పరవిద్యా అపరవిద్యా అని ఉపనిషత్తులు విద్య (జ్ఞానం)ను విభజిస్తున్నాయి. భక్తుడి దృష్టిలో పరవిద్యకూ పరభక్తికీ నిజానికి ఎలాటి భేదమూ లేదు. “ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్బ్రహ్మ విదోవదన్తి । పరాచైవాపరాచ । తత్రాపరా – ఋగ్వేదో యజుర్వేదః సామవేదోఽథర్వ వేదః శీక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్దో జ్యోతిషమితి । అథ పరా యయాతదక్షరమధి గమ్యతే ॥* – పరవిద్య అనీ అపరవిద్య అనీ తెలియదగిన విద్య రెండు విధాలని బ్రహ్మవేత్తలు వక్కాణిస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, శిక్ష (వేదోచ్చారణశాస్త్రం), కల్పం (యజ్ఞ విధానాన్ని బోధించేశాస్త్రం), వ్యాకరణం, నిరుక్తం (శబ్దార్థశబ్దనిష్పత్తులను గురించిన శాస్త్రం), ఛందస్సు (పద్యలక్షణశాస్త్రం), జ్యోతిషం – వీటితో కూడినది అపరవిద్య; దేనివలన అక్షర పరబ్రహ్మజ్ఞానం కలుగుతుందో అదే పరవిద్య.” దీనివలన బ్రహ్మజ్ఞానమే పరవిద్య అనటం స్పష్టం. ఇక పరభక్తిని గురించి శాస్త్రాలు ఇలా తెలుపుతున్నాయి:* “ఒక పాత్రనుంచి మరొక పాత్రలోకి అవిచ్ఛిన్నమైన ఏకధారగా పోయబడే చమురువలె, మానసం అవిచ్ఛిన్న ప్రవాహరూపంలో పరమేశ్వరుణ్ణి గురించి చింతించేటప్పుడు మనకు పరభక్తి సిద్ధిస్తోంది.” నిశ్చలం, నిరంతరం, అనురాగయుతం అయినట్టి భగవచ్చింతనమే భగవానుడిపట్ల మనకు కలిగే మహోన్నత ప్రేమను ప్రకటిస్తుంది. ఇతరమైన భక్తిరూపాలన్నీ మహోన్నతమైన ఇలాటి పరభక్తిని పొందటానికి సాధనాలు. దీనికి రాగానుగభక్తి అని మరొకపేరు. ఈ పరమప్రేమ హృదయంలో జనించగానే భక్తుడికి భగవచ్చింతనం తప్ప ఇతర స్మృతి వుండదు. భగవచ్చింతనకే తప్ప వేరే దేనికీ అతడు తావు ఇవ్వడు. అతడి ఆత్మ చలించని విశుద్ధి కలిగి ఉంటుంది. సమస్త మనోబంధాలు తెంచుకొని నిర్మల విముక్తి నొందేశక్తి అతడికి మాత్రమే ఉంది; ముక్తికాంత ఆతణ్ణి వరిస్తుంది; ప్రశాంతి ఆతనికి కరతలామలక మవుతుంది. తన హృదయసింహాసనంలో భగవంతుణ్ణి ఆరాధించటానికి ఆతడొక్కడే అర్హుడు. అర్చావిధులు, ప్రతీకాలు, గ్రంథాలు, సిద్ధాంతాలు – ఇవన్నీ ఆతడికి అనావశ్యకాలు, నిష్ప్రయోజనాలు. భగవంతుణ్ణి ఈ విధంగా ప్రేమించటం అతి దుర్లభం. ఎక్కడ ప్రేమ ప్రతిఫలిస్తుందో అక్కడే సామాన్యంగా మానవప్రేమ వికసించటం చూస్తాం. ప్రేమకు ప్రతిఫలమైన ప్రేమ సిద్ధించకుంటే కేవలం నిర్లక్ష్యతను చూపుతుంటారు. ప్రేమరూపమైన ప్రతిఫలం లభించనప్పుడు ప్రేమించటం అరుదు. ప్రతిఫలాపేక్షలేని ప్రేమ మిడుతకు అగ్నిపట్ల గల ప్రేమలాంటిది. మిడుత మంటమీద ప్రేమతో దాన్లోపడి మాడిపోతుంది. ఇలాటి ప్రేమ ఆ పురుగుకు సహజం. ప్రేమించటమే ప్రకృతి అయినందువల్ల ప్రేమించటం అనేది లోకంలో ప్రేమ దాల్చే అత్యుదాత్త నిస్స్వార్థరూపమనటం నిర్నిరోధం. అలాటి ప్రేమ ఆధ్యాత్మికరంగంలో పరాభక్తిని తప్పక సిద్ధింప చేస్తుంది.