13.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరాలయంలో భక్తులతో
ఆదివారం, ఆగష్టు 19, 1883
పౌర్ణమికి మరునాడు. మిట్టమధ్యాహ్న సమయం. ఇంతకు మునుపే దక్షిణేశ్వర దేవాలయంలో నివేదనలు పూర్తయి, దీపారాధన ప్రారంభ సూచకంగా నాదస్వరం వినవచ్చింది. దేవాలయ ద్వారాలు మూసివేయటం కూడా జరిగింది. శ్రీరామకృష్ణులు ప్రసాదం ఆరగించి, కాసేపు విశ్రమించారు. విశ్రాంతి గైకొన్న పిదప ఆయన తమ చిన్న మంచం మీద కూర్చున్నారు. ఇంతలో ‘మ’ వచ్చి ప్రణామం చేసి, నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో వేదాంత విషయాలను గురించి మాట్లాడసాగారు.
13.1.1 వేదాంతుల దృక్పథం – కృష్ణకిశోర్
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): అష్టావక్ర సంహితలో ఆత్మజ్ఞానాన్ని గురించి చర్చించబడి ఉంది. ఆత్మజ్ఞానులు ‘సో-హం’ అంటారు; అంటే ‘ఆ పరమాత్మను నేనే’ అని అర్థం. వేదాంతులైన సన్న్యాసుల దృక్పథం ఇది. కాని అన్ని పనులు చేసుకుంటూ తానే నిష్క్రియుడైన పరమాత్మనని సంసారులు చెప్పుకోవటం తగదు. వేదాంతవాదుల ప్రకారం ఆత్మ నిర్లిప్తమైనది. సుఖం – దుఃఖం, పాపం – పుణ్యం ఇత్యాది ద్వంద్వాలు ఏ రీతిలోనూ ఆత్మకు ఏ విధమైన హాని కలిగించలేవు. కాని దేహాభిమానులైన వ్యక్తులకు కష్టాన్ని కలిగించగలవు. పొగ, గోడను మసిబార చేస్తుంది కాని ఆకాశంపై ఎటువంటి ప్రభావమూ చూపలేదు. ఈ కోవకు చెందిన జ్ఞానులను అనుసరించే కృష్ణకిశోర్, తాను ‘ఖ’ అంటే ‘ఆకాశం వంటివాణ్ణి’ అని చెప్పుకుంటూ ఉంటాడు. పరమభక్తుడవటం చేత అతడు అలా చెప్పుకోవటం సమర్థనీయమే. కాని ఇతరులు అలా చెప్పుకోవటం సుతరామూ సబబు కాదు.
13.1.2 పాపం, పుణ్యం – మాయ, దయ
“కాని తాను ‘ముక్తుడ’ నని భావించుకోవటం చాలా మంచిదే. సతతం ఒక వ్యక్తి ‘నేను ముక్తుడను, నేను ముక్తుడను’ అని స్మరించటం వలన అతడు వాస్తవానికి ముక్తుడే అవుతాడు. అందుకు భిన్నంగా నిరంతరం ‘నేను బద్ధుడను, నేను బద్ధుడను’ అంటూ తలపోస్తూ ఉంటే, అతడు తప్పక సంసారబద్ధుడే అవుతాడు. ‘నేను పాపిని, నేను పాపిని’ అంటూ ఉండే అవివేకి నిజానికి అధోగతి పాలవుతాడు. అందుకు బదులుగా ఇలా అనాలి: ‘నేను భగవన్నామ స్మరణ చేస్తున్నాను. మరి నాకు పాపం ఏమిటి? బంధం ఏమిటి?’
(‘మ’ తో) “ఇలా చూడు. ఈ రోజు నా మనస్సు ఏమీ బాగోలేదు. తాను చాలా అస్వస్థుడుగా ఉన్నానని హృదయ్ జాబు వ్రాశాడు. ఇది మాయా లేక దయా?
‘మ’ ఏమని బదులు ఇవ్వగలడు? మౌనం వహించాడు.
శ్రీరామకృష్ణులు: మాయ అంటే ఏమిటో నీకు తెలుసునా? తల్లితండ్రులు, సోదరీసోదరులు, భార్యపిల్లలు, మేనల్లుడు, మేనకోడలు ప్రభృత బంధుగణం పట్లగల ప్రేమే మాయ. సర్వభూతాల పట్ల గల ప్రేమే దయ. ప్రస్తుతం హృదయ్ పట్ల నా భావన దేనికి చెందుతుంది, మాయా లేక దయా? కాని హృదయ్ నాకు ఎంతో చేశాడు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హృదయపూర్వకంగా సేవాశుశ్రూషలు చేశాడు. కాని తరువాతి కాలంలో నాకు ఎంతో కష్టం కూడా కలిగించాడు. అతడు కలిగించే కష్టాలను భరించలేక ఒకానొక సందర్భంలో నేను గంగలో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి గంగానది గట్టు వద్దకు కూడా వెళ్ళాను. కాని అతడు నా సేవకై ఎంతో శ్రమించాడు. ప్రస్తుతం అతడికి కొంత ధనం సమకూరితే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఏ పెద్ద మనిషితో దీన్ని గురించి చెప్పగలను? ఎవరు దీన్ని గురించి చెప్పుకుంటూ తిరుగుతారు?”
13.2 ద్వితీయ పరిచ్ఛేదం మృణ్మయంలో చిన్మయదేవి – విష్ణుపూర్‌లో మృణ్మయిదేవి దర్శనం
మధ్యాహ్నం రెండు లేక మూడు గంటల సమయంలో అధర్సేన్, బలరామ్ వచ్చారు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి, నేల మీద కూర్చుని “బాగా ఉన్నారా?” అని వారు అడిగారు. అందుకు శ్రీరామకృష్ణులు “అవును, శరీరమైతే బాగానే ఉంది, కాని మనస్సు ఏమీ బాగోలేదు” అన్నారు. ఆయన హృదయ్, అతడి కష్టాల గురించి ప్రస్తావించలేదు.
బడేబజారులో మల్లిక్ కుటుంబంవారి సింహవాహినీదేవి విగ్రహం గురించి సంభాషణ మళ్లింది.
శ్రీరామకృష్ణులు: నేను సింహవాహినీదేవిని దర్శించ వెళ్లాను. ఒక పేటలోని మల్లిక్ వంశీయుల ఇంట్లో దర్శించాను. వారు నివసిస్తున్న గృహం శిథిలావస్థలో ఉంది. వారు ప్రస్తుతం పేదరికంలో మ్రగ్గుతున్నారు. గోడలు, నేల గబ్బిలాల, పావురాళ్ల రెట్టలతో నిండి ఉన్నాయి. గోడలకున్న సున్నపు పూత పడిపోతోంది. ఇతర మల్లిక్ వంశీయుల గృహాలకు వ్యతిరేకంగా ఈ గృహంలో పేదరికం తాండవిస్తోంది. (‘మ’ తో) సరే, అది దేన్ని సూచిస్తుందో తెలుసా?
‘మ’ మౌనం వహించాడు.
శ్రీరామకృష్ణులు: ఏమిటో తెలుసా? పూర్వజన్మ కర్మను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. గతజన్మల నుంచి సంక్రమించిన సంస్కారాల ప్రభావాన్ని, ప్రారబ్ధకర్మ ఫలాన్ని ఒప్పుకోవలసిందే.
“అయినప్పటికీ ఆ శిథిల గృహంలో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూన్న సింహవాహినీదేవి ముఖారవిందాన్ని తిలకించాను. విగ్రహంలోని దివ్యత్వాన్ని విశ్వసించే తీరాలి.
“ఒకసారి నేను విష్ణుపూర్ వెళ్లాను. ఆ ఊరి రాజుకు చక్కని దేవాలయాలు ఉన్నవి. ఒక దేవాలయంలో జగన్మాత వెలసి ఉంది. పేరు మృణ్మయి. ఈ ఆలయం సమీపంలో లాల్బంధ్, కృష్ణబంధ్ మొదలైన పేర్లతో పలు కోనేరులున్నాయి. ఒక కోనేటి నీటిలో స్త్రీలు తమ శిరోజాలకు ఉపయోగించే వాసన నూనె గుబాళింపు వచ్చింది. దీన్ని నువ్వెలా వివరించగలవు? నాకు మొదట్లో తెలియరాలేదు. భక్తురాండ్రు ఆ ఆలయంలోని మృణ్మయి దేవిని దర్శించే సమయంలో ఈ వాసన నూనెను సమర్పిస్తారని అప్పుడు నాకు తెలియదు. దేవాలయంలోని విగ్రహాన్ని దర్శించక మునుపే, ఆ కోనేటి వద్ద నాకు భావసమాధి కలిగింది. ఆ స్థితిలో కోనేటి నీటి నుండి పైకి వచ్చిన మృణ్మయిదేవి దివ్యరూపాన్ని నడుము వరకు దర్శించాను.”
13.2.1 భక్తుని సుఖదుఃఖాలు – దేవకీదేవి, పాండవులు
ఈలోపు తక్కిన భక్తులు అక్కడకు వచ్చారు. ఎవరో కాబూల్‌లో చెలరేగుతున్న రాజకీయ విప్లవం, అంతర్యుద్ధాల గురించి ప్రస్తావించారు. ఆప్ఘనిస్థాన్ అమీర్ యాకుబ్ ఖాన్‌ను గద్దెదించారని ఒక భక్తుడు చెప్పాడు. అమీర్ గొప్ప దైవభక్తుడని అతడు శ్రీరామకృష్ణులకు తెలిపాడు.
శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటో తెలుసా? దేహానికి సుఖ దుఃఖాలు సహజ లక్షణాలని నువ్వు గుర్తుంచుకోవాలి. కవి కంకణ్ రచించిన చండీ గ్రంథంలో కాలువీర్ను చెరసాలలో బంధించి అతడి ఛాతీ మీద పెద్ద బండరాయిని పెట్టినట్లుగా వ్రాసి ఉంది. జగన్మాత వరప్రసాదుడై కాలువీర్ జన్మించినప్పటికీ ఇలా జరిగింది. దేహాన్ని ధరించినప్పుడు సుఖదుఃఖాలు అనివార్యాలు. మహాభక్తుడైన శ్రీమంతుడి దృష్టాంతం తీసుకోండి. అతడి తల్లి ఖుల్లనా జగన్మాత పరమ భక్తురాలు అయినప్పటికీ అతడి కష్టాలకు అంతేలేదు. దాదాపుగా అతడి తల నరికినంత పనయింది.
“జగన్మాతకు ప్రియతమ భక్తుడైన, కట్టెలు కొట్టి అమ్ముకొని జీవించే ఒకానొక వ్యక్తి ఉదాహరణ చూడండి. జగన్మాత అతడి ఎదుట ప్రత్యక్షమై అతడిపైన తన కరుణాకటాక్ష వీక్షణం పరపింది. అయినా జీవనోపాధికై అతడు కట్టెలు కొట్టి అమ్ముకునే కఠోర జీవితాన్నే కొనసాగించాడు కదా! కారాగారంలో ఉన్న దేవకీదేవికి శంఖ–చక్ర–గదా–పద్మధారి ఆయిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు దర్శనం కలిగింది. అయినప్పటికీ ఆమెకు కారాగార విముక్తి కలుగలేదు.”
‘మ’ : కేవలం కారాగారవాసం తీరటమే ఎందుకు? సర్వానర్థాలకు మూలం ఈ దేహం. దేవకీదేవికి దేహ విముక్తి కలిగివుంటే బాగుండేది.
శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటో తెలుసా? ప్రారబ్ధకర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. పూర్వకర్మలు పూర్తిగా తీరేటంత వరకు దేహం ఉండే తీరుతుంది. ఒకప్పుడు గ్రుడ్డివాడొకడు గంగలో స్నానం చేశాడు. తత్ఫలితంగా అతడి పాపాలు నశించాయి. కాని అతడి అంధత్వం మటుకు అలాగే ఉండిపోయింది. (అందరూ నవ్వారు) పూర్వజన్మలో చేసిన పాపకృత్యాల కారణంగా అతడు అంధత్వం అనుభవించవలసి వచ్చింది.
‘మ’ : అవునండి. విల్లు నుండి విడువబడ్డ బాణం మన అదుపులో ఉండదు కదా!
శ్రీరామకృష్ణులు: భక్తుడు శారీరక సుఖదుఃఖాలను ఎంతగా అనుభవిస్తున్నప్పటికీ అతడిలో భక్తిజ్ఞానాలనే నిధిని కలిగి ఉంటాడు. ఈ నిధి అతణ్ణి ఎన్నటికీ వీడదు. ఉదాహరణగా పాండవులను తీసుకోండి. వారు అంతులేని కష్టాలను అనుభవించినప్పటికీ, ఒక్కసారి కూడా వారు భగవత్ చైతన్యాన్ని కోల్పోలేదు. అంతటి భక్తి జ్ఞానాలు ఉన్న వ్యక్తులను ఎక్కడ చూడగలం?
13.3 తృతీయ పరిచ్ఛేదం సమాధి స్థితిలో – కెప్టెన్, నరేంద్రుడు
ఇంతలో నరేంద్రుడు, విశ్వనాథ ఉపాధ్యాయ గదిలోకి వచ్చారు. విశ్వనాథ్ నేపాల్ మహారాజు వకీలు గాను, రాయబారిగాను వ్యవహరించేవాడు. అతణ్ణి శ్రీరామకృష్ణులు ‘కెప్టెన్’ అని పిలువటం రివాజు. అప్పుడు నరేంద్రుడు ఇరవై రెండేళ్ల వయస్కుడు, కళాశాలలో బి.ఏ. చదువుకుంటున్నాడు. అతడు అప్పుడప్పుడు, సామాన్యంగా ఆదివారాలలో శ్రీరామకృష్ణులను దర్శించ వస్తాడు. శ్రీరామకృష్ణులకు వారిద్దరూ ప్రణామాలు చేసి, నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పాడమన్నారు. గది పడమటి గోడకు తంబూరా వ్రేలాడుతోంది. నరేంద్రుడు తబలాను శ్రుతి వేస్తుండగా భక్తులు అతణ్ణి ఏకాగ్రంగా చూడసాగారు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో): చూడు, తబలాల శబ్దం అంత బాగున్నట్లు లేదు.
కెప్టెన్: అవి ప్రస్తుతం పూర్ణంగా ఉన్నాయి. అందుచేతనే శబ్దం రాలేదు. (అందరూ నవ్వారు) నిండు కుండవలె. లేక భగవత్ చైతన్యంతో నిండిపోయిన సాధువు మౌనం పాటించేలా అవి ఉన్నవి.
శ్రీరామకృష్ణులు (కెప్టెన్‌తో): కాని నారదుడి వంటి మహర్షుల సంగతి ఏమిటి?
కెప్టెన్: ఇతరుల కష్టాలను చూసి చలించిపోయి వారు ఉపదేశించారు.
శ్రీరామకృష్ణులు: సరిగ్గా చెప్పావు. సమాధి స్థితిని పొందాక నారదుడు, శుకదేవుడు ప్రభృతులు కొన్ని మెట్లు క్రిందికి దిగి సాధారణ స్థాయికి వచ్చారు. జనులు అనుభవిస్తున్న కష్టాలకు ద్రవించిపోయి వారికి సహాయం చేసే నిమిత్తం తమ మౌనానికి భంగం కలిగించారు.
నరేంద్రుడు పాడసాగాడు:
ఎన్నటికో నికనెన్నటికో
ఆ శుభసమయం బెన్నటికో
అంచితముగ భాగ్యారుణ కాంతుల
తెలతెలవారే దెన్నటికో……
పై పాటలోని కొన్ని పదాలను వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధి మగ్నులైనారు. తూర్పు వైపు తిరిగి చేతులు జోడించుకుని ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన దేహం నిటారుగా ఉంది; ఆనందమయ రూప సాగరంలో మునిగి ఉన్నారు. మనస్సు పూర్తిగా బాహ్యచైతన్యాన్ని కోల్పోయి ఉంది. ఆయన ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది కూడా తెలియరావటం లేదు. నిమేష శూన్యులై ఉన్నారు. కిత్తనార బట్టపై గీచిన చిత్తరువులా ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఈ ప్రపంచాన్ని విడిచి వేరే ఎక్కడికో వెళ్లిపోయారేమో అన్నట్లు ఉన్నారు.
13.4 చతుర్థ పరిచ్ఛేదం సచ్చిదానంద ప్రాప్తికి మార్గం – జ్ఞానులకు భక్తులకు భేదం
శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని చూడగానే నరేంద్రుడు గది నుండి తూర్పు వైపు వసారాలోకి వెళ్లాడు; అక్కడ హాజ్రా చేత జపమాల పుచ్చుకుని ఒక దుప్పటి మీద కూర్చుని ఉన్నాడు. వారిద్దరూ మాటల్లో పడ్డారు.
గది నిండా భక్తులు గుమిగూడి ఉన్నారు. ఈలోపు శ్రీరామకృష్ణులు సమాధిస్థితి నుండి బాహ్యస్మృతిలోకి వచ్చి చుట్టూ కలయ చూశారు. నరేంద్రుడు కనిపించలేదు. తంబురా మాత్రం నేల మీద ఉంది. భక్తులు అందరూ శ్రీరామకృష్ణులను ఆరాటంతో చూస్తూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు: అతడు (నరేంద్రుడు) అగ్నిని రగిలించాడు. ఇప్పుడు అతడు ఈ గదిలో ఉన్నా లేక బయటకు వెళ్లినా అసంగతమే.
(కెప్టెన్ ప్రభృతులతో) “చిదానందాన్ని ఆరోపించుకోండి; అప్పుడు మీకు కూడా ఆనందం లభిస్తుంది. చిదానందం అన్నది ఉండనే ఉంది. అయినా ఆవరణం, విక్షేపక* శక్తుల కారణాన మరుగున ఉన్నది. విషయానురక్తి తగ్గేకొద్దీ భగవత్ప్రేమ అధికరిస్తుంది. దాన్లో ఆటుపోటులు అధికరిస్తాయి.
కెప్టెన్: కలకత్తాలోని ఇంటి వైపు వెళ్లేకొద్దీ కాశీ దూరం అవుతూ ఉంటుంది. అట్లే కాశీ వైపుగా వెళ్లే కొద్దీ, మన ఇల్లు దూరం అవుతూ ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: రాధ శ్రీకృష్ణునికి చేరువ అయ్యేకొద్దీ ఆమె ఆతడి దేహ సౌరభాన్ని మరింతగా ఆఘ్రాణిస్తుంది. భగవంతుడికి ఎంత సమీపంగా వెళితే ఆయన పట్ల అంత భావభక్తి కలుగుతుంది. నది, సముద్రాన్ని సమీపించేకొద్దీ దాన్లో ఆటుపోటులు అధికరిస్తాయి.
“జ్ఞానులు అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తారు. అది ఒకే దిశగా ప్రవహిస్తున్న గంగాప్రవాహం లాంటిది. వారికి అంతా స్వప్న సదృశమే. వారు సర్వదా స్వస్వరూపంలో నెలకొని ఉంటారు. కాని భక్తుడి మనస్సులో అలాంటిది లేదు. అతడి భావాలు ఒకే దిశలో సాగిపోవు. అతడు దివ్యోన్మాదపు ఆటుపోటులు అనుభవిస్తాడు. భగవత్ పారవశ్యంలో భక్తుడు విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు. భక్తుడు భగవంతుడితో క్రీడింప ఇచ్ఛగిస్తాడు. సచ్చిదానంద సాగరంలో ఒక్కోసారి ఈదుతాడు, ఒక్కోసారి మునకలు వేస్తాడు, కొన్నిసార్లు ఉపరితలం పైకి వస్తాడు – నీటిలోని మంచుగడ్డల మాదిరి. (నవ్వారు)
13.4.1 సచ్చిదానందం, సచ్చిదానందమయి – బ్రహ్మం శక్తి అభేదం
“జ్ఞాని బ్రహ్మాన్ని అనుభూతం చేసుకోగోరతాడు. కాని భక్తుడు షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుని కోరతాడు. కాని నిజానికి బ్రహ్మం – శక్తి అభేదమైనవి. సచ్చిదానందుడు – సచ్చిదానందమయి అభిన్నులు. రత్నం యొక్క మెరుపును గురించి మాట్లాడేటప్పుడు, రత్నం మదిలో మెదలుతుంది; రత్నం గురించి చెబుతున్నప్పుడు దాని మెరుపును ప్రస్తావిస్తారు. రత్నాన్ని గురించి యోచింపక రత్నం యొక్క మెరుపును భావించలేం, రత్నం యొక్క మెరుపును యోచింపక రత్నాన్ని భావించలేం.
“సచ్చిదానంద పరబ్రహ్మం ఏకైకమైనది. శక్తియొక్క విభిన్నతలచేత ఉపాధి భేదాలు ఏర్పడుతున్నాయి. అందుచేతనే భగవంతుని వివిధ రూపాలను గాంచుతున్నాం. భక్తుడు ‘ఓ నా తారాదేవీ, నువ్వే నా ఈ సమస్తమూ!’ అంటూ గానం చేస్తాడు. ఎక్కడ కార్యం (సృష్టి స్థితి లయాలు) ఉంటుందో అక్కడే శక్తి ఉంటుంది. నిశ్చలంగా ఉన్నా లేక అలలతో, బుడగలతో ఉన్నా కూడా నీరు, నీరే కదా! సృష్టి స్థితి లయాలను ఒనరించే ఆద్యాశక్తి ఆ సచ్చిదానందుడే. ఏ పని చేయకుండా కూర్చుని ఉన్నా లేక పూజ చేసుకొంటూ ఉన్నా లేక ఆఫీసుకు వెళ్లినా ‘కెప్టెన్’ ఒక్కడే కదా! కేవలం ఉపాధులలోనే తేడా ఉంది.
కెప్టెన్: అవునండీ.
శ్రీరామకృష్ణులు: ఈ మాటలే కేశవసేన్కు కూడా చెప్పాను.
కెప్టెన్: కేశవసేన్ ఆచారబద్ధుడు కాడు. తన ఇష్టానికి అనుగుణంగా అతడు ఆచారవ్యవహారాలను పాటిస్తాడు. అతడు సంపన్నుడైన పెద్దమనిషే కాని సాధువు కాడు.
శ్రీరామకృష్ణులు (ఇతర భక్తులతో): కేశవ్ వద్దకు పోవద్దని కెప్టెన్ నన్ను నిషేధిస్తున్నాడు.
కెప్టెన్: మహాశయా! మీరు మీ ఇష్టప్రకారం వర్తిస్తారు, అందుకు నేనేం చేయగలను?
శ్రీరామకృష్ణులు (తీవ్రంగా): కేశవ్‌ను చూడటానికి నే నెందుకు వెళ్లకూడదు? ఆంగ్లేయ దొర వద్దకు ధనం కోసం వెళ్లినప్పుడు నీకు పట్టింపులు ఉండవు. కేశవ్ భగవచ్చింతన, హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. భగవంతుడే మాయగా, జీవ జగత్తులుగా అయ్యాడని నువ్వే సదా చెబుతూ ఉంటావు కదా! ఎవరు భగవంతుడో ఆతడే ఈ సమస్త ప్రాణికోటిగానూ, జగత్తులుగానూ అయి ఉన్నాడు. అలాంటప్పుడు కేశవ్‌లో కూడా భగవంతుడు కొలువుదీరి ఉండడా?
13.5 పంచమ పరిచ్ఛేదం నరేంద్రునితో జ్ఞాన, భక్తియోగాల సమన్వయం
ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణులు తటాలున గది వదలి ఈశాన్యం వైపున ఉన్న వసారాలోకి వెళ్లారు. ఆయన రాక కోసం కెప్టెన్, ఇతర భక్తులు గదిలోనే వేచివున్నారు. శ్రీరామకృష్ణులతో ‘మ’ కూడా వెళ్లాడు. అక్కడ వసారాలో నరేంద్రుడు, హాజ్రాతో మాట్లాడుతున్నాడు. హాజ్రా సదా మెట్ట వేదాంత చర్చలు చేస్తూ ఉంటాడని శ్రీరామకృష్ణులకు తెలిసిన విషయమే. హాజ్రా ఇలా అంటూ ఉంటాడు: “జగత్తు అవాస్తవం, కల వంటిది. పూజ, దేవతా నైవేద్యం ఇత్యాదులు మనోదౌర్బల్య లక్షణాలు. ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం స్వస్వరూప చింతనయే. అహం బ్రహ్మాస్మి.”
శ్రీరామకృష్ణులు నవ్వి హాజ్రా, నరేంద్రులతో “ఏమోయ్ దేన్ని గురించి మీరు మాట్లాడు కుంటున్నారు?” అని అడిగారు.
నరేంద్రుడు (నవ్వుతూ): ఓ! మేం అనేక గొప్ప విషయాల గురించి చర్చిస్తున్నాం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కాని శుద్ధజ్ఞానం, శుద్ధభక్తి – ఇవి రెండూ ఒక్కటే సుమా! శుద్ధజ్ఞానం ఎక్కడకు తీసుకు వెళుతుందో, అక్కడికే శుద్ధభక్తీ తీసుకు వెళుతుంది. భక్తిమార్గమే చాలా సులభమైనది.
నరేంద్రుడు ఒక పాటను ఉదహరించాడు:
వెర్రివానిని చేయవే । నీ ప్రేమలోన
పిచ్చివానిని చేయవే । ననుగన్న తల్లి॥ వె ॥
ఏల జ్ఞానము ఏల తర్కము
చాలుచాలివి ఏల నాకు
బాలుడను నీ ప్రేమమద్యము
గ్రోలజేయుము కొల్లకొల్లగ…………
నరేంద్రుడు ‘మ’ తో తాను హామిల్టన్ రచించిన ఒక పుస్తకం చదువు తున్నాననీ, “A learned ignorance is the end of philosophy and the beginning of religion” అని వ్రాశాడు అనీ చెప్పాడు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): దానికి అర్థం ఏమిటి?
నరేంద్రుడు: పాండిత్య మూర్ఖత్వం తత్త్వశాస్త్రంతో అంతమై మతంతో ప్రారంభమవుతుంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): థాంక్యూ, థాంక్యూ.
13.6 షష్ఠ పరిచ్ఛేదం సంధ్యాసమయంలో భగవన్నామం – నరేంద్రుని సుగుణాలు
దాదాపు సాయంకాలం కావటంతో నరేంద్రుడితో సహా భక్తులలో పలువురు శ్రీరామకృష్ణుల నుండి సెలవు గైకొన్నారు. రాత్రి కాబోతోంది. ఆలయ సిబ్బంది నాలుగు ప్రక్కలా దీపాలు వెలిగించసాగారు. కాళీ, విష్ణు ఆలయాలకు చెందిన అర్చకులు ఇద్దరు గంగలో స్నానం చేస్తున్నారు. వారు వెంటనే వెళ్లి హారతి, రాత్రి నైవేద్య ఏర్పాట్లు చేయవలసి ఉంది. దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు తోటలో పచార్లు చేస్తున్నారు. కొందరు కట్ట మీద నడుస్తూ చల్లగాలులను అనుభవిస్తూ, చిరు అలలతో, నురుగుతో వేగంగా ప్రవహించే వర్షాకాలపు గంగను చూస్తూ ఉన్నారు. కొందరు, బహుశా ఆలోచనాపూరిత మనస్కులైనవారు పంచవటి ప్రశాంతతలో నడుస్తున్నారు. శ్రీరామకృష్ణులు పశ్చిమ మొగసాల నుండి కాసేపు గంగానదిని చూస్తూ ఉండిపోయారు.
చీకటి పడింది. ఆలయ సిబ్బంది దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణుల గదిలో దాసీ మనిషి దీపం వెలిగించి, సాంబ్రాణి ధూపం వేసింది. ఈలోపు ద్వాదశ శివాలయాల్లోను, కృష్ణ, కాళీ ఆలయాల్లోను సంధ్యా హారతులు మొదలయ్యాయి. కంచుగంటల, జేగంటల నాదాలు సుమధురంగా వినవచ్చాయి. దానితోబాటు ఆలయం చెంత ప్రవహిస్తున్న గంగానది మర్మరధ్వనీ వినవస్తోంది.
అది పౌర్ణమి తరువాతి రోజు కావటంతో కాసేపట్లో చంద్రోదయమైంది. ఆలయాల శిఖరాలను, వృక్షాగ్రాలను క్రమక్రమంగా చంద్రకాంతి ముంచెత్తింది. చంద్రకాంతి రాజ్యంచేస్తూ ఉండటం చూసి గంగానది అపరిమిత ఆనందం చెంది పొంగి ప్రవహించసాగింది.
సంధ్యాహారతులు ముగిశాక శ్రీరామకృష్ణులు జగజ్జననికి ప్రణామం చేశారు. తరువాత చేతులతో తాళం వేస్తూ భగవంతుని మధుర నామస్మరణ చేయసాగారు. ఆ గది గోడలకు ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళీ, రాధాకృష్ణులు, పట్టాభిరాముడు మొదలైన అనేక చిత్రపటాలు తగిలించబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు ఆ పటాల ముందు వంగి నమస్కరించి ఆయా పావన నామాలను స్మరించారు. పిదప ఆయన “బ్రహ్మం–శక్తి, శక్తి–బ్రహ్మం; వేదాలు, పురాణాలు, తంత్రాలు, గీత, గాయత్రీ” అంటూ జపించారు. తదనంతరం ఆయన ఇలా అన్నారు: “ఓ జగజ్జననీ, నీ పాదాల వద్ద నేను శరణుజొచ్చాను. నేను కాదు, నువ్వే. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపే దానవు.”
భగవన్నామ స్మరణ చేశాక శ్రీరామకృష్ణులు చేతులు జోడించి జగజ్జననిని ధ్యానించారు. ఒకరిద్దరు భక్తులు గంగాతీరంలోని ఉపవనంలో పచార్లు చేస్తున్నారు. హారతి పూర్తి అయ్యాక ఒక్కొక్కరుగా శ్రీరామకృష్ణుల గదిలోకి రాసాగారు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఉన్నారు. ‘మ’, అధర్, కిశోరీ మొదలైన భక్తులు ఆయన ముందు నేల మీద కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): నరేంద్రుడు, భవనాథ్, రాఖాల్లు నిత్యసిద్ధులు, ఈశ్వరకోటులు. వీరు సాధనలు చేయటం నామమాత్రానికే. నరేంద్రుణ్ణి చూడండి. అతడు ఎవరినీ ఖాతరు చెయ్యడు. ఒక రోజు కెప్టెన్ గారి బండిలో అతడు నాతో రావటం తటస్థించింది. అతణ్ణి అనువైన చోట కూర్చోమని కెప్టన్ చెప్పగా, నరేంద్రుడు కెప్టన్ వంక కన్నెత్తి అయినా చూడలేదు. అతడు నన్ను కూడా లెక్క చేయడు. తనకు తెలిసినదంతా నాతో చెప్పడు, ఒకవేళ తన పాండిత్యాన్ని నలుగురి ముందు ప్రశంసిస్తానని అతడి భయం కాబోలు. అతడికి మాయామోహాలు లేవు; బంధాలు లేవు. అతడు సౌశీల్యవంతుడు. ఎన్నో సుగుణాలు ఒకే చోట నెలకొని ఉన్నాయి. సంగీతంలో నిష్ణాతుడు, గాయకుని గాను, వాద్యగాని గాను బహుముఖ ప్రజ్ఞావంతుడు. పైగా అతడు జితేంద్రియుడు; ఎన్నటికీ వివాహ మాడనంటున్నాడు. నరేంద్ర భవనాథుల మధ్య ప్రగాఢ స్నేహం నెలకొని ఉంది, భార్యాభర్తల వలె. ఇక్కడికి నరేంద్రుడు తరచూ రావటం లేదు. మంచిదే, అతడు తరచూ వస్తూవుంటే నేను వివశుడనైపోతూ ఉంటాను.”
13.7 సప్తమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో భక్తులతో
సోమవారం, ఆగష్టు 20, 1883
13.7.1 మనోమోహన్కు ఉపదేశం – బ్రహ్మజ్ఞాన లక్షణాలు – ధ్యానయోగం
దక్షిణేశ్వర ఆలయంలోని శ్రీరామకృష్ణుల గది. అప్పుడు సమయం రాత్రి దాదాపు ఎనిమిది గంటలు అయి ఉంటుంది. తమ చిన్నమంచం మీద, దోమ తెరలో కూర్చుని శ్రీరామకృష్ణులు ధ్యానం చేసుకుంటున్నారు. ‘మ’ తన మిత్రుడైన హరిబాబుతో పాటు అక్కడకు వచ్చి నేల మీద కూర్చున్నాడు. హరిబాబు ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు. పదకొండు సంవత్సరాల క్రితం అతడి భార్య మరణించింది; పునర్వివాహం చేసుకోకుండా తల్లితండ్రుల, సోదరసోదరీమణులతో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ వచ్చాడు. వారిపట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండటం చేత, వారికి సేవలందించేటందుకై వారితోనే కలిసి జీవించసాగాడు. రాఖాల్, శ్రీరామకృష్ణులతోనే ఉంటూ, ఎప్పుడైనా అధర్ ఇంట్లో గడిపే వాడు. నరేంద్ర, భవనాథ్, అధర్, ‘మ’, రామ్, మనోమోహన్ ప్రభృతులు దాదాపు ప్రతి వారం దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవారు.
శ్రీరామకృష్ణుల మేనల్లుడు హృదయ్ స్వగ్రామంలో అస్వస్థుడై ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు అనేక సేవలు చేసి ఉన్నాడు. హృదయ్ అస్వస్థత గురించి విని ఆయన ఎంతో కలత చెందారు. హృదయ్‌కు పంపడానికై ఒక భక్తుడు పది రూపాయలు రామ్ఛటర్జీకి ఇచ్చి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు అక్కడ లేరు. భక్తులు నీరు త్రాగేటందుకు ఒక గ్లాసు కావాలని శ్రీరామకృష్ణులు ఆ భక్తుడితో చెప్పారు. ఈ రోజు ఆ భక్తుడు గ్లాసు కొని తీసుకువచ్చాడు.
భక్తులు వచ్చి కూర్చోగానే శ్రీరామకృష్ణులు దోమతెర నుండి బయటకు వచ్చారు. ‘మ’ మొదలైన భక్తులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. దోమ తెర పైకెత్తి కట్టివేశారు. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: దోమతెర లోపల ధ్యానం చేసుకుంటున్నాను. ఏదో ఒక రూపాన్ని ఊహించుకుని చింతించటమే కదా ధ్యానం అని నాకు అనిపించింది. వెంటనే ధ్యానం పట్ల ఆకాంక్ష తగ్గిపోయింది. ధ్యానించే వ్యక్తికి మెరుపులా భగవంతుడు ఒకసారి ప్రత్యక్షమైతే అంతా సరిపోతుంది. తరువాత ధ్యానించేది ఎవరు? ఎవరిని ధ్యానించటం? అనీ అనుకున్నాను.
‘మ’ : అవునండీ. భగవంతుడే సమస్తం – ఈ జీవ జగత్తులై వెలయుచున్నాడని మీరు సెలవిచ్చారు కదా! అటువంటప్పుడు ధ్యానించే వ్యక్తి కూడా భగవంతుడే కదా!
శ్రీరామకృష్ణులు: అంతేకాదు, భగవదేచ్ఛ లేనిదే ఏదీ జరుగదు. భగవంతుడు ధ్యానానికి వీలు కల్పించినప్పుడే మనం ధ్యానం చేయగలం. నువ్వేమంటావు?
‘మ’ : వాస్తవమేనండీ. మీలో ‘నేను’ అనే భావం లేనందుననే మీరు అలా భావించుకో గలుగుతున్నారు. ‘అహం’ లేని చోటనే ఇటువంటి స్థితి కలుగుతుంది.
శ్రీరామకృష్ణులు: అయితే ‘నేను భగవంతుడి దాసుణ్ణి, సేవకుణ్ణి’ – ఈ మాత్రంగా అహంకారం ఉండడం మంచిది. తన కర్తవ్యాలను తాను నిర్వర్తిస్తున్నాననే భావం ఉన్నంత వరకూ, ‘భగవంతుడు ప్రభువు, నేను దాసుడను’ అనే భావన కలిగి ఉండటం అతడికి మంచిది. కర్మ చేస్తున్నాననే ఎరుక ఉన్నప్పుడు, భగవంతుడి పట్ల సేవ్య సేవక భావం నెలకొల్పుకోవాలి.
‘మ’ సర్వదా పరబ్రహ్మం అంటే ఏమిటని దీర్ఘంగా యోచిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణి ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: బ్రహ్మం ఆకాశం లాంటిది. అగ్నికి ఎలాటి రంగూలేనట్లు బ్రహ్మంలో ఎటువంటి మార్పు లేదు. అయితే శక్తి కారణంగా బ్రహ్మం అనేకాలై ఒప్పారుతుంది. సత్వరజస్తమో గుణాలు శక్తికి సంబంధించినవే. తెల్లని పదార్థం మంటలో వేస్తే, తెలుపు రంగుగా తోస్తుంది. ఎరుపు రంగు పదార్థం వేస్తే ఎరుపు, నలుపు పదార్థం వేస్తే నలుపుగా తోస్తుంది. సత్త్వరజస్తమో గుణాలు మూడింటికీ అతీతమైనది బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏమిటో మాటలలో వివరించలేము. అది వాక్కుకు అతీతం. నేతి, నేతి (ఇది కాదు) అంటూ వేదాంత పరంగా తర్కించుకుంటూ పోగా మిగిలి ఉన్నది ఏదో, ఆనంద స్వరూపమైనదేదో అదే బ్రహ్మం.
“ఒక యువతి భర్త, తన మామగారి ఇంటికి వచ్చి ముందు చావడిలో మరికొందరు యువకులతో కూర్చుని ఉన్నాడని అనుకోండి. ఆ యువతి, ఆమె స్నేహితురాళ్లు లోపలే ఉండి ఈ యువకులను కిటికీ గుండా చూస్తూ ఉన్నారు. ఆ యువతి భర్త ఎవరో ఆ స్నేహితురాళ్లకు తెలియదు; అందుచేత ఒక యువకుని చూపుతూ ‘నీ భర్త అతడేనా?’ అని అడిగారు. నవ్వుతూ ఆ యువతి ‘కాదు’ అని జవాబిచ్చింది. ఆ స్నేహితురాళ్లు మరో యువకుని చూపుతూ ‘ఇతడేనా నీ భర్త’ అని అడిగారు. మళ్లీ ఆ యువతి ‘కాదు’ అని జవాబిచ్చింది. మరో యువకుని సూచిస్తూ వారు అదే ప్రశ్న వేశారు; ఆమె అదే జవాబు ఇచ్చింది. చివరకు ఆ స్నేహితురాళ్లు ఆ యువతి భర్తనే చూపుతూ ‘ఇతడేనా?’ అని అడిగారు. అప్పుడు ఆ యువతి అవును, కాదు అని చెప్పక చటుక్కున సిగ్గుతో నవ్వుతూ ఊరక ఉంటుంది. ఆమె స్నేహితురాళ్లు ఆతడే ఆమె భర్త అని గ్రహిస్తారు.
“యథార్థ బ్రహ్మజ్ఞానం అనుభూతమైనచోట అంతా మౌనమే.
13.7.2 సజ్జన సాంగత్యం – గృహస్థుల కర్తవ్యం
(‘మ’ తో) “సరే, నే నింతగా మాట్లాడటం ఎందుకు?”
‘మ’ : మరగ కాగిన నేతిలో పచ్చి పూరీ వేసినప్పుడు ‘సుమ్’ అనే శబ్దం వస్తుందని మీ రొకసారి చెప్పారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవటానికి మీరు మాట్లాడుతున్నారు.
శ్రీరామకృష్ణులు ‘మ’ తో, హాజ్రాను గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: సజ్జనుల స్వభావం ఎటువంటిదో నీకు తెలుసా? ఆతడు ఇతరుల మనస్సులను నొప్పించడు; ఎవరికీ క్షోభ కలిగించడు. అయితే కొందరి స్వభావం ఎటువంటిదో తెలుసా? విందు భోజనానికి ఆహ్వానిస్తే తమకు ప్రత్యేక ఆసనాలు కావాలని అంటారు. నిక్కమైన భగవద్భక్తి ఉన్న వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వెయ్యడు, ఉత్తపుణ్యానికి ఎవరికీ కష్టం కలిగించడు.
“దుర్జన సహవాసం మంచిది కాదు. అటువంటి వారికి దూరంగా ఉంటూ తనను సంరక్షించుకోవాలి. (‘మ’ తో) నువ్వు ఏమంటావు?”
‘మ’ : అవునండీ. దుర్జన సాంగత్యంలో మనస్సు నిమ్నస్థాయికి దిగజారిపోతుంది. కాని, మీరు అన్నట్లు వీరుని విషయంలో అలా ఉండదు.
శ్రీరామకృష్ణులు: అదెలా?
‘మ’ : కొద్దికొద్దిగా రాజుకొంటున్న పొయ్యిలో ఒక చిన్న కట్టెను పడవేసినా మంట ఆరిపోతుంది; కాని ప్రజ్వలిస్తూ ఉన్న మంటలో పచ్చి అరటి చెట్టును పడవేసినా మంట ఆరదు. పైగా ఆ అరటి చెట్టుకూడా కాలి బూడిదైపోతుంది.
శ్రీరామకృష్ణులు, ‘మ’ ను అతడి మిత్రుడు హరిబాబును గురించి అడిగారు.
‘మ’ : ఇతడు మీ దర్శనార్థం వచ్చాడు. ఇతడికి పత్నీవియోగం జరిగి చాలకాలమైంది.
శ్రీరామకృష్ణులు (హరితో): నువ్వు ఏం పని చేస్తూ ఉంటావు?
‘మ’ : ఫలానా అంటూ ఏదీ లేదు. కాని ఇంట్లో తల్లితంద్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను చక్కగా సేవిస్తూ ఉంటాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అదెలా? ఏదో సామెత చెప్పినట్లుగా నువ్వు గుమ్మడికాయలు కోసియిచ్చే బాబయ్యవా? ఇటు సంసారివీ కాకపోయావు, అటు భగవద్భక్తుడివీ కాకపోయావు. అది మంచిది కాదు. కొంతమంది పురుషులు ప్రత్యేకించి ఏ పనిపాటులూ చేయకుండా, ఎవరికి ఏది కావలసివస్తే దాన్ని చేస్తూ ఉంటారు. చావిట్లో కూర్చుని ఉబుసుపోక కబుర్లతో, చుట్టపీలుస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఈ రెండూ కాకుంటే ఊరకే కూర్చుని ఉంటారు. ఆడవాళ్లు గుమ్మడికాయను కోయరాదు.* అందుచేత పిల్లలచే అతడికి వారు కబురు పంపుతారు. ఇతడు వంట ఇంట్లోకి పోయి గుమ్మడికాయను రెండుగా కోసి ఇచ్చి పోతాడు. అతడి ప్రయోజనం అంతవరకు మాత్రమే. అందుకే అటువంటి వ్యక్తులకు ‘గుమ్మడి కాయలు కోసియిచ్చే బాబయ్య’ అని పేరు వచ్చింది.
“నువ్వు ‘ఇదీ’ చెయ్యి, ‘అదీ’ చెయ్యి. భగవంతుని పాదపద్మాలపట్ల నీ మనస్సును లగ్నం గావించి నీ బాధ్యతలను నిర్వర్తించు. ఏకాంతంగా ఉన్నప్పుడు భాగవతం, చైతన్య చరితామృతం మొదలైన భక్తి గ్రంథాలను పఠించు.”
రాత్రి పది గంటలయింది. చంద్రోదయమైంది. చంద్రకాంతిలో ఆలయ గోపురాలు ఎంతో అందంగా దర్శనమిచ్చాయి. ఇంకా కాళికాలయం మూయలేదు. ‘మ’, రామ్ఛటర్జీ మాట్లాడుకుంటూ రాధాకాంత, కాళికాలయాలకు వెళ్లి ప్రణామాలు చేశారు. శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన దక్షిణాభిముఖంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. ఒకటి రెండు పూరీలు, కాస్త రవ్వ పాయసం. కాసేపయ్యాక ‘మ’, అతడి మిత్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని కలకత్తాకు మరలారు.
13.8 అష్టమ పరిచ్ఛేదం గురుశిష్య సంవాదం – గోప్యవిషయాలు
శుక్రవారం, సెప్టెంబర్ 7, 1883
దక్షిణేశ్వర ఆలయం. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని ‘మ’ తో ఏకాంతంలో మాట్లాడుతున్నారు. ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు సమయం రాత్రి ఏడున్నర అయి ఉంటుంది.
శ్రీరామకృష్ణులు: ఈ మధ్య ఒక రోజు నేను కలకత్తాకు వెళ్లాను. వీథుల గుండా బండిలో పోతూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి దృష్టీ నిమ్న వస్తువులపై లగ్నమై ఉండటం గమనించాను. ప్రతి ఒక్కరూ ఉదర పోషణార్థమే చింతన చేస్తున్నారు ఆహారం కోసమే వారి పరుగు. ప్రతి వ్యక్తి మనస్సూ కామినీ కాంచనాలలోనే నిమగ్నమై ఉంది. ఏ ఒకరిద్దరు మాత్రమే ఊర్ధ్వదృష్టి కలిగి, మనస్సును భగవంతునిపై నిలిపినవారుగా కనిపించారు.
‘మ’ : ప్రస్తుత కాలం ఉదర చింతనను తీవ్రతరం చేసింది. ఆంగ్లేయులను అనుకరించే ప్రయత్నంలో, జనం భోగవిలాసాల పట్ల మరింత మొగ్గు చూపుతున్నారు; ఆ కారణంగా వారి ఆవశ్యకతలు కూడా అధికరించాయి.
శ్రీరామకృష్ణులు: భగవంతుని గురించి ఆంగ్లేయుల భావన ఏమిటి?
‘మ’ : వారు నిరాకారవాదులు.
13.8.1 శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానావస్థలో పొందిన అభేదదర్శన సంఘటన
శ్రీరామకృష్ణులు: ఇక్కడా ఆ మతం ఉన్నది కదా!
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానావస్థలో తమకు కలిగిన అనుభవాలను వర్ణింపసాగారు.
శ్రీరామకృష్ణులు: ఒకనాడు నాకు అద్వయ అఖండ చైతన్య దర్శనం అయింది. మొదట్లో అసంఖ్యాక మనుజులు, జీవజంతువులు నాకు కనిపించారు. వారిలో కులీనులు, ఆంగ్లేయులు, మహమ్మదీయులు, చండాలులు, కుక్కలు మొదలైన వారు ఉన్నారు; నేనూ ఉన్నాను. పొడవైన గడ్డం ఉన్న ఓ మహమ్మదీయుడు వారిలో ఉన్నాడు. అతని చేతిలో ఓ కంచం ఉంది. అందులో అన్నం ఉంది. ఇతడు ఒక్కొక్కరి నోట కొన్ని మెతుకులు పెట్టాడు. నేనూ కాస్త రుచి చూశాను.
“మరొక రోజు ఇంకో దృశ్యం కనిపించింది. దాన్లో అన్నము, కూరలు, పలు రకాల పిండివంటలు, వాటితోపాటు మలమూత్రాలుకూడా పడి ఉండటం చూశాను. హఠాత్తుగా నాలో నుండి జీవాత్మ బయటకు వచ్చి ఒక అగ్నిజ్వాల వలె చెలరేగి అక్కడ ఉన్న పదార్థాల నన్నిటినీ రుచిచూసింది. అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఒకే పదార్థం – అద్వయ అఖండ చైతన్యం – అనే ఎరుకను కలిగించింది.
13.8.2 స్వజనుల దర్శనం – శ్రీరామకృష్ణులు అవతార పురుషులా?
(‘మ’ తో) “మరొక రోజు* నా అంతేవాసులు, స్వజనం అయిన భక్తులను చూశాను. ఆలయాలలో సంధ్యాహారతులు ఇచ్చే తరుణంలో శంఖారావంతో గంటలు మ్రోగటం ఆరంభం కాగానే నేను కుఠీ* పైకి ఎక్కి వారికోసం, ‘హో, మీరంతా ఎక్కడ ఉన్నారు? ఇక్కడకు రండి. మిమ్మల్ని చూడాలని నా ప్రాణాలు కొట్టుకుంటున్నాయి!’ అంటూ వ్యాకులతతో కేకలు పెట్టాను.
(‘మ’ తో) “సరే, ఈ దర్శనాలను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?”
‘మ’ : భగవంతుడు మీ ద్వారా క్రీడిస్తున్నాడు. ఇంతవరకే నేను గ్రహించాను. మీరు యంత్రం, ఆయన మిమ్మల్ని నడిపేవాడు. జీవులందరినీ భగవంతుడు ఒకే మూసలో పోసి సృజించాడు; కాని మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు.
శ్రీరామకృష్ణులు: భగవద్దర్శనానంతరం షడైశ్వర్యాలు కలుగుతాయని హాజ్రా అంటూ ఉంటాడు.
‘మ’ : శుద్ధభక్తిని కోరుకునే వారు భగవదైశ్వర్యాలను ఆకాంక్షించరు.
శ్రీరామకృష్ణులు: హాజ్రా బహుశా పూర్వజన్మలో పేదవాడై ఉండి ఉంటాడేమో! అందుచేతనే ఐశ్వర్యాలు చవిచూడాలని అంతగా ఆరాటపడుతున్నాడు. ‘హు, వంటవాడితో ఏమిటి నేను మాట్లాడేది’ అనేవాడు. తరువాత ‘దేవాలయ కోశాధికారితో నేనే స్వయంగా మాట్లాడి మీకు కావలసినవన్నీ అందేట్లు ఏర్పాటు చేస్తాను,’ అనేవాడు. (‘మ’ బిగ్గరగా నవ్వాడు)
శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వుతూ “ఈ రీతిలో అతడు నాతో మాట్లాడతాడు. నేను ఏమీ బదులు పలుకను” అన్నారు.
13.8.3 భక్తుల నిమిత్తమే భగవంతుని అవతారం
‘మ’ : శుద్ధభక్తిని కలిగి ఉన్నవాడు భగవంతుని ఐశ్వర్యాలను చూడకోరడని మీరు అనేకసార్లు చెప్పి ఉన్నారు. అటువంటి భక్తుడు భగవంతుణ్ణి బాలగోపాలునిగా చూడగోరతాడు. ప్రారంభంలో భగవంతుడు అయస్కాంతం కాగా, భక్తుడు సూది అవుతాడు. కాని చివరకు భక్తుడే అయస్కాంతంగాను, భగవంతుడు సూదిగాను మారిపోతాడు. అంటే, తన భక్తుడి ముందు భగవంతుడు చిన్నవాడై పోతాడు.
శ్రీరామకృష్ణులు: అవును, అది తొలిసంజ సూర్యుని మాదిరిది. ఆ సూర్యుణ్ణి సులభంగా చూడగలం. కళ్లకు మిరిమిట్లు గొల్పడు, అంతేగాక కంటికి తృప్తిగాను ఉంటుంది. భక్తుడి కోసం భగవంతుడు కోమల స్వభావు డవుతాడు. తన మహిమలను ఆవలకు నెట్టి భక్తుని ముందు ప్రత్యక్షమవుతాడు.
కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
‘మ’ : మీ దివ్యదర్శనాలన్నీ ఎందుకు యథార్థాలు కావు? అవి అసత్యమయ్యే పక్షంలో ఈ జగత్తు మరింత అసత్యం అయి ఉండాలి. ఎందుకంటే, గ్రహణశక్తికి ఉపకరణమైన మనస్సు ఒక్కటే ఉండటం. మీ పరిశుద్ధ మానసం ఆ దివ్యదర్శనాలను గాంచుతుంది, మా సాధారణ మనస్సులు లౌకిక వస్తువులను చూస్తాయి.
శ్రీరామకృష్ణులు: నీకు అనిత్యత్వం గురించి అవగతం అయిందని తెలుస్తోంది. మంచిది, హాజ్రా గురించి నువ్వు ఏమనుకొంటున్నావో చెప్పు.
‘మ’ : నాకు తెలియదు.
శ్రీరామకృష్ణులు నవ్వారు.
శ్రీరామకృష్ణులు: సరే, నా మాదిరి వ్యక్తిని మరెవరినైనా చూసి ఉన్నావా?
‘మ’ : లేదండి.
శ్రీరామకృష్ణులు: ఎవరైనా పరమహంసలను?
‘మ’ : లేదండీ. మీకు సరిపోలిన వారు లేరు.
శ్రీరామకృష్ణులు; (చిరునవ్వుతో): ‘అచీన’ అనే చెట్టును గురించి విని ఉన్నావా?
‘మ’ : లేదండి.
శ్రీరామకృష్ణులు: ఆ పేరుతో ఒక చెట్టు ఉన్నది. కాని దాన్ని చూసి, అది ఏ చెట్టో ఎవరూ చెప్పలేరు.
‘మ’ : అదే విధంగా మిమ్మల్ని కూడా తెలుసుకోలేం. మిమ్మల్ని ఎవడెంత అవగాహన చేసుకుంటాడో అతడు అంత ఉన్నతిని పొందుతాడు.
‘మ’ మౌనంగా ఆలోచించసాగాడు: ‘తొలిసంజ సూర్యుడు’, ‘తెలియరాని చెట్టు’ గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావిస్తున్నారు. ఇదేనా అవతారం? ఇదేనా మానవలీల? శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ భగవదవతారమా? కుఠీ పైకప్పు నుండి భక్తుల కోసం ‘మీ రెక్కడ ఉన్నారు? నా వద్దకు రండి’ అంటూ ఆయన కేకలు పెట్టింది ఇందు నిమిత్తమేనా?
13.9 నవమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో రతన్ ప్రభృతులతో
ఆదివారం, సెప్టెంబరు 9, 1883
దక్షిణేశ్వరం, శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు కూర్చుని దరహాస వదనులై భక్తులతో మాట్లాడుతున్నారు. భోజనం ముగించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒకటి లేక రెండు గంటలు అయివుంటుంది. రాఖాల్, ‘మ’, రతన్ ప్రభృతులు నేల మీద కూర్చుని ఉన్నారు. మధ్యమధ్యలో రామ్‌లాల్, రామ్ఛటర్జీ, హాజ్రా గదిలోకి వచ్చి పోతూ ఉన్నారు. యదుమల్లిక్ ఉద్యాన గృహానికి రతన్ నిర్వహణాధికారిగా ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి భక్తిప్రపత్తులు ఉన్నాయి. ఆయన దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. కలకత్తాలోని యదుమల్లిక్ గృహంలో నీలకంఠుని యాత్ర ప్రదర్శన జరుగనున్నది. శ్రీరామకృష్ణులు ఆ విషయంగా రతన్‌తో మాట్లాడుతున్నారు.
రతన్: మీరు తప్పక రావాలి. ఫలానా రోజున యాత్ర ప్రదర్శన జరుగుతుందని వాళ్లు చెప్పి పంపారు.
శ్రీరామకృష్ణులు: మంచిది. నాకూ వెళ్లాలనే ఉంది. ఆహా, నీలకంఠుడు భక్తిపారవశ్యంలో పాడతాడు.
ఒక భక్తుడు: అది నిజమండీ.
శ్రీరామకృష్ణులు: పాడుతూన్నప్పుడు అతడి కళ్ల వెంట అశ్రువులు స్రవిస్తాయి. (రతన్‌తో) యాత్ర ప్రదర్శనకు వచ్చినప్పుడు నాటి రాత్రి అక్కడే గడపాలనుకుంటున్నాను.
రతన్: అది చాలా బాగా ఉంటుంది.
13.9.1 యథార్థ చాతుర్యం
రామ్ఛటర్జీ, ఇతర భక్తులు యదుమల్లిక్ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి రతన్‌ను అడిగారు.
రతన్: అవును, యదుబాబు గారింటి పూజామందిరం నుండి దేవుని బంగారు పాదుకలు ఎవరో దొంగిలించుకుపోయారు. అది ఇంట్లో గందరగోళాన్ని సృష్టించింది. ‘మంత్రించినపళ్లెరం’ ద్వారా దొంగను కనుగొనటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ ఒక గదిలో కూర్చుని ఉంటారు. అప్పుడు ఒక పళ్లెరాన్ని మధ్యగా ఉంచి గిరగిర త్రిప్పుతారు. పాదుకలను దొంగిలించిన వ్యక్తి దిశగా ఆ పళ్లెరం కదులుతూ వెళుతుంది.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): పళ్లెం ఎలా కదులుతుంది? దానంతట అదే కదులుతుందా?
రతన్: కాదు. ఒకరు దాన్ని నేల కేసి ఒత్తి ఉంచుతారు.
ఒక భక్తుడు: అది చిత్రమైన హస్తలాఘవం, చాతుర్యం.
శ్రీరామకృష్ణులు: ఏ చాతుర్యంతో భగవంతుని పొందగలమో అదే యథార్థమైన చాతుర్యం. ఆ చాతుర్యమే చాతుర్యం.
13.10 దశమ పరిచ్ఛేదం తాంత్రికసాధన – శ్రీరామకృష్ణుల సంతాన భావం
ఇలా సంభాషణ సాగుతూ ఉండగా కొందరు బెంగాలీ పెద్దమనుష్యులు గదిలోకి ప్రవేశించి, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, కూర్చున్నారు. వారిలో ఒకరిని శ్రీరామకృష్ణులు ఇదివరకే ఎరుగుదురు. ఈ పెద్దమనుష్యులు తాంత్రిక మార్గం అనుసరించి పంచమకార సాధనలు చేసేవారు. శ్రీరామకృష్ణులు అంతర్యామి. వారి భావాలన్నిటినీ గ్రహించారు. వీరిలో ఒకరు మతం పేరిట పాప కార్యాలలో పాల్పడుతూ ఉన్నట్లు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. అతడు ఒక సంపన్నుని మరణించిన సహోదరుని భార్యతో అక్రమసంబంధం కలిగి ఉండి మతం పేరిట ఆమెతో పంచమకార సాధన చేస్తున్నాడనీ ఆయనకు తెలుసు.
శ్రీరామకృష్ణులది సంతాన భావం. స్త్రీల నందరినీ, వేశ్యలను సైతం – తల్లిగాను, జగన్మాత పలురూపాలుగాను గాంచేవారు.
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): అచలానందుడు ఎక్కడ? ఆనాడు కాళీకింకరుడు వచ్చి ఉన్నాడు. ఎవరో సింహమట, అతడు కూడా వచ్చాడు. (‘మ’ ప్రభృతులతో) అచలానందుడి, అతడి శిష్యుల మతాదర్శాలు వేరు. నా భావం సంతాన భావం.
వచ్చిన పెద్దమనుష్యులు ఒక్కమాట కూడా మాట్లాడక కూర్చుని ఉన్నారు.
13.10.1 అచలానందుని తాంత్రికసాధన
శ్రీరామకృష్ణులు: నాది సంతాన భావం. అప్పుడప్పుడు అచలానందుడు ఇక్కడకు వచ్చి బస చేస్తూ ఉండేవాడు. నివేదించిన మద్యాన్ని తప్పత్రాగేవాడు. స్త్రీ పట్ల నా వైఖరిని గురించి విని, తన సొంత దృక్పథాలను మొండిగా సమర్థించుకునేవాడు. మళ్లీ మళ్లీ ఇలా పిడివాదం చేస్తూ ఉండేవాడు: ‘వీరభావం అవలంబించి స్త్రీతో పాటు చేసే సాధనలను మీ రెందుకు గుర్తించరు? పరమశివుని అనుజ్ఞలను మీ రెందుకు అంగీకరించరు? సాక్షాత్తూ శివుడే తాంత్రిక సాధనలను రచించాడు. ఆ సాధనలలో వీరభావంలో చేసే సాధన కూడా ఉంది కదా!’ అప్పుడు నేను అతడితో ఇలా అన్నాను: ‘ఎవరికి తెలుసు చెప్మా, నాకు అవి కాస్త కూడా నచ్చవు. నాది సంతాన భావం.’
“అచలానందుడు తన సంతానాన్ని పోషించడు. నాతో, ‘పిల్లలను భగవంతుడే కాపాడతాడు, అంతా భగవంతుని సంకల్పం’ అని అంటాడు. నేను ఏమీ బదులివ్వక మౌనంగా ఉండేవాణ్ణి. కాని నాలో ‘అతని సంతానాన్ని ఎవరు పోషిస్తారు? భార్యాబిడ్డలను త్యజించానని చెబుతూ ధన సంపాదనకు ఇదొక మార్గమా!’ అని అనుకొన్నాను. ఇతడు సమస్తం త్యజించాడు అని జనులు అనుకుంటారు, దానితో మంచి రాబడే వస్తుంది.
“వ్యాజ్యాలలో నెగ్గాలి, చాలా ధనం గడించాలి, ఇతరులను న్యాయస్థానాలలో గెలిపించాలి, వారి వస్తువులను వారికి ఇప్పించాలి – వీటి కోసం సాధన చేయటమా? ఇది నీచాతినీచం.
“తిండి, గుడ్డ, తలదాచుకోటానికి ఒక ఇల్లు, భగవత్సేవకు, సాధుసేవకు, ఎదుటబడ్డ పేదసాదలకు సహాయం చేయటానికి ధనం వినియోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకు, భోగాలకు ధనం ఉపయోగించరాదు. పేరుప్రతిష్ఠలు సముపార్జించటానికి ధనం వినియోగించకూడదు.
13.10.2 పంచమకారాలు – అష్టసిద్ధులు
“సిద్ధులు పొందటానికే తాంత్రికులు పంచమకార సాధనలు అనుష్ఠిస్తారు. అది ఎంతటి నీచబుద్ధి! శ్రీకృష్ణుడు అర్జునుడితో ‘మిత్రమా! అష్ట సిద్ధులలో ఒకదానిని పొందితే చాలు, నీ శక్తి అధికరిస్తుంది. కాని నన్ను మాత్రం పొందలేవు సుమా!’ అన్నాడు. సిద్ధులు ప్రదర్శిస్తూ ఉన్నంత వరకూ మాయను తొలగించుకోలేము. మాయలో ఉండటం వల్ల అహంకారం కలుగుతుంది. విసుగు చెందినప్పుడు మూడు చుక్కల మద్యాన్ని త్రాగినందువల్ల ఏం లాభం ఒనగూరుతుంది? లేక ఒక వ్యాజ్యెంలో గెలుపొందిన మాత్రంచేత ఏం ఒరుగుతుంది?
13.10.3 హఠయోగం ధీర్ఘాయువు కొరకే
“దేహం, ధనం– ఇత్యాదులన్నీ అనిత్యాలు. వాటి నిమిత్తం అంతగా శ్రమించటం ఎందుకు? హఠయోగుల దుర్దశను కాస్త చూడండి. దీర్ఘాయువు లవటమే వారి ఏకైక ఆదర్శం. భగవంతుని గురించిన చింతనే వారికి ఉండదు. ఉదరాన్ని, ప్రేగులను నేతి, ధ్యౌతి ప్రక్రియలతో ప్రక్షాళన చేయటం, గొట్టం గుండా పాలను స్వీకరించటం – అంతటితో సరి.
“ఒకప్పుడొక స్వర్ణకారుని నాలుక మడతపడి అంగుటికి అంటుకొనిపోయింది. అందుచేత అతడు జడ సమాధిస్థితి పొందిన వ్యక్తిలా అయిపోయాడు. ఇక కదలడు, మెదలడు. అదే స్థితిలో చాలాకాలం ఉండిపోయాడు. అతణ్ణి పూజించటానికి జనులు రాసాగారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక హఠాత్తుగా అతడి నాలుక యథాస్థితికి తిరిగి వచ్చింది; అతడు చైతన్యంలోకి వచ్చి మళ్లీ తన వృత్తి పనులను చేసుకో మొదలుపెట్టాడు. (అందరూ నవ్వారు)
“ఈ సాధనలన్నీ శరీరానికి సంబంధిచిన క్రియలే; భగవంతునితో వీటికెటువంటి పొత్తూ లేదు. ఎనభై రెండు రకాల ఆసనాలు వేసి యోగసమాధిని గురించి గొప్పలు చెప్పుకొనే వ్యక్తి ఒకడు ఉండేవాడు. కాని అతగాడి అంతరంగం కామినీ కాంచనాల మీదనే ఉండేది. ఒక రోజు దివాన్ మదనభట్ట్కు చెందిన కొన్నివేల రూపాయల విలువగల బ్యాంకు నోటు క్రిందపడిపోయింది. దాన్ని చూసిన ఇతడు ప్రలోభానికి లోనై ఆ నోటును మ్రింగివేశాడు; ఆ నోటును తరువాత ఏదో విధంగా బయటకు తీసుకోవచ్చని అతడు భావించాడు. ఆ తరువాత నోటును బయటకు తెప్పించడమూ జరిగింది, అతడికి మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించటమూ జరిగింది, ఆతడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాడని నేను అమాయకంగా భావించేవాణ్ణి. భగవంతునిపై ఒట్టు, నేను అట్లే అనుకొన్నాను.
13.10.4 మహేంద్రపాల్ ఇచ్చిన డబ్బు అతనికి తిరిగి ఇవ్వడం
“ఒకసారి సింథి వాసి మహేంద్రపాల్, రామ్‌లాల్‌కు ఐదు రూపాయలు ఇచ్చాడు. అతడు వెళ్లిపోయాక రామ్‌లాల్ నాకీ సంగతి తెలిపాడు. ఈ కానుక ఎందుకు, ఎవరికి అని అడిగాను. అది ఇక్కడి కోసమే అని రామ్‌లాల్ చెప్పాడు. అప్పుడు అనిపించింది, ఈ పైకంతో పాలు తీసుకొన్న బాకీలో కొంత అయినా చెల్లించవచ్చనీ, పోనివ్వు, కాస్త అప్పు అయినా తీరుతుంది అని. ఆనాటి రాత్రి పడుకున్న తరువాత, నమ్మండి, హఠాత్తుగా లేచి కూర్చున్నాను. ఛాతీ లోపల పిల్లి గోళ్లతో రక్కివేస్తున్నట్లుగా నాకు అనిపించింది. వెంటనే నేను రామ్‌లాల్ వద్దకెళ్లి ‘మహేంద్రుడు ఈ డబ్బు ఎవరికోసం ఇచ్చాడు? మీ పిన్ని* కోసమా?’ అని అడిగాను. ‘కాదు. అది మీ కోసమే’ అన్నాడు రామ్‌లాల్. ‘అలా అయితే వెంటనే ఆ డబ్బు అతడికి తిరిగి ఇచ్చేసిరా. లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు’ అన్నాను. రామ్‌లాల్ తెల్లవారగానే వెళ్లి ఆ డబ్బు తిరిగి ఇచ్చివేశాకనే నా మనస్సు కుదుటపడింది.
13.10.5 కర్తాభజ సంప్రదాయాన్ని నిరసించడం
“ఒక ఊళ్లో భగవతి అనే నూనె అమ్ముకొనే స్త్రీ ఉంది. ఆమె కర్తాభజ సంప్రదాయానికి చెందినది. ఈ సంప్రదాయస్థులు స్త్రీలతో కలిసి సాధనలు చేస్తారు. ఒక పురుషుడు లభించకుంటే స్త్రీలకు సాధన, భజనలు సాధ్యపడవు. ఆ పురుషుణ్ణి ‘రాగకృష్ణుడు’ అని పేర్కొంటారు. ‘కృష్ణుడు దొరికాడా?’ అని మూడుసార్లు అడుగుతారు. ‘దొరికాడు’ అని ఆమె మూడుసార్లు జవాబిస్తుంది. భగవతి నిమ్నజాతి స్త్రీ. నూనె అమ్ముతుంది. అందరూ ఆమె కాళ్లపై పడి ప్రణామం చేస్తారు. ఆమె పాదధూళిని తలపై ధరిస్తారు. ఇదంతా చూసి జమీందారుకు కోపం వచ్చింది. నేను ఆతణ్ణి చూసి ఉన్నాను. ఆతడు ఒక దుష్టుణ్ణి ఆమె వద్దకు పంపాడు. అతడి వలలో పడి, ఆమె గర్భం ధరించటం జరిగింది.
“ఒకసారి ధనవంతుడొకడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ‘అయ్యా! నా వ్యాజ్యెం గెలిపించటానికి మీరు ఏదో ఒకటి చేసిపెట్టండి. మీ ఖ్యాతి విని, మీ వద్దకు వచ్చాను.’ అందుకు నే నతడితో ఇలా చెప్పాను: ‘నాయనా! నువ్వు తప్పు చోటుకి వచ్చావు. నువ్వు వెదకుతున్న వ్యక్తి నేను కాదు. ఆ వ్యక్తి అచలానందుడు.’
“భగవంతుని పట్ల యథార్థ భక్తిప్రపత్తులున్న వ్యక్తి శరీరం, ధనం మొదలైన వాటిని ఖాతరు చెయ్యడు. అతడు ఇలా అనుకుంటాడు: ‘దేహ సుఖాలు, ధనం లేక పేరుప్రఖ్యాతులకై నే నెందుకు జపతపాదులను అనుష్ఠించాలి! అవన్నీ అనిత్యాలు. కొన్ని రోజులు ఉండి మాయమైపోయేవి.’”
దర్శనార్థం వచ్చిన పెద్దమనుష్యులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, సెలవు పుచ్చుకున్నారు. వారు వెళ్లిపోయాక శ్రీరామకృష్ణులు నవ్వి, ‘మ’ తో ఇలా అన్నారు: “దొంగలు ధార్మిక ప్రసంగాలు వినరు.” (అందరూ నవ్వారు)
13.11 ఏకాదశ పరిచ్ఛేదం భగవంతునిపై విశ్వాసమే ఆత్మవిశ్వాసానికి మూలం
శ్రీరామకృష్ణులు (నవ్వుతూనే ‘మ’ తో): అది సరే కాని, నరేంద్రుణ్ణి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?
‘మ’ : చాలా ఉత్తముడు.
శ్రీరామకృష్ణులు: అవును. అతడు గొప్ప విద్యావంతుడు, అలాగే తెలివి తేటలూను. అదేకాదు పాడతాడు, సంగీత వాయిద్యాలను వాయిస్తాడు. మరో ప్రక్క చూస్తే జితేంద్రియుడు కూడా. ఎన్నటికీ వివాహం చేసుకోనని చెబుతున్నాడు.
‘మ’ : పాపం గురించి సర్వదా మాట్లాడే వ్యక్తి చివరికి పాపిగా మారిపోతాడని మీరు సెలవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి తదనంతర జీవితంలో పురోభివృద్ధి గాంచలేడు. కాని తాను భగవంతుని బిడ్డననే దృఢవిశ్వాసం ఉంటే సత్వరం పురోగమించ గలుగుతాడు.
13.11.1 కృష్ణకిశోర్ విశ్వాసం – హలధారి తండ్రి విశ్వాసం
శ్రీరామకృష్ణులు: అవును. విశ్వాసం! కృష్ణకిశోర్‌కు ఎంతటి మహత్తర విశ్వాసం ఉందో చూడండి! అతడు నాతో ఒకసారి ఇలా అన్నాడు: ‘నే నొకసారి భగవన్నామాన్ని స్మరించాను. అది చాలు. నేను పాపిని ఎలా అవుతాను? నేను పరిశుద్ధుణ్ణి, కళంకరహితుడను అయ్యాను.’ ఒక రోజు హలధారి ఇలా అన్నాడు: ‘భగవత్ ప్రీత్యర్థం అజామిళుడు కూడా నారాయణుని గురించి తపస్సు చేయవలసి వచ్చింది. తపశ్చర్యలు ఒనరించక భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరా? నారాయణ నామాన్ని కేవలం ఉచ్చరించినంత మాత్రం చేత ఒనగూరే లబ్ధి ఏముంది?’ ఈ వ్యాఖ్యానంతో కృష్ణకిశోర్ కోపం తారాస్థాయిని చేరుకొంది. పువ్వుల సేకరణకై తరువాత ఆలయ ఉపవనానికి వచ్చినప్పుడు కృష్ణకిశోర్, హలధారి వంక కన్నెత్తి చూస్తే ఒట్టు!
“హలధారి తండ్రి గొప్పభక్తుడు. నదిలో దిగి స్నానం చేసి నడుంలోతు నీళ్లలో నిలబడి ‘రక్తవర్ణం చతుర్ముఖం’ మొదలైన శ్లోకాలు ఉచ్చరించేటప్పుడు ఆయన కళ్ల వెంట ప్రేమాశ్రువులు స్రవించేవి.
“ఒక రోజు అరియాదాహ స్నానఘట్టానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన్ను మేం దర్శించే విషయంగా ప్రస్తావన వచ్చింది. అప్పుడు హలధారి ఇలా అన్నాడు: ‘పంచభూత సమన్వితమైన పంజరాన్ని చూడటంలో మనకు ఒరిగే లాభం ఏమిటి?’ ఈ విషయం తెలిసిన కృష్ణకిశోర్ ‘ఏమిటి? ఒక సాధు సందర్శనలో ఒనగూరే లబ్ధి ఏమిటనా హలధారి అడుగుతున్నాడు? ఎవరైనా కృష్ణ నామాన్ని లేక రామ నామాన్ని జపిస్తే దేహం, చిన్మయదేహం అయిపోతుంది. అటువంటి వ్యక్తి సమస్తాన్ని చిన్మయంగానే గాంచుతాడు. చిన్మయ శ్యామ్ చిన్మయ ధామ్! ఒక్కమారు రామనామంగాని, కృష్ణనామంగాని జపిస్తే నూరు సంధ్యావందనాల ఫలం లభిస్తుంది’ అని అన్నాడు.
“కృష్ణకిశోర్ కుమారు డొకడు మరణశయ్యపై రామనామ స్మరణ చేశాడు. అప్పుడు కృష్ణకిశోర్ ‘వాడు రామనామాన్ని స్మరించాడు; ఇక వాడు ఎందుకూ కలత చెంద పనిలేదు’ అన్నాడు. కాని ఎప్పుడైనా కొన్ని సమయాల్లో విలపించేవాడు – ఎంతైనా పుత్రశోకం కదా!
“బృందావనంలో ఒకమారు కృష్ణకిశోర్ దప్పిక చెందగా అక్కడే ఉన్న ఒక అంత్యజునితో ‘నువ్వు శివా అని పలుకుతూ నీరు తోడి ఇవ్వు’ అన్నాడు. ఆ అంత్యజుడూ శివనామం ఉచ్చరిస్తూ నీరు తోడి ఇచ్చాడు. అంత ఆచార నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఆ నీటిని త్రాగాడు. ఎంత విశ్వాసం!
“విశ్వాసరహితంగా ఆచరించే పూజాపురస్కారాలు, జపతపాలు, సంధ్యా వందనాది కర్మలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోవు. నువ్వు ఏమంటావు?”
‘మ’ : అవునండీ అది నిజం.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): గంగలో స్నానార్థం వచ్చే జనాన్ని నేను చూసి ఉన్నాను. ప్రతి విషయం గురించీ అప్రస్తుత ప్రసంగం చేస్తారు. వితంతురాలైన అత్త ఇలా అంటుంది : ‘ఏం చెప్పను. నేను లేకుంటే పూజ జరగదు. వత్తి చేయడం కూడా వారి వల్ల కాదు. ఇక వివాహమో మరేదో అయితే నేనే అన్నీ చెయ్యాల్సి వస్తుంది. అప్పుడే సాగుతుంది. మంచం అలంకరించటం లగాయతు కాయగూరలు కొనేవరకూ అంతా నా తలపైనే.’
‘మ’ : అవునండీ. వారిని నిందించి ఏం ప్రయోజనం? వారు వేరే ఏం చెయ్యగలరు?
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): మేడ మీద పూజా మందిరంలో నారాయణ పూజ జరుగుతోందనుకో. పూజ కోసం నైవేద్యం తయారుచేయటం, గంధం తీయటం మొదలైన పనులు సాగుతున్నాయి. అయితే అక్కడ భగవంతుని గురించిన ప్రస్తావనే ఉండదు. వారి మధ్య ఇలా సంభాషణ సాగుతూ ఉంటుంది: ‘ఇవాళ ఏం వంట చేద్దాం?’ ‘బజారులో మంచి కూరగాయలే దొరకలేదు.’ ‘నిన్న చేసిన కూర ఎంత రుచిగా ఉందో!’ ‘ఆ కుర్రవాడు నా పినతండ్రి కొడుకే!’ ‘ఒరే! ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నావా?’ ‘నేను ఎలా ఉన్నానని మాత్రం అడగవద్దు!’ ‘నా హరి వెళ్లిపోయాడుగా నాయనా!’ చూడు, పూజామందిరంలో పూజాసమయంలో ఇటువంటి మాటలు!
మ: అవునండీ. చాలామంది ఇలాగే ఉంటారు. మీరు చెప్పినట్లు, భగవంతుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి పూజ, సంధ్యావందనాదులు చాలాకాలం కొనసాగించాలా ఏమిటి?
13.12 ద్వాదశ పరిచ్ఛేదం విభు రూపం – జ్ఞానం, విజ్ఞానం
శ్రీరామకృష్ణులు, ‘మ’ ఇప్పుడు ఏకాంతంలో సంభాషించుకుంటున్నారు.
‘మ’ : అయ్యా! భగవంతుడే సర్వమూ అయివున్నప్పుడు ఈ నానాభావాలు ఎందుకు?
శ్రీరామకృష్ణులు: విభు రూపంలో భగవంతుడు సర్వభూతాలలో నెలకొని ఉన్నాడు. కాని శక్తి తారతమ్యాలు ఉన్నాయి. ఆయన ఒక్కో చోట విద్యాశక్తిగాను, మరో చోట అవిద్యాశక్తిగాను; ఒకచోట అధిక శక్తితోను, మరొక చోట తక్కువ శక్తితోను విరాజిల్లుతూ ఉంటాడు. మనుష్యులలోనే చూడు ఎన్ని రకాలో – వంచకులు, జూదరులు, పులిలాంటి భీకరులు – ఉన్నారు. నేను వారిని ‘వంచక నారాయణుడు’, ‘పులినారాయణుడు ‘గా పేర్కొంటాను.
‘మ’ (నవ్వుతూ): అవును. మనం వారికి దూరం నుండే ప్రణామం చేయాలి. ‘పులి నారాయణుని’ దరి చేరి, కౌగిలించుకుంటే, అది మ్రింగి వేస్తుంది.
శ్రీరామకృష్ణులు: భగవంతుడు – ఆయన శక్తి; బ్రహ్మం, శక్తి – ఇవి తప్ప మరొకటి ఏదీ లేదు. నారదుడు, శ్రీరాముని ఇలా స్తుతించాడు: ‘ఓ రామా! నువ్వు శివుడవు – సీత, పార్వతీదేవి. నువ్వు బ్రహ్మవు – సీత, సరస్వతి. నువ్వు ఇంద్రుడవు – సీత, ఇంద్రాణి. నువ్వు నారాయణుడవు – సీత, లక్ష్మీదేవి. ఓ రామా! పురుష రూపాలన్నీ నీవి, స్త్రీ రూపాలన్నీ సీతవి.’
‘మ’ : మరి చిన్మయరూపం?
శ్రీరామకృష్ణులు ఏదో ఆలోచిస్తున్నారు. మెల్లగా ఇలా అన్నారు: “అది ఎలా ఉంటుందో తెలుసునా? నీటి వలె… సాధనలు చేస్తే ఇవన్నీ అవగత మవుతాయి.
“నువ్వు భగవద్రూపాలను విశ్వసించు. అగ్ని – దాని దహనశక్తి వలె బ్రహ్మమూ శక్తీ ఒక్కటే, రెండు కాదు అన్న విషయం బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాతనే తెలుస్తుంది. అగ్నిని తలచుకుంటే, దానికున్న దహనశక్తిని కూడా తలచినట్లే. అలాగే దహనశక్తిని తలచుకుంటే అగ్నిని కూడా తలచుకున్నట్లే. ఇంకా. – పాలు దాని తెల్లని రంగు; నీరు, దాని తడితనం అవినాభావాలు.
“కాని బ్రహ్మజ్ఞానానికి కూడా ఆవల ఒక స్థితి ఉంది. జ్ఞానానికి ఆవల విజ్ఞానం వస్తుంది. జ్ఞానం యొక్క ఎరుక ఉన్న వ్యక్తి, అజ్ఞానం యొక్క ఎరుకనూ గ్రహించి ఉంటాడు. బ్రహ్మర్షి అయిన వసిష్ఠుడు నూరుమంది పుత్రుల మరణ శోకంతో కుప్పకూలిపోయాడు. బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి అలా శోకించటం ఎందుకు అని లక్ష్మణుడు, రాముణ్ణి అడిగాడు. అందుకు రాముడు ‘సోదరా! జ్ఞానాజ్ఞానాలను దాటిపో’ అన్నాడు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వ్యక్తికి అజ్ఞానం కూడా ఉంటుంది. పాదంలో ముల్లు గుచ్చుకుంటే, మరొక ముల్లుతో మొదటి ముల్లును తీసివేయాలి. ఆపైన రెండవ ముల్లును కూడా పారవేయాలి.”
‘మ’ : అంటే జ్ఞానాజ్ఞానాలు రెంటినీ త్యజించివేయాలా?
శ్రీరామకృష్ణులు: అవును. అదే విజ్ఞానం యొక్క ప్రయోజనం. ఇది వెలుతురు అన్న జ్ఞానం ఉన్న వ్యక్తికి చీకటి అంటే ఏమిటో తెలిసి ఉండటం నువ్వు గమనించలేదా! సుఖం ఎరుక గల వ్యక్తికి దుఃఖం ఎరుక కూడా ఉంటుంది. పుణ్యం ఎరుక ఉన్న వ్యక్తికి పాపం ఎరుక ఉండే ఉంటుంది. మడి అన్న జ్ఞానం ఉన్న వ్యక్తి, మైల అనే జ్ఞానమూ కలిగి ఉంటాడు. ‘నేను’ అనే భావం ఉన్న వ్యక్తికి ‘నువ్వు’ అన్న భావనా ఉంటుంది.
“విజ్ఞానం అంటే విశేష రీతిలో భగవంతుని తెలుసుకోవటమే. కట్టెలో అగ్ని ఉన్నదనే ఈ ఎరుకను, ఈ విశ్వాసాన్ని జ్ఞానం అంటారు. కాని ఆ కట్టెల మంటపై అన్నం వండి, ఆ అన్నం తిని పుష్టికరంగా తయారవడమే విజ్ఞానం. ఆంతరిక అనుభవం చేత భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం జ్ఞానం. కాని ఆయనతో మాట్లాడి వాత్సల్య, సఖ్య, దాస్య, మధుర ఇత్యాది భావాలలో ఏదో ఒక భావంలో ఆనందం చవిచూడటమే విజ్ఞానం. ఆయనే ఈ జీవజగత్తులుగా అయివున్నాడని దర్శించడమే విజ్ఞానం.
“ఒక సంప్రదాయం వారు భగవత్సాక్షాత్కారాన్ని అంగీకరించరు. ఎవరు ఎవర్ని సాక్షాత్కరించుకుంటారు అనేదే వీరి వాదన. ఓడ కాలాపానీ చేరుకుంటే, తిరిగి రాదు. ఏ సమాచారమూ అందించటం దానికి సాధ్యం కాదు.”
‘మ’ : మీరు చెప్పినట్లు, ఎత్తైన కట్టడం పైకెక్కిన వ్యక్తికి క్రింద జరిగే సంగతులు – గుర్రాలు, బళ్లు, ఆంగ్ల స్త్రీ, ఆంగ్లేయుడు, ఇళ్లు వాకిళ్లు, అంగళ్లు, ఆఫీసులు – మొదలైనవాటి వివరాలు తెలియవు.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడు నేను కాళికాలయానికి పోవటం లేదు. ఇందువల్ల ఏదైనా హాని సంభవిస్తుందా? ‘ఈయన ఇంకా కాళికాలయానికి పోతూ ఉన్నారే’ అని నరేంద్రుడు అంటున్నాడు.
‘మ’ : ప్రతిరోజు మీరు క్రొత్త క్రొత్త మనోస్థితులలో ఉంటారు. మీకేమిటి, హాని కలుగటమేమిటి?
శ్రీరామకృష్ణులు: హృదయ్ గురించి సేన్‌తో భక్తులు ఇలా చెప్పారు: ‘హృదయ్‌కి ఎంతో జబ్బుగా ఉంది. దయచేసి మీరు రెండు చొక్కాలు కొని ఇప్పిస్తే, అతడికి పంపుతాం.’ సేన్ ఇచ్చింది రెండు రూపాయలు. దీన్ని ఏమనాలి? అతడి వద్ద ఎంతో ధనం మూలుగుతోంది. అయినప్పటికీ చూడు, రెండు రూపాలయలే ఇచ్చాడు.
‘మ’ : భగవదన్వేషణా, జ్ఞానోపలబ్ధియే జీవితోద్దేశంగా ఎంచిన వారు ఇలా ఎన్నడూ ప్రవర్తించరు.
శ్రీరామకృష్ణులు: భగవంతుడొక్కడే సత్యం, తక్కిన దంతా అసత్యమే.
13.13 త్రయోదశ పరిచ్ఛేదం అధర్ ఇంట్లో – రాఖాల్, ఈశాన్ ప్రభృత భక్తులతో
శనివారం, సెప్టెంబర్ 22, 1883
మధ్యాహ్న సమయం. కలకత్తాలోని అధర్సేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు విచ్చేసి అతిథుల గదిలో కూర్చున్నారు. రాఖాల్, అధర్, ‘మ’, ఈశాన్ తదితర భక్తులు కూడా ఉన్నారు. ఇరుగు పొరుగు పెద్దలు పలువురు కూడా హాజరై ఉన్నారు.
శ్రీరామకృష్ణులకు ఈశాన్చంద్ర ముఖోపాధ్యాయ పట్ల ఎంతో ప్రీతి. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అతడు సూపరింటెండెంట్‌గా ఉండేవాడు. ఉద్యోగ విరమణానంతరం ఈశాన్చంద్ర ధ్యానం, దాన ధర్మాది కార్యాలలో కాలం గడుపుతున్నాడు. గంగాతీరంలో ఏకాంత ప్రదేశాలలో కూర్చుని భగవచ్చింతన చేస్తాడు. గాయత్రీ పురశ్చరణం చేయ నిర్ణయించుకున్నాడు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు.
మఛువా బజారులోని ఆతడి ఇంటికి శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపు ఒకసారి వెళ్లి ఉన్నారు. రోజంతా అక్కడే ఉండి, నరేంద్రుడు మొదలైన భక్తులతో కలసి భోజనం చేశారు.
నరేంద్రుడు రావలసి ఉన్నది. అయితే అతడికి రావటం కుదరలేదు.
13.13.1 బాలుని విశ్వాసం
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): ఉత్తరం తపాలు చేసిన బాలుని కథ మాకు చెప్పండి.
ఈశాన్ (నవ్వుతూ): ఒకసారి ఒక బాలుడు భగవంతుడే మన సృష్టికర్త అని విన్నాడు. వెంటనే తన ప్రార్థనలను ఒక ఉత్తరంలో వ్రాసి, దాన్ని తపాలా డబ్బాలో వేశాడు. ఆ ఉత్తరంపై ఏం చిరునామా వ్రాశాడో తెలుసునా? స్వర్గం. (అందరూ నవ్వారు).
శ్రీరామకృష్ణులు (మందహాసంతో): చూశారా! ఆ బాలుని వంటి విశ్వాసం కావాలి. అప్పుడు మాత్రమే అవుతుంది. (ఈశాన్తో) అవునూ, కర్మ పరిత్యాగం గురించిన ఆ కథ కాస్త చెప్పండి.
ఈశాన్: భగవత్సాక్షాత్కారానంతరం సంధ్యావందనాది క్రియలు తొలగిపోతాయి. ఒక రోజు గంగాతీరంలో అందరూ కూర్చుని సంధ్యవారుస్తున్నారు. కాని వారిలో ఒకడు దాన్లో పాల్గొనలేదు. అందుకు కారణం ఏమిటని అడగ్గా, అతడిలా అన్నాడు: ‘నేను మైలలో ఉన్నాను కనుక సంధ్య చేయజాలను. నా మైలకు మరణమూ, జననమూ రెండూ కారణాలే. అవిద్య అనే తల్లి మరణించింది, ఆత్మజ్ఞానం అనే కుమారుడు జన్మించాడు. నేను ఎలా సంధ్యావందనం చేయగలను?’
శ్రీరామకృష్ణులు: ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు జాతిభేదాలు తొలగిపోతాయి. ఆ కథ చెప్పండి.
13.13.2 శంకరాచార్యులు – సాధువు హృదయం
ఈశాన్: ఒకసారి కాశీలో శంకరాచార్యులు గంగలో స్నానం ఆచరించి స్నానఘట్టం మెట్లు ఎక్కుతున్నారు. అప్పుడు ఆయనకు ఒక చండాలుడు అనేక కుక్కలతో ఎదురుపడ్డాడు. అతడితో ‘అరే, నువ్వు నన్ను స్పృశించావు’ అన్నారు శంకరులు. ఇది విని అతడు ‘మహాత్మా! నేను మిమ్మల్ని స్పృశించలేదు, మీరూ నన్ను స్పృశించలేదు. ఆత్మ అన్నిటికీ అంతర్యామి, నిర్లిప్తం. మద్యంలోను, గంగా జలంలోను ప్రతిఫలించే సూర్యుని ప్రతిబింబంలో తారతమ్యం ఏమైనా ఉంటుందా?’ అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: సర్వధర్మ సామరస్యం, అన్ని మతాల ద్వారాను భగవంతుని పొందటం – దీన్ని గురించీ చెప్పండి.
ఈశాన్ (నవ్వుతూ): హరి – హర శబ్దాలకు ధాతువు ఒక్కటే. ప్రత్యయంలోనే తేడా ఉంది. యథార్థానికి హరి ఎవరో అతడే హరుడు. విశ్వాసం ఉంటే చాలు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): సాధువు హృదయం అన్నింటికంటే ఎలా మహోన్నతమైనది – దీన్ని గురించి చెప్పండి.
ఈశాన్: మన పరిసరాలలో కనిపించే అతిపెద్ద వస్తువు ఈ భూమి. కాని భూమి కంటే విస్తృతమైనది సాగరం; సాగరం కంటే పెద్దది ఆకాశం. కాని మహావిష్ణువు తన ఒక పాదంతో భూమి, ఆకాశం, పాతాళాలను ఆక్రమించాడు. ఆ మహావిష్ణువు పాదమే సాధువుల హృదయాలలో ప్రతిష్ఠితమై ఉంది. కనుకనే సాధువు హృదయం అన్నిటికంటే మహోన్నతమైనది.
13.14 చతుర్దశ పరిచ్ఛేదం శక్తి ఆరాధన బ్రహ్మ ఆరాధనే – బ్రహ్మం శక్తి ఒక్కటే
ఈ పలుకులు విని భక్తులు ఆనందిస్తున్నారు.
ఈశాన్ భాట్‌పాడాలో ఏకాంతవాసం చేస్తూ గాయత్రీ పురశ్చరణ చేయనెంచాడు. గాయత్రి బ్రహ్మమంత్రం. విషయబుద్ధి సమూలంగా నశించనిదే బ్రహ్మజ్ఞానం సిద్ధించదని శ్రీరామకృష్ణులు చెప్పారు. పైగా ఈ కలియుగంలో అన్నగత ప్రాణియైన మనిషి మనస్సు రూప, రస, గంధ, స్పర్శ, శబ్దాదుల నుండి పూర్తిగా వైదొలగటం సాధ్యంకాని పని. అందుచేతనే కలియుగానికి వైదికమతం చెల్లనేరదని శ్రీరామకృష్ణులు అంటారు. ఎవరు బ్రహ్మమో అతడే శక్తి, శక్తిని ఆరాధిస్తే అది బ్రహ్మాన్ని ఆరాధించటమే అవుతుంది. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయనను శక్తి అని పేర్కొంటాం. రెండూ వేర్వేరు కావు, ఒక్కటే.
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అంటూ నీ సమయాన్ని ఎందుకు వృథా చేసుకుంటావు? బ్రహ్మాన్ని గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పలేము, కేవలం అస్తిమాత్రమ్ (అది ఉన్నది) అని చెప్ప గలుగుతాం. కేవలః రామః.
“దేనినైతే మనం చూస్తున్నామో లేక భావిస్తున్నామో అదంతా ఆద్యాశక్తి, చిచ్ఛక్తి అభివ్యక్తీకరణయే. సృష్టి స్థితి లయాలు, జీవ జగత్తులు, ధ్యాస, ధ్యాత, భక్తి, ప్రేమ – ఇవన్నీ ఆ శక్తి అభివ్యక్తీకరణలే.
“కాని బ్రహ్మమూ, శక్తీ అభేదాలు. లంక నుండి తిరిగి వచ్చాక హనుమంతుడు రాముణ్ణి ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: ‘ఓ రామా! నువ్వే పరబ్రహ్మానివి, సీత నీ శక్తి. నుమ్వా, సీతా అభేదమూర్తులు.’ బ్రహ్మమూ శక్తీ, పాము దాని తిర్యక్ గతి (మెలికలు తిరిగే కదలిక) లాంటివి. పామును గురించి తలచినప్పుడు దాని తిర్యక్గతి గురించిన ఆలోచన కూడా తప్పక మన మనస్సులో మెదలుతుంది; తిర్యక్గతి గురించి భావించినప్పుడు, పామును కూడా తప్పక భావించటం జరుగుతుంది. లేక అవి పాలు, దాని తెల్లదనం లాంటివి. పాలను గురించి యోచించినప్పుడు దాని రంగు తెలుపుదనం గురించి తలచుకుంటాం; లేక పాల తెల్లదనాన్ని గురించి ఆలోచించినప్పుడు, పాలను గురించి ఆలోచించకుండా ఉండలేము. లేక అవి నీరు, దాని తడితనం వంటివి. నీటిని గురించి ఆలోచిస్తే దాని తడితనం గురించి ఆలోచింపక ఉండలేము; నీటి తడితనాన్ని గురించి యోచించినప్పుడు, నీటిని గురించి ఆలోచింపక ఉండలేం కదా!
“ఈ ఆద్యాశక్తి, అదే మహామాయ బ్రహ్మాన్ని ఆవరించి ఉన్నది. ఆవరణం తొలగిపోగానే ‘ఇంతకు మునుపు నే నెవరో, నేను అదే’. ‘నేనే నువ్వు, నువ్వే నేను అని గ్రహిస్తాడు.’
“ఆ మాయావరణం ఉన్నంత వరకు వేదాంతవాదుల ‘సోఽహం’ అంటే ‘నేను ఆ పరబ్రహ్మాన్నే’ అనే మాట సరిపడదు. అలలు నీటికి చెందుతాయి, నీరు అలలకు చెందినది కాదు. ఆవరణం నెలకొని ఉన్నంతవరకు భగవంతుణ్ణి ‘అమ్మా, అమ్మా’ అంటూ పిలవడం మంచిది. భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ భక్తుడు ఇలా పలకాలి: ‘నువ్వే తల్లివి, నేను నీ బిడ్డను. నువ్వు ప్రభువువి, నేను నీ దాసుడను.’ సేవ్యసేవక భావమే మంచిది. ఈ దాస్య భావం నుండే తక్కిన భావాలన్నీ – శాంతభావం, సఖ్యభావం మొదలైనవి – ఉద్భవిస్తాయి. యజమాని తన సేవకుణ్ణి ప్రేమించినప్పుడు, అతడితో ‘రా, ఇలా వచ్చి నా ప్రక్కన కూర్చో; మన ఇద్దరి మధ్య తారతమ్యం లేదు!’ అనవచ్చు. కాని సేవకుడు తనంతట తానే యజమాని ప్రక్కన కూర్చోవటానికి ముందుకు వస్తే, యజమానికి కోపం రాదా?
13.14.1 అవతార లీల – వేద, పురాణ, తంత్రాల సమన్వయం – మాయ అంటే?
“అవతార లీల – ఈ సమస్తమూ చిత్ శక్తి యొక్క ఐశ్వర్య అభివ్యక్తీకరణయే. ఏదయితే బ్రహ్మమో అదే రాముడు, కృష్ణుడు, శివుడు కూడా.”
ఈశాన్: అవునండీ. హరి, హర రెండూ ఒకే ధాతువుకు చెందుతాయి. ఉన్న తేడా అంతా ప్రత్యయంలోనే. (అందరూ నవ్వారు)
శ్రీరామకృష్ణులు: అవును. ఉన్నది ఒక్కటే, అన్యమైనది ఏదీ లేదు. వేదాలు ఓం సచ్చిదానందః బ్రహ్మగా పేర్కొన్నాయి. పురాణాలు ఓం సచ్చిదానందః కృష్ణగా, తంత్రాలు ఓం సచ్చిదానందః శివగా పేర్కొంటున్నాయి.
“ఈ చిత్శక్తియే మహామాయ రూపంలో సర్వులనూ అజ్ఞానంలో ఉంచుతుంది. శ్రీరాముని దర్శించిన ఋషులు అందరూ ఆయనను కేవలం ఇలా ప్రార్థించారని అధ్యాత్మ రామాయణంలో పేర్కోబడి ఉంది: ‘ఓ రామా! దయచేసి నీ భువనమోహన మాయలో మేము మైమరచిపోయేలా చేయవద్దు.”
ఈశాన్: ఈ మాయ అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: దేనినైతే మీరు చూస్తారో, వింటారో లేక భావిస్తారో – అదంతా మాయయే. ఒక్క మాటలో చెప్పాలంటే ‘కామినీ కాంచనాలే’ మాయ యొక్క ఆవరణ.
“తాంబూల సేవనం, చేపలను తినటం, పొగ త్రాగటం లేక శరీరానికి నూనె మర్దన చేసుకోవటం – వీటన్నింటిలో దోషం లేదు. కేవలం వీటిని త్యజించినంత మాత్రాన ఒరిగేదేముంది? ఆవశ్యకమైనది ఒక్కటే, ‘కామినీ కాంచన’ త్యాగమే. ఆ త్యాగమే నిజమైన త్యాగం. గృహస్థులు అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధన భజనలు చేసి, భక్తిని అలవరచుకుని మానసికంగా త్యజిస్తారు. కాని సన్న్యాసులు బాహ్యత్యాగం, మానసిక త్యాగం – రెండూ చేస్తారు.
13.14.2 కేశవ్‌చంద్ర సేన్ నవవిధాన్ – నిరాకారవాదం
“ఒకమారు కేశవసేన్తో నేను ఇలా అన్నాను: ‘ఒక కూజా నీరు, ఊరగాయ, చింతపండు ఉన్న గదిలో ఒక సన్నిపాత (టైఫాయిడ్) రోగిని ఉంచితే అతడి రోగం ఎలా నయమవుతుంది?’ అప్పుడప్పుడు ఏకాంతవాసం చేస్తూ ఉండాలి.”
ఒక భక్తుడు: మహాశయా! నవవిధాన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది కలగూరగంప లాంటిదిగా నేను భావిస్తున్నాను.
శ్రీరామకృష్ణులు: అదొక ఆధునిక సంప్రదాయమంటారు కొందరు. అటువంటప్పుడు బ్రహ్మసమాజపు భగవంతుడు వేరే భగవంతుడా? తమ సంప్రదాయాన్ని బ్రహ్మసమాజస్థులు నవవిధాన్ అంటుంటారు. మంచిది, బహుశా అది అలాగేనేమో. షట్ దర్శనాలు ఉన్నట్లే ఏదో ఒకటై ఉండవచ్చు.
“నిరాకారవాదులు ఎక్కడ పొరబడతారో మీకు తెలుసా? భగవంతుడు నిరాకారుడు, తక్కిన మార్గాలన్నీ పొరబాటైనవి అని వారు అంటారు; – ఇక్కడే వారు పప్పులో కాలు వేసేది. కాని భగవంతుడు సాకారుడూ, నిరాకారుడూ – రెండూ కూడా, ఇంకా ఎన్నో విధాలుగా కూడా ఉండగలడని నాకు తెలుసు. ఆయన అన్నీ కాగలడు.
13.14.3 అస్పృశ్యులలోనూ భగవంతుడే విరాజిల్లుతున్నాడు
(ఈశాన్తో) “ఆ చిచ్ఛక్తి, ఆ మహామాయ ఇరవై నాలుగు తత్త్వాలుగా ఉంటోంది. ఒక రోజు ధ్యానంలో ఉండగా నా మనస్సు రసిక్ ఇంటికి వెళ్ళిపోయింది. అతడొక పాకీవాడు. నా మనస్సుకు ఇలా చెప్పాను: ‘ధూర్తుడా! ఇక్కడే ఉండు.’ ఆ ఇంట్లో పలువురు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. వారు కేవలం ముసుగులు. వారిలో ఒకే కుండలినీ, అవే షట్చక్రాలు నెలకొని ఉండటం అమ్మ నాకు దర్శింపచేసింది.
“ఈ ఆద్యాశక్తి పురుషుడా లేక స్త్రీయా? కామార్పుకూర్లో ఒకసారి లాహాగారి ఇంట్లో కాళీపూజ జరుగుతూ ఉంటే చూశాను. జగజ్జనని ప్రతిమకు యజ్ఞోపవీతాన్ని ధరింప చేశారు. ఎవరో ‘జగజ్జననికి యజ్ఞోపవీతాన్ని ఎందుకు వేశారు?’ అని అడిగారు. అందుకు ఆ ఇంటి యజమాని ఇలా జవాబిచ్చాడు: ‘సోదరా! జగజ్జననిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయితే జగజ్జనని పురుషుడా లేక స్త్రీయా అనే విషయం నాకు ఇంకా తెలియరాలేదు.’
“ఆ మహామాయ శివుణ్ణి మ్రింగివేసిందని చెబుతారు. లోపలకు వెళ్లిన శివుడు షట్చక్రాల గురించిన జ్ఞానం పొందాడు. తరువాత ఆమె తొడగుండా బయటకు వచ్చాడు. ఆ తరువాతనే శివుడు తంత్రశాస్త్రాన్ని రూపొందించాడు.
“ఆ చిచ్ఛక్తిలో, ఆ మహామాయలో శరణాగతి పొందాలి.”
ఈశాన్: దయచేసి నన్ను అనుగ్రహించండి.
13.14.4 అగాధంలోకి మునుగు – సచ్చిదానందుడే గురువు
శ్రీరామకృష్ణులు: మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఇలా ప్రార్థించు: ‘ఓ భగవాన్! నాకు నీ దర్శనం కలిగించు.’ విలపించు. భగవంతుని ఇలా ప్రార్థించు: ‘ఓ భగవాన్! కామ కాంచనాల నుండి నా మనస్సును విముఖం చేయి.’ అగాధంలోకి మునుగు. నీటి పైపైనే తేలుతూ లేక ఈదుతూ ఉంటే ముత్యాలు లభిస్తాయా? అందుకై అగాధంలోకి మునిగి వెళ్లాలి.
“గురువు నుంచి ఉపదేశం పొందాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి బాణలింగం అనే శివలింగాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. ఎవరో అతడికి ఇలా చెప్పారు: ‘ఆ ఫలానా నది వద్దకు వెళ్లు. దాని తీరంలో ఒక వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం సమీపంలో ఒక సుడిగుండం ఉంటుంది. దాన్లో దూకితే ఆ శివలింగం నీకు లభిస్తుంది.’ ఆ విధంగానే గురువు నుంచి మార్గాన్ని అడిగి తెలుసుకోవాలి.
ఈశాన్: నిజమేనండీ!
శ్రీరామకృష్ణులు: సచ్చిదానందుడే గురువు రూపంలో మన వద్దకు వస్తాడు. మానవ గురువు నుంచి ఒక వ్యక్తి దీక్ష పుచ్చుకొన్నప్పుడు, ఆ గురువును కేవలం మానవమాత్రునిగా పరిగణిస్తే, ఆ సదరు వ్యక్తి ఏమీ సాధించలేడు. గురువును సాక్షాత్తూ భగవంతునిగా పరిగణించాలి. అలాంటప్పుడు మాత్రమే గురువు ఉపదేశించిన మంత్రం పట్ల శిష్యుడికి విశ్వాసం కుదురుతుంది. విశ్వాసం కలిగిందంటేనే, అన్నీ సాధించినట్లే. ద్రోణుని మట్టి ప్రతిమ ముందు అరణ్యంలో శూద్రజాతికి చెందిన ఏకలవ్యుడు ధనుర్విద్యను అభ్యసించాడు. ఆ మట్టి ప్రతిమనే అతడు సజీవ ద్రోణునిగా ఆరాధించాడు. ఆ విశ్వాసమే అతణ్ణి ధనుర్విద్యాపారంగతుణ్ణి చేసింది.
13.14.5 బ్రాహ్మణ పండితుడు – శాస్త్రాధ్యయనం
“బ్రాహ్మణ పండితులతో ఎక్కువగా వ్యాపకాలు పెట్టుకోవద్దు. వారి ధ్యేయం ఒక్కటే – ధన సంపాదన. స్వస్త్యయనం నిర్వర్తిస్తున్నప్పుడు బ్రాహ్మణ పురోహితులు చండీపారాయణ చేయటం నేను చూశాను. వారు చండీపారాయణం చేస్తున్నారో లేక మరేదైనా పఠిస్తున్నారో చెప్పటం కష్టం. వారు పుస్తకంలోని సగం పుటలను పఠించకుండానే త్రిప్పివేస్తూ ఉంటారు. (అందరూ నవ్వారు)
“తనను తాను చంపుకోటానికి చిన్న పేనాకత్తి చాలు. ఇతరులను చంపాలంటే కత్తి, డాలు మొదలైన ఆయుధాలు అవసరం. శాస్త్రాల ప్రయోజనమూ ఇదే రీతిలో ఉంటుంది.
“నిజానికి నానా శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. వివేకం లేనట్లయితే, కేవలం పాండిత్యంతో ఏమీ ఒరగదు. షట్దర్శనాలను ఆసాంతం అధ్యయనం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఏకాంతంలో, గోప్యంగా భగవంతునికై విలపించు. నీకు అవసరమైనదంతా ఆయన ప్రసాదిస్తాడు.
13.14.6 ఈశాన్ – పురశ్చరణ
పురశ్చరణం చేయటానికై భాట్‌పాడాలో ఈశాన్ ఒక పర్ణశాల కట్టిస్తున్నాడని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (ఉత్సుకతతో): పర్ణశాల కట్టటం పూర్తి అయిందా? విషయం ఏమిటో తెలుసా? ఇటువంటి విషయాలు ఎంతవరకు ఇతరులకు తెలియకుండా చేస్తామో అంత మంచిది. సత్త్వగుణ ప్రధానులైన భక్తులు ఏకాంతంలోనో లేక ఒక అరణ్యంలోనో లేక అంతర్ముఖంగానో (కోనే, వనే, మనే) ధ్యానం చేసుకుంటారు. కొన్ని సమయాల్లో వారు దోమతెర లోపల నుండి ధ్యానం చేస్తూ ఉంటారు.
ఈశాన్ అప్పుడప్పుడు హాజ్రాను భాట్పాడాకు పిలుచుకు వెళ్లేవాడు. బాహ్యశుచి పట్ల హాజ్రాకు వెర్రి అభిలాష. శ్రీరామకృష్ణులు ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని తరచూ హాజ్రాను హెచ్చరించారు.
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): మరో విషయం మీకు చెప్పాలి. బాహ్య శౌచ్యాల గురించి మరీ అంతగా పట్టించుకోగూడదు. ఒకప్పుడు ఒక సాధువుకు బాగా దాహం వేసింది. తోలు నీటిసంచిలో నీటిని గొనిపోతున్న ఒక వ్యక్తి ఆ సాధువుకు నీటిని ఇవ్వబోయాడు. ఆ ‘తోలు’ సంచి పరిశుభ్రంగా ఉందా అని సాధువు అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “స్వామీ! నా ‘తోలు’ సంచి ఎంతో పరిశుద్ధంగా ఉంది. కాని మీ ‘తోలు’ లోపల మలమూత్రాలనే ఎన్నో మలినాలు ఉన్నాయి. అందుకే నా ‘తోలు’ సంచీలోని నీటిని త్రాగండి అని చెబుతున్నాను. మీకెలాంటి దోషమూ ఉండదు.” మీ ‘తోలు’ అనటంలో దేహం, ఉదరం ఇత్యాదులను సూచిస్తున్నాడు.
“భగవన్నామం పట్ల విశ్వాసం కలిగి ఉండండి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు పుణ్యతీర్థ సేవన ఆవశ్యకత కూడా ఉండదు.”
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తులై పాడసాగారు:
నే నెందుకు పోవలె కాశీ కంచీ
గంగా గయ ప్రభాసముకూ
కాళీ నామమును కలవరించుచు
కడపటి శ్వాసను వదులుచుండగా…
ఈశాన్ మౌనంగా అంతా వింటూ ఉన్నాడు.
13.14.7 విశ్వాసంతో సర్వం సాధించగలం
శ్రీరామకృష్ణులు (ఈశాన్తో): ఇంకా ఏవైనా సంశయాలు ఉంటే అడగండి.
ఈశాన్: మహాశయా! విశ్వాసం ఉండాలని చెప్పేశారు కదా!
శ్రీరామకృష్ణులు: నిజమైన విశ్వాసం వలననే భగవత్ ప్రాప్తిని పొందగలం. భగవత్ విషయాలన్నిటి పట్ల విశ్వాసం కుదిరినప్పుడు, సాక్షాత్కారం ఇంకా శీఘ్రగతిని సంభవిస్తుంది. ఆవు తన ఆహారాన్ని ఎంచుకొని తిన్నప్పుడు బొట్లుబొట్లుగా మాత్రమే పాలను ఇస్తుంది. దొరికినదంతా తినే ఆవు ధారాళంగా పాలను ఇస్తుంది.
“రామకృష్ణ బెనర్జీ కుమారుడు ఒక సంఘటనను నాకు చెప్పాడు. ‘తన ఇష్టదైవాన్ని ఒక గొర్రెపోతులో కాంచ’ మని ఒక వ్యక్తికి భగవదాదేశం వినిపించింది. అతడు తక్షణమే దాన్ని విశ్వసించాడు. సకల భూతాలలోను భగవంతుడే నెలకొని ఉన్నాడు.
“ఒక గురువు తన శిష్యుడికి ‘రాముడు మాత్రమే సకల దేహాలలో వసించి ఉన్నాడు’ అని చెప్పాడు. ఆ శిష్యుడు దాన్ని అట్లే విశ్వసించాడు. ఒకసారి, ఒక కుక్క రొట్టెను నోట కరచుకొని పరుగెత్తసాగింది. అది చూసి ఆ శిష్యుడు ఆ కుక్క వెంట ఒక వెన్న గిన్నెతో పరుగుపెట్టి ఇలా అరవసాగాడు: ‘ఓ రామా, కాస్త ఆగు! ఆ రొట్టెకు వెన్న రాచి ఇస్తాను.’
“కృష్ణకిశోర్ ఎంత ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నాడు! అతడు ఇలా అంటూ ఉంటాడు: ‘ఓం కృష్ణ! ఓం రామ! అంటూ నామస్మరణ చేస్తే కోటి సంధ్యావందన ఫలం దక్కుతుంది.’ ఒకమారు రహస్యంగా నాతో ఇలా అన్నాడు: ‘నాకు ప్రస్తుతం ఈ సంధ్యావందనాదులు నచ్చడం లేదు. ఈ విషయం ఎవరికీ చెప్పకండి.’
“కొన్ని సమయాలలో నాకూ అలాగే అనిపిస్తుంది. సర్వమూ తానే అయివున్నట్లు అమ్మ నాకు వెల్లడి చేస్తుంది. ఒకనాడు నేను సరుగుడు తోపు నుంచి పంచవటి కేసి వస్తున్నాను. ఒక కుక్క నన్ను అనుసరించింది. ఆ కుక్క ద్వారా అమ్మ నాకు ఏదో చెప్పబోతుందేమో అన్న ఆలోచన నా మనస్సులో మెదలింది. కనుకనే పంచవటి వద్ద నేను కాసేపు స్థాణువులా నిలబడిపోయాను.
“విశ్వాసం ద్వారా సమస్తాన్ని సాధించగలం అని నువ్వు అనటం ఎంతో సరైనది.”
13.14.8 గృహస్థులు – భగవంతుని కృప
ఈశాన్: కాని మేం గృహస్థులం అయిపోయాం కదా!
శ్రీరామకృష్ణులు: అయితే ఏమిటి? ఆయన కరుణాకటాక్షంతో అసాధ్యమైనది కూడా సుసాధ్యమౌతుంది. ‘ఈ లౌకిక ప్రపంచం కేవలం ఒక మాయామందిరం’ అని రామప్రసాద్ గానం చేశాడు. అందుకు బదులన్నట్లుగా మరొకరు ఇంకో పాట పాడారు:
ఈ లోకమే ఒక్క ఆనందం సౌధం
ఆనందముగ నిందు తిని త్రాగుచునుందు
మతిలేని ఓ వైద్యకుల సంభవుండ*
నీ చూపు విషయాలు పైపైనె చూచు॥ ఈ ॥
ఆ జనక మహారాజు అసమానఘనుడు
ఏ లోప మాతనికి ఇహపరమునందు?
ఇద్దాని అద్దాని తాననుభవించు
పొరలేటి పాత్రలో తన పాలు గ్రోలు॥ ఈ ॥
అయితే మొదట్లో ఏకాంతవాసంలో గోప్యంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి భగవత్సాక్షాత్కారం పొందిన తరువాత సంసారంలో జీవించవచ్చు. అలా చేసినప్పుడే జనక మహారాజులం కాగలం. లేకుంటే అదెలా సాధ్యం?
“చూడండి, శివుడి విషయం తీసుకోండి. ఆయనకు అందరూ ఉన్నారు – కార్తికేయుడు, గణేశుడు, లక్ష్మి, సరస్వతి. అయినప్పటికీ కొన్ని సమయాల్లో ఆయన సమాధిలో మునిగి ఉంటాడు; కొన్ని సందర్భాలలో ‘రాం, రాం’ అంటూ నృత్యం చేస్తూ ఉంటాడు.”