ఈ కిందివి భక్తిప్రకాశ రూపాలలో కొన్ని: వీటిలో మొదటిది సమ్మానం.* దేవాలయాలన్నా, పుణ్యక్షేత్రాలన్నా జనం ఎందుకు పూజ్యభావం చూపుతూంటారు? భగవంతుడు అక్కడ ఆరాధించబడటంచేత, అలాటి తావులలో భగవంతుడు వెలసివుంటాడని విశ్వసించటంచేత భక్తిభావం చూపుతూంటారు. ప్రతి దేశంలోను జనులు ధర్మప్రబోధకులను – ఆచార్యులను – గౌరవిస్తూంటారు ఎందుకు? మానవహృదయానికి ఇది సహజం. ఎందుకంటె అలాటి ప్రబోధకులందరు భగవంతుణ్ణి గురించి బోధిస్తారు. ప్రేమకుసుమం వికసించటంచేత కలిగే పరిమళమే గౌరవం. మనం ప్రేమించని వ్యక్తిని ఎన్నడూ గౌరవించలేం. సమ్మానానికి తరువాతది భగవత్ప్రీతి. విషయసుఖాలంటె జనానికి ఎంత ఆనందం! తమకు ప్రీతికరమైన దాన్ని సముపార్జించటానికై ఎంత దూరమైనా వెళతారే! ఎంత కష్టమైనా ఓర్చుకొంటారే! ఇలాటి ప్రేమే భక్తుడికి అపేక్షితం, కాని ఈ ప్రేమను భగవంతుడి వైపుకు మరల్చటమే భక్తుడు చేయవలసిన పని. తరువాత విషయం వేదనలలోకల్లా ప్రియతమమైన విరహవేదన. భగవంతుణ్ణి పొందలేక పోయాననే వేదనచేత దాదాపు పిచ్చివాడైపోయిన వ్యక్తి మనస్థితే విరహం; ప్రియతమాన్య విషయాలను చూసి ఆతడు వ్యాకుల చిత్తుడైపోతాడు. ఈ స్థితే ఏకరతివిచికిత్స అని పేర్కోబడుతుంది. లౌకికమైన ప్రేమలో ఈ విరహం ఎంత తరచు కలుగుతూంటుందో చూస్తూనే వున్నాం. అంతేగాక పురుషులను గాని, స్త్రీలు పురుషులనుగాని గాఢంగా ప్రేమించేటప్పుడు వారికి ప్రేమపాత్రాలుగానివి ఏవి కనిపించినా సహజంగా ఒక రకమైన విసుగు – ఒకరీతి ఏవగింపు– జనిస్తూంటుంది. సరిగ్గా ఈ రకమైన అసహనమే పరభక్తి వివశులైనవారికి కామితాన్యవిషయాలపట్ల కలుగుతుంది. భగవదితర విషయాలను గురించిన మాటే, వారికి రుచించదు. “తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముఙ్చథ* – ఆతణ్ణి గురించే, ఆ పరమాత్మను గురించే, చింతించు. ఆత్మేతర ప్రసంగాలను విసర్జించు.” ఎవరు భగవంతుణ్ణి గురించి మాత్రమే ముచ్చటిస్తారో వారే తనకు మిత్రులని భక్తుడు భావిస్తాడు; భగవదితర విషయాలను గురించి మాట్లాడేవారు ఆతడికి శత్రువులై తోస్తుంటారు. ఇంతకంటే ఉత్తమస్థితి వుంది. పరమప్రేమమూర్తి అయిన – తన జీవనజ్యోతి అయిన – భగవంతుడికోసం మాత్రమే నిలుపుకొనేటప్పుడు భక్తుడు ఈ ఉత్తమ స్థితిని పొందుతున్నాడు. ఇదే తదర్థప్రాణసంస్థాన మని పేర్కోబడుతోంది. ఇది లభించనిదే అలాటి ఉత్తమభక్తుడి జీవితం క్షణంకూడ నిలువలేదు. ప్రేమామృతసాగరమైన భగవానుని గురించి చింతించటంచేతనే జీవితం మనోహరమై ఒప్పుతుంది. భక్తియోగం అనుసరించి మానవుడెప్పుడు పరిపూర్ణుడవుతాడో, ధన్యుడవుతాడో, భగవంతుణ్ణి పొందుతాడో, నిజంగా భగవచ్చరణార విందాలను స్పృశిస్తాడో – అప్పుడు తదీయత అనే స్థితి సిద్ధిస్తోంది. అప్పు డాతడి స్వభావం పరిశుద్ధమై సంపూర్ణ పరిణామం పొందుతుంది. జీవిత పరమార్థం ప్రాప్తమై జీవితోద్దేశం సఫలమవుతుంది. అయినా ఇలాటి భక్తులలో అనేకులు కేవలం భగవానుని ఆరాధించటానికే జీవిస్తూంటారు. ఆ పరమానందాన్ని, జీవితైక మహాసుఖాన్ని వారు విడువ ఇష్టపడరు. “ఓ రాజా! ఎవరు ఆప్తకాములో, సంసారబంధ వినుర్ముక్తులో అలాటి మహనీయులు సైతం భక్తికోసమే హరిభజన చేస్తూంటారు.” “యం సర్వే దేవాః నమస్యన్తి ముముక్షువో బ్రహ్మవాదినశ్చేతి* – సమస్త దేవతలు, ముముక్షువులు, బ్రహ్మజ్ఞానులుకూడ అర్చించే భగవానుడు.” భగవద్భక్తి ఇంత మహత్తరమైనది. కేవలం తనను తాను మరచి, “నాది అనేది ఏదీ లేదు” అని భావించే భక్తుడికి తదీయత కలుగుతోంది; అన్నీ ప్రేమపాత్రుడైన భగవంతుడివే అవటంచేత అన్నీ భక్తుడికి పవిత్రమే. లౌకిక ప్రేమలోకూడ కాముకుడికి తాను ప్రేమించిన వనితయొక్క సర్వస్వం పవిత్రమై, ప్రియతమమై తోస్తుంటుంది గదా. తన ప్రియురాలి చీరకూడ ఆతడికి ప్రేమపాత్రమే. ఇలాగే జగదీశ్వరుణ్ణి ప్రేమించేటప్పుడు సమస్త జగత్తూ మనకు ప్రేమపాత్రమై ఒప్పారుతుంది. ఎందుకంటె జగత్తు ఈశ్వరుడిదే కదా!