“స తన్మయో హ్యమృత ఈశసంస్థో జ్ఞః సర్వగో భువనస్యాస్య గోప్తా ।
య ఈశే అస్య జగతో నిత్యమేవ నాన్యో హేతుర్విద్యత ఈశనాయ ॥
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం, ముముక్షు ర్వై శరణ మహం ప్రపద్యే ॥”
అతడు ఈ లోకానికి అంతరాత్మ; అమృత స్వరూపుడు; ఈశ్వరుడు; సర్వజ్ఞుడు; సర్వవ్యాపి; లోకరక్షకుడు; శాశ్వత ప్రభువు; శాశ్వతుడైన (అలాటి పరమాత్మకంటె) జగన్నియామకుడు మరొకడు లేడు.
సృష్ట్యాదిని బ్రహ్మను ఎవ్వరు సృజించి వేదాలను ఒసగాడో, ఎవ్వని ప్రకాశం బుద్ధిని ఆత్మాభిముఖం గావిస్తుందో ఆ దేవదేవుణ్ణి మోక్షార్థినై శరణు వేడుతున్నాను.
-శ్వేతాశ్వతరోపనిషత్తు (6–17–18)
భక్తి నిర్వచనం
భగవంతుణ్ణి గురించి నిజమైన, నిష్కళంకమైన అన్వేషణయే భక్తియోగం. ఇది ప్రేమలో జనించి, ప్రేమలో వికసించి, ప్రేమలో లయిస్తుంది. ఉత్కృష్టమైన ఇలాటి భగవత్ప్రేమోన్మాదం క్షణమాత్రం లభించినా అది మనకు శాశ్వత మోక్షాన్ని ఒనగూరుస్తుంది. భక్తిసూత్రాలను ఉగ్గడిస్తూ నారదుడు, “భగవంతుడిపట్ల పరమ ప్రేమే భక్తి” (“సా త్వస్మిన్ పరమ ప్రేమరూపా”)* అని నిర్వచించాడు. అలాటి భక్తి లభించిన వ్యక్తి సమస్తాన్నీ ప్రేమిస్తాడు, దేన్నీ ద్వేషించడు; నిత్య సంతుష్టుడౌతాడు. ఈ ప్రేమను ఏ ఐహిక లాభస్థాయికి దింపలేం.* ఎందుకంటె లౌకిక విషయవాంఛలు ఉన్నంతవరకు అలాటి భగవత్ప్రేమ ఎన్నటికీ జనింపదు. కర్మకంటె, జ్ఞానంకంటె యోగంకంటె భక్తి అత్యున్నతం. కారణం, ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించేవి; భక్తి అంటే, దాని కదే ప్రతిఫలం. అదే సాధన, సాధ్యమూ.
మన మహర్షులు నిరంతరం ప్రసంగించింది భక్తిని గురించే. ముఖ్యంగా భక్తిని గురించి వ్రాసిన నారద, శాండిల్య ఋషుల మాటలు అలావుంచి, విశేష జ్ఞానప్రబోధకులై వ్యాససూత్రాలకు వ్యాఖ్యానం రచించిన శంకరాదులూ భక్తిని గురించి ఎంతో పర్యాలోచింపదగిన భావాలను వెల్లడించివున్నారు. వ్యాఖ్యానకర్త ప్రమాణ వచనాలన్నిటికి కాకున్నా పెక్కింటికి శుష్కజ్ఞానపరంగా అర్థం చెప్పటానికి ఆతురత చెందినా ముఖ్యంగా ఉపాసనా ప్రకరణంలోని సూత్రాలు ఆ విధమైన వ్యాఖ్యానానికి అంత సులువుగా వశపడవు.
జ్ఞానానికి, భక్తికి జనం అనుకొనేటంత వ్యత్యాసం నిజానికి లేదు. పరిశీలించినకొద్దీ రెండిటికీ గమ్యస్థానం ఒక్కటే అనీ, అక్కడ కలుసుకొంటాయనీ మనకు వెల్లడౌతుంది. రాజయోగ విషయంకూడ ఇలాంటిదే. అమాయకులైన సామాన్య ప్రజల కళ్లలో దుమ్ముకొట్టటంగాక మోక్షేచ్ఛతో అవలంబిస్తే రాజయోగం ఆ పరమావధినే మనలను ప్రాపింపచేస్తుంది. కాని మన దురదృష్టవశాత్తు రాజయోగం తరచు పండితమ్మన్యులు, రహస్యవిక్రేతలు అయినవారి చేజిక్కి లోకవంచనకే వినియోగింపబడుతోంది.
భక్తిమార్గంలోని గొప్పలాభం, ప్రయోజనం ఏమంటే అది పరమావధిని పొందటానికి ఎంతో సహజము, సులభమైన మార్గం.* ఇక దీన్లోని ప్రమాద మేమంటే, క్షుద్రమార్గాల్లో ఉపాసనాకాండలో – తరచూ ఇది ఘోరమైన పరమతద్వేషం, స్వమతదురభిమానంగా పరిణమిస్తూంటుంది. సనాతన ధర్మంలోగాని, మహమ్మదీయ క్రైస్తవ మతాల్లోగాని స్వమతాభిమాన పిశాచగ్రస్తులు సర్వసామాన్యంగా ఈ క్షుద్రదేవతోపాసక వర్గంనుంచే బైలుదేరుతుంటారు. ఏది లోపిస్తే నిజమైన ప్రేమలత వికసించదో అలాటి ఇష్టనిష్టే తరచూ ఇతర మత నిరసనకు కూడా కారణమవుతుంటుంది. ప్రతి మతంలోను, ప్రతి దేశంలోను పరిణతలేని దుర్బలమనస్కులందరూ, తమ ఆదర్శంలో ఒక్క విధంలోనే అభిమానం చూపుతుంటారు – అదేదంటే పరమతద్వేషం, పరమతాదర్శ నిరసనం; తన ఇష్టదేవతపట్ల అంత మక్కువగల భక్తుడే, స్వమతాదర్శంలో అంత శ్రద్ధాళువైన మానవుడే, పరమతాదర్శం మాటగాని, పరమత విషయంగాని ప్రస్తావించినంతనే గగ్గోలు చేసే ద్వేషి అవటానికి ఇదే కారణం. తన యజమాని సంపద పరాధీనం కాకుండా రక్షించే కుక్కబుద్ధి వంటిది కొంతవరకు ఈ విధమైన స్వమతాభిమానం విశేషమేమంటే, మానవుడి తార్కిక బుద్ధికంటె కుక్కకున్న సహజగుణమే మేలు; ఎందుకంటె తన యజమాని ఏ రకమైన దుస్తులను ధరించి తన ముందుకు వచ్చినా కుక్క, అతణ్ణి శత్రువని భ్రమించదు. మరోవిషయం – పరమతద్వేషికి విచక్షణాశక్తి నశిస్తుంది. వ్యక్తిగతాభిప్రాయాలకే ఆతడు తలఒగ్గి వాటిచేత మోహితుడౌతాడు. ఎవరైనా ఏదైనా చెబితే అది న్యాయసమ్మతమా కాదా అనే విషయం అతడికి అక్కర్లేదు. కాని అతడు ఎల్లవేళలా ముఖ్యంగా తెలుసుకొనే శ్రద్ధవహించేది ఒకటి వుంది – అతనికి కావలసింది. అదెవరు చెప్పారనే విషయం. తన అభిప్రాయంతో ఏకీభవించేవారిపట్ల దయాసౌజన్యాలతో, ప్రేమానురాగాలతో మెలగే మానవుడే మతాంతరులైన సోదరులపట్ల దారుణ కృత్యాలు చేయటానికి లవలేశం సంకోచించడు.*
సాధనదశలోని గౌణస్థితిలో వున్నప్పుడే భక్తిమార్గంలో ఈ ప్రమాదం ఉంది. భక్తి పరిపక్వమై పరాభక్తిగా పరిణమించగానే ఈ ఘోర మతద్వేషాలకు అవకాశంగాని వాటివల్ల భయంగాని కలుగదు. అతి ప్రశస్తమైన ఈ పరాభక్తి రసాస్వాదనంలో తన్మయుడైన భక్తుడు ప్రేమమూర్తి అయిన భగవంతుడికి అతి సన్నిహితుడు; భక్తిరసపూరితమైన ఆతడి హృదయంలో ఇక ద్వేషానికి తావెక్కడుంది?
సమరసమైన సౌశీల్య నిర్మాణానికి మనలో అందరూ పెట్టిపుట్టలేదు. అయినా భక్తి జ్ఞాన యోగాలనే ఈ మూడూ సంపూర్ణ సమన్వయం పొందిన సౌశీల్యమే మహోత్తమమైనదని మనకు తెలుసు. పక్షికి ఎగురటానికి రెండు రెక్కలూ, చుక్కాని వంటి తోకా ఆవశ్యకాలు కదా. ఇందులో ఒకటి జ్ఞానం, రెండోది భక్తి; యోగమే చుక్కాని అయిన తోక. ఒక్క పట్టులో ఈ మూడింటిని సమంగా ఉపాసింప జాలక భక్తిమార్గాన్ని మాత్రమే అవలంబించేవారు అవశ్యం ఈ విషయాన్ని గుర్తించాలి. క్రియాకలాపాలూ విధులూ అభివృద్ధి చెందే సాధకుడికి ఎంత ఆవశ్యకాలైనా భగవంతుడిపట్ల మనకు గాఢానురక్తి కలిగించటంకంటె వాటికి మరో ప్రయోజనం లేదు.
భక్తి ప్రభావాన్ని అంగీకరించటంలో జ్ఞాన ఆచార్యులూ భక్తి ఆచార్యులూ ఏకీభవిస్తూన్నా వీరిలో కాస్త భేదాభిప్రాయం వుంది. జ్ఞానులు భక్తిని మోక్షసాధనగా పరిగణిస్తారు;* భక్తులైతే భక్తే సాధనమనీ సాధ్యమనీ భావిస్తారు.* నా బుద్ధికి ఇది అంతగా భేదంలేని తారతమ్యమని తోచుతోంది. నిజానికి సాధనంగా ఉపయోగింప బడినప్పుడు భక్తికి సామాన్యోపాసన అని అర్థం. సాధకుడు పరిణతి నొందాక ఆతడి పూర్వానుభవం ఉత్తమమైన సర్వేశ్వరోపాసనతో అవినాభావ సంబంధం పొందుతుంది. కోరకపోయినా పరిపూర్ణమైన భక్తి వెంట యథార్థమైన జ్ఞానం కలిగి తీరుతుందన్న సంగతిని, పరిపూర్ణమైన జ్ఞానంనుంచి నిజమైన భక్తి వేరుపర్చలేనిదనే సత్యాన్ని* మరిచి ప్రతి ఒక్కడూ విచిత్రమైన తన ఉపాసనా పద్ధతే మోక్షద్వారమని చాటుతుంటాడు.
మనం ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని మహాభాష్యకారులు* దీన్ని గూర్చి ఏం తెలుపుతారో గ్రహించటానికి ప్రయత్నిద్దాం. “ఆవృత్తి రస కృదుపదేశాత్” అనే సూత్రాన్ని వివరిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు: “జనులు ఇలా అంటారు – ‘ఆతడు గురువును ఉపాసిస్తున్నాడు, ఆతడు రాజును ఉపాసిస్తున్నాడు. అలా ఉపాసించటమే తన పరమ లక్ష్యంగా భావించి వారిని అనువర్తిస్తూన్న వానిని గూర్చి వారిలా పలుకుతారు.’ ఇలాగే ‘ప్రియురాలైన భార్య తన ప్రాణేశ్వరుని గురించి ధ్యానిస్తుంది’ అని అంటారు. ఇక్కడ ఉత్కంఠతో కూడిన నిరంతర స్మరణ అనే తాత్పర్యం.”* శంకరాచార్యులను అనుసరించి ఇదే భక్తి.*
“ధ్యానంచ తైలధారావ దవిచ్ఛిన్న స్మృతి సంతానరూపమ్ – ధ్రువాస్మృతిః, స్శృతిలమ్భే సర్వగ్రన్థీనాం విప్రమోక్షః” – ఒక పాత్రనుండి మరో పాత్రలోకి ఎడతెగని ధారగా పోయబడ్డ చమురులా (ధ్యేయాన్నిగూర్చి) చేయబడే నిరంతర స్మరణమే ధ్యానం. (భగవంతుణ్ణిగూర్చి) ఇలాటి నిరంతర స్మరణ లభించగానే భవబంధాలన్నీ పటాపంచలవుతాయి* ఇలా నిరంతర స్మరణ మోక్షోపాయమని స్మృతులచే చెప్పబడింది. అంతేగాక ఈ స్మరణం తత్త్వదర్శనంతో సమ (రూప) మైంది. ఎలాగంటే ‘భిద్యతే హృదయగ్రన్ధి శ్ఛిద్యన్తే సర్వసం శయాః । క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ॥ అనేట్లు ‘దూరస్థమైనా సన్నిహితమైన పరతత్త్వాన్ని దర్శించగానే అజ్ఞానపాశాలు విచ్ఛిన్నమౌతాయి. సమస్త సంశయాలు సమసిపోతాయి, అశేషకర్మ క్షయమవుతుంది’ అనేదే దీన్లోని తాత్పర్యం. సన్నిహితుడైన ఆతణ్ణి దర్శించవచ్చును, కాని దూరస్థుడైన ఆతణ్ణి కేవలం స్మరింపగలం.* ఎలాగైనా, సన్నిహితుడైన వాడిని మాత్రమేకాక దూరస్థుడైన వాడిని కూడా దర్శించాలి. (‘ఆత్మావా అరే ద్రష్టవ్యః’) అని శ్రుతి చెప్పినప్పుడు పైన చెప్పిన స్మరణం దర్శనంతో తుల్యమైందని సూచితమౌతోంది. ఈ స్మరణం అభివృద్ధి పొందినపుడు దర్శనంతో సమరూపం నొందుతుంది. నిరంతర స్మరణమే ఉపాసన అని స్మృతి ప్రామాణ్యం. అంతేగాక అనవరతోపాసనమే జ్ఞానం. ఈ జ్ఞానం నిరంతర స్మరణమని వర్ణింపబడింది. ఇలా సాక్షాత్కారతుల్యమైన ఉత్తమ స్మరణం, శ్రుతిచే మోక్షోపాయమని చెప్పబడింది. ‘నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా నబహునాశ్రుతేన । యమై వైషవృణుతే తేనలభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్ ॥’ – ఈ ఆత్మను శాస్త్రప్రవచనాల చేతగాని, ధీశక్తి చేతగాని, విశేషమైన వేదపఠనం చేతగాని పొందజాలం. ఈ ఆత్మ ఎవరిని వరిస్తుందో వాడికే లభిస్తుంది; వాడికే సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ కేవల శ్రవణ మనన నిదిధ్యాసనాలు ఆత్మప్రాప్తికి ఉపాయాలు కావని చెప్పాక ‘ఎవరిని ఈ ఆత్మ వరిస్తుందో వాడికే ఆ ఆత్మ లభిస్తుంది’ అని చెప్పబడింది. ఎంతో ప్రేమించబడిందే కోరబడుతుంది. ఎవడికి ఈ ఆత్మ ప్రియతమమో, వాడే ఆత్మకూ ప్రియతము డవుతాడు. కాబట్టి ఇలాటి ప్రియమైన వస్తువును పొందటానికి స్వయంగా భగవంతుడే (మనకు) తోడ్పడతాడు.
శ్లో ॥ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తితే ॥
‘సదా నా పట్ల ఆసక్తులై, ప్రీతిపూర్వకంగా నన్ను భజించేవారికి నన్ను పొందడానికి హేతువైన బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను’ అని భగవంతుడు వచించి ఉన్నాడు. కాబట్టి స్మరణరూపక సాక్షాత్కార లభ్యమైన పరమాత్మకు ప్రియమవటంచేత సాక్షాత్కారరూపమైన ఈ స్మరణం ఎవడికి ప్రియతమమో వాడినే పరమాత్మ వరిస్తాడు; వాడికే పరమాత్మ లాభం కలుగుతుంది. ఇలాటి నిరంతర స్మృతే భక్తి అనబడుతుంది.”
“అథాతో బ్రహ్మజిజ్ఞాసా” అనే (వ్యాస) సూత్రానికి వ్యాఖ్యానంలో రామానుజాచార్యులు పై విధంగా చెప్పాడు.
“ఈశ్వర ప్రణిధానాద్వా” లేదా ఈశ్వర ప్రణిధానంవల్ల – అనే పాతంజల యోగ సూత్రానికి – వ్యాఖ్యానం చేస్తూ, “ఈశ్వరో వక్ష్యమాణ లక్షణం, తత్ర ప్రణిధానం భక్తివిశేషో విశిష్టముపాసనమ్, సర్వక్రియాణాం తత్రార్పణం విషయ సుఖాదికం ఫలమనిచ్ఛన్ సర్వాః క్రియాస్తస్మిన్ పరమగురావర్ప యతి తత్ప్రణిధానమ్” – విషయ సుఖాదిక ఫలాపేక్షను విడిచి సమస్త కర్మలను పరమగురువైన ఈశ్వరుడికి అర్పించటమే భక్తివిశేషమైన ప్రణిధానం”* అని భోజ దేవుడు వచించాడు. ఆ సూత్రానికే వ్యాఖ్యానం చేస్తూ వ్యాసభగవానుడు* ప్రణిధానాన్ని ఇలా నిర్వచించాడు: దేనిచేత యోగికి పరమేశ్వరానుగ్రహం లభ్యమై ఆతడి కోరికలు ఈడేరునో అలాటి భక్తివిశేషమే ప్రణిధానం. “సా పరానురక్తి రీశ్వరే” ఈశ్వరునిపట్ల పరానురక్తియే భక్తి అని శాండిల్య నిర్వచనం.* కాని భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుని వచనమే భక్తికి ఉత్తమ నిర్వచనమని చెప్పవచ్చు. శ్లో “యాప్రీతి రవివేకానాం విషయే ష్వనపాయనీ । త్వా మనుస్మరత స్సామే హృదయాన్మాపసర్పతు ॥” ‘క్షణికాలైన విషయసుఖాల్లో అవివేకులకు ఎలాటి ప్రీతి వుంటుందో – నిన్ను ధ్యానించేటప్పుడు – (నీ పట్ల) అలాటి (గాఢమైన) ప్రీతి నా హృదయం నుండి తొలగిపోకుండును గాక!’ ప్రీతి! ఎవరిలో? పరమేశ్వరుడిలో. ఇతర విషయాల్లో ఎంతటి పీతివున్నా అది భక్తి అనిపించుకోదు; ఎందుకంటె, శ్లో ॥ ఆ బ్రహ్మ స్తంబ పర్యన్తా జగదన్తర్వ్యవస్థితాః ప్రాణినః కర్మ జనిత సంసార వశవర్తినః ॥ యతస్తతో నతే ధ్యానే ధ్యానినా ముపకారకాః । అవిద్యాన్తర్గతాః సర్వే తే హి సంసార గోచరాః ॥ * ప్రపంచంలో బ్రహ్మ మొదలు గడ్డి పోచవరకు సమస్త ప్రాణులు కర్మజనిత సంసారబద్ధులు; అందుచేత వాటిని ధ్యానానికి లక్ష్యభూతాలుగా చేసుకొంటే అవి ఉపకరించవు.” ఇలా రామానుజాచార్యుడు సుప్రసిద్ధుడైన ఒక పూర్వాచార్యుడి వాక్యాలను ఉదాహరిస్తూ చెప్పాడు. శాండిల్యుడు ఉపయోగించిన ‘అనురక్తి’ అనే మాటకు వ్యాఖ్యానంచేస్తూ ‘అను’ అంటే అనంతరమనీ ‘రక్తి’ అంటే రాగమనీ, అంటే పరమేశ్వర స్వభావ వైభవాలను గ్రహించాక జనించే రక్తి అని స్వప్నేశ్వరాచార్యుడు అంటాడు.* లేకుంటే ఎవ్వరిలోనైనా, అంటే భార్యాపుత్రాదుల్లో మనకుండే రాగం సైతం భక్తి అనవలసి వస్తుంది. కాబట్టి సామాన్యమైన ఆరాధనతో మొదలుపెట్టి భగవంతుడిలో గాఢానురక్తిని మించే దివ్యానుభూతిని పొందటానికై చేసే సాధనక్రమమే భక్తి అని మనకిప్పుడు స్పష్టమౌతోంది.