11.1 ప్రథమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో ఫలహారిణీ కాళీపూజ
సోమవారం, జూన్ 4, 1883
11.1.1 మణిలాల్, త్రైలోక్యుడు, రామ్ చటర్జీ, రామ్‌లాల్, రాఖాల్
నేడు అమావాస్య. ఫలహారిణీ కాళీపూజ పర్వదినం. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో తమ గదిలో కూర్చుని ఉన్నారు. భక్తులు ఆయన దర్శనార్థం వస్తూ ఉన్నారు.
‘మ’ మునుపటి రోజైన ఆదివారం నాడే వచ్చేశాడు. ఆనాటి రాత్రి కాత్యాయినీ పూజ జరిగింది. శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో కాళికాలయ మండపంలో జగజ్జనని ఎదుట నిలబడి, “అమ్మా! బృందావనంలోని కాత్యాయినీ దేవివి నువ్వే” అన్నారు. ఇలా జగజ్జననితో మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు ఒక్కసారిగా ప్రేమోన్మత్తులయ్యారు. తిన్నగా తమ గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నారు.
వేకువజాము వరకు దేవీనామ సంకీర్తన జరిగింది.
సోమవారం ఉదయం బలరాం మరి కొందరు భక్తులు వచ్చారు. ఫలహారిణీ కాళీపూజను పురస్కరించుకుని కాళికాలయ యజమానులైన త్రైలోక్యుడు* ప్రభృతులు వచ్చి ఉన్నారు.
అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు. తమ గదికి గంగాభిముఖంగా ముందున్న అర్ధచంద్రాకార మొగసాలలో శ్రీరామకృష్ణులు మందహాస వదనులై ‘మ’ తో కూర్చుని ఉన్నారు. రాఖాల్ తలను తమ ఒడిలో ఉంచుకున్నారు. రాఖాల్ అలాగే పడుకొని ఉన్నాడు. గత కొన్ని రోజులుగా శ్రీరామకృష్ణులు రాఖాల్ను సాక్షాత్తూ బాలగోపాలుడిగా భావించసాగారు.
త్రైలోక్యుడు కాళీదేవిని దర్శించేటందుకై ఆ దారిన పోతున్నాడు. పనివాడు ఒకడు అతడికి గొడుగు పట్టుకొని వెళుతున్నాడు. శ్రీరామకృష్ణులు రాఖాల్తో, “రాఖాల్, లే! లే!” అన్నారు. త్రైలోక్యుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు.
శ్రీరామకృష్ణులు (త్రైలోక్యుడితో): ఏమోయ్! గతరాత్రి ‘యాత్ర’ (నాటక ప్రదర్శన) జరిపించలేదా?’*
త్రైలోక్యుడు: లేదండి. జరిపించటానికి వీలుపడలేదు.
శ్రీరామకృష్ణులు: ఈసారి జరిగిన దేదో జరిగిపోయింది. ఇకపైన ఎన్నడూ ఇలా జరుగకుండా చూడు. ఆలయ సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలి సుమా!
త్రైలోక్యుడు “అలాగే” అంటూ తన దారిన వెళ్లిపోయాడు. కాసేపయ్యాక విష్ణ్వాలయ పూజారి రామ్ ఛటర్జీ అక్కడకు వచ్చాడు.
శ్రీరామకృష్ణులు: చూడు రామ్! నిన్న ‘యాత్ర’ జరుగలేదు. ఇక మీదట ఇలా పొరపాటు జరుగకుండా చూసుకోమని త్రైలోక్యుడితో చెప్పాను. నే నలా అనటం సమంజసమేనా?
రామ్: మహాశయా! మీరు తప్పుగా ఏమీ సెలవియ్యలేదే? సంప్రదాయాలను తప్పక పాటించాలి.
శ్రీరామకృష్ణులు (బలరామ్‌తో): ఈ రోజు నువ్వు ఇక్కడే భోంచెయ్యి.
భోజనానికి ముందు శ్రీరామకృష్ణులు తమ దివ్యోన్మత్త దినాలను భక్తులకు వర్ణించి చెప్పారు. రాఖాల్, ‘మ’, బలరామ్, రాంలాల్, మరికొందరు అక్కడున్నారు.
11.1.2 హాజ్రాపై కోపం – అమ్మే మానవరూపాలు ధరించినట్లు దర్శనం
శ్రీరామకృష్ణులు: అప్పుడప్పుడు హాజ్రా నాకు ఉపదేశం చేయటానికి ముందుకు వచ్చేవాడు. అతడిలా అనేవాడు: ‘మీరు ఈ యువకుల నిమిత్తం ఎందుకు అంతగా యోచిస్తారు?’ ఒక రోజు బండిలో బలరామ్ ఇంటికి పోతూ ఉన్నప్పుడు దీన్ని గురించి ఎంతో కలతకు గురైనాను. అమ్మతో ఇలా అన్నాను: ‘తల్లీ! నరేంద్రుడు తదితర యువకుల గురించి ఇంతగా ఆలోచించడం ఎందుకని హాజ్రా నన్ను అడుగుతున్నాడు. భగవచ్చింతన వదలిపెట్టి ఈ యువకుల గురించి ఎందుకు ఆలోచిస్తుంటావు? అంటున్నాడు.’ ఈ ఆలోచన నా మదిలో మెదలటమే తరువాయి, అమ్మ తానే మానవ రూపాలను ధరించానని లిప్తలో నాకు తెలియచేసింది. కాని ఆమె పవిత్రాత్ములలో సుస్పష్టంగా ప్రకాశిస్తోంది. ఈ దివ్యదర్శనం గాంచి నేను సమాధిమగ్నుడనైనాను. సమాధి స్థితి నుండి కాస్త బాహ్యజ్ఞానంలోకి రాగానే హాజ్రాపై కోపం వచ్చింది. ‘ఈ వెధవ నా మనస్సును కష్టపెట్టాడు’ అనుకున్నాను. తరువాత ఇలా అలోచించాను; ‘పాపం వాడిది మాత్రం తప్పేముంది? వాడికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి?’
11.1.3 నరేంద్రుని ప్రథమ సందర్శన సందర్భంలోని సంఘటన
“ఈ యువకులు సాక్షాత్తూ నారాయణ స్వరూపులని నే నెరుగుదును. నరేంద్రుణ్ణి ప్రప్రథమంలో చూసినప్పుడే అతడికి కించిత్తయినా దేహబుద్ధి లేదన్న సంగతి గమనించాను. నా చేత్తో అతడి ఛాతీని కాస్త స్పృశించగానే అతడు బాహ్యచైతన్యాన్ని కోల్పోయాడు. బాహ్మచైతన్యం కలిగాక ఇలా అన్నాడు: ‘ఓ, మీరు నన్ను ఏం చేశారు? ఇంట్లో నాకు తల్లితండ్రులున్నారు.’ మరొకసారి యదుమల్లిక్ ఇంట్లోకూడా ఇదే విధంగా జరిగింది. రోజులు గడిచేకొద్ది అతణ్ణి చూడాలని మరింతగా తపించసాగాను; ప్రాణాలు కొట్టుకుపోయేవి. ఇటువంటి సమయంలో ఒకనాడు భోలానాథ్తో* నేనిలా అన్నాను: ‘నా మనస్సు ఎందుకు ఇలా అయిపోతోంది? నరేంద్రు డనే ఒక కాయస్థ యువకుడున్నాడు. అతడి గురించి నే నెందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను?’ అందుకు భోలానాథ్ ఇలా బదులిచ్చాడు: ‘దీనికి వివరణ మహాభారతంలో ఉంది. సమాధి స్థితి నందిన మహాత్ముల మనస్సు క్రిందికి దిగి సామాన్యస్థాయికి వచ్చినప్పుడు సత్త్వగుణ సంపన్నుల సహచర్యంలో ఆనందిస్తుంది. అటువంటి వ్యక్తులను చూడగానే వారి మనస్సు శాంతిస్తుంది.’ ఈ మాటలు విన్నాక నా మనస్సు కుదుట పడింది. అప్పుడప్పుడు ఏకాంతంగా కూర్చుని నరేంద్రుణ్ణి చూడాలని విలపించే వాడిని.
11.2 ద్వితీయ పరిచ్ఛేదం శ్రీరామకృష్ణుల దైవోన్మత్త స్థితిలో జరిగిన సంఘటనలు
“ఓహ్! నేను ఎటువంటి మానసిక స్థితిని అనుభవించానని! తొలుత ఆ స్థితి కలిగినప్పుడు రేయింబవళ్లు ఎలా గడచిపోయేవో తెలిసేదే కాదు. నేను పిచ్చివాడిని అయిపోయానని అందరూ అన్నారు. అందుచేతనే నాకు వివాహం చేశారు. అప్పుడు దైవోన్మత్త స్థితిలో ఉండేవాడిని. మరి ఆమె పరిస్థితి ఏమిటి అని కలవరపడ్డాను. తరువాత ఆమె కూడా నాలాగే తింటూ త్రాగుతూ జీవిస్తుందని నిశ్చయించుకున్నాను.
“ఒకసారి అత్తగారి ఇంటికి వెళ్లాను. అక్కడ ఒక సంకీర్తన ఏర్పాటు చేశారు. పవిత్ర భగవన్నామ సంకీర్తనతో అదొక గొప్ప ఉత్సవంలాగా జరిగింది. అప్పుడప్పుడు నా భవిష్యత్తు గురించి ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. అమ్మతో ఇలా అనేవాణ్ణి: ‘తల్లీ, ఇక్కడి భూస్వాములు నాకు గౌరవం కనబరిస్తే, నాకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులను వాస్తవాలుగా పరిగణిస్తాను.’ ఆ భూస్వాములు తమంతట తామే వచ్చి నాతో మాట్లాడి వెళ్లారు.
11.2.1 సుందరీపూజ, కుమారీపూజ, రామ్‌లాలా దర్శనం, సీహోర్‌లో గొల్లబాలురు, మథుర్ ఇంట్లో
“ఓహ్! ఏం పారవశ్య స్థితి అది! స్వల్ప సూచన సైతం నాలో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఉద్దీపింపచేసేది. పద్నాలుగేళ్ల బాలికకు ‘సుందరీ పూజ’ చేశాను. ఆమెను సాక్షాత్తూ జగన్మాతగా గాంచాను. పూజానంతరం ఒక రూపాయి దక్షిణ సమర్పించి ఆమెకు ప్రణామం చేశాను.
“ఒక రోజు రామలీల ప్రదర్శన చూడడానికి వెళ్ళాను. ఒక్కసారిగా చూశాను – వేషధారులందరూ సాక్షాత్తు సీత, రామ, లక్ష్మణ, హనుమంత, విభీషణులే. తరువాత ఆ పాత్రలను పోషించిన నటీనటులందరినీ పూజించాను.
“ఆ రోజుల్లో నేను బాలికలను ఇక్కడకు రావించి కుమారీపూజ చేసేవాడిని. వారిని సాక్షాత్తూ జగన్మాతగా గాంచేవాణ్ణి.
“ఒక రోజు నీలిరంగు చీరలో పొగడచెట్టు వద్ద నిలబడి ఉన్న ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక వేశ్య. ఒక్క క్షణంలో ఆమె నాలో సీతాదర్శనాన్ని ఉద్దీపింప చేసింది. ఆ స్త్రీని మరచిపోయాను. లంకలో రావణుని చెరనుంచి రక్షించబడి శ్రీరాముని వద్దకు వెళుతూ ఉన్న సాక్షాత్తూ సీతాదేవిగా ఆమెను చూశాను. చాలాసేపటి వరకు సమాధి స్థితిలో ఉండిపోయాను.
“మరొక రోజు కలకత్తాలోని గఢ్ మైదానానికి షికారుగా వెళ్లాను. అక్కడ బెలూన్ ఎగురవేయడాన్ని చూసే నిమిత్తం చాలామంది గుమిగూడి ఉన్నారు. ఒక ఆంగ్లేయ బాలుడు త్రిభంగిగా నిలబడి ఒక చెట్టుకు ఆనుకొని ఉండటం హఠాత్తుగా నా కళ్లబడింది. అతణ్ణి చూడగానే నాకు కృష్ణోద్దీపన కలిగి సమాధి మగ్నుడనైపోయాను.
“సిహోర్‌లో ఒకసారి గొల్లబాలురకు ఆహారం తినిపించాను. వారి చేతుల్లో తినుబండారాలు పెట్టాను. వారిని సాక్షాత్తూ బృందావన గోపబాలురగా చూశాను; వారి చేతుల నుండి తినుబండారాలను గైకొని నేనూ కాస్త ఆరగించాను.
“ఆ రోజుల్లో నేను దాదాపు బాహ్యస్పృహలో లేననే చెప్పాలి. మథుర్బాబు తన జాన్బజార్ భవనంలో కొన్ని రోజులు నన్ను అట్టేబెట్టుకున్నాడు. ఆ భవనంలో నివసిస్తూన్నప్పుడు నన్ను సాక్షాత్తూ జగన్మాత దాసీగా భావించుకునేవాణ్ణి. ఆ ఇంటి స్త్రీజనం నా సమక్షంలో సిగ్గు పడేవారే కారు – ఎవరైనా పసిబాలుడో లేక బాలికనో చూస్తే ఎలా సిగ్గుపడరో అలాగన్న మాట. మథుర్బాబు కుమార్తెను, ఆమె భర్త గదికి దాసీతో కూడా వెంటబెట్టుకు పోయేవాణ్ణి.
“ఇప్పటికి కూడా అతిస్వల్ప విషయం సైతం నాలో భగవదుద్దీపనను కలుగజేస్తుంది. రాఖాల్ పెదవులాడిస్తూ జపం చేసేవాడు. అటువంటి సమయాల్లో, స్థిరంగా ఉండలేకపోయేవాణ్ణి, క్షణమాత్రంలో భగవదుద్దీపన కలిగి పరవశుడనైపోయేవాణ్ణి.”
జగజ్జననిని దాసీభావంతో ఆరాధించే సమయంలో తమకు కలిగిన విభిన్న అనుభవాలను శ్రీరామకృష్ణులు చెప్పుకుంటూపోయారు. ఆయన ఇలా అన్నారు: “ఒకసారి ఒక గాయకుడికి, గాయకి ఎలా ప్రవర్తిస్తుందో, ఆమె పద్ధతుల నన్నిటినీ అనుకరించి చూపాను. అప్పుడు ఆ గాయకుడు ‘మీరు చాలా బాగా అనుకరిస్తున్నారే! ఇవన్నీ మీరు ఎలా నేర్చారు?’ అని అడిగాడు.” తరువాత శ్రీరామకృష్ణులు గాయకి ఎలా ప్రవర్తిస్తుందో హావభావాలతో అనుకరించి చూపేసరికి, భక్తులంతా కడుపుబ్బ నవ్వుకున్నారు.
11.3 తృతీయ పరిచ్ఛేదం మణిలాల్ ప్రభృతులతో – అహేతుక కృపాసింధు
మధ్యాహ్న భోజనం తరువాత శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ఆయన కాస్త మగత నిద్రలో ఉన్నారు. ఇంతలో బ్రహ్మసమాజ సభ్యుడైన మణిలాల్ మల్లిక్ గదిలోకి వచ్చి, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా పడుకునే ఉన్నారు. మణిలాల్ ఆయన్ను ఏవో ప్రశ్నలడుగుతున్నాడు; ఆయన మగతలో ఉండే ఒకటి రెండు పదాలతో జవాబిస్తున్నారు.
మణిలాల్: నిత్యగోపాల్ను, శివనాథ్ ఎంతో ప్రశంసిస్తున్నాడు. అతడి ఆధ్యాత్మిక స్థితి ఎంతో ఉన్నతంగా ఉంది అంటాడతడు.
శ్రీరామకృష్ణులు ఇంకా పడుకొనే ఉన్నారు. నిద్ర నుంచి పూర్తిగా మేలుకోలేదు. “హాజ్రా గురించి వారు ఏమంటారు?” అని అడిగి, లేచి కూర్చున్నారు. తరువాత మణిలాల్‌తో భవనాథ్ భక్తి గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఆహా! అతడు ఎంతటి సమున్నత స్థితిలో నెలకొని ఉన్నాడు! దైవ సంకీర్తన ప్రారంభించీ ప్రారంభించకనే అతడి కళ్ళు స్రవించేవి. హరీశ్‌ను చూడగానే ఒక్కసారిగా భావపరవశు డవుతాడు. హరీశ్ ఎంతో అదృష్టవంతుడని అంటాడు. హరీశ్ అప్పుడప్పుడు ఇల్లు విడిచి వచ్చి ఇక్కడ గడుపుతూ ఉంటాడు కదా, అందుకనే అలా అన్నాడు.
(‘మ’ తో) “సరే, భక్తి కలగటానికి హేతువు ఏమిటి? భవనాథ్ వంటి యువకులకు ఆధ్యాత్మిక భావాలు ఎందుకు జాగృత మవుతున్నాయి?”
‘మ’ కు ఏం చెప్పాలో తెలియలేదు.
శ్రీరామకృష్ణులు: ఇది ఎటువంటిదో తెలుసా? మనుషులందరూ చూడడానికి ఒకేలా అగుపిస్తారు. అయితే కజ్జికాయలలో లాగా కొందరిలో ‘పాలకోవా’ నింపబడి ఉంటుంది. కజ్జికాయ లోపల మినప్పప్పు నింపవచ్చు, లేకుంటే పాలకోవా అయినా నింపవచ్చు. అయితే చూడడానికి మాత్రం రెండు ఒకేలా కనిపిస్తాయి. భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆయన పట్ల ప్రేమ భక్తి – వీటినే పాలకోవాగా పేర్కోవచ్చు.
11.3.1 గురువు అనుగ్రహంతో ముక్తి – స్వరూప దర్శనం – శ్రీరామకృష్ణుల అభయం
శ్రీరామకృష్ణులు భక్తులకు అభయం ఇస్తూ మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): కొందరు ఇలా తలపోస్తారు: ‘బహుశా నాకు భక్తి జ్ఞానాలు అలవడవు. నేను బద్ధజీవిని.’ కాని గురువు అనుగ్రహం ఉంటే ఎంతమాత్రం భయపడవలసిన పనిలేదు.
“ఒకప్పుడు గర్భం ధరించిన ఆడపులి ఒకటి మేకల మందపై పడ్డది. అలా మందపై దూకేటప్పుడు అది పులిపిల్లను ప్రసవించి చచ్చిపోయింది. ఆ పులిపిల్ల మేకలతో పాటే పెరుగసాగింది. ఆ మేకలు గడ్డిని మేసేవి; ఈ పులి పిల్లకూడా గడ్డినే మేయసాగింది. మేకల మాదిరిగానే ఇదికూడా ‘మే, మే’ అని అరవసాగింది. క్రమంగా ఆ పిల్ల పెద్దపులిగా ఎదిగింది.
“ఇలా ఉండగా ఒక రోజు మరొక పెద్దపులి ఆ మేకల మందపై దాడిచేసింది. అక్కడ ‘పచ్చిగడ్డి తినే ఆ పెద్దపులిని’ చూసి ఈ పెద్దపులి విస్తుపోయింది దాని వెంట పరుగెత్తి, దానిని దొరకబుచ్చుకోవడంతో అది ‘మే, మే’ అంటూ అరవసాగింది. ఈ పెద్దపులి ఆ మేక–పులిని నీటి వద్దకు ఈడ్చుకుపోయి దానితో ఇలా అంది: ‘చూడు. నీళ్లలో నీ ముఖాన్ని చూసుకో. అది నా ముఖంలాగానే ఉండటం గమనించు. ఇదిగో, ఈ కాస్త మాంసాన్ని తిను.’ ఇలా అంటూ ఆ పెద్దపులి దాని నోట్లో మాంసాన్ని బలవంతంగా కూరింది. కాని ఆ ‘పచ్చగడ్డి తినే పులి’ ఆ మాంసఖండాన్ని తిననే తినదు; ‘మే, మే’ అంటూ అరవసాగింది. కాని క్రమంగా అది రక్తం రుచి మరిగి మాంసాన్ని తినసాగింది. అప్పుడు ఆ పెద్దపులి ఇలా అంది: ‘ఇప్పుడు అర్థమయింది కదా! నేను ఎవరినో, నువ్వు కూడా అదే. ఇక రా నాతోబాటు. అడవిలోకి వెళ్దాం.’
“అందుకనే గురువు అనుగ్రహం కలిగినప్పుడు భయానికి తావే ఉండదు. నువ్వు ఎవరివో నీ స్వస్వరూపం ఏమిటో ఆయన నీకు తెలియజేస్తాడు.
“ఒకింత ఆధ్యాత్మిక సాధన చేయగానే గురువు “ఇదే, ఇదే” అని తెలియజేస్తాడు; అప్పుడు శిష్యుడే సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో స్వయంగా తెలుసుకోగలుగుతాడు. భగవంతుడొక్కడే సత్యం, ఈ ప్రపంచం అనిత్యం అని తెలియవస్తుంది.
11.3.2 కపట సాధన కూడా మంచిదే – జీవన్ముక్తుడు సంసారంలో ఉండగలడు
“ఒకనాటి రాత్రి బెస్తవాడొకడు ఒక తోటలో ప్రవేశించి అక్కడున్న చెరువులో వలవేసి దొంగతనంగా చేపలు పడుతున్నాడు. తోట యజమానికి ఆ సంగతి తెలియడంతో అతడి మనుష్యులు ఆ బెస్తవాణ్ణి చుట్టుముట్టారు. దివిటీలు వెలిగించి ఆ బెస్తవాడి కోసం గాలించసాగారు. ఈలోపు బెస్తవాడు ఒంటినిండా బూడిద పూసుకొని సాధువులా నటిస్తూ ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. తోట యజమాని, పనివాళ్లు ఎంతగా వెదకినప్పటికీ దొంగను కనుగొనలేక పోయారు. వారికి అక్కడ కంటబడింది ఒక చెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్న సాధువు మాత్రమే! ‘ఆ తోటలో ఓ గొప్ప సాధువు వెలశాడు’ అనే వార్త మర్నాడు ఆ పరిసరాలలో వ్యాపించింది. అనేకులు సాధువును దర్శించుకుని పువ్వులు, పళ్లు, మిఠాయిలు సమర్పించి భక్తిప్రపత్తులతో ప్రణామాలు చేయసాగారు. వారిలో కొంతమంది ఆతడికి దక్షిణ కూడా సమర్పించారు. అప్పుడు ఆ బెస్తవాడు ఇలా తలపోశాడు: ‘ఎంత విచిత్రం! నేను నిజమైన సాధువును కాను. అయినప్పటికీ జనం నా పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కనబరుస్తున్నారు. నేను నిజమైన సాధువుగా మారితే భగవంతుని తప్పక పొందగలుగుతాను. ఇందులో సందేహం లేదు.’
“కేవలం కపట సాధన మాత్రం చేతనే అంతటి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అయినప్పుడు, యథార్థమైన సాధనా ప్రభావం గురించి వేరే చెప్పవలసింది ఏముంది? ఏది సత్యమో, ఏది అసత్యమో ఎరుకలోకి వస్తుంది. భగవంతు డొక్కడే సత్యం, ఈ సంసారం యావత్తు అనిత్యం అన్న ఎరుక కలుగుతుంది.”
భక్తులలో ఒకరు ఇలా అనుకుంటున్నాడు: ‘అయితే సంసారం అనిత్యమా? ఆ బెస్తవాడేమో సంసార త్యాగం చేయనే చేశాడు. అయితే సంసారంలో జీవించే వారి గతి ఏమిటి? వాళ్లూ సంసారాన్ని త్యజించాలా?’
ఎదుటి వ్యక్తిలోని మనోభావాలను గ్రహించగల శ్రీరామకృష్ణులు మృదువుగా ఇలా అన్నారు: “ఒక గుమాస్తా చెరసాలకు పంపబడ్డాడని అనుకుందాం. అక్కడ అతడు నిస్సంశయంగా కారాగారవాస జీవితాన్ని గడపవలసిందే. కాని చెరసాల నుండి విడుదలయ్యాక అతడు వీథిలో కుప్పిగంతులు వేస్తాడా? కానే కాదు. మళ్లీ అదే గుమాస్తా ఉద్యోగం సంపాదించి గతంలో మాదిరే పని కొనసాగిస్తాడు. గురువు అనుగ్రహంతో జ్ఞాన సముపార్జన చేశాక కూడా ఆ వ్యక్తి సంసారంలో జీవన్ముక్తుడిలా జీవిస్తాడు.”
ఇలా వచిస్తూ శ్రీరామకృష్ణులు గృహస్థులైన వారికి అభయ ప్రదానం చేశారు.
11.4 చతుర్థ పరిచ్ఛేదం మణిలాల్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు – నిరాకారవాదం
మణిలాల్ (శ్రీరామకృష్ణులతో): మహాశయా! నిత్యపూజలో భగవంతుణ్ణి ఏ స్థానంలో ధ్యానించాలి?
శ్రీరామకృష్ణులు: హృదయమే అత్యుత్తమ స్థానం; భగవంతుణ్ణి హృదయంలో ధ్యానించు.
11.4.1 విశ్వాసమే సర్వం – నిరాకారంపై హలధారి విశ్వాసం
బ్రహ్మసమాజస్థుడైన మణిలాల్ నిరాకారవాది. అతణ్ణి ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “కబీరు ఇలా అనేవాడు: ‘సాకారం నా తల్లి, నిరాకారం నా తండ్రి. నేను ఎవరిని నిందించగలను? ఎవరిని ఆరాధించను? త్రాసులోని రెండు ప్రక్కలూ సమానం.’
“హలధారి పగలంతా సాకార పూజాధ్యానాలలోను, రాత్రిళ్ళు నిరాకార ధ్యానంలోనూ గడిపేవాడు. అందుకే నువ్వు ఏ భావాన్ని ఆశ్రయించినా సరే, దృఢవిశ్వాసం ఉంటే అంతా సరి అయిపోతుంది. నువ్వు భగవంతుణ్ణి సాకార మూర్తిగానే విశ్వసించవచ్చు లేక నిరాకారునిగానైనా విశ్వసించవచ్చు; కాని నీ విశ్వాసం హృదయపూర్వకమైనదై ఉండాలి.
11.4.2 శంభు మల్లిక్ విశ్వాసం
“శంభుమల్లిక్ బాగ్‌బజార్ నుంచి దక్షిణేశ్వరంలోని తన ఉద్యాన గృహానికి కాలినడకన వస్తూ ఉండేవాడు. ఒక రోజు ఎవరో అతడితో ఇలా అన్నారు: ‘ఇంత దూరం నడిచి రావటం ఎందుకు? బండి కట్టుకొని రావచ్చు కదా! లేకుంటే ఏమైనా ప్రమాదం సంభవించవచ్చు.’ ఆ మాటలకు శంభు కళ్లు ఎర్రచేసి ఇలా అరిచాడు: ‘ఏమిటీ, భగవన్నామం జపిస్తూ బయలుదేరాను. ఇక నాకు ఏ ప్రమాదం సంభవిస్తుంది?’
“కేవలం విశ్వాసంతోనే ప్రతిదీ సాధించవచ్చు. ‘ఒక ఫలానా వ్యక్తిని కలుసుకున్నా లేదా ఫలానా దక్షిణేశ్వర ఆలయ ఉద్యోగి నాతో మాట్లాడినా ఇదంతా (తమ ఆధ్యాత్మిక అనుభూతులు) నిజమని భావిస్తాను’ అని నేను అనుకొనే వాడిని. నేను అనుకొన్నట్లే జరుగుతూండేది.”
‘మ’ పాశ్చాత్య తర్కశాస్త్రం అధ్యయనం చేశాడు. ఆ శాస్త్రంలో తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మూఢనమ్మకస్థులు విశ్వసిస్తారని అతడు చదివి ఉన్నాడు. అందుచేత శ్రీరామకృష్ణులను “ఇందుకు మినహాయింపు అంటూ ఎన్నడూ ఉండి ఉండలేదా?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: లేదు. ఆ రోజుల్లో అంతా ఆ విధంగానే జరిగేది. భగవన్నామం జపించి, ఒక ఫలానా విషయం జరుగుతుందని విశ్వసించే వాడిని; నేను విశ్వసించినట్లే జరిగేది. (మణిలాల్‌తో) కాని విషయం ఏమిటో తెలుసా? సరళ స్వభావం, హృదయ వైశాల్యం ఉంటే కాని అటువంటి విశ్వాసం కలుగదు. పెద్ద ఎముకలూ కండ తక్కువా, గుంటకళ్లు ఇంకా ఇటువంటి భౌతిక అవలక్షణాలు ఉన్నట్లయితే, అటువంటి వ్యక్తులకు సులభంగా విశ్వాసం కుదరదు. దక్షిణాన అరటిచెట్టు, ఉత్తరాన బచ్చలికూర, అడ్డంగా నల్ల పిల్లి – నేను ఒంటరిగా ఏం చెయ్యగలను?* (అందరూ నవ్వారు)
11.4.3 భగవతీ దాసిపై కరుణ
మునిమాపు వేళ అయింది. పనిమనిషి గదిలోకి వచ్చి సాంబ్రాణి ధూపం వేసింది. మణిలాల్ తదితర భక్తులు సెలవు పుచ్చుకుని కలకత్తాకు వెళ్లిపోయారు. ఒకరిద్దరు భక్తులు ఉండిపోయారు.
శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని జగజ్జననిని ధ్యానిస్తున్నారు. నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. సాంబ్రాణి ధూపం గదంతా వ్యాపించి ఉంది. ‘మ’ నేల మీద కూర్చుని ఉన్నాడు. రాఖాల్ కూడా ఉన్నాడు.
కాసేపయ్యాక ఆలయ యజమానుల ఇంటి పనిమనిషి భగవతీదాసి వచ్చి, దూరం నుంచే శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసింది. శ్రీరామకృష్ణులు ఆమెను కూర్చోమన్నారు. చాలా ఏళ్లుగా మథుర్బాబు ఇంట్లో ఆమె పనిచేస్తూ వస్తోంది. శ్రీరామకృష్ణులు ఆమెను చాలాకాలం నుంచి ఎరుగుదురు. చిన్న వయస్సులో ఆమె ఇంచుమించు నీతిబాహ్య జీవితాన్ని గడిపింది; కాని కరుణాసింధువు అయిన శ్రీరామకృష్ణులు పాపులను పావనులను చేయగలరు. ఆమెతో పాత రోజుల గురించి మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఇప్పుడు వయస్సు బాగా పైబడింది. సంపాదించిన ధనాన్ని వైష్ణవులకు, సాధువులకు అన్నదానం చేస్తూ ఉదాత్త మార్గంలో ఖర్చు చేస్తున్నావు కదా?
భగవతీ (కించిత్తు నవ్వుతూ): దాన్ని గురించి నేనే ఎలా చెప్పగలను?
శ్రీరామకృష్ణులు: బృందావనం, కాశీ మొదలైన పుణ్యతీర్థాలను సందర్శించావా?
భగవతీ (సంకోచిస్తూ): దాన్ని గురించి నేనే ఎలా చెప్పగలను? ఒక స్నాన ఘట్టాన్ని కట్టించాను; అక్కడ ఒక ఫలకంపై నా పేరుకూడా చెక్కబడింది.
శ్రీరామకృష్ణులు: ఓ, అట్లాగా!
భగవతీ: అవునండీ. నా పేరు ‘శ్రీమతి భగవతీ దాసి’ అని అక్కడ వ్రాయబడి ఉంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ): బాగుంది చాలా బాగుంది.
శ్రీరామకృష్ణుల పలుకులతో కాస్త ధైర్యం పుంజుకొని ఆమె ఆయనను సమీపించి, ఆయన పాదాలను స్పృశించి ప్రణామం చేసింది.
ఆ స్పర్శతో శ్రీరామకృష్ణులకు తేలు కుట్టినట్లయింది. తక్షణమే ఆయన లేచి నిలబడి బిగ్గరగా “గోవిందా! గోవిందా!” అంటూ కేక పెట్టారు. గదిలో ఓ మూల ఒక బిందెలో గంగాజలం ఉంది. గబగబా ఆ బిందె వద్దకెళ్లి భగవతీ దాసి తాకిన చోటును గంగాజలంతో ప్రక్షాళన చేసుకున్నారు.
గదిలో ఉన్న ఇద్దరు ముగ్గురు భక్తులు ఈ సంఘటనను దిగ్భ్రాంతితో చూస్తూవున్నారు. భగవతీదాసి కుప్పకూలిపోయింది.
కరుణాసింధూమా, పాపులను పావనులను గావించే అవ్యాజ ప్రేమమూర్తీ అయిన శ్రీరామకృష్ణులు ఆమెను అనునయించి కారుణ్యం ఉట్టిపడే స్వరంలో “కాస్త దూరం నుంచే నాకు ప్రణామం చేస్తే చాలు” అన్నారు. ఇలా చెప్పి మళ్లీ చిన్నమంచం మీద కూర్చున్నారు. జరిగిన సంఘటనను మరచిపోయి ఆమె అనునయం చెందాలని, “పాటలు పాడతాను విను” అంటూ కొన్ని పాటలు పాడారు:
నల్లనిదౌ నా మానస మధుపము
ఉల్లాసంబుగ లాగివేయబడె
తల్లి శ్యామ పదనీరాజనమునకు
ఉల్లము రంజిలజేయు విధమున…
మరల ఆయన ఇలా పాడారు:
మా యమ్మ పద స్వర్గమం దున్నతంబుగా
పయనించె నొక గాలిపడగలా నా మది
పాపంపు సుడిగాలి బలముగా వీచుచు
వడివడిగ భువి వైపు పడద్రోసె దానిని…॥ మా ॥
తరువాత ఇలా పాడసాగారు:
ఉండు మనసా నీలో నుండవే
ఏ వేళ నైన॥ ఉం ॥
చేరవద్దు పరుల పంచ
చేరి నీలో చూచుకొనిన
కోరి వెదకుచున్నవెల్ల
దొరకు నీకు దాని యందు॥ ఉం ॥
పరుసవేది పరమాత్మ
ఏరి ప్రార్థననైన తీర్చు
చేరి హృదయమందు నిలచు
గారవంపు రత్న మతడు॥ ఉం ॥
ఎన్నరాని ముత్యములును
వన్నెతీరు రత్నములును
అన్నిచోట్ల పరచియుండె
ఎన్నో హృదయ ప్రాంగణమున॥ ఉం ॥
11.5 పంచమ పరిచ్ఛేదం ప్రేమోన్మాద స్థితిలో శ్రీరామకృష్ణుల అనుభవాలు
మంగళవారం, జూన్ 5, 1883
శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో ఉన్నారు. ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు రావటం రివాజు. నేడు మంగళవారం అయినందున భక్తులు ఎక్కువ మంది లేరు. రాఖాల్, శ్రీరామకృష్ణులతోనే వసిస్తున్నాడు. హాజ్రా కూడా అక్కడే ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల గదికి ముందున్న వసారాలో హాజ్రా కూర్చుని ఉన్నాడు. ఆదివారం నాడే అక్కడకు వచ్చిన ‘మ’ ఇంకా ఇంటికి వెళ్లలేదు.
సోమవారం రాత్రి కాళికాలయ మండపంలో కృష్ణయాత్ర జరిగింది. శ్రీరామకృష్ణులు కాసేపు తిలకించారు. ఈ యాత్ర ఆదివారం రాత్రే జరిగి ఉండవలసింది. ఆ రోజు జరగనందున సోమవారం రాత్రి జరిపించారు.
మధ్యాహ్న భోజననానంతరం శ్రీరామకృష్ణులు భక్తులకు ప్రేమోన్మాద స్థితిలో తమకు కలిగిన అనుభవాలను గురించి చెబుతున్నారు.
శ్రీరామకృష్ణులు (‘మ’ తో): ఆహా! ఆ రోజులలో నాకు ఎటువంటి స్థితులు కలిగేవని! ఆ కాలంలో ఇక్కడ భోజనం చేసేవాడిని కాను. దక్షిణేశ్వరంలోనో, బారానగర్లోనో లేక అరియదాహాలోనో ఎవరైనా బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళేవాణ్ణి. అదికూడా వేళకాని వేళలో వెళ్ళేవాణ్ణి. అక్కడకు వెళ్ళి ఒక్క మాటైనా పలుకకుండా మౌనంగా కూర్చుండిపోయేవాణ్ణి. విషయం ఏమిటని ఇంట్లో వారు ప్రశ్నించినప్పుడు ‘నేను ఇక్కడ భోజనం చేస్తాను’ అని మాత్రమే పలికేవాడిని. అంతే! అంతకు మించి వేరే ఏమీ మాట్లాడేవాడిని కాను. అప్పడప్పుడు ఆలంబజార్లోని రామ్ఛటర్జీ ఇంటికి లేక దక్షిణేశ్వరంలోని సావర్ణ చౌధురీగారి ఇంటికి వెళ్లేవాడిని. చౌధురీగారి ఇంట్లో భోజనం చేసేవాడిని కానీ, వారి ఆహారం నాకు రుచించేది కాదు. వారి భోజనంలో మాంసం, చేపల వాసన వచ్చేది.
11.5.1 దేవేంద్రనాథ్ ఠాగూర్, దీన ముఖర్జీ, కుమార్ సింగ్
“ఒక రోజు దేవేంద్రనాథ్ టాగూర్ (రవీంద్రనాథ్ టాగూర్ తండ్రి) ఇంటికి వెళ్ళాలన్న ఆరాటం జనించింది.
మథుర్‌తో ఇలా అన్నాను: “దేవేంద్రుడు భగవన్నామాన్ని జపిస్తాడు. అతణ్ణి చూడాలని ఉంది. నన్ను అక్కడకు తీసుకువెళ్లగలవా?” మథుర్బాబు ఆభిజాత్యం ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి ఇంటికి అతడి ఆహ్వానం లేకుండా వెళతాడని ఎలా ఆశించగలం? మొదట అతడు తటపటాయించాడు. తరువాత “అలాగే. నేనూ, దేవేంద్రుడూ కలసి చదువుకున్నాం. బాబా, నిన్ను అతడి వద్దకు తోడ్కొని వెళతాను” అన్నాడు.
దేవేంద్రనాథ్ టాగూర్
“మరో రోజు బాగ్‌బజార్‌లో వంతెన సమీపంలో నివసిస్తున్న దీన ముఖర్జీ అనే సజ్జనుడి గురించి నాకు తెలియవచ్చింది. అతడు భక్తుడు. అతడి వద్దకు నన్ను తీసుకువెళ్లమని మథుర్ని పట్టుబట్టాను. అతడు మాత్రం ఏం చేస్తాడు? ఒక బండిలో దీన ముఖర్జీ ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. పెద్ద బండిలో ఎవరో ధనవంతుడు రావడంతో ఆ ఇంటివారు ఇరకాటంలో పడిపోయారు. మేమూ సందిగ్ధంలో పడ్డాం. పైగా ఆనాడు దీన ముఖర్జీ కుమారుడి ఉపనయనం కూడా. జనంతో ఇల్లు క్రిక్కిరిసి ఉంది; కూర్చోవడానికి కూడా చోటు లేదు. మేం ఒక ప్రక్కనున్న గదిలోకి ప్రవేశించబోతూండగా ఎవరో “ఆ గదిలోకి వెళ్లకండి. అక్కడ స్త్రీలు కూర్చుని ఉన్నారు!” అంటూ కేక పెట్టారు. నిజానికి అదొక దురవస్థ! తిరిగి వస్తున్నప్పుడు మథుర్బాబు నాతో, “బాబా! ఇక మీదట నీ మాట విననంటే వినను” అన్నాడు. నేను నవ్వి ఊరుకొన్నాను.
“ఆహా! అప్పుడు ఎటువంటి స్థితులు కలిగాయని! ఒకసారి కుమార్ సింగ్, సాధు సంతర్పణ చేస్తూ నన్ను కూడా ఆహ్వానించాడు. అక్కడకు ఎంతోమంది సాధువులు వచ్చివుండటం చూశాను. నేను వెళ్ళి కూర్చోగానే అనేకమంది సాధువులు నా గురించి అడగసాగారు. వాళ్ళు అలా అడగడం ప్రారంభించగానే వారిని వదిలిపెట్టి మరొకచోట కూర్చున్నాను. ‘వీరికి ఈ విషయాలన్నీ ఎందుకో’ అనుకున్నాను. తరువాత ఆకులువేసి అందరినీ భోజనానికి కూర్చోబెట్టారు. ఎవరూ ఏదీ చెప్పక మునుపే నేను భోజనం చేయ ప్రారంభించాను. ‘ఓ! ఎటువంటి మనిషి ఈతడు?’ అని వారిలో కొంతమంది సాధువులు అనటం నా చెవులబడింది.”
11.6 షష్ఠ పరిచ్ఛేదం హాజ్రాతో సంభాషణ – గురుశిష్య సంవాదం
అప్పుడు సమయం సాయంత్రం దాదాపు ఐదు గంటలయింది. శ్రీరామకృష్ణులు తమ గది వసారా మెట్ల మీద కూర్చుని ఉన్నారు. హాజ్రా, రాఖాల్, ‘మ’ లు ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నారు. హాజ్రా ‘సోఽహం’ అనే వేదాంత భావాన్ని అనుసంధానం చేసే వ్యక్తి.
శ్రీరామకృష్ణులు (హాజ్రాతో): అవును. ఆయనే ఆస్తికుడు, ఆయనే నాస్తికుడు; ఆయనే మంచి, ఆయనే చెడు; సత్ ఆయనే, అసత్తూ ఆయనే. జాగ్రదవస్థ నిద్రావస్థ – ఇత్యాది స్థితులన్నీ ఆయనవే. అంతేకాదు, ఆయన ఈ స్థితులన్నిటికీ అతీతుడు కూడా. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ గందరగోళమంతా సమసిపోతుంది.
“ఒక రైతుకు వయస్సు పైబడ్డాక ఒక కుమారుడు జన్మించాడు. తల్లి తండ్రులు ఆ పిల్లవాణ్ణి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. పిల్లవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజు ఆ రైతు పొలంలో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు పొరుగింటి ఆసామీ ఒకడు అక్కడకు వచ్చి ఆ రైతు కుమారుడు జబ్బుచేసి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడనే కబురు చెప్పాడు. ఆ రైతు ఇంటికి చేరేసరికి కుమారుడు మరణించాడు. రైతు భార్య భోరున విలపిస్తోంది. కాని ఆ రైతు కళ్లు కనీసం చెమ్మగిల్లనైనా లేదు. అది చూసి ఆమె పొరుగువారితో ‘చూశారా, బంగారంలాంటి కొడుకు పోయినా ఈయన కంట ఒక బొట్టు కన్నీరుకూడా రాలేదు’ అంది నిష్ఠూరంగా. చాలాసేపు గడిచాక ఆ రైతు, భార్యతో ఇలా అన్నాడు: ‘నే నెందుకు ఏడవలేదో నీకు తెలుసా? గత రాత్రి నేనొక కల కన్నాను. ఆ కలలో నేను రాజునయ్యాను. ఏడుగురు కుమారులకు తండ్రినయ్యాను. ఆ కుమారులు అందంలోనూ, గుణాలలోనూ మిన్నగా ఉన్నారు. వారు దినదిన ప్రవర్ధమానులై విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. ఆ ఏడుమంది కుమారుల కోసం విలపించాలో లేక ఈ కుమారుడి కోసం విలపించాలో తెలియక సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నాను.’
“జ్ఞానుల విచారణ ప్రకారం స్వప్నావస్థ ఎంత సత్యమైనదో జాగ్రదవస్థ కూడా అంతే సత్యమైనది.
“భగవంతుడే కర్త. సమస్తం ఆయన ఇచ్ఛానుసారమే జరుగుతోంది.”
హాజ్రా: కాని ఆ విషయం గ్రహించటం ఎంతో కష్టం. భూకైలాస్‌లోని సాధువు విషయం తీసుకోండి. జనం ఆయనను ఎలా చిత్రహింసలకు గురి చేశారు; ఒక విధంగా వారు ఆయన్ను చంపారనే చెప్పవచ్చు! ఆయన సమాధి స్థితిలో ఉండటం వారు చూశారు. ముందుగా ఆయనను పూడ్చిపెట్టారు, ఆ తరువాత నీళ్ల అడుగున ఉంచారు, పిదప వేడి ఇనుప చువ్వతో వాతలు పెట్టారు. ఆ విధంగా ఆయనను బాహ్యచైతన్యంలోకి తేవటానికి ప్రయత్నించారు. కాని చివరికి ఆ సాధువు ఈ చిత్రహింసల ఫలితంగా మరణించాడు. భగవంతుడి సంకల్పానుసారమే ఆ సాధువు మరణించాడని మీరు అనవచ్చు. కాని నిస్సందేహంగా ఆ జనం పెట్టిన యాతనల కారణంగానే ఆయన మరణించాడు.
11.6.1 ఆత్మ అమరం
శ్రీరామకృష్ణులు: మనిషి తన కర్మకు తగ్గ ఫలం అనుభవిస్తాడు. అయితే ఆ సాధువు మరణానికి సంబంధించినంతవరకు అది భగవదేచ్ఛే. కవిరాజ్‌లు (ఔషధకారులు) మకరధ్వజ* ఔషధాన్ని ఒక సీసాలో తయారుచేస్తారు. ఆ సీసాకు మట్టిపూత పూసి కప్పి ఉంచి మంట క్రింద వేడిచేస్తారు. సీసాలోని బంగారం కరిగి ఇతర దినుసులతో కలిసి, ఔషధం తయారవుతుంది. తరువాత వైద్యుడు సీసాను అతిజాగ్రత్తగా పగులగొట్టి ఔషధాన్ని బయటకు తీస్తాడు. ఔషధం తయారయ్యాక సీసాను పదిలపరిచినా లేక పగులగొట్టినా తేడా ఏం ఉంటుంది? జనం ఆ సాధువు చంపబడ్డాడని భావిస్తారు. కాని బహుశా ఆంతరిక సత్తు పరిపక్వత చెంది తయారై ఉంటుంది. భగవత్సాక్షాత్కారానంతరం దేహం జీవించినా ఒక్కటే లేక మరణించినా కూడా ఒక్కటే.
11.6.2 సాధువు, అవతార పురుషుల మధ్య తేడా
“భూకైలాస్ సాధువు సమాధి స్థితిలో ఉండేవాడు. సమాధిలో అనేక రకాలు ఉన్నాయి. ఒక హృషీకేశ్ సాధువు నుంచి విన్న విషయాలతో నా స్థితులు సరిపోలాయి. ఒంటి మీద చీమ ప్రాకుతున్న విధంగా కొన్ని సందర్భాలలో నా అంతరాళంలో ఆధ్యాత్మిక ప్రవాహం పైకెగయటం నాకు అనుభూతం అయ్యేది. మరికొన్ని సమయాల్లో చెట్టుపై ఒక కొమ్మనుంచి మరొక కొమ్మకు కోతి గెంతులు వేస్తున్నట్లు అనిపించేది. ఒక్కోసారి నీళ్లలో ఈదుతూ ఉన్న చేపను తలపించేది. ఈ అనుభూతులను స్వయంగా అనుభవించిన వ్యక్తికే అవెలా ఉంటాయో అవగతమవుతుంది. సమాధి స్థితిలో బాహ్యప్రపంచాన్ని మరచిపోతారు. మనస్సు ఒకింత క్రిందికి దిగివచ్చినప్పుడు, నేను అమ్మతో ఇలా అంటాను: ‘తల్లీ! దీని నుంచి నాకు స్వస్థత చేకూర్చు, నేను జనంతో మాట్లాడాలి.’
“సమాధిస్థితి నుంచి బాహ్యచైతన్యానికి ఈశ్వరకోటికి చెందిన వారు తప్ప మరెవరూ తిరిగి రాలేరు. కొందరు సామాన్యులు ఆధ్యాత్మిక సాధనల తీవ్రతచే సమాధి స్థితిని పొందుతారు; కాని వారు వెనుకకు తిరిగి రాలేరు. కాని ఇతరులకు ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకొన్న సాక్షాత్తూ ఆ భగవంతుడే మానవుడుగా అవతరించినప్పుడు, మానవాళి హితానికై సమాధిస్థితి నుండి బాహ్య చైతన్యానికి తిరిగి వస్తాడు.”
మ (తనలో) : శ్రీరామకృష్ణులు మానవాళికి ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్నారా ఏమిటి?
హాజ్రా: భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే చాలు; అవతారమూర్తి ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి?
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): అవును, అవును. విష్ణుపూర్‌లో పెద్ద ‘రిజిస్ట్రార్’ ఆఫీసు ఉంది. అక్కడ ‘రిజిస్టర్’ చేయగలిగితే, ఇక గోఘాట్‌లో* నమోదు చేసే అగత్యం ఉండదు.
11.6.3 గురుశిష్య సంవాదం – శ్రీముఖం నుండి జాలువారిన స్వీయచరితం
సాయంత్రం అయింది. ఆలయాలలో దీపారాధన జరిగింది. ద్వాదశ శివాలయాల్లో, రాధాకాంత ఆలయం, భవతారిణీ ఆలయం మొదలైన వాటిలోను శంఖం, గంటల మంగళ నాదం వినవచ్చింది. దీపారాధన పూర్తికాగానే శ్రీరామకృష్ణులు గదిలోనుంచి వెలుపలకు వచ్చి దక్షిణ వసారాలో కూర్చున్నారు. నాలుగు దిశలా చిమ్మచీకటి క్రమ్ముకొంది. ఆలయాలలో మాత్రం అక్కడక్కడ దీపాలు మిణుకు మిణుకుమని వెలుగుతున్నాయి. ఆకాశపు నలుపుదనాన్ని తనలో ప్రతిఫలిస్తూ ఉన్నట్లుగా పావన గంగానది ప్రవహిస్తోంది.
శ్రీరామకృష్ణులు సహజంగానే భావపారవశ్య స్థితిలో నెలకొని ఉంటారు. నేడో అమావాస్య. నేటి భావపారవశ్యస్థితి ఎంతో ప్రగాఢమై ఉంది. మధ్యమధ్యలో ఆయన ఓంకారాన్నీ, జగజ్జనని పావన నామాన్నీ ఉచ్చరిస్తూన్నారు.
వేసవికాలం కావటంతో గదిలో బాగా ఉక్కపోస్తోంది. అందుచేతనే ఆయన వసారాలోకి వచ్చి కూర్చున్నారు.
భక్తుడొకరు శ్రీరామకృష్ణులకు ఒక చాపను సమర్పించాడు. దాన్ని వసారాలో పరిచారు. అహర్నిశలూ శ్రీరామకృష్ణులకు జగజ్జనని ఆలోచనయే. ఆ చాప మీద పడుకొనే ‘మ’ తో మెల్లగా మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: ఇదుగో చూడు. భగవంతుని దర్శించవచ్చు. ఆ ఫలానా వ్యక్తికి భగవద్దర్శనం అయింది. కాని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. నీకు సాకారం ఇష్టమా లేక నిరాకారమా?
‘మ’ : మహాశయా! ప్రస్తుతం నాకు నిరాకారమే నచ్చుతున్నది. అయితే ఆయనే ఈ సాకారమూర్తులు అన్నీగా వెలసి ఉన్నాడని కొద్దికొద్దిగా అర్థమవుతోంది.
శ్రీరామకృష్ణులు: ఇదుగో చూడు. బేల్ఘరియాలోని మతి సీల్గారి ఉద్యాన గృహానికి నన్ను బండిలో తీసుకువెళతావా? అక్కడున్న కొలనులో మరమరాలు వేస్తే చాలు, కొలనులోని చేపలు నీటిపైకి వచ్చి వాటిని ఆనందంగా తింటాయి. ఆహా! ఆ నీళ్లలో చేపలు గుంపులు గుంపులుగా ఆడుకోవటం చూస్తే నాకు పరమానందం కలుగుతుంది. ఆ దృశ్యం నీలోనూ ఉద్దీపన కలుగజేస్తుంది. సచ్చిదానంద సాగరంలో ఆత్మ అనే చేప క్రీడిస్తున్నట్లు తోస్తుంది. అదే విధంగా ఒక సువిశాల మైదానంలో నేను నిలబడినప్పుడు నాకు దైవీభావం కలుగుతుంది. తొట్టెలోనుండి ఒక చేపను కొలనులోకి విడిచినట్లు అనిపిస్తుంది.
“భగవద్దర్శనం కావాలంటే సాధనలు చేయవలసి ఉంటుంది. నేను కఠోర సాధనలను చేయవలసి వచ్చింది. ఆ బిల్వవృక్షం క్రింద నేను ఎన్ని రకాల సాధనలు చేశానని! ఆ చెట్టు క్రిందే పడి ఉండేవాడిని. ‘అమ్మా! నీ దర్శనం కలిగించు’ అంటూ మొరపెట్టుకొనే వాడిని. కన్నీటితో శరీరం తడిసిపోయేది.”
‘మ’ : మీరు ఎన్నో కఠోర తపస్సాధనలు చేశారు. కాని జనం క్షణమాత్రంలో భగవత్సాక్షాత్కారం పొందాలని ఆశిస్తారు. ఇంటి చుట్టూ చేతి వ్రేలును కేవలం కదిలిస్తూ పోతే గోడలు తయారవుతాయా ఏమిటి?
శ్రీరామకృష్ణులు (చిరునవ్వుతో): అమృతుడు ఇలా అంటూ ఉంటాడు: ‘ఒకడు మంట రగిలిస్తే పదిమంది దాని వేడిమిలో చలి కాచుకుంటారు.’ మరో విషయం చెప్పవలసి ఉంది. నిత్యాన్ని చేరుకున్న తరువాత లీలలో నెలకొని ఉండటం మంచిది.
‘మ’ : జగన్నాటక వినోదార్థం లీల తలానికి దిగి రావాలని మీ రొకసారి అన్నారు గదా!
శ్రీరామకృష్ణులు: కాదు, అలా కాదు. లీల కూడా సత్యమే.
“ఒకమాట చెబుతా విను. నువ్వు ఇక్కడకు వచ్చేటప్పుడు ఏదైనా చేత పుచ్చుకుని రా. నేను అలా అనకూడదు; అహంకారంలా అగుపించవచ్చు. అధర్కు కూడా పైస విలువైనది ఏదైనా తనతోకూడా తెమ్మని చెప్పాను. కనీసం ఒక పైస తమలపాకులయినా తెమ్మని భవనాథ్కు చెప్పాను. అతడి భక్తి ఎటువంటిదో గమనించావా? నరేంద్రుడు, భవనాథ్ – ఇద్దరు నరుడు, నారివలె అగుపిస్తారు. భవనాథ్ నరేంద్రుని వెన్నంటి ఉంటాడు.
“నీతో బాటు నరేంద్రుణ్ణి కూడా బండిలో తోడ్కొని రా; నీతోపాటు కొన్ని తినుబండారాలు పట్టుకురా. ఇది నీకు ఎంతో మేలు ఒనగూరుస్తుంది.
జ్ఞాన భక్తి మార్గాలు రెండూ భగవంతుని కడకు చేరుస్తాయి. భక్తి మార్గంలో బాహ్యాచారాలను కాస్త అధికంగానే పాటించవలసి ఉంటుంది. కాని జ్ఞానమార్గావలంబి విషయంలో బాహ్యపవిత్రత ఉల్లంఘన అతడికి హాని వాటిల్లజేయదు. అది జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోతుంది. కార్చిచ్చులో పడవేసినప్పుడు పచ్చని అరటిచెట్టు కూడా దగ్ధమైపోతుంది కదా!
“జ్ఞానులు విచారణ మార్గాన్ని అనుసరిస్తారు. విచారణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో నాస్తిక భావం జనించే ప్రమాదం ఉంది. కాని ఆయన్ను దర్శించాలన్న తీవ్ర ఆకాంక్ష కలిగిన భక్తుడు నాస్తిక భావం కలిగినప్పటికీ భగవచ్చింతన మాత్రం వీడడు. తాతల కాలం నాటి నుండి వ్యవసాయాన్నే వృత్తిగా కలిగివున్న వ్యక్తి అతివృష్టి లేక అనావృష్టి కారణంగా ఫలసాయం ఏమీ దక్కనప్పటికీ తన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు.”
చాప మీద పడుకొని దిండు మీద తల పెట్టుకొని శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. ఆయన ‘మ’ తో ఇలా అన్నారు: “కాళ్లు కొద్దిగా నొప్పి పుడుతున్నాయి. కాస్త మృదువుగా వాటిని ఒత్తు.”
ఆ విధంగా అనంత కరుణామయులైన శ్రీరామకృష్ణుల పాదపద్మాలను సేవిస్తూ ఆయన ముఖతా జాలువారే అమృత వచనాలను ఆలకిస్తూ ఉన్నాడు ‘మ’.
11.7 సప్తమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో రాఖాల్, రామ్, కేదార్, తారక్, ‘మ’ ప్రభృతులతో
శుక్రవారం, జూన్ 8, 1883
11.7.1 కాళికాలయంలో పూజ
కాళికాలయంలో సాయంకాల హారతి ముగిసింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని ప్రతిమ ఎదుట నిలబడి కొన్ని నిమిషాలు చామరం వీచారు.
సంధ్యానంతరం కలకత్తా నుండి రామ్, కేదార్ ఛటర్జీ, తారక్‌లు శ్రీరామకృష్ణుల కోసం మిఠాయిలు మొదలైనవి తీసుకుని బండిలో వచ్చారు.
కేదార్ వయస్సు దాదాపు యాభై ఏళ్లు ఉంటాయి. అతడు పరమ భక్తుడు. భగవత్ ప్రసంగం వింటూనే అతడి కళ్లు చెమ్మగిల్లుతాయి. మొదట్లో అతడికి బ్రహ్మసమాజంతో సంబంధం ఉండేది. తరువాత కర్తాభజా, నవరసిక్ మొదలైన సంప్రదాయాలలో చేరాడు. చివరికి శ్రీరామకృష్ణుల పాదపద్మాలను ఆశ్రయించాడు. ప్రభుత్వ కార్యాలయంలో అతడు గణకుడు (అకౌంటెంటు)గా ఉద్యోగం చేస్తున్నాడు; కలకత్తా పొలిమేరలోని కాంసారాపాడ సమీపంలోని హాలిసహర్ గ్రామంలో అతడి నివాసం.
తారక్ (కాలాంతరంలో స్వామి శివానంద) సుమారు ఇరవై నాలుగేళ్ల యువకుడు. వివాహమైన కొద్దికాలంలోనే అతడి భార్య మరణించింది. కలకత్తాకు దగ్గరలోని బారాసత్ ఇతడి స్వగ్రామం. ఇతడి తండ్రి గొప్ప శక్తి ఉపాసకుడు; శ్రీరామకృష్ణులను అనేకమార్లు సందర్శించాడు. తారక్ తల్లి మృతిచెందాక, అతడు పునర్వివాహం చేసుకున్నాడు.
తారక్ తరచూ రామ్ ఇంటికి వెళుతూ ఉండేవాడు; అక్కడ నుండి రామ్, నిత్యగోపాల్లతో కలిసి శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటాడు. ఇతడు ప్రస్తుతం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు. కాని లోకంపట్ల అతడిది పూర్తి ఉదాసీన వైఖరి.
తారక్ (స్వామి శివానంద)
శ్రీరామకృష్ణులు కాళికాలయం నుండి బయటకు వచ్చి నేలమీద సాగిలపడి కాళీమాతకు ప్రణామం చేశారు. అక్కడ రామ్, కేదార్, ‘మ’, తారక్ మొదలైన భక్తులు బయట నిలబడి ఉండటం చూశారు.
11.7.2 తారక్ పట్ల ఆప్యాయత – కేదార్, కామినీ కాంచనాలు
తారక్‌ను చూడటంతోనే శ్రీరామకృష్ణులు అపరిమితానందభరితులైనారు. తారక్ చుబుకాన్ని స్పృశించి అతడిపట్ల తమకున్న ఆప్యాయతను వెలిబుచ్చారు.
శ్రీరామకృష్ణులు తమ గదిలోకి తిరిగి రాగానే భావావిష్టులై నేల మీద కాళ్లు చాపుకుని కూర్చున్నారు. రామ్, కేదార్లు ఆయన పాదాలను పువ్వులతో, మాలలతో అలంకరించారు. ఆయన సమాధిస్థితి పొందారు.
కేదార్ నవరసిక్ సంప్రదాయంలో ఇంకా విశ్వాసం కలిగి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల నుండి ఆధ్యాత్మిక శక్తిని తనలోకి ప్రసరింపచేయ నెంచి ఆయన కాలిబొటన వ్రేళ్లను కేదార్ పట్టుకొన్నాడు. కొంత స్పృహ రాగానే శ్రీరామకృష్ణులు “అమ్మా! నా బొటనవ్రేళ్లు పట్టుకొని అతడు ఏం చేయబోతున్నాడు?” అన్నారు. కేదార్ వినమ్రంగా చేతులు జోడించుకుని కూర్చుని ఉన్నాడు.
ఇంకా భావపారవశ్యంలోనే ఉండి శ్రీరామకృష్ణులు, కేదార్‌తో ఇలా అన్నారు: “నీ మనస్సు ఇంకా కామినీ కాంచనాల వైపే ఆకర్షితమై ఉంది. ‘వాటిని నేను ఖాతరు చేయ’ నని నువ్వు ఊరకే చెప్పటంలో ప్రయోజనం ఏమిటి? ముందుకు సాగిపో. చందన వనానికి ఆవల అనేకమైనవి ఉన్నాయి; వెండి, బంగారు, రత్నాల గనులు ఉన్నవి. ఏదో ఒకింత ఆధ్యాత్మికత ఒంటబట్టినంత మాత్రం చేత సర్వాన్ని సాధించానని భావించుకోకు.”
శ్రీరామకృష్ణులు మళ్లీ జగన్మాతతో, “అమ్మా! ఇతణ్ణి ఇక్కడ నుంచి పంపించి వెయ్యి” అన్నారు. ఈ మాటలతో కేదార్ గొంతులో తడారిపోయింది. భయం ఉట్టిపడే స్వరంతో కేదార్ “ఆయన ఏమంటున్నారు?” అని రామ్‌ను అడిగాడు.
రాఖాల్ను చూడగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశ్యత చెందారు. తమ ప్రియతమ శిష్యుడితో ఆయన ఇలా అన్నారు “నేను వచ్చి చాలారోజులు అయింది. నువ్వు ఎప్పుడు వచ్చావు?”
శ్రీరామకృష్ణులు తాను అవతారపురుషుడనీ, రాఖాల్ తన ఆంతరంగిక భక్తుడనీ చెబుతున్నారా ఏమిటి?
11.8 అష్టమ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో మణిరాంపూర్ భక్తులతో శ్రీరామకృష్ణులు
ఆదివారం, జూన్ 10, 1883
11.8.1 శ్రీరామకృష్ణుల బాల్య స్మృతులు
అప్పుడు సమయం ఉదయం దాదాపు పది గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కాసేపు కూర్చుని, కాసేపు నిలబడి భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. రాఖాల్, ‘మ’, లాటు, కిశోరీ, రామ్‌లాల్, హాజ్రా తదితర భక్తులు కూడా ఉన్నారు.
శ్రీరామకృష్ణులు తమ తొలినాళ్ళ జీవితాన్ని వర్ణిస్తూ వారితో ఇలా అన్నారు: “నా చిన్ననాటి రోజుల్లో కామార్పుకూర్లోని స్త్రీ పురుషులు అందరూ నన్ను ఎంతగానో అభిమానించేవారు. నా పాట వినటానికి ఎంతో ఇష్టపడేవారు. నేను ఇతరుల అభినయాన్ని, సంభాషణలను అనుకరిస్తూ వారికి వినోదం కలిగించే వాణ్ణి. ఇల్లాళ్ళు నా కోసం తినుబండారాలు దాచివుంచి, ఇచ్చేవారు. ఎవరూ నా పట్ల అపనమ్మకం కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరూ నన్ను వారి కుటుంబ సభ్యునిగా ఎంచేవారు.
“ఆనందంగా ఉన్న పావురం మాదిరి ఉండేవాణ్ణి. సుఖ సంతోషాలతో వర్ధిల్లే కుటుంబాలకే నేను తరచూ వెళ్లేవాణ్ణి. బాధలు, దుఃఖం ఉన్న చోటు నుంచి నేను పలాయనం చేసేవాడను.
“ఒకరిద్దరు మంచి కుర్రవాళ్లతో అతిసన్నిహితంగా మెలగేవాణ్ణి. కొందరితో స్నేహం చేసేవాడను. ప్రస్తుతం వాళ్లు సంసారంలో మునిగిపోయి ఉన్నారు. వారిలో కొందరు ఇక్కడకు వస్తూ ఉంటారు. నన్ను చూసి, ‘ఓ, ఇతడు పాఠశాలలో ఎలా ఉండేవాడో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు’ అనేవారు. గణితం అంటేనే నాకు తల తిరిగిపోయేది. కాని బొమ్మలు చక్కగా గీసేవాడిని; దేవీ దేవతల బొమ్మలను అందంగా చేసేవాణ్ణి.
11.8.2 అన్నసత్రం – రామాయణ, మహాభారాతాలపై మక్కువ
“అన్నసత్రం, ధర్మశాల, ఎక్కడ కంటబడ్డా అక్కడకు వెళ్ళేవాణ్ణి. చాలాసేపు అక్కడే నిలబడి సాధువులను చూస్తూ ఉండేవాడను.
“రామాయణం, భాగవతం పఠించే చోట్లకు పోయి కూర్చుని వినేవాణ్ణి. పఠించే వ్యక్తి అభినయంతో పఠిస్తే దాన్ని ఇతరులకు అట్లే చేసి చూపేవాడను, వారికి ఆ పురాణ కథలను వినిపించేవాడను. స్త్రీల ప్రవర్తనను సులభంగా అర్థం చేసుకునేవాడిని. వారు ఎలా సంభాషిస్తారో హావభావాలతో సహా అనుకరించే వాడిని. బాల వితంతువులు తండ్రి పిలిచేటప్పుడు, ‘వస్తు…. న్నా…..ను’ అంటూ సాగదీసి బదులు చెప్పేవారు. ముసలమ్మలు వసారాలో నుంచే, ‘ఓ బెస్తవాడా!’ అని పిలుస్తారు. నీతిబాహ్యురాండ్రైన స్త్రీలను సులువుగా గుర్తించేవాడను. భ్రష్టత చెందిన వితంతువులు మధ్యలో పాపిడి తీసుకుంటారు. ఒంటికి నూనె రాచుకోవటంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. వారికి లజ్జ తక్కువగా ఉంటుంది. వారు కూర్చునే పద్ధతే ప్రత్యేకంగా ఉంటుంది. సరి, సరి. ఈ లౌకిక మాటలు ఇక చాలు.”
తరువాత శ్రీరామకృష్ణులు, రామ్‌లాల్‌ను పాడమన్నారు.
రామ్‌లాల్ పాడసాగాడు:
ఎవరూ! ఆ భీకరమానిని ఎవరూ?
అర్ధనిశీథపు ఆకాశమువలె
గభీరవర్ణపు కాళరూపిణి॥ ఎ ॥
నల్ల కలువవలె రక్తసంద్రమున
నాట్యము చేయుచు యుద్ధభూమిలో
అనంతత్వమును అంబరముగ తన
ఒడలికి ఉడుపుగ తొడుగు ఒంటరి॥ ఎ ॥
భీషణముగ తన మూడు కన్నులను
వెర్రిగ హడలుగ త్రిప్పు భయంకరి
ఎవ్వరి నడకల బరువున భువియే
అదరుచు ఇటునటు కదలు కామిని॥ ఎ ॥
బలిష్టుడగు శివుడెవరి భర్తయో
భీషణపినాకపాణి ఎవ్వరో
విజయపాదముల క్రింద శవమువలె
అమరియున్న యా మహామాయయా॥ ఎ ॥
తరువాత రావణుడు మరణించాక మండోదరి మనోవేదన భరించలేక దుఃఖీంచటం గురించి పాడాడు.
11.8.3 శ్రీరామకృష్ణులు – గోపికల ప్రేమ
ఆ పాటను విని కళ్లు చెమ్మగిల్లగా శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “ఒకసారి నేను బయలుకై సరుగుడు తోపుకు వెళ్ళాను. అప్పుడు గంగలో పడవ నడిపేవాడు ఒకడు ఈ పాట పాడాడు. అది విని చాలాసేపు విలపిస్తూ నిలబడిపోయాను. తరువాత, ఎవరో వచ్చి నన్ను నా గదికి తీసుకువెళ్ళవలసి వచ్చింది.”
కృష్ణుడి పట్ల గోపికలకు ఉన్న ప్రేమను గురించి రామ్‌లాల్ ఒక పాట పాడాడు.
అక్రూరుడు, కృష్ణుణ్ణి రథంలో ఎక్కించుకొని మథురకు బయలుదేరటానికి ఉద్యుక్తుడయ్యాడు. అది చూసి గోపికలు రథ చక్రాన్ని వడిసి పట్టుకున్నారు. కొందరు చక్రాల ముందు అడ్డంగా పడుకున్నారు. అక్రూరుడి పట్ల వారు కోపం వహించారు. కృష్ణుడు తన ఇచ్ఛానుసారమే అక్కడకు పోతున్నాడు అన్న సంగతి, పాపం వారి కెలా తెలుస్తుంది? ఈ సంగతి అక్రూరుడు గోపికలకు వివరిస్తున్నాడు.
వదలండి వదలండి ఓ వెర్రులార
రథచక్రములనేల లాగి పట్టెదరు
చలియింపజేయునవి చక్రంబులాదాని॥ వ ॥
ఎవ్వాని తలపుచే ఎల్ల భువనములు
కదలుచున్నవి వానిగతి తప్పకుండ
ఆ కృష్ణుడే వాని నడిపించువాడు॥ వ ॥
శ్రీరామకృష్ణులు (భక్తులతో): గోపికల ప్రేమ ఎటువంటిదో చూడండి! ఎంతటి ప్రేమ! రాధ, కృష్ణుని చిత్రాన్ని గీచింది, కాని దాన్లో కాళ్ళను చిత్రించలేదట, కాళ్ళు ఉంటే మథురకు పారిపోతాడన్న భయంతో.
“బాలుడుగా ఉన్నప్పుడు నేనీ పాటలను తరచూ పాడేవాడను. కొన్ని నాటకాలలోని పాటల నన్నిటినీ అట్లే ఒప్పచెప్పేవాణ్ణి. కాళీయదమన్ నాటక బృందంలో నేనూ ఉండేవాడినని కొందరు అంటుంటారు.”
భక్తు డొకడు నూతన అంగవస్త్రాన్ని కప్పుకొని అక్కడకు వచ్చాడు. రాఖాల్ది పసిపిల్లవాడి స్వభావం. ఒక కత్తెరను తీసుకువచ్చి ఆ వస్త్రంలో వ్రేలాడుతూ ఉన్న దారపు పోగులను కత్తిరించబోయాడు.
శ్రీరామకృష్ణులు (రాఖాల్తో): దాన్ని ఎందుకు కత్తిరిస్తున్నావు? ఉండనీ, శాలువాకు ఉన్నట్లే బాగానే ఉంది కదా! (భక్తుడితో) అవునూ, దీని ఖరీదు ఎంత?
ఆనాడు విదేశీవస్త్రం ధర తక్కువగా ఉండేది.
భక్తుడు: జత ఒక రూపాయ ఆరు అణాలు.
శ్రీరామకృష్ణులు: ఏమంటున్నావు? జత ఒక రూపాయ ఆరు అణాలా? అంతేనా?
కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు భక్తుడితో, “వెళ్లు, వెళ్లి గంగలో స్నానం చేసి రా. (మరో భక్తుడితో) ఇతడికి కొంచెం నూనె ఇవ్వు” అన్నారు. భక్తుడు స్నానం చేసి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అలమరాలోనుంచి ఒక మామిడిపండు తీసుకువచ్చి ఆ భక్తుడికి ఇచ్చారు.
“ఇతడికి ఈ పండు ఇస్తున్నాను. ఇతడు మూడిటిలో పాస్ (ఉత్తీర్ణుడు) అయ్యాడు.* అవునూ, నీ సోదరుడు ఎలా ఉన్నాడు?” అని అడిగారు.
భక్తుడు: మంచి ఔషధం ఇచ్చారు, నయం కావాలి.
శ్రీరామకృష్ణులు: అతడికి నువ్వొక ఉద్యోగం ఇప్పించరాదా? నువ్వే కదా అతడి సంరక్షకుడవు.
భక్తుడు: ఆరోగ్యం కుదుటపడితే అన్నీ సవ్యంగా జరుగుతాయి.
శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం చిన్నమంచంపై కూర్చుని ఉన్నారు. విశ్రాంతికి సమయం దొరకలేదు. భక్తులు రాసాగారు. మొదట మణిరాంపూర్ నుండి ఒక భక్తబృందం వచ్చింది. ప్రజాపనుల శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక వ్యక్తి వచ్చాడు. అతడు పింఛను పుచ్చుకుంటున్నాడు. మరొక భక్తుడు ఇతణ్ణి తోడ్కొని వచ్చాడు. కాసేపయ్యాక బేల్ఘరియా నుంచి ఒక భక్తబృందం అరుదెంచింది. మణిమల్లిక్ ప్రభృతులూ వచ్చి చేరారు.
మణిరాంపూర్ భక్తులు: మహాశయా! మీ విశ్రాంతికి భంగం కలిగించామేమో?
శ్రీరామకృష్ణులు: అటువంటి దేమీ లేదు. అదంతా రజోగుణం గలవారికి వర్తిస్తుంది. అటువంటి వ్యక్తిని గురించి జనం, ‘అతడు ఇప్పుడు సుఖంగా నిద్రబోతున్నాడు’ అంటారు.
మణిరాంపూర్ అని వినగానే శ్రీరామకృష్ణులకు తమ చిన్ననాటి నేస్తం శ్రీరామ్ జ్ఞాపకానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “శ్రీరామ్ దుకాణం మీ గ్రామంలో ఉంది. కామార్పుకూర్లో అతడు నాతో కలిసి చదువుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇక్కడకు వచ్చి ఉన్నాడు.”
మణిరాంపూర్ భక్తులు: భగవత్సాక్షాత్కారానికి మార్గం ఏమిటి? దయచేసి మాకు తెలుపండి.
11.8.4 మణిరాంపూర్ భక్తులకు ఉపదేశం – సాధన, భజనలు, వ్యాకులత
శ్రీరామకృష్ణులు: కొంత సాధనానుష్ఠానాలు చెయ్యటం అవసరం. పాలలో వెన్న ఉన్నది అని చెప్పటం మాత్రం చాలదు. పాలను తోడుపెట్టి పెరుగుగా చేసి, దాన్ని చిలికి వెన్నను తీయాలి. అందుకే మధ్య మధ్యలో ఏకాంతవాసం చేయాలి. కొన్ని రోజులు ఏకాంతంలో వసించి, భక్తిని పొందాక ఎక్కడైనా జీవించవచ్చు. కాళ్లకు చెప్పులు ఉంటే ముళ్లు ఉన్న అడవిలో సైతం సులభంగా నడిచి వెళ్లవచ్చు.
“ముఖ్యమైన విషయం విశ్వాసం. సంకల్పానికి తగ్గట్లే ఫలితం ఉంటుంది. విశ్వాసమే మూలధనం. విశ్వాసం కలిగితే, మరిక ఏ భయమూ ఉండదు.”
మణిరాంపూర్ భక్తుడు: స్వామీ, గురువు అవసరమా?
శ్రీరామకృష్ణులు: చాలామందికి అవసరమే. కాని గురు వాక్యాలపై విశ్వాసం ఉంచాలి. గురువును సాక్షాత్తూ భగవంతునిగా ఎంచినప్పుడే విజయం చేకూరేది. అందుకే వైష్ణవులు ‘గురువు – కృష్ణుడు – వైష్ణవుడు’* అని చెబుతుంటారు.
“సర్వదా భగవంతుని నామస్మరణ చేయాలి. కలియుగంలో భగవన్నామానికి ఎంతో మాహాత్మ్యం ఉంది. ఈ యుగంలో జీవులు అన్నగతప్రాణులు గనుక యోగసాధనలు సాధ్యం కాదు. భగవన్నామాన్ని చప్పట్లు కొడుతూ భజన చేస్తే పాపా లనే పక్షులు ఎగిరిపోతాయి.
“సర్వదా సత్సంగం ఎంతో అవసరం. గంగానదికి ఎంత సమీపంగా వస్తే అంత చల్లనిగాలిని అనుభవించవచ్చు. అగ్నిని సమీపించేకొద్దీ అధిక వేడిమిని పొందుతాం.
“సోమరితనంతో దేన్నీ సాధించలేం. సంసారంలోని సుఖాలపట్ల అనురక్తి ఉన్నవారు, ‘ఆ, ఏదో ఒక రోజు భగవద్దర్శనం కలుగుతుందిలే’ అంటారు. కొడుకు మంకుపట్టు పడితే నిర్ణీత కాలానికి మూడు సంవత్సరాల ముందే తండ్రి ఆస్తి పంచి ఇచ్చివేస్తాడు అని ఒకసారి కేశవ్సేన్తో చెప్పాను.
“తల్లి వంట చేస్తోంది. పసిబిడ్డ పడుకొని ఉంది; తల్లి ఆ బిడ్డ నోట్లో పాలపీక పెట్టి వెళ్లింది. కాని బిడ్డ దాన్ని తీసిపారవేసి ఏడవసాగినట్లయితే, తల్లి వెంటనే కుండను దించిపెట్టి పరుగున వచ్చి బిడ్డను ఎత్తుకొని పాలు ఇస్తుంది. ఇదంతా నేను కేశవ్‌కి చెప్పాను.
“కలియుగంలో ఒక పగలు, ఒక రాత్రి విలపిస్తేనే చాలు, భగవద్దర్శనం అవుతుందని చెబుతారు. నిష్ఠూరంగా ఇలా పలుకు; ‘అమ్మా! నువ్వు నన్ను సృష్టించావు. నాకు దర్శనం ఇచ్చే తీరాలి.’
“నువ్వు సంసారంలోనే ఉండు, లేకుంటే మరి ఎక్కడయినా ఉండు; భగవంతుడు మాత్రం మనస్సునే చూస్తాడు. విషయాసక్తమైన మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్ల లాంటిది, ఎంత గీచినా వెలగనే వెలగదు. ఏకలవ్యుడు, ద్రోణుని మట్టిప్రతిమను గురువుగా ఎంచి విలువిద్యలో ప్రవీణుడైనాడు.
“ముందుకు సాగిపో. కట్టెలుకొట్టేవాడు ముందుకు వెళ్లటం వలననే చందనం చెట్లు, వెండి గని, బంగారుగని మొదలైన వాటిని గాంచగలిగాడు. ఇంకా ముందుకు వెళ్లి వజ్రాల గనులను చూడగలిగాడు.
“అజ్ఞానంలో ఉన్నవారు మట్టి గోడలున్న ఇంట్లో వసిస్తూ ఉన్న వారికి సమానం. ఇంట్లోనూ వలసినంత వెలుగు లేదు, వెలుపలా ఏ వస్తువునూ చూడలేరు. జ్ఞానం పొందాక సంసారంలో వసించేవాడు అద్దాల ఇంట్లో వసించే వ్యక్తి లాంటివాడు. ఇంట్లోనూ వెలుగు, వెలుపలా వెలుగు. లోపలి వస్తువులను చూడగలడు; వెలుపలి వస్తువులనూ చూడగలడు.
11.8.5 బ్రహ్మం, శక్తి ఒక్కటే
“ఉన్నది ఒక్కటే. అన్యమైనది ఏదీ లేదు. ఆ పరబ్రహ్మం మనలో ‘నేను’ అన్న భావాన్ని ఉంచినంత వరకు, ఆయనే ఆద్యాశక్తి రూపంలో సృష్టి స్థితి లయాల నన్నిటిని నిర్వర్తిస్తూ ఉన్నట్లు మనకు చూపిస్తాడు.
“ఏదైతే బ్రహ్మమో, అదే ఆద్యాశక్తి కూడా. ఒక రాజు ఒక యోగితో తనకు ఒక్క మాటలో జ్ఞానం ప్రసాదించమని అడిగాడు. అందుకు యోగి, ‘సరే! నువ్వు ఒకే మాటలో జ్ఞానం పొందుతావు’ అన్నాడు. కాసేపటికి రాజు వద్దకు ఒక ఐంద్రజాలికుడు వచ్చాడు. వచ్చిన ఆతడు రెండు వ్రేళ్లు తిప్పుతూ రాజుతో, ‘రాజా! ఇదుగో చూడండి, ఇదుగో చూడండి’ అన్నాడు. రాజూ ఆశ్చర్యంతో చూశాడు. కాసేపట్లో రెండు వ్రేళ్లు ఒక వ్రేలుగా మారిపోయింది. ఐంద్రజాలికుడు ఆ ఒక వ్రేలును తిప్పుతూ, ‘రాజా! ఇదుగో చూడండి, ఇదుగో చూడండి’ అన్నాడు. దీని అర్థం బ్రహ్మమూ ఆద్యాశక్తీ మొదట్లో రెండుగా తోస్తాయి. కాని బ్రహ్మజ్ఞానం పొందాక రెండు ఉండవు. అప్పుడు ఉన్నది ఒక వస్తువే, రెండు వేర్వేరు వస్తువులు లేనే లేవు. అభేదం; అద్వైతం.”
11.9 నవమ పరిచ్ఛేదం బేల్ఘరియా భక్తులతో
బేల్ఘరియా నుండి గోవిందముఖోపాధ్యాయ తదితర భక్తులు వచ్చి ఉన్నారు. మునుపు ఒకసారి ఆతడి ఇంటికి శ్రీరామకృష్ణులు వెళ్లారు. అప్పుడు ఒక గాయకుడు, ‘మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని’ అన్న పాటను పాడాడు. ఆ పాట విని శ్రీరామకృష్ణులు సమాధిస్థితి పొందారు. గోవిందుడు ఆ గాయకుణ్ణి తోడ్కొని వచ్చాడు. అతణ్ణి చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. అతణ్ణి పాడమని కోరారు. గాయకుడు పాడటం ప్రారంభించాడు:
మేలుకో మాయమ్మ మేలుకో ఓ జనని
మేలుకోవే తల్లి మేలుకో
మూలాధారచక్రమందెంత కాలము
ముకుళించి నిదురింతువు॥ మే ॥
శిరమందు శివుడుండ వేయి దళపద్మమున
చేరనాతని వేగలెమ్ము
గోపనీయమైన నీ గూఢకార్యము
ఫలకారి గావించుకొనుము॥ మే ॥
షట్చక్రభేదనము సత్వరమె చేయుము
చైతన్యరసరూపరాశీ
దూరముగా నాదు దుఃఖభారమును
తొలగంగద్రోయజేసి॥ మే ॥
శ్రీరామకృష్ణులు: ఈ పాటలో షట్చక్రాల భేదనం గురించి వర్ణించబడింది. భగవంతుడు బాహ్యంలోనూ ఉన్నాడు, లోపలా ఉన్నాడు. ఆయన లోపల ఉండి మనస్సు యొక్క పలువిధాలైన స్థితులను కల్పిస్తున్నాడు. షట్చక్రాలను భేదించి వెళితే, మాయా రాజ్యాన్ని అధిగమించి జీవాత్మ పరమాత్మతో ఐక్యమైపోతుంది. ఇదే భగవద్దర్శనం.
“మాయ, ద్వారం నుండి ప్రక్కకు తొలగకుంటే భగవద్దర్శనం కలుగదు. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురూ వెళుతూ ఉన్నారు; మొదట రాముడు, మధ్యలో సీత, వెనుక లక్ష్మణుడు. సీత మధ్యలో ఉండటం చేత లక్ష్మణుడు, రాముణ్ణి చూడలేకపోయాడు. అదే విధంగా నడుమ మాయ ఉండటం చేత జీవుడు భగవంతుణ్ణి చూడలేకున్నాడు. (మణిమల్లిక్తో) కాని భగవత్కృప కలిగితే మాయ, ద్వారం నుండి తొలగిపోతుంది. యజమాని ఉత్తర్వు ఇస్తే కాపలావాడు, ‘ప్రభో, ఇదుగో ఇతడికి ద్వారం తెరుస్తున్నాను’ అంటాడు.
“వేదాంత మార్గం, పురాణ మార్గం అని రెండు చింతనాధోరణులు ఉన్నాయి. ‘ఈ సంసారం ఒక మాయా భవనం’ అంటుంది వేదాంతం. అంటే ఈ జగత్తు అసత్యం, స్వప్నం లాంటిది, అంటుందది. కాని పురాణాలు, భక్తిశాస్త్రాలు భగవంతుడే ఇరవై నాలుగు తత్త్వాలుగా అయివున్నాడని చెబుతాయి. ఆయనను బాహ్యంలోను, అంతరంగంలోను ఆరాధించు.
“ ‘నేను’ అనే భావనను భగవంతుడు మనలో ఉంచినంత వరకు అన్నీ ఉంటాయి; అప్పుడు జగత్తు స్వప్నం లాంటిది అని చెప్పజాలం. క్రింద మంట మండుతూ ఉన్నందునే కుండలో బియ్యం, పప్పు, బంగాళాదుంపలు గెంతుతున్నాయి; ‘నేను ఉన్నాను, నేను గెంతుతున్నాను’ అని చెబుతూ ఉన్నట్లు అవి గెంతుతున్నాయి. దేహమే కుండ; మనస్సు, బుద్ధి నీరు; ఇంద్రియ విషయాలే బియ్యం, పప్పు, బంగాళాదుంపలు మొదలైనవి. ‘నేను’ అనే చైతన్యం ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది ‘నేను గెంతుతున్నాను’ అంటూ గెంతుతున్నది. సచ్చిదానందమే మంట.
“భక్తిశాస్త్రాలు ఈ సంసారాన్ని, ఒక ‘ఆనందసౌధం’ గా పేర్కొంటాయి. రామ్‌ప్రసాద్ ఒక పాటలో ఈ సంసారాన్ని ‘ఒక మాయాభవనం’ అంటాడు. దానికి జవాబు ఇచ్చే రీతిలో మరొకరు సంసారం ‘ఆనందసౌధం’ గా పేర్కొన్నాడు. కాళీ భక్తుడు జీవన్ముక్తుడు; సర్వదా ఆనందమయుడు. భగవంతుడే మాయగా అయివున్నట్లు భక్తుడు గాంచుతాడు. ఆయనే జీవజగత్తులుగా అయి ఉన్నాడు. భగవంతుడు, మాయ, జీవ జగత్తులు – సమస్తాన్నీ భక్తుడు ఒక్కటిగానే దర్శిస్తున్నాడు. కొందరు భక్తులు సమస్తాన్నీ రామమయంగా దర్శిస్తారు. రాముడే సర్వమూ అయివున్నాడని వారు అంటారు. మరికొందరు సర్వాన్ని రాధాకృష్ణమయంగా దర్శిస్తారు. కృష్ణుడే ఇరవై నాలుగు తత్త్వాలుగా విరాజిల్లుతున్నాడు అంటారు వారు. ఆకుపచ్చ కళ్లద్దాలు ధరిస్తే అంతా ఆకుపచ్చగానే కనిపిస్తుంది.
“కాని భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణలో తేడాలు ఉండటం భక్తిమార్గం ఒప్పుకుంటుంది. రాముడే సమస్తమూ అయివున్నాడు. కాని కొన్నిచోట్ల ఆయన శక్తి అధికంగాను, మరి కొన్నిచోట్ల తక్కువగాను అభివ్యక్తం అవుతోంది. అవతార పురుషులలో ఒక విధమైన అభివ్యక్తీకరణ, సామాన్య జీవులలో మరో రకమైన అభివ్యక్తీకరణ కానవస్తుంది. అవతార పురుషులకూ దేహబుద్ధి ఉంటుంది. మాయ కారణంగా వారు దేహాన్ని ధరిస్తున్నారు. సీతకోసం రాముడు విలపించాడు. పిల్లలు దాగుడుమూతలు ఆడేటట్లు అవతార పురుషులు కావాలనే తమ ఇచ్ఛానుసారం తమ కళ్లకు గంతలు కట్టివేసుకుంటున్నారు. కాని తల్లి పిలిస్తే వెంటనే ఆట ఆగిపోతుంది. కాని జీవుల స్థితి వేరు; కళ్లకు గంతలుగా కట్టిన అదే గుడ్డ వీపు పైన ఎనిమిది మేకులతో కట్టివేయబడి ఉంది. ఆ ఎనిమిది మేకులే అష్టపాశాలు. అవి; లజ్జ, ద్వేషం, భయం, ఆభిజాత్యం, శోకం, కులం, శీలం, గోప్యం. గురువు సహాయం లేకుండా ఇవి విడివడవు.”
11.10 దశమ పరిచ్ఛేదం వ్యాకులతతో ప్రార్థన – నిజమైన భక్తుని లక్షణాలు
బేల్ఘరియా భక్తుడు: మహాశయా, దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి.
శ్రీరామకృష్ణులు: సకల భూతకోటిలోను భగవంతుడు ఉన్నాడు. కాని ‘గ్యాస్ కంపెనీ’ కి అర్జీ పెట్టుకో. వారు వచ్చి నీ ఇంటికీ గ్యాస్ సరఫరా చేస్తారు.
“కాని వ్యాకులతతో ప్రార్థించాలి. మూడు ఆకర్షణలు ఏకం అయినప్పుడు భగవద్దర్శనం కలుగుతుంది అని చెబుతారు. తల్లికి బిడ్డపట్ల గల ఆకర్షణ, పతివ్రతకు భర్తపట్లగల ఆకర్షణ, విషయాసక్తుడికి విషయ వస్తువులపట్ల గల ఆకర్షణ – ఇవే ఆ మూడు ఆకర్షణలు.
“నిజమైన భక్తుడికి కొన్ని గుర్తులు ఉన్నాయి. గురువు ఉపదేశం వినగానే అతడి మనస్సు స్థిరమైపోతుంది. పాములవాడి నాగస్వరాన్ని వినగానే విషసర్పం స్థిరంగా అయిపోతుంది. అయితే నాగుపాము అలా కాదు. మరొక గుర్తు: నిజమైన భక్తుడికి గ్రహణ శక్తి ఉంటుంది. ‘ఫోటోగ్రాఫ్’ తీస్తున్నప్పుడు ఉత్త అద్దం మీద పటం నమోదు కాదు. కాని నలుపు ద్రావణం పూసిన అద్దంపై పటం పడుతుంది. ఆ నలుపు ద్రావణమే భక్తి. మరొక గుర్తు: నిజమైన భక్తుడు జితేంద్రియుడై ఉంటాడు. కామాన్ని జయిస్తాడు. గోపికలలో కామం ఉండేది కాదు.
“మీరు సంసారంలో ఉన్నారు, అట్లే ఉండండి. దాన్లో ఉంటూనే సాధనలు చేయటం సులభం. ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్లు. శవసాధన చేసేటప్పుడు శవం మధ్య మధ్యలో ‘ఆ’ అంటూ నోరు తెరచి భయపెడుతుంది. అందువల్ల బియ్యం, వేయించిన పప్పులు ప్రక్కన ఉంచుకోవాలి; దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. శవం శాంతించాక నిశ్చింతగా జపం చేయవచ్చు. అదే విధంగా భార్యాబిడ్డలను శాంతియుతంగా ఉంచాలి. అప్పుడే సాధన భజనలు చేయటానికి ఏ ఆటంకమూ ఉండదు.
“సుఖభోగాలపట్ల ఇంకా ఆసక్తిగలవారు సంసారంలో ఉంటూనే భగవంతుని ప్రార్థించాలి. అందుచేతనే నిత్యానందుడు, ‘మాగుర్ చేపల పులుసు, యువతుల కౌగిలింత, హరినామస్మరణ’* అంటూ ఏర్పాటూ చేశాడు.
“కాని నిజమైన సన్న్యాసి స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. తేనెటీగ పువ్వుల మీద తప్ప మరి దేనిమీదా వ్రాలదు. చాతకపక్షికి అన్ని నీళ్లు నిష్ప్రయోజనమే; మరి ఏ నీటినీ త్రాగదు, కేవలం స్వాతి నక్షత్రం నాడు కురిసే వాననీటికై అది నోరు తెరచుకుని ఉంటుంది. ఇదే విధంగా నిజమైన సన్న్యాసి భగవదానందం తప్ప వేరే ఆనందం దేన్నీ ఆశించడు. తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వ్రాలుతుంది. యథార్థ సన్న్యాసి తేనెటీగ లాంటివాడు. సంసారులు మామూలు ఈగలలాంటి వారు. ఈగ, మిఠాయిల మీదా వ్రాలుతుంది, క్రుళ్లిపోయిన పుండు మీదా వ్రాలుతుంది.
“మీరు ఇంత శ్రమపడి ఇక్కడకు వచ్చారు. భగవంతుని అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించటంతోనే సంతృప్తి చెందుతున్నారు. ఏ ఒకరిద్దరు మాత్రమే తోట యజమానిని వెదుకుతారు. లోకులు జగత్సౌందర్యాన్ని చూడడంలోనే నిమగ్నమై ఉన్నారు, దాని యజమానిని మాత్రం వెదకటం లేదు.
11.10.1 హఠయోగం, రాజయోగం – షట్చక్ర భేదనం, సమాధి
(గాయకుణ్ణి చూపుతూ) “ఇతడు షట్చక్రాల గురించిన పాటను పాడాడు. అవి అన్నీ యోగానికి సంబంధించిన విషయాలు. హఠయోగం, రాజయోగం అని రెండు యోగాలు ఉన్నాయి. హఠయోగి పలురకాల శారీరక వ్యాయామాలు చేస్తాడు. సిద్ధులు సంపాదించడమే ఆతడి లక్ష్యం. అష్టసిద్ధులూ, దీర్ఘాయుమా సముపార్జించాలన్నదే ఆతడి సంకల్పం. భక్తి, ప్రేమ, జ్ఞానం, వైరాగ్యం వంటివి రాజయోగ లక్ష్యాలు. రాజయోగమే మంచిది.
“వేదాంతం పేర్కొనే సప్తభూమికలకు, యోగం తెలిపే షట్చక్రాలకు పలుసామ్యాలు ఉన్నవి. వేదాలు పేర్కొనే మొదటి మూడు భూమికలే యోగం తెలిపే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రాలు. అపానస్థానం, జననేంద్రియం, నాభి – ఈ మూడు స్థానాలలోనే మనస్సు సామాన్యంగా నెలకొని ఉంటుంది. మనస్సు నాలుగవ స్థానానికి అధిరోహించేటప్పుడు, అంటే అనాహత పద్మాన్ని చేరుకొనేటప్పుడు దీపశిఖలా జీవాత్మ దర్శనం అవుతుంది; జ్యోతి దర్శనమూ కలుగుతుంది. అప్పుడు ‘ఇది ఏమిటి! ఇది ఏమిటి!’ అంటూ ఆశ్చర్యపోతాడు సాధకుడు.
“మనస్సు ఐదవ స్థానానికి ఎగసినప్పుడు భగవంతుని గురించిన ప్రసంగాలనే మనస్సు ఇష్టపడుతుంది. ఇక్కడ విశుద్ధ చక్రం ఉంది. ఆరవ భూమిక, అజ్ఞాచక్రమూ ఒక్కటే. మనస్సు అక్కడకు పోగానే భగవద్దర్శనం కలుగుతుంది. కాని అక్కడొక అడ్డంకి ఉంది. లాంతరు లోపల దీపం ఉంది, కాని నడుమ అద్దం ఉండటం చేత దాన్ని తాకలేకపోవటం లాగా.
“జనక మహారాజు పంచమ భూమిక నుండి బ్రహ్మజ్ఞానం ఉపదేశించేవాడు. ఆయన కొన్ని సమయాల్లో పంచమ భూమికలోను, కొన్ని సందర్భాలలో ఆరవ భూమికలోను వసించాడు.
“షట్చక్రాలను భేదించిన తరువాత ఏడవ భూమిక ఉంది. అక్కడ చేరగానే మనస్సు బ్రహ్మంలో ఐక్యమయిపోతుంది; జీవాత్మా పరమాత్మలు రెండూ ఒక్కటైపోతాయి; సమాధి కలుగుతుంది; దేహబుద్ధి వైదొలగుతుంది; బాహ్యస్పృహ అనేది ఉండదు. ‘నానా విషయాలు’ అన్న జ్ఞానం తొలగిపోతుంది; విచారణ ఆగిపోతుంది.
“విచారణ చేసేటప్పుడు, ‘అనేకం’, ‘నానా విషయాలు’ అన్న ఎరుక ఉంటుందని త్రైలింగస్వామి అనేవారు. సమాధి స్థితి కలిగిన తరువాత ఇరవై ఒక్క రోజుల్లో మరణం సంభవిస్తుంది. కాని కుండలినీ శక్తి జాగృతం కాకుండా చైతన్యం కలుగదు.
11.10.2 భగవల్లాభం పొందిన వ్యక్తి లక్షణాలు
“భగవల్లాభం పొందిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు బాలునిలా, ఉన్మాదిలా, జడునిలా, దయ్యంలా అయిపోతాడు. అతడికి ‘నేను యంత్రాన్ని, భగవంతుడు దాన్ని నడిపేవాడు; ఆయన కర్త, తక్కిన వారు అందరూ అకర్తలు’ అన్న బోధ కలుగుతుంది. ‘ఆకులు కదలటం కూడా భగవదేచ్ఛ మేరకే’ అని సిక్కులు అంటారు. రాముని ఇచ్ఛ మేరకే సమస్తం జరుగుతోంది అన్న భావం ఉండాలి. సాలెవాడు ఇలా అనేవాడు కదా – ‘రాముని ఇచ్ఛ ప్రకారం వస్త్రం ధర ఒక రూపాయ ఆరు అణాలు. రాముని ఇచ్ఛ మేరకు దొంగతనం జరిగింది. రాముని ఇష్టప్రకారమే నన్ను పోలీసులు పట్టుకువెళ్లారు. రాముని ఇచ్ఛానుసారమే దొంగలు పట్టుబడ్డారు. చివరికి రాముని ఇచ్ఛమేరకే నన్ను విడుదల చేశారు.’ అటువంటి భావన ఉండాలి.”
మునిమాపువేళ కావచ్చింది. శ్రీరామకృష్ణులు ఒకింతసేపు విశ్రాంతి కూడా తీసుకోలేకపోయారు. భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. మణిరాంపూర్, బేల్ఘరియా భక్త బృందాలు, తదితరులు శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామాలుచేసి, సెలవు పుచ్చుకొన్నారు. ఆ తరువాత వారు ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేసి తమ నివాసాలకు బయలుదేరారు.
11.11 ఏకాదశ పరిచ్ఛేదం గృహస్థాశ్రమంపై ప్రసంగం
శుక్రవారం, జూన్ 15, 1883
11.11.1 రాఖాల్, ‘మ’, రాఖాల్ తండ్రి, అతని మామగారు
అమావాస్య గడిచిపోయిన పదవ రోజు. భక్తులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చి ఉన్నారు. అధర్కు, ‘మ’ కు సెలవులు కాబట్టి వారూ వచ్చి ఉన్నారు.
రాఖాల్ తండ్రి తన మామగారితో కలిసి వచ్చాడు. రాఖాల్ తల్లి మరణించిన తరువాత తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. ఆయన మామగారు శ్రీరామకృష్ణుల గురించి మునుపే వినివున్నాడు. ఆయనొక సాధకుడు. శ్రీరామకృష్ణులను దర్శింప వచ్చాడు.
భోజనానంతరం శ్రీరామకృష్ణులు చిన్నమంచం మీద కూర్చుని ఉన్నారు; మధ్యమధ్యలో రాఖాల్ తండ్రి, మామగారిని చూస్తున్నారు. భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు.
మామగారు: మహాశయా! గృహస్థులుగా ఉన్నవారు భగవత్సాక్షాత్కారం పొందగలరా?
శ్రీరామకృష్ణులు (మందహాసం చేస్తూ): ఎందుకు పొందలేరు? కుమ్మరి పురుగులా సంచరించండి. అది బురదలో వసిస్తున్నప్పటికీ దాని ఒంటికి బురద అంటుకోదు. అక్రమ సంబంధం కలిగివున్న స్త్రీలా ఉండండి. ఇంటి పనులన్నీ ఆమె నిర్వర్తిస్తుంది. కాని మనస్సు సదా తన ప్రియుడి మీదనే లగ్నం అయి ఉంటుంది. భగవంతునిపై మనస్సు లగ్నం చేసి, సంసార విధులను అన్నింటినీ నిర్వర్తించు. కాని ఇలా చెయ్యటం ఎంతో కష్టం.
“ ‘ఊరగాయ జాడీలు, నీటి కుండలు ఉన్న గదిలో సన్నిపాత రోగిని ఉంచటమా? అతడి రోగం ఎలా నయమవుతుంది? ఊరగాయ ఆలోచన మనస్సులోకి రాగానే నోరు ఊరుతుందే’ అని ఒక సందర్భంలో నేను బ్రహ్మ సమాజస్థులతో చెప్పాను. ఇక్కడ పురుషులకు ఊరగాయ అంటే స్త్రీలే. విషయతృష్ణ మనిషికి సర్వదా ఉండనే ఉంది; ఈ తృష్ణయే నీటి కుండలు. ఈ తృష్ణకు అంతం అంటూ ఉండదు. ‘నేను ఒక కుండెడు నీరు త్రాగుతాను’ అంటూ మంకుపట్టు పట్టాడంటే, పరిస్థితి విషమిస్తుంది.
“సంసారంలో ఎన్నో జంజాటాలు ఉన్నాయి. ఈ వైపుకు పోతే పారతో దెబ్బలు తింటావు! ఆ వైపుకు పోతే చీపురుకట్టతో దెబ్బలు తింటావు. మరో వైపుకు పోతే చెప్పుదెబ్బలు! ఇకపోతే, ఏకాంతవాసం లేనట్లయితే భగవచ్చింతన సాధ్యపడదు. స్వర్ణకారుడు బంగారం కరిగించి నగలు చేస్తూ ఉంటాడు. ఆ పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు అతణ్ణి పదేపదే పిలిస్తే అతడు బంగారాన్ని ఎలా కరిగిస్తాడు? బియ్యం నుండి పొట్టు తీయాలంటే ఒంటరిగా కూర్చుని ఆ ధాన్యాన్ని దంపాలి. మధ్యమధ్యన బియ్యాన్ని చేత పుచ్చుకొని పొట్టు ఊడిపోయిందా లేదా అని చూడాలి. ధాన్యం దంపుతూన్నప్పుడు మాటి మాటికి అతణ్ణి పిలుస్తూ ఉంటే పని ఎలా సాగుతుంది?”
11.11.2 తీవ్ర వైరాగ్యం – గంగాప్రసాద్ సేన్ వద్ద వైద్యం
ఒక భక్తుడు: మహాశయా, మరి ఇందుకు తరుణోపాయం ఉందా?
శ్రీరామకృష్ణులు: తరుణోపాయం ఉంది. తీవ్ర వైరాగ్యం కలిగినట్లయితే, లక్ష్యం సిద్ధిస్తుంది. ఏదైతే మిథ్యగా గోచరిస్తుందో దాన్ని తక్షణమే త్యజించివెయ్యి. ఒక సందర్భంలో నేను తీవ్రంగా అస్వస్థుడనై ఉన్నప్పుడు గంగాప్రసాద్ సేన్ వద్దకు నన్ను తీసుకుని వెళ్లారు. గంగాప్రసాద్ నాతో, ‘ఔషధం పుచ్చుకోవాలి. కాని నీళ్లు మాత్రం తాగకూడదు. కావాలంటే దానిమ్మపండు రసం తాగవచ్చు’ అని చెప్పాడు. అందరూ ‘ఈయన నీళ్లు తాగకుండా ఎలా ఉండగలరు?’ అని అనుకోసాగారు. కాని నేను, నీళ్లు తాగకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నాను. ‘నేను పరమహంసను, ఒట్టి హంసను కాను! రాజహంసను కదా! పాలనే తాగుతాను’ అనుకున్నాను.
“కొంతకాలం ఏకాంతవాసం చేయాలి. దాగుడుమూతల ఆటలో తల్లిని తాకితే, ఆ తరువాత భయంలేదు. బంగారంగా అయిపోతే, తదనంతరం ఎక్కడైనా వసించవచ్చు. ఏకాంతవాసం చేస్తూ భక్తిని పొందగలిగితే, భగవల్లాభం పొందగలిగితే సంసారంలోనూ ఉండవచ్చు. (రాఖాల్ తండ్రితో) అందుచేతనే యువకులను ఇక్కడ బసచేయమని చెబుతాను. ఇక్కడ కొంతకాలం నివసిస్తే భగవంతుని పట్ల వారికి భక్తి ఏర్పడుతుంది. ఆ తరువాత వారు నిశ్చితంగా సంసారంలో జీవించవచ్చు.”
11.11.3 పాపం, పుణ్యం – సంసార వ్యాధికి మహౌషధం సన్న్యాసం
ఒక భక్తుడు: సర్వానికి భగవంతుడే కర్త అయిన పక్షంలో, మంచి – చెడులు, పాప – పుణ్యాల గూర్చి మాట్లాడటం ఎందుకు? పాపం చేయడం కూడా ఆయన ఇచ్ఛ వల్లనే కదా!
మామగారు: భగవంతుని ఇచ్ఛను మన మెలా తెలుసుకోగలం? Thou Great First Cause least understood అని పోప్* కూడా చెప్పి ఉన్నాడే!
శ్రీరామకృష్ణులు: పాపపుణ్యాలు ఉన్నాయి, కాని భగవంతుడు స్వయంగా నిర్లిప్తుడు. వాయువులో సువాసన, దుర్వాసన ఉన్నాయి. కాని వాయువు నిర్లిప్తం. అదేవిధంగా భగవంతుని సృష్టికూడా. సృష్టిలో మంచీ ఉంది, చెడూ ఉంది; సత్యమూ ఉంది, అసత్యమూ ఉంది. ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి – కొన్ని మామిడిచెట్లు, కొన్ని పనస చెట్లు, మరికొన్ని రేగిచెట్లు. చూడండి, దుష్టుల అవసరమూ ఉంది. జమీలో ఒక ప్రాంతంలో ప్రతిఘటించిన కౌలుదారులను నియంత్రించడానికి భూస్వామి దుష్టులను పంపాల్సి వస్తుంది.
సంభాషణ మళ్ళీ గృహస్థాశ్రమ జీవితం వైపు మళ్లింది.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): విషయం ఏమిటో తెలుసా? సంసారంలో మునిగి ఉంటే మనోశక్తి వృథాగా వ్యయం అయిపోతుంది. ఈ విధంగా శక్తి వ్యయం అవటంవల్ల మనస్సుకు ఏర్పడే నష్టాన్ని సన్న్యాసం స్వీకరించి భర్తీ చేసుకోవచ్చు. తండ్రి మొదటి జన్మ నిస్తున్నాడు, ఉపనయన మప్పుడు రెండవ జన్మ లభిస్తుంది, సన్న్యాసం స్వీకరించినప్పుడు మరో జన్మ దక్కుతుంది. కామినీ కాంచనాలు – ఇవి రెండే అడ్డంకులు. స్త్రీ పట్లగల అనురక్తి మనిషిని భగవన్మార్గం నుండి విముఖుణ్ణి చేస్తుంది. తను ఎలా పతనం అయిపోతాడో మనిషికి తెలియనైనా తెలియదు. కోట (కలకత్తాలోని కోట)కు వెళుతూ ఉన్నప్పుడు, బండి ఏటవాలు మార్గాన పోతూ ఉన్నట్లు కాస్తకూడా తెలియలేదు. లోపలకు వెళ్లిన తరువాతే, ఎంతో క్రిందికి వచ్చివున్నాం అన్న సంగతి తెలిసింది. ఆహా! స్త్రీలు పురుషులను కనీసం తెలుసుకోనైనా తెలుసుకోనివ్వరు. నా భార్య తెలివైనది అంటాడు కెప్టెన్. దయ్యం పట్టిన వ్యక్తికి, తనను దయ్యం పట్టిందన్న సంగతి కూడా తెలియదు. ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ ఉంటాడు. (అందరూ మౌనంగా వింటూ ఉన్నారు)
“సంసారంలో భయపడవలసింది ఒక్క కామానికే కాదు, క్రోధం కూడా ఉంది. కోరికలను తీర్చుకోవడానికి అడ్డంకులు ఏర్పడితే క్రోధం కలుగుతుంది.”
‘మ’ : నేను భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లి మెల్లగా వచ్చి చేప ముక్కను తీసుకో ప్రయత్నిస్తుంది. నేను దాన్ని వారించను.
శ్రీరామకృష్ణులు: ఎందుకు? ఒకసారి ఒక దెబ్బ వెయ్యి. దాన్లో తప్పు ఏముంది? సంసారులు బుసకొట్టాలి; అయితే విషం జిమ్మటం మంచిది కాదు. ఎవరికీ హాని కలిగించకూడదు. పగవారి నుంచి రక్షణకై కోపం ప్రదర్శించాలి. లేకుంటే వారు హాని చేస్తారు. కాని సన్న్యాసికి బుసకొట్టాల్సిన అవసరం కూడా లేదు.
ఒక భక్తుడు: సంసారంలో ఉంటూ భగవంతుణ్ణి ప్రాప్తించుకోవటం చాలా కష్టంగా తోస్తోంది. అలా ప్రాప్తించుకున్నవారు ఎందరున్నారు? అలాంటివారు ఎక్కడా తారసపడరే!
శ్రీరామకృష్ణులు: ఎందుకు ప్రాప్తించుకోలేవు? కామార్పుకూర్లో ఒకరు ఉన్నట్లు విని ఉన్నాను. ఆతడు ఒక డిప్టీ (డిప్యూటీ మేజిస్ట్రేటు). సజ్జనుడు పేరు ప్రతాప్ సింగ్. దానధర్మం, ధ్యానం భక్తి వంటి సుగుణాలు గలవాడు. నన్ను ఒకసారి అతడు ఆహ్వానించి ఉన్నాడు. అటువంటి వ్యక్తులు ఉండనే ఉన్నారు.
11.12 ద్వాదశ పరిచ్ఛేదం సాధన ప్రయోజనం – గురువాక్యంపై విశ్వాసం – వ్యాసుని విశ్వాసం
“సాధన చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధన చేస్తే ఎందుకు సాధ్యం కాదు? దృఢ విశ్వాసం కనుక ఏర్పడినట్లయితే, మరి అంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. గురూపదేశాలపట్ల విశ్వాసం ఉంచాలి!
“వ్యాసమహర్షి ఒక సందర్భంలో యమునా నదిని దాటవలసి వచ్చింది. అప్పుడు గోపికలూ అక్కడకు వచ్చారు. వారూ నదిని దాటవలసి ఉంది. కాని పడవ ఏదీ అందుబాటులో లేదు. అందుచేత గోపికలు వ్యాసమహర్షితో, ‘స్వామీ! ఇప్పుడు ఏం చెయ్యాలి?’ అని సలహా అడిగారు. అందుకు వ్యాసుడు గోపికలతో, ‘మిమ్మల్ని నేను ఆ వైపుకు తోడ్కొని వెళతాను. కాని నాకు ఎంతో ఆకలిగా ఉంది. తినటానికి ఏదైన ఉందా?’ అని అడిగాడు. గోపికల వద్ద పాలు, పెరుగు, వెన్నలు ఉన్నాయి. వ్యాసుడు వాటిని తిన్నాడు. తరువాత గోపికలు ఆయనతో, ‘స్వామీ, నదిని దాటే విషయం ఏమైంది?’ అని అడిగారు. వెంటనే వ్యాసుడు యమునా తీరంలో నిలబడి, ‘హే యమునాదేవీ! నేను ఈ రోజు ఉపవాసం ఉండివుండటం నిజమైతే, మాకు దారి ఇవ్వు! మేమంతా ఆ దారిగుండా అవతలి ఒడ్డుకు పోతాం’ అని అన్నాడు. వ్యాసుడు ఇలా అనీ అనగానే యమునానది రెండు పాయలుగా విడిపోయింది. గోపికలు సంభ్రమంతో అవాక్కులైనారు. ‘ఇదెక్కడి వింత! మన ముందే కదా ఈయన కడుపార తిన్నది! అయినా ‘ఈ రోజు నేను ఉపవాసం ఉన్న పక్షంలో’ అని అన్నారు అంటూ అచ్చెరువొందారు. దృఢ విశ్వాసం అంటే ఇదే. ‘తిన్నది నేను కాదు, హృదయ మధ్యంలో నెలకొని ఉన్న నారాయణుడే తిన్నది’ అన్న దృఢ విశ్వాసం.
“శంకరాచార్యులు బ్రహ్మజ్ఞాని. కాని మొదట్లో ఆయనకు భేదభావం ఉండేది; అంత విశ్వాసం లేదు. ఒక సందర్భంలో ఆయన గంగలో స్నానం చేసి వస్తూ ఉన్నాడు. ఒక చండాలుడు తలపై మాంసాన్ని మోసుకొంటూ ఎదురుగా వచ్చాడు. ఆ చండాలుడి శరీరం శంకరుల దేహాన్ని స్పృశించింది. అందుకు ఆయన బిగ్గరగా ‘ఒరేయ్! నువ్వు నన్ను ముట్టుకొన్నావే!’ అన్నారు. అందుకు ఆ చండాలుడు, ‘స్వామీ! మీరూ నన్ను తాకలేదు, నేనూ మిమ్మల్ని తాకలేదు. శుద్ధ ఆత్మ శరీరం కాదు, పంచభూతాలూ కాదు, చతుర్వింశతి తత్త్వాలూ కాదు’ అన్నాడు. అప్పుడు శంకరులకు బోధ కలిగింది.
“జడభరతుడు రహూగణుడనే రాజు పల్లకీని మోస్తూ ఆత్మజ్ఞానం గురించి మాట్లాడాడు. వెంటనే రాజు పల్లకీ దిగి ‘అయ్యా, తమరెవరు?’ అని అడిగాడు. అందుకు జడభరతుడు, ‘నేను ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు), నేను శుద్ధ ఆత్మను’ అని బదులు ఇచ్చాడు. ‘నేను శుద్ధ ఆత్మను’ అని జడభరతునికి పరిపూర్ణ విశ్వాసం ఉండేది.
11.12.1 యోగతత్త్వం – జ్ఞానయోగం, భక్తియోగం
“ ‘సోఽహం’ (నేనే ఆ పరబ్రహ్మాన్ని), ‘నేను శుద్ధ ఆత్మను’ – ఇది జ్ఞానుల మతం. భక్తులు ఇవన్నీ భగవంతుని ఐశ్వర్యాలంటారు. సంపద లేకుంటే ఎలా ఒక సంపన్నుణ్ణి గుర్తించగలం? సాధకుడి భక్తిని చూచి భగవంతుడే ఆ సాధకునితో, ‘నేను ఏదో, అదే నువ్వు’ అని చెబితే, అప్పుడు సంగతే వేరు. రాజు సింహాసనంలో ఆసీనుడై ఉన్నప్పుడు, వంటవాడు అక్కడకు వచ్చి సముచిత ఆసనంలో కూర్చుని, ‘రాజా! నువ్వు ఏదో, నేను కూడా అదే’ అని చెబితే, లోకం అతణ్ణి పిచ్చివాడు అంటుంది. కాని వంటవాడి సేవలతో సంతుష్టుడై రాజు స్వయంగా ఒక రోజు అతడితో, ‘ఒరేయ్, నువ్వు నా ప్రక్కన వచ్చి కూర్చో, అందులో తప్పేమీ లేదు. నువ్వు ఏదో, నేను కూడా అదే’ అని అన్నాడనుకోండి. అప్పుడు వంటవాడు రాజు ప్రక్కన వచ్చి కూర్చోవటంలో తప్పు లేదు. సామాన్యజీవి, ‘సో-హం’ అనటం మంచిది కాదు. తరంగం, నీటికి చెందినది కాని నీరు, తరంగానికి చెందుతుందా ఏమిటి?
“మొత్తం మీద ఇదీ సంగతి – ఏ మార్గాన్ని అవలంబించినా సరే, మనస్సు స్థిరపడకుంటే యోగం కుదరదు. మనస్సు యోగి వశంలో ఉంటుంది. కాని, మనస్సు వశంలో యోగి ఉండడు. మనస్సు స్థిరపడితే వాయువు (ప్రాణం) స్థిరమౌతుంది; కుంభకం సిద్ధిస్తుంది. భక్తియోగం ద్వారా కూడా కుంభకం సిద్ధిస్తుంది. భక్తితో వాయువు స్థిరమయిపోతుంది.
“గాయకుడు ‘నితాయ్ ఆమార్ మాతా హాథీ, నితాయ్ ఆమార్ మాతాహాథీ’* అని పాడుతూ ఉన్నప్పుడు భావపారవశ్య స్థితి కలిగితే అన్ని పదాలను ఉచ్చరింపలేకపోవటం జరుగుతుంది; హాథీ, హాథీ అని మాత్రమే వస్తుంది. ఆ తరువాత ‘హా’ అని మాత్రమే ఉచ్చరించగలుగుతాడు. పారవశ్య స్థితిలో వాయువు స్థిరమౌతుంది; కుంభకం సిద్ధిస్తుంది.
“ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ సమయంలో అక్కడకు ఎవరైనా పరుగెత్తుకుంటూ వచ్చి, ‘ఫలానా వ్యక్తి మరణించాడు’ అన్న కబురు చెప్పాడు అనుకోండి. మరణించిన వ్యక్తి అతడికి ఆత్మీయుడు కానట్లయితే, ఊడుస్తూ ఉన్న వ్యక్తి పనిని కొనసాగిస్తాడు. కాని మధ్య మధ్యలో, ‘అయ్యో పాపం! అతడు చనిపోయాడా? చాలా మంచివాడు’ అంటూ ఉంటాడు. మరోవంక నేలను ఊడ్వటమూ జరుగుతూ ఉంటుంది. కాని చనిపోయిన వ్యక్తి ఆత్మీయుడు అయినపక్షంలో, వార్త వినీ వినగానే చీపురు అప్రయత్నంగా చేతులనుంచి జారి క్రింద పడిపోతుంది. ‘అయ్యో!’ అంటూ కూలబడిపోతాడు. అప్పుడు వాయువు స్థిరమౌతుంది; ఇక ఏ పనీ అతడు చేయలేడు, యోచించనూ లేడు.
“స్త్రీలలో చూడలేదా? ఒకామె దేన్నో చూసో, వినో సంభ్రమంతో అవాక్కైపోతే, ఇతర స్త్రీలు ఆమెను ‘ఏమిటి? పరవశంలో మునిగిపోయావా?’ అని అడుగుతారు. ఇక్కడా వాయువు స్థిరమౌతుంది, అందుచేతనే ఆమె నోరు తెరచుకొని ఉంటుందిగాని, మాటా పలుకూ ఉండదు.
11.12.2 జ్ఞాని లక్షణాలు – నిత్యసిద్ధులు, సాధనసిద్ధులు
“ ‘సోఽహం’, ‘సోఽహం’ అని నోటితో ఉచ్చరించినంత మాత్రాన ఏమీ జరుగదు. జ్ఞానులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. నరేంద్రునివి విప్పారుతూ ముందుకు వచ్చిన నేత్రాలు. (ఒక భక్తుణ్ణి చూపుతూ) ఇదుగో ఈతడికి కూడా నుదురు, కళ్ళ లక్షణాలు బాగా ఉన్నాయి.
“అందరూ ఒకే విధమైన స్థితిలో ఉండరు. జీవులను బద్ధజీవులు, ముముక్షుజీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు అని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అందరూ సాధన చేయవలసిందే అన్న నియమం ఏమీ లేదు.
“నిత్యసిద్ధులు, సాధనసిద్ధులు అని రెండు రకాలవారు ఉన్నారు. కొందరు పలు సాధనలు ఒనరించి భగవంతుని పొందుతారు. ప్రహ్లాదుని వంటి కొందరు జన్మతః సిద్ధులై ఉన్నారు. హోమపక్షి ఆకాశంలో వసిస్తుంది. అది పెట్టే గ్రుడ్డు క్రింద పడిపోతుంది. అలా క్రింద పడుతూ ఉన్నప్పుడే గ్రుడ్డు పొదగబడి పక్షిపిల్ల బయటకు వస్తుంది. అదీ క్రింద పడిపోవనారంభిస్తుంది. ఇవన్నీ ఆకాశంలో అత్యంత ఎత్తులో జరుగుతాయి. పక్షిపిల్ల భూమి కేసి వచ్చేకొద్దీ దానికి రెక్కలు మొలుస్తాయి. అది కళ్లు తెరచి చూస్తుంది. భూమ్మీద పడితే ఛిన్నాభిన్నమైపోతాను అని గ్రహించి అది వెంటనే తల్లిపక్షి ఉన్న చోటుకేసి తిరిగి, ‘అమ్మా, ఎక్కడ? అమ్మా, ఎక్కడ?’ అంటూ వెదకుతూ వేగంగా పైకి ఎగిరిపోతుంది!
“ప్రహ్లాదుడు మొదలైన, నిత్యసిద్ధులు సాధనలు తరువాత చేశారు కాని సాధనలకు మునుపే వారికి భగవల్లాభం కలుగుతుంది. గుమ్మడి, సొర వంటివి ముందు పిందెలు వేసి పిదప పుష్పిస్తాయి, అలా అన్నమాట. (రాఖాల్ తండ్రితో) నిత్యసిద్ధుడు నిమ్నకులంలో జన్మించినా, అతడు నిత్యసిద్ధుడుగానే ఉంటాడు, వేరేలా అయిపోడు. చిక్కుడు గింజ పేడకుప్పలో పడినప్పటికీ, అది చిక్కుడు తీగగానే మొలకెత్తుతుంది.
11.12.3 శక్తి తారతమ్యం – పాండిత్యం
“భగవంతుడు కొందరికి అధిక శక్తినీ, కొందరికి తక్కువ శక్తినీ ప్రసాదించి ఉన్నాడు. ఒకచోట చిరుదీపం మసగ్గా వెలుగుతోంది. మరొక చోట ఒక దివిటీ వెలుగుతోంది. విద్యాసాగర్ ఒక్క మాటనుండే ఆతడి మేధస్సు గరిష్ఠ పరిమితిని నేను తెలుసుకున్నాను. భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణలలో తారతమ్యాలు ఉన్నాయని చెప్పటంతో అతడు ‘మహాశయా! అలా అయితే భగవంతుడు కొందరికి అధిక శక్తినీ, కొందరికి తక్కువ శక్తినీ ప్రసాదించాడా?’ అని అడిగాడు. అందుకు నేను, ‘అవును, నిశ్చయంగా. అలా శక్తిలో హెచ్చుతగ్గులు లేకుంటే మీ పేరు ఇంత సుప్రసిద్ధం కావటానికి కారణం ఏమిటి? మీ పాండిత్యం, మీ కరుణలను గురించి విని కదా మిమ్మల్ని చూడ మేము వచ్చింది? అంతే కాని మీకు రెండు కొమ్ములు అయితే మొలవలేదు కదా!’ అని చెప్పాను. విద్యాసాగర్ ఎంత తెలివితేటలు ఉన్నవాడు! ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచాడు! అయినప్పటికీ, ‘భగవంతుడేమిటి కొందరికి అధికంగాను, కొందరికి తక్కువగాను శక్తిని ఇవ్వడ మేమిటి?’ అని పిల్ల తరహాగా ప్రశ్నించాడు!
“విషయం ఏమిటో తెలుసా? వలలో మొదట పెద్ద చేపలే చిక్కుకుంటాయి. తరువాత బెస్తవాడు కాలితో బురదను కలయబెడతాడు. అప్పుడు చిన్న చేపలు పైకి లేచి వస్తాయి; అవి చూస్తూండగానే పట్టుబడిపోతాయి. భగవంతుణ్ణి తెలుసుకోకుంటే లోపల ఉన్న చిరుచేపలు (కోర్కెలు) మెల్లమెల్లగా బయటకు వస్తాయి. కేవలం పండితుడయినంత మాత్రాన ఏం ప్రయోజనం?”
11.13 త్రయోదశ పరిచ్ఛేదం దక్షిణేశ్వరంలో తాంత్రికభక్తునితో
ఆదివారం, జూన్ 17, 1883
మధ్యాహ్న సమయం. దక్షిణేశ్వర కాళికాలయంలోని శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం ఒకింత సేపు విశ్రమించారు. అధర్, ‘మ’ మొదలైనవారు వచ్చి, ప్రణామాలు చేశారు. ఒక తాంత్రిక భక్తుడు కూడా వచ్చి ఉన్నాడు. రాఖాల్, రామ్‌లాల్, హాజ్రా ప్రభృతులు ప్రస్తుతం శ్రీరామకృష్ణుల వద్దనే ఉంటున్నారు.
శ్రీరామకృష్ణులు (భక్తులతో): సంసార జీవితంలో ఉన్నప్పుడు భగవదనుభూతి ఎందుకు లభించదు? కాని అది బహుదుర్లభం అనటం నిస్సంశయం. జనకుడు మొదలైనవారు జ్ఞానం పొందిన తరువాత సంసారంలో అడుగిడారు. అయినప్పటికీ భయం ఉండనే ఉన్నది. ఫలాపేక్ష లేకుండా జీవించే సంసారి కూడా భయపడవలసి ఉంది. జనకుడు ఒక భైరవిని చూసినప్పుడు తల క్రిందకు దించుకొన్నాడు, స్త్రీని చూడ సంకోచించాడు. అది చూసిన భైరవి, ‘జనకా! నీకు ఇంకా జ్ఞానం సిద్ధించలేదనే తోస్తున్నది. స్త్రీ, పురుష భేదభావం నీలో ఇంకా నెలకొని ఉందే!’ అన్నది.
“బొగ్గు నిల్వచేసిన గదిలోకి వెళ్లినప్పుడు, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కాస్త మరక పడకుండా ఉండదు. గృహస్థ భక్తులు పట్టువస్త్రాలు ధరించి పూజ చేసేటప్పుడు భక్తిపారవశ్యంలో ఉండటం చూస్తున్నాను; తరువాత భోజనం ముగిసేటంత వరకు అదే స్థితిని చూడవచ్చు. ఆ తరువాత పాత కథే; రజోగుణం, తమోగుణం నిండిన సహజ స్థితికి వచ్చేస్తారు. (BG 2.67, BG 2.68)
“సత్త్వగుణం భక్తిని కలిగిస్తుంది. కాని భక్తిలోను సత్త్వభక్తి, రజోభక్తి, తమోభక్తి అని మూడు రకాలు ఉన్నాయి. సత్త్వభక్తి శుద్ధసత్త్వం అవుతుంది. ఈ భక్తి జనిస్తే భగవంతుని వైపుకు తప్ప మరి దేనివైపూ మనస్సు పోదు. ఈ భక్తులు దేహ రక్షణకైన కనీస శ్రద్ధనే దానిపై కనబరుస్తారు.
11.13.1 పరమహంసలు త్రిగుణాతీతులు; కర్మ ఫలాలకూ, పాపపుణ్యాలకూ అతీతులు
“పరమహంసలు ఈ మూడు గుణాలకు అతీతులు. వారిలో ఈ మూడు గుణాలూ ఉన్నాయి, కాని లేవు. వారు, పిల్లల వలె ఏ గుణాల వశంలోనూ ఉండరు. ఈ పరమహంసలు చిన్నబాలుర స్వభావాన్ని పొందే నిమిత్తం వారిని తమ సామీప్యంలోకి రావటానికి అనుమతిస్తారు. పరమహంస దేనినీ సంచయం చేసుకోడు. ఈ నియమం సంసారులకు వర్తించదు; వారు తమ కుటుంబానికై వస్తుసంచయం చేసే తీరాలి.”
తాంత్రిక భక్తుడు: పరమహంసలకు పాపపుణ్యాల ఎరుక ఉంటుందా?
శ్రీరామకృష్ణులు: ఈ ప్రశ్ననే కేశవ్ ఒకసారి అడిగాడు. అందుకు నేను, ‘ఇంకా నేను చెబితే నీ సమాజం గిమాజం అంటూ ఏదీ నిలువబోదు’ అన్నాను. అది వినగానే అతడు, ‘మహాశయా, అలా అయితే మీరు ఏమీ చెప్పవద్దు లెండి’ అన్నాడు.
“పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసా? సద్బుద్ధిని ఇచ్చేది ఆయనే, దుర్బుద్ధిని ఇచ్చేది కూడా ఆయనే అని పరమహంస గాంచుతాడు. చేదుపళ్లు, తీపి పళ్లూ ఉన్నాయి కదా! కొన్ని చెట్లకు తీపి పళ్లు, కొన్ని చెట్లకు చేదుపళ్లు; కొన్ని చెట్లకు పులుపు పళ్లు కాయటం లేదా! భగవంతుడే తీపిపళ్లు కాచే మామిడి చెట్టును సృష్టించాడు, అదే విధంగా పులుపు పళ్ళనిచ్చే రేగి చెట్టునూ సృజించాడు.”
తాంత్రిక భక్తుడు: అవునండి. కొండపైన గులాబీ తోటను చూస్తాం. కంటికి కనిపించే మేరకు గులాబీ తోటయే.
శ్రీరామకృష్ణులు: సత్యం, అసత్యం; మంచి, చెడు; పాపం, పుణ్యం – ఇవన్నీ భగవంతుడి మాయ యొక్క ఐశ్యర్యాలుగా పరమహంస దర్శిస్తాడు. కాని ఇది అత్యున్నత స్థితి. ఆ స్థితిలో సమాజాలు, సమావేశాలు నిర్వహించటం జరుగని పని.
11.13.2 కర్మఫలం – పాపం, పుణ్యం
తాంత్రిక భక్తుడు: కాని కర్మసిద్ధాంతం ఉందే!
శ్రీరామకృష్ణులు: అవును, ఉంది. మంచి పనులు ఆచరిస్తే మంచి ఫలితం, చెడు పనులు చేస్తే చెడు ఫలితం. మిరపకాయను కొరికితే మంటపెట్టకుండా ఉంటుందా? ఇవన్నీ భగవంతుడి లీలలు.
తాంత్రిక భక్తుడు: మాకు తరణోపాయం ఏది? ప్రారబ్ధ కర్మ ఉండనే ఉంది!
శ్రీరామకృష్ణులు: ఉండనివ్వు. ఆయన భక్తుల సంగతే వేరు.
ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు:
పొలముదున్నుట తెలియదు నీకు
బీడువారినది జీవిత క్షేత్రము
బాగుగదున్ని పదునుచేసిన
గొప్ప పంటను కోసెదు మనసా॥ పొ ॥
కాళీనామము గట్టువేయుచు
పండిన పంటను భద్రపరచిన
దట్టమైన యా గట్టు దాపునకు
కాలిడలేడు కాలుడు కూడ॥ పొ ॥
గురూపదిష్టపు పరమేశ్వరుని
నామ బీజములు నాటుము పొలమున
భక్తిశ్రద్ధలు పరిఢవిల్లగ
నీరు పెట్టుము తరుణమందున॥ పొ ॥
చక్కని పొలము గ్రక్కున విడచు
తరుణము త్వరలో దాపరించును
కావున ఈ పని కష్టము తోచిన
సాయము రామప్రసాదు నడుగుము॥ పొ ॥
మరల పాడసాగారు:
గట్టిమూసితి కాలుని మార్గము
అతని రాకకు అడ్డముకట్టుచు
ఇంతటినుండియు అంతము చెందుచు
మసిపోయినవి సంశయభయములు॥ గ ॥
ఇంటిని నిలిపెడు ఒంటిస్తంభమును
మూడుపగ్గములు కూడి బిగించగ
తొమ్మిది దారులతోడ నొప్పునా
ఇంటిని స్వయముగ ఈశుడుగాచును॥ గ ॥
సహస్రదళముల సరసీజమును
వాసగృహముగ చేసికొనిన యా
విశ్వనాథుడే విడువక గాచును
మానక నన్నభిమానముతోడుత॥ గ ॥
పాట ముగించాక శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “కాశీలో మరణించేవారు బ్రాహ్మణుడైనా సరే లేక వెలయాలైనా సరే అందరూ శివగతినే పొందుతారు. హరినామాన్నో, కాళీనామాన్నో లేక రామనామాన్నో ఉచ్చరించేటప్పుడు కళ్ళ నుండి అశ్రువులు స్రవిస్తే, ఇక సంధ్యావందనం, కవచం మొదలైన కర్మలు చేయనవసరం లేదు. కర్మలు తమంతట తామే వైదొలగుతాయి. కర్మఫలం చెంతకు చేరదు.”
శ్రీరామకృష్ణులు మళ్లీ పాడారు:
నీ ధ్యానమేవిధమొ నీ భావ మావిధము
నీ భావమునుబట్టి నీ కుండు భక్తి॥ నీ ॥
భక్తి ఏ రీతియొ ఫలమగును ఆ రీతి
ఫలములన్నిటికి మూల మా శ్రద్ధయే॥ నీ ॥
కాళికాపదసుధా కాసారమున నాదు
మది మునిగినిండార మధురూపమై దనర
బలులకు పూజలకు బహుయజ్ఞములకును
లేదుపని వానితో లేదసలు లేదమ్మ॥ నీ ॥
మరొక పాట ప్రారంభించారు:
నే నెందుకు పోవలె కాశీ కంచీ
గంగా గయ ప్రభాసముకూ
కాళీ నామమును కలవరించుచు
కడపటి శ్వాసను వదలుచుండగానే….
శ్రీరామకృష్ణులు: భగవంతునిలో నెలకొని ఉంటే అసత్య బుద్ధి, పాప బుద్ధి అతడిలో నిలిచి ఉండవు.
తాంత్రిక భక్తుడు: ‘విద్య – నేను’ మిగిలి ఉంటుందని మీరు తెలిపారు కదా!
శ్రీరామకృష్ణులు: అవును. ‘విద్య –నేను’ అంటే నేను భక్తుడను, నేను సేవకుడను అనే ‘మంచి–నేను’ మిగిలి ఉంటుంది. ‘చెడ్డ–నేను’ పారిపోతుంది. (నవ్వారు)
తాంత్రిక భక్తుడు: మహాశయా, మా సందేహాలు అనేకం తీరిపోయాయి.
శ్రీరామకృష్ణులు: ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు అన్ని సందేహాలూ తొలగిపోతాయి.
11.13.3 తమోగుణ భక్తి – నిరర్థక జీవుల సంశయం – అష్టసిద్ధులు
“తమోగుణ భక్తిని ఆశ్రయించు. ‘ఏమిటి? నేను రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాను, కాళీనామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాను. మరి నాకు బంధం ఏమిటి, ప్రారబ్ధ కర్మ ఏమిటి?’ అని పలుకు.”
శ్రీరామకృష్ణులు మళ్లీ పాడారు:
ఓ దుర్గా యని పిలచుచు
అసువుల నిట బాసినచో
ఎటులీయవు ముక్తి నాకు
ఎంతటి పాతకినైన నేను….
శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు: “విశ్వాసం! విశ్వాసం! విశ్వాసం! ‘రాముడే సర్వమూ అయివున్నాడు. ఆ రాముడే ప్రతి ఒక్కరిలోను ఉన్నాడు’ అని ఒక గురువు, శిష్యుడితో చెప్పాడు. ఒక కుక్క రొట్టెను కొరికి, తీసుకుపోయింది. అది చూసిన శిష్యుడు, ‘ఓ రామా! కాస్త ఆగు, కాస్త ఆగు. రొట్టెకు వెన్న రాచి ఇస్తాను’ అని అన్నాడు. గురువు పలుకులలో ఎంతటి విశ్వాసం!
“నిరర్థక జీవులకు విశ్వాసం కలుగదు, ఎప్పుడూ సంశయమే; ఆత్మసాక్షాత్కారం కానిదే సంశయాలు అన్నీ నివృత్తి కావు.
“శుద్ధభక్తిలో ఎటువంటి ఆకాంక్ష ఉండదు. ఈ భక్తి ద్వారా సత్వరమే ఆయనను పొందవచ్చు. అణిమాది సిద్ధుల సముపార్జన, ఇత్యాదులు – కోరికలే. కృష్ణుడు అర్జునుడితో, ‘మిత్రమా! అణిమాది సిద్ధులలో ఏ ఒక్కటి సంతరించుకున్నా భగవల్లాభం సిద్ధించదు. ఈ సిద్ధులతో శక్తి కాస్త అధికరిస్తుంది, అంతే’ అన్నాడు.”
తాంత్రిక భక్తుడు: మహాశయా, తాంత్రిక క్రియలు ప్రస్తుతకాలంలో ఫలవంతం కాకపోవటం ఎందుచేత?
శ్రీరామకృష్ణులు: వాటిని కచ్చితంగానూ, భక్తిపూర్వకంగానూ ఆచరించనందునే అవి ఫలవంతం కావటం లేదు.
శ్రీరామకృష్ణులు సంభాషణ ముగిస్తూ ఇలా అన్నారు: “భక్తియే సారం. నిజమైన భక్తుడికి ఎటువంటి భయం, కలవరపాటు ఉండదు. జగజ్జనని సమస్తం ఎరుగును. పిల్లి ఎలుకను ఒక పద్ధతిలో నోట కరచి పట్టుకుంటుంది; కాని తన కూనను మరో విధంగా నోట కరచి పట్టుకుంటుంది.”