31.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో శ్రీరామకృష్ణులు
శనివారం, అక్టోబర్ 11, 1884
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో చిన్నమంచం మీద పడుకుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు అయివుంటుంది. ‘మ’, ప్రియముఖర్జీ నేల మీద కూర్చుని ఉన్నారు. పాఠశాల నుంచి ఒంటి గంటకు బయలుదేరిన ‘మ’ దాదాపు రెండు గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఒకసారి యదుమల్లిక్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే అతడు, ‘బండి బాడుగ ఎంత?’ అని అడిగాడు. ఎవరో, ‘మూడు రూపాయల రెండణాలు’ అన్నారు. పిదప బండివాడి వద్దకెళ్ళి రహస్యంగా, ‘బాడుగ ఎంత?’ అని అడిగాడు. అతడు, ‘మూడు రూపాయల నాలుగు అణాలు’ అన్నాడు. (అందరూ నవ్వారు) ఈ మాట వినగానే మళ్ళీ నా వద్దకు పరుగున వచ్చి, ‘అవునూ, బండి బాడుగ ఎంతని చెప్పారు?’ అని అడిగాడు.
“అక్కడ ఒక దళారి ఉన్నాడు. అతడు యదుమల్లిక్తో, ‘బడా బజార్లో నాలుగు ఎకరాల స్థలం అమ్మకానికి ఉంది. కొంటారా?’ అని అడిగాడు. ‘ధర ఎంత?’ అని యదు అడిగాడు. ధర చెప్పగానే, ‘ఏమిటి, కాస్త తగ్గించరాదా?’ అన్నాడు. ‘ఇలా చూడు, నువ్వు ఎలాగూ దాన్ని కొనబోవు, అనవసరంగా ఎందుకు బేరం చేస్తావు?’ అని నే నడిగాను. ఈ మాట వినగానే యదు నా వైపు తిరిగి నవ్వాడు. నలుగురు వస్తూ పోతూ ఉండాలి, పేరు ప్రసిద్ధి గాంచాలి అన్నదే లౌకికుల నైజం.
“అధర్ ఇంటికి యదుమల్లిక్ వెళ్ళాడు. నేను అతడితో, ‘నువ్వు తన ఇంటికి రావటం అధర్కు ఎంతో సంతోషదాయకమైంది!’ అన్నాను. అది వినగానే అతడు, ‘ఏమన్నారు, ఏమన్నారు, నిజంగానే సంతోషించాడా?’ అని అడిగాడు.
“యదు ఇంటికి ఒక ఫలానా మల్లిక్ వచ్చి ఉన్నాడు. అతడు చతురుడు, వంచకుడు; అతడి కళ్ళు చూసే తెలుసుకున్నాను. అతడిని చూస్తూ, ‘చాతుర్యం అంత మంచిది కాదు. కాకి ఎంతో చాతుర్యం గలది, సమర్థమైనది. అది ఇతరుల విసర్జనలను తిని తిరుగుతూ ఉంటుంది’ అన్నాను. వాడు దరిద్రుడనీ తెలుసుకున్నాను. అది చూసి యదు తల్లి ఆశ్చర్యంతో, ‘బాబా, అతడు దరిద్రుడని నీ కెలా తెలిసింది?’ అని అడిగింది. ‘ముఖం చూడగానే తెలిసిపోయింది’ అని అన్నాను.”
ఇంతలో నారాయణ్ వచ్చాడు, అతడూ నేల మీద కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (ప్రియనాథ్తో): మీ హరి చాలామంచి కుర్రవాడు.
ప్రియనాథ్: స్వామి, అంతగా చెప్పుకోదగ్గది ఏముంది? చిన్న పిల్లల స్వభావం!
నారాయణ్: భార్యను అమ్మా అని పిలుస్తాడు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి! నేనే అలా సంబోధించలేను. కాని ఇతడు అమ్మా! అంటున్నాడే! (ప్రియనాథ్తో) విషయం ఏమిటో తెలుసా, కుర్రవాడు శాంతస్వభావుడు, మనస్సు భగవంతుణ్ణి కోరుతోంది.
శ్రీరామకృష్ణులు ఇతర విషయాలను గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: హేమ్ ఏం చెప్పాడో తెలుసా? ‘భగవంతు డొక్కడే సత్యం, మిగిలిన దంతా మిథ్య’ అని బాబూరామ్‌తో చెప్పాడు. (అందరూ నవ్వారు) అవును. చిత్తశుద్ధితోనే చెప్పాడు. దానికి తోడు, నన్ను తన ఇంటికి తోడ్కొని వెళ్ళి కీర్తనలు పాడి వినిపిస్తానన్నాడు. కాని అది జరగలేదు. ‘నేను తాళాలు, మృదంగాన్ని చేత పుచ్చుకుంటే జనం ఏమనుకొంటారు?’ అని తరువాత ఏదో చెప్పాడట. జనం తనను పిచ్చివాడి క్రింద జమకడతారని అతడి భయం.
31.1.1 ఘోష్పారా స్త్రీ, హరిపదుడు – కౌమార వైరాగ్యం
“హరిపదుడు ఒక ఘోష్పారా వనిత వలలో చిక్కుకున్నాడు. ఆమె అంత సులభంగా వదలిపెట్టే రకం కాదు. ఇతణ్ణి ఒడిలో ఉంచుకుని అన్నం పెడుతుందట. గోపాల భావనో ఏదో అట! నేను అతణ్ణి పలుమార్లు హెచ్చరించాను! అది వాత్సల్య భావన అంటుంది ఆమె. ఈ వాత్సల్యభావమే పిదప తాచ్ఛల్య భావంగా (తుచ్ఛ భావంగా) పరిణమిస్తుంది.
“విషయం ఏమిటో తెలుసా? స్త్రీల నుండి దూరంగా ఉండాలి. అప్పుడే భగవదనుభూతికి అవకాశం ఉంటుంది. దురుద్దేశపరులైన స్త్రీల వద్దకు వెళ్ళడం, వారి చేతుల మీదుగా తినటం హానికరం. వీళ్ళు ఆధ్యాత్మికతను హరించివేస్తారు.
“ఎంతో అప్రమత్తంగా ఉంటేనే భక్తిని పరిరక్షించుకోగలిగేది. ఒక రోజు భవనాథ్, రాఖాల్ తదితరులు అంతా చేరి అన్నం వండారు. భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక బావుల్ వచ్చి వారి పంక్తిలోనే కూర్చుని, ‘నాకూ భోజనం పెట్టండి’ అన్నాడు. ‘అన్నం సరిపోదు, మిగిలితే నీకు పెడతారు’ అని చెప్పాను. అంతే! కోపంతో అతడు వెళ్ళిపోయాడు. విజయ దశమి రోజున ఎవరు పడితే వారు వచ్చి ఎవరికంటే వారికి నోట్లో అన్నం పెడుతుంటారు. కాని అది మంచిది కాదు. శుద్ధసత్వ భక్తుల చేతుల నుంచి తినవచ్చు.
“స్త్రీల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. గోపాల భావన వగైరాలు నమ్మకు. ‘స్త్రీ ముల్లోకాలను మ్రింగివేస్తుంది’ అన్నది లోకోక్తి. ఒకడు యువకుడై, అందగాడైతే పలువురు స్త్రీలు అతడి మీద ఒక క్రొత్తమాయ వలను విసురుతారు. పైగా దీన్ని గోపాల భావన అని కూడా చెబుతారు!
“కౌమారంలోనే వైరాగ్యం అలవరచుకున్న వారు, బాల్యం నుండే భగవంతునికై పరితపించేవారు, గృహస్థ జీవితాన్ని తిరస్కరించేవారు ప్రత్యేక కోవకు చెందిన వారు. వారు నిష్కళంక కులీనులు! నిజమైన వైరాగ్యం జనించినప్పుడు, ఎక్కడ తమ పురోగమనానికి హాని వాటిల్లుతుందోనని వీళ్ళు స్త్రీల నుంచి యాభై అడుగుల దూరంగానే ఉంటారు. వీళ్ళూ స్త్రీల వలలో చిక్కుకుంటే కల్తీలేని పరిశుద్ధ స్థితి నుంచి దిగజారిపోతారు. వారి భావన భగ్నమైపోతుంది, అధోగతి పాలవుతారు. ఎవరిలోనైతే కౌమారం నుంచే యథార్థమైన వైరాగ్యం ఉంటుందో వాళ్ళు ఉన్నత శ్రేణికి చెందినవారు. అమిత పరిశుద్ధులు. శారీరకంగా కూడా కళంకం లేనివారు.
31.1.2 జితేంద్రియుడవడానికి మార్గం – ప్రకృతి భావంలో సాధన
“జితేంద్రియుడవటం ఎలా? అతడు తనను స్త్రీగా భావించుకోవాలి. నేను అనేక రోజులు సఖీభావంతో ఉన్నాను. స్త్రీల వలె చీర కట్టాను. నగలు ధరించాను. ఛాతీపై వస్త్రం వేసుకొనేవాడను. ఛాతీపై వస్త్రంతోనే హారతి ఇచ్చేవాడను. లేకుంటే భార్యను నాతో ఎనిమిది నెలలు ఏ విధంగా ఉంచుకోగలిగాను? ఇద్దరం జగజ్జనని చెలికత్తెలవలె ఉండే వాళ్ళం. పురుషుడనని నేను చెప్పలేను. ఒక రోజు నేను పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు నా భార్య నన్ను చూసి, ‘నేను మీకు ఏమవుతాను?’ అని అడిగింది. అందుకు నేను, ‘ఆనందమయి తల్లివి!’ అని బదులు చెప్పాను.
“చనుమొనలున్న వారందరూ స్త్రీలు అనే ఒక అభిప్రాయం ఉంది. అర్జునుడికి, కృష్ణుడికీ ఛాతీపై మొనలు లేవట! శివపూజ ఉద్దేశం ఏమిటో తెలుసా? శివలింగ పూజ – అంటే లింగాన్ని, యోనిని పూజించటం. వాటిని పూజించే భక్తుడు, ‘ఓ దేవా! ఇకపై నాకు జన్మ లేకుండా అనుగ్రహించు. యోని గుండా ఇక నాకు జన్మ రాకుండు గాక!’ అని ప్రార్థిస్తాడు.”
31.2 ద్వితీయ పరిచ్ఛేదం స్త్రీలతో చేసే సాధనలపై నిషేధం
టాగూర్ కుటుంబ ఉపాధ్యాయుడు, కుటుంబంలోని కొందరు బాలురతో కలసి గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తమ మాటలు కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): కృష్ణుని శిఖపై నెమలి పింఛం ఉంది. నెమలి ఫించంలో యోని చిహ్నం ఉంది. కృష్ణుడు స్త్రీ తత్త్వాన్ని తలపై నిలుపుకున్నాడని దానికి అర్థం. కృష్ణుడు రాసమండలానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే స్త్రీగా మారిపోయాడు. అందుకే రాసమండలంలో అతణ్ణి స్త్రీ వేషధారణలో చూస్తున్నాం. స్త్రీ భావం ఆరోపించుకోనిదే ఎవరికైనా స్త్రీలతో కలసిమెలసి ఉండే అధికారం ఉండదు. ప్రకృతి భావం ఏర్పడితేనే రాసలీల జరుగుతుంది; అప్పుడే సంగమం.
“కాని సాధక దశలో ఎంతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఆ సమయంలో స్త్రీల నుంచి చాలా దూరంగా ఉండాలి. భక్తురాలైనప్పటికీ ఆమెకు అతి సమీపంలోకి పోరాదు. మెట్ల గుండా పైకి పోతున్నప్పుడు ముందు వెనుకలకు ఊగరాదు, అలా ఎక్కితే క్రింద పడిపోతారు. బలహీనులు చేపట్టు పుచ్చుకుని పైకి ఎక్కాలి.
“సిద్ధుని స్థితి పొందాక ఆ సంగతే వేరు. భగవద్దర్శనానంతరం అంత భయం ఉండదు; చాలావరకు సురక్షితమే. ఎలాగైనా మేడను ఎక్కితే చాలు, అలా ఎక్కిన పిదప అక్కడ నువ్వు నాట్యం కూడా చేయవచ్చు, కాని మెట్లపై నాట్యం చేయలేవు. మరో విషయం – మొదట వదలిపెట్టిన వాటినన్నిటినీ మేడపై చేరుకున్నాక వదలిపెట్టవలసిన అవసరం ఉండదు. ఇటుకలు, సున్నం, బంకమన్ను మొదలైన వాటితో కట్టబడింది మేడ. మెట్లూ అదే వస్తువులతోనే కట్టబడి ఉన్నాయి. ఏ స్త్రీతో అప్రమత్తంగా మెలగవలసి వచ్చిందో, భగవద్దర్శనానంతరం అదే స్త్రీ జగజ్జననిగా గోచరిస్తుంది. అప్పుడు ఆమెను తల్లిగా పూజించాలి, అక్కడ అంత భయం ఉండదు. సంగతి ఇదే; దాగుడుమూతల ఆటలో ‘తల్లి’ ని తాకిన పిదప ఏమన్నా చేసుకో.
31.2.1 బహిర్ముఖ స్థితి, అంతర్ముఖ స్థితి -శ్రీరామకృష్ణుల ధ్యానం
“బహిర్ముఖ స్థితిలో స్థూల వస్తువులనే గాంచుతాం. ఆ స్థితిలో మనస్సు అన్నమయకోశంలో నెలకొని ఉంటుంది. తరువాతది సూక్ష్మశరీరం, లింగ శరీరం. ఆ సమయంలో మనస్సు మనోమయ, విజ్ఞానమయ కోశాలలో నెలకొని ఉంటుంది. ఆ తరువాత కారణ శరీరం. మనస్సు కారణ శరీరాన్ని చేరుకున్నప్పుడు సకలం ఆనందమయం, అప్పుడు మనస్సు ఆనందమయ కోశంలో నెలకొని ఉంటుంది. ఈ స్థితే చైతన్యదేవుల అర్ధబాహ్య దశ.
“దీని తరువాత మనస్సు నశిస్తుంది, మహాకారణంలో లయిస్తుంది. మనస్సు నశించాక ఏ వివరాలూ ఉండవు. ఇదే చైతన్యుల అంతర్దశ. అంతర్దశ ఎటువంటిదో తెలుసా? దయానందుడు దీన్ని ఇలా వివరించాడు: ‘లోపలకు ప్రవేశించు, తలుపు మూసివెయ్యి.’ ఎవరు పడితే వాళ్ళు ఇంటి అంతర్భాగంలోకి ప్రవేశించలేరు.
“నేను దీపశిఖపై ధ్యానం చేసేవాడను. దాని ఎరుపు వర్ణాన్ని స్థూలమనీ, దాన్లోని ధవళవర్ణాన్ని సూక్ష్మమనీ, అన్నిటికి లోపల ఉన్న నల్లని తిరి భాగాన్ని కారణ శరీరమనీ భావించేవాడను.
“ధ్యానం సరిగా కుదిరిందనటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, ధ్యానం చేస్తూ ఉన్న వ్యక్తిని ఏదో ఒక జడపదార్థమని ఎంచి పక్షులు ఆతడి తల మీద వ్రాలుతాయి.
31.2.2 కేశవ్ ధ్యానం – ధ్యానం గురించి పంటినొప్పి ఉపమానం
“కేశవ్సేన్ను మొట్టమొదటిసారి నేను ఆదిబ్రహ్మ సమాజంలో చూశాను. వేదిక మీద కొందరు కూర్చుని ఉన్నారు, వారి మధ్యలో కేశవ్ ఉన్నాడు. కట్టెలా నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. మథుర్బాబుతో, ‘ఇలా చూడు, ఇతడి ఎరను చేప మ్రింగింది’ అన్నాను. అటువంటి ధ్యానస్థితి ఏదో అతడికి ఉన్నందుననే, ఆశించినవన్నీ (పేరు ప్రతిష్ఠలు) భగవంతుని ఇచ్ఛమేరకు సాధించాడు.
“కళ్ళు తెరచుకుని కూడా ధ్యానించవచ్చు, మాట్లాడుతూ ఉన్నప్పుడూ ధ్యానం చేయవచ్చు – పంటి నొప్పితో బాధపడుతున్న వాడిలా. అటువంటి వాడు ఏం చేస్తున్నా సరే, నొప్పితో విలవిల్లాడుతూనే ఉంటాడు.”
టాగూర్ కుటుంబ ఉపాధ్యాయుడు: అవునండీ. అది నాకు బాగా తెలుసు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అంతే. పంటి నొప్పితో బాధపడేవాడు పనులన్నీ చేసుకుంటూ పోతాడు. కాని మనస్సు మాత్రం పంటినొప్పిని గురించే యోచిస్తూ ఉంటుంది. అది జరిగే పక్షంలో కళ్ళు తెరచిన స్థితిలోనూ ధ్యానం కుదురుతుంది, మాట్లాడుతూ ఉన్నప్పుడూ ధ్యానం చేయవచ్చు.
31.2.3 సిక్కు మతస్థులు, శ్రీరామకృష్ణులు
ఉపాధ్యాయుడు: భగవంతునికి పతిత పావనుడని పేరుకూడా ఉంది. ఇది మనకు ఆశాజనకం. ఆయన దయామయుడు కదా!
శ్రీరామకృష్ణులు: సిక్కు మతస్థులు కూడా భగవంతుణ్ణి దయామయుడనే పేర్కొంటారు. వారితో నేను, ‘ఆయన ఎందుకు దయామయుడు?’ అని అడిగాను. అందుకు వాళ్ళు, ‘స్వామీ! ఆయన మనలను సృజించాడు, మన కోసం ఇన్ని వస్తువులను ఏర్పరచాడు; మనలను మనుష్యులుగా రూపొందించాడు; అడుగడుగునా మనలను ఆపదల నుండి కాపాడుతున్నాడు’ అన్నారు. వెంటనే నేను, ‘అవును. మనలను సృష్టించింది ఆయనే. ఆయన కాపాడుతున్నాడు, తిండి పెడుతున్నాడు. దీన్లో గొప్ప ఏముంది! నీకు కొడుకు పుడితే అతణ్ణి పొరుగింటి వాడా వచ్చి పెంచుతాడు?’ అని అడిగాను.
31.2.4 పూర్వ జన్మల సంస్కారాలు – లాలాబాబు, రాణి భవాని
ఉపాధ్యాయుడు: స్వామీ, కొందరికి సత్వరం సిద్ధిస్తుంది. కొందరికో అలా సిద్ధించనే సిద్ధించదు. అలా ఎందుకు అవుతుందో తెలియచేయండి.
శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటో తెలుసా? గత జన్మల సంస్కారాల మేరకే దాదాపు అంతా జరుగుతోంది. ఏదో హఠాత్తుగా జరిగిందని లోకులు అనుకుంటారు.
“ఒకడు ఉదయంపూట ఒక గ్లాసు కల్లు త్రాగాడు. దానితోనే మత్తెక్కి తూలిపోసాగాడు. ‘ఒక గ్లాసుకే ఇంత మత్తుతో తూలిపోతున్నాడు?’ అని జనులు ఆశ్చర్యపోయారు. ‘అది కాదండీ, అతడు రాత్రంతా త్రాగుతూనే ఉన్నాడు’ అన్నాడు మరో వ్యక్తి.
“హనుమంతుడు బంగారంలాంటి లంకను దహించాడు. ‘ఏమిటి! ఒక చిన్నకోతి వచ్చా లంకనంతా దహనం చేసివేసింది?’ అంటూ లోకులు ఆశ్చర్యపోయారు. కాని నిజానికి సీతాదేవి నిట్టూర్పులూ, రాముడి కోపమే లంకను దహించాయి సుమా!
“లాలాబాబును* చూడండి. అతడు ఎంత ధనవంతుడు? పూర్వజన్మ సంస్కారాలు లేకుండా హఠాత్తుగా ఇంతటి వైరాగ్యం వచ్చేస్తుందా? ఇక రాణి భవాని సంగతి! ఒక స్త్రీయై ఉండీ ఎంతటి జ్ఞానం, ఎంతటి భక్తి!
“ఆఖరి జన్మలో శుద్ధసత్త్వం కలుగుతుంది. మనస్సు భగవంతుని పట్ల లగ్నమవుతుంది, ఆయన కొరకు వ్యాకులత చెందుతుంది. అనేక లౌకిక కర్మల నుంచి అది వైదొలగి ఉంటుంది.
“కృష్ణదాస్ పాల్ ఇక్కడకు వచ్చాడు. అతడిలో రజోగుణం ఉండటం చూశాను. కాని అతడు హిందువు, చెప్పులు బయట వదలి వచ్చాడు. కాసేపటి మాటల్లోనే అతడి లోపల సారం ఏమీ లేదని తెలుసుకున్నాను. మానవుడి కర్తవ్యం ఏమిటని అతణ్ణి అడిగాను. అందుకు అతడు, ‘లోకోపకారం చేయటమే’ అని చెప్పాడు. వెంటనే నేను, ‘అందుకు మీ రెవరు? ఏ ఉపకారం చేయగలరు? మీరు ఉపకారం చేసే మేరకు లోకం ఏమిటి అంత చిన్నదా?’ అని అడిగాను.”
31.2.5 నారాయణ్ పట్ల ఆప్యాయత
ఇంతలో నారాయణ్ వచ్చాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు పరమానందభరితులయ్యారు. నారాయణ్‌ను తన ప్రక్కన చిన్న మంచం మీద కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా అతణ్ణి నిమిరారు. మిఠాయిలు తినిపించారు. “మంచి నీళ్ళు త్రాగుతావా?” అని ఆప్యాయంగా అడిగారు. నారాయణ్ ‘మ’ పాఠశాల విద్యార్థి. శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడల్లా ఇంట్లో దెబ్బలు తింటాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ప్రేమగా, “నువ్వొక తోలు చొక్కా కుట్టించుకుని ధరించు. అప్పుడు కొట్టినా నొప్పిపుట్టదు” అన్నారు. పిదప, “హుక్కా త్రాగాలని ఉంది” అన్నారు హరీశ్‌తో.
మళ్ళీ నారాయణ్‌ను చూస్తూ ఇలా అన్నారు: “హరిపదుణ్ణి కుమారునిగా చూసుకొంటూ ఉన్న ఆ స్త్రీ నాడు వచ్చింది. నేను హరిపదుణ్ణి బాగా హెచ్చరించి పంపాను. ఆమె ఘోష్పారా సంప్రదాయస్థురాలు. ‘నీకు ఆశ్రయం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?’ అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, ‘అవును, ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చక్రవర్తి కుటుంబానికి చెందిన వాడు’ అన్నది.
(‘మ’ తో) “ఆహా! ఆ రోజు నీలకంఠుడు వచ్చాడు. ఆహా, ఎంతటి పారవశ్యం! మరో రోజు వచ్చి పాడతానని చెప్పి వెళ్ళాడు. నేడు అక్కడ నృత్యం జరుగనున్నది, వెళ్ళి చూడు. (రామ్‌లాల్‌కు ఒక సీసాను చూపి) నూనె తీరిపోయింది, నూనె నింపలేదా?”
31.3 తృతీయ పరిచ్ఛేదం రాధాకృష్ణులు; ప్రకృతి, పురుష సంబంధిత వివేకమే యోగం – ఆద్యాశక్తి
శ్రీరామకృష్ణులు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఒకసారి గది లోపల, మరోసారి గదికి దక్షిణాన ఉన్న వసారాలోను నడుస్తున్నారు. ఇంకోసారి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో నిలబడి గంగను చూస్తున్నారు.
31.3.1 సాంగత్య ఫలం – చిత్రపటాలు, చెట్లు, పిల్లలు
కాసేపయ్యాక వచ్చి చిన్నమంచం మీద కూర్చున్నారు. అప్పుడు సమయం మూడు గంటలైంది. భక్తులు వచ్చి మళ్ళీ నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద మౌనంగా ఉన్నారు. మధ్యమధ్యలో గది గోడల వంక చూస్తున్నారు. గోడకు అనేక పటాలు తగిలించబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులకు ఎడమ వైపు సరస్వతీ పటం. దాని ప్రక్కన చైతన్య నిత్యానందులు భక్తులతో నామసంకీర్తన చేస్తూ ఉన్న చిత్రపటం. ఎదురుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళీమాత చిత్రాలు, కుడి వైపున రాజరాజేశ్వరి. వెనుక వైపు నీటిలో మునిగిపోతున్న పీటర్‌ను, ఏసుక్రీస్తు లేవనెత్తుతున్న చిత్రపటం. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “ఇలా చూడు. సాధు సన్న్యాసుల చిత్రపటాలను ఇంట్లో తగిలించి ఉంచటం మంచిది. ఉదయం లేవగానే ఇతరుల ముఖం చూడకుండా సాధు సన్న్యాసుల ముఖాలను చూడటం శ్రేయోదాయకం. ఆంగ్లేయుల చిత్రాలను గోడలకు తగిలించటం – ధనవంతుడు, రాజు, క్వీన్, ఆమె కుమారుడు, కుమార్తె, ఆంగ్లేయునితో కలిసి ఒక స్త్రీ నడవటం వంటి చిత్రపటాలన్నీ రజోగుణానికి లక్షణాలు.
“ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి స్వభావం నీకూ వచ్చేస్తుంది. అందుకే చిత్రపటాల ద్వారా కూడా హాని వాటిల్లవచ్చు. ప్రతి ఒక్కరూ తన స్వభావానికి తగిన వ్యక్తినే వెదకుతూ ఉంటారు. పరమహంసలు చిన్నపిల్లలను తమ ప్రక్కన ఉంచుకుంటారు. ఐదు లేక ఆరేళ్ళ పిల్లలను మాత్రమే తమ ప్రక్కకు రానిస్తారు. ఆ స్థితిలో, పిల్లలతో మెలగటం మాత్రమే వారికి నచ్చుతుంది. సత్త్వరజస్తమో గుణాలలో వేటి అధీనంలోనూ పిల్లలు ఉండరు.
“చెట్లను చూడగానే తపోవనం, ఋషులు తపస్సు చేసుకోవటం జ్ఞాపకానికి వస్తాయి.”
31.3.2 సింథీ బ్రాహ్మణుడు – దయానంద సరస్వతి
ఇంతలో సింథీకి చెందిన బ్రాహ్మణు డొకడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. అతడు కాశీలో వేదాంతం అధ్యయనం చేశాడు, స్థూలకాయుడు, నవ్వు ముఖం.
శ్రీరామకృష్ణులు: ఏమోయ్! ఎలా ఉన్నావు? ఇక్కడకు వచ్చి చాలా రోజులు అయినట్టు ఉందే?
పండితుడు (నవ్వుతూ): అవునండీ. కుటుంబ బాధ్యతలు, రావటానికి వీలు దొరకటం లేదు. ఇది మీకు తెలిసినదే కదా!
పండితుడు నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడనారంభించారు.
శ్రీరామకృష్ణులు: కాశీలో చాలారోజులు ఉన్నావు కదా, ఏమేం చూశావు? చెప్పు. దయానందుల గురించి కాస్త చెప్పు.
పండితుడు: దయానందులను చూశాను. మీరూ ఆయన్ను చూశారు కదా!
శ్రీరామకృష్ణులు: అవును, చూడబోయాను. ఆయన గంగకు ఆవలి ఒడ్డున ఒక ఉద్యాన గృహంలో బసచేసి ఉన్నాడు. నాడు కేశవ్ అక్కడకు వస్తాడనుకున్నారు. అతడి రాకకై ఆయన చాతకపక్షిలా నిరీక్షిస్తూ ఉన్నాడు. గొప్ప పండితుడు. వంగ భాషను గౌరాండ భాష అంటూ హేళన చేశాడు. దేవతలను ఆయన ఒప్పుకుంటాడు. కాని కేశవ్ వారిని ఒప్పుకోడు. ‘భగవంతుడు ఇన్ని వస్తువులను సృష్టించాడు. దేవతలను సృష్టించలేడా ఏమిటి?’ అంటూ ఉంటాడు దయానందుడు. ఆయన నిరాకారవాది. కెప్టన్ ‘రాం, రాం’ అంటూ ఉచ్చరి స్తుండటం చూసి, వ్యంగ్యంగా ‘దానికంటే మిఠాయి, మిఠాయి అని ఉచ్చరించు. అది మేలు’ అన్నాడు.
దయానంద సరస్వతి
పండితుడు: కాశీలో పలువురు పండితులు దయానందులతో తీవ్రంగా వాదించారు. చివరకు పండితు లందరు ఒక వైపు, ఈయన మాత్రం మరో వైపు అయిపోయారు. ఎలాగైనా బ్రతికి బయటపడితే చాలన్న స్థితికి వచ్చేశారు ఈయన. అందరూ ముక్తకంఠంతో, ‘యదుక్తం దయానందేన తద్ధేయమ్* ’ అంటూ కేకలు పెట్టారు.
31.3.3 థియోసఫీ – శ్రీరామకృష్ణులు – “భక్తిని అన్వేషిస్తున్నారా?”
“కల్నల్ ఆల్కాట్‌ను కూడా చూశాను. మహాత్ములు ఉన్నారు; చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్ర లోకం అన్నీ ఉన్నాయట. సూక్ష్మ శరీరంతో ఆ లోకాలకు పోవచ్చునట. ఓ, ఆల్కాట్ మరెన్నో అటువంటి విషయాల గురించి మాట్లాడాడు. మంచిది. స్వామీ! థియోసఫీ గురించి మీరు ఏమనుకుంటున్నారు?”
శ్రీరామకృష్ణులు: భక్తి – భగవంతుని పట్ల భక్తి మాత్రమే సారం. వాళ్ళు భక్తిని అన్వేషిస్తున్నారా? అలా ఐతే మంచిది. చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్ర లోకం, మహాత్ములు అనే చింతన చేస్తూ ఉంటే భగవంతుని కనుగొనలేరు. భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి జనింప సాధనలు చేయాలి, మనో వ్యాకులతతో ప్రార్థించాలి. మనస్సును నానా విషయాల నుంచి తప్పించి భగవంతుడి వైపుకే మళ్ళించాలి.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు రామప్రసాద్ పాట నొకదాన్ని పాడారు.
దేవదేవు తత్వమేమొ
తెలియనెట్లు పాటుపడెడు
చీకటింటి చిక్కుపిచ్చి
వానివలెను వెదకె దీవు……
“శాస్త్రాలలోను, దర్శనాలలోను, వేదాంతంలోను – దేన్లోను భగవంతుడు లేడు. ఆయన కోసం మనస్సు వ్యాకులత చెందకుండా ఏదీ జరుగదు.
వేదములును తంత్రములును
దర్శనములు తెలుపలేవు
‘అస్తి’ మార్గమునను తప్ప
‘నేతి’ వలన తెలియలేవు
భక్తి సుధామధురిమచే
భగవంతుడు ప్రీతుడగును
శాశ్వతానందమందు
దేహ గుహన దేవుడుండు.
“ప్రగాఢ మనోవ్యాకులత కావాలి – ఈ పాట వినండి:
శ్రీ రాధా శుభ దర్శన మగునె ప్రతివారికిని
అవిరళమగు ఆ భక్తి అనుభవమా అందరకు ॥ శ్రీ ॥
నిధులన్నిటిలో మిగుల దుర్లభమై దొరకనిది
ఏ భౌతిక నిధిగాని ఈ నిధిని కొనలేదు ॥ శ్రీ ॥
దర్శన భాగ్యముగాని తన్మయమగు భక్తిగాని,
సాధన భజనలు లేక సాధ్యముగా దెవ్వరికిని ॥ శ్రీ ॥
సాగర గర్భములోన స్వాతిలొ కురిసిన చినుకు
ముత్తెపు చిప్పన పడిన ముత్తెముగా మార్పు చెందు ॥ శ్రీ ॥
సాగర మందే ఇతర సమయంబుల కురిసిన
ముత్తెపుచిప్పన నట్టి ముత్యముగా నేర్పడునా ॥ శ్రీ ॥
తల్లులు తమ శిశువులను చంకలలో నెత్తుకొని
“రావె రావె చందమామ దిగి రావె జాబిల్లి”
అని పిలువ భ్రమలోన పసివారె పడువారు
దివి చంద్రుండెపుడైన దిగివచ్చునె భువిపైకి ॥ శ్రీ ॥
31.3.4 సాధనే ప్రధానం
“సాధనలు తప్పక చేసి తీరాలి. భగవద్దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏమిటి? ‘భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే, ఎందుకు?’ అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అప్పుడు నా మనస్సులో స్ఫురించింది అతడికి చెప్పాను. ‘పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు. అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు. గాలం, ఎర అన్నీ సిద్ధం చేసుకో. ఎర వాసన పట్టి చేప నీటి అడుగు నుంచి పైకి వస్తుంది. నీళ్ళు కదలటం నుంచి పెద్ద చేప వస్తోంది అని తెలుసుకోవచ్చు.’
“వెన్న తినగోరుతున్నావు! ‘పాలలో వెన్న ఉంది, పాలలో వెన్న ఉంది’ అని పదే పదే అనటంలో ప్రయోజనం ఏముంది? శ్రమ పడితేనే కదా వెన్న లభించేది. ‘భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు’ అని చెప్పటం వల్ల భగవంతుని దర్శించగలవా? కావలసింది సాధనే!
“లోకోపదేశార్థం జగజ్జననియే పంచముండి* ఆసనం అధిష్ఠించి కఠోరమైన తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు పూర్ణబ్రహ్మ స్వరూపుడు. ఆయన కూడా లోకానికి మార్గం చూపటానికై రాధాయంత్రాన్ని రూపొందించి తపస్సు చేశాడు. (BG 6.5)
31.3.5 రాధాకృష్ణులు – బ్రహ్మం, శక్తి అభిన్నం
“శ్రీకృష్ణుడు పురుషుడు; రాధ ప్రకృతి, చిచ్ఛక్తి, ఆద్యాశక్తి. రాధ త్రిగుణమయియైన ప్రకృతి. సత్త్వరజస్తమో గుణాలు ఆమెలో ఉన్నాయి. ఉల్లిపాయను ఒలిస్తే మొదట నలుపు ఎరుపు కలగలసిన పొర వస్తుంది. దాని తరువాత ఎరుపు రంగు పొర. ఆ తరువాత తెల్లని పొర వస్తుంది. వైష్ణవ శాస్త్రాలలో కామ – రాధ, ప్రేమ – రాధ, నిత్య – రాధల గురించి పేర్కోబడి ఉంది. చంద్రావళే కామ–రాధ; శ్రీమతే ప్రేమ–రాధ; గోపాలుని ఒడిలో ఉంచుకున్న నిత్య–రాధను నందగోపుడు చూశాడు.
“ఈ చిచ్ఛక్తీ, వేదాంతం పేర్కొనే బ్రహ్మమూ వేరు కాదు – నీరు దాని తడితనమూ లాగ. నీటి తడితనాన్ని తలచుకుంటే, నీటిని తలచుకోకుండా ఉండలేం. అదే విధంగా నీటిని తలచుకుంటే దాని తడితనం తలపుకు వస్తుంది. పాము, దాని తిర్యక్ గమనమూ. తిర్యక్ గమనాన్ని తలచుకొంటే పాము తలపుకు వచ్చే తీరుతుంది. పాము తలపుకు వస్తే తిర్యక్ గమనం కూడా తలపుకు వచ్చే తీరుతుంది. బ్రహ్మమని ఎప్పుడు పేర్కొంటాం? నిష్క్రియ స్థితిలో లేక నిర్లిప్త స్థితిలో అది నెలకొని ఉన్నప్పుడు. వస్త్రం ధరించినప్పుడూ అదే మనిషి; దిగంబరుడుగా ఉన్నప్పుడు కూడా అదే మనిషి. ప్రస్తుతం వస్త్రం ధరించి ఉన్నాడు, మళ్ళీ దిగంబరుడవుతాడు. పాములో విషం ఉంది; కాని అది పాముకు హాని కలిగించదు. ఎవరిని కాటువేస్తుందో అతడి శరీరంలోకే విషం ఎక్కుతుంది. బ్రహ్మం వస్తుతః నిర్లిప్తమైనది.
“నామరూపాలన్నీ ప్రకృతి యొక్క విభూతులు (ఐశ్వర్యాలు). సీతాదేవి ఆంజనేయునితో, ‘వత్సా! నేనే ఒక రూపంలో రాముడను, మరో రూపంలో సీతను; ఒక రూపంలో ఇంద్రుణ్ణి, మరో రూపంలో ఇంద్రాణి; ఒక రూపంలో బ్రహ్మ మరో రూపంలో సరస్వతి; ఒక రూపంలో రుద్రుడను, మరో రూపంలో పార్వతి – ఇలా నేనే ఉన్నాను’ అని చెప్పింది. ధ్యానం, ధ్యాతతో సహా నామ రూపాలన్నీ చిచ్ఛక్తి యొక్క ఐశ్వర్యాలే. నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన ఉన్నంత వరకు నేను శక్తి ఇలాకాలోనే ఉంటాను. (‘మ’ తో) వీటి నన్నింటిని బాగా అర్థం చేసుకో. వేదాలను పురాణాలను వినాలి, అవి పేర్కొన్న వాటిని జీవితంలో ఆచరించాలి.
(పండితునితో) “మధ్యమధ్యలో సాధు సాంగత్యం మంచిది. విషయాసక్తత అనే దీర్ఘకాలిక రోగం మనిషికి వాటిల్లింది. సాధు సాంగత్యం దీన్ని చాలా మేరకు నయం చేస్తుంది.
31.3.6 ‘భగవంతుడే నీ సొంతవాడు, తక్కిన వాళ్ళెవరూ కారు’ – గురుశిష్యుల కథ
“ ‘నేను, నాది’ – ఇదే అజ్ఞానం. ‘ఓ భగవంతుడా! నువ్వే అంతా చేస్తున్నావు, నువ్వే నాకు అత్యంత ఆత్మీయుడవు. ఈ ఇల్లూ వాకిలి, కుటుంబం, బంధుగణం, మిత్రులు, ఈ ప్రపంచం అన్నీ నీవే, ఇవన్నీ నీవే’ – ఇదే సరైన జ్ఞానం. ‘అంతా నేనే చేస్తున్నాను. నేను కర్తను. నా ఇల్లు వాకిలి, నా కుటుంబం, నా భార్యాబిడ్డలు, నా మిత్రులు’ – ఇది అజ్ఞానం.
“ఒకప్పుడు ఒక గురువు తన శిష్యునికి ఇదంతా ఉపదేశించాడు. ‘భగవంతుడే నీ సొంతవాడు, తక్కిన వాళ్ళెవరూ కారు’ అన్నాడు గురువు. వెంటనే శిష్యుడు, ‘మీరేమంటున్నారు? నా తల్లి, నా భార్య నన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. క్షణమైనా నన్ను చూడకుంటే వాళ్ళకు లోకమే చీకటైపోతుంది. వాళ్ళు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు’ అని అన్నాడు. అందుకు గురువు, ‘ఇవన్నీ నీ పొరబాటు అభిప్రాయాలు. వీరిలో ఎవరూ నీకు ఆత్మీయులు కారని నేను నిరూపించి చూపుతాను. ఇదుగో, ఈ మాత్రలు కొన్ని ఉంచుకో. ఇంటికి వెళ్ళి వీటిని మింగి పడుకో, నువ్వు చనిపోయినట్లుగా కనబడతావు, అందరూ అట్లే భావిస్తారు. కాని నీకు స్పృహ ఉంటుంది, వినగలవు, చూడగలవు. అప్పుడు నేను వస్తాను’ అన్నాడు.
“శిష్యుడు ఇంటికి వెళ్ళి, మాత్రలు మింగాడు. పిదప స్పృహలో లేనట్లు పడిపోయాడు. తల్లి, భార్య, బంధువులు అందరూ భోరున ఏడవసాగారు. ఆ సమయంలో గురువు ఒక వైద్యుని వేషంలో అక్కడకు వచ్చాడు. అంతా వివరంగా విన్న తరువాత, ‘మంచిది. దీనికి మందు ఉంది. ఇతణ్ణి బ్రతికించవచ్చు. కాని ఒక విషయం! ఈ మందును మొదట మీలో ఒకరు పుచ్చుకోవాలి. ఆ తరువాతే అతడికి ఇవ్వవలసి ఉంటుంది. కాని మొదట పుచ్చుకొన్న వ్యక్తి మరణిస్తాడు. ఇక్కడ ఇతడి తల్లి, భార్య ఇంకా అందరూ ఉన్నారు. ఒకరు కాకుంటే మరొకరైనా తప్పక ఈ మందు పుచ్చుకొంటారు. దాన్లో సందేహం లేదు. మీరు పుచ్చుకోగానే ఇతడు బ్రతుకుతాడు’ అన్నాడు.
“శిష్యుడు అంతా వింటూనే ఉన్నాడు. వైద్యుడు ముందుగా తల్లిని పిలిచాడు. నేలపై పొర్లాడుతూ విలపిస్తూ ఉన్న తల్లిని చూసి వైద్యుడు, ‘అమ్మా, ఇక నువ్వు విలపించనక్కర్లేదు. ఈ మందు పుచ్చుకో, నీ కొడుకు బ్రతుకుతాడు. కాని నువ్వు చనిపోతావు’ అన్నాడు. మందు చేతనుంచుకొని తల్లి ఆలోచనలో పడింది. తరువాత ఏడుస్తూ, ‘అయ్యా, నాకు ఇంకా పిల్లలున్నారు. నేను మరణిస్తే వారి గతి ఏమిటి అనే యోచిస్తూ ఉన్నాను. వాళ్ళను ఎవరు చూసుకుంటారు? ఎవరు అన్నం పెడతారు? వారిని గురించే బెంగ పడుతున్నాను’ అంది. వైద్యుడు, శిష్యుని భార్యను పిలిచి మాత్రను ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కుమిలికుమిలి ఏడుస్తోంది. చేత మాత్రను పుచ్చుకుని ఆమె కూడా దీర్ఘాలోచనలో పడిపోయింది. ఆ మాత్ర వేసుకొంటే తనకు మరణం తప్పదని ఆమె కూడా విన్నది. బాగా యోచించి ఆమె విలపిస్తూనే, ‘ఇలా చూడండి వైద్యులవారూ! ఆయనకు జరగవలసిందేదో జరిగిపోయింది. నేను కూడా చనిపోతే ఈ పసిపిల్లల గతి ఏమవుతుంది? వీరిని ఎవరు సంరక్షిస్తారు? నే నీ మందును ఎలా పుచ్చుకోగలను?’ అని అన్నది.
“ఈలోపు శిష్యుడు పుచ్చుకున్న మందు ప్రభావం తగ్గిపోయింది. ఎవరూ ఎవరికీ సొంతం కారు అన్న విషయం శిష్యుడు అర్థం చేసుకున్నాడు. చటుక్కున లేచి నిలబడి గురువు వెంట వెళ్ళిపోయాడు. ‘నిజానికి నీకు సొంతమైన వారు ఒక్కరే, ఆతడే భగవంతుడు’ అని గురువు అతడితో చెప్పాడు.
“అందుకే భగవంతుని పాదపద్మాల పట్ల ఏ విధంగా భక్తి కలుగుతుందో, దేని ద్వారా ఆయన మాత్రమే నా సొంతం అని ఆయన్ను ప్రేమించగలమో, అది చేయటమే మంచిది. లౌకిక జీవితాన్ని చూస్తున్నారు కదా, అది రెండు రోజులకు మాత్రమే. దాన్లో ఏదీ లేదు.”
31.3.7 గృహస్థులు మానసికంగా త్యజించాలి – భక్తి ‘అంతఃపురంలోకి’ వెళ్ళగలదు, జ్ఞానం వెళ్ళలేదు
పండితుడు (నవ్వుతూ): స్వామీ, ఇక్కడకు వచ్చినప్పుడల్లా పూర్తి వైరాగ్యం జనిస్తుంది, సంసారాన్ని త్యజించి వెళ్ళిపోవాలని తోస్తుంది.
శ్రీరామకృష్ణులు: వద్దు, ఎందుకు త్యజించాలి? మీరు మానసికంగా త్యజించి జీవించండి, అనాసక్తతతో జీవించండి.
“అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి బస చేయాలని సురేంద్రుడు ఒక పడక తెచ్చుకున్నాడు. ఒకటి రెండు రోజులు గడిపాడు కూడా. ఆ తరువాత అతడి భార్య, ‘పగటి పూట ఎక్కడికైనా వెళ్ళండి. కాని రాత్రి బయటకు వెళ్ళకూడదు’ అని చెప్పేసింది. పాపం! సురేంద్రుడు ఏం చెయ్యగలడు! ఇప్పుడు రాత్రిపూట ఇక్కడ బసచేయ వీలులేకుండా పోయింది.
“చూడండి, శుష్క విచారణతో ప్రయోజనం ఏమిటి? భగవంతునికై వ్యాకులత చెందాలి, ఆయన్ను ప్రేమించడం నేర్చుకోవాలి. జ్ఞానం, విచారణలు పురుషుడిలా ఇంటి ముంగిటి గదివరకే పోగలవు. కాని భక్తి, స్త్రీలా అంతఃపురంలోకి పోగలదు.
“ఏదో ఒక భావాన్ని ఆశ్రయించుకోవాలి. అప్పుడే భగవదనుభూతి కలుగుతుంది. సనకాది మునులు శాంతభావాన్ని ఆశ్రయించారు. హనుమంతుడు దాస్య భావం చేపట్టాడు. శ్రీదాముడు, సుదాముడు, గోపబాలురది సఖ్యభావం. యశోదది వాత్సల్య భావం, అంటే భగవంతుణ్ణి పిల్లవాడిగా భావించటం. రాధది మధురభావం.
“ఓ భగవంతుడా! నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి – ఇదే దాస్యభావం. సాధకులకు ఈ భావం చాలామంచిది.”
పండితుడు: అవునండీ!
31.4 చతుర్ధ పరిచ్ఛేదం ఈశాన్కి ఉపదేశం – భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు
సింథీకి చెందిన ఆ పండితుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. సాయంకాలం కావస్తోంది. కాళికాలయంలో సంధ్యాహారతులను సూచించే వాద్యనాదాలు ప్రారంభమైయ్యాయి. శ్రీరామకృష్ణులు గదిలో ఉన్న దేవుళ్ల పటాలకు నమస్కరించారు. మంచం మీద కూర్చుని అంతర్ముఖులైనారు. కొందరు భక్తులు వచ్చి నేల మీద కూర్చున్నారు. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది.
ఒక గంటసేపు గడచిపోయింది. ఈశాన్ ముఖోపాధ్యాయ, కిశోరీ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి నేల మీద కూర్చున్నారు. ఈశాన్కు పురశ్చరణాది శాస్త్రవిహిత కర్మలు చేయడమంటే చాలా ఇష్టం. అతడొక కర్మయోగి.
శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ‘జ్ఞానం, జ్ఞానం’ అని అంటూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుందా? జ్ఞానం ఉదయించటానికి రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది అనురాగం, అంటే భగవంతుణ్ణి ప్రేమించటం. నువ్వు శుష్క విచారణ చేయవచ్చు. అయితే భగవంతుని పట్ల మనకు అనురాగం, ప్రేమ లేనట్లయితే ఆ విచారణ అంతా వ్యర్థమే. మరో లక్షణం, కుండలినీశక్తి జాగృతం కావటం. కుండలినీ శక్తి నిద్రాణంలో ఉన్నంత వరకు జ్ఞానం సిద్ధించదు. గంటల తరబడి కూర్చుని శాస్త్రాలను అధ్యయనం చేస్తాం, విచారణ చేస్తాం, కాని అంతరంగంలో మనోవ్యాకులత ఉండదు, ఇది జ్ఞానం యొక్క లక్షణం కాదు. కుండలినీ శక్తి జాగృతమైతే పారవశ్యం, భక్తి, ప్రేమ అన్నీ ఉదయిస్తాయి. దీనినే భక్తియోగం అంటారు.
“కర్మయోగం* ఎంతో కఠినమైనది. కర్మయోగం ద్వారా కొంత శక్తి సంచయమవుతుంది, సిద్ధులు లభిస్తాయి.”
ఈశాన్: నేను హాజ్రా వద్దకు వెళ్ళివస్తాను.
శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికల్లా ఈశాన్ మళ్ళీ వచ్చాడు. అతడితో హాజ్రా కూడా వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఇంకా మౌనంగానే ఉన్నారు, అట్లే కూర్చుని ఉన్నారు. కాసేపు చూసి హాజ్రా, ఈశాన్తో “రండి, వెళదాం. ఈయన ధ్యానంలో ఉన్నారు” అన్నాడు. వెంటనే ఇద్దరూ అక్కడ నుంచి కదిలారు.
శ్రీరామకృష్ణులు ఇంకా మౌనంగానే కూర్చుని ఉన్నారు. మెల్లమెల్లగా నిజంగానే ధ్యాన మగ్నులైనారు. చేత్తో లెక్కిస్తూ జపం చేయసాగారు. ఆ చేతిని తల మీద, నుదుటి మీద, మెడ మీద, ఛాతీ మీద పిదప నాభి మీద ఉంచారు. షడ్చక్రాలలో ఆద్యాశక్తిని ధ్యానిస్తూ ఉన్నారా? శివసంహితాది శాస్త్రాలలో యోగం గురించి పేర్కొన్నది ఇదేనా?
31.5 పంచమ పరిచ్ఛేదం నివృత్తి మార్గం – భగవద్దర్శనానంతరమే కర్మత్యాగం
హాజ్రాతో కలిసి ఈశాన్ కాళికాలయానికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణుల ధ్యానస్థితి కొనసాగింది. అప్పుడు సమయం రాత్రి దాదాపు ఏడున్నర గంటలు. ఇంతలో అధర్ అక్కడకు వచ్చాడు.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి బయలుదేరారు. జగజ్జననికి ప్రణమిల్లిన పిదప, ఆమె పాదపద్మాల వద్ద ఉన్న పువ్వులలో ఒకదాన్ని తీసుకుని తల మీద పెట్టుకున్నారు. మళ్ళీ ఆమెకు ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు, చామరం వీచారు, పారవశ్యంలో మునిగిపోయారు! బయటకు వచ్చినప్పుడు ఈశాన్ ఉద్ధరిణితో సంధ్యావందనం చేస్తూ ఉండటం చూశారు.
31.5.1 కర్మ దానంతట అదే తొలగిపోతుంది
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): ఏమిటి? ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంకా సంధ్యావందనం చేస్తూనే ఉన్నావా? ఒక పాట విను.
ఎందుకు పోవలె కాశీ కంచీ
గంగా గయ ప్రభాసముకూ…..
“సంధ్యావందనాదులు ఎన్ని రోజుల వరకు? భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి ఏర్పడనంత వరకు, ఆయన నామాన్ని ఉచ్చరింటేటప్పుడు అశ్రువులు స్రవించనంత వరకు, రోమాంచితం కానంత వరకే.
నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు
ఎరిగినాడ కాళి, బ్రహ్మ మేకమనెడు మర్మమింక
పుణ్యపాపములను త్రోసివేసినాడ పూర్తిగాను
అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు.
“పిందె రాగానే పువ్వు రాలిపోతుంది. భక్తి కలుగగానే, భగవదనుభూతి కలుగగానే సంధ్యావందనాదులు తొలగిపోతాయి.
“కోడలు గర్భం ధరించినప్పుడు అత్తగారు ఆమె పనులను తగ్గించివేస్తుంది. నవమాసాలు నిండగానే ఆమెతో ఏ పనీ చేయనివ్వదు. బిడ్డ పుట్టాక, బిడ్డను ఒళ్ళో పెట్టుకుని చూసుకోవటం మాత్రమే ఆమె పని, మరే పనీ ఉండదు. భగవల్లాభం పొందిన పిదప సంధ్యావందనాది కర్మలు వైదొలగుతాయి.
31.5.2 ఉత్తిష్ఠత! జాగ్రత! – ఈశాన్కి ఉపదేశం
“నువ్వు ఇలా తాబేటి వేగంతో పోతే ఏమీ సాధ్యం కాదు, తీవ్ర వైరాగ్యం అవసరం. ఏడాదికి పదిహేను నెలలు అని లెక్కించుకోవటంలో ప్రయోజనం ఏమిటి? నీలో బలిమి లేదు, శక్తి లేదు. నానబెట్టిన అటుకుల్లా ఉన్నావు. నడుం బిగించి కార్యంలోకి దిగాలి. ‘సోదరా! సంతోషంగా భగవంతుని పట్టుకుని ఉండు. ఏదో ఒక రోజు ఆయన్ను పొందగలవు’ – ఈ భావంగల పాట నాకు నచ్చదు.
“నేడో రేపో పొందగలవట – ఇది నాకు నచ్చలేదు. తీవ్ర వైరాగ్యం కావాలి. ఈ మాటే నేను హాజ్రాకూ చెప్పాను.
31.5.3 కామినీ కాంచనాలే యోగంలో అడ్డంకులు
“తీవ్ర వైరాగ్యం ఎందుకు కలుగటం లేదు అని అడుగుతావా? దానికి కారణం ఉంది. మనస్సులో సంస్కారాలు, కోర్కెలు అన్నీ ఉన్నాయి. హాజ్రా స్థితి కూడా ఇదే. గ్రామాలలో పొలాలకు నీళ్ళు పెడతారు. నీళ్ళు వృథాగా బయటకు పోకుండా ఆపటానికి పొలం చుట్టూరా గట్లు కడతారు. గట్టు, మట్టితో నిర్మితమైనది; దాన్లో మధ్య మధ్య కలుగులు, రంధ్రాలు ఉంటాయి. ఎంతో శ్రమకోర్చి పొలాలకు నీళ్ళు పెడుతుంటారు, కాని నీరు కలుగుల ద్వారా బయటకు పోతుంది. కోర్కెలే కలుగులు. జప తపాదులు అన్నీ చేస్తున్నావు, నిజమే; కాని కోర్కెలనే కలుగుల గుండా అంతా వృథా అయిపోతున్నది.
“వెదురు బద్దను విల్లులా వంచి చేపలు పడుతూ ఉంటారు. వెదురు తిన్నగానే ఉంటుంది కాని ఇక్కడ వంగి ఉంది. ఎందుకు? చేపలు పట్టడానికి. కోర్కెలే చేపలు, కనుకనే మనస్సు సంసార జీవితం కేసి వంగి ఉంది. కోర్కెలు లేకుంటే సహజంగా మనస్సు ఊర్ధ్వముఖంగానే ఉంటుంది, అంటే భగవంతుని ఆకాంక్షిస్తూ ఉంటుంది.
“ఎలాగో తెలుసా? త్రాసులోని ముళ్ళలాగా. కామినీ కాంచనాల బరువు కారణంగా పైముల్లు క్రింది ముల్లు సరిసమానంగా ఉండవు. మనుషుల్ని యోగభ్రష్టులను చేసేది ఈ కామినీ కాంచనాలే. చిరుదీపాన్ని చూడలేదా? చిరుగాలికే చలిస్తుంది. యోగస్థితి అన్నది గాలి వీచని చోట వెలుగుతూన్న దీపం లాటిది.
“మనస్సు చంచలంగా ఉంది – ఒక భాగం ఢాకాకు వెళ్ళింది, ఒక భాగం ఢిల్లీకి, మరో భాగం కూచ్బిహార్కు. ఈ మనస్సును కూడగట్టుకోవాలి. కూడగట్టి ఏకాగ్రం చేయాలి. పదహారు అణాల వస్త్రం కావాలంటే, వస్త్ర వ్యాపారికి పదహారు అణాలు చెల్లించాలి కదా!
“కించిత్తు విఘ్నం వాటిల్లినా యోగం సిద్ధించదు. టెలిగ్రాఫ్ తీగ కొంచెం తెగినా సమాచారం చేరదు.
31.5.4 జగజ్జననిని స్వాధికారంతో అడుగు!
“సంసారంలో ఉన్నావు. అయితే ఏమిటి? కర్మ ఫలాన్ని యావత్తూ భగవంతునికి సమర్పించాలి. కర్మఫల కాంక్ష కించిత్తూ ఉండరాదు.
“కాని ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. భక్తిని కోరుకోవటం కోర్కె క్రిందకు రాదు. భక్తిని కోరుకోవాలి, భక్తి కోసం ప్రార్థించాలి. తామసిక భక్తిని చేపట్టు. జగజ్జనని వద్ద మొండికేసి కూర్చో. రాంప్రసాద్ పాట ఒకటి ఉంది:
పోటీ పడెదనా నీ కొడు కెంతటి
ఘటికుడో బాగా తెలియును నీకు
ఏటి ఆట ఇది ఎన్నడెరుగనని
మాటలాడు మన రాంప్రసాదు.
వదలను నిన్ను వేధించక ఇక
పోరు వదలుచు గరువము మాని
బిరబిర నను నీ కరముల నెత్తుచు
ఉరమున హత్తెడు వరకు వదలను.
“ ‘నేను ఆ కుటుంబంలోపుట్టినప్పుడే నాకు ఆ ఆస్తిలో వాటా వచ్చేసింది’ అంటూ ఉంటాడు త్రైలోక్యుడు* .
“ఈమె నీ సొంత తల్లి కాదా, ఈమె సవతితల్లా? ఈమె నామమాత్రానికా తల్లి? నీ హక్కుకై పట్టుబట్టి ఈమెను కాకపోతే మరెవరిని అడుగుతావు?
ఎవరనుకొంటివో మాతా నను నీ
ఎనిమిది నెలలకు పుట్టిన బిడ్డని
ఎంచినావటె మాతా నను! నీ
ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా
వెరపును గొలుపగ జాలవు నన్ను.
“ఆమె నీ సొంత తల్లి! ఆమెను స్వాధికారంతో అడుగు! ఒకనిలో ఏం అంశం ఉంటుందో, అతడికి దాని పట్ల ఆకర్షణ ఉంటుంది. జగజ్జనని అంశం నాలో ఉన్నందునే నాకు ఆమె పట్ల అంతటి ఆకర్షణ కలిగింది. ఒక నిజమైన శైవుడిలో శివుని అంశ కానవస్తుంది, ఏదో బిందుమాత్రంగా నైనా ఆ అంశం అతడిలో వచ్చి చేరుతుంది. నిజమైన వైష్ణవుడు నారాయణాంశజుడు. ఇక మీదట నువ్వు లౌకిక కర్తవ్యాలలో పాలుపంచుకో నవసరం ఉండదు. ఇక కొన్ని రోజులు భగవచ్చింతనలో మనస్సును నిమగ్నం చెయ్యి. సంసారంలో ఏదీ లేదని చూసేశావు కదా!”
శ్రీరామకృష్ణులు తమ మధుర కంఠంతో మళ్ళీ పాడారు:
నీ వారెవ్వరు లేరను సత్యము
మరువకు మెప్పుడు ఓ మనసా…..
31.5.5 అన్నీ వదిలేయ్! – భగవంతుణ్ణే పట్టుకో!
“వ్యాజ్యాలు నడిపించటం, నాయకత్వం వహించటం అంటూ ఏం చేస్తూ ఉన్నావు! నువ్వు తగాదాలు పరిష్కరిస్తూ ఉంటావని, లోకులు నిన్ను వ్యాజ్యాలకు పిలుస్తూ ఉంటారని విని ఉన్నాను. వీటన్నిటినీ ఎంతో కాలంగా చూస్తూనే ఉన్నావు కదా! ఇకమీదటైనా, ఎవరికి కావాలంటే వారు వాటి నన్నిటిని చేసుకొంటారని వదలివేయి. ప్రస్తుతం భగవంతుని పాదపద్మాలపై మనస్సును మరింతగా నిలుపటానికి ప్రయత్నించు. ఒక సామెత ఉంది: ‘లంకలో రావణుడు మరణించాడు, అందుకు బేహులా బిగ్గరగా విలపించిందట’* – అలా ఉంది వ్యవహారం. (BG 18.66)
“శంభు ఇలాగే, ‘ఆసుపత్రులు కట్టిస్తాను, డిస్పెన్సరీలు కట్టిస్తాను’ అంటూండేవాడు. అతడొక భక్తుడు. అందుకే నేను అతడితో, ‘భగవంతుడు సాక్షాత్కరిస్తే ఆసుపత్రులూ, డిస్పెన్సరీలు కోరుకుంటావా?’ అని అడిగాను.
“భగవద్దర్శనం ఎందుకు కలుగలేదని కేశవ్సేన్ అడిగాడు. ‘పేరు ప్రతిష్ఠలు, పాండిత్యం, ప్రతిభల నన్నిటినీ పట్టుకుని ఉన్నావు కదా! అందుకే కలుగలేదు’ అని చెప్పాను. బిడ్డ పాలపీకను – ఎరుపురంగు పాలపీకను చీకుతూ ఉన్నంతవరకు తల్లి అక్కడకు రాదు. కాసేపయ్యాక, పాలపీకను ఆవల పారేసి బిడ్డ ఏడిస్తే ఆమె అన్నం కుండను పొయ్యి మీద నుండి దింపివేసి పరుగున వస్తుంది.
“నువ్వు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ తిరుగుతున్నావు. అప్పుడు అమ్మ, ‘పోనీ, నా కుమారుడు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, అలాగే ఉండనీ’ అని భావిస్తుంది.”
ఈశాన్ అప్పుడు శ్రీరామకృష్ణుల పాదాలను పట్టుకుని కూర్చుని ఉన్నాడు; వినమ్రంగా, “నేను ఇష్టపడి ఈ పనులు చేయటం లేదండి” అన్నాడు.
31.5.6 మహామాయ ఇచ్ఛ
శ్రీరామకృష్ణులు: నాకు తెలుసు. అది అమ్మ ఆడుతున్న ఆట. ఆమె లీల. సంసారంలో బంధించి ఉంచటమే మహామాయి ఇచ్ఛ. ఎలాగో తెలుసా?
ఎన్నెన్ని పడవలు ఎగుడు దిగుడు గలిగి
భవసాగరంబుపై పయనించుచుండె ।
పయనించుచుండిన పడవలవి యెన్ని
ఆ సాగరము లోతులందున మునిగిపోవు ॥
* * *
లక్షలోన ఏదో ఒకటి
తెంచుకొనుచు ఎగిరిపోవు
దాని చూచి నవ్వుకొనుచు
చప్పట్లను చరుతు వీవు.
“లక్షమందిలో ఏదో ఒకరిద్దరు మాత్రమే ముక్తులు అవుతున్నారు. మిగిలిన వారంతా ఆమె ఇచ్ఛ మేరకు బద్ధజీవులై పడివున్నారు. (BG 8.3)
“దాగుడు మూతల ఆట చూడలేదా? ఆట కొనసాగాలనేదే దాది కోర్కె. అందరూ ఆమెను తాకితే ఆట కొనసాగదు. అందుచేత అందరూ తమను తాక ఆమె ఇష్టపడదు.
“మరో విషయం – పెద్ద అంగళ్లలో బియ్యాన్ని పెద్ద రాసులుగా పోసి ఉంచుతారు – పైకప్పును తాకేటంత ఎత్తు ఉంటుంది. బియ్యం ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది. వాటిని ఎలుకలు తినకుండా ఉండటానికి వ్యాపారి ఒక తట్టలో చక్కెరతో కలిపిన మరమరాలు ఉంచుతాడు. దాని వాసన, తీపితనం ఎలుకలకు ఎంతో ఇష్టం. కనుక లోపల ఉన్న ఎలుకలు అన్నీ ఆ తట్ట వైపుకే వెళతాయి తప్ప బియ్యపు రాసుల ఎరుక వాటికి ఉండదు. మానవులు కామినీ కాంచనాలలోనే మైమరచిపోతారు, భగవంతుడనే వాడి గురించి తెలుసుకోరు.
31.6 షష్ఠ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల త్యాగం – కేవలం భక్తి కొరకే ప్రార్థన
“రాముడు నారదుడితో, ‘నా నుంచి ఏదైనా వరం కోరుకో’ అన్నాడు. అందుకు నారదుడు, ‘రామా! నాకు ఏం కొరత? నేనేం కోరుకోను? వరం ప్రసాదించి తీరాలి అనుకుంటే నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలిగేట్లు, నీ భువన మోహన మాయలో మైమరచిపోకుండా ఉండేట్లు అనుగ్రహించు’ అని వేడుకున్నాడు. వెంటనే రాముడు, ‘నారదా! మరేదన్నా కూడా కోరుకో’ అన్నాడు. అందుకు నారదుడు, ‘రామా!నాకు మరేదీ వద్దు. నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలగాలి. దీన్ని అనుగ్రహిస్తే చాలు’ అన్నాడు.
“నేను అమ్మతో ‘అమ్మా! నాకు పేరు ప్రతిష్ఠలు అక్కర్లేదు. తల్లీ! అష్టసిద్ధులు, శత సిద్ధులు ఏవీ అక్కర్లేదు. దేహసుఖం వద్దు. నాకు కావలసింది ఒక్కటే ఒక్కటి – అది నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి. దానినే అనుగ్రహించు’ అని ప్రార్థించాను.
“అధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు రాముడితో, ‘రామా! నువ్వు ఏ ఏ స్థితులలో, ఏఏ రూపాలలో ఉన్నావు? నిన్ను ఎలా తెలుసుకోవటం?’ అని అడిగాడు. అందుకు రాముడు, ‘తమ్ముడూ! ఒక విషయం తెలుసుకో. ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను నిశ్చయంగా ఉంటాను’ అన్నాడు. ఊర్జిత భక్తుడు నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు! ఎవరికైనా ఈ విధమైన భక్తి కలిగితే అక్కడ భగవంతుడు నెలకొని ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకో. చైతన్యులకు ఈ స్థితి కలిగింది.”
భక్తులు మంత్రముగ్ధులై వింటూ ఉన్నారు. దైవీ వాక్కులను వింటూ ఉన్నట్లు దాన్లో మునిగిపోయి ఉన్నారు. కొందరు తమలో, ‘ప్రేమభక్తిలో నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు అంటున్నారు శ్రీరామకృష్ణులు. ఇది చైతన్యుల స్థితి మాత్రమే కాదు, శ్రీరామకృష్ణుల స్థితి కూడా ఇదే కదా! అలా అయితే ఇక్కడ భగవంతుడు నెలకొని ఉన్నాడు కదా!’ అనుకుంటూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు అమృతతుల్యమైన నివృత్తి మార్గోపదేశాలు చేస్తూ ఉన్నారు. మేఘ గర్జన వలె, ఈశాన్కు ఉపదేశ వచనాలు గంభీరంగా చెప్పసాగారు.
31.6.1 ముఖస్తుతి మాటలు కావు, బాణాలు
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): ముఖస్తుతి చేసేవారి మాటల్లో మైమరచిపోకు. పశువు చచ్చిపడి ఉంటే రాబందులు గుమిగూడేట్లు వాళ్ళు విషయాసక్తులను చుట్టుకుంటారు. లౌకికులలో సారం లేదు, వాళ్ళు కేవలం పేడకుప్పల వంటి వారు! ముఖస్తుతిపరులు వీళ్ళ వద్దకు వచ్చి, ‘మీరు దానశీలురు, జ్ఞానులు, ధ్యానశీలురు’ అంటూ పొగడ్తలు చేస్తారు. అవి వట్టి మాటలు కావు, బాణాలు! ఐహికలోలురైన బ్రాహ్మణ పండితుల మధ్య రేయింబవళ్ళు మెలగటమూ, వాళ్ళ పొగడ్తలు వినటమూ – ఏం తలరాత!
31.6.2 మొదట భగవంతుడు; ఆ తరువాతే అన్నీను
“సంసారులు ముగ్గురికి దాసులు, వాళ్ళలో ఏం సారం ఉంటుంది? వాళ్ళు భార్యలకు దాసులు, ధనానికి దాసులు, పై అధికారికి దాసులు! ఒక ఫలానా వాడు ఉన్నాడు – పేరు చెప్పను, ఎనిమిది వందల రూపాయల జీతం, కాని భార్యకు దాసుడు. ఆమె నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు!
“వ్యాజ్యాలు పరిష్కరించటం, నాయకత్వం వహించటం – ఇవన్నీ ఏం పనులు? దయ, పరోపకారం అన్నీ కావలసిన మేరకు చేసివేశావు. ఇవన్నీ చేసే వారు వేరే తరగతికి చెందినవారు. భగవంతుని పాదపద్మాల పట్ల మనస్సును నిమగ్న పరచటానికైన కాలం నీకు ఆసన్నమైంది. ఆయనను పొందగలిగితే అన్నీ పొందవచ్చు. మొదట భగవంతుడు; ఆ తరువాత దయ, పరోపకారం, లోకకల్యాణ కార్యాలు, జీవులను తరింపచేయటం అన్నీను. వాటిని గురించి నువ్వు ఎందుకు తల బ్రద్దలు కొట్టుకోవాలి? లంకలో రావణుడు మరణించాడు, బేహులా అందుకై రోదించిందట! నీ సంగతీ ఇట్లే ఉంది. సర్వసంగ పరిత్యాగియైన సన్న్యాసి ఒకరు నీకు, ‘ఇలా, ఇలా చేయి’ అని తెలియచేస్తే మంచిది. ఐహికులైన సంసారుల సలహాలు – వాళ్ళు బ్రాహ్మణ పండితులైనప్పటికీ సరే, మరెవరైనా సరే – సరైనవి కావు.
31.6.3 భగవత్ప్రేమలో పిచ్చివాడివే అయిపో! – ఇవన్నీ జగజ్జనని ఉపదేశాలే!
“పిచ్చివాడివి అయిపో. భగవత్ప్రేమలో పిచ్చివాడివే అయిపో. ‘ఈశాన్కి పిచ్చిపట్టింది. సాంసారిక విధులను ఇక ఆయన నిర్వర్తించలేడు’ అని లోకులకు తెలియాలి. వ్యాజ్యాలను పరిష్కరించటం, నాయకత్వం వహించటం మొదలైన వాటికోసం ఆ పిదప వాళ్ళు నీ వద్దకు రారు. పంచపాత్ర, ఉద్ధరిణి అన్నిటిని విసిరివేయి. ఈశాన్* అనే పేరుకు తగినట్లు జీవించు.”
ఈశాన్: ‘వెర్రివానిని చేయవే నీ ప్రేమలోన! పిచ్చివానిని చేయవే నను గన్న తల్లి.’
శ్రీరామకృష్ణులు: పిచ్చి పట్టడం! అవును, అదే సరైనది. ‘అధికంగా భగవత్ చింతన చేస్తే మెదడు పాడైపోతుంది’ అని శివనాథ్ అన్నాడు. అందుకు నేను, ‘ఏమిటీ! చైతన్యాన్ని గురించి చింతన చేసేవాడు అచైతన్యుడవుతాడా? భగవంతుడు నిత్య శుద్ధ బోధ స్వరూపుడు. ఆయన చైతన్యం వలననే అన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఆయన చైతన్యం ద్వారానే సమస్తం చైతన్యమయంగా గోచరిస్తుంది. ఎవరో తెల్లదొరకు మతి చెడిందట, అందుకు కారణం అతడు అధికంగా భగవత్ చింతన చేశాడట – అంటున్నాడు ఇతడు. ఒకవేళ అలా జరిగి ఉండనూ వచ్చు – వాళ్ళు అధికంగా ఐహిక వస్తు చింతన చేస్తారు. ‘భగవత్ ప్రేమ నాలో నిండింది, అందుచే జ్ఞానం కోల్పోయాను’ అని ఒక పాటలో ఉంది. కాని ఇక్కడ చెబుతూ ఉన్న జ్ఞానం బాహ్యప్రపంచం గురించిన జ్ఞానం.
శ్రీరామకృష్ణుల పాదాలను పట్టుకునే ఈశాన్ అన్నీ వింటున్నాడు. మధ్యమధ్యలో ఆలయంలో వెలసి ఉన్న కాళీమాత విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు. దీపాల కాంతిలో ఆమె వదనంలో దరహాస చంద్రికలు వెల్లివిరిశాయి. శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడుతున్న పవిత్రవేదవాక్కులను పోలిన వచనాలను ఆలకించి మహదానందం పొందుతూ ఉన్నట్లుగా ఆమె గోచరించింది.
ఈశాన్ (శ్రీరామకృష్ణులతో): మీ ముఖతా వెలువడుతూ ఉన్న వచనాలన్నీ జగజ్జనని నుంచీ వస్తూ ఉన్నవి.
శ్రీరామకృష్ణులు: నేను యంత్రాన్ని, ఆమె యంత్రం నడిపేది. నేను ఇల్లు, ఆమె ఇల్లాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను, ఎలా పలికిస్తే అట్లా పలుకుతాను. కలియుగంలో వేరే విధంగా దైవవాణి సామాన్యంగా వినం; కాని పసిపిల్లవాడు, పిచ్చివాడు, ఇటువంటి వారి ద్వారా దైవవాణి వినవస్తుంది!
“ఒక మనిషి గురువు కాలేడు. భగవంతుని ఇచ్ఛ మేరకే అంతా జరుగుతుంది. మహాపాతకాలు, జన్మజన్మాంతరాల పాపాలు, సుదీర్ఘ కాలపు అజ్ఞానం అన్నీ భగవత్ కృప కలిగితే రెప్పపాటులో తొలగిపోతాయి. వేయి సంవత్సరాలుగా చీకటిలో పడి ఉన్న గదిలోకి హఠాత్తుగా వెలుగు ప్రవేశిస్తే ఆ చీకటి కాస్తకాస్తగా మాయమవుతుందా లేక క్షణంలో మటు మాయమౌతుందా? వెలుతురు రాగానే యావత్తు చీకటి ఒక్కసారిగా తొలగిపోతుంది.
“మనిషి ఏం చెయ్యగలడు? అనేక విషయాల గురించి అతడు మాట్లాడగలడు, కాని చివరకు అంతా భగవంతుని చేతిలోనే. ‘నేను చెప్పాల్సినదంతా చెప్పేశాను. ఇక అంతా న్యాయమూర్తి చేతిలోనే’ అంటాడు వకీలు.
“బ్రహ్మం నిష్క్రియం. సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దానిని ఆద్యాశక్తి అని పేర్కొంటాం. దేవీమాహాత్మ్యంలో నువ్వు చదవలేదా? దేవతలు మొదట ఆద్యాశక్తిని స్తుతి చేశారు. ఆమె ప్రసన్నురాలైతేనే శ్రీహరి యోగనిద్ర నుండి మేల్కొంటాడు.”
ఈశాన్: అవునండీ, మధుకైటభుల వధ సమయంలో బ్రహ్మాది దేవతలు స్తుతి చేశారు.
శ్రీరామకృష్ణులు: అవును, అది నువ్వు గ్రహించుకోవాలి.
31.7 సప్తమ పరిచ్ఛేదం కర్మమార్గం కఠినం, భక్తి మార్గం శ్రేయం
కాళికాలయం ఎదురుగా శ్రీరామకృష్ణుల చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. ఆయన ముఖతా వెలువడుతూ ఉన్న అమృత వాక్కులను ఇంతవరకూ వింటూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. జగజ్జనని సన్నిధానానికి వచ్చి ఆమెకు సాష్టాంగంగా ప్రణమిల్లారు. భక్తు లందరూ వెంటనే వచ్చి ఆయన పాదాలకు మ్రొక్కారు. అందరికీ ఆయన పాదధూళిని గైకోవటం ఎంతో ఆనందదాయకం! అందరూ ప్రణమిల్లిన తరువాత శ్రీరామకృష్ణులు మెట్లు దిగి, ‘మ’ తో మాట్లాడుతూ తమ గదికి వెళ్ళారు.
శ్రీరామకృష్ణులు (పాడుతూ ‘మ’ తో):
నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు
ఎరిగినాడ కాళి, బ్రహ్మ మేకమనెడు మర్మమింక
పుణ్యపాపములను త్రోసివేసినాడ పూర్తిగాను
అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు.
“ధర్మం, అధర్మం అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ ధర్మం అంటే వైదీక ధర్మం. అంటే దానం చేయడం, శ్రాద్ధ కర్మలు, పేదలకు అన్నదానం వంటివి. దీన్నే కర్మకాండ అంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. నిష్కామకర్మ చేయటం ఎంతో కష్టం. అందుకే భక్తి మార్గాన్ని ఆశ్రయించమని చెప్పబడింది.
“ఒక ఇంట్లో శ్రాద్ధకర్మ జరుగుతూ ఉంది. పలువులు భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక కసాయివాడు వధ్యస్థానానికి ఒక పశువును తోలుకు పోతున్నాడు. పశువు తిరగబడింది, దాన్ని లొంగదీయటంలో అతడు అలసిపోయాడు. అందుచేత ఆ శ్రాద్ధకర్మ జరుగుతూ ఉన్న ఇంటికి వెళ్ళి భోజనం చేసి, బలం పుంజుకున్నాక పశువును తోలుకొని పోవచ్చు అని భావించాడు. అట్లే చేయనూ చేశాడు. తరువాత పశువును వధించినప్పుడు గోహత్యాపాతకం శ్రాద్ధం పెట్టిన వ్యక్తిని చుట్టుకుంది. అందుకే కర్మకాండ కంటే భక్తిమార్గం శ్రేయోదాయకం అంటాను.
శ్రీరామకృష్ణులు ‘మ’ తో పాటు గదిలోకి వచ్చారు. మెల్లని స్వరంలో పాడారు. నివృత్తి మార్గం గురించి ఆయన చెప్పినదే పాటలోనూ ప్రతిధ్వనించింది. మెల్లని స్వరంలో, ‘అమ్మ, చివరగా ఇవి ఉంటే చాలు – బొమికెల మాల; హుక్కా కావాలంటే తక్కినవన్నీ వదిలించి వెయ్యి’ అనే భావం వచ్చే పాట పాడారు.
శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చున్నారు. అధర్, కిశోరీ ఇంకా తక్కిన భక్తులు వచ్చి నేల మీద కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఈశాన్ను చూశాను. ఏమో, ఏమీ జరుగలేదు! ఐదు నెలలపాటు పురశ్చరణ చేసి ఉన్నాడు! ఇంకెవరైనా ఇది చేసి ఉంటే ఎంతో సాధించి ఉండేవారు.
అధర్: మా ముందు మీరు ఆయనతో అంతగా చెప్పటం సముచితం కాదు.
శ్రీరామకృష్ణులు: అదేమిటి అలా అంటున్నావు? అతడు ఎక్కువగా జపం చేస్తాడు. అతడిని ఈ మాటలు ఏమీ చెయ్యవు.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు అధర్తో, “ఈశాన్ గొప్పదాత. ఎంతో జపతపాదులూ అనుష్ఠిస్తున్నాడు” అని చెప్పారు.
తరువాత కొంతసేపు మౌనంగా ఉన్నారు. భక్తులు ఆయన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయారు.
హఠాత్తుగా ఆయన అధర్ను ఉద్దేశిస్తూ, “నీలో యోగం భోగం రెండూ ఉన్నాయి” అన్నారు.
31.8 అష్టమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో కాళీపూజ – భక్తులతో శ్రీరామకృష్ణులు
శనివారం, అక్టోబర్ 18, 1884
నేడు అమావాస్య. కాళీపూజ పర్వదినం. రాత్రి పది, పదకొండు గంటల సమయంలో కాళీపూజ ప్రారంభం కానున్నది. ఈ అమావాస్య కారుచీకటి వేళలో శ్రీరామకృష్ణులను దర్శించే నిమిత్తం కొందరు భక్తులు పగటి వేళే వచ్చేశారు. రాత్రి దాదాపు ఎనిమిది గంటలకు ‘మ’ ఒంటరిగా వచ్చాడు. కాళికాలయంలో ఉత్సవ వేడుకల ఏర్పాట్లు ప్రారంభమైనవి. తోటలో అక్కడక్కడ దీపాలు ప్రకాశిస్తున్నాయి. దీపాల వెలుగులో ఆలయం సౌందర్యాన్ని సంతరించుకొన్నది. సంగీత వాయిద్యాలు మ్రోగుతున్నాయి. పనివాళ్ళు చకచకా ఇక్కడికీ అక్కడికీ పరుగులు పెడుతూ పనులు చేస్తున్నారు. నాడు రాణీరాస్మణి నిర్మించిన కాళికాలయంలో పూజ జరుగుతుందనీ, అర్ధరాత్రి దాటాక యాత్ర ప్రదర్శన జరుగుతుందనీ దక్షిణేశ్వర ప్రజలకు తెలిసిన విషయమే. గ్రామస్థులు ఆబాల గోపాలం జగజ్జననిని పూజింప గుంపులు గుంపులుగా వస్తున్నారు.
సాయంత్రం రాజనారాయణ్ దేవీమాహాత్మ్య కీర్తనల కచ్చేరి జరిగింది. భక్తులు పరివేష్టించి ఉండగా శ్రీరామకృష్ణులు ప్రేమానందంతో కీర్తనలు విన్నారు. ఆనాటి రాత్రి కాళీపూజ జరుగనున్నది. శ్రీరామకృష్ణులు ఆనందంలో ఓలలాడుతున్నారు.
31.8.1 శ్రీరామకృష్ణులు – నిరంజన్ బంధువుల కుర్రవాడు
రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చిన ‘మ’ శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉండటమూ, ఆయన సమీపంలో నేలమీద బాబూరామ్, చిన్నగోపాల్, హరిపదుడు, కిశోరీ, నిరంజన్ బంధువుల పిల్లవాడు, అరియదాహకు చెందిన ఒక యువకుడు కూర్చుని ఉండటమూ చూశాడు. రామ్‌లాల్, హాజ్రా మధ్య మధ్య వచ్చిపోతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిరంజన్ బంధువుల కుర్రవాడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతణ్ణి ధ్యానం చేయమని శ్రీరామకృష్ణులు ఆదేశించారు.
శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ‘మ’ కూర్చున్నాడు. కాసేపయ్యాక నిరంజన్ బంధువుల కుర్రవాడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. అరియదాహకు చెందిన యువకుడు, ఆ కుర్రవాడితోనే వెళ్ళటానికి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి నిలబడ్డాడు.
శ్రీరామకృష్ణులు (నిరంజన్ బంధువుల కుర్రవాడితో): మళ్ళీ ఎప్పుడు వస్తావు?
కుర్రవాడు: స్వామీ, బహుశా సోమవారం.
శ్రీరామకృష్ణులు (ఉత్కంఠతో): దీపం కావాలా? తీసుకొనిపోతావా?
కుర్రవాడు: వద్దండీ! ఈ తోటకు ప్రక్కనే ఉంది మా ఇల్లు. దీపం అక్కర్లేదు.
శ్రీరామకృష్ణులు (అరియదాహ యువకునితో): నుమ్వా బయలుదేరావా?
యువకుడు: అవునండీ! జలుబు చేసింది.
శ్రీరామకృష్ణులు: అలాగా, తల కప్పుకొని వెళ్ళు.
యువకులిద్దరూ మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు.
అమావాస్య కారుచీకటి, అందుకు తోడు జగజ్జనని పూజ. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద ఒక తలగడను ఆనుకుని కూర్చుని ఉన్నారు. అంతర్ముఖ స్థితి! మధ్య మధ్యలో భక్తులతో ఒకటి రెండు మాటలు మాట్లాడారు.
హఠాత్తుగా ‘మ’ ను, తక్కిన భక్తులను చూస్తూ ఇలా అన్నారు: “ఆహా! ఆ కుర్రవాడి ధ్యానం! (హరిపదుడితో) ఏం ధ్యానం కదా!”
హరిపదుడు: అవునండీ. కట్టెలా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు (కిశోరీతో): ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? వరుసకు నిరంజన్‌కు సోదరుడు.
31.8.2 జగజ్జనని భావనలో దివ్యానంద స్థితిలో శ్రీరామకృష్ణులు
మళ్ళీ అందరూ మౌనంగా ఉండిపోయారు. హరిపదుడు శ్రీరామకృష్ణులకు పాదసేవ చేస్తున్నాడు. సాయంత్రం దేవీమాహాత్మ్య కీర్తనలు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. మెల్లగా పాడసాగారు.
ఎరుగక తరమె ఏరికినైన
తల్లి కాళి నిజతత్వ మించుక?…..
శ్రీరామకృష్ణులు నిటారుగా కూర్చున్నారు. కాళీపూజ కాబట్టి ఆమెను గురించి పాడసాగారు:
ఎల్ల సృష్టి వెర్రి తల్లి శ్యామ కాళి లీలయే
మాయీ మాయా మోహమునకు మునిగె మూడు జగములూ ॥ ఎ ॥
ఆమె పిచ్చి, భర్త పిచ్చి, పిచ్చి శిష్యులిరువురూ
తెలుపజాల రెవ్వరామె హావభావ రీతులూ ॥ ఎ ॥
గరళకంఠుడైన శివుడు గొంతులోని బాధచే
కాళి, కాళి, కాళి యనుచు కాళి జపము చేయును ॥ ఎ ॥
రాయి చేత రాయి పగులగొట్టి నట్టి విధముగా
నిరాకారమునకు పోటీపెట్టును సాకారమూ ॥ ఎ ॥
ఎట్టి దానినైన ఆమె వప్పుకొనుచు నుండును
కాని విధుల విషయమందు అసలు చోటు పెట్టదు ॥ ఎ ॥
జీవసాగరమున నీదు తెప్పతేలునట్లుగా
ఆటుపోటులందు నడుపు మనును రామప్రసాదు ॥ ఎ ॥
శ్రీరామకృష్ణులు పాడుతూ దివ్యానందంలో సోలిపోయారు; “ఇవన్నీ దివ్యానందపు కైపును జనింపచేసే పాటలు” అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు:
ఓ కాళీమాయీ నిన్నీమారు మ్రింగుదునే
నా జనన గ్రహరాశి నీ గండం బనినారే…..
* * *
సదానందమయి కాళి
మహాకాళ మనోహారి
నీవె ఆడి నీవె పాడి
కరతాళము తట్టుదీవె…
* * *
ఆఖరు క్షణమున అమ్మ నామము
సంస్మరించుచు అసువుల బాసిన
చెందెద నేను శివసాయుజ్యము
పని యేమున్నది వారణాసితో? ॥ ఆ ॥
అనంతమైనవి అమ్మ విభూతులు
ఆమె సుగుణముల కంతు తెలియదు
అంశ మాత్రమే అరసిన శివుడు
పాదపద్మముల క్రింద పరుండెను ॥ ఆ ॥
పాడటం పూర్తయింది. ఇంతలో రాజనారాయణుని కుమారు లిద్దరు వచ్చి శ్రీరామకృష్ణులకు నమస్కరించారు. నాటి సాయంత్రం ఆలయ మండపంలో రాజనారాయణ్ దేవీమాహాత్మ్యం కీర్తనలు పాడినప్పుడు ఆ బాలురూ ఆయనతో కలిసి పాడారు. “ఎల్ల సృష్టి వెర్రితల్లి శ్యామ కాళి లీలయే….” అన్న పాటను శ్రీరామకృష్ణులు వారితో కలిసి మళ్ళీ పాడారు. ఆ బాలురిద్దరిలో చిన్నవాడు శ్రీరామకృష్ణులను గౌరాంగుని గురించి పాడమని ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు ఈ పాట పాడసాగారు:
ఓ గౌరు ఓ నిత్తాయి మీరు
ధన్యజీవులు, పావన జన్ములు…..
ఇంతలో రామ్‌లాల్ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో, “నేడు కాళీపూజ పర్వదినం. కొంచెం పాడు” అన్నారు. రామ్‌లాల్ పాడాడు:
వినరా సోదర దేవి చరితము
వీనుల విందుగ తందానతాన
యుద్ధభూమిలో చిచ్చుపెట్టెడు
యువతి ఎవ్వరచట? తందాన…..
రామ్‌లాల్ మళ్ళీ పాడాడు:
ఎవరూ! ఆ భీకర మానిని ఎవరూ?
అర్ధనిశీధపు ఆకాశమువలె
గభీరవర్ణపు కాళీరూపిణి…..
శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూనే పాడారు:
నల్లనిదౌ నా మానస భ్రమరము
ఉల్లాసంబుగ లాగి వేయబడె….
పాట, నృత్యం పూర్తయ్యాయి. భక్తులు మళ్ళీ నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చున్నారు. ‘మ’ తో, “నువ్వు రాలేదు. దేవీమాహాత్మ్య కీర్తనలు ఎంత బాగా పాడారో తెలుసా?” అని అన్నారు.
31.9 నవమ పరిచ్ఛేదం కాళీపూజ రాత్రి సమాధిస్థితి – భక్తుల పురోగమనంపై శ్రీరామకృష్ణులు
భక్తులలో కొందరు కాళీమాత దర్శనార్థం ఆలయానికి వెళ్ళారు. కొందరు ఆమెను దర్శించుకుని గంగాతీరంలో ఏకాంతంలో ప్రశాంతంగా కూర్చుని జపం చేసుకోసాగారు.
రాత్రి దాదాపు పదకొండు గంటలయింది. చిమ్మచీకటి ఆవరించి ఉంది. గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది. తీరంలోని దీపాల వెలుగులో నల్లని ఆ నీటిని చూడ సాధ్యమైంది.
రామ్‌లాల్ ‘పూజావిధానం’ అనే పుస్తకంతో కాళికాలయానికి వెళ్ళాడు. పుస్తకాన్ని ఆలయంలో పెట్టాడు. ‘మ’ అపేక్షతో దేవిని దర్శించుకుంటూ ఉండటం చూసిన రామ్‌లాల్, అతణ్ణి, “లోపలకు వస్తారా?” అని అడిగాడు. దాన్ని మహద్భాగ్యంగా ‘మ’ ఎంచి లోపలకు వెళ్ళాడు. దేవి అలంకారం అత్యద్భుతంగా ఉంది. దేవి ముందు రెండు దీప సమ్మెలు వెలుగుతున్నాయి. పైకప్పు నుంచి వ్రేలాడుతున్న చాందినీ నుండి ప్రసరిస్తున్న వెలుగులో గర్భగుడి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. నేల మీద పలు రకాల నైవేద్యాలు అమర్చబడి ఉన్నవి. జగజ్జనని పాదపద్మాల వద్ద ఎర్రమందారాలు, బిల్వదళాలు సమర్పింపబడి ఉన్నాయి. పలు రకాల పువ్వుల హారాలతో దేవిని అలంకరించి ఉన్నారు. ఎదురుగా చామరం వ్రేలాడుతూ ఉంది. ఈ చామరం పుచ్చుకునే కదా శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు దేవికి వీచి ఉన్నారనే జ్ఞాపకం హఠాత్తుగా ‘మ’ కు వచ్చింది. వెంటనే అతడు కాస్త సంకోచిస్తూ రామ్‌లాల్‌తో, “నే నొకసారి చామరం వీచవచ్చా?” అని అడిగాడు. రామ్‌లాల్ సమ్మతించగానే ‘మ’ దేవికి చామరం వీచసాగాడు. ఇంకా పూజ ప్రారంభం కాలేదు.
బయటకు వెళ్ళివున్న భక్తులు మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. బ్రహ్మభక్తుడు వేణీపాల్ శ్రీరామకృష్ణులను ఆహ్వానించి ఉన్నాడు. మరునాడు సింథీ బ్రహ్మసమాజానికి వెళ్ళవలసి ఉంది. కాని ఆహ్వాన పత్రికలో తేదీ తప్పుగా వ్రాయబడి ఉంది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): వేణీపాల్ నన్ను ఆహ్వానించాడు. కాని ఇలా ఎందుకు వ్రాశాడు?
‘మ’ : అవునండీ. సరిగా వ్రాయలేదు, అజాగ్రత్తతో వ్రాశాడు!
శ్రీరామకృష్ణులు గది మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రక్కన బాబూరామ్ నిలబడి ఉన్నాడు. వేణీపాల్ ఆహ్వానం గురించి మాట్లాడుతున్నప్పుడు బాబూరామ్ను పట్టుకుని నిలబడ్డవారు, హఠాత్తుగా సమాధిస్థితి పొందారు.
భక్తులు ఆయన చుట్టూ నిలబడ్డారు. సమాధిస్థితిలో నిలబడి ఉన్న ఆ మహాపురుషుని అందరూ సంభ్రమంతో చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఎడమ కాలును కొంచెం ముందుకు చాచి నిలబడి ఉన్నారు. భుజం ఒక వైపుకు కాస్త వంగి ఉంది. చేతిని బాబూరామ్ మెడ మీద, చెవు ప్రక్కన వేసుకుని ఉన్నారు.
కాసేపట్లో బాహ్యస్పృహలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు అట్లే నిలబడి ఉన్నారు. చెంపకు చేయి ఆనించి ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లున్నారు. పిదప చిరునవ్వు చిందిస్తూ భక్తులను చూస్తూ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: అంతా చూశాను. – ఎవరు ఎంతవరకు పురోగమించారో? రాఖాల్, ఇతడు (‘మ’), సురేంద్రుడు, బాబూరామ్ ఇంకా పలువురిని చూశాను.
హాజ్రా: నన్ను?
శ్రీరామకృష్ణులు: అవును.
హాజ్రా: బంధనాలు ఎక్కువ ఉన్నాయా?
శ్రీరామకృష్ణులు: లేవు.
హాజ్రా: నరేంద్రుణ్ణి చూశారా?
శ్రీరామకృష్ణులు: లేదు, చూడలేదు. ఐనా చెప్పగలను – కాస్త చిక్కుల్లో పడ్డాడు. కాని అందరూ పొందగలరని చూశాను. (‘మ’ తో) అందరూ దాక్కొని ఉన్నట్లుగా చూశాను.
దైవమే ప్రత్యక్షంగా వచ్చి చెబుతున్నట్లుగా శ్రీరామకృష్ణులు తెలుపుతున్న విషయాలు విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
శ్రీరామకృష్ణులు: కాని ఇతణ్ణి (బాబూరామ్) తాకి ఉండటం వల్లనే ఈ స్థితి ఏర్పడింది.
హాజ్రా: ఎవరు ఫస్ట్?
శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. కాసేపయ్యాక, “నిత్యగోపాల్లా కొందరు ఉంటే మంచిది” అన్నారు.
మళ్ళీ ఆయన ఆలోచనల్లో మునిగిపోయారు. భావపారవశ్య స్థితిలోనే నిలబడి ఉన్నారు. మళ్ళీ మాట్లాడసాగారు: “అధర్సేన్ పనులు, బాధ్యతలు కొంచెం తగ్గితే… కాని ఆంగ్లేయ అధికారి చీవాట్లు పెడతాడేమో, ‘ఇదేం మూర్ఖత్వం’ అని చెబుతాడేమో అని భయంగా ఉంది.” (అందరూనవ్వారు)
శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చున్నారు. భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. బాబూరామ్, కిశోరీలు గబగబ వెళ్ళి చిన్నమంచం ప్రక్కన కూర్చుని చెరోపాదం పుచ్చుకుని ఆయనకు పాదసేవ చేయసాగారు.
శ్రీరామకృష్ణులు (కిశోరీతో): ఈ రోజు ఎందుకింత సేవ?
ఇంతలో రామ్‌లాల్ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. సభక్తికంగా ఆయన పాదధూళిని శిరస్సున దాల్చాడు. అతడు కాళీమాత పూజ చేయటానికి వెళుతున్నాడు.
రామ్‌లాల్ (శ్రీరామకృష్ణులతో): నేను బయలుదేరుతున్నాను.
శ్రీరామకృష్ణులు: ఓం కాళీ! ఓం కాళీ! జాగ్రత్తగా పూజ చెయ్యి. మేకపోతును బలి ఇవ్వాలి కూడా.
అర్ధరాత్రి అయింది. పూజ ప్రారంభమైంది. శ్రీరామకృష్ణులు పూజ తిలకించటానికి వెళ్ళారు. ప్రక్కకు వెళ్ళి జగజ్జననిని దర్శించుకున్నారు. అప్పుడు బలి ఇచ్చే వేళ అయింది. భక్తులు గుమిగూడి ఉన్నారు. కట్టివేసి ఉన్న మేకపోతును దేవికి అర్పింప బలిపీఠం వద్దకు తీసుకు వెళ్ళారు. శ్రీరామకృష్ణులు గదికి వెనుదిరిగారు. బలిని ఆయన చూడలేరు.
రాత్రి రెండు గంటల వరకు ఒకరిద్దరు భక్తులు కాళికాలయంలో ఉండిపోయారు. హరిపదుడు అక్కడకు వచ్చి, “రండి, ఆయన పిలుస్తున్నారు. ప్రసాదం సిద్ధంగా ఉంది” అన్నాడు. పిదప భక్తులు ప్రసాదం ఆరగించారు. తరువాత దొరికిన చోట అక్కడక్కడ పడుకున్నారు.
తెల్లవారింది. దేవికి మంగళహారతి ముగిసింది. కాళికాలయం ముందున్న మండపంలో యాత్ర ప్రదర్శన జరుగుతోంది. యాత్ర ప్రదర్శన తిలకింప శ్రీరామకృష్ణులు విశాల ప్రాంగణం గుండా వచ్చారు. ‘మ’ ఆయనతోబాటు వచ్చాడు. సెలవు పుచ్చుకోనున్నాడు.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడే నువ్వెందుకు వెళ్ళాలి?
‘మ’ : మీరు ఈ సాయంత్రం సింథీకి వెళతారు కదా! నేను అక్కడకు రాగోరుతున్నాను. ఈలోపుగా ఇంటికి కాస్త వెళ్ళి వద్దామనుకుంటున్నాను.
ఇలా మాట్లాడుకుంటూ కాళికాలయం వద్దకు వచ్చారు. మండపంలో యాత్ర ప్రదర్శన జరుగుతోంది. ‘మ’ మెట్ల వద్ద శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం ఆచరించి, లేచాడు.
శ్రీరామకృష్ణులు: మంచిది, వెళ్ళిరా, స్నానం చేసేటప్పుడు వాడుకోటానికి నాకు రెండు మామూలు పంచెలు కొని పట్రా.