26.1 ప్రథమ పరిచ్ఛేదం శివపూర్ భక్తులతో – కుండలీ, షట్చక్రభేదం
ఆదివారం, ఆగష్టు 3, 1884
సమయం మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు భోజనానంతరం భక్తులతో సంభాషిస్తున్నారు. నిన్నటి దినం ఆయన, సురేంద్ర ఇంటికి వెళ్ళారు. అక్కడకు శశధర్, కొందరు భక్తులు వచ్చి ఆయనను దర్శించుకున్నారు.
నేడు శివపూర్ నుండి బావుల్శాఖకు చెందిన భక్తబృందం, భవానీపూర్ భక్తులు వచ్చి ఉన్నారు. రాఖాల్, లాటూ, హరీశ్‌లు ఈ మధ్య ఇక్కడే ఉంటున్నారు. బలరామ్, ‘మ’ లు కూడా గదిలో ఉన్నారు.
శివపూర్‌కు చెందిన భక్తులను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): మనస్సు కనుక కామినీ కాంచనాలలో నిలచి ఉన్నట్లయితే, యోగం సిద్ధించదు. సాధారణ జీవుల మనస్సు లింగ, పాయువు, నాభి ప్రదేశాలలో ఉంటుంది. తీవ్రంగా సాధనలు చేసిన తరువాత కుండలినీ శక్తి జాగృత మవుతుంది. ఇడ, పింగళ, సుషుమ్నా అని మూడు నాడులు ఉన్నాయి. సుషమ్నా నాడిలో ఆరు పద్మాలు ఉన్నాయి. అన్నిటికంటే క్రింద ఉన్న పద్మాన్ని మూలాధారం అంటారు. దానిపైన ఉన్న పద్మాలను స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా అంటారు. వీటినే షడ్చక్రాలు అంటారు.
“కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు అది మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం – ఈ పద్మాలన్నిటినీ క్రమంగా దాటి హృదయంలోని అనాహత పద్మంలో నెలకొంటుంది. మనస్సు లింగ, పాయువు, నాభి ప్రదేశాల నుండి పైకి వెళ్ళినప్పుడు జ్యోతి దర్శనం కలుగుతుంది. సాధకుడు ఆ జ్యోతిని దర్శించి అచ్చెరువొందుతాడు. ‘ఇదేమిటి, ఇదేమిటి’ అని ప్రశ్నించుకుంటారు.
“షడ్చక్రాలను భేదించిన పిదప కుండలినీశక్తి సహస్రార పద్మాన్ని చేరుకుంటుంది; అప్పుడు సాధకుడు సమాధిస్థితి పొందుతాడు.
“వేదాలు ఈ చక్రాలను ‘భూమి’ అని పేర్కొంటాయి. ఈ విధంగా ఏడు భూములు ఉన్నాయి. హృదయం చతుర్థ భూమి; హృదయ స్థానంలోని అనాహత పద్మంలో పన్నెండు దళాలు ఉంటాయి.
“విశుద్ధ చక్రం పంచమ భూమి. కుండలినీ ఈ చక్రాన్ని చేరుకున్నప్పుడు మనస్సు కేవలం భగవత్ ప్రసంగాలు వినటానికి, మాట్లాడటానికి మాత్రమే వ్యాకులత చెందుతుంది. ఈ చక్రం యొక్క స్థానం కంఠం. అది పదహారు దళాల పద్మం. కుండలినీ ఈ చక్రాన్ని చేరినప్పుడు, ఆ వ్యక్తి ముందు విషయ వస్తువుల గురించి, కామినీ కాంచనాల గురించి మాట్లాడితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడు. అటువంటి మాటలు మాట్లాడిన పక్షంలో అతడు అక్కడ నుండి లేచివెళ్ళిపోతాడు.
“అటు తరువాత ఉన్నది షష్ఠ భూమి – ఆజ్ఞాచక్రం. ఇది రెండు దళాల పద్మం. కుండలినీ శక్తి అక్కడకు చేరుకున్నప్పుడు సమాధిస్థితి కలుగుతుంది. సహస్రారంలో సచ్చిదానంద శివుడు ఉన్నాడు. ఆయన, శక్తితో సంయోగం చెందుతాడు. అది శివ, శక్తుల సంయోగం.
“కుండలినీ సహస్రారాన్ని చేరుకున్నప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు అతడికి ఏమాత్రం బాహ్యస్పృహ ఉండదు; అటుపై దేహాన్ని నిలుపుకోలేడు. నోట పాలుపోసినా, బయటకు వచ్చేస్తాయి. ఈ స్థితిలో ఉన్నట్లయితే, ఇరవై ఒక్క రోజులలో మరణం సంభవిస్తుంది. కాలాపానీ* కి వెళ్ళిన ఓడ తిరిగిరాదు.
“ఈశ్వరకోటికి చెందినవారు, అవతార పురుషులు మొదలైనవారు ఈ సమాధి స్థితి నుండి క్రిందికి దిగి రాగలరు. వారు భక్తిని ఆశ్రయించుకుని, భక్తుల సాంగత్యంలో గడపాలని కోరుకుంటారు; అందువల్లనే దిగిరాగలరు. లోకులకు ఉపదేశించే నిమిత్తం వారు తమలో ‘విద్యా – నేను’ ‘భక్తుడి నేను’ ను నిలుపుకుంటారు. వారి స్థితి షష్ఠ, సప్తమ భూముల మధ్య, అటూ ఇటూ చేసే నౌకా విహారం లాంటిది.
“సమాధి స్థితి పొందిన పిదప కొంతమంది ‘విద్యా నేను’ ను తమ ఇచ్ఛ మేరకే ఉంచుకుంటారు. ఆ ‘నేను’ ఎటువంటి బంధనాన్నీ కలిగించదు. అది కేవలం నీటి మీద గీచిన గీత లాంటిది.
“హనుమంతుడు సాకార నిరాకారాలు రెండిటినీ సాక్షాత్కరించుకున్న పిదప ‘దాసుడి నేను’ నిలుపుకున్నాడు. నారదాది మహర్షులు, అంటే సనక, సనంద, సనాతన, సనత్కుమారుల వంటివారు బ్రహ్మజ్ఞానం పొందిన పిదప ‘దాసుడి నేను’, ‘భక్తుడి నేను’ ను నిలుపుకున్నారు. వీరు పెద్ద ఓడలాంటి వారు. వీరు తాము స్వయంగా తరించడమేకాక ఇంకా అనేక మందిని తరింప చేస్తారు.
26.1.1 పరమహంసలలో సాకార, నిరాకారవాదులు
“పరమహంసలలో నిరాకారవాదులు ఉంటారు, సాకారవాదులూ ఉంటారు. నిరాకారవాదులు అంటే త్రైలింగస్వామి లాంటివారు. ఆయనలాంటి పరమహంసలు కేవలం తమ శ్రేయస్సు గురించే ఆలోచిస్తారు. వారికి, తాము గమ్యాన్ని చేరుకుంటే చాలు. దానితోనే సంతుష్టులైపోతారు.
“సాకారవాదులు బ్రహ్మజ్ఞానం పొందిన పిదప కూడా లోకులకు ఉపదేశించే నిమిత్తం భక్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తారు. వారు నిండుకుండ లాంటి వారు. దాన్లోని నీటిని వేరే పాత్రలోకి కూడా పోయవచ్చు.
“వీరు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి తాము చేసిన సాధనలు అన్నిటినీ లోకుల హితం కోరి వారికి ఉపదేశిస్తారు. త్రాగే నీటి కోసం ఎవరైనా పలుగు, పారలు పుచ్చుకుని ఎంతో శ్రమకోర్చి బావిని త్రవ్వారనుకుందాం. బావి త్రవ్వడం పూర్తయిన తరువాత కొంతమంది పలుగు, పారలను బావిలోకి విసిరివేస్తారు. అయితే మరికొందరు అవి ఇతరులకు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో వాటిని బావి గట్టు మీదనే ఉంచుతారు.
“కొందరు చాటుగా మామిడి పండు తిని మూతిని తుడుచుకుంటారు. మరి కొందరు మామిడి పండును ఇతరులతో కలసి పంచుకుంటారు. అదే విధంగా కొందరు మహాపురుషులు ఇతరుల సహాయార్థం పాటుపడతారు, భక్తుల సాంగత్యంలో భగవదానందాన్ని అనుభవించగోరుతారు. ‘నేను చక్కెరను తినడానికి ఇష్టపడతాను కాని చక్కెరలా మారిపోవాలని కాదు.’
“గోపికలకు కూడా బ్రహ్మజ్ఞానం కలిగింది. అయితే వారు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునేవారు కాదు. వారు వాత్సల్య, సఖ్య, మధుర లేక దాసీ భావాలలో భగవంతునితో సంయోగం చెందగోరారు.”
26.1.2 భజనానందంలో శ్రీరామకృష్ణులు
శివపూర్ భక్తులు తంబురా పుచ్చుకుని తత్త్వాలు పాడసాగారు. ‘మేము పాపులము, మమ్ముల ఉద్ధరించుము’ అంటూ పాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): భయం కనబరుస్తూ భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రవర్తకుల పద్ధతి. ఆయనను ప్రాప్తించుకునే పాటలు పాడండి, భగవదానందాన్ని గురించి పాడండి. (రాఖాల్తో) ఆ రోజు నవీన్ నియోగి ఇంట్లో పాడిన పాటలు ఎంత బాగున్నాయో కదా! ‘బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలు చుండవె ఓ మనసా!’
“కేవలం అశాంతి గురించిన మాటల ప్రస్తావన బాగుండదు. భగవంతునితోను, భగవదానందంతోనూ ఉన్మత్తులు కావాలి.
” శివపూర్ భక్తుడు: అయ్యా, మీరు ఒక పాట పాడరా?
శ్రీరామకృష్ణులు: నేనేం పాడను? సరే, భావం కలిగినప్పుడు పాడతానులే.
కొద్దిసేపటి తరువాత శ్రీరామకృష్ణులు పాడటం మొదలుపెట్టారు. పాడుతున్నప్పుడు ఆయన దృష్టి ఊర్ధ్వాభిముఖమై ఉంది.
(అదిగో) గోరా ప్రేమానంద తరంగములందు
మునింగెను విశ్వంబెల్లను
అందు మునింగి యానందమందనా
డెందెంబాతర మందుచున్నది ॥ గో ॥
గౌరవర్ణుడౌ గౌరాంగుని యా
గారవమేనన్ కబళించె సఖా ॥ గో ॥
భావపంకంబున బద్ధులైన మన
నీవల కీడ్చుచు నింత ప్రేమతో
ఎవరింత మన వేదనలన్గని
కలవరమందును గౌరాంగునివలె ॥ గో ॥
మునుగువే లోతుకు మునుగవే మనసా……
సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికిని…….
నల్లనిదౌ నా మానస మధుపము………
ఏమిటే ఈ కీలుబొమ్మ!……
26.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల సమాధి – జగజ్జననితో సంభాషణ – ప్రేమతత్త్వం
ఆఖరి పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులయ్యారు. భక్తులందరూ అవాక్కై ఆయన్ను చూస్తున్నారు. కాసేపటికి కొద్దిగా బాహ్యస్పృహ కలిగిన పిదప ఆయన జగజ్జననితో సంభాషించసాగారు. “అమ్మా! పై నుండి క్రిందకు దిగి రా” అన్నారు. సప్తమ భూమి అయిన సహస్రారం నుండి క్రిందకు దిగిరమ్మని సూచిస్తున్నారో ఏమో! ఆయన సంభాషణ ఇంకా ఇలా కొనసాగింది: “అమ్మా! నన్ను యాతన పెట్టవద్దు. నిశ్చలంగా కూర్చో అమ్మా, ఎవరికి ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో అలాగే జరుగుతుంది. నేను మాత్రం ఏం చెప్పాను? వివేక వైరాగ్యాలు లేకుండా ఏదీ సాధ్యం కాదు.”
“తరువాత ఆయన బాహ్య చైతన్యంలోకి వచ్చి తమ అమృత వచనాలు కొనసాగించారు: “వైరాగ్యంలో పలు రకాలు ఉన్నాయి. ఒకటి, మర్కట వైరాగ్యం – సంసార దావాగ్నిలో దహించుకుపోగా ఏర్పడే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎక్కువ కాలం నిలబడదు. మరొకటి, యథార్థమైన వైరాగ్యం కూడా ఉంది. దేనికీ లోటు లేదు, అన్నీ చక్కగా అమరి ఉన్నాయి. అయినప్పటికీ, ఇదంతా మిథ్యే అన్న బోధ కలుగుతుంది.
“వైరాగ్యం ఒక్కసారిగా కలుగదు. సమయం ఆసన్నం కాకుండా జనించదు. అయితే ఒక విషయం – వైరాగ్యం గురించి వింటూ ఉండటం మంచిది. సమయం వచ్చినప్పుడు, ‘అవును, దీని గురించి విని ఉన్నానే’ అన్న భావం ఉత్పన్న మవుతుంది.
“మరో మాట, ఈ విషయాలన్నిటి గురించి వినగా వినగా విషయ వాసనలు క్రమంగా అడుగంటుతాయి. మధువు త్రాగిన వాడికి ఆ మత్తు దిగిపోవాలంటే కొద్ది కొద్దిగా బియ్యపు కడుగు త్రాగించవలసి ఉంటుంది. అప్పుడు క్రమేణా మత్తు తగ్గుముఖం పడుతుంది.
“జ్ఞానోపలబ్ధి పొందగల అధికారులు బహు అరుదు. గీతలో ఇలా చెప్పబడింది – ‘వేలాదిమందిలో ఎవ్వడో ఒక్కడు మాత్రమే నన్ను పొందాలని కోరుకుంటాడు. మళ్ళీ అలా కోరుకునే వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు.’”
ఒక భక్తుడు: ‘మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే.’
శ్రీరామకృష్ణులు: సంసారం పట్ల అనురక్తి ఎంత మేరకు తగ్గితే అదే మేరకు జ్ఞానం కూడా అధికరిస్తుంది. అనురక్తి అంటే, కామినీ కాంచనాల పట్ల అనురక్తి.
26.2.1 సాధుసాంగత్యం, శ్రద్ధ, నిష్ఠ, భక్తి, భావం, మహాభావం, ప్రేమ
“ప్రేమ అందరికీ కలుగదు. చైతన్యదేవులకు ప్రేమ కలిగింది. జీవునికి మహా అయితే భావ అనుభూతి కలుగుతుంది. ఈశ్వరకోటికి చెందిన వారికి మాత్రమే – అవతార పురుషుల వంటి వారికి మాత్రమే ప్రేమ జనిస్తుంది. ప్రేమ కలిగితే సంసారం మిథ్యగా గోచరిస్తుంది. ఆ ప్రేమ ఎటువంటిదంటే, అది జనించిన వ్యక్తి, మనిషి ఎంతో ప్రియంగా భావించే తన దేహాన్ని మరిచిపోతాడు.
“ఒక పారశీక పుస్తకంలో ఇలా ఉంది: చర్మం లోపల మాంసం, మాంసం లోపల ఎముకలు, ఎముకలలో మజ్జ – ఇంకా దీని తరువాత ఏమేం ఉన్నాయో తెలియదు. వీటన్నిటికంటే లోపల ఉన్నది ప్రేమ. ప్రేమతో మనిషి స్నిగ్ధంగా, కోమలంగా రూపొందుతాడు. ప్రేమ కారణంగా కృష్ణుడు త్రిభంగి (మూడు వంకరలు కలవాడు) అయ్యాడు.
“ప్రేమ ద్వారా సచ్చిదానందుణ్ణి బంధించగలిగే రజ్జువు దొరుకుతుంది. ఆయన్ను దర్శించాలంటే దాన్ని పట్టుకుని లాగితే చాలు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన నీకు దర్శనం ఇస్తాడు.
“భక్తి పరిపక్వమైతే భావం కలుగుతుంది. భావం కలిగితే, ఆ వ్యక్తి సచ్చిదానందుణ్ణి గురించి యోచిస్తూ నిశ్చేష్టుడైపోతాడు. జీవులు చేరుకోగలిగేది ఇంత వరకు మాత్రమే. మళ్ళీ భావం పరిపక్వమైతే మహాభావం, ప్రేమ కలుగుతాయి. ఇది పచ్చిగా ఉన్న మామిడి పండు, బాగా మాగివున్న మామిడిపండు మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిది.
“శుద్ధభక్తియే సారం. తక్కినదంతా మిథ్యే.
“నారదుడు స్తోత్ర పాఠాలతో స్తుతించాక శ్రీరాముడు అతణ్ణి వరం కోరుకోమన్నాడు. నారదుడు శుద్ధభక్తిని కోరుకుని ఇలా అన్నాడు: ‘ప్రభో! నీ భువన మోహన మాయచే నేను సమ్మోహితుడను కాకుండా అనుగ్రహించు!’ శ్రీరాముడు ‘అది జరిగిపోతుందిలే. ఇంకా మరేదైనా వరం కోరుకో’ అన్నాడు. అందుకు నారదుడు ‘మరేమీ వద్దు, కేవలం భక్తి ఉంటే చాలు’ అన్నాడు.
“ఈ భక్తిని పొందడం ఎలాగో తెలుసా? ప్రథమంగా సాధుసాంగత్యం నెరపాలి. సాధుసాంగత్యం చేయడం వల్ల భగవత్ విషయాల పట్ల శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ పిదప నిష్ఠ ఏర్పడుతుంది. అప్పుడు కేవలం భగవంతుని గురించిన విషయాలు తప్ప అన్యమైనవి ఏవీ వినడానికి ఇచ్ఛ కలుగదు. ఆయన కార్యాలను మాత్రమే చేయాలన్న ఇచ్ఛ కలుగుతుంది.
“నిష్ఠ పిమ్మట భక్తి, అటుపైన భావం, తరువాత మహాభావం, ప్రేమ ఆఖరున సద్వస్తువు ప్రాప్తి.
“మహాభావం, ప్రేమ అవతార పురుషులకు మాత్రమే కలుగుతాయి. సంసార జీవుల జ్ఞానాన్ని, భక్తుల జ్ఞానాన్ని అవతార పురుషుల జ్ఞానంతో పోల్చలేము. సంసార జీవుల జ్ఞానం దీపపు వెలుగు లాంటిది. ఆ వెలుగు కేవలం గదికి మాత్రమే పరిమితమై ఉంటుంది; గదిలోని వస్తువులు మాత్రమే చూడగలుగుతాం. ఆ జ్ఞానంతో తిండి తిప్పలు, ఇంటి వ్యవహారాలు సరిదిద్దుకోవడం, దేహ సంరక్షణ, పిల్లలను పెంచడం – కేవలం ఇటువంటి పనులు మాత్రమే సాధ్యం.
“భక్తుడి జ్ఞానం చంద్రుని వెలుగు లాంటిది. గది లోపలి వస్తువులు, బయటి వస్తువులు రెండూ కనిపిస్తాయి. అయితే చాలా దూరంగా ఉన్న వస్తువులు లేక చాలా చిన్న వస్తువులు అగుపించవు. అవతార పురుషుల జ్ఞానం సూర్యప్రకాశం లాంటిది. లోపలా బయటా, చిన్నా పెద్దా – అన్ని వస్తువులూ కానవస్తాయి.
“సంసార జీవుల మనస్సు బురద నీటిలాంటి దన్నమాట నిజమే. అయితే చిల్లగింజలు వేసి దానిని మళ్ళీ పరిశుద్ధం చేయవచ్చు. వివేక వైరాగ్యాలే చిల్లగింజలు.”
26.2.2 భగవత్ సంభాషణ, శ్రవణం – శ్రీరామకృష్ణుల మనోస్థితి
ఇప్పుడు శ్రీరామకృష్ణులు శివపూర్ భక్తులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: మీరు ఏమైనా అడగదలచుకున్నారా?
భక్తుడు: అయ్యా, మీ మాటలన్నీ వింటూనే ఉన్నాం.
శ్రీరామకృష్ణులు: అవును. ఆ విధంగా శ్రవణం చేస్తూ ఉండటం మంచిది. అయితే తగిన సమయం రాకుండా ఏదీ జరగదు. జ్వరం విపరీతమైనప్పుడు క్వినైన్ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం? ఫీవర్ మిక్స్చర్ ఇచ్చాక విరేచనం అవుతుంది; జ్వరం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు క్వినైన్ ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందికి ‘క్వినైన్’ ఇవ్వకపోయినా సరే, జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది.
“పిల్లవాడు నిద్రపోయే ముందు తన తల్లితో ‘అమ్మా, నాకు బయలుకు పోవలసి వచ్చినప్పుడు నిద్రలేపు’ అన్నాడు. తల్లి ‘నాయనా, నేను లేపవలసిన అవసరం లేదు. అది వచ్చినప్పుడు ఆ అవసరమే నిన్ను లేపుతుంది’ అని చెప్పింది.
“ఇక్కడకు వచ్చే భక్తులతో పాటు పడవలో వారి స్నేహితులు కొందరు వస్తూంటారు. వారికి భగవత్ ప్రసంగాలు రుచించవు. ఇక్కడ ఉన్నంతసేపు వారు ఆ భక్తుణ్ణి ‘వెళ్దాం పద, వెళ్దాం పద’ అంటూ ఉంటారు. అతడు బయలుదేరే సూచనలు ఏవీ కనబరచనప్పుడు వారు లేచి ‘మేము పడవలో నీ కోసం ఎదురు చూస్తూంటాం’ అని చెప్పి వెళ్ళిపోతారు.
“మొదటిసారి మానవజన్మ ఎత్తినవాడికి సుఖభోగాలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పనులు చేయనిదే ఆధ్యాత్మిక చైతన్యం కలుగదు.”
శ్రీరామకృష్ణులు సరుగుడు తోపువైపు వెళ్ళనున్నారు. అర్ధచంద్రాకార మొగసాలలో ‘మ’ తో ఇలా అన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నా మనోస్థితి గురించి నువ్వేమనుకుంటావు?
‘మ’ (నవ్వుతూ): అయ్యా, మీరు బయటకు అమాయకంగా కనిపించినా లోపల గంభీరులు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును. ఇది ఫ్లోర్ (సిమెంటు నేల) లాంటిది. జనం పైన కనిపిస్తున్న దానినే చూస్తారు. లోపల ఏయే వస్తువులు ఉన్నాయో వారికి తెలియదు.
సమయం నాలుగు గంటలు కావస్తోంది. చాందనీఘాట్ నుండి బలరామాది భక్తులు పడవలో కలకత్తాకు తిరిగి వెళుతున్నారు. గంగలో పోటు బయలుదేరింది, పైగా దక్షిణపు గాలి వీస్తోంది. అందువల్ల వారు త్వరగా కలకత్తా చేరుకోగలరు. తరంగాల మృదుమధుర నాదంతో గంగానది శోభాయమానంగా ఒప్పారుతోంది. బలరామ్ పడవ బాగ్బజార్వైపుగా సాగిపోతోంది. పడవ కనుమరుగయ్యే వరకు ‘మ’ అట్లే దాన్ని చూస్తూ నిలబడిపోయాడు. తరువాత అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. ఆయన సరుగుడు తోపుకు వెళ్ళడానికి వసారా మెట్లు దిగుతున్నారు. ఆకాశంలో వాయవ్య దిశగా నీలిమేఘాలు మనోహరంగా దోగాడుతున్నాయి.
శ్రీరామకృష్ణులు అన్నారు: “వర్షం వస్తుందా? కాస్త ఆ గొడుగు తీసుకురా.” ‘మ’ వెళ్ళి గొడుగు తీసుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులు, ‘మ’ బయలుదేరారు. వెంట లాటూ కూడా ఉన్నాడు.
పంచవటిని చేరుకున్నాక శ్రీరామకృష్ణులు లాటూను “నువ్వు ఈ మధ్య చిక్కిపోతున్నా వెందుకు?” అని అడిగారు.
లాటూ: ఏమీ తినలేకపోతున్నానండీ.
శ్రీరామకృష్ణులు: ఓ, వేరే కారణమేదీ లేదు కదా! వాతావరణం బాగుండటం లేదు. బహుశా ఎక్కువగా ధ్యానం చేస్తున్నావేమో! (‘మ’ తో) నీతో ఒక మాట చెప్పాలి. రాఖాల్ లేని సమయంలో బాబూరామ్ను వచ్చి ఒకటి రెండు రోజులు నాకు తోడుగా ఉండమని చెప్పు. లేకుంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది.
‘మ’ : అలాగేనండీ. నేను చెప్పి చూస్తాను.
సరళ (నిష్కపట) హృదయులే భగవంతుణ్ణి పొందగలరు. బాబూరామ్ అటువంటి వ్యక్తే కదా అని శ్రీరామకృష్ణులు ‘మ’ ను అడుగుతున్నారు. తరువాత ఆయన అక్కడ నుండి సరుగుడు తోపు వైపు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తిరిగి రావడం ‘మ’, లాటూలు పంచవటి నుండి చూశారు. ఆయన వెనుక, ఆకాశం నీలిమేఘాలతో క్రమ్మివుంది. దాని ప్రతిబింబం గంగానదిలో ప్రతిఫలిస్తోంది; దానితో గంగాజలం కృష్ణవర్ణంలో అగుపిస్తోంది.
స్వయంగా ఆ భగవంతుడే భక్తుల నిమిత్తం మర్త్యలోకంలో మానవ రూపాన అవతరించినట్లు శ్రీరామకృష్ణులు వేంచేస్తున్నారు, కల్మషహారిణి, హరి పాదపద్మసంజాత అయిన పవిత్ర భాగీరథీ తీరాన నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఆయన సల్పిన కఠోర సాధనలకు, పొందిన మహోన్నత ఆధ్యాత్మిక స్థితులకు మేము సాక్ష్యం, ఆయనకు ఇవే మా జోహార్లు అన్నట్లుగా చెట్లన్నీ తలలు ఊపుతున్నాయి. ఆహా! ఆ పరమహంస సమక్షాన మానవులే గాక పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, ధూళి రేణువులు సైతం పరమ పావనతను సంతరించుకున్నాయి!
26.3 తృతీయ పరిచ్ఛేదం నవాయ్ చైతన్య, నరేంద్ర, బాబూరామ్, లాటూ, ‘మ’, రాఖాల్, నిరంజన్, అధర్
శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగివచ్చి చిన్నమంచంపై కూర్చున్నారు. బలరామ్ ఇచ్చిన మామిడి పళ్ళు కొన్ని అక్కడ ఉన్నాయి. ఆయన రాంఛటర్జీతో “ఈ పళ్ళు మీ పిల్లవాడి కోసం తీసుకువెళ్ళు” అని చెప్పారు. గదిలో నవాయి చైతన్య కూర్చుని ఉన్నాడు. అతడు ఎరుపురంగు పంచె ధరించి ఉన్నాడు.
తరువాత శ్రీరామకృష్ణులు ఉత్తరంవైపు ఉన్న పొడవాటి వసారాలోకి వెళ్ళి హాజ్రాతో మాట్లాడసాగారు. ఆయన కోసం ఒక బ్రహ్మచారి ‘హరితాల్ భస్మం’ పంపాడు. సంభాషణ దాని గురించే నడుస్తోంది.
శ్రీరామకృష్ణులు: ఆ బ్రహ్మచారి పంపిన మందు బాగా పనిచేస్తోంది. అతడు సజ్జనుడు.
హాజ్రా: పాపం! అతడు సంసారంలో చిక్కుకుపోయాడు. కొన్నగర్ నుండి నవాయి చైతన్య వచ్చాడు. గృహస్థు అయివుండి కూడా ఎర్రపంచె కట్టుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: నేనేం చెప్పగలను? భగవంతుడే స్వయంగా ఈ మనుష్య రూపాలన్నిటినీ ధరించి ఉన్నట్లు నేను గాంచుతున్నాను. అందువల్లనే ఎవరికీ ఏమీ చెప్పలేను.
శ్రీరామకృష్ణులు మళ్ళీ గదిలోకి వచ్చారు. నరేంద్రుడి గురించి ప్రస్తావన వచ్చింది.
హాజ్రా : నరేంద్రుడు మళ్ళీ వ్యాజ్యెంలో ఇరుక్కున్నాడు.
శ్రీరామకృష్ణులు: అతడు శక్తిని అంగీకరించడు. దేహాన్ని ధరించినప్పుడు శక్తిని అంగీకరించాలి.
హాజ్రా: ‘నేను కనుక శక్తిని అంగీకరిస్తే, అందరూ నన్నే అనుసరిస్తారు. అందువల్లనే నేను శక్తిని అంగీకరించజాలను’ అంటాడు నరేంద్రుడు.
శ్రీరామకృష్ణులు: అయితే అంతదూరం పోవటం మంచిది కాదు. ఇప్పుడు జగజ్జనని అధికార పరిధిలోకి వచ్చాడు. ఆఖరికి జడ్జి అయినా సరే సాక్ష్యం ఇవ్వాలంటే వచ్చి సాక్షి బోనులో నిలబడవలసిందే. (‘మ’ తో) ఇటీవల నువ్వు నరేంద్రుణ్ణి కలుసుకోలేదా?
‘మ’ : లేదండీ. ఈ మధ్య కలుసుకోలేదు.
శ్రీరామకృష్ణులు: ఒకసారి అతణ్ణి బండిలో తీసుకురా. (హాజ్రాతో) అది సరే, నరేంద్రునికి
ఇక్కడితో (అంటే, శ్రీరామకృష్ణులతో) సంబంధం ఎటువంటిదో చెప్పు.
హాజ్రా: అతడు మీ నుండి సహాయం ఆశిస్తున్నాడు.
శ్రీరామకృష్ణులు: మరి భవనాథ్ సంగతి ఏమిటి? మంచి సంస్కారాలు లేకుంటే ఇక్కడకు
ఇంతగా వస్తాడా? ఇంకా హరీశ్, లాటూల సంగతి ఏమిటి? ఎప్పుడూ ధ్యానం చేస్తుంటారు కదా!
హాజ్రా: ఆ, వారు సదా ధ్యానం చేయవలసిన ఆవసరం ఏమిటి? ఇక్కడ ఉంటూ మీ సేవ చేస్తే అది వేరే సంగతి.
శ్రీరామకృష్ణులు: బహుశా నువ్వు చెబుతోంది నిజమే కావచ్చు. అయినా ఏం ఫరవాలేదు వారి బదులు వేరే ఎవరైనా వస్తారు.
26.3.1 ‘మ’ కు ఉపదేశాలు – శ్రీరామకృష్ణుల సహజ స్థితి, ‘అహం’
హాజ్రా గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. సాయంకాలం కావడానికి ఇంకా సమయం ఉంది. శ్రీరామకృష్ణులు గదిలో ‘మ’ తో ఏకాంతంగా మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అది సరే, భావావస్థలో మాట్లాడే నా మాటలు జనాన్ని ఆకర్షిస్తాయా?
‘మ’ : అవునండి. ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
శ్రీరామకృష్ణులు: జనం నా గురించి ఏమనుకుంటారు? నన్ను భావావస్థలో చూస్తే వారికి ఏమైనా అర్థం అవుతుందా?
‘మ’ : ఒకే ఆధారంలో జ్ఞానం, ప్రేమ, వైరాగ్యం అన్నీ మేళవించి ఉన్నాయి. పైకి సహజ స్థితి విరాజిల్లుతున్నట్లు తెలియవస్తోంది. లోపల అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో పెద్ద పెద్ద ఓడలలా ప్రయాణం చేశాయి. అయినప్పటికీ, సహజమైన స్వభావం ఉండనే ఉంది. ఆ స్థితిని చాలామంది అర్థం చేసుకోలేరు. కాని కొంతమంది అది చూసే ఆకర్షితులవుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఘోష్పారా శాఖలో భగవంతుని ‘సహజుని’ గా పేర్కొంటారు. స్వయంగా సహజ స్వభావులం కానిదే సహజుణ్ణి పొందలేమని కూడా అంటారు. (‘మ’ తో) నాకు ‘అహం’ అంటూ ఏమైనా ఉందా?
‘మ’ : ఆ, కొద్దిగా ఉందండి. శరీర సంరక్షణార్థం, భక్తి – భక్తుల నిమిత్తం వారికి జ్ఞానోపదేశం చేయడానికి కొద్దిగా ఉంచుకున్నారు. ఇది కూడా మీరు జగజ్జననిని ప్రార్థించి నిలుపుకున్నారు.
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది నేను నిలుపుకోలేదు. ఆమే ఈ ‘అహం’ భావనను నిలిపింది. అది సరే, భావపారవశ్యతలో ఎలా అగుపిస్తాను?
‘మ’ : మీరు చెప్పినట్లు మనస్సు షష్ఠ భూమిని అధిరోహించినప్పుడు భగవంతుని రూప దర్శనాలు కలుగుతాయి. ఆ తరువాత మాట్లాడటం ప్రారంభించినప్పుడు మనస్సు పంచమ భూమికి దిగివస్తుంది.
శ్రీరామకృష్ణులు: భగవంతుడే అంతా చేస్తున్నాడు. నాకు ఏమీ తెలియదు.
‘మ’ : అవునండీ. అందుకే కదా జనులు మీ పట్ల ఇంతగా ఆకర్షితులవుతున్నారు!
26.3.2 సకల శాస్త్రాలూ సత్యమే
“మహాశయా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. శాస్త్రాలలో రెండు రకాలుగా చెప్పబడింది: ఒక పురాణంలో శ్రీకృష్ణుడు చిదాత్మగానూ, రాధాదేవి చిత్శక్తిగానూ వర్ణింపబడి ఉంది. మరో పురాణంలో శ్రీకృష్ణుడే కాళి, ఆద్యాశక్తిగా చెప్పబడింది.”
శ్రీరామకృష్ణులు: దేవీపురాణం ప్రకారం కాళీయే శ్రీకృష్ణుని రూపాన్ని ధరించింది. అయితే దానివల్ల కలిగే నష్టమేమిటి? భగవంతుడు అనంతుడు, ఆయన మార్గాలు కూడా అనంతమే.
ఈ మాటలు విని ‘మ’ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత ఇలా అన్నాడు: “ఓ, ఇప్పుడు అర్థమైందండి. మీరు చెప్పినట్లు మేడ ఎక్కడమే ప్రధానం. తాడు పుచ్చుకునో, వెదురుగడ పట్టుకునో, లేక ఏదో ఒక ఉపాయం ద్వారా ఎక్కడమే ప్రధానం.”
శ్రీరామకృష్ణులు: ఈ మాత్రం అర్థం చేసుకొన్నది కూడా భగవంతుని కృపతోటే. భగవత్కృప కలుగనిదే సంశయాలు సమసిపోవు.
“కావలసిందల్లా ఏదో ఒక విధంగా ఆయన పట్ల భక్తి కలగడమే, ప్రేమ జనించడమే. నానా విషయాలను తెలుసుకోవలసిన ఆగత్యం ఏమిటి? ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళినప్పుడు ఆయన పట్ల ప్రేమ కలిగితే, ఇక పని జరిగిపోయినట్లే. ప్రేమ కలిగినప్పుడే ఆయనను పొందగలం. అటు పైన అవసరం అనిపిస్తే ఆయనే అన్ని విషయాల గురించి, అన్ని మార్గాల గురించి తెలియపరుస్తాడు. భగవంతుని పట్ల ప్రేమ కలిగితే చాలు, నానాతర్కవితర్కాలతో ఏమిటి అవసరం? మామిడి పండు తినటానికి వచ్చావు, మామిడి పండును తిను. కొమ్మలెన్ని, ఆకులెన్ని – వీటన్నిటినీ లెక్కపెట్టవలసిన అవసరం లేదు. హనుమంతుడి భావం కావాలి. అతడు ఇలా అనేవాడు. ‘నేను తిథి వార నక్షత్రాలు ఏవీ ఎరుగను. నేను కేవలం రామ చింతన చేస్తాను.’”
26.3.3 కర్మత్యాగం – సంచయనం, ‘యాదృచ్ఛా లాభ’
‘మ’ : ఇప్పుడు కర్మలను పూర్తిగా తగ్గించివేసి భగవంతునిపై మనస్సు నిలపాలన్న ఇచ్ఛ కలుగుతోంది.
శ్రీరామకృష్ణులు: ఆహా! అంతకంటే కావలసింది మరేముంది? అయితే జ్ఞాని నిర్లిప్తుడై సంసారంలో మనగలడు.
‘మ’ : అవునండీ. అయితే నిర్లిప్తులం అవడానికి ప్రత్యేక శక్తి అవసరం కదా!
శ్రీరామకృష్ణులు: ఆ, ఆ మాట నిజమే. అయితే గతంలో నువ్వు బహుశా సంసార జీవితాన్ని కోరుకుని ఉంటావు. కృష్ణుడు రాధాదేవి హృదయంలోనే ఉండేవాడు. అయితే రాధాదేవికి మానవరూపంలో క్రీడించాలన్న ఇచ్ఛ కలిగింది. అందుచేతనే బృందావనంలో అన్ని లీలలు ప్రదర్శింపబడ్డాయి.
“ఈ సాంసారిక కర్తవ్యాలన్నీ తగ్గిపోయేలా భగవంతుణ్ణి ప్రార్థించు. మనస్సుతో త్యజిస్తేనేచాలు.
‘మ’ : మీరు చెప్పేది బాహ్యంగా సన్న్యసించలేని వారికి వర్తిస్తుంది. అయితే ఉన్నత శ్రేణికి
చెందినవారు బాహ్యంగానూ త్యజిస్తారు, అంతరంగంలోనూ త్యజిస్తారు.
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: వైరాగ్యం గురించి ఇందాక నేను చెప్పిన మాటలు విన్నావు కదా?
‘మ’ : అవును, విన్నానండీ.
శ్రీరామకృష్ణులు: వైరాగ్యం అంటే ఏమిటో కాస్త చెప్పు, చూద్దాం.
‘మ’ : వైరాగ్యం అంటే అర్థం కేవలం సంసారం పట్ల విరక్తితో ఉండటమే కాదు. వైరాగ్యం అంటే భగవంతుని పట్ల అనురక్తి, సంసారం పట్ల విరక్తి.
శ్రీరామకృష్ణులు: అవును, సరిగ్గా చెప్పావు. సంసారంలో ధనం అవసరమే. అయితే దానికోసం ఎక్కువగా చింతన చేయవద్దు. ‘యదృచ్ఛా లాభ’ (దొరికిన దానితో సంతుష్టి నొందడం) – ఇదే మంచిది. సంచయం చేయాలని ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దు. భగవంతునికి మనో ప్రాణాలను సమర్పించినవారు, ఆయన భక్తులుగా ఉండి ఆయనకు శరణాగతులైనవారు వీటన్నిటి గురించి అంతగా ఆలోచించరు. ‘యత్ర ఆయ, తత్ర వ్యయ’ (ఎలా సంపాదిస్తారో అలాగే ఖర్చు పెట్టేస్తారు). ఒక వైపు నుండి ధనం వస్తూ ఉంటుంది. మరోవైపు నుండి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇదే సంగతి గీతలో ‘యదృచ్ఛా లాభ’ అని చెప్పబడింది.
26.3.4 హరిపద, రాఖాల్, బాబూరామ్, అధర్ ప్రభృతుల గురించి సంభాషణ
శ్రీరామకృష్ణులు హరిపదుని గురించి మాట్లాడుతూ “హరిపదుడు ఆ రోజు వచ్చాడు” అన్నారు. ‘మ’ (నవ్వుతూ): హరిపదుడికి హరికథ చెప్పడం తెలుసు. ప్రహ్లాద చరిత్ర, శ్రీకృష్ణ జననం – వీటన్నిటినీ చక్కగా స్వరయుక్తంగా పాడతాడు.
శ్రీరామకృష్ణులు: అవునా? ఆ రోజు అతడి కళ్ళు చూశాను, అంతర్ముఖమై ఉన్నాయి. ‘ఏమిటి, ఎక్కువగా ధ్యానం చేస్తున్నావా?’ అని అడిగాను. అతడు తల వంచుకుని కూర్చుండిపోయాడు. అప్పుడు నేను ‘ఇంతగా మితిమీరి చేయవద్దు’ అని చెప్పాను.
సంధ్యా సమయం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తూ అంతర్ముఖులయ్యారు. కాసేపటి తరువాత ఆలయాలలో హారతులు ప్రారంభమయ్యాయి. శ్రావణ శుక్ల ద్వాదశి. ఝులన్ ఉత్సవం రెండవ రోజు. చంద్రోదయం అయింది. ఆలయం, ఆలయ ప్రాంగణం, ఉద్యానవనం – అన్నీ చంద్రుని చల్లని వెన్నెలలో స్నానం చేస్తున్నాయి. క్రమక్రమంగా సమయం రాత్రి ఎనిమిది గంటలయింది. గదిలో రాఖాల్, ‘మ’ లు శ్రీరామకృష్ణులతో పాటు కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): బాబూరాం ‘అయ్య బాబోయ్! సంసారమా!’ అంటాడు.
‘మ’ : అతడు ఇటువంటి మాటలు ఎక్కడో వినివుంటాడు. సంసారం గురించి అతడికి ఏం తెలుసని? అతడో బాలుడు.
శ్రీరామకృష్ణులు: ఆ, అదీ నిజమే. నువ్వు నిరంజన్ను చూశావు కదా! కల్లాకపటం అంటే ఏమిటో ఎరుగని సరళ స్వభావం అతడిది.
‘మ’ : అవునండీ. అతడి ముఖంలో కళ ఉంది. కళ్ళలో ఎంతో తేజస్సు కానవస్తుంది.
శ్రీరామకృష్ణులు: కేవలం కళ్ళే కాదు, అతడి సమస్త రూపమూ ప్రకాశిస్తుంది. ఇంట్లోని వారు అతడికి వివాహం చేయ తలపెట్టారు. అందుకు అతడు ‘ఎందుకు మీరంతా కలసి నన్ను ముంచివేయాలని చూస్తున్నారు?’ అన్నాడు. (నవ్వుతూ) పగలంతా ఎముకలు విరిగేలా పనిచేసి వచ్చి సాయంకాలం భార్య వద్ద కూర్చుంటే ఎంతో ఆనందం కలుగుతుందని లోకులు అంటుంటారు.
‘మ’ : అవునండీ. ఆ భావంలో ఉన్నవారికి అలా ఆనందం కలుగుతుంది. (రాఖాల్తో) మనకు పరీక్ష జరుగుతోంది. ఇది మనకు చాలా ముఖ్యమైన ప్రశ్న.*
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇరుగుపొరుగు వారితో తల్లి ఇలా అంటూంటుంది. ‘మా అబ్బాయిని ఒక ఇంటివాణ్ణి చేస్తే నేను నిశ్చింతగా ఉంటాను. అతడు ఎండలో మాడివచ్చినప్పుడు కాస్త సాంత్వనం పొందగలడు.’
‘మ’ : అవునండీ. రకరకాల తల్లిదండ్రులు ఉన్నారు. జ్ఞాని అయిన తండ్రి తన కుమారుణ్ణి వివాహ బంధంలో ఇరికించడు. అలా కాకుండా, తండ్రి ఒకవేళ కుమారుని వివాహం చేసినట్లయితే ఇక ఆ తండ్రి ‘జ్ఞానం’ గురించి చెప్పడానికి ఏముంటుంది?
శ్రీరామకృష్ణులు ఆహ్లాదంగా నవ్వసాగారు.
అధర్సేన్ కలకత్తా నుండి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి కాసేపు కూర్చున్నాడు. తరువాత లేచి ఆలయాల సందర్శనానికై వెళ్ళాడు. ‘మ’ కూడా కాళీమాతను దర్శించి శివాలయాల మధ్య ఉన్న చాందనీ ఘాట్ వద్ద ఒంటరిగా కూర్చున్నాడు. వెన్నెల కాంతిలో గంగానది తళతళలాడుతోంది. ‘మ’, శ్రీరామకృష్ణుల అద్భుత జీవితం గురించి తలపోస్తున్నాడు – ఆయన అత్యున్నత సమాధిస్థితులు, నిరంతర భావావేశం, అనర్గళంగా చేసే భగవత్ ప్రసంగాలు, భక్తుల పట్ల అపరిమిత వాత్సల్యం, పసిబాలుని పోలిన స్వభావం ఇత్యాదుల గురించి ఆలోచిస్తున్నాడు. ‘ఇంతకూ ఈ వ్యక్తి ఎవరు? భక్తులను ఉద్ధరించటానికై భగవంతుడే మానవ రూపం ధరించి వచ్చినవాడా?’ అని తలస్తున్నాడు.
26.3.5 అధర్ చంద్రనాథ్, సీతాకుండ్ యాత్రా విశేషాలు
కాసేపటికి అధర్, ‘మ’ లు మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. అధర్, ఆఫీసు పని మీద చిట్టగాంగ్ వెళ్ళి వచ్చాడు. అతడు అక్కడ దర్శించిన చంద్రనాథ్ తీర్థం, సీతాకుండ్ల గురించి ముచ్చటిస్తున్నాడు.
అధర్: సీతాకుండ్లో నాలుకల్లా నీటి మీద అగ్నిజ్వాలలు చెలరేగుతూ ఉంటాయి.
శ్రీరామకృష్ణులు: అదెలా సాధ్యం?
అధర్: నీటిలో భాస్వరం ఉన్న కారణాన అలా జరుగుతుంది.
ఇంతలో రామ్ఛటర్జీ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ప్రశంసిస్తూ అధర్తో ఇలా అన్నారు: “రామ్ ఉన్నాడు కాబట్టి మనం నిశ్చింతగా ఉండగలుగుతున్నాం. ఇతడు హరీశ్, లాటూ మొదలైన వారిని పిలిచి మరీ భోజనం పెడుతుంటాడు. వారు ఏ చెట్టు క్రిందనో ధ్యానమగ్నులై ఉంటారు. ఇతడు వారిని వెతికి తీసుకువచ్చి అన్నం తినేలా చేస్తాడు.”
26.4 చతుర్థ పరిచ్ఛేదం నరేంద్రాది భక్తులతో భజనానందం, సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు
శనివారం, సెప్టెంబరు 6, 1884
సమయం మధ్యాహ్నం దాదాపు మూడుగంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు అధర్ ఇంట్లో రెండవ అంతస్తు కచేరీ చావడిలో ఆసీనులై ఉన్నారు. నరేంద్రుడు, ముఖర్జీ సోదరులు ఇరువురూ, భవనాథ్, ‘మ’, ఛునీలాల్, హాజ్రా ప్రభృతులు అక్కడే ఉన్నారు.
భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేస్తున్నారు. ‘మ’ ప్రణామం చేశాక ఆయన అధర్తో “నితాయీ డాక్టరు రాడా?” అని అడిగారు.
నరేంద్రుడు పాటలు పాడనున్నాడు. అందుకొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. నరేంద్రుడు తంబురా శ్రుతి సరిచేస్తున్నప్పుడు ఒక తీగ తెగిపోయింది. శ్రీరామకృష్ణులు “అరే! ఇదేమిటి, ఇలా చేశావు?” అన్నారు.
అటుపై నరేంద్రుడు తంబురా వదలి తబలా వాయించసాగాడు. శ్రీరామకృష్ణులు, “నువ్వు తబలా వాయిస్తుంటే ఎవరో నా చెంపలు వాయిస్తున్నట్లు అనిపిస్తోంది” అన్నారు.
నరేంద్రుడు కీర్తన గీతాల గురించి మాట్లాడుతూ “కీర్తనలలో తాళం గొడవ లేదు. అందుకనే అవి అంతగా పాపులర్ (జనప్రియం)” అన్నాడు.
శ్రీరామకృష్ణులు: అలా ఎందుకు అంటావు? అవి కరుణాపూరితం కాబట్టే లోకులు వాటిని అంతగా ఇష్టపడతారు.
నరేంద్రుడు పాడసాగాడు:
మధురం మధురం నీ శుభనామం…….
ఈలాగు వ్యర్థముగ నా దినములన్నియు
గడుపవలసిదేన దేవా ॥ ఈ ॥
రాత్రింబగళ్ళు నే నార్తితో వేచితిని
ఆశాపథము వైపు దేవా
విశ్వనాథుడ వీవు బిచ్చగాడను నేను
ఏలాగు హృది నిలువమని వేడగలను? ॥ ఈ ॥
నా బీద యెదయను గుడిసె తలుపులు బాగ
తెరువబడియున్నవి దేవా
దయయుంచి ఒకసారి దానిలోనికి వచ్చి
హృదయదాహము తీర్చరావా? ॥ ఈ ॥
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, హాజ్రాతో): నరేంద్రుడు నన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇదే పాట పాడాడు.
నరేంద్రుడు మరి రెండు పాటలు పాడాడు. పిదప వైష్ణవచరణ్, మథురలో శ్రీకృష్ణుణ్ణి చూసి గోపికలు పడిన ఆవేదనను వ్యక్తం చేసే పాటను పాడాడు.
శ్రీరామకృష్ణులు (వైష్ణవచరణ్తో): ‘పాడవే! ఓ వీణా! ప్రభునామ గానము’ అన్న పాటపాడు. వైష్ణవచరణ్ పాడసాగాడు:
పాడవే! ఓ వీణా! ప్రభునామగానము శ్రీహరి నామ గానము
హరిచరణ కృపలేక పరతత్త్వ మగుపడదు ॥ పా ॥
అవగతము కాదసలు హరిభజన దుఃఖహరము
పలికించు హరిభజన పలికించు కృష్ణభజన ॥ పా ॥
హరి దయ నా మీద బరపిన భయపడను
ఒకమారు హరిభజన గావింపుమో వీణ ॥ పా ॥
ఈ మణులు దిగదుడుపు హరినామమణి ముందు
వ్యర్థముగా కాలము గడచెనని గోవింద ॥ పా ॥
వగచి దుఃఖాబ్ధినిక పయనించనని పలికె
గతిలేని మార్గముల పయనించనని పలికె ॥ పా ॥
26.4.1 శ్రీరామకృష్ణుల అంతర్దశ, అర్ధ బాహ్యదశ, నృత్యం
పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. ‘ఆహా! ఆహా! హరిబోల్, హరిబోల్’* అంటూ బాహ్యస్పృహను కోల్పోయి సమాధిస్థితులయ్యారు. భక్తులు వారి చుట్టూ కూర్చుని ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నారు. గది అంతా భక్తులతో నిండిపోయింది.
అటుపై గాయకుడు చైతన్యదేవుల కీర్తనలను గానం చేయడం మొదలుపెట్టగానే శ్రీరామకృష్ణులు లేచి నాట్యం చేయసాగారు. కొంతసేపటి తరువాత కూర్చుని, చేతులు బార చాపి ‘ఒకమారు హరి భజన గావింపుము వీణ’ అనే చరణం పాడసాగారు. అలా పాడుతూనే మళ్ళీ సమాధిస్థితి నొందారు. ఆయనకు ఎదురుగా పెద్ద తలగడ ఒకటి ఉంది. ఆయన తల తూలి దానిపై పడింది. బాహ్యస్పృహ లేదాయె. ‘శ్రీగౌరాంగ సుందర నవ నటవర’ అంటూ గాయకుడు మరో పాట పాడాడు.
ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ‘ప్రేమతో తన్మయుడై నాట్యమాడె’ అని పాడుతూ ప్రేమావేశంతో నాట్యం చేయసాగారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి నరేంద్రాది భక్తులు వివశులై ఆయనతో పాటు కలసి మనోహరంగా నాట్యం చేయసాగారు.
నాట్యం చేస్తూనే శ్రీరామకృష్ణులు ఒక్కోసారి సమాధి స్థితి నొందుతున్నారు. అది అంతర్దశ – ఆ దశలో నోట పలుకు లేదు. శరీరం కట్టెలా నిశ్చలంగా ఉండిపోయింది. అప్పుడు భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నారు.
ఇలా కొంతసేపు గడచిన తరువాత చైతన్యదేవుల వలెనే శ్రీరామకృష్ణులకు అర్ధ బాహ్యదశ కలిగింది. అప్పుడు ఆయన ప్రేమోన్మత్తులై ఒడలు మరచి నాట్యం చేయసాగారు. ఇప్పుడు కూడా నోట మాట మాత్రం లేదు. తరువాత కొద్దికొద్దిగా బాహ్యస్పృహ కలుగుతోంది. వెంటనే ఒక్కో చరణాన్ని అందుకుంటున్నారు.
నేడు అధర్ సేన్ ఇల్లు శ్రీవాసుని గృహంగా అలరారుతోంది. హరినామ సంకీర్తన, భజనలు, నృత్యం – వీటి కోలాహలం వీథంతా వినిపిస్తోంది. దారిన వెళ్ళేవారందరూ ఈ మధుర భగవన్నామాన్ని విని అధర్ ఇంటి ముందు గుమిగూడసాగారు.
ఈ విధంగా శ్రీరామకృష్ణులు భక్తులతోపాటు భజనానందంలో ఓలలాడారు; కాసేపటి తర్వాత కూర్చున్నారు. భావపారవశ్యం కొద్దిగా ఉపశమించిందే కాని పూర్తిగా తగ్గలేదు. ఆ స్థితిలో ఆయన నరేంద్రునితో, “అమ్మా! వెర్రివానిని చేయవె నీ ప్రేమలోన” అనే పాట పాడమన్నారు. ఆయన మాటను శిరసావహించి నరేంద్రుడు ఆ పాట పాడాడు.
పిదప శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ‘పరమానందపు ఎరుక సాగరో’ అనే పాట పాడమనేసరికి నరేంద్రుడు ఆ పాటకూడా పాడాడు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): ఆ పాట పాడమా – ‘విజ్ఞాన గగనమున ప్రేమచంద్రుడు పూర్ణబింబమున ఉదయించెను’ పెద్దపాట కదా! కాస్త నెమ్మదిగా పాడు.
నరేంద్రుడు ఆ పాట పాడాడు.
శ్రీరామకృష్ణులు: ‘బ్రహ్మానందపు మధు మత్తతలో’ పాట పాడు నాయనా!
నరేంద్రుడు పాడటం మొదలుపెట్టాడు. శ్రీరామకృష్ణులు కూడా అతడితో స్వరం కలిపారు.
బ్రహ్మానందపు మధుమత్తతలో
మత్తిలుచుండవె ఓ మనసా ।
భువిపై దొరలుచు పొరలుచు నేడ్చుచు
హరిని భజింపవె ఓ మనసా ॥ బ్ర ॥
ఆకసమంతయు నీ గర్జనలచే
మార్మోగింపవె ఓ మనసా ।
చేతులెత్తుచు హరిని పాడుచు
నృత్యము చేయవె ఓ మనసా ॥ బ్ర ॥
మధురమైన ఆ మాధవు నామము
మనుజులకీయవె ఓ మనసా ।
పగలు రాత్రి ఆ పరమానందము
నందు నీదవె ఓ మనసా ॥ బ్ర ॥
హరిప్రేమామృతమందు మునుగుచు
ఖండన సేయవె కామమును ।
దానిచేత నీ జీవితమంతయు
ధన్యత గాంచునె ఓ మనసా ॥ బ్ర ॥
తరువాత శ్రీరామకృష్ణులు, భక్తులు కాసేపు విశ్రమించారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల చెంతచేరి మెల్లగా ‘మీరు ఆ పాట ఒకసారి పాడరూ?’ అని అడిగాడు. శ్రీరామకృష్ణులు తమ గొంతు బొంగురు పోయిందన్నారు. కొద్దిసేపటి తర్వాత ఏ పాట అని అడిగారు.
నరేంద్రుడు: ‘ఏమి లావణ్యము ఈ జగమునెల్ల’ అనే పాట.
శ్రీరామకృష్ణులు మెల్లగా పాడారు:
ఏమి లావణ్యము ఈ జగమునెల్ల
ఆహ్లాదమొనరించి ఆనందమునను
రంజిల్లజేయుచు సంతృప్తిపరచు
ఆ గౌరు నదియాకు నడిపించి రెవరు? ॥ ఏ ॥
ముంగురుల్ కుచ్చులై ఉంగరాల్ తిరిగి
కప్పియుండిన మోము కాంతి చిమ్ముచును
కారుమేఘమునుండి మిరుమిట్లు గొలుపు
మెరపుతీగను బోలి మెరసిపోయినది ॥ ఏ ॥
అటుపై మరోపాట పాడారు. శ్రీకృష్ణుని ఎడబాటుకు తాళలేక ఒక గోపిక పాడిన పాట ఇది.
కనరాడె ఓ చెలీ! నా కృష్ణుడు
కృష్ణరహితమై నా గృహము
చిన్నవోయినదే ఓ చెలియా……
26.5 పంచమ పరిచ్ఛేదం నరేంద్రాదులతో సంభాషణ – భావావస్థలో అంతర్దృష్టి
పాట పాడాక శ్రీరామకృష్ణులు నరేంద్ర, భవనాథ్ మొదలైన భక్తులతో సంభాషించసాగారు. ఆయన నవ్వుతూ “హాజ్రా నాట్యం చేశాడా?” అని అడిగారు.
నరేంద్రుడు (నవ్వుతూ): ఆ, ఏదో కాస్త.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాస్తేనా?
నరేంద్రుడు (నవ్వుతూ): అవునవును. అతడి పొట్ట కూడా నాట్యం చేసింది. (అందరూ నవ్వారు)
శశధర్ ఆతిథేయి శ్రీరామకృష్ణులను విందుకు ఆహ్వానించాలని అనుకుంటున్నాడు. ఈ విషయం ప్రస్తావనలోకి వచ్చింది.
నరేంద్రుడు: ఆ ఆతిథేయి విందుకు పిలిచాడా?
శ్రీరామకృష్ణులు: అతడి ప్రవర్తన మంచిది కాదని విన్నాను.
నరేంద్రుడు: మీరు మొదటిసారి శశధర్ను కలిసినప్పుడు కూడా, ఆతడు తాకిన గ్లాసులో నుండి నీరు త్రాగలేకపోయారు. అతడి ప్రవర్తన మంచిది కాదని మీకు ఎలా తెలుసు?
26.5.1 సిహోర్‌లో హృదయ్ ఇంట్లో వైష్ణవునితో జరిగిన సంఘటన
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఇంతకు ముందొకసారి సిహోర్ గ్రామంలో, హృదయ్ ఇంట్లో కూడా ఇలాగే జరిగింది. హాజ్రాకు ఈ విషయం తెలుసు.
హాజ్రా: అవును. ఆ రోజు మిమ్మల్ని దర్శించటానికి నాతో పాటు ఒక వైష్ణవుడు కూడా
వచ్చాడు. అతడు వచ్చి కూర్చోగానే మీరు అతడి వైపు వీపు త్రిప్పి కూర్చున్నారు.
శ్రీరామకృష్ణులు: అతడు భ్రష్టుడని, పినతల్లితో కాపురం చేస్తున్నాడని తరువాత తెలిసింది. (నరేంద్రుడితో) ఇవన్నీ నా మతిభ్రమలే అని నువ్వు మొదట్లో అనేవాడివి.
నరేంద్రుడు: నాకెలా తెలుసు? చూడబోతే ఇప్పుడు అన్నీ నిజమనే తోస్తున్నాయి.
నరేంద్రుడి ఉద్దేశం ఏమిటంటే, శ్రీరామకృష్ణులు భావస్థితులలో వ్యక్తి యొక్క స్వభావాన్ని క్షుణ్ణంగా పసిగట్టగలరు అని. ఈ విషయాన్ని అతడు పలుమార్లు పరీక్షించి నిర్ధారించుకున్నాడు.
26.5.2 భక్తులకు కులబేధం ఉండదు
అధర్సేన్ శ్రీరామకృష్ణులకు, భక్తులకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. వచ్చి అందరినీ భోజనానికి ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు, ముఖర్జీ సోదరులతో (మహేంద్ర, ప్రియనాథ్) “ఏమిటి, మీరు భోజనానికి రావటం లేదా?” అని అడిగారు. వారు వినయపూర్వకంగా “వద్దు లెండి” అన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): వీరు అన్నీ చేస్తుంటారు. కానీ కేవలం భోజనం చేయడంలో సంకోచం ఎందుకో?
ఒక తమాషా విషయం చెబుతాను వినండి. ఒకామె మామగారి పేరు ‘హరి’, బావగారి పేరు ‘కృష్ణ’. ఆమె ‘హరేకృష్ణ’ మంత్రాన్ని జపించాలనుకుంది. కానీ అలా పలికితే మామగారి, బావగారి పేర్లు పిలచినట్లవుతుంది. అందువల్ల ఆమె, ‘గరే గృష్ణ గరే గృష్ణ, గృష్ణ గృష్ణ గరే గరే । గరే రామ గరే రామ రామ రామ గరే గరే ॥’ అంటూ జపించసాగింది.
అధర్ స్వర్ణకారుల కులానికి చెందినవాడు. అందువల్ల బ్రాహ్మణులైన భక్తులు కొందరు అతడి ఇంట భోజనం చేయటానికి సంకోచించేవారు. అయితే స్వయంగా శ్రీరామకృష్ణులే అతడి ఇంట భోజనం చేయడం చూసిన తరువాత వారి సంకోచం తొలగిపోయింది.
రాత్రి తొమ్మిది గంటలు అవుతోంది. నరేంద్రుడు, భవనాథ్ తదితర భక్తులతో కలసి శ్రీరామకృష్ణులు విందు ఆరగించారు. పిదప కచేరీ చావడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఆయన దక్షిణేశ్వరం తిరిగి పోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరునాడు ఆదివారంనాడు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల ప్రీత్యర్థం ముఖర్జీ సోదరులు సంకీర్తన జరపనున్నారు. పేరు మోసిన గాయకుడు శ్యామా దాస్ వచ్చి గానం చేయనున్నాడు. శ్యామాదాస్ వద్ద రామ్ సంగీతం నేర్చుకుంటున్నాడు.
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి మరుసటి రోజు దక్షిణేశ్వరం రమ్మన్నారు.
శ్రీరామకృష్ణులు: రేపు నువ్వు అక్కడకు రా. వస్తావు కదూ?
నరేంద్రుడు: ప్రయత్నిస్తానండీ.
శ్రీరామకృష్ణులు: స్నానాపానాదులు అక్కడే చేయవచ్చు. (‘మ’ ను చూపుతూ) ఇతడు కూడా అక్కడే భోంచేస్తాడు. (‘మ’ తో) నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పథ్యమేమీ లేదు కదా?
‘మ’ : లేదండీ. నేను కూడా వస్తాను.
నిత్యగోపాల్ బృందావనంలో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే ఛునీలాల్ అక్కడ నుండి తిరిగి వచ్చాడు. అతడి ద్వారా శ్రీరామకృష్ణులు, నిత్యగోపాల్ క్షేమసమాచారాలు తెలుసుకుని దక్షిణేశ్వరానికి బయలుదేరారు. ‘మ’ తన శిరస్సును ఆయన పాదపద్మాలపై ఉంచి ప్రణామం చేశాడు. ఆయన వాత్సల్యం ఉట్టిపడే కంఠంతో ‘మ’ తో “రేపు వస్తావు కదూ?” అన్నారు. (నరేంద్రాది భక్తులతో) “నరేంద్ర, భవనాథ్ – మీరు కూడా రేపు రండి” అన్నారు.
నరేంద్రుడు, భవనాథ్ మొదలైన భక్తులు కూడా శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. ఆయన అత్యద్భుత సంకీర్తనానంద, మనోహర నృత్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భక్తులు ఆనందభరిత హృదయాలతో తమ తమ ఇళ్ళకు పయనమయ్యారు.
నేడు భాద్రపద బహుళ పాడ్యమి, వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. శ్రీరామకృష్ణులు భవనాథ్, హాజ్రా మొదలైన భక్తులతో కలసి బండిలో దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయారు.