21.1 ప్రథమ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణులతో ప్రాణకృష్ణ, ‘మ’, రామ్, గిరీంద్ర, గోపాల్
శనివారం, ఏప్రిల్ 5, 1884
అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు. ‘మ’ దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు పరమహంస దేవులు చిన్నమంచం మీద కూర్చుని దరహాస వదనారవిందులై భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. కొందరు భక్తులు క్రింద కూర్చుని ఉన్నారు. ప్రాణకృష్ణ ముఖర్జీ కూడా అక్కడ ఉన్నాడు.
ప్రాణకృష్ణ సంసార జీవితం గడుపుతూ ఉన్నప్పటికీ వేదాంత చర్చల పట్ల ఎంతో ఆసక్తి గలవాడు. అవకాశం లభించినప్పుడల్లా దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించుకుంటాడు. ఆయనను తన ఇంటికి ఆహ్వానించి పెద్ద ఉత్సవం జరిపాడు కూడా. నాడు బాడుగ పడవలో ‘మ’ ను తోడ్కొని దక్షిణేశ్వరానికి బయలుదేరాడు. పడవ బయలుదేరి కాస్త దూరం వెళ్లగానే గంగలో పెద్దపెద్ద అలలు ఉవ్వెత్తున లేవసాగాయి. ‘మ’ భయపడి తనను పడవ నుంచి దించివేయమని వేడుకున్నాడు. ప్రాణకృష్ణ, అతడి మిత్రుడు ‘మ’ కు ఎంతగానో ధైర్యం నూరిపోశారు; కాని లాభం లేకపోయింది. ‘మ’ వారు చెప్పిన దేదీ వినిపించుకోక, “నన్ను తీరంలో దింపివేయండి. నేను తీరం వెంట కాలినడకన దక్షిణేశ్వరానికి పోతాను” అన్నాడు. చేసేదిలేక ప్రాణకృష్ణ ‘మ’ ను ఒడ్డున దింపి వేశాడు.
‘మ’ దక్షిణేశ్వరం చేరుకున్నప్పుడు ప్రాణకృష్ణ తదితరులు అంతకు మునుపే వచ్చి శ్రీరామకృష్ణులతో మాట్లాడుతూ ఉన్నారు. ‘మ’ శ్రీరామకృష్ణులకు సాష్టాంగదండ ప్రణామం చేసి ఒక మూల కూర్చున్నాడు.
21.1.1 అవతారవాదం
శ్రీరామకృష్ణులు (ప్రాణకృష్ణతో): కాని భగవంతుడు మానవుడిలోనే అధికంగా అభివ్యక్తం అవుతాడు. అవతారాన్ని అంగీకరించడం ఎలా? సామాన్యునికి ఉన్న ఆకలిదప్పుల వంటివి అవతార పురుషునికీ ఉంటున్నాయి; బహుశా రోగ శోకాలు కూడా ఉంటాయి. అటువంటి ఒక వ్యక్తిని భగవంతుని అవతారమని ఎలా చెప్పగలమని మీరు అడగవచ్చు. ‘పంచభూతాలు అనే వలలో చిక్కువడి బ్రహ్మం కూడా విలపిస్తుంది’ అన్నదే దీనికి సమాధానం.
“సీతా వియోగ దుఃఖంలో శ్రీరాముడు విలపించలేదా? మళ్లీ, హిరణ్యాక్షుని వధింప శ్రీమన్నారాయణుడు వరాహావతారం ఎత్తాడు. రాక్షసుని వధించాడు కాని తరువాత కూడా ఆయన స్వధామానికి మరలిపోలేదు. వరాహంగానే జీవించసాగాడు. అనేక పిల్లలను కని వాటితో ఒక రకమైన ఆనందంలో కాలం గడపసాగాడు. దీన్ని చూసి దేవతలు, ‘ఇప్పుడు ఏం చేయాలి? ఈయన తిరిగి వచ్చేట్లుగా కనబడటం లేదే!’ అనుకుని కలతచెంది శివుడి వద్దకెళ్లి మొరపెట్టుకున్నారు. శివుడు వెళ్లి ఎంతో చెప్పి చూశాడు. కాని నారాయణుడు మాత్రం పిల్లలకు పాలివ్వటంలోనే నిమగ్నమై ఉన్నాడు. (అందరూ నవ్వారు) పిదప శివుడు త్రిశూలంతో వరాహ దేహాన్ని చీల్చివేశాడు. అప్పుడు నారాయణుడు ‘హీ హీ’ అని నవ్వుతూ తన నెలవుకు వెళ్లిపోయాడు.
ప్రాణకృష్ణ: మహాశయా! అనాహత శబ్దం అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: అనాహత శబ్దం సర్వవేళలా వినవస్తూనే ఉంటుంది. అది ప్రణవనాదం, పరబ్రహ్మం నుండి వస్తుంది. యోగులు దాన్ని వినగలరు. విషయాసక్తులు వినలేరు. ఆ శబ్దం ఒక వంక తన నాభి నుండి జనిస్తూందని, మరోవంక క్షీరసాగర శయనుడైన పరబ్రహ్మం నుండి ఉద్భవిస్తూ ఉందని యోగి ఎరుగును.
21.1.2 పరలోక విషయంగా కేశవ్సేన్ ప్రశ్న
ప్రాణకృష్ణ: మహాశయా! పరలోకం ఎలా ఉంటుంది?
శ్రీరామకృష్ణులు: కేశవ్సేన్ కూడా ఇదే ప్రశ్న వేశాడు. మనిషి అజ్ఞానంలో ఉన్నంతవరకు, అంటే భగవంతుని ప్రాప్తించుకోనంత వరకు మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తుతూనే ఉండాలి. కాని జ్ఞానం చేకూరాక ఈ ప్రపంచానికి తిరిగి రానక్కరలేదు; మర్త్యలోకానికే కాదు, మరే లోకానికీ పోనక్కరలేదు.
“కుమ్మరివాడు కుండలు ఎండబెడతాడు. వాటిలో కాల్చిన కుండలు, పచ్చి కుండలు ఉండటం గమనించి ఉంటారు. ఆవులు, మేకలు వాటి మీద నడిచిపోతే కొన్ని కుండలు పగిలిపోతాయి. కాల్చిన కుండలు పగిలిపోతే వాటిని కుమ్మరి అవతల పారేస్తాడు, వాటితో ఏ ప్రయోజనమూ ఉండదు. కాని పగిలిన పచ్చి కుండలను సేకరిస్తాడు; వాటిని మట్టిముద్దగా చేసి కుమ్మరి సారెలో పెట్టి, మళ్లీ దానితో కొత్త కుండలు తయారుచేస్తాడు. అదే విధంగా భగవద్దర్శనం కానంత వరకు కుమ్మరివాడి చేతిలో పడవలసిందే, అంటే ఈ లోకానికి మళ్లీ మళ్లీ రావలసిందే.
“ఉడకబెట్టిన వడ్లను నాటితే ఏం ప్రయోజనం? అవి ఎన్నటికీ మొలకెత్తవు. ఆ విధంగానే జ్ఞానాగ్నిలో ఉడికి పక్వమైన పిదప ఆ వ్యక్తిని నూతన సృష్టిలో ఉపయోగించడం జరుగదు; అతడు ముక్తుడైపోతాడు.
21.1.3 వేదాంతం ప్రకారం ‘అహం’ – అవస్థాత్రయ సాక్షి – జ్ఞానం, విజ్ఞానం
“పురాణాల ప్రకారం భక్తుడు వేరు, భగవంతుడు వేరు; నేను వేరు, నువ్వు వేరు. శరీరం ఒక కుండ; దాన్లో మనస్సు, బుద్ధి, అహంకారమనే నీరు ఉంది. బ్రహ్మమే సూర్యుడు. ఆతడు ఆ నీటిలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు భగవంతుని రూపాన్ని దర్శించగలుగుతున్నాడు.
“వేదాంతం ప్రకారం బ్రహ్మమే సత్యవస్తువు, తక్కినదంతా మాయ, స్వప్నతుల్యం, అస్తిత్వం లేనిది. అహమనే కర్ర ఒకటి సచ్చిదానంద సాగర మధ్యంలో పడి ఉంది. (‘మ’ తో) నువ్వు దీన్ని జాగ్రత్తగా విను. ఈ అహమనే కర్రను తీసి వేస్తే ఒకే సచ్చిదానంద సాగరం మాత్రమే ఉంటుంది. అహమనే కర్ర ఉన్నంత వరకు రెండుగా కానవస్తుంది; ఈ వైపు ఒక భాగం, ఆ వైపు మరోభాగం. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి సమాధిస్థితి పొందుతాడు. అప్పుడు ఈ అహం తుడిచిపెట్టుకుపోతుంది.
“కాని లోకులకు ఉపదేశించే నిమిత్తం శంకరుడు ‘విద్యా–నేను’ ను నిలుపుకున్నాడు.(ప్రాణకృష్ణతో) కాని జ్ఞానికంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి. తాను జ్ఞాని అయిపోయానని కొందరు అనుకుంటారు. జ్ఞాని లక్షణాలు ఏవి? జ్ఞాని ఎవరికీ హాని కలిగించడు, పిల్లవాడిలా అయిపోతాడు. ఇనుప కత్తి పరుసవేదిని తాకితే అది బంగారు కత్తిగా మారిపోతుంది. బంగారంతో ఖండించలేం. ఆ విధంగా జ్ఞానిలో క్రోధం ఉన్నట్లూ, అహంకారం ఉన్నట్లూ కనబడవచ్చు. నిజానికి అవేవీ అతడిలో ఉండవు.
“దూరం నుంచి చూసినప్పుడు కాలిపోయిన తాడు నిజం తాడులా అగుపడుతుంది. కాని దగ్గరకెళ్లి ఊదితే అది ఎగిరిపోతుంది. జ్ఞానిలో క్రోధం, అహంకారం ఉండేది నామమాత్రంగానే; అయితే నిజానికి క్రోధమూ లేదు, అహంకారమూ లేదు.
“చిన్న బిడ్డకు దేని పట్లా అనురక్తి ఉండదు. ఇసుకతో ఇల్లు కడతాడు, ఎవరైనా ఆ ఇంటిని తాకితే చాలు, చిందులు త్రొక్కుతూ ఏడ్వ నారంభిస్తాడు. కాసేపట్లో అతడే దాన్ని పడగొడతాడు. ఈ నిమిషం దుస్తుల పట్ల ఎంతో మోజు కలిగి ఉంటాడు; ‘మా నాన్న కొని ఇచ్చాడు, ఎవరికీ ఇవ్వను’ అంటాడు. మరునిమిషం ఒక బొమ్మను ఇస్తే అంతా మరచిపోతాడు, దుస్తులు వదలిపెట్టి బొమ్మను తీసుకుని వెళ్లిపోతాడు.
“ఇవన్నీ జ్ఞానుల లక్షణాలు. అతడి ఇంట్లో ఎంతో సంపద ఉండవచ్చు; మంచం, కుర్చీ, చిత్తరువులు, బండి, గుర్రం మొదలైన వస్తువులు విరివిగా ఉండవచ్చు. కాని వాటన్నిటిని వదలిపెట్టి అతడు కాశీకి వెళ్లిపోతాడు.
“వేదాంతం ప్రకారం జాగ్రదవస్థ కూడా మిథ్యే. కట్టెలు కొట్టేవాడొక కలగన్నాడు. అప్పుడు ఎవరో వచ్చి అతణ్ణి తట్టి లేపారు. కల చెదరిపోయింది. నిద్రలేచిన కట్టెలు కొట్టేవాడు కోపంతో, ‘నా నిద్ర ఎందుకు పాడుచేశావు? కలలో నే నొక రాజునైనాను, ఏడుగురు పిల్లలకు తండ్రినైనాను. వారందరూ చదువు సంధ్యలు, విలువిద్య మొదలైన వాటన్నిటిలోనూ ఆరితేరారు. నేను సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేస్తూ ఉన్నాను. ఆ సుఖమయ జీవితాన్ని కూలద్రోశావే?’ అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, ‘అదొక కల! అది చెదరిపోవటం చేత నీకు నష్టమేమిటి?’ అని అడిగాడు. వెంటనే కట్టెలు కొట్టేవాడు. ‘ఓరీ మూర్ఖుడా, నీకు అర్థం కాదు. నేను కట్టెలు కొట్టేవాడిగా ఉండటం ఎంత మేరకు యథార్థమో, కలలో రాజుగా ఉండటమూ ఆ మేరకు యథార్థమే. కట్టెలు కొట్టేవాడిగా ఉండటం నిజమైతే కలలో రాజుగా ఉండటమూ నిజమే’ అని జవాబిచ్చాడు.”
ప్రాణకృష్ణ సర్వదా జ్ఞానం గురించే మాట్లాడతాడు. అందుకే కాబోలు శ్రీరామకృష్ణులు జ్ఞాని స్థితిని గురించి మాట్లాడారు. తరువాత ఆయన విజ్ఞాని స్థితిని గురించి వర్ణించ నారంభించారు. దీని మూలంగా ఆయన తమ సహజావస్థను సూచిస్తూ ఉన్నారా?
శ్రీరామకృష్ణులు: నేతి – నేతి అని వివేచన చేస్తూ ఆత్మను అనుభూతం చేసుకోవటమే జ్ఞానం. ఇలా విచారణ చేసి సమాధిలో మగ్నమైతే ఆత్మోపలబ్ధి పొందగలడు.
“విజ్ఞానం అంటే విశేష జ్ఞానం. కొందరు పాలను గురించి విని ఉంటారు, కొందరు పాలను చూసి ఉంటారు, మరికొందరు పాలను త్రాగి ఉంటారు. కేవలం విన్నవాడు అజ్ఞాని. చూసిన వ్యక్తి జ్ఞాని. త్రాగిన వ్యక్తికే విజ్ఞానం లభించింది. అంటే వారు దాన్ని గురించి విశేషంగా తెలుసుకుని ఉన్నారు. భగవద్దర్శనం పొంది, అత్యంత సన్నిహిత బంధువులా ఆయనతో మాట్లాడటమే విజ్ఞానం.
21.1.4 గృహస్థునికి విజ్ఞానం లభిస్తుందా? – సాధన చేయాలి
“మొదట నేతి – నేతి అంటూ వివేచన చేయాలి. బ్రహ్మం పంచభూతాలు కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధ్యహంకారాలూ కాదు. అన్ని తత్త్వాలకూ అతీతమైనది అది. మేడ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టుగా అన్ని మెట్లను వదలిపెట్టాలి. మెట్లు ఎన్నటికీ మేడ కాబోదు. కాని మేడ ఎక్కిన పిదప, ఏ ఇటుక, సున్నం, బంకమన్నుతోనైతే మేడ కట్టబడిందో ఆ వస్తువులతోనే మెట్లూ కట్టబడి ఉండటం కనుగొంటాం. ఏది పరబ్రహ్మమో అదే జీవజగత్తులుగాను, ఇరవై నాలుగు తత్త్వాలుగాను అయి ఉంది. ఆత్మ ఏదో అదే పంచభూతాలుగా అయి ఉన్నది. ఆత్మ నుండి ఉద్భవించినదే అయితే మట్టి ఎందుకు ఇంత గట్టిగా ఉంది? భగవత్సంకల్పంతో ఏదైనా సాధ్యమే. రక్తం, వీర్యం నుండి ఎముకలు, మాంసం రూపొందలేదా? సముద్రపు నురుగు ఎంత గట్టిగా మారుతోంది!*
“విజ్ఞాని స్థితిని చేరుకున్నాక సంసారంలో కూడా జీవించవచ్చు. భగవంతుడే జీవజగత్తులుగా అయి ఉన్నాడు, ఆయన సంసారం నుండి వేరుగా ఉన్నవాడు కాదు అన్న సంగతి అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీరాముడికి జ్ఞానం కలిగాక, ‘ఇక నేను సంసారంలో ఉండను’ అన్నాడు. నచ్చచెప్పటానికి దశరథుడు వసిష్ఠుణ్ణి అతడి వద్దకు పంపించాడు. వసిష్ఠుడు రాముడితో, ‘రామా! సంసారమన్నది భగవంతుడు లేకుండా ఉన్నట్లయితే దాన్ని నువ్వు పరిత్యజించవచ్చు’ అని అన్నాడు. రాముడు మారుమాట పలుకలేదు. భగవంతుడు తప్ప మరేదీ లేదని ఆతడికి చక్కగా తెలుసు. ఆ పిదప సంసారం త్యజించే యోచన అతడికి రాలేదు.
(ప్రాణకృష్ణతో) విషయం ఇదే! దివ్యదృష్టి కావాలి. మనస్సు పరిశుద్ధమైనప్పుడు ఆ దృష్టి కలుగుతుంది. కుమారిపూజనే తీసుకుందాం. మలమూత్రాలు విసర్జించే కన్య – కాని నేను ఆమెను సాక్షాత్తూ జగజ్జననిగా గాంచాను. ఒక వ్యక్తికి ఒక వైపు భార్య, మరో వైపు కుమారుడు ఉన్నా డనుకుందాం. ఆ వ్యక్తి ఇద్దరినీ ప్రేమిస్తాడు, కాని భిన్నభావాలతో. అందుచేత సమస్తం మనస్సు మీదనే ఆధారపడి ఉంది. పరిశుద్ధ మానసంలో ఒక నూతన భావం ఉదయిస్తుంది. అటువంటి మనస్సు ఉంటే సంసారంలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. అందుకే సాధనలు చెయ్యాలి.
“అవును, సాధనలు చేయాలి. పురుషునికి స్త్రీ పట్ల సహజంగానే అనురక్తి ఏర్పడుతుందని తెలుసుకో. స్వభావరీత్యా స్త్రీ పురుషుని ప్రేమిస్తుంది, పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు. ఇందుచేతనే ఇరువురు సత్వరం భ్రష్టులవుతున్నారు. కాని సంసారంలో ఒక పెద్ద సానుకూలత ఉంది. కలయికే అవసరమైతే సొంత భార్యతోనే చేరువకావచ్చు! (నవ్వుతూ ‘మ’ తో) నువ్వెందుకు నవ్వుతున్నావు?”
‘మ’ (తనలో): గృహస్థులు ఒకేసారి సర్వం త్యజించలేరనే శ్రీరామకృష్ణులు ఇంతగా అనుమతి నిస్తున్నారు. సంసారంలో నూటికి నూరుపాళ్లు బ్రహ్మచర్యం పాటించటం సాధ్యం కాని పనా?
పంచవటిలో గత కొన్ని రోజులుగా వసిస్తూ ఉన్న హఠయోగి గదిలోకి వచ్చాడు. అతడు పాలు, నల్లమందు మాత్రమే పుచ్చుకుంటాడు. హఠయోగం చేస్తాడు. అన్నం మొదలైనవి తినడు. పాలు, నల్లమందు కొనటానికి అతడి వద్ద డబ్బు లేదు. శ్రీరామకృష్ణులు పంచవటి వైపు వెళ్లినప్పుడు ఇతడితో మాట్లాడారు. ఆ హఠయోగి రాఖాల్తో, ‘పరమహంసల వారితో నాకు కొంచెం డబ్బు ఏర్పాటు చేయమని చెప్పు’ అని తెలిపి ఉన్నాడు. ‘కలకత్తా పెద్దమనుషులు వస్తే చెప్పి చూస్తాను’ అని శ్రీరామకృష్ణులు బదులు చెప్పి పంపారు.
హఠయోగి (శ్రీరామకృష్ణులతో): మీరు రాఖాల్తో ఏం చెప్పారు?
శ్రీరామకృష్ణులు: కలకత్తా నుంచి ధనవంతులు ఎవరైనా వస్తే ఏదైనా ఇస్తారేమో చూద్దాం అని చెప్పాను. (ప్రాణకృష్ణతో) ఇటువంటి వారిని మీరు ‘లైక్’ చెయ్యరని తోస్తోంది.
ప్రాణకృష్ణ మౌనంగా ఉండిపోయాడు. హఠయోగి బయటికి వెళ్లిపోయాడు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు.
21.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల సత్యసంధత – నరలీలపై విశ్వాసం
శ్రీరామకృష్ణులు (ప్రాణకృష్ణాదులతో): సంసారంలో ఉండాలంటే సత్యసంధత ఉండాలి. సత్యంతోనే భగవంతుణ్ణి పొంద వీలవుతుంది. సత్యసంధత పట్ల నాకున్న పట్టుదల ప్రస్తుతం కాస్త సడలింది, మునుపు అతి తీవ్రంగా ఉండేది. స్నానం చేస్తాను అని చెబితే చాలు, గంగలో దిగడం ఏమిటి, మంత్రోచ్చారణ చేయటం ఏమిటి, శిరస్సున నీళ్లు చల్లుకోవడమేమిటి అన్నీ అయిపోయేవి. అయినప్పటికీ సరిగ్గా స్నానం చేశానా లేదా అనే సందేహం తీరదు. ఫలానా చోట బయలుకు పోతాను అని చెబితే ఆ చోటుకే పోవాలి. కలకత్తాలో రామ్ ఇంటికి వెళ్లి ఉన్నాను. పూరీ తినను అన్నాను. భోజనానికి కూర్చున్నప్పుడు బాగా ఆకలి వేసింది. కాని, పూరీ తినను అని చెప్పేశాను కదా, అందుచేత మిఠాయిలు తిని కడుపునింపుకున్నాను. (అందరూ నవ్వారు)
“ప్రస్తుతం ఆ తీవ్రత కాస్త తగ్గింది. బయలుకు రాలేదు, కాని బయలుకు వెళతానని చెప్పివేశానే! ఇప్పుడు ఏం చెయ్యాలి! రామ్ఛటర్జీని అడిగేసరికి ‘వెళ్ళవలసిన అవసరం లేదు’ అన్నాడతడు. నేనూ యోచించాను. అందరూ నారాయణులే. రామ్ఛటర్జీ కూడా నారాయణుడే. అతడి మాట నే నెందుకు కాదనాలి? ఏనుగు నారాయణుడే, అదే విధంగా మావటివాడూ నారాయణుడే! ‘ఏనుగు సమీపంలోకి రావద్దు’ అని అతడు చెబుతూ ఉన్నప్పుడు అతడి మాట నేనెందుకు వినకూడదు? ఈ విధంగా విచారణ చేశాక నా పట్టుదల మునుపటి కంటే కాస్త సడలింది.
21.2.1 వైష్ణవచరణ్ ఉపదేశం – నరలీలపై విశ్వాసం
“ప్రస్తుతం నా మనోస్థితిలో మార్పు కలగటం గుర్తిస్తున్నాను. వైష్ణవచరణ్ మునుపు ఒకమారు నాతో, ‘మానవుడిలో భగవంతుణ్ణి దర్శించినప్పుడు జ్ఞానం పరిపూర్ణమవుతుంది’ అని చెప్పాడు. భగవంతుడే పలు రూపాలలో నడయాడుతున్నాడని ఇప్పుడు నేను చూస్తున్నాను – కొన్ని సమయాల్లో సన్న్యాసి రూపంలో, కొన్ని సమయాల్లో దుష్టుని రూపంలో, కొన్ని సమయాల్లో వంచకుడి రూపంలో కూడా. అందుచేతనే సన్న్యాసిరూప నారాయణుడు, దుష్టరూప నారాయణుడు, వంచకరూప నారాయణుడు, వెలయాలి రూప నారాయణుడు అని చెబుతూ ఉంటాను.
“అందరికీ భోజనం ఎలా పెట్టాలి అనేదే ప్రస్తుతం నా చింత. అందరికీ భోజనం పెట్టాలన్న ఇచ్ఛ కలుగుతోంది. కనుకనే ఒక్కొక్కరిని నాతో ఉంచుకుని భోజనం చేయిస్తున్నాను.
” ప్రాణకృష్ణ (‘మ’ ను చూసి నవ్వుతూ): భలేవాడివయ్యా నువ్వు! (శ్రీరామకృష్ణులతో) పడవ నుండి తనను దింపే వరకు ఇతడు వదల్లేదు….. పడవను ముందుకు పోనివ్వలేదు, స్వామీ!
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎందుకు? ఏం జరిగింది?
ప్రాణకృష్ణ: మాతోబాటు పడవ ఎక్కాడు. గంగలో అలలు కాస్త ఉద్ధృతమయ్యే సరికి తనను దింపివెయ్యమని బలవంతపెట్టాడు. (‘మ’ తో) ఎలా వచ్చి చేరుకున్నావు?
‘మ’ (నవ్వుతూ): నడిచే.
శ్రీరామకృష్ణులు నవ్వారు.
21.2.2 సంసారుల విషయకర్మల త్యాగం – పండితుడు, వివేకం
ప్రాణకృష్ణ (శ్రీరామకృష్ణులతో): స్వామీ, ఇక పనులన్నీ ఆపివేయాలనుకుంటున్నాను. పనులలో మునిగితే మరి దేనినీ పట్టించుకోలేము. (తనతో వచ్చిన వ్యక్తిని చూపుతూ) నా పనులన్నీ ఇతడికి నేర్పిస్తూ ఉన్నాను. నేను వదలి వేశాక ఇతడు వాటిని నిర్వహిస్తాడు. ఇక నా వల్ల కాదు.
శ్రీరామకృష్ణులు: అవును, పెద్ద జంజాటమే. ఇక నువ్వు కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ భగవచ్చింతనలో గడపటం మంచిది. పనులన్నీ వదలి పెడుతున్నానంటున్నావు! కెప్టనూ ఇలాగే అన్నాడు. సంసారంలో ఉన్నవారు ఇలాగే చెబుతారు, కాని చెప్పినట్లు చేయటం వారికి సాధ్యం కాకుండా ఉంది.
“జ్ఞానం గురించి మాట్లాడే పండితులు ఎంతోమంది ఉన్నారు. వారివి వట్టి నోటిమాటలే గాని చేతలు సున్న. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది; కాని దాని దృష్టి క్రింద పడి ఉన్న పీనుగుల గుట్ట మీదనే ఉంటుంది. ఆ విధంగా వీరికి కామినీకాంచనాల మీదే దృష్టి, లౌకిక జీవితం పట్లే అనురక్తి. ఫలానా పండితుడు వివేక వైరాగ్యాలున్న వ్యక్తిగా విని ఉంటే అతడి పట్ల నాకు ఒకింత (శ్రద్ధాపూర్వకమైన) భయం కలుగుతుంది; లేకుంటే వారు కుక్కల్లా, మేకల్లా అగుపిస్తారు.”
ప్రాణకృష్ణ ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నాడు. (‘మ’ తో) “మీరూ వస్తారా?” అని అడిగాడు. ‘మ’, “లేదండి, మీరు బయలుదేరండి” అని చెప్పాడు. ప్రాణకృష్ణ బిగ్గరగా నవ్వి, “ఇకమీదట మీరు మాతో పడవలో రావటమా!” అన్నాడు. (అందరూ నవ్వారు)
‘మ’ పంచవటి సమీపాన పచార్లు చేసి, పిదప శ్రీరామకృష్ణులు స్నానం చేసే ఘట్టంలో స్నానం చేశాడు. ఆ తరువాత భవతారిణి, రాధాకాంతులను దర్శించి ప్రణమిల్లాడు. అతడు ఇలా చింతన చేయసాగాడు: ‘భగవంతుడు నిరాకారుడని విని ఉన్నాను. అలా అయితే ఈ విగ్రహాల ముందు ఎందుకు ప్రణామం చేయాలి? శ్రీరామకృష్ణులు ప్రణామం చేస్తున్నందుకా? నాకో భగవంతుని గురించి ఏమీ తెలియదు, అర్థం కూడా కాదు. శ్రీరామకృష్ణులు విశ్వసిస్తూ ఉన్నారు, నే నెంత? అంగీకరించే తీరాలి.’
‘మ’ భవతారిణికి ప్రణమిల్లాడు. ఆమె ఎడమవైపు ఉన్న రెండు చేతులలో మనిషి తల, కత్తి ఉన్నాయి. కుడివైపు ఉన్న చేతులు వరద, అభయముద్ర దాల్చి ఉన్నాయి. ఒక వైపు భయంకరి, మరొకవైపు భక్తవత్సల – రెండు భావాల సామరస్యం. భక్తుల, దీనుల, హీనుల పట్ల ఆమె దయామయి, స్నేహమయి. అదే సమయంలో భయంకరిగా, కాలకామినిగా కూడా ఆమె ఉన్నదనటం నిజం. ఒకే రూపంలో రెండు భావాలు ఎందుకు? అది ఆమెకే తెలియాలి!
శ్రీరామకృష్ణుల ఈ వ్యాఖ్యానాన్ని ‘మ’ తలచుకున్నాడు. కేశవ్సేన్ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన తరువాతనే కాళీని అంగీకరించాడు. మృణ్మయ రూపంలో చిన్మయమూర్తి అని కేశవ్సేన్ అనటంలో ఉద్దేశం ఇదేనా?
21.2.3 శ్రీరామకృష్ణులు – ‘మ’
‘మ’ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి కూర్చున్నాడు. ‘మ’ స్నానం చేసి వచ్చాడని తెలిసి ఆయన అతడికి పళ్లు మొదలైన ప్రసాదం ఇచ్చారు. ‘మ’ అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చుని ప్రసాదం తిన్నాడు. మంచినీళ్ల కూజా మొగసాలలోనే ఉంది. ‘మ’ గబాగబా తిని గదిలోకి వచ్చి కూర్చోబోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, “కూజా తీసుకురాలేదా?” అని అడిగారు.
‘మ’ : ఇదుగో, తెస్తాను.
శ్రీరామకృష్ణులు: ఓ!
‘మ’ సిగ్గుపడిపోయాడు. వెంటనే వెళ్లి కూజాను తీసుకువచ్చాడు.
‘మ’ ఇల్లు కలకత్తాలో ఉంది. కుటుంబంలో కలతలు నెలకొనడంతో అతడు శ్యాంపుకూర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి ప్రక్కనే అతడు పనిచేసే చోటు ఉంది. భద్రాసన్లోని పాత ఇంట్లో తండ్రి, సోదరులు వసిస్తూ ఉన్నారు. ‘మ’ సొంత ఇంట్లో వసించాలన్నది శ్రీరామకృష్ణుల అభిలాష. భగవత్ చింతన చేయటానికి ఉమ్మడి కుటుంబంలో అనుకూలాలు ఎక్కువ. కనుకనే ఆయన ఇందు గురించి పలుమార్లు ప్రస్తావించినప్పటికీ దురదృష్టవశాత్తు ‘మ’ సొంత ఇంటికి పోనేలేదు. ఈ రోజు మళ్లీ ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు.
శ్రీరామకృష్ణులు: ఏమిటి, ఈసారన్నా సొంత ఇంటికి వెళతావా?
‘మ’ : అక్కడ కాలుపెట్టడానికి మనస్కరించటం లేదు.
శ్రీరామకృష్ణులు: ఎందుకు? మీ నాన్నగారు ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టిస్తున్నాడు కదా!
‘మ’ : ఆ ఇంట్లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అక్కడకు పోవటానికి సుతరామూ నా మనస్సు ఒప్పుకోవటం లేదు.
శ్రీరామకృష్ణులు: ఎవరిని చూసి భయపడుతున్నావు?
‘మ’ : అందరినీ.
శ్రీరామకృష్ణులు (గంభీరంగా): పడవలో ఎక్కటానికి భయపడ్డావే, అలాంటిదేనా?
ఆలయాలలో నివేదనలు ముగిశాయి. హారతి జరుగుతూ ఉంది. గంటలు మ్రోగుతూ ఉన్నాయి. కాళికాలయం ఆనందంలో ఓలలాడుతూ ఉంది. హారతి నాదం విని బికారులు, సాధువులు, ఫకీర్లు అందరూ వేగంగా అతిథిశాలకు వెళ్లారు. కొందరి చేతుల్లో ఆకులు, కొందరి చేతుల్లో కంచాలు, గ్లాసులు. అంతా ప్రసాదం పుచ్చుకున్నారు. ‘మ’ కూడా భవతారిణీదేవి ప్రసాదం పుచ్చుకున్నాడు.
21.3 తృతీయ పరిచ్ఛేదం కేశవ్ ‘నవవిధాన్’ – నవవిధాన్లోనూ కొంతసారం ఉంది
ప్రసాదం తిన్న పిదప శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. అప్పుడు రామ్, గిరీంద్రుడు, మరికొందరు భక్తులు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామాలు చేసి కూర్చున్నారు.
కేశవ్ ‘నవవిధాన్’ గురించిన ప్రస్తావన వచ్చింది.
రామ్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా! నవవిధాన్ వల్ల కించిత్తయినా ప్రయోజనం కలిగినట్లు నాకు తోచటం లేదు. కేశవ్సేన్ సిసలైన వ్యక్తి అయివుంటే ఆతడి శిష్యుల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? నవవిధాన్లో ఏదీ లేదనే అనుకుంటున్నాను. చిల్లపెంకులను గలగలలాడించి పెద్దగా శబ్దం లేవదీసి, గదిలో పడేసి తాళం వేసినట్లుగా ఉంది ఈ వ్యవహారం! లోపల బోలెడంత డబ్బు దస్కం ఉండి గలగలలాడుతోందని లోకులు అనుకుంటారు. కాని లోపల ఉన్నది వట్టి చిల్లపెంకులు మాత్రమే. బయట ఉన్నవారికి లోపలి విషయం ఏదీ తెలియదు.
శ్రీరామకృష్ణులు: నవవిధాన్లో సారం కొంత లేకేం? లేకుంటే ఇంతమంది కేశవ్‌ను ఎందుకు గౌరవిస్తారు? శివనాథ్ ఎందుకు అంతగా గౌరవింపబడడం లేదు? భగవత్ సంకల్పం లేకుండా ఇటువంటిది సంభవించదు.
“కాని సంసారం త్యజించకుండా ఎవరూ ఆచార్యుడు కాలేడు; లోకులు గౌరవించరు. ‘ఈ వ్యక్తి సంసారంలో ఉన్నాడు. ఇతడు గుట్టుగా కామినీ కాంచనాలను అనుభవిస్తున్నాడు. మనతో భగవంతుడే సత్యం, సంసారం అనిత్యం, కలలాంటిది అంటూ కోతలు కోస్తాడు’ అంటారు. సర్వసంగ పరిత్యాగం చేయకుంటే అతడి ఉపదేశాలు ఎల్లరూ పాటించరు; లౌకికులు కొందరు అనుసరిస్తారు. అంతే! కేశవ్‌కు కుటుంబం ఉంది. అందుచేత అతడు కుటుంబం మీదా మనస్సు నిలిపాడు. కుటుంబాన్ని సంరక్షించాలి కదా! కనుకనే ఆతడు ఇన్ని లెక్చర్లు ఇచ్చినప్పటికీ కుటుంబాన్ని మంచి స్థితిలోనే వదలిపెట్టిపోయాడు. ఆతడికి ఎంత మంచి అల్లుడు! ఒకసారి ఆ అల్లుని ఇంటికి వెళ్లాను. పెద్దపెద్ద పట్టెమంచాలు ఉన్నాయి. సంసార జీవితంలో ప్రవేశిస్తే ఇవన్నీ క్రమక్రమంగా వచ్చి చేరుతాయి. సంసారం భోగనిలయమే.”
రామ్: ఆ మంచాలన్నీ ఆస్తి పంపకంలో కేశవ్ వాటాకు వచ్చాయి. మహాశయా! మీరు ఎన్నయినా చెప్పండి కాని విజయ్ నాతో చెప్పింది వినండి. కేశవ్ ఒకసారి విజయ్‌తో, ‘నేను ఏసుక్రీస్తు, చైతన్యుల అంశను. నిన్ను అద్వైతునిగా* నువ్వు ప్రకటించుకో’ అని చెప్పాడట. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? మీరు కూడా నవవిధాన్కి చెందినవారట! (శ్రీరామకృష్ణులు, తక్కిన అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): ఎవరికి తెలుసోయ్, నవవిధాన్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు! (అందరూ నవ్వారు)
రామ్: ప్రప్రథమంలో భక్తి జ్ఞానాలు రెంటికీ సామరస్యం కల్పించినది కేశవ్యే అని అతడి శిష్యులు చెప్పుకుంటున్నారు.
శ్రీరామకృష్ణులు (దిగ్భ్రమ చెంది): ఇదేం మాట? అలా అయితే అధ్యాత్మ రామాయణం మాట ఏమిటి? నారదుడు శ్రీరాముణ్ణి, ‘ఓ రామా! వేదాలు పేర్కొన్న పరబ్రహ్మం నువ్వే. నువ్వే మానవరూపంలో మా వద్ద ఉన్నావు. నువ్వు మానవుడిలా తోస్తున్నావు. నిజానికి నువ్వు మానవుడవు కాదు; నువ్వు ఆ పరబ్రహ్మమే’ అంటూ స్తుతించాడు. అందుకు శ్రీరాముడు, ‘నారదా! నీ పట్ల ప్రసన్నుడనైనాను! కావలసిన వరం కోరుకో’ అన్నాడు. అందుకు నారదుడు, ‘రామా! వేరే ఏం కోరుకుంటాను? నీ పాదపద్మాల పట్ల సర్వదా శుద్ధభక్తిని ప్రసాదించు! నీ భువనమోహన మాయలో పడి నేను మోహం చెందకుండేలా చేయి’ అని ప్రార్థించాడు. అధ్యాత్మ రామాయణ మంతటా కేవలం భక్తి జ్ఞానాల గురించే ప్రస్తావించబడింది.
కేశవ్ శిష్యుడైన అమృతుడి ప్రస్తావన వచ్చింది.
రామ్: అమృతుడు మునుపటిలా లేడు.
శ్రీరామకృష్ణులు: అవును. ఆ రోజు చూసినప్పుడు రోగంతో చాలా చిక్కిపోయి ఉన్నాడు.
రామ్: స్వామీ, నవవిధాన్ లెక్చర్ల ధోరణి చూడండి. మృదంగ నాదం ఆరంభం కాగానే, ‘కేశవ్‌కు జై’ అంటూ నినదిస్తారు. పారుదల లేని మడుగులో ‘దళ్’* ఏర్పడుతుందని మీరు చెబుతూ ఉంటారు కదా! ఆ మాట పుచ్చుకొని ఒక రోజు అమృతుడు తన లెక్చర్‌లో, “పారుదల లేని మడుగులో ‘దళ్’ ఏర్పడుతుందని ఒక సాధువు చెబుతున్నారు. కాని సోదరులారా! ఒక తెగ, ఒక దళం ఉండాలి, కచ్చితంగా ఉండాలి. నిజంగా చెబుతున్నాను. నిశ్చయంగా మనకొక తెగ ఉండాలి” అన్నాడు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: ఇదేమిటి! ఛీ, ఛీ! ఇదీ ఒక లెక్చరా?
కొందరు పొగడ్తల పట్ల ఆసక్తులై ఉండటం గురించిన ప్రస్తావన వచ్చింది.
శ్రీరామకృష్ణులు: ‘నిమాయ్ సన్న్యాసం’ నాటకం తిలకించటానికి నన్ను కేశవ్ ఇంటికి తోడ్కొని వెళ్లారు. ఎవరో ఒకరు కేశవ్‌ను, ప్రతాప్‌ను, ‘వీరిద్దరూ చైతన్య నిత్యానందులు’ అని అన్నారు. వెంటనే ప్రసన్నుడు నన్ను చూస్తూ, ‘అలాగైతే మీరెవరండీ?’ అని అడిగాడు. నేను ఏం చెప్పబోతానో తెలుసుకోగోరి కేశవ్ నాకేసి చూశాడు. ‘నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదధూళిలో ధూళిని’ అన్నాను నేను. కేశవ్ నవ్వుతూ ‘ఈయన అంతు దొరకనివ్వరు’ అన్నాడు.
రామ్: కేశవ్ కొన్ని సమయాల్లో మిమ్మల్ని ‘జాన్ ది బాప్టిస్ట్’* అని పేర్కొనేవాడు.
ఒక భక్తుడు: కొన్ని సందర్భాలలో మీరు నైన్టీన్త్ సెంచురీ చైతన్యులు అనీ పేర్కొనేవాడు.
శ్రీరామకృష్ణులు: దాని అర్థం ఏమిటి?
భక్తుడు: ఈ పందొమ్మిదవ శతాబ్దంలో చైతన్య మహాప్రభువు మళ్లీ అవతరించారు. మీరే ఆయన – ఇదీ దాని అర్థం.
శ్రీరామకృష్ణులు (పరధ్యానంలో): అది అలా ఉండనివ్వు; ఇప్పుడు నా చెయ్యి ఎలా నయమవుతుందో చెప్పు. ఇప్పుడల్లా నా చెయ్యి ఎలా నయమవుతుందో అనే దిగులే.
త్రైలోక్యుడి పాటల గురించిన ప్రస్తావన వచ్చింది. త్రైలోక్యుడు కేశవసేన్ బ్రహ్మసమాజంలో పాడేవాడు.
శ్రీరామకృష్ణులు: ఆహా! త్రైలోక్యుడు ఎంత బాగా పాడతాడు!
రామ్: అన్ని పాటలు భావయుక్తమైనవేనా?
శ్రీరామకృష్ణులు: అవును. లేకుంటే అవి మనస్సును ఇంతగా ఎలా ఆకట్టుకుంటాయి!
రామ్: అన్నీ మీ భావాలను ఆధారం చేసుకొనే రచించబడినవి. ఉపాసనా సమయంలో కేశవ్ వాటిని వివరించేవాడు, త్రైలోక్యుడు పాటల రూపంలో వాటిని రచించాడు. వాటిలో ఒక పాట భావం ఇలా ఉంది: ప్రేమసంతలో ఆనందపు దుకాణం తెరువబడింది. భక్తుల సాంగత్యంలో హరి ఎలా క్రీడిస్తున్నాడో చూడండి!
“మీరు భక్తబృందంతో దివ్యానందంలో ఓలలాడడం చూసి అతడు ఇటువంటి పాటలన్నీ వ్రాశాడు.
” శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): చాలోయ్! ఇక నన్ను యాతన పెట్టకు. నన్నెందుకు వీటిలో దింపుతున్నావు? (అందరూ నవ్వారు)
గిరీంద్రుడు: పరమహంస దేవులకు ‘ఫేకల్టీ ఆఫ్ ఆర్గనైజేషన్’ లేదని బ్రహ్మసమాజస్థులు అంటున్నారు.
శ్రీరామకృష్ణులు: అలా అంటే అర్థం ఏమిటి?
‘మ’ : సంస్థను నడపటం మీకు చేతకాదట. అందుకైన తెలివితేటలు మీకు లేవని అంటున్నారు. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (రామ్‌తో): పోనీ. నా చెయ్యి ఎందుకు విరిగిందో చెప్పు. లేచి నిలబడి దీని మీద ఒక లెక్చరు ఇవ్వు, చూద్దాం. (అందరూ నవ్వారు)
21.3.1 బ్రహ్మసమాజం, వైష్ణవులు, శాక్తేయులు
“భగవంతుడు నిరాకారుడు, నిరాకారుడు అని బ్రహ్మసమాజంవారు చెబుతున్నారు – అట్లే ఉండనీ. హృదయపూర్వకంగా ఆయనను ప్రార్థిస్తే చాలు. ఆయన అంతర్యామి; మనం మనసార పిలుస్తే, తన స్వరూపం ఏమిటో ఆయన మనకు బోధపరుస్తాడు.
“ ‘నేను అర్థం చేసుకున్నదే ఒప్పు, ఇతరులు చెప్పేది తప్పు’ అన్న వైఖరి మంచిది కాదు. ‘నేను భగవంతుణ్ణి నిరాకారుడు అంటున్నాను. అందుచేత ఆయన నిరాకారమూర్తే; సాకారుడు కానే కాడు’ అనో, ‘భగవంతుడు సాకారుడు అంటున్నాను, కనుక ఆయన సాకారమూర్తే, నిరాకారుడు కాడు’ అనో పలుకటం మంచిది కాదు. ఆయన ఫలానా విధంగా ఉంటాడు అని ఎవరైనా చెప్పగలరా ఏమిటి?
“వైష్ణవులు, శాక్తేయులు ఇట్లే కలహించుకొంటూ ఉన్నారు. ‘మా విష్ణువే ముక్తిదాత’ అంటారు వైష్ణవులు. శాక్తేయులు, ‘మా భగవతియే ముక్తి నివ్వగలదు’ అంటారు.
“నే నొకసారి వైష్ణవచరణ్ను మథుర్బాబు వద్దకు తోడ్కొని వెళ్లాను. వైష్ణవచరణ్ ఒక విరాగి, గొప్ప పండితుడు; కానీ అతడు వైష్ణవమత దురభిమాని. మథుర్బాబో దేవీభక్తుడు. వారి నడుమ వాదం మొదలైంది. వైష్ణవచరణ్, ‘ముక్తిప్రదాత అయిన ఏకైక దేవుడు కేశవుడే’ అని అన్నాడు. అంతే, మథుర్బాబు ముఖం ఎర్రబారింది; ‘ధూర్తుడా!’ అంటూ మండిపడ్డాడు. (అందరూ నవ్వారు) మథుర్ శాక్తేయుడు కదా, అలా అనకుండా ఉంటాడా? నేను వైష్ణవచరణ్ను మోచేతితో పొడిచి ఊరుకోమని సైగ చేశాను.
“మతం, మతం అంటూ తిరిగేవారిని ఎందరినో చూసి ఉన్నాను. వీడు వాడితో దెబ్బలాడతాడు, వాడు మరొకడితో పోట్లాడతాడు. హిందూ, ముస్లిమ్, బ్రహ్మసమాజస్థులు, శాక్తేయులు, వైష్ణవులు, శైవులు – అందరూ పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. ఎవరిని కృష్ణుడంటామో అతడినే శివుడు, ఆద్యాశక్తి, ఏసు, అల్లా అంటున్నామనే జ్ఞానం లేదు. రాముడు ఒక్కడే, ఆతడికి సహస్రనామాలు. వస్తువు ఒక్కటే, పేర్లు వేర్వేరు. అందరూ కోరుకునేది ఒకే వస్తువునే; కాని దేశకాలపాత్రలు వేర్వేరు.
“ఒక కోనేరుకు పలు ఘట్టాలున్నవి. హిందువులు ఒక ఘట్టం నుండి కుండలలో నీరు తీసుకుంటున్నారు; దాన్ని ‘జలం’ అంటున్నారు. మహమ్మదీయులు మరో ఘట్టం నుండి తోలు సంచులలో నీరు తీసుకుపోతున్నారు, ‘పానీ’ అంటున్నారు. క్రైస్తవులు ఇంకొక ఘట్టం నుండి నీరు తీసుకుంటున్నారు, ‘వాటర్’ అంటున్నారు. (అందరూ నవ్వారు)
“ఇది జలం కాదు పానీ అనో, పానీ కాదు వాటర్ అనో, వాటర్ కాదు జలం అనో ఎవరైనా దెబ్బలాడితే అది పరిహాసాస్పదమే అవుతుంది. కాని దానితోనే ఈ అభిప్రాయ భేదాలు, మనః స్పర్థలు, దెబ్బలాటలూ అన్నీను. మతం పేరిట కొట్లాటలు, నరుక్కోవడాలు మంచివి కావు. అందరూ భగవన్మార్గంలోనే పయనిస్తూ ఉన్నారు. మనఃపూర్వకమైన ఇచ్ఛ ఉంటే, మనోవ్యాకులత ఉంటే అందరూ ఆయన్ను పొందవచ్చు.
(‘మ’ తో) “దీన్ని శ్రద్ధగా విను. వేదాలు, తంత్రాలు, పురాణాది శాస్త్రాలన్నీ ఆ భగవంతుణ్ణే, ఆ ఒకే సచ్చిదానంద స్వరూపుడినే అన్వేషిస్తూ ఉన్నాయి; మరెవరినో కాదు. వేదాలు సచ్చిదానంద బ్రహ్మమని ఎవరిని పేర్కొంటున్నాయో, ఆయన్నే తంత్రాలు సచ్చిదానంద శివుడని పేర్కొంటున్నాయి, పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని పేర్కొంటున్నాయి.”
రామ్ ఇంట్లో అప్పుడప్పుడు స్వయంగా వంటచేసుకుని తింటాడని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): నువ్వు స్వయంగా వంట చేసుకుని తింటున్నావా?
‘మ’ : లేదండీ.
శ్రీరామకృష్ణులు: ప్రయత్నించి చూడు. కొంచెం ఆవు నెయ్యి వేసుకుని తిను; దాని వల్ల శరీరం, మనస్సు శుద్ధమవుతాయి.
21.4 చతుర్థ పరిచ్ఛేదం పితా ధర్మః పితా స్వర్గః పితాహి పరమన్తపః
రామ్ ఇంటి విషయాల గురించిన ప్రస్తావన వచ్చింది. రామ్ తండ్రి పరమ వైష్ణవుడు. ఇంట్లో అతడు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటాడు. రామ్ చిన్నతనంలోనే అతడి తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. తండ్రీ, సవతితల్లీ రామ్ ఇంట్లోనే వసించేవారు. కాని సవతి తల్లి పెంపకంలో రామ్ జీవితం సుఖంగా గడవలేదు. సవతితల్లి వయస్సు నలభై ఏళ్లు ఉంటాయి. సవతితల్లి కారణంగా రామ్ అప్పుడప్పుడు తండ్రి పట్ల కోపగించుకోవటం కద్దు. ఆ విషయాలన్నీ నేడు ప్రస్తావనలోకి వచ్చాయి.
రామ్: మా నాన్న పూర్తిగా చెడిపోయారండీ.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): విన్నారా! తండ్రి చెడిపోయాడు. కాని ఇతడు మంచివాడేనట.
రామ్: ఆమె ఇంట్లోకి వస్తేనే అశాంతి. ఏదో ఒక గందరగోళం సృష్టింప బడుతుంది. మా కుటుంబం విచ్ఛిన్నమయ్యేట్లుగా ఉంది. అందుకే ఆమెను వాళ్ల పుట్టింటికి పోయి ఉండమని నే నంటాను.
గిరీంద్రుడు (రామ్‌తో): నీ భార్యనూ అదే విధంగా ఆమె పుట్టింటికి పంపివేయవచ్చుగా? (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): భార్యాభర్తలు కుండలు మూతలు వంటి వారా ఏమిటి? ఇది కుండ ఒక ప్రక్క, మూత మరో ప్రక్క ఉంచినట్లు భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటారా ఏమిటి? శివుడు ఒక చోట, శక్తి మరొక చోటా?
రామ్: మహాశయా! మేం ఆనందంగానే ఉన్నాం. ఆమె వస్తే ఇంట్లో ఒకే రచ్చ. ఈ స్థితిలో…
శ్రీరామకృష్ణులు: సరే, అలా అయితే ప్రత్యేకంగా ఒక ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వు, అదొక దారి. నెలనెలా ఖర్చుకు డబ్బు పంపు. తల్లితండ్రులు పూజనీయులు కదా! ‘తండ్రి తిన్న ఆకులో తినవచ్చునా?’ అని రాఖాల్ నన్ను అడిగాడు. అందుకు నేను, ‘అదేమిటి, అలా అడుగుతున్నావు? నీ తండ్రి ఆకులో నుంచి తినకూడదనే మేరకు నీకు ఏం జరిగిపోయిందని?’ అని అడిగాను. కాని సత్పురుషులు తమ ఉచ్ఛిష్టాన్ని ఇతరుల కెవరికీ ఇవ్వరు; అంతెందుకు, వారు కుక్కలకు సైతం తమ ఎంగిలివెయ్యరు.
21.4.1 గురువు నీతిబాహ్యుడైనా నిత్యానందుడే
గిరీంద్రుడు: మహాశయా! తల్లితండ్రులు ఘోరాపరాధం చేసి ఉంటే, మహాపాపం చేసి ఉంటే ఏం చేయాలి?
శ్రీరామకృష్ణులు: ఐతే ఏం! తల్లి నీతిబాహ్యురాలే అయినప్పటికీ ఆమెను త్యజించ రాదు. ఒక పెద్దమనిషి యొక్క గురుపత్ని నీతిబాహ్యురాలైనది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు, “ఇక మీద ఈ గురువు కుమారుని గురువుగా స్వీకరిస్తున్నాం!” అని అన్నారు. నేను వాళ్లతో ఇలా అన్నాను: ‘అదెలా? పెండలాన్ని త్రోసిరాజని దాని రెమ్మను తీసుకోవటమా? ఆమె నీతిబాహ్యురాలైతే మాత్రం ఏమిటి? మీరు ఆమెను మీ ఇష్టదైవంగా పరిగణించండి. “నా గురువు సారా దుకాణానికి వెళ్ళినా సరే ఆయన నిత్యానందుడే.”’
21.4.2 చైతన్యులు, తల్లి – మనకు ఉన్న ఋణాలు
“తల్లితండ్రులంటే సామాన్యులనుకున్నారా? వారు ప్రసన్నులు కాకుంటే ఆధ్యాత్మిక సాధన ఫలవంతం కాదు. చైతన్యులు భగవత్ప్రేమలో పిచ్చివాడై ఉండేవాడు. అయినప్పటికీ సన్న్యాసం స్వీకరించే ముందు తల్లికి ఎన్నో రోజులపాటు నచ్చచెప్పాడు; ‘అమ్మా! నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళతాను’ అంటూ తల్లిని ఎంతో ప్రార్థించాడు.
(‘మ’ ను గర్హిస్తూ) నీకు ఇంకొకటి చెబుతున్నాను. నీ తలితండ్రులు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఇప్పుడు నీకూ పిల్లలున్నారు. ఈ స్థితిలో భార్యను తోడ్కొని బయటకు వచ్చేశావు! తల్లితండ్రులను మోసం చేసి, భార్యా పిల్లలను పిలుచుకుని ఏదో గొప్ప మహాత్ముడిలా వచ్చినట్లు భావన! నీ తండ్రికి డబ్బు సమస్య లేదు. లేకుంటే నిన్ను చడామడా తిట్టి ఉండేవాణ్ణి. (అందరూ స్తబ్ధులైనారు)
“మనకు ఎన్నో ఋణాలున్నాయి – దేవఋణం, ఋషిఋణం, మాతృ ఋణం, పితౄణం, దారాఋణం. తల్లితండ్రుల ఋణం తీర్చకుంటే ఏ పనీ నెరవేరదు. భార్య ఋణం కూడా ఉంది. హరీశ్ భార్యను వదలిపెట్టి ఇక్కడ ఉంటున్నాడు. భార్య తిండితిప్పలకు లోటులేదు, లేకుంటే అతణ్ణి తుచ్ఛుడని తిట్టి ఉండేవాణ్ణి.
“జ్ఞానం పొందాక అదే భార్యను సాక్షాత్తూ జగన్మాతగా గాంచాలి. ‘యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా’ అని చండీస్తోత్రంలో ఉంది. ఆమెయే మన తల్లిగా ఉంటోంది.
“కానవచ్చే స్త్రీలందరూ దేవీస్వరూపిణులే. అందుచేతనే నేను బృంద (పరిచారిక)ను కూడా చీవాట్లు పెట్టలేను. కొందరు శ్లోకాలను వల్లిస్తారు, పెద్దపెద్ద మాటలు మాట్లాడతారు, కాని ప్రవర్తన తద్విరుద్ధం. రామప్రసన్నుడు ఆ హఠయోగికి నల్లమందు, పాలు ఏర్పాటు చేయటానికి చెడతిరుగుతున్నాడు. సాధు సేవ చేయాలని మనుధర్మశాస్త్రం చెబుతోందని అంటాడు. ఇటు చూస్తే అతడి వృద్ధురాలైన తల్లికి తినటానికి తిండి లేదు. ఆమే స్వయంగా కొట్టుకు వెళ్ళవలసి వస్తోంది. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా?
21.4.3 ఋణాలన్నింటి నుండి విముక్తి ఎవరికి?
“కాని మరో విషయం గమనించాలి. భగవత్ ప్రేమోన్మాదం కలిగితే, ఇక తండ్రి ఎవరు? తల్లి ఎవరు? భార్య ఎవరు? అది ఎంతటి ప్రేమ అంటే ఆ ప్రేమలో ఆతడు పిచ్చివాడే అయిపోతాడు. అతడికి ఏ కర్తవ్యమూ ఉండదు. అతడు ఋణాల నన్నిటి నుండి విముక్తుడవుతాడు. ప్రేమోన్మాదం ఎటువంటిదో తెలుసా? ఆ స్థితి ఏర్పడితే ప్రపంచాన్నే మరచిపోతాడు. అతిప్రియమైన ఈ దేహాన్ని మరచి పోతాడు. చైతన్యులకు ఈ స్థితి కలిగింది. సముద్రమనే ఎరుక లేకుండా దాన్లో దూకివేశాడు, ఇసుకలో పదేపదే పొర్లాడాడు. ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, శరీర స్పృహే లేదు.”
21.4.4 పెద్ద గోపాల్ తీర్థయాత్రాభిలాష – తీర్థయాత్రల ఆవశ్యకత
“హా చైతన్యా!” అంటూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. పిదప భక్తులను చూస్తూ, “చైతన్యమంటే అఖండ చైతన్యం కదా! ఆ అఖండ చైతన్యంలో చైతన్యదేవులు ఒక బుడగ మాత్రమే అని వైష్ణవచరణ్ చెప్పేవాడు” అన్నారు. (పెద్ద గోపాల్‌తో) “తీర్థయాత్రలు చేయాలనే అభిలాష ఇప్పుడు ఉందా?” అని అడిగారు.
పెద్దగోపాల్: అవునండీ, కొంచెం తిరిగివద్దా మనుకుంటున్నాను.
రామ్ (పెద్దగోపాల్తో): ‘బహూదకుడైన తరువాత కుటీచకుడు’ అని ఈయన (శ్రీరామకృష్ణులు) చెబుతారు. పలు పుణ్యస్థలాల సందర్శనార్థం తిరుగుతూ ఉండే సాధువు బహూదకుడు. అటూ ఇటూ తిరగాలన్న కోరిక తీరిపోయి, స్థిరంగా ఒకేచోట కూర్చునే సాధువు కుటీచకుడు.
“దీన్ని గురించి ఈయన ఒక కథ చెబుతారు: ఒక పక్షి ఓడ తెరచాప మీద కూర్చుని ఉన్నది. ఓడ గంగను దాటి సముద్రంలో ప్రవేశించటం అది గమనించలేదు. ఆ సంగతి తెలిసి రాగానే ఎలాగైనా తీరాన్ని చేరాలని ఆ పక్షి ఉత్తరదిశగా ఎగిరిపోయింది, తీరం కానరాలేదు, తిరిగి వచ్చింది. కాసేపు విశ్రమించి దక్షిణదిశగా ఎగురసాగింది. అక్కడా తీరం చేరుకోలేక పోయింది, అలసిపోయి ఓడ వద్దకు వచ్చింది. కాసేపు ఆగి, తూర్పు వైపుకు పిదప పశ్చిమంగాను పయనించింది. ఏ దిశలోనూ తీరమో, భూమియో కానరాలేదు. చివరకు తెరచాప మీదనే ప్రశాంతంగా కూర్చుండిపోయింది.”
పెద్దగోపాల్ (స్వామి అద్వైతానంద)
శ్రీరామకృష్ణులు (పెద్దగోపాల్, తదితర భక్తులతో): భగవంతుడు ‘అక్కడ’, ‘అక్కడ’ ఉన్నాడనే భావన ఉన్నంతవరకు అజ్ఞానం ఉంటుంది; ‘ఇక్కడ’, ‘ఇక్కడ’ అన్న భావన కలిగినప్పుడే జ్ఞానం.
“ఒక వ్యక్తికి పొగ త్రాగాలనే కోర్కె కలిగింది. నిప్పు కోసం పొరుగింటికి వెళ్లాడు. రాత్రి బాగా ప్రొద్దుపోయింది. వాళ్లు నిద్రిస్తూ ఉన్నారు. చాలాసేపు తట్టి పిలిచాక ఒకడు వచ్చి తలుపు తెరిచాడు. ‘ఏమిటి సంగతి? ఎందుకోసం అర్ధరాత్రి తలుపు తట్టావు?’ అని అడిగాడు. అందుకు ఇతడు, ‘అర్థం కాలేదా? నాకు పొగత్రాగే అలవాటు ఉందని నీకు తెలిసిన సంగతే కదా. నిప్పు కోసమే వచ్చాను’ అన్నాడు. వెంటనే పొరుగింటి వ్యక్తి, ‘భలేవాడివేనయ్యా నువ్వు! ఇంత కష్టపడి వచ్చి తలుపులు బాదుతున్నావు! నీ చేతిలో వెలుగుతున్న లాంతరు దీపం ఉన్నది కదా! తెలియదా?’ అని అడిగాడు. (అందరూ నవ్వారు) కోరుకున్నది ప్రక్కనే ఉంది, కాని మనుష్యులు దాన్ని వెదుకుతూ అక్కడా ఇక్కడా తిరుగాడుతున్నారు.”
భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అటువంటప్పుడు తీర్థయాత్ర లెందుకు అని శ్రీరామకృష్ణులు సూచిస్తూ ఉన్నారా?
రామ్: మహాశయా! కొందరు శిష్యులను నాలుగు తీర్థాలకు గురువు పంపించటం ఎందుకు అన్న విషయం ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఒకసారి చుట్టు తిరిగి వస్తే, ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా ఉన్నదని కనుగొని వాళ్లు గురువు వద్దకే తిరిగి వస్తారు. ఇవన్నీ గురువాక్యాల పట్ల విశ్వాసం ఏర్పడటానికే.
21.4.5 రామ్, అధర్ – శ్రీరామకృష్ణులు
ఈ సంభాషణ కాస్త ఆగిన పిదప శ్రీరామకృష్ణులు రామ్ సద్గుణాలను ప్రశంసించసాగారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): ఆహా! రామ్‌లో ఎన్ని సద్గుణాలు! ఎంతగానో భక్తులసేవ ఒనరుస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూన్నాడు! (రామ్‌తో) అధర్ పట్ల నువ్వు ఎంతో ఆదరం చూపావని అతడే చెప్పాడు.
అధర్ ఇల్లు శోభాబజార్లో ఉంది. అతడు శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. అతడి ఇంట్లో చండీపారాయణం జరిగింది. శ్రీరామకృష్ణులు, పలువురు భక్తులు అక్కడకు వెళ్ళారు. కాని రామ్‌ను ఆహ్వానింప అధర్ మరచిపోయాడు. రామ్ ఆభిజాత్యం గలవాడు. అధర్ తనను ఆహ్వానించకపోవటం ఇతరులతో చెప్పుకుని బాధపడ్డాడు. అందుచేత అధర్, రామ్ ఇంటికి పోయి జరిగిన పొరపాటు గురించి విచారం వెలిబుచ్చాడు.
రామ్: అది అధర్ తప్పు కాదు. అది రాఖాల్ తప్పు అని తెలుసుకున్నాను. అప్పుడు ఆ బాధ్యత రాఖాల్కు అప్పగించారట.
శ్రీరామకృష్ణులు: రాఖాల్ను తప్పుపట్టకు! అతడు పసివాడు. కంఠం నొక్కితే తల్లిపాలు బయటకు వస్తాయి!
రామ్: మహాశయా, ఏమంటున్నారు? చండీపారాయణం జరిగింది.
శ్రీరామకృష్ణులు: అధర్కు అది తెలియదు. ఈ సంగతి చూడు, ఆనాడు యదుమల్లిక్ ఇంటికి నాతో పాటు వచ్చాడు. అక్కడ నుండి బయలుదేరేటప్పుడు, సింహవాహినికి కానుక సమర్పించావా అని అడిగాను. అందుకు అధర్, ‘స్వామీ! కానుక సమర్పించాలని నాకు తెలియదు’ అన్నాడు. (రామ్‌తో) ఒకవేళ అతడు నిన్ను ఆహ్వానించలేదే అనుకో, అయితే మాత్రం హరినామ సంకీర్తనలో పాల్గోవటంలో ఈ ఆర్భాటం ఎందుకు? హరినామ సంకీర్తనలో పాల్గోవటానికి ఆహ్వానం లేకున్నా వెళ్లవచ్చు, ఆహ్వానం అవసరం లేదు.