ప్రతిమారాధన – ప్రతీకోపాసనలను గురించి మనం ఇక పర్యాలోచించవలసి ఉంది. భగవంతుడికి దాదాపుగా ప్రత్యామ్నాయాలే ప్రతీకాలు; అంతేగాక ప్రతిమ లంటె విగ్రహాలు. ప్రతీక మూలాన భగవంతుణ్ణి ఉపాసించటం అంటె ఏమిటి? “అబ్రహ్మణి బ్రహ్మదృష్ట్యనుసంధానమ్” – బ్రహ్మం కాని దానిని బ్రహ్మంగా భావించి భక్తితో దాన్లో మనసు లగ్నం చేయటమే అని భగవద్రామానుజులు నిర్వచించారు.* మనస్సే బ్రహ్మంగా భావించి ఉపాసించు, ఇది ఆధ్యాత్మికం; ఇలాగే ఆకాశమే బ్రహ్మమనేది ఆధిదైవికం – అంటె దేవతలను గురించినట్టిది.* మనస్సు అంతరప్రతీకం, ఆకాశం బాహ్యప్రతీకం; రెంటినికూడ భగవత్ప్రత్యామ్నాయాలుగా గైకొని ఉపాసించాలి. ఇలాగే శంకరాచార్యులు ఇలా వచించారు:” ‘ఆదిత్యో బ్రహ్మేత్యాదేశః’* – సూర్యుడే బ్రహ్మం, ఇది (వేద) శాసనం…. ‘నామమే బ్రహ్మంగా ఎవడు ఉపాసిస్తాడో…’ ఇలాటి ప్రవచనాలన్నిటిలోను ప్రతీకోపాసనాన్ని గురించి సంశయం ఉదయిస్తుంది.”* ‘ప్రతీక’ అనే పదానికి ఉన్ముఖమవటం అని అర్థం. ఒక్క విషయంలోగాని, అనేక విషయాలలోగాని విశేషంగా బ్రహ్మం వంటిదైనప్పటికీ బ్రహ్మం కానట్టి ఒకదాన్ని బ్రహ్మానికి ప్రతిగా ఉపాసించటమే ప్రతీకోపాసన. శ్రుతులలో పేర్కోబడ్డ ప్రతీకలతో పాటు పురాణాలలోను తంత్రాలలోను వివిధాలైన ఇతర ప్రతీకలు కానవస్తాయి. బహువిధాలైన పితృదేవతారాధననూ, దేవతారాధననూకూడ ఈ ప్రతీకోపాసన అనే శీర్షిక కిందనే చేర్చవచ్చును.
భగవంతుణ్ణి, భగవంతుణ్ణి ఒక్కడినే ఆరాధించటం భక్తి. దేవతలనుగాని, పితృదేవతలనుగాని, మరి వేనినిగాని ఆరాధించటం భక్తి కాబోదు. వివిధాలైన దేవతోపాసనలన్నీ కర్మకలాపంలో చేరుతాయి. ఉపాసకుడికి ఏ దివ్యభోగాన్నో ఇస్తే; అవి ప్రత్యేక ఫలదాయకాలవుతాయిగాని భక్తిముక్తులను ఒసగలేవు. కాబట్టి మనం ఒక విషయాన్ని బాగా గుర్తించాలి. పరమతాత్త్వికాదర్శం అయిన బ్రహ్మాన్ని ప్రతీకోపాసనా మూలాన ప్రతీకస్థితికి దించి, సాక్షాత్తు ప్రతీకాన్నే ఉపాసకుడు తన అంతరాత్మగా భావిస్తే అలాటి ఉపాసకుడు పూర్తిగా పెడత్రోవ తొక్కుతున్నాడు. ఎందుకంటె, ఏ ప్రతీకమూ నిజానికి ఉపాసకుడి ఆత్మ కాజాలదు. కాని బ్రహ్మమే ఉపాసకుడికి లక్ష్యమై, ప్రతీక అందుకు కేవలం ప్రతిగా ఉన్నప్పుడు – అంటె సర్వవ్యాపకమైన బ్రహ్మం ప్రతీక మూలాన ఉపాసింపబడినప్పుడు, ప్రతీకమే మూలకారణమైన బ్రహ్మంగా భావించబడినప్పుడు – ఆ ఉపాసన నిజానికి లాభకరం అవుతుంది; అంతేకాదు! ఉపాసనలో ప్రాథమికదశను సన్నాహదశను అతిక్రమించే పర్యంతం సర్వమానవులకూ అలాటి ఉపాసన అత్యావశ్యకమూ, విద్యుక్తమూ కాబట్టి దేవతలుకాని, ఇతర గణాలుకాని స్వయంగా ఆరాధించబడినప్పుడు అది కేవల కర్మకలాపమే అవుతుంది. విద్యారూపంలో అది ప్రత్యేకమైన ఆ విద్యయొక్క ఫలాన్ని ఇస్తుంది. కాని దేవతలుగాని మరెవరుగాని బ్రహ్మభావంతో ఉపాసింపబడిన పక్షంలో బ్రహ్మోపాసనాఫలితమే సిద్ధిస్తుంది. అనేక సమయాల్లో ఒక దేవతనో, ఋషినో, మరే ఇతర దివ్యపురుషుణ్ణో గైకొని ఆతడి స్వభావం నుంచి ఉత్తీర్ణుని చేసి మరి బ్రహ్మభావంతో ఉపాసిస్తూన్నట్లు శ్రుత్యాదులలో కానవస్తూండటానికి ఇదే కారణం. “నామరూపాలను తొలగించినప్పుడు సర్వం బ్రహ్మమే కదా” అని అద్వైతి వచిస్తాడు. “ప్రతి జీవిలోను అంతర్యామిగా ఉండేవాడు పరమేశ్వరుడే కదా” అని విశిష్టాద్వైతి అంటాడు. ఈ విషయంగా శంకరాచార్యులు తన బ్రహ్మసూత్రభాష్యంలో ఇలా పేర్కొన్నారు! “ఫలమతిథ్యాద్యుపాసన ఇవాదిత్యాద్యుపాసనేపి బ్రహ్మైవ దాస్యతి సర్వాధ్యక్షత్వాత్ – ఆదిత్యాదులను ఉపాసించటంవల్ల ఫలంకూడ బ్రహ్మమే ఇస్తున్నాడు; ఎందుకంటె సర్వాధ్యక్షుడు బ్రహ్మమే.” అంతే గాక, “ఈ దృశం చాత్ర బ్రహ్మణ ఉపాస్యత్వం యత్ ప్రతీకేషు తద్దృష్ట్యాధ్యారోపణం ప్రతిమాదిషు ఇవ విష్ట్వాదీనామ్* – విష్ట్వాదిమూర్తులు ప్రతిమలలో ఆరోపింపబడ్డ విధంగానే బ్రహ్మం ప్రతీ కాలంలో అధ్యారోపింపబడిన కారణాన ఇక్కడ ఈ విధంగా ఉపాస్యుడు అవుతున్నాడు.”
ప్రతీకోపాసనను గురించి పైన పేర్కొన్న భావాలే ప్రతిమారాధన విషయానా అనువర్తిస్తుంది; అంటె ప్రతిమ ఒక దేవతకో, మహాపురుషుడికో ప్రతిగా గైకోబడినట్లయితే అలాటి ఆరాధన ముక్తిని ఇవ్వలేదు; కాని పరమేశ్వరుడికే ప్రత్యామ్నాయమైన పక్షంలో భక్తిముక్తులు రెండిటిని ఒసగుతుంది. ప్రపంచంలోని ప్రధానమతాలలో వేదాంతమతం, బౌద్ధమతం, క్రైస్తవమతంలో కొన్ని సంప్రదాయాలు ఉపాసనలో విరివిగా విగ్రహాలను ఉపయోగిస్తాయి; మహమ్మదీయ మతమూ ప్రొటస్టెంట్ మతమూ మాత్రమే ఇలాటి సాహాయ్యాన్ని అంగీకరించవు. కాని మహమ్మదీయులు తమ మహాపురుషుల గోరీలను, స్వమతరక్షణార్థం ప్రాణాలను అర్పించిన మహనీయుల గోరీలను కాస్త ఇంచుమించుగా విగ్రహస్థానాన ఉపయోగిస్తున్నారు; ఇక ప్రొటస్టెంట్లయితే ప్రత్యక్ష సాహాయ్యాల నన్నిటిని నిరాకరించటంతో నానాటికీ పరమార్థానికి దూరమవుతున్నారు. చివరకు నేడు ముందంజవేస్తున్న ప్రొటస్టెంట్లలకు అగస్టు కాంట్* అనుచరులకు నీతిశాస్త్రాన్ని మాత్రమే బోధించే అజ్ఞేయవాదులకు (అగ్నాస్టిక్స్)* వ్యత్యాసం ఏమీ కనిపించటం లేదు. అంతేగాక క్రైస్తవమహమ్మదీయ మతాలలో ఏమాత్రం ప్రతిమారాధన నిలబడి ఉన్నా అది భగవద్దర్శన సౌకర్యార్థంకాక కేవలం ప్రతిమనే అర్చించే విధానంలో చేరుతుండటంతో ఉత్తమపక్షం అది కర్మకలాపంగా ఉండి భక్తినిగాని ముక్తినిగాని కలుగచేయ అసమర్థమవుతోంది. ఈ విధమైన ప్రతిమారాధనలో భగవదితరాలైన వాటికి అంజలి ఘటింపబడటంచేత ప్రతిమలనుగాని, గోరీలనుగాని, దేవాలయాలనుగాని, సమాధులనుగాని ఇలా వినియోగించటాన్నే నిజమైన ప్రతిమారాధన అని చెప్పాలి. స్వయంగా ఇది పాపంకాదు, దుష్కార్యమూ కాదు – మరేమంటె కేవలం ఇది కర్మ; ఇలా ఉపాసించేవారికి తదనుగుణమైన ఫలం కలగాలి, కలుగుతుంది.