సమష్టిని (భగవంతుణ్ణి) మనం ప్రేమించనిదే వ్యష్టిని (విశ్వాన్ని) ప్రేమింపజాలం. భగవంతుడే ఈ సమష్టి, సామాన్యీకరించబడ్డ నిర్విశేషపూర్ణం; మనకు గోచరించే ఈ విశ్వమే వ్యష్టి విశేషరూపం. కోట్లాది చిన్నచిన్న ఏకత్వాలను తనలో ఇముడ్చుకొని ఏకైకమైన ఏకత్వమనదగ్గ ఈ సమష్టిని – సామాన్యాన్ని – ప్రేమించటంచేతనే విశ్వాన్నంతా ప్రేమించగలుగుతాం. భారతీయ తత్త్వజ్ఞులు వస్తువిశేషాలను గ్రహించటంతోనే తమ జిజ్ఞాసను వదలుకోక విశేషాలను ఒక్కసారి త్వరితగతిన అవలోకించి వెంటనే, సమస్త విశేషాలను తనలో ఇముడ్చుకొనే సామాన్యరూపాల కనుగోనారంభిస్తారు. సర్వం తానే అయిన దాని జిజ్ఞాసే భారతీయ మత వేదాంతాలలోని ఏకైక జిజ్ఞాస. వస్తువుల అఖండ స్వరూపాన్ని, సర్వమూ తానే అయిన నిర్విశేషసత్తను, దేనిని తెలుసుకోవటం సర్వం తెలుసుకోవటం అవుతుందో దానినే జ్ఞాని లక్షిస్తాడు. సర్వమూ తానే అయి ఇట్టివాడు అట్టివాడని అనరాని పురుషుణ్ణి, ఎవరిని ప్రేమించటం సర్వాన్ని ప్రేమించటం అవుతుందో అతణ్ణి భక్తుడు సాక్షాత్కరించుకో గోరతాడు. సమస్త శక్తులూ తానే అయిన శక్తిని, దేన్ని వశపరచుకొంటే విశ్వాన్నంతా వశపరచుకొన్నట్లవుతుందో అలాటి శక్తిని పొందాలని యోగి కోరతాడు. భారతీయుల చరిత్రను తిలకించండి. భారతీయుడు చిత్తాన్ని, సర్వాన్ని తానే అయిన దానివంకకే సదా మరలుస్తాడు, విజ్ఞానశాస్త్రంలోను అంతే; మనస్తత్త్వశాస్త్రంలోను అంతే; ప్రేమలోను అంతే; వేదాంతంలోను అంతే. కాబట్టి కేవలం ఒకరి వెంబడి ఒకరిని ప్రేమించ మొదలుపెడితే పరాంతకాల పర్యంతం అలా ప్రేమిస్తూనే ఉండవచ్చుగాని, ప్రపంచాన్నంతా మాత్రం ఏకంగా ఎన్నటికీ ప్రేమించినవారం కాజాలమనేదే భక్తుడి సిద్ధాంతం. సమస్త ప్రేమకూ మూర్తీభావం భగవంతుడే అనీ, ముక్తులుగాని, ముముక్షువులుగాని బద్ధులుగాని అందరి కోర్కెలకూ మూర్తీభావం భగవంతుడే అనీ, మూలాశయం ఎప్పుడు ఒకడికి అధిగతమవుతుందో అప్పుడు మాత్రమే విశ్వప్రేమను వెలువరచటం అతడికి శక్యమవుతుంది. భగవంతుడే ఈ సమష్టి; ఈ దృశ్యప్రపంచం ప్రత్యేకించబడి వ్యక్తం గావించబడిన ఆతడి స్వరూపమే. సర్వమూ తానే అయిన ఈ తత్త్వాన్ని మనం ప్రేమిస్తే సర్వాన్ని ప్రేమించిన వారమవుతాం. విశ్వప్రేమ, విశ్వహితం, సర్వం అప్పుడు సులభంగా సిద్ధిస్తుంది; మొదట భగవంతుణ్ణి ప్రేమించటం చేతనే మనం ఈ శక్తిని పొందాలి; లేకుంటే జగద్ధిత మనేది అంత సులభసాధ్యం కాదు. “సమస్తం భగవంతుడిదే, ఆతడే నా ప్రియుడు, నే నాతణ్ణి ప్రేమిస్తాను, కామిస్తాను” అంటూ భక్తుడు పలుకుతాడు. విశ్వమంతా భగవంతుడిదే కాబట్టి విశ్వమంతా భక్తుడికి పవిత్రమవుతుంది. అతడికి అందరూ భగవంతుడి బిడ్డలే, భగవచ్ఛరీరమే, భగవత్స్వరూపమే. అలాటప్పుడు భక్తుడు ఎవరికీ హానిచేయటం అసాధ్యం కదా. ఎవరినీ, ఏ జీవజంతువునుగాని ప్రేమించకుండటం అసంభవం కదా! ఇలాటి విశ్వేశ్వరప్రేమతో విశ్వమానవప్రేమ కలుగుతుందనటం యథార్థం.పరమేశ్వరుణ్ణి సమీపించేకొద్దీ సర్వం పరమేశ్వరుడిలోనే సంస్థితమై ఉందని చక్కగా గ్రహించ నారంభిస్తాం. ఇలాటి పరమప్రేమానందాన్ని పొందిన వ్యక్తి వెంటనే సర్వభూతాల్లోను భగవంతుణ్ణి దర్శించ నారంభిస్తాడు. అప్పుడు మన హృదయం ప్రేమకు తరగని చెలమగా విరాజిల్లుతుంది. మనం ఈ ప్రేమలో పై మెట్లను అందుకొన్నకొద్దీ ప్రాపంచిక భేదాలన్నీ అదృశ్యం అవుతాయి; మానవుడు ఇక మానవుడుగా కనిపించడు, సాక్షాత్తు భగవత్స్వరూపుడై కానవస్తాడు; జంతువు జంతువులా కనబడదు. జగదీశ్వరుడి రూపంగా కనబడుతోంది; పులికూడ ఇక పులికాదు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఇలా ఈ పరమభక్త్యవస్థలో ప్రతి మానవుణ్ణి, ప్రతి ప్రాణిని, ప్రతి భూతాన్ని భక్తుడు ఆరాధిస్తాడు. “ఏవం సర్వేషు భూతేషు భక్తి రవ్యభిచారిణీ కర్తవ్యాపండితై జ్ఞాత్వా సర్వభూతమయం హరిమ్* – హరి సర్వభూతమయుడని గ్రహించి సర్వభూతాలలోను నిశ్చలమైన భక్తి చూపటమే విజ్ఞులకు కర్తవ్యం.” ఇలాటి జగద్వ్యాప్తమైన అచంచల ప్రేమవల్ల సంపూర్ణమైన ఆత్మనివేదన భావం – మనకు ప్రతికూలంగా ఏదీ సంభవించదనే దృఢనిశ్చయం – కలుగుతుంది. ఈ స్థితే ‘అప్రాతికూల్యం’ అనబడుతుంది. ఈ విధమైన ప్రేమపూరితుడైన వ్యక్తి తనకు కష్టంవస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడు. ఆతడి మనస్సు ఎలాటి దుస్థితి సంభవించినా, “రా! నుమ్వా నా దైవం నుంచే వస్తున్నావు” అంటూ ఆహ్వానిస్తాడు. తాచుపాము వచ్చినా “రా” అంటూ ప్రేమతో పలుకుతాడు.* మృత్యువు ఎదురైనా అలాటి భక్తుడు చిరునవ్వుతో ఆహ్వానిస్తాడు. “అన్నీ నా వద్దకే వస్తున్నాయి, ధన్యుణ్ణి నేను! అన్నిటికీ స్వాగతం!” ఇదే భక్తుడి భావన. గాఢమైన ఇలాటి భగవత్ప్రేమచేత, భగవంతుడికి చెందిన సర్వభూతాలపట్ల ప్రేమచేత, జనించే ఆత్మార్పణ బుద్ధివల్ల భక్తుడి అనుభూతిలో ఖేద మోద విభేదబుద్ధి అంతరిస్తుంది. ఎలాటి బాధ కలిగినా, ఎలాటి దుస్థితి సంభవించినా, మొరపెట్టుకోవటం ఎలాటిదో ఆత డెరుగడు. ప్రేమ స్వరూపుడైన భగవంతుడి సంకల్పమే సదా నెరవేరుతుంది అనే ఆత్మార్పణబుద్ధి సకల మహాద్భుత వీరకృత్యాలకంటె, వైభవంకంటె నిశ్చయంగా ఘనతరం, పొందశక్యమైనది.
మానవకోటిలో అధికసంఖ్యాకులకు శరీరమే వారి సర్వస్వం, శరీరమే వారి ప్రపంచం, శరీర సౌఖ్యమే వారి పరమావధి. ఈ శరీరారాధన పిశాచం, ఇంద్రియారాధన భూతం మనల నందరినీ ఆవేశించివుంది. ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎంత ఆకాశపథానికి ఎగిరినా చివరకు మనం గద్దల వంటివారం; కిందవున్న కామకాంచన శవాలమీదనే మన దృష్టి లగ్నమై ఉంటుంది.* పులివాత పడకుండా మన శరీరాన్ని ఎందుకు రక్షించుకోవాలో చెప్పండి. పులికి మన శరీరాన్ని ఎందుకు సమర్పించకూడదు?* అందువల్ల పులి తృప్తిపొందుతుంది కదా! అలా చేయటం స్వార్థత్యాగంకంటె – పరమేశ్వరారాధనకంటె – భిన్నం కాదుకదా! స్వార్థపరత సంపూర్ణంగా నశించిన ఇలాటి మహోన్నతాదర్శాన్ని ఎన్నడైనా మీరు సాధించగలరా? ఇదేకదా ప్రేమతత్త్వ మహోన్నత శిఖరం! ఈ శిఖరాన్ని అధిరోహించ గలిగినవారి సంఖ్య అతి తక్కువ; కాని సదా మనస్ఫూర్తిగా ఇలాటి త్యాగానికి సంసిద్ధుడు కానిదే మానవుడు ఎన్నటికీ పరిపూర్ణ భక్తుడు కాలేడు. దాదాపు తృప్తికరంగా మనం ఎంతో కొంతకాలం శరీరాన్ని కాపాడుకోవచ్చు, కాని ఎప్పటికైనా చివరకు ఈ శరీరం నశించక తప్పదు; శరీరం శాశ్వతంకాదు. లోకకల్యాణ యత్నంలో, లోక సేవాచరణలో ఎవరి శరీరం నశిస్తుందో అతడే ధన్యాత్ముడు. “సిరిసంపదలను, ప్రాణాన్ని సైతం లోకహితార్థం వినియోగించటానికై మహాత్ముడు సదా సంసిద్ధుడై ఉంటాడు. లోకంలో అన్నిటికంటె ఒక్కటి, అంటే మరణం, ఎల్లరికి ధ్రువమై ఉండటంచేత ఈ శరీరం దురుద్యమంలోగాక, సదుద్యమంలో నశించటమే శ్రేయస్కరం.” ఏభై ఏళ్ళో లేక నూరేళ్ళో జీవితం సాగిస్తాం గాక, కాని తరువాత సంభవించేది ఏమిటి? పుట్టినవన్నీ గిట్టక తప్పదుకదా. సృష్టిలో సంయోగాన్ని ఆశ్రయించుకొనే వియోగం వుంది. సమస్తం లయమయ్యే కాలం వచ్చి తీరుతుంది.* బుద్ధుడు, మహమ్మదు, ఏసుక్రీస్తు – వీరంతా మరణించారు; జగద్గురువులూ ప్రవక్తలూ మరణించారు. సమస్తం మృత్యువు వాతపడే ఈ మర్త్యలోకంలో మన నియమితకాలాన్ని సాధ్యమైనంత సార్థకం చేసుకోవటమే మన కర్తవ్యం. ఇదే భక్తుడి అభిప్రాయం. నిజానికి జీవితాన్ని సద్వినియోగం చెయ్యడమంటే సర్వభూత సేవయే. “శరీరమే మనం” అనే నీ భ్రమతో – శరీర రక్షణ, శరీర సంతృప్తికై సర్వవిధాల శక్తికొద్దీ యత్నించాలనే భ్రాంతితో – కూడిన ఘోరమైన నీ శరీరాభిమానమే స్వార్థపరాయణతను వృద్ధి పరుస్తుంది. నీ శరీరంకంటె నిశ్చయంగా నువ్వు భిన్నుడవని గ్రహిస్తే నువ్వు పోరాడవలసిన వారు ప్రతిఘటించవలసినవారు ఎవ్వరూ లేరు. స్వార్థభూయిష్ఠాలైన సమస్త భావాలూ బొత్తిగా లేకుండా పోతాయి. కాబట్టి మనం సాంసారిక విషయాలపట్ల మృతప్రాయులమై మసలుకోవాలనీ ఇదే నిజమైన ఆత్మార్పణమనీ భక్తుడు వక్కాణిస్తాడు. సుఖదుఃఖాలను యథేచ్ఛగా రానివ్వు. “నీ ఇచ్ఛే నెరవేరుగాక!”* అనే వచనానికి ఇదే తాత్పర్యం కాని, ఊరక పోరాడుతూ, ప్రయాసపడుతూ, మన లోపాలు విషయవాంఛలుకూడ భగవదిచ్ఛే అని తలపోయటం కాదు. స్వార్థపూరిత యత్నాలచేతకూడ మేలు కలుగవచ్చు. కాని దానికి కర్త దేవుడు. స్వప్రయోజనాన్ని ఆశించటంకాని, అందునిమిత్తం కృషిచేయటంకాని ఎన్నటికీ పరిపూర్ణుడైన భక్తుడి ఆశయం కాకూడదు. “ప్రభూ, నీ పేర వారు పెద్దపెద్ద దేవాలయాలు నిర్మిస్తారు; గొప్ప దానధర్మాలు చేస్తారు. నేను దరిద్రుణ్ణి, నా వద్ద ఏమీలేదు. కాబట్టి నా ఈ దేహాన్ని నీకు సమర్పిస్తాను. స్వీకరించు! దేవా, నన్ను విడువవద్దు!” ఇదే భక్తుడి హృదయాంతరాళం నుంచి వెలువడే ప్రార్థన. ప్రాణనాథుడైన భగవానుడిపట్ల ఈ విధంగా కావించబడిన ఆత్మార్పణాన్ని అనుభవించిన భక్తుడు ఆ అనుభూతి సమస్త సంపదలకంటే, భోగానుభవాలకంటే, జగద్విఖ్యాతికంటే ఘనతరమని భావిస్తాడు. నిరాడంబరమైన ఆత్మార్పణంవల్ల భక్తుడికి కలిగే శాంతి ఇంతింతని చెప్పలేం.* దాని విలువ సాటిలేనిది. ఇదే అప్రాతికూల్యం అనే మనోస్థితి. ఇలాటి మనోస్థితి పొందిన భక్తుడికి ఇక ఏ విధమైన స్వార్థచింతా ఉండబోదు. కాబట్టి అతడికి దీనిమీద విరోధంలేదు. ఈ ఉదాత్త విరక్తదశలో సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడిలో తప్ప ఇతరంలో ఆతడికి ఆసక్తి సంపూర్ణంగా నశిస్తుంది. భగవత్ప్రేమ రూపమైన ఈ అనురాగం బంధహేతువు కాకపోవటమే కాక సకల బంధవిముక్తికీ అమోఘసాధనమవుతుంది.