22.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వర ఆలయంలో ఫలహారిణీ కాళీపూజ – విద్యాసుందర్ నాటకం
శనివారం, మే 24, 1884
నేడు అమావాస్య. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం పదకొండు గంటలు అయివుంటుంది. రాఖాల్, ‘మ’, పలువురు భక్తులు అక్కడ ఉన్నారు.
గత రాత్రి ఫలహారిణీ కాళీపూజ జరిగింది. ఆ సందర్భంగా అర్ధరాత్రి గడిచాక ఆలయ మండపంలో విద్యాసుందర్ నాటకం ప్రదర్శింపబడింది. శ్రీరామకృష్ణులు ఉదయాన కాళీమాతను పూజింప ఆలయానికి వెళ్లినప్పుడు కాసేపు నాటకాన్ని తిలకించారు. ఉదయం నాటక బృందంవారు, స్నానం చేసి శ్రీరామకృష్ణులను దర్శింప ఆయన గదికి వచ్చారు. వారిలో పసిమి ఛాయలోని యువకుడు ఒకడు ‘విద్య’ అనే పాత్రలో ప్రశంసనీయంగా నటించాడు. శ్రీరామకృష్ణులు అతడితో ఉల్లాసంగా మాట్లాడసాగారు. భక్తులూ ఆతురతతో వింటున్నారు.
22.1.1 నటునికి ఉపదేశం – అభ్యాసయోగం – కామానికి, కామనకు వ్యత్యాసం
శ్రీరామకృష్ణులు (నటునితో): నీ నటన అద్భుతం. పాటలు పాడటంలోనో, వాయిద్యాలు వాయించటంలోనో, నృత్యం చేయటంలోనో లేక ఏదో ఒక విద్యలో మేటి అయినవాడు ప్రయత్నిస్తే, సత్వరం భగవత్ప్రాప్తి పొందగలడు. ఏ విధంగానైతే మీరు ఎంతో అభ్యాసం ద్వారా పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, నృత్యం చేయటం నేర్చుకుంటారో, అదే విధంగా మనస్సునూ భగవంతునిపై లగ్నం చేయడం అభ్యసించాలి. పూజ, జపం, ధ్యానం మొదలైన వాటిని క్రమం తప్పకుండా చేయాలి. అవునూ, నీకు వివాహమైందా? పిల్లలా?
నటుడు: వివాహం అయిందండీ. ఒక ఆడపిల్ల పుట్టి, చనిపోయింది. ఇప్పుడు మరో బిడ్డ ఉంది.
శ్రీరామకృష్ణులు: నువ్వు పిన్న వయస్కుడవు. ఈలోపునే పుట్టడం, గిట్టడం కూడానా! ఒక లోకోక్తి ఉంది – ‘వివాహం కాగానే నా భర్త మరణించాడు. నేను ఎన్ని రాత్రులు విలపించాలో?’ (అందరూ నవ్వారు) సంసార సుఖాన్ని చవిచూస్తూనే ఉన్నావు కదా! రేగిపండులా కేవలం గింజ, తోలు మాత్రమే. తింటే కడుపు నొప్పి! నువ్వు నటుడిగా ఉంటున్నావు, మంచిదే. కాని బాధాకరమైన వృత్తి ఇది. ఇప్పుడు నువ్వు పిన్నవయస్కుడవే. అందుచేతనే ముఖం గుండ్రంగా, నదరుగా ఉంది. కొంతకాలం అయ్యాక అంతా సొట్టలు పడిపోతుంది. సామాన్యంగా నటులందరి పరిస్థితీ ఇట్లే ఉంటుంది – సొట్టలుపడ్డ ముఖం, బానపొట్ట, చేతులకు తాయెత్తు. (అందరూ నవ్వారు)
“నేనెందుకు నీ నాటకాన్ని చూశానో తెలుసా? తాళం, పాట, శ్రుతి అన్నీ చక్కగా అమరినాయి. దానికి తోడు నారాయణుడే నటుల రూపంలో వేషం ధరించి నటిస్తూ ఉన్నట్లు అమ్మ నాకు చూపించింది.”
నటుడు: మహాశయా, కామానికి, కామనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: కామం చెట్టు వేరు లాంటిది; కామనలు కొమ్మలు, ఆకులు. కామక్రోధలోభాది అరిషడ్వర్గం అడుగంటా నశించదు. అందుచేత వాటిని భగవంతుని వైపుకు మరలించాలి. కామన ఉంచుకోగోరితే, లోభం ఉంచుకోగోరితే, భగవంతుని పట్ల భక్తి కావాలనే కామన ఉంచుకో, ఆయన్ను పొందాలనే లోభం ఉంచుకో. నీకు మదం కలిగితే, అహంకారం జనిస్తే ‘నేను భగవంతుడి దాసుడను, భగవంతుని బిడ్డను’ అనే మదం రానివ్వు, ఆ అహంకారాన్ని స్వీకరించు.
22.1.2 భోగం, యోగం – సోదరులతో మైత్రి
“మనస్సును సంపూర్ణంగా భగవంతునికి అర్పించకుంటే ఆయన దర్శనం కలుగదు. కామినీ కాంచనాలలో మనస్సు వృథాగా ఖర్చు అయిపోతుంది. ఇదుగో చూడు! నీకు పిల్లాజల్లా ఉన్నారు, నాటకాలలో నటిస్తున్నావు. ఈ అనేక వ్యాపకాల కారణంగా మనస్సు భగవంతునిలో లగ్నం కాకుండా పోతుంది.
“భోగం ఉండే పక్షంలో యోగం తగ్గిపోతుంది. భోగమంటే దుఃఖాలలో మ్రగ్గిపోవటమే. అవధూత యొక్క ఇరవై నలుగురు గురువులలో గ్రద్ద ఒకటి అని భాగవతం చెబుతోంది. గ్రద్ద ముక్కున చేప ఉన్నంత వరకు వేలాది కాకులు దాన్ని చుట్టుముట్టాయి, ముక్కున చేపతో గ్రద్ద ఏ దిశలో ఎగిరినా అక్కడకు కాకులు కావ్… కావ్… అని అరుస్తూ వెన్నంటాయి. యాదృచ్ఛికంగా గ్రద్ద ముక్కు నుండి చేప క్రింద పడిపోయింది. అంతే, కాకులు చేపను వెన్నంటాయి, గ్రద్దను విస్మరించాయి.
“చేప అంటే భోగవస్తువు; కాకులు అంటే కోరికలు, ఆదుర్దాలు. ఎక్కడయితే భోగం ఉంటుందో, అక్కడ కోరికలు, ఆదుర్దాలు ఉంటాయి. భోగాలను త్యజిస్తేనే ప్రశాంతత.
“ఇంకా చూడు, అర్థమే (అంటే, ధనం) అనర్థమైపోతుంది. మీరందరూ అన్నదమ్ముల్లా ఆనందంగా ఉంటున్నారు. కాని అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు వస్తే చాలు, అంతా గందరగోళం అయిపోతుంది. కుక్కలు ఒకదాన్నొకటి నాక్కుంటూ ఉంటాయి, పరస్పరం ప్రీతిపూర్వకంగా ఉంటాయి. కాని ఇంట్లో నుండి కొంచెం అన్నం పడేస్తే చాలు, అవి కాట్లాడుకుంటాయి.
“అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉండు. (‘మ’ తదితరులను చూపుతూ) వీళ్లు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఆదివారం రోజునో, లేకపోతే మరో సెలవు రోజునో వస్తారు.”
నటుడు: వానాకాలం, పంట కోతల సమయంలో మాకు మూడు నెలలు సెలవులు ఉంటాయి. మిమ్మల్ని దర్శించటం మా అదృష్టం. దక్షిణేశ్వరానికి వస్తూ ఉన్నప్పుడు ఇద్దరిని గురించి వినివున్నాం. ఒకరు మీరు, మరొకరు జ్ఞానార్ణవ.
శ్రీరామకృష్ణులు: సోదరులతో మైత్రీపూర్వకంగా మెలగు. మైత్రీభావంతో మెలగినట్లయితే చూడటానికి, వినటానికి ఇంపుగా ఉంటుంది. నాటకాలలో నువ్వు చూడలేదా? నలుగురు కలిసి పాడేటప్పుడు, ఒక్కొక్కరు ఒక్కో స్వరంలో పాడితే నాటకమే అభాసుపాలవుతుంది.
నటుడు: వలలో అనేక పక్షులు చిక్కుకున్నాయి. అన్నీ ఒక్కటిగా కలిసి ఒకే దిశలో వలతోసహా ఎగిరిపోతే తప్పించుకునే మార్గం ఉంటుంది. కాని అవి వేర్వేరు దిశలలో ఎగరటానికి ప్రయత్నిస్తే తప్పించుకోలేవు.
“తల మీద కుండ పెట్టుకుని నృత్యం చేయటం నాటకాలలో మనం చూసే ఉన్నాం.”
శ్రీరామకృష్ణులు: సంసారంలో ఉండు, అదే సమయంలో తల మీద కుండను కూడా స్థిరంగా ఉంచుకో. అంటే మనస్సు భగవంతుని మీద సుస్థిరంగా నిలుపు.
“సైనిక శిబిరంలోని సిపాయిలతో నే నొకసారి, ‘మీరు మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. కాని కాళుడనే రోకలి చేతి మీద పడనే పడుతుంది, కనుక అప్రమత్తంగా ఉండండి’ అని చెప్పాను.
“కామార్పుకూర్లో వడ్రంగి స్త్రీలు రోకలితో అటుకులు దంపుతారు. ఒకామె రోకలి వేస్తూవుంటుంది, మరొకామె అటుకులను చేత్తో తోస్తూ ఉంటుంది. అదే సమయంలో రోకలి చేతి మీద పడకుండా అప్రమత్తంగా ఉంటుంది. వీటికి తోడు బిడ్డకు పాలు పడుతుంది, మరో చేత్తో నానిన వడ్లను కుండలో వేసి వేయిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఖాతాదారులతో, ‘నువ్వు ఇంత బాకీ ఉన్నావు, చెల్లించు’ అంటూ ఉంటుంది.
“ఈ విధంగా మనస్సును భగవంతునిలో లగ్నం చేసి, సంసారంలో అనేక కర్తవ్యాలను నిర్వర్తించవచ్చు. కాని అభ్యాసం ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అటువంటప్పుడే రెండిటిలోనూ మనస్సును నిలిపి జీవించవచ్చు.”
22.1.3 భగవద్దర్శనానికి మార్గం – సాధుసాంగత్యం – సైన్సు కాదు
నటుడు: మహాశయా, ఆత్మ శరీరానికి భిన్నమైన దనటానికి ఋజువు ఏమిటి?
శ్రీరామకృష్ణులు: ఋజువా? భగవంతుణ్ణి దర్శించవచ్చు. తపస్సు చేసినట్లయితే, ఆయన కృపతో ఆయన దర్శనం కలుగుతుంది. ఋషులు ఆత్మను సాక్షాత్కరించుకున్నారు. సైన్స్ ద్వారా భగవత్ తత్త్వాన్ని తెలుసుకోలేం. దానితో మనకు తెలిసేది, ‘దీన్ని దానితో చేర్చితే ఇది లభిస్తుంది, దాన్ని దీనితో చేర్చితే అది లభిస్తుంది’ అని ఇంద్రియాలతో తెలుసుకోగల వస్తువుల గురించిన సమాచారం మాత్రమే. అందుచేతనే ఈ బుద్ధితో భగవత్ తత్త్వాన్ని తెలుసుకోలేం. సాధు సాంగత్యం చేయాలి. వైద్యునితో సహవాసం చేయగా చేయగా నాడి చూడటం ఎలాగో తెలుసుకోవచ్చు.
నటుడు: మహాశయా, ఇప్పుడు అర్థమవుతోంది.
శ్రీరామకృష్ణులు: తపస్సు చేయాలి. అప్పుడే నీకు వస్తువు దక్కుతుంది. శాస్త్రాలలోని శ్లోకాలను కంఠోపాఠం చేసినందువల్ల ఏదీ జరుగదు. భంగు, భంగు అంటూ చెప్పినందువల్ల మత్తు జనించదు, దాన్ని త్రాగాలి.
“భగవత్సాక్షాత్కారం పరులకు విశదపరచలేం. ఐదేళ్ళ బిడ్డకు దాంపత్య సుఖాన్ని విశద పరచలేం.”
నటుడు: స్వామీ ఆత్మదర్శనం పొందటం ఎలా?
22.1.4 రాఖాల్ పట్ల శ్రీరామకృష్ణుల బాలగోపాలుని భావం
అదే సమయంలో రాఖాల్ భోజనానికి కూర్చున్నాడు. గదిలో పలువురు ఉండటం వలన భుజించడానికి సంకోచిస్తున్నాడు. ఈ మధ్య శ్రీరామకృష్ణులు రాఖాల్ను బాలగోపాలునిగానే భావిస్తున్నారు; యశోదలా వాత్సల్య భావాన్ని ప్రకటిస్తున్నారు.
శ్రీరామకృష్ణులు (రాఖాల్తో): ఎందుకు సంకోచిస్తావు? నువ్వు తిను. కావాలంటే వీళ్లు ఒక ప్రక్కన నిలబడతారు. (ఒక భక్తునితో) రాఖాల్కు కొంచెం మంచుగడ్డ తెచ్చిపెట్టు. (రాఖాల్తో) నువ్వు బన్హుగ్లీకి మళ్లీ వెళ్తావా? ఎండలో వెళ్లవద్దు.
రాఖాల్ భోజనానికి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మళ్లీ నటునితో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: మీరందరూ కాళికాలయ ప్రసాదం ఎందుకు తినకూడదు? ఇక్కడే తింటే బాగుంటుందే!
నటుడు: అవునండీ. కాని అందరూ ఒకేలా భావించటం లేదే! అందుచేతనే వేర్వేరుగా వంట చేస్తున్నారు. ధర్మసత్రంలో భోజనం చేయటం అందరికీ ఇష్టంలేదు.
రాఖాల్ భోజనం చేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో మొగసాలలోకి వెళ్లి, అక్కడ కూర్చుని మాటలు కొనసాగించారు.
22.2 ద్వితీయ పరిచ్ఛేదం నటుడు – సంసారంలో సాధన – భగవద్దర్శనానికి మార్గం
శ్రీరామకృష్ణులు (నటునితో): ఆత్మదర్శనానికి మార్గం మనోవ్యాకులత; మనోవాక్కాయాల ద్వారా ఆయనను పొందడానికి ప్రయత్నం చేయాలి. పిత్తం అధికరిస్తే కామెర్ల రోగం దాపురిస్తుంది. అప్పుడు అన్ని వస్తువులూ పసుపు పచ్చగా కానవస్తాయి, పసుపు పచ్చ తప్ప మరే రంగూ కనబడదు. మీ నాటక బృందంలో సదా స్త్రీ పాత్రలలోనే నటిస్తూ ఉండే పురుషులకు స్త్రీ నైజం వచ్చేస్తుంది. స్త్రీలను స్మరించి స్మరించి వారి హావభావాలు అన్నీ స్త్రీవలెనే మారిపోతాయి. అదే విధంగా అహర్నిశలూ భగవంతుని స్మరిస్తే భగవన్నైజాన్ని పొందవచ్చు.
“చలువ చేసిన వస్త్రం వంటిది మనస్సు. మనస్సును ఏ రంగులో ముంచుతామో ఆ రంగును అది సంతరించుకుంటుంది.”
నటుడు: కాని మొదట దాన్ని చలువ చేయాలి కదా?
శ్రీరామకృష్ణులు: అవును. మొదట చిత్తశుద్ధి; ఆ పిదప మనస్సును భగవత్ చింతనలో నిలిపి ఉంచితే అది ఆ వర్ణాన్నే సంతరించుకుంటుంది. కాని మళ్లీ సంసారంలో దిగితే, నాటకాలలో నటింప ప్రారంభిస్తే ఆ విధంగానే అయిపోతుంది.
22.3 తృతీయ పరిచ్ఛేదం హరి, నారాయణ్ ప్రభృత భక్తులతో
శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించసాగారు. అంతలో కలకత్తా నుంచి హరి, నారాయణ్, నరేంద్ర బంధోపాధ్యాయ మొదలైన భక్తులు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత ఆచార్యుడైన రాజకృష్ణ బంధోపాధ్యాయుని కుమారుడు నరేంద్ర బంధోపాధ్యాయ. తండ్రితో కాస్త మనఃస్పర్థ ఏర్పడినందున శ్యామ్పుకూర్లో విడిగా భార్యాబిడ్డలతో ఉంటున్నాడు. నిరాడంబరుడు; వయస్సు ఇరవై తొమ్మిది లేక ముప్ఫై సంవత్సరాలు ఉండవచ్చు. చివరి రోజుల్లో అలహాబాద్‌లో వసించాడు. యాభై ఎనిమిదేళ్లు జీవించాడు.
అతడు ధ్యానంలో గంటల ధ్వని మొదలైన నాదాలు ఆలకించటం, పలు దృశ్యాలు గాంచటమూ పరిపాటి. భూటాన్ మొదలైన వాయవ్య ప్రాంతాలు ఎన్నో, సందర్శించాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చేవాడు.
హరి (కాలాంతరంలో స్వామి తురీయానంద) బాగ్‌బజార్‌లో తన సోదరులతో ఉంటున్నాడు. జనరల్ అసెంబ్లీ పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకు చదివాడు. పిదప చదువుకు స్వస్తి చెప్పాడు. ఇంట్లో భగవత్ చింతన, శాస్త్రాధ్యయనం, యోగాభ్యాసంతో రోజులు గడుపుతున్నాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటాడు. ఆయన బాగ్బజారులోని బలరామ్ ఇంటికి వెళితే కొన్ని సమయాల్లో ఇతణ్ణి పిలువనంపేవారు.
నారాయణ్ పదహారు లేక పదిహేడేళ్ల పాఠశాల విద్యార్థి. అతడు తరచూ శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్నాడు. అతడంటే ఆయనకు ఎంతో మక్కువ.
22.3.1 బుద్ధుడు – బోధస్వరూపం – నాంగ్టా ఉపదేశం
శ్రీరామకృష్ణులు (భక్తులతో): బుద్ధుని గురించి ఎంతో విని ఉన్నాను. ఆయన దశావతారాలలో ఒకరు. బ్రహ్మం నిశ్చలమైనది, నిర్లిప్తమైనది, నిష్క్రియమైనది, బోధ స్వరూపమైనది. బుద్ధి ఈ బోధస్వరూపంలో విలీనం అయినప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది; అప్పుడు మనిషి బుద్ధుడవుతాడు. ‘మనస్సు బుద్ధిలో లయమవుతుంది; బుద్ధి బోధస్వరూపంలో లయమవుతుంది’ అనేవాడు నాంగ్టా.
“ ‘అహం’ భావన ఉన్నంతవరకు బ్రహ్మజ్ఞానం ఉదయించదు. బ్రహ్మజ్ఞానం ఉదయించినప్పుడే, భగవద్దర్శనం కలిగినప్పుడే ‘అహం’ భావన మన వశంలోకి వస్తుంది. లేకుంటే, ‘అహం’ భావనను వశపరచుకోలేం. తన నీడను పట్టుకోవటం కష్టం. కాని సూర్యుడు నడినెత్తి మీదకు వస్తే నీడ ఒక జానెడు అయిపోతుంది.”
22.3.2 బంధోపాధ్యాయ్కు బోధ – సాధుసాంగత్యమే భగవద్దర్శనానికి మార్గం
ఒక భక్తుడు: భగవద్దర్శనం ఎలా ఉంటుంది?
శ్రీరామకృష్ణులు: థియేటర్లో నాటకం చూడలేదా? ప్రేక్షకులు గలగలా మాట్లాడుకుంటూ ఉంటారు. హఠాత్తుగా తెర లేస్తుంది. వెంటనే అందరి మనస్సు నాటకంలో పూర్తిగా లీనం అయిపోతుంది, ఆ పిదప వారి దృష్టి ఎటుకేసీపోదు. ఈ విధంగా అంతర్ముఖమవడాన్నే సమాధిస్థితి అంటున్నాం. మళ్ళీ తెర పడగానే దృష్టి అటూ ఇటూ పోతుంది. మాయ అనే తెర పడగానే మనిషి మళ్ళీ బహిర్ముఖుడవుతాడు. (నరేంద్ర బంధోపాధ్యాయ్తో) నువ్వు పలు ప్రాంతాలు సందర్శించావు కదా! సాధువుల గురించి కాస్త ముచ్చటించు.
బంధోపాధ్యాయ భూటాన్‌లో ఇద్దరు యోగులను దర్శించినట్లు, వారు నిత్యం అర సేరు వేప ఆకుల రసం త్రాగే వారని చెప్పాడు. నర్మదా నదీతీరంలో ఒక సాధువు ఆశ్రమాన్ని కూడా సందర్శించాడతడు. అక్కడున్న సాధువు ఒకరు, ప్యాంట్ ధరించిన ఒక బెంగాలీబాబును చూసి, ‘ఇతడు నడుమున కత్తి ధరించాడు’ అని వ్యాఖ్యానించాడట.
శ్రీరామకృష్ణులు: ఇదుగో చూడు, సాధువుల చిత్తరువులను ఇంట్లో తగిలించి ఉంచాలి. అప్పుడు భగవత్ చింతనలు సర్వదా మనస్సున పెల్లుబుకుతాయి.
బంధోపాధ్యాయ: మీ చిత్రాన్ని ఇంట్లో ఉంచుకున్నాను. చేత హుక్కాతో పర్వతాలలో వసించే ఒక సాధువు చిత్రమూ ఉంది.
శ్రీరామకృష్ణులు: అవును, సాధువుల చిత్రాలను చూస్తే మనస్సులో ఆధ్యాత్మిక భావనలు జాగృత మవుతాయి. సీతాఫలం బొమ్మను చూసినప్పుడు నిజమైన సీతాఫలం గుర్తుకు వస్తుంది కదా, యువతిని చూసినప్పుడు మనస్సులో భోగ భావనలు కలుగుతుంటాయి కదా. అందుచేతనే మీకు చెబుతున్నాను సదా సాధుసాంగత్యం ఉండాలని.
(బంధోపాధ్యాయ్తో): సంసారంలోని దుఃఖాలను చూస్తూనే ఉన్నావు కదా! భోగాన్ని స్వీకరిస్తేనే దుఃఖం వాటిల్లుతుంది. గ్రద్ద ముక్కున చేప ఉన్నంత వరకు కాకుల గుంపు దాన్ని యాతనపెడుతూనే ఉంటుంది.
“సాధు సాంగత్యంతో శాంతి చేకూరుతుంది. మొసలి నీటిలో చాలాసేపు ఉండిపోతుంది; కాని ఊపిరి పీల్చుకోవటానికి అప్పుడప్పుడు ఉపరితలానికి వస్తుంది, అప్పుడు భారంగా ఊపిరి పీల్చుకుని ఉపశమనం పొందుతుంది.
22.3.3 నటుడు – భగవంతుడు కల్పతరువు – సకామ ప్రార్థనలో ‘పులి’ ముప్పు
నటుడు: స్వామీ, భోగం గురించి మీరన్నది నిజం. భగవంతుణ్ణి భోగ సుఖాలకై కోరితే చివరకు అధోగతే. మనస్సులో ఎన్నో రకాల కాంక్షలు తలెత్తుతాయి. అన్ని కాంక్షలూ మనకు మేలు చేయవు. భగవంతుడు కల్పతరువు, ఏది కోరితే అది ప్రసాదిస్తాడు. కాని, ‘భగవంతుడు కల్పతరువై ఉన్నాడే! ఒక పులి వస్తే చూద్దాం’ అని అనుకుంటే పులి వచ్చి నిలబడుతుంది, మనలను మ్రింగనూ మ్రింగుతుంది.
శ్రీరామకృష్ణులు: అవును, పులి వస్తుందని గుర్తు ఉంచుకోవాలి. ఇంకా చెప్పటానికి ఏముంది? మనస్సును భగవంతునిపై నిలుపుకో. ఆయనను మరువవద్దు, సరళ హృదయంతో ఆయనను ప్రార్థిస్తే ఆయన దర్శనం ఇస్తాడు.
“మరో సంగతి – ఆఖరున హరినామ సంకీర్తన చేసి నాటకాన్ని ముగించండి. అప్పుడే గాయకులు, శ్రోతలు అందరూ భగవత్ చింతన చేసుకుంటూ తమ తమ ఇళ్ళకు వెళతారు.”
22.3.4 గృహస్థ భక్తులు – స్త్రీలకు ఉపదేశం – విగ్రహారాధన ప్రాశస్త్యం
నాటక బృందం వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. ఇద్దరు భక్తుల భార్యలు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. వారు ఆయన దర్శనార్థం ఉపవాసం చేసి వచ్చారు. ఇద్దరూ తోడికోడళ్లు, వయస్సు ఇరవై రెండు లేక ఇరవై మూడు ఉండవచ్చు. ఇద్దరికీ పిల్లలున్నారు, మేలి ముసుగు ధరించి ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (ఆ స్త్రీలతో): ఇదుగో చూడండి, మీరు శివపూజ చేయండి. నిత్యకర్మ అనే పుస్తకం ఉంది. దాన్ని చూసి పూజ చేయడం ఎలాగో తెలుసుకోండి. పూజ చేయడం ద్వారా భగవత్ కార్యాలలో చాలా సమయం నిమగ్నులు కావచ్చు. పువ్వులు సేకరించటం, చందనం తీయటం, పూజా పాత్రలను తోమటం, నైవేద్యం తయారుచేయటం మొదలైనవి చేస్తూ ఉన్నప్పుడు మనస్సు అటువైపే మళ్లి ఉంటుంది; అల్పతనం, కోపం, ఈర్ష్య మొదలైనవి తొలగిపోతాయి. మీరిద్దరూ మాట్లాడేటప్పుడు భగవంతుని గురించే మాట్లాడుకోండి.
“ఏ విధంగానైనా సరే, మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి. ఎప్పుడూ, ఒక్కసారి కూడా ఆయన్ను మరచిపోరాదు. తైలధారలా నిరంతరాయంగా భగవత్ చింతన జరుగుతూ ఉండాలి. ఒక ఇటుక రాయినో, శిలనో కూడా దైవంగా ఎంచి భక్తితో పూజిస్తే, ఆయన కృపతో దాని మూలంగానే భగవద్దర్శనం పొందవచ్చు.
“నేను మొదట చెప్పినవి, అంటే శివపూజ వంటివి చేయాలి. మనస్సు పరిపక్వత చెందితే, పిదప ఎక్కువ రోజులు పూజ చేయవలసిన అవసరం లేదు. ఆ స్థితిలో మనస్సు సదా భగవంతునిలో లగ్నమయ్యే ఉంటుంది; స్మరణ మననాలు సర్వదా నెలకొని ఉంటాయి.”
పెద్ద తోడికోడలు: మాకు ఏదైనా ఉపదేశిస్తారా?
శ్రీరామకృష్ణులు (ఆప్యాయతతో): నేను మంత్రదీక్ష నివ్వటం లేదే! మంత్రదీక్ష ఇస్తే శిష్యుల పాపం, బాధలు అన్నీ గురువు స్వీకరించాలి. అమ్మ నన్ను ఒక బిడ్డ స్థితిలో ఉంచింది. నేను చెప్పిన శివపూజ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇక్కడకు రండి. తరువాత భగవత్సంకల్పం మేరకు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. స్నానయాత్ర దినాన మళ్లీ ఇక్కడకు రావటానికి ప్రయత్నించండి. ఇంట్లో హరినామ సంకీర్తన చేయమని చెప్పి ఉన్నానే, చేస్తున్నారా?
పెద్ద తోడికోడలు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: మీరు ఉపవాసం చేసి ఎందుకు వచ్చారు? భోజనం చేసే రావాలి. స్త్రీలు నా జగజ్జనని పలురూపాలే కదా! అందుకనే వాళ్లు కష్టపడటం నేను చూడలేను. మీ రందరూ జగజ్జనని యొక్క వేర్వేరు రూపాలు. భోజనం చేసి రండి, ఆనందంగా ఉండండి.
ఈ విధంగా చెప్పి శ్రీరామకృష్ణులు రామ్‌లాల్‌ను పిలిచి ఆ ఇద్దరు స్త్రీలను కూర్చోబెట్టి, ఆహారం ఇవ్వమన్నారు. ఫలహారిణీ కాళిపూజ ప్రసాదం, లూచీ, పలురకాల పళ్లు, గ్లాసు పానకం, మిఠాయిలు వారికి ఇవ్వబడ్డాయి.
తరువాత శ్రీరామకృష్ణులు, “మీరు కాస్త తిన్నారు. ఇప్పుడే నా మనస్సు కుదుటబడింది. స్త్రీలు ఉపవసించటం నేను చూడలేను” అన్నారు.
22.4 చతుర్థ పరిచ్ఛేదం భక్తులకు గోప్యసమాచారం – కేశవ్ సేన్
సాయంత్రం ఐదు గంటలయింది. శ్రీరామకృష్ణులు శివాలయం మెట్లపై కూర్చుని ఉన్నారు. ప్రక్కనే అధర్, డా ॥ నితాయ్, ‘మ’ తదితర భక్తులు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఇదుగో చూడండి, నా స్వభావం మారిపోతూ ఉంది.
తరువాత శ్రీరామకృష్ణులు ఒక మెట్టు దిగివచ్చి ఏదో గోప్యమైన సమాచారం చెప్పబోతున్నట్లు భక్తుల ప్రక్కన కూర్చుని మాట్లాడసాగారు:
22.4.1 మనిషిలోనే అధికంగా భగవత్ వ్యక్తీకరణ – అవతార తత్త్వం
“మీరు భక్తులు. మీతో ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడల్లా నాకు భగవంతుని చైతన్యమయ స్వరూప దర్శనం కలగటం లేదు. ఇప్పుడు సాకార మానవ రూపంలోనే ఆయనను దర్శిస్తున్నాను. నా నైజం భగవంతుని రూపాన్ని తిలకించటమే, స్పృశించటమే, ఆలింగనం చేసుకోవటమే. కాని అమ్మ, ‘నువ్వు దేహం ధరించి ఉన్నావు. కనుక సాకారమైన మానవ రూపాల ద్వారా ఆనందం పొందు’ అంటోంది.
“భగవంతుడు సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నాడు. అయినప్పటికీ మనిషిలో అధికంగా అభివ్యక్తమవుతున్నాడు.
“మనిషి సామాన్యుడా ఏమిటి? అతడు భగవత్ చింతన చేయగలడు. అనంత స్వరూపాన్ని చింతన చేయగలడు. తక్కిన ప్రాణికోటికి అది సాధ్యం కాదు. తక్కిన ప్రాణికోటిలోను, చెట్టు చేమలు, సకలభూతాలలోను భగవంతుడు ఉన్నాడు, కాని మనిషిలో ఆయన అభివ్యక్తీకరణ అధికం. అగ్నితత్త్వం సకల భూతాలలోనూ, అన్ని వస్తువులలోనూ ఉన్నది. కాని కలపలోనే దాని ఉనికి అధికం.
“రాముడు లక్ష్మణునితో, ‘తమ్ముడూ! ఏనుగు ఎంత పెద్ద జంతువు! అయినప్పటికీ అది భగవంతుని గురించి చింతన చేయలేదు, చూశావా?’ అని చెప్పాడు.
“ఇక అవతారాలలో భగవంతుడు మరింత అధికంగా అభివ్యక్తమవుతూ ఉంటాడు. రాముడు, లక్ష్మణునితో, ‘సోదరా, ఎవరిలో ఊర్జిత భక్తి ఉంటుందో, ఎవరు భావావస్థలో నవ్వుతూ, విలపిస్తూ, నృత్యం చేస్తూ, పాడుతూ ఉంటారో, వారిలోనే నేను ఉన్నాను’ అని చెప్పాడు.”
శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ సంభాషణ కొనసాగించారు.
22.4.2 కేశవ్సేన్పై శ్రీరామకృష్ణుల ప్రభావం
శ్రీరామకృష్ణులు: కేశవ్సేన్ ఇక్కడకు తరచూ వచ్చేవాడు. ఇక్కడకు వచ్చిన తరువాత ఎంతో మారిపోయాడు, పిదప గొప్పవాడైపోయాడు. ఇక్కడకు పలుమార్లు తన భక్తులతో వచ్చి ఉన్నాడు. ఒంటరిగా రావడానికి కూడా అతడు ఇష్టపడేవాడు. మొదట్లో అతడికి సాధు సాంగత్యం అంతగా లభించలేదు. కలుటోలాలోని అతడి ఇంటికి వెళ్లి అతణ్ణి చూశాను, నాతో హృదయ్ కూడా వచ్చాడు. కేశవ్ ఉన్న గదిలో మమ్మల్ని కూర్చోబెట్టారు. బల్ల మీద అతడు ఏదో వ్రాసుకుంటున్నాడు. చాలాసేపటికి కలాన్ని ప్రక్కన పెట్టి, కుర్చీలో నుంచి లేచి వచ్చి నేలమీద మాతోబాటు కూర్చున్నాడు. కాని అప్పుడతడు మాకు నమస్కారం అంటూ ఏదీ చేయలేదు.
“ఇక్కడకు అప్పుడప్పుడు వచ్చేవాడు. ఒక రోజు నేను భావపారవశ్యంలో అతడితో, ‘సాధువుల ఎదుట కాలిమీద కాలు వేసుకొని కూర్చోకూడదు, దానివల్ల రజోగుణం పెరుగుతుంది’ అన్నాను. కేశవ్, అతడి మిత్రులు వస్తే వెంటనే నేను వారికి నమస్కరించేవాడిని. క్రమక్రమంగా వారు సాష్టాంగ నమస్కారం చేయటం నేర్చుకున్నారు.
“ఒకసారి నేను కేశవ్‌తో, ‘హరినామ భజన చెయ్యి. కలియుగంలో భగవన్నామ గుణకీర్తన చేయటం ఆవశ్యకం’ అని చెప్పాను. ఆ తరువాత వాళ్లు మృదంగ తాళాలతో హరినామ సంకీర్తన చేయనారంభించారు.
“నాకు హరినామంలో విశ్వాసం ఎలా బలపడిందో తెలుసా? ఈ కాళికాలయానికి తరచూ సాధువులు సందర్శనార్థం వస్తూ ఉంటారు. ఒకసారి ముల్తాన్‌కు చెందిన సాధువొకరు రావటం జరిగింది. గంగాసాగర్‌కు వెళ్లేవారి కోసం వేచి ఉన్నాడు. అతడికి (‘మ’ ను చూపుతూ) ఇతడి వయస్సు ఉంటుంది. ‘నారదీయ భక్తే మార్గం’ అని చెప్పింది ఆతడే.
22.4.3 కామినీ కాంచనాలే ‘చేపలబుట్ట’ – సాధుసాంగత్యమే ‘పూల వాసన’ – ఏకాంత సాధన
“ఒక రోజు కేశవ్ వచ్చాడు. రాత్రి పది గంటల వరకు ఉండిపోయాడు. మేమందరమూ పంచవటిలో కూర్చున్నాము. ప్రతాప్, మరికొందరు, ‘ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదాం’ అన్నారు. అందుకు కేశవ్, ‘వద్దు, నాకు పని ఉంది; వెళ్లాలి’ అన్నాడు. నేను నవ్వుతూ, ‘చేపలబుట్ట వాసన లేకుండా నిద్ర రాదా ఏం?’ అని అడిగాను.
“బెస్త పడుచు ఒకామె ఒక పువ్వుల వ్యాపారి ఇంట్లో అతిథిగా ఉండటం జరిగింది. ఆమె చేపలు విక్రయించి, ఖాళీ బుట్టతో వచ్చింది. పువ్వులు ఉంచిన గదిలో నిదురించటానికి ఆమెకు స్థలం ఇచ్చారు. పువ్వుల సువాసన కారణంగా ఆమెకు రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అది చూసిన ఆ ఇంటి యజమానురాలు, ‘ఏమమ్మా, ఎందుకు ఇంకా నిద్రించక పొర్లాడుతూ ఉన్నావు?’ అని అడిగింది. అందుకు ఆ బెస్త పడుచు, ‘నాకు ఏమీ అర్థం కావటం లేదు. పువ్వుల సువాసన వల్లనే నాకు నిద్రపట్టడం లేదని తోస్తోంది. నా చేపల బుట్టను కాస్త ఇస్తారా? అది ప్రక్కన ఉంటే ఒకవేళ నిద్రపట్టవచ్చు’ అని అన్నది. చివరికి చేపలబుట్టను తీసుకువచ్చి దానిపై నీళ్లు చల్లి ముక్కు ప్రక్కన ఉంచుకుంది. వెంటనే గురక పెడుతూ నిద్రించసాగింది.
“ఈ కథ వినగానే కేశవ్, అతడి అనుయాయులూ గొల్లున నవ్వారు.
“కేశవ్ సాయంత్రం గంగ స్నానఘట్టం వద్ద ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన కాగానే నేను కేశవ్‌తో, ‘ఇదుగో చూడు భగవంతుడే ఒక రూపంలో భాగవతంగా అయి ఉన్నాడు. కనుకనే వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నిటినీ పూజించాలి’ అని అన్నాను. ‘ఇంకో రూపంలో భగవంతుడే భక్తుడుగానూ అయి ఉన్నాడు. భక్తుని హృదయం భగవంతుడి కచేరి చావడి. చావడిలోకి పోతే ఇంటి యజమానిని సులువుగా చూడవచ్చు. అందుచేత భక్తుని పూజించటం భగవంతుని పూజించటమే అవుతుంది’ అని చెప్పాను.
“కేశవ్, అతడి సమాజస్థులు ఇవన్నీ ఎంతో శ్రద్ధగా విన్నారు. నాడు పౌర్ణమి, నాలుగు దిశలా వెన్నెల వ్యాపించి ఉన్నది. మేమందరం గంగాతీరాన గల మెట్ల పైభాగాన కూర్చున్నాం. ‘అందరూ భాగవతం – భక్తుడు – భగవంతుడు అని చెప్పండి’ అన్నాను నేను. అందరూ కలిసి ‘భాగవతం – భక్తుడు – భగవంతుడు’ అంటూ ముక్తకంఠంతో ఉచ్చరించారు. పిదప, ‘బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మం అని చెప్పండి’ అని నేను చెప్పగా వాళ్లు ‘బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మం’ అని ఉచ్చరించారు. ‘మీరు దేనిని బ్రహ్మం అంటున్నారో దాన్నే నేను అమ్మ అంటున్నాను. అమ్మ అనే పదం ఎంతో సుమధురమైన పదం అని వారితో చెప్పాను.’
“పిదప వారితో, ‘గురువు – కృష్ణుడు – వైష్ణవుడు’ అని చెప్పమనగానే కేశవ్ నాతో, ‘స్వామీ, అంత దూరం వద్దు! అలా పలికితే జనం మమ్మల్ని దురభిమానపూరిత వైష్ణవులని భావిస్తారు’ అని చెప్పాడు.
“నేను అప్పుడప్పుడు కేశవ్‌తో ఇలా అనేవాణ్ణి: ‘మీరు దేనిని బ్రహ్మం అంటారో, దానినే నేను అమ్మ, ఆద్యాశక్తి అంటున్నాను. మనోవాక్కులకు అతీతమైన, నిర్గుణ, నిష్క్రియ స్థితిలో నెలకొని ఉన్నప్పుడు వేదాలు ఆయనను బ్రహ్మంగా పేర్కొంటాయి. సృష్టి స్థితి లయాలలో పాల్గొన్నప్పుడు నేను ఆయనను శక్తి, ఆద్యాశక్తి తదితర నామాలతో పేర్కొంటాను.
“ ‘సంసారంలో ఉంటూ భగవంతుని పొందటం చాలా కష్టం. ఊరగాయ, చింతపండు, నీటికుండ పెట్టిన గదిలో సన్నిపాత రోగిని ఉంచితే అతడికి ఎలా నయమవుతుంది? అందుకే సాధన భజనలు చేయటానికి మధ్యమధ్యలో ఏకాంతంలోకి వెళ్లిపోవాలి.
“ ‘చెట్టుబోదె లావుగా తయారయ్యాక ఏనుగును కూడా కట్టివేయవచ్చు, కాని మొక్కగా ఉన్నప్పుడు దాన్ని మేకలు, పశువులు తినివేస్తాయి.’ అందుకే కేశవ్ తన లెక్చర్‌లో, ‘మీరు పరిపక్వత చెందాక సంసారంలో జీవించండి’ అని అనేవాడు.
(భక్తులతో) “ఇదుగో చూడండి, కేశవ్ ఎంత గొప్ప పండితుడు! ఆంగ్లంలో లెక్చర్ ఇచ్చేవాడు. ఎంతోమంది ఆతణ్ణి గౌరవించేవారు. సాక్షాత్తూ క్వీన్ విక్టోరియాతో కూర్చుని మాట్లాడాడు. అటువంటవ్యక్తి ఇక్కడకు వచ్చినప్పుడు, చొక్కా లేకుండా వచ్చేవాడు. సాధు సందర్శనానికి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తీసుకు వెళ్లాలి, కనుకనే పళ్లు చేతబుచ్చుకొని వచ్చేవాడు. అతడిలో కించిత్తు అహం కూడా లేదు.
22.4.4 అధర్, ‘మ’ లకు ఉపదేశం – “ముందుకు వెళ్ళు”
(అధర్తో) “ఇదుగో చూడు! నువ్వు విద్వాంసుడివి, పైగా డిప్టీవి. కానీ భార్యావిధేయుడవు. ముందుకు వెళ్లు. చందన వనానికి ఆవల వెండిగనులు, పిదప బంగారు గనులు, ఆ తరువాత వజ్రాల గనులు అంటూ ఎన్నో అమూల్యాలు ఉన్నాయి. కట్టెలుకొట్టే వాడొకడు అడవిలో కట్టెలు కొట్టుకుంటున్నాడు. బ్రహ్మచారి ఒకరు అతడితో ‘ముందుకు వెళ్లు’ అని చెప్పాడు.”
శివాలయం మెట్ల నుండి క్రిందికి దిగి ప్రాంగణం గుండా శ్రీరామకృష్ణులు తమ గదికి బయలుదేరారు. అధర్, ‘మ’ తదితర భక్తులూ వెంట వెళ్లారు. విష్ణ్వాలయ పూజారి రామ్ఛటర్జీ వచ్చి మాతృదేవి (శారదాదేవి) పరిచారికకు కలరా సోకిందని తెలిపాడు.
రామ్ ఛటర్జీ (శ్రీరామకృష్ణులతో): ఈ విషయం మీకు పదిగంటలకే చెప్పాను. మీరెవరూ దాన్ని పట్టించుకోలేదు.
శ్రీరామకృష్ణులు: నేను ఏం చేయగలను?
రామ్ ఛటర్జీ: నిజమే, మీరు ఏం చేయగలరు? కాని రాఖాల్, రామ్‌లాల్ అందరూ ఉన్నారే, వారూ ఏమీ చేయలేదే!
‘మ’ : కిశోరీ ఔషధం కొని తేవటానికి ఆలంబజార్ వెళ్లి ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి, ఒంటరిగానా వెళ్లాడు? ఎక్కడ నుంచి తెస్తాడు?
‘మ’ : ఒంటరిగానే వెళ్లాడు. ఆలంబజార్ నుంచి తెస్తాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): వ్యాధి తీవ్రమైతే ఏం చేయాలో, తగ్గితే ఏం చేయాలో రోగిని చూసుకుంటూ ఉన్న వ్యక్తికి తెలియజేయి.
‘మ’ : అలాగేనండీ.
ఆ ఇద్దరు భక్తురాళ్లు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. ఆయన వారితో, “మునుపు చెప్పినట్లు శివపూజ చేస్తూ ఉండండి. ఇక్కడకు వచ్చేటప్పుడు భోజనం చేసి రండి, లేకుంటే నా మనస్సు కష్టపడుతుంది. స్నానయాత్ర దినాన మళ్లీ రావటానికి ప్రయత్నించండి” అని చెప్పారు.
22.5 పంచమ పరిచ్ఛేదం
శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. బంధోపాధ్యాయ, హరి, ‘మ’ మొదలైన భక్తులు ఆయన ప్రక్కన కూర్చున్నారు. బంధోపాధ్యాయ కుటుంబ కష్టాలను గురించి ఆయన ఎరుగుదురు.
22.5.1 సంసారానికి కారణం? – “కౌపీనం కోసం” ఉపమానం – శరణాగతే మార్గం
శ్రీరామకృష్ణులు: ఇదుగో చూడు! ‘ఒక కౌపీనం గుడ్డముక్క కోసం* , ఎన్ని కష్టాలో! వివాహం చేసుకుంటాడు. పిల్లాజల్లా పుట్టుకొస్తారు. వారిని పోషింప ఉద్యోగం చేయవలసి వస్తుంది. సాధువు, కౌపీనం కారణంగా చింతాక్రాంతుడవుతాడు; గృహస్థుడు భార్య కారణంగా చింతాక్రాంతుడవుతాడు. ఇది చాలదన్నట్లు ఇంట్లో వారితో సఖ్యత ఉండదు; కనుక విడికాపురం పెట్టవలసి వస్తుంది. (నవ్వుతూ) చైతన్యదేవుడు నిత్యానందుడితో, ‘వినవయ్యా తమ్ముడూ, నిత్యానందా! సంసారజీవులకు ఎన్నటికీ గతి లేదు’ అన్నాడు.
‘మ’ (తనలో): అవిద్య నిండిన సంసారం గురించే శ్రీరామకృష్ణులు చెబుతున్నారు కాబోలు! అటువంటి సంసారమే మనిషిని బంధంలో ముంచివేస్తుంది. బహుశా సంసార జీవులు అవిద్యా సంసారంలో జీవిస్తారు కాబోలు!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, ‘మ’ ను చూపుతూ బంధోపాధ్యాయతో): ఇతడూ విడి కాపురమే. మీ ఇద్దరికీ చక్కని సామ్యం కుదిరింది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడం జరిగింది. మొదటి వ్యక్తి ‘నువ్వెవరు?’ అని అడిగేసరికి ‘నేను దేశం వదలి వచ్చాను’ అని బదులు చెప్పాడు రెండవ వ్యక్తి. పిమ్మట అతడు ‘మరి నువ్వెవరు?’ అని అడిగేసరికి ‘నేను ప్రేయసిని వీడివచ్చిన వాణ్ణి’ అని బదులు ఇచ్చాడు మొదటి వ్యక్తి. ఇద్దరికీ చక్కని సామ్యం. (అందరూ నవ్వారు)
“కాని భగవంతుని శరణు జొచ్చితే భయపడ నక్కర్లేదు, ఆయనే రక్షిస్తాడు.”
హరి: స్వామీ, భగవంతుణ్ణి పొందటంలో అనేకులకు జాప్యం ఎందుకు అవుతోంది?
శ్రీరామకృష్ణులు: ఎందుకో తెలుసా? భోగవాసనలు, కర్మలు తీరకుండా మనోవ్యాకులత జనించదు. ‘కొన్ని రోజులు గడవనీ, ఆ తరువాత మామూలు మందుతోనే వ్యాధిని నయం చేయవచ్చు’ అని వైద్యులు చెప్పటం వినలేదా?
“నారదుడు రాముడితో, ‘రామా! నువ్వు అయోధ్యలోనే కాలం గడిపితే రావణ వధ ఎలా జరుగుతుంది? నువ్వు అందు నిమిత్తమే కదా అవతరించావు’ అని అడిగాడు. అందుకు రాముడు, ‘నారదా! సమయం రానివ్వు, రావణుని కర్మ తీరనివ్వు. ఆ తరువాత ఆతడి వధకు అంతా సిద్ధం అవుతుంది’ అన్నాడు.”
22.5.2 సంసారంలో దుఃఖాలు – హరి – శ్రీరామకృష్ణుల విజ్ఞాన స్థితి
హరి: సంసారంలో ఇన్ని దుఃఖాలు ఎందుకు ఉన్నాయి?
శ్రీరామకృష్ణులు: ఈ సంసారం ఆయన లీల; ఆట లాంటిది. ఈ లీలలో సుఖం – దుఃఖం, పాపం – పుణ్యం, జ్ఞానం – అజ్ఞానం, మంచి – చెడు అన్నీ ఉన్నాయి. దుఃఖం, పాపం ఇత్యాదులు లేకుంటే లీల కొనసాగదు. దాగుడుమూతల ఆటలో తల్లిని తాకాలి. కాని ఆట ప్రారంభంలోనే తాకడం ఆమెకు సంతుష్టిని కలిగించదు. ఈ ఆట కొంతసేపు కొనసాగాలి అనేదే భగవంతుని (తల్లి) సంకల్పం. ఆ పిదప – ‘లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచు ఎగిరిపోవు । దాని చూచి నవ్వుకొనుచు చప్పట్లను చరతు వీవు!’
“అంటే, కఠోర తపస్సులు చేశాక భగవంతుని కృపతో ఆయన దర్శనం పొంది ఎవరో ఒకరిద్దరు మాత్రమే ముక్తి పొందుతారు. అప్పుడు అమ్మ, ‘ఓ, తెగిపోయింది’ అంటూ ఆనందంతో చప్పట్లు కొడుతుంది.”
హరి: కాని ఈ ఆట మాకు ప్రాణాంతకంగా ఉందే!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): నువ్వెవరు? చెప్పుకో చూద్దాం. భగవంతుడే మాయ, జీవజగత్తులు, ఇరవై నాలుగు తత్త్వాలు అన్నీ అయివున్నాడు. ‘పాము రూపంలో కాటువేస్తున్నాను, మంత్రవాదిగా వచ్చి విషాన్ని తొలగిస్తున్నాను.’ ఆయన విద్య, అవిద్య రెండుగానూ ఉంటున్నాడు. అవిద్యా మాయ ద్వారా అజ్ఞానంలో ఉన్న జీవుడుగా ఉంటున్నాడు, విద్యామాయ ద్వారా గురువనే మంత్రవాదిగా అరుదెంచి అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు.
“ ‘అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం. భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ఆయనే కర్త, సృష్టి స్థితి లయాలన్నీ గావించేది ఆయనే’ అని చూసేవాడు జ్ఞాని. కాని విజ్ఞానో, భగవంతుడే సమస్తమూ అయివున్నట్లు దర్శిస్తాడు. మహాభావం, ప్రేమ అనే స్థితులు ఏర్పడినప్పుడు ఆయన తప్ప మరేదీ లేదని గాంచుతాడు.
“భావపారవశ్యంతో పోలిస్తే భక్తి వెలవెలపోతుంది. భావపారవశ్యం పరిపక్వమైతే మహాభావం, ప్రేమగా పరిణమిస్తుంది. (బంధోపాధ్యాయతో) ధ్యాన సమయంలో ఇంకా ఘంటానాదం వింటూ ఉన్నావా?
బంధోపాధ్యాయ్: అవునండీ, ప్రతిరోజూ వింటున్నాను. దానికి తోడు రూపదర్శనమూ కలుగుతోంది! వీటిని మనస్సు ఒకసారి అనుభవిస్తే పిదప అవి ఆగిపోతాయా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవును. కలపకు ఒకసారి నిప్పు రాజుకొంటే పిదప ఆరిపోదు. (భక్తులతో) ఇతడికి విశ్వాసం గురించి బాగా తెలుసు.
బంధోపాధ్యాయ్: నాకు విశ్వాసం అధికం.
శ్రీరామకృష్ణులు: కాస్త చెప్పు, చూద్దాం.
బంధోపాధ్యాయ్: ఒక గురువు ఒకడికి, ‘మూర్ఖుడు’ అనే మంత్రాన్ని ఉపదేశించి, ‘మూర్ఖుడే నీ ఇష్టదైవం’ అని చెప్పాడు. ‘మూర్ఖుడు’ మంత్రాన్ని జపించే ఆ శిష్యుడు సిద్ధి పొందాడు. గొల్లపడుచులు రామనామాన్ని జపిస్తూ గంగానదిని దాటారు.
శ్రీరామకృష్ణులు: నీ కుటుంబంలోని స్త్రీలను బలరామ్ కుటుంబంలోని స్త్రీలతో తోడ్కొని రా.
బంధోపాధ్యాయ్: బలరామ్ ఎవరు?
శ్రీరామకృష్ణులు: బలరామ్ ఎవరో నీకు తెలియదా? బోస్పారాలో అతడి ఇల్లు ఉంది.
సరళ హృదయం గలవారిని చూస్తే శ్రీరామకృష్ణులు ఆనందపరవశులౌతారు. బంధోపాధ్యాయ్ కల్లాకపటం లేని వ్యక్తి. నిరంజన్ కూడా అటువంటి వాడే. కనుకనే అతడిపట్ల ఆయనకు అంత ప్రీతి.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు నిరంజన్ను కలుసుకోవాలని ఎందుకు చెబుతున్నానో తెలుసా? అతడు నిజంగానే సరళ హృదయుడా అని తెలుసుకోవటానికే!
22.6 షష్ఠ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు
ఆదివారం, మే 25, 1884
శ్రీరామకృష్ణులు పంచవటి మర్రిచెట్టు క్రింది అరుగుపై దక్షిణాభిముఖంగా కూర్చుని ఉన్నారు. విజయ్, కేదార్, సురేంద్రుడు, భవనాథ్, రాఖాల్ మొదలైన భక్తులు ఆయనతోపాటు కూర్చుని ఉన్నారు. పలువురు అరుగు చుట్టూ నిలబడి ఉన్నారు. పగటి వేళ – సమయం ఒంటి గంట అయివుంటుంది.
ఫాల్గుణ మాసం శుక్ల విదియ – శ్రీరామకృష్ణుల జన్మదినం. ఆయనకు చేయి విరిగినందున జన్మదినాన్ని ఇంతవరకు పండుగ చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన చెయ్యి దాదాపు నయమైంది. కనుక నేడు శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. సహచరి అనే గాయకురాలి పాట కచేరీ ఏర్పాటు చేశారు. కాస్త వయస్సు పైబడ్డా, ఆమె ప్రఖ్యాత గాయకురాలు.
శ్రీరామకృష్ణులు గదిలో కనిపించనందున ‘మ’ ఆయనను వెదకుతూ పంచవటికి వచ్చాడు. అక్కడ భక్తులు పరమానందంలో మునిగి ఉండటం చూశాడు. భక్తబృందం మధ్యలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉండటం తొందరలో ‘మ’ గమనించలేదు. ఆయన ముందే నిలబడి ఆతురతతో, “శ్రీరామకృష్ణులు ఎక్కడ?” అని అడిగాడు. భక్తులందరూ గొల్లున నవ్వారు. ఆ తరువాత శ్రీరామకృష్ణులను చూసి ‘మ’ సిగ్గుతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనకు ఎడమవైపు కేదార్, విజయ్ అరుగు మీద కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, ‘మ’ తో): చూశావా? (కేదార్, విజయ్‌లు) ఇద్దరినీ ఎలా ఒకటిగా చేర్చానో!
1868లో శ్రీరామకృష్ణులు బృందావనం నుండి ఒక మాధవీలతను తీసుకువచ్చి పంచవటిలో నాటారు. అది బాగా పెరిగి పెద్దదయింది. చిన్న పిల్లలు దాని తీగలు పట్టుకుని ఉయ్యాలలూగుతూ ఉన్నారు. దాన్ని చూసి ఆనందించి శ్రీరామకృష్ణులు, “కోతి పిల్లల వలె, క్రిందపడ్డా దూకటం మానరు” అన్నారు. పిదప సురేంద్రుడు అరుగు ప్రక్కన నిలబడి ఉండటం చూసి, “నువ్వు పైకి రా, కాళ్లు వ్రేలాడేసుకుని హాయిగా కూర్చోవచ్చు” అన్నారు ఆప్యాయంగా. సురేంద్రుడు అరుగు మీద కూర్చున్నాడు. భవనాథ్ చొక్కా ధరించి ఉండటం చూసి సురేంద్రుడు, “ఏమోయ్, విదేశాలకు వెళ్లబోతున్నావా?” అని అడిగాడు. వెంటనే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, “మనకు విదేశాలకు పోవడమంటే భగవంతుని వద్దకు పోవటమే” అన్నారు. పిదప భక్తులతో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: నేను కొన్ని సమయాలలో దుస్తులన్నీ విప్పివేసి, ఆనందంగా తిరిగేవాడను. ఒక రోజు శంభు నాతో, ‘దుస్తులు విప్పి తిరగటం హాయిగానే ఉంది. అందుకే మీరు అట్లా తిరుగుతున్నారు కాబోలు. నేనూ ఒకసారి అలా చేసి చూశాను’ అన్నాడు.
22.6.1 సురేంద్రుని ఆఫీసు – సంసారం, అష్టపాశాలు, త్రిగుణాలు
సురేంద్రుడు: ఆఫీసు నుంచి తిరిగి వచ్చి ప్యాంటు, చొక్కా విప్పేటప్పుడు, ‘అమ్మా! నన్ను ఎన్ని బంధనాలలో బంధించావు తల్లీ!’ అని అనుకుంటూ ఉంటాను.
శ్రీరామకృష్ణులు: మనిషి అష్టపాశాల ద్వారా బంధింపబడి ఉన్నాడు. లజ్జ, ద్వేషం, భయం, ఆభిజాత్యం, సంకోచం, గోప్య స్వభావం మున్నగునవన్నీ బంధనాలే.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
అమ్మా! అమ్మా! నన్నీ ఖేదము
వ్యధతో హృదయము పిండుచున్నదే…..
ఎగురవేయుచున్నావు గాలి పడగలను శ్యామా!
సందడైన లోకసంతలోన మాయ దారముగను……
“మాయాదారం అంటే భార్యాపిల్లలు. ‘ఐహికాశ గాజు జిగురు’ కారణంగా దారం గట్టిపడింది. కామినీకాంచనాలే ఆ ఐహికాశ గాజు జిగురు.”
తరువాత శ్రీరామకృష్ణులు పంచభూతాలు, అరిషడ్వర్గాలు మొదలైన వాటిని గురించిన పాట పాడి, ఆ భావాన్ని ఇలా వివరించసాగారు: “ఐదు అనేవి పంచభూతాలు, ఐదులోను ఆరులోను చిక్కువడటమంటే పంచభూతాలకు, అరిషడ్వర్గాలకు వశం కావటం. ఆరుగురుని మోసపుచ్చటమంటే అరిషడ్వర్గాలకు వశం కాకుండటం. మూడును మోసగించటమంటే, మూడు గుణాలకు అతీతమవటం.
“సత్త్వ రజ స్తమో గుణాలు మూడూ మనిషిని తమ వశంలో ఉంచుకున్నాయి – ముగ్గురు సోదరులు. సత్త్వగుణం ఉంటే అది రజోగుణాన్ని సహాయానికి పిలుస్తుంది. రజోగుణం ఉంటే తమోగుణాన్ని పిలుస్తుంది. మూడు గుణాలూ దొంగలే. తమోగుణం వినాశనం చేస్తుంది, రజోగుణం బంధిస్తుంది. సత్త్వగుణం బంధాలను విప్పుతుంది కానీ అది భగవంతుని వద్దకు తీసుకుపోలేదు.”
విజయ్ (నవ్వుతూ): సత్త్వమూ దొంగే కదా!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): దానికి భగవంతుని వద్దకు తీసుకుపోవటం సాధ్యం కాదు. కాని మార్గాన్ని చూపుతుంది.
భవనాథ్: ఆహా! అద్భుతమైన వాక్కులు!
శ్రీరామకృష్ణులు: అవును. ఇది అత్యున్నత స్థితికి చెందిన విషయం.
భక్తులు ఇవన్నీ విని ఆనందిస్తున్నారు.
22.7 సప్తమ పరిచ్ఛేదం విజయ్, కేదార్‌లకు కామినీ కాంచనాల గురించి ఉపదేశం
శ్రీరామకృష్ణులు: బంధానికి కారణం కామినీ కాంచనాలు. కామినీ కాంచనాలే సంసారం. కామినీ కాంచనాలే భగవంతుని దర్శింపనీయకుండా మనలను అడ్డుకుంటున్నాయి.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తువ్వాలుతో తమ ముఖాన్ని కప్పుకొన్నారు. పిదప భక్తులతో ఇలా అన్నారు: “ఇప్పుడు మీరు నన్ను చూడగలుగుతున్నారా? లేదు. ఇదే తెర! కామినీ కాంచనాలనే ఈ తెరను తొలగిస్తే చిదానందం లభిస్తుంది. ఇంకా విను. స్త్రీ–సుఖాన్ని త్యజించినవాడు ప్రపంచ సుఖాలనే త్యజించినవాడు అవుతాడు. భగవంతుడు అతడికి అతి చేరువగా ఉన్నాడు.”
కొందరు కూర్చునీ, కొందరు నిలబడీ ఈ అమృత వాక్కులను శ్రద్ధాభక్తులతో వింటూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (కేదార్, విజయ్ తదితరులతో): స్త్రీ–సుఖాన్ని త్యజించిన వాడు ప్రపంచ సౌఖ్యాలను త్యజించినవాడే అవుతున్నాడు. ఈ కామినీ కాంచనాలే తెర. మీరందరూ బుర్రమీసాలు పెట్టుకొని ఉన్నారు. కాని దీన్లో చిక్కువడి ఉన్నారు. కాదా? చెప్పండి చూద్దాం. మీకు మీరే ఈ ప్రశ్న వేసుకుని వివేచన చేయండి.
విజయ్: అది నిజమేనండీ.
కేదార్ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు.
శ్రీరామకృష్ణులు: అందరూ స్త్రీలకు వశవర్తులు కావటమే చూస్తూ ఉన్నాను. కెప్టన్ ఇంటికి వెళ్లి ఉన్నాను, అక్కడ నుండి రామ్ ఇంటికి వెళ్లాలనుకున్నాను. అందుచేత కెప్టన్తో, ‘బండి బాడుగ ఇవ్వవోయ్’ అని చెప్పాను. కెప్టన్ తన భార్య నడిగాడు. ఆమె అతడికి తగిన భార్య – ‘ఏమిటి సంగతి, ఏమిటి సంగతి’ అంటూనే ఉంది. చివరకు కెప్టన్ మాతో, ‘వాళ్లే (రామ్ ఇంట్లోని వారు) ఇస్తారులే’ అని చెప్పాడు. భగవద్గీత, భాగవతం, వేదాంతం అన్నీ ఆమె తరువాతే. (అందరూ నవ్వారు)
“ధనం, పత్రాలు అన్నీ భార్య చేతుల్లోనే. పైగా, ‘నా స్వభావం ఎలాంటిదో చూడండి. నా చేతిలో రెండు రూపాయలు కూడా ఉంచుకోలేకపోతున్నాను’ అంటారు వాళ్ళు అమాయకత్వం ప్రదర్శిస్తూ.
“ ‘ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాని ఈ అధికారి నాకు ఒక ఉద్యోగం వేసి ఇవ్వనంటున్నాడే!’ అన్నాడొకడు. ఆ మాటలు విన్న మరొకడు, ‘గులాబీని పట్టుకో. నీకు ఉద్యోగం తథ్యం’ అన్నాడు. గులాబీ ఆ అధికారి ఉంపుడుకత్తె.
22.7.1 కోట దారి – స్త్రీలు ‘ఏటవాలు మార్గం’
“స్త్రీల కారణంగా ఎంతగా దిగజారిపోయాం అన్న విషయం పురుషులు తెలుసుకోనేలేరు. ఒకసారి కోట దారిగుండా బండిలో వెళ్లాను. సమతల బాటలో పోతూ ఉన్నట్లే తలచాను. కాని చివరకు చూస్తే నాలుగంతస్థుల క్రింద ఉన్నాను. అంతటి ఏటవాలు మార్గం అది. దయ్యం పట్టిన వ్యక్తి తనను దయ్యం ఆవహించినట్లు తెలుసుకోలేడు; తాను బాగానే ఉన్నానని అతడు భావిస్తాడు.”
విజయ్ (నవ్వుతూ): ఒక మాంత్రికుడు దొరికితే ఆ దయ్యాన్ని వదలగొడతాడు.
శ్రీరామకృష్ణులు దీనికి జవాబుగా “అది భగవదేచ్ఛ” అని మాత్రం చెప్పారు.
మళ్లీ స్త్రీల ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు: ఎవరిని అడిగినా, ‘అవునండీ, నా భార్య చాలా మంచిది’ అనే చెబుతారు. ఒక్కని భార్య కూడా తారుమారుగా లేదు. (అందరూ నవ్వారు) కామినీ కాంచనాల్లో మునిగి ఉన్నవాడు, ఆ మత్తు కారణంగా దేనినీ స్పష్టంగా తెలుసుకోలేక పోతున్నాడు. చదరంగం ఆడుతూన్న వ్యక్తి అనేక సందర్భాలలో సరైన ఎత్తును వేయటం తెలుసుకోలేడు. కాని ఆటను పైనుండి చూస్తూ ఉన్నవారు, సామాన్యంగా సరైన ఎత్తును గ్రహించగలరు.
“స్త్రీ మాయాస్వరూపిణి. నారదుడు రాముణ్ణి ఇలా ప్రార్థించాడు: ‘రామా! పురుషులందరూ నీ అంశలు. స్త్రీలు నీ మాయాస్వరూపిణియైన సీతాదేవి అంశలు. నాకు ఏ వరమూ వద్దు. నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తిని ప్రసాదించు; నీ జగన్మోహన మాయలో నేను మునిగిపోకూడదు – దీన్ని మాత్రం అనుగ్రహించు.’
22.7.2 గిరీంద్రుడు, నాగేంద్రులకు ఉపదేశం
సురేంద్రుని చిన్న తమ్ముడు గిరీంద్రుడు, అతడి అన్న కుమారుడు నాగేంద్రుడు మొదలైన వారు వచ్చి ఉన్నారు. గిరీంద్రుడు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నాగేంద్రుడు వకీలు పని నేర్చుకుంటున్నాడు.
శ్రీరామకృష్ణులు (గిరీంద్రాదులతో): సంసారానురక్తులు కాకండి అని మీకు చెబుతున్నాను. చూడండి, రాఖాల్కు ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అనే తెలివి వచ్చేసింది. ఏది సత్తు, ఏది అసత్తు అనే వివేకం జనించింది. ఇప్పుడల్లా నేను అతడితో, ‘ఇంటికి పో. ఎప్పుడైనా ఇక్కడకు రా, ఒకటి రెండు రోజులు బసచేయి’ అని చెబుతున్నాను. మీరు పరస్పరం సఖ్యతతో జీవించాలి. అప్పుడే మేలు కలుగుతుంది, ఆనందంగా జీవిస్తారు.
“గాయకులు ఏక స్వరంలో పాడితేనే నాటకం రక్తి కడుతుంది. శ్రోతలకూ ఆనందం కలుగుతుంది!
“మనస్సులో అధికపాలు భగవంతునిపై నిలిపి, ఒకింతపాలు మనస్సుతో సంసారంలోని బాధ్యతలు నిర్వర్తించండి.
“సాధువు మనస్సులో ముప్పావు వంతు భగవంతునిపైన, తక్కిన పావు భాగం తన కర్తవ్యాలలోనూ నిలపాలి. ఆధ్యాత్మిక విషయాలలో అతడు ఎంతో జాగ్రత్తగా మెలగాలి. పాము తోకను తొక్కిన వాడు తప్పించుకోవటం కష్టం, పాముకు తోక అతిసున్నితమైనది. అదే విధంగా సాధువుకు ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యమైనది.”
22.7.3 పంచవటిలో సహచరి కీర్తన – మేఘం, వాన
శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్లారు. గొడుగును గదిలోకి తీసుకు వెళ్ళమని సింథీకి చెందిన గోపాల్‌కు చెప్పి వెళ్లారు. పంచవటిలో సంకీర్తన కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామకృష్ణులు వచ్చి కూర్చోగానే సహచరి పాడ నారంభించింది. చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు, కొందరు నిలబడీ ఉన్నారు.
నిన్న శనివారం అమావాస్య. జ్యేష్ఠ మాసం. నేడు వానమేఘాలు ఆకాశాన క్రమ్ముకున్నాయి. హఠాత్తుగా పెద్దగాలి, వాన ప్రారంభమైనవి. శ్రీరామకృష్ణులు భక్తులతో గదికి బయలుదేరారు. గదిలోనే సంకీర్తన కొనసాగించటానికి నిర్ణయించారు.
శ్రీరామకృష్ణులు (సింథీ గోపాల్‌తో): ఏమోయ్, గొడుగు తెచ్చావా?
గొడుగు పంచవటి వద్దే పడి ఉంది, గోపాల్ దాన్ని తేవటానికి పరుగెత్తాడు.
శ్రీరామకృష్ణులు: నాకు మామూలుగానే పరధ్యానం, అయినా ఈ మేరకు లేదు. రాఖాలూ అట్లే. మమ్మల్ని ఒకచోటికి ఆహ్వానించారు; అది 13 వ తేదీ అని చెప్పటానికి బదులుగా 11 వ తేదీ అన్నాడు. గోపాల్ విషయమో? గోపాలుడు నిజంగానే గోవులను పాలించేవాడు. (అందరూ నవ్వారు)
“స్వర్ణకారుని కథ వినలేదా? ఒకడు, ‘కేశవా’ అంటాడు, మరొకడు, ‘గోపాలా’ అంటాడు, ఇంకొకడు, ‘హరి’ అంటాడు, వేరొకడు, ‘హర’ అంటాడు. అక్కడ గోపాలా అంటే అర్థం ఆవుల మంద అని.” (అందరూ నవ్వారు)
సురేంద్రుడు, గోపాల్‌ను ఆటపట్టిస్తూ, “కన్నయ్యా, ఎక్కడున్నావ్?” అన్నాడు.
22.8 అష్టమ పరిచ్ఛేదం భజనానందంలో విజయ్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు
గాయకురాలు చైతన్యుల సన్న్యాసం గురించిన పాట పాడుతోంది. పాటలో కొన్ని చరణాల భావం ఇలా ఉంది: ‘సన్న్యాసి, స్త్రీ వంక కన్నెత్తి కూడా చూడడు – ఇదే సన్న్యాసి ధర్మం. జీవుల దుఃఖాలను దూరం చేసే నిమిత్తం సన్న్యాసి, స్త్రీ వంక చూడడు!’ చైతన్యుల సన్న్యాసం గురించి వినగానే శ్రీరామకృష్ణులు లేని నిలబడి సమాధిస్థితి నొందారు. భక్తులు ఆయన మెడలో పువ్వుల మాలలు వేశారు. ఎక్కడ పడిపోతారో అనుకుని భవనాథ్, రాఖాల్ ఆయనను పట్టుకుని నిలబడ్డారు. ఆయన ఉత్తరాభిముఖంగా నిలబడి ఉన్నారు. విజయ్, కేదార్, రామ్, ‘మ’, మనోమోహన్, లాటు మొదలైన భక్తులు ఆయన చుట్టూ నిలబడ్డారు. సాక్షాత్తూ చైతన్యులే అక్కడకు వచ్చి భక్తులతో హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నట్లుగా ఉంది ఆ దృశ్యం.
22.8.1 శ్రీకృష్ణుడే అఖండసచ్చిదానందుడు
శ్రీరామకృష్ణులకు మెల్లమెల్లగా బాహ్యస్మృతి రాసాగింది. ఆయన సచ్చిదానంద కృష్ణునితో మాట్లాడసాగారు. మధ్యమధ్యలో, “కృష్ణా, కృష్ణా!” అంటున్నారు. కొన్ని సమయాల్లో స్పష్టంగా ఉచ్చరించలేకున్నారు. పిమ్మట ఇలా అన్నారు: “కృష్ణా, కృష్ణా, కృష్ణా, కృష్ణా, సచ్చిదానందా, ఇప్పుడల్లా నీ రూపాన్ని దర్శించలేకున్నానే! ఇదుగో, ఇప్పుడు నిన్ను అంతరంలోనూ బాహ్యంలోనూ దర్శిస్తూ ఉన్నాను. జీవజగత్తులు, ఇరవై నాలుగు తత్త్వాలు అన్నీ నువ్వే. మనస్సు, బుద్ధీ అంతానువ్వే.
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః
అని గురుస్తోత్రంలో చెప్పబడి ఉంది కదా!
నువ్వే అఖండుడవు. నువ్వే చరాచర వ్యాప్తుడవు! నువ్వే ఆధారం, నువ్వే ఆధేయం, ప్రాణకృష్ణ! మనఃకృష్ణ! బుద్ధికృష్ణ! ఆత్మకృష్ణ! హే ప్రాణవల్లభా గోవింద మమ జీవన!”
విజయ్ కూడా భావపారవశ్యంలో ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, “ఏమిటి నుమ్వా బాహ్యస్మృతి కోల్పోయావా?” అని అడిగారు.
విజయ్ (వినయంగా): లేదండీ.
గాయకురాలు పాడుతూనే ఉంది. గ్రుడ్డి భక్తి గురించి ఆమె కొన్ని చరణాలు జత కలిపి పాడింది – ‘హే ప్రాణబంధూ! నిన్ను సదా హృదయంలో ప్రతిష్ఠించుకుంటాను.’
శ్రీరామకృష్ణులు మళ్లీ సమాధిమగ్నులైనారు. గాయపడిన చెయ్యి భవనాథ్ భుజం మీద ఉంది. ఆయనకు కాస్త బాహ్యస్మృతి వచ్చినప్పుడు గాయకురాలు మళ్లీ కొన్ని చరణాలు జోడించి పాడసాగింది. దాని అర్థం ఇలా ఉంది: ‘నీ కొరకు సర్వం త్యజించిన వానికి ఇన్ని కష్టాలా?’
శ్రీరామకృష్ణులు గాయకురాలికి నమస్కరించారు. కూర్చునే పాట వింటున్నారు. మధ్యమధ్యలో భావపారవశ్యం చెందుతున్నారు. గాయకురాలు పాడటం పూర్తిచేయగానే మాట్లాడనారంభించారు.
22.8.2 ప్రేమలో జగత్తు మరుపు – భక్తులతో నృత్యం, సమాధి
శ్రీరామకృష్ణులు (విజయ్ తదితర భక్తులతో) : ప్రేమంటే ఏమిటి? ఎవరు భగవంతుని ప్రేమిస్తాడో అతడు చైతన్యదేవుల వలె జగత్తును మరచిపోతాడు. అంతేకాదు, ఎంతో ప్రియమైన దేహాన్ని కూడా మరచిపోతాడు.
ప్రేమ ఉదయిస్తే ఏం జరుగుతుందో శ్రీరామకృష్ణులు ఒక పాట పాడి వివరించారు.
ప్రభు హరి నామము పాడుచు కన్నుల
అశ్రులు కురిసే దెన్నటికో
హృదయము నుండీ కామవాసనలు
రయమున తొలగేదెన్నటికో……
శ్రీరామకృష్ణులు లేచి నృత్యం చేయసాగారు. భక్తులూ ఆయనతో కలిసి నృత్యం చేశారు. ఆయన ‘మ’ చేతిని పుచ్చుకుని లాగి నృత్యం చేసే బృందంలో అతడిని కలుపుకున్నారు. నృత్యం చేస్తూనే మళ్లీ ఆయన సమాధిస్థితి నొంది చిత్తరువులా నిశ్చేష్టితులై నిలబడిపోయారు. కేదార్ ఆయనకు బాహ్యస్మృతి తెప్పించటానికి స్తోత్రాలు చదివాడు :
హృదయ కమలమధ్యే నిర్విశేషం నిరీహం ।
హరిహర విధివేద్యం యోగిభిర్ధ్యాన గమ్యం ॥
జనన మరణ భీతిభ్రంశి సచ్చిత్స్వరూపం ।
సకల భువనబీజం బ్రహ్మచైతన్యమీడే ॥
శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్యస్మృతిలోకి రాసాగారు. క్రింద కూర్చుని భగవన్నామాన్ని జపించసాగారు – “ఓం సచ్చిదానంద! గోవింద! గోవింద! గోవింద! యోగమాయ! భాగవతం – భక్తుడు – భగవంతుడు!”
22.9 నవమ పరిచ్ఛేదం సన్న్యాసికి కఠిన నియమాలు – సన్న్యాసి, లోకశిక్షణ
పాడి నృత్యం చేసి ఆ నేలమీది పావన ధూళిని తీసుకుని తమ నుదుట ధరించి శ్రీరామకృష్ణులు గంగాభిముఖంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వెళ్లి కూర్చున్నారు. ప్రక్కన విజయ్, భవనాథ్, ‘మ’, కేదార్ మొదలైన భక్తులు ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన “హా! కృష్ణ చైతన్యా!” అంటూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (విజయ్ తదితరులతో): గదిలో హరినామ సంకీర్తనం జరిగింది కదా! అందుకే గది భక్తి వాతావరణంతో నిండి ఉంది.
భవనాథ్: అవును. అందునా సన్న్యాసం గురించిన పాటలు కదా!
శ్రీరామకృష్ణులు: ఆహా! ఎంతటి ఉన్నత భావాలు!
ఇలా అంటూ ఆయన పాడసాగారు.
ఏమి చెప్పను ఏమని చెప్పను
ఎంతని చెప్పను ఎటుల చెప్పను॥ ఏ ॥
కడవ వెంబడి కడవ గార్చుచు
ప్రేమామృతమును ప్రసాదించును
ఎంతపంచిన, ఎందరకిచ్చిన
తరుగదింక గోరాప్రేమ॥ ఏ ॥
ప్రేమతో నిత్తాయి పిలువ నందర
రమ్మని ఆనతి నిమ్మాయిసేయును
ప్రేమ ముంపులో మునిగె శాంతిపురి
పొంగిపొరలెను పూర్తిగ నదియా॥ ఏ ॥
(విజయాదులతో) గాయకురాలు సంకీర్తనలో చక్కగా చెప్పింది – ‘సన్న్యాసి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడు, ఇదే సన్న్యాసి ధర్మం!’ ఎంత ఉన్నతాదర్శం!
విజయ్: అవునండీ.
శ్రీరామకృష్ణులు: సన్న్యాసిని చూసే కదా ఇతరులు నేర్చుకునేది. అందుకే అంత కఠోర నియమం! స్త్రీ చిత్తరువును కూడా సన్న్యాసి చూడరాదు! – అంతటి నిష్కర్షమైన నిబంధన.
“నల్లటి మేకను దేవికి బలి ఇవ్వాలి. కాని చిన్నగాయం ఉన్నా అది బలికి పనికి రాదు. సన్న్యాసి స్త్రీలతో సాంగత్యం చేయకపోవడమే కాదు, వారితో మాట్లాడనూకూడదు.”
విజయ్: చిన్న హరిదాసు ఒక భక్తురాలితో మాట్లాడాడు, ఆ కారణంగా చైతన్యుడు అతణ్ణి బహిష్కరించాడు.
22.9.1 శ్రీరామకృష్ణులకు మార్వాడీ కొంత డబ్బును, మథుర్ కొంత భూమిని ఇవ్వజూపిన సంఘటన
శ్రీరామకృష్ణులు: సన్న్యాసికి కామినీ కాంచనాలు, అందగత్తెకు తన దేహం నుండి వెలువడే దుర్గంధం లాంటిది. దుర్గంధం కారణంగా ఆమె అందం నిష్ప్రయోజనమైపోతుంది.
“ఒక మార్వాడీ నా పేరిట కొంత ధనం వ్రాసి ఇవ్వదలిచాడు, మథుర్ కొంత భూమి వ్రాసి ఇవ్వదలిచాడు. కాని నేను వాటిని స్వీకరింపలేకపోయాను.
“సన్న్యాసికి విధించిన నియమాలు చాలా కఠోరమైనవి. సన్న్యాస వస్త్రాలు ధరిస్తే, అతడు కచ్చితంగా అందుకు తగినట్లుగానే నడుచుకోవాలి. థియేటర్లో చూడలేదా? రాజు పాత్ర ధరించిన వ్యక్తి రాజులాగానే నటిస్తాడు, మంత్రి పాత్ర ధరించిన వ్యక్తి మంత్రిలా నటిస్తాడు.
“ఒక నటుడు సన్న్యాసి పాత్ర ధరించాడు. సంపన్నులు అతడికి కానుకగా పెద్దమొత్తంలో ధనం ఇవ్వజూపారు. ఆ నటుడు దాన్ని నిరాకరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాసేపయ్యాక వేషం తీసివేసి, కాళ్లు చేతులు కడుక్కొని మామూలు దుస్తులు ధరించి అక్కడకు వచ్చి, ‘ఏదో ఇవ్వబోయారే, దాన్ని ఇప్పుడు ఇవ్వండి’ అని అడిగాడు. సన్న్యాసి వేషం కట్టినప్పుడు అతడు ధనం తాకలేకపోయాడు. ఇప్పుడు కేవలం నాలుగు అణాలు ఇచ్చినా, పుచ్చుకోవటానికి సిద్ధమే.
“కాని పరమహంస స్థితిలో మనిషి చిన్నబిడ్డలా మారిపోతాడు. ఐదేళ్ల బిడ్డకు స్త్రీ పురుషుల వ్యత్యాసం తెలియదు. కాని లోకానికి ఉదాహరణగా పరమహంస కూడా జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది.”
22.9.2 కేశవ్సేన్ బోధనా వైఫల్యానికి కారణం?
కేశవ్ గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావించారు. కేశవ్ కామినీ కాంచనాల నడుమ జీవించాడు. అందుకే అతడికి జనానికి బోధించటంలో ఆటంకం ఏర్పడింది.
శ్రీరామకృష్ణులు: ఆతడు – ఎవరో అర్థం చేసుకున్నావా?
విజయ్: అవునండీ.
శ్రీరామకృష్ణులు: ఆతడు ఇందులోనూ, అందులోనూ – రెండిటిలోనూ కాలుపెట్టబోయి చివరికి పెద్దగా ఏదీ సాధించలేకపోయాడు.
22.9.3 చైతన్యులు సంసారాన్ని ఎందుకు త్యజించారు?
విజయ్: చైతన్యులు నిత్యానందునితో, ‘నితాయ్, నేను సంసారాన్ని త్యజించకుంటే లోకానికి హితం చేకూరేది కాదు. నన్ను చూసి అందరూ సంసార జీవితాన్నే కోరుకునేవారు; కామినీ కాంచనాలను త్యజించి మనస్సును సంపూర్ణంగా హరి పాదపద్మాలలో సమర్పింప ప్రయత్నించేవారు కారు’ అని చెప్పాడు.
శ్రీరామకృష్ణులు: లోకోపదేశానికై చైతన్యులు సంసారాన్ని పరిత్యజించారు. సన్న్యాసులు తమ మేలుకై కామినీ కాంచనాలను త్యజించాలి. నిర్లిప్తుడైన స్థితిని పొందినప్పటికీ, లోకులకు ఆదర్శంగా నిలవడం కోసం అతడు తన ప్రక్కన కామినీ కాంచనాలను అనుమతించరాదు. సర్వసంగాలను పరిత్యజించిన సన్న్యాసి జగద్గురువు. ఆతణ్ణి చూసే కదా జనులలో చైతన్యం జాగృతమయ్యేది.
సాయంత్రం గడిచి రాత్రి కాసాగింది. భక్తులు ఒక్కొక్కరుగా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. విజయ్, కేదార్‌తో “నేటి ఉదయం ధ్యాన సమయంలో మిమ్మల్ని చూశాను. చేత్తో తాకబోయాను, ఎవ్వరూ లేరాయె” అన్నాడు.