33.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో మనోమోహన్, మహిమ ప్రభృత భక్తులతో
ఆదివారం, అక్టోబర్ 26, 1884
రండి సోదరులారా, రండి! నేడు మళ్ళీ ఆ మహాపురుషుని సన్నిధికి వెళదాం. తల్లిని తప్ప అన్యమైనది ఏదీ ఎరుగని పసిబాలుడు! మనలను ఉద్ధరించడానికే మానవరూపాన్ని ధరించిన ఆ పరమహంస దేవులను దర్శించుకుని మన జీవితం సార్థకం చేసుకుందాం. సన్న్యాసులకు, గృహస్థులకు అందరికీ ఆయన వద్ద ఆశ్రయం లభిస్తుంది. వారివారి స్వభావానికి అనుగుణంగా పరమ గమ్యాన్ని చేరుకునే మార్గమేమిటో ఆయన అందరికీ విశదపరుస్తారు. ఆయన ఎవరినీ నిరసించరు. అనంత గుణధాముడు! ప్రసన్నమూర్తి! భగవన్నామం వినినంతనే అనందాశ్రువులు ధారలు కడతాయి. అట్టి మహాపురుషుడు దక్షిణేశ్వర కాళీ ఆలయంలో మన కోసం ఎదురు చూస్తున్నారు. అహేతుక కృపాసింధువు, అహర్నిశలు భగవత్ ప్రేమోన్మత్తుడు. అట్టి పరమానంద స్వరూపుడు, పరమహంస శ్రీరామకృష్ణులను దర్శించుకుని ఆయన ఉపదేశ మకరందాన్ని గ్రోలి ధన్యులమవుదాం, రండి.
నేడు ఆదివారం, అక్టోబర్ 26, 1884. హేమంత ఋతువు. మధ్యాహ్న సమయం. శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో పాటు ఆసీనులై ఉన్నారు. గదికి పశ్చిమంగా అర్ధచంద్రాకార వసారా ఉంది. వసారాకు పశ్చిమంగా తోటబాట ఉంది. బాటకు పశ్చిమాన భవతారిణీ కాళీమాత కోసం పువ్వుల తోట ఉంది. దానికి ఆవల పాపనాశిని, సర్వకల్మషహారిణి అయిన పవిత్ర భాగీరథి దక్షిణ దిశగా ప్రవహిస్తోంది.
నేడు భక్తులనేకులు వచ్చారు. ఇవాళ ఆనందపు సంత తెరచినట్లుంది. ఆనందమయమూర్తి శ్రీరామకృష్ణుల భగవత్ప్రేమ భక్తుల వదనాలలో ప్రతిబింబిస్తోంది. అంతేకాదు; బయట ఉన్న తోటలోనూ, చెట్ల ఆకులలోనూ, పలురకాల పువ్వులలోనూ, విస్తృత గంగానదిలోనూ ఆ ఆనందం ప్రతిభాసిస్తోంది. ‘మధువత్ పార్థివం రజః’ – నిజంగానే తోటలోని ధూళి కూడా మధుమయమే. గోప్యంగా కాని, లేకుంటే భక్తులతో కలసి కాని ఈ ధూళిని కొల్లగొట్టుకుపోవాలన్న ఇచ్ఛ కలుగుతోంది. ఈ తోటలో ఏదో ఒక మూల నిలబడి ఈ పవిత్ర జాహ్నవీనదిని దర్శిస్తూనే కాలం గడపాలన్న సంకల్పం జనిస్తోంది. ఈ తోటలోని పత్రపుష్ప శోభిత లతలను, మొక్కలను, వృక్షాలను ఆత్మీయులుగా భావించి సంభాషించాలనీ, వాటిని ఆలింగనం చేసుకోవాలనీ ఆకాంక్ష పుడుతోంది. ఈ ధూళి మీదనే కదా శ్రీరామకృష్ణులు నడుస్తారు. ఈ లతలు, వృక్షాల నడుమనే కదా ఆయన సదా సంచరిస్తూ ఉంటారు.
ఆలయ పూజారి, ద్వారపాలకుడు, పరిచారకులు అందరూ పరమ ఆత్మీయులుగా తోస్తారు. ఇక్కడకు వచ్చినప్పుడు సుదీర్ఘ కాలం తరువాత జన్మభూమికి తిరిగి వచ్చిన భావన కలుగుతుంది. ఇక్కడ సర్వం ఆనంద రసంలో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది.
శ్రీరామకృష్ణుల గదిలో మనోమోహన్, మహిమాచరణ్, ‘మ’ లు కూర్చుని ఉన్నారు. క్రమంగా ఈశాన్, హాజ్రాలు వచ్చారు. ఇంకా పలువురు భక్తులు కూడా అక్కడ ఉన్నారు. బలరామ్, రాఖాల్ ఇంకా బృందావనంలోనే ఉన్నారు. ఇటీవల కొందరు క్రొత్తగా వస్తున్నారు: నారాయణ్, పల్టు, చిన్న నరేంద్రుడు, తేజచంద్ర, వినోద్, హరిపదుడు మొదలైనవారు. బాబూరామ్ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడే బస చేస్తుంటాడు. రామ్, సురేశ్, కేదార్, దేవేంద్రాది భక్తులు ఒకటి రెండు వారాలకు ఒకసారి వచ్చి పోతుంటారు. లాటూ ఇక్కడే ఉంటున్నాడు. యోగీన్ (కాలాంతరంలో స్వామి యోగానంద) ఇల్లు సమీపంలోనే ఉంది. దాదాపు ప్రతి రోజూ వస్తాడు. నరేంద్రుడు అప్పుడప్పుడు వస్తుంటాడు. అతడు వచ్చిందే తడవు ఆనందపు కోలాహలం సృష్టిస్తాడు. నరేంద్రుడు తన దేవదుర్లభ కంఠంతో భగవన్నామ కీర్తనలు గానం చేసినప్పుడు శ్రీరామకృష్ణులు పలురకాల అనుభూతులు పొందుతారు, సమాధి స్థితి నొందుతారు. బాలభక్తులు తమతో బస చేయాలన్నది ఆయన అభిలాష, ఎందుకంటే వారు పరిశుద్ధ మనస్కులు; సంసారం, వివాహం ఇత్యాది బంధనాలలో చిక్కువడని వారు. శ్రీరామకృష్ణులు, బాబూరామ్ను ఇక్కడే ఉండమని చెబుతుంటారు. అతడు మధ్యమధ్యలో ఇక్కడే బస చేస్తుంటాడు. అధర్సేన్ తరచూ వస్తుంటాడు.
శ్రీరామకృష్ణులు బాలుని వలె నిలబడి ఏదో ఆలోచిస్తున్నారు. భక్తులు తదేకంగా ఆయన వంక చూస్తున్నారు.
33.1.1 సమస్తమూ భగవంతునిగానే శ్రీరామకృష్ణుల దర్శనం
శ్రీరామకృష్ణులు (మనోమోహన్తో): సమస్తం రామమయంగా దర్శిస్తున్నాను. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా! అయితే అందరిలోనూ రాముణ్ణే చూస్తున్నాను.
మనోమోహన్: అవునండీ, సమస్తం రాముడే అయివున్నాడు. అయితే, మీరు చెబుతుంటారు కదా – ‘ఆపో నారాయణః’ – నీరు నారాయణుడే కాని కొన్ని నీళ్ళు త్రాగడానికి ఉపయోగపడతాయి; కొన్ని నీళ్ళు ముఖం కడుక్కోవడానికి, మరి కొన్ని నీళ్ళు అంట్లు తోమడానికి మాత్రమే ఉపయోగ పడుతుంటాయి.
శ్రీరామకృష్ణులు: అవును. కాని భగవంతుడే సమస్తంగా అయివున్నట్లు చూస్తున్నాను. ఆయనే జీవజగత్తులుగా అయి ఉన్నాడు.
ఇలా పలుకుతూ శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు.
33.1.2 శ్రీరామకృష్ణుల సత్యనిష్ఠ, పరిత్యాగం
శ్రీరామకృష్ణులు (మహిమాచరణ్తో): ఏమయ్యా, సత్యం పలకాలన్న నిష్ఠతో నాకు ‘పట్టింపుల జాడ్యం’ ఏమైనా వచ్చి చేరిందంటావా? ఉన్నట్టుండి ‘తినను’ అని చెప్పేశాననుకో, అప్పుడు ఆకలి వేస్తున్నప్పటికీ తినలేను. ఎవరినైనా చెంబుతో నీరు తీసుకుని సరుగుడు తోపుకు రమ్మని చెప్పానే అనుకో, అప్పుడు ఆ సదరు వ్యక్తే నీరు తీసుకు రావాలి. మరెవరయినా తెస్తే దానిని వెనక్కు తీసుకు వెళ్ళమని చెప్పవలసి వస్తుంది. ఇదేమిటయ్యా, ఇలాగయింది? ఇందులో నుండి బయటపడే ఉపాయం లేదా?
“పైగా, నాతో పాటు ఏమీ తీసుకు వెళ్ళలేను. తాంబూలం కాని, తినుబండారం కాని దేనినీ తీసుకువెళ్ళలేను. ఎందుకంటే, అలా చేస్తే సంచయం చేసినట్లవుతుంది కదా! చేతిలో కాస్త మట్టి కూడా తీసుకువెళ్ళలేను.”
శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి “మహాశయా, యదుమల్లిక్ తోట వద్దకు హృదయ్ వచ్చి ఉన్నాడు. అక్కడ తోట ద్వారం వద్ద వేచి ఉన్నాడు. మిమ్మల్ని చూడాలంటు న్నాడు” అన్నాడు. అది విని శ్రీరామకృష్ణులు భక్తులతో “నే నొకసారి వెళ్ళి హృదయ్‌ను కలుసుకుని వస్తాను. మీరు కూర్చుని ఉండండి” అని, చెప్పులు వేసుకుని ఆలయపు తోటకు తూర్పు దిక్కున ఉన్న ద్వారం వైపు వెళ్ళారు. ‘మ’ కూడా ఆయన్ను అనుసరించాడు. ఆలయ నిర్వహణాధికారి దారిలో నిలబడి ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు వినయపూర్వకంగా ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు ఆలయ ఆవరణపు ఉత్తర ద్వారం గుండా వెళ్ళారు. అక్కడ గడ్డంతో ఉన్న కాపలావారు ఉన్నారు. ఆయన ఎడమ వైపుగా ఉన్న కుఠీని దాటుకుంటూ వెళ్ళారు. అటుపై దారికి ఇరువైపులా పువ్వుల చెట్లు ఉన్నాయి. కుడి ప్రక్కన అనతి దూరంలోనే కాళీ ఆలయపు కోనేరు కానవస్తోంది.
33.2 ద్వితీయ పరిచ్ఛేదం హృదయ్‌తో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు ఆలయ ఆవరణ నుండి బయటకు వచ్చి యదుమల్లిక్ తోట ద్వారం వద్ద హృదయ్ నిలబడి ఉండడం చూశారు. శ్రీరామకృష్ణులను చూడగానే చేతులు జోడించి నిలబడి ఉన్న హృదయ్ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన లేవమనే సరికి, అతడు లేచి నిలబడి పసిబాలుడిలా భోరున ఏడ్వసాగాడు. శ్రీరామకృష్ణుల కనుకొలకులలో కూడా నీరు అగుపించింది. చేతులతో కన్నీరు తుడుచుకున్నారు. ఎంత ఆశ్చర్యం! హృదయ్ దక్షిణేశ్వరంలో వసించేటప్పుడు అతడు శ్రీరామకృష్ణులను నానా యాతనలు పెట్టాడు. అటువంటి హృదయ్ కోసం ఆయన దాదాపుగా పరుగెత్తుకుంటూ వచ్చారు, విలపిస్తున్నారు కూడా.
శ్రీరామకృష్ణులు: ఇక్కడకు ఎందుకు వచ్చావు?
హృదయ్ (ఏడుస్తూ): నిన్ను చూడడానికి వచ్చాను. నా దుఃఖాలను నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోను?
శ్రీరామకృష్ణులు నవ్వి, ఓదార్పుగా ఇలా అన్నారు: “సంసారంలో ఇటువంటి దుఃఖాలు ఉండనే ఉంటాయి. సంసార జీవితంలో సుఖదుఃఖాలన్నవి సహజం. (‘మ’ ను చూపుతూ) అందుకనే వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటారు. ఒకటి రెండు భగవత్ప్రసంగాలు వినగానే మనస్సుకు సాంత్వన చేకూరుతుంది. ఇప్పుడు నీ బాధ ఏమిటి?
హృదయ్ (ఏడుస్తూనే): నీ సాంగత్యం కోల్పోయానన్నదే నా బాధ.
శ్రీరామకృష్ణులు: నువ్వే చెప్పావు కదా – ‘నీ దారి నువ్వు చూసుకో. నా దారి నేను చూసుకుంటాను’ అని.
హృదయ్: అవును, నిజమే. అయితే అజ్ఞానంలో అలా పలికాను.
శ్రీరామకృష్ణులు: సరేలే, ఇవాళ్టికి నువ్విక వెళ్ళు. మరో రోజు రా. అప్పుడు మాట్లాడుకుందాం. నేడు ఆదివారం కదా! చాలామంది వచ్చి ఉన్నారు. నా కోసం కాచుకొని ఉన్నారు. ఈసారి పంటలు ఎలా ఉన్నాయి?
హృదయ్: ఏదో, ఫరవాలేదు.
శ్రీరామకృష్ణులు: సరేలే, తరువాత కలుసు కుందాం. మరో రోజు రా.
హృదయ్ (హృదయ్రామ్ ముఖోపాధ్యాయ)
హృదయ్, శ్రీరామకృష్ణులకు మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేశాడు. తరువాత శ్రీరామకృష్ణులు ‘మ’ తో కలసి వెనక్కు తమ గదికి బయలుదేరారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): హృదయ్ నాకు ఎంతగా సేవలు చేశాడో అంతగా యాతనలు కూడా పెట్టాడు. నేను ఉదర వ్యాధితో బాధపడేటప్పుడు దేహం అస్థిపంజరంలా తయారయింది. ఏమీ తినలేకపోయేవాడిని. అప్పుడు అతడు నాతో ‘ఇలా చూడు, నేను ఎంత బాగా తింటున్నానో చూడు. అర్థం పర్థం లేని ఆలోచనల కారణంగానే నువ్వు ఏమీ తినడం లేదు’ అనేవాడు. మళ్ళీ ఇలా అనేవాడు. ‘నేను కనుక నీతో ఉండకపోయినట్లయితే నీ సాధుత్వమంతా ఏమై ఉండేది?’ ఒకనాడు అతడు నన్ను ఎంతగా కష్టపెట్టాడంటే, ఆ కష్టాలను భరించలేక గంగలో దూకి దేహత్యాగం చేద్దామనే ఉద్దేశంతో నది గట్టుపై నిలబడ్డాను. ఆ సమయంలో నది పోటులో ఉంది.
ఈ మాటలు విని ‘మ’ నివ్వెరపోయాడు. ‘ఆహా! ఏమి కారుణ్యం!’ అటువంటి వ్యక్తి కోసమేనా ఈయన కన్నీరు కార్చింది’ అనుకున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అది సరే, హృదయ్ నన్ను అంతగా సేవించాడు కదా! అయినప్పటికీ అతడికి ఈ దుర్గతి ఎందుకు పట్టినట్లు? పసిపిల్ల వాడి ఆలనాపాలనా చూసుకున్నట్లు నన్ను చూసుకున్నాడు. రాత్రింబవళ్ళు నేను స్పృహతప్పి పడిపోయి ఉండేవాడిని. పైగా చాలా రోజులపాటు జబ్బుతో బాధ పడ్డాను. ఆ సమయంలో నేను పూర్తిగా అతడి మీదనే ఆధారపడి ఉండేవాడిని. అతడు నన్ను ఎలా కూర్చోబెడితే అలాగే కూర్చుండి పోయేవాడిని.
పాపం! ‘మ’ ఏమని బదులు చెప్పగలడు? మారుమాట్లాడలేదు. ‘హృదయ్ బహుశా ఆ సేవలను నిష్కామభావంతో చేసి ఉండడు’ అని తలచాడు.
33.3 తృతీయ పరిచ్ఛేదం వివిధ విషయాలపై భక్తులతో సంభాషణ – భావం, మహాభావం
శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగి వచ్చి చిన్నమంచం మీద కూర్చున్నారు. ఆయన కోసం భక్తులు ఆతురతతో నిరీక్షిస్తున్నారు. కొన్నగర్ నుండి అనేకమంది భక్తులు వచ్చారు. వారిలో ఒకడు శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు.
భక్తుడు: అయ్యా, మీకు తరచూ సమాధిస్థితి కలుగుతుంటుందని విన్నాము. అలా ఎందుకు అవుతుందో, ఎలా అవుతుందో మాకు వివరించ ప్రార్థన.
శ్రీరామకృష్ణులు: రాధాదేవికి మహాభావం కలుగుతూండేది. ఆమెను తాకడానికి చెలి ఒకతె వెళ్ళబోయినప్పుడు మరో చెలి, ఆ చెలిని ఇలా వారించేది: ‘ఆమె దేహాన్ని తాకవద్దు, అది కృష్ణుడి క్రీడాస్థానం. ప్రస్తుతం ఆమె దేహంలో కృష్ణుడు క్రీడిస్తున్నాడు.’
“భగవదనుభూతి కలుగనిదే భావం లేదా మహాభావం జనించదు. నీటిలో ఎంతో లోతు నుండి ఏదైనా చేప వచ్చినప్పుడు నీటిలో కదలిక ఉంటుంది. అదే పెద్దచేప కనుక అయినట్లయితే నీరు చెల్లాచెదరయిపోతుంది. అందుకే భక్తుడు భావంలో నవ్వుతాడు, ఏడుస్తాడు, నాట్యం చేస్తాడు, గానం చేస్తాడు.
“భావంలో ఎక్కువసేపు ఉండజాలం. ఎవరైనా వ్యక్తి అద్దం ఎదుట కూర్చుని సర్వదా తన ప్రతిబింబం కేసి చూసుకుంటూ ఉంటే జనం అతణ్ణి పిచ్చివాడి కింద జమకడతారు.”
భక్తుడు: అయ్యా, మీరు భగవంతుణ్ణి దర్శిస్తారని విన్నాము. దయచేసి మాకు కూడా ఆ దర్శనం కలుగచెయ్యండి.
33.3.1 సాధన చేస్తేనే భగవత్ ప్రాప్తి
శ్రీరామకృష్ణులు: అంతా భగవదాధీనమే. మనిషి చేయగలిగింది ఏముంది? భగవన్నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఒక్కోసారి అశ్రువులు స్రవిస్తాయి, ఒక్కోసారి అలా జరుగదు. ఆయన్ను ధ్యానించేటప్పుడు ఒక్కో రోజు గొప్ప ఉద్దీపన కలుగుతుంది, ఒక్కో రోజు అలా కాదు.
“పనిచేయాలి, అప్పుడే దర్శనం లభించేది. ఒక రోజు, భావావస్థలో హల్దార్పుకూర్ను చూశాను. నిమ్నజాతికి చెందిన ఒక వ్యక్తి నీటిపైన ఉన్న పాచిని ప్రక్కకు తొలగించి నీరు తీసుకుంటున్నాడు. మధ్య మధ్యలో ఆ నీటిని చేతిలోకి తీసుకుని పరీక్షిస్తున్నాడు. పాచిని తొలగించకుండా నీటిని చూడజాలమన్న సంగతి నాకు ఆ స్థితిలో ఆవిష్కృతమైనది. అంటే పనిచేయకుండా భక్తిని పొందలేము, భగవద్దర్శనం కలుగదు. పని అంటే అర్థం జపం, ధ్యానం మొదలైనవి. భగవంతుడి నామగుణ కీర్తనలు కూడా పనే. ఇంకా దానం, యజ్ఞం ఇత్యాదులు కూడా పనే.
“వెన్న కావాలంటే ముందుగా పాలను తోడుపెట్టాలి. తరువాత దాన్ని కదపకుండా ఉంచాలి. పెరుగు తోడుకున్న పిదప శ్రమకోర్చి చిలకాలి. అప్పుడే నీకు వెన్న లభించేది.
మహిమాచరణ్: అవునండీ. పని చేయవలసిందే. లేకుంటే ఎలా? ఎంతగానో పరిశ్రమించ వలసి ఉంటుంది. అప్పుడే కదా ఫలితం దక్కేది. చదవడానికి ఎంత ఉందని! శాస్త్రాలకు అంతు లేదు.
33.3.2 శాస్త్రాధ్యయనం, విచారణల కన్నా వ్యాకులత, సాధనలే ప్రధానం
శ్రీరామకృష్ణులు (మహిమాతో): నువ్వు శాస్త్రాలు ఎన్నని చదవగలవు? కేవలం విచారణతో ప్రయోజనం ఏమిటి? ముందుగా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. గురువాక్యం పట్ల విశ్వాసం ఉంచి ఏమైనా పని చెయ్యి. గురువు లేనిపక్షంలో వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయన ఎలా ఉంటాడో ఆయనే తెలియపరుస్తాడు.
“పుస్తకాలు చదవడం ద్వారా భగవంతుని గురించి ఏం తెలుసుకోగలవు? సంత చేరుకోనంత వరకు దూరం నుండి మనం ఆ కోలాహలాన్ని కేవలం అస్పష్టంగా మాత్రమే వినగలుగుతాం. అయితే సంతలోకి వెళ్ళాక ఆ సంగతే వేరు. అప్పుడు అంతా స్పష్టంగా చూడవచ్చు, స్పష్టంగా వినవచ్చు. ‘బంగాళాదుంపలు తీసుకో, నగదు ఇవ్వు’ వంటి కేకలు వినవచ్చు.
“దూరం నుండి నువ్వు సముద్రపు హోరును మాత్రమే వినగలవు. దానికి సమీపంగా వెళ్ళే కొద్దీ ఓడలు పయనిస్తూ ఉండడం, పక్షులు ఎగురుతూండడం, అలలు ఉవ్వెత్తున లేస్తూ ఉండడం – అంతా చూడవచ్చు.
“పుస్తక పఠనం ద్వారా యథార్థ భగవదనుభూతిని పొందజాలం. ఆ అనుభూతికీ, పుస్తక పరిజ్ఞానానికీ ఎంతో వ్యత్యాసం ఉంది. భగవద్దర్శనం తరువాత పుస్తకాలు, శాస్త్రాలు, సైన్సు (విజ్ఞానశాస్త్రం) అన్నీ గడ్డిపోచలా తోస్తాయి.
“కావలసింది ఇంటి యజమానితో పరిచయం. ఆయనకు ఎన్ని ఇళ్ళు, ఎన్ని తోటలు, ఎన్ని రొక్క పత్రాలు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడానికి అంతగా ఆతురత చూపడం ఎందుకు? ఇంటి నౌకర్ల వద్దకు వెళితే వారు అక్కడ నిలబడడానికి కూడా అనుమతించరు. ఇక రొక్క పత్రాల గురించి ఏం చెబుతారు? అందుకే ఏదో విధంగా ఇంటి యజమానిని పరిచయం చేసుకోవాలి – అది నౌకర్లతో గెంటివేయబడైనా సరే, లేకుంటే ప్రహరీగోడ దూకి అయినా సరే. అప్పుడు తనకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎన్ని తోటలున్నాయో, ఎన్ని రొక్క పత్రాలున్నాయో స్వయంగా యజమానే తెలుపుతాడు. పైగా ఆయనతో పరిచయం ఏర్పడితే నౌకర్లు, ద్వారపాలకులు అందరూ సలాంచేస్తారు.” (అందరూ నవ్వారు)
భక్తుడు: మరి ఇంటి యజమానితో పరిచయం కలిగించుకోవడం ఎలా అన్నదే ప్రశ్న.
శ్రీరామకృష్ణులు: పని అవసరం అని నేను చెబుతోంది అందుకే. భగవంతుడు ఉన్నాడు అని పలికి ఊరకే కూర్చుని ఉంటే ఒరిగేదేమీ ఉండదు. ఏదో విధంగా ఆయన వద్దకు వెళ్ళాలి. ఏకాంతంలో ఆయన్ను పిలువు, ప్రార్థించు. ‘ఓ ప్రభూ, దర్శనం ఇవ్వు, దర్శనం ఇవ్వు’ అంటూ వ్యాకుల చిత్తంతో విలపించు. కామినీకాంచనాల కోసం పిచ్చివాడిలా తిరుగాడుతావు. మరి అటువంటప్పుడు భగవంతుడి కోసం ఒకింత పిచ్చివాడివవు. ‘ఫలానా వ్యక్తి భగవంతుడి కోసం పిచ్చివాడైపోయాడు’ అని జనం చెప్పుకోనివ్వు. కొన్ని రోజులు సర్వం త్యజించి ఏకాంతంలో ఆయన్ను ప్రార్థించు.
“ఊరకే ‘భగవంతుడు ఉన్నాడు’ అంటూ కూర్చోవడం వల్ల ఏం సాధించగలవు? హల్దార్ పుకూర్లో పెద్దపెద్ద చేపలు ఉంటాయి. చెరువు ఒడ్డున ఊరకే కూర్చుని ఉంటే చేపలు దక్కుతాయా ఏమిటి? వాటిని పట్టుకోవడానికి మసాలా పూసిన ఎరను తయారుచేసి దానిని చెరువులోకి వేయాలి. అప్పుడు మెల్లమెల్లగా చేపలు అగాధాల నుండి వస్తాయి; నీటిలో కదలిక కానవస్తుంది. దానితో ఆనందం జనిస్తుంది. బహుశా ఏదైనా చేప ఒకటి శబ్దం చేస్తూ ఎగిరి దూకుతుంది. అది అలా అస్పష్టంగా కనిపించగానే నీకు మరింతగా సంతోషం కలుగుతుంది.
“పాలను పెరుగుగా తోడుబెట్టి, పిదప ఆ పెరుగును చిలికినప్పుడే కదా వెన్న లభ్యమయ్యేది. (మహిమాతో) ఈ వ్యవహారమేదో బాగానే ఉందే! ఎవరో వచ్చి భగవంతుణ్ణి చూపించాలి, అయితే తాను మాత్రం ఊరకే కూర్చుని ఉండాలి! వెన్నను తీసి నోటి ముందు ఉంచాలి! (అందరూ నవ్వారు) వ్యవహారం బాగానే ఉంది. చేపను పట్టి చేతికి అందించాలట.
“ఒక వ్యక్తి రాజును దర్శించాలనుకున్నాడు. రాజు సప్త ద్వారాలకు ఆవల ఉన్న అంతః పురంలో వసిస్తున్నాడు. ప్రథమ ద్వారం దాటగానే ఆ వ్యక్తి ‘రాజుగారు ఎక్కడున్నారు?’ అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్నవి మొత్తం ఏడు ద్వారాలు. ఒకదాని తరువాత మరొకటిగా అతడు ద్వారాలన్నిటినీ దాటాకనే కదా రాజుగారిని దర్శించగలిగేది.”
33.3.3 భగవల్లబ్ధికి మార్గం – వ్యాకులత – ‘అసాధారణ ఔషధం’ కథ
మహిమాచరణ్: ఎటువంటి కర్మ ద్వారా మనం భగవంతుణ్ణి పొందగలం?
శ్రీరామకృష్ణులు: ఈ కర్మ ద్వారా ఆయన్ను పొందగలము, ఈ కర్మ ద్వారా ఆయన్ను పొందలేము అంటూ ఏమీ లేదు. అదంతా ఆయన కృప మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనోవ్యాకులతతో కొంత కర్మ అంటూ చేయవలసిందే. వ్యాకులత ఉన్నట్లయితే ఆయన కృప కలుగుతుంది.
“భగవంతుణ్ణి పొందడానికి అనుకూల పరిస్థితులు ఉండాలి. సాధుసాంగత్యం, వివేచన, సద్గురువు ప్రాప్తి – ఇటువంటివి. బహుశా అన్నయ్య ఇంటి బాధ్యతలను స్వీకరించవచ్చు; లేకుంటే భార్య విద్యాశక్తిగా ఉండి గుణవంతురాలై ఉండవచ్చు; లేకుంటే, ఆ వ్యక్తి అవివాహితుడై సంసారంలో బద్ధుడు కాకుండా ఉండి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అది సాధ్యపడుతుంది.
“ఒక ఫలానా కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో బాధ పడుతున్నాడనుకోండి. ఆ వ్యక్తి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఆ ఇంటి యజమానికి ఎవరో ఇలా సలహా ఇచ్చారు: ‘దీనికి ఒక చికిత్స ఉంది. ముందుగా స్వాతి నక్షత్రంలో వర్షం కురవాలి. ఆ వర్షపు నీరు ఒక మనిషి పుర్రెలో పడాలి. అప్పుడు కప్ప ఒకటి అక్కడకు రావాలి, ఒక పాము దాన్ని వెంబడిస్తూ ఉండాలి. కప్పను పాము కాటు వేయబోయే సమయంలో ఆ కప్ప ఒక్క గెంతుతో ఆ కాటు నుండి తప్పించుకోవాలి, ఆ పాము విషం పుర్రెలో పడాలి. ఆ విషంతో తయారుచేసిన ఔషధాన్ని రోగి పుచ్చుకుంటే అతడు బ్రతికి బయటపడే అవకాశం ఉంది.’ ఇది విని ఆ ఇంటి యజమాని నక్షత్రమేమిటో పంచాంగంలో చూసి సరైన సమయంలో బయలుదేరాడు. మనోవ్యాకులతతో ఔషధం తయారు చేయడానికి కావలసిన వస్తువులు కోసం వెదుకసాగాడు. ‘ప్రభూ, నువ్వు ఈ వస్తువులన్నీ ప్రాప్తింపచేస్తే, పని జరిగిపోతుంది’ అని అతడు అంతరంగాన భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు. ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు నిజంగానే పుర్రె ఒకటి నేల మీద పడి ఉండడం అతడు చూశాడు. చూస్తూండగానే ఒక వానజల్లు పడింది. అప్పుడు ఆ వ్యక్తి భగవంతున్ణి ఇలా మొరపెట్టుకున్నాడు: ‘ప్రభో, స్వాతి నక్షత్రపు జిల్లు పడింది, పుర్రె కూడా లభించింది. పైగా, ఆ వాన నీరు కొంత పుర్రెలో కూడా పడింది. ఇప్పుడు దయచూపి తక్కిన వస్తువులు కూడా లభించేలా చెయ్యి.’ ఈ విధంగా అతడు పరితపిస్తున్నప్పుడు విషసర్పం ఒకటి అటువైపుగా రావడం చూశాడు. అప్పుడు అతడి ఆనందానికి హద్దు లేక పోయింది. అతడు ఎంతగా ఉత్తేజితుడయ్యాడంటే తన గుండె కొట్టుకోవడం అతడికి స్పష్టంగా వినిపిస్తోంది. ‘భగవంతుడా’ అంటూ ఇలా ప్రార్థించాడు: ‘ఇప్పుడు పాము కూడా వచ్చింది. ఔషధానికి వస్తువులు చాలావరకు సమకూరాయి. దయ ఉంచి తక్కిన వాటిని కూడా సమకూరేలా చెయ్యి.’ అతడు అలా ప్రార్థించాడో లేదో, అక్కడకు ఒక కప్ప కూడా గెంతుతూ వచ్చింది. పాము దాని వెంటపడింది. అవి అలా పుర్రె వద్దకు వచ్చాక పాము, కప్పను కాటు వేయబోయింది. కప్ప ఒక్క గెంతున ప్రక్కకు తప్పుకొంది. పాము విషం పుర్రెలో పడింది. అప్పుడా వ్యక్తి ఆనందంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేయసాగాడు.
“వ్యాకులత ఉంటే సర్వం సిద్ధిస్తుందని అందుకే నేను చెబుతూంటాను.
33.4 చతుర్థ పరిచ్ఛేదం సన్న్యాసం, గృహస్థాశ్రమం – నిజమైన సన్న్యాసి ఎవరు?
శ్రీరామకృష్ణులు: మానసికంగా సంపూర్ణ త్యాగం చేయనిదే భగవత్సాక్షాత్కారం లభించదు. సాధువు సంచయం చేయలేడు. ‘పక్షులు, ఫకీర్లు రేపటి కోసం సంచయం చేయరు.’ నా మనోస్థితి ఎలా ఉందంటే, నాతో పాటు మట్టిని కూడా తీసుకుని వెళ్ళలేను; సంచీలో తమలపాకులు కూడా పట్టుకుని వెళ్ళలేను. హృదయ్ నన్ను పీడించేటప్పుడు ఇక్కడ నుండి కాశీకి వెళ్ళిపోదామనుకున్నాను. కొన్ని బట్టలు తీసుకొని వెళ్దామని అనుకున్నాను కానీ ధనం తీసుకుని ఎలా వెళ్ళగలను? అందువల్ల కాశీకి వెళ్ళలేక పోయాను. (అందరూ నవ్వారు)
(మహిమాతో) “మీరు గృహస్థులు. మీరు ‘ఇదీ’ పట్టుకోండి, ‘అదీ’ పట్టుకోండి. సంసారం, ధర్మం రెండింటినీ పట్టుకోండి.
మహిమా: మహాశయా! ‘దానిని’ పట్టుకున్నవాడు ‘దీనిని’ పట్టుకోగలడా?
శ్రీరామకృష్ణులు: ఒకసారి పంచవటి సమీపంలో గంగానది ఒడ్డున కూర్చుని, ఒక చేతిలో రూపాయిని మరో చేతిలో మట్టిని పట్టుకొని ‘రూపాయి, మట్టి, మట్టి, రూపాయి; రూపాయి మట్టే’ అని విచారణ చేసి రూపాయిని గంగానదిలోకి విసిరివేశాను. అయితే అప్పుడు నాకు ఒక భయం పట్టుకుంది. ‘నేనెంత తెలివిమాలిన వాడిని, లక్ష్మీదేవిని కించపరిచానే! ఆమె తిండి దొరక్కుండా చేస్తే ఎలా?’ అని తలపోయసాగాను. చివరకు నేను కూడా హాజ్రాలా వ్యాపార ధోరణి అవలంబిం చాను. లక్ష్మీదేవితో ‘అమ్మా, నువ్వు నా హృదయంలో వసించు’ అన్నాను. ఒక వ్యక్తి చేస్తున్న తపస్సుకు జగజ్జనని సంతుష్టురాలై ‘ఏదయినా వరం కోరుకో’ అంది. ఆ వ్యక్తి ‘అమ్మా, నువ్వు నాకు వరం ఇవ్వదలిస్తే ఈ వరం ఇవ్వు – నేను నా మనుమళ్ళతో బంగారు కంచంలో భోజనం చేసేటట్లు అనుగ్రహించు’ అని కోరుకున్నాడు. చూశారా, ఒక వరంలోనే మనమళ్ళు, సంపద, బంగారు కంచం అన్నీ సమకూరాయి. (అందరూ నవ్వారు)
“మనస్సులో నుండి కామినీ కాంచనాలు తొలగి పోయినప్పుడు అది భగవంతుడి వైపుకు మరలుతుంది, ఆయనలో లీనమైపోతుంది. ముక్తిని పొందగలిగేది బద్ధజీవే. భగవంతుడి నుండి విముఖులం అవగానే బద్ధులమైపోతాం. త్రాసులో క్రింద ఉన్న ముల్లు, పైన ఉన్న ముల్లు నుండి దూరంగా ఎప్పుడు పోతుంది? పళ్ళెంలో భారం ఉంచినప్పుడు అలా జరుగుతుంది. కామినీ కాంచనాలే ఆ భారం.
“తల్లి గర్భంలో నుండి బయట పడగానే శిశువు ఏడుస్తుంది ఎందుకని? దాని రోదన ఇలా చెబుతూన్నట్లుగా ఉంటుంది: ‘నేను ఎక్కడకు వచ్చి పడ్డానో చూడండి. గర్భంలో ఉన్నప్పుడు నేను భగవంతుడి పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండేదానిని. అయితే ఇప్పుడు ఎక్కడకు వచ్చిపడ్డానో చూడండి.’
(మహిమాతో) “మీరందరు మానసికంగా త్యజించాలి. నిరాసక్తులై గృహస్థ జీవితాన్ని గడపండి.
33.4.1 సంసార త్యాగం
మహిమా: మనస్సు భగవంతుడి వైపుకు మరలినప్పుడు ఆ వ్యక్తి సంసారంలో జీవించగలడా?
శ్రీరామకృష్ణులు: ఇదేం ప్రశ్న? సంసారంలో ఉండకపోతే మరి ఎక్కడకు వెళతాడు? నేను ఎక్కడ ఉన్నా సరే, శ్రీరాముడి అయోధ్యలో ఉన్న అనుభూతిని పొందుతూంటాను. ఈ ప్రపంచమంతా శ్రీరాముడి అయోధ్యే. గురువు నుండి ఉపదేశం పొందాక సంసారం త్యజిస్తానన్నాడు శ్రీరాముడు. అతణ్ణి ఆ ప్రయత్నం నుండి విరమింప చేయడానికి దశరథుడు, వసిష్ఠ మహర్షిని పంపాడు. రాముడు తీవ్రవైరాగ్య జనితుడై ఉండడం వసిష్ఠుడు గమనించాడు. అతడితో ఇలా అన్నాడు: ‘రామా! ముందుగా నువ్వు నాతో వాదన చెయ్యి. కావాలంటే ఆ తరువాత సంసారాన్ని త్యజించు. సంసారమనేది భగవంతుడి నుండి వేరై ఉందా? అలా వేరై ఉన్న పక్షంలో నువ్వు దాన్ని త్యజించవచ్చు.’ భగవంతుడే సమస్త జీవజగత్తులుగా విరాజిల్లుతున్నట్లు రాముడు దర్శించాడు. భగవంతుడి అస్తిత్వం కారణంగానే సమస్తమూ వాస్తవంగా ద్యోతకమవుతోంది. అందుచేత రాముడు మౌనం వహించాడు.
“ఈ ప్రపంచంలో కామక్రోధాదులతో పోరు సలపవలసి ఉంటుంది. పలురకాల కోర్కెలతో, ఆసక్తితో యుద్ధం చేయవలసి ఉంటుంది. కోటలోనే ఉంటూ, అంటే ఇంట్లోనే ఉంటూ యుద్ధం చేయడం అనుకూలం. ఇంట్లో తినడానికి తిండి దొరుకుతుంది, ధర్మపత్ని పలువిధాలుగా సహాయం చేస్తుంది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. అన్నం కోసం ఏడు ఇళ్ళ తలుపులను తట్టడం కంటే ఒకేచోట ఉండి పుచ్చుకోవటం మేలు. ఇంట్లో జీవించటం కోటలో ఉండి యుద్ధం చేయటం లాటిది.
“తుపాను గాలికి ఎగురుతూ ఉన్న ఎంగిలి విస్తరాకులా సంసారంలో వసించు. తుపాను గాలికి ఆ ఆకు ఒక్కోసారి ఇంటి లోపలికి పోతుంది, మరోసారి చెత్తకుప్పపై పడుతుంది. గాలి ఎటువైపు వీస్తే ఆకు కూడా అటువైపే కొట్టుకుపోతుంది. ఒక్కోసారి మంచిచోటుకు, ఒక్కోసారి అపరిశుభ్రమైన చోటుకు పోతుంది. భగవంతుడు ప్రస్తుతం నిన్ను సంసారంలో ఉంచాడు, అది మంచిదే. ఇప్పుడు నువ్వు అదే చోట ఉండు. తరువాత నిన్ను ఆ చోటు నుండి లేవదీసి అంతకంటే మంచి ప్రదేశంలో నిలిపినప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది.
33.4.2 ఆత్మ సమర్పణ – ‘రాముడి ఇచ్ఛ’ కథ
“భగవంతుడు నిన్ను సంసారంలో నిలిపాడు. అందుకు నువ్వేం చేయగలవు? సమస్తం ఆయనకు సమర్పించు. ఆయనకు ఆత్మసమర్పణం చేసుకో. అటుపైన మరే చింతా ఉండదు.అప్పుడు అంతా ఆయనే చేస్తున్నట్లుగా తెలుసుకోగలవు. సర్వం ‘రాముడి ఇచ్ఛ’ మీదనే ఆధారపడి ఉంటుంది.”
ఒక భక్తుడు: అయ్యా, ‘రాముడి ఇచ్ఛ’ గురించిన కథ చెబుతారా?
శ్రీరామకృష్ణులు: ఒక ఫలానా గ్రామంలో ఒక సాలెవాడు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. గ్రామస్థులకు అతడంటే ఎంతో ఇష్టం, అతడిపై ఎంతో నమ్మకం ఉన్నది. తాను నేసిన వస్త్రాలను అతడు సంతలో విక్రయించేవాడు. వస్త్రం ధర ఎంత అని కొనుగోలుదారులు అడిగినప్పుడు అతడు ఇలా పలికేవాడు: ‘రాముడి ఇచ్ఛ మేరకు నూలు ధర ఒక రూపాయి. రాముడి ఇచ్ఛ మేరకు వస్త్రం నేసినందుకు కూలి నాలుగు అణాలు. రాముడి ఇచ్ఛ మేరకు లాభం రెండు అణాలు. రాముడి ఇచ్ఛ మేరకు వస్త్రం ధర రూపాయి ఆరు అణాలు.’ జనానికి అతడి మీద ఎంతటి విశ్వాసం ఉండేదంటే, వారు తక్షణమే డబ్బు ఇచ్చేసి వస్త్రం కొనుక్కొనే వాళ్ళు. అతడు పరమ భక్తుడు. రాత్రి భోజనం ముగించి చాలాసేపటి వరకు ఆలయ మండపంలో కూర్చుని భగవచ్చింతన చేసేవాడు, ఆయన నామగుణ కీర్తనలు చేసేవాడు. ఒక రోజు రాత్రి చాలా పొద్దుపోయింది. అతడికి నిద్ర పట్టలేదు, మధ్య మధ్యలో పొగ త్రాగుతున్నాడు. అదే సమయంలో ఆ దారి గుండా బందిపోట్ల గుంపు ఒకటి దొంగతనం చెయ్యడానికి వెళుతోంది. వారికి తమ సామగ్రి మోయడానికి ఒక వ్యక్తి అవసరమైనందున ఆ సాలెవాడిని ‘మాతో పాటు రా’ అని పిలిచి చెయ్యి పట్టుకుని తీసుకుపోయారు. పిదప ఒక ఇంటిని కొల్లగొట్టారు. అనేక వస్తువులను సాలెవాడి నెత్తి కెక్కించి అతడితో మోయించ సాగారు. అప్పుడు పోలీసులు అక్కడకు రావడం జరిగింది. బందిపోట్లందరూ పారిపోయారు కానీ సాలెవాడు మాత్రం నెత్తి మీద భారంతో పట్టుబడ్డాడు. ఆ రోజు రాత్రి అతణ్ణి కారాగారంలో బంధించారు. మరుసటి రోజు విచారణ నిమిత్తం మేజిస్ట్రేటు ముందు హాజరు పరిచారు. ఈ విషయం తెలియడంతో గ్రామస్థులందరూ అక్కడకు వచ్చారు. వారందరూ ‘అయ్యా, ఈ వ్యక్తి ఎన్నటికీ దొంగతనం చేయజాలడు’ అని మేజిస్ట్రేటుకు విన్నవించారు. ‘ఏమయ్యా, అసలు ఏమయిందో చెప్పు’ అని ఆయన అతణ్ణి అడిగాడు. అందుకు అతడు ఇలా సమాధానమిచ్చాడు: ‘అయ్యా, రాముడి ఇచ్ఛ మేరకు నేను నిన్న రాత్రి భోజనం చేశాను. తరువాత రాముడి ఇచ్ఛ మేరకు ఆలయ మండపంలో కూర్చుని ఉన్నాను. రాముడి ఇచ్ఛ మేరకు రాత్రి బాగా పొద్దుపోయింది. రాముడి ఇచ్ఛ మేరకు నేను ఆయన్ను ధ్యానిస్తూ ఆయన నామగుణ కీర్తనలు చేస్తూ ఉన్నాను. అదే సమయంలో రాముడి ఇచ్ఛ మేరకు బందిపోట్ల గుంపు ఒకటి ఆ దారిలో వెళుతోంది. రాముడి ఇచ్ఛ మేరకు వాళ్ళు నన్ను కూడా లాక్కుని వెళ్ళారు. రాముడి ఇచ్ఛతో వాళ్ళు ఒక ఇంట్లో దొంగతనం చేశారు. రాముడి ఇచ్ఛ మేరకు పోలీసులు అక్కడకు వచ్చారు. రాముడి ఇచ్ఛ వల్ల నేను పట్టుపడ్డాను. అప్పుడు రాముడి ఇచ్ఛ మేరకు పోలీసులు నన్ను కారాగారంలో పెట్టారు. ఈ రోజు ఉదయం రాముడి ఇచ్ఛ కారణంగా వాళ్ళు నన్ను మీ ఎదుట హాజరు పరిచారు.’ సాలెవాడు ధర్మపరాయణుడని గ్రహించి మేజిస్ట్రేటు అతణ్ణి విడుదల చేశాడు. ఇంటికి వెళ్తూ సాలెవాడు తన మిత్రులతో ‘రాముడి ఇచ్ఛ మేరకు నన్ను విడుదల చేశారు’ అన్నాడు. సంసారంలో ఉండడం, సన్న్యాసం పుచ్చుకోవడం – అంతా రాముడి ఇచ్ఛే. అందుకే, భారం అంతా ఆయనకే వదలిపెట్టి సంసార బాధ్యతలు నిర్వర్తించు. లేకుంటే నువ్వు మరేం చేస్తావు? ఒకసారి ఒక గుమాస్తా చెరసాలపాలయ్యాడు. శిక్ష పూర్తయ్యాక అతణ్ణి విడుదల చేశారు. మరి అతడిప్పుడు గెంతులు వేస్తూ నాట్యం చేస్తాడా ఏమిటి? లేకుంటే తన గుమాస్తాగిరినే కొనసాగిస్తాడా?
“సంసారి జీవన్ముక్తుడయినట్లయితే అతడు సునాయాసంగా సంసారంలో జీవించగలడు. జ్ఞానప్రాప్తి పొందిన వ్యక్తికి ‘ఇక్కడ’, ‘అక్కడ’ అంటూ తేడా ఉండదు. అతడికి అంతా సమానమే. మనస్సులో ‘అక్కడ’ అన్న భావన ఉన్న వ్యక్తికి ‘ఇక్కడ’ అన్న భావన కూడా ఉంటుంది.
“కేశవ్సేన్ను నేను మొట్టమొదటిసారి (జయగోపాల్ సేన్) ఉద్యాన గృహంలో చూసినప్పుడు ‘ఇతడి తోక ఊడిపోయింది’ అన్నాను. అది విని అక్కడ ఉన్న వారందరూ నవ్వారు. అప్పుడు కేశవ్ వారితో ఇలా అన్నాడు: ‘మీరు అలా నవ్వవద్దు. ఈయన అలా చెప్పడంలో ఏదో అంతరార్థం ఉంది. అదేమిటో ఈయన్నే అడుగుదాం.’ తరువాత నేను కేశవ్‌తో ఇలా అన్నాను: ‘తోక రాలనంత వరకు కప్ప నీటిలోనే వసించవలసి ఉంటుంది. గట్టు ఎక్కి అది భూమ్మీద చరించ లేదు. తోక ఊడిపోగానే అది ఒడ్డు మీదకు గెంతుతుంది. అప్పుడు అది నీటిలోనూ ఉండగలదు, భూమ్మీదా వసించగలదు. అదే విధంగా మనిషికి అవిద్య అనే తోక ఊడిపోనంతవరకు అతడు సంసారమనే నీటిలోనే పడి ఉంటాడు. అవిద్య అనే తోక ఊడిపోయినప్పుడు, అంటే జ్ఞానోదయం అయినప్పుడు అతడు ముక్తజీవిగా చరించవచ్చు. లేక, కావాలనుకుంటే గృహస్థుడిగా కూడా జీవించవచ్చు.”
33.5 పంచమ పరిచ్ఛేదం గృహస్థాశ్రమ విషయాలు – నిర్లిప్త సంసారి
మహిమాచరణ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల అమృత వచనాలను భక్తి ప్రపత్తులతో వింటూన్నారు. ఆయన ముఖతా జాలువారే రత్నాలను అందరూ తమతమ సామర్థ్యం మేరకు మూట కట్టుకుంటున్నారు. జోలె మోయలేనంతగా నిండిపోయింది. ఆధారం చిన్నదయినప్పుడు ఉపదేశాలను ఎక్కువగా ధారణ చేసుకోలేము. సృష్టి ప్రారంభం నుండి నేటి వరకు మానవ హృదయాలలో తలెత్తిన సమస్యలన్నీ పరిష్కృతాలవుతున్నాయి. పద్మలోచన్, నారాయణ్ శాస్త్రి, గౌరీ పండితుడు, దయానంద సరస్వతి మొదలైన శాస్త్ర పారంగతులు, పండితశ్రేష్ఠులు ఆశ్చర్య చకితులవుతున్నారు. శ్రీరామకృష్ణులను, ఆయన సమాధి స్థితులను దర్శించినప్పుడు దయానందుడు ఆయన్ను ఇలా ప్రశంసించాడు: ‘మేమందరం వేదవేదాంతాలను కేవలం అధ్యయనం చేశాము. అయితే ఈ మహాపురుషునిలో వాటి ఫలాన్ని చూస్తున్నాము. ఈయన్ను చూశాక, పండితులు శాస్త్రాలను మథించి కేవలం మజ్జిగను మాత్రమే తాగుతారని తెలుస్తోంది. అయితే వెన్న తినేది ఇటువంటి మహనీయులు మాత్రమే’. ఆంగ్ల విద్యలు అభ్యసించిన కేశవ్‌చంద్రసేన్ మొదలైన పండితులు కూడా శ్రీరామకృష్ణులను చూసి విస్మయం చెందారు. వారు ఇలా తలచారు: “ఎంత ఆశ్చర్యం! నిరక్షరాస్యుడైన వ్యక్తి ఇలాంటి నిగూఢ తత్త్వ విషయాలను ఎలా విశదపరచ గలుగుతున్నాడు? ఏసుక్రీస్తులా ఈయన కూడా గ్రామీణభాషలో, కథల రూపంలో ఆబాలగోపాలం సులువుగా అర్థం చేసుకునేలా వివరిస్తున్నారు. ఏసుక్రీస్తు ‘ఫాదర్, ఫాదర్ (తండ్రి, తండ్రి)’ అంటూ పిచ్చివాడే అయిపోయాడు. ఈయన కూడా ‘అమ్మ, అమ్మ’ అంటూ ఉన్మత్తులైపోతారు. “కేవలం జ్ఞానపు అక్షయ భాండాగారం మాత్రమే కాదు. భగవత్ప్రేమ కూడా అవిరళంగా వర్షిస్తూనే ఉంది.’ ఈయన కూడా ఏసుక్రీస్తులా త్యాగపురుషుడు. ఆయనలా ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడు. అందుకే ఈయన ఉపదేశాలలో అంతటి పటుత్వం గోచరిస్తుంది. సంసారులు మాట్లాడితే అందులో అంతటి పటుత్వం ఉండదు. ఎందుకంటే, వారు త్యాగ పురుషులు కాదు కదా! వారికి అంతటి విశ్వాసం ఎక్కడ ఉంది? కేశవ్సేన్ తదితరులు ఇంకా ఇలా అంటుంటారు: “ఇటువంటి నిరక్షరాస్యుడైన వ్యక్తికి ఇంతటి విశాల దృక్పథం ఎలా అలవడింది? ఎంత ఆశ్చర్యం! ఎలాంటి వైషమ్య భావాలు లేవు! సర్వ మతావలంబులను ఆదరిస్తారు! ఎవరితోనూ ఎలాంటి కలహం లేదు.”
నేడు మహిమాచరణ్తో, శ్రీరామకృష్ణుల సంభాషణ విని ఒక భక్తుడు ఇలా తలపోస్తున్నాడు: ‘శ్రీరామకృష్ణులు, సంసారం త్యజించమని చెప్పడం లేదు. పైగా ఇల్లు కోటలాంటిదని చెబుతున్నారు. ఈ కోటలో వసిస్తూ కామ క్రోధాది శత్రువులతో యుద్ధం చేయడంలో సానుకూలత ఉంది.’ ఇంకా ఇలా అంటున్నారు – ‘సంసారంలో ఉండని పక్షంలో మరి ఎక్కడకు వెళ్ళగలవు? గుమాస్తా, చెరసాల నుండి విడుదల అయ్యాక మళ్ళీ గుమాస్తా పనే కదా చేస్తాడు. అంటే, జీవన్ముక్తుడు సంసారంలో కూడా వసించగలడని చూచూయగా చెప్పారు. అందుకు ఆదర్శం – కేశవ్సేన్, ‘నీ తోక ఊడిపోయింది. ఇక్కడ ఉన్నవారిలో మరెవ్వరికీ అలా కాలేదు’ అని ఈయన ఒకమారు కేశవ్‌తో చెప్పి ఉన్నారు. అయితే ఒక విషయం మాత్రం శ్రీరామకృష్ణులు నొక్కి చెప్పారు – అప్పుడప్పుడు ఏకాంతవాసం చేస్తూండాలి. చెట్టు, చిన్నమొక్కగా ఉన్నప్పుడు దానికి కంచె వేయవలసి ఉంటుంది. లేకుంటే గొడ్డు, గోదా దాన్ని మేస్తాయి. ఆ మొక్క, చెట్టుగా ఎదిగి దాని బోదె దృఢమయ్యాక కంచె ఉన్నా లేకున్నా ఒక్కటే. అప్పుడు ఆ చెట్టుకు ఏనుగును కట్టివేసినా సరే, చెట్టుకు ఎటువంటి హాని వాటిల్లదు. ఏకాంతంలో వసిస్తూ, జ్ఞానాన్ని సముపార్జించుకుని, భగవద్భక్తిని అలవర్చుకొని సంసారంలో ఉన్నట్లయితే ఏ భయమూ ఉండదు. అందుకే ఈయన కేవలం ఏకాంతవాసం గురించి వచిస్తుంటారు.’
భక్తులు ఈ విధంగా తలపోస్తున్నారు. కేశవ్సేన్ గురించి మాట్లాడిన తరువాత శ్రీరామకృష్ణులు మరికొందరు గృహస్థ భక్తుల గురించి మాట్లాడసాగారు.
33.5.1 దేవేంద్రనాథ్ ఠాగూర్‌లో యోగం, భోగం
శ్రీరామకృష్ణులు (మహిమా ప్రభృతులతో): ఒకసారి నేను మథుర్బాబుతో కలసి దేవేంద్రనాథ్ టాగూర్‌ను (రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి) చూడడానికి వెళ్ళాను. మథుర్బాబుతో ఇలా అన్నాను: ‘దేవేంద్ర టాగూర్ భగవచ్చింతన చేస్తూ ఉంటాడని విన్నాను. ఆయన్ను కలుసుకోవాలన్న ఇచ్ఛ కలుగుతోంది.’ అందుకు మథుర్బాబు ఇలా అన్నాడు: ‘అలాగే బాబా. నిన్ను నేను దేవేంద్ర వద్దకు తోడ్కొనిపోతాను. మేమిద్దరం హిందూ కాలేజీలో కలసి చదువుకున్నాం. అతడు నాతో ఎంతో స్నేహంగా ఉంటాడు.’ తరువాత మేమిద్దరం దేవేంద్ర ఇంటికి వెళ్ళాం. అప్పటికి మథుర్, దేవేంద్రలు కలుసుకుని చాలా కాలం అయింది. మథుర్ను చూసి దేవేంద్ర ‘నువ్వు ఎంతో మారిపోయావు. ఇప్పుడు నీకు పొట్టకూడా వచ్చేసింది!’ అన్నాడు. అతడితో మథుర్బాబు నా గురించి ఇలా చెప్పాడు: ‘ఈయన నిన్ను కలుసుకోవడానికి వచ్చాడు. సర్వదా “భగవాన్, భగవాన్” అంటూ పిచ్చివాడిలా ఉంటాడు’. నేను దేవేంద్రుడి దేహ లక్షణాలను చూడదలచాను. ‘ఏదీ, మీ దేహం చూడనివ్వండి’ అన్నాను. దేవేంద్ర తన చొక్కా విప్పాడు. గౌరవర్ణం, లేత ఎరుపు రంగులలో ఉంది. ఆయన జుట్టు అప్పటికి ఇంకా తెల్లబడలేదు.
“ఆయనలో కొద్దిగా స్వాతిశయం ఉండటం గమనించాను. అది సహజమే కదా! ఆయనకు అంతటి ఐశ్వర్యం, పాండిత్యం, పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి! ఆయనలో ఆ స్వాతిశయపు ఛాయలు గమనించి మథుర్బాబుతో ఇలా అన్నాను: ‘స్వాతిశయం కలిగేది జ్ఞానం వల్లనా లేక అజ్ఞానం వల్లనా?’ బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి “నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని, నేను ధనవంతుడిని” అనే అహంకారం ఉంటుందా?’
“దేవేంద్రతో మాట్లాడుతుండగా నాకు హఠాత్తుగా, మళ్ళీ ఆ స్థితి కలిగింది. ఆ స్థితిలో ఎవరు ఎటువంటి వారో నేను స్పష్టంగా చూడగలను. నాకు లోపల నుండి విపరీతమైన నవ్వు వచ్చింది. ఆ స్థితి కలిగినప్పుడు నాకు పండితులు, గిండితులు అందరూ గడ్డిపోచలా తోస్తారు. వివేక వైరాగ్యాలు లేని పండితుణ్ణి వట్టి గడ్డి పోచలా పరిగణిస్తాను. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది; కానీ దాని దృష్టి అంతా క్రింద పడివున్న పీనుగుల మీదనే ఉంటుంది. ఆ పండితుణ్ణి కూడా ఆ రాబందు లాంటి వాడిగానే భావిస్తాను.
“దేవేంద్రలో యోగం, భోగం రెండూ ఉండడం చూశాను. ఆయనకు బహు సంతానం – చిన్నచిన్న పిల్లలు. కుటుంబ వైద్యుడు అక్కడ ఉన్నాడు. చూశారా, ఆయన అంతటి జ్ఞాని అయివుండి కూడా సర్వదా లౌకిక కార్యాలలో తలమునకలై ఉంటాడు. ఆయనతో ఇలా అన్నాను: ‘మీరు కలియుగ జనకులు. జనకుడు ‘ఇది’, ‘అది’ రెండిటినీ పట్టుకుని, అంచువరకు నిండివున్న గిన్నెలో నుండి పాలు త్రాగేవాడు. మీరు సంసారంలో ఉంటూ భగవంతుడి పైన మనస్సు నిలిపి ఉంటారని విని చూడడానికి వచ్చాను. దయచేసి భగవంతుడి గురించి కాస్త చెప్పండి.’
“ఆయన వేదాలలో నుండి పాఠాలు కొన్ని వినిపించాడు. ‘ఈ జగత్తు ఒక చాందినీ (పెద్దపెద్ద హాళ్లలో పైకప్పుకు వ్రేలాడగట్టబడే పలుదీపాల సెమ్మె) వంటిది. ప్రతి జీవి దాన్లో ఒక దీపం’ అన్నాడు. ఒకసారి నేను పంచవటిలో ధ్యానం చేస్తున్నప్పుడు సరిగ్గా అటువంటి దర్శనమే కలిగింది. దేవేంద్రుడి మాటలు నా దర్శనంతో సరిపోలడం చూసి ఆయన్నో గొప్ప మనిషిగా భావించాను; ఆయన చెప్పిన మాటలను వివరించమన్నాను. ఆయన ఇలా అన్నాడు: ‘భగవంతుడు తన మహిమను ప్రదర్శించే నిమిత్తం మనుషులను సృష్టించాడు. లేకుంటే, ఈ జగత్తును తెలుసుకొనేవారెవరు? చాందినీలోని దీపాల ప్రకాశం లేకుంటే సమస్తం అంధకారంగానే ఉండిపోయేది. చివరకు చాందినీ కూడా కనిపించేది కాదు.’
“ఆ విధంగా మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాం. తరువాత దేవేంద్ర సంతోషంతో ‘మీరు మా బ్రహ్మసమాజ ఉత్సవానికి రావాలి’ అన్నాడు. నేను ఇలా అన్నాను: ‘అది భగవత్ సంకల్పం మీద ఆధారపడి ఉంది. నేను ఉన్న స్థితి ఎటువంటిదో చూస్తూనే ఉన్నారు కదా! భగవంతుడు నన్ను ఎప్పుడు ఏ భావంలో ఉంచుతాడో తెలియదు.’ అయితే దేవేంద్ర వదల్లేదు: ‘లేదండి. మీరు రావలసిందే. అయితే మీరు ధోవతి, ఉత్తరీయం ధరించి, రండి. మిమ్మల్ని అవ్యవస్థితంగా చూసి ఎవరైనా ఏమైనా అంటే నాకు బాధ వేస్తుంది.’ అందుకు బదులుగా నేను, ‘నేనలా మాట ఇవ్వలేను. నేను బాబును కాజాలను’ అన్నాను. దేవేంద్ర, మథుర్బాబు అందరూ నవ్వారు.
“ఆ మర్నాడే మథుర్బాబుకు దేవేంద్ర వ్రాసిన ఉత్తరం అందింది. బ్రహ్మ సమాజపు ఉత్సవానికి రమ్మంటూ నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన ఆ ఉత్తరంలో వెనక్కు తీసుకున్నాడు. అందుకు కారణం – ఉత్తరీయం ధరించకపోతే అది చిన్నతనంగా ఉంటుందట. (అందరూ నవ్వారు)
33.5.2 కెప్టెన్ గొప్ప గృహస్థ భక్తుడు
(మహిమాతో) “ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు: ఆయన కెప్టెన్. గృహస్థే కానీ ఆయన గొప్పభక్తుడు కూడా. నువ్వు ఆయనతో మాట్లాడు. కెప్టన్‌కు వేదాలు, వేదాంతం, భాగవతం, గీత, అధ్యాత్మ రామాయణం మొదలైనవన్నీ కంఠస్థం. నువ్వు ఆయనతో మాట్లాడి చూడు.
“ఆయన ధార్మికచింతన గలవాడు. ఒకసారి నేను బారానగర్‌లోని ఒక వీథిలో వెళ్ళేటప్పుడు ఆయన నాకు గొడుగు పట్టాడు. నన్ను తన ఇంటికి తీసుకు వెళ్ళి ఎంతగా సేవించాడని! విసన కర్రతో వీస్తాడు, కాళ్ళు పడతాడు, పలురకాల కూరలు చేయించి నాకు వడ్డిస్తాడు. ఒక రోజు నేను ఆయన ఇంట్లో, మరుగు దొడ్డిలో సమాధిస్థితి నొందాను. ఆయన అంతటి ఆచారనిష్ఠాపరుడైనప్పటికీ, మరుగుదొడ్డిలోకి వచ్చి నన్ను జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. అంతటి నిష్ఠాగరిష్ఠుడైనప్పటికీ అలా చేయడంలో ఆయన ఎటువంటి తిరస్కృతీ చూపలేదు.
“ఆయనకు ఖర్చులు అధికం. కాశీలో వసిస్తున్న సోదరులను ఆయనే పోషిస్తాడు. ఆయన భార్య మొదట్లో పిసినారిగా ఉండేది. ఇప్పుడు కుటుంబ భారం అధికం, తాను ఖర్చు చేద్దామనుకున్న డబ్బునంతటినీ ఖర్చు పెట్టలేకపోతోంది. కెప్టన్ భార్య నాతో ‘ఈయనకు గృహస్థ జీవనం రుచించడం లేదు. అందుకే సంసారం వదిలేస్తానని చెప్పారు’ అంది. ఆ మాట నిజమే. అప్పుడప్పుడు ఆయన సంసారాన్ని పరిత్యజించాలన్న కోర్కె వెలిబుచ్చేవాడు.
“కెప్టెన్ భక్తుల వంశంలో జన్మించిన వాడు. ఆయనగారి తండ్రి సైన్యంలో పనిచేశారు. యుద్ధభూమిలో కూడా ఆయన ఒక చేత్తో శివపూజ చేస్తూ మరో చేత్తో ఒర నుండి తీసిన ఖడ్గాన్ని ధరించి ఉండేవారని విన్నాను.
“కెప్టెన్ ఆచారాలు, నిష్ఠల విషయంలో చాలా పట్టుదల గల వ్యక్తి. నేను కేశవ్ సేన్ వద్దకు వెళ్ళేవాడిని కదా! అందుకని కెప్టన్ ఒక నెల రోజుల పాటు నా వద్దకు రావడం మానేశాడు. నాతో ఇలా అన్నాడు: ‘కేశవ్సేన్ ఆచారాలను ఉల్లంఘించిన వ్యక్తి; ఆంగ్లేయులతో కలిసి భుజిస్తాడు, కుమార్తెను వేరే కులంవాడికి ఇచ్చి పెళ్ళిచేశాడు, కులభ్రష్టుడయ్యాడు.’ అందుకు నేను ఇలా జవాబిచ్చాను: ‘వాటన్నిటిని నేనెందుకు పట్టించుకోవాలి? కేశవ్ హరినామం జపిస్తాడు, అందుకే నేను అతణ్ణి చూడడానికి వెళతాను, భగవత్ప్రసంగాలు వినడానికి వెళతాను. నేను రేగిచెట్టు పళ్ళను మాత్రమే తింటాను. ఆ చెట్టు ముళ్లతో నా కేమిటి పని?’ అయితే కెప్టెన్ తన పట్టు వదల్లేదు. ‘మీరు కేశవ్ సేన్ వద్దకు ఎందుకు వెళతారు?’ అన్నాడు. దానితో నాకు విసుగు పుట్టింది. ఇలా అన్నాను: ‘ఆతడి వద్దకు నేను వెళ్ళేది ధనం కోసం కాదు, హరి నామం వినడానికి వెళ్తాను. నువ్వు లాట్సాహెబ్ (వైస్రాయి) ఇంటికి ఎలా వెళుతున్నావు? ఆయనొక మ్లేచ్ఛుడు. ఆయన సాంగత్యంలో నువ్వు ఎలా ఉండగలవు?’ ఇలా అనే సరికి కెప్టెన్ కాస్త మెత్తబడ్డాడు.
“కాని ఆయన గొప్ప భక్తుడు. పూజ చేసేటప్పుడు కర్పూరంతో హారతి ఇస్తాడు. ఆసనంపై కూర్చుని స్తవస్తోత్రాలు పఠించేటప్పుడు ఆయన పూర్తిగా మరో వ్యక్తే అయిపోతాడు. అందులో తన్మయమైపోతాడు.”
33.6 షష్ఠ పరిచ్ఛేదం వేదాంత విచారణ, మిథ్య – ‘జ్ఞాని అయిన రైతు’ కథ
శ్రీరామకృష్ణులు (మహిమాతో): “వేదాంత విచారణ ప్రకారం ఈ సంసారం మాయామయం, స్వప్నంలా మిథ్య. పరమాత్మ అనేది సాక్షీస్వరూపం. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ సాక్షీస్వరూపమే. ఈ విషయాలన్నీ నీ మనోవైఖరికి నప్పుతాయి కదా! నీ వైఖరితో ఏకీభవించే కథ ఒకటి విను:
“ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు; గొప్ప జ్ఞాని. వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకునే వాడు. అతడు వివాహితుడు. చాలాకాలం తరువాత అతడికి ఒక కుమారుడు జన్మించాడు. వాడికి హారు అని పేరు పెట్టాడు. కుమారుడి పట్ల తల్లిదండ్రుల కిద్దరికీ ఎంతో అనురాగం ఉండేది. అది సహజమే, ఎందుకంటే ఆ కుమారుడు కుటుంబానికి రత్నం లాంటివాడు. రైతు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలవాడైనందున గ్రామస్థులందరూ అతణ్ణి ఇష్టపడేవాడు. ఒక రోజు అతడు తన పొలంలో పని చేసుకుంటున్నాడు. అప్పుడు ఎవరో వచ్చి హారుకు కలరా సోకిందని చెప్పారు. రైతు ఇంటికి వెళ్ళి, హారుకు చికిత్స చేయించాడు. కాని వాడు మరణించాడు. దానితో ఇంట్లోని వారందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కాని రైతు మాత్రం ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. పైగా, దుఃఖీంచి ఏమిటి ప్రయోజనం అంటూ అందరికీ ఓదార్పు చెప్పసాగాడు. తరువాత సేద్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే భార్య ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆమె ఇలా అంది: ‘నువ్వెంత కఠినాత్ముడవు? కుమారుడి కోసం ఒక్క చుక్క కన్నీరైనా కార్చలేదు.’ అందుకు ఆ రైతు ప్రశాంత చిత్తంతో ఇలా సమాధాన మిచ్చాడు: ‘నేనెందుకు ఏడవలేదో చెప్పమంటావా? నిన్న నేనొక కల గన్నాను. అందులో నేను రాజునయ్యాను, ఎనిమిది మంది కుమారులకు తండ్రినయ్యాను. వారితో ఎంతో ఆనందంగా ఉన్నాను. అంతలో మెలకువ వచ్చింది. ఇప్పుడు నేనో సందిగ్ధంలో పడ్డాను– ప్రస్తుతం నేను ఆ ఎనిమిది మంది కుమారుల కోసం దుఃఖీంచాలా లేక ఈ ఒక్క హారు కోసమా?’
“ఆ రైతు జ్ఞాని. అందుకే స్వప్నావస్థ ఏ విధంగా మిథ్యో జాగ్రదావస్థ కూడా అలాగే మిథ్య అని గ్రహించాడు. నిత్యవస్తువు ఒక్కటే, అది ఆత్మ.
33.6.1 విశిష్టాద్వైతం – బిల్వ ఫల దృష్టాంతం
“నా మటుకు నేను అన్నిటినీ అంగీకరిస్తాను; తురీయావస్థతో కూడా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడు. నేను ఈ మూడు స్థితులను అంగీకరిస్తాను. నేను అన్నిటినీ ఒప్పుకుంటాను. బ్రహ్మంతో పాటు మాయ, జీవజగత్తులు అన్నిటినీ. అన్నిటినీ ఒప్పుకోని పక్షంలో పూర్తి బరువు రాదు కదా!”
ఒక భక్తుడు: పూర్తి బరువా? అదేమిటి? (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: బ్రహ్మం అనేది జీవజగత్తులచే ప్రతిపాదితమైనది. మొదట్లో ‘నేతి నేతి’ అని విచారణ చేస్తున్నప్పుడు జీవజగత్తులను తృణీకరించ వలసి ఉంటుంది. ‘అహం’ భావన ఉన్నంత వరకు భగవంతుడే సమస్తం అయి ఉన్నాడన్న బోధ ఉండనే ఉంటుంది. ఆయనే ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడు.
“ఎవరైనా వ్యక్తి బిల్వఫలంలోని సారపదార్థం ఏమిటి అని మాట్లాడేటప్పుడు అందులోని సారం కండ మాత్రమే కానీ దాని పెంకు, విత్తనాలు కాదనేదే ఆతడి ఉద్దేశం. అయితే బిల్వ ఫలపు మొత్తం బరువు గురించి మాట్లాడేటప్పుడు కేవలం కండ బరువును మాత్రమే తూచితే సరిపోదు. అతడు విత్తనాలు, పెంకు, కండ – సమస్తమూ అంగీకరించాలి. విత్తనాలు, పెంకు, కండ అన్నీ అదే ఫలానికి చెందినవి.
“నిత్యం, లీలలు రెండూ ఒకే వస్తువుకు చెందినవి. అందుకే నేను నిత్యం, లీలలు అన్నిటినీ అంగీకరిస్తాను. మాయ అంటూ ప్రపంచాన్ని కొట్టిపడెయ్యను. అలా చేసినట్లయితే బరువు తక్కువైపోతుంది.”
33.6.2 నిత్యం, లీల – జ్ఞానయోగం, భక్తియోగం
మహిమాచరణ్: ఇది చక్కటి మేళనం – నిత్యం నుండి లీలకు, మళ్ళీ లీల నుండి నిత్యానికి.
శ్రీరామకృష్ణులు: జ్ఞానులు అంతా స్వప్నంగానే గాంచుతారు. అయితే భక్తులు అన్ని అవస్థలనూ అంగీకరిస్తారు. జ్ఞానుల నుంచి పాలు కేవలం బొట్లు బొట్లుగానే స్రవిస్తాయి. (అందరూ నవ్వారు) కొన్ని ఆవులు గ్రాసాన్ని ఎంచుకొని మరీ మేస్తాయి. అందుకే అవి బొట్లు బొట్లుగా పాలను ఇస్తాయి. అయితే విచక్షణ చేయకుండా ఏది పడితే దాన్ని తినే ఆవులు కడవల కొద్దీ పాలు ఇస్తాయి. ఉత్తమ భక్తుడు నిత్యం, లీలలు రెండింటినీ అంగీకరిస్తాడు. అందుకే అతడు మనస్సును నిత్యం నుండి క్రిందకు తీసుకు వచ్చినప్పుడు కూడా భగవంతునితో యోగం కలిగే ఉంటాడు. అటువంటి భక్తుడు కడవల కొద్దీ పాలు ఇచ్చే ఆవు లాంటి వాడు. (అందరూ నవ్వారు)
మహిమా: అయితే, అలా ఏది పడితే దాన్ని తినే ఆవు ఇచ్చే పాలలో అదో రకమైన వాసన వస్తుంది. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఆ మాట నిజమే. అందుకే ఆ పాలను కొద్దిగా వేడి చేయాలి. మంటపైన కొద్దిగా వేడిచేయాలి. పాలను జ్ఞానాగ్నిలో కొద్దిగా వేడి చేసినట్లయితే మరే వాసన ఉండదు. (అందరూ నవ్వారు)
33.6.3 ఓంకారం – నిత్యం, లీలల యోగం
(మహిమాతో) “ఓంకారాన్ని మీరు కేవలం ‘అ’ కారం, ‘ఉ’ కారం, ‘మ’ కారాలతో చెబుతారు.
మహిమా: ‘అ’ కారం ‘ఉ’ కారం ‘మ’ కారం అంటే అర్థం సృష్టి స్థితి లయాలు.
శ్రీరామకృష్ణులు: నేను గంట యొక్క ‘టం’ అనే శబ్దపు ఉపమానాన్ని ఇస్తాను: ‘ట–అ–మ్’. అది లీలలో నుండి నిత్యంలో లయమవడం; స్థూల, సూక్ష్మ కారణాలు మహాకారణంలో లయమవడం; జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థల నుండి తురీయావస్థలో లయమవడం. గంట మ్రోగడమనేది సముద్రంలో ఒక పెద్ద వస్తువు పడడం లాంటిది. అప్పుడు తరంగాలు ప్రారంభమవుతాయి. నిత్యం నుండి లీల ప్రారంభమవుతుంది. మహాకారణం నుండి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బయటకు వస్తాయి. అదే తురీయావస్థ నుండే జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు బయలుదేరుతాయి. మళ్ళీ, మహాసముద్రం నుండి ఉత్పన్నమైన తరంగాలు మహాసముద్రంలోనే లయమవుతాయి. నిత్యాన్ని పట్టుకుంటూ వెళితే లీల, మళ్ళీ లీలను పట్టుకుంటూ వెళితే నిత్యం. అందుకే నేను ‘టం’ అనే గంటానాదపు ఉపమానం ఇస్తాను. నేను వీటినన్నిటినీ స్పష్టంగా చూశాను. అంతంలేని చిత్ సముద్రం నాకు దర్శనమయింది. అందులో నుండి ఈ లీల అంతా పైకి లేచింది. మళ్ళీ అందులోనే లయమైపోయింది. చిదాకాశంలో కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతాయి. మళ్ళీ అందులోనే లయమైపోతాయి. ఇదంతా నాకు దర్శనమయింది. పుస్తకాలలో ఏం వ్రాసుందో నాకు పెద్దగా ఏమీ తెలియదు.
మహిమా: అటువంటి వాటిని దర్శించినవారు శాస్త్రాలు వ్రాయలేదు. వారు సర్వదా తమ భావంలోనే మునిగి ఉండేవారు. ఇక శాస్త్రాలు ఎప్పుడు వ్రాస్తారు? వ్రాయడానికి కాస్త లెక్కలుకట్టే బుద్ధి అవసరమవుతుంది. ఋషుల నుండి ఆ విషయాలు విని ఇతరులు ఆ పుస్తకాలు వ్రాశారు.
33.6.4 బ్రహ్మానందం చవిచూస్తే సంసారాసక్తి క్షీణిస్తుంది
శ్రీరామకృష్ణులు: కామినీ కాంచనాల పట్ల ఉన్న అనురక్తి తొలగిపోదు ఎందుకని అని సంసారులు అడుగుతుంటారు. భగవంతుణ్ణి ప్రాప్తించుకుంటే ఆ అనురక్తి తొలగిపోతుంది. ఒకసారి బ్రహ్మానందాన్ని కనుక చవిచూసినట్లయితే ఇంద్రియ సుఖాలు అనుభవించాలనో లేక ధనం, పేరు ప్రతిష్ఠల కోసమనో మనస్సు పరుగు లెత్తదు. దీపపు పురుగు ఒకసారి వెలుగును చూస్తే అది మళ్ళీ చీకటిలోకి పోదు.
“రావణుడితో ఆతడి మిత్రులు కొందరు ఇలా అన్నారు: ‘నువ్వు సీత కోసం నీ మాయాజాలంతో నానా రూపాలు ధరించి వెళుతుంటావు. అయితే రాముడి రూపమే ధరించి సీత వద్దకు వెళ్ళ వెందుకని?’ అందుకు రావణుడు ఇలా సమాధాన మిచ్చాడు: ‘తుచ్ఛం బ్రహ్మపదం పరవధూసంగః కృతః – నేను రామచింతన చేసినప్పుడు బ్రహ్మపదం కూడా తుచ్ఛమైపోతుంది. ఇక పరస్త్రీ విషయం వేరే చెప్పాలా? అటువంటి సామాన్య విషయం కోసం రాముడి రూపాన్ని ఎలా ధరించగలను.’
“సాధన భజనల ఉద్దేశం ఒక్కటే – అది సంసారానురక్తిని తొలగించుకోవడం ఎలా అన్నదే. భగవచ్చింతన ఎంత అధికంగా చేస్తే ఆ మేరకు సామాన్య భోగవస్తువుల పట్ల అనురక్తి ఉడిగిపోతుంది. ఆయన పాదపద్మాల పట్ల భక్తి ఎంతగా వృద్ధి చెందితే అంతగా విషయవాసనలు సన్నగిల్లుతాయి, దేహసుఖాల పట్ల దృష్టి అంతగా తగ్గిపోతుంది. అప్పుడు పరస్త్రీ తల్లిగా తోస్తుంది; భార్య, ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పాటు నందించే సహచరిగా గోచరమవుతుంది. పశుభావాలు తొలగిపోతాయి, దైవీభావాలు ఉత్పన్నమవుతాయి. అటువంటి వ్యక్తి సంసారం పట్ల పూర్తి అనాసక్తుడవుతాడు. అతడు సంసారంలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడై చరిస్తాడు. చైతన్యదేవుల శిష్యులు అనాసక్తులై సంసారంలో జీవించారు.
33.6.5 జ్ఞాని, భక్తుడు
(మహిమాతో) “యథార్థ భక్తుడైన వాడికి నువ్వు వేలాది వేదాంతపు వాదనలు ఉదహరించవచ్చు. ‘సర్వం స్వప్నవత్’ అని వివరించనూ వచ్చు. అయితే అతడి భక్తిని మాత్రం కదల్చలేవు. అటూ ఇటూ తిరిగి అతడు మళ్ళీ భక్తినే ఆశ్రయిస్తాడు. ఒక బేతవనంలో ముసలం ఒకటి పడి ఉండేది. దానితోనే ‘ముసలం కులనాశనమ్’ – యదువంశమంతా అంతరించిపోయింది.
“శివుడి అంశతో జన్మించిన వ్యక్తి జ్ఞాని అవుతాడు. అతడి మనస్సు సర్వదా ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ అనే భావన వైపుకే మరలి ఉంటుంది. విష్ణు అంశతో జన్మిస్తే ప్రేమభక్తి కలుగుతుంది. ఆ ప్రేమ భక్తి తొలగిపోయేది కాదు. జ్ఞాన విచారణల తరువాత ఆ ప్రేమభక్తి కొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చునేమో కానీ అది మళ్ళీ వేయిరెట్లు పెంపొందుతుంది. ముసలం యదువంశాన్ని ధ్వంసం చేసివేసింది కదా – అలాగన్నమాట.”
33.7 సప్తమ పరిచ్ఛేదం మాతృసేవ – శ్రీరామకృష్ణులు, హాజ్రా
శ్రీరామకృష్ణుల గదికి తూర్పుగా ఉన్న వసారాలో హాజ్రా కూర్చుని జపం చేసుకుంటున్నాడు. అతడి వయస్సు 46 లేక 47 సంవత్సరాలు. అతడి జన్మస్థలం కామార్పుకూర్కు దగ్గరలోనే. ఎంతోకాలం వైరాగ్యంతో ఉన్నాడు. ఇంటికి వెళ్ళకుండా బయటనే తిరుగుతూంటాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి పోతాడు. ఇంటి వద్ద కాస్త పొలం ఉంది. దానితో భార్యాబిడ్డలకు జీవనం గడిచిపోతుంది. అయితే హాజ్రాకు వెయ్యి రూపాయల అప్పు ఉంది. దాన్ని తీర్చడమెలా అన్న చింతతో అతడు అహర్నిశలూ సతమతమవుతూ ఉంటాడు. తరచూ కలకత్తాకు వెళ్ళి వస్తుంటాడు. అక్కడ ఠన్ఠనియాలో వసిస్తున్న ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ హాజ్రాను ఎంతగానో ఆదరిస్తాడు, సాధువును సేవించే రీతిలో అతణ్ణి సేవిస్తాడు.
శ్రీరామకృష్ణులు కూడా సర్వదా హాజ్రా యోగక్షేమాలను విచారిస్తూ ఉంటారు. అతడితో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అతడి ధోవతి చిరిగిపోతే క్రొత్త ధోవతిని ఇప్పిస్తారు. అయితే అతడికి వాదనలంటే ఎంతో ఆసక్తి. ఒక్కోసారి ఆ వాదనల ప్రవాహంలో ఎక్కడికో కొట్టుకుపోతుంటాడు కూడా. వసారాలో ఆసనం వేసి కూర్చుంటాడు, సదా సర్వవేళలా జపమాల చేత పుచ్చుకుని జపం చేస్తూంటాడు.
హాజ్రా తల్లికి అనారోగ్యంగా ఉందన్న వార్త వచ్చింది. రామ్‌లాల్ స్వగ్రామం నుండి తిరిగి వచ్చేటప్పుడు హాజ్రా తల్లి రామ్‌లాల్ చేతులు పుచ్చుకుని ఇలా బ్రతిమాలుకుంది: ‘నాయనా రామ్‌లాల్! మీ బాబాయితో (శ్రీరామకృష్ణులు) నా అభ్యర్థన తెలియచెయ్యి. ఏదో విధంగా నచ్చ చెప్పి ప్రతాప్ (హాజ్రా)ను ఇక్కడకు పంపమని చెప్పు. అతడి నొకసారి చూడాలని ఉంది.’ శ్రీరామకృష్ణులు, హాజ్రాకు అదే విషయం చెప్పారు. ‘ఒకసారి ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని చూసి రా. ఆమె రామ్‌లాల్‌తో పరిపరి విధాల చెప్పి పంపించింది. అమ్మకు కష్టం కలిగిస్తే భగవచ్చింతన సాధ్యమయ్యేనా? ఒకసారి వెళ్ళి రా’ అన్నారు.
భక్తులు వెళ్ళిపోయాక మహిమాచరణ్, శ్రీరామకృష్ణుల వద్దకు హాజ్రాను తీసుకువచ్చాడు. ‘మ’ కూడా అక్కడే ఉన్నాడు. మహిమాచరణ్ నవ్వుతూ శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: “అయ్యా, మీతో ఒక విషయం మాట్లాడాలి. హాజ్రాను మీరు ఇంటికి వెళ్ళమని చెప్పారట కదా? అయితే అతడికి ఇంటికి వెళ్ళాలని ఏమాత్రం ఇష్టం లేదు.”
శ్రీరామకృష్ణులు: అతడి తల్లి రామ్‌లాల్ వద్ద ఎంతగానో బాధపడిందట. అందుకే కనీసం మూడు రోజుల పాటయినా ఇంటికి వెళ్ళి ఆమెను చూసి రమ్మని అతడితో చెప్పాను. అమ్మను కష్టపెడితే ఆధ్యాత్మిక సాధనల్లో ఫలం దక్కుతుందా ఏమిటి? నేను బృందావనం వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోదామని దాదాపుగా నిశ్చయం చేసుకున్నాను. అంతలో నాకు మా అమ్మ జ్ఞప్తికి వచ్చింది. నేను ఆమె నుండి దూరమై పోయినట్లయితే ఆమె విలపిస్తుంది అనుకున్నాను. తరువాత మథుర్బాబుతో కలసి ఇక్కడకు వచ్చేశాను. అయినా హాజ్రాలాంటి జ్ఞానికి సంసారంలోకి వెళితే మటుకు భయం ఎందుకు?
మహిమా (నవ్వుతూ): హాజ్రా జ్ఞాని అయిపోయినప్పుడే కదా ఆ ప్రశ్న తలెత్తేది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఊహూఁ, హాజ్రాకు సర్వం సిద్ధించింది. పిల్లలు, కాస్త అప్పు కారణంగానే ఆతడి మనస్సు సంసారం వైపు కాస్త నిలచి ఉంది. పెద్దమ్మకు రోగాలన్నీ ‘నయమై పోయాయి కానీ కాస్త జబ్బు చేసింది, అంతే’ అని జనం అంటుంటారు కదా! (అందరూ నవ్వారు)
మహిమా: అయితే అతడి జ్ఞానం ఎక్కడ ఉంది, మహాశయా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): లేదు నాయనా, నీకు ఆ సంగతి తెలియదు. హాజ్రా ఉత్తముడని అందరూ అంటుంటారు. అతడు రాస్మణి ఆలయంలో వసిస్తుంటాడని అందరికీ తెలుసు. జనం సర్వదా హాజ్రా గురించే చెబుతుంటారు. దీని (శ్రీరామకృష్ణుల) గురించి అడిగే నాథుడే లేడు. (అందరూ నవ్వారు)
హాజ్రా: మీరు అసదృశులు; మీకు సాటియైన వారు లేరు. అందుకే మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేకున్నారు.
శ్రీరామకృష్ణులు: అదీ సంగతి! అసదృశులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేము కదా! మరి అలాంటప్పుడు జనం దీని (తమను) గురించి ఎందుకు పట్టించుకుంటారు? (అందరూ నవ్వారు)
మహిమా: మహాశయా, అతడికి మాత్రం ఏం తెలుసు? మీరు ఎలా చెబితే అలా చేస్తాడు.
శ్రీరామకృష్ణులు: అదేం కాదు. నువ్వే అతణ్ణి అడిగి చూడు. నాతో ‘నీకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు’ అంటాడతడు.
మహిమా: ఎక్కువగా వాదిస్తుంటాడు.
శ్రీరామకృష్ణులు: పైగా, మధ్య మధ్యలో నాకు పాఠాలు కూడా నేర్పుతుంటాడు. (అందరూ నవ్వారు) ఒక్కోసారి అతడి వాదనలు మితిమీరి పోయినప్పుడు అతణ్ణి నేను తిట్టడం కూడా జరిగింది. తరువాత నేను దోమతెరలో పడుకొని ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడానో జ్ఞప్తికి వస్తుంది. హాజ్రాను బాధ పెట్టానన్న ఆలోచనతో నాకు క్షోభ కలుగుతుంది. వెంటనే లేచి వెళ్ళి హాజ్రాకు ప్రణామం చేసి వస్తాను. అప్పటికి కాని నా మనస్సు స్థిమితపడదు.
33.7.1 శుద్ధ ఆత్మ – ఈశ్వరుడు
(హాజ్రాతో) “నువ్వు శుద్ధ ఆత్మను ‘ఈశ్వరుడు’* అని ఎందుకు అంటావు? శుద్ధాత్మ నిష్క్రియమైనది, మూడు అవస్థలకు సాక్షీభూతమైనది. సృష్టి స్థితి లయాల గురించి ఆలోచించినప్పుడు దాన్ని ‘ఈశ్వరుడు’ అంటాను. శుద్ధాత్మ ఎలా ఉంటుందో తెలుసా? అది సూదికి సుదూరంలో ఉన్న అయస్కాంతం లాంటిది. అయితే సూది కదులుతూనే ఉంటుంది కానీ అయస్కాంతం ఎటువంటి కదలికా లేకుండా ఉంటుంది, నిష్క్రియమై ఉంటుంది.”
33.8 అష్టమ పరిచ్ఛేదం సంధ్యాకాల సంకీర్తన – ఈశాన్తో సంభాషణ
సాయంకాలం అవబోతోంది. శ్రీరామకృష్ణులు గదిలో పచార్లు చేస్తున్నారు. ‘మ’ ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా అతడితో ఇలా అన్నారు: “నాకు ఒకటి రెండు నారవస్త్రాలు పట్టుకురా. నేను అందరి వస్త్రాలను ఉపయోగించలేను కదా! మొదట్లో కెప్టెన్‌ను అడుగుదామనుకున్నాను కాని ఇప్పుడు నువ్వే పట్రా.” ‘మ’ కూర్చున్నవాడు లేచి నిలబడి “చిత్తమండీ” అన్నాడు.
సంధ్యాకాలమయింది. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి ధూపం వేశారు. ఆయన, గదిలోని దేవతా పటాలకు మ్రొక్కి బీజమంత్రాన్ని జపించారు. పిదప నామ సంకీర్తన చేయసాగారు. గది బయట అపూర్వమైన శోభ నెలకొని ఉంది. కార్తీక మాసపు శుక్ల పక్ష సప్తమి తిథి. దక్షిణేశ్వర కాళికాలయం విమలచంద్ర కిరణాలలో స్నానం చేస్తున్నట్లుంది. మరో వైపు భాగీరథి మెలమెల్లగా ప్రవహిస్తూన్నది. పోటు ఆగిపోయింది. దేవాలయ హారతి నాదాలు గంగానది యొక్క స్నిగ్ధ ఉజ్వల ప్రవాహం నుండి ఉత్పన్నమౌతున్న మర్మరధ్వనితో కలసిపోయి సుదూరంలో లయమైపోతున్నాయి. ఆలయపు ఆవరణలో ఏక కాలంలో కాళి, విష్ణు, శివాలయాలలో కన్నుల పండువుగా హారతి జరుగుతోంది. పూజారి ద్వాదశ శివలింగాలకు ఒక్కొక్కటిగా హారతి ఇస్తున్నాడు. ఆతని కుడిచేతిలో పంచ దీపం, ఎడమ చేతిలో గంట, వెంట ఉన్న పరిచారకుని చేతిలో జేగంట ఉన్నాయి. నహబత్తులో నుండి సాయం సంధ్యాకాలపు రాగాలు వినవస్తున్నాయి. ఆనందమయి కాళీమాత నిత్యోత్సవం జీవునికి ఇలా జ్ఞప్తి చేస్తున్నట్లు ఉంది: ‘ఓ జీవుడా, నువ్వు నిరాశతో కృంగిపోవద్దు. సంసారంలో సుఖదుఃఖాలు ఉన్నాయన్న మాట నిజమే. అయితే ఏమిటి? ఉంటే ఉండనివ్వు. నీ మటుకు నువ్వు సదా ఆనందంలో విహరిస్తూ ఉండు. ఎందుకంటే మనకు అమ్మ ఉంది కదా! ఏ అమ్మ? జగత్తుకు అమ్మ. దాసీ పుత్రుడికి తినడానికి సరైన తిండి దొరక్కపోవచ్చు, ధరించడానికి మంచివస్త్రం లేకపోవచ్చు, వసించడానికి సరైన చోటు లేకపోవచ్చు. అయితేనేం? మా అమ్మ ఉంది అనే ధీమా అతడికి ఉంటుంది.
‘మన తల్లి సవతి తల్లి కాదు, సొంత తల్లి. నేను ఎవర్ని, ఎక్కడ నుండి వచ్చాను, నేను ఎక్కడకు పోతాను – అన్నీ ఆమెకే ఎరుక. ఇవన్నీ మనం తెలుసుకుని ఏం చేయాలి? అవసరమైతే ఆమే తెలియచేస్తుంది. నువ్వు మాత్రం ఆనందంలో మునిగిపో.’
శ్రీరామకృష్ణులు గదిలో తమ సహజమైన ఆనందమయ స్థితిలో ఓలలాడుతున్నారు. ఇంతలో కలకత్తా నుండి ఈశాన్ వచ్చాడు. ఆతడికి భగవంతుని మీద ప్రగాఢ విశ్వాసం. ఎవరైనా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పావన దుర్గా నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినట్లయితే పరమశివుడు త్రిశూలాన్ని చేత బట్టుకుని వెంటవస్తూ ఆతణ్ణి అన్ని విపత్తుల బారినుండి సంరక్షిస్తాడు అని ఈశాన్ అంటూంటాడు.
33.8.1 విశ్వాసం – కర్మయోగం – వైదీ భక్తి, రాగభక్తి
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): నీకు అపారమైన విశ్వాసం ఉంది. అయితే మాకు అంతగా లేదు. (అందరూ నవ్వారు) విశ్వాసం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి పొందగలం.
ఈశాన్: అవునండీ.
శ్రీరామకృష్ణులు: నువ్వు జపం, సంధ్యావందనం, ఉపవాసం, పురశ్చరణ మొదలైన కర్మలను అనుష్ఠిస్తుంటావు. అది చాలా మంచిది. ఎవరైనా వ్యక్తి భగవంతుని పట్ల యథార్థంగా ఆకర్షితుడైనప్పుడు ఆయన ఆ వ్యక్తితో ఈ సమస్త కర్మలు ఒనరింప చేస్తాడు. ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా ఈ కర్మలన్నిటినీ నిర్వర్తించినట్లయితే నిశ్చయంగా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. ‘శాస్త్రాలలో అనేక కర్మలు చేయమని చెప్పబడి ఉంది, కనుకనే నేను ఈ కర్మలను చేస్తున్నాను’ – ఇటువంటి భక్తిని వైధీభక్తి అంటారు. రాగభక్తి అని మరొకటి ఉంది. అది భగవంతుని పట్ల విశేషమైన ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు జనిస్తుంది. ప్రహ్లాదునికి ఆ భక్తి ఉండేది. ఆ భక్తి కలిగినప్పుడు, అటుపిమ్మట వైధీ కర్మల అవసరం ఉండదు.
33.9 నవమ పరిచ్ఛేదం దాసుడి మనోగతం
సంధ్యాకాలానికి మునుపు ‘మ’ అటూ ఇటూ పచార్లు చేస్తూ ఇలా తలపోస్తున్నాడు. ‘రాముడి ఇచ్ఛ – ఇది ఎంత చక్కటి విషయం! దీనితో pre – destination (భగవంతుడి సంకల్పం), free will (స్వతంత్రేచ్ఛ)ల మధ్య ఉన్న సంఘర్షణ సమసిపోతుంది. రాముడి ఇచ్ఛ కారణంగా నన్ను దొంగలు తోడ్కొని వెళ్ళారు. రాముడి ఇచ్ఛ కారణంగా నేను పొగ త్రాగుతూ ఉన్నాను. రాముడి ఇచ్ఛ కారణంగా నన్ను పోలీసులు పట్టుకున్నారు. నేను సాధువు అయింది కూడా రాముడి ఇచ్ఛ వల్లనే. ‘ఓ ప్రభూ నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం సద్బుద్ధిని మాత్రమే ప్రసాదించు. నాతో దొంగతనం చేయించవద్దు’ – ఇలా ప్రార్థించడం కూడా రాముడి ఇచ్ఛ కారణంగానే. సత్సంకల్పం, దుష్ట సంకల్పం ఈ రెంటినీ ఇచ్చింది ఆయనే. ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు. భగవంతుడు దుష్ట సంకల్పాలను ఎందుకు కలిగిస్తాడు? దొంగతనం చేయాలన్న ఆలోచనలను ఆయన ఎందుకు పుట్టిస్తాడు? దీనికి సమాధానంగా శ్రీరామకృష్ణులే ఇలా అన్నారు: ‘జంతువుల్లో పులి, సింహం, పాము వంటి క్రూరమైనవి ఉన్నాయి. వృక్షాలలో విషవృక్షాలు కూడా ఉన్నాయి. అదే విధంగా మనుషుల్లో కూడా దొంగలు, వంచకులు ఉన్నారు. మరి భగవంతుడు వారిని ఎందుకు సృష్టించాడు అని అడగితే దానికి సమాధానం ఎవరు చెప్పగలరు? భగవంతుడి లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు?’
శ్రీరామకృష్ణుల భక్తి గురించి ఆలోచించే కొద్దీ మనం ఆశ్చర్యభరితులమై పోతాము. కేశవ్సేన్ హరినామం జపిస్తాడు, భగవచ్చింతన చేస్తాడు అని విన్న వెంటనే ఆయన కేశవ్‌ను చూడడానికి పరుగులు పెడతారు, కేశవ్ తమకు అత్యంత ఆత్మీయుడై పోయాడు. అతడిపై కెప్టెన్ మోపిన ఆరోపణలను శ్రీరామకృష్ణులు ఖాతరు చేయలేదు. కేశవ్సేన్ విదేశాలకు వెళ్ళాడు, ఆంగ్లేయులతో కలసి భోజనం చేశాడు, కుమార్తెకు కులాంతర వివాహం చేశాడు – కేశవ్సేన్పై ఇటువంటి ఆరోపణలను మోపి కెప్టెన్ ఆతణ్ణి ఆడిపోసుకున్నప్పుడు శ్రీరామకృష్ణులు కెప్టన్ మాటలను ఖాతరు చెయ్యలేదు. కావలసింది రేగిపండు మాత్రమే, దాని ముళ్ళతో మన కేమిటి పని?
భక్తి ప్రవాహంలో సాకారవాదులు, నిరాకారవాదులు ఒక్క టైపోతారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఏకమైపోతారు. చాతుర్వర్ణాలవారూ కలసి జీవిస్తారు. అంతిమ విజయం భక్తిదే. జై రామకృష్ణ! జై జై రామకృష్ణ! సనాతన ధర్మపు ఈ విశ్వజనీన భావానికి తిరిగి జీవం పోసింది నీవే. బహుశా అందుకేనేమో అన్ని సంప్రదాయాలవారికీ నీ పట్ల అంతటి ఆకర్షణ. సకల మతావలంబులు నిన్ను పరమ ఆత్మీయునిగా ఎంచి ఆలింగనం చేసుకుంటున్నారు. కులం ఏదైనా, మతం ఏదైనా నీవు చూసేది కేవలం ఆంతరంగిక భక్తిని మాత్రమే. ఎవరైనా భక్తిపరుడైతే చాలు, ఆతడు నీకు అత్యంత సన్నిహితుడయిపోతాడు. మహమ్మదీయునికి అల్లా మీద ప్రేమ ఉంటే చాలు, క్రైస్తవునికి ఏసుక్రీస్తు మీద భక్తి ఉంటే చాలు – వారిని నీవు స్వబాంధవులుగానే పరిగణిస్తావు. నదులు విడివిడిగా ప్రవహించినా వాటన్నిటికీ గమ్యస్థానం సాగరమే కదా!
ఈ విశ్వబ్రహ్మాండం మహాచిదాకాశంలో ఆవిర్భవించి తదనంతర కాలంలో లయమై పోతుందని వింటుంటాము. మహాసముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున పైకి ఎగిసి, మళ్ళీ కాలంలో లయమై పోతాయి. ఆనంద సాగరంలో అనంత లీలా లహరి! ఆ లీలకు ఆది ఏమిటి, అంతం ఏమిటి? దానిని మాటల్లో వర్ణించలేం, మనస్సుతో ఊహించలేం. చివరకు మానవుడి శక్తి ఏపాటిది? అతడి మేధస్సు కూడా పరిమితమైనదే కదా! మహాపురుషులు సమాధిమగ్నులై ఆ నిత్య పరమ పురుషుణ్ణి దర్శించారు. అయితే వారు దర్శించింది ఈ చర్మచక్షువులతో కాదు, దివ్యచక్షువులతో. అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని దర్శించింది, ఋషులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందింది, స్వర్గంలో ఉన్న పరమపితను ఏసుక్రీస్తు సందర్శించింది ఆ దివ్యచక్షువులతోనే. ఆ చక్షువులు ఎలా ఏర్పడతాయి? ‘వ్యాకులత ద్వారా’ అని శ్రీరామకృష్ణులు చెబుతుంటారు. మరి ఆ వ్యాకులత ఎలా జనిస్తుంది? సంసారం పరిత్యజించాలా? ఇవాళ ఆయన అలాగని ఏం చెప్పలేదే!
33.10 దశమ పరిచ్ఛేదం సన్న్యాసికి సంచయం నిషేధం – “మద్గతాంతరాత్మ”
ఆదివారం, నవంబర్ 9, 1884
శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్నమంచం మీద పూర్వాభిముఖులై కూర్చుని ఉన్నారు. భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. మధ్యాహ్న సమయం. ‘మ’ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి క్రింద కూర్చున్నాడు. క్రమంగా తక్కిన భక్తులు కూడా రాసాగారు. పలువురు బ్రహ్మసమాజ భక్తులతో పాటు విజయ్‌కృష్ణ గోస్వామి కూడా అక్కడకు వచ్చి ఉన్నాడు. పూజారి రామ్ చక్రవర్తి కూడా అక్కడ ఉన్నాడు. కాసేపటి తరువాత మహిమాచరణ్, నారాయణ్, కిశోరీలు వచ్చారు.
శీతకాలం ప్రారంభమవుతోంది. శ్రీరామకృష్ణులకు చొక్కాలు కావలసి వచ్చింది. వాటికోసం ఆయన ‘మ’ కు చెప్పి ఉన్నారు. రెండు చొక్కాలతో పాటు మందపాటి వస్త్రంతో కుట్టిన మరో చొక్కాను కూడా తెచ్చాడు ‘మ’. అయితే ఆ చొక్కాను తెమ్మని శ్రీరామకృష్ణులు చెప్పలేదు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు దాన్ని వాపసు తీసుకువెళ్ళడమే మంచిది. దాన్ని నువ్వే వాడుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. అది సరే, నిన్ను నేను ఎటువంటి చొక్కాలు తెమ్మని చెప్పాను?
‘మ’ : అయ్యా! మీరు మామూలు కుర్తాలే పట్టుకు రమ్మని చెప్పారు. ఈ మందమైన కుర్తా గురించి చెప్పలేదు.
శ్రీరామకృష్ణులు: అయితే దానిని వెనక్కు తీసుకువెళ్ళు.
(విజయ్ తదితరులతో) “ఇలా చూడండి, ద్వారికాబాబు నాకు శాలువా నొకదానిని ఇచ్చాడు. మర్నాడే భక్తులు కూడా ఒక శాలువాను తీసుకువచ్చారు. అయితే నేను దానిని తీసుకోలేదు.
శ్రీరామకృష్ణులు ఇంకా ఏదో చెప్పబోతున్నారు. అంతలో విజయ్ ఇలా అన్నాడు: “అవునండి. మనకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే అంగీకరించాలి. అలా ఇవ్వడానికంటూ ఒక మనిషి కూడా ఉండాలి. మనిషి కాకపోతే మరెవరు ఇవ్వగలరు?”
శ్రీరామకృష్ణులు: ఇచ్చేవాడు ఆ భగవంతుడే. అత్తగారు తన కోడలితో ఇలా అంది: ‘అమ్మాయీ! సేవ చేయడానికంటూ ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు ఉండనే ఉన్నారు. నీకు కూడా పాదాలు ఒత్తడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది.’ అందుకు కోడలు ‘అత్తగారూ! ఆ భగవంతుడే నా పాదాలు ఒత్తుతాడు. వేరే ఎవరి అవసరం నాకు లేదు!’ అంది. ఆమె భగవంతుని పట్ల యథార్థమైన భక్తి కలిగి ఉంది కాబట్టే అలా అంది.
“ఒకసారి ఒక ఫకీరు అక్బరు పాదుషా వద్దకు కొంత ధనం యాచించే నిమిత్తం వెళ్ళాడు. ఆ సమయంలో అక్బరు, నమాజు చదువుతున్నాడు. ‘ఓ ప్రభూ! నాకు సంపదలను ప్రసాదించు’ అని ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఫకీరు తిరిగి వెళ్ళిపోసాగాడు. అది చూసి అక్బరు ఆయనను కూర్చోమని సైగచేశాడు. నమాజు పూర్తయ్యాక అక్బరు ఆ ఫకీరును ‘ఇందాక మీరెందుకు అలా వెళ్ళిపోతున్నారు?’ అని అడిగాడు. ఫకీరు ‘సిరి నివ్వు సంపదల నివ్వు అని మీరే యాచిస్తున్నారాయె! అలాంటప్పుడు, ఏమైనా యాచించాలంటే ఆ భగవంతుణ్ణే యాచిస్తాను; మరో భిక్షగాణ్ణి యాచించడం ఎందుకు అనుకొని వెళ్ళిపోబోయాను’ అని బదులిచ్చాడు.”
విజయ్: నేను గయలో ఒక సాధువును చూశానండి. అతడు దేని కోసమూ ఎటువంటి ప్రయత్నమూ చేయడు. ఒక రోజు భక్తులకు భోజనం పెడదామన్న సంకల్పం కలిగిందాతడికి. మేం వెళ్ళి చూసేసరికి మైదాపిండి, నెయ్యి, పళ్ళు మొదలైన ఆహార పదార్థాలన్నీ ఎక్కడినుండో వచ్చాయి.
33.10.1 మూడు రకాల సాధువులు
శ్రీరామకృష్ణులు (విజయ్ తదితరులతో): సాధువులలో ఉత్తమ, మధ్యమ, అధమ సాధువులని మూడు రకాల వారున్నారు. ఉత్తమ సాధువులు ఆహారం కోసం ఎటువంటి ప్రయత్నమూ చేయరు. దండీ సాధువులలాంటివారు మధ్యమ, అధమ రకాలకు చెందినవారు. మధ్యమ సాధువు ఆహారం నిమిత్తం ఏదో ఒక ఇంటి ముందు ‘నమోనారాయణ’ అని చెప్పి నిలబడిపోతాడు. అధమ సాధువుకు భిక్ష లభించనట్లయితే కొట్లాటకు దిగుతాడు. (అందరూ నవ్వారు)
“ఉత్తమ సాధువు ప్రవర్తన కొండచిలువలా ఉంటుంది. అతడు ఒక చోట కూర్చుని ఉంటాడు. ఆహారమే ఆతడి వద్దకు వస్తుంది. కొండచిలువ తాను ఉన్నచోటు నుండి ప్రక్కకు కదలదు. బాల బ్రహ్మచారియైన ఒక కౌమార సన్న్యాసి భిక్షాటనకు వెళ్ళాడు. ఒక అమ్మాయి ఆతనికి భిక్షనిచ్చింది. ఆమె స్తనాలను చూసి ఆతడు, ఆమెకు ఛాతీపైన వ్రణాలు లేచాయని తలచి, వాటి గురించి ఆమెను అడిగాడు. అప్పుడు ఇంట్లో స్త్రీలు వచ్చి ఆ అమ్మాయి గర్భంనుంచి ఏదో ఒక రోజున సంతానం జనిస్తుందని, అప్పుడు భగవంతుడు ఆ స్తనాల ద్వారా వారికి పాలు ఇప్పిస్తాడని విశదపరిచారు; భగవంతుడు వారి కోసం ఏర్పాట్లు చేసి ఉన్నాడని చెప్పారు. ఈ మాటలు విని ఆ సన్న్యాసి ఆశ్చర్యభరితుడై ఇలా అన్నాడు: ‘మరి అలాగైతే నాకు భిక్ష ఎత్తాల్సిన అగత్యం లేదు. నాకోసం కూడా భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు.’”
‘మరి అలాగైతే మేం కూడా ఎటువంటి ప్రయత్నాలూ చేయకూడదా’ అని కొందరు భక్తులు ఆలోచిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: కాని ప్రయత్నం చేయడం అవసరం అని భావించే వారు ప్రయత్నించి తీరాలి.
విజయ్: ఈ విషయమై భక్తమాలలో చక్కని కథ ఒకటి ఉంది కదండీ.
శ్రీరామకృష్ణులు: అదేమిటో మాకు కాస్త చెప్పు.
విజయ్: లేదండీ, మీరే చెప్పండి.
శ్రీరామకృష్ణులు: కాదు, కాదు. నువ్వే చెప్పు. నాకు సరిగా గుర్తుకు రావడం లేదు.
33.10.2 హనుమంతుని స్థితి – కాకి రామ జపం – పూర్ణజ్ఞానం
“ప్రారంభంలో శ్రవణం చేయవలసి ఉంటుంది, అందుకే నేను వాటిని మొట్టమొదట్లో వినేవాడిని. కాని ప్రస్తుతం నేను ఉన్న స్థితి వేరు. హనుమంతుడు ఇలా అన్నాడు: ‘నేను తిథి, వార, నక్షత్రాలను ఎరుగను. నేను కేవలం రామచింతన మాత్రం చేస్తాను’.
“చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే అపేక్షిస్తుంది. దప్పికతో ప్రాణాలు పోతున్నాసరే అది నోరు పైకెత్తి ఆకాశం నుండి జాలువారే నీటిని మాత్రమే కోరుతుంది. గంగ, యమున, సప్త సముద్రాలు నీటితో పరిపూర్ణంగా నిండి ఉంటాయి. అయినప్పటికీ అది భూజలాన్ని మాత్రం త్రాగనే త్రాగదు.
“రామలక్ష్మణులు పంపా సరోవరం వద్దకు వెళ్ళారు. ఒక కాకి నీటికోసం పరితపించిపోవడం లక్ష్మణుడు చూశాడు. అది మాటిమాటికీ సరోవరంలోని నీటిని త్రాగడానికి వస్తోంది, కాని నీటిని త్రాగడం లేదు. దాని గురించి లక్ష్మణుడు అడిగేసరికి రాముడిలా వివరించాడు: ‘తమ్ముడూ! ఈ కాకి గొప్ప భక్తిపరురాలు. అహర్నిశలూ అది రామనామం జపిస్తుంది. దప్పికతో దాని గొంతు ఎండి పోతుంది కాని, అది మాత్రం రామనామ జపానికి ఆటంకం కలుగుతుందన్న భయంతో నీరు త్రాగడం లేదు.’
“ఒకసారి పూర్ణిమ రోజున నేను హలధారిని ‘ఇవాళ అమావాస్యా?’ అని అడిగాను. (అందరూ నవ్వారు)
(నవ్వుతూ) “ఔనయ్యా, నిజమే! పూర్ణిమ, అమావాస్యల మధ్య భేదభావం తొలగిపోవడం పూర్ణజ్ఞానుల లక్షణం అని విని ఉన్నాను. అయితే హలధారిని ఈ విషయంలో ఎవరు ఒప్పించగలరు? అతడు ఇలా అన్నాడు: ‘ఇది నిజంగానే కలికాలం సుమండీ! అమావాస్య, పూర్ణిమల మధ్య వ్యత్యాసం కూడా ఇతడికి తెలియడం లేదు. అయితే లోకులు మాత్రం ఇతణ్ణి గౌరవిస్తారు.’”
ఇంతలో మహిమాచరణ్ లోపలికి వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (సాదర భావంతో): ఆ, రండి, రండి. కూర్చోండి. (విజయ్ తదితర భక్తులతో) అటువంటి స్థితిలో నేను తారీఖు గుర్తుంచుకోలేను. ఆ మధ్య ఒకసారి వేణీపాల్ ఉద్యానవనంలో ఉత్సవం జరిగింది. అయితే నేను తారీఖు మరిచిపోయానాయె. ‘ఫలానా రోజు మంచిరోజు, ఆ రోజు కూర్చుని తనివితీరా భగవన్నామం జపిస్తాను’ అని నేను నిశ్చయించుకోలేను.
శ్రీరామకృష్ణులు కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. మళ్ళీ సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: అయితే ఫలానా వ్యక్తి వస్తానంటే మాత్రం జ్ఞాపకం ఉంటుంది.
33.10.3 భగవంతుని పట్ల ప్రేమ – భగవదుద్దీపన
“భగవంతుని మీద నూటికి నూరుపాళ్ళ విశ్వాసం ఏర్పడినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు అతణ్ణి ఇలా అడిగాడు: ‘హనుమా! నువ్వు సీతను చూశావుకదా! ఆమె ఎలా ఉందో కాస్త చెప్పు.’ అందుకు హనుమంతుడు ఇలా బదులిచ్చాడు: ‘ఓ రామా! నేను అక్కడ కేవలం సీతాదేవి శరీరం మాత్రమే పడి ఉండడం చూశాను. ఆ శరీరంలో మనస్సు, ప్రాణం లేదు. తన మనోప్రాణాలన్నింటినీ ఆమె నీ పాదపద్మాల వద్దనే సమర్పించింది. అందుకే కేవలం ఆమె శరీరం మాత్రమే అక్కడ పడి ఉండడం చూశాను. పైగా, అక్కడ యమధర్మరాజు తచ్చాడుతుండడం నేను చూశాను. ఆయన మాత్రం ఏం చేయగలడు? అక్కడ ఉన్నది కేవలం శరీరం మాత్రమే. అందులో మనోప్రాణాలు లేవాయె.’
“నువ్వు దేని గురించి అయితే ధ్యానిస్తావో, అదే స్వభావం నువ్వు సంతరించుకుంటావు. రాత్రింబవళ్ళు భగవచ్చింతన చేయడం వల్ల భగవంతుని స్వభావమే కలుగుతుంది. ఉప్పుబొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవడానికి వెళ్ళింది; కాని అది సముద్రంలో ఒకటైపోయింది. పుస్తకాల, శాస్త్రాల లక్ష్యం ఏమిటి? భగవత్సాక్షాత్కారమే. ఒక వ్యక్తి ఒక సాధువుకు చెందిన పుస్తకాన్ని తెరిచి చూశాడు. అందులో ప్రతి పుటలోను కేవలం ‘రామ’ అని మాత్రమే వ్రాయబడి ఉండడం గమనించాడు. అంతకు మించి మరేం లేదు.
“భగవంతునిపట్ల ప్రేమ కలిగినట్లయితే కించిత్తు సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది. అప్పుడు ఒక్కసారి ‘రామ’ అంటేనే కోటి సంధ్యల ఫలం దక్కుతుంది. మేఘాన్ని చూడగానే నెమలికి ఉద్దీపన కలుగుతుంది, ఆనందంతో పురి విప్పి నాట్యం చేస్తుంది. రాధాదేవికి కూడా అటువంటి అనుభూతే కలుగుతూ ఉండేది. మేఘం కళ్లబడగానే ఆమె మనస్సులో కృష్ణుడు మెదలేవాడు.
“ఒకసారి చైతన్య మహాప్రభువు ఒక గ్రామం గుండా వెళుతున్నారు. ఆ గ్రామంలోని మట్టితో ఖోల్ (ఒక సంగీతవాయిద్యం) తయారుచేస్తారని ఆయన విన్నారు. వెంటనే ఆయన భావ పరవశులైనారు. ఎందుకంటే హరినామ సంకీర్తనలో ఖోల్ వాయిస్తారు కదా! అయితే ఇటువంటి ఉద్దీపన ఎవరికి కలుగుతుంది? విషయాసక్తిని త్యజించిన వారికే. ఈ విషయాసక్తి అనే రసం ఇంకిపోయినవారికి కించిత్తు సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది. చెమ్మగిల్లిన అగ్గిపుల్లను నువ్వు వెయ్యిసార్లు గీచినా సరే, అది మాత్రం వెలుగనే వెలుగదు. అయితే అది ఎండి ఉన్నట్లయితే, కాస్త గీయగానే ‘గప్’ మంటూ వెలుగుతుంది.
33.10.4 ఆత్మ సమర్పణ – రాముడు, కప్ప
“దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పాందిన వాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ – సమస్తాన్నీ భగవంతుడికే సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు తమ ధనువులను నేలలోకి గ్రుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనుస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండడం గమనించాడు. రాముడు అతడితో ‘తమ్ముడూ! చూడు, చూడు. ఏదో ప్రాణి హింసకు గురయినట్లుంది’ అన్నాడు. లక్ష్మణుడు, మట్టి తవ్వి చూసేసరికి పెద్ద కప్ప ఒకటి కనిపించింది, అది మరణించే స్థితిలో ఉంది. రాముడు కరుణాపూరిత స్వరంతో ‘నువ్వెందుకు అరవలేదు. మేము నిన్ను కాపాడడానికి ప్రయత్నించి ఉండేవాళ్ళం కదా! పాము వాతన పడినప్పుడు నువ్వు బెకబెక మంటావు కదా!’ అన్నాడు. అందుకు ఆ కప్ప ఇలా అంది: ‘ఓ రామా! పాము పట్టుకున్నప్పుడు “ఓ రామా, రక్షించు, ఓ రామా, రక్షించు” అని కేకలు పెడతాను. అయితే ఇప్పుడు చూడబోతే రాముడే నన్ను చంపుతున్నాడు. అందుకే మౌనం వహించాను.’”
33.11 ఏకాదశ పరిచ్ఛేదం స్వస్వరూపంలో నెలకొని ఉండడం ఎలా? – జ్ఞానయోగం
భక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉన్నారు. గురుశిష్య సంప్రదాయాన్ని మహిమాచరణ్ అంగీకరించడని ఆయన విని ఉన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: గురువాక్యాల పట్ల విశ్వాసం ఉంచడం మంచిది. గురువు ప్రవర్తనను చూడవలసిన అవసరం లేదు. ‘నా గురువు సారాయి దుకాణానికి వెళ్లినా సరే, ఆయన నిత్యానంద స్వరూపుడే!’
“ఒక వ్యక్తి దేవీమాహాత్మ్యం, భాగవతాలను పారాయణం చేసి జనులకు వినిపించేవాడు. అతడు, ‘చీపురు తాను స్వయంగా అశుభ్రంగా ఉన్నప్పటికీ మలిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది’ అని చెప్పాడు.”
మహిమాచరణ్ వేదాంతాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. బ్రహ్మజ్ఞానం సాధించాలన్నదే అతడి లక్ష్యం, జ్ఞానమార్గగామి! సర్వదా విచారణ చేస్తూ ఉంటాడు.
శ్రీరామకృష్ణులు (మహిమాతో): జ్ఞాన లక్ష్యం స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. దీనినే జ్ఞానం అంటారు, దీనినే ముక్తి అంటారు. ఆత్మ నిజస్వరూపం పరబ్రహ్మమే. నేనూ, పరబ్రహ్మం ఒక్కటే – అయితే మాయ కారణంగా ఈ విషయం మనకు తెలియరావడం లేదు.
“నేను హరీశ్‌తో ఇలా అన్నాను: ‘అసలు విషయం ఇదే: కొన్ని గంపల మట్టి క్రింద బంగారం మరుగయి ఉంది. చేయవలసింది ఆ మట్టిని ప్రక్కకు తొలగించడమే’.
“భక్తులు ‘నేను’ ను నిలుపుకుంటారు; అయితే జ్ఞానులు నిలుపుకోరు. స్వస్వరూపంలో నెలకొని ఉండడం ఎలాగో నాంగ్టా ఉపదేశించేవాడు. ‘మనస్సును బుద్ధిలో లయం చెయ్యి. బుద్ధిని ఆత్మలో లయం చెయ్యి. అప్పుడు నువ్వు స్వస్వరూపంలో నెలకొని ఉంటావు’ అనేవాడు.
“అయితే ఈ ‘నేను’ మాత్రం ఉండనే ఉంటుంది. అది వదలిపోయేది కాదు. అనంత జలరాశిని ఊహించుకో. పైనా, క్రిందా, ముందు వెనుక, కుడి వైపు, ఎడమవైపు – సర్వత్రా జలమయమే. ఈ నీటిలో కుండ నొకదానిని ఉంచామనుకో. నీరు కుండ లోపలా ఉంటుంది, బయటా ఉంటుంది; అయితే కుండ కూడా ఉండనే ఉంటుంది. ‘నేను’ అనేది ఈ కుండ లాంటిదే.
33.11.1 కాళికాలయంపై పిడుగుపాటు – బ్రహ్మజ్ఞాని శరీరం
“జ్ఞానం పొందాక కూడా జ్ఞాని తన శరీరాన్ని నిలుపుకునే ఉంటాడు. కామం మొదలైన శత్రువులను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసివేస్తాడు. చాలా కాలం క్రితం తుపాను వచ్చినప్పుడు కాళీ ఆలయంలో పిడుగు పడింది. ఆలయ ద్వారాలకు ఎటువంటి నష్టమూ జరగలేదు కానీ మరమేకుల తలలు మాత్రం విరిగిపోయి ఉండడం మేము గమనించాము. ఇక్కడ ద్వారాలు అంటే దేహం; మరమేకులు అంటే కామం మొదలైన కోర్కెలు.
“జ్ఞాని కేవలం భగవత్ప్రసంగాలను మాత్రమే ఇష్టపడతాడు. లౌకిక సంభాషణలు జరిగినట్లయితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడు. లౌకిక వ్యక్తులు అంటే విషయలోలురు వేరే తరగతికి చెందిన వారు. వారికి అవిద్య అనే తలపాగా ప్రక్కకు తొలగనే తొలగదు. వేరే ఏం మాట్లాడినా సరే వారు తిరిగి తిరిగి మళ్ళీ లౌకిక సంభాషణల వైపుకే వస్తారు.
“వేదాలలో సప్త భూముల గురించిన వర్ణన ఉంది. జ్ఞాని మనస్సు సప్తమ భూమిని చేరుకున్నప్పుడు ఆతడు భగవత్ప్రసంగాలు తప్ప అన్యమైనది ఏదీ వినలేడు, మాట్లాడనూ లేడు. ఆ స్థితిలో ఆతడి నోటినుండి కేవలం జ్ఞానోపదేశాలు మాత్రమే జాలువారుతాయి.
“వేదాలు సచ్చిదానంద బ్రహ్మం గురించి పేర్కొంటాయి. బ్రహ్మం ఒక్కటి కాదు, రెండూ కాదు; ఒకటి, రెండులకు అతీతంగా ఉన్నది. అది అస్తి అనీ (ఉందనీ) చెప్పలేము, నాస్తి అని కూడా (లేదనీ) చెప్పలేము. అది అస్తి, నాస్తిలకు అతీతంగా ఉన్నది.
33.11.2 రాగభక్తితో భగవత్ప్రాప్తి
“రాగభక్తి జనించినట్లయితే, అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. వైధీభక్తి ఎంత సులువుగా వస్తుందో అంతే సులువుగా పోనూపోతుంది. వైధీభక్తి అంటే: ఇంత జపం, ఇంత ధ్యానం, ఇన్ని యజ్ఞయాగాలు చేస్తాను: ఇన్ని ఉపచారాలతో పూజ చేస్తాను, పూజ సమయంలో ఈ మంత్రాలు పఠిస్తాను – ఇదన్నమాట. ఆ భక్తి జనించినంత సులువుగానే దాన్ని కోల్పోగలం కూడా. చాలామంది ఇలా అంటూంటారు: ‘అరే తమ్ముడూ. ఎన్ని రోజులు హవిష్యాన్నం తిన్నాం! ఇంట్లో ఎన్నిసార్లు పూజచేశాం. అయినప్పటికీ సాధించింది ఏముంది?’ రాగభక్తి అలా పతనమైపోదు. రాగభక్తి అనేది ఎవరికి కలుగుతుంది? పూర్వజన్మలలో అనేక పుణ్యకర్మలు చేసిన వారికో లేకుంటే నిత్యసిద్ధులకో ఆ భక్తి కలుగుతుంది. పూర్తిగా పాడుబడిన ఇల్లు ఒకటి ఉందనుకోండి; అందులో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తీసివేస్తుంటే గొట్టంతో ఉన్న నీటిబుగ్గ ఒకటి కానవచ్చింది. అది మట్టి, ఇటుకలతో కప్పబడి ఉంది. వాటిని ప్రక్కకు తొలగించిన వెంటనే నీరు పైకి ఎగజిమ్ముతుంది.
“రాగభక్తి కలిగి ఉన్నవారు ‘తమ్ముడూ, నేను ఎన్నో రోజులపాటు హవిష్యాన్నమే తింటూ గడిపాను. కాని ఏం ఒరిగింది?’ – ఇలాంటి మాటలు మాట్లాడరు. క్రొత్తగా వ్యవసాయంలోకి దిగినవారు పంటలు సరిగ్గా పండనట్లయితే వ్యవసాయం మానుకుంటారు. వంశపారంపర్యంగా సాగుబడి చేస్తున్నవారు పంట పండినా సరే, లేకున్నా సరే వ్యవసాయం మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. తండ్రి తాతల కాలంనాటి నుండే వ్యవసాయం వారికి వృత్తిగా ఉంటూ వచ్చింది; జీవనోపాధి కోసం తాము కూడా వ్యవసాయమే చేయవలసి ఉంటుందని వారికి తెలుసు.
“రాగభక్తి ఉన్నవారిని మాత్రమే భగవంతుడి యథార్థమైన భక్తులుగా పేర్కోవచ్చు. భగవంతుడు వారి భారాన్ని స్వీకరిస్తాడు. ఆసుపత్రిలో నువ్వు పేరు నమోదు చేస్తే రోగం నయమయ్యే వరకు డాక్టరు నిన్ను ఇంటికి పంపడు. భగవంతుడు ఎవరినయితే పట్టుకుని ఉన్నాడో, వారికి ఎలాంటి భయంలేదు. పొలం గట్టుమీద నడిచేటప్పుడు తానే స్వయంగా తండ్రి చేతిని పట్టుకొన్న పిల్లవాడు ఏమరుపాటుతో చేయిజారి క్రిందపడిపోయే ప్రమాదం ఉంది. అయితే తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నట్లయితే వాడు అలా పడిపోయే ప్రమాదం ఉండదు.
33.11.3 భగవత్ సంభాషణ – గృహస్థుని సంసార త్యాగం
“విశ్వాసానికి సాధ్యం కానిదంటూ ఏమైనా ఉందా? నిజమైన భక్తుడు సాకారం, నిరాకారం, రాముడు, కృష్ణుడు, భగవతి అన్నిటినీ విశ్వసిస్తాడు.
“ఒకసారి నేను కామార్పుకూర్కు వెళ్ళేటప్పుడు దారిలో గాలివాన పట్టుకుంది. అక్కడ దొంగల భయం కూడా ఉంది. అప్పుడు నేను రాముడు, కృష్ణుడు, భగవతి అంటూ అన్ని నామాలు ఉచ్చరించసాగాను, హనుమంతుడి నామం కూడా ఉచ్చరించాను. ఆ నామాలన్నీ ఉచ్చరించాను. దీనికి అర్థం ఏమిటి? అది నేనే చెబుతాను విను: సంతకు వెళ్ళి సరుకులు కొనడానికి డబ్బు లెక్కపెట్టేటప్పుడు నౌకరు ‘ఈ పైసలు బంగాళాదుంపల కోసం, ఈ పైసలు వంకాయల కోసం, ఈ పైసలు చేపలకోసం’ అంటూ వేరు చేస్తాడు. పైసలు అన్నిటినీ వేర్వేరుగా లెక్కించిన తరువాత మళ్ళీ అన్నిటినీ కలిపేస్తాడు.
“భగవంతుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి కేవలం ఆయన గురించి మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎవరినయినా ప్రేమిస్తే కేవలం ఆ వ్యక్తి గురించి మాత్రమే వినడానికి, మాట్లాడడానికి ఇష్టపడతావు. తన కుమారుడి గురించి మాట్లాడేటప్పుడు సంసారి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. తన కుమారుణ్ణి ఎవరైనా ప్రశంసిస్తూ మాట్లాడితే, వెంటనే ఆ వ్యక్తి కుమారుడితో ‘వెళ్ళి మీ బాబాయ్‌కి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు పట్రా’ అంటాడు.
“పావురాలంటే ఇష్టపడే వ్యక్తి ఎదుట వాటిని మెచ్చుకుంటూ మాట్లాడితే ఆతడు ఎంతగానో సంతోషిస్తాడు. పావురాల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడితే ఆతడు వెంటనే లేచి నిలబడి ‘మీ పద్నాలుగు తరాలలో ఎవరైనా ఎప్పుడైనా పావురాలను పెంచి ఉన్నారా?’ అంటూ గట్టిగా అరవవచ్చు కూడా.”
గార్హస్థ్య జీవితం గడుపుతున్న మహిమాచరణ్ను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (మహిమాతో): సంసారాన్ని పూర్తిగా త్యజించవలసిన అవసరం ఏముంది? దాని పట్ల అనురక్తి తొలగిపోతే చాలు. కాని సాధనలు చేయాలి; ఇంద్రియాలతో యుద్ధం చేయవలసి ఉంటుంది.
“కోట లోపల ఉంటూనే యుద్ధం చేయడంలో ఎంతో సానుకూలత ఉంది. కోట లోపల నుండి ఎంతో సహాయం అందుతుంది. సంసారం భోగస్థానం. ఒక్కో వస్తువును అనుభవించి దానిని వెంటనే త్యజించ వలసి ఉంటుంది. నాకు బంగారు మొలత్రాడు ధరించాలన్న కోర్కె ఉండేది; తరువాత అది లభించింది కూడా. దాన్ని ధరించాను, అయితే వెంటనే దాన్ని తీసివేయ వలస్
“ఒకసారి నేను ఉల్లిపాయ తిన్నాను. తింటూ విచారణ చేయసాగాను. మనస్సుకు ‘మనస్సా, ఉల్లిపాయ అంటే ఇదే’ అని చెప్పుకున్నాను. తరువాత దాన్ని నోట్లో అటూ ఇటూ కదిపి బయటకు ఉమ్మివేశాను.”
33.12 ద్వాదశ పరిచ్ఛేదం భజనానందంలో శ్రీరామకృష్ణులు
నేడు తన బృందంతో పాటు ఒక గాయకుడు రావలసి ఉంది. శ్రీరామకృష్ణులు మధ్యమధ్యలో భక్తులను “గాయకుడు ఎక్కడ?” అని అడుగుతున్నారు.
మహిమా: మాకు ఇలాగే బాగుందండి.
శ్రీరామకృష్ణులు: అది కాదయ్యా, ఏడాది పొడవునా ఇది ఉండనే ఉంది కదా!
గది బయట నుండి ఎవరో భక్తుడు “గాయకుడు వచ్చేశాడు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు ఆనందంతో “ఆఁ, వచ్చేశాడా?” అని అడిగారు.
గదికి ఈశాన్యంగా ఉన్న పొడవుపాటి వసారాలో చాపలు పరిచారు. శ్రీరామకృష్ణులు “ఈ చాపల మీద కొద్దిగా గంగాజలం చిలకరించండి. అనేకమంది లౌకిక వ్యక్తులు వీటి మీద కూర్చున్నారు” అన్నారు.
బాలీకి చెందిన ప్యారీబాబు కుటుంబ స్త్రీలు కాళీ ఆలయ దర్శనం నిమిత్తం వచ్చారు. కీర్తనకు ఏర్పాట్లు జరుగుతుండడం చూసి, వారు కూడా వినదలచారు. ఒక భక్తుడు వచ్చి శ్రీరామకృష్ణులతో “గదిలో కూర్చోడానికి మాకు చోటు ఉందా అని ఆ స్త్రీలు అడుగుతున్నారు. వారు ఇక్కడ కూర్చో వచ్చునా?” అన్నాడు. కీర్తన అప్పటికే మొదలయింది. శ్రీరామకృష్ణులు “లేదు లేదు. గదిలో చోటు ఎక్కడుంది?” అన్నారు.
నారాయణ్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన ఆప్యాయంగా అతడితో “నువ్వెందుకు వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అంతగా కొట్టారు కదా!” అన్నారు. అతడికి తినడానికి ఏమైనా ఇవ్వమని ఆయన బాబూరామ్‌కు సైగ చేశారు. నారాయణ్ గదిలోకి వెళ్ళాడు. తటాలున శ్రీరామకృష్ణులు కూడా అతణ్ణి అనుసరించారు. అతడికి తమ చేతులతో తినిపించాలన్నది ఆయన అభిలాష. తరువాత ఆయన మళ్ళీ వసారాలోకి వచ్చారు.
33.13 త్రయోదశ పరిచ్ఛేదం భక్తులతో సంకీర్తనానందంలో
విజయ్, మహిమాచరణ్, ‘మ’, చిన్నగోపాల్ మొదలైన భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. కాసేపట్లోనే నారాయణ్ కూడా అక్కడకు వచ్చి వారితోపాటు కూర్చున్నాడు.
దాదాపు మూడు గంటలకు అధర్ సేన్ వచ్చాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఉత్తేజితులయ్యారు. అధర్ ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు. తమకు సమీపంగా రమ్మని ఆయన అధర్కు సైగచేశారు.
కీర్తన ముగిసింది. భక్తులు కొందరు తోటలో వాహ్యాళికై వెళ్ళారు, మరి కొందరు ఆలయ దేవతల హారతి సందర్శనానికి వెళ్ళారు.
సంధ్యాకాలం తరువాత శ్రీరామకృష్ణుల గదిలో కీర్తన ఏర్పాటు చేశారు. ఆయన అత్యంత ఉత్సాహంతో ఒక భక్తుడితో “ఇక్కడ మరో దీపం వెలిగించు” అన్నారు. రెండు దీపాలూ గదిని ప్రకాశవంతం చేశాయి.
శ్రీరామకృష్ణులు విజయ్‌తో “నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? నా ప్రక్కకు రా” అన్నారు. ఈసారి కీర్తన గంభీర వాతావరణాన్ని సృష్టించింది. శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో నృత్యం చేయసాగారు; భక్తులు కూడా ఆయన చుట్టూ వృత్తాకారంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూండగా విజయ్ వస్త్రాలు జారిపోయాయి, దిగంబరుడై పోయాడు. అయితే ఆతడికి బాహ్యస్పృహ లేదాయె.
కీర్తన పూర్తయ్యాక విజయ్ తన తాళం చెవికోసం వెదుక్కోసాగాడు. అది ఎక్కడో పడిపోయింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ అతడితో “ఇంకా దాని గురించి చింతించడం ఎందుకు?” అన్నారు. పెట్టెలు, తాళాలు ఇత్యాది వ్యవహారాలతో ఇంకా సంబంధం పెట్టుకోవడం ఎందుకు అని ఆయన ఉద్దేశం.
కిశోరీ శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు; అతడు బయలుదేరనున్నాడు. అతడి ఛాతీని మృదువుగా స్పృశిస్తూ శ్రీరామకృష్ణులు అతణ్ణి ఆశీర్వదించారు. “మళ్ళీ రా” అన్నారు. ఆయన పలుకులలో కారుణ్యం ఉట్టిపడుతోంది. కాసేపయ్యాక ‘మ’, గోపాల్ కూడా ఆయనకు ప్రణామం చేశారు. వారు కూడా బయలుదేరనున్నారు. మళ్ళీ అదే కరుణాపూరితమైన పలుకులు – “రేపు ఉదయం వెళ్ళరాదా? రాత్రి సమయంలో వెళ్ళడం వల్ల జలుబు చేస్తుందేమో!” అన్నారు.
‘మ’, గోపాల్ రాత్రికి అక్కడే బస చేయడానికి నిశ్చయించుకున్నారు. మరికొందరు భక్తులతో వారు నేలపైనే పడుకున్నారు.
శ్రీరామకృష్ణులకు ఇవాళ రోజంతా బొత్తిగా విశ్రాంతి లేకపోయింది. పగలంతా భక్తులు ఆయనతోనే ఉన్నారు. కాసేపు ఆయన బయటకు వెళ్ళి వచ్చారు. తిరిగి వచ్చి చూసేసరికి రామ్‌లాల్ వద్ద నుండి ‘మ’ పాట నొక దానిని వ్రాసుకుంటున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఏం వ్రాస్తున్నావేమిటి?
ఫలానా పాట వ్రాస్తున్నానని ‘మ’ చెప్పేసరికి “అది చాలా పెద్ద పాట” అన్నారాయన. ఒకటి రెండు పంక్తులు వ్రాసి ‘మ’ వ్రాయడం ఆపేశాడు.
శ్రీరామకృష్ణులు రాత్రి భోజనానికి కొద్దిగా రవ్వ పాయసం, ఒకటి రెండు లూచీలు (అంటే, మైదా పిండితో చేసిన పూరీలు) పుచ్చుకుంటారు. “పాయసం ఉందా?” అని రామ్‌లాల్‌ను అడిగారు. రామ్‌లాల్, పాయసం తీసుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు నేల మీద ఆసనంపైన కూర్చుని దాన్ని సేవించారు. ఆయనకు ప్రక్కగా దీపం ఒకటి ఉంది. ‘మ’ ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. ఆయన “గదిలో మిఠాయిలు ఏమైనా ఉన్నాయా” అని అడిగారు. తాను తీసుకువచ్చిన మిఠాయిలను ‘మ’ అల్మరా పైన పెట్టి ఉంచాడు. ఒక మిఠాయి ఇవ్వమన్నారాయన. అయితే ఇప్పుడు చూస్తే అవి లేవు. ‘మ’ అటూ ఇటూ వెదకినా కనిపించలేదు. వాటిని భక్తులకు పంచడం జరిగింది. ‘మ’ సిగ్గుతో కుంచించుకుపోయాడు.
పాయసం తిన్నాక శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. ‘మ’ ఆయనకు దగ్గరగా చాప మీద కూర్చున్నాడు. నారాయణ్ గురించి మాట్లాడుతూ ఆయన భావమగ్నులవుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఇవాళ నారాయణ్‌ను చూశాను.
మ: అవునండి. అతడు కంట తడిపెట్టుకున్నాడు. అతణ్ణి చూసి నాక్కూడా ఏడ్వాలనిపించింది.
శ్రీరామకృష్ణులు: అతణ్ణి చూస్తే నాకు వాత్సల్యం జనిస్తుంది. ఇక్కడకు వచ్చినందుకు ఇంట్లో వాళ్ళు అతణ్ణి కొడతారు. అతణ్ణి సమర్థించేవాళ్ళు ఎవరూ లేరు.
‘మ’ (నవ్వుతూ): ఒక రోజు హరిపదుని ఇంట్లో పుస్తకాలు పెట్టి అతడు మీ వద్దకు పారిపోయి వచ్చాడు.
శ్రీరామకృష్ణులు: అలా చేయడం అతడికి మంచిది కాదు.
కాసేపు మౌనంగా ఉండి శ్రీరామకృష్ణులు మళ్ళీ మాటలు కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: అతడిలో ఎంతో సారం ఉంది. లేకుంటే నేను కీర్తన వింటున్నప్పుడు కూడా అతడు నన్ను అంతగా ఎలా ఆకర్షించగలడు? కీర్తన బృందాన్ని వదిలిపెట్టి నేను గదిలోకి వచ్చాను. అలా ఎప్పుడూ జరుగలేదు.
మళ్ళీ కాసేపు మౌనంగా ఉండి శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: ఎలా ఉన్నావని భావావస్థలో అతణ్ణి అడిగేసరికి ఆనందంగా ఉన్నానని బదులిచ్చాడు. (‘మ’ తో) అప్పుడప్పుడు అతడికి ఏమైనా కొనిపెట్టి ఆప్యాయంగా తినిపిస్తూ ఉండు.
తరువాత తేజచంద్ర గురించి మాట్లాడారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అతడు నా గురించి ఏమనుకొంటున్నాడో ఒకసారి అడిగిచూడు. అతడు నన్ను జ్ఞానిగా భావిస్తున్నాడా, లేక మరేదోగా అనుకుంటున్నాడా? అతడు బహు నెమ్మదస్తుడని విని ఉన్నాను. (గోపాల్‌తో) తేజచంద్రను శని మంగళ వారాల్లో ఇక్కడకు రమ్మని చెప్పు. (‘మ’ తో) అది సరే, ఒకసారి మీ స్కూలుకు వచ్చి చూడనా?
ఆయన స్కూలుకు వచ్చి నారాయణ్‌ను చూడాలనుకుంటున్నారని తలచాడు ‘మ’. ఆయనతో “మీరు మా ఇంట్లోనే కూర్చుని ఎదురు చూడవచ్చునండి” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది కాదు. నేను మరో విషయం గురించి ఆలోచిస్తున్నాను. మీ స్కూలులో ఇంకా వేరే అబ్బాయిలు ఎవరైనా ఉన్నారేమో చూడాలనేదే నా తలంపు.
‘మ’ : మీరు తప్పక రావచ్చునండీ. తక్కిన వాళ్ళలాగే మీరు కూడా రావచ్చు.
శ్రీరామకృష్ణులు పొగత్రాగుతున్నారు. ‘మ’, గోపాల్ భోజనం చేశారు. నహబత్తుకు వెళ్ళి అక్కడే నిద్రపోదామనుకున్నారు. ‘మ’ మళ్ళీ శ్రీరామకృష్ణులకు దగ్గరగా నేలపైన కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నహబత్తులో కుండలు, పాత్రలు పడి ఉంటాయి. ఇక్కడే పడుకోరాదా?
‘మ’ : అలాగేనండీ.
33.14 చతుర్దశ పరిచ్ఛేదం అహేతుక కృపాసింధువు – ‘మ’ సేవ
రాత్రి పది లేక పదకొండు గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దిండును ఆనుకొని చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు. ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. గోడకు దీపం వ్రేలాడుతోంది.
శ్రీరామకృష్ణులు అహేతుక కృపాసింధువు. తమకు సేవ చేయడానికి ‘మ’ కు అవకాశమిచ్చారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): పాదాలు నొప్పి పుడుతున్నాయి. కాస్త మృదువుగా ఒత్తు.
‘మ’ చిన్న మంచం మీద కూర్చుని ఆయన పాదాలను తన ఒడిలోకి తీసుకున్నాడు. మెల్లగా ఒత్తసాగాడు. శ్రీరామకృష్ణులు మధ్యమధ్యలో అతడితో మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇవాళ సంభాషణ నీకెలా అనిపించింది?
‘మ’ : చాలా బాగుందండి.
శ్రీరామకృష్ణులు: అక్బరు పాదుషా గురించిన ప్రస్తావన ఎలా ఉంది?
‘మ’ : బాగుందండి.
శ్రీరామకృష్ణులు: అదేమిటో ఒకసారి చెప్పు, చూద్దాం.
‘మ’ : ఒక ఫకీరు అక్బరు వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన నమాజు చదువుతున్నాడు, నమాజు చదువుతూ సిరి సంపదలు ప్రసాదించమని అల్లాను ప్రార్థిస్తున్నాడు. అది చూసి ఫకీరు గదిలో నుండి బయటకు వెళ్ళిపోబోయాడు. తరువాత అక్బర్ దాన్ని గురించి ప్రశ్నించే సరికి ‘భిక్షమెత్త వలసి వస్తే మరో బికారి వద్ద భిక్షమెత్తడం ఎందుకు?’ అని బదులిచ్చాడా ఫకీరు.
శ్రీరామకృష్ణులు: ఇంకా ఏమేం మాట్లాడుకున్నాం?
‘మ’ : సంచయం చేయడం గురించి మీరు చాలా చెప్పారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏం చెప్పానేమిటి?
‘మ’ : ప్రయత్నం చెయ్యాలి అన్న భావన ఉన్నంతవరకు ప్రయత్నించ వలసిందే. దాని గురించి మీరు సింథీలో ఎంత చక్కగా చెప్పారు!
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పాను?
‘మ’ : భగవంతుని సంపూర్ణంగా శరణుజొచ్చిన వారి భారాన్ని ఆయనే స్వీకరిస్తాడు. యుక్తవయస్సు రాని కుర్రవాడి (మైనరు) బాగోగులను సంరక్షకుడు చూసుకోవడం లాంటిది అది. మరో విషయం కూడా చెప్పారు: విందు భోజనంలో కూర్చోడానికి పిల్లవాడు చోటు వెదుక్కోలేని పక్షంలో వేరే ఎవరయినా వచ్చి అతణ్ణి కూర్చోబెడతారు.
శ్రీరామకృష్ణులు: ఊహూ, ఇక్కడ పొరబడ్డావు. పిల్లవాడి చేతిని తండ్రి పుచ్చుకున్నట్లయితే వాడు పడిపోయే ప్రమాదం ఉండదని నేను చెప్పాను.
‘మ’ : ఇంకా మీరు మూడు రకాల సాధవుల గురించి చెప్పారు. ఉత్తమ సాధువు తన ఆహారం కోసం అటూ ఇటూ ఎక్కడికీ వెళ్లడు. తాను కూర్చున్న చోటనే అతడికి ఆహారం లభిస్తుంది. మీరు ఆ కౌమార సన్న్యాసి కథ కూడా చెప్పారు. ఒక అమ్మాయి స్తనాలను చూసి అతడు “ఛాతీ పైన వ్రణాలు ఎందుకు ఉన్నాయి?” అని అడిగాడు. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు, దేనికదే సాటి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఏమిటవి?
‘మ’ : పంపా కాకి కథ. అహర్నిశలూ అది రామనామం జపించేది. అందుకే అది నీటికి సమీపంగా వెళ్ళినా నీరు త్రాగలేకపోయేది. ఇంకా, ఆ సాధువు గురించి కూడా చెప్పారు. అతడి పుస్తకంలో కేవలం ‘ఓం రామ’ అని మాత్రమే వ్రాసుంది. ఇంకా, రాముడితో హనుమంతుడు ఏం చెప్పాడో చెప్పారు.
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పాడు?
‘మ’ : హనుమంతుడు రాముడితో ‘ఓ రామా, నేను లంకలో సీతాదేవిని చూశాను. అయితే అక్కడ ఉన్నది ఆమె దేహం మాత్రమే. మనస్సు, ప్రాణాలు అన్నీ ఆమె నీ పాదాల చెంతనే సమర్పించి వేసింది’ అని చెప్పాడు.
“ఇంకా, చాతకపక్షి విషయం. వర్షపు నీటిని తప్ప అది మరే నీటినీ త్రాగదు. జ్ఞానయోగం, భక్తియోగం గురించి కూడా చెప్పారు.”
శ్రీరామకృష్ణులు: ఏమిటది?
‘మ’ : ‘కుండ’ గురించిన జ్ఞానం ఉన్నంత వరకు ‘నేను’ కూడా ఉండనే ఉంటుంది. ‘నేను’ గురించిన జ్ఞానం ఉన్నంత వరకు ‘నేను దాసుణ్ణి, నువ్వు భగవంతుడివి’ అన్న భావమూ ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది కాదు. ‘కుండ’ గురించిన జ్ఞానం ఉన్నా సరే, లేకున్నా సరే, ‘కుండ’ (నేను) మాత్రం పోదు. నువ్వు వెయ్యిసార్లు విచారణ చేయవచ్చు గాక, అయితే అది మాత్రంపోదు.
‘మ’ కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
‘మ’ : కాళీ ఆలయంలో ఈశాన్ ముఖర్జీకి మీరు చెప్పిన మాటలు! ఆ సమయంలో అక్కడ ఉండడం నిజంగా మా అదృష్టం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవునవును. ఏం మాట్లాడానో కాస్త చెప్పు.
‘మ’ : కర్మకాండ అనేది ఆదికాండ మాత్రమే అని చెప్పారు. శంభు మల్లిక్‌తో మీరు చెప్పిన మాట – ‘భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమైతే ఆసుపత్రులు, డిస్పెస్సరీలు కోరుకుంటావా ఏమిటి?’ ఈ మాట కూడా చెప్పారు.
“మరో విషయం కూడా చెప్పారు: కర్మల పట్ల ఆసక్తి ఉన్నంత వరకు భగవంతుడు దర్శనమివ్వడు. ఆ మాట మీరు కేశవ్సేన్కు చెప్పి ఉన్నారు.”
శ్రీరామకృష్ణులు: ఏం చెప్పానేమిటి?
‘మ’ : పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ వాటితో మైమరంచి ఉండే వరకు తల్లి వంటపని, తక్కిన ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే వాడు బొమ్మలను అవతలకు పారేసి ఏడుపు లంకించుకోగానే ఉడుకుతున్న అన్నం కుండను క్రిందకు దించి ఆమె వాడి వద్దకు వస్తుంది.
“ఆ రోజు మీరు మరో సంగతి కూడా చెప్పారు: భగవంతుణ్ణి ఎక్కడెక్కడ చూడగలమని లక్ష్మణుడు రాముణ్ణి అడిగేసరికి, అతడు లక్ష్మణుడికి ఎంతగానో వివరించాక ఇలా చెప్పాడు: ‘తమ్ముడూ, ఎవరిలో అయితే ఊర్జిత భక్తి కానవస్తుందో అంటే ఎవరైతే నా ప్రేమలో ఉన్మత్తుడై నవ్వుతూ, రోదిస్తూ, నాట్యం చేస్తాడో అక్కడ నేను (భగవంతుడు) ఉన్నానని తెలుసుకో.’”
శ్రీరామకృష్ణులు: ఆహా! ఆహా!
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉన్నారు.
‘మ’ : ఆ రోజు మీరు ఈశాన్కు కేవలం వైరాగ్య ప్రబోధక వచనాలే చెప్పారు. ఆ రోజునుండి మాలో చాలామందికి తెలివి వచ్చింది. కర్తవ్యాలను తగ్గించుకోవడానికి మేమందరమూ ఆతురపడుతున్నాము. మీరు చెప్పారు కదా ‘లంకలో రావణుడు మరణించాడు. ఇక్కడేమో బేహులా వెక్కి వెక్కి ఏడ్చింది’ అని.
ఇది విని శ్రీరామకృష్ణులు బిగ్గరగా నవ్వారు.
‘మ’ (వినయంగా): అయ్యా! కర్తవ్యాలు, ఇతర లేనిపోని చిక్కులు తగ్గించుకోవడం మంచిదే కదా?
శ్రీరామకృష్ణులు: అవును. అయితే ఏ సాధువో లేక పేదవాడో ఎదురుపడితే అది వేరే సంగతి. అప్పుడు వారిని సేవించాలి.
‘మ’ : ఇంకా ఆ రోజు మీరు ముఖస్తుతి పరులను గురించి ఈశాన్కు బాగా చెప్పారు. వారు పీనుగును పీక్కుతినే రాబందుల వంటివారు. ఒకసారి మీరు పద్మలోచన్కు ఆ మాట చెప్పారు.
శ్రీరామకృష్ణులు: కాదు, కాదు. ఆ మాట చెప్పింది ఉలోర్కు చెందిన వామన్దాస్కు.
కాసేపటి తరువాత ‘మ’ చిన్న మంచానికి దగ్గరగా నేలపైన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులకు నిద్ర వస్తోంది. ‘మ’ తో “నువ్వు వెళ్ళి పడుకో. గోపాల్ ఎక్కడ? తలుపులు మూసివెయ్యి” అన్నారు.
మరుసటి రోజు శ్రీరామకృష్ణులు చాలా పెందలకడనే లేచారు. దేవీదేవతల నామసంకీర్తన చేయసాగారు. మధ్య మధ్యలో గంగామాతను దర్శిస్తున్నారు. రాధాకాంత, కాళీ ఆలయాలలో మంగళారతి మొదలయింది. గత రాత్రి ‘మ’ శ్రీరామకృష్ణుల గదిలో పడుకున్నాడు. అతడు లేచి వెళ్ళి ఆలయాలలో జరుగుతూన్న మంగళారతులు చూస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు స్నానం చేసి ‘మ’ తో కలసి కాళీ ఆలయానికి వెళ్ళారు. ‘మ’ తో గదికి తాళం వెయ్యమన్నారు.
శ్రీరామకృష్ణులు, ఆలయంలో దేవి ఎదుట ఉన్న ఆసనంలో కూర్చున్నారు. పువ్వులను తీసుకొని ఒక్కోసారి తమ శిరస్సు మీద, ఒక్కోసారి దేవి పాదపద్మాల వద్ద సమర్పించారు. కొద్దిసేపు చామరం వీచారు. తరువాత గదికి తిరిగివచ్చారు. తాళం తీయమని ‘మ’ కు చెప్పారు. గదిలోకి ప్రవేశించి చిన్న మంచం మీద కూర్చున్నారు. ఆయన పూర్తిగా భావపారవశ్యంలో ఉన్నారు. భగవన్నామాన్ని కీర్తిస్తున్నారు. ‘మ’ నేల మీద ఒంటరిగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు, కాళీమాత గురించి గానం చేయసాగారు:
ఎరుగగ తరమె ఏరికినైన
తల్లి కాళి నిజతత్వమించుక
షడ్దర్శనములు శక్తిహీనములు
తల్లి విషయము తెలియ జేయుటకు…..
* * *
ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే
మాయి మాయామోహమునను మునిగె మూడు జగములూ……
శ్రీరామకృష్ణులు ‘అమ్మా, నువ్వు నన్నింక మోసం చెయ్యలేవు’ అనే పాట పాడితే బాగుంటుంది అని ‘మ’ అనుకున్నాడు.
ఏం ఆశ్చర్యం! ‘మ’ కు ఆ ఆలోచన వచ్చిందో లేదో, శ్రీరామకృష్ణులు అదే పాట పాడారు. కాసేపటి తరువాత ‘మ’ ను ఇలా అడిగారు: “నా ప్రస్తుత స్థితి గురించి నువ్వేమనుకుంటున్నావు?
‘మ’ (నవ్వుతూ): అది మీ సహజమైన, సరళమైన స్థితి.
శ్రీరామకృష్ణులు తమలో తామే “స్వయంగా సరళ స్వభావం పొందకుండా సహజుడైన భగవంతుణ్ణి పొందలేము” అనే భావం వచ్చే పాట పాడుకోసాగారు.