25.1 ప్రథమ పరిచ్ఛేదం కాళీయే బ్రహ్మం – బ్రహ్మం, శక్తి అభిఙన్నాలు
సోమవారం, జూన్ 30, 1884
అప్పుడు సమయం సాయంకాలం నాలుగు గంటలుకావస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో శశధర్ పండితుడు, భక్తులతో నేలపై పరచిన చాపమీద కూర్చునివున్నారు. మరి కొందరు ప్రక్కనే నేలపై కూర్చుని ఉన్నారు. సురేంద్ర, బాబూరామ్, ‘మ’, హరీశ్, లాటూ, హాజ్రా, మణిమల్లిక్ ప్రభృతులు కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు, పండితుడు పద్మలోచన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పద్మలోచన్ బర్డ్వాన్ ఆస్థాన పండితుడిగా ఉండేవాడు.
ఆరు రోజుల క్రితం, అంటే రథయాత్ర నాడు శ్రీరామకృష్ణులు కలకత్తాలో శశధర్ను కలుసుకోవటం తటస్థించింది. నేడు స్వయంగా శశధరే దక్షిణేశ్వరం వచ్చాడు. శశధర్తో పాటు భూధర్ ఛటోపాధ్యాయ, అతడి అన్నయ్య కూడా వచ్చారు. కలకత్తాలో శశధర్ బస చేస్తోంది వీరి ఇంట్లోనే.
శశధర్ జ్ఞానమార్గావలంబి. శ్రీరామకృష్ణులు అతడికి ఇలా వివరిస్తున్నారు: “నిత్యం దేనికైతే చెందినదో లీల కూడా దానికి చెందినదే. ఎవరైతే అఖండ సచ్చిదానందుడో ఆయనే లీల నిమిత్తం పలు రూపాలు ధరించాడు.” భగవత్ ప్రసంగాలు చేస్తూ శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యాన్ని కోల్పోతున్నారు. ఆయన శశధర్తో ఇలా అంటున్నారు: “సోదరా, బ్రహ్మం మేరుపర్వతంలా నిశ్చలమైనది. కాని ఎవరు నిశ్చలమో, వారు చలించగలరు కూడా.”
శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో ఉన్మత్తులయ్యారు. దేవతలకు సైతం దుర్లభమైన తమ మధుర కంఠ స్వరంతో పాడ నారంభించారు:
ఎరుగగ తరమె ఏరికినైన
తల్లి కాళి నిజతత్వమించుక!
షడ్దర్శనములె శక్తిహీనములు
తల్లి విషయము తెలియజేయుటకు……
మాతగూడ సామాన్య స్త్రీలవలె
జన్మించిన మామూలు మగువయా?
ఆమె నామ ఘన మంత్రజపముచే
హాలాహలము వహించె నీశ్వరుడు॥ మా ॥
దివ్యనేత్రముల రెప్పపాటులో
ఎల్లలోకముల నెవరు సృజించిరొ
పెంచి వాని సంహారమొనర్చిరొ
ఆమె గర్భమున దాల్చు విశ్వమును॥ మా ॥
ఆమె పాదముల నాశ్రయించిన
అనిమిషులెల్లరు ఆనందించిరి
దేవదేవు డా మహాదేవుడే
పడియుండెను ఆ పాదతలంబుల॥ మా ॥
మాత మహేశుని మగువ మాత్రమే?
సంహారకారి సాక్షాత్తు కాలుడే
ముదిత పాదముల మ్రోలమ్రొక్కునే॥ మా ॥
దిగంబరిగ తాతిరుగు లోకమున
దైత్యసంఘముల ధ్వంస మొనర్చును
శివుని గుండెపై చిందులాడును॥ మా ॥
పతిని పాదముల క్రింద తొక్కెడి
ఎట్టి పత్ని ఈ వింత భామిని?
విధినిషేధముల విధ్వంసజాలములు
అమ్మ లీలలని అనును ప్రసాదు॥ మా ॥
ప్రబల యత్నములు బహుళ సాధనలు
చేసి పవిత్రత చెంది మానసా ।
అమ్మ విధానము లరయు మంతట॥ మా ॥
నేను గ్రోలెడు మద్యమెట్టిదో తెలుసా…..
సాధ్యమేనా శ్యామదర్శనం । ప్రతివారికిని
లభ్యమేన కాళిసంపద । ప్రతివారికిని
సత్యమేదో ఏలచూడదు । నా పిచ్చి మనసు
సాధ్యమేన శ్యామదర్శనం । నా కెన్నడైన
తపములెన్నో చేసియుండియు । సదాశివ
శ్యామపాద అరుణదర్శనం । చేయంగలేక
మనోమోహనమైన దర్శనం । ఎవ్వరికైనా
అమ్మ పాద ధ్యానపరునకు । విలువేమి లేదు
స్వర్గమిచ్చు ఇంద్రభోగము । విలువేమి లేదు
శ్యామ కృపావీక్షణంబులు । పైబడినవాడు
బ్రహ్మానందమందు ఈదును । ఆ ధన్యజీవి
అమ్మ పాదపద్మ ధ్యానము । చేతనగునె
దేవతాధిపతికినైనను । సాధ్యమగునె
యోగయోగేశుకైనను । అతిదుర్లభంబు
సాధ్యమేన శ్యామదర్శనం । ప్రతివారికిని
దీనుడైన కమలకాంతుడు । ఇది తెలిసికూడా
అమ్మ దివ్య పాదపద్మము । కాంక్షించుచుండు
సాధ్యమగున శ్యామదర్శనం । ప్రతివారికిని
లభ్యమగున కాళిసంపద । ప్రతివారికిని
శ్రీరామకృష్ణుల భావావేశం కాస్త తగ్గుముఖం పడుతోంది. పాడటం ఆపి కాసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత లేచి తమ చిన్నమంచం మీద కూర్చున్నారు.
శశధర్ పాటలు విని ముగ్ధుడైపోయాడు. ఉట్టిపడే వినయంతో “అయ్యా! ఇక పాడరా?” అన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడటం మొదలుపెట్టారు:
మాయమ్మ పదస్వర్గమం దున్నతంబుగా
పయనించె నొక గాలిపడగలా నా మది
పాపంపు సుడిగాలి బలముగా వీచుచు
వడివడిగ భువివైపు పడద్రోసె దానిని…..
తెలిసికొంటి తెలిసికొంటి తెలియదగిన దెల్లనిపుడు
సర్వమెరుగు నొకని నుండి, భావమర్మమెరిగినాను
రాత్రిలేని ఊరి నుండి వచ్చి కలసె నొక్క మనిషి
పగలు రాత్రి భేదమిపుడు పట్టలేను వేరుచేసి ॥
విధి నిషేధములును భక్తిపూజ పునస్కారములును
నిరుపయోగ మనెడు భావమిపుడు నాకు ప్రబలమయ్యె ॥
నిద్ర నాకు భగ్నమయ్యె – నిద్ర నెట్లు పోగలను?
నిద్రలేని యోగమందు మేలుకొంటి తెలివితోడ ॥
యోగనిద్రలోన తల్లి ఐక్యమైతి మిరువురము
నిద్రపుచ్చినాడ నాడు నిద్రకింక శాశ్వతముగ ॥
నాదు శిరము వంచినాను కామ మోక్షములకు ముందు
ఎరిగినాడ కాళి బ్రహ్మమేక మనెడు మర్మమింక ॥
పుణ్యపాపములను త్రోసి వేసినాడ పూర్తిగాను
అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు ॥
నా కేదీ ఇక భయము
మృతియనిన నిర్భయము
నా కేదీ మృతిభయము
లేదిక నాకే భయము॥ నా ॥
కాళీమా పదపద్మము
చేసితి జీవశరణ్యము
నిర్భయ మా పదరాజము
నా కేదీ మృత్యుభయము॥ నా ॥
శ్రీ కాళీ ఘననామము
చేకొని నా శిరమున బంధము
వైచితి పిలకకు మంత్రము
నా కేదీ మృత్యుభయము॥ నా ॥
గావించితి నా దేహము
లోకసంత విక్రయము
చేసితి ఖర్చాధనము
కొనుటకు దుర్గానామము॥ నా ॥
‘చేసితి ఖర్చాధనము కొనుటకు దుర్గానామము’ – ఈ చరణం వినగానే శశధర్ కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. శ్రీరామకృష్ణులు పాడటం కొనసాగించారు:
ఎదలో కాళీ నామము
నాటితి కల్పకభూజము
చూపెద నా అంకురము
అగుచో యమదర్శనము॥ నా ॥
గెంటితి అరిషడ్వర్గము
‘జయ దుర్గా’ యని పలుకుచు
పయనమునకు సంసిద్ధము
దాటగ జీవ సముద్రము॥ నా ॥
ఉండు మనసా నీలో నుండనే
ఏ వేళనైన……….
శ్రీరామకృష్ణులు ముక్తి కంటే ఉన్నతమైనది భక్తి అంటూ మళ్ళీ పాడారు:
ముక్తి నొసగ వెరువగాని
శుద్ధభక్తి నొసగ వెరతు నేను…..
25.2 ద్వితీయ పరిచ్ఛేదం శాస్త్రాధ్యాయనం – సాధన – విజ్ఞానం
శశధర్ పండితుడు వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి; సదా జ్ఞాన చర్చలలో మునిగివుంటాడు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని అతడికేసి చూస్తూ పలు రకాలుగా ఉపదేశిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (శశధర్తో) : వేదాది శాస్త్రాలు అనేకం ఉన్నాయి, కాని సాధనలు అనుష్ఠించకుండా, తపస్సులు చేయకుండా భగవంతుని ప్రాప్తించుకోలేము. ‘షడ్దర్శనాల ద్వారా కానీ, ఆగమ నిగమ తంత్రాల ద్వారా కానీ భగవద్దర్శనం పొందజాలము.’
“అయితే, శాస్త్రాలలోని విషయాలను ఆకళింపు చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించాలి. ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎక్కడ పెట్టాడో గుర్తుకు రావటం లేదు. దీపం తీసుకువచ్చి ఆ వెలుగులో వెతకటం మొదలుపెట్టాడు. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలసి వెతికేసరికి ఆ ఉత్తరం దొరికింది. అందులో ఐదు సేర్ల మిఠాయి, ఒక ధోవతి పంపమని వ్రాసి ఉంది. ఆ విషయాన్ని చదివిన తరువాత అతడు ఉత్తరాన్ని పారవేశాడు. ఉత్తరం అవసరం మరి లేకపోయింది. ఇక ఐదు సేర్ల మిఠాయి, ఒక ధోవతీ కొని పంపడమే చేయవలసిన పని.
25.2.1 పఠనం, శ్రవణం, దర్శనం
“పఠనం కంటే శ్రవణం మంచిది; శ్రవణం కంటే శ్రేష్ఠమైనది దర్శనం. గురుముఖతా లేక సాధుముఖతా వినడం ద్వారా విషయం మనస్సుకు బాగా హత్తుకు పోతుంది; అప్పుడు శాస్త్రాలలోని నిస్సార విషయాలను గురించి ఆలోచించే అవసరం ఉండదు. హనుమంతుడు ఇలా అన్నాడు: ‘నేను తిథి వార నక్షత్రాలు ఏవీ ఎరుగను. నేను కేవలం రామ చింతన చేస్తాను.’
“శ్రవణం కంటే దర్శనం ఎంతో శ్రేష్ఠమైనది. దర్శనం ద్వారా సంశయాలు అన్నీ నివృత్తి, అయిపోతాయి. శాస్త్రాలలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. కానీ భగవత్సాక్షాత్కారం లభించినట్లయితే, ఆయన పాదపద్మాలపై భక్తి జనించనట్లయితే, చిత్తశుద్ధి కలుగనట్లయితే అంతా వ్యర్థమే. ఇరవై పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో ఉంది. కాని సదరు పంచాంగాన్ని పిండితే ఒక్క బొట్టు అయినా నీరు రాలదు. కనీసం ఒక్క బొట్టు కూడా రాలదు.
25.2.2 విచారణ ఎంత కాలం? విజ్ఞాని ఎవరు?
“శాస్త్రాది విషయాల గురించి విచారణ ఎంత కాలం? భగవత్ సాక్షాత్కారం కానంత వరకే. తుమ్మెదలు ఝంకారం చేయటం ఎంత వరకు? పువ్వు మీద వ్రాలనంత వరకే. పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలడం ఆరంభించగానే, అటుపై అది ఝంకారం చెయ్యదు.
“అయితే మరో సంగతి ఉంది. భగవత్ దర్శనం పొందిన వ్యక్తి అటు పిమ్మట కూడా మాట్లాడుతూ ఉండవచ్చును. అయితే అప్పుడు అతడు మాట్లాడేది కేవలం భగవంతుని గురించి, భగవదానందాన్ని గురించి మాత్రమే. ఇది త్రాగుబోతులు ‘జై కాళీ’ అనడం లాంటిది. త్రాగుబోతు, మత్తు కారణంగా అంతకు మించి మరేమీ మాట్లాడలేడు. పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలిన పిమ్మట కూడా తుమ్మెద అస్పష్టంగా ఝంకారం చేస్తూ ఉంటుంది.
“జ్ఞాని ‘నేతి, నేతి’ విచారణ చేస్తాడు. ఈ విధంగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఎక్కడైతే ఆనందం ప్రాప్తిస్తుందో అదే బ్రహ్మం. జ్ఞాని స్వభావం ఎటువంటిదో తెలుసా? జ్ఞాని శాస్త్ర నియమాల ప్రకారం నడుచుకుంటాడు.
“నన్ను ఒకసారి చానక్కు తీసుకువెళ్ళారు. అక్కడ ఎంతో మంది సాధువులను చూశాను. వారిలో చాలామంది బట్టలు కుట్టుకుంటున్నారు. (అందరూ నవ్వారు) మమ్మల్ని చూడగానే వారు అవన్నీ ప్రక్కకు పెట్టేశారు. తరువాత కాలు మీద కాలు వేసుకొని మాతో మాట్లాడసాగారు. (అందరూ నవ్వారు)
“అయితే భగవత్ విషయాల గురించి ప్రశ్నించనిదే జ్ఞాని వాటి గురించి మాట్లాడడు. ముందుగా అతడు ‘ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ కులాసాయేనా?’ లాంటి ప్రశ్నలు వేస్తాడు.
“అయితే విజ్ఞాని స్వభావం వేరు. అతడి స్వభావం ఏమాత్రం చీకూ చింత లేకుండా, దేనిని పట్టించుకోకుండా, ఖుషీ కులాసాగా ఉంటుంది. బహుశా అతడి పంచె జారిపోతూ ఉండవచ్చు, లేకుంటే, చిన్న పిల్లల్లా దానిని చంకలో బిగబట్టుకొని ఉండవచ్చు.
“భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. కట్టెలో అగ్ని ఉన్నదని నిశ్చయంగా తెలుసుకున్న వాడు జ్ఞాని. అయితే, కట్టెను మండించి వంట వండి కడుపునిండా భుజించి బ్రేవుమని త్రేన్చేవాడు విజ్ఞాని.
“అయితే విజ్ఞానికి అష్టపాశాలు విడివడతాయి. అతడిలో కామక్రోధాదులు ఉండేది కేవలం పైపై చూపులకు మాత్రమే.”
శశధర్: ‘భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయాః’. (హృదయ గ్రంథులు విడివడుతాయి, సంశయాలు అన్నీ సమసిపోతాయి).
శ్రీరామకృష్ణులు: అవును. ఓడ ఒకటి సముద్రంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా దాని లోహ వస్తువులు – కీలలు, మరమేకులు అన్నీ వదులు అవసాగాయి. సమీపంలో ఒక అయస్కాంత పర్వతం ఉంది. అందుకే ఓడ యొక్క లోహ వస్తువులు అన్నీ వదులై జారిపోతున్నాయి.
“నేను కృష్ణ కిశోర్ ఇంటికి వెళ్ళేవాడిని. ఒకసారి అలా వెళ్ళినప్పుడు అతడు ‘మీరు తాంబూలం ఎందుకు వేసుకుంటారు’ అని అడిగాడు. నేను అన్నాను: ‘అది నా ఇష్టం. తాంబూలం వేసుకుంటాను, అద్దంలో ముఖం చూసుకుంటాను, వెయ్యిమంది అమ్మాయిల నడుమ దిగంబరుడై నాట్యం చేస్తాను.’* అది విని కృష్ణకిశోర్ భార్య అతణ్ణి చీవాట్లు పెట్టసాగింది. ‘నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు? రామకృష్ణులతోనా ఇలా మాట్లాడటం?’ అనసాగింది.
“అటువంటి స్థితి కలిగినట్లయితే కామక్రోధాదులు దగ్ధమై పోతాయి. దేహంలో మటుకు ఎలాంటి మార్పు సంభవించదు; చూడటానికి మామూలుగానే తక్కిన దేహాల మల్లే కనిపిస్తుంది. కాని లోపల అంతా డొల్లగా, నిర్మలంగా అయిపోతుంది.”
ఒక భక్తుడు: భగవత్ దర్శనం తరువాత దేహం నిలుస్తుందా?
శ్రీరామకృష్ణులు: కొంతమంది విషయంలో (ప్రారబ్ధ) కర్మలు అనుభవించే నిమిత్తం, లేకుంటే లోకశిక్షణ (అంటే లోకులకు ఉపదేశించే) నిమిత్తం నిలుస్తుంది. గంగా స్నానం చేస్తే పాపాలు అన్నీ నశించిపోతాయి; ముక్తి లభిస్తుంది. కాని గ్రుడ్డివాడి అంధత్వం మటుకు పోదు. అయితే గతంలోని పాపకర్మల ఫలాన్ని అనుభవించటానికై ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉండగా, ఇప్పుడు ఆ అవసరం తప్పిపోతుంది. ప్రారబ్ధ కర్మల ఫలం ఉన్నంతవరకూ ఈ శరీరం నిలిచి ఉంటుంది. అయితే మళ్ళీ జన్మ ఎత్తడం అంటూ ఉండదు. కదలికను కల్పించిన ప్రచోదన శక్తి నెలకొని ఉన్నంతవరకు చక్రం కదులుతూనే ఉంటుంది. ఆ తరువాత అది ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి విషయంలో కామక్రోధాదులు అన్నీ దగ్ధమై పోతాయి. అప్పుడు దేహం నిలిచేది ఏవో కొన్ని కర్మల నిమిత్తమే.
శశధర్: దానినే సంస్కారం అంటారు.
శ్రీరామకృష్ణులు: విజ్ఞాని సర్వదా భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటాడు. అందుకే అతడు ఈ ప్రపంచం పట్ల ఉదాసీనుడై ఉంటాడు. కళ్ళు తెరచి ఉండే భగవంతుని దర్శిస్తాడు. ఒక్కోసారి నిత్యం నుండి లీలకు దిగివస్తాడు; మరోసారి లీల నుండి నిత్యానికి అధిరోహించిపోతాడు.
శశధర్: ఇది నాకు అర్థం కావటం లేదు.
శ్రీరామకృష్ణులు: జ్ఞాని ‘నేతి, నేతి’ విచారణ చేస్తూ నిత్యమూ, అఖండమూ అయిన సచ్చిదానందుణ్ణి చేరుకుంటాడు. అతడు ఈ విధంగా విచారణ చేస్తాడు: ‘బ్రహ్మం జీవులు కాదు; జగత్తు కాదు, ఇరవై నాలుగు తత్త్వాలూ కాదు.’ నిత్యాన్ని చేరుకున్న తరువాత అతడు మళ్ళీ ఆ బ్రహ్మమే జీవులు, జగత్తు, ఇరవైనాలుగు తత్త్వాలుగా అయివున్నట్లు గాంచుతాడు.
“పాలను తోడుపెట్టి, పెరుగు తోడుకున్న పిదప చిలికి వెన్న తీయాలి. అయితే వెన్న తీసిన పిదప మజ్జిగ, వెన్న రెండూ ఒకే పదార్థమనీ, వాటిలో భేదం లేదనీ తెలుస్తుంది. చెట్టుపై బెరడు, లోపలి కాండం రెండూ ఒకే పదార్థానికి చెందినవి కదా!”
శశధర్ (భూధర్తో నవ్వుతూ): అర్థమయిందా? ఈ విషయాల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
శ్రీరామకృష్ణులు: వెన్న ఉంటే మజ్జిగ కూడా ఉన్నట్లే. వెన్న గురించి ఆలోచించినట్లయితే దానితో పాటు మజ్జిగ గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది; ఎందుకంటే మజ్జిగ లేకుంటే వెన్న కూడా ఉండదు. అదే విధంగా, నిత్యాన్ని అంగీకరిస్తే లీలను కూడా అంగీకరించవలసి ఉంటుంది. అనులోమం – విలోమం. సాకార నిరాకారాలను దర్శించిన తరువాత ఈ స్థితి కలుగుతుంది. సాకారం చిన్మయ రూపం; నిరాకారం అఖండ సచ్చిదానందం.
“బ్రహ్మమే సమస్తమూ అయివుంది. అందుచేతనే విజ్ఞానికి ‘ఈ లోకమే ఒక ఆనంద సౌధం.’ జ్ఞాని విషయంలో ఇది ‘మాయాభవనం’. రాంప్రసాద్ దీనిని ‘మాయా భవనం’ అన్నాడు. అందుకనే ఎవరో ఇలా గట్టిగా జవాబు ఇచ్చారు.
ఈ లోకమే ఒక్క ఆనందసౌధం
ఆనందముగ నిందు తిని త్రాగుచుందు
మతిలేని ఓ వైద్యకుల సంభవుండ!
నీ చూపు విషయాలు పైపైనె చూచు॥ ఈ ॥
ఆ జనకమహారాజు అసమానఘనుడు
ఏ లోపమాతనికి ఇహపరమునందు ।
ఇద్దాని అద్దాని తాననుభవించు
పొరలేటి పాత్రలో తన పాలుగ్రోలు॥ ఈ ॥
“విజ్ఞాని భగవదానందాన్ని విశేషంగా అనుభవిస్తాడు. కొందరు పాలను గురించి వినివున్నారు, కొందరు చూశారు, మరికొందరు పాలను సేవించారు. విజ్ఞాని పాలను త్రాగి ఆనందం పొందుతాడు; పుష్టికరంగానూ తయారవుతాడు.”
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. శశధర్ను ధూమపానం చేసి రమ్మన్నారు. శశధర్ ఆగ్నేయ వసారాలోకి వెళ్ళి ధూమపానం చేయసాగాడు. తిరిగి వచ్చి నేల మీద కూర్చున్నాడు.
25.3 తృతీయ పరిచ్ఛేదం జ్ఞానం, విజ్ఞానం – శ్రీరామకృష్ణులు, ఋషులు
శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని తమ వచనామృత ప్రవాహాన్ని కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (శశధర్తో): మీకో విషయం చెబుతాను, వినండి. ఆనందం మూడు విధాలుగా ఉంటుంది – విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కామినీ కాంచనాల ఆనందాన్ని విషయానందం అంటారు; లోకులు సర్వదా ఈ ఆనందంలోనే మునిగిపోయి ఉంటారు. భగవంతుని నామగుణ కీర్తనలు చేయడంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారు. భగవద్దర్శనంలో లభించే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందాన్ని ప్రాప్తించుకుని ఋషులు స్వేచ్ఛావిహారు (అంటే, శాస్త్ర నియమాలకు అతీతు) లైపోయేవారు.
“చైతన్య దేవులకు మూడు రకాల స్థితులు కలుగుతూ ఉండేవి. అవి: అంతర్దశ, అర్ధబాహ్యదశ, బాహ్యదశ. అంతర్దశలో భగవంతుని దర్శించి సమాధిస్థితు లయ్యేవారు, జడ సమాధిస్థితిని పొందేవారు. అర్ధబాహ్య దశలో కొద్దిగా బాహ్య స్పృహ ఉండేది. బాహ్యదశలో భగవంతుని నామగుణ కీర్తనలు చేయగలిగేవారు.”
హాజ్రా (శశధర్తో): మీ సందేహాలన్నీ తీరిపోయాయి కదా?
శ్రీరామకృష్ణులు (శశధర్తో): సమాధి అని దేనిని అంటారో తెలుసా? మనస్సు ఎక్కడైతే లయమైపోతుందో దానినే సమాధి అంటారు. జ్ఞానులకు జడసమాధి కలుగుతుంది – ఇందులో ‘నేను’ అనేది ఉండదు. భక్తిమార్గంలో కలిగే సమాధిని చేతన సమాధి అంటారు. ఇందులో ‘సేవ్య – సేవక నేను’, ‘రసము – రసికుడి నేను’ ‘ఆస్వాద్యము – ఆస్వాదకుడి నేను’ ఉంటుంది. భగవంతుడు సేవ్యుడు (అంటే, సేవింపబడేవాడు), భక్తుడు సేవకుడు. భగవంతుడు రసస్వరూపుడు, భక్తుడు రసికుడు. భగవంతుడు ఆస్వాదింపబడేవాడు, భక్తుడు ఆస్వాదించేవాడు. ‘నేను చక్కెరగా మారిపో ఇచ్ఛగించను; చక్కెరను ఆస్వాదించగోరతాను.’
శశధర్: ఆయన కనుక ‘నేను’ ను పూర్తిగా లయం చేస్తే ఏమవుతుంది? చక్కెరగా మార్చివేస్తేనో?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అదీ, అలా మనస్సులోని మాటను విప్పి చెప్పు. కాని శాస్త్రాలలో నారద, సనక, సనాతన, సనంద, సనత్కుమారుల గురించి లేదా ఏమిటి?
శశధర్:అవునండీ, ఉంది.
శ్రీరామకృష్ణులు: వారు జ్ఞానులు అయివుండీ ‘భక్తుడి ననే నేను’ ను నిలుపుకున్నారు. నువ్వు భాగవతం చదవలేదా?
శశధర్: చదివాను కానీ పూర్తిగా చదవలేదు.
శ్రీరామకృష్ణులు: ప్రార్థన చెయ్యి. ఆయన దయామయుడు. ఆయన భక్తుల మాటలను ఆలకించడా ఏమిటి? ఆయన కల్పతరువు. ఆయన వద్దకు వెళ్ళి ఏది కోరితే అది లభిస్తుంది.
శశధర్: నేను వీటన్నిటి గురించి అంతగా ఆలోచించలేదు. అయితే ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది.
శ్రీరామకృష్ణులు: బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత కూడా ఆ భక్తుడిలో భగవంతుడు ‘నేను’ ను కొద్దిగా ఉంచుతాడు. అది ‘భక్తుడిననే నేను’, ‘విద్యా నేను’. ఆ ‘నేను’ ద్వారా భక్తుడు భగవంతుడి అనంత లీలను ఆస్వాదిస్తాడు. ముసలాన్ని మొత్తంగా నూరాక ఒక చిన్న ముక్క మిగిలిపోయింది. ఆ ముక్క బేతవనంలో పడిపోవడంతో యదువంశం పూర్తిగా నశించిపోయింది. అందుకనే విజ్ఞాని ఆస్వాదనం చేయడం కోసం, లోకులకు ఉపదేశించే నిమిత్తం ఈ ‘భక్తుడి ననే నేను’, ‘విద్యా నేను’ ను నిలుపుకుంటాడు.
25.3.1 ఋషుల భయం – ‘రెండు చేతులను పైకి ఎత్తివేసాను’ – సాలె స్త్రీ, ఆమె స్నేహితురాలు
“ఋషులు భయభీతులై ఉండేవారు. వారి భావం ఏమిటో తెలుసా? అది ‘నేను ఏ విధంగా ఈ సంసారం నుండి తరించిపోగలను, మళ్ళీ ఇక్కడకు ఎవరు వస్తారు?’ అని. బోలుకర్ర నీటిపై తేలుతూ కొట్టుకొని పోతూవుంటుంది. దానిపై ఒక పక్షి వాలితే చాలు, అది మునిగిపోతుంది. అయితే నారదాది మహర్షులు మంచి చేవగల దుంగల వంటివారు. అవి స్వయంగా తేలిపోవటమే కాక అనేక జీవజంతువులనూ తమతో తీసుకుపోతాయి. స్టీమరు స్వయంగా సముద్రాన్ని దాటుతుంది; అనేక మందిని దాటిస్తుంది కూడా.
“నారదాది ఆచార్యులు విజ్ఞానులు. వారు తక్కిన ఋషుల కంటే సాహసులు. పాచికల ఆటలో ఆరితేరిన వాళ్ళు. పాచికలు వేస్తూ ‘ఇదిగో వేస్తున్నాను, ఎంత కావాలి? ఐదు కావాలా; ఊహూ, ఆరా? ఇదుగో, ఆరే వేస్తున్నాను’ అని రెట్టించి చెప్పి మరీ వేస్తారు; నెగ్గుతారు కూడా. అటువంటి నేర్పరులైన ఆటగాళ్ళు వారు. మధ్యమధ్యలో మీసాలు మెలివేయటం కూడా కద్దు.
“కేవలం జ్ఞానిగా ఉన్నవాడు భయభీతుడై ఉంటాడు. అంతగా అనుభవం లేని ఆటగాడి వంటి వాడతడు. తన పావులు ఏదో విధంగా ఎదుటివాని చేతిలో పడకుండా ఉంటే చాలు అనేటటువంటి ధోరణి అతడిది. అయితే విజ్ఞాని దేన్ని చూసినా సరే, భయపడడు. అతడు సాకార నిరాకారాలు రెండింటినీ సాక్షాత్కరించుకుని ఉంటాడు. భగవంతునితో సంభాషిస్తాడు, భగవదానందాన్ని అనుభవిస్తాడు. ఆయన గురించి చింతన చేస్తూ మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోవడం విజ్ఞానికి ఆనందాన్ని కలిగిస్తుంది; అలా లీనం కాని పక్షంలో, మనస్సును లీలలో నిలిపి ఆనందాన్ని పొందుతాడు.
“కేవలం జ్ఞానిగా ఉన్నవాడు ఒకదాన్నే పుచ్చుకుని వ్రేలాడుతూ ఉంటాడు. ఊరికే ‘ఇది కాదు, ఇది కాదు; ఇదంతా స్వప్నం లాంటిది’ అని విచారణ చేస్తూ ఉంటాడు, అంతే. నేను రెండు చేతులను పైకి ఎత్తివేశాను. అందుకే నేను అన్నిటినీ అంగీకరిస్తాను.
“ఒక కథ చెబుతాను వినండి: ఒక స్త్రీ తన స్నేహితురాలిని చూడటానికి వెళ్ళింది. ఆ స్నేహితురాలు ఒక సాలెవాని ఇల్లాలు. ఆ సమయంలో ఆమె పలు రంగుల పట్టు దారాలు వడకుతోంది. ఈ స్త్రీని చూడగానే ఆమె ఎంతగానో ఆనందపడిపోయి ఇలా అంది: ‘రా, సోదరీ, రా! మళ్ళీ ఎన్నాళ్ళ కొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా కూర్చో. నేను వెళ్ళి కొన్ని మిఠాయిలు పట్టుకొస్తాను’ అని ఇంటి లోపలికి పోయింది. ఇక్కడ ఈ స్త్రీ ఆ రంగు దారాలను చూసి దురాకర్షణకు లోనై ఒక దారపు బంతిని తన చంక క్రింద దాచుకొంది. ఇంతలో ఆ స్నేహితురాలు వచ్చి మిఠాయిలు అక్కడ పెట్టింది. అమితోత్సాహంతో ఈ స్త్రీకి మిఠాయిలు తినిపించసాగింది. అయితే కొద్దిసేపటికి ఆమె చూపు తన పట్టుదారాల మీద పడగానే ఒక దారపు బంతి తక్కువ అయినట్లు, ఈ స్త్రీ దానిని దాచుకున్నట్లు గ్రహించింది. మరి ఆ బంతిని తిరిగి రాబట్టడం ఎలా? అప్పుడు ఆమె ఒక ఉపాయం ఆలోచించి, ఇలా అంది: ‘సోదరీ! ఇన్నాళ్ళ తరువాత వచ్చావు. ఈ రోజు ఎంతో ఆనందకరమైనది. మనం ఇద్దరం కలిసి నాట్యం చేయాలని నాకు ఎంతో మక్కువగా ఉంది. రా, రెండు అడుగులు వేద్దాం.’ అప్పుడు ఆ స్త్రీ, ‘ఆ, అవును సోదరీ, నాకు కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అంది. ఇద్దరూ కలిసి నాట్యం చేయనారంభించారు. ఈ స్త్రీ చేతులు ఎత్తకుండానే నాట్యం చేస్తూండటం గమనించి ఆ ఇల్లాలు ‘సోదరీ, రా! మనం రెండు చేతులు పైకెత్తి నాట్యం చేద్దాం. ఇవాళ ఆనందదాయకమైన రోజు’ అంది. పాపం, ఈ స్త్రీ అవస్థ వర్ణనాతీతం. ఒక చంకను బిగపట్టి మరో చేతిని పైకెత్తి నాట్యం చేయసాగింది. ఆ ఇల్లాలు, ‘ఇదెక్కడి చోద్యమమ్మా! ఎవరైనా రెండు చేతులు పైకెత్తి నాట్యం చేస్తారు కాని ఇలా ఒక చేత్తో చేస్తారా ఏమిటి? ఇలా చూడు. నేను ఎలా రెండు చేతులూ పైకి ఎత్తి నాట్యం చేస్తున్నానో’ అంది. అప్పుడు ఈ స్త్రీ ‘సోదరీ, నాకు ఇలాగే చేతనవుతుంది’ అంది.”
శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు: “నేను అలా చంకలు బిగబట్టను. నేను రెండు చేతులను వదలివేస్తాను. నాకు ఎటువంటి భయమూ లేదు. నేను నిత్యము, లీల రెండిటినీ అంగీకరిస్తాను.”
‘జ్ఞానులకు కీర్తి ప్రతిష్ఠలపై మోజు ఉంటుంది. ముక్తి పొందాలనే కోరిక ఉంటుంది. అందుచేతనే వారు రెండు చేతులను ఎత్తి నాట్యం చేయలేకున్నారు’ అని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా? ‘వారు నిత్యం, లీల రెండిటినీ స్వీకరించలేరు. జ్ఞానికి మళ్ళీ బంధంలో చిక్కుకుంటానేమో అన్న భయం ఉంటుంది. అయితే విజ్ఞానికి అటువంటి భయం ఉండదు’ – ఇదేనా శ్రీరామకృష్ణులు చెబుతోంది?
శ్రీరామకృష్ణులు: ‘నేను’ ను త్యజించకుంటే ఏదీ సిద్ధించదని కేశవ్సేన్తో చెప్పాను. అతడు, ‘మహాశయా, మరి అటువంటప్పుడు ఈ (బ్రహ్మ) సమాజం గిమాజం అంటూ దేనినీ నిలుపుకోజాలను కదా!’ అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను: “నేను అంటోంది ఈ ‘అపరిపక్వమైన నేను’, ‘దుష్ట నేను’ ను త్యజించమనే. అయితే ‘పరిపక్వమైన నేను’, ‘పసివాడిననే నేను’, ‘భగవంతుని దాసుడననే నేను’, ‘విద్యా నేను’ – వీటిలో తప్పు లేదు.” సంసారుల నేను ‘అవిద్యా నేను’, ‘అపరిపక్వమైన నేను’ గా ఉంటుంది. ఈ ‘నేను’ పెద్ద చేవకర్ర లాంటిది. సచ్చిదానంద సాగరంలోని నీటిని ఈ కర్ర రెండు భాగాలుగా విభజిస్తోంది. అయితే ‘భగవంతుని దాసుడననే నేను,’ ‘పసివాడిననే నేను’, ‘విద్యా నేను’ నీటి మీద గీచిన గీత లాంటిది. జలరాశి ఒక్కటే; ఎంతో స్పష్టంగా అగుపిస్తోంది. రెండు భాగాలుగా విభజిస్తున్నట్లుగా మధ్యలో కేవలం ఒక గీత గీయబడింది. అయితే పదార్థరీత్యా దాన్ని ఒక్కటే జలంగా చూడవచ్చును. శంకరాచార్యులు లోకులకు ఉపదేశించే నిమిత్తం ‘విద్యా నేను’ ను నిలుపుకున్నారు.
25.3.2 బ్రహ్మజ్ఞానానంతరం “నేను” – గోపికల భావం
“బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుకున్న పిదప కూడా భగవంతుడు, అనేక మందిలో ‘విద్యా నేను’, ‘భక్తుడిననే నేను’ ను ఉంచుతాడు. హనుమంతుడు సాకార నిరాకారాలను రెండిటినీ దర్శించిన తరువాత సేవ్య – సేవక భావంలో, భక్తుడిననే భావంలో ఉండేవాడు. అతడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు: ‘ఓ రామా! ఒక్కోసారి నువ్వు పూర్ణము, నేను అంశ అనీ మరోసారి నువ్వు సేవించబడేవాడివి, నేను సేవకుడిని అనీ అనుకుంటూ ఉంటాను. కాని తత్త్వజ్ఞానం కలిగినప్పుడు “నువ్వే నేను, నేనే నువ్వు” గా గాంచుతాను.’
“యశోద, కృష్ణుని ఎడబాటుతో వ్యాకులత చెంది రాధ వద్దకు వెళ్ళింది. ఆమె బాధ చూడలేక రాధ ఆమెకు తన స్వస్వరూపాన్ని దర్శింపజేసి, ఇలా అంది: ‘కృష్ణుడు చిదాత్మ, నేను చిత్‌శక్తిని. అమ్మా, నువ్వు నా నుండి ఏదైనా వరం కోరుకో.’ అప్పుడు యశోద, ‘అమ్మా, నాకు బ్రహ్మజ్ఞానం అక్కర లేదు. ధ్యాన సమయంలో గోపాలుని రూపాన్ని సదా దర్శించేటట్లు, సర్వదా కృష్ణ భక్తుల సాంగత్యం కలిగేటట్లు, నేను ఎల్లప్పుడు వారికి సేవలు ఒనరించేటట్లు, సర్వదా భగవంతుడి నామగుణ కీర్తనలు చేసేటట్లు వరం ఇవ్వు, అది చాలు’ అంది.
“గోపికలకు భగవంతుడి దైవీ రూపాలను దర్శించాలన్న కోర్కె కలిగింది. కృష్ణుడు వారిని యమునా నదిలో మునిగి రమ్మన్నాడు. వారు అలా మునక వేసీవేయగానే, అందరూ వైకుంఠాన్ని చేరుకున్నారు. అక్కడ షడైశ్వర్యపూర్ణుడైన భగవంతుని రూపాలను దర్శించారు. అయితే అది వారికి రుచించలేదు. అప్పుడు వారు కృష్ణుడితో ‘ఓ కృష్ణా! మేము గోపాలుని దర్శించేటట్లు, ఆతడి సేవ చేసేటట్లు అనుగ్రహిస్తే చాలు. మాకు వేరే ఏమీ అక్కర లేదు’ అని వేడుకున్నారు.
“మథురకు వెళ్ళడానికి ముందు కృష్ణుడు గోపికలకు బ్రహ్మజ్ఞానోపదేశం చేయ ప్రయత్నించాడు. వారితో ఇలా అన్నాడు: ‘నేను సర్వభూతాల లోపలా ఉన్నాను, వెలుపలా ఉన్నాను. మీరేమిటి, ఒక్క రూపాన్నే దర్శిస్తున్నారు?’ అప్పుడు వారు, ‘కృష్ణా, నువ్వు మమ్మల్ని వదలి వెళ్లిపోదామనుకుంటున్నావా? అందుకేనా మాకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తున్నావు!’ అన్నారు.
“గోపికల భావం ఏమిటో తెలుసా? మేము రాధకు చెందినవారము, రాధ మాకు చెందినది అని.”
ఒక భక్తుడు: ఈ ‘భక్తుడిననే నేను’ పూర్తిగా తొలగిపోదా?
25.3.3 శ్రీరామకృష్ణులు – వేదాంతం
శ్రీరామకృష్ణులు: ఈ ‘నేను’ ఒక్కోసారి పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మజ్ఞానం పొంది సమాధి స్థితిగతుడౌతాడు. నాకు కూడా పోతూ ఉంటుంది. అయితే ఎల్లవేళలా కాదు. సంగీత స్వరాలైన ‘స రి గ మ ప ద ని’ లలో హెచ్చుస్థాయికి చెందిన ‘ని’ పై స్వరం ఎక్కువసేపు నిలుపలేము. తిరిగి దిగువ స్థాయికి చెందిన స్వరాల మీదకు దిగిరావలసి ఉంటుంది. నేను అమ్మతో ‘అమ్మా, నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించకు’ అని వేడుకుంటాను. మొదట్లో చాలామంది సాకారవాదులు ఇక్కడకు వచ్చేవారు. అటుపిమ్మట (నిరాకార వాదులైన) ఆధునిక బ్రహ్మసమాజ భక్తులు రాసాగారు. ఆ రోజులలో నేను అధిక సమయం బాహ్యస్పృహను కోల్పోయి సమాధిస్థితుడనై ఉండేవాడిని. స్పృహ రాగానే ‘అమ్మా, నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వవద్దు’ అని మొరపెట్టుకునేవాడిని.
శశధర్: భగవంతుడు మన మొరలను ఆలకిస్తాడా?
శ్రీరామకృష్ణులు: భగవంతుడు కల్పతరువు. ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది. అయితే కల్పతరువు వద్ద నిలబడి, ప్రార్థించవలసి ఉంటుంది. అప్పుడే కోరికలు ఈడేరుతాయి.
“అయితే మరో విషయం ఉంది. భగవంతుడు భావగ్రాహి. ఎవరెవరు ఎలా కోరికలు పెట్టుకుని సాధనలు చేస్తారో, వారి కోరికలు అలాగే నెరవేరుతాయి. భావం ఎలా ఉంటుందో, ఫలం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. గారడీ వాడొకడు ఒక రాజు సమక్షంలో తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. మధ్య మధ్యలో ‘రాజా! కాసు లివ్వు! కోకలివ్వు’ అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు హఠాత్తుగా అతడి నాలుక అంగుడికి అతుక్కుపోయింది. వెంటనే కుంభకం సిద్ధించింది. అంతే, ఉలుకు పలుకు లేకుండా అతడు నిశ్చేష్టితుడైపోయాడు. తక్కిన వారందరు ఇటుకలతో సమాధిని కట్టి అతణ్ణి ఆ స్థితిలోనే పూడ్చివేశారు. ఇలా వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత ఎవరో ఒకనాడు ఆ సమాధిని త్రవ్వడం జరిగింది. సమాధిస్థితిలో కూర్చున్న అతణ్ణి చూసి, మహాత్ముడని తలచి జనులు అతణ్ణి పూజించసాగారు. ఆ సమయంలో వారు అతణ్ణి కదుపుతూ ఉండగా అతడి నాలుక యథాస్థితికి వచ్చేసింది. అతనికి బాహ్యస్పృహ కలిగింది. వెంటనే అతడు ‘మాయ చూడు, మంత్రం చూడు. రాజా, కాసు లివ్వు, కోక లివ్వు’ అంటూ అరవసాగాడు.
“నేను విలపిస్తూ అమ్మతో ఇలా మొరపెట్టుకొనే వాడిని: ‘అమ్మా! నా విచారణ బుద్ధి మీద పిడుగు పడుగాక!’”
శశధర్: మరి మీకు కూడా విచారణ బుద్ధి ఉండేదా?
శ్రీరామకృష్ణులు: ఆ! ఒకప్పుడు ఉండేది.
శశధర్: మాకు కూడా తొలగిపోయేట్లు కాస్త ధైర్యం నూరిపోయండి. అది మీకు ఎలా తొలగిపోయింది?
శ్రీరామకృష్ణులు: అలాగే ఎలానో వెళ్ళిపోయింది.
25.4 చతుర్థ పరిచ్ఛేదం భగవత్ప్రాప్తే పరమగమ్యం – దానికి మార్గం
25.4.1 భగవంతుడు, భగవదైశ్వర్యం
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ తమ అమృతవచనాలను కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: భగవంతుడు కల్పతరువు. ఆయన వద్దకు వెళ్ళి అర్థించాలి. అప్పుడు ఏది కావాలంటే దానిని పొందవచ్చు.
“భగవంతుడు ఎన్నిటిని సృష్టించాడో ఎవరికి తెలుసు? ఆయన సృష్టి అనంతమైనది. ఆయన యొక్క అనంత ఐశ్వర్యాన్ని తెలుసుకోవడంతో నాకేమిటి ప్రయోజనం? ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే, ముందుగా ఆయన్ను ప్రాప్తించుకోవాలి. తరువాత ఆయనే స్వయంగా వెల్లడిస్తాడు. యదుమల్లిక్కు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ పూచీ పత్రాలు ఉన్నాయి – నాకు ఇవన్నీ తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి? నాకు కావలసిందల్లా ఎలాగోలా అతడితో మాట్లాడటమే. అది గోడ దూకైనా సరే, కాపలావారిని బ్రతిమాలుకునైనా సరే లేక వారి చేతిలో తన్నులు తినైనా సరే, ఎలాగోలా అతడిని చేరుకోవాలి. అతడితో పరిచయం ఏర్పడిన తరువాత, ఏఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో ఒక్కమారు అడుగగానే అతడే స్వయంగా చెప్పేస్తాడు. యజమానితో పరిచయం ఏర్పడితే అతడి ఉద్యోగులు కూడా నీకు మర్యాద నిస్తారు కదా! (అందరూ నవ్వారు)
“కొందరు (భగవంతుని) ఐశ్వర్యాలను గురించి తెలుసుకో ఇచ్ఛగించరు. కల్లు దుకాణంలో ఎన్ని పీపాల కల్లు ఉందో తెలుసుకుని ఏం చేయాలి? ఒక్క ముంత కల్లుతోటే పని జరిగిపోతుంది. ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకొని ఏం చేసేది? కొద్దిపాటి కల్లు త్రాగగానే, దానితోనే మత్తెక్కి మైమరుస్తూంటేనో!
25.4.2 జ్ఞానయోగం కఠినం – అవతార పురుషులు నిత్య సిద్ధులు
“భక్తియోగం, జ్ఞానయోగం రెండూ భగవంతుని చేరే మార్గాలే. ఏ మార్గంలో పోయినా సరే, ఆయనను పొందగలవు. భక్తి మార్గం సులువైనది. జ్ఞానం, విచారణల మార్గం కష్టతరమైనది. ఏ మార్గం సరియైనదో ఇంతగా తర్జనభర్జనలు చేయడం ఎందుకు? విజయ్‌తో ఈ విషయమై చాలారోజుల పాటు చర్చించాను. అతడితో ఇలా అన్నాను: ‘ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఇలా ప్రార్థించేవాడు: “ఓ భగవంతుడా! నువ్వెవరవు? ఎలా ఉంటావు? నువ్వెవరవో నాకు తెలియజేసి దర్శనం ఇవ్వు!”’
“జ్ఞాన విచారణా మార్గం కఠినమైనది. పార్వతీదేవి తన తండ్రియైన హిమవంతునికి తన అనేకరూపాలను దర్శింపజేసి ఇలా అంది: ‘తండ్రీ, బ్రహ్మజ్ఞానం పొందగోరితే సాధుసాంగత్యంనెరపు.’
“బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణింపజాలం. బ్రహ్మం ఇట్టిదై ఉండవచ్చునని మాత్రమే శాస్త్రాలు సూచిస్తున్నాయని రామగీతలో చెప్పబడింది. ఉదాహరణకు ‘గంగపైనున్న గొల్లపల్లె (గంగాయాం ఘోష్ః)’ అంటే అది సూచించేది గంగానది ఒడ్డున ఉన్న గొల్లపల్లెనే.
“నిరాకార బ్రహ్మాన్ని ఎందుకు సాక్షాత్కరించుకోలేము? అది ఎంతో కఠినమైన మార్గమన్నమాట నిజమే. విషయబుద్ధి లేశమాత్రమున్నా సరే, అది సాధ్యం కాదు. రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ ఇంద్రియ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ త్యజించినప్పుడే, మనస్సు లయ మొందినప్పుడే, బోధలో బోధ అనుభవానికి వస్తుంది. అప్పుడు కూడా బ్రహ్మం గురించి తెలియవచ్చేది కేవలం అస్తి (అంటే, ఉన్నది) అని మాత్రమే.”
శశధర్: అస్తి ఇతి ఉపలబ్ధవ్యః (‘అది ఉన్నది’ అని మాత్రమే తెలియ వస్తుంది).
శ్రీరామకృష్ణులు: ఆయనను పొందాలంటే ఏదో ఒక భావాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. అది వీరభావమో, సఖీభావమో, దాసీభావమో లేక సంతాన భావమో, ఏదో ఒక భావం కావచ్చు.
మణిమల్లిక్: స్థిరమైన భావం ఏర్పడేది అప్పుడే.
శ్రీరామకృష్ణులు: నేను సఖీభావంలో చాలారోజులు గడిపాను. నేను ఇలా పలికేవాడిని: ‘నేను ఆనందమయి అయిన బ్రహ్మమయికి దాసిని. ఓ దాసీలారా! నన్ను కూడా మీలో చేర్చుకోండి. అప్పుడు “నేను బ్రహ్మమయి దాసి” నని సగర్వంగా చాటుకోగలను.’
“కొంతమందికి సాధనలు చేయకుండానే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. వారిని నిత్యసిద్ధులు అంటారు. జపతపాది సాధనల ద్వారా భగవంతుని పొందిన వారిని సాధనా సిద్ధులు అంటారు. మరికొందరు కృపాసిద్ధులు అని కూడా ఉంటారు. వీరి సిద్ధత్వం ఎటువంటిదంటే – వెయ్యి సంవత్సరాల పాటు అంధకారబంధురమైన ఇంట్లోకి దీపాన్ని తీసుకు వెళితే ఆ ఇల్లు తత్క్షణమే ప్రకాశవంతమైపోవడం లాంటిది.
“హఠాత్సిద్ధులు అని మరికొందరు ఉంటారు. ఇది ఎలాంటిదంటే – పేద పిల్లవాడొకడు ఒక సంపన్నుడి దృష్టిలో పడ్డాడు. ఆ సంపన్నుడు అతడికి తన కుమార్తె నిచ్చి వివాహం చేశాడు. దానితో ఆ పేదవాడికి పెండ్లి కుమార్తెతో పాటు సంపన్నుడి ఆస్తిపాస్తులు, దాసదాసీలు, వస్తువాహనాలు అన్నీ ఒనగూరాయి.
“ఇంకా స్వప్న సిద్ధులు అనీ కూడా ఉంటారు. వీరు స్వప్నంలో భగవంతుని దర్శించి ఉంటారు”.
సురేంద్ర (నవ్వుతూ): అయితే మేమిప్పుడు నిద్రపోతాము. లేచేసరికి భాగ్యవంతులం అయిపోతాం.
శ్రీరామకృష్ణులు (మృదువుగా): నువ్వు భాగ్యవంతుడివే. ‘క’ కు దీర్ఘమిస్తే ‘కా’ అవుతుంది. దానికి మళ్ళీ దీర్ఘం ఇవ్వడం వ్యర్థం. ఇచ్చినప్పటికీ అది ‘కా’ గానే ఉండిపోతుంది. (అందరూ నవ్వారు)
“నిత్యసిద్ధులు ప్రత్యేక శ్రేణికి చెందినవారు. వారు అరణికాష్ఠం* వంటివారు. కొద్దిపాటి రాపిడితోనే అగ్ని రగుల్కొంటుంది; రాపిడి లేకున్నప్పటికీ అగ్ని రగుల్కొంటుంది. నిత్యసిద్ధులు కొద్దిగా సాధన చేయగానే భగవంతుని సాక్షాత్కరించుకుంటారు; సాధన చేయకున్నప్పటికీ ఆయనను పొందుతారు.
“అయితే నిత్యసిద్ధుడు భగవత్ప్రాప్తి అనంతరం సాధనలు చేస్తాడు. ఇది గుమ్మడి, సొరకాయల వలె – మొదట కాయ కాస్తుంది, పిదప పువ్వు.”
శశధర్ పండితుడు ఈ ఉదాహరణ విని నవ్వసాగాడు.
శ్రీరామకృష్ణులు: ఇంకా, నిత్యసిద్ధులు హోమపక్షి లాంటివారు. హోమపక్షి ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటుంది. అది గ్రుడ్డు పెట్టినప్పుడు, ఆ గ్రుడ్డు క్రిందకు పడుతూండగానే, అది పగిలి పిల్ల బయటకు వస్తుంది. ఆ పిల్లపక్షి క్రిందికి పడుతూన్నప్పుడు దానికి రెక్కలు మొలుస్తాయి; కళ్ళు తెరిపిడి పడతాయి. అయితే నేలను తాకగానే ఛిన్నాభిన్నమైపోతానని గ్రహించి, అది ‘అమ్మా, ఎక్కడ ఉన్నావు’ అంటూ రివ్వున పైకి ఎగిరిపోతుంది. ప్రహ్లాదుడు ‘క’ అక్షరం దిద్దుతూనే (కృష్ణుని ఉద్దీపన కలిగి) అతడి కన్నుల నుండి ప్రేమాశ్రువులు వర్షించాయి.
శ్రీరామకృష్ణులు అరణికాష్ఠం, హోమపక్షుల దృష్టాంతాలతో నిత్యసిద్ధుల గురించి వివరిస్తూ తమ నిజ స్థితులను సూచిస్తున్నారా ఏమిటి?
శశధర్ పండితుని వినమ్రతను చూసి శ్రీరామకృష్ణులు ముగ్ధులైనారు. అతడి స్వభావం గురించి భక్తులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): పండితునిది చాలా మంచి స్వభావం. మట్టి గోడలో మేకులు దిగగొట్టడంలో ఎటువంటి కష్టమూ ఉండదు. కాని రాతి గోడలో మేకు కొట్టబోతే మొన విరిగి మేకు వంగిపోతుంది. కానీ మేకు మాత్రం దిగదు. కొంతమంది ఉంటారు – వెయ్యిసార్లు భగవత్ ప్రసంగాలు వినివుంటారు; అయినా కూడా వారికి ఎటువంటి చైతన్యమూ కలుగదు. మొసళ్ళకు కత్తితో కూడా గాటు పెట్టజాలము.
శశధర్: అయితే మొసలిపొట్టలోకి బల్లెం విసిరితే, అది సాధ్యపడుతుంది. (అందరూ నవ్వారు)
25.4.3 సాధనే ప్రధానం, పాండిత్యం కాదు – వివేకం
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): లెక్కలేనన్ని శాస్త్రాలు చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం? మీ ‘ఫెలాజఫి’* వల్ల ఒరిగేది ఏముంది? (అందరూ నవ్వారు)
శశధర్ (నవ్వుతూ): ఆ, ఆ మాట నిజమే.
శ్రీరామకృష్ణులు: పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వలన ఏమిటి ప్రయోజనం? విలువిద్య నేర్చుకునేటప్పుడు బాణాన్ని మొదటగా అరటిచెట్టు వైపు గురిపెట్టాలి; పిదప కాడ వైపు, ఆ తరువాత దీపశిఖ వైపు గురిపెట్టాలి; తరువాత ఎగురుతూన్న పక్షికేసి. అందుచేతనే మనస్సును మొదట సాకార రూపంలో సుస్థిరం చేసుకోవాలి.
“ఇంకా, త్రిగుణాతీత భక్తులు కూడా ఉన్నారు. వారు నారదాదుల వలె నిత్యభక్తులు. ఆ భక్తిలో శ్యాముడు చిన్మయం, అతడి ధామం చిన్మయం, భక్తుడు కూడా చిన్మయమే. భగవంతుడు, ఆయన ధామం, భక్తుడు – అన్నీ నిత్యమే.
“ ‘నేతి, నేతి’ అంటూ జ్ఞాన విచారణ చేసేవాళ్ళు అవతారాన్ని అంగీకరించరు. హాజ్రా ఈ విషయాన్ని ఎంతో చక్కగా చెబుతాడు – ‘భగవదవతారం భక్తుడి కొరకే; జ్ఞానికొరకు కాదు. జ్ఞాని ‘సోఽహం’ భావనలో మునిగివుంటాడు.’”
అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత శశధర్ పండితుడు మాట్లాడసాగాడు.
శశధర్: అయ్యా, ఈ బండరాతి మనస్తత్వాన్ని తొలగించుకోవడం ఎలా? విచారణకు అలవాటుపడిన కారణాన నవ్వును చూస్తే అది కేవలం నరాలు కండరాల కదలిక మాత్రమే కదా అని తోస్తుంది. దుఃఖాన్ని చూస్తే నాడీవ్యవస్థ గుర్తుకు వస్తుంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అందుచేతనే నారాయణశాస్త్రి ‘శాస్త్రాలు చదవడం వల్ల వచ్చిన గొడవే ఇది; అది మనిషిని తర్క విచారణలలోకి తోసి వేస్తుంది’ అనేవాడు.
శశధర్: అయ్యా, మరి మాకు మార్గాంతరం లేదా?
శ్రీరామకృష్ణులు: ఉంది, అది విచక్షణా మార్గం. ఒక పాటలో ఇలా ఉంది: ‘ఆమె కుమారుణ్ణి వివేకాన్ని అడుగు, తత్త్వజ్ఞానం గురించి!’
“వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగం – ఇదే మార్గం. వివేకం కలుగకుంటే, మాట్లాడే మాటలు ఎన్నటికీ సరి అయినవిగా ఉండవు. సమాధ్యాయి పండితుడు చాలాసేపు వ్యాఖ్యానించిన పిదప ‘భగవంతుడు నీరసుడు’ అన్నాడు. ఒకసారి ఎవరో ‘మా మామగారి ఆవులకొట్టం నిండా గుర్రాలు ఉన్నాయి’ అన్నాడు. ఆవుల కొట్టంలో ఎక్కడైనా గుర్రాలు ఉంటాయా?
(నవ్వుతూ) “నువ్వు గులాబ్జామ్లా అయిపోయావు. ఇక, కొద్దిరోజులు రసంలో ఉండటం నీకు మంచిది. అది తక్కిన వారికి కూడా మంచిదే. కేవలం కొద్ది రోజులే.”
శశధర్ (నవ్వుతూ): అయితే గులాబ్‌జామ్ బాగా మాడి బొగ్గులా అయిపోయిందే.
శ్రీరామకృష్ణులు: ఊహూ, అది గోధుమ రంగులో ఉంది. అది సరియైన రంగు.
హాజ్రా: బాగా వేగివుంది. అది రసాన్ని ఇంకా బాగా పీల్చుకుంటుంది.
25.4.4 గీతా సారం – వ్యాకులత కావాలి!
శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటంటే శాస్త్రాలు ఎక్కువగా చదివే అవసరం లేదు. ఎక్కువగా చదివితే తర్కం, విచారణలు వచ్చివేస్తాయి. గీతను పదిసార్లు ఉచ్చరించినప్పుడు ఏదైతే ఉంటుందో అదే గీతాసారం అని నాంగ్టా (తోతాపురి) నాకు ఉపదేశించేవాడు. అంటే పదిసార్లు ‘గీతా, గీతా’ అని పలుకుతూ ఉంటే అది, ‘తాగీ, తాగీ (త్యాగీ, త్యాగీ)’ గా మారిపోతుంది.
“వివేకం వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగమే మార్గం. అది ఎటువంటి అనురాగం? భగవంతుడి కొరకు ప్రాణాలు వ్యాకులపడిపోవాలి – ఆవు వ్యాకులతతో దూడ వెంబడి పరుగెత్తినట్లు.”
శశధర్: వేదాలలో సరిగ్గా ఇలానే చెప్పబడి ఉంది: ‘ఆవు, దూడ కొరకు ఎలా ఆరాట పడుతుందో మేము కూడా నీ కొరకు అలాగే ఆరాటపడుతున్నాం.’
శ్రీరామకృష్ణులు: వ్యాకులతతో పాటు విలపించాలి. వివేకం, వైరాగ్యం పొంది సర్వస్వాన్ని పరిత్యజించగలిగితే, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. నువ్వు జ్ఞానమార్గంలో ఉన్నా సరే లేక భక్తిమార్గంలోనైనా సరే, అటువంటి వ్యాకులత కలిగితే ఉన్మాద స్థితి ఏర్పడుతుంది. దుర్వాసునికి జ్ఞానోన్మాదం కలిగింది.
“సంసారుల జ్ఞానానికి, సర్వసంగ పరిత్యాగుల జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సంసారుల జ్ఞానం దీపపు వెలుగు లాంటిది. దీపపు వెలుగులో కేవలం తన ఇల్లు మాత్రమే ప్రకాశించినట్లు సంసారి జ్ఞానం కేవలం తన దేహం, ఇల్లు, కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంతకుమించి అతడు ఇక దేనినీ అర్థం చేసుకోలేడు. సర్వసంగ పరిత్యాగి యొక్క జ్ఞానం సూర్యుని ప్రకాశం లాంటిది. ఆ ప్రకాశంతో ఇంటి లోపలా, బయటా అంతా కానవస్తుంది. చైతన్యదేవుల జ్ఞానం, జ్ఞాన సూర్యుని ప్రకాశం కలిగివుండినది. మళ్ళీ, ఆయనలో భక్తిచంద్రుడి చల్లటి వెన్నెల కూడా ఉండేది. బ్రహ్మజ్ఞానం, భక్తిప్రేమ – రెండూ ఉండేవి.”
శ్రీరామకృష్ణులు చైతన్య దేవుల స్థితులను వర్ణిస్తూ తమ స్థితులను తెలుపుతున్నారా ఏమిటి?
25.4.5 భావం, అభావం – అన్నీ మార్గాలే – భక్తే కలియుగంలో సులువైన మార్గం
శ్రీరామకృష్ణులు: ‘అభావముఖ చైతన్యం, భావముఖ చైతన్యం.’ ఒకటి, భావభక్తి మార్గం; మరొకటి, అభావ (నేతి, నేతి జ్ఞాన విచారణా) మార్గమూ ఉంది. నువ్వు అభావ మార్గం గురించి మాట్లాడుతున్నావు. అయితే, ‘అది చాలా ఇబ్బందికరమైన స్థితిలో పడవేస్తుంది; ఆ స్థితిలో గురు శిష్యులు ఒకరి నొకరు పరామర్శించుకోరు.’ జనకుని వద్దకు శుకదేవుడు బ్రహ్మజ్ఞానోపదేశం కొరకు వెళ్ళాడు. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు: ‘నువ్వు గురుదక్షిణను ఇవ్వజాలవు. ఎందుకంటే, ఆ స్థితిలో గురుశిష్యుల భేదం తొలగిపోతుంది.’
“భావం, అభావం – అన్నీ మార్గాలే. అనంత మతాలు – అనంత మార్గాలు. అయితే, ఒక విషయం – కలియుగానికి నారదీయ భక్తి మార్గమే సరియైనది. ఈ మార్గంలో, మొదటగా భక్తి జనిస్తుంది; భక్తి పరిపక్వమైనప్పుడు భావం; భావంకంటే శ్రేష్ఠమైనది మహాభావం, ప్రేమ. మహాభావం, ప్రేమలు సామాన్య జీవునికి కలుగవు. వీటిని పొందినవాడు యథార్థ వస్తువును, అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు.”
శశధర్: తత్త్వం గురించి మాట్లాడేటప్పుడు, ఎన్నో మాటల ద్వారా విశదపరచాల్సి ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: అనవసర విషయాలను కట్టిపెట్టి కేవలం సారపదార్థాన్ని మాత్రమే బోధించు.
25.5 పంచమ పరిచ్ఛేదం బ్రహ్మమే శక్తి – సర్వధర్మ సమన్వయం
శశధర్ పండితుడు, మణి మల్లిక్ సంభాషించసాగారు. మణిమల్లిక్ బ్రహ్మసమాజ సభ్యుడు. శశధర్ బ్రహ్మసమాజపు గుణదోషాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చొని చిరునవ్వుతో ఇదంతా తిలకిస్తున్నారు. మధ్యమధ్యలో అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లు ఇలా అంటున్నారు: “ఇదే సత్వగుణం యొక్క తమో భావం – వీర భావం. ఇది కూడా అవసరమే. అసత్యం, అన్యాయాలను చూస్తూ కిమ్మనకుండా ఉండరాదు. పతితురాలైన స్త్రీ నిన్ను ఆధ్యాత్మిక జీవితం నుండి కూలద్రోయాలని చూసినప్పుడు, వీరభావాన్ని ప్రదర్శించి ఇలా పలకాలి: ‘ఓసీ నీచురాలా! నా ఆధ్యాత్మిక జీవితానికి హాని కలిగించ నెంచుతావా? ఎంత ధైర్యం? ఇప్పుడే నిన్ను చీల్చి చెండాడుతాను.’”
మళ్ళీ నవ్వి శశధర్తో ఇలా అనసాగారు: “మణిమల్లిక్ చాలా కాలంగా బ్రహ్మసమాజ సభ్యుడుగా ఉన్నాడు. అతడిలో నువ్వు నీ అభిప్రాయాలను చొప్పించకు. పాత సంస్కారాలు అంత సులువుగా పోతాయా ఏమిటి? ఒక ఊళ్లో ధర్మపరాయణుడైన హిందువు ఒకడు ఉండేవాడు. సర్వదా జగదంబను పూజిస్తూ ఆమె నామాన్ని జపించేవాడు. మహమ్మదీయులు ఆ ఊరిని జయించినప్పుడు ఆ భక్తుణ్ణి బలవంతంగా తమ మతంలోకి మార్పించారు. అతడితో ‘నువ్విక మహమ్మదీయుడవు. ఇకపై నువ్వు కేవలం ‘అల్లా’ నామాన్ని మాత్రమే జపించాలి’ అన్నారు. పాపం! ఆ భక్తుడు అతికష్టంతో ‘అల్లా అల్లా’ అంటూ ఉచ్చరించసాగాడు. కాని మధ్యమధ్యలో అప్రయత్నంగానే అతని నోటి నుండి ‘జగదంబ’ నామం వెలువడేది. దానితో మహమ్మదీయులు అతణ్ణి కొట్టడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ భక్తుడు వారితో ఇలా అన్నాడు: ‘అయ్యా, నన్ను చంపవద్దు. నేను ‘అల్లా’ నామాన్ని జపించటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. అయితే నా కంఠం వరకు మా జగదంబ నిండివుంది. ఆమే మీ అల్లాను బయటకు నెట్టివేస్తోంది!’ (అందరూ నవ్వారు)
(నవ్వుతూ, శశధర్తో) “చూడు, మణిమల్లిక్కు ఏమీ చెప్పవద్దు.”
“వేర్వేరు వ్యక్తులు వేర్వేరు రుచులను కలిగివుంటారు; వారి జీర్ణశక్తి కూడా వేరుగానే ఉంటుంది. అధికార* భేదాలను అనుసరించి భగవంతుడు పలు మార్గాలను, మతాలను ఏర్పరచాడు. అందరూ బ్రహ్మజ్ఞానానికి అధికారులు కాలేరు. అందుకే ఆయన మళ్ళీ సాకార పూజకు కావలసిన ఏర్పాట్లు కూడా చేశాడు. పిల్లల కొరకు తల్లి, ఇంటికి చేప నొకదానిని తెప్పించిందనుకుందాం. ఆ ఒక్క చేపతోనే ఆమె పులుసు, వేపుడు, పలావు అన్నీ వండుతుంది. అందరూ పలావును జీర్ణించుకోలేరు. కాబట్టి అలా అజీర్తితో బాధపడేవారి కోసమనే ఆమె పులుసు వండుతుంది. మరికొందరికి వేపుడు తినడం ఇష్టం. అందరి స్వభావాలు వేర్వేరుగా ఉంటాయి; మళ్ళీ, అధికార భేదాలు కూడా ఉంటాయి.”
అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు శశధర్తో “వెళ్ళు, వెళ్ళి దైవదర్శనం చేసుకో. పిమ్మట తోటలో కాసేపు తిరుగు” అని చెప్పి పంపించారు.
సమయం సాయంత్రం ఐదున్నర అవుతోంది. శశధర్ పండితుడు తన మిత్రులతో ఆలయాలను సందర్శించే నిమిత్తం బయలుదేరాడు. వారితోపాటు కొందరు భక్తులు కూడా వెళ్ళారు. కాసేపటి తర్వాత ‘మ’ తో కలసి శ్రీరామకృష్ణులు కూడా గంగా తీరపు స్నానఘట్టం వైపు వెళ్ళసాగారు. ఆయన ‘మ’ తో ఇలా అన్నారు: “బాబూరామ్ ‘చదువులు చదివి ఏం ప్రయోజనం’ అంటున్నాడు.” గంగానది ఒడ్డున ఆయన మళ్ళీ శశధర్ను కలిశారు. అతడితో “ఏమయ్యా, నువ్వు కాళీమాత దర్శనానికి వెళ్ళలేదా” అన్నారు. శశధర్, “రండి, ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుందాం” అన్నాడు.
శ్రీరామకృష్ణులు దరహాస వదనులై ప్రాంగణం గుండా, కాళీ ఆలయం వైపుగా అడుగులు వేశారు. శశధర్తో ఈ పాట వినమని చెప్పి, తమ సుమధుర కంఠంతో పాడసాగారు:
నా మాయీ నల్లనిదా?
కాళరూపి దిగంబరి
హృదయాబ్జపు ఉద్దీపని…..
ప్రాంగణంలో వెళుతూ శశధర్తో “ఒక పాటలో ఇలా ఉంది” అని ఇలా చెప్పారు: “హృదయ కుహరంలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమయి కాళీ స్వరూపాన్ని దర్శించు.”
ఆలయంలోకి వెళ్ళి శ్రీరామకృష్ణులు, కాళీమాతకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆమె పాదాలను ఎర్ర మందారాలు, మారేడు పత్రాలు అలంకరించి ఉన్నాయి. వరాభయ ముద్రలు ధరించిన చేతులు; ఆమె బెనారస్ చీర కట్టుకుని సర్వాలంకార భూషితయై భక్తులపై కృపాదృక్కులు పరపుతోంది.
కాళీమాతను దర్శించి భూధరుని అన్నయ్య, “ఈ విగ్రహాన్ని రూపొందించినది నవీన భాస్కర్ అని విన్నాను” అన్నాడు. శ్రీరామకృష్ణులు, “అవును, నాకు తెలుసు. కాని నాకు ఈమె చిన్మయమూర్తి” అన్నారు.
శ్రీరామకృష్ణులు తిరిగి వస్తూ బాబూరామ్ను తమతో రమ్మని పిలిచారు. ‘మ’ కూడా వెంట ఉన్నాడు.
25.6 షష్ఠ పరిచ్ఛేదం
సాయంకాలమయింది. గదికి పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో శ్రీరామకృష్ణులు అర్ధ బాహ్యదశలో కూర్చున్నారు. బాబూరామ్, ‘మ’ కూడా అక్కడే ఉన్నారు. ఈ మధ్య రాఖాల్, శ్రీరామకృష్ణుల వద్ద వసించటం లేదు. అందువల్ల ఆయనకు సేవాశుశ్రూషలు సక్రమంగా జరగడం లేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు కాని భావావేశ స్థితులలో ఉన్నప్పుడు ఆయన వారి స్పర్శను భరించలేరు. బాబూరామ్‌తో సూచనప్రాయంగా ఇలా అన్నారు: “నువ్వు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఈ స్థితిలో నేను మరెవ్వరినీ నన్ను తాకనివ్వలేను.”
25.6.1 సంధ్యాది కర్మలు ఎన్నినాళ్ళు?
శశధర్ పండితుడు ఆలయాలను దర్శించి శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు పశ్చిమ మొగసాలలో నుండే శశధర్ను కొద్దిగా ఫలహారం స్వీకరించమన్నారు. శశధర్, ఇంకా సంధ్య వార్చలేదని బదులు పలికాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావోన్మత్తులై లేచి నిలబడి గానం చేయసాగారు:
నే నెందుకు పోవలె కాశీ కంచీ
గంగా గయ ప్రభాసముకూ
కాళీ నామమును కలవరించుచు
కడపటి శ్వాసను వదలుచుండగా…..
శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్ములై ఇలా అన్నారు: “సంధ్యాది కర్మలు ఎన్నినాళ్ళు? ‘ఓం’ అని పలకగానే మనస్సు భగవంతునిలో లీనం కానంత వరకే.”
శశధర్: అయితే మరి నేను ఫలహారం స్వీకరించిన తరువాత సంధ్య వార్చుతాను.
శ్రీరామకృష్ణులు: నేను నీ వ్రతానికి భంగం కలిగించగోరను. తగిన సమయం ఆసన్నం కాకుండానే త్యజించటం మంచిది కాదు. కాయ బాగా పండిన తరువాత పువ్వు దానంతట అదే రాలిపోతుంది. పచ్చిగా ఉన్న దశలో కొబ్బరి మట్టలను లాగివేయరాదు. అలా చేయడం వల్ల చెట్టు దెబ్బతింటుంది.
సురేంద్ర, బండిలో ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. మిత్రులను రమ్మని పిలుస్తున్నాడు. “మహేంద్ర బాబూ, నాతో వస్తారా” అని అడిగాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు; పూర్తిగా బాహ్యస్పృహలోకి రాలేదు. ఆ స్థితిలోనే సురేంద్రతో, “నీ గుర్రం మోయగలిగేదానికంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టకు” అన్నారు. సురేంద్ర ప్రణామం చేసి వెళ్ళిపోయాడు.
25.6.2 బాబూరామ్ ‘కొత్తకుండ’
శశధర్ సంధ్య వార్చడానికి వెళ్ళాడు. ‘మ’, బాబూరామ్లు కలకత్తాకు వెళ్ళనున్నారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన ఇంకా భావావస్థలోనే ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నోట మాట సరిగా రావడం లేదు. కాసేపు ఆగు.
‘మ’ కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఏం సెలవిస్తారోనని ఎదురు చూస్తున్నాడు. ఆయన బాబూరామ్ను కూడా కూర్చోమని సైగ చేశారు. బాబూరామ్ ‘మ’ తో ఇంకా కొద్దిసేపు కూర్చుందామన్నాడు. శ్రీరామకృష్ణులు, బాబూరామ్ను విసనకర్రతో విసరమన్నారు. బాబూరామ్, ‘మ’ ఇద్దరు కలసి ఆయనకు వీయసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో, ఆప్యాయంగా): ఇటీవల నువ్వు తరచూ రావటం లేదు, ఎందుకని?
‘మ’ : ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. ఇంట్లో కాస్త పని ఉండటం చేత, అంతే.
శ్రీరామకృష్ణులు: బాబూరామ్ ఏ స్థాయికి చెందినవాడో, నేను నిన్న తెలుసుకున్నాను. అందుచేతనే, అతణ్ణి ఇక్కడే ఉండమని ఇంతగా చెబుతున్నాను. పక్షి సకాలంలో గ్రుడ్డును పొదుగుతుంది. విషయం ఏమిటంటే, వీరందరు పరిశుద్ధాత్ములు. కామినీ కాంచనాల గంధం ఇంకా వీరికి సోకలేదు. ఏమంటావు?
‘మ’ : అవునండీ. ఇంకా ఎటువంటి మచ్చ పడలేదు.
శ్రీరామకృష్ణులు: కొత్త కుండలో పాలు ఉంచితే చెడిపోవు.
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: బాబూరామ్ ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా ఉంది. అప్పుడప్పుడు నాకు ఏర్పడే స్థితుల కారణంగా బాబూరామ్ లాంటి వ్యక్తి ఒకరు నాతో పాటు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాని అతడు కూడా ఒక్కసారిగా వచ్చి నాతో శాశ్వతంగా ఉండిపోలేడట. అందువల్ల లేనిపోని గొడవలు తలెత్తుతాయన్నాడు. నేను శని, ఆదివారాలలో వస్తూండమని చెప్పాను.
ఇంతలో శశధర్ పండితుడు సంధ్య వార్చుకుని తిరిగి వచ్చాడు. అతడితో పాటు భూధర్, అతడి అన్నయ్య* వచ్చారు. శశధర్ ఫలహారం స్వీకరించబోతున్నాడు.
భూధర్ అన్నయ్య ఇలా అన్నాడు: “అయ్యా, మరి మా గతి ఏం కాను? మాకు మార్గం ఏమిటో కాస్త సెలవియ్యండి.”
శ్రీరామకృష్ణులు: మీరు ముముక్షువులు. వ్యాకులత కలిగితే భగవంతుడు లభిస్తాడు. శ్రాద్ధ భోజనాన్ని తినవద్దు. అక్రమ సంబంధం కలిగివున్న స్త్రీవలె సంసారంలో జీవించండి. ఆమె ఇంట్లోని పనుల నన్నిటినీ ఎంతో శ్రద్ధతో చేస్తుంటుంది. కాని ఆమె మనస్సు మటుకు రాత్రింబవళ్ళు తన విటుడి మీదనే ఉంటుంది. సంసారంలో మీ కర్తవ్యాలు నిర్వర్తించండి, అయితే మనస్సును మాత్రం సదా భగవంతునిపైనే నిలిపి ఉంచండి.
శశధర్ ఫలహారం తింటున్నాడు. ఆసనం మీద కూర్చుని తినమని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు. శశధర్ ఫలహారం తిన్నాక అతడితో ఇలా అన్నారు: “మీరు గీత చదివారు కదా! అందులో ఇలా ఉంది: ‘ఎవనినైతే జనులు గౌరవిస్తారో, అతనిలో భగవంతుని శక్తి విశేషంగా ఉంటుంది.’”
శశధర్: ‘యద్యద్ విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా.’
శ్రీరామకృష్ణులు: మీలో ఆయన శక్తి ఉండనే ఉంది.
శశధర్: అయ్యా, నేను చేపట్టిన వ్రతాన్ని పట్టుదలతో పూర్తి చేయాలా?
శ్రీరామకృష్ణులు ఎంతో కష్టం మీద “అవును” అన్నారు. తరువాత వేరే మాటల ద్వారా ఆ ప్రస్తావనను అంతటితోనే ఆపివేశారు.
శ్రీరామకృష్ణులు: శక్తిని అంగీకరించ వలసిందే. విద్యాసాగర్ నన్ను ‘భగవంతుడు కొందరికి అధికంగా శక్తిని ఇచ్చాడా ఏమిటి?’ అని అడిగాడు. అందుకు నేను ‘మరి అలా కాని పక్షంలో ఒకే వ్యక్తి వందమందిని ఎలా హతమార్చగలుగుతున్నాడు. శక్తి విశేషంగా అభివ్యక్తం కానట్లయితే, క్వీన్ విక్టోరియాకు అంతటి గౌరవ మర్యాద లేల? ఈ విషయం ఒప్పుకుంటావా లేదా’ అని అడిగాను. అతడు, ‘ఆ, ఒప్పుకుంటానండీ’ అన్నాడు.
శశధర్ లేచి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతడి మిత్రులు కూడా ప్రణామం చేశారు.
శ్రీరామకృష్ణులు శశధర్తో ఇలా అన్నారు: “మళ్ళీ రండి. గంజాయి త్రాగేవాడికి మరో గంజాయి త్రాగేవాడిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ఒక్కోసారి ఒకరి నొకరు కౌగిలించుకుంటారు కూడా. వేరే ఎవర్నయినా చూస్తే మొహం తిప్పుకుంటారు. ఆవు తన దూడను ప్రేమతో నాకుతూ ఉంటుంది. కాని వేరే ఆవులను చూస్తే కొమ్ములతో పొడుస్తుంది.” (అందరూ నవ్వారు)
శశధర్ వెళ్ళిపోయిన పిదప శ్రీరామకృష్ణులు ముసిముసి నవ్వులు నవ్వుతూ, “అతడు ఒక్క రోజులోనే డైల్యూట్ (పలుచన) అయిపోయాడు. చూశావా, ఎంతటి వినయ భావమో! నేను చెప్పినదంతా ఒప్పుకున్నాడు” అన్నారు.
శుక్లపక్ష సప్తమి. పశ్చిమ మొగసాలలో వెన్నెల కురుస్తోంది. శ్రీరామకృష్ణులు ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. ‘మ’ ప్రణామం చేశాడు. ఆయన ఆప్యాయంగా “ఏమిటి, వెళతావా?” అని అడిగారు.
‘మ’ : అవునండీ, వెళతాను.
శ్రీరామకృష్ణులు: ఒక్కరొక్కరి చొప్పున అందరి ఇళ్ళకు వెళ్ళాలని ఒకసారి అనుకున్నాను. మీ ఇంటికి కూడా వస్తాను. ఏమంటావు?
‘మ’ : అయ్యా, తప్పక రండి. అది నా మహద్భాగ్యం.
25.7 సప్తమ పరిచ్ఛేదం
గురువారం, జూలై 3, 1884
శ్రీరామకృష్ణులు, బలరామ్ ఇంట భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఆయన ప్రసన్న వదనంలో చిరుదరహాసం తొణికిసలాడుతోంది. ఆహ్లాదంగా భక్తులతో సంభాషిస్తున్నారు.
నేడు ఆషాఢ శుక్ల దశమి – జగన్నాథ స్వామి పునర్యాత్ర రథోత్సవ దినం. బలరామ్ ఇంట జగన్నాథ స్వామికి నిత్య పూజా నైవేద్యాలు జరుగుతాయి. ఒక చిన్న రథం కూడా ఉంది. ఈ రథాన్ని ఇంటి రెండవ అంతస్తులోని వసారాలో తిప్పుతారు. పునర్యాత్ర సందర్భంగా బలరామ్ శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు.
గత జూన్ 25, బుధవారం నాడు రథయాత్ర మొదటి రోజు. ఆనాడు శ్రీరామకృష్ణులు, ఈశాన్ ముఖోపాధ్యాయ ఆహ్వానాన్ని మన్నించి ఠన్ఠన్లోని అతడి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రమే కాలేజి స్ట్రీట్‌లో భూధర్ ఇంటికి వెళ్ళి మొదటిసారిగా శశధర్ పండితుని కలుసుకున్నారు. మూడు రోజుల క్రితం, దక్షిణేశ్వరంలోని కాళీ ఆలయంలో శశధర్, శ్రీరామకృష్ణులను రెండవసారి కలుసుకున్నాడు.
శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని అనుసరించి బలరామ్ నేడు శశధర్ పండితుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడు. పండితుడు హిందూధర్మంపై ఉపన్యాసాలు ఇస్తూంటాడు. అతడిలో భక్తిబీజాలు నాటి ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పటానికి శ్రీరామకృష్ణులు పిలిపించారో ఏమో?
శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు ముందు చావడి గదిలో కూర్చుని మాట్లాడుతున్నారు. రామ్, ‘మ’, బలరాం, మనోమోహన్, పలువురు యువ భక్తులు, బలరామ్ తండ్రి కూర్చుని ఉన్నారు.
బలరామ్ తండ్రి నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవుడు. ఆయన ఎక్కువగా బృందావనంలోనే ఉంటాడు. అక్కడ ఒక తోటలో వారు కట్టించిన శ్యామసుందర ఆలయం ఉంది. ఈయన అక్కడే ఏకాంతవాసం చేస్తూ శ్యామసుందరుని పూజా నైవేద్యాలు సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. బృందావనంలో తన సమయాన్నంతా భగవంతుని సేవించటంలోనే గడుపుతుంటాడు. అప్పుడప్పుడు చైతన్య చరితామృతం తదితర భక్తిగ్రంథాలను పఠిస్తుంటాడు; మరొకప్పుడు పువ్వులు కోసి తెచ్చి మాలలు కడుతుంటాడు; వేరొకప్పుడు వైష్ణవ భక్తులను ఆహ్వానించి వారిని సేవిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులను దర్శించిన తరువాత బలరామ్, తన తండ్రికి ఎన్నో ఉత్తరాలు వ్రాసి ఆయనను కలకత్తాకు రప్పించాడు.
శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా అన్నారు: “అన్ని మతాలలోనూ మా మతమే గొప్పదన్న భావాలు ఉన్నాయి. వైష్ణవులలో ఈ భావం మరీ ఎక్కువగా ఉంది. వేరు వేరు మతస్థులు పరస్పరం పోట్లాడుతూ ఉంటారు. సమన్వయం చేయటం ఎలాగో వారికి తెలియటం లేదు.”
25.7.1 సర్వధర్మ సమన్వయం – వైష్ణవులు, శాక్తేయులు
శ్రీరామకృష్ణులు (బలరామ్ తండ్రి, తదితర భక్తులతో): వైష్ణవుల గ్రంథం భక్తమాల మంచి పుస్తకమే. ఎంతోమంది వైష్ణవ భక్తుల చరిత్రలు అందులో ఉన్నాయి. అయితే, మా మార్గమే సరైనది అన్నట్లు పుస్తకం ఏకపక్షంగా సాగుతూ ఉంటుంది. జగజ్జనని విష్ణుమంత్రం స్వీకరించిందని కూడా అందులో ఒక చోట వ్రాసి ఉంది.
“ఒకసారి నేను మథుర్బాబుతో వైష్ణవచరణ్ గురించి బాగా ప్రశంసించి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించేలా చేశాను. మథుర్ అతడికి ఎన్నో మర్యాదలు చేశాడు. వెండి కంచంలో ఉపాహారం పెట్టించాడు. అంతా అయ్యాక వైష్ణవచరణ్, మథుర్ ఎదుటే ‘మీరు ఎన్నయినా చెప్పండి. వైష్ణవ మంత్రం స్వీకరించకుండా ఏదీ సాధ్యపడదు’ అన్నాడు. అది విని మథుర్ కళ్ళెర్ర చేశాడు. అతడు శాక్తేయుడు, దేవీ ఉపాసకుడు. వెంటనే నేను వైష్ణవచరణ్ని మోచేత్తో పొడిచాను.
“శ్రీమద్భాగవతంలో కూడా ఇటువంటి భావాలు ఉన్నాయని విన్నాను. కృష్ణమంత్రం పుచ్చుకోకుండా భవసాగరాన్ని దాటే ప్రయత్నం కుక్కతోక పట్టుకుని మహాసముద్రాన్ని దాటే ప్రయత్నం లాంటిది అని అందులో ఉన్నట్లు విన్నాను. అన్ని మతాలవారు మా మతమే గొప్పదని చెప్పుకుంటారు.
“శాక్తేయులు కూడా వైష్ణవులను చిన్నబుచ్చడానికి ప్రయత్నిస్తుంటారు. ‘శ్రీకృష్ణుడు నౌకను నడిపి జనులను భవసాగరాన్ని దాటింపజేసే నావికుడు’ అంటుంటారు వైష్ణవులు. అందుకు జవాబుగా శాక్తేయులు, ‘ఆ, ఆ మాట నిజమే. ఎందుకంటే మా అమ్మ రాజరాజేశ్వరీ దేవి కాబట్టి. ఆమే స్వయంగా వచ్చి జనులను తరలిస్తుందా ఏమిటి? అందుకనే ఆమె ఈ పనికి కృష్ణుణ్ణి నియమించుకుంది” అని చురక అంటిస్తుంటారు. (అందరూ నవ్వారు)
“లోకులు తమ తమ మతాలను పట్టుకుని ఎంతగా అహంకారం చూపుతుంటారని! కామార్పుకూర్ దగ్గరలోని గ్రామాలలో అనేకమంది సాలెవాళ్ళు ఉండేవారు. వారిలో చాలామంది వైష్ణవులు – పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు నూలు వడుకుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు: ‘నువ్వు ఏ విష్ణువును పూజిస్తుంటావు – సృష్టిని పాలించే విష్ణువునా! ఓ, మేము అతణ్ణి తాకనైనా తాకం. నువ్వు మ్రొక్కే శివుడు ఎవరు? మేము ఆత్మారామ శివుణ్ణి ప్రార్థిస్తాం.’ లేకుంటే, ‘నువ్వు ఆరాధించే హరి గురించి మాకు కాస్త చెప్పవోయ్, చూద్దాం, అంటుంటారు.’ ఒకవైపు మగ్గాలు నేస్తుంటారు, మరోవైపు ఇలా బడాయికి పోతుంటారు.
“రతి తల్లి, రాణి కాత్యాయినీకి ఆంతరంగికురాలు – వైష్ణవచరణ్ జట్టుకు చెందినది; వైష్ణవ దురభిమాని. నా వద్దకు తరచూ వస్తూ ఉండేది; ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉండేది. ఒకసారి నేను కాళీమాత ప్రసాదం స్వీకరించడం చూసింది. అంతే, ఆ నాటి నుండి ఆమె ఇక్కడకు వస్తే ఒట్టు.
“వీటిని అన్నింటినీ సమన్వయ పరచినవాడే నిజమైన మనిషి. చాలామంది తమ మార్గం మాత్రమే సరైనది అన్నట్లు ఏకపక్షవాదులుగా ఉంటారు. అయితే నేను, అన్నింటినీ ఒక్కటిగానే దర్శిస్తాను. శాక్తం, వైష్ణవం, వేదాంతం – అన్ని మతాలు ఆ ఒక్క సత్యాన్నే ధ్యేయంగా చేసుకుని ఉన్నాయి. ఎవరైతే నిరాకారమో, ఆయనే సాకారంగా కూడా ఉన్నాడు. ఆయనే రకరకాలరూపాలు ధరించి ఉన్నాడు. ‘నిర్గుణుడు నాకు తండ్రి, సగుణుడు తల్లి. నేను ఎవరిని నిందించగలను, ఎవరిని పూజించగలను? త్రాసు యొక్క సిబ్బులు రెండూ ఒకే బరువును కలిగి ఉంటాయి.’
“వేదాలు ఎవరి గురించి వర్ణించాయో, ఆ సచ్చిదానందుణ్ణి గురించే తంత్రాలు, పురాణాలు కూడా వర్ణించాయి. నిత్యం, లీలలు రెండూ ఒకే వస్తువుకు చెందినవి.
“వేదాలు ‘ఓం సచ్చిదానంద బ్రహ్మ’, తంత్రాలు ‘ఓం సచ్చిదానంద శివ – కేవలం శివుడే’, పురాణాలు ‘ఓం సచ్చిదానంద కృష్ణ’ అంటున్నాయి. వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ ఆ ఒక్క సచ్చిదానందుని గురించే వర్ణిస్తున్నాయి. వైష్ణవశాస్త్రాలలో కూడా కృష్ణుడే కాళీ అయివున్నట్లు వ్రాయబడి ఉంది.”
25.8 అష్టమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల పరమహంస స్థితి
శ్రీరామకృష్ణులు కాసేపు వసారాలోకి వెళ్ళి తిరిగివచ్చారు. ఆయన గదిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు విశ్వంభరుని కుమార్తె ఆయనకు నమస్కరించింది. ఆ అమ్మాయికి ఆరు లేక ఏడు సంవత్సరాల వయస్సు. ఆమె శ్రీరామకృష్ణులతో మాట్లాడసాగింది. ఆమెతో పాటు అదే ఈడుగల పిల్లలు ఇద్దరు ముగ్గురు అక్కడే ఉన్నారు. విశ్వంభరుని కుమార్తె శ్రీరామకృష్ణులతో “నేను నీకు నమస్కారం చేశాను. నువ్వు చూడనే లేదే!” అంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఓ, నేను గమనించనేలేదు.
విశ్వంభరుని కుమార్తె: అయితే ఆగు. మళ్ళీ నమస్కారం చేస్తాను. ఆగాగు, ఆ కాలికి కూడా నమస్కారం చేస్తాను.
శ్రీరామకృష్ణులు నవ్వుతూ కూర్చున్నారు. నుదుటిని నేలకు తాకించి ఆ అమ్మాయికి ప్రతినమస్కారం చేశారు. ఆమెను ఏదైనా పాట పాడమన్నారు. ఆ అమ్మాయి, “మా అమ్మ తోడు, నిజంగా నాకు పాడటం రాదు” అంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడమని కోరేసరికి ఆ అమ్మాయి, “అమ్మ మీద ఒట్టు పెట్టాక కూడా మళ్ళీ అలా అడగవచ్చా?” అంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఆ అమ్మాయితో హాస్యాలాడుతూ, ఇలా పాడారు:
రావె రావె చిన్న, రావె రావె కన్న
నీ మొగుడు చూచి నిన్ను తిట్టకుండ
జుట్టు దువ్వి నీకు చుట్ట చుట్టుదునె
ఈ పాట విని పిల్లలతో సహా అక్కడున్న వారందరు కడుపుబ్బ నవ్వసాగారు.
25.8.1 శివరామ్ బాల్య సంఘటనలు – పరమహంస ఉన్మాద స్థితి
శ్రీరామకృష్ణులు (భక్తులతో): పరమహంస స్వభావం పూర్తిగా ఐదు సంవత్సరాల బాలుని పోలి ఉంటుంది. అతడు సర్వమూ చైతన్యమయంగా దర్శిస్తాడు.
“ఒకసారి నేను కామార్పుకూర్లో ఉంటున్నప్పుడు, రామ్‌లాల్ తమ్ముడికి* నాలుగు లేక ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుంది. చెరువు దగ్గర మిడతలు పడుతున్నాడు. గాలికి ఆకులు కదులుతూ ఉంటే, ‘ఉష్, చప్పుడు చేయవద్దు. నేను మిడుతలను పడుతున్నాను’ అనసాగాడు ఆకులతో. మరోసారి, కుండపోతగా వర్షం కురుస్తోంది; మెరుపులు మెరుస్తున్నాయి. నాతో పాటు గదిలో ఉన్నాడు. ఆ సమయంలో తలుపు తీసి బయటకు వెళ్ళాలంటాడు. నేను చీవాట్లు పెట్టేసరికి బిక్కుబిక్కుమంటూ గదిలోనే కూర్చుండిపోయాడు. మధ్యమధ్యలో బయటకు తొంగిచూస్తున్నాడు. మెరుపులు మెరిసినప్పుడల్లా, ‘చిన్నాన్నా! చూడు, వారు చెకుముకి రాళ్ళు కొడుతున్నారు’ అనేవాడు.
“పరమహంస ఒక చిన్న పిల్లవాని వంటి వాడు. తన వారు, పరాయివారు అన్న తేడా ఉండదు; సాంసారిక సంబంధాల గురించి ఎటువంటి లక్ష్యం ఉండదు. ఒక రోజు రామ్‌లాల్ తమ్ముడు నన్ను ‘నువ్వు మా చిన్నాన్నవా లేక మామయ్యవా?’ అని అడిగాడు.
“పరమహంస ప్రవర్తించే తీరు పసిబాలుని పోలి ఉంటుంది. తాను ఎక్కడ తిరుగుతున్నాడో ఎరుక ఉండదు. సర్వత్రా బ్రహ్మమయంగా దర్శిస్తాడు. తాను ఎక్కడకు వెళ్తున్నాడో, ఎక్కడ కూర్చున్నాడో బొత్తిగా పట్టించుకోడు. రామ్‌లాల్ తమ్ముడు, హృదయ్ ఇంట దుర్గాపూజ చూడటానికి వెళ్ళాడు. ఇంటి నుండి బయటకు వచ్చి ఒంటరిగా ఎటో వెళ్ళిపోయాడు. నాలుగు సంవత్సరాల కుర్రవాడిని చూసి దారిన పోయేవాళ్ళు ఎక్కడ నుండి వచ్చావు అని అడిగారు. వాడు కేవలం ‘పందిరి’ అన్నాడు. అంటే దుర్గాపూజ జరిగేచోట వేసిన పెద్ద పందిరి అని అతడి భావం. ఎవరి ఇంటికి వచ్చావు అని అడిగేసరికి ‘అన్నయ్య’ అని చెప్పాడు.
“పరమహంసకు ఒక్కోసారి ఉన్మాద స్థితి కలుగుతుంది. నాకు ఆ స్థితి కలిగినప్పుడు, స్వలింగాన్నే శివలింగంగా భావించి పూజించేవాడిని. సజీవ లింగపూజ! ఒక్కోసారి ముత్యం కూడా తొడిగేవాడిని. అయితే ఇప్పుడు అలా చేయలేను.
25.8.2 పూర్ణ జ్ఞానియైన పిచ్చివాడు, శ్రీరామకృష్ణులు
“దక్షిణేశ్వర ఆలయ ప్రతిష్ఠ జరిగిన కొన్ని రోజులకు ఒక పిచ్చివాడు అక్కడకు వచ్చాడు. అతడు పరిపూర్ణ జ్ఞాని. చిరిగిన చెప్పులు తొడుక్కుని ఉన్నాడు; ఒక చేతిలో వెదురు కర్ర, మరో చేతిలో మామిడి మొక్క ఉన్న మట్టి పిడత పట్టుకుని ఉన్నాడు. గంగలో మునకవేసి వచ్చాడు. సంధ్య వార్చడం లాంటిది ఏదీ చేయలేదు. మూటలో కట్టివున్నదేదో తిన్నాడు. తరువాత కాళీ ఆలయంలోకి వెళ్ళి స్తోత్ర పాఠాలు చదివాడు. ఆలయం కంపించిపోయింది. ఆ సమయంలో ఆలయంలో హలధారి ఉన్నాడు. ఆలయ ధర్మసత్రంలో ఆ పిచ్చివాడికి అన్నం పెట్టలేదు. అతడు ఆ తిరస్కృతిని ఏమాత్రం పట్టించుకోలేదు. పారవేసిన ఎంగిలి ఆకులలోని మెతుకులు ఏరి తినసాగాడు; ఒక్కొక్కసారి కుక్కలను ప్రక్కకు త్రోసి తింటున్నాడు. కుక్కలు అతణ్ణి ఏమీ చేయలేదు. హలధారి అతడి వెంటే వెళ్ళి ‘నువ్వెవరవు? పూర్ణజ్ఞానివా’ అని అడిగాడు. అతడు ‘అవును. నేను పూర్ణజ్ఞానినే. హుష్’ అన్నాడు. హలధారి నాకు ఈ విషయం చెప్పేసరికి నా గుండెలు దడదడలాడాయి. హృదయ్‌ను గట్టిగా పట్టుకుని, ‘అమ్మా, నాక్కూడా ఇదే గతి పడుతుందా?’ అంటూ ఏడ్వసాగాను. మేము ఆ పిచ్చివాడిని చూడవెళ్ళాం. మాతో అత్యున్నత జ్ఞానం గురించిన విషయాలు ఎన్నో మాట్లాడేవాడు. అయితే మరెవరైనా వస్తే మళ్ళీ పిచ్చివాడిలా ప్రవర్తించే వాడు. అతడు వెళ్ళిపోయేటప్పుడు హలధారి చాలాదూరం వరకు అతణ్ణి సాగనంప వెళ్ళాడు. ఆలయ ద్వారం దాటాక హలధారితో ఇలా అన్నాడు: ‘ఇక నీకు చెప్పవలసింది ఏముంది? ఈ మడుగులోని నీరు, గంగాజలం – ఈ రెండిటి మధ్య భేదబుద్ధి తొలగిపోయిన నాడు పూర్ణజ్ఞానం కలిగిందని తెలుసుకో.’ ఇలా పలికి అతడు గబగబ వెళ్ళిపోయాడు.”
25.9 నవమ పరిచ్ఛేదం పాండిత్యం, తపస్సు
శ్రీరామకృష్ణులు ‘మ’ తో మాట్లాడసాగారు. తక్కిన భక్తులు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): శశధర్ గురించి నీ అభిప్రాయమేమిటి?
‘మ’ : అతడు ఉత్తముడండీ.
శ్రీరామకృష్ణులు: చాలా బుద్ధిమంతుడు కదా!
‘మ’ : అవునండీ. గొప్ప పాండిత్యం కలవాడు.
శ్రీరామకృష్ణులు: ఎవరిపట్లయితే, అనేకమంది జనులు గౌరవమర్యాదలు చూపుతారో అతడిలో దైవీశక్తి విశేషంగా ఉంటుందని గీతలో చెప్పబడి ఉంది. కాని అతడు ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది.
“కేవలం పాండిత్యం ఉంటే ఏం ప్రయోజనం? కొద్దిగా తపస్సు చేయాలి, కొద్దిగా సాధనలు చేయాలి.
25.9.1 గౌరీ పండితుడు, నారాయణ శాస్త్రి – బేల్ఘరియాలో కేశవ్‌ని కలిసిన సంఘటన
“గౌరీ పండితుడు సాధనలు చేశాడు. అతడు ‘హా రే రే నిరాలంబ లంబోదర’ అని స్తవం చేయగానే పండితు లంతా అతడి ముందు వానపాములే అయిపోయేవారు.
“అదే విధంగా నారాయణశాస్త్రి కూడా. అతడు కేవలం పండితుడే కాదు, సాధకుడు కూడా. నిరంతరాయంగా పాతిక సంవత్సరాల పాటు శాస్త్రాధ్యయనం చేశాడు. న్యాయశాస్త్రం ఒక్కటే ఏడు సంవత్సరాలు చదివాడు. అయినప్పటికీ ‘హర హర’ అంటూనే అతడికి భావావేశం కలిగేది. జైపూర్ రాజు అతణ్ణి తన ఆస్థాన పండితుడుగా నియమించదలచాడు. అయితే అతడు ఆ పనికి ఒప్పుకోలేదు. తరచూ దక్షిణేశ్వరం వచ్చి వసిస్తూండేవాడు. వసిష్ఠాశ్రమం వెళ్ళి తపస్సు చేయాలని అతనికి తీవ్ర ఆకాంక్ష జనించింది. వెళ్ళిపోతానని నాతో చాలాసార్లు చెప్పాడు. అయితే నేను అక్కడకు వెళ్ళవద్దని వారించేవాడిని. ‘ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చేయాలి సాధనలు?’ అనసాగాడు. అతడి మొండిపట్టుదల చూసి చివరకు నేను అతణ్ణి వెళ్ళమని చెప్పాను. తరువాత అతడు చనిపోయాడని, తపస్సు చేస్తుండగా భైరవుడు వచ్చి చెంపదెబ్బ కొట్టాడని ఎవరో చెబుతుండగా విన్నాను. ‘లేదు, అతడు జీవించేవున్నాడు. ఇప్పుడిప్పుడే మేము అతణ్ణి రైలు ఎక్కించి వస్తున్నాం’ అంటారు మరికొందరు.
“నేను కేశవ్సేన్ను కలుసుకోబోయే ముందు, అతడు ఎటువంటి వ్యక్తో చూసి రమ్మని నారాయణశాస్త్రిని పంపాను. అతడు చూసివచ్చి, కేశవ్ జపం చేయడంలో సిద్ధుడు అన్నాడు. నారాయణ్‌కు జ్యోతిషం కూడా తెలుసు. అతడు, ‘కేశవ్‌ది అదృష్ట జాతకం. అతడితో నేను సంస్కృతంలో మాట్లాడాను. అతడు వంగభాషలో మాట్లాడాడు’ అన్నాడు.
“అటుపై నేను హృదయ్‌ను వెంటబెట్టుకుని బేల్ఘరియాలోని ఉద్యాన వాటికకు కేశవ్‌ను చూడ వెళ్ళాను. అతణ్ణి చూడగానే నేను ‘ఇతడి తోక ఊడిపోయింది. ఇతడు నీటిలోను నివసించగలడు, నేల మీదా నివసించగలడు’* , అన్నాను.
“నన్ను పరీక్షింపనెంచి కేశవ్ ముగ్గురు బ్రహ్మసమాజ భక్తులను నా వద్దకు పంపాడు. వారిలో ప్రసన్నుడు కూడా ఉన్నాడు. వారి పని రాత్రింబవళ్ళు నన్ను పరిశీలించి ఆ విషయాలను కేశవ్‌కు విన్నవించటం. వారు రాత్రిపూట నా గదిలోనే నిద్రపోయారు. కేవలం ‘దయామయుడు, దయామయుడు* ’ అంటున్నారు. నాతో ‘మీరు కేశవ్బాబును అనుసరించండి. మీకు మేలు జరుగుతుంది’ అన్నారు. ‘నేను సాకార రూపాన్ని పూజిస్తాను’ అని వారితో అన్నాను. అయినప్పటికీ వారు ‘దయామయుడు, దయామయుడు’ అనటం మానలేదు. అప్పుడు నాకు ఒక వినూత్న స్థితి కలిగింది. ఆ స్థితిలో వారిని గది నుండి బయటకు వెళ్ళిపొమ్మని చెప్పాను. వారిని గదిలోకి రానివ్వలేదు. ఆ రాత్రి వారు వసారాలోనే పడుకున్నారు. కెప్టన్ కూడా నన్ను మొదటిసారి చూసినప్పుడు, ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు.
25.9.2 మైకేల్, నారాయణ శాస్త్రిల సంభాషణ
“నారాయణ్ అక్కడ ఉంటున్నప్పుడు ఒక రోజు మైకేల్* (మధుసూదన్ దత్త) వచ్చాడు. మథుర్బాబు పెద్దకుమారుడు ద్వారికాబాబు అతణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు. ఆలయ యజమాన్యానికి ఆలయం ప్రక్కనున్న మందు గుండు కార్ఖానా (బ్రిటీషు) యజమానులతో ఏదో వ్యాజ్యెం ఉంది. ఆ విషయమై మైకేల్ సలహా తీసుకోవడానికి అతణ్ణి పిలుచుకు వచ్చారు.
“కార్యాలయం ప్రక్కనున్న పెద్ద గదిలో అతణ్ణి కలుసుకున్నాం. నేను నారాయణ్శాస్త్రిని అతడితో మాట్లాడమన్నాను. మైకేల్ సంస్కృతంలో సరిగా మాట్లాడలేకపోయాడు. తప్పులు దొర్లాయి. అందువల్ల సంభాషణ వంగభాషలోనే సాగింది.
“నారాయణ్ శాస్త్రి, మైకేల్‌ను ‘మీరు మతం ఎందుకు మార్చుకున్నారు?’ అని అడిగాడు. మైకేల్ తన పొట్టను చూపిస్తూ, ‘ఈ పొట్టకూటి కోసమే’ అన్నాడు. నారాయణ్, ‘పొట్టకూటి కోసం మతం మార్చుకునే వాడితో నేనేమిటి మాట్లాడేది?’ అన్నాడు. అప్పుడు మైకేల్ నాతో ‘మీరు ఏమైనా సెలవివ్వండి’ అన్నాడు. నేను, ‘నాయనా, ఎందుకనో నాకు మాట్లాడబుద్ధి పుట్టడం లేదు. నా నోటిని ఎవరో నొక్కి పెడుతున్నట్లుగా ఉంది’ అన్నాను.”
25.9.3 కామిని కాంచన ఆసక్తి మనిషిని నీచుణ్ణి చేస్తుంది – విషయాసక్తుల పూజ
శ్రీరామకృష్ణులను దర్శించేందుకు చౌధురి వస్తున్నాడా లేదా అన్న ప్రస్తావన వచ్చింది.
మనోమోహన్: చౌధురి రావడం లేదు. ఫరీద్పూర్ నుండి శశధర్ వస్తున్నాడు, అందువల్ల రానని చెప్పాడు.
చౌధురి ఎమ్.ఏ. చదువుకున్నవాడు. నెలకు మూడు నాలుగు వందల రూపాయల జీతం సంపాదిస్తాడు. భార్య చనిపోయినప్పుడు తీవ్ర వైరాగ్యం కలిగింది. అయితే కొంతకాలం తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.
శ్రీరామకృష్ణులు: అతడిది ఎంతటి నీచబుద్ధి! బాగా చదువుకున్నానన్న అహంకారం. పైగా రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ప్రపంచాన్ని గడ్డిపోచలా చూస్తాడు.
(భక్తులతో) “ఈ కామినీ కాంచనాల ఆసక్తి మనిషిని నీచుణ్ణి చేసివేసింది. హరమోహన్ మొదట్లో వచ్చేటప్పుడు అతడిలో చాలా మంచి లక్షణాలు ఉండేవి. అతణ్ణి చూడాలని నేను ఆరాట పడిపోయేవాడిని. అప్పుడు అతడి వయస్సు 17 లేక 18 సంవత్సరాలు. ఇక్కడకు రమ్మని చెప్పి నేను తరచూ కబురు పంపేవాడిని. అయితే అతడు వచ్చేవాడు కాదు. ఇప్పుడు భార్యతో కలసి వేరు కాపురం పెట్టాడు. మొదట్లో తన మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. సంసారానికి సంబంధించిన ఏ చీకూచింతా ఉండేది కాదు. ఇప్పుడు వేరు కాపురం పెట్టాడు. రోజూ బజారుకు వెళ్ళి భార్య కొరకు సరకులు తెస్తుంటాడు. (అందరూ నవ్వారు) ఒక రోజు దక్షిణేశ్వరానికి వచ్చాడు. నేను అతడితో ‘ఇక్కడ నుంచి వెళ్ళిపో. నిన్ను తాకితే నా ఒళ్ళు జలదరిస్తుంది’ అన్నాను.”
కర్తాభజా సంప్రదాయానికి చెందిన చంద్ర ఛటర్జీ వచ్చాడు. అతడి వయస్సు 60 లేక 65 సంవత్సరాలు ఉంటుంది. అతడి నోట ఎప్పుడూ కర్తాభజా సంప్రదాయానికి చెందిన గేయాలే. శ్రీరామకృష్ణుల పాదాలను స్పృశింప వెళ్ళాడు. అయితే ఆయన అందుకు అనుమతించలేదు.
జగన్నాథ స్వామిని దర్శించటానికి శ్రీరామకృష్ణులు ఇంట్లోపలకు వెళ్ళారు. ఇంట్లోని స్త్రీలు ఆయనను దర్శించి ప్రణామం చేశారు. తరువాత ఆయన, హాలులోకి తిరిగి వచ్చారు. నవ్వుతూ ఇలా అన్నారు: “నేను శౌచానికై వెళ్ళాను. తరువాత బట్టలు మార్చుకొని జగన్నాథుని దర్శించాను. కొన్ని పువ్వులు పళ్ళు సమర్పించాను.”
తరువాత సంభాషణను కొనసాగించారు: “విషయాసక్తుల పూజ, జపతపాలు కేవలం ఆ సమయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ ఎరుగనివాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు ఆయన నామాన్ని జపిస్తుంటాడు. కొంతమంది మనస్సులోనే సర్వదా ‘రామ్’ ‘ఓం రామ’ అంటుంటారు. జ్ఞానమార్గగాములు కూడా ‘సో-హం’ అంటూ జపం చేస్తూనే ఉంటారు. కొంతమందికి నాలుక ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. సర్వదా స్మరణ మననాలు చేయాలి.”
బలరామ్ ఇల్లు
25.10 దశమ పరిచ్ఛేదం బలరామ్ ఇంట్లో శశధర్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు – సమాధి
ఇంతలో శశధర్ పండితుడు ఒకరిద్దరు మిత్రులతో గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : మేమందరం పెళ్ళికుమార్తె చెలికత్తెల్లాగా వరుడు ఎప్పుడు వస్తాడా అని శయ్య వద్ద ఎదురు చూస్తున్నాం.
శశధర్ నవ్వసాగాడు. గది అంతా భక్తులతో నిండి ఉంది. డా ॥ ప్రతాప్, బలరాం తండ్రి కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు (శశధర్తో): జ్ఞానికి మొదటి లక్షణం, శాంత స్వభావాన్ని కలిగి ఉండటం. రెండవది, అహంకార రహితంగా ఉండటం.
“జ్ఞానికి మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు సాధువు సమక్షంలో త్యాగిగా ఉంటాడు. పనిలో నిమగ్నమైనప్పుడు, ఉదాహరణకు లెక్చర్ ఇచ్చేటప్పుడు సింహసదృశుడై ఉంటాడు. భార్యతో మాట్లాడేప్పుడు హాస్యరసప్రియుడై ఉంటాడు. (అందరూ నవ్వారు)
“విజ్ఞాని స్వభావం వేరైనది. చైతన్యదేవుల వలె బాలుడిలా, పిచ్చివాడిలా, జడునిలా, పిశాచిలా ప్రవర్తిస్తుంటాడు.
“బాలక స్వభావంలో కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి – బాల్యం, కౌమారం, యౌవనం. కౌమారావస్థలో పరిహాసాలు ఆడతాడు. ఉపదేశాలు ఇచ్చేటప్పుడు యౌవనావస్థలో ఉంటాడు.”
శశధర్: ఎటువంటి భక్తి వల్ల భగవంతుణ్ణి పొందగలం?
25.10.1 మూడు రకాల భక్తి – అచంచల విశ్వాసం – వైష్ణవుల దైన్యభావం
శ్రీరామకృష్ణులు: మనిషి స్వభావాన్ని అనుసరించి భక్తి మూడు రకాలు. అవి సాత్త్విక భక్తి, రాజసిక భక్తి, తామసిక భక్తి.
“సాత్త్విక భక్తుడి భక్తి కేవలం భగవంతుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. అటువంటి భక్తుడు ఏకాంతంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. బహుశా దోమతెరలో కూర్చుని ధ్యానం చేస్తూండవచ్చు. ఎవరికీ తెలియనైనా తెలియదు. సత్త్వగుణపు సత్వం, అంటే విశుద్ధ సత్త్వగుణం కలిగినప్పుడు భగవద్దర్శనానికి మరి ఎక్కువ సమయం పట్టదు. తూర్పున ఆకాశం ఎర్రబారగానే ఇక సూర్యోదయానికి ఎక్కువ సమయం పట్టదని తెలుస్తుందే, అలాగన్నమాట.
“రాజసిక భక్తుడికి తన భక్తిని అందరి ముందు ప్రదర్శించాలన్న కోరిక ఉంటుంది. అతడు షోడశోపచారాలతో పూజ చేస్తాడు. పట్టు పంచె ధరించి ఆలయానికి వెళతాడు. మధ్య మధ్యలో ముత్యాలు, బంగారు పూసలతో గుచ్చబడిన రుద్రాక్షమాలను మెడలో ధరించి ఉంటాడు.
“తామసిక భక్తుడు బందిపోటు దొంగలా ధైర్యసాహసాలను ప్రదర్శిస్తాడు. బందిపోటు, ఆయుధాలు ధరించి దోపిడీ చేయటానికి బయలుదేరుతాడు. ‘చంపండి, కొల్లగొట్టండి’ అని కేకలు పెడుతుంటాడు. ఎనిమిది మంది పోలీసులకు కూడా భయపడడు. తామసిక భక్తుడు కూడా ‘హర హర, బం బం, జై కాళీ’ అంటూ పిచ్చివాడిలా కేకలు పెడుతుంటాడు అతడు ఎంతో మనోస్థైర్యాన్ని, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉంటాడు.
“శాక్తేయులు కూడా అటువంటి విశ్వాసమే కలిగి ఉంటారు. వారు ఇలా అంటుంటారు: ‘ఏమిటి, ఒక్కమారు కాళీనామాన్ని స్వీకరించాను, దుర్గానామాన్ని ఉచ్చరించాను, రామనామాన్ని ఒకసారి ఉచ్చరించాను. ఇక నాకు పాపం ఎందుకు చుట్టుకుంటుంది?’
“వైష్ణవులకు దైన్యభావం ఎక్కువ. (బలరాం తండ్రిని చూస్తూ) వారు కేవలం జపమాల తిప్పుతూ ఉంటారు. ‘హే కృష్ణా! దయ చూపించు. నేను అధముణ్ణి, పాపిని’ అంటూ విలపిస్తుంటారు.
“ ‘నేను భగవంతుడి నామాన్ని జపించాను. ఇక నాకు పాపం ఏమిటి?’ – ఇటువంటి అచంచల విశ్వాసం కావాలి. అయితే కొందరు రాత్రింబవళ్ళు హరి నామాన్ని జపిస్తూనే ఉంటారు; మళ్ళీ ‘నేను పాపిని’ అంటుంటారు.”
ఇలా సంభాషిస్తూ శ్రీరామకృష్ణులు దివ్యపారవశ్యంలో గానం చేయసాగారు:
ఓ దుర్గా దుర్గాయని పిలుచుచు, అసువుల నిట బాసినచో
ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను…..
పాట విని శశధర్ విలపించసాగాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు:
అదిగో । అల్లదిగో । అమ్మదిగో । చూడదిగో ।
పారవశ్యమున ఒడలు మరచి తా
పరమేశ్వరుతో నాడుచున్నది
త్రాగి గ్రుక్కెడు దేవమద్యము
ఊగి, ఊగి తా తూగుచున్నను
ఆగి నేలపై తూలివాలదు॥ అ ॥
నిట్టనిలువుగా శివుని గుండెపై
పెట్టిపాదము నిలచియున్నది
గట్టివైన ఆ పాదఘట్టనమే
అట్టు నిట్టు భువె అదరుచున్నది॥ అ ॥
అవమానభయము లామూల నెట్టి
ఆవేశపూర్ణులై ఆ భార్యాభర్తలు
వివశులగుచు ఉన్మత్తవిత్తులై
విహ్వలాత్మలై నిలచిపోయిరి॥ అ ॥
తరువాత గాయకుడు వైష్ణవ చరణ్ పాడసాగాడు.
పాట భావం: ఓ రసనమా! సర్వదా నువ్వు దుర్గానామం జపించు. ఈ దుర్గమమార్గంలో దుర్గామాత తప్ప నిన్ను రక్షించే వారెవరు? అమ్మా దుర్గా! స్వర్గ మర్త్య పాతాళములు నువ్వు. హరి, శివుడు, ద్వాదశ గోపాలురూ ఉద్భవించింది నీలో నుండే. అమ్మా, దశ మహావిద్యాశక్తులు నువ్వే, దశావతారాలు కూడా నువ్వే. ఈసారికి, ఎలాగైనా సరే నువ్వు నన్ను తరింపచేయ వలసిందే. చలాచలాలు, స్థూలసూక్ష్మాలు, సృష్టిస్థితిలయాలు నువ్వే; విశ్వానికి మూలమూ నువ్వే. త్రిలోక జననీ, త్రిలోక తారిణీ నువ్వే. అందరి శక్తివి నువ్వే, నీ శక్తివి కూడా నువ్వే.
ఆఖరి చరణాలు కొన్ని వింటున్నప్పుడు శ్రీరామకృష్ణులకు భావావేశం కలిగింది. పాట ముగిశాక శ్రీరామకృష్ణులే స్వయంగా పాడటం మొదలుపెట్టారు.
నన్ను కన్నతండ్రి నల్లనయ్య రార ।
అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువ
ఆమె చెంత చేరి ఆటలాడు ముద్దు
మోము నెందు దాచినావు భద్రకాళి!
కత్తిప్రక్కబెట్టి కరము మురళి పట్టి
పుర్రెమాలదీసి పూలమాల దాల్చి
ఒక్కసారి నీవు కృష్ణు డాడినట్లు
నాట్యమాడు శ్యామ నాదు ప్రీతి కొరకు
శివుడు లేక నీవు ఆడలేకయున్న
ఆ బలాయి తోడ ఆడు శివుని బదులు
బాలకృష్ణు డెట్లు ఆడినాడో అట్లు
ఆడవమ్మ శ్యామ ఆడవమ్మ ఇపుడు
ఎట్టి మురళి హృదయములు దోచె
అట్టి మురళి పట్టి పాడుమమ్మ మరల
పూరిమేయు పశుల ప్రోగుచేసి యమున
లోని నీటి గతిని ఆపునట్టి మురళి
మీద నొక్కసారి పాడుమమ్మ మరల,
ఎండమండునప్పుడే యశోద కలత
చెంది కృష్ణు పిలుచు, “రార గోపబాల
వెన్నమీగడిదిగో తినగ రార కన్న”
అనుచు నతని పెద్ద నల్లజుట్టు దువ్వి
కొండిచుట్ట చుట్టి కొసరిమోము నిమురు
నీదు సన్నమేను, మెడను, నడుము, మడిమ
వద్ద వంచి సఖు సుదాము తోడనాడు
తాథయ్య తాథయ్య తతథైథై
అనుచు చేతిగాజులపుడు చేయు ధ్వనుల
మోహపరచు ధ్వనుల వినిన గోపికలును
పరుగు తీసికొనుచు దరికి వత్తురంత ॥
అటుపై గాయకుడు కీర్తనలు పాడసాగాడు. శ్రీరామకృష్ణులకు సమాధిస్థితి కలిగింది. శశధర్ కళ్ళు ప్రేమాశ్రువులు వర్షిస్తున్నాయి.
25.11 ఏకాదశ పరిచ్ఛేదం బలరామ్ ఇంట్లో రథయాత్ర – భక్తులతో శ్రీరామకృష్ణుల నృత్య సంకీర్తనలు
శ్రీరామకృష్ణులు సాధారణ స్థితికి దిగివచ్చారు. కీర్తనలు గానం చేయటం ముగిసింది.
శ్రీరామకృష్ణులు, శశధర్ను చూపుతూ ‘మ’ తో “మీరు అందరు ఇతడిని ఏమైనా అడగండి” అంటున్నారు.
రాందయాళ్ (శశధర్తో): శాస్త్రాలలో పరబ్రహ్మపు స్వరూప కల్పన ఉంది. అయితే ఆ కల్పన చేసిన దెవరు?
శశధర్: పరబ్రహ్మమే స్వయంగా కల్పన చేస్తుంది. అది మానవుని కల్పన కాదు.
ప్రతాప్: బ్రహ్మం ఎందుకు అలా రూపకల్పన చేస్తుంది?
శ్రీరామకృష్ణులు: ఎందుకు అని అడుగుతావా? అది ఆయన ఇష్టం. ఆయన ఇచ్ఛామయుడు. ఆయన ఎవరి సలహా తీసుకుని పనిచేయడు. ఆయన ఎందుకు ఇలా చేశాడు – ఈ ప్రశ్న మనకు అనవసరం. మామిడి పళ్ళు తినడానికి తోటకు వచ్చావు, మామిడిపళ్ళు తిను. తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి అని లెక్కలు వేయడం వల్ల ఏం ప్రయోజనం? వృథా తర్కవిచారణలు చేయడం వల్ల సద్వస్తువు ప్రాప్తించదు.
ప్రతాప్: మరి విచారణ చేయకూడదా?
శ్రీరామకృష్ణులు: వృథా తర్క విచారణలు చెయ్యవద్దు. కాని సదసద్విచారణ చెయ్యి, నిత్యానిత్య వివేచన చెయ్యి. కామక్రోధ శోకాదులు ఉత్పన్నమైనప్పుడు విచారణ చెయ్యి.
శశధర్: దానిని వివేకాత్మక విచారణ అంటారు.
శ్రీరామకృష్ణులు: అవును, సదసద్విచారణ. (అందరూ మౌనంగా ఉండి పోయారు.)
(శశధర్తో) “మునుపు గొప్పగొప్ప వ్యక్తులు ఇక్కడకు వచ్చేవారు.”
శశధర్: బాగా డబ్బున్నవారా?
శ్రీరామకృష్ణులు: ఊహూ, గొప్ప గొప్ప పండితులు.
ఇంతలో చిన్న రథాన్ని మేడపైనున్న వసారాలోకి తెచ్చారు. జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలకు కొత్త పీతాంబరాలు కట్టబెట్టారు. పలురకాల పూమాలలతో, భూషణాలతో అలంకరించారు. అది దేవతామూర్తులను శోభాయమానంగా దర్శింపజేస్తోంది. బలరామ్బోస్ పూజ సాత్త్వికమైనది, ఎటువంటి బాహ్యాడంబరాలు ఉండవు. ఇంట్లో రథయాత్ర జరుగుతోందని బయటివారికి అసలు తెలియదు.
శ్రీరామకృష్ణులు, భక్తులతో కలసి వసారాలోకి వచ్చారు. రథం పగ్గం పట్టుకొని కొంతదూరం లాగారు. అటుపై పాడసాగారు:
శ్రీ గౌరాంగుడి ప్రేమ లహరిలో
నదియా మొత్తం కంపించిపోతోంది…….
మళ్ళీ పాడారు:
అదుగో ఇద్దరు సోదరులు హరిని జూచుచు అశ్రులు గార్తురు
ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు…..
శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై భక్తులతో కలసి నాట్యం చేయసాగారు. వైష్ణవచరణ్ కూడా తన జట్టుతో కలసి పాడుతూ నాట్యంలో పాల్గొన్నాడు. చూస్తూండగానే మొగసాల భక్తులతో నిండిపోయింది. అందరూ కలసి ఆనందంతో నాట్యం చేయసాగారు. ప్రక్కగదిలో నుండి స్త్రీలు ఈ మహదానందమయ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. శ్రీవాసుని ఇంట చైతన్యదేవులు హరిప్రేమలో ఉన్మత్తులై భక్తులతో కలసి నాట్యం చేస్తున్నట్లుగా తోస్తోంది. శశధర్ పండితుడు తన మిత్రులతో రథం ఎదుట నిలబడి ఆశ్చర్యంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నాడు.
ఇంకా సాయంకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు మళ్ళీ హాలులోకి వచ్చారు. తిరిగి భక్తులకు తమ అమృత వాక్కులను వినిపించసాగారు.
శ్రీరామకృష్ణులు (శశధర్తో): దీనినే భజనానందం అంటారు. సంసారులు విషయానందంలో మునిగి ఉంటారు – అది కామినీ కాంచనాల ఆనందం. భజన చేయగా చేయగా భగవంతుని కృపకు నోచుకున్నప్పుడు ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తాడు – అది బ్రహ్మానందం.
శశధర్ ఇతర భక్తులు ఈ అమృత వాక్కులను శ్రద్ధగా ఆలకిస్తున్నారు.
శశధర్ (వినయంతో): అయ్యా, ఎటువంటి వ్యాకులత కలిగినప్పుడు ఆ ఆనందం లభిస్తుందో సెలవియ్యండి.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి దర్శించడానికి ప్రాణాలు విలవిలా కొట్టుకున్నప్పుడు వ్యాకులత జనిస్తుంది. ఒక గురువు, శిష్యునితో ఇలా అన్నాడు: ‘నువ్వు నాతో పాటు రా. ఏ విధంగా వ్యాకులత చెందితే భగవద్దర్శనం కలుగుతుందో నీకు చూపిస్తాను.’ ఇలా పలికి అతణ్ణి ఒక చెరువు వద్దకు తీసుకు వెళ్ళాడు. శిష్యుణ్ణి చెరువులో ముంచి కాసేపు అతడి తలను నీటిలోనే అదిమిపట్టాడు. తరువాత అతడిని వదలిపెట్టి ‘నీ తలను నీటిలో అదిమిపెట్టినప్పుడు నీకు ఎలా అనిపించింది?’ అని అడిగాడు. శిష్యుడు, ‘స్వామీ, ప్రాణాలు పోతున్నట్లు తోచింది. ఒక్కసారి శ్వాస పీల్చుకోవడానికి తహతహలాడిపోయాను’ అన్నాడు.
శశధర్: అవునవును, ఇప్పుడు విశదపడిందండీ.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి ప్రేమించటమే అసలు విషయం. భక్తియే సారం. నారదుడు శ్రీరాముణ్ణి ఇలా వేడుకున్నాడు : ‘ప్రభో, నీ పాదపద్మాల పట్ల సర్వదా నాకు శుద్ధభక్తి కలిగేలా చెయ్యి. నీ భువనమోహన మాయలో నేను మోహితుణ్ణి కాకుండా చెయ్యి.’ ‘ఏదైనా వేరే వరం కోరుకొ’ మ్మని శ్రీరాముడు చెప్పగా నారదుడు ‘ప్రభో, నాకు మరేమీ వద్దు. నీ పాదపద్మాలపట్ల భక్తి ఉంటే చాలు’ అన్నాడు.
శశధర్ పండితుడు సెలవు తీసుకుంటున్నాడు. అతడి కోసం బండిని పిలిపించమని శ్రీరామకృష్ణులు చెప్పారు.
శశధర్: వద్దండి. మేము నడిచేపోతాం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అదెలా కుదురుతుంది. ‘ధ్యానం ద్వారా కూడా బ్రహ్మ నిన్ను తెలుసుకోలేడు.’
శశధర్: ఇప్పుడే వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. అయితే సంధ్య వార్చవలసి ఉంది.
25.11.1 శ్రీరామకృష్ణుల కర్మత్యాగం – భగవన్నామ స్మరణ
శ్రీరామకృష్ణులు: సంధ్యాది కర్మలను అమ్మ నా నుండి తొలగించి వేసింది. సంధ్య ద్వారా దేహం, మనస్సు పరిశుద్ధ మవుతాయి. ఇప్పుడు ఆ స్థితి లేదు.
ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఒక పాటలోని చరణాలు కొన్ని పాడారు:
శుద్ధాశుద్ధము లటునిటు నుండగ
ఆనందాలయ సౌధమున
వాని నడుమనే పవ్వళించుటను
నేర్చునదెప్పుడే ఓ మనసా
ఏక పంచలో భార్య లిరువురను
తృప్తిగనుంచెడు దారి దొరికిన
అద్వితీయమగు శ్యామరూపమును
సందర్శించగ జాలెద వీవు.
శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి శశధర్ వెళ్ళిపోయాడు.
రామ్: నిన్న నేను శశధర్ను చూడడానికి వెళ్ళాను. మీరు చెప్పారు కదా!
శ్రీరామకృష్ణులు: ఎక్కడిది, నేనేం చెప్పలేదే! కాని, వెళ్ళావంటే మంచిదే.
రామ్: ఒక వార్తాపత్రిక (Indian Empire) సంపాదకుడు మిమ్మల్ని దుర్భాషలాడుతున్నాడు.
శ్రీరామకృష్ణులు: అవునా, దుర్భాషలాడనీ, దానితో కలిగే నష్టమేమిటి?
రామ్: తరువాత ఏం జరిగిందో వినండి. నేను మీ గురించి చెప్పాక అతడు నన్ను వదల్లేదు. ఇంకా చెప్పమని బలవంతపెట్టాడు.
సాయంకాలం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తున్నారు. అటుపై రామనామం, కృష్ణనామం, హరినామం ఉచ్చరించారు. ఆయన మధుర కంఠం నుండి వెలువడుతున్న నామామృతాన్ని భక్తులు నిశ్శబ్దంగా గ్రోలుతున్నారు. నేడు బలరామ్ ఇల్లు చైతన్యదేవులు వసించినప్పటనవద్వీపంలా తయారయింది. బయట వసారా నవద్వీపం గాను, లోపల బృందావనం గానూ ఒప్పారుతున్నాయి.
నేటి రాత్రి శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం తిరిగి వెళ్ళిపోతారు. బలరామ్ ఉపాహారం ఆరగించే నిమిత్తం ఆయనను లోపలకు తీసుకు వెళ్ళారు. ఈ సమయంలో భక్తురాండ్రు ఆయనకు మళ్ళీ ప్రణామం చేశారు.
భక్తులు హాలులో ఆయనకోసం నిరీక్షిస్తూ సంకీర్తన ప్రారంభించారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు కూడా వచ్చి వారితో పాటు సంకీర్తనలో పాల్గొన్నారు.
నా గౌరాంగుని నాట్యము గనుడు
శ్రీవాసుని గృహ ప్రాంగణంబున॥ నా ॥
భక్తుల తోడను కూడి యాడుచును
కీర్తన పాడుచు నృత్యము చేసెడు॥ నా ॥
“నామ భజోహరి నామభజోహరి”
అని పాడెడు నా గౌరుచంద్రుని॥ నా ॥
అట్టి గదాధరువైపె చూడగా
భక్తి బాష్పములు పసిడి మేనిపై
జారుచుండ తన ఎరుపు కన్నులన్
శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో :
గోరా కీర్తన పాడుచుండెనట
పాడుచు నాట్యము చేయుచుండెనట
నా గౌరాంగుడు నాట్యమాడునట
శచీకుమారుడు నాట్యమాడునట
(నా) ప్రాణప్రియుడు నాట్యమాడునట ॥