ఈ మహోన్నతమూ అనిర్వచనీయమూ అయిన ప్రేమాదర్శాన్ని మానవభాషలో నిర్వచించలేం. మానవుడి మహోన్నతభావనాశక్తి సైతం ఈ దివ్యప్రేమ పరిపూర్ణసుందర స్వరూపాన్ని గ్రహించలేదు. కాని ప్రేమ మతానుసారులు అన్ని దేశాలలోను, దాని పరాపరరూపాలు రెండిట, ఇన్నాళ్లు తమ ప్రేమాదర్శాన్ని ఆకళించుకోవటానికి నిర్వచించటానికి అసమర్థమైన మానవభాషనే ఉపయోగించుకోవలసి ఉండినది. విశేషం ఏమంటే, ఈ అనిర్వచనీయ దివ్యప్రేమకు మాదిరి చూపటానికి మానవప్రేమలోనే ఉన్న నానారూపాలు ఉపయోగింపబడుతున్నాయి. మానవుడు దివ్యవిషయాలను గురించి స్వీయమానవసరళి ననుసరించి మాత్రమే చింతించగలడు; నిర్విశేషబ్రహ్మాన్ని గురించి సాపేక్షమైన మన భాషలో మాత్రమే మనకు తెలియగలదు” ఈ విశ్వమంతా నామరూపాత్మక భాషలో నామరూపాతీతాన్ని వెలువరచే కావ్యం. కాబట్టి దేవుణ్ణి గురించీ, ప్రేమమార్గంలో దేవుణ్ణి ఉపాసించటాన్ని గురించీ చెప్పేటప్పుడు భక్తులు సామాన్యమానవప్రేమకు సంబంధించిన సామాన్యపదాల నన్నిటిని వాడుతారు. పరభక్తిని గురించి గ్రంథాలు రచించిన మహనీయులు కొందరు ఈ దివ్యప్రేమను అనేక విధాలలో గ్రహించటానికి అనుభూతం చేసుకోటానికి యత్నించారు. ఈ ప్రేమ దాల్చే అతి కిందితరగతి రూపాన్ని వారు ‘శాంతభక్తి’ అంటారు. ప్రేమలో తీక్షతలేక, ఉన్మాదంలేక, ఇంచుకైనా ఊరకుండనివ్వని పిచ్చ్ణికించిత్తూలేక, ప్రతీకాలకంటె, లింగాలకంటె, క్రతువులకంటె మాత్రం ఒక్కమెట్టు పైది అనదగిన ప్రేమతో నిరుద్వేగ సామాన్య ప్రేమతో భక్తుడు భగవంతుణ్ణి ఉపాసించేటప్పుడు అది ‘శాంతభక్తి’ గా పేర్కోబడుతుంది.* మెల్లగా జీవయాత్ర సాగించగోరేవారు కొందరూ, ఝంఝావర్తమారుతం మాదిరి జీవితరంగానికి వచ్చి వెళ్ళేవారు కొందరూ లోకంలో రెండు రకాల వ్యక్తులున్నారు. శాంతభక్తి సాధకుడు నెమ్మది, నిమ్మళమూ గలిగినవ్యక్తి, సాధువు.
దీనికంటే పై మెట్టుదైన ప్రేమ ‘దాస్యభక్తి’ అనబడుతుంది. భక్తుడు తాను భగవత్సేవకుడనని భావించేటప్పుడు ఇది కలుగుతుంది. శ్రద్ధాళువైన సేవకుడికి తన ప్రభువుపట్ల ఉండే అనురాగం దాస్యభక్తుడికి ఆదర్శం.
శాంతదాస్యభక్తి రూపాలకు తరువాతిది ‘సఖ్యభక్తి’ – “నువ్వే నా ప్రియసఖుడవు” అనే భావంతో కూడుకొన్న భక్తి. ప్రియసఖుడికి తన హృదయాన్ని ఎలా వెల్లడిస్తాడో, దోషాలకు తనను నిందించక మిత్రుడు తన కెలా సదా సాయంచేయ యత్నిస్తాడని ఎరుగుతాడో – వెయ్యిమాటలెందుకు, మిత్రుల మధ్య ఎలా సమభావం చెలువొందుతుందో అలాగే ఉపాసకుడికీ ఆతడి ప్రియమిత్రుడైన భగవంతుడికీ పరస్పరం సమప్రేమ విరాజిల్లుతూంటుంది. భగవంతుడు ఇలా మనకు మిత్రుడవుతాడు, అంతరంగ మిత్రుడవుతాడు. మన జీవితోదంతాల నన్నిటిని ఆ మిత్రుడికి స్వేచ్ఛగా తెలుపవచ్చు; ఆతడు బైటపెట్టడు, మనకు తోడ్పడతాడనే మహాధైర్యంతో మన పరమరహస్యాలను అత్యంత నిర్భయంగా ఆతడికి వెల్లడించవచ్చు. భక్తుడు తనకు సమానంగా స్వీకరించే మిత్రు డతడే. సఖ్యభక్తిలో భగవంతుడు మన చెలికాడు. ఈ విశ్వంలో మన మందరం క్రీడిస్తున్నామని చెప్పవచ్చు. బిడ్డలు ఎలా ఆటలాడుకొంటారో, మహారాజాధిరాజులు ఎలా తమ క్రీడావినోదాలలో తేలియాడుతూంటారో, ప్రేమపాత్రుడైన భగవంతుడూ అలాగే ఈ జగత్తుతో క్రీడిస్తూన్నాడు. ఇది ఆతడి లీల. భగవంతుడు నిత్యపరిపూర్ణుడూ, సర్వాప్తకాముడూ అయివుండగా ఆతడికి ఈ సృష్టికార్యం ఎందుకు? మనకు ఏదో లభించాలనే కోరికతో మనం కర్మ చేస్తూంటాం; కోరిక ఎప్పుడు అపరిపూర్ణతను సూచిస్తుంది. భగవంతుడు నిత్యపరిపూర్ణుడు. సర్వాప్తకాముడు. అయినా ఆతడు నిరంతరం ఈ సృష్టివ్యాపారంలో నిమగ్నుడవటం ఎందుకు? ఆతడు ఈ సృష్టిచే ఉద్దేశించే ప్రయోజనం ఏమిటి? ఏదో ఒక ప్రయోజనంకోసం భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని మనం ఊహించే కథలు వట్టి పుక్కిటిపురాణాలుకాని వేరొకటి కావు. నిజానికి భగవంతుడికి ఇదంతా లీల. విశ్వం అతని వినోదం. ఈ సమస్త ప్రపంచం ఆతడికి ఆనందకరమైన ఒక గొప్ప వినోదమై ఉండొచ్చును. నువ్వు దరిద్రుడవైతే పేదరికాన్ని ఒక వేడుకగా ఎంచి ఆనందించు; భాగ్యవంతుడవైన పక్షంలో భాగ్యమబ్బినదనే వేడుకతోకూడి ఆనందించు; ఆపదలు వాటిల్లితే ఆ వాటిల్లటమూ ఒక వేడుకే; సుఖాలు లభిస్తే, అంతకంటె విశేషమైన వేడుక. ప్రపంచం ఒక క్రీడారంగం. దీన్లో మనం క్రీడిస్తూ వినోదిస్తున్నాం. భగవంతుడు మనతోకూడి క్రీడిస్తున్నాడు. ఆయనతో కలిసి మనమూ క్రీడిస్తున్నాం. మనకు ఆతడు నిత్యమిత్రుడు. ఆహా! ఆత డెంత చక్కగా క్రీడిస్తున్నాడో చూడండి! కల్పాంతంలో ఆతడి క్రీడ సమాప్తమవుతుంది. అల్పకాలమో, అధికకాలమో ఈ క్రీడలో కొంత విరామం ఉంటుంది, తిరిగి అందరూ వెలువడి క్రీడించ నారంభిస్తారు. ఇదంతా క్రీడ అని గుర్తించనప్పుడు మాత్రమే, నుమ్వా ఈ క్రీడలో భగవంతుడికి తోడ్పడుతున్నావనే సంగతి మరచినప్పుడు మాత్రమే, ఆపదలు దుః ఖాలు అనుభవిస్తావు. దుఃఖభారంతో నీ హృదయం కుంగిపోతుంది; ప్రపంచం ఆత్యంతికశక్తితో నీకు దుర్భరమవుతుంది. ఈ క్షణిక జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే సంభవాలు వాస్తవాలనే తలంపును ఎప్పుడు వీడుతావో, ఇదొక క్రీడారంగమని, మనం ఆడుకొంటున్నామని, ఆటలో దేవుడికి తోడ్పడుతున్నామని ఎప్పుడు గుర్తిస్తావో, తక్షణమే నీ దుఃఖాలు సమసిపోతాయి. ప్రతి అణువులోను ఆతడు క్రీడిస్తున్నాడు; భూ సూర్యచంద్ర మండలాలను నిర్మించేటప్పుడు ఆతడు క్రీడిస్తున్నాడు. సుఖదుఃఖ నిలయమైన మానవమానసాలతో, జంతువులతో, వృక్షాలతో ఆతడు క్రీడిస్తున్నాడు. మనం ఆతడి ఆటపాళిలోని పాచికలం. ఈ పాచికల నాతడు ఆటపలకమీదపెట్టి కదిల్చివేస్తాడు. మొదట ఒక తీరులోను, తరువాత మరో తీరులోను ఆతడు మనలను నియమిస్తున్నాడు.* మనకు ఇది తెలిసినా తెలియకపోయినా ఈ క్రీడలో మనం తోడ్పడుతున్నాం. ఆహా! ఏమి బ్రహ్మానందం! మనం జగదీశ్వరుడి క్రీడాసఖులం కదా!
తరువాతిది ‘వాత్సల్యభక్తి’ – భగవంతుడు మన తండ్రి అనిగాక, బిడ్డగా ప్రేమించటం. ఇది విపరీతంగా కనిపించవచ్చు; కాని దేవుణ్ణి గురించిన మన స్మరణంలో ఆయన శక్తులమీది తలంపు లేకుండా చేసికోగలగటానికి ఇది శిక్షణ. అధికారం భయహేతువు. ప్రేమలో భయం ఉండరాదు. గౌరవమూ విధేయతా శీల నిర్మాణానికి ఆవశ్యకాలైనప్పటికీ శీలం సునిర్మితమవగానే, ఉపాసకుడు శాంత భక్తిని భక్త్యున్మాదాన్నికూడ కొంచెం చవిచూడగానే ఇక ఆతడికి ధర్మశాస్త్ర ప్రవచనాలూ శిక్షాస్మృతులూ అనావశ్యకాలు. భగవంతుడు అఖండశక్తిమంతుడనో, సకలైశ్వర్య సంపన్నుడనో, అద్వితీయ వైభవాన్వితుడనో లేక జగదీశ్వరుడనో భావించటాన్ని తాను ఎంతమాత్రమూ లక్ష్యపెట్టనని భక్తుడు పలుకుతాడు. భయావహమైన అధికారాన్ని భగవంతుడికి అన్వయించకుండటానికే భక్తుడు ఆతణ్ణి తన బిడ్డగా భావించి ఉపాసిస్తాడు. పుత్రవాత్సల్యంలో తల్లిదండ్రులకు ఎలాటి భయంకాని గౌరవంకాని ఉండే ప్రసక్తిలేదు. అంతేగాక తమ బిడ్డడి అనుగ్రహాన్ని పొందాలని వారు ఆశించరు కదా. బిడ్డడు ఎప్పుడూ ప్రేమపాత్రుడు; తల్లిదండ్రులో, తమ బిడ్డలపట్ల వాత్సల్యంతో వేయిసార్లైనా తమ శరీరాన్ని సైతం అతగాడికోసం సమర్పిస్తారు. పుత్రవాత్సల్యం ముందు వారికి తమ జీవితాలే లెక్కలోనివి కావు. కాబట్టి భక్తుడు భగవంతుణ్ణి తన బిడ్డ అనే భావంతో ప్రేమిస్తాడు. భగవంతుడిపట్ల ఈ వాత్సల్యం అవతారసిద్ధాంతాన్ని విశ్వసించే మతసంప్రదాయంలో సహజంగా జనించి వృద్ధిపొందుతుంది. మహమ్మదీయ మతస్థులకిది అసాధ్యం; భగవంతుడిపట్ల వాత్సల్యమంటె వారికి మహాపరాధంగా తోచుతుంది, భయంతో శరీరం కంపిస్తుంది. కాని హిందువులకు బాలకృష్ణుడూ, క్రైస్తవులకు బాల ఏసుక్రీస్తూ, ఉండటంతో వాత్సల్యభక్తి వీరికి సులభంగా అనుభూతమవుతుంది. హైందవనారీమణులు తరచు తమను కృష్ణుడి తల్లిగా భావించుకొంటూంటారు: క్రైస్తవమాతలూ ఈ భావాన్ని గైకొని జీసస్సుపట్ల వాత్సల్యభక్తిని అవలంబించవచ్చు. అంతేగాక పాశ్చాత్యుల కిది భగవంతుడిపట్ల మాతృభావాన్ని కలుగచేస్తుంది. నిజానికి నేడిది పశ్చిమఖండానికి ఎంతో ఆవశ్యకమై వుంది. భగవంతుడిపట్ల భయభక్తులనే మూఢవిశ్వాసం మన హృదయంలో వేళ్లూనుకొనివుంది. భగవద్వైభవాతిశయం, భగవదౌన్నత్యం, భగవంతుడంటె భయంతో కూడుకొన్న మన గౌరవ ప్రతిపత్తులు మొదలైన మనోభావాలను ప్రేమ తరంగాలతో కడిగివేయటానికి మనకు చాలకాలం పడుతుంది.*
దివ్యాదర్శ ప్రేమతత్త్వంలో సూచించబడే మరొక భక్తిభావం ఉంది. ఇదే భక్తి పరిభాషచేత సూచితమయ్యే సమస్త దివ్యభావాలలోను ఉత్కృష్టమైన మధురభావం. లోకంలో వ్యక్తమయ్యే మహోత్తమ ప్రేమపై మధురభావం ఆధారపడి వుంది. ఇదే మనకు అనుభవనీయమైన మహోత్కృష్ట ప్రేమ. మానవస్వభావాన్ని ఉర్రూతలూగించే ప్రేమ – మనిషిని ఉన్మత్తుణ్ణి చేసే, శరీరస్మృతిరహితుణ్ణి చేసే ప్రేమ – మనిషిని దేవతగానో, దానవుడిగానో పరిణమింపచేసే ప్రేమ– స్త్రీ పురుషులకు పరస్పరం కలిగే ప్రేమకు సాటైన ప్రేమ మరేదివుంది? ఈ దివ్యమధుర ప్రేమలో జగన్నాథుడే మన నాథుడు. మన మందరం స్త్రీలం; ఈ ప్రపంచంలో పురుషు లెవ్వరూ లేనేలేరు; పరమపురుషు డొక్కడే పురుషుడు, ఆతడే మన ప్రాణేశ్వరుడు. పురుషుడు స్త్రీ పట్లా, స్త్రీ పురుషుడిపట్లా చూపే ప్రేమనంతా మధురభావంలో భగవంతుడికి సమర్పించవలసివుంది. లోకంలో మనకు తారసిల్లే బహువిధాలైన ప్రేమకంతకూ – దేనితో మనం కేవలం వినోదిస్తున్నామో అలాటి ప్రేమకంతకూ – భగవంతుడే పరమావధి; కాని దురదృష్టవశాత్తు మానవుడు ఈ మహాప్రేమవాహినికి గమ్యస్థానమైన అనంతామృతసాగరాన్ని ఎరుగక మానవులనే మట్టిబొమ్మలమీద తన ప్రేమను చూపయత్నిస్తాడు. శిశువును ఆమితంగా ప్రేమించే గుణం మానవుల ప్రకృతిలో ఉంది. అది మానవ శిశువు అనే బొమ్మకై ఉద్దేశించబడినది కాదు. అంధప్రాయంగా నీ ప్రేమనంతా దానిమీదనే లగ్నంచేస్తే చివరకు దుఃఖమే నీకు కలిగే ఫలం; కాని నీలోని ప్రేమను మానవమాత్రుడిపట్ల చూపిస్తే ఎప్పుడో ఒకప్పుడు అది దుఃఖజనకం కాక మానదనే ప్రబోధం నీకు కలిగి తీరుతుంది. ఇదే ఆ దుఃఖంవల్ల కలిగే ఫలం. కాబట్టి మన ప్రేమను మృత్యురహితుడు, నిర్వికారుడు అయిన పరాత్పరుడికి – నిశ్చలప్రేమసాగరుడికి – అర్పించాలి. ప్రేమ తనకు ఉచితమైన గమ్యస్థానాన్ని పొందాలి, అనంతప్రేమసాగరమైన భగవంతుణ్ణి పొందాలి. సమస్త నదీనదాలు సముద్రంలో సంగమిస్తాయి కదా. పర్వతపార్శ్వం నుంచి వచ్చే ఉదకబిందువుకూడ కాలువనికాని నదినిగాని చేరగానే అవి ఎంత పెద్దవైనా అవనీగాక, దానిగతి సమాప్తం కాబోదు; అదీ ఎలాగో సముద్రంలో పడితీరాలి. మన కామక్రోధాదులకు భగవంతుడే ఏకైక లక్ష్యం.* కోపపడాలనివుంటే భగవంతుడిమీద కోపించు: నిందించాలని వుంటే నీ ప్రియతముడైన భగవానుని నిందించు. నిర్భయంగా ఇక ఎవరిని నిందించగలవు? మానవమాత్రుడు నీ కోపాన్ని సహించలేడు, సహించడు. అతగాడికి తిరిగి నీమీద కోపం వస్తుంది. నా మీద నువ్వు కోపగిస్తే వెంటనే అందుకు ప్రతీకారం చేసితీరతాను. నీ కోపాన్ని సహించే ఓర్పు నా వద్ద లేకపోవటమే దీనికి కారణం. ప్రియతముడైన భగవంతుడితో ఇలా అను: “ఎందుకు నువ్వు నా వద్దకు రావు? నన్ను ఇలా ఎందుకు ఏకాకిని చేసిపోతావు?” భగవంతుడిలోకాక సుఖానుభూతి మరి దేన్లోవుంది? క్షుద్రమైన మట్టిబొమ్మలతో మనం ఏం భోగం అనుభవించగలం? ఆనందం అనుభవించగలం? అనంతానంద ఘనస్వరూపాన్ని మనం అన్వేషించాలి; అది భగవంతుడిలో మాత్రమే ఉంది. మన కామక్రోధాదులన్నిటికీ భగవంతుడే లక్ష్యం అవుగాక, భగవంతుడికోసమే ఇవి ఉద్దిష్టాలై వున్నవి; లక్ష్యాన్ని తప్పి అవి నికృష్టగాములైతే దుష్టాలవుతాయి. లక్ష్యభూతుడైన భగవంతుడి వైపుకే ప్రసరిస్తే పరమ నిక్కృష్టమైనది సైతం ఉదాత్తగా పరిణతి గాంచుతుంది. మానవ మనశ్శరీరశక్తులు ఎలా వ్యక్తాలైనా అన్నిటికి భగవంతుడే పరమావధి. మానవహృదయంలోని సమస్త కామాలకూ ప్రేమలకూ గమ్యం భగవంతుడే, ఆయనే ప్రియతముడు; భగవంతుడికంటె ఈ హృదయం ఎవరిని ప్రేమించగలదు? ఆతడే దివ్యసుందరుడు, ఉదాత్తుడు; సౌందర్యానికి ఉదాత్తతకు ప్రతిరూపం. విశ్వంలో ఆతణ్ణి మించిన సుందరు లెవరు? అతడికంటె గొప్పవాడైన భర్త ఎవరు? ఆతణ్ణి మించిన ప్రేమపాత్రు లెవ్వరు? కాబట్టి భగవంతుడే మనకు ప్రియుడగుగాక! ప్రాణప్రియుడగుగాక. తరచు ఏం జరుగుతుందంటె దివ్యకాములు దివ్యప్రేమను కీర్తించేటప్పుడు అందుకు బహువిధాలైన మానవప్రేమకు సంబంధించిన భాషే చాలునని అంగీకరిస్తారు. అజ్ఞులు దాన్ని గ్రహించరు, గ్రహించలేరు. దీన్ని వారు ప్రాపంచిక దృష్టితో చూస్తారు. ఈ దివ్యప్రేమోన్మత్తత వారికి అవగాహనకాదు, ఎలా కాగలుగుతుంది?
శ్లో. “సురతవర్ధనం శోకనాశనం
స్వరితవేణునా సుష్ఠుచుమ్బితమ్,
ఇతరరాగవిస్మారణం నృణాం
వితరవీరనస్తేస్త్రీధరామృతమ్.”*
ప్రియతముడైన సర్వేశ్వరుడి ఇలాటి చుంబనం ఆశించు; భక్తుణ్ణి ఉన్మత్తుణ్ణి చేసే, మానవుణ్ణి దేవతగా చేసే, ఆ మహనీయుడి అధర చుంబనాన్ని ఆశించు. పరమేశ్వరుడి ముద్దు పొందే భాగ్యం కలిగిన, పరమేశ్వర చుంబనంచేత ధన్యుడైన వ్యక్తికి విశ్వప్రకృతి పరిపూర్ణంగా మారిపోతుంది, సూర్యచంద్రులు అంతరిస్తారు. లోకాలు అదృశ్యాలవుతాయి. ఆ అనంతాద్వితీయ ప్రేమసాగరంలో యావత్తు విశ్వం కరగిపోతుంది. దివ్యప్రేమోన్మాదానికి ఇదే పరిణతి. పరిపక్వత అనటం ఎందుకు – నిజమైన భక్తుడికి ఇది తృప్తికరం కాదని చెప్పాలి; భార్యాభర్తల అన్యోన్యప్రేమకూడ ఆతడి దృష్టిలో ప్రేమోన్మత్తతకు చాలదు. వేయేల, భక్తులు జారశృంగారాన్ని సైతం అవలంబిస్తారు; ఎందుకంటే అదంత బలీయంగా ఉంటుంది; ఆ ప్రేమలోని అయుక్తత ఎంతమాత్రం వారి దృష్టిలో లేనేలేదు. స్వేచ్ఛగా ప్రకటించటానికి ఎన్ని ఆటంకాలు ఎదురైతే అంత ఉద్రిక్తమవుతూండటం ఆ ప్రేమకు నైజం. భార్యాభర్తల పరస్పరానురాగంలో ఒడిదుడుకులు ఉండవు; ఆటంకాలు కలుగవు; కాబట్టి అది సరళంగా సాగుతుంది. యువతి ఒకణ్ణి వలచినప్పుడు ఆమె తల్లిదండ్రులుగాని, భర్తగాని అలాటి ప్రేమను ఆక్షేపిస్తారు, ఆటంకాలు కలిగేకొద్దీ ఆమె ప్రేమ బలీయమవుతూంటుంది కదా. భక్తుడు ఈ మనోభావాన్ని ఆదర్శంగా గైకొంటాడు. బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఎలా ప్రేమించారో, ఆ ధన్యులు ఎలా ఆతడి వేణుగానాన్ని వినగానే సమస్తం మరచిపోయి, సంసారాన్ని, సంసార బంధాలను, సుఖదుఃఖాలను, విధులను సమస్తం మరచిపోయి కృష్ణుణ్ణి కలుసుకోటానికై ఇళ్ళు విడిచి పరుగెత్తి వచ్చేవారో – వర్ణించేశక్తి మానవభాషకు లేదు. ఓయీ, మానవుడా, దివ్యప్రేమను గురించి నువ్వు ప్రసంగిస్తావే! తోడుగా ఈ మాయాసంసార బంధాలనన్నిటిని పైనవేసుకొంటున్నావే! నువ్వు నిష్కపటచిత్తుడవేనా?
“జహాం రామ తహాం కామ నహీ,
జహాం కామ తహాం నహీరామ;
దో నో ఏక సాథ మిలత నహీ
రవిరజనీ ఏకఠామ.”*
“రాముడు పాలించే హృదయంలో కాముడూ, కాముడు పరిపాలించే హృదయంలో రాముడూ ఉండలేరు! సూర్యతేజమూ చీకటీ ఒక్కచోట వుండలేవు కదా!”