2.1 ప్రథమ పరిచ్ఛేదం బలరామ్ ఇంట్లో భక్తులతో ప్రేమోన్మాద నృత్యం
శనివారం, మార్చ్ 11, 1882
దోలాపూర్ణిమ (హోలీ పండుగ) గడచిన ఏడు రోజుల తరువాతి సంఘటన. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో, లోగడే నిర్ణయించుకున్నట్లు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరామ్ బోస్ ఇంటికి ఏతెంచారు. ఆయనతోబాటు రామ్, మనోమోహన్, రాఖాల్ (కాలాంతరంలో స్వామి బ్రహ్మానంద), నిత్యగోపాల్ తదితర భక్తులు వచ్చి ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం దక్షిణేశ్వరంలో ‘నేను కలకత్తాలోని బలరాం ఇంటికి వెళతాను. నుమ్వా అక్కడకు రా’ అన్న శ్రీరామకృష్ణుల మాట ప్రకారం ‘మ’ అక్కడకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు, భక్తులు దైవోన్మత్తులై హరినామ సంకీర్తనలతో నృత్యం చేశారు. భావావస్థనొందిన కారణంగా నిత్యగోపాలుడి వక్షం రక్తవర్ణం దాల్చింది. రాఖాల్ పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయి, భావావస్థలో నేలమీద పడిపోయాడు. శ్రీరామకృష్ణులు రాఖాల్ వక్షం మీద చేత్తో నిమురుతూ “శాంతించు, శాంతించు” అంటున్నారు. రాఖాల్కు భావావస్థ కలగటం ఇది రెండవసారి. తన తండ్రితో అతడు కలకత్తాలో నివసించేవాడు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చేవాడు. ఆ సమయంలో శ్యాంపుకూర్లోని విద్యాసాగర్ పాఠశాలలో కొద్దికాలం చదువుకొన్నాడు. అందరూ కూర్చున్న తరువాత ‘మ’ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు.
సంకీర్తన ముగిశాక భక్తులు వసారాలో కూర్చుని ప్రసాదం స్వీకరించారు. బలరామ్ బోసు వినమ్రుడై, ఒక సేవకుడి మాదిరి అక్కడ నిలబడ్డాడు. అతణ్ణి ఆ ఇంటి యజమాని అని ఎవరూ అనుకోరు. భక్తులకు ‘మ’ ఇంకా అపరిచితుడే. నరేంద్రుడితో మాత్రమే అతడికి దక్షిణేశ్వరంలో పరిచయమైంది. తక్కిన భక్తులతో అతడికి ఇంకా పరిచయం కాలేదు.
2.1.1 సర్వధర్మ సమన్వయం
ఇది జరిగిన (అంటే, మార్చ్ 11 తరువాత) కొన్నిరోజులకు ‘మ’ శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో కలుసుకున్నాడు. ‘మ’ వచ్చినప్పుడు సమయం సాయంత్రం నాలుగు, ఐదు గంటల మధ్య అయివుంటుంది. శ్రీరామకృష్ణులు, ‘మ’ శివాలయాల మెట్ల మీద కూర్చున్నారు. రాధాకాంత ఆలయంవైపు దృక్కులు పరపుతూ శ్రీరామకృష్ణులు భావావస్థనొందారు.
కొద్దిసేపటి తరువాత శ్రీరామకృష్ణులు తమ గదిలో నేలమీద పరచిన పడక మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. దక్షిణేశ్వరం నుండి హృదయ్‌ను పంపివేసినప్పటి నుండీ శ్రీరామకృష్ణుల సేవ నిమిత్తం ఎవరూ లేకున్నారు. అందుచేత ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
శ్రీరామకృష్ణులు జగజ్జననితో సంభాషిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు: “అమ్మా! ప్రతి ఒక్కరూ ‘నా గడియారమే సరైనది’ అంటూ ఉంటారు. క్రైస్తవులు, బ్రహ్మసమాజస్థులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ‘నా మత మొక్కటే సత్యం’ అంటారు. కాని అమ్మా! ఎవరి గడియారమూ సరైనది కాదు. నిన్నెవరు సరిగా అర్థం చేసుకోగలరు? వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే, నీ కృపచేత ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను చేరగలరు. అమ్మా! క్రైస్తవులు తమ చర్చ్‌లలో నిన్నెలా ఆరాధిస్తారో ఒకసారి నాకు దయచేసి చూపించు. కాని అమ్మా, నేను చర్చ్‌లోకి వెళితే జనం ఏమనుకొంటారో? వారు ఏమైనా ఆర్భాటం చేస్తారేమో! తిరిగి నన్ను కాళికాలయంలోకి అనుమతిస్తారో, లేదో? సరేలే, క్రైస్తవుల ఆరాధనను వాకిలి బైటనుండి చూపించు.”
2.1.2 భక్తబృందంతో భజనానందంలో – గోపగోపికల ప్రేమ – ‘ప్రేమ సుర’
మరో రోజున (మార్చి నెలలోనే) శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద ఆనందమయులై కూర్చుని ఉన్నారు. ఆయన వదనంలో చిరుదరహాస చంద్రికలు వెల్లివిరిసి ఉన్నాయి.
కాళీకృష్ణభట్టాచార్యుడనే మిత్రుణ్ణి వెంటబెట్టుకొని ‘మ’ ఆ గదిలోకి వచ్చాడు. అతడికి ‘మ’ తనను ఎక్కడకు తీసుకెళుతున్నాడో తెలియదు. అతడితో ‘మ’ చెప్పింది ఇదే: “కల్లు అంగడిని చూడాలనుకొంటే నాతో రా. అక్కడ బానెడు కల్లు చూస్తావు.” ‘మ’ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఈ సంగతి చెప్పగా, ఆయన నవ్వి ఇలా అన్నారు: “భజనానందం, బ్రహ్మానందం – ఈ ఆనందమే సుర; ఇది ప్రేమ సుర. మానవజీవిత లక్ష్యం భగవంతుని పట్ల ప్రేమను అలవరచుకోవటమే, ఆయన్ను ప్రేమించటమే. భక్తియే సారం. జ్ఞాన విచారణ ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవటం ఎంతో కష్టం.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడనారంభించారు:
ఎరుగగ తరమె ఏరికినైనా
తల్లి కాళి నిజతత్వ మించుక?
షడ్దర్శనములె శక్తిహీనములు
తల్లి విషయము తెలియచేయుటకు॥ ఎ ॥
అంతర మందున ఆత్మానందము
ఆస్వాదించెడు ఆత్మయోగికి
ఆమెయె వెల్గును అంతరాత్మయై
సర్వశాస్త్రములు సన్నుతిజేయును॥ ఎ ॥
ఎల్లప్రాణుల ఉల్లమునందున
ఆమె వసించును ఐచ్ఛికముగనే
ఆమె గర్భమున అమరి ఉన్నవి
అండాండంబులు బ్రహ్మాండంబులు॥ ఎ ॥
అంత విశాలము ఆమె గర్భము
నీవు దానిని అవలోకింతువే?
మూలాధార సహస్రారముల
ఆమెను యోగి ధ్యానము సేయును॥ ఎ ॥
ఆమె ఎట్టిదో అసలు ఎవ్వరో
శివుడుగాక మరి ఎవరు చూచెదరు
పద్మవనములో పతి సన్నిధిలో
హంసి హంసతో ఆటలాడును॥ ఎ ॥
అమ్మ నెరుగ నెవడాశించినను
రవ్వ చేయును రామప్రసాదు
ఆమె నెరుగవలె ననుచు తలచుట
నవ్వులాట సాగరము నీదుట॥ ఎ ॥
మది ఎరిగినను హృది ఎరుగక
అందమైన యా చందమామను
పట్టుకొనుటకై కొట్టుకొనెడు మరు
గుజ్జు వానివలె కోరుచున్నది॥ ఎ ॥
శ్రీరామకృష్ణులు తిరిగి ఇలా కొనసాగించారు: “భగవంతుణ్ణి ప్రేమించటమే మానవ జీవిత ఉద్దేశం; బృందావనంలోని గోపగోపికలు, ఆలకాపరులు శ్రీకృష్ణునికోసం వ్యక్తపరచిన ప్రేమలాంటిది. శ్రీకృష్ణుడు మధురానగరానికి వెళ్లిపోయినప్పుడు గోపికలు శ్రీకృష్ణుని ఎడబాటుకు విలపిస్తూ సంచరించారు.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చూపును పైకి సారిస్తూ పాడసాగారు:
లేగదూడ నెత్తుకొని
చెట్టుకొమ్మ పట్టుకొని
ఉన్న గొల్లపిల్లవాని
ఇప్పు డేను చూచినాను॥ లే ॥
‘అన్నరార’ కన్నయ్యా!
అనుచు వాడు అరచెగాని
‘క’ అన్న అక్షరంబు
కన్న నోట మాటరాదు॥ లే ॥
అన్నా ఎక్కడున్నావురా?
అనుచు ఆర్తితోడ నేడ్వ
అశ్రుపూరితంబు లగుచు
అతని కనులు మూతపడియె॥ లే ॥
శ్రీరామకృష్ణుల ప్రేమ పూరితమైన ఈ పాటను విని ‘మ’ కళ్ళు చెమ్మగిల్లాయి.
2.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్యామ్పుకూర్లో ప్రాణకృష్ణ ఇంట్లో శ్రీరామకృష్ణులు
ఆదివారం, ఏప్రెల్ 9, 1882
శ్రీరామకృష్ణులు కలకత్తాలోని శ్యామ్పుకూర్కు వచ్చారు. అక్కడ ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ్ ఇంటి రెండవ అంతస్తులోని అతిథుల గదిలో భక్తబృందం నడుమ కూర్చుని ఉన్నారు. అంతకు మునుపే భక్తులతో ప్రసాదం ఆరగించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒకటి లేక రెండు గంటలు అయి ఉంటుంది. కెప్టన్ ఆ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఒకింత విశ్రాంతి తీసుకున్నాక కెప్టన్ ఇంటికి వెళ్ళి అతణ్ణి కలుసుకొని, అక్కడనుంచి కమల కుటీరానికి వెళ్ళి కేశవసేన్ను చూడాలనుకుంటున్నారు శ్రీరామకృష్ణులు. ప్రాణకృష్ణ, రామ్, మనోమోహన్, కేదార్, సురేంద్ర, గిరీంద్ర (సురేంద్ర సోదరుడు), రాఖాల్, బలరామ్, ‘మ’ మొదలైనవారు అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో వసిస్తూ ఉన్న పెద్ద మనుష్యులు, మరికొందరు వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోల అందరూ ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు: భగవంతుడు – ఆయన ఐశ్వర్యం. ఈ జగత్తు ఆయన ఐశ్వర్యం. కాని జనం ఐశ్వర్యాన్ని గాంచి దాన్లో మైమరచిపోతారే గాని ఈ ఐశ్వర్యం ఎవరిదో ఆయన్ను వెతుకరు. అందరూ కామినీ కాంచనాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అయితే వారికి లభించేవి అపరిమిత దుఃఖం, అశాంతి మాత్రమే. ఈ సంసారం విశాలాక్షిలో* ఏర్పడే సుడిగుండంలాంటిది. దాన్లో ఏదైనా పడవ కనుక చిక్కుకుంటే, ఇక దానిని రక్షింప ఎవరి తరమూ కాదు. ఇంకా చెప్పుకోవాలంటే, ఈ సంసారం ఒక ముళ్ళకంప లాంటిది. ఒక ముల్లునుండి విడివడగానే మరో ముల్లు చిక్కుపడుతుంది. పద్మమ్యాహంలో ఒకసారి చిక్కుకున్నట్లయితే, బయటపడటం కష్టం. మనిషి సంసార దావానలంలో దగ్ధమైపోతాడు.
ఒక భక్తుడు: మహాశయా, మరి మార్గం ఏమిటి?
2.2.1 సాధుసాంగత్యం, ప్రార్థనలే మార్గం
శ్రీరామకృష్ణులు: సాధుసాంగత్యం, ప్రార్థన – ఇవే మార్గాలు.
“వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేవు. కేవలం ఒక్క రోజు మాత్రమే సాధుసాంగత్యం చేస్తే చాలదు? సర్వదా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రోగం దీర్ఘకాలికమైనది కాబట్టి. నిరంతరం వైద్యుడితో ఉంటేనే తప్ప నాడీజ్ఞానం కలుగదు. అతడి చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఏది కఫనాడి, ఏది పిత్తనాడి అని తెలియవస్తుంది.”
భక్తుడు: సాధుసాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భగవంతుడి పట్ల అనురాగం, ప్రేమ కలుగుతాయి. వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేం. సాధుసాంగత్యం చేయగా చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవిల్లాడిపోతాయి. ఇది ఎలాంటిదంటే – కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్థుడైతే అతడికి ఎలా నయమౌతుందా అని ఆ ఇంటి యజమాని మనస్సు కొట్టుమిట్టాడుతూంటుంది గదా – అలాగన్న మాట; లేక భగవంతుడికోసం ఎలా ఆరాటపడాలంటే: తన ఉద్యోగం పోగొట్టుకొన్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు కదా! ‘ఉద్యోగం ఖాళీ లేదు’ అని అతణ్ణి తిప్పి పంపితే, మరునాడు అక్కడికే వెళ్ళి ‘ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా?’ అంటూ వ్యాకులతతో అడుగుతాడు.
“మరో మార్గం ఉంది – వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించటం. ఆయన మన సొంతం. మనం ఆయనతో ఇలా చెప్పుకోవాలి: “ఓ భగవాన్! నీ స్వరూపం ఎలాంటిది? నాకు దర్శనమివ్వు. దర్శనమిచ్చి తీరవలసిందే. లేకపోతే నన్నెందుకు సృష్టించావు?”
“కొందరు సిక్కు భక్తులు ‘భగవంతుడు దయామయుడు’ అని నాతో చెప్పారు. నేనిలా చెప్పాను: ‘మనం ఆయన్ను దయామయుడని ఎందుకు పేర్కొనాలి? ఆయనే మనలను సృష్టించాడు. మనపట్ల ఆయన దయ వహించటంలో ఆశ్చర్యం ఏముంది? తలిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్దచెయ్యటం సహజం. దాన్ని నువ్వు దయకింద పరిగణిస్తావా? అది వారి కర్తవ్యమే!” కాబట్టి ఆయన్ను గట్టిగా పట్టుపట్టి ప్రార్థించాలి. ఆయన మన తల్లి, తండ్రి కాదా మరి?
“కుమారుడు తిండి తిప్పలు మాని ఆస్తిలో భాగాన్ని కోరితే, న్యాయమైన కాలగడువుకు మూడేళ్ల ముందే తల్లితండ్రులు ఆస్తిని అతడికి పంచియిస్తారు. పిల్లవాడు “అమ్మా, నీ కాళ్లు పట్టుకొంటాను, నాకు డబ్బు ఇవ్వు” అంటూ మళ్ళీ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాకులత చూసి గత్యంతరం లేక డబ్బు ఇచ్చేస్తుంది.
“సాధుసాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది. అది సదసద్విచారాన్ని పెంపొందిస్తుంది. భగవంతుడొక్కడే సత్యం, అంటే నిత్యం; జగత్తు అసత్యం, అంటే అనిత్యం. ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తుకేసి మరలుతుందో తక్షణమే విచారణ చేయాలి. పొరుగువారి తోటలోని అరటి చెట్టును తినటానికి ఏనుగు తన తొండాన్ని చాపగానే మావటివాడు అంకుశంతో పోటు పొడుస్తాడు.” (BG 6.26)
ఒక పొరుగింటి వ్యక్తి: మహాశయా! పాప భావనలు ఎందుకు జనిస్తాయి?
శ్రీరామకృష్ణులు: భగవంతుడి సృష్టిలో అన్ని రకాలవారూ ఉన్నారు. సాధువులనూ ఆయనే సృష్టించాడు, దుష్టులనూ ఆయనే సృష్టించాడు. సద్బుద్ధిని ఇచ్చేదీ ఆయనే, దుర్బుద్ధిని ఇచ్చేదీ ఆయనే.
2.2.2 పాపం చేయడంలో బాధ్యత – కర్మఫలం
పొరుగింటి వ్యక్తి: అలాటి పక్షంలో పాపం చేయటంలో మా బాధ్యత ఉండదా?
శ్రీరామకృష్ణులు: పాపం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించే తీరాలి. ఇది భగవంతుడి నియమం. మిరపకాయ నమిలితే నాలుక మంటపుట్టదా? తన యౌవనంలో మథుర్బాబు అడ్డదిడ్డంగా జీవితాన్ని గడిపాడు. అందువల్లే తన చివరి రోజుల్లో నానారోగాలతో బాధపడ్డాడు.
“యౌవనంలో ఈ యథార్థాన్ని గ్రహించలేకపోవచ్చు. కాళికాలయం వంటశాలలో కట్టెలు మండేటప్పుడు గాడిపొయ్యి వంక చూసేవాణ్ణి. చెమ్మవున్న కట్టెలు మొదట్లో చక్కగా మండేవి. వాటిలో ఇంత తడి ఉన్నట్లు అప్పుడు తెలియనే తెలియదు. కాని కట్టె బాగా కాలిన తరువాత, కట్టెలోని తడి అంతా ఒక చివరికి చేరుకొంటుంది. చివరికి నీరు ఎగచిమ్మి మంటను ఆర్పివేస్తుంది. కాబట్టి కామక్రోధ లోభాలు – ఇత్యాదుల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. హనుమంతుడి ఉదాహరణ తీసుకోండి. కోపోద్రేకంలో లంకను తగులబెట్టాడు. దాని తరువాతనే అశోకవనంలో సీత ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని కంగారు పడిపోయాడు.”
పొరుగింటి వ్యక్తి: అలా అయితే భగవంతుడు దుష్టులను ఎందుకు సృష్టించినట్లు?
శ్రీరామకృష్ణులు: ఆయన ఇచ్ఛ, ఆయన లీల. ఆయన మాయలో విద్యామాయ, అవిద్యామాయ – రెండూ ఉన్నాయి. చీకటి ప్రయోజనం కూడా ఉంది. చీకటి, వెలుగు యొక్క మహిమను అధికతరం చేస్తుంది. కామం, క్రోధం, లోభం ఇత్యాదులు నిస్సంశయంగా దోషాలే. అలాంటప్పుడు భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు? మహాత్ములను సృష్టించే నిమిత్తం. ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. జితేంద్రియుడికి సాధ్యం కానిదేముంది? భగవత్ కృపతో అతడు ఆయన్ను ప్రాప్తించుకోగలడు. మరో విషయాన్నీ గమనించాలి. కామం ద్వారానే భగవంతుని సృష్టి లీల కొనసాగుతోంది.
“దుష్టులు ఉండటం కూడా అవసరమే. ఒక గ్రామంలో జనులు తిరుగుబాటు చేశారు. వారిని అణచటానికి గోలోక్ చౌధురిని పంపవలసి వచ్చింది. అతడి పేరు వింటేనే జనం గడగడ వణకిపోతారు. అంత చండశాసనమైనది అతడి నిర్వాహకం.
“అన్ని రకాల వ్యక్తులూ ఉండాలి. సీత, రాముణ్ణి చూసి, ‘నాథా! అయోధ్యలో అన్నీ భవనాలే అయి ఉంటే బాగుంటుంది. అనేక ఇళ్లు శిథిలావస్థలో పాడుబడి కనబడుతున్నాయి’ అని చెప్పింది. అందుకు రాముడు, ‘సీతా! అన్ని ఇళ్లూ సుందరంగా ఉంటే తాపీపనివారి జీవనం ఏమౌతుంది?’ అన్నాడు. (అందరూ నవ్వారు)
భగవంతుడు నానావిధాలైన వాటిని సృజించాడు. మంచిచెట్టు, విషపుచెట్టు, వాటితోపాటు కలుపు మొక్కలు సృష్టించాడు. ప్రాణులలో మంచివి, క్రూరమైనవి అన్నీ ఉన్నాయి. పులి, సింహం, పాము మొదలైనవి ఉన్నాయి.”
2.2.3 సంసారులకూ భగవల్లాభం కలుగుతుంది – అందరూ ముక్తులవుతారు
పొరుగింటి వ్యక్తి: మహాశయా! సంసారంలో ఉంటూనే భగవంతుని పొందలేమా?
శ్రీరామకృష్ణులు: కచ్చితంగా పొందవచ్చు. కాని ఇంతకు మునుపు చెప్పినట్లు సాధుసాంగత్యం, నిరంతర ప్రార్థన చేయాలి. భగవంతుడి కోసం విలపించాలి. మనోమాలిన్యాలు సంపూర్ణంగా ప్రక్షాళనమైన తరువాత ఆయన దర్శనం కలుగుతుంది. బురదతో కప్పబడ్డ సూది వంటిది మనస్సు, భగవంతుడు అయస్కాంతం. బురద తొలగించకుంటే సూది, అయస్కాంతంచే ఆకర్షింపబడదు. సూదిని కడిగితే కప్పి ఉన్న బురద తొలగిపోతుంది. అంటే వ్యాకులతతో విలపించితే కామ క్రోధ లోభాలు, పాపబుద్ధి, విషయబుద్ధి మనస్సులో నుంచి వైదొలగుతాయి. బురద తొలగిపోతే అయస్కాంతం సూదిని ఆకర్షిస్తుంది. అంటే భగవద్దర్శనం అవుతుంది. చిత్తశుద్ధి కలిగితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. జ్వరం వచ్చింది, ఒంట్లో అధికంగా నీరు చేరుకొంది. ఇందుకు కేవలం క్వినైన్ మాత్రలచే ఏం ప్రయోజనం ఉంటుంది? సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ఎందుకు పొందకూడదు? అందుకే సాధుసాంగత్యం, విలపిస్తూ ప్రార్థించటం, మధ్యమధ్యలో ఏకాంతవాసం చేయటం మొదలైనవి ఉండాలి. కంచె కనుక లేకుంటే ఫుట్–పాత్(కాలిబాట)లోని మొక్కలను గొడ్లు మేసేస్తాయి.
పొరుగింటి వ్యక్తి: అలా ఐతే గృహస్థులకు కూడా భగవద్దర్శనం కలుగుతుందన్నమాట.
శ్రీరామకృష్ణులు: తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది. కాని గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి. పెడత్రోవ పడితే తిరిగి రావటం చాలాకష్టం. ముక్తి కలగటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఈ జన్మలో దక్కక పోవచ్చునేమో! బహుశా అనేక జన్మల తరువాత దక్కవచ్చు. జనకాదులు సంసారంలో ఉండీ బహుకార్యాలు నిర్వర్తించారు. మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని పనులు చేసేవారు. అదెలాగంటే, నర్తకి తల మీద పాత్ర ఉంచుకొని నాట్యం చేసే విధంగా. పశ్చిమ ప్రాంతాల (ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్)లోని స్త్ర్తీలను మీరు చూడలేదా! వారు తల మీద నీటి బిందెలను ఉంచుకొని పరాచికాలాడుకుంటూ, నవ్వుకుంటూ పోతుంటారు.
పొరుగింటి వ్యక్తి: గురువు ఉపదేశాలను గురించి ప్రస్తావించారు కదా! గురువు ఎలా లభిస్తాడు?
శ్రీరామకృష్ణులు: ప్రతి ఒక్కరూ గురువులు కాలేరు సుమా! ఒక పెద్ద కలప దుంగ నీటి మీద తేలుతూ, అనేక జంతువులను కూడా మోసుకు పోతుంది. కాని ఒక చిన్న కలపముక్క మీద ఎవరైనా కూర్చుంటే అది మునిగిపోతుంది, అతణ్ణీ ముంచేస్తుంది. కాబట్టి ప్రతి యుగంలోను భగవంతుడే లోకులకు ఉపదేశించే నిమిత్తం గురువు రూపంలో అవతరిస్తూంటాడు. సచ్చిదానందుడే గురువు.
“ఏది జ్ఞానం? ‘నేను’ అనే ఈ అహం ప్రవృత్తి ఏమిటి? ‘భగవంతుడొక్కడే కర్త, తక్కిన వారంతా అకర్తలే’ – ఇదే జ్ఞానం. నేను కర్తను కాదు, నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని. అందుకే నేను అమ్మ (జగజ్జనని)తో ఇలా అంటాను: “అమ్మా! నేను యంత్రాన్ని, నువ్వు యంత్రాన్ని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను బండిని, నువ్వు బండిని నడిపేదానవు. నువ్వు నన్ను ఎలా కదిలిస్తే అలా కదలుతాను. ఎలా చేయిస్తే అలా చేస్తాను. ఎలా పలికిస్తే అలా పలుకుతాను. ‘నేను కాదు, నేను కాదు. నువ్వే, నువ్వే’.”
తరువాత శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణుని ఇంటినుండి కెప్టన్ విశ్వనాథ్ ఇంటికి, అక్కణ్ణుంచి కేశవసేన్ కమల కుటీరానికి వెళ్లారు.
2.3 తృతీయ పరిచ్ఛేదం కమలకుటీరంలో శ్రీరామకృష్ణులు – కేశవ్ సేన్
అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంట్లో ముందు గదిలో కూర్చుని ఉన్నారు. రామ్, మనోమోహన్, సురేంద్ర, ‘మ’ ప్రభృతులతోపాటు ప్రతాప్ మజుందార్, త్రైలోక్యుడుకూడా అక్కడ ఉన్నారు. కేశవ్ బైటికి వెళ్ళటానికి దుస్తులు ధరించి ఉన్నాడు. అస్వస్థుడైన అతడి మిత్రుడు కాళీనాథ్ బోసును చూడబోతున్నాడు. వీరి రాకను తెలుపగానే ప్రస్తుతం ఆ ప్రయాణాన్ని మానుకున్నాడు.
2.3.1 కేశవచంద్రసేన్తో శ్రీరామకృష్ణుల మైత్రి – జగజ్జననికి ప్రార్థన
శ్రీరామకృష్ణులు కేశవ్‌తో ఇలా అన్నారు: “మీకు ఎన్నో వ్యాపకాలు. దీనికి తోడు ఒక పత్రిక సంపాదకత్వం కూడా. దక్షిణేశ్వరానికి రావటానికి మీకు తీరిక దొరకదని మిమ్మల్ని చూడ్డానికి నేనే వచ్చాను. మీరు జబ్బుపడ్డారని విని, మీకు నయం కావాలని అమ్మకు కొబ్బరి బోండాం, చక్కెర* మొక్కుకున్నాను. ఆమెతో ‘అమ్మా! కేశవ్‌కి ఏదైనా జరిగితే, కలకత్తాకు వెళ్లినప్పుడు నేను ఎవరితో మాట్లాడగలను’ అన్నాను.”
తరువాత శ్రీరామకృష్ణులు ప్రతాప్ తదితర బ్రహ్మసమాజస్థులతో మాట్లాడారు. సమీపంలో కూర్చుని ఉన్న ‘మ’ ను చూపిస్తూ శ్రీరామకృష్ణులు కేశవ్‌తో ఇలా అన్నారు: “ఇతడు దక్షిణేశ్వరానికి ఎందుకు రావటం లేదో మీరు కాస్త అడగండి. పైగా భార్యాబిడ్డలపట్ల బంధం లేదని అనేకసార్లు అంటూ ఉంటాడు.”
గత నెల రోజులుగా ‘మ’, శ్రీరామకృష్ణుల వద్దకు రాకపోకలు సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అక్కడకు వెళ్ళక పోవటాన్ని ఆయన సుతిమెత్తగా ఎత్తి పొడుస్తున్నారు. తన రాకకు ఆలస్యమైతే జాబు రాయమని ఆయన ‘మ’ కు గతంలో చెప్పేవున్నారు.
పండిత సమాధ్యాయీ అనే వ్యక్తీ అక్కడ ఉన్నాడు. బ్రహ్మసమాజస్థులు శ్రీరామకృష్ణులకు ఆతణ్ణి చూపుతూ, “ఈయన పండితుడు. వేదశాస్త్రాలలో చక్కని పాండిత్యం ఉన్నవారు” అంటూ పరిచయం చేశారు. వెంటనే శ్రీరామకృష్ణులు, “అవును, అవును; ఇంట్లోని వస్తువులు అద్దాల తలుపు గుండా ఎలా స్పష్టంగా కనబడతాయో అట్లే ఈయన మనస్సులోనివి ఈయన కళ్లగుండా స్పష్టంగా కనబడుతున్నాయి” అన్నారు.
త్రైలోక్యుడు పాట పాడుతున్నాడు. సంధ్య దీపాలు వెలిగించారు. సంకీర్తన ఇంకా సాగుతూనే ఉంది. పాటను వింటూవున్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా నిలబడి జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ సమాధిమగ్నులయ్యారు. కాసేపటికి కాస్త బాహ్యస్మృతిలోకి వచ్చి ఆయన నృత్యం చేస్తూ పాడసాగారు.
నేను గ్రోలెడి మద్య మెట్టిదొ
ఎరుగ గోరుదురె నరులారా?
అమ్మ కాళి ఘన నామజపముతో
గ్రోలెద నిత్యానంద మధువును॥ నే ॥
ఎంత మత్తు నా కెక్కునప్పుడన
త్రాగుబోతునని తలతురెల్లరును॥ నే ॥
మద్యము చేయుట కొరకై గురువే
ఇచ్చును బెల్లపు నీరు మొదటనే॥ నే ॥
నే నిటుపడు పరితాపము దానిని
పులియబెట్టు సామగ్రి యగునుగా॥ నే ॥
జ్ఞాన మనెడు ఆ మద్య కారకుడు
నాకై మద్యము తయారుచేయును
మాయి నామమున శుద్ధిచేసి నే
మంత్రమనెడు సీసాలో త్రాగుదును॥ నే ॥
ఒక్క గుక్కకే ధర్మాది చతుర్విధ
పురుషార్థ మబ్బునని ప్రసాదు* పల్కును॥ నే ॥
శ్రీరామకృష్ణులు కేశవ్ కేసి, అతడు తన సొంతమనిషి ఐనట్లుగా, దయార్ద్రంగా చూశారు. కేశవ్ మరెవరికో సొంతమౌతాడేమో – సంసారా సక్తుడౌతాడేమో – అని భయపడుతున్నట్లు కానవచ్చారు. కేశవ్‌ను చూస్తూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు.
చెప్పగానూ లేము చెప్పకుండను లేము
నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధ!
ఇప్పుడే నిను గోలుపోవనున్నామని॥ చె ॥
ఏ మర్మమెరిగి మేమెన్ని గండాలు
దాటినామొ యొరుల దాటించి నామొ
ఆ మర్మమే నీకు తెల్పెదము ఓ రాధ!
నీ వేమి చేతువో నీదె భారంబంత॥ చె ॥
పాటలో చివరి చరణాన్ని మళ్ళీ ఒకసారి పాడి శ్రీరామకృష్ణులు, కేశవ్‌తో ఇలా చెప్పారు: “అంటే సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయనే సత్యం, తక్కినదంతా అనిత్యమే. ఆయన్ను తెలుసుకోకుంటే, తక్కినదంతా వ్యర్థమే! ఇదే మహామంత్రం.”
కేశవచంద్ర సేన్
తరువాత శ్రీరామకృష్ణులు కూర్చుని భక్తులతో మాట్లాడసాగారు. భక్తుడొకడు వాయిస్తున్న పియానో సంగీతాన్ని కొంతసేపు బాలుడిలా ఆనందిస్తూ విన్నారు. ఆ తరువాత ఆయనను ఇంటిలోపలికి తీసుకువెళ్లి ఫలహారాలు స్వీకరింపచేశారు. స్త్రీలు ఆయనకు ప్రణామాలు చేశారు.
శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంటినుండి బయలుదేరేటప్పుడు బ్రహ్మసమాజ భక్తులు మర్యాదసూచకంగా ఆయనతో కూడా బండి దాకా వచ్చారు. కమలకుటీరాన్ని వీడి బండి దక్షిణేశ్వరం వైపు సాగింది.