15.1 ప్రథమ పరిచ్ఛేదం కేశవ్ ఇంటి వద్ద – “పశ్యతి తవ పన్థానమ్”
బుధవారం, నవంబర్ 28, 1883
15.1.1 కేశవ్, ప్రసన్న, అమృత్, ఉమానాథ్, కేశవ్ తల్లి, రాఖాల్, ‘మ’
మధ్యాహ్నం రెండు గంటల వేళ. సర్క్యులర్ రోడ్డుకు పశ్చిమంగా కేశవచంద్రసేన్ గృహం – కమలకుటీరం ఉంది. దానికి తూర్పువైపున ఉన్న కాలిబాటపై ఒక భక్తుడు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నాడు. ఎవరికోసమో ఆరాటంతో ఎదురుచూస్తూ ఉన్నట్లు తోచుతోంది. ఎందరో ఆ దారిలో వెళుతున్నారు. వారినందరినీ చూస్తూ పచార్లు చేస్తున్నాడు ఆ భక్తుడు.
కేశవ్ అస్వస్థుడై ఉన్నాడు. అతడి ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించిపోతోంది. ఈసారి అతడు బ్రతికి బట్టకట్టడం సందేహమంటున్నారు. శ్రీరామకృష్ణులు, కేశవ్‌ను ఎంతగానో ప్రేమించేవారు. అతణ్ణి చూడగోరి దక్షిణేశ్వరం నుంచి వస్తున్నారు. ఆయన గురించి ఎదురుచూస్తూనే ఆ భక్తుడు అక్కడ పచార్లు చేస్తూ ఉన్నాడు.
కమల కుటీరానికి ఉత్తరం వైపున ‘మంగళవాడి’ అనే గృహసముదాయం నుండి బ్రహ్మసమాజస్థులు పలువురు అక్కడ నివసిస్తున్నారు. కమలకుటీరానికి ఎదురుగా విక్టోరియా కళాశాల ఉంది. అక్కడ బ్రహ్మసమాజానికి చెందిన స్త్రీలు, సభ్యుల కుమార్తెలు చదువుకుంటున్నారు. ఆ కళాశాలకు ఉత్తరం వైపున విశాలమైన తోట మధ్యలో నెలకొన్న ఇంట్లో ఒక ఆంగ్లేయ కుటుంబం వసిస్తోంది. ఆ ఇంటిని చూసినప్పుడు అక్కడ ఏదో దుర్ఘటన జరిగి ఉండవచ్చునని ఆ భక్తుడికి తోచింది. అది ఏమై ఉంటుందో అని యోచిస్తూ ఉన్నప్పుడు, నల్లని దుస్తులు ధరించిన శకటవాహకుడొకడు ఒక శవపేటికను బండిలో ఉంచి తీసుకువచ్చాడు. దాదాపు రెండు గంటలుగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
నశించే ఈ దేహాన్ని వీడి ఎవరో వెళ్లిపోయారు – అందుకోసమే ఈ ఏర్పాట్లు.
‘మనిషి ఎక్కడకు వెళ్ళిపోయాడు, దేహాన్ని వదలిపెట్టి ఎక్కడకు పోతున్నాడు’ అనుకుంటున్నాడు ఆ భక్తుడు.
ఎన్నో బళ్లు ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుగా వస్తూనే ఉన్నాయి. శ్రీరామకృష్ణులు వస్తున్నారా అని ప్రతి బండిని ఆతురతతో తదేకంగా ఆ భక్తుడు చూస్తూ ఉన్నాడు.
సాయంత్రం ఐదు గంటలు అయింది. శ్రీరామకృష్ణుల బండి వచ్చి ఆగింది. ఆయనతో లాటూ, ఒకరిద్దరు భక్తులూ వచ్చి ఉన్నారు. ‘మ’, రాఖాల్ వారిని కలుసుకున్నారు.
కేశవ్ ఇంటివారు వెంటనే వచ్చి శ్రీరామకృష్ణులకు స్వాగతం పలికి మేడ మీదకు తోడ్కొని వెళ్లారు. అక్కడ అతిథుల గదికి దక్షిణానగల వసారాలో ఒక మంచం వాల్చి ఉంది. ఆ మంచం మీద శ్రీరామకృష్ణులను ఆసీనులను చేశారు.
15.2 ద్వితీయ పరిచ్ఛేదం సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు – మహాభావంలో జగజ్జననితో సంభాషణ
కేశవ్ రాకకై శ్రీరామకృష్ణులు చాలాసేపు వేచివున్నారు. కేశవ్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లూ, కాసేపట్లో వచ్చేస్తాడనీ కేశవ్ శిష్యులు వినమ్రంగా తెలిపారు. కేశవ్ ఆరోగ్యం చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. అందుచేతనే శిష్యులూ, ఇంటివారూ ఆతణ్ణి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు, కేశవ్‌ను చూడాలనే ఆతురతతో అశాంతికి గురైనారు.
శ్రీరామకృష్ణులు (కేశవ్ శిష్యులతో): ఏమోయ్! ఆయన లేచి రావడం ఎందుకు? లోపలకు వెళ్లి నేనే ఎందుకు ఆయన్ను చూడకూడదు?
ప్రసన్నుడు(వినమ్రంగా): మహాశయా, ఆయనే కాసేపట్లో ఇక్కడకు వస్తారు.
శ్రీరామకృష్ణులు: ఇక చాలించండి. ఎందుకీ గందరగోళం? నేను లోపలికి వెళతాను?
శ్రీరామకృష్ణులను మరపించేందుకు ప్రసన్నుడు, కేశవ్‌ను గురించి మాట్లాడసాగాడు.
ప్రసన్నుడు: ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మీలాగే ఆయన జగజ్జననితో మాట్లాడుతున్నారు. జగజ్జనని మాట్లాడటం విని నవ్వుతారు, విలపిస్తారు.
జగజ్జననితో కేశవ్సేన్ మాట్లాడాడు, నవ్వాడు, విలపించాడు అని వినగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యం పొందారు. చూస్తూ ఉండగానే సమాధిమగ్నులైనారు.
అప్పుడు శీతకాలం. శ్రీరామకృష్ణులు ఆకుపచ్చని ప్లానలు జుబ్బా ధరించి దాని మీద ఒక శాలువ కప్పుకుని ఉన్నారు. నిటారుగా కూర్చున్న స్థితి, దృష్టి నిశ్చలంగా ఉంది. చాలాసేపు అదే స్థితిలో ఉండిపోయారు. సమాధిస్థితి నుండి బయటకు వచ్చే సూచనలు ఏవీ కానరాలేదు.
సంధ్యాకాలమయింది. శ్రీరామకృష్ణులు, ఒకింత బాహ్యచైతన్యంలోకి వచ్చారు. అతిథుల గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులను అక్కడకు తోడ్కొని పోవటానికి ఏర్పాట్లు చేశారు. ఎంతో శ్రమతో ఆయనను అక్కడకు తీసుకువెళ్లారు. ఆ గదిలో సోఫాలు, కుర్చీలు, అలమారలు, దీపాలు మొదలైన సామాన్లు ఉన్నాయి.
శ్రీరామకృష్ణులను ఒక సోఫాలో కూర్చోబెట్టారు. కూర్చోగానే బాహ్యచైతన్యం కోల్పోయి ఆయన మళ్లీ పారవశ్యంలో మునిగిపోయారు. ఆ స్థితిలోనే, సోఫాను చూస్తూనే, ఏదో మత్తులో మాట్లాడేటట్లు, “ఇంతకు మునుపు వీటన్నిటి అవసరం ఉండేది. ఇప్పుడు ఇవి ఎందుకు?” అన్నారు. తరువాత రాఖాల్ను చూసి, “రాఖాల్, నువ్వు వచ్చావా?” అన్నారు.
15.2.1 జగజ్జనని దర్శనం, ఆమెతో సంభాషణ – ఆత్మకు చావులేదు
శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఏదో దృశ్యాన్ని చూసి ఇలా పలుకసాగారు: “ఇదుగో, ఇదుగో జననీ! అమ్మా, నుమ్వా వచ్చి ఉన్నావా! బెనారస్ పట్టు చీరలో ఎంత కళకళలాడుతున్నావమ్మా! అమ్మా, కూర్చో! నా తల్లీ, కూర్చో!”
శ్రీరామకృష్ణుల మహాభావస్థితి కొనసాగింది. గది ప్రకాశంతో నిండి ఉంది. బ్రహ్మసమాజ భక్తులు చుట్టూ కూర్చుని ఉన్నారు. లాటూ, రాఖాల్, ‘మ’ మొదలైన వారు శ్రీరామకృష్ణుల ప్రక్కనే కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో తమలో తామే మాట్లాడుకుంటున్నారు:
“దేహం, ఆత్మ! దేహం పుడుతుంది, గిడుతుంది. ఆత్మకు చావులేదు. పోకచెక్కలా. పండిన పోకలోవున్న వక్క పెంకుకు అంటుకోక విడిగా ఉంటుంది. కాని లేతగా ఉన్నప్పుడు వక్కను పెంకు నుండి వేరుచెయ్యటం చాలా కష్టం. భగవంతుణ్ణి దర్శించి ఆయనను పొందితే, ఆ వ్యక్తికి దేహబుద్ధి నశిస్తుంది. అప్పుడు దేహమూ ఆత్మా వేర్వేరు అన్న జ్ఞానం కలుగుతుంది.”
ఇంతలో కేశవ్ వచ్చాడు. అతడు తూర్పు ద్వారం గుండా గది లోపలికి వచ్చాడు. బ్రహ్మసమాజ మందిరంలోనో, టౌన్హాలులోనో ప్రసంగం ఇచ్చినప్పుడు ఆతణ్ణి చూసిన వారు, ఇప్పుడు ఎముకల గూడులా ఉన్న ఆతణ్ణి చూసి నిర్ఘాంత పోయారు. కేశవ్ నిలబడలేక పోతున్నాడు. గోడను పట్టుకుని మెల్లమెల్లగా నడిచి వచ్చాడు. అతికష్టంమీద నడిచివచ్చి సోఫా ముందు నేల మీద కూర్చున్నాడు. ఇంతలో శ్రీరామకృష్ణులు సోఫాలోనుండి దిగి నేల మీద కూర్చున్నారు. కేశవ్, శ్రీరామకృష్ణులకు తలవంచి ప్రణామం చేసి ఆయన పాదపద్మాలను తన తలతో స్పృశించి చాలాసేపు అట్లే ఉండిపోయాడు. తరువాత లేచి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యంలోనే ఉన్నారు. ఆయన తమలో ఏదో గొణుగుకుంటూ జగజ్జననితో మాట్లాడుతూన్నట్లు ఉంది!
15.3 తృతీయ పరిచ్ఛేదం బ్రహ్మం, శక్తి అభిన్నం – అనులోమం, విలోమం
అప్పుడు కేశవ్, “నేను వచ్చాను, నేను వచ్చాను” అన్నాడు కాస్త బిగ్గరగా, ఇలా అంటూ ఆతడు శ్రీరామకృష్ణుల ఎడమ చేతిని పుచ్చుకొని మెల్లగా నిమురసాగాడు. శ్రీరామకృష్ణులు భావపారవశ్యస్థితిలో తమను పూర్తిగా మరచిపోయి కూర్చుని ఉన్నారు. ఆయన తమలో మాట్లాడుకుంటూన్నట్లు ఎంతో మాట్లాడారు. భక్తులు మంత్రముగ్ధులై శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు.
శ్రీరామకృష్ణులు: ఉపాధి జ్ఞానం ఉన్నంత వరకు ఈతడు కేశవ్, ఈతడు ప్రసన్నుడు, ఈతడు అమృతుడు అని నానా విషయాల గురించిన ఎరుక ఉంటుంది. పూర్ణజ్ఞానం కలిగినప్పుడు సమస్తమూ ఒకే చైతన్యం అనే ఎరుక కలుగుతుంది. అంతేకాదు, ఆ స్థితిలో చైతన్యం ఒక్కటే ఈ జీవజగత్తులుగాను, ఇరవై నాలుగు తత్త్వాలుగాను అయివున్నట్లు దర్శిస్తాడు.
“కాని శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యాలు ఉంటాయి. సమస్తమూ ఆయనే అయివున్నాడన్న మాట నిజమే, అయితే కొన్నిచోట్ల శక్తి అధికంగా అభివ్యక్తం అవుతూ ఉంది, కొన్నిచోట్ల తక్కువగా అభివ్యక్తం అవుతోంది.
“విద్యాసాగర్ ఒకసారి నాతో, ‘అలా అయితే భగవంతుడు కొందరికి అధిక శక్తిని, కొందరికి తక్కువ శక్తిని ఇచ్చి ఉన్నాడా?’ అని అడిగాడు. అందుకు నేను ‘అవును. అలా కాకుంటే ఒక్కడే యాభై మందిని ఓడించగలుగుతున్నాడే! అదెలా సాధ్యం! పైగా, మిమ్మల్ని దర్శించే నిమిత్తం మేం రావటానికి ఏమిటి కారణం?’ అని అన్నాను.
“భగవంతుడి లీలలు ఎవరి ద్వారా అభివ్యక్తం అవుతాయో ఆతడిలో విశేష శక్తి కానవస్తుంది. జమీందారు తన జమీలో అన్ని చోట్లకు పోతూ ఉంటాడు; కాని కచ్చేరి చావడికి మాత్రం ప్రతిరోజూ వచ్చి చాలసేపు కూర్చుంటాడు. భక్తుడే భగవంతుడి కచ్చేరి చావడి. భక్తుడి హృదయంలో తన లీలలు ప్రదర్శింప భగవంతుడు ఇష్టపడతాడు. భక్తుడి హృదయంలోనే ఆయన విశేష శక్తి అభివ్యక్తమవుతుంది. అటువంటి భక్తుడి లక్షణాలు ఏమిటి? మహాకార్యాలు నిర్వర్తింపబడే చోట్ల భగవంతుడి విశేషశక్తి అభివ్యక్తీకరణ ఉంటుంది.
“ఈ ఆద్యాశక్తీ, పరబ్రహ్మమూ అభిన్నాలు. ఒకదాన్ని వదిలి మరొకదాన్ని ఊహించనైనా లేము. మాణిక్యం, దాని ప్రకాశం మాదిరి. మాణిక్యాన్ని వదలి దాని ప్రకాశాన్ని మాత్రం ఊహించుకోవటం అసాధ్యం. అదే విధంగా ప్రకాశాన్ని విడిచి మాణిక్యాన్ని మాత్రం ఊహించుకోవటమూ సాధ్యం కాదు. అలాగే, పామూ, దాని తిర్యక్గతి (మెలికలు తిరిగే కదలిక). పామును విడిచి, తిర్యక్గతిని ఊహించగలమా? తిర్యక్ గతిని వదలి పామును ఊహించటమూ సాధ్యం కాదు.
15.3.1 భక్తులలో భగవంతుని ప్రకాశం – సాధకుడు, సిద్ధుల మధ్య వ్యత్యాసం
“ఆద్యాశక్తియే ఈ జీవజగత్తులుగాను, ఇరవై నాలుగు తత్త్వాలుగాను అయి ఉంది. అనులోమం, విలోమం.*
“రాఖాల్, నరేంద్రుడు మొదలైన యువకులకై నేను ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను? ‘వీళ్ల కోసం ఇంతగా ఆరాటపడుతూ ఉంటే ఇక భగవచ్చింతన ఎప్పుడు చేస్తారు?’ అని హాజ్రా నన్ను అడిగాడు. (కేశవాదులు నవ్వారు) అప్పుడు నేను ఎంతో వ్యధకు లోనయ్యాను.
జగజ్జననితో, ‘అమ్మా! నా స్థితి ఇలా అయిందే! ఈ యువకుల కోసం ఎందుకు ఆరాటం చెందుతున్నావు అని హాజ్రా అడుగుతున్నాడే!’ అని మొరపెట్టుకున్నాను. తరువాత భోలానాథ్తో ఈ విషయం గురించి అడిగాను. అందుకు భోలానాథ్ ఇలా చెప్పాడు: ‘మహాభారతంలో ఈ ప్రస్తావన ఉంది. సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి క్రిందికి దిగివచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటాడు? సత్త్వగుణ భక్తులనే!’ మహాభారతంలోని ఈ వివరణను విన్న తరువాత ప్రశాంతచిత్తుడనైనాను. (అందరూ నవ్వారు)
“ఇందులో హాజ్రా తప్పు ఏమీ లేదు. సాధన ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు, ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని విచారణచేసి మనస్సును సంపూర్ణంగా భగవంతుడి వైపు కేంద్రీకరించాలి. కాని సిద్ధినొందాక, ఆ పరిస్థితే వేరు. భగవద్దర్శనానంతరం అనులోమ విలోమం.* వెన్న తీయాలంటే మొదట దాన్ని మజ్జిగ నుండి విడగొట్టాలి. వెన్న తీసిన పిదప ‘మజ్జిగకు చెందినదే వెన్న, వెన్నకు చెందినదే మజ్జిగ’ అన్న విషయం అవగతమవుతుంది. అదే విధంగా భగవంతుడే సమస్తమూ అయి ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకుంటాం. కొన్నిచోట్ల అధిక ప్రకాశం, కొన్ని చోట్ల తక్కువ ప్రకాశం.
“సముద్రం పొంగితే తీరం యావత్తు నీటిమయమవుతుంది. మునుపు చుట్టూ మెలికలు తిరిగి ప్రవహించే నది మీదుగా పడవను నడిపే, సముద్రం చేరుకోవాలి. ఇప్పుడో, వరద వెల్లువలో ఎక్కడ చూసినా నీరే; కనుక పడవను తిన్నగా నడిపి సముద్రాన్ని చేరుకోవచ్చు. వరికోతలు అయ్యాక, గట్లపై చుట్టు తిరిగి వెళ్లవలసిన అగత్యం ఉండదు. అడ్డంగా చేల మీదుగానే నడిచిపోవచ్చు.
“భగవద్దర్శనానంతరం ఆయనను సర్వాంతర్యామిగా గాంచవచ్చును. మనుష్యుల్లో, అందునా సత్త్వగుణ భక్తులలో, అంటే కామినీ కాంచన ఆసక్తి లేశమాత్రమైనా లేని వారిలో ఆయన శక్తి ప్రకాశం అధికంగా ఉంటుంది. (అంతా మౌనంగా ఉన్నారు) సమాధిమగ్నుడైన వ్యక్తి క్రిందికి దిగివస్తే తన మనస్సును ఎక్కడ నిలుపుతాడు? అందుచేతనే కామినీ కాంచన ఆసక్తి లేని, సత్త్వగుణ భక్తుల సాంగత్యం అవసరమై ఉంటుంది. లేకుంటే సమాధిస్థితిని పొందినవారు దేనిని ఆధారం చేసుకుని జీవిస్తారు?
15.3.2 జగత్తుకు అమ్మ
“ఎవరు బ్రహ్మమో ఆయనే ఆద్యాశక్తి. నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయనను బ్రహ్మమనీ లేక పరమపురుషుడనీ చెబుతాం. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను శక్తి అంటాం, ప్రకృతి అంటాం. పురుషుడు, ప్రకృతి. ఎవరు పురుషుడో ఆయనే ప్రకృతి. ఆనందమయుడు, ఆనందమయి.
“ఎవరికి పురుష జ్ఞానం ఉంటుందో, అతడికి స్త్రీ గురించిన ఎరుకా ఉంటుంది. తండ్రి ఎరుక ఉన్న వ్యక్తికి తల్లి గురించిన ఎరుకా ఉంటుంది. (కేశవ్ నవ్వాడు) చీకటి గురించిన ఎరుక ఉన్న వ్యక్తికి వెలుతురు గురించిన ఎరుక ఉంటుంది. రాత్రి గురించిన ఎరుక గల వ్యక్తికి పగలు గురించిన ఎరుకా ఉంటుంది. సుఖం గురించిన ఎరుక ఉన్న వాడికి దుఃఖం గురించిన ఎరుకా ఉంటుంది. ఇది మీకు అర్థం అవుతోంది గదా?”
కేశవ్ (నవ్వుతూ): అవును, అర్థం చేసుకున్నాను.
శ్రీరామకృష్ణులు: అమ్మ! ఏ అమ్మ? జగత్తుకు అమ్మ! ఎవరు జగత్తును సృష్టించిందో, రక్షిస్తోందో, తన పిల్లలను సర్వదా కాపాడుతూ ఉందో, ధర్మార్థ కామమోక్షాలలో ఎవరు ఏం కోరుకున్నా దాన్ని వారికి అనుగ్రహిస్తుందో, ఆ తల్లి. నిజమైన పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేడు. అతడి తల్లికి అన్నీ తెలుసు; తినటం త్రాగటం, తిరగటం – ఇవే పిల్లవాడు చేసేవి. మరి దేని గురించీ పిల్లవాడు కలత చెందడు.
కేశవ్: అవునండీ.
15.4 చతుర్థ పరిచ్ఛేదం బ్రహ్మసమాజస్థులు – భగవదైశ్వర్య వర్ణన
ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీరామకృష్ణులు మామూలు స్థితికి వచ్చేశారు. మోమున చిరునవ్వు మొలకెత్తగా కేశవ్‌ను చూస్తూ మాట్లాడసాగారు. ఆ గది నిండా కూర్చుని ఉన్న భక్తులు ఆతురతతో వింటున్నారు. కాని ‘మీరు ఎలా ఉన్నారు?’ వంటి కుశల ప్రశ్నలు ఏవీ లేకపోవటం చూసి అందరూ విస్తుబోయారు. భగవంతుణ్ణి గురించే మాట్లాడటం జరిగింది.
శ్రీరామకృష్ణులు (కేశవ్‌తో): బ్రహ్మసమాజస్థులు భగవన్మహిమలనే అంతగా వర్ణిస్తారు ఎందుకు? ‘ఓ భగవంతుడా! నువ్వు చంద్రుణ్ణి సృష్టించావు, సూర్యుణ్ణి సృష్టించావు, నక్షత్రాలను సృష్టించావు’ లాటి వాటిని ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముంది? అధిక సంఖ్యాకులు తోటను చూసి, దాన్నే ప్రశంసిస్తారు. తోట సొంతదారుని చూడాలని ఎంతమంది అభిలషిస్తారు? తోట గొప్పదా, లేక దాని సొంతదారుడా?
“కల్లు త్రాగాక, దుకాణంలో ఇంకా ఎన్ని ముంతల కల్లు నిల్వ ఉందో లెక్క గట్టడం ఎందుకు? ఒక ముంత కల్లుతోనే పని పూర్తి అవుతోంది కదా!
“నరేంద్రుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా, ‘నీ తండ్రి పేరు ఏమిటి? ఆయనకు ఎన్ని ఇళ్లు ఉన్నాయి?’ అని అడగనేలేదు.
15.4.1 శంభుకు ఉపదేశం, విష్ణాలయంలో ఆభరణాల చోరీ సంఘటన
“అసలు సంగతి ఏమిటో తెలుసా? మానవుడు తన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాడు. అదే విధంగా భగవంతుడూ తన మహిమలను ఇష్టపడతాడని అతడు అపోహపడతాడు. భగవదైశ్వర్యాలను శ్లాఘిస్తూ వర్ణిస్తే ఆయన సంతుష్టుడవుతాడని అతడు భావిస్తాడు. ఒక సందర్భంలో శంభు నాతో, ‘స్వామీ, నా సిరిసంపదలనంతా భగవంతుడి పాదపద్మాల వద్ద సమర్పించి మరణించేట్లు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నాడు. అందుకు నేను, అతడితో, ‘ఇవన్నీ నీకు సంబంధించినంత వరకు మాత్రమే సంపదలు. భగవంతుడికి నువ్వు ఏం సమర్పించగలవు? ఆయనకు ఇవన్నీ దుమ్ము ధూళికి సమం సుమా’ అన్నాను.
“రాధాకాంతాలయ ఆభరణాలు అన్నీ దొంగిలించబడినప్పుడు మథుర్ బాబు, నేను విషయం తెలుసుకోవడానికి ఆలయంలోకి వెళ్లాం. అప్పుడు మథుర్బాబు, ‘ఓ భగవంతుడా! సిగ్గుచేటు! నీ విలువ ఇంతేనా? దొంగలు నీ ఒంటి మీది ఆభరణాలను దొంగిలించుకుపోయారు, అయినా నువ్వేమీ చేయలేకపోయావు’ అన్నాడు. వెంటనే నేను మథుర్బాబుతో, ‘ఇవేం మాటలు? నువ్వు వేటిని నగలు గిగలు అంటూ గొప్పగా చెప్పుకుంటున్నావో, అవన్నీ భగవంతుడికి మట్టిబెడ్డలతో సమానం. సాక్షాత్తూ మహాలక్ష్మియే ఎవరికి సతియై ఉన్నదో, ఆయన నీ కొద్దిపాటి ధనం దొంగిలింపబడినందుకై కలత చెందుతాడా ఏమిటి? ఇలా మరెప్పుడూ మాట్లాడవద్దు’ అన్నాను.
“భగవంతుడు ఐశ్వర్యానికి వశుడా? ఆయన భక్తికి వశుడౌతాడు. భగవంతుడు దేన్ని కాంక్షిస్తాడు? ధనం కాదు. ఆయన భక్తి, ప్రేమ, వివేకం, వైరాగ్యాలను మాత్రమే కాంక్షిస్తాడు.
15.4.2 వివిధ ఉపాసకులు – త్రిగుణాతీత భక్తులు
“ప్రతి ఒక్కరూ తమ మనోస్థితికి అనుగుణంగా భగవంతుణ్ణి భావిస్తున్నారు. తమోగుణంగల భక్తుణ్ణి తీసుకొందాం – జగజ్జనని కూడా మేకమాంసం తింటుందని భావిస్తాడతడు. అందుచేతనే మేకను బలి ఇస్తున్నాడు. రజోగుణ భక్తుడు పంచభక్ష్య పరమాన్నాలతో జగజ్జననికి నైవేద్యం సమర్పిస్తాడు. సత్త్వగుణ భక్తుని పూజలో పటాటోపం ఉండదు. అతడు పూజచేస్తూ ఉన్నట్లు కూడా తెలుసుకోలేం. పువ్వులు లభించకుంటే బిల్వదళాలు, గంగాజలం అర్పించి పూజను ముగిస్తాడు. అతడు సమర్పించే నైవేద్యం బెల్లం కలిపిన కాసిని అటుకులు లేక కాస్త పటికబెల్లం – దీనితోనే సరి. ఎప్పుడన్నా కాస్త పాయసం వండి, నివేదిస్తాడు.
“త్రిగుణాతీతులైన భక్తులు ఉన్నారు. వారిది బాలుని స్వభావం. భగవన్నామస్మరణే వారు చేసే పూజ. భగవన్నామమే పావనమైనది.
15.5 పంచమ పరిచ్ఛేదం వ్యాధి జాడమాత్రంగా మిగిలి ఉన్నా భగవంతుడు వదిలిపెట్టడు
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ, కేశవ్‌తో) : “మీ ఆరోగ్యం ఎందుకు బాగోలేదు? దానికొక కారణం ఉంది. పలురకాల ఆధ్యాత్మిక భావనలు మీ దేహం గుండా వెలువడ్డాయి. అందుచేతనే రోగం సంక్రమించింది. భావపారవశ్య స్థితి కలిగినప్పుడు మనకు ఏమీ తెలియదు. చాలారోజులు గడిచాక అది దేహారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెద్ద పెద్ద ఓడలు గంగానది మీదుగా పోవటం చూశాను. అవి పోయేటప్పుడు ఎటువంటి చడీచప్పుడూ ఉండదు. కాని కాసేపయ్యాక, బాబోయ్! అలలు ఉవ్వెత్తున్న లేచి ఒడ్డును మోదుతాయి! ఎంత అల్లకల్లోలం! కొన్ని సందర్భాలలో తీరం గట్టు కొంత విరిగికూడా పోవచ్చు.
“ఒక గుడిసెలో ఏనుగు జొరబడితే, గుడిసె ఛిన్నాభిన్నమౌతుంది. అట్లే భావహస్తి (భగవత్ ప్రేమ అనే ఏనుగు), శరీరమనే గుడిసెలో జొరబడి, దాన్ని ఛిన్నాభిన్నం చేసివేస్తుంది.
“అసలు ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఇంట్లో అగ్నిప్రమాదం సంభవిస్తే మొదట లోపల ఉన్న కొన్ని వస్తువులు కాలిపోతాయి. తరువాత అల్లకల్లోలం. అదేవిధంగా జ్ఞానాగ్ని మొదట కామక్రోధాలనే శత్రువులను దగ్ధం చేస్తుంది; తదనంతరం అహంకారాన్ని అణచివేస్తుంది. ఆ తరువాత పాంచభౌతిక శరీరంలో ఒక పెద్ద అలజడి ప్రారంభమౌతుంది.
“అంతా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు. కాని వ్యాధి జాడమాత్రంగా మిగిలి ఉన్నప్పటికీ భగవంతుడు నిన్ను వదలిపెట్టడు. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే, పిదప బయటకు రాలేవు. వ్యాధి పూర్తిగా నయం కాకుండా డాక్టరు నిన్ను బయటకు పంపడు. ఎందుకు నీ పేరు నమోదు చేశావు?” (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు ఆసుపత్రిని ఉదాహరణగా ప్రస్తావించటం చూసి కేశవ్ పదేపదే నవ్వసాగాడు. అతడు నవ్వును ఆపుకోలేకపోయాడు. చాలాసార్లు ప్రయత్నించి వీలుకాక, తెరలు తెరలుగా నవ్వాడు. శ్రీరామకృష్ణులు మళ్లీ మాట్లాడసాగారు.
15.5.1 శ్రీరామకృష్ణుల వ్యాధి – రామ్ కవిరాజ్ చికిత్స
శ్రీరామకృష్ణులు (కేశవ్‌తో): ‘ఇటువంటి భావపారవశ్య స్థితులను మరెక్కడా చూడలేదు, ఇట్టి వ్యాధినీ మరెక్కడా చూడలేదు’ అంటాడు హృదయ్. అప్పుడు నేను అతిసార విరేచనాలతో బాధపడ్డాను. లక్షలాది చీమలు తలను కుట్టినట్లుగా బాధ. అయినప్పటికీ భగవత్ ప్రసంగమే అహర్నిశలూ కొనసాగించాను. రామ్ కవిరాజ్ అనే వైద్యుడు నన్ను పరీక్షించే నిమిత్తం వచ్చాడు. అప్పుడు నేను జ్ఞాన విచారణలో మునిగిపోయి ఉన్నాను. ‘ఇదెక్కడి పిచ్చితనం! ఒంట్లో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పైగా విచారణ చేస్తూన్నాడే’ అన్నాడతడు. (కేశవ్‌తో) అంతా భగవత్సంకల్పం..
సకలము నీ తలపే
జరిగింతువు అటువలెనే
నీ పనులను నీ వొనరుప
తా జేసితిమని తలతురు॥ స ॥
పంకమందు కూరునట్లు
భద్రగజము బంధింతువు
కుంటివాని దూకింతువు
కొండల పైపైకి కూడ॥ స ॥
కూలద్రోతు వీ వొకరిని
ఘోర భవాఘాతమందు
ఎక్కింతువు వేరొకరిని
ఎనలేని బ్రహ్మపథము॥ స ॥
నే యంత్రము నీవు యంత్రివి
నే గృహమును నీవు గృహిణి
నే రథమును నీవు రథివి
ఎటు నడపెదొ అటె నడతును॥ స ॥
“మంచు బిందువులు పడటం కోసం తోటమాలి గులాబి మొక్కకు పాదులు చేసి వేళ్లు బయటకు కనబడేట్లు చేస్తాడు. మంచు కురవటంతో గులాబి మొక్క ఏపుగా పెరుగుతుంది. అందుచేతనే మీరూ వేళ్ల వరకూ కదలించబడ్డారని తోచుతోంది. (కేశవ్, శ్రీరామకృష్ణులు నవ్వారు) మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఘనకార్యాలు సాధిస్తారని అనుకుంటున్నాను.
15.5.2 కేశవ్ నిమిత్తం శ్రీరామకృష్ణులు సిద్ధేశ్వరికి మొక్కుకున్న సంఘటన
మీకు జబ్బు చేసిందని వింటే నా మనస్సు క్షోభిస్తుంది. ఇంతకు మునుపు మీకు జబ్బు చేసినప్పుడు వేకువజామున లేచి మీ కోసం విలపించేవాణ్ణి. ‘అమ్మా! కేశవ్‌కి ఏదైనా జరిగితే ఆ తరువాత నేను ఎవరితో మాట్లాడగలను?’ అంటూ జగజ్జననితో మొరపెట్టుకొన్నాను. తరువాత నేను కలకత్తాకు వచ్చినప్పుడు సిద్ధేశ్వరీదేవికి మొక్కుకున్న కొబ్బరి బొండాం, చక్కెర సమర్పించాను. మీకు నయం కావాలని జగజ్జననిని ప్రార్థించాను.”
శ్రీరామకృష్ణులకు కేశవ్ పట్ల గల అవ్యాజ ప్రేమ, ఆయన పడ్డ వ్యాకులతా చూసి భక్తులు చలించిపోయారు.
శ్రీరామకృష్ణులు: నిజం చెప్పాలంటే ఈసారి నేను అంత ఆరాటం చెందలేదు. రెండు రోజులు ఒకింత ఆరాటపడ్డాను.
ఇంతలో కేశవ్ లోపలికి వచ్చిన అదే తూర్పు వాకిలి గుండా ఆతడి తల్లి వచ్చి నిలబడింది. ఆ వాకిలి వద్ద నిలబడ్డ ఉమానాథ్ శ్రీరామకృష్ణులతో బిగ్గరగా, “మహాశయా, ఇక్కడ తల్లి మీకు ప్రణామం చేస్తూ ఉన్నారు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు నవ్వారు. ఉమానాథ్ మళ్లీ, “కేశవ్ వ్యాధి నయం అయ్యేట్లు ఆతణ్ణి ఆశీర్వదించమని తల్లి మిమ్మల్ని వేడుకుంటోంది” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (కేశవ్ తల్లిని చూస్తూ): అన్ని వరాలు అనుగ్రహించేదీ, ఆనందమయీ అయిన జగజ్జననిని ప్రార్థించండి. మీ కష్టాలను ఆమె తొలగిస్తుంది.
(కేశవ్‌తో) “ఇంట్లోనే ఎక్కువసేపు గడపవద్దు. భార్యాపిల్లల మధ్య ఎక్కువ సేపు గడిపితే ఇంకా మునిగిపోతావు. భగవత్ ప్రసంగాలు వింటే మునుపటి కన్నా తేరుకుంటావు.”
గంభీరమైన స్వరంలో ఇదంతా చెప్పి, ఒక బాలునిలా నవ్వసాగారు శ్రీరామకృష్ణులు. తరువాత కేశవ్‌ను చూస్తూ, “ఏదీ మీ చెయ్యి చాపండి, చూస్తాను” అన్నారు. పిల్లవాడిలా చెయ్యి ఎత్తిపట్టుకొని బరువు చూశారు. తరువాత, “నీ చెయ్యి తేలికగా ఉంది. నయవంచకుల చెయ్యి బరువుగా ఉంటుంది” అన్నారు. (అందరూ నవ్వారు)
ఉమానాథ్ తలుపు వద్ద నుండి మళ్లీ శ్రీరామకృష్ణులతో, “కేశవ్‌ను ఆశీర్వదించమని తల్లి మిమ్మల్ని వేడుకుంటున్నారు” అన్నాడు.
శ్రీరామకృష్ణులు (గంభీరంగా): నా వల్ల ఏం అవుతుంది? భగవంతుడే అందరినీ ఆశీర్వదిస్తాడు. అమ్మా! సకలము నీ తలపే, జరిగింతువు అటు వలెనే; నీ పనులను నీ వొనరుప, తా జేసితిమని తలతురు లోకులు!
“భగవంతుడు రెండు సందర్భాలలో నవ్వుతాడు. ఇద్దరు అన్నదమ్ములు భూమి పంపకాల సందర్భాన అడ్డంగా తాడు పుచ్చుకొని, ‘ఈ ప్రక్క నాది. ఆ ప్రక్క నీది’ అంటూ ఉన్నప్పుడు ఆయన నవ్వుతాడు. ‘ఈ జగత్తంతా నాది. వీరు దాన్లో ఒక వీసం భూమిని ఉంచుకొని ఈ ప్రక్క నాది, ఆ ప్రక్క నీది! అనుకుంటున్నా’ రని భగవంతుడు నవ్వుతాడు.
“భగవంతుడు మరో సందర్భంలో కూడా నవ్వుతాడు. బిడ్డకు జబ్బు చేసి ప్రమాదస్థితిలో ఉన్నప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటుంది. వైద్యుడు ఆమెతో, ‘అమ్మా, భయపడవద్దు. నేను నయం చేస్తాను’ అని చెబుతాడు. అప్పుడూ భగవంతుడు నవ్వుతాడు. బిడ్డ చనిపోవాలనేది భగవంతుడి ఇచ్ఛ అయినప్పుడు, బిడ్డను కాపాడటం ఎవరివల్లా సాధ్యం కాదు అన్న సంగతి వైద్యుడికి తెలియదు.” (అందరూ మౌనంగా ఉండిపోయారు)
ఆ సమయంలో కేశవ్‌కి తెరలు తెరలుగా దగ్గు వచ్చింది. చాలాసేపు ఎడతెరపి లేకుండా దగ్గసాగాడు. ఆతడు దగ్గటం చూసి ఆతడి ఆవేదన గాంచి అందరికీ కష్టం వేసింది. చాలసేపయ్యాక ఎంతో ప్రయత్నం మీద దగ్గు కాస్త తగ్గింది. ఇక కేశవ్ అక్కడ ఉండలేకపోయాడు. శ్రీరామకృష్ణుల ముందు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తరువాత మునుపటిలా ఎంతో శ్రమతో గోడపట్టుకొని నడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు.
15.6 షష్ఠ పరిచ్ఛేదం కేశవ్ – వేదాలలో ప్రస్తావితమైన దేవతలు – దయానందుడు
15.6.1 కేశవ్ కుమారుడు, అమృతుడు
శ్రీరామకృష్ణులకు ఉపాహారం సమర్పింప ఏర్పాట్లు చేసి ఉన్నారు. కేశవ్ పెద్ద కుమారుడు ఆయన ప్రక్కకు వచ్చి కూర్చున్నాడు. అమృతుడు, ఆ పిల్లవాణ్ణి శ్రీరామకృష్ణులకు పరిచయం చేసి, “ఇతడే కేశవ్ పెద్ద కుమారుడు. మీరు ఇతణ్ణి ఆశీర్వదించండి. ఓ, ఇదేమిటి! ఇతడి తల మీద చెయ్యివేసి ఆశీర్వదించండి” అంటూ వేడుకున్నాడు. అందుకు ఆయన, “నేను ఆశీర్వదించలేనే!” అంటూ, మధురంగా నవ్వుతూ కేశవుడి కుమారుడి దేహాన్ని తమ చేత్తో నిమిరారు.
అమృతుడు (మందహాసం చేస్తూ): సరి, అలా అయితే వీపు నిమరండి. (అందరూ నవ్వారు)
అమృతుడు మొదలైన బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు కేశవ్ గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ‘జబ్బు నయమగుగాక!’ వంటి దీవెనలు నేను చెయ్యలేను. ఇటువంటి శక్తిని ఎన్నడూ జగజ్జననిని కోరలేదు. ‘అమ్మా! నాకు శుద్ధభక్తిని ప్రసాదించు’ అనే ఆమెను ప్రార్థించాను.
“కేశవ్ సామాన్యమైన వాడా? ధనవంతులూ ఆతణ్ణి గౌరవిస్తున్నారు; సాధువులూ గౌరవిస్తున్నారు. నేనొకసారి దయానందుణ్ణి కలుసుకున్నాను. అప్పుడు ఆయన ఒక ఉద్యాన గృహంలో బసచేసి ఉన్నాడు. ‘కేశవ్, కేశవ్’ అంటూ కేశవ్ రాకకై ఎదురుచూస్తూ ఆయన క్రిందికీ పైకీ పచార్లు చేస్తున్నాడు. నాడు కేశవ్ అక్కడకు వస్తానని చెప్పి ఉన్నాడనుకుంటాను.
“దయానందుడు వంగభాషను ‘గౌరాంగ భాష’ అని పేర్కొనేవాడు. కేశవ్‌కి వేదాలలో ప్రస్తావితమైన బలులలోను, దేవతలలోను విశ్వాసం లేదు అని తోచుతోంది. అందుచేతనే దయానందుడు, ‘ఇన్ని వస్తువులను సృజించిన వ్యక్తి వల్ల దేవతలను సృజించటం సాధ్యం కాదా ఏమిటి?’ అని చెప్పాడు.”
శ్రీరామకృష్ణులు, కేశవ్‌ను శ్లాఘిస్తూ ఆతడి భక్తులతో ఇలా అన్నారు: “కేశవ్‌కి సంకుచిత బుద్ధి లేదు. ఆతడు పలువురితో, ‘మీలో ఎవరికైనా సంశయాలు కలిగితే అక్కడకు (శ్రీరామకృష్ణుల వద్దకు) వెళ్లి నివృత్తి చేసుకోండి’ అంటాడు. నా స్వభావమూ అటువంటిదే; ‘కేశవుడి సద్గుణాలు కోటిరెట్లు పెరగనీ. మర్యాద మన్ననలు పొంది నేను ఏం చేయబోతాను?’ అంటాను నేను. కేశవ్ ఒక గొప్ప వ్యక్తి. అతణ్ణి ధనవంతులూ, సాధువులూ అందరూ గౌరవిస్తున్నారు.”
ఉపాహారం ఆరగించాక శ్రీరామకృష్ణులు బయలుదేర సిద్ధమైనారు. బ్రహ్మసమాజ భక్తులు బండి దాకా సాగనంపటానికి వచ్చారు.
మెట్లు దిగుతూ క్రిందికి వచ్చేటప్పుడు క్రింది భాగంలో దీపాలు లేకపోవటం శ్రీరామకృష్ణులు గమనించారు. వెంటనే అమృతుడు మొదలైన భక్తులతో, “ఇలాంటి చోట్ల చక్కని వెలుతురు ఉండేటట్లు దీపాలు పెట్టాలి. దీపాలు లేని ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోండి” అన్నారు.
15.7 సప్తమ పరిచ్ఛేదం జయగోపాల్ సేన్ ఇంటికి శుభాగమనం
తరువాత శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో దక్షిణేశ్వరానికి బయలు దేరారు. దారిలో మాథాఘసా వీథిలో వసిస్తున్న జయగోపాల్ సేన్ ఇంటికి వెళ్లారు. అప్పుడు సమయం ఏడు గంటలు అయివుంటుంది. కొందరు భక్తులతో శ్రీరామకృష్ణులు ఆ ఇంట్లోకి వెళ్లారు.
శ్రీరామకృష్ణులను గురించి భక్తులు ఏ విధంగా భావిస్తున్నారు?
శ్రీరామకృష్ణులు రేయింబవళ్లు హరిప్రేమలో మునిగి ఉన్నారు. వివాహం చేసుకున్నారు; అయినప్పటికీ ఇతరుల వలె భార్యతో కాపురం చేయటం లేదు. భార్య పట్ల భక్తి చూపుతున్నారు, భార్యను పూజిస్తున్నారు; ఆమెతో భగవంతుని గురించి మాత్రమే మాట్లాడతారు. భగవంతుణ్ణి గురించే గానం చేస్తారు, ఆయన్నే ఆరాధిస్తారు, ధ్యానం చేస్తారు. కాపట్యం లేదు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యంగా ఆయనకు గోచరమవుతుంది. ధనం, లోహవస్తువులు, పాత్రలు వీటిని ఆయన స్పృశించలేరు; స్త్రీలను స్పృశించలేరు. స్పృశిస్తే ముల్లు గుచ్చుకొన్నట్లు తాకిన చోటు జివ్వుమని బాధపెడుతుంది. ధనం, బంగారం వీటిని పుచ్చుకొంటే చెయ్యి కొంకర్లు తిరిగిపోయేది; ఊపిరి ఆగిపోయేది. చివరికి ఆ వస్తువును విసిరివేస్తేగాని తిరిగి మామూలుగా ఊపిరి పీల్చుకోగలిగేవారు కాదు!
భక్తులు ఇంకా ఏవేవో ఊహిస్తున్నారు; సంసారాన్ని త్యజించాలా? అధ్యయనం వల్ల, శ్రవణం వల్ల ఏం ప్రయోజనం? వివాహం చేసుకోకుంటే ఉద్యోగం చేయాల్సిన అగత్యం ఉండదు కదా! తల్లితండ్రులను వదలివేయాలా? నేను వివాహం చేసుకున్నాను. నాకు పిల్లలు ఉన్నారు. నేను కుటుంబాన్ని కాపాడాలి. నా గతి ఏమవుతుంది? రేయింబవళ్లు హరిప్రేమలో మునిగిపోయి ఉండాలనే నేనూ అభిలషిస్తాను. శ్రీరామకృష్ణులను చూస్తూ ఉన్నప్పుడు, నేను ఏం చేస్తూ ఉన్నాను అని తోచుతోంది. ఆయన అహర్నిశలూ తైలధారలా నిరవచ్ఛిన్నంగా భగవత్ చింతనలోనే నిమగ్నమై ఉన్నారు. మరి నేనో, రేయింబవళ్లు లౌకిక చింతనలలో మునిగిపోయి ఉన్నాను. కారుమేఘాలు దట్టంగా ఆవరించిన ఆకాశంలో, ఏదో మూల ఒక చిన్న వెలుగు ఈయన దర్శనం మాత్రమే. ఇప్పుడు జీవిత సమస్యను ఎలా పరిష్కరించాలి?
ఈయన ఆచరణలో చూపిస్తున్నారు. అయినప్పటికీ సందేహమా? ఇసుకచే నిర్మితమయిన ఆనకట్టను కూలద్రోసి మనోభిలాషను పూర్తిచేసుకోనా! ఇది నిజంగా ఇసుక ఆనకట్టయేనా? అలాగైతే సంసారాన్ని ఎందుకు త్యజించలేను? శక్తి అల్పమేనని తెలుసు. కాని భగవంతుడి పట్ల ప్రేమ కలిగితే ఈ లెక్కలు ఏవీ మిగలవు. గంగలో పోటు వచ్చినప్పుడు ఎవరు దాన్ని నిరోధించగలరు? ఏ భక్తితో చైతన్యుడు కౌపీనం ధరించి సన్న్యాసి అయినాడో, ఏ ప్రేమ భక్తితో ఏసుక్రీస్తు అనన్యచిత్తుడై వనంలో వసించాడో, ప్రేమ నిండిన తన పరమపితరుని ముఖారవిందాన్ని తిలకిస్తూ ప్రాణాలు విడిచాడో, ఏ ప్రేమతో బుద్ధుడు రాజభోగాలను త్యజించి విరాగి అయ్యాడో, ఆ ప్రేమలోని ఒక్క బిందుమాత్రం ఉదయిస్తేనే ఈ అనిత్య లౌకిక జీవితం ఎక్కడో కనుమరుగయ్యేది.
పోనీ, దుర్బలులు, ప్రేమ ఉదయించని వారు, సంసారంలో ఉన్నవారు, ‘మాయ’ సంకెళ్లతో కాళ్లు కట్టివేయబడ్డ వాళ్లు – వీరికి దారి ఏమిటి? మూర్తీభవించిన ప్రేమమయమూర్తి ఈ మహాపురుషుడు ఏం చెబుతాడో చూద్దాం?
ఈ విధంగా భక్తులు యోచిస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు జయగోపాల్సేన్ ఇంటి అతిథుల గదిలో భక్తులతో కలిసి ఆసీనులైనారు. ఎదురుగా జయగోపాల్, ఆతడి బంధువులు, ఇరుగు పొరుగులు కూర్చుని ఉన్నారు. పొరుగు వ్యక్తి ఒకరు శ్రీరామకృష్ణులతో మాట్లాడటానికి ఎంతో ఆతురతతో ఉన్నాడు. జయగోపాల్ అన్నగారైన వైకుంఠ్ కూడా అక్కడ ఉన్నాడు.
15.7.1 గృహస్థాశ్రమం – శ్రీరామకృష్ణులు
వైకుంఠుడు: మహాశయా, మేం సంసారంలో మునిగి ఉన్న వారం. మాకు ఏదైనా ఉపదేశించండి.
శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఒక చేతిని ఆయన పాదపద్మాలపై ఉంచండి. రెండవ చేత్తో బాధ్యతలు నిర్వర్తించండి.
వైకుంఠ్: సంసారం మిథ్యా?
శ్రీరామకృష్ణులు: భగవంతుని తెలుసుకోనంత వరకు మిథ్యయే. ఈ స్థితిలో మనిషి ఆయన్ను మరచిపోయి ‘నాది, నాది’ అంటూ మాట్లాడుతున్నాడు; మాయలో చిక్కుకుని, కామినీకాంచనాల గుప్పెటలో చిక్కువడి ఇంకా కూరుకుపోతున్నాడు. తప్పించుకోవటానికి మార్గం ఉన్నప్పటికీ అతడు తప్పించుకోలేకపోతున్నాడు; మాయ కారణంగా ఆ మేరకు అతడు అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాడు. ఒక పాట ఉన్నది –
మహామాయ వ్యామోహమున జగమె భ్రమజెంది
వివేకహీనుడుగ బ్రహ్మ గావింపబడ
చైతన్యరహితుడై చలగంగ విష్ణువు
మరి ఆశ ఏముండు మానవుల కింక?…
“సంసారం అనిత్యమైనదని మీరే చూస్తూ ఉన్నారు. ఈ ఇంటినే తీసుకోండి. ఎంతమందో వచ్చారు, పోయారు. ఎంతమందో పుట్టారు, గిట్టారు! జీవితమనేది ఇదుగో ఉంది, ఇదుగో లేకుండాపోయింది. ఇది అనిత్యమైనది. ఎవరిని ‘నా వాడు, నా వాడు’ అనుకుంటారో; కళ్లను మూసివేస్తే ఇక అతడు లేడు. ఎవరూ లేరు, అయినప్పటికీ మనవణ్ణి విడిచి కాశీకి పోలేడు! ‘నా హారూను ఎవరు చూసుకుంటారు?’ అనేదే ఆరాటం. బయటపడటానికి మార్గం ఉన్నప్పటికీ వలలో చిక్కుకున్న చేప తప్పించుకోటానికి ప్రయత్నించదు. తాను కట్టుకున్న గూట్లో తానే చిక్కుకొని చచ్చిపోతుంది పట్టుపురుగు. ఈ విధంగా సంసారం మిథ్య, అనిత్యం అయివుంది.”
పొరుగు వ్యక్తి: మహాశయా! ఒక చేత భగవంతుణ్ణీ, మరో చేత సంసారాన్నీ ఎందుకు పుచ్చుకోవాలి? సంసారం అనిత్యమైనదే అయితే ఒక చేత్తో మటుకు మాత్రం దాన్ని ఎందుకు పుచ్చుకోవాలి?
శ్రీరామకృష్ణులు: భగవంతుని తెలుసుకున్నాక సంసార జీవితంలో ఉంటే అది అనిత్యం కాబోదు. ఒక పాట విను:
పొలుము దున్నుట తెలియదు నీకు
బీడువారినది జీవిత క్షేత్రము
బాగుగదున్ని పదునుచేసిన
గొప్ప పంటను కోసెదు మనసా॥ పొ ॥
కాళీనామము గట్టువేయుచు
పండిన పంటను భద్రపరచిన
దట్టమైన యా గట్టు దాపునకు
కాలిడలేడు కాలుడుకూడ॥ పొ ॥
గురూపదిష్టపు పరమేశ్వరుని
నామబీజముల నాటుము పొలమున
భక్తిశ్రద్ధలు పరిఢవిల్లగ
నీరుపెట్టు తరుణమందున॥ పొ ॥
చక్కని పొలము గ్రక్కున విడచు
తరుణము త్వరలో దాపరించును
కావున ఈ పని కష్టము తోచిన
సాయము రామప్రసాదు నడుగుము॥ పొ ॥
15.8 అష్టమ పరిచ్ఛేదం గృహస్థాశ్రమంలో భగవత్ప్రాప్తికి మార్గం
శ్రీరామకృష్ణులు: పాటను విన్నావా? ‘కాళీ నామము గట్టువేయుచు పండిన పంటను భద్రపరచిన.’ భగవంతుణ్ణి శరణు వేడు, సకలమూ సాధిస్తావు. ‘దట్టమైన యా గట్టు దాపునకు కాలిడలేడు కాలుడు కూడ’ – దట్టమైన గట్టు. భగవంతుణ్ణి పొందినప్పుడు సంసారం నిస్సారం అని తోపదు. భగవంతుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, ఆ భగవంతుడే జీవ జగత్తులుగా అయివున్నట్లు గాంచుతాడు. పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు బాలగోపాలుడికి పెడుతూ ఉన్నట్లుగా భావించండి. తల్లితండ్రులను భగవతిగాను భగవంతునిగాను కాంచండి. సేవలు చేయండి. భగవంతుని తెలుసుకున్నాక సంసారం చేసేవాడు సామాన్యంగా భార్యతో శారీరక సంబంధం పెట్టుకోడు. ఇద్దరూ భక్తులు; భగవంతుని గురించే మాట్లాడతారు. భగవత్ ప్రసంగంలోనే వారు కాలం వెళ్లబుచ్చుతారు. వారు భక్తులకు సేవలు ఒనరిస్తారు. సకల భూతకోటిలోను వెలసి ఉన్న భగవంతుణ్ణి వారిద్దరూ సేవిస్తారు.
పొరుగింటి వ్యక్తి: మహాశయా, అటువంటి భార్యాభర్తలను చూడలేమే?
శ్రీరామకృష్ణులు: ఉన్నారు, కాని బహు అరుదు. లౌకిక జనులు వీరిని తెలుసుకోలేరు. కాని ఇలా జీవించాలంటే ఇద్దరూ సత్ప్రవర్తనులై ఉండాలి. ఇద్దరూ భగవదానందాన్ని చవిచూసి ఉంటేనే ఇలా జీవించగలరు. భగవంతుని విశేష అనుగ్రహమూ ఉండాలి. లేకుంటే సదా అపార్థాలు చోటుచేసుకుంటాయి. కొన్ని సందర్భాలలో ఇద్దరూ విడిపోవటం కూడా జరగవచ్చు. అవగాహన లేకుంటే జీవితమే నరకప్రాయమవుతుంది. రేయింబవళ్లు భార్య, ‘నా తండ్రి నన్ను నీకిచ్చి ఎందుకు వివాహం చేశాడో? స్వయంగా తినటానికే లేదు, పిల్లలకు పెట్టటానికీ లేదు. ధరించడానికి వస్త్రాలు లేవు, పిల్లలకూ గుడ్డలు లేవు. ఒక నగానట్రా లేదు. నువ్వు నాకు ఏం సుఖం ఇచ్చావు? కళ్లుమూసుకుని ‘భగవాన్, భగవాన్’ అంటూ జపిస్తూ ఉన్నావు. ఈ పిచ్చివ్యవహారాన్ని కట్టిపెట్టు’ అని సణుగుతూ ఉంటుంది.
ఒక భక్తుడు: అవునండీ, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఒక వంక పిల్లలు చెప్పిన మాట వినరు; ఇంకా ఎన్నో కష్టాలు. అలా అయితే మార్గం ఏమిటి?
శ్రీరామకృష్ణులు: సంసారంలో ఉంటూ సాధన చేయటం చాలా కష్టం. అనేక ఆటంకాలు ఉన్నాయి. రోగం, శోకం, దారిద్ర్యం; భార్యతో పొసగదు; అవిధేయులూ, మూర్ఖులూ, మొండివారూ అయిన పిల్లలు – ఇవన్నీ నేను నీకు చెప్ప పనిలేదు. అయినప్పటికీ మార్గం ఉంది. అప్పుడప్పుడు ఏకాంతంలో భగవంతుని ప్రార్థించాలి. ఆయనను పొంద ప్రయత్నించాలి.
పొరుగింటి వ్యక్తి: ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా?
శ్రీరామకృష్ణులు: కచ్చితంగా వద్దు. అవకాశం లభించినప్పుడు ఒక రోజో, రెండు రోజులో ఏకాంతంలోకి వెళ్లిపో. అప్పుడు కుటుంబంతో ఎలాటి సంబంధమూ ఉండరాదు, లౌకికులతో లౌకిక సంభాషణలలో దిగరాదు. వీలుపడితే ఏకాంతవాసం, లేకుంటే సాధుసాంగత్యం చేయి.
పొరుగింటి వ్యక్తి: సాధువును తెలుసుకోవడం ఎలా?
శ్రీరామకృష్ణులు: ఎవరి మనస్సు, ప్రాణం, అంతరాత్మ భగవంతుణ్ణే శరణుజొచ్చి ఉన్నాయో ఆతడే సాధువు. ఎవరు కామినీకాంచనాలను త్యజించాడో ఆతడే సాధువు. సాధువు స్త్రీలను భోగవస్తువు అనే దృష్టితో చూడడు. సర్వదా వారిని విడిచి దూరంగానే ఉంటాడు. వారి సమీపంలోకి వెళ్లవలసివస్తే వారిని తల్లిగానే ఎంచుతాడు, ఆరాధిస్తాడు. సాధువు ఎల్లప్పుడు భగవచ్చింతనలో మునిగి ఉంటాడు, భగవత్ ప్రసంగాలు తప్ప మరి దేన్ని గురించి మాట్లాడడు. సకల ప్రాణికోటిలోను భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడని ఎరిగి వారికి సేవలు చేస్తాడు. సామాన్యంగా ఇవే సాధువు లక్షణాలు.
పొరుగింటి వ్యక్తి: ఎల్లప్పుడూ ఏకాంతంలో జీవించాలా?
శ్రీరామకృష్ణులు: ఫుట్ పాత్‌లోని చెట్లను చూశావా? అవి చిన్న మొక్కలుగా ఉన్నంత వరకు చుట్టూ కంచె కట్టాలి. లేకుంటే పశువులు వచ్చి ఆ మొక్కలను మేస్తాయి. చెట్టుబోదె లావుగా పెరిగిన పిదప కంచె అవసరం ఉండదు. అప్పుడు ఏనుగును కట్టివేసినా కూడా చెట్టుకు ప్రమాదం ఉండదు. మనస్సును దృఢమైన చెట్టుబోదెలా చేసుకోగలిగితే పిదప విచారింప పనిలేదు. మొదట వివేకం సముపార్జింప పాటుపడు. నూనె రాచుకుని పనసపండును ఒలిస్తే, చేతికి జిగట అంటుకోదు.
పొరుగింటి వ్యక్తి: వివేకం అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం – ఈ విచారణ. సత్ అంటే నిత్యమైనది, అసత్ అంటే అనిత్యం. వివేకం జనించిన వ్యక్తికి భగవంతుడే సత్యం, తక్కినదంతా అసత్యం అని తెలుస్తుంది. వివేకం ఉదయిస్తే భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఆకాంక్ష కలుగుతుంది. అసత్యమైనదాన్ని అభిలషిస్తే, అంటే దేహసుఖం, కీర్తి, ధనం మొదలైన వాటిని ఆశిస్తే సత్యస్వరూపమైన భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనస్సు ఇచ్ఛగించదు. సదసత్ విచారణ ప్రారంభిస్తే భగవంతుని అన్వేషింప కోర్కె జనిస్తుంది.
ఒక పాటను విను:
రావే మనసా షికారు పోదము ।
కాళీకల్ప ద్రుమంబునకు
ప్రోగుచేయుమా చెట్టు క్రిందను ।
నాలుగు పురుషార్థంబులును….
“మనస్సు అంతర్ముఖమైనప్పుడు వివేకం ఉదయిస్తుంది. వివేకం జనిస్తే సత్యం వికసిస్తుంది. అప్పుడు కాళీ అనే కల్పవృక్షం క్రింద పచార్లు చేయ మనస్సులో ఇచ్ఛ జనిస్తుంది. ఆ వృక్షం క్రిందకు వెళితే, అంటే భగవంతుని దరిని చేరితే ధర్మార్థకామమోక్షాలు సునాయాసంగా పొందుతావు. శ్రమలేకుండా అవి లభిస్తాయి. భగవంతుణ్ణి పొందగలిగితే, ఎవరైనా కోరే పక్షంలో, సామాన్యంగా మనిషి కాంక్షించే ధర్మార్థకామమోక్షాలు కూడా లభిస్తాయి.”
పొరుగింటి వ్యక్తి: అలా అయినప్పుడు సంసారాన్ని మాయ అని పేర్కోటం ఎందుకు?
15.8.1 విశిష్టాద్వైతం – బిల్వఫల ఉదాహరణ
శ్రీరామకృష్ణులు: భగవంతుని పొందనంత వరకు ‘నేతి, నేతి’ అంటూ త్యాగం చేయాలి. ఆయనను పొందిన వారు ఆయనే సర్వమూ అయివున్నట్లు తెలుసుకుంటారు. భగవంతుడు, మాయ, జీవజగత్తులు అన్నీ ఒక్కటే అనే ఎరుక అప్పుడు కలుగుతుంది. జీవజగత్తులు మొదలైనవన్నీ ఆయనే. బిల్వఫలాన్ని పెంకు, కండ, విత్తనం అంటూ విభజిస్తున్నాం. అప్పుడు ఎవరైనా బిల్వఫలం బరువు ఎంత అని ప్రశ్నిస్తే పెంకు, విత్తనం తీసివేసి కండను మాత్రం తూచుతావా? తూచవు. బరువు కావాలంటే పెంకు, విత్తనాన్ని కూడా చేర్చాలి. ఆ పిదపే బిల్వఫలం బరువు ఇంత అని చెప్పగలం. పెంకే జగత్తు, విత్తనమే ప్రాణికోటి. విచారణ చేసేటప్పుడు జీవజగత్తులను అనాత్మగానూ అసత్యమైనదిగానూ చెప్పుకున్నాం; ఆ సమయంలో కండయే సారం, పెంకు విత్తనం నిస్సారమైనవి అన్న ఎరుక కలుగుతుంది. కాని విచారణ పూర్తికాగానే అన్నీ చేరి ఒక్కటే అని తెలుస్తుంది. ఏ వస్తువు నుండి కండ రూపొందినదో దాని నుండే పెంకు, విత్తనం ఉత్పన్నమౌతున్నాయి అనే ఎరుక కలుగుతుంది. బిల్వఫలాన్ని అవగాహన చేసుకుంటే అన్నిటినీ తెలుసుకోగలం.
“ ‘అనులోమం, విలోమం’. వెన్న మజ్జిగకు చెందినదే; మజ్జిగ వెన్నకు చెందినదే. మజ్జిగ ఉన్నప్పుడు వెన్న కూడా ఉన్నట్లే, వెన్న ఉన్నప్పుడు మజ్జిగ కూడా ఉన్నట్లే. ఆత్మ ఉంటే, అనాత్మ కూడా ఉంటుంది.
“నిత్యం ఎవరికి చెందినదో ఆయనదే లీల కూడా, లీల ఎవరికి చెందినదో ఆయనదే నిత్యం కూడా. భగవంతుడని తెలుసుకోబడేవాడే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఆయనే అన్నీ అయి ఉన్నట్లు; తండ్రి, తల్లి, పిల్లవాడు, పొరుగింటి వ్యక్తి, ప్రాణికోటి, మంచి చెడులు, శుచి అశుచి అన్నీ అయి ఉన్నట్లు గాంచుతాడు.”
15.8.2 పాపపుణ్యాలు – భక్తుడు
పొరుగింటి వ్యక్తి: అలా అయితే పాపపుణ్యాలు లేవా?
శ్రీరామకృష్ణులు: ఉన్నాయి, అదే సమయంలో లేవు కూడా. భగవంతుడు మనలో ‘అహం’ భావాన్ని ఉంచితే, భేదబుద్ధినీ ఉంచుతాడు; పాపపుణ్య భావాలను ఉంచుతాడు. ఏదో ఒకరిద్దరికి అహంకారాన్ని అడుగంటా రూపుమాపుతాడు. వీరు పాపపుణ్యాలకు, మంచి చెడులకు అతీతులవుతారు. భగవద్దర్శనం కలుగనంత వరకు భేదబుద్ధి, మంచి – చెడులు అన్న ఎరుక ఉండే తీరుతుంది. ‘పాపమూ పుణ్యమూ నాకు సమానమే, భగవంతుడు ఎలా చేయిస్తాడో అట్లే చేస్తాను’ అని నువ్వు నోటితో చెప్పవచ్చు. కాని ఇవన్నీ నిరర్థక ప్రసంగాలని అంతరంగాన నీకు బాగా తెలుసు. ఏదైనా చెడు పని చేస్తే మనస్సు టకటక కొట్టుకుంటుంది! భగవద్దర్శనానంతరమూ, భగవంతుడు ఇచ్ఛగిస్తే, ‘నేను దాసుణ్ణి’ అనే ఎరుకను భక్తుడిలో ఉంచుతాడు. ఆ స్థితిలో భక్తుడు, ‘నేను దాసుణ్ణి నువ్వు ప్రభువ్వి’ అంటాడు. ఇటువంటి భక్తుడికి భగవంతుని గురించి మాట్లాడటం, భగవత్ సేవాకార్యాలు ఆనందం కలిగిస్తాయి; భగవదపేక్ష లేని వారిని అతడు ఇష్టపడడు, భగవత్లక్ష్యం లేని కార్యాలలో విముఖుడవుతాడు. ఇటువంటి భక్తులలో భగవంతుడు భేదబుద్ధి ఉంచుతాడని దీని నుండి తెలుస్తోంది.
పొరుగింటి వ్యక్తి: మహాశయా, భగవంతుణ్ణి తెలుసుకొని సంసారం సాగించమని అంటున్నారు. ఆయనను తెలుసుకోగలమా?
శ్రీరామకృష్ణులు: ఇంద్రియాల ద్వారానో, ఈ మనస్సు ద్వారానో తెలుసుకోలేం. ఏ మనస్సులో విషయ వాసనలు లుప్తమో ఆ పరిశుద్ధ మానసంతో ఆయన్ను తెలుసుకోవచ్చు.
పొరుగింటి వ్యక్తి: భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు?
శ్రీరామకృష్ణులు: ఆయనను సరిగ్గా ఎవరు తెలుసుకోగలరు? మనకు ఎంత అవసరమో అంత మేరకు తెలుసుకుంటే చాలు. ఒక చెంబు నీరే ఎక్కువ అయినప్పుడు, బావిలో ఉన్న మొత్తం నీటితో ఏమిటి అవసరం? చక్కెర గుట్ట వద్దకు ఒక చీమ వెళ్లింది. అంత చక్కెరతో దానికి ఏం ప్రయోజనం? రెండు కణాలు లభిస్తేనే చాలు. అదే దానికి ఎక్కువైపోతుంది.
పొరుగింటి వ్యక్తి: మేం సన్నిపాత రోగులం. మా రోగానికి ఒక చెంబు నీరు ఎలా సరిపోతుంది? భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలని కదా అనిపిస్తుంది.
15.8.3 సంసార రోగానికి ఔషధం – “మామేకం శరణం వ్రజ”
శ్రీరామకృష్ణులు: నిజమే. కాని రోగానికి ఔషధం ఉంది కదా!
పొరుగింటి వ్యక్తి: ఏ ఔషధం, మహాశయా!
శ్రీరామకృష్ణులు: సాధుసంగం, భగవంతుని నామగుణసంకీర్తన, ఎడతెరపి లేకుండా ప్రార్థించటం. ‘అమ్మా! నాకు జ్ఞానం వద్దు. ఇదుగో నీ జ్ఞానం, ఇదుగో నీ అజ్ఞానం; రెండూ నువ్వే తీసుకో. నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తిని మాత్రమే ప్రసాదించు. నాకు మరేదీ వద్దు’ అని జగజ్జననిని నేను ప్రార్థించాను.
“రోగానికి తగిన ఔషధం కావాలి. గీతలో భగవంతుడు, ‘అర్జునా! నువ్వు నన్నే శరణు పొందు. నిన్ను నేను సకల పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను!’ అంటున్నాడు (గీత 18.66). భగవంతుని శరణుపొందు. ఆయన సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. నీ బరువు బాధ్యతల నన్నిటినీ ఆయనే స్వీకరిస్తాడు. అప్పుడు సమస్త రుగ్మతలు నిన్ను విడిచి పారిపోతాయి.
“ఈ బుద్ధితో ఆయనను తెలుసుకోగలమా? ఒక సేరు పాత్రలో నాలుగు సేర్ల పాలు పడతాయా? ఆయనే అర్థం చేసుకోనివ్వకుంటే, అవగాహన చేసుకోగలమా? కాబట్టే ఆయనను శరణు పొందు అంటున్నాను. ఆయన ఇచ్ఛామయుడు. మనిషికి ఉన్న శక్తి ఏపాటిది?”