12.1 ప్రథమ పరిచ్ఛేదం సంకీర్తనానందంలో శ్రీరామకృష్ణులు – ఈయనే చైతన్యులా?
సోమవారం, జూన్ 18, 1883
సమయం మధ్యాహ్నం ఒంటి గంట. పానీహాటీ* రాచబాటలోని ఉత్సవ ప్రదేశంలో అసంఖ్యాక జనం గుమిగూడి ఉన్నారు. శ్రీరామకృష్ణులను దర్శించే ఆతురతతో జనం నాలుగు వైపులా నిలబడి ఉన్నారు. సంకీర్తన బృందం మధ్యలో శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాద స్థితిలో నృత్యం చేస్తూ ఉన్నారు. ‘చైతన్యులే మళ్లీ అవతరించి వచ్చారా!’ అనుకున్నారు కొందరు. నాలుగు ప్రక్కలా హరినామం తరంగ ఘోషలా వినవస్తోంది. చుట్టూ పువ్వులు, మధురభక్ష్యాలు గుట్టలా వర్షిస్తూ ఉన్నాయి.
నవద్వీప్ గోస్వామి సంకీర్తనం చేస్తూ రాఘవ ఆలయం కేసి వెళుతున్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా ఎక్కడ నుండో వేగంగా పరుగెత్తి వచ్చి సంకీర్తన బృందం మధ్యలో నిలబడి నృత్యం చేయసాగారు.
ఒకానొక కాలంలో రాఘవ పండితుడు నిర్వహించిన ఉత్సవం శుక్లపక్ష త్రయోదశీ తిథిలో ప్రతీ ఏటా జరుపబడుతోంది. ప్రప్రథమంలో రఘునాథ్ దాస్ ఉత్సవాన్ని ఆరంభించాడు. ఆ తరువాత రాఘవ పండితుడు ప్రతి ఏటా దాన్ని నిర్వహించాడు. నిత్యానందుడు, రఘునాథ్ దాస్‌తో “ఓరీ దొంగా! ఇల్లు వదలి పారిపోయి దొంగతనంగా ఒంటరిగా నువ్వు మాత్రం పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఇది మాలో ఎవరికీ తెలియకుండా జరుపుతున్నావా! అందుకై నీ కొక శిక్ష విధించబోతున్నాను. నువ్వు అటుకుల ఉత్సవం జరిపి భక్తులకు సేవ లొనరించు” అన్నాడు.
శ్రీరామకృష్ణులకు ప్రతీ ఏట ఈ ఉత్సవానికి వెళ్లటం ఆనవాయితీ. ఈ సంవత్సరమూ రామ్ మొదలైన భక్తులతో అక్కడకు వెళ్లదలచారు. అందుకైన ఏర్పాట్లు చేయబడినవి. రామ్, ‘మ’ తో ఉదయాన్నే దక్షిణేశ్వరం చేరుకున్నాడు. ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. తరువాత ఉత్తరం వైపునున్న వసారాలో కూర్చుని ప్రసాదం స్వీకరించారు. ఆ తరువాత తాము కలకత్తా నుండి వచ్చిన బండిలోనే శ్రీరామకృష్ణులను పానీహాటీకి తోడ్కొని వెళ్లారు. రాఖాల్, భవనాథ్, ఒకరిద్దరు భక్తులు శ్రీరామకృష్ణులతో బాటు వెళ్లారు. ఒకరు బండి కప్పుపై కూర్చుని ప్రయాణం చేశారు.
బండి మేగజైన్ రోడ్డు మీదుగా ట్రంకురోడ్డు పైకి వచ్చింది. శ్రీరామకృష్ణులు యువకులతో ఉల్లాసంగా మాట్లాడసాగారు.
12.1.1 పానిహాటీ ఉత్సవంలో శ్రీరామకృష్ణుల మహాభావం
పానీహాటీలో ఉత్సవం జరిగే చోటును సమీపించగానే, అక్కడ జరిగిన సంఘటనను చూసి రామ్ ప్రభృతులు విస్తుబోయారు. అంతసేపు వేడుకగా మాట్లాడుతూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బండి నుండి దిగి, బాణంలా దూసుకెళ్లి జనసమూహంలో కలిసిపోయారు. అక్కడా ఇక్కడా వెదకిన తరువాత చివరకు ఆయన నవద్వీప్ గోస్వామితో సంకీర్తన బృందంలో నృత్యం చేస్తూ ఉండటం చూశారు. మధ్యమధ్యలో సమాధిస్థితులవుతూ ఉన్నారు కూడా. సమాధి స్థితిలో ఆయన క్రింద పడిపోకుండా నవద్వీప్ గోస్వామి ఆయనను జాగ్రత్తగా ఆనుకొని పట్టుకుని ఉన్నాడు. చుట్టూ భక్తులు భగవన్నామం ఉచ్చరిస్తూ ఆయన పాదపద్మాల వద్ద పువ్వులను, మధురభక్ష్యాలను వెదజల్లారు. ఆయనను ఒక్కమారైనా దర్శించాలనే అభిలాషతో జనసమూహాన్ని త్రోసుకొంటూ ఆతురతతో ముందుకు వెళుతున్నారు కొందరు.
దాదాపు బాహ్యస్మృతిని కోల్పోయి శ్రీరామకృష్ణులు నృత్యం చేస్తూ ఉన్నారు. బాహ్యస్మృతి రాగానే పాడసాగారు.
అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులు గార్తురు
ఆనందముతో నాడుచు జగమును హరిభజనముతో నాడ జేతురు
అరుగో అశ్రులు గార్చుచు జగమును ఆక్రందనలో ముంచుచుండిరి
బాధకు ప్రతిగా సోదరు లిరువురు భక్తి పాపులకు పంచి పెట్టుదురు॥ అ ॥
హరి ప్రేమంబున అరుగో మత్తిలి జగమును మత్తిలజేయుచునుండిరి
కృష్ణ బలాయిగ వ్రజమున నుండి ముంతల వెన్నలు మ్రుచ్చిలి దొంగలు
అరుగో ఇద్దరు సోదరులు ఇరుగో ఇట్టుల తిరిగి వచ్చిరి॥ అ ॥
దూరము చేసిన హరిజను నైనను అనుజుని వలె తమ అక్కున నొక్కుచు
వర్ణనియమముల వమ్ముజేసెడి వార లిరువురు వచ్చిరి చూడుడు
నామ భజనమున తమనే మరచుచు జగమున్మత్తము చేయు వారలు॥ అ ॥
వేరుగారు సర్వేశ్వరు కన్నను
పావన నామము పాడుచు నుందురు॥ అ ॥
ఘోరకర్ములగు జగాయి మధాయి
పాపవర్తనము బాపి బ్రోచుచు
శత్రు మిత్రుల తారతమ్యమును
ఎంత మాత్రము ఎంచని వారలు॥ అ ॥
అరుగో ఇరువురు సోదరులు
గౌరు నిత్యానందులు వారు
మానవజాతి సముద్ధరించుటకు
మరల మరల భువి కరుగుదెంతురు॥ అ ॥
శ్రీరామకృష్ణులతో బాటు తక్కిన వారు కూడా ఉన్మాదుల్లా నృత్యం చేస్తున్నారు. చైతన్యుడు, నిత్యానందుడు తమతో కలిసి నృత్యం చేస్తూ ఉన్నారనే ఆనందాన్ని వారు అనుభవించారు. శ్రీరామకృష్ణులు మళ్లీ పాడసాగారు:
చైతన్యుల ప్రేమ తరంగాలలో
నాదియా ఆడుతూన్నది…..
సంకీర్తన తరంగాలు రాఘవ ఆలయంకేసి సాగిపోతున్నాయి. సంకీర్తన బృందం ఆలయం చుట్టి వచ్చి రాధాకృష్ణులకు ప్రణామాలు అర్పించాక గంగా తీరంలోని రాధాకృష్ణుల ఆలయంకేసి వెళ్లసాగింది. ఆ ఆలయం చిన్నదైనందున కొద్దిమంది మాత్రమే లోనికి వెళ్లగలిగారు. ఎక్కువ మంది ఆలయం ద్వారం వద్దనే లోపలికి తొంగి చూస్తూ నిలబడిపోయారు.
పానిహాటీ ఉత్సవ ప్రాంగణం, అక్కడి ఆలయంలో రాధాకృష్ణులు
12.1.2 రాధాకృష్ణుల ఆలయ ప్రాంగణంలో నృత్యం
రాధాకృష్ణుల ఆలయ ప్రాంగణంలో శ్రీరామకృష్ణులు మళ్లీ నృత్యం చేయసాగారు. కీర్తనానందంలో పూర్తిగా ఉన్మత్తులైనారు. మధ్య మధ్యలో సమాధి స్థితిని పొందారు. ఇంకా నాలుగువైపుల నుండి పువ్వులు, మిఠాయిలు ఆయన పాదపద్మాలపై పడ్డాయి. ప్రాంగణం నుండి అప్పుడప్పుడు హరినామ ఘోష వెలువడుతోంది. వీథిలో వెళుతూ ఉన్న భక్తులు దాన్ని విన్నప్పుడు వారూ ప్రతి ధ్వనిలా హరినామాన్ని ఉచ్చరించారు. సమీపంలోని గంగానదిలో పడవలలో పయనిస్తూ ఉన్న జనులు ఇది విని పరవశంతో ‘హరిబోల్’, ‘హరిబోల్’ అంటూ ఎలుగెత్తి కేకలు పెట్టసాగారు. సర్వత్రా హరినామం వెల్లువలై ప్రవహించసాగింది.
ఆ ఉత్సవ వేడుకలు తిలకింప వచ్చి ఉన్న వేలాది జనులలో కొందరు, ‘ఈ మహాత్మునిపై నిశ్చయంగా చైతన్యులు ఆవేశించారు’ అని తలచారు. కొందరైతే, ‘ఈయనే చైతన్యులు’ అనుకున్నారు.
12.1.3 మణిసేన్ అతిథిగృహంలో శ్రీరామకృష్ణులు
ఆ చిన్న ప్రాంగణం నుండి శ్రీరామకృష్ణులను భక్తులు ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. తరువాత ఆయన భక్తులతో మణిసేన్ ఇంటి అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. మణిసేన్ కుటుంబంవారే ప్రస్తుతం ప్రతి ఏటా ఆ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవానికి శ్రీరామకృష్ణులనూ ఆహ్వానిస్తున్నారు.
కాసేపు విశ్రమించాక మణిసేన్, శ్రీరామకృష్ణులను, తన గురువైన నవద్వీప్ గోస్వామిని లోపలి గదిలోకి తీసుకువెళ్లి భోజనం వడ్డించాడు. తరువాత రామ్, రాఖాల్, ‘మ’ మొదలైన భక్తులకు మరో గదిలో భోజనం పెట్టారు. భక్తవత్సలులైన శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి స్వయంగా తామే భక్తులకు ప్రసాదం పెట్టారు.
12.2 ద్వితీయ పరిచ్ఛేదం నవద్వీప్ గోస్వామికి ఉపదేశం
సాయంత్ర సమయం. రాఖాల్, రామ్ ప్రభృత ప్రియతములతో మణిసేన్ ఇంటి అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. నవద్వీప్ గోస్వామి ప్రసాదం ఆరగించాక ఒకింత విశ్రాంతి తీసుకుని అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణుల సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు వచ్చిన బండికి బాడుగ మణిసేన్ చెల్లిస్తానన్నాడు. శ్రీరామకృష్ణులు, రామ్ తదితరులను చూపిస్తూ, “బాడుగను నీ నుండి వీళ్లు ఎందుకు పుచ్చుకోవాలి? వీళ్లూ ఆర్జిస్తూన్న వాళ్లే కదా” అని అన్నారు. తరువాత నవద్వీప్ గోస్వామితో మాట్లాడసాగారు.
12.2.1 చైతన్యుల మహాభావం, ప్రేమ – మూడుదశలు
శ్రీరామకృష్ణులు: భక్తి పరిపక్వత చెందితే భావం జనిస్తుంది. దాని తరువాత మహాభావం, పిదప ప్రేమ, ఆ తరువాత భగవల్లబ్ధి. చైతన్యులకు మహాభావమూ, ప్రేమా ఏర్పడ్డాయి. ఈ ప్రేమ ఏర్పడితే జగత్తును మరచేపోతారు. అంతేకాదు. అతిప్రియమైన దేహాన్ని కూడా మరచిపోతారు. చైతన్యులకు ఈ ప్రేమ జనించింది. సముద్రాన్ని చూసి యమునానదిగా భావించి దాన్లో దూకేశారు. జీవులకు మహాభావం, ప్రేమ ఏర్పడవు. వారు భావస్థితి వరకు పోవచ్చు. చైతన్యులకు ఈ మూడు దశలు కలిగేవి. ఏమంటావు?
గోస్వామి: అవునండీ. అది నిజమే. అంతర్దశ, అర్ధబాహ్యదశ, బాహ్యదశలనే మూడు దశలనూ ఆయన అనుభవించారు.
శ్రీరామకృష్ణులు: అంతర్దశలో ఆయన సమాధిమగ్నులై ఉండేవారు. అర్ధబాహ్య దశలో ఆయన నృత్యం మాత్రం చేయగలిగేవారు. బాహ్యదశలో నామసంకీర్తనం చేసేవారు.
అప్పుడు నవద్వీప్ గోస్వామి తన కుమారుణ్ణి తోడ్కొని వచ్చి శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. అతడు యువకుడు, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు.
గోస్వామి: ఇంట్లోనే శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు. ఈ దేశంలో వేదాలు లభించటం గగనమైపోయింది. మాక్స్‌ముల్లర్ అనువదించి ప్రచురించటం వల్ల జనం చదువగలుగుతున్నారు.
12.2.2 పాండిత్యం, శాస్త్రం – శాస్త్రాల సారాన్ని గ్రహించాలి
శ్రీరామకృష్ణులు: శాస్త్రాలనే మితిమీరి అధ్యయనం చేస్తే మేలు కంటే కీడే అధికం. శాస్త్రాలలోని సారాన్ని గ్రహించాలి. ఆ తరువాత పుస్తకాలతో పని ఏమిటి? సారాన్ని గ్రహించాక భగవత్ ప్రాప్తికై అగాధాలకు పోవాలి.
“వేదాంతసారం ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ అని అమ్మ నాకు తెలిపింది. భగద్గీత సారం ఏమిటి? గీతా, గీతా అంటూ పదిసార్లు వల్లించు. త్యాగీ, త్యాగీ అని వినిపిస్తుంది. అదే గీతాసారం.
గోస్వామి: సరిగ్గా త్యాగీ అని రాదు, తాగీ అనే వస్తుంది. కాని అర్థం మాత్రం ఒక్కటే. రెండిటికీ ధాతువు ‘తగ్’, దీనికి ‘ఘ….ఞ్’ ప్రత్యయం చేరితే ‘తాగః’. దీనిలో ‘ఇన్’ ప్రత్యయం చేరి ‘తాగీ’ అవుతుంది. కాబట్టి ‘త్యాగీ’ అన్నా ‘తాగీ’ అన్నా అర్థం ఒక్కటే.
శ్రీరామకృష్ణులు: ‘జీవులారా! సమస్తం త్యజించి భగవంతుని పొందటానికై సాధన చెయ్యండి’ అన్నదే గీతాసారం.
గోస్వామి: త్యాగం చేయాలన్న మనోభావం కలుగటం లేదే?
శ్రీరామకృష్ణులు: మీరు గోస్వాములు. మీరు ఆలయ పూజారులు, మీరు సంసారం త్యజించటానికి వీలులేదు. మీరు సంసారం త్యజిస్తే ఆలయంలో పూజాదులను ఎవరు చేస్తారు? మీరు మానసికంగా మాత్రమే త్యజించాలి.
“ప్రపంచానికి సోదాహరణంగా భగవంతుడే మిమ్మల్ని సంసారంలో ఉంచాడు. మీరు వెయ్యిసార్లు ప్రయత్నించండి, పరిత్యజించటంలో మీరు సఫలురు కాలేరు. భగవంతుడు మీ కిచ్చిన ప్రవృత్తి ఎలాంటిదంటే, ఆ ప్రవృత్తి కారణాన మీరు సంసార కృత్యాలు నిర్వహించవలసిందే.
“శ్రీకృష్ణుడు, అర్జునుడితో ‘నువ్వు ఏమంటున్నావు? యుద్ధం చేయబోవటం లేదా? నువ్వు తలచుకున్నా యుద్ధం నుండి వైదొలగలేవు. నీ ప్రవృత్తియే నిన్ను యుద్ధానికి పురిగొల్పుతుంది’ అని అన్నాడు.”
12.2.3 సమాధిలో శ్రీరామకృష్ణులు – గోస్వామి యోగం, భోగం
శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన ఉదంతం చెబుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్లీ సమాధిమగ్నులైనారు. శరీరం నిశ్చలమైంది, కనురెప్పలు వాల్చడం లేదు, ఊపిరాడుతున్నదో లేదో తెలియరావటం లేదు. గోస్వామి, అతడి కుమారుడు, భక్తులు అందరూ నివ్వెరబోయి శ్రీరామకృష్ణులనే చూస్తూ ఉండిపోయారు.
కాస్త బాహ్యస్మృతి వచ్చాక శ్రీరామకృష్ణులు, గోస్వామితో ఇలా అన్నారు: “యోగం, భోగం రెండూ ఉన్నాయి. మీరు గోస్వామి వంశస్థులు. మీకు రెండూ ఉన్నాయి. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించటం మాత్రమే చెయ్యి. ‘ప్రభూ! నీ భువన మోహన మాయకు చెందిన ఐశ్వర్యాలను నేను ఆకాంక్షించటం లేదు. నాకు కావలసింది నువ్వే’ అంటూ మనసార ప్రార్థించు. భగవంతుడు సర్వభూతాలలోను విరాజిల్లుతున్నాడు. అలాంటప్పుడు ఎవరిని భక్తుడని పిలవగలం? ఎవరు భగవంతునిలో నెలకొని ఉన్నాడో, ఎవరి మనస్సు, ప్రాణం, అంతరాత్మ – సర్వం భగవంతునిలోనే లయం అయి ఉన్నాయో ఆతడే భక్తుడు.”
శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్యచైతన్యంలోకి వచ్చారు. గోస్వామితో, “నా ఈ స్థితిని కొందరు వ్యాధిగా పేర్కొంటున్నారు. ఏ చైతన్య శక్తిచే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతూ ఉన్నదో ఆ చైతన్య స్వరూపుణ్ణి ధ్యానించటం చేత ఎవరైనా అచేతనులు కాగలరా, అన్నదే నా ప్రశ్న” అని చెప్పారు.
ఉత్సవానికి వచ్చిన భక్తులకు మణిసేన్ వీడ్కోలు తెలిపాడు. వ్యక్తికి తగినట్లు కొందరికి రూపాయ, కొందరికి రెండు రూపాయలు దక్షిణ ఇచ్చాడు. శ్రీరామకృష్ణులకు ఐదు రూపాయలు ఇవ్వబోయాడు. “డబ్బు పుచ్చుకోవటం నా వల్ల కాదు” అని చెప్పారు శ్రీరామకృష్ణులు. మణిసేన్ బలవంతపెట్టాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, “నీ గురువుతోడు, నన్ను బలవంత పెట్టవద్దు” అన్నారు. అప్పటికీ మణిసేన్ వదలిపెట్టలేదు. శ్రీరామకృష్ణులు విసుగుచెంది ‘మ’ తో, “ఏమంటావు? డబ్బు పుచ్చుకోమంటావా?” అన్నారు. అందుకు ‘మ’, “వద్దండీ, ఏమైనాసరే పుచ్చుకోకండి” అన్నాడు.
మణిసేన్ మిత్రులు పళ్లు, మిఠాయిలు కొనే సాకుతో ఆ డబ్బును రాఖాల్కు ఇచ్చారు. అది చూసి శ్రీరామకృష్ణులు ‘మ’ తో, “నేను ఆతడి గురువుపై ఒట్టుపెట్టి డబ్బును తిరస్కరించాను. నా బాధ్యత తీరింది. రాఖాల్ పుచ్చుకున్నాడు. ఇక అతడిదే భారం” అన్నారు.
12.2.4 నిరాకారధ్యానం – శ్రీరామకృష్ణులు
దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్లటానికి శ్రీరామకృష్ణులు భక్తులతో బండిలో ఎక్కారు. దారిలో మతిశీల్ ఆలయ ఉపవనం ఉంది. చాలారోజుల క్రితం శ్రీరామకృష్ణులు ‘మ’ ను ఆ ఆలయంలోని కొలనును తమకు చూపించమని అడగటం జరిగింది. ఆ కొలనులోని చేపలను చూపించి భగవంతుని నిరాకారునిగా ఎలా ధ్యానించాలో వివరిస్తానని చెప్పి ఉన్నారు.
శ్రీరామకృష్ణులకు జలుబు చేసింది. అయినప్పటికీ ఆలయాన్ని దర్శింప బండిలో నుండి దిగారు. ఆ ఆలయంలో చైతన్యులపూజ జరుగుతూ వస్తోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో చైతన్యులకు సాష్టాంగప్రణామం చేశారు. అప్పుడు సమయం సాయంకాలమవుతోంది.
ఆలయం తూర్పువైపున ఉన్న కొలను వద్దకు వచ్చి దాన్లోని చేపలను శ్రీరామకృష్ణులు చూశారు. ఆ కొలను చేపలకు ఎవరూ ఏ రకమైన హానీ కలిగించరు. మరమరాలు మొదలైన వాటిని నీళ్లలో వెయ్యగానే చేపల గుంపులు నీళ్లలో అటూ ఇటూ తిరుగాడుతాయి.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇదుగో ఈ చేపలు ఎలా తిరుగుతున్నాయో చూడు! నిరాకార భగవద్ధ్యానం అంటే, సచ్చిదానంద సాగరంలో ఈ చేపల్లా ఆనందంగా ఈదడం వంటిది.
12.3 తృతీయ పరిచ్ఛేదం రాఖాల్, ‘మ’ ప్రభృతులతో బలరాం ఇంట్లో శ్రీరామకృష్ణులు
సోమవారం, జూన్ 25, 1883
అప్పుడు సమయం సాయంత్రం దాదాపు ఐదుగంటలు అయివుంటుంది. శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి వచ్చి ఉన్నారు. ‘మ’ సమీపంలో కూర్చుని ఉన్నాడు. రాఖాల్ కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో ఉన్నారు.
12.3.1 స్వస్వరూప దర్శనం – భగవద్దర్శనం – ఆత్మదర్శనం
శ్రీరామకృష్ణులు (పారవశ్యంలో): ఇదుగో చూడు, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే స్వస్వరూపాన్ని గాంచగలం. ఏ మేరకు విషయ భోగవాంఛలు అధికంగా ఉంటాయో, ఆ మేరకు స్వస్వరూప దర్శనం తగ్గుముఖం పడుతుంది.
‘మ’ : దాన్లో ‘దూకివెయ్యాలి’ అని చెబుతారు కదా!
శ్రీరామకృష్ణులు (ఆనందంతో): అలా చెప్పు.
అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు మళ్లీ మాట్లాడసాగారు:
(‘మ’ తో) “ఇదుగో చూడు, అందరికీ ఆత్మదర్శనం కలుగుతుంది.”
‘మ’ : నిజమేనండీ. కాని భగవంతుడు కర్త. పాత్రానుగుణంగా ఆయన కొందరికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తాడు, కొందరిని అజ్ఞానంలో ముంచెత్తుతాడు.
12.3.2 హృదయపూర్వక ప్రార్థన – నిత్యం, లీల
శ్రీరామకృష్ణులు: అలా కాదు. మనోవ్యాకులతతో ఆయనను ప్రార్థించాలి. ప్రార్థన మన హృదయాంతరాళం నుంచి వచ్చినట్లయితే ఆయన దాన్ని తప్పక వింటాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు.
ఒక భక్తుడు: అవునండీ, ‘నేను’ ఉండే పక్షంలో ప్రార్థన చెయ్యవలసే ఉంటుంది.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): మెట్ల ద్వారా మేడ మీదికి వెళుతూ ఉన్నట్లు లీలను పట్టుకునే నిత్యాన్ని పొందాలి. నిత్యాన్ని దర్శించిన తరువాత నిత్యం నుండి లీలకు దిగివచ్చి భక్తిని గైకొని భక్తుల సాంగత్యంలో జీవించవచ్చు. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఇదే శ్రేష్ఠమైన మార్గం.
“భగవంతునికి నానారూపాలు, నానాలీలలు ఉన్నాయి. ఈశ్వరలీల, దేవలీల, మానవలీల, జగత్ లీల అంటూ ఆయన లీలలు పలురకాలు. ప్రేమభక్తిని బోధించే నిమిత్తమే ప్రతి యుగంలోను భగవంతుడే మానవుడుగా అవతరిస్తూన్నాడు. చైతన్యమహాప్రభువును చూడండి! అవతారపురుషుని ద్వారానే భగవంతుని ప్రేమభక్తిని చవిచూడవచ్చు. ఆయన లీలలు అనంతమైనవి. కాని నాకు కావలసినదంతా ప్రేమా, భక్తే. నాకు కావలసింది పాలు. పాలు ఆవు పొదుగు నుండి వస్తాయి. అవతారపురుషులు ఆవు పొదుగువంటివారు.”
శ్రీరామకృష్ణులు ‘నేను అవతరించాను. నన్ను దర్శిస్తే భగవంతుని దర్శించినట్లే’ అని చెబుతున్నారా? చైతన్యులను గురించి చెప్పి తమనే సూచిస్తూ ఉన్నారా?
12.4 చతుర్థ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో వివిధ భావాలలో శ్రీరామకృష్ణులు
బాగా ఎండ కాచిన ఒక సాయంత్రం. కాసేపట్లో రాత్రి కాబోతోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని శివాలయాల మెట్ల మీద కూర్చుని ఉన్నారు. ‘మ’ మంచుగడ్డలు మొదలైనవి తీసుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి, ఆయన పాదాల వద్ద, మెట్లపై కూర్చున్నాడు.
12.4.1 జె.ఎస్.మిల్ – శ్రీరామకృష్ణులు – మనిషి పరిమితుడు, నియమబద్ధుడు
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): మణిమల్లిక్ మనుమరాలి భర్త వచ్చి ఉన్నాడు. అతడు ఏదో పుస్తకం* చదివాడట. దాన్లో ‘భగవంతుడు అంత గొప్ప జ్ఞాని అని కానీ, సర్వజ్ఞుడని కానీ తోచడంలేదు. భగవంతుడు జ్ఞాని, సర్వజ్ఞుడు అయితే ఎందుకు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి? మరణం తథ్యం, అలాంటప్పుడు ఒకేసారి చంపివెయ్యవచ్చునుగదా, అలా కాకుండా కొంచెం కొంచెంగా క్షోభకు లోనుచేసి చంపటం ఎందుకు? నేనే అయి ఉంటే దీని కంటే మంచి లోకాన్ని సృష్టించి ఉండేవాణ్ణి’ అని ఆ గ్రంథకర్త వ్రాసి ఉన్నాడట.
‘మ’ ఆశ్చర్యంతో ఆ పలుకులు విని మౌనంగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు:
“భగవంతుణ్ణి మనం తెలుసుకోగలమా ఏమిటి? నేను కూడా ఒక్కోసారి ఆయనను మంచివాడిగాను, మరోసారి చెడ్డవాడిగాను భావిస్తూంటాను. ఆయన మనల్ని మహామాయలో ఉంచాడు. కొన్ని సమయాలలో మనల్ని జాగృతం చేస్తాడు. కొన్ని సమయాలలో అజ్ఞానంలో ముంచివేస్తాడు. ఒక క్షణం అజ్ఞానం తొలగిపోతుంది, మళ్లీ ఆవరిస్తుంది. పాచితో మూసుకుపోయిన కొలనులోకి రాయి విసిరితే ఒకింత నీటిని చూడగలుగుతాం. అయితే కాసేపట్లో మళ్లీ పాచి కదలుతూ వచ్చి ఆ కొద్దిపాటి నీటిని మూసివేస్తుంది.
“దేహబుద్ధి ఉన్నంతవరకే సుఖదుఃఖాలు, జనన మరణాలు, రోగశోకాలు ఉంటాయి. ఇవన్నీ దేహానికి మాత్రమే కాని ఆత్మకు కాదు. దేహం మరణించిన తరువాత భగవంతుడు అతణ్ణి మంచిచోటుకి తీసుకువెళుతూండవచ్చు. ఇది ఎలాగంటే, ప్రసవ వేదన అంతరం శిశువు జన్మించినట్లు. ఆత్మజ్ఞానం పొందాక సుఖదుఃఖాలు, జనన మరణాలు స్వప్నంలా తోస్తాయి.
“మనకు ఏం తెలుసు! ఒక సేరు పాత్రలో పది సేర్ల పాలను ఉంచగలమా? ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవటానికి వెళ్లింది. తిరిగివచ్చి సమాచారం అందివ్వదు. అది సముద్రంలోనే కరిగిపోతుంది.”
12.4.2 …ఛిద్యంతే సర్వసంశయాః,…తస్మిన్ దృష్టే పరావరే
సంధ్యాసమయమైంది. అన్ని ఆలయాలలో దీపారాధన మొదలైంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్నమంచం మీద కూర్చుని జగజ్జననిని ధ్యానిస్తున్నారు. రాఖాల్, లాటు, రామ్‌లాల్, కిశోరీ, గుప్త మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. ‘మ’ నాటి రాత్రి అక్కడ బస చేయాలనుకున్నాడు.
తమ గదికి ఉత్తరం వైపు ఉన్న చిన్న వసారాలో శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. అతడితో “ప్రాతఃకాలాన, రాత్రి అంతమయ్యేటప్పుడు ధ్యానం చేయటం మంచిది. ప్రతి రోజూ సంధ్యాకాలంలో ధ్యానించాలి” అన్నారు. సాకార, నిరాకారాలను ఎలా ధ్యానించాలో కూడా తెలియజేశారు.
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు రాత్రి దాదాపు తొమ్మిది గంటలు అయివుంటుంది. ‘మ’ సమీపంలో ఉన్నాడు. రాఖాల్ మొదలైన భక్తులు మధ్య మధ్యలో గదిలోకి వస్తూపోతూ ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఇలా చూడు, ఇక్కడికి వచ్చేవారందరి సందేహాలు తీరిపోతాయి. నువ్వు ఏమంటావు?
‘మ’ : అవునండీ.
ఆ సమయంలో గంగానదిలో చాలా దూరంలో పడవ నడిపేవాడు ఒకడు తెడ్డు వేస్తూ పాడుకొంటున్నాడు. ఆ మధుర కంఠస్వరం అనాహత ధ్వనిలా నదిపై మెల్లగా తేలుతూ వచ్చి శ్రీరామకృష్ణుల కర్ణకుహరాలలో ప్రవేశించింది. శ్రీరామకృష్ణులు వెంటనే పారవశ్య స్థితిని పొందారు. ఆయనకు రోమాంచితమైంది. ‘మ’ చెయ్యిపుచ్చుకొని, “చూడు, చూడు. నాకు రోమాంచితమవుతోంది. నా శరీరం పట్టుకుని చూడు” అన్నారు. పరవశత్వంలో రోమాంచితమైన శ్రీరామకృష్ణుల శరీరాన్ని స్పృశించి చూసిన ‘మ’ విస్తుబోయాడు. ఆనంద పరవశ శరీరం! ఉపనిషత్తులు బ్రహ్మాన్ని విశ్వం, ఆకాశాలలో ఓతప్రేతమై ఉన్నట్లుగా అభివర్ణిస్తాయి. ఆ బ్రహ్మమే శబ్దరూపంలో శ్రీరామకృష్ణుల శరీరాన్ని స్పృశిస్తోందా? శబ్దబ్రహ్మం అంటే ఇదేనా?
కాసేపు గడిచాక శ్రీరామకృష్ణులు మళ్లీ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఇక్కడ వచ్చేవారందరూ మంచి సంస్కారాలు గలవారు. నువ్వు ఏమంటావు?
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: అధర్ మంచి సంస్కారవంతుడు.
‘మ’ : అవునండీ.
శ్రీరామకృష్ణులు: సరళ (కల్లాకపటంలేని) స్వభావం కలిగితే భగవంతుణ్ణి శీఘ్రంగా పొందవచ్చు. సన్మార్గం, దుర్మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయి. సన్మార్గంలో వెళ్తూవుండాలి.
12.4.3 సర్వం ఎందుకు త్యజించాలి?
‘మ’ : అవునండీ. దారంలో ఒక పోగు విడివడినా దారం సూది బెజ్జంగుండా పోదు.
శ్రీరామకృష్ణులు: తినేటప్పుడు నాలుకకు ఒక వెంట్రుక తగిలినా ముద్దను అలాగే ఉమ్మివేయాల్సి వస్తుంది.
‘మ’ : కాని భగవద్దర్శనం అయిన వ్యక్తికి దుష్టుల సాంగత్యం ఎటువంటి హాని కలిగించదు అని మీరు చెబుతూ ఉంటారు కదా! ప్రజ్వలించే అగ్నిలో పచ్చి అరటిచెట్టు సైతం దగ్ధం అయిపోతుంది. అదే విధంగా జ్ఞానాగ్నిలో అన్నీ బూడిద అయిపోతాయి.
శనివారం, జూలై 14, 1883
12.4.4 అధర్ ఇంట్లో చండీ పారాయణం
కలకత్తాలోని అధర్సేన్ గృహం. శ్రీరామకృష్ణులు అక్కడకు ఏతెంచారు. రాఖాల్, ‘మ’ మొదలైన వారూ వచ్చివున్నారు. పూజామందిరంలో పాటకు ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌నారాయణ్ పాడుతున్నాడు.
నాకేదీ ఇక భయము
మృతి యన నిర్భయము
నాకేదీ మృతిభయము
లేదిక నాకే భయము….
శ్రీరామకృష్ణులు పాటను ఒకింత వినగానే పారవశ్యస్థితిని పొందారు. లేచి నిలబడి మధ్యమధ్యలో గాయకుడితో కలిసి పాడుతున్నారు. క్రొత్తగా కొన్ని చరణాలు కూడ చేరుస్తున్నారు. ‘అమ్మా, నన్ను నీవద్దకు చేర్చుకో, అమ్మా!’ అని పాడుతూ మళ్లీ సమాధిమగ్నులైనారు. బాహ్యచైతన్యాన్ని కోల్పోయి, నిశ్చలంగా నిలబడిపోయారు.
గాయకుడు మళ్లీ పాడసాగాడు:
వినరా సోదర దేవిచరితము
వీనులవిందుగ తందానతాన
యుద్ధభూమిలో చిచ్చుపెట్టెడు
యువతి ఎవ్వరచట! తందానతాన
నల్లమేఘముల కన్న నల్లగా
నాతిరూపు మెరయ తందానతాన
ఆమె దంతముల నుండి జ్వాలలు
మెరపులాగ మెరసి
భ్రాంతిచెందెడు కాంతులంతట
గ్రక్కుచున్నవట తందానతాన
దేవదానవ యుద్ధమందున
దేవి పరుగులెత్త
విరియబోసిన జుట్టు వెనుకగా
పరుగుదీయుచుండె తందానతాన
అట్టహాసము చేసెరా సై
అసురసేనలు అదరెరా సై
వారి గుండెలు చీలెరా సై
తళతళ మెరసి
మెరుపులు చిందుచు
కన్నులు మిరుమిట్లు
గొల్పెరా! సై
ఎట్టి యుద్ధమో తమ్ముడూ
చూడలేమురా సోదరా,
చెమట బిందువులు చేరి బొమలపై
అందమొలుకుచుండె తందానతాన
దట్టమైన ఆ నల్లకురులపై
మ్రోగె మధుపములును తందానతాన
ఆమె అందమె సాగరంబుగా
చందమామ జూచి
సిగ్గుచెందుచు ముఖము మీదను
ముసుగుకప్పుకొనియె తందానతాన
వింతలకెల్ల వింతయైన ఈ
కాంత ఎవ్వరండి? తందానతాన
మాయచేయు ఈ మగువ ఎవ్వరో
చెప్పగలరా నాకు తందానతాన
శివుడు ఓడి ఆమె పదముల చెంతను
పడెను శవము వలెను తందానతాన
ఊహచేసెను కమలకాంతుడు
ఆమె ఎవరో కాదు తందానతాన
అన్ని లోకముల కమ్మయైన యా
హస్తిగమన కాళి, తందానతాన
వినరా సోదర దేవిచరితము
వీనుల విందుగా తందానతాన తరికిట, తక, తరికిట, తరికిటతై!
శ్రీరామకృష్ణులు మళ్లీ సమాధిమగ్నులయ్యారు. పాటలు ముగిశాక పూజా మందిరం నుండి మేడ మీద ఉన్న చావడిలోకి వెళ్లి, భక్తులతో కలిసి కూర్చున్నారు. అప్పుడు భగవంతుని గురించి పలురకాల మాటలు దొర్లాయి. కొందరు భక్తులు ఫల్గునది వంటివారు. వారిలో లోపల సారం ఉంది, కాని బయటకు ఏమీ కనిపించదు – ఇటువంటి సూక్తులు వెలిబుచ్చారు.
12.5 పంచమ పరిచ్ఛేదం కలకత్తాకు వెళ్ళే మార్గంలో భక్తులతో శ్రీరామకృష్ణులు
శనివారం, జూలై 21, 1883
అప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అయివుంటుంది. రామ్‌లాల్, ఒకరిద్దరు భక్తులతో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి బండిలో కలకత్తాకు బయలుదేరారు. బండి కాళీ ఆలయ సింహద్వారం దాటుతూండగా, ఎదురుగా చేత నాలుగు మామిడిపళ్లతో ‘మ’ వస్తూ ఉండటం శ్రీరామకృష్ణులు చూశారు. వెంటనే బండిని ఆపమన్నారు. ‘మ’ బండి ముందుకు వచ్చి తలవంచి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు మొదట అధర్సేన్ ఇంటికి, తరువాత యదుమల్లిక్ ఇంటికి, చివరగా ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్లాలనుకున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ ను చూసి నవ్వుతూ): నుమ్వా రా. మేం అధర్ ఇంటికి వెళుతున్నాం.
‘మ’ “చిత్తం” అంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. ‘మ’ ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. అతడికి పూర్వజన్మ సంస్కారాలలో నమ్మకం లేదు. అయినప్పటికీ అధర్లో చక్కని సంస్కారాలు ఉండటం వల్లనే అతడు శ్రీరామకృష్ణుల పట్ల భక్తి కలిగి ఉన్నాడని కొన్ని రోజులకు మునుపు శ్రీరామకృష్ణుల వద్దనే ‘మ’ ఒప్పుకొన్నాడు. ఇంటికి వెళ్లి ఆలోచించి చూసినప్పుడు సంస్కార విషయంలో తనకు ఇంకా పూర్తి విశ్వాసం ఏర్పడలేదని అతడు కనుగొన్నాడు. ఆ విషయం తెలుపటానికే ‘మ’ నేడు దక్షిణేశ్వరం వచ్చాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: మంచిది. అధర్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?
‘మ’ : అతడికి భగవంతుడి గురించి ఎంతో వ్యాకులత ఉంది.
శ్రీరామకృష్ణులు: అధర్ కూడా నిన్ను ఎంతో ప్రశంసిస్తున్నాడు.
‘మ’ కాసేపు మౌనం పాటించాడు. తరువాత పూర్వజన్మ సంస్కారాల ప్రస్తావన తీసుకువచ్చాడు.
12.5.1 భగవల్లీలలు అనంతాలు – మనమేమీ తెలుసుకోలేం
‘మ’ : నాకు పూర్వజన్మ, పూర్వజన్మ సంస్కారం పట్ల అంతగా నమ్మకం లేదు. ఇది నా భక్తికి ఆటంకమా?
శ్రీరామకృష్ణులు: భగవంతుని సృష్టిలో సర్వమూ సంభవించవచ్చు అన్న విశ్వాసం ఉంటేనే చాలు. ‘నేను తలచిందే నిజం, ఇతరుల తలపులు తప్పు’ అనే భావాన్ని మనస్సులోకి రానివ్వకు. తరువాత సమస్తాన్ని భగవంతుడే నీకు విశదపరుస్తాడు.
“భగవంతుని లీలలను మానవమాత్రులు తెలుసుకోగలరా? భగవల్లీలలు అనంతాలు. అందుచేతనే నేను వాటిని అర్థం చేసుకోవటానికి కించిత్తు కూడా ప్రయత్నించలేదు. ఆయన సృష్టిలో సమస్తం సంభవమే అని విని ఉన్నాను. దాన్ని మనసులో ఉంచుకుని తక్కిన ఆలోచనలను విడిచిపెట్టి ఆయననే ధ్యానిస్తూ ఉంటాను. ‘నేడు తిథి ఏమిటి?’ అని హనుమంతుణ్ణి అడిగారు. అందుకు ఆతడు ‘తిథి వార నక్షత్రాలేవీ తెలియవు. నేను రాముని ఒక్కడి గురించి చింతన చేస్తూ ఉంటాను’ అని బదులిచ్చాడు.
“భగవల్లీలా వైచిత్ర్యాన్ని తెలుసుకో శక్యమా మనకు? ఆయన మనకు సమీపంలోనే ఉన్నాడు, కాని తెలుసుకోలేకున్నాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని బలరాముడు తెలుసుకోలేదు.”
‘మ’ : అవునండీ. భీష్ముణ్ణి గురించీ మీరు చెప్పి ఉన్నారు గదా!
శ్రీరామకృష్ణులు: అవును, అవును. ఏం చెప్పానో చెప్పు చూద్దాం.
‘మ’ : అంపశయ్యపై పరుండి భీష్ముడు విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడితో, ‘ఇదేమి వింత! మా పితామహుడు మహాజ్ఞాని అయివుండీ మృత్యువు గురించి యోచించి విలపిస్తున్నాడే’ అన్నారు.
“అందుకు, ‘ఎందుకు విలపిస్తున్నాడో ఆయన్నే అడగండి’ అన్నాడు కృష్ణుడు. ‘భగవంతుని లీలలు వేటినీ తెలుసుకోలేకున్నానే అని విలపిస్తున్నాను! ఓ కృష్ణా! నువ్వు పాండవులకు తోడునీడవై ఉన్నావు. అడుగడుగునా వీరిని ఆపదల నుండి కాపాడుతున్నావు. అయినప్పటికీ వీరి కష్టాలకు అంతే లేదే, అని తలచే శోకిస్తున్నాను’ అన్నాడు భీష్ముడు.”
శ్రీరామకృష్ణులు: భగవంతుడు తన మాయచే సర్వాన్ని కప్పి ఉంచాడు. ఒకింత కూడా తెలియనివ్వడు. కామినీకాంచనాలు మాయ. ఈ మాయను తొలగించి చూసిన వారే ఆయనను దర్శించగలరు. నేను ఈ విషయం ఒకరికి విశదపరుస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చటుక్కున నాకొక అద్భుత దృశ్యం చూపించాడు. కామార్పుకూర్లోని ఒక కొలను; దాన్లో ఒక వ్యక్తి పాచిని చేత్తో త్రోసివేసి నీళ్లు త్రాగుతున్నాడు. నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సచ్చిదానంద స్వరూపుడే మాయ అనే పాచితో కప్పబడి ఉన్నట్లు నాకు చూపబడింది. పాచిని తొలగించిన వాడు నీరు త్రాగగలడు.
“శ్రద్ధగా విను! నీకొక అతి గుహ్యమైన విషయం చెబుతాను. ఒకసారి సరుగుడు తోపుకు బయలుకు నిమిత్తం వెళ్ళాను. అప్పుడు ఒక గది తలుపు మూసివున్న దృశ్యం కనిపించింది. గదిలో ఏముందో చూడలేకపోయాను. పేనా కత్తితో తలుపుకు రంధ్రం పెట్ట ప్రయత్నించాను, కాని రంధ్రం పెట్టలేకపోతున్నాను. తొలుస్తూ ఉండగా మట్టి పడి దాన్ని మూసివేయసాగింది. తరువాత ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది.”
ఈ మాటలు చెప్పి శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్లీ మాట్లాడసాగారు:
“ఇవన్నీ అత్యున్నత స్థితికి చెందిన విషయాలు. ఇలా చూడు. ఎవరో నా నోటిని అణచివేసి మూస్తూ ఉన్నట్లుగా ఉంది. భగవంతుడు యోనిలో వసించడం కళ్లారా చూశాను – కుక్కల మైథున చర్యలో ఆయనను చూశాను.
“భగవంతుని చైతన్యం మూలంగానే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతోంది. చిరు చేపలలో కూడా ఆ చైతన్యమే కదలాడుతూ ఉన్నట్లు కొన్ని సమయాలలో గాంచుతాను.”
ఇంతలో బండి శోభాబజారు కూడలిని చేరుకుంది. శ్రీరామకృష్ణులు మళ్లీ మాట్లాడనారంభించారు:
“వర్షాకాలంలో నేల నీటిలో ఊరివున్నట్లు జగత్తు ఈ చైతన్యంలో ఊరివున్నట్లు కొన్ని సందర్భాలలో చూస్తాను.
“ఇలా ఎన్నో నేను చూసి ఉన్నాను. అయినప్పటికీ నాకు లేశమైనా అహంకారం కలుగదు.”
‘మ’ (నవ్వుతూ): ఔరా! మీకా అహంకారం?
శ్రీరామకృష్ణులు: దేవుని తోడు, నాకు కించిత్తూ అహంకారం కూడా లేదు.
‘మ’ : గ్రీసు దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆతడి పేరు సోక్రటీస్. మానవులలో అతడే మహాజ్ఞాని అని అశరీరవాణి పలికింది. అది విని అతడు దిగ్భ్రాంతుడైనాడు. చాలాసేపు ఏకాంతంలో కూర్చుని దాన్ని గురించి చింతన చేసి దాన్ని అవగాహన చేసుకున్నాడు. తరువాత తన మిత్రులతో, “నాకు ఏమీ తెలియదని మాత్రమే నేను తెలుసుకోగలిగాను. కాని ప్రతి ఒక్కరూ, ‘నేను మహాజ్ఞానిని’ అని భావిస్తున్నారు. నిజానికి అందరూ అజ్ఞానులే’ అని అన్నాడు.
శ్రీరామకృష్ణులు: నాకు ఏం తెలుసునని ఇక్కడకు ఇందరు వస్తున్నారు అని కొన్ని సమయాల్లో నేను అనుకుంటూ ఉంటాను. వైష్ణవచరణ్ గొప్పపండితుడు. ఆతడు నాతో, ‘మీరు చెబుతూ ఉన్నవన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. అయినప్పటికీ మీ వద్దకు ఎందుకు వస్తున్నానో తెలుసా? వాటిని మీ ముఖతా వినటానికే’ అనేవాడు.
‘మ’ : మీ పలుకులు అన్నీ శాస్త్రాలతో సరిపోలి ఉన్నాయి. నాడు పానీహాటీలో నవద్వీప్ గోస్వామిగారూ ఇదే చెప్పారు. గీతా గీతా అని పలుమార్లు వల్లిస్తే త్యాగీ త్యాగీ అవుతుందని మీరు చెప్పారు. కాని నిజానికి తాగీ తాగీ అనే వస్తుంది. కాని తాగీ అన్నా త్యాగీ అన్నా ఒకే అర్థం; తగ్ ధాతువు నుండి తాగీ శబ్దం కూడా వస్తుంది అని గోస్వామి చెప్పారు.
శ్రీరామకృష్ణులు: నన్ను పోలిన వ్యక్తిని పండితుడో, సాధునో లేక మరెవరినైనా నువ్వు చూశావా?
‘మ’ : భగవంతుడు మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు. ఇతరులను మెషీను ద్వారా సృష్టించాడు.శాసనం మేరకు ఇతరులను ఆయన సృష్టించాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ రామ్‌లాల్ ప్రభృతులతో): ఇతడు ఏం చెబుతున్నాడో విన్నారా? (మరి కాసేపు నవ్వి చివరికి) భగవంతునిపై ఒట్టు, నాలో నలుసంతైనా అహంకారం లేదు.
‘మ’ : జ్ఞానం వల్ల ఒక మేలు ఒనగూరుతుంది; అది ‘నాకు ఏమీ తెలియదు. నేను ఏమీ కాను’ అన్న ఎరుకను కలిగిస్తుంది.
శ్రీరామకృష్ణులు: అవునవును. నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ కాను. మంచిది. ఆంగ్ల ఖగోళశాస్త్రంలో నీకు నమ్మకం ఉందా?
‘మ’ : వారి సిద్ధాంతాల సహాయంతో క్రొత్త విషయాలను కనుగొనవచ్చు. యురేనస్ అనే గ్రహం యొక్క క్రమరహిత చలనాన్ని దూరదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు నెప్ట్యూన్ అనే కొత్త గ్రహాన్ని కనిపెట్టారు. పైగా గ్రహణాన్ని గురించి ముందుగానే వారు చెప్పగలుగుతున్నారు.
శ్రీరామకృష్ణులు: అవును. అది నిజమే.
బండి అధర్ ఇంటిని సమీపిస్తూ ఉంది. శ్రీరామకృష్ణులు ‘మ’ తో, “సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండు. దీనితోనే భగవల్లాభం సిద్ధిస్తుంది” అన్నారు.
‘మ’ : ‘ఓ భగవంతుడా, నేను నిన్నే ఆకాంక్షిస్తున్నాను. నీ భువనమోహన మాయలో నన్ను భ్రమింపచేయకు. నేను నిన్నే కోరుతున్నాను’ అంటూ ప్రార్థించమని మీరు, నవద్వీప్ గోస్వామితో చెప్పారు.
శ్రీరామకృష్ణులు: అవును. అంతరాంతరాళాల్లో నుంచి ఈ మాట రావాలి.
12.6 షష్ఠ పరిచ్ఛేదం అధర్ సేన్ ఇంట్లో సంకీర్తనానందంలో శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు అధర్సేన్ ఇల్లు చేరుకున్నారు. రామ్‌లాల్, ‘మ’, అధర్, మరో ఒకరిద్దరు భక్తులతో అధర్ ఇంటి ప్రాంగణంలో వెళ్లి కూర్చున్నారు. ఇరుగు పొరుగు వారు కొందరు శ్రీరామకృష్ణులను దర్శించటానికి వచ్చారు. రాఖాల్ తండ్రి కలకత్తాలో నివసిస్తూ ఉండటంతో రాఖాల్ తండ్రి వద్ద ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు (అధర్తో): ఏమిటి, రాఖాల్కు కబురు పంపలేదా?
అధర్: కబురు పంపించానండీ.
శ్రీరామకృష్ణులు రాఖాల్ను చూడాలని ఎంతో ఆతురత చెందటం చూసి అధర్ తన బండిలో ఒకరిని పంపి రాఖాల్ను పిలుచుకు రమ్మన్నాడు.
అధర్, శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చున్నాడు. నేడు శ్రీరామకృష్ణులను దర్శింప అతడు అమితంగా వ్యాకులత చెందాడు. శ్రీరామకృష్ణుల రాక గురించి అతడికి ఇదమిత్థంగా కూడా తెలియదు. అందుచేత ఎటువంటి ముందు ఏర్పాట్లూ చేయలేదు. భగవంతుని ఇచ్ఛ ఉండబట్టే శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్లారు.
అధర్: మీరు ఇక్కడకు వచ్చి చాలా రోజులు అయింది. నేడు మీరు రావాలని ప్రార్థించాను, కంటతడిపెట్టుకొన్నాను.
శ్రీరామకృష్ణులు (ప్రసన్నవదనంతో నవ్వుతూ): ఏమంటున్నావు!
సంధ్య గడిచింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి జగజ్జననికి ప్రణామం చేశారు. ఆయన మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లు తోచింది.
ఆ తరువాత మధుర కంఠంతో, “గోవిందా! గోవిందా! సచ్చిదానంద! హరిబోల్! హరిబోల్!” అంటూ భగవన్నామస్మరణ చేయసాగారు. ఆయన పలుకులు అమృతం చిలికినట్లు ఉన్నది. భక్తులు మౌనంగా నామామృతాన్ని పానం చేస్తున్నారు.
రామ్‌లాల్ పాడసాగాడు.
ఓ శంకరి! నీ నామము భయనాశకరమని విని
నా భారము పడవైచితి నను గావుము కరుణామయి॥ ఓ ॥
నీ గర్భములో నుండి ఈ జగముద్భవమందును
నీ ఆత్మచే అది యంతయు పరివ్యాప్తంబయి యున్నది॥ ఓ ॥
కాళీ యన నీవేనా? రాధా యన నీవేనా?
నీ తత్వము ఎవరైనా అభివ్యక్తము గావింతురె॥ ఓ ॥
ఓ యమ్మా! ప్రతిప్రాణి నీ వాసగృహమమ్మా
మూలాధారమున కుండలినిగా నీ ఉందువు॥ ఓ ॥
ఆ మూలాధారమున నాలుగు దళముల పద్మమున
నీ వాసగృహమే గద కులకుండలినీశక్తి॥ ఓ ॥
ఆపై స్వాధిష్టానము ఆరు దళములలోన
వజ్రాసనమున నీ ఉందువు నీ వాస గృహమదియును॥ ఓ ॥
నాభీదేశము నందు పదిదుదళములుగ
మణిపూరంబను నీలరాజీవము రంజిల్లును॥ ఓ ॥
హృదయస్థానములోని కాసారపు సుధయందు
ద్వాదశ దళపద్మశిఖ ఎరుపుకు కన్నులు సోలు॥ ఓ ॥
సుషుమ్నా మార్గమున ఆ కమలంబెగబ్రాకి
ఓ పద్మపువనరాణీ (ఆ) వికసిత పద్మంబున నుందువు॥ ఓ ॥
నీ పాదస్పర్శనమున ఆ పద్మము వికసింప
అట చీకటి మటుమాయంబగు నీ సందర్శనమున॥ ఓ ॥
కంఠస్థానమునందు షోడశదళ పద్మమున
పొగరంగు దళములలో సూక్ష్మాకాశము గలదు॥ ఓ ॥
దానిని దాటిన వాడు విశ్వంబాకాశములో
లీనంబై కరగుటను, నిరవధిగా తా గాంచు॥ ఓ ॥
ఆపై భ్రూమధ్యము నందొక పద్మము గలదు
రెండూ దళములతోడ ఆ పద్మము వికసించు॥ ఓ ॥
ఆ చోటున మానవు మది బందీయై అడ్డుగడచి
అటనిలచి జీవిత నాటకమును తాజూడగోరు॥ ఓ ॥
అన్నిటికన్నను పైన మనమోహనమగు చక్రము
వేయిదళములతోడ వెల్గొందును శిరమందు॥ ఓ ॥
సర్వేశునకది నిలయము అటకెగసి ఓ శంకరీ
కూర్చుండుము సింహాసనమం దాతని సరసన॥ ఓ ॥
ఆద్యాశక్తివి నీవు నీ వింద్రియ వశకారివి
హిమగిరిసుత ఉమగా యోగులు నిను ధ్యానింతురు॥ ఓ ॥
శివశక్తివి నీవమ్మా అశనంబగు నా కోర్కెల
నశియింపగజేసి జనని పడనీయకు భవమందున॥ ఓ ॥
ఆద్యాశక్తివి నీవు పంచమహాశక్తులును
నయమాతీతను నిన్ను తెలియంగ తరమౌనె॥ ఓ ॥
నీ భక్తులపై కృపచే నీవెన్నో రూపంబులు
ధరియించుచు నుండెదవు ఓ శంకరి! అభయంకరి!॥ ఓ ॥
నీ భక్తుని పంచేంద్రియ మా పంచభూతంబుల
లీనంబయి కరుగంగ ఉండేదీ నీవేగా!॥ ఓ ॥
ఏ రూపము లేని నీ నిర్గుణ సత్యమునే
ఓ మాతా నిన్నొకతనె! నీ భక్తుడు దర్శించును॥ ఓ ॥
12.6.1 నిరాకార సచ్చిదానంద దర్శనం
‘కంఠస్థానమునందు షోడశదళ…’ అనే చరణాలను రామ్‌లాల్ పాడుతూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ‘మ’ తో ఇలా అన్నారు: “ఇది విను. దీనినే నిరాకార సచ్చిదానంద దర్శనం అంటారు. విశుద్ధ చక్రాన్ని భేదిస్తే అంతా ఆకాశమే.”
‘మ’ : చిత్తమండీ.
శ్రీరామకృష్ణులు: ఈ మాయానిర్మితమైన జీవజగత్తుకు అతీతంగా పోయినప్పుడే నిత్యాన్ని చేరవచ్చు. నాదభేదం చేసినప్పుడే (నాదాన్ని అతిక్రమించినప్పుడే) సమాధిస్థితి కలుగుతుంది. ఓంకారోపాసన చెయ్యగా చెయ్యగా నాదాన్ని అతిక్రమించవచ్చు. తరువాత సమాధిస్థితి కలుగుతుంది.
12.7 సప్తమ పరిచ్ఛేదం యదుమల్లిక్ ఇంట్లో సింహవాహినీ దేవి సాన్నిధ్యంలో
శ్రీరామకృష్ణులకు పళ్లు, మిఠాయిలు మొదలైనవి అధర్ సమర్పించాడు. “నేడు యదుమల్లిక్ ఇంటికి వెళ్లాలి” అన్నారాయన.
శ్రీరామకృష్ణులు యదుమల్లిక్ ఇంటికి వెళ్లినప్పుడు అంతటా వెన్నెల ప్రకాశిస్తోంది. మొదట సింహవాహినీ దేవిని దర్శింప పూజామందిరానికి వెళ్లారు. భక్తులూ వెంటవెళ్లారు. పువ్వులతోను, మాలలతోను అలంకృతయై దేవి దేదీప్య మానంగా ప్రకాశిస్తోంది. సమీపంలో పురోహితుడు కూర్చుని ఉన్నాడు. దేవి విగ్రహం ముందు దీపం వెలుగుతోంది. భక్తుడు ఒకరితో ఒక రూపాయి కానుకగా ఇచ్చి జగజ్జననికి నమస్కరించమన్నారు శ్రీరామకృష్ణులు. ఆలయానికి వెళితే కానుక అర్పించాలి కదా!
శ్రీరామకృష్ణులు సింహవాహినీదేవి ముందు చేతులు జోడించుకుని నిలబడ్డారు. ప్రక్కన భక్తులూ చేతులు జోడించుకుని నిలబడ్డారు. ఇలా నమస్కరిస్తూ శ్రీరామకృష్ణులు చాలాసేపు నిలబడిపోయారు. ఏం ఆశ్చర్యం! అట్లే సమాధిమగ్నులైనారు. శిలాప్రతిమలా చలనరహితంగా రెప్పపాటైనా లేకుండా నిలబడి ఉన్నారు.
చాలసేపయ్యాక భారంగా ఊపిరి తీసుకుని మామూలు స్థితికి వచ్చారు. ఏదో మత్తులో చెబుతూ ఉన్నట్లు, “అమ్మా! వెళ్లివస్తాను” అన్నారు. కాని ఆయన కదలలేకపోయారు. అట్లే పారవశ్యస్థితిలో నిలబడిపోయారు. రామ్‌లాల్‌తో, “నువ్వు ఆ పాట పాడు, నేను సాధారణ స్థితికి వచ్చేస్తాను” అన్నారు.
రాంలాల్ ‘ఓ శంకరి! నీ నామము’ అన్న పాటను పాడాడు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులూ, భక్తులూ ప్రాంగణంలోకి వచ్చారు. వచ్చేదారిలో “అమ్మా! నా హృదయంలో నివసించు తల్లీ!” అంటూ ఒకసారి అన్నారు.
యదుమల్లిక్
యదుమల్లిక్ తన కుటుంబ సభ్యులతో చావడి గదిలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో పాడసాగారు:
ఆనందమయి మాతా వెనుకాడకే నీ
నిర్భాగ్య శిశువు నాకు ఆనందమీయగ…..
పాట పూర్తి అయ్యాక పారవశ్య స్థితిలోనే యదుమల్లిక్ని, “ఏమయ్యా? ఏ పాట పాడను? ‘ఎవరనుకొంటివో మాతా నను నీ’ అన్న పాటను పాడనా?” అని అడిగి, పాడసాగారు:
ఎవరనుకొంటివో మాతా నను నీ
ఎనిమిది నెలలకు పుట్టిన బిడ్డని
ఎంచినావటె మాతా నను! నీ
ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా
వెరపును గొలుపగజాలవు నన్ను॥ ఎ ॥
సదాశివుడు తన యెదపై మోసెడు
పదపద్మమునె నాదు సంపదలు
పదపడి ఆస్థిని వదలమనగనే
ఏదో సాకులు వదరుచుందువు॥ ఎ ॥
ఏమనుకొంటివో నీ మగడే ధ్రువ
పరచిన దానపత్రము దాచితి
తప్పదు గెలుపు దావావేసిన
ఒక్క దెబ్బతో ఓడిపోదువు॥ ఎ ॥
పోటీపడెదవా నీ కొడుకెంతటి
ఘటికుడో బాగా తెలియును నీకు
ఏటి ఆట ఇది ఎన్నడెరుగనని
మాటలాడుమన రాంప్రసాదు॥ ఎ ॥
వదలను నిన్ను వేధించక ఇక
పోరు వదలుచు గరువము మాని
బిరబిర నను నీ కరముల నెత్తుచు
ఉరమున హత్తెడు వరకు వదలను॥ ఎ ॥
పారవశ్యస్థితి ఒకింత తగ్గాక శ్రీరామకృష్ణులు, “దేవీ ప్రసాదం తింటాను” అన్నారు. సింహవాహినీదేవి ప్రసాదం తెచ్చి శ్రీరామకృష్ణులకు ఇచ్చారు. యదుమల్లిక్ కూర్చుని ఉన్నాడు. ప్రక్కనే కొందరు మిత్రులూ, బంధువులూ కుర్చీలలో కూర్చుని ఉన్నారు. వారిలో ముఖస్తుతి చేసేవారూ కొందరు ఉన్నారు.
శ్రీరామకృష్ణులు యదుమల్లిక్ను చూస్తూ కుర్చీలో కూర్చుని నవ్వుతూ మాట్లాడారు. శ్రీరామకృష్ణుల భక్తులలో కొందరు ప్రక్క గదిలో ఉన్నారు. ‘మ’, ఒకరిద్దరు భక్తులు ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నారు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): అవునూ, నువ్వెందుకు ఈ విదూషకులను నీతో కూడగట్టుకొన్నావు?
యదుమల్లిక్ (నవ్వుతూ): విదూషకులే అనుకుందాం. మీరు వారిని ఉద్ధరించరా?
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): కల్లు ముంతను పవిత్రీకరింప గంగకు కూడా సాధ్యం కాదు!
12.7.1 సత్యసంధత – పురుషుడి మాట, ఏనుగు దంతం వెనక్కి పోవు
యదుమల్లిక్ చండీపారాయణకు ఏర్పాటు చేస్తానని శ్రీరామకృష్ణులకు వాగ్దానం చేశాడు. చాలారోజులు గడచినా అతడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు.
శ్రీరామకృష్ణులు: ఏమయ్యా? చండీపారాయణ ఏమైంది?
యదుమల్లిక్: అనేక పనులు. అందుచేతనే ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోయాను.
శ్రీరామకృష్ణులు: అదెలా? పురుషుడు మాట ఇచ్చి వెనక్కు తీసుకోడు. ‘పురుషుడి మాట, ఏనుగు దంతం ఒకలాటివి; వెలుపలికి వస్తాయి, వెనక్కుపోవు.’ ఏమంటావు?
యదుమల్లిక్ (నవ్వుతూ): అదేమో నిజమే.
శ్రీరామకృష్ణులు: నువ్వు నేర్పరివి. లెక్కలుగట్టి పనిచేస్తావు. బ్రాహ్మణుడి ఆవు మాదిరి – తక్కువగా మేయాలి, అధికంగా పేడ వేయాలి, బిందెలకొద్దీ పాలూ ఇవ్వాలి. (అందరూ నవ్వారు)
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు, యదుమల్లిక్తో ఇలా అన్నారు: “నాకు అర్థమైపోయింది, నువ్వు రాంజీవన్పురిలో ఉన్న శిలవంటివాడవు. సగం ఉష్ణం, సగం శీతలం. నీ మనస్సు భగవంతుని పైనా ఉంది, సంసారంలోనూ ఉంది.”
తరువాత శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో యదుమల్లిక్ ఇంట్లో మిఠాయిలు పళ్లు, పాలు పుచ్చుకున్నారు. తరువాత ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్లారు.
12.8 అష్టమ పరిచ్ఛేదం ఖేలాత్ ఘోష్ ఇంటికి శుభాగమనం – వైష్ణవునికి ప్రబోధం
శ్రీరామకృష్ణులు ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్లినప్పుడు రాత్రి పది గంటలు అయివుంటుంది. ఆ భవనం, ముందున్న పెద్ద ముంగిలి వెన్నెలలో స్నానమాడుతున్నాయి. ఇంట్లోకి వెళ్లగానే శ్రీరామకృష్ణులు పారవశ్యస్థితిని పొందారు. ఆయనతో రామ్‌లాల్, ‘మ’, ఇంకా కొందరు భక్తులు ఉన్నారు.
ఆ భవనంలో అనేక గదులున్నవి. మేడ మీద వసారా గుండా దక్షిణం వైపు కాస్తదూరం వెళ్లి, తూర్పు వైపు తిరిగి, పిదప ఉత్తరం వైపు కాస్తదూరం వెళితే భవనపు లోగిలిని చేరవచ్చు. ఇంట్లో ఈ భాగానికి వస్తే పెద్ద గదులు, ముందువైపు ఒక పొడవైన వసారా ఉన్నాయి. ఇంట మనుష్యులున్న అలికిడి లేదు.
శ్రీరామకృష్ణులను ఈశాన్యం వైపున ఉన్న ఒక గదిలో ఆసీనులను చేశారు. ఆయన ఇంకా భావపారవశ్యంలోనే ఉన్నారు. ఆయనను అక్కడకు ఆహ్వానించిన భక్తుడు వచ్చి స్వాగతం పలికాడు. అతడు ఒక వైష్ణవుడు. దేహం మీద నామాలు మొదలైన చిహ్నాలు, చేత జపమాల ఉన్న ఒక సంచీ ఉన్నాయి. కాస్త వయస్సు పైబడిన వ్యక్తి. అతడు ఖేలాత్ ఘోష్ బావమరిది. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్లి శ్రీరామకృష్ణులను దర్శించి వస్తూ ఉండేవాడు. కొందరు వైష్ణవులు సంకుచిత మనస్కులు. వారు వేదాంతులను, శాక్తేయులను నిరసిస్తారు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు.
12.8.1 శ్రీరామకృష్ణుల సర్వధర్మ సమన్వయం
శ్రీరామకృష్ణులు (వైష్ణవ భక్తునీ, తక్కిన భక్తులనూ చూస్తూ): నా మతమే సరియైనది, తక్కినవారి మతాలు తప్పు – ఇటువంటి అభిప్రాయం ఉండటం మంచిది కాదు. భగవంతుడు ఒక్కడే, రెండు కానేరడు, ఆయనను విభిన్న జనులు పలురకాల పేర్లతో పిలుస్తున్నారు. కొందరు ‘గాడ్’ అంటున్నారు. మరికొందరు ‘అల్లా’ అని పేర్కొంటున్నారు, కొందరు కృష్ణుడనీ, కొందరు శివుడనీ, కొందరు బ్రహ్మమనీ పిలుస్తూ ఉన్నారు. కొలనులో నీరు ఉంది. ఒక చోట ‘వాటర్’ అని పేర్కొంటున్నారు, మరొక చోట ‘జలం’ అంటున్నారు, ఇంకొక చోట ‘పానీ’ అంటున్నారు. హిందువులు జలం అంటున్నారు. క్రైస్తవులు వాటర్ అంటున్నారు. మహమ్మదీయులు పానీ అంటున్నారు. ఐతే ఉన్న వస్తువు ఒక్కటే. మతం అంటే మార్గం. ఒక్కొక్క మతమూ మనలను భగవంతుని వద్దకు తీసుకుపోయే ఒక్కొక్క మార్గం అవుతుంది. పలుప్రాంతాల నుండి ప్రవహిస్తూ వచ్చే నదులు సముద్రంలో సంగమం అయ్యేట్లుగా.
“వేదాలలోను, పురాణాలలోను, తంత్ర గ్రంథాలలోను ప్రతిపాదించబడింది ఆ సచ్చిదానందుడే. వేదాలలో సచ్చిదానంద బ్రహ్మం; పురాణాలలో సచ్చిదానంద కృష్ణుడు, సచ్చిదానంద రాముడు; తంత్రాలలో సచ్చిదానంద శివుడు. సచ్చిదానంద బ్రహ్మం, సచ్చిదానంద కృష్ణుడు, సచ్చిదానంద శివుడు.”
అందరూ మౌనంగా ఉండిపోయారు.
వైష్ణవ భక్తుడు: మహాశయా, భగవంతుణ్ణి మనం ఎందుకు స్మరించాలి?
12.8.2 జీవన్ముక్తుడెవరు? ఉత్తమ భక్తుడెవరు? – భగవద్దర్శన లక్షణాలు
శ్రీరామకృష్ణులు: ఇటువంటి ఎరుక ఉన్న వ్యక్తి జీవన్ముక్తుడే* కాని అందరికీ ఈ విశ్వాసం లేదు, పైపై మాటలే. ‘భగవంతుడు ఉన్నాడు. ఆయన ఇచ్ఛానుసారమే సమస్తమూ జరుగుతూ ఉన్నది’ అని లౌకికులు అంటూ ఉంటారు. కాని దాన్లో విశ్వాసం ఉంచరు.
“విషయలోలురకు భగవంతుడు ఎటువంటివాడో తెలుసా? పిల్లలు దెబ్బలాడుతున్నారు. అప్పుడు భగవంతుడిపై ఒట్టువేస్తారు. ఇది వయస్సు మళ్లిన బామ్మ, అత్తలు దెబ్బలాడుకుంటున్నప్పుడు చెప్పింది విని మళ్లీ చెప్పటం, అంతే.
“అందరూ భగవంతుణ్ణి గ్రాహ్యం చేసుకోగలరా? భగవంతుడు మంచి వారిని సృష్టించాడు, దుష్టులను సృష్టించాడు; భక్తులను సృజించాడు, భక్తిహీనులను సృజించాడు; విశ్వాసం ఉన్నవారిని సృష్టించాడు, విశ్వాసరహితులను సృష్టించాడు. ఆయన లీలలలో అన్ని వైచిత్ర్యాలూ ఉన్నాయి. ఆయన శక్తి కొన్ని చోట్ల అధికంగా అభివ్యక్తమౌతుంది, కొన్నిచోట్ల తక్కువగా అభివ్యక్తం అవుతోంది. సూర్యరశ్మి మట్టిపైన కంటే నీళ్లలో ఎక్కువగా ప్రకాశిస్తుంది; నీటికంటే అద్దంలో మరింతగా ప్రకాశిస్తుంది. ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, సాధారణ భక్తుడు అంటూ భక్తులలోనూ పలు రకాలు ఉన్నారు. భగవద్గీతలో ఈ కోవల గురించి పేర్కోబడి ఉంది.
వైష్ణవ భక్తుడు: అవునండీ.
శ్రీరామకృష్ణులు: ‘భగవంతుడు ఉన్నాడు, పైన ఆకాశంలో సుదూరంలో ఆయన ఉన్నాడు’ అంటాడు సాధారణ భక్తుడు. మధ్యమ భక్తుడు, ‘భగవంతుడు సర్వభూతాలలోను చైతన్యరూపంలోను, ప్రాణస్వరూపంలోను ఉన్నాడు’ అంటాడు. ఉత్తమ భక్తుడు, ‘భగవంతుడే సర్వమూ అయి ఉన్నాడు. కనిపించేవన్నీ ఆయన వేర్వేరు రూపాలే. ఆయనే మాయ, ఆయనే జీవజగత్తులు, ఆయనే సర్వమూ అయి ఉన్నాడు. ఆయన తప్ప వేరేదీ లేదు’ అంటాడు.
వైష్ణవ భక్తుడు: ఇట్టి మానసిక స్థితి ఎవరికైనా కలుగుతుందా?
శ్రీరామకృష్ణులు: భగవద్దర్శనం కాకుంటే ఇటువంటి మానసిక స్థితి కలుగదు. భగవద్దర్శనం పొందాడో లేదో అనటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు కొన్ని సమయాల్లో ఉన్మాదునిలా నవ్వుతాడు, ఏడుస్తాడు, నాట్యం చేస్తాడు, పాడతాడు. కొన్ని సందర్భాలలో పిల్లవాడిలా, అంటే ఐదేళ్ల బాలుని స్థితిలో కల్లాకపటంలేని వానిలా, ఉదారునిగా ఉంటాడు. అతడిలో అహంకారం ఉండదు, అనాసక్తుడుగా ఉంటాడు. ఏ గుణాలకూ వశవర్తి కాడు. సదా ఆనందమయుడై ఉంటాడతడు. మరికొన్ని సమయాల్లో పిశాచిలా వర్తిస్తాడు. మడి, మైల అనే భేదబుద్ధి అతడిలో ఉండదు. విధి విహితాలన్నీ అతడికి ఒకటే అయిపోతాయి. కొన్ని సమయాల్లో ఏదో చూస్తున్నట్లు, జడునిలా అయిపోతాడు; అప్పుడు ఏ పనీ చేయలేడు. ఏ ప్రయత్నంలోనూ పాల్గొనలేడు.
శ్రీరామకృష్ణులు తమ స్వకీయ స్థితులన్నీ సూచిస్తున్నారా?
శ్రీరామకృష్ణులు (వైష్ణవ భక్తునితో): ‘నువ్వు’, ‘నీది’ – ఇది జ్ఞానం, ‘నేను’, ‘నాది’ – ఇది అజ్ఞానం. ‘ఓ దేవా! నువ్వే కర్తవు, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి; దేహం, మనస్సు, ఇల్లు, ఇల్లాలు, జీవజగత్తు – అన్నీ నీవే. ఏదీ నాది కాదు’ – ఇదే జ్ఞానం.
“అజ్ఞాని, ‘భగవంతుడు “అదుగో, అక్కడ” బహుదూరంలో ఉన్నాడు’ అంటాడు. జ్ఞాని, ‘భగవంతుడు “ఇదుగో, ఇక్కడే” అతిసమీపంలో హృదయ మధ్యంలో, అంతర్యామిగా ఉన్నాడు. అంతేగాక ఆయనే నానారూపాలు ధరించి ఉన్నాడు’ అంటాడు.”
12.9 నవమ పరిచ్ఛేదం బ్రహ్మతత్త్వం – ఆద్యాశక్తి
ఆదివారం, జూలై 22, 1883
12.9.1 జ్ఞానయోగం – నిర్వాణస్థితి
అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు, దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల గది. సెలవు రోజు కావటంతో శ్రీరామకృష్ణుల దర్శనార్థం భక్తులు అనేకులు వచ్చి ఉన్నారు. తక్కిన రోజులలో రావటానికి వారికి సాధ్యపడేది కాదు. అధర్, రాఖాల్, ‘మ’ మొదలైనవారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక బాడుగ బండిలో కాళీ ఆలయానికి వచ్చారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. గదిలో మణిమల్లిక్ ప్రభృత భక్తులు ఉన్నారు.
శ్రీరామకృష్ణుల గది గోడలకు చిత్రపటాలు తగిలించబడి ఉన్నాయి. వాటిలో ఒకటి నీటిలో మునిగిపోతూ ఉన్న పీటర్‌ను, ఏసుక్రీస్తు చెయ్యి అందిస్తూ పైకి లేవదీసి కాపాడుతున్న చిత్రపటం. బుద్ధుని చిన్న శిలాప్రతిమ కూడా గదిలో ఉంది.
శ్రీరామకృష్ణులు మంచం మీద ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ఉన్నారు. భక్తులు కొందరు చాప మీద, కొందరు నేల మీద, కొందరు తివాచీ మీద కూర్చుని ఉన్నారు. మహాపురుషుడూ, ఆనందమయమూర్తీ అయిన శ్రీరామకృష్ణుల వైపే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
వర్షాకాలం కావటంతో పావన గంగానది వెల్లువలో దక్షిణం కేసి పరుగులుతీస్తూ ప్రవహిస్తోంది. సాగర సంగమానికి ఎంత ఆరాటం! ప్రవహించే మార్గంలో ఈ మహాత్ముని ధ్యాన మందిరాన్ని చూడగానే ఒకసారి స్పృశించి, ప్రణామం చేసి పరుగెత్తసాగింది!
మణిమల్లిక్ అరవై, అరవై ఐదేళ్ల వయస్కుడు. ప్రధాన బ్రహ్మసమాజ భక్తుడు. కొన్ని రోజుల క్రితం అతడు కాశీకి వెళ్లి వచ్చాడు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చి ఉన్నాడు. కాశీ గురించి అతడు శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు.
మణిమల్లిక్: నేనొక సాధువును చూశాను. ‘ఇంద్రియ నిగ్రహం లేకుంటే ఏదీ సాధ్యం కాదు. కేవలం భగవంతుడా, భగవంతుడా అనటం వల్ల ఏం ప్రయోజనం?’ అని ఆయన చెప్పారు.
శ్రీరామకృష్ణులు: వీరి పద్ధతి ఏమిటో తెలుసా? మొదట సాధన చెయ్యాలి. శమ, దమ, తితిక్షాదులను అభ్యసించాలి. వీరు నిర్వాణ స్థితిని పొంద ప్రయత్నిస్తున్నారు. వీరు వేదాంతవాదులు. ‘బ్రహ్మసత్యం, జగన్మిథ్య’ అంటూ సదా విచారణ చేస్తూ ఉంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. జగత్తు మిథ్య అంటే నువ్వు మిథ్యయే; ఇలా చెప్పేవాడూ మిథ్యే. ఆతడి పలుకులు కూడా స్వప్నతుల్యాలు. అయితే ఈ అనుభూతి సామాన్య మానసానికి ఎంతో దూరమైనది.
“ఎలాగో తెలుసా? కర్పూరాన్ని వెలిగిస్తే ఏమీ మిగలదు. కొయ్యను మండిస్తే బూడిదయైనా మిగులుతుంది. చివరికి విచారణ అంతంలో సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో ‘నేను’, లేక ‘జగత్తు’ – దేని గురించీ ఆలోచన ఉండదు.
12.9.2 పద్మలోచన్ – విద్యాసాగర్
“పద్మలోచన్ గొప్ప జ్ఞాని. అప్పుడు నేను ‘అమ్మా, అమ్మా’ అంటూ పురశ్చరణ చేస్తూ ఉండేవాణ్ణి. నా పట్ల అతడికి ఎంతో గౌరవం ఉంది. అతడు బర్డ్వాన్ రాజు గారి ఆస్థాన పండితుడు. కలకత్తా వచ్చినప్పుడు కామార్హాటీకి ప్రక్కనున్న ఉద్యానగృహంలో బసచేశాడు. ఆతణ్ణి కలుసుకోగోరాను. ఆతడికి అహంకారం ఉందేమో చూసిరమ్మని హృదయ్‌ని అతడి వద్దకు పంపించాను. ఆతడికి అహంకారం లేదు అని తెలుసుకున్నాను. మేం కలుసుకొన్నాం. అంతగొప్ప పండితుడూ, గొప్ప జ్ఞానీ అయివుండీ రాంప్రసాద్ పాటలు నేను పాడగా విని కంటతడిపెట్టి విలపించాడు.
“నేను ఆతడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పొందిన ఆనందం మరెవరివద్దా పొందలేదు. ఆతడు నాతో, ‘భక్తులతో కలిసి ఉండాలనే ఆశను వదలిపెట్టండి. లేకుంటే నానారకాల జనం వచ్చి మిమ్మల్ని క్రిందికి లాగివేస్తారు’ అని చెప్పాడు.
“వైష్ణవచరణ్ గురువైన ఉత్సవానందునికీ, ఈతడికీ ఉత్తరాల ద్వారా వాదోపవాదాలు జరిగాయి. మేం ఇద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని గురించి ఆసక్తికరమైన ఒక సంఘటనను నాతో చెప్పాడు. ఒక సభలో శివుడు గొప్పవాడా లేక బ్రహ్మ గొప్పవాడా అనే పెద్ద వివాదం తల ఎత్తింది. చివరగా పండితులు అందరూ పద్మలోచన్ను అడిగారు. అందుకు అతడు కల్లాకపటంలేని హృదయంతో, ‘నా పదునాల్గు తరాల వారెవరూ శివుణ్ణీ చూడలేదు, బ్రహ్మనూ చూడలేదు’ అన్నాడట. కామినీకాంచన త్యాగం గురించి నా అభిప్రాయం విని అతడు ఒక రోజు నాతో, ‘వాటిని ఎందుకు త్యజిస్తున్నారు? ఇది ధనం, అది మట్టి అన్న భేదబుద్ధి అజ్ఞానం నుండే కదా జనిస్తోంది?’ అని అడిగాడు. అందుకు నేనేం చెప్పగలను? ‘ఏమో నాయనా, నాకు ధనం, నాణేలు వగైరాలు గిట్టవు బాబూ’ అన్నాను.
“అహంకారపూరితుడైన ఒక పండితుడు ఉండేవాడు. భగవంతుడు సాకార రూపాలను అతడు అంగీకరించడు. కాని భగవల్లీలను ఎవరు తెలుసుకోగలరు? ఒక రోజు ఆద్యాశక్తి రూపంలో ఆయన ఆ పండితుడికి దర్శనం ఇచ్చాడు. ఆ పండితుడు చాలాసేపు బాహ్యచైతన్యం కోల్పోయాడు. కాస్త బాహ్యస్మృతి కలిగాక కా, కా (అంటే ‘కాళి, కాళి’) అని మాత్రమే అతడు అనగలిగాడు.”
12.9.3 విద్యాసాగర్ దయ – మేలిమిబంగారం కప్పబడి ఉంది
ఒక భక్తుడు: మీరు విద్యాసాగర్‌ను చూశారే, ఆయన్ను గురించి ఏమనుకుంటున్నారు?
శ్రీరామకృష్ణులు: విద్యాసాగర్‌లో పాండిత్యం ఉంది; దయ ఉంది. కాని ఆయనకు అంతర్దృష్టి లేదు. లోపల మేలిమి బంగారం కప్పబడి ఉంది. అది ఆయనకు తెలిసివుంటే, బాహ్య కార్యకలాపాలు తగ్గి ఉండేవి, చివరికి అన్నీ పూర్తిగా ఆగిపోయి ఉండేవి. లోపల హృదయ మధ్యంలో భగవంతుడు ఉన్నాడనే సంగతి తెలిసి ఉంటే ఆయన్ను ధ్యానించటంలోనే మనస్సు నిలిచేది. చాలాకాలం నిష్కామ కర్మలు చేశాక కొందరికి వైరాగ్యం జనిస్తుంది. మనస్సు భగవంతుని వైపు మరలుతుంది; ఆయనలోనే మనస్సు లగ్నమైపోతుంది.
“విద్యాసాగర్ చేస్తూన్నవి మంచిపనులే. దయ ఉండటం చాలామంచిది. దయకు మాయకు ఎంతో తారతమ్యం ఉంది. దయ మంచిది, మాయ మంచిది కాదు. భార్యాపిల్లలను, సోదరీసోదరులను, తలిదండ్రులను, బంధువులను ప్రేమించటం మాయ. సర్వజీవులనూ సమానంగా ప్రేమించటం దయ.”
12.10 దశమ పరిచ్ఛేదం “గుణత్రయ వ్యతిరిక్తం సచ్చిదానంద స్వరూపః” – బ్రహ్మం త్రిగుణాతీతం, నోటితో చెప్పలేం
‘మ’ : దయకూడా ఒక బంధమా?
శ్రీరామకృష్ణులు: అవును, నిజమే. అయితే అది సాధారణ జీవునికి సుదూరమైన విషయం. దయ సత్త్వగుణ సంజనితం. సత్త్వగుణంతో స్థితి, రజో గుణంతో సృష్టి, తమోగుణంతో లయం చేయబడుతున్నాయి. కాని సత్త్వరజస్త్సమో గుణాలకు అతీతమైనది బ్రహ్మం; అది ప్రకృతికి అతీతమైనది.
12.10.1 బాటసారి, ముగ్గురు దొంగల కథ
“మూడు గుణాలు బ్రహ్మం దరికి చేరలేవు. ఇది ఎలాగంటే, పట్టుబడతామనే భయంతో దొంగలు ఎలా బహిరంగ ప్రదేశానికి వెళ్లలేరో, అలాగన్నమాట. సత్వరజస్త్సమో గుణాలు మూడు దొంగలు. ఒక కథ చెబుతాను విను.
“ఒక వ్యక్తి అడవిగుండా పోతున్నాడు. అప్పుడు ముగ్గురు దొంగలు ఆ వ్యక్తిని అడ్డగించి అతణ్ణి నిలువుదోపిడీ చేశారు. ఆ దొంగలలో ఒకడు, ‘ఇతణ్ణి ఇలా వదిలిపెట్టటంలో ఏం ప్రయోజనం ఉంది?’ అంటూ, కత్తి దూసి ముందుకువచ్చాడు. అప్పుడు రెండవ దొంగ, ‘వద్దు, ఇతణ్ణి చంపటంలో ఏం ప్రయోజనం ఉంది? కాళ్లూ చేతులూ కట్టి ఇక్కడే పడేసిపోదాం’ అన్నాడు. అట్లే అతడి కాళ్లూచేతులూ కట్టిపడేసి వెళ్లిపోయారు. కాసేపయ్యాక ఆ దొంగల్లో మూడవవాడు తిరిగి వచ్చి, ‘అయ్యో పాపం! బాగా దెబ్బలు తగిలాయా? ఇదుగో, నీ కట్లు విప్పివేస్తాను’ అంటూ, కట్లు విప్పివేశాడు. తరువాత అతడు, ‘రా, నిన్ను రహదారి వరకు తీసుకువెళతాను’ అన్నాడు. చాలసేపయ్యాక ఇద్దరూ రహదారిని చేరుకొన్నారు. అప్పుడు ఆ దొంగ, ‘ఈ దారిలోనే వెళ్లు, అదుగో నీ ఇల్లు కనబడుతోంది చూడు!’ అన్నాడు. ఆ వ్యక్తి దొంగతో, ‘అయ్యా, మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు. మీరూ నాతో రండి, మా ఇంటికి పోదాం’ అన్నాడు. అందుకు దొంగ, ‘నేను అక్కడకు రాలేను. పోలీసులకు తెలుస్తుంది’ అన్నాడు.
“ఈ ప్రపంచమే అడవి; సత్త్వం, రజస్సు, తామసం అనే మూడు గుణాలు దొంగలు. వాళ్లు మనిషి తత్త్వజ్ఞానాన్ని అపహరిస్తున్నారు. తమోగుణం మనిషిని నాశనం చేయ ప్రయత్నిస్తుంది. రజోగుణం సంసారంలో అతణ్ణి బంధిస్తుంది. కాని సత్త్వగుణం అతణ్ణి రజస్త్సమోగుణాల నుండి రక్షిస్తోంది. సత్త్వగుణం మనిషిని కామక్రోధాది తమోగుణాల నుండి పరిరక్షిస్తుంది. సత్త్వగుణం జీవుని సంసార బంధం నుండి విమోచనం కలిగిస్తుంది. కాని సత్త్వగుణమూ ఒక దొంగే, తత్త్వజ్ఞానాన్ని అది అందివ్వలేదు. కాని ఆ ఉన్నత స్థితిని పొందటానికైన మార్గాన్ని అది చూపుతుంది. ఆ మార్గంలో మనలను చేర్చి, ‘అదుగో చూడు, అక్కడ నీ గృహం కానవస్తోంది’ అంటుంది. అయితే సత్త్వగుణం కూడా బ్రహ్మజ్ఞానం నుండి ఎంతో దూరంలో ఉంది.
“బ్రహ్మాన్ని మాటలలో వర్ణింపజాలం. దాన్ని పొందిన వ్యక్తీ వివరించలేడు. కాలాపానీ చేరిన పడవ, తీరం చేరుకోదు అనే లోకోక్తి ఒకటి ఉంది.
“ఒకప్పుడు నలుగురు మిత్రులు నడుస్తూ వెళుతున్నప్పుడు దారిలో గోడచే ఆవృతమైన ఒక స్థలం చూశారు. గోడ చాల ఎత్తైనది. లోపల ఏముందో చూడాలనే కుతూహలం వారికి కలిగింది. ఒకడు గోడెక్కి లోపల తొంగిచూశాడు. అక్కడ చూసిన దృశ్యంతో భ్రమించిపోయి, నోట మాటరాక ‘హా! హా!’ అంటూ కేకపెట్టి లోపలికి దూకేశాడు. అతడు ఏ వివరమూ చెప్పలేదు. గోడనెక్కిన అందరూ ‘హా! హా!’ అని మాత్రం కేకలుపెడుతూ లోపలికి దూకినప్పుడు, సమాచారం చెప్పేది ఎవరు?
12.10.2 జడభరతుడు, దత్తాత్రేయుడు, శుకుడు… వీరు బ్రహ్మ జ్ఞానులు
“జడభరతుడూ, దత్తాత్రేయుడూ తాము పొందిన బ్రహ్మదర్శనం గురించి ఏమీ వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానం పొంది, సమాధిస్థితి ఏర్పడితే, ఆ తరువాత ‘నేను’ ఉండదు. అందుకే రాంప్రసాదు ‘మనసా! నీ వల్ల కాకుంటే రాంప్రసాద్‌ను తోడ్కొని వెళ్లు’ అని పాడాడు. మనస్సు జ్ఞానంతో లయం అయిపోవాలి. రాంప్రసాద్, అంటే ‘నేను’ తత్త్వం అదృశ్యమైపోతుంది. అప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.”
ఒక భక్తుడు: మహాశయా! శుకదేవుడికి బ్రహ్మజ్ఞానం కలుగలేదా?
శ్రీరామకృష్ణులు: ‘శుకదేవుడు బ్రహ్మసాగరాన్ని చూశాడు, స్పృశించాడు, అంతే; దాన్లో దిగి మునకవేయలేదు; అందుచేతనే తిరిగి వచ్చి అన్ని ఉపదేశాలు చేశాడు’ అని కొందరు అంటారు. కాని ఆయన బ్రహ్మజ్ఞానం పొందాక లోకోపదేశార్థం దిగివచ్చారు అని కొందరు అంటున్నారు. ఆయన పరీక్షిత్తుకు మహాభగవతం ఉపదేశించాడు, ఇంకా మరెన్నో బోధనలు చేశాడు. అందుకే భగవంతుడు ఆయన ‘నేను’ భావాన్ని అడుగంటా నశింపచేయలేదు. ఆయనలో ‘విద్యా నేను’ ఒకింత ఉంది.
12.10.3 సంఘాలు, సంప్రదాయాల గురించి కేశవ్‌కు ప్రబోధించిన సంఘటన
ఒక భక్తుడు: బ్రహ్మజ్ఞానం పొందాక సంఘం, సమాజం వగైరాలు నిలుస్తాయా?
శ్రీరామకృష్ణులు: ఒక రోజు నేను కేశవ్‌తో బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు కేశవ్, ‘ఇంకా చెప్పండి’ అని అడిగాడు. అందుకు నేను, ‘ఇంకా చెబితే మీ సంఘం, సమాజాలు ఏవీ నిలిచి ఉండవు’ అన్నాను. ‘అలా అయితే వద్దులెండి’ అన్నాడు కేశవ్. (అందరూ నవ్వారు) అప్పుడు కేశవ్‌తో – ‘నేను, నాది’ అనటం అజ్ఞానం. అజ్ఞానం లేకుంటే ‘నేను కర్త’, ‘నా భార్య, పిల్లలు, ధనం కీర్తి’ లాంటి భావాలు రావు’ అని చెప్పాను. అందుకు కేశవ్, “మహాశయా, ‘నేను’ భావాన్ని వదలివేస్తే తదనంతరం ఏమీ మిగలదే” అన్నాడు. దానికి నేను, “కేశవ్, నువ్వు ‘నేను’ అన్న భావాన్ని పూర్తిగా వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు. ‘అపరిపక్వమైన నేను’ ను త్యజించు. ‘నేను కర్త’, ‘నా భార్య, పిల్లలు’, ‘నేను గురువు’ – ఇటువంటి అహంకారమే ‘పరిపక్వంకాని నేను’. దీన్ని త్యజించి, ‘పరిపక్వమైన నేను’ గా ఉండు. అంటే, ‘నేను ఆయన దాసుడను, నేను ఆయన భక్తుణ్ణి, నేను కర్తను కాను, ఆయనే కర్త’ అనే భావంలో ఉండండి” అని చెప్పాను.
12.10.4 భగవదాదేశం పొందిన తరువాతే ధర్మప్రచారం
ఒక భక్తుడు: ‘పరిపక్వ నేను’ స్థితిలో సంఘం, సంస్థ మొదలైనవి నిలువవా?
శ్రీరామకృష్ణులు: నేను కేశవ్‌తో, ‘నేను నాయకుడను, నేను సంఘం నడుపుతున్నాను, నేను జనులకు బోధిస్తున్నాను’ అనే ‘నేను’ ‘అపరిపక్వమైన నేను’ అని చెప్పాను. ధర్మప్రచారం చేయటం ఎంతో కష్టం. భగవదాదేశం లేకుండా అది సాధ్యం కాదు. ఆయన అనుజ్ఞ ఉండాలి. శుకదేవుడు, భాగవతం ప్రవచనం చేయడానికి ఆదేశం పొందాడు. భగవద్దర్శనానంతరం, ఎవరైనా ఆయన ఆదేశం పొంది ప్రచారం చేస్తే, ప్రజలకు బోధిస్తే, దాన్లో ఎటువంటి దోషమూ లేదు. అటువంటి ‘నేను’, ‘అపరిపక్వ నేను’ కాదు. అది పరిపక్వత చెందిన ‘నేను’.
“పరిపక్వం చెందని ‘నేను’ ను వదిలివేయి; ‘నేను దాసుడను, నేను భక్తుడను’ అనే భావంలో తప్పులేదు’ అని కేశవ్‌కి చెప్పాను. పైగా అతడితో, ‘మీరు సంఘం, సమాజం అంటూ రూపొందిస్తున్నారు. కాని ప్రజలు మీ సమాజం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు’ అన్నాను. అందుకు అతడు, ‘నిజమేనండీ! మూడేళ్లు ఈ సమాజంలో ఉండిపోయి, ఆ సమాజంలోకి పోతున్నారు. అది మాత్రమే కాదు, పోతున్నప్పుడు నన్ను నిందించడమూ కద్దు’ అన్నాడు. దానికి నేను, ‘నువ్వు వ్యక్తుల నైజాన్ని ఎందుకు పరికించవు? ఎవరినిపడితే వారిని శిష్యులుగా చేసుకుంటే ఒరిగేదేముంది’ అని బదులు చెప్పాను.
12.10.5 ఆద్యాశక్తిని అంగీకరించమని కేశవ్‌కు ఉపదేశం
“నేను కేశవ్‌తో ఇలా చెప్పి ఉన్నాను: ‘నువ్వు ఆద్యాశక్తిని అంగీకరించు. బ్రహ్మమూ శక్తీ అభిన్నాలు. ఎవరు బ్రహ్మమో ఆతడే శక్తి. దేహబుద్ధి ఉన్నంతవరకు ద్వైతభావం ఉండనే ఉంటుంది. మాటలు ఆరంభించగానే ద్వైతం వచ్చేస్తుంది.’ కేశవ్ తరువాత కాళీని అంగీకరించాడు.
“ఒక రోజు కేశవ్ శిష్యులతో కలిసి ఇక్కడకు వచ్చాడు. నేను ‘నీ లెక్చరు వినాలనుకుంటున్నాను’ అని అతడితో చెప్పాను. ఆతడు చాందినీలో కూర్చుని, లెక్చరు ఇచ్చాడు. తరువాత గంగ ఒడ్డున కట్టపై కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నేను, ‘భగవంతుడు ఎవరో ఆతడే ఒక రూపంలో భక్తుడై ఉన్నాడు. ఆతడే ఒక రూపంలో భాగవతంగా ఉన్నాడు. భాగవతం – భక్తుడు – భగవంతుడు అని చెప్పండి’ అన్నాను. కేశవ్, శిష్యులు ముక్తకంఠంతో, ‘భాగవతం – భక్తుడు – భగవంతుడు’ అని చెప్పారు. తరువాత ‘గురువు – కృష్ణుడు – వైష్ణవుడు’ అని పలుకమని చెప్పగా కేశవ్, ‘మహాశయా! ఇప్పుడు అంతదూరం వద్దు. లేకుంటే లోకులు నన్ను సనాతన హైందవుడని పేర్కొంటారు’ అన్నాడు.
12.10.6 శ్రీరామకృష్ణుల మూర్ఛ సంఘటన – మాయ మూలాన్ని గ్రహించాలి
“త్రిగుణాతీతుడుగా ఉండటం ఎంతో కష్టం. భగవత్సాక్షాత్కారం కలుగకుండా ఈ స్థితి ఏర్పడదు. జీవులు మాయాలోకంలో జీవిస్తున్నారు. ఈ మాయ భగవంతుని తెలుసుకోనివ్వదు. ఈ మాయ మనిషిని అజ్ఞానిగా చేసివేసింది.
“ఒకసారి హృదయ్ ఒక లేగదూడను తీసుకువచ్చాడు. గడ్డి మేయటానికై దానిని తోటలో కట్టివేసి ఉంచటం చూశాను. ‘హృదయ్! ఈ దూడను రోజూ అక్కడ ఎందుకు కట్టివేస్తున్నావు?’ అని అడిగాను. అందుకు అతడు, ‘మామా! ఈ లేగదూడను గ్రామానికి పంపుతాను. పెరిగి పెద్దయ్యాక దీన్ని నాగటికాడికి కడతాను’ అన్నాడు. అతడు ఆ మాటలు పలుకగానే నేను మూర్ఛితుడనై క్రింద పడిపోయాను. మనస్సులో ఇలా అనుకున్నాను: ‘మాయ లీలలు ఎంత విచిత్రమైనవి? కామార్పుకూర్, శిహోర్* ఎక్కడ? కలకత్తా ఎక్కడ? ఈ లేగదూడ అంతదూరం వెళుతుందట! అక్కడ పెరిగి పెద్దదవుతుందట! కొన్ని రోజుల తరువాత దీన్ని నాగటికాడికి కడతాడట! అది దున్నుతుందట! ఇదే సంసారం! ఇదే మాయ!’ చాలసేపయ్యాక నేను స్పృహలోకి వచ్చాను.”
శ్రీరామకృష్ణులు అహర్నిశలూ సమాధి స్థితిలో నెలకొని ఉన్నారు. పగలు – రాత్రి ఎలా గడచిపోతున్నాయో తెలియరావటం లేదు. ఏదో అప్పుడప్పుడు భక్తులతో భగవంతుని గురించి మాట్లాడుతున్నారు; ఆయన కీర్తనలను గానంచేస్తున్నారు.
12.11 ఏకాదశ పరిచ్ఛేదం సమాధి స్థితిలో
అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు లేక నాలుగు గంటలు అయివుంటుంది. శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద భావపారవశ్యంలో కూర్చుని ఉండటం ‘మ’ చూశాడు. కాసేపయ్యాక ఆయన జగజ్జననితో మాట్లాడనారంభించారు. మాటల మధ్యలో, “అమ్మా! అతడికి ఒక కళమాత్రం ఎందుకు ఇచ్చావు?” అని అడిగారు. ఒకింతసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత, “అమ్మా! అర్థం చేసుకున్నాను. ఒక కళ మాత్రమే అతడికి చాలు. దానితోనే అతడు నీ కార్యాలు సాధిస్తాడు. జనులకు బోధిస్తాడు” అన్నారు.
ఇలా శ్రీరామకృష్ణులు తమ శిష్యులకు శక్తిని ప్రసాదిస్తున్నారా ఏమిటి? తదనంతరం లోకులకు బోధించటానికై వారిని ఇప్పుడే తయారుచేస్తున్నారా?
‘మ’ ప్రక్కన రాఖాల్ కూడా గదిలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్య స్థితిలోనే ఉన్నారు. రాఖాల్తో, “నువ్వు కోపగించుకొన్నావే! నీకు ఎందుకు కోపం కలిగించానో తెలుసా? కారణం ఉంది. ఔషధం సరిగ్గా పనిచేయటానికే అలా చేశాను. కురుపు పక్వం చెందాక అది పగిలి ఆరిపోవటానికి మందు వేయాలి” అని అన్నారు.
కాసేపయ్యాక మళ్లీ మాట్లాడసాగారు: “హాజ్రాను ఎండిపోయిన కట్టెలా గాంచాను. అలా ఉండీ అతడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు? దానికి కారణం ఉంది. జటిల, కుటిలలు ఉంటేనే లీలానాటకం రక్తి కడుతుంది.
(‘మ’ తో) “భగవద్రూపాలను అంగీకరించాలి. జగద్ధాత్రీ రూపం అర్థం ఏమిటో తెలుసా? జగత్తును ధారణ చేసిందని అర్థం. ఆమె ధారణ చేయకుంటే, ఆమె పాలించకుంటే, జగత్తు క్రిందపడిపోయేది; నాశనం అయిపోయేది. మనస్సు అనే ఏనుగును ఎవడు నియంత్రించగలడో అతడి హృదయంలో జగద్ధాత్రి విరాజిల్లుతుంది.”*
రాఖాల్: మనస్సు ఒక మదపుటేనుగు.
శ్రీరామకృష్ణులు: అందుచేతనే సింహవాహినీదేవి వాహనమైన సింహం, ఏనుగును నియంత్రించి ఉంచింది.
మునిమాపువేళ అయింది. ఆలయాలలో హారతులు ప్రారంభమయ్యాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని దేవీదేవతల నామస్మరణ చేస్తూ ఉన్నారు. గదిలో ధూపం వేయబడింది. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి చిన్నమంచం మీద కూర్చుని జగజ్జననిని ధ్యానిస్తూ ఉండిపోయారు. బేల్ఘరియా నుండి గోవింద ముఖర్జీ, అతడి మిత్రులు వచ్చి, ఆయనకు ప్రణామం చేసి, నేల మీద కూర్చున్నారు. ‘మ’, రాఖాల్ కూడా అక్కడే ఉన్నారు.
గదికి బయట చంద్రకాంతి సర్వత్రా వ్యాపించి ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. గదిలో భక్తులు మౌనంగా కూర్చుని శ్రీరామకృష్ణుల ప్రశాంతవదనాన్ని తిలకిస్తూ ఉండిపోయారు. ఆయన భావపారవశ్య స్థితిలో ఉన్నారు. కాసేపట్లో ఆ స్థితిలోనే మాట్లాడ నారంభించారు.
12.11.1 శ్యామా రూపం – ప్రకృతి, పురుషులపై వ్యాఖ్య – భక్తుడు, విచారణ మార్గం
శ్రీరామకృష్ణులు: మీకు సందేహాలు ఉంటే అడగండి, నివృత్తి చేస్తాను.
గోవింద, తక్కిన భక్తులు యోచించసాగారు.
గోవింద: మహాశయా, కాళికాదేవి మేని ఛాయ నల్లగా ఎందుకు ఉన్నది?
శ్రీరామకృష్ణులు: దూరం కారణం చేతనే. దగ్గరకు పోయిచూస్తే ఏ రంగూ ఉండదు. కొలను నీరు దూరం నుంచి చూస్తే నల్లగా కనబడుతుంది. దగ్గరకు వెళ్లి చేతిలోకి తీసుకొని చూస్తే ఏ రంగూ ఉండదు. దూరం నుంచి ఆకాశం నీలంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్న ఆకాశాన్ని చూడు, రంగు ఉండదు. భగవంతుణ్ణి సమీపించేకొద్దీ ఆయనకు నామరూపాలు లేవని తెలుస్తుంది. ఆయన నుంచి ఒకింత దూరం కదిలితే మళ్లీ, ‘గడ్డిపువ్వు వర్ణంగల మా అమ్మ కాళీమాత’ అంటావు.
“కాళీ, పురుషుడా లేక ప్రకృతా? ఒక భక్తుడు పూజ చేశాడు. ఆ పూజను చూడవచ్చిన మరో వ్యక్తి జగజ్జనని మేనిపై యజ్జోపవీతం చూశాడు! వెంటనే అతడు, ‘జగజ్జననికి యజ్ఞోపవీతాన్ని వేశావే?’ అని అడిగాడు. అందుకు భక్తుడు, ‘సోదరా! నువ్వు జగజ్జననిని అవగాహన చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పురుషుడా లేక ప్రకృతా అని నేనింకా తెలుసుకోలేకపోయాను. అందుచేతనే యజ్ఞోపవీతాన్ని అలంకరించాను’ అన్నాడు.
“ఎవరు కాళియో ఆమే బ్రహ్మం. సాకారుడు ఎవరో ఆతడే నిరాకారుడు కూడా. ఎవరు సగుణుడో ఆతడే నిర్గుణుడు కూడా. బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మం! అభిన్నులు. సచ్చిదానందమయుడూ సచ్చిదానందమయీ.”
గోవింద: ‘యోగమాయ’ అంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు: యోగమాయ అంటే ప్రకృతి పురుషుల యోగం. నీకు కనబడేదంతా ప్రకృతి పురుషుల యోగమే. శివసమేతమైన కాళికాదేవిని చూడు. శివుడి మీద కాళి నిలబడి ఉంది. శివుడు శవంలా పడివున్నాడు. కాళి, శివుణ్ణి చూస్తూ ఉంది. ఇదంతా పురుష ప్రకృతుల యోగాన్ని సూచిస్తుంది. పురుషుడు నిష్క్రియుడు, అందుచేతనే శివుడు శవంలా పడివున్నాడు. పురుషుని కలయిక చేత ప్రకృతి సకల కార్యాలనూ నిర్వర్తిస్తోంది. సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉన్నది.
“రాధ కృష్ణులు కలిసి ఉన్న ప్రతిమ అర్థం కూడా ఇదే. ఈ కలయిక చేతనే అవి పరస్పరం వంగిన భంగిమలో ఉంటాయి. ఈ కలయికను చూపటానికే కృష్ణుడు ముక్కున ముత్యం ధరించాడు, రాధ తన ముక్కున నీలమణిని ధరించి ఉంది. రాధ మేని ఛాయ ముత్యంలా ప్రకాశిస్తోంది. కృష్ణుడు నీలమేఘశ్యాముడు. అందుకే రాధ నీలమణిని ధరించి ఉంది. శ్రీకృష్ణుడు పీతాంబరాన్ని, రాధ నీలాంబరాన్ని ధరించి ఉన్నారు.
“ఉత్తమ భక్తుడు ఎవరు? బ్రహ్మజ్ఞానం పొందాక ఆ బ్రహ్మమే జీవజగత్తులుగా, ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివుండటం చూసేవాడే ఉత్తమ భక్తుడు. మొదట, ‘నేతి, నేతి’ అంటూ విచారణ చేసి డాబా ఎక్కాలి. తరువాత డాబా ఏ వస్తువులతో కట్టబడిందో, అదే ఇటుకలు, సున్నం మొదలైన వస్తువులతోనే మెట్లుకూడా కట్టబడ్డాయని భక్తుడు తెలుసుకుంటాడు. అప్పుడు బ్రహ్మమే జీవజగత్తులు మొదలైనవన్నీ అయి ఉన్నట్లు గాంచుతాడు.
“కేవలం విచారణా! థూ! థూ! అది నాకు అక్కరలేదు! (శ్రీరామకృష్ణులు ఖాండ్రించి ఉమ్మారు)
“విచారణ చేసి నేనెందుకు వట్టిపోవాలి? ‘నేను, నువ్వు’ అనే బుద్ధి ఉన్నంత వరకు భగవంతుని పాదపద్మాల పట్ల శుద్ధభక్తి ఉండాలి. (గోవిందతో) నేను కొన్ని సమయాలలో, ‘నువ్వే నేను, నేనే నువ్వు’ అంటూ ఉంటాను. కొన్ని సందర్భాలలో, ‘నువ్వే నువ్వు’ గా అయిపోతుంది. అప్పుడు ‘నేను’ ను వెదకినా కనిపించదు.
“శక్తియే అవతారాలుగా వస్తోంది. ఒక సంప్రదాయం ప్రకారం రాముడు, కృష్ణుడు చిదానంద సాగరంలో రెండు అలలు మాత్రమే.
“అద్వైతజ్ఞానం పొందిన తరువాత చైతన్యం జాగృతం అవుతుంది. సకలభూతాలలోను భగవంతుడు చైతన్య రూపంలో విరాజిల్లటం అప్పుడు గాంచుతాడు. ఈ చైతన్య జాగృతం తదనంతరం ఆనందం. అద్వైతం, చైతన్యం, నిత్యానందం.*
12.11.2 భగవంతునికి రూపం ఉంది – భోగవాసనా క్షయంతోనే వ్యాకులత
(‘మ’ తో) “నీకు చెబుతున్నాను, భగవంతుని రూపాల పట్ల అపనమ్మకం ఉంచుకోకు. సాకారం నిజమని విశ్వసించు. తరువాత నీకు ఏ రూపం ప్రియమైనదో ఆ రూపాన్నే ధ్యానించు.
(గోవిందతో) “విషయం ఏమిటో తెలుసా? భోగవాసనలు ఉన్నంత వరకు, భగవంతుని తెలుసుకోటానికో లేక దర్శించటానికో మనస్సు వ్యాకులత చెందదు. చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ అన్నిటిని మరచిపోతాడు. మిఠాయి ఇచ్చి పిలువు, ఏదో కాస్త తింటాడు, అంతే. కాని ఆట బొమ్మలు నచ్చనప్పుడు, మిఠాయి నచ్చనప్పుడు, ‘అమ్మ వద్దకు పోతాను’ అంటాడు. అప్పుడు అతడికి మిఠాయి కూడా అక్కరలేదు. ముక్కూముఖం తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి, ‘రా, మీ అమ్మ దగ్గరకు నిన్ను తీసుకుపోతాను’ అంటే, ఆ వ్యక్తితోనే వెళ్ళిపోతాడు. ఎవరు చంకనెత్తుకొని పోతాడో అతడితోనే వెళ్ళిపోతాడు.
“విషయవాంఛలు తీరిపోగానే భగవంతుడికై మనస్సు వ్యాకులత చెందుతుంది. ఆయనను ఎలా పొందగలను అనే చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న వ్యక్తితో భగవంతుని గురించి ఎవరు ఏది చెప్పినా దాన్ని అతడు వింటాడు.”
‘మ’ (తనలో): భోగవాసనలు ఉడిగిన తరువాతనే మనోవ్యాకులత వస్తుందట!
12.12 ద్వాదశ పరిచ్ఛేదం బలరామ్ ఇంట్లో – భగవద్దర్శన విశేషాలు
శనివారం, ఆగష్టు 18, 1883
శ్రీరామకృష్ణులు, బలరామ్ బోసు ఇంటికి వెళ్లి ఉన్నారు. అక్కడ అవతారతత్త్వాన్ని వివరించారు:
శ్రీరామకృష్ణులు: అవతార పురుషులు లోకులకు ఉపదేశించటానికై భక్తి భావాన్ని ఆపాదించుకుని భక్తులతో కలసి జీవిస్తున్నారు; డాబా ఎక్కిన తరువాత, మెట్లను ఎక్కి దిగటం వలె. తక్కిన వారు డాబా ఎక్కాలంటే, జ్ఞానం లభించనంత వరకు, వాసనలన్నీ ఉడిగిపోనంత వరకు భక్తి మార్గాన్ని అనుసరించాలి. వాసనలన్నీ అడుగంటా నశించిన తరువాతనే డాబా ఎక్కగలం. దుకాణదారుడు జమాఖర్చులు చిట్టాలో వ్రాసి పూర్తిచెయ్యకుండా నిద్రకు ఉపక్రమించడు. చిట్టాలోని లెక్కలు సరిచూసుకున్న తరువాతనే నిద్రపోతాడు.
(‘మ’ తో) “పూర్తిగా మునకవేస్తే విజయం తథ్యం. అటువంటి వ్యక్తికి విజయం తథ్యం.
“మంచిది. కేశవ్, శివనాథ్ చేస్తూ ఉన్న ఉపాసన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?”
‘మ’ : మహాశయా, మీరు చెబుతున్నట్లు వారు తోటనే వర్ణిస్తున్నారు. తోట యజమానిని చూడటం గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. సామాన్యంగా ప్రారంభం నుండి చివరి వరకు తోటను గురించి వర్ణనే.
శ్రీరామకృష్ణులు: సరిగ్గా చెప్పావు! తోట యజమానిని వెదకి పట్టుకొని అతడితో మాట్లాడాలి – అదే నిజమైన కర్తవ్యం. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవటమే జీవితోద్దేశం.
బలరామ్ ఇంటి నుండి శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వచ్చారు. సాయంత్రం అయిన తరువాత అధర్ అతిథుల గదిలో నామసంకీర్తనం చేసి, నాట్యం కూడా చేశారు. వైష్ణవచరణ్ కీర్తనలు గానం చేశాడు. అధర్, ‘మ’, రాఖాల్ మొదలైన వారూ ఉన్నారు.
12.12.1 అధర్ ఇంట్లో భజనానందం – అధర్కు ఉపదేశం
కీర్తన ముగిసే సమయంలో శ్రీరామకృష్ణులు భావపారవశ్యం చెందారు. రాఖాల్తో (తమను చూపుతూ) “ఇక్కడ ఉన్న (నా) విషయాలు వానాకాలపు వర్షం కాదు. వానాకాలం వర్షం కుండపోతగా కురుస్తుంది, అదే వేగంతో ఆగిపోతుంది. ఇది (నేను) స్వయంభూలింగం, మానవ నిర్మితం కాదు. ఆనాడు నువ్వు కోపగించుకుని దక్షిణేశ్వరం నుండి వెళ్లిపోయావు; ‘అమ్మా! ఇతణ్ణి క్షమించు’ అని అమ్మను నేను ప్రార్థించాను” అన్నారు.
శ్రీరామకృష్ణులు అవతారపురుషులా? స్వయంభూ శివుడా?
భావపారవశ్యంలో ఉంటూనే అధర్తో, “నాయనా, నువ్వు ఎవరి నామాన్ని కీర్తించావో ఆ దైవాన్నే ధ్యానం చేయి” అంటూ తమ వేలితో అధర్ నాలుకను స్పృశించి ఏదో వ్రాశారు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు అధర్కు దీక్షను ఒసగారా?
12.13 త్రయోదశ పరిచ్ఛేదం ఆద్యాశక్తి – అవతారతత్త్వం
మరొక రోజు దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయం వైపున ఉన్న వసారాలో మెట్ల మీద కూర్చుని ఉన్నారు. రాఖాల్, ‘మ’, హాజ్రాలు కూడా ఉన్నారు. తమ చిన్ననాటి సంఘటనలను కొన్నిటిని శ్రీరామకృష్ణులు మృదుస్వరంలో చెప్పారు.
12.13.1 సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు – జగజ్జననితో సంభాషణ
సాయంత్రం అయింది. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. తమ గదిలోనున్న చిన్నమంచంపై కూర్చుని జగజ్జననితో మాట్లాడుతున్నారు. “అమ్మా! ఇంత హంగామా ఎందుకు? అమ్మా, అక్కడకు నేను వెళ్లాలా? నువ్వు తోడ్కొనివెళితే నేను వెళతాను” అన్నారు.
శ్రీరామకృష్ణులు ఒక భక్తుని ఇంటికి వెళ్లబోతున్నారు. అందుకే జగజ్జననిని ఇలా అడుగుతున్నారా?
శ్రీరామకృష్ణులు మళ్లీ జగజ్జననితో మాట్లాడసాగారు. తమ ఆంతరంగిక భక్తుడు ఒకరిని గురించి ఆయన ప్రార్థిస్తున్నట్లు ఉంది: “అమ్మా! అతణ్ణి శుద్ధుణ్ణి చెయ్యి. అమ్మా, అతడికి ఒక్క కళను మాత్రమే ఎందుకు ఇచ్చావు?”
కాసేపు మౌనంగా ఉండి మళ్లీ మాట్లాడారు: “ఓ, అర్థమైంది; దీనితోనే నీ కార్యం జరిగిపోతుంది, అంతేగదా!”
పదహారు కళలలో ఒక్కటి ఉంటేనే జగజ్జనని కార్యం అంటే జనులకు బోధించటం జరిగిపోతుంది అన్న విషయం గురించేనా శ్రీరామకృష్ణులు అంటున్నారు?
మళ్లీ శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మునిగిపోయారు. ఆ స్థితిలోనే ‘మ’ మొదలైన వారికి ఆద్యాశక్తి, అవతారతత్వం గురించి తెలిపారు:
“ఎవరు బ్రహ్మమో ఆయనే శక్తి. ఆ శక్తినే నేను అమ్మా అని సంబోధిస్తున్నాను. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయనను బ్రహ్మం అంటాను; సృష్టి స్థితి లయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు శక్తి అంటాను. ఇది నీరు నిలకడగా ఉండటమూ, అలలు ఉవ్వెత్తున లేవటమూ లాంటిది. శక్తి లీలలే అవతారం. ప్రేమభక్తిని బోధించే నిమిత్తమే అవతార ఉద్భవం. అవతార పురుషుడు ఆవు పొదుగులాంటి వాడు. పాలు, ఆవు పొదుగు నుండి మాత్రమే లభిస్తాయి. పొలంలోని గుంటలలో చేపలు చేరుకొనేట్లు భగవంతుడు మనిషిలో అవతరిస్తాడు.”
‘శ్రీకృష్ణుడు, చైతన్యుడు, ఏసు వంటి అవతార పురుషులలా శ్రీరామకృష్ణులు కూడా’ అని భక్తులలో పలువురు భావించుకోసాగారు.