ఇక గురువును గుర్తించటం ఎలా? స్వయంజ్యోతి అయిన దినకరుణ్ణి చూపటానికి కాగడా తేనక్కర్లేదు. సూర్యుడు ఉదయించగానే సహజంగానే మనకు తెలియవస్తుంది. ఇలాగే ప్రబోధకుడైన ఆచార్యుడు మనకు సాయంచేయ ఏతెంచగానే తత్త్వజ్యోతి తనమీద కాంతులను ప్రసరించ మొదలు పెట్టిందని ఆత్మకు సహజంగానే తెలుస్తుంది. సత్యం స్వతఃప్రమాణం; సత్యాన్ని నిరూపించటానికి మరొక ప్రమాణం అక్కర్లేదు; అది స్వయంజ్యోతి. సత్యతేజం మన హృదయాంతరాళాలలోకూడ ప్రవేశిస్తుంది; దాని ముందు లోకమంతా అంజలి ఘటించి “ఇదే సత్యం” అని వక్కాణిస్తుంది. ఎవరి సత్యనిష్ఠా, జ్ఞానతేజమూ భానుదీప్తితో వెలుగొందుతుందో అలాటి ఆచార్యవరేణ్యులే లోకంలో మహిమాన్వితులు. మానవకోటిలో అధిక సంఖ్యాకులు భగవంతుణ్ణి పూజించినట్లే వారిని పూజిస్తారు. కాని వీరికంటె ఇంచుక తక్కువ వారినుంచీ మనకు సాయం లభించవచ్చు; పైగా మనకు మార్గదర్శకుడై ప్రబోధం చేసేవ్యక్తి గొప్పతనం సరిగా గ్రహించటానికి తగినంత సహజావలోకనశక్తి మనవద్ద లేదు. కాబట్టి శిష్యుడి మాదిరే గురువును కొన్ని పరీక్షలకు గురిచేసినప్పుడు కొన్ని నిబంధనలను బట్టి చూసినప్పుడు సంతృప్తికరంగా ఉండాలి.
విశుద్ధత, నిజమైన జిజ్ఞాస, ధృతి అనేవి శిష్యుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. అపవిత్రుడికి ఎన్నడూ ఆధ్యాత్మికత అలవడదు. ఎవరికైనా పారమార్థికశీలం పట్టుపడాలంటె మనోవాక్కాయాలలో పరిశుద్ధత కుదరాలి. జిజ్ఞాస విషయమై మనం కోరేది ఏదో అదే మనకు లభిస్తుంది అనేది సనాతన నియమం. మన మనసు నిలిచిన విషయాలేకాని అన్యమెన్నడూ మనకు సంప్రాప్తం కాదు. నిజానికి పరమార్థానికై పరితపించటం దుర్లభం, పారమార్థిక చింతన సాధారణంగా మనం అనుకొనేటంత సులభసాధ్యం కాదు. ఉపన్యాస శ్రవణం, తాత్త్విక గ్రంథ పఠనం ఉన్నంత మాత్రాన్నే హృదయంలో నిజమైన జిజ్ఞాస ఉందని నిశ్చయించటానికి వీలుపడదు; నిజమైన పారమార్థిక పిపాస కలిగే వరకు – విజయం చేకూరే పర్యంతం, మనలో ఉన్న పశుప్రవృత్తితో ఎడతెగని పోరాటం – సడలని యుద్ధం చేయాలి. ఒకటి రెండు రోజులతో తీరిపోయే పనికాదు ఇది; ఒకటి రెండు ఏళ్లలో సమాప్తంకాదు; ఒకటి రెండు జీవితకాలాలుకూడ ఇందుకు చాలవు. జన్మశతాలు సైతం ఈ పోరాటాన్ని సాగించవలసి రావచ్చు. విజయం ఒకప్పుడు వెంటనే లభించవచ్చు. కాని అనంతకాలమైనా సరే ఓర్పుతో వేచివుండ సంసిద్ధులమై వుండాలి.* ఇలాటి పూనికతో సాధనకు పూనుకొనే శిష్యుడు చివరకు విజయాన్ని – సాక్షాత్కారాన్ని పొంది తీరుతాడు.
ఇక గురువు విషయానికి వస్తే, ఆతడు శాస్త్రార్థ తాత్పర్యాలను గ్రహించినవాడై ఉండాలి. లోకమంతా వేదాలను, బైబిల్లను, ఖురానులను చదువుతుంది; కాని అవి వారికి వట్టి మాటలు, వాక్యాన్వయాలు, శబ్దనిష్పత్తులు, శబ్దశాస్త్రాలు, తత్త్వశరీరంలోని అస్థులు. ఎంతసేపూ మితిమీరిన శబ్దవ్యాఖ్యానాలతో కాలక్షేపంచేస్తూ శబ్దశక్తి చేత విమోహితుడైన గురువు శ్రుతిహృదయాన్ని జారవిడుస్తాడు. శ్రుతిసార జ్ఞానమే నిశ్చయంగా గురువు లక్షణం. మహారణ్యాన్ని పోలిన శబ్దజాలంలో చిక్కుకొని మన మనస్సు దారి కానక బాధపడుతుంది.
“శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణమ్”*
“వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యాన కౌశలమ్,
వైదుష్యం విదుషాం తద్వ ద్భుక్తయే నతు ముక్తయే.”*
అన్నట్లు శబ్దాల పరస్పరతతో కూర్చే నానారీతులు, వివిధాలు అయిన వాక్చాతురీ విధానాలు, శాస్త్రవ్యాఖ్యాన విధాన వైవిధ్యం – ఇవన్నీ వాదాలకు, భుక్తికి ఉపయోగపడతాయి గాని ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడవు. ఇతరులకు మతప్రబోధం చేయటానికై ఇలాటి విధానాలను అవలంబించేవారు లోకం తమను ఇంతటి మహాపండితులు లేరని పొగడటానికై తమ పాండిత్యం వెల్లడించటానికై, ఆతురపడుతూంటారు. ప్రపంచంలోని ఏ మహామతాచార్యుడూ ఈ వ్యాఖ్యాన ఆడంబరంలోకి దిగలేదని నువ్వు గుర్తిస్తావు. వలసిన అర్థాన్ని పిండటానికి వారు శాస్త్రవాక్యాలను బాధించ యత్నించలేదు. ఊరక శబ్దార్థ శబ్దనిష్పత్తులతోనే సర్వకాలాన్ని గడపలేదు. అయినా ఇతరులు ఒక శబ్దాన్ని గైకొని, దాని ఉత్పత్తిని గురించి మొట్టమొదట దాన్ని ఉపయోగించిన వ్యక్తిని గురించి – తరచూ ఆతడు ఏం తిన్నాడో, ఎంతసేపు నిద్రించాడో మొదలైన గొప్పసంగతులను గురించి – మూడు సంపుటాల గ్రంథాన్ని రాస్తూంటే, ఈ ఆచార్యులు తమ ఔదార్యం అతిశయించ, లోకానికి తత్త్వాన్ని బోధించివున్నారు.
శ్రీరామకృష్ణ భగవానుడు ఒక కథ చెబుతూండేవాడు: కొందరు ఒక మామిడితోటలోకి వెళ్లి ఆకులను, కొమ్మలను, పండ్లను లెక్కిస్తూ, వాటి రంగులను పరిశీలిస్తూ ఒండొంటి పరిమాణాలను సరిపోలుస్తూ, అతిజాగ్రత్తతో అన్నిటిని సవిమర్శంగా గుర్తించాక వాటిలో ప్రతి విషయం గురించి తమ పాండిత్యం అతిశయిల్ల, తమకు ఆనందం ఇనుమడింప, గొప్పచర్చ చేశారట! కాని వారిలో ఒకడు – ఇతరులకంటె బుద్ధిమంతుడైనవాడు – వీటిలో వేటినిగాని గణించలేదు. ఆ మామిడిపళ్లు కోసుకొని తినసాగాడు. అతడే కదా బుద్ధిమంతుడు! కాబట్టి నీ శాఖాపత్రగణనలూ, లెక్కలు రాసిపెట్టటమూ ఇతరులకు విడిచిపెట్టు! ఈ విధమైన వ్యాపారానికి ప్రాపంచిక జీవితంలో స్థానంవుంది; కాని పారమార్థిక రంగంలో కాదు. ఈ ‘ఆకులను లెక్కించేవారి’ నుంచి ఆధ్యాత్మిక మహిమాన్వితులు ఎన్నడూ వెలువడింది లేదు. మానవుల మహోన్నతాదర్శమూ, మహోన్నత వైభవమూ అయిన పారమార్థికతకు ఇంత ప్రయాసపడనక్కర్లేదు. మీరు భక్తులు కాదలిస్తే కృష్ణుడు మథురలో జన్మించాడా? రేపల్లెలో జన్మించాడా? ఆతడు ఏం చేసేవాడు? లేక గీతాప్రబోధం చేసిన సరైన తేదీ ఏది? – ఈ విషయాలను మీరు ఎంతమాత్రం తెలుసుకోనక్కర్లేదు. కాని భక్తియోగాన్ని గురించి, కర్మయోగాన్ని గురించి, భగవద్గీతలో చెప్పబడ్డ మనోహర ధర్మాలకై ఆతురత చెందటమే మీకు కావలసింది. గీతను గురించిన, గీతాకర్తను గురించిన వివరాలన్నీ పండితుల వినోదంకోసం కాని మనకు కాదు. వారికి కావలసిన ఆ ఆనందం అంతా వారినే పొందనివ్వండి. వారి ప్రజ్ఞావాదాలకు స్వస్తి చెప్పిమనం ‘మామిడిపళ్లను తిందాం’.
గురువుకు వుండవలసిన రెండవ లక్షణం పాపరాహిత్యం. “గురువు శీలాన్ని వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించటం ఎందుకు? ఆతడి బోధనల యోగ్యతను పరిశీలించి వాటిని పాటించటమే మన పని” అని తరచు వింటుంటాం. ఇది సరికాదు. గతిశాస్త్రాన్ని గురించో, రసాయనశాస్రాన్ని గురించో, మరే ఇతర ప్రకృతిశాస్త్రాన్ని గురించో నాకు ఎవరైనా కొంత బోధించకోరితే అతడి ప్రవర్తన అతగాడి చిత్తానుసారంగా ఉండొచ్చు: ఎందుకంటె ప్రకృతిశాస్త్రాలకు కావలసింది బుద్ధికుశలత; కాని ఆధ్యాత్మిక విద్యల విషయంలో మలినహృదయాన ఆత్మవికాసం ఉండటం కలలోని వార్త. మలిన హృదయుడు మతధర్మాన్ని ఏం బోధించగలడు? పరమార్థాన్ని స్వయంగా గ్రహించటానికిగాని, పరులకు బోధించటానికిగాని ముఖ్యంగా కావలసింది ఆత్మశుద్ధి, హృదయ పవిత్రత. భగవద్దర్శనంగాని, పరతత్త్వానుభవలేశంకాని చిత్తశుద్ధిలేనిదే ఎన్నటికీ ఒనకూరదు. కాబట్టి ఆచార్యుడి విషయంలో ముఖ్యంగా మనం చూడవలసింది ‘అతడు ఎలాటి వ్యక్తి’ అనే విషయం. ముమ్మాటికీ ఆతడు ఎంతో పరిశుద్ధుడై వుండాలి. అప్పుడే అతడి మాటలకు విలువ వుంటుంది. నిజానికి అప్పుడే అతడు జ్ఞానాన్ని సంక్రమింప చేయగలవాడవుతాడు. తనకే ఆధ్యాత్మికశక్తి లేనివాడు పరులకు ఏమి ఒసగగలడు? ఆచార్యుడి హృదయంలో ప్రశస్తమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పుడే సానుభూతితో అది శిష్యుడి హృదయానికి అందింపబడుతుంది. ఆచార్యుడి కర్తవ్యం కేవలం శిష్యుడి ధీశక్తినికాని, మరే ఇతర శక్తిసామర్థ్యాలనుకాని ఉద్దీపింప చేయటంకాదు, దివ్యమైన అపూర్వ శక్తిని శిష్యుడికి సంక్రమింప చేయటమే ఆచార్యుడి విధి. నిక్కమై, అనుభవగోచరమైన శక్తి ఆతడినుంచి వెలువడి శిష్యుడిలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆచార్యుడు పరిశుద్ధుడై వుండాలి.
ఉద్దేశానికి సంబంధించిన మూడవ లక్షణం. స్వార్థాన్ని మనసులో ఉంచుకొని ధనం కీర్తికోసం గురువు బోధించకూడదు. కేవలం వినిర్మల ప్రేమతో, విశ్వమానవప్రేమతో ఆతడు బోధనకు పూనుకోవాలి. ప్రేమద్వారా ఆధ్యాత్మికశక్తి ప్రసరిస్తుంది. స్వలాభం, ప్రఖ్యాతి మొదలైన ఏ స్వార్థచింత అయినా ఉంటే వెంటనే ఈ పవిత్రప్రేమ వినష్టమవుతుంది. భగవంతుడు ప్రేమస్వరూపుడు. భగవంతుణ్ణి ఎవరు ప్రేమమయుడిగా ఎరుగుతాడో అలాటి వ్యక్తే భగవంతుణ్ణి గురించీ, భగవత్తత్త్వాన్ని గురించీ బోధించ సమర్థుడైన ఆచార్యుడు కాగలడు.
ఈ లక్షణాలు నీ గురువులో ఉండే పక్షంలో నీకు క్షేమం చేకూరుతుంది. లేకుంటె అలాటి వ్యక్తినుంచి ఉపదేశం పొందటం అనర్థకం. ఎందుకంటె, నీకు ఆతడు సద్బుద్ధిని కలుగచేయకపోయినా, దుర్బుద్ధిని కలిగించవచ్చు, ఈ మహావిపత్తుకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి. “శ్రోత్రియోఽవృజినోఽకామహతో యో బ్రహ్మవిత్తమః” * – శ్రోత్రియుడు (వేదశాస్త్రవేత్త) పాపరహితుడు కామగంధ దూరుడు, బ్రహ్మవేత్తలలో మేటీ – అయినవాడే నిజమైన గురువు.
పైన పేర్కోబడ్డ విషయాల ననుసరించి సత్యాన్ని గుర్తించటానికీ ప్రేమించటానికీ మనలో ఐక్యం చేసుకోటానికీ అభ్యాసం చెయ్యడం అనేది మనకు ప్రతివ్యక్తివద్దా, ప్రతిస్థలంలోనూ సాధ్యం కాదని సహజంగానే వెల్లడవుతోంది. “శిలలో శీలోపదేశమూ వాగులలో గ్రంథపాండిత్యమూ అన్నిటిలో మేలూ”* అనేది ఎంతో చక్కని కావ్యాలంకార మవటం నిజం, అంతే; కాని ఎవరికైనా సరే తత్త్వబీజాలు ఆతడి మానసంలో ఉండనిదే తత్త్వాన్ని అతగాడి కెవడూ అణు మాత్రమైనా బోధించలేడు. శిలలు సేలయేళ్ళు ఎవరికి ధర్మాన్ని బోధిస్తాయి? ఎవరి పావనహృదయారవిందంలో అంతకు మునుపే చైతన్యం ఉరకలు వేస్తూందో అలాటి వ్యక్తికి ఈ హృదయారవిందాన్ని చక్కగా వికసింపచేసే తేజం, యోగ్యుడూ వివేకీ అయిన ఆచార్యుడినుంచే సదా వెలువడుతుంది. హృదయం ఇలా ప్రఫుల్లం కావించబడగానే రాయినుంచికాని, వాగులనుంచికాని, సూర్యచంద్ర తారకలనుంచి కాని, విష్ణుమయమైన ఈ జగత్తున దేనినుంచి అయినా తత్త్వోపదేశం పొందటానికి సమర్థత కలుగుతుంది. కాని ఇలా వికసించని హృదయానికో, రాయి కేవలం రాయిగానే కనిపిస్తుంది. వాగు వాగుగానే కనిపిస్తుంది. చిత్రవస్తుప్రదర్శనశాలకు గుడ్డివాడు వెళితే, అతడికి దానివల్ల ఆవంత అయినా ప్రయోజనం ఉంటుందా? ఉండబోదు. మొదట అతడికి చూపు (మనకు చేతనైతే) కలిగించాలి. అప్పుడతడు ప్రదర్శనశాలలోని వస్తువులు ఏమి బోధిస్తాయో గ్రహించ గలుగుతాడు.
సాధకుడి కళ్ళు తెరిచేవాడు గురువు. పూర్వపురుషుడితో ఆతడి వంశస్థుడికున్న సంబంధమే గురువుతో శిష్యుడికున్న సంబంధం. గురువుపట్ల మనకు శ్రద్ధ, విధేయత, వినయం, గౌరవం అనేవి లేనిదే మన పారమార్థిక చింత ఎన్నటికి అభివృద్ధి కాబోదు. అంతేగాక ఎక్కడ ఇలాటి గురుశిష్య సంబంధం విరాజిల్లుతూంటుందో అక్కడే ఆధ్యాత్మిక మహిమాన్వితులు వెలువడుతున్నారు. ఇక ఇలాటి సంబంధాన్ని యథావిధిగా కాపాడ శ్రద్ధపూనని దేశాలలో జరుగుతున్న విషయాలివి: ఆచార్యుడు అక్కడ కేవలం ఉపన్యాసకుడైనాడు; తనకు రావలసిన పది రూకలమీదే అతడి దృష్టి. శిష్యుడు తన తలను గురువాక్యాలకు అద్దెకిస్తున్నాడు. అంతటితో ఎవరి తోవ వారిది. ఇలాటి పరిస్థితుల్లో ఆత్మపరత సహజంగా అజ్ఞాత వస్తువైపోవటం అబ్బురం కాదు. పరమార్థాన్ని బోధించేవారు లేరు, వినేవారు అంతకన్నా లేరు. ధర్మం ఇలాంటి వ్యక్తుల చేతుల్లోపడి వర్తకం కిందికి దిగింది. డబ్బుతో వీళ్ళు ధర్మాన్ని సముపార్జించ గలమనుకొంటారు. దైవమా, పరమార్థతత్త్వం అంతతేలికగా లభించేదిగా ఉండకూడదా! కాని మన దురదృష్టం అది అంత సులభసాధ్యం కాదు!
ఆత్మజ్ఞానం మహోన్నతమైన జ్ఞానం, మహోన్నత వివేకం. అది డబ్బుకు లభించేది కాదు; గ్రంథాలనుంచీ లభ్యమవనిది లోకాన దిగ్దిగంతాల, మూలమూలల గాలించి చూసినా హిమాలయాలను ఆల్ప్సు, కాకససు పర్వతాలను అధిరోహించి పరిశోధించినా టిబెట్ దేశంలోకి, గోబీ ఎడారిలోకి పోయి వాటిలోని ప్రతి అణువును పరిశీలించినా; తత్త్వజ్ఞానం పొందటానికి నీ హృదయం పరిపక్వం కానిదే, నీ గురువు నీ వద్దకు రానిదే, ఎక్కడా లభ్యం కాదు. భగవన్నియమితుడైన ఆ గురువు అరుదెంచినప్పుడు బాలుడి విశ్వాసాన్ని పోలిన విశ్వాసంతో, సరళహృదయంతో ఆతణ్ణి సేవించు. ఆతడి మహాప్రభావం నీలో ప్రవేశించటానికై నీ హృదయ ద్వారాన్ని పూర్తిగా తెరిచి ఉంచు. సాక్షాత్తు భగవదవతారమూర్తిగా ఆతణ్ణి కాంచు.* ఇలాటి ప్రేమ గౌరవాలతో గురుసన్నిధిని సత్యాన్వేషణ చేసేవారికి సత్యస్వరూపుడైన నారాయణుడు సత్యాన్ని శివాన్ని సుందరాన్ని కూర్చి మహాద్భుతరహస్యాలను వెల్లడిస్తాడు.