30.1 ప్రథమ పరిచ్ఛేదం మణిలాల్‌కి ఉపదేశం – మత ఛాందసం కూడదు
గురువారం, అక్టోబర్ 2, 1884
విజయదశమి గడచి రెండు రోజులైంది. నిన్నటి దినం శ్రీరామకృష్ణులు కలకత్తాలోని అధర్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ నారాయణ్, బాబూరామ్, ‘మ’, కేదార్, విజయ్ మొదలైనవారిని కలుసుకోవడం జరిగింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి పాడి, నృత్యం చేసి ఆనందించారు.
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో భక్తులతోపాటు కూర్చుని ఉన్నారు. లాటూ, రామ్‌లాల్, హరీశ్‌లు ఆయన వద్దే బస చేసి ఉన్నారు. బాబూరామ్ తరచూ వచ్చి అక్కడే బసచేయటం కద్దు. రామ్‌లాల్ భవతారిణీ కాళీమాతకు అర్చకుడు. హాజ్రా కూడా అక్కడ ఉన్నాడు.
మణిలాల్ మల్లిక్, ప్రియ ముఖర్జీ, అతడి బంధువైన హరి, శివపూర్ నుంచి వచ్చిన గడ్డపు బ్రహ్మ సమాజస్థు డొకడు, బడా బజార్‌కు చెందిన మార్వాడీ భక్తులు మొదలైనవారు ఉన్నారు.
దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు, సింథీకి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైనవారు క్రమంగా వచ్చి చేరుకున్నారు.
మణిలాల్ బ్రహ్మసమాజ భక్తులలో పాతవాడు.
శ్రీరామకృష్ణులు (మణిలాల్ ప్రభృతులతో): మనసా నమస్కరించటం మంచిది. నేల మీద సాగిలపడి పాదాలు పుచ్చుకుని ప్రణామం చేయవలసిన అవసరం ఏముంది? మనసా నమస్కరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.
“నా మతమే సరైనది, పరాయి మతాలు సరి కావు అనే మనోవైఖరి మంచిది కాదు. భగవంతుడు సమస్తమూ తానే అయి ఉండటం నేను గాంచుతున్నాను – మనుష్యులు, ప్రతిమలు, సాలగ్రామాలు అన్నిటిలోను ఒక్కటే చూస్తూ ఉన్నాను. ఏకమేవా-ద్వితీయం. అతడు తప్ప రెండవ వస్తువు నాకు కనబడదు.
“ ‘నా అభిప్రాయమే సరైనది, ఇతరులవి తప్పు; మేమే గెలిచాం, ఇతరులు ఓడిపోయారు’ అని అనుకుంటూ ఉంటారు కొందరు. కాని ముందుకు పోయిన వ్యక్తికి ఏదో చిన్న అడ్డంకి కారణంగా ఆగిపోవలసి రావచ్చు. వెనుకపడ్డ వ్యక్తి అప్పుడు ముందుకు పోవచ్చు. వైకుంఠపాళి ఆటలో చాలావరకు పురోగమించి ఉండవచ్చు, కాని ఆ పిదప పాచికలు సరిగ్గా పడనే పడవు.
“జయాపజయాలు దైవాధీనాలు. భగవంతుని లీలలను ఒకింత కూడా అర్థం చేసుకోలేం. చూడు, కొబ్బరి బొండాం ఎంత ఎత్తులో ఉంది, దానిమీద ఎండ పడుతూనే ఉంటుంది; అయినప్పటికీ కొబ్బరిబొండాం నీరు ఎంత చల్లదనం ఇస్తూ ఉంది! కాని పరికెగడ్డ నీళ్ళలోనే ఉంటుంది, అయినప్పటికీ దాన్ని తింటే వేడి చేస్తుంది. మనిషి దేహాన్నే చూడండి. దానికి శిరస్సే కదా మూలం. కాని అదే పైభాగాన ఉన్నది.”
30.1.1 యోగతత్వం, మనోయోగం
మణిలాల్: మరి మా కర్తవ్యం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: ఏదో విధంగా భగవంతునితో ఐక్యం అవటమే. అందుకు రెండు మార్గాలున్నాయి -కర్మయోగం, మనోయోగం. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కర్మల ద్వారా యోగం అభ్యసిస్తారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అని నాలుగుదశలు ఉన్నాయి.
“సన్న్యాసులు కామ్యకర్మలను పరిత్యజించాలి. అయితే నిత్యకర్మలను నిష్కామంగా చేయాలి. దండధారణ, భిక్షాటన, తీర్థయాత్రలు, పూజాపురస్కారాలు, జపతపాదుల వంటి కర్మల మూలంగా వారికి భగవంతునితో యోగం సిద్ధిస్తుంది.
“ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఫలాపేక్షను వదలిపెట్టి నిష్కామభావంతో చేసినట్లయితే భగవంతునితో యోగం కలుగుతుంది.
“మరో మార్గం – మనోయోగం. మనోయోగం అభ్యసించే యోగులలో బాహ్యచిహ్నాలు ఏవీ గోచరించవు. వారి యోగం అంతా లోలోపలే. ఉదాహరణకు జడభరతుడు, శుకదేవుడు ఇంకా మరెందరో. వారిలో వీరిద్దరు సుప్రసిద్ధులు. వీరు శిరోజాలను, గడ్డాన్ని యథేచ్ఛగా పెరుగనిస్తారు.
“పరమహంస స్థితిలో కర్మలు తొలగిపోతాయి. స్మరణ మననాలు నెలకొని ఉంటాయి, అటువంటి వ్యక్తి మనస్సు సర్వదా భగవంతునితో అనుసంధానమై ఉంటుంది. అటువంటి వ్యక్తి కర్మలు నిర్వర్తిస్తే, అది లోకశిక్షణ నిమిత్తమే.
“కర్మయోగం ద్వారా కాని లేక మనోయోగం ద్వారా కాని యోగం సిద్ధించవచ్చును గాని, భక్తి జనిస్తే సర్వం తెలుసుకోగలం. భక్తి ద్వారా కుంభకం దానంతట అదే ఏర్పడుతుంది. మనస్సు ఏకాగ్రమైనప్పుడే వాయువు స్థిరమవుతుంది, వాయువు స్థిరంగా నిలిచినప్పుడు మనస్సు ఏకాగ్ర మవుతుంది, బుద్ధీ స్థిరం అవుతుంది. ఎవరికి ఈ స్థితి కలుగుతుందో, అతడు దీన్ని తెలుసుకోలేడు.
30.1.2 జగజ్జనని వద్ద శ్రీరామకృష్ణుల ప్రార్థన
“భక్తియోగం ద్వారా సకలం సిద్ధిస్తుంది. నేను విలపిస్తూ అమ్మతో ‘అమ్మా! యోగులు యోగం ద్వారా దేనిని తెలుసుకున్నారో, జ్ఞానులు విచారణ చేసి దేనిని తెలుసుకున్నారో దాన్ని నాకు తెలియచెయ్యి, నాకు దర్శింపచెయ్యి’ అని మొరపెట్టు కున్నాను. ఆమె అనుగ్రహించింది, వాటినన్నిటినీ చూపించింది. పరితప్త హృదయంతో ఆమె వద్ద విలపిస్తే ఆమె సర్వం ఎరుక పరుస్తుంది. వేదాలు, వేదాంతం, పురాణాలు, తంత్రాలు – వీటిలో ఉన్నవన్నిటినీ ఆమె నాకు ఎరుకపరచింది.”
మణిలాల్: మరి హఠయోగం సంగతి ఏమిటి?
శ్రీరామకృష్ణులు: హఠయోగులకు దేహాభిమానం మరీ ఎక్కువ. నేతి ధౌతి క్రియలచే దేహాన్ని పదిలపరచుకోవటంలోనే వారి ధ్యాస అంతా. ఆయుస్సు పెంచుకోవటమే వారి లక్ష్యం. రాత్రింబవళ్ళు దేహ సంరక్షణకే పాటుపడతారు. ఇది మంచిది కాదు.
30.1.3 గృహస్థులు మానసికంగా త్యజించాలి
“మీ కర్తవ్యం ఏమిటి? మీరు కామినీ కాంచనాలను మానసికంగా త్యజించాలి. సంసార జీవితం కాకిరెట్ట వంటిదని మీరు చెప్పలేరు.
“గోస్వాములు గృహస్థులు. అందుకే వారితో నేను, ‘మీరు ఆలయాలలో పూజాదికాలు నిర్వహించవలసి ఉంటుంది. సంసారాన్ని మీ రెలా త్యజించగలరు? మీరు సంసారాన్ని మాయ అంటూ త్రోసిరాజనలేరు’ అని అన్నాను.
“ప్రాణికోటిపట్ల దయ, వైష్ణవులకు సేవ, నామసంకీర్తనలు – ఇవే గృహస్థుల కర్తవ్యాలని శ్రీచైతన్యులు చెప్పి ఉన్నారు.
“ఒకమారు కేశవ్సేన్, ‘ఆయన ఇప్పుడు మనలను రెండూ చేయమని చెబుతున్నారు. కాని ఏదో ఒక రోజు కాటువేయనే వేస్తారు’ అని చెప్పాడు. అది నిజం కాదు. నే నెందుకు కాటువేయాలి?
మణిమల్లిక్: స్వామీ, మీరు కాటువేస్తూనే ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు, నువ్వు గృహస్థుడవు. దాని నెందుకు పరిత్యజించాలి?
30.2 ద్వితీయ పరిచ్ఛేదం ఆచార్యుడు – లోకశిక్షణ
శ్రీరామకృష్ణులు: “ఎవరి ద్వారానైతే భగవంతుడు లోకశిక్షణ ఒనగూరుస్తాడో వాళ్ళు సంసార జీవితాన్ని త్యజించటం అవసరం. ఆచార్యునిగా ఉన్న వ్యక్తి కామినీకాంచనాలను పరిత్యజించే తీరాలి. లేకుంటే లోకులు అతడి ఉపదేశాలను స్వీకరించరు. అతడికి ఆంతరంగిక వైరాగ్యం మాత్రమే చాలదు, బాహ్యత్యాగమూ ఉండాలి. లేకపోతే లోకులు, ‘ఈయన మనల్ని కామినీ కాంచనాలను విడిచి పెట్టమని ఉపదేశిస్తున్నాడు, కాని గోప్యంగా అన్నీ తాను అనుభవిస్తూనే ఉన్నాడు’ అని అనుకుంటారు.
30.2.1 ఆచార్యుని త్యాగం – వైద్యుడు, రోగి కథ
“ఒక వైద్యుడు, రోగికి మందులు వ్రాసి ఇచ్చి, ‘మరో రోజు రా; పథ్యపానాదుల విషయం అప్పుడు చెబుతాను’ అన్నాడు. ఆ రోజు అతడి గదిలో బెల్లం ఉన్న జాడీలు కొన్ని ఉన్నాయి. ఆ రోగి ఇల్లు సుదూరంలో ఉంది. తరువాత ఒక రోజు ఆ రోగి వచ్చి వైద్యుణ్ణి చూశాడు. అప్పుడు వైద్యుడు అతడితో, ‘ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండు, బెల్లం మాత్రం తినకు’ అన్నాడు. రోగి వెళ్ళిపోయాడు. అక్కడున్న ఒక వ్యక్తి వైద్యుడితో, ‘అవునూ, అతణ్ణి ఇంతదూరం రప్పించి కష్టపెట్టడమెందుకు? ఈ ముక్క ఆ రోజే చెప్పి ఉండవచ్చు కదా!’ అన్నాడు. వైద్యుడు నవ్వుతూ, ‘దానికొక కారణం ఉంది. నాడు ఈ మాట చెప్పివుంటే అతడికి నా మాటపై గురి ఏర్పడి ఉండేది కాదు. “ ‘ఇతడి గదిలో ఎన్ని బెల్లం జాడీలు ఉన్నాయి! కాస్తయినా ఇతడు కచ్చితంగా తిననే తింటుంటాడు. కాబట్టి బెల్లం అంత చెరుపు చేయ” దని రోగి అనుకుంటాడు. నేడు బెల్లం జాడీలను దాచిపెట్టాను. ఇప్పు డతడికి నా మాటలపై గురి కుదురుతుంది’ అన్నాడు.
“ఆది బ్రహ్మసమాజ ఆచార్యుని చూశాను. రెండవసారో లేక మూడవసారో పెళ్ళి చేసుకున్నాడని విని ఉన్నాను! ఈడువచ్చిన పిల్లలు కూడా ఉన్నారట. వీరందరూ ఆచార్యులు! ‘బ్రహ్మసత్యం జగన్మిథ్య’ అని వీరు బోధిస్తే ఎవరు నమ్ముతారు? వీరికి ఎటువంటి శిష్యులు వస్తారో మీరే ఊహించుకోండి.
“గురువును బట్టే శిష్యుడూను. సన్న్యాసి మానసికంగా త్యజించి, బాహ్యంగా కామినీకాంచనాలతో సంబంధం పెట్టుకుంటే అతడి ద్వారా లోకోపదేశం జరుగదు. అతడు గోప్యంగా ‘బెల్లం’ తింటున్నాడంటారు లోకులు.
30.2.2 శ్రీరామకృష్ణుల త్యాగనిరతి
“సింథీకి చెందిన మహేంద్ర వైద్యుడు రామ్‌లాల్‌కి ఐదు రూపాయలు ఇచ్చాడు. నా కా విషయం తెలియదు. తరువాత దీన్ని గురించి రామ్‌లాల్ నాతో చెప్పాడు. వెంటనే అతడితో నేను, ‘ఎవరి కోసం ఇచ్చాడు?’ అని అడిగాను. ‘ఇక్కడ కోసమే’ అన్నాడు. ‘పాల బాకీ కొంచెం ఉంది, దాన్ని ఇచ్చివేయవచ్చు’ అని అనుకున్నాను. అమ్మబాబోయ్! ఆ రోజు పడుకుని ఉన్న వాణ్ణి రాత్రి హఠాత్తుగా లేచాను. నా ఛాతీపై పిల్లి రక్కినట్లు బాధ! వెంటనే రామ్‌లాల్ వద్దకు వెళ్లి, ‘నీ పిన్ని కోసం ఇచ్చాడా, ఏమిటి?’ అని అడిగాను. అందుకు అతడు, ‘కాదు’ అన్నాడు. వెంటనే అతడితో, ‘ఇలా చూడు, ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు అతడికి ఇచ్చేసి రా’ అన్నాను. రామ్‌లాల్ మర్నాడు వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చివేశాడు.
“సన్న్యాసి ధనం స్వీకరించటమూ, భోగవస్తువుల పట్ల అనురక్తి కలిగి ఉండటమూ ఎటువంటిదో తెలుసా? సుదీర్ఘకాలం సాత్త్వికాహారం తింటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వచ్చిన ఒక బ్రాహ్మణ వితంతువు, పిదప నిమ్నజాతి వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లాంటిది. (అందరూ నిర్ఘాంతపోయారు)
“కామార్పుకూర్లో భగీ అనే తెలకుల స్త్రీ ఉండేది. ఆమెకు పలువురు శిష్యులు ఉన్నారు. నిమ్నజాతికి చెందిన ఆమెను పలువురు నమస్కరించటమూ, ప్రశంసించటమూ చూసి అసూయ చెందిన జమీందారు ఆమె మీదికి ఒక దుష్టుణ్ణి ప్రయోగించాడు. అతడు ఆమెను వలలో వేసుకుని, శీలాన్ని అపహరించాడు. ఆమె సాధనానుష్ఠానాలన్నీ మంటగలిశాయి. భ్రష్టుడైన సన్న్యాసి గతీ ఇంతే.
30.2.3 సాధుసాంగత్యం – శ్రద్ధ
“మీరు సంసార జీవితం గడుపుతున్నారు. మీకు సాధు సాంగత్యం అత్యావశ్యకం. మొదట సాధు సాంగత్యం, పిదవ శ్రద్ధ. సాధువు భగవన్నామ గుణకీర్తనలు గావించకుంటే లోకులకు భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు, విశ్వాసం ఎట్లా కలుగుతాయి? ఫలానా వ్యక్తి మూడు తరాలుగా జమీందారీ పారంపర్య కుటుంబానికి చెందినవాడని తెలిస్తే లోకులు అతణ్ణి గౌరవిస్తారు.
(‘మ’ తో) “జ్ఞానం పొందిన పిదప కూడా సదా భగవచ్చింతన అభ్యసిస్తూ ఉండాలి. ‘చెంబును కేవలం ఒక్క రోజు మాత్రమే తోమితే ఏమిటి ప్రయోజనం? అట్లే ఉంచితే మళ్ళీ చిలుము పడుతుంది’ అని నాంగ్టా చెప్పేవాడు. నీ ఇంటికి ఒకసారి రావాలి. నీ ఇంటిని తెలుసుకుని ఉంటే అక్కడ పలువురు భక్తులను కలుసుకోవచ్చు. ఒకసారి ఈశాన్ను చూసి రా.
(మణిలాల్‌తో) “నాడు కేశవ్ తల్లి ఇక్కడకు వచ్చింది. ఆమె కుటుంబంలోని పిల్లలు హరినామ కీర్తన చేశారు. ఆమె వారి చుట్టూ తిరుగుతూ తప్పట్లు కొడుతూ ఆనందించింది, వదనంలో పుత్రశోకం కానరాలేదు. ఇక్కడకు వచ్చి ఏకాదశి పాటించింది, జపమాలతో జపం కూడా చేసింది. ఆమెలో భక్తితత్పరతను గాంచాను.”
మణిలాల్: కేశవ్సేన్ తాతగారైన రామ్‌కమల్ గొప్ప భక్తుడు. తులసి తోటలో కూర్చుని నామజపం చేసేవాడు. కేశవ్ తండ్రియైన ప్యారీమోహన్ కూడా వైష్ణవ భక్తుడు.
శ్రీరామకృష్ణులు: తండ్రి అట్టివాడు కాకుంటే అటువంటి కుమారుడు జన్మించడు. విజయ్ సంగతే తీసుకోండి. విజయ్ తండ్రి, భాగవతం పారాయణం చేస్తూ పారవశ్యంలో మునిగిపోయి బాహ్యచైతన్యాన్ని కోల్పోయేవాడు. విజయ్ కూడా అప్పుడప్పుడు హరీ హరీ అంటూ లేచి నిలబడతాడు. ప్రస్తుత కాలంలో అతడు గాంచుతూ ఉన్న భగవద్దర్శనాలన్నీ యథార్థాలే! ఊసరవెల్లి కొన్నివేళల్లో ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులలోను కొన్ని సందర్భాలలో ఏ రంగూ లేకుండాను ఉండేట్లుగా భగవంతుడు సగుణుడుగానూ, నిర్గుణుడుగానూ ఉంటాడని విజయ్ చెప్పాడు.
30.2.4 సరళ స్వభావం ఉంటేనే భగవల్లాభం!
“విజయ్ సరళ హృదయుడు. అమిత ఔదార్యం, సరళత్వం లేకుండా భగవంతుణ్ణి పొందలేం. విజయ్ నిన్న అధర్ ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆ ఇంటిని తన సొంత ఇల్లుగానూ, ఆ ఇంటివారిని తన బంధువులుగానూ అతడు పరిగణించాడు. విషయవాసనలు నశించనిదే సరళత్వమూ ఔదార్యమూ జనించవు.
శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఆ పాట భావం:
‘ఓ మనసా! నువ్వు పరిశుద్ధమయ్యే పక్షంలో అమూల్యమైన నిధిని పొందగలవు….’
తరువాత మాటలు కొనసాగించారు: “మట్టిని బాగా శుభ్రం చేయకుండా కుండలు తయారుచేయటం సాధ్యం కాదు. మట్టిలో రాళ్ళో, ఇసుకో ఉంటే కుండ బీటలువారుతుంది. అందుకే కుమ్మరి మొదట మట్టిని శుభ్రపరచుకుంటాడు.
“అద్దంపై దుమ్మ పేరుకుని ఉంటే దాన్లో ముఖం చూసుకోలేం. చిత్తశుద్ధి లేనిదే స్వస్వరూపాన్ని దర్శించలేం. చూడు, అవతారపురుషులు జన్మించిన చోట్లలో నిశ్చయంగా సరళత్వాన్ని గాంచగలం. నందగోపుడు, దశరథుడు, వసుదేవుడు మొదలైన వారందరూ సరళ వర్తనులు.
“చిత్తశుద్ధి లేనిదే భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న ఆకాంక్ష జనించదని వేదాంతం పేర్కొంటోంది. చివరి జన్మో, లేక కఠోర తపోమయ జీవితమో లేకుంటే ఔదార్యం, సరళత్వం జనించవు.”
30.3 తృతీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల ‘పసిబాలుని స్థితి’
శ్రీరామకృష్ణుల కాళ్ళు కాస్త వాచి ఉన్నాయి. అందుచేత ఆయన ఒక పిల్లవానిలా దిగులు చెందుతున్నారు. ఇంతలో సింథీకి చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు (ప్రియ ముఖర్జీ, మొదలైన భక్తులతో): ‘నిన్న నారాయణ్‌తో, ‘నీ కాళ్ళు వత్తి చూడు, గుంట పడిందా?’ అని అడిగాను. అతడు కాళ్ళు వత్తి చూశాడు, గుంట పడింది. అప్పుడే నా మనస్సు స్థిమితపడింది. (ముఖర్జీతో) నీ కాళ్ళు కాస్త వత్తి చూడు! గుంట పడుతోందో లేదో చూద్దాం.
ముఖర్జీ: అవునండీ, గుంట పడుతోంది.
శ్రీరామకృష్ణులు: అబ్బ! ఇప్పుడే పూర్తి ఉపశమనం.
మణిమల్లిక్: ప్రవహించే నీటిలో మీరు స్నానం చేసి చూడండి, ఔషధం ఎందుకు పుచ్చుకోవాలి?
శ్రీరామకృష్ణులు: అలా కాదు! మీ రక్తంలో సత్తువ ఉంది, మీ సంగతే వేరు. అమ్మ నన్ను పసిబాలుని స్థితిలో ఉంచింది. ఒక రోజు పచ్చికబయలులో ఉన్నప్పుడు ఏదో నన్ను కుట్టింది. పాము కాటు వేసినప్పుడు ఆ పామే మళ్ళీ కాటువేస్తే విషం దిగిపోతుందని విని ఉన్నాను. అందుచేత పాము పుట్టలో చేయిపెట్టి నిరీక్షించసాగాను. ఆ దారిలో పోతున్న వ్యక్తి ఒకడు, ‘ఏం చేస్తూ ఉన్నారు? పాము ఏ చోట కాటు వేసిందో మళ్ళీ ఆ చోట కాటు వేస్తేనే విషం దిగుతుంది. వేరే చోట కాటు వేస్తే దిగదు’ అన్నాడు.
“శరదృతువు మంచు ఒంటికి మంచిదని విని ఉన్నాను. ఒక రోజు కలకత్తా నుంచి బండిలో తిరిగి వస్తూ ఉన్నప్పుడు తలను బయటకు సాచి ఉంచి మంచులో తడిశాను. (అందరూ నవ్వారు)
(మహేంద్ర వైద్యునితో) “సింథీలోని ఆ మీ పండితుడు సజ్జనుడు. వేదాంత వాగీశుడని బిరుదం పొందాడు. అతడికి నా పట్ల గౌరవం ఉంది. నేను అతడితో, “మీరు ఎంతో అధ్యయనం చేసి ఉన్నారు, కాని ‘నేను పండితుణ్ణి అన్న భావాన్ని వదిలి పెట్టండి’ అని చెప్పినప్పుడు అతడు చాలా సంతోషించాడు. అతడితో వేదాంతం గురించి ముచ్చటించాను.
30.3.1 శుద్ధ ఆత్మ, మాయ
(‘మ’ తో) “పరిశుద్ధమైన ఆత్మ నిర్లిప్తం. దాన్లోనే మాయ లేక అవిద్య ఉంది. ఈ మాయలో సత్త్వరజస్తమో గుణాలు మూడు ఉన్నాయి. ఎవరు శుద్ధ ఆత్మో అతడిలో ఈ మూడు గుణాలు ఉన్నాయి. కాని అతడు నిర్లిప్తుడు. మంటలో నీలి గుళికను పడవేస్తే నీలిజ్వాల వస్తుంది; ఎరుపు గుళికను వేస్తే ఎరుపు జ్వాలను కాంచవచ్చు. కాని మంటకంటూ ఎటువంటి రంగూ లేదు.
“నీటిలో నీలి గుళికను కరిగిస్తే నీరు నీలిరంగు సంతరించుకొంటుంది. ఆ నీటిలో చిల్లగింజలను వేస్తే నీరు తన సహజ రంగును తిరిగి పొందుతుంది.
“మాంసపు బుట్టను మోసుకొనిపోతూ ఉన్న చండాలుడు శంకరులను స్పృశించాడు. వెంటనే శంకరులు అతడితో, ‘రేయ్! నువ్వు నన్ను ముట్టుకొన్నావే!’ అన్నారు. అందుకు చండాలుడు ‘స్వామీ! నేనూ మిమ్మల్ని తాకలేదు, మీరూ నన్ను తాకలేదు. మీరు శుద్ధ ఆత్మస్వరూపులు, నిర్లిప్తులు’ అన్నాడు. జడ భరతుడూ ఇట్టి విషయాలను రహూగణుడనే రాజుకు చెప్పాడు.
“శుద్ధ ఆత్మ నిర్లిప్తమైనది. శుద్ధ ఆత్మను కాంచలేం. నీటిలో కలిసిపోయిన ఉప్పును కళ్ళతో చూడలేం.
“ఏదయితే శుద్ధ ఆత్మో, అదే మహాకారణం; కారణాలన్నిటికీ కారణం. స్థూలం, సూక్ష్మం, కారణం, మహాకారణం – పంచభూతాలు స్థూలం. మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైనవి సూక్ష్మం. ప్రకృతి లేక ఆద్యాశక్తియే అన్నిటికీ కారణం. బ్రహ్మం లేక శుద్ధ ఆత్మ కారణాలన్నిటికీ కారణం. ఈ శుద్ధ ఆత్మే మన నిజస్వరూపం.
“జ్ఞానం అని దేనిని పేర్కొంటాం? ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, మనస్సును దాన్లో నిలపటమే. శుద్ధ ఆత్మను తెలుసుకోవడమంటే ఇదే.
30.3.2 కర్మలు ఎంతకాలం?
“కర్మలు ఎంత కాలం నిర్వర్తించాలి? దేహాభిమానం ఉన్నంతవరకు; అంటే ‘దేహమే నేను’ అనే బుద్ధి ఉన్నంతవరకు. గీతలో ఇదే విషయం చెప్పబడి ఉంది. (గీత. 18.11). దేహాన్ని ఆత్మగా తలచటమే అజ్ఞానం. (శివపూర్ భక్తునితో) మీరు బ్రహ్మ సమాజస్థులా?
భక్తుడు: అవునండీ.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నిరాకారోపాసకులను వారి కళ్ళు, ముఖాన్ని చూసే నేను తెలుసుకోగలను. మీరు ఇంకా కొంత లోతుగా మునగండి. పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. నేను సాకారం, నిరాకారం రెండింటినీ అంగీకరిస్తాను.
30.3.3 మార్వాడీ భక్తుడు – జీవాత్మ – మరణానంతరం – మాయ అంటే?
బడాబజార్‌కు చెందిన మార్వాడీ భక్తులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన వారిని ప్రశంసిస్తూ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఆహా! వీరే నిజమైన భక్తులు! అన్ని దేవతల ఆలయాలకూ పోతారు, స్తుతిస్తారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈసారి తమ పురోహితునిగా నియమించుకున్న వ్యక్తి భాగవతంలో పాండిత్యం ఉన్నవాడు.
మార్వాడీ భక్తుడు: ‘నేను నీ దాసుడను’ అని చెప్పటంలోని ‘నేను’ ఎవరు?
శ్రీరామకృష్ణులు: లింగ శరీరం లేక జీవాత్మ. మనోబుద్ధ్యహంకార చిత్తాలతో కూడినదే లింగశరీరం.
మార్వాడీ భక్తుడు: జీవాత్మ ఎవరు?
శ్రీరామకృష్ణులు: అష్టపాశాలచే బంధింపబడిన ఆత్మే. చిత్తం అంటే ఏమిటి? ‘ఓహో’ అంటూ లేచి నిలబడి ముందుకు వచ్చేది.
మార్వాడీ భక్తుడు: స్వామీ! మరణానంతరం ఏం జరుగుతుంది?
శ్రీరామకృష్ణులు: మరణ సమయంలో దేనిని గురించి తలుస్తావో అదే అయిపోతావని గీతావాక్యం. భరత మహారాజు లేడిని గురించి తలపోశాడు, లేడిగానే జన్మనెత్తాడు. అందుకే భగవలబ్ధి పొందగోరితే సాధనలు అనుష్ఠించాలి. అహర్నిశలూ భగవంతుని గురించి చింతన చేస్తే మరణ సమయంలో ఆ జ్ఞాపకమే వస్తుంది.
మార్వాడీ భక్తుడు: స్వామీ, విషయ వస్తువులపట్ల వైరాగ్యం కలుగదు ఎందుకని?
శ్రీరామకృష్ణులు: మాయ అంటే ఇదే. మాయ కారణంగా సత్తు అసత్తుగాను, అసత్తు సత్తుగాను గోచరిస్తుంది. ఎవరు శాశ్వతమో ఆయనే సత్, అంటే పరబ్రహ్మం. అసత్తు అంటే అశాశ్వతమైన సంసార జీవితం.
మార్వాడీ భక్తుడు: శాస్త్రాలు చదువుతాం. కాని వాటిని ఎందుకు అవగతం చేసుకోలేకున్నాం?
శ్రీరామకృష్ణులు: కేవలం చదివినంత మాత్రాన ఏం ఒనగూరుతుంది? తపస్సాధనలు చేయాలి. భగవంతుని స్మరించు. ‘భంగు, భంగు’ అంటూ పలవరిస్తే ఏమిటి ఫలం? ఒకింత అయినా పుచ్చుకోవాలి.
“ఈ సంసార జీవితం ముళ్లకంప వంటిది. చేయి తగిలితేనే రక్తం స్రవిస్తుంది. ఒక ముళ్ళమొక్కను తీసుకువచ్చి, దాని ప్రక్కన కూలబడి ‘ఈ చెట్టు కాలిపోయింది’ అని పదే పదే చెబుతూ ఉంటే ఆ మొక్క కాలిపోతుందా? జ్ఞానాగ్నిని రగిలించు. ఆ అగ్నిచే మొక్కను దహించు, అప్పుడే అది దగ్ధమయ్యేది!
“సాధన దశలో కొంత శ్రమించే తీరాలి. ఆ పిదప మార్గం సుగమమవుతుంది. నది వంపులు తిరిగి ప్రవహించే చోట్ల జాగ్రత్తగా పడవను నడిపితే, ఆ తరువాత అనుకూల పవనాల వాటున సులువుగా నడవపచ్చు.
30.3.4 కామినీ కాంచనాలే మాయ – మాయా త్యాగం వల్లే భగవల్లబ్ధి
“మాయ అనే భవనంలో ఉన్నంతవరకు, మాయామేఘం ఆవరించి ఉన్నంత వరకు జ్ఞానభాస్కరుడు ప్రకాశించడు. మాయయైన భవనాన్ని వీడి బయటకు వచ్చేస్తే, అంటే కామినీ కాంచనాలను వదిలివేస్తే జ్ఞానభాస్కరుడు అజ్ఞానాన్ని దగ్ధం చేస్తాడు.
“భూతద్దం, కాగితాన్ని గదిలో కాల్చలేదు. బయటకు వచ్చి నిలబడితే సూర్యరశ్మి భూతద్దం మీద పడుతుంది. అప్పుడే కాగితం కాలుతుంది. మేఘాలు క్రమ్మినప్పుడు భూతద్దంచే కాగితం కాలదు, మేఘాలు తొలగితేనే అది కాలేది.
“కామినీ కాంచనాలనే గృహం నుంచి కాస్త బయటకు వచ్చి నిలబడితే, నిలబడి కొద్దిగా తపస్సాధనలు చేస్తేనే మనస్సులోని అంధకారం పటాపంచలయ్యేది. అవిద్య, అహంకారమనే మేఘం తొలగిపోతుంది! జ్ఞానం ప్రాప్తిస్తుంది! మేఘం అంటే కామినీ కాంచనాలే.
30.4 చతుర్ధ పరిచ్ఛేదం లక్ష్మీనారాయణ్ మార్వాడీ శ్రీరామకృష్ణులకు ధనం సమర్పించబోయిన సంఘటన
(మార్వాడీ భక్తులతో) “సన్న్యాసులు కఠోర నియమాలు పాటించాలి. కామినీ కాంచన సంసర్గం జాడమాత్రంగా కూడా ఉండరాదు. ధనాన్ని చేత్తో స్పృశించకపోవటమే కాదు, ప్రక్కన కూడా ఉంచుకోరాదు.
“లక్ష్మీనారాయణ్ మార్వాడీ ఒక వేదాంతి. తరచూ ఇక్కడకు వస్తూ ఉంటాడు. నా పడక మాసిపోయి ఉండటం చూసి నాతో, ‘నేను పదివేల రూపాయలు మీ పేరిట వ్రాసియిస్తాను. దాని నుంచి వచ్చే వడ్డీతో మీ ఖర్చులు జరిగిపోతాయి’ అన్నాడు. ఆ మాటలు వినగానే దుడ్డుకర్రతో నన్ను బాదినట్లు అనిపించింది. నేను స్పృహతప్పి పడిపోయాను. స్పృహ రాగానే అతడితో, ‘మళ్ళీ నీ నోట ఇటువంటి మాటలు వస్తే ఇకపై ఇక్కడకు రావద్దు. ధనాన్ని నేను తాకలేను, ప్రక్కన కూడా ఉంచుకోలేను’ అని అన్నాను. అతడు తెలివైనవాడు. వెంటనే నాతో, ‘అలా అయితే ఇంకా మీలో “ఇది త్యాజ్యం, ఇది గ్రాహ్యం” అన్న భావన ఉందన్నమాట. అంటే మీకు ఇంకా పూర్ణజ్ఞానం సిద్ధించలేదు’ అన్నాడు. అందుకు నేను, ‘నాయనా, నాకు అంత మేరకు సిద్ధించలేదులే’ అన్నాను. (అందరూ నవ్వారు)
“లక్ష్మీనారాయణ్ ఆ ధనాన్ని హృదయ్‌కు ఇవ్వగోరాడు. అందుకు నేను, ‘నువ్వీ ధనాన్ని హృదయ్ వద్ద పెట్టినట్లయితే “ఇతడికి ఇవ్వు, అతడికి ఇవ్వు” అని అతడితో చెప్పవలసి వస్తుంది. అతడు ఇవ్వకుంటే కోపం వస్తుంది! ధనాన్ని ప్రక్కన ఉంచుకోవడం కూడా మంచిది కాదు. కనుక ఇదంతా జరిగే పనికాదు. అద్దం ముందు వస్తువును ఉంచితే ప్రతిబింబం పడే తీరుతుంది కదా!’
30.4.1 కలియుగంలో వేదమార్గం కన్నా పురాణమార్గమే శ్రేష్ఠం
మార్వాడీ భక్తుడు: స్వామీ, గంగాతీరాన మరణిస్తేనేనా ముక్తి లభించేది?
శ్రీరామకృష్ణులు: జ్ఞానం కలిగితేనే ముక్తి. ఎక్కడ మరణిస్తే ఏం? శవాలు పడవేసిన గోతిలో మరణించినా సరే లేక గంగాతీరంలో మరణించినా సరే, జ్ఞానికి ముక్తి తథ్యం. కాని గంగాతీరం అజ్ఞానికి ఉద్దేశింపబడింది.
మార్వాడీ భక్తుడు: స్వామీ, కాశీలో మరణిస్తే ముక్తి ఎందుకు కలుగుతుంది?
శ్రీరామకృష్ణులు: కాశీలో మరణిస్తే శివదర్శనం కలుగుతుంది. అక్కడ మరణించే వారికి శివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు: ‘ఇది నా సాకార రూపం. ఇది మాయాస్వరూపం. భక్తుల కొరకై దీన్ని దాల్చాను. ఇలా చూడు! నేను అఖండ సచ్చిదానందంలో ఐక్యం అవుతున్నాను.’ ఇలా పలికి ఆ రూపం అంతర్ధానమవుతుంది.
“పురాణాల ప్రకారం చండాలునికి కూడా భక్తి జనిస్తే ముక్తి దక్కుతుంది. వీటి ప్రకారం నామజపం మాత్రం చాలు; యజ్ఞయాగాదులు, మంత్ర తంత్రాలు ఏవీ అవసరం లేదని పురాణాలలో పేర్కోబడి ఉంది.
“వేదమార్గం విభిన్నమైనది. దాని ప్రకారం బ్రాహ్మణుడు కాకుంటే ముక్తి లభించదు. మంత్రోచ్ఛారణ సరిగా లేనిపక్షంలో పూజ అంగీకరింపబడదు. యజ్ఞయాగాలు, మంత్ర తంత్రాలు అన్నీ విధివిహితంగానే నిర్వర్తించబడాలి. వేదోక్త కర్మలను అనుష్ఠించటానికి కలియుగంలో తీరిక ఎక్కడ? అందుకే కలియుగానికి నారదీయ భక్తి ఉద్దేశింపబడింది. కర్మయోగం అత్యంత కఠినం. నిష్కామంగా కర్మలు చేయకుంటే అది బంధహేతువుగా పరిణమిస్తుంది. పైగా జీవులు అన్నగత ప్రాణులు. కర్మలన్నిటినీ విధివిహితంగా చేయటానికి వారికి తీరికలేదు. ఇంకా, పాత పద్ధతులకు చెందిన దశమూల కషాయాన్నే నమ్ముకుని ఉంటే అది పనిచేసేలోపు రోగి కాస్త హరీ అంటాడు. అందుకే ఆధునిక కాలానికి చెందిన ‘ఫీవర్ మిక్స్చర్” పుచ్చుకోవాలి.
“నారదీయ భక్తి అంటే భగవన్నామ గుణకీర్తనలు చేయడం. కలియుగానికి కర్మయోగం సరిపడదు. భక్తియోగమే సరైనది. కర్మఫలాలను అనుభవించ వలసి నంత వరకు కర్మలు నిర్వర్తించు. కాని భక్తి ప్రేమలు పెంపొందించుకో. భగవన్నామ, వైభవాలను కీర్తిస్తే కర్మక్షయం అవుతుంది.
“యావజ్జీవితం కర్మలు చేస్తూ ఉండనవసరం లేదు. భగవంతుని పట్ల శుద్ధ భక్తి, అనురాగం పెంపొందేకొద్దీ కర్మలు తగ్గుతూ వస్తాయి. భగవల్లబ్ధి పొందిన పిదప కర్మలు పూర్తిగా తొలగిపోతాయి. కోడలు గర్భం ధరిస్తే అత్తగారు ఆమె పనులను తగ్గిస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత అసలు పనులే చేయనక్కర్లేదు.”
30.4.2 బ్రహ్మం సత్యస్వరూపం – ఉత్తమ సంస్కారాలు ఉంటేనే భగవంతునికై వ్యాకులత కలుగుతుంది
దక్షిణేశ్వర గ్రామం నుంచి కొందరు యువకులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. వారు కూర్చున్నాక శ్రీరామకృష్ణులను కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడు సమయం సాయంకాలం నాలుగు గంటలవుతోంది.
యువకుడు: స్వామీ, జ్ఞానం అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: ‘భగవంతుడొక్కడే సత్యం, మిగిలినదంతా అసత్య’ మని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ సత్యస్వరూపాన్నే బ్రహ్మమని పేర్కొంటారు; దాన్ని కాలం (మహాకాలం) అని కూడా పిలుస్తారు. అందుకే, ‘కాలం ముందు ఎన్నెన్నో ఉద్భవించాయి, ఎన్నెన్నో కనుమరుగయ్యాయి సోదరా!’ అనే లోకోక్తి వచ్చింది.
“కాలునితో క్రీడించేదే కాళి. ఆమే ఆద్యాశక్తి. కాలుడు, కాళి – బ్రహ్మం, శక్తి అభిన్నాలు.
“సత్యస్వరూపమైన ఆ బ్రహ్మం శాశ్వతం, అది త్రికాలాలలోనూ ఉంటుంది, ఆద్యంతాలు లేనిది, వర్ణనాతీతమైనది. దాన్ని మాటల్లో వర్ణించాలనుకుంటే, మహా అయితే అది చైతన్యరూపమైనది, ఆనంద స్వరూపమైనది అని మాత్రమే వర్ణించగలం.
“జగత్తు అనిత్యం, భగవంతుడే నిత్యం. ఈ ప్రపంచం ఇంద్రజాలం వంటిది. ఐంద్రజాలికుడే సత్యం, ఇంద్రజాలం మిథ్య.”
యువకుడు: ఈ ప్రపంచం ఇంద్రజాలం, మాయ అయిన పక్షంలో మాయ ఎందుకు తొలగిపోదు?
శ్రీరామకృష్ణులు: సంస్కారాల ప్రభావం కారణంగా మాయ తొలగిపోదు. ఈ మాయా ప్రపంచంలో అనేక జన్మలుగా జీవిస్తూ వచ్చిన కారణాన మాయ సత్యమని తోస్తుంది.
“సంస్కారాలు ఎంత బలవత్తరమైనవో తెలుసా? చెబుతాను విను! రాజకుమారుడొకడు పూర్వజన్మలో ఒక రజకుని కుమారుడు. అతడు ఆడుకుంటున్నప్పుడు నేస్తాలతో, ‘ఈ ఆటలు కట్టిపెట్టండి; నేను బోర్లాపడుకుంటాను. మీరు నా వీపుమీద టప్ టప్మని గుడ్డలు ఉతకండి’ అన్నాడు.
30.4.3 గోవిందపాల్, గోపాల్ సేన్, నిరంజన్, హీరానంద్ల గురించి శ్రీరామకృష్ణులు
“యువకులు అనేకులు ఇక్కడకు వస్తున్నారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే భగవంతునికై పరితపిస్తున్నారు. వాళ్ళు మంచి సంస్కారాలతో జన్మించారు, వివాహ ప్రస్తావన వస్తే గడగడ వణకిపోతారు. వివాహం గురించి వారు ఎన్నడూ ఆలోచననైనా చేయరు. వివాహం చేసుకోనని నిరంజన్, చిన్ననాటి నుండే చెబుతున్నాడు.
“చాలాకాలం క్రిందట, దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం బారానగర్ నుంచి ఇద్దరు యువకులు వచ్చేవారు. ఒకడి పేరు గోవిందపాల్, మరొకడి పేరు గోపాల్సేన్. ఇద్దరూ చిన్ననాటి నుండే మనస్సును భగవంతుని పైన నిలిపి ఉన్నారు. వివాహ ప్రస్తావన వస్తేనే భయపడి వణకిపోయేవారు. గోపాల్‌కు భావపారవశ్యత కలగటం కద్దు. లౌకికులను చూస్తే, పిల్లిని చూసి ఎలుక బిగుసుకుపోయేట్లు, బిగుసుకు పోయేవాడు. ఒక రోజు టాగూర్ కుటుంబానికి చెందిన యువకులు ఇక్కడ తోటలో పచార్లు చేయటానికి వచ్చారు. వారిని చూడగానే అతడు కుఠీలోని గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు. వాళ్లు కనుక చూస్తే వారితో మాట్లాడవలసి వస్తుందనేదే అతడి భయం.
“గోపాల్‌కు పంచవటిలో భావపారవశ్య స్థితి కలిగింది. ఆ స్థితిలో నా కాళ్ళు పట్టుకుని, ‘నేను పోతాను, ఇకపై ఈ ప్రపంచంలో జీవించలేను. మీరు రావటానికి ఇంకా ఆలస్యమవుతుంది. నేను పోతాను’ అన్నాడు. నేను పారవశ్య స్థితిలోనే అతడితో, ‘మళ్ళా వస్తావా?’ అని అడిగాను. అందుకు అతడు, ‘అవును, మళ్ళీ వస్తాను’ అని బదులు చెప్పాడు. కొన్ని రోజులు గడిచాక గోవింద వచ్చాడు. ‘గోపాల్ ఎక్కడ?’ అని అడిగాను. ‘అతడు వెళ్ళిపోయాడు (చనిపోయాడు)’ అన్నాడతను.
“తక్కిన యువకులు దేనికై తిరుగాడుతున్నారో చూశావా? ధనం, ఇళ్లు వాకిళ్ళు, వస్తువాహనాలు, దుస్తులు, అటుపైన వివాహం – ఇలా అవిశ్రాంతంగా పరుగులు పెడుతున్నారు. పెళ్ళికుమార్తె ఎటువంటిదో ముందుగానే తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు. ఆమె అందగత్తేనా కాదా అని చూడగోరి తామే వెళతారు.
“నేను యువకులను అభిమానిస్తూ ఉన్నందున ఒకడు నా గురించి చెడుగా మాట్లాడుతుంటాడు. ఎవరయితే మంచి సంస్కారవంతులో, నిష్కపటులో, భగవంతునికై ఆరాటపడుతుంటారో, ఎవరి మనస్సు ధనం, దేహసుఖాదుల వంటి వాటిని అపేక్షించదో వారినే నేను ప్రేమిస్తున్నాను.
“వివాహం చేసుకున్న వారికీ భగవంతుని పట్ల భక్తి జనిస్తే వారు సంసారాసక్తులు కాజాలరు. హీరానంద్ వివాహితుడు. అయితే ఏం? అతడికి సంసారాసక్తత అంతగా లేదు.”
హీరానంద్ సింధు ప్రాంతపు వ్యక్తి. బి.ఏ. పట్టభద్రుడు. బ్రహ్మ సమాజస్థుడు.
మణిలాల్, శివపూర్‌కు చెందిన బ్రహ్మసమాజస్థులు, మార్వాడీ భక్తులు, దక్షిణేశ్వర గ్రామ యువకులు అందరూ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి సెలవు పుచ్చుకున్నారు.
30.5 పంచమ పరిచ్ఛేదం కర్మత్యాగం ఎప్పుడు? – మంత్రదీక్ష, జపం
చీకటి పడబోతోంది. దక్షిణపు వసారాలోను, పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార వసారాలోను ఆలయ పరిచారకులు దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించి, ధూపం వేశారు. ఆయన కుర్చీలో కూర్చుని దేవీనామ స్మరణ చేస్తూ ఆమె ధ్యానంలో మునిగి ఉన్నారు. గదిలో ‘మ’, ప్రియ ముఖర్జీ, అతడి బంధువైన హరి నేల మీద కూర్చుని ఉన్నారు. కొంతసేపు ధ్యానం చేసిన పిదప శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు. ఆలయంలో సంధ్యాహారతులు మొదలవటానికి ఇంకా వ్యవధి ఉంది.
30.5.1 సంధ్యావందనం, గాయత్రి, ఓంకారం
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): రాత్రింబవళ్ళు భగవచ్చింతనలో గడిపే వ్యక్తికి సంధ్యావందనాదులు ఎందుకు?
కర్మకలాపపు పని యేమున్నది
భక్తి విధానము లిక నెందులకు
మాతృ భజనము మూడు సంధ్యలను
మానక మనుజుడు చేయుచుండగ…..
“సంధ్యావందనం గాయత్రిలో లయమవుతుంది, గాయత్రి ఓంకారంలో లయమవుతుంది. ఒక్కమారు ప్రణవోచ్చారణ చేయగానే సమాధి కలిగే స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు అతడు ఆధ్యాత్మిక పథంలో పాతుకుపోయాడని అర్థం చేసుకో.
“హృషీకేశ్‌లో ఒక సాధువు ఉండేవాడు. వేకువజామున లేవగానే అతడు ఒక జలపాతం ప్రక్కకు వెళ్ళి నిలబడతాడు. రోజంతా ఆ జలపాతాన్ని చూస్తూ, ‘ఆహా! ఎంత రమ్యంగా చేశావు! ఎంత రమ్యత! ఏం అద్భుతం!’ అంటూంటాడు భగవంతుని ఉద్దేశించి. వేరే జపతపాలు ఏవీ అతడికి లేవు. రాత్రి కాగానే తిరిగి తన కుటీరానికి వచ్చేస్తాడు.
30.5.2 ‘తత్త్వమసి’, ‘ఓం తత్సత్’ – గీతాసారం
“భగవంతుడు నిరాకారుడా, సాకారుడా అని తలపోస్తూ తల బ్రద్దలు కొట్టుకోవలసిన అగత్యం ఏముంది? ఏకాంత ప్రదేశంలో మనోవ్యాకులతతో విలపిస్తూ, ‘భగవాన్! నువ్వు ఎలా ఉన్నావో నాకు చూపించి అనుగ్రహించు’ అని ప్రార్థించటమే చాలు. ఆయన లోపలా, బయటా ఉన్నాడు.
“లోపల వసించేది ఆయనే. అందుకే వేదాలు, ‘తత్త్వమసి’ అని పేర్కొంటున్నాయి. బాహ్యంలోనూ ఆయనే ఉన్నాడు. మాయ వలన నానారూపాలుగా గోచరమవుతున్నాడు; కాని వాస్తవానికి ఉన్నది ఆయనే. అందుచేతనే నామరూప వర్ణనకు మునుపు ‘ఓం తత్సత్’ అని చెప్పాలి.
“శాస్త్రాలు అధ్యయనం చేసి ఆయన్ను తెలుసుకోవటం ఒకటి, ఆయన్ను దర్శించడమన్నది మరొకటి. శాస్త్రాలలోని జ్ఞానం కేవలం ఆభాసమాత్రం (అంటే అవి కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలవు). కనుకనే అనేక శాస్త్రాలు చదవటం వలన ఏ ప్రయోజనమూ లేదు. దానికంటే ఏకాంతంలో భగవంతుని ప్రార్థించటమే మేలు.
“గీతను పూర్తిగా చదవకపోయినా ఫర్వాలేదు. పదిమార్లు గీతా, గీతా అని పలుకుతే ఏం వస్తుందో అదే గీతాసారం. గీత అనేది తాగీ అవుతుంది, అంటే త్యాగీ. ‘ఓ మానవా! సర్వం త్యజించి భగవంతుని ఆరాధించు’ – ఇదే గీతాసారం.”
30.5.3 కాళీహారతి దర్శనం, శ్రీరామకృష్ణుల భావపారవశ్యం
శ్రీరామకృష్ణులు భక్తులతో కాళీమాతకు ఒనరించిన హారతి చూస్తూ భావపారవశ్యం చెందారు. కాళీమాత ఎదుట సాష్టాంగ ప్రణామం గావించే స్థితిలో లేరు. భక్తులు ఎంతో జాగ్రత్తగా ఆయన్ను గదిలోకి తీసుకువచ్చి, ఆసీనులను చేశారు. ఇంకా పారవశ్య స్థితిలోనే ఉన్నారు, ఆ స్థితిలోనే మాట్లాడసాగారు.
ముఖర్జీల బంధువైన హరి వయస్సు పద్ధెనిమిది లేక ఇరవై ఏళ్ళు ఉండవచ్చు. అతడు వివాహితుడు. అప్పుడు ముఖర్జీల ఇంట్లో బసచేసి ఉన్నాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తిప్రపత్తులు కలిగిన వాడతడు.
30.5.4 ‘చిత్తశుద్ధితో ఇక్కడకు వచ్చేవారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక!’
శ్రీరామకృష్ణులు (పారవశ్య స్థితిలో హరితో): నువ్వు మీ తల్లిగారి అనుమతి పొంది మంత్రోపదేశం పుచ్చుకో. (ప్రియ ముఖర్జీతో) ఇతడికి (హరికి) నేను మంత్రోపదేశం చేస్తానని చెప్పి కూడా చేయలేకపోయాను. నేను ఎవరికీ మంత్రదీక్షను ఇవ్వటం లేదు. నువ్వు అనుష్ఠిస్తూ ఉన్న జపధ్యానాలనే కొనసాగించు.
ప్రియ ముఖర్జీ: అలాగేనండీ.
శ్రీరామకృష్ణులు: నేను ఈ స్థితిలో చెబుతున్నాను, నా మాటల్లో విశ్వాసం ఉంచు. ఇలా చూడు! ఇక్కడ వేషం గీషం ఏవీ లేవు. నేను పారవశ్య స్థితిలో, ‘అమ్మా! చిత్తశుద్ధితో ఇక్కడకు వచ్చేవారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక!’ అని అమ్మతో విన్నవించు కున్నాను.
సింథీకి చెందిన మహేంద్ర వైద్యుడు వసారాలో కూర్చుని రామ్‌లాల్, హాజ్రా ప్రభృతులతో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు తాము కూర్చున్న చోటు నుంచే, “మహేంద్రా, మహేంద్రా” అని పిలిచారు. ‘మ’ వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకు వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (వైద్యునితో): రా, వచ్చి కూర్చో. నేను చెప్పేది కాస్త విను.
వైద్యుడు కాస్త తత్తరపాటుతో కూర్చుని, శ్రీరామకృష్ణుల మాటలను వినసాగాడు.
30.5.5 భగవంతునికి పలువిధాల సేవలు – బలరాముని భావం – చైతన్యుల మూడు స్థితులు
శ్రీరామకృష్ణులు (భక్తులతో): భగవంతుణ్ణి పలు విధాలలో సేవించవచ్చు. భగవత్ప్రేమ ఉన్న వ్యక్తి పలు విధాలుగా ఆయన ప్రేమను ఆస్వాదించగలడు. కొన్ని వేళల్లో, ‘భగవాన్! నువ్వు పద్మానివి. నేను భ్రమరాన్ని’ అని తలుస్తాడు, కొన్ని సమయాల్లో, ‘భగవాన్! నువ్వు సచ్చిదానంద సాగరం, నేను చేపను’ అనుకుంటాడు. మరి కొన్ని సందర్భాలలో, ‘నేను నీ నర్తకిని’ అని భావిస్తాడు, భగవంతుని ఎదుట పాడుతూ నృత్యం చేస్తాడు. కొన్ని సమయాలలో సఖీ భావంలోను, దాస్య భావంలోను ఆయన్ను సేవిస్తాడు. యశోదలా వాత్సల్యభావననూ, గోపికల వలె మధుర భావననూ ఆపాదించుకోవటం కద్దు.
“బలరాముడు కొన్ని సమయాల్లో శ్రీకృష్ణుని సఖునిగా ఎంచాడు. కొన్ని వేళల్లో, ‘నేను కృష్ణుని గొడుగులా ఉంటాను’ లేకుంటే ‘ఆసనంగా ఉంటాను’ అని భావిస్తూ నానా విధాలుగా అతడికి సేవలు చేశాడు.”
ప్రేమభక్తుని స్థితిని వివరించటం మూలంగా శ్రీరామకృష్ణులు తమ స్థితినే తెలుపుతున్నారా? చైతన్యుల మూడు స్థితులు తెలుపటం ద్వారా తమ స్థితినే గీతగీచి చూపుతున్నారా?
శ్రీరామకృష్ణులు: చైతన్యదేవులకు మూడు స్థితులు కలిగేవి. అంతర్దశలో ఉన్నప్పుడు సమాధి స్థితిలో మగ్నమయ్యేవారు, బాహ్యస్పృహలేని స్థితి ఇది. అర్ధబాహ్య దశలో భావపారవశ్యంతో నృత్యం చేసేవారు, కానీ మాట్లాడలేకపోయేవారు. బాహ్యదశలో భగవన్నామ సంకీర్తన చేసేవారు.
(భక్తులతో) “మీరు నా పలుకులన్నీ వింటున్నారు, వాటిని మనస్సులో పదిలం చేసుకో యత్నించండి. లౌకికులు సాధువుల వద్దకు వచ్చినప్పుడు లౌకిక చింతనలను, లౌకిక వ్యవహారాలను పూర్తిగా దాచివేస్తారు. బయటకు రాగానే మళ్ళీ వాటిని వ్యక్తం చేస్తారు. పావురం ధాన్యం తింటుంది, అది జీర్ణం చేసుకున్నదని మనం అనుకొంటాం. కాని గొంతుక్రిందనున్న తిత్తిలో సేకరించి ఉంచుకుంటుంది. గొంతులో గరగరలాడుతూ ఉంటుంది.
30.5.6 సంధ్యాకాలంలో జపధ్యానాలు – మహ్మదీయులు
“సంధ్యాకాలంలో పను లన్నిటిని ప్రక్కకు పెట్టి భగవంతుని ప్రార్థించండి. చీకటి, భగవంతుణ్ణి జ్ఞప్తికి తెస్తుంది. చీకటి పడ్డప్పుడు ‘ఇప్పుడే అన్నీ స్పష్టంగా తెలిశాయి! అంతలో ఎవరు ఈ చీకటిని రప్పించారు!’ అని తోస్తుంది. మహమ్మదీయులను చూడండి. నియమిత వేళన పనులన్నిటిని ఆవలకు పెట్టి నమాజ్ చేస్తూ ఉంటారు.”
ముఖర్జీ: స్వామీ! జపం చేయటం మంచిదా?
శ్రీరామకృష్ణులు: అవును. జపం మూలంగా భగవల్లబ్ధి చేకూరుతుంది. ఏకాంతంలో భగవన్నామ జపం చేయగా చేయగా ఆయన అనుగ్రహం కలుగుతుంది, ఆ పిదప ఆయన దర్శనం. ఒక పెద్ద కొయ్యదుంగ నీటిలో మునిగి ఉందనుకోండి. దాన్ని గొలుసుతో తీరానికి కట్టివేసి ఉన్నారు. గొలుసు కొక్కేలను ఒకదాని వెంట ఒకటి పట్టుకొంటూ పోతే చివరకు కొయ్యదుంగను తాకవచ్చు.
“పూజకంటే జపం ఉన్నతమైనది. జపం కంటే ధ్యానం శ్రేష్ఠమైనది. ధ్యానం కంటే భావం ఉన్నతమైనది. భావం కంటే మహాభావం, ప్రేమ శ్రేష్ఠం. చైతన్యులకు ప్రేమ ఏర్పడింది. ప్రేమ జనిస్తే భగవంతుణ్ణి బంధించగల త్రాడు దొరికినట్లే.”
ఇంతలో హాజ్రా వచ్చి కూర్చున్నాడు.
30.5.7 వైధీభక్తి, రాగభక్తి – జపమాలతో మంత్రజపం – శ్రీరామకృష్ణులు, నారాయణ్
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): భగవంతునిపై అనురాగం కలిగితే దాన్ని రాగభక్తి అంటారు. వైధీభక్తి ఎంత సత్వరం కలుగుతుందో అంతే వేగంగా తొలగిపోతుంది. రాగభక్తి స్వయంభులింగం వంటిది. అన్వేషించినా దాని మూలాన్ని తెలుసుకోలేం. దాని మూలం కాశీ వరకు వ్యాపించి ఉందట. అవతార పురుషులకు, వారితో వచ్చిన మహాపురుషులకు మాత్రమే రాగభక్తి కలుగుతుంది.
హాజ్రా: ఆహా!
శ్రీరామకృష్ణులు: ఒక రోజు నేను బయలుకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు నువ్వు జపం చేసుకుంటున్నావు. అది చూసి నేను అమ్మతో, ఇలా అన్నాను: ‘అమ్మా! ఇతడిది ఎంత తుచ్ఛమైన బుద్ధి! ఇక్కడకు వచ్చి కూడా జపమాలను త్రిప్పుతున్నాడే! ఇక్కడకు వచ్చేవారికి ఒకేసారిగా చైతన్యం జాగృత మవుతుంది. వాళ్ళు జపం చేయడం మొదలైనవి అంతగా చేయనవసరం లేదు. కలకత్తా వచ్చి చూడు. వేలాదిమంది జపమాలను త్రిప్పుతూ జపం చేస్తూ ఉంటారు – చివరకు వేశ్యలు కూడా.’
(‘మ’ తో) “నువ్వు నారాయణ్‌ను బండిలో తోడ్కొనిరా. అతణ్ణి గురించి ముఖర్జీకి చెప్పి ఉన్నాను. అతడు ఇక్కడకు వస్తే కొంచెం ఏదైనా తినటానికి పెడతాను. వారికి తినిపించడంలో నిగూఢమైన అర్థం ఉంది.”
30.6 షష్ఠ పరిచ్ఛేదం నవీన్సేన్ ఇంట్లో భజనానందంలో శ్రీరామకృష్ణులు
శనివారం, అక్టోబర్ 4, 1884
నేడు దుర్గాపూజ తరువాత వచ్చే పౌర్ణమి. కలకత్తాలో కేశవ్సేన్ అన్నగారైన నవీన్సేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు అరుదెంచారు. గత గురువారం నాడు కేశవ్సేన్ తల్లి దక్షిణేశ్వరానికి వచ్చింది. అప్పుడామె శ్రీరామకృష్ణులను పలుమార్లు వేడుకుని ఆహ్వానించింది.
శ్రీరామకృష్ణులు మేడ మీది గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. కేశవ్ అన్న కుమారులైన నందలాల్ ప్రభృతులు, కేశవ్ తల్లి, బంధువులు, మిత్రులు అందరూ శ్రీరామకృష్ణుల పట్ల మర్యాద మన్ననలు చూపారు. మేడ మీది గదిలోనే సంకీర్తన జరిగింది. ఆ ప్రాంతంలోని సేన్ వంశజులైన పలువురు స్త్రీలూ వచ్చి ఉన్నారు.
శ్రీరామకృష్ణులతో బాటు బాబూరామ్, కిశోరీ, ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. ‘మ’ కూడా వచ్చాడు. అతడు క్రింద గదిలో కూర్చుని శ్రీరామకృష్ణుల సుమధుర గానాన్ని వింటూ ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ భక్తులతో, “సంసార జీవితం అనిత్యం. సదా మృత్యువు గురించిన జ్ఞప్తి ఉండాలి” అని అన్నారు. తరువాత పాడసాగారు:
నీ వారెవ్వరు లేరను సత్యము
మరువకు మెప్పుడు? ఓ మనసా……
పిదప ఇలా అన్నారు: “లోతుగా మునుగు. పైపైనే తేలటం వలన ఏం ప్రయోజనం? కొన్ని రోజులైనా ఏకాంతంలో, అన్నిటిని వదిలివేసి, నూటికి నూరుపాళ్ళ మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించు.”
శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు:
మునుగవే లోతుకు మునుగవే మనసా
సర్వేశు సౌందర్య సంద్రంబునందు…….
బ్రహ్మసమాజ భక్తులను “సర్వము నీవే సర్వేశా….” అనే పాటను పాడమని ఆయన కోరేసరికి వారు పాడారు:
నా సర్వము నీవే సర్వేశా
నా సర్వము నీవే సర్వేశా
నా ఉనికి మనికీ నీతోనే…..
తరువాత శ్రీరామకృష్ణులు తామే పాడారు.
నన్ను కన్న తండ్రి నల్లనయ్య రార!
అనుచు మాతశ్రీ యశోద నిన్ను పిలువ……
బ్రహ్మభక్తులు మృదంగ, తాళాల ప్రక్క వాయిద్యాలతో పాటను పాడారు:
మాత నీదు ప్రేమ మానవాళి మీద
ఎంత గాఢమమ్మ సుంత తెలియలేను ॥ మా ॥
తలచి తలచి దాని తల్లడిల్లుచుంటి
కనుల నీరు పొంగి కాల్వ గట్టుచుండె ॥ మా ॥
నాదు జననమాది నీదు శాసనముల
ధిక్కరించుచున్న లెక్కపెట్టకుండ ॥ మా ॥
మధురమైన ప్రేమ మాటలాడి నన్ను
ధైర్యపరచు కన్నతల్లివమ్మ నీవు ॥ మా ॥
తలచి తలచి దాని తల్లడిల్లుచుంటి
కనుల నీరు నిండి కాల్వలగుచు నుండె ॥ మా ॥
మోయలేని బరువు మాయి నీదు ప్రేమ
చల్లనైన చేయి స్పర్శ తగులగానే ॥ మా ॥
తల్లి మనసు తల్లడిల్ల నేడ్చి నిన్ను
చేరినాడ పాద శరణుజొచ్చి నేను ॥ మా ॥
తరువాత వాళ్ళు జగజ్జననిపై కొన్ని పాటలు పాడారు:
అంతరాత్మవై నడపెడు మాతా!
అనయము హృదయము నందు మేల్కొనుము
ఒడిలో నిడుకొని దివారాత్రములు
లాలించుచు నను పాలించెదవు ॥ అం ॥
అల్పుడైన ఈ అయోగ్య శిశువుపై
ఇంత వత్సలత నేల చూపెదవు
ఎంత పిచ్చి నీకెంత ప్రేమ, న
న్నెత్తి ముద్దిడుచు నొత్తి కౌగిలిన ॥ అం ॥
మెదలకుండ నన్నదిమిపట్టి నీ
సుధను గుడుపుదువు వ్యధను దీర్పగా
చెవిన చెప్పుదువు ముద్దుముచ్చటలు ॥ అం ॥
తప్పెరుంగని గొప్ప ప్రేమతో
కష్ట సమయముల గాచుచుండెదవు
అమ్మ నాది, నే నమ్మ బిడ్డనను
సత్య మెరిగితిని పతిత పావని ॥ అం ॥
ఆలకింతు నిపుడామె మాటలనె
న్యాయ పథములో నడచుచుండెదను
మాత స్తన్యముల మరిమరి గ్రోలుచు
జయహే మాతా బ్రహ్మనిరంతర్
అని నే పాడెద పుష్టి తుష్టి
సంతుష్టి పుష్టి పడ ॥ అం ॥
తరువాత శ్రీరామకృష్ణులు హరినామాన్ని ఉచ్చరిస్తూ, చైతన్యుల గురించి పాడుతూ బ్రహ్మభక్తులతో కలిసి నృత్యం చేశారు. చాలాసేపటి వరకు పాటలు, నృత్యం కొనసాగాయి.
30.7 సప్తమ పరిచ్ఛేదం హాజ్రా, శ్రీరామకృష్ణులు – అహేతుక భక్తి
ఆదివారం, అక్టోబర్ 5, 1884
మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో కూర్చుని ఉన్నారు. ప్రక్కన నేల మీద ‘మ’, హాజ్రా, పెద్దకాళీ, బాబూరాం, రామ్‌లాల్, ముఖర్జీల బంధువైన హరి మొదలైనవారు కూర్చుని ఉన్నారు. కొందరు కూర్చునీ, కొందరు నిలబడీ ఉన్నారు. నిన్నటి దినం కేశవ్ తల్లి శ్రీరామకృష్ణులను కలకత్తాలోని తన ఇంటికి ఆహ్వానించి ఉంది. అక్కడ పాటలూ, నృత్యాలలో పాల్గొని శ్రీరామకృష్ణులు మహదానందం పొందారు.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): నిన్న కేశవ్ ఇంట్లో (నవీన్ సేన్ ఇంట్లో) బాగా తిన్నాను. వాళ్ళు భక్తి ప్రపత్తులతో భోజనం పెట్టారు.
30.7.1 హాజ్రా – తత్త్వజ్ఞానం
హాజ్రా చాలా రోజులుగా శ్రీరామకృష్ణులతో బసచేస్తూ వచ్చాడు. అతడిలో ‘నేను జ్ఞానిని’ అన్న భావన ఒకింత ఉంది. లోకులతో శ్రీరామకృష్ణులను గురించి కాస్త తక్కువచేసి మాట్లాడుతుంటాడు. వసారాలో ఆసనంలో కూర్చుని జపమాలను త్రిప్పుతూ జపం చేస్తాడు. చైతన్యదేవులు, ‘ఆధునిక అవతారం’ అంటూ హేళన చేస్తుంటాడు. “భగవంతుడు శుద్ధభక్తిని మాత్రమేనా ఒసగుతాడు? అలా కాదు. ఆయన వద్ద ఐశ్వర్యానికీ కొరతలేదు. దాన్నీ ఆయన ప్రసాదిస్తాడు. ఆయన్ను పొందితే అష్టసిద్ధులనూ పొందవచ్చు” అంటాడతడు. అతడికి దాదాపు వేయి రూపాయల అప్పు ఉంది. దాన్ని తీర్చటం ఎలా అన్నదే అతడి చింత.
పెద్దకాళీ ఒక కార్యాలయంలో ఉద్యోగస్థుడు. తక్కువ జీతం. ఇంట్లో భార్యా పిల్లలందరూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తిప్రపత్తులు ఉన్నవాడు. కొన్ని సమయాల్లో ఉద్యోగానికి పోకుండా కూడా శ్రీరామకృష్ణుల దర్శనార్థం రావటం కద్దు.
పెద్దకాళీ (హాజ్రాతో): మీరు ఒక గీటు రాయిలా ఏది మంచి బంగారం, ఏది కల్తీది అంటూ ఎందుకు తిరుగాడుతూ ఉంటారు? పరుల తప్పుల నెంచటంలో మీకు ఎందుకింత అక్కర?
హాజ్రా: నేను చెప్పేదంతా ఆయనతోనే (శ్రీరామకృష్ణులతో) చెబుతున్నాను.
శ్రీరామకృష్ణులు: అదేమో నిజమే.
తత్త్వజ్ఞానాన్ని గురించి హాజ్రా వివరింప మొదలుపెట్టాడు.
హాజ్రా: తత్త్వజ్ఞానం అంటే ఏమిటి? ఇరవై నాలుగు తత్త్వాలున్నాయి కదా, వాటిని తెలుసుకోవటం.
ఒక భక్తుడు: ఆ ఇరవై నాలుగు తత్త్వాలు ఏవి?
హాజ్రా: పంచ భూతాలు, అరిషడ్వర్గం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొదలైనవన్నీ.
‘మ’ (నవ్వుతూ శ్రీరామకృష్ణులతో): అరిషడ్వర్గం కూడా ఇరవై నాలుగు తత్త్వాలలో చేరిందంటున్నాడే!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): చూడు, తత్త్వజ్ఞానం పేరిట ఏదేదో వాగుతున్నాడు! తత్త్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. తత్ అంటే పరమాత్మ, ‘త్వం’ అంటే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానం కలిగినప్పుడు అది తత్త్వజ్ఞానం అవుతుంది.
కాసేపటికి హాజ్రా వసారాలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ ప్రభృతులతో): అతడు వితండవాదం చెయ్యటంలో సరి. ఇప్పుడు సర్వం తెలిసినట్లు మాట్లాడతాడు, కాని మరుక్షణం పాత కథే. లాగుతూ ఉన్నది పెద్దచేప కావటంతో నేను త్రాడును కాస్త వదలిపెట్టాను. లేకుంటే అది త్రాడును త్రెంచి వేస్తుంది. దానికి తోడు, త్రాడును పుచ్చుకున్న వ్యక్తీ నీళ్ళలో పడిపోవచ్చు. అందుకే నేను ఏమీ చెప్పకుండా ఊరకే ఉంటాను.
30.7.2 ముక్తి, షడైశ్వర్యాలు – మలినభక్తి, అహేతుక భక్తి
(‘మ’ తో) “బ్రాహ్మణుడిగా జన్మించకుంటే ముక్తి లభించదని హాజ్రా అంటాడు. అందుకు నేను, ‘నువ్వు ఏమంటున్నావు? భక్తి వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. శబరి బోయ వనిత. భోజన వేళకు గంటలు కొట్టే పనిచేసేవాడు రుహిదాసు. వీరందరూ నిమ్నజాతివారు. వీళ్ళు భక్తితోనే ముక్తి పొందారు!’ అన్నాను. ‘అయినప్పటికీ….’ అంటాడతడు. ధ్రువుణ్ణి ఒప్పుకుంటాడు. కాని ప్రహ్లాదుని అంగీకరించిన మేరకు కాదు. ఒకసారి లాటూ, ‘ధ్రువునికి బాల్యంలోనే ఎంతటి భక్తి’ అన్నప్పుడు అతడు బదులు పలుకలేదు. ఎటువంటి కోరికలు కోరని భక్తి అహేతుక భక్తి – దీనికంటే గొప్పది ఏదీ లేదు అంటాను నేను. దాన్ని అతడు ఖండించాడు. అందుకు నేను ఇలా అన్నాను: ‘ఏదైనా సహాయం కోరి ధనికుని వద్దకు వెళితే అతడు విసుక్కుంటాడు. కోపంగా “అదుగో వస్తున్నాడు చూడు” అంటాడు; ప్రక్కకు రాగానే, “కూర్చో” అంటాడు ఉదాసీనతతో. ఒకటే విసుగుదల. వీళ్ళను సమానంగా ఎంచి తనతో బండిలో తీసుకు వెళ్ళడు.’
“అందుకు హాజ్రా ఇలా అన్నాడు: ‘భగవంతుడు ఇటువంటి సామాన్య ధనికుల వంటివాడు కాడు. ఆయనకు సిరిసంపదలకు లోటు ఏమిటి? ఇస్తే తగ్గిపోతుందనే బాధ లేదు. ఆకాశం నుంచి వర్షం కురిసేటప్పుడు గంగ మొదలైన పెద్దనదులు, పెద్ద పెద్ద జలాశయాలు అన్నీ నిండిపోతాయి. చిన్న గుంటలు, చెరువులు కూడా నిండుతున్నాయి. ఆయన అనుగ్రహం లభిస్తే భక్తిజ్ఞానాలను మంజూరు చేస్తాడు, దానితోబాటు సంపదలనూ ఇస్తాడు.’
(భక్తులతో) “కాని దీన్ని నేను మలిన భక్తి అంటాను. మీరు నా నుంచి ఏదీ కోరటం లేదు. కాని నన్ను చూడ, నా పలుకులు వినగోరుతున్నారు. నా మనస్సు మిమ్మల్ని గురించే యోచిస్తూ ఉంటుంది. మీరెలా ఉన్నారు, మీరు ఇంకా ఎందుకు రాలేదనే ఆలోచిస్తూ ఉంటాను. భగవంతుని నుండి దేన్నీ కోరక పోయినా ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నారు – ఇదే అహేతుక భక్తి, శుద్ధ భక్తి. ప్రహ్లాదునికి ఇట్టి భక్తి కలిగింది. అతడికి రాజ్యం అక్కర్లేదు, సిరిసంపదలు అక్కర్లేదు. శ్రీహరి మాత్రమే కావాలి.”
‘మ’ : హాజ్రా వదరుబోతు. మౌనం వహించకపోతే అతడు దేన్నీ సాధించలేడు.
30.7.3 హాజ్రా అహంకారం
శ్రీరామకృష్ణులు: కొన్ని సమయాల్లో నా ప్రక్కకు వచ్చి సాత్త్వికుడయిపోతాడు. కాని అదేం గ్రహచారమో ఏమో, మళ్ళీ వాదింప మొదలుపెడతాడు. అహంకారం తొలగించుకోవటం సులభం కాదు. రావిచెట్టును ఇవాళ నరకండి, మర్నాటి కది చిగురించి ఉంటుంది. వ్రేళ్ళు ఉన్నంతవరకు అది చిగురిస్తూనే ఉంటుంది. ఎవరినీ నిందించవద్దని హాజ్రాతో చెప్పాను. నారాయణుడే ఈ అన్ని రూపాలుగాను ఉన్నాడు. అందుచేత దుష్టులకు కూడా ప్రణమిల్లి, పూజించవచ్చు.
“కుమారి పూజను చూశావు కదా! మలమూత్రాలను విసర్జించే, ముక్కు నుంచి చీమిడి కారే ఒక సామాన్య బాలికను ఎందుకు పూజిస్తున్నాం? ఆమె, జగజ్జనని ఒక అంశ అనే కదా!
“భగవంతుడు భక్తులలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుని కచేరి చావడి. సొరకాయ బుర్ర పెద్దదయితే మంచి తంబూరా చేయవచ్చు, చక్కని నాదం వెలువరిస్తుంది.”
(నవ్వుతూ రామ్‌లాల్‌తో) “ఓ రాంలాల్! హాజ్రా దాన్ని ఎలా ఉచ్చరించాడు? అంతస్ బహిస్ యది హరిస్…. (అంటే అస్ చేర్చి)! ఎవరో ఒక వ్యక్తి, ‘అమ్మలు ఆహారాలు తింటున్నారులు’ అని ‘లు’ చేర్చి చెప్పాడట, అలాగన్నమాట.” (అందరూ నవ్వారు)
రామ్‌లాల్ (నవ్వుతూ): అంతర బహిర్ యది హింస్తపసా తతః కిమ్. (అంతరంలోను బాహ్యంలోను హరి ఉన్నప్పుడు తపస్సు అవసరం ఏమిటి?)
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): దీన్ని నువ్వు నేర్చుకో. అప్పుడప్పుడు నాకు చెబుతూ ఉండు.
శ్రీరామకృష్ణుల గదిలోనుంచి ఒక గిన్నె కనపడకుండా పోయింది. రామ్‌లాల్, పరిచారిక బృంద దాన్ని గురించి ఆయనతో, “ఆ గిన్నె గురించి మీకు ఏమైనా తెలుసా?” అని అడిగారు.
శ్రీరామకృష్ణులు: తెలియదు. ఈ మధ్య దాన్ని నేను చూడలేదే! మునుపు ఉంది, చూసి ఉన్నాను.
30.8 అష్టమ పరిచ్ఛేదం ఇద్దరు సాధువులతో శ్రీరామకృష్ణులు – పరమహంస స్థితి
ఆనాటి ఉదయం ఇద్దరు సాధువులు పంచవటికి వచ్చి ఉన్నారు. వారు గీత, వేదాంతం, శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేశారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు. అప్పుడు ఆయన చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. సాధువులు ఆయనకు ప్రణమిల్లి, నేల మీద పరచి ఉన్న చాప మీద కూర్చున్నారు. ‘మ’ ప్రభృతులూ అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు వారితో హిందీలో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: భోజనమైనదా?
సాధువులు: అయినదండీ.
శ్రీరామకృష్ణులు: ఏం తిన్నారు?
సాధువులు: చపాతీలు, పప్పు. మీరు పుచ్చుకుంటారా?
శ్రీరామకృష్ణులు: వద్దు. నేను కొంచెం అన్నమే తింటాను. మంచిది, మీరు జపధ్యానాలు నిష్కామంగానే కదా చేస్తూ ఉన్నారు?
సాధువులు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: అది మంచిది. ఫలాన్ని భగవంతునికి సమర్పించాలి. కాదా? గీత అట్లే కదా చెబుతూ ఉంది.
ఒక సాధువు (రెండవ సాధువుతో): యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్ । యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ॥ (గీత, 9.27)
శ్రీరామకృష్ణులు: భగవంతునికి ఒకటి సమర్పిస్తే అది వెయ్యిరెట్లుగా మనకు తిరిగి వస్తుంది. అందుకే ఏదైనా పుణ్యకార్యం చేశాక కృష్ణార్పణమస్తు అంటూ నీళ్ళు వదలుతాం – అంటే ఫలాన్ని భగవంతునికి సమర్పించివేస్తాం. యుధిష్ఠిరుడు తన పాపాలను కృష్ణునికి అర్పించబోతూన్నప్పుడు భీముడు అతణ్ణి వారించి ‘ఇలా చేయవద్దు. కృష్ణునికి ఏది అర్పించినా అది వెయ్యిరెట్లుగా తిరిగి వస్తుంది’ అని హెచ్చరించాడు. (ఒక సాధువుతో) మంచిది స్వామీ, నిష్కాములై ఉండాలి. కోర్కెలన్నిటిని వదిలివేయాలి. అంతేకదా?
సాధువు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: కాని నాకు భక్తిపట్ల కోర్కె ఉంది. అది హానికరం కాదు. అందుకు మారుగా అది మేలు ఒకగూరుస్తుంది. మిఠాయిలు దేహానికి చెరుపు చేస్తాయి. కారణం, అవి ఆమ్లాన్ని ఉత్పన్నం చేస్తాయి. కాని పటికబెల్లం మేలు చేస్తుంది. ఏమంటారు?
సాధువు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: అదిసరే. వేదాంతం గురించి మీరు ఏం అనుకుంటున్నారు?
సాధువు: వేదాంతంలో షడ్దర్శనాలు ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు: కాని వేదాంత సారం – బ్రహ్మసత్యం జగన్మిథ్య, ‘నేను’ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు, నేను ఆ బ్రహ్మాన్ని అని. అంతేకదా!
సాధువు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: కానీ గృహస్థ జీవనం గడిపేవారికి, దేహబుద్ధి కలవారికి ‘సోఽహం’ భావం మంచిది కాదు. గృహస్థులు యోగవాసిష్ఠం, వేదాంతం చదవడం మంచిది కాదు; వారికి అవి ఎంతో హానికరం. వాళ్ళు సేవ్య సేవక భావం అవలంబించాలి; ‘పరమేశ్వరుడా, నువ్వు నా యజమానివి, నేను నీ సేవకుడను, నీ దాసుడను’ అని భావించుకోవాలి. దేహబుద్ధి ఉన్న వారికి ‘సోఽహం’ భావం తగదు.
అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు లోలోన నవ్వుకుంటూ, తమ ఆనందంలో ఆనందం గాంచారు – ఆత్మారాములు!
ఒక సాధువు రెండవ సాధువు చెవిలో గుసగుసలాడాడు – “చూడు చూడు. ఇదే పరమహంస స్థితి.” శ్రీరామకృష్ణులు సాధువుల వంక చూస్తూ ‘మ’ తో, “నాకు నవ్వు వస్తోంది” అంటూ ఒక బాలునిలా తమలో తామే నవ్వారు.
సాధువులు వెళ్ళిపోయారు.
30.9 నవమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – కామినీ; సన్న్యాసులకు కఠిన నియమాలు
శ్రీరామకృష్ణులతోబాటు బాబూరామ్, ‘మ’, ముఖర్జీల బంధువైన హరి మొదలైన పలువురు భక్తులు గదిలోను, మొగసాలలోను పచార్లు చేస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నవీన్సేన్ ఇంటికి వెళ్ళావా?
‘మ’ : అవునండీ, వెళ్ళాను. క్రిందనుండే పాటలు విన్నాను.
శ్రీరామకృష్ణులు: అలాగా! మంచిపని చేశావు. నీ భార్య వచ్చింది. కేశవ్సేన్కు ఆమె చిన్నాన్న కుమార్తె కదా?
‘మ’ : ఆ, కాస్త దూరపు బంధుత్వం.
నవీన్సేన్ ఒక భక్తుని వియ్యంకులకు బంధువు.
శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఏకాంతంలో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: అత్తగారింటికి పోతూ ఉంటారు. నేనూ వివాహం చేసుకుంటాను, అత్తగారి ఇంటికి పోతాను, ఉల్లాసంగా ఉంటాను అంటూ ఎంతో అనుకునేవాణ్ణి. కాని జరిగింది ఏమిటో చూశావు కదూ?
30.9.1 వామన్దాస్ను కలిసిన సంఘటన
‘మ’ : అవునండీ. పిల్లవాడు తండ్రి చేయి పుచ్చుకుంటే క్రింద పడిపోవచ్చు. కాని తండ్రి పిల్లవాడి చేయి పుచ్చుకుంటే పడిపోవటానికి ఆస్కారం ఉండదు అని మీరే చెప్పి ఉన్నారు కదా! మీ స్థితి ఇట్లే ఉన్నది. అమ్మే మీ చేయి పుచ్చుకుని ఉంది.
శ్రీరామకృష్ణులు: ఉలోర్కు చెందిన వామనదాస్ను విశ్వాస్ ఇంట్లో కలుసుకున్నాను. ‘నేను నిన్ను చూడడానికే వచ్చాను’ అన్నానతడితో. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడు కుంటూ ఉన్నది వినటం తటస్థించింది: ‘అబ్బా! పులి మనిషిని పట్టుకున్న రీతిలో దేవి ఈయన్ను పట్టుకుని ఉన్నది’ అన్నాడతడు. అప్పుడు నా వయస్సు తక్కువ, బాగా లావుగా ఉండేవాణ్ణి. సర్వదా భావపారవశ్య స్థితిలోనే ఉండేవాణ్ణి.
30.9.2 స్త్రీల పట్ల శ్రీరామకృష్ణుల వైఖరి
“స్త్రీలంటే నాకు చాలా భయం, వారిని చూస్తే ఆడపులి తినవస్తూ ఉన్నట్లు తోస్తుంది. వారి శరీరం, అంగాలు, సూక్ష్మరంధ్రాలు అన్నీ పెద్దవిగా కానవస్తాయి. రాక్షసిలా కనిపిస్తారు. మునుపు ఎంతో భయం చెందేవాడను. ఎవరినీ ప్రక్కకు రానిచ్చే వాడిని కాను. ఇప్పుడు పలువిధాల మనస్సుకు నచ్చచెప్పి వాళ్ళను దేవీ ఆనందమయి నానా రూపాలుగా గాంచుతాను. జగజ్జనని అంశలు వాళ్ళు. కాని పురుషులకు సంబంధించినంత వరకు, సాధువులకు సంబంధించినంత వరకు, భక్తులకు సంబంధించినంత వరకు స్త్రీలు పరిత్యజనీయులు.
“ఎంతటి భక్తురాలైనప్పటికీ స్త్రీలను ఎక్కువసేపు సమీపంలో కూర్చోనివ్వను. కాసేపవగానే వాళ్ళతో ఆలయానికి వెళ్ళిరండని చెబుతాను. అప్పటికీ వాళ్ళు లేవకుంటే హుక్కా త్రాగే సాకుతో బయటకు వెళ్ళిపోతాను.
30.9.3 స్త్రీల పట్ల నిరంజన్, హరిల అనాసక్తి
“కొందరికి స్త్రీల పట్ల కించిత్తు ఆసక్తి కూడా లేకపోవటం చూస్తూ ఉన్నాను. ‘నా మనస్సు ఏనాడూ స్త్రీల వైపు పోనేలేదు’ అని నిరంజన్ అంటాడు. హరిని (కాలాంతరంలో స్వామి తురీయానంద) అడిగినప్పుడు తన మనస్సులో స్త్రీల గురించిన ఆలోచనలే మెదలవని అతడూ చెప్పాడు.
హరి (స్వామి తురీయానంద)
“భగవంతునికి అర్పించాల్సిన మనస్సులో ముప్పావు వంతును స్త్రీలు అపహరిస్తూ ఉన్నారు. బిడ్డ పుట్టగానే మనస్సు దాదాపు పూర్తిగా ఖర్చు అయిపోతుంది. ఇక భగవంతునికి ఏం సమర్పిస్తావు? “ఇంకా కొందరికి భార్య వైపు కన్నేసి ఉండడంలోనే ప్రాణం పోతూ ఉంటుంది. ఆ ద్వార కాపలావాడు ఒక పండు ముసలి, అతడికి పద్నాలుగేళ్ళ భార్య. ఆమె ఆ ముసలివాడితో సంసారం చేయాలి. పూరిపాక! దారిన పోయే వారు కొబ్బరి మట్టలను ప్రక్కకు జరిపి లోపలికి తొంగి చూసేవారు. ప్రస్తుతం ఆమె పారిపోయింది.
“మరొకడున్నాడు. అతడికి భార్యను ఎక్కడ ఉంచాలో తెలియరాలేదు. ఇంట్లో ఒకటే గొడవలు. ఇప్పుడు బాగా కలతచెంది ఉన్నాడు. ఓ, ఇక చాలు ఇటువంటి కబుర్లు.
“ఇక స్త్రీలతో కలిసి ఉంటేనే వాళ్ళకు అణగిమణగి ఉండవలసి వస్తుంది. గృహస్థులు స్త్రీలు లెమ్మంటే లేస్తారు, కూర్చోమనగానే కూర్చుంటారు. సామాన్యంగా అందరూ తమ భార్యలను పొగడుతూనే ఉంటారు.
“ఒకమారు నే నొకచోటుకు పోగోరాను. వెళ్ళవచ్చా అని రామ్‌లాల్ పిన్నిని (శ్రీ శారదామాతను) అడిగాను, ఆమె వద్దన్నది. నేను వెళ్ళలేకపోయాను. తరువాత ‘ఆహా! నేను కాపురం చెయ్యలేదు. నేను కామినీ కాంచన త్యాగిని. నా స్థితే ఇలా ఉండగా గృహస్థుడు ఏ మేరకు భార్యకు విధేయుడై ఉంటాడు!’ అనుకున్నాను.”
‘మ’ : కామినీ కాంచనాల నడుమ జీవిస్తే ఒంటికి ఒకింతైనా మరక పడకుండా పోదు. మీరు జయనారాయణ్ గురించి చెప్పి ఉన్నారు కదా – ఎంత గొప్ప పండితుడు, వయస్సు పైబడ్డవాడు. మీరు ఆయన్ను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు చాప, దిండ్లను ఎండలో ఆరవేస్తూ ఉన్నాడు కదా.
శ్రీరామకృష్ణులు: కాని పండితుడునన్న అహంకారం అతడిలో లేదు. అదే కాదు, తాను చెప్పినట్లే చివరి రోజులు కాశీలో గడిపాడు కూడా. ఆయన పిల్లలను చూశాను – కాళ్ళకు బూట్స్, ఆంగ్ల చదువులు!
30.9.4 ప్రేమోన్మాదంలో శ్రీరామకృష్ణుల వివిధ స్థితులు
ప్రశ్నోత్తరాల మూలంగా శ్రీరామకృష్ణులు ‘మ’ కు తమ స్థితిని విశదపరిచారు.
శ్రీరామకృష్ణులు: ఇదివరలో ఎంతో పిచ్చిపట్టిన వాడిలా ఉండేవాణ్ణి. ప్రస్తుతం తగ్గిపోయింది. అది ఎందుకు? కాని ఇప్పుడు కూడా కొన్ని వేళల్లో ఆ స్థితి వస్తూ ఉంది.
‘మ’ : మీరే అన్నట్లు కొన్ని వేళల్లో బాలునిలా, కొన్ని సమయాల్లో ఉన్మాదునిలా, కొన్ని సందర్భాలలో జడునిలా, కొన్ని వేళల్లో పిశాచంలా పలుస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు సాధారణ స్థితిలోనూ ఉంటారు.
శ్రీరామకృష్ణులు: అవును. బాలుని వలెనే; దానికి తోడు పసిబాలుని, యువకుని స్థితులూ ఏర్పడుతూ ఉంటాయి. జ్ఞానోపదేశం చేసేటప్పుడు యువకుని స్థితి. ఇక బాలుని స్థితి; అప్పుడు పన్నెండు, పదమూడేళ్ళ బాలునిలా చిలిపి చేష్టలు చేయాలనిపిస్తుంది. అందుకే చిన్నపిల్లలతో వేడుకల్లో వినోదాల్లో పాల్గొంటూ ఉంటాను. అది సరే, నారాయణ్ ఎటువంటివాడు?
‘మ’ : స్వామీ, లక్షణాలన్నీ బాగానే ఉన్నాయి.
శ్రీరామకృష్ణులు: సొరకాయ బుర్ర బాగానే ఉంది, దానితో తయారు కాబడే తంబురా చక్కని నాదాన్ని వెలువరిస్తుంది. అతడు నాతో, ‘మీరే సర్వమూ (అంటే అవతారం)’ అంటాడు. ఎవరు ఎలా అవగాహన చేసుకుంటున్నారో అందుకు తగినట్లుగా మాట్లాడుతున్నారు. కొందరు నేనొక సామాన్య సాధువును, సాధారణ భక్తుడను అని అంటున్నారు.
“ఇది కూడదు అంటూ నేను దేనినైనా కట్టడిచేస్తే అతడు మనస్సులో దాన్ని బాగా పదిలపరచుకుంటాడు. తెరను తీయమన్నాను; అతడు తీయలేదు. ముడివేయటం, కుట్టటం, తెరను తీయటం, పెట్టె మూతవేసి తాళం పెట్టటం వంటి వాటిని చేయరాదని చెప్పి ఉన్నాను. ఆ విషయం బాగా జ్ఞప్తిలో ఉంచుకున్నాడు. సన్న్యాసం స్వీకరింపగోరేవారు ఇటువంటి వాటిని అభ్యసించాలి. ఈ సాధనలు సన్న్యాసుల కోసం ఉద్దేశింపబడినవి.
“సాధనలు అనుష్ఠించే కాలంలో స్త్రీని దావానలంలా, తాచుపాములా పరిగణించాలి. కాని సిద్ధత్వం పొందాక, భగవత్సాక్షాత్కారానంతరం అదే స్త్రీ ఆనందమయిగా తోస్తుంది. అప్పుడు ఆమెను జగజ్జనని రూపంగా గాంచుతావు.”
కొన్ని రోజులుగా శ్రీరామకృష్ణులు స్త్రీల విషయంలో నారాయణ్‌ను హెచ్చరిస్తూ ఉన్నారు. “స్త్రీ గాలి కూడా నీ శరీరం మీద పడకుండా చూసుకో. అలా పడకుండా ఉండటానికి మందపాటి వస్త్రంతో నీ శరీరాన్ని మూసివేసుకో. తల్లి తప్ప తక్కిన స్త్రీల నుండి కనీసం ఎనిమిది మూరలైనా, లేకుంటే కనీసం రెండు మూరలైనా దూరంగా ఉండు. సాధ్యం కాకుంటే కనీసం ఒక మూర దూరంగానైనా సదా వైదొలగి ఉండు” అని అతడితో చెప్పి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నారాయణ్ తల్లి నన్ను గురించి అతడితో, ‘ఆయన్ను చూసి మేమే లాగివేయబడుతున్నాం. నువ్వో ముక్కుపచ్చలారని బిడ్డవు’ అని అన్నది. సరళ స్వభావం లేకుంటే భగవంతుని పొందలేరు. నిరంజన్ ఎంతటి సరళ హృదయుడు!
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: ఆ రోజు కలకత్తాకు పోతూ ఉన్నప్పుడు బండిలో అతణ్ణి నువ్వు గమనించలేదా? సర్వదా ఒకే మాదిరి స్థితి – కల్లాకపటం లేని మనస్సు. మనుష్యులు ఇంట్లో ఒక రకంగా ఉంటారు, బయటకు వస్తే మరో రకంగా ప్రవర్తిస్తారు. తండ్రి మరణానంతరం నరేంద్రుడు ఇంటి బాధ్యతను గురించి కలత చెందుతున్నాడు. అతడికి కొద్దిగా లెక్కలు కట్టే బుద్ధి ఉంది. యువకులందరూ నిరంజన్, నరేంద్రుల్లా ఉంటే ఎంత బాగుంటుంది!
“నీలకంఠుని యాత్రా ప్రదర్శనం చూడబోయాను. దక్షిణేశ్వరంలో నవీన్ నియోగి ఇంట్లో జరిగింది. అక్కడ ఉన్న యువకులు పూర్తిగా నేలబారు రకాలు. ఇతరులలో లోపాలు ఎంచటమే వారి పని. ఇటువంటి స్థలాలలో ఆధ్యాత్మిక చింతనలకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. మరొక యాత్రా ప్రదర్శన చూసి డాక్టర్ మధు కళ్ళనుండి అశ్రువులు స్రవించాయి. నేను అతణ్ణే చూస్తూ ఉన్నాను, మరెవరినీ చూడలేకపోయాను.
30.10 దశమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులు – బ్రహ్మసమాజం – సమన్వయ ఉపదేశం
“అది సరే, ఇంతమంది ఆకర్షితులై ఇక్కడకు వస్తున్నారే, దీని అర్థం ఏమిటి?”
‘మ’ : బృందావన లీల ఒకటి నాకు జ్ఞప్తికి వస్తోంది. ఒకసారి కృష్ణుడే గోపబాలురుగాను, దూడలుగాను మారాడు. అప్పుడు ఆ గోపబాలుర పట్ల గోపికలకు, ఆ దూడల పట్ల తల్లి గోవులకు ఆకర్షణ అధికమైంది.
శ్రీరామకృష్ణులు: అది భగవదాకర్షణ. నిజం ఏమిటో తెలుసా? జగజ్జనని ఇటువంటి ఇంద్రజాలాన్ని పరపుతుంది, అందుకే ఈ సమ్మోహనం.
“అది సరే, కేశవ్సేన్ వద్దకు వెళుతూ ఉండే మేరకు ఇక్కడకు జనులు రావటం లేదే? అతణ్ణి ఎంతమంది గౌరవిస్తున్నారు, కీర్తిస్తున్నారు! విదేశాలలో కూడా అతణ్ణి ఎరిగి ఉన్నారు. క్వీన్ విక్టోరియాయే అతడితో మాట్లాడింది! ఎవరిని పలువురు గౌరవించి, కీర్తిస్తూ ఉంటారో అతడిలో భగవంతుని శక్తి ఉంటుందని గీత తెలుపుతోంది! ఇక్కడకు ఆ విధంగా అంతమంది వస్తున్నట్లు అనిపించటం లేదు!
‘మ’ : సంసారాసక్తులే కేశవ్ వద్దకు పోయేవారు.
శ్రీరామకృష్ణులు: అవును, అది నిజమే – కేవలం లౌకికులు.
‘మ’ : కేశవ్ స్థాపించిపోయింది నిలుస్తుందా?
శ్రీరామకృష్ణులు: ఏం? ఒక సంహిత వ్రాసి ఉన్నాడే? దాన్లో ఎన్ని నియమాలు!
‘మ’ : అవతార పురుషులు ఒనరించే పనుల విషయమే వేరు. ఉదాహరణకు చైతన్యదేవులు.
శ్రీరామకృష్ణులు: అవును! అవును! సరిగ్గా చెప్పావు.
‘మ’ : నేను నాటిన విత్తనాలు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు తప్పక మొలకెత్తుతాయని చైతన్యులు చెప్పారని మీరే తెలిపి ఉన్నారు. ఇంటి చూరులో దాచిన విత్తనాలు ఇల్లు కూలిపోయిన తరువాత మొలకెత్తి చెట్టుగా ఎదుగుతుందనీ మీరు చెప్పి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: అది సరే. శివనాథ్ ప్రారంభించిన సమాజానికీ చాలామంది వెళుతున్నారు.
‘మ’ : అవును. ఏదో అదేరకం వాళ్ళు పోతున్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవునవును! లౌకికులు పోతున్నారు. భగవంతునికై మనోవ్యాకులత చెందేవారు, కామినీ కాంచనాలను పరిత్యజించ ప్రయత్నించేవారు అక్కడకు అరుదుగా పోతారు.
‘మ’ : ఇక్కడ నుంచి ఒక తరంగం లేచి బయలుదేరితే బాగుంటుంది. దాని ఉద్ధృతిలో అన్నీ కొట్టుకొనిపోతాయి. ఇక్కడ నుండి బయల్వెడలినదేదీ ఏకపక్ష పోకడగలదై ఉండదు.
30.10.1 శ్రీరామకృష్ణులు – వివిధ మతాలు
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నేను ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తాను. వైష్ణవుణ్ణి వైష్ణవ భావాన్నే అనుసరించమని చెబుతాను. శాక్తేయుని శాక్త భావంలోనే ఉండమంటాను. కాని ఒకటి – ‘నా మార్గమే సరైనది; తక్కినవన్నీ తప్పుదారులు, అసత్యం అని మాత్రం చెప్పబోకు’ అనీ చెబుతాను. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అందరూ వేర్వేరు మార్గాల ద్వారా ఒకే గమ్యాన్నే చేరుకుంటున్నారు. స్వధర్మాన్ని అనుసరించి, నిజమైన తపనతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవదనుభూతి కలుగుతుంది.
“విజయ్ అత్తగారు నాతో ఒకసారి, ‘సాకార రూపాన్ని పూజించే అవసరం ఏమిటి? నిరాకార సచ్చిదానందుని ప్రార్థిస్తేనే చాలు’ అని బలరామ్ ఇంటివారితో చెప్పమన్నది. ‘నే నెందుకు అలా చెప్పాలి? వాళ్ళూ దాని నెందుకు వినాలి?’ అని బదులు చెప్పాను.
“తల్లి చేపను వండుతుంది; ఒక పిల్లవాడికి చేప పలావ్ ఇస్తుంది. జీర్ణశక్తి సరిగ్గాలేని బిడ్డడికి చేప పులుసు చేసి పెడుతుంది. రుచి భేదాన్ని బట్టీ, అధికార భేదాన్ని బట్టీ ఒక వస్తువును పలురకాలుగా చేసిపెట్టాలి.”
‘మ’ : అవునండీ. దేశకాలపాత్రలకు అనుగుణంగా మార్గాలు వేరవుతున్నాయి. కాని ఏ మార్గం గుండా వెళ్ళినా శుద్ధమనస్సుతో నిజాయతీగల వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుని పొందవచ్చునని మీరు చెబుతుంటారు కదా!
30.10.2 ముఖర్జీల బంధువు హరితో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు గదిలో తమ ఆసనంలో కూర్చుని ఉన్నారు. ముఖర్జీ సోదరుల బంధువైన హరి, ‘మ’ మొదలైనవారు నేల మీద కూర్చుని ఉన్నారు. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి అక్కడ కూర్చున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు, “అతడి కళ్ళు సరిగ్గా లేవు. పిల్లికళ్ళు” అన్నారు.
శ్రీరామకృష్ణుల కోసం హరి హుక్కా తయారుచేసుకుని వచ్చాడు.
శ్రీరామకృష్ణులు (హుక్కాను చేత పుచ్చుకుని హరితో): ఏదీ నీ అరచేయి చాపు. ఈ లక్షణాలు శుభాన్ని సూచిస్తున్నాయి. చేతిని వదులుగా ఉంచు. (తమ చేత్తో హరి చేతిని పుచ్చుకుని బరువు చూసినట్లు తూచారు) పిల్లవాని మనస్తత్వం! ఇంకా ఏ కళంకమూ సోకలేదు.
(భక్తులతో) “నేను చేతిని చూసే మనిషి కపటుడా లేక గుణవంతుడా అని చెప్పగలను.
(హరితో) “అత్తగారి ఇంటికి వెళ్ళు. భార్యను కాస్త పలకరించు. కావాలనుకుంటే ఆమెతో కాస్త వినోదంగా గడుపు. (‘మ’ తో) నువ్వేమంటావు?” (‘మ’, తదితరులు నవ్వారు)
‘మ’ : స్వామీ, క్రొత్త కుండ పాడైపోతే దాన్లో పాలను ఉంచలేం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇంకా పాడవలేదని నీ కెలా తెలుసు?
ముఖర్జీ సోదరులైన మహేంద్ర ప్రియనాథ్లు ఎవరి క్రిందా ఉద్యోగం చేయలేదు. వారికి సొంతంగా పిండిమిల్లు ఉంది. ప్రియనాథ్ ఇదివరలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేవాడు. శ్రీరామకృష్ణులు హరితో, ముఖర్జీ సోదరులను గురించి మాట్లాడారు.
శ్రీరామకృష్ణులు: పెద్దవాడు మంచివాడు, నిష్కపటి. అంతేకదా!
హరి: అవునండీ.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): చిన్నవాడు ఎంతో పిసినారి వాడట. ఇక్కడకు రావటం మొదలు పెట్టాక ఎంతో మేలట. ‘మునుపంతా నాకు ఏమీ తెలియదు’ అని నాతో చెప్పాడతడు. (హరితో) వాళ్ళు దానం ధర్మం ఏదైనా చేస్తూ ఉన్నారా?
హరి: అట్లా ఏమీ తెలియరావటం లేదు. వీరికి పెద్దన్నగారు ఒకరు ఉండేవారు. ఇప్పుడాయన లేరు. ఆయన చాలా మంచివారు, దానధర్మాలు విరివిగా చేశారు.
30.10.3 శారీరక లక్షణాలు – శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు (‘మ’ ప్రభృతులతో): శారీరక లక్షణాలను చూసే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. కపట హృదయుని చేయి బరువుగా ఉంటుంది. చప్పిడి ముక్కు మంచి లక్షణం కాదు. శంభు ముక్కు అట్లే ఉండేది. అందుకే ఎంతో తెలివి ఉన్నప్పటికీ, అతడికి అంతగా సరళత్వం లేదు. పావురాయి వంటి ఛాతీకూడా మంచి లక్షణం కాదు. లావుగా ఉన్న ఎముకలు, బరువైన మోచేతులు, పిల్లికళ్ళు, పిల్లికళ్ళ వంటి పసుపుపచ్చ కళ్ళు – ఇవన్నీ అవలక్షణాలు.
“డోమ్‌ల* వంటి (మొద్దు) పెదిమలు గలవాళ్ళు నీచబుద్ధి కలిగి ఉంటారు. కొన్ని నెలలు విష్ణ్వాలయంలో తాత్కాలిక పూజారిగా ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తాకిన ఆహారాన్ని నేను తినలేకపోయేవాడను. ఒక రోజు హఠాత్తుగా, ‘అతడొక డోమ్’ అనేశాను. తరువాత అతడు నా వద్దకు వచ్చి, ‘అవును. మా ఇల్లు డోమ్‌లు వసించే ప్రాంతంలోనే ఉంది. నాకు డోమ్లవలె బుట్టలు అల్లటం తెలుసు’ అన్నాడు.
“ఇంకా విపరీతమైన అవలక్షణాలు ఉన్నాయి – ఒంటికన్ను, మెల్లకన్ను. ఒంటి కన్ను ఫరవాలేదు, మెల్లకన్ను మంచిది కాదు. వీళ్ళు దుర్జనులుగా, మోసగాళ్ళుగా ఉంటారు.
“మహేష్ న్యాయరత్నుని విద్యార్థి ఒకడు ఇక్కడకు వచ్చాడు. తననొక నాస్తికుడనని చెప్పుకున్నాడు. అతడు హృదయ్‌తో, ‘నేను నాస్తికుణ్ణి, నువ్వు ఆస్తికుడవు. నాతో వాదించు’ అన్నాడు. అప్పుడు అతణ్ణి నేను జాగ్రత్తగా పరికించాను. అతడివి పిల్లికళ్ళు!
“ఒక వ్యక్తి నడిచే తీరును చూసే అతడు సజ్జనుడో, దుర్మార్గుడో తెలుసుకోవచ్చు.”
శ్రీరామకృష్ణులు గదిలో నుంచి వచ్చి వసారాలో పచార్లు చేయసాగారు. ఆయనతో ‘మ’, బాబూరామ్లు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): ఒక వ్యక్తి ఇక్కడకు వచ్చాడు. అతడివి పిల్లికళ్ళు. అతడు నాతో, ‘మీకు జ్యోతిషం తెలుసా? నేను కష్టాల్లో ఉన్నాను’ అన్నాడు. అందుకు నేను, ‘తెలియదు. బారానగర్‌కు వెళ్ళు. అక్కడ జ్యోతిష్కులు ఉన్నారు’ అన్నాను.
బాబూరామ్, ‘మ’ లు నీలకంఠుని యాత్రా ప్రదర్శనను గురించి మాట్లాడుకుంటున్నారు. బాబూరామ్ నవీన్ సేన్ ఇంటి నుంచి తిరిగి వచ్చి గతరాత్రి దక్షిణేశ్వరంలో బస చేశాడు. నేటి ఉదయం దక్షిణేశ్వరంలోని నవీన్ నియోగి ఇంట్లో నీలకంఠుని యాత్రాప్రదర్శనను చూడటానికి శ్రీరామకృష్ణులతో కలసి వెళ్ళాడు.
30.10.4 ఏకాంత సాధన – ‘భగవదేచ్ఛ’ – నారాయణ్ గురించి ఆరాటం
శ్రీరామకృష్ణులు (‘మ’, బాబూరామ్లతో): ఏం మాట్లాడుకుంటున్నారు?
‘మ’, బాబూరామ్: నీలకంఠుని యాత్రా ప్రదర్శన గురించీ, ‘దేవి పాదపద్మాలపట్ల విశ్వాసం, నదీతీరంలో జీవితం’ అనే పాట గురించీ మాట్లాడుకుంటున్నాం.
మొగసాలలో పచార్లు చేస్తూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా ‘మ’ ను ప్రక్కకు తీసుకుపోయి, “భగవచ్చింతన ఎంత మేరకు పరులకు తెలియకుండా అనుష్ఠించగలిగితే అంత మంచిది” అని చెప్పారు. ఇలా అంటూ తక్షణమే అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు హాజ్రాతో, మాట్లాడసాగారు.
హాజ్రా: నీలకంఠుడు ఇక్కడకు వస్తానని మీతో చెప్పాడు కదా! అతణ్ణి పిలిపిస్తే మంచిది.
శ్రీరామకృష్ణులు: వద్దు. రాత్రంతా జాగరణే కదా. భగవదేచ్ఛ వలన తనంతట తానే వస్తే అది వేరే సంగతి.
శ్రీరామకృష్ణులు బాబూరామ్ను, నారాయణ్ ఇంటికి వెళ్ళి చూసిరమ్మన్నారు. నారాయణ్‌ను సాక్షాత్తూ నారాయణుడిగా ఆయన భావించారు. అందుకే అతణ్ణి చూడ అంత ఆరాటపడుతున్నారు. ‘నువ్వు ఒక ఆంగ్ల పాఠ్యపుస్తకాన్ని పుచ్చుకుని అతడి వద్దకు వెళ్ళు’ అని బాబూరామ్‌తో చెప్పారు.
30.11 ఏకాదశ పరిచ్ఛేదం నీలకంఠుడు, అతని బృందంతో భజనానందంలో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు అయి ఉంటుంది. నీలకంఠుడు తన బృందంలోని ఐదారు మందితో శ్రీరామకృష్ణుల గదికి వచ్చాడు. నీలకంఠునికి స్వాగతం పలుకుతున్నట్లుగా కాబోలు ఆయన తూర్పు ద్వారం వద్దకు వెళ్ళారు. నీలకంఠుడు తూర్పు వాకిలి గుండా లోపలికి వచ్చి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు! ఆయనకు వెనుక బాబూరామ్, ముందు ‘మ’ ఉన్నారు. నీలకంఠుడు, అతడి బృందంలోని వారందరూ ఆయన్ను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. మంచానికి ఉత్తరం వైపు ఆలయపు కోశాధికారియైన దీననాథ్ నిలబడి శ్రీరామకృష్ణులను చూస్తున్నాడు. కాసేపటికల్లా ఆలయ సిబ్బందితో గది నిండిపోయింది.
శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితి నుంచి కాస్త దిగివచ్చారు. లేచి నేల మీద చాప మీద కూర్చున్నారు. ఆయనకు ఎదురుగా నీలకంఠుడు, చుట్టూ భక్తులు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (పారవశ్యస్థితిలో): నేను బాగానే ఉన్నాను.
నీలకంఠుడు (ముకుళిత హస్తాలతో): నన్నూ బాగానే ఉండేట్లు చేయండి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మీరు బాగానే ఉన్నారు కదా. ‘క’ కు అకారం చేరుస్తే ‘కా’. మళ్ళీ ‘అ’ చేరిస్తే ఏం ప్రయోజనం? ‘కా’ తో మళ్ళీ ‘అ’ చేర్చినా అది ‘కా’ గానే ఉంటుంది. (అందరూ నవ్వారు)
నీలకంఠుడు: స్వామీ, సంసారంలో మునిగిపోయి ఉన్నాను.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): పలువురి మేలు కోసమే భగవంతుడు మిమ్మల్ని సంసారంలో ఉంచాడు. అష్టపాశాలున్నాయి. అన్నీ వదలిపోవు. లోక శిక్షణ నిమిత్తం ఆయన ఒకటి రెండు పాశాలను అలాగే ఉంచివేస్తాడు. మీరు యాత్ర ప్రదర్శిస్తున్నారు. మీ భక్తిని చూసి ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు! పైగా, అన్నిటిని వదిలివేస్తే వీళ్ళు (బృందంలో వారు) ఎక్కడకు పోతారు?
“భగవంతుడు మీ ద్వారా ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు. అది పూర్తయితే మీకు పని ఉండదు. గృహిణి అన్ని పనులు ముగించుకుని, అందరికీ భోజనం వడ్డించి, పనివారికీ భోజనం పెట్టిన పిదప స్నానానికి వెళుతుంది. అప్పుడు ఎంతగా కేకలు పెట్టి పిలిచినా సరే, ఆమె తిరిగి రాదు.”
నీలకంఠుడు: నన్ను ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు: కృష్ణుని ఎడబాటు భరించలేక యశోద పిచ్చిదానిలా రాధ వద్దకు వెళ్ళింది. రాధ ఆ సమయంలో ధ్యానమగ్నయై ఉంది. పారవశ్య స్థితిలో ఆమె యశోదతో, ‘మూల ప్రకృతియైన ఆద్యాశక్తినే నేను. నన్ను ఏదైనా వరం కోరుకో’ అన్నది. అందుకు యశోద, ‘నన్ను ఇంకేం వరం కోరుకోమంటావు. నన్ను ఇలా ఆశీర్వదిస్తే చాలు: మనోవాక్కాయాలచే కృష్ణుణ్ణే చింతనచేస్తూ ఆతడికి సేవ లొనరించాలి. చెవులతో ఆతడి నామగుణకీర్తనలు వినాలి. చేతులతో అతడికి, ఆతడి భక్తులకూ సేవ చేయాలి. కళ్ళతో ఆతడి దివ్యమంగళ రూపాన్ని, ఆతడి భక్తులను దర్శించాలి’ అని బదులు చెప్పింది.
“భగవన్నామం ఉచ్చరించగానే మీ కళ్ళు కన్నీటితో నిండితే ఆ పిదప దిగులు ఎందుకు? ఆయన పట్ల మీకు ప్రేమ జనించింది.
“అనేక విషయాలు తెలుసుకోవటం అజ్ఞానం; ఒక్క దానినే తెలుసుకోవటం, అంటే భగవంతుడొక్కడే సత్యం, ఆయనే సకల ప్రాణికోటిలోను విరాజిల్లుతున్నాడు అని తెలుసుకోవటం జ్ఞానం. ఆయనతో మాట్లాడటం విజ్ఞానం, అంటే భగవద్దర్శనానంతరం ఆయనను పలువిధాల ప్రేమించటం విజ్ఞానం.
“భగవంతుడు అద్వితీయుడు; అవాఙ్మానసగోచరుడు అని పేర్కొంటారు. లీల నుంచి నిత్యానికి మళ్ళీ నిత్యం నుంచి లీలకు పోవటం – దీని పేరే పరిపక్వ భక్తి.
“ ‘జగజ్జనని పాదాలపట్ల విశ్వాసం; నదీ తీరంలో జీవనం’ అనే ఆ మీ పాట చాలాబాగా ఉంది. సమస్తం భగవంతుని అనుగ్రహంపై ఆధారపడి ఉందనే విశ్వాసం ఉంటే, అది చాలు. కాని అనుగ్రహం అంటూ ఊరకే ఉండక ఆయన్ను ప్రార్థించాలి. ఏమీ చేయకుండా ఉండటంలో ప్రయోజనం లేదు. న్యాయవాది, న్యాయమూర్తితో తన వాదననంతా చెప్పేసి, చివరగా, ‘నేను చెప్పవలసినదంతా చెప్పి వేశాను. ఇక అంతా న్యాయమూర్తి చేతుల్లోనే ఉంది’ అంటాడు.”
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు నీలకంఠునితో, “ఉదయం మీరు అంతసేపు పాడారు. పిదప శ్రమను చూసుకోకుండా ఇక్కడకు వచ్చారు. కాని ఇక్కడ అంతా హానరరీ (ఉచితం)” అన్నారు.
నీలకంఠుడు: అలా ఎందుకు అంటున్నారు?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలుసు.
నీలకంఠుడు: అమూల్యమైన రత్నాన్ని తీసుకొనిపోతాను.
శ్రీరామకృష్ణులు: ఆ అమూల్య రత్నం మీ వద్దే ఉంది. ‘కా’ తో ‘అ’ చేరిస్తే ఏమవుతుంది? లేకుంటే మీ పాటలు నాకు నచ్చటానికి కారణం ఏమిటి? రాంప్రసాదు మహాత్ముడు, అందుకే ఆయన పాటలు నచ్చాయి.
“సామాన్య జీవుని మానుష్ అంటారు. ఎవరిలో చైతన్యం జాగృతమైనదో అతణ్ణి మన్హోశ్ అంటారు. మీరు మన్హోశ్* .
“మీ పాట ఉంటుందని విని, అక్కడకు రావాలని ముందే నిర్ణయించుకున్నాను. అప్పుడు నియోగి నన్ను ఆహ్వానింప వచ్చాడు.”
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నీలకంఠునితో, “జగజ్జననిపై పాడండి” అన్నారు. నీలకంఠుడు ప్రక్కవాద్యాలతో పాడ నారంభించాడు.
జగజ్జనని పాదాలపట్ల విశ్వాసం, నదీ తీరంలో జీవనం…
మహిష మర్దని….
ఈ పాటలు వింటూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి సమాధిమగ్నులయ్యారు. నీలకంఠుడు పాడసాగాడు, శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంలో నృత్యం చేయసాగారు. నీలకంఠుడూ, భక్తులూ ఆయన చుట్టూ తిరుగుతూ పాడుతూ, నృత్యం చేశారు. ‘శివ శివ’ అనే పాటకూ శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి నృత్యం చేశారు.
పాటలు ముగిశాయి. అప్పుడు శ్రీరామకృష్ణులు నీలకంఠునితో, “మీరు కలకత్తాలో పాడిన పాటను వినగోరుతున్నాను” అన్నారు.
‘మ’ : గౌరాంగుడి గురించిన పాటా?
శ్రీరామకృష్ణులు: అవునవును.
నీలకంఠుడు ఆ పాటను పాడాడు. శ్రీరామకృష్ణులూ జతకలపి పాడుతూ నీలకంఠుడు తదితర భక్తులతో కలిసి నృత్యం చేశారు. ఆ అద్భుత నృత్యాన్ని చూసిన వారెవరూ ఎన్నడూ దాన్ని మరిచిపోలేరు. గది భక్తులతో క్రిక్కిరిసి పోయింది. అందరూ దాదాపు దివ్యోన్మాద స్థితిలోనే ఉన్నారు. ఆ గది శ్రీవాసుని గృహంలా కానవచ్చింది.
మనోమోహన్ భావపారవశ్య స్థితిలో మునిగిపోయాడు. అతడి ఇంటి స్త్రీ జనం కొందరు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఉత్తరం వైపు మొగశాలలో ఉండి ఈ పాటను వింటూ, అద్భుత నృత్యాన్ని చూస్తూ ఉన్నారు. వారిలోను ఒకరికి భావపారవశ్య స్థితి కలిగింది. మనోమోహన్ శ్రీరామకృష్ణుల భక్తుడు. రాఖాల్ వివాహం చేసుకున్నది ఇతడి సోదరినే.
శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు:
అరుగో ఇద్దరు సోదరులు
హరిని బాడుచు అశ్రులు గార్తురు….
పాడుతూనే నీలకంఠుడు తదితర భక్తులతో నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో కొన్ని చరణాలు జోడించారు.
అరుగో ఇద్దరు సోదరులు
రాధా ప్రేమోన్మత్తులై వచ్చిరోయి
బిగ్గరగా వినవస్తున్న ఈ సంకీర్తన విని నాలుగు వైపుల జనం మూగారు. దక్షిణ, ఉత్తర, పశ్చిమ వైపు గల అర్ధచంద్రాకార వసారాలలో జనం క్రిక్కిరిసి పోయి ఉన్నారు. గంగలో పడవలో ప్రయాణిస్తూ ఉన్నవారు తమ చెవులబడ్డ ఈ సుమధుర సంకీర్తనంతో ఆకర్షితులైనారు.
పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు జగజ్జననికి నమస్కరించి, “భాగవతం – భక్తుడు – భగవాన్, జ్ఞానులకు ప్రణామం, యోగులకు ప్రణామం, భక్తులకు నమస్కారం” అన్నారు.
శ్రీరామకృష్ణులు, నీలకంఠుడు మొదలైన భక్తులతో పశ్చిమం వైపు ఉన్న అర్ధచంద్రాకార మొగశాలలోకి వెళ్ళి కూర్చున్నారు. సాయంత్రం గడచిపోయింది. పౌర్ణమి మర్నాడు. అంతటా వెన్నెల వ్యాపించి ఉంది. శ్రీరామకృష్ణులు నీలకంఠునితో ఆనందంగా మాట్లాడసాగారు.
30.11.1 శ్రీరామకృష్ణులు ఎవరు? – “నా ‘నేను’ ను వెదికినా దొరకలేదు!”
నీలకంఠుడు: మీరు సాక్షాత్తూ చైతన్యులు.
శ్రీరామకృష్ణులు: అదేం మాట! నేను అందరికీ దాసానుదాసుడను. గంగకు చెందినది అల, ఎన్నటికీ అలకు చెందదు గంగ.
నీలకంఠుడు: మీరు ఏం చెప్పినా సరే, మిమ్మల్ని మేం అట్లే గాంచుతున్నాం.
శ్రీరామకృష్ణులు (ఒకింత పారవశ్యంలో, అనురాగం పెల్లుబుకగా): నాయనా, నా ‘నేను’ ను వెదకి వెదకి చూశాను. కాని అది కనిపించలేదు. ‘రామా, కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణుడవు నేను అంశను అనీ, నువ్వు ప్రభువ్వు నేను సేవకుడను అనీ తలుస్తాను. కాని తత్త్వజ్ఞానం కలిగినప్పుడు “నువ్వే నేను, నేనే నువ్వు” గా గాంచుతూంటాను’ అన్నాడు హనుమంతుడు.
నీలకంఠుడు: నేను చెప్పటానికి ఏం ఉంది? మమ్మల్ని అనుగ్రహించండి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మీరు ఎందరినో సంసార సాగరం నుండి తరింప చేస్తున్నారు. మీ పాట విని ఎందరికో చైతన్యం జాగృతమైంది.
నీలకంఠుడు: తరింప చేస్తూ ఉన్నానంటున్నారు. కాని నేను మునిగి పోకుండా ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): మునగాలనుకొంటే అమృత సాగరంలో మునగండి!
నీలకంఠుని రాక శ్రీరామకృష్ణులకు ఎంతో ఆనందదాయకమైంది! అతడితో ఇలా అన్నారు: “అనేక సాధనలు చేయడం మూలంగానే జనులు మిమ్మల్ని దర్శించగలరు!” ఒక పాట వినండి –
పాట భావం: సర్వమంగళకారియైన గౌరీమాత నా ఇంటికి అరుదెంచి నప్పుడు ఎంత వైభవంగా చండీపారాయణం జరుగుతుంది! ఆ శుభసందర్భాన ఎంతమంది యోగులు, జటాధారులు, దండి సాధువులు విచ్చేస్తారు!
చండీదేవి ఇంటికి అరుదెంచితే ఎంత మంది యోగులు, జటాధారులు వస్తారు!
శ్రీరామకృష్ణులు నవ్వారు. కాసేపయ్యాక ‘మ’, బాబూరాం మొదలైన భక్తులను చూస్తూ ఇలా అన్నారు: “వీళ్ళే గాయకులు, వీరికి నేను పాట పాడి చూపుతున్నానే! నాకు ఒకటే నవ్వు వస్తోంది.”
నీలకంఠుడు: మేం ఏ పాటలు పాడుతూ తిరుగాడుతున్నామో, ఆ పాటలకు నేడు తగిన బహుమానం లభించింది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కొన్ని వస్తువులను కొనేటప్పుడు కొసరిస్తారు. మీరు నవీన్ ఇంట్లో పాడారు. ఇక్కడ కొసరు ఇచ్చారు. (అందరూ నవ్వారు)