‘అమ్మా అమ్మా’ అంటూ జగజ్జనని దర్శనం కోసం తల్లడిల్లి పోతాడు. తన పనులన్నిటినీ ప్రక్కనపెట్టి అమ్మ పరుగు పరుగున వచ్చేది ఆతడి వద్దకే.
“ఆహా! ఆ వ్యాకులతే అసలైన విషయం. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా సరే – హిందూ, ముసల్మాన్, క్రైస్తవం, శాక్తం, వైష్ణవం లేక బ్రహ్మసమాజం – అసలు విషయం వ్యాకులతే. భగవంతుడు అంతర్యామి. నువ్వు తప్పు మార్గం గుండా వెళ్ళినా సరే, వ్యాకులత ఉంటే చాలు. ఆయనే మళ్ళీ నిన్ను సరైన మార్గంలో ప్రవేశపెడతాడు.
“పైగా అన్ని మార్గాలలోనూ తప్పులు ఉన్నాయి. తన గడియారమే సరైన దని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు, అయితే నిజానికి ఎవరి గడియారమూ సరైనది కాదు. అయితే ఆ కారణంగా ఎవరి పనీ కుంటువడదు. వ్యాకులత ఉన్నట్లయితే సాధుసాంగత్యం లభిస్తుంది; సాధుసాంగత్యం ద్వారా మన గడియారాన్ని చాలావరకు సరిచేసుకోవచ్చు.
34.5 పంచమ పరిచ్ఛేదం భజనానందంలో శ్రీరామకృష్ణులు
బ్రహ్మసమాజానికి చెందిన త్రైలోక్యుడు పాడడం ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు కీర్తన కాస్త వింటూనే, తటాలున లేచి నిలబడి బాహ్యస్పృహ కోల్పోయారు; సమాధి స్థితిలో సంపూర్ణంగా అంతర్ముఖులైపోయారు. ఆయన చుట్టూ భక్తులు వలయాకారంలో నిలబడ్డారు. గుంపును తోసుకుంటూ బంకిం శ్రీరామకృష్ణులకు దగ్గరగా వచ్చి తదేక దృష్టితో ఆయన్ను చూడసాగాడు. బంకిం మునుపు ఎన్నడూ ఎవర్నీ సమాధిస్థితిలో చూసింది లేదు.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు ఒకింత బాహ్యస్పృహలోకి వచ్చి పారవశ్యంతో నాట్యం చేయసాగారు. అది శ్రీవాసుని ఇంట్లో చైతన్యదేవులు నాట్యం చేస్తున్నటువంటి దృశ్యంలా ఉంది. అదొక అద్భుత దృశ్యం! ఆంగ్లం అభ్యసించిన బంకిం, ఆయన మిత్రులు ఈ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులైపోయారు. ప్రేమానందం అంటే ఇదేనా? భగవత్ ప్రేమలో ఇంతగా ఉన్మత్తులై పోవడం సాధ్యమేనా? నవద్వీపంలో శ్రీ గౌరాంగుడు చేసింది కూడా ఇదేనా? ఈ విధంగానేనా నవద్వీపం, శ్రీ క్షేత్రం (పూరీ)లో గౌరాంగుడు ప్రేమ సంత తెరిచింది? ఈయనలో కపటమైతే ఉండబోదు. ఎందుకంటే ఈయన సర్వసంగ పరిత్యాగి; ధనం, పేరు ప్రతిష్ఠలు పెంపొందించుకోవలసిన అవసరం ఈయనకు ఎంతమాత్రమూ లేదు. అంటే, మానవజీవిత లక్ష్యం ఇదేనా? మనస్సును ఎటువైపూ మరల్చకుండా కేవలం భగవంతుని వైపే మరలించి ఆయన్ను ప్రేమించడమే కదా మార్గమూ, లక్ష్యమూ. యథార్థమైన ప్రేమ జనించినట్లయితే ఆయన దర్శనం లభించి తీరుతుంది.
భక్తులు ఈ విధంగా ఆలోచిస్తూ తదేకంగా ఆ అద్భుతమూర్తిని దర్శిస్తున్నారు.
సంకీర్తన ముగిశాక శ్రీరామకృష్ణులు తమ నుదుటిని నేలకు తాకించి “భాగవతం – భక్తుడు – భగవాన్” అంటూ “జ్ఞానులు, యోగులు, భక్తులు – అందరి పాదాలకూ ప్రణామం” అన్నారు. ఇలా పలికి మళ్ళీ ఆసీనులయ్యారు. భక్తులు కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు.
బంకిం (శ్రీరామకృష్ణులతో): అయ్యా! భక్తిని అలవర్చుకోవడం ఎలా?
శ్రీరామకృష్ణులు: వ్యాకులత ద్వారా – పిల్లవాడు ఎలాగైతే తల్లికోసం విలపిస్తాడో అటువంటి వ్యాకులత ద్వారా. తల్లిని చూడకపోయేసరికి పిల్లవాడు గాభరా పడిపోతాడు, ఆమె కోసం వెక్కివెక్కి ఏడుస్తాడు. అదే విధంగా, వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు.
“అరుణోదయం అయ్యేసరికి తూర్పుదిక్కు ఎర్రబారుతుంది. సూర్యోదయం అవడానికి ఇక ఎక్కువ సమయం పట్టదని అప్పుడు తెలుస్తుంది. అదే విధంగా భగవంతుని కొరకు ఎవరికైనా ప్రాణాలు తల్లడిల్లిపోవడం చూశావంటే, అప్పుడు ఆ వ్యక్తికి భగవద్దర్శనం పొందడంలో ఇక ఎక్కువ సమయం పట్టదని నిశ్చయంగా తెలుసుకోవచ్చు.
“ఒక శిష్యుడు గురువుతో ‘అయ్యా, దయచేసి భగవంతుణ్ణి పొందడమెలాగో నాకు తెలియచెయ్యండి’ అన్నాడు. ‘నాతో పాటు రా. అది ఎలాగో నీకు చూపిస్తాను’ అని చెప్పి గురువు, శిష్యుణ్ణి ఒక చెరువు వద్దకు తోడ్కొని వెళ్ళాడు. ఇద్దరూ చెరువులోకి దిగారు. తటాలున గురువు, శిష్యుని తలను నీటిలో అదిమిపెట్టాడు. కాసేపటి తరువాత వదలిపెట్టేసరికి శిష్యుడు తలపైకెత్తి లేచి నిలబడ్డాడు. ‘నీకు ఎలా అనిపించింది?’ అని గురువు అడగ్గా శిష్యుడు ‘అయ్యా, నా ప్రాణాలు పోతున్నాయనిపించింది. శ్వాస కోసం అల్లాడిపోయాను’ అన్నాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు: ‘భగవంతుని కొరకు ఆ విధంగా ప్రాణాలు తల్లడిల్లిపోయినప్పుడు ఆయన సాక్షాత్కారానికై ఎక్కువగా వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకో.’
(బంకింతో) “మీకో సంగతి చెప్పాలి. ఊరకే పైపైనే తేలుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? కాస్త లోతుగా మునుగు. రత్నాలు ఎంతో లోతులో ఉన్నాయి. ఊరకే పైపైనే కాళ్ళు చేతులు ఆడించడం వల్ల ఏమిటి ప్రయోజనం? నిజమైన మణి బరువుగా ఉంటుంది. అది పైపైనే తేలుతూ ఉండదు, అది అగాధాన ఉంటుంది. నిజమైన రత్నాన్ని పొందాలనుకుంటే లోతుగా మునిగిపోవాలి.”
34.6 షష్ఠ పరిచ్ఛేదం భక్తియోగం, భగవత్ప్రేమ
బంకిం: అయ్యా, మేము ఏం చేయగలం? మాకు వీపు మీద బెండ్లు కట్టబడి ఉన్నాయి (అందరూ నవ్వారు) అవి మమ్మల్ని మునగనివ్వడం లేదు.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి స్మరించినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయన నామంతో కాళుడి బంధాలన్నీ తెగిపోతాయి. నువ్వు లోతులోకి మునిగి తీరవలసిందే. లేకుంటే, రత్నం లభించదు. ఒక పాట విను:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబునందు
అట్టడుగు లోతులను అందగలవేని
ప్రభు ప్రేమరత్నము పొందెదవచట ॥ ము ॥
వెదుకవే హృదయాన వెదుకవే మనసా
వెదుకవే దానిలో బృందావనంబు
శ్రీకృష్ణచంద్రుండు క్రీడించునెపుడు
భక్తబృందము కూడి పాడియాడుచును ॥ ము ॥
వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి
వెలిగింపవే నిత్య విజ్ఞానదీప్తి
ఆరకుండగజేయు మా దీపశిఖను
నిరతము కదలక నీ డెందమందు ॥ ము ॥
నీ పడవ నెవ్వరు నెట్టుచున్నారు
గట్టిదౌ నేలపై పట్టి త్రోయుచును
అతడె నీ గురువని అనియె కుబీరు
భావింపు మా గురుపద పద్మములను ॥ ము
అందరూ మంత్రముగ్ధులై పాట విన్నారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (బంకింతో): కొందరు మునగడానికి ఇష్టపడరు. ‘దేవుడు, దేవుడు అని అతిగా చేసి చివరకు పిచ్చివాళ్ళం అవ్వాలా ఏమిటి?’ అంటూంటారు వాళ్ళు. భగవత్ప్రేమలో ఉన్మత్తులైన వాళ్ళ గురించి చెబుతూ ‘వాళ్ళకు పిచ్చిపట్టింది’ అంటూంటారు వీరు. అయితే సచ్చిదానందమనేది అమృత సాగరమని వీరు ఎరుగరాయె. ఒకసారి నేను నరేంద్రుణ్ణి ఇలా అడిగాను: ‘ఒక పాత్రలో పానకం ఉందనుకో, నువ్వు ఈగవై ఉన్నావనుకో. అప్పుడు నువ్వు ఆ పానకాన్ని ఎక్కడ కూర్చుని తాగుతావు?’ అందుకు అతడు ‘నేను పాత్ర అంచున కూర్చుని ముక్కు చాచి త్రాగుతాను’ అన్నాడు. ‘ఎందుకు? పాత్ర మధ్యలోకి దూకి త్రాగడంలోని హాని ఏమిటి?’ అని అడిగాను. ‘అలాంటప్పుడు నేను పానకానికి అతుక్కుపోయి చచ్చిపోతాను’ అన్నాడు నరేంద్రుడు. అప్పుడు నేను ఇలా అన్నాను: ‘నాయనా, సచ్చిదానంద రసం అలాంటిది కాదు, అది అమృత రసం. అందులో మునగడం వల్ల మనిషి మరణించడు, అమరుడవుతాడు.’
“అందుకే నేను చెప్పటం, లోతుగా మునుగు అని. ఏమాత్రం భయపడవద్దు, మునగడం వల్ల అమరుడవవుతావు.”
బంకిం, శ్రీరామకృష్ణులకు వంగి నమస్కారం చేశాడు. అక్కడ నుండి సెలవు తీసుకోనున్నాడు.
బంకిం: అయ్యా, నేను మీరు అనుకున్నంత అవివేకిని ఏమీ కాను. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే. దయచేసి ఒకసారి మా ఇంటికి వచ్చి మీ పాదధూళితో దాన్ని పావనం చేయండి.
శ్రీరామకృష్ణులు: మంచిదే. భగవంతుని సంకల్పం ఉంటే నేను రాగలను.
బంకిం: అక్కడ కూడా మీరు భక్తులను చూడగలరు.
34.6.1 ‘గోపాల! కేశవ!’ కథ
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎలాంటి భక్తులు? ‘గోపాల! గోపాల! కేశవ! కేశవ!’ అంటూ ఉండేలాటి భక్తులా? (అందరూ నవ్వారు)
ఒక భక్తుడు: అయ్యా, ఏమిటా ‘గోపాల! గోపాల!’ కథ?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అయితే కథ చెబుతాను, విను. ఒకచోట స్వర్ణకారుడి దుకాణం ఒకటి ఉండేది. అక్కడ పనిచేసేవారందరూ మంచి వైష్ణవ భక్తులుగా పేరు గాంచారు. వారు కంఠంలో జపమాల, నొసటన తిలకం ధరించి చేతిలో జపమాల సంచి పట్టుకుని ఉండేవారు; సర్వదా హరినామం ఉచ్చరిస్తూండేవారు. ఇంచుమించు వారిని సాధువులనే చెప్పవచ్చు కానీ పొట్టపోసుకొనే నిమిత్తం, భార్యబిడ్డలను పోషించేందుకై వారు స్వర్ణకారులుగా పని చేస్తూండేవారు. వారు భక్తిపరులని విని అనేకమంది కొనుగోలుదారులు వారి దుకాణానికే వచ్చేవారు, తమ బంగారం లేక వెండి విషయంలో వారు మోసం చెయ్యరనే ఉద్దేశంతో. కొనుగోలుదారులు దుకాణంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడి పనివాళ్ళు ‘హరి, హరి’ అని ఉచ్చరిస్తూ తమ పని చేసుకుంటూండేవారు. కొనుగోలుదారులు వచ్చి కూర్చోగానే, పనివాళ్ళలో ఒకడు ‘కేశవ! కేశవ! కేశవ!’ అని అరుస్తాడు. కాసేపటి తరువాత మరొకడు ‘గోపాల! గోపాల! గోపాల!’ అంటాడు. వారు మరికొంతసేపు మాట్లాడిన తరువాత మూడవ పనివాడు ‘హరి! హరి! హరి!’ అంటాడు. కొనుగోలుదారుల లావాదేవీలు ఒక కొలిక్కి వస్తూన్నప్పుడు నాలుగవ వ్యక్తి ‘హర! హర! హర!’ అని అరుస్తాడు. వీరి భక్తిశ్రద్ధలను చూసి కొనుగోలుదారులకు ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. నిశ్చింతగా వారికి డబ్బు ఇస్తారు. వీరు ఎన్నటికీ మోసం చేయరని వారికి గట్టి నమ్మకం కలుగుతుంది.
“కాని అసలు విషయం ఏమిటో తెలుసా? కొనుగోలుదారులు వచ్చినప్పుడు ‘కేశవ, కేశవ* ’ అన్నవాడు ‘వీరందరూ ఎవరు?’ అని అడుగుతున్నాడు. అంటే, కొనుగోలుదారులు ఎంతమేరకు తెలివైనవారు అని అతడు అడుగుతున్నాడు. ‘గోపాల, గోపాల* ’ అన్న వ్యక్తి ఉద్దేశం వీరు ‘ఆవుల మంద’ లాంటివారేలే అని. ‘హరి, హరి’ అన్న వ్యక్తి అలా అనడంలోని అంతరార్థం – ‘వీరు ఆవుల మంద లాంటివారే అయినప్పుడు, మరి వీరిని హరించి వెయ్యనా, అంటే దోచుకోనా?’ అని. చివరగా ‘హర, హర’ అన్న వ్యక్తి ‘వీరు ఆవులమంద లాంటి వారే కాబట్టి వీరిని తప్పక హరించవచ్చు’ అని సూచిస్తున్నాడు. చూశావు కదా, అటువంటి భక్తులు కూడా ఉన్నారు.” (అందరూ నవ్వారు)
బంకిం సెలవు తీసుకున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. గది తలుపు వద్దకు వెళ్ళాక తన ఉత్తరీయం జారిపోయిందన్న సంగతి గ్రహించాడు. చొక్కా మాత్రమే ఉంది. ఒక పెద్దమనిషి పరుగెత్తుకుంటూ వచ్చి ఉత్తరీయాన్ని ఆయనకు అందించాడు.
అక్కడ ఉన్న భక్తులలో శరత్, సన్యాల్‌లు బ్రాహ్మణులు. కాని అధర్ స్వర్ణకారుల కులానికి చెందినవాడు. అక్కడ ఉంటే అధర్ ఇంట్లో భోజనం చేయవలసి వస్తుందేమోనన్న ఉద్దేశంతో వారిద్దరూ త్వరగా వెళ్లిపోయారు. శరత్, సన్యాల్‌లు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చింది ఈ మధ్యనే. అధర్ పట్ల ఆయనకు ఎంతటి ప్రీతో వారికి తెలియదాయె. ‘భక్తులు ప్రత్యేక కులానికి చెందుతారు. వారిలో వారికి కులభేదాలు ఉండవు’ అని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు.
శ్రీరామకృష్ణులను, భక్తులను అధర్ విందుభోజనంతో సత్కరించాడు. భోజనం అయ్యాక శ్రీరామకృష్ణుల బోధామృతాన్ని నెమరువేసుకుంటూ, సర్వదా భావమగ్నులైన ఆ అద్భుత ప్రేమమయ మూర్తిని తమ హృదయాలలో తనివితీరా దర్శిస్తూ భక్తులు ఇళ్ళకు బయలుదేరారు. అప్పటికి బాగా పొద్దుపోయింది.
శ్రీరామకృష్ణులను తన ఇంటిని పావనం చేయమని బంకిం ఆహ్వానించినందున, కొన్ని రోజుల తరువాత ఆయన గిరీశ్, ‘మ’ లను బంకిం ఇంటికి పంపారు. అప్పుడు శ్రీరామకృష్ణుల గురించి వీరిద్దరితో బంకిం చాలాసేపు మాట్లాడాడు. మళ్ళీ ఆయన్ను దర్శించాలన్నాడు. అయితే ఆ కోరిక ఈడేరలేదు.