భగవన్నామం ఎక్కడ కీర్తించబడుతుందో ఆ స్థలంసైతం పవిత్రమవుతుంది. అలాంటప్పుడు కీర్తించేవాడు ఇంకెంత పవిత్రుడో! పరమార్థోపదేశం చేసే గురువర్యుణ్ణి ఎంత ఆదరంతో ఆశ్రయించాలో! అలాటి సద్గురువరేణ్యులు ఈ లోకంలో ఎంతో అరుదుగా ఉన్నారు; అయినా వాళ్ళు బొత్తిగాలేని సమయం మాత్రం ఎన్నడూలేదు. మానవ జీవిత నందనవనంలో వారే పారిజాతాలు. వారు “అహేతుక దయాసింధువులు”* “ఆచార్యం మాం విజానీయాత్” – “ఆచార్యుణ్ణి నేనే అని తెలుసుకోవటం” అని శ్రీకృష్ణభగవానుడు భాగవతంలో తెలిపాడు.* ఇలాటి మహనీయులు ఎప్పుడు ఉండరో ఆ క్షణమే ప్రపంచం ఘోరనరకమై వినాశంకేసి పరుగెత్తుతుంది.
సామాన్య గురుకోటికంటె ఉన్నతమూ ఉదాత్తమూ అయిన ఆచార్యశ్రేణి లోకంలో ఉంది. అలాటి గురువరేణ్యులు సాక్షాత్తు భగవదవతారమూర్తులు. స్పర్శతో, కేవలం సంకల్పంతో వారు మనలను పారమార్థిక శీలురుగా చేయగలరు.* పరమనికృష్టులు – పతితులు – వారి ఆజ్ఞామాత్రాన పరమపావను లవుతారు. వారే గురువులకు గురువులు, మానవరూపంలో దేవుడు ఎత్తే మహోన్నతావతారాలు. వారి మూలానేకాని భగవంతుణ్ణి దర్శించలేం; వారిని ఆరాధించకుండా ఉండలేము; నిజానికి వారే మనకు అర్చనీయులు.
మానవుడుగా అవతరించిన రూపంలోనేగాని నిజానికి ఎవరూ భగవంతుణ్ణి చూడలేరు. వేరు విధంగా చూడ ప్రయత్నిస్తే, భగవంతుణ్ణి గురించి ఘోరవికృతరూపాన్ని కల్పించుకొని మన కల్పన నిజమైన భగవద్రూపానికి తీసిపోదని నమ్ముతూంటారు. వెనకటికి ఒక కథ వుంది. ఒక తెలివితక్కువ దద్దన్న నెవరో శివవిగ్రహం చేయమని కోరగా అతగాడు అనేక రోజులు అఖండ పరిశ్రమచేసి చివరకు ఒట్టి కోతివిగ్రహాన్ని చేశాడట! కాబట్టి భగవంతుడి అఖండ పరిపూర్ణరూపాన్ని మనం భావింప ప్రయత్నించినప్పుడల్లా అపజయమే మనలకు ఎదురవుతుంది; ఎందుకంటె మనం మానవులమై ఉన్నంత వరకు భగవంతుణ్ణి మానవుడికంటె అతిరిక్తుడని ఎన్నడూ భావించలేం. మానవస్వభావాతీతులమై మనం ఆతణ్ణి యథారూపంలో చూసే సమయం వస్తుంది; కాని మానవులమై వున్నంత వరకు మనం భగవంతుణ్ణి మానవాంతర్యామిగా మానవరూపిగానే ఆరాధించి తీరాలి. ఎన్ని చెప్పినా, ఎంత ప్రయత్నించినా మానవుడిగా తప్ప భగవంతుణ్ణి గురించి వేరేవిధంగా భావించలేవు. దేవుణ్ణి గురించీ ప్రపంచంలోని సమస్త విషయాలను గురించీ ధీనిధివై మహోపన్యాసాలు చెయ్యవచ్చుగాక. మహాతార్కికుడవై “భగవంతుడు మానవుడై అవతరిస్తాడు” అనే సిద్ధాంతం వట్టి ప్రలాపం అని నిరూపిస్తావు గాక! కాని అనుభవపూర్వకమైన వివేకదృష్టితో లోకవ్యవహారాన్ని క్షణం పరిశీలించి చూస్తే ఈ రకమైన మీ ప్రజ్ఞావిశేషానికి వెనుక ఏమున్నది? పూర్ణానుస్వారం, వట్టి గడబిడ, లొడలొడ. అవతార ఆరాధనను నిరసిస్తూ ఎవడైనా మహోపన్యాసం చేస్తూండగా మళ్ళా నువ్వు వినటం తటస్థించినప్పుడు ఆతణ్ణి కలిసి, భగవంతుణ్ణి గురించి అతడి అభిప్రాయం ఏమిటో, ‘సర్వశక్తిమత్త్వం’, ‘సర్వవ్యాపకత్వం’ మొదలైన మాటలకు వర్ణక్రమాన్ని మించి అతగాడికి ఏమి తెలుసో అడగండి. నిజానికి వీటిని గురించి అతడి కేమీ తెలియదు; మానవనైజ బాధితంకాని ఎలాంటి తలంపూ ఆ పదాలను గురించి అతడికి తట్టదు; ఈ విషయంగా అక్షరజ్ఞానంలేని గ్రామీణుడికంటె అతడు ఎంతమాత్రం అధికుడు కాడు. ఏమైనా ఆ గ్రామీణుడు తాను నెమ్మదిగా ఉంటాడు: లోకుల ప్రశాంతతను చెడగొట్టడు. ఇక ఈ మహాప్రలాపి లోకంలో అశాంతిని, దుఃఖాన్ని తెచ్చిపెడతాడు. ఎన్ని చెప్పినా సాక్షాత్కారమే మతధర్మం. వాచాలతకూ ఆత్మానుభూతికీ ఉన్న వ్యత్యాసాన్ని మనం చక్కగా గమనించవలసి ఉంది. హృదయాంతరాళంలో మనం పొందే అనుభూతే సాక్షాత్కారం. ఈ విషయంగా సామాన్య వివేకం అంతటి అసామాన్యమైనది మరొకటి లేదు.
సావధికమైన మన ప్రస్తుతావస్థలో భగవంతుణ్ణి గురించి మానవ రూపంలోనేగాని అన్యధా భావించలేం. మాటవరసకు, దున్నపోతులు దేవుణ్ణి ఆరాధించకోరే పక్షంలో తమ స్వభావాన్ని అనుసరించి అవి దేవుణ్ణి ఒక పెద్దదున్నపోతుగా భావిస్తాయి. ఒక చేప భగవంతుణ్ణి ఆరాధించాలనుకొంటె, భగవంతుడు ఒక పెద్దచేప అని భావించక తప్పదు; ఇలాగే మానవుడు దేవుణ్ణి గురించి మనిషిగా భావించవలసిందే. ఈ భావనలన్నీ మందంగా పారే ఊహలుకావు. మానవుడు, దున్న, చేప – ఇవన్నీ వివిధ పాత్రలని భావించాలి. ఈ పాత్రలన్నీ తమతమ రూపసామర్థ్యాల మేరకు అమృతపూరితాలవటానికై భగవత్సాగరానికి పోతాయి; మనిషిలో ఈ అమృతం మానవరూపాన్ని, దున్నలో దున్న రూపాన్ని, చేపలో చేపరూపాన్ని పొందుతుంది. ఈ పాత్రలు ఒక్కోదాన్లో ఉన్నదీ భగవత్సాగరామృతమే. మనుషులు చూసేటప్పుడు భగవంతుడు మానవుడుగానే అగపడతాడు, జంతువులకు ఏమైనా భగవద్భావం ఉంటె వాటికి వాటివాటి ఆదర్శ సామర్థ్యాల మేరకు భగవంతుడు జంతువుగానే – అగపడి తీరుతాడు. కాబట్టి దేవుణ్ణి మనం మానవుడిగా చూడవలసిందే; అందుచేత మానవరూపంలో మనం ఆతణ్ణి ఆరాధించవలసి ఉన్నాం. వేరేమార్గం లేదు.
రెండు రకాలైన మనుషులు భగవంతుణ్ణి మానవుడిగా ఆరాధించరు – అసలు పారమార్థిక చింతలేని మానవపశువు ఒకడు, సమస్త మానవ దోషాతీతుడై, మానవ స్వభావాతీతుడైన పరమహంస ఒకడు. పరమహంసకు సమస్త ప్రకృతీ ఆతడి ఆత్మే. ఆతడే యథారూపంలో భగవంతుణ్ణి ఉపాసించ సమర్థుడు. ఇతర విషయాలు అన్నిట్లోను మాదిరే ఇక్కడా పరమ నీచోచ్ఛస్థితులు సమంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పరమజ్ఞానులు, పరమమూఢులు అనే రెండు తెగలవారు భగవంతుణ్ణి ఉపాసించరు. అజ్ఞానంచేత మానవపశువు ఉపాసించడు; తమలోనే భగవత్సాక్షాత్కారం పొందటంచేత జీవన్ముక్తులు ఉపాసించరు. ఈ రెండుస్థితులకు మధ్య ఉన్న వ్యక్తి ఎవడైనా భగవంతుణ్ణి మానవరూపంలో తాను ఆరాధించనని మీతో చెబితే ఆ వ్యక్తి విషయంలో ప్రేమతో తగుశ్రద్ధ వహించండి. ఆతడు తన బాధ్యత నెరుగని కేవల ప్రలాపి – ఇంతకంటె కఠినమైన పదాన్ని వాడదలచుకోలేదు. ఆతడి మతం మట్టి బుర్రలకు, మతిలేనివారికే కాని ఇతరులకు కాదు.
మానవుడి దోషాలను గ్రహించి, కరుణాపయోనిధి అయిన భగవానుడు లోకకల్యాణానికై మానవరూపంలో అవతరిస్తాడు.
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి, భారత ।
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥”
(భగవద్గీత 4–7, 8)
(ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి, అధర్మం వృద్ధిచెందుతుందో అప్పుడల్లా నేను అవతరిస్తాను. ధర్మసంస్థాపనకోసం, అధర్మనాశనంకోసం యుగయుగాల్లోను నేను అవతరిస్తాను)
“అవజానంతి మాం మూఢా మానుషీ తను మాశ్రితమ్ ।
పరంభావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ॥”
(భగవద్గీత 9–11)
(నేను జగదీశ్వరుణ్ణి అనేట్టి నా తత్త్వాన్ని గ్రహించక మూఢులు మానవరూపినైవున్న నన్ను అవమానిస్తారు.)
అవతారతత్త్వాన్ని గురించి శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞాపూర్వక వ్యాక్యాలివి. అంతేగాక శ్రీరామకృష్ణ భగవానుడు ఇలా వచించాడు: “పెద్దవరద వచ్చినప్పుడు స్వయంగా ఎలాటి ప్రయత్నమూ, ఎరుకా లేకుండానే చిన్నచిన్న దొరువులూ, గుంటలూ బాగా నిండుతాయి. ఇలాగే అవతారపురుషుడు ఆవిర్భవించినప్పుడు ఆధ్యాత్మిక సంపద అనే వెల్లువ ప్రపంచాన్ని ముంచెత్తుతుంది. అప్పుడు ఆధ్యాత్మికత వాతావరణంలో నిండి జనుల మానసాలను ఆవరిస్తుంది.”