1.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వర ఆలయాలు
కలకత్తాకు ఉత్తరాన ఐదు మైళ్ల దూరంలోని దక్షిణేశ్వర మనే గ్రామంలో పావన గంగానది తూర్పు తీరాన ఈ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయ నిర్మాత రాణీ రాస్మణి అనే పరమ భక్తురాలైన ఒక జమీందారిణి. ఒక రోజు కాళీమాత ఆమె కలలో కనిపించి, తనకొక ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆ మేరకు ఆమె అనతికాలంలో ఈ ఆలయం నిర్మించి, దేవిని ప్రతిష్ఠించింది. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు, సుందరమైన ఈ ఆలయాన్ని చూపిస్తూ, “ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన రాణీ రాస్మణీ! నువ్వు భాగ్యశాలివి. నీ పుణ్యం చేతనే కదా లోకులకు నేడు ఈ సజీవ దైవమూర్తి అయిన భగవాన్ శ్రీరామకృష్ణులను దర్శించి, పూజించే అవకాశం కలిగింది” అనటం కద్దు. సాధువులు, పరమహంసలు, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బ్రహ్మసమాజస్థులు, శాక్తేయులు, వైష్ణవులు, అందరూ ఇక్కడకు వస్తూంటారు.
1.1.1 చాందనీ – ద్వాదశ శివాలయాలు
పడవనుంచి దిగగానే మొదట విశాలమైన మెట్లుగల స్నానఘట్టం వస్తుంది. ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానం చేసేవారు. స్నానఘట్టం దాటగానే కానవచ్చే చాందనీలో ఆలయపు ద్వారపాలకులు వసించి, కాపలా కాస్తూ ఉంటారు. వారి మంచాలు, చెక్కపెట్టెలు, రెండుమూడు పాత్రలు అన్నిటినీ అక్కడ చూడవచ్చు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న సంపన్నులు కొందరు స్నానార్థం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని కబుర్లాడుతూ ఒంటికి నూనె రాచుకొంటారు.
సాధువులు, ఫకీర్లు, బైరాగులు మొదలైనవారు ఆలయ ధర్మశాలలో ప్రసాదం భుజింప పూజ నైవేద్య గంటలు మ్రోగేవరకు ఇక్కడ వేచి ఉంటారు. కొన్ని సందర్భాలలో కాషాయ వస్త్రధారిణియైన భైరవి, త్రిశూలం చేతపుచ్చుకొని ఇక్కడ కూర్చుని ఉండటం చూడవచ్చు. భోజన వేళ కాగానే ఆమెకూడా ధర్మశాలకు పోతుంది.
చాందనీకి ఉత్తరాన ఆరు, దక్షిణాన ఆరు, మొత్తం పన్నెండు శివాలయాలు వరుసగా కానవస్తాయి. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు, దూరంనుంచే ఈ ద్వాదశ శివాలయాలను చూపి, “రాణీ రాస్మణి నిర్మించిన ఆలయా లివి” అని చెప్పుకోవటం పరిపాటి.
1.1.2 ప్రాంగణం, రాధాకాంత ఆలయం
చాందనీకి శివాలయాలకు తూర్పున పొడవైన విశాలమైన ప్రాంగణం ఉత్తర–దక్షిణాలకు వ్యాపించి ఉంది. దాన్లో ప్రక్కప్రక్కన రెండు ఆలయాలను చూడవచ్చు. దక్షిణాన, దక్షిణాభిముఖంగా ఉన్న పెద్ద ఆలయంలో కాళీమాత, ఉత్తరం వైపున ఉన్న చిన్న ఆలయంలో, పశ్చిమదిశన పరవళ్ళు తొక్కుతూ ఉన్న పావన గంగానదిని చూస్తూ రాధాకాంతుడు వెలసి ఉన్నారు. ఈ రాధాకాంత ఆలయాన్ని విష్ణ్వాలయం అని కూడా పేర్కొంటారు.
మెట్లెక్కి రాధాకాంత ఆలయం చేరుకోవచ్చు. అక్కడ పశ్చిమాభిముఖంగా రాధ, కృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నవి. ఆలయం నేల చలువరాళ్లతో పరచి ఉన్నది. ఆలయ పైకప్పున అలంకృతమైన గాజు దీపాలు వరుసలుగా వ్రేలాడుతూన్నాయి. ప్రస్తుతం వాటిని ఉపయోగించటం లేదు. దుమ్ము, ధూళి పడకుండా ఎర్రని వస్త్రంతో వాటిని కప్పి ఉంచారు. సాయంత్రపు సూర్యుని కిరణాలు విగ్రహాల మీద పడకుండా ఉండటానికి వసారాలోని పెద్ద స్తంభాల నడుమ మందపాటి తెరలు కట్టబడి ఉన్నాయి.
రాధాకాంత ఆలయం
ఒక కాపలాదారు ఆలయాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ద్వారం ప్రక్కన చిన్న ఇత్తడి పాత్రలో శ్రీపాదతీర్థం ఉంచబడి ఉంటుంది. దేవుణ్ణి పూజించి తిరిగివచ్చే భక్తులు ఈ తీర్థాన్ని భక్తితో పుచ్చుకొంటారు. ఆలయం లోపల రాధాకృష్ణులు సింహాసనారూఢులై దర్శనం ఇస్తున్నారు. 1857–58 లో శ్రీరామకృష్ణులు మొట్టమొదట ఈ ఆలయంలోనే పూజారిగా ఉండేవారు.
1.1.3 భవతారిణీ కాళికాదేవి
కాళికాలయంలో కాళీమాత సుందరమైన శిలావిగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఇక్కడ కాళీమాతను భవతారిణిగా అంటే భవసాగరాన్ని దాటించే దేవిగా పూజిస్తారు. ఆలయ గచ్చు తెలుపు నలుపు చలువరాళ్లతో పరచబడి ఉంది. మెట్లున్న ఎత్తైన పీఠం ఒకటి ఇక్కడ ఉంది. పీఠం మీద వెండితో తయారైన సహస్రదళ పద్మం, దాని మీద దక్షిణాభిముఖంగా తల, ఉత్తరం వైపుగా సాచిన కాళ్లతో శివుడు శవంలా పడి ఉంటాడు. శివుని విగ్రహం తెల్లని చలువరాతితో తయారైనది. బెనారస్ పట్టుచీరను ధరించి, వివిధాలంకారభూషితయై, నల్లని చలువరాతితో మలచబడి సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్న ముక్కంటి దేవియైన శ్యామాకాళీ, శివుని హృదయస్థానం మీద నిలబడి ఉన్నది. ఆమె నిలబడి ఉన్న, గాంభీర్యం ఉట్టిపడే తీరుతెన్నులను మాటలతో వర్ణించలేం.
కాళికాలయం, భవతారిణీ కాళికాదేవి
కాళీమాత పాదాలకు నూపురం, గజ్జెలు, పాజీబులు, మెట్టెలు మొదలైన ఆభరణాలు, మందారపువ్వులు, బిల్వపత్రాలు అలంకరింపబడి ఉన్నవి. శ్రీరామకృష్ణుల కోర్కె మేరకు మథుర్బాబు అనేక ఆభరణాలను దేవికి కానుకగా సమర్పించాడు. అమ్మవారి చేతికి వంకీలు, మురుగులు, గాజులు; మెడలో కంటె, కాసులదండ, ముత్యాలసరం, శిరస్సున కిరీటం, కర్ణాభరణాలు అలంకరింపబడి ఉన్నాయి. ముక్కుపుడకలు, నత్తు, బేసరి ఉన్నవి. రెండు ఎడమ చేతుల్లో మానవ శిరస్సు, ఖడ్గం పట్టుకొని ఉంది. కుడి రెండు చేతులు వరదాభయ ముద్రలు చూపుతున్నవి. ఆమె నడుముకు మానవ హస్తాల మాల, వేపాకుల గుత్తి, వడ్డాణము ధరింపబడి ఉన్నాయి. ఆమె రూపం విధ్వంసక భీతిని, మాతృ హృదయ మార్దవం అందించే విశ్వాసాన్ని కలగలిపి చూపుతూ ఉన్నట్లుగా కానవస్తోంది. జగత్ శక్తి ఆమె. యావత్ప్రపంచంలో ద్వంద్వాలకు వైభవాన్విత సామరస్యం ఆమే. సృష్టి స్థితి లయాలు నిర్వర్తించేదీ ఆమే. ఆమె మూడవ కన్ను జ్ఞాననేత్రం. ఆ త్రినేత్రాల దృక్కులు దుష్టులకు భయకంపనాలను, సజ్జనులకు అనురాగాన్ని కల్పిస్తాయి.
గర్భగుడిలో ఒక మూల, అంటే ఈశాన్యమూల దేవి విశ్రాంతి గైకొనటానికి మంచం వేసి ఉంది. మరో ప్రక్కన వింజామరం (చామరం) వ్రేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఈ వింజామరంతో దేవికి ఎన్నోమార్లు వీవన చేసి సేవలు ఒనరించి ఉన్నారు.
పీఠంపై పద్మదళాల ఆసనం మీద ఒక వెండి చెంబులోనూ, పీఠం క్రింద వరుసగా పేర్చిన కలశాలలోనూ నీళ్లు నింపబడి ఉంటాయి. పీఠం చుట్టూ అష్ట ధాతువులతో తయారైన సింహం, మొసలి, త్రిశూలం, ఆడ నక్క, నల్లరాతితో మలచిన నంది, హంస కానవస్తాయి.
పీఠం మెట్లపై వెండితో తయారైన చిన్న సింహాసనం మీద సాలగ్రామం, జటాధారి అనే సాధువునుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారైన ‘రాంలాలా’ అని పేర్కోబడే బాలరాముని విగ్రహం, బాణేశ్వరలింగం, అనేక దేవీదేవతల విగ్రహాలు అమర్చబడి ఉంటాయి.
జగజ్జనని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠితయై ఉంది. దేవి పీఠానికి దక్షిణంగా ఉన్న కలశంలో కుంకుమ, అర్చన గావించబడిన పువ్వులు, పుష్పమాలలు మొదలైనవి ఉంటాయి.
గర్భగుడిలో మరోవైపు దేవి ఆచమనం చేయటానికి తామ్రపాత్ర ఒక దాన్లో నీళ్లు నింపి ఉంచుతారు. దేవి పీఠం మీద ఎత్తులో అందమైన గోపురం అమరి ఉంది. దేవికి వెనుకవైపు బెనారస్ పట్టుతో రూపొందిన అందమైన తెర వ్రేలాడుతోంది. పీఠం నాలుగువైపులా చిన్న చిన్న వెండి స్తంభాలు నిలచి ఉన్నాయి. స్తంభాలపైన నవరత్నఖచితమైన గోపురం అమరి ఉంది. గర్భగుడి సుదృఢ ద్వారాలతో సురక్షితంగా ఉంటుంది. ఒక ద్వారం ప్రక్కన, వసారాలో కాపలాదారు కూర్చుని ఉంటాడు. ఆలయ ద్వారం ప్రక్కనే దేవి పాదతీర్థం ఉంటుంది.
కాళికాలయ అగ్రాన తొమ్మిది గోపురాలు అమరి ఉన్నవి. క్రింది వరుసలో నాలుగు చిన్న గోపురాలు, మధ్య వరుసలో నాలుగు చిన్న గోపురాలు, అన్నింటి కంటే పైన ఒక చిన్న గోపురం అమరి ఉన్నవి. వీటిలో ఒక గోపురం ప్రస్తుతం విరిగి ఉంది. భవతారిణీ కాళికాలయంలోను, రాధాకాంత ఆలయంలోను శ్రీరామకృష్ణులు పూజలు ఒనరించి ఉన్నారు. ధ్యానాయత్త జీవితానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ గోచరమవుతుంది. భవతారిణీ ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో పెద్ద స్తంభాలు రెండు వరుసల్లో అమరి ఉన్నాయి. ఈ స్తంభాలు కప్పుభారాన్ని తలదాల్చి ఉన్నాయి. ఉత్సవ వేళల్లో, కాళీపూజ వంటి పర్వదినాలలో ఈ మండపంలో నాటకాలు ప్రదర్శిత మవుతాయి. ఈ మండపంలోనే శ్రీరామకృష్ణుల ఇచ్ఛమేరకు ‘అన్నమేరు’ ఉత్సవం, రాణీ రాస్మణి అల్లుడైన మథుర్బాబు ఏర్పాటుచేశాడు. ఇక్కడే శ్రీరామకృష్ణులు భైరవీపూజను ఘనంగా నిర్వహించారు.
1.1.4 వంటశాల, భాండాగారము, అతిథిశాల, బలిపీఠం
ప్రాంగణం పశ్చిమాన ద్వాదశ శివాలయాలు ఉన్నాయి. సన్న్యాసులకు ఇష్టదైవమైన శివుని పలుస్థితులు తెలియచేసే పన్నెండు శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. అనునిత్యం విధివిహితంగా ఈ శివలింగాలకు పూజాదికాలు నిర్వర్తిస్తారు.
పెద్ద ఆవరణ తక్కిన మూడు వైపుల వంటశాలలు, భాండాగారాలు, అతిథిశాల (ధర్మశాల) కట్టబడి ఉన్నాయి. తూర్పున వంటశాల, భాండాగారము, అతిథులశాల అమరి ఉన్నాయి. రాధాకాంత ఆలయ, కాళికాలయ నైవేద్యాలను విడివిడి వంటశాలల్లో వండుతారు. అనునిత్యం కాళీపూజ తరువాత, మధ్యాహ్న భోజన వేళకు కాస్త ముందుగా నైవేద్యం అర్పించబడుతుంది. పిదప, ఆ అన్నప్రసాదాన్ని ధర్మశాలలో గుమిగూడిన భక్తులకు, పేదలకు వితరణ చేస్తారు. వండిన ఆహారం స్వీకరింప నొల్లని సాధువులకు స్వయంపాకం వస్తుభండారంనుంచి ఆలయ కోశాధికారి అనుమతితో ఇస్తారు. ఆలయ సిబ్బందికి కూడా ప్రసాదంలో భాగం ఉంది. రాణీ రాస్మణి బంధువులు, మిత్రులు వచ్చినప్పుడు కుఠీ (అతిథి భవనం)లో బస చేస్తారు. వారికీ ఆలయ ప్రసాదం పంపబడుతుంది. భాండాగారానికి దక్షిణంగా బలిపీఠం ఉంది.
1.1.5 కార్యాలయం
పెద్ద ఆవరణకు దక్షిణాన వరుసగా అనేక గదులు కానవస్తాయి. ఆలయ కార్యాలయమూ, ఆలయ సిబ్బంది బస, భక్తుల బస ఇక్కడ ఉన్నాయి. కార్యాలయ నిర్వహణాధికారి, గణకుడు ఇక్కడే నివసిస్తారు. భాండాగార నిర్వహణాధికారి, వంటశాల సిబ్బంది, ఆలయ అర్చకులు, పనివారు మొదలైనవారు సదా ఇక్కడ తిరుగాడుతూ ఉంటారు. ఉత్సవదినాలలో మాత్రమే వినియోగింపబడే పెద్దపెద్ద జంపఖానాలు, తెరలు మొదలైనవాటిని కొన్ని గదుల్లో పదిలపరచి ఉంచుతారు. శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలో నివేదనం వండడానికి కొన్ని గదులను నేటికీ ఉపయోగిస్తున్నారు.
ఉత్తరం వైపున కొన్ని గదులు వరుసగా కట్టబడి ఉన్నాయి. ఈ వరుస మధ్యన ఒక ద్వారం కానవస్తుంది. ఇక్కడ సదా ఒక కాపలాదారు ఉంటాడు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లేవారు తమ పాదరక్షలను ఇక్కడ వదలి వెళతారు.
1.1.6 శ్రీరామకృష్ణుల గది
ప్రాంగణంలో వాయవ్యమూల, అంటే ద్వాదశ శివాలయాలకు ఉత్తరంగా శ్రీరామకృష్ణుల గది ఉంది. శ్రీరామకృష్ణులు తమ జీవితకాలంలో అత్యధికభాగం ఇక్కడే గడిపారు. ఈ గదికి పశ్చిమాన నెలకొన్న అర్ధచంద్రాకార మొగసాలలో నిలబడి పావన గంగానదిని దర్శిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు. ఈ వసారాను ఆనుకొని కాలిబాట ఒకటి ఉత్తర–దక్షిణంగా పోతూ ఉంది. బాటకు పశ్చిమాన పువ్వులతోట – దాన్ని దాటి వెళితే రాళ్లతో కట్టబడిన గట్టు – గట్టును తాకుతూ సర్వతీర్థమయి అయిన గంగాదేవి కలకల నినాదంతో ప్రవహిస్తూ ఉంది.
1.1.7 నహబత్, పొగడ చెట్టు, పంచవటి
శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపు ఒక చదరపు వసారా, అక్కడనుంచి పూతోటకు వెళ్లే బాట, పూతోట* అమరి ఉన్నాయి. పూతోట దాటితే మేడతోకూడిన నహబత్ (మేళపు చావడి) కానవస్తుంది. ఈ మేళపుచావడిలో శ్రీరామకృష్ణుల వయోవృద్ధురాలైన తల్లి, మాతృమూర్తి శారదాదేవి నివసించే వారు. నహబత్ తరువాత పొగడచెట్లు, స్నానఘట్టం ఉన్నాయి. ఈ ఘట్టంలో, ఊరి స్త్రీజనం స్నానం చేస్తారు. ఇక్కడే శ్రీరామకృష్ణుల తల్లి 1877 లో భగవత్ సన్నిధానం చేరుకొంది.
పొగడచెట్టును దాటి ఉత్తరం వైపుకు వెళితే పంచవటి వస్తుంది. శ్రీరామకృష్ణులు ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారు. భక్తులతో కలసి పచార్లు చేశారు. కొన్ని వేళల్లో నడిరేయి కూడా అక్కడకు వెళుతూండేవారు. పంచవటిలో వటవృక్షం (మర్రిచెట్టు), అశ్వత్థవృక్షం (రావిచెట్టు), నింబవృక్షం (వేపచెట్టు), ఆమలక వృక్షం (ఉసిరి చెట్టు), బిల్వవృక్షం (మారేడు చెట్టు) ఉన్నాయి. వీటిని శ్రీరామకృష్ణులు స్వయంగా నాటి, పెంచారు. బృందావనం నుంచి తాము తెచ్చిన పావన మృత్తికను ఇక్కడ చల్లారు. ఈ పంచవటికి తూర్పున ఒక పర్ణకుటీరం నిర్మింపచేసి దాన్లో చాలాకాలం తపస్సులో, భగవచ్చింతనలో గడిపారు. ఇప్పుడు ఈ పర్ణకుటీరాన్ని కట్టడంగా మార్చి ఉన్నారు.
పంచవటి పలురకాల పక్షులకు, జంతువులకు ఆలవాలమై ఉంది. అక్కడి మఱ్ఱి చెట్టు చుట్టూ మెట్లతో కూడిన అరుగు ఒకటి నిర్మితమై ఉంది. ఈ అరుగుమీద వాయవ్యమూలన కూర్చుని శ్రీరామకృష్ణులు అనేక కఠోర సాధనలు అనుష్ఠించారు. దేవీ దర్శనంకోసం కన్నీరుమున్నీరైనారు.
1.1.8 సరుగుడు తోపు, బిల్వవృక్షాలు, కుఠీ
పంచవటికి కొంచెం ఉత్తరంగా వెళితే ఇనుప తీగెలతో కట్టిన కంచె ఒకటి వస్తుంది. ఆ కంచెకు ఆవలి వైపునే సరుగుడు తోపు ఉంది. అక్కడ సరుగుడు చెట్లు వరుసగా బారులుతీరి ఉన్నాయి. సరుగుడు తోపుకు తూర్పుగా వెళితే బిల్వవృక్షం వస్తుంది. ఇక్కడకూడా శ్రీరామకృష్ణులు అనేక సాధనలు సల్పారు. సరుగుడు చెట్లు, మారేడు చెట్లకు వెనుకనే ఎత్తైన ప్రహరీగోడ ఉంది. దానికి ఆవల తుపాకీమందు కర్మాగారం ఉంది.
ఆలయ ప్రాంగణపు సింహద్వారం బయట ఉత్తరం వైపున రెండంతస్థుల ‘కుఠీ’ ఉన్నది. రాణి రాస్మణి, ఆమె అల్లుడు మథుర్బాబు మొదలైన వారు ఆలయానికి వచ్చినప్పుడు ఇందులోనే విడిది చేసేవారు. వారు జీవించి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఈ కుఠీలోని క్రింది అంతస్థులో పడమటివైపు గదిలో ఉండేవారు. ఇక్కడనుండి పొగడచెట్ల గట్టుకు వెళ్ళవచ్చు. అక్కడనుండి గంగానది సుందర దృశ్యం చక్కగా కానవస్తుంది.
1.1.9 పాత్రలు తోమే గట్టు, గాజీతోలా, రెండు వాకిళ్ళు
సింహద్వారానికి, కుఠీకి మధ్యన ఉన్న దారిలో వెళ్ళినప్పుడు కుడి ప్రక్కగా మెట్లతో తీర్చి కట్టబడిన సుందరమైన కోనేరు ఉన్నది. కాళికాలయానికి తూర్పువైపున ఈ కోనేటి గట్టు మరొకటి ఉంది. అక్కడ వంటపాత్రలు తోముతారు. అదేవైపున అనతిదూరంలోనే మరో గట్టు ఉంది. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. దీన్ని గాజీతోలా అంటారు. ఆ దారినే తూర్పుగా వెళితే సింహద్వారం ఒకటి వస్తుంది. ఆలంబజార్, కలకత్తానుండి వచ్చేవారు ఆ ద్వారం నుండే ఆలయంలోకి రావచ్చు. ఇక్కడ సర్వదా ద్వారపాలకుడు కాపలాకాస్తుంటాడు. కలకత్తానుండి శ్రీరామకృష్ణులు, రాత్రి పొద్దుపోయాక వచ్చినప్పుడు ఈ ద్వారంగుండానే లోపలికి వచ్చేవారు. అప్పుడు ద్వారపాలకుడు తాళం తీసి ద్వారం తెరిచేవాడు. శ్రీరామకృష్ణులు, అతణ్ణి తమ గదికి తీసుకువెళ్ళి పూరీలు, మిఠాయిలు వంటి ప్రసాదం పెట్టేవారు.
1.1.10 హంసపుకూర్, అశ్వశాల, గోశాల, పువ్వుల తోట
పంచవటికి తూర్పువైపున మరో కొలను ఉంది. దాన్ని హంసపుకూర్ అంటారు. దానికి ఉత్తర దిక్కున అశ్వశాల, గోశాల ఉన్నాయి. గోశాలకు తూర్పుగా సందువాకిలి ఉంది. ఈ వాకిలి నుండే దక్షిణేశ్వర గ్రామానికి వెళ్ళవచ్చు. పూజారులు, మరికొందరు పనివారు తమ కుటుంబాలను తోడ్కొని వచ్చి దక్షిణేశ్వరంలోనే వసించేవారు. వారు ఈ వాకిలిగుండానే రాకపోకలు సాగించేవారు.
ఆలయ ప్రాంగణానికి దక్షిణ సరిహద్దు నుండి ఉత్తరాన గల పంచవటి వరకు గంగాతీరాన కాలిబాట ఉంది. ఆ బాటకు ఇరువైపులా పువ్వుల చెట్లు నాటి ఉన్నారు. అలాగే కుఠీ వద్ద తూర్పు–పడమరలుగా ఉన్న దారిలోకూడా పువ్వుల చెట్లు ఉన్నాయి. గాజీతోలా నుండి గోశాలవరకు; కుఠీ, హంసపుకూర్లకు తూర్పుగా ఉన్న స్థలంలో నలుదిక్కులా పలురకాల పువ్వుల, పండ్ల చెట్లు ఉన్నాయి. ఇక్కడ మరో కొలనుకూడా ఉంది.
వేకువజామున ఆకాశం రక్తవర్ణంతో శోభించేటప్పుడు మంగళహారతి సుమధుర నాదాలు ఆలయంనుండి వినిపిస్తాయి. అప్పుడు పూజ నిమిత్తం కాళికాలయం తోటలో పువ్వులు కోయ నారంభిస్తారు. గంగాతీరాన పంచవటికి ఎదురుగా బిల్వవృక్షం, తెల్లగన్నేరు పువ్వుల చెట్లు ఉన్నాయి. మల్లెపూలు, మాధవీలత, తెల్లగన్నేరు పువ్వులంటే శ్రీరామకృష్ణులకు మహాప్రీతి. మాధవీలతను స్వయంగా బృందావనం నుండి తెచ్చి నాటారు. హంసపుకూర్, కుఠీకి మధ్యనున్న కొలను ఒడ్డున సంపెంగ చెట్టు ఉంది. దానికి కొంత దూరంలో పన్నీరు, మందారపువ్వుల చెట్లు ఉన్నాయి. దడిలో శంఖు పువ్వుల తీగ అల్లుకొని ఉంది. దానికి చివరగా మొల్లచెట్టు, పారిజాతపు చెట్లు ఉన్నాయి. ద్వాదశ శివాలయాలకు పశ్చిమంగా శ్రీరామకృష్ణుల గదికి ఇరువైపులా ఉన్న స్థలం పలురకాల పువ్వుల చెట్లతో అలరారుతోంది.
ప్రప్రథమంలో శ్రీరామకృష్ణులు కూడా ఇక్కడ పువ్వులు కోసేవారు. ఒక రోజు పంచవటి ఎదుటనున్న ఒక బిల్వవృక్షం ఆకులు కోస్తూంటే ఒక కొమ్మ కొద్దిగా ఊడి వచ్చింది. అప్పుడు ఆయనకు సర్వభూతాలలోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడు అన్న అనుభూతి కలిగింది. ఆ భగవంతునికి ఎంతగా బాధకలిగిందో అని చింతించారు. తరువాత ఆయన ఆకులు కోయలేక పోయారు. మరొక రోజు పువ్వులు కోయడానికి తిరుగుతున్నారు. అప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుత్తిగా విరాట్ శివునికి అలంకరిస్తూ, అహర్నిశలూ ఆ విరాడ్రూపుని పూజ జరుగుతున్నట్లుగా ఆయన దర్శించారు. అప్పటి నుండి పువ్వులను కోయడం మానివేసారు.
1.1.11 శ్రీరామకృష్ణుల గది వసారా
శ్రీరామకృష్ణుల గదికి తూర్పువైపున పొడవైన వసారా ఉంది. ఈ వసారాలో కొంత భాగం ప్రాంగణం వైపుగా అంటే దక్షిణాభిముఖంగా ఉంది. శ్రీరామకృష్ణులు తరచూ ఈ వసారాలో కూర్చుని ఆధ్యాత్మిక ప్రసంగాలు, భగవత్ సంకీర్తనలు గావించేవారు. వసారాలోని మిగిలిన భాగం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఈ వసారాలో భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునేవారు; ఆయనతోపాటు సంకీర్తన చేసేవారు; ఆయన, వారితోపాటు కలసి కూర్చుని ప్రసాదం స్వీకరించేవారు. కేశవ్చంద్రసేన్ భక్తి వినమ్రతలతో శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ వసారాలోనే. ఆనందంగా అందరూ కలసి మరమరాలు, కొబ్బరి, పూరీలు, మిఠాయిలు మొదలైనవాటిని ఆరగించేవారు. నరేంద్రుణ్ణి చూసి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయింది కూడా ఈ వసారాలోనే.
శ్రీరామకృష్ణుల గది వసారా, అర్ధచంద్రాకార మొగసాల
1.1.12 ఆనంద నికేతనం
కాళికాలయం ఆనంద నికేతనంగా రూపొందింది. ఇక్కడ రాధాకాంతులు, భవతారిణీదేవి, శివభగవానుల నిత్యపూజానైవేద్యాలు, అతిథి సేవలు జరుగుతున్నాయి. ఒకవైపు పవిత్ర భాగీరథీ కనుచూపు మేర కానవస్తుంది. మరొకవైపు సుగంధపరిమళభరితమై చిత్రవిచిత్ర కుసుమ సమూహాలతో పువ్వుల తోట అలరారుతోంది. ఒక చేతన పురుషుడు రాత్రింబవళ్ళు భగవత్ప్రేమలో ఉన్మత్తుడయింది ఇక్కడే! ప్రత్యక్షదైవంగా నివసించిందీ ఇక్కడే! దేవికి మేలుకొలుపు సేవ మొదలు పవళింపు సేవ వరకు యథావిధిగా మంగళ వాద్యాలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా పూజాదికాలు నిర్వర్తింపబడుతూ కాళీ ఆలయం ఆనంద నికేతనంగా విరాజిల్లుతూ ఉన్నది.
రాణీ రాస్మణి
1.2 ద్వితీయ పరిచ్ఛేదం ప్రథమ దర్శనం
తవకథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్ ।
శ్రవణమంగళం శ్రీమదాతతం భువిగృణన్తి యే భూరిదా జనాః ॥
(శ్రీమద్భాగవతం, గోపికాగీతం, రాసపంచాధ్యాయం)
ఫిబ్రవరి 26, 1882
గంగాతీరాన నెలకొన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలసివుంది. అది వసంతకాలం. క్రీ.శ 1882 సం ॥ ఫిబ్రవరి 23 వ తేదీ గురువారంనాడు శ్రీరామకృష్ణ పరమహంస, కేశవచంద్రసేన్, కెప్టన్ కుక్ మహాశయులతోపాటు స్టీమర్లో విహారంచేసి వచ్చారు. శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం జరిగిపోయిన కొన్ని రోజుల తరువాతి సంఘటన ఇది:
ఆ నాడు ఫిబ్రవరి 26 వ తేదీ ఆదివారం. సిద్ధేశ్వర మజుందార్ (ఉత్తర వరాహ నగరవాసి)తో బారానగర్ (వరాహనగరం) నుంచి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ సెలవు రోజు కాబట్టి ‘మ’* షికారుగా ఇక్కడకు వచ్చాడు. అంతకు క్రితం శ్రీ ప్రసన్న బెనర్జీగారి తోటలో విహరిస్తూంటే, సిద్ధేశ్వర మజుందార్ (సిద్ధూ) “గంగాతీరంలో సుందరోద్యానం ఒకటి ఉంది. మీరు దాన్ని చూడటానికి వస్తారా? అక్కడొక పరమహంస నివసిస్తున్నారు” అన్నాడు. ‘మ’ సరేనన్నాడు.
‘మ’, సిద్ధూ ఇద్దరూ దక్షిణేశ్వర తోట సింహద్వారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. ఇదే ‘మ’ ప్రథమ సందర్శనం. గదిలోకి ప్రవేశించేసరికి, గది నిండా భక్తులు నేలమీద కూర్చుని పరమహంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖంగా మంచం మీద ఆసీనులై దరహాస వదనంతో భగవంతుణ్ణి గురించి ప్రసంగిస్తున్నారు.
‘మ’ నిశ్చేష్టుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతూన్నట్లు అనిపించింది. సాక్షాత్తూ శుకమహర్షి భగవత్ప్రసంగం చేస్తున్నట్లుగా, శ్రీ చైతన్య మహాప్రభువు పూరీ జగన్నాథ క్షేత్రంలో రామానంద, స్వరూపానందాది భక్తులతో శ్రీ నారాయణ గుణనామకీర్తన చేస్తున్నట్లుగా అతడికి తోచింది.
1.2.1 కర్మత్యాగం ఎప్పుడు?
శ్రీరామకృష్ణులు ఇలా పలుకుతున్నారు: “ఒక్కసారి హరినామంగాని, రామనామంగాని ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలువారితే, సంధ్యావందనాది కర్మలు ఆపైన నిర్వర్తించ నక్కరలేదని స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతడికి కలుగుతుంది. కర్మ దానంతట అదే వదలిపోతుంది. అటువంటి స్థితిలో ఏదో ఒకటి – రామనామంగాని, హరినామంగాని లేకపోతే కేవలం ఓంకారాన్నిగాని జపిస్తే చాలు.”
మళ్లీ కొనసాగిస్తూ ఇలా అన్నారు : “సంధ్యావందనం గాయత్రిలో లయిస్తుంది. గాయత్రి ఓంకారంలో లయిస్తుంది.”
‘మ’ నిశ్చేష్టుడై చూస్తూ తనలో ఇలా భావించుకోసాగాడు: ‘ఆహా! ఎంత సుందరమైన స్థలం! ఆహా! వీరెంత ఆకట్టుకొనే స్వరూపులు! ఎంత మధురమైన పలుకులు! ఇక్కణ్ణుండి కదలటానికి మనసొప్పటంలేదు.’ కొంతసేపయ్యాక ‘నాలుగు వైపులా కలయచూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను’ అనుకొన్నాడు.
సిద్ధూతోపాటు గదిలోనుండి బయటకు అడుగువెయ్యగానే హారతి గంటల సుమధుర నాదం వినవచ్చింది. కంచు గంటలు, చేతి గంటలు, మృదంగ తాళాలు ఒకేసారి మోగసాగాయి. తోట దక్షిణ సరిహద్దులో మేళపు మండపం (నహబత్) నుండి ఇంపైన సన్నాయి నాదం వినవచ్చింది. ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతూ పోయి సుదూరంలో ఎక్కడో సమసి పోతూన్నాయి. పుష్ప మకరంద సుగంధంతో వసంత వాయువు సుతిమెత్తగా వీస్తోంది. అప్పుడే చంద్రోదయమైంది.
ఆ తోటలో వెలసిన ఆలయాలన్నింట్లోనూ పూజ, హారతులు ప్రారంభమైనాయి. ద్వాదశ శివాలయాల్లోను, తరువాత రాధాకృష్ణ మందిరంలోను, చివరగా భవతారిణీ కాళికాలయంలోను సంధ్యాహారతులు దర్శించి ‘మ’ అమితానందపరవశుడైనాడు.
“ఇది రాణీ రాస్మణి నిర్మించిన ఆలయం. ఇక్కడ యథావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతాయి. అనేకమంది యాత్రికులకు, భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది” అన్నాడు సిద్ధూ, ‘మ’ తో.
ఇలా వారిద్దరూ మాట్లాడుకొంటూ భవతారిణీ కాళీదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణుల గది గుమ్మం వద్దకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండటం చూశారు.
అంతకు క్రితమే గదిలో సాంబ్రాణి ధూపం వేశారు. పాశ్చాత్య సభ్యతా సంస్కారాలు ఉన్న ‘మ’ అనుమతి లేకుండా తటాలున గదిలోకి ప్రవేశించ లేకపోయాడు. గుమ్మం వద్ద బృంద (పనిమనిషి) నిలబడి ఉంది.
“ఏమమ్మా, సాధువుగారు గదిలో ఉన్నారా?” అని అడిగాడు సిద్ధూ.
బృంద : ఆ! గదిలోనే ఉన్నారు.
‘మ’ : వీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు?
బృంద : ఓ, చాలాకాలం నుంచీ ఉంటున్నారు.
‘మ’ : వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా?
బృంద : అబ్బే పుస్తకాలా! సాక్షాత్తూ సరస్వతీదేవి ఆయన నాలుక మీద వసిస్తోంది.
‘మ’ ఈ మధ్యే కళాశాల చదువు పూర్తిచేశాడు. శ్రీరామకృష్ణులు పుస్తకాలేవీ చదవలేదని విని ఆశ్చర్యపోయాడు.
‘మ’ : వీరిప్పుడు సంధ్యవారుస్తా రనుకొంటాను. మేం లోనికి పోవచ్చునా? కాస్త వారికి మా గురించి చెబుతావా?
బృంద : మీరు తిన్నగా లోనికి వెళ్లి కూర్చోండి.
సిద్ధూ, ‘మ’ గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచం మీద కూర్చుని ఉన్నారు. ఇతరులు ఎవరూ లేరు. సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులన్నీ మూసివున్నాయి. గదిలో ప్రవేశించగానే ‘మ’ చేతులు ముకుళించి ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే, వారిద్దరూ నేల మీద కూర్చున్నారు.
“నువ్వు ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? బారానగర్కు ఎందుకు వచ్చావు?” మొదలైన ప్రశ్నలు వేశారు శ్రీరామకృష్ణులు. ‘మ’ ఈ ప్రశ్నలకు జవాబు లిచ్చాడు. కాని మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అన్యమనస్కు లవుతూండటం ‘మ’ గమనించకపోలేదు. ఇలా మనస్సు అన్యాయత్త మవటమే భావావస్థ అని తరువాత తెలుసుకొన్నాడు. ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది అది. చేప వచ్చి ఎరను తినటం ప్రారంభించగానే గొళ్లెం కదులుతుంది. అప్పుడా వ్యక్తి గాలపు ముల్లు వైపే చూస్తూంటాడు. ఇతరులతో మాట్లాడక నిశ్చలంగా కూర్చుని ఉంటాడు. ఈ భావావస్థకూడా అదే విధమైనది. సాయంకాలం అవుతూండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవశ్యం కలుగుతూండటం సహజం. ఒక్కొక్కప్పుడు ఈయన పూర్తిగా బాహ్యస్పృహను కోల్పోతారు. తరువాత ‘మ’ ఈ సంగతి గురించి విన్నాడు, కళ్లారా చూశాడు కూడా.
‘మ’ (మహేంద్రనాథ్ గుప్త)
‘మ’ : మీరు సంధ్యావందనం చేసుకొంటారు కాబోలు, ఇక మేము సెలవు తీసుకుంటాం.
శ్రీరామకృష్ణులు (భావావస్థలోనే): సంధ్యావందనమా… అలాంటిది ఏదీ లేదు.
కొంతసేపు సంభాషణ జరిగాక ‘మ’ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొన్నాడు. ఆయన “మళ్లీ రా” అన్నారు.
‘మ’ ఇంటికి వెళుతూ ఇలా తలపోశాడు: ‘ఈ మహానుభావుడు ఎవరు? మళ్లీ ఆయన వద్దకు వెళ్లాలని కోరిక కలుగుతోందే! పుస్తక పరిజ్ఞానం లుప్తమైన వ్యక్తి మహానుభావుడు కాగలడా? ఏం ఆశ్చర్యం! మళ్లీ ఆయన వద్దకు వెళ్లాలనే ఆశ కలుగుతోందే! ఆయన ‘మళ్లీ రా’ అన్నారు కదా! రేపో, ఎల్లుండో పెందలకాడే వెళతాను.’
1.3 తృతీయ పరిచ్ఛేదం ద్వితీయ దర్శనం – గురుశిష్య సంవాదం
అఖండమణ్డలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥
రెండవసారి ‘మ’ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తమ గదికి ఆగ్నేయమూల వరండాలో క్షురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు. అప్పుడు ఉదయం ఎనిమిది గంటల సమయం. ఇంకా కాస్త చలిగా ఉంది. అందుచేత ఆయన శాలువా కప్పుకొని ఉన్నారు. శాలువాకు నాలుగు వైపులా ఎర్ర అంచు ఉంది. ‘మ’ ను చూడగానే “ఓ! వచ్చావా? మంచిది, ఇక్కడ కూర్చో” అన్నారు.
తరువాత శ్రీరామకృష్ణులు క్షురకర్మకు కూర్చున్నారు. మధ్యమధ్యలో ‘మ’ తో మాట్లాడుతున్నారు. ఒంటి మీద శాలువా, కాళ్లకు చెప్పులు, నవ్వు ముఖం, మాట్లాడేటప్పుడు ఒకింత నత్తి.
శ్రీరామకృష్ణులు(మ’ తో): అవును మీ ఇల్లు ఎక్కడోయ్?
‘మ’ : కలకత్తాలోనండీ.
శ్రీరామకృష్ణులు: ఇటుకేసి ఎక్కడకు వచ్చావు?
‘మ’ : ఇక్కడ బారానగర్లో మా అక్కగారి ఇంటికి వచ్చాను, ఆయుర్వేద వైద్యుడు
ఈశాన్గారి ఇల్లు.
శ్రీరామకృష్ణులు: ఓహో ఈశాన్ ఇల్లా!
1.3.1 కేశవచంద్రసేన్ నిమిత్తం జగజ్జననికి శ్రీరామకృష్ణుల ప్రార్థన
శ్రీరామకృష్ణులు: కేశవ్ ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందట?
‘మ’ : నేనూ అలాగే విన్నాను. బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారనుకొంటాను.
శ్రీరామకృష్ణులు: నేను కేశవ్కోసం అమ్మ (జగజ్జనని)కి కొబ్బరిబొండాం, చక్కెర మొక్కుకొన్నాను. వేకువనే నిద్ర నుండి మెలకువ రాగానే తల్లి వద్ద విలపించే వాణ్ణి: ‘కేశవ్ జబ్బు నయం చెయ్యి తల్లీ! కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను?’ అందుకే కొబ్బరికాయ నీరు, చక్కెర సమర్పిస్తానని మొక్కుకొన్నాను.
అది సరే! కుక్ దొర కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నాడటగా? నీకు తెలుసా? కేశవ్ నన్నొకసారి స్టీమర్లో తీసుకొని వెళ్లినప్పుడు ఈ కుక్దొర కూడా ఆ బృందంలో ఉన్నాడు.
‘మ’ : చిత్తం. అలాగే విన్నాను. కాని నేను ఆయన ప్రసంగం వినలేదు. నాకు ఆయన గురించి ఎక్కువగా తెలియదు.
1.3.2 గృహస్థులు – తండ్రి కర్తవ్యం
శ్రీరామకృష్ణులు: ప్రతాపుడి సోదరుడు ఇక్కడకు వచ్చి కొన్నిరోజులు ఉన్నాడు. పనిపాటులు ఏమీ లేవు. ఇక్కడే ఉండిపోతానన్నాడు. ఆలుబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి, ఇక్కడ కాలం గడపటమా! బాగా చీవాట్లు పెట్టాను. ‘నీ ఆలుబిడ్డలను పొరుగింటి ఎల్లమ్మ, పుల్లమ్మ పెంచుతారా? సిగ్గుచేటు! భార్యా బిడ్డలను ఇతరులు పోషిస్తారా? అత్తగారింట్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే! ముందుగా ఒక పని సంపాదించుకో’ అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాను. ఆ తరువాతనే ఇక్కడ నుంచి కదిలాడు.